ఖాజాబీబి

రచన: డా.కె . మీరాబాయి (. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం )

చింత చిగురు అమ్మే ఖాజాబీబి చాన్నాళ్ళుగా కనబడడం లేదు.
” చిగురమ్మోయ్ ” అంటూ వణికే గొంతుతో ఖాజాబీబి కేక వినబడగానే కాలనీ లోని ఇల్లాళ్ళు హడావిడిగా నిద్ర లేచి గుమ్మం లోకి వస్తారు. పేరుకు చింతచిగురు ఖాజాబీబి అని అంటాముగానీ , ఆకు కూరలు, రేగి పళ్ళు, సీతా ఫలాలు, జామ పళ్ళు, ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో ఇంటి ముందుకు తీసుకు వచ్చి అమ్ముతుంది.
ఆమె ఆకారం చూస్తే ఇంత ఓపిక ఈమెకు ఎక్కడిదీ ఆన్న ఆశ్చర్యం కలిగేట్టు వుంటుంది.. ఒక్కిపోయిన పోయిన ఒళ్ళు, చికిలించిన కళ్ళు, ముడుతలు పడిన ముఖం, వెలిసి పోయిన చీర, వదులుగా వేలాడే రవిక, పండిపోయిన జుత్తు, వంగిపోయిన నడుము, చేతిలో కర్ర, తల పైన ఆకుకూరల బుట్ట ఇదీ ఖాజాబీబి అవతారం.
కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచే చిన్న టేకూరు ఖాజాబీబిని ఎరుగని వాళ్ళు మా కాలనీలో లేరు అనాలి.
అనప గింజలు, పచ్చి చెనిక్కాయలు తెచ్చినప్పుడు ముందుగా మా ఇంటికే వస్తుంది .
నా బోణీ మీద నమ్మకం ఆ అమ్మికి అందుకే ముందు నాకే అమ్మకం. బుట్ట కింద పెట్టి , పైన కప్పిన తడి బట్ట తీస్తే ఇంద్ర జాలికుడిలాగా రకరకాలు బయటకు తీస్తుంది. . ఆకుకూరలు పెద్ద కట్టలను ఒబ్బిడిగ విడదీసి చిన్న కట్టలుగా కట్టి మనకు భలే మంచి బేరం అనిపించేలా నాలుగు కబుర్లు చెప్తూ అమ్మేస్తుంది.
” కాపీ చుక్క పోయవూ? ” ఆంటూ మనదగ్గరే కొసరు లాగుతుంది.
మొలనున్న చిన్న చిక్కం సంచీ లో నుండి రెండు తమలపాకులు, ఒక్క పేడు తీసుకుని బుగ్గన పెట్టుకుని వెడద నవ్వు నవ్వుతుంది.
” చింత చిగురు తేవడం లేదేమి ఖాజాబీబి? ” అని అడిగితే ” చెట్లన్నీ కొట్టేసి మిద్దెలు కడుతుంటే వాన చినుకు పడకుంటే చిగురు యాడ తెచ్చేది ?” అని మనల్నే ఎదురు ప్రశ్న వేస్తుంది.
“ఆకుకూరలు కూడా ఇంత ప్రియమా? ” అంటే ” బోర్లు ఏసి ఏసి భూమి గుండె ఎండిపాయె నేనేం చేతు?” అని తప్పు మనదేనంటుంది.
సంక్రాంతి కైనా, ఉగాదికైనా ఖాజాబీబి మామిడాకులు, అరటి పళ్ళు తెస్తేనే పండగొస్తుంది మా కాలనీకి.
ఇంత గా మాకందరికీ అలవాటయిపోయిన ఖాజాబీబి చాన్నాళ్ళుగా రాక పోయేసరికి ముసలామె మంచాన బడిందా ఏమి అని అందరూ అనుకోబట్టిరి.
నాకైతే ఇంకా గుబులు బుట్టింది. ఎందుకంటే అదేమీ కర్మమో నా చేత్తో చింత కాయ తొక్కు పెడితే నెల్లాళ్ళకే బూజు పడుతుంది .ఆమాటె ఒకసారి ఖాజాబీబితో అంటే ” నేను దంచిస్తాను చూడు మరి రెండేండ్లయినా కొత్త తొక్కు వున్నటే వుంటుంది ” అంది.
” నువ్వా? ” అన్న నా సందేహం చూసి “చేత్తో ముట్టనులే చెక్క గరిటతొ తీస్తా” అని దారి చూపింది.
” నువ్వేమి దంచగలవు అవ్వా? “అని మొహమాట పడుతుంటే ” జొన్నలు దంచిన చేతులు నావి ” అని గుండమ్మ కథలో సావిత్రి అంత ధీమాగా చెప్పింది.
కాయలన్నీ శుభ్రంగా తుడిచి, నేను పసుపు, ఉప్పు మెంతిపొడి తెచ్చి పెడితే ఒక్కో వాయికీ సరిపడా వేస్తూ చుట్టు చిందకండా దంచింది
చింత తొక్కు జాడీలోకి గరిటతో వేసి ” మరి మా ముసలాయనకు అన్నంలోకి ఇంత పెట్టవూ!” అని అడిగితే ఆ మాత్రం నాకు తోచలేదే అని సిగ్గేసింది.
నిజంగానే ఖాజాబీబి పెట్టిన చింత కాయ పచ్చడి ఏడాది దాటినా పచ్చగా కొత్త తొక్కు లాగ వుంది.
అందుకే ఈ ఏడు పచ్చడి పెట్టే సమయానికి ఖాజాబీబి రావడం మానేసిందని నాకు దిగులు గా వుంది.
. ” బుట్ట దించేదానికి ఒక చేయి వెయ్ అమ్మా ” అంటుంది. కడుపు నిండా బిడ్డలను కన్న తల్లి ఖాజాబీబి.
“ఈ వయసులో ఎందుకంటే కష్టపడతావు ఖాజాబీబి. నీ బిడ్డలు మీ ఇద్దరు ముసలోళ్ళను చూడరా? ” అని అడిగితే నోరంతా తెరిచి నవ్వింది ఆ రోజు.
” ఈ రెండు చేతుల కష్టం తో నలుగురు కొడుకులను , ఒక కూతుర్ని సాకినాను. వాళ్ళ నాయన బండికింద పడి చేయి విరగ్గొట్టుకునే. ముసలాయననూ బిడ్డ లెక్కన సాకాల్సి వచ్చే . వాండ్లకందరికి పెడ్లిండ్లు చేసేంత వరకు కూలికి పోతూంటి. నలుగురు కొడుకులు కలిసి మా ఇద్దరినీ సాకేదానికి కాలేదు. ఎవరి సంసారం వాండ్లదే. నేను మా ముసలోడు వేరుగా వుంటము. నడుము వంగినాక కూలికి పోలేక ఆకుకూరలు అమ్మబట్టినా. ” అంది.
చింత చిగురు అమ్మే చిన్న టేకూరు ఖాజాబీబి చాన్నాళ్ళుగా రాకపాయె అని కాలనీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
వెలిసి పోయి , చిరుగు పట్టిన చీరెలో వున్న ఖాజాబీబికి నావి నాలుగు పాత పాలిఎస్టర్ చీరలు ఇచ్చాను చింత తొక్కు దంచినందుకు కూలి, చింతకాయల ఖరీదుకు అరవై రూపాయలు చేతిలోపెట్టి .
” నాకైతే చీరలిచ్చినావు. ముసలోనికి ఒక అంగీ ఈయవూ? ” నోరంతా తెరిచి నవ్వుతూ అడిగింది.
నువ్వు కొసరు వేయవు గానీ మా దగ్గర కొసరుతావు ” అని లోపలికి పోయి రెండు పాత షర్టులు తెచ్చి ఇస్తే ఆనందంగా అందుకుంది. ముఖం అంత నవ్వు పులుముకుని “మా యమ్మ చల్లగా వుండు ” అంది
“ఇప్పుడు షేర్ ఆటో కూడ పది రూపాయలు అడుగుతుండ్రు ” ఇచ్చిన డబ్బు ఇంకో చిన్న సంచీలొ వేసి ,రవికలో దాచుకుని పైకి లేస్తూ అంది.
ఇంకో పది రూపాయల కాగితం చేతిలో పెడితే నవ్వుకుంటూ వెళ్ళింది.
మరునాడు చింకి చీర బదులు నేనిచ్చిన చీర కట్టుకు వస్తుందేమో అని చూస్తే మళ్ళీ అదే చీరలో వచ్చింది.
” నాలుగు చీరలు ఇచ్చినాను కదా కట్టుకోరాదాబీబీ? ”
” నా బేటీ షం షాద్ వచ్చిందమ్మ . నువ్వు ఇచ్చిన చీరలు చూసి ఖుషీ పడింది. నేను నాలుగు దినాలు కట్టుకుని ఇస్తానమ్మా అని తీసుక పోయింది. ముసలిదాని నేను ఏది కట్టుకున్నా ఒకటే కదా.” అని నవ్వింది.
నిజమే మెడలో నల్ల పూసలు, చేతికి రంగు రంగు గాజులు, ముఖాన నవ్వు ఇవి చాలు బీబీకి.

నా కోడళ్ళు లాప్ టాప్ ఒళ్ళో పెట్టుకు పుట్టిన వాళ్ళు. మైక్రో ఓవెన్, కరెంట్ కుకర్, మిక్సీలు మాత్రమే వాడడం తెలుసు. రుబ్బు రోలు, రోకలి, తిరగలి వంటి వస్తువులు వచ్చే తరం వాళ్ళు బొమ్మలు లోను , పురాతన వస్తువుల ప్రదర్శన లోను మాత్రమే చూడగలరు. ఇంట్లో అందరికీ చింతకాయ పచ్చడి ఇష్టమే గానీ పెట్టేందుకు బీబి రావాలి కదా.
నెల్లాళ్ళ ముందు ఒకనాడు కొత్త సమస్య గురించి చెప్పి అంగలార్చింది ఖాజాబీబి.
” మూడో కొడుకు దుబాయి పోతనని పట్టిండమ్మ . మా గుడిసె వున్న స్థలం అమ్మి దుడ్లు తీస్కరా అంట పట్టినాడు. ”
” నీ ఇల్లు అమ్మ బాక బీబీ. తిన్నా, తినకున్న తల దాచుకునే చోటు వుంది ఇప్పుడు. అదీ పోగొట్టుకోకు. బ్యాంకులో అప్పు అడిగిపొమ్మను. ” సలహా ఇచ్చాను.
” ఏంది చూసి ఇస్తారమ్మా అప్పు? ” అప్పు చేసి ఆటో కొని నడుపుకున్నాడు గానీ కంతులు కట్టలే . బ్యాంకులో వాళ్ళే బండి తోలుకు పోయిండ్రు. దుబాయిలో మస్తుగ సంపాదించుక వచ్చి నాకు ఇల్లు కట్టిస్తడంట .” మన దేశంలో గంజి తాగి బతికినా సుఖం నాయనా. దుడ్లు సంపాదిస్త మంటు అప్పులు జేసి దేశమిడిచి పోయినోళ్ళు వెనక్కి రాలేక అక్కడ తండ్లాడుతుండరు. ” అంటా మంచిమాట ఆడితే ‘నీకు కడుపున పుట్టిన కొడుకు కంటే గుడిసె జాగా మీద ప్రేమ ఎక్కువ ‘అని విదిలించి పోయే. ఏమి చేసేదమ్మా?” కండ్లు తుడుచుకుంది బీబి.
యాభై గజాల ఇంటిజాగా అమ్మి కొడుకును దుబాయి పంపే పనిలో వుందేమో బీబి.
దసరాకి పండుగకు పూర్ణం పోళీలు ,పులిహార ,ఆకులో పెట్టి “తిను బీబీ “అని ఇస్తే కొడుకు కోసం తాను తినకుండా బుట్టలో పెట్టుకుని తీసుకుపోయిన మనిషికి ఇంత అన్నం పెట్టలేని కొడుకులు.
చింత చిగురు అమ్మే చిన్న టేకూరుఖాజాబీబి చాన్నాళ్ళుగా కనబడడం లేదని కాలనీ వాళ్ళంతా మాటాడుకుంటున్నారు
పదిరోజులు పోయాక ఒక నాడు నేను బీబీకి ఇచ్చిన పాలిఎస్టర్ చీర కట్టుకుని ,గంప నెత్తిన పెట్టుకుని కాలనీకి వచ్చింది ముప్ఫై ఏళ్ళ ఆడ మనిషి. ఇంటి ముందుకు వచ్చాక పోల్చుకున్నా ఖాజాబీబి పోలికలు
” షం షాద్ అంటె నువ్వేనా? .
. ” అమ్మ ఎట్లుంది ? నువ్వు తెచ్చినావే ఆకు కూరలు? ” గంప దించక ముందే ఆత్రంగా అడిగాను.
గంప కింద పెట్టి కళ్ళు తుడుచుకుంది షం షాద్.
“మీ అన్న దుబాయి పోయినాడా? బీబి గుడిసె జాగా అమ్మేసిందా? ”

“ఇల్లు అయితే అమ్మేసింది. కానీ భాయిజాన్ దుబాయికి పోయేదానికి కాదు. అన్నకు కడుపులో కాలేయం చెడిపోయిందంట. అమ్మిజాన్ తన కడుపులో నుండి తీసి పెట్టమంది . ఆన్న బాగున్నాడు. అమ్మ ఆల్లాహ్ దగ్గరికి పోయింది .. కళ్ళ నీళ్ళు కారుస్తూ చెప్పింది షం షాద్.
తనని కన్న అమ్మ కడుపుకు ఇంత అన్నం పెట్టని కొడుకు కోసం కడుపు కోసి ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది ఖాజాబీబి . బండి కింద పడి కుడి చేయి విరిగి పోయినాక పెండ్లాము ప్రేమతో సాకుతుంటే ముప్ఫై ఏండ్లు బతికిన ఖాజాబీబి మొగుడు ఆ యమ్మ పోయినంక మూడు రోజులు కూడా బ్రతుక లేదంట.
చింత చిగురు అమ్మే ఖాజాబీబి చాన్నాళ్ళుగా రావడం లేదని ఎదురు చూసిన మా కాలనీ వాసుల ముఖాలు బీబీ ఇక రాదని తెలిసి చిన్న బోయాయి .
ఇప్పుడు ఖాజాబీబీ కూతురు గొంతు పొద్దున్నే ఖంగున వినబడుతోంది మా కాలనీలో ” ఆకుకూరలమ్మో “అంటూ .
——– ———- ———–

ప్రేమ కానుకలు

రచన: సురేఖ దేవళ్ల

 

చిన్నగా పడుతున్న చిరుజల్లులను, మాకోసం మరింత తొందరగా మా దగ్గరకు చేరుకో అంటూ తమ కదలిక ద్వారా సంకేతాన్ని అందిస్తున్న అందమైన ఆకుపచ్చని మొక్కలతో,

అప్పుడప్పడే విచ్చుకుంటూ తమ సోయగంతో పరిమళాలను వెదజల్లుతూ చూపరుల నయనాలనే కాకుండా మనసును కూడా వాటివైపు మరిలేలా చేస్తున్న సన్నజాజుల అల్లరితో ఆ సాయంత్రం చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంది.

ఆ సాయంత్రపు ప్రకృతి కంటే అందంగా సింగారించుకుని బంగారుబొమ్మలాంటి  కుందన తన భర్త  హేమంత్ కోసం ఎదురుచూస్తోంది.

ఆ ఎదురుచూపులు విసుగు కలిగించకుండా సన్నజాజి తీగ తన అల్లరితో తనకు చేరువగా ఉన్న ఆమె మోమును తాకి ఆమె ధ్యాసను తనవైపు తిప్పుకుంది.

నీ చిలిపితనం నాకు అర్థం అయ్యిందిలే అన్నట్లుగా దానివైపు చూసి నవ్వి “రోజూ నాకెన్నో పూలను ఇస్తావు, అయినా మరికొన్నింటిని నేను కోయకుండా నీలోనే దాచేసుకుని నాకు నయనానందం కలిగిస్తావు” అంటూ తన నేస్తమైన సన్నజాజి తీగకు కబుర్లు చెప్తున్న కుందన దగ్గరకు హేమంత్ వచ్చి . .

“అయ్యాయా మీ కబుర్లు, ఇక దేవిగారి  మనసు ఇటు మరల్చవలసిందిగా ఈ దీనుని విన్నపం” అన్నాడు.

ఆ మాటలు విని కిలకిలా నవ్వేసింది కుందన. .

మీకోసమే వెయిట్ చేస్తున్నా, రండి . అంటూ లోపలికి నడిచింది కుందన.

హేమంత్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి  వేడివేడి బజ్జీలు రెడీ చేసింది.

ఇద్దరూ కలిసి తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

రేపు మీ పుట్టినరోజు కదా, ఏం ప్లాన్ చేశారు అంది కుందన.

ఆఫీస్ లో ఫ్రెండ్స్ పార్టీ కావాలని గోల చేసేస్తున్నారు. కాబట్టి బయట వాళ్ళకి పార్టీ ఇద్దాం ఫ్యామిలీలతో. అన్నాడు హేమంత్.

సరే,మీ ఇష్టం అంది కుందన.

*******
“నిన్న పార్టీ బాగుందని మావాళ్ళందరూ ఒకటే పొగడ్తలు.  నిజంగా ఫుల్ హ్యాపీ ” అన్నాడు హేమంత్.

“అవునా,గుడ్ గుడ్. మీకు ఈ వీకెండ్ ఏమైనా పనులున్నాయా. ” అడిగింది కుందన.

ఎందుకో చెప్పు ఫస్ట్.  అన్నాడు హేమంత్.

“ఆదివారం మొత్తం మీరు నాతోనే ఉండాలి.  మనం ఒకచోటుకి వెళ్ళబోతున్నాం ” అంది కుందన.

“అవునా,ఎక్కడికి.  మళ్ళీ హనీమూన్ ఆ, నాకు ఓకే ” అన్నాడు హేమంత్ కొంటెగా. .

“అబ్బా, చాల్లే. అదేంకాదు. ఎక్కడికి అనేది సస్పెన్స్. ” అంది కుందన నవ్వేస్తూ. .

సరే శ్రీమతిగారు అంటూ దగ్గరకు తీసుకున్నాడు భార్యని.

౦౦౦౦౦
“ఇక్కడ వాతావరణం చాలా బాగుంది ప్రశాంతంగా . . . ఎవరిల్లు ఇది “అన్నాడు
హేమంత్.

కుందన నవ్వుతూ “తినబోతూ రుచెందుకు అడుగుతున్నారు, పదండి లోపలకు ” అంటూ లోపలికి దారితీసింది.

రకరకాల సందేహాలతో  లోపలికి వెళ్ళాడు.

ఆ ఇల్లు చుట్టూ పళ్ళ మొక్కలు,పూల మొక్కలతో చాలా బాగుంది.

ఇల్లు కూడా సింపుల్ గా బాగుంది.

హేమంత్ ని హాల్లో కూర్చోపెట్టి కళ్ళకు గంతలు కట్టింది కుందన.

ఏయ్,ఏంటిది అన్నాడు హేమంత్.

ఒక్క ఐదు నిమిషాలు శ్రీవారు,ప్లీజ్.  నేను చెప్పేవరకు తీయొద్దు అని రిక్వెస్ట్ చేసింది కుందన.

సరే అన్నాడు హేమంత్ వేరే దారిలేక.

ఒక మూడు నిమిషాలకు” ఒకసారి నోరు తెరవండి శ్రీవారూ “అంది కుందన. .

నోరు తెరిచిన హేమంత్, ఆ పదార్థం రుచి చూడగానే ఒక్కసారిగా అమ్మా అంటూ సంతోషంతో కళ్ళగంతలు తీసేశాడు.

ఎదురుగా నిలబడిన వాళ్ళమ్మని కౌగలించుకుని  ఏడ్చేసాడు.

తమ ప్రేమ పెళ్ళితో విడిపోయిన ఆ తల్లీకొడుకులు ఇప్పుడు ఇలా ఒకటవటం చూసి చాలా సంతోషపడింది కుందన.

కొడుకుతో పాటు కోడలిని కూడా దగ్గరకు తీసుకున్నారు హేమంత్ వాళ్ళమ్మగారు.

నాన్నగారికి కోపం తగ్గలేదు రా, ఆయన కోపం తగ్గే వరకు నేనే వచ్చి వెళుతూ ఉంటాను. ఈ ఇల్లు మా ఫ్రెండ్ ది.

కుందన చాలా మంచి అమ్మాయి.

ఈకాలంలో ఏ అమ్మాయైనా అత్తమామలుతో కాకుండా విడిగా ఉండాలని పోట్లాడి మరీ వెళ్ళిపోతున్నారు. .

అటువంటిది నన్ను ఇక్కడికి తీసుకుని రావటానికి చాలా కష్టపడింది.

తనను బాగా చూసుకో, తన మనసు ఎప్పుడూ కష్టపెట్టకు.

అర్థం అయ్యిందా అన్నారు హేమంత్ అమ్మ.

తప్పకుండా అమ్మా అన్నాడు హేమంత్.

ఆవిడ వెళ్ళిపోయారు మళ్ళీ కలుస్తా అంటూ.

మీ పుట్టినరోజుకి లేట్ గా ఇచ్చిన   నా ప్రేమకానుక. నచ్చిందా. .    అంది కుందన.

“థాంక్యూ సో మచ్ కన్నా.  చాలా చాలా నచ్చింది.    ఐ లవ్ యూ సో మచ్ రా. నాకు చాలా సంతోషంగా ఉంది. తొందరలోనే నాన్న కూడా మనసు మార్చుకుంటారని నా నమ్మకం ” అన్నాడు హేమంత్.

“తప్పకుండా మనల్ని అర్థం చేసుకుని, మనతో సంతోషంగా గడిపే రోజు వస్తుంది” అంది కుందన.

ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు హేమంత్.

౦౦౦౦౦౦౦
“రేపు మనం ఊరెళుతున్నాం, అత్తయ్యా వాళ్ళ దగ్గరకు.  బట్టలు సర్దు. వారం రోజులు అక్కడే ఉంటాం” అన్నాడు హేమంత్.

‘ఏంటి సడెన్ గా’.  అడిగింది కుందన కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం సంతోషంగా.

“నాకు కొంచెం పనుంది అటువైపు, ఎలాగూ వెళతా కదా .   నువ్వు వస్తావని. మన పెళ్ళికి మీ వాళ్ళు ఒప్పుకున్నా, నాతో ముభావంగా ఉంటున్నారని పుట్టింటికి వెళ్ళడమే మానేసావు ఈమధ్య.

కానీ,మనసులో అయినా ఉంటుంది కదా కన్నవాళ్ళని చూడాలని.

అందుకే ఈ ప్రయాణం” అన్నాడు హేమంత్.

ఆ మాటలకు కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ప్రేమగా అతనివైపు చూసింది.

ప్రేమను చెప్పడానికి ప్రతిసారీ భాష అవసరం లేదు.

********
పుట్టింటికి వచ్చిన కూతురిని చూసి చాలా సంతోషపడ్డారు కుందన తల్లిదండ్రులు.

హేమంత్ ని కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు.

ఆ మర్నాడు బయటికి వెళ్దాం అంటూ తీసుకుని వెళ్ళాడు హేమంత్.

“ఇటువైపు మా స్కూల్ ఉంటుంది” అంది కుందన ఆ దారి చూసి.

అవునా అన్నాడు హేమంత్ నవ్వాపుకుంటూ.

సరిగ్గా స్కూల్ దగ్గరకు వచ్చేసరికి బైక్ ఆపాడు హేమంత్.

ఇదేంటి ఇక్కడ ఆపారు. అయోమయంగా అడిగింది కుందన.

ఏం లేదు, నా ప్రియసఖి చదివిన స్కూల్ ఎలా ఉందో చూద్దామని అన్నాడు కొంటెగా.

చాలు చాలు అంటూనే సిగ్గు పడింది కుందన.

స్కూల్ లోపలికి వెళుతూనే అక్కడ చూసి షాకయ్యింది.

తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మాలిని అక్కడ ఉంది.

కుందనని చూస్తూనే సంతోషంతో దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంది.

ఇద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళేసరికి దాదాపు ఎనభై మంది వరకు ఉన్న అందరూ” హాయ్ కుందనా” అంటూ అరిచేశారు.

అందరినీ చూసి ఆశ్చర్యపోయింది కుందన.

పట్టలేని సంతోషంతో మాటలు రావడంలేదు కుందనకి.

సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపేశారు ఆటపాటలతో,  తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంగా వారి మనసుల్లో ముద్రించుకున్నారు.

కొంచెం బాధతో, ఎక్కువ సంతోషంతో అందరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని వెళ్ళిపోయారు.

చివరికి  హేమంత్,  కుందన,మాలిని మిగిలారు.

అందరూ కుందన వాళ్ళింటికి వెళ్ళారు.

అందరి కుశలప్రశ్నలు అయ్యాకా డాబామీదకి  చేరారు ముగ్గురు.
“థాంక్యూ సో మచ్ మాలిని.  ఇలా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ” అంది కుందన.

“ఈ సర్ప్రైజ్ మీ శ్రీవారి ప్లాన్.  రెండు నెలల నుండి కష్టపడుతున్నారు అందరినీ ఒకచోటికి చేర్చడానికి హేమంత్ చాలా కష్టపడ్డారు.

ఎక్కడెక్కడో ఉన్నవారి అడ్రస్ లు కనుక్కుని, అందర్నీ ఒకచోటికి చేర్చారు.

నీ పొగడ్తలు ఏమైనా ఉంటే అవి మీ ఆయనకే చెందుతాయి ” అంది మాలిని.

అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది కుందన.

నవ్వుతూ చూశాడు హేమంత్.

కొద్దిసేపు మాట్లాడుకున్నాక అక్కడే భోంచేసి. .
“సరేనే మళ్ళీ కలుద్దాం, ఇకనుంచి టచ్ లో ఉందాం” అంటూ శెలవు తీసుకుంది  మాలిని.

డాబామీదకి చేరారు ఆ దంపతులు.

“థాంక్యూ సో మచ్ శ్రీవారు. నాకు ఇంతకన్నా చెప్పడానికి మాటలు రావడం లేదు ” అంది కుందన.

“మాటలు అవసరం లేదు,నీ కళ్ళే చెబుతున్నాయి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో. ” అన్నాడు ప్రేమగా హేమంత్.

ఒకరికొకరు ఇచ్చుకున్న ఆ ప్రేమకానుకలు గురించి చర్చించుకుంటూ, వాటికోసం తాము చేసిన ప్రయత్నాలను చెప్పుకుంటూ ఆ  అందమైన వెన్నెల రాత్రిని మరింత అందంగా మార్చుకున్నారు.

అది ఒక ఇదిలే…

రచన : సుధేష్ణ

 

అపార్ట్మెంటు అంతా శుభ్రం చేసి టేబుల్ పైన వేజ్లో పువ్వులు గుత్తిగా అమర్చి ఆ పక్క నిలబడి, ఈ పక్క నిలబడి చూసాడు. డైనింగ్ టేబుల్, దానిపైన వెజ్, అందులో పువ్వులు అన్నీఅందంగానే కనిపిస్తున్నా యని రూడీ చేసుకున్నాక తృప్తిగా ‘మేరి సప్నోంకి రాణి’ ఈల వేస్తూ వంటిన్ట్లో కేల్లాడు రోహన్. పెద్దగా ఏనాడూ వంట చేసినవాడు కాదు. ఐపాడు ముందు పెట్టుకుని ఘుమ ఘుమ లాడే వంట కాలు పొలావు, కోడికూర, యమ్.టి.ఆర్.మిక్స్‌తో సాంబారు అవికాక ఇంకా పెరుగు పచ్చడి చేసాడు. ముందు రోజే కారుని కూడా ఎంతో శ్రద్దగా శుభ్రం చేసాడు. ఇప్పుడది మెరుస్తోంది. ఈ రోజు స్పెషల్..ఆలోచనకే రోహన్ కు వళ్ళంతా పులకరించింది. సంతోషం పట్టలేక గట్టిగా అరిచాడు  ‘నా పెళ్ళాం అమెరికా వస్తోందండోయ్!’

రోహన్ హరితను పెళ్ళి చేసుకుని రెండేళ్ళయ్యింది. అమెరికన్ అయితే ఈ పాటికి విడాకులకు సిద్ధ పడేవాడు. రోహిత్ పెళ్ళయ్యాక రెండు వారాలే ఇండియాలో ఉన్నాడు. జాలితో మీ గుండె కరిగి పోతోందా! మీరు నమ్మలేక పోతే వెళ్లి అ కర్కోటకులైన అమెరికన్ కన్సోలేటు వాళ్ళకు చెప్పండి. ఆ తర్వాత రెండుసార్లు రోహిత్ ఇండియా వెళ్ళాడను కోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది అది కాదు. రోహిత్ కథ వేరులెండి. ఎందుకని అడక్కండి. పెళ్ళి  చేసుకుంటానని నెల రోజుల సెలవుతో ఇండియా వెళ్ళాడు. అమ్మాయిల మొహాలు చూసి (ఫోటోలో లెండి), వాళ్ళను కలవడానికి రెండు వారాలు పట్టింది. ఆ తర్వాత ఈ అందమైన హరితను ఎన్నుకొని పెళ్ళి చేసుకున్నాక ఒక వారమే మిగిలిందని మరో వారం సెలవు పొడిగించాడు. అదీ జరిగింది.

నీటుగా ఉన్న కారులో సోగ్గాడిలా కూచుని పాటలు గున్ గునాయిస్తూ, స్పీడ్ లిమిట్ ఎంతో రోడ్డు సైడు బోర్డుకేసి చూస్తూ కారు నడుపుతున్నాడు. ఈ రోజు స్పీడ్ టికెట్టు రాకూడదు మరి. హరితకు ఇష్టమని పాత పాటలన్నీ ప్రోగ్రాం చేసి రెండు వారాలనుండి విసుగు లేకుండా అవే వింటున్నాడు. రోహిత్ బుద్దిమంతుడైన కుర్రాడిలా ఉన్నాడీ రోజు.

నెల రోజుల క్రితం స్నేహితుణ్ణి ఎయిర్ పోర్టునుండి పికప్ చేయడానికి పది నిమిషాల్లో వెళ్ళాడు. ఈ రోజేమిటీ రోడ్డును ఎవరేనా లాగి పొడుగు చేసారా! ఎయిర్ పోర్టు ఇంత దూరంగా ఉందా!! నాకెప్పుడూ ఇంత టైం పట్టలేదే! అనుకుంటున్నాడు. ఎలాగైతేనేమి చివరికి ఎయిర్ పోర్టు చేరాడు. కారులోంచి దిగుతూంటే కాస్త నర్వస్ గా ఫీలయ్యాడు. ఒక్కసారి తన డ్రైక్లీన్ మీడియం స్టార్చ్ పెట్టిన షర్ట్, ద్రైక్లీన్ ప్యాంటు నుండి అతని చూపు కింద షూజ్ పై వాలింది. ఊప్స్! ఎడమ షూజ్ పైన ఏదో మరక ఉంది. వెంటనే ప్యాంటు పాకెట్ లోంచి టిష్యూ తీసి షూస్ పై మరక తుడిచేసాడు. ఆ టిష్యు పడెయ్యాలి, ఒక్క కార్నర్ తోనే తుడిచాడు. పడేసే ముందు రెండవ షూజ్ కూడా తుడుచుకున్నాడు. ఎరైవల్ కారిడార్ లోకి నడుస్తూంటే మనసులో ఆలోచనలు రేసు గుర్రాల్లా పరుగెత్తుతున్నాయి.

‘హరిత చాల అందగత్తె, ఇప్పుడు ఎంత మారిందో! దగ్గరగా చూసి ఎనిమిది నెలల యింది. పింక్ చుడీదార్ వేసుకుంటానని చెప్పింది. వంట ఇంకా ఇతర పనులు కూడా రాక పోవచ్చు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. నానమ్మ చాలా గారాబంగా, పెంచింది. నాజూకుగా ఉండే నా భార్యకు వంట రాక పోయినా ఫర్వాలేదు. చుట్టు పక్కల చాల రకాల రేస్తారెంటులున్నాయి. ఆడవాళ్ళు బాగా డబ్బు ఖర్చు చేస్తారని స్నేహితులు మాట్లాడటం తెలుసు అందుకే అనవసర ఖర్చులు చేయకుండా చాల పొదుపుగా డబ్బు కూడ బెట్టాడు. హరితకు ఇక్కడి  విషయాలు తెలియక పోవచ్చు వచ్చాక నిదానంగా ఒకటొకటి చెప్పాలి. పరిసరాలు, పనులు అలవాటు అయ్యేవరకు సాయం చేస్తూ తనకు దగ్గరగానే ఉండాలి’ అను కున్నాడు.

“రోహాన్! హియర్. ఇటు వేపు..” ఉపుతున్న చేయితో బాటు మధురమైన గొంతు. గబ గబా అటువేపు వెళ్ళాడు. వయ్యారి అందాలు చూస్తూ దగ్గరగా వెళ్లి,

“హరితా! ప్రయాణం బాగా జరిగిందా?” అందంతో సిగ్గు మొగ్గయిందా! నెవర్ మైండ్, వంగి చెంప మీద ముద్దిచ్చాడు. బేగులు తీసి కార్ట్ లో పెట్టాడు. హరిత రెండు బేగులు పట్టుకుంది.

“రోహన్! ఈ రెండు బేగులు ఇంటికి వెళ్ళేవరకు ఎక్కడా పెట్టను.” తేనెలొలికే స్వరంతో అంది.

“నువ్వు చాలా అలసి పోయుంటావు. అవి బరువుగా ఉన్నట్టున్నాయి, ఈ కార్ట్ లో పెట్టు హరితా.”

“ ఫరవాలేదు. నేనంతగా అలసిపోలేదు.”

ఇద్దరి మనసులు గాలిలో తేలిపోతున్నాయి. ఇంటికి చేరగానే హరిత రెండు రోజుల అలసట పోవడానికి షవర్ తీసుకుంది. రోహన్ టేబుల్ పైనున్న కేండిల్ వెలిగించి పువ్వుల పక్కనే

పెట్టాడు. అంతలోఊర్వశిలా వచ్చింది.

‘కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై విరుల తేనే కులుకై’ రోహన్ మనసు

లో పాడుకున్నాడు. కవి కళ్ళకు ఎంత అందం కనిపిస్తే అంత గొప్ప కవిత జన్మిస్తుంది!

హరిత అలసి పోలేదంటు బెగుల్లోంచి స్వీట్స్ తీసి ఫ్రిజ్‌లో పెట్టింది. సంతోషంగా డైనింగ్తేబుల్వేపు చూసింది. ఆ కళ్ళల్లోని మేచ్చుకోలుకు పొంగి పోయాడు. ఇంట్లో రేంజ్ మొదలుకొని అన్నీ ఎలా వాడాలో చూపించాడు. అ వారం సెలవు తీసుకుని హరితకు ఉరు చూపించాడు.  ఫ్రిజ్‌లో ఫుడ్ చాల  నింపి పెట్టాడు గాబట్టి ఇప్పట్లో వంట పని ఉండదు. వారం ఇట్టే గడిచి పోయింది. రోహన్ వర్కు వెళ్లేముందు ‘నేను వీలైనప్పుడల్లా ఫోను చేస్తుంటాను. నీకు ఎప్పుడు ఫోన్ చేయాలనిపిస్తే అప్పుడు చేయి.’ అంటూ ఇండియాకు ఎలా ఫోన్ చేయాలో చెప్పాడు. వర్క్‌లో ఆలోచనల పవన వీచికలు  కదులుతూంటే మనసు ఏ పనీ చేయడం లేదు.

‘మొన్నటి వరకు కాలేజి కెళ్ళిన హరిత వంట ప్రయత్నంలో మాడ్చేసిన గిన్నెలు సింకులో కనబడొచ్చు అనుకున్నాడు. అయినా పర్లేదు రోహన్ తట్టు కోగలడు. కొత్తగా పెళ్ళ యిన జంట కదా! చేతన్ వైఫు ప్రీతికి ఆర్నెల్లు అయినా వంట సరిగ్గా రాలేదని, బట్టలు ఐరన్ చేయడం అసలు చాతకాదని, గ్రాసరీ బేగులు అసలు పట్టుకోదని ఎప్పుడు గోణుగుతుంటాడు. బేగులు నేనే   పట్టుకుంటానులే. ఇండియాలో ఆడవాళ్లకు అలవాటులేని పనికదా!’

ఈ ఆలోచనలతో లాభం లేదని పని క్విట్ చేసి త్వరగా ఇంటికి బయల్దేరాడు. ఇంటికి వెళ్లి తలుపు తీయగానే ‘నా చేతుల్లో వాలిపోతుందా! లేదా భయంతో తలుపులేసుకుని బెడ్ రూమ్ లో భయంగా కుర్చుంటుందేమో’. ఆరాటం, ఆత్రుత అతనిలో.

ఇంట్లోకి అడుగు పెట్టగానే నవ్వుతూ ఎదురొచ్చిన హరితను చూసి పులకరించి పోయాడు. టీ తో పాటు ఉల్లిపాయ పకోడీ చేసింది. రాత్రి వంట కూడా చేసేసింది. చాల రుచిగా ఉన్నాయి. ఒకరోజు స్నేహితులను భోజనానికి పిలిచాడు. ఆనాడు కూడా రోహన్ సహాయం లేకుండా అన్ని తనే చేసుకుంది. రోహన్ అదృష్టవంతుడు! ఒప్పుకుంటారుగా! కాలచక్రం తిరుగుతోంది. దంపతు లిద్దరూ గ్రాసరి కొనడానికి వెళ్ళినపుడు బేగులు రోహిత్ ను పట్టుకోనివ్వలేదు హరిత. కాస్త

ఏమ్బరాసిన్గ్గా ఫీలయ్యాడు. ఎలాగో బలవంతపు నవ్వుతో బయట పడ్డాడు. కారు డ్రైవ్ చేయడం

నేర్పిస్తే కావలసినవి తానే తెచ్చుకుంటుంది అనుకున్నాడు.

త్వరలోనే కొంతమంది ఇండియన్స్ ని  ఫ్రెండ్స్ చేసుకుంది. కానీ వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు. ఆ మాటే అన్నాడు

“నేను నా వాళ్ళను చాల మిస్సవుతున్నాను. పెద్దవాళ్ళను చూస్తె నాకు మావాళ్ళను చూసి నట్టే ఉంటుంది. వాళ్ళు ఎంతో ఆపేక్షగా మాట్లాడతారు.”

“హరితా! మనం పెద్ద వాళ్ళతో స్నేహం చేసినా వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలతో వేరుగా ఉంటాయేమో. వాళ్లతో మనం కార్డ్స్ ఆడగలమా! వీకేండ్ కలిసి పిక్నిక్ వెల్లగలమా! కలిసి డ్రింక్ తీసుకోగలమా!”

“వాళ్ళు చాల మంచి వాళ్ళు రోహన్. గాసిప్ చేయరు. మనకు  మన వయస్సు ఫ్రెండ్సు కూడా ఉంటారు. నామీద నాకు నమ్మకం ఉంది. పెద్ద వాళ్లతో స్నేహం చేస్తే నేను పెద్ద దాన్నయి పోను, నాతో ఉంటె వాళ్ళు చిన్నవాల్లై పోరు ముఖ్యంగా అమెరికాలో. మనుషులతో కలిసి ఉండాలి గాని వయస్సుతో కాదు. వయస్సు చిన్నదైనా మనస్సు ముసలిదై ఎప్పుడూ ఎవరిమీదో ఏడుస్తూ …వాళ్ళు మనకవసరమా!”

కుడ్య చిత్రంలా ఉన్న హరితను చూస్తూ, ఓరి భగవంతుడా! అనుకున్నదానికంటే తెలివైంది నా బంగారు బొమ్మ అనుకున్నాడు. అన్నీ ప్లేస్ లే ఉన్నాయి.మురిసి పోయాడు.

“ నాకేమీ పట్టింపు లేదు. వయస్సు గురించి కాదు కానీ మన యువ స్నేహితులు మనల్ని చూసి వింత మనుషులు అనుకుంటారేమో” అన్నాడు.

“ఒకరు అంటారని మనకు నచ్చినవి మానుకోలేము. పీర్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఇష్టాయిష్టాలు చంపుకుంటారు. నకలన్తివెమీ లేవు. నాకు నానమ్మ ట్రెయినింగ్” – అంటూ కనుబొమ్మ ఎగరేసింది. “నానమ్మ చెప్పేది మన మనసు కంటే బలవత్తర మైంది మరోటి లేదుట. యౌవ్వనంలో ఉన్నామని  హరా బరా తిరుగుతూ, పోటా పోటీలు చేస్తూ, భస్మాసుర హస్తంతో అందరిని అదిమి పైకి రావాలని ఆరాటం ఉన్నవాళ్లని ముసలి వాళ్ళ కింద జమ కట్టొచ్చు. మనం యౌవ్వనంలో ఉన్నపుడే మంచి పనులు చేయడం అలవాటు చేసుకుంటే  మన మనసుకు బలం సుఖం వస్తుంది.”

“నిజం చెప్పావు హరిత.”

నానమ్మ గారాబం చేసి బంగారు బొమ్మను మాత్రమే ఇచ్చింది అనుకున్నాడు కానీ ఇంత మంచి తెలివైన  బుర్ర ఉన్న బంగారు బొమ్మను ఇచ్చారనుకోలేదు.

రోహన్ కు జాక్ పాట్ దొరికింది. నేనూ అదే అనుకున్నాను. మీరేమనుకుంటారు!

 

***** సమాప్తం *****

 

 

 

 

 

 

 

 

 

ట్రాఫిక్ కంట్రోల్

రచన:  మణి గోవిందరాజుల….

కారు చాలా స్మూత్ గా వెళ్తున్నది రెండేళ్ళ తర్వాత విదేశాల నుండి వచ్చిన గౌరవ్ కిటికీ లో నుండి కనపడుతున్న సిటీ ని చూసి  చాలా ఆశ్చర్యపోయాడు.   “అరేయ్ ప్రకాశ్ నన్నొకసారి గిల్లరా? ఇది కలా నిజమా? ఇది హైదరాబాదేనా? లేక నేను ఇంకా యూయెస్ లోనే వున్నానా?” అడిగాడు

“నువు హైదరాబాద్ వచ్చావు.   నేను నిన్ను తీసుకుని ఎయిర్పోర్ట్ నుండి ఇంటికెళ్తున్నాను.   ఇది నిజం.   ముమ్మాటికీ నిజం” హాస్యంగా చెప్పాడు ప్రకాశ్.

“పోనీ ఇది చెప్పు నేనెళ్ళి ఒక పాతికేళ్ళు అయిందా? లేదా సినిమాల్లో చూపినట్లు నేను గత పాతికేళ్ళుగా నిద్ర పోతునే వున్నానా?అదీ కాకపోతే యే మాంత్రికుడో నన్నెత్తుకెళ్ళి ఇప్పుడు విసిరేసాడా?” ప్రశ్నాపత్రం సంధించాడు గౌరవ్.

“యేంట్రా? నీ గోల? చావగొడుతున్నావు ఇందాకటినుండి? అవును మరి నువ్వో భట్టి విక్రమార్కుడివి.   నిన్ను బలిఇస్తే అన్ని తాంత్రిక శక్తులు వశమవుతాయని నిన్నెత్తుకెళ్ళాడు మాంత్రికుడు” వెక్కిరించాడు ప్రకాశ్ .   “నువెళ్ళి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయ్యాయి.   అయినా బాబ్బాబు నీకు పుణ్యం వుంటుంది.   నా బుర్ర తినకు.   ఇంట్లో నీ కోసం చాలా మంది యెదురు చూస్తున్నారు.  వాళ్ళవి తిను.  ” హాస్యంగా అంటూనే కారు రయ్యిన పోనిచ్చాడు ప్రకాశ్.   యెప్పుడూ ఇల్లు చేరడానికి గంటన్నర పట్టేది.   అరగంటలో ఇల్లు చేరే సరికి దిమ్మ తిరిగి పోయింది గౌరవ్ కి.

ఇల్లంతా పెళ్ళికళతో కళ కళ లాడుతున్నది ఇంటినిండా బంధుజనం సందడి.  ఇంట్లోకి వెళ్తూనే అందరూ గ్రాండ్ గా వెల్కం చెప్పారు.   అందర్నీ చూసి సంతోషంతో మాట్లాడుతున్నా మనసు ఒకవేపు గందరగోళం తో కొట్టుమిట్టాడుతున్నది.

“ఇప్పుడు చెప్పరా? యేమి జరిగింది? మన జనరేషన్ చూడలేమనుకున్న వింతని యెలా చూడగలుగు తున్నాము? ఎలా జరిగింది? యెవరు దీనికి కారణం?” ఎంతో ఆతృతగా అడిగాడు ఆ రాత్రి బెడ్ రూం లోకి చేరాక.

“నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తే నాకేంటంటా?”

“సమాధానం ఇస్తే నీకేంటో నాకు తెలీదు కాని ఇవ్వకపోతే మటుకు నీకు ఖచ్చితంగా తన్నులే.  ” ప్రకాశ్ నడ్డి మీద ఒక్కటిచ్చాడు గౌరవ్.

“చచ్చాన్రా బాబూ! నాయనా గౌరవా చెప్తాను కాని నన్ను తన్నమాక.   అయినా ఇంటల్లుడిని కాబోతున్నాను.   మర్యాద మర్యాద” నడ్డి సవరించుకుంటూ వేడుకుంటూనే డిమాండ్ చేసాడు ప్రకాశ్.

“అదంతా పెళ్ళయ్యాక.  ఇప్పుడు కాదు” కాళ్ళు లాగబోయాడు గౌరవ్.

ప్రకాశ్ గౌరవ్ మేనత్త మేనమామ పిల్లలు.   ఒకరంటే ఒకరికి ప్రాణం.  పుట్టినప్పటినుండి కూడా ఒకరిని వదిలి ఒకరు ఉన్నది లేదు.  కలిసి చదివారు,పెరిగారు తిరిగారు.   ఇప్పుడు ప్రకాశ్ గౌరవ్ కి బావగారు కూడా కాబోతున్నాడు.   అదిగో ఆ సందర్భంగానే గౌరవ్ స్వదేశాగమనం.  .  .  గౌరవ్ కి చాలా సంతోశంగా వుంది.   బాల్య స్నేహితుడే బావ కాబోతున్నందుకు.   యెంత మేనల్లుడైనా ఇంటల్లుడు కాబట్టి మర్యాద ఇవ్వాలని తల్లీతండ్రీ చెప్తే ఇష్టం లేకపోయినా ఒకసారి ఫోన్ చేసినప్పుడు మర్యాదగా మాట్లాడబోతే ప్రకాశ్ వారం రోజులు మాట్లాడలేదు.   ఈ మర్యాదల చట్రం లో ఇరుక్కుపోతే బాల్యస్నేహితాన్ని కోల్పోతామేమోనని ప్రకాశ్ భయం.   అందుకే ఇప్పుడు ఇద్దరూ మొదటిలాగే హాయిగా మాట్లాడుకోగలుగుతున్నారు.

“ఓకే! బాబా! ఓకే… సరే ఒకసారి నువు ఇక్కడున్న రోజులని రింగులు తిప్పుకుంటూ చూసుకో.  .  ఈ లోగా నేనో నిద్ర తీస్తాను.  తెల్లవారుఝామున్నే లేపారు నన్ను” ఆవలిస్తూ ముసుగు కప్పాడు ప్రకాశ్.

ప్రకాశ్ అన్నట్లుగానే గౌరవ్ కళ్ళముందు రింగులు తిరగసాగాయి.  .

*************

“ఛీ!” గట్టిగా స్టీరింగ్ మీద కొట్టాడు గౌరవ్ కోపంతో.

“అరేయ్ అలా కోపం తెచుకుంటే నీ స్టీరింగే విరుగుద్ది.   అప్పుడదో బొక్క నీకు.  తన కోపమే తన శత్రువు అని వూర్కే అనలేదు.   చిల్ బాబా చిల్” శాంత పరచబోయాడు ప్రకాశ్.

“అరేయ్ వెళ్ళి ఒక్కొక్కళ్ళని బండనా బూతులు తిట్టాలని ఉందిరా.   ఆటో వాళ్ళెళ్తున్నారంటే పోనిలే అనుకోవచ్చు.   వాళ్ళకు మొదటినుండీ అలవాటు.   కాని ఈ చదువుకున్న మూర్ఖులు, అందరూ సాఫ్ట్ వేర్ యెంప్లాయీస్ లాగానే వున్నారు.   వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో కాకపోతే యెలా? ఇప్పుడు చూడు మనకి ఫ్రీ లెఫ్ట్.   అయినా మననెవ్వరూ పోనివ్వరు.   ఆఖరికి స్కూల్ బస్సులు ఆర్ టీ సీ బస్సులు కూడా అడ్డం వస్తాయి.   స్కూలు బస్సులే అలా పోతే ఇక పిల్లలకి వారేమి నేర్పిస్తారు?”

“చెప్పింది చాలుకానీ.  ఇక పోనివ్వు.  ఇక్కడ నీ మాటలు విని మెచ్చుకుని మేకతోలు కప్పేవాళ్ళు యెవరూ లేరు.  ”

సీరియస్ గా కార్ పోనిస్తూ “ఎప్పుడు మారుతుందిరా మనదేశం? అటు చూడు అంత యెత్తుగా వున్న డివైడర్ ని యెక్కి ఇటు దూకుతున్నారు.   పైనుండి చంకలో పిల్లాడు,చేతిలో పిల్ల.  అది యెంత ప్రమాదం? యేమన్నా జరిగితే మళ్ళీ కారు వాళ్ళు కన్నూ మిన్నూ కానక డ్రైవ్ చేసారంటారు.   పెద్ద వాళ్ళు ఏది చేస్తే పిల్లలదే చేస్తారు.   రేపు ఈ పిల్లలు పెద్దవాళ్ళు లేకుండా కూడా ఇలానే రోడ్ క్రాస్ చేస్తారు.  ” ఆవేదనగా అంటూ ట్రాఫిక్ ని తప్పించుకుంటూ నెమ్మదిగా డ్రైవ్ చేయసాగాడు గౌరవ్.

“అందరూ యెలా వెళ్తున్నారో ,మనమూ అలానే వెళ్ళాలి.   అంతకంటే చేసేదేమీ లేదు.  ” ఓదార్పుగా చెప్పాడు ప్రకాశ్.

“అయినా ప్రభుత్వం కూడా రూల్స్ ని కఠిన తరం చేసింది కదా? మార్పు ఒక్కసారిగా రాదురా. టైం పడుతుంది.  ”

“ఎంతకాలం రా? సిగరెట్ పెట్టెమీద “సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్” అని రాసినట్లే వున్నాయి మన ప్రభుత్వపు రూల్స్.   అదిగో అటు చూడు వాడికి ప్రభుత్వం ఏమీ చేయలేదన్న నమ్మకం ఎంత లేకపోతే బైక్ మీద స్పీడ్ గా వెళ్తూ మొబైల్ ని తలకు చెవులకు మధ్య పెట్టుకుని మాట్లాడుతూ వెళ్తాడు?వాడికి తెలీదా వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడితే జరిమానా వుందని? కాని నమ్మకం, తననెవరూ పట్టుకోరులే అని.  ఒకవేళ పట్టుకున్నా డబ్బులిస్తే యెవడికోసం వదిలిపెడతాడులే అనే నమ్మకం.  .   అయినా రూల్ అనికాదు, జరిమాన పడుతుందని కాదు కాని కనీస పౌరుడిగా తన బాధ్యత తనకు గుర్తు లేకపోతే ఎలా?.   మన దేశ పౌరుల్లో మార్పు రావాలంటే కనీసం పాతికేళ్ళు పడుతుంది.  ” నిస్పృహగా అన్నాడు గౌరవ్.

అలానే రోజూ తిట్టుకుంటూ కాలం గడుపుతుండగా గౌరవ్ కి యూయెస్ లో జాబ్ వచ్చింది.   అదిగో అప్పుడెళ్ళి మళ్ళీ ఈ పెళ్ళి సందర్భంగా ఇప్పుడొచ్చాడు.

“యేరా రింగులు ఇంకా ఆగలేదా?” కళ్ళముందు చిటికలేస్తూ అడుగుతున్న ప్రకాశ్ మాటలతో ఈ లోకం లోకి వచ్చాడు గౌరవ్.  సమయం చూస్తే పన్నెండు అయింది.

“ఆపేసావు కదా రింగుల్ని.   ఇప్పుడు చెప్పరా యేమి జరిగిందొ.   మధ్య మధ్య అమ్మావాళ్ళు చెప్తున్నా ఏదో కొద్దిగా బాగైనా మనకదే గొప్ప కదా అనుకున్నాను.   కాని ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు.   నిజంగా చాలా హాయిగా వుంది సిటీ” చాలా సంతోషపడ్డాడు గౌరవ్.

“నువ్వింకోటి గమనించినట్లు లేవు.   ఎక్కడన్నా బిచ్చగాళ్ళు కనపడ్డారా?”

“అవున్రా! కరెక్టే.  ఎక్కడా తగల్లేదు.  ఎలా? ఇంత ప్రపంచ తొమ్మిదో వింత ఎలా జరిగింది?”

“తొమ్మిదోదా?ఎనిమిదోదేంటి?”

“ఎనిమిదోది మన హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవడం” ఇద్దరూ నవ్వుకున్నారు.

“నిజం రా మన దేశ ప్రజలు నిజమైన పౌరులుగా ఇలా వుండాలి అనేది నా కల.   ఎంత హాయిగా వుంది అందరూ అలా వుంటె?”

“ఈ ఊరింపులు కాదు కాని చెప్పు ఏమి జరిగిందొ”.  .

“ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎన్నో రకాల ఫైన్ లు విధించింది కదా? నువు ఉన్నావా అప్పుడు? రూల్స్ ఫాలో కాకపోతే పేరెంట్స్ కి శిక్ష అనే రూల్ పెట్టిందీ?”

“అవును అప్పుడు కూడా ఇంకెవరినో తీసుకొచ్చి మేనేజ్ చేయడం మొదలు పెట్టారు.   ఇంకా రక రకాలుగ ఫైనులు విధించినా దానికి ప్రత్యమ్నాయం ఏదో ఒకటి వుండేది.   అందుకే సక్సెస్ కాలేకపోయింది.   ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను.  ”

“ అదిగో ఆ సమయం లోనే కొత్త కమీషనర్ వచ్చాడు.   ఆయనొచ్చాక కూడా ఒక నెల రోజుల వరకు పెద్ద తేడా ఏమీ లేదు.   కాని ఆ తర్వాత మొదలయింది అసలు డ్రామా.  ”

“అరేయ్! నీ బోడి సస్పెన్సూ నువ్వూను.   విషయానికిరా”

“ఎంత డబ్బు ఫైన్ కింద పెట్టినా కూడా ఉన్నవాళ్ళకు లక్ష్యం లేదు.  కట్టలేని వాళ్ళు సాధారణ సగటు ఉద్యోగి అంత డబ్బు ఎలా కట్టగలడు అని ఎదురుదాడికి దిగుతున్నారాయె.   అంతే కాని కొద్ది ముందుగా బయలుదేరి ఆఫీసుకు టైం కి చేరుకుందాము ఎటువంటి ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేయకుండా అనుకునే వాళ్ళే లేరు.  .  పోనీ అని పేరెంట్స్ కి శిక్ష అంటే మారతారేమో అనుకుంటే హమ్మయ్య నా కొడుక్కు జైల్ శిక్ష తప్పింది కదా అని సంతోష పడే వెర్రి తలితండ్రులున్న దేశం మనది.   మొబైల్ మాట్లాడుతూ వెళ్తే ప్రమాదం తనకొక్కడికే కాదు తోటి ప్రయాణికులకు కూడా అన్న చిన్న విషయం తెలుసుకోలేని యువత ఉన్న దేశం మనది.   అందుకే కొత్తగా వచ్చిన కమీషనర్ ముఖ్యంగా ఈ రెండు ప్రాబ్లమ్స్ మీదే దృష్టి పెట్టాడు.   ఆ నెలరోజులూ ఆయన ఖాళీగా ఏమీ లేడు.   ట్రాఫిక్ సమస్యని ఎలా తీర్చాలి అన్న దాని మీదే దృష్టి పెట్టాడు.  ”

“సోదాపి సంగజ్జెప్పు.  ”

“అదిగో అలా అరిస్తే నేను చెప్పను” రెండు చేతులతో నోరు మూసుకున్నాడు ప్రకాష్.

“అయితే సరే చక్కిలిగిలి పెడతా నీ ఇష్టం” బెదిరించాడు.  చక్కిలి గిలి పెడితే ప్రకాశ్ అస్సలు తట్టుకోలేడు.

“బాబోయ్! వద్దులే విను.   నెల తర్వాత సిటీ లో ఉన్న బిచ్చగాళ్ళందరినీ , ట్రాఫిక్ దగ్గర అమ్ముకునేవాళ్ళనీ కూడగట్టాడు.   ప్రతి సిగ్నల్ దగ్గరా పదిమంది దాకా ఉంటారు.  ఎవరైనా సరే ట్రాఫిక్ క్రాస్ చేస్తున్నా,మొబైల్ మాట్లాడుతూ కనపడ్డా వీళ్ళెళ్ళి వాళ్ళ చుట్టూ నిలబడి చప్పట్లు కొట్టుకుంటూ పాటపాడతారు.   అది ఫొటో/వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టేసే వాళ్ళు.   “ట్రాఫిక్ రూల్ ని అతిక్రమిస్తూ బిచ్చగాళ్ళకు/స్ట్రీట్ వెండర్స్ కి దొరికిన వ్యక్తి” అంటూ.  .  ఫైన్ మామూలె.  .  ఆ తర్వాత వాళ్ళు కట్‌తే ఫైన్ వాళ్లకు పంచేవారు.  వీళ్ళను మానిటర్ చెస్తూ ఒక ట్రాఫిక్ పోలీస్ ఉండేవాడు.   ఫుల్లు ట్రాఫిక్ లో కూడా నేర్పుగా తిరిగే టాలెంట్ బిచ్చగాళ్ళ సొంతం.   అందుకే ఎంత తప్పించుకుందామన్నా రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళు దొరికి పోయేవారు.   మొదట్లో బాగా గొడవ చేసినా తర్వాత్తర్వాత ట్రాఫిక్ కి అలవాటు పడ్డారు.

“మొదట్లో అడుక్కునేదానికన్నా బాగా తక్కువ డబ్బులొస్తున్నాయని బిచ్చగాళ్ళు చాలా గొడవ చేసారు.   కానీ మరి ఆయన ఎలా ఒప్పించాడో తెలీదు గప్ చుప్.  .  .  .  ట్రాఫిక్ బాగా కంట్రోల్ అయింది.   అప్పుడు వారందరినీ చెత్తని కంట్రోల్ చేసే వారికింద మార్చాడు రోడ్డు మీద ఎవరన్నా చెత్త వేస్తూ కపడితే సేం ట్రీట్ మెంట్.   ఇప్పుడు వారందరికీ ప్రభుత్వ జీతాలు .  ”

పడీ పడీ నవ్వసాగాడు గౌరవ్.  ”అయ్యో నేనెంత మిస్ అయ్యాను.   మా లాబ్ లో సోషల్ నెట్వర్క్ ఉండదు.   వారానికి ఒకసారి అమ్మవాళ్లతో మాట్లాడ్డమే.   అప్పుడు కూడా కొద్ది సమయమే ఇచ్చేవారు అందుకే తెలీలేదు.   సరే ఒకసారి బయట తిరిగొద్దాము పద”

కారు అద్దాలు తీసుకుని డ్రైవ్ చేయసాగాడు గౌరవ్.   చల్లని గాలి చక్కిలిగిలి పెడుతున్నది.   వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.   రోడ్ సైడ్ ఇడ్లీ దోస సెంటర్స్ చాలా శుభ్రంగా వెంటనే వెళ్ళి తినాలనేంత నీట్ గా వున్నాయి.   హాయిగా వెనక్కి వాలి నిదానంగా వెళ్తుంటే ఒక దృశ్యం ఆకర్శించింది గౌరవ్ ని.   “అరేయ్ ఎన్ని మారినా జనాలు రోడ్ మీద యూరినేట్ చేయడం మానరు కదా?” విసుక్కున్నాడు.

“అలా అనకురా! ఒక్కసారి మొత్తం మార్పు రాదురా.  బయట తిరుగుతున్న వెండార్స్ యెక్కడ వెళ్తారు? రోజంతా ఇంటికెళ్ళేదాకా ఆపుకుంటే హెల్థ్ ప్రాబ్లమ్స్ వస్తాయి.   దీన్ని ఒక ఉద్యమం లాగా చెయ్యాలి.  ప్రభుత్వం వారు పబ్లిక్ టాయిలెట్స్ ని విరివిగా నిర్మించాలి.   మళ్ళీ దాన్ని మెయింటెయిన్ చెయ్యాలి.   వాటిని కొంత డబ్బు పే చేసి వాడుకుందాము అన్న గ్రహింపు వీళ్ళకు రావాలి.   సులభ్ వాళ్ళు చేసారు కాని అందులో కూడా శుభ్రత తక్కువ.   ఇదంతా ఒక సర్కిల్.  .   మళ్ళీ ఎవరో వస్తారు ఇలాగే” చెప్పాడు ప్రకాశ్.

చల్లగాలిని తనలో నింపుకుంటూ పూలరథం లా వెళ్ళసాగింది కారు.

 

 

 

 

 

 

అతివలు అంత సులభమా…..

రచన: ఆర్. ఉమాదేవి

 

అదురుతున్న గుండెను అదిమిపట్టుకుంటూ.. ఒక్క ఉదుటున తన సీట్లోకి వచ్చి పడింది సుమన.

ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఆమెకి. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటల్ తీసి గటగటా నీళ్ళు తాగింది. కాసేపటి తర్వాత గాని ఆమె స్థిమితపడ లేకపోయింది.

గదిలో జరిగింది తలుచుకుంటూ ఉంటే మళ్ళీ గుండెలు గుబగుబలాడాయి.

*****

సాయంత్రం ఆఫీస్ అవగానే ఇల్లు చేరింది సుమన. అన్యమనస్కంగానే వంట గదిలో పనులు చేస్తోంది.

“సుమనా! కాస్త కాఫీ ఇవ్వవూ..తల నొప్పిగా వుంది.” అడిగాడు ఆమె భర్త.

ఆలోచనల్లో ఉన్న సుమనకు వినిపించలేదు.

“సుమనా!” మరో సారి పిలిచాడు.

భర్త మూడో సారి పిలిచేవరకు ఆమె ఈ లోకం లోకి రాలేదు.

“ఏమిటండి?” ఈ సారి ఆమె గదిలోంచి బయటకు వచ్చి అడిగింది.

“కాఫీ అడిగాను. ఏమాలోచిస్తున్నావ్? ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లెమా?”

“అబ్బే అదేం లేదండి. పనిలో పడి వినిపించుకోలేదు. ఇప్పుడే తెస్తాను.” అంటూ లోపలికెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది భర్తకు.

*****

సుమనకు పాతికేళ్ళు ఉంటాయి. ఓ ప్రైవేటు కంపనీలో చిరుద్యోగి. అదే ఆఫీస్ లో పని చేస్తున్న ప్రభాకర్ తో  పరిచయం ప్రేమగా మారడం…పెళ్ళితో వారిద్దరూ ఒక్కటవ్వడం త్వరత్వరగా జరిగి పోయాయి. కాని దురదృష్టవశాత్తూ పెళ్ళైన ఏడాది తిరక్కుండానే ప్రభాకర్ కు జరిగిన  యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి. మంచం మీద నుండి కదలలేని పరిస్థితి. అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుందన్నారు డాక్టర్లు.

మధ్య తరగతి కుటుంబ నేపథ్యం…కొత్త సంసారంలో పూర్తిగా కుదుట పడకనే చుట్టుముట్టిన ఆర్ధిక ఇబ్బందులు వారిని కొంత ఉక్కిరిబిక్కిరి చేసాయి.

సుమన ఉదయాన్నే లేచి భర్త అవసరాలన్నీ చూసుకొని వంట ముగించి ఆఫీస్ కు వెళుతుంది. ఇంటికి ఆఫీస్ దగ్గరే అవటంతో మధ్యాహ్నం మళ్ళీ వచ్చి అతడికి భోజనం పెట్టి తనూ తినేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం రాగానే ఇంటి పని… వంట పని… భర్తకు సపర్యలు వీటితో సరిపోతుంది.

ఇంటి పరిస్థితులు, ఆఫీస్ పనులతో మొదట్లో  కాస్త ఇబ్బంది పడినా ఇప్పుడిప్పుడే  అలవాటు పడుతోందామె. సహచరుడి భార్యగా, సాటి ఉద్యోగినిగా  ఆమెకు కలిగిన కష్టానికి ఆఫీస్ లో  మిగిలిన వాళ్ళందరూ సానుభూతితో సహకరించేవారు. ఆమె కూడా తన బాధలను మనసులోనే దాచుకుని తన పనిని నిబద్ధత తో పూర్తి చేసేది. ఎలాగోలా బతుకు బండి నడుస్తోంది అనుకునేలోగా ఆ ఆఫీస్ కు కొత్తగా వచ్చిన మేనేజర్ సుధాకర్ రూపంలో ఆమెకు కష్టాలొచ్చి పడ్డాయి.

అతడు రాగానే అందరు ఉద్యోగుల గురించి తెలుసుకునే క్రమంలో సుమన గురించి, ఆమె భర్త గురించి తెలుసుకున్నాడు……వెనకా ముందూ పెద్దగా బలగం లేని మనిషని…….అన్నిటికి మించి  వయసులో ఉన్న అందమైన అబల అని కనిపెట్టాడు.

మెల్లమెల్లగా ఆమెని తన దారిలోకి తెచ్చుకోవడానికి  తన శైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

మొదట్లో ఆమెకు కలిగిన కష్టానికి సానుభూతి ప్రకటించేవాడు. నీకేం భయం లేదు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను ..నేను నీ శ్రేయోభిలాషి ని ..అనేవాడు. భర్తను ఒకోసారి హాస్పిటల్ కు తీసుకెళ్ళాల్సి వచ్చేది ఆమె. అలాంటపుడు సెలవు అడిగితే ఇంతోటి దానికి సెలవెందుకు? పని చూసుకుని వచ్చి వర్క్ అటెండ్ అవమని చెప్పేవాడు. సుమన తన ధోరణిలో తనుండి అతడి మనసులో దురుద్దేశాన్ని కనిపెట్టలేకపోయింది. తనకు అతను ఎంతో ఉపకారం  చేస్తున్నాడని ఆమె మనసు అతడి పట్ల కృతజ్ఞత తో నిండిపోయేది. ఇంట్లో భర్తతో కూడా అతడు తనకెంత సహాయం చేస్తున్నదీ చెప్పేది.

ఆమె తనని పూర్తిగా నమ్మిందని రూడీ అయ్యాక తర్వాతి అంకం లోకి దిగాడు సుధాకర్.

ఫైల్స్ ఆమెకు ఇచ్చేటపుడో తీసుకునేటపుడో చేతి వేళ్ళు తగిలించడం…..ఆమె దేనిగురించైనా బాధలో ఉంటె భుజం తట్టడం..లాంటివి మొదలు పెట్టాడు. సుమన ఇంకా గుర్తించలేదు.

ఆ రోజు సుమన..ప్రభాకర్ ల పెళ్లి రోజు. ఉన్నంతలో కాస్త మంచి చీర కట్టుకుని ఆఫీస్ కు బయలుదేరింది సుమన.

అసలే అందమైన ఆమె, కాస్త ప్రత్యేకంగా కనపడే సరికి సుధాకర్ లోని మృగాడు నిద్ర లేచాడు. సుమన యధావిధిగా పంపవలసిన లెటర్స్ టైపు చేసి అతడి సంతకాల కోసం మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్ళింది.

“ ఏమిటి ఈ రోజు కొత్తగా ఉన్నావ్?” ఫైల్స్ అందుకుంటూ అడిగాడు సుధాకర్.

“ ఈ రోజు మా పెళ్లి రోజు సర్. మా ఆయన ఈ రోజైనా మంచి చీర కట్టుకోమని చెప్పారు. ఇప్పుడున్న ఇబ్బందుల్లో ఎందుకని నేను వద్దన్నా వినలేదు.” కాస్త బిడియంగా చెప్పింది సుమన.

“ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావ్. అందుకే కట్టుకొమ్మని చెప్పి వుంటారు.” అదోలా నవ్వుతూ అన్నాడు.

మొదటిసారిగా సుమనకు అతడి తరహా ఏదో తేడాగా అనిపించింది. ఏం మాట్లాడలేదు.

“పాపం మీ ఆయన బాగుంటే పెళ్లి రోజు చక్కగా ఎంజాయ్ చేసేవారు కదూ….ఈ వయసులో నీకు రాకూడని కష్టం వచ్చింది.”

అతడి చూపులో, మాటలో వెకిలితనం ఆమె ఆడమనసుకు తెలుస్తోంది. కానీ పై అధికారి అవడంతో ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోయింది.

ఆమె మౌనం అతడికింకా బలాన్నిచ్చింది.

“ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నువ్వు ఊ అనాలే గాని నీ పెళ్లి రోజును నేను సెలబ్రేట్ చేయనూ…” సంతకాలు చేసిన లెటర్స్ అందుకుంటున్న ఆమె చేతిని పట్టి తన మీదకి లాక్కున్నాడు.

అది ఊహించని ఆమె తూలి అతడి మీద పడబోయి, చివరి క్షణంలో టేబుల్ పట్టుకుని తమాయించుకుంది.

ఒక్క విదిలింపు తో అతన్ని విసిరికొట్టి గబగబా ఆ గది లోంచి బయటకు వచ్చేసింది.

బయటకు వచ్చిన చాలా సేపటి వరకు ఆమె ఆ షాక్ లోంచి తేరుకోలేకపోయింది.

ఇన్నాళ్ళూ ఇతడినా తను మంచి వాడనుకుంది. మనసులో ఇంత విషం పెట్టుకుని తనకు సహాయం చేసినట్టు నటించాడు దొంగవెధవ. ఇక ఆ రోజు మనసు పెట్టి పని చేయలేకపోయింది. ఎలాగోలా అయిందనిపించి ఆఫీస్ లోంచి బయటపడింది.

ఈ విషయం భర్త తో ఎలా చెప్పుకోగలదు. ఉద్యోగం లేకపోతే తమ బతుకులు అంతంత మాత్రమే. ఆ వెధవ…. ఈ రోజు ఇంత సాహసం చేసినవాడు రేపటి నుండి తన జోలికి రాడనే గారెంటీ లేదు. ఇక తనకు దిన దిన గండమే….

ఆమె ఈ ఆలోచనల్లో పడే భర్త అన్ని సార్లు పిలిచినా పలుక లేదు.

ప్రభాకర్ ఆమె అన్యమనస్కంగా ఉండటం చూసి మరోలా అనుకున్నాడు.

వంట పూర్తి చేసి ప్రభాకర్ కు పెట్టి తనూ కాస్త తిన్నాననిపించింది. తిండి కూడా సరిగా సహించలేదు ఆమెకు.

“సారీ సుమా! ఈ రోజు ఎంతో ఆనందంగా గడపాల్సిన రోజు. నేనిలా అయిపోవటంతో నా సేవతోనే నీకు రోజు గడిచిపోయింది.” అన్నాడు బాధగా.

“ఛ! ఛ! అవెం మాటలండీ! మీరు కోలుకుంటే నాకు అంతే చాలు. మీరు మనసులో ఏం పెట్టుకోకుండా పడుకోండి.” అంది అతడి పడక సరిచేస్తూ.

ఆమె అనుకున్నట్టుగానే తర్వాతి రోజు నుండి సుధాకర్ విశ్వరూపం చూపసాగాడు.

ఆమె అతడి గదిలోకి వెళ్ళడమే మానుకుంది. లెటర్స్ ఏమైనా ఉంటే అటెండర్ చేత పంపుతోంది. కాని ఏదో ఒక నెపంతో అతడు ఆమెను గదిలోకి పిలుస్తున్నాడు. ద్వంద్వార్థ మాటలు ఆమె మీద ప్రయోగిస్తున్నాడు.

రోజు రోజుకి అతడి టార్చర్ ఎక్కువవుతోంది. నీ ఉద్యోగం నా దయా దాక్షిన్యాలపైనే ఆధారపడి ఉంది. నీ పనితనం సరిగా లేదని పైకి రిపోర్ట్ రాస్తే నిన్ను ఉన్నపళం గా పీకి అవతల పడేస్తారు. నువ్వు నా దారికి రాక తప్పదు అంటూ ఈ మధ్య బెదిరింపులకు  కూడా దిగుతున్నాడు.

ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. యాజమాన్యానికి ఫిర్యాదు చేద్దామా అనుకుంది. కానీ ఎక్కువ మాట్లాడితే ఈ ఉద్యోగం మానేసి వెళ్ళవచ్చు అంటారేమో…అలా అనుకోగానే ఆమెకు ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. ఇక తన బతుకు ఇంతేనా…ఆ మేనేజర్ గాడు ఏదో ఒకరోజు తనను కబలించేస్తాడేమో….ఈ ఉద్యోగం చెయ్యలేని.. వదిలెయ్యలేని… తన అసహాయతను తనే తిట్టుకుంది.

మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్ళగానే మరో కొత్త అమ్మాయి కనిపించింది. ఎవరని ఆరా తీస్తే నెల క్రితం ఇంటర్వ్యూ జరిగిన స్టెనో పోస్ట్ కు సెలెక్ట్ అయిన పిల్ల హాసిని. వయసు పాతికేళ్ళ లోపే ఉంటుంది. కాస్త మోడరన్ గా ఉంది. అందంగానూ ఉంది. ఇంగ్లీష్ లో గలగలా మాట్లాడేస్తోంది. సుమనని చూసి పలకరింపుగా నవ్వింది. కాసేపట్లో ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరూ.

హాసిని వచ్చాక సుధాకర్ దృష్టి ఆ పిల్ల మీదకి మళ్ళినట్టుంది. సుమన జోలికి రావడం తగ్గించాడు. హాసిని ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడు అచ్చం అప్పుడు సుమనను చేసినట్టే. సుమన ప్రాణానికి ఇప్పుడు కాస్త హాయిగా ఉన్నా వాడికి హాసిని బలి అయిపోతుందేమో అని బాధ పడసాగింది.

అక్కడికీ హాసినిని హెచ్చరిస్తూనే ఉంది అతడితో జాగ్రత్త అని. ఆమె సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. సుమన చెప్పినపుడు నిర్లక్ష్యంగా నవ్వి ఊరుకుంటోంది.

సుధాకర్ మొదటి స్టేజి దాటి రెండో స్టేజి లోకి వచ్చాడు. హాసిని తెలిసినా తెలియనట్టు ఉంటోంది. అతడు మరో అడుగు ముందుకేసాడు.

ఆ రోజు డిక్టేషన్ తీసుకుంటున్న హాసిని వెనుకవైపుగా వచ్చి ఆమె భుజాల మీద చేతులేసాడు. అంతే….దిగ్గునలేచి అతడి చెంపలు చెళ్ళుమనిపించింది. అంతటితో ఆమె ఆగలేదు. అతడి షర్టు పట్టుకుని గదిలోంచి బయటకు లాక్కొచ్చింది.

సుధాకర్ ఎదురుచూడని ఈ అవమానానికి బిత్తరపోయాడు.

“యూ డెవిల్. చూడు నిన్నేం చేస్తానో” అన్నాడు రోషంగా..

“షట్ అప్ యూ ఇడియట్ .నువ్వు నన్ను ఏమిటి చేసేది? నేనే నిన్ను ఏం చేస్తానో చూడు.” సుమన ప్రక్కనున్న ల్యాండ్ ఫోన్ నుండి ఓ నెంబర్ డయల్ చేసింది హాసిని.

ఆఫీస్ లో అందరూ అవాక్కయి చూస్తున్నారు.

“డాడీ! మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే ! ఇక్కడ మేనేజర్ ఓ పెద్ద రోగ్. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అంటే ఏం చేసినా పడుండే ఆటబొమ్మలని అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ కి చెడ్డపేరు. వెంటనే డిస్మిస్ చేయండి.” అంది.

ఆ మాటలతో ఆఫీస్ వారికి ఆమె తమ బాస్ కూతురని అర్థం అయిపోయింది. సుధాకర్ తో సహా అందరూ అటేన్షన్ లోకి వచ్చేసారు. కాని ఆమె ఇన్నాళ్ళూ ఇలా తమ మధ్య అజ్ఞాతంగా ఎందుకు ఉందో, సుధాకర్ గురించి ఎవరు ఫిర్యాదు చేసారో వారికి అర్థం కాలేదు.

ఆమె ఇంకా ఫోన్ లో మాట్లాడుతోంది. అవతల తమ బాస్ ఏం చెప్తున్నాడో…..

“…………………”

“వాడికి ఛాయిస్ ఎందుకు డాడీ! పోలీసులకు అప్పగించక….”

“…………………”

“సరే డాడీ! అలాగే!” ఫోన్ పెట్టేసింది ఆమె.

అప్పటికే సుధాకర్ బిక్క చచ్చిపోయాడు. తమ బాస్ కూతురు ఎక్కడో విదేశాల్లో చదువుతోందని తెలుసు. సినిమాల్లో చూపినట్టు ఆమె ఇక్కడికి రావడం ఏమిటి? తనకు తెలియకుండా పోవడం ఏమిటి? తన కర్మ కాలిపోయి ఆమెతోనే అసభ్యంగా ప్రవర్తించాడు. అయినా తన మీద ఎవరు ఫిర్యాదు చేసి ఉంటారు? ఆఫీస్ లో అందరినీ తను చెండాడుతూనే ఉంటాడు. ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చే ఉంటాడు. బయటకు వెళితే ఎంత అవమానం? ఇప్పుడు తనకేది దారి? ఆలోచిస్తుంటే అతడికి ఒళ్లంతా చెమటలు పట్టేసాయి.

“మిస్టర్ సుధాకర్! నీ మీద నిర్భయ కేసు పెట్టి జైలుకు పంపేద్దాం అన్నంత కోపం ఉంది నాకు. కాని కంపెనీ పరువు పోకుండా ఉండటానికి  డాడీ నీకు మరో ఆప్షన్ ఇద్దామని అన్నారు. నువ్వు చేసిన వెధవ పనులన్నీ ఓ కాగితంలో రాసి, నీ రాజీనామాను ఇచ్చి తిరిగి చూడకుండా వెళతావా? లేక పోలీసులను పిలిచి జైల్లో తోయించమంటావా? నువ్వే నిర్ణయించుకో. సుమన గారిని నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో ఆవిడా, నన్ను ఏం చేసావో నేను రాసి ఇస్తే నువ్విక జన్మలో బైటకు రాలేకుండా మా డాడీ చూసుకుంటారు.” అంది హాసిని.

సుధాకర్ ఎక్కువ సేపు ఆలోచించలేదు. ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం చూసుకోవచ్చు అనుకుని ఆమె చెప్పినట్టే రాసి ఆమె చేతికి అందించాడు.

అతడు రాసిన లెటర్ ను ,రాజీనామా ను మెయిల్ ద్వారా హెడ్ ఆఫీస్ కు కూడా పంపమంది. అతను అలాగే చేసాడు.

“ గెట్ అవుట్ ఫ్రం హియర్ “

అతడు తల దించుకుని వెళ్ళిపోయాడు.

అప్పటి వరకు ఉత్కంట గా చూస్తున్న స్టాఫ్ అందరు  కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాళ్ళూ తమ మధ్య ఉన్న బాస్ కూతురితో తాము ఏదైనా తప్పుగా ప్రవర్తించామా అని లోలోపలే ఆలోచించుకోసాగారు.

అయోమయంగా చూస్తున్న సుమన దగ్గరికి వచ్చింది హాసిని. ఆమె తమ యజమాని అని తెలియగానే సుమన మునుపటిలా చొరవగా మాట్లాడలేకపోయింది.

“మీరు అతడి వల్ల ఎన్ని బాధలు పడుతున్నా నోరు విప్పలేదేందుకు? కనీసం ఇంట్లో వాళ్లకు కూడా చెప్పుకోలేరా? ఇలా మనం నోరుమూసుకున్న కొద్దీ ఇలాంటి వెధవల ఆగడాలు ఎక్కువ అవుతాయి అని గుర్తించరెందుకు?” అడిగింది హాసిని.

“ మేడం! మీకు …..మీకెలా తెలుసు నేను అతడి వలన ఇబ్బంది పడుతున్నానని. స్వయంగా మీరే వచ్చారు. నేనెవరికి చెప్పనే లేదు…” తడబాటుగా అడిగింది సుమన.

“నాకెవరూ చెప్పలేదు.” అంది హాసిని.

“మరి మీకెలా?…”

“వెధవ పనులు చేసేవాడు ఎంతటి తెలివైన వాడైనా ఎక్కడో ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పే అతడిని పట్టిస్తుంది.” అంది.

“అది ఏమిటి?” అని  అడిగే సాహసం చేయలేదు సుమన.

“ఓకే అందరూ మీ పనులు మీరు చేసుకోండి “ అంటూ ఆఫీస్ లో సీనియర్ క్లర్క్ ను పిలిచి ఆ రోజుకు ఆఫీస్ తాళాలు అతని దగ్గర పెట్టుకోమని చెప్పి తను బయలుదేరి వెళ్ళిపోయింది.

*********

రెండు రోజుల తర్వాత ఆఫీస్ కు వెళ్ళిన సుమన పక్క సీట్లో హాసినిని చూసి కంగారు పడింది.

“మేడమ్! మీరిలా…మళ్ళీ…”

“అయ్యో సుమన గారూ! ఎందుకు నన్ను చూసి కంగారు పడతారు? నీ మీ స్నేహితురాలు హాసినినే! నాకు అనవసర మర్యాదలు అక్కర్లేదు.”

“మీరు…మీరు మా బాస్ కూతురు కాదా?” ఇంకా ఆమె గొంతులో ఇంకా అపనమ్మకం.

“కాదండి బాబు! ఏదో పొట్ట గడవక ఉద్యోగానికి వచ్చిన దాన్ని.ఇలా రండి.నా పక్కన కూర్చోండి.”

మొన్నటి కంటే ఈ రోజు ఎక్కువ షాక్ తింది సుమన.

అంతలో ఆఫీస్ లో ఏదో కలకలం…. యం.డి. గారు వస్తున్నారు అని…అందరూ వారి వారి సీట్లలో సర్దుకున్నారు.

ఆయన రానే వచ్చారు. వెంట మరో మేనేజర్, మరి కొంత మంది ఉన్నారు.

“ డియర్ ఫ్రెండ్స్! మన ఆఫీస్ లో హాసిని అనే అమ్మాయి ఎంత గొప్ప సాహసం చేసిందో మీకు తెలియదు కదూ! మిస్ హాసిని! కం హియర్ !”

హాసిని లేచి ఆయన దగ్గరికి వెళ్ళింది.

“లైంగిక వేధింపులకు గురి చేస్తున్న పాత మేనేజర్ కు ఎంతో తెలివిగా తగిన బుద్ధి చెప్పింది. తను ఎన్నుకున్న మార్గం తప్పే అయినా తన తెలివితేటలను అభినందిస్తున్నాను. మా అమ్మాయి అని చెప్పి అతడి తప్పులను అతడి చేతనే ఒప్పించి రాజీనామా ఇచ్చేలా చేసింది. మీరు నేరుగా ఫిర్యాదు చేసినా అటువంటి వారు సాక్ష్యాలు లేక తప్పించుకునే అవకాశం ఉంది. కానీ హాసిని తిరుగులేని సాక్ష్యం సంపాదించి అతడికి అతడే శిక్ష విధించుకునేలా చేసింది. జరిగినది అంతా వెంటనే నన్ను కలిసి చెప్పి, అతడి రాజీనామాను అందజేసింది. అమ్మాయిలు తమని తాము కాపాడుకోవడంలో ఇలాంటి నేర్పరి తనం ప్రదర్శించాలి. మొదటి తప్పుగా భావించి హాసినిని క్షమించి వదిలి వేస్తున్నాం. ఇక మీదట ఇక్కడ పని చేసే ఆడవారికి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా నాకు నేరుగా ఫిర్యాదు చేసే వీలు కల్పిస్తున్నాను.” ఆయన చెప్పడం ముగించారు.

అందరూ ఆశ్చర్యం లోంచి ఇంకా తేరుకోలేదు. ఆపై అందరూ ఆమెని అభినందించారు.

కొత్త మేనేజర్ ఛార్జ్ తీసుకున్నారు.

హడావిడి అంతా సద్దుమణిగాక సుమన అడిగింది హాసినిని… ఇంతకూ సుధాకర్ దొరికిపోవడం లో చేసిన తప్పేమిటీ అని.

ఏముందీ! నేను బాస్ కూతురిని అని కాస్త బిల్డప్ ఇవ్వగానే కంగారు పడి రాజీనామా ఇవ్వడమే…ఇక్కడ ఎవరూ బాస్ కూతుర్ని చూడకపోవడం అలా నాకు కలిసొచ్చింది….. గలగలా నవ్వింది హాసిని.

 

 

 

 

 

 

 

 

గాంధీజీ గాయపడ్డారు

రచన: డా.లక్ష్మీ రాఘవ


అది ఒక పురాతనమైన గుడి.
ఆ రోజు గుడి తలుపులు ఇంకా తెరుచుకోలేదు.
పూజారి రావడం ఆలస్యం అయ్యింది.
అయినా గుడి వెలుపల హడావిడి రోజూ లాగే మొదలైంది.
పక్కన పేర్చి వున్న రాళ్ళు వరసగా పెట్టుకుని పళ్ళ బుట్ట దాని మీద పెట్టింది కామాక్షి.
ఎదురుగా వున్నా వరసలో మొదటిగా వచ్చే పూలమ్మి పుల్లక్క అప్పటికే వెదురు బుట్ట లో పూలు రంగులవారిగా పెట్టుకుని నీళ్ళు చల్ల్లుతూంది.
నీళ్ళు చల్లినాక పల్చటి గుడ్డ తడిపి వాటి మీద కప్పి వుంచి, భక్తులు వచ్చినప్పుడు తొలగించి “పూలమ్మా పూలు ..మీరిచ్చే పూలతో శివుడు మురిసిపోతాడు..”అంటూ అరుస్తూంది.
అప్పుడే టెంకాయల సంచి మోసుకుని వచ్చి పుల్లక్క పక్కన పెడుతూ వెంకడు
”ఒక్క నిముషం చూసుకో అక్కా…నిముషం లో వస్తా” అంటూ జవాబుకోసం ఎదురు చూడకుండా పరుగులు తీశాడు.
పూజారి రావటం చూసి “ఏందీ సామీ ఆలీశం అయ్యింది? పానం బాగానే వుండాదా?” అనడిగింది కామాక్షి.
“కొంచెం జ్వరంగా వుంది లే …”అని త్వరగా అడుగులు ముందుకు వేసినాడు పూజారి.
రోజూ గుడి ముందు బాట కు ఇరు వైపులా కూర్చుని పూజకు కావాల్సిన వస్తువులు అమ్మే వాళ్ళు ఒకరికొకరు అన్నట్టుగా బతుకుతారు అక్కడ. కామాక్షి, పుల్లక్క, వెంకడు, రాములమ్మ, బ్రామ్మడు, రాములు ఒక్కొక్కరిదీ ఒక్కో కథ! కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఒకరికొకరు అన్నట్టుగా వుంటారు. ఎవరికీ వ్యాపారం జరిగినా సంతోషమే!
వె౦కడు వెనక్కి వచ్చి సంచిపట్ట పరిచి టెంకాయలు వరసగా పేర్చి పెట్టి, పక్కనే అగరొత్తుల పొట్లాలు పెట్టుకు కూర్చున్నాడు. పక్కన వున్న పుల్లక్క “తమలపాకులు తెచ్చినాలే ..తడి బట్టలో నాకాడే ఉండనీ బేరం అయినప్పుడు తీసుకో “అంటే తల వూపినాడు…
కామాక్షి పక్కన వున్న ఖాళీ లో గాజుల బుట్ట తో కూర్చుంది రాములమ్మ.
దూరంగా వస్తున్న బ్రామ్మడి ని చూసి నిట్టూర్చింది కామాక్షి.
ఏడ నుండీ వచ్చినాడో ఈ బ్రామ్మడు.ఎవ్వరూ ఒక్క రూపాయి వెయ్యరు కానీ రోజూ రావటం తప్పడు.
“అమ్మా, బ్రామ్మడికి దానం ఇస్తే పుణ్యం. ఒక్క రూపాయి ఇవ్వండి ఆశీర్వాదం చేస్తా “అంటూ గుడికి వచ్చిన ప్రతి భక్తుల గుంపుకూ చెబుతూనే ఉంటాడు. ఎవరూ పట్టించుకోరు. అసలే ఆ బక్కపక్షి కప్పుకున్న పైపంచ పలచగా చిరుగులతో వుంటుంది. లోపల జంజం కనిపిస్తూ వుంటుంది.
ఏదీ దొరకనప్పుడు. అక్కడ అమ్మే వాళ్ళే తలా రూపాయి ఇస్తారు. ఒకపూట భోజనానికి సరిపోయ్యేలా…
భక్తులు రావటం మొదలుపెట్టి క్రమంగా ఎక్కువ అవుతూంది.
కామాక్షి బుట్టలో జామకాయలు , పక్కన వున్న పచ్చి మామిడి కాయలు సన్నగా పీసులు చేసి చిన్న ముక్కలుగా చెక్కి సరాల రూపం లో అమర్చింటే యిట్టె తినేసెయ్యా లని అనిపిస్తుంది . కోనేవాల్లకి కొంచే ఉప్పు , కారం చల్లి మరీ ఇస్తుంది కామాక్షి…కామాక్షి దగ్గర సరుకు ఎప్పుడూ తాజాగానే వుంటుంది. సాయంకాలం లోపల తెచ్చినవన్నీ ఖర్చయి పోతాయి.
వెంకడికీ, పుల్లక్క కూ అస్తమానం బేరం జరుగుతుందని గ్యారెంటీ లేదు. వూరి భక్తులు చాలాసార్లు ఇంటినుండీ టెంకాయలూ, పూలూ తెచ్చుకుంటారు.
వెంకడు “ఏందీ పుల్లక్కా ,ఈ రోజు ఇంకా గాంధి తాత రాలేదు??” అన్నాడు
“అవునే కామాక్షీ గాంధీ తాత ఇంకా రాలేదు నిన్న బాగానే వున్నాడా ??” అనడగింది కామాక్షిని.
“నిన్న జ్వరంగా వుంది అన్నాడు…మధ్యాహ్నం నిలుచుకోలేక వెళ్ళిపొయినాడు. వాళ్ళ బాసుగాడు ఏమన్నాడో…అయినా వొళ్ళంతా వెండి రంగు పూయించు కోవడానికి గంటన్నర పడుతుందట. కంటి అద్దాలూ, కట్టే పట్టుకుని ఎంతసేపైనా కదలకుండా ఉండేదానికి వయసు తక్కువా ?? సన్నగా బోడి గుండు తో వుంటాడని వెదికి పట్టుకున్నాడు గానీ పని ఎంత కష్టమైనదో తెలుసునా… శిల మాదిరి నిల్చునుంటే గదా అందరూ పైసలు వేస్తారు? “అరె గాంధీ తాత విగ్రహం ఎంతబాగుంది “అనుకుంటా పోతారు…బాగుంది అని పిల్లలను పక్కన నిలబెట్టి ఫోటోలు తీసుకుంటారు కానీ పది
రూపాయల నోటు వెయ్యరు..అనీ చిల్లర పైసలే ..ప్చ్ …” భారంగా అంది కామాక్షి.
“రోజూ వచ్చే పైసల్లో నూరు రూపాయలు వాడి బాసుకు ఇవ్వాల్నంట. మిగిలిందే తాతకు… అందుకే ఎవరైనా పెద్దనోటు వేస్తే బాగుండు అనినాడు ఒకసారి…” వెంకడు తనకు తెలిసింది చెబుతూ
వచ్చే బెరాలతో బిజీ గా వున్నా గాంధీ తాత గురించి చెప్పుకుంటూనే వున్నారు అక్కడ.
అప్పుడు మెల్లిగా నడుచుకుంటూ వచ్చినాడు గాంధీ తాత లాగా వేషధారి అయిన రాములు. వరసలో చివరిగా నిలబడుతూ ముందర ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టు కున్నాడు..
ఇక కదలకుండా నిలబడాలి. బక్కగా వున్న రాములు వొళ్ళంతా సిల్వర్ కలర్ పెయింట్ తో, కంటికి అద్దాలు పెట్టుకుని చేతిలో ఏటవాలుగా పట్టుకున్న కట్టెతో అచ్చు నాలుగు రోడ్లకూడలి లో కనిపించే గాంధీ తాత బొమ్మ లాగా వున్నాడు.
“ఏమైంది తాతా ఇంత అలీశం చేసినావు అప్పుడే ఒక గుంపు భక్తులు వచ్చినారు ఒక బస్సులో, అట్లా వూర్లనుండీ వచ్చినోల్లె నీకు బాగా వేస్తారు గదా…మాకుగూడా బేరాలు బాగా జరిగినయ్యి…”అంది నొచ్చుకుంటూ కామాక్షి
ఎదురుగా మనుష్యులు లేరని గమనించి మెల్లిగా “లేదమ్మా నిన్నటి నుండీ జ్వరం వస్తూనే వుంది..’ఈరోజు హాలిడే కి దండిగా గుడికి వస్తారు …ఓపిక వున్నతసేపు నిలబడు’ అని జరం మాత్ర ఇచ్చినాడు మా బాసు… మద్యాహ్నం దాకా వుండి ఎల్లిపోతా..కాళ్ళు నొప్పులు… దుడ్లు లేకుండా కోడలు కూడు పెట్టదు. అందుకే వచ్చినా ..”అన్నాడు గాంధీ తాత. రాములు కొడుకు తాగుడుకి ఎంత డబ్బైనా చాలదు. భర్త మీద కోపం మామ మీద చూపుతుంది కోడలు. అందుకే ఇలా సంపాదన తప్పదు రాములుకు. ఈ వేషం మొదలు పెట్టినాక కొంచెం బాగున్నా, ఈ వయసులో అంతసేపు నిలుచుకోవడం కష్టం.
ఇలాగే అక్కడ ఒక్కొక్కరిది ఒక్కో కథ!
ఇంతలో మరో బస్సు, ఇంకా రెండు కార్లూ వచ్చినాయి అక్కడకు.
బస్సులో వాళ్ళు స్కూలు పిల్లలు కాబట్టి ఎక్కువ బేరం కాదు . కానీ వెనక వచ్చిన కార్లలో ఖరీదైన ఫామిలే పట్టు చీరలతో, నగలతో దిగితే అక్కడున్న వారందరికీ ఆశ కలిగింది..
ఒక కారులో నుండీ దిగిన ఎనిమిదేళ్ళ అబ్బాయి “ అరె గాంధీ తాత ….”అని పరిగెత్తుతూ ముందుకు వచ్చాడు.
వాడి వెంటే వాళ్ళమ్మ కాబోలు పరిగెత్తి వచ్చింది “ఏ రాహుల్ స్టాప్ …”అంటూ.
ఇంతలో రాహుల్ అనే ఆ కుర్రాడు గాంధీ తాతను ఆనందంగా చూస్తూ వున్నాడు…
అక్కడికి చేరుకున్న ఒకాయన “అల్లాగే నుంచో రాహుల్ గాంధీ తాత పక్కన, పిక్చర్ తీస్తా” అని చేతిలోని సెల్ ఫోను ఫోకస్ చేసాడు. రాహుల్ కు భలే ఆనందం వేసింది..
అలాగే రాహుల్ వాళ్ళ అమ్మనూ, తాత పక్కన నిలబడమని ఫోటో తీసాడు వాళ్ళ నాన్న కాబోలు. తరువాత కారు దగ్గర వున్నడ్రైవర్ ని రమ్మని చెయ్యి ఊపి మొత్తం ఫామిలీ ఫోటో తీసుకున్నారు గాంధీ తాతతో… అక్కడనుండీ వెళ్ళిపోతూ నూరు రూపాయల నోటు ప్లాస్టిక్ డబ్బాలో వేసాడు. .అదిచూసిన రాములుకు సంతోషం అయ్యింది ఇంకోక్కరు ఇలాటివారు వస్తే చాలు ఇంటికి వెళ్లిపోవచ్చుఈ రోజు అన్న అంచనాలో వున్నాడు.
స్కూలు పిల్లలు కూడా గుంపుగా నిలబడి గాంధీ తాత దగ్గర ఫోటోలు తీసుకున్నారు కానీ ఒక్క ఇరవై రూపాయల చిల్లర మాత్రమె పడింది డబ్బాలో…
బ్రామ్మడు “ఆశీర్వాదం చేస్తా” అని ఎంత అడుక్కున్నా ఒక్క ఫామిలీ కూడా నిలవకుండా వెళ్ళింది…”ఆడ కార్లలో పెద్దోళ్ళు వచ్చినారు చూడయ్యా . దగ్గరికి పోతే ఏమైనా వేస్తారు” అంది పుల్లక్క.
ఆకలికి కడుపు నకనక లాడుతూంటే దగ్గరగా పార్క్ చేసి వున్న కార్లదగ్గరకు పోయినాడు. “అమ్మా, అయ్యా బ్రామ్మడికి దానం చేస్తే బోలెడంత పుణ్యం”అని చెయ్యి చాచాడు . ఒక కారు అద్దాలు దించి ఒక ముసలామె ఇరవై రూపాయలు ఇచ్చింది..ఆమెకు ఆశీర్వాదం పలికి పక్కనే వున్న బండిలో రెండు ఇడ్లిలు తిని చాయ్ తాగినాడు.. పరవాలేదు ఇంకా క్కాస్సేపు నిల్చుకోవచ్చు అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి నించున్నాడు.
గాంధీ తాత వేషధారి రాములుకు కళ్ళు తిరుగుతున్నాయి…ఇంకా ఎక్కువసేపు నిలుచు కోవడానికి కష్టమనిపిస్తా వుంది…అతని అవస్థను మొదటగా చూసింది వెంకడు.
“తాతా, చాయ్ తెచ్చిస్తా ఆ పక్కకు పోయి తాగిరా…” అంటూ టీ కొట్టు దగ్గరికి వెళ్లి చాయ్ తెచ్చినాడు. గాంధీ తాత మెల్లిగా వెనక్కి నడిచి కొంచెం మరుగున వున్న చేట్టు కింద కు పోయి రాతి మీద కూర్చుంటే వెంకడు చాయ్ తెచ్చినాడు. అది తీసుకుని “తాగేసి వస్తా లే వెంకన్నా..”అన్నాడు.
చాయ్ తాగుతూ చుట్టూ ఎవరూ గమనించడం లేదుకదా చూస్తూ వుంటే ..కడుపులో తిప్పసాగింది..చాయ్ తో బాటు కొంచెం పెయింట్ లోపలకు వెళ్ళిందేమో ..ఒక్క సారిగా వాంతి వచ్చింది . బళ్ళున వాంతి చేసుకుతూంటే కళ్ళు తిరిగి బండ మీదకు పడి కిందకు పడిపోయినాడు…బండకు తగిలి తలమీద గాయం అయి రక్తం కారసాగింది.
ఆ క్షణాన ఆ పక్కకు చూసిన వెంకడు ఒక్క వూకున లేచి “గాంధీ తాత పడిపోయినాడు రక్తం వస్తా వుంది..”అని అరుస్తూ పరిగెత్తినాడు కామాక్షి, పుల్లక్క, బ్రామ్మడు అందరూ ఒకా సారిగా పోయి గాంధీ తాతను ఎత్తి పట్టుకున్నారు… మన స్పృహలో లేడు తాత….
మనుష్యలు గుమికూడుతూ వుంటే “108 కి ఫోను చెయ్యండ్రా…”అని అరిచినాడు వెంకడు.
అయ్యో గాంధీ తాత కు గాయం అయ్యిందీ అని అందరూ అంటూంటే . కామాక్షీ, పుల్లక్కా బ్రామ్మడు గబా,గబా తమదగ్గర వున్నా పైసలు పోగు చేసి నారు..
108 రాగానే గాంధీ తాత ను లోపలకు తీసుకున్నారు. వెంకడు కూడా బండి ఎక్కినాడు.
అది కదిలే లోపల బయట ఒకడు “ గాంధీ తాతకు గాయం అయ్యింది …పైసలు వెయ్యండీ…”అని గట్ట్ట్టిగా అరుస్తూ వుంటే వచ్చేపోయ్యేవాళ్ళు వింతగా జేబులో చిల్లర వేస్తూ వున్నారు…
పరవాలేదు ఈ దేశం లో గాంధీ వేషం వేసినా డబ్బులు పడతాయి ….
జాతిపిత గాంధీని ఇలా ఉపయోగించాల్సి వస్తున్నందుకు అందరూ సిగ్గు పడాలి…
……

కళ్యాణ వైభోగమే

రచన: రాము కోల

“పెళ్ళి కుదిరింది అనుకోగానే సరిపోయిందా..
రూపాయి ఎంత త్వరగా ఖర్చు అవుతుందో కూడా లెక్కేసుకోవాలి.”
“ఎమంటావు మావా!” అంటూ నోట్లో ఉన్న పుగాకు కాడ నవులుతు.. పక్కనే ఉన్న గొపయ్య. వైపు చూశాడు చిదానందం.
“ఓసోసి! ఊరుకోవోయ్..
పెళ్లి కుదరటమే మా గొప్ప సంగతి. ఇక రూపాయంటావా? మనందరం లేమా ఏటి,
తలా ఓ చెయ్య వేస్తే పిల్లకూడా ఓ ఇంటిది అయిపోద్ది. ”
” నువ్వు ఏటి దిగులు పడమాక”
అంటూ దైర్యం చెపుతున్న మార్కోస్ ను చూసి..
పెళ్లి జరిగిపోయినంత సంభరపడిపోయాడు గోపయ్య.
“ఇదిగో గోపయ్య! నువ్వు దిగిలు పడమాక, రేపు ఉదయం ఆ లగ్నపత్రిక మా నడిపోడికిచ్చేయ్. పట్నం పోతాడు. తిరిగి వస్తా వస్తా కార్డులు ప్రింటేంచుకు వచ్చేస్తాడు…
“ఇక కార్డు పంపకమంటావా! మా చిన్నోడు చూసుకుంటాడు. ఆడికి మన బంధుత్వాలు చుట్టపక్కాలు బాగా తెలుసు.. వాడైతే చుట్టేసుకొస్తాడు.. ఏమంటావ్..
అంటున్న మల్లన్న వైపు చూస్తూ..
” నువ్వు చెప్పితే కాదంటానా బాబాయి.. మా కున్న పెద్ద తలకాయ, అన్నీ చూసుకునేది నువ్వే కదా.. అలాగే కానీ”
అంటూ సగం పనులు పూర్తి అయిపోయేగా అనుకున్నాడు గోపయ్య.
“ఇదిగో గొపయ్య! ఉదయమే మన ట్రాక్టర్ పొలంగట్టుదాక పోద్ది. మనోల్లని ఓ ఇద్దరిని పంపించా వంటే.. కంది కట్టే.. తాటాకులు ఏసుకొస్తారు..
“ఇంటి ముందు పందిరేస్తేనే కదా పెళ్లి కళ వచ్చేది,” అంటుంటే, అలాగే బావగారు. ఉదయమే మన పిల్లలు సిద్దంగా ఉంటారు..
” నీకు శ్రమ కలిగిస్తున్నానేమో..”
అంటున్న గోపయ్య భుజం తట్టి.
“ఏటిరా నీ కూతురు నాకుతురు తోటిది.
ఇక పక్కపక్కన వాళ్ళం ఇది కూడా చేయకపోతే ఇంకేందుకు.. ఇరుగుపొరుగు అని.”
” ఇది మన పల్లెరా అబ్బాయ్.. పట్నం కాదు, అందరం కలిసే చేసేద్దాం నీ కూతురు పెళ్ళి.. నువ్వు ఏమీ ఆలోచించక..”
” సరే నేనలా ఎటిగట్టు దాకా ఎళ్ళివస్తా! సరేనా అంటు ముందుకు సాగుతున్న భూషణం వైపు ప్రేమగా చూశాడు గోపయ్య.
“మావయ్య!
పెళ్ళికి లైటింగ్.. టెంట్లు.. అన్నీ నే చూసుకుంటా.. మనోడొకడున్నాడు.. ఎంతో కొంత సర్ది చూసి ఇచ్చేద్దాం.. ఏమంటావ్… ”
అంటున్న నాగరాజును.. సరే నీ ఇష్టం అనలేక పోయాడు గోపయ్య.
“ఏంటి ఎవరికి వారు మీకుగా మీరు చేసుకుంటే ఎలా!
నాకూ కాస్త బాగం కల్పించండి. ఆ వంటల కార్యక్రమంలో నన్ను చేర్చేస్తే నలుగురికి నాలుగు రకాల వంటలు వండి వడ్డించే ఏర్పాటు చేసుకుంటా… కాదనకండి.. ”
అంటున్న భీమన్నహవైపు తిరిగిన గోపయ్య.
“ఎంతమాట భీమన్నా! నీకు కాక మరోకరికి ఎలా అప్పగిస్తాం వంట పని.. అసలే నీ మేనకోడలి పెళ్ళి. కదా.. ఇవ్వకుంటే తను ఊరుకుంటుందా చెప్పూ.”. అంటూ ముసిముసి గా నవ్వాడు గోపయ్య.
దూరంగా ఉన్న రత్తాలును చూస్తూ, ఏటి రత్తాలు..
ఉలుకూ పలుకూ లేకుండా అలా చూస్తున్నావ్.. ఏంటి సంగతి, అంటూ ముందుకొస్తున్న బాస్కరా చారీగారిని చూస్తూ.
“అందరూ అన్నీ పంచేసుకుంటే.. నాకు ఇక పనేటి ఉంది. నేనేటి చేయను” అంటుంటే…
“అలా చిన్న బుచ్చుకోకే రత్తాలు.. అమ్మాయి అలంకరణ మొత్తం నీదేకదా… మండపంకు కావలసిన పూలుకూడా నువ్వే చూసుకో.. సంతోషమే కదా”అంటున్న బాస్కరా చారీగారిని మెచ్చుకోలుగా చూసింది రత్తాలు..
“నా మట్టి బుర్రు ఇది తట్టలేదేటండి.. ”
అంటుంటే.. మట్టి బుర్రకాదు గటకటి బుర్ర.. నీది అంటూ ఆటపట్టించడం బాస్కరా చారిగారి వంతు అయింది.
“ఏమయ్యా.. గ్రామ పెద్దలు ఇదేమన్నా బాగుందా.. ఇక్కడ.. ముకుందనాధం అని ఒక వ్యక్తి ఉన్నాడని.. వాడిని కూడా కలుపుకుందామనే ఆలోచన ఏమైనా ఉందా మీకు..
పెళ్లికి కావలసిన ప్రతి సరుకూ నా దుకాణం నుండే వెళ్ళాలి.. నన్ను కాస్త కలుపుకొండయ్యా…”అంటున్న ముకుందనాధం కౌగిలించుకున్నాడు గోపయ్య…
“అడకుండానే సాయం చేయగల హృదయం నీది. నీ వంతు లేకుండా ఎలా నా కూతురు పెళ్లి జరుగుతుంది..అది తెలియనిదా నీకు” అంటూ ఒకరికి ఒకరు ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.
“పెద్దనాన్నా! నన్ను మరచిపోయారు.. చెల్లాయికి ఉరేగించేది నా జీపులోనే అది మరచిపోకండి “అంటున్న మురళి వైపు మురిపంగా చూశాడు గోపయ్య….
ఇదేనేమో..
పల్లేలో ఉండే ఆత్మీయత.. ప్రతిదీ మనందరిది అనుకునే మంచి మనసు వీరిసొంతం.
ఇందరి మధ్యన రంగరంగ వైభవంగా జరిగింది వైష్ణవి పెళ్ళి…..
దివిలో దేవతల దీవెనలు.. భువిపై మంచి మనసున్న ఆత్మీయులకు మధ్యన…

జలజం… మొహమాటం.

రచన: గిరిజా కలవల

ఆ మధ్య జలజం ఓ బీరకాయపీచు చుట్టమింటికి వెళ్ళింది. బంధుప్రీతి ఎక్కువ కదా మన జలజానికి… ఎవరినీ వదలదు.. ఆ ప్రకారం గా.. ఆ బీరకాయ పీచు ఇంటికి వెళ్ళగా… వారు సాదరంగా ఆహ్వానించి సముచిత ఆసననంబుపై ఆశీనులుకమ్మని.. తదుపరి యోగక్షేమం విచారించి… తగు ఆతిధ్యమీయ ఆ బీరకాయపీచు… ఒక ప్లేటు నిండుగా ఉల్లి పకోడీలు తెచ్చి మన జలజానికి అందించెను.
ఉల్లి వాసనకి ముక్కుపుటాలు అదిరి… నోట లాలాజలం రివ్వున ఎగసింది … వెంటనే ప్లేటు అందుకోకుండా కొంచమైనా మొహమాటపడకపోతే బావుండదని తలచి… మన జలజం..
” అయ్యో… . మా ఇంట్లో భోంచేసే బయలు దేరాను… ఇదిగో ఇప్పుడే చేయి కడుక్కున్నాను… ఒట్టు…” అనగానే…. సదరు బీరకాయ పీచు.. ఏ మాత్రం మొహమాటం లేకుండానే ” అవునా ! ఇప్పుడే భోం చేసారంటున్నారు… ఇక ఇవి ఏం తింటారులెండి..” అంటూ ఆ ప్లేటు తీసుకుని వెనుతిరిగింది.
ఆ పీచు గారి భర్త మాత్రం సహృదయులు కాబోలు…” అదేంటే… అలా అన్నంత మాత్రాన.. పెట్టవా ఏంటి?” అనగానే జలజం లో ఆశలు రేగాయి… అంతలోనే ఆయన… ” పోనీ సగం తీసేసి పెట్టు ” అన్నాడు.. భారంగా నిట్టూర్చింది జలజం…” సరే.. ” అంటు సదరు బీరకాయ పీచు ప్లేటు లో రెండంటే రెండే రెండు పకోడీలు ఉంచి మిగిలినవి తీసేసింది… పాపం జలజం.. ఏడవలేని నవ్వు ని ముఖాన పులుముకుని.. అవే పరపరా లాగించేసింది.
ఆ తర్వాత కాఫీ రాగానే….” అబ్బో.. ఇంత కాఫీయే..” అందామనుకుంది కానీ… అనకుండానే గభాల్న అందేసుకుంది.. కాదు లాగేసుకుంది.
తనకీ ఓ రోజు రాకపోదు.. అప్పుడు చెప్తా నీ పని… అంటూ కసితీరా పళ్ళు నూరుకుంది బీరకాయ పీచు ని.
ఆ తర్వాత కొన్నాళ్ళకి.. సదరు బీరకాయ పీచు… జలజం ఇంటివేపు వచ్చింది. దొరికింది బుల్ బుల్ పిట్ట అనుకుంది.
కాసేపు లోకాభిరాయాయణ అనంతరం…. జలజం ఓ ప్లేట్ లో.. ముచ్చటగా మూడంటే మూడు అరటికాయ బజ్జీ లు వేసి… బీరకాయ పీచుకి అందించింది… ఎలాగూ.. ఆ ప్లేట్ చూడకుండానే..
” అమ్మో… ఇన్నే.. కొన్ని తీసెయ్యి” అంటుందని ఊహించుకుంది… కానీ.. వెంటనే ప్లేట్ అందుకున్న..

ఆ బీ. పీ… ” వావ్… బజ్జీలే… నాకెంతో ఇష్టం ఇవి… మరీ మూడే వేసావే… ఇంకొంచెం పట్రాపోయావా?” అంది. వెర్రి మొహం వేసుకుని మన జలజం… వేడిగా బజ్జీల వాయి ఒకదాని తర్వాత మరోటి వేయించడం… బీరకాయ పీచు లాగించడం.. మొహమాటమే లేని బీరకాయ పీచు దగ్గర ఏమనలేక జలజం మొహం మాడిపోయింది . ఇంతకింతా… బీ. పీ.. దగ్గర కక్ష తీర్చుకుందామనుకున్న జలజానికి బి. పీ పెరిగిపోయింది పాపం..

తేనెలొలుకు తెలుగు –

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

పద్యప్రేమ-2

దాదాపుగా అన్ని భారతీయ భాషలకు మాతృస్థానంలో ఉన్న సంస్కృతం తెలుగు భాషలో పాలలో చక్కెరలా కలిసిపోయింది. ఎంత తెలుగులోనే మాట్లాడాలని పట్టుదల కలిగిన వారైనా, సంస్కృత భాషను ఇచ్చగించని వారైనా, సంస్కృతపదాలను వాడకుండా మాట్లాడటం కష్టమైనపని. అయితే తొలిదశలో అప్పుడప్పుడప్పుడే తెలుగు భాషకు ఒక లిఖితరూపం ఏర్పడే కాలంలో పద్యరచన సంస్కృత సమాసాలతోనే సాగింది.
మచ్చుకి నన్నయ గారి పద్యం చూద్దాం.

బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ
సహితమహామహీభరమజస్ర సహస్ర ఫణాళిదాల్చిదు
స్సహతరమూర్తికిన్ జలధిశాయికి బాయకశయ్యయైనయ
య్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు బ్రసన్నుడయ్యెడున్

ఇందులో ఒకటి రెండు తప్ప మిగతావి అన్నీ సంస్కృత పదాలే. నన్నయ పదవ శతాబ్దం వాడైతే
తిక్కన పన్నెండవ శతాబ్దం వాడు. తిక్కన పద్యాలలో సంస్కృత పదాలు తక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు భంగపడిన ద్రౌపది కృష్ణునికి తన గోడు చెప్పుకునే సందర్భంలో

వరమునబుట్టితిన్ భరతవంశముజొచ్చితి నందు బాండు భూ
వరులకు గోడలైతి జనవంద్యుల బొందితి నీతి విక్రమ
స్థిరులగు పుత్రులం బడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్
సరసిజనాభ ఇన్నిట బ్రశస్తికి నెక్కిన దాననెంతయున్.

ఏ మాత్రం అన్వయ కాఠిన్యం లేని పద్యం.
ఎఱ్ఱన వీరి తర్వాతి కాలం వాడైనా పూరించింది ఆరణ్య పర్వ శేషం గనుక అటు నన్నయ ధోరణి నుండి ఇటు తిక్కన ధోరణి దాకా చక్కని పద్యవారధి నిర్మించాడు. నన్నయ చివరి పద్యం

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హారపంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూరపరాగ పాండురుచి పూరములంబర పూరితంబులై

ఉజ్వలంగా ప్రకాశిస్తున్న నక్షత్ర మాలికలతో అందంగాఉన్న శరత్కాలపురాత్రులు, అప్పుడేవికసించిన కలువపూల సువాసన కలిగిన గాలితో, చంద్రకిరణ కాంతితో కలిసి ఆకాశమునిండా కర్పూరపు పొడి చల్లినట్లుగా ఉన్నాయి. కర్పూరంతో పోల్చడంలో కవి గొప్ప తనము తెలుస్తుంది. కర్పూరం వెన్నెల లాగా తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కలువపూలవాసన లాగా కమ్మని వాసన కలిగి వుంటుంది. మెరిసే నక్షత్రాలలాగా తళుకులుంటాయి. ఇక్కడ నన్నయ్య అరణ్యపర్వాన్ని ఆపితే కిందిపద్యంతో ఎర్రన అరణ్యపర్వశేషాన్ని మొదలు పెడతాడు. నన్నయ వెంనేలరాత్రిని వర్ణించి ఆపితే ఎర్రన సూర్యోదయంతో ప్రారంభిస్తాడు చూడండి

ఎర్రన మొదటి పద్యం
స్ఫురదరుణాంశు రాగరుచి బొంపిరివోవ నిరస్త నీరదా
వరణములై దళత్కమల వైభవ జృంభణముల్లసిల్ల ను
ద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
గరమువెలింగె వాసరముఖమ్ములు శారదవేళ చూడగన్

దట్టమైన ఎర్రని సూర్యకిరణాల కాంతికి ఎరుపెక్కిన మేఘాలు, వికసించిన కమలాల వైభవం , వాటిచుట్టూ మూగిన హంసలు, బెగ్గురుపక్షులు, తుమ్మెదల సవ్వడులు వ్యాపిస్తు ఉండగా శరత్కాలపు ఉద్యమనే ముఖం వెలిగి పోయిందట. ఎఱ్ఱన కూడా నన్నయ్య కు తీసిపోకుండా పద్యం రాశాడు. ముఖం ఎప్పుడు వెలుగుతుంది. సంతోషం ఎప్పుడు కలుగుతుంది. ఇష్టమైనవాళ్లు ఇంటికి వచ్చినప్పుడు. మరివచ్చినప్పుడు మెల్లిగా పకరిస్తామా ? హడావుడి అల్లరితో పలకరిస్తాం . కమలాలకు ఇష్టమైనవాడు సూర్యుడు వచ్చాడు, కమలాలు వికసించాయి. కమలాలు వికసించగానే హంసలు, తుమ్మెదలు తదితర పక్షులు శబ్దాలు చేశాయి. ఆవిధంగా ఎర్రన సూర్యోదయ వర్ణనతో ఆరణ్యపర్వశేషం మొదలవుతుంది. ఎర్రన అంటే ఎర్రని వాడు అని కడ్డ అర్థం . తనపేరుకూడా స్ఫురించే విధంగా స్ఫురదరునాంశు పద్యంతో ముందుకుసాగినాడు.
శారదరాత్రులుజ్వల అన్నప్పుడు పోతన్న పద్యం కూడా గుర్తుకు వస్తుంది. అన్నీ తెల్లని వస్తువులను ఏరి ఏరి రాసిన పద్యం.

శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషారఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధాపయోధి సిత తామరసామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!. . .

ఇలా తెలుగు పద్యం మన ప్రబంధ కవుల చేతుల్లో ఎన్ని సోయగాలు పోయిందో చెప్పలేం. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి.
అందుకే విశ్వనాథవారు తెలుగు పద్యాలలోని మేలిమి పద్యాలను మూడు వందలదాకా ఎంచుకొని వాటికి తనదైన వ్యాఖ్యతో కావ్యసురభి అనే పుస్తకం వేశారు అప్పట్లో. కావ్యాలను చదివి ఎలా ఆనందించాలనే వారి కావ్యానందం తెలియజేస్తుంది.
ఆటవెలదులతో ఆటలాడుకున్నాడు వేమన.
సీసపద్యాలతో చిత్రాల చేసాడు శ్రీనాథుడు.
రామరాజభూషణుని సంగీతజ్ఞత ఆయన పద్యాలలో
ఇమిడి ఉంటుంది. రాసిక్యత చూడాలంటే అల్లసాని,
భక్తి భావానికి పోతన ఇలా నాటి కవుల పద్యాలు కొన్నైనా నోటిమీద ఆడాలి. ఒక్కో సందర్భాన్ని ఒక్కో కవి ఎంత విశిష్టంగా చెప్పాడో గమనించాలి. అవి జీర్ణించుకుంటే పద్యం మనల్ని వరిస్తుందని నా భావన

వృక్షో రక్షతి రక్షితః

రచన: రాజశేఖర్ తటవర్తి..

 

కిరణ్ మేఘనాలది  చూడ ముచ్చటైన జోడి. ఇద్దరికీ పుస్తకపఠనం అంటే మక్కువ. ఇక పాట హిందీ పాటలంటే చెవికోసుకుంటారు. మేఘనకి కిరణ్ గాత్రం అంటే బహుప్రీతి. అప్పుడప్పుడు సరదాగా సాయంత్రం బాల్కనీ లో కూర్చున్నపుడు  “చౌదవి కా చాంద్ హో ” లేక “తేరే సూర్ ఆర్ మేరె గీత్” పాటపాడో ఆమెని మురిపించేవాడు.

కిరణుకి సంగీతంలో లోతైన ప్రవేశంలేకపోయినా వివిధ రాగాలలో, నగరంలో జరిగే కచేరీలలో ఆసక్తి చూపించేవాడు. అది తన జీవన శైలిలో ఒక విడదీయరాని భాగంగా ఉండేది. మేఘనతో  దైనందిన సంభాషణల్లో అవకాశం వస్తే సంగీతమిళిత పదాలు వాడేవాడు. తొందరగా రావాలి అనడానికి… పంతువరాళి అని, పంచదార కలసని భీంపలాసాని, పిల్లులని పీలు అని, కాఫీని కాపీ అని రాగ సంబంధిత  ప్రాసశబ్దాలు ఉపయోగించేవాడు.  మేఘన తనవంతున కిరణ్‌ని మియాకి మల్హార్ అని , కోపంవస్తే అహిర్ భైరవ్ అని సంభోదించేది.

ఇలా ౩ పాటలు, 6 రాగాలుగా గడుస్తన్న వారి వైవాహిక జీవనగమనం కొంతకాలానికి ద్వితీయ ఘట్టానికి చేరుకుంది. ఇద్దరికీ పిల్లల మీద మక్కువ ఉంది కానీ ఇరువురు ఉద్యోగం చేస్తున్నమూలన పిల్లలకి సరైన సమయం, లాలన కేటాయించగలరా అని ఒక సందిగ్ధం.

“డార్లింగ్! ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. మేనేజ్ చెయ్యవచ్చు. లోకంలో ఏంతో మంది ఉభయులు పనిచేస్తున్న భార్యాభర్తలు పిల్లలని పెంచడం లేదా?  ఒక రోజు నువ్వు ఒక రోజు నేను ఆఫీస్ నించి తొందర వస్తాము”. పైగా మన ఆఫీస్‌లో వారానికి ఒకరోజు పిల్లలని ఆఫీసుకి  తీసుకురావచ్చు. వీకెండ్స్ పూర్తిగా సెలవే” అన్నాడు కిరణ్ అదో పెద్ద సమస్య కాదన్నట్టు.

“స్టాప్ ఇట్ కిరణ్” అంది మేఘన అసలే చారడేసి కళ్ళని మరింత పెద్దవి చేస్తూ.. “ఇది ఒకటో రెండో సంవత్సరాల మాట కాదు. మన మీద ఒక జీవితం ఆధారపడి ఉంటుంది. మనము ఆ బిడ్డకి తగిన సమయం, ప్రేమ, ప్రేరణ, నైతిక విలువలు స్థిరముగా ఇవ్వగలమా లేదా అని భాద్యతగా ఆలోచించాలి” అంది ఆత్రంతో కూడిన స్వరంతో .

ఈ మీమాంసలో కూట్టుమిట్టాడుతోంటే ఒకరిద్దరు సన్నిహితులు కుక్కపిల్లనిగాని, మొక్కలనిగాని పెంచితే ఆ అభ్యాసం పిల్లల్ని పెంచడానికి బాగా పనికివస్తుందని బ్రహ్మరహస్యం  చెప్పితే..ఇదేదో బాగుందని..కుక్క అయితే హై మెయింటెనెన్స్  రోజూ బైటకు తిప్పడం, మొరగడం అదీ ఉంటుందని, నోరులేని, కదల్లేని మొక్కలు పెంచడాన్ని ఎంచుకున్నారు. చిన్నపుడు టీవీలో అన్నదాత కార్యక్రమం చూశామన్న ధీమా కామోసు!

మర్నాడు ఆఫీసులనించి త్వరగావచ్చి దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి వెళ్లారు ఇద్దరూ. అక్కడ ఉన్న వివిధ రకాల మొక్కలు చూసి అవాక్కయ్యారు.

“వాడిపోయిన పూలు చూస్తే నా మనస్సు ఆరాటం చెందుతుంది” అన్నది మేఘన గారంగా బాధపడుతూ..

“నో ప్రాబ్లెమ్ హనీ! వీ విల్ ట్రై నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్” అన్నాడు మేఘన తల నిమురుతూ.

అలా పూలు పూయని మొక్కలని పెంచాలని నిర్ణయించుకున్నారు. ఒక ఫెర్న్ ప్లాంటుని (Fఎర్న్), ఓక పామ్ (ఫల్మ్) ప్లాంటుని చెరొక కుండీలో పెట్టి జాగ్రత్తగా, మోజుతో ఇంటికి తెచ్చుకున్నారు.

వాటికి రోజూ ఆఫీసు నుండి వచ్చిన తరువాత మేఘన చెరో మగ్గుడూ నీరుపోసేది. కిరణ్ వాటికి కొంచెం ఎరువు వేసి రోజూ పొద్దున్నే ఎండ సోకే ప్రాంతంలో పెట్టి ఆఫీసుకి వెళ్ళేవాడు. ఇలా ఒక నెల గడచిన తరువాత పామ్ ప్లాంటు ఆకులు పచ్చగా అవ్వసాగాయి. కిరణ్ ఒకటి రెండు ఆకులకు తెగులు ఏమో అని వాటిని కట్ చేసాడు. మేఘన వాటికి మరింత నీరుపోయసాగింది. ఇలా ఒక వారం రోజుల తరువాత కాండంతో సహా మొక్కంతా పచ్చగా అయ్యి వాలిపోసాగింది.

ఏమి చెయ్యాలో తోచక కంగారు పడుతూ ఆ మొక్కలమ్మిన నర్సరీ వాడికి మొరపెట్టుకోగా అతను విషయం గ్రహించి సత్రాజిత్తు కృష్ణుడికి శమంతకమణి ఇవ్వని మూలాన  ఇలా జరిగింది అని చెప్దామనుకొని వారి శోకగ్రస్తమైన మొహాలు చూసి జాలిపడి ఇలా సలహా ఇచ్చాడు. “సార్..  ఆలా చలివేంద్రంలో మజ్జిగ పోసినట్టు మొక్కలకు నీళ్లు పోయకూడదు. అజీర్ణం చేస్తుంది. ఒక పనిచేయండి. ఈ మధ్యన సాక్క్యూలంట్స్ (శుచ్చులెంత్స్) అని అతి చిన్న మొక్కలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వాటికి వారానికి ఒక సారి నీరు పోస్తే చాలు. మెయింటెనెన్స్  కూడా చాలా తక్కువ. మీ బుక్‌షెల్ఫ్ మీద కూడా వీటిని పెంచవచ్చు.”

చంటిపిల్లలు కూడా అంతే చిన్నగానూ, లేతగానూ ఉంటారు కాబట్టి ఈ బువ్వలాటలో బొమ్మల మాదిరి ఉండే మొక్కలను ట్రై చేద్దామని నాలుగు సాక్క్యూలంట్స్ ఇంటికి తీసుకు వచ్చారు. ఆ నాలుగు చిరుమొక్కలు కిరణ్ దోసిళ్ళలో పట్టేసేటంత బుజ్జిగా ఉన్నాయి. చంటిపిల్లని చేతులోకి తీసుకున్నట్టు అతి భద్రంగా రెండు లిల్లీపుట్ మొక్కలను కిరణ్ నుంచి తీసుకొని మేఘన తన అరచేతిలో సున్నితంగా పట్టుకుంది.

ఇంటికి తీసుకొని వచ్చి వాటిని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ.. స్టడీ టేబుల్ మీద లాంప్ క్రింద పెట్టారు. ఆ దీపపు వేడి తట్టుకోలేవని అక్కడినించి మార్చి హాలులో పైషెల్ఫ్ మీద పెట్టారు.

ఆ  మరునాడు నడిరాత్రి మేఘనకి  ఆ చిన్నకుండీలు షెల్ఫ్ మీద నుండి అమాంతం క్రింద పడినట్టు కల వచ్చి హట్టాతుగా లేచి వాటిని హాలులో క్రింద షేల్ఫులో పెట్టి ప్రశాంతంగా పడుకుంది.

రోజూ వాటిని మృదువుగా ముట్టుకొని, ప్రియముగా వాటితో మాట్లాడి, సాయంత్రం వాటిని బాల్కనీలో వారితోపాటు పక్కన పెట్టుకునేవారు. ప్రతి ఆదివారం ఒక గుక్కెడు నీరు పసిపిల్లవానికి పాలు పట్టినట్టు ఆప్యాయంగా పోసేవారు. నెలకి ఒకసారి నర్సరీవాడి దగ్గరకు వెళ్లి ఆ చిన్నకుండీలో మట్టిని మార్పించి (పిల్లవాడి డైపర్ లాగ) కలియగలిపించేవారు.

నర్సరివాడి సలహా మేరకు ఆ బాలాకుపచ్చలను కొంచంసేపు ఎండలో పెట్టి, మూడు నెలలకు ఒక సారి ఒక చిటెకెడు ఎరువుగింగులు వేలుతో మెత్తగా మట్టిలో గుచ్చి (వాక్సినేషన్ మాదిరి), వేసవికాలంలో ఆ మొక్కలను బెడ్ రూమ్ షేల్వ్స్ మీదకి మార్చి.. చంటి పిల్లాడిలా సాకారు. వాటికి అమ్రితవర్షిణి, రసియా, కళ్యాణి మరియు మోహన అని పేర్లు పెట్టారు.

ఇలా ఒక 6 నెలలు గడిచాయి. ఆ చిన్న మొక్కలో కొత్తచిగురు వచ్చింది. వాటిని పెంచడంలో వీరికి చేయి తిరిగింది. కిరణ్ మేఘనలు ద్వితీయ అధ్యాయానికి  అరంగేట్రం చేశారు. “అశోకుడు అన్ని చెట్లు ఎందుకు నాటించాడో ఇప్పుడు అర్థమయ్యింది”  అన్నాడు కిరణ్ ఉల్లాసంగా. పది నెలల తరువాత హాస్పిటల్ లేబరురూంలో ప్రసవ సమయంలో ఆ సాక్క్యూలాంట్స్ తన పక్కన పెట్టుకొంది మేఘన. వారు తల్లి తండ్రులవడానికి సంసిద్ధులను చేసిన ఆ మొక్కలకు కృతఙ్ఞతలు చెప్పుతూ ఆ  సిరులొలికించే పసిబిడ్డకి “శాకాంబరి” అని నామకరణం చేసారు.

సంతోషంతోనో లేక ఫ్యానుగాలికో మరి ఆ చిన్నారి మొక్కలు ఒకసారి అటూఇటూ తుళ్ళాయి.

*****