విశ్వపుత్రిక వీక్షణం – భూమి ద్వారం మూసుకపోతోంది

రచన: విజయలక్ష్మి పండిట్.

మన దేశంలో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళలలో చిన్నవయసులోనే 15-45 ఏండ్ల లోపే గర్భసంచి తొలగింపుకు లోనవుతున్నారని, ఇది మహిళలలను ఆరోగ్య సమస్యలకు గురిచేయడమే కాకుండా కొన్ని బీద, వెనుకబడిన, నిరక్షరాస్య మానవ సమూహాలు, జాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్న నిజాలు.

ఇటీవల మహిళా దినోత్సవ సధర్భంగా “ వసుంధర “ పురస్కార గ్రహీత గైనకాలజిస్టు డా. వెంకట కామేశ్వరి గారి ప్రత్యక్ష అనుభవం ఆమె మాటలలో మనలో తీవ్ర ఆలోచనలను రేపుతుంది. ఇది పెరుగుతున్న స్రీల
ఆరోగ్య, ఆర్థిక, మానవ జనాభా, జాతి అంతరించిపోయే వైపు నిశ్శబ్ధంగా అడుగులేస్తున్న తీవ్ర సమస్య.
ఆమె పంచుకున్న నిజాలు నాలో రేపిన భయాలోచనలు ఈ నా కవితాక్షరాలుగా రూపు దిద్దుకున్నాయి.

***

“భూమి ద్వారం మూసుకపోతోంది”

“ఇదిగో ఇటు చూడండి
నన్ను చూడండి ..,
నిర్ధయగా నన్ను కోసి పారేసిన
నా దుర్గతిని తిలకించండంటూ”…
గుట్టలుగా గుట్టలుగా పడి
గడ్డకట్టిన రక్తమాంసాల దిబ్బ
ఏడుస్తూ పిలుస్తూన్న భావన..!?

కొంచెం దగ్గరకెళ్ళి పరిశీలించి
అవాక్కయినాను..అర్థమయింది
ఆ ఆర్థనాదాలెవరివో…
ఎవరో కాదు.., అవి
నిర్జీవంగా పడివున్న
మాతృమూర్తి మందిరాలు
మనిషికి ప్రాణంపోసే జీవామృతకలశాలు
ప్రకృతిని వికశింపచేసే ఆలయాలు
అవి స్త్రీ పవిత్రగర్భాశయాలు…!

ఎవరిదీ అజ్ఞానాంధకార చర్య?
ఎవరీ అమానుష కార్యకర్తలు..?!
మనిషి మూర్ఖత్వం స్వార్థం
పడగవిప్పి బుస కొడుతున్న వైనం
గుడిలో గర్భాలయాన్ని పడగొట్టినరీతి
మాతృమూర్తుల శరీరాలయాలలో
పవిత్ర గర్భాశయాన్ని విడగొడుతున్నారు..,

మనిషి జాతి మనుగడకు
తెరదించు తున్నారు
కవిపించడంలేదా..?!
మాతృమూర్తుల గర్భాశయాల నాశనం
వినిపించలేదా ఆ …గర్భాశయాల గోష.?!
భూమిపై మూసుకుపోతూంది
మనిషి సంక్రమణ ద్వారం..?!

నిరక్షరాస్యత చీకటి వలయంలో చిక్కుకున్న
అభంశుభంఎరుగని అమాయక పడతులు
తమ అర్ధాయుషును ఆ దిబ్బలో వదలి
నడిచిపోతున్నారు జీవశ్చవాలై..,

అదిగో అటుచూడండి
భూమిపై గుంపులు గుంపులుగా
నిష్క్రమిస్తున్నాయి గర్భాశయాలు
మాతృమూర్తి ఆలయాలు
గర్భాలయంకూలిన శిధిలాలయాలు
స్త్రీ శిధిలాలయాలు
శిధిలాలయాలు..?!

యోగాసనం 2

రచన: రమా శాండిల్య

హరి ఓం

భద్రాసనం

భద్రాసనం అంటే ఆసనం పేరులోనే భద్రత యిముడ్చుకున్నది. అంటే ఆ ఆసనం వేయడం వలన మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది అని వేరే చెప్పక్కరలేదు కదా.

భద్రాసనం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది అరుగుదల ఆహారం ఆరగడానికి పనికి వస్తుంది. కాంష్టిపెషన్ ఉండదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ , ఇన్డేజెషన్ ఇలాంటి వాటికి కూడా చాలా మంచిది.

ఈ రోజుల్లో ప్రతివారికి నడుము నొప్పి ఉంటోంది ఆ నొప్పికి మందు ఈ భద్రాసనం.

కాళ్ళు , తొడలు, పొత్తికడుపు దగ్గరవున్న కొవ్వు కరగడానికి ఈ ఆసనం చాలా ఉపయోగం. చిన్నగా మొదలు పెట్టి ఎంతసేపు కూర్చోగలిగితే అంతే సేపు చెయ్యాలి. ఆసనంలో ఉన్నంతసేపు శ్వాసను గమనించాలి. ఆలోచనల మీద ధ్యాస పెట్టొద్దు.

కొంతమంది ధ్యానం గురించి , మరి కొందరు ప్రాణాయామం చెప్పమని అడుగుతున్నారు.

వారందరు కూడా మొదట శాంతిగా కూర్చోవడం వస్తే గాని అవి చెయ్యలేరు. అందుకే మొదట ఆసనంలో కూర్చోవడం సాధన చేయాలి.

ఆసనం వెయ్యడం అనే నియమంతో సాధన చేస్తున్నాము మనం.

పద్మాసనం

ఈ ఆసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొందాం
పద్మాసనం వేయడానికి ముందుగా కాళ్ళు రెండు చాపి కూర్చోవాలి. తరువాత ఒక కాలుని చాపి, రెండవకాలు మడిచి తొడమీద పాదం వచ్చేలా పెట్టుకోవాలి. అదే విధంగా రెండవ కాలు కూడా పెట్టుకోవాలి.
ఈ ఆసనం వేయడం వల్ల తొడల దగ్గర నడుములో పెరిగిన కొవ్వు కరిగి, కూర్చోవడానికి శక్తి పెరుగుతుంది.
వెన్నుముక గట్టి పడుతుంది. ఆసనం వేయడం మొదలైనప్పటి నుంచీ విశ్రమ స్థితి వరకు శ్వాస మీద ధ్యాస ఉండాలి. పై పెదవి మీద గాలిని గమనిస్తూ ఉండాలి.

ఇంక పద్మాసనం రెండవ స్థితి.

మొదట పద్మాసనం వేసి కూర్చున్నాక అరచేతిలో బొటన వేలు పెట్టి చూపుడు వేలిని వదిలేసి మిగిలిన మూడు వేళ్ళతో మూసి గన్ ఫోజు పెట్టి కూర్చోవాలి. చూపుడు వేళ్ళతో చెవులను గట్టిగా మూసుకొని నోరు కూడా బంధించి ఉంచి గొంతుతో శబ్దం చెయ్యాలి.
ఆ శబ్దం మనసుతో ఓం అని వింటూ ఉండాలి. ఈ రకంగా శబ్దం చేసే సమయంలో శ్వాసమీద ఆంటే మన పై పెడవిమీద మాత్రమే ధ్యాస ఉండాలి.
ఈ రకంగా 2నిముషాల నుంచి 5నిముషాల సమయం ఉండొచ్చు. ఈ క్రియ చేసిన వెంటనే కళ్లు తెరవ వద్దు. 5 నిమిషాలు శ్వాసను, శరీరాన్ని గమనిస్తూ ఉండాలి.
పద్మాసనం వేయలేనివారు సుఖాసనంలో చేయవచ్చు. క్రింద కూచోలేనివారు కుర్చీలో కూడా కూర్చుని చేయవచ్చు.
ఇలా 40 రోజులు చేయడం వల్ల పొట్టను తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. బరువు తగ్గుతుంది ఇబ్బంది పెట్టే ఆలోచనలు తగ్గుతాయి.
పద్మాసనంతో చేస్తే ఫలితం తొందరగా చూడొచ్చు కాకపోతే కొంచెం ఆలస్యమయే అవకాశం ఉంటుంది.
దీనితో పాటు 11 గాని, 21 గానీ ఓం కారం పెద్ద శబ్దంతో చేసి 10 నిముషాలు మనము ఏ శబ్దం పైకి చేసామో, అదే శబ్దాన్ని మనసుతో వింటూ కూర్చోవాలి.

పద్మాసనం – శాంతి మంత్రం

పద్మాసనంలో చేసే రెండవ క్రియను శాంతి మంత్రము అంటారు.రెండూ చేయడం వలన బాధపెట్టే ఆలోచనల నుంచీ స్వాంతన పొందవచ్చు. 5 నిమిషాల సమయం నుంచీ పదిహేను నిమిషాలు వరకు చేయవచ్చు.

పద్మాసనంలో అలా కూర్చోవడం వలన, ధ్యానం మీద ఏకాగ్రత పెరుగుతుంది. మన వెన్నుపూస నిటారుగా ఉండడాని సహకరిస్తుంది. కాళ్ళు రెండు మడవడం వలన, పొత్తికడుపులో అగ్ని ప్రజ్వలన జరిగి, మనం తిన్న ఆహారం అరగడానికి ఉపయోగపడుతుంది. మన నరాలు మరియు కండరాల పై ఒత్తిడి తగ్గి, blood pressureని కూడా నియంత్రిస్తుంది.

తర్వాత ఆసనం మార్జాలాసనం. లేదా గోవాసనం.

Cat pose or cow pose ఈ ఆసనం వేయడం వలన నడుము నొప్పి పూర్తిగా తగ్గుతుంది.
నడుము నొప్పి ఉన్నవారు కూడా వేయడానికి ట్రై చేయచ్చు కానీ శరీరము సహకరించి నంతవరకు మాత్రమే మరీ నొప్పి ఉంటే వేయక పోవడం మంచిది.
నడుము నొప్పి లేనివారికి ఆసనం వేయడం వలన వెన్నుముకకు వీపు మొత్తం బలంగా వుంటాయి. ఈ ఆసనం వేసే పద్ధతి పది నెలల పిల్లలు మోకాళ్ళ మీద పాకడానికి మొకాళ్ల మీద వంగి, నడుము క్రింద భాగం కొంచం పైకి ఎత్తి, ఆ టైమ్ లో ముందు తల్లీ నుంచుని పిలిస్తే తల పైకెత్తి చూస్తారు. అలాంటి స్థితిలో ఉండడమే ఈ ఆసనం స్థితి పిల్లిలా ఉండగలగడం. ఈ ఆసనం కూడా రెండు నిమిషాలు నుండి పదిహేను నిమిషాలు వరకు చేయవచ్చు.
ఆసనం మొదలు పెట్టినప్పుడు శ్వాసమీద దృష్టి పెట్టి ఆసనం మరియు విశ్రాంతి స్థితి వరకు కూడా శ్వాస మీద దృష్టి ఉండాలి. పై పెదవి మీద గాలిని గమనిస్తుండాలి. మొదటి రోజు నేర్చుకున్న ఒక విషయం మళ్లీ గుర్తు చేసుకుందాం. ఆసనానికి మూడు స్థితులు ఆసనం వేయాలి అని శరీరాన్ని, మనసుని సిద్ధం చేయడం. ఆసనం వేసిన స్థితి, విశ్రమస్థితి ఆసనానికి ఇవి మూడు తప్పనిసరి.
ఎక్కువ ఆసనాలు తక్కువ సమయం కాకుండా తక్కువ ఆసనాలు ఎక్కువ సమయం ఉండేలా చూడండి ఫలితం ఎక్కువగా వుంటుంది. శ్రీ గురుభ్యోనమః

నడక-నడత

రచన: శారదాప్రసాద్

(Eingeschränkte Rechte für bestimmte redaktionelle Kunden in Deutschland. Limited rights for specific editorial clients in Germany.) MOHANDAS GANDHI (1869-1948). Hindu nationalist and spiritual leader. Photographed at the Sevagram Ashram. (Photo by Rühe/ullstein bild via Getty Images)

ఈ రోజుల్లో ప్రతివారూ నడకను గురించి మాట్లాడేవాళ్లే! సాధారణ నడక చాలని నా అభిప్రాయం. బజార్ కెళ్ళి మన పనులు మనం చేసుకుంటే చాలు. అతిగా నడవటం వలన అనర్ధకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గుండెను వేగంగా పరిగెత్తిస్తుంటారు. ఈ నడక పిచ్చివాళ్లల్లో విపరీతమైన పోటీ కూడా ఉంటుంది . నేను 10 రౌండ్లు వేశానని ఒకాయన అంటే మరొకాయన నేను 12 వేసాను అంటాడు! ఇంతకీ ఆ రౌండ్స్ ఏమిటో? నడక పూర్తి అయిన తర్వాత , స్టేడియం వెలుపలే
కొన్ని తినుబండారాల స్టాల్స్ ఉంటాయి. అలసి సొలసిన ఈ నడకదారులు-ఇక షాపుల మీద పడి తెగతింటారు. అంతసేపు నడిచినవారికెవరికైనా ఆకలి కావటం సహజం! కడుపు మాత్రం ఊరుకుంటుందా? ఒక కప్ కాఫీ తాగితే 250 గ్రాముల ఫాట్ పెరుగుతుందట! ఈ లెక్కన ఈ నడకరాయుళ్లకు ఫాట్ (క్షమించండి–పొగరు కాదు)ఎంత పెరుగుతుందో మీరే ఆలోచించండి! నా స్నేహితుడొకడు 100 కిలోల బరువు ఉంటాడు, షుగర్ వ్యాధి, రక్తపోటు లాంటి qualifications అన్నీ ఉన్నాయి. రోజూ ఉదయం , సాయంత్రం రెండుపూటలా నడుస్తాడు. ఉదయం నడక పూర్తి కాగానే మార్గ మధ్యంలో అల్పాహారం చేసివస్తాడు. ఇంట్లో తయారు చేసేటప్పటికి ఆలస్యం అవుతుందని! ఇక సాయంత్రం పూట నడక పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు, బజ్జీలు , పునుగులు . . . తెచ్చుకుంటాడు. రాత్రి 11 గంటలకు ఆకలవుతుందట ! అంత ముందు చూపున్న క్రాంతదర్శి ఆయన! ఇంత వాకింగ్ చేస్తున్నప్పటికీ ఆయన బరువు ఒక గ్రాము కూడా తప్పకపోగా, ప్రస్తుతం 105 కిలో వైపుగా అభివృద్ధివైపు దూసుకెళుతున్నాడు . చాలా రోజుల క్రితం ఒక Cardiologist మిత్రుడు చెప్పింది ఏమంటే–సాధారణ నడక చాలు.
అమెరికాలోని కొందరు వాకింగ్ షూస్ అమ్మేవాళ్ళు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ని పాటించారని , అసలు సీక్రెట్ చెప్పాడు. వాకింగ్ వలన రకరకాల సమస్యలు కూడా లేకపోలేదు. కొందరికి బౌల్స్ regulate అయ్యి ఎక్కడ పడితే అక్కడికి టాయిలెట్ కు వెళ్లాల్సిందే, లేకపోతే స్వచ్ఛ భారత్ కాస్తా మరేదో అవుతుంది. నాకు కూడా హార్ట్ సర్జరీ అయిన తర్వాత, పిల్లలు అలారం పెట్టి మరీ నిద్రలేపి బలవంతంగా వాకింగ్ కు పంపించేవారు. నాకు companion ఆ బౌలింగ్ ప్రాబ్లెమ్ ఉన్న స్నేహితుడు. ఎక్కడికి వాకింగ్ కు వెళ్ళాలి అనేది ఆయనే డిసైడ్ చేస్తాడు. దగ్గరలో స్నేహితుల ఇళ్ళు ఉండాలి మరి! ఎక్కడ తొందరైతే , అక్కడ పని పూర్తి చేసుకోవటానికి! చలికాలం అయితే , మంకీ కాప్, స్వెట్టర్ , చేతిలో ఒక కర్ర , షూస్ . . ఇవన్నీ వేసుకొని వెళ్లేవారం ! చేతిలో కర్ర ఎందుకంటే, కుక్కలు వెంటపడకుండా! వాకింగ్ ను ఎప్పుడు ఆపెయ్యాలో నిర్ణయించేది కూడా నా మిత్రుడే! కాదంటే తిడతాడు, మొహమాటం లేకుండా! జీవితంలో నేను భయపడేది ఆ మిత్రుడికే ! ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా చెప్పిన మాట వినకపోతే, మీ స్నేహితుడికి చెబుతాం అని బెదిరించేవారు కూడా! తెల్లవారుఝామున 4 గంటలకు ప్రారంభించే నడక ఉదయం 8 గంటలకు ముగుస్తుంది. ఈ లోపు హైదరాబాద్ నుండి నా తమ్ముడు రెండు సార్లు ఫోన్ చేసి, ఇంకా వాకింగ్ నుంచి రాలేదా? అయితే కొద్ధిసేపట్లో హైదరాబాద్ చేరుకుంటాడేమో అని ఛలోక్తి విసిరేవాడు. కొంతకాలం ఇలా అందరికీ భయపడి నడిచాను, ఇష్టపూర్వకంగా కాదు! నా పిల్లలు ‘చూడు నాన్నా! ఉదయాన్నే ఎంతమంది నడుస్తున్నారో? నీకెందుకు ఇంత బద్ధకం? ‘ అని దెప్పి పొడిచేవారు. విసుగుపుట్టి వాళ్లందరికీ ఒకటే సమాధానం చెప్పాను. వాళ్లందరికీ ఏదో ఒక రోగమో, రొస్టో ఉంటుంది, లేకపోతే ఆ చలిలో ఎందుకు నడుస్తారని తిరగపడి చెప్పాను. మా బంధువుల్లో ఒకామె ఇలానే అతిగా నడిచి , మోకాళ్ళ నొప్పులతో బాధపడి, ఆపరేషన్ కూడా చేయించుకుంది.
ఏదీ అతి కాకూడదు. దేహమే మనం ఏ పనులు చేయాలో నిర్ణయిస్తుంది. ఒకప్పుడు మంతెన వారు -రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగమని చెప్పారు. మనది కడుపా లేక పెదకళ్ళేపలి చెరువా? మనం ఎన్ని నీళ్లు తాగాలో దేహం డిమాండ్ చేస్తుంది. మనుషులే సిజేరియన్ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు, కుక్కలు ఎందుకు చేయించుకోవని అర్ధం పర్ధం లేని ఉపన్యాసాలిచ్చేవారు. ఆయన చెప్పినట్లు చేస్తే , నాకు విరేచనం సాఫీగా అయ్యేది . అదే విషయాన్ని ఆయనకు నా బాణీలో –టాయిలెట్ కు పోయినప్పుడల్లా మీరే గుర్తొస్తున్నారని చెప్పాను. ఇంత ఆహార నియామాలు పాటించిన ఆయనకు బై పాస్ సర్జరీ అయిందని ఎవరో చెప్పారు. ఆయన తర్వాత ఏచూరి వారు కొంతకాలం ఊదరగొట్టారు. ఇంట్లోనే అన్ని మందులను చేయించుకోమని! వాటిని ఇంట్లో చేసుకోవటం కన్నా, బైద్యనాద్ వారి మందులు కొనటం వలన ఖర్చు కూడా తక్కువే!
మా అపార్ట్మెంట్ లో ఒక నా వయసంతామె, ఒక బుట్ట గులాబీ పూలు తెచ్చుకుంటూ కనపడింది. ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉందా అని అడిగాను. దానికి ఆమె చెప్పిన సమాధానం విని సిగ్గుతో తలదించుకుని వెళ్లాను! ఇంతకీ ఆ సమాధానము ఏమిటంటే ఒక పెద్ద గంగాళం నిండా నీళ్ళుపోసి, ఆ నీళ్ళల్లో గులాబీలను వేసి, ఒక అరగంట నగ్నంగా కూచుంటే తెల్లపడతారట! గంగాళం ముందే కొని ఉంచారట! ఇదంతా పిచ్చి వ్యామోహం, వృద్ధాప్యంలో యవ్వనంగా కనిపించాలనుకోవటం కూడా జబ్బేనేమో! 70 ఏళ్ళు వయసుదాటిన వారు కూడా జుట్టుకు రంగు వేసుకోవటం, ఉన్న కాస్త జుట్టును కత్తిరించుకోవటం దేనికో? తర్వాత వీరమాచనేని వారొచ్చారు. మాట్లాడితే కొబ్బరి నూనె తాగమంటాడు ఆయన! టాయిలెట్ కు పోతే ఆ జిడ్డు ఒక పట్టాన వదలదు. ఇప్పుడు ఖాదర్ వలి గారి టైం. అన్ని ఆకులతో కషాయం చేసుకొని తాగమంటాడు. కొన్ని ఆకులను మనం గురుపట్టలేం! పొద్దున్నేలేచి పోటీల పందెం లాగా జామచెట్ల మీద దాడి చేస్తున్నారు జనాలు. చెట్టుకు ఒక్క ఆకు కూడా కనపడటం లేదు. చెట్లు కూడా తిరుపతి పోయోచ్చాయా అన్నట్లుగా ఉంది.
సిరి ధాన్యాలను విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు. కొర్రలతోటి కారప్పూసలను చేసి అమ్ముతున్నారు. ప్రతి దాంట్లో వ్యాపార దృక్పధం తెచ్చేది-గుజరాతీలు మరియు మనమేనేమో! ఇంతకీ నేను చెప్పోచ్చేదామంటే, ఏదైనా మితంగా తింటే చాలని. ఈ సందర్భంలో మా గురువుగారైన ‘ ముని’ మాణిక్యం నరసింహారావు గారు కాంతానికి ఒక సారి దీన్ని గురించే ఇలా క్లాస్ పీకారట – మనం పండ్లుతిని తొక్కలను పారేస్తాం , అసలు తొక్కలోనే విటమిన్లు అన్నిఉంటాయని! దానికి కాంతం–సరేలేండీ! రేపటి నుంచి పళ్ళను నేనూ, పిల్లలం తిని , తొక్కలను మీకుంచాతాం అంది ! మునిమాణిక్యం వారు బిత్తర చూపులు చూడక తప్పలేదట! బాబారాందేవ్ (పతంజలి) వారిని గురించి కూడా పనిలో పనిగా ఒక్క మాటలో చెబుతా! కడుపును క్లీన్ చేసుకోవట కోసం ఆయన కడుపును వెన్నెముకకు తాకించి మరలా దాన్ని సాధారణ స్థాయికి తేవటం మీరు కూడా టీవీల్లో చూసేవుంటారు. ఒకసారి అలా కడుపు లోపలికిపోయి మళ్ళీ సాధారణ స్థితికి రాకపోతే ఆపరేషన్ చేయించుకున్నాడని వినికిడి! ఇలా రాస్తూ పోతే ఎంతైనా చెప్పొచ్చు! దాదాపుగా సంవత్సరం పైగా నడిచిన జగన్ ను గురించి ఒక్క మాట కూడా చెప్పకుంటే , ఇది అసంపూర్ణం అవుతుంది! ఇక రోజు నడవక పోతే ఆయనకు తోచదేమో! అభ్యాసం వ్యసనం కాకూడదు!

 

నడక ముఖ్యమే! దానికన్నాముఖ్యమైంది నడత!

ఇది ఎవరినీ నొప్పించటానికోసం నేను వ్రాయలేదు, కొంత యదార్ధం లేకపోలేదు. వివరణ ఇచ్చినా ఇంకా ఎవరైనా బాధపడితే అది వారి ఖర్మ!

యోగాసనాలు 1

రచన: రమా శాండిల్య

హరి ఓం
మిత్రులందరికీ శుభోదయ వందనం

ఈ రోజు నుంచి యోగాను గురించి తెలుసుకొందాం

యోగా అనగానే అందరికీ ఆసనంలో కూర్చోడం అనుకుంటాము. కదలకుండా ఒక చోట కూర్చోవడం అనుకుంటాము

కానీ మా గురుదేవులు యోగా అంటే ఒక క్రొత్త అర్థం చెప్పారండి.

యోగా అంటే యోగం అంటే మహర్జతకం అని అర్థంట.

అందుకే ప్రతి వారు రోజులో కొంత సమయం ఆ యోగాన్ని అనుభవించి తెలుసుకోవాలని అనేవారు.
కొంత సమయం యోగా చేయడం వల్ల 24 గంటల సమయం ప్రశాంతంగా ఉండొచ్చు

యోగాను 3 భాగాలుగా చేస్తుంటాం. అవి ఆసనం, ప్రాణాయామం, ధ్యానం కానీ అవి మూడు కలిసి ఒక్కటిగా చేయాలి ఆ పద్ధతిలో చేస్తే మనకు ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే యోగా అంటే ఆసనం, ప్రాణాయామం, ధ్యానం కలిపి చేసే ప్రక్రియ.
ఆసనం గురించి తెలుసుకుందాము ఏ ఆసనం వేయాలన్న మూడు స్థితులు ఉంటాయి.
ఒకటి శరీరాన్ని, మనసుని ఆసనం వైపుకు దృష్టి మళ్లేలా చేయడం.
రెండు ఆసనంలో కూర్చుని ఆ స్థితిని అనుభవించడం.
మూడు విశ్రాంతి స్థితి.
తప్పని సరిగా ఈ మూడు స్థితులు గమనించాలి.
ఆసనం వేయడం మొదలు పెట్టిన పటినుంచి విశ్రమా స్థితి అయేవరకు మన శ్వాసను గమనిస్తూ ఉండాలి.
శ్వాస అంటే పై పెదవి మీద తగిలే గాలి రూపంగా వచ్చే ఉచ్వసా, నిశ్వస లను గమనిస్తూ ఉండాలి.
ఆసనం వేస్తున్నంతసేపు కళ్లు మూసి ఉంచాలి.
ఆసనం నుంచి విశ్రమం అయ్యేవరకు అయ్యాక కూడా కొంచంసేపు అదే స్థితిలో ఉండాలి
రోజు యోగాకు కూర్చున్నపుడు ఓం కారం మూడుసార్లు గట్టిగా నాభి నుంచి తల వరకు ఊహిస్తూ శబ్దం చేస్తూ తల పై భాగానికి చేరగానే పెదవులు మూసి గొంతుతో శబ్దం చేస్తూ శబ్దం తక్కువ చేయాలి ఇలా మూడు సార్లు చేసి ఆసనాలు మొదలు పెట్టాలి.
ముందుగా సుఖాసనం గురించి తెలుసుకుందాం..

సుఖాసనంలో అందరం

ఈ ఆసనం వేయడం అందరికి తెలుసు. సాధారణంగా దీన్ని ఒక ఆసనం అనుకోరు. బాసింపట్టు వేసి కూర్చోవడం అని చెప్తారు. కానీ ఆసనాల్లో కెల్లా సుఖమైన ఆసనం అందుకే దీన్ని సుఖాసనం అంటారు.
ఎక్కువ సేపు కూర్చుని ఏ పనైనా చేయగల ఆసనం ఇది. ఈ ఆసనంలో పూజలకు, ధ్యానానికి ఎక్కువసేపు కూర్చోడం అవసరమవుతుంది
ఆసనం వేయడం వలన వెన్నుముక నిటారుగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది
సుఖాసనంలో ధ్యాన ముద్రలో కూర్చుంటే శాంతి పెరుగుతుంది. ప్రాణాయామం చేయడానికి అణువు అనువుగా ఉంటుంది
రోజు సుఖాసనంలో పది నిమిషాలు నుంచి కూర్చో గలిగినంత సేపు కూర్చోవచ్చు

శ్రీ గురుభ్యోనమః