చిన్నారితల్లి నా చిట్టితల్లి

రచన: తులసి భాను

నాన్నా అంటూ వెనుకనుంచీ మెడచుట్టూ చేతులు వేసి గారాలు పోతోంది 28 యేళ్ళ చిట్టితల్లి, తన తండ్రి ఆనంద్ దగ్గర. ఏమ్మా ఏం కావాలీ అన్నాడు ఆనంద్ తన పని ఆపేసి. నాన్నా ఇప్పుడు పెళ్ళి వద్దు నాకు అంది దిగులుగా రేణుక తండ్రి చెవుల్లో రహస్యంగా. తల్లి వింటే తిడుతుందని భయం మరి,ఇన్నేళ్ళొచ్చాయి, పెళ్ళి వద్దు వద్దు అని ఇన్నేళ్ళు సాగదీసావు, ఇంకా ఇప్పుడు కూడా దాటేయాలని చూస్తే ఊరుకోను అని నిన్ననే స్ట్రాంగ్ గా బెదిరించింది తల్లి నిర్మల.
ఇప్పటికే నా బుజ్జితల్లికి 28 యేళ్ళు వచ్చేసాయి, ఇంక ఇప్పటికయినా పెళ్ళి చేసుకోకపోతే ఎలారా. అన్నాడు ఆనంద్ సర్దిచెబుతూ. . రేణుక తల దించుకుని కూర్చుని ఉంది, సమాధానం ఏమీ ఇవ్వట్లేదు. కూతురు అలిగింది అనిపించి, గడ్డం కింద చెయ్యి పెట్టి కూతురు మొహాన్ని పైకెత్తాడు. రేణుక కళ్ళ నిండా నీళ్ళు. . తల్లీ, ఏమయ్యిందిరా అని కంగారుపడిపోయాడు ఆనంద్. అతనికి కూడా, కూతురి కళ్ళలో నీళ్ళు చూసి ఏడుపు గొంతు పడింది. వీళ్ళకు కనపడకుండా ఫ్రిజ్ అవతల నుంచుని వీళ్ళ మాటలు వింటున్న నిర్మలకు కూడా కూతురు ఏడుస్తోందని అర్ధమై కళ్ళు నీటిచెలమలైపోయాయి, తన చీరకొంగుతో కళ్ళు వత్తుకుంటూ కూతురు ఏం చెబుతుందా అని ఆత్రంగా వింటోంది. నాన్నా మీ దగ్గర ఉన్నట్టు నాకు ఇంకెక్కడా బాగోదు, మీ దగ్గరే ఉండిపోతాను నాన్నా, హాయిగా అమ్మవళ్ళో బజ్జుని, నీ గొంతు వింటుంటే, పొద్దున్నుంచీ రాత్రి ఎనిమిందింటివరకూ నేను జాబ్ లో పడ్డ అలసటంతా తీరిపోతుంది. . అక్కడ నన్నెవరు చూసుకుంటారు నాన్నా అంత బాగా, అమ్మ నువ్వూ చూసుకున్నట్టు ఎవ్వరికీ రాదు తెలుసా. అంటోంది. .
రేణూ నువ్వసలు నీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ వేనా, ఇంత బేలగా ఉంటే ఎలా చెప్పు. జీవితంలో ఒక్కొక్క దశ మారుతూ ఉంటుంది, అది సహజంగా జరిగిపోవాలి, ఇలా ఇదే తరహాలో ఆలోచిస్తే, నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళ లేవు. అన్నీ ఒకటొకటిగా అలవాటు అవుతాయి చిట్టితల్లీ, అని ధైర్యం చెబుతూ రేణుక తలను తన గుండెలకు కత్తుకున్నాడు ఆనంద్. . ఇంతలో కూతురి మాటలకు, మనసు బరువెక్కి, నిర్మలకు చాలా ఏడుపొచ్చి, వెక్కిళ్ళు పెడుతోంది. ఆ వెక్కిళ్ళ శబ్దం తండ్రీ కూతురికి వినపడింది. చకచకా వచ్చి చూసారు, నిర్మల ఏడుపు ఆపుకోవాలనుకుంటున్నా, తన వలన కావట్లేదు. . అది చూసి రేణుక, ఓయ్ అమ్మా , గయ్యాళి లా నాలుగురోజుల నుంచీ, పెళ్ళొద్దంటున్నానని నా వెంట తిడుతూ తిరుగుతున్నావు, ఇవ్వాళేంటి ఇలా ఆ. అని రేణుక తల్లిని నవ్వించాలని చూస్తోంది. . తల్లి నిర్మల, రేణుకని మ్రృదువుగా తన చేతుల లోకి తీసుకుంది. ఎంత ప్రేమ ఉన్నా ప్రతీ కూతురూ పెళ్ళి చేసుకుని వెళ్ళాల్సిందే కదరా. . అని తనకి ధైర్యం చెప్పుకుంటూనే, కూతురికీ సర్దిచెబుతోంది. .
పసుపు రాయడం, కూతురిని పెళ్ళికూతురుని చేయడం, గోరింటాకు సంబరం చేయడం, చేతినిండా గాజులు వేసి అందరూ సరదాగా పాటలు పాడటం. . ఇలా అన్నీ వేడుకగా జరిగేటప్పుడు, ఆ సందడిలో రేణుక హుషారుగానే ఉంది. . ఒక్కొక్క వేడుక ముందుకు వెళుతున్న కొద్దీ ఆనంద్, నిర్మలకి కూతురు, తమని వదిలి, అత్తారింటికి వెళ్ళిపోతుంది అనిపించినప్పుడల్లా, చుట్టూ అందరినీ, అన్నీ మరిచిపోయి మరీ, కూతురినే కళ్ళారా చూసుకుంటూ, కళ్ళల్లో దిగులు పేరుకుంటుండగా, కూతురినే చూసుకుంటూ బొమ్మల్లా నిలబడిపోతున్నారు.
హ్రృదయాలు వేరైనా, తల్లీ తండ్రిగా ఇరువురూ ఒకే బాధను అనుభవిస్తున్నారు కూతురి కోసం. . నిర్మల చెల్లెలు సాహితీ, అన్ని సందర్భాలలోనూ ఫొటో లు తీస్తోంది తన మొబైల్ ఫోన్ లో, చాలా ఫొటోల్లో బావ మొహంలో దిగులు స్పష్టంగా తెలుస్తోంది, ఇహ అక్క అయితే, కూతురి చెంపకి తన చెంప ఆనించో, కూతురి భుజానికి తన మొహాన్ని తాకించుకుని దిగిన ఫొటోల్లో ఇహ కన్నీరు కంటి అంచుల్లోంచీ రాబోతోంది అన్నట్లే ఉంది. .
ఇద్దరూ ఇంత మరీ దిగులు పడుతున్నారే అనిపించి, ఇద్దరికీ ఫొటో లన్నీ చూపించి, కాస్త నవ్వండి ఫొటోల్లో అని సలహా చెప్పింది. . ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని, కళ్ళతోనే ఊరడించుకుని సరే సరే అని నవ్వుతూ చెప్పారు సాహితీకి. .
పెళ్ళి ధూం ధాం గా బాగా జరిగింది. . హనీమూన్ కి పారిస్ వెళ్లొచ్చారు కొత్త జంట. . దిగులు దిగులు అన్న చిన్నారితల్లి, మొదట్లో పూటకి ఒకసారి ఫోన్ చేసేది. . ఒక్కొక్కరితో, అరగంటకి తక్కువ కాకుండా ఓ గంటసేపు మాట్లాడేది. . తరువాత తరువాత రోజుకి ఒకసారి, అదీ ఒక అరగంట. . హనీమూన్ అయింది. .
కొత్తకాపురం మొదలయ్యింది. . వారానికి రెండుసార్లు ఫోన్ లు వస్తున్నాయి. . శని, ఆదివారాలు అమ్మా నాన్న దగ్గరికే వచ్చేవారు. .
నెమ్మదినెమ్మదిగా రేణుక, నిర్మల, ఆనంద్. ముగ్గురూ అలవాటు పడ్డారు, దిగులును స్వీకరించి సర్దుకుపోవడానికి. .
మూడు నెలల తరువాత రేణుక కోపంగా తల్లి ఇంటికి వచ్చింది, అరగంట తేడాలో అల్లుడు విశ్వ వచ్చాడు. . నిర్మల ఇద్దరికీ వేడిగా దోశలు వేసి ఇచ్చింది, ఇద్దరూ మౌనంగా తింటున్నారు. .
గంట తరువాత అటు రేణుక, నిర్మలతో, ఇటు విశ్వ, ఆనంద్ తో చెబుతున్నారు. . రేణుక ఫేవరెట్ హీరో ప్రభాస్ సినిమాకి వెళదామని అడిగింది, రెండ్రోజుల ముందు బుక్ మై షో లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. . తీరా ఈ రోజు సినిమా టైమ్ కి రేణుక తనకి ఇష్టం అయిన డ్రెస్ వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయి కూర్చుంది, విశ్వ కి ఫోన్ చేసింది, లేట్ చేయద్దు, ముకేష్ ఆడ్ తో సహా పేర్లు నుంచీ ఏ ఒక్కటీ మిస్ అవకుండా చూడాలి నేను, లేకపోతే సినిమా చూసినట్టుండదు నాకు అని స్పష్టంగా ముందుగానే చెప్పింది రేణుక, విశ్వ గంట ముందు రావాల్సింది, పదిహేను నిముషాలు లేటుగా వచ్చాడు, ఈ పదిహేను నిముషాలలో నిముషానికి ఒక డిగ్రీ చొప్పున, రేణుక కోపం పెరిగిపోయింది. .
ఇహ యుధ్ధానికి సిద్ధంగా కూర్చుని ఉంది విశ్వ ఇంటికొచ్చే టైమ్ కి. . నా డిసప్పాయింట్ కి నీకు అసలు కొంచెం కూడా గిల్టీ లేదు, నేను ఇంకెప్పుడూ సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోనూ, ఇదే మా అమ్మా నాన్న అయితే రెండు గంటలు ముందే రెడీగా ఉంటారు నాకోసం, వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ లో అయినా ఉండనీ అని ఒకటే అలక, కోపం, తిట్లు విశ్వ మీద. . చూసాడు చూసాడు విశ్వ, అరే ఇప్పుడు కూడా మనం టైమ్ కి చేరిపోతాం, బయల్దేరు అంటే, ఆ పిచ్చి కోపంలో రేణుక వినిపించుకుంటేనా. . ఇహ విశ్వ కి కోపం వచ్చి ఇంత మూర్ఖత్వం మంచిది కాదు అన్నాడు రేణుకతో. అంతే, నన్ను అంత మాట అంటావా అనేసి, పుట్టింటికి పరిగెత్తుకొచ్చేసింది. .
ఆనంద్, నిర్మలకి అసలే రేణుక అంటే అపురూపం, తనో మాట రేణుకని అనేసాడని వారికి, తన మీద ఎక్కడ కోపం వస్తుందో అని, తనను వారేమి అంటారో, అది విని తనకు ఇంకా కోపం వస్తుందేమో అనిపించి కంగారుగా ఉంది విశ్వకు. .
ఆనంద్ సీరియస్ గా విన్నాడు. . విశ్వ ఆనంద్ మొహంలో మారుతున్న ముఖకవళికలను గమనిస్తున్నాడు. . అంటే మా అమ్మాయి మూర్ఖురాలు అంటావు అన్నాడు ఆనంద్ విశ్వ తో. . భర్త అల్లుడిని తొందరపడి ఏమంటాడో అని, నిర్మల కంగారుపడుతూ భర్త దగ్గరకు వస్తోంది, ఏమనద్దు అన్నట్టు అడ్డంగా తలూపుతూ భర్తని చూస్తూ. .
ఆనంద్ భళ్ళుమని గట్టిగా నవ్వేసాడు. . నవ్వుతూ ఉన్నాడు. . విశ్వకి, నిర్మలకి, రేణుకకి ఏమీ అర్థం కాలేదు, ఆనంద్ ఎందుకు అలా నవ్వుతున్నాడో. .
విశ్వా, ఇలానే, అచ్చు ఇలానే మీ అత్తగారు, ఇదే విషయం మీద నాతో మొదటిసారి గొడవేసుకుంది. అప్పట్లో తనకి నాగార్జున అంటే ఇష్టం. మజ్ను సినిమాకి తీసుకెళ్ళమంది, నాకూ ఒక పదే పది నిముషాలులేట్ అయింది. . ఇహ కైకేయి లెవెల్లో అలకాగ్రృహం సీను చూపించింది. . మరి మీ ఆవిడకి మాత్రం, మా ఆవిడ పోలికేగా వచ్చేది. . ఏదేమైనా అల్లుడూ, ఈ విషయం లో నేను నీ వైపేనయ్యా, ఎందుకంటే సాటి భర్తగా, భార్యలు అలిగినప్పుడో, మనతో వాదించేటప్పుడో, ఒక భర్త పడే బాధ ఏంటో నాకు బాగా అనుభవం. అప్పుడంటే నాకు మా మావగారి సపోర్ట్ తీసుకోవాలని తెలీలేదు, ఒకవేళ నేను అడిగుంటే మా మావగారు ఏమనేవారో కానీ నేను ఏ రోజూ ఆయన సాయం కోరలేదు, ఈ రోజు మాత్రం నువ్వు అడగకపోయినా నేను నీ పార్టీనే అనేసాడు ఆనంద్ నిజాయితీగా. .
అదంతా విని నిర్మల నోరు తెరుచుకుని ఆశ్చర్యం గా చూస్తూ ఉండిపోయింది, రేణుకేమో, అమ్మా అని ఏడుపు మొదలుపెట్టబోయింది. . హేయ్ రేణు రేణు ఏడవకు, సారీ సారీ నేను, నిన్ను, అలా ఇంకెప్పుడూ అనను, ఇప్పుడైనా త్వరగా బయల్దేరితే నైట్ టెన్ ఓ క్లాక్ షో కి వెళ్ళచ్చు మనం. అని బతిమలాడాడు. . ఫో నాన్నా నీతో పచ్చి, నీతో కటిఫ్ అని, ఆనంద్ తో చిన్నపిల్లలా అనేసి, రేణుక, విశ్వ తో కలిసి సినిమాకు బయలుదేరింది. .
వాళ్ళు అలా వెళ్ళారో లేదో నిర్మల గిన్నెలు దడా దడా విసిరేస్తూ, ఆనంద్ మీద కోపం ప్రదర్శిస్తోంది. . అబ్బా, కూతురి పెళ్ళి హడావుడి లో పడి, నీ గిన్నెల సంగీతం విని చాలా రోజులయ్యిందోయ్, మళ్ళీ ఇవాళ వింటున్నా. అన్నాడు నోరారా నవ్వుతూ. .
అల్లుడి ముందు నా పరువు తీసేసి, నన్ను రాక్షసిని చేసేసి ఇప్పుడు బావుందా మీకు అంది బాధగా నిర్మల. . ఓ నిముషం మౌనంగా ఉన్నాడు ఆనంద్. భర్త ఏం చెబుతాడా అని ఎదురుచూస్తోంది. . నిర్మలా, కూతురి కోసం, అల్లుడుని ప్రశ్నించకూడదు, అనవసరంగా ఓ మాట అనకూడదు, నేను అతని పక్షాన నిలవగానే, అతనికి వాదించే అవసరమే లేకుండా అయ్యింది, కూతురిని తప్పు పట్టలేక, మనిద్దరి విషయాన్ని ప్రస్తావించాల్సివచ్చింది, అలా చేయటం వలన ఇది అందరి భార్యాభర్తల మధ్యా సహజమే అని వారికీ తెలిసొచ్చింది. . ఇప్పుడు రేణుక ఎంతో విశ్వా కూడా అంతే, మనకు, ఎవరికి ఏమి చెప్పాలన్నా, ఒకటే బాధలా అనిపించింది, అందుకే మరి అన్నాడు,. నిర్మల వైపు అర్థం చేసుకుంటావుగా అన్నట్టు చూస్తూ ఆనంద్. . ఏమనిపించిందో కోపంతో ఎర్రబడ్డ నిర్మల మొహంలోకి సన్నని చిరునవ్వు వచ్చింది. . అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అని పాటందుకున్నాడు ఆనంద్. అబ్బో నేనో అమ్మాయి, మీరో అబ్బాయి అంది నిర్మల సరదాగా. .

అత్తగారు – అమెరికం

రచన: సోమ సుధేష్ణ

గణ గణ మోగుతున్న ఫోను అందుకుని “హలో వదినా, నేనే ఫోను చేద్దామని కుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. నీకు నూరేళ్ళ ఆయుష్షు. రేపు రవీంద్ర భారతికి వెళ్తున్నావా?” అంది అరుణ.
“నూరేళ్ళు వద్దులే అరుణ. ఉన్నన్ని రోజులు కాళ్ళు చేతులు బాగుండి పోయేరోజు వరకు మంచం ఎక్కకుండా ఉంటే చాలు. నువ్వు, లలిత రావడం లేదు. నేనొక్క దాన్నే రవీంద్ర భారతికి ఏం వెళ్ళను చెప్పు. రేపు ఏం చేస్తున్నావు? ఇక్కడికిరా, లలితను కూడా రమ్మంటాను.” లక్ష్మి బతిమాలుతున్నట్టుగా అంది.
అమరేందర్, లక్ష్మి పెళ్ళయినపుడు అరుణ అప్పుడే కాలేజీలో చేరింది. అరుణ తన అన్న పెళ్ళిలో పెత్తనం చేసిన ఆనందం కంటే లక్ష్మిని చూసి ఎక్కువ ఆనందించింది. వాళ్ళిద్దరూ మొహాలు చూసుకున్న ఘడియ అనే చెప్పాలి, లక్ష్మీ నాలుగేళ్ళు పెద్దదయినా ఇద్దరూ మంచి స్నేహితుల య్యారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రాణం. అరుణ భర్త రఘురాం కూడా అక్కా అని పిలుస్తూ లక్ష్మితో చనువుగా ఉండేవాడు. అమరేందర్ అరవైయ్యో ఏట వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి చని పోయాడు. అప్పుడే బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న పవన్ హైదరాబాదులోనే జాబు చూసు కున్నాడు. అప్పటి నుండి లక్ష్మి తన కొడుకు పవన్, కోడలు హిమతో జూబిలీ హిల్స్ లో ఉంటోంది. కూతురు ప్రగతి అమెరికాలో ఉంటోంది. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా వదినా మరదళ్ల మధ్య బంధం పెరిగిందే కానీ తరగలేదు.
“మనసేం బాగా లేదు. ఇంట్లోంచి కదలాలని లేదు వదినా.”
“ఏమయింది? అఖిల్ గుర్తుకోచ్చాడా? రఘు గుర్తు కొచ్చాడా? నాదగ్గర ఒక వారం రోజులుండి పోదువుగాని రా.”
“వాళ్ళిద్దరు ఎప్పుడు మనసులో ఉండే వాళ్ళే గదా. ఇప్పుడు రాను. నేను లలితకు ఫోన్ చేస్తాను రేపు మీరిద్దరు ఇక్కడికే రండి. ఇక్కడే లంచ్ తిందాం. రాత్రికి వీలయితే ఇక్కడే ఉండేట్టు రా వదిన.”
“ఈ సారి కాదు. పవన్ బెంగుళూరులో మీటింగ్ కు వెళ్ళాడు. హిమ కూడా వర్క్ లో బిజీగా ఉండి లేటుగా వస్తోంది. మరో రోజు నైట్ గడపడానికి వస్తాలే. రేపు గుత్తి దొండకాయ కూర తెస్తాను నీకిష్టం కదా!”
రఘు ఆలోచనలు అరుణ మనసును తొలిచేస్తున్నాయి. రఘు గురించి ఆలోచించకుండా ఉండలేదు, ఆలోచనలు వచ్చినప్పుడు బాధ కలగకుండా ఉండదు.
ఉన్న ఒక్క కొడుకు పెళ్ళి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యాడు. కొడుకు పిలుపుకు, కంటికి అందనంత దూరంలో ఉన్నాడని అప్పుడప్పుడు అనిపించినా ఈ రోజుల్లో యువతరం అంతా అమెరికాకు వెళ్తే తప్ప బ్రతుకే లేదన్నట్టు అందరూ అక్కడికే వలస పోతున్నారు. నా కొడుకూ అంతే అనుకుని స్థిమిత పడ్డారు అరుణ, రఘురాం.
‘చనిపోతే నన్ను ఫ్రీజర్ లో పెట్టకురా కన్నా’ అని ఒకసారి కొడుకుతో చెప్పుకున్నాడు రఘురాం. చాలామంది పిల్లలు విదేశాల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. చనిపోగానే పరదేశాల్లో ఉన్న కొడుకు రావాలనో, కూతురు రావాలనో చనిపోయిన వాళ్ళ శవాన్ని తీసుకెళ్ళి ఐసు డబ్బాల్లో ఫుడ్ ఫ్రీజ్ చేస్తున్నట్టు బాడీలను ఫ్రీజ్ చేస్తున్నారు. ఆ ఆలోచన మనసులోకి వస్తేనే రఘురాంకు ఒళ్ళు జలదరిస్తోందనేవాడు. ఆ చుట్టు పక్కల స్నేహితులకు, బంధువులకు జరిగే ఆ చివరి అంకంలోని తంతు పెద్దతరం వాళ్ళ మనసులో ముద్ర వేసుకుని కలవర పెడ్తోంది. అఖిల్ వెంటనే, ‘డాడ్ మీ హెల్త్ ఫర్ఫెక్ట్ గా ఉంది. మీరలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది. నన్ను అమెరికా నుండి వచ్చేయమంటే వచ్చేసి ఇక్కడే జాబ్ చూసుకుంటాను.’ అన్నాడు.
‘తొందరపడి అలాంటి పనులు ఏమి చేయొద్దు కన్నా. ఏదో మనసు కొన్నిసార్లు అలా లోయల్లోకి వెళ్లి పోతుంది. అయినా చావొచ్చినా, తుఫానొచ్చినా ఆగదుగా! ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నే పోయాక నీ మమ్మీని బాగా చూసుకో.’ అన్నాడు.
రఘురాంకు కూడా కొడుకు అమెరికా వెళ్ళాడంటే ఏదో జీతం లేని ప్రమోషన్, కనిపించని ఎత్తు పెరిగినట్టుగా ఉంది. ముఖ్యంగా కొడుకు దేనికీ కొరత లేకుండా హాయిగా ఉంటాడని నమ్మకం.
కొన్ని రోజుల్లోనే హటాత్తుగా గుండె పోటుతో మరణించిన రఘురాం మృతదేహాన్ని ఐసుబాక్స్ లో పెట్టక తప్పలేదు. అఖిల్ వెంటనే బయల్దేరినా రావడానికి టైం పట్టింది. తండ్రి కోరిక తీర్చలేదని చాల బాధపడ్డాడు. కానీ అసమ్మతమైన కాలానికి లొంగక తప్పలేదు.
తండ్రి అంతిమ దశలో జరగవలసిన కార్యక్రమాలన్ని సక్రమంగా ముగిసాక,
“మమ్మీ! నువ్వొక్కదానివి ఇక్కడేలా ఉంటావు నాతో వచ్చేయ్యి.” అఖిల్ కు తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి సుతరాము ఇష్టం లేదు.
“ఇప్పుడు కాదులే నాన్నా! నాకిక్కడ అలవాటైన ఇల్లు, స్నేహితులు ఉన్నారు. నన్ను ప్రేమగా చూసుకునే వదిన ఉంది. నాకెమీ ఫర్వాలేదు. నువ్వు దిగులుపడకు.”
“నువ్వు ఒక్కర్తివే ఇక్కడుంటే దిగులు పడకుండా ఎలా ఉంటాను మమ్మీ!”
“నేను పెళ్ళి చేసుకుని ఈ ఇంట్లోకే వచ్చాను. నువ్వు పెరిగిన ఇల్లు ఇది. నీ పెళ్ళయ్యాక సరితను తీసుకొచ్చిన ఇల్లు ఇది. ఈ ఇంట్లో మీ అందరి జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. నాకేమీ కాదు.”
“అవన్నీ డాడ్ ఉన్నప్పుడు చెబితే వినేవాణ్ణి . ఇప్పుడు నువ్వొక్కదానివే, ఎన్ని చెప్పినా వినేది లేదు.” మొరాయించాడు అఖిల్.
“ఇప్పుడప్పుడే కాదు కన్నా, కొన్నాళ్ళ తర్వాత వస్తాను. నువ్వేమి బెంగ పడకు.” ఊరడింపుగా అంది.
“అరుణా! నువ్వు అఖిల్ తో యుఎస్ వెళ్ళడమే మంచిదనిపిస్తోంది. కనీసం కొన్నాళ్ళు వెళ్లిరా. నువ్విక్కడే ఉంటె నాకంటే ఎక్కువ సంతోషించేవాళ్ళు ఎవ్వరూ ఉండరని నీకు తెలుసు. కానీ వెళితే నీకు స్థల మార్పుతో మనసు కొంత తేరుకుంటుంది.” లక్ష్మి నచ్చ చెప్పింది.
“ఇప్పుడు కాదులే వదినా. నాకేం, ఇనప గుండులా ఉన్నాను. అన్నింటికీ నాకు నువ్వున్నావు, పవన్, హిమ, లలిత, పార్వతి ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళం కిట్టి పార్టీలకు కలుస్తూనే ఉంటాం. మీరంతా ‘హల్లో’ అంటే క్షణంలో నా ముందు వాలుతారు.”
ఆమె నిర్ణయం మార్చడం కష్టమని అఖిల్ కు అర్థం అయ్యింది. ఎన్నో ఏళ్ళు గడిపిన ఆ ఇంట్లో అందునా తండ్రి పోయిన తర్వాత వెంటనే ఆ ఇంటిని వదలి దూరంగా వెళ్ళడం కష్టమే. తల్లి స్నేహితులకు, ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న నెయిబర్సుకు అప్పగింతలు చెప్పి , అన్ని వసతులు తల్లికి అనువుగా అమర్చి అమెరికా వెళ్లి పోయాడు.
అరుణకు ఒంటరితనం కొంత బెదిరించినా–తనకు తానే ధైర్యం పుంజుకుంది. సాయంత్రం వరండాలో రఘురాం కూర్చునే రాకింగ్ కుర్చీ పక్క కుర్చీలో కూర్చుని రాకింగ్ కుర్చీని చెయ్యితో ఊపి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. రఘురాం బట్టలు అన్నీ తీసి డబ్బాలో పెడ్తుంటే తన చర్మాన్ని ఒలి చేస్తున్నట్టుగా బాధ పడింది.
“ఈ బట్టలు ఎంత చక్కగా హేంగ్ చేసావు మేరే జాన్!” పొగుడుతూ మురిసిపోయే రఘు కనిపించేవాడు.
రఘురాం ముందు నుండి సందడి చేసే మనిషి, అరుణ వెనక చిన్న పిల్లాడిలా తిరుగుతూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. రిటైర్ అయ్యాక ఇద్దరు మరీ క్లోజ్ అయ్యారు.
అరుణ వంట చేస్తూంటే పక్క వరండాలో పచార్లు చేస్తూ కబుర్లు చెప్పేవాడు. అరుణ ఎప్పుడూ న్యూస్ పేపరు ఎక్కువగా చదవదు కానీ వార్తలన్నీ తెలుస్తాయి- రఘురాం చాలా వార్తలు వంటింట్లోనో, భోజనా లయ్యాక తీరిగ్గా సోఫాలో కూర్చున్నపుడో రీలే చేసేవాడు. ఇద్దరూ భోజనాలయ్యాక వరండాలో కూర్చుని బంధువుల, మిత్రుల జీవితాలు నెమరు వేసుకునేవారు. ‘ఒంటరిగా ఎలా ఉంటాననుకుని నన్నోదిలి వెళ్లి పోయావు రఘూ’ అరుణ కంటి నీరు పెట్టింది.
******************
మరునాడు లక్ష్మి, లలిత వచ్చారు. అరుణ బాధ తగ్గించడానికే వాళ్ళిద్దరూ ప్రయత్నించారు. కాస్త సరదాగానే గడిచింది. వాళ్లు వెళ్ళగానే మళ్ళీ వంటరితనం చుట్టుముట్టింది. మనసులో ఉన్న ఒంటరితనం బయట ఉన్న మనుషులతో పోదుగా!
అఖిల్ రోజూ వర్క్ కు వెళ్తూ ఫోన్ చేసి తల్లితో కాసేపు కబుర్లు చెబుతాడు. ఆగని కాలం కదిలిపోతూనే ఉంది. రఘురాం లోకం వదిలి ఆరు నెలలు గడిచిపోయాయి. అఖిల్ ఒక వారంరోజుల కోసం ఇండియా వచ్చాడు. ఈసారి తల్లి వీసాకు అప్లై చేసాడు.
“మమ్మీ! వీసా రాగానే తెలిసిన వాళ్ళెవరైనా వస్తూంటే అదే డేట్ కు నీ టికెట్టు బుక్ చేస్తాను. ఇంటి విషయం పవన్ బావ చూసుకుంటాడు. నువ్వు దేనిగురించి ఆలోచించాల్సిన పని లేదు, నీకు కావాల్సిన నీ వస్తువులు మాత్రమే తీసుకొనిరా. నా మాటకు నువ్వేమి అడ్డు చెప్పొద్దు.”
“అరుణా! నువ్వు అఖిల్ మాట విను. వాళ్లతో కలిసి ఉంటే నీకు బావుంటుంది. కొన్నాళ్ళ తర్వాత నీకు ఇక్కడికి రావాలనిపిస్తే తప్పకుండా రా. కానీ నువ్వు వెళ్ళకపొతే నేను నా మకాం పూర్తిగా ఈ దగ్గరకు మార్చాల్సి వస్తుంది. నీకు తెలుసు పవన్ ను చూడకుండా నేను ఎక్కువ రోజులు ఉండలేను, అయినా వస్తానంటున్నాను. నువ్వు ఆలోచించు ఏం చేస్తావో. నన్ను రమ్మంటావా లేక నువ్వు …” అల్టిమేటం ఇచ్చింది లక్ష్మి.
అరుణకు ఒంటరితనం కష్టంగానే ఉంది. కొడుకు దగ్గరకు వెళ్ళాలనే ఆలోచన వైపే మొగ్గింది మనసు. మరో మాట లేకుండా ‘సరే’ అంది.
“ఇక్కడ ఇల్లరికం వెళ్లి ఇల్లు మారుస్తారు. నన్ను అమెరికం వెళ్లి దేశం మారమంటున్నావా వదినా!” పరిహాసం చేసింది.
“అలాగే అనుకో” నవ్వుతూ అంది లక్ష్మీ. లక్ష్మీ గత నాలుగేళ్ళ లో రెండుసార్లు అమెరికా వెళ్లి వచ్చింది. ఆమె
ద్వారా అమెరికా కబుర్లు విని ఉన్న అరుణకు అమెరికా ప్రయాణమంటే సంకోచం లేదు కానీ పరిపూర్ణ మనస్సుతో ప్రయాణ సన్నాహాలు చేసుకోలేక పోతోంది. ఆత్మీయ బంధం ఏదో తనను వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తోంది అరుణకు. ఒంటరి తనంలో కలిగే బాధ కంటే నా అనే అన్నింటినీ వదిలి పోతున్నానే బాధ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రఘు ఉనికికి దూరం వెళ్ళడం, ఉన్నఆత్మ బంధువులను వదులుకుని పోవాలంటే మామూలు మాట కాదుగా! వేర్లు పెకిలించు కుని పోవాలి. లక్ష్మీ సహాయంతో అరుణ ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టింది.
రఘురాంకు అమెరికా చూడాలని చాల కోరికగా ఉండేది. అతని కోరిక తీరనేలేదు. ‘నన్నొదిలి నువ్వు తొందరగా వెళ్లి పోయావు రఘూ’ అరుణ కళ్ళంబట నీటి ధారలు.
********************
విమానంలో అన్ని గంటలు కూర్చుని అరుణకు వళ్ళంతా నొప్పులు, నిద్ర లేక, (రాక) తలనొప్పి వచ్చిందే కానీ దిగాల్సిన ఊరు మాత్రం రాలేదు. ఇంత దూర ప్రయాణం! మన పురాణాల్లో చెప్పినట్టు మాయ తివాసీలు, అదృశ్య అశ్వాలు ఈ సైంటిస్టులు కనిపెట్టినట్టు లేరు ఇంకా. అది మన ఇండియా వాళ్ళ తెలివి కదా వీళ్ళకు అంత అలోచన వచ్చి ఉండదులే అనుకుంది.
ఎయిర్ పోర్టులో కనిపించిన అఖిల్, సరితను చూడగానే దుఃఖం ఆపుకోవడం అరుణ వల్ల కాలేదు.
అంతా కలలాగ ఉంది.
అఖిల్ ఇల్లు పెద్దది, అందులో ఉండే మనుషులు ఇద్దరే. అరుణ కోసం వేరుగా అమర్చిన గది, అందులోని సదుపాయాలన్నీ చూపించాడు అఖిల్. అన్ని చక్కగా అమర్చి ఉన్నాయి. మధ్యాహ్నం నిద్దర పోవడం, మధ్య రాత్రికి లేచి కూర్చోవడం చేస్తోంది అరుణ. దయ్యాలు రాత్రి మెలుకువగా ఉంటాయట. బాడి క్లాక్ అడ్జస్ట్ కావాలని తెలుసు అయినా అమెరికా రాగానే దయ్యం అయి నట్టున్నాను అనుకుని నవ్వుకుంది..
ఒకరోజు రాత్రి పడుకోబోయే ముందు,
“మాం! రాత్రి కూడా పళ్ళు బ్రష్ చేసుకుంటే పళ్ళు శుభ్రంగా గట్టిగా ఉంటాయి” అంటూ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఎలా వాడాలో చూపించాడు. అమ్మకు అమ్మై పోయాడు నా కొడుకు అనుకుంది.
“ఇన్ని ఏళ్లలో నేను రాత్రి ఎప్పుడూ పళ్ళు తోముకోలేదు కన్నా. రాత్రి తిన్నాక నీటితో బుక్కిలిస్తాను అంతే. ఉన్న పళ్ళను ఊడకుండా చూసుకోవాలిగా, అలాగే చేస్తాలే.”
అలంకారాల గురించి వింది కాని బాత్రూంలో చూస్తుంటే మరీ బావుంది. అరుణ కళ్ళు పెద్దవి చేసి అన్నీ ముచ్చటగా చూసింది.
“కన్నా! బాత్రుంలు కూడా ఇంత అందంగా అలంకరించుకుంటారా హోటల్లో లాగ?”
“అవును మమ్మీ. బాత్రూం కూడా ఇంట్లోనే ఉందికదా. ఇల్లంతా అలంకరించినపుడు బాత్రూం ఎందుకు అలంకరించ గూడదు!”
నిజమే కదా అనుకుంది. ‘రఘు ఉంటే ఇంకా ఎన్నో చెప్పేవాడు’ నిట్టూర్చింది. రఘు, అరుణ ఒకసారి డిల్లీ ట్రిప్ వెళ్ళినపుడు వెళ్ళిన ప్రతి చోటల్లా దానికి సంబధించిన చరిత్ర అరుణకు చెప్పేవాడు. రఘు పక్కనుంటే బావుండునని అరుణ మనసు తల్లడిల్లింది.
మరునాడు స్నానానికి ముందుగా సరిత వచ్చి వేడి నీళ్ళు , చన్నీళ్ళు షోవర్ లో తుంపరలు, పెద్ద చినుకులు, చిన్న చినుకులు, పెద్ద వాన, వరద అన్నీ అందులో ఎలా సెట్ చేసుకోవాలో చూపించి,
“మాం! నేను ఈ పక్కనే ఉంటాను. ఏదైనా కావాలంటే పిలవండి.”
“సరితా! నీ పని చూసుకో. నాకేం ఫర్వాలేదులే.” పైకి అందే కానీ మనసులో మాత్రం నా స్నానం అయ్యేవరకు ఇక్కడే ఉండమ్మా అనుకుంది అరుణ. షావర్ లోంచి వాన తుంపరలు పడ్తున్నై. చిన్న పిల్ల వానలో తడుస్తున్న భావన కలిగింది అరుణకు.
మొదటి వారం అంతా అఖిల్ ఇంటినుండే పనిచేసాడు. ఒకరి తర్వాత ఒకరు సెలవు తీసుకొని కొన్ని రోజుల పాటు అరుణకు అలవాటు అయ్యేవరకు తోడు ఉన్నారు. వాళ్ళ రోజంతా ఉద్యోగాల దగ్గిరే గడిచి పోతుంది. సరిత మొదటి రెండు రెండు రోజులు ఇంటినుండే పని చేసింది. కొడుకు, కోడలిని చూసి అరుణ సంబరపడింది.
“నన్నొదిలి నువ్వు తొందరగా వెళ్లి పోయావు రఘూ. వీళ్ళిద్దరినీ ఇలా చుస్తే ఎంత సంతోషించేవాడివో.” బరువుగా కన్నీళ్ళు రాలాయి.
సరిత వంట చేస్తూంటే అరుణ ఆ పక్కనే ఉండి “నేను కట్ చేస్తాను ఆ ఉల్లిపాయ ఇలా ఇవ్వు”
“మాం! మీరు రెస్టు తీసుకోండి. కొంచెం అలవాటయ్యాక చేద్దురు.” ఎంత చక్కగా మాం అని పిలు స్తుంది. అఖిల్ పిలుస్తుంటే తనకు పిలవాలనిపిస్తుందేమో. తను కూడా నా బిడ్దేకదా! మనసు తేలికగా అనిపించింది.
ఓ వారం తర్వాత అరుణ పరిసరాలకు చాలా వరకు అలవాటు పడింది. రఘు గుర్తు వచ్చినపుడు మాత్రం రూములో కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. ఇండియాకు ఫోన్ చేసి లక్ష్మితో ప్రతీది వివరించేది. దాంతో మనసు కాస్త తేలికగా అనిపించేది. ఫోన్ చేసి స్నేహితుల బాగోగులు పేరు పేరునా ఒక్కొక్కరి గురించి మాట్లాడేది.
అరుణ వంటింట్లో అన్నీ ఎక్కడ ఏముంటాయో తెలుసుకుంది. ఐపాడ్ ఎలా వాడాలో చూపించాడు అఖిల్. పాటలు ఎలా పెట్టుకోవాలి, టివి ఎలా చూడాలి తెలుసుకుంది అరుణ. ప్రతి దానికి అరడజను బటన్లు, ఆ టీవి చుట్టూ వల అల్లినట్టుగా అన్ని వైర్లే. నెమ్మదిగా అన్నీ వాడడం నేర్చుకుంది. అరుణకు ఇష్టమని రీడర్స్ డైజెస్ట్, ఉమెన్స్ డే, మార్తా స్తువార్డ్ మేగజీన్ లు తెప్పిస్తున్నారు. ఇండియాలో తెలుగు నవలలు, మేగజీన్స్ లో కథలు చదివేది. ఇండియాలో ఉన్నప్పుడు ఇంగ్లీషు చదవడం తక్కువే ఇప్పుడు అవి కూడా చదివి కొత్త విషయాలు తెలుసుకోవచ్చని మంచి కాల క్షేపం అనుకుని మురిసి పోయింది. లక్ష్మీ కూడా ఫోనులో అదే అంది.
సరిత వంట చేయడం తక్కువే. నాలుగు మైళ్ళ దూరంలో ఒక తెలుగావిడ వంట చేస్తుందిట, ఆవిడ దగ్గరే తెచ్చుకుంటారు. ఆవిడ వంటల్లో నూనె కుమ్మరించకుండా, రుచికోసం మసాలాలు దిమ్మరించకుండా మనం ఇంట్లో చేసుకున్నట్టే వండుతుందని చాలా మంది కొనుక్కుంటారట. హోటల్లో కంటే నయం అని అఖిల్ అంటాడు. ఫ్రిజ్ లో అన్నీ ఆవిడ వండినవే ఉన్నాయి.
“నేనుండగా బయటి నుండి ఫుడ్ తేవద్దు.” తల్లి మాటలకు ఇద్దరూ తలాడించారు.
సరిత వంట చేస్తున్నపుడు అఖిల్ టీవి చూడ్డమో, ఫోనులోనో ఉండేవాడు. సరితకు కాస్త హెల్ప్ చేస్తాను అంటూ లేచిన తల్లితో,
“మాం! రోజూ ఇద్దరికి ఏం వంటలే అని తెచ్చుకుంటాం కాని అవి తిని విసుగొచ్చినపుడు రీటా వంట చేస్తుంది. చాల ఫాస్ట్ గా వంట చేస్తుంది.”
“ఇంటికొచ్చేసరికే చాల ఆలస్యమవుతుంది. అప్పుడు వంట చేసే ఒపిక ఉంటుందా!”
“మాం! సరిత అన్నీ మానేజ్ చేసుకోగలదు. ఇంట్లోనే కాదు ఫైనాన్స్ కూడా చూసుకోగలదు.”
“అన్ని పనులు వచ్చి ఉంటే మంచిదే.” అలోచించి పని లోకి దిగింది అత్తగారు అరుణ.
సరిత జాబులో చాల బిజీగా ఉన్నా, అలసి పోయినా దారిలో హోటల్ లోంచి డిన్నరు తెచ్చుకోవడం బాగా అలవాటు. అరుణ అది పూర్తిగా మానిపించేసింది. అలా అని సరదాగా తినడానికి ఆపదు. పైగా తనే ఎంజాయ్ చేయడానికి వెళ్ళమంటుంది.
అఖిల్ ఇంట్లో పని చేస్తూ బ్రేక్ తీసుకున్నప్పుడు అరుణ మాట్లాడిస్తూ చిన్న చిన్న పనులు- కూరలు కట్ చేయడం- లాంటివి చేయించింది. అలవాటు లేక ఇబ్బంది పడ్తున్న అఖిల్ ను చూసి మనసులో బాధ కలిగినా పైకి ఎమీ అనలేదు. చిన్నప్పుడే పనులు చేయడం అలవాటు చేస్తే ఇప్పుడు సులభంగా ఉండేది. మన సంఘంలో మగవాళ్ళు వంటింటి పనులు చేస్తే చిన్నతనమని ఒక స్టిగ్మా ఉంది. అరుణ కొడుకుని చాల గారాబంతో ఏ పని ముట్టుకోనివ్వలేదు. గడిచి పోయిన వాటిని జడ్జ్ మెంటు కోటాలో పెట్టి వగచే కంటే ప్రస్తుతంలో మార్పు ఎలా ప్రవేశ పెట్టాలో చూడాలి. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నపుడు ఇద్దరికి పని వచ్చి ఉంటే వాళ్ళకే సుఖం. వీకెండుకు తల్లి, కొడుకు కలిసి వంట చేస్తూంటే సరిత ఇబ్బందిగా అఖిల్ ను పక్కకు జరగమని తాను సాయం చేసేది.
“అఖిల్ ను నేర్చుకోనివ్వు సరితా. మగవాడయినంత మాత్రాన వంట నేర్చుకోగూడదని ఎక్కడుంది.”
సరితకు మొదట్లో ఇబ్బందిగా ఉండేది. తన తల్లి అలా అంటే అర్థం చేసుకోగలదు కానీ అఖిల్ తల్లి…నెమ్మదిగా అరుణ మనసు తెలుసుకున్న సరిత చాల సంతోషించింది.
రెండు నెలలు గడిచి పోయాయి. అఖిల్ ఇంట్లో ఉన్నప్పుడు అరుణ పని చేస్తూంటే ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాడు. అలా చేస్తుంటే అరుణకు గర్వంగా ఉంది. వీకెండ్ డిన్నర్ పార్టీలకు అరుణ కూడా వెళ్తోంది. అక్కడ కొంత మంది పేరెంట్సు, ఇన్లాస్ కలిసారు.
“మాం! వినుత ఇన్లాస్, రజిత పేరెంట్సు, మాలిని మదర్ మన వీధిలోనే ఉంటారు. మీరు మధ్యాహ్నం కలుసుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం మనం వాకింగ్ కు వెళ్లి వాళ్ళను కలుద్దాం. నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళందరికీ వీలయితే రేపు లంచ్ కు కలుసుకోవచ్చు. ఏమంటారు?” సరే అంది అరుణ.
సరిత ఫోన్ చేసి సాయంత్రం వాకింగ్ ప్రోగ్రాం చేసింది. మరునాడు పెద్దవాళ్ళంతా లంచ్ కు కలుసుకున్నారు. అందరూ వయస్సులో, పద్ధతులలోను, భాషలోను వేరైనా వచ్చింది మాత్రం గ్రాండ్ కిడ్స్ కోసమే. ఆ తర్వాత ఒకరితో ఒకరు తరుచుగా ఫోన్ లో మాట్లాడుకున్నారు. బయట ఎండగా ఉంటే చాల బావుంది అంటూ బ్రేక్ ఫాస్ట్ తిని అందరూ కాసేపు వాకింగ్ కేళతారు. నెలకొకసారి పాట్ లక్ పెట్టుకుని కలుసుకుంటారు. అఖిల్ వంట చేయడం నేర్చుకుంటున్నాడని అరుణ చెప్పగానే విని తోటివారంతా మొహం తేలేసారు. అమెరికా వచ్చి కొడుక్కు వంట నేర్పుతున్నావా! అని ముక్కు మీద వేలేసుకున్నంత పన్జేసారు.
“అందులో తప్పేముంది. నేను చిన్నప్పుడే నేర్పాల్సింది. కనీసం ఇప్పుడైనా నేర్చుకుంటున్నాడు. వంటే కాదు ఇంట్లో ఏ పనైనా సాయం చేస్తున్నాడు. రోజూ బయటినుండి ఫుడ్ తెచ్చుకుని తినేకంటే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ రోజుల్లో ఆడవాళ్ళ పనులు, మగవాళ్ళ పనులు అని కేటాయించి లేవుగా. అన్ని పనులు కలిసి చేసుకుంటే సుఖం. ఇండియాలో కంటే ఇక్కడ మగవాళ్ళు పని చేయడం కాస్త సులభంగా అనిపిస్తుంది. సరిత జాబ్ లో బిజీగా ఉంటే గ్రాసరీ స్టోర్ కెళ్ళి మొన్న కూరగాయలు, పళ్ళు తెచ్చాడు. పళ్ళు ఫర్వాలేదు గాని కూరగాయలు ఇంకా సరిగ్గా చూసి తేవడం తెలీదు. ఒకసారి వెంట వెళ్లి చూపించాలి.” అరుణ మాటలు అందరికి నచ్చలేదు.
“ఎలా ఒప్పించావు? ఆ కిటుకేదో మాకు చెప్పు. రజిత అటు ఉద్యోగం ఇటు ఇంట్లో పని చేయలేక ఇద్దరు ఎప్పుడూ కస్సర బిస్సర అనుకుంటూనే ఉంటారు. నేను నెమ్మదిగా చేస్తానని నన్ను వద్దంటుంది.”
అరుణ నవ్వుతూ “మనం సరదాగా మాట్లాడుతూ మనం చేస్తూ వాళ్ళను పనుల్లోకి దించాలి” అని నవ్వుతూ చెప్పింది. కొందరు ఉత్సాహంగా చూద్దాం మనమెంత చేయించగలమో అని సవాల్ చేసుకుంటూ వెళ్ళారు.
అరుణకు టైం ఇట్టే గడిచి పోతోంది. మేగజీన్లు, టీవి, ఫ్రెండ్స్, ఇంట్లో ఏదో ఒక పనిచేస్తూ తోచని రోజంటూ లేదు. అరుణ తన దినచర్య లక్ష్మికి చెప్పగానే,
“నిజంగానే అమెరికం వెళ్లి పోయావు అరుణా. సరిత మంచి అమ్మాయి లాగుంది.”
“వాళ్ళిద్దరూ నా బిడ్డలే కదా వదిన. కొడుకు సంతోషంగా ఉండాలంటే కోడలు సంతోషంగా ఉండాలి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. రఘు ఉంటే చూసి ఎంత సంతోషించేవాడో!”
“నిజమే రఘు మురిసేవాడు. నీ మనసు మంచిది అరుణ. మనసులో మంచి ఆలోచనలు ఉంటే నోటి వెంట చెడ్డ మాటలు రానేరావు. ఎదుటి వారిలో కూడా మార్పు వస్తుంది. అదే మన జీవిత రహస్యం. తెలుసుకుంటే భూలోకంలోనే స్వర్గం కనిపిస్తుంది. అఖిల్ వంట ఎంత వరకు వచ్చింది?”
“సరిత బిజీగా ఉన్న రోజు అఖిల్ ఇంటికి రాగానే ‘ఇవ్వాళ్ళ డిన్నరుకు ఏం చేసుకుందాం మాం?” అంటాడు. మొన్న ఒకరోజు బటర్ చికెన్, చిక్ పీస్, రైతా, పులావ్ చేసి సరితకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. నన్ను కూచోబెట్టి ఒక్కడే అన్నీచేసాడు, చాల రుచిగా ఉన్నాయి. నేను ఇండియా వచ్చినా బయటి ఫుడ్ రోజూ తినకుండా మేనేజ్ చేసుకోగలరు. ఇప్పుడు బయట ఫుడ్ తెచ్చుకుని తినడం చాలా తగ్గిపోయింది. ఇంట్లో సరితకు కూడా పనుల్లో సహాయం చేస్తున్నాడు. నాకు గర్వంగా ఉంది. నువ్వు వచ్చినపుడు చూద్దువు గాని. ఎప్పుడు వస్తున్నావు వదినా!”
“పిల్లలకు వేసవి సెలవులు ఉన్నపుడు వస్తే పిల్లలను చూసుకోవచ్చు. అరుణా! నీ ఐడియా చాల మంచిది. మేమెవ్వరము ఆలోచించనిది నువ్వు అమలులో పెట్టావు. ఇండియాలో కూడా అందరం మగ, ఆడ తేడా లేకుండా అన్ని పనులు చేసుకుంటే బావుంటుంది. నేను నెమ్మదిగా పవన్ మీద ప్రయోగం చేస్తాను. వంటే కాదు ఇంటి పనుల్లో చేయూత నివ్వడం మంచిదే. అయినా ఆ పాత ఆలోచనలు పక్కన పెట్టి ఉత్సాహంతో మార్పులు చేసు కుంటూ ముందుకు కదలాలి.” ఉత్తేజంగా అంది లక్ష్మీ.
మన పధ్ధతి మనమే మార్చుకోవాలి. మనసులు మారితే మనుషులు మారుతారు. మనం మారాలి, మనతో బాటు పురుషులను కూడా మన వెంట ముందుకు తీసికేళ్ళాలి. తరతరాలుగా ఉన్న అనవాయితీని మార్చడం ఒక్క రోజులో కాదు, ఒక్కరితో కాదు. వంటింట్లోనే కాదు ప్రతి పనిలో ఇద్దరి చేతులు కలిసి ఉంటేనే జీవితం బాలెన్స్ అవుతుంది. మనస్పర్థలకు అవకాశ ముండదు. చదువు, ఉద్యోగాలు ఒక్క ధనాభి వృద్దికే కాదు, సామరస్యంతో మనో వికాసానికి, బంధుత్వ అభివృద్ధిని పెంపొందించి నపుడే పురోగతి అనిపించు కుంటుంది.

***** సమాప్తం *****

‘తల్లి ప్రేమమయి, గొప్పది అంటారు. నిజమే. కానీ భార్య కూడా గొప్పది. భార్య కూడా ప్రేమ మయి. భార్యకు పనుల్లో సహాయం చేసే మగవారు ఎంతమంది! ఎంతమంది తల్లులు కొడుకులకు
ఇంటి పని, వంట పని నేర్పిస్తున్నారు? భార్యకు పనుల్లో సహాయం చేయడం తప్పుకాదు అని

ఎంతమంది తల్లి, తండ్రి నేర్పిస్తున్నారు.’ అని ఒక సవాల్ సంఘంలోకి విసిరారు మమత రఘువీర్
గారు, ఒక సంఘ సేవికురాలు, స్త్రీ సహాయాభి వృద్ధికై కంకణం కట్టుకున్న మహిళ
“వసుంధర పురస్కారం” అవార్డ్ గ్రహీత. ఆమెకు నా అభివందనాలు.
మన వేష భాషలోనే కాదు, మన ఆలోచనల్లో, మన చేతలలో మార్పు రావడమే ఆమెకు జవాబు.

******************

ఆత్మీయ బంధాలు

రచన: కె. మీరాబాయి

పసుపు రాసిన గడపలు, గుమ్మాలకు మామిడి తోరణాలు, ఇంటి ముందు పచ్చని కొబ్బరి ఆకుల పందిరి అమరేసరికి ఇంటికి పెళ్ళికళ వచ్చేసింది. పెళ్ళి జరిగేది కల్యాణ మండపంలోనే అయినా ఇంటి ముందు పందిరి , రంగవల్లులు వుంటేనే అందం శుభకరం.
పెళ్ళికి నాలుగు రోజుల ముందే రమ్యని పెళ్ళికూతుర్ని చేసారు. ఆ రోజు ఉదయాన్నే రమ్యను, రమ్య అమ్మ నీరజను, నాన్న శ్రీనివాస్ ని పీటలమీద కూర్చోబెట్టి నుదుట , కుంకుమ పెట్టి, హారతి ఇచ్చి , వాళ్ళు తలంటి పోసుకోవడానికి తలకు నూనె పెట్టింది నీరజ వాళ్ళ చిన్నక్క కమల. సున్నం పసుపు నీళ్ళలో కలిపి ఆ ఎర్ర నీళ్ళతో వాళ్ళకు ద్రిష్టి తీసింది నీరజ ఆడపడుచు. తోడికోడళ్ళు, బావగార్లు, భర్త పిల్లలతో బాటు వచ్చిన ఆడబడుచులు ఇంటి నిండా బంధువులు కల కలలాడుతూ తిరుగుతున్నా నీరజ మనసులో మాత్రం వెలితి గానే వుంది. ఆందుకు కారణం అమ్మ లాటి అక్క పార్వతి రాక పోవడం.
ఒకవేళ నిజంగానే ఆమె రాక పోతే అత్తవారింటి వారి ముందు చులకన కాకూడదని పార్వతి తరఫున చదివించడానికి మంచి ఖరీదైన పట్టు చీర , జరీ పంచల చాపు తెప్పించి పెట్టింది నీరజ.
బరువుగా నిట్టూర్చింది నీరజ. అమ్మ మనసులో రేగుతున్న అలజడి అర్థం చేసుకున్న పెళ్ళికూతురు రమ్య అమ్మ చేయి సున్నితంగా నొక్కింది . ‘దిగులు పడకు వస్తుందిలే అన్నట్టు. . ‘
ఆడవాళ్లు అలంకరణ ముగించేసరికి పురోహితుడు రానే వచ్చాడు. ఆయన వెనకాలే మేళగాళ్ళు వచ్చేసారు. ” శ్రీ గణపతిని సేవింపరారే “అంటూ సౌరాస్ట్ర రాగంలో కీర్తనతో పది నిముషాలలో మంగళ వాద్యాలు మొదలయ్యాయి. సన్నాయి, మృదంగం డొలు వంటి వాద్యగోష్టి హోరులో పెళ్ళి ఇంట్లో ఒకరి మాటలు మరొకరికి వినబడడం లేదు.
” కార్యక్రమం మొదలు పెట్టాలి . పెళ్ళికుమార్తె, తల్లి, తండ్రి వచ్చి పీటలమీద కుర్చోండమ్మ “అంటూ హడావిడి చేస్తున్నాడు పురోహితుడు.
“వస్తున్నాము” అన్నట్టు సైగ చేసి ఆశ వదులుకోలేక వీధి గుమ్మంలోకి వచ్చింది నీరజ. అక్క వచ్చే జాడ కనబడుతుందేమో అని చూస్తూ. నిరాశగా వెనక్కి వస్తూ ఎదో తోచినట్టు ఫోనులో పార్వతి నంబరు నొక్కింది. “రారా మా ఇంటిదాకా రఘువీర సుకుమార ” అంటూ అసావేరి రాగంలో వాయిస్తున్న భజంత్రీల ముందు వుంచింది ఫోను.
ఈ సందడి విని అయినా అక్క మనసు కరగకపోతుందా ఆన్న ఆలోచనతో నీరజ కళ్ళు చెమరించాయి.
అటువైపు ఫోనులో ఆ మంగళ నాదాలు వినగానే పార్వతి గుండె నీరయిపోయింది. ముప్ఫై ఏళ్ళ క్రిందట తన చేతులతో స్వయంగా పెళ్ళికూతురుగా అలంకరించిన నీరజ ముద్దు మొగం మనసులో మెదిలింది. ఫోను పక్కన పేట్టి అలా కూర్చుండిపోయింది. ఆడపిల్లలు లేని పార్వతి తోడబుట్టిన చెళ్లెళ్ళను కడుపున పుట్టిన కూతుళ్ళలా చూసుకుంది. ఆమ్మ పోయాక తనే వాళ్ళకు అమ్మ అయ్యింది. ఏ సమస్య వచ్చినా తండ్రికంటే ముందు ఆమెకే చెప్పుకునేవారు కమల, నీరజ .
ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణ అర్థం అయినట్టు పార్వతి తల మీద చేయి వేసి నిమిరాడు ఆమె భర్త సారధి.
“వాళ్ళంటే ప్రాణం పెడ్తావు. ఈ పంతాలు పట్టింపులు ఎందుకు?” లాలనగా అన్నాడు సారథి.
“వాళ్ళు నన్ను అవమానిస్తే నేను పట్టించుకుని వుండేదాన్ని కాదండీ ! మా వాళ్ళకు ఎంత చేసారు మీరు? అదంతా మరచిపోయి ఎంతమాట అన్నారు మిమ్మల్ని? ”
తండ్రి దక్ష ప్రజాపతి ఆయన తలపెట్టిన యాగానికి తనను పిలవక పోయినా సహించిన శచీదేవి శంకరుడిని తండ్రి అవమానిస్తే తట్టుకోలేక పోయినట్టు సారథిని వాళ్ళు ఆన్న మాట పార్వతి గుండెకు చేసిన గాయం ఇంకా మానలేదు.
గణపతి పూజ అయ్యాక ముత్తైదువలతో పందిరి పూజ చేయించాడు పురోహితుడు.
కొబ్బరి ఆకులు చుట్టిన పందిరి గుంజలకు పూలు చుట్టి, పసుపు కుంకుమలు పెట్టి అన్ని శుభంగా జరగాలని మొక్కుకుంటున్న నీరజ కళ్ళు ఎవరి రాక కోసమో ఎదురుచూస్తున్నట్టు మాటికి ప్రహరీ గుమ్మం వైపు చూస్తున్నాయి.
తన పిచ్చి గానీ పెద్దక్క పార్వతి పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఈ పెళ్ళికి వస్తుందనే? నిరాశ తొంగి చూసింది నీరజ మనసులో.
మూడేళ్ళ్ల క్రిందట పెద్ద కూతురు పెళ్ళిలో అంతటా ఆమే అయి తిరుగుతూ, పెళ్ళి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది పార్వతి.
“అక్కా ! ఇద్దరు ఆడపిల్లల పెళ్ళి ఎలా చేస్తానో ఏమో. ఆసలే నాకు ఆ పద్ధతులు, శాస్త్రాలు అంతగా తెలియవు. ” అని నీరజ దిగులు పడినప్పుడు వెంటనే ధైర్యం చెప్పింది పార్వతి “పక్కన నేను వుంటాను కదే అన్నీ నేను చూసుకుంటాను . నీకెందుకు చింత? ” అంటూ చెల్లెలికి భరోసా ఇచ్చింది .
ఇచ్చిన మాట ప్రకారం నీరజ పెద్ద కూతురు రాధిక పెళ్ళికి వారం ముందే వచ్చిన పార్వతి అన్ని బాధ్యతలు మీద వేసుకుని జరిపించింది.
నిజానికి పార్వతి వాళ్ళ అమ్మ పోయాక ఇద్దరు చెళ్ళెళ్ళు, తమ్ముడు బరువు బాధ్యతలు తన భుజాల మీద వేసుకుని కమల , నీరజ , రఘుల చదువులు , పెళ్ళిళ్ళు అన్నిటిలోనూ తండ్రికి చేదోడు వాదోడుగా నిలబడింది పార్వతి. ఇవన్నీ పార్వతి చేయగలిగింది అంటే అది ఆమె భర్త సారధి సహకారం వలననే. ఆ తరువాత కూడా కమల, నీరజలకు పురుళ్ళు పుణ్యాలు అన్నిటికీ పార్వతి ముందు వుంది. తండ్రిని చివరి రోజులలో సారధి సహకారంతో తన దగ్గరే పెట్టుకుని ఆలనా పాలనా చూసుకుంది పార్వతి.
బుగ్గన చుక్క , నుదుట కల్యాణ తిలకం, పూలజడతో మెరిసిపోతూ పెళ్ళికూతురు రమ్య వచ్చి పీటల మీద కూర్చుంది. కలశ పూజ, ఇంటి దేవుడి పూజ అయ్యాక పీటల మీద కూర్చున్న వారికి బట్టలు చదివించే కార్యక్రమం మొదలు అయ్యింది. ముందు నీరజ తమ్ముడు రఘు పుట్టింటి వారి తరఫున అక్క బావలకు, రమ్యకు కొత్త బట్టలు చదివించాడు. నీరజ కనుసన్నతో చిన్నక్క కమల లోపలికి వెళ్ళి నీరజ కొనివుంచిన చీర , పంచలు తీసుకు వచ్చి పురోహితుడికి అందించింది.
“పెళ్ళికుమార్తె పెద్దమ్మ పార్వతి, పెద్దనాన్న సారధి ఆశీర్వదించించి చదివిస్తున్న పట్టు వస్త్రాలు అంటూ ఆ పళ్ళెం నీరజ, రమ్య ల చేతికి అందించాడు. శ్రీనివాస్ భార్య వైపు మెచ్చుకుంటున్నట్టు చూసాడు. మిగతా దగ్గరి వాళ్ళ చదివింపులు అయ్యాక వధువును, ఆమె తలితండ్రులను కొత్త వస్త్రాలను ధరించి రమ్మన్నాడు పంతులు గారు
“అదేమిటి అన్ని శుభకార్యాలకు ముందు వుండే మీ పెద్దక్క పార్వతి ఇంకా రాలేదు? నీరజ భయపడుతున్నట్టుగానే ప్రశ్నించింది పెద్ద తోడికోడలు.”
“కొంచం నలతగా వున్నదట . ఎదురుకోళ్ళ సమయానికి వచ్చేస్తుంది.” గొంతులో జీర కనబడకుండా జాగ్రత్త పడుతూ సమాధానం చెప్పింది నీరజ.
మధ్యాన్నం భోజనాలకు ముందు ఆ రోజు వండిన తీపి పదార్థం పూర్ణం పోళీలలో ఒకటి పందిరి మీద వేయించాడు పంతులు గారు . పదహారు రోజుల పండుగ తరువాత పందిరి తీసే రోజున అలాగే చేయమని సూచించాడు.
పైకి అందరితో నవ్వుతూ కబుర్లు చెబుతూ హడావిడిగా తిరిగేస్తున్నా నీరజ మనసు ఆలోచిస్తూనే వుంది. పెద్ద కూతురు రాధిక పెళ్ళిలో జరిగిన సంగతులు మెదులుతున్నాయి.
ముహూర్తం ముందురోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
*****
శుభ ముహూర్తం తెల్లవారు ఝామునే వుండడం వలన ముందురోజు సాయంత్రం ఎదురుకోలు సంబరం ముగిసాక రాత్రి ఎనిమిది గంటలనుండి రిసెప్షన్ ఏర్పాటు చేసారు. రిసెప్షన్ కు అనుకున్న దానికన్న ఎక్కువ మంది రావడం జరిగింది. తీరా మగ పెళ్ళివాళ్ళు భోజనాలకి వచ్చేసరికి కూరలు తక్కువ పడ్డాయి. మారు వడ్డించలేదని పెళ్ళివారు అనడంతో నీరజ బావగారు , పార్వతి భర్త అయిన సారధి కేటరింగ్ చేసిన వంటవాళ్ళ మీద కోపం చూపించాడు. దానితో వంట వాళ్ళు సహాయ నిరాకరణ మొదలు పెట్టి కూర్చుండి పోయారు
రసాభాసం కాకూడదని ఆడపెళ్ళి వాళ్ళు వియ్యంకులకు సర్ది చెపుతూ తామే వడ్దనకు దిగారు.
పార్వతి, ఆమె భర్త సారధి వంటవాళ్ళను శాంతింప చేసారు. . ఇంతలోనే బంధువులలో ఒకరు మాట తూలారు ” ఎంతయినా ఆడ పెళ్ళివారు కదా ఆ సారధి కాస్త అణిగి వుండక అంత దురుసుగా నోరు పారేసుకోవడం దేనికి? కొంచం వుంటే గొడవైపోయి పెళ్ళి అభాసు పాలయ్యేది. ” అని.
“మా బావగారికి కొంచం కోపం ఎక్కువ. కాస్త శాంతంగ వుండాల్సింది ” అంది నీరజ. ఆ మాట పార్వతి చెవినబడింది.
“మా ఆయన నడ్డి విరిగేట్టు చాకిరీ చేసింది ఎవరికీ కనబడలేదుగానీ వంటవాళ్ళను కోప్పడినందుకు ఆయన గారిని ఆడి పోసుకుంటున్నారు. ఆసలు ఈ పెళ్ళికి వచ్చి తప్పు చేసాము. ఇంకోసారి నీ గుమ్మం తొక్కితే ఒట్టే” అనేసి రాత్రికి అభొజనంగా వుండిపోయింది.
మరుచటి రోజు పెళ్ళి సలక్షణంగా జరిగింది. భోజనాలు అయ్యాక సంప్రదాయం ప్రకారం అమ్మాయిని అప్పగింతలు పెట్టడం , రాత్రికి శోభనం అన్నీ నిర్విఘ్నంగా పూర్తి అయ్యాయి.
నీరజతో మాట్లాడకండానే ఏ విషయంలోనూ లోటు రాకండా చూసుకుంది పార్వతి.
వాళ్ళు బయలుదేరేటప్పుడు సారధికి , పార్వతికి బట్టలు పెట్టి కాళ్ళకు నమస్కరించారు నీరజ, శ్రీనివాస్ . ” తెలియక మీ మనసు కష్టపెట్టి వుంటే క్షమించండి” అంది నీరజ. మౌనంగా వెళ్ళి బండి ఎక్కింది పార్వతి.
ఆంతే ఈ మూడేళ్ళుగా ఒక్క సారి కూడా ఫోనులొ పలుకలేదు పార్వతి.
రమ్య పెళ్ళి అనుకోకుండా పదిహేను రోజుల్లో పెట్టుకోవలసి వచ్చింది. పత్రిక పంపించి ఫోనులో ఆప్యాయంగా ఆహ్వానించింది నీరజ . వినడం తప్ప అటునుండి మౌనమే సమాధానం.
నీరజ భయపడినట్టే రమ్యను పెళ్ళికూతుర్ని చేసే రోజుకు కూడా రాలేదు పార్వతి.
” అమ్మా ! నేను , మీ అల్లుడు శ్రీశైలం వెళ్ళి వస్తాము” అని ప్రయాణమయ్యింది నీరజ పెద్దకూతురు రాధిక. ఎల్లుండి పెళ్ళి వారొస్తున్నారు. ఇప్పుడెందుకే? అన్న అమ్మ మాటకు “ఒక్క రోజులో రామూ?” అనేసి వెళ్ళింది.
అన్నట్టుగానే మరుసటి రోజు వచ్చేసింది రాధిక . వెళ్ళిన ఇద్దరు మరో నలుగురిని తీసుకు వచ్చారు.
పార్వతి, సారథి, వాళ్ళ కొడుకు కోడలు కూడా రావడం చూసి నీరజకు ఆనందంతో నోట మాట రాలేదు.
“అక్కా! నువ్వూ వచ్చేసావు ఇది చాలు అక్కా నాకు. “అంటూ అక్కని కౌగలించుకుంది నీరజ.
“రాకుండా ఎలా వుంటానే పిచ్చిదానా? ఏదో మాట మాటా అనుకున్నంత మాత్రాన ఆత్మీయ బంధాలు తెగిపోతాయా? నువ్వలా చూస్తు వుండు అన్నీ నేను చూసుకుంటాను. ఇంతకీ నా చిన్న కూతురు అదే పెళ్ళికూతురు ఏదీ? ఆంటూ లోపలికి నడిచింది పార్వతి.
తల్లికి శ్రీశైలం వెళ్తున్నట్టు చెప్పి విజయవాడలో పెద్దమ్మ పార్వతి ఇంటికి వెళ్ళింది రాధిక. హటాత్తుగా వచ్చిన రాధికను చూసి ఆశ్చర్య పోయింది పార్వతి.
“పెద్దమ్మా , పెద్ద నాన్నా మీరిద్దరూ దగ్గర వుండి నా పెళ్ళి జరిపించారు. మొత్తం బాధ్యత మీరిద్దరే మోసారు అని అమ్మ నాన్నా ఈ రోజుకూ తలచుకుంటారు. మీరు రాకపోతే అమ్మకు రమ్య పెళ్ళి ఆన్న సంతోషమే లేదు. మా అమ్మగానీ నాన్నగానీ మీ మనసు కష్టపెట్టి వుంటే చిన్నవాళ్ళు అని క్షమించేయండి. మీరు నాతో రాకపోతే మేమిద్దరం కూడా వెళ్ళము. ఇక్కడే వుండిపోతాము” చిన్న పిల్లలాగా పార్వతిని రెండుచేతులతో చుట్టేసి అన్నది. రాధిక. కరిగిపోయింది పార్వతి.
ఆప్యాయంగా సారథి భుజం మీద చేయి వేసి లోపలికి నడిపించాడు శ్రీనివాస్ .
ఆత్మీయ బంధాలు అల్లుకున్న పెళ్ళి వారిల్లు మరింత శోభను సంతరించుకుని కళ కళ లాడింది .

శుభం

ఖజానా

రచన : సోమ సుధేష్ణ

రాత్రి నిద్రలో వచ్చిన కలల తాలూకు ఛాయలు ఉమ మోహంలో నీలి నీడల్లా కదులు తున్నాయి. ఆ నీడలను దులి పెయ్యాలని ఉమ కాఫీ కలుపుకుంది. కూతురికి లంచ్ బాక్స్ తీయాలని ఫ్రిజ్ డోర్ తీయబోయి అలవాటుగా డోర్ పై పెట్టిన ‘ఈ రోజు చేయాల్సిన పనుల’ లిస్టు చూసింది. సరసి డాన్స్ క్లాసు ఐదింటికి, వచ్చే దారిలో కొనాల్సినవి- పాలు, ఆరెంజ్ జ్యూస్, లంచ్ స్నాక్, డ్రై క్లీనర్స్ దగ్గర సూట్ పికప్ – అని ఉంది. అదే కేలెండర్ లో ఫిబ్రవరి 11th నాడు గుండె ఆకారం వేసి ఉంది. కేలెండర్ లో చిన్నగా ఉన్న ఆ సంఖ్య పెద్దదై ఉమ గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. ఎనిమిదేళ్ళ క్రితం అదే రోజు నాడు…బాధ శూలంలా దూసుకు వచ్చింది. మనసులో వెలితిగా తోచి, చిన్న పిల్లలా ఒంటరితనం ఫీలయింది. నాన్నగారికంటే రెండేళ్ళ ముందే తల్లి శరీరాన్ని వదిలింది. తండ్రి కూడా ఇక లేడు అనుకుంటే ఆనాధలా అనిపించింది ఉమకు. ఇండియాకు తనకు బంధం తీరి పోయింది. ఆ ఆలోచనకే ఊపిరి అడలేదు.
“ఏమిటలా ఉన్నావ్?” కాఫీ మగ్ లోకి కాఫీ నింపుకుంటున్న సతీష్.
టోస్టర్ అవెన్ లోంచి మఫ్ఫిన్ తీసి స్ట్రాబెర్రి జాం రాసి ప్లేటులో పెట్టి అతనికిచ్చింది.
“షర్ట్ మీద క్రంబ్స్ పడుతున్నాయి.” తింటున్న సతీష్ కు నేప్ కిన్ అందిచ్చింది.
“ఎందుకలా ఉన్నావు చెప్పలేదు.”
“వచ్చేప్పుడు డ్రైక్లీనర్స్ లో మీ సూటు పికప్ చేయండి.” ఫ్రిజ్ పై మాగ్నెట్ కు అతుక్కున్న కాగితం తీసి అతని కందిచ్చింది.
“దీని కోసం అలా ఉన్నావా? పికప్ చేస్తాలే. నో ప్రాబ్లం. అదికాదులే నీ మోహంలో ఏదో కాస్త బాధ కదిలినట్టుగా అనిపిస్తోంది.” మాటల్లో ప్రేమ తోణికిసలాడింది.
“ఏదో కలల కలకలం.” బలవంతపు నవ్వు. అంతలోనే
“గుడ్ మార్నింగ్ లివింగ్ గాడ్స్!” గంపెడు బుక్స్ ఉన్న బేగ్ ను నేలమీద పెట్టి గబగబా వచ్చి తల్లి అందిస్తున్న పాలగ్లాసు, మఫ్ఫిన్ అందుకుని,
“థాంక్స్ మాతాజీ!” హడావుడిగా మఫ్ఫిన్ తింటూ పాలు తాగింది సరసి. ఉమ నవ్వింది.
“డాడ్! షర్ట్ పాకెట్ లో అలా పెన్ను పెట్టుకోకు బావుండదు. గ్రాండు పేరెంట్సు పెట్టుకుంటారు.”
సతీష్ షర్ట్ పాకెట్ లోంచి పెన్ను తీసేసింది.
“ఒక పెన్ను నా దగ్గర ఎప్పుడూ ఉండాలి అదిటివ్వు. నా బంగారు తల్లివి కదూ !”
“నా బంగారు తండ్రివి కదూ, షర్ట్ పేకేట్టులో పెట్టుకోనంటే ఇస్తాను. నీ బర్త్ డేకు అంత మంచి పెన్ సెట్ ప్రజెంట్ చెసాను, అది డ్రాయర్ లో పడేసి ఈ పిచ్చి పెన్ షర్ట్ పెకేట్టులో పెట్టు కుంటావు.” బుంగ మూతి పెట్టింది సరసి.
“నా ప్రేషేస్ ప్రిన్సెస్ వి కదూ, ఇటివ్వు.”
తండ్రి, కూతుర్ల మాటలను మందహాసంతో వింటూ అక్కడే నుంచున్నఉమకు ఖాళి మగ్ అందిచ్చి వెళ్లి బ్రీఫ్ కేసు అందుకున్నాడు.
“ఇది యక్కి పెన్” సరసి మొహం వికారంగా పెట్టింది.
“నువ్వు కూడా అందంగా ఉన్నావు.”నవ్వుతూ కూతురి చేతిలోని పెన్ లాక్కుని అలవాటు ప్రకారం షర్ట్ పేకెట్ లో పెట్టుకున్నాడు.
“ఈ సారి ఆ పెన్ తీసి పడేస్తాను నా ప్రేషస్ పాపడం.”
“కమాన్, లెట్స్ గో మిస్ ఇండియా.” హడావుడి చేసాడు.
“డాడ్ డ్రైవ్ చేస్తున్నపుడు పెద్దగా ఆర్గ్యుమెంటు పెట్టుకోకు. సతీష్ ఎవరైనా ఓవర్ టెక్ చేస్తే చిరాకు పడకు.” ప్రేమతో అప్పగింతలు పెట్టింది ఉమ. ఇద్దరు ఉమకు కిస్ తో బై చెప్పి బయల్దేరారు.
“ఐయాం రడీ పితాజీ. ఆ నర్డ్ ఇంకా అలాగే నన్ను చూసి నవ్వుతున్నాడు.”
సరసి డాడ్ తో ఏదైనా చెప్పగలదు. అ షర్ట్ వేసుకుంటే నర్డ్ లా ఉన్నావు, తల అలా కాదు ఇలా దువ్వుకుంటే హేన్ద్సం డాడ్ లా ఉంటావు. స్లీపోవర్ కు వద్దంటే ‘టిపికల్ కన్సర్వేటివ్ ఇండియన్ డాడ్ లా మాట్లాడుతున్నావు.’ అంటుంది. ఈ జీవితంలోంచి ఆ చనువు అందుకుంది సరసి.
కారు వైపు వెళ్ళుతున్న వాళ్ళ మాటలు తెరిచి ఉన్న కిటికీ లోంచి వినబడుతూనే ఉన్నాయి ఉమకు. కూతురిని స్కూల్లో డ్రాప్ చేసి అఫీసు కేల్తాడు సతీష్. కిటికిలోంచి వాళ్ళిద్దరిని అలా చూస్తూ సింక్ లో ఉన్న మురికి గిన్నెలు అన్ని డిష్ వాషర్ లో పెట్టి బెడ్ రూమ్ లో కెళ్ళింది. సతీష్ షర్ట్ ఐరన్ చేసి ఐరన్ ప్లగ్ తీసేయలేదు. ‘ఈ రోజు ఉదయం నుండే నేను పరధ్యానం పంతులమ్మను’ ఐరన్ ప్లగ్ ఊడలాగింది.
ఫ్రెష్ కాఫీతో వచ్చి బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆ పక్కనే ఉన్న ఫ్రిజ్ పై కాలెండర్ లోని 11th డేట్ ‘హలో’ అంది. ఉమ మనసులో దొర్లుతున్న అలనాటి ఆలోచనలను ఆహ్వానించింది.
‘నాన్నగారు ఏ వేళలో ఏం చేస్తారో ఇంట్లో అందరికి తెలుసు. ఉదయమే లేచి కాల కృత్యాలు పూర్తి చేసుకుని యోగ చేసి తర్వాత కాసేపు పేపరు చూసి స్నానం చేస్తారు. నేను, ఉదయ్ బ్రేక్ ఫాస్ట్ తింటున్నప్పుడు నాన్నగారు కూడా వచ్చి మాతోపాటు కలిసి తినేవారు. అమ్మ నాన్నగారి కోసం వెండి పళ్ళెం, నీళ్ళ గాజు గ్లాసు, కాఫీకప్పు విడిగా ఉంచేది. ప్రతి రోజు అందులోనే తినేవారు. మాకెందుకు వెండి పళ్ళెంలో పెట్టవు అని గునిసేదాన్ని. ‘నీ పెళ్ళిలో ఇస్తాను, ఆ తర్వాత నువ్వు అందులోనే తినొచ్చు.’ అమ్మ నవ్వింది. నాకిప్పుడే కావాలని ఒక రోజు మారాము చెసాను. పెళ్ళి చేసుకోకపోతే నాకు వెండిగిన్నె ఇవ్వరేమో అని చాల రోజులు దిగులు పడ్డాను కూడా. బ్రేక్ ఫాస్ట్ తినగానే నాన్నగారు వెళ్లి ఆఫీసు గెటప్ లో టిప్ టాప్ గా రడీ అయి వచ్చి కాఫీ తాగేవారు. ఇస్త్రీ చేసిన తెల్లని షర్ట్, నలగని పేంటు, శాండిల్స్ తో ఉన్న నాన్నగారు ఆఫీసర్ లాగ హాండ్సమ్గా కనిపించేవారు.
వెళ్లే ముందు, టీ తాగి ఆ కప్పు టేబుల్ పై పెట్టి, “హోం వర్క్ బుక్ బేగ్ లో పెట్టుకోవడం మరిచి పోకండి.” ఇద్దరం తలాడించేవాళ్ళం. మా తలపై చేతితో నిమురుతూ నవ్వుతూ ‘గుడ్..గుడ్. అమ్మను విసిగించకండి.’ అంతసేపు కారు కీస్ చేతిలో కదులుతూ ఉంటుంది. ‘బై’ నవ్వుతూ వెళ్లి పోయెవారు. ఈనాటికీ అది నిన్న జరిగినట్టుగానే ఉంది.
ఉదయ్ కాస్త అల్లరి చేస్తే ఎలా బాగుపడతాడో ఏమో అని అమ్మ దిగులు పడేది. ఉదయ్ ని అందరూ ‘పోకిరి’ అనేవారు కానీ సరసి చేసే అల్లరి ముందు ఉదయ్ చాలా నెమ్మది.
‘సరసిని చూస్తే నాన్నగారు ఎంత మురిసి పోయేవారో! గ్రాండు పేరెంట్స్ తో గడపగలగడం కూడా ఒక అదృష్టమే.’ దీర్ఘంగా నిట్టూర్చింది.
‘సరసి తీరే వేరు. తల్లి, తండ్రితో చనువుగా ఉంటూ ఫ్రీగా మనసులో ఉన్నది మాట్లాడు తుంది. ‘ఐ లవ్ యూ’ అని రోజుకు ఎన్ని సార్లైనా చెప్ప్పగలదు. సంతోషంగా ఉంటె వెంటనే కౌగలించుకుని ముద్దు పెడ్తుంది. నేనెప్పుడూ అమ్మకు గాని నాన్నగారికి గాని ‘ఐ లవ్ యు’ అని చెప్ప్పిన గుర్తు లేదు. నాన్నకు నేను, ఉదయ్ అంటే ఎంతో ప్రేమ ఉండేది. నేను, తమ్ముడు ‘నాన్నగారు’ అని పిలిచే వాళ్ళం. అదేమో కానీ మరో విధంగా పిలవడం ఊహకే అందేది కాదు. ప్రేమకు మాత్రం ఎక్కడా లోటుండేది కాదు. ఏదైనా కావాలంటే అడగడంలో, అల్లరి చేయడంలో మేము నాలుగు ఆకులు ఎక్కువే చదివాం. తండ్రి తన నుదుటిపై ముద్దు పెట్టు కోవడం, తలపై ప్రేమగా నిమరడం ఎంతో ఆత్మీయత కనిపించేది.’ అది గుర్తు రాగానే తండ్రిని దగ్గరగా చూడాలని ఉమ మనసెంతగానో తపించింది. చిన్నప్పుడు ఉమను ఎత్తుకుని గిర్రున తిప్పి “నా బంగారు తల్లి” అనేవారు.
ఆయన సంతోషం ఇల్లంతా వ్యాపించేది. కుటుంబంలోని మనుషుల మధ్య అనుబంధాలే వేరుగా ఉండేవి. భావాలన్నీ తెలిసినా బహిరంగంగా చెప్పలేని అదృశ్య నిబంధన. మనుష్యుల మధ్య లేదనిపించే దూరం ఉండేది. కానీ మనసులు కలిసి పోయి ఉండేవి. బందుమిత్రులు అందరూ చేయి చాపితే అందేంత దూరంలో ఉంటూ, పిలిస్తే వచ్చేసేవారు.’
ఆలోచనలు ఆడుకుంటున్నాయి .
‘నాన్నగారు సాయంత్రం రాగానే మాతో కాసేపు ఆడుకునేవారు. అప్పుడప్పుడు మాకోసం పళ్ళు, మిఠాయి, పూలు కొనుక్కొచ్చేవారు. గులాబీలు, మల్లెలు అంటే నాన్నగారికి చాల ఇష్టం. దొడ్లో రెండు గులబీ చెట్లు నాటారు. మొదటిసారి తెల్ల గులాబీ పూవులు పూసినపుడు రెండు తెచ్చి ఒకటి నాకు మరోటి అమ్మకు ఇచ్చారు. మల్లె చెట్టుకు పందిరి కూడా వేసారు. క్రోటన్ మొక్కలను గుండ్రంగా బంతి ఆకారంలో కత్తిరించేవారు.. మేము హోంవర్క్ చేస్తుంటే నాన్నగారు న్యూస్ పేపర్ లేదా ఏవో బుక్స్ చదువుతూ మా పక్కనే కూర్చునేవారు. ఎక్కువగా వివేకానంద బుక్స్ చదవేవారు. అవి పెద్దగా, బరువుగా ఉండటం నాకు బాగా గుర్తు. ఎప్పుడేనా నాన్నగారు పుస్తకంలోని పేజీలు గబగబా తిప్పుతూంటే కోపంగా ఉన్నారని మాకు తెలిసి పోయేది. ఉదయ్, నేను కిక్కురు మనకుండా హోం వర్క్ చేస్కునేవాళ్ళం.
సరసి ఆలోచనే వేరు. సతీష్ కాస్త సీరియస్ గా ఉంటే చాలు రెండు నిమషాల కంటే ఎక్కువసేపు భరించలేక ‘అలా సీరియస్ గా ఉంటే నాకేం బాలేదు. నాకు దిగులుగా ఉంది.’ అని బిక్క మొహం పెడ్తుంది. వెంటనే సతీష్ నవ్వేసి కూతురితో కబుర్లు చెబుతాడు. సరసి కాబట్టి అలా జరిగింది.
నాన్నగారి పుట్టినరోజు నాడు బ్రేక్ ఫాస్ట్ లో తినడానికి ఒక్క గోధుమ రొట్టె నా చేతులతో స్వయంగా చేసి పెనం మీద కాల్చి వడ్డించాను. నాన్నగారు ఎంత ఇష్టంగా తిన్నారో నాకు ఇంకా గుర్తున్నది. దగ్గర ఉండి కూర కూడా వడ్డించాను. స్కూల్లో నా స్నేహితులందరికి చెప్పాను. తర్వాత అమ్మ నాకు రొట్టె చేయడం నేర్పించినపుడు చెప్పింది మందంగా చేస్తే రొట్టె కాలక పిండి పిండిగా ఉంటుందని. పెద్దయ్యాక చాలాసార్లు చేసాను. కానీ నేను నాన్నగారికి చేసి వడ్డించడం నా ఖజానాలో దాచుకున్నాను.
కొన్నిసార్లు అందరం పార్కుకు వెళ్ళేవాళ్ళం, వచ్చేప్పుడు హోటల్లో డిన్నర్ తిని వచ్చేవాళ్ళం.
అది నా ఫెవరేట్ డే. అమ్మ, నాన్న కలిసి సాయంత్రాలు బయట కెళ్ళడం తక్కువే. ఎప్పుడేనా వెళ్ళడానికి అమ్మ తయారవుతూ ఉంటే నేను అమ్మ దగ్గరే నుంచుని చూసేదాన్ని. నీలం చీర, ముత్యాల గొలుసు, ముత్యాల కమ్మలు పెట్టుకుని అమ్మ చాల అందంగా ఉంది. నాన్నగారు కూడా తెల్ల బట్టలు వేసుకుని విజిల్ వేస్తూ కారు కీస్ ఊపుతూ నిలబడ్డారు. ఎడేళ్ళున్న నాకు నేను వేసుకున్న ఆకుపచ్చ ఫ్రాకు బరువై పాతదనిపించింది. వాళ్లతో వెళ్ళనందుకు అలా అనిపించిందని తర్వాత తెలుసుకున్నాను. నాన్న నన్ను దగ్గరగా తీసుకుని ‘రాములమ్మను విసిగించకుండా తమ్ముడితో ఆడుకో. నీకు మిఠాయి తెస్తాగా అమ్మకు చెప్పకు.’ అని నా చెవిలో రహస్యం చెప్పారు. నా రెండు చేతులు పట్టుకుని సుతారంగా ‘లాలలా లాలా’ పాట విజిల్ వేస్తూ ఇంగ్లీషు మూవీలో లాగ డాన్స్ చేసాం. ‘నా బంగారు తల్లివి.’ అని ముద్దిచ్చారు. అవి నా జీవితంలోని బంగారు ఘడియలు. నాన్న నా ఎవర్ గ్రీన్ హీరో.
శనివారం వేంకటేశ్వరుని గుడికి వెళ్లి నపుడు అమ్మ అన్నం లడ్డూలు చేస్తుంది. నాకు అవి చాల ఇష్టం. అన్నం, ఆలుగడ్డలు ఇంకా చాలా వేసి వండాక నాన్నగారు, అమ్మ ఇద్దరూ కలిసి వాటితో పెద్ద లడ్డూలు కట్టేవారు. నా రెండు చేతులలో కూడా పట్టనంత పెద్దగా ఉండేవి. వాటిని గుడి ముందు కూచునే బిచ్చగాళ్ళకి ఒక్కొక్కరికి ఒకోటి పేపర్లో పెట్టి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు సంతోషంగా తింటూంటే నేను, ఉదయ్ కూడా ఉత్సాహంతో ఇచ్చి ఆ తర్వాత గుళ్ళో కేల్లెవాళ్ళం. ‘వాళ్ళ కడుపులో దేవుడుంటాడు. మనం ఇచ్చిన ఆహరం తిని ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు’ అని నాన్నగారు చెప్పారు. అలాంటి సంఘటనలు ఎన్నింటినో నా ఖజానాలో దాచుకున్నాను.
*****************
“మాం!” స్కూల్ నుండి వచ్చిన సరసి తల్లి మొహం చూసి,
“మదర్ థెరీసా! సేవలతో అలసి పోయావని ఫేస్ చెప్తోంది. నేను హెల్ప్ చేస్తాను, ఏ పని చేయాలి?”
“నేను చేసుకుంటాలే. నువ్వెళ్లి నీ హోమ్ వర్క్ చేసుకో. ఈ రోజు నా ఖజానా తెరిచి నా నాన్నగారిని ఆహ్వానించాను.”
“నేను కూడా గ్రాండ్ పాను మిస్సవుతున్నాను మమ్మీ. ఉంటే ఎంత బావుండేది. సియ గ్రాండ్ పా లాగే నాక్కూడా అన్నీ కబుర్లు చెప్పుకోవడానికి బావుండేది.”
“అవును, ఉంటే చాలా బావుండేది. ఎనిమిదేళ్ళ క్రితం ఈ రోజు నేను గ్రాండుపా దగ్గిరే ఉన్నాను.”
“అప్పుడు నన్ను సియ వాళ్ళింట్లో వదిలి వెళ్ళావు. నాకు గుర్తుంది మమ్మీ.”
“అవును ఇండియా నుండి వచ్చిన మూడు నెలలకే మళ్ళి వెళ్ళాల్సి వచ్చింది.”
సరసి తల్లికి దగ్గరగా వెళ్లి హగ్ కిస్ ఇచ్చి, తల్లి మొహంలోకి కాసేపు చూసి హోమ్ వర్క్ లో మునిగిపోయింది.
ఎనిమిదేళ్ళ క్రితం ఉన్నట్టుండి తండ్రిని చూడాలనే బలమైన కోరిక కలగడంతో వెంటనే సరసిని తీసుకుని ఇండియా వెళ్ళింది ఉమ. ఆరునెల్ల క్రితమే ముగ్గురూ వచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్ళారు. ఉమ కూతురితో మళ్ళి రావడం, సతీష్ వెంట లేకపోవడంతో చూసి కూతురిని గుచ్చి గుచ్చి ప్రశ్నలేసాడు తండ్రి. చూడాలని అనిపించి వచ్చానంది. తండ్రిలో వచ్చిన మార్పు చూసి గాబరాపడింది. ఒక్కుమ్మడిగా వయస్సంతా వచ్చి మీద పడ్డట్టుగా చిక్కిపోయి ఉన్నాడు. విజిల్ వేస్తూ ఎంతో తీయగా పాటలు వినిపించే నాన్న ఇప్పుడు ఊపిరి తీయడానికే బాధ పడ్తున్నారు.
డాక్టరు దగ్గరకు వెళ్దామని ఉమ ఎంత వత్తిడి చేసినా ఆరోగ్య సమస్య ఏమీ లేదు. వయస్సు నాతో పరాచికాలాడుతోంది అంటూ నవ్వాడు. తరుచుగా అలసిపోయి వెళ్లి విశ్రాంతి తీసుకునేవాడు. అతనిలో తిండి మీద అయిష్టం, మనుషుల మీద నిరాసక్తత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో, ఒంటరిగా ఉండటం విషయంలో ఉదయ్ ఎన్నిసార్లు వాదించినా, ప్రేమగా చెప్పినా అతను అసలు పట్టించు కునే వాడు కాదు’.
ఉమ, సరసి ఉన్న మూడు వారాలు సంతోషంగా గడిపాడు. తిరిగి అమెరికా ప్రయాణం రెండు రోజుల్లో ఉంది. ఉమ మనసులో అలజడి. డేట్ మార్చుకుని ఇంకా కొన్ని వారాలు ఉండాలనుకుంది. కానీ తండ్రి ససేమిరా కుదరదు సతీష్ ఒక్కడే ఉంటాడు వెళ్ళాల్సిందే అన్నాడు.
ఎయిర్ పోర్టులో ఓపిక లేకున్నా చాలా సేపు అలా నిలబడి ఉమను, సరసిని చూస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.‘నాన్నగారు! మీ ఆరోగ్యం జాగర్తగా చూసుకోండి.’ అంటున్న ఉమను గుండెలకు హత్తుకున్నాడు. ‘నా బంగారు తల్లి’ అంటున్న నాన్నగారి కళ్ళ ల్లోంచి నీటి చుక్కలు రాలాయి.’
ఏనాడూ తండ్రి కళ్ళల్లోంచి నీళ్ళు రావడం చూడని ఉమకు గాబరాగా అనిపించింది. కంటిలో ఊరె నీటిని వెంట వెంటనే తుడుచుకుంటున్నాడు. -ఆ కొద్ది క్షణాలు కనిపించే బిడ్డలను స్పష్టంగా చూడాలని గాబోలు. ఉమ కూడా కన్నీటిని తుడుచుకుంటూ తండ్రిని అతను ఊపే చేతిని చూస్తూ తండ్రి ప్రతిమను మనసులో నిలుపుకుంది. కనుమరుగయ్యే వరకు ఊపుతున్న తండ్రిని చూస్తూ తాను చెయ్యి ఉపుతూ వెనక్కి మరీ మరీ చూస్తూ ఉమ ముందుకు కదిలింది. అదే ఆఖరి చూపు అవుతుందని ఉమ అనుకోలేదు.
ఆ తర్వాత మూడు నెలలకే తండ్రి సీరియస్ అని ఉదయ్ చెప్పడంతో ఉమ వెంటనే ఇండియా వచ్చినా స్పృహలేని తండ్రిని ఐ సీయులో చూసింది.
తండ్రి చిక్కి పోవడానికి కారణమేమిటోఉదయ్ చెప్పే వరకు ఉమకు తెలీదు. నాన్నగారికి డిప్రెషన్ ఒక వ్యాధిలా ముదిరిందని డాక్టర్ చెప్పాడట. అమ్మ చనిపోయాక నాన్నగారు ఎప్పుడూ సంతోషంగా లేరు. వాళ్ళ పెళ్ళయ్యాక నాణేనికి రెండు వైపులా ఉండే బొమ్మ, బొరుసులాగ బతికారు. ఎటూ వెళ్ళినా, ఏం చేసినా ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. అమ్మ లేని జీవితం ఎంత శూన్యంగా ఉందో! తిండి మీద ధ్యాస లేదు. మనుషుల మీద ఆసక్తి లేదు. అన్నాళ్ళ అనుబంధం! అతన్ని తీరని మనోవేదన తినేస్తోంది.
‘నాతో వచ్చేయండి నాన్నగారు’ విషాదాన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తూ, ‘అమ్మ పోయిన ఇంట్లోంచే నేను పోతానమ్మా, నాకిక్కడే ఉండాలని ఉంది. ఉదయ్ కు కూడా ఈ మాటే చెప్తున్నాను.’
‘ఆ మాటల విన్నాక మరెప్పుడూ నాతో రమ్మని అడగలేదు. దేనికి బలవంతం చేయలేదు’. ఎంత శక్తిని పుంజుకుని ఎయిర్ పోర్టుకు వచ్చి ఉంటాడో తలుచుకుని ఉమ రోదించింది.
ఈ పరదేశం వెళ్ళడం, ఈ దూరాలు ఎందుకు ఏర్పరచుకున్నాము అని ఉమ మనసు విల విల లాడింది. ‘విదేశాలకు వెళ్తుంటే ఆప్తులను వదిలి వెళ్ళాలి, ప్రాణాలు పొతే ఆప్తులను వదిలిపోవాలి. అందల మెక్కిస్తూ, అధః పాతాళానికి తోసే ఈ ఆత్మీయత, ఈ అనుబంధం ఎందుకు సృష్టించావు భగవంతుడా! ఈ మనఃస్తాపాన్ని దాటటానికి ఆధ్యాత్మిక చింతన అన్నావు కాని ఆ జ్ఞానం లేని వాళ్లు కోకొల్లలు ఇలా నలిగి పోవలసిందేనా!’ ఉమ మనసు బాధతో సుళ్ళు తిరిగింది.
పియానో చప్పుడు వినిపించి ఉమ తానున్న ప్రపంచంలోంచి బయటికి వచ్చి కళ్ళు తుడుచుకుంది. ఉమ మనసు ఇప్పుడు కాస్త తేలికగా ఉంది. ఉదయమంత బరువుగా లేదు.
సరసి పాడుతూ పియానో ప్లే చేస్తోంది.
“మాం! నా హోమ్ వర్క్ అయిపొయింది. ఓ..నువ్వింకా అలాగే ఉన్నావా! మమ్మీ! తాతయ్య అరవై ఏళ్లకే చనిపోయాడు. సియ తాతయ్య డేబ్బైఐదు ఉంటాడు. సియతో చాల గేమ్స్ ఆడతాడు. నా తాతయ్యకు ఏమయింది మమ్మీ?”
“అందరు ఒక్కలాగే ఉండరు. కొందరు ధృడంగా ఉండి ఎక్కువకాలం జీవిస్తారు. తాతయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చింది. బలహీనంగా ఉండటంతో తట్టుకోలేకపోయారు. మన అదృష్టం నువ్వు, నేను వెళ్లి మూడు వారాలు తాతయ్యతో సంతోషంగా గడిపాం.”
“తాతయ్యను మన దగ్గరనే ఉంచుకుంటే మనం జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం కద మమ్మీ.”
“అవును. తాతయ్యకు ఆ ఇల్లు వదిలి ఎవరి దగ్గరా ఉండటం ఇష్టం లేదు. అందుకే తాతయ్య బెంగుళూరులో ఉన్న ఉదయ్ మామ దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఆ ఇంట్లోనే ఉండాలని అతని కోరిక.”
ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనే ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, ఒంటరి తనాన్ని భరించలేక డిప్రెషన్ లో జీవిస్తున్నాడని ఆ బలహీనతలో హార్ట్ ఎటాక్ ను తట్టుకోలేక పోయాడని సరసికి ఎలా చెప్పాలో ఉమకు తట్టలేదు.
నా మనసులోని ఖజానా తెరిచి దుఃఖించే నా మనసును ఓదార్చాను.
‘నాలాగా సరసికి కూడా మరపురాని సంఘటనలు ఉంటాయా! నాలాగే ఖజానాలో దాచు కుంటుందా!’
ప్రదర్శించే పద్దతి వేరైనా ఆనాడు ఈనాడు అంతే ప్రేమ అంతే ఆత్మీయతలు ఉన్నాయి. ఆశలు, అవకాశాలు తన మనసును లొంగ దీసుకోకుండా ఉంటే సరసి కూడా నాలాగే అతి ప్రియతమమైన బంధాలను తన ఖజానాలో దాచుకుంటుంది.
మనసులో ప్రేమ ఉండాలే కాని బంధాలు నిలవడానికి ఏ పద్ధతి అయితేనేమి! భగవంతుడి పై మనసుండాలే కానీ యోగమైనా, యాగమైనా– సన్యాసమైనా, సంసారంమైనా గమ్యం ఒక్కటే. అన్నింటికి మనసు ఉండాలి, ఆ మనసులో ఉండే పవిత్రమైన ప్రేమ ముఖ్యం.

***** సమాప్తం *****

నిన్నే ప్రేమిస్తా………

రచన: మణికుమారి గోవిందరాజుల

“యేమిటలా చూస్తున్నావు?”
“స్ఫటికం లాంటి నీ మనసుని. యెంత స్వచ్చంగా మెరిసిపోతూ కనపడుతున్నదో” తన్మయంగా అన్నది.
“నా మనసులో యేముంది? నిన్ను నువ్వు చూసుకో యెంత అందంగా కనపడతావో?”
“నేనా? అందంగానా? వెక్కిరిస్తున్నావా? యెటుపోయింది ఆ అందమంతా?” దుఃఖంతో గొంతు పూడుకు పోయింది.
“మై డియర్ సాజీ నాకు ఇప్పుడు నువు వేరేగా కనపడవు. అప్పుడెలా వున్నావో ఇప్పుడూ అలానే కనపడతావు”
“అయినా ఇదిగో ఇలా మాట్లాడావంటే నేను నీ దగ్గరికే రాను” బెదిరించాడు.
“లేదు..లేదు.. ఇంక అలా మాట్లాడను.” చున్నీతో కళ్ళు తుడుచుకుంది.
“చూడు శ్రీ ఇన్నాళ్ళకు భగవంతుడు నా కళ్ళు నేనే తుడుచుకుందుకు చేతులిచ్చాడు” నవ్వింది.
“ఓకే ..ఓకే.. ఇక అలా మాట్లాడను” అలిగినట్లుగా పోజు పెట్టి కూర్చున్న శ్రీకర్ ని చూస్తూ చేతులు చాపింది.
యెదురుగా ఇంకో కుర్చీలో కూర్చున్న శ్రీకర్ లేచి వచ్చి ఆమె పక్కన కింద కూర్చుని చాపిన ఆ చేతులను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆ చేతులను తన మెడ చుట్టూ వేసుకుని ఆమె మోకాళ్ళమీద తల పెట్టుకున్నాడు.
“శ్రీ “
“ఊ!”
“ఇదంతా నిజమే నంటావా?నా చేతులకు తగులుతున్న నీ శరీర స్పర్శ నిజమేనంటావా? నా కళ్ళకు కనపడుతున్న నువ్వు నిజమేనంటావా?కల కాదు కదా?”బేలగా అడిగింది.
తన మెడ చుట్టూ వేసుకున్న ఆమె యెడమ చేతిని తన కుడి చేత్తో పట్టుకుని సున్నితంగా తన చెంప మీద కొట్టుకున్నాడు.
“నా చెంప పగిలినంత నిజం సరేనా?”
తన రెండు చేతులతో శ్రీకర్ మొహం, నుదురు,కళ్ళు, పెదాలు, గడ్దం నిమురుతూ “నిజంగా నిజం. నిజంగా నిజం” అనుకోసాగింది.
“అమ్మాయ్! ఇక నన్నొదిలితే ఆఫీసుకు వెళ్ళొస్తాడీ దీనుడు.”
“ఇంకొద్ది సేపు వుండొచ్చుకదా?”
“నాకు మటుకు వెళ్ళాలనుందేమిటి? కానీ తప్పదు కదా?”
“నా వల్లే కదా నీకీ కష్టాలు? నీకు అవసరం లేని బాధ్యత నెత్తిన వేసుకున్నావు.” బాధగా అన్నది. కళ్ళల్లో నుండి అశ్రువులు రాలాయి.
“నేనిది బాధ్యత అనుకోవడం లేదు సాజీ” ప్రేమగా ఆమె కళ్ళు తుడిచి ముంగురులు సవరించాడు. “నన్ను నేను కాపాడుకుంటున్నాను”
“అవును కానీ ఈ రోజు ఫిజియోథెరపిస్ట్ వచ్చి వెళ్ళిందా? ఆమె చెప్పినట్లు చేస్తున్నావా? చాలా బాధ వుంటుంది కాని గుడ్ గర్ల్ లాగా ఆమె చెప్పినట్లు చేసెయ్యాలి మరి. నువు యెంత తొందరగా కోలుకుంటే మనం అంత తొందరగా కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు మరి.” మాట మార్చి వూరించాడు.
“నువు నా గురించి పడుతున్న కష్టం ముందు నేను పడే బాధ యేపాటిది శ్రీ? యెంత బాధనైనా భరించే శక్తి నీ అపారమైన ప్రేమ నాకంద చేస్తున్నది. అయినా యెందుకు? యెందుకు శ్రీ? నా గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఇప్పటికి నాలుగు సంవత్సరాలయింది ..వేరే సరదాలు వేరే ప్రపంచం లేకుండా నా గురించే ఆరాటపడ్డావు, పడుతున్నావు. నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకుని వొంటరి పోరాటం చేసావు. యెంత సర్దుకుందామన్నా నీ బాధ చూస్తుంటే తట్టుకోవడం నా వశం కావడం లేదు. ఇంకా యెన్నాళ్ళిలా అనే ప్రశ్నకు బదులే లేదు. వదిలేయ్ శ్రీ.. నా మానాన నన్ను వదిలేసి నువన్నా హాయిగా వుండు..”
“వదిలేసి పోవడానికి, నువు బాగున్నప్పుడు నువు అందంగా వున్నావని నిన్ను కామించలేదు సాజీ..అప్పుడూ ప్రేమించాను. ఇప్పుడూ ప్రేమిస్తున్నాను.ఈ మాట యెన్నిసార్లు చెప్పడానికైనా నాకు ఓపిక వుంది. చెప్తూనే వుంటాను… ఐ లవ్ యూ..ఐ లవ్ యూ…” గట్టిగా అన్నాడు.
“యెన్ని వూసులు చెప్పుకున్నాము? యెన్ని కలలు కన్నాము? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించు కున్నాము. అదంతా అంతా బాగుంటేనేనా? ఇప్పుడు నీకు బాలేదని నిన్ను వదిలేసి నా దోవ నేను చూసుకుంటే దాన్నేమంటారు? నిన్ను వదులుకుంటే నన్ను నేను వదులుకున్నట్లే. ప్రేమంటే నమ్మకం. ప్రేమంటే భరోసా.. ఆ నమ్మకం, ఆ భరోసా మన ఇద్దరి మధ్యా మనం జీవించి వున్నంత కాలం వుండాలి..,వుంటుంది… అయినా అన్నీ బాగుండి అంతా బాగుంటేనేనా ప్రేమ నిలిచేది? నా అదృష్టం బాగుంది కాబట్టి నీకేమీ కాలేదు.” తృప్తిగా నిట్టుర్చాడు…
“నాకేమీ కాలేదా? మూడేళ్ళు కోమాలో వున్నాను. తెలివొచ్చి ఆరు నెలలు మంచంలో వున్నాను. అయిదు నెలల క్రితం వరకు కళ్ళు తప్ప యే అవయవం కదల్లేదు. నాలుగు నెలల క్రితం వరకు మాట కూడా లేదు. మూణ్ణెల్ల నుండే కదా లేచి కూర్చుంటున్నాను. ఇంకా నడక రానే లేదు. యెక్కడి నుండి డబ్బు యెలా తెస్తున్నావో తెలీటం లేదు .యెలా అయిపోయావో చూడు?”
“ఇదిగో చూడు ..పలుకులకు చిలకలు ఇప్పించలేదనే కదా నీ గొడవ ఇప్పిద్దాములే.. అడుగులకు అరిశలు కూడా ఇప్పిస్తాను సరేనా?” నవ్వుతూ తేల్చేసాడు.
“అయినా నువు చెప్పిన దాన్ని బట్టే తెలుస్తున్నది కదా ఇంప్రూవ్ మెంట్ యెంత బాగా వున్నదీ?..డబ్బు దేముంది? అంతా పోయినా కూడా నువు జీవంతో వున్నావు. అదే పదివేలు. యెప్పటికైనా లేచి తిరుగుతావు అన్న వూహే నాకు బలాన్ని ఇస్తున్నది. సాజీ… నా చేతిలో విద్య వున్నది. గుండెల్లో నువున్నావనే ధైర్యం వున్నది. నీకేమన్నా అయిన నాడు నేను కూడా వుండను..”
చటుక్కున శ్రీకర్ నోటికి చేయి అడ్డం పెట్టింది అలా మాట్లాడొద్దన్నట్లుగా.. చేయి తప్పించి మళ్ళీ చెప్పసాగాడు..
“కోమాలో నుండి బయటపడ్డాక నీ పరిస్తితి యెలా వుంటుందో చెప్పలేమన్నారు డాక్టర్లు. యెంత భయపడ్డానో…యెన్ని..యెన్ని రాత్రుళ్ళు నిన్నే చూస్తూ గడిపానో … యెంతమంది ..దేవుళ్ళకు మొక్కు కున్నానో..యే దేవుడు కరుణించాడో నీకు తెలివి రావటమే కాకుండా అన్నీ చక్కగా గుర్తున్నాయి.. చక చక నడిచేసేయ్…ఇద్దరం కలిసి వెళ్ళి అన్ని మొక్కులూ తీర్చుకుందాము.” వుత్సాహపరిచాడు.
“సాజీ ! ప్లీజ్. నువు సంతోషంగా వుంటేనే తొందరగా కోలుకుంటావు. లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్తావు..డాక్టర్స్ మరీ మరీ చెప్పారు. నువు మనసులో కూడా బాధ పడకూడదని.. నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వాళ్ళను నేనేమీ వదులుకోలేదు. వాళ్లు నన్ను వదల్లేదు. వాళ్ళ సహకారం లేకుంటే నేనేమీ చేయలేకపోయేవాడిని. మొదట్లో యేదో అన్నారు ..తలిదండ్రులు కదా వాళ్ళకేవో ఆశలు వుంటాయి మరి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు.. అందుకే నా కంటే వాళ్లే నిన్ను యెక్కువగా కనిపెట్టుకుని వుంటున్నారు.” ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు.
“ఒక తపస్సు లాగా నిన్నీ స్థితికి తెచ్చుకున్నాను డియర్ . ఇక అలసిపోయాను. సాజీ.. నేను డిప్రెషన్ లోకి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత నీదే మరి. లేదంటే మళ్ళీ మన జీవితంలోనుండి నాలుగేళ్ళు మైనస్ అవుతాయి. ఛీరప్ బేబీ…. ఇప్పుడు కాస్త వీల్ ఛెయిర్ లో తిరుగుతున్నావు కదా ?త్వరలోనే నీ కాళ్ళ మీద నీవు నిలబడతావు. తొందరలో మనం ఇంటికెళ్తాము ప్రామిస్…ప్లీజ్ నిరాశను నీ దరి చేర నివ్వకు..అది నిన్నూ నన్నూ కూడా తినేస్తుంది. నాకు ఆఫీస్ టైం అవుతున్నది. పరిగెత్తుకుని సాయంకాలం వస్తాను సరేనా?రోజంతా నీ పక్కనే వుండాలనిపిస్తున్నది డియర్…కాని వుద్యోగ ధర్మం తప్పదు ” నుదుటి మీద చుంబించి వదిలేసాడు.
“ఓకే! మరి నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళు… ఈ రోజు ఇంకో గంట యెక్కువ కూర్చుంటాను.”
“గుడ్ గర్ల్” మెచ్చుకున్నాడు.
అలా సాజీని యెత్తి అపురూపంగా వీల్ ఛెయిర్ లో కూర్చోబెట్టాడు.
“ఓకే! బై బై డియర్..” చెప్పి వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళాడు శ్రీకర్.
********************
సహజ కోమాలో నుండి బయటకు వచ్చాక అన్ని నెలలు మంచంలో నిద్ర పోతున్నట్లు వున్నా మనం చెప్పేవి తనకు వినపడి అర్థం చేసుకో గలుగుతుందని , ప్రమాదం విషయం కూడా చెప్పమనీ అందువల్ల పూర్తి తెలివి వచ్చాక దాని ఇంపాక్ట్ తక్కువుంటుందనీ డాక్టర్లు చెప్పడంతో శ్రీకర్ పక్కనే కూర్చొని సహజ వినే దానితో సంబంధం లేకుండా యెన్ని కబుర్లో చెప్పేవాడు. అందువల్ల శ్రీకర్ ఒక విషయం కాదు మామూలు మనుషులతో యెలా మాట్లాడతారో అలా అన్ని విషయాలు మాట్లాడేవాడు. డాక్టర్లు చెప్పినట్లుగానే అన్నీ అర్థమవుతుండేవి సహజకు. కానీ కన్ను కూడా కదల్చ లేకపోయేది. అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో సడన్ గా ఒక రోజు కళ్ళు తెరిచి అందర్నీ చూడటం మొదలు పెట్టింది. మెడికల్ హిస్టరీలోనే చాలా ఆశ్చర్యమనీ అంతా శ్రీకర్ కృషి ఫలితమనీ వైద్యులు చెప్పారు.
తెలివి వచ్చిందే కాని కొద్దిగా లేచి కూర్చోగలగడానికి తొమ్మిది నెలలు పట్టింది. కొద్దిగా కూర్చొని కాళ్ళు చేతులు కదిలించడం మొదలు పెట్టగానే లాప్ టాప్ తెచ్చివ్వమంది. శ్రీకర్ కి సహజ తెలివితేటల మీద గొప్ప నమ్మకం వుంది. అందుకే వెంటనే అడిగినవన్నీ సమకూర్చాడు. ఒక పదిహేను రోజులు కంప్యూటర్ నాలెడ్జి అంతా రీకలెక్ట్ చేసుకుంది. పదిహేను రోజులు అన్ని జాబ్స్ కి అప్ప్లై చేస్తూ కూర్చుంది. చివరికి పెద్దది కాకపోయినా టైంపాస్ జాబ్ దొరికింది.. యేదైనా మొదలు మెదడుకి మేతలాగా యేదో ఒక పని చేయకపోతే ఆలోచనలు యెక్కువవుతాయని శ్రీకర్ అభ్యంతరం చెప్పలేదు
చిన్నగా వీల్ ఛెయిర్ ని జరుపుకుంటూ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళింది సహజ. వెళ్ళిందే కాని పని మీద ధ్యాస నిలవడం లేదు.
చదువుకునే రోజుల్లో కాలేజీలో పరిచయమయ్యాడు శ్రీకర్.
శ్రీకర్ వ్యక్తిత్వం, స్త్రీలను గౌరవించే విధానం యెంతో ఆకట్టుకున్నాయి సహజను.
సహజ రూప లావణ్యాలే కాకుండా , ఆమె స్నేహస్వభావము,అందరితోను కలుపుగోలుగా వుండడం , వెనుకా ముందూ చూడకుండా అందరికీ సహాయం చేసే తీరు చూసి ముగ్ధుడయ్యాడు శ్రీకర్. యెప్పుడు జరిగిందో తెలీకుండానే ఒకరినొకరు ఇష్టపడటం మొదలయింది. సాధారణ కుటుంబమని మొదలు వద్దన్నా తప్పదని ఒప్పుకున్నారు తలితండ్రులు. పెళ్ళి ఇక నెల రోజుల్లో కొచ్చేసింది.
ఆ రోజు గుర్తొచ్చేసరికి భయంతో వొళ్ళు జలదరించింది సహజకు.
ఆ రోజు శ్రీకర్ తానూ కలిసి షాపింగ్ చేసుకుని ఎంఎంటీసీ కోసమని స్టేషన్ కి వచ్చారు. ట్రైన్ వస్తున్నట్లుగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ప్లాట్ఫామ్ మీదికి రైల్ వచ్చేస్తున్నది.ఇంతలో ఒక మూడేళ్ళ బాబు, తలితండ్రులు యేమయ్యారో, బంతితో ఆడుకుంటూ ప్లాట్ ఫారం చివరికి వెళ్ళిపోయాడు. చేతిలో వున్న బంతి కిందపడి దొర్లుకుంటూ పట్టాలమీదికి వెళ్ళిపోయింది. బంతి కోసమని యేడుస్తూ ప్లాట్ ఫాం దిగడానికి ట్రై చేయబోతున్నాడు బాబు.అందరూ అరుస్తూ కేకలు పెడుతున్నారు.
పక్కనే శ్రీకర్ తో మాట్లాడుకుంటూ ఆ కేకలు విని అదాటుగా అటు చూసిన సహజకు గుండాగినంత పనయింది. పరుగునా వెళ్ళి బాబుని లాగి ఇవతలికి పడేసింది. ఆ వూపులో అప్పుడే వస్తున్న రైలుకి ప్లాట్ ఫాం కి మధ్యలో పడటం రైలు కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్ళి వదిలేయడం కన్ను మూసి తెరిచినంతలో జరగడంతో శరీరం లో ప్రాణం వుందే కాని విరగని యెముక లేదు. సహజకు ఆ క్షణంలో తల వెళ్ళి రైలుకు కొట్టుకోవడం వరకే స్పృహలో వుండడంతో గుర్తుంది. మళ్ళీ మూడేళ్ళ తర్వాత తెలివి రావడమే.
కోమాలోకి వెళ్ళడమంటే ప్రాణం పోయిన వాళ్ళతో సమానమని సహజ పేరెంట్స్ తో సహా యెంత మంది చెప్పినా శ్రీకరు సహజ చెయ్యి, ఆమెకు బాగవుతుందన్న ఆశ వదల్లేదు. తనకొచ్చిన వాటామొత్తం అమ్మేసి హాస్పిటల్ బిల్లు కట్టాడు. ఈ విశయాలన్నీ రోజు సహజ కోమాలో వున్నప్పుడూ,ఆ తర్వాత కళ్ళు తెరిచాక చెప్తూ వుండేవాడు శ్రీకరు.
అన్నీ కాకపోయినా కొన్ని గుర్తుండేవి. కళ్ళతో పాటు మెమొరి కూడా రావడంతో తర్వాత అన్నీ గుర్తు వచ్చాయి సహజకు. తనకు పునర్జన్మనిచ్చిన శ్రీకరు మీద,అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని తనకు దగ్గర చేసిన దేవుడి మీదా చాలా ప్రేమ భక్తి కలిగాయి సహజకు. ఆలోచనల్లో సమయం తెలియలేదు …..
“హల్లో సహజా..యెలా వుందీ రోజు?”పలకరించుకుంటూ లోపలికి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ ని చూసి
“హలో ఆశా ! బాగున్నాను..హౌ ఆర్ యు?” తను కూడా నవ్వుతూ పలకరించింది..
“యేడి?మీ హీరో?ఇంకా రాలేదా?”
హాస్పిటల్లో అందరికీ కూడా శ్రీకర్ ని చూస్తే హీరో వర్షిప్..అందరూ హీరో అని పిలుస్తుంటారు
“వచ్చే టైం అయింది..ఇప్పుడు మన టైం కదా ?ఇదవ్వగానే వస్తాడు.మొదలు పెడదామా”
ఆశాకి సహజ ఇచ్చే కో ఆపరేషన్ యెంతో నచ్చుతుంది…రెగ్యులర్గా చేయించేవన్ని చేయించి వెళ్ళిపోయింది. నర్స్ వచ్చి స్నానం చేయించి చక్కగా పక్క దులిపి చిన్నగా పక్క మీద పడుకోబెడుతుండగా శ్రీకరు వచ్చాడు.
లోపలికి వస్తున్న శ్రీకరుని కళ్ళ నిండుగా చూసుకుంది సహజ.దగ్గరికి రమ్మన్నట్లుగా చెయ్యూపింది ..ఆ లోపలే వచ్చి పక్కన కూర్చున్నాడు
“శ్రీ! యే జన్మలో యే పుణ్యం చేసుకున్నానో ఇంత అదృష్టవంతురాలనయ్యాను. ఇంతగా ప్రేమించటం యెవరివల్ల నన్నా అవుతుందా? డబ్బు అందం చదువు ఇప్పుడు ఆకారంలో ,అన్నిటిలో నేను చాలా సామాన్యురాలిని. శ్రీ! నిన్నందుకునే అర్హత నాకు లేదు. ఇది చివరివరకూ వుంటుందా అని భయంగా వుంటుంది” కళ్లు భయంతో రెపరెప లాడాయి.
యెంతటి ట్రౌమా నుండి సహజ బయట పడిందో శ్రీకరుకి తెలుసు. ఆ భయంలో యెటువంటి అనుమానాలొస్తాయో వూహించగలడు.
“పిచ్చి సాజీ! నువు మాటా పలుకూ లేనప్పుడే నీ చెయ్యి వదల్లేదు. ఇప్పుడు వదుల్తానా?నో వే! కోటి సార్లు చెప్పనా నిన్నే ప్రేమిస్తా అని? చూడు నా గుండె లబ్ డబ్ బదులు సాజీ సాజీ అని కొట్టుకుంటుంది” సహజ తలని సుతారంగా యెత్తి తన గుండెకు ఆనించుకున్నాడు.
“అన్నయ్యా పబ్లిగ్గా ఈ వేశాలేంటి?మేమొప్పుకోము” నవ్వుతూ లోపలికి వచ్చారు శ్రీకర్ చెళ్ళెళ్ళిద్దరూ.. ఆ వెనకే “హ్యాపీ బర్త్ డే డియర్ సాజీ” పాడుతూ సహజ పేరెంట్స్, ఫ్రెండ్స్, శ్రీకర్ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ లీడ్ చేస్తూ శ్రీకర్ తల్లితండ్రులూ వచ్చారు….
శ్రీకర్ కి తెలుసు సహజ ఇక జీవితాంతం నడవలేదన్న సంగతి. కాని ప్రేమించటం మాత్రమే తెలిసిన శ్రీకరుకి సహజ నడవగలుగుతుందా లేదా, అందంగా వుందా లేదా అన్న దానితో సంబంధం లేదు.. కాని ఆశ మాత్రం వుంది తన ప్రేమతో నడిపించగలనని….
శ్రీకరు ఆశ తీరాలని మనం కూడా ఆశపడదాము మరి.

శుభం..

వీరి తీరే వేరయా…

రచన: పద్మజ యలమంచిలి

నోరాడినట్టు రాలాడుతుంది అంటే ఏమిటో కొంతమందిని చూస్తే అర్ధమైపోతుంది!
ఏమాత్రం వళ్ళు వంచరు.. సుఖాలకు, జల్సాలకు అలవాటు పడిపోయి ఎంతకైనా దిగజారిపోతారు. సంఘంలో ఇలాంటి చీడ పురుగుల వల్ల మొత్తం స్త్రీ జాతినే అసహయించుకునే పరిస్థితి వస్తుంది..అయినా అది వారికి పట్టదు!

*********

చిన్నప్పటినుండీ ఇద్దరమూ ఒకే స్కూల్లో చదవడం వల్ల దుంధుభిని దగ్గరనుండి గమనించేదాన్ని.
తనకు కావాల్సింది కష్టపడకుండా ఎదుటివారిని ప్రలోభాలకు గురిచేసో, మాటలతో బురిడీ కొట్టించో సాధించుకునే తత్వం!
తెల్లగా, బారుగా వివిధ అలంకరణతో అందంగానే కనిపిస్తుంది .
జయసుధలా ఉన్నానని అందరూ తన వెంట పడుతున్నారు అని మురిసిపోయేది..
అలా వెంటపడిన ఒకరితో ప్రేమలో పడింది కానీ…
పెళ్ళిపేరెత్తేసరికి ఒక్కరూ కనపడకపోవడంతో తండ్రి చూసిన సంబంధమే చేసుకోవాల్సివచ్చింది..
తండ్రి పేరున్న రాజకీయనాయకుడి తమ్ముడే అయినా ఆర్ధిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే.. ముగ్గురి ఆడపిల్లలకు గంతకు తగ్గ బొంతలను చూసి పెళ్ళిళ్ళు చేసేసాడు.
మిగిలిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నదాంట్లో పొదుపుగా గుట్టుగా సంసారం చేస్తూ బాగా కూడబెట్టి స్థిరపడ్డారు .
దుంధుభి మాత్రం చాలా అసహనంగా..తన అందానికి తగ్గ సంబంధం కాదని నిరుత్సాహంగానే ఉండేది .. పెళ్ళైన కొత్తమోజులో కొద్దిరోజులు కాపురం చేసి ఓ పిల్లాడికి తల్లైంది..
ఆ తర్వాతే తనలో ఉన్న అసంతృప్తి భగ్గుమంది..భర్త శంకర్‌ను నానా మాటలతో హింసించడం మొదలు పెట్టింది, , చేతనైంత వరకు అన్ని సౌకర్యాలు సమకూర్చినా ఆమెను తృప్తి పెట్టలేకపోయాడు. సరికదా చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడవటం వల్ల కృంగిపోయాడు తప్ప భార్యను అదుపులో పెట్టుకోలేకపోయాడు..
పర్యవసానంగా విచ్చలవిడితనానికి అలవాటు పడి డబ్బున్న మరో ఆసామితో పిల్లాడితో పాటు వున్నవూరు వదిలి పెద్ద సిటీలో కాపురం పెట్టింది…వాడొక పెళ్ళాం వదిలేసిన జల్సారాయుడు. మోజు తీరాకా వదిలేసి పోయాడు..అయినా ఏమాత్రం ఖర్చులు తగ్గించుకోలేదు..పిల్లాడిని సరైన దారిలోనూ పెంచలేదు.

స్వతహాగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది కనుక తండ్రి పేరును ఉపయోగించుకుని నెమ్మదిగా రాజకీయాల్లోకి ప్రవేశించి పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగి పక్కనపెట్టుకుని, చిన్న చిన్న పైరవీలతో జీవితాన్ని పోషించుకుంటూ గడిపేస్తోంది..
అలా సాగిపోతే ఎవ్వరికీ బాధలేదు..కానీ మరో వింత ప్రవర్తన అందరి జీవితాలను నాశనం చేసేస్తోంది. చిన్ననాటి ఫ్రెండ్స్ ని అందర్నీ కలవడం, వారి ఆర్ధిక, కుటుంబ పరిస్థితులను తెలుసుకోవడం..వారు బావుంటే ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అది తిరుగుబోతు ఇలా సంపాదించింది, అలా సంపాదించింది…పొగరెక్కి బ్రతుకుతుంది అని లేని పోనీ చాడీలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పడం వల్ల నిజమేనేమో..దూరంగా ఉంటే మేలు అని ఎవరికి వారు వేరైపోవడంతో పాటు కుటుంబాల్లో అనుమానపు చిచ్చులు రేగాయి.. తను మాత్రం అందరితోనూ కలుస్తూ పనులు సాధించుకుంటూ తిరుగుతూనే ఉంది.
తన అసంతృప్తి ఈ రకమైన శాడిజంగా మారిందని నేను గ్రహించాను.
ఒక దుర్ముహూర్తాన ఏదో తెలియని జబ్బు వల్ల ఆపాస్మారకస్థితిలో దుంధుభిని అకస్మాత్తుగా హాస్పిటల్ లో జాయిున్ చెయ్యాల్సి వచ్చింది..దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో కొడుకు బెంబేలు ఎత్తిపోయి నాకు ఫోన్ చేశాడు..
సరే తప్పదు కదా అని చూడటానికి వెళ్ళా..భోరుమని ఏడుస్తూ..తన తిరుగుళ్ళ వల్ల కొడుక్కి సరిగ్గా చదువు అబ్బలేదని, ఉద్యోగం సద్యోగం లేక గాలికి తిరుగుతున్నాడని, ఇప్పుడు తన ఆరోగ్యం పాడైపోయింది..వాడి భవిష్యత్తు ఎలా అని భయమేస్తోంది అని శోకాలు తీసింది.
సరే అయిపోయిందేదో అయిపోయింది.. ఇప్పటికైనా భార్యాభర్తలు కలిసి వాడిని ఒక దారిలో పెట్టుకోండి అని వాళ్ళాయనకు ఫోన్ చేసి పిలిపించా..
అన్ని పనులు చేయించుకుని, ఆరోగ్యం చక్కబడే వరకు అతనితో బానే ఉంది..కాస్త కుదుటపడగానే..ఈ వయస్సులో నేను నీకు వండి పెట్టలేను..నీ పని నువ్వు చూసుకో నా పని నేను చేసుకుంటా అని మళ్ళీ మొదలికి వచ్చింది…

********

ఇదొక అంతులేని కథ.. స్త్రీవాదులు వీరిది స్వేచ్చావాదం అని వెనకేసుకొచ్చిన సందర్భాలు కూడా కోకొల్లలు! ఇలాంటి వాళ్ళు కాళ్ళు చేతులు బాగున్నంతవరకు, ..మాటల గారడితో అందాన్ని కక్కుర్తి గాళ్ళకు ఏరవేసి , సంఘంలో మంచి పేరును ముసుగేసుకుని ఎలాగోలా వైభవంగానే బ్రతికేస్తారు.. వారిని వేలెత్తి చూపిన వారిని దుర్మార్గులుగా లోకం ముందు నిలబెట్టగల లౌక్యం వీరి సొంతం!
********
అంతిమసమయం ఆసన్నమైనప్పుడు, విధి వక్రీకరిస్తే మాత్రం…
వీరి శవాలను ఏ మున్సిపాలిటీ కుక్కల బండిలోనో తరలించాల్సి వస్తుందనేది కాదనలేని సత్యం!

ఇండియా ట్రిప్

రచన:  సోమ సుధేష్ణ

 

 

“ఈసారి ఇండియా వెళ్ళినపుడు మద్రాస్ అక్కడి నుండి సిలోన్ వెళ్దాం మిట్టూ.”

“త్వరగా డేట్ ఫిక్స్ చేసుకుంటే నేను కూడా వెకేషన్ కు అప్లై చేస్తాను.” అప్పుడే స్నానం చేసిన  మిట్టు టవల్ తో బాడి డ్రై చేసుకుంటూ అన్నాడు.

“ఈసారి త్రీ వీక్స్ అయినా వెళ్ళాలి. జనవరి ఎండింగ్లో అయితే బావుంటుంది కదా! తిరునాళ్ళ కెల్లినట్టుగా జనం తోసుకుంటూ ఎయిర్ పోర్టు నిండా కనిపించరు. రష్ తగ్గి పోతుంది.”  మాట్లాడుతూ స్టాటిక్ తో ఎగురుతున్న హెయిర్ ను అద్దంలో చూస్తూ హెయిర్ స్ప్రే తో సవరించుకున్నాను.

“ఇండియాకు ఎప్పుడైనా ఆఫ్ సీజన్, రష్ తగ్గడం చూసావా లక్కు! ఎప్పుడూ సీజనే. నాకు జనవరి ఎండింగ్ లో టూ వీక్స్ దొరకొచ్చు. అంత కంటే ఎక్కువ దొరకదు. సో..ఒక వీక్ అక్కడ ఇంట్లోంచే పని చేస్తాను.”

“ఒకే. నాకు ఆ డేట్స్ లో లీవ్ దొరుకుతుందనే అనిపిస్తోంది. ఈ రోజే రిక్వెస్ట్ పంపుతాను. రాగానే టికెట్స్ బుక్ చేసుకుందాం. ఖతార్ లో వెళ్దామా! కంఫీగా ఉంటుంది.”

“ష్యూర్ లక్కు! సాయంత్రం నాకు క్లైంట్ తో మీటింగ్ ఉంది. ‘మిథున్ కాస్త ముందుగా రా నీతో మాట్లాడాలి’ అన్నాడు బాస్. లేటవుతోంది. టాక్ టు యు లేటర్. బై.” అంటూ నా చెంపపై కిస్ ఇచ్చాడు. ఒక చేతిలో బ్రీఫ్ కేసు, మరో చేతిలో కాఫీ మగ్ తో వెళ్ళిపోయాడు.

హడావుడిలో అయినా ప్రేమగా కిస్ ఇవ్వకుండా ఎప్పుడు వెళ్ళడు. నా రోజు అలా మొదలవడం నాకు మంచి శకునం లాగ అనిపిస్తుంది. ఇద్దరం ఆఫీసుకు రడీ అవుతూనే ఇండియా ప్రయాణం ప్లాన్ దిద్దుకుంటోంది. ఆఫీసులో అందరు  క్రిస్టమస్, న్యూయియర్ వెకేషన్ నుండి వచ్చేస్తారు గాబట్టి లీవ్ దొరుకుతుందని నమ్మకం ఉంది. అప్పుడే చేసిన వేజ్జి జ్యూస్ బాటిల్ లో పోసుకుంటుండగా ఫోన్ రింగయింది. ఎడం చేతిలో ఫోన్ బొటనవేలితో నొక్కి,

“హాయ్”

“లతికా! కమాన్, ఇట్స్ గెట్టింగ్ లేట్.”

“ఐ యాం ఆన్ మై వే లిజ్.” ఒక పది నిముషాలు లేటైతే చాలు ట్రాఫిక్ లో ఇరుక్కుని వర్క్ కు ఒకగంట లేటవుతుంది. అందుకే ఆ ఉరుకులు పరుగులు.

***************

ఇండియా ప్రయాణం ఫిక్స్ అయిపొయింది. ఇండియాకు తీసుకెల్లాల్సినవి, ఇండియా నుండి తీసుకు రావాల్సినవి, షాపింగ్ లిస్ట్ తయారు చేయడంలో నాకిక ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. కాస్త టైం దొరికితే చాలు నా మనసంతా ఇండియాలో ఫేమిలీ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అటునుండి ఇటు, ఇటు నుండి అటు టెక్ట్స్ నడుస్తూనే ఉన్నాయి.

“ఇవి కొత్త ఫాషన్ అందరూ వేసుకుంటున్నారని కొనుక్కొచ్చాను. ఇది నీకు బావుంటుంది వేసుకో. నీ కిష్టమని షాహీ తుక్ రా చెసాను, ఇంకో ముక్క వేసుకో.” అమ్మ అనే మాటలు గుర్తు వచ్చాయి. అమ్మను మించిన ఆప్తులు ఎవరుంటారు ఈ ప్రపంచంలో. నా కళ్ళల్లో నీళ్ళు నిండు  కున్నాయి.

‘ఇండియా వెళ్లి రెండేళ్ళు అయ్యింది. నందిక అక్కకు బాబు పుట్టాడు, వాన్ని చూడనేలేదు. కూతురు రష్మిమూడేళ్ళది. వాళ్ళకేమిటో పెళ్ళవగానే పిల్లలు పుట్టటం అయిపోతే ఆ చాప్టర్ అయిపోతుంది అనుకుంటారు. అన్నిగబగబా అయి పోవాలని ఆరాటం. రోహన్ బావది చాల మంచి మనసు. ఇద్దరు చక్కటి జోడి. అక్క ఆలోచనలకి నా ఆలోచనలకు చాలా తేడాఉంటుంది! ఏమిటో ఇండియా వెళ్ళే ముందు ఆలోచనలతో రెప్ప వాలదు.

మాల్ లో సేల్ ఉందని తెలిస్తే చాలు వెళ్ళకుండా ఉండలేను. ‘ఇది బావుంది ఇండియాలో

ఎవరికేనా ఇవ్వొచ్చు’ అనిపించి కొనేస్తాను. నాకు షాపింగ్ క్రేజ్ ఎక్కువని ఫ్రెండ్స్ కే కాదు కుటుంబంలో అందరికి తెలుసు. నన్ను ఏడిపిస్తారు కూడా. నాకు వాళ్ళ మాటలు విని విని అలవాటయి పోయింది.

“ఎల్లోడ్ లగేజ్ మాత్రమే తీసికేల్దాం. ఆలోచించి కొను.” మిథున్ హెచ్చరిస్తూనే ఉన్నాడు. నిజమే, కాస్త చూసి కొనాలి. లగేజ్ ఫుల్ అయితే ఐ యాం స్టక్ విత్ ఆల్ దోజ్ థింగ్స్. ఎనీవే హైదరాబాదు

లో దొరకని వస్తువంటూ లేదని తెలుసు అయినా ఈ రోజు వాణి ఫోను చేసి ఫేయిర్ ఫీల్డ్ మాల్ లో సేల్ ఉందనగానే వర్క్ నుండి ఆటే వెళ్ళాను.

‘అమ్మకు, అత్తమ్మకు ఈజిప్ట్ సాఫ్రాన్ చాల ఇష్టం మర్చిపోక ముందే తేవాలి. వెంటనే దగ్గరలోనే ఉన్న ఈజిప్తియన్ షాపుకు వెళ్లి పట్టుకొచ్చాను. క్లాజేట్ లో ఉన్న నా చీరలు, ఛుడీదార్లు అన్నీ సూట్ కేసుల్లో నింపాను. ఇండియాలో ఇంట్లో పని చేసే వాళ్ళకి, ఊర్లో అందరికి ఇవ్వొచ్చు. వాళ్ళు సంతోషంగా కట్టుకుంటారు. నా రెండు సూటుకేసులు నిండి పోయాయి. మిట్టుకు ఒక సూటుకేసు చాలు. ఒక్క సూటుకేస్ లో సగం చాలు మిథున్ బట్టలకు. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ మగవాళ్ళు లక్కీ అని. వేసుకున్నవే ఎన్ని సార్లు వేసుకున్న ఎవరూ పెద్దగ పట్టించుకోరు. అదే ఆడవాళ్లకు అమ్మో! ఒకసారి కట్టిన చీర రెండేళ్ళ తర్వాత కట్టినా ఎవరో ఒకరు చెవుల్లో ఉదేస్తారు. ఈ విషయంలో మెమొరీ చాల షార్ప్ గా ఉంటుంది.

“అవన్నీ ఇండియాలో ఇచ్చేయడానికా! కొత్తగానే ఉన్నత్తున్నాయి.” మిట్టూ ఊరుకోలేక అంటున్నాడని నాకు తెలుసు. కొన్ని సార్లు పిసినారి తనం చూపిస్తాడు.

“కొన్ని ఒకసారి తోడిగినవి, కొన్ని ఓల్డ్ ఫేషన్ వి, వాటిని ఇప్పుడు ఎవరు వేసుకోవడం లేదు. బట్టలు చిరిగే వరకు ఎవరు వేసుకోరు మిట్టూ. ఇండియాలో ఎవరికేనా ఇస్తే వాళ్ళు కొంతకాలం అయినా వేసుకోవాలి గదా! నేను శాపహాలిక్ నని మీరు అందరూ అంటారుగా, ఆ పేరు సార్థకం చేసుకుందామని అనుకుంటున్నాను.” నాకు కోపం వచ్చింది.

“కొన్ని వేసుకోకుండానే ఇచ్చేస్తున్నావు. అలా పడేసేటంత రిచ్ కాదోయ్!”

“మరీ ఓల్డ్ ఫేషన్ బట్టలు వేసుకునేటంత పూర్ కూడా కాదుగా. నేనేం చిన్న పిల్లను కాను.”

ఆ సాయంత్రం కూడా ఇండియా వెళ్ళే ప్లాన్ గురించే మా మధ్య చాటింగ్ జరిగింది.

“మద్రాస్ లో రెండు రోజులుండి అక్కడినుండి శ్రీలంక వెళ్దాం. అక్కడ నాలుగు రోజులకంటే ఎక్కువ అవసరం లేదట. టికెట్ బుక్ చేసుకుందామా? ఇండియా వెళ్ళాక షాపింగులు, డిన్నర్లు  తిరుగుతూ పోస్ట్ పోన్ చేస్తాం.” మిథున్ సోఫాలో కూర్చుంటూ అన్నాడు.

“నాకీ ట్రిప్ వెళ్ళాలని చాల ఉంది గాబట్టి మార్చి పోవడమనేది జరగదు. ఒక్క వారం ట్రిప్ వెళ్తాం. ఎంజాయ్ చేయడానికి మనకి ఇంకా రెండు వారాల టైం ఉంటుంది. ఒక వారం అత్తమ్మ దగ్గర మరో వారం అమ్మ దగ్గర ఉండొచ్చు. ఇండియా వెళ్ళాక మన శ్రీహరి టికెట్లు బుక్ చేస్తాడు. మిట్టూ! కొంత మనీ ట్రాన్స్ఫర్ చెయ్యవా! ఇండియాలో నేను చాల షాపింగ్ చేయాలి. మద్రాసులో చీరలు, హైదరాబాదులో నగలు చాల కొనాలి. రెండేళ్ళల్లో చాలా మారిపోయింది. సుమతి  ప్రతి సారి మద్రాసు నుండి కొత్త చీరలు తెచ్చుకుంటుంది ఎంత బావుంటాయో.” నాకైతే ఎప్పుడు మద్రాసు వెళ్తానా అని ఈగర్ గా ఉంది.

“ఇండియా అకౌంట్ లో డబ్బు ఉంది. ఇక్కడ ప్రతి క్లాజేట్ లో నీ బట్టలే. మళ్ళి ఏం కొంటావ్ లతికా.”  మిథున్ కు కోపం డోస్ ఎక్కువైతే నా పూర్తి పేరు పిలుస్తాడు. నేనూ అలాగే పిలుస్తాను.

“ఇండియా వెళ్లి రెండు సంవత్సరాలయింది. అయినా నీకు లేడీస్ బట్టలు, నగల గురించి ఏమీ తెలీదు. ఫేషన్ అస్సలు తెలీదు. నేను ఈసారి లేటెస్ట్ బట్టలు, నగలు తెచ్చు కుంటాను. ప్లీజ్ నో అనకు మిథున్.” నాకు ఏడుపు కూడా వస్తోంది నిజంగానే వద్దంటున్నాడని అతని తీరే చెప్తోంది.

కాని నా మాటలు వినగానే నో అనే శక్తి మనసులోంచి ఆవిరై పోయినట్లుగా “సరేలే” అన్నాడు. నాకు ఎగిరి గంతెయ్యాలనిపించింది.

***************

ప్రయాణం చేసే రోజు రానే వచ్చింది. సూట్కేసులు అన్ని క్వాడ్రూప్లేక్స్ తో ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఫుల్ లోడై ఉన్నాయి. నాలుగు పెద్ద సూటుకేసులు, రెండు రోలాన్సు నా హీండ్ బాగ్ కూడా రోలాన్ కంటే కాస్త చిన్నగా మరో రోలాన్ లా ఉంది. అన్నింటినీ ఈడ్చుకుంటూ ఎయిర్ పోర్ట్ చేరాం. ఇండియా వెళ్తున్నామంటే ఈ మాత్రం లగేజ్ అవుతుంది.

ప్లెయిన్ లో నేను తెచ్చుకున్న బుక్స్ చదవ మనసు రాక, నిద్ర పోలేక పక్కనే హాయిగా నిద్ర పోతున్న మిట్టును చూసాను. దిండు తాకితే చాలు నిద్ర పోతాడు, లక్కి ఫెలో. ఇండియా వెళ్ళాక .. ఆలోచనే ఎంత బావుందో..

‘వంట చేసుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఐరన్ చేసుకో అక్కర్లేదు. ముఖ్యంగా ఇల్లు క్లీన్ చేసుకో అఖ్కర్లేదు. ఇష్టం లేకపోతే బట్టలు ఐరన్ చేయకుండా మానేజ్ చేయోచ్చు కానీ టాయిలెట్స్ క్లీన్ చేయడం అంత పాడుపని ఇంకోటి ఉండదు. పోయిన జన్మలో చేసుకున్న ఖర్మ అంటుంది రోజా. నిజమేనేమో! ఉదయం లేవగానే వర్క్ అంటూ పరు గేట్టక్కర్లేదు. కాలేజి రోజుల్లో లాగ రంగరంగ వైభోగంగా తింటూ షాపింగులు తిరగొచ్చు.’

మిట్టు కజిన్ సుహాస్ ఎయిర్ పోర్ట్ కు వచ్చి మమ్మల్ని పికప్ చేసాడు. సుహాస్ బి.యి. సెకెండ్ యియర్ చేస్తూ అమెరికా ఎగరడానికి రెక్కలు పెంచుకుంటున్నాడు. అమెరికాలో ట్రంపు అందరి ట్రంపు కార్డ్స్ ఇన్ వాలీడ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయేమో అమెరికాలో తానేం చేయ బోతాడో ఫ్యూచర్ ప్లానంతా చెప్తుంటే నేను, మిట్టు జోగుతూ విన్నాం. ముందు తరం వాడు కదా హుషా రుగా ఉన్నాడు. ఈ రోజుల్లో అమెరికా గురించి ఆటో వాడికి, అడుక్కునే వాడిక్కూడ అన్ని తెలుసు. ఇల్లు చేరేసరికి అత్తమ్మ మేలుకునే ఉంది. మామయ్య లేచి వచ్చారు.

“ప్రయాణం బాగా జరిగిందా! లగేజ్ అంతా సక్రమంగా వచ్చిందిగా. బాగా అలసి పోయుంటారు. వెళ్లి రెస్ట్ తీసుకోండి.” మిట్టుకు దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నారు.

అత్తమ్మ దగ్గరగా వచ్చి మిట్టును ఆ తర్వాత నన్ను దగ్గరగా తీసుకున్నారు. ఫేస్ టైంలో చూస్తాం గాబట్టి మరీ అంతా షాక్ ఉండదు.

“రెండేళ్ళయింది మిమ్మల్ని చూసి. ఇద్దరి మొహాలు పీక్కు పోయాయి. ఆరెంజ్ జ్యూస్ తాగుతారా? ఆకలిగా ఉంటె ఫ్రూట్స్ తెస్తాను.” అత్తమ్మ కిచేన్ లోకి వేల్తుంటే…

“అమ్మా! ఇప్పుడవేమి వద్దు. అలసి పోయాం. పడుకుంటాం.” మిట్టు ఆవలింత తీస్తూ అన్నాడు. అందరం పడుకోవడానికి వెళ్ళాం.

మరునాటి నుండి మేము లేవడం వాళ్ళు పడుకోవడం – అలా రెండు రోజుల పాటు పరదేశీలను జెట్ లాగ్ అంటూ మమ్మల్నినిద్దరకు వదిలేసారు.

ఆ రోజు సాయంత్రం వంటింట్లోంచి ఘుమఘుమ వాసనలు ముక్కు పుటాలను అదర గొట్టేస్తు న్నాయి. నేను వంటింట్లో కేళ్ళాను. లక్ష్మి వంట చేస్తోంది..

“లక్శ్మీ బాగున్నావా? ఏం చేస్తున్నావు?” రొజూ వంటపని, ఇంటిపని చేస్తుంది. డిన్నర్ త్వరగా వండి టేబుల్ పై ఎరేంజ్ చేసి వెళ్లి పోతుంది.

“బాగున్న. నువ్వేట్లున్నవు తల్లి? శాన దినాలయే సూసి. నీరజమ్మ మసాల కోడి, బెండకాయ

ఏపుడు, గుమ్మడికాయ ఒడియాలు తయ్యార్ వెట్టమంది. జొన్న రొట్టెలు సెయ్యిమంది. కోడి కూర పసందుగ తింటరని అమ్మ సెప్పింది.”

“వాసన భలే వస్తోంది. నీ వంటలు మా అందరికి ఇష్టమే. నీ పిల్లలు బాగున్నారా?”

“మీ అందరి దయ. బాగనే ఉన్నరు. బుడ్డోడు రెండు రోజులు జేరమొచ్చి ఇస్కూలు డుమ్మ గొట్టిండు. సుసీల గూడ ఇస్కూల్ పోతది.”

“పిల్లల్ని చదివిస్తున్నవు, చాల మంచి పని.”

“మీ బాంచను తల్లి, నీరజమ్మ సుసీలను గూడ సదివి పియ్యి అని సెప్తే అది మల్ల పోవుడు మొదలు వెట్టింది.”

“మ్..మ్..డిన్నర్ కు నేను రడీ. వాసనలు జటరాగ్నిని పొంగిస్తున్నాయి.” అంటూ మిట్టు  అప్పుడే ఇంట్లోకి వచ్చాడు.

*****************

మరునాడు మమత వదిన కుటుంబంతో చైనీస్ రెస్టారెంట్ లో డిన్నర్ కు ప్లాన్ వేసుకున్నారు. మమత వదినకు తమ్ముడంటే ప్రాణం. నేను మధ్యహ్నం టీ తాగడానికి వంటింట్లో కెల్లాను.

“లక్ష్మీ, నాక్కాస్త టీ పెట్టిస్తావా!” లక్ష్మీ మమ్మల్ని ఏ పని ముట్టుకోనివ్వదు.

వరండాలో బట్టలు మడత పెడ్తున్న లక్ష్మి ఆ పని పక్కన పెట్టి, ”మసాల టీ పెట్టనా తల్లి.”

“అత్తమ్మకు కూడా పెట్టు, లేచే వేళ్ళయింది.”

“నీరజమ్మకు రోజు చేసే చాయ్ చేస్త. మసాలాలు పసందు సేయ్యదు.”

“నాక్కూడ అదే పెట్టు, రెండు రకాలెందుకు.”

“ఒక్క సెకన్ల అయిపోతది. నీగ్గావాల్సింది నీకు జేత్త, నీరజమ్మ గ్గావాల్సింది నీరజమ్మకు జేత్త. నువ్వట్ట గూకోని సూస్తుండు. మురుకులు, ఓడప్పలు తెచ్చియ్యనా తల్లి. మీరు ఒస్తరని ఇన్నప్పటినుండి నీరజమ్మ ఆరాటం జూడాలె.” ఎంతో ప్రేమగా చెప్పింది. మేము వస్తున్నామని

ఎప్పటిలాగే ఈసారి కూడ పది రకాల స్నాక్స్ చేయించింది అత్తమ్మ. ఇక్కడ అత్తమ్మ, అక్కడ అమ్మ ఇద్దరూ అంతే మాకోసం ఏవేవో చేస్తారు. ఎంత ప్రేమ వాళ్ళకి, నేను అదృష్టవంతురాలిని.

“నేను తీసుకుంటానులే నువ్వు టీ పెట్టివ్వు.” ఆ పక్కనే షెల్ఫ్ మీద ఉన్న బాక్స్ లోంచి నా కెంతో ఇష్టమైన మురుకులు తీసి ఓ నాలుగు ప్లేటులో పెట్టుకున్నాను.

‘టింగ్’ నా సెల్ లో మెసేజ్ వచ్చుంటుంది, నా సెల్లో మెసేజెస్ చూడటం, డిలీట్ చేయడంలో మునిగి పోయాను. ఇంతలో అత్తమ్మ వచ్చి నా పక్కనే ఉన్నకుర్చీలో కూర్చింది.

“లక్ష్మి భర్త ఏం చేస్తాడత్తమ్మా?”

“ఆటోరిక్షా ఉంది. కానీ ఈ రోజుల్లో ఊబర్ వచ్చాక ఆటోరిక్ష గిరాకి బాగా తగ్గి పోయింది, లక్ష్మి  సంపాదన మీదే నడిపిస్తున్నది.” కాస్త గొంతు తగ్గించి అంది అత్తమ్మ.

నీటుగా మడత బెట్టిన బట్టలు తీసికెళ్ళి లోపల పెట్టి వచ్చి టేబుల్ కు అవతలి వైపు గోడ

కానుకొని నిలబడింది లక్ష్మి. మొహం వాడిపోయి ఉంది.

“లక్ష్మీ, లంచ్ తిన్నావా?’ అత్తమ్మ అడిగింది.

“ముద్ద దిగుతలేదమ్మ” అంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది.

“ఏమైందే? వంట్లో బావుందా? ఇంటి దగ్గర అంత బాగున్నారా?” అడిగిన అత్తమ్మ వైపు చూస్తూ,

“నా పెనిమిటి ఎల్లుండి ఊర్కి పోతుండు.” లక్ష్మి ఏడుస్తూ అంది.

“రాఘవులు ఊరికి పోతున్నాడా? నువ్వెందుకు ఏడుస్తున్నావు?” అత్తమ్మ లేచి లక్ష్మి భుజం తట్టింది. లక్ష్మి కుటుంబాన్ని ఇంట్లో పని చేయడానికి ఏడేళ్ళ క్రితం ఊరినుండి తీసుకొచ్చారు. కొన్నాళ్ళు  గేటు పక్కనే ఉన్న  రెండు గదుల ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత కాస్త దూరంలో ఉన్న లో ఇన్ కమ్ కాలనీలొ ఒక ఇల్లు ఇప్పించాడు మామయ్య. చాల కాలం నుండి ఉంది గాబట్టే ఇంట్లో ఎవరికి ఏం కావాలో లక్ష్మికి బాగా తెలుసు. అత్తమ్మ, మామయ్యది దయార్ద్ర హృదయం. లక్ష్మిని పనిమనిషిగా చూడరు. లక్ష్మి కుటుంబాన్ని ఎన్నో సార్లు అవసరానికి ఆదుకున్నారు. ‘అలాంటి మంచి మనసున్న అత్తమ్మ, మామయ్య ఉండటం నా  అదృష్టం’ అనుకుంటాను.

కాళ్ళు ముడుచుకుని నేల మీద కూచున్నలక్ష్మి అత్తమ్మ వేపు చూస్తూ కళ్ళు తుడుచుకుని

ముక్కు చీదింది.

“నా పెనిమిటి కిడ్నిఅమ్ముతడంట. ఊర్లె పటేల్ కు కిడ్నీలు పని జేస్తలేవంట. డాకుటరు అందరికి రెండుంటయి గాని ఒకటి ఉంటె చాలు బతుకుతరు అని సెప్పిండట. ఒక కిద్నికి

రెండు లక్షల రూపాయిలు ఇస్తరట. ఆ పైసలతోటి బిడ్డకు కాలు బాగా జేపిస్తడట అయినంక లగ్గం జేస్తడట.”

అత్తమ్మ లక్ష్మి వీపు తట్టగానే లక్ష్మి కొంగుతో మొహం కప్పుకుని కొంచెం సేపు ఏడ్చి మళ్ళి చెప్పడం మొదలు పెట్టింది.

“ఊబర్ నడపాలంటే మస్ట్ పైసలు గావాలంట. ‘ఈ ఆటో మెడకు బండరాయి కట్టుకొని ఉరుకు తున్నట్టే  ఉంది. వచ్చింది చేతికి మూతికే సరి పోతలేదు. బిడ్డ కాలు ఆపరేషన్ ఏం బెట్టి చేపిచ్చేది. ఈటన్నిటికి పైసలు గావలె. ఒక్క కిడ్ని పోతె ఏందే, మనందరి బతుకులు సుదు రాయిస్తయి.’ అంటున్నడు. సుసీల ముట్లకొచ్చింది దానికి లగ్గం జేయ్యాలని షెప్పిన గాని పెయ్యిల ఉన్నవి అమ్ముకోమంటనా! ఎంత జెప్పినా ఇంట లేడమ్మా.” మళ్ళి ఏడవడం మొదలు పెట్టింది.

“ఎవరే మీకీ వార్తలిచ్చే వాళ్ళు?” అత్తమ్మ కోపంగా అడిగింది.

“రాఘవులు చెల్లెలు రామపురంల ఉంటది. అన్నకు ఎక్కిస్తున్నది. రాత్రి పగలు అదేమాట. ఇంటందుకు బాగనే ఉంది ఈన కేమన్నఅయితే నేను, పిల్లలు ఆగమయిపోతం. మా గతేం గాను!” లక్ష్మీ ఏడుపు ఆపలేదు.

“ఇవ్వాళ్ళ మేము డిన్నర్ కు బయటకు పోతున్నం నీకు వంట పని లేదు. నువ్వెళ్ళి రాఘవులుని తీసుకొని రా. సార్ తో మాట్లాడమను.” అత్తమ్మ లక్ష్మిని ఓదార్చి ఇంటికి పంపింది.

మేమున్నని రోజులు మామయ్య చాల వరకు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ కార్డు గేమ్స్, క్లబ్ మీటింగ్స్ చాల వరకు మానేస్తారు. ఆరోజు మామయ్య త్వరగానే ఇంటికి వచ్చారు. అందరూ కూర్చుని తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం. నా  మనసులో లక్ష్మి మాటలు తుఫాన్ లా కదులు తున్నాయి. కాసేపట్లోనే లక్ష్మి భర్త రాఘవులుతో వచ్చింది.

“నమస్తే సార్.” చేతులు జోడించి నమస్కరించి రెండు చేతులు ముడుచు కున్నాడు రాఘవులు

అత్తమ్మ అన్ని విషయాలు ముందుగానే చెప్పడం మూలాన మామయ్య రాఘవులుని చూడగానే,

“ఏం రాఘవులు ఎట్లున్నావు? నీ ఆటో ఎట్ల నడుస్తున్నది?” చేతిలో పేపరు పక్కన పెడ్తూ అడిగాడు.

“ఆటో సంగతి మీకు తెల్వంది ఏముంది సార్. ఊబర్లు గాలి దుమారమోలె ఒచ్చినవి. ఆటోలు ఎండుటాకులోలె ఎగిరి పోయ్యినట్టె మాయమైనవి. గిరాకీలు ఏం రావుసర్. చేతి ఖర్చులకే ఎల్త లేదు.” దిగులుగా అన్నాడు.

“గిరాకీలు ఒస్తలేవని కిడ్ని అమ్ముకుంటున్నవా?” మామయ్య గొంతు కాస్త పెద్దగ వినిపించింది.

“ఒక్క కిడ్నితో బెఫికరుగ బతుకొచ్చని డాక్టరు ఖరారుగ సేప్తున్నడు. ఈ సంగతి బయట తెలిస్తే పోలీసులతోటి అంత ఖరాబయితది సర్.” భయభయంగా నసిగాడు.

“నేనేం చెప్పనులే. ఏం బేరం చేసుకున్నావు?”

“రెండు లక్షల రూపాయలు ఇస్తరట. ఈడోచ్చింది సుశీలకు లగ్గం జెయ్యిమని లచ్చిమి ఊకే అంటున్నది. ఒంకర కాలుదాన్ని జేసుకొని సుఖపెట్టేటోడు ఈ రోజుల్ల ఎవడుంటడు సర్! ఆపరేషన్  జేస్తే కాలు బాగయితదట, చాల పైసలు గావలె. ఆటో తీసేస్తే ఒక్క పైస రాదు. ఊబర్ తీసుకుందామంటే ముందు పదిహేనువేలు కడ్తె కారిస్త అంటున్నడు. ఊబర్ నడుపంగనే పైసలు రాలవు గద సార్, శేతికోస్తందుకు రెండు నెలలన్న అయితది. కొంచెం సొంచాయించినంక ఒక్క కిడ్ని తోనే పనెల్తుంటే రెండోది ఉట్టిగెందుకు- మస్తు పైసలిస్తున్నరు. దానికి లగ్గం జేసి, బుడోనికి సదువు సెప్పిస్త. ఇప్పుడు మీరే సేప్పన్రి, నేను ధిమాక్ తోనే సొంచాయించిన గద.”

లక్ష్మి ఏడుస్తూ “ఈన పానాలకేమన్న అయితే నేను, నా పిల్లలు ఆగమై పోతం గదయ్య.”

“ఏహే ఊకే ఏడ్వకు. నాది గట్టి పానం, ఫిఖర్ జెయ్యకు.”

దూరంగా కూర్చున్న నాకు ఇదంతా ఒక కలలా ఉంది. ‘చనిపోయాక మీ ఆర్గన్స్ డొనేట్ చేసే ఉద్దేశ్యం ఉంటే ఈ ఫారం పూర్తి చేయండని అమెరికాలో కొన్ని సంఘాలు ప్రచారం చేస్తాయి. అది ఒక ప్రపంచం, ఇది మరో ప్రపంచం. బ్రతికుండగానే ఆర్గన్స్ డబ్బుకు అమ్మడమేమిటి? ఎంత దారుణం? కష్ట పడినా పేదరికంలోంచి బయట పడలేక పోతున్నారు. ఇదీ ఒక దారేనా!’ నాకు  కడుపులో దేవినట్టుగా అయ్యింది. అత్తమ్మ నా వేపు చూసి వెంటనే,

“లతికా! సిసింద్రి వచ్చే టైం అయ్యింది. వచ్చిందంటే నిన్ను వదలదు. నువ్వు వెళ్లి రడీ అవ్వు.” సిసింద్రి అంటే మమత వదిన కూతురు అన్య, తన చిలిపి తనం గురించి అత్తమ్మ చెప్తూంటే నేను పెద్దగా నవ్వేసాను.

“అరే రాఘవులు, నీకు ఊబర్ కు కావాలంటే మిత్తి లేకుండ నేను పైసలు ఇస్తను, నీకు సుదిరినప్పుడే  పైసలు ఇద్దువు గాని. సొంచాయించుకో.”

నేను లోపలి వెళ్తూ అదంతా విన్నాను. నాకు ఏడుపు వస్తోంది. ఏదో బాధ సలుపుతోంది.

మిట్టు హుషారుగా ఈల వేస్తూ రడీ అవుతున్నాడు. “లక్కూ! మన సిలోన్ ట్రిప్ కి డేట్స్ చెప్తే టికెట్లకు పే చేసెయ్యొచ్చు.” విజిల్ ఆపి ఒక పక్కగా కూర్చున్న నన్ను చూసాడు.

“ఏమైంది? అలా ఉన్నావేమిటి? ఒంట్లో బాలేదా?” గాబరాగా అంటూ నా పక్కనే మంచంపై కూర్చున్నాడు.

“నా మనసేం బాగాలేదు.” ఆపుకోలేని బాధ, అంత బాధ ఎందుకు కలుగు తోందో అర్థం కావడం లేదు. లక్ష్మి కథ నన్ను ఇంత బాధ పెద్తోండా! మిట్టు నన్ను  దగ్గరగా తీసుకుని “ఏమైంది” గాబరాగా అడుగుతున్నాడు.

అంతలోనే ఆన్య పరుగెత్తుకొచ్చి “అత్తా! ఈ మల్లె పూవులు నీకోసం.” అంటూ దండ ఇచ్చి “రా పోదాం” అంటూ నా చెయ్యి పట్టుకుని లాగింది. వచ్చినపుడల్లా నన్ను వదలకుండా నీడలా తిరుగుతుంది.

“వచ్చాక మాట్లాడుకుందాం పద.” మిట్టు నా మరో చెయ్యి పట్టుకుని “నీ కిష్టం అని అమ్మ చైనీస్ రెస్టారెంట్ పిక్ చేసింది.”

ఇంటికి వచ్చాక ఆ రాత్రి “లక్కూ! ఇప్పుడు చెప్పు ఏమయింది? అక్కడ ఫుడ్ కేలుకుతూ సరిగ్గా తినలేదు.”

నన్ను దగ్గరగా తీసుకున్నాడు. అతని ఛాతిపై వాలిపోయి చాల ఏడ్చేసాను. ఏడుపు కాస్త తగ్గాక లక్ష్మి  కథ అంతా చెప్పాను.

“ఇది చాల అన్యాయం. ఇల్లీగల్ అని తెలిసినా భయం లేకుండా ఈ కిడ్ని వ్యాపారాలేమిటి! అక్క డక్కడా రహస్యంగా ఇలా జరుగుతుంటాయని విన్నాను కానీ ఇప్పుడు రాఘవులు చేస్తున్నా డంటే నమ్మ బుద్ధి కావడం లేదు. లక్ష్మి ఎంతో కాలంగా మనకు పని చేస్తోంది. మన పెళ్ళికి ఆ కుటుంబంవాళ్ళు అందరూ చాల పని చేసారు.” బాధగా అన్నాడు.

“మామయ్య ఊబర్ కొనడానికి ఇంటరెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తానన్నాడు. మనం కూడా ఏమైనా హెల్ప్ చేద్దాం!” సాలోచనగా ఉన్న మిట్టు మొహంలోకి చూసాను.

“నాక్కూడా హెల్ప్ చేయాలని ఉంది లక్కు…”

మిట్టు గొంతు వినగానే నాకు తెలిసి పోయింది మనసులో ఏముందో, ఇంకో ఆలోచన రాక ముందే,

“మనిద్దరికీ మంచి జాబులున్నాయి. వాళ్ళకు హెల్ప్ చేస్తే మనకేమి ఇబ్బంది ఉండదు.” గబగబా అనేసాను.

“నీ షాపింగ్ ..ఇల్లు కొనడం.. బిజినెస్ ” ఆలోచనలోంచి చిన్నగా నసిగాడు మిథున్.

“నాకు ఇప్పుడప్పుడే ఏమి కొనుక్కోవాలని లేదు. నా దగ్గర చాల బట్టలు, నగలు ఉన్నాయి. నాకు ఉన్నవి కాక అత్తమ్మ, అమ్మ, నందిక అక్క కొని పెట్టినవి చాలా ఉన్నవి. ఈసారి మద్రాసు, సిలోన్ ట్రిప్ కూడా వద్దు. మనమేలాగు పెద్దిల్లు ఇప్పుడప్పుడే కొనొద్దనుకున్నాము గదా! బిజినెస్ మాత్రం మనం అనుకున్నట్టుగానే స్టార్ట్ చేద్దాం.”

“బిజినెస్ అంటే మనం కాస్త బాకప్ మనీ ఉంచుకోవాలి. రిటైర్ అయ్యాక నాన్నను ఇబ్బంది పెట్టొద్దనుకున్నాను. రాఘవులుకు ఇవ్వాలనుకున్న డబ్బు నాన్నకు ఇస్తే నాన్నే చూసు కుంటారు. రేపు నాన్నతో మాట్లాడుతాను.”

“మన బిజినెస్ కు మన జాబులే బేకప్. రాఘవులు సంగతి మామయ్య చూసుకుంటే ఇంకా మంచిదే కానీ మామయ్య ఆరోగ్యం అంత బావుండదు. ఈ పనులతో అలసి పోతారేమో.”

“మనం ఉన్నప్పుడే లక్ష్మి బిడ్డకు సర్జరీ అయ్యే ప్లాను వేద్దాం. దాంతో పెద్ద పని అయిపోతుంది. మిగతా పనులు నాన్న చూసుకుంటారనే ధైర్యం నాకుంది..”

“అంత తొందరగా ఎలా అవుతుంది!”

“చాల మంది డాక్టర్లు మన బంధువులు, స్నేహితులు. నాన్నకు అందరూ తెలుసు. మనం కాస్త పనులన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్ లో చేసి చూద్దాం.”

నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరునాడు పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ అవగానే  మిట్టు మామయ్యతో మాట్లాడాడు. మామయ్య  ఒప్పుకుంటాడని తెలిసినా నాకు గాబరాగా ఉంది. కాసేపట్లోనే మిట్టు వచ్చి

“లక్కూ ! నాన్న రమ్మంటున్నారు. అమ్మ కూడా అక్కడే ఉంది.”

నాకు కాస్త టెన్షన్ గా ఉంది, వెళ్లి మిట్టు పక్కనే కూర్చున్నాను.

“మీరు రాఘవులుకు సహాయం చేయడం మంచిదే. చాల నమ్మకస్తులు, మనల్ని నమ్ము కున్నారు. కాని మీరు త్వరలో కంపెని ఓపెన్ చేయబోతున్నారు. ఇల్లు కొనుక్కోవాలి. ఈలోగా పిల్లా, జెల్లా వస్తే అప్పుడు ఖర్చులు బాగా ఉంటాయి. మీరు బాగా ఆలోచించుకోండి.” అత్తమ్మ అంది.

“అమ్మ చెప్పింది నిజమే. మీరు కంఫర్టబుల్ గా సెటిల్ అయ్యాక ఇలాంటి వాటికి కంట్రిబ్యూట్

చేయోచ్చు. వాళ్ళకు మరీ అవసరమయితే నేను కొంతవరకు సర్డుతాలే. మంచి నియ్యత ఉన్న మనుషులు. మీరు కమ్మిట్ ఆయేముందు కాస్త ఆలోచిచుకోండి.” ఎంతో కేరింగ్ గా అన్నారు మామయ్య .

“నాన్నా! మీరు అక్కను డాక్టరు చదివించారు, నన్ను ఢిల్లీ లో కాలేజికి పంపి చదివించారు. చాల చేసారు. మీరింక ఏ ఖర్చులు పెట్టొద్దు. ఇప్పుడు లక్ష్మికి ఇవ్వబోయే డబ్బు  ఖర్చులన్నీ నేను చూసుకుంటాను. మీరిక మీ ఆరోగ్యం గురించి ఆలోచిచుకోవాలి. మీరు, అమ్మ ఇప్పుడు ప్రశాంతంగా గడపండి. మా ఇద్దరికీ మంచి జాబులు ఉన్నాయి. ఇప్పుడున్న టౌన్ హౌస్ లోనే ఇంకొన్నాళ్ళు ఉండాలని ఉంది. ముందు కంపెని స్టార్ట్ చేస్తాం అది పికప్ చేసాక ఇల్లు కొంటాం. రాఘవులుకు హెల్ప్ చేయాలని మా ఇద్దరికి ఉంది. కిడ్నిఇవ్వడం లాంటి పిచ్చి పనులు చేయొ ద్దని చెప్పండి. అమ్మా! నువ్వేమంటావు?”

“మీ ఆలోచనలు వింటూంటే గర్వంగా ఉంది మిట్టూ. నీకు తోడు లతిక- మీ ఇద్దరినీ చూస్తుంటే  చాల సంతోషంగా ఉంది.” అత్తమ్మ కళ్ళల్లోంచి వచ్చే నీటిని కొంగుతో అద్దుకున్నారు.

“మొదలు ఊబర్ తీసుకొని పని మొదలు పెట్టమని రాఘవులుకు చెప్పాలి. ఒర్తోపెడిక్ సర్జన్ రంగాచారి మనకు తెలిసిన మనిషే. మంచి సర్జన్ అని పేరుంది. నేను ఫోన్ చేసి మాట్లాడి వివరాలు తెలుసుకుంటాను. చంద్రశేఖర్ కొడుకు గౌతమ్ నీకు గుర్తుందా మిట్టు! నీ హైస్కూల్ ఫ్రెండ్, ఇప్పుడు ఇరవై కార్లు కొని ఊబర్ బిజినెస్ చేస్తున్నాడు. నువ్వొకసారి ఫోన్ చేసి చూడు పనయి పోతుందేమో. లేక పోతే ఇంకేవరినన్న చూద్దాం. ఐ యాం ప్రౌడ్ ఆఫ్ యు బోత మై చిల్రన్.” మామయ్య గొంతులో సంతోషం, గర్వం స్పష్టంగా వినిపించాయి.

ఆ మరునాడే మామయ్య, మిట్టు కలిసి ప్లాన్ అమలులో పెట్టారు. రాఘవులు కిడ్ని ఇచ్చే ప్లాన్ అంతా రద్దు చేయించారు. మిట్టు గౌతమ్ కు ఫోన్ చేసినపుడు హైస్కూల్  రోజుల గురించి చాల సేపు మాట్లాడుకున్నారు. వెళ్ళే లోగా ఒకరోజు భోజనానికి రమ్మని పదే పదే చెప్పాడట. గౌతమ్ ఊబర్ ఇచ్చే ఏర్పాటు చేస్తాన్నానని అనగానే అందరికి హేప్పిగా అనిపించింది. అటో అమ్మేసి ఊబర్ కు డౌన్ పేమెంటు ఏర్పాటు చేసారు నా హీరోలు ఇద్దరు.

“నాకు మనసు నిలకడగ ఉంటలేదు, రాఘవులుకు ఇదంతా కల పడ్తున్నట్టే  ఉందంటు న్నడు.” పదే పదే అంటూ లక్ష్మి ఎంత వద్దన్నా వినకుండా మాకందరికి దండాలు పెడ్తోంది.

ఆ రోజు లక్ష్మి సుశీలనుతన వెంట పనికి  తీసుకొచ్చింది. కాస్త నలుపు ఉన్నా మోహంలో కళ ఉంది. బిడియంగా తల్లి పక్కన నిలబడి మాకు నమస్కారం పెట్టింది. మనిషి మనసు చస్తే అందం ఉన్నా లాభం లేదు.

“అందరు నవ్వుతరని ఎక్కడ్కి వోదు. రాఘవులు బిడ్డంటే పానం బెడతడు.”

“ఏం చదువుతున్నవు సుశీలా?”

“సెవెన్త్ క్లాస్ మేడమ్.” తలోంచుకునే జవాబు చెప్పింది.

“మంచిగ చదువుకొంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు.” సరే అన్నట్టు సుశీల తలాడించింది. పద మూడేళ్ళ అమ్మాయికి జీవితంలో ఆశ చావకూడదు. లక్ష్మికి పనిలో సాయం చేస్తోంటే నేను చూస్తూ ఉన్నాను. కుడి వైపుకు మోకాలు బాగా బెండ్ అయి వంగి నడుస్తుంది. ఎడమ వైపు హిప్ ఎత్తుగా ఉంది.

ఆ తర్వాత ఒకరోజు …

డాక్టర్ రంగాచారి సుశీలను టెస్ట్ చేసి, “మోకాలు దగ్గర బోన్ కాస్త పక్కకు తిరిగి ఉంది. నొప్పి  రాకుండ కాలును హిప్ ను తిప్పి నడవడం మూలాన హిప్, కాలి షేప్ అలా కనబడ్తోంది. అదే అలవాటయి పోయి షేప్ అలాగే  పెరిగింది. నాటే మేజర్ ప్రాబ్లం. ఇట్ విల్ బి డన్. తర్వాత ఫిజికల్ తెరపి చేయిస్తే కొంత టైం పట్టినా నార్మల్ అవుతుంది.” అని హామి ఇచ్చాడు.

చిన్నప్పటినుండి అలాగే నడుస్తూ కుంటి పిల్ల అనుకున్న సుశీలకు అదేమంత పెద్ద సమస్య కాదని అంత వరకు తెలియదు. వారం రోజుల తర్వాత సర్జరీ అయ్యింది. సర్జరీ అయిన మూడో నాడే ఇంటికి పంపి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు. అనుకున్నదాని కంటే ముందుగానే పనులన్నీ అయి పోయాయి. అందరికి సంతోషంగా ఉంది.

బిడ్డ కాలు బాగు చేయిస్తున్నారని తెలియగానే లక్ష్మి, రాఘవుల సంతోషం చెప్పనలవి గాదు. కుటుంబంలో ఒక్కొక్కరి కాళ్ళ మీద పడి దండాలు పెట్టారు. వాళ్ళ జీవితంలో ఈ మార్పు  వారి జీవితాల్నె మారుస్తుందని తెలిసి నాకు చాల సంతోషంగా, తృప్తిగా అనిపించింది.

అమ్మా, నాన్న అక్క ఈ వార్త విని దిగ్భ్రమ చెందారు. వాళ్లు మామయ్యలాగే బాగా ఆలోచించు కోండి అంటూ పదే పదే చెప్పారు. కానీ నేను, మిట్టు ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఆ తర్వాత అందరూ మా మనసు మార్చాలని ప్రయత్నించలేదు.

నేను, మిట్టు అమ్మ వాళ్ళింట్లో వారం రోజులు హర్రి బర్రీ లు లేకుండా ఫెమిలీతో గడిపాం. రాఘవులు తన ఊబర్ లోనే మమ్మల్ని అన్ని చోట్లకు తీసుకెళ్ళాడు. తిరుగు ప్రయాణం రోజు ఊబర్ లోనే ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసాడు.

ఈ జీవితం చాల విచిత్రమైంది. రాఘవులు ‘తాగి డబ్బు వృధా చేసేవాడు కాదు, సోమరిగా

రోజులు దోర్లించేవాడు కాదు, తాగుబోతు కాదు. అందని ఆశల కోసం ఎగబడేవాడు అంతకన్నా కాదు. కష్టపడి పని చేసి బాగుపడాలని కోరుకునే వాడే అయినా జీవితం వారికి కొన్ని దారులు  మూసేసింది. లక్ష్మి కష్ట పడి పని చేస్తుంది. మంచి మనసుతో జీవిస్తోంది కానీ చాలా డబ్బు కావాలని భర్తను వేధించదు. ఇలాంటి వారికి కాస్త సహాయం చేసి వాళ్ళు నవ్వుతూ సంతోషంగా ఉంటె నాకు తృప్తిగా ఉంది.

ఎయిర్ పోర్టులో గేటు దగ్గర సీట్లో కూర్చుని నేను, మిట్టు జరిగినవి నెమరు వేసుకుంటున్నాం.

“శాపహాలిక్ లో ఇంత దయ ఉందని నాకు తెలీదు. లతిక బదులు నీ పేరు కరుణ ఉంటె బాగుండేది.” నవ్వుతూ అన్నాడు మిథున్.

“పో..మిట్టూ-. ఈసారి మన ఇండియా ట్రిప్ చాలా బావుంది కదూ. నాకైతే ఎంతో సంతోషంగా ఉంది. లక్ష్మీ ఫేమిలీలో అందరూ ఎంత హేప్పిగా ఉన్నారు! మనం ఎవ్రీ ఇయర్ కాకుండా ఎవ్రీ అదర్ ఇయర్ ఇండియా వద్దాం. ఇండియా వచ్చినపుడు ఒక ఫెమిలికి హెల్ప్ చేద్దాం.” నా మనసంత తేలికగా ఉంది. ఇంతకు ముందు నాకిలాంటి ఆలోచన ఎందుకు రాలేదో!

“ప్రతిసారి కిడ్నీ ఇవ్వాలని అనుకునేవాళ్లు దొరకాలంటే కష్టమే!” మిట్టు జోకింగ్ గా అంటున్నా డని నాకు తెలుసు.

“సేం టైప్ ఆఫ్ హెల్ప్ అని నేనడం లేదు. ఒకరికి చదువు చెప్పించడమో, హెల్త్ విషయంలో చేయూత నీయడమొ చేయోచ్చు. చిన్న హేల్పైనా సరే అది వాళ్ళ జీవితాన్నే మార్చేస్తుంది.”

“నాక్కూడా తృప్తిగా ఉంది. మే బి వుయ్ విల్ డు సంథింగ్ లైక్ దట్. అమ్మ అన్నట్టు పిల్ల, జెల్ల వస్తే ఏం చేద్దాం.” సడన్ గా అలా అనేసరికి నాకు నిజంగా చాల సిగ్గేసింది.

_________  సమాప్తం __________

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అరుంధతి… అటుకుల చంద్రహారం.

రచన: గిరిజారాణి కలవల

 

మామూలుగా తెలుగు సినిమాల్లో వచ్చే డైలాగే ఇది… “ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ సంగతీ చెప్పలేము…” అన్నాడు మెళ్ళో స్టెత్ సవరించుకుంటూ.. ఆ కుర్ర డాక్టర్.

డ్యూటీలోకి కొత్తగా వచ్చినా,  ఆ వాక్యం బానే కంఠోపాఠం పట్టినట్టున్నాడు.. అందుకే అప్పచెప్పేసాడు… అంతటితో ఆగకుండా అతని స్క్రిప్ట్ లో రాసిన మరో డైలాగ్ గుర్తు వచ్చి…” ఎందుకైనా మంచిది… బంధువులందరికీ కబురు పెట్టండి.. ఆవిడ ఎవరినైనా చూడాలని అనుకుంటే కనుక వెంటనే పిలిపించండి… ఆవిడకి ఆఖరికోరిక ఏదెనా వుంటే తీర్చేయండి..” అంటూ… పూర్తిగా చెప్పేసానా… ఇంకేమైనా చెప్పాలా.. అన్నట్టుగా.. నర్సు సిస్టర్ వేపు  చూసాడు…

ఆ నర్సమ్మ.. అంతేగా . అంతేగా.. అన్నట్టు బుర్ర పైకీ కిందకీ ఊపింది. ఈ మాటలు చెప్పేసి.. వాళ్ళిద్దరూ.. ఇంకేమైనా.. ఈ డైలాగులు చెప్పవలసిన పేషెంట్స్ వున్నారేమో వెతుక్కుంటూ వెళ్లిపోయారు.

ఆ మాటలకి అక్కడున్నవారందరూ మొహామొహాలు చూసుకున్నారు. అందరూ.. ఒకరి భుజాలమీద మరొకరు చేతులు వేసి… క్రికెట్ ఆటలో లాగా  గుండ్రంగా.. వచ్చి.. తలలు వంచి.. ” ఇప్పుడు.. ఏంటి కిం కర్తవ్యం?  ఏదో ఈ పూట మంచం  నుంచి దించెయ్యొచ్చు  అనుకుంటూంటే డాక్టర్ ఇంకా ఇరవైనాలుగు గంటలు అంటూ డౌట్ పెట్టాడు.. పైగా ఆఖరి కోరిక అంటున్నాడు… కొంపతీసి అది తీరకపోతే.. కానీ ఈవిడ పోదేమో.. ఆవిడ ఆఖరి కోరికేంటో మనకి తెలుసు కదా… అది ఇప్పుడు ఎక్కడ తీర్చగలమూ… అయినా గాడిదగుడ్డు కాదూ… నిజంగా ఆఖరి కోరిక కోసం ప్రాణం పోకుండా వుంటుందా ఏంటి? పోయే కాలం వస్తే అదే పోతుంది.. ఆ ప్రాణం ఎలాగూ పోతుంది.. దానికోసం ఇప్పుడు ఆ ఆఖరికోరిక తీర్చక్కర్లేదు.. ” అని తీర్మానం చేసుకున్నారు… ఆ పోడానికి సిద్ధంగా వున్న.. ముసలావిడ అరుంధతిగారి కొడుకు, కోడలు,  కూతురు, అల్లుడూ.. ఇంకా చెరి ఇద్దరి చొప్పున.. మొత్తం  నలుగురు మనవలూ.. వాళ్ళ పెళ్ళాలూ  అదీ సంగతి..

ఐ. సి. యు లో వున్న అరుంధతిగారిని ఒకరితర్వాత ఒకరు చూసి వచ్చేసి… ఇరవైనాలుగు గంటల్లో హాస్పిటల్ వాళ్ళే ఫోన్ చేస్తారెటూ.. అప్పుడు వద్దాము.. ఇక్కడుండి చేసేది లేదు పోదాం… అనుకుంటూ రెండు కుటుంబాలవారూ ఇళ్ళకి వెళ్లి పోయారు.

అదేమీ తెలియని అరుంధతి… తన ఆఖరి కోరిక తీరేదాకా.. తన గుండెని కొట్టుకోమనే చెప్పినట్టుంది..

డాక్టర్లు చెప్పిన ఇరవైనాలుగు గంటల గడువు నలభైఎనిమిదికి పెరిగింది..

మళ్లీ రెండు కుటుంబాలూ రౌండప్ చేసుకున్నారు.

అరుంధతి కూతురు… ఉమ.. ” వదినా! పోనీ డాక్టర్ చెప్పినట్లు అమ్మ ఆఖరి కోరిక తీరిస్తేనో.. పాపం ఆ ప్రాణం కొట్టుకుంటోంది.. దాని కోసమే కాబోలు..” అంది..

దానికి అరుంధతి కోడలు.. భారతి.. ” నీకేం.. నువ్వు బానే చెపుతావు.. సలహాలు… ఇప్పుడు హాస్పిటల్ ఖర్చే.. రెండు లక్షలు అయింది… ఇక ఆ కోరిక  కూడా తీర్చాలంటే కనీసం.. మరో రెండు లక్షలు అయినా పెట్టాలి. మా వల్ల కాదమ్మా!   ఏంటండీ బెల్లం కొట్టిన రాయల్లే మాట్లాడరు.. మీ చెల్లికి సమాధానం చెప్పండీ” అంది.   హమ్మా !!    ఆ తర్వాత.. అమ్మది నాకేగా అని కొట్టేద్దామనే ప్లాన్ కాబోలు.. అనుకుంది మనసులో..

అరుంధతి కొడుకు.. బ్రహ్మానందం..  భార్య భారతి మాటలకి తలూపుతూ..” అంతేగా.. అంతేగా.. ” అన్నాడు.

అన్న, వదిన మాటలకి చర్రున కోపం వచ్చింది  ఉమకి.. ఆ కోపం తన భర్త  శివరావు మీద చూపిస్తూ..”ఏంటండీ.. తుమ్మ మొద్దులా నిలబడ్డారూ.. చెప్పండీ.. అమ్మ గురించి రాత్రి మనం ఏమనుకున్నామో.. ” అంటూ.. కసిరింది.

” అది కాదు.. బామ్మర్దీ… ఇలాంటి స్టేజీ లో వున్నవారి ఆఖరి కోరిక తీర్చకపోతే.. ఆ ప్రాణం అలా కొట్టుకుంటూనే వుంటుందట..ఆ తర్వాత ఆత్మ కూడా ఇక్కడిక్కడే తిరుగుతూఉంటుందట. దయ్యమై మనల్ని పట్టుకోనూ వచ్చట.. అందుకని  చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలము.. ఇప్పటికే హాస్పిటల్ ఖర్చు రెండులక్షలయిందని మీ ఆవిడ బాధ పడుతోంది.. ఇంకా ఇలాగే.. ఐ. సి. యు. లో.. వెంటిలేటర్ మీద ఎన్నాళ్ళుంచుతాము?  మరో రెండు మూడు లక్షలు పైగా అయేట్టుంది ఖర్చు .. ఏతావాతా ఆ తర్వాత కర్మకాండల ఖర్చు ఎలాగూ తప్పదు.. అందుకే.. అదేదో కొనేసి ఆవిడకి ఓసారి చూపించామనుకో.. తృప్తిగా కళ్ళు మూస్తుంది మీ అమ్మ గారు.. ” అన్నాడు శివరావు.

” అదేంటన్నయ్యా… మీరూ అలాగే అంటారు? ఇప్పుడు అంత పెట్టుబడి మేము ఎలా పెట్టగలము? కాస్త ఆలోచించండి.. ” అంది భారతి.

” ఔనమ్మా… అదికూడా ఆలోచించాను.. అందుకే నేను సగం పెడతాను.. మీరు సగం పెట్టండి. ఆవిడకీ సంతృప్తిగా అనిపిస్తుంది.. పైగా ఇప్పటి కోరికా అది ? మనవెవరం రాక ముందుది.. ఆవిడ కాపురానికి వచ్చినప్పటినుండీ.. కాదు కాదు.. ఆవిడ చిన్నప్పటి నుంచీ దాని మీదే వుంది ఆవిడ మనసు.. అదేదో మనం కొంటే..  ఓసారి కళ్ళారా చూసుకుని.. కళ్ళు మూసేస్తుందిక. ఆ తర్వాత కార్యక్రమాలు అయ్యాక.. మళ్లీ మనిద్దరం ఎవరి వాటా వాళ్ళు తీసేసుకుందాం.. ఇంతకిమించి మరో మార్గం లేదు ఇప్పుడు..  ” అన్నాడు శివరావు.

” ఆ సగం పెట్టాలన్నా… ఇబ్బందే అన్నయ్యగారూ.. ” అంది భారతి.. మనసులో మాత్రం ఇదేదో బావుందే.. ఇలాగైనా నా కోరికా తీరవచ్చు.. అనుకుంటూ..

వెంటనే అందుకుంది ఉమ…” మాకు మాత్రం ఇబ్బంది లేదేంటి వదినా.. అప్పో సప్పో చేయాల్సిందే మేమైనా.. ఏదో అమ్మ ఆఖరి కోరిక తీర్చగలిగితే చాలు.. ” అంది..

ఈ రూపంలో అయినా తన కోడళ్ళ కిద్దరికీ.. ఏదో అమర్చినట్లవుతుంది.. అనుకుంది తనూ లోలోపల.

” అయితే.. మరి పదండి… వెళ్లి తీసుకువద్దాము.. సాయంత్రానికి మనం తీసుకువచ్చి ఆవిడకి చూపిస్తే.. .. రాత్రికి ఏ సంగతీ తేలిపోతుంది.. ” అంటూ శివరావు అందరినీ  బయలు దేరమన్నాడు.

పొలో మని రెండు కార్లలో అందరూ బయలుదేరారు.

వాళ్ళందరూ ఎక్కడకి బయలుదేరారో.. ఏం తేబోతున్నారో..

అసలు..  ఇంతకీ ఆ అరుంధతి గారి ఆఖరి కోరిక ఏంటో తెలుసుకోవాలంటే… చాలా వెనక్కి వెళ్ళాలి. ఎంత వెనక్కి అంటే.. అరుంధతి బాల్యం లో దాకా వెళ్లి పోవాలి…

టయ్ టయ్ టయ్.. రింగులు రింగులు తిప్పుతున్నా.. ఫ్లాష్ బ్యాక్ లోకి..

అప్పుడు.. అరుంధతికి ఆరేళ్ల వయసు.  తండ్రి, తల్లి, బామ్మ, అన్నయ్య..వీళ్లు  తన కుటుంబ సభ్యులు.  అప్పుడప్పుడు.. పండగలకీ, పబ్బాలకీ.. మేనత్త సుభధ్ర అత్తగారి ఊరు అమలాపురం నుంచి పుట్టింటికి వస్తూ వుండేది. ఓ వారం పది రోజులుండి వెళ్ళేది. మేనత్త వస్తోందంటే అరుంధతికి చాలా సంతోషంగా వుండేది. ఆవిడ వున్ననాళ్ళూ.. వెనకాలే  తిరిగేది. ఆవిడ తీసుకువచ్చే.. సున్నుండల కోసమో.. వెళ్ళేటపుడు చేతిలో పెట్టే ఐదురూపాయల కోసమో కాదు ఆ సంతోషం. మేనత్త మెడలో మెరిసిపోయే అటుకుల చంద్రహారం కోసం.. అదంటే అరుంధతికి ఎంత ఇష్టమో. పచ్చగా మెరిసి పోయే మేనత్త మెడలో ఆ  నాలుగుపేటలు… అరచేయంత బిళ్ళతో వుండే ఆ అటుకుల చంద్రహారం. ఆవిడ నడుస్తున్నపుడు.. ఊగుతూ.. తళుక్కున మెరుస్తూ.. అరుంధతిని ఆకట్టుకునేది.  ” అత్తా! ఓసారి నీ గొలుసు ఇయ్యవా..” అనడిగితే.. అబ్బే.. అస్సలు ఇచ్చేది కాదు మేనత్త. మిగిలినప్పుడు ఎంత ముద్దు చేసినా… చంద్రహారం దగ్గరకి వచ్చేసరికి మాత్రం ఒప్పుకునేది కాదు. ” ఇంకా నయమే.. ఇది పిల్లలు వేసుకోకూడదే.. నాలుగు పేటలూ నలభై తులాలు.. ఎక్కడెనా పారేసావనుకో.. మా అత్తారు గుమ్మం కూడా తొక్కనీయరు.. చిన్నపిల్లవి నీకెందుకూ ఇంత గొలుసు..” అనేది కానీ.. ముచ్చటపడుతోంది కదా.. ఓసారి కూడా అరుందతి మెళ్ళో వేసేదికాదు.

” అమ్మా! అత్తకి ఉన్న గొలుసు లాంటిది నాకూ చేయించవే.. ” అని అమ్మ దగ్గర గారాలు పోయేది అరుంధతి.

” మనకంత తాహతు లేదే తల్లీ. ఆ కరణం గారు తన దగ్గర. ఆ జమాబందీ లెక్కలు రాసేటప్పుడు  మీ నాన్నకి   ఇచ్చిన ఏదో.. రూపాయీ, అర్ధా.. డబ్బులు  మిగిల్చి.. నీకూ, నాకూ.. చెరో ముక్కుపుడకా… కాళ్ల కి వెండిపట్టీలు.. కొనగలిగారు… అంతే.. ఇక ముందుకు మాత్రం ఇక పోలేరే.. నాలుగు వేళ్ళూ వేళకి లోపలకి వెడితే చాలు… నాలుగుపేటల గొలుసంత సంబరమే మన బతుకులకి… ” అనేది అమ్మ.. ఆ నిష్టూరాలేంటో అర్ధమయేవి కావు అప్పట్లో అరుంధతికి.

రాత్రి పూట బామ్మ పక్కలో పడుకుని.. కధలు వినేటప్పుడు.. ..” బామ్మా.. అటుకుల చంద్రహారం కొనాలంటే ఎంత డబ్బులు కావాలీ? ” అనేది.

” ఓసి, పిచ్చి మొహమా.. నీకెప్పూడూ అదే ధ్యాస.. అది కొనాలంటే డబ్బులు అక్కర్లేదే.. పెళ్లి చేసుకుంటే చాలు.. అత్తారే కొనిపెడతారు.. మీ సుభధ్ర అత్తకి దాని పెళ్ళి లో.. వాళ్ళ అత్తగారు పెట్టారు ఆ చంద్రహారం.. నీకూ అలాగే మీ అత్తగారు పెడతారులే. ” అనేది ఆవిడ.

వెంటనే నాన్న దగ్గరకి పరుగెత్తుకుని వెళ్లి..” నాన్నా! నాకు తొందరగా పెళ్ళి చేసెయ్యి నాన్నా ! మా అత్తారు అటుకుల చంద్రహారం పెడతారు.. ” అంది.

” అలాగే.. బంగారు తల్లీ… ఇంకొక్క పదేళ్ళు ఆగు.. అలాగే చేసేస్తాను.. ” అనేవాడు తండ్రి.

ఓసారి.. అరుంధతికి మల్లెపూలతో జడ కుట్టింది బామ్మ.. కూతురితో.. ” సుభధ్రా! ఓసారి నీ చంద్రహారం.. అరుంధతి మెళ్ళో వెయ్యవే.. ముచ్చటపడుతోంది… ఈ జడ, ఆ హారంతో.. ఫోటో తీయిద్దాము.. దాని మోజు తీరుతుంది.. ” అని.. ఆ  హారం వేయించి స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీయించింది. ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టించి.. మంచం పక్కనే పెట్టుకునేది అరుంధతి.. హారం కేసి చూస్తూ పడుకునేది.

చూస్తూండగా పెళ్ళీడుకి ఎదిగింది.  వచ్చిన రెండు సంబంధాలలో ఇది బాగా నచ్చింది అరుంధతి తండ్రికి..  పెళ్లి కొడుకు  శేఖరానికి గవర్నమెంట్  ఉద్యోగం… సొంత ఇల్లు.. రెండెకరాల మాగాణి వుంది  కరెంటు ఆఫీసులో గుమాస్తా గిరీ  వుంది..  తండ్రికి రెండకరాల పొలం వుంది.. ఆయన వ్యవసాయం చేస్తాడు.. ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద పిల్లకి పెళ్ళి అయింది.. ఇంకా ఇద్దరు పెళ్ళికి వున్నారు. తల్లి లేదు.. వాళ్ళకి అరుంధతి నచ్చింది.. జాతకాలూ కుదిరాయి.

తమ తాహతుకి ఇంతకి మించి సంబంధం రాదని అనుకుని అరుంధతి తండ్రి.. మంచిరోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందామనుకున్నాడు. మళ్లీ గుర్తు చేసింది అరుంధతి.. అటుకుల చంద్రహారం గురించి తండ్రికి.

ఆయన.. తాంబూలాలు మార్చుకునే రోజున వియ్యంకుడితో అన్నాడు…  “పెళ్లి కి మేము మా పిల్లకి బాలతొడుగు కింద..  జత గాజులు, పుస్తెల గొలుసు పెడతాము… మీరు మీ కోడలికి ఎలాగూ ఏదో ఒకటి చేయించాలి కదా… అటుకుల చంద్రహారం చేయించండి.. మా పిల్లకి ఎప్పటినుండో దాని మీద మనసుగా వుంది..” అంటూ మొహమాటం లేకుండా చెప్పేసాడు.

“అయ్యో.. మీరింతగా చెప్పాలా! మా ఇంటికి వచ్చే మహాలక్ష్మికి.. చంద్రహారం చేయించమంటే కాదంటామా… అయితే.. పంట చేతికి వచ్ఛాక చేయిస్తాను.. ఇప్పుడు పెళ్లిలో నల్లపూసల దండ, ఉంగరం పెడతాం  లెండి.. ” అంటూ తప్పించుకున్నాడు అరుంధతి కాబోయే మావగారు..

“పంట చేతికి    రాక పోతుందా.. తన  కలల పంట పండకపోతుందా.. ” అనుకుని… తల వంచి మెళ్ళో తాళి కట్టించేసుకుంది అరుంధతి.. కానీ… కాలక్రమంలో పుట్టింటివారు పెట్టిన బంగారం పుస్తెల గొలుసు  స్థానంలో.. పసుపుతాడు వచ్చింది కానీ… అటుకుల చంద్రహారం పెడతామన్న మాట హుళిక్కే అయింది. పంట చేతికి రావడం మాట అటుంచి.. మిగిలిన ఇద్దరాడబడుచుల పెళ్ళి కోసం.. వున్న రెండెకరాలు అమ్మేసారు మామగారు. ఆ తర్వాత.. ఆడబడుచుల రాకపోకలు.. పురుళ్ళు, పుణ్యాలూ.. ఆ తర్వాత మామగారు మంచాన పడితే ఖర్చులూ.. ఇలా ఒకదానితర్వాత మరోటి వచ్చిపడి అటుకుల చంద్రహారాన్ని వెనక్కి నెట్టేసాయి. మధ్య మధ్యలో.. తన చిన్నప్పటి ఫోటో.. మేనత్త తన మెడలో వేసినప్పుడు తీయించుకున్న ఫోటో కేసి ఆశగా చూసుకుంటూ వుండిపోయేది పాపం.

తర్వాత.. తన పిల్లలు బ్రహ్మానందం, ఉమ పుట్టడం.. వాళ్ళ చదువులు, ఖర్చులకి సొంత ఇల్లు కూడా అమ్మాల్సిన పరిస్థితి  వచ్చింది. పేరుకి గవర్నమెంట్ ఉద్యోగమే అయినా జీతం అంతంతమాత్రమే..ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు రెడీగా కూర్చునేది. పాపం.. శేఖరానికి. భార్య అరుంధతి నోరు తెరిచి అడక్కపోయినా.. ఆవిడ కోరిక తెలుసు.. ఎప్పటికైనా  ఎలాగైనా తీర్చాలనే అనుకుంటూ వుంటాడు.

” అరుంధతీ… ఉన్న ఆస్తులను అమ్మేసుకోవలసి వచ్చింది.. నా చెల్లెళ్ళు.. ఇప్పుడు మన పిల్లల కోసం. ఇప్పుడు పిల్లల బాధ్యత కూడా తీరిపోయింది.. అబ్బాయి సెటిల్ అయిపోయాడు.. అమ్మాయికి పెళ్లి చేసేసాం.. ఇక కొత్తగా ఖర్చులు లేవు.. మరో మూడు నెలలో రిటైర్ అయిపోతాను.. అప్పుడు వచ్చే డబ్బులతో నీకు అటుకుల చంద్రహారం చేయిస్తాను.. ఒట్టు.. ” అన్నాడు శేఖరం.

ఆ మాటలతో అణిగిపోయిన అటుకుల చంద్రహారం ఆశ మళ్లీ మొలకెత్తింది అరుంధతికి. భర్త ఎప్పుడు రిటైర్ అవుతాడా.. ఎప్పుడు చంద్రహారం కొంటాడా అని ఆ మూడు నెలలూ మూడు యుగాలుగా గడిపింది. రిటైర్ అయ్యాక… ఓ నెలరోజుల్లో.. శేఖరం చేతికి ఓ పెద్ద మొత్తమే అమిరింది. ఆ  సాయంత్రమే భార్యాభర్తలిద్దరూ .. బంగారం కొట్టుకి వెళ్ళారు. అయితే.. అరుంధతి కోరుకున్న నాలుగుపేటలకీ.. ఈ డబ్బుతో రెండు పేటలు కూడా రావని తెలిసింది.  పోనీ ఒక పేట తీసుకోమని భర్త చెప్పినా.. రాజీ పడలేదు అరుంధతి.. నాలుగుపేటలూ.. అరచెయ్యంత బిళ్ళ వుండాల్సిందే.. వేరేలా వద్దు కాక వద్దనేసింది. చేసేదేం లేక  ఇంటి మొహం పట్టారు.

ఇంతలో శేఖరం స్నేహితుడు.. మోహనరావు.. ఇల్లు కట్టుకుంటూ.. అవసరానికి నీ దగ్గర వున్నవి సర్దు… పదిహేను రోజుల్లో చీటీపాట డబ్బులు వస్తాయి.. అప్పుడు ఇచ్చేస్తానంటే.. కాదనలేక తనకి వచ్చిన డబ్బును.. మోహనరావుకి  ఇచ్చాడు. పదిహేను రోజులే కదా.. అని రాతకోతలేవీ లేకుండా  చేబదులుగా  ఇచ్చాడు. తానొకటి తలిస్తే దేముడొకటి తలుస్తాడు కదా.. ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న  మోహనరావు యాక్సిడెంట్ అయి అక్కడక్కడే పోయాడు.. ఆ తర్వాత… ఈ డబ్బు సంగతి శేఖరం.. మోహనరావు కొడుకులని అడిగితే.. తమకేం తెలీదు.. తండ్రేం తమకి చెప్పలేదు కాబట్టి మాకు సంబంధం లేదని నిక్కచ్చి గా చెప్పేసారు. తమకి అంటూ మిగిలింది మొత్తం ఇలా పోగొట్టుకొనేసరికి శేఖరం దిగులతో మంచమెక్కాడు. భార్య కోరిక తీర్చలేకపోయాననే  బాధతో నెలలోపునే కన్ను మూసాడు.

అరుంధతి కొడుకు పంచన చేరక తప్పలేదు. ఏదో ఫర్వాలేదు.. రోజులు వెళ్ళదీస్తోంది.. అప్పుడప్పుడు ఆశగా తన చిన్నప్పటి ఫోటో కేసి చూసుకుంటూ. ఆవిడ కోరిక తీర్చలేని స్థితిలో అయితే మాత్రం లేడు కొడుకు. ఓ సారి భార్యతో..  “పోనీ పాపం.. అమ్మకి ఆ హారం కొంటేనో.” . అని పొరపాటున అన్నాడు.. అంతే.. .”ఇంత వయసులో కూడా ఆవిడకి అటుకుల చంద్రహారమేంటీ.. నవ్వుతారు అందరూ.. ఊరుకోండి..  ఆవిడకి మనం మూడుపూటలా తిండి పెడుతున్నాం చాలు.. ఇక ఆ కోరికలెక్కడ తీరుస్తాం.” . అంటూ కోడలు భారతి.. బ్రహ్మానందాన్ని..  మళ్లీ నోరెత్తనీయలేదు.

ఓపిక ఉన్ననాళ్ళూ కొడుకు, కోడలికి  చేయగలిగినంత చేసిన.. అరుంధతి.. ఇక ఎనభైలో పడిన వయసూ.. శరీరం మూలన పడి.. చివర ఇదిగో ఇలా ఐ. సి. యూ వరకూ లాక్కొచ్చాయి..

అన్ని షాపులూ తిరిగి.. చివరకు లలితా జ్యూయలరీలో నాలుగు పేటల అటుకుల చంద్రహారం.. మొత్తానికి తీసుకున్నారు బ్రహ్మానందం, ఉమ.. చెరిసగం డబ్బులేసుకుని..

తిన్నగా  హాస్పిటల్ కి వచ్చి.. అరుంధతి దగ్గరకి వెళ్ళారు.  కూతురు, కోడలు.. కొడుకు, అల్లుడు ఆవిడ బెడ్ కి అటూఇటూ చేరి.. ఆవిడ రెండు చెవుల్లోనూ…

” అటుకుల చంద్రహారం.. అటుకుల చంద్రహారం.. ఇదిగో.. ఒకసారి కళ్ళు తెరవండి..” అంటూ పదే పదే అనేసరికి.. అప్పటిదాకా అచేతనంగా వున్న అరుంధతి శరీరంలో చిరుకదలిక కనపడింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా.. అటుకుల చంద్రహారం కనపడేసరికి.. ఆ గాజుకళ్ళలో మెరుపు మెరిసింది. నెమ్మదిగా ఆవిడ తల పైకెత్తి.. మెడలో ఆ హారం వేసారు.. ఆ హారం స్పర్శ లోపల  గుండెకి తెలిసింది కాబోలు.. చిన్నగా కొట్టుకోవడం మొదలెట్టింది.. అక్కడే వున్న డ్యూటీ డాక్టర్..  మానిటర్ కేసి చూస్తూ ..

” వండర్.. ఆవిడ పల్స్ కరెక్టుగానే కొట్టుకుంటోంది…” అంటూ.. గబగబా మిగిలిన టెస్టులు అన్నీ చేసి.. ” చాలా ఆశ్చర్యంగా వుంది.. ఆవిడకి ఇప్పుడు ఏ ప్రోబ్లమ్ లేదు.. ఇంత సడన్ గా ఈ మార్పుకి మాకే వింతగా వుంది.. రెండు రోజుల్లో ఆవిడని ఇంటికి తీసుకెళ్ళపోవచ్చు మీరు”.. అనేసరికి.. వినగానే  ఢాం అని పడిపోయిన భారతిని, ఉమని.. అదే హాస్పిటల్ లో చేర్చారు..

క్షేమంగా ఇంటికి చేరిన అరుంధతి.. అటుకుల చంద్రహారం మోజు తీర్చుకుని .. సెంచరీ కొట్టాక.. ఓరోజు నిద్రలోనే.. ఎవరికీ చెప్పకుండానే.. శాశ్వత నిద్రలోకి వెళ్లి పోయింది తృప్తిగా..

 

 

*****

ఎడం

రచన- డా. లక్ష్మి రాఘవ

 

“సుచిత్ గురించి భయంగా వుంది రూపా” మాలిని గొంతు ఆందోళనగా వుంది ఫోనులో

“ఏమయింది?” రూప అడిగింది స్నేహితురాలిని.

“ఈమధ్య వాడు కొంచం వేరుగా బిహేవ్ చేస్తున్నాడు”

“ఒక సారి ఇంటికి తీసుకురా మాలినీ”

“ఇంటి కా? నీ క్లినిక్ కి వద్దామనుకున్నా”

“ఈ వారం స్కూల్స్ విజిట్ చెయ్యాలి. కాబట్టి క్లినిక్ కి వెళ్ళను.”

“అయితే వాడు స్కూల్ నుండీ రాగానే తీసుకు వస్తా”

“చిన్నోడు ఎలా వున్నాడు? రజిత్ కదా పేరు…”

“అవును, రజిత్ ను కూడా తీసుకు వస్తా”అని ఫోను పెట్టేసింది మాలిని.

మాలిని ఫ్రెండు  రూప పిల్లల సైకాలజిస్టు గా పని చేస్తూంది. పిల్లలు కొత్త కొత్త కోణాలలో వివిధ సమస్యలు సృష్టిస్తూ తన జాబ్  ని  చాలెంజ్ గా వుంచినా  వాళ్ళ బుర్రల్లోకి దూరిపోయి చూడాలన్నట్టు  ఉత్చాహంగా ఉంటుంది ఎప్పుడూ…మాలిని ఫోను వచ్చాక వాళ్ళ పెద్దబ్బాయి సుచిత్ ప్రాబ్లం ఏమి వుంటుందీ అని ఆలోచించసాగింది.

మరురోజు సుచిత్ ను, నాలుగేళ్ల రజిత్ ను తీసుకుని వచ్చింది మాలిని. భర్త  రవి  ఆఫీసు పని మీద బెంగళూరు వెళ్ళారుట.

పదేళ్ళ సుచిత్ కి వీడియో గేమ్స్  ఇష్టం ఉండచ్చు అని అవి ఇచ్చింది. రజిత్ అక్కడ వున్న కారు, జీపు బొమ్మలతో ఆడుకోవాలని చూసాడు.

కాఫీ తీసుకుని వచ్చి మాలినికి ఇస్తూ…

“ఇప్పుడు చెప్పు…ఏమిటి ప్రాబ్లం?” అంది.

“కొద్ది రోజులు గా సుచిత్ డల్ గా ఉంటున్నాడు. సరిగ్గా చదవటం లేదు కూడా. బెదిరించినా కొట్టినా ప్రయోజనం లేకుండా వుంది. స్కూల్ ల్లో టీచర్ కూడా పిర్యాదు  చేసింది. హో0వర్క్  సరిగా చెయ్యటం

లేదుట..పలానా హో౦వర్క్ వుంది అని  చెప్పడం మానేసాడు.. ఇక రజిత్ తో బాగానే ఆడుకునేవాడు ఇప్పుడు అది కూడా మానేశాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు…”

“నీవు చెక్ చెయ్యవా ఏమి హోం వర్క్ ఇచ్చినారు అని?”

“అంత టైం వుండదు రూపా…రవి క్యాంపులు ఎక్కువయ్యాక నాకు పని ఎక్కువ అయ్యింది. రజిత్ చిన్నవాడు, వాడిని చూసుకోవాలి కదా…సుచిత్ కి పదకొండేళ్ళువచ్చాయి…పెద్దవాడు కదా…”

“చదువులో హెల్ప్ కావాలంటే ట్యూషన్ కి వెయ్యచ్చు కదా”

“వెయ్యచ్చు…అది అంతగా ఆలోచించలేదు రూపా, నార్మల్ గా వున్నవాడు సడన్ గా మాటలు ఎందుకు తగ్గింఛి ముభావంగా తయారైనాడు?”

“ఇంకా….”

“ఒంటరిగా కూర్చుని ఆలోచించేది ఏమి వుంటుంది ఈ వయసులో? ఏదైనా ఒంట్లో బాగాలేకుండా ఉందా అని డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్నీ చెకప్ చేయించాము. అంత నార్మల్ గ వుంది. ఏమీ అర్థం కావటం లేదు. పైగా  రజిత్ తో ఆడుకోవడానికి గానీ, ఇంకేదైనా చేద్దామని కానీ ఆసక్తి లేకపోవడం ఎందుకు? నీవు స్కూల్స్ కు  కూడా వేడతావు కదా పిల్లల ప్రాబ్లెమ్స్ బాగా  తెలుస్తాయి..అనుకుని నీ దగ్గరికి వచ్చాను” అంటూంటే రజిత్ వచ్చాడు బాత్రూం వెళ్ళాలి అని. మాలిని తనను తీసుకుని వెళ్ళింది.

సుచిత్ ఏమిచేస్తున్నాడో అని తొంగి చూసింది..

సుచిత్ వీడియో గేమ్ పక్కన పడేసి, ఏరోప్లేన్ ప్రాజెక్ట్ బాక్స్ తీసి చూస్తున్నాడు.

“ఓ…ఇది హెల్ప్ లేకుండా చెయ్యడం కష్టం, రజిత్ హెల్ప్ తీసుకో…”అంది రూప.

“నో…” అని గట్టిగా అని అక్కడ నుండి లేచి వీడియో గేమ్ తీసుకుని దూరంగా కుర్చీలో కూర్చున్నాడు.

హాల్లోకి మాలిని రాగానే కొన్ని స్నాక్స్ తీసుకు వచ్చి అందరికీ ఇస్తూ…

“ఈ మధ్య కాలం లో ఏమైనా మార్పులు జరిగాయా?” అని అడిగింది రూప.

“అంటే??”

“స్కూల్ ల్లో టీచర్ మారటం…వాడి ఫ్రెండ్స్ మారటం…లాటివి.”

“ఏమీ లేదు. పాత టీచరే …ఫ్రెండ్స్ లో మార్పులు కూడా లేవు…” అంది ఆలోచిస్తూ.

“సరే మాలినీ రేపు కొంచం సేపు సుచిత్ ని నాదగ్గర వదిలి పెట్టు అబ్సర్వ్ చేస్తాను…”

కాసేపు కూర్చుని పిల్లలు ఇద్దరినీ తీసుకుని వెళ్ళిపోయింది మాలిని.

మరురోజు  సుచిత్ ని  స్కూల్ నుండీ నేరుగా రూప ఇంట్లో దింపి వెళ్ళింది మాలిని.

ఇంట్లో పనులు చేసుకుంటూనే సుచిత్ తో మాట్లాడుతూ వుంది రూప.

డైనింగ్ టేబులు దగ్గర కూర్చుని రూప ఇచ్చిన స్నాక్స్ తింటూ జవాబులు చెబుతున్నాడు సుచిత్.

జవాబులు ముక్త సరిగా వున్నాయి.

“స్కూల్ ల్లో నీ ఫ్రెండ్స్ ఏమి ఆడతారు?”

“నీకు ఏ గేమ్ ఇష్టం…?”

“నీకు ఏ టీచర్ ఇష్టం?”

“నీకు నచ్చిన సబ్జక్ట్ ఏమిటి?”

దేనికీ పొడుగాటి జవాబు కానీ, కొనసాగించే ప్రయత్నం కానీ జరగలేదు…

“ఇంటి దగ్గర రజిత్ తో నే ఆడతావా?”

“నాకిష్టం లేదు…” టక్కున వచ్చింది జవాబు!

“ఎందుకు?”

“రజిత్ చిన్న వాడు…నాతో బాటు సైకిల్ కూడా తొక్కలేడు…పరిగేట్టలేడు…పైగా వాడు పడిపోతే మమ్మీ కోప్పడుతుంది…” కొంచం అర్థమైనట్టు అనిపించింది రూపకు.

“ఇంకా…” అంది

“నాకు తేజా తో ఆడుకోవాలని వుంటుంది…వాడు ఆడడు.”

“తేజ ఎవరు?”

“పక్కింటి అబ్బాయి…” అని చటుక్కున లేచి ప్లే రూం లోకి వెళ్ళిపోయాడు.

ఎక్కువ పొడిగించడం ఇష్టం లేనట్టు…సో…ఎలా మాట్లాడితే సరిపోతుందో అంచనా వేసుకుంది రూప.

ఏడూ గంటలకు మాలిని వచ్చి పికప్ చేసుకుంది.

“రేపు కూడా కొంచం సేపువదిలి పెట్టు మాలినీ” అంది రూప.

మరు రోజు స్కూల్ అయ్యాక సుచిత్ ని దింపడానికి వచ్చిన మాలిని తో

“తేజా ఎందుకు ఆడుకోడు సుచిత్ తో?” అని అడిగింది రూప

“తేజా వాళ్ళు పక్కన ఇంటికి వచ్చి 6 నెలలు అవుతూంది. అంతగా క్లోజ్ అవలేదు ఇంకా”

“సుచిత్ వయసేనా? ఇంకా ఫ్రెండ్ అవలేదా?”

“సుచిత్ వయసే కానీ వాడికి కొంచం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంత చిన్నవయసులో ఆరోగ్యం గా లేకపోవడం ఎంత బాధాకరమో అని వాడి అమ్మ చాలా బాధపడింది పక్కన ఇల్లు చేరిన కొత్తలోనే. వాడిని బయట ఆడుకోవడానికి పంపరు. అందుకే సుచిత్ ను ఎక్కువ పంపను వాళ్ళింటికి…ఎప్పుడూ చాలా కేర్ తీసుకుంటారు ఆ అబ్బాయి విషయంలో వాళ్ళ పేరెంట్స్.” అని చెప్పింది మాలిని.

“సరే ఈరోజు నేనే దింపుతాను సుచిత్ ని…నీవు రాకు…” అంది.

“రేపు రవి వచ్చేస్తాడు…” అంటూ కారెక్కింది మాలిని.

వరసగా మూడో రోజు రూప దగ్గరికి వస్తూ వుండటం తో  సుచిత్ కొంచం ఫ్రీగా, చనువుగా తిరిగాడు ఇల్లంతా.

సుచిత్ వెంట వెడుతూ మాట్లాడుతూంది రూప. నిన్నటి కంటే కొంచం మెరుగైన జవాబులిచ్చాడు.

“మీ ఇంట్లో అయితే ఎంచక్కా ఇద్దరు వుంటారు…నీవు, రజిత్… కాబట్టి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది…”

“నాకిష్టం లేదు…”

“ఎందుకని? ”

“ముందు నేను ఒక్కడినే వుండే వాడిని…మమ్మీ డాడీ నాతోనే ఎక్కువసేపు వుండే వాళ్ళు.”

ఉన్న రెండు గంటలూ సుచిత్ బాగా అర్థం అయ్యాడు రూపకు…సుచిత్ ని  ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యడానికి  వెళ్ళినప్పుడు.

“కాస్సేపు మాట్లాడాలి నీతో”అంది మాలిని తో

“ఉండు రూపా, పిల్లలకి కార్టూన్ నెట్వర్క్ పెట్టి వస్తాను” అని వెళ్లి పిల్లలని అక్కడ సెట్ చేసి వచ్చింది.

తనకు అర్థమైన సుచిత్  ప్రాబ్లం గురించి కొంచం చెప్పగానే మాలిని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి.

“ఒకరుగా పెరగటం కంటే ఇద్దరుగా వుంటే తోడూ వుంటుంది అని సుచిత్ కోసమే రజిత్ ని కన్నాము రూపా. కాక పొతే కాస్త ఆలస్యంగా ఆలోచించాము…ఏజ్ గ్యాప్ ఇంతలా ఎఫెక్ట్అవుతుందనుకోలా…”

“వయసు తేడా వచ్చేసరికి తన సామ్రాజ్యం లోకి రజిత్ వచ్చాడనే ఫీలింగ్ వచ్చింది.

పైగా అన్నీ షేర్ చేసుకోవాలని చెప్పేసరికి ఇంకా కోపం  ఎక్కువైంది. పెద్దవాడని వాడికి బాధ్యతలు పెంచకూడదు..ముఖ్యంగా ఆడుకునేటప్పుడు…చూసుకోమని మీరు చెప్పేసరికి  తన ఇష్టానుసారంగా ఆడుకో లేకుండా పోయానని ఫీల్ అయ్యాడు…”

“వాడికేంత వయసని ఇంతలా ఆలోచన చేసాడు?”

“ఆలోచన చేసే శక్తే కదా మనకు వున్నది. పిల్లల మనస్తత్వాలు విచిత్రంగా వుంటాయి.వాళ్ళ వయసులో కూడా డిప్రెషన్ వుంటుంది…ఆలోచనలూ మారతాయి…ఏదైనా ప్రాబ్లెం ఉన్నప్పుడే ఇది తెలుస్తుంది. రజిత్ పుట్టాక  మొదట బాగున్నట్టు  అనిపించినా తరువాత తనను పట్టించుకోవటం లేదన్న దాన్ని  ఫీల్ అయ్యేలా ఎన్నో సంఘటనలు జరిగివుంటాయి..ప్రతి ఒక్కటీ వాడి మైండ్ లో

రిజిస్టర్ అయ్యివుంటుంది..క్రమంగా సుచిత్ కి ‘ఎందుకిలా?? అన్న ఆలోచనతో డిప్రెషన్ వచ్చివుంటుంది…దానితో కొంచెం   ముభావంగా వుండటం జరిగి వుంటుంది…క్లాసులో కూడాముభావంగా వుండటం, చదువులో వెనక బడటం తో టీచర్ ద్వారా మీకు తెలిసినాక మీరు గమనిచడం ప్రారంభించారు…”రూప చెబుతూ వుంటే  ఆపి

“అంటే రెండో బిడ్డ కనడానికి కూడా ఇంత ఆలోచన చెయ్యాలి? అని అనుకోలేదు. జీవితం లో సుజీత్ కి ఒక తోడూ గా తమ్ముడిని ఇస్తున్నాం అనే అనుకున్నాం ”

“రెండో బిడ్డని కంటున్నామని కాదు మాలినీ ఎప్పుడు కంటున్నావనేది ఆలోచించాలి…సారీ ఇలా అంటున్నందుకు…గ్యాప్ ఎక్కువయ్యే కొద్దీ పెద్ద వాడికి ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఇది నచ్చింది,ఇది నచ్చలేదు అని ఆలోచన చేస్తాడు…ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే నార్మల్ చైల్డ్ వేరుగా బిహావ్ చేస్తాడు…హెల్త్ బాగుంటే వేరే కారణాలు ఏమిటీ అని ఆలోచించాలి.

పిల్లలు ఎదిగే వయసులో ప్రతి స్టెప్ లోనూ తల్లిదండ్రుల సాయం అవసరం వుంటుంది.

మనం గమనించకుండా ఉండిపోతే సుచిత్ లో ఇంకా బిహవియర్ చేంజెస్ వచ్చేవి…లక్కీ గా తెలుసుకున్నాం కదా.”

మాలిని ఆప్యాయంగా రూప చేయ్యిపట్టుకుంది

“తేజాని చూసినప్పుడు నా పిల్లలు ఆరోగ్యంగా వున్నారని దేవుడికి థాంక్స్ చెప్పుకున్నాను రూపా…ఇలాటి ప్రాబ్లంస్ గురించి ఆలోచనే రాలేదు”

“ఏమీకాదు మాలినీ, ఇప్పుడైనా ఆలస్యం కాలేదు…పిల్లలిద్దరినీ సమానంగా ట్రీట్ చేస్తున్నట్టు తెలిసేలా జాగ్రత్త తీసుకోండి… రవికి చెప్పు అవసరమైతే మళ్ళీ నాదగ్గరకు రండి.ఎప్పుడైనా సుచిత్ ని నాదగ్గరకు తీసుకురా…సరేనా?”అంది లేస్తూ

కళ్ళ నిండా నీళ్ళతో “థాంక్స్ చాలా”అంది మాలిని.

“అల్ ది బెస్ట్…ఫోను చెయ్యి” అంది కారెక్కుతూ రూప.

ఎంత మంది పిల్లలు కావాలి అన్న నిర్ణయం తో బాటు పిల్లల మధ్య ఎంత ఎడం వుంటే బాగుంటుంది అన్నది  కూడా ఆలోచించాల్సిన విషయమే అనిపించింది మాలినికి!!

 

 

******

 

 

 

హృదయ బాంధవ్యం

రచన: డా.కె.మీరాబాయి

“నేను జయంత్ నండి. నేను మీతో మాట్లాడాలి. ఈవాళ భోజన సమయంలో మిమ్మల్ని కలుసుకోవచ్చునా?”
ఫోనులో అతని గొంతు వినగానే వారిజ గుండె ఝల్లుమంది.
” అలాగే మీ ఇష్టం ” అంది కంగారు ఆణుచుకుంటూ. ఫోను పెట్టేయగానే రుమాలుతో ముఖం తుడుచుకుంది.
మొదటిసారి అబ్బాయిలతో మాట్లాడబోతున్న పదహారేళ్ళ పిల్లలాగా ఈ బెదురేంటీ? అని తనను తాను కుదుట పరచుకుంది.
ఈ రోజు ఆఫీసుకు చీర గానీ , చుడీదారుగానీ వేసుకుని వుంటే బాగుండేది అనుకుంది తను వేసుకున్న నీలం రంగు జీన్స్ పాంట్, తెల్లని టీ షర్ట్ చూసుకుంటూ.
తనేమన్నా కలగనిందా ఇవాళ అకస్మాత్తుగా అతను వచ్చి కలుసుకుంటాడని? నిన్ననే బెంగుళూరు వెళ్ళిపోయి వుంటాడనుకుంది. ఇంకోసారి నాతో మాట్లాడాలి అనిపించిందేమో ! ఆనుకుంటే వారిజ బుగ్గలు వెచ్చబడ్డాయి.
తన క్యుబికల్ నుండి బయటకు వచ్చి విశ్రాంతి గదిలోకి వెళ్ళింది ముఖం కడుక్కుని, పౌడర్ రాసుకుని, తేలికగా లిప్ స్టిక్ అద్దుకుంది.
తల మరోసారి దువ్వుకుని క్లిప్ పెట్టుకుంది. ఇవన్నీ చేస్తున్నా ఆమె మనసు మాత్రం ఆలోచిస్తూనే వుంది. వారిజకు సడెన్ గా ఆ రోజు వాలెంటైన్స్ డే అని గుర్తుకు వచ్చింది ” కాబోయే జీవన సహచరికి పువ్వులు కానుక ఇచ్చి ఆశ్చర్య పరచాలని అనుకున్నాడేమో ” ఆన్న ఆలోచన వచ్చి ఆమె పెదవుల మీద ఆహ్లాదకరమైన చిరునవ్వు తొంగి చూసింది.
తనకు ఇరవై అయిదేళ్ళు నిండిపోతున్నాయని అమ్మా, నాన్నా తొందర పెడుతుంటే అయిష్టం గానే పెళ్ళికి ఒప్పుకుంది. ఎవరిద్వారానో జయంత్ గురించి తెలిసి వారిజ జాతకము, ఫోటో ఈమైల్ చేసారు.
అన్నీ సరిపోయాయి అనుకున్నాక స్కైప్ లో చూసి మాట్లాడుకున్నారు. ప్రత్యక్షంగా కలుసుకోవడానికి వాళ్ళు నిన్న రావడం , జయంత్ , వారిజ అరగంట విడిగా మాట్లాడుకుని అంగీకారం తెలపడం జరిగింది.
మంచి రంగులో ఒడ్డు పొడవు వుండి , ముప్పై ఏళ్ళ వయసులోనే ప్రోజక్ట్ మానేజర్ గా చేస్తున్న జయంత్ ని చూడగానే నచ్చాడు వారిజకు. ఆలాగే అందంగా , చలాకీగా సుకుమారంగా వున్న వారిజ మొదటి చూపులోనే అతనికి నచ్చింది.
జయంత్ తలిదండ్రులకు ఒక్కడే కొడుకు. తండ్రి బాంక్ ఆఫీసరు గా రెటైర్ అయ్యారు. తల్లి గ్రుహిణి. వాళ్ళిద్దరూ వారిజతో కలుపుగోలుగా మాట్లాడారు.
“మాకు పెళ్ళైన పదేళ్ళకు పుట్టాడు వీడు. బి. టెక్ చదవడానికి దూరంగా పంపించాలంటే దిగులు పడిపోయాము. మాకు వున్నది వాడొక్కడే కదా ! ఆంటూ ప్రేమ నిండిన కళ్ళతో కొడుకు వైపు చూసాడు ఆయన.
“వీడికి ఉద్యోగం బెంగుళూరులో వచ్చింది. వంట రాదు. రోజూ హొటల్ లో ఎంత కాలమని తింటాడు? వాడి ఆరోగ్యం కన్న మాకు స్వంత ఇల్లు , మా వూరు ముఖ్యం కాదు కదా ! ఆందుకే ” అమ్మా నువ్వు వచ్చి వండి పెడితే తప్ప ఈ ఉద్యోగం చేయలేను”అంటూ మావాడు అడిగితే ఇల్లు అద్దెకు ఇచ్చేసి వాడిదగ్గరకు వచ్చేసాము. ఎప్పటికైనా మేము వాడి దగ్గర వుండాల్సిందే కదా ! మాకున్నది వాడొక్కడే కదా!” తల్లి అందుకుని చెప్పింది.
వారిద్దరూ అలా చెప్తుంటే జయంత్ అసహనంగా కదలడం గమనించి మనసులో నవ్వు కుంది వారిజ
పెళ్ళవగానే బెంగుళూరుకి బదిలీ పెట్టుకుంటుంది లెండి వారిజ ” అంది వారిజ తల్లి.
” మా అమ్మాయికి వంట బాగా వచ్చులెండి. ” అంది మళ్ళీ.
“వారిజ ఇక్కడ ఒక్క పడకగది ఫ్లాట్ మా ఇంటికి దగ్గరలోనే తీసుకుంది. ఆద్దెకు ఇచ్చేసాము. ఆలాగే కారు కూడా కొనుక్కుంది. రెండింటికీ వాయిదాలు కడుతోంది.” కూతురు జీతం తాము వాడుకోవడం లేదు అని స్పష్టం చేసాడు వారిజ నాన్న.
ఈ మాటలు విన్న జయంత్ ముఖం వికసించడం గమనించింది వారిజ.
వచ్చే నెలలోనే పెళ్ళి ముహూర్తం పెట్టుకుందామని అనుకున్నారు.
పెళ్ళి దగ్గరలోనే వుంది గనుక నిశ్చితార్థం ఆడంబరంగా పెట్టుకోవద్దని , మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందామని చెప్పి వెళ్ళారు వాళ్ళు.
ఆఫీసు పనిమీదవెళ్ళినప్పుడు సహోద్యోగులతో కలిసి భోజనం చేయడం మామూలే. ఆయినా ఈ రోజు ఇలా తన కాబోయే జీవిత భాగస్వామితో కలిసి వెళ్ళడం అంటే కొత్తగా వుంది ఆమెకు.
సరిగ్గా ఒంటి గంటకు వారిజ బయటకు వచ్చి నిలబడింది. ఆయిదు నిముషాలలో అతను వచ్చాడు. అతని చేతిలో పూలగుత్తి గానీ, గిఫ్ట్ పాకెట్ గానీ లేకపోవడం గమనించింది వారిజ.
ఇద్దరూ వారిజ కారులోనే దగ్గరే వున్న రెస్టారెంట్ కి వెళ్లారు.
“నేను ఇలా రావడం మీకు ఇబ్బందిగా లేదు కదా? కాళీగా వున్న ఫామిలీ రూములో కిటికీ దగ్గరగా ఉన్న బల్ల ముందు కూర్చుంటూ అడిగాడు జయంత్.
“అదేమీ లేదు. డబ్బాలో తెచ్చుకున్న చల్లారిపోయిన తిండి బదులు హాయిగా ఏదన్నా వేడిగా తినవచ్చు.” ఆంది నవ్వుతూ.
“అంటే వేడి భోజనం తప్ప నా రాక మీకు ఆనందమని చెప్పరా? ” నవ్వాడు జయంత్.
మెను కార్డ్ చూసి , మీకేది ఇష్టం అని వారిజను అడగకుండానే తనకు నచ్చింది చెప్పి తెమ్మన్నాడు. ఆశ్చర్య మనిపించినా మౌనంగా వూరుకుంది.
సర్వర్ వెళ్ళిపోగానే గొంతు సవరించుకున్నాడు జయంత్.
” నిన్న మీ అమ్మగారు మీరు బెంగుళూరుకు బదిలీ చేయించుకునే విషయం మాట్లాడారు. మీరు తొందరపడి బదిలీ గురించి అడిగేస్తారేమో అని ఈ రోజు ప్రయాణం మానుకుని మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను.” అని ఆగాడు.
ఆశ్చర్యంగా చూసింది వారిజ.
” అదే బెంగుళూరులో మేము అద్దె ఇంట్లో వుంటున్నాము. అదీ ఒక్క పడకగది ఇల్లు. ఆ గది నేనే వాడుకుంటున్నాను లెండి. అమ్మా నాన్నా హాల్లో పడుకుంటారు.” సందేహంగా ఆగాడు.
“నాకు మీ అమ్మ నాన్నలతో కలిసి వుండడం ఇష్టమే. కావాలంటే మరొక పెద్ద ఇల్లు చూసుకోవచ్చును. ” నెమ్మదిగా చెప్పింది వారిజ.
” అదికాదు. మాకు అనంతపురంలో స్వంత ఇల్లు వుంది. అమ్మ చెప్పింది కదా నాకు భోజనం ఇబ్బంది కాకూడదని వాళ్ళను రప్పించుకున్నాను. ఇక్కడ మీకు స్వంత ఫ్లాట్ వుండగా అక్కడ అంత అద్దె పోసి మరో ఇంటికి మారడం దండగ కదా? వాళ్ళు ఇదివరకటి లాగానే అనంతపురం వెళ్ళి మా స్వంత ఇంట్లో వుంటారు. నాకు మీ వూరికి పోస్టింగ్ కావాలని మా బాస్ ని అడుగుతాను. ” గబ గబ చెప్పాడు.
ఒక నిముషం ఆలోచిస్తూ వుండిపోయింది వారిజ
“కానీ నేను కొన్నది కూడా ఒకే పడకగది ఇల్లు. మీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి వుండాలనుకుంటే వారికి అనుకూలంగా వుండదేమో ” అంది.
“వాళ్ళు ఇక్కడికి రావలసిన అవసరమేముంది? నేనే అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తాను. ” జయంత్ మాట్లాడుతూనే ఫోన్ లో మెసేజ్ లు చూసుకుంటూ ఇంకా రాని బట్లర్ కోసం అసహనంగా అటూ ఇటూ చూస్తున్నాడు.
వారిజ అతను వైపు పరిశీలనగా చూసింది.
జయంత్ చిన్నగా నవ్వాడు. “అంతే కాదు. ఇక్కడ మీ అమ్మా వాళ్ళకు దగ్గరగా వుండడం వలన అద్దె మిగలడమే కాక ఇంకో లాభం కూడా వుంది.
అని ఆమె వైపు చూసి నవ్వాడు.
వారిజ కళ్ళలో ప్రశ్న చదివినట్టు తిరిగి అతనే చెప్పాడు ” రేపు భవిష్యత్తులో మన పిల్లలను క్రెష్ లో వదలడమో, బోలెడు డబ్బు పోసి ఆయాను పెట్టుకోవడం అవసరం వుండదు. మీ అమ్మా నాన్నగారు ఆరోగ్యంగా వున్నారు గనుక వాళ్ళే చూసుకుంటారు. మీ చెల్లెలు ప్రస్థుతం ఖాళీగానే వుంది గనుక తన సహాయమూ వాళ్ళకు వుంటుంది.. రెండుమూడేళ్ళు గడిచాక వాళ్ళూ చూడలేకపోయినా మనకు సమస్య వుండదు.” వెయిటర్ భోజనం తీసుకుంది వచ్చి పెడుతుంటే అటు చూస్తూ అన్నాడు.
వారిజకు ఊపిరి ఆడనట్టు అనిపించింది.
అప్రయత్నంగా తన ఒళ్ళొని హాండ్ బాగ్ ని భుజానికి తగిలించుకుంది.
” అదేమిటి అప్పుడే లేస్తున్నారు?” ఆశ్చర్యం గా అడిగాడు.
” ఒక్క నిముషం. చేతులు కడుక్కుని వస్తాను. “అని లేచి, వాష్ రూముకు వెళ్ళింది.
చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుంటే తెరిపిగా అనిపించింది ఆమెకు.
” మనుషుల నడుమ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న మాటకు నిర్వచనంలా వున్నాడు ఇతను. నిన్న తాము మాట్లాడుకున్న అరగంటలో అతని ఉద్యోగ బాధ్యతల గురించీ, జీవితంలో పైకి రావాలన్న అతని తపన గురించీ చెప్పాడు. , ఇంకా స్నేహితులు, సినిమాలు గురించీ ముచ్చటించుకున్నారు. అతనేమిటో ఈ రోజు అర్థం అవుతున్నట్టుగా వుంది వారిజకు. నెమ్మదిగా నడుస్తూ తాము కూర్చున్న చోటుకి వచ్చింది.

ఆ సరికి జయంత్ అతని ప్లేట్ లోకి కావలసినవి వడ్డించుకున్నాడు. అప్పుడే తినడం మొదలు పెట్టేసాడు..వారిజ ముందు వున్న ప్లేట్ కాళీగా వుంది. మర్యాద కోసమైనా ఆమె పళ్ళెంలో వడ్డించలేదు అతను.
” అన్నట్టు చెప్పడం మరచిపోయాను. నాకు ఆమెరికా వెళ్ళే అవకాశం రావొచ్చు. బెంగుళూరులో కట్టే అద్దె మిగులుతుంది కదా అది నేను కొన్న స్థలానికి కట్టేస్తాను. అమెరికాలోనే స్థిర పడాలని నా ఆశయం. ఆ స్థలాన్నిఅమ్మి అక్కడ ఇంటికి డౌన్ పేమెంట్ కట్టవచ్చు ఇక్కడి ఖర్చులు మనం చెరి సగం పెట్టుకుందాము. మరి కాస్త బిరియానీ వడ్డించుకుంటూ చెప్పాడు.
అప్పుడు గుర్తు వచ్చినట్టు ” అరే మీరు తినడం మొదలు పెట్టనే లేదు. ” అన్నాడు.
” ఫరవాలేదు. నాకు ఆకలిగా లేదు. ఆంటూ కొంచం ప్లేట్లో వేసుకుంది.
జయంత్ తనకు ఆమెరికా రావడం ఇష్టమా కాదా అని అడగ లేదన్నమాట పక్కన పెట్టి ” మీ అమ్మా నాన్నలకు మీరు ఒక్కడే కొడుకు కదా వారి మాట ఏమిటి. ” అని అడిగింది.
” అయితే. వాళ్ళ కోసం నా భవిష్యత్తు వదలుకుంటానా? శక్తి వున్నన్నాళ్ళు చేసుకుంటారు. చేత కానప్పుడు చూద్దాం. ”
“అప్పుడు అమెరికా తీసుకు వెళ్తారా ? అడిగింది వారిజ.
“ఇంకా నయం. అక్కడి ఆరోగ్య భీమాలు, ఖర్చులకు ఆరిపోతాము. ఇక్కడే ఎవరో బంధువుల సహాయం తీసుకోవడమో, , తప్పదు అంటే వౄద్ధాశ్రమంలో చేర్పించడమో చేయాలి. ” ఎటువంటి భావోద్వేగమూ లెకుండా చెప్పాడు.
ఆమె తింటున్నదీ లేనిదీ పట్టించుకోకండా మరో పదార్థం వేసుకున్నాడు.
“మీరేమి తింటారని అడగలేదు. మీకు ఆమెరికా రావడానికి అభ్యంతరం లేదు కదా అని కనుక్కోలేదు. కనీసం తను వచ్చేదాకా ఆగకుండా తినడం మొదలు పెట్టేసాడు. కాబోయే అత్తామామలను మరదలిని ,తన బిడ్డలకు బేబీ సిట్టర్స్ గా వాడుకోడానికి సిద్ధమైపోయాడు. ‘తనతో సమంగా చదువుకుని, సంపాదించే భార్యకు, ఆమె వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు అతను ప్రాముఖ్యమివ్వడని స్ఫష్టంగా అర్థం అయ్యింది.
ప్రాణంగా పెంచుకున్న కన్నవారినీ కూరలో కరివేపాకు లాగా తీసి పారేస్తున్నాడు అంటే చాలా స్వార్థపరుడే నన్నమాట.
తినడం ముగించి కాగితం రుమాలుతో మూతి, చేతులు తుడుచుకుని వుండ చుట్టి పారేసాడు.
“వాడుకుని పారేసే కల్చర్ బాగానే ఒంటబట్టింది. ” అనుకుని లేచి నిలబడింది.
అతని ముఖంలోకి సూటిగా చూస్తూ నిదానంగా మాట్లాడడం మొదలు పెట్టింది.
” ప్రస్థుతం ఈ వస్తు వినిమయ ప్రపంచంలో కుటుంబం ఆవల నిజమైన ప్రేమ, ఆత్మీయత దొరకడం అరుదై పోయింది. ఎంత సంపాదించినా ప్రేమించే మనుషులను కొనగలమా? మా అమ్మా నాన్నా మా కోసమే తమ జీవితం అన్నట్టు బ్రతికారు. నాకు ఉద్యోగం వస్తే వాళ్ళు గర్వపడ్డారు. నాకు దెబ్బ తగిలితే వాళ్ళు నొప్పి అనుభవించారు. ” వారిజ క్షణం ఆగి ఊపిరి తీసుకుంది.
జయంత్ కాస్త అసహనంగా చూసాడు. “ఎవ్వరి తల్లితండ్రులు అయినా అంతే కదా. ” అన్నాడు తనూ లేచి నిలబడుతూ.
“మన కోసం ఎంత త్యాగం చేయాల్సి వచ్చినా వాళ్ళు క్షణకాలం తటపటాయించలేదు. అటువంటి ఆత్మీయులను అవసరానికి వాడుకుని వాళ్ళకు మన చేయూత అవసరమైనప్పుడు వృద్ధాశ్రమాలపాలు చేసే డబ్బు, అమెరికాలో ఉద్యోగం , ఆడంబరాలు నాకు అక్కరలేదు. నాకు జీవితంలోభర్త, పిల్లలు ఎంత ముఖ్యమో నా తలిదండ్రులు, చెల్లి కూడా అంతే ముఖ్యం.పుట్టింటి లో అయినా మెట్టినింటిలోనైనా నేను కోరుకునేది మనసులను కలిపే మమతానుబంధం. “కుటుంబంలో అమ్మానాన్నల , అత్తా మామల , భర్త , పిల్లల ప్రేమ , వాత్సల్యం అందుకుంటూ ఆనందంగా బ్రతకాలి అన్నదే నా కోరిక. ముఖ్యంగా నా జీవిత సహచరుడితో నాకు కావలసింది వ్యాపార బాంధవ్యం కానే కాదు. మనసులు కలిసిన, ఒకరికొకరుగా జీవించగలిగే హృదయ బాంధవ్యం. మీ అభిప్రాయాలు నిన్ననే నాకు చెప్పి వుంటే ఈ రోజు సెలవు దండగ చేసుకుని నన్ను కలుసుకోవలసిన అవసరం వుండేది కాదు మీకు.” ఆని చిన్నగా నిట్టూర్చింది.
హాండ్ బాగ్ తెరిచి అయిదువందల నోటు తీసి వెయిటర్ తెచ్చిన బిల్ మీద పెట్టి “ఈ రోజు లంచ్ బిల్ లో నా వాటా. గుడ్ బయ్ ” అని బయటకు వెళ్ళే తలుపు వైపు నడిచింది వారిజ.
జయంత్ ఫోనులో “కన్నా అన్నం తిన్నావా ? అని మెసేజ్ కనబడింది. ప్రేమగా అమ్మ పంపిన సందేశం మనసును తడుముతూ కొత్త అనుభూతిని కలిగిస్తుంటే , స్థిరంగా అడుగులు వేస్తూ నడిచి పోతున్న వారిజ వైపు చూస్తూ నిలబడిపోయాడు జయంత్.

———— ———— ———–