నవరసాలు..నవకథలు.. అద్భుతం 9

రచనః శ్రీమతి నండూరి సుందరీ నాగమణి.

నదీ సుందరి నర్మద

ఆకాశంలో ఇంద్రధనువును చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో నర్మదను చూసినా అంతే నాకు. పూలలోని మకరందాన్ని, ఆకాశంలోని అనంతాన్ని, కడలిలోని గాంభీర్యాన్ని, హిమవన్నగాల ఔన్నత్యాన్ని, సంగీతంలోని మాధుర్యాన్ని, సూరీడి వెచ్చదనాన్ని, జాబిల్లి చల్లదనాన్ని, మల్లెపూవుల సౌరభాన్ని కలిపి రంగరించి నర్మదను తయారుచేసాడేమో ఆ బ్రహ్మ! అదీ నా కోసం. ఆమె ఎప్పుడూ అద్భుతమే మరి నాకు!

***

నేను వేదిక మీద పాడినపుడు పరిచయమైంది నర్మద. స్థానిక సంగీత కళాశాలలో వేణుగాన అధ్యాపకుడిగా పనిచేసే నేను వేణుగానమే కాకుండా, నా గొంతుతో కూడా పాడతాను. ఒక సంగీత కార్యక్రమంలో నేను అన్నమాచార్య కీర్తనలను ఆలపించినపుడు, ఆ కచేరి అయిపోగానే దగ్గరకు వచ్చి ప్రశంసించిన నర్మద నాకు అత్యంత దగ్గరి స్నేహితురాలిలా అనిపించింది. మా పరిచయం కొనసాగి, క్రమేపీ అది స్నేహంగా పరిమళించింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగి ఐన నర్మద, నేను ప్రతీ ఆదివారం ఏదో ఒక సంగీత సభలో కలిసేవాళ్ళము.

ఎక్కువగా మా సంభాషణలు సంగీతం మీదనే సాగేవి. ఆమె పాడకపోయినా, పాటల సాహిత్యం మీద మక్కువ ఎక్కువ అయినది కావటం వలన నేను పాడే కీర్తనల సాహిత్యాన్ని విడమరచి చెప్పేది. ఒక సారి పత్రికా విలేఖరి అయిన తన స్నేహితురాలిని పిలిపించి, నా ఇంటర్వ్యూ వేయించింది ఆ పత్రికలో. దానితో నాకెంతో మంచి పేరు రాసాగింది. నాకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అయ్యాయి.

ఆ దశలోనే ఒక సలహా ఇచ్చింది నర్మద. నన్ను చిత్రగీతాలు ఆలపించమని. సాధారణంగా శాస్త్రీయ సంగీతం పాడే వారికి, బోధించేవారికి, చిత్రగీతాలు రుచించవు. కారణం సంగీత రాగాలను కలిపేసి, అన్య స్వరాలను వేసేసి లేదా వక్రసంచారం చేయించి పాటల్లో వాడేస్తారన్న ఒక భావన.

మా గురువు గారు కూడా సంగీతం నేర్పే ముందావిషయమే చెప్పి, చిత్రగీతాలను పాడితే అసలైన సంగీతం రాదని చెప్పారు. కేవలం నర్మద మాట తీసెయ్యలేక నేను పాత హిందీ, తెలుగు చిత్రగీతాలను వినటం మొదలుపెట్టాను.

***

నాకింతవరకూ తెలియని ఒక గొప్ప ప్రపంచం నాకు పరిచయమైంది. ఆహా ఎన్ని గీతాలని? హిందీ చిత్రగీతాలలోని మాధుర్యాన్ని వర్ణించే మాటలే నాకు దొరకలేదు.

కె యల్ సైగల్, ముఖేష్, మహమ్మద్ రఫీ, మహేందర్ కపూర్, మన్నాడే, కిషోర్ కుమార్ గండుకోయిలలైతే, లతా, ఉషా, ఆషా సోదరీమణులు, అనూరాధా పౌడ్వాల్, సాధనా సర్గం, అల్కా యాగ్నిక్, సురయ్యా వంటి మత్తకోకిలలు…

జేసుదాస్ వంటి కారణజన్ముడు అటు శాస్త్రీయ సంగీతమే కాకుండా ఇటు హిందీ రంగం లోనూ, అటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర సంగీత రంగాల లోనూ సంగీతామృత మథనం సలుపుతున్న గొప్ప గాయకుడు.

ఇక మన మాతృభాష అయిన తెలుగు పాటల తీయదనం తీరేవేరు. చక్కని చిక్కని సాహిత్యానికి అంతకన్నా మక్కువైన బాణీలు కట్టిన స్వరసారధులు ఎంత మందో…

తన గళమంటేనే మాధుర్యానికి మారుపేరని ఘంటసాల వేంకటేశ్వరరావు గారు, మధురిమ, చిలిపిదనం, ప్రణయవల్లరి కలబోతతో తొలినాటి పాటలతో మనసు దోచిన బాలసుబ్రహ్మణ్యం గారు, తీపిరాగాలను పంచిన పీబీ శ్రీనివాస్ గారు, మెత్తని గొంతుతో పాడిన ఎ యం రాజా గారు, మెలొడీతో ప్రాణం తీసేసే జేసుదాస్ గారు, రామకృష్ణ, ఆనంద్ ఎంత మంది గాయకులనీ…

అలాగే వనితామణులలో లీల, సుశీల, యస్ వరలక్ష్మి, రావు బాలసరస్వతి, వసంత, యల్లార్ ఈశ్వరి, యస్ జానకి, వాణీజయరామ్… ఆ తర్వాతి తరం లో చిత్ర, ఉష, గోపికాపూర్ణిమ, సునీత ఇంకా ఎంతమంది గాయనీమణులు?

ఆ పాటలు వింటూ ఉంటే, ఆ వాద్యసహకార సమ్మేళన అందలాలలో ఊరేగే పదాల వధువుల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఇక వేరే ప్రపంచమే వద్దని అనిపిస్తూ ఉండేది.

అలా ఒక మూడు నెలలపాటు నిర్విరామంగా చిత్ర సంగీతం విన్నాను. వింటున్న కొద్దీ కొత్త విషయాలు తెలిసేవి.

నిజానికి శాస్త్రీయ సంగీతాన్ని చిత్రరంగం ఉపయోగించుకున్నట్టు, విశ్వవ్యాప్తం చేసినట్టు మరే మీడియా చేసి ఉండదేమో…

అద్భుతమైన దర్బారీ కానడ రాగాన్ని ‘శివశంకరీ’ పాట ద్వారా అందరికీ తెలిసేట్టు చేసిన పెండ్యాల వారి, ఘంటసాల వారి కృషిని ఎలా విస్మరించగలము?

ఆనందభైరవి, హంసానందిని, వసంత, వలజి, కళ్యాణి, అమృత వర్షిణి, చక్రవాకం, శంకరాభరణం, కానడ, సింధుభైరవి… ఎన్నెన్ని రాగాలని? ఎన్నెన్ని గీతాలని? ఇక హిందోళ, మోహనాలయితే ఎన్ని గీతాలలోనో మోహనాలే… సమ్మోహనాలే…

చిత్రగీతాలను నేర్చుకుని పాడాలన్న అభిలాష కలిగింది నాకు. లిరిక్స్ కావాలంటే ఏ పాట కావాలన్నా క్షణంలో సరఫరా చేసేది నర్మద. కొన్ని మంచి హిందీ, తెలుగు చిత్రగీతాలు నేర్చుకున్నాను.

ప్రతీరోజూ చేసే శాస్త్రీయ సంగీత సాధనతో పాటుగా ఈ గీతాల గాన సాధననూ కొనసాగిస్తూ ఉండేవాడిని. వేణువు మీద ఇళయరాజా గారి చిత్రగీతాల ఇంటర్ ల్యూడ్స్ ని వాయించేవాడిని. ముఖ్యంగా ‘సాగరసంగమం’ చిత్రంలోని ‘మౌనమేలనోయి’ పాటకు ముందు వచ్చే వేణువు బిట్ ని వాయిస్తూ ఉంటే ఆ సమ్మోహన మాధుర్యానికి ప్రాణం పోయినంత పనయ్యేది… రససిద్ధి కలిగి కళ్ళలోంచి కన్నీరు పొంగి వచ్చేది. ఇంత అద్భుతమైన మాధుర్యాన్ని పరిచయించిన నర్మద ఋణాన్ని ఎలా తీర్చుకోగలను?

అప్పుడప్పుడూ వేదికల మీద చిత్రగీతాలను పాడటం లేదా వాటికి ఫ్లూట్ బిట్స్ అందించటంలాంటివి నర్మద స్నేహితుల ద్వారా సాధ్యమైంది. అందరూ అందించే ప్రశంసలు నా బలాన్ని పెంచేవి.

***

అమ్మానాన్నలు నా పెళ్ళికి వత్తిడి చేయసాగారు. కొన్ని కారణాల వలన నేను పెళ్ళి చేసుకోదలచుకోలేదు. నా తమ్ముడికీ, చెల్లెలికీ మంచిచదువులు చదివించి పెళ్ళిళ్ళు చేయాలన్నదే నా సంకల్పం. నా సంగీత విద్యను బోధించటం ద్వారానే దానికి సార్థకత కలిగించాలన్నది నా ధ్యేయమైనది.

ఒక ఆదివారం నర్మద మా యింటికి వచ్చినపుడు ఈ ప్రసక్తి వచ్చింది. నర్మద అప్పటికే మా అమ్మానాన్నలకు ఎంతో దగ్గరైంది. తమ్ముడు మురళీ, చెల్లెలు హరిణీ కూడా ఎంతో చనువుగా ఉండేవారు తన దగ్గర.

అమ్మ నా పెళ్ళి ప్రసక్తి తేగానే నా ముఖంలో చిరాకు ప్రదర్శితమైంది. అసలే నాకిష్టం లేని టాపిక్, పైగా నర్మద ఇంటికి వచ్చినపుడు… కోపంగా అమ్మ వైపు చూసాను.

“అయ్యో, ఎందుకంత కోపం? అమ్మ మాత్రం ఏమడిగారని? ఏ వయసుకా ముచ్చట కదండీ? మీరు ఒకింటి వారైతే చూడాలని పెద్దవారి ఆశ…” అంది నర్మద నచ్చజెబుతున్నట్టుగా.

“చాల్లెండి… ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువ… అవసరం లేదు… నన్నిలా ఉండనీయండి…” అని లేచి వడివడిగా నా గదిలోకి వెళ్ళిపోయాను.

ఎందుకో చాలా నిస్సహాయంగా అనిపించింది. నర్మద నా మనసంతా నిండి ఉంది. అలా అని ఆమెను అడగలేను, నా ప్రేమను వ్యక్తమూ చేయలేను. ఒక వేళ తాను కాదంటే ఈ స్నేహం కూడా మిగలదు మా మధ్య!

ఎప్పటికీ నేనందుకోలేని అందమైన తీరమే నర్మద…

***

మర్నాడు ఉదయం ఐదు గంటలకల్లా లేచి స్నానాదులు పూర్తి చేసుకుని, డాబా మీద కూర్చుని నా సంగీత సాధన మొదలుపెట్టాను. ఎప్పట్లాగానే ఒక ఐదు కీర్తనలు పాడుకున్నాక, వేణువు తీసి వాయించసాగాను.

నాకు తెలియకుండానే నా మురళి నుంచి ‘రా…రా… రాగమై, నా… నా… నాదమై’ అనే పాట వెలువడింది. నర్మదను తలచుకుంటూ నాదాన్ని నాభి నుంచి ఊదుతూ మురళిలో పలికిస్తూ ఉంటే మనోదేహాల అణువణువూ జలదరింపుతో ఒక్కసారిగా వణికింది.

తాదాత్మ్యతను మించినదేదో నన్ను ఆవహించగా పాట వాయించటం పూర్తికాగానే సొమ్మసిల్లిపోయినట్టు అయిపోయాను.

పది నిమిషాల పైగా అలాగే మౌనంగా ధ్యాన ముద్రలో ఉన్నట్టు ఉండిపోయిన నేను నా మొబైల్ రింగ్ అవుతుంటే చేయి చాచి దాన్ని అందుకున్నాను.

“హలో నేను నర్మదను మాట్లాడుతున్నాను…” నాగస్వరం విన్నట్టే అయింది నా మనసు.

అవతలినుంచి ఆమె చెబుతున్నది వింటుంటే నా కళ్ళలోంచి ధారలుగా కన్నీరు కాల్వలు కట్టింది. ఆనందవిషాదాల సమ్మేళనమే నా అశ్రుధార.

***

నా జీవితంలో నాకు అయాచితంగా లభించిన వరాలు రెండు. ఒకటి సంగీతం, మరొకటి నర్మద.

మరి? నర్మద తనంతట తాను నన్ను ప్రేమిస్తున్నాననీ, ఇద్దరం వివాహం చేసుకుందామని ఆ రోజు నాకు ఫోన్ లో చెప్పకుండా ఉండి ఉంటే నా జీవితంలో ఇంత మాధుర్యం నిండేదా?

నా ప్రతీ అడుగునూ నర్మదతో కలిసి నడుస్తూ, జీవితంలో ఎన్నెన్నో వసంతాలను వసంతమయం చేసుకున్నాను. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి, వారిని చక్కని సంగీత రత్నాలుగా తీర్చి దిద్దాము.

నా ప్రతీ అవసరాన్ని ఎంతో ప్రేమగా తీరుస్తూ, అవసరమైన విషయాలలో చక్కని సలహాలను అందిస్తూ, ఆకటివేళల ఆహారాన్ని తినిపించి, పడకగదిలో తనను తాను ప్రేమతో అర్పించుకుని, నా కోపాన్ని, ఉక్రోషాన్ని, తొందరపాటును భరిస్తూ, ఎప్పటికప్పుడు ప్రేమతో క్షమిస్తూ నా జీవితాకాశంలో ఎన్నటికీ అస్తమించని పూర్ణ చంద్రబింబమయింది నా నర్మద.

అసలు స్త్రీ అంటేనే అంతే కదా… మనల్ని ఏ వయసులోనైనా అక్కున చేర్చుకునే అద్భుతమైన అమ్మ ఆమె. అందులోనూ నా నర్మద నాకు మరింత ప్రత్యేకం.

***

ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. మా పెళ్ళి అయి అప్పుడే ముప్పై వసంతాలైపోయాయి.

మా తొలి వివాహ వార్షికోత్సవం హైదరాబాదులో కాకుండా ఎక్కడైనా జరుపుకుందామని నర్మద అన్నప్పుడు, ఎక్కడకు తీసుకువెళ్ళాలో స్థల నిర్ణయాన్ని కూడా ఆమెకే వదిలిపెట్టాను.

అప్పుడే తొలిసారిగా ఇక్కడికి వచ్చాము. టూరిజం ఆట్టే డెవలప్ అవలేదీ ప్రాంతంలో అప్పటికి.

పాపి కొండల మధ్యలోని ఒక రిసార్ట్ ఇది. చుట్టూరా నీలిరంగులో ఉన్న కొండలు. చల్లగా మెల్లగా పారే గోదావరీ నదీమతల్లి. ఒడ్డున ఉన్న కుటీరంలో మేమిద్దరం. పున్నమికి ముందు రోజు వచ్చాము. అక్కడ పూర్తిగా ప్రకృతి, మేము మాత్రమే ఉన్నాము. ఇసుక తిన్నెల మీద కూర్చుని ఆ అందాలను ఆస్వాదిస్తూ, సంగీతాలాపన చేస్తుంటే రోజులు గంటలుగా, గంటలు క్షణాలుగా కరిగిపోతున్నాయి.

చక్కని చల్లని వెన్నెల రాత్రి, ఎదురుగా గోదారి, అందులో మెల్లగా పయనించే రాదారి పడవలు, పైనుంచి తెల్లని మంచు ధారలాగా పరిమళించే వెన్నెల… ఆ వెన్నెల కిరణాల స్పర్శతో మరింతగా మెరిసే గోదావరి… ఎంత సేపు అక్కడ ఉన్నా, ఎంత సేపు ఆ మాధురిని ఆస్వాదించినా తనివి తీరనంత అందం…

నర్మద అభిరుచిని, ఎంపికను అభినందించకుండా ఉండలేకపోయాను. ఆ నది ఒడ్డున ఒకరితో ఒకరుగా ఎన్నెన్నో చెప్పుకుంటూ, పాడుకుంటూ, ఒకరిలో ఒకరుగా ఒదిగిపోయాము.

ఆనాటి మధురస్మృతులను మరల మరల మననం చేసుకోవటానికి పదవ వార్షికోత్సవం, ఇరవయ్యవ వార్షికోత్సవం కూడా ఇక్కడే జరుపుకున్నాము. పున్నమిరోజులలోనే వచ్చేలా ప్లాన్ చేసుకుని…

అయితే రజతోత్సవానికి నర్మద పదవీవిరమణ ఉత్సవం జరగటం వలన రావటానికి వీలు కుదరలేదు. మళ్ళీ అయిదేళ్ళ తరువాత, ఇదిగో… ఇప్పటికి కుదిరింది.

“చూడు నర్మదా… ఎంత చల్లగా ఉందో ఈ రాత్రి… ఆరోజులాగానే ఆకాశంలో మబ్బులు లేవు… చంద్రుడు మాత్రమే… సుధాకరుడు కదా, అమృతాన్ని కడుపునిండా తాగేసాడేమో దాన్ని మెల్లగా మనమీద వర్షిస్తున్నాడు… అదిగో చూడు అప్పటిలాగానే ఆ చిన్ననావలో దీపం చూడు… ఇప్పుడే వండుకుని తిన్నట్టున్నారు ఆ దంపతులు… అరె, ఆ నది మీద చూడు, వెన్నెల అలలు ఎలా కదులుతున్నాయో…” నర్మద చేయి పట్టుకుని మాట్లాడుతూనే ఉన్నాను ఆగకుండా, ఆపకుండా…

***

“పంతులు గోరూ… పంతులు గోరూ…” ఎవరో భుజమ్మీద తట్టినట్టయింది. ఉలిక్కిపడి “ఎవరదీ?” అన్నాను అప్రయత్నంగా…

“నాను అప్పలకొండనండే… కాటేజీ వోచ్ మేన్ని. ఏటిదీ, ఇంత దూరం ఒక్కరూ వొచ్చేసీ, మీలో మీరే ఏటేటో మాటాడేసుకుంతన్నారూ? అసలే మీకు కళ్ళునేవు… సూపు ఆపడదు… మీకు తెలవకుండానే నది దగ్గరసా ఎల్లిపోతన్నారు… రాండి కాటేజీకి ఎలిపోదాం. అర్దరేత్రి అవుతున్నాది. మీ అబ్బాయిగోరు తెల్లారీసరికొచ్చేత్తామని నాకు పోను సేసారు. రండి మరి…” అని లేవదీసి నడిపించసాగాడు.

“చూసావా నర్మదా… వీళ్ళంతా నువ్వు లేవని అంటున్నారు… నిజం చెప్పు నువ్వే కదా నన్నిక్కడికి తీసుకువచ్చింది? లేకపోతే నేను ఒక్కడినీ ఎలా రాగలుగుతాను? ఈ అందాలన్నీ నువ్వు లేకుండా ఎలా చూడగలనూ? ఎప్పుడూ నా పక్కనే ఉంటూ, నన్ను నడిపిస్తూ, నాకు నీ కళ్ళతో చూపించే ప్రపంచాన్ని ఇప్పుడూ చూస్తున్నానంటే నాలో నిండి ఉన్న నువ్వే కదా నన్ను నడిపిస్తున్నావు? ఈ మామూలు మనుషులకు అర్థం కాదు… మన అలౌకిక బంధపు విలువేమిటో ఎంత వివరించినా అవగతం కాదు.

నువ్వు భౌతికంగా నాకు దూరమయ్యావు కానీ నాలోనే లీనమై ఉన్నావని ఈ అమాయకులకు ఎలా చెప్పేది? నా పేరు సాగర్ కదా… నర్మద విలీనమయ్యేది ఈ సాగరుడిలోనే అని ఎప్పటికి తెలుస్తుందో ఈ ప్రపంచానికి!

అన్నట్టు… కొత్తగా నేను కనుక్కున్న రాగానికి నీ పేరు పెట్టాను కదా… ఆ రాగాలాపన సీడీ లాంచింగ్ ఎల్లుండే… అందుకనే నన్ను తీసుకువెళ్ళటానికి నీ కొడుకు తెల్లారకుండానే వచ్చేస్తున్నాడు… మరి వెళ్ళి పడుకుందామే, చాలా రాత్రి అయింది కదా… ఈసారి ఇంకా ఎక్కువ రోజులుందాం లే…”

“అయ్యో అయ్యోరూ మల్లీ మీలో మీరే మాటాడేసుకుంతన్నారూ… రాండి, కాటేజీ వొచ్చేసినాది… ఇదిగో వొరండాలోనే ఉంతాను. మీకేం కావాలన్నా ఒక కేకెయ్యండి. ఇలా పడుకోండే…” అంటూ జాగ్రత్తగా నన్ను పడుకోబెట్టాడు అప్పలకొండ.

“నర్మదా… పడుకుందాంరా… శుభరాత్రి!” అలసటగా కళ్ళు మూసుకున్నాను, నా నర్మదను తలచుకుంటూ…

అవును… నర్మద ఓ అద్భుతం… నా అద్భుత ప్రపంచమే నర్మద…

***

నవరసాలు..నవకథలు.. భీభత్సం 8

రచన: మంథా భానుమతి

చిట్టి చెల్లెలు

ఆదివారం. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు తీరిగ్గా పనులు చేసుకుంటున్నారు. శబ్దాలు బయటికి వినిపించకుండా తయారయి, తమ గది తలుపులు వేసి బైటికొచ్చింది పదమూడేళ్ల వినత. ఇంటి వెనుక ఉన్న తోటలోకి వెళ్లింది.. ఆదివారం మొక్కలకి నీళ్లుపెట్టటం వినత పని.
ఇల్లంతా దులిపి ఒక కొలిక్కి తెచ్చి, పిల్లల గది సర్దుదామని లోపలికెళ్లిన వనజ, కంఠనాళాలు పగిలిపోయేట్లు కెవ్వుమని అరిచింది.
తోటలోంచి వినత, వరండాలో కూర్చుని పేపరు చదువుతున్న వాసు, ఒకేసారి గదిలోకి వెళ్లారు.
అక్కడ పరిస్థితి భీభత్సంగా ఉంది.
వనజ, తలుపు దగ్గరే అడ్డంగా స్పృహ తప్పి పడిపోయుంది. పక్కింటి వైపుకున్న కిటికీ గ్రిల్ లోనుంచి సగం శరీరం బైటికి, సగం లోపలికి వేళ్లాడుతూ కళ్లు రెండూ బైటికి వెళ్లుకొచ్చిన పక్కవాళ్ల నల్ల పిల్లి, నాలుక బైట పెట్టి, వీళ్లకేసే చూస్తున్నట్లుగా ఉంది. కిటికీ అంతా రక్తం.. రోజూ కిటికీ లోనుంచి పిల్లల దగ్గరికి వచ్చి ఆడుకునే పిల్లి.. ఎలాగో గ్రిల్ లో ఇరుక్కుపోయినట్లుంది.
కిటికీ దగ్గర నిలబడి, చేతుల నిండా, మొహం నిండా రక్తంతో, కళ్లు పెద్దవి చేసి చూస్తోంది ఏడేళ్ల సరిత. బుగ్గల నిండా నీళ్లు. ఎప్పటి నుంచీ ఏడుస్తోందో!
అదాటుగా చూస్తే బలహీనులకి గుడె నొప్పి రావటం ఖాయం.
అది పిల్లల గది.. రెండు సింగిల్ మంచాలు చెరో గోడకీ వేసి ఉన్నాయి.
వినత అరుస్తూ చెల్లెలి దగ్గరికి వెళ్లబోగా, తల అడ్డంగా తిప్పి,వెనక్కి వెనక్కి జరుగుతూ కళ్లు ఇంకా పెద్దవి చేసి మొహం వికృతంగా పెట్టింది సరిత. అయినా సరే, వెళ్లి చెల్లెల్ని పట్టుకోబోయింది.
వాసు గట్టిగా నిట్టూర్చాడు, సరిత మొహంలోకి చూసి..
“వినతా! నువ్వు అటెళ్లకు.బకెట్లో నీళ్లు, తువ్వాలు తీసుకురా!” వాసు హెచ్చరించి, భార్యని లేపి, హాల్లోకి నడిపించాడు. వనజ మొహం మీద నీళ్లు కొట్టి, వేడిగా పాలు తాగించి సోఫాలో దిళ్లు సరిచేసి పడుక్కోబట్టాడు.
కళ్ల నీళ్లు కారుస్తూ, వనజ దీనంగా చూసింది.
సరితని బాత్ రూం లోకి తీసుకెళ్లి కడిగి స్నానం చేయించి బట్టలేసి, హాల్లో కూర్చోపెట్టాడు.
పక్కింటావిడని పిలిచి, యాక్సిడెంటని చెప్పి, అప్పుడే వచ్చిన పనమ్మాయి చేత, కిటికీ దగ్గరంతా శుభ్రం చేయించేసరికి తాతలు దిగొచ్చారు. వాసు సరితని తయారు చేస్తున్నప్పుడే, వినత, కిటికీ వెనక్కి వెళ్లి అక్కడున్న ఇనప రాడ్ ని ఎవరికీ కనిపించకుండా విసిరేసింది.
……………
మరునాడు పొద్దున్న.. పనిమనిషి రాలేదు..చీపురు పట్టుకుని హాల్ ఊడుస్తోంది వనజ.
గోడ మూల ఒకచోట.. పాతగుడ్డలో చుట్టి..అటూ ఇటూ కదులుతున్న మూట కనిపించింది..
భయపడుతూనే విప్పింది.
పచ్చడైపోయిన బొద్దెంకలు.. కొన్ని బ్రతికున్నవి బిలబిల్లాడుతూ బైటికొస్తుంటే.. వాంతొచ్చినంత పనైంది. కెవ్వుమని అరిచి, చీపురు కింద పడేసి, లోపలికి పరుగెత్తింది…..
వాసు గట్టిగా పట్టుకుని కుర్చీలో కూర్చోపెట్టి మంచి నీళ్లు తాగించాడు. గట్టిగా హత్తుకుని పోయి, వెక్కుతూ ఉండిపోయింది.
వినత ఆ మూట చెత్తబుట్టలో పడేసి, హాల్ తుడిచి, తను తయారయి స్కూల్ కి వెళ్ళి పోయింది.
…………
“సిరీ అని పిలుచుకుందామని, వినూకి మంచి తోడుంటుందని ఎంతో సంతోషంగా, సరితని కన్నాము వాసూ. అది పుట్టిన పది నెలలు ఏం బాగుందో! అప్పటి నుంచీ మన పాట్లు మొదలయ్యాయి. ఆ ఉయ్యాల్లోంచి ఎలా పడిపోయిందో.. పైకి దెబ్బ కనిపించలేదు. గట్టిగా ఏడవను కూడా లేదు. ఇంక అంతే. మన బతుకే మారి పోయింది. మాటలు రాలేదు. పిచ్చి బలం. మిడిగుడ్లేసుకుని చూట్టం.. ఎలా వస్తాయో ఆ పిచ్చి ఐడియాలు.. పిచ్చి అల్లరి.” పగలంతా నిస్త్రాణగా పడుకుని,సాయంత్రం మొదలు పెట్టింది బొంగురు గొంతుతో వనజ.
స్కూల్నుంచి వచ్చాక తనే పాలు తీసుకుని తాగటం మొదలెట్టింది వినత. అమ్మ, నాన్నా మాట్లాడుకోవటం వినిపిస్తూనే ఉంది. రోజూ అలవాటై పోయింది.
“అవును. సరిత మనింట్లోకి రాకపోతే ఏ గొడవా ఉండేది కాదు..” వినత తనలో తను అనుకుంటూ తమ గదిలోకి వెళ్లింది సరిత ఏంచేస్తోందో చూట్టానికి.
అమ్మానాన్నల ఆక్రోశాలు వినిపిస్తూనే ఉన్నాయి. సరిత, తెల్ల కాగితం మీద ఏవో గీతలు గిలుకుతోంది. ఏంటో.. పిచ్చిగీతలు, చూద్దామని దగ్గరగా వెళ్లిన వినతకి అందకుండా ముక్కలు చేసేసింది. ఆ ముక్కలేరేసి, తను అనుకున్నట్లుగా గదిని తయారు చేసి, ఫ్రెండింటికెళ్లింది, హోం వర్క్ చేసుకోడానికి.
చెవులు వినిపించకపోయినా, మాటలు రాకపోయినా తెలివికేం లోటు లేదు.. సరితకి. ఎంతమంది డాక్టర్లకి చూపించారో! అంతుబట్టని సమస్య. మానసికం అని తేల్చారు.
అక్క చేస్తున్నదంతా చూస్తూనే ఉంది సరిత.. లేచి తనకు చేతనయినంత సర్ది పెడదామని కింద కూచుని సవరించ సాగింది.
అంతలో.. తలుపు తోసుకుని వచ్చిన అమ్మని చూసి, తల అడ్డంగా తిప్పుతూ, గబగబా మంచం ఎక్కేసింది, ఏడుస్తూ.
గదంతా భీభత్సంగా ఉంది. పుస్తకాలన్నీ చిందరవందరగా పడున్నాయి. వినత తెచ్చుకున్న ఎర్రని నైల్ పాలిష్ గది మధ్యలో వంపేసి ఉంది. మడతపెట్టిన బట్టలు చిమ్మేసి ఉన్నాయి. గదంతా పౌడర్ చల్లేసి ఉంది. ఎక్కడ జారి పడతానో నని వెనక్కి వెళ్లి పోయింది వనజ. సరితనేమీ అనలేదు. అనటానికి మాటలే రాలేదు.
…………………
“ఊరుకో వనజా! రేపు హోమ్ కి పంపించేద్దాం. అక్కడేమో బాగానే ఉంటుందిట.
విచిత్రంగా ఉంది మీ అమ్మాయి కేసు అంటారు డాక్టర్లు.”
“ఇక్కడున్నప్పుడు కూడా మొదటి రెండురోజులూ బానే ఉంటుంది. చక్కగా నా వెనుకే తిరుగుతూ, గిన్నెలవీ అందిస్తూ ఉంటుంది. కనిపించకుండా చేసేస్తుంటుంది విధ్వంసం. మొన్నటికి మొన్న.. గోధుమ పిండి కలిపి చపాతీలు చేద్దామని అంతా సర్ది, ఫోన్ వస్తే లోపలికి వెళ్లాను. ఎప్పుడెళ్లిందో.. నూనె సీసా ఆంతా పిండి నిండా వంపేసి, పక్కనే కూరలో వేద్దామని పెట్టిన కారప్పొడి సీసాలో కారం ఇల్లంతా చిందరవందర చేసేసింది. ఒళ్లు మండి నాలుగు తగిలించాను. గుడ్లలోంచి నీళ్లు కారుస్తుంది తప్ప, ఏ స్పందనా లేదు. రాయిలా నిలుచుంటుంది.” వనజ గొంతు కొరబోయింది, ఏడుపుతో.
“అదే ఆశ్చర్యంగా ఉంది.. హోంలో నేమో ఏమీ చెయ్యదుట. చిన్న చితకా పనులన్నీ చక్కగా చేస్తుందిట. కానీ అక్షరాలు నేర్చుకోమంటే మటుకు మొరాయిస్తుందిట. అందుకే మీ అమ్మాయిని తీసుకుపొండి..”షి ఈజ్ నార్మల్” అంటుంటారు. ఇక్కడేమో ఎప్పుడెవరికి మూడుతుందో తెలీట్లేదు. చివరికి తను కూడా రక్తాలొచ్చేట్లు కోసుకోడం..” వాసు విచారంగా అన్నాడు.
“మళ్లీ అక్క జోలికి వెళ్లదు. అదేం పిల్లో.. చుట్టుపక్కల వాళ్ల పిల్లలెవరైనా ఇంటికోస్తే, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, అక్కడే ఉంటాను. ఎవర్నేం చేస్తుందో అని.. ఒక్క సారి వదిలేస్తే, వెనకనుంచి కళ్లు మూసి, ఎదురింటి బుజ్జిగాడి మెడ కొరికిందిట. అప్పుడే.. వినత వెళ్లి విడిపించిందిట.”
అమ్మానాన్నల మాటలు వింటూ వినత నిద్రపోయింది. సరిత అంతకు ముందే పడుకుంది.
“సరే! రేపు హోమ్ కి ఫోన్ చేసి దింపేద్దాం. లేకపోతే, వినూకి పిచ్చెక్కిపోయేలాగుంది. దానికేమో చెల్లెలంటే చచ్చేంత ప్రేమ. ‘హోమ్ కి పంపద్దమ్మా. నేను జాగ్రత్తగా చూసుకుంటా చెల్లిని’ అంటుంది.” వాసు లేచెళ్లి, కూతుళ్లిద్దరి తలలూ నిమిరి, మంచినీళ్లు తాగొచ్చి పడుక్కున్నాడు. సరిత చిన్నగా కదిలింది. ఒంగుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిద్దట్లోనే చిన్నగా నవ్వింది సరిత. కడుపులో పేగులు కదిలినట్లయింది.
“ఏం చేస్తాం.. ఇందాకా పక్కింటావిడని ఊరుకోబెట్టే సరికి తాతలు దిగొచ్చారు. తప్పదు. ఆవిడ ఎంత జుగుప్సాకరంగా చూసిందో!” వాసు ఆలోచన చదివినట్లుగా అంది వనజ.
గట్టిగా నిటూర్చి, కళ్లు మూసుకుని పడుక్కోడానికి ప్రయత్నించాడు వాసు.
…………………..
పేరు పొందిన పిల్లల సైకియాట్రిస్ట్ ఊర్లోకి వచ్చాడని ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు వాసుకి. ఒక్కసారి ఆయనకి చూపించమని బలవంత పెట్టాడు.
“పిల్లలిద్దరినీ తీసుకురండి. మీ పెద్దమ్మాయిని కూడా.. ఇద్దరికీ చెప్పకుండా తీసుకురండి.” ఆ ఆదివారం అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడే వివరాలన్నీ కనుక్కుని ఆ డాక్టర్ చెప్పాడు.
సరితని తయారు చేసి, వినతకి బైటికెళ్తున్నాం, తయారవమని చెప్పి, ఇద్దరూ చెరో బాత్ రూం లోకీ వెళ్లారు వనజ, వాసు.
“అయ్యో.. సబ్బైపోయిందే. పిల్లల గదిలో ఉండాలొకటి.” అనుకుంటూ బాత్రూంలోంచి బైటికొచ్చిన వనజ, పిల్లల గది తలుపు చటుక్కున తీసి.. అలాగే తలుపులు పట్టుకుని నిర్ఘాంతపోయి నిలుచుండి పోయింది.
…………………..
ఉప సంహారంః
సైకియాట్రిస్ట్ ఎదురుగా కూర్చున్నారు, వాసు, వనజ, సరిత.
“సో.. సమస్య పెద్దమ్మాయి. ఇప్పుడు అర్ధమయింది కదా! అందుకే ఇద్దరినీ తీసుకురమ్మన్నా.” డాక్టర్ గారు తన దగ్గరున్న నోట్స్ తిరగేస్తూ అన్నారు.
వనజ ఇంకా షాక్ లోనే ఉండిపోయింది.
“ఐతే ఏంటి? మొదట్నుంచీ నేనే చేశానంటావా? చెల్లిని నేనే కావలసి పడేశానా ఉయ్యాల్లోంచి? చెల్లి ఇంట్లో ఉన్నంతసేపూ అయినవన్నీ నేనే చేశానా? మొన్నా పిల్లిని కూడా నేనే రాడ్ పట్టుకుని కొట్టానంటావా? చెల్లిని భయపెట్టి మాటలు రాకుండా చేశానంటావా? అది నా చిట్టిచెల్లెలమ్మా!” పొద్దున్న తలుపుతీసిన వనజ, గదంతా భీభత్సంగా చిందరవందర చేస్తున్న వినతనీ, నోట్లో వేలేసుకుని, మంచం మీద కూర్చుని చూస్తున్న సరితని చూసి మ్రాన్పడి నిలబడి పోయినప్పుడు, వినత కూడా షాక్ తిని, వెంటనే అరచిన అరుపులు, ఇంకా చెవుల్లో గింగురుమటూనే ఉన్నాయి.
“ఇది రేర్ గా నైనా, అక్కడక్కడ కనిపిస్తూ ఉండే సమస్యే. ఆధునిక జీవనంలో ఒక్కరూ లేక ఇద్దరూ అనే కాంసెప్ట్.. చెల్లో తమ్ముడూ వస్తే, అమ్మానాన్నా సరిగ్గా చూడరేమోననే అభద్రతాభావం.. ఫస్ట్ చైల్డ్ ని సైకో కింద మారుస్తోంది. మీ అమ్మాయి కేసులో.. మొదట్లోనే కనిపెడితే కాస్త సులభమయ్యేది. అటువంటి పిల్లలకి కొంచెం కూడా అనుమానం రాకుండా వ్యవహరించే తెలివి బాగా ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చిన్నమ్మాయికే ప్రాబ్లం లేదు. నార్మల్ చైల్డ్. ఆ భయం పోగొడితే.. మాటలు కూడా వచ్చే అవకాశం ఉంది.” డాక్టర్ గారు అంతా వివరించారు.
“మరి వినత.” గొంతు కొరబోయి.. మాట కంఠంలోనే ఉండిపోయింది వాసుకి.
“ఆ పాపకి కూడా కొంత మందులతో, కొంత కౌన్సిలింగ్ తో నయమైపోతుంది. ముఖ్యంగా మీరిద్దరూ, తనకి ఏమీ జరగదనే ధైర్యం ఇవ్వాలి. వారానికి రెండు సార్లు కౌన్సిలింగ్ కి తీసుకురండి. నేను ఇక్కడ రెండు నెలలుంటాను. ఆ లోగా బాగా గుణం కనిపించవచ్చు. మీ ఇద్దరిలో ఎవరితో క్లోజ్ గా ఉంటుంది తను?”
“వాళ్లమ్మతో.”
“ఐతే.. ఇద్దరూ మీ మీ రూమ్స్ లోకి చెరొక పాపనీ మార్చండి. మీ ప్రేమంతా రంగరించి వాళ్లని నార్మల్ పాపలుగా మార్చచ్చు.. అండర్ మై గైడెన్స్.”
******

నవరసాలు..నవకథలు.. రౌధ్రం 7

రచన: మణికుమారి గోవిందరాజుల

ఆదిశక్తి

“ఆంటీ నేను ఇక్కడ మీతో పాటు కూర్చోనా నేనెక్కిన కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా వుంది. నాకు భయమేస్తున్నది. మీరున్నారని చెప్పి టీసీ నన్నిక్కడికి పంపారు”
ఆడపిల్ల గొంతు విని తలెత్తింది సుకన్య. ఇరవై యేళ్ళుంటాయేమో రిక్వెస్టింగ్ గా అడుగుతున్నది.
“అయ్యో దానికి నన్నడగడమెందుకు? నా బెర్త్ కాదుగా నువ్వడిగేది? ”నవ్వింది.
నిజమే ఈ రోజేంటో అన్ని కంపార్ట్మెంట్సూ ఖాళీగా వున్నాయి. టీసీ అదే చెప్పి తలుపులు తెరవొద్దని చెప్పి యేమన్నా అవసరం వుంటే పిలవమని ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడూ తాము కూర్చున్న చోట కూడా తామిద్దరే. అబ్బ పక్కన యెవరూ లేకపోతే బోర్ గా వుంటుందే అనుకుంటుంటే ఈ అమ్మాయి వచ్చింది. హమ్మయ్య అనుకుంది సుకన్య.
శ్యాం సుందర్ నవ్వాడు భార్యని చూసి నీకో బకరా దొరికింది కదా అన్నట్లుంది ఆ నవ్వు.
అదేమీ పట్టించుకోకుండా ఆ అమ్మాయిని పరీక్షగా చూసింది. కనుముక్కు తీరు చక్కగా వుంది. పొందిగ్గా వున్న శరీరం తీరు చక్కటి అమ్మాయి అనిపించేస్తుంది. కళ్ళెందుకో భయంతో రెప రెప లాడుతున్నాయి. మాటి మాటికీ తానొచ్చిన వేపు చూస్తున్నది.
“అక్కడెవరన్నా వస్తే వెళ్దామనా? పర్లేదులే అన్ని బెర్త్ లూ ఖాళీగానే వున్నాయి. అర్థ రాత్రొచ్చి నిన్నెవ్వరూ లేపరులే” చెప్పింది సుకన్య.
ఆ అమ్మాయి అటు చూడ్డము మానుకుని సర్దుకుని కూర్చుని బ్యాగ్ లో నుండి వాటర్ బాటిల్ తీసి సగం నీళ్ళు గట గటా తాగేసింది.
“నీ పేరేంటమ్మాయ్? ఎక్కడిదాకా”
“ చిద్రూపి అండీ. వరంగల్ వెళ్తున్నాను! ” వినయంగా చెప్పింది.
“అమ్మవారి పేరు. బాగుందమ్మా! ” మెచ్చుకుంది.
చిద్రూపి సుకన్యకి చాలా నచ్చేసింది. అప్పుడే తన కొడుక్కి సూటవుతుందా లెదా అని లెక్కలేయసాగింది.
“సుక్కూ నీ కొడుక్కి ఇంకా పెళ్ళి వయసు రాలేదు” చక్కటి అమ్మాయి కనపడగానే సుకన్య అలానే ఆలోచిస్తుందని తెలిసిన శ్యాం సుందర్ గుర్తు చేసాడు.
“ ఉఊ” మూతి తిప్పింది. భర్త ని పట్టించుకోకుండా చిద్రూపి వేపు తిరిగి ,
“బాగుందమ్మా! చత్రపూర్ మీ సొంతూరా ? నీ వయసెంత? చూస్తుంటే తెలుగమ్మాయి లాగా వున్నావు? ఎంతమంది మీరు? అన్నా తమ్ములు? అక్క చెల్లెళ్ళూ? ”
“సుక్కూ! ఇప్పుడే కదే వచ్చింది మనం ఇంకా చాలా ప్రయాణం చేయాలి. కొద్దిగా వూపిరి తీసుకోనివ్వవే? ” విసుక్కున్నాడు శ్యాం సుందర్. “అమ్మాయ్! అక్కడ కూర్చున్నా బాగుండేది. ఇక్కడి కొచ్చి పడ్డావు ఇక నీకు టార్చరే. తాను నిద్రపోదు. నిన్ను నిద్రపోనివ్వదు. ” వెక్కిరించాడు భార్యని.
“నాకదే కావాలి” అనుకుంది చిద్రూపి.
“బాగుంది. ఎంతో దూరం ప్రయాణం చేయాలి. ఒకళ్ళకొకళ్ళం పరిచయమైతే ఒక ఆత్మీయత వుంటుంది. చెప్పమ్మా”
“మాది వరంగల్ ఆంటీ. చత్రపూర్ లో మా వాళ్ళుంటే సెలవులకి వచ్చి వెళ్తున్నాను. , మా వాళ్ళకి అర్జెంట్ గా కలకత్తా వెళ్ళాల్సిన పని పడింది. అందుకే తప్పని సరై ఒక్కదాన్ని పంపుతున్నారు”
“అదేమన్న మాట ఆడపిల్లలు ఒక్కళ్ళమే అనుకోకూడదు. ధైర్యంగా వుండాలి. మగపిల్లలనుకుంటారా అమ్మో ఒక్కళ్ళమే అని? మనం మటుకు ఎందుకనుకోవాలి. అందులో అమ్మవారి పేరు పెట్టుకున్నావు”
“యేమే! అల్లాంటి పిచ్చి ధైర్యాలు నేర్పకు. రోజులన్నీ ఒక్కలాగా వుండవు. మన జాగ్రత్తలో మనం వుండాలి. ”
“మీరన్నది నిజమే. రోజులన్నీ ఒక్కలాగా వుండవు. అందుకే అవసరం వచ్చినప్పుడు స్త్రీ ఆదిశక్తి అవతారం కావాలి. మొన్నటికి మొన్న చూడండి ఒకడెవడో పెట్రోల్ పోసి అమ్మాయిని తగలబెట్టడమే కాక అంటుకున్నదా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంతసేపు అక్కడే వున్నాట్ట. ఈ లోపు ఆ అమ్మాయి వెళ్ళి వాణ్ణి గట్టిగా పట్టుకున్నట్లయితే వాడు కూడా అంటుకునే వాడు కదా? ” ఆవేశపడింది.
“కరెక్టే కాని అప్పటి పరిస్తితులేంటో మనకు తెలీదు కదా? ”
“అందుకే చెప్తున్నాను ఏ పరిస్తితుల్లోనయినా మనకు చెడు చేసేవాణ్ణి మనం ఎంతవరకు దెబ్బ తీయగలం అని ఆలోచించాలి. శరీరం లోని ప్రతి అవయవం ఒక ఆయుధం కావాలి. శారీరకంగా వున్న ఆడవారి ఒక్క బలహీనతని మగవాళ్ళు వాడుకుంటున్నారు. ఇక ముందు అలా జరగనీయకూడదు. ”
వాళ్ళ మాటలు వింటుంటే ఏదో ధైర్యం ఆవహించసాగింది చిద్రూపిని. “నిజమే ఆంటీ మీరన్నది. ఇక ముందు అలా జరగనీయకూడదు. ” అన్నది. “నిజంగా జరగనీయకూడదు” త నలో తాననుకుంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుంది.
ఏవేవో అడగసాగింది సుకన్య. వినయంగా జవాబులిస్తున్నది చిద్రూపి..
కొద్ది సేపయ్యాక చిన్నగా సైగ చేసాడు శ్యాం సుందర్.
చిద్రూపీ ! కొద్దిగా పక్కకి వెళ్తావామ్మా? బెడ్ ప్యాన్ తీస్తూ అడిగింది.
“అంకుల్ కి యేమయిందాంటీ? ” తిరిగొచ్చాక అడిగింది.
“ఆక్చువల్ గా మేము టూర్ కి వచ్చాము. భువనేశ్వర్ లో మెట్ల మీంచి పడి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి.. వుండమన్నారు కాని అక్కడ వుండలేక. కట్టు కట్టించుకుని వెళ్తున్నాము. అప్పటికీ వారం వున్నాము. ” చెప్పింది సుకన్య “చిన్నగా కర్ర పట్టుకుని నడుస్తా అంటున్నారు కాని నేనే వద్దంటున్నాను, ట్రైన్ కదుల్తూ వుంటుంది కదా పడతారేమో అని దానికి తోడు మా కోసమే అన్నట్లుగా ట్రైన్ ఖాళీగా వుంది.. వద్దన్నా సరే కర్ర మాత్రం పక్కనుంచుకుంటారు. నా మీద కంటే కర్ర మీద నమ్మకమెక్కువ” నవ్వింది పక్క సర్దుతూ. శ్యాం సుందర్ చేతికి కాలికి సిమెంట్ కట్లున్నాయి. నడుముకో పెద్ద బెల్ట్ వుంది.
వాళ్ళను చూస్తే గొప్పగా అనిపించింది చిద్రూపికి..
ఇంతలో రైల్ శ్రీకాకుళం రోడ్ స్టేషన్ లొ ఆగింది. అక్కడ కూడా ఎవరూ ఎక్కలేదు రైల్ కదలగానే డిన్నర్ ప్యాక్ బయటికి తీసింది సుకన్య.
“చిద్రూపీ! రా డిన్నర్ చేద్దాము. ” పిలిచింది.
“నేను కూడా తెచ్చుకున్నానాంటీ” తన బాక్స్ ఓపెన్ చేయబోతూ చెప్పింది.
ఇంతలోచిద్రూపి బాక్స్ ఎగిరి అంత దూరం పడింది. అదిరిపడి తల ఎత్తేసరికి అంతకు ముందునుండీ వేధిస్తున్న కుర్రాళ్ళిద్దరు వికటంగా నవ్వుతూ యెదురుగుండా వున్నారు. చిద్రూపి వాళ్ళనుండి తప్పించుకోవడానికే వీళ్ళ దగ్గరికి వచ్చింది.
“మా దగ్గరనుండి తప్పించుకుని ఈ ముసలాళ్ళ దగ్గరకొచ్చి హాయిగా వున్నాననుకుంటున్నావా? ఎలా తప్పించుకుంటావో మేము చూస్తాము. రావే. ! ” అంటూ చేయి పట్టుకున్నారు.
నిర్ఘాంతపోయారు సుకన్యా శ్యాం సుందర్.
“వదలండ్రా.. ”తన చేతిలో వున్న అన్నాన్ని వాళ్ళమీదికి విసురుతూ అరిచింది సుకన్య.
మీద పడబోతున్న అన్నాన్ని తప్పించుకుంటూ వెకిలిగా నవ్వారు వాళ్ళిద్దరూ.
శ్యాం సుందర్ గబ గబా టీసీ కి ఫోన్ చేద్దామని ఫోన్ తీసాడు.
“ టీసీ ని పిలుద్దామనా? వాడా బాత్ రూం లో కొట్టుకుంటున్నాడు వచ్చేవాళ్ళెవరూ లేరు. కంపార్ట్మెంట్ లో కూడా ఎవరూ లేరు. వీళ్ళిద్దరూ ఏదో పెద్ద హీరోలమనుకుంటున్నారు. కట్టి పడేయరా వాళ్లని” అరుస్తూ చిద్రూపి ని దగ్గరికి దగ్గరికి లాక్కుంటున్నాడు ఒకడు. . జేబులో నుండి సన్నని ప్లాస్టిక్ వైర్ తీసి సుకన్య ను కట్టడానికి ఒకడు వీళ్ళ దగ్గరకొచ్చాడు.
చిద్రూపి మీద జరుగుతున్న అఘాయిత్యాన్ని చూసి ఆపుకోలేని ఆవేశంతో వూగిపోయింది సుకన్య. తన దగ్గరికి రాబోతున్న వాడికి అందకుండా వెనక్కి జరిగి టిఫిన్ బాక్స్ లో వున్న పచ్చడి అన్నాన్ని వాడి మీదికి విసిరేసింది. ముందే గ్రహించినట్లుగా వాడు తప్పుకుని ఈడ్చి సుకన్య చెంప మీదఫెఢీ ఫెఢీ మని కొట్టి తాడుతో కట్టేయసాగాడు. యాభై ఏళ్ళు దాటిన సుకన్య శరీరం ఆ దెబ్బలకి తట్టుకోలేక తాడుకి కట్టుబడ్డా మనసులోని ధైర్యం తగ్గట్లేదు, కోపం ఆగడం లేదు. తన చేతనయినంత వరకు ప్రతిఘటిస్తూనే ఉంది.. పక్కనే కూర్చున్న శ్యాం సుందర్ ఒక చేత్తో వాడిని నెట్టసాగాడు. కట్టు కట్టిన శ్యాం సుందర్ చేతిని కాలిని బలంగా మెలి పెట్టి వెనక్కు నెట్టాడు ఆ రాక్షసుడు.
“అమ్మాఆఆ….. ”ఆర్తనాదం చేస్తూ వెనక్కి పడిపోయాడు శ్యాం సుందర్.
ఈ లోపు మొదటి వాడు చిద్రూపి డ్రెస్ చింపడానికి పయత్నిస్తున్నాడు. అంతకు ముందు తెచ్చుకుందామనుకున్న ధైర్యం ఎటు పోయిందో చిద్రూపి ఏడుస్తూ బతిమాలసాగింది తనని వదిలేయమని. . కాని వాడు వినిపించుకోవట్లేదు. ఇంకా ఇంకా దగ్గరికి లాక్కుని కింద పడేసాడు
“చిద్రూపీ సిగ్గులేదా ఎదిరించు మన ప్రాణం ఉన్నంత వరకు వాడికి అవకాశం ఇవ్వకూడదు. ఇందాకే కదా అనుకున్నాము. నీలోని శక్తిని మేల్కొలుపు లే. వాడికి అవకాశం ఇవ్వకు నీశక్తినంతా కూడగట్టుకో “అరిచింది సుకన్య.
శ్యాం సుందర్ కళ్ళనీళ్ళతో నిస్సహాయంగా చూస్తున్నాడు లేవ లేని తానేమీ చేయలేనని.
తగ్గుతున్న ధైర్యం సుకన్య మాటలతో కొద్ది కొద్దిగా ప్రోది కాసాగింది చిద్రూపికి. తన మీదికి వంగి మొహం లో మొహం పెట్టబోతున్న వాడిని దగ్గరికి రానిచ్చి మోకాళ్ళతో వాడి కాళ్ళ మధ్య బలంగా తన్నింది. అబ్బా అని వాడు లేవబోయాడు.
అంతకు ముందు సుకన్య ఇచ్చిన ధైర్యమే పని చేసిందో. ……..
మగవాళ్ళ అరాచకాలకి మంటల్లో కాలిపోతున్న తన తోటి స్త్రీలే కళ్ళ ముందు మెదిలారో? .. . . . . . . . .
ఎవడో వచ్చి తన మీద చెయ్యేసి తనని ఆక్రమించుకోవాలని చూస్తుంటే అలాంటి వాడిని ఎందుకు వదిలేయాలనే స్పృహే కలిగిందో……
తనని ప్రాణంగా పెంచుకుంటూ తనకేమన్నా అయితే తల్లడిల్లి పోయే తల్లీ తండ్రులే గుర్తొచ్చారో…
ఇప్పుడు వాడు తననేమన్నా చేస్తే పోయే తన శీలం కంటే కుళ్ళబొడిచే సంఘమే గుర్తొచ్చిందో , అంత బలం ఎలావచ్చిందో
లేవబోతున్న వాడు లేచేలోపల మళ్ళీ తన్నింది బలంగా.
“పిశాచీ” కేకలు పెడుతూ లేచాడు మొదటి వాడు. వాడితో పాటే లేచి పక్కనే వున్న శ్యాం సుందర్ చేతికర్ర అందుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది. దెబ్బలు తట్టుకోలేక వాడు భయంకరంగా కేకలు వేయసాగాడు. ఇది చూసి రెండో వాడు దగ్గరికి రాబోయాడు.
“ఖబడ్దార్. దగ్గరికి వచ్చావంటే చచ్చావే. యేమనుకుంటున్నార్రా? ” రౌద్ర రూపిణి అయి ఆవేశంతో వూగిపోతు , చేతిలోని కర్రని తిప్పుతూ వేయి చేతులున్న ఆదిశక్తి అవతారం లా కనపడుతున్న చిద్రూపి దగ్గరికి రావడానికి జంకాడు రెండో వాడు.
లేవలేని వాడు తన్నేమి చేస్తాడులే అనుకుని శ్యాం సుందర్ ని కట్టేయకపోవడంతో. శ్యాం సుందర్ గబ గబా సుకన్య కట్లు విప్పాడు. సుకన్య కూడా ఫ్రీ అయ్యేసరికి రెండో వాడు పారిపోయాడు
మొదటివాడు మాత్రం అరుస్తూ దొర్ల సాగాడు. వాడి అరుపులను పట్టించుకోకుండా, స్త్రీల మీద దౌర్జన్యం చేయాలనే ఆలొచన కూడా మగవాడికి రాకుడదన్నట్లుగా , మళ్ళీ మళ్లీ కొట్టసాగింది చిద్రూపి. .
ఎలాగో తలుపులు తెరుచుకుని వచ్చిన టీసీ కాని, ఫ్రీ అయిన సుకన్య కాని, అశక్తుడుగా వున్న శ్యాం సుందర్ కాని చిద్రూపిని ఆపలేకపోతున్నారు…..

నవరసాలు..నవకథలు.. శాంతం 6

రచన: ఉమాదేవి కల్వకోట

ఇక అబద్ధాలు చెప్పకండి నాన్నా.

సాయంత్రం ఆరుగంటలు దాటింది. పార్కులో చిన్నపిల్లల ఆటలూ, కేరింతలు,పెద్దవాళ్ళ కబుర్లు, ప్రేమికుల ఊసుల బాసల సందడులన్నింటికీ దూరంగా ఒక బెంచిమీద ఒంటరిగా కూర్చొని తన కొడుకు కార్తీక్ రాసిన ఉత్తరం గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారు రామారావుగారు. ఇప్పటికే రెండుసార్లు చదివిన ఆ ఉత్తరాన్ని అప్రయత్నంగానే జేబులో నుండి తీసి మరోసారి చదవసాగారు..

నాన్నా !
ఒకే ఇంట్లో ఉంటూ మీకీ ఉత్తరం రాయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. కానీ ఏంచేయను? కొన్ని విషయాలు మీతో డైరెక్టుగా మాట్లాడలేక ఈ ఉత్తరం రాయాల్సి వచ్చింది.
నాన్నా!సాధారణంగా అందరి తల్లిదండ్రులు మీలాగానే తమ పిల్లలకు అబద్ధాలు చెప్పడం చాలా తప్పని చెప్తుంటారు. మరి మీరెందుకు నాన్నా పదేపదే అబద్ధాలు చెప్తున్నారీమధ్య. కాదని మళ్ళీ అబద్ధం చెప్పకండి. నాకన్నీ తెలుసు. మొన్నటికి మొన్న బామ్మ ఇద్దరు అత్తయ్యలనీ, మామయ్యలనీ సంక్రాంతి పండగకి పిలవమనీ, వాళ్ళకి మంచి బట్టలూ అవీ పెట్టి మర్యాదలు చెయ్యాలని చెప్పింది కదా. మీరూ సరేనన్నారు. కానీ అమ్మ రెండునెలల క్రితమే బామ్మని హాస్ఫిటల్లో చేర్పించినప్పుడు చాలా ఖర్చయింది. మళ్ళీ ఇప్పుడు వీటికి డబ్బులెలాగాని బాధపడుతుంటే మీరేం చెప్పారూ.. మీ ఆఫీసులో ఈసారి ఫెస్టవల్ ఎడ్వాన్సు ఇస్తున్నారని, కంగారుపడొద్దని చెప్పారు. కానీ మీరు మీ ఆఫీసులో పనిచేసే సుబ్బరాజు అంకుల్ దగ్గర అప్పుచేసారని, మొన్న అంకుల్ మనింటికి వచ్చినప్పుడు మీరు వడ్డీ డబ్బులివ్వడం చూసినప్పుడే నాకు తెలిసింది.. ఎందుకు నాన్నా అమ్మకు అబద్ధం చెప్పారు.
మీకున్న నాలుగు జతల డ్రెస్సులు బాగా పాతబడిపోయాయని, కనీసం మీ పుట్టినరోజుకైనా రెండు జతల బట్టలు కుట్టించుకొమ్మని అమ్మ పోరితే, మన చుట్టాలెవరో ఏవో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మీకు పెట్టిన ప్యాంటు షర్టు గుడ్డలేవో తీసుకెళ్ళి మనప్రక్క వీధిలో ఉన్న హరి టేలర్ షాపులో కుట్టడానికి ఇచ్చారు కదా. అవిచూసి ఆయన అవి అంత మంచి గుడ్డలు కావని, కుట్టుకూలీ వేస్టని చెప్పారు. మీ పుట్టినరోజున కొత్తబట్టలు వేసుకోలేదేంటని ఆమ్మ ఆడిగితే, ఆ టేలర్ షాపతను ఏదో అర్జెంట్ పనిమీద షాపు మూసేసి, ఊరెళ్ళాడని చెప్పారు. కానీ ఆ హరి ఆంకుల్ మీ నాన్న వేరే గుడ్డలు తెచ్చిస్తానని తేలేదేంటని నన్ను అడిగితే అసలు విషయం నాకు అర్ధమయింది. చూసారా నాన్నా, మీరు మళ్ళీ అబద్ధం చెప్పారు.
మీరీమధ్య మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు. కుంటుతూ నడుస్తున్నారు కూడా. రాత్రుళ్ళు కూడా చాలా బాధ పడుతున్నారని, సరిగా నిద్రపోవడంలేదని అమ్మ చెప్పింది. అమ్మా, బామ్మ పోరుతూంటే పదిహేనురోజులక్రితం పక్కింటి రామనాథం అంకుల్ తో హాస్ఫిటల్ కి వెళ్ళారు. ఏవో టెస్టులూ, ఎక్స్ రే లు చేసారన్నారు. డాక్టర్ ఏమన్నారని అడిగితే వయస్సుతో వచ్చే చిన్న సమస్యేనని, మందులు రాసిచ్చారని చెప్పారు. మీ కొలీగ్ సుబ్రహ్మణ్యంగారితో మీరు ఫోన్లో చెప్తుంటే నేను విన్నాను. మీ రెండుకాళ్ళకీ ఆపరేషన్ అవసరమన్నారనీ, దానికి నాలుగైదులక్షల రూపాయలు కావాలన్నారని చెప్పారు. ఇటీవల ఉద్యోగులకిచ్ఛే హెల్త్ కార్డు సౌకర్యం కూడా ప్రస్తుతం రిటైరైనవాళ్ళకే ఇస్తున్నారని, అందుకని రిటైరయ్యాకే కుదురుతుందని చెప్పారు. మళ్ళీ మా అందరితో అబద్ధం.. ఇలా ఎన్ని అబద్ధాలు, ఎంతకాలం చెప్తారు నాన్నా.
ఇప్పుడే కాదు ఇదివరకు కూడా మీరు అబద్ధాలు చెప్పారు నాన్నా. నేను టెన్త్ క్లాసు పాసయిన తర్వాత నన్ను మంచి కాలేజీ లో చేర్పించాలని, ఎంసెట్ లో మంచి ర్యాంకు వస్తే, నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి, విదేశాల్లో ఎమ్మెస్ చేయాలని మీరు ఆశపడ్డారు. నన్ను చేర్పించిన కాలేజ్ లో ఫీజులు చాలాఎక్కువ. అవి కట్టడానికి మీరు ఆఫీసు అయిపోయిన తర్వాత కూడా మీరు వేరే చోట పనిచేసేవారు. ఇంటికొచ్చేప్పటికి రాత్రి తొమ్మిది దాటేది. ఆలస్యం ఎందుకవుతుందని ఆమ్మ అడిగితే కొత్త ఆఫీసర్ వచ్చారని, పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేయాల్సినవి చాలా ఉన్నాయని దానికి చాలా రోజులు పడుతుందని చెప్పారు గుర్తుందా.
అది అబద్ధమేకదా. నా చదువుకోసం అంతలా కష్టపడ్డారు మీరు. నాకు మంచి కాలేజ్లో సీటు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ రాంబాబుగారు నన్ను అభినందిస్తూ మీ నాన్న కష్టానికి ఫలితం దక్కిందని ఈ విషయం చెప్పేవరకు మాకెవరికీ అసలు సంగతి తెలీదు.
ఆలాగే అక్క పెళ్ళప్పుడు బావగారి సంబంధం వచ్చినప్పుడు అక్క కట్నం తీసుకునే వాళ్ళని చేసుకోనంది. బావగారు కూడా సరేనన్నారు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం బావగారి అమెరికాలో చదువుకి చాలా ఖర్చయిందని, కనీసం పెళ్ళి ఖర్చులకయినా మూడు లక్షల రూపాయలు కావాలన్నారు. మంచి సంబంధం వదులుకోవద్దని, పల్లెటూళ్ళో మనకున్న ఒకే ఒక్క ఆస్థి తాతగారు కట్టిన పాత ఇంటిని అమ్మేసారు. ఆ ఇల్లు కూలిపోయేలా ఉందని , పక్కవాళ్ళెవరో కొంటా నన్నారని, అబద్ధం చెప్పారు. నిజానికి ఆ ఇల్లు చక్కగా ఉంది. రిజిస్ట్రేషన్ కి మీతో నేను కూడావచ్చాను కదా.అక్కకి, కట్నం విషయం చెప్పకుండా పెళ్ళిచేసారు. తనిప్పుడు అమెరికాలో సంతోషంగా ఉందనుకొండీ. కానీ ఆ ఇల్లు అమ్మినప్పుడు మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు నాన్నా..
ఇలాఎన్నోఅబద్ధాలు చెప్పి, మీరు కష్టపడుతూ మమ్మల్ని సుఖంగా ఉంచారు. ఎప్పటికప్పుడు మీ కష్టాలను మాకు తెలీకుండా దాచిపెట్టారు.
మీరు మాకు చాలా విలువైనవారు నాన్నా. మీకంటే మాకేదీ ఎక్కువ కాదు. మీరు బాగుంటేనే మేము బాగుంటాము. ఇన్నాళ్ళు మీరు ప్రతిక్షణం మా అందరి గురించే ఆలోచించారు. ఇకనుండైనా మీ గురించి ఆలోచించుకోండి నాన్నా. మాకు అవసరమైనవన్నీ సమకూరుస్తూ, మీ అవసరాలూ, కోరికలు అన్నీ త్యాగం చేస్తూనే ఉన్నారు. మా అందర్నీ మభ్య పెట్టడానికి అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానెయ్యండి నాన్నా.
నాన్నా! నేను ఉద్యోగంలో చేరి ఆరునెలలయింది. ప్రొబెషనరీ పీరియడ్ ఈ నెలతో అయిపోతుంది. ఇక నాకు మా కంపెనీలో మెడికల్ లోను, హౌసింగ్ లోనులాంటివి ఇస్తారట. నేను లోన్ తీసుకొని మీ ఆపరేషన్ కి ఏర్పాటు చేస్తాను. నాకు కష్టమవుతుందని మళ్ళీ ఏదో అబద్ధం చెప్పి ఆపరేషన్ వద్దనకండి ప్లీజ్. నాకు మంచి సాలరీ వస్తుంది. నా జీతంలో సగం లోన్ కట్టినా ఏడాదిన్నరలో అప్పు తీరిపోతుంది. నేను మీ కొడుకుని. మీకున్న ఓర్పు, సహనం, శాంతం నాకూ ఉన్నాయి. ఇకపై మీ బాధ్యతలు నన్నూ పంచుకోనివ్వండి. ఇక అబద్ధాలు చెప్పే అవసరం మీకుండకూడదు. నన్ను ఓ కొడుకులానే కాకుండా, ఓ మంచి స్నేహితునిలా కూడా భావించండి నాన్నా. ప్లీజ్.

మీ కార్తీక్

మూడోసారి ఆ ఉత్తరం చదివినప్పటికీ, మళ్ళీ మొదటిసారిలాగానే ప్రతీ పదం, ప్రతీ లైన్ పట్టి పట్టి చదువుతూ రామారావుగారు చెమర్చిన తన కళ్ళని జేబురుమాలుతో తుడుచుకున్నారు.

నవరసాలు..నవకథలు.. హాస్యం 5

రచన: కలవల గిరిజారాణి.

జలజాపతి బదీలీ బాధలు..

ప్రతీ మూడేళ్ళకయినట్లే జలజాపతికి మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయింది. నిజామాబాద్ నుంచి విజయనగరానికి. ఇదోమూల అదోమూల.. తప్పదుగా.. తిట్టుకుంటూ.. విసుక్కుంటూ సామాను సర్దడం మొదలెట్టింది జలజం.
పైన అటకల మీద సామాను దించలేకపోతోంది.. పనిమనిషి రెండు రోజుల నుంచీ రావడం లేదు.. ప్రయాణం వారంలో పడింది.. ఎవరైనా మనిషినైనా పంపడు ఈ అయోమయం మొగుడు. చెపితే కోపం.. మొడితే ఏడుస్తాడు అన్నట్టుంటాడు.. అని తిట్టుకుంటూ జలజాపతి కి ఫోన్ చేసింది.. ” ఇదిగో.. మీ ట్రాన్స్ ఫర్ కాదు కానీ.. నేను ఛస్తున్నాను.. అస్తమానం ఈ సామాన్లు సర్దలేక.. మీరేమో ఇటుపుల్ల అటుకూడా పెట్టరు.. నేనొక్కదాన్నే చెయ్యలేకపోతున్నా.. మీరేనా తొందరగా కొంపకి రండి.. లేకపోతే కూలి మనిషినైనా మాట్లాడండి.. ఏదీ కాదంటే.. నేను మా పుట్టింటికి పోతాను.. మీరే ఇక్కడ పేకింగ్ లు చేసుకుని అక్కడ సర్దేసేక పిలవండి.. అప్పుడు వస్తాను.. ” అంటూ గయ్యిన లేచింది.
” అంత విసుగెందుకు జలజం.. సాయంత్రం మా ఆఫీసు ప్యూన్.. సల్మాన్ ఖాన్ ని తీసుకుని వస్తాను.. మేమిద్దరం కలిసి సర్దేస్తాము.. ” అన్నాడు జలజాపతి.
” సల్మాన్ ఖాన్ నే తెస్తారో.. షారూఖ్ ఖాన్ నే తెస్తారో.. నాకనవసరం.. నేను మాత్రం ఇప్పుడు ఏ సామానూ ముట్టుకోనుగాక ముట్టుకోను. అటక మీద నుంచి గంగాళం దించేసరికి నా నడుం పడిపోయింది.. లేవలేకపోతున్నాను.. వచ్చేటపుడు హొటల్ నుంచి భోజనం కూడా తీసుకురండి” అని ఆర్డరేసింది జలజం.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. ప్రతీసారీ.. పాపం.. జలజమే ఓపిగ్గా సామాన్లు అన్నీ అట్టపెట్టెలకి సర్దడం.. ఏదో పెద్ద సామాన్లు అయితే మాత్రం జలజాపతి ఓ చెయ్యి వెయ్యడం అంతవరకే. లారీకి ఎక్కించేటపుడు కూడా జలజమే.. వాళ్ళకి జాగ్రత్తగా అందించేది. కొత్త ఊళ్లో కూడా.. అన్నీ తానే సర్దుకునేది..
” ఏంటి సార్.. సల్మాన్ ఖాన్ అంటున్నారూ.. ఏదైన పనుందా ?” అంటూ.. తన సిక్స్ పేక్ లనీ లెక్కపెట్టుకుంటూ వచ్చాడు ప్యూన్ సత్తయ్య.
” ఔను, కండల వీరా.. ఇంటి దగ్గర పనుంది.. సాయంత్రం నాతో పాటు రా.. సామాన్లు పేకింగ్ చెయ్యాలి..” అన్నాడు జలజాపతి.
” మనమెందుకు సార్.. కష్టపడడం.. ఆ పేకింగులోళ్ళుంటారు కదా.. వాళ్ళే అట్టపెట్టెలు తెచ్చుకుంటారూ.. వాళ్ళే సద్దుతారూ.. వాళ్ళే ప్లాస్టిక్ కవర్లు చుడతారూ.. వాళ్ళే లారీ ఎక్కిస్తారూ.. వాళ్ళే అక్కడ దించుతారూ.. వాళ్ళే అక్కడ సద్దేస్తారూ.. మనకేం పనుండదు సారూ..” అంటూ దండకం చదివాడు.. సల్మాన్ ఖాన్.
” ఏమోనోయ్.. నేనెప్పుడూ వాళ్ళతో సర్దించలేదు. .. ఎలా చేస్తారో.. ఏంటో.. నువ్వు రావోయ్ కొంచెం.. ” అన్నాడు జలజాపతి.
” ఏం కాదు సార్.. వాళ్ళు బానే సద్దుతారు.. ఇంతకు ముందు ఆఫీసర్ గారు కూడా అలాగే చేసారు. ఆ పేకింగ్ వాళ్ళ నెంబరు నా దగ్గరుంది.. చేసి ఓ సారి మాట్లాడండి.. మీకే తెలుస్తుంది ” అన్నాడు సల్మాన్ ఖాన్.
వీడి దుంపతెగ… పెంచిన కండలు చూసుకుంటూ.. తాను సల్మాన్ ఖాన్ అనుకుని ఫోజులు కొడతాడు వీడు… తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు వీడు.. పని చెపితే పారిపోయేరకం… వీడితో లాభం లేదనుకుని..
చేసేదేంలేక..
” సరే.. అదేదో.. నువ్వే మాట్లాడు వాళ్ళతో.. .” అన్నాడు జలజాపతి.
” అలో.. అలో.. .. పేకర్సూ.. మూవర్సూ.. వాళ్ళేనా.. మాకు విజీనగరానికి ట్రాన్స్ ఫర్ అయిందీ.. మీరొచ్చి సామాన్లు సద్దిపెట్టాలి.. ఎంతవుతుందీ? ట్రాన్సు పోర్టు కూడా మీదేగా.. దానికెంతవుతుందీ? అక్కడ కూడా సామాను దించేసి సర్దుతారటగా.. దానికెంతవుతుందీ? మొత్తం కలిపి చెపుతారా? విడివిడిగా చెపుతారా? .. ఏంటీ.. ముందొచ్చి సామాన్లు చూసి చెపుతారా? అయితే సాయంత్రం ఫలానా అడ్రస్ కి వచ్చేయండి.. ” అని సల్మాన్ ఖానే.. జలజాపతి తరపున వకాల్తా తీసుకుని మాట్లాడేసాడు.
” సారూ… సాయంత్రం ఇంటికొస్తారట.. మేడమ్ గారికి చెప్పండి. ”
అలాగే.. అన్నాడు కానీ.. పని హడావుడి లో పడి జలజానికి ఈ విషయం చెప్పడం మర్చిపోయాడు జలజాపతి.
ఆ తర్వాత ఆఫీస్ లో రిలీవర్ రావడం.. ఫేర్ వెల్ పార్టీ.. ఈ హడావుడి ముగిసి ఇంటికి చేరాడు.
ఎదురుగా జలజాక్షి.. టీ. వీ లో..” దెబ్బకి ఠా.. దొంగల ముఠా ” సినిమా దీక్ష గా చూస్తోంది. భర్త ని చూసిన జలజం..
” హమ్మయ్య.. వచ్చారా? ఇందాకటి నుండి మీ గురించే ఎదురు చూస్తున్నాను..” అంది జలజాక్షి.
” ఏమిటోయ్.. హడావుడి.. ఏంటి సంగతి?” అన్నాడు జలజాపతి.
” అదో పెద్ద కధ.. వుండండి చెపుతాను..” అంటూ.. భర్త కళ్ళ ముందు వేలితో రింగులు రింగులు తిప్పింది.
” ఏంటే.. ఇది ? ఈ తిప్పుళ్ళేంటీ? ” అన్నాడు జలజాపతి.
” జరిగిన సంగతి చెప్పాలంటే… సినిమాల్లో అలాగే రింగులు తిరుగుతాయిగా ” అంది.
” నా ఖర్మ.. ఏంటో చెప్పు ముందు .. ” అన్నాడు జలజాపతి.
చెప్పడం మొదలెట్టింది..
ఇందాకా కాలింగ్ బెల్లు కొడితే … మీరే అనుకుని తలుపు తీసాను..
జెమా జెట్టీల్లా వున్న ఇద్దరు.. . నన్ను తోసుకుంటూ లోపలకి వచ్చేసారు.
బిత్తరపోయాను. ” ఎవరు మీరు? ఏంటలా లోపలకి వచ్చేస్తున్నారు? ఆగండక్కడ..” అంటూ అరుస్తూనేవున్నాను… వాళ్ళు వినిపించుకోకుండా హడావుడిగా ఇల్లంతా కలియ తిరిగేస్తున్నారు.
అలమార్లు, బీరువాలు తలుపులు తీసి చూసేస్తున్నారు. ఒకడైతే ఎవరికో ఫోన్ చేసి..” డబల్ డోర్ ఫ్రిజ్ వుంది.. పెద్ద బాక్స్ తీసుకురండి.. రెండు బీరువాలు.. అటక మీద స్టీలు సామాన్లు బాగానే వున్నాయి.. టి. వీ సైజు కూడా పెద్దదే.. మంచాలు అయితే కంప్లసరీ విప్పేస్తేనే కుదురుతుంది… సోఫాసెట్ కూడా వుంది.. పెద్ద వెహికలే తేవాలి..” అని చెప్పడం విని.. నాకు అనుమానం రూఢీ అయిపోయింది. వీళ్ళెవరో ఇల్లు దోచేయడానికి వచ్చిన గజదొంగలే అనుకున్నాను.
” మేడమ్.. కిచెన్ ఎక్కడుందీ? గ్రైండరూ.. ఓవెనూ వున్నాయా? ” అంటూ ఇద్దరూ వంటింటిలోకి వెళ్ళారు.
ఇక లాభం లేదు… పక్కవాళ్ళనెవరినైనా పిలుద్దామన్నా… ఆ పక్కవాళ్ళు, ఈ పక్కవాళ్ళు కలిసి టూర్ కి వెళ్ళారు.. వీళ్ళిద్దరూ కూడబలుక్కుని ఇల్లు దోచేసాలా వున్నారు.. నేనిక వీరఝాన్సీరాణి అవతారం ఎత్తాల్సిందే అనుకున్నాను.
వాళ్ళ వెనకాలే వంటింటిలోకి నెమ్మదిగా నేనూ వెళ్ళాను. వరస పెట్టి చూసిన టి. వి సీరియల్స్ అన్నిటినీ గుర్తు చేసుకున్నాను. “గుడ్డి మందారం” సీరియల్ లో.. విలన్ భూపతి నుండి.. తనని తాను కాపాడుకునేందుకు గుడ్డి హీరోయిన్ చేసిన పని ఠకీమని గుర్తు వచ్చి.. కారం డబ్బా మూత తీసాను.రెండు గుప్పిళ్ళు.. నిండా కారం తీసుకుని.. ఇద్దరి కళ్ళలోకి ఒకేసారి కొట్టాను .. అనుకోని ఈ సంఘటనతో.. కళ్ళలో కొట్టిన కారం భగ్గుమనేసరికి గావుకేకలు పెట్టారిద్దరూ.. కళ్లు తెరవలేక ఇద్దరూ మంటా.. మంటా అని అరవడం మొదలెట్టారు.
అంతటితో ఆగలేదు నేను. మరో సీరియల్.
.” పట్టుకో.. పట్టుకో.” . లో అత్తగారు..
ఆదివరాహలక్ష్మి పెట్టే బాధలు పడలేక కోడలు ..
కూర్మ మహాలక్ష్మి.. పరిగెడుతూంటే.. తన భారీ శరీరంతో.. కోడలిని పట్టుకోలేక.. నూనె సీసా కింద వంపేసి.. జారి పడిన కోడలిని పట్టుకోవడం గుర్తు వచ్చి.. రెండులీటర్ల నూనెని.. నేల మీద ధారగా వాళ్ళిద్దరి చుట్టూ వంపేసాను. ఇహ.. చూస్కోండి.. అసలే కళ్ళు మంట.. ఆపై.. నేలమీద నూనె జారుడు.. లేవడం.. జర్రుమనడం.. లేవడం.. జర్రుమనడం.
ఇదే అదునుగ తీసుకుని.. పచ్చడి బండ తీసుకుని.. బడబడా పచ్చడి దంచినట్లే.. ఇద్దరినీ ఎక్కడపడితే అక్కడ ఇద్దరినీ.. పచ్చడి చేసి పారేసి.. బయటకి వచ్చి.. వంటింటికి గొళ్లెం పెట్టేసి.. హాల్లోకి వచ్చి కూర్చుని.. ఇదిగో.. . ” దెబ్బకు ఠా.. దొంగలముఠా” సినిమా చూస్తూ కూర్చున్నా..
లేకపోతే.. నా ఇల్లే దోచుకుందామని వస్తారా.. వెధవలు.. తగిన శాస్తి చేసాను.. మీరు పోలీసులకు కబురు చేయండి.. మిగిలింది వాళ్ళే చూసుకుంటారు.. ” అంది జలజం..
అప్పుడు జలజాపతి బుర్ర కి ఏదో సిక్త్ సెన్స్ కొట్టింది.. గబగబా వెళ్లి వంటింటి తలుపు గొళ్లెం తీసి లోపలకి వెళ్ళాడు. నూనెలో తడిసి నిగనిగా మెరుస్తూ.. ఇద్దరు దొర్లుతూ కనపడ్డారు.
” ఇదిగో.. కొంపతీసి.. మీరిద్దరూ పేకర్సూ. మూవర్సూ కాదు కదా! ” అన్నాడు.. కంగారుగా..
” కొంపతీసి కాదు కానీ.. మీ కొంపలో సామాను చూసుకుని వస్తామని మీకు చెప్పాం కదా! మీరు మేడమ్ గారికి ఆ విషయం చెప్పలేదా? మా ఇద్దరికీ కూసాలు కదిలిపోయాయి.. ఏ పార్టు ఎక్కడ ఎలా వుందో కూడా తెలీని స్టేజీ లా వుంది మాకు. అయ్యా! మీకో దండం.. మీ సామాను సర్దడానికో దండం.. మీ ఆవిడ గారికి శత సహస్ర దండాలు.. ఏదైనా ఆటో పిలిపించి… మమ్మల్ని హాస్పిటల్ కి పేకింగ్ చేసి.. మూవింగ్ చేయించండి.. ” అన్నాడొకడు..
” అయ్యే.. పొరపాటయిపోయింది.. క్షమించండి… మరి మా సామాన్లు సర్దడం ఎలా? ఎప్పుడు వస్తారు? ” అని అడిగాడు.
” ముందు మా శరీరంలోని పార్టులు సర్దుకోనివ్వండి.. తర్వాత మీ ఇల్లు సర్దడం సంగతి ఆలోచిస్తాము.. ” అన్నారు వాళ్ళిద్దరూ..
” జలజం.. సామాన్లు సర్దలేకపోతున్నానూ.. నడుం పట్టేసిందీ.. అన్నావని.. వీళ్ళ ని మాట్లాడాను.. వాళ్ళ నడుంలు చితక్కొట్టేసావు కదే… ఇప్పుడిక నాకు తప్పేట్టులేదు.. ఈ పేకింగూ.. మూవింగూ.. అన్నాడు జలజాపతి.
” నీ చావు నువ్వు చావు” సీరియల్ లో మునిగిపోయిన జలజానికి.. జలజాపతి మాటలు చెవికెక్కలేదు..

__________________________________________

నవరసాలు..నవకథలు.. వీర 4

రచన: జ్యోతి వలబోజు

ధైర్యం.

రాత్రి తొమ్మిదిన్నర అవుతోంది. భాస్కర్ తన దుకాణం మూసేసి ఇంటికి వచ్చాడు.
ఇంట్లోకి రాగానే కూతుళ్లిద్దరూ మొహాలు మాడ్చుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటూ కనపడ్డారు.
అమ్మానాన్నలు అప్పుటికే నిద్రపోయినట్టున్నారు. వాళ్ల రూమ్ తలుపు దగ్గరగా వేసుంది.
చెప్పులు విప్పి తన రూమ్ లోకి వెళ్తున్న భాస్కర్ ని చూసి “నాన్నా!” అరిచినట్టుగా పిలిచారు పిల్లలిద్దరూ.
“ఏంట్రా బంగారం? తినండి. నేను స్నానం చేసి వస్తాను.” అన్నాడు ప్రేమగా.
“అదంతా మాకు తెలీదు. ముందిలా రండి.” అని గట్టిగా అరిచారు.
ఇదేదో చాలా సీరియస్ వ్యవహారంగా ఉందని వెళ్లి వాళ్లకెదురు కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్.
“నాన్నా!.. అమ్మ చూసావా.. నాలుగు రోజులనుండి అమ్మ టమాట తప్ప వేరే వండడం లేదు. టమాటా పప్పు, టమాటా చారు, టమాటా చట్నీ.. వేరే కూరగాయలు చేయమంటే లేవంటుంది. ఆమ్లెట్ వేయమంటే ఎగ్స్ లేవంటోంది. నాన్నగారు తెచ్చాక అన్నీ వండిపెడతా అంటోంది” అని కోపంగా , ఉక్రోషంతో చెప్పారు.
“అవునా అమ్మలూ.. శ్యామలా ఇలా రా. ఏం జరిగింది? పిల్లలు అడిగినవి ఎందుకు చేయడం లేదు. కూరగాయలు తెచ్చిపెట్టా కదా!” కాస్త గట్టిగానే అడిగాడు వంటింట్లోనుండి వచ్చిన భార్యని.
“చాలా ఖరీదున్నాయని మీరే కదా రెండు రకాల కూరగాయలు, చవగ్గా ఉన్నాయని రెండు కిలోల టమాటాలు తెచ్చారు. గుడ్లు కూడా అయిపోయాయి. రెండు రోజులనుండి మీతో చెప్తూనే ఉన్నాను. మీరేమో లేటుగా వస్తున్నారు. ఎవరు తెస్తారు మరి. నేనేం చేయను?”
“ఏం చేయను అంటే అన్నీ నేనే తేవాలా? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు. బయటకు వెళ్లి కావలసినవి తెచ్చుకోవచ్చుగా. ఆమాత్రం తెలివితేటలు లేవా? ఎప్పుడు చూసినా ఇంట్లోనే పడుంటావు. అన్నీ తెచ్చి పెడితే వంట చేస్తానంటావు. ఒక్కటీ సొంతంగా చేయలేవు. తెలీదు. భయం అంటావు. ఎలా చచ్చేది నీతో? తల పట్టుకున్నాడు భాస్కర్.
శ్యామలకి ఏం చెప్పాలో తెలీక భయంగా, మౌనంగా నిలబడింది.
ఇందులో తన తప్పేమీ లేదు. ఒక్కతే కూతురని, ఆడపిల్ల అని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలు బయటకు వెళ్లరాదు. సేఫ్ కాదు అని అడగకుండానే అన్నీ అమర్చేవాడు తండ్రి. బయట పని ఏదున్నా కొడుకులను పంపించేవాడు. అలా ఇంటిని దాటి బయటకు వెళ్లడం అలవాటు లేదు. ఏదైనా కావాలంటే తల్లిని వెంట తీసుకుని వెళ్లడమే.
పెళ్లయ్యాక కూడా తను మారలేదు. భర్త కూడా ఆమెని అలాగే వుండనిచ్చాడు. ఇంట్లోకి కావలసిన సామాన్లు, బట్టలు కూడా తనే తీసుకొచ్చేవాడు. లేదా అందరూ కలిసి వెళ్లి షాపింగ్ చేసేవాళ్లు. ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్లలేదు. అలా వెళ్లాలంటే కూడా భయం ఆమెకు.
ఆడపిల్లలు కాస్త పెద్దయ్యారు కాబట్టి తమకు కావలసినవి తెచ్చుకునేవారు కాని ఇంటికి సంబంధించిన పనులు మాత్రం భాస్కరే చేయాల్సి వచ్చేది. తండ్రి కూడా పెద్దవాడయ్యాడు కాబట్టి ఆయనను బయటకు పంపలేడు.
అప్పుడప్పుడు ఇలా అవస్ధలు పడ్డా కూడా శ్యామల తన భయాన్ని పిరికితనాన్ని వీడలేదు. తనకు ఇంటిపని, వంటపని , పిల్లలు, భర్త , అత్తమామలకు కావలసినవి చేసిపెట్టడం మాత్రం వస్తే చాలనుకునేది. ఇంటర్ వరకు చదివినా కూడా వంటరిగా ఇంటిగడప దాటలేదు. ఇంటి పనయ్యాక ఇంట్లోవాళ్లు తినడానికి ఏదైనా చేసిపెట్టడం, ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం మొదలైన పనులతో ఎప్పుడూ ఖాళీగా ఉండేది కాదు.

******

ఆ రోజు ఆదివారం. సాయంత్రం ఏడు గంటలైంది.
భాస్కర్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ టీవీ చూస్తున్నాడు.
పిల్లలు తమ గదిలో చదువుకుంటున్నారు. వాళ్లకు పరీక్షలు జరుగుతున్నాయి.
తల్లిదండ్రులిద్దరూ తమ గదిలోనే ఉన్నారు.
శ్యామల రాత్రి భోజనాలకోసం వంటింట్లో బిజీగా ఉంది. అరగంటలో వంట పూర్తవుతుంది.
డోర్ బెల్ వినపడింది. భాస్కర్ వెళ్లి తలుపు తీసాడు.
వంటపనిలో నిమగ్నమై ఉన్న శ్యామల ఏదో గొడవలా వినిపించి హాల్లోకి తొంగి చూసింది.
హల్లో టీవీ నడుస్తోంది. భర్త కనపడలేదు. మరి ఈ గొడవ, ఈ శబ్దం ఎక్కడినుండి వచ్చిందని వంటింటి తలుపు దాటి వచ్చింది.
అక్కడినుండి హాలు ముందుగదిలోకి చూడగానే శ్యామల గుండె ఝల్లుమంది.
ముందుగదిలో ఇధ్దరు దొంగలు భర్తను బెదిరిస్తున్నారు. ఒకడు చేతిలో కత్తి చూపిస్తూ ఏధో అంటున్నాడు. టీవీలో వస్తోన్న సినిమా శబ్దంలో సరిగ్గా వినపడలేదు.
శ్యామల వెంటనే తేరుకుంది. మెల్లిగా శబ్దం రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ అత్తామామల రూమ్, పిల్లల రూమ్ లకు బయటనుండి గొళ్లెం పెట్టింది.
తర్వాత వంటింట్లోకి వెళ్లి అటు ఇటూ చూసింది. ఏం చేయాలో ఆలోచించసాగింది.
తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అన్న ఆలోచన తప్ప ఆ సమయంలో ఆమెలో భయం తాలూకు ఛాయలు అస్సలు కనపడలేదు.
ముందుగా గాస్ ఆఫ్ చేసింది. చీర చెంగును నడుముకు దోపింది. పక్కనే ఉన్న కారం పొడి డబ్బా నుండి రెండు పిడికిళ్లలో కారం పొడి తీసుకుని వెనకాల పెట్టుకుని “ఏవండి! ఏం చేస్తున్నారు. వంట పూర్తయింది. భోజనానికి రండి”అంటూ హాల్లోనుండి ముందు రూమ్ లోకి రాబోయింది.
అప్పుడే ఆ దొంగలిద్దరు భాస్కర్ ను తోసేసి హాల్లోకి వచ్చారు. ఇద్దరి చేతుల్లోనూ కత్తులున్నాయి. నల్ల తుమ్మ మొద్దుల్లా చూస్తేనే భయపడేలా ఉన్నారు.
భాస్కర్ భయపడ్డాడు, ఏం చేయాలో కూడా ఆలోచించే పరిస్థితిలో లేడు. కాని శ్యామల తన భయాన్ని మొహంలో కనపడనీయలేదు.
ఆ దొంగలిద్దరూ హాల్లోకి రాగానే కారంపొడి వాళ్ల కళ్లల్లో పడేలా చల్లింది. భాస్కర్ ముందుగదిలోనే పడిపోయాడు కాబట్టి అతనికి ఏం కాలేదు.
ఆ వెంటనే శ్యామల హాల్లో సోఫా పక్కన ఉన్న మామగారి చేతికర్ర తీసుకుని వాళ్లను చంపేయాలన్నంత కోపంగా, గట్టిగా అరుస్తూ చాలా ఆవేశంగా బాదసాగింది.
ఒకవైపు కళ్లల్లో మంటలు. ఒకవైపు దెబ్బలతో దొంగల ఒళ్లు హూనమవ్వసాగింది.
ఇంట్లోకి కావలసిన వస్తువులకోసం ఎంత అవసరమైనా కూడా బయటకు వెళ్లని పిరికిదైన భార్య ఇంత వీరావేశంతో ఆ దొంగలను అరుస్తూ, కొడుతూ ఉంటే కొద్దిసేపు బిత్తరపోయి చూసాడు భాస్కర్.
వెంటనే తేరుకుని కింద పడిపోయిన దొంగల కత్తులను తీసి పక్కన పెట్టి తాడు తెచ్చి శ్యామల గట్టిగా కొట్టిన దెబ్బలకు తల్లడిల్లిపోతున్న దొంగలను కట్టేసాడు.
ఇంకా ఆవేశంగా కొడుతున్న భార్యని “ఇక చాలు. శాంతించు శ్యామల” అంటూ ఒడిసి పట్టుకున్నాడు.
శ్యామల అరుపులు, దొంగల కేకలు విన్న భాస్కర్ తల్లిదండ్రులు, పిల్లలు కంగారుగా తలుపులు బాదసాగారు. కాని అవి బయటనుండి గొళ్లెం పెట్టి ఉన్నాయి.
అది విన్న భాస్కర్ వెళ్లి తలుపు తెరిచాడు.
చూస్తుండమని చెప్పి బయటకు వెళ్లి కాలనీ వాచ్ మెన్ ను, ఇరుగు పొరుగు వారిని పిల్చుకొచ్చాడు.
కళ్లనిండా కారం పడ్డ దొంగలు మంటలు భరించలేక విలవిలలాడారు. దానితోపాటు శ్యామల ఆవేశంగా, గట్టిగా కొట్టిన దెబ్బల మంటలు వేరే.
ఇల్లంతా కారం. చేతిలో కర్రతో ఆవేశంగా రొప్పుతున్న శ్యామలను చూసి పిల్లలు, అత్తామామలు హతాశులయ్యారు.
నిజంగా తమ తల్లేనా అని నమ్మలేకుండా ఉన్నారు పిల్లలు. దొంగలను పోలీసులు పట్టుకెళ్లారు. తర్వాత తెలిసిందేంటంటే వాళ్లు పాత దొంగలు, హంతకులు కూడా అని. వాళ్లని పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారంట. అది శ్యామలకే అందిస్తామని పోలీసులు చెప్పి వెళ్లారు.
ఆ తర్వాత భాస్కర్ ఇంటిపనులు, బయటపనులు కూడా శ్యామలే ఒంటరిగా చేసుకునేలా వెంట తిప్పి, చూపించి అన్నీ నేర్పించాడు.

ఆడది ఎంత పిరికిదైనా, భయం ఉన్నా, ఏమీ తెలీకున్నా తన కుటుంబానికి, పిల్లలకు ఆపద వస్తే మాత్రం అమ్మోరు తల్లే అవుతుంది.

నవరసాలు..నవకథలు.. కరుణ 3

రచన: జి.సుబ్బలక్ష్మి

ఫోటో

“ప్రయాగ వెడుతున్నార్ట కదా సావిత్రీ.. “ రెండిళ్ళ అవతలున్న జానకి సందు చివరనున్న కొట్టు దగ్గర కూరలు కొంటున్న సావిత్రిని అడిగింది.
“అవును జానకీ. ఒక్కసారి ఆ త్రివేణీసంగమంలో మునగాలనుందిరా, కుంభమేళాకి తీసికెళ్ళరా అనడిగితే ఆ రష్ లో మనం వెళ్లలేవమ్మా అన్నాడు ముందు. కానీ తర్వాత మా గిరిజ వాడికి నచ్చచెప్పింది. ఎంత బాగా చెప్పిందనుకున్నావ్! మనం కాకపోతే అత్తయ్యగారిని ఎవరు తీసికెడతారండీ అంటూ మొత్తానికి వాణ్ణి ఒప్పించింది.” సంతోషంతో వెలిగిపోతున్న మొహంతో అంది సావిత్రి.
కూరలు తీసుకుని సావిత్రి పక్కనే నడుస్తూ వస్తున్న జానకి నెమ్మదిగా అంది. “ఏంటో సావిత్రీ, కొన్ని కబుర్లు వింటుంటే భయం లాంటిది వేస్తోంది. నిన్న టీవీలో చెప్పేరు, ఎవరో ఒకతను ముసలి తల్లిని తీసుకుని ప్రయాగ వెళ్ళి, అక్కడ వదిలేసి వచ్చాడుట. రోడ్డు పక్కన కొడుకింకా వచ్చి తనని తీసికెడతాడని ఎదురుచూస్తున్న ఆవిడని టీవీలో చూపిస్తుంటే ఎంత బాధేసిందో.”
“అయ్యయ్యో. అలాంటి కొడుకులు కూడా ఉంటారా!” ఒక్కసారిగా నిలబడిపోయి ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.
“ఎందుకుండరూ! ఎన్నిరకాల మనుషులో. నువ్వు జాగ్రత్త సావిత్రీ.” అన్న జానకి మాటలకి నవ్వుకుంది సావిత్రి. తన కొడుకు రవి బంగారం. తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో. కోడలు గిరిజ మటుకు తననెంత గౌరవిస్తుందీ! ఇంక మనవడు తననసలు వదలనే వదలడు.
అనుకున్నట్టే కొడుకు రవీ, కోడలు గిరిజ, మనవడు అజిత్ తో ప్రయాగలో రైలు దిగిన సావిత్రి, ప్లాటుఫారం మీద నిలబడి “ఈ జన్మకిది చాలు భగవంతుడా.” అనుకుంటూ గుండెలనిండా గాలి పీల్చుకుంది.
రైల్వే ప్లాట్ఫామ్ మీదే కాదు, స్టేషన్ దాటి బైట కొచ్చాక కూడా ప్రవాహంలాగా జనాలు. రవి బయల్దేరినదగ్గర్నుంచీ పాఠం అప్పచెప్పించుకున్నట్టు తన పేరు, అడ్రసూ అజిత్ చేత అప్పచెప్పించుకుంటూనే ఉన్నాడు. తల్లికీ, భార్యకీ కూడా జాగ్రత్తలు చెప్పాడు. ఒకరిని వదిలి ఇంకొకరు వెళ్ళకూడదనీ, స్నానానికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా కనీసం ఇద్దరైనా ఒక జట్టుగా ఉండాలనీ చెప్పాడు.
కుంభమేళా. కోట్లకొద్దీ ప్రజలు భక్తిప్రపత్తులతో వచ్చి త్రివేణీసంగమంలో పాపప్రక్షాళన చేసుకుని తరించిపొయే ప్రయాగ నగరం. ఎక్కడికక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లూ చేసింది ప్రభుత్వం.
వచ్చినరోజే త్రివేణీసంగమంలో పవిత్రంగా స్నానం చేసి, గుడికి వెళ్ళొచ్చారు. స్నానం చేసి గుడికొస్తున్నదారిలోనూ, గుడినుంచి బసకు వస్తున్న దారిలోనూ రోడ్డు మీద అక్కడక్కడా ఉన్న ముసలివారిని చూసి సావిత్రి కెందుకో దుఃఖంలాంటిది వచ్చింది. దారంతా అక్కడక్కడా పోలీసులు ఆ ముసలివాళ్లతో మాట్లాడి వాళ్లని చెయ్యి పట్టుకుని తీసికెడుతున్నారు. ఇంక బస దగ్గరయితే కొన్ని ఫొటోలతో ఒక బోర్డ్ కూడా కనపడింది. అది హిందీలో ఉంది. హిందీ సావిత్రికి అర్ధంకాదు. అందుకని కొడుకుని ఆ బోర్డు మీద ఏంరాసుందోనని అడిగింది. రవి వరసగా ఉన్న ఆ ఫొటోలన్నీ చూపిస్తూ, వాళ్లంతా మతిమరుపు(అల్జీమర్స్) వ్యాథితో బాధపడుతున్న పెద్దవారనీ, వారు వారి పిల్లలను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారనీ, అందుకని పిల్లలే వచ్చి వారిని గుర్తుపట్టి తమవెంట తీసికెళ్లవలసిందనీ ఆ బోర్డు మీద రాసుందని చెప్పాడు. ఆ ఫొటోలు చూస్తూ “అయ్యోపాపం.. ఆ పిల్లలెవరో ఇక్కడికొచ్చి చూస్తారంటావా..” అడిగింది సావిత్రి రవిని.
“ఏమో..వెతుక్కుంటూ వచ్చే పిల్లలకి కనీసం వాళ్ళిక్కడ ఉన్నారని తెలుస్తుంది కదా!” అన్నాడు రవి.
వీళ్ళతో పాటుగా ఆ ఫొటోలని చూస్తున్న మరో ఆయన “అయినా వీళ్ళ పిచ్చి కాకపోతే కావాలని వదిలేసి వెళ్ళినవాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తారండీ!” అన్నాడు కల్పించుకుంటూ.
సావిత్రికి ఒక్కసారి ఊళ్ళో జానకి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. భయంతో వెన్ను జలదరించింది. మళ్ళీ కాసేపట్లోనే తనను తాను సముదాయించుకుంది. అయినా అలాంటివాళ్లతో తనకేం పోలిక? తన కొడుకు బంగారం. ఒకవేళ ఈ జనం వత్తిడిలో ఎక్కడైనా తప్పిపోయినా తనకి నోట్లో మాటుంది. ఆ మాత్రం ఊరూ, అడ్రసూచెప్పగలదు.
“నానమ్మా, నానమ్మా అక్కడ బొమ్మలున్నాయి చూద్దాంరా నాన్నమ్మా.” చెయ్యిపట్టి లాగుతున్న అజయ్ ని ఆపింది గిరిజ.
“నాన్నమ్మ అలిసిపోయేరు కానీ నువ్వూ, డాడీ వెళ్ళి కొని తెచ్చుకోండి. మేం రూమ్ కి వెడతాం.” అంటూ గబగబా రూమ్ వైపు నడిచింది.
“రా రా..” అంటూ అజయ్ చెయ్యి పట్టుకుని రవి ఆ బొమ్మల వైపు వెళ్ళాడు. సావిత్రి రూమ్ నంబర్లు చూసుకుంటూ తమ రూమ్ దగ్గర ఆగి అవునా కదా అన్నట్టు ఒక్క క్షణం నిలబడింది. ఎదురుగా గదిలో గిరిజ అటువైపు తిరిగి మొబైల్ లో మాట్లాడుతోంది.
“అవునే, ఇప్పుడే చూసేను బైట ఫొటోలు. మతిమరుపు జబ్బున్న ముసలాళ్ళవి. హూ.. నాకా అదృష్టం లేదులే. మా అత్తగారికి ఎప్పటెప్పటివో కూడా నిక్షేపంలా గుర్తుంటాయి.”
గిరిజ మాటలు విన్న సావిత్రి ఒక్కసారిగా స్థాణువైపోయి గదిలోకి వెయ్యబోయిన అడుగుని ఆపేసింది.
“ఇన్నేళ్ళూ బానే ఉందే. మా అందరికీ కూడా బానే చేసిపెట్టేది. ఈ మధ్య యేడాదినించే ఏవో రోగాలంటుంది. ఇక్కడ పుల్ల అక్కడ పెట్టటం లేదు. అయినా మా ఆయనకి మరీ అపురూపం వాళ్లమ్మంటే. ఏం చెప్పమంటావులే.. ఈ యేడాదిలో టెస్ట్ లకే బోల్డయింది తెల్సా!”
వద్దన్నా చెవులో పడుతున్న ఆ మాటలు వింటుంటే సావిత్రి మనసు మూగపోయినట్లైపోయింది.
అవతలివాళ్ళేం చెప్పారో మరీ ఇట్నించి గిరిజ “అబ్బే, అలా చేస్తే మా ఆయన దగ్గర చెడ్డదాన్నయిపోనూ! ఆయన దగ్గర నాకు మా అత్తంటే ఎంతో గౌరవం, భక్తీ ఉన్నట్టుండాలి. ఈవిడంతట ఈవిడే మళ్ళీ మాతో వెనక్కి రాకూడదు. ఏదో ఆలోచిస్తాలే.. ఎన్నాళ్ళు చేస్తాను ఈ రోగిష్టిదానికి చాకిరీ..” అంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగింది.
పాలిపోయిన మొహంతో నిలబడ్ద సావిత్రిని అప్పుడే చూసినట్టు చూస్తూ తడబడింది. “మీరు వెళ్ళలేదా అత్తయ్యా వాళ్లతో..” అంటూ మొహం చాటు చేసుకుందుకన్నట్టు బైట వరండా లోకి వెళ్ళిపోతూ అనుకుంది. “హమ్మయ్య, తను అనుకున్నట్టే ఈవిడ వింది. చాలా అభిమానంగల మనిషి. ఈ మాటలు వింది కనక ఇంక మాతో వెనక్కి రాదు. ఇంక వాళ్ళిద్దర్నీ ఎలాగోలాగు మానేజ్ చేసానా, ఈవిడ పీడ వదిలినట్టే..”
తను వినాలనే గిరిజ ఆ మాటలన్నట్లనిపించింది సావిత్రికి. వాటిని అర్ధం చేసుకోవడానికి చాలా సమయమే పట్టిందావిడకి. కొడుకు పెళ్ళైన పదేళ్ళనుంచీ కోడలుని కాలు కింద పెట్టనివ్వకుండా గారంగానే చూసుకుంది సావిత్రి. ఈ మధ్యనే వయసు మీద పడడం వల్లో యేమో ఆయాసంగా అనిపిస్తుంటే సాయంత్రాలు వంట కోడలు చేస్తోంది. కొడుకు భయపడి ఏవో నాలుగైదు పరీక్షలు చేయించాడు. పెద్దవయసు తప్పితే వేరే సమస్యలేమీ లేవు, విశ్రాంతి కావాలన్నారు డాక్టర్లు. అప్పట్నించీ కొడుకు కోడలినే వంట చెయ్యమన్నాడు. కానీ అలవాటైన పనులు మానుకుని ఉట్టిగా కూర్చోలేక పొద్దుటి వంట తనే చేస్తోంది. అంతమాత్రానికే తను రోగిష్టురాలైపోయిందా! తనను ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి ఏం చెయ్యాలో ఆలోచిస్తోందా గిరిజ? విన్నది స్పష్టంగా అర్ధమౌతున్న కొద్దీ సావిత్రికి కళ్ళు తిరిగినట్లయి కూలబడిపోయింది. ఎంతో ప్రేమగా “అత్తయ్యా..” అంటూ పిలిచే కోడలి మనసులో ఇంత కల్మషం దాగుందని తెలీని సావిత్రికి ఒక్కసారి షాక్ తగిలినట్లయిపోయింది.
మర్నాడు సాయంత్రం మళ్ళీ వెనక్కి ప్రయాణమే. అందుకని పొద్దున్నే బయల్దేరి నలుగురూ అలహాబాదులో ఉన్న దేవాలయాలు కూడా దర్శించుకుంటూ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళారు. అక్కడ సన్న ద్వారంలోంచి లోపలికి వెడితే మధ్యలో ఆంజనేయస్వామి దర్శనమిస్తుంటాడు. లోపలంతా ఎక్కువ వెలుతురుండదు.
దర్శనం చేసుకుని ముందు బయట కొచ్చిన గిరిజ గబగబా బసకి, అట్నించి ఏకంగా స్టేషన్ కి ఒక ఆటోని మాట్లాడి రెడీగా పెట్టింది. కాస్త ఆలస్యంగా వెనకాల వస్తున్న రవి, అజయ్ లను చూసి, “తొందరగా రండి. సామాన్లు తీసుకుని స్టేషన్ కి వెళ్ళాలి. టైమ్ లేదు..” అంటూ ఆటో ముందు నిలుచుని గట్టిగా పిలిచింది.
అప్పటికే సావిత్రి ఆటోలో ఉందనుకుని ఎక్కబోయిన రవి హఠాత్తుగా ఆగి, “అమ్మేది!” అన్నాడు.
“అత్తయ్యగారికి ఆవిడ చుట్టాలావిడ కనిపించారుట. ఆవిడతో కలిసి వాళ్ల వాళ్ళని కలిసి ఏకంగా అట్నించటే స్టేషన్ కి వచ్చేస్తానన్నారు. మీరెక్కండి.” అంది.
“నాకు తెలీని అమ్మ చుట్టాలెవరూ!” అన్న రవికి సమాధానంగా,
“ఎప్పుడో మీ చిన్నప్పుడు కలిసేర్ట. మీకు తెలీదులెండి.” అన్న గిరిజతో,
“మరి అమ్మ దగ్గర డబ్బులు లేవుగా!” అంటూ ఇంకా ఏదో అడగబోతున్న రవిని “అబ్బబ్బా, నేనిచ్చేనులెండీ. మళ్ళీ మనకి ట్రైన్ తప్పిపోతుంది. ఎక్కండీ.” అంటూ రవినీ, అజయ్ నీ ఆటో ఎక్కించేసింది. బసకి వెళ్ళి వాళ్ల సామానులన్నీ తీసుకుని, ఆఫీసులో డబ్బు కట్టేసి మళ్ళీ ఆలస్యమైపోతుందని తొందరగా ఆటో ఎక్కేసారు ముగ్గురూ. ఆఖరున బేగులు తీసుకుని వస్తున్న గిరిజ అత్తగారి బేగ్ కావాలనే రూమ్ గుమ్మం ముందు వదిలేసి వచ్చింది.
ఆటో దిగి స్టేషన్ లో అడుగుపెట్టిందగ్గర్నించీ రవీ, అజయ్ సావిత్రికోసం ప్లాట్ ఫామ్ అంతా గాలిస్తున్నారు. “అమ్మా, అమ్మా” అంటూ, రవీ, “నాన్నమ్మా, నాన్నమ్మా” అంటూ అజయ్ గొంతెత్తి పిలుస్తున్నారు. చుట్టూ వింటున్నవాళ్ళు వీళ్ళవంక సానుభూతిగా చూసి వెడుతున్నారు. ఇంతలో వీళ్ళెక్కాల్సిన రైలు వచ్చింది. “ఎక్కండి. ఎక్కండీ..” అంటూ గిరిజ తొందరపెట్టింది. “ఆవిడ ఏదో పెట్టెలో ఎక్కేసే ఉంటారు. ఈ రైలని తెల్సుగా. మళ్ళీ మనం తప్పిపోతాం.” అంటూ ఇద్దర్నీ ఎక్కించేసింది గిరిజ. రైలు కదిలాక కూడా గుమ్మంలోంచి బైటకి సావిత్రి కనపడుతుందేమోనని తొంగిచూస్తూనే ఉన్నాడు రవి.
“అయ్యో, అక్కడలా నిలబడకండీ. అత్తయ్యగారు వెళ్ళిన చుట్టాలావిడ కూడా ఎక్కేది ఇదే రైలుట. తప్పకుండా వాళ్లతో ఎక్కేసుంటారు..” అన్న గిరిజ మాటలకి లోపలికొచ్చి తన సీటులో కూర్చుంటూ “అమ్మ ట్రైన్ ఎక్కుంటుంది కదా!” అనడిగేడు. “అయ్యో, తప్పకుండా ఎక్కే వుంటారండీ. నాతో చెప్పేరుగా. లేకపోతే నేనెందుకు చెప్తానూ!” అంది గిరిజ ధీమాగా.
అక్కడ ఆంజనేయస్వామి గుడిలో కొడుకు, కోడలు, మనవళ్ళ వెనకాల వరసలో లోపలికెళ్ళిన సావిత్రి జనాలని తప్పించుకుంటూ దేవుని దర్శనం చేసుకుని బయట కొచ్చేటప్పటికి అక్కడ తనవాళ్ళెవరూ కనపడలేదు. కాసేపు అక్కడే నిలబడి వాళ్ళింకా లోపలే ఉన్నారేమో బయట కొస్తారని చూస్తూ నిలబడింది. కానీ పావుగంట గడిచినా లోపల్నించి వాళ్ళు రాలేదు. దాంతో ఖంగారుపడుతూ తను మళ్ళీ లోపలికెళ్ళి, ఆ రైలింగ్ పట్టుకుని, చుట్టూ తిరిగి బయటకొచ్చింది. అక్కడా లేరు. లోపలా బయటా కూడా కొడుకు కనపడకపోవడంతో సావిత్రి ఖంగారుపడింది. ఏ పక్కకో వెళ్ళుంటారు అని మనసుని సమాధానపరచుకుంటున్నా నిన్న గిరిజ ధోరణి తెలిసినప్పట్నించీ ఒక రకమైన భయంలాంటిది సావిత్రిలో మొదలైంది. తననొదిలేసి వాళ్లంతా బసకి వెళ్ళిపోయారా! తను లేకుండా కొడుకు ఎలా వెళ్ళేడు!
ఇంకాసేపట్లో హైద్రాబాదు వెళ్ళడానికి రైలెక్కాలి. ఇంకా ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే బసనుంచి వాళ్ళు స్టేషన్ కి వెళ్ళిపోతారేమో! ఇప్పుడు తనేం చెయ్యాలి అనుకుంటూ గుండె దిటవు చేసుకుని తాము బస చేసిన హోటల్ కి వెడామనుకుంది. ఆ హోటల్ పేరు సదరన్ హౌస్. ఆ పేరు సావిత్రికి గుర్తే.. బయటకొచ్చి ఆటో ఎక్కుదామంటే భాషా రాదు, చేతిలో డబ్బులూ లేవు. నెమ్మదిగా తనని తాను స్వాధీనంలోకి తెచ్చుకుని చుట్టూ పరికించింది. ఎక్కడా తన వారి జాడ కనపడలేదు. కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ ఆటోల దగ్గరే నిలబడి అక్కడికి వచ్చే భక్తులని పరిశీలించడం మొదలెట్టింది.
ఒక ఆటో మాట్లాడుతున్న మగాయనతో వాళ్లావిడ “ఇంకివాల్టికి హోటల్ కి వెళ్ళిపోదామండీ. నడవలేను. మిగిలినవి రేపు చూసుకుందాం. “ అంటూన్న తెలుగుమాట వినిపించింది. గబుక్కున ఆవిడ దగ్గరకెళ్ళి “అమ్మా, మావాళ్ళు తప్పిపోయేరు. బహుశా మేం బసచేసిన చోటుకి వెళ్ళుంటారు. కాస్త మీవారితో చెప్పి నన్నక్కడ దించగలరా! అక్కడికి వెళ్ళగానే మా అబ్బాయి మీకు డబ్బులిచ్చేస్తాడు.” అనడిగింది మొహమాటం చంపుకుని గబగబా.
ఆయన సావిత్రిని తేరిపార చూసాడు. అయినింటావిడలాగే ఉంది. కట్టూబొట్టూ చూస్తే మర్యాదస్తురాలిలాగే కనపడుతోంది. పాపం తెలుగు తప్ప హిందీ రానట్టుంది. తనవాళ్ళు చూసుకోకుండా ముందు వెళ్ళిపోయుంటారు అనుకుంటూ భార్యని చూసి, “బస ఎక్కడో తెలుసేమో అడుగు..” అన్నాడు.
సావిత్రి సంతోషపడిపోయి, “సదరన్ హౌసండీ..” అని చెప్పింది. ఆటోవాణ్ణి ఆ అడ్రస్ గురించి వాకబు చేసి, వాళ్లతోపాటు సావిత్రిని కూడా ఎక్కించుకుని సదరన్ హౌస్ దగ్గరకి తీసుకొచ్చారాయన. “ఇదేనా..” అనడుగుతున్న ఆయనకి నమస్కారం పెడుతూ, దూరంగా కనిపిస్తున్న కొడుకూ, కోడలూ, మనవడినీ చూపిస్తూ, “అరుగో వాళ్ళేనండీ.. ఉండండి, మా అబ్బాయినడిగి మీ డబ్బులు తెచ్చిస్తాను..” అంటున్న సావిత్రిని ఆపి, “పరవాలేదండీ. ఇది మేం వెళ్ళే దారే. మీరు తొందరగా వెళ్లండి.” అంటూ ఆటోలో వెళ్ళిపోయారు ఆ దంపతులు.
హమ్మయ్య అనుకుంటూ ఇటు తిరిగిన సావిత్రికి రవీ వాళ్ళూ కనిపించలేదు. తాము దిగిన రూమ్ నంబర్ తెలుసు కనక ఆ రూమ్ దగ్గరికి వెళ్ళింది. కానీ అప్పటికే అందులో ఇంకెవరో దిగిపోయారు. సంగతి తెలుసుకుందుకు ఆఫీసురూమ్ కెళ్ళి కొడుకు గురించి అడిగింది.
“వాళ్ళిప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా!” అన్న మాటలు విన్నావిడ మ్రాన్పడిపోయింది. ఇంకా ఆశ చావక మళ్ళీ తాము దిగిన రూమ్ కి వెళ్ళింది. ఆ రూమ్ గుమ్మం పక్కన తన బేగ్ కనపడింది. అంతే.. అంతా అర్ధమైపోయిందావిడకి. కోడలు తనని వదిలేసి వెళ్ళిపోయింది. మరి కొడుకూ! కొడుకుతో ఏం చెప్పిందో. పెళ్ళాం చెప్పిన మాటలు నమ్మి తనను వదిలేసి వెళ్ళిపోయేడా రవి! సావిత్రి మనసు దానికి అంగీకరించలేదు. లేదు. తన కొడుకు అలాంటివాడు కాదు. ఎక్కడికెళ్ళినా తనని వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికే వస్తాడు అనుకుంటూ రవి రాగానే కనపడేలాగా ఆఫీసుముందున్న బెంచీమీద కూర్చుంది. ఎక్కడ రవి వస్తే తను మిస్సయిపోతుందేమో ననుకుంటూ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపింది. తెల్లారింది. కొడుకు రాలేదు. సావిత్రి గుండె బద్దలైంది.
ఆఫీసులో పొద్దున్నే డ్యూటీ మారినతను బెంచీమీద కూర్చున్న సావిత్రిని చూసి అడిగాడు. “మీదే ఊరండీ? మీ పేరేమిటీ!” అంటూ.
అర్ధంకానట్టు చూస్తున్న ఆవిడని చూసి “పాపం, మతిపరుపు జబ్బేమో.” అనుకున్నాడు. ఎవరేమడిగినా నోరువిప్పని సావిత్రిని అక్కడందరూ జాలిగా చూసారు.
మరో నాలుగురోజులకి ఆ బసముందున్న ఫొటోల్లో సావిత్రి ఫొటో కూడా చేరింది.

నవరసాలు..నవకథలు.. భయానకం ..2

రచన: చెంగల్వల కామేశ్వరి

“హెల్ప్ మి”

భలే సంతోషంగా ఉందిరా ! ఎప్పటినుండో అనుకున్నాను. ఇప్పటికి కుదిరింది ఇలా ట్రైన్ లో అరకు వెళ్లాలని. అంటున్న వాసు మాటలకి నవ్వేసి
ఏం చేస్తాము? ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదరదు.
ఆ గోపాల్, వర్మ , రాంబాబు గొడవ ! ఎప్పుడూ మేమే రావాలా! ఎక్కడెక్కడివాళ్లో వస్తున్నారు. మీరిద్దరూ రారేంటిరా !
ఆ భాగ్యనగరంలో ఉన్నారని పెద్దబడాయి.”
అని సాధింపులు.
ఇంట్లో పెళ్లాం పిల్లలని వదిలి, బాస్ గాడికి మస్కా కొట్టి లీవు సంపాదించి బయల్దేరాలంటే మాటలా? ఇన్నాళ్ల కి కుదిరింది. ఈ నాలుగు రోజులు బ్యాచిలర్స్ లాగా హేపీగా గడపాలిరా! అన్నాడు. ఆనంద్.
పాపం మన ఫ్యామిలీలను కూడా తీసుకురావొచ్చు కాని వాళ్లందరికీ అన్నీ చూసేసరికే మనపని అయిపోతుంది. మనూళ్లోలాగా వీకెండ్స్ లో లా
వాళ్ల కబంధ హస్తాల నుండి బయటపడలేము. వాళ్ల సేఫ్టీ మనమే చూడాలికదా! అని గట్టిగా నవ్వేసాడు వాసు!
ఉండుండి వచ్చే టన్నెల్స్ రాగానే కుర్రకారు వేసే విజిల్స్ తో హోరెత్తిపోతున్నాయి కంపార్ట్ మెంట్స్. అప్రయత్నంగా వాసూ, ఆనంద్ కూడా వాళ్లలా చిన్నవాళ్లయిపోయినట్లుగా ఈలలు వేసేసారు ట్రైన్ కిటికీలోనుండి “బొమ్మాళీ! నానుండి తప్పించుకోలేవే! అని, ఓ—- అని కేకలేసి, గోల చేసారు.
పచ్చనిఅడవులు కొండలు లోతయిన లోయల గుండా వెడుతున్న కిరండోల్ ఎక్స్ ప్రెస్ ఉత్సాహాలకి కుర్రకారు అల్లర్లను మోసుకుంటూ వెడుతోంది.
ఫొటోలు వీడియోలు తీసుకుంటూ ఆ పచ్చని ప్రకృతి అందాలు చూసి మురిసి పోతున్నారు ఆ మిత్రులిద్దరూ.
ట్రైన్ లో అమ్ముతున్న జామకాయలు పల్లీలు టిఫిన్స్ ఆరగించి ఆరారా కాఫీలు తాగుతూ చాలా ఉల్లాసంగా ఉన్న వారిద్దరినీ కొందరు వింతగా చూస్తూన్నారు.
సిగరెట్ వెలిగించి హాయిగా దమ్ము పీల్చి బైట కి చూస్తూన్న వాసు ఒక్కసారిగా తృళ్లిపడి “ఆనంద్ అటు చూడు ! అనరిచాడు. వాసు చెప్పిన వైపు చూసిన ఆనంద్ కూడా విభ్రాంతికి గురయ్యాడు.
లోతుగా ఉన్న లోయలోనుండి ఇద్దరు స్త్రీలు వారి చేతుల్లో ఉన్న రుమాళ్లు వారు అరుస్తున్నట్లు కన్పించినా. ట్రైన్ స్పీడుకి ఆ రూపాలు కనుమరుగయిపోవడంతో నివ్వెరపోయాడు.
“ఎవర్రా వాళ్లు అక్కడెందుకున్నారో! అని మాత్రం అనగలిగాడు.
ఆ మాటకి అదేరా! ఇద్దరూ లేడీసే !పెద్ద ఏజ్ కూడా ఉన్నట్లు లేదు ‌. అక్కడికెలా వెళ్లారో హెల్ప్ హెల్ప్ అని అంటున్నట్లుగా ఉందిరా! అన్నాడు వాసు.
ఇద్దరికీ మూడ్ పాడయినట్లుగా అయి ఆ ఇద్దరి రూపాలే గుర్తొస్తుంటే ఒకరిద్దరిని అడిగారు ఎవరయినా చూసారా! అని కాని ఎవరూ చూడలేదన్నట్లే చెప్పారు.
ఆ సంఘటన గురించే చర్చించుకుంటూ ఉండగానే మరోగంటకి ట్రైన్ అరకులోయ చేరడం తమ కోసమే స్టేషన్ లో ఎదురు చూస్తున్న మిత్రబృందాన్ని కలవడం .
ఆ హడావిడిలో మిత్రులను కలసిన ఆనందంలో అన్నీ మరిచిపోయారు. గోపాల్ తెచ్చిన టాప్ లెస్ జీపులో కూర్చుని తమ కోసం బుక్ చేసిన యాపిల్ రిసార్ట్ కి చేరుకున్నారు. సామాన్లు అక్కడ రూమ్స్ లలో పడేసి మళ్లీ జీపు మీద అరకు విహారం మొదలుపెట్టారు.
తిన్నగా చాపరాయి జలపాతాలకి తీసుకెళ్లిపోయాడు గోపాల్ అక్కడ నీళ్లలో తడిసి ఈదులాడుతూ కేరింతలు కొడుతూ స్నానాలు చేసి జోకులు నవ్వుల లో ములిగితేలారు. తర్వాత అందరూ జీపులో కూర్చుని చిల్డ్ బీర్ కి అక్కడే ఆర్డర్ చేసుకున్న వేడి వేడి బొంగు చికెన్ ఆరగించారు,
అందరూ కలుసుకుని అయిదారు సంవత్సరాలు కావడంతో వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కబుర్లకు అంతేలేదు. వాసూకి, ఆనంద్ కి, వచ్చేపుడు చూసిన విషయం ఒకట్రెండుసార్లు గుర్తొచ్చినా, వేరేమాటల ప్రవాహంలో కొట్టుకుపోయింది.
అలా అలా తిరుగుతూ ట్రైబల్ మ్యూజియమ్, కాఫీ మ్యూజియమ్ చూసుకుని మధ్యలో లంచ్ లాగించి కొండల్లో పొద్దుకుంకి మంచుపొరలు అలముకుంటూ చీకటి పడుతుంటే, తమ రిస్సార్ట్ కి చేరుకున్నారు. కాస్త అలసటగా ఉన్నా వేడినీళ్ల స్నానం చేసేసి ఫ్రెష్ గా తయారయి వేడి కాఫీతో సేదదీరేసరికి.రాంబాబు వర్మ గోపాల్ కూడా ఫ్రెషప్ అయి వచ్చేసారు.
“పదండ్రా బైట మనకన్నీ రెడీ! అంటున్న గోపాల్ మాటకి ” బాబోయ్ ఈ చల్లోనా మా వల్లకాదు ఇక్కడే సెటప్ చేయొచ్చుకదా! అన్న ఆనంద్ మాటలకి
“చలీ లేదు గిలీలేదు కేంప్ ఫైర్ వేస్తారు మన కోసం థింసా డాన్సు కూడా ఉంది. మందుంది. చిందుంది. ఇంకేమింకేం కావాలే చాల్లే ఇదిచాల్లే! మనమంతా ఏకపత్నీవ్రతులం కదా! అంతే చాలు కదా! అని నవ్వాడు వర్మ.
“ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఇంకా ఎందుకురా అబద్దాలు! అని కవ్వింపుగా అంటున్న వాసూ మాటలకి
కృష్ణావతారం అయిపోయిందిరా! ఇంక నేను రామావతారంలోనే అన్న వర్మ మాటకి నవ్వుకుంటూ అందరూ బయటకి వచ్చారు.
చిక్కటి చీకటి అలముకుని జివ్వుమంటున్న చలిలో అక్కడక్కడ వెలుగుతున్న లైట్ల జిలుగులు రిసార్ట్ ముందు ఎత్తయిన కొండలు నడుమ ఉన్న రైల్వే ట్రాక్ మీద మెల్లగా పోతున్న గూడ్స్ ట్రైన్ తమ రిసార్ట్ గదులకెదురుగా ఉన్న పచ్చిక బయలు లో అక్కడక్కడ వెలిగించిన కేంప్ ఫైర్ లు వాటిముందు గుంపు గుంపులు గా జనాలు
నడుమ రంగు రంగు దుస్తులు వెండిపట్టాలు కడియాలు వేసుకుని చెట్టాపట్టాలుగా లయబద్దంగా థింసా నృత్యం ఆడుతున్న స్త్రీలు కోలాహలంగా ఉండటంలో చలి నిజంగానే పారిపోయినట్లనిపించింది.
తమకై ఏర్పర్చిన కేంప్ ఫైర్ దగ్గర కుర్చీలలో అందరూ కూర్చున్నారు. రిసార్ట్ బోయ్ తెచ్చిన వేడిపకోడీలతో హఫ్రైడ్ కాజూతో విదేశీ స్కాచ్ జతకలిసింది. ఆ చలిలో అలా వెచ్చగా చలికాగుతూ ఆ డాన్సులు కోలాహలం ఎవరికి వారు ఇలా ఎంజాయ్ గా ఉండటం అద్భుతంగా అనిపించింది.
భలే సంతోషంగా ఉందిరా !
“చెవులున్న గోడలు లేవు కుళ్లుకునే కళ్లేమి లేవు ! అన్నట్లు అంతా స్వేఛ్చ! తమ దగ్గర కూడా నృత్యం చేసిన థింసా బృందానికి అందరూ డబ్బులు ఇచ్చి వాళ్లల్లాగే వీళ్లు కూడా డాన్స్ నేర్పమని డాన్స్ కట్టేసరికి ఆ అమ్మాయిలు నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
పాటలు చిందులు ఆపి కబుర్లలో పడిన తరుణంలో సడన్ గా ఆ లోయలో కనిపించిన స్త్రీలు గుర్తొచ్చి ఆనంద్ కి నిలువెల్లా గగుర్పొడిచింది. ఈ చీకటిలో, చలిలో వాళ్లేలా ఉన్నారో! అనుకోగానే ఆ విషయాన్ని గోపాల్ వర్మ రాంబాబుల కి చెప్పాలనిపించింది.
వెంటనే ఒరే గోపాల్ ఇవాళ మేము వస్తున్నప్పుడు ఏమయిందో తెలుసా! అంటూ వాసూ తాను చూసిన విషయాన్ని పూసగుచ్చినట్లుగా వివరంగా చెప్పాడు.
వాసూ కూడా అదే విషయాన్ని చెప్తుంటే వింటున్న వర్మకి రాంబాబుకు గోపాల్ ఆశ్చర్యం కల్గింది.
అదెక్కడి ప్లేసో చెప్పగలరా! ఐమీన్ ఏ స్టేషన్ తర్వాత? అనడిగాడు వర్మ.
వాసూ ఆనంద్ ఇద్దరూ ఆలోచించి కొంచెం తర్జనభర్జనల తర్వాత కొత్తవలస తర్వాత అనుకుంటామని చెప్తూ “పాపం వాళ్లని కాపాడాలిరా! అసలు ఈ సమయంలో ఆ చిట్టడవి లోయల్లో ఎలా చిక్కడ్డారో! ఏమిటో! మనమేదయినా చేయగలమా? అనడిగిన వారిద్దరి మాటలకు మొహాలు చూసుకున్నారు ఏం చేద్దామన్నట్లుగా!
చేయొచ్చు కాని, అంత ఈజీకాదు మేముగ్గురం ఇక్కడ ఇన్నేళ్లనుండి ఉద్యోగాల రీత్యా ఉంటున్నాము కాని ఇలా ఎప్పుడు వినలేదు. అన్నాడు రాంబాబు.
“అయినా మనం రైలెక్కితే ఏమి చేయగలం నడుచుకుంటూ విశాఖపట్నం రూటులో ఆ రైలు పట్టాలమ్మట వెడితే కనిపించొచ్చు ఒక పని చేద్దాము. మనకు వీలయినంత ప్రయత్నం మనం చేద్దాము కనిపించారా సాయం చేద్దాము లేదంటే వెనక్కొచ్చేద్దాము… గోపాల్ ప్రతిపాదన కి ఒకే అన్నారందరూ.
“రేపు బొర్రాకేవ్స్ చూడాలనుకున్నాము కదా అది మానేసి స్టేషన్ నుండి ఆ పట్టాలమ్మట వెడదామంటే అందరం పోదాము.వర్మ మాటకి అందరూ అంగీకరించారు.
కొండలకిందకి లోయల్లోకి దిగాలంటే త్రాళ్లు పెద్ద మేకులు వంటివి ఏవయినా స్నాక్స్ బిస్కెట్స్, వాటర్ లాంటివి తీసుకెళ్లాలి అనుకోగానే ఏదో ఎడ్వంచర్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతోంది అందరిలో ఏమేమి పట్టుకెళ్లాలో ఒక లిస్ట్ రాసుకున్నారు.ఉదయాన్నే రైల్వే స్టేషన్ కి వెళ్లాలి మనం వెళ్లేటప్పుడే మనకి కావల్సినవన్నీ తీసుకెళ్లాలి అని ఇలా రకరకాల ప్లానులేసుకుని ఆర్డర్ చేసిన ఫుడ్ లాగించి తమ రూముల్లోకి వచ్చేసారు.
నిద్రకు పక్రమించారు.=
తెల్లారి లేచి మొత్తం కొండలంతా పరచుకున్న మంచుతో ప్రక్రతి ఎంతందంగా ఉన్నా ఆ ఇద్దరు స్త్రీలే గుర్తొస్తున్నారు. అందరికీ
స్నానాలు టిఫిన్లు ముగించి అన్నీకొనుక్కుని అరకు స్టేషన్ కొచ్చేసరికి పదయ్యింది.
రైలు పట్టాలమ్మటే నడుచుకుంటూ మధ్యమధ్యలో ఆరారా స్నాక్స్ తింటూ వాటర్ త్రాగుతూ నడక మొదలుపెట్టారు. కాని టన్నెల్స్ వచ్చినదగ్గర, అగాధాల వంటి లోయల దగ్గర భయానికి కాళ్లు వొణికాయి
రాంబాబుకి వాళ్లని రక్షించడమేమో కాని తమకేమి ఆపద రాదు కదా! అన్న భయం కలిగింది.
అదే మెల్లగా గొణిగినా “ఒరేయి ఆపదలో ఉన్న ఆడాళ్లకి సహాయం చేయడానికి వెనుకాడతావేంట్రా! మగాడివికాదూ!
నీకొక్కడికే కాదు మా అందరికీ పెళ్లాలు పిల్లలున్నార్రా తండ్రీ! అని గేలి చేసి పడేసాడు ఆనంద్. మిగతావాళ్లు నవ్వులు
చేసేదిలేక వాళ్లని అనుసరించాడు రాంబాబు
అలా ఎన్నిమైళ్లు నడిచారో లెక్క తెలీలేదు చివరికి నాల్గు గంటలకి ఒక భయంకరమైన లోయ అక్కడికి రాగానే వాసూ “అదిగో చూడండర్రా మేము చెప్పామా! వాళ్లని చూడండి! ఎలా ఎలుగెత్తి పిలుస్తున్నారో! అనగానే ఉత్సుకత తో ఆ లోయలోకి చూపులుసారించిన ఆనంద్, రాంబాబు, గోపాల్ వర్మలకు ఇద్దరు స్త్రీలు నల్ల రుమాళ్లు ఊపుతూ “ప్లీజ్ కాపాడండి హెల్ప్ మి అనరుస్తున్నట్లు లోయలో ప్రతిధ్వనిస్తుంటే ఒళ్లంతా గగుర్పొడిచింది.
వెంటనే వాసు తన రుమాలును ఊపుతూ, “వస్తున్నాము మీకోసమే భయపడకండీ! అని అరిచిన అరుపు లోయలో ప్రతిధ్వనించింది. అతనిని చూసి మిగతావారు కూడా తమ రుమాళ్లు గాల్లోకి ఊపుతూ, అరుస్తుంటే ఆ స్త్రీలు నమస్కార ముద్ర తో “ధాంక్యూ! అని బదులిచ్చారు.
ఎక్కడినుండి దిగాలా! అని చుట్టుపక్కల పరికించి ఒక చెట్టుకి త్రాడుకట్టి ఆ త్రాడుకి మరిన్ని తాళ్లు జతపరిచి దాని ఆధారంతో దిగాలని నడుమ నడుమ ఆ త్రాడుని పెద్ద మేకులతో కొండభూమిలోకి దిగగొట్టాలని నిర్ణయించుకుని ఒకరొకరుగా అంచెంచెలుగా ఆ లోయలోకి దిగడానికి సాహసించారు.
చీకటి పడుతోంది ఎండ తగ్గి వాతావరణం చల్లగా మారుతోంది.
ఎప్పుడో కాలేజి రోజుల్లో ట్రెక్కింగ్ అనుభవాలని గుర్తు చేసుకుంటూ “సాహసం సేయరా డింభకా! అన్న నేపాళీ మాంత్రికుని మాటలు గుర్తు చేసుకుంటూ దిగడానికి ఉపక్రమించారు.
భయంతో ఉన్న రాంబాబుని ఉండిపొమ్మని వెనక్కి వెళ్లమన్నాడు వర్మ .కాని ఇంతవరకు వచ్చాక మీతోనే నేను అనుకుని మీ మధ్యలో ఉంటాను అని వర్మ ఆనంద్ దిగటం ప్రారంబించాక, తను దిగడం మొదలెట్టాడు.
మేమంతా మీకోసం ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చాము. అని అతివినయంగా చెప్తున్న గోపాల్ మాటలు విని , మాకు తెలుసు మీరొస్తారని అందుకే ఇక్కడే ఎదురుచూస్తున్నాము.
మాకోసం వచ్చిన మీకు మర్యాద చేయడం మా బాద్యత రండి రండి దయ చేయండి! తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ అని పాడుతూ, గాల్లో చేయూపింది.
అక్కడ అప్పటికప్పుడు నాలుగు సోఫాలు కుర్చీలు ఏర్పడటం చూసి పైప్రాణాలు పైనే పోయాయి.భయంతో వణుకుతున్న రాంబాబుకి స్ప్రహ పోయింది..
“ఇప్పుడు నేను! నంది కొండ వాగుల్లో నల్లతుమ్మ చెట్టు నీడలో నీకై నేనుంటా అని పాడుతూ, బేబీ హుషారుగా గాల్లో రెండు చేతులు ఊపింది దడదడమంటూ పైనుండి రకరకాల పళ్లు అందరినెత్తిన పడేసరికి హడిలిపోయారు.
గుమ్మడి పండు గోపాల్ నెత్తిమీద, పుచ్చపండు వర్మ నెత్తిమీద , పడేసరికి, కళ్లు బైర్లు కమ్మి “వీళ్లు దెయ్యాలేరాబాబోయ్! అంటూ నేల మీదకు వాలిపోయారు.
వాసూ తమ మిత్రుల దుస్తితి చూసి చేతులు జోడించి “మీకు పుణ్యముంటాది ! మమ్మల్ని వదిలి పొండమ్మా! అనిభోరుమన్నాడు.
ఆనంద్ “ఎందుకమ్మా! ఇలా ! మమ్మల్ని కాల్చుకు తింటున్నారు. అనేసరికి
“ఛీ నాకు వీళ్లెవరూ నచ్చలేదు మమ్మీ! పిరికి మొహాలు! మాట్లాడితే ఏడుస్తారు. కళ్లు తేలేస్తారు. ఛీ నాకు బోర్
బోర్ ! అని ఒక్కెగురు ఎగిరింది.
“ఉండవే బేబీ నేనూ వస్తాను! పిరికి సన్నాసులు వీళ్లెందుకూ! ఇంకెవరయినా వస్తారేమో చూద్దాము . అని ఒక్కుదుటన పైకెగరగానే ఆనంద్, వాసూ , అదురుపాటుతో నేల మీదే కూలబడ్డారు.
అక్కడున్న సోఫాలు కుర్చీలు అన్నీ మాయం! ఒకనిముషం తర్వాత మెల్లగా తేరుకుని
“హమ్మయ్య! పోయాయిరా బాబూ ముదనష్టపు దయ్యాలు ఇలాఇరుక్కున్నావేమిట్రా బాబూ ! తెల్లారగానే వెళ్లిపోవాలి దేముడా ! అని అంటున్న వాసూని, ఉద్దేశ్యించి
” ముందు వాళ్లని లేపాలిరా బాబూ! ఇక్కడినుండి వెంటనే వెళ్లిపోవాలి.” అంటూ వాచ్ చూసేసరికి అయిదవుతోంది.
“ఒరేయి లేవండర్రా బాబూ ! వెళ్లిపోదాము అంటూ వాటర్ బాటిల్ లో మిగిలిన నీళ్లు చిలకరించి ఒక్కొక్కరిని కూర్చోపెట్టారు.
వాళ్లకు స్ప్రహ వచ్చినా బెదురు పోలేదు .
“ఒరేయి! మనమింకా బ్రతికున్నామా ! చచ్చిపోయామనుకున్నారా! అనవసరంగా వచ్చామురా” అని రాంబాబు ఏడుపు “ఊర్కోరా ! అని అందరూసముదాయిస్తుండగా లేలేత కిరణాలు తో ఆకాశం ఎర్రబడి తెలవారుతున్న వేళ అడవంతా దద్దరిల్లిపోయేంత నవ్వులు. వినిపించగానే అందరూ అదిరిపడ్డారు.
“మనలని కాపాడటానికి వచ్చారటే ! ఈ పిరికి సన్నాసులు “ఆడాళ్లు కదా అనుకుని ఎగిరొచ్చారు.ఇప్పుడు మనం పోనీయం కదా! “అని వినిపించి ” హమ్మో అనుకుంటూ ఎక్కడనుండా? అని హడిలిపోతో చూస్తున్న ఆ మిత్రులకి తాము అష్టకష్టాలు పడి దిగివచ్చిన కొండ అంచుమీద కూర్చుని జుట్టు విరబోసుకుని తమని చూసి వికటంగా నవ్వుతూ , కాళ్లూపుతూ ఉన్న ఆ తల్లీకూతుళ్లు కన్పించారు.అది చూస్తూనే కళ్లు తిరిగాయి.అందరికీ
కాళ్లూ చేతులు ఆడలేదు.
ఆనంద్ కి వణుకొచ్చింది. తామిక్కడే ఇలా ఉండిపోతే తమ కుటుంబాల గతి ఏమిటనే భయం నిలువెల్లా పాకింది.మొక్కవోని విశ్వాసంతో దేముని మీద భారమేసి, చిన్నప్పటినుండి అలవాటయిన శ్రీరామ రక్షా స్త్రోత్రం గడగడా గట్టిగా చదవడం ఆరంభించాడు.
అంతే! ఆ కొండ అంచునున్న తల్లీ కూతుళ్లిద్దరూ కెవ్వున కేకలేసుకుంటూ గగనాల అంచులో కలిసి పోయారు. తిమిరాన్ని జయించిన వెలుగురేఖలు ఆ పరిసరాలను వేయి కాంతులుగా ప్రసరించాయి. ఆవెలుగులో ముక్కుమొహం తెలీనివారి కోసం ఉపకారాలు చేయడానికొచ్చి అపాయంలో పడ్డ ఆ మిత్రులందరూ “బ్రతుకు జీవుడా” అనుకుని కొండ ఎక్కడం మొదలుపెట్టారు.

నవరసాలు.. నవకథలు.. శృంగారం .. 1.

రచన: రజనీ శకుంతల

అది ఒక ఇదిలే…!!

“ప్లీజ్ బామ్మా! నా మాట విను. అందరిలో నాకు ఇలా ‘కార్యం’ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. చెప్తుంటే వినవేం.. కాలం మారింది. ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేస్తా.. నైట్ అక్కడికి వెళ్తాం. తెల్లారి వచ్చేస్తాం. ఇలా అందరిలో నా పెళ్ళాన్ని అలంకరించి, పాల గ్లాసుతో గదిలోకి పంపడం లాంటివి ఏం వద్దు… ” రుషి బామ్మ వింటుందనే నమ్మకం లేకున్నా తన ప్రయత్నంగా మరోసారి చెప్పి చూసాడు.
“ఒరే మనవడా! నువ్వీ విషయంలో ఏం చెప్పినా నేను వినను… ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇలాంటివి మన ఇంటా వంటా లేవు. కార్యం సంగతి పెద్దలు చూసుకుంటారు. మా అచ్చటా-ముచ్చటా తీరొద్దా?” అంది బామ్మ. తన మాటకు తిరుగు లేనట్టుగా.
“బామ్మా! నువ్వు ఆర్.జి.వి లాగా మొండిదానివి . చెప్తే అర్ధం కాదు..”
“ఆర్.జి.వి. .. ఎవడ్రా?” బోసినోటితో నవ్వుతూ అడిగింది.
“ఉన్నాడులే.. నీలాంటి మొండివాడొకడు” విసుక్కుంటూ అక్కడినుండి వెళ్లిపోయాడు.
వెనకనుండి బామ్మ గట్టిగా “ఆఈసు నుండి కాస్త త్వరగా రా.. కావాలంటే వచ్చేటప్పుడు నాలుగు కిలోల స్వీట్లు, బుట్టేడు మల్లెపూలు తేవడం మర్చిపోకు… ” అంది ఆర్డర్ వేస్తూ ..
“ఈ పెద్దోళ్ళున్నారే..” అనుకుంటూ రుసరుస వెళ్లిపోయాడు రుషి.
***
అసలు విషయానికి వస్తే….
రుషికి, అనూషితో పెళ్ళయింది.
శోభనం ముచ్చట, బంధుమిత్రుల సమక్షంలొ ఆ రోజు జరగనుంది. అక్కడే పేచీ వచ్చింది రుషికి, బామ్మకీ. అందరికీ చెప్పి, అందరూ చూస్తుండగా అమ్మాయిని గదిలోకి పంపి, తెల్లారి అందరూ తమని చూస్తుంటే సిగ్గుతో చితికిపోయి… చాలా ఎంబరాసింగ్‌గా అనిపించింది రుషికి.
ఈ హంగామా అంతా ఇష్టం లేని రుషి, సింపుల్‌గా నైట్ హోటల్‌కి వెళ్ళిపోదాం అని ప్రిపేర్ అయ్యాడు.
ఇప్పుడు బామ్మ ఒప్పుకోవడం లేదు.
అదీ సమస్య..
******
సాయంత్రం ఆరుగంటలు కావొస్తుంది.. ఇల్లంతా హడావిడిగా ఉంది.
శోభనం గది అలంకరిస్తున్నారు బామ్మ పర్యవేక్షణలో. గులాబీలూ, సన్నజాజులూ, విరజాజులు, లిల్లీ పూలతో రుషి గదిని డెకొరేట్ చేయిస్తోంది బామ్మ.
పెళ్లికూతురు అనూషని శోభనపు పెళ్ళికూతురిగా ముస్తాబు చేస్తున్నారు. తెల్లని పట్టుచీర, పొడుగాటి వాలుజడలో ఇంకా పూర్తిగా విచ్చుకోని మల్లెల మాలలు, కాళ్లకు పారణి, మెడలో తాళి, మొహంలో కదలాడుతున్న నునులేత సిగ్గుతో బంగారు బొమ్మలా వుంది అనూష.
అమ్మో! అమ్మాయికి దిష్టి తగులుతుంది అని అప్పటికి రెండుసార్లు దిష్టి తీసేసింది బామ్మ..
సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. బామ్మ లిఫ్ట్ చేసింది.
రుషికి యాక్సిడెంట్ జరిగింది. స్టార్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసారు. త్వరగా రమ్మని ఎవరో చెప్పారు.
బామ్మకు టెన్షన్ పెరిగింది. రుషి తల్లి ఏడుపు మొదలెట్టింది. తండ్రి బాధలో ఉన్న కనపడనీయలేదు.
అనూష షాక్ తిన్నట్టు వుండిపోయింది.
పది నిమిషాల్లో అనూషని ఇంట్లోనే ఉంచి అందరూ హడావిడిగా హాస్పిటల్ కు పరిగెత్తారు.
***
రాత్రి తొమ్మిదవుతుండగా మెలకువ వచ్చింది రుషికి. కళ్లు తెరవగానే తనవంకే ఆందోళనగా చూస్తున్న బామ్మ, అమ్మానాన్న కనపడ్డారు
“ఏంట్రా రుషి..! ఏవిటిదంతా? ఎవరి దిష్టి తగిలిందో … ఇంకా నయం. బ్రతికి బయట పడ్డావ్. ఏడుకొండలవాడా.. నడిచి కొండెక్కి వస్తా స్వామి…. అందరూ బయటికి వెళ్లండి. రాత్రికి నేనుంటా వీడిని చూసుకుంటూ” అంది బామ్మ.
“ఒసే బామ్మ.. అనూని వుంచవే. ఆ దాక్టరుతో అదీ మాట్లాడాలంటే నీ వల్ల కాదు.” అని ప్రాధేయపడ్డాడు రుషి.
అదీ నిజమే అనిపించింది బామ్మకు. కానీ డౌటనుమానంగా.”ఎలా వుంచనురా.. ఇంకా కార్యం కూడా కాకుండా.. ఇద్దరూ ఈ హాస్పిటల్ రూంలో ఎలా ఉంటారూ…” పాయింట్ లాగింది బామ్మ.
“నీ కార్యాన్ని కాకులు ఎత్తుకుపోనూ.. ఓ పక్క నా నడుం విరిగి నేను ఏడుస్తుంటే.. ఇప్పుడా సంగతి ఎందుకే?. కాస్త బాత్రూంకి అదీ హెల్ప్ చేయాలన్నా అనూష ఉంటే బెటర్ కదా.. “అంతూ కష్టపడి ఒప్పించాడు రుషి.
బామ్మకి ఒప్పుకోక తప్పలేదు.
***
నగరంలోనే అతి ఖరీదైన హాస్పిటల్ అది. స్టార్ హోటల్ రేంజిలో వుంది. ప్రతీ గదిలో కలర్ టీవీ, ఫ్రిజ్, ఏ.సి. బాత్రూంలో టబ్.. బెల్ కొడితే వచ్చే అటెండర్సూ, వాట్ నాట్.. హాస్పిటల్ అన్నమాటేగానీ, ఫైవ్ స్టార్ హోటల్‌లాగే వుంది. రుషికి జాగ్రత్తలు చెప్పి, అనూషని పంపిస్తామని చెప్పి అందరూ ఇంటిదారి పట్టారు.
అనూష సింపుల్‌గా తయారయి హాస్పిటల్‌కి బయలుదేరింది. రుషి ఆమెకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.
భర్తను అడ్మిట్ చేసిన గదిలోకి అడుగుపెట్టిన అనూష కుర్చీలో కూర్చుని తాపీగా పేపర్ చదువుతున్న రుషిని చూసి ఆశ్చర్యపోయింది.
“యాక్సిడెంట్ అన్నారు” కదా అనుకుంది. బాండేజీలతో బెడ్ మీద సెలైన్ ఎక్కించుకుంటూ వుంటాడనుకుంది.
“వెల్‌కం అనూ… ఇఫ్పుడు మనం ఒక స్పెషల్ చోటికి వెళుతున్నాం.!” అన్నాడు
అప్పుడు టైం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలు.
“ఇప్పుడా… ఎక్కడికి.. ఎందుకు ?” ఆశ్చర్యంగా అడిగింది అనూష.
“ఫస్ట్ నైట్.. ఫినిషింగ్ టచ్..”అన్నాడు.
“మరి మీకు యాక్సిడెంట్?”
“అదా.. బామ్మ ఒప్పుకునే రకం కాదని ఇలా ప్లాన్ చేసా..”
“అంటే…?”
“బామ్మ మనల్ని గంగిరెద్దుల్లా తయారు చేసి , అందరినీ పిలిచి, బొట్టు పెట్టి శోభనం ఏర్పాటు చేయడం నాకిష్టం లేదు. అందరిలో ఎంత ఇబ్బందిగా ఉంటుంది. హాయిగా మనమిద్దరమే ఉండాలి. ఎవరికీ చెప్పనవసరం లేదు.. అందుకే ఈ యాక్సిడెంట్ డ్రామా ఆడాను… హాస్పిటల్ లో జాయిన్ అయి తర్వాత స్టార్ హోటల్ కి షిఫ్ట్ అవుదాం. మళ్లీ పొద్దున ఆరుగంటలకల్లా ఇక్కడికొచ్చేసి, డిస్చార్జ్ అయి ఇంటికెళ్లపోదాం. .. ఎలా ఉంది నా సెటప్..?” బుగ్గ గిల్లుతూ అడిగాడు.
“ఓ..కే… గానీ.. పాపం.. బామ్మ..!” అంది.
“పాపం లేదు.. పుణ్యం లేదు.. బామ్మా లేదు.. పద..” అంటూ రుషి అనూష చేయి పట్టుకుని బయటకొచ్చాడు. రిసెప్షన్ లో కీస్ ఇచ్చి హోటల్ కి బయలుదేరారు.
భర్త వుద్ధేశ్యం అర్ధమవ్వటంతోనే అనూష బుగ్గల్లో సిగ్గులు పూసాయి.!
మల్లెలు మురిసాయి.. జాజులు విరిసాయి. ప్రేమ వరదలైంది. ప్రాయం పరుగులు తీసింది.
కిటికీ బయట చంద్రుడు కూడా వెన్నెలని మరింతగా వికసింపచేసాడు.