June 14, 2024

స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -8

రచన: శ్రీమతి లక్ష్మీ సలీం

అనువాదం: స్వాతీ శ్రీపాద

21. కష్టమైన నిర్ణయం

వేసవి పూర్తయే వేళకు సలీం తన ఎక్జామ్ తో బిజీగా ఉన్నాడు. కాని అతను మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టు కనిపించాడు. ముఖ్యంగా రాత్రిళ్ళు బాబీ విషయంలో సాయపడుతూనే ఉన్నా అతన్ని ఏం బాధిస్తోందో నాకు అర్ధం కాలేదు. తన ఎక్జామ్ రాయడానికి జూన్ లో డబ్లిన్ వెళ్ళాడు. కాని అది క్లియర్ చెయ్యకుండానే నిరాశగా తిరిగి వచ్చాడు. సలీం కొత్త జాబ్ మొదలుపెట్టే వైట్ ఆబ్బీ హాస్పిటల్ వెళ్ళడానికి మా ప్యాకింగ్ మొదలుపెట్టాం. కాని సలీం మరీ ముభావంగా మారిపోయి నాతో గాని పిల్లలతో గాని అంతగా మాట్లాడటమే లేదు. ఎంతో వెంటపడి అడిగాక లో స్వరంతో చెప్పాడు, ” డా. మన్ అన్నది నిజమే అనిపిస్తోంది. ఫెలోషిప్ ఎక్జామ్ క్లియర్ చెయ్యలేకపోయాను. మన భవిష్యత్తు నాకు అగమ్యగోచరంగా ఉండి పిల్లలతో ఎలా ఎక్కడ సెటిల్ అవాలనేది నిర్ణయించుకోలేకపోతున్నాను. నాకు అంతా అయోమ యంగాఉంది.”
“అంతా బాగానే ఉంటుంది. మనం అంతగా అయితే విజయవాడవెళ్ళి స్వంత హాస్పిటల్ పెట్టుకోగలం. అక్కడ ఎలాగూ సరైన ప్లాస్టిక్ సర్జరీ సౌలభ్యం లేదు.” ధైర్యం ఇస్తూ చెప్పాను.
“మధు ఏమన్నాడో నీకు గుర్తులేదా? మన రాష్ట్రంలో ప్లాస్టిక్ సర్జరీ గురించి ఎవరికీ అవగాహన లేదు. అన్ని విషయాల్లో నీ ముక్కుసూటి తత్వం, దాపరికం లేకపోడం వల్ల మన ప్రాక్టీస్ గొప్పగా ఎదగనూ వచ్చు లేదా అది పని చెయ్యకపోనూవచ్చు-అన్నాడుగా పైగా మనకు సరిపడే ఆర్ధిక వనరులు కూడా లేవు.” అన్నాడు.
నేను మాత్రం నమ్మకంగా జవాబు చెప్పా,
“మన ప్రేమా నిజయతీలతో ప్రతి ఒక్కరినీ గెలుచుకోగలం. నీతి నియమాలు లేకుండా అడ్డమైన దారులు తొక్కి మన ప్రాక్టీస్ పెంచుకోనక్కరలేదు. వైట్ యాబ్బీలో మరో ఏడాది పాటు ఉండి చూద్దాం. అక్కడ ఎమర్జెన్సీ పని ఉండదు గనక మరోసారి నీ ఎగ్జామ్ మీద దృష్టిపెట్టి చూద్దువు గాని. పిల్లల గురించి, ఇల్లు, వెనక్కు వెళ్ళే తయారీ మిగతా అంతా నేను చూసుకుంటాను.”
సలీమ్ అతని అనుమానాలు, దిగులు వ్యక్తం చేసాడు.
“కులమతాల పట్ల ఎన్నో అపోహలున్న విజయవాడలాటి చోట మనం ఎలా నెగ్గుకు రాగలం? మనకు ఎవరు సాయపడతారు? ఏ కుటుంబం అయినా ఎలా స్పందిస్తుంది?”
అతనికి ఏ మాత్రం నమ్మకం లేనట్టుగా ఆందోళనగా కనిపించాడు.
భారతదేశానికి మంచికోసమే వెళ్ళిపోవాలని నిర్ణయించుకోడం నాకు సుముఖంగానే అనిపించినా ఆ సమ యంలో అతని అయోమయం దూరం చెయ్యడం ఎలాగో అర్ధం కాలేదు. కాలమే అన్ని విషయాలు చూసుకుంటుందని మాత్రం చెప్పగలిగాను. అతని ఆలోచనలకు అతన్ని వదిలి పిల్లలను చూడటానికి వెళ్ళాను. అతనికి కావలసిన ఏకాంతాన్ని ఇచ్చాను. రోజూ అతను ఆలోచననించి బయటపడే శక్తినివ్వమని దేవుడిని ప్రార్ధించాను. నాకు తెలుసు నేను దృఢంగా నిలబడాలి.
ఒక సాయంత్రం సలీం వ్యాకులపడుతున్నట్టు అనిపించి తనకు పబ్ కి వెళ్ళాలని ఉందని అన్నాడు. అతను తాగుడుకు దూరం అని తెలిసీ ఎందుకు, ఎవరితో వెళ్తావని అడిగాను.
” నేను ఒంటరిగానే వెళ్తాను. నాక్కాస్త ఏకాంతం కావాలి.” అన్నాడు.
“ఓకే, అస్వాదించు. నీకు ఏకాంతత అవసరం అంటే అది నేనిస్తాను” అతన్ని ప్రోత్సహించాను.
అతను వెళ్ళాక, పిల్లలకు తినిపించి నిద్రపుచ్చాను. అతని కోసం ఎదురు చూస్తూ కూచున్నాను. చివరికి పదకొం డింటికి ఇల్లు చేరాడు.
“నీకు తెలుసా, ఒక జంట భార్య లేకుండా ఒక్కడివే ఎందుకు వచ్చావని అడిగింది. మాకు చిన్న పిల్లలు ఉన్నారని చెప్పాను.” ఆన్నాడు.
ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకున్నానని చెప్పాడు, నేను నమ్మాను. ఆ రాత్రి అతను విచారంగా, కలవరపాటుతో గడిపాడు. అతను నిద్రపోడానికి నా శాయశక్తులా సాయపడ్డాను.
మళ్ళీ అమ్మూ పుట్టిన రోజు సమయం అది. దానికి కొన్ని నగలు కొనమని నాకు సరిగ్గా ఏంకావాలో అతనికి వివరించాను. దాదాపు లంచ్ సమయంలో వెళ్ళిన మనిషి అర్ధరాత్రి వరకు తిరిగి రాలేదు. బెల్ఫాస్ట్ లో జరుగుతున్న గొడవల కారణంగా భయపడిపోయాను. ఎలాటి సమాచారమూ తెలియక భయంతో ఎదురు చూస్తూ ఉండిపోయాను. రాత్రి తొమ్మిది దాటాక ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు.
లగాన్ లోయ లేక్ దగ్గర కూచుంటే సమయమే తెలియలేదని చెప్పాడు కాని విచారంగా కనిపించాడు.
అతని అపరిపక్వ, తెలివితక్కువ బాధ్యతారాహిత్య ప్రవర్తనకు నేను ఏమనుకున్నానో చెప్పేందుకు మాటలు చాలవు.
” ఒక మనిషి మెదడు అతని విధానాన్ని ప్లాన్ చేసినా, పైనున్న వాడు అతని అడుగులకు మార్గదర్శి అవుతాడు”

22. ఇంటి వైపు …

మేము భారతదేశం వెళ్ళేముందు యూకే లో అమ్ము తన మిత్రులతో పుట్టిన రోజు జరుపుకోవాలని అనుకున్నాను. అమ్మును బాబీని తీసుకుని డెకోరేషన్, రిటర్న్ గిఫ్ట్స్ కోసం పార్టీ స్టోర్ వెళ్ళాను. దాని ప్రెండ్స్ కోసం ఇద్దరం కలిసి కొన్ని గేమ్స్ కూడా ప్లాన్ చేసాం. బాధేమిటంటే సలీం వీటిల్లో ఎప్పుడూ పాలుపంచుకోలేదు.
గుడ్డిలో మెల్లగా వైట్ యాబీకి వెళ్ళడానికి చేసే ప్యాకింగ్ లో మాత్రం సలీం ఊతం ఇచ్చాడు. టీవీ, మ్యూజిక్ సిస్టెమ్, ఇతర గాజు సామాగ్రి ప్యాకింగ్ చేసాడు. చుట్టు చేట్లూ, మొక్కలున్న రెండు బెడ్ రూంల ఇంటికి మారాం. నాకా చోటు బాగా నచ్చింది. సంవత్సరాంతానికి, అతనికి ఫెలోషిప్ వచ్చినా రాకపోయినా (1983) భారతదేశం వెళ్ళి పోదామని, మా భవిష్యత్తు గురించి సలీంను బలవంతపెట్టాను.
సలీం తన ఎగ్జామ్ పుర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటే నేను కాంపస్ లో ఉన్న ఇతర భారతీయ కుటుంబాలతో స్నేహం చేసుకున్నాను. అమ్మును డాన్స్, స్విమ్మింగ్ క్లాస్ లకూ, ఇద్దరు పిల్లలనూ పార్క్ కూ బీచ్ కీ తీసుకువెళ్ళేదాన్ని. ఇంట్లోనూ చాలా సమయం పిల్లలతోనే గడిపేదాన్ని. బాబీ చాలా నెమ్మదైన పిల్లాడు, వాడి వయసుకు ఎక్కువ కాకపోయినా బరువుగానే ఉండేవాడు. తిండిని చాలా ఆస్వాదించేవాడు కాని నేను మాత్రం వాడు ఇంటి ఆహారమే తినేలా చూసు కునేదాన్ని.
జీవితం సాఫీగా సాగుతున్నట్టుగానే ఉంది.
అమ్మూ ప్రెప్ స్కూల్ సెప్టెంబర్ లో ఆరంభమైంది. క్లాస్ లో వారితో అది అడ్జస్ట్ అవడానికి సమయం పట్టింది. దాని క్లాస్ లో ఒక అమ్మాయి అమ్ముతో స్నేహానికి విముఖత చూపింది. దానికి ఒక సీన్ చేసే బదులు ఆ పిల్లను ఇంటికి పిలిచి సమస్య పరిష్కరించాలని అనుకున్నాను. పెట్టినది తిని, అమ్ముతో, బాబీ తో ఆడుకుని, అమ్ము బెస్ట్ ఫ్రెండ్ గా వెనక్కు వెళ్ళింది. సమస్య సామరస్యంగా పరిష్కరించినందుకు ఆనందపడ్డాను.
ఇంట్లో ఉన్నప్పుడు విజయవాడలో ప్రాక్టీస్ పెట్టేందుకు కావలసిన సామాగ్రిని ఏర్పాటు చేసేదాన్ని. తన ఎఫ్ ఆర్ సీఎస్ ఎక్జామ్ తయారీలో అతాలాకుతలమవుతున్న సలీంకు సాయపడాలని అనిపించినా, రోజంతా పిల్లలతో అలసిపోయి రాత్రి మేలుకోడం నా వల్ల అయ్యేది కాదు. సలీం ఎందుకో కొంచంలో ఆ ఎగ్జామ్ క్లియర్ చెయ్యలేకపోయాడు.
సమ్మర్ చివరలో పిల్లలతో నేను భారతదేశం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. దాని వల్ల వాళ్ళు అక్కడ పరిస్థితులకు అలవాటు పడతారు. సలీం మాత్రం ఆర్ధిక వెసులుబాటు కోసం మరో ఆర్నెల్లు అక్కడే పనిచేస్తాడు. అతను గనక మళ్ళీ ప్రయత్నం చేసి ఎగ్జామ్ పాసయితే నేను వెనక్కు వస్తాననీ, అతనికి రెజిస్ట్రారుగా జాబ్ వస్తే మెయిన్ లాండ్ వెళ్దామనీ చెప్పాను. సలీంకి కూడా ఈ ప్లాన్ ప్రాక్టికల్ గానే అనిపించింది. మా ఏర్పాట్లు మేం చేసుకుంటున్నాము. ఇండియా వెళ్ళకముందు నేను ప్లాస్టిక్ సర్జరీలో ఒక నెలైనా పనిచేయ్యాలని దానితో సబ్జెక్ట్ టచ్ లో ఉంటాననీ అను కున్నాను. మాంచెస్టర్ వింగ్టన్ ఆసుపత్రిలో టెంపరరీ ఉద్యోగం దొరికింది. హనుమంతరావ్ , కుమారీ పిల్లల విషయంలో నాకు సాయపడ్డారు. నేను వాళ్ళతోనే ఉన్నాను కూడా. దానివల్ల వాళ్ళ అమ్మాయి ఆశా నా పిల్లలతో ఆడుకునేది. పదిహేను నెలల తరువాత ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో పనిచెయ్యడం నాకు ఆనందాన్నిచ్చింది
యూకేలో నా సమయం అయిపోవస్తూ ఉండటంతో హనుమంతరావ్, కుమారీ ఇండియా వెళ్ళాలనే నా నిర్ణయం పట్ల వర్రీ అయి, ఒంటరిగా ఇద్దరు పిల్లలతో సెటిల్ అవడానికే విసిగిపోతానని అనుకున్నారు. కాని నేను మాత్రం గట్టిగానే నిర్ణయించుకున్నాను. ఇద్దరు పిల్లలూ కూడా సరైన వయసులోనే ఉండటం వల్ల కొత్త ప్రదేశానికి అలవాటు పడటం సమస్యేమీ కాదనే అనుకున్నాను. ఇంతవరకూ వాళ్ళిచ్చిన మద్దతుకు సహకారానికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను.
ప్యాకింగ్ పూర్తి చేసుకుందుకు, సలీం చిన్న అపార్ట్మెంట్ కు మారేందుకు సాయపడటానికి బెల్ఫాస్ట్ వెళ్ళాను.
ఆగస్ట్ మూడో వారం 1983 అమ్ము, బాబీ నేను ఇండియా బయలుదేరాం. మాకు వీడ్కోలు చెప్పేందుకు సలీం, హనుమంతరావ్ కుటుంబం వచ్చారు. ఒక రకమైన నిశ్చయంతో, కొంచం తడబాటుతో ఇండియా ప్రయాణం చేసాను.
” నా స్వంత దేశానికి వెళ్ళబోతున్న నేను, నేను నేనుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.”
” ప్రమాదాల నుండి,నిరాశ నుండి, కష్టాల నుండి రక్షణ కావాలని కోరుకోను కాని వాటిని ఎదుర్కొందుకు బలం ఇమ్మని కోరుకుంటాను.”

23. సలజ
బాబీని ఎత్తుకుని అమ్ము చెయ్యి పట్టుకుని మద్రాసులో ఎయిర్ ఇండియా విమానం దిగాను. నా సోదరుడు ప్రేమ్ మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాడు. బాబీ మామను ఎప్పుడూ చూడకపోయినా ప్రేమ్ కనబడగానే ఎంతో థ్రిల్ అయ్యాడు.
ఇంటికి చేరుకునేసరికి మా కుటుంబం మొత్తం మా కోసం ఎదురుచూస్తూ ఉంది. మొదటిసారి చూసిన బాబీ మీద ప్రేమజల్లులు కురిపించారు. వాడు అమ్ము లాగ ఎవరితో స్నేహంగా ఉండాలనేంత ఎంచుకునే రకం కాదు.
వాళ్ళందరి ప్రేమా ఆస్వాదించాడు.
వెనక్కు తిరిగిరాడం మంచికే అనిపించింది, పైగా నా స్వంత హాస్పిటల్ కు యజమాని కావడమనే నా స్వప్నం సాకారం చేసుకోగలుగుతున్నాను కూడా. యూకేలో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నా కూడా అమ్ముతో, బాబీతో మేం స్వంత దేశానికి తిరిగిరావాలనే నిర్ణయించుకున్నాము. అమ్ముకు ఎనిమిదేళ్ళు, బాబీ పదిహేను నెలల వాడు. కాని నేనను కున్నంత సులభం కాదు ఇక్కడ సర్దుకుపోడం.
మేము ఇక్కడ దిగీ దిగక ముందే అమ్ముకు గాస్ట్రో ఎంటిరైటిస్ వచ్చింది. దానికి ఐవి ఇవ్వాలేమోనని భయపడ్డాను. కాని 48 గంటల తరువాత రికవర్ అవడం మొదలైంది. దానికోసం ఒక మంచి స్కూల్ వెతకాలని ఒక క్రిస్టియన్ కాన్వెంట్ కు వెళ్ళాను. అక్కడ ఒక ఖాళీ ఉండకపోతుందా అని ఆశపడుతూ అడిగా, ఖాళీ రాగానే తెలియజేస్తానని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. ఆమె నా వివరాలు చదివి నా పేరు లక్ష్మీ సలీం అని చూడగానే మా అమ్మ వైపు బిత్తరపోయి చూస్తూ, “మీ కూతురు ఒక ముస్లిమ్ ను పెళ్ళాడేందుకు ఎలా ఒప్పుకున్నారు?” అని అడిగింది.
ఆమె నన్ కాబట్టి సర్వమత సామరస్యం అమెలో ఉంటుందని అనుకున్న నాకు చాలా కోపం వచ్చింది. నేను వెంటనే బయటపడి, ప్రిన్సిపల్ కే అంత వివక్ష ఉన్న అక్కడికి జన్మలో అడుగు పెట్టనని అన్నాను అమ్మతో.
అమ్ము చివరికి అట్కిన్సన్ అనే ఒక ఇంగ్లీష్ మీడియమ్ క్రిస్టియన్ స్కూల్ కి వెళ్ళింది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఆమె తో బాగా మాట్లాడి అక్కడ సెటిల్ అవడానికి సాయపడ్డారు.
అప్లికేషన్ ఫామ్ లో రెలిజియన్ అండ్ కాస్ట్ అన్న చోట ఇండియన్ అని మాత్రమే రాసాను. ఎవరినీ నొప్పించడం నా అభిమతం కాదు. ప్రిన్సిపల్ నా వంక చూసి ఒక తెచ్చుకున్న నవ్వు నవ్వారు.
అమ్ము ఇండియన్ స్కూల్స్ విధానాలకు అలవాటు పడుతున్నట్టు అనిపించలేదు. స్కూల్ కి వెళ్ళిన మొదటి రోజునే ఒక విద్యార్ధికి పనిష్మెంట్ ఇవ్వడం దానిలో భయాన్ని రేకెత్తించింది. నాకు తెలుసు దాన్ని స్కూల్ కి పంపడం అక్కడ సర్దుకుందుకు సాయపడటం కష్టమైన పనే అని అయినా రోజు రోజూ అదెంత ఇబ్బందో ఊహించలేకపోయాను.
రోజూ పొద్దున్నే బాబీని తీసుకుని రిక్షాలో అమ్ముని స్కూల్లో దిగబెట్టి, అక్కడే రెండు మూడు గంటలు ఉండేదాన్ని. ప్రిన్సిపల్ సిస్టర్ స్టెల్లా అమ్మును దాని క్లాస్ కి వెళ్ళమని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. అక్కడి విధానానికి అలవాటు పడటానికి సమయం ఇచ్చింది. ఏ భయం లేకుండా క్లాస్ రూమ్ లో అడుగుపెట్టడానికి దానికి రెండు నెలలు పట్టింది.
ఇంట్లో బాబీని నా కుటుంబం చూసుకునేది. నేను ప్రైవేట్ గవర్నమెంట్ ఆసుపత్రులు తిరుగుతూ అక్కడి యాజమాన్య విధానాలు, వాటి కార్యక్రమ వివరాలు, రోగుల వైనాలు, జబ్బులు, ప్లాస్టిక్ సర్జరీ పద్ధతులు దానికున్న అవకాశాలు అర్ధం చేసుకుంటూ నన్ను నేను సంసిద్ధం చేసుకున్నాను. ఆ అధ్యయనం తరువాత ఈ నగరంలో ప్లాస్టిక్ సర్జరీకి ఎలాటి డిమాండ్ లేదనీ ఇక్కడి జనాలు దీన్నీ చాలా ఖరీదైన విభాగం అనుకుంటున్నారనీ తెలుసుకున్నాను. ప్లాస్టిక్ సర్జరీ గురించి జనాల మైండ్ సెట్ మార్చడం బ్రహ్మతరం కూడా కాదని నాకు తెలుసు.
క్రితం ఏడాది మేం వచ్చినప్పుడు అనుకున్న విధంగానే విజయవాడలో నేను పుట్టిన మా ఇల్లు సూర్యభవన్ ఖాళీ చేయించాము. కావలసిన మార్పులు, రీమాడలింగ్, రిపేర్ ఎక్కువగానే ఉన్నా కింద భాగంలో ఆసుపత్రి ప్రారంభించాలనుకున్నాము. దానికి కావలసిన అంచనా మా బడ్జెట్ దాటి పోయింది. అయినా ఆసుపత్రి మంచి
ఇన్ఫ్రా స్ట్రక్చర్ తో నడపాలి. మా పెళ్ళి రోజున అంటే 21 ఫిబ్రవరి 1984 ఆసుపత్రి ఆరంభించాలనుకున్నాను, దానికి ఇహ మిగిలినది కొద్ది నెలలే.
సలీం ఇంగ్లండ్ లో, అమ్ము స్కూల్ బిజీలోఉండటం వల్ల నేను పూర్తిగా ఇంటి మీదే దృష్టిపెట్టాను. ఒక స్క్రబ్ రూం, కన్సల్టింగ్ రూం , ఆపరేషన్ థియేటర్ అవసరం ఉండటం వల్ల మొత్తం ఇల్లు మార్చవలసి వచ్చింది.
కింద పోర్షన్ రెంట్ ఇస్తామని చెప్పి నిర్ణయించినా నా సోదరులు నేను మా తలిదండ్రులను వాడుకుంటున్నానని అనుకోసాగారు. కాని నేను అన్ని ఖర్చుల అకౌంట్ రాసిపెట్టాను. సలీం కూడా నాకు ఆర్ధికంగా సాయపడటం వల్ల మేం ఇద్దరం పౌండ్స్ లో బాగా సంపాదించామని జనం అపోహ పడ్డారు. ఇల్లు ఆసుపత్రిగా మార్చడానికి నాకు చాలానే ఖర్చు వచ్చింది. దాదాపు 5 వేల పౌండ్లు. ఇంకా కావలసిన పరికరాలు, సామాగ్రి, ఇతర వస్తువులు కొనుగోలు చెయ్యాలి అవి అక్కడి నుండి రావాలి.
సలీం తను ఎగ్జామ్ క్లియర్ చెయ్యలేకపోయాననీ జనవరిలో తిరిగి వద్దామనుకుంటున్నాననీ చెప్పాడు. తనతో పాటు హాస్పిటల్ కి చాలా సామాగ్రి తెచ్చాడు. అతను వచ్చే సమయానికి హాస్పిటల్ దాదాపు రెడీ అయింది. నేను జనాలకు నా సేవలు మొదలుపెట్టినా నేనిచ్చే అద్దె మార్కెట్ విలువకు సరితూగదని అనుకోసాగారు. నేనెంత ఇస్తున్నాననే దాని గురించి మా అమ్మానాన్న ఎప్పుడూ ఏమీ అనుకోలేదు. నేనూ రిపేర్ కోసం వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసు కోలేదు. సలీం విస్మరించాలనుకున్న ఎన్నో వాదనలు, చర్చలు, జరిగాయి.
నేనక్కడ ఉండి ఎన్నో నెలలు ఎదురుచూసిన నా స్వప్నం , ఈ ఆసుపత్రి ఆరంభం సాకారం చేసుకుంటానని చెప్పాను. మేం దానికి సలజా అని పేరు పెట్టుకున్నాం. సలీంలోని స, లక్ష్మి లోని ల, జ అంటే సంస్కృతంలో జన్మనిచ్చినది. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి గుంటూరు నుండి మా టీచర్లను ఆహ్వానించాము. ఎట్టకేలకు మా స్వంత ప్లాస్టిక్ సర్జరీ అండ్ జనరల్ సర్జరీ ఆసుపత్రిని మా సిటీ జనాలకోసం ఆరంభించాము.
ఆసుపత్రికి పరికరాలకు చాలానే వెచ్చించినా మాకు కనీసం ఆర్నెల్లకు చాలినంత దాచుకున్నాము. దానితో పెద్ద వర్రీ లేకుండా పనిచెయ్యగల స్వేచ్చ మాకు మిగిలింది. అది మా ఇద్దరికీ ఆనందమే. పీజీఐ లో, యూకే లో మేం నేర్చుకున్న దాని వల్ల స్థానిక సమస్యలను, రోగుల ఆర్ధిక స్థితి గతుల నేపధ్యంలో వారిని మరింత వాస్తవిక ధృక్పదంతో అర్ధం చేసుకో గలిగాం. చిత్రంగా జనరల్ సర్జరీ పనికన్నా ప్లాస్టిక్ సర్జరీ పనే ఎక్కువగా ఉంది.
సలజాలో సర్జికల్ సెట్ అప్ దేశంలోనే ప్రైవేట్ సెక్టర్ లో తొలి ప్రత్యేకమైన ప్లాస్టిక్ సర్జరీ సౌలభ్యం. అదీ కాలిన గాయాలకు, కాస్మెటిక్ సర్జరీకి విడివిడి విభాగాలు కేటాయించడంతో ఒకరి నుండి మరొకరికి ఇన్ఫెక్షన్ రాకుండా వేరు వేరు అంతస్థుల్లో ఏర్పాటు చెయ్యడం. ఆసుపత్రి చిరకాల లక్ష్యాల గురించి గాని, ఎలా నడిపించాలని గాని నేను ఆలోచించ లేదు.
ఉమ్మడి కుటుంబంలో ఉండటం అనుకూలంగా అనిపించక ఆసుపత్రి దగ్గరలో అద్దె ఇంటికి మారిపోయాం. అది మా అమ్మానాన్నకు కోపం తెప్పించింది. మా అన్నదమ్ములు మమ్మల్ని వెళ్ళగొట్టారని జనాలు అనుకుంటారని వాళ్ళ భయం. కాని ఇంట్లోనూ పనిలోని మనశ్శాంతి ముఖ్యం మాకు.
సలీం కుటుంబం అప్పుడో ఇప్పుడో చూసేందుకు వచ్చి వెళ్తున్నా, మాతో ఎప్పుడూ ఎక్కువ రోజులు ఉండలేదు. ఏ విధంగానూ సాయపడనూ లేదు. నా కుటుంబం సాయపడుతున్నా రోజువారీ పనులకు పనివాళ్ళ మీద ఆధారపడవలసి వచ్చేది. నిజానికి యూకేలో గాని, ఇక్కడ గాని పిల్లలను చూసుకునే విషయంలో పెద్ద తేడ ఏం కనిపించలేదు. పని సమ తుల్యం చేసుకుంటూ పిల్లలకు సమయం కేటాయించాలని నాకు తెలుసు.
నేను చెయ్యగలనన్న నమ్మకం నాకుంటే, మొదట్లో లేకపోయినా, చేసేందుకు కావలసిన సామర్ధ్యం నేను సంపాదించుకోవాలి.
ఎమ్.కె. గాంధీ

1 thought on “స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *