గుర్తుకు రాని కధలు..!

రచన: ఉమ గోపరాజు

ఒక మాట..

గుర్తొచ్చిన కధలు అని ఎవరైనా రాసారో లేదో తెలియదు కాని, నాకు మాత్రం ఎప్పటివో కధలు, గుర్తున్నవి, తల తోక గుర్తులేనివి అన్నిటినీ కలిపి కలగాపులగం అయినా పనికొచ్చేదేదైనా ఉంటే చెప్పుకోవడంలో తప్పులేదని రాయాలనిపిస్తుంది. ఇహ పోతే, ఎథిక్స్ విషయానికి వచ్చినా, పెద్ద పెద్ద కవివరేణ్యులు, కూడా అక్కడో ఇక్కడో చూసి, చదివి రాసినవే కదా? అందరమూ, అమ్మ ఇచ్చిన అక్షరాలే అల్లుతూ రాసేవాళ్ళమే…
అయితే ఇ౦తకూ రాయట౦ అ౦టూ మొదలెట్టి౦ది, హ్యూస్టన్ లోనే , ఇదివరక౦తా రాయట౦ ’రాస్తున్నాను జనులార” అ౦టూ ఇ౦ట్లోనూ బయటా రాధ్ధా౦త౦ చేసినా, (అ౦టే రాద్ధా౦త౦ కాదనుకో౦డి, ఏదో ప్రాస బావు౦ది కదాని.. చిన్నప్పుడు మా బళ్ళో ప౦తులుగారు చెప్పారు, ప్రాస తప్పి మాట్లాడకురా పాచి పళ్ళ వెధవా అని.. అ౦టే అసలైతే ’పాసు నాయా*” అన్నారనుకో౦డి.., కాని మరీ అలా రాస్తే ఏ౦ బావు౦టు౦ది? కదా..!) అ౦చేత, తెలుగులోనే మాట్లాడి౦చిన మా హ్యూస్టన్ మితృల౦దరికీ, నమస్కరిస్తూ, (మళ్ళీ గొడవ పెట్టక౦డీ, అదేమిటి? మే౦ నేర్పలేద౦టావా, పుట్టినదాదిగా తెలుగులోనే కదా పెరిగావు పిల్లా, అ౦టే (అలా అనే వాళ్ళున్నారు, పెద్దవాళ్ళ౦దరూ, వాళ్ళ౦దరికి తొలి ద౦డ౦ అనుకోండి.. కాని, మధ్యలో అ౦గ్రేజీ గ్రేజి౦గ్ చేసి వెలగి౦చాము కదా..(అదేలె౦డి, మళ్ళీ అలా రాస్తే ఏ౦ బావు౦టు౦దీ.. ఆ( ఏమిటీ ఫరవాలేదా? తట్టుకు౦టారా, నా భాష ఎలా అన్నా? మరీ అ౦తలేసి మాటలు రాయమ౦టారా.. అదేన౦డీ ’వెలగబెట్టావులే మహా అన్నారు కదా, అప్పట్లో, అనే వాళ్ళే అన్నారు లె౦డి.. తట్టుకొ౦డి మరి, చన్నీళ్ళతో తలను!!) వాళ్ళ౦దరిలో కొ౦తమ౦ది లేరు ఇప్పుడు, కాని, ఆత్మలయితే జనన మరణాలకి అతీత౦ కదా!) అయితే ఇ౦తకీ ఏమిట౦టే, మాట్లాడితే, మాటల్లో, ఒక్క తెలుగు పద౦, ముప్పై తెలుగు కాని పదాలతో వాక్య౦ పూర్తయ్యేది, కాని ని౦చుని తెలుగులోనే మాట్లాడాలి, అని మన గురువు గారు శాయి గారు, రాజు గార్లూ వెన్నెల్లో తెలుగువెన్న అ౦దరికీ ప౦చారు కదా, అవన్నీ ఆరగి౦చాక, తెలుగు బుద్ది కుదిరి.. వ౦ట బట్టి, మొత్తానికి కాశ్మీరు ను౦డి కన్యాకుమారి వరకు, కాకినాడ ను౦డి కాలిఫోర్నియా వరకు, అ౦తకు ము౦దు, వెనకా, కొనా మొదలు, తెలుగు వాళ్ళ౦దరూ, తెలుగులోనే ఉద్ధరి౦చాలి అని ప్రతిన పూరిన వాళ్ళై, తెలుగన్న౦ తి౦టూ, తెలుగు కధ వి౦టూ, చదువుతూ వర్ధిల్లాలని, నాకొక ఊహ కలిగి౦ది. అ౦చేత, తెలుగు అప్పడాలు, వడియాలు కధలూ కాకరకాయలూ ద౦చేయాలని ఏదో కోరిక, (అసలైతే, కుతి, యావ లా౦టి పదాలు కూడా ఉన్నప్పటికీ, ఊహలు ఊయలలు కదా అని అ౦దమైన పదాలే వాడదామని, అలా అనేసుకున్నాను.. అన్నమాట! (అమ్మయ్య ఆపి౦ది.. మహాతల్లి, అనుకు౦టున్నారా? ఎక్కడ, నేనేదో ఓ మాదిరి రాద్దామని ప్రయత్న౦ చేస్తున్నాను కాని, అ౦త స్టేటస్ మనకెక్కడిదీ!) సరే మొత్తానికి కధలోకి వెళదాము! గబ గబా.. (ఎ౦దుక౦టే పాతకధను అ౦త పొడిగి౦చట౦ అనవసరమని అ౦టారేమోనని!)

“అనోరణీయా౦..”!
ఈ కధ పేరసలు ఇది కాదు. అడవిలో దయ్య౦ అని అ౦దామనుకున్నాను. కానీ మరీ దయ్య౦ పేరేమిటి శుభమా అని కధలు మొదలెడుతూ, అని రాజు గారు కసురుకు౦టే, అలామార్చాను, ఇ౦దాకే. ఇ౦తకీ ఆ కధ అసలు పేరు.., ఏదో ఒకటి, గుర్తుకు రావట్లేదు. ఏదయితేనే౦, కధ కధే కదా. కనుక చెప్ప దలచుకున్నది చెప్తాను. అయితే ఇదొక థియరీ లాగా ఉ౦ది కూడా, ఆలోచిస్తు౦టే. ఏ౦ థియరీ అ౦టే, సరిగ్గా గుర్తుకురావట్లేదు కాని ఏదో ఉ౦ది. అదేమిట౦టే ’నువ్వెలా ఇతరులు నీ గురి౦చి భావిస్తున్నారని అనుకు౦టావో, అలాగే అవుతావు సుమా’ అని, అలాటిదేదో…! ఆ!అదీ.. అది Theory Of Self Fulfilling Prophecy! కదా!
అనగా అనగా ఒక ఊళ్ళో ఒకడు ఉ౦డేవాడు. ఊళ్ళో ఒక్కడేమిటీ వ౦ద మ౦ది ఉ౦డొచ్చు, లేదా పది మ౦ది ఉన్నా ఉ౦డొచ్చు లేదా కోకొల్లలు౦డి ఉ౦డవచ్చు, ఇప్పుడు కాకున్నా,ఎప్పుడో ఒకప్పుడు. అసలు మన తెలుగు వాళ్ళామ౦తా తేటతెలుగు మాధుర్యాన్ని అనుభవిస్తూ, తెలుగిళ్ళకి వెళ్ళిపోతే, అ౦దరమూ ’ఈ ఊరూ, ఈ గాలీ “ అని పాడేసుకు౦టూ కొన్నాళ్ళక్కడా, కొన్నాళ్ళెక్కడో ఉన్నా, తెలుగు నేల౦తా అక్షరలక్షలు పలుకుతు౦ది.. మరే అదే ప్రాస అన్నా అ౦దులో శ్లేష అన్నా… కదా మరి! అక్షరాలు లక్షలకొద్దీ వాడుకోవడ౦, అక్షరాల కొద్దీ లక్షలు ఆ నేల పాడడ౦.. అదీ అలా అ౦దుకోవాలి శ్లేషార్థాలు. శభాష్! ఓహో వివరి౦చాలా? ఏ౦లేదబ్బాయ్ (ఎహె, అమ్మాయిలకి చెప్పాల్సిన పనేము౦ది? మనకు పుష్కళ౦గా తెలుసు అ౦తకు ము౦దే. ఓ సమానత్వాల౦టే, మనని మన౦ చులకన చేసుకోవడ౦, మన౦ మహోన్నతుల౦. అ౦తే. అమ్మవారి అ౦శ కదా. అయ్యవారు స౦గతా, సరే. !(అ౦టే ’కిసుక్కున నవ్వుకోడ౦” అమ్మాయిలూ! అది కూడా వాళ్ళ బ్ర౦హా౦డమైన బుర్రలకి అర్థ౦ కావాలని, విడమర్చాన౦తే!)!(’!’ మళ్ళీ!) ఇ౦తకీ నేల పాడి౦ది అ౦టే ప౦ట పొలాలు, ప్రజలూ అ౦దరూ పైరు పచ్చగా వర్ధిల్లాలనుకోవడ౦, మన తెలుగు స౦స్కృతి వర్ధిల్లడ౦, ఎలా అ౦టే విదేశీ స౦స్కృతి అ౦టే కేవల౦ ప౦ట్లామూ, చొక్కాలే కదా, అవి ఏ౦ ర౦గుర౦గులు౦టాయి, మన చీర కట్టూ, వల్లె వాటూ ము౦దు? అలా అని..ఇ౦కా, వస్తున్నా వస్తున్నా, ధరలు పలకడ౦ కూడా! కొత్త రె౦డువేల నోట్లతోనే లె౦డి! ఆ మైక్రో చిప్పు లేకు౦టే చెల్లదు కదా! అ౦టే చిన్న పె౦కు అని తెలుగులో అ౦టారు లె౦డి.
ఇ౦తకీ ఆ ఊళ్ళోవాడక్కడే ఉన్నాడు ఎక్కడికీ పోలేదు, కధలోనే ఉన్నాము, కాకరకాయల అ౦గట్లోకి రాలేది౦కా.. కొ౦చె౦ నిదాన౦ అవసర౦ స్మీ..!
అయితే ఆ కధలో వాడు, పెళ్ళా౦ గోల భరై౦చలేక, అడవికెళ్ళాడు, కనిపి౦చని దేవుడికి మొరపెట్టుకు౦టూ(ఆ( కధలో కూడా.. అబ్బబ్బ మీర౦తా మా ఎయిట్ సియి పిల్లల్లాగా మాట్లాడుతున్నారు. క్వయేట్ ప్లీజ్!) మొత్తానికి దేవుడికి, కాదు దేవతగారి పతిదేవుడికి! (అలాగే అనుకొ౦డి! పతిదేవుడేకదా, కాదు.., అక్కడ నొక్కి వక్కాణిస్తున్నది,”దేవత గారి’ వల్ల వచ్చి౦ది వారికి కూడా గొప్పతన౦! కదా మరి అమ్మాయిలూ?! అదిగో చూడ౦డి, ఆ పైనున్న వాళ్ళిద్దరూ చూస్తున్నారు, వీణ వాయిస్తూ, ఆ వాదన వి౦టూ, చిరునవ్వుతో!) మొత్తానికి వాళ్ళిద్దరికీ మొర పెట్టుకున్నాడు, ఎలా దీని బారిను౦డి తప్పిస్తావురా అని. అప్పుడు అమ్మవారు వీణ మీటడ౦ కొ౦చె౦ ఆపి, మధురమైన స్వన౦లో, వాడిని చూసుకో౦డి ఒకసారి, పాప౦ అని అర్థి౦చారు. (లేదులే ఆనతిచ్చారు. సరేనా?) ఆయనగారేమో జీ హుజూర్ అని, ఈజీ చెయిర్లో ను౦డి లేచి, క౦డువా సవరి౦చుకు౦టూ, ’ఒరే, ఏ౦ట్రా, ఏ౦కావల్రా?” అ౦టే, వాడు,” నేనేమని అనుకు౦టే అదే జరగాలి స్వామీ”అని వేడుకున్నాడు. అమ్మవారు, అలా చూసి, నవ్వి ఒకే అన్నారు. అప్పుడేమో అయ్యవారు అలాగే జరుగు గాక అని దీవి౦చి వెళ్ళారు.
వాడికి అది మొదలు ఏమనుకు౦టే అది జరుగుతూ ఉ౦ది. వాడి భార్య కూడా, కాస్త ఓరక౦ట గమనిస్తూ ఊరుకు౦ది. వాడిల్లు మేడ అయి౦ది, బ౦గార౦, వజ్రాలు, పీతా౦బరాలు, బి ఎమ్ డబ్ల్యూ (!.. డబ్ల్యూ!)! అయిదు వ౦దలూ, వెయ్యి నోట్లూ, కొల్లలు కొల్లలు, ఇలా కావల్సినవన్నీ కూర్చుకు౦టున్నాడు, కానీ మనసులో భయ౦. ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళెక్కడ పట్టుకు౦టారో నని.. ఏమైనా అ౦టే పెళ్ళా౦ ఏమ౦టు౦దో ఏమోనని భయ౦, ఇలా భయపడుతూ ఉ౦డేవాడు.
ఒకనాడు వాడు ఇ౦ట్లో ఉ౦డగా, బాగా ఉరుములూ మెరుపులతో వర్ష౦ పడుతూ ఉ౦ది. చీకటిగా ఉ౦ది, పవర్ కట్ అయిన౦దువలన!”వాళ్ళావిడ ఎక్కడికెళ్ళి౦దసలు’, ఏమిటి? పక్కి౦ట్లో ఎవరి౦ట్లోనో శ్రావణ మాస౦ పేర౦టనికి వెళ్ళి౦ది కదా, మరచి పోయారా, ఉరుములూ మెరుపులూ శ్రావణమాస౦ అని? ఆ, ఏ కాలమైనా మన నోములూ వ్రతాలూ వర్ధిల్లుతూ మనల్ని ఉద్ధరిస్తూనే ఉ౦టాయి, అమెరికా , ఆస్ట్రేలియా ఏమిటి, అ౦తరిక్ష౦లో కూడా. అది అ౦తే. అ౦తరిక్ష౦లో కూడా వస్తాయి వర్షాలు కాకు౦టే ఉల్కల వర్షాలు.. ష్!
అయితే ఇల్లు పెద్దది కదా, డ్రైవ్ వే కూడా పెద్దదే, ఇ౦తలో ఒక నల్ల కారు ఇ౦టి ము౦దు ఆగట౦ చూసి, ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళేమో కర్మ అనుకున్నాడు. ఇ౦తలో కారు పక్కగా, దూర౦ ను౦డి వస్తూ, తల ని౦డా కొ౦గు కప్పుకుని, భారీ పట్టు చీరలో, చేతిలో వాయినాల స౦చీతో వస్తున్న శాల్తీని, చీకట్లో చూసి, భార్య అని గుర్తి౦చలేదు వాడు. “అమ్మో, ఎవరా వచ్చేది? మని౦ట్లోకి కాదు కదా?” అనుకున్నాడు. ఆవిడ సరిగ్గా ఇ౦ట్లోకి రావడ౦ చూసి, ’అమ్మో! దెయ్యమైతే కాదు కదా?భూతమేమో” అనుకున్నాడు. అ౦తే అది దయ్య౦లా, భూత౦లా మారిపోయి౦ది. అది లోపలికి రావట౦, ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళ రేడ్ జరగట౦, నిమిషంలో జరిగిపోయి౦ది.
అప్పటిను౦డీ ఇప్పటివరకూ వాడిని ఇన్‌కమ్ టాక్స్ భూత౦ పట్టుకునే ఉ౦ది..
’ఇద౦డి గురువుగారూ, ఇలా కధ అల్లేద్దామని” అన్నాను, కాకినాడలో కాజాల్లా౦టి తెలుగు కధలు చదువుతున్న రాజు గారితో, దూరవాణిలో. ’ఇ౦తకీ ఇద౦తా ఎ౦దుకు రాస్తున్నాన౦టే, మీరు నాకు అచ్చ౦గా తెలుగులోనే మాట్లాడమని, రాయమని చెప్పారు కదా,’ అని అ౦టూన్న నాతో “గిల్టీ ఆజ్ ఎక్యూస్డ్” అన్నారు, రాజు గారు.
ఇ౦కా, “ఇ౦తకూ అసలు స౦గతేమిట౦టే, వాడలా అనుకోకున్నా, అ౦దరినీ అలా౦టి శాల్తీలే పట్టుకుని ఉన్నాయి, ఇప్పటికీ..” అన్నారు గురువుగారు.
’అవునులె౦డి. రాజుగారూ, మీరు నిజ౦!ఆ వాక్య౦ అచ్చ౦ అలాగే వాడుకు౦టాను నా కధలో” అని దూరవాక్కు ముగి౦చాను.! అవును కదా, అ౦దరినీ అలా౦టి శాల్తీలే పట్టుకుని ఉన్నాయి అన్నమాట ఇ౦కా! !! మరే!
ఇ౦తలోనే, ’ఉన్నావా?’ అని అణువాణిలో స౦దేశ౦ పెడుతున్న శ్రీవారితో, ’ఇక్కడే ఉన్నాన౦డీ” అని మళ్ళీ నేలరేఖ లో పలికాను, అణువాణిలో అణువ౦తైనా ప్రాణ౦ మిగల్లేదని!
ఒకే బై!

ముఖపుస్తక పరిచయం

రచన: గిరిజారాణి కలవల

మూర్తి గారు సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగా కనపడ్డ దృశ్యం.. ఆయనను నిశ్చేష్టుని చేసింది. ఆశ్చర్యంతో నోరు తెరిచేసారు. కలయో.. నిజమో.. తెలీని స్థితిలో.. తనకు తనే గట్టిగా గిల్లుకుని.. హా.. ఇది నిజ్జంగా నిజ్జమే.. అనుకుని, ఆ అయోమయంలోనే లోపలికి చిన్నగా వెళ్ళారు. అలాగే ఫ్రెష్ అయి, తానే కాఫీ పెట్టుకుని తాగుతూ.. ఇందాక హాలులో తాను చూసిన దృశ్యాన్ని తలుచుకున్నారు.
తన సతీమణి సరోజ.. కింద ఫ్లోర్ లో వుండే రమణి.. ఇద్దరూ సోఫాలో పక్కపక్కనే కూర్చుని టపటపా సెల్ఫీలు తీసుకుంటున్నారు. మూతులు బిగించి, సాగదీసి, ముడేసి, అబ్బో రకరకాలుగా సెల్ఫీ కర్రను అటు తిప్పి, ఇటు తిప్పీ.. ఫోజులెడుతున్నారు. టీపాయ్ మీద తాగేసిన కూల్ డ్రింకుల గ్లాసులు, తిన్న ప్లేట్లు వున్నాయి. ఆ కబుర్ల జోరు ప్రవాహంలా సాగుతోంది. ఇవన్నీ మూర్తిగారికి ప్రపంచంలో ఎనిమిదో వింతలా అనిపించింది.
ఔను.. మరి… ఉప్పునిప్పులా వుండే వీరిద్దరూ పాలునీళ్ళలా కలసి ఇలా వుండడం ఆశ్చర్యమేగా మరి. నాలుగేళ్ల క్రితం ఈ అపార్ట్మెంట్ లోకి తమ ఇద్దరి కుటుంబాలు ఇంచుమించు ఒకేసారి గృహప్రవేశం చేసుకున్నాయి. తన క్రింద ఫ్లోర్ లో రావుగారు, భార్య రమణి, వారిద్దరి పిల్లలు వుంటారు. తమ పిల్లలు, వారి పిల్లలు ఇంచుమించు ఒకే వయసు వారు. ఒకే స్కూల్లో చదువుతున్నారు. ఇళ్లలో చేరిన కొత్తల్లో తమ రెండు కుటుంబాలు స్నేహంగానే వుండేవి. పిల్లలు నలుగురూ కలిసి ఆడుకోవడం, చేసుకున్న పిండివంటలు ఇచ్చిపుచ్చుకోవడాలూ, కలిసి పిక్నిక్కులూ, అబ్బో భలే జోరుగా సాగేవి. అలా ఓ ఏడాది పాటు జరిగాక ఉన్నట్టుండి ఇద్దరి ఆడవాళ్ళ మధ్య చిన్న చిన్న విషయాలలో తేడాలు రావడం మొదలయి, సర్దుకుపోలేక, భయంకరమైన గొడవలు రావడం ప్రారంభమయ్యాయి. వాటి ఫలితం పిల్లల మీద, మగవారిద్దరి మధ్య కూడా పడింది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద పడడం ఆగిపోయింది. కూరగాయల బండి మీద కూరలు కొనడం పోటీ నుండి, శ్రావణమాసం పేరంటం పోటీవరకూ సాగేది. పిల్లల చదువులు, ఆటలు వంటి వాటి మీద కూడా ఒకరిని మించి మరొకరు వుండాలని పిల్లల మీద ఒత్తిడి తీసుకురావడం మొదలెట్టేరు. ఓ కుటుంబం సెలవలలో యూరప్ ట్రిప్ వెడితే.. వెంటనే రెండో కుటుంబం అమెరికా ట్రిప్ వెళ్ళాల్సిందే. ఒకరు ఇంటికి ఓ కొత్త వస్తువు కొన్నారని తెలీగానే అవసరం వున్నా లేకపోయినా మరొకరు కొనాల్సిందే. తను, మూర్తి గారు ఆడవాళ్ళిద్దరికీ తెలీకుండా మోర్నింగ్ వాకింగ్ లో కలిసినప్పుడు చెప్పుకుని ఎప్పటికైనా వీళ్లు మారకపోతారా అని ఒకరినొకరు ఓదార్చుకునే వారం.
ఇన్నాళ్ళకి ఆ మంచి రోజు వచ్చిందని ఆనందంతో తబ్బిబ్బు అవుతూ.. మూర్తిగారికి ఫోన్ చేసేసి విషయం చెప్పేసి, విని ఆయనింకా షాక్ లోనుండి తేరుకోకుండానే, ఆ ఆనందాన్ని ఆదివారం మందుపార్టీలో పంచేసుకుందామని అనేసుకున్నారప్పుడే.
కాసేపటికి, రమణి వెళ్లిపోయాక సరోజ లోపలికి రాగానే.. ఏమీ తెలీనట్టు పేపరు చదువుతూ, అసలు విషయం ఆవిడే చెపుతుందికదా అని దొంగచూపులు చూడసాగారు రావుగారు. అనుకున్నట్టుగానే.. సరోజ వచ్చి చటుక్కున పేపరు లాగేసి అదేంటీ.. రమణిని పలకరించకుండా లోపలికి వచ్చేసారు.. ఏమనుకుంటుందో అని కూడా లేదు మీకు..”అనేసరికి ఏం సమాధానం చెప్పాలో కూడా తోచలేదు పాపం రావుగారికి.”అదికాదు.. సరోజా… మీరేదో ఫోటోల హడావిడిలో వున్నారు కదా.. డిస్ట్రబ్ చెయ్యడమెందుకని.. లోపలకి వచ్చేసా..”అన్నారు ఆయన. ”ఓసారి హలో.. అంటే మీ సొమ్మేం పోయింది”అని మూతి తిప్పుకుంటూ వంటింటిలోకి వెళ్లింది.
రావుగారికి మాత్రం ఈ సూర్యకాంతం, ఛాయాదేవి కి సఖ్యత ఎలా కుదిరిందన్న విషయం బోధపడక తల బద్దలు కొట్టకున్నారు. తను కూడా బంగాళదుంపలకి తొక్కు తీసే నెపంతో చిన్నగా వంటింటిలోకి చేరి భార్యతో మాటలు కలపసాగారు. అన్ని కబుర్లు చెపుతోంది కానీ అసలు సంగతి బయటకి రాలేదు. వంటయిపోగానే గిన్నెలు టేబుల్ మీదకి చేర్చేసి, భోజనాలకి కూర్చున్నారు. ఇక లాభం లేదు.. ఆవిడ చెప్పేట్లులేదు.. తనే అడుగుదామనుకునేసరికి భార్యామణి ఒక చేత్తో వడ్డన, మరో చేత్తో ఫోన్ లో ఫేస్బుక్ మొదలెట్టింది. అలాంటి పరిస్థితిలో ఏదడిగినా ఆవిడ దగ్గర నుండి జవాబు రాదని తెలిసి ఆయన మౌనంగా తినడం మొదలెట్టారు.
ఫోన్ చూసుకుంటున్న శ్రీమతి ముఖారవిందం వెలిగిపోతోండం చూసి ఆగలేక అడిగేసారాయన ‘ఏమిటి సంగతీ’ అని. దానికి జవాబుగా ఆవిడ ఫోను చూపించింది. ఇందాక వీళ్లు ఇద్దరూ తీసుకున్న ఫోటోలు ఇద్దరి పేర్లూ టాగ్ చేసుకుని ఫేస్బుక్ లో పెట్టారు… వాటికి వచ్చే కామెంట్లు, లైకులు వందల సంఖ్యలో వచ్చేసి వున్నాయి. అవి చూసుకునే కాబోలు మురిసిపోతోంది.”సరే కానీ.. మీ ఇద్దరికీ పడదుకదా… ఇప్పుడిలా ఇద్దరూ ఒక్కటై పోవడమేమిటి… ఈ ఫోటోలు ఏమిటీ… మిమ్మల్ని మెచ్చుకుంటూ ఇన్ని కామెంట్లు రావడమేమిటీ… నాకేమీ అర్థం కావడం లేదే…”అని వెర్రిమొహం వేసుకుని అడిగారాయన.
దానికి ఆవిడిచ్చిన సమాథానానికి బుర్ర గిర్రున తిరిగింది. అదేంటంటే…. ఇన్నాళ్లూ వీళ్లు ఎలా కలుస్తారా అని తను, రావుగారు ఎదురుచూస్తూవుంటే… ఈ ఇద్దరినీ కలిపింది ఆ జుకర్ బర్గ్ మహాశయుడని తెలిసి హాశ్చర్యంతో నోరు తెరిచాడు..
ఇంతకీ ఆ కథనం ఏంటంటే…. సదరు ఫేస్బుక్ లో మణి అనే పేరుతో తన శ్రీమతీ, రోజా అనే పేరుతో రావుగారి శ్రీమతీ, ఏదో గ్రూప్ లో పరిచయమయి, గాఢ స్నేహితురాళ్ళయిపోయారట. వాళ్ళ ఫోటోలు ఎక్కడా పెట్టుకోక పోవడంతోనూ. ..పేర్లు కూడా పూర్తిగా లేకపోవడంతోనూ… ఒకరికొకరు ఎవరో తెలీకుండానే… ప్రాణ స్నేహితురాళ్ళయిపోయారట. అలా చాటింగ్ లు చేసుకుంటూ.. కుంటూ.. ఈరోజు కలుసుకుందాం అనుకని ఇంటి అడ్రస్ లు చెప్పుకునేసరికి ఎవరో తెలిసిందట. బోలెడంత ఆశ్చర్యపోయి, అబ్బురపడిపోయి , పాత గొడవలు అసలు తలుచుకోకుండా.. కొత్తగా ఫ్రెండ్స్ అయినట్లుగా… కలుసుకున్నామని చెప్పింది. ఈ కలుసుకోవడం వల్లే ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెట్టుకుంటే మాకు బోలెడు కామెంట్లు ఎలా వస్తున్నాయో చూడండి…. అంటూ ఆవిడ కామెంట్లు లెక్కపెట్టుకోవడంలో మునిగిపోయింది.
ఆశ్చర్యం నుండి తేరుకున్న మూర్తిగారు తనలో తనే”ముఖాముఖాలు చూడడానికి కూడా ఇష్టపడని వీరిద్దరినీ ముఖపుస్తకం ఎంత చిత్రంగా కలిపింది. తను, రావుగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరనిది.. ఈ ఫేస్బుక్ వల్ల అయింది. ఇలాగే ముఖపరిచయంలేని వారెందరినో.. కలుపుతోంది.. ఒకానొకచోట స్పర్థలతో విడతీస్తోంది.. ముఖపుస్తకమా!.. నీకు జోహారు. నువ్వు ఏదైనా చేయగలవు”అనుకుని రావుగారితో ఈ సంతోషాన్ని ముస్తఫా… ముస్తఫా.. అనుకుంటూ ఫోనులో పంచుకున్నారు.

ట్రాన్స్ జెండర్ ….

రచన: శ్రీకాంత గుమ్ములూరి

మార్కెట్లో కూరలూ పళ్ళూ కొన్నాక ఆటోలో ఇంటికి తిరుగుముఖం పట్టాము నేనూ, రాణీ, వాళ్ళ అమ్మమ్మతో. రెడ్ సిగ్నల్ రావడంతో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఆటో ఆగింది. ఇంతలో ఒక ట్రాన్స్ జెండర్ ఆటో దగ్గరికి వచ్చి చప్పట్లు చరుస్తూ చెయ్యి చాపింది.
మొగ లక్షణాలు మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గాడీగా, పెద్ద పువ్వులున్న పసుపు పచ్చటి చీర కట్టుకుంది. మొహాన పెద్ద స్టిక్కర్ బొట్టు, పెదాలకి లిప్ స్టిక్ , చేతుల నిండా గాజులూ, తలా నిండా పువ్వులూ.
రాణీ కాళ్ళదగ్గరున్న బరువైన సంచీలోంచి ఒక బాదామీ మామిడిపండు తీసి దాని చేతిలో పెట్టింది. ఆమె రాణీ తలమీద చెయ్యి పెట్టి,” పిల్లా పాపలతో చల్లగా వుండు” అని దీవించి , “అరే సంతోష్ ! అజా పోరా ! ఆమ్ ఖా ” అంటూ పక్కనే మట్టిలో ఆడుకుంటున్న చిన్న కుర్రాడి చెయ్యి పట్టి లేవదీసి పేవ్మెంట్ మీద కూచోబెట్టి, నోటితో తొక్క ఊడదీసి, పండు వాడి మూతికి అందించింది.
రాణీ అమ్మమ్మ నిశ్చేష్టురాలై, “అదేం పనే? ఓ రెండు రూపాయలు పారేస్తే సరిపోయేదిగా !” అంది.
“అమ్మమ్మా!! ఎందుకు పారెయ్యాలి? ఒక పండు ఇస్తే నేం? ఇంటికి వచ్చిన ఆంటీలకి నువ్వు మాత్రం పళ్ళు ఇవ్వవూ బొట్టు పెట్టి?” అంది రాణీ.
“అంటే పునిస్త్రీలకీ, నపుంసకులకీ తేడా లేదూ? ”
“అయితే నపుంసకులకి మామిడి పండు తినే అర్హత లేదా? వాళ్ళ జన్మా మనిషి జన్మేగా ?”
“సరే, నీతో వాదన నాకనవసరం.”
“నాతో వాదన కాదు. నీకు తోటి మానవుడి గురించి గ్రాహ్యం అవసరం అమ్మమ్మా. పురాతన భావాలూ, జాతి, లింగ విభేదాలూ పక్కకి పెట్టి, కాస్త సహృదయంతో ఆలోచించాలి మరి” అంటూ లెక్చర్ మూడ్ లోకి వెళ్ళిపోయింది రాణీ.
ఎందుకసలు పాపం వాళ్ళని అడుక్కునే వాళ్ళు, ఇతరులని భయపెట్టి డబ్బు దోచుకునే దుష్టులు, చరిత్ర హీనులు అంటూ ఇలాంటి కళంకాలన్నీ ఆపాదించి చిన్న చూపు చూడ్డం? వాళ్ళు చెయ్యని నేరానికి, దేవుడు వాళ్ళ కటువంటి జన్మ నిచ్చినందుకు సమాజమే కాకుండా స్వంత తల్లితండ్రుల చేత కూడా వెలి వెయ్యబడి, ఎంత నికృష్టమైన జీవితానికి గురి అవుతారో అంచనా వెయ్యగలమా?
అనాధ బతుకు. ఆకలి ఎలాంటి పనైనా చేయిస్తుంది. ముష్టెత్తుకోడం, దొంగతనం, సెక్స్ వర్కర్ల లా పనిచెయ్యడం. సమాజంలో స్థానం లేనివాళ్లు మరి ఏ విధంగా బతగ్గలరు? చదువు సంధ్యలూ, బతుకుతెరువు కోసం పనులూ, వాళ్ళ కోసం కాదని మొహాన రాసి పెట్టి ఉందిగా. అన్ని క్షేత్రాల్లోనూ వంచితులే . దానికి కారణం మనమే మారని సమాజం! దేశం పురోగతి కోసం అందరం పాటుపడాలని వ్యాఖ్యానిస్తాం. కానీ మన భావవైఖరి ఎంత అధోగతిలో వుందో ఎవ్వరం పట్టించుకోము.
కళ్ళకి కనబడితే అసహ్యించుకుంటాం., తిరస్కారంతో వాళ్ళని తప్పించుకోడానికి తలుపులు మూసేస్తాం, , వాళ్ళ అవయవాలను గురించి అవహేళన చేస్తాం,. లేదంటే మనవాళ్ళెవరికీ అటువంటి జన్మ వొద్దు కనక పెళ్లికూతుర్లకీ, గర్భిణీ స్త్రీలకీ వాళ్ళ చేత దిష్టి తీయిచడానికి పిలుస్తాం. అసలు వాళ్ళ మనసేమిటి, దిన దినమూ ఎలాంటి అవమానాలకు గురి అవుతున్నారు అని ఆలోచించగలిగే మానవత్వాన్ని మనలో పెంచుకున్నామా? మార్పు ముందు మనం తెచ్చుకుని మన చుట్టూ వుండే వాళ్లలో కూడా తేవడానికి ప్రయత్నించాలి.
నేనూ రాణీ మాటలతో ఏకీభవిస్తూ, నాకున్న పరిజ్ఞానంతో చెప్పడం మొదలు పెట్టాను.
అసలు మన పురాణ ఇతి హాసాలలో నపుంసకులకు గౌరవనీయమైన స్థానం లేకపోలేదు. ఒకానొక వాల్మీకేతర రామాయణంలో ఉన్న ఒక కథ ఏమిటంటే శ్రీరాముడు పదునాలుగేళ్ళ వనవాసానికి వెళ్తున్న సమయాన అయోధ్యా ప్రజ ఆయనపై గల అనురాగంతో దుఃఖితులై ఆయన వెంట అడవులదాకా అనుసరించారు. అది గమనించిన శ్రీరాముడు వారందరినీ సమాయత్త పరిచి, అయోధ్యావాసులైన స్త్రీ పురుషులందరూ దుఃఖాన్ని విడనాడి, వెనుదిరిగి తమ నివాస స్థానములకు పోవలసిందని అర్ధించి, సీతా,లక్ష్మణసమేతుడై తన కార్యసిద్ధికి వెళ్ళిపోతాడు. పదునాల్గు సంవత్సరముల తర్వాత అయోధ్యకు వెనుదిరిగి వచ్చి, మళ్ళీ అదే అడవిలో ప్రవేశించినపుడు స్త్రీ పురుష జాతికి చెందని, అయోధ్యావాసులైన హిజ్రాలు ఆ స్థలం నుంచి కదలక అక్కడే ఉండిపోవడం గమనించి, తన తప్పిదాన్ని గ్రహించి, భావోద్రేకుడైన శ్రీరాముడు వారికి వివాహం, శిశుజన్మ సంబంధమైన శుభ కార్యాలలో అందరినీ ఆశీర్వదించగల ఉన్నతస్థానం వారికి కలిగేట్లుగా వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచీ, వారు ఈ సంఘటనను ఉద్ఘాటిస్తూ, పెళ్లిళ్లలో పాడుతూ, దీవించటం పరిపాటి.
మహాభారతంలో అర్జునుడు కూడా అజ్ఞాతవాసంలో, బృహన్నలగా, నపుంసక ధారణను పొంది వివాహాది శుభ కార్యాలలో పాల్గొన్నాడని వింటాం.
కానీ నేడు మాత్రం మన సమాజంలో వాళ్ళు అత్యంత హీనదశలో ఉన్నారు.
“నిజానికి 2014 వ సంవత్సరంలో సుప్రీం కోర్టు స్త్రీ పురుష లింగాలతో పాటు నపుంసక లింగాన్ని మూడవ లింగంగా గుర్తించడం భారత సంవిధాన శాసనంలో గర్వించదగ్గ విషయం. అయినా సమాజం మాత్రం వాళ్లకి సంఘంలో సమాన స్థానాన్ని ఇవ్వడానికి బదులు అంటరానితనాన్ని సంఘ బహిష్కరణని ఇంకా అమలు పరుస్తూనే వుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో సుమారుగా 500,000 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నట్లు తీర్మానించారు. అంత పెద్ద సంఖ్యలో వున్నా వారిని మైనారిటీ గ్రూపుగా అంగీకరించి, వారి కనీస హక్కులు వాళ్లకి దక్కేటట్లు చెయ్యడానికి వెనకాడుతున్నాం.
కలకత్తాకు చెందిన మానవీ బంధోపాధ్యాయ అనే ట్రాన్స్ జెండర్ మహిళ పరిస్థితులను ఎదిరించి, ఉన్నత విద్యల నభ్యసించి, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, కృష్ణగోర్ ఉమన్స్ కాలేజీకి ప్రిన్సిపాల్ పదవిని సంపాదించింది. ‘కష్టపడితే ఎవరైనా, దేన్నైనా సాధించ వచ్చు’ అనే సత్యాన్ని నిరూపించి, ప్రధానాధ్యాపకురాలి పదవిని పొందగలిగిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ మహిళ !
కానీ, సహకారం, సహృదయత లేని సహచరుల మధ్య నెగ్గుకు రావడం చాలా కష్టం. కొందరు ఆమెను సమర్ధించినా, మరి కొందరు సహోపాధ్యాయులూ , విద్యార్థులూ ఆమెకు ప్రతికూలంగా ప్రవర్తించి, స్ట్రైకులూ, ఘెరావులూ సృష్టించి, ఆమెను తీరని మనస్తాపానికి గురి చేశారు. ఇవన్నీ తట్టుకోలేని ఆమె రెండు సంవత్సరాల లోపునే పదవీవిరమణ చెయ్యవలసి వచ్చింది.
అంత స్ఫూర్తిదాయకంగా ఎదిగిన ఆమెను సమాజం కూకటి వేళ్ళతో తొలగించివేసింది . ఎంత దైన్య పరిస్థితి !
మానవత్వంతో కొందరు లీడర్షిప్ క్వాలిటీస్ వున్నవాళ్లు సమాజంలో అందరికీ ట్రాన్స్ జెండర్స్ గురించి అవేర్నెస్ తేవాలనీ, వాళ్ళ సంఘానికి ఒక స్థానాన్ని ఏర్పరచాలనీ పాటుపడుతున్న వాళ్ళూ వున్నారు. ఈ మధ్యనే ‘టైమ్స్ అఫ్ ఇండియా’ లో చదివాను. 73 ఏళ్ళ మంగళ అహిర్ అనే మహిళ ‘డాన్సింగ్ క్వీన్స్’ అనే ఒక ప్రొఫెషనల్ ట్రాన్స్ జెండర్ డాన్సింగ్ ట్రూప్ ని తయారు చేసింది. వాళ్ళు తమ నాట్యప్రతిభ ద్వారా సమాజంలో సమాన హక్కులు అర్ధించడానికి, తమ సంఘాన్ని పటిష్టం చేసుకోడానికి ధన సముపార్జనకీ సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. వారికి తమ అంగీకారాన్ని, సమర్ధతనీ తెలుపుతూ ఎల్. జీ . బీ . టీ . సెక్షన్ వారందరూ కూడా పూర్తి మద్దతు నిచ్చారు.
ఒకసారేం జరిగిందంటే , వారి నాట్య ప్రదర్శనని చూసిన తర్వాత ఒక దంపతుల జంట తమ కృతజ్ఞతను తెలుపుతూ సోషల్ ఆక్టీవిస్ట్ అయిన, మంగళా ఆహిర్ పాదాలను తాకి ధన్యవాదాలు చెప్పారు. నాట్య నిష్ణాతురాలైన ఆమెకు తెలిసిందేమంటే వాళ్ళూ తనలాగానే ట్రాన్స్ జెండర్ బిడ్డకి తల్లి తండ్రులు. అదే ట్రూపులో నాట్యంలో పాల్గొన్న తమ కొడుకు లింగత్వంతో ఏవిధంగా వ్యవహరించాలో సతమతమవుతున్న సమయాన “డాన్సింగ్ క్వీన్స్ ” గురించి విని, వారిని కలిసి, వారి ప్రోత్సాహం ద్వారా తమ బిడ్డకు కూడా ఒక అస్తిత్వాన్ని కలిగించ గలిగే అదృష్టాన్ని పొందినవారు.
2009 లో, అభినా అహిర్ ద్వారా స్థాపించబడిన ఈ సంస్థ ద్వారా వీళ్ళు ఒక దశాబ్ద కాలం నుంచీ నాట్యప్రదర్శనాలు ఇస్తున్నారు. నాట్య మాధ్యమంతో సమాజంలో ట్రాన్స్ జెండర్స్ కి సమాన స్థాయి కలిగించడం వారి ముఖ్యోద్దేశం. పలు ప్రదర్శనల ద్వారా, సమాజం , బంధు మిత్రుల నుంచీ వెలివేయబడ్డ ట్రాన్స్ జెండర్స్ యొక్క మంచి చెడ్డల కోసం అత్యంత కృషి చేస్తున్నారు. వారి స్థితి గతులను, వారు ఎదుర్కొనే కష్ట నష్టాలనూ అందరి గ్రహింపుకీ తెస్తున్నారు. ఫామిలీ సపోర్ట్ ఎంత అవసరమో నొక్కి వక్కాణిస్తున్నారు.
ఈ సంస్థను స్థాపించక ముందు ఈ డాన్సింగ్ క్వీన్స్ , రహదారులలో అడుక్కునో, వేశ్యావృత్తితోనో తమ జీవనం సాగించేవారు. మరి కొందరు బార్ డాన్సర్లుగా వుండి, పెళ్లిళ్లలోనూ , పండగ ఉత్సవాలలోనూ నాట్యం చేసేవారు. అదే మనసులో పెట్టుకుని , అవహేళన చేస్తూ, సమాజం వారిని చిన్న చూపు చూస్తుంది. నిజానికి ప్రదర్శనను తిలకించే వారు పాతభావాలను పక్కకి పెట్టి, ట్రాన్స్ జెండర్స్ కి అంటగట్టబడిన స్టిగ్మాను మర్చిపోయి, వారి లింగత్వాన్ని, పూర్వ జీవితాన్ని గమనించకుండా వారిని నాట్య ప్రదర్శకులుగా మాత్రమే ఎంపిక చెయ్యగలిగిన నాడు వారి బతుక్కొక పరమార్ధం ఏర్పడినట్లు భావించవచ్చు. తోటి మానవునిగా మనమూ వారి ఉనికిని గ్రహించి, మనలో ఒకరిగా పరిగణించి, లింగ విభేదాలను మరచి సహానుభూతితో చేయూతనందించడం మన కర్తవ్యంగా భావించడం ఎంతైనా అవసరం.” అంటూ ముగించాను.
రాణీ మళ్ళీ అంది , “మనకి సిగ్నల్ దగ్గర కనబడిన ఆమె ఏం చేసింది ? తనకి దొరికిన చిన్న సంతోషాన్ని తాను అనుభవించకుండా, అది దొరకని చిన్ని సంతోష్ నోటికి అందించింది. తనకి దొరకని సంతోషాన్ని ఆ చిన్నవాడిని సంతోష పెట్టడం ద్వారా పొందుతూ మనకంటే తానే ఉన్నత స్థాయిలో ఉన్నదని నిరూపించుకుంది.”
రాణీ మాటలలో సత్యం ఆమెను సిగ్గుపడేలా చేసింది.
నిజమే ! బూజు పట్టిన పాత భావాలున్న వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయమేగా మరి !!!

దూరపు బంధువులు

రచన: మణికుమారి గోవిందరాజుల

చలనం లేకుండా కూర్చొని వున్నాడు కేశవరావు. యెదురుగుండా భార్య వసుధ యెటువంటి బాధా లేకుండా ప్రశాంతంగా పడుకుని వుంది. వచ్చిన బంధువులందరూ అతనికి వోదార్పు మాటలు చెబుతున్నారు.
“యెంత అదృష్ణవంతురాలు! మాట్లాడుతూ మాట్లాడుతూనే అలా పక్కకి వొరిగిపోయిందట. సుమంగళిగా దాటిపోయింది. చాలా కొద్దిమందికి మాత్రమే ఇలాంటి చావు దొరుకుతుంది.”
“ సాయంత్రం కలిసింది. చీకటి పడ్డదాకా మాట్లాడుకున్నాము. భోజనాలయ్యాక కూడా కాసేపు వాకిట్లో మెట్లమీద కూర్చుంది వసుధక్క. ఇక తొమ్మిది దాటుతోంది పడుకుంటాను అని లోపలికి వెళ్ళి గంటన్నా కాకుండా కేశవరావుగారి కేకలకు లోపలికి వెళ్ళి చూసేసరికి అంతా అయిపోయింది” అని పక్క ఇంట్లో అద్దెకు వుంటున్న జ్యోతికి చెబుతుంటేనే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి
“ హార్ట్ అటాక్ అట కదా? ”యెవరో అడిగారు. .
“అవును డాక్టర్ చూసి చెప్పాడు. మాసివ్ అటాక్ అట”
యేది యేమైనా పోయిన ఆమె హాయిగా దాటిపోయింది. ఇపుడు కేశవరావుగారి పరిస్థితి యేంటో పాపం. యెలా తట్టుకోగలుగుతారో? పోట్లాడుకున్నా మాట్లాడుకున్నా ఒకరికొకరు”
“యేమి ఆమె పోతే నేను వుండలేనా? ” మనసులో అనుకున్నాడు కేశవరావు.
“యేంటో? మనం ఇంతమందిమి ఇన్నిరకాలుగా బాధపడుతున్నాము. అతని కంట్లోనుండి ఒక్క చుక్క నీరు, నోట్లోనుండి ఒక్క మాటా రావడం లేదు.”
“నువు మరీను వదినా! మగవాళ్ళు బాధను, ప్రేమను ఎక్స్ ప్రెస్స్ చేయలేరు. అయినా ఆడవాళ్ళు యేడ్చినట్లు మగవాళ్ళు యేడుస్తారా యేంటి? ”
“ఆ రెండూ యేమో కాని మగాళ్ళు కోపాన్ని, చిరాకుని మటుకు వెంటనే పెళ్ళాల మీద చూపిస్తారు. . అది మాత్రం వాళ్ళ హక్కు” యెవరో చాలా కోపంగా అంటున్నారు
“అవునా? నిజంగానేనా? నిజమేనేమో! అందుకేనేమో పోట్లాడుకుంటూనే నలభై యేళ్ళ సంసార జీవితం గడిపారు తామిద్దరూ”
“చీకటి పడకముందే కార్యక్రమం కానిచ్చేద్దాము అన్నయ్యా ! జరిగిపోయినదానికి మనం యేమీ చేయలేం. పద పద” తమ్ముడు హరి వచ్చి చెప్పాడు.
యాంత్రికంగా బ్రాహ్మలు చెప్పినట్లుగా చేయసాగాడు కేశవరావు.
– – – – – –
కేశవరావు, వసుధలది పెద్దలు కుదిర్చిన వివాహం. కేశవరావు చదువుకునే రోజుల్లోనే క్లాస్మేట్ వసంత అనే అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళి చేసుకుందామనుకునే లోపే తండ్రి కుటుంబం మంచిదని, వుద్యోగం చేసే పిల్ల కట్నంతో సహా వస్తుందని వసుధ సంబంధం కుదిర్చేసాడు. ఆ కట్నంతో పెద్ద కూతురి పెళ్ళి చేసాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా డిగ్రీ పూర్తవుతూనే కేశవరావు గుమాస్తా వుద్యోగంలో చేరాల్సి వచ్చింది. అది ఒక అసంతృప్తి కాగా, ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకునే వీలు లేకుండా కట్నం ఆశ చూపి వసుధను తనకు అంటగట్టారనే కోపం ఇంకొకటి. కేశవరావు తండ్రి కొడుకు పెళ్ళికొచ్చిన కట్నంతో కూతురు పెళ్ళి చేసి ఊపిరి పీల్చుకున్నాడు. కాని తండ్రికి యెదురు చెప్పలేక తప్పనిసరిగా చేసుకున్న పెళ్ళితో కేశవరావు సంతోషంగా యేమి లేడు. అసలే కోపిష్టి అయిన కేశవరావుకి అసంతృప్తి తోడై అదంతా యెవరిమీద చూపెట్టాలో తెలీక అన్నిటికి భార్య కారణం అని భార్య మీద చూపెట్టేవాడు. దానికి తోడు మగవాడినన్న అహంకారం ఒకటి. ముగ్గురన్నదమ్ముల మధ్య గారాబంగా పెరిగిన వసుధకి ఆత్మాభిమానం యెక్కువే. భర్త అహంకారాన్ని తట్టుకోవడం కష్టం అయింది. అంతే కాకుండా ఒక్క పని ముట్టుకోని ముగ్గురాడపడుచులు. తనకసలు తెలీదు ఆడపడుచులు పని చెయ్యకూడదని. తనొక్కతే అయినా కూడా యెన్నడు కూర్చుని చేయించుకోలేదు. తనకు కూర్చోబుద్ది కూడా అయ్యేది కాదు. కాని అత్తగారింటికి వచ్చేసరికి పూర్తి వ్యతిరేకంగా వుంది. అత్తగారు చెడ్డదేమి కాదు కాని ఆవిడకేంటంటే కూతుళ్ళు ఇంటి ఆడపడుచులు కాబట్టి కూతుళ్ళు పని చేయకూడదు. మగపిల్లలు వంశోద్ధారకులు. వాళ్ళెందుకు చేస్తారు? ఇక తను అత్తగారేనాయే? ఈ విధంగా ఇంట్లో వున్న తొమ్మిదిమంది సభ్యుల్లో యెనిమిది మంది ఖాళీగా కూర్చుంటే తనొక్కతి వాళ్ళందరికీ చేయడం చాల అవమానంగా అనిపించేది. మామగారికేమి పట్టదు. కోడలు ఉద్యోగం చేస్తే చాలు. కనీసం ఆఫీసునుండొచేసరికైన కూడా యే పని చేయకుండా అలాగే కూర్చునేవాళ్ళు. ఆఫీసు పని చేసొచ్చి యెంతో అలసిపోయేది. కొత్తగా పెళ్ళి అయిన మధురిమలు పంచుకోకుండానే పోట్లాటలు మొదలయ్యాయి. తన తల్లి మాట భార్య వినలేదనే కోపంతో యేకాంతంలో వుండగా వూసులు చెప్పుకునే వేళ వూహించని విధంగా దాడికి దిగేవాడు. ఆ రకంగా కొత్త కాపురం కలహాల కాపురంగానే సాగింది.
– – – – – –
“ అన్నయ్యా! యేమనుకోకురా. . మళ్ళీ కర్మల టైంకి వస్తాము. సౌమ్య పురిటికి వచ్చింది. ఇవాళో రేపో అన్నట్లుగా వుంది. ఒక్కడివి యెలా చేసుకుంటావో యేమిటో. అలాగని మేముండే వీలు లేదు. బాధ్యతలు మాకు ఇంకా పూర్తికాలేదు. ఒంటరివాడివి నువ్వే మా దగ్గరికి వచ్చి వుండరాదూ. అందరం ఒక్కచోటే వుంటాం” తమ్ముడు మాధవ అడిగాడు.
తలవూపి వూరుకున్నాడు కేశవ. . అటూ ఇటూగా తమ్ముళ్ళు మాధవ, హరి, చెళ్ళెళ్ళు పార్వతి, సంధ్య, అరుణ చెప్పేసి వెళ్ళిపోయారు”. భార్య వున్నప్పుడు యెంతో ఆత్మీయులుగా అనిపించారు వీరంతా కూడా. కాని వీరిలో ఇప్పుడు ఆ ఆత్మీయత కనపడటంలేదేమిటో విచిత్రంగా?” అనుకున్నాడు కేశవ . చుట్టూ చూసాడు యెవ్వరూ కనపడలేదు. అందరు వెళ్ళినట్లున్నారు తనకోసం యెవ్వరూ ఆగలేదేంటో. యెక్కడినుండో భార్య అరుపులు వినపడుతున్నట్లుగానే వున్నాయి. భార్య పోతే యెవరూ కూడా బాధపడరా? తనకు కన్నీళ్ళు రావడం లేదు సరే అలాగని హమ్మయ్య పీడా పోయిందిలే అని కూడా అనుకోలేకపోతున్నాడు యెందుకు? గుండెల్లో యేదో భారంగా వుందెందుకో?
ఒకసారి స్నేహితుడి భార్య చనిపోతే ఇద్దరు వెళ్ళారు . చనిపోయిన భార్యను పట్టుకుని విపరీతంగా దుఃఖిస్తున్నాడు అతను. ఆమెతో గడిపిన రోజులన్నీ తల్చుకుని తల్చుకుని యేడుస్తున్నాడు. కాసేపు వుండి ఇంటికొచ్చాక స్నేహితుడిని హేళన చేయడం ప్రారంభించాడు కేశవ.
“అయినా వాడేంటి? ఆడవాళ్ళలా అలా యేడుస్తాడు? నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. అసలు భార్య చస్తే యేడ్చే మగవాణ్ణి వీడినే చూసాను. మగవాడు ఆడంగి వెధవలా యేడుస్తుంటే చూట్టానికి అసహ్యంగా వుంది”
ఇన్నేళ్ళు కాపురం చేసిన భార్య చనిపోతే ఆ మాత్రం బాధ వుండదా? అయినా అందరూ మీలా వుంటారా యేంటి? భార్య యెపుడు పోతుందా అని చూసేవాళ్ళు మీరు”.
“అవునే ! నువు పోతే నాకు హాయి. నేను మటుకు ఛస్తే యేడవను. హమ్మయ్య అని నీళ్ళొదులుతాను. కాదు కాదు యే ఆస్పత్రికో ఇచ్చేస్తాను. . కనీసం వాళ్ళకన్నా వుపయోగపడతావు.
“నిజమే మీకే మాత్రం వుపయోగపడలేదు కదా? నేనిచ్చిన కట్నంతో మీ పెద్ద చెల్లి పెళ్ళి చేసారు. ఆఫీసులో నేను తీసుకున్న లోనుతో మీ రెండో చెల్లి పెళ్ళి, పురుళ్ళు, పుణ్యాలు కానిచ్చారు. మూడో చెల్లి పెళ్ళికి చేసిన అప్పు మొన్న మొన్నటి దాకా తీరుస్తూనే వున్నాము. ముగ్గురు తమ్ముళ్ళను ప్రయోజకులని చేయడానికి నా జీతమూ, జీవితమూ సరిపోయింది. ఇక మీకైతే అన్నిరకాల ఆకళ్ళు తీర్చాను. . ఆఖరికి మీ అమ్మ వుచ్ఛ, నీచాలన్ని యెత్తిపోసాను. యే సందర్భంలో మీకుపయోగపడలేదో చెప్పండి? ఆఖరికి నా తమ్ముళ్ళు నా చెళ్ళెళ్ళు అంటూ నాకు పిల్లలు పుట్టకుండా చేసారు. ఉద్యోగంలో మీకంటే యెక్కడ యెదిగిపోతానో అని యే పరీక్షలూ రాయనివ్వలేదు.” దుఃఖంతో గొంతు పూడుకు పోయింది వసుధకు.
“మరొక్కమాట మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. . యెవడికొసం చేస్తావ్? ”
“ఛీ! చదువూ సంస్కారం వున్నవాళ్ళు మాట్లాడే మాటలేనా? భార్యనెలా గౌరవించాలో మీకు తెలీకపోగా యెవరన్నా గౌరవిస్తుంటే అది మీకు హేళన.”
“ఆ నిన్ను పెళ్ళి చేసుకున్నాకే నేను చదువూ సంస్కారం అన్నీ మర్చిపోయాను. ఛీ!” విసురుగా బయటకెళ్ళిపోయాడు .
– – – – – –
తెల్లారింది.
“యేమే! నా మొహాన కాఫీ నీళ్ళేమన్నా పోసేదుందా? నీ గోలే నీది కాని నా గురించిన ఆలోచన వుందా? కాఫీ తాగితే కాని యే పనీ మొదలు పెట్టలేను”
పనిమనిషి రాలేదని సణుక్కుంటూ వాకిలి వూడుస్తున్న వసుధకు సర్రున మండింది. “నేను పోతే మీకు హాయి అంటూంటారుగా? నేను లేననుకుని కాఫీ పెట్టుకుని తాగండి. వీలైతే నా మొహాన కూడా పోయండి.”
“ ఎదురుగుండా దిష్టి బొమ్మలా కనబడుతుంటే లేవని యెలా అనుకుంటాను? వచ్చి కాఫీ ఇవ్వు” కోపంగా అరిచాడు.
సణుక్కుంటూనే వచ్చి కాఫీ ఇచ్చింది. “నేను కాఫీ ఇస్తే కాని మీకు తెల్లారదు. నన్ను తిట్టంది మీకు పొద్దు గడవదు. మగవాడినన్న అహంకారం మీకు ఒళ్ళంతా వుంది”
“వెనకటికి ఓ ముసల్ది నా కోడి కూయకపోతే తెల్లారదు అనుకుందట. అలా వుంది నువు చెప్పేది. ఆ మాత్రం కాఫీ నేనూ పెట్టుకోగలను. కానీ కార్యేషు దాసీ అని మన పెద్దలు చెప్పారు. నువు దాసీ దానివి. చెప్పింది చచ్చినట్లు చెయ్యాలి” హాయిగా కాఫీ తాగుతూ చెప్పాడు.
“అసలు మిమ్మల్ని కాదు మీకు అస్సలు పని చెప్పకుండా పెంచిన మీ అమ్మననాలి”
“మా అమ్మ పేరెత్తావంటే వూర్కోను”
అది అలా అనంతంగా సాగుతూనే వుంటుంది. యెక్కడికో వెళ్ళి ఒపికలు తగ్గాక ఆగుతాయి మొహం కడుక్కుని లోపలికి వస్తూనే కాఫీ రడీగా వుండాలి తనకి. తనకే కాదు తన చెల్లెళ్ళకి కూడా. అయిదు నిమిషాలు లేట్ అయినా వీరంగం ఆడేవారు తాము. ఇక తన చెల్లెలు చేతికి కాఫీ ఇవ్వలేదని తనకంటే పదిహేనేళ్ళు పెద్దదైన వదిన మీద అరుస్తుంటే కూడదని యెన్నడూ వారించక పోగా చెల్లెళ్ళతో కలిసి భార్యను హేళన చేసేవాడు. పడక్కుర్చీలో కూర్చుని కళ్లు మూసుకున్న కేశవకి అన్నీ గుర్తొస్తున్నాయి.
– – – – – –
“అయ్యా కాఫీ!” పనమ్మాయి మంగ మాటతో కళ్ళు తెరిచాడు కేశవ. కాఫీ తీసుకుంటూండగా ఫోన్ రింగయింది. మంగ ఫోన్ తెచ్చి ఇచ్చింది. చూస్తే తమ్ముడు మాధవ.
“యేంట్రా? మాధవా? ”
“అన్నయ్యా! మరి వదినకి కార్యక్రమాలవి చేయడానికి బ్రాహ్మలను మాట్లాడాలి కదా?” నాకేమో రావడనికి అవదు. …”
“చూద్దాం లేరా!” ఫోన్ మధ్యలోనే కట్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
“నా వాళ్ళు అనుకుంటున్న వీరెవరూ కూడా మనకు పెద్దతనంలో అక్కరకు రారు. మనకంటూ మన పిల్లలు వుండాలి. ఆర్ధిక ఇబ్బందులు ప్రతి ఇంట్లో వుండేవే. దానికోసం పిల్లల్ని కనడం మానేస్తారా యేంటీ? ఇదెక్కడి వింత? నేనొప్పుకోను”
“నువు ఒప్పుకునేదేమిటి? నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మనం పిల్లల్ని కని మన స్వార్ధం మనం చూసుకుంటే నా బాధ్యతలు యెలా తీర్చగలను? నీ జీతం నా జీతం కలిపితేనే బొటా బొటిగా సరిపోతుంది. ఇక పిల్లలుంటే యెంత ఖర్చు? ”
“ఖర్చు అని పిల్లలు వద్దనుకుంటారా? వున్నదాన్లోనే సర్దుకుందాం. మనం అన్నీ ఆర్చుకుని తీర్చుకునే వేళకు పెంచడనికి మనకు ఓపిక వుండొద్దా? వయసు మళ్ళీ వెనక్కి వస్తుందా? ”
“అదంతా నాకు తెలీదు. ప్రస్తుతం పిల్లలు వద్దు. నువు అబార్శన్ చేయించుకుంటున్నావు. అంతే!” దగ్గరికి వచ్చి బ్రతిమాలుతున్న భార్యను ఒక్క తోపు తోసాడు.
“ అమ్మాఆఆఆఅ!!!!!” కిందపడుతూనే కడుపు పట్టుకుని పెద్దగా కేక పెట్టింది వసుధ.
వులిక్కిపడి పడక్కుర్చీలోనుండి లేచాడు కేశవ. కిందపడ్డప్పుడు తగిలిన దెబ్బతో తాను కోరుకున్నట్లు అబార్శన్ అవడమే కాకుండా శాశ్వతంగా మాతృత్వానికి దూరమైంది వసుధ. కళ్ళనుండి నీళ్ళు ధారగా కారుతున్నాయి కేశవకి.
అది జరిగాక వసుధ యెంతో కృంగిపోయింది. కానీ తానేం చేసాడు?
మంచం మీద ముడుచుకుని పడుకుని కుళ్ళి కుళ్ళి యేడుస్తున్న వసుధ దగ్గరికి వెళ్ళాడు కేశవ. ”యేడ్చింది చాల్లే! చేసిందంతా చేసి ఇప్పుడు యేడ్పులెందుకు? హాయిగా నేను చెప్పగానే ఒప్పుకున్నట్లయితే ఈ విధంగా జరిగేది కాదు కదా? లే! లేచి వంట సంగతి చూడు”గట్టిగా అరిచాడు కేశవ.
“మీరెంతన్నా అరవండి. నేనిప్పుడు లేవలేను. అబార్శన్ అంటే బాలింతతనంతో సమానం. ప్రేమ, గౌరవాలు యెటూ లేవు. మానవత్వం లేని మనుషులు. కాస్తంతన్న జాలి కూడా లేదు. నిన్న నీళ్ళన్నీ మోస్తుంటే చూస్తూ కూర్చున్నారు మీ చెళ్ళెళ్ళు. నా వల్ల కాదు ఇప్పుడు లేవడం . యేం చేసుకుంటారో చేసుకోండి. పస్తులే వుంటారో, వంటే చేసుకుంటారో!”
చివరికి ఆ రోజు యేమి జరిగింది? భార్య ఒక్క చేత్తో చేసే పనిని తామంతా కలిసినా కూడా గందరగోళంగా చేసారు. మొత్తం మీద అన్నం తినేసరికి నాలుగయింది. అపుడైన పడుకున్న మనిషిని లేపి అన్నం పెట్టారా అంటే అదీ లేదు. యెంత జాలి లేని మనుషులు తాము?
– – – – – –
ఒక్కొక్క విషయం గుర్తొస్తున్న కొద్దీ క్రుంగిపోతున్నాడు కేశవ. ఆ తర్వాత వసుధ ఆరోగ్యం చాలా పాడయింది. అయినా కూడా తాము యేమి పట్టించుకోలేదు. యెప్పుడు ఆస్పత్రికి వెళ్ళేదో యెప్పుడు వచ్చేదో. . ఇల్లు, ఇంట్లో చాకిరీ కాలం గడిచిపోయింది. తమ్ముళ్ళు కూడా వుద్యోగాల్లో సెటిల్ అయి, పెళ్ళిళ్ళు చేసుకుని, యెవరి కాపురాలు వాళ్ళు యేర్పాటు చేసుకున్నారు. వాళ్ళల్లో వచ్చిన, వస్తున్న మార్పులను తాను కూడా గమనిస్తూనే వున్నా ఒప్పుకోటానికి తన ఇగో అడ్డం వచ్చేది. తల్లితండ్రి మనవల, మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చూసి హాయిగా కాలం చేసారు.
పంపకాలప్పుడు “అన్నయ్యా మేమే నీ పిల్లలం. తండ్రిలా మా బాగోగులు కనుక్కుని మాకు అన్ని వేళలా అండగా వున్నావు. నువు మా దగ్గరే వుండాలి” అన్న తమ్ముళ్ళ మాటలకి పొంగిపోయి తనకంటూ యేమీ లేకుండా చేసుకున్నాడు. ఫలితం తాతల కాలంనాటినుండి వుంటున్న ఇంట్లో తనకంటూ వాటా లేకపోయేసరికి ఇల్లు వదిలి వేయాల్సి వచ్చింది. యెపుడో వుద్యోగంలో చేరిన కొత్తల్లో అందరూ కడుతున్నారని తనతో గొడవపడి వూరికి దూరంగా ఐదు వందల గజాల స్థలం కొన్నది వసుధ. తమ్ముళ్ళ చదువులకు దాన్ని కూడా అమ్ముదామన్నాడు తాను. కానీ వసుధ ససేమిరా వొప్పుకోలేదు. ఆ విషయంగా తామిద్దరి మధ్యా కొన్ని సంవత్సరాలు గొడవ జరిగింది. ఇల్లు వదలాల్సిన పరిస్థితి వచ్చినపుడు ఆ స్థలమే ఆదుకుంది. రిటైర్మెంట్ డబ్బులతో అందులో రెండు గదుల వాటాలు రెండు కట్టి ఒకటి అద్దెకిచ్చి ఒకదాన్లో తాముంటున్నారు. ఆ తర్వాత చిన్నగా రాకపోకలు తగ్గిపోయాయి. తనతో యెంత పోట్లాడినా పిల్లలంటే చాలా ప్రేమ వసుధకి. . అందులో తన మన అన్న భేధం వుండేది కాదు. అందర్నీ ఒకేరకంగా చూసుకునేది. . ఆ మమకారంతో పిల్లలు ఫోన్లు చేయటం లేదనీ, వూళ్ళోకొచ్చినపుడు కూడా రాకుండా వెళ్తున్నారని బాధపడుతుండేది. కాని తను అరిచి నోరు మూయించేవాడు.
వసుధ పోయినరోజు సంగతి గుర్తొచ్చింది. పాత ఇంటి పక్కింటావిడ ఫోన్ చేస్తే మాట్లాడి పెట్టిన వసుధ మొహం చిన్నబోయి వుండడం చూసి అడిగాడు యేంటి సంగతి అని. .
“మాధవ కూతురు సౌమ్య పురిటికి వచ్చిందట. నిన్న సీమంతం చేసారట. మనం కనపడక పోయేసరికి యెందుకు రాలేదా అని అడిగితే దూరంగా వున్నారని పిలవలేదని చెప్పారట . కాని అసలు సంగతి అది కాదు నీకు పిల్లలు లేరు. పురుడొచ్చే సమయంలో నువ్వెందుకని మనల్ని పిలవలేదట . నిండు నెలలతో పూర్ణ గర్భిణి సౌమ్య చాల అందంగా వుందట. సీమంతం సంగతి దేముడెరుగు అసలు కడుపుతో వున్న సంగతే మనకు తెలీదు . పెళ్ళయ్యాక మనం దాన్నసలు చూడనే లేదాయె.” పిల్లల సంగతి వస్తే చాలు వసుధకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.
నిజమే సౌమ్య చాలా అందంగా వుంటుంది. నిదానంగా కుదురుగా వుండే సౌమ్య అంటే అందరికీ ముద్దే. . వసుధకైతే మరీను. సౌమ్య పుట్టినపుడు మాధవ అత్తగారివాళ్ళకు యేవో ఇబ్బందులొస్తే తమ దగ్గరికే తీసుకొచ్చి పురుడు పోసారు. అప్పటినుండి మూదో నెల వెళ్ళేముందు వాళ్ళ ఇంటికి వెళ్ళేవరకు దాన్ని తన చేతుల్లోనే పెంచింది మరి.
“యేమండీ ! నేనేమన్నా అంటే మీకు కోపం. కానీ ఒక్కసారి ఆలోచించండి. నా తమ్ముళ్ళే నా పిల్లలు అన్నారు. . కాని మీ పిల్లలనుకున్న వాళ్ళేమి చేస్తున్నారో చూడండి. మనం తప్ప అందరూ వచ్చారట. మీరంత కాని వాళ్ళెందుకయారో ? కుటుంబాన్ని వదులుకోమని, బాధ్యతలనుండి దూరం అవమని నేనెన్నడు చెప్పలేదు. మన బాధ్యతలని మనం సక్రమంగా నెరవేర్చాము. మరి వీళ్ళేమి చేస్తున్నారు? వీళ్ళకోసమా? ప్రతి స్త్రీ కలలు కనే మాతృత్వానికి నన్ను దూరం చేసారు? వీళ్ళకోసమా? మన దాంపత్య జీవితమంతా కలహాలతోనే గడిపారు? మొగుడు గౌరవం ఇవ్వకపోతే దారిన పోయే కుక్క కూడా ఒసే అంటుందట. నా జీవితంలో ఆనందం లేకుండా చేసారు కదండీ? పెద్దమ్మా నాకది కావాలి . పెద్దమ్మా నాకిది కావాలి . పెద్దమ్మా యే సంగతైనా నీకే మొదలు చెప్పాలనిపిస్తుంది. అంటూ నా వెనకాల తిరిగిన దానికి పెద్దమ్మా నీకో మనవడో మనవరాలో పుట్టబోతున్నారు అని చెప్పాలనిపించలేదా? అక్కా తల్లిలాగా పురుడు పోసావు . నాకు మా అమ్మ తర్వాత నువ్వే అన్న మీ మరదలికి కూడ అనిపించలేదా? అక్కా నీ చేతుల్లో పుట్టిన పిల్ల తల్లి కాబోతున్నదని? లేక నాకు పిల్లలు లేరు గొడ్రాలు కేమి చెప్పేది అనుకున్నారా? మీ తమ్ముడు హరి కొడుక్కి సుస్తీ చేసి హాస్పిటల్లో చేర్పిస్తే నాకు భయం అని కన్నతల్లి ఇంట్లో హాయిగా పడుకుంటే తెల్లవార్లూ వాడిని కంట్లో రెప్పలా చూసుకుని మళ్ళీ ఇంటికొచ్చి ఇంత చాకిరీ చేస్తున్నపుడు గుర్తు రాలేదా నేను గొడ్రాలునని? నీ మాటైతే చక్కగా వింటారు. నువ్వంటే ఇష్టం పిల్లలందరికీ అని పిల్ల మూకనంతా నా మీద పడేసి సినిమాలు, షికార్లు తిరిగినపుడు తెలీదా నేను గొడ్రాలునని? నా బంగారం తాకట్టు పెట్టి, అఫీసులో లోన్లు తీసుకుని వాళ్ళ పిల్లల ఫీజులు కట్తించుకున్నప్పుడు మాత్రం మీరు మమ్మల్ని తల్లిదండ్రులలాగా చూసుకుంటున్నారు అన్న వాళ్ళకు ఆ తలిదండ్రులు ఇంకా బ్రతికే వున్నారని గుర్తులేదా? అల్లుడి వుద్యోగం పోయింది నువిచ్చావని తెలిస్తే అభిమానపడుతుంది అని నా పేరు చెప్పకుండా యెన్ని సంవత్సరములు అత్తయ్య డబ్బులు తీసుకెళ్ళి కూతురుకిచ్చారు? మనవాళ్ళు అన్న ప్రేమతోనే కదా అవన్నీ చేస్తాం? మీరు కట్టిన తాళికి కట్టుబడి కట్టు బానిసలాగా చాకిరీ చేసాను. ప్రేమ ఇస్తే ప్రేమిస్తారంటారు. . మరి మరి నాకేమి ఇచ్చారు మనోవ్యధ తప్ప? నేనేమి చేసానని నన్ను ఇంతగా ద్వేషించారు? మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేసుకోలేక పోయారని మీ అసహాయత, కోపం. కట్నం ఆశ పెట్టి నన్నిచ్చి పెళ్ళి చేసారని మీ నాన్న మీద చూపలేక నా మీద కోపం. మీకున్న కోపానికి యే విధంగా కూడా నేను బాధ్యురాల్ని కాదు. అయినా అంత కోపాన్ని నా మీద చూపించి మీ జీవితాన్ని కూడా అశాంతి పాలు చేసుకున్నారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండీ. నా వాళ్ళు అంటూ మన జీవితమంతా వాళ్ళకు ధార పోయించారు. ఇప్పుడేమి జరిగింది. అందుకే నేను అంతగా చెప్పాను మన పిల్లలంటూ వుండాలని. ఒక్క సంగతి దేవుణ్ణి ప్రార్ధించుకోండి. నాకన్నా ముందు మీరే పోవాలని. గద్దరిదాన్ని యెలాగన్నా బ్రతగ్గలను. మీకే కష్టమంతాను. ఒకవేళ నాకేమన్నా అయ్యి నేనే ముందు పోతే మీరు శ్రమపడకండి. మీరన్నట్లు హాస్పిటల్ కే ఇచ్చేయండి. బతికున్నప్పుడు సరిగా చూడకపోయినా పోయాక కర్మలు బాగా చేయాలనే నమ్మకం మీకున్నా నాకేమాత్రం నమ్మకాల్లేవు. . నేనడిగిన ప్రశ్నలకి ఒక్కదానికన్నా సమాధానం చెప్పగలిగిన రోజున, మీరనుకుంటున్న ఆత్మీయులు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక వారం రోజులు ఉంచుకున్నప్పుడు, అయ్యో ఇన్నాళ్ళు నాతో కాపురం చేసింది. నా కష్టసుఖాల్లో పాలు పంచుకుంది అని మీరు మనః స్పూర్తిగా అనుకుని నాకోసం ఒక కన్నీటి చుక్క విదిల్చిన రోజు చాలు నా ఆత్మ శాంతిస్తుంది. అంతకంటే మీరేమి చేసినా జాగ్రత్త మిమ్మల్ని దయ్యమై పీక్కు తింటాను” నవ్వింది వసుధ.
“యేంటో యేదో మాట్లాడేస్తున్నాను. ఒక్కసారిగా మనసంతా వికలమై పోయిందండీ. మనుషులు ఇలా యెలా మారిపోతారు? కాలం గడుస్తున్న కొద్దీ ముందున్నంత వుండదు. కానీ మరీ ఇలా కరివేపాకులా తీసేస్తారా? మనం యేమడిగాము? మణులూ మాణిక్యాలు అడిగామా? లేక ఇక్కడికొచ్చి మనకు సేవ చేయమన్నామ? ఒక ఫోన్ కాల్. ఒక ఆత్మీయమైన పిలుపు. మీకు మేమున్నాము అని ఒక ధైర్యము ఇవే కదా మనం ఆశించేది? ”మాట్లాడి మాట్లాడీ అలసిపోయిన వసుధ మొహం కడుక్కొచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది.
“యేంటీ! మనం దూరం వున్నాం కాబట్టి దూరపు బంధువులయ్యమని పిలవలేదా? బాగుందండీ మీకొచ్చిన బిరుదు. మెళ్ళో వేసుకుని వూరేగండి” పకపకా నవ్వింది వసుధ . నవ్వుతూనే అలా పక్కకి ఒరిగిపోయింది
“వసుధా!! గట్టిగా పిలుస్తూ లేచాడు కేశవ. తప్పు సవరించుకునే అవకాశం లేకుండా తిరిగిరాని లోకాలకు వెళ్ళిన భార్య మీద కొత్తగా కలిన ప్రేమో లేక మారిన తనవాళ్ళ మనస్తత్వాలను కొత్తగ్గా గమనించడం వల్ల గుండే పగిలిందో ఆకాశం చిల్లు పడ్డట్లుగా గుండెల్లో భారమంతా పోయేట్లుగా వెక్కి వెక్కి యేడవసాగాడు కేశవ.

ఆక్సిడెంట్‌ నేర్పిన పాఠం

రచన: ఝాన్సీరాణి.కె

టైం చూశాను.. 8:35 ఫర్వాలేదు.. ఇంకొక్క పది నిముషాల్లో రెండు బస్సున్నాయి. 5 నిముషాల తేడాతో కరెక్ట్ టైంకి ఆఫీసులో వుండవచ్చు అనుకుంది.  బాక్సుల్లో సర్దగా మిగిలినవి ఒక ప్లేట్‌లో తెచ్చుకున్నవి భవాని డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కుర్చీలాగి కూర్చుని తినసాగింది. హడావిడిగా ఆ కొన్ని నిముషాలయినా కాళ్ళకు రెస్ట్‌ అనుకుంది. ‘ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళందరికి ఈ వత్తిడి  తప్పదు. కొంతమందికి భర్తలు కూడా సాయం చేస్తారు.’ అలాసాగి పోతున్నాయి భవాని ఆలోచనలు.

‘భవానీ మీ బాస్‌ని 17 నుంచి 23 దాకా ఒక వారం  సెలవు కావాలని అడుగు. మా భాస్కరం మామయ్య 75వ పుట్టిన రోజుకి ఏవో పూజలు, హోమములు చేయిస్తున్నామని మామయ్య కొడుకు కిరణ్‌ ఫోన్‌ చేశాడు,’ అన్నాడు శ్రీధర్‌.

ఏమనాలో తోచలేదు భవానికి. భవాని పని చేస్తున్నది ఒక ప్రైవేట్‌ కంపెనీలో. కంపెనీ చాలా పెద్దది పేరున్న కంపెనీ. వాళ్ళకు ఒక ఆరు బ్రాంచీలున్నాయి. సెలవు దొరకడం చాలా కష్టం. ఇంకో ఇరవై రోజులలో బాలన్స్‌ షీట్‌ వర్క్‌ ప్రారంభవుతుంది. భవానీది ఇంపార్టెంట్‌ రోల్‌. అన్ని బ్రాంచీ డాటా కలెక్ట్‌ చేయడం, కావాల్సిన ఫార్మ్స్‌ అన్నీ తయారు చేయడం మొదలైనవన్నీ తన బాధ్యతే.

“ఏమిటి? మాట్లాడవు” అన్నాడు శ్రీధర్‌.

“అప్పటికి వీవుతుందో కాదో బాన్స్‌షీట్‌ వర్క్‌ వుంటుంది కదా” అంది భవాని.

“ఈ ఆఫీసులో పనులెప్పుడూ వుండేవే. ఈ అరుదైన కార్యక్రమం మాటిమాటికి రాదు కదా. అయినా అంత అవసరమైతే ఉద్యోగం మాని పడేయ్‌. నీ టాలెంట్‌కి బోలెడు ఉద్యోగాలస్తాయి. మా బంధువులు అందరూ వస్తున్న ఫంక్షన్‌ మనం తప్పనిసరిగా వెళ్ళాల్సిందే” అన్నాడు శ్రీధర్‌.

ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు శ్రీధర్‌. పదేళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ వుంది తనకి. రేపోమాపో మేనేజరయ్యే అవకాశాలున్నాయి. ఆఫీసులో వర్క్‌ కల్చర్‌ బాగుంది. జీతం ఠంచనుగా 2వ తారీఖున  అక్కౌంట్‌లో పడిపోతుంది. ప్రయివేట్‌ రంగంలో మంచి పేరుంది తమ కంపెనీకి. అటువంటి కంపెనీని వదలి వేరే వుద్యోగం చూసుకోవాలా?’ భర్త కన్నార్పకుండా చూస్తూ వుండటంతో “పోనీ మొదటి రోజు, ఆఖరి రోజు సెవు పెడతాను మిగతా రోజు సాయంత్రం వెళ్దాం అంది” నెమ్మదిగా.

“భవానీ నాకేదైనా ఎక్కువసార్లు చెప్పడం అలవాటులేదని తెలుసు. నీవు సెలవు పెడుతున్నావు అంతే” అని బయటికి వెళ్ళిపోయాడు శ్రీధర్‌.

అతనికి కోపం తెప్పించినందుకు తలుపు తాళం పెట్టడం డ్యూటీ కూడా తనకే పడిందన్న మాట అనుకుని వుసూరుమంటూ తాళం చెవి తీసుకుంది భవాని.

శ్రీధర్‌ మంచివాడే, భార్యా పిల్లలను బాగా చూసుకుంటాడు. ఇంట్లో తన మాట నెగ్గాలి అంతే. ఎలాగోలా తంటాలు పడి ఆఫీసుకు   చేరుకుంది భవాని. ఆ రోజు బాస్‌ మీటింగ్‌ పెట్టాడు. పది రోజుల తర్వాత ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్‌ గురించి, దాని తర్వాత చేయాల్సిన బాలన్స్‌ షీట్‌ వర్క్‌ గురించి 2 గంటలు మీటింగ్‌. తర్వాత ఊపిరి సలపనంత పని. ఇక లీవు గురించి ఆలోచించడానికి కూడా కుదరలేదు భవానికి. తర్వాత రోజు బాస్‌ బ్రాంచ్‌ విజిట్స్‌కి వెళ్ళాడు.

ఆ రోజు సాయంత్రం భవాని వచ్చేసరికి పిల్లలు వచ్చి వున్నారు. చైతన్య 6వ క్లాసు తేజ 4వ క్లాసు. పిల్లలిద్దరు సాయంత్రం స్నాక్స్‌ తిన్నాక కార్టూన్‌ నెట్‌ వర్క్‌ చూస్తున్నారు. సాయంత్రం పని ప్రారంభించింది భవాని. వేడి వేడి కాఫీ త్రాగి ఓపిక తెచ్చుకుని గంట దాటింది. శ్రీధర్‌ ఇంకా రాలేదు. 7 కాగానే పిల్లలు టీ.వీ. ఆఫ్‌ చేసి   రూంలో కూర్చుని హోంవర్క్‌ చేసుకుని చదువుకుంటారు. 6:30 కల్లా శ్రీధర్‌ వచ్చేస్తాడు. రోజు భవాని వచ్చేసరికి 7:30 దాటుతుంది. కానీ ఆ రోజు బస్‌ వెంటనే దొరకడం, కూరలు తేవాల్సిన పనిలేక పోవడంతో తొందరగా వచ్చింది. ‘ఆఫీస్‌లో లేటయిందా? ఎవరైనా కలిసారా?’ దారిలో బండి ఆగిపోయిందా?’ శ్రీధర్‌ చెల్లెలు గీత దగ్గరికి వెళ్ళాడా?’ అలా సాగుతున్నాయి భవాని ఆలోచను. కుక్కర్‌ పెడదామని లేచింది ఇంతలో మొబైల్‌ రింగ్‌ అయింది. శ్రీధర్‌ దగ్గరి నుంచి కాల్‌.

‘భవానీ! గీతకి ఆక్సిడెంట్‌ అయిందని ప్రసాద్‌ ఫోన్‌ చేశాడు. నేను హాస్పిటల్‌కి వచ్చాను” అన్నాడు శ్రీధర్‌

“గీత ఎలా ఉంది?’ ఏ హాస్పిటల్‌” అడిగింది భవాని.

“కరుణ నర్సింగ్‌ హోమ్. నీవు మాకందరికి వంట చేసి టేబుల్‌ మీద సర్దేసి, రాత్రికి ఇక్కడ ఉండేలా రా’ అన్నాడు  శ్రీధర్‌. గబగబ వంట చేసి అన్ని టేబుల్‌ మీద సర్ది, తను తిని, రాత్రికి కావల్సినవి తీసుకుని, పిల్లలకు అన్నీ ఎక్కడ ఉన్నా యో చెప్పి, ఇంటి గురించి జాగ్రత్తలు చెప్పి బయుదేరింది భవాని.

నర్సింగ్‌ హోమ్ ముందు ఆటో దిగేసరికి శ్రీధర్‌ ఎదురొచ్చాడు.

“గీత ఎలావుంది?” అడిగింది భవాని.

“ఇందాకే మెలకువ వచ్చి మాట్లాడింది” అన్నాడు శ్రీధర్‌.

‘పెద్ద దెబ్బలా?’ అంది గీత.

“స్కూటరిస్టు కొట్టేయడంతో డివైడర్‌ మీద పడ్డది. దాంతో తల దగ్గర దెబ్బ తగిలింది. 5 కుట్లు పడ్డాయి. అనస్తీషియా ఇచ్చారు. మగత ఇప్పడే వీడి మాట్లాడింది” అన్నాడు శ్రీధర్‌ బాస్కెట్‌ అందుకుని ముందుకు నడుస్తూ.

రూంలో మంచం మీద పడుకుని వుంది గీత. పక్కన బెంచ్‌ మీద చాణక్య డీలాపడి కూర్చున్నాడు తల్లిని చూస్తూ. ప్రసాద్‌ మంచం ప్రక్కన స్టూల్‌ మీద కూర్చుని భార్యకు ధైర్యం చెబుతున్నాడు.

“గీతా ఎలా వున్నావు?” అంది భవాని గీత మీద చేయి వేసి.

“వదినా!” అని భవాని చెయ్యి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది గీత.

“ఊరుకో, భగవంతుడి దయ వల్ల ఏమి కాలేదు. ఊరుకో చాణక్య భయపడుతాడు” అంది ఓదారుస్తూ.

“భవానీ ఇలా కూర్చో” అన్నాడు ప్రసాద్‌.

“అన్ని టేబుల్‌ మీద సర్దేశాను. భోజనం చేయండి. ఉదయం మీరు తొందరగా వస్తే నేను వెళ్ళి పిల్లల సంగతి చూస్తాను” అంది భవాని.

“అన్నయ్యా!  మీరు కూడా మా ఇంట్లోనే పడుకోరాదు” అంది భవాని.

“లేదులే ఇంటికెళ్ళి, మళ్ళీ పొద్దున వస్తాలే” అన్నాడు ప్రసాద్‌.

వాళ్ళు వెళ్ళాక ‘గీతా అసలేమయింది చెప్పు’ అంది భవాని.

“వదినా ఈవాళ ఒకటి కాదు రెండు గండాలు తప్పాయి” అంది గీత.

“అదేమిటి?” అంది కంగారుగా భవాని.

“అసలేమయిందేంటే ఈ రోజు ఉదయం ఆయనకు, నాకు గొడవ అయింది. మా భాస్కరం మామయ్య 75వ పుట్టిన రోజు గురించి వారం రోజు ఫంక్షన్‌ గురించి సెలవు పెట్టమన్నాను. చాణక్యను కూడా స్కూల్‌కి సెలవు పెట్టమని చెబుదామన్నాను. ప్రసాద్‌ నా మీద ఇంత ఎత్తున లేచారు. ‘వారం రోజుల సెలవు ఆ రోజు అక్కడ కూర్చుని వాడిని సపోర్ట్‌ చేస్తావనుకుంటే స్కూలు మానేయమంటావా?’ అన్నారు. వాడు టోర్నమెంట్‌కి పై సంవత్సరం వెళతాడు. మా మామయ్య 75వ పుట్టిన రోజు మళ్ళీ రాదు అన్నాను. తనకి చాలా కోపం వచ్చింది. మాట్లాడకుండా వెళ్ళిపోయారు” అని ఆగింది.

అన్నాచెలెళ్ళ యిద్దరిది ఒకటే బాట అనుకుంది భవాని.

“ఇంకొకటేమన్నారో తెలుసా వదినా! చాణక్య టాలెంట్‌ని నేను పైకి రానివ్వటం లేదన్నారు. వచ్చే సంవత్సరం అయితే వాడు పెద్దవాళ్ళతో ఆడాలి. మళ్ళీ మొదటి రౌండ్‌ నుంచి ఆడాలి. ఇప్పుడయితే సిక్స్త్‌ లెవల్‌లో వున్నాడు. స్టేట్‌ లెవల్‌ గురించి కూడా ఆలోచించు. టోర్నమెంట్‌కు ప్రాక్టీస్‌ వెళ్ళి సాయంత్రం డైరెక్ట్ గా ఫంక్షన్‌కి  రండి. నేను కూడా ఆఫీస్‌ నుంచి అటే వస్తాను. సాయంత్రం 7గంటల నుంచి మొత్తం అయ్యేంత దాకా అక్కడే వుండవచ్చు’ అని. ‘ ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ రోడ్‌ మీద నడుస్తున్నాను. నాకు కోపంగా వుంది, చిరాగ్గా వుంది. వెనక సీటీబస్‌ హారన్‌ వేయడం నాకు వినిపించలేదు. ఒక కాలేజి అమ్మాయి పక్కకు లాగేయడంతో బ్రతికిపోయాను. నేను సర్దుకుని పక్కకి జరిగేసరికి  ఒక మెటార్‌ సైకిల్‌ నా మీదకు రావడం నేను ప్రక్కనే వున్న డివైడర్‌ పై పడడం తల మీద తగలడం జరిగిపోయాయి’ అంది గీత.

“అంత ఆలోచనతో నడుస్తావా రోడ్డు మీద. అయినా ప్రసాద్‌ తప్పేముంది. మీ మామయ్య మీకెంత ముఖ్యమో ప్రసాద్‌కి తన కొడుకు అంతకంటే ముఖ్యం. అది నాచురల్‌. నీకు కోపం రావడమే ఆశ్చర్యంగా వుంది. ప్రసాద్‌కు చెప్పావా ఇవన్నీ?” అంది భవాని.

“లేదు వదినా! తను గిల్టీగా ఫీలవుతాడేమో. తన మూలంగానే నేను ఆలోచన్లో పడి ఇలా ఆక్సిడెంట్ల పాలు కాబోయానని” అంది గీత.

“ఎప్పుడు  వీళ్ళ ఆలోచనలిలా వక్రంగానే ఉంటాయోమో” అనుకుంది భవాని.

“కాని వదినా ఆ డివైడేర్‌ మీద పడుతూండగా ఎన్ని ఆలోచనలు  వచ్చాయని. బ్రతుకుతానో లేవో అని జీవితం క్షణప్రాయం అనిపించింది. అంత చిన్న జీవితంలో నా కొడుకు లాలెంట్‌ ప్రూవ్‌ అయ్యే సమయంలో వాడి సంవత్సరం లాక్కోవడానికి నాకేమి హక్కుంది. అందుకే నాకు తెలివి రాగానే ప్రసాద్‌కి సారీ చెప్పాను.  ప్రసాద్‌కి అర్థం కాలేదు. ఆ క్షణాల్లోనే నాకు జీవితం విలువ తెలిసింది వదినా, దయచేసి ప్రసాద్‌కి సిటీబస్‌ సంగతి చెప్పకు వదినా” అని ముగించింది గీత. నాలుగు రోజు తర్వాత డిస్‌చార్జ్‌ అయి ఇంటికి వచ్చింది గీత. ‘నాలుగు రోజు రెస్ట్‌ తీసుకుని ఓపిక వచ్చాక ఇంటికి వెళ్దువు గాని’ అంది భవాని.

ఉదయం 4:30కి లేచింది భవాని వంట కాగానే, ఇడ్లీ చేసి హాట్‌ప్యాక్‌లో సర్దింది. అందరికి బాక్స్‌లు సర్దింది. ఇంతలో గీత లేచింది.  “తొందరగా బ్రష్‌ చేసుకో కాఫీ తాగుదాం” అంది భవాని. వదినా మరదళ్ళు ఇద్దరూ కాఫీ త్రాగారు. కాఫీ త్రాగుతున్నంత సేపు భవాని అప్పగింతలు పెడుతూనే  వుంది. “నీవు పూర్తిగా రెస్ట్‌ తీసుకో, మధ్యాహ్నం ప్రసాద్‌ వచ్చి  నీకు భోజనం పెట్టి వెళ్తాడు” అంది భవాని.

నాలుగు రోజుల తర్వాత వెళ్ళడంతో చాలా పని పెండింగ్‌ వుండటంతో బాగా లేట్‌ అయింది భవానీకి. పిల్లలు వచ్చేసి వుంటారు.  ప్రసాద్‌. శ్రీధర్‌ కూడా వచ్చేసి వుంటారు. శ్రీధర్‌ చాలా కోపంగా వుంటాడు. పైగా ఇంట్లో పేషంట్‌ అనుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన భవానీ చేతిలోని బాగు సోఫాలో పడేసి కూబడింది.. ఆశ్చర్యంగా వంటింట్లో నుంచి కుక్కర్‌ విజిల్‌, సాంబారు ఘుమఘుమ ఇంగువ వేసిన తాలింపు వాసన బావ, బావమరదుల నవ్వులు  వినిపిస్తున్నాయి. గదిలో ఉండాల్సిన గీత వంటింటి ముందు కుర్చీలో కూర్చుని వారికి డైరెక్షన్లు ఇస్తూంది. ఇంకో గదిలో చాణక్య హోంవర్క్‌ చేసుకుంటూ చైతన్య, తేజ చేత హోంవర్క్‌ చేయిస్తున్నాడు.

“భవానీ! ముందు నీవు కాళ్ళు కడుక్కుని రా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం” అన్నాడు ప్రసాద్‌.

“సారీ. చాలా లేట్‌ అయింది. చాణక్య ఇలారా” అని వాళ్ళకు తెచ్చిన పేస్ట్రీలు అవి ఇచ్చింది. గీతకు పళ్ళిచ్చింది. ఇక్కడ మీకు స్వీట్‌ కార్న్‌ తెచ్చాను అంది శ్రీధర్‌తో. భవానీ ముందు కాఫీ అన్నాడు ప్రసాద్‌.

ఆ పూటంతా సరదాగా గడిచిపోయింది. శ్రీధర్‌ కూడా ఏమి అనలేదు. రాత్రి పడుకోబోయే ముందు “భవానీ ధాంక్యూ ` గీతకు ఇంతగా చేసినందుకు. ఎంత ఇబ్బందయినా నీవు ఒక్కమాట కూడా మాట్లాడకుండా చాలా చేశావు!” అన్నాడు శ్రీధర్‌.

“అదేం మాటండీ,  గీత నాకు చెల్లెలు లాంటిది. అవసరమైనప్పుడు కాకపోతే ఇంకెందుకు ఒకరికొకరు” అంది భవానీ. “సారీ భవానీ, ఉద్యోగం మానేయి, వారం సెలవు అని ఎన్నెన్నో అన్నాను. మనకు ఇంతకంటే అవసరాలు ఎన్నొస్తాయో. గీత నాకు అన్నీ చెప్పింది. కాబట్టి నీవు సెలవు పెట్టకు, సాయంత్రం ఆఫీసయ్యాక మామయ్య ఫంక్షన్లకి వద్దువు గాని, నేను ఆఫీసు నుంచి వచ్చి పిల్లల్ని తయారు చేసి తీసుకు వస్తాను. గీత కూడా చాణక్య చెస్‌ ప్రాక్టీస్‌ అయ్యాక వస్తానంది” అన్నాడు శ్రీధర్‌.

*****

టీ కప్పు రేపిన తుఫాను

రచన: కె.ఝాన్సీకుమారి

కాలింగ్‌ బెల్‌ అదే పనిగా మోగుతూంది. బాత్‌రూం నుంచి బయటికి వచ్చిన పద్మజ గబగబా తలుపు దగ్గరి కెళుతూ గదిలోకి చూసింది. కంప్యూటర్‌ ముందు కూర్చుని వున్నాడు రాఘవ.

నేను బాత్‌రూంలో వున్నాను. కాస్త మీరు తలుపు తీసివుండవచ్చు కదా అంది తలుపు గడియ తీస్తూ. “నేను ఇంటర్నిట్‌లో ఉన్నాను” అన్నాడు అక్కడి నుంచి కదలడం కష్టం అన్నట్టుగా. పక్కఫ్లాట్లో వుంటున్న శైలజ లోపలికి వచ్చింది చేతిలో ఒక చిన్న గిన్నెతో. పద్మజ అమెరికాలో ఉన్న కొడుకు సుధీర్‌తో, ఆస్ట్రేలియాలో వున్న కూతురు రవళి కుటుంబంలో చాటింగ్‌ చేయడానికి మాత్రమే కంప్యూటర్‌ ముందు కూర్చుంటుంది. వెబ్‌కాంలో మనవడు, మనవరాలి ఫోటోలు చూసేటప్పుడు ఆ కంప్యూటర్‌ అంటే ఇష్టం. మిగతా టైం అంతా ఆ కంప్యూటర్‌ గది రాఘవ సామ్రాజ్యం. ‘ఆంటీ కొంచెం పంచందార ఇవ్వండి’ అంది శైలజ గిన్నె పద్మజ చేతికిస్తూ. పద్మజ వంట ఇంట్లోకి బయలుదేరింది. ఎంత తొందరగా చక్కెర ఇచ్చి అంత తొందరగా శైలజను పంపించేద్దామా! అని “పద్మజా నాకు ఒక టీ ఇస్తావా?”

అన్నాడు రాఘవ వచ్చి ‘ఇందాకా ఇంటర్నెట్‌లో బిజీ అన్నారుగా’ అంది పద్మజ. ‘ఇప్పుడు శైలజ వచ్చిందిగా ఇద్దరం తాగుదాం ఏమంటావు శైలూ” అన్నాడు రాఘవ. “ఆంటీ చేసే టీ నాకు చాలా ఇష్టం అంకుల్‌” అంది శైలజ కుర్చీలో కూర్చుంటూ. ఇక తప్పదనుకుంటూ వంటింట్లోకెళ్ళింది పద్మజ. స్టౌ మీద టీకి నీళ్ళు పడేసింది. అల్లం దంచసాగింది. శైలజ, శ్రీనిధి ప్రక్క ఫ్లాట్‌లో చేరి 4 నెలలు అయింది. శైలజ సినిమాలో ప్రవేశించడానికి ప్రయాత్నాలు చేస్తూంది. పార్టీకు వెళ్ళడం, రకరకాల సినిమాలకు సంబంధించిన వ్యక్తులను కలవడం శైలజ ప్రస్తుతం చేస్తున్న పని. శ్రీనిధి ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో పని చేస్తుంది. ఇద్దరు కలిసి ఫ్లాట్‌ తీసుకుని వుంటున్నారు.
శైలజ రాఘవతో, పద్మజతో కలివిడిగా వుండేది. అప్పుడప్పుడు చక్కెర, టీ పొడి ఏదైనా కూరవుంటే ఇవ్వమని వచ్చేది. ఈ మధ్య రోజూ రాకపోకలు ఎక్కువయ్యాయి. ఉదయాన్నే రావడం, రాఘవ ఇద్దరికీ టీ చేయమనడం పద్మజ టీ చేస్తున్నప్పుడు రాఘవ, శైలజ నెమ్మదిగా మాట్లాడ్డం ఇవన్నీ పద్మజ గమనిస్తూ వుంది. ‘‘పద్మజ టీ అయిందా?’’ అనే రాఘవ మాటతో ఈ లోకంలోకి వచ్చింది పద్మజ. ఏమిటి వీళ్ళ గుసగుసకు అర్థం మనవడు మనవరాలు ఉన్న రాఘవ శైలజతో `ఆ ఆలోచనే భయంకరమనిపించింది పద్మజకు. మరి వీళ్ల ప్రవర్తనకు అర్థమేంటి అనుకుంటూ టీ కప్పుల్లోకి వంచి ఆ ట్రే తీసుకుంటూ వుండగా అది కిందపడడం, కప్పు పగలడం, టీ నేల మీద ఒలకడం ముక్కలు వంట్లింతా చెల్లాచెదరుగా పడడం జరిగింది. “పద్మజా ఏమైంది?” అంటూ రాఘవ వంటింట్లోకి వచ్చాడు. వెనకే శైలు. అక్కడ జరిగింది చూడగానే ‘‘సారీ ఆంటీ” అని పద్మజతో అని, అంకుల్‌ నేను ఒకరిని కలవాలి వస్తాను’’ అని వెళ్ళి పోయింది శైలు.

మనసంతా చికాగ్గా వుండడం కళ్ళ వెంబడి నీళ్ళు కారుతూ వుండటంతో తమ గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుంది. వంటింట్లో రాఘవ ఒక బట్ట తడిపి టీ మరకలన్ని తుడిచాడు. టీ కప్పు ముక్కలన్నీ తీసేసి శుభ్రం చేసి అంతా సర్దేశాడు. “పద్మజ ఎందుకో చాలా చిరాగ్గా వుంది. తామిద్దరు బయటికి వెళ్ళి కూడా చాలా రోజులయింది. పద్మజను లంచ్‌కి బయటికి తీసుకెళ్ళాలి అనుకున్నాడు రాఘవ. కాస్సేపటికి నెమ్మదిగా సర్దుకుంది పద్మజ. అయ్యో వంట్లిల్లు ఒక రణ రంగంలా వుంటుంది. ఆస్యం అయితే ఆ టీ మరకలు పట్టేస్తాయి అనుకుంటూ వంటింట్లోకి వచ్చేసరికే రాఘవ బయటకు వస్తున్నాడు.
‘‘ఏమండి జాగ్రత్త వంటిల్లంతా టీ కప్పు ముక్కలు, టీ ఒలికి పోయింది ఇప్పుడే శుభ్రం చేసేస్తాను’’ అంది పద్మజ. ‘‘మొత్తం శుభ్రం అయిపోయింది’’ అన్నాడు రాఘవ అయ్యో మీరు చేశారా? నేనేదో ఆలోచిస్తూ అలా కూర్చుండి పోయాను’’ అంది పద్మజ.
‘‘ఫర్వాలేదు ఎవరు చేస్తే ఏముంది. పద విశ్రాంతి తీసుకుందువు గాని’’ అన్నాడు రాఘవ.
‘‘ఇంకా వంట ప్రారంభించలేదు’’ అంది పద్మజ. ‘‘ఈ రోజు వంట గింట అంతా బంద్‌. బయటకెళ్ళి ఎక్కడైనా భోజనం చేద్దాం’’ అన్నాడు రాఘవ.
ఇద్దరూ బషీర్‌ షాన్‌బాగ్‌ హోటల్‌లో భోజనం చేసి, ప్రసాద్‌ ఐమాక్స్ లో సినిమా చూసి, సాయంత్రం లుంబినీ పార్క్‌లో కాస్సేపు తిరిగి వస్తూ, ఇంటి దగ్గరే ఉన్న మెస్‌లో పుల్కాలు, కూర తీసుకుని ఇంటికి వచ్చారు. చాలా రోజుల తర్వాత హాయిగా గడిపిన భావన ఇద్దరికి. రేపు పిల్లలకి ఈ కబుర్లన్నీ చెప్పాలి అనుకుని పడుకుంది పద్మజ.
ఉదయం చిన్న చిన్న చప్పుళ్ళు, గదిలో లైట్‌ వెలుతురికి మెలకువ వచ్చింది పద్మజకి. గడియారం కేసి చూసింది. 5 గంటలు కావస్తుంది. ఎదురుగా ఒక బ్యాగ్‌తో తయారయి నుంచున్న రాఘవ కనిపించాడు. ప్రశ్నార్థకంగా చూసింది అతని వేపు.
‘‘పద్మజా రాత్రి మా ఫ్రెండ్‌ ఫోన్‌ చేశాడు. నేను నల్గొండ వెళ్లున్నాను. రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను. నీవిప్పుడే లేవడం ఎందుకు? హాయిగా పడుకో నేను 5:30 బస్‌కి బయలుదేరుతాను’’ అన్నాడు రాఘవ.
‘‘ఏ ఫ్రెండు? ఏమిటంత అవసరమైన పని’’ అడిగింది పద్మజ.
ఆ ఫ్రెండు నీకు తెలియదులే. నాకు బస్‌కి వేళవుతుంది. రేపు సాయంత్రం అన్నీ చెబుతానుగా వస్తా మరి’’ అంటూ ముందుకు కదిలాడు రాఘవ.
ఆశ్చర్యంగా అతడిని చూస్తూ అతడు వెళ్ళాక తలుపు వేసుకుని వచ్చిపడుకుంది పద్మజ. ‘ఎవరీ కొత్త ఫ్రెండు`ఆడా? మగా? ఏమిటా సమస్య తనకు చెప్ప వచ్చుగా. అంత అర్థం చేసుకోలేని దానిని కానుగా?’ ఇలాంటి ఆలోచనతో ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు పద్మజకు. అదే పనిగా విడవకుండా కాలింగ్‌ బెల్‌ మ్రోగుతూ వుండటంతో మెలకువ వచ్చింది పద్మజకు. టైం తొమ్మిది అయింది. అంటే మల్లిక ఒకసారి వచ్చి తను లేవక పోతే మిగతా ఇళ్ళలో పని చేసుకుని మళ్ళి వచ్చిందన్నమాట అనుకుంటూ తలుపు తీసింది. పద్మజ.
“అదేంటమ్మగారూ అలా పడుకుండిపోయారు. ప్రాణం బాగానే వుంది కదా? అయ్యగారేరి కనిపించరేం” అంటూ గబగబా ఇల్లు వూడుస్తూ ప్రశ్నల పరంపర కురిపించింది పనిమనిషి మల్లిక.
‘‘ఏమో నిద్ర పట్టేసింది. మీ అయ్యగారు పని మీద ఊరు వెళ్ళారు. నేను బాగానే వున్నాను. నువ్వు పని తెముల్చుకో. వెళ్ళి టీఫిన్‌ తీసుకుని వద్దువుగాని ఇద్దరం తిందాం’’ అన్నది పద్మజ అక్కడ ఉంటే ఇబ్బందనిపించి బాత్‌రూంలోకి దారి తీసింది.
మల్లిక ఇడ్లీ తీసుకు వచ్చేసరికి స్నానం, పూజ పూర్తి చేసుకుని కుక్కర్‌ పెట్టేసింది. వంటయ్యాక వంట ఇల్లు సర్దుతూవుంటే ముందు రోజు శైలజ పంచదార కావాలని ఇచ్చిన గిన్నె స్టౌ పక్కన కనిపించింది. ‘గిన్నె ఇచ్చేయాలి లేకుంటే ఆ వంకతో ఇంకోసారి వస్తుంది. అయినా ఈ రోజు ఇంకా రాలేదు. వాళ్ళ అంకుల్‌ లేరని పసిగట్టిందా ఏమిటి’ ఆలోచను పక్కదారి పడుతున్నట్లు అనిపించి పక్క ఫ్లాట్‌కు వెళ్ళింది పద్మజ ఆ గిన్నె తీసుకుని.
శ్రీనిధి తలుపు తీసింది ‘‘రండి ఆంటీ’’ అంటూ, ‘‘ఆంటీ టీ తాగండి’’ అంటూ లోపలికెళ్ళి ఇంకో టీ కప్పుతో వచ్చింది శ్రీనిధి. ‘‘శ్రీనిధి టీ చాలా బాగుంది’’ అంది టీ త్రాగి కప్పు కింద పెడుతూ పద్మజ. ‘‘ఆంటీ టీ చేయడమొక్కటే నా వంతు. వంట శైలూనే చేస్తూంది, చాలా బాగా చేస్తుంది’’ అంది శ్రీనిధి. శైలూ ఏది కనిపించదే’’ అంది పద్మజ. ‘‘నల్గొండ వెళ్ళిందాండి’’ అంది శ్రీనిధి.
ఉలిక్కిపడి సర్దుకుంది పద్మజ. శ్రీనిధి టీవి సౌండ్‌ తగ్గించడంలో మునిగి ఉండటంతో గమనించలేదు. ‘‘నిన్న రాత్రి ఎవరితో చాలా సేపు ఫోన్లో మాట్లాండిందాంటి. ఉదయం నాలుగు గంటలకే లేచింది. 6గంటల బస్‌కి నల్గొండకు వెళ్తానని, రేపు సాయంత్రం వస్తానని చెప్పిందాంటి. వివరాన్నీ వచ్చాక చెబుతాను” అంది. “శైలూ లేదు కదా లంచ్‌ తెప్పిస్తాను. మీరు కూడా రండి అంకుల్‌ లేరని చెప్పారుగా కలిసి భోజనం చేద్దాం’’ అంది శ్రీనిధి.
‘‘లేదు అంకుల్‌ వచ్చేస్తానన్నారు. ఇంకోసారి బయటకు వెళ్దాం. తలనొప్పిగా వుంది’’ అని చెప్పి లేచి వచ్చేసింది పద్మజ. తన ఫ్లాట్‌కి ఎలా వచ్చిందో కూడా తెలియదు. తలుపు గడివేసి సోఫాలో కూబడింది. అంతే కట్టు తెంచుకున్నట్టు దు:ఖం పొంగిరాసాగింది. అంటే రాత్రి రాఘవకు వచ్చిన ఫోన్‌ శైలూ నుంచా. నల్గొండకు ఎందుకు? ఎలాంటి వార్త వినవలసి వస్తుందో. ఇన్నేళ్లు బాగా జరిగిన సంసారంలో మనవలు వున్న ఈ వయసులో తనకీ కష్టం ఏమిటి. తనేమి చెయ్యాలి ముందు? తమ్ముడి దగ్గరికి వెళ్తుంది. పిల్లలిద్దరూ ఎప్పుడూ రమ్మని పిలుస్తూనే వున్నారు. ఏ సంగతి చెప్పకుండా వాళ్ళిద్దరి దగ్గర వుండి వచ్చాకా ఆలోచించాలి. పాస్‌పోర్ట్‌ తీసుకోవడం మరచిపోకూడదు. ఇంత వరకు బంధువుల్లో, స్నేహితుల్లో తమ కుటుంబానికి చాలా మంచి పేరుంది. ఎవరితో ఈ విషయం చర్చించకూడదు. ఇలా సాగుతున్నాయి పద్మజ ఆలోచనలు. లేచి తన బట్టలు సర్దుకుంది, రెండు బ్యాగులయ్యాయి.
రాఘవతో తన పెళ్ళి, అత్త మామలు, ఆడపడుచు, బావగారు. తోడికోడలు, అందరు తనని అపురూపంగా చూసుకోవడం. చిన్న చిన్న అలకలు, తగాదాలు, ఆడపడుచు పెళ్ళి సమస్య. కొన్నాళ్లకు తన పిన్ని కొడుకు పూనా నుంచి హైదరాబాదు ట్రైనింగ్‌కి రావడం, తను పూనుకుని ఆడపడుచు పెళ్ళి పిన్ని కొడుకుతో జరిపించడం. పిల్లలు, బావగారు వాళ్ళు కొడుకు లండన్‌లో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిర పడటం తమ పిల్లల చదువు, వారి పెళ్ళిళ్ళు. అన్నిటిలో తన పాత్ర. తను అన్నీ సమర్థవంతంగా నిర్వహించానని కుటుంబ సభ్యుందరికి తనంటే ప్రత్యేకమైన అభిమానం. చివరికి ఇప్పుడు రాఘవ తనకిచ్చిన బహుమానం. అన్నీ సినిమా రీళ్ళలాగ తిరుగుతున్నాయి. దు:ఖం తన్నుకుని వస్తూంది. కన్నీళ్ళు ఆగకుండా కారిపోతూనే వున్నాయి. అలా ఎంత సేపు ఏడుస్తూ వుందో… సొమ్మసిల్లి సోపాలోనే పడుకుండిపోయింది పద్మజ.
ఉదయం మెలకువ రాగానే ముందు రోజు జరిగిందంతా గుర్తుకువచ్చింది. ఆ రోజు గురువారం కావడంతో తలారా స్నానం చేసి బాబా ముందు దీపం వెలిగించి భక్తిగా మొక్కుకుంది. సాయి ఇన్నేళ్ళు నాకు తోడుగా వున్న నీవు ఈ కష్టం నుంచి బయట పడేయి అని మొక్కుకుంది. మళ్ళీ ఈ ఇంటికి తను వస్తుందో రాదు అనుకుంటూ రాఘవ కిష్టమయిన ముక్కల పులుసు, టమాటా పప్పు, బీన్స్‌ కూర, గోంగూర పచ్చడి, అప్పడాలు, వడియాలు వేయించింది. ఇల్లంతా శుభ్రం చేసింది. మొత్తం నీట్‌గా సర్దింది. తమ పెళ్ళయ్యాక రాఘవ మొదటి బోనస్‌తో కొన్న మంచాలు. ఒకసారి అరియర్స్‌తో కొన్న అల్ల్మైరా. తనకిచ్చిన డబ్బులో నుంచి దాచి కొన్న ట్రాన్‌సిస్టర్‌, ఒక షెల్ఫ్‌నిండా రాఘవ కిష్టమైన బుక్స్‌, పైన అరలో అందమైన భగవద్గీతోపదేశం పెయింటింగ్‌, చిన్నప్పుడు మూడోక్లాసులో అబ్బాయి చిన్న కుండపై వేసిన పెయింటింగ్‌, అమ్మాయికి వీణ కాంపిటిషన్‌లో వచ్చిన చిన్న వీణ, తమ కానీలో ఒకసారి వినాయక చవితికి అందరికి ఇచ్చిన ఒక ఫ్లవర్‌ వాజ్‌, అలా ఇంటి నిండా తీపి గుర్తులు ఒక్కొక్కటి చూస్తూ ఆలోచిస్తూ అలాగే నుంచుండిపోయింది పద్మజ. మధ్యాహ్నం అయింది భోజనం కూడా చేయలేదు. స్నానం చేసి తయారయింది. ‘‘ఇంకో పావు గంటలో వచ్చేస్తున్నా’’ అని రాఘవ ఫోను. ఇంతకు ముందు ఎక్కడికెళ్ళినా 2 గంటకొకసారి ఫోన్‌ చేసేవారు. ఇక ఆలోచనలు అనవసరం అనుకుంటూ లేచి వెళ్ళి స్టౌమీది ఒకవైపు పాలు మరోవైపు కాఫీకి డికాక్షన్‌ పడేసింది`పద్మజ.
ఇంతలో కాలింగ్‌ బెల్‌ మ్రోగింది. తలుపు తీసింది పద్మజ. గబగబా లోపలి కొచ్చాడు రాఘవ. “అక్కడ అస్సలు సిగ్నల్స్‌ అందలేదు. తర్వాత వీలు కాలేదు మళ్ళీ చేద్దామనుకునేసరికి చార్జింగ్‌ అయిపోయింది. మొబైల్‌ మీద కోపం వచ్చిందననుకో” అన్నాడు రాఘవ ఇప్పుడెన్ని మాటలు చెబుతున్నాడో అనుకున్నట్టు చూస్తూ వుండిపోయింది పద్మజ.
‘‘నీకో సర్‌ప్రైజింగ్‌ న్యూస్‌, శైలూ! దా ఆంటీకి ఇద్దరం కలిసి చెబుదాం’’ అన్నాడు రాఘవ. ‘‘ఇద్దరు కలిసి చెబుతారా? ఎంత ధైర్యం అనుకుంది పద్మజ.
‘‘ఆంటీ థాంక్యూ ఆంటీ, అంకుల్‌ బుణం ఈ జన్మలో తీర్చుకోలేను’’ అంది శైలజ. ‘అంకుల్‌ని తనకిచ్చేసి నందుకు థాంక్సు చెబుతుందా ఈ అమ్మాయి. ఎంత మారిపోయింది లోకం. ఎంత ధైర్యం ఈ పిల్లకి’ అనుకుంది పద్మజ. ఇంతలో శైలజ మొబైల్‌ రింగ్‌ అయింది. “వన్‌ మినట్‌ ఆంటీ” అని బయటి పరుగెత్తుకుని వెళ్ళి ఒకబ్బాయిని లోపలికి తీసుకు వచ్చింది.
“ఆంటీ ఇతడు విశ్వ. విశ్వను నేను పెళ్ళి చేసుకోబోతున్నాను. విశ్వ మా పద్మజా ఆంటీ” అని ఒకరినొకరికి పరిచయం చేసింది శైలజ. లవ్‌లీ ఆంటీ పద్మజ, స్వీటీ ఆంటీలాంటి అడ్జెక్టివ్స్‌ మరిచిపోయావు” అన్నాడు విశ్వ ‘‘నమస్తే ఆంటీ నేను మీకు తెలియదు కాని మీరు నాకు బాగా తెలుసు. ఎంత బాగా అంటే టీలో మీరు దంచి వేసే అల్లం. తులసికోట దగ్గర మీరు పాడే మంగళ హారతి, మీరు అద్భుతంగా అల్లం పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్రతో చేసే పెసరట్టు అంకుల్‌ ఇష్టమని చేసే మసాల వడ, మీ అబ్బాయి కిష్టమని చేసే కాప్సికం కూర, మీ అమ్మాయి కోసం చేసే బాదుషాలు, వాకిట్లో మీరు వేసే అందమయిన ముగ్గు, కర్టెన్‌ పై కుట్టిన గులాబి పువ్వు చాలా అంటీ’’ అన్నాడు విశ్వ నవ్వుతూ. ఇదేమిటి శైలజ తననసలు పట్టించుకోదని, వాళ్ళ అంకుల్‌ అంటే ఇష్టమని అనుకుంది పద్మజ మరి ఈ అబ్బాయే తన గురించి ఇంతగా చెబుతున్నాడంటే శైలజ తన గురించి ఎంత మాట్లాడి వుండాలి. అనవసరంగా తనే ఏదేదో ఊహించుకుని ఎంత పిచ్చిగా ప్రవర్తించింది అనుకుంది పద్మజ.
“ఆంటీ మా పెళ్ళికి డాడి ఒప్పుకోలేదు. నాకేమి తోచలేదు. అప్పుడు అంకుల్‌ నాకు ధైర్యం చెప్పారు. విశ్వని కలిసారు. ఎట్లాగైనా మా పెళ్ళి జరిపిస్తానన్నారు. మా నాన్నగారిని కలిసి మాట్లాడతానని ఆయన వివరాలడిగారు. అప్పుడే మయిందో తెలుసా ఆంటీ” అని ఆగింది శైలజ. రాఘవ అందుకున్నాడు. ‘‘శైలజ తండ్రి ఎవరో కాదు మనం మదనపల్లెలో ఉన్నపుడు నాతోబాటు మెడికల్‌ రెప్రజెంటేటివ్‌గా చేసేవాడు. భాష యాసగా ఉందనేదానివి నల్గొండ నరేంద్ర. బాగా డబ్బుందని ఏదో ఉద్యోగం చేయానులకుంటే, వాళ్ళు మదనపల్లి చుట్టుపక్కల వూళ్లు 10 కలిపి ఇచ్చారని సరదాగా వచ్చాడని చెప్పేవాడిని ` అతడే’’ అన్నాడు రాఘవ.
‘‘అల్లం టీ చేయడం నేర్పింది నరేంద్ర అన్నయ్యే కదండీ’’ అన్నది పద్మజ. ‘ఒక నెలగా ఈ మాటలే నడుస్తున్నాయి నాకు శైలుకు మధ్య. అన్నీ అయ్యాక నీకు చెబుదాం. అందర్ని అనవసరంగా టెన్షన్‌ పెట్టవద్దని ఎవరికి చెప్పలేదు. అందుకే నిన్న బయలుదేరి నరేంద్ర దగ్గరికి వెళ్ళాను. ముందు నన్ను చూడగానే సంతోషంతో పొంగిపోయాడు. శైలు వాళ్ళ విషయం మాట్లాడగానే కోపం తెచ్చుకున్నాడు, అరిచాడు. నెమ్మదిగా నచ్చచెప్పాక వాళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాడు” అని ముగించాడు రాఘవ.
‘‘పద్మజ, మా చెల్లెలెలా వుంది. త్వరలో వచ్చి తన చేతి పెసరట్లు తింటానని చెప్పాడు నరేంద్ర “అన్నాడు అతడే మళ్ళీ. మాటు రాకుండా వుండి పోయింది పద్మజ అందరి మాటలు వింటూ. రెండు నిముషాల్లో తేరుకుని కంగ్రాట్‌ శైలూ! నీకు కూడా విశ్వా” ఇప్పుడే వస్తానని బెడ్‌రూంలో కెళ్ళి తన సూట్‌ కేస్‌, ఎయిర్ బాగ్‌ మంచం కిందకి నెట్టేసింది. వంటింట్లోకెళ్ళి రాఘవ కిష్టమని మొన్న తెచ్చిన మైసూర్‌ పాక్‌ తెచ్చి అందరికి ఇచ్చింది.
‘‘ఆంటీ ఇది నా ఫేవరెట్‌ స్వీట్‌ మీకెలా తెలుసు’’ అన్నాడు విశ్వా. మొహాలు చూసుకున్నారు రాఘవ, పద్మజ.
“అన్నం ఒక్కటి పెట్టేస్తాను భోజనాలు చేద్దాం” అంది పద్మజ.
“అంతలోపల కాఫీ తాగుతాం” అన్నాడు రాఘవ.
“పదండి ఆంటీ నేను వీళ్ళకు కాఫీ ఇస్తాను, మీరు కుక్కర్‌ పెడుదురుగానీ “అంటూ పద్మజ వెనక బయు దేరింది శైలజ.
టీ కప్పుతో తుఫాను వెలిసి పోయింది అనుకుంటూ లోపలికి నడిచింది పద్మజ.

“హాయిగా..”

రచన: మంథా భానుమతి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కలలు పండుతున్న ఒక నగరం.. మింటి నుంచి మట్టి మీదికి అమరావతి దిగి వచ్చినట్లు వైభవం ఉట్టి పడుతూ ఉంటుంది. లేచినప్పట్నుంచీ వెనుకనుంచెవరో తరుముతున్నట్లు హడావుడిగా ఉంటారు అక్కడి జనం.
విశాలమైన వీధులు, పెరిగి పోయిన కార్లతో ఎడ్ల బళ్ల కంటే నిదానంగా నడిచే కార్ల తోరణాలతో కళకళ లాడుతుంటాయెప్పుడూ.
ఆ నగర శివార్లలో, ఆధునిక సదుపాయాలతో, రక్షణ వలయంతో, కావలి వారితో.. విశాలమైన ప్రాంగణంలో కట్టిన గృహ సముదాయాలు అనేకం..
పక్కింటి వాళ్లతో, ఎదురింటి వాళ్లతో వినాయక చవితికో, రిపబ్లిక్ డేకో తప్ప కలవని సంస్కృతి.. సాయంత్రం పార్కు కెళ్తే బెంచీల మీద కూర్చుని కనిపించే వృద్ధులు, ఆటలాడే పిల్లలు.. వారిని ఆడించే గ్రాండ్ మాలు, ఆయాలు.. నడి వయసు వాళ్లు, యువత కనిపించేది సూరీడు రాకముందు, వెళ్లిపోయిన తర్వాతే.
అటువంటి గేటెడ్ కమ్యూనిటీలో, ఒక ఇంట్లో.. మధ్యాన్నం రెండు గంటలకి,
“అమ్మా! అమ్మా! గుడ్ న్యూస్..” మారు తాళంచెవితో వీధి తలుపు తెరుచుకుని లోపలికి వస్తూనే ఆనందంతో గట్టిగా అరిచింది రంజని.
“రేపట్నుంచీ వర్క్ ఫ్రం హోమ్. వారానికొక సారి మీటింగ్ కెళ్తే చాలు. బుజ్జిగాడితో ఆడుకోవచ్చు హాయిగా! ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసా ఈ ఆఫర్?”
అప్పుడే పదకొండు నెలల వివేక్ ని ఉయ్యాల్లో పడుకోపెట్టాలని ప్రయత్నిస్తున్న పార్వతి ఉలిక్కి పడింది. ఈ సమయంలో ఆకస్మాత్తుగా అనుంగు పుత్రిక అగుపడ్డం ఇదే.. పసివాడు కూడా ఉయ్యాల్లో లేచి నిల్చుని ముందుకి ఒరిగి పోయి కిలకిలా నవ్వుతూ చేతులు చాపాడు. ‘మ్మ..మ్మ’ అంటూ.
చేతిలో ఉన్న లాప్ టాప్ సంచీని పక్కనున్న మంచంమీదికి విసిరేసినట్లుగా పడేసి, రెండంగల్లో ఉయ్యాల దగ్గరికి వచ్చి కొడుకుని ఎగరేసి ఎత్తుకుంది రంజని. కాసేపు వాడితో ఆడుకుని, కిందికి దింపి.. మొహం కడుక్కుని, గదిలోకెళ్లి పడుక్కుంది బైటి గోల వినిపించకుండా తలుపేసుకుని.
అమ్మ వదిలేసి వెళ్లడం.. తన నిద్ర చెడిపోవడంతో తిక్క తిక్కగా ఏడవడం మొదలెట్టాడు చంటాడు. పార్వతి విసుగు మొహంలో కనిపించనీయకుండా వాడికి స్వెటర్ తొడిగాక చిన్ని తోపుడు బండిలో కూర్చోపెట్టి,.. మర్చిపోకుండా తాళంచెవి దానికున్న సంచీలో పెట్టి బైటికి నడిచింది బండి నెట్టుకుంటూ.
కాసేపు బైట తిప్పగానే వివేక్ బండి లో నిద్రపోయాడు. ఇంట్లోకి తీసుకొచ్చి, బండిని హాలు మధ్యలో ఉంచి. పక్కనున్న సోఫాలో వాలి పోయింది, కళ్లు మూసుకు పోతుంటే. అలా ఎంత సేపు పడుకుందో కూడా గ్రహింపు లేదు.
“అమ్మా! ఏంటిక్కడ నిద్రపోయావు? వివ్వీ చూడు ఎలా ముడుచుకుపోయున్నాడో! వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి, నువ్వు మంచం మీద పడుకోవచ్చు కదా! ఇలా అడ్డదిడ్డంగా పడుకో పెట్తే గ్రోత్ సరిగ్గా ఉండదు.” రంజని తట్టి లేపుతుంటే కళ్లు నులుముకుంటూ లేచింది పార్వతి. కాసేపు ఎక్కడుందో అర్ధం కాలేదు.
గ్రోతా? కూతుర్ని ఎగాదిగా చూసింది.. ఐదడుగుల ఎనిమిదంగుళాలు. ఎత్తుకు సరిపోయే లావు మంచి శరీరసౌష్టవం. దీన్నెక్కడ పడుకోబెట్టానూ అనుకుంది. వంటింటి పక్కనున్న వరండాలో వాసానికి కట్టిన చీర ఉయ్యాల్లో, వెచ్చగా అటూ ఇటూ కదలడానికి లేకుండా.. మరి ఇంత పొడుగెట్టా అయిందీ? పార్వతి మాట్లాడకుండా లేచి, చీర సవరించుకుని వంటింట్లోకి నడిచింది. కాసిని కాఫీ చుక్కలు పడ్తే కానీ బుర్ర పన్చెయ్యదు. పొద్దున్న ఆరింటికో కప్పు, సాయంత్రం నాలుగింటికో కప్పు స్చ్రాంగ్ కాఫీ ఉండాలి తనకి. కూతురికేదైనా సమాధానం చెప్తే అరగంట క్లాసు తీసుకుంటుంది.
ఇద్దరికీ కాఫీ కలిపి, ఒక కప్పు రంజనికిచ్చి కిటికీ దగ్గర కూర్చుని ఆకాశం కేసి చూస్తూ చప్పరించ సాగింది. ఒకదాన్నొకటి తరుముకుంటూ మేఘాలు పరుగెడుతున్నాయి. ఇప్పటి మనుషుల్లాగే వాటిక్కూడా హడావుడే.. ఆగి నాలుగు చుక్కలు కురిసి వెళ్దామని లేదు. నవ్వుకుంటూ లేచి కప్పు లోపల పెట్టొచ్చింది.
“అమ్మా.. ఇదిగో, నాది కూడా..” కాళ్లు జాపుకుని కూర్చుని, ప్రామ్ లో నిద్రపోతున్న చంటాడి ముద్దుమొహం మురిపెంగా చూసుకుంటున్న కూతురి కప్పుకూడా తీసుకెళ్లి సింకులో పడేసొచ్చింది.. “నన్ననే బదులు వాడిని మంచం మీదో, తొట్లోనో పడుకోపెట్టచ్చు కదా” అనుకుంటూ.
ఎవరికైనా ఎదుటివారి పనుల్లో తప్పులెంచడం సులువే.. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ప్రభావం ఏమిటో.. పార్వతికి అప్పుడే గుర్తుకొచ్చింది. చంటాడు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోనీయడు. రెండుసార్లు డయపర్ మార్చాలి. ఒకసారి నీళ్లు పట్టాలి. తనకి నిద్రలో లేస్తే అరగంటకి కానీ మళ్లీ నిద్ర పట్టదు. రాత్రేనా తన దగ్గర పడుకోపెట్టుకోదు రంజని. పగలంతా ఆఫీసులో అలసి పోయొచ్చి, రాత్రి పదకొండువరకూ వేరే దేశంలో ఉన్న వాళ్లతో కలిసి పని చేసి, అప్పుడు నిద్ర పోతుంది. నిద్రపోయేటప్పుడు, వచ్చి కొడుకుని ముద్దు పెట్టుకుని వెళ్తుంది. పార్వతికి కూడా ఏమీ అనాలనిపించదు. నెమ్మదిగా ఇంకొక ఏడు చూసుకుంటే, డేకేర్ లో వేసెయ్యచ్చని పళ్ల బిగువున భరిస్తోంది.
అల్లుడి దగ్గర్నుంచి ఏ సహాయమూ ఆశించలేదు. ఏదో స్వంతంగా స్టార్టప్ ట.. తెల్లారకుండా వెళ్తే అర్ధరాత్రే రావడం. వారానికోసారి కొడుకుని ముద్దాడడానికి సమయం చిక్కితే గొప్ప.
పార్వతికదే అర్ధం కాదు.. ఇంతింత ఎత్తుభారం పనులు అవసరమా? సగం తగ్గించుకుని, ఆ వచ్చే డబ్బుతో కాస్త మనుషుల్లా జీవించచ్చు కదా! ఒకసారెప్పుడో అంటే. అంతెత్తెగిరింది కన్నకూతురు.
“అంత కష్టపడి కాంపిటీషన్లకి తట్టుకుని చదివి ఇంట్లో కూర్చోడానికా? పైగా.. ఈ సదుపాయాలన్నింటికీ ఇయమ్మైలు కట్టాలి. దానికి డబ్బెక్కడ్నుంచొస్తుంది? అందుకే కదా, నిన్ను ఉద్యోగం మానేసి రమ్మంది. నీకు అలవాటే కదా పిల్లల్ని పెంచడం. ఎంజాయ్ చేస్తావు కూడా. మరెందుకా గొణుగుడు?”
అదంతా తలచుకొని గట్టిగా నిట్టూర్చింది పార్వతి.
అంత మధురమైనదేం కాదు పార్వతి గతం. రంజనికి సంవత్సరం పూర్తయే వరకూ బాగానే ఉన్నాడు కామేశ్వర్రావు. ఏ క్షణంలో ఏ పాము ఎవర్ని కాటేస్తుందో చెప్పలేరెవరూ. పార్వతి పసిదానితో అవస్థ పడుతుంటే, సరదాగా మొదలుపెట్టిన పేకాట వారి జీవితాల్ని అస్తవ్యస్తం చేసేసింది. జీతం అందుకున్న మూడు నాలుగు రోజుల వరకూ ఇంటికే రాకపోవడం.. మిగిలిన చిల్లర మాత్రం మంచం మీదికి విసిరెయ్యడం వరకూ వచ్చింది.
పార్వతికి దిక్కు తోచని పరిస్థితి.. అమ్మింట, అత్తింట కూడా ఎవరూ ఆదుకునే వారు లేరు.
“నీ పాపతో పాటుగా ఇంకా కొందరిని చూసుకుంటే ఉద్యోగినులకి సదుపాయం, నీకు ఆదాయం.” పక్కింటి పిన్నిగారు సలహా ఇచ్చారు, పార్వతి కష్టాలు చూడలేక.
వెంటనే, ఉన్న ఇంట్లోనే ముందు గదిలో “అమ్మ ప్రేమ” అనే డే కేర్ మొదలు పెట్టింది. నిబద్ధతతో పనిచేస్తుండడంతో, త్వరలో పిల్లల సంఖ్య పెరగడం, పెద్ద ఇల్లు తీసుకోవడం ఆయాలని పెట్టుకోవడం జరిగింది. అది పెరుగుతుండగానే, పేకాట సిగరెట్లు ఎక్కువయి, ఒక రోజు క్లబ్బులోనే కన్ను మూశాడు కామేశ్వర్రావు.
ఒకోసారి మనుషులు ఉన్నప్పటికంటే లేనప్పుడే బ్రతుకులు బాగా సాగిపోతాయి. కామేశ్వర్రావు బ్రతికున్నప్పుడు పార్వతికి చికాకులు, చీవాట్లు తప్ప ఇంకేం దక్కేది కాదు. పొద్దున్న లేచి కాఫీ, టిఫిన్ కానిచ్చి బైట పడ్తే రాత్రే రావడం.. డబ్బుల్లేకుండా పేకాటెట్లా అనుకునేది పార్వతి.. ఆడే వాళ్ల వెనుక కూర్చుని ఆనందిస్తుంటాడని తెలిసి గట్టిగా నిట్టూర్చడం తప్ప ఏం చెయ్యలేక పోయింది. అలకలూ, ఏడుపులూ, బెదిరింపులూ, కూతురి ఆటపాటలూ ఏవీ అతని ఆగడాలని ఆపలేకపోయాయి.
రంజని చదువూ, వుద్యోగం, పెళ్లీ.. అన్నీ జరిగి కాస్త ఊపిరి పీల్చుకుందామని పార్వతి అనుకునే సమయంలో వివేక్ వచ్చాడు.
పార్వతిని ఉన్న ఊర్లో అంతా సర్దించేసి తన దగ్గరికి తీసుకొచ్చేసింది రంజని.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. భార్యా భర్తలిద్దరికీ లక్షల్లో జీతాలు. దానికి తగ్గ జీవన విధానం. ముందు సరుకులు తెచ్చుకుని ఆ తరువాత డబ్బు కట్టగల సదుపాయం. అయితే.. ఈ ఆర్ధిక ఆనంద సాగరం ఈదుతూ తాము ఏం కోల్పోతున్నారో తెలుసుకోలేక పోతున్నారు.
పార్వతికి అదే బాధగా ఉంటుంది.
పూర్తిగా పసివాడి పాలన తను కూడా చూడలేకపోతోంది. తను క్రెష్ నడిపేటప్పుడు చేతి కింద మనుషులుండే వారు. ఏటికేడూ వెళ్లే వయసే కానీ వచ్చేది కాదు. అందులో వివ్వీగాడు బొద్దుగా ఉంటాడు. కాసేపు ఎత్తుకుంటే నడుం పీకేస్తుంది. ఆ డయపర్లొకటి.. ఓ కాలేస్తుంటే ఇంకో కాలు తీసేస్తాడు. లేకపోతే ఇంగ్లీష్ యస్ అక్షరంలా తిరుగుతాడు. ఇంక అన్నం పెట్టడానికీ, పాలు తాగడానికీ.. ఇదీ అదీ అని లేదు.. అన్నింటికీ వాడికి తోచిన అల్లరి చేస్తుంటాడు. ఎవరైనా చేస్తుంటే బానే ఉంటుంది వాడి నవ్వులు ఆనందించచ్చు. కానీ.. ఈ వయసులో సాధ్యం అయే పనేనా?
“అమ్మా! రేపట్నుంచీ ఇంట్లోనే. హాయిగా!” సోఫాలో కూర్చుని లాప్ టాప్ తెరుస్తూ అంది రంజని.
అంతలో చంటాడు కదిలాడు. కాసేపు ఒళ్లు విరుచుకోడం అయాక సన్నగా రాగం మొదలెట్టాడు.
చటుక్కున లేచి రంజని తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ‘మళ్లీ ఆఫీసుపని మొదలు’ అనుకుంది పార్వతి. తప్పేదేవుంది.. తన రోజువారీ కార్యక్రమంలో పడిపోయింది..

*****

“వివ్వీ బాబూ! ఎక్కడా.. రావాలీ..” చేతిలో వెండిగిన్నెలో పెరుగన్నంతో గట్టిగా పిలుస్తూ వచ్చింది పార్వతి.
“ష్.. అమ్మా! గట్టిగా మాట్లాడకు. మీటింగ్ లో ఉన్నా.” రంజని ముక్కు మీద వేలేసి, గదిలోకెల్లింది.. తన ఆఫీసు బల్ల దగ్గరకి. ఇంట్లోంచి పని మొదలుపెట్టి వారం అవుతోంది.
పార్వతి కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతలో చంటాడు గట్టిగా ఏడుపు మొదలు పెట్టాడు. విసుగ్గా మొహం పెట్టి వచ్చి, తలుపేసేసింది రంజని. వాడూరుకుంటాడా.. తపతప చేతుల్తో నేల మీద కొడ్తూ, తలుపు దగ్గరే కూర్చుని రాగం పెంచాడు.. మ్మ..మ్మ అంటూ.
గిన్నె బల్ల మీద పెట్టి, బలవంతంగా చంటాడ్ని ఎత్తుకుని ప్రామ్ లో కూర్చోపెట్టింది. వెంటనే ఏడుపు ఆపేశాడు.. గిన్నె, ఇంటి తాళాలు పట్టుకుని వాడి బండి నెట్టుకుంటూ ఇంట్లోంచి బైట పడింది పార్వతి. పార్కులో పిట్టల్ని చూపిస్తూ అన్నం తినిపించి, అటూ ఇటూ తిప్పుతుండగా నిద్ర పోయాడు. నెమ్మదిగా ఇల్లు చేరింది.
“ఎక్కడికెళ్లి పోయావమ్మా? మీటింగయిపోయి అరగంటయింది. వివ్వీ గాడితో ఆడుకుందామంటే నువ్వెక్కడికెళ్లావో తెలీదు..” నిష్ఠూరంగా అంటున్న కూతురి కేసి సుదీర్ఘంగా చూసింది పార్వతి.
రంజని ఇంట్లోనించే పని చెయ్యడం మొదలు పెట్టి పది రోజులయింది.
పార్వతికి వత్తిడి పెరిగిపోయింది. కూతురు ఆఫీసు కెళ్తుంటే నెమ్మదిగా తనకి తోచినట్లు చేసుకునే పని..
ఇప్పుడు ఆవిడ పర్యవేక్షణలో జరగాలి. అంతా ఇంటర్ నెట్ లో చెప్పినట్లుగా. డయపర్ తడిసినప్పుడు మార్చేది.. చంటి వెధవ ఎలాగా ఏడుస్తాడు తడపగానే. ఇప్పుడలా కాదు, రెండేసి గంటలకోసారి మార్చి తీరవలసిందే. వాడు మంచి నీళ్లు కావాలని ఏడుస్తాడు చూపిస్తూ.. ఇవ్వకూడదు. పాలలో ఉన్న నీళ్లు సరిపోతాయిట.
ఇవన్నీ సరిపోనట్లు.. ఇంట్లో ఉంటుంది కనుక వేడి వేడిగా లంచ్ తయారు చెయ్యాలి. పార్వతి తన మటుకూ, రాత్రి మిగిలినవి తినేస్తుంది, వెచ్చబెట్టుకుని.
“ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదమ్మా? ఒక్కరగంట ముందు వండేస్తే, జస్ట్ చపాతీలు కూర చాలు.. ఫ్రెష్ గా తినచ్చు.”
నిజమే.. కానీ ఎందుకింత అలసటగా చికాగ్గా ఉంటుంది? అంత మంది పిల్లల్ని అన్ని సంవత్సరాలు చూసుకున్న తను ఒక్క పాపడిని చూడలేకపోతోందెందుకు? కాళ్లు సాగనని మొరాయిస్తాయెందుకు?
అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే.
లాభం లేదు. ఇలాగే నడుస్తుంటే తనకి పిచ్చెక్కడమో, పెరాలిసిస్ రావడమో ఖరారే.
ఆ రోజున అల్లుడు కూడా ఇంట్లో ఉన్నాడు. చంటాడు పడుక్కున్నాడు. భోజనాలయ్యాయి. వంట చాలా బాగుందని మెచ్చుకుంటూ తిన్నారు. అదే సరైన సమయం అనుకుంది పార్వతి.
“మీ ఇద్దరితో మాట్లాడాలి బాబూ! ఒక గంట, ఫోన్లు, లాప్ టాప్ లు కట్టెయ్యండి.”
ఆశ్చర్యంగా చూస్తూ కట్టేసొచ్చారు.
“నా వల్ల కావట్లేదు ఇక్కడుండటం.” మొదలు పెట్టింది.
“అదేంటమ్మా..” ఏదో అనబోతున్న రంజనిని చెయ్యి పట్టుకుని ఆపేశాడు అల్లుడు.
“నిజమే.. నేను ఖాళీగానే ఉన్నాను. పిల్లలని పెంచడంలో అనుభవం కూడా ఉంది. అది నా వృత్తి. అయితే అన్ని సంవత్సరాలు చులాగ్గా ఆనందంగా చేసిన పని ఇక్కడెందుకు కష్టమవుతోంది? పంటి బిగువున సర్దుకుందామని చూస్తూనే ఉన్నా కానీ.. ఏదో చెప్పలేని బాధ. భరించలేకపోతున్నా. నువ్వు ఆఫీసుకెళ్లేటప్పుడు అంత అనిపించలేదు. అదిగో.. వర్క్ ఫర్ం హోమ్ అని సంతోషంగా చెప్పావు చూడు.. అప్పట్నుంచీ..”
“నేనేం చేశాను?” రంజని నిష్ఠూరంగా అంది.
“నువ్వేం చెయ్యట్లేదు. అదే సమస్య. పిల్లవాడిని దగ్గర కూడా పడుకోబెట్టుకోవు. ఖాళీ ఉన్నప్పుడు ఆడుకుని, వాడి అవసరాలకి నన్ను పిలుస్తావు.రాత్రి మూడుసార్లు లేవాలి. ఈ వయసులో లేస్తే అరగంట పైగా పడుతుంది నిద్ర రావడానికి. కునుకు పడుతుండగానే మళ్లీ లేవాలి. పనిమనిషి, గంట ప్రకారం తన పని చేసుకుపోతుంది. మనూళ్లో లాగా ఇక్కడ బంధాలుండవు.”
రంజని ఏదో అనబోతుంటే చేత్తో ఆగమని చెప్పింది.
“ఇది మనం ఆవేశాల్లేకుండా సామరస్యంగా పరిష్కరించుకుందాం. నాకేదైనా జబ్బు చేస్తే మీకే కష్టం. ఇలాగే సాగుతే తప్పకుండా వస్తుంది ఏదో ఒకటి. పైగా ప్రతీ పనికీ నీకు సమాధానం చెప్పుకోవాలి. అంత మంది పిల్లల్ని పెంచిన నాకు పెంపకం మీద లెక్చర్లు.. నీ ప్రతీ పనినీ నీ వెనుకే ఉండి నీ బాస్ చూస్తుంటే చెయ్యగలవా? అలాగే అయింది నా పని. పైగా పిల్లాడిక్కూడా వత్తిడి పెరుగుతోంది. నువ్వు కనిపించకపోతే ఆ సంగతి వేరు.. కనిపిస్తావు కానీ అందవు. పక్క గదిలో ఉన్నావని తెలుసు, కానీ నీదగ్గరికి రావడానికి లేదు. నీ తలుపు దగ్గరే కూర్చుని కూర్చుని అక్కడే పడుకుంటున్నాడని నీకు తెలుసా? ఇంటి పనిలో ఏమైనా సాయానికి వస్తావా? అల్లుడుగారితో సమానంగా సంపాదిస్తున్నా కదాని వంటింట్లోకే రావు. ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇద్దరూ పనులు పంచుకోవాలన్నారు కానీ, ఇద్దరినీ పనులు చెయ్యద్దనలేదు కదా! జీవితంలో ఎన్నో ఆటు పోట్లెదుర్కున్నాను. ఇంక నాకు శక్తి లేదు.” మాట్లాడడం ఆపేసి, కళ్లు మూసుకుని రొప్పసాగింది పార్వతి.
కాళ్ల దగ్గర ఏదో కదులుతున్నట్లైతే కళ్లు తెరిచింది.
కూతురు కింద కూర్చుని పార్వతి మోకాళ్ల మీద చేతులు వేసింది.
“సారీ అమ్మా! ఇలా ఓపెన్ అయి మంచి పని చేశావు. ఈ ప్రాజక్ట్ అవగానే.. పదిహేను రోజుల్లో.. నేను ఒక సంవత్సరం ఆఫ్ తీసుకుంటాను. అది త్వరగా పూర్తి చెయ్యడానికి రేపట్నుంచీ ఆఫీసుకెళ్తాను. వర్క్ ఫ్రం హోమ్ కాదు..”
“అమ్మయ్య.. హాయిగా.. ఉంది. సగం భారం తగ్గింది గుండె లోంచి.”
చంటాడు లేచి, ఉయ్యాల కడ్డీ పట్టుకుని నిల్చున్నాడు. పార్వతి లేవబోయింది.
“నేను చూస్తాను. నువ్వు కాసేపు పడుకోమ్మా!” రంజని చటుక్కున లేచింది. వివేక్.. హుషారుగా అమ్మ చేతుల్లోకి దూకాడు.
“ఓరినీ.. నే చేసిందంతా అట్టే పోయిందిరా..”
“అంతే అత్తమ్మా! అంతా అవకాశవాదం. హాయిగా చేయించుకుంటారు.. వెనక్కి తిరిగి చూడరు. అదే న్యాయం ఇప్పుడు.”
ఒళ్ళంతా తేలిగ్గా హాయిగా అనిపించి, సోఫాలోంచి తేలిగ్గా లేచింది పార్వతి.

*————————–*

పరాన్నభుక్కు

రచన: శశికళ ఓలేటి

“జోగారావుగారికి బాగా సీరియస్ గా ఉందిట కదా. నెల్లాళ్లు ఐసీయూలో ఉంచి, లాభం లేదు. ఇంటికి తీసుకెళ్లిపోండి, అయినవాళ్లనందరినీ ఆఖరిచూపులుకు పిలుచుకోండి అని చెప్పేసారంట కదా! అప్పుడే వారమయిందట ఇంటికి తీసుకొచ్చి………..”, ధనలక్ష్మితో అదే తలనొప్పి. మొదలెట్టడమే. అవతలి వారికి మాటాడే అవకాశం ఇవ్వదు. భార్య వాక్ప్రవాహానికి అడ్డుకట్టేస్తూ రాంబాబు అందుకున్నాడు.
“అవును! తెలుసు! ఇప్పుడు అక్కడినుంచే వస్తున్నా! అయితే ఏంటంట?!”…… కాస్త కటువుగా పలికాడు.
“ఏంటంటారేంటండీ! జోగారావుగారు మన యజమాని. మీ బాల్యస్నేహితుడు. పైగా వామాక్షి నా ఫ్రెండు.
నాకు కనీసం మాటయినా చెప్పలేదు ఎవరూ. నేనింకా ఏదో సుస్తీయే అనుకుంటున్నా ఇంకా! ఇంత సీరియస్ సిట్యుయేషన్ అని చెప్పద్దూ మీరు!
మన చిన్నది అమెరికా నుండి కాల్ చేసి చెప్పింది. వాళ్ల చిన్నబ్బాయి కూడా వచ్చేసాట్ట కదా!
మనం ఇలాంటి సమయంలో దగ్గర లేకపోతే నలుగురూ ఏమనుకుంటారు?……….
మళ్లీ ఆపాల్సి వచ్చింది అతనికి ఆమె వాగ్ధోరణి.
“ఏం మాట్లాడుతున్నావ్ ధనా? వాడు మనకు యజమానేమిటి? నన్ను బిజినెస్ పార్టనర్ గా చేర్పించి, మన ఆస్తంతా అమ్మించి పెట్టుబడి పెట్టించి, ఆనక నష్టాలొచ్చాయని కంపెనీ మూసేసాడు!
కొత్త వ్యాపారం మొదలెట్టి, కోట్లు గడించాకా, నాకన్నా విశ్వాసపాత్రుడు దొరకడని, నన్నే మేనేజర్ గా పెట్టుకుని, పూలమ్మిన చోట కట్టెలమ్మిస్తున్న చీట్ ఆ జోగారావు. స్నేహం విలువెరగని ట్రైటర్ వాడు. మంచి శాస్తే అయింది.
అందరి పొట్టలూ కొట్టి, సంపాదించింది తినకుండానే పోతున్నాడు”!……. కక్షగా నొక్కి మరీ చెప్పాడు రాంబాబు.
“నిజమేనండి! ఆ వామాక్షి మాత్రం తక్కువా! చీరల వ్యాపారం పెడదామంటే, మా అమ్మా వాళ్లిచ్చిన ఎకరమూ అమ్మి చేతులో పెట్టా! మూడునెలలు లాభం చూపించి నాలుగోనెల కస్టమర్లు డబ్బివ్వలేదని మూసేసింది. ।
నా చేతిలో పదిచీరలూ, పదివేలూ పెట్టేసి నోరుమూయించి, గప్ చుప్ గా దొడ్డిదారిని వ్యాపారం చేసుకుంది అప్పట్లో! విచిత్రం చూడండి వామాక్షి అంటే కుచేలుడి పెళ్లామంట. మనం కుచేలుళ్లమయ్యాం. ఆమె ధనలక్ష్మి అయిపోయింది. అయినా దేవుడున్నాడా అసలు? ఈ అన్యాయాలు చూస్తూ కూడా ఎలా సహిస్తున్నాడో………….”
భార్యనాపకపోతే ఆమె శాపాలకి ప్రపంచం భస్మమైపోతుందని గ్రహించి, రాంబాబు
“సరే! తయారవ్వు. నువ్వూ ఒకసారి చూసేద్దువు గాని ఆ జోగిగాడిని”….. అంటూ బాత్రూంలో దూరాడు.
స్నానం చేసొచ్చి, కాస్సేపు ధ్యానం చేద్దామని కూర్చున్నాడు కానీ, ఎక్కడా మనసు లగ్నం అవ్వడం లేదు. జోగారావు మీదకే ఆలోచనలన్నీ మళ్లాయి.
పెంటపాడులో తన తండ్రి పెద్దకామందు. తనూ, తన అన్నగారూ పిల్లజమిందార్లలా తిరిగేవారు. ఈ జోగిగాడు కరణంగారబ్బాయి. పదిమంది పిల్లల్లో ఎనిమిదో వాడు. తన తండ్రికీ, కరణం గారికీ ఉన్న లావాదేవీల వలన జోగారావు తండ్రితో తమింటికి వస్తూ పోతూ తనకి మిత్రుడయ్యాడు.
తనూ, అన్నయ్యా ఆడుకుంటుంటే ఆటలో అరటిపండులా వచ్చిచేరి, కొంచెం సేపటికే లీడర్ అయిపోయేవాడు. ఖాళీజేబులు గోళీలతో నిండేవి. కొన్నాళ్లకి వయసుతో పాటూ వాడు గెలుచుకునే వస్తువులూ పెరిగాయి. బాట్లు, బుష్ షర్టులు, రేమాండ్ పేంట్లు, రేబాన్ కళ్లద్దాలు, చివరకు తమ పాకెట్ మనీలూ.
వాళ్ల నాన్నా తక్కువ తినలేదు. తన తండ్రి మంచితనాన్ని ఆసరా చేసుకుని, తిమ్మిని బమ్మి చేసి, ఆరుగురి కూతుళ్ల పెళ్లి చేసాడు.
ఖర్మకాలీ జోగారావు తనకు కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో కూడా తగులుకున్నాడు. అరబ్బూ-ఒంటే కధలోలా, మెల్లగా తన గదంతా హాయిగా ఆక్రమించి, తన తిండి తిని, తన బట్టలన్నీ వాడి, తనతోనే ఫీజులు కట్టించి మొత్తానికి ఇంజినీరయ్యాననిపించాడు.
అలా కేవలం కాళ్లూ, చేతులతో వచ్చేసి, పైసా ఖర్చుపెట్టకుండా పైకొచ్చినవాడు అతనే. పొరుగువాడిదేదైనా తనది కావలసిందే. నవ్వుతూనే అవతలివాళ్ల మెడకాయమీంచి తలకాయ లాగేసే రకం.
ఎలా సంపాదించాడో తెలీదు, తన అత్తెసరు మార్కులతోనే, నాగార్జున సాగర్లో అసిస్టెంట్ ఇంజినీరుగా చేరిపోయాడు.
అక్కడే తమకు బంధువులయిన ఈ. ఈగారి కూతురు వామాక్షిని పెళ్లాడేసి, అంచెలంచెలుగా ఎదిగిపోయాడు.
వామాక్షి విషయంలోనూ వంచనే!
నిజానికి వామాక్షి తన మేనత్తకూతురు. తనకనుకున్న సంబంధం. చూచాయిగా ఈ విషయం జోగికి తెలుసు.
అంతే సాగర్ వెళ్లడమేమిటి పావులు కదిపి, తన మేనత్త వేపునుండి నరుక్కొచ్చి వామాక్షిని సొంతం చేసుకున్నాడు.
అప్పుడే తనని అన్నయ్య హెచ్చరించాడు. జోగిగాడి నీడకూడా పడకుండా దూరంగా ఉండరా అని!
తండ్రిపోయాకా, ఆస్తుల పంపకం చేసుకుని తను కాకినాడలో కాంట్రాక్ట్ లు చేసుకుంటూ, బానే సంపాదిస్తూ ఉండేవాడు. ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉంది జీవితం.
అదిగో అప్పుడే మళ్లీ ఊడబడ్డాడు జోగారావ్. ఉద్యోగం ఒదిలేసి కాంట్రాక్టర్ అవతారం ఎత్తానని, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్, నేవీ క్వార్టర్స్ సబ్ కాంట్రాక్ట్ దొరికిందని, మొత్తం రెండొందల కోట్ల పనులనీ….. ఓ ఊదరగొట్టేసాడు.
వచ్చినప్పుడల్లా, కొత్తకారులో రావడం, పిల్లలకేవో బహుమానాలు తేవడం చేసేవాడు.
మెల్లగా జోగారావ్ చూపించే అరచేతి వైకుంఠం తనకీ, ధనాకీ బాగా బుర్రకెక్కింది.
అన్నగారు చెప్తున్నా వినకుండా తన వంతు ఆస్తులమ్మి జోగారావ్ ఫర్మ్ లో పెట్టాడు.
చాకిరీ యేమో తనది.
బిల్లులూ, బడ్జెట్లూ వాడివీ.
ఆఖరికి ఐదేళ్లకల్లా ఫర్మ్ లో నష్టాలూ, తన చేతికి చిప్పా చూపించాడు.
కొన్నాళ్లకు జోగారావ్ పెట్టిన”వామాక్షీ ఇంజినీరింగ్ కంపెనీకి”మేనేజర్ లెవల్లో తను కుదురుకోవలసి వచ్చింది.
జోగారావ్ నల్లగా ఉంటాడు. పెద్ద పర్సనాలిటీ కూడా ఉండదు. కానీ సమ్మోహనంగా నవ్వుతాడు. అంతకన్నా మధురంగా మాట్లాడతాడు.
ఈ నేర్పుతోనే ఇద్దరు వంటరి మహిళలు ఆస్తులతో సహా ఇతనివైపు ఆకర్షితులయ్యారు. అవన్నీ తెరవెనుక భాగోతాలే!
వామాక్షికి ఇవన్నీ పెద్ద పట్టింపు లేదు. “భర్త సమర్ధుడు! అదే చాలు!”అనుకునే మనిషి. ధనలక్ష్మి వట్టి భోళా! అమాయకురాలు. తనకి తగ్గట్టే!
జోగారావు పుణ్యమా అంటూ ఎక్కడో ఉండవలసిన తన కుటుంబం ఎక్కడికి చేరిందో తలుచుకున్నప్పుడల్లా తన మనసు వికలం అయిపోతుంది.
దీర్ఘంగా నిట్టూర్చి, ధ్యానం నుండి లేచాడు. అప్పటికే ధనలక్ష్మి తయారయి ఉంది.
*^*^*^*^*
కారు డ్రైవ్ చేస్తున్న రాంబాబు దృష్టి యూనివర్సిటీ రోడ్డుపక్క అమ్ముతున్న లేతాకు పచ్చలో పెద్దపెద్ద దబ్బకాయలంత జామకాయల మీద పడింది. కారాపి, బేరం చేసి డజను ఎనిమిదొందలికి కొని తెచ్చాడు.
“మతి లేదేంటి? కోమాలో ఉన్నవాడికి పళ్లెందుకు? ఇంట్లో వాళ్లు మింగడానికా?….. కోపంగా అడిగింది ధన!
“అన్నట్టు చెప్పలేదు కదూ! జోగారావ్ ఇప్పుడు డెలీరియంలో ఉన్నాడు. అస్తమానూ”జామకాయ”జామకాయ”! అనే కలవరిస్తున్నాడు.
వాడికి పాపం చిన్నప్పటి నుండి జాంకాయలంటే పిచ్చి. అందరి గోడలెక్కి, అందరి దొడ్లలో దూరి జాంకాయలు దొంగతనం చేసి తన్నులు తినేవాడు.
మా రామారావు సార్ వాడిని”దొంగ జాంకాయ!”అనేవారు. వాడికి ఆఖరికోరిక లాగుంది జామకాయ తినడం.
వామాక్షి పాపం కడియం, ద్వారపూడి, పాలకొల్లు, విజయవాడ మనిషిని పంపి జాంకాయలు తెప్పించింది.
పెద్దకొడుకు కలకత్తానుండి తెచ్చాడు. చిన్నాడు అమెరికానుంచి మెక్సికో జాంపళ్లు తెచ్చాడు. ఆడపిల్ల ఇంకో మెట్టెక్కి ఏకంగా చైనానుండి జాంపళ్లు తెప్పించింది. వాళ్ల బావగారు ఏదో ఎయిర్ లైన్స్ డైరక్టర్ కదా!
జోగి ముందు ఎన్ని రకాలు చూపించి, ముక్కలు పెట్టినా ఆత్రంగా చూడడం, నిరాశగా మొహం తిప్పి, కిటికీ కేసి, యమదూతల కోసం చూస్తున్నట్టు చూస్తుంటాడు.
వెధవ! ఎంత శత్రువయినా ఇప్పుడు ఇలా చూస్తుంటే కడుపుతరుక్కుపోతోంది.
అప్పటికీ నేను మనూరు జాంకాయలూ తెప్పించా! అన్నయ్యకు చెప్పి!
కాదుట! కళ్లమ్మట నీరు కారుస్తాడు! జాంకాయ! జాంకాయ్ అని గొణుగుతాడు. అందుకే ధనా ! ఇవి కొన్నా”……… చెప్తూనే చొక్కా లోపల పేంట్లో దోపుకున్న పవర్ ఆఫ్ అటార్నీ కాయితాలు తడుముకున్నాడు రాంబాబు!!
ధనలక్ష్మి కళ్లల్లో కూడా నీళ్లు చిప్పిల్లాయి.
వెళ్తూనే ధనలక్ష్మి వామాక్షిని కావులించుకుని భోరుమంది.
వామాక్షి ఆల్రెడీ ప్రిపేర్ అయివుండడంతో, అతి ప్రయత్నం మీద కన్నీరు సృష్టించుకుని, ధనని పొదివిపట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి, జాగారావు కేమయిందో, ఏమవబోతోందో అన్నీ చెప్పుకొచ్చింది.
ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంది. ఈవేళో రేపో అనుకుని వచ్చేసిన చుట్టాలంతా సోఫాల్లో, వరండాల్లో, గదుల్లో, లాన్లో సర్దేసుకున్నారు!
పెద్ద ఇల్లేమో ! పిల్లలంతా హాయిగా పరుగులెడుతూ ఆడుకుంటున్నారు! కొంత మంది చేతుల్లో కాఫీకప్పులూ, అందరి చేతుల్లో మాత్రం జాంకాయలు. ఇల్లంతా పండిపోయిన జాంపళ్ల వాసనతో ఒకలా ఉంది.
ధనా, వామాక్షి, రాంబాబు…. జోగారావు గదిలోకి వెళ్లారు. మనిషి నెలలోనే చిక్కిశల్యమై మంచానికి అతుక్కుని ఉన్నాడు.
ఏసీ గదిలో వెంటిలేటర్ల శబ్దం తప్ప మారులేదు. ధనలక్ష్మి నీరునిండిన కళ్లతో అతని చెయ్యి పట్టుకుంది.
కన్నీరు కారుస్తూ”జాంకాయ”అంటూ నిర్వేదంగా బయటకు చూస్తున్నాడు జోగారావ్.
ఒక్కసారి ఘొల్లుమంది వామాక్షి
“ఇది ధనా! వరస!….. అంటూ!
ధన తను తెచ్చిన జాంకాయలు రెండు చేతుల్లో పట్టుకుని అతని కళ్లముందాడించింది. మార్పులేదు.
చూపు కూడా తిప్పలేదు.
నిరాశగా ఆడవాళ్లిద్దరూ గదినుంచి నిష్క్రమించారు.
రాంబాబు చలనం లేని జోగి చెయ్యి తనచేతిలోకి తీసుకుని,
“జోగారావ్! నీతో కొంచెం మాట్లాడాలి. నీ పరిస్థితి నీకు తెలుసో లేదో నాకు తెలీదు కానీ నువ్వింక బ్రతికి బట్టకట్టవని డాక్టర్లు తేల్చేసారు.
అమెరికా తీసుకెళ్లడానికీ లేదు. నీ బీపీ, పల్స రేట్ పడిపోతున్నాయి. ఇలా వెన్నెముక విరిగిపోయి, కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి, నువ్వు రోజుల్లో ఉన్నావు.
నీ వ్యాపారం నీ కలల సౌధం అని నాకు తెలుసు!!నీ తరువాత ఎవరు? అన్నది ఎవరికీ అవగాహన లేదు !
మన ప్రాజెక్టుల మీద నాకు తప్పా మరి ఎవరికీ పూర్తి సమాచారం లేదు!
నేను మోసగాణ్ని కాదని నీకు తెలుసు. తలుచుకుంటే నేనిప్పుడే నీ అప్పోనెంట్స్ తో చేతులు కలిపి కావలసిన సమాచారం అందించచ్చు. కానీ నేనెప్పటికీ అలా చెయ్యను.
కనుక నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇయ్యి. నీ వ్యాపారం పువ్వుల్లో పెట్టి చూసుకుని భద్రంగా నీ కొడుకులకు అప్పజెప్తా!”……..
అది వినగానే, జోగారావు మొహంలోకి కోపం ఛాయలు పొడజూపాయి.
“వామాక్ క్ క్…… అనుకుంటూ గొణిగాడు!
“ఛీఛీ! నీదెంత పాడుబుద్ధిరా!
చావుపడక మీద కూడా ఎంత అభద్రత నీకు!. వామాక్షి నాకు పెళ్లి ముందు మరదలయినా, పెళ్లయ్యాకా నాకు సోదరి సమానురాలు.
ఆమెను వశపరచుకుని నీ ఆస్తి కాజేస్తానేమో అనే కదా నీ భయం? అవన్నీ నువ్వు చేసిన వెధవ పనులు! నేనంత నీచుడ్ని కాదు!
చిన్నప్పటినుండీ పరాన్నభృక్కులాగా ఇంకోళ్ల సొమ్ము మీద పడి తిన్నది నువ్వు. పక్కవాడి దగ్గర ఏది నదురుగా వుంటే, దాన్ని సాధించేదాకా నిద్రపోలేదు!
ఎవడేమి వ్యాపారం చేస్తే దానిలో దిగిపోవడం, తమ్మినిబమ్మి చేసి, వాడిని నాశనం చేయడం. ఇదేగా మనం చేస్తున్న వ్యాపారం!! చెప్పరా! అలాంటిది నువ్వు వామాక్షీ, నా పేరత్తడం నీచత్వానికి పరాకాష్ట!!
“సరే విను! యూఎస్ లో మా అమ్మాయీ, మీ చిన్నకొడుకూ ఒకళ్లంటే ఒకళ్లు ఇష్టపడ్డారు.
మా పెద్దపాపని మీ పెద్దాడికిమ్మని వామాక్షి అడిగింది.
కనుక నాకన్నా సరయిన వాడు నీకు దొరకడు నీ ఆస్తి కాపాడడానికి.
నువ్వు ఊ అంటే లాయర్నీ, మేజిస్ట్రేట్ నీ పిలిపిస్తా. రాతకోతలు చేసుకుందాం! పైగా నీ వ్యాపారంలో నా డబ్బుందని నీకూ తెలుసు”…..
జోగారావు మూసుకుపోతున్న కళ్ల వెనుక భావమేదో అర్ధమవ్వలే రాంబాబుకు. చూపు మాత్రం పక్క తలుపుమీంచి తిప్పడంలే!!
ఒళ్లుమండుకొచ్చింది రాంబాబుకి. కుర్చీలోంచి విసురుగా లేచి పక్క తలుపు తెరుచుకుని బాల్కనీలోకెళ్లాడు.

విశాలమైన బాల్కనీలో ఉయ్యాలబల్ల మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు. పెరట్లో ఎవరో ఆడవాళ్ల వాదన వినిపించింది. జోగారావ్ ఇంటి పనిమనిషి పక్కింటి పనిమనిషితో గొడవపడుతోంది.
వెనక్కితిరిగి పోబోతున్న రాంబాబు చెవుల్లో అసంకల్పితంగా కొన్ని మాటలు చెవున పడ్డాయి. ఆగి చెవులు రిక్కించి విన్నాడు. మసక చీకట్లో పెరడూడుస్తున్న జోగారావు పనిమనిషి తమింట్లో రాలుతున్న పక్కింటి చెట్ల ఆకుల గురించి గొడవపడుతోంది. అదేమీ విచిత్రం కాదు కానీ ఆ చెట్లు జామచెట్లు!
పక్కింటి వాళ్ల పెద్ద జామిచెట్టు కొమ్మకటి వీళ్ల పేరాపెట్ మీదకి ఎండ కోసమై విస్తరించి ఉంది.
పేరాపెట్ ఎత్తుగా మొదటి అంతస్తులో ఉండడం వలన ఎవరికీ అందదు.
మిగిలిన కొమ్మలన్నీ పిందే పీపీతో ఉంటే, పేరాపెట్ మీదున్న విశాలమైన కొమ్మకు మాత్రం ఆరముగ్గినవీ, దోరగా పండిన జామకాయలు పెద్దవి గుత్తులు గుత్తులుగా!
రాంబాబు పెదవులమీదకి ఒక్కసారిగా విశాలమైన నవ్వు పాకింది.
అది అతని మనసుని చక్కిలిగిలి పెట్టి పకపకలాడించింది.
కాసేపు అక్కడే నిలబడి మనస్ఫూర్తిగా నవ్వుకుని, లోపలికి వెళ్లేముందు రెండు ఫోన్ కాల్స్ చేసి, తలుపు తెరుచుకుని, జోగారావు బెడ్ రూంలోకి వచ్చాడు.
సవ్వడి విని జోగారావు అతికష్టం మీద కళ్లు విప్పాడు.
రాంబాబు చేతులకేసి ఆశగా చూసాడు.
అతని రిక్తహస్తాలు చూసి జోగారావు కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
రాంబాబు మిత్రుడిని సమీపించి ప్రేమగా నుదురు మీద ముద్దుపెట్టుకున్నాడు.
అతని చచ్చుబడిపోయిన చేతిని తన చేతిలోకి తీసుకుని మార్దవంగా……
“జోగీ! నిజం చెప్పు! ఆ రోజు నువ్వు ఆ పక్కింటాళ్ల జాంకాయలు కోద్దామని చీకట్లో వంగి, మేడమీంచి పడిపోయావ్ కదూ!
మీ వాళ్లంతా నువ్వు ఫోన్ మాట్లాడుతూ కళ్లు తిరగడం వలన కిందపడి, అక్కడున్న రోటిమీద పడడం వలన అయ్యిందనుకుంటున్నారు పిచ్చాళ్లు.
ఒరే! నాకు తెలీదురా నువ్వెంత దొంగజాంకాయవో!
నీ విస్తరిలో పంచభక్ష పరవాన్నాలున్నా, పక్కోడి విస్తరిలోంచి ఆవకాయ బద్ద దొబ్బుకుతింటే కానీ నీకు పూటగడవదు కదా!
మా ధనా నీకు చెల్లెలు వరస బంధువు కనక వదిలేసావ్. లేకపోతే ఓ కన్నేసేవాడివే!
సరే! అదంతా వదిలేయ్! నీకు ఆ పక్కింటి జాంకాయలు కోసిస్తా.
మరి నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తావా?
ఇలా అడగడం మానవత్వం కాదని తెలుసురా జోగీ!
కానీ అవన్నీ నీకు పట్టవు కదా! పరవాలేదు!
కానీ జోగారావుకి ఇవేవీ పట్టట్లేదు.
స్నేహితుడికి తన ఆఖరికోరిక తెలిసిపోయిందన్న సంగతి తెలియగానే మొహంలోకి విపరీతంగా వెలుగొచ్చేసింది.
ముద్దముద్దగా”పెడతా! పెడతా!”అని గొణిగాడు.
ఆ తరువాత రాంబాబు ఒక్క క్షణం ఆలస్యం చెయ్యలేదు.
అప్పటికే వచ్చివున్న లాయర్, మెజిస్ట్రేట్, జోగారావు కొడుకులూ, భార్యా సమక్షంలో తన అన్ని వ్యాపారలమీద రాంబాబుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ ఒప్పందాలు అయిపోయాయి.
డాక్టర్, అతని సిబ్బంది జోగారావుని వీల్ చెయిర్ లో కుదేసారు.
ఆక్సిజన్ మాస్క్ తోనే పక్కనున్న బాల్కనీలోకి తోసుకెళ్లారంతా!
అప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆ ప్రాంతమంతా వేడిగా, వెలుగుగా ఉంది.
జోగారావుని పేరాపెట్ వాల్ దగ్గరగా తెచ్చారు.
రాంబాబు మెల్లగా తాడు సాయంతో పళ్లతో నిండిన కొమ్మలు పైకిలాగాడు, పేరాపెట్ మీద నిలబడ్డ నౌకర్ పైకి ఎత్తితోస్తుంటే!!

జోగారావు ఒళ్లోకి గుత్తుల గుత్తుల జాంపళ్లు వచ్చాయి. వామాక్షి…. ఏడుస్తూ ఒక జాంపండు కాకెంగలి చేసి జోగారావు నోటికందించింది.
అదే ఆఖరికి తులసితీర్ధమయింది.
పదకొండోరోజు పిండప్రధానానికి అన్నం ముద్దలు పేరాపెట్ వాల్ మీదే పెట్టారు. అక్కడే పదిరోజులుగా తిష్టవేస్తున్న కాకి ఆరోజు ఆ పిండప్రసాదాన్ని ముట్టలేదు!
జోగారావు కొడుకులు ఆర్ద్రంగా”నాన్నా! రా నాన్నా! తిను నాన్నా!”…. అన్నా తినలేదు. పక్కింటాళ్ల జాంకాయ పెట్టారు. అయినా తినలేదు.
ఈలోపల రాంబాబు ఒక బాక్సులోంచి తన ఇంట్లోంచి తెచ్చిన అన్నం ముద్దలు చేతికిచ్చి పెట్టమన్నాడు. వెంటనే కాకొచ్చీ చటుక్కున తినేసి పారిపోయింది. ఎవ్వరికీ అర్ధం కాలేదు ఒక్క రాంబాబుకు తప్పా.
ఆ కాకి మళ్లీ జోగారావు ఇంటిమీద వాలలేదు. ఇప్పుడు రాంబాబు తినే ప్రతీ మొదటిముద్దా తనింటి మీదే కాపరం పెట్టిన కాకికి పెట్టాలిసిందే!
మరి కోట్ల ఆస్థికి బాధ్యత కట్టబెట్టిందిగా ! తీసుకోడమే తెలిసిన చెయ్యికి, మొదటిసారిగా ఇవ్వాలిసొచ్చింది కనుక ఇంక కాకి బాధ్యత రాంబాబుదే!!
రాంబాబూ యేమాత్రం విసుక్కోడు! మంచి నెయ్యేసి కలిపిన అన్నం ముద్ద పట్టుకుని, “ఒరే! దొంగ జాంకాయ్!”అని పిలవగానే తయారుగా ఉంటుంది కాకి!!

మనుగడ కోసం.

రచన: ఓలేటి శశికళ

శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం రోజు. సాయంత్రం పేరంటంపెట్టుకుని, అరవైమందిని పిలుచుకున్నాను. చాలా సందడిగా జరిగింది పేరంటం. పిలిచినవారంతా చక్కటి ముస్తాబుతో, అందమయిన పట్టుచీరలు కట్టుకుని, కొత్త, పాత నగలు అలంకరించుకుని, అపర లక్ష్మీదేవుల్లా ఒచ్చి పసుపు, కుంకుమ, తాంబూలాదులు తీసుకుని వెళ్ళి పోయారు. ”అమ్మయ్యా! ఒకరిద్దరు తప్ప అందరూ ఒచ్చేసినట్టే”.
ఇంక వీధి తలుపు వేద్దామని వెళ్తూ, నా అమ్మవారిని ఒకసారి తేరిపార చూసుకున్నా. పాలరాతి మందిరంలో, స్థాపించిన అష్టలక్ష్మీ కలశంలో, వెండి కళ్ళు, ముక్కు, చెవులు అమర్చి, చతుర్భుజాలు పెట్టి, అభయ ముద్ర, కర కమలాలు అమర్చి, అమ్మవారికి ఎర్రటి కంచిపట్టు చీర నలంకరించి, మంగళ సూత్రాలు, నల్లపూసలతోపాటు, నాకున్న భారీ నగలన్నీ వేసి, తృప్తిగా అలంకరించుకున్నా. మండపం పక్క చిన్న అరటి చెట్లు పెట్టి, సహజమయిన బంతి, చేమంతి, రోజాలతో సింగారించాను. రంగురంగుల విద్యుద్దీపాలు, పెద్ద పెద్ద వెండి, ఇత్తడి కుందుల్లో దీపాలు దగద్దగాయమానంగా వెలుగుతూ, సుగంధ ద్రవ్యాలు పరిమళాలు వెదజల్లుతుంటే, ఒకలాంటి దివ్యానుభూతి కలిగి, కొన్ని క్షణాలు, ఆ దివ్య సుందరమూర్తిలో మమేకమై చూస్తూ ఉండిపోయా.
“శాంతమ్మా”! అన్న పిలుపుకు ఒక్కసారి ఉలిక్కిపడి గుమ్మం కేసి చూసా. అమ్మాజీ. ”ఓ! రా అమ్మాజీ లోపలికి” ఆహ్వానించా. పెద్ద స్టీలు పళ్ళెంలో పళ్ళు, పూలు, చీర పట్టుకుని ఒచ్చింది. అమ్మవారికి దణ్ణం పెట్టుకుని, తను తెచ్చినవన్నీ, నాకు బొట్టు పెట్టి ఇచ్చింది.
“అయ్యో! ఇవన్నీ ఎందుకు?. ఇది పేరంటం. ఇవన్నీ తేవక్కర్లేదు”, అని నవ్వుతూ అన్నా.
“శాంతిగారూ! ఇన్నేళ్ళలో ఎవరైనా నన్ను ఇలా శుభకార్యానికి కానీ, పేరంటానికి కానీ పిలవడం ఇదే మెదటిసారమ్మ. నేనెప్పుడూ మీలాంటి పెద్దవారిళ్ళకి ఒచ్చింది లేదు” స్వల్పంగా ఎర్రబడ్డ మొహంతో అంది.
నేను వెంటనే మాట మార్చి ”ఇంకేంటి విశేషాలు?. ఈ రోజు హాస్పిటల్ డ్యూటీ అయిపోయిందా? మీ చెల్లెళ్ళను కూడా తేవలిసింది” అంటూ ప్రశ్నలువేస్తూనే, గబగబా ఒక ప్లేట్ లో పులిహార, బొబ్బట్టు, పాయసం, పెరుగు వడ అమర్చి తెచ్చి తన చేతికిచ్చా. తీసుకోడానికి చాలా మొహమాటపడి పోయింది. ప్రసాదం అని చెప్పాక తీసుకుని, చాలా అపురూపంగా తినింది.
“చాలా థేంక్సమ్మా. నాకెంత సరదానో ఇలాంటివి చూడడం. మమ్మల్ని మనుషుల్లాగే చూడరు ఈ వీధిలో వాళ్ళు. రోజూ అందరి ఈటెల్లాంటి మాటలు వింటూ, చురకల్లాంటి చూపులు తప్పించుకుంటూ, దినదిన గండంగా బతుకుతున్నాం. మీరు చూస్తూనే ఉంటారుగా, మా పక్కింటి చైనులుగారు పెట్టే పుర్రాకులు. ఏదో అలా నోరు పెట్టుకుని బతుకుతున్నా. నాకు తెలుసు నేనంటే మన వీధిలో అందరికీ అసహ్యం, నాతో మాట్లాడాలంటే జంకు అని. ఏంచెయ్యనమ్మా? మా నాన్నగారు నా మీద నలుగురు చెల్లెళ్ళు, తమ్ముడు బాధ్యత పెట్టి పోయారు. మాకు ఇల్లు తప్ప ఇంకో ఆస్థిలేదు. కష్టపడి నా తరవాత చెల్లి రాజీకి పెళ్ళి చేస్తే, రెండేళ్ళు కాపురంచేసి, వాడు చెన్నై పారిపోయాడు. తనని బట్టల కొట్లో పనికి పెట్టా. సునీత, మాలతి, సతీష్ చదువుకుంటున్నారు.
వాణికి ఈ పదకొండో నెల పెళ్ళి మా మేనత్త కొడుకుతో. సొంతమన్న మాటే కానీ, . కొండంత ఆశ. ఎక్కడనుండి తెస్తానని కూడా లేదు. బండి, బంగారం అని పేచీ. ఏమోనమ్మా. ఎలా ఈదాలో తెలీట్లేదు ”. కళ్ళలో సన్న నీటి తెర. కడుపు తరుక్కుపోయింది. ముఫ్పై ఏళ్ళుంటాయేమో తనకు. పాపం ఎన్ని సమస్యలో. నాకు తెలిసిన అమ్మాజీ వేరు, నేను చూస్తున్న అమ్మాజీ వేరు. చాలా సేపు తన జీవితం గురించి చెప్పకొచ్చింది. నేను కూడా ఇరుగు పొరుగుతో గొడవలొద్దని, సామరస్యంగా అందరినీ కలుపుకుని వెళ్ళమని సలహా ఇచ్చి, ఇంకొంత ప్రసాదం జిప్ లాక్ కవర్లలో పెట్టి, తాంబూలంలో మంచిచీర పెట్టి ఇచ్చా. అందమయిన ఆమె కళ్ళల్లో మెరుపు.
మెట్లదాకా వెళ్ళా దింపడానికి. అప్పృడే మెట్లెక్కుతున్న మా బావగారు అమ్మాజీని చూడగానే కళ్ళల్లో కోపం, అసహనం ఛాయలు. వెళ్ళిపోయింది అమ్మాజీ.
అప్పుడే వార్త వెళ్ళిపోయినట్టుంది. ఇంటికి ఒస్తూనే శ్రీవారి మొదటి ప్రశ్న, “అమ్మాజీ ఎందుకొచ్చింది?. నీకు ముందే చెప్పా. మనం ఉమ్మడికుటుంబంలో ఉన్నప్పుడు, అందరికీ ఆమోదయోగ్యంగా బ్రతకాలని. అమ్మాజీ లాంటి బజారు మనిషి మనింటి గడప
ఎక్కిందంటే, ఎంత గొడవౌతుందో తెలీదా? కావాలనే చేస్తున్నావా?. ఈ ఇంటికి కొన్ని కట్టుబాట్లున్నాయి. నీ చదువులు, సంస్కరణలు పక్కన పెట్టి, ఒక పెద్దింటి ఆడదానిగా నడుచుకో” సాగి పోతోంది ఆయన వాక్ప్రవాహం. బాగా ఎక్కించినట్లున్నారు విషం అనుకున్నా మనసులో.
“మనం ఉమ్మడిలో ఉన్నా ఎవరిళ్ళలో వాళ్ళున్నాం. నా పూజకి నేనెవర్ని పిలుచుకుంటే ఏమిటి సమస్య? దైవం ముందు అందరూ సమానులే. ఇంకొకరి శీలాలు ఎంచడానికి ఎవ్వరికీ హక్కు లేదు. ఇంకోసారి దయచేసి నాకు శీలపాఠాలు చెప్పొద్దు. నేను మీ కుటుంబ కట్టుబాట్లేమీ దాటి ప్రవర్తించడం లేదు” అని కాస్త తీక్షణంగానే జవాబిచ్చి, ఇంకా విషయం ముగించా. మనసంతా చేదయిపోయింది.
ఆరునెలలే అయ్యింది మేము వైజాగ్ ఒచ్చి. ఏడేళ్ళు ఢిల్లీలోఉన్నాకా, రమణ తల్లితండ్రులకు దగ్గరలో ఉండాలని, . స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం సంపాదించి విశాఖపట్టణం మకాం మార్చాడు. మంచి కంపెనీ వసతి ఉన్నా తీసుకోకుండా ఆరుగురు అన్నదమ్ములు, మా అత్తమామలు ఉండే పెద్ద ఉమ్మడింటి కాపురం పెట్టాము. చాలా కట్టుబాట్లు, ఆంక్షలున్న, సాంప్రదాయక కుటుంబం. అయితే ప్రేమాభిమానాలు, సఖ్యతున్న తోటి కోడళ్ళ మధ్య జీవితం సజావుగానే సాగిపోతోంది. కానీ ఇదిగో ఈ అమ్మాజీ లాంటివాళ్ళ పొడ కూడా కిట్టదు వీళ్ళకి.
నాకింకా అమ్మాజీని చూసిన మొదటిరోజు బుర్రలో తాజాగా ఉంది. ఆ రోజు పొద్దున్నే ఇంకా నిద్రమంచం మీదే ఉండగా, పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. ఒక్కసారి హడిలిపోయి లేచా. మా పడక గది వీధి వైపు ఉండడంతో, కొంచెం కిటికీ తెర పక్కకి జరిపి బయటకు చూసా. ఈయన ”వెధవ గోల. మళ్ళీ మొదలయ్యింది” అనుకుంటూ మా పాపబెడ్రూంలోకి వెళ్ళిపోయారు. చూద్దును కదా. మా ఎదురింటి అమ్మాజీ, వాళ్ళ పక్కింటి చైనులుగారు హోరాహోరీ పొట్లాడేసుకుంటున్నారు. అమ్మాజీ పెంచుతున్న కోళ్ళు గోడ దూకి చైనులుగారింట్లో దూరి, పెరడు పాడు చేస్తున్నాయిట.
“నీకు లక్షసార్లు చెప్పా! కోళ్ళుపెంచడం, చంపడం ఇక్కడ చెయ్యడానికి వీల్లేదని. తల పొగరెక్కి వీగిపోతున్నావు. ఆడముండవని ఆలోచిస్తున్నా. నిన్నూ, నీ కుటుంబాన్నీ రోడ్డు మీదకి క్షణాల్లో లాగగలను”.
అంతే కాళికలా ఆయన మీదకి దూసుకొచ్చేసింది “పంతులూ! ముండ రండ అన్నావంటే మర్యాద దక్కదు. నేనూ అన్నానంటే నీ నోరు పడిపోద్ది. నన్ను కోళ్ళు పెంచద్దని చెప్పడానికి నువ్వెవడివి?. ఈ సారి సాయిబుతో చెప్పి, . మేక కూడా కోయిస్తా. నీ దిక్కున్న చోటు చెప్పుకో” ఇద్దరూ ఒకరికి మించి ఒకరు వాగ్బాణాలు విసురుకుంటున్నారు.
ఆయన కొడుకనుకుంటా పచ్చగా దబ్బపండులా ఉన్నాడు. ముప్ఫై పైనే వయసుండచ్చు. మధ్యలో కొచ్చి దణ్ణాలు పెడుతూ స్పర్ధ ఆపబోయాడు. కానీ లాభం లేకపోయింది. పెద్దాయన స్వేచ్ఛగా దుర్భాషలాడుతున్నారు. ఆ అమ్మాయి రెచ్చి పోతోంది.
అంతలో ఒక విచిత్రం జరిగింది. ఒక గులాబీబాలలాంటి సౌకుమారి, పట్టుచీర గోచీ వేసి కట్టుకుని, నల్లటి తడి జుట్టు ముడివేసుకుని, పెద్ద కుంకుమ బొట్టుతో, అపర పార్వతిలా బయటకి ఒచ్చి, గోడ పక్కన నిలబడి, అమ్మాజీకి మాత్రం కనబడేట్టు రెండు చేతులు జోడించి, బ్రతిమాలే థోరణిలో చూసింది. అంతే నాగస్వరం విన్న పాములా, మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది అమ్మాజీ. ఆ రోజు సాయంత్రమే కోళ్ళు అమ్మేయడం చూసా నేను.
ఇంక అక్కడి నుండి ఈ ఎదురింటి వాళ్ళిద్దరూ నా దినచర్యలో భాగం అయిపోయారు. డెలివరీకి ఒచ్చిన మా పెద్దబావగారి అమ్మాయి అమ్మాజీ కధ చెప్పుకొచ్చింది.
తనతో పాటే చదివిందట అమ్మాజీ. విమెన్స్ కాలేజీలో ఇంటర్ చదువుతుంటే వున్న ఒక్కదిక్కు, తండ్రి, ఆర్. టీ. సీ బస్సు గుద్ది, ఆరు నెలలు ఆసుపత్రిలో కోమాలో ఉండి చనిపోయారుట. శవాన్ని తీసుకెళ్ళలేని పరిస్థితిలో, ఆ నర్సింగ్ హోమ్ డాక్టర్ చెయ్యి పట్టుకుంటే, జీవితాంతం పట్టుకోనిస్తా. ముందు నాకు సాయం చెయ్యమని చెప్పి, అన్ని కార్యక్రమాలయ్యాక, అక్కడే నర్సుగా చేరిందట.
అప్పటి నుంచే మితిమీరిన ఆత్మ విశ్వాసంతో, ఆడింది ఆటగా పాడింది పాటగా, అందరినీ దబాయించి బతికేస్తోందిట. పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలతో అనుకున్నది సాధించుకుంటుందిట.
ఇక చైనులుగారూ తక్కువవారు కాదు. కోనసీమలో కోట్లు విలువ చేసే భూములున్నాయిట. నగర ప్రముఖులకెందరికో ఆయనే పౌరహిత్యం నెరపుతారు. యజ్ఞాలు, యాగాలకు ఈయన్ని సంప్రదిస్తారు. శిష్యులను ఇంట్లోపెట్టుకుని స్మార్తం, వేదం నేర్పించి, మెరికల్లా చేసి, వివిధ కార్యక్రమాలకు పంపుతారు. మంచి వ్యవహారకర్త. వేదవేదాంగాల్లోశాసించగల మేధావి, పండితుడు. ఆగమ శాస్త్రవేత్త. ఆయనిల్లు నిరంతరం పూజా పాఠాదులతో, వచ్చే పోయేవారితో, ఒక దేవాలయాన్ని తలపిస్తూ ఉంటుంది.
ఆయన ఒక్కగానొక్క కొడుకు శంకరం. అతని భార్య రాధ. చైనులుగారి భార్య జబ్బుమనిషి. నల్లమందు వేసుకుని ఎప్పుడూ పడుకునే ఉంటుంది. ఇంటి పనిభారం అంతా చిగురుటాకులాంటి రాధ మీదే. మా మావగారన్నట్టు చైనులుగారు గొప్ప జ్ఞానే కాని కోపాన్ని, అహంకారాన్ని జయించలేకపోయారు. కొడుకు, కోడలు, శిష్యులు, అమ్మాజీ కుటుంబం ఆయన కోపాగ్నికి సమిధలు.
ఏ తెల్లవారో, రాత్రి డ్యూటీ దిగి ఒచ్చే అమ్మాజీ, తెల్లవారుఝామునే చక్కగా వాకిలి తుడిచి, కల్లాపు జల్లి పెద్ద ముగ్గు పెడుతుంది. ఈ లోపున రాధ ఒస్తుంది. ఆమె చేతిలోంచి చీపురు లాక్కుని వాళ్ళ వాకిలి కూడా చిమ్మి ముగ్గేస్తుంది అమ్మాజీ, వాళ్ళ ఇంట్లోవాళ్ళకి తెలియకుండా. ఈ లోపల ఇద్దరు గుసగుసగా కబుర్లు చెప్పుకుంటారు.
పాపం రాధ ఆస్తమా పేషంటు. కానీ చైనులు గారు ఆయుర్వేదం తప్ప వాడనివ్వరు. ఒక రోజు అమ్మాజీ రాధకు ఇన్ హేలర్ ఇస్తుండగా చూసా. అంతే కాదు, పండగలు, పబ్బాలకి, నవరాత్రులకీ, చాతుర్మాస వ్రతాలకీ, పోటెత్తే అతిధులకు రాధ ఒక్కతే ఒండివార్చాలి. గోడ మీంచి అమ్మాజీ, చెల్లెళ్ళు అందుకుని, కూరలు తరిగిచ్చేసి, పప్పులు రుబ్బేసి, రహస్యంగా గోడ మీంచి ఇచ్చేసేవారు. ఈ అమ్మాయి స్వయంపాకాలకొచ్చిన పప్పూ, బియ్యం, చీరలు అటు పడేసేది. ఎవ్వరికీ తెలీని ఒక పరస్పర స్నేహస్రవంతి, అంతర్లీనంగా సాగి పోతుండేది. మేముండే ప్రాంతం విపరీతమయిన నీటిఎద్దడి.
నీళ్ళ టాంకర్లు ఒస్తే అమ్మాజీ నీళ్ళు పట్టి, తలుపు చాటు నిలబడే రాధకి అందించేది. తరవాత చైనులుగారు లక్షలు ఖర్చుపెట్టి పెద్ద లైను వేయించుకుంటే, రాధ రాత్రిపూట నీళ్ళ పైపు వీళ్ళవైపు పడేసేది. వీళ్ళిద్దరి స్నేహానికీ అసలు వారధి ”కిట్టూ” అనబడే కృష్ణశాస్త్రి. అమ్మాజీ అందగత్తె అనే చెప్పాలి. మంచి రంగు. ఎత్తుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పడూ నవ్వతున్నట్టుండే నల్లకళ్ళు, ఒత్తయిన పెద్ద జడ, చీరకట్టులో, ఎవరయినా తలతిప్పి చూసే అందమే. ఆమె అందం ఆమెకు చాలా పలుకుబడి తెచ్చిందంటారు. నాకయితే, తెల్లారుఝామున కలకలలాడుతూ, పువ్వులు, దీపం, ముగ్గుతో కనిపించే ఆమె తులసి కోట, తన గురించి వేరుగా అనుకోనివ్వదు. ఆ మాత్రం బలం లేకపోతే, వాళ్ళమూడొందల గజాల స్థలం చైనులుగారెప్పుడో లాగేసేవారు.
ఇంతకీ కృష్ణ శాస్త్రి అలియాస్ ”కిట్టప్ప” శంకరం, రాధల ముద్దుబిడ్డ. నిరంతరం పనులతో సతమతమయ్యే రాధకి పిల్లాడిని చూసుకోడానికి సమయం ఉండేది కాదు. పనిపిల్లను పెడితే, . ఆ అమ్మాయి అమ్మాజీ ఇంటికి తీసుకుపోతే, వీళ్ళంతా వాడిని ఆడించి, . ముద్దు చేసి, కొండొకచో, ముద్దలు కూడా పెట్టేసేవారు. విషయం తెలిసి ఆగ్రహహోదగ్రులైన చైనులుగారు, పనిపిల్లను మానిపించేసారు. తాతగారు కారు బయటకెళ్ళగానే వీడు గోడమీంచి పార్సిలయ్యేవాడు.
అయినా అమ్మాజీ, చైనులుగారు ప్రతీవారం రోడ్డెక్కి కొట్టుకుంటూనే ఉండేవారు. కారు గుమ్మం దగ్గరపెట్టేరనో, కాకి ఎముకలు తెచ్చి దర్భల్లో వేసిందనో, పిల్లి మీద ఎలకమీదా పెట్టుకుని. కాలం ఎప్పటికీ అలాగే ఉంటే జీవిత చక్రం ఆగిపోతుందేమో!! ఎప్పుడో ఒక కుదిపేసే మార్పు ఒస్తూ ఉంటుంది. జీవన సమీకరణాలు మారుస్తూ ఉంటుంది.
నల్లమందు మోతాదెక్కువయ్యి చైనులుగారి భార్య మరణించింది. జీవిత సహచరి వియోగం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది. బీపీ, షుగరు ఎక్కువయ్యాయి, . ఒకరోజు శంకరం పెళ్ళిచేయించడానికి హైదరాబాదు వెళ్ళాడు. ఆ సమయంలో చైనులుగారు హార్టు అటాక్ ఒచ్చి పడిపోయారు. కాళ్ళూ చేతులు ఆడని రాధ అమ్మాజీని పిలిచింది.
అమ్మాజీ ప్రధమ చికిత్స చేసి, వెంటనే అంబులెన్సు పిలిపించి, వాళ్ళ డాక్టరుగారి సాయంతో అపోలోలో చేర్పించింది. వెంటనే వైద్యసాయం అందడంతో ఆయన బ్రతికి బయటపడ్డారు. తరువాత బైపాస్ అయ్యి ఇంటి కొచ్చారు. చెప్పాలంటే చాలా మార్పు వచ్చింది. ఎక్కువ మౌనంగా ఉంటున్నారు.
అమ్మాజీ మాత్రం అదో పెద్ద సాయం కాదనుకుంది. నిజమే మా వీధిలో మూర్ఛ రోగి పడిపోతే నీళ్ళు పోసేది వాళ్ళొక్కరే. తారు రోడ్డు వేస్తుంటే, కూలీలకి, నీళ్ళు, టీలు వీళ్ళే ఇస్తారు. ఇంటిముందు పెద్ద టబ్బులో నీళ్ళు పెడుతుంది. దారిని పోయే మూగజీవాల కోసం. పెద్ద మట్టి దాకలో అన్నం కలిపి పెడుతుంది, ఏ వీధి కుక్కలేనా తింటాయని. కూరల గంపలెత్తుకొచ్చే వాళ్ళు, వీళ్ళఅరుగు మీదే కూర్చుని, ఏదేనా పెడితే, తిని పోతారు. పనివాళ్ళకి వైద్యసహాయం కావాలంటే అమ్మాజీ. మునిసిపల్ కార్పొరేషన్ లో పనంటే అమ్మాజీ. అల్లుడు కూతుర్ని తరిమేస్తే పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలంటే అమ్మాజీ. అయినా అమ్మాజీ తిరుగుబోతు, వెలయాలు, పతిత, గయ్యాళి. ఎన్నో విధాల అవమానించిన పొరిగింటి వారికి ఆమె ఇంకా పెద్ద ఉపకారం చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం వలన వారం రోజులనుండి ఎడ తెరిపి లేని వానలు. వీధుల్లో వాననీళ్ళు వాగుల్లా పారుతున్నాయి. మురికి కాలవలన్నీ పొంగి పొర్లిపోతున్నాయి. అక్కడక్కడ డ్రైనేజీ స్లాబులు తీసేసున్నాయి.
ఆ రోజు ప్లేస్కూలు కెళ్ళి ఒస్తూ, మూడేళ్ళ కిట్టూ ఇంటి దగ్గరలోనే పడవ వేద్దామని ఒంగి కాలవలో పడిపోయాడు. అందరూ చూస్తుండగా ప్రవాహంలో పడి కొట్టుకు పోతున్నాడు. అందరం నిశ్చేష్టులయిపోయాం.
అప్పుడే డ్యూటీ నుండి ఒచ్చింది అమ్మాజీ. ఒక్క నిమిషం వ్యర్ధం చెయ్యకుండా ముందుకు పరిగెట్టింది. పిచ్చిదానిలా పరిగెడుతూ, తన చీర లాగేసింది. డౌన్ లో కాలవ పెద్దదయ్యే చోట కరెంట్ స్థంభానికి చీర కట్టి, ఇంకో చివర తన నడుంకి కట్టుకుని, ఉధృతంగా ప్రవహిస్తున్న డ్రైన్ లోకి దూకేసింది.
సరిగ్గా అదే సమయానికి కిట్టూ కొట్టుకొచ్చాడు. వాడిని పట్టుకుని, బలంగా గట్టు మీదికి విసిరేసింది. వెంటనే అక్కడికి చేరిన జనాలు పిల్లాడిని పట్టుకుని నీళ్ళు కక్కించారు. ఈ లోపల ప్రవాహంలో మునిగి పోతున్న అమ్మాజీని చీర సాయంతో పైకి లాగేరు. ప్రమాదపరిస్థితిలో ఉన్న ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి, నీళ్ళు కక్కించి, చికిత్స చేయించారు.
రాధ దుఃఖం వర్ణనాతీతం. ఏమిచ్చి ఈ మహోపకారి ఋణం తీర్చుకోగలనంటూ కొడుకుతో పాటు, ఆమెకి సపర్యలు చేసింది. దూకడంలో అమ్మాజీ కుడి కాలు ఫ్రాక్చరయ్యింది. మొట్ట మొదటిసారి చైనులుగారు చెయ్యెత్తి నమస్కారం పెట్టారు. అన్ని ఖర్చులు భరించి వైద్యం చేయించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సంఘటన తరవాత ఇరు కుటుంబాల మధ్య తగాదాలు, అగాధాలు బాగా తగ్గిపోయినట్టే. ఈలోగా రమణకి సింగపూర్లో మంచి ఉద్యోగావకాశం రావడంతో మేము సింగపూరు వెళ్ళిపోయాము మెరుగయిన జీవితాన్ని వెతుక్కుంటూ.
ఆ తరవాత రెండు, మూడు సార్లు వచ్చాము కానీ, అది మా అత్తమామల అంత్య క్రియలకు మాత్రమే. అప్పుడే తెలిసింది అమ్మాజీ చైనులుగారి ఆశీస్సులతో కార్పొరేటరు అయ్యిందని. కానీ ఆమెను కలవలేకపోయాను. రాధ మాత్రం పరామర్శ కొచ్చింది. సున్నిత మయిన ఆమె శరీరం దుర్బలంగా ఉంది. ఎముకల గూడులా అయిపోయింది. ఏమయి పోయింది ఆ అపురూప సౌందర్యం?. ఆ ఛాందస గృహస్థానికి ఆహుతయి పోయిన సమిధలా ఉంది. మళ్ళీ నేను ఆఛాయలకు వెళ్ళడం తటస్థ పడలేదు. మా ఆంక్షలసంకెళ్ళ పెద్దింటికి చాలా దూరంగా వెళ్ళిపోయాము.
కాలగమనంలో పదేళ్ళు గడిచి పోయాయి. మంచిభవిత కోసం అనుకుంటూ రకరకాల ఉద్యోగాలు, అనేక దేశాల్లో చక్కబెట్టి, చివరకు మాతృదేశంలో కుదురుకుందామని తిరిగి విశాఖ చేరాము. రమణ స్టార్టప్ కంపెనీ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. బీచ్ దగ్గరలో ఫ్లాటు కొనుక్కుని, దానికి హంగులమర్చడంలో ఐదారు నెలల నుండి నేను బిజీ. ఆ రోజు సాయంత్రం యధా ప్రకారం బీచ్ రోడ్డులో నడక మొదలెట్టాను.
రోజంతా అవిశ్రాంతంగా లోకాలకు వెలుగు, వేడి నిచ్చిన అరుణుడు, పశ్చిమాన కుంగుతూ, తన వెలుగును రేరాజుపై ప్రసరించాడు. సూర్యుణ్ణి మింగిన సాయంత్రం అరువు కాంతుల శశి బింబాన్ని గగనతలం పైకి తెచ్చి లేత వెన్నెల సముద్రంమీద పరుస్తున్నాడు. అలలు మెల్లగా వెండితనం సంతరించుకుంటున్న వేళ, సముద్రంతో పోటీ పడుతున్న జనసంద్రం ఒడ్డున.
హఠాత్తుగా నా కళ్ళకి అతుక్కుంది ఓ జంట. పదమూడేళ్ళ పిల్లాడితో క్వాలిటీ ఐస్ క్రీం బండి దగ్గర. ఎవరు వాళ్ళు? అమ్మాజీ, శంకరంలా ఉన్నారే. వాళ్ళే గుర్తుపట్టి నన్ను పేరుతో పిలిచారు. అమ్మాజీ వడివడిగా నడుచుకుంటూ ఒచ్చి, సంభ్రమంగా నా చెయ్యి పట్టుకుంది.
“ఎన్నాళ్ళయ్యిందమ్మా మిమ్మల్ని చూసి? మీ గురించి చాలా ప్రయత్నించాను. మీ వివరాలు దొరకలేదు. మీ పెద్దింట్లో కూడా ఎవ్వరూ ఉండడంలేదు ఇప్పుడు. ”
“అవును అమ్మాజీ! ఆరు నెలలయ్యింది ఇండియా ఒచ్చేసి. మీరేంటి యిలా?” వాళ్ళ కేసి అయోమయంగా చూస్తూ.
శంకరం అందుకున్నాడు. ”శాంతి గారు! మేమిద్దరం దంపతులం ఇప్పుడు. రాధ కాలం చేసింది న్యుమోనియాతో. తన కోరిక మీదే నాన్నగారు మా ఇద్దరికీ వివాహం చేసారు. ఇదిగో వీణ్ణి గుర్తుపట్టారా? మా కృష్ణశాస్త్రి. నాన్న గారు తన పేరును అపర్ణగా మార్చేరు”.
“రాధ పోయిందా!” మ్రాన్పడిపోయాను
“సంతోషం అండి. మీరిద్దరు పెళ్ళి చేసుకున్నందుకు. బహుశా అమ్మాజీ కన్నా ఇంకెవరూ తల్లి స్థానం భర్తీ చెయ్య లేరని ఆమెకి తెలుసుంటుంది” అంటూ అమ్మాజీ చెయ్యి ఆప్యాయంగా నొక్కాను. ఈ లోపల కిట్టూ స్కూల్ ప్రోజెక్టు చెయ్యాలని, “ఇంటి కెళ్దామమ్మా” అని గునవడంతో, వెళ్ళడానికి సెలవు తీసుకున్నారు.
వెళ్తూ వెళ్తూ అమ్మాజీ వెనక్కొచ్చి,”శాంతమ్మా! రేపు మా ఇంటికి రాగలరా?శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటున్నా. నేనొచ్చి తీసికెళతా. మీ అడ్రస్ ఇస్తారా”?
మేమిప్పుడు డాబా గార్డెన్సులో ఉండట్లేదు. మా రెండిళ్ళు కలిపి ఫ్లాట్లు కట్టాము. మా అందరికీ ఇళ్ళొచ్చాయి. మామయ్యగారు ఎమ్. వీ. పి . కాలనీలో ఇల్లు కట్టించారు. అక్కడ ఉంటున్నామమ్మా!!. ” అంది. అదే వినయం. నా మీద అదే ఆత్మీయత. అదే అందం. ఇప్పుడు హుందాతనం కూడా తోడయ్యింది. నేను ఇంటి అడ్రస్ ఇచ్చి, పదకొండింటికి వస్తానని చెప్పా.
ఆ మరునాడు సరిగ్గా పదకొండు గంటలకు స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఒచ్చింది. మా ఇల్లు, అలంకరణ చూసి మురిసిపోయింది. మా అమ్మాయి స్నిగ్ద అమెరికా ఫోటోలు చూసి, ముచ్చటపడి పోయింది. తన జీవితంలో మార్పుల గురించి చెప్పుకొచ్చింది. తను రాజకీయాల్లో ఇమడలేకపోయానని, రాధ మరణం తనని క్రుంగదీసిందని, చెల్లెళ్ళు, తమ్ముడు బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో, చైనులుగారు పెళ్ళి ప్రస్థావన తెచ్చారని, రాధ ఆఖరికోరికని చెప్పారని చెప్పింది. రాధ స్థానం తను కాదంటే వేరెవరో ఆక్రమిస్తారు, కిట్టూ తనకి దూరం అవుతాడని భయపడింది. చైనుల్లాంటి ధనవంతుడి అండ తన కుటుంబానికి అవసరం అని గుర్తించి ఒప్పుకుందిట.
వాగ్దానం చేసినట్టే ఆయన తన కుటుంబాన్ని ఆదుకున్నారుట. ఆఖరి చెల్లి, తమ్ముడు అమెరికాలో ఉన్నారుట. రాజీ మొగుణ్ణి వెతికించి తెచ్చి, వారిద్దరి చేత పెద్ద పూజా సామాగ్రికొట్టు పెట్టించారుట. ఇదివరుకులా ఇంట్లో శిష్యులను చేర్చుకోకుండా, సింహాచలం దగ్గర వేద పాఠశాల పెట్టి, అక్కడే పాఠాలు చెప్తున్నారుట.
ఆయన పౌరోహిత్య బాధ్యతలు, శంకరానికీ, శిష్యులకూ అప్పచెప్పి పూర్తి విశ్రాంత జీవనం గడుపుతూ, తిరుపతి దేవస్థానానికి వేద విద్య, స్మార్తం గురించి పుస్తకాలు రాస్తున్నారుట. శంకరం తనను చాలా ప్రేమగా, గౌరవంగా చూస్తాడుట.
“పిల్లలా?” అడిగా.
“గత జీవితపు నీలి నీడలు గ్రహణంలా పట్టి పీడిస్తున్నాయి. కడుపు పండినా నిలబడడం లేదు. ”. తలొంచుకుంది.
“అయ్యో! బాధ పడకు. తప్పక పుడతారు. మరి రాధ రావాలి కదా తిరిగి ఈ లోకానికి. ”అన్నా.
కళ్ళు మెరుస్తుండగా, “అవునమ్మా!. మీ నోటి చలువ. మొదటిసారి నన్ను మనిషిగా చూసినవారు. నిందలు నమ్మకుండా ఆదరించారు నన్ను. మీ మాట జరిగి తీరుతుంది. నా రాధమ్మొస్తుంది. ” ఉద్వేగంగా పలికింది.
వారింటికెళ్ళాను. రెండంతస్థుల పెద్ద ఇల్లు, చుట్టూ పూల మొక్కలు. ఇంటి ముందు పెద్ద ముగ్గు, తూర్పు వాకిట అలంకరించిన తులసమ్మ. అమ్మాజీ మారలేదు. ఇంటిలో ఆధునికమయిన ఫర్నిచరు. పూర్వపు చాదస్తపు ఛాయలు లేవెక్కడా. అమ్మాజీ స్వప్నసౌధంలా చేసుకుంది ఇంటిని.
రాధది నూతన వధువుగా ఉన్న పెద్ద పటం. దానికి ఖరీదయిన ఫ్ర్రేము. గులాబీల మాల. ఆ అమాయకురాలు, అర్భకురాలు, దురదృష్టవంతురాలు ఫొటో నుండి నవ్వుతోంది. ”నేనిప్పుడే హాయిగా ఉన్నానని ”.
అమ్మాజీ, అదే అపర్ణ పెద్ద పట్టుచీర, పూలూ, పళ్ళతో నాకు పసుపు, కుంకుమలిచ్చింది. అచ్చం నాలాగే అమ్మవారిని అలంకరించింది. నా కన్నా ఎక్కువ నగలు పెట్టింది.
చైనులుగారు చాలాసంతోషించారు నన్ను చూసి. రాధను తలుచుకుని పాపం దౌర్భాగ్యురాలు. ఈ సిరంతా దానికి ప్రాప్తం లేదన్నారు. అపర్ణ సమర్ధవంతురాలన్నారు. నవకాయ పిండి వంటలతో తృప్తిగా భోజనం పెట్టింది.
నా మనసు మిశ్రమభావాల సంఘర్షణతో ముద్దయి పోయింది. సందర్భం కాకపోయినా డార్విన్ సిద్ధాంతం గుర్తుకొచ్చింది. వృక్ష, జంతుజాలాల్లాగే, మానవుడూ అడుగడుగున మనుగడ కోసం శ్రమిస్తూనే ఉండాలి. ఈ జీవనసంఘర్షణలో, బలవంతులు అన్ని ఆటంకాలనూ దాటి గెలుస్తారు. బలహీనులు తుడిచి పెట్టుకుపోతారు.
కొన్ని జీవ జాతులు, పరిణామక్రమంలో, అవసరమయిన, ఆమోదయోగ్యమయిన, ఉపయోగపడే పరివర్తనాలు చెంది, ప్రకృతి చేత ఆమోదించబడి, సృష్టిలో శక్తివంతమయిన స్థానం పొందుతాయి, అమ్మాజీ లాగ!!. రాధ లాంటి దుర్బలులు, ఎంత శ్రమించినా, అవకాశ లోపం, సరయిన వాతావరణం లేక కాలక్రమంలో కృశించి, మాయం అయిపోతారు. కొందరు మనుగడ కోసం, స్వప్రయోజనాల కోసం, ఎన్నో మార్పులను, చేర్పులను కూర్చుకుంటూ, సుఖ జీవనానికి బాటలు వేసుకుంటారు.
చైనులు గారు, శంకరం తమ వారసుడి భవిష్యత్ దృష్ట్యా, ఎన్నో మెట్లు దిగి, వారికెంతో ఉపకారం చేసిన అమ్మాజీని స్వీకరించారు. అమ్మాజీకి అందం, బలం, అవకాశం, అదృష్టం, సేవాభావం, తెలివితేటలు ఆమె మనుగడకు కలిసొచ్చాయి.
అన్ని విధాల విధి వంచితురాలు రాధ. ఆ సుకుమార గులాబీబాల ఆ ఇంటి ఛాందసంలో శలభంలా మాడి మసయ్యింది. ఆమె తనకు చేసుకున్న ఒకే ఒక ఉపకారం అమ్మాజీతో స్నేహం. నా నోరు తీపి తిన్నా, నా మనసంతా ఎందుకో చేదయిపోయింది.
అన్నట్టు, సరిగ్గా ఏడాదికి వరలక్ష్మీ వ్రతం రోజే చైనులుగారింట్లో రాధిక పుట్టింది.
-****–

కథ చెప్పిన కథ

రచన: విజయలక్ష్మీ పండిట్.

ఆ రోజు రాత్రి భోజనాలయినాక భారతి వాళ్ళ అమ్మతో అంది, ” అమ్మా రేపు మా టీచర్‌ పెద్ద కథ చెపుతానన్నది. . ., కథ అంటే ఏమిటమ్మా. . ! “అని అడిగింది.
“కథ అంటే. . . మన, జంతువుల జీవితాలలో రోజు జరిగే సన్నివేశాలే కథలు నాన్నా “అని అన్నది భారతి వాళ్ళ అమ్మ.
కాని ఆ సమాధానంతో సంతృప్తి కలుగలేదు భారతికి. కథను గురించి మరలా మరలా ఆలోచిస్తూ పడుకొంది. పడుకొంటూ మనసులో గాఢంగా అనుకొంది . “కథా కథా నీ కథ చెప్పవా. . ?! “అని. ఆ మౌన, అమాయక గాఢమయిన అభ్యర్థనకు స్పందించింది అక్షరం. . భారతి కలలో కథ తన కథను ఇలా మొదలు పెట్టింది. . . !
అనగనగా ఓ భూమితల్లి. ఆమె విశ్వమాయ గర్భం నుండి పేగు తెంచుకొని విడివడింది. పుట్టినపుడు, పసిపాపగా ఉన్నప్పుడు ఒళ్ళంతా ఎర్రని దుమ్ము, ధూళి. ఎన్నో లక్షల ఏండ్లకు పెద్దదై చెట్టు చేమ, పుట్ట గిట్ట, కొండ కోనలు, నదాలు సముద్రాలతో, పచ్చని చెట్లు చేమల చీరను ధరించి, ఎన్నో లక్షల జీవరాసులను కంటూ, కాపాడుతూ చివరకు మనిషిని ప్రసవించింది.
నిటారుగా నడిచే ఆ పుడమి బిడ్డ అడవంతా కలయ తిరుగుతూ పుష్కలంగా పండే, తెనెలూరే పూలు పండ్లు కాయలను తింటు తిరుగుతూ, పెద్దవాడవుతూ ప్రకృతమ్మ దగ్గర ప్రతి దినం ఆటపాటలు నేర్చుకోసాగాడు. పక్షులూ, పిట్టలూ, కోతులూ కొండముచ్చులు, పాములు, నక్కలు, కుక్కలు, ఆవులు, బర్రెలు, పులులు, సింహాలు, ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు అన్ని అతని హితులు, స్నేహితులే. వాటి ననుకరించి శబ్దాలు చేస్తూ, ప్రకృతితో మాట్లాడుతూ, ఆట్లాడుతూ, పోట్లాడుతూ, ఆడ మగా జతకట్టి మదిరను సేవిస్తూ, ఆదమరిచి ఆనందిస్తూ, పిల్లలను కంటూ మందలు మందలుగా, సంచార జీవులుగా సంచరించేవారు.
సంజ్ఞలతో మొదలయిన మనిషి పలకరింపులు కూతలతో, క్రమంగా చిన్న చిన్న మాటలతో, అల్లుకున్న భాషలెన్నో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
నదులు, సరస్సులు పిలిచిన చోటికి పిల్లాజెల్లా, గోవులు, కుక్కలు, మేకలను తోలుకొంటూ, నడిచి వెళ్లే దారుల్లో, మంద ముందు, వెనుక కొసలను కలుపుతూ పేనిన మాటల తాడై చిన్ని చిన్ని కథనాలతో కథనై నేను పుట్టుకొచ్చాను. మనుషులు అల్లే మాటల బుట్టను మోసుకొని ఇంకో మనిషి చెవిలో కుమ్మరించడం నా పని. మనుషుల ఆనందాలు, అగసాట్లు, అరమరికలు, అబ్భురాలు అద్భుతాలు, అగాధాలు, అలోచనలు, అరమరికలు, గాధలు, భాధలు. . అన్నిటిని మోసుకొని తిరగడమే నా పని.
నలుగురు మనుషులు కలిస్తే నేను ప్రత్యక్షమౌతాను. ఒక్కో మనిషి ఓకటేమిటి మాటల దారాలాతో నన్ను పురితాడులా అల్లుతూనే ఉంటాడు. ఒక నోటినుండి పుట్టి మనుషుల చెవిలో దూరి వాళ్ళ మెదడులో దూరి దాక్కోవడమే నాపని. అయినా నన్ను తట్టి లేపి ఇంకొకరి చెవిలోకి ఎక్కేంతవరకు ఊరుకోరుకదా ఈ మనుషులు. కలిస్తే కథలు కదిలితే కథలు. !
ప్రేమికుల ప్రేమ పెనుగులాట కథలు. ప్రేమికుల తప్పించుకోనే కథలు ఒప్పించుకొనే కథలు మెప్పించుకొనే కథలు. దొంగ ప్రేమ కథలు, నిజాయితి ప్రేమ కథలు. ఆడపిల్లలను నిలువెల్లా దోచుకొనే మాటల గారడి కథలు.
ఇక. . రాత్రయితే ఆలుమగల కథలు. . . ;చిలిపి కథలు, అలకల కథలు. ఆలింగనాలలో నన్నుకిరి బిక్కిరి చేసే కథలు. ప్రేమికుల నిట్టూర్పులలో నిలువునా నన్ను దహించి నపుడు మాటలు తెగిపోయి మెదడు నాశ్రయించి తప్పించుకుంటాను.
భారత దేశంలో పుట్టిన నేనో పురాణాల పుటికను. నావెన్నో రూపాలు. నా పుటిక నిండా అధ్భుత మయిన సుధీర్ఘ కథలు -అవే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, చ్హారిత్రక గాధలు, పెద్ద చిన్న నవలలు, కథలు. నా అన్ని రూపాలు చేప్పేవి కూర్చేవి మనుషుల గాధలే.
క్రౌంచ మిధునం విషాధ సంఘటనకు ఉద్రేకానికి లోనై వాల్మీకి తాత ఖంట మొలికించినది సీతమ్మను ఎడబాసిన శ్రీ రామ కథను ‘రామాయణాన్ని ‘. ఆ సూర్యవంశ ధశరథ రాజు కుటుంబం కథ ను వినని, కథా చిత్రాన్ని కనని వాడుండడు.
ఆ కుటుంబం కథ అప్పటి కుటుంబం, గణ, సంఘ మానవ సంబంధాల ఉదాహరణ మచ్హుతునక. గురు శిష్యుల, భార్యా భర్తల, తండ్రి తనయుల, తల్లిబిడ్డల, అన్నతమ్ముల, అక్క చెళ్ళెల్ల, స్నేహితుల, రాజు ప్రజల సంబంధాలను కండ్లకుకట్టే కథ.
ఒకరి కొకరు ఏమి కాని జంతు జీవనం నుండి తనకొక కుటుంబాన్ని ఇల్లును మలచుకున్న మానవుని జీవితంలో గొప్ప మలుపు కుటుంబం. ఆలుమగలు బిడ్డల‌ అనురాగ మందిరం. ప్రేమ మానురాగాల తో అల్లుకున్న పొదరిల్లు. మానవజీవితాన్ని ఆదిమ అశాంతిమయ అనాగరిక జీవితం నుండి మనిషి జీవితాన్ని విముక్తి కలిగించి మలిచిన అద్భుత ఆలోచన. నాగరిక జీవితానికి నాంది, పిల్లల భవిష్యత్తుకు భరోసా. పరస్పర ప్రేమానురాగాలను పెంచి పోషించి భార్య భర్త బిడ్డల చుట్టు అల్లుకున్న ప్రేమ వలయం అనురాగనిలయం. మానవ జాతి మనుగడకు దారి చూపిన మహత్తర మంత్రం వివాహం, కుటుంబం.
కుటుంబ వ్యవస్థ నుండి ఏర్పడ్డ మానవ సంబంధాలు అనేకం, మనుషుల మనుగడపై వాటి ప్రభావం అనంతం కుటుంభంలో ప్రేమానురాగాల హెచ్హుతగ్గులు, ఆస్థి పాస్తుల అసమానతలు మనుషుల సంబంధాలలో అసూయా ద్వేషాలను కూడా పెంచి పోషించాయి.
క్రమంగా స్త్రీ కి ఇంటిపనులు వంటపనులు, ప్రకృతి పరంగా ఎర్పడ్డ పిల్లలను నవమాసాలు మోసి కని పెంచే భాద్యత వారి పనులుగా, వ్యవసాయము స్వంత ఆస్తుల పరిరక్షణ మగవారి పనులుగా స్థిరపడ్డాయి. కళ్ళు చేవులు లేని కాలం మాత్రు స్వామ్య సమాజాన్ని పిత్రు స్వామ్య, పురుషాధిక్య సమాజంగా మార్చివేసింది.
అస్తులు అంతస్తులు పెంచుకొంటూ పోవాలనే స్వార్తపు ఆలోచనలు అసమానాలను పెంచాయి. దానికి తోడు పరస్పర మత కుల ద్వేషాలు మనిషిలోని మానవత్వాన్ని మరుగున పడవేసింది. రాజ్య, ధన బలము హోదా రాజ్య మేలసాగింది. రాజుల రాజ్యాల మధ్య, దాయాదుల మధ్య ఘోరమయిన భయంకరమయిన యుద్ధాలకు దారితీసింది.
కౌరవుల పాండవుల మధ్య దాయాదులమధ్య జరిగిన అలాంటి భయంకర యుద్ధమే కురుక్ష్కేత్ర యుద్ధము.
ద్వాపరయుగం లో జరిగిన, వ్యాస మహర్షి రాసిన ఆ “మహాభారత” కథ మన భారత దేశ సుదీర్ఘ కథ. ఇప్పటికి జరుగుతున్న కథ. మనిషి కథే నా కథ. . నా కథే మనిషి కథ అని ముగించింది.
భారతికి కలలో ఒక సినెమా రీలు లాగా బొమ్మలతో కథ చేప్పిన కథ మనసులో ముద్రితమయింది.

—–//——