వర్షం…. వర్షం…

రచన :  శ్రీకాంత గుమ్ములూరి.

 

హర్షం ఇవ్వని వర్షం

గట్టు తెగిన కాలవ గుట్ట

పొంగి పొరలే వెల్లువ

వరదతో పాటు బురద

 

కొట్టుకుపోయే చెట్టులు

పట్టుకు వేళ్ళాడే జీవులు

అందుకోబోయే అన్నలు

లబో దిబో మనే తల్లులు

 

గళ్ళు పడ్డ ఇళ్ళు

నీరు కారే చూరు

చెమ్మకి చివికిన గోడలు

దుర్గంధపు మార్గాలు

 

మురికి గుంటల్లో దోమలు

కలిగించే డెంగూ, మలేరియాలు

తిండి పై ముసిరే ఈగలూ

అందించే పలు జబ్బులూ

 

బురదలో పడ్డ నీరద

జబ్బు పడ్డ సుబ్బు

దగ్గుతున్న జగ్గు

జ్వరం వచ్చిన జ్వాల

 

వర్షాల్లో  వచ్చే పండుగలు

పండుగలు తెచ్చే దండగలు

కలిసి వస్తే పండుగలు జబ్బులూ

వేటికై వెచ్చించాలి డబ్బులూ ???

 

 

 

వినతి

రచన:  జి.భానువర్ధన్

 

అన్నార్తుల కేకలే నీకు సంకీర్తనలు..

దాహార్తుల కన్నీటి బొట్లే నీకు అభిషేకాలు..

అనాధల ఆక్రందలనే నీకు నైవేద్యాలు..

మసకబారిన బడుగు బతుకులే నీకు సంతర్పణలు..

అయినా నీవు  ప్రసన్నుడవు కావేల?

నీ ప్రచండ కోపాగ్నిన దహించుట ఏల?

ఉన్నోడికి వరాల ఝల్లులు ..

లేనోడికి శాపాల కొరడా దెబ్బలు..

 

ఓ దేవా..!

ఈ వివక్షత నీకు మేలా?

ఇది నీ సృష్టి లోపమా ..?

మా దృష్టి లోపమా ..?

తేల్చుకోలేక ఆత్మార్పణ చేస్తుంది పేద ప్రజానీకం.!!

వేడుక చూడక వినతిని విని

బ్రతుకును  దరి చేర్చవయ్యా..!

కోరములే మేము రాజ భోగాలు..

కోరములే మేము అధికార పీఠాలు.

 

 

జీవన్మరణ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పేదలకు

గుప్పెడు మెతుకులు,

గుక్కెడు నీటితో  జీవము పోసిన చాలు.

అదే పేద బ్రతుకులకు నీవిచ్చే కోటివరాలు..

అంతం చేయాల్సింది పేదరికాన్నే కానీ పేదలను కాదు.

“నేరం నీదే.. భారం నీదే..”

 

 

 

 

 

 

నీ జ్ఞాపకంలో

రచన, చిత్రం : కృష్ణ అశోక్.

గుండె గూటిలో
నీవు అనే జ్ఞాపకం
ఒక అద్భుతం…

ఈ జీవితానికి జతకాలేమేమోకానీ
మనసులో నిరంతరజతగా మరుజన్మ వరకూ
జీవిస్తూ.. నిర్జీవిస్తూ…

నీ జాబిలి చెక్కిలి చుంబనాల
చెమరింపుల వర్ణాల జిలుగులలో
భ్రమిస్తూ.. పరిభ్రమిస్తూ…

చుక్కలను తాకే నీ జ్ఞాన పరిపక్వత
వెలుగుల ఆరాలను చేరేందుకు
శ్రమిస్తూ.. విశ్రమిస్తూ…

అంతర్యామివై నాలో నగ్నంగా కదిలే
నీ ఆత్మతో అలౌకిక స్వప్నంలో
రమిస్తూ.. విరమిస్తూ…

గుండెల కౌగిళ్ళలో బిగించాలనిపించే
దేహారహిత నీ దేవతా రూపాన్ని
స్మరిస్తూ.. స్పృశిస్తూ…

ఆఖరి క్షణాన అంపశయ్య ఆశ్రమాన
నీ చుంబనాల చినుకుల మేఘాల కోసం
కామిస్తూ.. నిష్క్రమిస్తూ…

మరుజన్మ వరకు నా ప్రేమపయనం
సాగదేమో అనే సంశయంతో
ఆకాశంలో కలిసిపోతూ.. క్రమంగా రాలిపోతు…

సంఘర్షణ

రచన: వంజారి రోహిణి

 

 

” నిరంతర ఘర్షణ

క్షణ క్షణం కీచులాట

నాలోని నాస్తిక,

ఆస్తికత్వాలకు…

తక్కెడలో తూకపు వస్తువుల్లా

ఒకసారి నాస్తికత్వం పైకొస్తే

మరోసారి ఆస్తికత్వానిది

పై చేయి అవుతుంది…

అరాచకాలు,అబలల

ఆక్రందనలు, పసిమొగ్గల

చిదిమివేతలు చూసినపుడు

మనిషి ఉలితో చెక్కి దేవుణ్ణి

చేసిన రాతిబొమ్మ

హృదయం లేని పాషాణమే

అని నాలోని నాస్తికత్వం

వేదనతో గొంతు చించుకుంటుంది…

మళ్ళీ ఎక్కడో ఓ చోట

ఓ కామాంధుడికి శిక్ష పడి

ధర్మం గెలిచిన నాడు

పాషాణంలా పడిఉన్న

రాతి బొమ్మకు చలనమొచ్చి

ధర్మ సంరక్షణ కావించిందని

నాలోని ఆస్తికత్వం ఆనందంతో

చిందులేస్తుంది…

మళ్ళీ రేపొద్దున ఏవో అరాచకాలు, ఎక్కడో

ఆక్రందనలు వినిపిస్తాయి

షరా మామూలే అన్నట్టు

నాస్తికత్వం మళ్ళా నాలో

మేల్కొంటుంది…

నిరంతర ఘర్షణే ఇక నాలోని

నాస్తిక,ఆస్తికత్వాలకు

అంతమే లేకుండా ”

 

 

నానీలు

 

రచన: అద్విత శ్రీరాగం

 

1 . నీ కోసం
నా కనుల పుష్పాలు వికసించాయి
అన్వేషణ పరిమళాలతోనే .

2 . నీ అడుగులు
నా హృదయంలో ధ్వనిస్తున్నాయి
నేను పరచిన పూలమీద .

3 . నా ఓణీ
గాలితో  ఏదో ఊసులాడుతోంది
మేఘ సందేశం పంపటానికి.

4 . మౌనం
నాకెంత ఇష్టమో !
హృదయ పత్రంపై ప్రేమలేఖ రాయటం .

5 . ప్రయాణం
గమ్యం నీవే సౌమ్యం నీవే
జీవితం పరుగు కాదు హంసధ్వని

మేలుకొలుపు!

రచన:- నాగులవంచ వసంతరావు

జీవితమంటేనే కష్టసుఖముల పెనుగులాట
మర్మం తెలుసుకుంటే మనకది వెలుగుబాట

లక్ష్యనిష్ఠలో నీకు కలిగిన మరపు
చేస్తుంది జీవితానికి అంతులేని చెరుపు

గరిటెడంత కృషిచేసి గొప్పగా పొంగిపోకు
గంపెడంత ఫలితంరాలేదని దిగులుగా కృంగిపోకు

క్షణికోద్రేకంలో చేసిన తప్పు
తెస్తుంది జీవితానికెంతో ముప్పు

గతాన్ని మరువనంతకాలం ఉంటుంది పురోగతి
మరచిన మరుక్షణమే అవుతుంది అధోగతి

సహజ జీవనమే సద్గతికి రహదారి
విలాస జీవితమే వినాశనానికి వారధి

చదువు నేర్పిన చక్కని సంస్కారాన్ని
నిలువెత్తు స్వార్థం స్వాహా చేసింది

అదేమని ప్రశ్నించిన అంతరాత్మ
నోరునొక్కింది అంతులేని అహంకారం

తాత్కాలిక ఆనందాలకు తిలోదకాలిద్దాం
ఉత్తమ సంస్కారాలకు ఊపిరిపోద్దాం

ఉత్తుంగ తరంగమై ఉవ్వెత్తున లేద్దాం
జాతి ఔన్నత్యాన్ని జగతికి చాటుదాం!
***

ఇల్లాలు (భర్త అంతర్వీక్షణ )

రచన: మూలా వీరేశ్వరరావు

 

నీ కష్టాలను ఫిల్టర్ చేసి
నాకు ఫిల్టర్ కాఫీ ఇచ్చావు
ఇంటి ధూళినే
మధూళి గా ధరించి
ఉదయాన్ని మధోదయంగా
మార్చావు !

గిన్నెలు కూడా నీ కన్నులతో
మాట్లాడతాయని
వంటిల్లు వదిలి
పుట్టింటికి వెళ్ళినప్పుడే
అర్ధమైంది !
గుట్టలు గా పెరిగిన
నా బట్టలు
నీ చేతిలో ఏ మంత్రముందో
మల్లెల దొంతరలుగా
మారిపోతాయి !
వంటింట్లో సామానులన్నీ
నీ వుంటే
శిక్షణ పొందిన సైనికులై
నీ ఆజ్ఞతో అమృతానికి
నకళ్ళవు తాయి !
అలవోకగా
నా అలకను తీర్చగలవు !
పండగ కో చీర కొని
గీర పోయే నేను
ఎన్ని చీరలతో నీ  శ్రమని తూచగలను ?
నీ వలపు రాగాలతో
జీవన సారాన్ని నింపు కున్న
నాకు
నీ ప్రాయంలోకి పరకాయ
ప్రవేశం చేసినా
నీ ప్రేమ ఐస్ బెర్గ్ లా
కొంతే తెలుసు
తెలియనిది
వలపు సంద్రానికే తెలుసు !

 

‘పర’ వశం…

 

రచన, చిత్రం : కృష్ణ అశోక్

గోవులు కాచే వయసుకే

గోపెమ్మ చేతిలో చిక్కాను,

ఆమె కమ్మని కబుర్ల ముద్దలు

ప్రేమ పెదవుల ముద్దులు మొదలు..

 

వయసు తెలిసే వేళకే

ఓ అంకం మొదలయ్యింది…

ఒళ్ళంతా చిన్ని చిన్ని మోహాల మొలకలు

లేలేత చిగుళ్ళు వేసి పరువపు గుర్తులుగా కొంచెం కొంచెం ఎదుగుతూ…

‘పరవశం’ కి అర్ధం తెలియకుండానే

మనసు తనువు ‘పర’వశము…

 

తొలిరోజుల నాటిన ఆ ప్రేమమొక్క

నాతోపాటు ఎదుగుతూనే ఉంది..

ఏపుగా పెరిగిన ఆ అందాల కొమ్మల్ని

అందాలు చూపి, ఎక్కితొక్కివిరగ్గొట్టాలని కొందరు కామినుల ప్రయత్నం…

విరిగిన కొమ్మ స్థానే మరో చిగురు..

ప్రతి వసంతానా తొడిగే ఓ కొత్త చిగురు..

అనుభవాలు….

రచన, చిత్రం : కాంత గుమ్ములూరి

 

ఐపోయిన సెలవులు
మొదలైన బడులు
పిల్లల నిట్టూర్పులు
మండే ఎండలు

ఉక్క పోతలు
కొత్త పుస్తకాలు
అర్ధంకాని పాఠాలు
తెలియని భయాలు

ఉపాధ్యాయుల బెదిరింపులు
సహాధ్యాయుల వెక్కిరింతలు
తండ్రుల సవాళ్లు
తల్లుల ఓదార్పులు

కొత్త స్నేహాలు
విడువని కబుర్లు
ప్రాణ స్నేహితులు
కలిసి అల్లర్లు

ఎఱ్ఱ రిబ్బన్లు
రెండేసి జడలు
తురిమిన మల్లెలు
వేసవి గుబాళింపులు

తొలకరి వానలు
రంగుల గొడుగులు
తడిసిన సంచులు
పిల్లల కేరింతలు

ఎదిగే అందాలు
ఎగసే ఉద్వేగాలు
విరిసే హృదయాలు
అందరివీ ఈ అనుభవాలు!!!

*********

నా శివుడు

రచన: రాజన్

దిక్కుల చిక్కుల జటాజూటము
అందులొ హరిసుత నిత్యనర్తనము
కొప్పున దూరిన బాలచంద్రుడు
జటగానుండిన వీరభద్రుడు
.
గణపతి ఆడగ నెక్కిన భుజములు
మాత పార్వతిని చేపట్టిన కరములు
స్కందుడు కూర్చొను ఊరువు నెలవులు
సకల దేవతలు మ్రొక్కెడు పదములు
.
అజ్ఞానాంతపు ఫాలనేత్రము
శుభాలనిచ్చే మెరుపు హాసము
ఘోరవిషమును మింగిన గ్రీవము
సర్వలోక ఆవాసపు ఉదరము
.
మదమను గజముకు చర్మము ఒలిచి
ఒంటికి చుట్టిన తోలు వసనము
మృత్యుంజయుడను తత్వము తెలుపు
మెడలో వేసిన కాలసర్పము
.
పుట్టుక మూలము కామదేవుని
మట్టుబెట్టిన మహాదేవుడవు
ప్రాణము తీసెడి కాలయమునికి
మృత్యువునిచ్చిన కాలకాలుడవు
.
గ్రుక్కెడు పాలు అడిగినవానికి
పాలసంద్రమే ఇచ్చిన వాడవు
పదునారేండ్ల ఆయువు వానిని
చిరంజీవిగా చేసిన రేడువు
.
భక్తిప్రపత్తుల పూజించ యక్షునికి
దిక్పాల్కత్వము ఇచ్చినవాడవు
సనకసనందుల శంకలు తీర్చగ
ఆదిగురువుగా వెలసినవాడవు
.
చేతిలొ ఢమరుక ఢమఢమ మ్రోగగ
అక్షరంబులే గలగల జారగ
అందు పుట్టినవి నీదు సూత్రములు
సర్వ శాస్త్రములకాధారములు
.
మహావిష్ణువే మద్దెల కొట్టగ
చదువులతల్లి వీణ మీటగా
మహాశక్తియే లాస్యమాడగా
చతుర్ముఖుండు వేదముపాడగ
దేవగణంబులు పొగడగ పొగడగ
మునిజనంబులు మనసున కొలువగ
అసురసంధ్యలో ధవళనగముపై
తద్ధిమి తకధిమి నాట్యమాడెదవు
.
కాలికదలికలె కాలపు గతులు
సత్యధర్మములె అడుగుల గురుతులు
సకల సంపదలు సర్వభోగములు
ఒంటికినంటిన భస్మరాశులు
.
భక్తకోటులు కొలిచెడి వేల్పుల
మనములనుండెడి వేల్పుల వేలుపు
నా మానసగిరిపై నివాసముండి
అరిష్డ్వర్గము పారద్రోలుమా
నీ పదపద్మము పట్టివీడని
మహాభోగమును కటాక్షింపుమా
హరహర శివశివ శంభోశంకర
గానామృతమున ఓలలాడగా
నన్నుమరువగా నిన్ను చేరగా
శక్తి నొసగుమా భక్తి నొసగుమా
అనితరసాధ్యమౌ ముక్తినొసగుమా
.
…………..హరహర మహాదేవ శంభోశంకర నమః పార్వతీపతయే నమః