హిమవత్పద్యములు-2

 

రచన:  జెజ్జాల కృష్ణ మోహన రావు

 

కందగీతి – బేసి పాదములు – తేటగీతి మొదటి మూడు గణములు, సరి పాదములు – తేటగీతి పాదము

ప్రేమ యామనిన్ బెంపొందు

ప్రేమ నీరామనిన్ నిండి – పెల్లుబుకును

ప్రేమ శిశిరపు రంగులౌ

ప్రేమ హేమంత కాలపు – వెచ్చదనము

 

కమలగీతి – సూ/సూ/సూ – సూ/సూ

రవి వెలుంగు తగ్గె – రాత్రి హెచ్చె

భువిని చెట్టులెల్ల – మ్రోడువారె

దివిని పులుఁగు వలను – దెసకుఁ బోయె

అవుర హిమము గురియు – నవనిపైన

 

కవికంఠభూషణము – స/జ/స/స/స/జ/గ 19 అతిధృతి 177900 (ప్రాసయతి)

మలపైన మంచు – చలి నిండెను గం-బళ మొండు కావలెన్

జలిలోన వేడిఁ – గలిగించఁగఁ గౌ-గిలి నాకు నీవలెన్

మెలెమెల్లగాను – నళిణేక్షణ న-న్నలరించ రావలెన్

జలి పారిపోవు – వలపందున వె-న్నెలఁ జిల్కి పోవలెన్

 

కాంచన – భ/న/య/లల UIIII – IIU UII 11 త్రిష్టుప్పు 1663

మంచు విరులు – మణులై పూచెను

కాంచన రవి – కళలన్ దోఁచెను

చంచలముగ – జలముల్ బారఁగ

కాంచ నుషయు – కవితాకారము

 

కుముద – న/భ/న/భ/న/న/న/లగ III UII III UII – III IIII IIIU 23 వికృతి 4193684

మలలపై మెల కురిసె వెన్నెల – మసృణ హిమములు మెఱయఁగా

కొలనిపై మెల కురిసె వెన్నెల – కుముదములు పలు తడియఁగా

వెలఁదిపై మెల కురిసె వెన్నెల – విరుల సరములు వెలుఁగఁగా

కలలపై మెల కురిసె వెన్నెల – కవనములు పలు చెలఁగఁగా

 

గీతిక – బేసి పాదములు – ఇం/సూ/ఇం, సరి పాదములు – ఇం/ఇం – సూ/ఇం

సుమముతో రంగవల్లులే

యమరు నీ మనసులో – నమరవల్లిగా

హిమముతో స్ఫటికవల్లులే

యిముడు నీ మనసులో – హేమవల్లిగా

 

గీతికాకందము – బేసి పాదములు – ఇం/సూ/ఇం, సరి పాదములు – ఇం/ఇం/సూ – సూ/ఇం

గీతికాకంద మందమై

ప్రీతితో వ్రాయనా నీకుఁ – బ్రేమఁ బాడనా

శీతల మ్మయ్యె భూమి, యీ

చేతమో యయ్యెఁగా వేడి – చెలియ తియ్యఁగా

 

గుణ “వృత్త్తము” – 1,2,4 పాదములు – చ/చ/చ/గ, 3 పాదము – చ/చ/చ/భ

కలలో వ్రాసిన – కవితయు నా

యలలో యనఁగా – నలరెనుగా

మలపైఁ దెల్లని – మంచు హసించెను

తళతళ లాడుచుఁ – దళుకులతో

 

చమరీచర – న/న/ర/న/ర III III UI – UIII UIU 15 అష్టి 11968

కలల కడలిలోనఁ – గామమణు లుండునా

మలల పయిన మంచు – మానికము లుండునా

శిలల హృదయమందుఁ – జేతనము లుండునా

పిలుపు సడులయందుఁ – బ్రేముడియు నుండునా

 

చామరము – ర/జ/గ UI UI UIU 7 ఉష్ణిక్కు 43

నింగిలోని యంచులా

శృంగమందు మంచులా

భృంగమందు వన్నెలా

రంగులందుఁ జిన్నెలా

మ్రంగు పూలతీగలా

గంగనీటి పొంగులా

కొంగ ఱెక్క ఱింగులా

నన్ గనంగ రా హలా

 

జగతీకందము – ప్రతి పాదారాంభములో జ-గణము, మిగిలినవి కంద పద్యపు లక్షణములు

దిగంతమం దుదయించెను

జగమ్మునకు వెలుఁగు నిచ్చు – సవితృఁడు మఱలన్

నగమ్ము వెలింగె మణులన

జిగేలుమని హిమము మెఱయఁ – జెలువముతోడన్

 

జలదరసితా – న/స/య/య/లగ IIIII UIU – UIU UIU 14 శక్వరి 4704

గగనమునఁ జంద్రుఁడా – కంటివా నావిభున్

పొగలవలె మంచులో – మోహనుం డెక్కడో

రగిలె నొక జ్వాలయే – రాత్రి యీ డెందమం

దగపడఁడు వాఁడు నా – యాశలే ధూపమా

 

తేటగీతి –

రంగు రంగుల టోపీల – హంగు మీఱ
దాల్చి రాచిన్ని పిల్లలు – దలలపైనఁ
గేక వేసిరి చెంపలఁ – గెంపు లలర
మంచు బంతుల నాడిరి – మలసి కలిసి

 

తేటగీతి వద్యము – (వద్యము – వచన పద్యము)

కరిగిపోయాయి మెల్లగా

కళ్ల యెదుట కనబడే మంచు కుప్పలు

కలుగుతుంది మనకు సందేహము

అసలు మంచు

రెండు రోజులకు ముందు పడినదా

రుజువు లేదు

 

అసంపూర్ణ తేటగీతి వద్యము – (వద్యము – వచన పద్యము)

వదలినది అనుకొన్నాము

వదలలేదు

నేను ఉన్నాను అంటుంది

మేను చలికి వణికి పోతుంది ఇంకా

చివరికి గెలుపు చలికి

హేమంత ఋతువుకు!

 

తేటగీతి – మధురగీతి (త్ర్యస్రగతిలో)

మధురగీతి – సూ/సూ/సూ – సూ/సూ/సూ

తేటగీతి – సూ/ఇం/ఇం – సూ/సూ

మమత నిండిన చిన – మాట – మధురతరము

కమలనేత్రుఁడు నను – గాంచఁ – గలుగు వరము

హిమము గురిసెను ధర-యెల్ల – హేమమయము

రమణ రా గృహమవ – రమ్య – రాసమయము

 

తేఁటిబోటి – ఆటవెలఁది బేసిపాదము + చంద్రగణము – సూ/సూ/సూ – ఇం/ఇం – చం

చెంగుమంచు నడచు – చిన్న దూడలు లేవు – సీమయందు

చెఱకు లేదు పళ్ల – కొఱకఁగా నిచ్చట – దొఱకవే

భోగి మంట లేదు – ప్రొద్దుట వాకిలి – ముందు జూడ

నిది ప్రతీచి, ధవళ – హిమము నిండిన దీర్ఘ – హేమంతము

 

దమనక – న/న/న/లగ 11 త్రిష్టుప్పు 1024

త్ర్యస్ర గతిలో – III III – III IU

సుమము విరియ – సొగసు గదా

హిమము గురియ – హితవు గదా

విమల మతియు – వెలుఁగు గదా

కమలనయనుఁ – గనుము సదా

 

పై పద్యమే చతురస్ర గతిలో – IIII IIII IIU

సుమములు విరియఁగ సొగసుల్

హిమములు గురియఁగ హితవుల్

విమలము మతి యవ వెలుఁగుల్

గమలపు చెలువము గనులన్

 

ద్విపద – ఇం/ఇం – ఇం/సూ

కురియుచుండెను మంచు – కుప్పలై చూడు
మురియుచుండుట యింట – మోదమే నేఁడు
బడి మూఁతపడ నేఁడు – బాగుబాగనిరి
విడకుండ టీవీని – బిల్లలు గనిరి

 

ఏ చిత్రకారుండు – నెట్లు చిత్రించె

యీ చిత్రమును జాల – యింపు మీఱంగ

 

ఈ హేమలతలందు – నెంతయో సొంపు

నీహారహారమ్ము – నిండు సౌష్ఠవము

 

నటహంస – ర/త/న/స/గ UIU UUI – IIIII UU 13 అతిజగతి 2019

ఆడనా నృత్యమ్ము – నతి మధుర రీతిన్

పాడనా గీతమ్ముఁ – బరవశము సేయన్

నేఁడు హేమంతమ్ము – నిశి బిలుచుచుండెన్

నేఁడు రా నన్ గూడ – నెనరు మది నిండున్

 

నవవత్సర – న/వ/వ/త/స/ర లేక న/జ/మ/న/త/గ  IIII UIU – UUI IIU UIU 16 అష్టి 20016

హిమములు రాలఁగా – నీభూమి ధవళ మ్మయ్యెఁగా

సుమతతి యింటిలో – సొంపార విరియన్ రంగులే

ద్యుమణియు వెచ్చఁగా – ద్యోతమ్ము నొసగన్ హాయియే

రమణియు రమ్యమై – రాగమ్ము పలుకన్ జందమే

 

 

సీతారామ కల్యాణం

రచన: కిభశ్రీ

రండి కన రండి – – – – తరలి రండి
రండి రండి రారండి – – – – కదలి రండి

నవ్య యుగములో అందరూ
సవ్యముగా జరుపుకునేది
దివ్యానుభూతిని ఇచ్చేదీ
భవ్యమైన కల్యాణమే ఇది || రండి||

తుల్యమే లేని సీతమ్మే
కౌసల్యతనయుని చేరునటా
కల్యాణం చూసినవారికి
కైవల్యం తథ్యమటా

ధరణిని జనకుని పట్టియట
ఆ సిరియే- – – పెండ్లికూతురట
సరియైనవాడె జోడట
ఆ హరియే – – -పెండ్లికొడుకట

కుందనపుబొమ్మ సీ-త-మ్మ – –
సుందరాంగుడా రామునిపైనా
అందరి చూపులు నిలుచునట – –
విందది అందరి కనులకటా

ఎదురుకోలుకై నిలిచిరట – – –
ఎదురెదురుగా వధూ వరులట
పదిరకాల పూలున్న మాలలను –
పదిలంగా మార్చుకునేరట

సిరిపతికే – – – దానమిచ్చేటి
భాగ్యము జనకునిదేనట
నరుడిగ చేరిన నారాయణునికి – – –
కన్యా – – దానమిచ్చునట

బంగారు కలశముతో – – – –
గంగాజలమును పోసి
మంగళవాద్యమె మోగగా – –
మంగళకరునికి కన్యనిచ్చునట

నడిచెద నీతో జీవితాంతమూ – – –
విడువకుండ యను బాసతో
ముడులు మూడు విడిపోకుండా – –
వడిగా రాముడు వేయునటా

మూడులోకములనుంచి తెచ్చిరట
ఏడువర్ణముల ముత్యాలెన్నో
వాడి అన్నిటిని తలంబ్రాలుగా
ఆడుకునేరా వధూవరులంట

సంధించిన తమ చూపులతో
బంధించిన తమ మనసులతో
అందరికీ ఆదర్శము కాగాల
బంధములో ముడివడేరటా

సచ్చరిత్రులేనాడైనా
సత్యమునెరిగిన జనకులేనట
సన్మార్గమునే నడచచూ
సత్యకర్మమను నాగలి వాడుచు
సద్భావమనే బీజములు నాట
సత్ఫలకన్యయె సీతమ్మటా
సత్పురుషునికే కన్యనీయగ
సదవకాశమీ పెండ్లియటా

అమ్మలు అయ్యలు స్వయముగా
సీతమ్మా రాములు వస్తారంట
నమ్మినవారికి కనిపించేరట
నమ్మనివారు అభాగ్యులేనటా

తల్లి *వేరు*

రచన:సందిత

ధరణిన్ చాలా గొప్పది
తరుమూలముతరచిచూడతగువిధిఁ! బీజాం
కురమదిప్రథమాంకురమది!
గురుతరమగుప్రథమమూల గుణితంబదియౌ!

బలమునొసంగెడుదుంపగు
తొలగింపగరోగమోషధులరూపమ్మౌ
తెలియసుగంధపువేరగు
పలువిషములవిరిచివేయుపరమామృతమౌ

పైపైకెదుగన్ జూడక
పైపైమెరుగులనుకోరిపరుగులనిడకన్
పైపైకెదుగన్ సహజుల
కాపై జూపకనసూయ నాహారమిడున్

స్వర్గసుగంధసుధలఁతరు
వర్గోద్భూతప్రసూనఫలరూపమునన్
దుర్గమమైనట్టియథో
మార్గంబందునచరించిమరియందించున్

సౌందర్యముమాధుర్యము
విందులుబడసినవియెదుగవేరులవలనన్
పొందుచునథోగతులనటు
నందించున్ సాయమటుల నమ్మనఁవేరుల్

పొగడునులోకంబారయ
నగుపించగవృక్షశోభనాహాయనుచున్
దిగుచున్ తానెదిగించును
సుగుణమ్ములరాశి *వేరు*సూనృతమరయన్

దిగుచున్ తొలుచుచుజేరును
పగలున్ రేయనకఁబూని పాతాళమ్మున్
భగవంతునిపాదమ్మది
సగమాకసమందు సగము సాగుచు భూమిన్ !