June 14, 2024

యోధ ప్రేమ

రచన: కృష్ణమాచార్యులు

ఆమె బాల్యంలో యెదురైన ప్రతికూల పరిస్థితులకు కృంగిపోలేదు. మగపిల్లల అల్లరి చేష్టలకు బెదరలేదు. కామ పిశాచి వికాటాట్ట హాసాలకు భయపడలేదు. నిలిచి పోరాడింది. సవాళ్ళను ఆనందంగా స్వీకరించి శ్రమించి గెలిచింది. జగడాల మారి, రౌడీ లాంటి బిరుదులతో తోటివారు పరిహసించినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగింది. తోడుగా నిలచిన ఒక స్నేహితుడిని, ప్రేమించినా చెప్పలేక సతమతమయ్యింది. ఓటమి యెరుగని ఆ యోధ, ప్రేమ ప్రపంచంలో గెలుస్తుందా?
***
చెన్నయి విమానాశ్రయం లాంజ్ లోనికి ప్రవేశించిన ఉదయ్ కొద్ది దూరంలో ఖరీదైన సూటులో వున్న యువతిని చూసి, రాణి కదా అని అనుకుంటూ మరింత పరీక్షగా చూసాడు. ఆమె రాణీయే అని నిర్ధారించుకున తర్వాత, అతను ఆమె ముందుకు నడిచాడు. అతడిని చూస్తూనే ఆమె ముఖం సంతోషంతో విప్పారింది. “హాయ్ ! ఉదయ్! ఎన్నాళ్లకు” అంటూ అతడిని హగ్ చేసుకుంది.
“ఇండియా వచ్చి మూడు నెలలయ్యింది. నిన్ను కలవాలని అనుకుంటున్నా, లక్కీగా ఇక్కడ కలిసాం!” అన్నాడు ఉదయ్ సంతోషం వ్యక్తం చేస్తూ.
“నమ్మను. నువ్వు ఆనాటి ఉదయ్ కాదు. ఆ ఉదయ్, నాకు కనబడకుండా ఇన్నాళ్ళు వుండడు” అలక నటిస్తూ అంది రాణి.
“నిజమే కానీ, చెల్లి పెళ్ళి హడావుడి. జాబ్ సెర్చ్. అలా రోజులు గడిచిపోయాయి . నువ్వు మంచి వుద్యోగంలో వున్నా వని తెలిసింది. కంగ్రాట్స్.”
“నీ దయవల్ల సియ్యే అయిన తర్వాత, ఒక కన్సల్టన్సీలో చేరాను. నా సంభాషణా చాతుర్యం నచ్చి, నన్ను ఇందూ ఇండస్ట్రీస్ యెండీ తన ఎక్సిక్యూటివ్ అసిస్టెంట్ గా తీసుకున్నాడు. మా కంపెనీ ఈ మధ్య కాలంలో ఒక కంపెనీని కొనుగోలు చేసింది. అప్పుడు కష్టపడి, నేను మా యెండీని బాగా ఇంప్రెస్ చేసాను” చెప్పింది రాణీ సంతోషంగా.
“గుడ్. అవకాశాలను అందిపుచ్చుకోవడమే కదా సామర్ధ్యం?”
“అందుకోవడం కాదు, పోరాడి గెలుచుకోవడమే. పోరాడే ఆడదాన్ని ఇంగ్లీషులో డెవిల్ అంటారు పురుషుడిని మొనగాడంటారు”
“నువ్వు మారలేదు. అదే ధైర్యం, అదే పోరాట స్పూర్తి”
“థాంక్స్. బహుశా ఈ కార్పొరేట్ ప్రపంచంలోకి రాకుండా వుంటే వేరేలా వుండేదాన్నేమో?”
“నిజమే, ఇది పోటీ ప్రపంచం. ఎవరి స్వార్ధం వారిది. ఇంతకీ నీవుండేది యెక్కడ.”
“చెన్నయి. కానీ ఎక్కువ రోజులు టూరులో వుంటాను”
ఇంతలో బెంగళూరు విమానం బోర్డింగ్ అనౌన్స్ చేసారు. మళ్ళీ కలుద్దామని చెప్పుకుని ఫోన్ నంబర్లు ఒకరికొకరు యిచ్చి పుచ్చుకున్నారు. డిల్లీకి వెళ్ళే విమానంలో కూర్చున్న ఉదయ్‌కి కాలేజిరోజుల జ్ణాపకాలు గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు.. పెంకి పిల్ల, పోట్ల గిత్త, జగడాలమారి …యిలా బహు నామాలున్న రాణీని చూసిన నాటినుంచే అభిమానించాడు ఉదయ్. సాహసంతో ఆమె తన అక్కకు క్రొత్త జీవితాన్నిచ్చిన వైనం గుర్తుకొచ్చి అతని పెదవులపై చిరు దరహాసం మెరిసింది.
***
బీ కాం మొదటి సంవత్సరం. విద్యార్ధినీ విద్యార్ధులు కలిసి ఒకే బల్లపై కూర్చునే పద్దతి వుండడం వల్ల ఆడపిల్లలతో
పరిచయాలు సులభంగా అయ్యేవి. ఆడపిల్లలందరిలో రాణీని రౌడీ అనేవారు. ఒక నెలరోజులు గమనించిన తర్వాత, ఒక రోజు
ఉదయ్ ఒంటరిగా వున్న రాణీని అడిగాడు.
“నిన్ను ఎందుకు రౌడీ అంటున్నారు?’
.”వాళ్ళకలా అనిపించింది” అంటూ రాణి నవ్వేసింది. ఆమే స్వచ్చమైన నవ్వు ఉదయ్‌కి నచ్చింది.
“కాదులే! చెప్పరాదూ, నాకు తెలుసుకోవాలని వుంది” అన్నాడు స్నేహంగా.
“ఇంకెప్పుడైనా” అంటూ రివ్వున పరిగెత్తి మాయమైంది.
అక్కడే కొద్దిదూరంలో వున్న హరిణి, “నన్నడుగు చెప్తాను” అంది ఉదయ్‌తో.
“సరే! చెప్పు” అన్నాడు ఉదయ్.
హరిణి వచ్చి అతని ప్రక్కన కూర్చుని యిలా చెప్పింది.
“రాణిది మావూరే. ఆమె తండ్రి త్రాగుబోతు. రోజూ త్రాగొచ్చి, తల్లిని తిట్టడం, కొట్టడం చేస్తూంటే, రాణి అతనికి యెదురు తిరిగింది. తల్లి వంటి మీద దెబ్బ వేస్తే చంపిపారేస్తానని బెదిరించింది. పూర్తిగా ఆయన మాట వినడం మానేసి. తనకు నచ్చినట్లు చదవడం, ఆటలాడడం చేసేది. తనను గాని, తన స్నేహితులను గాని మగపిల్లలు హేళనగా ఒక మాట అంటే చాలు పరుగెత్తించి కొట్టేది. ఒక రకంగా తన తండ్రి మీద కోపం వాళ్ళ మీద చూపించేది. అలా రౌడీగా పేరు వచ్చింది తనకు”
“అంతేనా! కానీ మగవాడిలా బట్టలేసుకోవడమెందుకు?”
“తను కరాటే నేర్చుకుంది. మంచి బాడ్మింటన్ ప్లేయర్. చదువులో ముందుంటుంది. ఇవి గదా ముఖ్యం, వేసుకునే బట్టలలో యేముంది?” అతని విమర్శను త్రిప్పికొడుతూ హరిణి బదులిచ్చింది.
రాణీ గురించి తెలిసాక ఉదయ్, ఆమెతో స్నేహం చేసి, ఆమెకు చదువులో తోడ్పడాలనుకున్నాడు.
పలకరిస్తే “హాయ్” అని వెళ్ళిపోతున్న ఆమెను ఒక రోజు “ఏమిటి? నన్ను చూసి పారిపోతున్నావు?” అని వెక్కి రించాడు. అంతే. అతననుకున్నట్లే ఆమె ఆగింది
“అలా అనిపించిందా! పనిలేని వారితో పెత్తనాలెందుకనుకున్నా. విషయమేమిటి?” అని నిలదీసింది
“ఇలా రా! ఒక నిమిషం” అంటూ కళాశాల ఆవరణలో తనకు దగ్గరలో వున్న చెట్టు క్రిందికి వెళ్ళాడు. ఆమె వచ్చి అతనికభిముఖంగా నిలబడింది.
“నీ గురించి తెలుసుకున్నాను. నీ పోరాట పటిమకు నా అభినందనలు. నీ చదువుకు లక్ష్యమేమిటొ తెలుసుకుందా మని నిన్ను ఆపాను.”
రాణి అనుమానంగా చూస్తూ, “నీ కెందుకు?” అని పుల్లవిరుపుగా అంది.
“యిష్టం లేకుంటే చెప్పకు. తోటి విద్యార్ధిగా అడిగాను” అన్నాడు ఉదయ్ నవ్వుతూ.
“నువ్వు మా నాన్నలా సోది చెప్పవు కదా! ” అని ఒక నిమిషం మౌనంగా వుండి ” సియ్యే చేయాలని నా కోరిక” అంది నెమ్మదిగా.
“మా పెదనాన్న ప్రాక్టీస్ చేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్. ఈ వూళ్ళోనే. నేను చెప్తే ఆయన నీకు గైడెన్సు యిస్తారు. ఈ ఆదివారం వుదయం వెళ్దామా?”
రాణి సందేహంగా అడిగింది.,”నువ్వెందుకు నాకు సహాయం చేస్తున్నావు?
“నీకు మంచి స్నేహితుడిగా వుండాలని. ఇష్టం లేకుంటే బలవంతం లేదు” అన్నాడు ఉదయ్. నిర్వికారంగా వున్న అతని వదనాన్ని చూసి రాణి, “నమ్ముతున్నాను” అంటూ చేయి చాచి కరచాలనం చేసింది.
అలా మొదలైన వారి స్నేహం కలిసి చదువుకోవడంవల్ల, ఒకరి అభిప్రాయలను, మరొకరు గౌరవించడం వల్ల గట్టి పడింది. అలా సాగుతున్న స్నేహానికి ఒకనాడు చిన్న పరీక్ష యెదురయ్యింది.
రాణి తరచుగా ఆ కళాశాల పాలిటిక్స్ మాస్టారు రఘుతో మాట్ల్లాడడం గమనించిన ఉదయ్, ఆమెనొక రోజు “ఏం జరుగుతోంది? అని ప్రశ్నించాడు. రాణి కి అతనలా ప్రశ్నించడం నచ్చలేదు.
ఆమె ముఖ కవళికలను గమనించిన ఉదయ్ వెంటనే “సారీ! నీ వ్యక్తిగతమైతే చెప్పకు” అని మాట మార్చాడు.
అతనలా అనడంతో రాణి మనస్సు ప్రసన్నమైంది.
” సారీ! నీకు చెప్పి వుండాల్సింది. ఆయన మా అక్క సుజాత ప్రేమించుకున్నారు. నాన్నను కలిసి ఈయన తమ ప్రేమ విషయం చెపితే, వీలు కాదని చెప్పి, మా నాన్న మొన్న వేసవిలో అక్కనొక గవర్నమెంట్ వుద్యోగికిచ్చి పెళ్ళి చేసాడు. అదే చెప్పి బాధపడుతున్నాడు”.
“పాపం! మీ అక్క యెలా వుందో! భర్త మంచివాడైతే ఈ ప్రేమను మర్చిపోగలుగుతుంది” అన్నాడు వోదార్పుగా.
రాణీ మౌనంగా ఆలోచిస్తూ వుండిపోయింది. ఆమె మనసులో అగ్ని పర్వతాలున్నాయని, అవి ఒక రోజు పేలతాయని ఆనాడు అతడికి తెలియదు.
దాదాపు నెలరోజుల తర్వాత ఒక వార్తతో ఆ వూరూ, కళాశాల అట్టుడికిపోయాయి.
‘రాణీ అనే అమ్మాయి ఆమె బావ పురుషాంగం కొరికేసిందని, రాత్రి నిద్రపోతున్న సమయంలో మృగంలా మీద పడి అత్యాచారం చేయబోయిన అక్క భర్త నుంచి తనను తాను రక్షించుకునే క్రమంలో ఆమె యిలా చేసిందని టీవీలో మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. రాణి యెలాగుందో, పోలీసుల అదుపులో వుందా అని ఉదయ్ భయపడిపోయాడు.
ఇంతలో హరిణి నుంచి ఫోన్ వచ్చింది.
“రాణిని ఆస్పత్రిలోచేర్చారు. గాయాలకు చికిత్స జరుగుతోంది. తనకేం పరవాలేదు. మన ప్రిన్సిపాల్ కూడా యిక్కడే వున్నారు. నిన్ను గాభరా పడవద్దని చెప్పింది” .
ఆమె క్షేమం తెలిసాక ఉదయ్ మనసు కుదుటపడింది. మరునాటికే ఆ సంఘటన మరుగునపడింది. పది రోజుల రోజుల తర్వాత రాణి క్లాసులకు హాజరయ్యింది. మెల్లగా ఒక రోజు, రాణీ రహస్యంగా ఉదయ్‌కి అసలేం జరిగిందో వివరంగా చెప్పింది.
“బావ ఒక సెక్స్ సైకో. శోభనం రాత్రి ఆ దరిద్రుడు మా అక్కకి చేసిన హితబోధ యేమిటో తెలుసా? సుజాతా, ఈ ప్రపంచంలో అన్నింటికన్నా యెక్కువ తృప్తినిచ్చేది సెక్స్. ఈ సొసైటీ దానినొక పాపంగా చూడడం మన దురదృష్టం. నీవు నా ఒక్కడితోనే వుండాలని బాధపడకు. మా స్నేహితులంతా అభ్యుదయవాదులు. మేమంతా భార్యల మార్పిడికి కట్టుబడి వున్నాం. రాత్రి నువ్వు నా స్నేహితుడితో గడిపితే, అతని భార్య నాతో గడుపుతుంది. రతి విజ్ఞానం కోసం సెక్స్ పుస్తకాలు, వీడియోలు అన్నీ మన దగ్గర వున్నాయి. అదృష్టం కదూ. నన్ను భర్తగా పొందటం. ఇక ప్రతిరోజూ పండుగే” .
ఆ మాటలకు అక్క అదిరిపడింది. ఏదో గుట్టుగా బ్రతుకుదామనుకుంటే ఈ గోల యేమిటి అని తల్లడిల్లిపోయింది. బావతో కరాఖండిగా చెప్పింది.
“ఇది నా వల్ల కాదు. మీరెలా వూరేగినా మీ యిష్టం. నా జోలికి రాకండి.”
బావ కోపంతో వూగిపోతూ అక్కను గొడ్డును బాదినట్టు బాదాడు. అప్పట్నుంచి అక్కను మానసికంగా హింసించడ మొక పనిగా పెట్టుకున్నాడు. శని, ఆదివారాలు అమ్మాయిలను ఇంటికి తెచ్చి అక్కను హేళన చేస్తూ వాళ్ళతో సరసాలాడేవాడు”.
“వినడానికి అసహ్యంగా వుంది. మీ అక్క యెలా కాపురం చేసిందో? ” అని సానుభూతి చూపాడు ఉదయ్.
“అవును. నిజానికి మా అక్క ఈ విషయం దాచింది. తను చేస్తోంది గొప్పపని అని నమ్మిన మా బావే నాకీ విషయం చెప్పి, నన్ను సహకరించమని కోరాడు. అక్కలా జడపదార్ధంలా వుండడం అవివేకమని హితవు చెప్పాడు. అప్పుడే బావకి శాస్తి చేసి, ఆక్కకు విడాకులిప్పించాలని పధకం వేసాను. రఘు మాస్టారును కలిసి అక్క పరిస్థితి చెప్పి, విడాకులు తీసుకుంటే పెళ్ళి చేసుకొంటారా? అని అడిగాను. ఆయన తప్పక చేసుకుంటానని మాట యిచ్చారు.”
“పులి నోట్లో తలబెట్టి, పులిని చావగొట్టిన వీరనారీమణివన్న మాట” అన్నాడు ఉదయ్ ప్రశంసాపూర్వకంగా.
“నా దెబ్బకి గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. కేసు దెబ్బకి పరువెలాగో పోయింది, వుద్యోగమైనా నిలబెట్టుకుందా మని రాజీ కొచ్చాడు. లంచాలతో పొలీసుని, మీడియాను సైలెంట్ చేసాడు. అక్కకు విడాకులు త్వరలో వస్తాయి.”
ఆనందంతో చెప్తున్న రాణని చూసి ఉదయ్ నవ్వుకుంటూ, ” నీవు సామాన్య స్త్రీవి కావు, ఒక ఫైటర్ వి” అని అభినం దించాడు.
***
బెంగళూరులో విమానం లాండింగ్ కాబోతోందన్న ప్రకటన విని ఉదయ్ వర్తమానానికి వచ్చాడు. ఒక వారం రోజుల తర్వాత, ఉదయ్ వుద్యోగంలో జాయినయ్యాడు. ఒక చక్కని అపార్టుమెంట్ అద్దెకు తీసుకున్నాడు. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ వుంది. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్ళనక్కరలేదు.. ఈ విషయం రాణీకి చెబుదామని మరుసటి రోజు ఉదయమే ఫోన్ చేసాడు.
వెంటనే ఫోన్ అందుకుని రాణీ అడిగింది. “ఎక్కడనుండి? ఎలా వున్నావు?”
“బెంగళూరులో వున్నాను. ఇక్కడే వుద్యోగం. నువ్వెక్కడ?” కులాసాగా బదులిచ్చాడు ఉదయ్.
“కంగ్రాట్స్. నేనిప్పుడు బెంగళూర్లో హోటల్ గదిలో”
“అక్కడెందుకు? ఇంటికి వచ్చెయ్యి?”
“జలుబూ దగ్గు. గత వారం నుంచి చంపేస్తున్నాయి. నీకు కూడా అంటుకుంటాయి”
“వంట్లో బాగోలేనప్పుడు హోటలెందుకు? లొకేషన్ పంపుతున్నాను. వెంటనే బయలుదేరి రా! రాగలవా, నేను రానా?” అని ఆదుర్దాగా అడిగాడు ఉదయ్.
అతని అహ్వానంలోని ఆప్యాయతకు ఆమె మనసు ఆర్ద్రమైంది.
“వద్దు. లొకేషన్ వచ్చింది. దూరం పది కిలోమీటర్లే. నేనే వస్తాను” అని జవాబిచ్చింది.
ఒక గంట తర్వాత రాణి తన సామానుతో వచ్చింది. తన వెంట వచ్చిన యువతిని తన సహోద్యోగి స్వాతి యని, ఉదయ్‌కి పరిచయం చేసింది.
ఉదయ్ ఇద్దరినీ ఆహ్వానించి, యిల్లు చూపించాడు. టీ త్రాగి, కాసేపు కబుర్లు చెప్పి స్వాతి వెళ్ళిపోయింది. ఈ కొద్ది సమయంలోనే రాణి నాలుగైదుసార్లు దగ్గడం చూసి. “మందులు వాడుతున్నావా, డాక్టరేం చెప్పాడు? అని అడిగాడు
“ఎగువ శ్వాసకోశ సంక్రమణ, ఇదొక వైరల్ వ్యాధి అన్నాడు. టాబ్లెట్స్ యిచ్చాడు కానీ, విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువగా నీరు త్రాగడం, యూకలిప్టస్ తో ఆవిరి పట్టడం, ఉప్పు నీటితో పుక్కిలించడం వగైరా వుపశమనాలు చెయ్యాలన్నాడు. రెండు వారాలకు పైగా వుంటుందట. ఒక వారమైంది”
“అయితే రా! పడుకుని విశ్రాంతి తీసుకో” అంటూ ఆమె చేయి పట్టుకుని పడకగదికి తీసుకెళ్ళాడు. ” త్రాగడానికి గోరు వెచ్చని నీరు, వుమ్మి వేయడానికో పాత్ర, యిక్కడున్నాయి” అని చూపించాడు. ఆమె పడుకున్నాక, పల్చని దుప్పటి కప్పి, “ఏం కావలన్నా పిలువు” అని చెప్పి వెళ్ళిపోయాడు.
రాణి తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకుంది. కానీ దగ్గు ఆమెను పడుకోనివ్వలేదు. ఆమె లేచి కూర్చోవలిసి వచ్చింది. ఒక పావుగంట తర్వాత, ఉదయ్ అమె దగ్గరకు వచ్చి ప్రక్కన కూర్చున్నాడు. “ఎంత కష్టపడుతున్నావు?” అని ఆమె భుజం మీద చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు.
ఆమె అతని మీదకు వొరిగి, భుజం మీద తలబెట్టుకుంది. అతడామె తల నిమురుతూ సేద తీర్చాడు. దగ్గు ఆగిపోవ డంతో ఆమె మెల్లగా ప్రక్కమీదకు జారి కనులు మూసుకుంది. అలసిన ఆమెకు నిద్ర పట్టేసింది.
దగ్గు రావడంతో పన్నెండు గంటలకు రాణి నిద్రలేచింది. విక్స్ బిళ్ళవేసుకుని చప్పరిస్తూ, పనిచేసుకుంటున్న ఉదయ్ దగ్గరకు వచ్చింది. ” రా!” అంటూ లాప్టాప్ మూసాడు ఉదయ్.
“అయ్యో ! పని చేసుకో. నేను టీవీ చూస్తాను” అంది రాణి.
“పరవాలేదు. మీటింగ్ కాదు లే ! కాసేపు టీవీ చూసి భోంచేద్దాం” అంటూ హాలులోకి నడిచాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూసి, ఆ తర్వాత భోజనం చేసారు.
తన గదికి వెడుతూ, ఉదయ్‌తో “నువ్వు పని చేసుకో, దగ్గుకు భయపడి పరిగెత్తుకు రాకు” అని చెప్పింది రాణి.
***
స్వాతి ప్రతి రోజూ యేదో ఒక సమయంలో వచ్చి వెడుతోంది. ఒక రోజు స్వాతి, రాణి నడిగింది.
“మీకు ఉదయ్ అంటే యిష్టం, ఆయనకి కూడా మీరంటే ఇష్టమే కదా! . మీరెందుకు పెళ్ళి చేసుకోరు? ” ఆని.
దానికి రాణి దిగులుగా బదులిచ్చింది..”ఉదయ్ నాకున్న ఒకే ఒక ఆప్తమిత్రుడు. నా శ్రేయోభిలాషి. అందుకే నేను నా
ప్రేమను చెప్పలేకపోతున్నా” .
“ఆయనకు కూడా అదే భావన అనుకుంటా. బహుశా మీ కెరీర్ కి తను అడ్డుకాకూడదని ఆయన మీకు ప్రపోజ్ చేయలేదు. మీరే ముందు ప్రపోజ్ చెయ్యాలి” అని సలహా యిచ్చింది స్వాతి,
“నా గతం తెలిస్తే, నువ్వీ సలహా యివ్వవు . తాగుబోతు తండ్రిని, లోకల్ అల్లరిమూకని యెదిరించిన రౌడీ పిల్లని. ఒక పాపాత్ముడి పీచమడచిన నేరస్తురాలిని. కార్పొరేట్ పోటీ ప్రపంచంలో మగరాయుడిలా తిరిగే, నన్ను సూరేకాంతం అంటారు గాని హీరోయిన్ అనరు” అని మనసులోని బాధను వ్యక్తపరిచింది
ఆమె బాధని చూసి, యేమనాలో అర్ధం కాక స్వాతి మౌనంగా వుండిపోయింది
నాలుగు రోజుల తర్వాత రాణికి దగ్గు రావడం తగ్గింది. ఆమె హోటలుకి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని ఉదయ్‌తో యిలా చెప్పింది
“మేమొక కంపనీ కొనుగోలు విషయంగా వచ్చాం. మూడు రోజుల్లో మా యెండీ వస్తున్నాడు. ఈ టైములో నేనక్కడ వుండడం అవసరం. స్వాతి సాయంత్రం వచ్చి నన్ను హోటలుకి తీసుకెడతానంది” .
“చెన్నయి తిరిగి వెళ్ళే ముందు వస్తావుగా?” ఆప్యాయంగా అడిగాడు ఉదయ్.
“నేను వుద్యోగం మానేస్తున్నాను. మా బాస్ నా స్థానంలో తన మేనల్లుడిని తెచ్చుకోవాలనుకుంటున్నాడు . నిజానికి, నేను అతని కోరిక తీర్చనందుకు యెప్పుడో వుద్వాసన చెప్పాలి. కానీ, నా అవసరం వుండబట్టి నన్ను వదులుకోలేదు. గౌరవంగా నేనే రాజీనామా చేస్తాను.” అంది రాణి నిర్విచారంగా.
“అలాగా! మరి వేరే వుద్యోగం చూసుకున్నావా? .
“లేదు. కొన్నాళ్ళు ఇంట్లో వుందామనుకుంటున్నా. నేనూ ఆడపిల్లనే కదా! రేపు నాకు పెళ్లయి, పిల్లలు పుడితే, కొన్నేళ్ళు ఇంట్లో వుండాల్సి రావచ్చు. అందుకు యీ అనుభవం పనికొస్తుంది.” అంది రాణి నవ్వుతూ.
ఉదయ్ సాలోచనగా తలపంకించి, “స్వాతి వచ్చినప్పుడు చెప్పు” అంటూ తను పనిచేసుకునే గదిలోకి వెళ్ళాడు.
సాయంత్రం నాలుగు గంటలకు స్వాతి వచ్చింది.
“నేను రెడీగా వున్నాను. ఉదయ్ నీ గురించి చూస్తున్నాడు. కలిసిరా!” అని చెప్పింది రాణీ.
“అక్క పెళ్ళికి పిలిచాను. వివరాల కోసమేమో? కార్డు తెచ్చాను. ఇచ్చేసి వస్తాను” అంటూ స్వాతి ఉదయ్ గదిలోకి వెళ్ళింది. కాసేపయ్యాక, స్వాతి, ఉదయ్ నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళారు. మెల్లగా మాట్లాడుతున్న వారి మాటలు వినపడక రాణీ అసహనానికి గురైంది. ఇంతలో స్వాతి టీ కప్పులతో వచ్చి, రాణీకి ఒక కప్పు అందించింది. టీ త్రాగిన తర్వాత ఉదయ్ దగ్గర సెలవు తీసుకుని రాణి, స్వాతి వెళ్ళిపోయారు.
***
సరిగ్గా ఒక వారం రోజుల తర్వాత రాణి అనుకున్న విధంగానే వుద్యోగం వదిలేసింది. స్వాతి ఆమె దగ్గరకు వచ్చి అక్క పెళ్ళికి రమ్మని అభ్యర్ధిస్తూ యిలా అంది.
“గుర్తుందా! రేపు మా అక్క వివాహం. మీరు కూడా రావాలి. అక్క మనల్ని బాగా డ్రెస్ చేసుకుని రమ్మంది. పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ కి మనం, మన డాన్సులతో మతులు పోవాలంది.”
“నన్నొదిలేయ్ స్వాతీ! నేను ఉదయ్ నొకసారి కలిసి, మా వూరు వెళ్ళిపోతాను” అని రాణి ప్రాధేయపడింది కానీ స్వాతి వొప్పుకోలేదు.
“అంతేనా మన స్నేహం! మా అక్కకి మీరంటే ఎంతో అభిమానం. మీరు రాలేదంటే అది చిన్న బుచ్చుకుంటుంది. రేపు నేను యేడు గంటలకు వస్తా. బ్యూటీపార్లరుకి వెడదాం. తొమ్మిదింటికి కల్యాణ మంటపం చేరుకుందాం . ఉదయ్ కూడా వస్తారు. అక్కడ మీరిద్దరూ కలిసి మీ ప్రయాణం గురించి ఆలోచన చెయ్యవచ్చు ” స్వాతి మాటలు కొట్టివేయలేక సరేనంది రాణి.
ఉదయ్‌ని కలవడం అన్న విషయం ఆమెకు నచ్చింది. ఇన్నాళ్ళు మగవేషాలలో కనబడిన తనను అందమైన ఆడ
పిల్లగా చూసి, అతను ముచ్చట పడితే చూడాలనుకుంది. ఆమె మనసులో ఒక క్రొత్త ఆశ మొలకెత్తింది. ఆ సాయంత్రం స్వాతి దగ్గరుండి రాణితో క్రొత్త డ్రెస్ కొనిపించింది. రాణి పెళ్ళి కూతురుకివ్వడానికి వెండి దీపాలు కొంది.
***
ఉదయం నిద్రలేచిన దగ్గరనుండి, రాణి మనసులో ఒక తెలియని వుద్విగ్నత, ఒక కొత్త వుత్సాహం. సరిగ్గా అనుకున్న సమయానికి స్వాతి వచ్చింది. ఇద్దరూ కలిసి పార్లర్లో అలంకరణ పూర్తి చేసుకుని, తొమ్మిది గంటలకు కల్యాణ మంటపం చేరుకున్నారు.
కారు డోర్ తీసిన వ్యక్తిని చూసి రాణి ఆశ్చర్యచకితురాలైంది. “రఘు బావా, మీరా?” అంటూ కారు దిగిన రాణిని ఆమె అక్క సుజాత వాటేసుకుంది.
“రా! అమ్మానాన్న కూడా వచ్చారు” అంటూ సుజాత, రాణీ చేయి పట్టుకుని ముందుకు నడిపించింది . రాణీ మనసులో తన వారిని చూసిన ఆనందం, వీళ్ళిక్కడకెందుకు వచ్చారన్న సందేహం పోటీపడ్డాయి. ఆమె తల్లి ప్రేమగా కౌగలించు కుని నుదుట ముద్దు పెట్టింది.
“నిన్ను చూసి గర్వపడుతున్నానమ్మా!” అన్నాడు తండ్రి, ఆప్యాయంగా తల నిమురుతూ.
ఆమెలో చెలరేగిన భావోద్వేగం తగ్గకముందే, ఆమె తండ్రి , ఆమెను దగ్గరలో నిలుచున్న దంపతుల దగ్గరకు తీసుకు వెళ్ళి “వీరు మన ఉదయ్ అమ్మానాన్నలు. వారి పాదాలకు నమస్కరించమ్మా!” అని చెప్పాడు.
రాణీ వారికి పాద నమస్కారం చేసింది. ఆ తర్వాత ఆమె అక్క సుజాత, ఒక యువ జంటను చూపి, “వీరు ఉదయ్ చెల్లెలు నీరజ, బావ సురేష్ ” అని పరిచయం చేసింది.
“హలో” అని పరిచయం చేసుకుంటుండగా, “త్వరగా రావాలి” అన్న పిలుపు వినిపించింది.
ఎవరా ఆని రాణి కుతూహలంగా చూస్తూండగా, “రా రాణీ” అని సుజాత ఆమె చేయి పట్టుకుని వేదిక వైపు నడిపించింది.
అప్పుడే ఉదయ్‌ని రఘు, సురేష్ వేదికపైకి తీసుకువెడుతూ కనిపించారు. రాణీకి అర్ధమైంది. ఇది ఉదయ్, స్వాతీలు కలిసి పన్నిన పన్నాగమని .
స్వాతి ఆమె దగ్గరకు వచ్చి, నవ్వుతూ ముందుకు పదండి అన్నట్లు చేయి చూపింది.
పండువెన్నెల కాంతిలో చంద్రుని చేరబోయిన రోహిణిలా రాణి ముందుకు సాగింది. ప్రేమ భూపాళరాగం ఆమె ఆత్మను మేల్కొల్పి, నూత్న జీవితానికి సమాయత్తపరిచింది. అనురాగ బృందావనిలో వేచివున్న మాధవుని చేరిన రాధికలా, ఆమె ఉదయ్ యెదుట నిలిచింది.
బావ సురేష్ అందించిన పూలగుత్తి చేతబూని, మోకాళ్ళపై కూర్చుని, ఉదయ్ రాణీకి ప్రపోజ్ చేసాడు.
“నీ అపురూపమైన స్నేహం నాకు స్పూర్తి. జీవిత పోరాటంలో అలుపెరగని యోధవి నువ్వు. నీ కోసమే నేను ఇండియా తిరిగి వచ్చాను. నీవు నా కోసం యెదురు చూస్తున్నావని పొంగిపోయాను. రాణీ! నన్ను నీ జీవితకాల స్నేహితునిగా, ప్రేమికు నిగా, ఆరాధకునిగా, భర్తగా స్వీకరిస్తావా?”
రాణీ మనసు అనురాగ పూర్ణ మధుకలశమైంది. ఆమె పుష్పగుచ్చం అందుకుని దరహాస కాంతులు విరజిమ్ముతూ యిలా చెప్పింది.
“నాకు తోడుగా వుంటూ దోవ చూపిన చెలికాడివి నువ్వు. నా మనసు నీకే అంకితం, నీతోనే నా జీవితం. ఐ లవ్ యూ.” అంది.
వారిద్దరూ కలిసి చేతులు జోడించి నిలిచారు. చప్పట్లతో హాలు మారుమ్రోగింది. వెనువెంటనే పెద్దలు నిశ్చితార్ధం చేసి కల్యాణ తేదీ ప్రకటించారు. పెద్దల అశీస్సులతో ఆ ప్రేమికులు ఉంగరాలు మార్చుకుని వధూవరులయ్యారు. ఆ రోజు రాత్రి జరిగిన స్వాతి అక్క పెళ్ళిలో, వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
***

1 thought on “యోధ ప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *