“మనీ” షి

రచన: కంభంపాటి రవీంద్ర

“లుటే కోయీ మన్ కా నగర్ ..బన్ కె మేరా సాథీ” అని అనిత పాడుతూంటే, చేతిలో ఉన్న ఐస్ కోల్డ్ గా ఉన్న కోక్ టిన్ను పట్టుకుని అలా వింటూండిపోయేడు ఆత్రేయ ! ఆఫీస్ లో ఎవరో యూఎస్ వెళ్తూంటే ఫేర్వెల్ పార్టీ జరుగుతూంది, పార్టీ అనే ఏమిటి, వాళ్ళ ఆఫీస్ లో ఏ ఫంక్షన్ అయినా కూడా అనిత పాట పాడడం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, అంత బాగా పాడుతుంది మరి !
పాట పాడడం అయిపోయిన వెంటనే అందరూ ఒకటే చప్పట్లు, ఇంకొక్క పాట పాడమని తెగ రిక్వెస్టు చేస్తే,” తేరే బినా భి జిందగీ సే కోయి షిఖ్వా తో నహీ” అంటూ ఆ అమ్మాయి పాడడం మొదలెట్టేసరికి, కాస్త దూరంలో ఉన్న దోశ కౌంటర్లో దోశెలేసే నరహరి దోశ తిప్పడం మర్చిపోయి అలా వింటూండిపోయేసరికి, వేస్తున్న దోశ కాస్తా మాడిపోయింది !
పాట పాడడం అయిపోయిన వెంటనే ఆత్రేయ దగ్గిరికి పరిగెత్తుకుని వచ్చేసింది !
“మిథాలీ దగ్గర కాస్సేపు ఉండొచ్చుగా .. మళ్ళీ తను యూఎస్ నుంచి ఎప్పుడొస్తుందో మరి “అన్నాడు ఆత్రేయ
“నువ్వు నా చుట్టుపక్కల ఉన్నప్పుడు, నీ కన్నా నాకెవరూ ఇంపార్టెంట్ కాదు” అని అనిత అంటే,” పోనీ నన్ను వెళ్లిపొమ్మంటావా ?” అని నవ్వేడు ఆత్రేయ .
“ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పను .. సరే .. కాస్సేపు అలా బయటికెల్దామా ?” అడిగింది అనిత.
ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్ బయటనున్న లాన్ లో నడుస్తున్నారు .
“మన సంగతి .. మీ ఇంట్లో చెప్పేవా ?” అడిగింది అనిత
“చెప్పాలంటే భయమేస్తూంది .. అందుకే .. మా పిన్ని హెల్ప్ తీసుకుంటున్నా” అన్నాడు ఆత్రేయ
“ఆవిడ మనకి సపోర్ట్ గా మాట్లాడతారంటావా ?”
“తప్పకుండా.. మొన్న వీకెండ్ మా పిన్ని, బాబాయ్ లని కలిసేను .. నీ ఫోటో చాలా నచ్చింది వాళ్లకి .. అసలు నీకో సిస్టరుంటే వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ కి చేసుకుందురట”
“పోన్లే.. అదొక రిలీఫ్ .. ఆవిడ మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయగలిగితే చాలు” అంది అనిత.
“సరే.. నేను ఇంటికి బయల్దేరాలి .. ఇవాళ మా లక్ష్మి పిన్ని వాళ్ళు ఇంటికొస్తామన్నారు .. హోప్ ఫుల్లీ ..వాళ్ళ సపోర్ట్ తో మన పెళ్లి సంగతి మాట్లాడతాను” అన్నాడు ఆత్రేయ
“లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్” అని అతని చేతిని గట్టిగా నొక్కింది అనిత .
ఆ రోజు రాత్రి ఆత్రేయ వాళ్ళింట్లో పెద్ద చర్చే నడిచింది .
“ఆ పిల్లకి తల్లీ, తండ్రీ లేరు, ఇలాంటి అణా కాణీ సంబంధం ఎందుకు మనకి” అన్నాడు ఆత్రేయ తండ్రి లక్ష్మణ్
“నిజమే బావగారూ .. ఆ పిల్లకి తల్లీ, తండ్రీ లేరు.. చిన్నప్పట్నుంచీ తనని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య పెంచారు .. అయినా కూడా ఎంత చక్కగా పెరిగింది ఆ అమ్మాయి ! బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తూంది .. ఇంత కన్నా ఏం కావాలండీ” అని లక్ష్మి అంటే
“చాల్లేవే .. వీడు చేసే ఉద్యోగం లో అమెరికా వెళ్లే అవకాశం ఉంది .. కానీ ఆ పిల్ల అమెరికా వెళ్ళాదట .. తను అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య లని ఎవరూ చూసుకోడానికి ఉండరు కాబట్టి ఇక్కడే ఉంటుందట ..అంటే .. మన వెధవ కూడా ఆ పిల్ల తో పాటు, ఇక్కడే పడి ఉండాల్సిందే ..పైగా .. ఆ ముసలాళ్ళిద్దరి ఖర్చూ కూడా మన వెర్రాడి జేబులోంచే “అంటూ అందుకుంది ఆత్రేయ తల్లి సరస్వతి
“అక్కా .. ఆ అమ్మాయి తనని పెంచినందుకు వాళ్ళని చూసుకోడానికి ఇండియా లోనే ఉండిపోడానికి నిశ్చయించుకుంది అంటే .. ఆ పిల్లది ఎంత గొప్ప మనసో ..” అని లక్ష్మి అంటే.
“మనసుదేవుంది ..అన్నం పెడుతుందా ఏవన్నానా .. వీడి తోటివాళ్ళందరూ అమెరికా, యూరప్ అంటూ ఉద్యోగాలొచ్చి వెళ్లి, డబ్బులు సంపాదించేస్తూంటే, వీడు మటుకు ఆ పిల్లతో పాటు ఇక్కడే ఉండి, ఆ ముసలాళ్ళ సేవలో తరించాలేంటి ? పైగా ..వాళ్ళది మన శాఖ కూడా కాదు ..
కనీసం వెలనాట్లు కూడా కాదు ..నియోగులట !!” ఈసడింపుగా బదులిచ్చింది సరస్వతి
“డబ్బుదేముందక్కా .. గుణం ముఖ్యం గానీ .. ఇంక శాఖాభేదం అంటావా ..ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు కనక ?.. అసలు మీవాడో బ్రాహ్మణ పిల్లని ప్రేమించేడు .. అదే సంతోషం అనుకోవాలి” అంది లక్ష్మి
“నీకు డబ్బూ, శాఖ, కులమూ ప్రధానం కానప్పుడు, ఆ పిల్లని మీవాడికే చేసుకో .. మావాడ్ని వెనకేసుకు రాకు .. ఒకవేళ వీడు మమ్మల్ని కాదని ఆ పిల్లని చేసుకుంటే, వీడికి మేమెవరమూ లేనట్టే” కోపం గా అన్నాడు లక్ష్మణ్
“నాకు ఆత్రేయ, ప్రవీణ్ వేర్వేరు కాదండి . . ఒకవేళ ఆత్రేయ ఆ అమ్మాయిని ప్రేమించకుండా ఉండుంటే, ఆ పిల్లని మా ప్రవీణ్ కి కళ్ళకద్దుకుని చూసుకునేదాన్ని” అనేసి విసురుగా వెళ్ళిపోయింది లక్ష్మి .
మర్నాడు అనితని తీసుకుని, లక్ష్మి పిన్ని వాళింటికెళ్ళేడు ఆత్రేయ.
“పిన్నీ .. ఏం చెయ్యాలో తోచటం లేదు ..అనితేమో పెద్దలు ఒప్పుకోనిదే పెళ్ళొద్దు అంటూంది .. మరి నిన్న మా అమ్మా వాళ్ళ అభిప్రాయం చూసేవు కదా .. నువ్వే చెప్పు ..” అన్నాడు
“ఒరే వెధవా .. ఆ పిల్లని నిజంగా ప్రేమించుంటే, ఏం చెయ్యాలో తోచడం లేదు లాంటి వెర్రిమాటలెందుకొస్తాయి ?.. నిజం చెప్పు .. ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నావా ?” అంది లక్ష్మి
“భలేదానివి పిన్ని .. మా అమ్మతో సమానమైన రెస్పెక్ట్ ఇస్తాను నీకు .. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పేనా ?.. నేను అనిత ని తప్ప వేరెవర్నీ పెళ్లి చేసుకోను .. ప్రామిస్” అన్నాడు ఆత్రేయ
“అయితే …ఇంకేమి. నేనూ, మీ బాబాయి గారు కలిసి వీళ్ళ తాతగారితో మాట్లాడతాము .. మీ అమ్మావాళ్ళూ ఇప్పుడు ఒప్పుకోకపోయినా, తర్వాతయినా ఒప్పుకోక తప్పదు .. నువ్వు తప్ప వాళ్ళకెవరున్నారు కనుక ?” అని భరోసా ఇచ్చింది లక్ష్మి పిన్ని !
“చాలా థాంక్స్ పిన్నీ” అని ఆత్రేయ అంటే,” మీరీ హెల్ప్ చేసినందుకు ఎప్పటికీ మర్చిపోలేమండి” అంటూ అనిత లక్ష్మి పిన్ని కాళ్ళకి దణ్ణం పెట్టేసింది
“ఆమ్మో! మా పెద్ద కోడలు బంగారం” అంటూ ఆశీర్వదించింది లక్ష్మి .

**************************

“మనకి పెళ్ళై రెండేళ్ళవుతూంది. బాబు పుట్టి ఏడాదవుతూంది .. ఇంతవరకూ మావయ్యగారూ వాళ్ళూ మనల్ని కలుపుకోడానికి ఇష్టపడ్డం లేదు” దిగులుగా అంది అనిత
“పెళ్ళైతే మాతో సంబంధం లేదని మా నాన్నగారు ముందే చెప్పేరుగా” అన్నాడు ఆత్రేయ
“కరెక్టే .. కానీ ఇప్పుడు, బాబుని, అమ్మమ్మ వాళ్ళని చూసుకోడానికి నేను జాబ్ మానేసి ఏడాదవుతూంది .. నీ ఒక్కడి శాలరీతో ఇంతమందిని ఎలా పోషిస్తావు ?” బాధగా అంది అనిత
“ఒక మూడు నెలలు అమెరికాకి వెళ్లమంటున్నారు .. కొంచెం ఇలాంటి షార్ట్ ట్రిప్స్ ఒప్పుకుంటే డబ్బులు మిగులుతూంటాయి .. నీకు సపోర్ట్ గా మా లక్ష్మి పిన్ని ఉంటుంది .. ఓసారి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెబుదాం” అని లక్ష్మి పిన్ని వాళ్ళింటికి బయల్దేరదీసేడు .
లక్ష్మి పిన్ని వాళ్ళ ఫ్లాట్ బయట చెప్పులిప్పి కాలింగ్ బెల్ కొట్టబోతూ ఆగాడు ఆత్రేయ,
“ఆ ఆత్రేయగాడిలా పిచ్చి సంబంధమేదైనా ప్రేమా దోమా అంటూ అన్నావంటే ఇదిగో. ఈ సిలిండర్ పేల్చుకుని చస్తా వెధవా .. నీకొచ్చింది అల్లాటప్పా సంబంధం అనుకున్నావా ? పిల్లకి గ్రీన్ కార్డుంది .. కోటీశ్వరులు .. పైగా మన శాఖే .. వైదీకులు” అంటూ తన కొడుకు ప్రవీణ్ మీద విరుచుకుపడుతున్న లక్ష్మి మాటలు స్పష్టంగా వినిపించాయి !

తను కన్నతల్లి

రచన: చెంగల్వల కామేశ్వరి

“అమ్మా” చిన్నగా అరిచింది విమల. సూది గుచ్చుకుంది. వేలులో దిగిన సూదిని తీసి పక్కన పెట్టింది. విమల ఆగకుండా కారుతున్న రక్తం! వదిన వంటింటి లోంచే ఏమయింది! అనడుగుతోంది. తనే గబగబా వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తింది. రక్తం కారుతున్న వేలుని నీళ్లతో కడిగి రక్తం కారడం ఆగాక మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చుని మళ్లీ అప్రయత్నంగా గోడ మీద ఉన్న ఫొటోలో నవ్వుతున్న అమ్మ ఫొటో చూసిన విమల కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి.
“అమ్మ “అమ్మ” ఉంటే ఈ పాటికి తన అజాగ్రత్తకు సుతిమెత్తగా తిడ్తూనే కాఫీ పొడి అద్దటం చేసేది. అన్నం కలిపి తినపెట్టేది. అప్పుడే నెలయింది. అమ్మ పోయి. ఇంత సడన్ గా అమ్మ తమందరిని వదిలి వెళ్లిపోతుందని అనుకోలేదు.
“అమ్మ” విలువేంటో అమ్మ గొప్పతనమేమిటో అమ్మ పోయాకే తెలిసింది. నాన్న తాము అమ్మ లేకుండా ఎలా ఉండాలో! అర్ధం కావటంలేదు. నాన్న అమ్మని ఎంత ప్రేమించాడో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. వాళ్ల దాంపత్యంలో ఉన్న అనుబంధమేమిటో నాన్న నోటినుండి అమ్మ జ్ఞాపకాలుగా వింటుంటే నాన్న ఇంత మాట్లాడటం అది కూడా అమ్మ గురించి. మాట్లాడటం. ఆశ్చర్యంగా ఉంది.
అమ్మ ఫొటోలు వీడియోలు వెతుక్కుని వెతుక్కుని చూస్తూ ఒక్కో సారి నవ్వేసుకుంటూ మరోసారి కళ్లొత్తుకుంటో చూస్తూ అమ్మ వియోగానికి చిక్కిశల్యమవుతున్న నాన్నని చూసి, చిన్న అన్నయ్య, తను ఏడ్వలేక, ఏడుపు ఆపుకోలేక, యాతన పడుతూ నాన్నని ఓదార్చాల్సి వస్తోంది. నాన్నని తనతో తీసుకెళ్లడం కోసమే తను వెళ్లకుండా ఆగిపోయింది.
పెద్దన్నయ్య వాళ్లు ఈ ఊళ్లోనే ఉన్నా పెద్దొదిన ధోరణికి తామెవ్వరూ వెళ్లరు. చిన్నన్నయ్య చిన్నొదిన అమ్మానాన్న అన్నా, తనన్నా ప్రాణం పెడతారు. అందుకే పిల్లలు కూడా ఇక్కడ ఉండటానికే ఇష్టపడతారు. కాని అందరి బదులు అమ్మని ఆడిపోసుకున్న పెద్దొదినకి, అమ్మ విలువ ఏనాటికీ అర్ధంకాదు. అందుకే పెద్దన్నయ్య రమ్మన్నా అక్కడికి వెళ్లలేదు నాన్న .
తను కూడా భర్త సూర్యాన్ని పంపేసి నాన్న కోసం కొన్నాళ్లు ఉండి వచ్చేప్పుడు నాన్నని తనతో తీసుకెళ్లాలని ఆగింది. నాన్న ఇంకా అమ్మ పోయిన షాక్ నుండి తేరుకోలేదు. తన ప్రక్కనే పడుకొన్న అమ్మ అచేతనంగా ఎలా అయిందో అర్ధం కాని అయోమయంలోనే ఉండిపోయాడు. సరిగ్గా నిద్రపోడు. ఏది పెట్టినా తినడు. ఎప్పుడూ తనలో తానే తిరణాలలో తప్పిపోయిన వాడిలా అమ్మ వాడిన వస్తువు దగ్గర పెట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు
వదిన ఏది చేసిపెట్టినా “అచ్చం మీ అత్తగారిలాగే చేసావమ్మా! ఇదివరకు అలా చేసేదానివి కాదు. మీ అత్తయే నీ చేత ఇలా చేయిస్తోందేమో! అని తినడానికి కూర్చున్నా అమ్మ జ్ఞాపకమొచ్చి చేయి కడిగేసుకుంటున్నాడు.
ఇంకో నెలలో అమెరికా వెళ్లిపోతుంది. మళ్లీ ఇండియాకి రావాలంటే అమ్మ లేని ఇంటికి ఎలా రావాలో! అనుకుంటేనే గుండె బావురుమంటోంది. తనని చూడాలని అమ్మ అంటే రెండేళ్లయింది నువ్వెళ్లి ఎప్పుడొస్తావే!
“తల్లి ఉన్నఫ్పుడే పుట్టిల్లు! పాలున్నప్పుడే పాయసం! అని సామెతలు చెప్పేది. కాని ఆ తల్లి ఇంకలేదు అని తెలిసాక ఎంత ఏడ్చిందో! అందరికన్నా చిన్నదని ఎంతో గారం చేసే అమ్మ చివరిక్షణాలలో కూడా చూసుకోలేదు. ఆ తరగని దుంఖంతో దూరం తరగని ఆ దూరప్రయాణం తాను మరువలేదు.
కానీ ఇక్కడే ఉన్న వాళ్లందరూ అమ్మని ఎంత మిస్సవుతున్నారో! వాళ్లెలా మామూలుగా అవుతారో! అమ్మంటే ప్రాణం పెట్టే తమతో పాటు అమ్మమ్మ బామ్మ మామయ్యలు పిన్నిలు బాబయ్యలు అమ్మ ఫ్రెండ్స్ అకస్మాత్తుగా దూరమయిన అమ్మ గురించి ఎంత వేదన పడుతున్నారో!
అమ్మ సహాయం పొందిన వారు అమ్మ గురించి చెప్పుకొని ఏడుస్తుంటే అటువంటి తల్లి కడుపున పుట్టటమే అదృష్టం కాని అమ్మని ఆనందపరిచే అవకాశం తామెవ్వరికీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా తను చేసుకునే మెడిటేషన్ పూజ సామాజిక కార్యక్రమాలతో ప్రశాంతంగా ఆనందంగా తానుంటూ అందరిని ఆనందపరిచేది.
అయినా “చచ్చిన వాళ్ల కళ్లు చారెడేసి !అన్నట్లు అమ్మ బ్రతికున్నప్పుడు అందరూ రకరకాలుగా అమ్మ ని ఏదో ఒకటి అన్నవారే! ఇప్పుడవన్నీ అమ్మతో పాటే మాయమైపోయాయి. అమ్మ మంచితనమే అందరికీ అర్ధమవుతుంది. ఉనికి పోయాకే మనుష్యులు గుర్తింపబడతారా ఏమో,! ఇప్పుడలాగే అనిపిస్తోంది.
అమ్మ ఉన్నప్పుడు అమ్మ కేవలం గృహిణి మాత్రమే కాదు . సామాజికంగా పలు సంస్థలు చేసే కార్యక్రమాలలో పాల్గొనేది. సాహిత్యం పట్ల మక్కువతో పుస్తకాలు కొని చదివేది. ఏవేవో రాస్తూ పుస్తకాలకు పంపేది. ఇలా ఎప్పుడూ తనను తాను బిజీగా ఉంచుకుంటూ సోషల్ మీడియాలో కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఇవన్నీ తమకు గర్వంగానే ఉండేవి. కాని కొందరు కావాలని హేళనగా మాట్లాడేవారు. నాన్న మీద తమ మీద అక్కరలేని జాలి కురిపిస్తూ అమ్మ తమందరినీ గాలికొదిలేసినట్లు నాన్న అమ్మని కట్టడి చేయలేదన్నట్లు చేసే వాఖ్యానాలకి అమ్మ చాలా బాధపడేది.
నాన్న అన్నయ్య తను ఎప్పుడూ అమ్మ వల్ల ఇబ్బంది పడలేదు. అమ్మ బిజీగా ఉంటే తామేదయినా సహాయం చేస్తే దానికే ఎంతో పొంగిపోయేది. ఇంటికెవరో ఒకరు రావడం సాహిత్య చర్చలు జరగడం అన్నీ బాగుండేవి. తమ పెళ్లిళ్లు అవి ఉన్నప్పుడు అవన్నీ మానుకుని ఇల్లాలిగా తల్లిగా తన బాద్యతలు నెరవేర్చేది. అలా ఇంటా బైటా గెల్చి మన్ననలు పొందిన అమ్మ పెద్దొదినకి నచ్చలేదు.
అమ్మ రాసిన విషయాలను కధలను ప్రస్తావించి హేళనగా మాట్లాడటం ఈ వయసులో ఇంత మెయింటెయిన్ చేసే వారినెక్కడా చూడలే్దు పెద్దరికం అంటే వయసుకొస్తే చాలదు. ఇంకా కోడళ్లతో కూతుళ్లతో పోటీ పడతుంది మా అత్తగారు. మనవలనెత్తినా స్వీట్ సిక్స్టీన్ అనుకుంటుంది. ఆ చీరలేంటో ఆ వాలుజడలేంటో! అని ఆవిడ పై ఉన్న ఈర్ష్యాసూయలు వెలిగ్రక్కుతూ ఉండేది. అమ్మ యాక్టివ్ గా ఉండటం వలన ఆవిడ వయసు కన్నా తక్కువగా కనిపించేది. దానికి సాయం ఇంటా బయటా పనుల కోసం తిరిగేదేమో ఉన్నంతలో నీటుగా ఉండేది. అది చూసి ఓర్వలేకపోయేది. పెద్దవదిన.
ఈవిడ మాటలు విని అమ్మేమయినా హర్ట్ అయిందేమో అనుకుని “అవేమి పట్టించుకోవద్దు” అని చెప్పబోతే చాలా తేలికగా నవ్వేసి” నాకు ఇవేమి కొత్తకాదమ్మా! నేనేమిటో మీకు తెలుసు. నాకు తెలుసు. నా గురించి అర్ధం కాని వారనుకుంటే ఎందుకు పట్టించుకోవాలి”అనేది. నాన్న జోక్ చేసేవారు. “భార్యా రూపవతీ శత్రువు” అన్నారు కాని అత్తా రూపవతీ శత్రువనలేదు కదే ! అని అమ్మ భయపడేది. “కోడలు వింటే గొడవలవుతాయి. బైటకెడతూ ఉంటాను కాబట్టి ఏదో రెడీ అయి వెడతాను. కాని, వయసులేదా అత్తగారు అవలేదా అమ్మమ్మ బామ్మ అవలేదా ! మీరు మరీను!” అని కేకలేసేది.
అలా అమ్మ మవునాన్ని అలుసుగా తీసుకుని బాహాటంగా అందరి ఎదురుగా మాట్లాడటం. ప్రతీదానికి వాళ్ల అమ్మతో పోల్చుకుని ఆవిడ మహా పతివ్రత మొగుడు గీసిన గీటు దాటదు. ఇల్లే ముఖ్యం మా అమ్మకి. . ఇవన్నీ ఆవిడా చేయగలదు. కాని, మా అమ్మకి ఇలా వీధులమ్మట సింగారించుకుని తిరగడం ఇష్టంలేదు అని” అయినా ఇలా వచ్చే పోయే వారికి వండి వార్చి ఇల్లు దిబ్బ చేస్తోంది రేపు మాకందరికీ ఉన్నాయి తిప్పలు” అంటూ అమ్మని మాటి మాటికి అంటుంటే నచ్చక ఒకరోజు నాన్నకి చిర్రెత్తింది. .
“ఏమ్మా! మీ అత్తగారు ఎలా ఉంటే నీకేమయింది. దానికి ఏది కట్టినా ఎలావున్నా నప్పుతుంది. ఈ రోజు కొత్తగా వచ్చింది నువ్వొక్కదానివే! అత్తగారు చేసేవి రాసేవి నచ్చకపోతే నీ ఇష్టం! మర్యాద తగ్గించి మాట్లాడితే బాగుండదు”. అని గట్టిగా చెప్పారు. దానికి పెద్ద రాద్దాంతమే జరిగింది.
అమ్మ కూడా కొన్ని సంధర్భాలలో మృదువుగా నచ్చచెప్పి చూసింది. కాని ,ఆ వంకా,ఈ వంకా పెట్టి వేరు కాపురం పెట్టించింది. పెద్దొదిన ఈ పరిస్తితులు చూసి పెద్దన్నయ్య ఇబ్బంది పడుతూ మెయిల్ పెడ్తే, తను కూడా చెప్పింది. “నచ్చనపుడు దగ్గరే ఉండి, నచ్చకుండా ఉండే కంటే, వేర్వేరుగా ఉండటమే మంచిది. ! అని. పాపం వాడు తనొక్కడే వేరయినట్లుగా దిగాలు పడటం చూసి తనూ చిన్నన్నయ్య అమ్మా నాన్న నచ్చచెప్పారు.
” ఏదో అప్పుడప్పుడు రావటం వెళ్లటం తప్ప పెద్దొదినతో పెద్ద అనుబంధం ఏర్పడలే్దు. తనకి కూడా చిన్నొదినలో అమ్మే కనిపిస్తుంది. అందరికీ ఆ చిన్నావిడే కావాలి మేమే ఎవరికీ అక్కర్లేదు అని మధ్య మధ్యలో దులపరించేస్తూ ఉంటుంది. విచిత్రమేమిటంటే అమ్మ పోయినప్పుడొచ్చిన రాజకీయ ప్రముఖులని, వీధంతా నిండిన పలు సంఘాల సభ్యులని చూసి పోయిన అత్తగారి గురించి చిలవలు పలవలు పోతూ పెట్టిన శోకాలు చూసి తమవారందరూ విస్తుపోయారు.
నాన్నకన్నా తను ముందు పోవాలని అనేది కాదుఅమ్మ పెద్దొదిన పెట్టే గొడవలకి కలత చెంది ” మీనాన్న కన్నా నేను ముందు పోతే ముత్తైదువగా పసుపుకుంకాలతో పోతానేమో కాని, నాన్న నేను లేకుండా ఉండలేరే! వాళ్లమ్మ పోయినపుడే ఎంత బెంగపడ్డారో! నేను లేకపోతే నాన్నను నువ్వే చూడాలమ్మా! అంటే అలాంటి మాటలేంటమా! ఏభయ్యేడేళ్లకే ఇలా మాట్లాడతావా! నువ్వింకా రిటైర్ కాలేదు నాన్నే రిటైర్ అయ్యారు. అయినా మీ ఇద్దరిని నాతో తీసుకెళ్లిపోతాను. ఆ సోషల్ వర్కేదో అమెరికాలో చేయి. ,! అనేది.
అలాంటిది ఇలా సడన్ గా వెళ్లిపోయింది. అని బాధ పడుతుంటే నాన్న తన తల నిముర్తూ “దాన్ని నా కళ్లల్లో పెట్టి చూసుకున్నాను. దాన్నెవరికి అప్పచెప్పి పోవాలా అనుకున్నాను. కడతేరేదాకా నా పక్కనే ఉంది. దాని మంచి మనసుతో లోకాన్ని గెలిచింది. ఇంట గెలవలేకపోయింది. ఆ సంగతి నాకు తెలుసమ్మా! దాని ఆశయాలు ఆలోచనలు ఉన్నతమైనవి. అందుకే అదేం చేస్తాను అన్నా అభ్యంతరపెట్టలేదు. కాని మీ అంతా పెద్దయ్యాక పిల్లలు పుట్టాక అమ్మ అభివృధ్ది చెంది అందరి కంటే బిజీగా ఉండటం కొందరికి నచ్చలేదు. అలాంటిది నేను ముందు పోయి అది మిగిలిపోతే దానికేం చేసేవారో కాని దాని మనసుని చంపేసేవాళ్లు. చాలా మందున్నారు. ఎవరి చేతా చేయించుకోకుండా మంచాన పడకుండా పువ్వులా వెళ్లిపోయింది. నేను కూడా అలాగే వెళ్లాలి అనే కోరుకుంటున్నాను” అన్ననాన్నమాటల్లోఎంతో సత్యముందనిపించింది. అందుకే అమ్మ కోరిక ప్రకారం మీరు నాదగ్గరే ఉండండి. నాన్నా! ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్నన్నయ్య దగ్గర ఉందురు గాని అని చెప్పింది తను.
ఇకనుండి నాన్నకు అమ్మానాన్న తనే ! అనుకుంటూ గుచ్చిన పూలదండ తీసుకెళ్లి తల్లి ఫొటోకి అలంకరిస్తూ అమ్మా! నాన్నలోనే నిన్నూ నాన్నను చూసుకుంటాను. నాన్న గురించి బెంగపడకమ్మాఅని చెప్తున్న “తను”చెప్పిన విధంగానే చేస్తున్న” తను “కన్న” తల్లి” తన కూతురి ని దీవిస్తున్నట్లుగా ఫొటోలోంచి నవ్వుతోనే ఉంది అమ్మ. తల్లి కోరిక తీర్చిన తనయగా ఆ దేవతకు మనస్పూర్తిగా మొక్కుకుంది విమల.

ఆపరేషన్ పాంచాలి

రచన: శ్రీదేవి

న్యూయార్క్ నగరం: పొద్దున్నే నిద్ర లేస్తూనే పరుగుపెట్టే పోటీ ప్రపంచంలో మానవాళికి ఏదన్నా సహాయ పడాలి అనే ఉన్నత ఆశయాన్ని ఊపిరిగా చేసుకొని జీవితoతో పోరాడుతున్న యువకుడు దీప్. ఒక విదేశీ కుటుంబానికి భారతీయురాలైన పేద తల్లి చేత దత్తతకి ఇవ్వబడ్డాడు. తన ఆశయం కోసం ఎలాంటి ప్రమాదన్నయినా స్వీకరిస్తాడు అతడు. ప్రపంచమంటే గిరి గీసుకున్న నాలుగు గోడలు కాదని, కొన్ని కోట్ల హృదయాల సమ్మేళనమే అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి. .
భారత దేశం: అచ్చమయిన పదహారణాల ఆడపిల్ల. విప్లవాత్మకమైన ఆలోచనలు, పుట్టుకతో ఫెమినిస్ట్. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్తత్వం, ప్రస్తుతం చిన్న చిన్న రచనలు చేస్తూ.. గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది-మహన్విత
తన పెంపుడు తల్లి ద్వారా మహన్విత గురించి తెలుసుకుంటాడు దీప్. తమ సంస్థకి గుర్తింపు రావాలంటే కొన్ని ప్రమాదకరమైన పనులు చేయాలని అది మహన్విత ద్వారా సాధ్యమని అతడి తల్లి అతడిని ఇండియాకి పంపుతుంది.
ఇండియాకి వచ్చాక మహాకి, అతడి తల్లికి ఎఫ్. బి లో తన పాత రచనల మీద జరిగిన వాగ్వివాదం గూర్చి చెప్పి సహాయానికి నిరాకరిస్తుంది మహా. ఎలాగో ఆమెను బతిమిలాడి ఒప్పించి తను వచ్చిన విషయం వివరిస్తాడు దీప్.
తనకి ఒక తీవ్రవాది అయిన 37 ఏళ్ల మహిళా జీవిత ఖైదీని ఇచ్చి పెళ్ళి చేయాలని, తద్వారా మానవతా దృక్పథంతో తను చేసిన పనికి, తమ సంస్థకు దేశ వ్యాప్తoగా గుర్తింపు కలుగుతుందని, తర్వాత నిదానంగా ఆమెకు జీవనోపాధి కల్పించి విడాకులు పొందాలని, దానికి మహా సహకరించాలని. మహా అందుకు తీవ్రంగా మండిపడుతుంది. అతడు అసహనంతో కొన్ని వారపత్రికలను ఆమె మొఖం మీద విసిరి కొడతాడు. వాటిలో మహా, తన చిన్ననాటి అభిమాన ప్రఖ్యాత విలేఖరి అయిన షామా చతుర్వేది, ఒక తీవ్రవాదిగా చేయని తప్పుకి 15 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తోంది అని తెలుసుకుని నమ్మలేకపోతుంది. జరిగిన అన్యాయం పూర్తిగా తెలుసుకోవాలని, ఆమెను రక్షించాలని దీప్ కి సహకరిస్తానని మాట ఇస్తుంది.
అప్పటి నించి ‘ఆపరేషన్ పాంచాలి’ మొదలవుతుంది.
**************
ఇద్దరూ షామాను కలిసి పెరోలు మీద తీసుకెళతామని చెప్పగా ఆమె “మీరు ఏమి ఆశించి ఈ సహాయం చేస్తున్నారో”? అంటూ సహాయాన్ని నిరాకరిస్తుంది. వారు నచ్చచెప్పటానికి ప్రయత్నించినా ససేమిరా అంటుంది షామా. ఈ క్రమంలో దీప్ ని చాచి పెట్టి కొడుతుంది ఒక సందర్భంలో షామా. మహా కలగచేసుకొని గొడవ సర్దుబాటు చేస్తుంది.
మొత్తానికి 4 లక్షలు తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టి షామాను పెరోలు మీద విడుదల చేయిస్తాడు దీప్. ఆమె 15 ఏళ్ళ శిక్ష కారణంగా త్వరగా కోలుకోదు. దీప్ కి ఈ విషయం కంఠకంగా మారుతుంది. ఆమెను ఎంత త్వరగా వివాహమాడి ఈ ప్రపంచానికి చూపిస్తే అంతా త్వరగా అతడి అప్పులు తీరి తమ సంస్థకి గుర్తింపు వస్తుంది. ఈ విషయం ఆమెతో చెప్పాలని అతడు శతవిధాలుగా ప్రయత్నించినా కూడా, ప్రతిసారి ఏవో అవాంతరాలు వచ్చి చెప్పలేక పోతాడు. మహా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
ఒక పక్కన 4 లక్షల అప్పు, దాని యొక్క వడ్డీ దీప్ ని వేధిస్తుంటే మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్లు, షామాకి బెయిల్ ఇచ్చిన లాయరు పెళ్లి నాటకం ఆమెకు చెప్తానని బెదిరిస్తుంటాడు, అంతే కాకుండా షామాకి దగ్గరవ్వటానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంటాడు. మహా వాటిని అంతే సమర్ధవంతంగా చెడగొడుతూ ఉంటుంది.
కొన్ని రోజులకి షామా పూర్తిగా కోలుకొని మునుపటి సంస్థలోనే ప్రోగ్రామ్ ఎక్సెక్యూటర్ ఉద్యోగములో చేరుతుంది. పరిస్ధితి మెరుగు పడటంతో షామాకి అసలు విషయం చెప్తుంది మహా. కానీ అప్పటికే తను రిషిని ప్రేమిస్తున్నానని తనకు తిరిగి ఉద్యోగానికి సరిపడే స్థైర్యాన్ని తానే కల్పించాడని, కావాలంటే డబ్బు తిరిగి ఇస్తానని చెప్పి దీప్ ని క్షమించమని కోరుతుంది. దీప్, మహా లు ఆమె సమాధానానికి హతాశులయిపోయి, షామాను బాధ పెట్టకూడదు అని అనుకుంటారు. నిరాశతో దీప్ వేరే ప్రోజెక్ట్ కోసం బయలుదేరుతుండగా మహాకి మెరుపు లాంటి ఆలోచన వస్తుంది.
ఇద్దరు కలిసి రిషి ఇంటికి వెళ్ళి షామా కోసం చేసిన ఖర్చు చూపి వాపసు చేయమని అడుగుతారు. అతడు సంతోషంగా వారి చేతిలో 10 లక్షలు పెడతాడు. గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లు అయ్యి వారిద్దరూ చెక్కు తో ఇంటి ముఖం పడతారు.
షామా, మహా ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారుతుంది. నిశ్చితార్థం కూడా రిషితో అంగ రంగ వైభవంగా జరుగుతుంది.
దీప్ కి డబ్బు వచ్చింది కానీ తను అనుకున్న పని అవ్వ లేదు. పైగా పది లక్షలు తీసుకోవటం అతనికి ఎందుకో మనస్కరించదు. అందుకే రిషికి చెక్కు ఇచ్చి వేయమని షామాకి చెప్పాలని, ఆమె ఇంటికి వెళ్తా డు. అక్కడ ఆమె లేదని ప్రోగ్రామ్ పని మీద MLA క్వార్టర్స్ కి వెళ్ళిందని తెలిసి అక్కడకు వెళ్తాడు.
అక్కడ.. రిషి , షామా పరిస్థితి చూసి అవాక్కు అయిపోతాడు. రిషి గాయాలతో నెత్తుటి మడుగులో అపస్మారక స్థితిలో ఉంటాడు. షామా MLA మహిధర్ వీడియోని షూట్ చేస్తూ ఉంటుంది. మహిధర్ “నేనే షామా మీద తీవ్రవాదీ అని ముద్ర వేసి 15 ఏళ్ళు జైల్ శిక్ష వేయించాను, ఆమె నా కార్యకలాపాలకు అడుగడుగునా అడ్డు పడటం నాకు నచ్చలేదు. ముఖ్యంగా భూకబ్జాల వీడియో ఎక్కడ బయట పెడుతుందో అని పధకం ప్రకారమే ఇదంతా చేశాను” అని పూస గుచ్చినట్లు చెప్పుకొస్తున్నాడు.
ఇంతలో గణగణమంటూ అంబులెన్సు, ఆ వెనుకే పోలీసుల జీపు వస్తాయి. రిషిని హుటా హుటిన తీసుకెళ్తారు వైద్య నిమిత్తం.
దీప్ షామాను చాచి పెట్టి కొడతాడు “ఇందుకేనా నిన్ను బయటకి తీసుకొచ్చింది” అంటూ.
“నీకు పది లక్షలు ఎలా వచ్చాయి దీప్?”
“ఇది నీకు ఇచ్చి వెళ్దామనే వచ్చాను”
“అది నీకు చెందిన చెక్కు, నాకెలా ఇస్తావ్”
“షామా”?
రిషి ఎవరో తెలుసా? నా చిరకాల మిత్రుడు, వాడిని నేను ఎందుకు చంపుతాను? పెరోలు కోసం మహా వచ్చినపుడు రిషి గురించి తెలుసుకొని, వాడు లాయరు అయ్యాడని తెల్సి ఆశ్చర్యపోయాను, వాడికి కబురు పంపాను. కానీ వాడి గూర్చి మీకు చెప్ప లేదు, ఎందుకంటే నా కేసు సాక్షాల సేకరణకు వాడు ఒక్కడే నాకు నమ్మకమైన వ్యక్తి, ఆ MLA శక్తి తెల్సి కావాలనే మీ ఇద్దరినీ దూరముగా ఉంచాను. వాడు తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ‌ ఆపరేషన్ ని ముందుకు తీసుకెళ్లాడు. నిశ్చితార్థం కూడా అతడిని కలవటానికి మేము ఆడిన నాటకమే.. ఈ MLA కారణంగా నా పిల్లలకి దూరం అయ్యాను. నా భర్త కూడా నన్ను అవమానించాడు, ఇప్పటికీ నన్ను గౌరవించటం లేదు, నా వృత్తిని కోల్పోయాను, నా 15 సంవత్సరాల జీవితం కోల్పోయాను.. అంటూ వివరిస్తుంది. నిస్తేజంగా షామా..
షామాను విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్తారు..
దీప్ మీద కదిలి పోతున్న పోలీసు జీపు పొగ చిమ్ముతూ వెళ్ళిపోతుంది.
*********************

కృతజ్ఞత

రచన: ఝాన్సీరాణి కె.

డాక్టర్‌ హరిత వార్డ్‌ రౌండ్‌ పూర్తి చేసుకుని బయటకు వస్తూంది. హరిత పేరు పొందిక గైనకాజిస్టు. హస్తవాసి మంచిదని రోగులను ప్రేమగా చూస్తుందని మంచిపేరు వుంది. ఆవిడ గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో పని చేస్తూంది.
హరిత భర్త ఆదిత్య కూడా డాక్టర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు. అంతేకాక చాలా క్లినిక్‌కి కూడా వెళ్ళి వస్తూంటాడు. క్రిటికల్‌ సర్జరీకి చాలా నర్సింగ్‌ హోమ్స్, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ నుంచి కూడా ఆదిత్యకు పిలుపు వస్తూ వుంటుంది. వారిది చాలాఅనోన్య దాంపత్యం ఆదిత్య, హరితకు ఒకే కూతురు చిరిత టెన్త్‌ క్లాస్‌ చదువుతూంది.
“మేడమ్‌, ఒక పేషెంట్‌ కడుపులో నొప్పి అంటూ వచ్చింది. గదిముందు బెంచిపై కూర్చోబెట్టి వచ్చాను” అంది నర్స్‌ విజయ.
పద వస్తున్నానంటూ కన్సల్టింగ్‌ రూం వైపు నడుస్తున్న హరిత ఒకక్షణం అలాగే నిలుచుండి పోయింది. ఆ మొహం ఎక్కడో చూసినట్లనిపించింది. మరో రెండు క్షణాలకి గుర్తుకి వచ్చింది తను ఆ మొహన్ని ఎక్కడ చూసిందో.
వారం రోజుల క్రితం ఆదిత్య బ్రీప్‌కేస్‌ నుంచి కొన్ని పేపర్స్‌ తీసుకు రమ్మన్నాడు. ఆ పేపర్స్‌ తీస్తూవుంటే కింద ఒక ఫోటో కనిపించింది. అప్పటికి ఆవేశాన్ని అణచుకుని రాత్రి హరిత ఆదిత్యని అడిగింది బ్రీఫ్‌కేస్‌లో ఉన్న ఫోటో గురించి. అది చాలా ముఖ్యమైన వ్యక్తిది. దాని గురించి పిచ్చి ఆలోచనలు చేయకు. ఇప్పటికి చర్చ అనవసరం అని బయటకు వెళ్ళాడు ఆదిత్య. అప్పటినుంచి ఆ ఫోటో గురించి ఎలా ఆరాతీయాలా? అసలు ఆ ఫోటోలో వ్యక్తి ఎవరు? ఆమెకు ఆదిత్యకు సంబంధం ఏమిటి? దాని వలన భవిష్యత్తులో తలెత్తే సమస్యలేమిటి? తన జీవితం మాట ఎలా వున్నా చరిత భవిష్యత్తు ఏమవుతుంది అన్న ఆలోచన మధ్య సతమతమవుతుంది హరిత. ఆదిత్యని ఆ ఫోటోగురించి అడిగినపుడు ఉలిక్కిపడలేదు సిగ్గుపడలేదు. పైగా వి.ఐ.పి అని చెప్పాడు. చర్చను సాగనీయకుండా మధ్యలో అనవసరం అని ఆపేశాడు. అతని స్వభావం తెలిసిన హరిత మళ్ళీ ఆదిత్యతో ఆ విషయం గురించి మాట్లాడలేదు కాని లోలోప మధన పడసాగింది.
ఆలోచనల్లోంచి బయటపడి విజయా ఆమెని లోపలికి పంపు అని గదిలోకి వెళ్ళింది హరిత.
ఆమె మెల్లగా విజయ ఒకవైపు పట్టుకుని నడిపించగా లోపలికి వచ్చింది.
“కూర్చోండి” అంది హరిత.
“మీ పేరేమిటి?” అడిగింది హరిత.
“దీప” చెప్పిందామె.
“ఎన్నోనెల?” హరిత ప్రశ్నించింది.
“ఎనిమిది” అంది ఆమె.
“ఇప్పుడేమిటి ప్రాబ్లెం” అడిగింది హరిత తన జీవితాన్నే ప్రాబ్లెంగా మార్చిన మనిషి ప్రాబ్లెం గురించి ఆడుగుతూంది” తను ఎంత విచిత్రం.
“బాగా నెప్పిగా వుంటుంది” అంది దీప
విజయ ఈమెని టేబుల్‌ మీద పడుకోబెట్టు చెక్‌ చేస్తానని తనను తాను కంట్రోల్‌ చేసుకుంటూ ఆదిత్య గృహిణిగా హరితను ప్రక్కకు నెట్టి డాక్టరు హరితగా ఆమెను పూర్తిగా చెక్‌ చేసింది.
“కంగారు పడక్కల్లేదు అంతా నార్మల్‌గా వుంది. మీరు దేనికైనా ఆంగైటీగా ఫీయితే ఇలా కడుపులో నెప్పి రావడం సహజం, టాబ్లెట్స్‌ వ్రాసిస్తాను. వాడండి తగ్గిపోతుంది డిసెంబర్‌ 20 తర్వాత ప్రసవం కావచ్చు. మీరు నొప్పులు ప్రారంభం కాగానే వచ్చి అడ్మిట్‌ అయిపోతే సరి” అంటూ ఒక ఇంజెక్షన్‌ ఇచ్చింది హరిత.
“థాంక్స్‌ డాక్టరు గారు మీరు చాలా మంచివారని, హస్తవాసి మంచిదని మా కాలనీలో వాళ్ళు చెబితే వచ్చాను” అంది అయిదు నిముషాల తర్వాత తేరుకున్న దీప.
“ఒక్కరే వచ్చారు?” అంది ఆమె వివరాలు కనుక్కునే నెపంతో హరిత.
“మావారు భాస్కర్‌ బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌. క్యాంప్‌కి వెళ్ళారు. అందుకని నేనే వచ్చాను. అయినా మీ గదిముందు “మా చేతుల్లో మీరు సురక్షితం” అనే మాట చూశాను. మీరున్నారు ఇక భయమెందుకు. థాంక్యూ డాక్టర్‌” అని మరోసారి చెప్పి బయటకు నడిచింది దీప.
ఈ అమ్మాయిని ఎంతవరకు నమ్మవచ్చు. అమ్మాయి అందంగా లేదు. చూస్తే చిన్నగా వుంది కాబట్టి ఆదిత్య క్లాస్‌మేట్‌ కూడా కాదు. భర్త రాలేదు పేరు భాస్కర్‌ అంది భాస్కర్‌, ఆదిత్య అన్నీ సూర్య భగవానుని పేర్లే కదా? బ్యాంక్‌లో ఆఫీసర్‌ అంది. అదెంత వరకు నిజం. అయినా తన జీవితం బాగు చేసుకోవడం వైవాహిక జీవితం నిలబెట్టుకోవడం అన్నీ తన చేతుల్లోనే వుంది. “నా చేతుల్లో నా గృహస్థ జీవితం సురక్షితం” డెలివరీకి వచ్చినపుడు ఆ దీపని ఆపరేట్‌ చేసి ఆమెకు యుటిరస్‌ రిమూవ్‌ చేస్తే సరి ఇక భవిష్యత్తులో మరే స్త్రీకి ఈ అమ్మాయి వల్ల ముఖ్యంగా తనకు తమ కుటుంబ పరువు ప్రతిష్టకు ఎలాంటి మచ్చ వుండదు. సమస్య వుండదు. దీప అని పేరు పెట్టుకుంది చుట్టూ వెలుగు నివ్వకుంటే మానే తన చుట్టూ చీకటి నింపకుంటే చాలు. ఆయినా ఇక ఈ దీప కాంతి నాచేతుల్లో” అనుకుంది హరిత.
“ఎంత క్రూరంగా క్రిమినల్‌లా ఆలోచిస్తుంది తను” హరితలోని డాక్టరు మేలుకుంది.
ఇంతలో వార్డ్‌బాయ్‌ రాజు వచ్చాడు.
“మేడం సూపరింటెండెంట్‌ సార్‌ రమ్మంటున్నారు” అంటూ
“వస్తున్నా” అంటూ లేచి గది బయటకు నడిచింది.
ఇప్పుడు ఆమె మొహంలో ఒక రిలీఫ్‌. వారం రోజుల నుంచి ఆమెను రాత్రింబవళ్ళు వేధిస్తున్న సమస్య. ఎలాంటి క్లూ లేకుండా ఆమె గురించి వెతకాలి అనుకుంటే ఆమె తన దగ్గరికి రావడం సమస్యకు పరిష్కారం దొరకడంతో హరిత మనసు ప్రశాంతంగా వుంది.
“మే ఐ కమిన్‌ సర్‌” అంది హరిత.
“రామ్మా హరితా” అన్నారు సూపరెంటెండెంట్‌ రాఘవగారు.
ఆయనకు ఓపిగ్గా, మంచిగా పేషంట్లని చూచే తెలివైనా హరిత అంటే ప్రత్యేకమైన అభిమానం.
“హరితా వైజాగ్‌లో డాక్టర్‌ లక్ష్మీ ఒక ట్రైనింగ్‌ కోసం మూడు నెలలు యు.ఎస్‌.కి వెళ్తూంది. అందుకని ఆవిడ ప్లేస్‌లో ఆ మూడు నెలలు నిన్ను వైజాగ్‌కి డెప్యుటేషన్‌ మీద పంపుతున్నాం. నీకిది ఒక మంచి అవకాశం. వైజాగ్‌లో డాక్టర్‌ కిరణ్మయిగారి దగ్గర నీవు చాలా నేర్చుకోవచ్చు.” అన్నారాయన.
“డిసెంబరు 10వ తారీఖు నీవు అక్కడ వుండాలి” అన్నారు ఆయన. మళ్ళీ “పదవ తారీఖా? మరి దీప డ్యూడేట్‌ 20 తర్వాత ఎలా వీలవుతుంది?”
“ఇంత సువర్ణావకాశం వదలుకోవడమా? నో నెవ్వర్‌” అనుకుంది హరిత.
“సర్‌ డిసెంబర్‌లో చాలా ఫంక్షన్‌ వున్నాయి” అంది నెమ్మదిగా
“సిల్లీగా మాట్లాడకు ఇది నీకు సువర్ణావకాశం” అన్నారు రాఘవగారు.
“తనకు దీప విషయంలో కూడా సువర్ణావకాశం ఇదే కదా” అనుకుంది. అయినా ఇప్పటి నుంచి ఎందుకు అనుకుంటూ లేచి వెళ్ళి తన గదిలో కూర్చుని ఆలోచించసాగింది. పోని వుద్యోగానికి రిజైన్‌ చేస్తే సరి. నెల జీతం కంటే తన జీవితం ముఖ్యం అంతే ఈ విషయం ఆదిత్యకు కూడా చెప్పకూడదు డిసెంబర్‌ తొమ్మిదిన రెసిగ్నేషన్‌ ఇచ్చేస్తే సరి అనుకుంది హరిత.
డిసెంబర్‌ 9 రానే వచ్చింది. హరిత సూపరింటెండ్‌కి తన రాజీనామా అందచేసింది.
“ఏమిటిది?” అడిగారు రాఘవ.
“ఇంతకంటే నేనేమి చెప్పలేను సర్‌. డెప్యుటేషన్‌ అదీ కుదరదు నాకు. మీరు లీవు ఇవ్వరు” అంది హరిత.
“అందుకని రిజైన్‌ చేస్తావా? ఆలోచించే చేస్తున్నావా? ఈ విషయం సాయంత్రం మాట్లాడుదాం నీవు వెళ్ళు” అన్నారు రాఘవ.
తన కనస్టల్టింగ్‌ రూంకి వెళ్ళగానే ఫోన్‌ అందించింది విజయ.
“గుడ్‌మార్నింగ్‌ డాక్టర్‌గారూ నేను మీ పేషంట్‌ దీప భర్తని. దీప ఇందాకా ఉన్నట్టుండి అన్‌కాన్షస్‌గా పడిపోయింది. తనను మీరే ట్రీట్‌ చేస్తున్నారు అని చెప్పింది. ప్లీజ్‌ మీరు రాగలరా” అడిగాడు భాస్కర్‌ ఆతృతగా.
అసలే చికాగ్గా వుంది హరితకి ఇంతలో ఈ ఫోన్‌.
“నేను గవర్నమెంట్‌ డాక్టర్‌ని పైగా ఓ.పీ.లో చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. ఎలాగైనా మీరే ఇక్కడికి తీసుకు రండి” అని ఫోన్‌ పెట్టేసింది హరిత.
పేషంట్స్‌ ఒక్కొక్కరు వస్తున్నారు. అన్యమనస్కంగానే చూచి పంపిస్తూంది ఇంతలో ఆదిత్య దగ్గర నుంచి ఫోన్‌.
“ఏంటి రెసిగ్నేషన్‌ ఇచ్చావా? అంత అవసరం ఏం వచ్చింది. వైజాగ్‌ వెళ్ళనన్నవట. ఆ విషయం కూర్చుని డిస్కస్‌ చేద్దాం తొందరపడవద్దు. రాఘవగారిప్పుడే నాకు కాల్‌ చేస్తే తెలిసింది” అంటున్నాడు అటువైపు నుంచి ఆదిత్య. ఇంతలో దీపని తీసుకువచ్చారు లోపలికి. ఆమె వాలకం చూడగానే భయం కలిగింది హరితకి.
ఒక అర్జంట్‌ కేసు ఒక అరగంట ఆగి నేనే ఫోన్‌ చేస్తాను అని ఫోన్‌ డిస్కనెక్ట్ చేసి పేషంట్‌ని టేబుల్‌ మీద పడుకోబెట్టమని అటుకేసి నడిచింది హరిత.
“డాక్టర్‌గారూ ఎలాగైనా నా దీపను కాపాడండి. ఇతరుల ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాలను కూడా లెక్కచేయని ఉత్తమురాలు దీప. అలాంటి దీపకు ఏం కాకూడదు” అన్నాడు భాస్కర్‌.
“ఏవరి ప్రాణాలను కాపాడిందో కాని నా జీవితంలో చొరపడి నా ప్రాణం మీదకు తెస్తూంది” అనుకుని ఆమెను చెక్‌ చేయసాగింది హరిత.
“ఈమె కాలుకేమైంది” అని అడిగింది హరిత భాస్కర్‌ని ఆమెకు ఇంజక్షన్‌ ఇస్తూ హరిత.
సుమారు ఆరు నెలలక్రితం ఒకరోజు దీప సూపర్‌ బజారుకు వెళ్ళి సామాన్లు తీసుకుని బయట ఆటో కోసం వెయిట్‌ చేస్తూంది. ఎదురుగా హాస్పిటల్‌ ముందున్న కారు క్రింది నుంచి ఒకడు బయటకు వచ్చాడు. ఇంకొకతను కారు ప్రక్కన నిలబడి వున్నాడు. అతడు “పనయిందా?” అని అడిగాడు.
“పర్‌ఫెక్ట్‌గా” అని కారు క్రిందనుంచి వచ్చిన వాడు చెప్పగానే ఇద్దరు సెల్‌లో ఎవరికో మెసేజ్‌ ఇస్తూ వెళ్ళిపోయారు. దీపకి ఈ తతంగమంతా అనుమానాస్పదంగా కనిపించింది. ఆ కారుకి బ్రేకు తీసేసారా. టైం బాంబ్‌ ఫిక్స్‌చేసారా? ఆ కారులో వెళ్ళే వ్యక్తికి తప్పకుండా ప్రమాదం అనుకుంది దీప. ఇంతలో ఆ హాస్పిటల్‌లోంచి ఒక డాక్టరు బయటకు వచ్చి ఆ కారు దగ్గరకు వస్తూన్నాడు.
“సార్‌ ఆ కారు ఎక్కవద్దూ” అంటూ రోడ్డుదాటి అటువైపుకు పరుగెత్తింది.
దీప ఇంతలో కుడివైపు నుంచి వస్తున్న కారు దీపను గుద్దేసింది. ఆ డాక్టరు వచ్చి దీపను హాస్పిటల్‌లోకి తీసుకెళ్ళి ట్రీట్‌ చేశాడు. మేజర్‌ ఇంజురీస్‌ తగ్గడానికి రెండు నెలలు పట్టింది. ఆ డాక్టరు ప్రాణాలను కాపాడిందన్న కృతజ్ఞతతో అతడు ఒక్కపైసా కూడా ఖర్చుకాకుండా ఆమెకు ట్రీట్‌మెంట్‌ ఇప్పించాడు.
హరితకు తలలో ఒకమూల ఒక లైట్‌ వెలిగినట్టయింది.
“ఆ హస్పిటల్‌ పేరు” ఆతృతను అణచుకుంటూ ఆడిగింది హరిత
“ధన్వంతరి” డాక్టరుగారిపేరు ఆదిత్య” అన్నాడు భాస్కర్‌
రెండు మూడు లైట్స్‌ వెలిగినట్లనిపించింది హరితకు.
ప్రక్కన విలేజ్‌లో పెద్ద తగాదా జరిగింది. ఒక ముఠా వాళ్ళు ఇంకోముఠా నాయకుడి తల పగుకొట్టారు.అతనిని ఈ డాక్టరు ఆపరేషన్‌ చేసి బ్రతికించాడు. అందుకని ఆ ముఠా వాళ్ళు ఈ డాక్టరుని చంపాని ప్రయత్నించారు. అది దీప కారణంగా విఫమయింది. ఈ విషయం పోలీసులకు గాని వేరే ఎవరికైనా చెప్పినా కుటుంబాన్నే నాశనం చేస్తామని బెదిరించారట. రెండు నెలల తర్వాత డాక్టరుగారికి థాంక్స్‌ చెబుదామని దీప వెళ్తే ఆరోజు డాక్టరుగారి బర్త్‌డే అని అక్కడ నర్స్‌ చెప్పిందట. దీప గ్రీటింగ్‌ స్వీట్స్‌ తీసికెళ్ళి ఆదిత్యగారికి ఇచ్చింది. ఆదిత్యగారు ఈ రోజు నేను ఈ పుట్టిన రోజు జరుపుకుంటున్నానంటే కారణం నేవే నీ ఫోటో ఒకటి ఇవ్వమ్మా అంటే తన ఫోటో ఇచ్చింది” అన్నాడు భాస్కర్‌.
గబగబా లైట్లు వెలిగి చీకటి తొగిపోయి ప్రకాశవంతంగా అయింది హరితకు
భాస్కర్‌ గారూ మీరేం వర్రీ కాకండి దీపని. మీ బేబీని కాపాడటం నా బాధ్యత అని విజయ ఆపరేషన్‌కి రెడి చేయండి సెడేటివ్‌ ఇవ్వండి అని చకచక ఆర్డర్లు పాస్‌ చేసింది హరిత.
తనెంత పొరబాటుగా ఆలోచించింది. తన జీవితంలో వెలుగు నింపిన దీప జీవితమే ఆర్పేయాలనుకుంది. క్రిమినల్‌లా ఆలోచించింది. భాస్కర్‌ ఇప్పుడు ఈ విషయం చెప్పకపోతే సరిదిద్దుకోలేని తప్పు చేసి జీవితాంతం బాధ పడాల్సివచ్చేది. థాంక్స్‌ గాడ్‌ దీపని, బిడ్డని భాస్కర్‌కి అప్పచెప్పి రాత్రికి వైజాగ్‌కి బయుదేరాలి. రాఘవ గారికి ఈ విషయం చెప్పాలి దీపను తను కాపాడిన విషయం తెలిస్తే ఆదిత్య ఎంత సంతోషిస్తాడు. దీపకు కొంతయినా రుణం తీర్చుకునే అవకాశం కలిగింది అంటాడు. తన రెజిగ్నేషన్‌ లెటర్‌ వాపసు తీసుకోవడాని సూపరింటెండెంట్‌ గదివైపు నడిచింది హరిత.

*****

కొత్త చీర

రచన : శ్రీకాంత గుమ్ములూరి.

“అన్నవస్త్రాలకి పొతే ఉన్న వస్త్రం ఊడిందిట !!”
“ఎవరి మీదే అక్కసు?” అడక్కుండా ఉండలేకపోయింది కొత్తగా పెళ్ళైన అక్కని.
“అధముడికి భార్య అయ్యేకన్నా బలవంతుడికి భార్య అవడం మేలు …. ” ఇంకో సామెత దూసుకు వచ్చింది అక్క నోటి నుంచి బాణంలా…
‘పెళ్లై రెండు రోజులైనా కాలేదు అప్పుడే బావని తిట్టుకుంటున్నావా?” చెల్లెలి ప్రశ్న.
దానికి ఆమె ఇచ్చిన తలతిక్క జవాబు అత్యంత వినసొంపు !!
అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు కట్టబెట్టారుగా నన్ను మేనరికానికి ….
అండలుంటే కొండలు దాటచ్చు, మేనత్త కొడుకుని పెళ్ళిచేసుకుంటే అత్తారింట్లో హాయిగా సుఖపడచ్చు అనుకుంటే.. జరిగిందేమిటిట? ఆడబడుచు కళ్లన్నీ నా చీరలమీదే… అండ ఉన్నవాడిదే అందలం… ఉన్నాడుగా అండగా చెట్టంత అన్న !అడిగిందే పాపం… అనుగ్రహం తన స్వభావం కదా… చెల్లెలు కొత్త చీర కొనిమ్మని కోరడం ఆలస్యం, “ఇప్పటికి ఇప్పుడే అంటే ఎక్కడ నుంచి తేను? కొత్త పెళ్లికూతురు దగ్గిర కొత్త చీరలు కోకొల్లలు. మన ఇంటి పిల్లేకదా. నీక్కావల్సింది ఒకటి తీస్కో.” అని సులువైన సలహా ఇచ్చాడు కట్టుకున్న మొగుడు.
ఇంటివాడు ఒసే అంటే బయటవాడూ ఒసే అంటాడు… అంతే ! నా చీరల మీదకి దండెత్తింది మహాతల్లి. నా పెట్టెలో ఉన్నకొత్త చీరలన్నీ మంచం మీద చక్కగా పరిచి మరీ ఎంచుకుంది తనకు నచ్చింది. నాకు నచ్చిన చీరే దానికీ నచ్చాలా? ఐనా … నా అన్న నాకిచ్చింది నేనింకొకళ్ళ కెందుకు ఇవ్వాలి? ఇచ్చినవాడు దాత… ఇవ్వనివాడు రోత… నా చీర నేనివ్వనని మొండికేస్తే… నామీద ఉక్రోషంతో ఒకటే ఏడుపు. ఇవ్వని మొండికి విడువని చండి …. “ఇవ్వనుగాక ఇవ్వను దిక్కున్నచోట చెప్పుకో.” అని నేను మొరాయిస్తే.. ఇల్లంతా పీకి పందిరే వేసింది…….
పోనీ అత్తయినా తనను సమర్ధిస్తుందా? అత్తకు మంచి లేదు చింతకు పచ్చి లేదు…
ఎంత బ్రతిమిలాడినా వినకుండా “ఇద్దరికీ బుద్ధి లేదు.” అంటూ… అన్న తనకి ఇచ్చిన నాల్గు కొత్త చీరలు, తాము పెట్టిన ఆరు కొత్త చీరలు ….. మొత్తం అన్నీ తీసి బీరువాలో దాచేసింది.
అంటే ఆరడి అనకుంటే అలుసు…. తాను గాని నోరు మెదప కుండా ఉండి ఉంటే … ఈ పాటికి తన చక్కదనాల కొత్త చీర కట్టేసుకుని బుట్ట బొమ్మల్లే ముస్తాబయ్యేది కదూ? ఇవ్వడమన్నది ఈ ఇంట లేదు, తే అన్నది తరతరాలుగా వస్తు న్నట్లు – కొత్త పెళ్లి కూతుర్ని నాకు పెట్టకపోగా నా నుంచే లాక్కోడానికి సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు వీళ్ళు!
మొన్నటికి మొన్న, నిశ్చితార్ధం రోజున అత్త ఇచ్చిన కొత్త జరీ చీర కట్టుకుని “ఈ చీరలో నేనెట్లా వున్నాను?” అని అడిగితే…. ” చీరెందుకే నీకు చిన్నారీ! చీర కంటే నువ్వు మరీ బాగుంటావు.” అన్నాడు బావ.
అడిగింది రొట్టె ఇచ్చింది రాయి… నేనన్నా నా చీరలన్నా అందరికీ అలుసే !

***

ఎఱ్ఱని అంచున్న తెల్ల చీర !!
ఎఱ్ఱని కలువలు పొదిగిన చీర !!
తన అర్ధాంగి మనసుపడి కోరిన చీర !!
తాను మక్కువతో కొని తెచ్చిన చీర !!

పొంగుతున్న పాలలా పెల్లుబుకుతున్న తన ఉత్సాహాన్ని క్షణంలో చన్నీళ్ళు చిలకరించి చప్పున చల్లార్చింది చెల్లి మహాతల్లి! పెళ్లి దానికైతే మరెవ్వరికీ మంచి చీర కట్టుకునే సౌభాగ్యం ఉండకూడదులావుంది!
జానా బెత్తెడు ఉద్యోగం. చిన్న చిన్న సంతోషాలు తీర్చుకోలేని జీవితం. అర్హతలు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయనే నగ్నసత్యం తెలిసిన వాడు కనునకనే ఉన్నంతలో లోపం లేకుండా, తన గురించి అన్నీ తెలిసిన బావతో చెల్లెలి పెళ్లి కుదిర్చాడు. అమ్మ నాన్నలు కరువైన నాటినుంచీ అత్తమ్మే తమకు పెద్ద దిక్కు. ఏ కష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని తమని ఆదుకుంది. దొడ్డ మనసుతో సంబంధం కలుపుకోడానికి తానే ముందుకు వచ్చి అడిగింది. వాళ్లదీ తమలాంటి మధ్య తరగతి బాపతే ! అయితేనేం? అత్తమ్మ చెల్లిని పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటుందన్న నమ్మకం తనకుంది. దాన్ని ఒక దారిలోకి తేగలదన్న ధీమా కూడా వుంది.
ఉన్నంతలో పెళ్లి పన్లు చకచకా చెయ్యడం మొదలెట్టాడు భార్య సహకారంతో.
కొత్త పెళ్లికూతురికి మూడు చీరలు, చిన్న చెల్లికొక చీర, తన భార్యకొక చీర…. అతి కష్టం మీద! అంతకు మించి కొనగలిగే తాహతేదీ?
ఆ రోజు … షాపింగు చేస్తున్న రోజు… షాపులో ఆ చీర చూడగానే కోమలి కళ్ళలో కనిపించిన మెఱుపు తానెలా విస్మరించగలడు? ఆ చీరతో తన భార్య ఎంత అందంగా ఉంటుందో అదే క్షణంలో, కొనక ముందే ఊహించేస్కున్నాడు! అది తన భార్యకే ఇవ్వడానికి గట్టిగా నిర్ణయించేసుకున్నాడు. కానీ అన్ని ఊహలూ నిర్ణయాలూ వ్యర్థం! ఇచ్చిన మూడు చీరలూ పుచ్చుకున్నాక ఆ చీర తనకి చాలా చాలా నచ్చిందనిన్నీ, అది గాని తనకివ్వకపొతే పెళ్లే చేసుకోననీ పెద్దపెట్టున రాగాలు పెట్టింది చెల్లి మహాతల్లి! అయ్యబాబోయ్! నిజంగా అలాగే జరిగితే తమ జీవితానికి తెరిపేదీ…. ?
ఇష్టం లేని పని కూడా తన ఇష్టానికి అనుగుణంగా మలచుకున్న వాడే ప్రజ్ఞావంతుడు….
ఎంత ప్రాప్తమో అంతే ఫలం…. మనసుని రాయి చేసుకుని, భార్యకి నచ్చ జెప్పుకుని, తల ప్రాణం తోకకి తెచ్చుకుని, ఇద్దరికీ ప్రాణ ప్రదమైన చీరను చెల్లికి ధారపోసి, పెళ్లి పనులలో బుర్ర దూర్చేసాడు అన్నివిధాలా అదే మంచిదని.

***

తనలో లోపాలే లేవనుకునే లోపాన్ని మించిన లోపం మరొకటి లేదు….
తాను చేసిన పనే అక్షరాలా తన ఆడపడుచు కూడా చేస్తోందన్న గ్రాహ్యం అక్కకి ఎందుకు లేదు ? తనకు తట్టిన విషయం అక్క కెందుకు తట్టలేదు ? ఆనాడు అన్న అందరికీ కొత్త చీరలు కొని తెచ్చినప్పుడు వొదినకి ఒక్క చీర కూడా మిగల్చకుండా అన్నీ తానే తీసేసుకోడం ఎంత అన్యాయం. ఎంతసేపూ తన గురించే తప్ప పక్కనున్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఇంగితమే లేదు అక్కకి. దేవుడు దీనికి తగిన శాస్తి చెయ్యకపోతాడా?
చిన్నబోయిన వదిన ముఖం, అన్న ముఖంలో నిరుత్సాహం ఆ క్షణంలో దాని కంట ఎందుకు పడలేదు ? స్వార్ధానికి సరిహద్దు లేదులా వుంది. అర్హతకు మించిన కోరికలు ఆనందాన్ని దూరం చేస్తాయి. ఉన్నంతలో సంతృప్తి ఊరంతా మంచి… లేనినాడు ప్రపంచమంతా చుక్కెదురే ! మూర్ఖురాలు – పరిస్థితి అర్ధం చేస్కోదే…. ఇక నుంచీ ఈ పరమ గయ్యాళిని అదుపులోనికి పెట్టవలసిన బాధ్యత అత్తమ్మదే.

***
అంతరంగం అందంగా ఉంటే ఆచరణ కూడా అర్ధవంతంగా ఉంటుంది ….
ఎవరినీ ప్రశ్నించకుండా, ఎవరిచేతా ప్రశ్నింపబడకుండా, ఎక్కడా పొల్లు పోకుండా, ఒకరికి వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా, ఉన్న నాల్గు రోజులూ ఒకే చీరతో, నోరెత్తకుండా పెళ్లి పనులన్నీ శ్రద్ధతో పూర్తిచేసి, భర్తతో ఇంటిముఖం పట్టడానికి సిద్ధమైంది కోమలి.
“బొట్టు పెట్టించుకుని వెళ్ళమ్మా” అని, దేవుడిగది లోనికి తీసుకువెళ్లి, ఆమె చేతిలో కొత్త చీరను ఉంచి, “నువ్వు ఈ చీర కట్టుకున్నాకనే ఈ గడప దాటేది.” అని హుకుం జారీ చేసింది అత్తమ్మ.
కొత్త చీర కట్టుకున్న కోమలిని చూసి కొత్త కోడలూ, కూతురూ కంగు తిన్నారు…..
కట్టుకున్న భర్త కళ్లింత చేసుకుని, కలువలన్నీ వెల్లి విరిసేట్టుగా వెన్నెలలు కళ్ళాపి జల్లాడు……
మేనల్లుడి కళ్ళలో జిలుగు చూసిన అత్తమ్మ ఆప్యాయంగా చిరునవ్వు నవ్వింది ……
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు !!!

——————

మాడర్న్‌ అమ్మమ్మ చెప్పిన మాడల్‌ కథలు

రచన: ఝాన్సీరాణి కె.

లక్ష్మిగారు డైనింగ్‌ టేబల్‌ దగ్గర కూర్చుని మరుసటి రోజు కూరకి చిక్కుడుకాయలు వలుస్తున్నారు. హాల్లో పిల్లలందరూ కూర్చున్నారు.
మన ఆర్థిక మంత్రి ఎవరు అడుగుతున్నాడు కిరాణ్‌ ?
“రోశయ్య” అంది లాస్య
“కాదు” అన్నాడు కిరణ్‌
హోంమంత్రి ఎవరో చెప్పు?
సబితా ఇంద్రారెడ్డి
“చెన్నై గవర్నరెవరు?”అడిగారెవరో
“రోశయ్య” అన్నాడు కిరణ్‌
“ఆయన మన ఆర్థిక శాఖ మంత్రి” అంది లాస్య.
“కావాలంటే ఈ బుక్‌ చూడంఢి. మూడేళ్ళ నుంచి ఈ బుక్‌ చదివిన వాళ్ళకే క్విజ్‌లో ప్రైజ్‌ వస్తూంది” అన్నాడు రోహిత్‌.
“అమ్మా ఇలా రండి” పిలిచారు లక్ష్మిగారు.
అందరూ బిలబిలా ఆవిడ చుట్టూ చేరారు.
“ఎల్లుండి క్విజ్‌ కాంపిటీషన్‌ ఉంది అమ్మమ్మా” అన్నాడు జార్జ్‌.
“కొన్ని ప్రశ్నలకు జవాబులు మాత్రం ఈ పుస్తకంలో ఉన్నవి కావంటున్నాడు కిరణ్‌” అని ఫిర్యాదు చేసింది లాస్య.
“పుస్తకంలో కూడా తప్పులుంటాయా అమ్మమ్మా?” అన్నాడు సాగర్‌.
“మీకొక కథ చెప్పనా?” అన్నారు క్ష్మీగారు
“బలే బలే” అంటూ వచ్చాడు రఫీ అందరూ కుర్చీలలో, గోడవార ఉన్న సోఫాలో సర్దుకుని కూర్చున్నారు.
“కనకరాజు” 9 లేక 10 చెట్లు కొట్టేవాడు. అతడితో బాటు రంగడు, గోపి, అహమ్మద్‌ అని మరో ముగ్గురు పని చేసేవారు. వారు పని మధ్యలో రెండు సార్లు టీ త్రాగటానికి వెళ్లి అరగంట తర్వాత వచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత కనకరాజు తన యజమాని జగన్నాధరావుగారితో తన తోటివారు, పని మధ్య లో వదిలేసి వెళ్ళి కబుర్లతో సమయం వృధా చేస్తున్నారని చెప్పాడు. ఒక వారం తర్వాత వాళ్ళను అడుగుతానన్నాడు జగన్నాధరావు. వారం రోజులు గడిచాయి. యజమాని వాళ్ళనెలా కోప్పడతాడో, అప్పుడు వాళ్ళేం చెబుతారో చూడాలని ఆతృతగా ఉన్నాడు. కనకరాజు.
జగన్నాధరావు కనకరాజును పిలిచాడు. మిగిలినవాళ్ళను పిలవకుండా తనను పిలుస్తున్నాడేమిటా అనుకుంటూ వెళ్ళాడు కనక రాజు.
జగన్నాధరావు చేతిలో ఒక కాగితం ఉంది. అందులో పని చేస్తున్న నలుగురి పేర్లు: వారం రోజుల్లో ఒక్కోరోజు పేరు కెదురుగా వారు కొట్టిన చెట్ల సంఖ్య వ్రాసి వుంది. ప్రతిరోజు నలుగురు సమానంగా కాని, లేకుంటే కనకరాజుకంటే ఎక్కువ చెట్లు కొట్టారు. అది చూపించి ఎవరినేమనాలో చెప్పమన్నాడు జగన్నాధరావు.
ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కనకరాజు కాని అతడికి అర్థం కానిది ఒక్కటే తనకంటే తక్కువ సమయం పనిచేసినా వాళ్ళెలా తనతో సమానంగానో, లేకపోతే ఎక్కువగానో పని చేయగలుగుతున్నారు అని తర్వాత రోజు వాళ్ళతో కలిసి టీ త్రాగటానికి వెళ్ళాడు కనకరాజు.
“ఏమిటి కనకరాజూ గాలిలా మళ్ళింది?” అన్నాడు అహమ్మద్‌. “సమయం వృధా కాదా?” అన్నాడు రంగడు. ఊరుకోండ్రా అంటూ టీ కప్పు కనకరాజుకిచ్చాడు గోపి.
టీ త్రాగాక వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ గొడ్డలి గొడకేసి సానపెట్టడం ప్రారంభించారు స్నేహితులు. ..
అప్పుడర్థమయింది కనకరాజుకు మిత్రులు కబుర్లు చెబుతూ సమయం వృధా చేయట్లేదని, తమ పనికి కావలసిన విధంగా పని ముట్టును తయారు చేసుకుంటున్నారని. తర్వాత రోజు నుంచి వాళ్ళతో కలిసి తనుకూడా వెళ్ళి గొడ్డలి పదును పెట్టడం ప్రారంభించాడు.
అతనికి ఫలితం పెరిగింది.
కాబట్టి మూడేళ్ల క్రితం పుస్తకం కొని చదవడంకాదు రాహుల్‌ నాన్నకు చెప్పి కొత్త పుస్తకం తెప్పించుకో. మన రాష్ట్ర మంత్రులు, దేశానికి సంబంధించిన మంత్రుల జాబితా అంతా ఎవరైనా పెద్దవాళ్ళని కాని, లేకుంటే స్కూల్లో మీ టీచర్ని కాని అడిగి వ్రాసుకోండి. మీ నాలెజ్జ్‌ని అప్‌టుడేట్‌ చేసుకోండి అని ముగించారు లక్ష్మీగారు.
పిల్లలు అమ్మమ్మకు ధాంక్స్‌ చెప్పి ఆవిడ సహా పాటించి క్విజ్‌ ప్రోగ్రాంలో కప్‌ గెలిచి సంతోషంగా తెచ్చి ఆవిడ చేతిలో పెట్టారు.
*****

గ్రహణం వదిలింది

రచన: గిరిజ కలవల

సాయంత్రం ఐదు కావస్తోంది. రాధ ఆఫీసు పని ముగించి టేబుల్ సర్దేసింది.
“ఏంటో.. మేడమ్ గారు అప్పుడే బయలుదేరిపోతున్నట్లున్నారే.. ఏమన్నా విశేషమా ఈ రోజు..” వెనక నుండి సూపరిడెంట్ భూషణం వ్యంగ్యంగా అన్నాడు.
“అవును.. సార్… రేపు మా అమ్మాయి పుట్టినరోజు.. డ్రస్ కొనుక్కుని వెళ్ళాలి. పెండింగ్ వర్క్ అంతా అయిపోయింది. అందుకనే వెడుతున్నాను.”అంది రాధ.
“డిసైడైపోయారుగా.. అలాగే కానీండి. . పుట్టినరోజు.. పార్టీ లు అంటారేమో.. ఈ వంకతో రేపు సెలవంటారేమో కుదరదు.. ముందే చెపుతున్నా..”అన్నాడు.
“సెలవు అవసరం లేదు నాకు. వెడుతున్నా”అని బయలుదేరిన రాధకి తెలుసు వాడి చూపులు వెనక గుచ్చుకుంటున్నాయని. కంపరంతో కొంగు నిండుగా కప్పుకుని ఆఫీసు నుంచి బయటపడింది.
బజార్లో పాపకి డ్రస్ తీసుకున్నాక. స్వీట్స్ కూడా పాక్ చేయించింది రాధ. అత్తగారికి కూడా వెంకటగిరిచీర తీసుకుంది. మామగారికి తీసుకోవడం ఇష్టం లేదు కానీ ఆయన అనే వంకర మాటలు భరించలేక ఓ పంచె, లాల్చీ కూడా తీసుకుంది. కవర్లు అన్నీ పట్టుకుని బస్ కోసం వెయిట్ చేసే ఓపిక లేక ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరింది.
అలసటగా వెనక్కి ఆనుకుని కళ్లు మూసుకున్న రాధ.. కి సూర్య గుర్తు వచ్చాడు. వెంటనే కళ్ళు నీటి చెలమలయ్యాయి.”సూర్యా.. రేపు పాప పుట్టినరోజు.. గుర్తుందా నీకు.. ఆరోజు హాస్పిటల్ లో ఎంత హడావుడి చేసావు… శుక్రవారం లక్ష్మీదేవి పుట్టింది నా ఇంట అంటూ స్టాఫ్ మొత్తానికి స్వీట్స్ పంచావు. తెగ మురిసిపోయావు. పాపని నేలమీద నడవనీయను.. అరచేతులపై పెంచుతాను.. పెద్ద చదువులు చదివిస్తాను.. అందాల రాజకుమారుని తెచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి చేస్తాను… అని ఎన్నెన్నో అన్నావే… ఎక్కడకి వెళ్లి పోయావు… నన్ను.. పాపని వదలి తిరిగి రాలేని లోకాలకెందుకు వెళ్ళావు.. నేనూ నీతో వద్దామంటే.. ఈ బంధాన్ని అడ్డు వేసావు..”మూగగా రోదిస్తోంది రాధ.
“అమ్మా.. ఈ వీధేగా మీరు చెప్పింది”అన్న ఆటోడ్రైవర్ మాటకి ఉలిక్కిపడి చెంపలు తుడుచుకుని”ఆ కుడిప్రక్క పచ్చగేటు ముందు ఆపు”అంది రాధ.
గేటు తీసుకుని ఇంట్లోకి వెడుతున్న రాధని బయటే కూర్చుని సిగరెట్ కాలుస్తున్న మామగారు రాజారావు పైనుంచి కింద దాకా ఓ చూపు చూసాడు. ఆ చూపులో రకరకాల అర్థాలు. తలదించుకుని రాధ లోపలికి వెళ్లి పోయింది.
మంచినీళ్ళతో ఎదురొచ్చిన అత్తగారు సుమతితో..”పాప విసిగించిందా.. అత్తయ్యా… బజారుకి వెళ్లి ఇవన్నీ కొనేసరికి ఆలస్యం అయింది.”అని తెచ్చిన కవర్లు అందించి సంజాయిషీ ఇచ్చుకుంది రాధ.
“ఏం లేదమ్మా.. ఆడుకుంటోంది… పేచీ లేకుండా అన్నం తినేసింది. పాపకి కొత్త బట్టలు తెచ్చావు చాలు… మాకెందుకమ్మా ఇప్పుడు.. అయినా బయటకి వెళ్ళేదానివి నీకుండాలి మంచి బట్టలు..”అన్న సుమతి మాటలకి చిరునవ్వే సమాధానమిచ్చి వంటింటిలోకి వెళ్లింది రాధ.
కాఫీ కలిపి కప్పులో పోసుకుని తన రూమ్ లోకి వచ్చి కూర్చున్న రాధకి కిటికీలోనుండి అస్తమిస్తున్న సూర్యుడు కనిపించేసరికి… తన జీవితంలో నుండి అస్తమించిన తన సూర్యని తలుచుకుంది. గతమంతా కళ్ళముందు మెదలసాగింది.
చిన్నపుడే తల్లి తండ్రులని కోల్పోయి మేనమామ పంచన పెరిగింది తను. అత్త రాజ్యం సూటిపోటి మాటలతో.. ఆవిడకి ఎదురు చెప్పలేని మామయ్య ఆనందరావు ఆదరణలో డిగ్రీ వరకు చదువుకోగలిగింది. మామయ్య స్నేహితుడొకరు తెచ్చిన సంబంధం. సూర్య గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ గా చేస్తున్నాడు.. తల్లితండ్రి తనతోనే వుంటారు.. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పిల్లాడి ఉద్యోగం ఒకటే కుటుంబానికి ఆధారం. ఇంతకుమించిన సంబంధం చూడడం తన వల్ల కాదని ఆనందరావు అనుకుని.. ఓ మంచి ముహూర్తంలో.. తనకి సూర్యకి పెళ్ళి చేసాడు. అప్పగింతల సమయంలో అత్త రాజ్యం సూర్య తల్లి సుమతితో చెప్పేసింది … ఇకపై రాధ బాధ్యత పూర్తిగా మీదే.. ఇన్నాళ్ళ పెంచడమే మాకు గొప్ప.. ఇకపై పండగలూ… పబ్బాలూ… పురుళ్ళూ అంటూ మా కొంపకి రావొద్దు.. అని నిర్మొహమాటంగా .
దానికి సహృదయురాలైన సుమతి కూడా ఏమనుకోలేదు… ఫర్వాలేదు.. మాకు కూతురైనా.. కోడలైనా.. రాధే…. ఇక నుండి రాధ బాధ్యత మాదే.. అని హామీ ఇచ్చింది. పోగొట్టుకున్న తల్లిని సుమతిలో చూసుకుని పొంగిపోయింది తను. కానీ.. మామగారు రాజారావు మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదు కానీ తనతో.. ఆయన చూపులూ, ఆయన తరహా ఎందుకో నచ్చలేదు తనకి.
ఇక సూర్య… తన జీవితంలో ఎదురుచూడని అదృష్టం సూర్య రూపంలో వచ్చిందని మురిసిపోయింది. తననెంతో ఆరాధనగా.. ఆప్యాయంగా చూసుకునేవాడు. తనకు చేతనైనంత దానిలోనే అన్నీ అమర్చి పెట్టేవాడు. సూర్య ప్రేమలోనూ.. అత్తగారు సుమతి అభిమానంతోనూ కాలం వేగంగా సాగిపోతోందన్న సంగతే పట్టించుకోలేదు తను.
అప్పుడప్పుడు అత్తగారు చాలా బాధ పడుతూ ఉదాసీనంగా వుండడం.. తరచు కంటనీరు పెట్టుకోవడం గమనించేది తను. కారణం ఆవిడా చెప్పేది కాదు.. తానూ అడిగే సాహసం చేయలేదు. ఒకసారి సూర్య దగ్గరే “మీ అమ్మగారు ఎందుకో కలత పడుతున్నారు.. ఏంటో కనుక్కోరాదా”అని అంటే దానికి సమాధానంగా సూర్య”అమ్మ బాధ ఎవరూ తీర్చలేనిది. చిన్నతనం నుండీ చూస్తున్నాను. నాన్న అలవాట్లు.. ఆయన ప్రవర్తించే తీరు అమ్మనెపుడూ బాధిస్తూనే వుంటుంది. అమ్మ సగటు ఆడదానికి ప్రతిరూపం. భర్తని ఎదిరించి మనలేని మనస్తత్వం. చాలాసార్లు చెప్పాను.. అమ్మా.. ఈ ఇంటి నుంచి.. నాన్న నుంచి దూరంగా వెళ్లి పోదామని.. ఒప్పుకోలేదు. ఆ ఆలోచనే తప్పంది.. భర్తను వీడిన భార్యకి అన్నీ అవమానాలే బయట.. దాని బదులు ఈ నాలుగు గోడల మధ్య అవమానాలే నయం.. అంటూ.. తనలో తనే కుమిలిపోతోంది తప్ప ఎవరికీ చెప్పుకోదు… నువ్వే అమ్మని అనునయించాలి..”అని చెప్పాడు.
ఎలా ఓదార్చాలో తెలీక మౌనంగానే వుండిపోయేది తను. ఈ క్రమంలో తాను నెల తప్పడం.. అత్తగారికి.. సూర్యకి పండగే ఆ వార్త. తనని నేల మీద కాలు పెట్టనీకుండా చూసుకునేవారు ఇద్దరూ. మామగారిలో ఈ వార్త ఎటువంటి భావమూ తెలియపరచలేదు. నెలలు నిండి తాను పండంటి ఆడపిల్లని ప్రసవించడం.. ఉన్నంతలోనే నామకరణం జరిపించి అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం చేసాడు సూర్య. పాప ముచ్చట్లతో కాలం సాగుతూంటే.. ఆ దేవుడికి కన్ను కుట్టింది కాబోలు… ఆఫీసు నుండి ఇంటికి వస్తుండగా సూర్యని లారీ ప్రమాదంలో తన వద్దకు తీసుకెళ్లి పోయాడు. లోకం చీకటైపోయింది తనకి. కొండంత కొడుకు పోయినా దుఃఖం దిగమింగుకుని అత్తగారు తన కోసం.. పాప కోసం.. అండగా నిలబడ్డారు. డిగ్రీ చదివిన తనకి సూర్య ఆఫీసులో ఉద్యోగం రావడం జరిగింది. ఈ పనుల మీద మామగారు తనని తీసుకువెళ్ళడం.. ఆ వంకతో.. ఈ వంకతో.. మీద చేతులు అనుకోకుండా వేసినట్టు వేయడం.. తనకి కంపరంగా అనిపించేది. అత్తగారికి చెప్పుకోలేని పరిస్థితి. ఎలాగో ఈ పరిస్థితి నుండి బయటపడడం అనిపించేది. భర్త తోడు లేని ఆడది అంటే ఇంటా బయటా తక్కువ భావమే.. అడుగడుగునా ముళ్ళకంచెలే.. చూసి చూసి అడుగులేసి పాప కోసం భారంగా జీవితాన్ని గడుపుతోంది తను. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపాలి అనుకుంది.
ఇంతలో”ఏంటమ్మా.. లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావు.”అంటూ స్విచ్ వేసింది అత్తగారు సుమతి.
“సరే! కానీ.. రేపు సెలవు పెట్టు.. పాప పుట్టినరోజు కదా.. మీ మామయ్యగారు బయటకి వెడదాం అన్నారు.. హోటల్ లో భోంచేద్దామన్నారు.”అని అన్న సుమతికి”అయ్యో.. అత్తయ్యా.. రేపు సెలవు కుదరదు. ఇంకోసారి వెడదామని చెప్పండి మామయ్యగారికి.”అని జవాబిచ్చింది.
“అదేం కుదరదు.. రేపు సెలవు పెట్టాల్సిందే… బయట భోజనంలో పాప సరిగ్గా తింటుందో లేదో.. ఇప్పుడే పాయసం చేస్తున్నా.. మళ్లీ రేపు రాత్రికి గ్రహణం కూడాను.. వచ్చి స్నానాలు చేసి వండుకోవాలి. సెలవు సంగతి ఆఫీసులో వాళ్ళకి ఇప్పుడే చెప్పెయ్యి”. అని ఖచ్చితంగా అనేసి జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్లి పోయింది సుమతి.
ఆఫీసులో సెలవు ఇవ్వనని ముందే చెప్పాడు భూషణం.. ఇప్పుడెలాగా.. అని ఆలోచించి.. ఏదో ఒకటి అందరిముందు కామెంట్ చేస్తాడు అంతేగా.. అని తన కొలీగ్ కి రేపు రావడం కుదరదని చెప్పేసింది.
వంటింటిలో సుమతి మనవరాలికి ఇష్టమైన సేమియా పాయసం చేద్దామనే ప్రయత్నంలో వుంది. చేతులు పని చేస్తోన్నా.. ఆవిడ ఆలోచనలు మాత్రం ఎక్కడో వున్నాయి. తన భర్త ఎంతటి నికృష్టుడో తెలుసు… ఇంట్లో నిక్షేపంలాంటి తనని పెట్టుకుని బయట వెధవ తిరుగుళ్లు. వయసు పెరిగినా బుధ్ధి మాత్రం రాలేదు. ఇదివరలో ఇంటికే ఎవరెవరినో తెచ్చేవాడు. ఎదురు మాట్లాడితే చెయ్యి చేసుకోవడమే. దమ్మిడీ సంపాదన లేకపోయినా మగాడిననే పొగరు. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో నోరు మూసుకుని వుండిపోయేది. తండ్రి అలవాట్లు కొడుక్కు రాకుండా .. ఎంతో జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది. రత్నంలాంటి కోడలు.. మాణిక్యంలాంటి మనవరాలు ఇంటికి వచ్చినా ఈ మనిషిలో రవ్వంతైనా మార్పు లేదు. ఇప్పుడు భర్తని కోల్పోయి.. తమ కోసం ఉద్యోగం చేసి కొడుకులా చూసుకుంటున్న కోడలిపై కన్నేసాడు. అది కనిపెట్టిన తాను. రాధ మన కూతురితో సమానం.. చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు.. ఇన్నాళ్ళూ మీరేం చేసినా నేను మాట్లాడలేదు.. కానీ ఇప్పుడు ఊరుకోను.. గోలగోల చేస్తాను. కోడలినీ.. మనవరాలినీ తీసుకుని వేరే వెళ్లి పోతాను.. రాధ జోలికి రాకండి.. అని కాళ్ళావేళ్ళా పడింది.. అరిచింది.. ఏడిచింది.. కానీ ఆ ధూర్తుడు మాత్రం కరగలేదు. పైగా.. నిన్న.. పసిది.. మనవరాలిని ఎత్తుకుని..”ఏం చేస్తావో.. నాకు తెలీదు… ఎల్లుండి దీని పుట్టినరోజు వంకతో మిమ్మల్ని బయటకి తీసుకువెడుతున్నా.. రాధని ఒప్పించు.. అక్కడ నువ్వు పాపని తీసుకుని ఏదో వంకతో బయటకి వెళ్ళాలి.. నా కోరిక తీరాలి. లేదంటే.. నీ మనవరాలి గొంతు పిసికి చంపేస్తాను. నా సంగతి తెలుసుగా.. అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తాను”అని బెదిరించేసరికి తాను హడలిపోయి నోట మాట రాలేదు. ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు తనకి. ఇప్పుడు కూడా రాధ ఆఫీసు నుంచి రాగానే”చెప్పావా.. లేదా”అన్నాడు. ఒప్పుకోకపోతే అన్నంత పనీ చేసి పసిదాని ప్రాణం తీసినా తీస్తాడు. ఒప్పుకుంటే రాధ బతుకు అన్యాయమైపోతుంది. ఎలా.. ఎలా…అని ఆలోచిస్తూ.. పాయసంలో పంచదార కలపసాగింది. దేముడి మీదే భారం వేసి.. ఓసారి ఆ పాయసం దేముడి ముందు పెట్టి నైవేద్యం పెట్టి… కాపాడు తండ్రీ… తప్పే చేస్తున్నానో… ఒప్పే చేస్తున్నానో.. నీదే భారం.. అంటూ కన్నీరు కారిపోతూండగా వేడుకుంది.
భర్త రాజారావుని భోజనానికి పిలిచింది.అన్నీ వడ్డించాక పక్కన కప్పు నిండుగా పాయసం పెట్టింది సుమతి.”రేపు కదా.. పాప పుట్టినరోజు.. ఈ రోజు స్వీట్ చేసావేమిటి”అన్న అతనికి జవాబుగా”రేపు బయట భోంచేద్దామన్నారు కదా… ఈ రోజే పాయసం చేసేసా..”అంది సుమతి.”ఓ. సరే .. సరే..”అంటూ తనకిష్టమైన పాయసం కప్పు తీసుకుని తిన్నాడు. భోజనం ముగించి తన గదిలోకి వెళ్లిపోయాడు రాజారావు.
అక్కడంతా శుభ్రం చేసేసి కోడలిని భోజనానికి పిలిచింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. మథ్యలో”అత్తయ్యా… పాయసం చేసానన్నారు.. ఏదీ..”అంది రాధ.” ఇందాక మీ మామయ్య గారికి ఇక్కడ వడ్డిస్తున్నపుడు కంగారులో పాయసం గిన్నె మీద మూత పెట్టడం మర్చిపోయానమ్మా… బల్లి పడింది.. పారబోసేసా…. రేపు మళ్లీ చేసుకుందాం”అంది సుమతి.
“ఔనా… నయమే. చూసారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రమాదమే..”అన్న రాథకి “ప్రమాదం జరగకూడదనేమ్మా నా తపన”అంది సుమతి.
ఆవిడ మాటలు అర్థంకాక మౌనంగా భోంచేసి.. అన్నీ సర్దేసి.. పాపని తీసుకుని గదిలోకి వెళ్ళింది రాధ.
సుమతి కూడా”రాధా.. నేను కూడా నీ గదిలోనే పడుకుంటానీవేళ..”అంటూ రాధ గదిలోకి వచ్చింది.
ఈ రోజు అత్తగారి మాటతీరు ఎందుకో వింతగా తోస్తోంది రాధకి.
“అలాగే అత్తయ్యా.. రండి.”అంది.
“రేపు సెలవు కావాలని ఆఫీసుకి ఫోన్ చేసి చెప్పాను అత్తయ్యా”అంది రాధ.
“రేపటి సంగతి రేపు చూద్దాం.. పడుకో..”అన్న అత్తగారిని విచిత్రంగా చూసి పాపని జోకొడుతూ నిద్ర లోకి జారుకుంది రాధ.
సుమతి కళ్ళు మూసుకుందే కానీ.. రేపు జరగబోయే సంఘటనలే కళ్ళ ముందు మెదిలి భయపెట్టసాగాయి.
తెల్లారింది.. రాధ లేచేసరికి పక్కన సుమతి లేదు. వంటింట్లో చప్పుళ్ళు వినపడేసరికి.. అత్తగారు అప్పుడే కాఫీల పనిలో మునిగిపోయారనుకుని… తాను స్నానాలు కానిచ్చుకుని వంటింటిలోకి వెళ్ళింది. ఆవిడ పూజ అయిపోయి టిఫిన్ ల ఏర్పాటులో వుంది. తనని చూసి..”రా.. రా.. లేచావా.. కాఫీ తాగి పాపని లేపు.. నెత్తిన నూనెపెట్టి.. హారతిచ్చి.. తలంటు పోద్దాం.”అంది. సరే అని చెప్పి…”ఔనూ.. ఈ రోజు గ్రహణం అన్నారు… ఎన్ని గంటలకి పడుతుందీ.. ఎప్పుడు విడుస్తుందీ.. మళ్లీ స్నానాలు చెయ్యడం వుంటుందేమో కదా..”అన్న రాధకి.. జవాబుగా ఆవిడ మనసులోనే”మనకి పట్టిన గ్రహణం ఎప్పుడో వదిలిపోయింది తల్లీ… ఇక మనకేం అపాయముండదు”అనుకుంది.
నిన్న రాత్రి బల్లి పడిందని అబధ్ధం చెప్పి…. పాయసంలో నిన్న మథ్యాహ్నం తెచ్చిన పాయిజన్ కలిపి ముందు రాజారావుకే తినిపించి.. మిగిలిన పాయసం అంతా సింకులో పారబోసిన విషయం తనకొక్కదానికే తెలుసు. కోడి తన రెక్కల మాటున పిల్లలని దాచుకున్నట్లు.. కోడలికని.. మనవరాలిని తాను దాచుకోగలిగింది. తాను తీసుకున్న నిర్ణయంతో. ఎన్నాళ్ళ నుండో బరువెక్కిన తన గుండె బరువు ఒక్కసారిగా దిగిపోయినట్లనిపించింది. ఇది తప్పు నిర్ణయం కాదు.. ఆ పాయసం దేముడి ముందు పెట్టినపుడు ఆ భగవంతుడే తనకీ దారి చూపించాడు. తమకి పట్టిన గ్రహణం వదిలించాడు. తాను బతికి వుండగా తన కోడలికి ఎలాంటి గ్రహణం పట్టకుండా కాపాడుకుంటాను అనుకుంది సుమతి.

మనసు గాయం మానేనా….?

రచన:- జ్యోతి వలబోజు

ఇంట్లో ఎవరూ లేరు.. నిశ్శబ్దంగా ఉంది. అసలు అది పెళ్ళి ఇల్లు అంటే ఎవరూ నమ్మరేమో. సుజాత తన గదిలోని మంచం మీద కూర్చుని టీవీ చూస్తుంది. కాని మనసు మాత్రం ఎక్కడో ఉంది. టీవీలొ కొత్త సినిమా వస్తుంది. కాని సుజాత దాన్ని మ్యూట్ చేసి రిమోట్ చేతిలో పట్టుకునే ఆలోచనలో పడింది.
ఎంతో కష్టం మీద కూతురుకు నచ్చినవాడితో పెళ్ళి చేసి పంపి పది రోజులైంది. పెళ్లైన వారంలోనే భర్తతో అమెరికా వెల్లిపోయింది కూడా. కొడుకు తనకు లీవ్ లేదని ఉద్యోగానికి బెంగుళూరు వెళ్లిపోయాడు. ఇక మిగిలింది సుజాత, ఆమె భర్త రమేష్. అతను కూడా ఇంట్లో ఉండి ఏం చేయాలని ఆఫీసుకు వెళ్లిపోయాడు.
మంచం మీద జారగిలాపడి కూర్చుని ఆలోచిస్తున్న సుజాత కళ్లనుండి అప్రయత్నంగానే కన్నీళ్లు రాలుతున్నాయి. కూతురు దూరమైనదన్న బాధా? ఇద్దరు పిల్లలు దూరంగా ఉన్నారన్న దిగులా? ఎదిగిన పిల్లలు ఎవరి దారి వారు చూసుకోక తప్పదని తనకు కూడా తెలుసు. అమ్మాయి సంతోషంగా కొత్త జీవితంలోకి వెళ్లిపోయింది. కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. సంతృప్తిగా, సంతోషంగా ఉండాల్సిన సమయంలో సుజాత మనసంతా దిగులుగా ఉంది. ఆమె ప్రమేయం లేకుండానే కన్నీళ్లు రాలిపోతున్నాయి. సుజాతకు తెలుసు తన కన్నీటి వెనకాల ఉన్న నిజం. వాటి అడుగున దాగిన దావానలం. అందుకే వాటిని ఆపడానికి, తుడుచుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. పోనీ అలాగైనా తన గుండెల్లోని బరువు కొంచెమైనా తగ్గుతుందేమో అనుకుంది.
సుజాత ఆలోచనలు ఐదేళ్లు వెనక్కి వెళ్లాయి.
మామూలుగా పిల్లలిద్దరు కాలేజీకి ,భర్త రమేష్ ఆఫీసుకు వెళ్లిపోయిన తర్వాత సుజాత తన టిఫిన్ కానిస్తుంది. ఆ తర్వాత టీ కప్పు పట్టుకుని కొద్ది సేపు టీవీ చూస్తుంది. తర్వాత మెల్లిగా ఇంటి పనులు పూర్తి చేసుకుంటుంది. కాని ఈ రోజు మాత్రం అందరూ వెళ్ళిపోగానే టిఫిన్ కూడా చేయకుండా తలుపులన్నీ వేసేసి వచ్చి సోఫాలో కూలబడిపోయింది.
అంతవరకు మౌనంగా పని చేసుకుంది కాని ఇక ఆగలేకపోయింది. భోరుమని ఏడ్వడం మొదలుపెట్టింది. గుండెల్లోంచి తన్నుకొస్తున్నట్టుగా వస్తున్న దుఖాన్ని ఆపలేకపోయింది. ఐనా కూడా ఆమె బాధ తగ్గలేదు. ఇంకా రగిలిపోసాగింది. ఎవరికీ చెప్పుకోలేని బాధ. కనీసం అమ్మకు కూడా చెప్పుకుని ఏడ్వలేదు.
తన జీవితంలో అసలు అటువంటి మాట పడాల్సి వస్తుందని ఆలోచించను కూడా లేదు సుజాత. తను ఎంతగానో ప్రేమించే వ్యక్తి, తన సర్వస్వం అనుకున్న వ్యక్తి తనను అన్న మాటలు రక్తం బొట్టు చిందకున్నా నిలువునా కత్తితో కోసినట్టుగా తల్లడిల్లిపోయింది. ఆ మాటలు దావానలంలా తనను కాల్చేస్తున్నట్టుగా ఏడుస్తూనే ఉంది. కొద్ది సేపటికి తేరుకుని ఇంటిపనుల్లో పడినా ఆమె మనసులోని బాధ, ఆవేశం తగ్గలేదు.
ఇల్లు సర్దుతున్నా, గిన్నెలు కడుగుతున్నా, బట్టలు ఉతుకుతునా ఆమె కంట నీరు ఆగకుండా పారుతూనే ఉంది. తనని తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తనకే తెలీడం లేదు. భోజనం కూడా చేయకుండా అలాగే ఉంది. తిన్నది లేనిది చూసేవారు లేరు. సాయంత్రమైంది. భర్త పిల్లలు వచ్చారు. తన కన్నీటిని అదిమేసి మౌనంగా వాళ్లకు కావల్సినవి అందించింది.
ఇలా కొద్ది రోజులుగా నడుస్తుంది. భార్యాభర్తలిద్దరూ సీరియస్సుగా, మౌనంగా ఉంటున్నారు. ఇద్దరిలో ఏదో సంఘర్షణ, ఆవేశం. పిల్లల ముందు గొడవపడకూడదని జాగ్రత్త పడుతున్నారు. కాని సరదాగా ఉండే అమ్మా నాన్న ఇలా ఎందుకున్నారని వాళ్లు అప్పుడే పసిగట్టారు. తమతో మామూలుగా ఉన్నా ఏదో జరిగిందని వాళ్లకు కూడా అర్ధమైపోయింది. అమ్మను అడిగితే “ఏం లేదు. మీరు చదువుకోండి” అంది.
ఒకరోజు రమేష్ ఆఫీసుకు వెళ్లలేదు. అతని అన్నయ్య వాళ్ల ఇంట్లో పార్టీ ఉంటే వెళ్ళాల్సి ఉండింది. మిగతా ఫంక్షన్స్ అన్నింటికి తనొక్కడే వెళ్ళి వస్తున్నా ఈసారి భార్యను తీసికెళ్లక తప్పేట్లు లేదు.. అందుకే వెల్డాం తయారవమని చెప్పాడు.
రమేష్ వాళ్ల అన్నయ్య ఇంట్లో అందరూ కలిసారు. సందడి సందడిగా ఉండింది. ఎప్పుడూ చలాకీగా, ఉత్సాహంగా ఉండే సుజాతను అందరూ చుట్టుముట్టారు. పలకరింపులు అయ్యాక సుజాత తోటికోడలికి సాయం చేయడానికి వెళ్లిపోయింది. తోటికోడళ్లు, ఆడపడుచులు, వాళ్ల పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతూ పని చేయసాగింది.
సుజాత చిన్నాడపడుచు రష్మి మాత్రం ఆమెలో ఏదో తేడా ఉందని గమనించింది. పైకి నవ్వుతూ ఉన్నా మధ్య మధ్యలో సైలెంట్ ఐపోతున్న సుజాతను గమనించసాగింది. ఆమెలో ఏదో బాధ ఉందని అర్ధమయ్యింది. అందరితో మాట్లాడుతూ, పని చేస్తున్నా కూడా సుజాత బెరుకు బెరుకుగా అటు ఇటూ చూడడం ఆశ్చర్యపరిచింది. సుజాత ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదే అనుకుంది.
ఆమె డాక్టరు కావడంతో పాటు సమవయస్కురాలు కావడంతో ఇద్దరూ బంధుత్వంకంటే ఎక్కువగా స్నేహితుల్లా ఉంటారు. అందుకే రష్మి తొందరగా పట్టేసింది. అందరిలో ఎందుకు అడగడం అని ఊరుకుంది.
రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం పూట ఇల్లు సర్దేసి పేపర్ చదువుతూ కూర్చుంది సుజాత. ఇంతలో డోర్ బెల్ మ్రోగింది. వెళ్లి చూస్తే రష్మి.
“హాయ్! రష్మి! ఎలా ఉన్నావు? ఏంటి సడన్‌గా? వస్తున్నానని కాల్ కూడా చేయలేదు?”
“అంటే నిన్ను కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకుని రావాలా? పద లోపలికి” అంది రష్మి.
“ఉండు మనిద్దరికి టీ చేసుకొస్తాను. తర్వాత కలిసి భోజనం చేద్దాం. సరేనా?” అంటూ కిచెన్‌లోకి వెళ్లి ప్లేట్లో కొన్ని జంతికలు, రెండు టీ కప్పులతో వచ్చింది.
“ఎప్పుడు చేసావ్ ఇవి” అంటూ జంతిక నములుతూ అడిగింది రష్మి.
“పిల్లలకోసమని నిన్నే చేసా” అని మౌనంగా టీ తాగసాగింది సుజాత.
“సొల్లు కబుర్లొద్దు కాని. ఇప్పుడు చెప్పు అసలు సంగతేంటి? ఏమైంది?”
“ఏంటి! ఏమైంది ? ఎవరికి?”
“సుజి! నన్ను బుకాయించాలని చూడకు. మనం బందువులకంటే స్నేహితుల్లా ఉంటాం. నా దగ్గర నువ్వు ఏమీ దాచవని నాకు తెలుసు. కొద్ది రోజులుగా నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఫోన్‌లో కూడా ఎక్కువ మాట్లాడడం లేదు. నీ మాటల్లో చలాకీతనం, సరదా లేదు. మొన్న ఫంక్షన్‌లో కూడా అందరిముందు నవ్వుతున్నా మనసులో చాలా బాధ ఉంది. దాన్ని కప్పి పెట్టడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం అంతా నేను గమనిస్తూనే ఉన్నాను. అసలు ఈ విషయం కనుక్కుందామనే ఇలా వచ్చాను. నేను నీకు ఆడపడుచు కంటే ఎక్కువగా స్నేహితురాలిని, నిన్ను అర్ధం చేసుకుంటాను అన్న నమ్మకం ఉంటే ఏం జరిగిందో చెప్పు” అంటూ సీరియస్‌గా అడిగింది రష్మి.
” ఏమీ లేదు రష్మి.. పెళ్ళైన పాతికేళ్లకు మీ అన్నయ్య నాకు గొప్ప బహుమతి ఇచ్చారు తెలుసా? నేను వ్యభిచారిని అని. అంటే దానికర్ధం నీకు తెలుసు కద” అంది నిర్లిప్తంగా కాఫీ తాగుతు సుజాత.
అది విన్న రష్మి అలాగే షాక్ తిన్నట్టు నిశ్చేష్టురాలైపోయింది. “ఏంటి! ఏమంటున్నావ్? ఇది నిజమా? ”
“యెస్ నిజమే! ” గుండెల్లో అగ్నిపర్వతాన్ని దాచుకున్నట్టుగా ఉన్న సుజాత కంటినుండి కన్నీరు జలజలా రాలసాగింది.
“ఇంకా నమ్మలేకున్నాను. మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారు. ఇన్నేళ్లల్లో ఏ గొడవా లేదు. ఎంత కష్టం ఉన్నా ఒకరికి చెప్పుకోకుండా, సాయం అడగకుండా గుట్టుగా ఉంటూ పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నారు. ఈ విషయంలో మేమంతా నిన్నే మెచ్చుకుంటాం తెలుసా. అయినా ఎందుకలా అన్నాడు అన్నాయ్య? నువ్వంటే తనకు ఎంత ప్రాణమో మాకందరికీ తెలీదా? మీరిద్దరూ ఒకరిమీద ఒకరు ఎప్పుడూ ఏ కంప్లెయింటు చేయలేదే? ఇప్పుడేంటి ఇలా?” రష్మి నోట మాట రావడం లేదు.
“నేను అబద్ధం ఎందుకు చెప్తాను. ఐనా మా మధ్య ఇన్నేళ్లలో చిన్న చిన్న మనస్ఫర్ధలు, గొడవలు తప్ప ఏమీ జరగలేదు. ఉన్నా కూడా నేను సర్దుకుపోయానే తప్ప ఎవరికీ చెప్పలేదు. ఆయన మీద నాకు కొన్ని కంప్లెయింట్లు ఉన్నాయి. ఎదిరించకుండా సర్దుకుపోయాను ఇన్నేళ్లు. నా భర్తను ఎవరి ముందూ కించపరచకూడదు దానివల్ల నాకే అవమానం అనుకుని ఎవరితో కూడా చెప్పలేదు. అవి నాకు బాధ కలిగించినా నాకు నేను సర్ది చెప్పుకుని పిల్లలను చూసి ఊరుకుండేదాన్ని. కాని ఎందుకో ఈ అవమానం నన్ను కత్తితో కోసేసినట్టుగా ఉంది. అసలు బ్రతకాలని లేదు రష్మి” అంటూ భోరున ఏడవడం మొదలుపెట్టీంది.
ఎన్నాళ్ళుగానో మనసులో బాధ ఎవరితో చెప్పుకోలేదా , దాచుకోలేక అల్లాడిపోయిన సుజాత ఇక తనని తాను నిలువరించుకోలేకపోయింది. పొగిలి పొగిలి ఏడవసాగింది.
ఓ ఐదు నిమిషాలు ఆమెను అలా ఏడవనిచ్చింది రష్మి. అలాగైనా సుజాత మనసులోని భారం తగ్గుతుందని ఆమెకు తెలుసు. తర్వాత సుజాతను పొదివి పట్టుకుని “ఇక చాలమ్మా.. ఊరుకో! నెమ్మదించు”. అని కళ్ళు తుడిచి, నీళ్ళు తాగించింది.
“ఇప్పుడు చెప్పు. అసలు ఏం జరిగింది? అన్నయ్య ఎందుకిలా అన్నాడు. ఏదైనా గొడవ జరిగిందా?
“ఏ గొడవా లేదు. ప్రతీ కుటుంబంలో ఉన్నట్టే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు తప్ప బానే ఉన్నాం. ఒక ఆరునెలల నుండి ఆయన ప్రవర్తనలో కొంచం మార్పు వచ్చింది. సీరియస్‌గా ఉంటున్నారు. సరే వర్క్ లేదేమో. డబ్బులకు ఇబ్బందిగా ఉండి అలా సీరియస్‌గా ఉంటున్నారు అనుకున్నా. నేను ఎవరితో మాట్లాడినా కోప్పడేవారు. ఎవరింటికీ వెళ్ళొద్దు. ఇంటికి ఎవరొచ్చినా ఎందుకొచ్చారు. ఏం పని అని తిట్టేవారు. సరేలే ఏదో బాధలో ఉన్నారని సర్దుకుపోయాను. ఎంత కోపంగా , ముభావంగా ఉన్నా నేను ఎదురు చెప్పక నార్మల్‌గా ఉండసాగాను. ఎదిగిన పిల్లల ముందు ఏం గొడవ పెట్టుకుంటాం. ఐనా వాళ్లకూ తెలుస్తూనే ఉంది. రెందు నెలల క్రింద ఒకరోజు ఏదొ చిన్న గొడవ మొదలై నువ్వు మంచిదానివి కావు. వ్యభిచారం చేస్తున్నావ్ అనగానే నాకు కాళ్ల క్రింద భూమి బద్ధలైనట్టైంది. ” దుఖం తన్నుకురావడంతో మాట ఆగిపోయింది సుజాతకు.
రెండు నిమిషాల్లో తేరుకుని మళ్లీ చెప్పసాగింది..
“నాకు ప్రాబ్లం రావడానికి నువ్వు కారణం. నేను లేనప్పుడు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావో? అందరితో ఇకఇకలు పకపకలు. మగవాళ్లతో నీకు మాటలేంటి. ఆడవాళ్లతో కూర్చుని ఉండలేవా.మొన్న పెళ్లిలో చూసాగా. మా వదినలు నీలాగే ఉంటున్నారా?” అన్నారు ఆయన.
నాకు కోపం, బాధ, ఆవేశం ఒక్కసారిగా వచ్చినా తనలా నేను రెచ్చిపోతే గొడవ తప్ప వేరే ఏమీ లేదు. “నేనెవరు మగవాళ్లతో నవ్వుతూ మాట్లాడాను. వాళ్లంతా మీ అన్నల, అక్కా చెల్లెల్ల పిల్లలు. మన పెళ్ళప్పుడు వాళ్లంతా ఎంత చిన్న పిల్లలు. నాకంటే చాలా చిన్నవాళ్లు . అత్తమ్మా, చిన్నమ్మా అని మాట్లాడతారు. వాళ్లతో నవ్వుతూ,సరదాగా మాట్లాడడం తప్పా?” అని అడిగా.
“అక్కరలేదు. మిగతా ఆడవాళ్లు అలా మాట్లాడుతున్నారా. నీకే ఎందుకు? నీ మూలంగానే నాకు ప్రాబ్లంగా ఉంది.
“మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గకు వెళ్ళి చూపించుకోండి. షుగర్ కానీ వచ్చిందేమో. లేదా ఇద్దరం వెళదాం పదండి. నాకేం భయం లేదు. తప్పు చేయనప్పుడు మాటలు పడేదాని కాదు. కావాలంటే అందరిముందు కూడా ఇదే చెప్తాను”
“డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం నాకు లేదు. నాకు తెలుసు. నాకేమీ కాలేదు. నీ కారెక్టర్ మంచిది కాదు. ఎవరితో సంబంధాలు పెట్టుకున్నావో. వ్యభిచారం చేస్తున్నావో. అందుకే ఇలా ఐంది.నువ్వే వెళ్లి చూపించుకో” అన్నారు కోపంగా .
“నా కారెక్టర్ మంచిది కాదు అని మాటలతో కాదు అందరిముందు నిరూపించండి. అప్పుడు ఒప్పుకుంటా. చిన్న ఫిజికల్ ప్రాబ్లం వచ్చింది కదా అని నన్ను అనుమానించడం , ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్డం మంచిది కాదు ” అని అక్కడినుండి వెళ్ళిపోయా అని చెప్పింది సుజాత.
“ఇంతేకాదు రష్మి. ఆయన ఈ మాట అన్న తర్వాత నాకు అర్ధమైంది. కొద్ది కాలంగా ఎందుకు సీరియస్‌గా ఉంటున్నారో. నేను మనీ ప్రాబ్లంస్ వల్ల అనుకున్నాను తప్ప ఇలా నా గురించి తన మనసులో అనుకుంటున్నారని అనుకోలేకపోయాను. ఈ మాట అమ్మతో కూడా చెప్పుకోలేను. చెప్తే పెద్ద గొడవ అవుతుంది. పిల్లలా ఎదిగే వయసు. ఇంత చదువుకుని తన ఫిజికల్ ప్రాబ్లంకి కారణం డాక్టర్ దగ్గరకు వెళ్ళి తెలుసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదా మీ అన్నయ్యకు. తన సమస్యకు కారణం తెలుసుకోకుండా నన్ను చెడ్డదాన్ని చేసేసారే. అది కూడా పెళ్లైన పాతికేళ్లకు. ఇదేనా నా మీద అయనకున్న నమ్మకం. ఇరవై ఏళ్లవయసులో ఆయన జీవితంలోకి వచ్చాను. నా గురించి ఆయనకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది. కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడూ తోడుగా ఉన్నాను. ఎప్పుడూ నాకేం పెట్టావని అడగలేదు. ఉన్నదాంట్లో సర్దుకుపోయాను. ఆయనకు కష్టంగా ఉన్నప్పుడు ఎవరినీ ఒక్క పైసా అడగకుండా, గొడవ పడకుండా ఇల్లు, పిల్లల చదువులు కూడా నేనే చూసుకున్నా . ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే బంధీ చేసినా ఊరుకున్నా. ఫోన్ మాట్లాడినా అనుమానమే. ఎవరితో మాట్లాడినా తప్పే. ఆఖరుకు పిల్లలకు ఉంటే ఏం కాదు కాదు కాని నాకు సెల్ ఫోన్ ఏందుకు? అవసరం లేదు. నాకు తెలీకుండా ఎవరితో మాట్లాడేదుంది” అంటారు. ఐనా భరించాను. కాని ఇప్పుడు ఈ అవమానంతో ఎంతవరకు భరించగలనో నాకు అర్ధం కావట్లేదు. ఇంతకుముందు లాగే మౌనంగా భరించి, మర్చిపోయి మామూలుగా అవుతానో, అసలు లేకుండా పోతానో మరి”
“హే! సుజాత! అలా ఎప్పుడు కూడా ఆలోచించకు. మర్చిపో అనడానికి ఇది చిన్న సమస్య కాదు. నాకు తెలుసు నీ బాధ. ఎంతగా తల్లడిల్లిపోతున్నావో కూడా తెలుసు. కాని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నీకోసం, నీ పిల్లల కోసం. అన్నయ్యకు నువ్వంటే ఇష్టం, ప్రేమ లేదని కాదు. మాకందరికీ తెలుసు. మీరిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణం అని, అందరిలా గొడవ పడకుండా, గుట్టుగా ఉంటూ పిల్లలను చదివించుకుంటున్నారని.ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావట్లేదు. అన్నయ్య అలాంటి మనిషి కాడే. ఎందుకిలా జరిగిందో. అసలు అతని మనసులో ఏముందో?. ఏం జరిగిందో. ఎలా తెలిసేది. తెలుసుకునేది”
“రష్మి.. ఆడదానికి ప్రపంచంలో తన కారెక్టర్ గురించి, శీలం గురించి ఇలా అనడం అది కూడా కట్టుకున్న భర్త నుండి రావడం కంటే పెద్ద అవమానం ఉండదు. అంటే నేను వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించి ఇల్లు నడిపించాను. పిల్లలను చదివించానా.. నా బంగారం అమ్మి, బట్టలు కుట్టి మరీ వాళ్ల ఫీజులు కట్టానే.. ఆయన దగ్గర డబ్బులేదని తెలిసి ఒక్క రూపాయి కూడా అడిగేదాన్ని కాదు. ఇంట్లో ఎంత కష్టంగా ఉన్నా, పిల్లల చదువులు నెత్తి మీద ఉన్నా కూడా నన్ను డబ్బులకు పని చేయనిచ్చేవారు కాదు. ఐనా ఆయనకు తెలీకుండా పచ్చళ్లు, కుట్లు అల్లికలు చేసేదాన్ని. అది కూడ గడప దాటకుండా…. తట్టుకోవడం నావల్ల కావడం లేదు” ఏడుపు ఆగడం లేదు సుజాతకు.
“సరే దీనికి పరిష్కారం కనుక్కుందాం. డోంట్ వర్రీ.. అన్నయ్యతో ఎక్కువగా మాట్లాటకు. నీ పనేదో నువ్వు చేసుకో.. నెమ్మదించు. పిల్లల మొహం చూసి ధైర్యంగా ఉండు ఏమీ కాదు. అన్నయ్య అంత దుర్మార్గుడేమీ కాదు. అన్నయ్య నీ గురించి అలా మాట్లాడినా ఎవరూ నమ్మరిక్కడ. నీ గురించి మాకందరికీ తెలుసు. సరేనా”
“రష్మి. నువ్వే చెప్పు. ఆడదానికి తన శీలం మీద అనుమానం కంటే మించిన అవమానం ఉంటుందా? అధి కూడా భర్త నుండి. చెడిపోయేదాన్ని అయితే ఇన్నేళ్లు ఆగేదాన్నా? పాతికేళ్ల తర్వాత తనకు ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని. నేను వ్యభిచారం చేసి రోగాలంటించానని అంటే ఎలా? కనీసం డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోకుంఢానే నా మీధ ఇంత నీచంగా ఆరోపణా? వేరేవాడి దగ్గర పడుకుని డబ్బులు సంపాదించి ఇల్లు నడిపించానా?. పిల్లలను చదివించానా?” అని విరుచుకుపడింది.
సుజాత బాధ అర్ధం చేసుకున్నా ఏమీ చెప్పలేకపోయింది రష్మి. మరో అరగంట ఉండి వెళ్ళిపోయింది..
ఇలా రోజులు భారంగా గడిచిపోతున్నాయి. ఎప్పటిలాగా నవ్వులు, సరదా ముచ్చట్లు లేవు. అమ్మానాన్నల మధ్య చిలిపి తగవులు లేవు. అరుపులు లేవు. ఇల్లంతా నిశ్శబ్ధంగా ఉంటుంది. పిల్లలున్నప్పుడే కాస్త సందడిగా ఉంటుంది. వాళ్లు కూడా అయోమయంగా ఉన్నారు. అమ్మానాన్న ఎందుకిలా ఉన్నారని.. వాళ్లిద్దరూ అవసరానికి మించి ఎక్కువ మాట్లాడుకోవడం లేదు అని గమనిస్తూనే ఉన్నారు.
ఒకరోజు ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అయ్యాక సుజాత తన కూతురితో చెప్పింది.” మీ డాడికి నా మీద నమ్మకం లేదు. నేను మంచిదాన్ని కాదు. చెడిపోయాను అంట. నేను వెళ్లిపోతున్నాను. మీ డాడిని, తమ్ముడిని చూసుకో. మీ చదువులు, పెళ్లిళ్లు ఆయనే చూసుకుంటారు. నా అవసరం లేదు “ అని చెప్పలేక చెప్పింది. అర్ధం చేసుకునే వయసు కాబట్టి కూతురికి చెప్పక తప్పలేదు.
“ఎక్కడి కెళ్తావ్? కొద్దిరోజులు అమ్మమ్మ దగ్గరకు వెళ్లు” అంది కూతురు.
“ఎక్కడికీ వెళ్లను. నా బతుకేదో నేను చూసుకుంటాను. లేదా లేకుండానే పోతాను. మీరు బాగుండండి. నీ చదువు ఐపోయింది. ఉద్యోగం వస్తుంది. నీ పెళ్లి సంగతి, తమ్ముడి చదువు, పెళ్లి మీ డాడీ చూసుకుంటారులే. నా వల్ల కావట్లేదు..” నిర్లిప్తంగా అంది సుజాత..
“ఐతే డాడీ అన్నాడని వెళ్లిపోతా అంటావ్. అమ్మమ్మ దగ్గరకు వెళ్లను. చచ్చిపోతాను అంటావ్. మరి మేమేం కామా నీకు. నాగురించి, తమ్ముడి గురించి నీకేమీ ఫీలింగ్స్ లేవా? డాడీ అన్నాడని మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్లిపోతావ్. పద నేను కూడా నీతో వస్తాను. నిన్ను నేను పోషించుకుంటాను. డాడీ ఒక్కడే ఉండనీ “ అని బాధతో, ఆవేశంతో అంది సుజాత కూతురు.
“మమ్మీ! ఏమైంది? ఎందుకలా ఉన్నావ్.. డాడీ ఏమైనా అన్నాడా? లైట్ తీసుకో మమ్మీ. పట్టించుకోకు “అని పక్కన వచ్చి కూర్చున్నాడు కొడుకు.
వాళ్లిద్దరినీ చూస్తూ ఔవీళ్లకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు. నాకు వీళ్లు కావాలి. వీళ్లకు నా అవసరం ఉంది. ఎక్కడికీ వెళ్లను.ఔ అని అనుకుని సోఫాలో అలా వెనక్కి వాలిపోయింది సుజాత.
కంటినుండి కారుతున్న నీటిని కూడా పట్టించుకోకుండా ఉన్న తల్లిని చూసి ఏమీ చేయలేక బాధపడ్డారు పిల్లలిద్దరూ.
అలా రోజులు భారంగా గడీచిపోతున్నాయి. పిల్లలున్నప్పుడు తప్ప ఆ ఇంట్లో అసలు మనుషులున్నారన్న సందడే ఉండడం లేదు. అవసరానికి మించి మాట్లాడడం లేదు సుజాత. ఎపుడు సరదాగా, ఇన్నేళ్ళలో ఎన్ని కష్టాలోచ్చినా భారమంతా తన మీద వేసుకుని ఏదో ఒకటి మాట్లాడుతూ, వాదిస్తూ, నవ్వుతూ ఉండే సుజాత ఇలా మౌనంగా ఉండడం రమేష్‌కు కూడా ఇష్టం లేదు. ఆమె చాలా గాయపడిందని అతనికి కూడా అర్ధమైంది. తను తప్పు చేసానా అనే ఆలోచన కూడా మొదలైంది. మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ముందులా సుజాతతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాడు. సుజాత మౌనంగానే ఇంట్లో పనులు చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ కాలం గడిపేస్తుంది. కనీసం తల్లితో కూడా చేప్పుకుని ఏడ్చేటట్టు లేదు. ఐనా ఈ విషయం పుట్టింటీ వాళ్ళకు తెలిస్తే పెద్ద గొడవలవుతాయి. అది తనకిష్టం లేదు.
ఆరోజు సుజాత పుట్టినరోజు. పొద్దున్నే తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని ఇంటిపనిలో పడింది. ప్రతీ సంవత్సరం పార్టీలాంటిది చేయకున్నా పిల్లలకోసం తినడానికి స్పెషల్ చేసేది. కాని ఈసారి ఏమీ చేయలేదు. రోజు లాగానే టిఫిన్, లంచ్ చేసి పెట్టి బాక్సులు సర్ది పంపించింది. వాళ్లు కూడా “హాపీ బర్త్ డే మమ్మీ” అని విష్ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ కూడా ఎప్పట్లాగే గడిచిపోయింది.

సాయంత్రం రమేష్ ఆఫీసునుండి హుషారుగా వచ్చాడు. చేటిలో ఏవో పాకెట్లు. మొహం ప్రసన్నంగా ఉంది. ఇంట్లోకి రాగానే తన చేతిలోని పాకెట్లు సుజాత చేతిలో పెట్టి “హాపీ బర్త్ డే సుజా” అని విష్ చేసాడు. షాక్ అయింది సుజాత. ఎప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు గుర్తుపెట్టుకోని , గుర్తున్నా సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన లేని భర్త ఇవాళ బహుమతులతో వచ్చి విష్ చేసాడంటే నమ్మలేకపోయింది. ఐనా అతనిలా సంతోషంగా ఉండలేకపోయింది.
“థాంక్ యూ. కాని ఇవన్నీ ఏవిటి? ఎవరికి?: అని అడిగింది.
“నీకోసమే. తీసి చూడు. నచ్చాయా లేదా చూడు. లేదంటే మార్చుకుందాం. తొందరగా రెడీ అవ్వు. పిల్లలు రాగానే అందరం బయటకు వెల్డాం. గుడికెళ్ళి అటునుండి అటే హోటల్‌లో డిన్నర్ చేసి వద్దాం. ఉండు పిల్లలను కూడా తొందరగా రమ్మని ఫోన్ చేస్తాను.”అన్నాడు రమేష్.
ఇంకా ఆశ్చర్యంలో మునిగిపోయింది సుజాత. ప్రతీ సంవత్సరం ఇదే విషయం మీద తను ఎన్నిసార్లు గొడవపడినా, వాదించినా మారని భర్త ఇవాళ తనంతట తానే బయటకు వెళ్దాం అంటున్నాడేంటి? తన మీద అంత నీచమైన అభియోగం వేసి, గాయపరిచిన మనిషి ఇప్పుడిలా ప్రవర్తిస్తున్నాడేంటి? ఇంతోటిదానికి నేను అన్నీ మర్చిపోయి ఏమీ జరగనట్టు ఎలా ఉండగలను?” అనుకుంది సుజాత.
“వద్దులెండి. ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు. పండక్కి కట్టుకుంటా ఈ చీర. స్వీట్స్ పిల్లలు వచ్చాక ఇస్తాను” అంటుండగానే పిల్లలు వచ్చేసారు. సందడి మొదలైంది. చాలా రోజుల తర్వాత తండ్రి సరదాగా మాట్లాడుతుండడం, అమ్మ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుందాం తొందరగా రమ్మని కాల్ చేయడంతో వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు.
“మమ్మీ! పద పద. అందరం బయటకు వెళ్దాం.. పార్టీ చేసుకుందాం. తొందరగా కొత్త చీర కట్టేసుకుని రెడీ కా… అంతలో మేము కూడా తయారైపోతాం. పద అక్క ” అంటూ కొడుకు అమ్మ భుజాలను పట్టుకుని ఆమె రూంలోకి తీసికెళ్ళాడు. కూతురు కవర్లు తెచ్చి మంచం మీద పెట్టింది.
సుజాత భర్త ప్రవర్తనకు ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంది. ముందు భర్తకు కాఫీ చేసి ఇచ్చి, ఎక్కువ మాట్లాడకుండానే తయారైంది. పిల్లలు ముందుగా స్వీట్ తినిపించి అందరూ ఒక్కో ముక్క తీసుకున్నారు. తర్వాత బయలుదేరారు. అంతలో లాండ్‌లైన్ మోగింది. రష్మి చేసింది.
“హ్యాపీ హ్యాపీ బర్త్ డే సుజాత” అని సంతోషంగా చెప్పింది.
“థాంక్ యూ రష్మి.” మామూలుగా చెప్పింది సుజాత.
‘ఏంటొదినా! ఇప్పుడు కూడా ఇంత సీరియస్సుగా ఉంటే ఎలా? అన్నయ్యలో మార్పు కనిపించిందా లేదా? నీకు సారీ చెప్పాలంటే అతనికి ధైర్యం చాలడం లేదేమో. అన్నయ్య చేసింది తప్పే కాదనను కాని నీ పిల్లలతో పాటు తల్లి లేని మా అన్నయ్యను కూడా తల్లిలా చూసుకున్నావు మాకు తెలీదా. ఇప్పుడు కూడా నువ్వే క్షమించవా.. రేపు మళ్ళీ మాట్లాడతాను. జస్ట్ ఎంజాయ్ యువర్ డే” అని పెట్టేసింది.
“ఏం జరిగిందబ్బా! ఆయనలో మార్పు ఎలా వచ్చింది. దానికి రష్మి ఏం చేసింది?” అనుకుంటూ కొంచం తేలికపడిన మనసుతో బయటకు వెళ్ళింది. భర్త , పిల్లలతో గుడికి వెళ్లి, అటునుండి హోటల్‌లో డిన్నర్ చేసి కొత్త సినిమా వచ్చిందని అది కూడా చూసి రాత్రి ఒంటిగంటకు ఇంటికి తిరిగొచ్చారు. అందరూ అలిసిపోయారు.
కొత్త చీర మార్చుకుని, పడుకోవడానికి వెళ్తున్న సుజాతని ఆపి ఆమె చేతిలో ఒక చిన్న పాకెట్ పెట్టాడు రమేష్. అది గిఫ్ట్ పాక్ చేయబడి ఉంది. “ఏంటండి ఇది? బహుమతులు అప్పుడే ఇచ్చారుగా. మళ్ళీ ఏంటి?” అంటూ తీసి చూసింది.
ఆ పాకెట్‌లో చిన్న “Sorry కార్డు, అందమైన కాలి పట్టీలు ఉన్నాయి.
అసలు భర్తలోని మార్పుకు కారణమేంటొ అర్ధం కాక సతమతమవుతున్న సుజాత ఇవి చూడగానే కరిగిపోయింది. అమ్మ మనసు కాబట్టి, అతన్ని అర్ధం చేసుకుని ప్రసన్నంగా మారింది. తనను బాధపెట్టినందుకు భర్త కూడా క్షోభ పడ్డాడని అర్ధమైపోయింది. కాని అతను అలా ఎందుకన్నాడో. ఎలా మారాడో అని అడగలేకపోయింది.
“థాంక్ యూ. చాలా బావున్నాయి.” అని పట్టీలు వెంటనే కాలికి పెట్టేసుకుంది. రమేష్ కూడా అది చూసి చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు. పెద్ద బరువు దింపుకున్నట్టైంది అతనికి.

ఆరునెలలుగా కలత నిదురతో గడిపిన సుజాత ఇవాళ కొద్ది సేపు ప్రశాంతంగా పడుకుందామనుకుని పనంతా తీర్చుకుని మధ్యాహ్నం అలా మంచం మీద వాలిపోయింది. ఇంతలో రష్మి కాల్ చేసింది.
“సుజా! ఇప్పుడు హ్యాపీనా? అన్నయ్యలో మార్పు కనిపించిందా.ముందులా ఉన్నాడా?” అని అడిగింది.
“అవును. ఏం చేసావేంటి? ఆయనలో మార్పు రావడానికి? ఆయనతో మాట్లాడావా? అసలు కారణం చెప్పారా ఆయన నీతో? ఐనా ఆయన సమస్య ఆడవాళ్లతో చెప్పేది కాదే..ఏం జరిగింది?” అని ఆత్రుతగా అడిగింది సుజాత.
“అదే చెప్తున్నా. ఆగు తొందరపడకు.. మీ ఇంట్లో మంజరి మాగజీన్ వస్తుంది కదా? అందులో డాక్టర్ సలహాలు ఇద్దరూ చదువుతారు కదా?”
“అవును రెగ్యులర్‌గా ఇద్దరమూ చదువుతాము. అప్పుడప్పుడు కొన్ని విషయాలమీద చర్చిస్తాము కూడా. ఇపుడు దాని సంగతి ఎందుకు చెప్తున్నావు?” ఆశ్చర్యపోయింది సుజాత తన భర్త సమస్యకు, మాగజీన్‌కు సంబంధమేమిటి అని.
“సరే ఐతే.. నేనేమీ చెప్పను. ముందు ఆ పత్రిక తీసి చదువుకో. నీకీ అర్ధమైపోతుంది. అన్నట్టు ఆ శీర్షిక నిర్వహించేది మా ఆయనే కదా. ఈ విషయం నీకు ఇంతవరకు చెప్పలేదు. నీతో మాట్లాడి వెళ్లాక ఆయనతో అన్నయ్య సమస్య గురించి మాట్లాడాను . ఆ పత్రికలో సమాధానం ఉంది చూడు. నీ మనసు ఎంత గాయపడిందో నాకు తెలుసు. దానికి మందు వేయడం తప్ప వెంటనే మర్చిపొమ్మని చెప్పలేను. అది అంత తేలికగా మరచిపోయేది. మానిపోయేది కాదు. కాని అసలు కారణం తెలుసుకుంటే కొంచెంలో కొంచెం మేలు అనుకుంటా. నేను ఫోన్ పెట్టేస్తున్నా. ముందు ఆ పత్రిక తీసి చదువు .. బై” అంటూ ఫోన్ పెట్టేసింది రష్మి.
పేపర్ల దగ్గర ఉన్న మంజరి వార పత్రిక తీసుకుని ముందుగా డాక్టర్ సలహాలు పేజీ తీసి వరుసగా చదవసాగింది. ఎప్పుడూ పత్రిక వచ్చిన రోజే మొత్తం చదివే అలవాటున్నా ఈసారి పత్రిక వచ్చి రెండు రోజులైనా అది తీసి చూడలేదు. నిన్న భర్త ఆఫీసుకు తీసికెళ్లడం చూసి తర్వాత చదవొచ్చులే అనుకుంది. ఇపుడు రష్మి మాట వినగానే పత్రిక చేతిలోకి తీసుకుని వరుసగా ప్రశ్నలు, జవాబులు చదవసాగింది.
ప్ర.. “డాక్టర్‌గారు, మావారి వయసు 52. నా వయసు 45.. మాది చిన్న చిన్న గొడవలు తప్ప అనుకూల దాంపత్యమే. ఇప్పటికీ రెగ్యులర్‌గా, ఇష్టంగా దాంపత్య సుఖం అనుభవిస్తున్నాము. కాని కొద్ది కాలంగా మావారిలో మార్పు వచ్చింది. తను ముందులా ఉండలేకపోతున్నారు. శారీరక సమస్య వచ్చిందని చిరాకుగా, కోపంగా ఉంటున్నారు. నేను కూడా దానిమీద ఎక్కువ గొడవ చేయలేదు. హేళనా చేయలేదు. కాని సడన్‌గా ఆయన నా కారెక్టర్ మంచిది కాదని. నావల్లే ఆయనకు రోగాలు వచ్చాయని. ప్రాబ్లమ్స్ వచ్చాయని తిడుతున్నారు.అది కూడా పెళ్లీడు కొచ్చిన పిల్లలుండగా.. ఇన్నేళ్ల దాంపత్యంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. పాతికేళ్ల వైవాహిక జీవితంలో ఒకరంటే ఒకరికి పూర్తిగా తెలుసు. కాని ఇప్పుడు ఇలా అనడంతో నా మనసు వికలమైంది. కోపంగా ఉంది. బాధగా ఉంది. ఇల్లు విడిచి వెళ్లిపోవాలి. చచ్చిపోవాలనిపిస్తుంది. పిల్లలకోసం ఆగాను. ” శ్యామల. రాజమండ్రి.
స.. “శ్యామలగారూ! ఇక్కడ మీరు చాలా సమన్వయంతో ఉండాలి. మీ భర్త సమస్యను అర్ధం చేసుకోండి. ఆడవాళ్లలో మెనోపాజ్‌లాగే యాభై దాటిన మగవాళ్లలో కూడా శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. దాన్ని “ఆండ్రోపాజ్ ” అంటారు. అప్పుడు హార్మోన్ల ప్రభావం వల్ల కొన్ని శారీరక సమస్యలు రావొచ్చు. తనలో లోపం గురించి తెలుసుకోలేక, దాన్ని అంగీకరించలేక తప్పు మీ మీద తోసాడాయన. భార్యగా మీరు అతని అసలు సమస్యని అర్ధం చేసుకుని సమన్వయంతో ఉండండి. మెల్లిగా అదే సర్దుకుంటుంది. ఇది శాశ్వతం కాదు. తనలోని సమస్య గురించి తెలుసుకుంటే ఆయన కూడా మారతారు. భార్యా భర్తల మధ్య ఇలాంటి శారీరక, మానసిక సమస్యలు వచ్చినప్పుడు వారి భాగస్వాములే అర్ధం చేసుకుని గొడవ పడకుండా ఉండాలి. కొంతకాలానికి అదే సర్దుకుంటుంది..ఇప్పుడు సమస్య పరిష్కారానికి మీ వంతు సాయం కూడా ఎంతో అవసరం”
సుజాతకు అర్ధమైపోయింది. ఆ ప్రశ్న రష్మి పంపిందని. అలాగే తన భర్త ప్రవర్తనకు అసలు కారణం తెలిసింది. అతను తన మీద నమ్మకం లేకుండా అభియోగాన్ని వేయడం తప్పైనా ఇప్పుడు తనే అతనికి అండంగా ఉండాలి. అని నిర్ణయించుకుంది సుజాత.
ట్రింగ్.. ట్రింగ్.. ట్రింగ్… బెల్ మ్రోతకు ఉలిక్కిపడింది సుజాత. గబ గబా కళ్లు తుడుచుకుని టీవీ కట్టేసి తలుపు తీయడానికి వెళ్ళింది. వచ్చింది రమేష్.
“ఏంటోయ్! సాయంత్రం వేళ నిద్రపోయావా? పద అలా సినిమాకి వెళ్లొద్ధాం. ఇంట్లో ఒక్కదానికి బోర్‌గా ఉండొచ్చు. పిల్లలిద్దరూ లేరు. ఇక మనకు మనమే తోడు. పద తొందరగా రెడీ అవ్వు..వెళ్దాం” అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు రమేష్.
ఇద్దరికీ కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్లింది సుజాత.

************************************

మాడర్న్‌ అమ్మమ్మ చెప్పిన మాడల్‌ కధలు … బ్రిడ్జి

రచన: ఝాన్సీరాణి కె

స్కూల్‌ నుంచి వచ్చిన రాహుల్‌ ఏదో ఆలోచనల్లో మునిగిపోయినట్లు కూర్చున్నాడు.
‘ఏమిటి? రాహుల్‌ ఏమి తినకుండా అలా కూర్చుండి పోయావు’ అని అడిగారు లక్ష్మీగారు. లక్ష్మీగారి కూతురు లావణ్య కొడుకు`రాహుల్‌. లావణ్య ఆఫీస్‌కి వెళ్ళి వచ్చేసరికి ఆస్యం అవుతుంది. అందుకని రాహుల్‌ స్కూు నుంచి క్ష్మీగారి దగ్గరికి వస్తాడు. అక్కడ బట్టు మార్చుకుని అమ్మమ్మ పెట్టిన టిఫన్‌ తిని కాస్సేపు ఆడుకుని తర్వాత చదువుకుంటాడు. ఒక్కోసారి తల్లి లావణ్యగాని తండ్రి శేఖర్‌ గాని వస్తే వాళ్ళతో వెళ్ళి ఇంట్లో చదువుకుంటాడు. లావణ్య వాళ్ళు కూడా క్ష్మీగారి ప్రక్క అపార్ట్‌మెంట్స్‌లో ఉంటారు.
‘ఏమిలేదు అమ్మమ్మా’ అన్నాడు రాహుల్‌
‘నీవు మామూలుగా లేవు. స్కూల్లో ఏమి జరిరిందో చెప్పు’ అన్నారులక్ష్మిగారు.
‘ఈ రోజు మా టెస్ట్‌ పేపర్స్‌ ఇచ్చారు అమ్మమ్మా మన అపార్ట్‌మెంట్‌లో అందరికి మంచి మార్కులే వచ్చాయి కాని కిరణ్‌కి తక్కువ వచ్చాయి. మాస్టారు బాగా కోప్పడ్డారు’ అన్నాడు రాహుల్‌.
‘ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు కదా’ అన్నారులక్ష్మిగారు. ‘అవును, కాని పరీక్షంటే ఎందుకో భయపడుతాడు. సరిగ్గా వ్రాయడు’ అన్నాడు.
‘కాస్సేపయ్యాక మీ పి. ఆర్‌.ఎస్‌ ని తీసుకురా’ అన్నారులక్ష్మిగారు.
పీ.ఆర్‌.ఎస్‌. ఏమిటి మేడం టి.ఆర్‌.ఎస్‌.లా? అన్నారు
వేణుగోపాల్‌రావు గారు మనవడి ప్రక్కన కూర్చుంటూ “పిల్ల రాక్షసుల సంఘం. మన అపార్ట్‌మెంట్లో ఆడవాళ్ళు పిల్లలకు ముద్దుగా పెట్టుకున్న పేరు. చదువులో, ఆటల్లో, అల్లరిలో అన్నిట్లో మనవాళ్ళు ముందుంటారుగా, అందుకే అలా పిలుస్తామన్నమాట అన్నారు లక్ష్మిగారు` కాఫీ అందిస్తూ.
మరి ఈ ఇవాళ ఈ బోధనా కార్యక్రమం ఏమిటి? అన్నారు వేణుగోపాల్‌రావుగారు.
కిరణ్‌ సంగతంతా వివరించారు లక్ష్మిగారు.
“ఐతే మళ్ళీ పరీక్షల్లో టాపర్‌ కిరణన్న మాట” అన్నారు వేణుగోపాల్రావుగారు. నేనలా పార్క్‌దాకా వెళ్ళి వస్తానంటూ, వంట ఇంట్లో అన్ని సర్ది మూడు పాకెట్ల బిస్కెట్లు నీళ్ళ బాటిల్స్‌ డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టి వచ్చేసరికి హాల్లో రెండు చాపలు, ఒక బెడ్‌షీట్‌ వేసి వున్నాయి. తొమ్మిదిమంది పిల్లలు లక్ష్మీగారి కోసం ఎదురు చూస్తున్నారు. “అమ్మమ్మా! మేం రెడీ “అంటూ.
ఈ రోజు నెట్‌ (ఇంటర్నెట్‌)లో ఒక కథ చదివాను చాలా బాగుంది. మీకు చెప్పాలనిపించింది అందుకే పిలిచాను అన్నారు లక్ష్మిగారు.
మా లెక్చరర్‌ ఒకరు ఇంగ్లీషు క్లాసు ప్రారంభంలో బోర్డు మీద వ్రాసిన మొదటి వాక్యం.
‘ఇట్‌ఈజ్‌ ఇంపాసిబుల్‌ టుసే వాట్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌’ అని, ముందు ఇంగ్లీష్‌ చాలా కష్టంగా ఉండేది.
‘ప్రపంచంలో అసాధ్యమైనదేదో చెప్పడం అసాధ్యం’ అని అంటే ప్రపంచంలో అసాధ్యమైనది మనం చేయలేనిది లేదు. అలాంటి కథ ఒకటి చదివాను అన్నారు లక్ష్మిగారు. మీకు తెలిసిన వంతెనలు (బ్రిడ్జెస్‌)ఏవో చెప్పండి అన్నారు లక్ష్మిగారు.
కృష్ణా బేరేజ్‌ అంది లాస్య
ధవళేశ్వరం అన్నాడు రఫీ
హౌరా అన్నారు అందరూ ఒక్కసారిగా
న్యూయార్క్‌లో ‘బ్రూక్లిన్‌ బ్రిడ్జ్‌’ తెలియని వారుండరు.
150 ఏళ్ళ క్రితం జాన్‌ రోయిబ్లింగ్‌ అనే అతడు ఒక జర్మన్‌, అతడు న్యూయార్క్‌కి ఒక బ్రిడ్జి కట్టాలని అనుకున్నాడు. కాని ఎవరూ అతడి మాటకు విలువ ఇవ్వలేదు. పైగా ‘అసాధ్యం’ అన్నారు. చాలా ఏళ్ళకు అతడి కొడుకు వాషింగ్‌టన్‌ తండ్రి మాటకు సరే అన్నాడు. ఇద్దరూ ఒకప్లాన్‌ తయారు చేశారు. కొంతమంది ఇంజనీర్లను కూడ కట్టుకున్నారు. బ్రిడ్జ్‌ పని ప్రారంభం అయింది. కొన్నేళ్ళకు బ్రిడ్జి దగ్గర జరిగిన ప్రమాదంలో తండ్రి అయిన జాన్‌ రోయిబ్లింగ్‌ మరణించాడు. అయినా పని ఆపకూడదు తండ్రి కోరిక తను నెరవేర్చానుకున్నాడు వాషింగ్టన్‌ రోయిబ్లింగ్‌. కాని విధివశాత్తు `వాషింగ్టన్‌కు (కొడుకు) బ్రైన్‌ దెబ్బతినడంతో శరీరం మొత్తం చచ్చుబడి పోయింది. అతను మంచం మీదనుంచి కదలేడు. మాట్లాడలేడు.
‘మేం చెబితే విన్నారా తండ్రీ కొడుకులూ ఇప్పుడేమయింది. ఆ బ్రిడ్జ్‌ కట్టడం మీ వల్ల కాదు’ అని రోయిబ్లింగ్‌ ఫామిలీ గురించి, తండ్రీ కొడుకుల ఆలోచనలను తెలిసినవారు వెక్కిరించారు.హేళన చేశారు..
తన గదిలో మంచం మీద పడుకున్న వాషింగ్టన్‌ కిటికీ పరదాలు తొలిగి ఒకరోజు సూర్యకిరణాు లోపలికి వచ్చి పడ్డాయి. ఒక్క వేలు మాత్రం కదిలేది. దానితో భార్య చేతిమీద కొట్టాడు. ఆవిడ అతడికేసి చూసింది కొన్నాళ్ళకు ఒక కోడ్‌ భాష తయారు చేసుకున్నారు భార్యాభర్తలు. భర్త కోరిక మీద బ్రిడ్జ్‌ మీద పని చేసిన ఇంజనీర్లను పిలిపించింది. అతడి కోరిక తెలిపి ఆదేశాలు వినిపించింది. వాళ్ళు పని ప్రారంభించారు. పదమూడు ఏళ్ళు వాషింగ్టన్‌ రోయిబ్లింగ్‌ భార్య చేతిమీద కొడుతూ చెప్పిన ప్రకారం అమె ఆ ఇంజనీర్లకు చెప్పేది. ఆ ప్రకారం వాళ్ళు చేశేవారు.
అందరూ అసాధ్యం అన్న బ్రిడ్జి అందంగా ఆవిష్కరించబడింది. ఒక చారిత్రాత్మక కట్టడంగా నిలిచిపోయింది.
ఆ బ్రూక్లిన్‌ బ్రిడ్జి మొత్తం శరీరం చచ్చుబడి ఒక వేలు మాత్రం కదల్చగలిగే ఒక వ్యక్తి పట్టుదలకు ప్రతిరూపం. తండ్రి కోరిక తీర్చాలనే ఆ కొడుకు తపనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఆ బ్రిడ్జిని ఎవరికి అంకితమివ్వాలో అనుకున్నప్పుడు తొలిసారి అందరూ హేళన చేసినా వాషింగ్టన్‌ రోయిబ్లింగ్‌ మీద నమ్మకముంచి అవిరామంగా శ్రమించి బ్రిడ్జి పూర్తి చేసి ఇంజనీర్లకు అంకితమివ్వాలి లేదా పదమూడేళ్ళు భర్తకు సహకరించి అతడి సంజ్ఞు అర్థంచేసుకుని ఇంజనీర్లకు ఆదేశాలిచ్చిన వాషింగ్టన్‌ రోయిబ్లింగ్‌ భార్యకు అంకితమివ్వాలి. అంటూ ముగించారు లక్మిగారు. అందరూ చప్పట్లు కొట్టారు.
ఒక్క వేలు మాత్రమే కదల్చగలిగిన వాడు ఆత్మవిశ్వాసంతో పదమూడేళ్ళు, తెలివి తేటలున్న వాళ్ళు మీరంతా ఎలా వుండాలో మీకే తెలుసుగా అన్నారు లక్ష్మిగారు. బిస్కెట్లు రెండు ప్లేట్లలో పెట్టి ముందు పెట్టి నీళ్ళు ఇస్తూ.
థాంక్యూ అమ్మమ్మా!! ఈసారి పరిక్షల్లో మా పట్టుదల ఏమిటో చూద్దురు గానీ అన్నారందరూ ముక్తకంఠంతో.. వారిలో కిరణ్‌ కూడా ఉండటం చూచి విజయసంకేతం చూపిస్తూ లోపలికి వచ్చారు వేణుగోపాల్రావుగారు.
*****

మాయానగరం – 41

రచన: భువనచంద్ర

‘గురువు’ గారి అడ్డ మహా గంభీరంగా వుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో చిన్న సైజు తీర్ధంలా వుంది. పార్టీ సామాన్య కార్యకర్తల నుంచీ, పార్టీ అధ్యక్షుడి దాకా, చిన్న చిన్న ఫేవర్స్ కోసం పడిగాపులు గాచే నిరుపేదవాడి నుంచి కేంద్రమంత్రివర్యుల దాకా వచ్చిపోతూనే వున్నారు. కారణం ఏమైనా’ప్రెస్’ వాళ్ళకీ,’ఛానల్’ వాళ్ళకీ పండగ్గా వుంది.
“మాదేముంది గురూ, పైన పటారం లోన లొటారం.. ఉత్త డొల్ల.. ఏదో ఈ కార్డుని పట్టుకొని తిరగడం కానీ, మా యాజమాన్యం జీతాలెక్కడ ఇస్తుంది? ఓ మాట చెప్పనా? మేమే నయం , మా ఎడ్వటైజర్ ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడూ వాళ్ళని గిల్లో, వీళ్ళని గీకో, ఎలాగలాగో గ్రాసం సంపాదించకపోతే అతనికి మాత్రం ఎట్టా గడుస్తుంది?” గురూగారు ఇప్పించిన కవర్ ని జేబులో పెట్టుకొని అన్నాడు’అద్వితీయం’. అది అతని కలం పేరు. అసలు పేరు అప్పల్రాజు.
“సర్లే! ఏవున్నా లేకపోయినా మీ పత్రికకు సర్కులేషన్ ఉంది. మాకైతే అదీ లేదుగా. సరేకానీ, మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న పుకారు పక్కన పెడితే, ఇవ్వాళ ఇక్కడ ఇంత సంతగా వుంది కదా , అసలు విషయం ఏమిటంటావూ?” గొంతు తగ్గించి అద్వితీయంతో అన్నాడు’ పరాగం’. ఇదీ కలం పేరే!
“నిజం చెబితే నాకూ తెలీదు” సిన్సియర్ గా మొహం పెట్టి అన్నాడు అద్వితీయం.
“చాల్లెండి వాసన పట్టడం పోలీస్ కుక్క కన్నా మీ ముక్కు వెయ్యి రెట్లు గొప్పదని మాకు తెలీదూ? మీ గుడ్లని మేము కొట్టేస్తామనా?” సుతారంగా అద్వితీయాన్ని వేలితో పొడిచి అన్నది సంఘమిత్ర. ఆవిడా జర్నలిస్టే. మాంఛి యవ్వనంతో కసకసలాడేప్పుడే ఫీల్డ్ కొచ్చింది. వచ్చిన కొత్తలో కుర్ర జర్నలిస్ట్ ల్ని మంచి చేసుకొని వార్తల్ని పుంఖాను ఫుంఖాలుగా వదిలింది. ఇప్పుడు వన్నె తగ్గినా, కన్నెపిల్లలా వగలు పోవడం మాత్రం తగ్గలేదు. అనుభవం కూడా తోడవడంతో వార్తా సేకరణలో ఇప్పటికీ ముందంజలోనే వుంది. మరో లాభం కూడా ఆవిడకు వుంది. కొన్నికొన్ని సమయాలలో తను సంపాదించిన’టిప్స్’ ని’క్లూ’ లని మిగతా జర్నలిస్ట్ లకు చవగ్గా’ అందిస్తుంది.
“సంగూ… నిజ్జంగా తెలీదు.. ప్రామీస్..” తల మీద చెయ్యి పెట్టుకొని అన్నాడు అద్వితీయం. చిన్నగా నవ్వింది సంఘమిత్ర. అందరి ముందు అసలు కథ విప్పడానికతను ఇష్టపడటం లేదని అర్ధమైంది.
“క్షమించాలి… ఇప్పటి దాకా కాఫీ, టీ లతో సరిపెట్టినందుకు గురూగారు మీ అందరికీ సారీ చెప్పమన్నారు. ఉదయమే ఏడుగంటలకు ఠంచనుగా వచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పమన్నారు. ఇప్పుడు సమయం ఎనిమిది. హాయిగా మీరు టిఫిన్లు కనిస్తే ఎనిమిదీ ముప్పావుకి గురూగారు మీ ముందు కొచ్చి స్వయంగా మాట్లాడుతారు” సవినయంగా అన్నాడు గురూగారు ఆంతరంగిక శిష్యుడొకడు. అతని వెనకే కాటరింగు వాళ్ళు టిఫిన్ సామాన్లు మోసుకొచ్చారు.
“చాలా అయిటమ్స్ వున్నాయి… ఏమై వుంటాయి?” కుతూహలంగా అన్నాడో చిన్న పత్రికకి సంబంధించిన జర్నలిస్ట్. అతనికెప్పుడూ ఆకలే. అర్నెల్లెకోసారీ జీతంలో సగం ఇచ్చినా ఇచ్చినట్టే అతనికి. అతనికి తెలుసు. ఆ కార్డు చేతిలో లేకపోతే కానీకి కూడా కొరగానని.
“నేను చెప్పనా?” సర్దుతున్న కేటరింగ్ వాళ్ళని చూస్తూ అన్నది సంఘమిత్ర.
“చెప్పు.. కరక్ట్ గా గెస్ చేస్తే పార్టీ” చిన్నగా నవ్వి అన్నాడు మోహన్. అతనో పెద్ద పాప్యులర్ ఛానల్ కి ఇన్చార్జ్. చాలా ముఖ్యమైనవాటికి రావడమే కాదు, సమావేశం అయ్యాక కూడా ప్రధాన వక్తన్ని/ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తాడు. ’లోపలి’ సంగతుల్ని వెలికి తీసి ఎంతవరకు విప్పాలో ఎంతవరకు కప్పాలో అతనే నిర్ణయిస్తాడు. చాలామంది అతన్ని సైలెంటుగా ఫాలో అయ్యిపోతారు. బ్రహ్మిని తమ్మి తమ్మిని బ్రహ్మి చేయగల దిట్ట.
“ఓ.కే.. పులిహోర, ఆవడలు, మిర్చీబజ్జీలూ, సేమ్యా + సగ్గుబియ్యం పాయసం , టమోటా పప్పు, నేతి బీరకాయ పచ్చడి, దోసావకాయ, బంగాళదుంప+ వంకాయా + టమోటా కలగలుపు కూర, గోంగూర పచ్చడి, బెండకాయ స్టఫ్ కూర, కంది పొడి, వూరమెరపకాయలు, అప్పడాలూ, గుమ్మెడికాయ వడియాలు.” నవ్వింది సంఘమిత్ర.
“అంత కరక్ట్ గా ఎలా చెప్పగలిగావు?… అయినా ఇది…” సడన్ గా ఆగాడు మోహన్.
“మోహన్ జీ… నేను చెప్పింది మధ్యాహ్నపు మెనూ… ఎందుకంటే ఒంటిగంటన్నర దాకా మనల్ని ఇక్కడే వుంచుతాడు గురూజీ. ఇహ బ్రేక్ ఫస్ట్ మెనూ ఏమంటే , కంచి ఇడ్లి, పొంగల్ వడ, పెసరట్టు ఉప్మా ఎండ్ పూరీ… కాఫీ, టీ, పాలూ, హార్లిక్స్ మామూలే” చిరునవ్వుతో అన్నది సంఘమిత్ర.
“మై గాడ్ .. యూ ఆర్.. గాడ్ .. అసలు ఇంత స్పష్టంగా ఎలా తెలుసు?” ఆశ్చర్యంగా అన్నాడు మోహన్.
“చూశాక చెప్పండి” లేచి అన్నది సంఘమిత్ర. అందరూ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేస్తున్న మీడియం హాల్లోకి వెళ్ళారు. టిఫిన్లు కరక్ట్ గా సంఘమిత్ర చెప్పినవే. మెనూ చెప్పినప్పుడు విన్నవాళ్ళు ఆశ్చర్యంగా ఆమె వంక చూశారు.
“మాకుండే రిసోర్సెస్ మాకుంటాయి… అద్దీ…” నవ్వింది సంఘమిత్ర.
“ప్లీజ్ ఏమీ మొహమాటపడకండి. రిలాక్సెడ్ గా టిఫిన్ చేయమని మా గురుగారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.” గురువాణి వినిపించాడు శిష్యరత్న.
అల్లంచెట్నీ, కొబ్బరిచెట్నీ, సాంబారు, కారప్పొడి, నెయ్యి, ఉల్లిపాయ టమోటా చెట్నీలు అద్భుతంగా వున్నాయి. రంగూ, రుచీ, వాసనా కూడా నోరూరించేస్తున్నాయి.
సుష్టిగా లాగించారు పాత్రికేయులూ, ఛానల్ వాళ్ళు,
“మధ్యాహ్నంకి కొంచం ఖాళీ వుంచుకుంద్దాము, లేకపోతే సూపర్ లంచ్ మిస్ అవుతాము.” ఫ్రండ్స్ ని హెచ్చరించింది సంఘమిత్ర.
************
పరమశివం గుండె మండిపోతోంది. జీవితంలో మొదటసారి ఒకడు చెంప పగలగొట్టాడు. నవనీతం విషయంలో ఇది రెండోసారి దెబ్బ తినడం. ఊహూ… అది బ్రతకకూడదు. అనుభవించి అనుభవించి దాన్ని చంపాలి. అలాగే నిన్న కొట్టినవాణ్ణి చంపాలి. పరమకిరాతకంగా చంపాలి. అసలు కారణం ఆ వెంకట్ గాడు… ముగ్గుర్ని చంపితే కానీ పగ తీరదు.” అటూ ఇటూ తిరుగుతున్నాడు పరమశివం. వాడికి కనపడకుండా వాడినే అబ్జర్వ్ చేస్తున్నాడు రొయ్యబాబు. రొయ్యబాబు నిజంగా నీళ్ళల్లో చేపలాంటివాడే!
అయితే ఇతను వలలో చిక్కే చేపలాటోడు కాదు. వలకీ, ఎరకీ కూడా అందనివాడు. అవసరమితే త్రాచుపాములా కూడా మారగలడు. అందుకే సర్వనామం అతన్ని పెట్టాడు పరమశివాన్ని అబ్జర్వ్ చేయడానికి.
సర్వనామం ఓ విచిత్రజీవి. అందరినీ అబ్జర్వ్ చేస్తాడు. అందరినీ దృష్టిలో వుంచుకుంటాడు.”ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?” అనుకునే మెంటాలిటి.
ప్రతీపనికి తగినవాళ్ళనే పురమాయించాలి. అన్నీ నేనే చేస్తాననుకునేవాడు పరమమూర్ఖుడు. గంటకు వెయ్యి సంపాదించగల వాడు పది రూపాయిల పనికి పోతే వాడంత వెధవ లోకంలో వుంటాడా? అలాగే, బరువులెత్తేవాడి సమర్ధత బరువులెత్తేవాడిదే, పరుగులెత్తేవాడి సమర్ధత పరుగులెత్తేవాడిదే. వీడిని వాడి ప్లేస్ లో పెడితే? అందుకే జాగ్రత్తగా ఎంచుకోవాలి” యీ పాయింటునే సర్వనామం శామ్యూల్ రెడ్డికి చెప్పింది. ఇప్పుడు తానూ అనుసరిస్తున్నది. గత రెండున్నర రోజుల నుంచీ రొయ్యబాబు పని పరమశివాన్ని నీడలా వెంటాడటమే!
కొన్ని నీడలు కనపడతాయి, కొన్ని నీడలు కనపడవు. చేప ఏడిస్తే ఎవరికీ తెలుస్తుంది? కన్నీరు నీటిలో కలిసిపోతుంది గదా! అలాగే, చీకట్లో నీడ జాడ ఎవరికి తెలుస్తుంది? కానీ పాఠకుడా… మనిషి నీడని ఎలాగోలా పట్టుకోవచ్చు… ఓ చిన్న అగ్గిపుల్ల వెలిగించి. కానీ కోటి సూర్యులైనా’మనసు నీడని’ పట్టుకోగలరా?
“అయ్యా… ప్రస్తుతం మన పిచ్చిక ప్రతీకారం మూడ్ లో వుంది. మీ దగ్గరకు రావచ్చా” అని ఎస్. టి. డి బూత్ నుంచి అడిగాడు.
“రా..” పెట్టేశాడు సర్వనామం.
శామ్యూల్ రెడ్డి నంబర్ కాక ఇంకో ఐదు నంబర్లు , అడ్డాలూ వున్నాయి సర్వనామానికి. పని వుంటే గానీ స్కూల్ కి పోడు.
“చెప్పు” రొయ్యబాబుని చూడగానే అడిగాడు సర్వనామం.
“బాస్… ముగ్గుర్ని ఇతను తరచుగా గమనిస్తున్నాడు, ఒకరు నవనీతం, ఆవిడ…”
“ఆవిడ విషయం వదిలేయ్.. మిగతావాళ్ళ గురించి చెప్పు” కట్ చేసి అన్నాడు సర్వనామం.
“వెంకటస్వామి అనేవాడిని, మహదేవన్ అనే పెద్దాయన్ని వీడు వెంటాడుతున్నాడు. మహదేవన్ కూతురు నందిని. వీడు మహదేవన్ కి చుట్టం. పరమ శాడిస్టు. తండ్రి చస్తున్నా, గుక్కెడు నీళ్ళు నోట్లో పొయ్యని పరమ కిరాతకుడు. మీరు నవనీతంగారి సంగతి వదిలేయ్యమన్నా, ఓ విషయం చెప్పక తప్పదు. వింటానంటే చెబుతా” ఆగాడు రొయ్యబాబు. ఓ నిమిషం సైలెంటుగా వున్నాడు సర్వనామం. చివరికో నిర్ణయానికి వచ్చి” సరే చెప్పు… సందేహం అక్కర్లేదులే నీకు తెలిసినవన్నీ నిర్మొహమాటంగా చెప్పు” అన్నాడు
” వన్ మినిట్” జేబులో హాఫ్ బాటిల్ తీసి” మందు తీసుకుంటూ చెప్పనా? మీరీ పని మీద నన్ను పురమాయించిన క్షణం నుంచీ ఇప్పటి దాకా దీన్ని ముట్టుకోలేదు” కొంచం ప్లీజింగా అడిగాడు.
“అలాగే” బీడీ ముట్టించాడు సర్వనామం
ఎవరి బలహీనతలు వారివి. కానీ, ప్రొఫెషన్ లో వుండగా మందు తాగే బలహీనతకి రొయ్యబాబు దూరంగా వుండటం సర్వనామానికి బాగా నచ్చింది. వృత్తికి ఏనాడు మన బలహీనతలు అడ్డు రాకూడదు అనేది సర్వనామం సిద్ధాంతం.
గబగబా ఓ పెగ్గు ఓ గ్లాస్ లో పోసుకొని నీళ్ళు కలుపుకొని గడగడా తాగేశాడు రొయ్యబాబు. ఓ క్షణం సుదీర్ఘంగా గాలి పీల్చుకొని …
“బాస్… శంఖుచక్రాపురంలో వెంకటస్వామీ, పరమశివం, వంట చేయడానికి వెళ్ళినప్పుడు యీ పరమశివంగాడు నవనీతాన్ని చెరబట్టడానికి ప్రయత్నం చేశాట్ట. వెంకటస్వామి అది చూసి ఓ బండరాయి తీసి పరమశివంగాడి బుర్ర పగలగొట్టాడుట. దాంతో వీడి శరీరం చచ్చుబడిపోయింది. అయినా ఏ దేవుడి కరుణతో కోలుకున్నాడు తెలియదు కానీ, కోలుకున్న మాట వాస్తవం. అక్కడ చర్చ్ నుంచి పారిపోయి వచ్చి ప్రస్తుతం’పగ’ తీర్చుకునే ప్రయత్నంలో వున్నాడు. నాకు తెలిసి వెంకటస్వామీ మంచోడూ కాదు, చెడ్డోడు కాదూ, అర్జెంటుగా’ రిచ్” అయిపోవాలనే ఆలోచన గలవాడు. నేను అబ్జర్వ్ చేసినదాన్ని బట్టి అతనికి నందిని మీద, ఆమె తండ్రి మహదేవన్ ఆస్తి మీద కన్నుందని అర్ధమయ్యింది. పరమశివం’పగ’ కి అదే మొదటి కారణం కావచ్చు. రెండో కారణం నవనీతం విషయంలో వెంకటస్వామి అడ్డు రావడం.” సంభాషణ ఆపి మరో పెగ్గు ‘ఫిక్స్’ చేసుకుంటున్నాడు రొయ్యబాబు.
“మరి… మరి… నవనీతం సంగతి” ఆలోచిస్తూ అన్నాడు సర్వనామం.
“నిజం చెబితే ఒకప్పుడు ఆమె బోస్ బాబు ఇలాకా. ఆమె అంటే పడి చచ్చేవాళ్ళు వందల్లోనే వుంటారు. బోస్ బాబు ఇలాకా కావడం వల్ల ఎవరూ ధైర్యం చేయలేదు. చెయ్యరు. ’కల్తీ సారా’ కేసులకి దూరంగా చుట్టం ‘ ఫాదర్ అల్బర్ట్ డేవిడ్’ గారి సంరక్షణలో కొన్ని నెలలు వుంది. అప్పుడే పరమశివంగాడు ఆమె మీద కన్ను వేశాడు.
ప్రస్తుతం ఆమెకీ, బోస్ కి ఏ విధమైన శారీరక సంబంధం లేదు. ఏదో తెలియని వేదనతో జీవితాన్ని గడుపుతోంది ఆమె.’చచ్చేదాక చచ్చినట్టు బ్రతకాలి’ అనేదానికి ఆవిడ జీవితమే ఓ రుజువు. మనిషి మాత్రం నిజంగా’ముత్యమే’ . మనసూ ’ముత్యమే’ దుమ్ముధూళి సంగతి వదిలేయ్యండి. నిత్యం అభిషేకాలు ఎన్ని చేసినా, రోడ్డు పక్కన దేవాళయాల్లోని దేవుళ్ళకి దుమ్ము అంటుకోవడం లేదా? ఇదీ అలాంటిదే” మాట ఆపి , గడగడా గ్లాసు పని పట్టాడు రొయ్యబాబు.
“సరే… ఇన్ని విషయాలు ఎలా సేకరించావు?” కావాలనే అడిగాడు సర్వనామం.
“అయ్యా… మీరు ఈ ప్రశ్న కావాలనే అడుగుతున్నారు. ప్రతి ప్రొఫిషన్ లో కొన్ని కష్టాలు, కొన్ని సులువులు కూడా వుంటాయి. ఎవరు అనుసరించే పద్ధతి వాళ్ళు అనుసరిస్తారు. న్యాయంగా అయితే మా పద్ధతి మేము బయట పెట్టకూడదు. కానీ, నేను చెప్పదలచుకున్నా. కారణం, నేను చేసిన పనిని నాకంటే ఫాస్ట్ గా మీరు చేయగలరు. నాలాంటి వాళ్ళతో కాదు, అవసరమైతే పోలీసుల్తోనే చేయించగలరు. మీ పేరు సర్వనామం. మీరు’టచ్’ చేయని వృత్తంటూ లేదు.’ఛాలెంజ్’ ని ఎదురుకోవడమంటే మీకు మహోత్యాహం. ప్రస్తుతం మీరు అదర్శ విద్యాలయం రెక్టారు శామ్యూల్ రెడ్డి గారు వెల్ విషరూ, ఫండు, ఫిలాసఫర్, గైడూ” నవ్వాడు రొయ్యబాబు.
“నేనడిగింది నా వివరాలు కాదు, కష్టమర్ కెపాసిటి గురించి ఎంక్వైరీ చేశాకే నువ్వు పని మొదలెడతావని నాకు తెలుసు” నిర్లిప్తంగా అన్నాడు సర్వనామం.
“క్షమించాలి. కాస్త అత్యుత్సాహంతో ఎక్కువగా వాగాను. సరే, ఈ వివరాలన్నీ నేను రాబట్టింది ఓ సెక్యూరిటీ గార్డ్ నుంచి. ఆ మనిషే వెంకటస్వామికి పరమశివం గురించి హెచ్చరించింది.” అంటూ మొత్తం వివరాలన్నీ పూసగుచ్చాడు రొయ్యబాబు.
“గుడ్… వాళ్ళ మీద రెండు కళ్ళూ వేసి వుంచు. అవసరమైతే కొందరు ఎసిస్టెంట్లని కూడా పెట్టుకో. కానీ, ఒక్క క్షణం కూడా ఏమరకూడదు.” మరో బీడీ వెలిగించాడు సర్వనామం.
“అలాగే, కానీ ఒక్క మాట చెప్పొచ్చో లేదో తెలీదు. ఆ వివరం మీకు పనికొస్తుందో లేదో కూడా తెలీదు.” మరో పెగ్గు పోసుకొని అన్నాడు రొయ్యబాబు.
” అన్నీ చెప్పు. ఏది పనికొస్తుందో, ఎప్పుడు పనికొస్తుందో, నిగ్గు తేల్చుకోవాలి. ఆ పని నేను చూసుకుంటా” నిర్లిప్తంగా అన్నాడు సర్వనామం. కానీ అతని లోపల విపరీతమైన కుతూహలం.
“నవనీతం ఇంటి వెనకాల వైపు కాపురముంటున్న ఓ ముసలావిడ ఇంఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు నవనీతం గర్భవతి” నెమ్మదిగా కుండ పగలకొట్టాడు రొయ్యబాబు.
ఇంకా వుంది…