గిలకమ్మ కతలు – అనాపోతే?

రచన: కన్నెగంటి అనసూయ

 

“ ఏటి.. సట్టిలో  కందిపప్పు కడిగట్తే పెట్టేవు? నానిపోతల్లేదా?ఉప్పుటికే  ఉబ్బింతింతైంది  పప్పు బద్ద. పప్పునీ మట్ని వదిలేసి దేని కోసం సూత్తన్నా ఈధరుగు మీద కూకుని…”

అప్పుడే ఊళ్ళో ఏలిడిసిన మేనమామ పెళ్లాం మంచం మీంచి పడిపోయిందని తెల్సి పలకరిత్తాకి ఎల్లొచ్చిందేవో..లోనకెల్లి కోక మార్సుకుని పాచ్చీర సుట్టబెట్టి పొయ్యికాడికొచ్చిందేవో.. ఎదురుగ్గా పప్పుగిన్ని.

“ గిలకమ్మ టమాటలట్టుకొత్తాకెల్లింది ఈరెంకడి సేలోకి.  వత్తాదేవోనని సూత్తన్నా.. కూకున్నాను. ఏ జావయ్యిందో దాన్నంపి. ఎక్కడ పెత్తనాలు సేత్తందో ఏటో..” ఈధరుగు మీద కూకునే తల తిప్పి దోరబందం మీదగా లోనకి  సూత్తా ఆల్లామ్మకి ఇనపడేతట్టు అరిసింది సరోజ్ని.

“ అయినా..దాన్నెంతుకంపా? ఈడొచ్చిన పిల్ల. రేపో ,మాపో సవత్తాడి సాపెక్కుతాకి సిద్దవవుతుంటే.. అత్తప్ప ఇంకొకళ్ళు దొరకలేదా ఏటి నీకు? మీయాయనకి తెలిత్తే ఊరుకుంటాడా?”

“ అదెల్లొత్తం ఏవో గానీ నీ గోల మాత్తరం ఆ మడిసి సేలో ఏ మూలున్నా ఇనిపిచ్చేతట్టే ఉంది గానీ ఊరుకో..! నాలుగడుగులేత్తే..ఎంకడి టవాటా సేనొత్తది. అదేవన్నా..మైళ్ల కొద్దీ దూరవా ఏటి?”

“ అయినా నోర్మూసుకునుండక  నాకెంతుకంట?  నీ కూతురు..నీ ఇట్టం. నీ ఇట్టం వచ్చినట్టు సేస్కో!  రెండ్రోజులుండి పోయీదాన్నినోరూరుకోక..దూలెక్కి…”

గొణుక్కుంది సుబ్బయ్యమ్మ.

“ అసలే పిల్లొత్తాలేదని నేనుడుకుమోతంటే..దీని గోలొకటి..” అంటా కూకున్నదల్లా లేసి సందు సివరకంటా ఎల్లి ..గిలక్కోసవని..సందులోకి వంగుని సూసిందేవో..

గిలకొత్తాలేదుగాని.. పది,పదేనుమడి పోగై ఏటో సూత్తుంటే ..ఇద్దరు ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటా వచ్చి..”మరే..మరే మీ గిలకమ్మ..శీనుగాణ్ణి  కొట్తేత్తంది..” అన్జెప్పేరేమో..రొప్పుతా రొప్పుతా..సరోజ్నికి పై పేనాలు పైనే పోయినియ్యి..

“ ఈ మడిసి పొలాన్నించొచ్చే ఏలయ్యింది. మాయమ్మన్నట్టు తిడతాడో ఏటో..తెలిత్తేని..” అని మనసులో అనుకుంటా   “ కాతంత ఆల్లిద్దర్నీ నేన్రమ్మానని సెప్పండమ్మా.మీకు పున్నెవుంటాది. ఆనక ఇయ్యేపు ఒచ్చినప్పుడు   ఏ ఏయించిన సెనగపప్పో, బెల్లమ్ముక్కో ఏడోటి పెడతాన్లే గానీ దాన్నిలా రమ్మని సెప్పండమ్మా..! ఈధిలో ఈరంగం ఎట్టింది..నామర్దా గూడాను..” అందాళ్లని బతిమాలుతున్నట్టు…

అప్పుడుదాకాను ..ఆ..ఊ..అంటా కాలి బొటనేలు నేల మీద మట్టిలో రాత్తా నీలుగుతున్నోళ్ళు  కాత్తా… ఏదన్నా పెడతాననే తలికి  రేసుగుర్రాల్లాగ పరిగెత్తేసేరేవో..దానికసలు ఊపిరాడనిచ్చేరో లేదోగానీ గిలకమ్మనెంటబెట్టుకుని గాని రాలేదాళ్ళిద్దరూను.

జుట్టు సెదిరిపోయి, లంగా సిరిగిపోయి గిలకమ్మా..ఒల్లంతా మట్టిగొట్టుకుపోయి శీనుగాడు..

“అయ్యి ..నియ్యమ్మాకడుపు మాడా..! ఏటల్లా ఆ వాలకాలు..పిచ్చెక్కిన కుక్కలు మట్టిలో పడి పొర్లాడినట్టు..ఏటే  దయిద్రగొట్టు ముండా..ఆ లంగా ఇంకెంతుకన్నా పనికొత్తదా?  “ అంటా గబుక్కున జుట్టట్టుకుని వంగదీసి పెడీ పెడీ మని నాలుగు సరిసింది. దాంతో మరింత రాగం అందుకున్నాడు శీను.

అలా ముందే ఏడిసేత్తే ఇంక కొట్టదని ఆడేత్తులు.

“ మతోయిందా ఏటి..ఈడొచ్చిన పిల్లనలా కొట్టుకుంట్నా?  అయ్యన్నీ తర్వాతడుగుదూగానీ  పాలట్టుకుని అబ్బాయొచ్చే ఏలయ్యింది..కాసిన్ని నీళ్లోసుకుని రమ్మను. ఎల్లే గిలకా ..నీళ్లోసుకో ఎల్లి.ఎప్పుడో పొద్దున్ననగా బళ్ళొకెల్లేతప్పుడు పోసుకున్న నీళ్ళు..”

“నేన్జెయ్యను.నాన్నని రానీ సెప్తేన్నీ సంగతి? ఆడేం జేసేడని అడగవు. ఎప్పుడూ నన్నే తిడతావ్. “ తంబానికి జారబడి కింద కూకుని ఏడుపు లంకిచ్చుకుంది గిలక..

“ ఏరా..ఏంజేసా అక్కని…ఇలారా” అరిసింది సరోజ్ని..

“ ఆడు సెప్తాడా? ఆడేంజేసేడో..అయినా ఆడు సెప్తేనే నమ్ముతావు..” అంటా మళ్ళీ  ఏడుత్తుం మొదలెట్టింది..గిలక.

‘’ సరేలే..నేనడుగుతానుగానీ..లెగమ్మా..! నా బంగారానివి గదా..నీళ్ళోసుకురాతూవులోకెల్లి.మీ నానొత్తే  మియ్యమ్మని తిడతాడు మల్లీని. నాయమ్మగదా..లెగు. దా…ఎనక్కి తిరుగు ఉక్సులు తీత్తాను..”

“నేన్తీసుకుంటాన్లే..! నువ్వేం యియ్యక్కల్లెద్దు..” అంది కళ్ళు నులువుకుంటా..

“ అంటే అన్నానంటావ్ గానీ..డబ్బులట్టికెల్లిందా? టమాటా పళ్ళు పట్టుకొచ్చిందేవో సూసేవా..? ఎయ్యే టమాటా పళ్ళూ..?” తేలేదా..?”

“తెచ్చేను…”

“మరెయ్యి..? ఎక్కడ గోతిలో పోసా?” గుడ్డురువి గిలక్కేసే సూత్తా అంది సరోజ్ని..

“కిందడి నలిగి పొయ్యినియ్యి…”  నదురూబెదురూ లేకుండా అంటన్న కూతుర్ని సూసి కోపం నసాలానికంటింది సరోజ్నికి..

“నలిగిపొయ్యినియ్యా? కిందెంతుకు పడ్డయ్యే..నీ పొగరు పొయ్యిలో బెట్టా..సెప్పి సావ్వేమే..ఊరికే నస.పెడతావు….” అరుత్తా దగ్గరకంటా ఎల్లి నెత్తి మీద ఒక్కటివ్వబోతంటే..

సెయ్యట్టుకుని ఆపి..

“ నలగవా మరి..టమాటాల సంచితో ఆణ్ని కొడితేని..”

“ ఆసి నీ జిమ్మడ..టమాటాల సంచితో కొట్తేవా? నీ పొగరు పొడిసెయ్య..”

“మరి కొట్టరా?”

“అదే..ఎంతుక్కొట్తేవని అడుగుతుంది మియ్యమ్మ. అదేదో సెప్పేత్తే గొడవొదిలిపోద్ది కదా..తానానికెల్లొచ్చు. “ సుబ్బయ్యమ్మనేతలికి..

“ సెప్పనిత్తే గదా? ఎప్పుడూ నన్నే తిడద్ది..ఆడేం జేసేడో మీకెవ్వళ్లకీ తెలవదు..”

అసలే పరువు పొయ్యిందనోపక్క బాధ. దానికి తోడు..ఆల్లమ్మ తిట్టిందేవో..గిలకమ్మకి ఉడుకుమోత్తనం వచ్చేసి బిక్క మొకం ఏసింది.

“సెప్పమ్మా..! నా బంగారం కదా..సెప్పు. “ అంటా పప్పునొదిలేసి…గిలకమ్మని దగ్గరైకి తీసుకుని  నాయమారతా అడిగిందేవో..

“ అమ్మేవో  అరీసుడు కాయలట్రమ్మందా.. ఎంకడేవో..పాపగారా.. మీరొచ్చేరేటండా.. నాన్నగారి క్కోపమొత్తాది  బేగినెల్లిపోండా…అంటా అక్కడెంతమంది బుట్టలట్టుకునున్నా నాకే తూసిచ్చేసేడనుకో…

ఈడికి తినాలనుంటే ఆటిల్లోయి తీసుకుని తినొచ్చు కదా? నేనిత్తానంటే  తీస్కోకుండా..ఎంకడి బుట్టలో పండు తీసుకున్నాడు..

నా దగ్గరేవో ఇత్తాకి ఇంక డబ్బుల్లేవు. అమ్మేవో అరీసుడుకే సరిపోయినన్ని ఇచ్చింది. ఆడలా తీత్తం అందరూ సూసేరు. నాకెంత సిగ్గేసిందో..! అదందులో ఏసెయ్..నేనిత్తాను ..న దగ్గిరున్నయ్ గందా అంటానే ఉన్నాను..గబుక్కున కొరికేసేడు..

“ఈరెంకడు ఏవన్నా అన్నాడా..?” సరోజ్నంది..

అయ్యన్నీ ఇని సరోజ్ని ఎక్కడ కొట్టుద్దోనని ఏడుపాపి సొక్కా నోట్లో కూరుకుని బెదిరిపోతా తల్లెనక్కే సూత్తం మొదలెట్తేడు..శీను..

“ఎంతుకండు? అనే ఉంటాడు..అన్నాడేటే,,?” రెట్టిచ్చింది సుబ్బయ్యమ్మ..

“అనాపోతే ..తప్పుగాదా?

అరిసింది గిలక ఇంత గొంతేసుకుని..

నోళ్లడిపోయినట్టున్నాయ్.

అక్కడంతా నిశ్శభ్దమే..

సేతులెనక్కెట్టి ఉక్సులు తీత్తా తూవుకేసి నడిసింది గిలక.

——

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గిలకమ్మ కతలు – బక్కసిక్కిన రేగొడేలు

  రచన: కన్నెగంటి అనసూయ

    

     అదసలే  శీతాకాలం..

అప్పుడప్పుడే తెల్లార్తందేవో..  అంతా పొగమంచు నిండిపోయి బాగా దగ్గిరికంటా వత్తేగాని మడిసి మడిసికి ఆపడ్తాలేదు.

        అంతకు ముందే లేసి పొయ్యిలో బూడిది సేట్లోకెత్తి అవతల దొడ్లో కుండలో పోసొచ్చి రెండు మూడు పిడకల్ని పేర్సి, కాయితం ముక్క లోనకంటా  కూరి  అగ్గి పుల్ల గీసింది సరోజ్ని పిడకల్ని అంటిత్తాకి.

    కాయితాలక్కాయితాలయిపోతన్నాయ్ గానీ పిడక అంటుకుంటే ఒట్టు….

   కూతురు కట్తం సూసి అక్కడే రేగ్గాయలు పుచ్చులున్నయ్యేవోనని సూసి సూసి మరీ సిదుపుతున్న సుబ్బయ్యమ్మ..

   “ ఎన్ని కాయింతాలని సింపుతా..? ఓ సుక్క కిరసనాలొయ్యి. ఎవరి కోసం అంటుకోదో సూద్దారి..అవతల పిల్లలు లేసే ఏలయ్యింది..బళ్ళొకెల్లాలిగందా..”

    “ తేరగా వత్తంది మరి కిరసనాలు”  సణుక్కుంది సరోజ్ని మాటల్లోనే మరో కాయితాన్ని నలిపి   పిడకల్లోకి జొనుపుతా..

      ఇంతలో కల్లు నులుంకుంటా    తిన్నగా ఈధి గుమ్మంకేసి ఎల్లిపోతన్న గిలక్కేసి సూత్తా..

  “ ఎక్కడికలాగ? ఎనక్కిరా. సీకటి. బయటేవీ అగుపిత్తాలేదు. అయినా పొద్దొడవకుండానే..ఎక్కడికే బయల్ధేరేవ్?  మొకం మొద్దులెట్టు..దవళ్ళ మీద పాసీ నువ్వూను….” అరిసింది సుబ్బాయమ్మ..గిలకెనక్కి  సూత్తా..

      “ఈదిలో ఎవరన్నా మంటేత్తన్నారో లేదో సూత్తాకి.  .సలికాసుకుంటాకి. “ అప్పటికే               పిడకలంటుకున్నయ్యేవో….గొట్టంతో ఉస్ ఉస్ అని ఊత్తానే సరోజ్నన్న మాటలకి తరుంకుంటా వచ్చింది సుబ్బాయమ్మా..

   “ మంటలకాడికైతే మాత్తరం మొకం మొద్దులెట్టకుండానేనా.? ఈలోపు  సెరుగ్గెళ్లేసుకుని ఏ ఎడ్లబండైనా వత్తే ఆమట్నే పరిగెత్తుద్ది….బండెనకాల..”    అంటా ఇంకా గొట్టంతోనే తవుసడతన్న కూతురికేసి సూత్తా..

   “పచ్చి పిడకలెట్టేవా ఏటి..అలా ఏడిపిత్తన్నయ్యి. అయ్యి ఇవతలికి లాగి పక్కనడేసి ఎండిన పిడకలు తీస్కోపోయేవా? నన్రమ్మంటావా? ” అంది సుబ్బయ్యమ్మ.

     “ ..గోడ్నించి వలిసేకా కూడా అయిదార్రోజులు ఎండలో పడేడిసినియ్యి. ఎండగ్గాదు. ఏడిపిచ్చాలని. ఒకో రోజింతే..” పొగకి కళ్ళు మండినియ్యేవో..సెంగుతో తుడుసుకుంటా బదులిచ్చింది..సరోజ్ని,  ఓపాళాన అంటుకోలేదేవో..పిడకలు..ఆట్నించొచ్చే పొగ, మంచుకి  పైకి  పోలేక అక్కడక్కడే తిరుగుతుం మొదలెట్టిందేవో..ఊపిరి సలుపుతుల్లేదని అక్కణ్నించి లేసి ఇవతలికొత్తా..

     ఈదిలో ఎక్కడా సలిమంటలేసేవోల్లు  అగపడపోయేతలికి  ఆమట్నే..సేతుల్రెండూ భుజాల మీదేసుకుని సలికి ముడుసుకుపోతా సుబ్బయ్యమ్మ దగ్గరికంటా వచ్చి నిల్సుని..

   ” అబ్బ..రేగుపళ్ళు. సెప్పరే…రేగొడియాలెడతన్నావని..?” అంది..అక్కడే నిలబడి ఆటెనక్కే  సూత్తా..

    “ పెడతన్నాంగానీ..మొకం కడక్కుండా ముట్టుకున్నావంటే ఊరుకోను. ఉప్పుడుదాకా ఈట్ని నీల్లల్లో ఏసి కడిగేతలికి  పెద్దలు దిగొచ్చేరు. ఎల్లు.  ఎల్లి మొకం కడుక్కురా..” ఇసుక్కుంది మనవరాల్ని సుబ్బాయమ్మ. 

        “ఎల్తాన్లేవే అమ్మమ్మా..! ముందీట్ని సూడ్నియ్..!  ఎవరు తెచ్చేరీటిని..?” సలికి గొంతుకులో సన్నని వణుకొచ్చేత్తందేవో…ముడుసుకుపోయి సుబ్బాయమ్మని ఆనుకుని కూచ్చుంటా…అంది గిలక.

     “ ..ఎవరిత్తారు? కొన్నాం కావిడోడి దగ్గర…రెండు కుంచాల ఒడ్లకి కుంచుడు రేగుపల్లు.. అస్సరేగానీ ఏవెట్టుకుని తోంతా పళ్ళు రోజూను? “

      ఏమ్మాట్తడకుండా రేగు పళ్లల్లో సెయ్యెట్టి కెలుకున్న మనవరాల్నే సూత్తా..మల్లీ సుబ్బాయమ్మే..“..వారానికోసారన్నా..కచ్చికితో తోంకోవాలి. ! అయ్యాలే ఇరిసిన  మల్లె పూలల్లే.. మెరిసిపోతయ్ పల్లు. మా సిన్నప్పుడు యాప్పుల్లతో కడుక్కునేవోల్లం. లేపోతే కాపి పొడో, ఉప్పో..అంతగా లేపోతే కచ్చికితోనో కడుక్కునేవోల్లం.  ఈ పేస్టులూ గీస్టులూ మాకు తెల్దు. సరిగ్గా  గంట కడిగీది మియ్యమ్మ కచ్చికితో. “ అరిగిపోతయ్యమ్మా..అంచేటు తోవితే..” అని అరిసీవోడు మీ తాత. అయినా ఇనేదిగాదు. కడిగి బోర్లిచ్చిన పింగాణీ గిన్నెలల్లే తలతల్లాడిపోయ్యీయి .. మియ్యమ్మ పల్లు..”

     “ఛీ..పేడతో సేత్తారయ్యి…! గేది ముడ్లోంచి ఒత్తది పేడ. కచ్చికితో పల్లు దోంకుంటవేటే అమ్మమ్మా..! “ అని కిసుక్కున్నవ్వి..

  “ మరి నాలికి దేంతో గీస్కునేవోళ్ళు..? గేది తోకతోనా? ”  పక పకా నవ్వేసింది గిలక..  రేగుపళ్ళల్లో సెయ్యెట్టి..అటూ ఇటూ కెలుకుతా..

     “ గేత్తోకతోనా? బాగానే ఉంది సంబడం. మియ్యమ్మిందంటే కొరకంచట్టుకొత్తాది. ఎల్లు. ఎల్లి  మొకం కడుక్కున్రా.  మొకం కడుక్కోకుండా ముట్టుకోవద్దన్నానా? సెయ్యెందుకెట్టా?” కాయలు సిదుపుతున్నదల్లా  గిలకమ్మ సెయ్యట్టుకుని ఒక్క గుంజు గుంజి ఇస్సురుగా లాగి ఇవతల  పడేసింది ఇసుగ్గా సుబ్బాయమ్మ..

    సుబ్బరంగా లేపోతే ఆవిడికి మా ఒల్లుమంట..

   “ఈ ఒక్కటీ సెప్పే అమ్మమ్మా..!  మీ సిన్నప్పుడు  నాలుక దేంతో గీసుకునీవోరు..? గేత్తోకతోనే గదా..?”

    “  గేత్తోకతోనా ఇంకేవన్నానా? కొబ్బరీనుల పుల్లతో గీస్కునేవోళ్లం.. గానీ..ఎల్లి మొకం కడుక్కు రమ్మంటే ఎల్లవేటి? ఇక్కడికొత్తంది పాసోసన..”

   “ సెప్తే ఇంటదా? ఇనదు. అదినాలంటే  మన్నోరడిపోవాలి..అయినా ఈదుల్లో ఎవరూ మంటేత్తన్నట్టు లేరు. ఆళ్ళేత్తే ఇది మనకి దొరకాపోను బడేల దాకా..” సరోజ్నంది పొయ్యిలో పిడకెగదోత్తా…

    ఆల్లమ్మన్న మాట ఇనిపిచ్చినా ఇనిపిచ్చనట్టున్న గిలక

“ ఈ రేగొడేలు ఎండుతాకెన్ని రోజులడద్దే  అమ్మమ్మా..” అంది గిలక.. పురుగేదైనా కనిపిత్తదేవోనని .పక్కనడేసిన పుచ్చు కాయలొంక  కళ్ళింతంత సేసుకుని సూత్తానే లేసి నిలబడతా.. ..

   “ అయిదార్రోజులైనా  ఇరగెండాలి. అదైనా ఎండొత్తేని…” అని గిలకతో అని..కూతురు కేసి..సూత్తా

 “ సరోజ్నే…ఆ పొయ్యంటుకుంటే  రెండు పిడకలు దాపెట్టు.  పొయ్యికాణ్నించి లెగాలింక.  మిరప్పళ్ళూ , బెల్లం తుయ్యాలి. ఎండెక్కిందంటే పోటెయ్యలేం. మల్లీ మియ్యాయన పొలాన్నించొత్తే ..ఆలీసమవ్వుద్ది.  “ అన్న తల్లి మాటల్ని పట్టిచ్చుకోకుండా.. 

    “  తూత్తాన్లేగానీ ..ఏటి? అయిదార్రోజులెండితే  సాలా?  పిండొడేలనుకుంటన్నావా ఏటి? రేగొడేలియ్యి. ఏవైదార్రోజులు..? మతిగాని పోయిందా ఏటే అమ్మా నీకు?  పది పన్నెండ్రోజులైనా ఎండా పోతే పురుగులట్టెయ్యవూ? రెండేళ్లనాడు  గేపకవుందా? మర్సిపోయేవా?  సరిగ్గా ఎండకే  గందా….అయిన కుంచుడొడియాలు  పురుగట్టి , ఇక్కడ పారబోత్తే  ఎవరన్నా  సూసినోల్లు..ఇదెంత గుండాబొయి ముండ, దీనికి ఉందీ..లేందీ ఏటీ తెలుత్తాలేదనుకుంటారని..మనూరట్టూపోయి ఎవరూ సూడకుండా  అక్కడ మన గుమ్మం ముందున్న  తూంకాలవలో పారబోసేవ్ .  మర్సిపోయేవా ఏటి? “ తరుంకొచ్చింది సరోజ్ని..

        “ అమ్మో..అన్ని రోజులాగాలా  ..తింటాకి? అప్పడు దాకా  ఈటిని తినగూడదా?”  నిరాశగా అంది. .

     “తినొచ్చో లేదో తర్వాజ్జెప్పుద్ది ముందు నువ్వెల్లి మొకం కడుక్కుని ఆణ్ణి లేపు బడేలవుతుంది..ఎన్నిసార్లు సెప్పాలి…”  అని గిలకనో కసురు కసిరి..

   “ పండు మిరప్పళ్ళు..కుంచుడు రేగు పళ్లకి ఎన్ని తుయ్యమంటా..” అంది తక్కెడి సరి సేసి కేజీ రాయోపక్కనేత్తా..

       “ మరీ అంత తుయ్యక్కా లేదులే  .ఉజ్జాయింపుగా ఏసేద్దారి. పట్టినన్నేసి మిగతాయి ఉప్పేసి తొక్కి వాసినిగడితే  పండుమిరప్పండు పచ్చడి రుబ్బొచ్చు..    “

    “ బూజట్టకుండా ఎండబెట్టాలి..ఎండెక్కడొచ్చి సత్తంది..” అంటా సీవెండి పళ్ళెం లోకి కాసిన్ని పండు మిరపకాయలు ఏసుకుని సుబ్బాయమ్మ దగ్గరకంటా వచ్చి ఆటిని సూపిత్తా..

   “ఇయ్యోసారి సూడు.  సరిపోతాయంటే ముక్కలు కోసేత్తాను కత్తిపీటేసుకుని. మల్లీ ఆడులేసినా, ఈయనొచ్చినా నాకు పని సాగదు..”

     “ తడార్నియ్యా..? లేపోతే పొడి గుడ్డెట్టి తుడువ్”  

   “ తళ్ళేదు. సూసేను.”

   “ అందాకా అందాజ్ గా ఏద్దారి ముందు. సాలా పోతే అప్పుడే సూడొచ్చులే..బెల్లవెక్కడుంది..? “

   “దింపిందైపోయింది. మసిరి మీదుంది. దింపిచ్చాలి..” అని ఆల్లమ్మతో అని  గిర్రున గిలకెనక్కి తిరిగి..పుల్లటి రత్తవొచ్చేలా నెత్తి మీదో మొట్టు మొట్టి..

  “ మొకం కడుక్కు రమ్మని పొద్దుణ్ణించి ఆమట్ని మొత్తుకుంటే నీగ్గాదా? ఎన్నిసార్లు సెప్పాలే? సెవుడా? ఎల్లు.ఎల్లి మొకం కడుక్కురా..!  పీటెక్కి మసిరి మీంచి  బెల్లాన్ని దింపాలి..ఎల్లు. ఎల్లేవా లేదా?”

   “ఎల్తానుండేహ్హె. అస్సలే సలిగా ఉంటే నువ్వలా మొడతావేటి? నేన్దియ్యను..  ఎదవ బెల్లవూ నువ్వూను..”

   తల్లి మొట్టుడుకి  దెబ్బకి సలొదిలి పోయిందేవో..ఇస్సురుగా అనేసి  తల మీద మొట్టిన సోట సేత్తో రాసుకుంటా అక్కణ్ణించి తూవులోకి పరిగెత్తింది..గిలక.

   “ పిల్ల పెద్దదవుతుంది.  సీటికీ మాటికీ నువ్వలా మొడతా ఉంటే..పెద్దోల్లయ్యాకా ఆల్లకియ్యే  మనసులో నాటూపోతాయ్. కాత్తంత సెయ్యి జాడిత్తం తగ్గిచ్చుకుంటే మంచిది. నేనెంతుకు సెప్తున్నానో ఇను…”సుబ్బయ్యమ్మంది గుసగుసలుగా కూతురుతోటి..

   “ ఇసుకొత్తందనుకో..! పెద్దదవుతున్నప్పుడు ఓసారి జెప్తే ఇనాల. ఇంకెప్పుడొత్తది ఇవరం. ఎన్నిసార్లని సెప్తాం. మనకి మాత్తరం ఓపికుండద్దాంట.. “   అంటానే కత్తిపీటోల్చి పండు మిరప్పళ్లను రెండేసి ముక్కల్జేత్తా..

   ఎంతసేపటికే రాని గిలక్కోసం..“..గిలకా..గిలకా అయ్యిందా మొకం కడుగుతుం?   “

   “ వత్నాను..ఆగెహ్హే..! మొట్నప్పుడు లేదేటి?  నేనెంతుకు తియ్యాలి” అరిసింది గిలక నాలిగ్గీసుకుంటా..

    అరవటం అయితే అరిసిందిగానీ..ఎల్లాపోతే మల్లీ ఎక్కడ మొట్టుద్దోనని..తుడ్సుకోకుండానే మూలగదిలోకెల్లి పీటీడ్సుకుని..ఇత్తడి ఎన్నగిన్ని కిందకి దింపి మొయ్యలేక మొయ్యలేక మోత్తా..ఆల్లమ్మ దగ్గరకి తెచ్చి పెట్టి ఎనక్కెల్లిపోబోతుంటే..

   “బళ్ళోకి ఎల్తాకి ఇంకా టైముంది గానీ.. వంటింట్లో గోడ మీద  మేక్కి తగిలిచ్చున్న  సేటిలా పట్రా..”   అని సేట తెచ్చేకా..”  కాసేపాగు. మరీ అడావిడి పడిపోనక్కల్లేదు. పేద్ద రోజూ టైంకి  బళ్ళోకెల్లిపోతన్నట్టు..” ఎటకారంగా అని..మళ్ళీ తనే..” అమ్మమ్మనడిగి ఎంత బెల్లం తుయ్యమంటదో..కలంలో రాయిదెచ్చి ముక్కలు కొట్టు. నలగా పోతే రేగొడియాల్లో బెల్లం సుద్దలు నాలిక్కి తగిలి సిరాకొత్తది….”

      “  ఏం రేగొడేలోగానీ సంపేత్తిందిరా  బాబోయ్..మాయమ్మ..” అని లోపల్లోపల అనుకోబోయి పైకే అనేసిందేవో..

  “ ఆ.. సప్పలిచ్చేతప్పుడో..! కాయితాల్లో సుట్టుకుని సంచిలో పెట్టుకుని బళ్ళోకి ఎల్లేటప్పుడను బాబోయ్ అని..” ఎటకారంగా అంది సరోజ్ని..

    “ య్యె య్యె “ అంతే ఎటకారంగా అంటా..జడలు ముందుకేసుకుని  రిబ్బను ముడులిప్పుతా దువ్వెన కోసం లోపలికెల్లింది గిలక..

   “ రెండు గుప్పిల్లు..జీలకర్రొయ్..రుసొత్తాది..” సుబ్బాయమ్మంది..సరోజ్నితో..

     “ అబ్బ…ఏటెల్లకాలం సెప్తానే ఉంటావా? రేగొడియాల్లో గీలకర్రేసుకుంతారని నువ్వు సెప్తే తెలవాలి మరి నాకు..” ఇసుక్కుంది సరోజ్ని..తల్లి మీద.   

     మజ్జానం బళ్లోంచి ఇంటికొచ్చేతలికి  రోట్లో ఏసి తొక్కుతున్న రెగుపళ్ల పచ్చణ్ణి సూసి  నోట్లో సివ్వున ఇంతెత్తున పొంగి అంగిణ్ణి తాకింది  నోట్లో నీల్లు.  

       అన్నం తినేసి..సిన్న డబ్బాలో బళ్లోకి పచ్చడట్టుకెల్లి  జతకత్తుల్తో కల్సి తింటే తప్ప తీర్లేదు గిలక్కి. సందేళ నోరంతా కొట్టుకుపోగా..పైపళ్లతో నాలుక మీద దురదొచ్చిన సోట గీక్కుంటా ఇంటికొచ్చేతలి..ఒకందంగా ఆకాసంలో నచ్చత్రాలని పేర్సినట్టు పేర్సేరు పట్తే మంచం మీద పరిసిన గుడ్డ మీద రేగొడేలు.  .

    నాలుక్కొట్టూపోయినా గానీ  సిన్నగా సిట్టి గారెలంతంత సైజులో మంచవంతా పరిసేసున్న ఆటిని సూత్తానే దవలేసరం లాకుల్లోంచి ఉరికురికొచ్చినట్టు ఎంటెంట్నే నోరూరేసింది గిలక్కి.

       “  నాకింకోటి కావాలి..” అంది ఆట్నే సూత్తా..

   “ ఏట్ గావాలి? పట్టికెల్లెందైపోయిందా..?  అయ్యన్నీ నీక్కాదా? ఎండెకా తిందూగాన్లే? “

    “ కుదరదు. నాక్కావాలంతే.. బెల్లవెంతుక్కొట్టిచ్చా నాతో..! అలాగన్జెప్తే బళ్ళోకెల్లాపోదునుగదా..!  నాకు నోరూరిపోతంది. నేనోటి తీసుకుంటాను..” కాల్లు నేలకేసి బాత్తా పట్టుదలగా అంది గిలక..

   “సెయ్యిరగ్గొడతాను ..వడేల్లో సేతులెట్టేవంటేని. నాలిక్కొట్టూపోతే వణ్నం దిన్లేవు..నువ్విలాగంటావనే ఎన్నొడేలెట్తేనో లెక్కెట్టేను..”

   “ ఆ..ఒకటి తీసుకోనిద్దూ..! అన్నీ దానికే అంటావు. తీస్కుంటానంటే సెయ్యిరగ్గొడతానంటావు..అన్నీ నీ మాటలే..పిల్లలన్నాకా తింటారు..తినకుండా ఎట్టుంటారు?  ” అని గిలక్కేసి తిరిగి..   “ తీస్కోమ్మా..! తింటాక్కాపోతే ఇంకెంతుకు? తీస్కో.”

   గుర్రున సూసింది సరోజ్ని తల్లొంక..మిటా మిటా సూత్తానే..

   “ అక్కడికి నువ్వు మంచిదానివీని..నేను కాదా? తీసేవంటే ఊరుకోను ఏవనుకున్నావో ఏవో గానీ..ఒకటి తియ్యనిత్తే..మరోటంటాది. ఇక అందవెక్కడుంటది మంచం మీదియ్యి మంచం మీదే అయిపోతే..”  అయ్యన్నీ ఇంటా  ఇద్దర్నీ మార్సి మార్సి సూసింది గిలక.  అంతలోనే ఏదో ఆలోసనొచ్చి ..

          “తియ్యన్లే..! అరవకండి..ఎండేకేనే దింటా..” అంది ..

           “ వడియం మొత్తం తీత్తే ఊరుకోవు . అంతే కదా..ఒసే పిచ్చి అమ్మా..! ” అని తన ఆలోసనకి తనే మనసులో నవ్వుకుంటా..

     గుడ్ద మీద రేగొడేలు ఎండుతూనూ ఉన్నాయ్..గిలకమ్మ నోరు సప్పలిత్తానూ ఉంది. సరోజ్ని లెక్కకి తక్కువైతే ఒట్టు..

   అర్దవయ్యాకా..”  ఓహో..! ఏటా సిక్కిపోతన్నయ్ అలాగనుకున్నాను..ఇంతుకా..ఓహ్హోహ్హో..ఏం తెలివే మనవరాలా?” అంది సుబ్బాయమ్మ..అటూ ఇటూ సూసి ఎవ్వరూ లేరనుకున్నాకా వడియంలోంచి  ఒడుపుగా  గింజలాగుతున్న గిలకమ్మకేసి మంచం మీద పడుకునే ఓసూపు సూత్తా..

       “..ఆహా..హ్హ..హ్హ..హ్హా..సూసేసావా?” పకపకా నవ్వింది గిలక  రేగ్గింజ సప్పలిత్తా..

                                                      —

 

 

   

       

   

 

   

   

 

  

    

     

 

 

 

గిలకమ్మ కతలు – బాతుగుడ్డెక్కిన కోడి

రచన: కన్నెగంటి అనసూయ

“ అయినియ్యా రాతలు..? తెల్లారగట్టనగా మొదలెట్టేవ్ రాత్తం. అదేదో దేశాన్నుద్దరిత్తాకి పేద్ద పేద్ద డాట్రు సదువులు సదుంతున్నట్టు. ఏం రాతలో ఏవో..! ఇయ్యేటికవుతయ్యో లేదో బాబా..”
గుల్లుప్పోసి కుండలో లోపలకంటా కూరిన పిక్కల్దీసిన సింతపండుని సిన్న డబ్బాలోకి తీసుకొత్తాకి మూలగదిలోకెల్లి వత్తా వత్తా..అక్కడే కింద వసారాలో మడిగాళ్ళేసుకుని కూకుని ఓమొర్కులో ములిగిపోయిన గిలక్కేసి సూత్తా ఇసుగ్గా అంది సరోజ్ని.
“య్యే..! దానిపని నీకేవొచ్చిందే సరోజ్నే రాస్కోనివ్వక? కొండల్ని గుండగొట్టాలా యేటది?మల్లీ ఏవన్నా అంటే అన్నానంటాక్కానీ.. “
అప్పుడే కోసుకొచ్చిన కనకాంబరం పూల్ని దండ కడతా గిలకమ్మని ఎనకేసుకొచ్చింది ఆల్ల అమ్మమ్మ సుబ్బాయమ్మ.
ఏసంకాలంలో వడేలెడతాకొచ్చి ఆమట్నే ఉండిపోయిందేవో..సుబ్బాయమ్మకీ పొద్దు ఎల్తాలేదు. లేత్తానే కూతురు ఇస్టీలు గళాసుతో తెచ్చిచ్చిన కాపీ పుచ్చుకుని ఆమట్నే దోడ్డెనకాలకెల్లిందేవో.. సెట్టు సుట్టూతా రాలి కిందడిపోయిన కనకాంబరం పూలని సూసి “అయ్ మీ కడుపులు మాడ. సెట్టేత్తవెంతుకో పూలు కోసుకుండగాని. రాలి అట్తే కిందడ్దాయ్. ఉన్నదొక్కగానొక్క కుర్రముండ. ఆ నాలుగూ కోసి ఆమట్న దండ కడ్తే అదెట్టుకోదా? రాలి సచ్చినియ్..” అని తిట్టుకుంటా సెంగులోకి కాసిన్ని కనకాంబరం పూలుకోసుకొచ్చి దారపు రీలందుకుంది ..మాలకడ్దావని.
“ ఏటో మాయమ్మ మనవరాల్ని ఇట్తే ఎనకేసుకొత్తన్నాది. పూల్దండ కట్టేతలికి వాసనంటేసి మా ఇదైపోయిన్నట్టుందేటే అమ్మా. ..నీకు? దాన్నెనకేసుకొత్తన్నావ్? ఏ ఝామైందది అక్కడయ్యేసుకుని కూకుని..” కయ్యుమంది సరోజ్ని..
కూతురుకంటే నాలుగాకులెక్కువే సదివిందేవో సుబ్బయమ్మ… ఆవిడూరుకుంటదా..
తాస్పామల్లే ఇంతెత్తున లెసింది కూతురు మీద..
“ నోర్మూసుకో..! పిల్లామట్న రాసుకుంటంటే ఏడేడి పాలుగాసి తెచ్చిత్తం మానేసి మాటలోటా? నీకెలాగా అచ్చరం ముక్క రానే లేదు. దాన్నన్నా సదుంకోనియ్యి. మీ నాన్నెంత తవుసట్టేడో నీ సదుంకోసం. బళ్ళోకెల్తేనా? “ అంటా నాలుగు కనక్కాంబరం పూలు రెండటు రెండిటు పెట్టి తోకలు కలిపి దారంలోకి దూరుత్తా గిలక్కేసి తిరిగి..
“ ఆ సదివిన నాలుక్కళాసులు దాకా పల్కా, బలపాలకిడాకులేనే గిల్కా. పుత్తకాలకి ఇంకైతే ఒట్టు..వచ్చినోడు వచ్చినట్టుండేవోడు మేస్టరుగారు..” సరోజ్నమ్మ సంచీ తెరిత్తే ఒట్తమ్మా.. సదుంతుం లేదమ్మగోరూ “ అని.
ఆయనొచ్చినప్పుడల్లా ఏ ఆనపకాయ ముక్కో, గుమ్మిడికాయ ముక్కో , కందముక్కో ఎతుక్కోలేక సచ్చీదాన్ని..పచ్చిమిర్గాయలో సంచీలో ఏసిత్తాకి. ఏమాటకామాటే సెప్పుకోవాలి..సెట్లకి రెండు వంకాయలుంటే ఆ రెండే అట్టుకెల్లీవోడు..ముండా మేష్టరు..ముండామేస్టరని..”
“నా కూతురు సదుంకేంగానీ …నువ్విచ్చే ఆటికోసం వత్నాడా మేష్టరని మియ్యమ్మని ఎనకేసుకొచ్చేవోడు మీ తాత. మియ్యమ్మ మింద గాలారనిచ్చేవోడా..ఈగ వాల్నిచ్చేవోడా మీ తాత.. ?”
“ అయ్యన్నీ ఎంతుకే ఇత్తం అమ్మమ్మా..?” రాస్కునే రాస్కునేదల్లా తలెత్తడిగింది గిలక సుబ్బాయమ్మొంక సూత్తా..
“ అయ్యా..! ఇవ్వాపోతే బళ్లోంచి పంపేత్తాడేవోనని నా గుండెల్దడెత్తిపోయ్యేవే గిలక..మీ తాత్తో పళ్ళేను గందా..మాటాడితే కర్రెత్తీసీవోడు..ఏదో నాలుగచ్చరం ముక్కలు రాతం వొత్తే ఉత్తరవన్నా రాత్తదనీవోడు.. ”
“…ఇయ్యాల .. నిన్నంటాకి దానికి నోరెలా వత్తందోగానీ మీయమ్మకి..సిన్నప్పుడు అజ్జేసిన అల్లరికి సగం ఆయుస్సయిపోయిందే గిలక మీ తాతకి. సంకనాకిచ్చేసేదనుకో..”
“ ఉప్పుడంటే ఇలాటి సంచులొచ్చినియ్యిగానీ…మీయమ్మ సదుంకునే రోజుల్లో ఏసంకాలం శెలవులయ్యాకా బళ్ళు తెరిసే ఏలకి సంచికుట్టిత్తాకని మీ తాత పొలానికి మందేసిన ఈరియా సంచి ఉతికీ ఉతికీ ఎండేసి దాన్నట్టుకుని మిసనోడి దగ్గరికి తిరిగిందాన్ని తిరిగినట్టుండేదాన్ననుకో. అయినా కుట్టి సత్తేనే ఆ సచ్చినోడు. సూదిరిగిపోద్దని తిప్పిందాన్ని తిప్పినట్టు తిప్పీవోడు. అక్కడికీ తిరగలి మీద రాయల్లే ఆడి సుట్టూ తిరగలేక సూదిచ్చుకుని కుట్టిన్రోజులున్నాయ్. “
అంటా సుబ్బయ్యమ్మ ఇంక ఏదో సెప్పబోతుంటే
“నువ్వయ్యన్నీ సెప్పక సెప్పక దానికే సెప్పు. దాన్నోటికి అద్దూ పద్దూ ఉండదింక . ఆల్లున్నారనీ సూడదు..ఈల్లున్నారనీ సూడదు..ఎంతమాటబడితే అంత మాటంతది..” అంటా ..
గిలకమ్మ దగ్గరకంటా వచ్చి..
అడుగున నాలుగాకులేసిన వైరు బుట్ట, డబ్బులూ గిలకమ్మ సేతికందిత్తా..
“ ఇంకా బట్టైమవ్వలేదుగానీ ..సంచక్కడెట్టి..రావులోరి గుడికాడ ..నర్సమ్మామ్ముంది సూడు..”
“ ఏ నర్సమ్మామ్మా..”
“ అదే ..ఎర్రతాత లేడా?”
“ఊ..ఊ..ఆ తాత ఆల్ల మామ్మా..! “
“అమ్మయ్య. ఎల్గిందా? పోన్లే..! బేగినే..బతికిచ్చేవ్. ఆ మామ్మగారిల్లే. ఆల్లింటికెల్లి.. కోడిగుడ్లట్రా..! మొన్నామజ్జన ఏదో ఆయంతిలో కనపడి సెప్పింది..పెట్ట గుడ్లెడతందని..కావాలంటే పిల్లనంపు అని. ” అంది సరోజ్ని..పుస్తకాలు సంచీలో సర్దేసి లేసి నిలబడ్ద గిలకమ్మొంక సూత్తానే బుట్టున్న సేయి ముందుకు సాపుతా..
“ ఎన్ని…” అంది గిలక డబ్బులెనక్కి సూత్తా.
“ ఎన్నుంటే అన్నీ ఇచ్చెయ్ మను. గుడ్డు మూడ్రూపాలు. సరిపోపోతే మల్లీ వత్తానన్సెప్పు..”
“ఇత్తదో..ఇవ్వదో..”
“ అదిత్తదో ఇవ్వదో. ముందు నువ్వే సెప్పేత్తావ్. అపశకునం మాటలూ నువ్వూను..సుభం పలకరా పంతులూ అంటే పెల్లికూతురు ముండని లేపుకురండన్నాడంట. నీలాటోడే..”ఇసుక్కుంది సరోజ్ని.
“తప్పేవంది. అయినందానికీ కాందానికీ పిల్లనాడిపోసుకుంటావ్. అదొక్కటి దొరికింది నీకు తేరగాను. “ అని సరోజ్నిని జగడమాడి..గిలకెనక్కి సూత్తా..
“ ఎల్లు.ఎల్లి మియ్యమ్మిచ్చిన డబ్బులుకి ఎన్నుంటే అన్నియ్యమని పట్రా.ఒకేల ఇంకా ఉంటే ఎన్నున్నాయో అడిగి ఉంచమని సెప్పిరా. ఎవ్వరికీ ఇయ్యద్దు ఇప్పుడే వచ్చేత్తానని సెప్పు. డబ్బులట్టుకుని ఎల్దూగాని..” అంటా గిలకమ్మని దగ్గరకంటా వచ్చి కింద కూకోమన్నట్టు సైగ సేసి అంతకు ముందే బిగిచ్చి సివరకంటా అల్లి రిబ్బను ముడేసిన జడలో మూరడు కనకాంబరాల దండ జడ పొడుగూతా ఏల్లాడేలాగా పెట్టి..పిల్ల ఈపు మీద రెండు సేతులేసి ముందుకు తోత్తా వేల్లిరిసింది..దిట్టి తీత్తన్నట్టు సరోజ్నీ ఆల్లమ్మ కలవలపల్లి సుబ్బాయమ్మ.
“ సాల్లే సంబడం. బాగానే ఏల్లాడతన్నయ్ గానీ ..గుడ్లట్టుకుని అందరూ సూసేరో లేదోనన్నట్టు దండలెగరేసుకుంటా రాక నిదానంగా రా..పగిలిపోతాయ్..” ఎనకనించి కేకేసింది సరోజ్ని.
“నువ్ సెప్పాలి మరి నాకు. గుడ్లు మెల్లిగా తేవాలని నాకు తెల్దు” ఇసుక్కుంది గిలక తలుపు దగ్గరకేసి ఎల్తా..ఎల్తా..
పెద్ద ఎడల్పాటి పేడతో అలికిన దాగరి బుట్టలో..ఎండు గడ్డేసి మెత్తగా ఉంటాకని సిట్టూ తవుడూ పోసినంతసేప్పట్తలేదు గుడ్లట్టుకుని గిలకమ్మొత్తాకి..
వత్తా వత్తానే..”ఇంతుకా గుడ్లట్టుకు రమ్మన్నావ్. పిల్లల్ని సేయిత్తాకా? “
“మరెంతుకనుకున్నా..? ఇన్నేసి గుడ్లు తెప్పిచ్చి అట్టేసిత్తే ఆరగిద్దావనుకున్నావా? “ ఎటకారంగా అంది గిలక దగ్గర్నించి బుట్టందుకుని ఒక్కోటీ సెవి దగ్గరెట్టుకుని ఊగిచ్చి ఊగిచ్చి సూత్తా..
“ఎంతుకలా ఊపుతున్నా ..” అడిగింది సుబ్బాయమ్మ కూతురెనక్కి మా ఇదిగా సూత్తా..
“ జడిసిపోయ్యినియ్యేవోనని. ఓసారిలాగే పిల్లల్జేత్తానని కోడి గుడ్లకంపితే కొనుక్కునీవోల్లెవరూ రాక ఉండిపొయ్యినట్టున్నయ్. పాత గుడ్డిచ్చింది. మూడు వారాలు కోడి ముణగదీసుకుని కూకున్నా పిల్లైతే ఒట్టనుకో. కొనుక్కుంటాకి ఎవ్వరూ రాపోతే గిన్నెలో కాసిన్నీళ్ళోసి పొయ్యి మీదెడితే అదే ఉడుకుద్దిగదా..! ముసిలోడికిత్తే తినడా? అసలే పళ్లన్నీ ఊడి సచ్చినయ్యీయ్యేవో..మెల్లగా నవుల్దుడు. ఏటో..అన్నీ అమ్ముతువే..! మొన్నామజ్జన పాదుక్కాసిన దొండకాయలు ఏబులుం రాయేసి అమ్మిందంట ఆ బేంకులో పన్జేసి ఆవిడికి. గదిలో అద్దెకుంటందనుకో. ఉండేది ఒక్కగానొక్క మడిసి.మొగుడా మొద్దులా? పిల్లలా పితికిలా? నాలుక్కాయిలిచ్చి ఏపుకోమ్మా అంటే ఎంటందంగా ఉండిపోను. ఎక్కడ్నించొత్తయ్..! పేడ కుప్పలోంచి పుట్టిందానికి పిడక బుద్దులు రాక.! మల్లీ ఇంట్లో ఉంటన్న పాపానికి ఏదన్నా పనుండి బేకీకెల్తే ముందు పంపిచ్చెయ్యాలి..ఇదేదో ఊరికినే ఉండనిత్తన్నట్టు..”
“మరలాటప్పుడు మల్లీ దానింటికే ఎంతుకంపా గుడ్లకోసం..ఊరు గొడ్డోయిందా గుడ్లకి. ఇంతబతుకూ బతికి ఇంటెనకాల సచ్చినట్టు..తెలిసీ తెలిసీ దానింటికంపి తెచ్చింది గాక…మల్లీ నోరడేసుకుంటం ఒకటి. ఒకసారయ్యిందిగందా..కూకుని కూకుని పెట్టకి ముడ్డి నొప్పితప్పితే గుడ్డు పిల్లయ్యేనా? అదేదో ముందే సూస్కో..”
“ అంతుకే మరి..సెయ్యూడొచ్చేతట్టు ఊపి మరీ స్సూసేది..ఎంతుకనుకున్నా? అయినా ఇయ్యాలా రేపూ అందరూ తిని సత్తన్నారు. బలవొచ్చుద్దనంట. గసికిల్లాగ తయారవుతున్నారు ఎదవ సోకులని ఎదవ సోకులు. అదొక్కద్దే అమ్ముద్ది. పైకట్టుకెల్లద్దంట ముసలోడిక్కూడా పెట్తకుండా..”
“ ఏడిసినట్టే ఉందిగానీ ..ఎన్నయినియ్యో లెక్కెట్టు. ఎన్ని గుడ్లెడదావనుకుంటన్నా?.”
అంది సుబ్బాయమ్మ బుట్తలోని సిట్టులో సెయ్యెట్టి మునేళ్లతో అటూ ఇటూ తిప్పుతా..
“పెట్త పెద్దదే గడోతల్లే. ఎన్నెట్నా లాగేసుకుంటది ఒళ్ళోకి. ఇరవైయ్యెట్టు..”
“ పెట్టు…అయిదారు అడిలిపోయినా పదేను పిల్లల్దాకా అవుతాయ్..! ఇంతకీ పెట్టనొదిలేసేవా? ఇంకా గూట్టోనే ఉందా? “
“ వదలకుండా ఉంటే సత్తాది. అంతుకే వదిలేసి కాసిన్ని నూకలుంటే జల్లేను.
“మంచి పన్జేసా..! ఒకసారంటూ అనగటం మొదలెట్టిందంటే తిండీ తిప్పలూ ఉండవిక. ఆమట్నే కూకునుంటాది గుడ్ల మీద..”
“కూకోనిత్తావా ఏటి అది కూకుంటానంటే మాత్తరం. రోజూ గంటా, గంటన్నరైనా వదిలేత్తాను.. లేదంటే సచ్చూరుకుంటది.” అంటా గుడ్ల బుట్టదెచ్చి సుబ్బాయమ్మ దగ్గరకంటా పెట్టి..”నువ్ సర్ధుతా ఉండు. రావుకాలం జూసొత్తాను. దాన్ని బట్టి కోణ్ణి పడుకోబెడదాం..” అంటా లోనికెల్లబోతంటే ..
“ఇయ్యాలేవారం..?” అంది సుబ్బాయమ్మ.
“శుక్రోరం…”
“ శుక్రోరం మజ్జాన్నించి గానీ రాదు రావుకాలం..పెట్టనట్టుకురా..గుడ్లెడతం ఎంతసేపు..” అంటా..గుడ్లన్నీ వరసాగ్గా పేర్సి కూతురట్టుకొచ్చే పెట్తకోసం సూత్తన్న సుబ్బాయమ్మ..
ఆయసంతో రొప్పుతా పరిగెత్తుకొచ్చిన గిలకమ్మన్జూసి..
“ ఇప్పుడే గందా ఎల్లేవ్? ఆ సేతుల్లోయేటి..?” అంది నుదురు సిట్లిచ్చి గిలకమ్మనే సూత్తా..
“ గుడ్లు..ఇయ్యి గూడా పెట్తమ్మమ్మా..” అంది గౌన్లోంచి గుడ్లు తీసి వాళ్ల అమ్మమ్మకందిత్తా..
“ ఇయ్యేంగుడ్లే..! నీ కడుపు సల్లగుండా? కోడి గుడ్లు కాదియ్యి. ఏం గుడ్లుయ్యి..? ఇంత పెద్దగా ఉన్నాయ్..”
“ బాతు గుడ్లు..”
“ అయ్ నియ్యమ్మా కడుపు మాడా? అయ్యెక్కడియ్యే నీకు? “ యెనకనించొత్తా సరోజ్నంది.
“ కొన్నా..! “
“ఎక్కడ?”
“ మా బడికాడ సెంద్రమ్మామ్మ ఆల్లు అమ్ముతున్నారు”
“ దయిద్దురుగొట్టుమ్ముండా..నన్నడగద్దేటే తెచ్చేటప్పుడు? బాతుగుడ్డెవడు తెమ్మన్నాడు నిన్ను. అయినా డబ్బులెక్కడియ్ నీకు..”
“నువ్వియ్యి” ఇచ్చి తీరాలన్నట్టు అంటన్న గిలక్కేసి తెల్లబోయి సూసింది..సరోజ్ని.
“ అయినా కోడి కింద బాతు గుడ్డెడితే పిల్లలవుతయ్యని నీకెవరు సెప్పేరు?”
“ కాకి కింద కోయిల గుడ్లెట్టుకుంటే కోయిల్లవుతుల్లేదా?”
కిసుక్కున్నవ్విందా మాటకి సుబ్బాయమ్మ..నవ్వీ నవ్వీ
“ దానికి బదులిత్తం నీ వల్లగాదుగానీ ..పిల్ల సరదా పడింది డబ్బులిచ్చి పంపిచ్చు.
“ అని కూతురితో అని..మనవరాలొంక మురిపెంగా సూత్తా..
“ అయ్యిటియ్యి పెడతాను. “ అని మల్లీ కూతురొంక సూత్తా
“ పిల్లల సరదా మనవెంతుక్కాదనాలి. ఇయాలా, రేపూ పిల్లల దగ్గర నేర్సుకోవాలి మనం. తప్పులేదు. సదువులట్తాటియ్యి. కాపోతే బాతు గుడ్డెడితే ఇంకోవారం ఎక్కువ పడుకోబెట్టాలి కోణ్ణి. “అంది సుబ్బాయమ్మ ..
ఎనకనించెల్లి అమ్మమ్మ మెడని సుట్తేసింది గిలక.
“ అమ్మమ్మ నోట్తోంచి ఊడిపడిందిది..” మనసులోనే అనుకుంది సరోజ్ని ఆల్లిద్దర్నీ అలా సూత్తా..
—-

“పెద్దోల్లైపోతే ..ఏం పెట్రా? “

రచన: కన్నెగంటి అనసూయ

“సరోజ్నే…సరోజ్నే…! లోపలేంజేత్తన్నావో గానీ ఓసారిలా వత్తావా బేటికి..”
గుమ్మం ముందు నిలబడి అదే పనిగా పిలుత్తున్న గౌరమ్మ గొంతిని లోపల బోషాణం పెట్టెలో ఏదో ఎతుకుతున్న సరోజ్ని ఇంకో రెండడుగులేత్తే లంగా సిరిగిపోద్దా అన్నంత ఏగంగా వచ్చేసింది పెద్ద పెద్ద అంగలేసుకుంటా..
“ఏటి గౌరొదినే..ఇంత పొద్దున్నే..ఇలాగొచ్చేవ్..?” అంది ..
“ఏవీ లేదు ..పెసరొడేలు పెడదావని..తవ్విడు పప్పు నానబోసేను..గబ గబా పని కానిచ్చుకుని ఒకడుగు అటేత్తావేమోనని..”
“..వత్తాన్లే గానీ మొన్నేగదా పెట్టేవు..కుంచుడో, మూడడ్లో అయినాయన్నావ్..? మల్లీ ఇయ్యెంతుకు?”
“పిల్లడిగింది..దానికి పెసరొడేలే ఎక్కువ కావాలంట. ఆల్లాయనకి రాత్రుల్లుమాటు సాంబారులోకి రోజూ వడియాలుండాలంట. దాని పెళ్లైన కొత్తలో..పొయ్యి పక్కనే మూకుట్లో నూనోసి దానామట్నే ఉంచి అందులోనే ఏపేత్తా ఉంటే మా సెబ్బరి పడిపోయేది..మరిగీ మరిగీ వడేలు ఏపినప్పుడల్లా ఇల్లంతా కంపమ్మా..అని.
ఆల్లకి వడియాలు బాగానే కరుసవుతాయ్. పెట్టుకోపోయావా అదెంత పనంటే..ఆ అపార్టుమెంటుల్లో నాకెలాక్కుదురుద్ది అంతది..”
“అదీ నిజవేలే..మరి. పైనెక్కడో టెర్రస్ మీదెట్టుకోవాలి. ఎండేదాకా అక్కడే కూకోవాలి. అయ్యన్నీ అయ్యే పన్లేనా?”
“అంతుకే..పనయ్యాకా ఒకడుగెయ్..”అంటా రెండడుగులేసి..
“వత్తానే సరోజ్నీ..అల్లం, పచ్చిమిర్గాయ్ ముక్కలు కోస్కోవాలి..”
“సర్లే ..” అని లోనకడుగేసిన సరోజ్ని..గబ గబా పన్జేసేసుకుని నాలుగు సెంబుల్నీల్లు ఒంటి మీంచి గుమ్మరిచ్చుకుని గౌరమ్మ ఇంటికేసి..ఎల్లింది. అప్పటికే ఆ ఈధిలో కిట్టవేణి, గౌరమ్మా. ..మంచం పక్కమ్మటా ఎత్తు పీటల మీద కూకుని రెండోకంటోల్లకి ఇనపడకుండా గుసగుసలుగా మట్తాడుకుంట్నారేవో..సరోజ్నిన్జూసి ఆపేసి మొకం నిండా మెరిసిపోయే రంగులల్లే నవ్వు పూసుకుని లోనకి రమ్మన్నారు.
తనొత్తంతోనే ఆల్లాపేసినంతుకు కాసేపు అదోలాగున్నా అంతలోనే మాటల్లోబడి..
ఆ మాటా ఈ మాటా మాట్టాడుకుంటుంటే…పక్కింటి సేసమ్మ..”గౌరొదినే..! తవ్విడే అన్నావని రాలేదు.ఒకడుగెయ్యమంటావా..” అంటా వచ్చి అక్కడే సరోజ్ని ఉంటం సూసి గౌరమ్మ ఏంజెప్పుద్సో ఇందావని గూడా సూడాకుండా వచ్చిందొచ్చినట్తే ఎల్లిపోయింది ఎనక్కి..
ఎంత్కో సరోజ్నికి అర్ధం కాలేదు…
“వచ్చిందెలాగూ వచ్చింది..లోనకొకడుగేత్తే పోయిందేవుందో..!” లోపలనుకోబోయి పైకే అనేసింది సరోజ్ని.
అప్పటికే మొగుడికి టీ పెట్టాలని కిట్తవేణి ఎల్లిపోయిందేవో..గౌరమ్మా, సరోజ్నీ ఇద్దరే ఉన్నారు..
“అన్నట్టు..మొన్నామజ్జన పెసరొడేలెట్టినప్పుడు..సేసమ్మని పిల్వలేదా ఏటి నువ్వు..”
అంది గౌరమ్మ..పెసరొడియాల పిండి సేతిలోకి తీసుకుని..సరోజ్ని వంకే సూత్తా..
“అయ్యా..ఇది మరీ బాగుంది. సేసమ్మనెంతుకు పిల్వలేదు.మా గిలకనంపితేని.
కేకెయ్యలేదని సెప్పిందా..? దాన్నోరడిపోను..సెల్సిత్తం ముండ..”
కోపంతో..కయ్యుమంది సరోజ్ని.
“అయ్యో..ఊరుకో..! మల్లీ ఇందంటే అదొగ్గోల..ఎంతుకొచ్చిన గొడవ. “నసిగింది గౌరమ్మ..
“మా గిలకెల్లొచ్చింది. పిల్సినోల్లందరూ ఒచ్చేరు..సేసమ్మే రాలేదు. ఏమ్ములిగిందో ఏవోలే అనుకున్నాను. అంతుకేనా పిండొడియాలు పోసుకుంటా అందర్నీ పిల్సి నన్ను పిలవలేదు..”
అంది సరోజ్ని..గుడ్ద మీద పెద్ద బఠాని సైజులో పెసరొడియాలు కొస్రి కొస్రి పెడతా..
“ఏదో ..తిరగేసుకుంది..కారాలు కొట్టుకున్నా..ఆవపిండ్లో పోటేసుకున్నా.. ఆవకాయలప్పుడైనా .. వడియాలూ అప్పడాలూ పెట్టేటప్పుడైనా ఈధిలో వోళ్లం అంతా ఒకరికొకరం సాయం సేసుకుంటా రాబట్టే గందా..సులాగ్గా అయిపోతన్నయ్..మరెంతుకు పిలవలేదో..అని తిరగేసుకుందిలే. అంతే .అంతకన్నా ఏవన్లేదమ్మా..పాపం..ఏమాటకామాటే సెప్పుకోవాలి..”
“అందుకే నన్నూ పిల్వలేదు..సరిపోయింది. అయినా గిలకనడుగుతానుండు..పిల్సిందో లేదో..! దానికి గుణం కుదిరితే పిలుత్తుది. ఇట్టం లేపోతే పిలవదు..”
“అడిగి సూడు..ఇలాటియ్యే..సిలికి సిలికి ఈదురుగాల్లవుతాయనేది మాయమ్మ..”
అయ్యాల మజ్జానం బళ్లోంచి కిలక అన్నానికని ఇంటికొచ్చినప్పుడు..అడగనే అడిగింది సరోజ్ని..”ఏవే గిలక..! అయ్యాల పెసరొడియాలెట్టిన్నాడు సేసమ్మామ్మని పిలవమన్జెప్పేను. పిల్సవా? ఎల్లి..”
“ఊ..ఊ..” అంటా ఆలోసిత్తా అల్లమ్మొంకే సూత్తా నిలబడిపోయింది అయ్యాలని గుత్తు దెచ్చుకుంటా..
అయ్యాల..తెల్లారి కాసేపయ్యిందేవో..
అప్పుడే నిద్దర్లేసి కల్లు నులుముకుంటా తిన్నగా వంటింటికాడికొచ్చిన గిలకెనక్కి సూత్తా..
“.అదిగో..ఆ గెడంచీ మీద డబ్బులెట్టేను. భద్దర్రావ్ కొట్టుకాడికెల్లి పావుకేజీ అల్లమిమ్మని పట్రా .”
అన్నవారుత్తానే వారకంట్న గిలకమ్మని సూత్తా అంది సరోజ్ని.
అల్లవనగానే గిలకనోట్టో నీరూరిపోయి..కల్లింతంతజేస్కోని..
“అల్లవెంతుకే అమ్మా..! పెసరట్టేత్తన్నారా?” అంది..ఆశగా..
“ఎప్పుడూ తిండిగోలే..ఏత్తే ఏత్తాన్లే. పెసరొడియాలెడతన్నాం..నువ్వెల్లి అల్లం పట్రా..”
పన్జేసుకుంటానే అంది సరోజ్ని..
“దాన్ని కాతంత మొకంకడుక్కోనీ. పాసి ముఖంతో ఎల్లద్దా..? నీ సేదత్తం ఎక్కడికోయింది? “అని కూతురితో అని..గిలకెనక్కి తిరిగి..
“ఎల్లు. తూంకాడికెల్లి సుబ్బరంగా పళ్ళుదోంకొన్రా. తెల్లగా మెరిసిపొవ్వాలి..” అంది అక్కడే రోట్టో పెసర పిండి రుబ్బుతున్న గిలకాళ్ల అమ్మమ్మ.
ఆవిడి ఏసంకాలంలో కూతురు పిండొడియాలూ, అప్పడాలూ , పెసరొడియాలూ, పచ్చల్లు పెట్టుకుంటాదని సాయంజేత్తాకి వచ్చి నెలా, నెలాపదేన్రోజులు కూతురింటికాడే ఉండిపోద్ది.
అప్పటికొచ్చి వారంరోజులవ్వుద్దేవో..అప్పటికే పిండొడియాలెట్టేసి ఎక్కడా తడన్నది లేకుండా ఇరగెండబెట్టేసి దబ్బాల్లోకెత్తేసేరు.
ఇయ్యాల పెసరొడియాలెడదామని తెల్లారగట్ట లేసి పెసరపప్పు నానబోసేరు.
మినప్పప్పుల్లాటియ్యయితే రేత్రికాడ నానబెట్టుకున్నా పరవాలేదుగానీ పెసరపప్పు మాత్రం మూడు నాలుగ్గంటల ముందే నానబెట్టాలని సరోజ్ని ఆల్లమ్మమ్మాళ్లూ సెప్తా ఉంటం గేపకేవేనేవో..
తెల్లారగట్త నానబెట్టేరు.
“ఏసంకాలం ఎండ బేగినే వచ్చేత్తింది. పొద్దున్నే కాపీల్తాగి.. ఆరింటికల్లా రుబ్బుతుం మొదలెట్తేత్తే…ఎండెక్కే టయానికి అయిపోతయ్యి. ఏటే అమ్మా… !” అంది సరోజ్ని ఆల్లమ్మతో..
“అంత పొద్దున్నే రుబ్బేత్తే పెట్టీవోల్లో? పెట్టీవోళ్లుండద్దా? ..మనక్కోడి కూసేసిందని ఇరుగూపొరుగోల్లక్కూడా కూసేత్తాదా? సేత్రం సెప్పినట్తుంది .. ఏడింటికి మొదలెడితే రెండుమూడు వాయలయ్యాకా పిలుత్తానని ముందే కవురెట్టు. నీడపట్టున కూకుని పెట్టేసి పోతారు. ఎండెక్కే కొద్దీ సిరాకొత్తాది ఎవురికైనాను..”
“సర్లే అయితే ..! గిలక లేసేకా కవురెడతాను..అయితే ఎంత పప్పోద్దాం..? అంది సరోజ్ని..ఆల్లమ్మనెక్కే సూత్తా..
“ఉల్లిపాయలూ..పచ్చి మిర్గాయలూ సూసేవా సరిపడా ఉన్నయ్యో లేవో..?”
“సూర్రావ్ సేలోకంపి నిన్నే కేజీకాయల్దెప్పిచ్చేను…”
“సరిపోతయ్యా..?” ఆల్లమ్మ గొంతులో ఆత్రం..
“అయ్యబాబోయ్..కుంచెడు పప్పు పెసరొడియాలకి సరిపోతయ్యయ్యి. పైగా వరం కాయలు కాదు. పొట్టి కాయలే. కారం బాగానే ఉందంట. వల్లూరోరి రాఘవమ్మ సెప్పింది. రాఘవమ్మక్కడ్నించే తెప్పించ్చిందట పచ్చిమిర్గాయలు. తనే సెప్పింది. లేపోతే నాకెక్కడ తెలుత్తాది..తనెట్తేసిందిలే. కుంచెడు పప్పోసి పెట్తేసింది. అయిదార్రోజులు అదే సరిపోయింది ఈది ఈదందరికిన్నీ..”
“కుంచెడు పప్పే? వామ్మో..! అన్నెంతుకో..?” బుగ్గమీచ్చెయ్యేసుకుని తెల్లబోతా అంది..సరోజ్ని ఆళ్లమ్మ.
“కూతురు పెళ్ళికుందిలే..! కుదిరితే పెట్తాలి కదావియ్యవోల్లకి కావుళ్ళు. అంతుకే అన్నీ ఎక్కువెక్కువే పెట్టి డబ్బాల్లో పోసేసుకుంటంది..పచ్చళ్ళు కూడా పెట్తేసుంచుకుంటదంట. కారలయ్యీ కొట్టిచ్చేసి కుండల్లో అణిసణిసి వాసిని గట్టి మరీ మసిరి మీదెట్టేసింది..”
“కుదరా పోతేనో..” అని ఒక వంకర నవ్వు నవ్వి..
“అప్పుటికప్పుడు పెట్టుకుంటే అవ్వదా ఏటి? ఉట్టు పట్తేత్తన్నాయ్ పురుగులు..”
“నువ్వూ బానే సెప్తాయ్. ఏసంకాలం అయితే బాగా ఎండుతాయ్. వాన్లడ్దాకా ఎండద్దా?
ఎండ రాపోతే అయ్యలా సాగుతా ఉంటాయ్ గుడ్ద మీద. నూన్లాగేసి అస్సలు బాగోవు ఏయించేటప్పుడు. కూరకైతే తప్ప..” అని అక్కడకదాపేసి..
“సర్లేగానీ ..కారం మరీ ఎక్కువైపోతే పిల్లలు తిన్రే అమ్మా..! ఆల్లు తినాపోతే ఇంకెంతుకు ఇంత
కట్తవూను..”
“అంతేలే..కానియ్. రెండు తవ్వల పప్పోత్తావా? ఇంకా తగ్గిద్దావా?”
“పోసేద్దాం లే. ఎండేకా సూడొచ్చు సరిపోతయ్యో లేదో. సరిపోపోతే అప్పుడే సూడొచ్చు.. “ “వద్దులే పోసేద్దాం. సీకట్లో లెగుత్తుం ఎంతుక్కానీ సెప్తే…కొలిసేసి దాకలో పోసేసి..దాకా, నీళ్ళూ మంచంకాడెట్టుకుంటాను. మెలకువ రాగానే దాకలో నీళ్ళోసేత్తాను..ఇంక లెగవక్కాలేదు..’ అంది సరోజ్ని..
సర్లెమ్మని రెండు తవ్వల పప్పు కొల్సి సేట్లో పోసి..ఆ పక్కనే సీవెండి దాకలో నీళ్ళు కూడా పోసేసి పడుకునే ఏల లైట్లన్నీ ఆరిపేసాకా..సరోజ్ని మంచం కాడెట్టింది..
పెందలాడే లేసి రోజూ కంటే ముందే కాతంత ఉడకేసి అక్కడ పడేసి..పప్పుకడగటం మొదలెట్టింది పెద్దావె. ఆవిడ కూతురింటో ఉన్నన్నాల్లూ..తనే వండుద్ది పొయ్యి కాడ కూకుని..
వంటయ్యిందనుకున్నాకా పప్పురుబ్బటం మొదలెట్టిందేవో..
సరోజ్ని ఇల్లిపాయీ, పచ్చి మిర్గాయీ సన్నగా ముక్కలు కోత్తుంటే గిలక లేసొచ్చిందేవో..అల్లానికని దాన్ని కొట్టుకాడికంపి అదొచ్చేకా..ఆ ఈధిలో ఇరుగూపొరుగోల్లు సేసమ్మ, గౌరమ్మా, కిట్తవేణి, సొరాజ్జం అందరికీ సెప్పి రమ్మని పంపింది..
అయ్యన్నీ గేపకవొచ్చి..
“సెప్పలేదు..” అంది గిలక ఆల్లమ్మతో..
ఆ మాటతో తెల్లబోయింది..సరోజ్ని..
“సెప్పమని సెప్పేను గదా సిలక్కి సెప్పినట్టు. నీకేమ్ పొయ్యేకాలవొచ్చిందే పిలవాపోతాకి?
అంతుకే నన్ను పిల్లేదంట..మొన్నాల్లింటికి..సిచ్చేట్టెవ్ గందా..?” కసురుకుంది కూతుర్ని..
“అయినా పెద్దోల్లు సెప్పినట్టు సెయ్యాలిగందా..సొంత పెత్తానాలేంటో..? ”అక్కడే కగోడకానుకుని కూచ్చుని వత్తులు సేత్తన్న పెద్దావె అంది..
“కావాల్నే సెప్పలేదు..”
“అదే ఎంతుకంటన్నాను..నేను సెప్పమన్నప్పుడు సెప్తే నీ సొమ్మేం పోద్దో..”
“నాకా సేసమ్మామ్మ ఇట్టం లేదు..”
“నీ ఇట్టం ఎవడిక్కావాలి? నేన్సెప్పమన్నాను సెప్పాలి . అంతే..
“సెప్పను. ఆ సేసమ్మామ్మ..ఆల్లింట్లో తాతమ్మ ఉంటస్సూడు. ఆ తాతమ్మకి ఏవీ పెట్టదు. ఆ తాతమ్మ..కిటికీకాడ కూకుని …నువ్వు ఏదైనా పెడ్తే నేను బళ్ళోకి తింటా ఎల్తాను సూడు .. అప్పుడు నన్ను కిటికీ దగ్గరకి పిల్సి పెట్తమని అడుగుద్ది. సేసమ్మామ్మ..ఏవీ పెట్టదంట..”
“ఆసి ముండా..! అంతుకేనా ..?”
“అంతుకే మరి. ఇంకెంతుకనుకున్నా..? అయినా పెద్దోల్లైపోతే ఏం పెట్రా..”
గిలకమ్మనే సూత్తా ఉండిపోయారిద్దరూ..
ఏం సెప్పాలో తెలవక.

గిలకమ్మ కతలు 11 – మరేమో..! అమ్మా..నీకో ?

రచన: కన్నెగంటి అనసూయ
బోగుల్లోరి దొడ్లో   నందొర్ధనం పూల్లాగా తెల్లగా తెల్లారి పోయి సేలా సేపైపోయిందేవో..ఊరు..ఊరంతా ఒకటే మసాలా కంపు గుమగుమాలాడిపోతంది…
అయ్యాల ఆదోరం…
ఆ ఈధిలో  పెతాదారం  కోణ్ణి కోసి పోగులేసమ్మే శీలచ్వి  దగ్గర  కోడిమాసం కొని   పొయ్యెక్కిచ్చినోళ్ళు కొందరైతే  పాటి మీద సెర్లో సేపలడతన్నారని సాటింపేత్తే..పందుమ్ముల నోట్లో నవుల్తానే  గేలం మీద సేపకోసవని రెండు మూడు గంటలు పడిగాపులుగాసి మరీ తెచ్చుకున్నోళ్ళు మరికొందరు.
నీసుకూరేదైనా తగ్గ మసలా పడాపోతే ..మడుసులేగాదు..కుక్క గూడా మూతెట్తదని, మూతి ముటముటలాడిత్తాదని శాత్రం. అయినా  ముక్క నవుల్తా ఆ కారానికి ముక్కు సీదాపోతే ఏంబాగుంటదనుకుంటారో ఏటోగానీ  కసి కొద్దీ కలం లో రాయితో అల్లమెల్లుల్లి నూరీ నూరీ మరీ కూర్లో దట్టిచ్చేరేవో..పొయ్యెగదోత్తన్న కొద్దీ  కూర దాకల్లో కుతకుతలెక్కువై  ఊరు ఊరంతా ఒకటే మసాలా కంపు..
అంతకు  మునుపు సేలా సేపయ్యింది గిలక మేక మాసం కోసవని సాయిబ్బు దుకానానికెల్లి.
ఆపాటికి వత్తా ఉండేపని. మరెంతుకో ఇంకా వత్తాలేదు.
గిలక్కోసవని లోపలకీ, బయటికీ అటూ ఇటూ తిరగలి ముద రాయిలాగ గిర గిరా  తిరుగుతానే ఉంది సరోజ్ని.
ఉండుండి.. గుమ్మాన్నట్టుకుని  గిలక్కోసవే సూత్తందేవో…సరోజ్నీ, గిలకెంతకీ రాకపోయేతలికి ఒకటే గుబులు ఉడికెత్తించేత్తంది  లోపల్లోపల.
తీరా ఈ మడిసి పొలాన్నించొచ్చేడంటే..పిల్లనెంతుకంపేవని  అదో గొడవ.
ఈడొచ్చిన పిల్లని యేడకీ  అంపిచ్చకని  అడపా దడపా సెవులో ఏత్తానే ఉంటాడు.
అంతుకే..
గుమ్మంకాడికొత్తంది. గుమ్మాన్నట్టుకుని  కాసేపలాగ నిలబడద్దో లేదో అంతలోనే ఏదో వణుకు.  రెండు పక్కలకీ  వంగుని మరీ  గిలక జాడుందేవోనని సూసి మరీ  లోపలకో అడుగేత్తంది. కుదురుగా కాలోసోట నిలుత్తాలేదు.
మామూలుగా అయితే సరోజ్నీ ఇంట్లో కూడా ఆ యేలప్పటికి అందర్లాగ   పొయ్యి కూసేసేదే. కాపోతే..
“ సేన్నాళ్లైందే అమ్మా..ముడుసుని సీకి.  అబ్బా..!నోట్లో మేక ముడుసెట్టుకుని  జుర్రున లోనకి పీలిత్తే బలేగుంటాదిలే.  మేక మాసం తిందావే అమ్మా..” అని సెంగట్టుకుని పిల్లలడిగేతలికి కాదన్లేని సరోజ్ని  సర్లెమ్మని  డబ్బులిచ్చి  గిలకమ్మనంపింది .
ఎండొత్తే లైను పొడుగైపోద్దని  సరోజ్నికి భయం.  అంతుకే సీకటుండగానే దబ్కా దబ్కా ఒంటి మీద రెండిచ్చి లేపి మరీ తోలేసింది. ఎప్పుడనగా ఎల్లిందో?
ఎంతకీ రాదే..?
ఆ ఈధిలో ఉంటే   శీలచ్వి మా మాటకార్రకం. ఏలికేత్తే కాలికీ,కాలికేత్తే ఏలికి ఏసే రకం.అలాటి మడిసి  కోళ్లు కోసి మాసం పోగులేసి అమ్ముతుం మొదలెట్టింది. అంతకు   మునుపంతా సరోజ్నీ ఇంట్లో కోడిమాసం కంటే మేక మాసం అంటేనే  తెల్లో ముద్దెట్తనిచ్చీవోరు పిల్లలు.
కాపోతేనీ.. ఆ మేక ముడుసుతోనే  వచ్చేసేది  ఎక్కళ్ళేని  మా సెడ్ద సిక్కు. మా తెత్తే పావు కిలో మేకమాసం దెప్పిచ్చి పిల్లలిద్దరికీ పళ్లెంలో సెరో రెండేసి  ముక్కలేసి  తనేదో గుజ్జుతో అయిందనిపిచ్చి పొద్దున్నకీ, రాత్రేళకీ దాంతోనే సరిపెట్తేసేది.     కాపొతే ..పావు కిలో మాసానికీ  తూకవయ్యాకా కొసర్లాగ ఒక ముడుసేత్తం మాసం సాయబ్బుకి అలవాటు.
ఆ ముడుసుకోసం, జుర్రితే వచ్చే ముడుసులోని మూలక్కోసం  కొట్టేసుకునేవోరు పిల్లలిద్దరూను. నాక్కావాలంటే నాక్కావాలని ఒకటే గొడవ.
నోట్లోకంటా పెట్టుకుని లాగి మరీ పీలుత్తుం ,సీకటం గిలక్కిట్టం. పెద్దోడయ్యే కొద్దీ పిల్లోడు పోటీకొత్తం మొదలెట్టేడేవో..
ఎంతుకొచ్చిన గొడవని అందరూ సీలచ్వి  సికెన్ బాగుంటుందంటన్నారని  పోగెత్తుతుం మొదలెట్టింది సరోజ్ని.
పైగా  సీలచ్చివి కవురు గూడా ఎట్టింది..పోగు పదేను..ఎన్నిపోగులంపమంటాని.
సీలచ్చానికదే పని. ఆదోరం వచ్చేతలికి పాతిక, ముప్పై కోళ్లైనా పీకలు తెగ్గోత్తది. ఈకలు పీకేసి  తీరిగ్గా కూకుని  తాటాకు మంట్లో కాల్సేసి  ముక్కలు  కోసి పోగులెట్టి ఆల్లనీ, ఈల్లనీ అడుగుద్ది కావాలాని.
సచ్చిన కోళ్లనీ, రోగాలొచ్చిన కోళ్లనీ కాకుండగాను..కళ్ళెదురుగా తెచ్చి బతికున్న కోళ్ళని వారం పొడుగూతా తిప్పి మరీ కోత్తదని శీలచ్వంటే  ఆ ఈధోల్లకి అదోలాటి నమ్మకం.
బయటోళ్ల దగ్గర కొంటేనీ  ఆడు ఎలాటి కోడి మాసం తెత్నాడోనని అనుమానం. కోళ్ల పారాల కాడ సచ్చిన కోళ్ళకీ, రోగాలొచ్చి రేపో మాపో సత్తయ్ అన్న కోల్లకీ  తక్కువ తీసుకుంటారంట.  అలాటి సెబ్బరి సరుకుని  సవగ్గా తెచ్చి బజార్రేటికే అమ్ముతారని , అలాటియ్యి తింటే  ఎవుకల రోగాలొచ్చి మూలడతారనీ శీలచ్వే పెసారం సేసింది.
“ స్సీ..ఎదవ్ బతుకు. తింటే సరైందే తినాల. రోగాలొచ్చిన కోళ్లు తింటే కొన్నాళ్లైనా ఏదీ తిన్లేక  నోళ్లకీ సీళ్ళేసు కోవాల్సొత్తాదేవోనని  శీలచ్వి దగ్గరే  పోగులు కొనుక్కుని బ్రేవు  బ్రేవంటం మొదలెట్టేరు వాడవాడంతాని.
ఒకేళ ఎవరైనా అయ్యాల పోగులేసే కోడికూరొద్దనుకున్నా   ముక్కు సేసే మూలుగులు తట్తుకోలేపోయీవోరు. పైగా ఇరుగూ పొరుగోళ్ల పలకరింపులొకటి..” ఏటియ్యాల పోగెత్త లేదంట? “ అంటాను అదేదో తప్పు సేసినట్టు. అయ్యాలంతా నరకంనూన్లో ఏగినట్టే అయిపోయేది బతుకు.
అంతుకే ఆదోరం వత్తే సాలు   ఇట్తవైనోళ్ళు ఇట్టవైనన్ని పోగులు శీలచ్వి దగ్గర ఎత్తుతానే ఉంటారు.  ఎవరిట్తం ఆల్లది.  అలాగలాగ ఎండెక్కే కొద్దీ తీర్తంలో పెరిగిపోయిన తానాల్లాగా  ..తొట్తతొలి ఒక్కోడితో మొదలెట్టి  ముడుసులూ, మెడకాయ మిగిల్తే సాలనుకున్న సీలచ్వేపారం పాతిక్కోళ్లకి పాకేసి.. అయ్యాల్టి కూర కరుసులు  పోగా…ఒకట్రెండు సిట్టీలేత్తవేగాదు సీర్లేపారం మొదలెట్టింది.
కట్టపడితే కోళ్ళే కాదు కోకలూ అమ్మొచ్చు , కోటలూగట్టచ్చు. అమ్ముతుంది కదాని ఊరికే  వారానికోపాలి  కొనేసి తినేసి దొల్లుతున్నాం.  అదేవో  సుక్కల్లోకెక్కి కూకుంటంది..మారాణిలాగా . మన కల్లెదురుగ్గానే కోడీకలు పీకటం మొదలెట్తింది. ఎక్కడికెల్లిపోయిందో సూడు. ఆకాశంలో సుక్కై కూకుంది..అందకుండాని.అదీ దాని సోకు..
ఆడెవడో.. “సుక్కల్లోకెక్కినాడే..సక్కనోడు “ అని పాడ్నట్టు..సుక్కల్లోకెక్కినాదే శీలచ్వి…మిల మిల మిల మెరుత్తాంది శీలచ్వీ..
సిట్టీలు గట్టినాదే శీలచ్వీ..” అంటా ఈధిలోవోల్లంతా ఏడ్వని రోజు లేదంటే ఒట్తు.
దాంతో..ఇదిగాదు పనని..ముక్కునోసారి మూల కూచ్చోమని కసిరి తుమ్మజిగుర్రాసి మూసేసి , ఆకలినాయగట్టుకుని ఆక్కూరలన్నా తిందాంగానీ  శీలచ్వి కాడ సికెన్ మాత్రం కొనొద్దని..కంటి సైగల్తో సైరన్ మోగిచ్చేసేరు ఏక మొత్తంగా అందరూ ఏడుత్తా…
సరోజ్నీ  సెవినీ సేరిందీ కవురు.
” ఈల్లెప్పుడు ఓర్సుకున్నారుగన్క..ఎదటోళ్ళెదుగుతుంటే..ఎదవలు..ఎదవలని.రోగాలొత్తే తెలుత్తాది” అనుకుంది తప్ప సెవినెట్లేదు సరోజ్నీ.
అయితే ..మజ్జమజ్జలో..గిలకమ్మ  మేకమాసం అనడక్కుండా..మేకరిసినట్టు..”మే…మే..” అని మేక సకిలింపులు సకిలిత్తా అటూ ఇటూ తిరుగుతా ఉంటే…
సరోజ్నికి అర్ధవై  అయ్యాల్టికి   మేకమాసం తెప్పిచ్చి వండిపెట్టేది.
అయితే ఇదొరకట్లాగ  పావుకేజీ తెత్తే  సరిపోతల్లేదు. కరువొచ్చి కొంపలంటూ పోయినట్టు రెండేసి ముక్కలేసి రెండు పూట్లా అదే  సరిపెడతానంటే  పిల్లలు ఊరుకోక పావుకేజీనల్లా అరకేజీ సేసేసింది ఇంకెంతుకులే ఆల్ల కోసం కాదా ఏటి ఇదంతా అని.
“ఏదో  అడిగేరని , శీలచ్వి మాయలోబడి పిల్లల ఇట్తాన్నే పట్టిచ్చుకుంటాలేదేమో “ అనిపిచ్చి పోనీలే తెచ్చుకొమ్మన్నానుకో..మరీ..ఇంతసేపా?  ఎంత సేపున్నా రాదే! “
“ ఏ జతకత్తులన్నా తగిలేరేవో..?కవుర్లాడతా కూకునుంటాది..రానియ్ సెప్తాను  దీన్సంగతి. “ మనసులో ఇసుక్కుంది సరోజ్ని గిలకమ్మని.
అదేపనిగా అటే గిలకమ్మొత్తాదని సూత్తందేవో..దూరంగా  సైకిల్ మీద మెల్లగా వత్తా కనిపిచ్చేడు ఆ ఈధిలో సుబ్బారావు.
పక్కింటిల్లే. ముందు యేండిల్ కి ఏలాడ్తా..సంచీలో మాసం పొట్లాం. అదెప్పుడూ సుబ్బడు  మాసం కోసం అట్టుకెల్లే సంచే. సైను గుడ్దతో కుట్తిచ్చింది ఆల్లమ్మ మాసం పొట్లం  బయటికి అగుపిత్తే  దిట్టి తగుల్తాదేవోనని.
సైకిల్మీద సుబ్బణ్ణి సూత్తానే పేనం లేసొచ్చినట్తయ్యింది సరోజ్నీకి కాతంత కవురన్నా తెలుత్తాదని.
సుబ్బడు గుమ్మం దాకా వచ్చాకా    గబుక్కున గడప దాటెల్లి సీడీలు దిగి “ సుబ్బారావా..! “ అని పిల్సింది….
గబుక్కున సైకిలాపి ఒక్కాలు కిందెట్టి నిలబడి “ఏటత్తయ్యా ..” అన్నాడు..సుబ్బడు.
“ మాగిల్కాపడిందా ? ఇందాకనగా ఎల్లింది..మాసం కొట్టిచ్చుకొత్తానని. ఇంకా వత్తల్లేదు..నీకాపడిందేవోనని..”
“ ఆ కాపడిందత్తో…! సిన్నపిల్లని  నా కంటే ముందే కొట్టిచ్చేసేడు. రెండు పొట్లాలు  కట్టిచ్చింది.
ఇంకోటెవరైనా తెమ్మన్నారేవో? గట్టిగా దభాయించి మరీ రెండు పొట్లాల్లోనూ రెండు  ముడుసులేయిచ్చింది..కూడాను. మొత్తం మీద మీ గిలక అలాటిలాటి గిలక కాదత్తో. ఉండదగ్గదే.” అన్నాడు సుబ్బడు పళ్ళికిలిత్తా.
అదంతా ఏవీ ఇనపళ్ళేదు సరోజ్నీకి. రెండు పొట్లాలెంతుకు కట్టిచ్చిందన్నదే అర్ధమవుతా లేదు.
ఒకేల ఆ బళ్ళో మేష్టారంటే పడి సత్తాది. పోనీ ఆవిడికేవన్నా కట్టిచ్చిందా అంటే ఆవిడేవో బేపందాయే.. నీసంటే ఆవడ దూరం పరుగెత్తుకెల్లద్ది. మరింకెవరికి కొట్టిచ్చినట్టు..”
“ పోనీ….ఈల్లసలే  శీలచ్వి సంపాదిచ్చేసుకుంటందని కడుపు, కళ్ళూ మాడిసేసుకుంటన్నారు అంతకంతకీని.  అవతలోళ్ళు బాగుపడితే పట్టిచ్చుకోరు. మనోళ్ళు బాగుపడుతుంటేనే  నిద్రారాలు మానేసి మరీ ఏడుత్తారు..ఈధిలో వోళ్ళెవరన్నా తెమ్మన్నారా? “
సరోజ్ని ఆలోసన్లు ఎటెటో పోతన్నాయ్ అంతకంతకీని.
ఇంతలో ఛల్ ఛల్ మంటా ఎగురుకుంటా లేడి పిల్లలా గంతులేసుకుంటా వచ్చేత్తా దూరంగా  గిలక. పేనం ఊపిరోసుకున్నంత పనయ్యింది సరోజ్నికి.
దగ్గరకొచ్చే కొద్దీ…   ఎప్పుడూ సూడ్నంత  ఆనందం ఏటో మరి ఆ లేత మొకంలో.   ఊరికే మెరిసిపోతంది..
పిల్లిలా..లోనికొచ్చిందో లేదో..అప్పటిదాకా ఉగ్గబెట్టుకున్న కోపాన్నంతా మజ్జేల్లో కెక్కిచ్చి..మరీ   పుల్లటి రత్తవొచ్చేలాగ ఒక్కటిచ్చింది నెత్తి మీద.. “ఇంతసేపేటే? “ కోపంగా కళ్లెర్రజేసి గిలక్కేసే సూత్తా..
పాపం..తెల్లబోయింది గిలక. సురుక్కు మందేవో  నెత్తి మీద మొట్టినసోట పావుకుంటా తల్లికెసే సూత్తుండిపోయింది కాసేపు తన్జేసిన తప్పేటో తెల్వక గిలక.
అదలా సూత్తండగానే..  పిల్ల సేతిలో పొట్లాలు లాక్కున్నంత పన్జేసి..కుంటా..
“   రెండు పోట్లాలేటే..? ఎవరు  తెమ్మన్నార్నిన్ను..? ఎవరన్నా తెమ్మన్నారా? ” కసిర్నట్టరిసింది సరోజ్ని.
“ మనయ్యే? ఎవరూ తెమ్మల్నేదు…” గెంతుతా అంది గిలక ముడుసు గుత్తొచ్చి ..మామూలుగా అయిపోయి..
“ నేనరకేజీయ్యే కదా తెమ్మన్నాది. మరి రెండు పొట్లాలేటి? ”
“ అబ్బా..! “ అని లేత వేళ్లతో”నీతో వేగలేక సస్తన్నా బాబూ..” అన్నట్టుగా  పెద్ద ఆరిందాలాగా  తల మీద కొట్టుకుని..
“   అదంతా అరకేజియ్యేనే అమ్మా. కానీ   ఇద్దరికని సెప్పి  రెండు పావు కేజీలు కొట్టిచ్చేను..”
అంది  తొక్కుడు బిళ్ళాట ఆడుతున్నట్టు లంగా పైకెత్తి పట్టుకుని ఒక్కాలు పైకెత్తి ఇంకో కాలుతో ముందుకి దుముకుతా ..
“ తెలివి తెల్లార్నట్తే ఉంది. ఎంతుకలాగ? దానొల్ల  కలిసొచ్చేదేటి..? ఇంట్నిండా ఇస్తరాకుల సెత్త తప్ప..” పెఢసరంగా అంటా తీసిపడేసింది సరోజ్ని..కూతుర్ని.
“కాదే అమ్మా..! నువ్వొకద్దానివి. సెప్తే నీక్కాదా? అరకేజీ ఒకేసారి  కొనేత్తే..కొసర్లాగ  ఒక్క ముడుసే ఏసీవోడు గదా..! అదేవో కూరొండాకా సిన్నోడని తమ్ముడికి ఏసేసీదానివి.  మేవిద్దరం ఆ ముడుసుకోసం  కొట్తేసుకునేవోళ్లం గదా..అప్పుడెప్పుడో.  నాకూ ఇట్తవే ముడుసంటే. అంతుకే రెండు  పావు కేజీలు కొంటే రెండు ముడుసులేత్తాడు గదా. అప్పుడు తమ్ముడూ,  నేనూ ఇద్దరం తినొచ్చని..” అని ..అంతలోనే ఏదో అప్పుడే గుత్తొచ్చినట్టు..గెంతేదల్లా ఆగి ఎనక్కి తిరిగి ఆల్లమ్మెనక్కే జాలిగా  సూత్తా..
“మరే ..మరే ..మరేమో!అమ్మా..నీకూ ? నీకూ ఇట్తవే గదా..ముడుసంటే..!ఈసారి మూడు పొట్లాలు కట్టిత్తాన్లే. మూడు ముడుసులొత్తాయ్. అప్పుడు తమ్ముడూ, నువ్వూ,నేనూ ముగ్గురుం తినొచ్చు..’’
అని ..మరో గంతేసి ….అప్పుడే ఏదో గుత్తొచ్చినట్తాగిపోయి..తల్లొంక సూత్తా..
“అయ్యిలాగిచ్చెయ్. మళ్ళొచ్చే ఆదోరం దాకా ఎంతుకు? ఇప్పుడే మల్లీ..ఎల్లి..ఇయ్యిచ్చేసి మూడు పొట్లాలు ఇప్పుడే  కట్టిచ్చుకొత్తాను..” అంది గబుక్కున సరోజ్ని సేతిలోని పొట్లాల్ని లాక్కోబోతూ..
ఇంటానే..
ముంజు మీద గోరు గిచ్చితే ఇంతెంత్తునెగిరిన నీటి సుక్కలల్లే..సరోజ్ని కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరగ్గా..పొట్లాలక్కడడేసి..రెండు సేతుల్తో గిలకని దగ్గరకంటా లాక్కుని పొట్టకేసి అదువుకుంది.