బద్ధకం- అనర్ధం

రచన: కన్నెగంటి అనసూయ

రాజానగరంలో నివశించే వ్యాపారి రామయ్యకి చాలా కాలానికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు.
అసలే పిల్లలంటే ఇష్టం. దానికితోడు లేక లేక పుట్టారేమో ఆ పిల్లల్ని ఎంతో గారాబంగా పెంచసాగారు భార్యాభర్తలు.
దాంతో ఇంట్లోనూ, బయటా వాళ్ళిద్దరూ ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచేది.
కష్టమన్నదే ఎరుగనీయని ఆ గారాబం కాస్తా ఆ పిల్లల్లో బద్ధకంగా మారిపోయింది. దాంతో ఆలస్యంగా నిద్రలేవటం, లేవగానే అతిగా తినటం, తినగానే నిద్రపోవటం చెయ్యసాగారు.
దాంతో బాగా లావుగా, వయసుని మించిన బరువుతో చూడటానికి అసహ్యంగా తయారయ్యారు.
వాళ్ల బద్ధకాన్ని ఎలా తగ్గించాలో తెలియలేదు రామయ్యకు. లావుగా ఉండటం వల్ల నష్టాలేంటో ఎన్ని విధాలా చెప్పినా పెడచెవిన పెట్టేవారు.
అయితే మిత్రుల సలహా ప్రకారం బడిలో వేస్తేనన్నా మారతారేమోనని ఇంకా బడిలో వేసే వయసు రానప్పటికీ పిల్లలిద్దర్నీ బడిలో వేసాడు రామయ్య. ఆ బాడి ఊరి శివార్లలో అడవికి దగ్గరగా ఉండేది. ఇష్టం ఉంటే బడికి వెళ్ళేవారు. ఇష్టం లేకపోతే బడి మానేసేవారు. ఎందుకు మానేసారు బడి అని తండ్రి రామయ్య ఎప్పుడైనా అడిగితే “అడవిలోంచి జంతువుల శబ్ధాలు వినిపిస్తున్నాయి. భయం వేస్తుంది “ అని చెప్పి తప్పించుకునేవారు.
దాంతో బెంగపడ్డ వ్యాపారి రామయ్య ఇద్దర్నీ వైధ్యుల దగ్గరకి తీసుకెళ్ళి చూపించాడు.
అయినా లాభం లేకపోవటంతో ఏంచెయ్యాలో తోచక బాధపడ్డారు తల్లిదండ్రులు ఇద్దరూ.
అయితే ఒక శెలవు రోజునాడు ఊరి చివర పిల్లలంతా ఆడుకుంటుంటే రామయ్య వీళ్ళిద్దర్నీ అక్కడికి తీసుకువచ్చి కూర్చోబెట్టి వెళ్ళాడు. వాళ్ళ ఆటలను చూసైనా వీళ్ళిద్దరూ ఆడతారనే ఆశతో.
వీళ్ళిద్దరూ ఆటల్ని చూస్తున్న సమయంలో అక్కడికి ఎక్కడ్నించో ఒక తోడేలు వచ్చింది. దానిని చూసి పిల్లలంతా భయంతో చెల్లాచెదురుగా పరుగెత్తసాగారు. వాళ్ళందర్నీ వెంటాడి వెంటాడి దొరికిన వాళ్లను దొరికినట్టుగా గాయపరచసాగింది తోడేలు.
కాసేపటికి అక్కడి పిల్లలంతా తోడేలుకి దూరంగా పారిపోయారు. ఒక్క రామయ్య కొడుకులు మాత్రం
భారీ శరీరం వల్ల పరుగెత్తలేక దానికి దొరికిపోయారు. ఒకళ్ళిద్దరు పిల్లలు వీళ్లను రక్షిద్దామన్నా వాళ్ల వల్ల కాలేదు.
అలా దొరికిన వీళ్ళిద్దర్నీ అందిన చోటల్లా కొరికెయ్యటానికి ప్రయత్నిస్తుంటే పరిగెత్తలేక నిస్సహాయంగా నిలబడి ఏడుస్తున్న పిల్లలను ఇరుగూ, పొరుగు వాళ్ళొచ్చి రక్షించారు.
అలా రక్షించిన వాళ్ళు వాళ్ళిద్దర్నీ ఇంటి దగ్గర దిగబెట్టి..
“చూశారా ..పిల్లలూ..మీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న శరీరం మిమ్మల్ని తోడేలు నుండి రక్షించలేక పోయింది. తోడేలు కాబట్టి వేగంగా మిమ్మల్ని తినలేకపోయింది. గాయాలతో సరిపెట్టింది. పెద్ద పులి అయితే వెంటనే తినేసేది. అదే మీరు సన్నగా ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు రక్షించుకోవటమే కాదు..ఇలాంటి ప్రమాదంలో చిక్కుకున్న మరి కొంతమందిని మీరే రక్షించేవాళ్ళు..” అని చెప్పేసరికి పిల్లలిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి.
ఆనాటి నుండి పనికి సరిపడా తినటం, తిన్నదానికి సరిపడా పని చెయ్యటం నేర్చుకున్నారు.

సంస్కరణ

రచన: శ్రీ మహాలక్ష్మి

మృదుల – ఆనంద్ ఇద్దరూ ఉద్యోగస్తులు. వారికి ఒక పాప. ఇద్దరూ ఉద్యోగస్తులు అవటం వల్ల పాపా సంరక్షణ మృదుల వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. ఏ చీకు చింత లేని కాపురం. అన్ని సమకూర్చినట్టు ఉన్న జీవితం. మృదులకి ఆఫీస్ లో తెలివైంది అని, కలుపుగోలు మనిషి అని, మంచి సమర్థురాలని ఇలా మంచి పేరుంది.ఆ పేరుని అలాగే నిలబెట్టుకోవాలని చాలా తాపత్రేయ పడుతుంది. ఆ రోజు తన ప్రతిభను చూపించగలిగే ఒక ముఖ్యమైన మీటింగ్. దీని గురుంచి ఆరు వారాలుగా సిద్ధం అవుతోంది.

~~~~~~~~~~~~~~~~

లంచ్ అయ్యి మీటింగ్ రూమ్ లోకి వెళ్తుంటే అమ్మ ఫోన్. కట్ చేశా. మళ్ళీ మళ్ళీ రింగ్ అయ్యింది. నేను ఎత్తి హలో అనే లోపే “చంటిదానికి ఆగకుండా వాంతులు, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నా, నువ్వు వెంటనే రా” అని అమ్మ కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేసింది. నేను ఈ విషయం మా మేనేజరుకి చెప్పి తొందరగా కార్ లో బయల్దేరాను. అప్పటికే అమ్మ అక్కడికి చేరుకుని అమ్మ డాక్టర్ కోసం ఎదురుచూస్తోంది. చంటిదానిని నా దగ్గరకి తీసుకుని డాక్టర్ గదిలోకి వెళ్ళాం. డాక్టర్ కి ఎం జరిగిందో అమ్మ చక చక చెప్పేసింది. “నిన్న రాత్రి ఏం పెట్టారు” అంది డాక్టర్ నన్ను చూస్తూ. నేను అమ్మని చూసా. అమ్మ చెప్పింది విని కాస్త మొహం చికిలించి మందులు రాసి ఇచ్చింది.

కార్లో ముగ్గురం ఇంటికి బయల్దేరాం. “ఎక్కడికి వెళ్తున్నావ్”అని అమ్మ గట్టిగా అరిచింది.”సారీ అమ్మ ఏదో ధ్యాసలో ఆఫీస్ రూట్ లోకి వచ్చేసాం” . మొత్తానికి ఇంటికి చేరుకునేసరికి చంటిది నిద్రపోయింది. సాయంత్రం లేచి అమ్మ చంక దిగనే లేదు. ఏవో కబుర్లు చెప్పి అమ్మ కాస్త అన్నం పెట్టి మందులు వేసి పడుకోబెట్టింది. అలానే అమ్మ కూడా నిద్రలోకి జారుకుంది.

నాకు ఎంతకీ నిద్ర పట్టలేదు. వెళ్లి అమ్మ గది దగ్గర నిల్చుని చూసా, చంటిది అమ్మని హత్తుకుని పడుకుంది. మా గదిలోకి వచ్చి భోరున ఏడిచేసా. ఆనంద్ ఉలిక్కి పడి లేచి “ఏమైంది?ఆర్ యు ఒకే? “అన్నాడు. “నో నాటెటాల్” అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. ఆనంద్ నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా నిమురుతూ ” అసలు ఏం జరిగింది? ఇలా ఏడిస్తే ఏం వస్తుంది? ముందు ఏడుపు ఆపి ఏం జరిగిందో చెప్పు?” అన్నాడు.

ఇవాళ జరిగిన విషయం అంతా చెప్పి మళ్లీ వెక్కి వెక్కి ఏడుపు మొదలు పెట్టా. “అమ్మా మృదులా భవాని……. ఈ ఏడ్పు ముందు మాని ఏం చేయాలనుకుంటున్నావో ముందు స్థిమితంగా ఆలోచించు. నువ్వేం చేసినా నా తోడు ఉంటుంది అని మర్చిపోకు. వెళ్ళు కాస్త బాల్కనీలో గాలి పీల్చి రా” అని అన్నాడు ఆనంద్.

వెళ్లి ఉయ్యాలలో కూర్చుని ఆలోచనలో మునిగా. అంతలోనే మృదుల ప్రత్యక్షమైంది. పాపకి భోజనం కూడా పెట్టలేని ఉరకలెత్తే జీవితం నీది? ఎందులో నీ ఉత్సాహం? అమ్మకి మోకాళ్ళ నొప్పి అంటే డాక్టర్ కి చూపించి వచ్చి పదిహేను రోజులు గడిచాయి. మందులు వేసుకుందో లేదో? నొప్పి తగ్గిందో లేదో? తెలుసుకోలేని తీరికాలేని జీవితం నీది? తల్లిగా, కూతురిగా నీ బాధ్యత ఏంటో మర్చిపోయి మరీ పరిగెత్తి ఏ తీరానికి చేరుతున్నావో? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసి ఒక వెక్కిరింపు నవ్వు నవ్వి మాయమైంది.

కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లారింది. లేచి వెళ్లి హాల్ లో కూర్చున్న. అమ్మ కాఫీ గ్లాస్ చేతికందించింది. “అమ్మ నేను ఇవాళ ఆఫీసుకు వెళ్ళటం లేదు” అన్నా. “ఎందుకే చంటిది బానే ఉంది. ఊరికే సెలవు అనవసరం” అంది అమ్మ. “అమ్మా! నువ్వు సాయంత్రం ఊరు వెళ్ళు. టిక్కెట్ బుక్ చేస్తా. నేనొక పది రోజులు సెలవు పెట్టా” అని గట్టిగా చెప్పా. అమ్మ ప్రశ్నార్ధక మొహం పెట్టి ఆనంద్ వైపు చూసింది. ఆనంద్ నా వైపు చూసాడు.

సాయంత్రం అమ్మని బస్ ఎక్కించి వచ్చి కార్ లో ఇంటికి బయల్దేరాం. చంటిది అమ్మమ్మ అని ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయింది. ఆనంద్ కార్ స్పీడ్ ని కాస్త తగ్గించి “ఇప్పుడు చెప్పు అసలు సంగతి” అన్నాడు. “ఆనంద్ నిన్న డాక్టర్ మందులు రాసిచ్చి ఒక మాట అంది అమ్మతో  “టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్” నాకు ఆ మాట వినగానే చాలా సిగ్గు అనిపించింది. ఒక గిల్ట్ ఫీలింగ్ ఏర్పడింది. నిజం ఆనంద్ నేను ముందు తల్లిగా నా బాధ్యతని పూర్తిగా విస్మరించాను. చంటిదానికి ముద్దులు పెట్టేసి కావాల్సిన బొమ్మలు కొనేసి దాన్ని సంతోషపరిచేస్తున్న అని సంబరపడిపోతున్నా. కానీ దానికి నేను ఎంత దగ్గర అవుతున్నానో దూరమవుతున్నానో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇక అమ్మ విషయానికి వస్తే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నేను నా బాధ్యతని విస్మరించి, నాకు సహాయపడే అమ్మకి నేను ఏదో పెద్ద సహాయం చేసేసినట్టు పని అమ్మాయిని పెట్టేసి ఎంతో గర్వపడిపోతున్నా. నేను నా లోకం అనుకుంటూ పక్కవాడి ధ్యాసే లేకుండా బ్రతికేస్తున్నా. అసలు అమ్మకి ఇక్కడ ఉండటం ఇష్టమో కాదో? తన వీలేంటో తెలుసుకోకుండా ఇలా ఇంటిని, పిల్లని అమ్మ నెత్తిన రుద్దేయటం నా స్వార్ధాన్ని సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి.

అలా అని నేనిప్పుడు ఉద్యోగం మానేస్తాను అని అనటం లేదు. నిజంగా ఆనంద్ ఆ డాక్టర్ నా వైపు చూసిన చూపులో తల్లి ప్రేమని, అమ్మకి చెప్పిన జాగ్రత్త లో కూతురి బాధ్యతని తట్టి లేపింది. ఉద్యోగాన్ని ఇంటిని సమపాళ్లలో నడిపించడానికి ప్రయత్నిస్తా. ఇల్లు ఉద్యోగం రెండూ ప్రాధాన్యమే. త్రాసులో రెండు పక్కల బరువు సమానంగానే ఉండాలి. నన్ను నేను సంస్కరించుకుంటాను.

ఉన్న పలానా వెంటనే వెళ్ళిపోమనడం కూడా నాలో మార్పుకి మొదటి మెట్టు. నాకు తెలుసు అమ్మ నేను ఏదో ఆవేశంతోనో మొండితనంతోనో ఇలా చేసానని అనుకుంటుంది. నేను చెప్పినా వినిపించుకోదు. నువ్వు నా బిడ్డవే కదా. నీ బాధ్యత నాదే కదా  అనుకుంటూ మళ్ళీ తల్లిప్రేమతో నెగ్గుకొస్తుంది అందుకే నాన్నగారికి ఈ విషయం అంతా ఫోన్ చేసి చెప్పా. ఆయనే ఆవిడకి అర్ధం అయ్యేటట్టు చెప్తారు. పాపం ఆయన “నాకు నువ్వు సారీ చెప్పటం ఏంటి తల్లీ” అన్నారు. “ఇప్పటికీ నేను కళ్లు తెరిచి మీకూ అమ్మకు సారీ చెప్పలేకపోతే నేను నా బిడ్డకు చెప్పే పరిస్థితి వస్తుంది “అని అన్నాను.

రాత్రికి ఇంటికి చేరి పడుకున్నామో లేదో తెల్లారిపోయింది. లేచి లేవగానే నా కళ్ళు వొళ్ళు కూడా వంటింటికేసి చూశాయి పాపాయికి పాలు కలిపి ఇచ్చి నేను కాఫీ తాగుతున్నా. అమ్మ ఫోన్ చేసింది. “మృదు నీకెప్పుడూ నాన్నేఇష్టం కదా, నాకు తెలుసు. నేను ఎంత దగ్గర ఉన్న నీ మనసు మాత్రం నాన్నతోనే మాట్లాడుతుంది నువ్వు అంతే లే నాకు తెలుసు “అంటూ గొణుకుతోంది.

“అయ్యో అమ్మ మళ్ళీ మొదలెట్టావా ? ఇలా నీ అమాయకపు అమ్మ ప్రేమతో నన్ను కట్టేస్తావ్. అమ్మ నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. ఒకసారి నువ్వు నాకు చెప్పావ్ పక్కవాడు మన తప్పు ఎత్తి చూపే లోపు మన తప్పు మనం గ్రహిస్తే ఉన్న మర్యాద మిగులుతుంది. అందుకే ఎప్పుడూ మనలని మనం కాస్త బేరీజు వేసుకోవాలని. నేనిప్పుడు అదే చేస్తున్న ” అని అన్నా.

“సర్లే జాగ్రత్త. ఎదో వెళ్ళిపోమంటే వెళ్లిపోయాననుకోకు. నా ఇష్టమొచ్చినప్పుడు మళ్ళీ వస్తా” అని చిన్న పిల్లలా చెప్తోంది.

అంతలో చంటిది ఫోన్ లాక్కుని ” అమ్మమ్మా!  అమ్మ చాక్లెట్ పాలు ఇచ్చింది. చాలా బాగున్నాయి” అంది.

“అవును మరి నేను ఇచ్చేవి ఏమిటే భడవాకానా” అంది మళ్ళీ ఉడుక్కుంటూ. “సరే అమ్మా మళ్ళీ ఫోన్ చేస్తా” అని పెట్టేసా.

చంటిదాన్ని స్కూల్ బస్ ఎక్కించటం, మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి వెళ్ళటం. అక్కడ అది దాని స్నేహితులందరిని పరిచయం చేసి మా అమ్మ వచ్చింది చూడండి అని సంబరపడిపోయింది.

ఇలా వారం రోజులు గడిచిపోయాయి.

ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్ళాలి పొద్దున్న సంగతి సరే ఒక గంట ముందు లేస్తే అన్ని పనులు అయిపోతాయి. ఆనంద్ దాన్ని స్కూల్ బస్ ఎక్కించి ఆఫీస్ కి బయల్దేరిపోతాడు. మరి స్కూల్ నుంచి వచ్చేసరికి ఎలా అని నేను ఆనంద్ ఆలోచిస్తుంటే చంటిది మా దగ్గరకి వచ్చి. “అమ్మ నేను కూడా నా ఫ్రెండ్ ఆవనిలా ఆఫ్టర్ స్కూల్ ఆక్టివిటీ క్లబ్ లో జాయిన్ అవుతా “అంది.

ఒక్కసారి నేను ఆనంద్ ఆశ్చర్యపడ్డాం.

ఈ ఆఫ్టర్ స్కూల్ ఆక్టివిటీ అంటే స్కూల్ అయిపోయాక ఏవో క్లాస్ లు జరుపుతారు. ఇవి మా లాంటి ఉద్యోగస్తులు పిల్లల కోసమే. ఒక లాంటి డే కేర్ లాంటిది. అదే స్కూల్ లో అవటం వల్ల కొత్త వాతావరణం లాంటిది ఏమి ఉండదు. పిల్లలకి అనుకూలంగా ఉంటుంది. దాని అయిదేళ్ల వయసులో దానికి తెలిసిన చిన్న సలహాతో మా ఈ సమస్యకు పరిష్కారం చూపించింది. ఆనంద్ దాన్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి ” నీకన్ని అమ్మ పొలికలే ” అని కితకితలు పెట్టేసి ఇద్దరూ నవ్వుల్లో తెలిపోయారు.

 

కౌండిన్య హాస్య కథలు – తప్పెవరిది?

రచన: రమేశ్ కలవల

 

భార్యా భర్తలన్నాక సవాలక్షా ఉంటాయి. వారి విషయంలో మనం జోక్యం  చేసుకోకూడదు. కానీ ఇది జోక్యం జేసుకోవడం కాదేమో, ఏం జరిగిందో తెలుసుకుంటున్నాము అంతే కాబట్టి ఓ సారి ఏం జరిగిందంటే…

ఆఫీసు నుండి వచ్చి బట్టలు విడిచి భార్యకు వాటిని ఉతకడానికి  అందజేసాడు చందోళం. ఆ ప్యాంటు చూస్తూ “ఉతుకడానికేనా?” అంది ఇందోళం.

“ఏంటి, నన్నా” అని అడిగాడు హాలులోకి వెడుతూ అప్రమత్తం అవుతూ.

“మీ ప్యాంటు తో మాట్లాడుతున్నానండి. పతి దేవులు మిమ్మల్ని ఎపుడైనా అలా అన్నానా?” అంది ఇందోళం.  దీనిలో ఏదో గూడార్థం లేకపోలేదు అనుకున్నాడు.

స్నానం చేసి వచ్చాడు. చందోళం తన  పడక గదిలోకి ఏదో చూసుకొని కేకలు పెట్టడంతో  ఆ ఉతికిన దాన్ని తీసుకొని ఆ గదికి బయలుదేరింది ఇందోళం.

“రెండు వేల రూపాయలు. కనిపించడం లేదు” అన్నాడు.

“ఏదో కొంపలు మునిగినట్లు అరిస్తే బాత్రూంలో కాలుజారి పడ్డారేమో అనుకున్నాను” అంది

ఆలోచించి “ఆ గుర్తుకొచ్చింది. నువ్వు ఉతికిన ప్యాంటులో ఉండాలి. ఉతికే ముందు జేబులో చూసి తీసావా?” అన్నాడు

“ప్చ్” అంటూ బుంగ మూతి పెట్టింది.

“చూడకుండా దాంతో పాటే ఉతికేసావా?” అని అడిగాడు.

“మొన్న ఉతకడానికి వేసే ముందు జేబులు చూసి ఉతకడానికి వేసే బాధ్యత మీదే నంటే సరేనన్నారు మహానుభావా” అంది

“డబ్బులేమైనా చెట్లకి కాస్తున్నాయా?” కోపంగా విసుక్కోబోయాడు.

ఆవిడ ప్యాంటు వైపు చూసి “ ఆకలేస్తే నోట్లు మింగేయటమే? అమ్మా ఆయ్” అంటూ అటు నడవబోతుంటే “మాట మార్చకు నీదే తప్పు” అన్నాడు

“కొన్ని దేశాలలో ప్లాస్టిక్ కరెన్సీ వచ్చిందిట.  చిరిగితే ప్యాంటైనా చిరుగుతుందిట కానీ నోటు మాత్రం చెక్కు చెదరదుట” అంది ఇందోళం.

“ఇది అప్రస్తుతం” అన్నాడు.

“ఇక్కడ కూడా అలాంటిది ప్రవేశపెడితే ఇదిగో ఇలా తడిసి ముద్దయ్యేది కాదు” అంటూ తడిసిన కాగితం ముద్ద చూపించింది.

“ఇదేంటి ఇండియా ఆకారంలో ఉంది” అన్నాడు.

“అవునండి. క్రితం సారి దొరికిన మాల్దీవుల్లా చిన్న తునకలు అవ్వలేదు” అంది

“దీని వల్ల నీ ఇంటి ఖర్చులలో రెండు వేలు కట్” అన్నాడు చందోళం.

”తప్పు మీది కాబట్టి  మీ క్యారేజీలో ఈ నెలంతా రెండు అరలే పెడతాను” అంది

“ఇదిగో రెండు వేలు పాడు చేసింది నువ్వే నువ్వే నువ్వే” అన్నాడు దురుసుగా ఆ ప్యాంటు లాగుతూ

“నేను కాదు, వాషింగ్ మెషిన్” అంటూ ఆయన చేతిలోంచి ఆ ప్యాంటు లాక్కొని ఆరేయటానికి బయలుదేరింది.

ఎక్కడలేని ఉడుకుమోతుతనం వచ్చింది చందోళానికి. ఇందోళానికి వినపడేలా “ఆ రోజు నువ్వు ఇలానే జేబులోంచి తీసి ఇది ఎవ్వరో గుర్తుపెట్టండి అని అడిగితే కళ్ళు చిట్లించి చూసి మా తాత అంటే, కాదు జాతి పిత అంటూ ఆ నాశనమైన ఇంకో నోటును చూపించావు, గుర్తుందా?”

“ఆ ఆ “ అంది.

“అదీకాక నా మిత్రుడు ఎన్నాళ్ళ తరువాత ఇండియా వచ్చినపుడు  ఫోన్ చేసి ఓ మంచి బిజినెస్ ప్రపోజల్ ఉంది ఈ నెంబరుకు కాల్ చేయి అంటూ ఇచ్చిన కాగితం పరిస్థితి అంతే కదా” అన్నాడు

“అవునవును” అంది

“నేను తెలివయిన వాడిని కాబట్టి ఏదో విధంగా దానిని పరిశీలనగా చూసి ఆ నెంబరు కలిపితే ఓ పెద్దావిడ ఎత్తి నాతో విసుగెత్తి చివరలో నన్ను ఫోన్ పెట్టేయ్ అని తిట్టింది. అంతా నీ వల్లే. లేకపోతే ఇప్పటికల్లా ఓ బిజినెస్ మాగ్నెట్ నయ్యేవాడిని” అన్నాడు. కోపంతో అలిగి పడకెక్కాడు, దుప్పట్లో దూరాడు.

ఇంతలో ఇందోళం వంట చేసి, ఆయన  పరిస్థితి తెలిసి తనే కంచంలో కలుపుకొని తీసుకొచ్చి దుప్పటి ముసుగు తీసింది. ఇదిగో అంటూ కోపంతో నోరు తెరవగానే కలిపిన ముద్ద నోట్లో పెట్టింది.

తింటూ “బావుంది పచ్చడి” అన్నాడు, మళ్ళీ లేని కోపం తెచ్చుకొని అటు జరిగాడు. ముసి ముసి నవ్వులు నవ్వుతూ “ఇంతకీ చెప్పడం మరిచాను. మీ మిత్రుడు ఫోన్ చేసాడు” అంది. ఆత్రుతగా దగ్గరకు జరిగాడు. ఇంకో ముద్ద పెడుతుంటే వారించాడు. ముందు ఇది తిన్న తరువాత అంటూ పెట్టి మళ్ళీ ఇంకో వంటకం కలపడానికి వంట గదిలోకి బయలుదేరింది. చందోళం కుతూహలంగా తన వెనుక నడిచాడు. “ఇంతకీ ఏమన్నాడు” అని అడిగాడు.

“చందోళం భార్య మీరేనా? అని అడిగాడు” అంది

“అబ్బా నీ గురించి అడిగితే అడిగాడు గానీ నా సంగతి ఏమన్నాడు?” అంటుండగా తను వంటింటి  నుంచి బయలుదేరడంతో వెనుకనే బయలుదేరి హాలులో కూర్చున్నాడు.

ఆవిడ పక్కన కూర్చొని ఘమ ఘమ వాసనలతో ఆ చెయ్యి దగ్గరకు వస్తుంటే, ఉండబట్టలేక నోరు తెరిచాడు మొత్తం తినేదాకా మాట్లాడితే ఒట్టు. అవ్వగానే వంటగదిలోకి నడిచింది. తనూ వెనుక నడిచాడు.

“ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేనంటే ప్రాణం వాడికి తెలుసా. చిన్నప్పుడు సలహాలన్ని నేనే ఇచ్చే వాడిని” అన్నాడు.

“అందుకే ఆయన అమెరికా వెళ్ళాడు” అంది

“ఏంటి వెటకారమా?” అన్నాడు

“అయ్యో కాదండి! మీ సలహా వల్లే ఎంతో ఎత్తుకు ఎదిగాడు అంటున్నాను” అంటూ మళ్ళీ హాలులోకి నడిచింది.

“నేనడగాలే కానీ వాడి బిజినెస్ లో సగం రాసిచ్చేస్తాడు తెలుసా” అన్నాడు

“అవునవును” అంటూ ఇంకో ముద్ద పెట్టింది.

“ఎలాగైనా నీ వంట బావుంటుందోయ్ ఇందోళం” అన్నాడు

“ఇంతకీ నెంబరు ఇచ్చాడా?” అని అడిగాడు.

“రెండు వేలు పోతే పోయాయి కానీ ఈ రోజు ఓ మంచి వార్త చెప్పావు. వాడికి నా మీద వెర్రి ప్రేమ కాకపోతే అంత పెద్ద బిజినెస్ లో పార్టనర్ చేస్తాననడం?” అంటూ మాట్లాడుతూ తినడం ముగించాడు.

ఇందోళం లేచి వంటగదిలోకి వెడుతూ ”మీ స్నేహితుడు చేసారు…. కానీ మళ్ళీ ఫోన్ చెయ్య వద్దని చెప్పటానికి చేసాడు. మీరు ఆ రోజు పెద్దావిడతో విసుగుగా మాట్లాడిన ఆవిడ వాళ్ళమ్మ గారుట” అంది.

ఆశ్చర్యంతో “అవునా! నేను ఆ రోజు నానిన కాగితం మీద నెంబరు వాడిది కాదేమోనని పొరపాటు పడి, ఎత్తిన ఆవిడ వాడి తల్లి అని తెలియక  ఫోను పెట్టేయమన్నాను“ అన్నాడు వంటగదిలో చేతులు కడుగుతూ.

మూతి కడుక్కొని ఇందోళం చీర కొంగు చేతిలోకి తీసుకున్నాడు. నిరాశ పడుతూ తుడుచుకున్న తరువాత ఆ కొంగులో ముడి వేసి ఉండటం కనపడంతో అది విప్పి తీసాడు. తీరా చూస్తే లోపల తన నోటు కనిపించింది.

“అరె.. నా రెండువేల రూపాయలు” అన్నాడు కళ్ళెగరేస్తూ.

వెంటనే పశ్చాత్తాప పడి భార్యతో “ఇందోళం క్షమించు! ఇక్కడ నుండి ఉతకడానికి వేసే ముందు జేబు వెతికే బాధ్యత నాదే” అన్నాడు.

“ఫరవాలేదు లేండి. ఉతికే ముందు చూసే బాధ్యత నాదే” అంది.

“అయితే సరేనోయ్!” అంటూ “వాడు మళ్ళీ ఫోన్  చేస్తే నాకు వాడి బిజినెస్ లో ఇష్టం లేదని చెప్పేయ్” అంటూ ఆవలిస్తూ పడక గదిలోకి నడిచాడు చందోళం.

తన భోజనం తెచ్చుకోవడానికి వంటగదిలోకి వెళ్ళింది ఇందోళం.

ఇదండీ ఇందోళం  (ఇందిరా) వెడ్స్ చందోళం (చంద్రశేఖర్) గార్ల చిర్రుబుర్రులాడిన కొన్ని గంటల సన్నివేశ కథ

 

అన్యోన్య దాంపత్యం

రచన: నిష్కల శ్రీనాథ్

 

‘అలనాటి రామచంద్రునికి అన్నింటా సాటి ..” అంటూ టీవీలో వస్తున్న పాటకు కూనిరాగం తీస్తూ బాల్కనీలో కుండీలలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తుంది శ్రావణి. ఆ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తూ పక్కింటి నుండి పెద్దగా అరుపులు వినపడ్డాయి , రోజు అవి విని విని అలవాటు పడిన శ్రావణి మాత్రం తన పని తాను చేసుకోసాగింది.

” మొదలైయిoది మళ్ళి ” అంది పని మనిషి సత్తెమ్మ ఇల్లు తుడిచిన గుడ్డని ఆరేస్తూ , శ్రావణి అది విని మౌనంగా వంటగదిలోకి వెళ్లింది సత్తెమ్మకు టీ పెట్టడానికి.

పక్కింటి నుండి అరుపులు ఆగిపోయాయి, శ్రావణి టీవీలో ఛానల్ మార్చింది ఆధ్యాత్మిక  ప్రవచనాలు  వస్తున్నాయి. సత్తెమ్మ కూడా శ్రావణి ఇచ్చిన టీ తీసుకుని టీవీ ముందు కూర్చుంది, అన్యోన్య దాంపత్యం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు.

“చూడండమ్మా ఆ పంతులు గారు చెప్పినట్టు ఈ రోజుల్లో మొగుడు పెళ్ళాలు ఎంతమంది ఉంటారు , పొద్దస్తమాను దెబ్బలాడుకునే వాళ్లే ఇదిగో ఆ పక్కింటివాళ్ళ లాగా . మీకు తెలుసా ఆ పిల్లకు బొంబాయి ట్రాన్స్ఫర్ అయిందoటా కావాలనే చేయించుకుందట , ఆ అబ్బాయికేమో ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయింది అని ఇక్కడ ఉండలేక కావాలనే చేయించుకున్నాదట . ఇద్దరు కలిసి ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది కాపురం , ఇక దూరంగా పోతే ఇంకేటి ఉంటాది? ” అంది బుగ్గలు నొక్కు కుంటు సత్తెమ్మ  .

“అయ్యో ” అంది శ్రావణి మనసులో బాధగానే ఉన్నా, అది సత్తెమ్మ ముందు బయటపడటం ఇష్టం లేక అంతకు మించి ఏమి అనలేక పోయింది.

“అయినా ప్రేమ పెళ్ళి లు ఇలాగే ఉంటాయి అమ్మా అందుకే పెద్దోళ్ళ మాట వీనాల , పెద్దోళ్ళు చేసిన పెళ్ళి ళ్ళే బాగా ఉంటాయి మీ మొగుడు పెళ్ళాం చూడండి సారు , మీరు గొడవ పడటం నేను పని చేస్తున్న ఈ ఆరు సంవత్సరాలలో ఒకసారి కూడా చూడలేదు ఈ రోజుల్లో పిల్లలకి ఈ యన్ని అర్థం అవుతాయా ? ఏటి? నేను వెళ్తానమ్మా” అంటూ లేచింది సత్తెమ్మ.

సత్తెమ్మ వెళ్లిపోయాక తలుపు వేసి సత్తెమ్మ అన్న మాటలు గుర్తు వచ్చి నవ్వుకుంది ‘ తమది ఆదర్శ దాంపత్యమా? అసలు కనీసం మాట్లాడుకుంటే కదా గొడవలు వచ్చేవి ‘. మొదట్లో భర్త మౌనం చిరాకు తెప్పించినా తరువాత పిల్లలు పుట్టడం వాళ్ళ పెంపకంలో అన్నీ మర్చిపోయింది శ్రావణి.  పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం ఉద్యోగరీత్యా భర్త తరచు క్యాంపులకు వెళ్ళాల్సిరావడం  ఇప్పుడు మళ్లీ ఆ నిరాశ , నిర్లిప్తత జీవితంలో చోటు చేసుకున్నాయి. అందుకే ఆ ఒంటరితనం ని దూరం చేయడానికి మొక్కలు పెంచుతూ కాలం వెళ్ళదిస్తుంది  శ్రావణి. మొక్కలు గురించి ఆలోచన రాగానే అవి ఉన్న బాల్కనీ అక్కడ నుండి వినపడే పక్కింటివాళ్ళ గొడవలు గుర్తు వచ్చాయి . ‘ చూడ చక్కని జంట ‘ అనుకుంది శ్రావణి మహిత, చరణ్ ని చూసి , పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారు . వాళ్ళని అలా చూడటం అదే మొదటి సారి అదే చివరిసారి కూడా. పెళ్ళి అయిన పది రోజులకే ఆ ఇంట్లో పెళ్ళికళ పోయింది ఎప్పుడు గొడవలతో రణరంగంలా మారిపోయింది . మధ్యలో ఒక్కోసారి మహిత పలకరించడం ‘అక్కా’ అని పిలవడం ఆనందంగా అనిపించినా అంత గొడవ జరుగుతున్నా ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు ఆ గొడవలని ఆపే ప్రయత్నం చేయకపోవడం శ్రావణికి ఆశ్చర్యంగా అనిపించేది . శ్రావణి ఆలోచనలకు భంగం కలిగిస్తూ ఫోన్ మోగింది.

“హలో ! శ్రావ్స్ ఎలా ఉన్నావే?” అన్న గొంతు విని ఆనందంగా గట్టిగా అరిచింది శ్రావణి ” హేయ్ జయ , రాక్షసి ఏమైపోయావు చాలా రోజులైంది నీతో మాట్లాడి” అంది ఉత్సాహంగా.

” నేను బాగున్నాను , ఇంటి హడావిడిలో ఉండి కాల్ చేయడం కుదరలేదు , అసలు విషయానికి వస్తే వచ్చే నెల మా గృహప్రవేశం నువ్వు సకుటుంబ సపరివార సమేతoగా రావాలి ”  అంది జయ .

“పిల్లలకి పరీక్షలు ఉండచ్చు ఈయనకి క్యాంపులు ఎప్పుడు పడతాయో తెలిదు ” అంది శ్రావణి ఆలోచిస్తూ.

” ఇలాంటి సాకులు నాకు చెప్పద్దు నా పెళ్ళికి , బాబు బారసాలకి అలాగే సాకులు చెప్పావు ఈసారి మాత్రం నేను ఊరుకోను ” అంది జయ కొంచెం కఠినంగా

” అబ్బా చెప్పేది పూర్తిగా విను పిల్లలను చూసుకోడానికి అమ్మ,నాన్నని రమ్మని చెప్తాను లే , ఇంక మా వారి సంగతి తెలిదు వస్తారని కచ్చితంగా చెప్పలేను . నేను మాత్రం తప్పకుండా వస్తాను ,సరే నా ” అంది శ్రావణి.

జయ నవ్వుతూ సరే అంది మరో అరగంట ఇద్దరు పిచ్చా పాటి మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేసి రిజర్వేషన్ చేసే పనిలో పడింది శ్రావణి.

*****************

వేద మంత్రోచ్చారణతో , గృహప్రవేశానికి వచ్చిన బంధువులతో ఇల్లు కళకళ లాడుతుంది . సత్యనారాయణ వ్రతం చేస్తున్న జయ దంపతులను చూస్తున్న శ్రావణి ‘ అన్యోన్య దంపతులు అంటే వీళ్ళే నేమో జయ మాటకారితనం , కలుపుగోలుతనం ఆమె భర్త మెతకతనం , మంచితనం కలిసి ఆదర్శంగా కనిపిస్తున్నారు . ఇద్దరి భాషలు వేరు వేరు అయినా ప్రేమ ఉంటే చాలు ఆ బంధం నిలబడటానికి అని నిరూపిస్తున్నారు  ‘ అనుకుంది. రెండు రోజుల నుండి గమనిస్తున్న వాళ్ళ ఇంటి వాతావరణం శ్రావణికి అలా అనిపించేలా చేసింది. జయది ప్రేమ పెళ్ళి భాష ప్రేమకు అడ్డంకి కాదు అని పెద్దవాళ్ళని ఒప్పించారు . పెళ్ళి అయ్యాక  చెన్నై మకాం మార్చారు. జయ కూడా తన భర్త తరపువారితో  బాగా కలిసిపోయింది. ఈ వాతావరణం చూసిన శ్రావణికి సత్తెమ్మ ప్రేమ పెళ్ళి గురించి అన్న మాటలు గుర్తు వచ్చాయి అయితే భార్య, భర్త మధ్య అవగాహన ఉండాలే గానీ ప్రేమ పెళ్ళి అయినా , పెద్దలు కుదిర్చిoది అయినా ఒకటే అని అర్ధం అయింది శ్రావణికి.

గృహప్రవేశం అయిపోగానే జయ తరపు బందువులు బయలుదేరారు , భర్త తరపు వాళ్లు అందరిది అదే ఊరు కావడంతో సాయంత్రమే ఇల్లు ఖాళి అయిపోయింది. శ్రావణి కూడా తరువాతి రోజు ప్రయాణానికి సిద్దమవుతుంటే జయ ఒప్పుకోక ఆ మరుసటి రోజుకి టికెట్ బుక్ చేయించింది.

మరుసటి రోజు జయ, శ్రావణి కలిసి బీచ్ కి వెళ్లారు . చాలా కాలం తరువాత కలుసుకోవడం వల్ల గృహప్రవేశం హడావిడి వల్ల ముందు రోజు మాట్లాడుకోక పోవడం వెరసి ప్రపంచాన్నే మర్చిపోయి మాట్లాడుకున్నారు చాలా సేపు .

శ్రావణి ఫోన్ లో టైం చూసేవరకు తెలీలేదు ఇద్దరికీ ” జయ ఇంక వెళ్దామా చాలా సేపు అయింది వచ్చి ” అంది శ్రావణి. “చాలా ఆకలిగా ఉంది అదిగో ఐస్ క్రీమ్ ఉంది తినేసి వెళ్దాం ” అంది జయ శ్రావణి చేయి పట్టుకుని.

ఇద్దరు ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్లారు , జయ ఐస్ క్రీమ్ తీసుకురావడానికి కౌంటర్ దగ్గరికి వెళ్లింది. శ్రావణి చుట్టూ చూస్తుంటే వాళ్ళ వెనక టేబుల్ దగ్గర ఉన్న వాళ్లు మాట్లాడుకుంటున్నారు. శ్రావణి కి అది తెలిసిన గొంతులా అనిపించి వెనక్కి చూసింది.

శ్రావణి నొసలు చిట్లించి ఆశ్చర్యంగా చూసింది అక్కడ దృశ్యం చూసి ఒక జంట ప్రేమగా ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్నారు అయితే అక్కడ ఉన్న జంట మరెవరో కాదు మహిత , చరణ్ .

ముంబైలో ఉండాల్సిన మహిత, నోయిడాలో ఉండాల్సిన చరణ్ ఇక్కడ ఉన్నారేoటి ? అని ఆశ్చర్యంగా చూస్తున్న శ్రావణి వైపు చూసిన మహిత ” హాయ్ ! అక్కా” అంటూ పలకరించింది.

ఇద్దరు శ్రావణి టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు తనకు వచ్చిన సందేహం గురించి అడిగింది శ్రావణి ” మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాము ఎలాగూ లాంగ్ వీకెండ్  ఇంకో రెండు రోజులు ఉండి తరువాత తనూ నోయిడా ,నేను ముంబై ” అంటూ తేలిగ్గా చెప్తున్న మహిత వైపు ఆశ్చర్యంగా చూసింది శ్రావణి .

” అయితే మీ ఇద్దరి మధ్య గొడవలు సద్దు మణిగి మళ్లీ ఒక్కటి అయ్యారన్న మాట ,చాలా సంతోషంగా ఉంది ” అంది శ్రావణి.

మహిత, చరణ్ ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు, ఎందుకు నవ్వుతున్నారో తెలియక తికమక పడింది శ్రావణి. వాళ్లు ఇద్దరు నవ్వడం ఆపి శ్రావణి వైపు చూసారు ” అక్కా ! అసలు మా ఇద్దరి మధ్య గొడవలు ఉంటేగా మళ్ళి కలవడానికి ” అంది మహిత .

” అదేంటి అంతగా గొడవ పడేవారు కదా మీరు ” అంది శ్రావణి ప్రశ్నార్థకంగా .

“అది అంతా నాటకం అక్కా. అసలు జరిగింది ఏంటి అంటే, నేను,చరణ్ అయిదు ఏళ్లుగా ప్రేమించుకుంటు న్నాము . చరణ్ వాళ్ళ ఇంట్లో కట్నం ఎక్కువ ఆశించారు ఎందుకంటే చరణ్ కి కట్నం తీసుకుని వాళ్ళ స్టేటస్ పెంచుకుని వాళ్ళ చెల్లికి డబ్బున్న సంబంధం చేయాలనీ వాళ్ళ అమ్మగారి ఆశ . మా ఇంట్లో మగ పిల్లలు లేరు కాబట్టి అల్లుళ్ళను గ్రిప్ లో పెట్టుకుంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయినా  వాళ్ళ మాటే నెగ్గుతుంది అని మా వాళ్ళ ఆలోచన . అందుకే ఒకరి కుటుంబం మీద మరొకరి కుటుంబానికి మంచి అభిప్రాయం కలగలేదు ఫలితంగా పెళ్ళి అయిష్టంగా జరిగింది . పెళ్ళి అయిన మూడో రోజు నుండే చరణ్ వాళ్ళ అమ్మ గారు ఎదో ఒక విధంగా మా మధ్య మాటలు పెరిగేలా ప్రవర్తించేవారు. మొదట్లో చరణ్ కి అర్ధం అయ్యేది కాదు తరువాత అర్ధం అయింది . అప్పుడు ఒకటి నిర్ణయించుకున్నాము మూడో వ్యక్తి వచ్చి గొడవ పెట్టే కన్నా మేమే గొడవ పడితే మా మీద ఆసక్తి తగ్గుతుంది కదా అని. అందుకే అదే చేసేవాళ్ళం కావాలనే గొడవ పడటం, సాయంత్రం 7 కే ఆఫీస్ అయిపోతే రాత్రి తొమ్మిది వరకు ఇద్దరం అలా తిరుగుకుంటు రావడం ఇంట్లో మాత్రం ఏమి తెలియనట్టు గొడవ పడుతున్నట్టు నటించడం. మా వాళ్లు కూడా అదే నమ్మి నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ వేరు కాపురం గురించి సలహాలు ఇస్తున్నారు ” అంటూ వివరం గా చెప్పింది మహిత

శ్రావణి , మాటల మధ్య ఐస్ క్రీమ్ తీసుకువచ్చిన జయ ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. అంతకు ముందే వాళ్ళ విషయం శ్రావణి చెప్పడంతో వాళ్ళని వేరేగా పరిచయం చేసుకోవలసిన అవసరం లేకపోయింది జయకు.

“మరి అలాంటప్పుడు ఇద్దరు వేరు వేరు ఊర్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎందుకు ” అంది శ్రావణి

“ఎంతకాలం నాటకం ఆడగలం, ఎప్పటికైనా తెలిసి పోతుంది. పోనీ ఇద్దరం ఒకే ఊరికి వెళ్దాం అంటే అక్కడికి కూడా వచ్చి ఎదో ఒకటి చేయాలనీ ప్రయత్నిస్తారు . అందుకే వేరువేరుగా ఉంటున్నాం అన్నట్టు వాళ్లకి అనిపించేలా ఇలా చేసాము ” అన్నాడు చరణ్.

“అయితే మరి దూరంగా ఎంత కాలం ఉంటారు ? ” అని అడిగింది జయ.

“ఇంకో ఆరేడు నెలల్లో చరణ్ ముంబై వస్తాడు , మాకు పిల్లలు పుట్టేవరకు అక్కడ ఉంటాం. ఈలోగా చరణ్ వాళ్ళ చెల్లి చదువు అయిపోతుంది తనకి పెళ్ళి చేయడం చరణ్ బాధ్యత కాబట్టి అప్పుడు వస్తాం . పిల్లలు ఉంటే ఇంక ఇద్దరినీ దూరం చేయాలనే ఆలోచన పెద్ద వాళ్లకి ఇంక ఉండదు అనుకుంటున్నాం ” అంటున్న మహిత ఆలోచనా శైలి ని అభినందించ లేకుండా ఉండలేక పోయారు శ్రావణి,జయ .

ఇన్ని ఉదాహరణలు చూసిన శ్రావణి కూడా తన దాంపత్య బంధాన్ని పటిష్ట పరిచే మార్గాలు గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్లిన వెంటనే అవి అమలుపరచాలని నిర్ణయించుకుంది.

 

 

 

 

 

 

 

 

 

ఆడాళ్లూ…. మీకు జోహార్లూ

రచన: పద్మజ యలమంచిలి

 

50వ దశకంలో..ఆధునికత అప్పుడప్పుడే వంటబట్టించుకున్న  కుటుంబాల్లో ఆడపిల్లలు చదువుకుని వారికి కావాల్సిన జీవితాన్ని బాగానే ఎంచుకుని జీవించగలిగినా..పల్లెటూరి పోకడలు, అజ్ఞానంతో కొట్టు మిట్టాడే కుటుంబాల్లోని ఆడపిల్లలు మాత్రం ఎంత ధనికులైనా తల్లి తండ్రులు చెప్పినట్టు బుద్దిగా పెళ్ళిచేసుకుని పిల్లలు ,సంసారం ఇదే ప్రపంచంగా బ్రతికేసే వారు..

అదిగో అలాంటి కుటుంబం నుంచి వచ్చిందే …మా ఇంటి పక్కన వుండే నా ఈడు ఈ సీతమ్మ తల్లి కూడానూ.. భర్తలేని పల్లెటూరి స్త్రీ ఎన్ని అవమానాలు ఎదుర్కొంటుందో..దగ్గరుండి గమనించినదాన్నినేను!
బాల్యం అంతా గారంగానే గడిచినా..నలుగురు ఆడపిల్లలు త్వరగా పెళ్ళిచేసేయ్యాలనే బంధువర్గం వత్తిడితో పెద్దదైన సీతమ్మ పెళ్ళి మరో పల్లెటూరి కుటుంబం రామయ్యతో జరిగిపోయింది.  20 సంవత్సరాల లోపే ముగ్గురి బిడ్డలకు తల్లై 25 ఏళ్లకు భర్తను పోగొట్టుకొన్న సీతమ్మను చూస్తే కుటుంబంలోని ఎవరికీ జాలి కాదు కదా కనీసం సానుభూతి కూడా లేదు. పైగా నష్టజాతకురాలని,ఎదురు పడకూడదని తోటికోడళ్ళ సాధింపులు..
దానికితోడు అవకాశం కోసం ఎదురుచూసే చుట్టుపక్కల మృగాళ్ళు సరేసరి.. ముగ్గురుబిడ్దలనూ గౌరవంగా పెంచుకోవాలంటే ..స్వార్ధపరుడైన  తండ్రి చెంత చేరక తప్పింది కాదు..భర్త ఆస్తిని అనుభవిస్తూనే తనకు ఆంక్షలు విధిస్తున్న తండ్రిని బిడ్డలకోసం మౌనంగానే భరించింది..
ఒకానొక శుభసమయంలో అమ్మా.. తాత మనల్ని ఇలా మోసం చేస్తున్నాడు అంటూ కొడుకు చెప్పగానే.. హమ్మయ్య ఎదిగొచ్చిన కొడుకు ఇంక ఆసరా అవుతాడని పొంగిపోయి ఆస్తి కొడుకు చేతిలో పెట్టి తండ్రి చెర నుండి బయటపడింది..
పాపం పిచ్చితల్లి అంతకంటే ఎక్కువ హింసను ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా ఉహించలేదు..
పెత్తనం చేతికి రాగానే మొదలైంది కొడుకు  విశ్వరూపసందర్శన యోగం..
డబ్బుగలవాడవటం చేత, చుట్టాలు, చుట్టుపక్కలవాళ్ళు వాడిని హీరోని చేసి..చిన్నప్పుడే భాద్యతలను భుజానకెత్తు కున్నాడని చుట్టూచేరి భజనలు బాగానే చేసేవారు!

********

చాలా రోజులైంది.. ఈ మధ్య పల్లెటూరికి రాక..ఓసారి సీతను పలకరిద్దామని  వెళ్ళాను…

సీత పెద్ద కూతురు ఎదురొచ్చింది సంతోషంగా..

ఆమాటా,ఈ మాటా అయ్యాకా అన్న గురించి చెపుతూ.. వాడంటే చిరాకు! అంది.

అదేంటి…..వాడేమైనా పరాయివాడా?? నీకన్నా రెండేళ్ళు ముందు పుట్టిన తోబుట్టువు. మీ ఆలనా, పాలనా చూసుకుంటున్నాడు. ఎంతగా ప్రేమించాలి అన్నా..

మీకు తెలియదు ఆంటీ..వాడి సంగతి ఎవ్వరికీ చెప్పుకోలేక మాలో మేమే ఎంత క్షోభ అనుభవిస్తున్నామో అంటూ..

చిన్నప్పుడు అన్నీ ముద్దుముద్దుగానే అనిపించేవి ఏమీ తెలిసేది కాదు.. మనస్తత్వాలను అధ్యయనం చేసేంత పెద్ద వయస్సు కాదు.. 8.వ తరగతి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను..వాడు  నా స్నేహితులను తేరిపార చూసేవాడు.. మొదట్లో ఏమీ అనిపించేది కాదు.. ఒక స్నేహితురాలు ఆబ్బ మీ అన్నయ్య ఉంటాడు చదువు కోడానికి  నీ దగ్గరికి రాను..నువ్వే మా ఇంటికి రా అంది..
అదేంటి మా అన్నయ్య నిన్నేం చేస్తాడు..అంటే చూపులతోనే వళ్ళంతా తడిమేస్తాడే  బాబూ..అంటూ చిరాగ్గా చూసింది..
అదిగో అప్పటినుండి మొదలైంది వాడిని గమనించడం!
ఎవరైనా మగపిల్లలతో మాట్లాడితే చాలు చెల్లెళ్లను అనుమానంగా చూడటం..ఆంక్షలు పెట్టడం..వాడి బుద్దే అందరికీ ఉంటుందనే ఆలోచన కావొచ్చు..చాలా దురుసుగా ప్రవర్తించేవాడు! మాకు భరించడం అలవాటైన కొద్దీ వాడి శాడిజం కూడా పెరిగిపోతూనే ఉంది..అమ్మను కూడా వదలడు..నీచాతి నీచమైన మాటలతో హింసిస్తూ ఉంటాడు..ఈ బాధలు ఎవరికీ చెప్పుకోలేక అమ్మ లోలోనే కుమిలిపోతోంది ఆంటీ..అంటూ. కాస్తో కూస్తో ఎదురించి చదువుకున్న పిల్ల బోరుమంది నన్ను పట్టుకుని..
మిషన్ నేర్చుకుని ఏదో కాలక్షేపం చేసే చిన్నదానికి ఇవేమీ తెలియదు..వాడూ దాని జోలికి అట్టే పోయేవాడు కాదు..గృహహింస..ఈ చట్టాలు ఉన్నా పరువుకోసం ప్రాకులాడే కుటుంబాలు వాటి జోలికి పోయి రోడ్డెక్కరు..
ఎన్ని కష్టాలైనా అలా దిగమింగుకుని కడతేరి పోతారు..

ఆఖరుకు కొడుకుతో కూడా సుఖం లేదు సీతకు అనుకోగానే మనసంతా మెలిపెట్టినట్టయ్యి భారంగా వెనక్కు వచ్చేశాను..

ఈ మధ్యనే తెలిసింది..ఇద్దరు ఆడపిల్లలకు గంతకు తగ్గ బొంతలను చూసి పెళ్ళి చేసిందని..వాళ్ళ బ్రతుకులూ అంతంత మాత్రంగానే తగలడ్డాయని..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..90 దశకంలో ఆడాళ్ళు చాలా తెలివిమీరిపోయారు!
డబ్బును చూసి పెళ్ళిచేసుకున్న కోడలు చాలా తెలివైనది.. ఆస్తి మొత్తం తన ఆధీనంలోకి తీసుకుని అత్తను బయటకు వెళ్ళగొట్టి మొగుడిని ఒక ఆట ఆడిస్తుంది..వాడు  తాగుడుకు బానిసై కోట్ల ఆస్తి ఉన్నా.. చెల్లెళ్ళని డబ్బులడుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది..
ఒక రకంగా కోడలు తెలివి  సీతమ్మకు మేలే చేసింది.. ఆ ఇంటినుండి స్వేచ్ఛ లభించింది!   తన కోసం తను బ్రతకడం అలవాటు చేసుకుంది…చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతానికి పదునుబెట్టి తనకు ఇష్టమైనభక్తి కార్యక్రమాలలో తన్మయత్వంతో  పాడుతూ సంతోషంగా బ్రతుకుతుంది!
*************

 

 

శాకుంతలం

రచన : శ్రీపాద

 

శకుంతలకు అన్నం సయించటం లేదు, కంటికి కునుకూ పట్టడం లేదు. కారణం ’అబ్బే ఏమీ లేదు ’ అన్నా ఆవిడకు తెలుసు ఏ మూలో ఉన్న దాని ఉనికి. అక్కడికీ ఆవిడకు పట్టు పరిశ్రమ అనేది బాగానే తెలుసు. ఎవరు ఏ కాస్త పనికి వస్తారనిపించినా అస్సలు వదలదు గాక వదలదు చీటికీ మాటీకీ చెట్టెక్కే భేతాళుడిని భుజాన వేసుకునే విక్రమార్కుడిలా.

అ”రామ సీత గొప్ప మనిషి ఎంత చక్కని కవిత్వం రాస్తుంది. ఎవరున్నారమ్మా మన ఆడ పీనుగుల్లో అంత కవిత్వం రాసే వాళ్ళు”  అన్న నోటితోనే,

“వెధవ పీనుగ  ఏం రాస్తుంది? దాని బొంద ఒక్క ముక్కా అర్ధం అయి చావదు. ఆ రోజుల్లో నేను రాసిన ప్రతి కవితా ఎంత గొప్పగా ఉండేవి.

రాస్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ

రాస్తూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ – అని రాసిన మాటలు ఏళ్ళ కేళ్ళు మారుమోగి పోయేవి.” అంటూ స్వోత్కర్ష మొదలు పెడితే ఆగేది కాదు.

ఆ ప్రవాహంలో ఎంతటి వాళ్ళూ గడ్డిపోచ ఆధారం దొరక్కుండా కొట్టుకుపోయేవాళ్ళు.

అలాటి శకుంతలకు ఆకలి దప్పులు లేవు. నిన్న గాక మొన్న ఆ పేరిందేవికి పెడన వాళ్ళు పాపాయమ్మ అవార్డు ఇవ్వగానే  ఎక్కడెక్కడి కూపీలూ లాగి ఎవరితో చెప్పించాలో వాళ్ళతో చెప్పించి ఏడాది తిరిగేసరికి ఆ అవార్డు కొట్టేసింది.

అల్లాగే క్రితం మాటు పక్క రాష్ట్రం వాళ్ళు ’అబ్బే నాకు ఓపిక లేదు నేను రాలేను’ అని అంటున్నా ఆవిడ పేరిటే అనౌన్స్ చేసి, సదరు మినిస్టర్ గారు మందీ మార్బలంతో ఇంటికి తెచ్చి ఇచ్చినా, ఆర్నెల్లు తిరిగేలోగా ఆయనకు యాభై ఆరేళ్ళకే షష్టి పూర్తి జరిపించి పట్టు బట్టలతో మొగుడూ పెళ్ళాలను సత్కరించి తన గుప్పిట బంధించి రాబోయే ఉగాదికి తన సత్కారం ఖరారు చేసుకుంది.

అడ్డు వస్తుందేమో అనిపించిన హంస గీతను తన సంస్థకు కార్యదర్శిని చేసి ,

” మేం యువతను ఆదరిస్తాం పైకి తెస్తాం ” అంటూ ముందరి కాళ్ళకు బంధం వేసి,

” ఈ మధ్యే రాస్తున్నది” అంటూ పదేళ్ళుగా రాసే ఆమెను పరిచయం చేస్తుంది.

అలాటిది, వినయంగా ఏం చెప్పినా తల ఊపే హంసలేఖ ఇంతపని చేస్తుందా?

అందుకే ఆవిడ ఆకలి దప్పులకు దూరం అయింది.

ఏం చెయ్యాలో తోచక కరకరా మిగిలిన గోళ్ళు అరిగి పోయిన పళ్ళతో కొరికేసి చిగుళ్ళు నొప్పుట్టాక బుర్ర వెలిగింది.

“దాన్ని మానసికంగా దెబ్బతియ్యాలి” అని ఆలోచనకు పదును పెడుతుంటే డోర్ బెల్ మోగింది.

తలుపు తీస్తే ఎదురుగా హంసగీత

పెళ్ళి బట్టల్లో ఆమెతో పాటు ఆవిడ ఒక్కగానొక్కసుపుత్రుడు.

కుప్పకూలిన ఆవిడకు ఏం అర్ధం కాలేదు , కాదు.

 

 

నా స్వామి పిలుపు వినిపిస్తుంది…

రచన, చిత్రం : కృష్ణ అశోక్


అరుణోదయ రాగాలు
రక్తి కడుతున్న వేళ
హృదికర్ణపు శృతిగీతం
పరిపూర్ణం కాక మునుపే….

చల్లని మండుటెండల్లో
భావుకతపు తరువుల నీడన
గుండె వాయువంతా
ఆక్సిజన్ ఆశలతో నిండకనే….

వెన్నెల కురిసే రాత్రుళ్ళు
ప్రియ తారలు వెదజల్లే
వెలుగు ధారల పరితాహాపు
మోహ దాహం తీరకనే….

కాన్వాస్ రంగుల చిత్రాలు
దేహం ప్రాణం దాటి
నా ఆత్మాణువులుగా
సంపూర్ణ పరిణామం పొందక మునుపే…

కొద్దికాలం ఇంకొద్దికాలం
గడువు పొడిగించు స్వామీ
నీ విశ్వజనీయ ప్రేమ బాహువుల్లో
ప్రాణార్పణచేసి లీనమయ్యేందుకు…

తపస్సు

రచన: రామా చంద్రమౌళి

 

జ్ఞానానికి రూపం లేదు.. గాలి వలె
ప్రవహించడం జీవ లక్షణమైనపుడు
స్థితి స్థల సమయ కాలాదులు అప్రస్తుతాలు
అగ్ని ఎప్పుడైనా, ఎక్కడైనా దహిస్తుంది కదా
జ్ఞానమూ, కళా అంతే
దహిస్తూ, వెలిగిస్తూ, దీప్తిస్తూ.. లీనమైపోతూంటుంది –
అది సంగీతమో, సాహిత్యమో, యుద్ధ క్రీడో
శిష్యుడు తాదాత్మ్యతతో భూమై విస్తరించాలి విస్తృతమై .. ఎదుట
అప్పుడు ముఖం రెక్కలు విప్పిన ‘ ఆంటెనా ‘ ఔతుంది
బీజాలు బీజాలుగా, సంకేతాలు సంకేతాలుగా .. జ్ఞాన వినిమయం
ఎప్పుడూ భూమిపై కురిసే చిరుజల్లుల వానే
తడుస్తున్నపుడు, రాగాలు హృదయాన్ని తడుతున్నపుడు
శరీరంలోనుండి.. గుంపులు గుంపులుగా పక్షులు సమూహాలై ఎగిరిపోతూ
లోపలంతా ఖాళీ
చినుకులు చినుకులుగా నిండిపోవాలిక మనిషి –
అలంకారాలుండవు.. శిష్యునికీ గురువుకూ
ఒక ఆత్మా.. ఒక దేహం.. ఇద్దరిలో రవ్వంత అగ్ని ఉంటే చాలు
విద్యే ఒక ఆభరణమౌతుంది
పాఠశాలలో ద్రోణుడూ పాండవకౌరవులూ, కొన్ని కుట్రలు అవసరం లేదు
కళాభ్యాసం నిరలంకారంగా వంటగదిలో,
పశువుల పాకలో, రాతి అరుగులపై కూడా జరుగుతుంది
బీదవాడి ఆయుధమైనా, వాయిద్యమైనా
దానికి ఒక పలికే గొంతూ, ద్రవించే జీవమూ ఉంటే చాలు
గురు శిష్యులు తపో మగ్నతలో ఉన్నపుడు
ఋతువును తోడ్కొని కాలం వాళ్ళ పాదాక్రాంతమౌతుంది
దీపం మట్టి దిగుట్లో కూడా దేదీప్యమై ప్రకాశిస్తుంది –

(పై చిత్రాన్ని ఫేస్‌ బుక్‌లో లభ్యపరచిన మిత్రునికి ధన్యవాదాలు – మౌళి)

TAPAS

Translated by Indira Babbellapati

Wisdom is abstract like air.
When flowing is the mark of life,
time the, status, or place
remain immaterial.
Just as burning and reducing the object
to ashes is the nature of fire,
so is wisdom and art.
They burn and throw light,
be it music, a poem, or
even a game of war.

The student should
immerse himself
so as to spread as the expanding earth.
Only then the countenance becomes
an antenna with wings spreading for
knowledge to transmit in coded letters.
When showers drench us, when a tune

gently knocks at the heart, birds hidden in
the body flap their wings to fly in flocks.
A sudden void is created
only to be filled by rain drops.
No embellishments needed for the teacher and the taught,
one soul, one body and
an iota of fire is enough to make knowledge your jewel.
Who needs a school or a Drona or the Pandavas or
the Kouravas and all that plotting?
Imparting education needs no place.
It can take place in the kitchen,
It can take place in a cattle shed or
can be carried out sitting on a stone-slab!
A beggar’s weapon or an instrument needs
only a voice and life that flows.
When the teacher and the taught are in unison,
time brings with it the seasons to surrender.

A wick burns bright
even in an earthen pan!

హిమవత్పద్యములు 1

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

మన భూమిపైన ఉత్తర ప్రాంతాలలో, ముఖ్యముగా అమెరికాలో, కనడాలో, యూరోపులో జనవరి, ఫిబ్రవరి నెలలలో ఎక్కువగా మంచు కురుస్తుంది. మంచు (snow స్నో) అంటే మెల్లగా ఘనీభవించిన నీరు. మేఘాలలోని నీళ్లు నేలను తాకడానికి ముందు వాయుమండలములో స్ఫటికరూపములో మారుతుంది. అంటే ఉష్ణోగ్రత సున్న డిగ్రీల సెల్సియస్ (అనగా -32 డిగ్రీల ఫారన్‌హైట్) కంటె తక్కువ ఉంటుంది. నేలపైన మళ్లీ నీరుగా మారకుండా ఉండాలంటే దాని ఉష్ణోగ్రత కూడ సున్న డిగ్రీలకన్న తక్కువగా ఉండాలి. ఈ నేల ఉష్ణోగ్రత చాల తక్కువగా ఉంటే మంచు పిండిలా తేలికగా ఉంటుంది. అది సున్నకంటె కొద్దిగా తక్కువగా ఉంటే మనకు బరువైన మంచు ఏర్పడుతుంది. బరువైన మంచు ఐదు లేక ఆఱు అంగుళాలు ఒక అంగుళపు వర్షపు నీటితో సమానము. తేలికగ ఉండే పిండి మంచు సుమారు 10 అంగుళాలు ఒక అంగుళపు వాన నీటితో సమానము. బరువైన మంచును పాఱతో ఎత్తి దారులను శుభ్రపఱచడము కష్టతరమైన కార్యము. తేలిక మంచును త్వరగా తీసివేయవచ్చును. ఈ మంచు స్ఫటికాలు భూమిని తాకడానికి ముందు నీరుగా మారి మళ్లీ ఘనీభవిస్తే దానిని sleet అంటారు. ఇవి చిన్న గులక రాళ్లలా ఉంటాయి. అంతే కాక ఉష్ణోగ్రత సున్న కన్న తక్కువగా నున్నప్పుడు నీటి ఆవిరి frostగా మారి గాజు మున్నగువాటిపైన పొరగా కప్పుతుంది. ఉదయము లేవగానే కారుపై frostను గీచకుండ దానిని drive చేయలేము. ఈ frost స్ఫటికాకృతిని తీసికొంటే అది hoarfrost అవుతుంది. ఇవి తీగెలవలె ఉంటాయి. వాన నీళ్లు నేలపైన పడి ఘనీభవించి స్ఫటికరూపముగా కాక మంచు పొరలయితే దానిని ice storm అంటారు. అన్నిటికన్న ఇది చాల అపాయకరమైనది. వాహనములను drive చేస్తున్నప్పుడు ఈ ఐస్ పైన చక్రాలు వెళ్లినప్పుడు వాహనము మన స్వాధీనములో నుండదు. విపరీతమైన స్నోతో గాలి కూడ (గంటకు 35 మైళ్లకన్న ఎక్కువగా) కలిస్తే దానిని blizzard అంటారు. సుమారు 6 అంగుళాలకన్న ఎక్కువ స్నో ఉంటే అది winter storm క్రింద వస్తుంది లేకపోతే winter weather advisory క్రింద ఉంటుంది ఆ సంఘటన. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల ముందు నేలపైన సుమారు నాలుగైదు అడుగుల పరిమాణములో స్నో ఉండినది మా ఊరిలో!

నేను వృత్తి రీత్యా స్ఫటికశాస్త్రజ్ఞుడిని. స్ఫటికాకృతిలో ఉండే ప్రకృతిసిద్ధమైన నీరు షడ్భుజ రూపములో ఉంటుంది. ఒక స్ఫటికములా మఱొకటి ఉండదు. ఈ హిమ స్ఫటికాలను ఒక శతాబ్దముముందు విల్సన్ బెంట్లీ (Wilson Bentley) అనే ఒక వెర్మాంట్ (Vermont) రాష్ట్రపు కర్షకుడు ఒక microscopic cameraను తానే design చేసి చిత్రములను తీసినాడు. ఒక స్ఫటికపు కాలావధి సుమారు రెండు నిమిషములు మాత్రమే. ఈ స్వల్ప సమయములో చిత్రమును తీయాలి. అతడు వేలాది ఫోటోలను తీసినాడు. అందులో కొన్ని పుస్తక రూపములో నున్నది ( https://www.amazon.com/Snow-Crystals-Dover-Pictorial-Archive/dp/0486202879 ). అతనిని గుఱించిన విశేషాలను ఇక్కడ చదువ వీలగును –
(
https://siarchives.si.edu/history/featured-topics/stories/wilson-bentley-pioneering-photographer-snowflakes

http://snowcrystals.com

https://en.wikipedia.org/wiki/Wilson_Bentley
)

నేను గడచిన 15 సంవత్సరాలలో మంచునుగుఱించి ఎన్నీయో పద్యములను వ్రాసినాను. సుమారు వంద పద్యాలు వివిధ ఛందస్సులలో ఉన్నాయి. వాటిని ఒకే చోట సేకరించి ఇప్పుడు మీకు ఒక సంకలన రూపములో అంద జేస్తున్నాను. భారతీయ భాషలలో మంచును లేక హిమమును గుఱించి వ్రాయడము కష్టము. ఎందుకంటే మనకు పదములు లేవు. dew అన్నదానికి మంచు పదమే, snow అన్నదానికి మంచు పదమే. కారణము మనకు భారతదేశములో హిమాలయ ప్రాంతాలలో తప్ప మిగిలిన చోటులలో ఈ హిమపాతములు లేవు, లేకపోతే అరుదు. నేను frost, hoarfrost అనే పదమునకు హేమలత అని వాడినాను. ఈ పద్యములను అకారాదిగా చూపియున్నాను. చదివి ఆనందించండి.

అంబుధివీచీ – మ/భ/స/స/గ UUUU – IIII UII UU 13 అతిజగతి 1777
శృంగమ్మందున్ – సిరివలె మంచుల కుప్పల్
బంగార మ్మా – ప్రవిమల భాస్కర కాంతుల్
నింగిన్ గంటిన్ – నెగడెడు పక్షుల శ్రేణుల్
సంగీతమ్మై – స్వరములు నామది లేచెన్

అనంగప్రియా – స/జ/త/స/గ IIUI UIU – UIII UU 13 అతిజగతి 1836
సొగసైన వేళలో – సోమకిరణ మ్మా
నగమందు శ్వేత సూ-నమ్మువలె మంచుల్
నగుమోము జూడఁగా – నా మనసు నిండెన్
సగమైన రాత్రిలోఁ – జాల సుగ మయ్యెన్

అపరాజితా – న/న/ర/స/లగ III III UI – UII UIU 14 శక్వరి 5824
ద్యుమణి వలను బోయె – ద్యోతము తగ్గెఁగా
సుమము విరియ దింక – సొంపులు నిండఁగా
ద్రుమము లవని నింక – మ్రోడుగ మారుఁగా
హిమము గురియు నింక – నిచ్చటఁ జల్లఁగా

అమృతగీతి ద్విపద – 11, 11 మాత్రలు, పాదాంత లఘువు
నయమగు సిగ్గును నేను – నగవుల నిగ్గువు నీవు
భగభగ మంటలు నేను – సొగసగు హిమములు నీవు
మొగిలున వానను నేను – గగనపు హరివిలు నీవు
సగమగు రేయిని నేను – జగతికి కాంతివి నీవు

ఆటవెలఁది –
కొయ్య బల్లమీద – కూర్చుండి జారిరి
చిన్ని పిల్ల లెంతొ – చెన్నుగాను
మంచుఁ బెల్లగించి – మనిషిని జేసిరి
యింటిముందు పిల్ల – లింపుగాను

ఆటవెలఁది షట్పది –
నింగిఁ జలువఱేఁడు
రంగు లిడెను నేఁడు
శృంగమందుఁ జూడు – సిరుల మంచు
చెంగలువల తావి
భృంగములకు నీవి
రంగఁ డూఁదుఁ గ్రోవి – రహిని ముంచు

ఇంద్రనీల – 5, 4 – 5, 4 మాత్రలు
ఆనంద వాక్యము – లావిర్భవించన్
మాణిక్య వీణయు – మార్మ్రోఁగుచుండన్
నేనొక్క నాకపు – నిశ్రేణి నెక్కన్
మేనందెఁ బుల్కల – మేఘముల హిమమున్

ఆమనియు మొదలవ – నవనిపై హిమమా
ఆ మంచు దూదిగ – నగుపించెఁ దరులన్
ధామనిధి మబ్బుల – దాగె నీ దినమున
నేమియో ప్రకృతిని – నెఱుగంగ వశమా

ఉత్సాహ – (సూ)4 – (సూ)3/గ
ఆకసమ్మునుండి రాలె – నందమైన ముత్తెముల్
స్వీకరించెఁ బుడమిదేవి – చిత్రమైన సేసలన్
నాకమదియు నందమొంది – నగ్నమైన భూమితో
నేకమయ్యె రజనివేళ – హృదయమలర వసుధకున్

ఋతుచక్రము – చ/చ/చ – చ/చ
ఎప్పుడు ముదమున నా కిట – హృదయము విరియునొ
అప్పుడె వచ్చును వాకిట – నామని మురియుచు
ఎప్పుడు వాడిన యాశల – హృదయ మ్మెండునొ
అప్పుడె గ్రీష్మము కాలుచు – నారని మంటల
ఎప్పుడు శోకాశ్రువులను – హృదయము రాల్చునొ
అప్పుడె నుఱుముల నా నీ-రామని వచ్చును
ఎప్పుడు శాంతుల నా యీ – హృదయము నిండునొ
అప్పుడె శరదాగమన – మ్మగు నది పండుగ
ఎప్పుడు రంగుల యాశలు – హృదిలో నెండునొ
అప్పుడె శిశిరము బ్రదుకున – నార్తియు నిండును
ఎప్పుడు పారక హిమ మగు – హృదయ స్రవంతియు
అప్పుడె యునికి తమస్సగు – నది హేమంతము

ఎత్తుగీతి – ఇం/సూ/సూ
ఆమని లక్ష్మి నీవు
హేమంత రాత్రి నేను
కోమల సుమము నీవు
ఆ మరుభూమి నేను

కందము –
వాహనమునఁగల చక్రము
లాహా యామంచు కుప్ప-లందునఁ జిక్కన్
సాహసమునఁ ద్రోసిరి తమ
దేహములందుఁ జలి చెమట – దిగి జాఱంగన్
దారుల నిండిన మంచును
బాఱలతోఁ బెల్లగించి – ప్రక్కన నింపన్
జేరెనది పెద్ద కుప్పగ
నౌరా హిమపాత మొసఁగు – నధికశ్రమమున్

మంచు కురియు వేళ యిదియు
చంచలమగు హేమమణులు – జ్వలియించెనుగా
మంచములో నిన్ను విడిచి
కుంచితగాఁ గుందుచుంటిఁ – గుటిలా చలిలో – నెమ్మికందము – 48

రవి యుదయించును గ్రుంకును
భువిపై హేమంత మగును – బూవులకారున్
రవి యస్తమించ డెప్పుడు
నవలా మన ప్రేమ జగతి – ననకారు సదా – నెమ్మికందము – 216

కురిపించు మంచు చుక్కల
విరుల కపోలమ్ములందు – విడక రజనియున్
కురిపించు నగ్గి చుక్కల
విరహిణుల కపోలమందు – విడక రజనియున్ – నెమ్మికందము – 537

బిందువు బిందువుగ హిమము
చిందెనుగా మొగముపైన – జెలువము లొలుకన్
సుందర శీతకమున హిమ
కందుకముల నాటలవియుఁ – గడు మోదముగా – నెమ్మికందము – 605

ఆమని యొక యనుభవమగుఁ
బ్రేమము గల హృదయమందు – ఋతువామనియే
యామనిలో విరులున్నను
బ్రేమము లేకున్న నదియు – హేమంతమ్మే – నెమ్మికందము – 671

ఉండని యూరికిఁ మార్గము
నెండిన నదిలోని యలల – యింపగు సడులన్
మండిన ప్రేమకుఁ బూవుల
కుండీలను వెదకుచుంటిఁ – గురిసెడు హిమమున్ – నెమ్మికందము – 741

కంద వద్యము – (వద్యము – వచన పద్యము)
అవునీ శిశిరము ఆమని
అవునీ ఆమనియు గ్రీష్మ
మది వర్షమవును
అవునా వర్షము శరదగ
అవునా శారదయు
మంచు లగు కాలముగా

ప్రాస కంద వద్యము –
ఒక నాడీ చలి తగ్గును
ఒక నాడీ చలికి బదులు
సుకముగ రవియును
రకరకముల విరులను గ-
ళ్లకు చూపును గాంతి నింపు
నిక యామనియే

తేనెలొలుకు తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

తెలుగు భాషను వన్నెకెక్కించిన ప్రక్రియల్లో అవధాన ప్రక్రియ ఒకటి. ఇప్పటికీ ఈ ప్రక్రియ నిత్య నూతనంగా ఉందని చెప్పడానికి నిన్నమొన్న రవీంద్రభారతిలో జరిగిన ద్విగుణిత అష్టావధానం ఉదాహరణగా చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఎక్కడో దేశంగాని దేశం అమెరికాలో పుట్టి గీర్వాణాంధ్ర భాషలలో సమంగా అష్టావధానం చేయడం మాటలు కాదు. అతననే కాదు అష్టావధానం ఎవరికైనా కష్టావధానమే. పద్యం రాయడంలో పట్టుండాలి. పాండిత్యముండాలి. సద్యస్ఫూర్తి ఉండాలి. ధారణా పటిమ ఉండాలి. వాక్శుద్ధి ఉండాలి. ఉచ్ఛారణాపటుత్వం ఉండాలి. నిబ్బరత్వం, ఆత్మస్థైర్యం ఉండాలి.
అవధానం ఒక సాహిత్య క్రీడ. నాకు తెలిసి ఇలాంటి ఉత్సుకతను కలిగించే సాహిత్య సల్లాప క్రియ మరే భాషలోనూ లేదనుకుంటాను. అవధానంలో అష్టావధానం, శతావధానాలు పేరు మోసినా, ద్విగుణిత, సహస్ర, ద్వి సహస్ర, పంచ సహస్ర అవధానాలు కూడా చెదురుమదురుగా చేయబడ్డాయి. ఇందులో జంట అష్టావధానం చేసిన వాళ్లున్నారు. తిరుపతివేంకట కవులు, కొప్పరపు కవులు పాత తరం వారైతే, మేడసాని మోహన్, నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావు, గుమ్మనగారి లక్ష్మీనృసింహా శర్మ, ఇందారుపు కిషన్ రావు, అష్టకాల నరసింహ రామశర్మ, ముద్దురాజయ్య అవధాని ఇలా చాలా మందే అవధానులు తెలుగు రాష్టాలలో అవధాన కార్యక్రమాన్ని నిర్వహించారు, నిర్వహిస్తున్నారు.
అవధానం అష్టావధానమైనా, శతావధానమైనా సాధారణంగా ముఖ్యమైన అంశాలు అవే ఉంటాయి. అవధానమంటేనే పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు అప్పటికప్పుడు పద్యరూపకంగా జవాబు చెప్పాలి. అంతేగాక నిషిద్ధాక్షరి, దత్తపది, సమస్య, వర్ణన, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, పురాణ పఠనం, ఘంటికా గణనం, తేదీకి తగిన వారం చెప్పడం వంటివాటిలో మొదటి నాలుగు మాత్రం తప్పక ఉంటాయి. మిగతావాటిలో ఏవైనా మూడు మరియు వీటికి తోడు అప్రస్తుత ప్రసంగం ఉంటాయి. అప్రస్తుత ప్రసంగానికి పద్య ప్రక్రియతో పనిలేదు. అది కేవలం అవధాని ఆలోచనలకు మధ్యమధ్య ఆటంకం కలిగించడమే. కాకపోతే అష్టావధానంలో ఎక్కువగా ఆకట్టుకునే అంశం అప్రస్తుత ప్రసంగమే. దానికి కారణం ఆ పృచ్ఛకుడు చమత్కారమైన, మెదడుకు మేతపెట్టే ప్రశ్నలో లేదా చొప్పదంటు ప్రశ్నలో వేయటం దానికి అవధాని సమయస్ఫూర్తితో జవాబివ్వటం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక నిషిద్ధాక్షరిలో పృచ్ఛకుడు ఏదైనా ఒక అంశం మీద పద్యం అడిగిన వృత్తంలో చెప్పాలి. కాని ఒక అక్షరంతో అవధాని మొదలుపెట్టగానే పృచ్ఛకుడు అవధాని చెప్బబోయే అక్షరాన్ని నిషేధిస్తే అవధాని వేరొక అక్షరం చెబతాడు. అలా రెండు పాదాలదాకా నిషేధం సాగుతుంది. యతి అక్షరం అవధాని ఇష్టం. మిగతా రెండు పాదాలకు నిషేధం ఉండదు. అయితే ఈ నాలుగు పాదాలు నాలుగు విడతల్లో చెప్పబడతాయి. అంటే మొదటి ఆవర్తంలో నిషిద్ధాక్షరి ఒకపాదం, దత్తపది ఒకపాదం, సమస్య ఒకపాదం, వర్ణన ఒకపాదం న్యస్తాక్షరి చెప్పటం జరుగుతుంది. ఆశువు, తేదీలకు వారం వగైరా ఎప్పటికప్పుడే సమాధానం ఇవ్వబడుతుంది. ఇక రెండవది దత్తపది. పృచ్ఛకుడు ఏవైనా నాలుగు పదాలు ఇచ్చి ఆ పదాలను ఒక్కో పాదంలో ఒక్కో పదాన్ని చేరుస్తూ అడిగిన అంశం మీద పద్యం చెప్పాలి. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. పృచ్ఛకుడు విచిత్రమైన పదాలు ఎన్నుకుంటాడు. ఉదాహరణకు క్రికెటు, వాలీబాలు, హాకీ. కబాడీ వంటి పదాలిచ్చి ఆపదల అర్థం కాకుండా పద్యాన్ని రామాయణార్థంలోనో భారతార్థంలోనో చెప్పమనటం. లేదా సినిమాతారల పేర్లో, ఇడ్లీ, దోస వంటి తిండి పదార్థాల పేర్లో ఇచ్చి పద్యం పూరించమనడం

మూడవది సమస్యాపూరణం. ఇదీ ఆకర్షణీయమైన అంశమే అవధానంలో. పద్యంలోని చివరిపాదాన్ని ఇస్తే మిగతా పద్యమంతా పూరించాలి. ఇందులో ఉన్న చిక్కేమిటంటే పృచ్ఛకుడు అసంగతమైన సమస్య ఇస్తే దాన్ని తెలివిగా పూరించాలి అవధాని. ఇది ఒకరకంగా ఇబ్బందికరమైన ప్రక్రియ.

ఉదాహరణకు పతిని తన్నకున్న పతితగాదె’ ఇది ఒకసారి ఆంధ్ర ప్రభ వారపత్రికలో వారం వారం అవధానంలో ఇచ్చిన సమస్య.
అప్పట్లో నేను దానిని ఇలా పూరించి పంపిస్తే బహుమతి వచ్చింది.

“పాడు తాగుడునకు బానిసయైపోయి
విత్తవాంఛతోడ విటుని దెచ్చి
తన్ను తార్చుటకును తలపడగా పత్ని
పతిని తన్నకున్న పతిత గాదె”
———————————

నేను అవధానిని గాదుగానీ ఒకటి రెండు అష్టావధానాల్లో పృచ్ఛకుడిగా ఉన్నాను

ఇలాంటివి ఇస్తే లౌక్యంగా పూరించవలసి ఉంటుంది. అప్పటికప్పుడు పరిష్కారం సాధించాలి. కనుక కొంచెం కష్టం.
నాలుగవది వర్ణన. ఏదైనా ఈయబడిన సందర్భమును పురస్కరించుకొని వర్ణిస్తూ పద్యం చెప్పాలి. ఆపై వ్యస్తాక్షరిలేదా న్యస్తాక్షరి ఏదో ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక వాక్యములోని అక్షరాలు క్రమరహితంగా (ఉదా॥5వ అక్షరం ‘ప’ తరువాత 11వ అక్షరం, ఆతరవాత 2వ అక్షరం ఇలా)అవధానం పూర్తయేలోపు మధ్యమధ్యలో పృచ్ఛకుడు అందిస్తాడు. అవన్నీ చివరలో పేర్చుకుని వాక్యం చెప్పాలి. ఇక న్యస్తాక్షరి అయితే ప్రతిపాదంలో ఏదో ఒక అక్షరం ఇచ్చి అది సంఖ్యాపరంగా 7వ అక్షరమనో 12వ అక్షరమనో చెప్పి ఆస్థానంలో ఆఅక్షరం వచ్చేట్టుగాపృచ్ఛకుడు అడిగిన సందర్భానికి ఏ వృత్తంలో అంటే ఆవృత్తంలో పద్యం చెప్పాలి. ఇకమిగతావన్నీ అవధాని ఏకాగ్రత భంగం చేసేవే అప్రస్తుతమైనా, తేదీలకు వారం చెప్పడమైనా గంటలు ఎన్ని కొట్టారో చెప్పడమైనా. పురాణపఠనం పాండిత్యానికి సంబంధించినది. ఏది ఏమైనా అవధానప్రక్రియ మేధోపరంగా కత్తిమీద సాములాంటిది. ఇదంతా అయిన తరువాత తాను పూరించిన పద్యాలన్నీ ధారణకు తెచ్చుకుని చదివి వినిపించడంతో అవధానం సుసంపన్నమవుతుంది. ఇంతటి కష్షటమైన ప్రక్రియను ఎందరో అవధానులు చాలా సునాయాసంగా చేసి ప్రేక్షకులను మెప్పించి అవధానానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టారు. అవధానం తెలుగు పద్యానికి తెలుగు భాషకు చాలా ప్రాచుర్యాన్ని గడించి పెట్టిందనటంలో సందేహం లేదు.