భగవంతునికి లేఖ… భగవంతుడి సమాధానం

రచన: రాజన్

సకల చరాచర సృష్టికర్త, ధర్మసంస్థాపకుడు అయిన భగవంతునికి,
జీవకోటిలొ శ్రేష్టుడు అయిన ‘నేను’ సందేహ నివృత్తికై వ్రాయుచున్న లేఖ.
భగవాన్! కళ్ళకు కనపడని నీవు ఎక్కడున్నావని అడిగితే.. గుళ్ళో ఉన్నావని కొందరు, భక్తుల గుండెల్లో ఉన్నావని మరికొందరు అంటున్నారు. సంతృప్తి చెందని నేను…స్వాములను, పండితులను దర్శించి ప్రశ్నిస్తే..నువ్వు నాలోనే ఉన్నావని, నేను చూడగలిగే వాళ్ళందరిలో ఉన్నావని, అసలు మేమంతా నీలోనే ఉన్నామని జ్ఞానోపదేశం చేసారు. కానీ.. ఒకప్పటి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తూ భౌతిక జీవన పరిణామానికి వెన్నెముకగా నిలుస్తున్న ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం నువ్వనే వాడివి అసలు లేవని, భ్రమకు మరో పేరే భగవంతుడని వాదిస్తున్నారు. పురాతన గ్రంధాలను, తత్వ శాస్త్రాన్ని అవపోసన పట్టిన పండితుల మాటలను నమ్మాలో..లేక అపర సృష్టికర్తలైన శాస్త్రవేత్తల మాటలు విశ్వసించాలో తెలియడం లేదు. అందుకే నా మొదటి ప్రశ్న…‘ నువ్వనే వాడివి ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు? ‘
ఇక నా రెండవ ప్రశ్న…నువ్వనే వాడివి ఉంటే నీకు ఇష్టమైన వారెవరు? నీ నామమే స్మరిస్తూ జనారణ్యానికి దూరంగా ఉండే మునులా? రోజూ నీకు కొబ్బరికాయలు, అరటిపళ్ళు సమర్పించి గంటల కొద్దీ పూజలు చెసే సామాన్య భక్తులా? కోట్లు కొల్లగొట్టి లక్షలు నీ హుండీ లో వేసే ధనిక భక్తులా? లేక జనానికి ధర్మోపన్యాసాలిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న నవీనతరం స్వామీజీలా? ఇంకో చిన్న అనుబంధ ప్రశ్న ప్రభూ…నిన్ను నమ్మని వారంటె నీకు కోపమా?
ధర్మం నశించినప్పుడు, అధర్మం ఉరకలేస్తునప్పుడు అవతరిస్తూనే ఉంటానని గీతలో గోవిందునిగా చెప్పావు. కానీ ఇప్పుడు ధర్మం నశించిపోలేదంటావా? పదవుల కోసం, ఆస్తుల కోసం సొంతవారినే చంపుకుంటున్నారు. కుల, మతాల పేరుతో ఒకరినొకరు ఊచకోతలు కోస్తున్నారు. విద్యా, వైద్యశాలలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. ప్రతి మనిషిలోనూ వికృతత్వం తాండవిస్తుంది. కేవలం ఒకరిద్దరు రాక్షసులను చంపడానికి, కొంతమంది భక్తులను రక్షించడానికి ప్రతీ యుగంలోను జన్మిస్తుంటావని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇంతమంది రాక్షసులున్న ఈ యుగంలో ఎందుకు నువ్వింకా జన్మించలేదు? ఇది నా మూడవ ప్రశ్న.
దయామయా… నా ప్రశ్నల్లో అజ్ఞానం ఉంటే మన్నించు. కానీ నిరంతరం నాలోను, నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలోనూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వేదన భరించలేకున్నాను. సృష్టిలో అత్యధికుల విశ్వాసానికి ప్రతిరూపానివైన నీవు మాత్రమే నాలోని ఈ అలజడిని తగ్గించి, శాంతిని ప్రసాదించగలవని భావించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
సౌగుణ్యశీలి అయిన జగన్మాతకు నా నమస్కారములు తెలియజేయి.
నీ జవాబు కోసం ఎదురు చుస్తూ,
భూలోక చరుడు,
మానవుడు

*************

భగవంతుని జవాబు
కుమారా,
నీవు వ్రాసిన “భగవంతునికి లేఖ” ప్రతి అందింది. సృష్ట్యాది నుండి తపస్సులు, పూజలు, ప్రార్ధనలు, బలిదానాలు వంటి విధానాల ద్వారా మాత్రమే ఇంతవరకూ నేను భక్తుల కోర్కెలను, సందేహాలను తీరుస్తూ వచ్చాను. వీటికి భిన్నంగా ఒక లేఖ ద్వారా నా అస్థిత్వానికి, పరమాత్మ తత్వానికి సంబందించిన సమాధానాలు తెలుసు కోవాలనుకున్న నీ ఆలోచన నన్ను ఆకర్షించింది. అందుకే సృష్టి చరిత్రలో మొదటిసారిగా నా స్వహస్తాలతో నీ లేఖకు సమాధానం వ్రాస్తున్నాను. సమాధానాలు చిత్తగించు.

నీ మొదటి ప్రశ్న: “నువ్వనే వాడివి ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు?” అన్నది నా అస్థిత్వానికి సంబందించినది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎందరో పండితులను, భక్తులను, శాస్త్రవేత్తలను ప్రశ్నించానన్నావు. కానీ ఇంతమందిని సమాధానం అడిగిన నీవు విచిత్రంగా నిన్ను నువ్వు మాత్రం ప్రశ్నించుకోవడం మరచిపోయావు. బాహ్య ప్రపంచం అన్నది నిలకడలేనిది. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి, ఒక సమాజం నుండి మరో సమాజానికి దాని స్వభావం మారిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా అంగీకరించే ఏక సిద్ధంతాలంటూ ఏమీ లేవు. ఈ పండితులు, శాస్త్రవేత్తలందరూ తమ చుట్టూ ఉన్న సమాజం నుండి, తమకు ఎదురైన అనుభవాల నుండి కొన్ని సిద్దాంతాలను ఏర్పరచుకొని అవి మాత్రమే నీకు చెప్పగలరు. మరి అలాంటప్పుడు వేల సిద్దాంతాలలో ఏదో ఒకదానిని పట్టుకు వేలాడే వాళ్ళకు మూల పదార్ధమైన నా గురించి ఎలా తెలుస్తుంది. నన్ను తెలుసుకోవడనికి, చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అంతర ప్రపంచంలోనికి ప్రయాణించడం. అలా తమలోకి తాము ప్రయాణం చేస్తున్న వారినే ఙ్ఞానులంటారు. ఙ్ఞానమన్నది ఓ నిరంతర ప్రయాణం. ఙ్ఞానమంటే సర్వమూ తెలిసిఉండటం కాదు. ఆ సర్వమూ తనలోనే ఉందని తెలుసుకోవడం. అలాంటి ఙ్ఞానులకు విగ్రహాలతోను, సిద్దాంతాలతోను పనిఉండదు. దేవుడు ఉన్నాడా లేడా అనే మీమాంసకు వారి మనసులో తావులేదు. ఇదే నీ మొదటి ప్రశ్నకు సమాధానం: దేవుడనే వాడు నిశ్చలానందంలోనూ, సర్వవ్యాపకత్వాన్ని గ్రహించగలిగే హృదయాంతరాళంలోను ఉన్నాడు. మరోలా చెప్పాలంటే “నువ్వే నేనై ఉన్నాను”.
ఇక నీ రెండవ ప్రశ్న: “నువ్వనే వాడివి ఉంటే నీకు ఇష్టమైన వారెవరు?”. నిజానికి నీ మొదటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే నీ మిగతా రేండు ప్రశ్నలకి సమాధానాలు సులభంగానే దొరుకుతాయి. అయినా నీ ప్రతి ప్రశ్నకు జవాబిద్దామనే ఉద్దేశ్యంతో వీటికి కూడా జవాబిస్తున్నాను. మునులు, ధనిక భక్తులు, బీద భక్తులు, ధర్మోపన్యాసాలిచ్చే గురువులు…వీరిలో నాకు ఇష్టమైన వారెవ్వరని అడిగావుకదా…విను… సృష్టికి అందాన్ని తేవడానికి, సృష్టి కార్యక్రమం సజావుగా జరగడానికి పగలు రాత్రి, ఎండా వానా, వేడీ చలీ అనే పరస్పర విరుద్ధ భావనలను సృజించాను. ఆ తరువాత నాలోనే మంచి చెడు, ఆనందం దుఖం లాంటి గుణాలను పుట్టించుకొని మానవునిగా మారాను. ఈ గుణాలను తొలగించుకుంటే మళ్ళీ దేవుడైపోతాను. అంటే మానవుడినైనా దేవుడినైనా నేనే… గుణాలే తేడా. మునులు, మూర్ఖులు, మహాత్ములు, బూటకపు స్వామీజీలు, ఆస్థికులు, నాస్తికులు వీళ్ళంతా నేనే. నీకంటికి నేను ఇన్ని రూపాలలో కనిపిస్తూ ఉండటం వల్ల నీకీ సందేహం వచ్చింది. నా మొదటి సమాధానం ద్వారా ఒక్క సారి నువ్వు నేనై చూడు. అంతా ఒకేలా కనిపిస్తుంది. ఇక నీ అనుబంద ప్రశ్న “నిన్ను నమ్మని వారంటే నీకు కోపమా?”. భగవంతుడు అనబడే నేను ఒక నమ్మకం…. నేను నమ్మిన వారి నమ్మకం లోనే కాక నమ్మని వారి నమ్మకం లోను ఉంటాను. ఇక నాకు నచ్చని వారనే ప్రశ్న ఎక్కడ ఉంది.
చివరిదైన నీమూడవ ప్రశ్న: “ఇంతమంది రాక్షసులున్న ఈ యుగంలో ఎందుకు నువ్వింకా జన్మించలేదు? “. ఇది బ్రహ్మ రహస్యం, కానీ చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. ప్రతీ యుగానికి కొన్ని యుగ లక్షణాలుంటాయి. పూర్వయుగాలలో రాక్షసులనే వారిని ప్రత్యేకించి సృష్టించి వాళ్ళను చంపడానికి రాముడుగా, కృష్ణుడుగా పుడుతూ వచ్చాను. కానీ కలియుగానికొచ్చేసరికి ఈ రాక్షసులను బయట కాక ప్రతీ మనిషి మస్తిష్కంలోనూ పుట్టించాను. భయం, ద్వేషం, అలసత్వం ఈ రాక్షసులలో ప్రముఖులు. వీరిని సంహరించడానికి ధైర్యం, ప్రేమ అనే రూపాలలో అదే మస్తిష్కంలో పుట్టే ఉన్నాను. కావలసిందల్లా యుద్ధం మొదలుపెట్టి ఆ రాక్షసులను చంపడమే. ఇదే నీ ఆఖరి ప్రశ్నకు సమాధానం: “నేను ఇప్పటికే నీ మస్తిష్కంలో జన్మించి ఉన్నాను”.
నీ సందేహాలు నివృత్తి అయ్యాయి కదా. మానవునిగా ప్రశ్నించి భగవంతునిగా సమాధానం చెప్పావు. ప్రశ్నించడం మొదలైంది అంటే దైవంగా మారడానికి నీ ప్రయాణం మొదలైందన్నమాట. ఙ్ఞానం పై మెట్టు అయితే ప్రశ్న మొదటి మెట్టు. ఇక నుండి ప్రతి ప్రశ్నని ప్రశ్నించు. ఆ వచ్చిన జవాబునీ ప్రశ్నించు. తలపెట్టిన ప్రతికార్యాన్ని సఫలీకృతం చేసుకోవడానికి పూర్తిస్తాయిలో యత్నించు. మానవుని పరిపూర్ణరూపమే భగవంతుడనే సత్యాన్ని ప్రపంచానికి చాటించు.

శుభం భూయాత్

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 27

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

సంసార పూరితులైన జనావళికి ఈ మాయను దాటి కైవల్యం పొందడానికి శ్రీహరి ఒక్కడే దిక్కు మరి ఇంక వేరే దారి లేనే లేదు అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో.

కీర్తన:
పల్లవి: శ్రీపతి యొకడే శరణము మాకును
తేప యితడె మఱి తెరగేది

చ.1. ఆసలు మిగులా నాతుమ నున్నవి
యీసులేని సుఖ మెక్కడిది
చేసినపాపము చేతుల నున్నది
మోసపోనిగతి ముందర నేది ॥ శ్రీపతి॥

చ.2. కోపము గొందుల గుణముల నున్నది
యేపున నిజసుఖ మిక నేది
దీపనాగ్ని తో దిరిగెటి దేహము
పై పై విరతికి బట్టేది ॥ శ్రీపతి॥

చ.3. పంచేంద్రియముల పాలిటబడు ఇది
యించుక నిలుకడ కెడ యేది
యెంచగ శ్రీ వేంకటేశ్వరు డొకడే
పంచినవిధులను పాలించుగాక॥ శ్రీపతి॥
(రాగము: లలిత; ఆ.సం.రేకు:299; సం.3, కీ.573)

పల్లవి: శ్రీపతి యొకడే శరణము మాకును
తేప యితడె మఱి తెరగేది

పూర్వం విదేహరాజుకు ఈ మాయను దాటి కైవల్యం పొందడానికి వచ్చిన సందేహ నివృత్తికై హరి అనే ముని ఇలా వివరించాడు “సర్వభూత మయుడైన సరసిజాక్షు డాతడే, తన యాత్మ యందుండు ననేడు వాడు, శంఖ చక్ర ధరుడంచు జానెడు వాడు, భక్తి భావాభిరతుండు వోభాగవతుండు” అని చెప్తూ ఇంకా ఆ శ్రీమహా విష్ణువు “వర్ణాశ్రమ ధర్మంబుల నిర్ణయ కర్మల జెడక నిఖిల జగత్సంపూర్ణుడు హరి యను నాతడే, వర్ణింపగ భాగవతుడు వసుధాధీశా!” అని చెప్పగా విదేహుని సందేహం తీరింది. కాని హరి నామ స్మరణం, ఆ కథామృత సేవనం కావాలనిపించి మళ్ళీ యిలా అడిగాడు. “గజరాజ వరదు గుణములు, త్రిజత్పావనము లగుటదేట డంగాసుజన మనో రంజనముగా విజితేన్ద్రియ వినగనాకు వేడుక పుట్టెన్” అని ఆ విషయం ఏమిటో చెప్పమని అడిగాడు. అప్పుడు “అంతరిక్షుడు” అనే మౌనివర్యుడు పరబ్రహ్మ మనగా, పరతత్త్వ మనగా బరమ దయాళువగు నీశ్వరుడన, గృష్ణు దన జగద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్” అని చెప్పి అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మంలో తనకు విపర్యయం గా జన్మించిన జ్ఞానమే “మాయ” యనీ చెప్తాడు. ఆ మాయ చేతనే ఆయన ఈ జగత్తును నిర్మిస్తాడు. ఆయన మాత్రం నిశ్చింతుడు. మాయ కూడా ఆత్మలో లీన మవుతుంది. “పంచ భూతాదిక జీవులను సృష్టించేది ఆ మాయయే! లయించేదీ అదే” అన్నాడు మహర్షి. మరి ఆ మాయను దాటే ఉపాయం చెప్పమన్నాడు రాజు. దానికి “ప్రబుధుడు” అనే మహర్షి “శరీరమే నిత్యం అనే భావనతో జీవులు దుఖంలో మునిగిపోతారు. తమ్ము తాము తెలుసుకోరు. అనిత్యమైన పాంచభౌతిక దేహంకోసం అనేక అగచాట్లు పడుతూ ఉంటారు. విరక్తి మార్గం అవలంబించరు. సద్గురువును పొంది భూతదయ, హరికదామృతపానం, బ్రహ్మచర్య, సాధు సంగమం, సజ్జన మైత్రి, వినయ,శుచిత్వ, క్షమ, మౌనం, వేదార్ధ వివేచనం, అహింస, ద్వంద్వవిసర్జనం చేసి ఈశ్వరుని సర్వగతునిగా భావించాలి .గృహారామక్షేత్ర కళత్రపుత్రా విత్తాదులను శ్రీహరికి అర్పణ చేయాలి. పరమాత్మను తప్ప దేనినీ చూడ రాదు” అని వివరించి సందేహ నివృత్తి చేస్తారు మహర్షులు.
ఇలా ఎన్నివిధాల మనం వేద వేదాంగాలను వెదకినప్పటికీ హరికదామృతపానం, సాధుసంగమం, సజ్జన మైత్రి, వినయ,శుచిత్వ, క్షమ, మౌనం, వేదార్ధ వివేచనం, అహింసలే కైవల్యానికి పరమావధులని తెలుస్తోంది. వాటిలో అతి సులభమైనది హరికీర్తనము. ఆయన్ను కీర్తిస్తూ ఆయన శరణు పొందితే చాలు. మనకు వేరే మరే మార్గమూ అవసరం లేదు. కైవల్యము సిద్ధించి తీరుతుంది అని నమ్మికతో నివేదిస్తున్నాడు అన్నమయ్య.

చ.1. ఆసలు మిగులా నాతుమ నున్నవి
యీసులేని సుఖ మెక్కడిది
చేసినపాపము చేతుల నున్నది
మోసపోనిగతి ముందర నేది

మనకు ఆత్మలో ఎన్నో ఆశలు, మోహాలు సహజంగా దేహంలో మనలను అంటి ఉంటాయి. ఈ మాయా లోకంలో ఈర్ష్య అనేది లేకుండా సుఖమయ జీవనం సాగించడం దుర్లభం. ఆ ఈర్ష్యా గుణం వలననే మనం మన చేతులతో ఎన్నో పాపాలు చేస్తూ గొప్ప ఆపదలను మూటగట్టుకుంటూ ఉంటాము. మోసాలు తిరిగి తిరిగి చేస్తూనే ఉంటాము. ఇక ఈ పాపాల ప్రవాహానికి అడ్డుకట్ట ఎక్కడ? తరుణోపాయం మనకు గోచరించదు.

చ.2. కోపము గొందుల గుణముల నున్నది
యేపున నిజసుఖ మిక నేది
దీపనాగ్ని తో దిరిగెటి దేహము
పై పై విరతికి బట్టేది

మనకు ఆశాపాశాలు, వ్యామోహాలు ఉన్నంతవరకూ ఈ కోపం అనేది పోదు. ఇలా కృఒధంతో రగిలిపొయ్యే వారికి సుఖం ఉపశమనం అసలు ఉండదు కదా! జఠరాగ్ని(వైశ్వానరము) వంటి అరిషడ్వర్గాలతో కూడిన దేహంతో తిరిగే జీవులకు దేహం ఎప్పుడూ రగిలిపోతూ మసిలిపోతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ తాత్కాలికంగా “కుక్క దాలిగుంట” తీరుగా తాత్కాలిక విరక్తి కలిగినప్పటికీ మళ్ళీ కొంత సమయం తర్వాత అన్నీ షరా మామూలుగానే వచ్చేస్తాయి దేహంలోకి. ఈ పై పై విరక్తులకు తగ్గి పరబ్రహ్మను గూర్చి స్థిరంగా ఆలోచించే సమయం వస్తుందా?

చ.3. పంచేంద్రియముల పాలిటబడు ఇది
యించుక నిలుకడ కెడ యేది
యెంచగ శ్రీ వేంకటేశ్వరు డొకడే
పంచినవిధులను పాలించుగాక

బ్రతుకంతా కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము అనే పంచేంద్రియముల అధీనంలో ఉంటుంది. నిత్యం క్రొత్త క్రొత్త సుఖాలను ఆశించే జీవులకు నిలకడ లేకుండా అంతులేని వ్యామోహాన్ని పిపాసను కలుగజేస్తూ ఉంటాయి. దీనికి అసలు కారణం ఏమిటి? తరుణోపాయం ఏమిటి? అనే విషయం తెలుసుకోవలసి ఉంది. మనం అన్నివిధాలా యెంచి నిలకడగా కాస్తా సుబుద్ధితో ఆలోచించి చూసినట్లైతే శ్రీవేంకటేశ్వరుడొక్కడే దిక్కు. ఆయన మనకు పంచి ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వర్తించడమే మన విధి అని చెప్తున్నాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధాలు: శరణము = దిక్కు, ఆదుకునే నాధుడు; తేప = తెప్ప, ఏదైన దాటు సాధనము; ఆతుమ = ఆత్మ; ఈసు = ఈర్ష్య; గొందుల గుణములు = సంక్షోభించే గుణములు; ఏపున = ఎక్కువగా; దీపనాగ్ని = జఠరాగ్ని(వైశ్వానరము); విరతి = విరక్తి; ఇంచుక = కొంచెము; ఎంచగ = అన్నివిధముల చూడగా; పంచిన = మనకు ఇవ్వబడిన సుకర్మములు అనే అర్ధంతో ఇవ్వబడిన మాటగా యెంచదగును.
విశేషము: అన్నమయ్య ఇక్కడ ఒక వింత మాట “దీపాగ్ని” అని వాడడం జరిగింది. దీనిని అర్ధం కొంతమంది “బడబాగ్ని” గా భావిస్తే కొంతమంది “జఠరాగ్ని” గా భావించడం జరిగింది. సకల జీవుల దేహాలలో జఠరాగ్నినై ఆహారాన్ని జీర్ణం చేసే వాడు భగవంతుడు. దేహాన్ని గురించి అన్నమయ్య చెప్తూ ఉన్నప్పుడు “జఠరాగ్ని” అనే అర్ధం తీసుకోవడమే సమంజసంగా భావిస్తున్నాను. “అనియానతిచ్చె కృష్ణుడర్జునితో – విని యాతని భజించు వివేకమా|” అన్న కీర్తనలో కూడా అన్నమయ్య “దీపనాగ్నినై జీవదేహముల యన్నములు – తీపుల నరగించేటి దేవుడనేను” అంటాడు. అందువల్ల జఠరాగ్ని సరియైన అర్ధం అనుకుంటున్నాను. (విజ్ఞులు దీనిపై వ్యాఖ్యానిస్తే మరింత ప్రయోజనకరం)
-0o0-

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 20

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య


అన్నమయ్య శ్రీవేంకటేశ్వరునికి చేసుకునే విన్నపం ఈ కీర్తనలో మానవజీవితం, భ్రమలు మాయలతో గడచిపోవడం గురించి చేసే నివేదన. ఈ లోకంలో జన్మంచిన ప్రతి మానవుడు ఎలా సుఖంగా.. సంతోషంగా జీవించాలా? అనే ఆలోచనతోనే గడుపుతారు. కానీ అసలు నేనెవరిని? ఈ ప్రపంచం ఏమిటి? దీన్ని ఎవరు సృష్టించ్చారు? ఈ జీవులంతా ఎవరు? మరణించాక ఎక్కడికి వెళ్తున్నారు? అని అలోచించడంలేదు. ఈ సృష్టికి లోనై మిమ్ములను గమనిచలేని స్థితిలో ఉన్నాము. మీరే కరుణజూపి మమ్ము కడతేర్చాలి అని అన్నముడు చేసే నివేదన ఇది.
కీర్తన:
పల్లవి: ఏమి సేయగలవాడ నిదివో నేను
నీమరుగు చొచ్చితిగా నీ చిత్తమికను
చ.1. పుట్టినవాడను నేను భోగించే వాడను నేను
గట్టిగా నిప్పుడు నాకు గర్తవు నీవు
పట్టరాదు జవ్వనము పాయరాదు సంసారము
యిట్టివెల్ల నీ మాయ యేమీ ననరాదు ||ఏమి||
చ.2. కడు గాంక్షలు నాసొమ్ము కర్మములు నాసొమ్ము
నడమ నంతర్యామివి నీకు నీవు
వుడివోవు కోరికలు వొదుగదు కోపము
కడదాకా నీ మహిమ కాదనరాదు ||ఏమి||
చ.3. భావించలేనివాడను ప్రకృతిలోని వాడను
శ్రీవేంకటేశ దయసేసితివి నీవు
తోవదప్పదు జ్ఞానము తొలగదు వివేకము
దేవుడవు నీమర్మము తెలియగరాదు ||ఏమి||
(రాగం: ఆహిరి; ఆ.సం.సం.3; 235వ రేకు; కీ.సం.200)
విశ్లేషణ:
పల్లవి: ఏమి సేయగలవాడ నిదివో నేను
నీమరుగు చొచ్చితిగా నీ చిత్తమికను
ఓ కలియుగ ప్రత్యక్ష దైవమా శ్రీవేంకటేశ్వరా! నేను ఏమి చేయగలను? ఇదిగో నేను నీ ఆశ్రయం కోసం వచ్చాను. ఇక అంతా నీ ఇష్టం. మా పాపాలు పుణ్యాలు అన్నీ మీకే అర్పిస్తున్నాం. ఆదుకొని మమ్ము కడతేర్చు స్వామీ అని అన్నముడు స్వామి కడ విలపిస్తున్నాడు కన్నీరు మున్నీరుగా.

చ.1. పుట్టినవాడను నేను భోగించే వాడను నేను
గట్టిగా నిప్పుడు నాకు గర్తవు నీవు
పట్టరాదు జవ్వనము పాయరాదు సంసారము
యిట్టివెల్ల నీ మాయ యేమీ ననరాదు.
ఈ భూమిపై జన్మించినది నేను. కర్మానుఫలమైనా సుఖాస్వాదనైనా అనుభవిస్తున్నదీ నేనే! కానీ ఇప్పుడు నీ మరుగుచొచ్చాను. ఇప్పుడు నన్నుఆదుకునే కర్తవు నీవే! యవ్వనమదము పట్టరానిదన్న విషయము ఎరుగుదును. సంసార బంధములు త్రోసిపుచ్చి జీవించలేను అన్నదీ వాస్తవమే! ఇదంతా జగన్నాటకసూత్రధారిగా నీవాడించే మాయానాటకమని ఎరుగుదును. ఏమి అనగలను? మీరు భగవద్గీతలో చెప్పినట్టు… చేసేవాడివీ… చేయించే వాడివి… అన్నీ తమరే కదా! ఆ మాయలను గూర్చి నేను ఏమని నిందించగలను? ఎవరిని నిందించగలను?

చ.2. కడు గాంక్షలు నాసొమ్ము కర్మములు నాసొమ్ము
నడమ నంతర్యామివి నీకు నీవు
వుడివోవు కోరికలు వొదుగదు కోపము
కడదాకా నీ మహిమ కాదనరాదు
అంతులేని కోరికలతో అలమటిస్తున్నాను. ఆ కోరికలు నెరవేరడానికి నేను పడే పాట్లు చేసే పనులు అన్నీ నా కర్మములే అని నాకు తెలుసు. కానీ ఈ విషయంలో నా తప్పొప్పులను ఎంచే నాధులు మాత్రం మీరే! కోర్కెలు అనంతాలు. అవి ఏమాత్రం తగ్గిపోవు. అవి తీరనప్పుడు నాకు కలిగే దు:ఖాతిశయము కూడా నా అధీనంలో ఉండదు. కడ దాకా ఈ ఆశలపోరాటం గెలుపోటములు మానవులుగా పుట్టినందుకు తప్పవు. అలాగే ఇవన్నీ చేయించే నీ మహిమనూ కాదనలేను.

చ.3. భావించలేనివాడను ప్రకృతిలోని వాడను
శ్రీవేంకటేశ దయసేసితివి నీవు
తోవదప్పదు జ్ఞానము తొలగదు వివేకము
దేవుడవు నీమర్మము తెలియగరాదు
నీవు సృష్టించిన ఈ సమస్త ప్రకృతికి ఆధీనుడై జీవం గడిపేవాడను నేను. నీ మాయాజాలం , నీ మహిమలు నేను వూహింపలేను, భావింపలేను. నా పూర్వజన్మల సుకృతం కొద్దీ నన్ను దయచూశావు. చాలు స్వామీ చాలు. నేను ఈ దారి ఎన్నటికీ వీడను గాక వీడను. నావివేకం విస్తరిస్తూ ఉంటుంది. ఆత్మజ్యోతి ఆరిపోదు. శ్రీవేంకటేశ్వరా! నీ రహస్యాలు తెలుసుకోవడం సామాన్యులకు దుస్సాధ్యం.

ముఖ్యమైన అర్ధాలు: మరగు = ఆశ్రయము; చిత్తము = ఇష్టము, మనసు; పట్టరాదు = ఆపరాదు; పాయరాదు = విడచిపోలేని స్థితి; ఉడివోవు = తగ్గిపోయేవి కావు; ఒదగదు = నా అధీనంలో జరిగే విషయం కాదు; మర్మము = మాయ, రహస్యము.

దైవప్రీత్యర్థం విధ్యుక్త ధర్మాచరణం

రచన: జి.సందిత

మానవులు జన్మను సార్థకం చేసుకోవటం అంటే భగవంతుని మెప్పుపొందటమే!
అందుకోసం మనుషులకై నిర్దేశించిన అనుసరించవలసిన కర్మాచరణ విధివిధానశాస్త్రమే ధర్మము.
కర్మాచరణం కూడా త్రికరణశుద్ధిగా చేయవలసి వుంటుంది. అప్పుడే అది ధర్మమవుతుంది. త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా వైరుధ్యం లేకపోవటమే!
ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి భోజనంపెట్టటం మన ధర్మం అనుకుందాం. అప్పుడు వండి సిద్ధం చేయటం, వడ్డించటం శరీరకర్మ.
అతిథిని భోజనానికి ఆహ్వానించటం తదుపరి ఏమేమి ఉన్నాయో తెలిపి కొసరికొసరి అడగటం వాచా కర్మ.
అలా చేస్తున్నందుకు తృప్తిపడుతూ ఆనందించటం మానసిక కర్మ.
అటువంటి పూర్ణ ధర్మాచరణమే దైవప్రీతమైన కార్యమన బడుతుంది. ఇలా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే కర్మాచరణంతో ముడివడిన ధర్మాచరణం సంపూర్ణసార్థక్యం చెందుతుంది.
ఇచ్చట మనసే ప్రధానమైనది. మనసులో అయిష్టత వైరుధ్యం వున్నప్పుడు, వండటంలోనూ, వడ్డించటంలోనూ భోజనానికి పిలవటంలోనూ, కొసరటంలోనూ, మాటల్లోనూ తృప్తిగా ఆనందించటంలో, మనసులోనూ భోజనం పరిమాణం, రుచులు, నాణ్యతలలోను ప్రభావం కనిపించవచ్చు.
అటువంటి ధర్మాచరణ మానవులదృష్టిలో ధర్మ కార్యమనబడవచ్చును కాని దైవం మెచ్చదు. దైవ ప్రీత్యర్హమైన ధర్మాచరణం ఒకచో — విధ్యుక్త ధర్మం- స్వీయకర్తవ్యం కావచ్చును. ఐనప్పటికిని అది పూజలు వ్రతాలకన్నను, జపతపాదికాలకన్నను, యజ్ఞహోమాదికాలకన్నను అత్యంతపవిత్రమైనదై దైవాన్ని మెప్పిస్తుంది.
ముఖ్యంగా వృత్తిరీత్యా దీనులను ఆదుకునే స్థానంలో కర్తవ్యాన్ని, విధ్యుక్తధర్మాలను నిర్వహించే వారైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా ఇతరత్రా స్వయంగా అటువంటి బాధ్యతలు నిర్వహించే వారైనా తమకు ప్రాప్తించిన అధికారాన్ని, వృత్తినైపుణ్యాన్ని దేవుడు మనకు ఇచ్చిన వరంగా ప్రసాదించిన మహిమగా భావించాలి.
ఆ విధంగా మనకు తన మహిమల్ని మనకు ఇచ్చి — మనుషుల దైన్యాలను దూరం చేసే అవకాశాన్ని మనకు ఇచ్చాడని గ్రహించాలి.
ఆ విధంగా మనుషులకు సేవ చేస్తూ దేవునికి దేవుని కృపకు దీనులను మరింత చేరువచేస్తూ భగవంతుణ్ణి మనం మెప్పించ గలగాలి. అప్పుడే మన జన్మసార్థకమౌతుంది.
దీనులంటే రోగములచే గాని ఇతరత్రా కష్టములచే గాని పీడింపబడుతూ భగవంతుని శరణువాడే వారే కదా! వారు బాధలనుండి రక్షిస్తారన్న ఆశతో—వైద్యులవద్దకు కాని, సంబంధిత అధికారుల వద్దకు గాని వస్తూవుంటారు.
అలా బయలుదేరుతూ వారు–
“దేవుడా! మేము వెళ్ళిన చోట ఆ వైద్యులు లేదా అధికారులు సిద్ధంగా వుండేట్లు చూడు. వాళ్ళు వెంటనే మా బాధల్ని తొలగించేట్లు చూడు” అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తారు. అలా కష్టాలు తీరితే–
” దేవుని దయవల్ల సులభంగా మాకు మేలు జరిగింది” అని దేవుణ్ణి తలుచుకుంటారు.
దేవుడు కూడా —
“ఫలానా వ్యక్తికి వైద్యునిగా లేదా అధికారిగా విధులునిర్వర్తించే అవకాశం శక్తి మహిమ ఇచ్చినందు వలన లోకానికి మంచి జరిగింది “అని భావిస్తాడు.
ఆ విధంగా విధ్యుక్తధర్మం, కర్తవ్యం సక్రమంగా నిర్వర్తించేవారికి మరో జన్మలో కాని అదే జన్మలో గాని ఇంకా మంచి వృత్తినైపుణ్యాలను, అధికారాలను ప్రసాదిస్తాడు దేవుడు.
దేవుడు అటువంటి వారికి అత్యున్నత స్థితులను కల్పిస్తూ ఇహలోక సంబంధమైనమైన అష్టైశ్వర్యాలను, స్వర్గసుఖాలను కల్పిస్తాడు. అటుపై ఏకంగా అటుపై మోక్షప్రాప్తినిస్తాడు.
అందుకు విరుద్ధంగా కర్తవ్యాలను విస్మరించే వారు దీనులకు తటస్థిస్తే దీనులు దిక్కుతోచక “దేవుడా నీవు దీనబాంధవునివని నిన్ను ప్రార్థించి బయలుదేరితిమే. ఎందుకు ఇలా చేసితివి తండ్రీ! నీ దయ మాపై చూపలేదేమి ”
అంటూ దేవునితో మొఱ పెట్టుకుంటారు.
దయతో ప్రసాదించిన విద్యావకాశములచే ఉద్యోగావకాశములచే దీనుల కష్టాలనుతీర్చే శక్తిని మహిమను అధికారములను పొందిన వారు –ధర్మాన్ని మరచిపోయిన ఫలితంగా మరుజన్మంటూ వుంటే వారికి దైవీయమైన పై నైపుణ్యాలను అధికారాలను ఎట్టి పరిస్థితులను ప్రసాదించడు.
దైన్యం అంటే ఏమిటో వారికి అర్థం అయ్యేలా అటువంటి కర్తవ్యద్రోహులకు దీనాతి దీనులుగా జన్మను ప్రసాదించి తనను ప్రార్థించి తనకు చేరువై దీనజన రక్షణావశ్యకతను గుర్తించేలా అనుగ్రహిస్తాడు.
మానవులమైన మనమైనా మనకు చెడ్డపేరు తెచ్చిపెట్టే కన్నబిడ్డలకైనా అధికారాలను బాధ్యతలను అప్పగించలేము కదా!
*** ** ***
దీనబాంధవుడైన భగవంతుని ప్రీత్యర్థం కర్తవ్యపాలనంలో భాగమైన విధ్యుక్త ధర్మాల్ని త్రికరణశుద్ధిగా నెరవేర్చటం మన ధర్మం. అదే మానవధర్మం కూడానూ.

భారతములో చెప్పబడ్డ కలియుగ ధర్మాలు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

ద్వాపరయుగము నాటివిషయము ఇది. మహాభారతములో పాండవులు కురుక్షేత్ర యుద్ధము అనంతరము వాన ప్రస్తాన పర్వంలో ఉండగా ధర్మరాజుకు కామ్యక వనములో మార్కండేయ మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు, మార్కండేయ మహాముని
పాండవులకు ద్రౌపదికి, కృష్ణుడు సత్యభామల సమక్షములో రాబోయే కలియుగధర్మాలను సవివరముగా వివరిస్తాడు. కలి యుగములో సంభవించబోయే పరిణామాలను వివరిస్తాడు. ద్యాపర యుగము ముగిసి కలియుగము త్వరలోనే మొదలవుతుంది అని ముని వారికి వివరిస్తాడు.
కలియుగములో జనులు అలవోకగా ఏమాత్రము జంకు లేకుండా అబద్దాలు ఆడటం ప్రారంభిస్తారు. కర్మకాండలు, దానధర్మాలు వారే స్యయముగా జరపకుండా వారి ప్రతినిధులచే జరిపించుకుంటారు. ప్రస్తుతము మనము బ్రాహ్మణుడు జపతపాలు చేస్తుంటే మనము “మమ”అనుకుంటూ క్రతువులను పూర్తిచేస్తున్నాము.
బ్రాహ్మణులు శుద్రులు చేసే పనులు చేయటము ఆరంభిస్తారు. శుద్రులు ధనసంపాదనలో పడతారు. క్షత్రియులు క్షాత్ర ధర్మాన్ని విడిచి మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమవుతారు. బ్రాహ్మణులు వేదాలను అభ్యసించటం మాని సర్వభక్షకులుగా (మాంసాహారము, శాఖాహారము రెంటిని తింటూ) మారుతారు.
శుద్రులేమో పూజలుపునస్కారాలో నిమగ్న మవుతారు.
ఈ విధముగా ప్రపంచము అంతా తల్లక్రిందులుగా నడుస్తుంది. అంటే ఎవరు వర్ణ ధర్మాలు ఆచరించరు ఇవన్నీ వినాశనానికి గుర్తులు. అనేకమంది దుర్మార్గులు రాజ్యాలు ఏలుతారు. వారి తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. ప్రజలు ఏవైతే పనులు చేయకూడదో ఆ పనులు చేస్తారు.
చిన్న వయస్సులోనే మరణాలు సంభవిస్తాయి. శారీరకముగా బలహీనులుగా ఉండి శక్తివిహీనులుగా ఉంటారు.
నిజము చెప్పరు. మానవుల జనాభా క్రమముగా తగ్గుతుంది జంతువుల సంఖ్య పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవిస్తాయి. జాతుల మధ్య వైరములు పెరుగుతాయి పనిపాటలు చేసుకునే వారు చదువుకున్న వారిని వారి పేర్లతో
సంభోదిస్తారు.
చదువుకున్నవారు పనివారిని “అయ్యా”అని సంభోదించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆహారానికి సువాసన రుచి వంటి లక్షణాల గురించి పట్టించుకోరు. ఆడవారు మంచి నడవడిని కోల్పోతారు. కరువునాటకాలు ఎక్కువ అవుతాయి. కూడళ్లలో వ్యభిచారులు ఎక్కువ అవుతారు. ఆడవారు చాలా మటుకు అణుకువను కోల్పోతారు. పాలఉత్పత్తి తగ్గుతుంది, పూలు తక్కువగా పూస్తాయి విజ్ఞులను మేధావులను చంపిన వారిని అబద్దాలకోరులైన పాలకులు సత్కరిస్తారు ప్రజలు పన్నుల భారంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
బ్రాహ్మణులు వ్యాపారాలలో దిగి ఆస్తులు సంపాదించుకుంటారు. చాలామంది డబ్బుమీద ఆశతో దొంగ సాధువులు సన్యాసులుగా మారి చేయకూడని పనులను చేస్తారు. అంటే సురాపానం వేశ్యా సంపర్కము వంటి పనులలో నిమగ్నమై ఉంటారు.
ఆశ్రమాలు ఆశ్రమాలు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారతాయి. మనము ప్రస్తుతము చూస్తున్నది ఇవే. వర్షాలు సకాలములో పడక పంటల సరిగా పండవు.
మనుషులు క్రూరముగా ఆలోచిస్తూ క్రూరమైన పనులు చేస్తారు. పగప్రతీకారాలలో ఆనందాన్ని అనుభవిస్తారు. భూమి అంతా
పాపముతో నిండిపోతుంది. సత్పురుషులు ఎక్కువకాలం బ్రతకరు. చాలామంది ధనాన్ని అక్రమ మార్గాల్లో సంపాదిస్తారు.
మంచివాడు సుఖముగా బ్రతకలేడు దొంగలు మోసగాళ్లు దుర్మార్గులు హాయిగా బ్రతుకుతారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో కూడా అసభ్యముగా సంచరిస్తారు. వారు అనుకున్నది సాధించటానికి తప్పుడు మార్గాలను అవలంభిస్తారు.
ఇతరుల ఆస్తులను ఆక్రమించుకోవటానికి ప్రజా ధనాన్ని దోచుకోవటానికి వెనుకాడరు. అడిగినా నిస్సుగ్గుగా తప్పేంటి అని ఎదురు
ప్రశ్నిస్తారు. జనసంచారాలలో దేవాలయాలలో జంతువులు పక్షులు, పాములు వంటివిదర్శనమిస్తాయి.
ఆడపిల్లలు చిన్నవయస్సులోనే గర్భవతులవుతారు, అలాగే చిన్నవయసు బాలురు తండ్రులవుతారు. యుక్త వయస్సు నాటికి జనులు బలహీనులవుతారు వారి ఆయుప్రమాణము తగ్గిపోతుంది.
యువకులు ముసలివారుగాను ముసలివారు యువకులుగా(కృత్రిమ వేష ధారణతో) ప్రవర్తిస్తారు.
భార్యలు నీతి తప్పి భర్తలు బ్రతికి ఉండగానే పరపురుషులతో సంభంధము పెట్టుకొని భర్తలను మోసగిస్తుంటారు.
ఈ విధముగా క్రమముగా నీతి సన్నగిలిపోవటము జరుగుతుంది అని మార్కండేయ మహాముని ధర్మరాజు మరియు ఇతరులకు వివరిస్తాడు.
మనము ప్రస్తుత సమాజాన్ని గమనిస్తే అవన్నీ నిజాలే, అక్షరాలా జరుగుతున్నాయని గమనించవచ్చు.
ప్రస్తుతము మనము కలియుగములోని ప్రధమ పాదములోనే వీటిని గమనిస్తున్నాము. యుగధర్మాన్ని అనుసరించి నైతిక విలువలకు అర్ధాలు మారుతున్నాయి
ద్వాపర యుగాంతానికి కురుక్షేత్ర యుద్ధము జరిగి ధర్మము రక్షింపబడింది. అలాగే కలియుగములో కూడాపాపము పెరిగి కలియుగములో నాలుగు పాదాలు పూర్తి ఆయేనాటికి భగవంతుడు మళ్లాఅవతారము ఎత్తి ధర్మాన్ని రక్షిస్తాడు అని హిందువుల ప్రగాఢ నమ్మకము
బ్రహ్మముగారి తత్వాలలో కలియుగ అంతానికి కొన్ని లక్షణాలు చెప్పారు. యాగంటిలోని బసవన్న(రాతి విగ్రహము) లేచి రంకె వేస్తుందని, కృష్ణా నది పొంగి కనకదుర్గమ్మ ముక్కు పూడకను తాకుతందని ఇలా కొన్ని లక్షణాలను తెలిపాడు ఇంకా ప్రధమ పాదములోనే ఉన్నాము కాబట్టి ఆ లక్షణాలు చూడటానికి చాలా కాలము ఎదురుచూడాలి.