దేవుళ్ళకూ తప్పలేదు!

రచన: పెయ్యేటి రంగారావు

దేవుళ్ళయినా పరిస్థితులకి తలలు ఒగ్గవలసిందే! ఒక్కొక్కసారి అటక ఎక్కుతారు, ఒక్కొక్కసారి అల్మారాల్లో దాక్కుంటారు. ఒక్కొక్కసారి గట్టెక్కుతారు!!
సీతమ్మగారి మనవడు గురుదత్త మహా గడుగ్గాయి. కొద్దిగా ఈ మధ్యనే నడక వచ్చింది. దాంతో ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. పొద్దున్న లేవగానే సీతమ్మగారి కోడలు సీతాలక్ష్మి పొందికగా మంచం మీద దుప్పటి చక్కగా సరిచేస్తుంది. ఆవిడ స్నానం చేసి బొట్టు పెట్టుకోవడానికి పడకగదిలోకి వచ్చేసరికి మంచం మీద దుప్పటి నేల మీద పారాడుతూ వుంటుంది. తల దువ్వుకుందామంటే దువ్వెన కనబడదు. తెగ వెతికేస్తుంటే దత్తు గాడి తలలో కనిపిస్తుంది. టేబులు వాడికందదు కదా, దువ్వెన ఎలా తీసాడు అని పరిశోధిస్తే, టేబులు దగ్గర తను పడకకుర్చీ దగ్గర పెట్టుకున్న చిన్న స్టూలు కనిపిస్తుంది. వాడు దాన్ని జరుపుకుంటూ టేబులు దగ్గిరకి తీసికెళ్ళి వుంటాడని, దాని మీదకెక్కి టేబులు మీదున్న దువ్వెన తీసేసి వుంటాడని అర్థమవుతుంది. అంతేకాదు, అక్కడ సీసాల్లో వున్న స్నో, పౌడర్లలో సగభాగం వాడి మొహాన్న పూయబడి వుంటుంది. ఇంకా వాడి ముస్తాబు పూర్తి అవదు. కుంకుమతో నిలువుబొట్టు మందంగా దిద్దుకుని శ్రీమహావిష్ణువులా దర్శనమిస్తాడు!
అక్కడితో వాడి అల్లరి ఆగుతే బాగానే వుండును. కాని బామ్మగారి భరతం పట్టందే వాడికి తృప్తి కలగదు.
సీతమ్మగారి దేవుడి గదిలోకి వెళ్ళి, అక్కడి దేవుళ్ళ పటాలన్నీ ఈడ్చుకుంటూ తీసుకువచ్చి, విష్ణుమూర్తిని హాలులో ఒక మూల కూర్చోబెడతాడు. శివుడిని తీసుకువెళ్ళి పడకగదిలో మంచం మీద పడుకోబెడతాడు. ఆంజనేయస్వామిని వంటింట్లో పోపులపెట్టి మీద కూర్చోబెడతాడు. ఇది రోజూ జరుగుతున్న దత్తభాగవతం.
వాడి బాధ పడలేక సీతమ్మగారు దేవుళ్ళందర్నీ టేబులు మీద సర్దుకుంది. ఐనా వాడు వదలడు. చిన్నస్టూలు జరుపుకుంటూ తీసుకుపోయి మళ్ళీ దేవుళ్ళందర్నీ కిడ్నాప్ చేసేస్తూ వుంటాడు.
ఆవిడ దేవుడి గదిలోంచి గావుకేకలు పెడుతూ వుంటుంది. ‘ఏమేవ్ సీతా! ఇవాళ దత్తబాబు నా శివుడ్ని ఎత్తుకుపోయాడే! అయ్యో, అయ్యో! శుక్కురారం పూటా లక్ష్మీదేవి ఏమయిపోయిందే? ఇంక నేనీ పూజలు, పునస్కారాలకి మంగళం పాడక తప్పదేమోనే తల్లీ! ఐనా పూజ చేసుకోకుండా కాఫీ కూడా తాగను కదే? నేనేం చేతునురా శ్రీరామచంద్రా!’
ఆవిద కేకలు వింటూ ఆ శ్రీరామచంద్రుడి, ఆ శివుడి అవతారమే అయిన గురుదత్త చిద్విలాసంగా నవ్వుతూ నిల్చుంటాడు.
ఇంక తప్పనిసరయి సీతమ్మగారు శ్రీమన్నారాయణుడిని లక్ష్మీసమేతంగాను, పరమశివుడ్ని పార్వతీసమేతంగాను, పాపం ఆంజనేయస్వామి బ్రహ్మచారి కనక ఒంటరిగాను మొత్తం అందరు దేవుళ్ళని అటక ఎక్కించేసి, తాను కుర్చీలో కూర్చుని జపం ముగించుకుని వాళ్ళకి అలాగే సైగలతో ధూపదీప నైవేద్యాలు కానిచ్చేస్తుంది. ఆ విధంగా సీతమ్మగారి ఇంట్లో దేవుళ్ళందరూ అటక ఎక్కేసారు పాపం!
ఇక సుబ్బలక్ష్మిగారి ఇంటికి వెడదాం.
పాపం సుబ్బలక్ష్మి గారు తమ స్వగ్రామంలో 800 గజాల స్థలంలో కట్టబడిన లంకంత కొంపలో వుండేవారు. వారి ఇంటిలో ప్రత్యేకించి విశాలమైన దేవుడి గది వుంది. ఆ గదిని ఆవిడ చాలా మనోహరంగా అలంకరించుకున్నారు. రోజూ పొద్దున్న స్నానం చేయగానే దేవుడి గదిలోకి వెళ్ళి నిష్టగా రెండుగంటలు జపం చేసుకునే వారు. శుక్రవారం అయితే సాయంత్రం కూడా రెండుగంటలు పూజ చేసుకునేవారు. కాని వారి అబ్బాయికి ఈ మధ్యనే పూనేకి బదిలీ అయింది. ఆయన బలవంతం మీద సుబ్బలక్ష్మిగారు కూడా పూనే వెళిపోయారు. అక్కడ ఒక అపార్ట్ మెంట్ లోని పదవ అంతస్థులోని ట్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో వారి మకాం. మూడు విశాలమైన పడకగదులు, హాలు, కిచెన్. అంతే. ఆ అపార్ట్ మెంట్ లో దేవుడి గది లేదు. అందుకని గత్యంతరం లేక సుబ్బలక్ష్మిగారు హాలులోని ఈశాన్యం మూలలో చిన్న అల్మారా పెట్టించుకుని అందులో దేవుళ్ళందరినీ బంధించి తాళం వెసేసారు. రోజూ పొద్దున్న స్నానం కాగానే ఆ అల్మారా తెరిచి కరెంటు దీపారాధన చేసి, కరెంటు అగరువత్తులు వెలిగించి, దణ్ణం పెట్టుకుని రెండు అరటిపళ్ళు, ఇవి మాత్రం నిజమైనవే, నైవేద్యం పెట్టి, మళ్ళీ ఆ అల్మారాకి తాళం వేసేస్తారు. ఎందుకంటే అడ్డమైన వాళ్ళూ (పొట్టిగా, లావుగా, పొణకంత బొజ్జతో వున్నవాళ్ళు), నిలువైన వాళ్ళూ, (సన్నగా పొడుగ్గా, గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా వుండేవాళ్ళు), ఎంతమందో రోజూ హాలులోకి చెప్పులతోనే వచ్చి కూర్చుంటూ వుంటారు. అందుకని సుబ్బలక్ష్మిగారికి దేవుళ్ళని అల్మారాలో పెట్టి బంధించక తప్పలేదు.
ఇక జానకమ్మగారి ఇంట్లో పరిస్థితి చూద్దాం. వారు వుంటున్నది మహానగరం ఐన హైదరాబాద్ లోనే. కాని వారిది ఇండిపెండెంట్ హౌస్. అందులో సెపరేట్గాత విశాలమైన దేవుడిగది వుంది. అందుకని అవిడకు ఏ విధమైన ఇబ్బంది లేదు. వచ్చిన చిక్కల్లా ఆవిడ వయసుతోనే. ఆవిడకు డెభ్భయి సంవత్సరాలు. భారీకాయం. ఆవిడ పాపం నేల మీద కూర్చోలేదు. అందుకని ఒక విశాలమైన కుర్చీ చేయించుకుని దేవుడి గదిలో వేయించుకుంది. ఐతే తను దర్జాగా సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని, దేవుళ్ళని పీటలు వేసి నేలబారుగా కూర్చోపెట్టడానికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు కదా? పైగా… పూజ చేస్తూ, తనేదో దేవుళ్ళని ఆశీర్వదిస్తున్నట్లు, వారి మీద అక్షింతలు చల్లితే ఏం బాగుంటుంది? తనకన్నా దేవుళ్ళని కొంచెం ఎత్తులో కూర్చోపెట్టాలి. అందుకని పాలరాతితో ఒక ఎత్తైన గట్టు కట్టించి, దేవుళ్ళందరినీ గట్టెక్కించింది.
ఎవరైనా దేవుడిని ‘హే పరంధామా! నన్నీ కష్టాలనించి గట్టెక్కించవయ్యా.’ అని ప్రార్థిస్తారు. కాని జానకమ్మగారు మాత్రం ఆ దేవుళ్ళనే గట్టెక్కించేసింది.
ఈ విధంగా సర్వాంతర్యాములైన దేవుళ్ళు పరిస్థితులకి తలలొగ్గి, కొందరిళ్ళలో అటకలెక్కారు, కొందరిళ్ళలో అల్మారాలలో దాక్కున్నారు, కొందరిళ్ళలో భక్తులని గట్టెక్కించే ఆలోచనలు విరమించుకుని తామే గట్టెక్కేసారు!

చూసారా, పాపం? దేవుళ్ళకూ ఈ ఇబ్బందులు తప్పలేదు!

గోడమీద బొమ్మ

రచన: చెంగల్వల కామేశ్వరి

సాయంత్రపు సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి ఆకాశపు నీలాన్ని కాజేసినట్లుగా, నీలపురాశిలా మెరిపోతోంది. వేగంగా తెల్లని నురుగులుతో ఒడ్డుకి కెరటాలని తోస్తోంది. అంతే నెమ్మదిగా వెన్నక్కి వెళ్లిపోతోంది.
ఇసకలో కాళ్లు కూరుకుపోతుంటే చేతుల్లో బరువయిన సంచీ అతికష్టం మీద మోసుకు వస్తూన్న పరమేశానికి ఆయాసం ఎగతన్నుతోంది. నడవలేక నడవలేక నడుస్తున్న పరమేశాన్ని చూసి పరుగులు తీస్తూ సముద్రం వైపు వెడుతున్న ఒక అబ్బాయి.
“తాతా బ్యాగ్ బరువుగా ఉందా ఇలా ఇవ్వు నేను తెస్తా!” అన్నాడు.
ఆ అబ్బాయి మాటకు “వద్దులే బాబూ ! అన్నాడు. ఒక్కనిముషం ఆగి కొద్దిగా ఆయాసం తగ్గాక మళ్లీ నడుస్తూ, మెల్లగా తీరానికి కాస్త దూరం లో చెప్పులు విడిచి తన బ్యాగ్ కిందపెట్టి పక్కన చతికిల పడ్డాడు. మసక బారిన కళ్ల జోడు తీసి తుడుచుకుని మళ్లీ పెట్టుకున్నాడు.
గుండె బరువుగా ఉంది బీచ్ లో తనకి. కొద్ది దూరంలో కొత్తగా పెళ్లయిన జంటలు , పిల్లలతో బీచ్ కి వచ్చినవాళ్లు నీళ్లల్లో కేరింతలు కొడుతూ ఫొటోలు దిగుతున్నారు. కెరటాలు ఉప్పొంగి వచ్చినప్పుడు కెరటాల అంచుల మీద తేలియాడుతూ, పక్కనున్నవారి కెవ్వుకేకలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు.
పాత జ్ఞాపకాల లో తనూ రాజీ ఇలా ఇదే బీచ్ లో ఎంతగా కేరింతలు కొట్టారో! నిలువెల్లా తడిసిపోయి భయానికి తనని హత్తుకుపోయిన రాజీ, పరిసరాలు మర్చిపోయి తమకంగా రాజీని అల్లుకుపోయినతాను. తమని ఫొటోలు తీసిన బావమరిది. సిగ్గుతో మొహమంతా ఎర్రవారి తమ్ముడిని తిట్టి, వాటిని చింపబోతే, అడ్డుకుని దాచుకున్న ఆ ఫొటోలు ఇప్పటికీ తన బ్యాగ్ లో ఉన్నాయి.
అవేనా! పిల్లలతో వచ్చి తమందరి కేరింతల ఫొటోలు, బారసాల ఫొటోలు అన్నప్రాసన తమ పెళ్లిఫొటోలు పిల్లల అక్షరాభ్యాసం ఫొటోలు అత్తింటివారితో పుట్టింటివారితో, తీయించుకున్న ఫ్యామిలీ గ్రూప్ ఫొటోలు. ఒక్కటేమిటి తన చిన్నప్పటినుండి తమ షష్టిపూర్తి వరకు ఎన్ని ఫోటోలో బాగున్న ఫొటోలు అన్నీ ఆల్బమ్ లలోనే కాక లామినేషన్ చేయించి ప్రతీగదిలో గోడగోడకు తరాలవారీగా అలంకరింపబడ్డ ఫొటోలు. తమ పిల్లల వేడుకలు శుభకార్యాలు కి తీయించిన వీడియో కేసెట్స్ డీవీడిలు సీడీలు ఒక్కటేమిటి తన వాళ్ల ఆనందాన్ని ఒడిసిపట్టిన నిధులు అవి.
ఇప్పుడు కూడా చెక్కుచెదరని చిరునవ్వులతో పదిలంగా కనిపించే అమ్మానాన్నలు అత్తామామలు తాతయ్యబామ్మలు అమ్మమ్మతాతలు తో తాము కూడా రకరకాల భంగిమల లో ప్రతి ఫోటోలో కళకళలాడుతున్నారు.
వాళ్లంతా అదృష్టవంతులు. గోడలమీద మనసులలో మోసేవాళ్లున్నారనే భరోసాతో హేపీగా వెళ్లిపోయారు. వాళ్లంతా ఎదరుగా ఉన్నట్లే అనిపించేది. ఏదయినా బెంగ అనిపిస్తే ఆ పొటోలు చూస్తే ధైర్యంగా అనిపించేది. ఇప్పుడు ఉన్న ఇల్లు అమ్ముకుని కావలసినవే మూట కట్టుకుని పిల్ల ల దగ్గరికే వెళ్లిపోతున్నాడు. ఊరు వదిలిపోతే తనదంటూ పోయేవి ఇల్లూ పొలమే అనుకున్నాడు. కాని తనకేమి కావాలో అవేమి లేని వాడని ఇప్పుడు అర్ధమవుతోంది.
తామిద్దరి తొలివలపులు పంచుకుని తమకి పవళింపు సేవ చేసిన పందిరిమంచం, తనెదురుగానే తెల్సున్నవాళ్లకి రాజీ జరీపూల పట్టచీరే పైన వేసి కుట్టిన పట్టు చీరల పరుపుతో సహా ఇచ్చేస్తే గుండెకి చిల్లు పెట్టినట్లయింది.
కొత్తకాపురంలో తామిద్దరే వెళ్లి కొనుక్కున్న కాఫీ ఫిల్టర్ దగ్గరనుండి ఇటీవల కొన్న స్మార్ట్ టీవీ డబుల్ డోర్ ఫ్రిడ్జి వరకు అన్నీ అన్నీ అయిన కాడికి అమ్మేసిన కొడుకులు. ఇవెందుకు ఇవెందుకు అంటూ అన్నీ తీసిపారేసిన కోడళ్లు ని చూస్తే తమ కాపురాన్ని విచ్చిన్నం చేస్తున్న వాళ్లల్లా అనిపించారు. కూతుళ్లు అయినా కొన్ని తీసుకుంటారేమో ! అనడిగితే! మాకెందుకూ ! అనేసారు.
అదే రాజీ పలకసర్లు, చంద్రహారాలు ఉంగరాలు నెక్లెస్ లు, జిగినీ, ఆరుగాజుల జతలు మంగళ సూత్రాల గొలుసుతో సహా అందరూ పంచుకున్నారు. అవి వాళ్లకీ ఉన్నాయి. మరి. ! ఆస్తులు అమ్మిన డబ్బులో ఇచ్చిన వాటాలు కూడా తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ల అమ్మ జ్ఞాపకాలు తలంపుకి వచ్చి ఏడిచారు. కోడళ్లు వోదార్చారు. ఈ సఖ్యత చూసి రాజీ పైనుండే ఆనందపడాలి.
రాజీ బ్రతికున్నప్పుడు ప్రతీదానికీ పోటీలు పంతాలు వంతులు చివరికి రాజీ మంచం మీదున్నప్పుడు కూడా వాళ్లల్లో వాళ్లు వాదులాడుకుని అలకలొచ్చి ఎవరూ పలక్కుంటే తానె జావకాచి పట్టించాడు.
తాను పోయేవరకయినా ఈఇల్లు అమ్మకుండా ఉంటే తనకీ సమస్య వచ్చేది కాదు. తన వారందరి గురించి ఇంత బాధ తనకుండేది కాదు. మొన్నీమధ్య కళ్లుతిరిగి పడి తలకి దెబ్బ తగలడం వల్ల వాళ్ల దగ్గరకి రమ్మని బలవంతం పెట్టి ఇల్లు పొలం కారు కూడా బేరాలు పెట్టించారు . అప్పుడేమి అనిపించలేదు కాని ఒక్కొక్కొ సామాను తీసేసి అందరికి ఇచ్చేస్తుంటే తన ఆనందం అంతా మూటగట్టిన ఆ ఇంటిలో తల్లి తండ్రి . తోదబుట్టినవారు. భార్య. ఎవరూ లేని ఒంటరి వాడిలా. దిక్కు లేని అనిపించి తనలో తానే కుమిలిపోయాడు.
ఆ ఒక్కొక్జ వస్తువు తమింటిలోకి ఎప్పుడు ఎలా వచ్చిందో దానికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి స్వాగతాలు పలికినపుడు ఎంత ఆనందం తమ కుటుంబం అనుభవించిందో పిల్లలకీ తెలుసు. వాళ్ల కోసం అవన్నీ కూడపెట్టకున్నా తమకి కావలసిన వస్తువులన్ని కొనుక్కుని సంతోషాల హరివిల్లు విరబూయించుకున్నారు. ఈ పొదరిల్లు చెల్లాచెదురయి మాలి లేని పూదోట అయిపోతుంది.
ఇలా అవుతుందనేమో! తమ కొలీగ్స్ కొందరు ఇవన్నీ వాళ్లే చక్కపెట్టేసుకుని హాయిగా ఆశ్రమాలకి డబ్బుకట్టి వాళ్లకు కావలసిన సదుపాయాలు చేయించుకుని తెరిపిగా ఉన్నారు . ఎవరు చూడాలసిన పనిలేదు చూడాలనుకున్నవారు వాళ్లే చూసి వస్తారు. ఓపిక ఉన్నన్నాళ్ల మధ్యలో వాళ్లే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లేవారు. తనలా ఒంటరిగా మిగిలినా, అక్కడే ఉంటున్నారు.
తను బ్రతికే రోజులెన్నో! టైమ్ కి తింటూ మందులేసుకుంటూ ఉండేవాడికి ఎక్కడుంటే ఏమి ! తన ఉనికి తప్ప వారికేమి అక్కర్కేదు.
చివరికి గోడలకున్న ఫోటోలు అన్నీ తీసేస్తుంటే తను అవన్నీ సర్దుకుంటుంటే తన పిల్లలు
” అవన్నీ దేనికి ? అంటూ, “మాకే ఇరుకయి చస్తున్నాము. ఇవన్నీ ఎందుకు నాన్నా ! అలా వదిలేయండి కొనుక్కునవారే తీసేస్తారు అంటున్నారు. వాటిని అక్కర్లేని చెత్త అని వాళ్లంటూ ఉంటే బాధ ! . అవన్నీ శాశ్వతం అనుకుని లామినేట్ చేయించుకున్న ఫొటోలు చెత్తలో పారేయాలా! దేముడివయితే ఎక్కడో అక్కడ గుళ్లో పెట్టచ్చు. ఎవరికయినా ఇవ్వొచ్వు. కాని తమ ఫొటోలు ఎవరికి కావాలి? ఎక్కడపెడతారు? అన్న మీమాంశ రాగానే పరమేశానికి తన పాదాల క్రింద భూమి కదిలినట్లయింది.
స్థాన భ్రంశం అంటే ఇదేనా! వస్తువే ఉనికి కోల్పోతే మనిషికి ఉంటుందా! అనుకోగానే గుండేభయంతో ఒణికింది. ఒక ఫొటో గోడమీదనుండి తొలగిస్తే అదెక్కడుండాలి. ?పెట్టినచోటే ఉండాలి. మనిషి కూడా అంతేగా! తన సామ్రాజ్యంనుండి మరొక సామ్రాజ్యంలోకి వెడితే ! వారెక్కడ ఎలా ఉండమంటే అలా ఉండాలి. అంతేనా అంతేనా ! అని ఆక్రోశిస్తున్న మనసుని చిక్కపెట్టుకుని ఆ ఫొటోలన్ని సర్దుకుని ఇలా బీచ్ లోకి వచ్చాడు. వాటిని అన్నింటిని నీళ్లల్లో పారేయగలడు. కాని వాళ్లతో మమేకమైన తన మనసుని వారి అనుబంధాలను ఎక్కడ పారేయగలడు?
తను మాములు గృహస్తు పేరొందిన వాడేమి కాదు. తన వద్దే ఇన్ని ఫొటోస్ ఉంటే పేరొందిన వారుంటారు. కవులు కళాకారులూ రాజకీయనాయకులుంటారు. సన్మానాలు సత్కారాలు పొందిన జ్ఞాపకాల ఫోటోలు ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళవయితే మ్యుజియంలో పెడతారు. తనలాంటి సామాన్యులకందరికీ ఇదే పరిస్థితా?చనిపోయే వరకు తమ ఇంటిలోనే నివసించేవారు ఎంత అదృష్టవంతులు! ప్రాణం పోగానే శరీరాన్ని తగలేట్టేప్పుడు ఇలాంటి జ్ఞాపకాలు కూడా తగలేట్టేస్తే సరిపోతుంది కదా ?
ఇలా ఆలోచిస్తూ ఉన్న పరమేశం చీకటి పడుతోందని గ్రహించుకుని మెల్లగా లేచాడు పరమేశం. మెల్లగా నడుచుకుంటూ నీళ్ల కెరటాల వరకు ఆ బ్యాగ్ మోసుకుని వెళ్లాడు సముద్రపు కెరటాలు కాళ్లని తడిపితే, కళ్లు కన్నీళ్లలతో చెంపలని తడుపుతున్నాయి. బ్యాగ్ తెరచి ఒకొక్కొ ఫొటొ తీసి మసకబారిన కళ్ళతో కళ్ళారా చూసుకుంటూ, బలమంతా కూడగట్టుకుని. ఒక్కొక్క ఫోటో నీళ్లల్లోకి విసురుతున్నాడు.
చుట్టుపక్కల జనం వింతగా చూస్తున్నారు. విషయం అర్ధమైనవారు నిట్టూరుస్తూన్నారు. అర్ధం కానివారు పట్టించుకోవడం మానేశారు. బంధాలను వదలలేనట్లుగా పరమేశం విసిరిన ఫోటోలన్ని కెరటాల మీద తేలి వచ్చి పరమేశం కాళ్లకే తగులుతున్నాయి. ఇంకాస్త లోపలికి వెళ్లి విసుదామమని అడుగేసిన పరమేశం ఇసుకలో అడుగు తడబడి కెరటాలలో నిట్టనిలువుగా పడిపోయాడు. చేతిలో బరువుగా ఉన్న బ్యాగ్ తో సహా కెరటాలలో మునకలేస్తూ మాయమైపోయిన పరమేశం ఉనికి తెలీక బీచ్ లో వెతుకుతున్న అతని పిల్లలకు మాత్రం పరమేశం కుటుంబం వాళ్ళ అమ్మానాన్నలు తోబుట్టువులు, అన్నదమ్ముల కుటుంబాలతో దిగిన ఫ్యామిలీ ఫొటో ఒకటి దొరికింది. దాన్ని పట్టుకు భోరుమన్న పరమేశం పిల్లల చుట్టూ గుమిగూడారు అక్కడున్న జనం. పిల్లలందరి ఇళ్ల ల్లో గోడలమీద సతీ సమేతంగా కొలువు దీరాడు పరమేశం. ఆతనికి కావాల్సిన ఉనికి అతనికి దొరికింది. గోడ మీద బొమ్మలా తన కుటుంబానికి శాశ్వత చిరునామా సంపాదించుకున్నాడు

పాలమనసులు

రచన: కొత్తపల్లి ఉదయబాబు

అది నగరంలోని ప్రసిద్ధమైన కార్పొరేట్ పాఠశాల మెయిన్ బ్రాంచ్. ఎలిమెంటరీ సెక్షన్స్ వన్ టు ఫైవ్ క్లాసెస్ ఉన్న బ్లాక్ లోని పేరెంట్ విజిటర్స్ రూంలో ప్రిన్సిపాల్ గారి కోసం నిరీక్షిస్తున్నాయి రెండు జంటలు తమ పిల్లలతో.
ఒక పక్క ఆఫీసుకు టైం అవుతోంది. రఘువరన్ అసహనంగా భార్యకేసి చూసాడు. యూనిఫామ్ లో ఉన్న ఐశ్వర్య తల్లి చెయ్యి పట్టుకుని ధీమాగా కూర్చుంది.
చరణ్ కూడా తనభార్య ప్రశాంతి తో అక్కడే కూర్చున్నాడు. తల్లి చున్నీలో ముఖం దాచుకుని సింహం ముందు ఆహారమవబోతున్న లేడి పిల్లలా భయంగా తండ్రి వంక డోర్ వంక, ఐశ్వర్య వంకా తన తెల్లటి కళ్ళను తిప్పుతూ చూస్తున్నాడు అభినయ్.
“హోమ్ వర్క్ చేసేసావా. . . “హఠాత్తుగా అడిగింది ఐశ్వర్య ముద్దుముద్దుగా.
“ష్. . . సిగ్గులేదు ఆ అబ్బాయితో మాట్లాడటానికి?”మెల్లగా కటువుగా కూతుర్ని మందలించాడు రఘువరన్.
“లేదు”అన్నట్టుగా తలూపాడు తల్లి చున్నీ చాటునుంచి అభినయ్.
మండి పోయింది చరణ్ కి. అతనికి కోపం వచ్చినట్టు కంద గడ్డలా మారిన ముఖంలో దవడ కండరం బిగుసుకోవడమే తెలుపుతోంది. ప్రశాంతి “తప్పు నాన్న మాట్లాడకు” అన్నట్టు అభినయ్ కి నోటిమీద వేలు పెట్టి చూపించింది.
“సిగ్గు లేకపోతే సరి. పిల్లల్ని చిన్నప్పటినుంచి సక్రమంగా పెంచుకోకపోతే ఇలాగే దోషుల్లా నిలబడి సంజాయిషీ ఇచ్చు కోవాల్సి వస్తుంది. వాళ్ళు తప్పు చేసిన పాపానికి మనకి టైం వేస్ట్. ” గొణుక్కుంటున్నట్టుగానే రఘువరన్ అన్నా చరణ్ కి స్పష్టంగా వినిపించింది.
“మిస్టర్. మైండ్ యువర్ లాంగ్వేజ్. ” అనేలోపుగానే ప్రశాంతి బలంగా చరణ్ జబ్బపుచ్చుకుని ఆపింది.
అంతలో ప్రిన్సిపాల్ ప్రవేశించి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ తన సీట్ లో కూర్చున్నాడు. సాలోచనగా తల పంకించి కాలింగ్ బెల్ ప్రెస్ చేసాడు.
ఒక 18 సంవత్సరాల అమ్మాయి లోపలికి వచ్చింది.
“టీచర్. సెకండ్ క్లాస్ టీచర్ ప్రవల్లికను రమ్మనండి. “ఆజ్ఞాపించాడు.
“ఎస్సార్”అని ఆ అమ్మాయి నిష్క్రమించింది.
“గుడ్ మార్నింగ్ సర్”అన్నాడు అభినయ్ ప్రిన్సిపాల్ కి సెల్యూట్ చేస్తూ.
అది విని ఐశ్వర్య కూడా “గుడ్ మార్నింగ్ సర్” అని ప్రిన్సిపాల్ కి సెల్యూట్ చేసింది.
“గుడ్ మార్నింగ్ మై స్వీట్ చిల్డ్రన్”అన్నాడు ప్రిన్సిపాల్ చిరునవ్వుతో.
అపుడు పిల్లల పేరెంట్స్ కేసి చూస్తూ ” గుడ్ మార్నింగ్ పేరెంట్స్. “అని పెద్దవాళ్ళు నలుగురికి విష్ చేసాడు.
తిరిగి విష్ చేశారు రఘువరన్, చరణ్ లు కూడా.
అంతలో “మే ఐ కమిన్ సర్?” అనుమతి అడుగుతూనే లోపలికి వచ్చింది. తిండి, గుడ్డ కరువై బీదస్థితిలో ఉండి కాలర్ బోన్స్ బయటకు కనిపిస్తున్న 20 ఏళ్ల ఆఅమ్మాయి స్వరం మాత్రం కోకిల కంఠంలా ఉంది.
తమ టీచర్ చూస్తూనే మళ్లీ “గుడ్ మార్నింగ్ టీచర్” అంటూ పిల్లలిద్దరూ ఒకే శృతిలో విష్ చేశారు. ప్రవల్లిక పిల్లలిద్దరినీ తిరిగి విష్ చేసింది.
ప్రిన్సిపాల్ కంఠం సవరించుకుని ” డియర్ పేరెంట్స్. మీరు మీ పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అంతా విన్నాక మీరు మాట్లాడటానికి నేను పెర్మిషన్ ఇస్తాను. ఈలోగా మీరు ఒక్క మాట మాట్లాడటానికి ప్రయత్నించినా మీరు మీ పిల్లల టీ. సి. తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. మళ్లీ మీ పిల్లలకు ఇక్కడ అడ్మిషన్ కావాలంటే ఒక ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఒకే కదా. ” అని వారిని హెచ్చరించి వారి సమాధానం కోసం చూడకుండా ప్రవల్లికని అడిగాడు.
“మిస్. మీరు చెప్పండి. నిన్న క్లాస్ లో ఎం జరిగిందో వివరంగా చెప్పండి. ”
పేరెంట్స్ టీచర్ చెప్పేదానికోసం అలెర్ట్ అయ్యారు.
“సర్. నా సెకండ్ క్లాస్ లో ఇద్దరు ఐశ్వర్య లు ఉన్నారు. కె. ఐశ్వర్య, ఈపాప ఎం. ఐశ్వర్య. నిన్న కె. ఐశ్వర్య పుట్టినరోజు. వాళ్ళ పేరెంట్స్ ఆ పాపని పుట్టినరోజు డ్రెస్ వేసి టీచర్స్ అందరికి కేక్స్, క్లాసులో పిల్లలందరికీ చాకలెట్స్ పంపారు. ఆ ఐశ్వర్యకు పిల్లలందరూ క్లాస్ లో హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడాక, స్వీట్స్ పంచడానికి ఈ ఐశ్వర్య ని చాకలెట్స్ ఉన్న బాక్స్ పట్టుకోమని చెప్పి ఒక్కొక్కరికి చాకలెట్స్ ఇవ్వసాగింది. సరిగ్గా అభినయ్ దగ్గరకు వచ్చి చాకలెట్స్ ఇస్తున్నప్పుడు అవితీసుకుని ” ఐశ్వర్య . ఐ లవ్ యూ ఐశ్వర్య” అన్నాడు. వెంటనే ఈ ఐశ్వర్యకి కోపం వచ్చి నేను చెబుతున్నా వినకుండా ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసింది సర్. తరువాత మీరు చెప్పినట్లుగానే డైరీస్ లో వాళ్ల పేరెంట్స్ ను ఈ మార్నింగ్ మిమ్మల్ని కలవడానికి రమ్మని రాసాను. ఇదే సర్ జరిగింది. ”
“ఒకే. నౌ యూ కెన్ గో అండ్ సెండ్ దట్ ఐశ్వర్య. ” ఆర్డరేశాడు ప్రిన్సిపాల్. ఆ అమ్మాయి బతుకు జీవుడా అంటూ అక్కడనుంచి నిష్క్రమించింది.
“విన్నారుగా పేరెంట్స్. అదీ జరిగింది. అమ్మాయి ఐశ్వర్యా. . . ప్లీజ్ కం టు మీ. ” పిలిచాడు ప్రిన్సిపాల్.
“సార్ పిలుస్తున్నారుగా వెళ్ళు. నిన్ను అలాంటి మాటలు అన్నవాళ్ళకి లేని భయం నీకెందుకు?ధైర్యంగా సర్ ఆడిగినదానికి సమాధానం చెప్పు. నెనున్నాగా ఇక్కడ”అన్నాడు రఘువరన్.
ఐశ్వర్య ధీమాగా ప్రిన్సిపాల్ దగ్గరగా వచ్చింది.
“అభినయ్ నిజంగా నిన్ను ఐ లవ్ యు అన్నాడామ్మా” అడిగాడు ప్రిన్సిపాల్
“ఎస్సార్. నిజంగానే అన్నాడు. నాకు భయమేసింది. వచ్చి మీతో చెప్పేసాను. కావాలంటే కె. ఐశ్వర్యని కూడా అడగండి. ” అంది.
“నువ్ కూడా ఇలా రా నాన్న. . . “అభినయ్ ని పిలిచాడు ప్రిన్సిపాల్.
అసలు తాను అన్నదాంట్లో తప్పేముందని తనని ప్రిన్సిపాల్ ముందు నిలబెట్టారో అర్ధం కాని ఆ లేతమనసు ఒక్కసారిగా ఏడవసాగాడు.
ప్రశాంతి అభినయ్ ని ఎత్తుకుని కళ్ళు తుడుస్తూ అంది. “తప్పు నాన్న. ప్రిన్సిపాల్ సర్ ఏమీ అనరు. నేను డాడీ ఇక్కడే ఉన్నాం కదా. సర్ ఆడిగినదానికి సరిగ్గా సమాధానం చెప్పు. ప్లీజ్ నాన్న. ఐ లవ్ యూ కదూ. ”
అభినయ్ ఏడుపు ఆపాడు. ప్రశాంతి అభినయ్ ని చరణ్ కి ఇచ్చింది. చరణ్ అభినయ్ ని ఎత్తుకుని “ఆ ఐశ్వర్య కూడా వస్తుంది కదా. సర్ ఆ అమ్మాయిని కూడా అడుగుతారు. నీకేం భయం లేదు. నిన్ను ఎవరూ ఏమీ అనరు. నేనున్నాను కదా. యూ లవ్ మీ కదా. ఏడవకుండా సర్ అడిగినదానికి భయపడకుండా సమాధానం చెప్పు. ఒకే నా”అని బుజ్జగించి ప్రిన్సిపాల్ దగ్గరకు పంపాడు.
అభినయ్ ప్రిన్సిపాల్ దగ్గరగా వచ్చి చేతులు కట్టుకున్నాడు.
“గుడ్ మార్నింగ్ సర్. మే ఐ కం ఇన్ సర్” అని నవ్వుతూ అడిగి లోపలికి వచ్చిన ఆ పాపను చూస్తూనే అక్కడి అందరి కళ్ళూ పెద్దవయ్యాయి ఆశ్చర్యం తో.
బాదం పాలతో స్నానం చేసిన బాల దేవకన్యలా మెరిసిపోతోంది ఆ అమ్మాయి. నవ్వితే పారిజాతపు పూలు జలజలా రాలుతున్నాయా అన్నంత అద్భుతంగా నవ్వుతోంది.
“ఎందుకు సర్ నన్ను రమ్మన్నారు?” అడిగింది ప్రిన్సిపాల్ ని.
“ఎం లేదురా. చిన్న మాట అడుగుదామని. నిన్న క్లాస్ రూమ్ లో నువ్ స్వీట్స్ పంచినపుడు అభినయ్ ఏమైనా అన్నాడా?”
గుర్తుకు వచ్చినట్టు అంది ఐశ్వర్య.
“ఎస్ సర్. క్లాస్ రూమ్ లో అందరూ థాంక్స్ చెప్పారు. కానీ అభినయ్ కి ఇచ్చినప్పుడు “ఐశ్వర్య. ఐ లవ్ యూ ఐశ్వర్య. ” అన్నాడు. అపుడు ఎం. ఐశ్వర్య ఏడుస్తూ వచ్చి మీకు కంప్లయింట్ చేసింది. అంతే సర్” అంది అమాయకంగా.
“అభినయ్ అలా అని నిన్ను అన్నాడా. . . ఎం. ఐశ్వర్య ని అన్నాడా?” అడిగారు ప్రిన్సిపాల్.
“నాతోనే అన్నాడు సర్. మరి ఎం. ఐశ్వర్యకు ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్ధం కాలేదు సర్. “అంది కె. ఐశ్వర్య నవ్వుతూ.
“ఒకే. యూ కెన్ గో టు యువర్ క్లాస్. ”
“థాంక్యూ సర్. “కె. ఐశ్వర్య వెళ్ళిపోయింది.
ప్రిన్సిపాల్ అభినయ్ ని దగ్గరకు తీసుకున్నాడు.
“నాన్నా అభినయ్. ఇపుడు నువ్ చెప్పు. నువ్ ఐ లవ్ యూ అని ఎవరిని అన్నావు?కె. ఐశ్వర్యనా? ఎం. ఐశ్వర్యనా? చెప్పు నాన్నా?” అనునయంగా అడిగాడు ప్రిన్సిపాల్.
వాళ్ళిద్దరిని అడిగాక తనని అడుగుతున్నారన్న ధైర్యంతో అన్నాడు అభినయ్ ” సర్. నిన్న కె. ఐశ్వర్య వేసుకున్న బర్త్ డే డ్రెస్ చాలా చాలా బాగుంది. అలాంటిది మా చెల్లికి మమ్మీ చేత కొనిపించాలనిపించింది. సరిగ్గా అపుడు కె. ఐశ్వర్య నాచేతుల్లో చాకలెట్స్ పెట్టింది. అంత దగ్గరగా వచ్చిన కె. ఐశ్వర్య ను చూసి ఐ లవ్ యూ అన్నాను. అంటే నువ్ ఈ డ్రెస్సులో చాలా బాగున్నావ్ అని అన్నాను. ప్రామిస్ సర్. నేను కె. ఐశ్వర్యనే అన్నాను. ఎం. ఐశ్వర్య ని అనలేదు. ప్లీజ్ సార్. నన్ను స్కూల్ నుంచి పంపకండి సర్. మా మమ్మీ ఏడుస్తుంది సర్. ప్లీజ్ సర్. “చివరలో అభినయ్ కి దుఃఖం పొర్లుకు వచ్చేసింది.
“నో నాన్నా. నువ్వు ఈ స్కూల్ లొనే చదువుతావ్. సరేనా. ఇంకెప్పుడూ అలాంటి మాటలు అనకూడదు. సరేనా. అభినయ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. గో టు యువర్ క్లాస్ రూమ్. ఎం. ఐశ్వర్య కమాన్. విన్నావ్ గా. అభినయ్ అన్నది నిన్ను కాదమ్మా. కె. ఐశ్వర్య ని. అయినా ఐ లవ్ యూ అంటే నీకు ఏమి అర్ధం అయిందమ్మా?” అడిగాడు ప్రిన్సిపాల్.
” టి. వి. లో వేసిన సినిమాలో హీరోయిన్ హీరోకి ఐ లవ్ యూ చెప్పకపోతే ముఖం మీద ఆసిడ్ పోసేసాడు సర్. ఇంకో సినిమాలో అయితే కత్తి పెట్టి హీరోయిన్ గొంతు కోసేసాడు సర్. అందుకే భయమేసి వచ్చి మీతో చెప్పాను సర్. కె. ఐశ్వర్య నైనా అనకూడదు కదా సర్. “ఆరిందాలా చేతులు తిప్పుతూ అంది ఎం. ఐశ్వర్య.
“ఒకే. నేను మీ పేరెంట్స్ తో మాట్లాడి పంపిస్తాను. యూ బోత్ గో టు యువర్ క్లాస్. బాగా చదువుకోవాలి. . నౌ మీరిద్దరూ గుడ్ ఫ్రెండ్స్. సరేనా?” అన్నాడు ప్రినిపాల్.
“ఒకే అండ్ థాంక్యూ సర్. బై మమ్మీ బై డాడీ. . . “అని పిల్లలిద్దరూ హుషారుగా అక్కడనుండి వెళ్లిపోయారు.
ప్రిన్సిపాల్ పేరెంట్స్ వైపు తిరిగారు.
” చూసారా సర్స్. ఈ ప్రపంచంలో అతి పవిత్రం గా పలకవలిసిన “ప్రేమ”అన్న పదం, ఆ పదానికి పూర్తి అర్ధం తెలియని పాలమనసుల్లో ఎటువంటి స్థితికి దిగజారిపోయిందో అర్ధమైందా సర్? అభం శుభం ఎరుగని ఆ పసి మనసుల్లో పుచ్చు విత్తనమై నాటుకుని అది మొక్కగా పెరిగి వృక్షమైతే దానికి బాధ్యులు ఎవరు సర్? మీరా? మేమా? చెప్పండి.
అనురాగం ఆత్మీయత అభిమానం ఇలాంటి అమృత తుల్యమైన మాటలున్న మన మాతృభాషకు సమాంతరంగా పరిజ్ఞానం కోసం ఆంగ్లభాష నేర్చుకోవలసిందే. నేర్చుకునే భాషల పట్ల మమకారాన్ని పెంచి అవగాహన కలిగించండి. అభం శుభం తెలియని ఏనిమిదేళ్ల వయసులో ఐశ్వర్యకు ఐ లవ్ యూ అంటే ఎలా అర్దమైందో చూసారా. . ?ఎవరు దానికి కారణం?, మేమా?
అలాగే పిల్లల పట్ల ప్రేమ ఉండాల్సిందే. కానీ వాళ్ళని సముదాయించడం కోసం ఐ లవ్ యూ నాన్న. యూ లవ్ మీ కదా. . . అని ముద్దు చెయ్యడం ఎంతవరకు సమంజసం?ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ఎంత అమృతమైనా విషమౌతుంది.
పిల్లల పెంపకంలో ప్రేమ ఎంత అవసరమో క్రమశిక్షణా అంతే అవసరం. వాటిని సమపాళ్లలో పెంపకంలో పిల్లలకు అందించిన నాడు పిల్లలలో ఈ విపరీత ధోరణు లుండవు.
డబ్బు అవసరానికి మించి సంపాదించి పిల్లల చదువులకు అవసరాలకు ధారపోస్తున్నామనుకుంటారే గాని వారి ప్రవృత్తి, ప్రవర్తన తల్లిదండ్రులు పట్టించుకోక పోతే రాబోయే తరం చేతిలో రాజీ పడలేక బ్రతకలేక జీవశ్చవా లల్లా బ్రతుకు ఈడ్చుకు రావలసిందే. ఆ పరిస్థితి మీకు రాకూడదనుకుంటే మీరు ఇప్పటినుంచీ జాగ్రత్తపడటం మంచిది. అర్ధమైందనుకుంటాను. ఇక మీరు వెళ్ళవచ్చు సర్” అన్నాడు ప్రిన్సిపాల్ లేచి నిలబడి.
తన పిల్లలో తప్పు పెట్టుకుని ఎదుటివారిని పరుషంగా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడ్డాడు రఘువరన్. తన పిల్లవాడితో ఎలాంటి మాటలు మాట్లాడాలో అర్ధమైన చరణ్ తన ప్రవర్తనను మనసులో నొచ్చుకున్నాడు.
నలుగురు లేచి వెళ్ళడానికి ఉద్యుక్తులౌతుండగా రఘువరన్ చరణ్ తో ” ఐయాం వెరీ సారి బ్రదర్. వెరీ వెరీ సారీ. ” అన్నాడు చరణ్ తో కరచాలనం చేసి.
చరణ్ కూడా “అయామ్ అల్సొ సో సారి ఫర్ ద ఇన్ కన్వీనియన్స్ బ్రదర్. రియల్లీ వెరీ సారీ. ” అన్నాడు.
“మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని మాట ఇస్తున్నాం సర్. మీ అమూల్య సూచనలకు సదా కృతజ్ఞతలు సర్. నమస్తే. ” అందరూ బయటకు కదులుతుండగా చివరగా ప్రశాంతి చెప్పిన మాటలకు మెచ్చుకోలుగా చూస్తూ చిరునవ్వుతో వీడ్కోలు పలికాడు ప్రిన్సిపాల్.

సమాప్తం

అమ్మమ్మ – 6

రచన: గిరిజ పీసపాటి

నాగకి జ్వరం ఎక్కువగా ఉండడంతో తమ ఇంటిలోకి తీసుకుని వచ్చి పడుకోబెట్టాక తెల్లవార్లూ నాగను కనిపెట్టుకుని కూర్చున్నారు తాతయ్య, అమ్మమ్మ, పెద్దన్నయ్య, వాళ్ళ అమ్మగారు. గంట గంటకూ నాగకి జ్వరం పెరగసాగింది. తెల్లవారేసరికి నాగకి ఒళ్ళంతా‌ కుంకుడు గింజల‌ పరిమాణంలో కండలు పోసేసి పెద్దమ్మవారు పోసింది. నాలుక మీద, నాలుక కింద, ఆఖరికి కంట్లో కూడా కుండలు పోసాయి.

వాటివల్ల విపరీతమైన దురదలు, మంట, జ్వరంతో నాలుగు సంవత్సరాల వయసు గల నాగ బాధ పడసాగింది. నాగకు అమ్మవారు పోసిన విషయం చూసిన తాతయ్య వెంటనే నాగ పుట్టినప్పుడు అమ్మమ్మకి‌ పురుడు పోసిన డాక్టర్ రాజేశ్వరమ్మ గారికి కబురు చేసారు. ఈలోగా నాగకు ఒంట్లో బాగోలేదని తెలిసిన తెనాలి నాజర్ పేట నివాసులంతా నాగను‌ చూడడానికి రావడంతో ఇల్లు కిటకిటలాడసాగింది.

ఈలోగా డాక్టర్ రాజేశ్వరమ్మ గారు రావడం, నాగను పరీక్షించి అది పెద్దమ్మవారు అనీ, వెంటనే ఫిజీషియన్ అయిన డాక్టర్ నమశ్శివయ్య గారికి చూపించమని సలహా ఇచ్చారు. నాగను చూడడానికి వచ్చిన ఊరివారు మాత్రం అమ్మవారు పోసినప్పుడు వైద్యం చేయిస్తే అమ్మవారికి ఆగ్రహం ఎక్కువై పిల్ల దక్కదని, అందువల్ల వైద్యం చేయించొద్దని సలహా ఇచ్చారు.

కానీ తెనాలి తాతయ్య నాగకు వైద్యం చేయించడానికే నిశ్చయించుకుని డాక్టర్ నమశ్శివయ్య గారికి కబురు పెట్టగా ఆయన వెంటనే వచ్చి నాగను పరీక్షించి అవసరమైన ఇంజక్షన్స్‌ చేసి, మాత్రలు ఇచ్చి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళారు. కానీ మాత్రలు మింగడానికి నోటిలో పోసిన అమ్మవారి పొక్కుల వల్ల సాధ్యం కాక బాగా ఇబ్బంది పడింది నాగ.

ఊరి జనమంతా పిల్లకి వద్దన్నా వైద్యం చేయిస్తున్నారు – పిల్ల దక్కుతుందో లేదో, ఇంట్లో ఎవరికైనా అమ్మవారు పోస్తే నూనె వంటకాలు చెయ్యకూడదు కనుక మన ఇళ్ళల్లో కూడా నాగకి అమ్మవారు తగ్గేవరకు ఎవరూ నూనెతో వంటలు చేయరాదని, ఆఖరికి పోపుకోసం కూడా నూనె వాడరాదని‌, ఏదో పచ్చడి, పప్పు మాత్రమే వండుకుందామని తీర్మానించుకుని వెళ్ళిపోయారు. నాగ పరిస్థితి ఇలా ఉండడంతో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పొయ్యి లోని పిల్లి లేవనేలేదు.

ఇలా పదిహేను రోజులు గడిచింది. అమ్మమ్మకి, తాతయ్యకి ఊరిలోనివారో, వారి ఇంటిలో అద్దెకుంటున్న వరలక్ష్మమ్మ గారో ఇంత ఉడకేసి ఇస్తే అదే తినసాగారు. నాగకి మందులు వాడుతున్నా పొక్కులు తగ్గలేదు సరికదా మరి కాస్త పెరిగాయి. ఒంటిమీద సెంటీమీటర్ గేప్ కూడా లేకుండా అమ్మవారు తీవ్రంగా పోసేసింది.

నాగకు అమ్మవారు పోసిన పదహారవ రోజు రాత్రి అమ్మమ్మ అర్ధరాత్రి దాటేవరకూ నాగను కనిపెట్టుకుని ఉండి, దుఃఖాన్ని నిగ్రహించుకోలేక దేవుడి గదిలోకి వెళ్ళి ఆ లలితా పరమేశ్వరిని ప్రార్ధిస్తూ అక్కడే మగత నిద్రలోకి జారుకుంది. అప్పుడు నిద్రలో వచ్చిన కలకి హఠాత్తుగా మెలకువ వచ్చింది అమ్మమ్మకి. ఆ కల తలుచుకుని నిలువునా‌ వణికిపోయింది.

తెల్లవారుజామున వచ్చిన కలలు తప్పకుండా నిజమౌతాయని అమ్మమ్మ ప్రగాఢ విశ్వాసం. కానీ… ఈ కల నిజమైతే… కాకూడదు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో అమ్మమ్మకు హఠాత్తుగా గుర్తుకొచ్చారు – తన అన్నయ్యకు ఒంట్లో బాగోలేనప్పుడు తరుణోపాయం సూచించి అన్నయ్య జీవితాన్ని నిలబెట్టిన అన్నపూర్ణ శాస్త్రులు గారు.

ఆయన ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసకులు. ఆయనే తనకు కూడా తరుణోపాయం సూచించగలవారు. కనుక ఆలస్యం చేయకుండా వెంటనే స్నానం చేసి, దేవుడికి దీపం పెట్టుకుని, తాతయ్యకి చెప్పి అన్నపూర్ణ శాస్త్రులగారి దగ్గరకు వెళ్ళింది. అప్పుడే పూజ, జపం పూర్తి చేసుకుని హాలులోని వాలు కుర్చీలో కూర్చుని ఉన్న అన్నపూర్ణ శాస్త్రులు గారు అమ్మమ్మను చూస్తూనే “బాగా దుఃఖంలో ఉండి, దిక్కుతోచని స్థితిలో వచ్చావు. ముందు లోపలికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని రా! తరువాత మాట్లాడుదాం” అన్నారు.
అమ్మమ్మ వారి ఇంట్లోనే ఉన్న పూజా పీఠాన్ని దర్శించి, నమస్కరించుకుని, తిరిగి వారి వద్దకు వచ్చింది.

అమ్మమ్మ తిరిగి వచ్చేసరికి వారు అర్ధ నిమీలిత నేత్రాలతో మౌనంగా ఉండడం చూసి, వారి ఏకాగ్రకు భంగం కలిగించకుండా మౌనంగా నిలుచుంది. కాసేపటి తరువాత కళ్ళు తరిచిన అన్నపూర్ణ శాస్త్రులు గారు “దేవుడితో పందెమా తల్లీ! అందులోనూ ఆ నాగేంద్రస్వామితోనా ఆటలు!? స్వామికి దయ కలిగితే ఎన్ని వరాలు కురిపిస్తాడో, కోపిస్తే అంతగా శపిస్తాడు. ఈ సంగతి తెలిసీ స్వామితో చెలగాటమా! అమ్మాయి పడమటి దిక్కుకి తిరిగి పడుకొనుంది. గౌరినాధం పక్కనే కూర్చుని వేపమండలతో విసురుతున్నాడు, పెద్దవాడు సత్యనారాయణ గ్లూకోజ్ నీరు పట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ, పిల్ల తాగలేక ఏడుస్తోంది” అంటూ చెప్తూనే మెత్తగా చీవాట్లు పెట్టారు.

తను ఏ విషయం చెప్పకుండానే సర్వం గ్రహించిన అన్నపూర్ణ శాస్త్రుల గారి పాదాల మీద పడింది అమ్మమ్మ. “తప్పు చేసాను, ముప్పు తప్పే మార్గం సూచించ”మని వేడుకుంటూ… ఇంతకీ అమ్మమ్మకి వచ్చిన కల మీకు చెప్పనే లేదు కదూ! మగత నిద్రలోకి జారిన అమ్మమ్మ కలలోకి ఒక చిన్న పాము పిల్ల కనిపించి చూస్తుండగానే ఐదు పడగలతో గదంతా చుట్ట చుట్టుకుని “బిడ్డ పుడితే కంఠానికి కాటు ఇస్తానని మొక్కుకున్నావు కదా! నీకు బిడ్డను ప్రసాదించాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన మాటను తప్పిన కారణంగా నేను ప్రసాదించిన బిడ్డను తిరిగి నాతో తీసుకుపోతున్నాను. నేనిటి సరిగ్గా నాలుగో రోజున నీ బిడ్డను నేను తీసుకెళ్ళపోతాను” అనడంతో అమ్మమ్మ భయపడిపోయింది.

తరువాత స్వామితో “అప్పుడు ఏదో నైరాశ్యంలో అలా అన్నాను కానీ, ఇప్పుడు నాకు పిల్లను చూస్తే బతకాలని ఉంది. ఆయనలో కూడా నేను కోరుకున్న మార్పు వచ్చింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. నాకు అప్పుడే చనిపోవాలని లేదు. కనుక ఏదైనా వేరే మార్గం ఉందా? నేను, నా పిల్ల కూడా బతకడానికి?” అని అడగగా నాగేంద్రస్వామి ‘ఉంది’ అన్నట్లుగా తల ఊపుతూ అదృశ్యమైపోయాడు. ఇదీ అమ్మమ్మకి వచ్చిన కల. ఈ కల రావడంతో పరిష్కార మార్గానికై అన్నపూర్ణ శాస్త్రుల గారిని‌ ఆశ్రయించింది అమ్మమ్మ.

****** సశేషం ******

ఎగురనీయండి. ఎదగనీయండి

రచన: మీరా సుబ్రహ్మణ్యం

సరోజ నేను కలిసి చదువుకున్నాము. ఓకే వూళ్ళో వేరే సంస్థలలో ఉద్యోగం చేస్తున్నాము. నాకు తోబుట్టువులు లేని లోటు తీర్చింది సరొజ. ఈ పాతికేళ్ళ స్నేహంలో తన కుటుంబ సభ్యులూ నాకు ఆత్మీయులయ్యారు.
గత పదిహేను సంవత్సరాలుగా జీవితంతో వొంటరి పోరాటం చేస్తొంది సరోజ. పెళ్ళైన నాలుగేళ్ళకే సరోజ భర్త రవి స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపొయాడు. అప్పటికి మూడేళ్ళ పసివాడు సాయి. సాయి కోసమే తన బ్రతుకు అన్నట్టు తల్లి తండ్రి తానే అయి పెంచుకుంది వాడిని.
సాయి స్వతహాగా తెలివైన వాడు. పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో పదో స్థానంలో ఉతీర్ణుడయ్యాడు. పొంగిపోయింది సరోజ. సాయిని డాక్టర్ని చేసి వాళ్ళ నాన్న కన్న కలలను నిజం చేయాలని సరోజ ఆశ. “నాకు బైయాలజీ ఇష్టం లేదమ్మా. “అన్న సాయి మాటలకు క్రుంగిపోయింది పోయింది. అమ్మను నొప్పించ లేక అయిష్టంగానే ఒప్పుకున్నాడు సాయి. వాడిని వదిలి వుండలేకపోయినా మంచి కాలేజి అని నెల్లూరులో ఇంటర్మీడియేట్ లో చేర్చి , హాష్టల్ లో పెట్టింది.
మొదటి సంవత్సరం తరువాత సెలవులలో ఇంటికి వచ్చిన సాయి ఒక వారం మాత్రం అమ్మ దగ్గర వున్నాడు.
“అప్పుడే వెళ్ళాలా? ” అన్న నా మాటలకు ఫేలవంగా నవ్వి “పెరోల్ మీద వచ్చిన ఖైదీలము కదా అంకుల్.” అన్నాడు.
“నా కోసం ఈ ఒక్క సంవత్సరం కష్టపడు నాన్నా. ఎలాగైనా నువ్వు మెడికల్ కాలేజీ లో చేరాలి. మీ నాన్నకు నేను ఇచ్చిన మాట నిలబెట్టు ” సాయిని దగ్గరకు తీసుకుని అంది. సరోజ. తమ భుజాల చుట్టూ వున్న అమ్మ చేతిని పక్కకు తప్పించాడు సాయి.
మరో ఏడాది తరువాత ప్రవేశ పరీక్షలు కూడా రాసాక ఇంటికి వచ్చాడు సాయి.
సాయి ని తీసుకుని ఇంటికి వచ్చింది సరోజ.
వచ్చినప్పటినుండి గమనిస్తున్నాను సాయి ఎప్పటిలా ఉత్సాహంగా లేడు. నేను అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా జవాబు చెప్పి ఊరుకున్నాడు.
సరోజ మాత్రం పెద్ద బరువు దించుకున్న దానిలా విశ్రాంతిగా కూర్చుని తన ఆఫీస్ విషయాలు చెబుతోంది.
” కాఫీ కలుపుకుని వస్తాను “అని నా భార్య రంజని లేవగానే “పద నేనూ వస్తాను”అని సరోజ అనుసరించింది.
“మెడిసిన్ ఏ కాలేజీలో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు సాయీ? ”
” ఏమో అంకుల్ . అమ్మ ఇష్టం. ” అన్నాడు నిరాసక్తంగా.
సాయి మెడిసిన్ చదివి గొప్ప వైద్యుడుగా పేరు తెచ్చు కోవాలని సరోజ జీవితాశయం.
“ఎం. బి. బి. ఎస్ చేస్తే చాలదు సాయీ మళ్ళీ పి. జి. కూడా చేయాలి కదా. మంచి బ్రాంచ్ ఎన్నుకోవాలి.”
” అదికూడా అమ్మ అప్పుడే నిర్ణయించేసింది కదా అంకుల్. నన్ను డాక్టర్ని చేస్తానని నాన్న ఎప్పుడూ అనేవారట. నాన్న కోరిక తీర్చడం కోసం నేను మెడిసిన్ చదవాలి. మా నాన్నమ్మ గుండె పోటుతో పోయింది అందుకుని నేను కార్డియొలొజిస్ట్ కావాలిట ” చేదుగా వున్నాయి సాయి మాటలు.
సాయి దేనిగురించో మనసులో మధన పడుతున్నాడని నాకు అర్థం అయ్యింది. చిన్నప్పటినుంచీ ఇది వాడికి అలవాటే. తన భావోద్వేగాలు మనసులో దాచుకుంటాడు తప్ప బయట పడడు. సాయిలో కనపడుతున్న ఈ నిరాశకు, నిరుత్సాహానికి కారణ మేమిటో తెలియడం లేదు నాకు .
అంతలో రంజని మా కోసం కాఫీ తీసుకు వచ్చింది. సరోజ కొడుకు కోసం బూస్ట్ తెచ్చింది. ” రెండేళ్ళు హాస్టల్లో వుండి వచ్చినా నీ కొడుకు ఇంకా కాఫీ కి అలవాటు పడలేదు అనుకుంటున్నావా ? తమాషాగా అడిగాను.
” నా సాయి అమ్మకు ఇష్టం లేని పని ఎప్పుడూ చేయడు ” అంది నమ్మకంగా.
అమ్మ అందిస్తున్న కప్పు అందుకుని పక్కన పెట్టేసాడు సాయి.
“సాయి మెడిసిన్ లో చేరిపోతే జీవితంలో స్థిరపడినట్టే. ఇక నాకు నిశ్చింత.”సాయి వీపు నిమురుతూ అంది సరోజ.
సాయి అసహనంగా కదిలాడు. తల్లి చేతిని తన మీద నుండి తప్పించి కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. రెండు చేతులు జాచి కిటికీకి వున్న గ్రిల్ ని గట్టిగా పట్టుకున్నాడు.
ఇన్నాళ్ళు తల్లి కొంగు చాటు పసివాడిగా కనబడిన సాయి హఠాత్తుగా పెద్దవాడై పోయినట్టు, తనదైన వ్యక్తిత్వాన్నీ , అస్థిత్వాన్నీ వెతుక్కుంటున్నట్టుఅనిపించింది.దేనికోసమో ఆరాట పడుతున్నట్టుగా వున్నాడు. నిజమే.పద్దెనిమి దేళ్ళు నిండుతున్నాయి సాయికి. ఇంచుమించు నా అంత పొడుగు వున్నాడు. నూనూగు మీసాలు, రోజూ షేవింగ్ అవసరమయ్యే చెంపలు చూస్తుంటే ఎంతలో ఎదిగి పోయాడు అని నాకే ఆశ్చర్యం కలుగుతోంది.
సాయి భవిష్యత్తు గురించి పలవరిస్తున్న సరోజ వాడి మనసులో రేగుతున్న కల్లోలాన్ని గమనించడం లేదు.
సాయితో ఒంటరిగా ఏకాంతంలో మాట్లాడితే తప్ప మాట్లాడితే తప్ప వాడి సమస్య ఏమిటో బయట పడదనిపించింది నాకు.
” రాత్రికి ఇక్కడే వుండిపో సాయీ ! క్రికెట్ మాచ్
వుంది గా. ఇద్దరం కలిసి చూదాము. ” అన్నా.
సమాధానం సాయి నుండి రాలేదు. ముందుగానే సరోజ అనేసింది ” వద్దులే.వాడు బాగా అలిసి పోయి వున్నాడు. తొందర గా అన్నం తిని పడుకోనీ “అని.
సాయి కనుబొమలు ముడిచి నా వైపు నిస్సహాయంగా చూసాడు.
అంతలో పక్కింటిలో ఆడుకుంటున్న మా పాప సరయు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కింకా పదేళ్ళే.మా పెళ్ళైన పదేళ్ళకు పుట్టింది.
” అమ్మా ! చందు వాళ్ళమ్మ పార్క్ కు పిల్చుకు పోతుంది.
నేను వెళ్తాను. ” అంది.
“ఇంక ఆటలు చాలు “అంది రంజని. ” నేనూ వెళ్తాను నాన్నా ” గారాలు పోయింది సరయు.
” పోనీలే రంజనీ. రేపు సెలవేగా అన్నాను “. “సరే పరుగులు పెట్టి కింద పడకు. ” జాగ్రత్తలు చెప్పింది రంజని
సాయి తల తిప్పి నావైపు చూసాడు. అ కళ్ళలో అనిర్వచనీయమైన భావమేదో కదలాడింది. ‘తండ్రి బ్రతికి వుంటే తన ఇష్టాఇష్టాలకు వత్తాసు పలికే వాడు అన్న ఆలోచన వచ్చిందేమో! ‘
సాయి కి అమ్మా నాన్నా తానే అయి పెంచిన సరోజ వాడిని వేయి కళ్ళతో కాచుకుంది. స్నేహితులతో తిరిగితే దారి తప్పుతాడని , క్రికెట్ చూస్తే చదువు పాడవుతుందని అతనికి ఆంక్షలు పెట్టేది. మేము సరోజ ఇంటికి వెళ్ళినా, సరోజ మా ఇంటికి వచ్చినా నేను సరయును సమర్థించినప్పుడు సాయి హఠాత్తుగా మౌన ముద్ర వహించే వాడు. ఇప్పుడూ అలాగే నిశ్శబ్ధంగా కూర్చున్నాడు.
సాయి ని కాలేజిలో చేర్చేటప్పుడు నువ్వూ రావాలి మధూ ” అంది సరోజ.
” ఎందుకు అమ్మా ? నేను స్నేహితులతో వెళ్ళగలను. ” అన్నాడు సాయి.
నేను మాట్లాడ లేదు. ఫలితాలు వచ్చిన తరువాత చూద్దాములే అనుకున్నాను.
వాళ్ళు వెళ్ళిపోయారు.
నెల రోజులు గడిచాయి. పరీక్షా ఫలితాలు వచ్చాయి. సాయికి ఇంటర్మీడిఏట్ లో రాష్ట్ర స్థాయిలో మూడో రాంక్, వైద్య విద్య ప్రవేశ పరీక్షలో మూడు వందల లోపు రాంక్ వచ్చింది. సరోజ సంతోషానికి అంతే లేదు. ఆ విజయం తనదే అన్నట్టు పొంగిపోయింది. నేను సాయికి విందు ఇద్దాము అంటే రంజని మంచి చేతి వాచీ కూడా కొందాము అంది.
ఆ రోజు కూడా సాయి ముఖంలో ఆనందం గానీ , ఉత్సాహం గానీ కనబడలేదు.
వారం తరువాత సరయు ఫోను చేసింది. ” సాయి ఎందుకో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు మధూ. ‘స్నానం చేసి రా నాన్నా భోజనం చేసి తొందర గా పడుకుందువు అంటే విసుక్కున్నాడు.’ నేను చిన్న పిల్లవాడిని కాను అమ్మా . ఎప్పుడు స్నానం చేయాలి , ఎప్పుడు భోజనం చేయాలి, ఎప్పుడు పడుకోవాలి అని చెప్పనక్కరలేదు. అని విసుక్కున్నాడు. ” నొచ్చుకుంటూ చెప్పింది.
” వాడి ఇష్టానికి వదిలేయి. మళ్ళీ నిన్ను వదలి దూరంగా వెళ్ళాలని దిగులేమో ! అని ఓదార్చాను.
నాలుగో రోజు మళ్ళీ ఫోను చేసింది ” సాయి వరస చూస్తుంటే భయంగా వుంది మధూ. వాడు ఇంట్లో ఎవరితొ మాట్లాడడం లేదు. స్నానం చేయడు. గడ్డం గీసుకోడు. తిండి తినడు. ఎప్పుడూ తన గదిలో మంచం మీద పడుకుని పైకి చూస్తూ వుంటాడు. పలుకరిస్తే బదులు పలుకడు. నాకు భయంగా వుంది. ఒక్క సారి వచ్చి వాడి సమస్య ఏమిటో కనుక్కో మధూ. ఏడుపుగొంతుతో అంది సరోజ.
” నేను సాయంత్రం వస్తాను. అనవసరంగా భయపడకు. అని చెప్పాను.
సరోజకు ధైర్యం చెప్పాను గానీ సాయి ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటా అని నాకూ ఆందోళన కలిగింది. కొంపదీసి ప్రేమలో గానీ పడ్డాడా.అ పిల్ల కాదు పొమ్మంటే ఇలా తయారయ్యాడా. సాయి మీద వాళ్ళ అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది పాపం.. వాడిని దారిలోకి తీసుకు రావడం ఎలా? ఆలోచనలతోనే సాయంత్రం దాకా గడిచిపోయింది.

ఆఫీస్ నుండి నేరుగా సరోజ ఇంటికి వెళ్ళాను. సరోజ ,వాళ్ళ అమ్మ, నాన్నగారు ముగ్గురూ నిశ్శబ్ధంగా కూర్చుని వున్నాడు.
” సాయి ఏడీ ? ”
మౌనంగా గది వైపు చేయి చూపింది సరోజ.
చప్పుడు చేయకుండా గదిలోకి వెళ్ళాను. కళ్ళు మూసుకుని నిద్రలో వున్నట్టు పడుకుని వున్నాడు సాయి. గడ్డం పెరిగి , నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేసిన వాడిలా నీరసించి పోయి వున్నాడు.
ఎవరో వచ్చినట్టు తెలిసిందేమో కళ్ళు తెరిచి గుమ్మం వైపు చూసాడు. ఆ కళ్ళు నిస్తేజంగా వున్నాయి. అసలు నన్ను గుర్తు పట్టాడా అని అనుమానం వచ్చింది.
దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చున్నాను. ” ఏమయింది సాయీ ఏదయినా సమస్య వుంటే మనసులో మధన పడితే పరిష్కారం దోరుకుతుందా? నీ బాధ ఏమిటో అమ్మకు ఎలా తెలుస్తుంది? ,
” మీ అమ్మ కోరుకున్నట్టు నీకు మెడిసన్ లో ప్రవేశం దొరికేంత
మంచి రాంక్ వచ్చింది కదా. ఇంకెందుకు దిగులు? అమ్మకు దూరంగా అన్నేళ్ళు వుండాలని బెంగగా వుందా? ” అని లాలనగా అడిగాను.

” మిమ్మల్ని అమ్మ పిలిపించిందా అంకుల్ ? ఆమ్మ చెప్పిన మాట విని బుద్ధిగా వుండమని చెప్పడానికి వచ్చారా?
” ఎప్పుడూ అమ్మ ఇష్ట ప్రకారమే నడిచాను. ఇప్పుడూ ఆమె మాట కాదనను. నాకు ఇష్టం లేకపోయినా మెడిసిన్ చదువుతాను. నా ఆశయాలు ఏవైనా ఆమె కోరిక ప్రకారమే నడుస్తాను. నా జీవితం అమ్మ జీవించాలనుకుంటొంది. నాకు కావలసినట్టు బ్రతకడానికి కుదరదు కదా అంకుల్. ఈ బ్రతుకు అమ్మ బిక్ష. అందుకే ఆమె ఎలా నడవమంటే అలా నడుస్తాను. ”
సాయి మాటలలో నిర్వేదం వుంది. తను కోరుకున్నది పొందలేని నిస్ప్రుహ , ఆశాభంగం వున్నాయి.
” పోనీ నీకు డాక్టర్ కావడం ఇష్టం లేకపోతే ఎం పి సీ తీసుకుని ఇంజినీరింగ్ కోర్స్
చేయాల్సింది.” అనునయంగా అన్నాను.
” ఇంజినీరింగ్ ,తప్పితే డాక్టర్ ,కాకుండా వేరే చదువులు లేవా అంకుల్? మీ పెద్దవాళ్ళు మీకు మంచి అనిపించింది మా మీద రుద్దుతారెందుకు? మాకు ఏది ఇష్టమో ఎప్పుడైనా అడిగారా? మా జీవితం మీరు జీవించాలనుకుంటారెందుకు ? ”
సాయి గొంతు తీవ్రం గా వుంది. కళ్ళలో తడి.
ముందు రోజు ఒక పుస్తకం లో చదివిన విషయం గుర్తుకు వచ్చింది. ఐ ఐ టి లో చదువుతున్న ఒక అబ్బాయి కాలేజి భవనం మీదనుండి దూకెసి ప్రాణం తీసుకున్నాడు. అతనికి కర్నాటక సంగీతం అంటే ఇష్టం అట. అయిదు సంవత్సరాలు నేర్చుకున్నాడు కూడా. అది కూడు పెట్టే విద్య కాదు అని బలవంతం గా ఇంజినీరింగ్ లో చేర్పించి చదివించారు. ఫలితం వాళ్ళ జీవితాన్ని చీకటి చేసి వెళ్ళిపోయాడు. సాయి అలాటి ఆలోచన తలపెడితే అన్న వూహకే నా గుండె ఝల్లు మంది..కళ్ళు చెమరించాయి.
“మీ అమ్మ నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే కదా ఇంత కష్టపడుతోంది. పోనీ మీకు ఏమి కావాలో స్పష్టమైన ఆలోచన వుందా? ”
” ఆనిమేషన్ ఫిల్మ్ కోర్స్ చేసి అందులో రాణించాలని నా ఆశయం. ఎప్పట్నుండో నేను కంటున్న కల. చిన్నప్పుడు నేను బొమ్మలు ఎంత బాగా వేసేవాడినో గుర్తుందా మీకు? స్కూల్లో అందరూ మెచ్చుకునేవారు కానీ అమ్మ మాత్రం టైం వేష్ట్ చేయవద్దని హెచ్చరించేది. ” టేబుల్ సొరుగు తెరిచి డ్రాయింగ్ పుస్తకాలు తీసి చూపించాడు. నిజంగానే ఎంతో బావున్నాయి..డాక్టర్ గా వుండే పేరు గౌరవం , సంపాదన అందులో వుంటుందో లేదో అది మన అద్రుష్టం. అందులో నెల జీతాలు రావు.. స్థిరత్వం అని అమ్మ అంటుందే అది అంత సులభంగా రాదు. నాకు డాక్టర్ కావడం ఇష్టం లేదు. కానీ అమ్మ కోసం చదవాలి.నా కోసమే బ్రతుకు తున్న అమ్మ మనసు కష్టపెట్ట లేను. నాకు బ్రతకాలని లేదు. మా రెక్కలను కత్తిరించేసి ఎగరమంటే ఎలా అంకుల్ ? సాయి ఏడుస్తున్నాడు.
నాకు మా అన్నయ్య గుర్తుకు వచ్చాడు. వాడు స్కూల్ రోజుల నుండి ఎన్. సి. సి లో వుండే వాడు. రైఫెల్ షూటింగ్ లో రాష్త్రంలో ప్రథముడిగా వచ్చాడు. డిల్లీ వెళ్ళి రిపబ్లిక్ దినోత్సవం పెరేడ్ లో పాల్గొన్నాడు కూడ.అదెలాగో వాడిలో సైన్యంలో చేరాలనే భావన బలంగా పడింది. ఎంపిక అయ్యాడు కూడా. కానీ మా అమ్మా నాన్నా తమ భయాలతో వాడిని పంపడానికి సుతరామూ ఒప్పుకోలేదు. వాళ్ళ అనుమతి లేనిదే సాధ్యం కాదు కదా అందుకని ఇష్టం లేకుండానే బాంక్ ఉద్యోగం లో చేరాడు. ప్రమోషన్లు వచ్చి చీఫ్ మానేజర్ అయినా వాడి మనసులో అసంత్రుప్తి అలా వుండి పోయింది. ఇప్పటికీ మా అమ్మా నాన్న తన జీవిత ధ్యేయానికి అడ్డు పడ్డారని బాధ పడతాడు. మరి సాయి అభిరుచి ఏమిటో సరోజ అర్థం చేసుకుంటుందా?
” అమ్మను నిరాశ పరచలేను. అమ్మ కష్టార్జితం తో ఇష్టంలేని చదువు చదివినా రాణించలేను. ఎలా అంకుల్ ? ఏమి చేయను? ”
సాయి గొంతులో అంతులేని నిర్వేదం.
గుమ్మం దగ్గర అడుగుల సవ్వడి విని నేను, సాయి అటు చూసాము. సరోజ లొపలికి వచ్చింది. సాయి పక్కన కూర్చుని వాడిని ఒడిలోకి తీసుకుంది.
“సారీ నాన్నా. నా ఆకాంక్షలు నీ మీద రుద్ది నిన్ను గొప్ప డాక్టర్ గా గా చూడాలన్న స్వార్థంతో ఆలోచించానే తప్ప నీ అభిరుచి ఏమిటని అడగలేదు. ”
“ఇష్టం లేని చదువులు చదువుతూ మీవంటి పిల్లలు పడే క్షోభ మా తరం అర్థం చేసుకోవడం లేదు. ”
“పద్దెనిమిదేళ్ళు వస్తే వోటు హక్కు, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు గానీ మీకు నచ్చిన జీవన మార్గం ఎంచుకునే అవకాశం మాత్రం మీకు మేము ఇవ్వడం లేదు. అందుకేనేమో ఈ తరం పిల్లలలో క్రుంగుబాటు, ఆత్మహత్యా ప్రయత్నాలు ఎక్కువగావున్నాయి. ”
” నాకు కావలసింది నీ గురించి గొప్పగా చెప్పుకుని గర్వ పడడం కాదు నాన్నా. నువ్వు సంతోషంగా , ఆనందంగా వుండడమే కావాలి. నీకు ఇష్టమైన ఆ ఆనిమేషన్ కోర్స్ చేయి. అందులోనే నీ ప్రతిభ చూపి మంచి పేరు తెచ్చుకో. నువ్వు అభివ్రుద్ధి లోకి రావడమే నాకు కావాలి. ” అంది సాయి తల నిమురుతూ.
నమ్మ లేనట్టు అమ్మ వైపు చూసాడు సాయి. ఆనందంతో అమ్మ భుజం మీద తల వాల్చాడు.
సరోజను చూస్తే నాకు గర్వం గా అనిపించింది. ” తలితండ్రులందరూ నీ లాగ పిల్లల మనసు అర్థం చేసుకుంటే యువతరం మరింత ఉత్సాహం తో ముందుకు సాగుతుంది.మంచి నిర్ణయం తీసుకున్నావు సరోజా ” మనస్ఫూర్తిగా అభినందించాను.

——— ————- ———-

లేచింది మహిళ

రచన : సోమ సుధేష్ణ

 

భారతికి నిద్ర రావడం లేదు. మూగబోయిన మనసుకు ఊపిరి ఆడటం లేదు. మనసేనాడో  మొద్దు బారిపోయింది. శరీరం చలించడం మానేసి చాన్నాళ్ళయింది. భర్త చనిపోయాడని బాధా లేదు, సంతోషమూ లేదు. దట్టమైన అడవిలో నడుస్తూ బయట ప్రపంచాన్ని చూస్తానా ! చూడనా! అనుకుంటూ జీవితమంతా నడిచి, అలసి పోయి ఆశ వదులు కున్నప్పుడు వెలుతురు కనిపిస్తుంది. అలవాటులేని వెలుతురు- అలవాటైన చీకటి- దేవుణ్ణి తలుచుకోవడం కూడా మరిచి పోయింది. యాంత్రికంగా రోజువారీ పూజలు జరిపించుకుంటున్న దేవుడు కూడా  ‘మనసులేని పూజ రొజూ జరిగినా అవి నాకవసరమా’! అనుకుంటున్నాడేమో!

యువతగా భారతి తనకు అందగాడు, తన్ను సంతోష పెట్టేవాడు వాడు భర్తగా రావాలని కన్యలందరి లాగే మనస్పూర్తిగా దేవుణ్ణి మొక్కుకుంది. దేవుడు అందగాన్నే ప్రసాదించాడు. డబ్బుకు కొదవ లేదు. చదువూ ఉంది. పేరు ప్రతిష్టలకు కొదవలేదు. కారు హోదాలు అన్నీ ఉన్నాయి. కొత్త దాంపత్యంలో చిరువాన మొదలయ్యి ఆ ఆనందాలు ఎక్కువ రోజులు నిలవ లేదు. మొదట్లో తల్లి ఫిర్యాదు, తనయుడి తిట్ల రివాజు మొదలయ్యింది.  ఆ ఇంట అది మామూలే అని కొంత కాలం తర్వాత తెలుసుకున్న భారతి కది అవమానంగానే ఉంది. భర్త మాటలకు షాక్ తగిలినట్టుగా నిర్జీవి అయ్యింది. అయినా మనస్పుర్తిగానే దేవుడికి పూజలు చేసింది. మాటలకు చితికి పోయిన మనసులో దేవుడు నిలవలేక వెళ్లి పోయాడు. మొదటి రెండుసార్లు భర్త తన ప్రవర్తనకు తాను తప్పుచేసినట్లు ఫీలయ్యాడు కానీ అది త్వరలోనే అలవాటుగా మారి వ్యసనంలోకి దిగింది.  భారతి తన పుట్టింటి కెళ్ళి తల్లితో తన బాధ వేళ్ళబోసుకుంది. ఆ తల్లి బిడ్డను ఓదార్చింది. వియ్యపురాలిని తూలనాడిందే కానీ బిడ్డకు దారి చూపలేక పోయింది. అది తర తరాలుగా స్త్రీజాతిలో జీర్ణించుకు పోయిన అసహాయత. దాన్ని వేర్లతో సహా పీకివేసే శక్తి ఒక్క స్త్రీకే ఉంది. ‘తిట్టు దెబ్బ కాదు, అది ఒక మాట అంతే’ అని సర్దుకు పొమ్మంది తల్లి. మరి తిట్లు తనని ఇంత బాధ పెడుతున్నా ఎందుకో భారతికి అర్థం కాలేదు.

భారతి ఎలా బ్రతుకును సరిదిద్దుకోవాలో తెలీక ఇసుకలో తల దూర్చిన ఆస్ట్రిచ్ లాగ జీవితంలో తల దూర్చుకుని బతక సాగింది. రాను రాను జీవితం ఆమెకు ఒక నటన లాగ అయిపొయింది.

అసలు మనసు పాతాళంలో ఎక్కడో కూరుకు పోయింది. భర్త కోపంలో ఒకటి రెండు సార్లు చేయి లేపాడే కానీ ఎప్పుడూ కొట్టలేదు అయితేనేం దేబ్బలకంటే ఎక్కువ అతని మాటలకు మనసు తూట్లు పడింది. ఆ మాటలకు అదిరి పడినప్పుడల్లా ఆశలు గడ్డ కట్టుకు పోయి కరుడు తేలాయి. కొన్ని బూతు మాటలకు అర్థం తెలీక ‘ఇంత మంచిగా కనిపించే మనిషిలో అంత చెడ్డ మాట లెక్కడి నుండి వచ్చాయా!’ అని చాలాసార్లు ఆలోచించింది. తనకు ఆ బూతు మాటలు అర్థం కాలేదు అంటే అర్థమయ్యే తిట్లు తిట్టేవాడేమో! అంతా విషాదంలోనూ భారతి నవ్వుకుంది. కొంత కాలం లోనే అది తండ్రి ద్వారా వచ్చిన విద్య అని తెలుసుకుంది. తిట్టడం తప్పు కాదను కునే కుటుంబం. ఇలాంటివి లోలోపలే తినేసే చెద పురుగులాంటివి. భారతికి తానేదో తప్పు చేసినట్టు, తనలో ఏదో లోపం ఉన్నట్టు ఫీలవ సాగింది. భార్య తన స్వంతం, ఏదైనా చేసే అధికారం ఉందను కుంటాడేమో! అందరితో ఎంతో అభిమానంగా ఉంటాడు. అతనిలో ఇంకో మనిషి దాగి ఉన్నాడని ఎవరు నమ్మరు. అందుకే అతని తల్లి ఈ జీవితానికి అలవాటు పడి పోయింది. శాశ్వతం కాని  ఈ జీవితంలో ఇన్ని నాటకాలు అవసరమా! ఇలా ఎంత మంది జీవిస్తున్నారు! వాళ్లతో తన బాధను పంచుకోగాలదా!

భర్త చనిపోయి మూడు నెలలు అయ్యింది. అంతా శూన్యంగానే ఉంది. ఇంకా అతని తిట్లు వినిపిస్తున్నట్టుగానే ఉంది భారతికి. భర్త చనిపోయినా ఆయన తిట్లు భారతితోనే ఉన్నాయి. ‘ఈ జన్మకిక విముక్తి లేదేమో!’ అనుకుంది. నిట్టూరుస్తూ బరువెక్కిన కనురెప్పలు తెరిచి ఆ పక్కకు  చూసింది. సోఫాలో కూర్చుని టి.వి. చూస్తోంది నీలిమ. టైం రాత్రి ఒకటిన్నర అయ్యింది. కొడుకు ఇంకా రానట్టున్నాడు.

“నీలిమా! అనూప్ ఇంకా రానట్టున్నాడు! చాల ఆలస్యమైంది నువ్వు పడుకో.”

“ఫర్వాలేదత్తయ్యా.” పిచ్చి పిల్ల ఒక్కత్తి పడుకోలేదు.

“ఇక్కడే పడుకో. నాకెలాగు ఇప్పుడు నిద్ర రావడం లేదు. నేను తలుపు తీస్తాలే. నాకు తెల్ల వారు జాములో ఎప్పుడో కానీ కునుకు పట్టదు.”

అమెరికాలో కింగ్ సైజ్ బెడ్ లాగ పెద్ద బెడ్ కావాలని స్పెషల్ గా ఆర్డరిచ్చి మరీ చేయించు కున్నాడు భర్త. ఒక్క మంచమే కాదు ఎటాచ్డ్ బాత్రూము-వగైరా వగైరా సదుపాయాలు అమెరికాలో లాగే చేయించుకున్నాడు. అనూప్ బిజినెస్ పని మీద వేరే ఊరెల్లి నప్పుడు నీలిమ అత్త పక్కన పడుకోవడం అలవాటే. మేనకోడలు కదా ఆ చనువుంది. కాసేపటికి నీలిమ వచ్చి

భారతి పక్కనే పడుకుంది. ఐదు నిమిషాల్లోనే ఘాడ నిద్రలోకి జారుకుంది. భారతి ఆలోచన ల్లోంచి బయట పడ్డానికి కాసేపు మెడిటేషన్ చేసి తాను మంచంపై ఒరిగింది. అంతలోనే డోర్ బెల్ మోగడంతో భారతి వెళ్లి తలుపు తీసింది. అనూప్ బాగా తాగినట్టున్నాడు, ఏ క్లబ్బులోనో గడిపి వస్తున్నాడు. తలుపు తీసినా సోలుగుతూ అక్కడే నిలబడ్డాడు.

“అనూ! లోపలికి రా.”

అనూప్ లోపలికి వస్తూనే,

“నువ్వు ఇంకా పడుకోలేదా!” మాటలు జారుడు బండ మీద నుండి జారుతున్నట్టుగా ఉన్నాయి.

కొన్ని నిమిషాల్లోనే అతని గొంతు ప్రతిధ్వనిస్తోంది. “నీలిమా! ఎక్కడున్నావ్? తలుపు తీయాలనే ధ్యాస కూడా లేకుండా నిద్ర పోతున్నావా! భర్త వచ్చినా రాక పోయినా నీకు పట్టిలేదు.”

భారతి ఒక్క క్షణం స్తంభించి పోయింది. కారు టైర్లు తిరిగినట్టు చరిత్ర కూడా రిపీట్ అవుతోందా! వెంటనే తేరుకుని కోపంగా అరిచిన కొడుకుకు అతని బెడ్ రూమువేపు చూపింఛి,

“నీలిమ వస్తుంది”. ఆతను రూములో కెళ్ళగానే

“నువ్వు బట్టలు మార్చుకో నీలిమ వస్తుంది”. అంటూనే భారతి లోపలి కెల్లింది.

అప్పుడే కళ్ళు తెరిచి గాబరాగా చూస్తున్న నీలిమతో నువ్వు ఇక్కడే ఉండు అని చేతితో సంజ్ఞ చేస్తూ ఒక గ్లాసుతో నీళ్ళు తీసుకుని వెళ్లి మంచం పై కూర్చున్న కొడుక్కు ఇచ్చింది.

“ఎక్కడ ఈ మహారాణి! సుఖంగా నిద్ర పోతున్నట్టుంది.” తారస్థాయిలో అనూప్ గొంతు లేచింది.

“నేను నీకంటే గట్టిగా అరవగలను.”

“అమ్మా! నువ్వు…”

“అవును, నేనే. ఎప్పుడో పైకి లేవాల్సింది. జరగలేదు. నీ గోంతు పైకి లేచి నువ్వు కింద పడ్డ క్షణమే నేను పైకి లేచాను.” గుండెల్లో ఆరని జ్వాలను అదిమి పట్టి,

“ఇద్దరం అరిస్తే రాత్రి నిశ్శబ్దంలో డ్రైవరు వింటాడు. రేపు నీ మొహం వాడికి చూపించడానికి ఇబ్బంది పడతావు. ఉదయం నువ్వు లేచాక మాట్లాడుకుందాం, నీళ్ళు తాగి పడుకో.” రూము బయటి కొచ్చి బయటి నుండి తలుపు గొళ్ళెం పెట్టి అరుస్తున్న కొడుకు మాటలు వినకుండా తన రూములోకి వెల్లింది. అయోమయంగా చూస్తూన్న నీలిమతో,

“ఏమి ప్రమాదం లేదు. ఉదయం నిదానంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు అటు వెళితే ఇక ఎప్పటికి వాడిలో మార్పు రాదు. చెడు అలవాట్లను ఎంత త్వరగా సమాధి చేస్తే జీవితం అంతా బాగు పడుతుంది. ఆలస్యం చేస్తే వేళ్ళు పాకి పోయి జీవితాలనే కబళించేసే ప్రమాద ముంది. కొన్ని సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకొని నిద్ర పోవడానికి ప్రయత్నించు.” ప్రేమగా అంది.

నీలిమ కళ్ళల్లోంచి నీళ్ళు కారుతున్నాయి. భారతి గుండె తరుక్కు పోయింది. ఇద్దరికి సరిపడా ధైర్యాన్ని తనలోనే పుంజుకుంది.

 

***** సమాప్తం *****

 

 

 

 

 

 

క్షమయా ధరిత్రే కాని……

రచన:  మణి గోవిందరాజుల

 

విలేఖరుల చేతుల్లోని ఫ్లాష్ లైట్లు చక చకా వెలిగిపోతున్నాయి. అక్కడ అంతా హడావుడిగా వుంది. పోలీసులు జనాన్ని అదుపు చేయలేకపోతున్నారు. హంతకురాలిని చూడడానికి జనం విరగబడి పోతున్నారు.

“చీ!చి!  . . అమ్మ అన్నపదానికే అవమానం తెచ్చింది” యెవరో చీదరించుకుంటున్నారు.

“ అసలు కన్నకొడుకు కాదేమో. . అందుకే అలా చేయగలిగింది. ”

“మన దేశం పరువు తీసింది కదా?ఇలాంటి వాళ్ళను వురి తీయాలి ఆలో చించకుండా”

“ప్రపంచ దేశాల్లో మనం తలదించుకునేది  ఇలాంటి వాళ్ళు చేసే పనుల వల్లే”

మనసులో దుఃఖం సుళ్ళు తిరుగుతున్నా అందరి మాటలు  నిర్వికారంగా వింటున్నా వసుమతి మనసులో యెక్కడో అంతర్లీనంగా తృప్తి వుంది.

———————

“ఒరేయ్! నాన్నా! తొందరగా రారా అన్నానికి. . . యెప్పటి నుండి పిలుస్తున్నాను. .  రావేమిరా?” విసుక్కుంది

“వుండమ్మా! వస్తున్నాను. ” అన్న మాటలతో పాటే ధభీ ధభీ అన్న చప్పుడూ,  పక్కింటి పిల్ల యేడుపూ వినపడ్డాయి. వినగానే అబ్బా!మళ్ళీ వీడేదో చేసినట్లున్నాడు అని విసుక్కుంటూనే పరుగునా బయటికెళ్ళింది.  అనుకున్నట్లుగానే యేడేళ్ళ విక్రాంత్ పక్కవాళ్ళ అమ్మాయి సంధ్య ను పట్టుకుని కొడుతున్నాడు.  ఆ దృశ్యాన్ని చూడగానే వసుమతికి   వొళ్ళూ పై తెలీలేదు. గబ గబా వెళ్ళి కొడుకు చేతుల నుండి ఆ పిల్లను తప్పించి వీరావేశంతో చేతికందిన కర్రతో నాలుగు బాదింది.  “యెన్ని సార్లు చెపాలిరా?ఆ పిల్ల జోలికి పోవద్దని?”

“అమ్మా ! అది నా మాట వినడం లేదు.  అందుకని కొట్టాను”నిర్భయంగా చెప్పాడు.

ఇంతలో లోపలినుండి సంధ్య తల్లి పరుగునా వచ్చింది. ”వసుమతి  ! మీ వాడు యెప్పుడూ ఇలా కొడుతూనే వుంటాడు. పిల్ల తట్టుకోలేక పోతున్నది.  కాస్త భయం చెప్పు” అన్నది.  దాంతో కాస్త వుక్రోషం వచ్చింది వసుమతికి.

“నీ మూలంగానేరా నేను అడ్డమైన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తున్నది”అంటూ ఇంకో రెండు బాదింది.

“అదేంటి వసుమతీ ! నేను పిల్లణ్ణి కొట్టమన్నానా? కాస్త భయం చెప్పమన్నాను కాని? కొడితే పిల్లలు ఇంకా మొండికేస్తారు” అనునయంగా చెప్పింది సంధ్యా వాళ్ళమ్మ.

అయినా సరే ఆ కోపం , వుక్రోశం తగ్గక” మళ్ళీ బయటికొచ్చావంటే కాళ్ళిరగ్గొడతాను.  యేమనుకున్నావో?” అరుస్తూ విక్రాంత్ ని లాక్కెళుతున్నట్లుగా లోపలికి తీసుకెళ్ళింది.

———————————

“చంపేస్తాను యేమనుకున్నాడో?నేనంత చాతగానివాడిననుకున్నాడా?”  గట్టిగా అరుపులు వినపడి  వరండాలోకి వచ్చింది వసుమతి. క్ విక్రాంత్ ఇంకో ఇద్దరు పిల్లలు హాలు ముందు వరండాలోని అరుగుల మీద కూర్చుని  వున్నారు.  అందరూ నూనూగు మీసాల వయసులో వారే. పదవతరగతి పిల్లలు. విక్రాంత్ మొహం యెర్రగా కందగడ్డలా వుంది ఆవేశంతో.

“అవున్రా వాడేదో పత్తిత్తు అయినట్లు కబుర్లు చెబుతాడు. ఒకసారి మన తడాఖా చూపించాలి. యెలా అంటే మళ్ళీ మన జోలికి రాకూడదు”

“ అసలు దానికెంత పొగరు? చెప్పు తీసుకు కొడుతుందా? వీడి అండ చూసుకునే కదా?

వీణ్ణి అణిస్తే దాని పొగరు దెబ్బకు దిగుతుంది”  రాని మీసాలను రువ్వుకుంటూ  రెచ్చగొడుతున్నారు విక్రాంత్ ని.

“యేంట్రా? విక్కీ ! యేమి జరుగుతున్నదిరా?యెందుకలా అరుచుకుంటున్నారు?”అడిగింది వసుమతి

“యేమీ  లేదమ్మా. . పదండ్రా పోదాము. ”తల్లి ముందు మాట్లాడ్డము ఇష్టము లేక స్నేహితుల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు విక్రాంత్.

ఆ తర్వాత స్కూల్ నుండి నోటీసు వస్తే కాని తెలీలేదు.  వీడు కొంతమంది కలిసి రమేశ్ అనే పిల్లవాణ్ణి చావబాదారని  రమేశ్ ని హాస్పిటల్ లో చేర్పించి వీడిని డిబార్ చేశారని. విక్రాంత్ తో పాటు చేయి కలిపిన పిల్లలు మొత్తం నేరం వీడిమీదకి నెట్టి వాళ్ళు తప్పుకున్నారు.

ఆ వెంటనే పరుగు పరుగున స్కూల్ కెళ్ళి హెడ్ మాష్టారి  కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలితే  పదవతరగతి కాబట్టి పరీక్షలు రాయనిస్తామని, స్కూలుకి మటుకు రానివ్వమని చెప్పారు.

విక్రాంత్ ని బతిమాలి, బెదిరించి మొత్తం మీద ఆ సంవత్సరం గట్టెక్కిందనిపించారు.

విక్రాంత్ కూడా యెందుకు భయపడ్డాడొ కాని ఆ పరీక్షలయ్యేంతవరకు ప్రశాంతంగానే వున్నాడు. పరీక్ష పాసయ్యాడే కాని ఆ వచ్చిన బొటా బొటీ మార్కులకు మంచికాలేజీ లో సీట్ రాలేదు. మామూలు కాలేజీలో చదవనని గొడవ చేస్తే మొత్తం మీద కష్టపడి ఒక కాలేజీలో చేర్పించారు.  చేరాడె కాని సరిగా వెళ్ళక  చెడు సావాసాలకి అలవాటు పడ్డాడు.  గొడవలు యెక్కువయ్యాయి.  తండ్రి ఆ దిగులుతో వుండగానే యేదో ఆక్సిడెంట్ లో మరణించాడు.  తండ్రి భయం కూడా లేకపోయేసరికి విచ్చలవిడితనం ఇంకా యెక్కువయ్యింది విక్రాంత్ కి.

——————————–

“ సైలెన్స్!సైలెన్స్! జడ్జి గారొస్తున్నారు” కోర్ట్ భంట్రోతు అందర్నీ హెచ్చరిస్తూ లోపలికి వస్తుండగా వెనకాలే జడ్జిగారు వచ్చి తన సీటులో కూర్చున్నారు

ఆ రోజు మొదటి కేసే వసుమతిది. దానికి సంబంధించిన ఫైలు జడ్జిగారికి అందించారు ప్రాసిక్యూషన్ లాయరు.

“వసుమతమ్మా, . . . వసుమతమ్మా. . . వసుమతమ్మా ” అని మూడుసార్లు పిలవగానే

లేచి చిన్నగా నడుచుకుంటూ వచ్చి బోనులో నుంచుంది వసుమతి. .  ఆమెని చూడగానే అక్కడ కూర్చున్న వారిలో మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి.

“ఆర్డర్!ఆర్డర్!” అందర్నీ హెచ్చరిస్తూనే కేసు పరిశీలించసాగారు .

అంతా అయ్యాక  బోనులో నుంచున్న వసుమతిని  పరిశీలనగా చూసారు.  యేడ్చి యేడ్చి కళ్ళు వాచి వున్నా ఆ కళ్ళల్లో యెక్కడా తప్పు చేసానే అన్న భావన లేదు. మధ్యతరగతి కుటుంబీకురాలిలా కనపడుతున్నది.  సాధారణమైన ఆకారం.  నిండా కొంగు కప్పుకుని వుంది.  అన్నం తిని చాలా రోజులయినట్లుగా బలహీనంగా వుంది.  ఆమెని చూస్తుంటే జడ్జిగారికి చాల జాలి వేసింది యెందుకో. .

ప్రాసిక్యూషన్ లాయరు లేచి కేసు పూర్వాపరాలు చెప్పి “కాబట్టి యువర్ ఆనర్. . . కన్నకొడుకునే కాక అతనితో పాటు మరి ఇద్దరిని  దారుణంగా హత్య చేసిన ఈమెకి మరణ దండనే సరి అయిన శిక్ష” అని చెప్పి తన వాదన ముగించారు.

“యేమ్మా? మీరు చెప్పుకునేది యేమైనా వుందా? కన్న కొడుకునే ఇంత దారుణంగా హత్య చేయడమనేది నా సర్వీసులో ఇది మొదటి సారి చూడడం. మీ తరపున వాదించడానికి చాలా మంది లాయర్లు వచ్చినా వద్దన్నారు?మీరు అంగీకరించక పోతే మీకు వ్యతిరేకంగా వున్న సాక్ష్యాధారాల ప్రకారం మీకు శిక్ష ఖరారు అవుతుంది” మృదువుగా అడిగారు జడ్జిగారువసుమతిని. .

ఒక్కసారి కొంగుతో కళ్ళని గట్టిగా తుడుచుకుంది వసుమతి. ”కన్న కొడుకు కాకపోతే పర్వాలేదా సార్?” నవ్వింది.  “తప్పు చేయబోయాడు. శిక్షించాను. కన్న కొడుకు కాబట్టే వాడిని శిక్షించే అర్హత నాకు మాత్రమే వుందని శిక్ష వేసేసాను. ”

“కాని దానికి చట్టము వుంది కదా? మీరు పోలీసులకి అప్పగించవలసింది. ”

“అంత సమయము ఆ సమయాన లేకపోయింది.”

“ఇప్పటికైన మీరు జరిగినదంతా కోర్టుకు చెప్పండి. ”

“అది చెప్పటానికే నేను బతికున్నాను సార్. మీకందరికీ వాడిని నేనెందుకు నా చేతులారా పోగొట్టు కున్నానో తెలియాలి. మేముసామాన్య  మధ్య తరగతి కుటుంబీకులము.  పరువుకు ప్రాణమిచ్చే వాళ్ళము.  అందరిలాగే మేము కూడా తొలిసారి మగపిల్లవాడు పుడితే యెంతో పొంగిపోయాము.   మా వంశాన్ని వుద్దరించేవాడు జన్మించాడని ఆశ పడ్డాము.  గొప్పగా పెంచగలిగితే ఒక్కడు చాలు అనుకున్నాము. కాని విధి ఇంకోలా రాసివుంది మా నుదుటిమీద. . .

పిల్లలు పుట్టి వాళ్ళు యెదిగే క్రమంలో వాళ్ళ ప్రవర్తనని మొదటగా గమనించేది తల్లి.  నేనూ అలాగే నా కొడుకులోని విపరీతబుద్దిని గమనించాను. కాని చిన్నతనం అని సర్దుకున్నాను.  కొడుకు కదా తప్పులు కనపడవు. ఇరుగు పొరుగు చెప్పినా కూడా వాళ్ళనే తప్పు పట్టాను.  అంతే కాని నా కొడుకుది తప్పని ఒప్పుకోలేదు.  యెంతైనా కొడుకు కదా? కొద్ది వయసు వచ్చాక అల్లరి చేస్తే కొన్నాళ్ళకి మారకపోతాడా అని ఆశపడ్డాను.  యుక్త వయసు వచ్చాక ఆడపిల్లల్ని అల్లరిపెడుతున్నాడని తెలిసి ఆ వయసు చేసే అల్లరి అని సరిపెట్టుకున్నాను.  ప్రేమించలేదని ఒక అమ్మాయి మొహం మీద ఆసిడ్ పోయటానికి ప్రయత్నించినపుడు తెలిసింది అది చిలిపి అల్లరి కాదనీ వయసుతో పాటు రాక్షసత్వం కూడా పెరుగుతున్నదని.  కాని తల్లిని కదా . . . జైల్లో పెడతారేమోనని నా ప్రాణం విల విలలాడింది.  పోలీసులనిబతిమాలుకుని,  ఆ పిల్ల అమ్మ నాన్నని బతిమాలుకుని  కొడుకుని జైలుకి పోకుండా కాపాడుకున్నాను. మహానుభావులు ఆ అమ్మాయి తలిదండ్రులు  యెక్కడవున్నారో?? వాళ్ళు అడగలేదు కాని వాళ్ళు నాకు చేసిన సహాయానికి  కృతజ్ఞతగా  వుంటున్న ఫ్లాట్ అమ్మి సగం ఆ అమ్మాయికి ఇచ్చాను.  ఆ పిల్ల కూడా ఒక అమ్మకి కూతురే కదా? మిగతా సగంతో వూరి చివర యెక్కడో చిన్న ఇంట్లొకి మారాను? ఇంత జరిగాక ఇక మారతాడులే ఇల్లు  లేకపోతే మటుకేమి కొడుకు మంచిగా వుంటే అదే చాలు పదిళ్ళ పెట్టు  అనుకున్నానండీ ” దుఃఖంతో మాటపెగల్లేదు వసుమతికి కోర్టంతా పిన్ డ్రాప్ సైలెన్స్ వుంది.  అందరి మనసులూ భారంగా అయ్యాయి. జడ్జిగారు కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నారు.

చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది వసుమతి.  “కాని ఒక రోజు తెలిసింది నా కడుపు తీపికొద్దీ నేను కాపాడుకున్న నా కన్నకొడుకు కొన్ని వేల తల్లుల గర్భశోకానికి కారణం కాబోతున్నాడని.  యేడ్చాను.  మొత్తుకున్నాను. ఆవేశపడి  కొట్టాను,  పోలీసులకప్పగిస్తానని బెదిరించాను. అమ్మని కదా సార్? బెదిరించానే కాని అప్పగించలేకపోయాను.  అప్పుడు తగ్గాడు. . విన్నట్టే విన్నాడు.  కాని వినిపించుకోలేదని తరువాత అర్ఠం అయింది.  ఆరోజు……. ”

మార్కెట్ నుండి వచ్చి తాళం తీసుకుని ఇంట్లోకి  రాగానే  కొడుకు బెడ్రూం లో నుండి

గట్టిగా అరుపులు వినపడుతున్నాయి. ”అబ్బ ! వీడు ఇంట్లో వుంటే గోలే…”విసుక్కుంటూ సరుకులు వంట ఇంట్లో పెట్టి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంది.  లోపలి నుండి అరుపులు ఇంకా వినపడుతున్నాయి.  తల పగిలిపోతున్నది ఆ అరుపులతో.  ఇంకా వేరే వాళ్ళ మాటలు కూడా వినపడుతున్నాయి.  ఇంక తట్టుకోలేక వాళ్ళను తగ్గమనడానికి గుమ్మం దగ్గరికి వెళ్ళింది.  ఇంట్లో యెవరూ లేరని వాళ్ళు స్వేచ్చగా మాట్లాడుకుంటున్నారు.  అంతకు ముందువరకు వాళ్ళేమి మాట్లాడుకున్నదీ దూరానికి వినపళ్ళేదు కాని దగ్గరికి వెళ్ళాక అర్థమై ఒక్కసారిగా ఒళ్ళు చల్లబడి కాళ్ళల్లో సత్తువ లేనట్లై కిందపడిపోయింది.  అప్పటివరకు మాట్లాడుతున్న వాళ్ళల్లా చప్పుడు విని ఆపేసారు.  అప్పుడే తల్లిని చూసిన విక్రాంత్  కిందపడ్డ తల్లిని యెత్తుకెళ్ళి  మంచం మీద పడుకోబెట్టాడు. మొహం మీద చల్లిన నీళ్ళతో మెలకువ వచ్చింది.  ఒక్కసారిగా కొడుకుని పట్టుకుని పెద్దగా యేడ్చేసింది.  “యేంట్రా మీరు చేయాలనుకుంటున్నది?మారిపోతాను.  మంచిగా వుంటాను అన్నావు కదరా?ఇంత దౌర్భాగ్యపు ఆలోచన యెలా వచ్చిందిరా? యేరీ వీళ్ళంతా? ఒక్కొక్కళ్ళ కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చో బెట్టాలి” ఆవేశంగా అరిచిందివసుమతి.

“అమ్మా! అనవసరంగా అరిచి గోల చేయకు. మేము వినాయకచవితికి వేయడానికి డ్రామా రిహార్సల్స్ చేసుకుంటున్నాము. . వాళ్ళు నా కోసం బయట యెదురుచూస్తున్నారు.  నేను వెళ్తున్నాను” చెప్పి వెళ్ళిపోయాడు విక్రాంత్.  కాని వసుమతి నమ్మలేదు.  వాడి మాటల్లో,  చూపుల్లో నిజాయితీ లేదనిపించింది.  అప్పటినుండి వాడి మీద నిఘా పెట్టింది. విక్రాంత్ కూడా తల్లి గమనిస్తున్నదని కొన్నాళ్ళు చాలా మంచిగా వున్నాడు. ఒక నెల మామూలుగా గడిచింది.  ఒకరోజు  వుతుకుదామని విడిచిన  బట్టలు తీస్తే అందులో నుండి   నోట్ల కట్టలు బయటపడ్డాయి.  అంత డబ్బు యెక్కడిదని నిలదీస్తే స్నేహితుడిదని చెప్పాడు.  కాని వసుమతి నమ్మలేదు.  అప్పటినుండి ఇంట్లో సమంగా వుండడం మానేసాడు.  ఒకవేళ వచ్చినా వెంట యెవరెవరినో తీసుకొస్తాడు.  వాళ్ళు  ఒక వారం వుంటారు.  వాళ్ళు వెళ్ళగానె మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు వారం వుంటారు.  వాళ్ళు ఇంట్లో వున్నన్ని రోజులూ యెక్కడికీ కదలరు.  ఇల్లు వూరికి దూరంగా వుండడంతో ఇంట్లొ యేమి జరుగుతున్నా యెవరికీ తెలీడం లేదు.  ఇలా కొంతకాలం గడిచింది. . . ” ఆగింది వసుమతి.

అందరూ కూడా యేదో సస్పెన్స్ సినిమా చూస్తున్నట్లుగా చాలా ఆసక్తికరంగా వింటున్నారు.

ఒకరోజు ఇంట్లో యెవరూ లేరు.  అప్పటికి పదిరోజులనుండి కొడుకు కూడా కనపడటం మానేసాడు. ఇంతలో పోలీసులు వచ్చి విక్రాంత్ గురించి విచారణ చేసారు. తన కొడుకే అని పది రోజులుగా ఇంటికి రావడం లేదని ,  అతని స్నేహితులు మటుకు వచ్చి వెళ్తున్నారని చెప్పింది. జరుగుతున్నదంతా కూడా వివరంగా చెప్పింది.  వసుమతికి యేమీ తెలీదని పోలీసులు అనుకున్నారు.  పోలీసులని అడిగింది యెందుకు విక్రాంత్ కోసం వెతుకుతున్నారని? విద్రోహ శక్తులతో చేతులు కలుపుతున్నాడని అనుమానం కలిగిందని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళి విచారణ చేయడానికి వెతుకుతున్నామని చెప్పారు వాళ్ళు.  కొన్నాళ్ళక్రితం వాళ్ళు మాట్లాడిన మాటలకర్థం ఇప్పుడు తెలుస్తున్నది.  గబ గబా లోపలికి వెళ్ళి వాడి గది మొత్తం వెదికింది.  యేమీ దొరకలేదు కాని యేదో చిన్న కాగితం మీద యేవో డేట్స్ వేసి వున్నాయి.  అన్నీ కూడా వచ్చే నెల తారీఖులు.  ఆ కాగితం తీసుకెళ్ళి  పోలీసులకి ఇచ్చింది.

“దీనివల్ల యేమీ వుపయోగం లేదు , అయినా కానీ దీన్ని తీసుకెళ్తాము. ఈ సారి కనక మీ అబ్బాయి ఇంటికొస్తే మాకు కబురు చెయ్యండి” చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు.

వొంట్లో  వున్న శక్తంతా  హరించుకుపోగా నిస్సత్తువగా కూర్చుండిపోయింది వసుమతి.  ఇంతలో దాక్కుంటూ దాక్కుంటూ విక్రాంత్ లోపలికి వచ్చాడు.  వాడి వెంట ఇంకో  ఇద్దరు వున్నారు.  వారు కరుడు  గట్టిన రాక్షసుల్లా వున్నారు.

“యేరా విక్కీ! యేం జరుగుతుందిరా?  ఇప్పటివరకు పోలీసులు నీ గురించి కాచుకుని కూర్చుని  వెళ్ళారు.  నీ వెంట పోలీసులు యెందుకు పడుతున్నారు? చెప్పరా చెప్పు? ఆవేశంతో   కొడుకు చొక్కా పట్టుకుని గుంజుతూ అడిగింది.

“అమ్మా! చాదస్తంగా అరవకు. వీళ్ళింకా వారం రోజులు ఇక్కడే వుంటారు. ఈ సారి పోలీసులు వచ్చి నా గురించి అడిగితే  నాకు తెలీదు, ఇంకా రాలేదని చెప్పు. ఈ వారం గడిచిందంటే మనకు బోల్డు డబ్బు వస్తుంది. ఇక నేను ఇవన్నీ మానేసి మంచిగా వుంటాను.  అప్పటి వరకు నోరు తెరిచావో నేను అదిగో ఆ పెట్రోలు పోసుకుని చస్తాను. ” బెదిరించాడు విక్రాంత్.

“చావరా! చావు. నువు  చచ్చినా నాకు సంతోషమే. స్నేహితులు అంటే యెలా వుండాలి?వీళ్ళు స్నేహితుల్లా లేరు.  నాకు అర్థమవుతున్నది.  మీరంతా కలిసి యేదో కుట్ర చేస్తున్నారు.  అయ్యో భగవంతుడా యెలాంటి కొడుకునిచ్చావురా?వుండండి మిమ్మల్ని ఇప్పుడే పోలీసులకి పట్టిస్తాను. ”

“అమ్మా! మంచిగా చెప్తున్నాను విను.  ఇదే చివరిసారి. ఈ ఒక్కసారి నా మాట విను.  మనం వూహించలేనంత మొత్తం డబ్బు వస్తుంది.  ఇక జీవితంలో వెనక్కి చూసుకోనక్కరలేదు.  నువు వినకపోతే వీళ్ళకు తల్లీ పిల్లా అన్న జాలి వుండదు. ”

“వుండకపోతే యేం చేస్తార్రా?నేను ఇపుడే వెళ్తున్నాను”ఆవేశంగా గుమ్మం వేపు వెళ్ళబోయింది.  అప్పటివరకు మాట్లాడకుండా నించున్న అతని స్నేహితులిద్దరూ వసుమతిని పట్టి లాక్కొచ్చి లోపలకు బస్తాలా విసిరేసారు.  ఆ పడటం పడటం తల వెళ్ళి గోడకు కొట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. .  మెలకువ వచ్చి చూసేసరికి ఒక కుర్చీకి కట్టి పడేసుంది.  అది  తమ ఇల్లు కాదు.

“అరేయ్! యెక్కడున్నార్రా?వచ్చి నన్ను విప్పండి. ఒరేయ్ విక్కీ! నేను నీ తల్లినిరా. . ఇలా కట్టి పడేసావేంటిరా?”

“యేయ్! నోర్మూసుకుని పడుండు. లేకపోతే తెరవడానికి నోరుండదు.” బెదిరించాడు అందులో ఒకడు.

“అమ్మా!మళ్ళీ చెబుతున్నాను విను. ఒక్క వారమే.  నిన్ను ఇలాగే వుంచుతారు. వారం తర్వాత మనం యెక్కడికెళ్ళేదీ కూడా యెవరికీ తెలీదు. ”

రోజులు యెలా గడుస్తున్నాయో తెలీడం లేదు. కాలకృత్యాలకి మటుకు తీసుకెళ్తున్నారు. .  మళ్ళీ అన్నం తినగానే కాళ్ళు చేతులు కట్టి పడేసి వాళ్ళపని వాళ్ళు చేసుకుంటున్నారు.  కొడుకు మొహంలోకి పరీక్షగా చూసింది చాలాసార్లు. తల్లినిలా కట్టేసినందుకు యేమన్నా బాధ కనపడుతుందేమో అని. కాని యేమాత్రం బాధ లేకపోగా మధ్య మధ్య బెదిరిస్తున్నాడు.  ఆహారంలో యేమి కలుపుతున్నారో కాని రోజంతా  మగతగా పడివుంటున్నది.  ఇప్పుడేమీ చేయలేదుకదా అనేమో తన ముందే వాళ్ళ ప్లాన్స్ అన్నీ చర్చించుకుంటున్నారు.  శక్తినంతా కూడదీసుకుని వాళ్ళ ఆలోచనలు, కౄరమైన వాళ్ళ ప్రణాళికలు వింటుంటే భయంతో విపరీతమైన జ్వరం వచ్చేసింది. యెలాగైనా తప్పించుకుని పోలీసులకి వార్త అందజేయాలని చూస్తున్నది. కాని అవకాశం కుదరడం లేదు. ఒకసారి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తే చూసి దొరకబుచ్చుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టారు.  యేమీ చేయలేని నిస్సహాయతతో భరించలేని దుఃఖం వచ్చింది. యెలా యెలా ఈ మారణహోమాన్ని  యెలా ఆపగలదు తాను? యెంతమంది తల్లులు  కడుపుకోతకు గురవుతారు? వందలమంది స్త్రీల సూత్రాలు తెగిపోతాయి. వేలమంది పసిపిల్లలు అనాధలవుతారు. భగవంతుడా!! నాకు ఒక్క అవకాశం ఇవ్వు తండ్రీ. . ఈ జీవితంలో నేను ఇంకేమీ కోరను. ఒక్క అవకాశం తండ్రీ. ఒక్కటంటే ఒక్కటే….  మోకాళ్ళతో నీ కొండకు నడిచి వస్తాను. తల నీలాలిచ్చుకుంటాను. కావాలంటే తల కూడా ఇస్తాను తండ్రీ” మనసులో వేదనపడుతూ వేడుకోసాగింది.

ఆ రోజెందుకో ముగ్గురూ చాలా వుత్సాహంగా వున్నారు. పొద్దుటినుండి ఇల్లు కదలకుండా మందు కొడుతూ కూర్చున్నారు.  చీకటి పడుతున్నా కూడా యెక్కడికి వెళ్ళలేదు.  ఆ రోజు యెమీ తినకుండా నిద్ర నటించసాగింది.  వాళ్ళు కూడా యెందుకో పట్టించుకోలేదు.

తెల్లవారితే దీపావళి.  యెక్కడో దూరం నుండి మతాబులు బాంబులు కాలుస్తున్నట్లుగా తెలుస్తున్నది.

“ఇంకొక్కరోజే. . ఈ రాత్రి గడిచిందంటే రేపు ఈ పాటికి మనం కోటీశ్వరులం అవుతాము” ఆనందంగా నవ్వుకున్నారు ముగ్గురూ.

గుండె గుభిల్లుమన్నది. ఇంకొక్కరోజా?రేపేమి చేస్తారు వీళ్ళు?ఈ రాక్షసుల్ని యెవరు చంపుతారు?యే దేవుడు దిగివస్తాడు?ఆలోచిస్తూ కళ్ళు తెరవకుండా వాళ్ళు మాట్లాడె మాటలు వినడానికి ప్రయత్నించసాగింది. వాళ్ళు యెవరెవరు యెక్కడికి వెళ్ళాల్సింది మాట్లాడుకుంటున్నారు. సిటీలో బాంబులు యెక్కడెక్కడ పెట్టాల్సింది కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. భూమి గిర్రున తిరిగిపోతున్నది. లోపలనుండి దుఃఖం తన్నుకుని రాసాగింది.  బలవంతాన ఆపుకున్నా కూడా వెక్కిళ్ళు రానే వచ్చాయి.

“యేడవడం తప్ప నువ్వేమీ చేయలేవు.  రేపీపాటికి సగం హైదరాబాద్ లేచిపోతుంది.” వికటంగా నవ్వాడు అందులో ఒకడు. మిగతావాళ్ళు జత కలిసారు . తాగి తాగి ఒళ్ళూ పై  తెలీకుండా నిద్రపోయారు ముగ్గురూ. కాళ్ళతో దగ్గరలో వున్న సీసాను తన్నింది. యెవ్వరూ లేవలేదు. చిన్నగా కట్లు విప్పుకోవడానికి ప్రయత్నించింది. ఇంక టైం దగ్గరపడుతుంది అనుకున్నారో యేమో తాళ్ళు గట్టిగా కట్టలేదు.  నెమ్మదిగా ఓపిక కూడగట్టుకుని  లేచింది.  బయటికి వెళ్ళే మార్గం వెతకసాగింది.   ఒక పాడుబడినట్లుగా వున్న ఇల్లు.  వీళ్ళు తెచ్చిన ఆహరపొట్లాలు, మందు , మంచినీళ్ళ సీసాలు తప్ప యేమీ లేవు. పక్క గదిలోకెళ్ళి చూసింది.  అక్కడ పెద్ద  సంచులు మూడు కనపడ్డాయి.  యేంటా అని దగ్గరకెళ్ళి  చూస్తే సినిమాల్లో మాదిరి కనపడ్డాయి బాంబుల డబ్బాలు.  చుట్ట చుట్టుకున్న కాల సర్పాల్లా కనపడ్డాయి.  అదే ముందుగదేమో ఒక గుమ్మం కనబడింది.  తలుపు తీసి చూస్తే ఆకాశం కనపడింది. అనందంతో కళ్ళనీళ్ళు తిరిగాయి.  పరుగునా బయటకెళ్ళి తలుపులు వేసేసింది. గొళ్ళెం పెడదామని చూస్తే బయటనుండి వేయటానికి యేమీ లేదు. యెవరన్నా కనపడతారేమో వాళ్ళ సాయం తీసుకుని ఆ ముగ్గుర్నీ పోలీసులకప్ప చెప్పొచ్చు అని.  కాని యెవరూ కనపడలేదు.  కనుచూపుమేరలో ఒక్క ఇల్లు కూడాలేదు.  అమావాస్య చీకటి.  నక్షత్రాల వెలుగులో అర్థమయింది అది ఒక పొలంలోని ఇల్లు.   అందుకే యెవరూ కనపడటం లేదు.  క్షణాలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ యెక్కువవుతున్నది.  యేడుపొచ్చేస్తున్నది.  నిస్సహాయంగా అక్కడే కూలబడిపోయింది. దూరంగా ఆకాశంలో మతాబులు వెలుగులు విరజిమ్ముతున్నాయి. నరకాసుర వధ అయినరోజు . దీపావళి పండగను అందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు.  “అయ్యో ఇక్కడ ఒకళ్ళు కాదు ముగ్గురు నరకాసురులు వున్నారు. యెవరన్నా రండిరా…”  యెలుగెత్తి అరిచింది వినేవాళ్ళు యెవరూ లేరని తెలిసినా. . మళ్ళీ వురుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళింది. . వాళ్ళు ఇంకా లేవలేదు.  తనని కట్టేసిన తాడు కనపడింది.  కాని ఒకడిని కట్టే లోపలే ఇంకోళ్ళని లేపుతే?. ఈసారి ఇక తనని కట్టేయడం కాదు చంపేస్తారు. చమటలు కారిపోతున్నాయి. .  ఆలోచనలతో తల పగిలిపోతున్నది.  భగవంతుడా అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి యేమీ చేసే అవకాశం లేకుండా చేసావు కదయ్యా??పోనీ ఆ బాంబుల డబ్బాలు వేసుకుని ఇక్కడి నుండి పారిపోతే? వాటిని పట్టుకోవాలని చూసింది. కాని చాలా బరువుగా వున్నాయి. యేమి చేసినా ఈ రాత్రే చెయ్యాలి తెల్లవారితే నగరం శ్మశానం అవుతుంది. బూడిద కుప్పలా మారిన నగరం కనపడింది. పడుకున్న వాళ్ళని చూసింది.  వేయి తలలతో విషాన్ని వెదజల్లుతున్న సర్పాల్లా కనపడ్డారు. ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా  మందు సీసాల్లోని మందంతా వాళ్ళ చుట్టూ పోసింది. . వాళ్ళమీద కొద్ది కొద్దిగా చల్లింది. .  అగ్గిపెట్టె తీసుకుని బయటికి నడుస్తూ వెనక్కి చూసింది.  బుడి బుడి నడకలతో యెత్తుకో అంటూ నవ్వులతో వస్తున్న కొడుకు కనపడ్డాడు. దుఃఖంతో కాళ్ళు తడబడ్డాయి. . కాని ఆ వెంటనే కరాళ నృత్యం చేస్తున్న మృత్యుదేవత కనపడింది…. గుండెలు బాదుకుంటూ యేడుస్తున్న యెంతో మంది తల్లులు కనపడ్డారు,  మనసు గట్టిగా చేసుకుని అగ్గిపుల్ల గీసింది వసుమతి…….

వింటున్న వాళ్ళందరి హృదయాలు బరువెక్కాయి.

“దేశానికెంత మంచి చేసినా మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు.  అది చట్టరీత్యా నేరం. కాని మీరు చేసింది మంచి అని నమ్మిన లాయర్లు మీకు సహాయం చేస్తామంటే వొద్దన్నారు. వున్న సాక్ష్యాధారాల ప్రకారం మీకు కఠిన శిక్ష పడుతుంది.  ”

“అది ఆ లాయర్ల  మంచితనం.   నాకు  సహాయం చేస్తానన్న పెద్దలకు నమస్కారం. కాని  నేను బయటికి  వచ్చి యేమి చేస్తాను? వున్న ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుని  నేను  బ్రతికి యెవరిని వుద్దరించాలి? వద్దు  సార్.  కాని ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నాను.  కొడుకులు తప్పు చేస్తే యే తల్లైనా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది.   కాని తప్పులు చేయటమే జీవితంగా పెట్టుకున్న యే కొడుకునైనా శిక్షించడానికి   తల్లి సత్యభామ అవతరం యెత్తుతుందని పిల్లలు తెలుసుకోవాలి.  తప్పు చేయటానికి   ఆ పిల్లలు భయపడాలి. . . ఆ భయం పిల్లలకు తల్లులు కల్పించాలి. యెంత ప్రేమ పంచినా ప్రేమ పక్కన భయం లేకపోతే నా కొడుకులాంటివాళ్ళు మాట వినరు. సమాజానికి విషసర్పం లాంటి నా కొడుకు బ్రతకటానికి అర్హత లేని వాడు.  నేను నా కొడుకుని  దేశానికి  అర్పించాను.   అందుకు  బాధగా  యేమీ లేదు” గొంతు వణికింది వసుమతికి.

“ఒక పిల్లాడు పాడైతే ఒక తరమే పాడవుతుంది. తల్లులూ …. కనిపెట్టి వుండండి” చెపుతూనే పెద్దగా యేడుస్తూ  బోనులో ఒరిగిపోయింది వసుమతి. .

 

 

——————————

 

‘ఉషోదయం’

రచన: నండూరి సుందరీ నాగమణి

 

“స్వాతంత్ర్యమె మా జన్మహక్కనీ చాటండీ!”రేడియో లో వినిపిస్తున్న ఘంటసాల వారి దేశభక్తి గేయాన్ని వింటూ మేను పులకించిపోతుండగా రెండు చేతులూ జోడించి కళ్ళుమూసుకుని ఒక ధ్యానంలో ఉండిపోయాడు గిరిధారి.

“అంకుల్, అంకుల్!”తలుపు కొట్టటంతో ధ్యాన భంగమై లేచి తలుపు తీసాడు. ఎదురుగా ఎదురింటి వారి మనవరాలు కుముద.ఆ పిల్ల వెనకాలే మరో పిల్లవాడు…

“మేమంతా ఆడుకుంటూ ఉంటే బంతి కిటికీలోంచిమీ ఇంట్లో పడింది…” అంది సోఫా క్రింద చూపిస్తూ. తీసుకోమన్నట్టు సైగ చేసాడు గిరి.

ఆ పాప అది తీసుకుని బయటకు వెళుతూ ఉండగా అడిగాడు… “ఈరోజు ఆగస్టు పదిహేను కదా, నువ్వు స్కూల్ కి వెళ్ళలేదా?”

“లేదంకుల్, మన కాలనీలో కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంది కదా…ఇండిపెండెన్స్ డే కి, రిపబ్లిక్ డే కీ ఉంటుంది.ఓ, జాన్యువరి ట్వంటీ సిక్స్త్ కి మీరు ఇక్కడ లేరు కదా?” అంది ఏదో అర్థమైనట్టు.

“అవునమ్మా… గణతంత్ర దినోత్సవానికి నేనింకా ఇక్కడికి రాలేదు. మరిఎనిమిది దాటింది…ఇంకా మొదలుపెట్టలేదు? బాగా ఆలస్యం అవుతుందా ?

“కాలనీ సెక్రెటరీ గారు వెళ్లి ఎమ్మెల్యే గార్ని తీసుకురావాలట, మా డాడీ చెప్పారు… నేను వెళతాను అంకుల్, బై…

గిరిధారి మనసు బాధగా మూల్గింది. ఒకప్పుడు తానే సంవత్సరానికి రెండుసార్లు గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికీతన ఇంటి వాకిట్లో పతాకవందనం చేసుకునేవాడు. పిల్లలూ తానూ కలిసి మూడు రంగుల కాగితాలతో తోరణాలు కట్టేవారు. పెరట్లో పూసిన అందమైన రంగు రంగుల పూలన్నీ జెండాలో చుట్టి ఉంచేది అలివేలు. ఉదయం ఎనిమిదికల్లా అందరూ తలంట్ల స్నానాలు చేసి, కొత్త బట్టలు కట్టుకుని తయారై ఉండేవారు. పిల్లల హర్షధ్వానాల మధ్య తానుస్తంభానికి కట్టి ఉంచిన జాతీయపతాకం తాడులాగి, ఆవిష్కరించేవాడు. ఒక్కసారిగా పూవులన్నీ జారి అంతెత్తునుంచి భరతభూమికి అభిషేకం చేసేవి. జాతీయపతాకం ఠీవిగా తలెత్తుకుని వినువీధిలో ఆనందంగా ఎగిరేది. పతాక వందనానికి చుట్టు ప్రక్కల ఇరుగుపొరుగు వారు కూడా వచ్చే వారు. పతాకావిష్కరణ తరువాత, పిల్లల చేత దేశభక్తిగీతాలాపన చేయిచేవాడు. ఆ తరువాతఅందరికీ స్వీట్లు పంచేవారు. ఆ కార్యక్రమమంతా అయ్యాకే తాము ఉదయపు ఫలహారం చేసేవారు.

గతాన్ని తలచుకున్న గిరి కళ్ళలో నీళ్ళు నిలిచాయి. ‘ఏవి తల్లీ, నిరుడు కురుసిన హిమ సమూహములు?’ ఎక్కడ ఆ వైభవం? ఏదీ ఆ పండుగ వాతావరణం? ఈరోజు జాతీయ పండుగలన్నీ ఒక సెలవు దినంగా మాత్రమే పరిగణించబడటం శోచనీయం. ఆలోచిస్తున్న గిరిధారికి ఎదురుగా ఆన్ చేసి ఉన్న టీవీలో రాజధాని నగరంలో జరగబోతున్న పతాకావిష్కరణ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం రాబోతున్నదన్న ప్రకటనకనిపించి, సర్దుకుని కూర్చున్నాడు, పతాకవందనానికై.

ఆ విరామంలో ప్రసారమైన ‘మిలే సుర్ మేరా తుమ్హారా…’ అనే దేశభక్తి గేయపులఘుచిత్రంలో నటించిన కళాకారుల హావభావాలు, వారిలో పొంగి పొరలే దేశభక్తిఅతనిని ముగ్దుడిని చేసాయి. ఆ లఘుచిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదతనికి. మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. లఘుచిత్ర ప్రదర్శన అనంతరం మరి కొద్ది నిమిషాల తదుపరి పతాకావిష్కరణ కార్యక్రమం మొదలైంది.

***

‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి!’ ఉత్తేజపరచే ఆదేవులపల్లి గీతాన్ని వింటూ, చేతిలో తేనీటి కప్పుతో వరండాలో కూర్చున్నాడు గిరిధారి.

“ఏరా గిరీ… ఏం చేస్తున్నావు?’ అంటూ వచ్చిన మాధవరావు పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

“నాకేం రా? నేను బాగానే ఉన్నాను… ఉండు నీకూ టీ తెస్తాను…” అంటూ లేవబోతుంటే వారించి,

“నేనిప్పుడే తాగి వస్తున్నాలే. నువ్వు బాగుంటే, ఆ ముఖం ఎందుకురా అంత నీరసంగా ఉంది? జ్వరం వచ్చి తగ్గిందట కదా… పనిమనిషి చెప్పింది. నేను ఊరినుంచి రాత్రే వచ్చాను. అయినా అయినవాళ్ళు ఉండీ నీకీ ఖర్మమేమిటిరా? ఒంటరిగా ఉండటం ఎందుకు ఈ వయసులో? పిల్లలు లేరా?” కోప్పడ్డాడు మాధవరావు.

పిల్లల మాట వినగానే గిరి ముఖం జేవురించింది.

“నాకెవ్వరూ లేరు మాధవా… నా అనుకున్న మనుషులు ఇద్దరే. ఒకరు నా భార్య… పైకి వెళ్ళిపోయింది. రెండోది నువ్వే… నేను అడిగిన వెంటనే, మీ వీధిలోనే ఈ ఇల్లు చూపించి, స్నేహ ధర్మం నిలుపుకున్నావు. రెండురోజులకోసారి వచ్చిపోతున్నావు. ఇంతకన్నా ఏం కావాలి? నాకు పుట్టిన పిల్లలు నా వాళ్ళు కానేకాదు… ఇంకోసారి వాళ్ళ మాట ఎత్తకు…”

“అవేం మాటలురా?గాంధీ, సుభాష్, ఝాన్సీ ఎంత బాధ పడుతున్నారో తెలుసా?”

“పడతారు రా… ఈ వయసులో తండ్రి వాళ్ళ దగ్గర ఉండకుండా వేరేగా ఉంటున్నాడని లోకం ప్రశ్నిస్తుందని బాధపడతారుఅంతే… వదిలేసెయ్…” కణతలు రుద్దుకున్నాడు మనసులో ఎగసి పడే బాధావీచికలను అదుముకుంటూ.

“మరీ చాదస్తాలకు పోకు గిరీ… పిల్లలు చక్కగా చదువుకుని, మంచి సంపాదనా పరులయ్యారు. నీవు అక్కడ ఉండటమే ఉత్తమం. నా మాట విను… మరీ అంతంత పంతాలకు పోకురా… సరే, మార్కెట్ కి వెళుతూ ఇలా వచ్చాను. నీకేమైనా కావాలా?”

“వద్దురా, కూరలన్నీ అలాగే ఉన్నాయి.”

“సరేరా, మరి వస్తాను…” వెళ్ళిపోయాడు మాధవరావు.

గిరిధారి మనసంతా ముళ్ళకంపలా తయారైంది. పిల్లలు గుర్తు వస్తే చాలు,గుండె చెరువు అవుతోంది…

***

పెద్ద కొడుకు గాంధీఎంబీయే చదివి ఒక పెద్ద కంపెనీలో హెచ్చార్ మేనేజర్ గా స్థిరపడ్డాడు. రెండోవాడు సుభాష్ ఇంజినీరింగ్ చదివి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక ఆఖరు సంతానం అయిన ఝాన్సీని ఎంబీబియస్ చదివించాడు గిరి. ఆమె గైనకాలజిస్ట్ గా స్థిరపడింది. ముగ్గురు పిల్లలూ మంచి ముత్యాలని మురిసిపోయేవాడు గిరి. అలివేలు ఆకస్మిక మరణంతో తప్పనిసరిగా కొడుకుల దగ్గర ఉండటానికి సిద్ధమయ్యాడు.

తన త్రీ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో ఒక రూమ్ తండ్రికి కేటాయించాడు గాంధీ. ఉదయం వెళితే రాత్రి పది దాటాకే ఇంటికి వచ్చేవాడు. కంపెనీలో తనది కీలక పాత్ర కావటంతో ఉద్యోగబాధ్యతలు చాలా ఎక్కువ అతనికి. అతని భార్య రమాదేవి గృహిణి కావటం వలన గిరికిపెద్దగా సమస్య లేకపోయేది. ఎక్కువగా మాట్లాడకపోయినా,మామగారికిసమయానికి అన్నీ అమర్చి పెట్టేది ఆమె.

రోజులిలా గడచిపోతూ ఉంటే ఒకరోజు కొడుకు వచ్చేవరకూ మేలుకుని ఉన్నాడు గిరి. సాధారణంగా మందులు వేసుకుని రాత్రి తొమ్మిదిన్నరకల్లా పడుకుంటాడు.

రమ తలుపు తీయగానే లోపలికి వచ్చిన గాంధీ తండ్రి గదివైపు చూస్తూ, “నాన్న పడుకున్నారుగా?” అన్నాడు. ముద్దగా వచ్చిన అతని మాట తీరూ, గాలిలో వ్యాపించిన వాసనా గిరిని విస్మయపరిచాయి. మద్యం!తన కొడుకు మద్యం సేవించి వచ్చాడు… గాంధీ అని, తానెంతోప్రేమతో పేరుపెట్టుకున్న తన తనయుడు ఈరోజు బ్రాందీ తాగాడు… ఇలా ఎన్ని సార్లు జరిగిందో తెలియదు కానీ… తానిప్పుడే చూస్తున్నాడు… అడుగుల చప్పుడు విని నిద్రపోతున్నట్టుగా కళ్ళుమూసుకున్నాడు గిరి.

తండ్రి గదిలోకి తొంగి చూసి, నిశ్చింతగా వెనుతిరిగిన గాంధీ, “ఈరోజు మరీ మొహమాట పెట్టేసారు పార్టీలు… బయట పనిచేస్తున్నాక ఇవన్నీ తప్పదు కదా, ఈయనకేమో అర్థం కాదు… మడికట్టుకుని కూర్చోమంటాడు…ఇదిగో ఈ డబ్బు లోపల పెట్టు…” అన్నాడు భార్యతో.

“ఇది ఎప్పటికైనా ప్రమాదమే కదండీ… ఆయనఆశయాలతో పెరిగారు మీరంతా… ఇప్పుడీ పనులేమిటి చెప్పండి. వారానికి రెండు సార్లు మీరిలాగే వస్తున్నారు. ఇది అలవాటుగా ముదిరిపోతే ఎన్ని సమస్యలు వస్తాయి? ఈరోజు సరే, ఎప్పటికైనా మామయ్య గారికి తెలియకుండా పోదు. మీరు బీరువాలో నింపుతున్న డబ్బు చూస్తుంటే తల తిరిగిపోతుంది… వద్దండీ, ఈ పాపపు డబ్బు మనకెందుకు? ఎవరి ఉసురు పోసుకోవటానికి? నా మాట వినండి… ఇకనైనా కంపెనీ మారండి… మీకు వచ్చే జీతం చాలు… మనకి పిల్లా, పాపా పుట్టలేదింకా… ఎలాగో సర్దుకుందాం. నేనూ ఉద్యోగంలో చేరతాను…” అనునయంగా చెప్పింది రమ.

“ఓహోహో మామకు తగ్గ కోడలు… ఈ ధర్మపన్నాలన్నీ ఎప్పుడూ చెప్పేవే కానీ, బాగా ఆకలేస్తోంది, అన్నం వడ్డించు…” అని వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు గాంధీ.

సన్నగా అయినా స్పష్టంగా వినిపించిన సంభాషణకు నిశ్చేష్టుడైన గిరి ఆ రాత్రి నిద్రకు దూరమే అయ్యాడు.

***

మరుసటి రోజు తండ్రీ కొడుకులకు పెద్ద వాగ్యుద్ధమే జరిగింది. గిరి, గాంధీని నిలదీయటంతో ఎదురుతిరిగాడతను.

ఈరోజుల్లో పై సంపాదన లేకుండా, లంచాలు తీసుకోకుండా, అప్పుడప్పుడూ మందు కొట్టకుండా ఉండటం అసాధ్యమని అంటాడు కొడుకు.

ఎన్నెన్నో ఆశయాలతో ఆదర్శాలతో పెంచి పెద్దచేస్తే, ఇలా చేయటం తల్లి భారతిని అవమానించటమే అని అంటాడు తండ్రి.

“గాంధీ, ఇకనైనా అన్నీ మానేయ్ నాయనా, అమ్మాయి చెప్పినట్టు, ఇది కాకపోతే మరొకటి. వేరే ఉద్యోగం చూసుకుందువులేరా తండ్రీ…” అని నచ్చజెప్పటానికి ప్రయత్నించాడు గిరి.

“నాన్నా, నువ్వూ నీ ఛాందస భావాలూ!బయట ప్రపంచమంతా ఇలాగే ఉంది. కాలం మారిపోయింది. నీలాగా, అబద్ధాలు చెప్పకుండా, పరుల సొమ్ము ఆశించకుండా ఎవ్వరూ లేరు… సుభాష్, ఝాన్సీ ల గురించి తెలుసా నీకు? నేనన్నా అద్దె అపార్ట్మెంట్ లో ఉంటున్నా, తమ్ముడీమధ్యే హైటెక్ సిటీలో విల్లా బుక్ చేసాడు. దాన్ని బట్టి వాడి సంపాదన ఎంతో అర్థం చేసుకో. కేవలం నెల జీతంతో ఇవన్నీ సాధ్యమా చెప్పు?

ఇక నీ ముద్దుల కూతురు ఝాన్సీ, దాని భర్తాకలిసి పెట్టుకున్న నర్సింగ్ హోమ్ లో జరుగుతున్న సర్గోసీ వ్యాపారం గురించి నీకు తెలియదు. వాళ్ళ మీద నేరాలు మోపటం నా అభిమతం కాదు. ఇలా ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో బ్రతకగలం అని చెప్పటానికి అంటున్నాను. నేనీ కంపెనీలో ఉద్యోగం మానేయటానికి క్షణం చాలు. నా సీటు కోసం లక్షలు వెచ్చించటానికి సిద్ధంగాఉన్నారు అభ్యర్థులు. పైగా మరోచోట ఉద్యోగానికి ప్రయత్నిస్తే నాకు వెంటనే దొరుకుతుంది. కానీ ఈ వ్యవస్థ అన్ని చోట్లా ఇలాగే ఉంది.” చెప్పాడు గాంధీ.

“అలా అయితే, నువ్వసలు ఉద్యోగమే చేయకు. మన ఊరికి వెళ్ళిపోదాము. అక్కడ ఒకచిన్న స్కూలు పెట్టుకుందువు గాని…”

చిన్నపిల్లాడిని చూసినట్టు జాలిగా తండ్రివైపు చూసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు గాంధీ. ఆ రాత్రే తన బట్టలు సర్దుకుని స్నేహితుడు మాధవరావు ఇంటికి వెళ్ళిపోయాడు గిరి.

***

“ఏమిటి నాన్నా ఇది, అన్నయ్యతో దెబ్బలాడి, ఇలా వేరే వచ్చేయటం ఏమిటి? అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండటం ఏమిటి? మాకేం బాగాలేదు నాన్నా…” చెల్లెలు ఝాన్సీ తో కలసి వచ్చిన సుభాష్ అన్నాడు తండ్రితో.

“మరెక్కడికి రమ్మంటావు? నీ ఇంటికా? కొత్తగా నువ్వెళ్ళబోయే నీ విల్లాకా? నేను మీకు ఉగ్గుపాలతో రంగరించి పోసిన నీతిసూత్రాలు ఏమైపోయాయో అర్థం కావటం లేదురా… మీరు మారందే నేను రాను. అన్నీ వదిలేయండి… నా కొడుకులుగా నిలవండి… ప్లీజ్ నాన్నా… మనం భరతమాతకు ద్రోహం చేయకూడదురా. ప్రపంచమే ఇలా ఉందని మీరంటున్నారు. కనీసం మీరు… మీరు మారండిరా… మీ పక్కవాడిని మార్చండి. లంచాలు తీసుకుని వ్యక్తిత్వాలను అమ్మకండి. అక్రమ సంపాదనతోఅక్రమ కట్టడాలు కట్టకండి… ఆ డబ్బుతో మీరు సుఖపడేది కేవలం తాత్కాలికమే. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుందిరా.అధర్మానికి చేటు తప్పదు. ఇది గ్రహిస్తే మంచిది మీరు.”

“ఏమిటి నాన్నా చాదస్తం… అమ్మ ఎలాగూ లేదు. ఉన్న నువ్వైనామాతో ఉండకుండా ఇలా దూరంగా ఉంటే ఎలా నాన్నా?మీ అల్లుడు గారు నిన్ను నాతో మా ఇంటికి తీసుకువచ్చేయమని చెప్పారు…”

“ఎందుకమ్మా డాక్టర్ ఝాన్సీ? ముందు వైద్యులుగా మీకు పట్టిన అవినీతి జబ్బును నయం చేసుకోండి తల్లీ… ఆ తర్వాత జనాలను ఉద్ధరించుదురు గానీ… ఏంటమ్మా, సర్గోసీ బిజినెస్ చేస్తున్నారట… పిల్లలు లేని పెద్దింటి వాళ్ళకు పేదోళ్ళ గర్భఫలాన్ని అమ్మేస్తున్నారట. శభాష్… నువ్వు ఇంటర్ చదివేటప్పుడు నీ స్నేహితురాలింట్లో ఫంక్షన్ కి నీకు చున్నీ గిఫ్ట్ గా ఇస్తే, నేను కోప్పడతానేమోనని తిరస్కరించిన నా ముద్దుల కూతురు ఝాన్సీవేనా అమ్మా నీవు? పరులసొమ్ము పాము వంటిది అని నేను చెప్పిన పాఠం ఆనాటి వరకూ గుర్తుందికదా? ఇప్పుడెందుకమ్మా ఈ మార్పు? ఏమైనా అంటే లోకమంతా ఇలాగే ఉందని అంటున్నారు. మీకు ఏర్చి కూర్చి, గాంధీ, సుభాష్, ఝాన్సీ అనే భారత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టుకున్నానమ్మా. అయిపోయింది! నా గర్వమంతా అణగారిపోయింది. తండ్రిగా నేను చచ్చిపోయానమ్మా… ఇక మీకు నాన్న లేడు. వెళ్ళండి తల్లీ… నన్ను మరచిపొండి… మాధవా, వీళ్ళను పంపించు…” పక్క గదిలోకి వెళ్లి తలుపు వేసేసుకున్నాడు గిరి.

***

ఇది జరిగి రెండేళ్ళు అయింది. మాధవరావు వీధిలోనే చిన్న ఇల్లు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు గిరి. అన్యాయాన్ని సహించలేని గిరి తన పిల్లల మీద ప్రభుత్వానికి తానే కంప్లయింట్ ఇవ్వాలని అనుకున్నాడు కానీ కడుపుతీపి, మిత్రుడి మాట అతన్ని ఆపేశాయి.

సంవత్సరం గడిచింది. గిరి బాగా కృంగిపోయాడు. ఒంటరితనం, అనారోగ్యం అతన్ని పట్టి పీడిస్తున్నాయి.

కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు కనుక ఒకరి తర్వాత ఒకరుగా గాంధీ, సుభాష్ ఉద్యోగాల్లోంచి సస్పెండ్ అయ్యారు. ఝాన్సీ నర్సింగ్ హోమ్ సీజ్ చేయబడింది. ఆమె మీద రకరకాల ఆరోపణలునమోదు అయ్యాయి.

బెయిల్ మీద బయటకు వచ్చి తండ్రి కాళ్ళమీద పడి క్షమాపణ వేడుకోవటానికి బయలు దేరింది ఝాన్సీ. అప్పటికే అన్నలిద్దరూ తండ్రి దగ్గర కూర్చుని పశ్చాత్తాపంతో విలపిస్తున్నారు. తండ్రి ముఖం తేటగా ఉంది. అన్యాయానికి, అధర్మానికి తగిన శిక్ష పడినందుకో ఏమో ఆయన ముఖంలో ఎప్పుడూ లేనంత శాంతి ప్రతిఫలిస్తోంది. పిల్లలు తమ తప్పు తెలుసుకున్నందుకు గిరి ముఖంలో ఆనందపు కాంతులు మెరుస్తున్నాయి.

వాళ్ళ భుజాలు తట్టి చెప్పాడు…

“ఇక పదండి, బయలుదేరదాం… మన ఊరు వెళ్ళి ప్రశాంతంగా గడుపుదాం. ఝాన్సీ తల్లీ, అక్కడ వైద్యశాల తెరుద్దువు గాని… ఏదో ఒక మంచి ఉద్యోగం, చిన్నదైనా వీళ్ళకు దొరక్క పోదు… లేదా మనింట్లో మామిడి చెట్టు కింద ఒక చిన్న బడి తెరుద్దాము. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా విద్యాదానం చేద్దాము.తప్పూచేయకుండా, ఏ భయం లేకుండా, నిశ్చింతగా, నిర్భీతిగా కాలం గడుపుదాం. ఈరోజు నేను మళ్ళీ పుట్టానర్రా… నన్నింక ఏ జబ్బూ ఏమీ చేయలేదు…” అన్నాడు మిలమిలా మెరిసే కళ్ళతో.

“కానీ నాన్నా, పాపం చేసినవాడికి తగిన శిక్ష పడి తీరవలసిందే. మూడు రోజులలో నాకేసు హియరింగ్ కి వస్తుంది. నాకు శిక్ష పడితే, దానిని అనుభవించి వస్తాను. నేను కూడా మన ఊరు వచ్చి మీతో జాయిన్ అవుతాను…”

“అలాగేనమ్మా… నీ తప్పు నీవు తెలుసుకున్నావు కనుక, దేవుడు క్షమించి, అతి తక్కువ శిక్ష వేస్తాడు లేమ్మా… నా ఆదర్శాలతో మిమ్మల్ని బాధపెడుతున్నానని నాకు తెలుసు… “ బాధగా అన్నాడు గిరిధారి.

“చెల్లాయికి జరినామా పడితే, అదిమేము కట్టేస్తాము నాన్నా… ” ముక్త కంఠంతో చెప్పారు అన్నదమ్ములిద్దరూ.

ఆ సైనికుడి ముగ్గురు సంతానపు హృదయాలలో అవినీతి చీకటి అంతరించి, నీతి అనే రవిబింబం ఉదయించసాగింది. అది ఇక ఎప్పటికీ అస్తమించదు.

***

 

 

 

 

 

 

 

 

 

“స్వచ్ఛ” తరం

రచన: జ్యోతి వలబోజు

“విజయా!! విజయా!” గట్టిగా అరుస్తూ ఇంట్లోకొచ్చాడు నరహరి.
భర్త కోసం ఎదురుచూస్తూ టీవీ సీరియల్ చూస్తున్న విజయ గభాల్న లేచి వచ్చింది.
“ఏంటీ పెద్దమనిషి? ఎప్పుడు లేనిది ఇవాళ చాలా కోపంగా ఉన్నట్టున్నాడు” అనుకుంది.
గట్టిగా చప్పుడొచ్చేలా అడుగులేస్తూ హాల్లోకి వచ్చి కోపంగా చూసాడు భార్యను.
“ఏమైందండి? ఎందుకలా కోపంగా ఉన్నారు? మీ స్నేహితులతో పార్టీ అని వెళ్లారుగా? అక్కడ ఏదైనా గొడవ జరిగిందా?”
“ఫ్రెండ్స్ కాదు నీ పిల్లలే .. వాళ్లకు ఎంత ధైర్యం? నాకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా? ఇక్కడి వ్యవహారాలన్నీ చూసుకుంటున్న నాకే ఏ సంగతి చెప్పకుండా అమెరికానుండే నిర్ణయాలు తీసేసుకునేంత పెద్దవాళ్లైపోయారా?” ఆవేశం, కోపంతో రొప్పసాగాడు నరహరి.
“ముందు మీరు స్తిమితంగా కూర్చోండి. ఈ నీళ్ళు తాగండి. తర్వాత మాట్లాడదాం” అంటూ మంచినీళ్ల గ్లాసు అందించింది విజయ.
నీళ్లు తాగినా కోపం చల్లారలేదు. మౌనంగానే ఉన్నా ఆవేశం తగ్గడం లేదు.
పది నిమిషాల తర్వాత “ఏవండి.. అసలేం జరిగింది. బయటకెళ్లేవరకు బానే ఉన్నారు కదా. మన వ్యాపారంలో ఏదైనా గొడవ జరిగిందా. ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చిందా. అమెరికాలో ఉన్న పిల్లలేం చేసారసలు?” విజయ మెల్లిగా అడిగింది.
పదినిమిషాలు మౌనంగా కూర్చున్నారిద్దరూ. నరహరి కోపం కూడ చాలావరకు తగ్గినట్టుగానే ఉన్నాడు.
“ఏం జరిగిందండి? ఎందుకలా పిల్లలమీద కోపంగా ఉన్నారు?” అడిగింది విజయ.
“మన ఊర్లో ఆ రమణయ్య పొలం, అతని చుట్టుపక్కలవారి పొలాలన్నీ కొందామని మార్కెట్ ధర కంటే తక్కువకు బేరం చేసి, పిల్లలు రాగానే డబ్బులిచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఆ స్థలంలో డిల్లీ నుండి వచ్చిన ఒక కంపెనీ వారితో కలిసి ఫాక్టరీ కట్టాలని నిర్ణయం జరిగింది కదా. దీనికి పిల్లలు కూడా ఒప్పుకున్నారు. కాని ఇప్పుడు నాకు చెప్పకుండా ఆ పొలాలను కొనడం లేదని ఆ రైతులందరికీ చెప్పాడంట నీ సుపుత్రుడు.” ఆవేశంగా అన్నాడు నరహరి.
“అవునా! ఇంత పెద్ద నిర్ణయం మీకు చెప్పకుండా తీసుకున్నారా? అసలు వాళ్లు ఇలా ఎందుకు చేసారు? అది కనుక్కున్నారా? రేపు ఆదివారం కదా కాల్ చేసి మాట్లాడండి అబ్బాయితో” అనునయిస్తూ చెప్పింది విజయ.

******
తెల్లారి ఆదివారం తొమ్మిదిగంటల సమయంలో నరహరి, విజయలు టిఫిన్ చేసి కాపీ తాగుతుండగా అమెరికా నుండి వాళ్లబ్బాయి శ్రీనివాస్ కాల్ చేసాడు.
కొడుకే కాల్ చేస్తాడని తెలిసిన నరహరి ఫోన్ తీసుకోలేదు. తల్లి తీసుకుని మాట్లాడింది.
“అమ్మా! ఫోన్ స్పీకర్ లో పెట్టు. నాన్నకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.”అన్నాడు శ్రీనివాస్.
“నాన్నా! కోపం తెచ్చుకోకుండా నా మాట విను. పొలాలు కొనడం లేదని నువ్వు కోపంగా ఉన్నావని తెలుసు. కాని దానికి కారణం కూడా చాలా ముఖ్యమైనది. మేము ఇక్కడ కష్టపడి సంపాదించింది మన ఊర్లోనే పెట్టుబడి పెట్టాలని నువ్వంటే సరే అని ఒప్పుకున్నాం. కాని వారం క్రితం జరిగిన సంఘటన మా ఆలోచన పూర్తిగా మార్చేసింది”.
“ఏం జరిగింది వాసూ” ఆత్రుతగా అడిగింది విజయ. నరహరి కూడా ఏం జరిగిందో అని వినడానికి రెడీ అయ్యాడు.
******
శ్రీనివాస్ ఆఫీసులో చాలా బిజీగా ఉన్నాడు. ఇయర్ ఎండింగ్ కావడంత తను పని చేస్తున్న ప్రాజెక్టు చివరి దశకు వచ్చింది. చాలా జాగ్రత్తగా టీమ్ ని నడిపించాలి. ఏమాత్రం తేడా వచ్చినా కోట్లలో నష్టం వస్తుంది. అందుకే టెన్షన్ గా కూడా ఉన్నాడు.
ఇంతలో అతని మొబైల్ మ్రోగింది. ఇండియా నుండి కాల్..
“హలో!” కంప్యూటర్ మీద పని చేస్తూ అన్నాడు శ్రీనివాస్.
“ఒరేయ్ వాసూ! నేను శ్యామ్ ని. మన ఊరినుండి మాట్లాడుతున్నాను. చాలా దారుణం జరిగిపోయిందిరా!” చాలా ఆందోళనగా మాట్లాడుతున్నాడు.
“అయ్యో! ఏమైందిరా? అంతా బానే కదా. మనం పొలాలు కొందామని బేరం పెట్టాం. రైతులేదన్నా గొడవ పెడుతున్నారా? డబ్బులు ఎక్కువ అడుగుతున్నారా లేక సర్పంచ్ ఏదైనా లిటిగేషన్ పెట్టాడా?? ఊరి పొలాలు వాడికి దక్కకుండా మన యువకులం కలిసి సేకరిస్తున్నామని మండిపోతున్నాడు కదా..” అన్నాడు వాసు.
“అది కాదురా? ఇటీవల కురిసిన వానలకు మన ఊళ్లోని బడి కూలిపోయింది. ఇద్దరు పిల్లలు చనిపోయారు. మరో పదిమందికి బాగా దెబ్బలు తాకాయిరా. ఆసుపత్రి కూడా అప్పుడో ఇప్పుడో కూలిపోతుందన్నట్టుగా ఉంది. లోపలికి వెళ్లాలంటే అందరూ భయపడుతున్నారు. ఇదే భయంతో ఆసుపత్రికి డాక్టరు రావడం ఎప్పుడో మానేసాడు. కాంపౌండరే చిన్న చిన్న సుస్తీలకు ఆదుకుంటున్నాడు.”
“అయ్యో! ఇంత ఘోరమా? ఊర్లో ఇంతమంది ఉన్నారు. బడిగురించి, ఆసుపత్రి గురించి ఎవ్వరూ పట్టించుకోలేదా? సరే ఇప్పుడేం చేద్దామంటావ్ శ్యామ్?” బాధగా అడిగాడు వాసు.
“నాది, మన ఫ్రెంఢ్స్ ఆలోచించిన తర్వాత అనుకున్న ఆలోచన ఇది. నువ్వు, అక్క కూడా ఆలోచించంఢి. మీరు అమెరికాలో సంపాదించింది ఊర్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకున్నారు. దానివల్ల ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కాని మీరు సంపాదించింది మొత్తం కాకున్నా కొంచెమైనా వ్యాపారం బదులు సాయం చేయగలరా? ఈ బడి, ఆసుపత్రి బాగోగులు మనమే చూసుకుంటే మంచిది కదా. ప్రతీదానికి ప్రభుత్వం అని కూర్చుంటే ఎప్పటికయ్యేను? ఆలోచించి ఏ సంగతి చెప్పండి. మన ఫ్రెంఢ్స్ అందరం ఎదురు చూస్తుంటాం.” అని ఫోన్ పెట్టేసాడు .
*****
“అదీ నాన్నా జరిగింది. మాకోసం నువ్వు బానే సంపాదించావు. నేను అక్క కూడా మంచి ఉద్యోగాలలో ఉన్నాము. అంతా మాకోసం , మా కుటుంబం కోసమే అనుకోకుండా మన పల్లెటూరికి కూడా కాస్త సాయం, సేవ చేయాలనుకున్నాం. వ్యాపారం పెట్టి దాన్ని అభివృద్ధి చేసేబదులు గ్రామంలో కావలసిన సదుపాయాలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనిపించింది. దీనివల్ల మాకు లాభం డబ్బు రూపేనా అందదు కాని ఎందరికో సాయం అందుతుంది. ఉపాధి కూడా లభిస్తుంది. ఏమంటావు?” అన్నాడు శ్రీనివాస్.
అంతలో వాళ్ల కూతురు స్వప్న కూడా గ్రూప్ కాలింగ్ లో వచ్చింది.
“నాన్నా! రెండు వారాల్లో నేను, తమ్ముడు ఇండియా వస్తున్నాం. అందరం మన ఊరెళదాం. రెడీగా ఉండండి.” అని చెప్పింది.
నరహరి కోపమంతా పోయి ఆలోచనలో పడ్డాడు. ఈ పిల్లలు చేస్తున్నది ఎంతవరకు కరెక్టు. కష్టపడి సంపాదించినదంతా ఇలా ధారపోయడం అవసరమా?? అనుకున్నాడు.

*****

నెల రోజుల తర్వాత రామాపురంలో కోలాహలంగా ఉంది. కూలిపోయిన బడి దగ్గర పెద్ద షామియానా వేసారు. కుర్చీలు వేసారు. గ్రామ యువత చాలా హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఊరిపెద్దలంతా అక్కడే ఉన్నారు.
ఇంతలో ఆ జిల్లా కలెక్టర్ వంశీమోహన్ ని తీసుకుని నరహరి, విజయ దంపతులు, వాళ్ల పిల్లలు తమ కుటుంబాలతో, మరి కొందరు స్నేహితులందరూ నాలుగైదు కార్లలో వచ్చారు.
గ్రామప్రజలంతా కలెక్టరుగారికి, యువతకు స్వాగతం పలికారు.
ముఖ్యులైన వారు స్టేజ్ మీద కూర్చున్నారు. మిగతావారు స్టేజ్ ముందు షామియానాలో కూర్చున్నారు.
శ్రీనివాస్ లేచి అందరికీ నమస్కరించాడు. “నేను పుట్టింది ఇక్కడే అయినా, పెరిగింది, చదువుకుని ఎదిగింది అంతా పట్టణంలోనే. కాని నా మూలాలు ఇక్కడే అని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. కొంతకాలంగా నేను , మా అక్క, కొందరు అమెరికాలోని స్నేహితులు, ఇక్కడి మిత్రులం కలిసి మన ఊరికి ఏదైనా చేయాలనే కోరికతో మా డబ్బులను ఇక్కడ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి ఉపాధి కల్పిద్దామనుకున్నాము. కాని దానికంటే ముఖ్యమైనవి చాలా ఉన్నయని అర్ధమయ్యాక మా ఆలోచనను కాస్త మార్చుకున్నాము. మా ఆలోచనలు, ప్రణాళికలను కలెక్టర్ గారు మీకు వివరిస్తారు” అని కూర్చున్నాడు.
కలెక్టర్ వంశీమోహన్ లేచి ప్రజలందిరికీ నమస్కరించాడు. “ సాంకేతికత పెరుగుతన్నది. సంపాదన పెరుగుతున్నది. సంపాదించాలనే కోరిక కూడా ఈనాటి యువతలో చాలా హెచ్చుగా ఉన్నది. చదువులన్నీ సంపాదనకొరకే.. వారికి తమ పల్లెటూరు, మాతృభూమి మీద మమకారం అంతగా లేదు. విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్నారు అని చాలామంది అనుకుంటారు. ఇది నిజమే కావొచ్చు కాని నేటి తరం మారుతున్నది. వారి ఆలోచనలు మారుతున్నాయి. డబ్బే వారి సర్వస్వం కాదు. ఏదైనా సాధించాలి. కష్టపడాలి. సంపాదించాలి. తమ కుటుంబం కోసమే కాక సమాజం కోసం కూడా తమ వంతు సేవ, సాయం చేయాలనే యువత ముందుకొస్తున్నది. వీరు విదేశాలలో ఉన్నా తమ మాతృభూమిలో ఎటువంటి అవసరం అయినా చేయడానికి ముందుకొస్తున్నారు. కొందరు తమ ఉద్యోగాలను, వ్యాపారాలను కూడా వదిలి తమ స్వస్థలానికి వచ్చి తమతో పాటు ఇతరులకు కూడా ఉపయోగపడే పనులను చేస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకం.
మన గ్రామ యువత కూడా తమవంతు సాయంగా కాదు ఒక బాధ్యతగా ఈ ఊరి అభివృద్ధి కోసం ఒక్కటై పని చేయాలని నిర్ణయించుకున్నారు. వారినందరినీ అభినందిస్తున్నాను. ముందుగా బడిని, ఆసుపత్రిని బాగు చేయాలని. పాత బిల్డింగులను తీసేసి కొత్తగా నిర్మించాలని ఆలోచన. దీనికి కావలసిన సొమ్ము అమెరికానుండి పంపిస్తే ఇక్కడి యువత దాన్ని ఈ కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఇదంతా నిస్వార్ధ సేవ. ఇందులో ఎవరి జోక్యము, ఆటంకము ఉండకూడదు. ప్రభుత్వం తరఫున మా పూర్తి సహకారం ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను” అని కూర్చున్నారు.
స్వప్న ముందుకు వచ్చి మైకు అందుకుని “ఈ ఊరిలో గర్భవతులకు, బాలింతలకు, పసిపిల్లలకు సరైనసదుపాయాలు లేవని తెలిసింది. నేను , నాకు తెలిసిన మిత్రులం కలిసి ఈ విషయంలో అతి త్వరలో ఒక బృహత్తరమైన ఆలోచన చేస్తున్నాము. గ్రామంలోని మహిళలకు సరైన వైద్య సదుపాయం అందేలా మావంతు కృషి మేము చేస్తాము. దీనికి ఇక్కడి యువత మాకు అండదండగా ఉన్నారు.”
ఈ మాటలు విన్న రామాపురం యువత మేమున్నాం అంటూ గట్టిగా అరిచారు.
“చూసారా! నిన్నటి మనకంటే నేటి తరం ఎంత స్వచ్ఛమైనదో.. “అంటూ సంతోషంగా భర్త చేతులు పట్టుకుంది విజయ. అవునంటూ చెమర్చిన కళ్లను తుడుచుకున్నాడు నరహరి..

******

పరికిణీ

రచన: కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

“అమ్మా..! రా అమ్మా..! కేక్ కట్ చేద్దూగానీ..  లేమ్మా.. నీకోసం కేక్ తెచ్చానమ్మా ” బ్రతిమాలుతోంది అమాయకంగా పర్ణిక, బెడ్రూం లో నిస్తేజంగా పడుకుని ఉన్న జయంతిని. ” ప్లీజ్ పర్ణిక నాకు ఇష్టం లేదు… గెట్ లాస్ట్ , ప్లీజ్ లీవ్ మి ఎలోన్” , హిస్టీరిక్ గా అరిచింది జయంతి.  ఎప్పుడూ పల్లెత్తు మాట అనని అమ్మ అలా అరిచే సరికి విస్తుపోయింది పదకొండేళ్ళ పర్ణిక. అంతలో వాకిలి తలుపు చప్పుడవ్వడంతో బెడ్రూం లోంచి బయటకు వచ్చి చూసింది. ఎదురుగా అమ్మమ్మ కనిపించడంతో బావురుమంటూ వెళ్ళి హత్తుకుంది. ఆ చిన్నారి కన్నులు శ్రావణ భాద్రపదాలయ్యి, అమ్మమ్మ రాగేశ్వరి భుజాలు తడిపేస్తున్నాయి. ” ఏమైంది చక్రీ, ఎందుకలా ఏడుస్తున్నావ్?” అంటూ హత్తుకున్న పర్ణికను ముందుకు తీసుకుని చేతుల్లో పొదివి పట్టుకుని ” నేనున్నా చెప్పు చక్రీ  తల్లీ ఏమైందీ చెప్పమ్మా” అంటుండగా “అమ్మా, అమ్మా”..అంటూ పర్ణిక ఏదో చెప్పేలోపే, ” అమ్మకేమైందీ, కొట్టిందా??” అనుమానం ఆదుర్దా కలగలిపిన స్వరంలో అడిగింది రాగేశ్వరి, పర్ణిక ఏడుస్తూ పలికిన పలుకులకు ప్రతిస్పందిస్తూ.

“నేను సంవత్సరం నుంచి దాచుకున్న  కిడ్డీ బ్యాంక్ లో డబ్బులు పెట్టి ఈ రోజు అమ్మ బర్త్ డే అని సర్పరైజింగ్ గా ఉండాలని  మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి కేక్ కొనక్కొచ్చా..! కానీ అమ్మ ఆ కేక్ ను చూడటానికి కూడా రావట్లే..! ఎప్పుడూ నా బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు కదా..! ఏ.. నేను అమ్మ బర్త్ డే  సెలబ్రేట్ చేస్తే తప్పేంటీ??”  అని కన్నీరు మున్నీరవుతుండగా అమ్మమ్మ ను నిలదీసింది పర్ణిక.

సంతోషంగా ఉండాల్సిన పుట్టిన రోజునాడు తన కూతురు అలా ఎందుకు ప్రవర్తించిందో తెలిసిన రాగేశ్వరిలో ఆందోళన లేదు. అప్పటికే తనలో ప్రవేశించిన ఆందోళన కాస్తా, బాధగా రూపాంతరం చెందటం ఆరంభించింది. ఆమె కళ్ళ కొసలకు  అకస్మాత్తుగా గండిపడింది.

“అమ్మమ్మా..నువ్వెందుకేడుస్తున్నావ్..!” అంటూ అమాయకంగా  కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, తన తన ఏడుపు ఆపి రాగేశ్వరి కళ్ల నీళ్ళు తుడుస్తున్న పర్ణికను గట్టిగా హత్తుకుంది రాగేశ్వరి. ఆమె కళ్ళ ముందు పుష్కరం క్రితం జరిగిన ఓ చెదరని జ్ఞాపకం మనసును మరలా కదిలించనారంభించింది.

*******************************

మసక దుప్పటి తొలిచి సూరీడు తన జటాఝూటాలను ఆకాశమంతా విస్తరింపజేస్తూ వెలుగు నింపుతున్నాడు.

“బుజ్జి నిద్ర లేచిందా…?” కంచు కంఠం ఆ పాత ఇంటిలో మార్మోగింది. “ఎప్పుడో లేచి తన స్నేహితురాలు శ్రీలత ఇంటికి వెళ్ళింది. అది నిద్ర లేచాక కుదురుగా ఉంటుందా??”  వంటింట్లో నుంచి  పెద్దగా అరచి చెబుతున్న రాగేశ్వరి మాటలు వరండాలో అరుగు పై కూర్చున్న భర్త వెంకన్న చెవులకి ఒకటి తర్వాత ఒకటిగా చేరుతుంటే అతని పెదాలు అరమోడ్పులవ్వసాగాయి.. మీసం మెలేస్తూ..తనలో తాను మురిసిపోయాడు వెంకన్న. విషయం తెలియడంతో  అప్పటి వరకూ తన కూతురు కోసం వెదికిన పొద్దుతిరుగుడు కళ్ళకి శ్రమ తగ్గిస్తూ…” కాఫీ పట్రా..” అని తనూ పెద్దగా అరిచాడు, వంటింట్లోని భార్య రాగేశ్వరికి వినబడుతుండో లేదో అని.

ఆరడుగులకు మరో అంగుళం ఎత్తుండి, ఆజానుబాహుడికి కాస్త తక్కువగా కనిపించే వెంకన్న మనసు వెన్నంటుంటారందరూ. భార్య తెచ్చిన కాఫీ అందుకుని సిగరెట్ ముట్టించాడు.

“ఎందుకా ముదనష్టపు సిగరెట్టు, పొద్దుటే?? పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు.వాళ్ల నాన్న సిగరెట్ త్రాగుతున్నారంటే వాళ్ళు నొచ్చుకోవచ్చు..” ఏదో చెప్పాలని చూసిన రాగేశ్వరి వైపు చూసి, “రాగేశ్వరీ నువ్వు రోజూ సిగరెట్ త్రాగటం  ఆరోగ్యానికి హానికరం అని పెట్టె మీద యాడ్ చదివి చెప్పడం, దానికి నేనూ ఏదో ఒక మాట చెప్పి,అప్పటికి తప్పించుకోవడం మనిద్దరికీ మామూలే కదా..!” అంటూ తన ఎత్తుకి ఏమాత్రం పోలిక లేని రాగేశ్వరి నెత్తిన చిన్నగా తట్టి జారిపోతున్న కండవ సరి చేసుకుని,  “త్వరలోనే పూర్తిగా మానేస్తా సరేనా..!”అన్నాడు. ” చాలా సార్లు విన్నాంలే” అనే విధంగా చిలిపి నవ్వు నవ్విన రాగేశ్వరిని కన్ను గీటుతూ.. మరలా తానే ” నిజం పూర్తిగా త్వరలోనే మానేస్తా..ప్రామిస్!” అని స్నానాల గది వైపు అడుగులేశాడు వెంకన్న.

భర్త మాటలో తొలిసారి నిజాయితీ వెదుక్కుని అత్తయ్యగారికి , మామయ్యగారికీ కాఫీ ఇవ్వాలి అసలే ఆలస్యమైంది ఏమనుకుంటారో ఏమో అని తనలో తాను గొణుక్కుంటూ వంటిల్లనే తన సామ్రాజ్యం వైపు అడుగులేసింది రాగేశ్వరి.   అప్పటికే  …” అమ్మాయ్   కాఫీ పెట్టవా? పాలు వచ్చాయా రాలేదా?”  బాణాలు  బెడ్రూం వైపునుంచి ఒక్కొక్కటిగా దూసుకొస్తున్నాయి వంటింటి వైపు.

స్నానం  చేసి వచ్చి,  ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన కూతురు కోసం వాకిలి వైపు చూస్తూ, మరొక సిగరెట్ ముట్టించి దట్టంగా పొగ వదులుతూ మధ్య మధ్య లో తండ్రి వస్తాడేమో అని ఇంటిలోకి తొంగి చూస్తూ జాగ్రత్తగా సిగరెట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వెంకన్న.

” అయ్యా పొలానికెళ్లాలి ఈ రోజు కూలీలొస్తారు” అంటూ వచ్చిన పాలేరు అరుపు, వెంకన్న ప్రశాంతతను భగ్నం చేసింది. “ఉండ్రా..  బుజ్జమ్మ వచ్చిందాకా ఉండి వెళ్దాం ఈ లోపు అమ్మనడిగి కాఫీ తెచ్చుకో ఫో”..అంటూ అరుగు మీదనుంచి ముందుకొచ్చి  మబ్బులు పరుచుకుంటున్న ఆకాశం వైపు చూశాడు.  అంతలోనే “నాన్నా..” అంటూ వాకిలి తలుపు నెట్టుకుంటూ గాలిలోని సుగంధ పరిమళంలా  వచ్చి తండ్రిని కౌగిలించుకుంది కూతురు బుజ్జి.

“తల్లీ ఎక్కడికెళ్ళావ్ రా.. ప్రొద్దుటే ఆటలేంటీ , కాలేజ్ లేదా..?” అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుని నుదుట ముద్దు పెట్టిన వెంకన్న వైపు ఓ సారి ప్రేమగా చూసి అంతలోనే ముఖం ముడిచి..
” ఆటకని ఎవరు చెప్పారూ అమ్మ చెప్పిందా? అదేంకాదు మా ఫ్రెండ్ శ్రీలత ఉంది కాదా.. వాళ్ళ అక్క సౌజన్య కి నొప్పులొస్తుంటే వెళ్లా అక్కడకి కీర్తన కూడా వస్తే లేటైంది. నొప్పులొసున్నాయంటే  బుజ్జిపాప పుడుతుందని చెప్పారంట, కాసేపు ఉండాలనిపించింది, కానీ కాలేజ్ కి వెళ్ళాలి కదా అందుకే వచ్చా ! కానీ..” అంటూ గడగడ ఆగకుండా విరిసిన మాటల పూదోటలో విహరించిన వెంకన్న, కానీ అని కూతురు మాట ఆగటంతో , స్వగతంలోకి వచ్చి “ఊ కానీ.. చెప్పూ తర్వాత”  అన్నాడు. “ఈ రోజు కాలేజ్ డుమ్మా కొడాతాలే నాన్నా” అని, “ఎందుకూ” అని అడుగుతున్న వెంకన్నకు నెమ్మదిగా గొలుసు కట్టు తెంచుకుని నేలను ముద్దాడుతున్న చిరుజల్లుని చూపించింది బుజ్జి.  “సరేరా తల్లీ వెళ్ళు.. వెళ్ళి స్నానం  చెయ్యిపో !” అని తనపై వాలిన కూతురి ప్రశాంత వదనాన్ని ఒక్కసారి చూసుకుని తృప్తిగా ఫీలయ్యాడు.

” బుజ్జమ్మా..! ఎటూ కాలేజ్ కి వెళ్ళటంలేదు కదా.. రెడీగా ఉండు సాయంత్రం పొలం నుంచి రాగానే పట్నం వెళ్దాం. నీ బర్త్ డే వస్తోంది కదా.. కొత్త పరికిణీ కొనుక్కొచ్చుకుందాం”  అన్నాడు వెంకన్న. అప్పటిదాకా ఆ ధ్యాస కూడా లేని బుజ్జి ఒక్కసారిగా ఆనందానికీ ఆశ్చర్యానికీ మధ్య ఊయలకట్టి ఊగిసలాడింది. ఆనందం చేసిన డామినేషన్ తో మరోసారి వెంకన్నను గట్టిగా కౌగిలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి “ఐ లవ్యూ నాన్నా”అంది. ఎక్కడో అనుమానం తొలిచిన వెంకన్న ” ఏమ్మా.. పట్టు పరికిణీ ఓకేగా.. డ్రెస్ ఏమన్నా తీసుకుందామనుకున్నావా?”  అడిగిన తండ్రి ప్రశ్నకు అవుననలేక కాదనలేక తన ముఖారవిందాన్ని తామర పువ్వుని చేసి, “నీ ఇష్టం  నాన్నా” అంది బుజ్జమ్మ. “నిన్ను పరికిణీలో చూసి చాలా రోజులైంది బుజ్జమ్మా, మరోసారి పట్టు పరికీణీలో నిన్ను చూడాలని అలా డిసైడ్ అయ్యా..” అన్న తండ్రితో తల ఢీ కొట్టి “నీ ఇష్టమే నా ఇష్టం నాన్నా” అంది.

నాన్న కూతుర్ల సంరంభాన్ని చూస్తూ, వారి దగ్గరకి వచ్చిచేరుకున్న రాగేశ్వరి వారి మాటల మధ్యలో కలుగజేసుకుంటూ.. “దానికేం కావాలో అదే కొనిపెట్టు నువ్వెళ్ళాక నన్ను చంపుతుంది” అంటుండగా .. ఎక్కడ నుంచి విన్నాడో ఏమో.. “నాకూ కొత్త డ్రెస్ కావాలీ నాన్నా” అంటూ కళ్లు నులుముకుంటూ వచ్చి వెంకన్నపై వాలిపోయాడు కొడుకు శ్రావణ్.
“ఇద్దరికీ తీసుకుందాం.. వెళ్లండి వెళ్ళి ముందు స్నానం చేసి టిఫిన్ తినండి..” అని, పాలేరు రాజుతో బయలుదేరాడు వెంకన్న, ‘పద రాజూ’అంటూ..!

అంతలో రాజు.. “అయ్యా..! చిన్నమ్మ గారి పేరు  బుజ్జమ్మగారేనా? మరేటన్నా ఉందా..?” మట్టి బుర్రలో  నాటుకుపోయి మొక్కైన విత్తనాన్ని తొలిచేయాలని ఆపుకోలేక అడిగేశాడు రాజు.

“ఓహ్ అదా… బుజ్జమ్మ అసలుపేరు జయంతి మా నాన్నమ్మగారి పేరు. ఆ పేరంటే అందరికీ హడల్ అందుకే ఆ పేరుతో పిలవలేక తనని బుజ్జమ్మా అని ముద్దుగా పిలుచుకుంటుంటా” అసలు విషయం చెదరని నవ్వుతో చెప్పాడు వెంకన్న.
” బుజ్జమ్మ పెద్దపిల్లయ్యారయ్యా.. అంటూ లోపలికి తమ్ముడితో వెళ్తున్న జయంతి వైపు చూస్తూ వెంకన్నని అనుసరించాడు రాజు.

చినుకు సవ్వడి మువ్వలని తలపిస్తోంది.. ” ఆ గొడుగు పట్రారా..!” అంటూ మూలనున్న గొడుగు వైపు చేయి చూపిస్తూ బయటకు చేరుకున్నాడు వెంకన్న.

పొలానికి వెళ్ళిన వెంకన్న కోసం మధ్యాహ్నం నుంచీ వాకిలి వదలకుండా కూర్చున్నారు అక్క జయంతి, తమ్ముడు శ్రావణ్.  అంతలో కాలేజ్ కి వెళ్ళి తిరిగి వస్తున్న తన స్నేహితుడు కృష్ణని పిలిచి కొద్ది సేపట్లో తన తండ్రితో కలిసి పట్నం వెళ్ళి పట్టు పరికిణీ కొనుక్కో బోతున్నట్లు చెప్పింది జయంతి. “ఏ.. మన క్లాసులో అందరికీ చెప్పమంటావా..” అంటూ ఆటపట్టించబోయి, “ఎందుకులే దీంతో..గొడవ,  పైన బడి రక్కుతుంద”నుకుని ..  “సరే..సరే..” అనుకుంటూ ముందుకెళ్లాడు  కృష్ణ. గర్వంతోవెనుదిరిగిన జయంతి మరలా గుమ్మనికి వేలాడిన పూమాలలా తమ్ముడికి తోడుగా గడపను చేరింది.

చినుకు చినుకు కలిసి జోరందుకున్నాయి. వర్షం కొంచెం కొంచెంగా పెరుగుతోంది.. అయినా సరే నాన్న తో పట్నం వెళ్ళాల్సిందే అని కళ్ళను నాన్న పై ధ్యాస పెంచేలా మనసుని పురమాయించింది జయంతి…

టెన్షన్ ఆపుకోలేక వంటింట్లో కాఫీ కలుపుతున్న రాగేశ్వరి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి .. ” అమ్మా.. నాన్న రాలేదేందమ్మ.. ఇంకా..? అయినా  పట్టుపరికిణీలో నేను బాగుంటానంటావా..? చెప్పు మా..!” అంటుంటే.. ” ఒసేయ్.. దూరంగా ఉండవే..! కాఫీ పైన ఒలుకుతాయ్.. మీ నాన్నమ్మకి ఇచ్చిరా..” అని కాఫీ కప్పు అందించి నెత్తిన ఒక్క మొట్టికాయ్ వేసి “పొద్దుటి నుంచి ఎన్ని సార్లడిగావే..! రేపు పరికిణీ కొనుక్కున్నాక నువ్వే చెబుదువులే..! ఫో” అంటూ కూతురిని తరిమింది రాగేశ్వరి. “ఎంతసేపా రోడ్డుకు అతుక్కుపోతావ్ మీ నాన్న వస్తార్లే అంతవరకూ మీ తాతయ్యతో కాసిని కబుర్లు చెప్పు” అని కాఫీ తీసుకెళ్తున్న జయంతికి సలహా ఇచ్చింది.

అంతలో రోడ్డు మీద అలికిడవ్వడంతో నాయనమ్మ చేతికి కాఫీ ఇస్తూనే “నాన్న వచ్చినట్లున్నారు పట్నం వెళ్ళి పరికిణీ తెచ్చుకోవాలి ముసిలీ..!” అని రోడ్డు మీదకి పరుగు పరుగున చేరుకుంది.

వర్షంలో ముద్ద ముద్దగా తడిచిన పాలేరు రాజు “అమ్మా..! అమ్మా..” అంటూ రోడ్డు పైనే నిల్చొని  పిలుస్తున్నాడు.
వర్షం శబ్దం అతని మాటను సగం సగంగా మింగేస్తోంది.  అతని ఒళ్ళంతా బురద ఉండటంతో లోపలికి రావట్లేదనుకుని,  “నాన్నేరి రాజూ ఇంకా రాలేదూ.. చీకటి పడుతోంది టైం ఆరైంది” అంటున్న జయంతి మాటకు అడ్డు వస్తూ “అమ్మగార్లేరా.. పిలువు చిన్నమ్మా..!” అన్నాడు రాజు. ఆ గొంతులో వ్యాత్యాసం పసిగట్టలేని, జయంతి “నాన్నేడని నేను నిన్నడుగుతుంటే , నువ్ నన్ను ఖ్వశ్చన్ చేస్తావేంటీ..?” అంటూ తన సహజత్వానికి కాస్త కోపం కలిపి గద్దించినట్లు అడుగుతుండగా అక్కడికి చేరుకున్న రాగేశ్వరి ..”ఉండవే నువ్వు” అని జయంతిని మందలింపుగా అని  ” ఏంటిరాజూ ..” అంటూ వాకిలి  చేరుకుంది. వర్షం పెరగడంతో మకాం గడప నుంచి అరుగు మీదకు మారిన అక్క తమ్ముళ్ళు తండ్రి రాగానే బయలుదేరాలన్న సంకల్పంతో రెడీ అవ్వడానికి సమాయత్తమవుతున్నారు.

రాజు చెప్పిన మాటతో కుప్పకూలిపోయింది రాగేశ్వరి. అప్పటి దాకా వర్షంతో కలిపేసిన తన దొంగ ధైర్యాన్ని ఒక్కసారిగా బయటపెట్టి గొల్లుమన్నాడు రాజు. క్రిందపడిపోయిన తల్లిని చూసి గాబరాగా “అమ్మా..”  అని అరచిన జయంతి  అరుపుకు ” ఏమైంది బుజ్జమ్మా అంటూ నాయనమ్మ, తాతయ్యా!” ఇంటి లొపలి నుంచి అరుగుపైకి చేరుకున్నారు.

“ఆయనను సమీపించిన రాజు అయ్యా..! చిన్నయ్యగారి ట్రాక్టర్ బోల్తాపడింది..” అంటుండగా ఉరుము తన మానాన తను నింగిలో శబ్ధం చేసి, నేలమీది చెవులకు చిల్లు వేసింది. అది విన్న వెంకన్న తల్లి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయింది. ఏం జరుగుతుందో జయంతికి అర్ధం కాలేదు. అర్ద్ధంచేసుకునే ప్రయత్నంలో మనసు కీడు శంకించింది. అమ్మ క్రిందపడిపోవడంతో కళ్ళల్లో నీళ్ళు నింపుకుని పెద్దగా ఏడవడం ఆరంభించాడు చిన్నోడు శ్రావణ్.

అప్పటికే విషయం తెలిసిన గ్రామస్తులంతా హాహాకారాలు చేస్తూ జోరు వర్షాన్నికూడా లెక్క చేయకుండా వెంకన్న పొలం వైపు పరుగు పెడుతున్నారు. వాళ్ళని అనుసరిస్తూ పరుగులాంటి నడకతో  పొలంవైపుకు అడుగులేస్తున్నాడు వెంకన్నతండ్రి. వెంకన్న వద్దని వారిస్తున్నా  వినకుండా తాను డ్రైవ్ చేస్తానంటూ పాలేరు రాజూ ట్రాక్టర్ నడపడంతో అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడిందని, క్రిందపడ్డ వెంకన్న పై ట్రాక్టర్ పడిందని తెలుసుకున్న పెద్దాయన మనసు రాయి చేసుకుని నిస్తేజంగా చూస్తూ పొలంగట్టునే కూర్చుండిపోయాడు. వర్షం ఎంత ప్రయత్నించినా అతని హృదయంలో భగ్గుమన్న లావాను చల్లార్చలేకపోతోంది.

ప్రాణం ఉండకపోతుందా అన్న ఆరాటం తొలుస్తుండగా, మధ్య మధ్యలో మూగగా తన ప్రాణాలు తీసుకెళ్ళికొడుకు ప్రాణాలు భద్రంగా ఉంచంటూ దేవుడికే ఆఫర్ ఇస్తున్నాడు పెద్దాయన.  అప్పటికే అక్కడికి చేరుకున్న కూలీలందరూ కలిసి వేరే ట్రాక్టర్ సహాయంతో బోలాపడ్డ ట్రాక్టర్ ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు..

గ్రామం భాష్ప గోళాల చెరువవుతుండగా వెంకన్న మృతదేహాన్ని పొలం నుంచి తీసుకు వచ్చి, ఇంటి అరుగు పై పడుకోబెట్టారు. జయంతికి అర్ధం కావడంలేదు.. పరికిణీ తెచ్చుకునేందుకు పట్నం  వెళ్దామన్న తండ్రి రాలేదన్న భావన దాటి బయపడలేని అగమ్యగోచరం లో బంధీ అయ్యింది. తండ్రి  ఇకలేడన్న విషయం జీర్ణం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో స్థాణువై ఉండిపోయింది.

“సిగరెట్ మానేస్తానంటే ఏంటో అనుకున్ననయ్యా.. ఇలా మానేస్తావనుకోలేదు.. ఒంటరిదాన్ని చేసి ఎలా వెళ్ళావయ్యా” అంటూ రోదిస్తున్న రాగేశ్వరిని ఓదార్చే ధైర్యం అక్కడున్న ఎవరూ చేయలేకపోయారు. చిన్నారి శ్రావణ్ కూడా తల్లి ఏడ్పులో తన  స్వరాన్నీ లీనం చేసి “నాన్నా లే నాన్నా న్యూడ్రస్ తెచ్చుకోవాలి” అంటూ పిలుస్తుంటే విన్నవారి గుండె తరుక్కుపోతోంది.. ఊరు ఏడుస్తుంటే చూడలేకేమో వర్షం వారందరి కన్నీటిని తనలో కలిపేసుకుంటూ  తనూ సంద్రమవుతోంది.

అక్కడ అందరి కళ్లూ జలపాతాలై, గుండె అగ్నిపర్వతాలవుతుంటే, జయంతి కంటిలోంచి మాత్రం చుక్క నీరు ఒలకలేదు.. తడియారిన కళ్ళు తండ్రివైపు మూగగా చూస్తున్నాయి. అందులో ఏమాత్రం జీవంలేదు.. జరుగుతున్న తంతుని నమ్మే స్థితిలో లేదు జయంతి. పరికిణీ కొనుక్కునేందుకు  వెళ్దామన్న తండ్రి రాలేదన్న భావన నుంచి ఇంకా  తేరుకోలేదు.

మంచివాడిగా పేరున్న వెంకన్న మృతి విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామస్తులు కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మువ్వలంక లోని వెంకన్న ఇంటికి చేరుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు తెల్లవారిందో ఎవరికీ తెలీదు, వేదనా హృదయాలు బరువెక్కిపోతున్నాయి. రాత్రంతా కన్నీరొలికించిన ఆకాశం కళ్ళు, పొడిబారినట్లు వర్షం ఒక్కసారిగా నిలిచిపోయింది. మౌనం అక్కడ కొలువయ్యింది.  జయంతి మాత్రం స్పృహలోకి రాలేదు. వచ్చిన బంధువులందరూ అందరూ “నాన్నను చూడుపోవే” అంటూ పిలుస్తున్నా కదలలేదు మెదల్లేదు.

అయ్యవారు పంచాంగం పట్టుకుని “ఉత్తరాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ విదియ సోమవారం” అంటూ క్రతువు ప్రారంభించాడు. నిన్నటి దాకా ఆనందం తాండవం చేసిన ఆ పొదరిల్లులో, ఇప్పుడు విషాదం విస్తరిస్తూనే ఉంది.  నిజం-అబధ్ధం మధ్య మనసులు కొట్టుమిట్టాడుతున్నాయి. ఏదైనా అద్భుతం జరగాలని, వెంకన్న చిరునవ్వుతో శాశ్వత నిద్ర నుంచి లేవాలని అక్కడ అన్నీ హృదయాలూ,  కోరుకుంటూనే ఉన్నాయి. నారాయణ..నారాయణ శబ్ధం దూరమవుతుంటే..ఇంటి వాకిలికి ఆడవారి రోదనలు వేలాడాయి.

శ్ర్రీరామచంద్రుడంటి  వెంకన్న  పెదకర్మకు భారీగా అన్నదానం ఏర్పాటు చేశారు ఆయన సోదరులు. గ్రామస్తులు, బంధుమిత్రులందరూ ఒకరి తర్వాత ఒకరుగా వెంకన్న ఫొటో వద్దకు వచ్చి నివాళులర్పించి వారికి వెంకన్నతో ఉన్న బంధాన్ని తలుచుకుని కళ్ళు తుడుచుకుంటూ ఎవరికి వారే వెళ్ళిపోతున్నారు.

ఒక వైపు పెదకర్మ జరుగుతుంటే  మరోవైపు  పన్నెండు రోజులైనా కోలుకోని జయంతి దగ్గరకు,  ఆమె మేనమామ నరసయ్య చేరుకుని తనతో తెచ్చిన పట్టు పరికిణీ అందించి కన్నీళ్ళు తుడుచుకుంటూ,”హేపీ బర్త్ డే రా బుజ్జీ” అన్నాడు. “నాకొద్దీ పరికిణీ, నాన్న కావాలి మామయ్యా..” అంటూ భోరున ఏడుస్తూ మేనమామను కౌగిలించుకుంది జయంతి ఆనకట్ట తెగిన గోదారమ్మై!! మేనత్త  శ్రీలత  కన్నీళ్ళు తుడుచుకుంటూ దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయింది.

*******************************

అమ్మమ్మ కూడా అమ్మని కేక్ కట్ చేయమని రికమెండ్ చేయకపోవడంతో  ఏం జరుగుతోందో అర్ధం కాని పర్ణిక  తాతయ్య ఫొటో దగ్గర నిలబడి “తాతా.. నువ్వన్నా చెప్పుతాతా అమ్మకి, నేను తనకోసం తెచ్చిన కేక్ కట్ చేయమని, నీమాట వింటుంది” అంటూ ఏడుస్తూ ప్రాధేయపడసాగింది.

*******************************

అంతం లేని కథ, తను అనుకున్న రీతిలో వచ్చిందని సంతృప్తి చెందిన కృష్ణుడు యథావిధిగా అచ్చుకు నోచుకోని తన కథల దొంతరలో ‘పరికిణీ’ని కూడా మడిచి సర్దేశాడు.

*******************************