మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయాజలతారు

సమీక్ష: సి. ఉమాదేవి

రచయిత సలీంగారు జగమెరిగిన రచయిత. తన సాహితీ ప్రస్థానంలో ఎన్నో కథాసంపుటాలను, నవలలను, కవితాసంపుటాలను పాఠకులకందించారు. ప్రతి రచనలోను నేటి సామాజికాంశాలపై రచయిత మనసులోని అంతర్మథనం స్పష్టంగా గోచరిస్తుంది. వీరు అందుకున్న పురస్కారాలు, రచనలకు బహుమతులు వీరిలోని సాహితీ ప్రజ్ఞకు కొలమానాలని చెప్పవచ్చు. రచయితలోని అక్షర స్పందన పాఠకుడి ఆలోచనా వల్మీకాన్ని కదిలిస్తుంది. కథలు చదివాక అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. రచయితతోపాటు మనకు కూడా సమస్యలకు పరిష్కారాన్ని అందరికి తెలియచేయాలనే తపన మొదలవుతుంది. మరి అలాంటి కథలను తరచి చూడాల్సిందే.
కళ తప్పుతోంది కథ ఊహించని ముగింపుతో కలవరానికి గురిచేస్తుంది. ప్రాణస్నేహితుడైన సత్యమూర్తి స్నేహితుడైన రఫీని నాటకంలోని రాముడి పాత్రకు అంగీకరించకపోవడం రఫీనే కాదు పాఠకులను ఆశ్చర్యపరుస్తుంది. చిన్ననాడు రామలక్ష్మణులుగా ఎన్నో నాటకాలలో నటించిన ఇద్దరు రామలక్ష్మణులని అందరిచేత పిలిపించుకున్న వైనం కథ ప్రారంభాన్ని ఆహ్లాదంగా చూపినా చివరకు సత్యమూర్తిలో, బాల్యంలోని కల్మషంలేని ఆప్యాయత కనుమరుగైన తీరును తెలుసుకున్నప్పుడు కళలకు కూడా కులం, మతం, ప్రాంతీయ బేధాలు అడ్డుకట్టలవడం రఫీని కలవరపరుస్తుంది. అయితే కళలకు కాక కళాకారుల మనసులకు తుప్పుపట్టిందని మరో స్నేహితుడు సాయి కథ ముగింపులో పలకడం ఆలోచించవలసిన అంశమే. సాలభంజికలు మరో వినూత్నమైన కథ. భార్యాభర్తలిరువురి ఆలోచనాసరళి భిన్నమైనదే. పెళ్లికి బహుమతి కొనడంలో పెళ్లి జరుగుతున్న ఇంటివారి ఆర్థిక పరిస్థితికి తగినట్లు ఉండాలనేది భర్త ఆలోచన. అయితే తమ ఇంట పనిమనిషిగా తమకన్నిపనులు చక్కగా చేస్నున్న ఐలమ్మ ఇంట్లో ఆమె కూతురికి జరుగుతున్న పెళ్లికి తగిన సహాయం చేయాలనే భార్య. విభిన్న భావాల నడుమ తమని పెళ్లికి పిల్చిన బిల్డర్ ఏర్పాటు చేసిన కళ్యాణమంటపానికి ఇద్దరు చేరుకుంటారు. బహుమతిగా ఇరవై ఐదువేలు ఇవ్వాలనుకున్న భర్త ఆలోచనను మలుపుతిప్పిన ఘటన అక్కడ తటస్థపడుతుంది.
నలుగురమ్మాయిలను కదలని రాతిబొమ్మలలా నిలుచోబెట్టి వారి కష్టాన్ని గమనించని ఆర్భాటపు పెళ్లిలో తానుండలేనని భార్య వెనుతిరుగుతుంది. బహుమతి డబ్బునిచ్చి అక్షింతలు వేసి వస్తానన్న భర్తతో వారు ఖర్చు చేసిన కోట్లముందు పాతికవేలు పంటికిందకి కూడా ఆనవు అని చెప్పి డబ్బును ఐలమ్మకు ఇవ్వాలంటుంది. భార్య ఆవేదనను భర్త అర్థం చేసుకోవడం కథకు చక్కటి మలుపవుతుంది.
అలజడి కథ నేటి సమాజతీరుతెన్నులకు అద్ధంపట్టి చూపింది. అవినీతి సొమ్మును కార్యాలయంలో అందరు పంచుకున్నా ఆ సొమ్మును అతడికి వాటాగా ఇచ్చినపుడు వద్దంటాడు ఆ ఆఫీసులో పనిచేసే ప్యూను మోజెస్. జీతంతోపాటు గీతం కూడా సహజమే అని నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాడు ఆ ఆఫీసు సూపరింటెండెంట్ చక్రపాణి. మోజెస్ స్థితిగతులను తెలుసుకోవాలంటూ మిగతావారికి చెప్తాడు. చక్రపాణి పెళ్లికి వెళ్తాడు. మోజెస్ చెప్పినట్లు తనను , తల్లిని తీసుకెళ్లడానికి బ్యాటరీ కారు వస్తుంది. ఆ కారు నడిపే వ్యక్తి సైతం చక్రపాణి దగ్గర డబ్బులు తీసుకోడు. నేను చేస్తున్నపనికి నాకు జీతం అందుతోంది. మీ దగ్గర ఏమి తీసుకున్నా యాచన క్రిందకే వస్తుందనడం చక్రపాణిలో అలజడిని రేకెత్తిస్తుంది. ఆఫీసుకు చేరాక అవినీతి డబ్బును ముట్టుకోవడం మానేస్తాడు. అతడు దర్పంగా కూర్చోవడం మోజెస్ గమనించడం కథకందిన చక్కని ముగింపు.
మాయజలతారు సమాజంలో జరుగుతున్న విపరీతధోరణిని పాఠకులు సైతం ఔరా అనుకునేలా చదివించిన అద్భుతమైన కథ. ఇక ప్రయాణం కథ ఎవరికైనా ఆచరించదగ్గ నీతిపాఠమే. సివిల్ సర్వీస్ పరీక్షలు వ్రాసి రైల్వే సర్వీస్ కు ఎన్నిక కాబడ్డ కొడుకును తనతోపాటు నాన్ ఏసీ బోగీలో ప్రయాణం చేయించిన తండ్రి పేద ప్రయాణీకులకు లేని సౌకర్యాలను, వారి అవస్థలను కొడుకు దృష్టికి తీసుకుని వస్తాడు. తండ్రి ఉదాత్తమైన కోరికను గుర్తుపెట్టుకుంటానని కొడుకు తండ్రి చేతిలో చేయి వేసి ప్రమాణం చేయడం ప్రయాణం కథకు చక్కని ముగింపు.
మరణం మనిషికి చివరి మజిలీ. అయితే మారుతున్న వ్యవస్థలో పేదవాడికి, ధనికుడికి నడుమ గీయబడ్డ గీత కడకు సమాధుల్నిసైతం ఆర్భాటంగా కొనుక్కునే వారికి ప్రత్యేకంగా కేటాయించడం వ్యాపారానికి మరణంకూడా వినియోగపడుతోందే అనే బాధ మనసును కల్లోలపరుస్తుంది.
శాశ్వతనిద్రను గురించిన భయం మనిషికి సహజ నిద్రను దూరం చేస్తుంది. అయితే అందరిలోను ఈ భయం ఉండదు. సున్నితమైన ఆలోచనలతో అడుగడునా మరణం గురించి ఉలిక్కిపడే వారికది నిత్య గరళమే. బతుకొక పండుగ కథలో మనిషి మనసును పసిపాపలా భద్రంగా కాపాడుకుంటే ఏ భయాలు దరిచేరవంటారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని వసంతంతో నింపాక శిశిరానికి అవకాశమెక్కడుంటుంది అని వారు రూపొందించిన పాత్ర ద్వారా వినిపించడం పాఠకులకు అందించిన సుగంధ పరిమళమే కదా!ఇటువంటి మరెన్నో చక్కని కథలున్న మాయజలతారు కథాసంపుటం అందించిన సలీంగారికి అభినందనలు.

విశ్వనాథ వారి భ్రమరవాసిని

రచన: రాజన్


అలల సవ్వడులలతో హోరెత్తుతూ.. తిరిగి నెమ్మదించి, ప్రశాంతత పొందిందనే లోపుగనే మరింత ఉధృత కెరటాలతో ఎగసిపడి, కల్లోలము నుండి ప్రశాంతతకు, ప్రశాంతత నుండి కల్లోలానికి తన పథాన్ని మార్చి మార్చి, నురగల నగవులో లేక నశ్రువులో చిందించే సాగరానికి సైదోడు… మనిషి మనస్సు. ఆలోచనల, కోరికల పుట్టినిల్లయిన అటువంటి మనస్సును గూర్చి, దాని స్వభావమును గూర్చి ఒక ఆలోచన చేయించి, ఆంతరిక ప్రపంచ జ్ఞానమును, బాహ్య ప్రపంచ విజ్ఞానమును కలబోసి, అక్షరములుగా పోతపోసి మనకందించిన ఋషులవంటి మహనీయులున్నారు. గత వంద, రెండువందలేండ్ల కాలములో చూసినట్లయితే అటువంటి మహారచయిత ఒకరు పవిత్ర కృష్ణానదీ తీరాన జన్మించి, మనసుకు ఆహ్లాదాన్ని, బుద్ధికి విజ్ఞానాన్ని, ఆత్మకు ఆనందాన్ని కలిగించగల తన రచనలతో కవికుల సమ్రాట్టుయై, రాశీభూత విజ్ఞానమై, ఆంధ్రుల మహద్భాగ్యమై ప్రకాశించెను. ఆ ప్రభావశీల ప్రకాశరేఖలు నేటికీ అనేకుల మనస్సులలో.. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గురువరేణ్యుల రూపమున మూర్తికట్టి వెలుగొందుచున్నవి. పురాణవైర గ్రంథమాల, కాశ్మీర రాజవంశ చరిత్ర, వేయిపడగలు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, చెలియలికట్ట మొదలైన అనేకానేక నవలలు కలియుగ రాజవంశ నిజ చరిత్రను, లౌకిక విజ్ఞానాన్ని, ఇంకా మనిషి ఆలోచనపు లోతులను మనకందిస్తాయి. అంతేకాక మనస్సును పట్టి కుదుపుతూ, దానిని దాటి మరింత లోతుగా వెళ్లడానికి ప్రయత్నించే భావనాతరంగమొకటి పుస్తకం చదువుచున్నంతసేపు మనలో కదలాడుతూనే యుంటుంది. అటువంటి రచనలలో నొకటి… కాశ్మీర రాజవంశ చరిత్ర నందలి ఆరవ మరియు ఆఖరి నవల… భ్రమరవాసిని.
కాశ్మీరాధిపతి రణాదిత్యుని శోభనపు గదిలో కథ మొదలౌతుంది. నూత్న వధువు రణరంభాదేవి రాకకై ఎదురుచూస్తున్న రణాదిత్యుని మనస్సును… అప్పటివరకూ జరిగిన సంఘటనలు, గోడలపై చిత్రాలు, ద్వారబంధము ప్రక్కనే ముమ్మూర్తులా రణరంభాదేవిలా యున్న ఒక శిల్పము కలవరపెడుతుంటాయి. అటుపై ఆమె గదిలో అడుగిడిన తదుపరి వారి మధ్య జరిగిన సంభాషణ, రాజును మరింత విస్మయానికి గురిచేస్తుంది. రణరంభాదేవి, తాను సాక్షాత్ శ్రీమహాలక్ష్మి స్వరూపమగు భ్రమరవాసినినని, రణాదిత్యుని కోరిక మేరకు రణరంభగా జనించి ఆతని భార్యనైతినని, ఆమెనాతడు స్పృశింప సాధ్యము కాదని చెప్పును. అంతియేకాక, అతనిని మోహవశుడను జేసిన ద్వారబంధము దగ్గరి ప్రతిమను మంచముపై పరుండబెట్టు మని చెప్పి, తాను భ్రమరమై భ్రమరీనినాదము జేయుచూ ఆతనిని నిద్రపుచ్చుటతో కథ ప్రథమ భాగము పూర్తియగును.
పెండ్లి జరిగిన కులూతదేశము నుండి కాశ్మీరానికి బయలుదేరిన పెండ్లి బృందముతో కులూతదేశ యువరాణి అమృతప్రభ ను కూడా తీసుకువచ్చిన రణరంభాదేవి, మార్గమధ్యములో సర్వాంగీకారముతో ఆమెకు రణాదిత్యునకు వివాహము జరిపించును. శ్రీనగరము చేరిన పిమ్మట రణాదిత్యుడు స్వప్నములలో తన పూర్వజన్మ కథయంతయూ తెలుసుకొనును. అతడు క్రితం జన్మమున మధుసూధనుడను సంపన్న బ్రాహ్మణుడు. పెద్దల బలవంతము మీద ఇష్టము లేకున్ననూ రూపవతి కానటువంటి నీలమణిని వివాహమాడతాడు. నాలుగేండ్ల వారి వివాహజీవితములో అతడామెతో సంసార సుఖమనుభవించడు. కాలక్రమాన వ్యసనపరుడై ఆస్థి యందలి పెద్ద మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. నీలమణి మాత్రం భర్త తెచ్చిన మహాలక్ష్మీ విగ్రహాన్ని ధూపదీపనైవేద్యాలతో ఆరాధిస్తూ, శుక్రవారం పూజలు చేస్తూ తన్మయత్వాన్ని అనుభవిస్తుంటుంది. భార్యను అమ్మాయని పిలుచుట ప్రారంభించిన భర్తతో నీలమణి నిష్ఠూరంగా అన్నట్టి “మీకు అమ్మ భార్య. భార్య అమ్మ” మాటలు ఒక శాపంగా పరిణమించి భవిష్యద్కథకు దోహదం చేస్తాయి. మధుసూధనుడు పరివర్తన దశలో యుండగానే, నీలమణి తన సవతి తల్లి అసూయకు బలైపోతుంది. విరక్తుడై తిరుగుచున్న మధుసూధనుడు, అనుకోకుండా ఒకనాడు తన ఇంట పూజామందిరంలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని చదువుతాడు. అందులో వివరింపబడిన అతి క్లిష్టమయిన భ్రమరవాసినీ వ్రతాన్ని బూని, ఇంటినీ, ఉరునీ విడచి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, చివరకు దేవిని ప్రసన్నం చేసుకుంటాడు. అమ్మ అనుగ్రహించేవేళ సమ్రాజ్యాధిపత్యముతోపాటు, వివేకహీనుడై ఆ అమ్మనే భార్యగా కోరతాడు. దయామయి అయిన అమ్మ అనుగ్రహించి అంతర్హితురాలౌతుంది. ఇదీ రణాదిత్యుని స్వప్న వృత్తాంతం. అప్పటి మధుసూధనుడే ఇప్పటి రణాదిత్యుడు, నీలమణియే అమృతప్రభ, సాక్షాత్ శ్రీ వైష్ణవీ మహామాయయగు భ్రమరవాసినియే రణరంభాదేవి.


ఆ తరువాత రణాదిత్యునితో జైత్రయాత్ర గావింపజేసిన రణరంభాదేవి, అతనిని సామ్రజ్యాధిపతిగా, భారత చక్రవర్తిగా చేస్తుంది. చివరగా రణాదిత్యునికి పాతాళలోక వాసముననుగ్రహించి, తాను శ్వేతద్వీపమున వింధ్యపర్వత గుహాంతర్భాగములో భ్రమరవాసినిగా భక్తులననుగ్రహిస్తూ వెలుగొందుతుంటుంది. ఇదీ స్థూలంగా భ్రమరవాసిని కథ.
కథ గొప్పదనం ఒకెత్తయితే, కథకుడు దానిని నడిపిన వైనం రెండెత్తులనవచ్చును. విశ్వనాథ వారి ప్రతిరచన యందు ఒక విశిష్టత యుంటుంది. పాత్రల మధ్య సంభాషణలతో ఒక విషయాన్ని చర్చించి అవకాశమున్నంత వరకూ వాదానికిరువైపులా పదునుపెట్టించి పరుగులెత్తించి చివరకు సత్యాన్ని రూఢీ చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈ కథలో కూడా భ్రమరవాసినీ రణాదిత్యుల మధ్య సంభాషణలటువంటివే. ఇక పాత్ర చిత్రీకరణల విషయానికి వస్తే… రణరంభాదేవి దయాస్వరూపిణి, తనను కోరిన భక్తుని అవివేకాన్ని మన్నించి ననుగ్రహించిన తల్లి. అతని కోరికీడేర్చుటకు మానవకాంతగ జనించి, రణాదిత్యుని పట్టమహిషియై ఆతనికి సామ్రాజ్యత్వమును కట్టబెట్టిన వైష్ణవీ మహాశక్తి. రణాదిత్యుని పాత్ర ఓ తరహా వైచిత్రి కలిగిన పాత్ర. అతడెంతటి మహావీరుడైనప్పటికీ కథలో ముప్పావుపాలు అయ్యేవరకూ జరిగేదంతా ఎందుకు జరుగుచున్నదో, తనకు వచ్చే కలల రహస్యమేమిటో తెలియక సంధిగ్థంలో నడిచే పాత్ర. సౌందర్యం, అమాయకత్వం రంగరించబడిన పాత్ర అమృతప్రభది. భర్త తిరస్కారానికి గురైనప్పటికీ, భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, మహాలక్ష్మీ ఆరాధనలో తన్మయత్వాన్ని పొందే పాత్ర నీలమణిది. నచ్చని పెళ్లి చేసుకుని, వ్యసనపరుడై తిరిగి పరివర్తన చెంది దేవ్యనుగ్రహాన్ని పొందినవాడు మధుసూధనుడు. ఇలా ప్రతిపాత్ర అద్భుతంగా మలచబడి నడపబడినవే.
ఇది యంతా కథేమిటో చెప్పడానికి ఉపయోగపడుతుంది గానీ, కథామాధుర్యాన్ని చవిచూడాలంటే మాత్రం భ్రమరవాసిని చదవవలసినదే. తన్మయమొందిన హృదయముతో నిద్దురలో భ్రమరీనినాదము వినవలసినదే.

కథ గురించిన కథ చెబుతా – ఏడు తరాలు

రచన: ఓరుగంటి శ్రీలక్ష్మి నరసింహ శర్మ.

నాకు ఇప్పటికి బాగా గుర్తు. నన్ను చిన్నప్పుడు మా హీరో తన హీరో సైకిల్ పైన కూర్చోపెట్టుకుని ఆ రోజ నన్ను మొదటిసారి మా ఊరిలో ఉన్న ఆ లైబ్రరీకి తీసుకునివెళ్ళడం. ముప్పై రెండు సంవత్సరాల క్రితం నాకు ఆ లైబ్రరీలో తొలి నేస్తంగా మారింది ఈనాడు ఆదివారంలో వచ్చే “ఫాంటం” కధలు.
అలా మొదలైన పుస్తకాలతో నా అనుబంధం ఆ లైబ్రరీలో ఉన్న నా వయస్సుకి తగ్గ పుస్తకాలన్నింటిని చదివేసినా తగ్గలేదు. తర్వాత కాకినాడకు ఆనుకుని ఉన్న ఇంద్రపాలెంలో నేను చదువుకున్న జిల్లా పరిషత్ స్కూల్ దగ్గరే ఉన్న లైబ్రరీ నా ఆకలిని కొంతవరకు తీర్చింది.
బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలజ్యోతి చివరగా చందమామ అక్కడకు రావటం పాపం వెంటనే నమిలేసేవాడిని. రోజు రోజుకి వయసుతోపాటు పెరుగుతున్న నా ఆకలిని తీర్చటం నెలకోసారివచ్చే వాటివల్ల కాలేదు. నెమ్మదిగా వారానికోసారి పలకరించే “స్వాతి” వంటి వీక్లీలతో పాటు రోజు వచ్చే దినపత్రికల వైపుగా వేశాను అడుగులు.
అసలే నాకు ఆకలి ఎక్కువేమో దాంతో ఆ లైబ్రరీ నా ఆకలికి సరిపోవటంలేదని మా కాకినాడలోని గాంధీ పార్క్లో, అలాగే గాంధీనగర్లోనే వెంకటేశ్వర స్వామి గుడికి రెండు వీధులివతల ఉన్న లైబ్రరీలనీ వీలున్నప్పుడల్లా కాదు కాదు వీలుచేసుకుని తప్పకుండా పలకరించి నా ఆకలిని తగ్గించుకునే యత్నం చేసేవాడిని.
అలా ఏది పడితే అది చదవటం అలవాటు ఐన నాకు, నెమ్మదిగా అప్పటికే పదిమందిచేత మంచివి అనిపించుకున్నవి… అలాగే కానివి కూడా చదవటం నేర్చుకున్నాను. అప్పటికి నాకంటూ ఏఇజం లేకపోవటంతో అన్ని ఇజాలను పలకరించేవాడిని.
రోజులన్నీ ఒకేలా ఉండవు కదా…
అందుకేనేమో రామక్రిష్ణ పరమహంస గురించి చదివిన తర్వాత సన్యాసిగా మారిపోవాలి అనుకున్న నేను…
“అమ్మ” చదివిన తర్వాత కమ్యూనిష్ట్ గా మారలేకపోయాను.
ఐనా పుస్తకాలు చదివితే ఎవ్వరైనా మారిపోతారా అదంతా ఒక వెర్రి భావనే కానీ, అని నేను అనుకుంటున్న కాలంలో జరిగిందా సంఘటన.
ఓరోజు తిరుపతి-మహతి ఆడిటోరోయింలో జరుగుతున్న పుస్తకాల సంతలో అన్నింటిని కళ్ళతోనే పరీక్షిస్తూ వెళ్తుంటే నాకు కనబడిందో పుస్తకం
అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో నిషేదించి, దాన్ని వ్రాసిన రచయిత మీద ఫత్వా కూడా జారిచేయించేలా చేసిన పుస్తకం అదే “లజ్జ”.
వెంటనే ఆ పుస్తకాన్ని కొని వెళ్తున్న నన్ను ఆకర్షించింది ఇంకొకటి. ఎందుకో తెలియదు కాని గులాబీ రంగంటే ఎక్కువుగా ఇష్టపడని నేను ఆ రోజు ఆ పుస్తకాన్ని కూడా కొని ఓ శనివారం సాయంత్రాన్ని లజ్జ పుస్తకానికి అంకితం చేసేశాను. పుస్తకం చదవటం మొదలు నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. నాలో విరుద్ధమైన భావనలు నా మస్తిష్కంలో తమ ప్రభావాణ్ణి చూపిస్తుండగా చిన్నప్పుడు నేను చదువుకున్న భారతీయులందరు నా సహోదరులు అనేది మర్చిపోయి మగతుగా మతం మత్తులోకి జారిపోయాను.
లజ్జ చదివిన తర్వాత ఆ ఆరు గంటలు నన్ను నేను కేవలం ఒక హిందువుని మాత్రమే అనుకుంటూ ఉన్నవేళ ముందురోజు కొన్న ఆ గులాబీ రంగు పుస్తకం మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నట్లు అనిపించడంతో చేతిలోకి తీసుకున్నాను.
ఆ ఆదివారం నా జీవితంలో ఓ పెనుమార్పు తీసుకొస్తుందని, వ్యక్తిగా నా ఆలోచనలను మొత్తంగా మార్చేస్తుందని ఆరోజు ఉదయం లేచినప్పుడు కాని ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు కాని నాకు తెలియదు.
నాకు తెలియని, నేనెప్పుడు వినని ఆఫ్రికాలో గాంబియా అనే ఓ మారుమూల దేశంలో…
కుంటా కింటే అనే నా మిత్రుని స్వచ్చమైన స్వేఛ్చపు బాల్యంతో మొదలయ్యి, కౌమారానికి వచ్చేసరికి బానిసగా బంధీ అయ్యి, తన యవ్వన, వార్ధక్య, మలి జీవితాలను కూడా బానిసత్వంలోనే గడిపి… ఏనాటికైనా నా అన్నవాళ్ళు ఎవ్వరైనా తప్పకుండా ఈ బానిస జీవితాల నుంచి విముక్తులు అవురాతనే ఆశని వదులుకోకుండా తన రక్తం ఐన లిటిల్ కిజ్జీతో తమ మూలాలను తెలిపే కధను చెప్పినప్పటినుంచి….
బానిసగా పుట్టి, బానిసగా పెరిగి, బానిసగా బ్రతికి చివరకు స్వేచ్ఛ అనే పదం కూడా తెలియకుండానే… బానిసగానే చనిపోయిన లిటిల్ కిజ్జీ నుంచి…
ఆ కధ మళ్ళీ తన కడుపునే బానిసగా పుట్టినా, చివరకు స్వేఛ్చా వాయువులు పీల్చిన కోళ్ళ జార్జ్…
అక్కడ నుంచి చివరకు ఇదిగో ఈపుస్తక రచయిత ఐన ఆ అలెక్స్ హేలీ వరకు చేరేసరికి 7తరాలు పట్టింది.
ఏదైనా సరే మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ తెలియదు మనకు.
అలాగే ప్రకృతి ఆకుపచ్చని దుప్పటి కప్పుకుందా అన్నట్లు ఉండే ఆ ఆఫ్రికా ఖండంలోని గాంబియా అనే దేశంలో జుపూర్ అనే ప్రాంతంలో స్వేచ్ఛకు ప్రతీకలా ఉండే కుంటాకింటే… తమ పెద్దవాళ్ళ సలహాను వినని కారణంతో అప్పటివరకు తన దగ్గర ఉన్న స్వేచ్చను కోల్పోయి తన కౌమార వయసు నుండి మిగిలిన జీవితం అంతా బానిసగానే బ్రతకవలసి రావడం నిజంగానే ఓ దుఃఖం.
ఏదైనా సరే మనకు తెలియనప్పుడు దాని గురించి మనం ఆలోచించం.
ఈ భూమ్మీదకు వచ్చి తొలి ఊపిరి పీల్చినప్పటి నుంచి, తన చివరి శ్వాస వరకు బానిసగానే బ్రతికిన లిటిల్ కిజ్జి. తండ్రి మాటల్లో కథగా మారిన తమ చరిత్రను తెలుసుకుని దాన్ని తన తర్వాతి తరాలకి అందేలా చేయాలనే కోరిక తప్ప స్వేచ్ఛ గురించిన ఆలోచన కూడా తెలియకుండానే ఈ లోకం నుండి వెళ్ళిపోవడం విషాదమే.
ఆలోచన అనేది ఉంటే ఆచరణ కనబడుతుంది.
ఓ ఆఫ్రికన్ తల్లికి, యజమానిగా పిలవబడే ఓ అమెరికన్ కు పుట్టినా… తన మూలాలు అనేవి తన రంగు తెలియజేస్తూ ఉన్నా… బానిసగా పుట్టి, బానిసగా పెరిగినా… ఇష్టంతో నేర్చుకున్న కళతో బానిసత్వం నుండి విముక్తుడైన జార్జ్… కాదు కాదు కోళ్ళ జార్జ్ జీవితం నిజంగానే ఓ గొప్ప పాఠం.
ఎటువంటి పుస్తకానైనా అవలీలగా చదివేసే నేను… ఆ రోజు ఆ పుస్తకంలోని చివరి పేజీలను చదవటానికి చేస్తున్న ప్రయత్నం నా ప్రమేయం లేకుండానే ధారపాతంగా కారిపోతున్న నా కన్నీళ్ళ వల్ల కావటంలేదు.
కాని అప్రయత్నంగానే నాకు తెలియని, నేను ఎప్పుడూ చూడని ఆ ఆఫ్రికా దేశానికి నా మనస్సు వెళ్ళిపోయి మానవ నాగరికతలో తొలి ఆచారాలను గమనించేసరికి తెలిసింది నేను ఎవరినో?
నేను గోదావరి ప్రాంతాంవాడినో…
ఆంధ్రావాడినో…
హిందువునో…
భారతీయుడునో…
ఇవేమీ కాదని నేను మనిషినని… నేను మానవుడనని.
మతం కంటే… మానవత్వమే మిన్నయని.
నువ్వు క్రిష్టియన్వి అయితే బైబిల్ చదువు.
ముస్లింవి అయితే ఖురాన్ చదువు.
హిందువువి అయితే భవద్గీత చదువు.
పైవన్నీ చదవకపోయినా పర్వాలేదు ఈ జన్మకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ నువ్వు మనిషిగా పుడితే, మనిషిగా మారాలంటే మాత్రం….
“స్వేఛ్చ నుంచి బానిసత్వంలోకి, బానిసత్వం నుంచి స్వేఛ్చకు” మానవుడు చేసిన ప్రయాణానికి గుర్తుగా అలెక్స్ హేలీ గారిచే “రూట్స్”గా రచింపబడి “సహవాసి”గారి కృషితో తెలుగులోకి అనువదించబడిన “ఏడు తరాలు” చదువు.

“సరికొత్త వేకువ” – “మానవత్వాన్ని ప్రతిబింబించే కోసూరి కథలు”

సమీక్ష: డా. మంథా భానుమతి.

నర్తకీమణిగా, నాట్యగురువుగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోసూరి ఉమా భారతిగారు, గత కొద్ది సంవత్సరములుగా రచయిత్రిగా కూడా పేరుతెచ్చుకుంటున్నారు. తన రచనలలో ఒక సందేశాన్ని, ఒక విశ్లేషణను జొప్పించటం ఉమాభారతిగారి ప్రత్యేకత.

నాట్యంలో.. నర్తకిగా, గురువుగా, వ్యాస కర్తగా అనేక పురస్కారాలు, బహుమతులు, సన్మానాలు జాతీయ అంతర్జాతీయ వేదికలపై అందుకున్న రచయిత్రి కొత్త కోణం ఇది. ఈ కథల పుస్తకంలో రచయిత్రి మనోభావాలు పూర్తిగా ఆవిష్కృత మౌతాయి.

కథల్లో పాత్రలు అన్నీ మంచివే. ఎక్కడా దుష్టులు, దుర్మార్గులు కనిపించరు. విధి ఆడిన వింత నాటకాలు తప్ప. రచయిత్రి కుటుంబంలోని సభ్యులందరూ వైద్యులే కావటంతో, ప్రతీ రోజూ వారి చర్చల్లో పాల్గొంటూ ఉండటంతో, బహు విధ జ్ఞానాన్ని సంపాదించుకుని, వైద్యవిజ్ఞానాన్ని పాఠకులకు పంచడానికి ప్రయత్నం చేశారు రచయిత్రి.

అంతే కాదు వైద్య వృత్తిలో కలుగుతున్న కాలానుగుణ మార్పులని కూడా వివరించి, ఆలోచించాలిసిందేనని చెప్తారు.

ఈ కథా సంకలనంలో పది కథలున్నాయి. ప్రముఖులు రచయిత్రి గురించి రాసిన ముందుమాటలు చదువుతుంటేనే కథల మీద ఆసక్తి కలుగుతుంది.

“పుత్తడి బొమ్మ”తో ఆరంభించిన ఈ సంపుటిలో మొదటి కథలోనే ఈ ప్రపంచంలోని మంచితనాన్ని, పరమత సహనాన్ని చూపిస్తారు. అనురాగం వెల్లి విరిసే కాపురం వసంతది. అన్యోన్య దాపత్యం, అవసరమైతే అఘమేఘాల మీద వాలిపోయే స్నేహితులు, ఏ సహాయానికైనా వెనుకాడని పిన్ని, పుత్తడిబొమ్మ లాంటి ఐదేళ్ల పాప.
మరి వారికొచ్చిన సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఉందా? కథ చివర్లో దూదిపింజలా తేలిపోతుంది సమస్య.

ఒక జాబిలమ్మ.. జాబిల్లి కథలు అమ్మమ్మ చెప్తుంటే విని అల్లారు ముద్దుగా తాత, అమ్మమ్మ, తల్లీ తండ్రుల కళల్లో జాబిలై పెరిగింది. ఉన్నత చదువులు చదివి, తనకి నచ్చిన వాడితో జీవితం పంచుకుని ఆనందంగా జీవిస్తున్న ఆ చందమామకి అనుకోని కష్టం అశనిపాతంలా వచ్చింది. అందరి బ్రతుకులూ అతలాకుతలం ఐపోయాయి. అప్పుడు ఆ జాబిలి తీసుకున్న నిర్ణయం ఏమిటి? “అనగనగా ఒక జాబిలమ్మ” చదివి కంట తడి పెట్టకుండా ఉండలేము.

తరువాతి కథలో కథానాయిక “తులసి”.. కథ చదివిన అందరూ ఇటువంటి అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుందొ అనుకుంటారు. అణకువ, బాధ్యత, తల్లి మీద అంతులేని ప్రేమ ఉన్న పాప. అందర్నీ సంతోష పెట్టాలనుకుని, తను చేసిన పని తల్లికి ఆగ్రహం తెప్పించింది. ఈ కథలో కూడా స్నేహితులు మానసికంగా ధైర్యం చెప్తుంటారు తులసి తల్లికి.

విదేశాలలో బంధువులు తక్కువగా ఉంటారు.. అదీ ఒక్కో సారి ఎన్ని నెలలకో కానీ కలవడానికి, కష్టం సుఖం చెప్పుకోవడానికి సాధ్య పడదు. నిత్య జీవితంలో స్నేహితులే అన్నిటా ఆదుకుంటారు. అక్కడ స్థిరపడిన రచయిత్రి అందుకనే స్నేహితులని, వారి సహకారాన్ని చూపించడానికి ప్రయత్నించారు, తమ కథల్లో.

శిశు సంక్షేమం అనే స్వచ్ఛంద సంస్థలో చురుకుగా పాల్గొనే ఇద్దరు స్నేహితురాళ్ల సంభాషణతో నడుస్తుంది, “కంచే చేనుమేస్తే” అనే కథ. అమెరికాలో పేద వారికిచ్చే సంక్షేమ సహాయాలకి, ఏవిధంగా స్వంత కొడుకుని తల్లి బలిచేస్తోందో తెలుసుకుని ఆశ్చర్య పోతాం.

మానవత్వానికి పరాకాష్ఠ కనిపిస్తుంది “ఏం మాయ చేశావో” కథలో.

పిల్లలకోసం పరితపించే ఆప్తురాలికి, తన కన్నబిడ్డని దత్తతకిచ్చిన మాతృమూర్తి బంధం వదులుకోలేక, అనుక్షణం ఆ పాపనే గుర్తు తెచ్చుకుంటూ బాధ పడుతుంటే అనుకోకుండా ఒక పాప, ‘మాయ’ ప్రవేశించి సాంత్వన కలిగిస్తుంది. ఆ తల్లి పడే మానసిక వేదనని మనసుకి హత్తుకునేలాగ చెప్పారు రచయిత్రి.

జీవితంలో అన్నీ ఉండి, ఒకరికొకరం అనుకున్న దంపతుల మధ్య అనుకోని విభేదం వస్తే.. “నిరంతరం నీ ధ్యానంలో” కథలో భర్త రాజ్ చేసిన పనికి కళ్యాణి ఏ విధంగా స్పందించిందో చూపించారు.

పాశ్చాత్య దేశాలలో తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకి పంపేస్తారనీ, పట్టించుకోరనీ, సంవత్సరానికి ఒక్కసారే వారి దగ్గరకి వెళ్తారనే అభిప్రాయం ఉంది మనందరిలో.. “కథ కాని కథ” లో ఇందుకు భిన్నమైన కథ చూపిస్తారు మనకి రచయిత్రి. తప్పనిసరి పరిస్థితులలో ఓల్డేజ్ హోంలో ఉంచిన తండ్రిని ప్రతీవారం స్నేహితురాలితో వెళ్లి చూసి, పలకరించటమే కాకుండా ఆయనతో భోంచేసే సాన్యా ఆదర్శనీయంగా అనిపిస్తుంది. అంతే కాదు, వివాహమయ్యాక, తనదగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటుండగానే.. అనూహ్యమైన మార్పు సాన్యా జీవితంలో.. దానికి ఆమే తండ్రి చూపించిన పరిష్కారం, కథ చదివి తెలుసుకోవలసిందే. అంతే కాదు, ఆ స్నేహితురాలికి కూడా కనువిప్పు కలగటం పాఠకులని నిట్టుర్పు విడిచేలాగ చేస్తుంది.

“సరికొత్త వేకువ” ఒక సరికొత్త కథను చెప్తుంది. తప్పని సరి పరిస్థితులలో దమయంతి గారింట చేరిన బంగారం, వారందరి ప్రోత్సాహంతో డాక్టర్ అవుతుంది. దమయంతిగారి అబ్బాయి సాగర్ ని మూగగా అరాధించే బంగారం జీవితం అనేక మలుపులు తిరిగి, తనని ఆదరించిన కుటుంబానికి ఆసరా అవుతుంది.

మాతృత్వానికి మంచి నిర్వచనం ఇచ్చిన కథ “మాతృత్వానికి మరోకోణం”.

ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగు పెట్టింది కళ్యాణి. దేనికీ లోటులేని జీవితం. దేశరక్షణకై అహర్నిశలూ పోరాడే వాయుసేనలో పని చేసే సందీప్ బావతో వివాహం.. పెద్దల అంగీ కారంతోనే. మరి ఒంటరి జీవితం ఎందుకు గడపవలసి వచ్చింది? తన జీవితాన్ని ఏ విధంగా సార్ధకం చేసుకుంది? “జీవ సందీప్తి” చదివితే అర్ధమవుతుంది, విధి చేతిలో అందరం కీలుబొమ్మలమే అని.

ఉమాభారతి గారి కథల్లో, సంగీత నాట్య కళలు ఆసక్తికరంగా చోటు చేసుకుంటాయి. వైద్య శాస్త్రం పరిచయం అవుతుంది. సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, వాటితో కథల్లోని పాత్రల అనుబంధం.. ఇంత హాయిగా జీవితం గడ్పవచ్చా అనిపిస్తుంది చదువరికి.

తప్పకుండా కొని చదువవలసిన పుస్తకం, “సరికొత్త వేకువ.”

నాకు నచ్చిన కధ చెన్నూరి సుదర్శన్ గారి “అడకత్తెరలో పోక చెక్క-“

అంబడిపూడి శ్యామసుందర రావు

చెన్నూరి సుదర్శన్ గారు ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేసి సెకండ్ ఇన్నింగ్ లో రచయిత అవతారమెత్తి వ్రాసిన కధల సంపుటి నుండి తీసుకున్న కధ. ఇప్పటివరకు నేను వివిధ పత్రికలలో (ఆన్ లైన్) చాసో, రావి శాస్త్రి మునిమాణిక్యం , కొడవటిగంటి వంటి పాత రచయితల కథలకే సమీక్షలు వ్రాశాను అనుకోకుండా సుదర్శన్ గారి “ఝాన్సీ హెచ్ ఎమ్ “అనే కధల సంపుటి చదవటం తటస్తించింది అందులో అడకత్తెరలో పోక చెక్క కధానిక నాకు బాగా నచ్చింది. ఆ కథను ఇతర పాఠకులతో పంచుకుందామని అనిపించి ఈ సమీక్ష వ్రాస్తున్నాను.
ముందు రచయిత సుదర్శన్ గారి గురించి తెలుసుకుందాము. నిజానికి బాల్యము నుండి రచయిత అయినప్పటికీ వృత్తిరీత్యా ఉండే ఒత్తిడుల వల్ల రచనా వ్యాసంగాన్ని పూర్తిగా సమయం కేటాయించక పోవటం వలన పూర్తి రచయితగా లోకానికి పరిచయము కాలేదు. రిటైర్ అయినాక కొద్దికాలంలోనే యాభై కధలు , అనేక చిత్రాలను చిత్రీకరించారు ఒకసారి మన మాజీ ప్రధాని పివి నరసింహారావుగారు తన 70ఏళ్ల వయస్సులో కంప్యూటర్, ఇంటర్ నెట్ కంపోజింగ్ వంటివి నేర్చుకొని తానే స్వయముగా తన స్వీయ చరిత్రను టైప్ చేసుకున్నాని చెప్పగా విని తానూ మటుకు ఆపని ఎందుకు చేయలేనని అలోచించి కంప్యూటర్ మొదలైనవి నేర్చుకొని యూనికోడ్ ద్వారా తెలుగులో టైపు చేసి పత్రికలకు ఇ మెయిల్ ద్వారా పంపుచు రచయితగా తన స్థానాన్ని సుస్థిర పరచుకున్న వ్యక్తి సుదర్శన్ గారు. యూనికోడ్ లో టైప్ చేసిన కధలను మళ్ళీ కంపోజ్ చేయకుండా నేరుగా ప్రింట్ చేయటానికి అనేక ప్రయోగాలు చేసి సాధించారు. ఈ విధముగా యువతరం రచయితలతో టెక్నాలజి విషయములో కూడా పోటీపడ్డ వ్యక్తి సుదర్శన్ గారు టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగము ప్రారంభించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా 2010 లో పదవి విరమణ చేశారు.

ప్రస్తుతము అయన వ్రాసిన “అడకత్తెరలో పోకచెక్క” అనే కథను గురించి ముచ్చటించుకుందాము. ఈ కద ఫక్తు తెలంగాణా గ్రామీణ మాండలికంలో వ్రాయబడింది/ ప్రస్తుతము జరిగే ఒకపూట హడావుడి పెళ్లిళ్లలో కనిపించని సాంప్రదాయము “అలక పాన్పు” అంటే పెళ్ళికొడుకు అప్పగింత కార్యక్రమము (ముహర్తము అయినాక పెళ్లికూతురును అత్తవారికి అప్పగించటము). ముందు వేడుకగా పాతరోజుల్లో పెళ్ళికొడుకుని మగపెళ్లివారు అలక పాన్పు ఎక్కించి మామగారిని ఏదైనా కోరిక కోరుకుంటే మామగారు అల్లుడి కోరిక తీర్చటం ఈ అలక పాన్పు ఉద్దేశ్యము. పాతరోజుల్లో అలకపాన్పు ఎక్కిన అల్లుడు మామగారిని హంబర్ సైకిలో, రిస్ట్ వాచో, రేడియోనో అడిగేవారు తరువాత కాలక్రమేణా అలవాటు తగ్గిపోయి అల్లుడికి కావలసినవి అన్నీ కట్నకానుకలలోనే వసూలు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో అది ఒక సరదాగా సాగేది.

ఈ కథలో పెళ్ళికొడుకు తల్లిదండ్రుల ఒత్తిడి, సామాజిక గౌరవానికి భయపడి అలకపాన్పు పేరిట కోర్కెలు కోరటం, వాటిని పెళ్లికూతురు తండ్రి తీర్చలేడని తెలిసి తానె రహస్యముగా బావమరిదికి డబ్బులు ఇచ్చి ఆడపెళ్లి వారె తన కోర్కెను తీర్చినట్లుగా సమాజనికి చూపే ఆదర్శ పెళ్ళికొడుకును రచయిత మన ముందు ఉంచుతాడు.
ముహూర్తము అయినాక అప్పగింతలు ముందు పెళ్లి పందిరిలో పెండ్లి పిలగాడు (పెళ్ళికొడుకు) కనబడుట లేదు అన్న వార్తా గుప్పుమంది. ఇంకేముంది పెళ్లికూతురు తండ్రి లచ్చయ్య, తల్లి లచ్చమ్మ తల్లడిల్లి పోయినారు చూచిరమ్మని పంపిన కొడుకు లసుమయ్య అదే పోతపోయినాడని విసుక్కుంటున్నాడు. లగ్గము నాగవల్లి అయిందో లేదో పారిపోయినాడు. ఏదన్న ఉంటె పెళ్ళికి ముందే పారిపోవాలి గాని పెళ్లి అయినాక పొతే పిల్ల గతి ఏమికావాలి అని పెళ్లికి వచ్చిన చుట్టాలు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. పెండ్లి కొడుకు తల్లి చదివింపులుగా వచ్చినవాటిని తన కూతురుకు చూపించుకుంటూ కాళ్ళు కడిగిన ఇత్తడి చెంబు కనిపించలేదని దేవులాడుతుంది. పెళ్ళికొడుకు తండ్రి కొమరయ్య ఇంటి అరుగు మీద కూర్చుని బీడీ కాలుస్తున్నాడు తీరిగ్గా. అది అక్కడి పరిస్థితి. పిల్ల తండ్రి లచ్చయ్య కొమరయ్య దగ్గరకు “బావా నీ కొడుకును యాడికన్నా తొలిచ్చినావే “అని భయం భయముగా అడిగాడు కొమరయ్య నోట్లోనుంచి బీడీ తీసి, “నీ అల్లుడు ఆలిగాడు”అని చావు కబురు చల్లగా చెప్పాడు

“అదేంది బావా మేమెన్న తక్కువ చేశామా? అనుకున్న దానికంటే ఎక్కువే ముట్ట జెప్పాము ” అని లచ్చయ్య అన్నాడు “సూడు బావా పెట్టపీటల కింద ఎన్ని పెట్టినా అలుక పోవటం అనేది పద్దతి ఈ తతంగము పూర్తిచేస్తే పిల్లను అప్పగించవచ్చు ” అని కొమరయ్య లచ్చయ్యకు నిర్మమొహమాటంగా తెలియజేశాడు. ఈ తతంగము జరుగుతూ ఉండగా లచ్చయ్య కొడుకు లసుమయ్య పరుగెత్తుకుంటూ వచ్చి, “అయ్యా బావా అప్పయ్య యింట్లనే ఉన్నాడే “అని చెప్పాడు. లచ్చయ్య, లచ్చమ్మలు లసుమయ్యను గదిలోకి తీసుకెళ్లి అన్ని విషయాలు చెప్పారు. కొడుకు తండ్రితో , “నీవు ఏమి దిగులుపడకు, చెల్లిని తీస్కొని పోయి బావా ఏమి అడుగుతాడో చూద్దాము ఎమన్నా అంటే దీపావళి దాకా ఆగమందాము “అని చెప్పి చెల్లితో, “బావా ఎక్కడి పోలేదు మన అప్పయ్య ఇంటికి అలగటానికి పోయిండు మనమెల్లి తీసుకొద్దాము పద “అని చెపుతాడు.

ఒక పెద్ద మనిషిని వెంటబెట్టుకొని అందరు అలిగిన పెండ్లి కొడుకు దగ్గరకు వెళతారు. ఈ భాగోతము చూడటానికి పిల్ల పెద్ద అందరూ గుమిగూడారు.
తలుపేసుకొన్న పెండ్లికొడుకును పిలిస్తే యవ్వారమంతా బామ్మర్దితోనే జరగాలని పెద్ద మనిషి ద్వారా లసుమయ్యకు పెండ్లికొడుకు సమాచారం ఇచ్చాడు. సరే బావ మరిది లసుమయ్య తన బావగారిని ఏమి కావాలి అని అడిగాడు. దానికి పెండ్లి కొడుకు, “నాకు బండి కావాలా నా దోస్తులందరికి బండ్లు పెట్టిండ్రు. అల్ల ముందట నాపరువేం గావాల నాకు బండి పెడతామని ఒప్పుకోండి తలుపు తీత్త”, అని తన మనసులో మాట చెప్పాడు పెండ్లికొడుకు ” ఏందీ బండి గావాల్నా నా పెయ్య(శరీరము)నలగ్గొట్టినా పెద్ద కొత్తెల్లది . యీడ్చి తన్నిన యీసమేళ్ళది, యాడ్నించి తేను, ఎంతసేపు అలుగుతావో అల్గు”అని , లచ్చయ్య లేవబోయినాడు
లసుమయ్య వాళ్ళ నాయనను లేవనివ్వకుండా కుకో అని సైగ చేశాడు. కానీ లచ్చయ్య తానూ పెళ్ళికి పెళ్ళికొడుకుకు పెట్టిన ఖర్చుఏకరువు పెట్టాడు కానీ లసుమయ్య వాళ్ళ బావకు బండి కొంటామని వాగ్దానము చేశాడు. విన్న లచ్ఛయ కయ్యిమని లేచాడు లచ్చమ్మ ఏడుపు మొదలుపెట్టింది. ఇదంతా విన్న లసుమయ్య” జరంత సేపు మీరు నోరు మూసుకోండి ఈ యవ్వారమంతా నేను సూసుకుంటా “, అని వాళ్ళ నోరు మూయించి “బావా నేను మాటిత్తున్నా నీకిట్టమైన బండి నీవు మల్ల వచ్చేటప్పటికి నీకోసము ఎదురు చూస్తూ ఉంటుంది తలుపు తియ్యి”అని చెప్పాడు. ఇంకేముంది పెళ్ళికొడుకు మొగము ట్యూబ్ లైట్ మాదిరి వెలిగిపోయింది. ఈ భాగోతాము చూడటానికి వచ్చినవాళ్లు అంతా సంతోషించారు. కానీ లచ్చయ్య లచ్చమ్మలు కొడుకు అల్లుడికి పదహారు రోజుల పండగకు ముందు బండి కొంటానని మాట ఇచ్చాడు అని ఆందోళన పడుతున్నారు

సరే సమస్య తీరింది కాబట్టి అప్పగింతల కార్యక్రమము పూర్తి అయింది. పెళ్ళికి వచ్చినవాళ్లు ఎక్కడివాళ్ళు అక్కడి వెళ్లిపోయారు. ఇల్లంతా బోసిపోయింది లచ్చయ్య లచ్చమ్మ బువ్వ తినకుండా కొడుకు కోసము ఎదురుచూస్తూ నడుము వాల్చారు. ఇంతలో లసుమయ్య వచ్చి పడుకున్న తల్లిదండ్రులను లేపాడు. తల్లి కొడుకును కాళ్ళుకడుక్కుని భోజనానికి రమ్మంది. కానీ లసుమయ్య మంచి నీళ్లు త్రాగి, “బావా శాన మంచోడే నాయన “అన్నాడు “ఈ మాట సెప్పటానికా లేసి కూకోమన్నావు “అని విసుక్కున్నాడు లచ్చయ్య. “నాయనా నేను సెప్పేది పురంగా ఇను బావ నాతో అన్న మాటలు సెపుతా, ఇప్పుడు నేను సెప్పే మాటలు మన గడప దాటగూడదు బావ మరి మరి సెప్పిండు. ఈ రహస్యము మావాళ్లకు తెలియకూడదని. పెళ్లి అనేది అంత సంబరపడిపోయేదికాదు ఇటు నాయనా అమ్మలనూ తృప్తి పరచాలి. అటు పెండ్లాము తల్లిదండ్రులకు మాట రాకుండా చూచుకోవాలి. అట్లా చేస్తేనే పెండ్లాము మొగుడంటే ఇష్టపడుతుంది. అడకత్తెరలో పోక చెక్క మాదిరి నా పానమంతా తకుమి కైతాంది. అని చెప్పాడు. ఇది విన్న లచ్చయ్య లచ్చమ్మలకు గుండె గాబారా పెరిగింది. ఇది గమనించిన కొడుకు కంగారు పడవద్దని అసలు విషయము చల్లగా చెప్పాడు.

పెండ్లికొడుకు తన తల్లిదండ్రులు అత్తగారి దగ్గరనుండి ఎంత వీలయితే అంత గుంజాలని ఎక్కించటం మొదలు పెట్టారు. వాళ్ళ మాట వినకపొతే అప్పుడే అత్తగారి సంకల్లో సొచ్చిండు అని నిందిస్తారు. కాబట్టి వాళ్ళ వాళ్లకు తెలియకుండా రెండు చీటీలు వేసి రెండు లక్షలు సంపాదించి ఆ చీటీల వాడు అత్తగారి ఇంటి కుదువ విడిపించి బండి తీసుకు వచ్చిమీకు ఇస్తాడు అని అల్లుడు ప్లాను వేసి అత్తమామలకు ఇబ్బందిలేకుండా చేస్సాడు. పదిమందిలో తానూ అలిగి బండి సంపాదించినట్లు బిల్డప్ ఇచ్చాడు ఎవరికీ అనుమానము రాకుండా. బావమరిదితో ఈ డ్రామా నడిపించాడు. ఇది విన్న లచ్చయ్య అల్లుడు మంచితనానికి కడుపు నిండి పోయింది లచ్చమ్మ ముక్కు మీద వేలు ఏసుకొని నోరు తెరిచింది ఈ సంతోషముతో ఎవ్వరికి ఆకలి వేయలేదు పెండ్లికొడుకు మంచితనంతో అందరి కడుపు నిండింది.

మనోవేదికపై నర్తించిన అక్షరరవళి


రచన: సి.ఉమాదేవి

ఆంగికం భువనం యశ్య
వాచికం సర్వవాఙ్మయమ్
ఆహార్యం చంద్రతారాది
తం వందే సాత్త్వికం శివమ్
అభినయ దర్పణములో ప్రారంభ శ్లోకంతో కోసూరి ఉమాభారతి రచించిన వేదిక నవలపై సమీక్ష ప్రారంభించడానికి కారణం నవల నడిచిన కాదు నర్తించిన తీరు. భరతముని రచించిన నాట్య శాస్త్రమును నాట్యవేదమంటారు. వేదిక నవల నాట్యశాస్త్రాన్ని గుర్తు చేయడం కాకతాళీయమే కాని విభిన్న నృత్యాంశాలకు చక్కటి మార్గదర్శినిగా నిలిచిన నాట్యశాస్త్రం నృత్యాభిలాష ఉన్నవారికి కరదీపిక అని పునశ్చరణ చేసుకోవడం నవలలో అగ్రభాగాన్ని ఆక్రమించుకున్న నృత్యాంశాల నేపథ్యంలో సమున్నతమేననిపించింది. ఈ నవల చక్కటి నృత్యగీతాలను మనోవీధిలో మరొక్కమారు విహరింపచేసింది. కోసూరి ఉమాభారతి జగమెరిగిన రచయిత్రేకాదు అలరించే నర్తకి కూడా. వేదిక నవల ద్వారా నృత్యప్రాధాన్యమైన నవలాంశాన్ని తీసుకుని పాఠకరంజకంగా రచించి మనకందించడం ముదావహం. నృత్యాంశంతోపాటు సమాంతరంగా ఒక కుటుంబం, దాని చుట్టూ అల్లుకున్న స్నేహబాంధవ్యాలు, తొంగి చూచే అసూయలు, పెనవేసుకునే ఆత్మీయతలు. ఇవన్నీ మన ప్రక్కనే కూర్చుని కష్టసుఖాలు పంచుకునే స్నేహితురాలిలా మొత్తం నవలను మనకు చంద్రకళ పాత్ర ద్వారా వినిపిస్తారు.
చంద్రకళ తల్లి శారద సంగీతం నేర్పే గురువేకాదు నృత్యం పట్ల అవగాహనగల వ్యక్తి. నాట్యమనగానే పదనర్తనం గావించే చంద్రకళ నృత్యాభిరుచిని గ్రహించి కూతురికి నృత్యం నేర్పడమేకాదు చక్కని వేదికలపై విభిన్న గీతాలకు చక్కని నృత్యాలను సమకూరుస్తుంది. ఇక మలేషియా, కౌలాలంపూర్, లండన్, పారిస్, ఇటలీవంటి దేశాలలో ప్రదర్శించేందుకు తగిన ఏర్పాట్లను చేసేందుకు తండ్రి సత్యదేవ్, అతని స్నేహితుడు భూషణ్ పాత్రలు కూడా అత్యంత సహజంగా సాధకబాధకాలను చర్చిస్తూ నవలలో ఒదిగిన తీరు ప్రశంసనీయం. తన కూతురి నృత్య ప్రదర్శనకు ముందు చక్కని పరిచయాన్ని వినిపించే సత్యదేవ్ మాటలు వేదికను హరివిల్లుగా మలచడంలో శ్రీకారమవుతాయి. ఒక కళాకారిణి ఎదుగుదలకు తల్లిదండ్రులు పోషించే పాత్ర ఎనలేనిది అనే నిజాన్ని ఈ నవల మరింత స్పష్టం చేసింది. తాళ, లయ జ్ఞానాన్ని ఔపోసన పట్టి పాదరసంలా పదనర్తనం గావించే చంద్రకళ అభినయం వెనుక మరొక ముఖ్యమైన వ్యక్తి ఆమెకు శాస్త్రీయంగా నృత్యం నేర్పిన గురువు పాత్రను మలచినతీరుకు గురుభ్యోన్నమ: అనిపిస్తుంది. యువకళాకార్ అవార్డ్ తో మొదలైన బహుమతుల పర్వం అనేకానేక అవార్డులను, రివార్డులను ప్రసాదించడమేకాక ప్రపంచనర్తకిగా గుర్తింపు పొందుతుంది చంద్రకళ. నృత్యభాష అంటే లయజ్ఞానమే కదా. మరి ఆ నృత్య భాషకు చక్కని భాష్యం పలికిన చంద్రకళకు కుటుంబ బాంధవ్యాలపైనా మెండైన అభిమానమే. చదువు, నృత్యం నడుమ ఆమ్మమ్మ, నానమ్మల ఊరికి ప్రయాణం, వారు ప్రేమను కూరి వండిపెట్టే విభిన్న వంటకాలు, వారి ముద్దుముచ్చటలు చదివే పాఠకుల మనసులు తమ ప్రమేయం లేకుండానే వారి బాల్యపు అనుభూతులను నెమరువేసుకునేలా చేస్తుంది.
వేదికకు నమస్కారంతో ప్రారంభమైన నృత్యలహరి మంగళంతో ముగుస్తుంది. వేదికపై నర్తించే వారే కాక నృత్యాన్ని తిలకించే వారి మనసును కూడా నర్తింపచేసిన వేదికకు ప్రణామాలు పలకాలనిపిస్తుంది. శ్రీకృష్ణావతారం, , కాళీయమర్ధనం, బ్రహ్మమొక్కటే, చిరుతనవ్వులవాడు…. ఇలా ఎన్నో! బ్రహ్మమొక్కటే దర్శించే తీరువేరు, నృత్యమొక్కటే నర్తించే రీతులు వేరు. జతులు, సంగతులు మేళవించిన నృత్యవేదిక సాహితీ సంస్కృతుల మేలు కలయిక. ఈ అందమైన వేదికపై అలరించే ఆహార్యం అందించే క్రమంలో ముత్యాలు, మువ్వలు అమర్చిన నృత్య వస్త్రాలు అద్భుత: అనిపిస్తాయి. నృత్యానికి చక్కటి వస్త్రాలను క్రిష్ణ సమకూర్చడంతో వేదికపై నాట్యం మరింత సొబగునందుతుంది. వేదిక ఒకసారి సరస్వతీ ప్రాంగణంలా, మరొకసారి కైలాసంలా, దేవాలయంలా భాసిల్లినట్లు చంద్రకళ ము:ఖత వింటుంటే నృత్యాన్ని మనోనేత్రంతో దర్శించగలం. చక్కని రహదారిలో సునాయాసంగా చేస్తున్న ప్రయాణంలో ఎదురయ్యే మలుపులు , స్పీడు బ్రేకర్లు ఎలా నిలువరిస్తాయో అలా నవలలో అందరి మనసులను తన వింత, మొండి ప్రవర్తనతో స్థంభింప చేసే పాత్ర భూషణ్ కూతురు రాణి. అయితే ఆమె మంచి గాయని. చంద్రకళ నర్తించే వేదిక పైనే తన గానామృతంతో అలరించి మొమెంటోలు పొందిన వ్యక్తి. చంద్రకళకు కావలసిన సహాయాన్ని ఎంతో నిబద్ధతతో చేసే వ్యక్తి భూషణ్. ఇదే రాణిలో చంద్రకళపట్ల అసూయకు కారణమవుతుంది. తన బావ జగదీష్ తో రాణి తీసుకునే అతి చనువు చంద్రకళకు ఇబ్బందిగా అనిపించినా ఆమెలోని సర్దుకుపోయే మనస్తత్వం మరే విధమైన అవాంఛిత సంఘటనలకు తెరలేపదు. కాని జగదీష్ నే పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం మనసులో బలంగా ముద్రించుకుంటుంది రాణి. ఈమె సరదాగా ‘ సినీహీరోనిచ్చి పెళ్లి చేయగలవా?’ అన్న మాటను నిజమనుకుని సినీహీరోతోనే పెళ్లి చేస్తానంటాడు భూషణ్. అయితే విచక్షణాలేమితో రాణి తనను తాను గాయపరచుకోవడంతో ఈ ముక్కోణపు ప్రేమకథలోని ప్రేమ మథనంలో కళ్యాణవేదికపై ఎవరు దంపతులవుతారో అనే ఆదుర్దా పొటమరిస్తుంది. రాణిని ఆత్మీయంగా స్నేహధర్మంతో పలకరించినా చంద్రకళతో వివాహానికి పెద్దల అనుమతి తీసుకున్న జగదీష్ పాత్ర మనోనిబ్బరానికి, మంచితనానికి ప్రతీక.
అకస్మాత్తుగా సత్యదేవ్ అనారోగ్యానికి గురవడం చంద్రకళను ఆందోళనకు గురి చేస్తుంది. తన కూతురు రాణికి జగదీష్ తో పెళ్లికై చంద్రకళ త్యాగాన్ని అర్థిస్తాడు భూషణ్. అతడు చేసిన సహాయానికి ప్రతిఫలంగా జగదీష్ కు దూరం కావాలనుకుంటుంది చంద్రకళ. నృత్యకారిణి తేజస్విని అమెరికానుండి అందించిన ఆహ్వానంతో తన గమ్యానికది మలుపు కాగలదని భావించి అమెరికా చేరుకుంటుంది. ఇక రాణి ప్రవర్తన అసూయ, ఆవేశాలకు ఆలవాలమై చివరకు ఆమెను పతనంవైపు నడిపిస్తుంది. నవల ముగింపు సంతరించుకునే వేళ పాఠకుల ఊహలకు విరామం పడుతుంది. భూషణ్ గుండెపోటుకు గురవడంతో దాదాపు మూడు సంవత్సరాలుగా మాతృదేశానికి దూరమైన చంద్రకళ తిరిగి వస్తుంది. అప్పటికి రాణికి జరగాల్సిన నష్టం జరగనే జరుగుతుంది. అయితే జగదీష్ కు దూరమై రంజిత్ కు దగ్గరైన రాణికి అతడితోనే వివాహం జరిపిస్తారు. జగదీష్ , చంద్రకళల వివాహవేదికతో నవల ముగుస్తుంది. కళకైనా, కలలకైనా జీవితమే వేదిక అనే వివరణతో వేదిక అనే శీర్షికకు అందమైన అర్థాన్ని తాపడం చేసి, ముఖచిత్రంగా నర్తకిని చిత్రించడం సముచితంగా ఉంది. ఇక నవల మధ్య మధ్యలో పలకరించే నృత్యభంగిమలు ఆహ్లాదపరుస్తాయి. వేదికపై ప్రదర్శించే అద్భుత నృత్యానికి ప్రేక్షకుల చప్పట్లు అభినందనసుమాలు. నవలకు చక్కని శీర్షికనొసగి వేదికకున్న ప్రాముఖ్యాన్ని మరింత ఉన్నతీకరించి చక్కని భాష, సున్నిత భావప్రకటనతో నవల ఆసాంతం చక్కని పట్టాలపై పరుగులు తీయించి మనల్ని వేదిక దగ్గరకు చేర్చిన కోసూరి ఉమాభారతికి అభినందన చప్పట్లు.

జి. యస్. హాస్యకథలు / వదినగారి కథలు

రచయిత్రి; జి. యస్. లక్ష్మి
సమీక్ష/మాటామంతీ: మాలాకుమార్

నవరసాలల్లో హాస్యరసం ప్రాధానమైనది అని నా భావన. నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు . కాని అన్ని సమయాలల్లో కాదు. అసలు నవ్వని వాడు ఒక రోగి, నవ్వటం ఒక భోగం అన్నారు జంధ్యాల. చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళను చూస్తే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది. అదే చిటచిటగా ఉంటే దూరంగా ఉందామనిపిస్తుంది. మనసు బాగాలేనప్పుడు, ఏదైనా చికాకు కలిగినప్పుడు మనసు మళ్ళించుకునేందుకు ఓ హాస్య నవలో, కథో చదవాలనిపిస్తుంది. ఆ కథ చదవగానే పెదవులపై ఓ చిరునవ్వు రావాలి. అందులోని హాస్య సంఘటనలు పదే పదే గుర్తొచ్చి పడీ పడీ నవ్వాలి. “పాపం బిక్కమొహం వేసాడు. “అని చదవగానే ఆ బిక్క మొహం కళ్ళ ముందు మెదలాడాలి. ఏదైనా సంఘటన హాస్యంగా ఉండవచ్చు. దానిని హాస్యంగా వ్రాయటం ఒక కళ. పత్రికలల్లో హాస్యకథ అని రాసినా ఆ కథ చదవగానే నవ్వు కాదు కదా పెదాలు కూడా విచ్చుకోవటం లేదు! కాని అదేమిటో తెలుగు లో అలాంటి హాస్య రచయతలు ఎక్కువగా లేరు. ఉన్న కొద్ది హాస్య రచయతలల్లో కి ఈ మధ్య తన హాస్య కథలతో దూసుకు వచ్చేస్తున్నారు జి. యస్. లక్ష్మి గారు. ఆరోగ్యం కోసం హాస్యం అంటూ , “జి. యస్. హాస్యకథలు / వదినగారి కథలు” పుస్తకాన్ని, మనసారా నవ్వుకోండి అని పాఠకులకు అందించారు.

జి. యస్ హాస్యకథలల్లో మొత్తం పదమూడు కథలు ఉన్నాయి. మొదటి కథ “అమ్మగారికి దండం పెట్టు” తో నవ్వటం మొదలుపెడితే ఇక ఆప కుండా నవ్వుకుంటూ పోవటమే మన పని. అయ్యో కథలన్నీ అప్పుడే ఐపోయాయా అనుకోకుండా , వెనక్కి తిప్పుతే గడుసు వదినగారు, అమాయకపు మరదలు కథలు కనిపించి అమ్మయ్య ఇంకాసేపు నవ్వుకోవచ్చు అనుకుంటాము. ఆ కథల గురించి నేను చెప్పటమెందుకు మీరే చదివి నవ్వుకోండి. పుస్తకము కొని చదువుకునే ముందు కొంచము రచయిత్రితో మాటా మంతీ.

 

1. మీకు రచనలు చేయాలనే కోరిక ఎప్పుడు కలిగింది?
జ) 1992 నుంచీ అప్పుడప్పుడు ఆకాశవాణిలో ప్రసంగవ్యాసాలు, నాటికలు, పాటలు ప్రసారమయ్యేవి. నా మొట్టమొదటికథ ఆ రోజుల్లోనే ఆంధ్రప్రభ వారపత్రికలో పడినా నేను రచనావ్యాసంగాన్ని సీరియస్ గా తీసుకున్నది 2002 నుంచే.
2. మీ హస్య కథల గురించి మాట్లాడుకునే ముందు, మీ నవల “ఒక ఇల్లాలి కథ ” గురించి చిన్న అనుమానము. మీ “ఒక ఇల్లాలి కథ” లో నాయిక స్వరాజ్యమును ముందు నుంచీ సాత్వికురాలిగా, తల్లికీ, భర్తకూ విధేయురాలుగా, అణుకువగా చూపించి, చివరలో తిరుగుబాటు చేయిస్తారు. నిజ జీవితంలో అలా మారటం సాధ్యమంటారా?
జ) ఒక ఇల్లాలి కథ లో నాయిక స్వరాజ్యం మనస్తత్వం మొదటినుంచీ తన గురించి కన్నా యితరుల గురించే యెక్కువ ఆలోచించే మనస్తత్వం. అందుకే పెద్దవాళ్ళ నిస్సహాయతను గుర్తించి రమణమూర్తి పెట్టిన షరతులకు లోబడి పెళ్ళి చేసుకుంది. పెళ్ళయాక ఆ యింటికే అంకితమయిపోయి, పుట్టింటినుంచి తను తెచ్చుకున్న బంగారంకూడా ఆడపడుచుని గొప్ప యింటిలో యివ్వడానికి తనంతట తనే యిచ్చేసింది. ఆఖరున కూడా తన తల్లీ, మేనత్తలకోసమే రమణమూర్తి దగ్గరకి వెడదామనుకుంది. కానీ, ఎప్పుడయితే మేనకోడలు స్రవంతి, ‘నువ్వు అలా వెడితే నిన్నే మాకు ఆదర్శంగా చూపిస్తారు’ అని చెప్పిందో అప్పుడు కూడా అదే మనస్తత్వంతో తనకోసం కాకుండా తన తరవాతి తరంవారికోసం తిరుగుబాటుకు నాంది పలికింది.
3. మీవి కొన్ని బ్లాగ్ పోస్ట్ లూ, ఒక కథ “అమ్మ మారిపోయిందమ్మా” మీ పేరు లేకుండా ఎవరో షేర్ చేసారు కదా!దానికి మీ స్పందన ఏమిటి?
జ) నా పేరు లేకుండా షేర్ అయినందుకు బాధగా అనిపించింది.
4. మీ కథ”అమ్మ మారిపోయిందమ్మా” కథ, దానితో పాటు మీరు పాపులర్ అయిపోయారు దానికి మీ స్పందన ఏమిటి?
జ) సంతోషంగా అనిపించింది.
5. మీకు రచనలు కాకుండా ఇంకా ఏ కళల్లోనైనా ప్రవేశం ఉందా?
జ) ప్రవేశం మాత్రమే వుంది.
6. రచయిత్రి రచన చేసేటప్పుడు దేనిని గుర్తు పెట్టుకోవాలి?
జ) తన చుట్టూ వున్న సమాజాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ రచయిత చేసే రచన వల్ల సమాజంలో ఒక నేరస్తుడు మంచివాడుగా మారాలి కానీ, ఒక మంచివాడు నేరస్తుడుగా మారకూడదు.
7. రచనల్లో స్త్రీ పాత్రలను యెలా చిత్రీకరించాలి?
జ) స్త్రీలు కూడా మనుషులే. వారికి కూడా వ్యక్తిత్వం వుంటుంది. అటువంటి వ్యక్తిత్వం గలవారిగా చిత్రించాలని నా అభిప్రాయం.
8. ఇక హాస్య కథలు గురించి హాస్యకథలు రాయడానికీ, సీరియస్ కథలు రాయడానికీ మధ్యగల తేడా యేమిటో చెప్పండి.
జ) చాలా తేడా ఉందండీ. సీరియస్ కథలనబడే కరుణ రసాత్మక కథలూ, అణచివేత కథలూ, ఆకలి కథలూ, సమస్యలకు పరిష్కారాన్ని చూపించే కథలూ వంటివి రాస్తున్నప్పుడు ఆ రసం పండడానికి ఆ సన్నివేశాన్ని ఎంత ఎక్కువగా వర్ణించితే పాఠకులు అంత ఎక్కువగా ఆస్వాదిస్తారు.
కానీ, హాస్యకథలు రాసేటప్పుడు ఆ సన్నివేశాన్ని పండించడానికి అలా ఎక్కువగా రాస్తే ఆ హాస్యం పాఠకుడికి వెగటు పుట్టిస్తుంది. తక్కువగా రాస్తే ఆ హాస్యం పండదు. అందుకే హాస్యరసాన్ని చాలా బాలన్సెడ్ గా రాయాలి.
9. బాలన్సెడ్ గా అంటే? ఏమైనా జాగ్రత్తల్లాంటివి తీసుకోవాలా?
జ) అవునండీ. హాస్యం రాసేటప్పుడు అది ఎదుటి మనిషిలోని అవకరాన్నిగానీ, లోపాన్నిగానీ యెత్తి చూపించి పాఠకులని నవ్వించే ప్రయత్నం చెయ్యకూడదు. ఒక మనిషి అరటితొక్కమీద కాలేసి జారిపడినట్టు లాంటివి రాస్తే, అది ఎదుటి మనిషి పడే బాధని మనం హాస్యంగా తీసుకున్నట్టవుతుంది. అది పాఠకుడిలో ఉండకూడని గుణాన్ని మనం పైకి తీసుకొచ్చినట్టవుతుంది. అందుకే హాస్యరచయిత(త్రి) మరింత జాగ్రత్తగా రచనలు చెయ్యాలి.
10. “వదినగారి కథలు” లో వదినగారి గురించి అలా రాసినందుకు మీ వదినగారు ఏమీ అనుకోలేదా?
జ) హ హ. . చాలామంది అలాగే అడుగుతుంటారండీ. కానీ, నా వదినగారికథల్లో వదిన నేను సృష్టించిన పాత్ర. మా వదినలెవ్వరూ అలా లేరు. కొంతమంది మనుషులు వాళ్ళు చేసిన పని తప్పయినా సరే, తప్పని వాళ్లకి తెలిసినా సరే అస్సలు ఆ తప్పు ఒప్పుకోరు. పైగా వాళ్ళ మాటల చాతుర్యంతో ఆ తప్పుని ఒప్పుగా ఎంచక్కా దిద్దేస్తారు. దానికి చాలా తెలివితేటలూ, సమయస్ఫూర్తీ, వాక్చాతుర్యం లాంటివి కావాలి. అలాంటి పాత్ర సృష్టే ఈ వదిన. అందుకె ఈ వదినంటే నాకెంతో ఆరాధన.
11. మీరు ఇంకా ఏమైనా చెప్పదలచుకుంటే చెప్పండి.
జ. తప్పక చెపుతానండీ. ఇలా నా అభిప్రాయాలను పంచుకోవడానికి దోహదపడిన మీకూ, పత్రికా సంపాదకులకూ నా ధన్యవాదాలు.
లక్ష్మిగారు మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి.

ప్రఖ్యాత రచయిత్రి మన్నెం శారదగారు చిత్రించిన ముఖ చిత్రముతో ఉన్న జి. యస్. హాస్య కథలు / వదినగారి కథలు అన్ని పుస్తక షాపులల్లోనూ దొరుకుతుంది. వందరూపాయిలకు కొనుక్కొని కడుపుబ్బ నవ్వుకోండి.

తుషార మాలిక లఘు సమీక్ష …!!

రచన: మంజు యనమదల

కవితలకు, కథలకు సమీక్షలు రాయడం అంటేనే చాలా కష్టమైన పని. సిరి వడ్డేగారు రాసిన త్రిపదలకు అది కూడా 1300 ల త్రిపదలకు నేను సమీక్ష రాయడమంటే సాహసం చేయడమే. అక్షరాలకు అందమైన పదభావాలను జత చేసి ముచ్చటైన మూడు వాక్యాల్లో త్రిపద కవితలను సిరి వడ్డే మనకు “తుషార మాలిక” తొలి త్రిపద సంపుటిగా అందించారు. ముందుగా వారికి నా ప్రత్యేక అభినందనలు.

ఒక్కో వాక్యానికి 20 అక్షరాలకు మించకుండా మూడు వాక్యాల్లో ముచ్చటైన కవితలను అందించిన తీరు చదువరులను ఆకట్టుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తుషార మాలికలో మొదటి త్రిపదం జన్మనిచ్చిన అమ్మతోనే మొదలు. చరాచర సృష్టికి మూలం అమ్మ. ఆ అమ్మ ఒడి ఓనమాలతో మొదలై జీవిత పాఠాలు నేర్చుకునే వరకు చదువుల తల్లి శారదమ్మలా మనకు బాసటగా ఉంటుందని చెప్పడం. అమ్మని కూడా పసిపాపను చేస్తూ మనల్ని కొట్టి అమ్మ కూడా ఏడవడాన్ని ఎంత బాగా చెప్పారో..

అమ్మ కూడా పసిపిల్లనే …
నన్ను కొట్టి ,
తను ఏడుస్తోందేమిటో…అలా వెక్కి వెక్కి..!!

పాపాయి బోసి నవ్వులతో నేర్చుకోవడం మొదలైన అమ్మ చదువుకోవడంలో ఎప్పటికి నిత్యా విద్యార్థిగానే ఉందని చెప్పడంలో భావుకురాలి గొప్పదనం తెలుస్తోంది. జ్ఞాపకాల గురించి చెప్పినప్పుడు వాడని పున్నాగపూల పరిమళాన్ని వీడని జ్ఞాపకాల మడతలతో పోల్చడం, ఇష్టమైనవాళ్లు విసిరిన చిరునవ్వు ఎదను హత్తుకున్న అమ్మ చేతి స్పర్శతో పోల్చడం, పాపాయి అలిగి అన్నం తినకపోతే అన్నం తినని అమ్మ అలకని తన చిన్నతనంలో పోల్చుకుని చెప్పడం, నాన్నతో అనుబంధాన్ని జీవితపు అవినాభావ సంబంధంగా, గుప్పెడుగుండేలో ఒదిగిన ప్రేమ అమ్మానాన్నల స్పర్శగా అనుభూతించడం, మానవత్వాన్ని చాటిచెప్పేవి పల్లెలే అని, ప్రపంచాన్ని, పుట్టిన పల్లెటూరును తూకం వేస్తె అనుబంధాలకు తూనిక తమ పల్లెలే అని తేల్చి చెప్పడం, అనుభవ పాఠాలను నేర్పే జీవితాన్ని గురువుగా భావించడం, వెన్నెల్లో విహరిస్తున్నా మాటల అమృతాన్ని మదినిండుగా గ్రోలడంలో ఓ రకమైన తీయని విరహాన్ని చెప్పడం, మనసు కొలనులో స్వప్నసుమాలను, చేజార్చుకున్న స్మృతుల మూటల వేడుకులాటలు, రెప్పలా మాటున దాగిన కలల మంత్రంనగరి మర్మాన్ని ఛేదించడం, కాలాన్ని పట్టి ఆపేసిన జ్ఞాపకాల డైరీని, అల కల దూరాల తీరాలని, నిశీథి సుమాలను ఏరి వెన్నెల నవ్వులకివ్వడం, మది వేదన శిశిరాన్నిదాటి ఆశతో పోల్చడం, కలిసిన క్షణాలన్నీ అందెల మువ్వల నవ్వులే అని, దైన్యాన్ని దాటి ధైర్యాన్ని అందుకోవడం, మౌన ధ్యానంలో వరమైన ప్రేమని, విధి పంపకాలను అప్పగింతలుగా, హృదయపు తికమకలను, మనోనేత్రపు మనసును, ప్రక్రుతి, సనాతన ఆవర్తనాలను, సెలయేటి గలగలలు, మబ్బు గిన్నెలు తొలకరి వర్షపు పూలజల్లులను, ఆకులపై అలరాలే చినుకుల ముత్యాలను, పాత పరిచయాన్ని పడే పడే పలవరించడం, చిగురాకు సవ్వడిలో పూమొగ్గల పరిమళాన్ని ఆస్వాదించడం, తలపుల తాకిడిని పెనుగాలికి రాలిపోయే పూలతో పోల్చడం, నది నడకలను, రాకను, పోకను కూడా సంధ్యానాదంతో పోల్చడం చాలా చాలా బావుంది. కదిలే మేఘాలను, పొద్దుపొడుపుల అందాలను, చీకటి దుప్పటిలో వెన్నెల నక్షత్రాలను, జ్ఞాపకాల తుంపర్లను, ప్రేమలో విజయ కేతనాన్ని, ధీరత్వాన్ని జీవితంలో ఆటుపోట్లకు వెరవని మనసని చెప్పడం, పొగడ్త మంచిదికాదని, సాగర సంగమం జీవితమని, పున్నమి, కలువల అనుబంధాన్ని, కలల నిరీక్షణలో వేసారిన కనురెప్పలకు, రెప్పల పరదాలను వేయడం చాలా అద్భుతమైన భావం.

రెప్పల పరదాలను వేసేసాను…
కనుల సౌధానికి,
నీ కలలను గుట్టుగా దాచుకుందామనే..!!

ఇలాంటి ఎన్నో అద్భుతమైన త్రిపదలు ఈ సంపుటి నిండా పరుచుకుని మనలను ఆపకుండా చదివిస్తాయనడంలో సందేహం లేదు. అన్ని సమీక్షించడం కన్నా చదవడం బావుంటుంది. ఓ చక్కని తుషార మల్లికను అందించిన సిరి వడ్డేకి మరోసారి మనఃపూర్వక అభినందనలు.

కొత్త కథలు – సమీక్ష

సమీక్ష: – నండూరి సుందరీ నాగమణి

కొత్త కథలు – ౩౩ మంది రచయిత్రుల మంచి కథలతో వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు వెలుగు లోనికి తీసుకువచ్చిన ఒక మంచి పుస్తకం.

ఈ పుస్తకములో సీనియర్ రచయిత్రుల దగ్గరనుండి, వర్థమాన రచయిత్రులవరకూ అందరి కథలూ ఉన్నాయి. ప్రతీ కథ కూడా కథా, కథనమూ ఆసక్తిని కలిగించేలా ఉండటం హర్షదాయకం.

విపంచితో విద్యుల్లతకు చిన్ననాటి స్పర్థా పూర్వక స్నేహం, పెద్దయ్యాక, ఆమెను చూసి, కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడిని గుర్తు చేసి కళ్ళు తెరిపిస్తుంది, ‘విశ్వవిపంచి’ అనే కథలో. ‘దుష్ట రక్షణ’ అనే కథలో తనను భక్షించబోయిన ముష్కరులను తెలివితో బంధించి, వారిని న్యాయస్థానానికి ఈడ్చిన శృతి పాత్రను అభినందించకుండా ఉండలేము. కానీ, దోషులు నిర్దోషులుగా నిరూపించబడి విడుదల కావటం, దుష్టులకే రక్షణ కలగటం కించిత్ బాధనే కలిగిస్తుంది. కానీ జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబంగా నిలిచిందీ కథ.

‘నెలపొడుపు’ అనే కథలో చేయని నేరానికి, ఒక హంతకిగా, కళంకితగా జైలు శిక్షను అనుభవించి తిరిగి వచ్చిన రమ్య పాత్ర కొడుకు కోసం ఎంతో ఆశతో తిరిగి వచ్చినా, బామ్మ పెంపకంలో పెరిగిన ఆ కొడుకు ఆవిడ నూరిపోసిన విష ప్రభావంతో తల్లిని ఛీత్కరించగా కుమిలిపోతూ వెనుదిరిగిన ఆమెను తన మాటలతో ధైర్యం చెప్పి, తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడం కోసం అయినా పోరాడమని అనునయిస్తాడు పోలీసు నరసింహ. ఆ స్ఫూర్తితో తిరిగి నిలబడుతుంది రమ్య.

‘స్వాభిమానం’ అనే కథలో దిక్కులేని ఒక దీనురాలికి భర్తయై అండగా నిలబడిన ఒక వృద్ధుడి ఔన్నత్యం మన కనులు చెమరింపజేస్తుంది. ‘పెండ్లి అంటే ఇది’, ‘అమ్మ నాన్న – ఒక పెళ్ళి’ కథలు జయప్రదమైన అభ్యుదయ వివాహాల గురించి ఎంతో వివరంగా తెలియజేస్తాయి. ‘పాతసామాన్లు’ అనే కథలో అటక మీద దాచిన ఒక్కొక్క వస్తువుకూ ఒక్కొక్క జ్ఞాపకాన్ని వెలికి తెచ్చి, మనసుకు హాయిని కలిగిస్తారు, రచయిత్రి. ఈ కథ మన ఇంటింటి కథ అని అనిపిస్తుంది. ‘మనిషి జాడలు’ కథ ధనముతో కొలవని మానవత్వాన్ని పరిచయం చేస్తుంది.

‘వచ్చే జన్మకైనా…’, ‘శ్రద్ధగా పని నేర్చుకో నాన్నా…’ కథలు మగపుట్టుకలో ఉండే కష్టాలను చెబుతూనే, గిలిగింతలతో నవ్విస్తాయి. ‘హుండీ’ కథ, మానవ హృదయం, మానవత్వపు దైవాన్ని నిలుపుకొని, ఎలా దేవాలయం కాగలదో ఎంతో హృద్యంగా తెలియజేస్తుంది. ఇంకా ‘చైతన్య’ కథ మహిళలకు స్ఫూర్తిదాయకంగానూ, ‘పేరు’ కథ వారిని ఆలోచింపజేసేది గానూ రచింపబడ్డాయి. ‘మానవత్వపు స్పర్శ’ మంచాన పడిన ఒక రోగికి మానసిక సాంత్వననిచ్చి కోలుకునేలా చేసిన ఒక మంచి మనిషిని పరిచయం చేస్తుంది. ఓ హెన్రీ వ్రాసిన ‘ది లాస్ట్ లీఫ్’ కథ లీలగా మనకు గుర్తుకు రాక మానదు. ‘తెలుగురాని దానివని దిగులు చెందకు…’ నేటి చిత్ర కథానాయికల, గాత్రదాన కళాకారిణులు, గాయనీ మణుల ఎంపిక మీద సంధించిన చక్కని వ్యంగ్యాస్త్రం.

మిగిలిన కథలన్నీ కూడా చదువరుల మనసులకు ఎంతో తృప్తిని ఇస్తాయి. పాఠకులూ, రచయిత(త్రు)లూ కూడా చదివి తీరవలసిన పుస్తకం ఇది. డా.సి.నారాయణరెడ్డిగారి సంస్మరణలో ఇంత మంచి పుస్తకం తీసుకువచ్చిన ‘వంశీ’ వారు ఎంతైనా అభినందనీయులే.

అంతర్వాణి – సమీక్ష

సమీక్ష: నండూరి సుందరీ నాగమణి

‘అంతర్వాణి’ – శ్రీ కొసరాజు కృష్ణప్రసాద్ గారి కవితాసంపుటి పేరుకు తగినట్టే స్వగతంగా వ్రాసుకున్న కవితలతో కొనసాగుతుంది. చక్కని పద ప్రవాహంతో, లయతో సాగిన ఈ కవితలు అన్నీ విభిన్న కవితావస్తువులతో అలరించాయి.

‘మాతా పిత: నమామి’ అంటూ అమ్మానాన్నల తలచుకొంటూ, వారికి ప్రణామములు అర్పిస్తూ మొదలైన కవితా వాహిని, ఆద్యంతమూ చదువరుల మనసును ఆకట్టుకునే విధంగా కొనసాగింది. ‘వ్రాసితిని వ్రాసితిని’ అనే కవితలో తన కవితకు స్ఫూర్తి దాయకులైన కవులను – అలనాటి రాయల నుంచి, ఇటీవలి మహాకవి శ్రీశ్రీ వరకూ అందరినీ స్మరించారు. రైతు గొప్పదనాన్ని ‘కృషీవలుడు’ అనే కవితలోనూ, తెలుగు నేల ఘనతను ‘తెలుగుతల్లి’ కవితలోనూ, శిల్పి చేతిలో శిల్పంగాను, పెద్ద పెద్ద భవంతులకు పునాది గానూ నిలిచే ‘రాయి’ని ‘రాయి’ అనే కవితలోనూ చక్కగా వర్ణించారు. ‘భడవ’, ‘చిట్టితల్లి’ అనే కవితలలో తమ సంతానం గురించి పితృ వాత్సల్యంతో వారిద్దరినీ వర్ణించారు.

వచనకవితలు వ్రాసే కవులందరికీ అజ్ఞాత గురువు శ్రీశ్రీ గారే… ‘శ్రీశ్రీ’ అనే కవితలో వారిని స్మరించుకున్న తీరు, ‘అమ్మ’ కవితలో అమ్మ గురించి వ్రాసుకున్న రీతి అమోఘంగా ఉన్నాయి. ‘మంచోళ్ళవండే’ కవిత నేటి రాజకీయ నాయకులపై, రాజకీయ పరిస్థితులపై ఒక చక్కని వ్యంగ్యాస్త్రం.

ఇంత మంచి కవితాసంపుటిని రచించిన శ్రీ ‘కొసరాజు కృష్ణప్రసాద్’ గారిని, అందంగా అచ్చువేసిన మన జేవీ పబ్లికేషన్స్ అధినేత శ్రీమతి జ్యోతి వలబోజు గారిని అభినందిస్తూ, పుస్తకం అందుకొని చదివేద్దామా మరి!
***
నండూరి సుందరీ నాగమణి