జాగేశ్వర మహదేవ్ మందిరం

రచన: నాగలక్ష్మి కర్రా

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశం గురించి వెతికితే మూడు రాష్ట్రాలలో అదే పేరుతో వున్నట్లు తెలిసింది. మొదటది మహారాష్ట్రలో వున్న ఔండ నాగనాధ్, ద్వారక దగ్గర వున్న నాగనాధ్ ఉత్తరాఖంఢ్ లో వున్న జాగేశ్వర్ లో వున్న నాగనాధ్. ఆయా రాష్ట్రాలవారు మాదే ఒరిజనల్ నాగనాధ్ అని అంటున్నారు, సరే మూడింటినీ చూసేస్తే పోలా అని జాగేశ్వర్ బయలుదేరేం.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాన్ని ఘరేవాల్, కుమావు ప్రాంతాలుగా విభజించేరు. బదరినాధ్, కేదార్ నాధ్, గంగోత్రి, యమునోత్రి, మొదలయిన పుణ్యక్షేత్రాలు ఘరేవాల్ ప్రాంతంలో వుండగా నైనిటాల్, రాణిఖేత్, జాగేశ్వర్, భాగేశ్వర్, పాతాళ భువనేశ్వర్ కుమావు ప్రాంతంలో వున్నాయి.
కుమావు ప్రాంతంలో వున్న జాగేశ్వర్ మహాదేవ్ గురించి తెలుసుకుందాం.
భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి జాగేశ్వర్ కి 400 కిమి.., ఢిల్లి నుంచి టూరిస్టు బస్సులు, ప్రైవేట్ టాక్సీలు బుక్ చేసుకోవచ్చు. రైలులో వెళ్లాలనుకొనేవారు ఢిల్లీ నుంచి కాఠ్ గోదాం వరకు రైలులో వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి. కాఠ్ గోదాం నుంచి జాగేశ్వర్ సుమారు 125 కిమీ.. ఈ దూరం మాత్రం రోడ్డు మార్గం ద్వారానే చేరుకోగలం. కాఠ్ గోదాం నుంచి అంటా ఘాట్ రోడ్డే కాబట్టి ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది.
ఢిల్లీ నుంచి రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటే మన ప్రయాణం ఉత్తరప్రదేశ్ లోని మీరట్, మొరాదాబాద్, రామనగర్ ( సమాజ్ వాది పార్టీలో వుండగా జయప్రద ఎం.పి గా వున్న నగరం ) ప్రాంతాల మీదుగా సాగి ఉత్తరాఖండ్ లోని హాల్ద్ వాని, కాఠ్ గోదాం మీదుగా సాగి ఆల్మొడా చేరుతాం. కాఠ్ గోదాం దాటిన తరువాత భోజన వసతులకు అల్మొడాలో మాత్రమే అనుకూలంగా వుంటుంది. కాఠ్ గోదాం నుంచి అంటా ఘాట్ రోడ్డు అవటం వల్ల , రోడ్డు వెడల్పు తక్కువ, కొండ చరియలు విరిగి పడ్డం వల్ల ప్రయాణానికి అంతరాయం కలిగిస్తూ 125 కిమీ.. సుమారు ఆరు యేడు గంటల సమయం పడుతుంది.
ఆల్మోడా దగ్గర పిత్తొరాఘఢ్ వెళ్ళే హైవే మీద సుమారు 14 కిమీ.. వెళ్ళిన తరువాత చితై అనే వూరు వొచ్చింది. యీ కొండ ప్రాంతాలలో ఊరులన్నీ రోడ్డుకి ఆనుకొని వుంటాయి. వూరు అంటే వేళ్ళ మీద లెఖ్ఖ పెట్టగలినన్ని ఇళ్ళు నిత్యావుసర వస్తువుల దుకాణాలు ఒకటోరెండో.అదీ వూరు.బట్టల షాపు, టీ బడ్డి వుంటే అది టౌను.ఆ వూర్లో రోడ్డుకి యిరువైపులా చిన్నచిన్న షాప్స్ అందులో అమ్మే వస్తువలు మనని ఆకట్టుకుంటాయి. అవి గంటలు, కోవెలలో కట్టే లాంటివి అతిచిన్న సైజు నుంచి అతి పెద్ద సైజు వరకు పెట్టి అమ్ముతున్నారు. కుతూహలం ఆపుకోలేక కారు రోడ్డుపక్కన ఆపి విషయం అడిగితే వాళ్లు చెప్పినదేమిటంటే అక్కడే చిన్న గుట్ట మీద వున్న అమ్మవారిని చైతై దేవి, గోలు దేవి అని అంటారని ఈ అమ్మవారికి మొక్కుబడులు యీ గంటల రూపంలో తీర్చుకుంటారుట భక్తులు, కాబట్టి యీ దేవిని గంటా దేవి అని అంటారని చెప్పేరు. అది వినగానే మేము కూడా అమ్మవారిని దర్శించుకోడానికి వెళ్లేం. ప్రవేశద్వారం నుంచి మెట్లు వుంటాయి,మెట్లుకి రెండువైపులా కొన్నివేల లక్షకి చేరేయో చిన్న పెద్ద గంటలు వేలాడ దీసి వున్నాయి. మండపం చుట్టూరా యేవేవో రాసిన చిన్న పెద్ద కాయితాల గుత్తులు వేలాడదీసి వున్నాయి. అవి అన్నీ న్యాయంకోసం భక్తులు పెట్టుకున్న ఆర్జీలుట. కోర్టు లో సాక్షాధారాలు న్యాయం వైపు లేక అన్యాయం జరిగిన వారు, న్యాయం కోసం కోర్టు వరకు వెళ్ళలేని వారు యిక్కడ తమకు జరిగిన అన్యాయం గురించి వొక కాయితం మీద రాసి కోవెలలో వ్రేలాడ దీస్తారు. అలాంటి వారికి న్యాయం చేస్తుందిట అమ్మవారు. పన్నెండు సంవత్సరాలు క్రిందట మేం మొదటిమారు యీ గోలు దేవిని దర్శించు కున్నప్పుడు యిది ఆలా చిన్న మందిరం. ఏటికేడాది ఈ కోవెలలో మార్పులు చోటు చేసుకుంటూ యిప్పడు ఆ కోవేలకి అర కిమీ ముందు నుంచి పూజా ద్రవ్యాలు, గంటలు అమ్మే దుకాణాలు మొదలవుతున్నాయి.గంటల సంఖ్య కుడా బాగా పెరిగిపోయాయి. అలాగే అర్జీలు కుడా గణనీయంగా పెరిగేయి. దీన్ని బట్టి చైతై దేవి మీద భక్తుల నమ్మకం రోజు రోజు పెరుగుతోందని మనకు తెలుస్తోంది.


గోలు దేవిని దర్శించు కొని తిరిగి మా ప్రయాణం కొనసాగించేము. మరో 20 కిమీ.. వెళ్లిన తరువాత రోడ్డుకి కుడివైపున జటగంగ వొడ్డున మందిర సముహం కనిపిస్తుంది. యిక్కడ కుబేరుని మందిరం, శివుని కోవెల యింకా చిన్న చిన్న మందిరాలు వున్నాయి. యీ దేవాలయ సమూహాలు అర్కియాలజి వారు సంరక్షిస్తున్నారు. దీనిని బాల జాగేశ్వర్ మందిరం అంటారు.
బాల జాగేశ్వర మందిరాన్ని చూసుకొని జాగేశ్వర్ బయలుదేరేం. మూడు కిలోమీటర్ల ప్రయాణానంతరం జాగేశ్వర్ చేరేం. అప్పట్లో జాగేశ్వర్ లో కుమావు వికాస మండల వారి గెస్ట్ హౌసు మాత్రమే వుండేది. వూరు మొదలులోనే గెస్ట్ హౌసు వుండడంతో ముందుగా రూము తీసుకొని ఫ్రెష్ అయి మందిరం వైపు వెళ్లేం. ఊరంతా కలిపి పది గడపల కంటే లేవు. గెస్ట్ హౌస్ కి పక్కగా మ్యూజియం వుంది అందులో చాలా పురాతనమైన రాతి విగ్రహాలు వున్నాయి. అక్కడ ఓ యూరోపియన్ జంట కలిసేరు, అక్కడ వున్న ఛాముండి విగ్రహం చూపించి యెవరు యేమిటి అని అడిగేరు, వచ్చీరాని యింగ్లీషులో పార్వతీ దేవి అవతారం అని చెప్తే కాళి, దుర్గాల గురించి తెలుసు కాని ఛాముండి గురించి తెలియదు అంటే ఛండ, ముండ అనే రాక్షసులను చంపడం మొదలయిన కథ వారికి వినిపించేను. మన హిందువులలో చాలామందికి పురాణాలమీద అవగాహన లేదు, ఆ శక్తిలేదు, వారి కుతూహలానికి జోహారు అనకుండా వుండలేకపోయేను. అయిదుకి మ్యూజియం మూసేస్తారు.
ఈ గ్రామం యిక్కడి మందిరం పేరు మీదనే గుర్తింపబడుతోంది. ఆల్మోడా నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరాన సుమారు 1870 మీటర్ల యెత్తులో దేవదారు వృక్షాల నడుమ , నందిని, సురభి అనే సెలయేరులు సంగమించిన పుణ్యప్రదేశం యిది.
ఆర్కియోలజికల్ సర్వే వారిచే సంరక్షింప పడుతున్న మందిర సముదాయం. సుమారు 124 చిన్న పెద్ద మందిరాలు వున్నాయి. ఇవి సుమారు తొమ్మిది నుంచి పదకొండవ శతాబ్దాల మధ్యలో నిర్మించినట్లు అంచనా. దండేశ్వరమందిరం, ఛండి మందిరం, జాగేశ్వర మందిరం, కుబేర మందిరం, పుష్టి దేవి మందిరం, మృత్యుంజయ మహదేవ మందిరం, నందాదేవి, నవ దుర్గ, నవ గ్రహ, సూర్య మొదలైన మందిరాలు వున్నాయి. వాటిలో అతి పురాతనమైనది మృత్యుంజ మందిరం, దండేశ్వర మందిరం అతిపెద్దది. ప్రాంగణమంతా రాతి పలకలు పరిచి వుంటాయి. చాలా చల్లగా వుంటుంది సూర్యాస్తమయం అవగానే శయన హారతి యిచ్చి మందిరం మూసేస్తారు. ఈ మందిరాలు పాండవులచే నిర్మింపబడ్డవి.
అన్ని ఉత్తరభారతదేశ మందిరాలలో వున్నట్లు యిక్కడకూడా శివలింగాన్ని తాకి పూజలు చేసుకోవచ్చు. స్థలపురాణం చెప్పుకొనే ముందర మందిరం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం.
జాగేశ్వర మందిరం శంకరాచార్యులవారిచే గుర్తింపబడ్డ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశం. ఇక్కడ పూజారులు కూడా శంకరాచార్యులచే నియమింపబడ్డ దక్షిణాదికి చెందిన పండితులే. అయితే కాలక్రమేణా యిక్కడి స్త్రీలను వివాహమాడి వారి భాషను కూడా మరచిపోయేరు, కాని మనం అడిగితే వారి పూర్వీకులు యే ప్రాంతానికి చెందినవారో చెప్పి సరదా పడతారు. జనవరి ఫిబ్రవరిలలో హిమపాతం జరుగుతుంది. మిగతా కాలం అతిచల్లగా వుంటుంది.
పాండవులు మృత్యుంజయుని రూపంలో శివుని ప్రార్ధించుకొని మహాభారత యుధ్దంలో మరణం లేకుండా వరం పొందేరుట.
జాగేశ్వరమహదేవ్ మందిరం కాస్త వెనుకవైపు వుంటుంది. ముందుగా యెడమవైపు వచ్చేది మృత్యంజయ మందిరం, ఇక్కడ చేసుకునే పూజ ధాన్యం ఆయుష్యు పెంచుతుందని నమ్మకం. ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగువారు యిక్కడ మృత్యుంజయ హోమాలు చేయించుకోడం చూసేం. కాలసర్పదోషం వున్నవారు యిక్కడ హోమం చేసుకుంటే దోషనివారణ జరుగుతుందని చెప్పేరు.

తరవాత దండేశ్వర మహదేవ్ మందిరం చివరగా కుడివైపున నాగేశం మందిరాలు వున్నాయి. నాగేశం మందిరం పైన పెద్ద రాతితో చెక్కిన పాము విగ్రహం వుంటుంది. బయట ద్వారపాలకులుగా నంది, స్కంది కాపలా కాస్తూ వున్నారు. లోపల మంటపంలో, మహంతు కూర్చొనే గద్ది వుంది . అక్కడ అఖండదీపం, శివలింగం వుంటాయి. శివలింగానికి వెనుకవైపు గోడకు అమ్మవారి విగ్రహం వుంటాయి. పక్కగా మంచం పరుపు వుంటాయి. ఇక్కడ శివలింగం రెండు ముఖాలు వున్నట్లుగా వుంటుంది. దీనిని అర్ధనారీశ్వర లింగం అంటారు, పెద్ద భాగం శివుడని, చిన్న భాగం పార్వతి అని అంటారు. అలాగే లింగం చేత్తో కదిపితే కదులుతూ వుంటుంది. ఇక్కడ శివుడు యెప్పుడూ జాగ్రదావస్థలో వుంటాడట, సాధారణంగా మందిరాలలో దేవుడు హారతి సమయాలలో మాత్రమే వుంటాడని, యిక్కడ మాత్రం యెప్పుడూ వుంటాడని అంటారు. అందుకే యీ శివుడిని జాగేశ్వరుడు అని పిలుస్తారు.
రాత్రి శయన హారతికి ముందు పక్కన వున్న పడకను చక్కగా అమర్చి పూజారులు తలుపులు మూసేస్తారు, మరునాడు తలుపులు తెరిచేసరికి పడక పైన వేసిన దుప్పటి శివుడు శయనించేడు అనడానికి నిదర్శనంగా చెదరి వుంటుందట యిది పూజారులు చెప్పిన విషయం.
ప్రతి సంవత్సరం శివరాత్రికి, శ్రావణ మాసంలోనూ యాత్ర జరుగుతుంది. అప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. మిగతా సమయాలలో చాలా నిర్మానుష్యంగా వుంటుంది.
మందిర ప్రాంగణం లో పుష్టిదేవి మందిరం చూడదగ్గది.

స్థలపురాణం ప్రకారం విష్ణుమూర్తిచే స్థాపించబడ్డ జ్యోతిర్లింగమైన నాగేశం ని వెతుకుతూ శంకరాచార్యులవారు వచ్చి యీ ప్రదేశాన్ని గుర్తించి నాగనాథ్ లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసి తనకూడా వచ్చిన శిష్యులను పూజారులుగా నియమించేరు. కాలాంతరంలో చంద్ర వంశానికి చెందిన కతూరియా రాజులు మరమ్మత్తులు చేయించేరు. మరో కథనం ప్రకారం శివుడు యీ ప్రదేశానికి వచ్చి తపస్సమాధిలో వుండగా రాక్షసులు ధ్యాన భంగం చేస్తూవుంటారు. శివుడు మూడు నేత్రాలుకలిగిన ‘ శామ్ ‘ అనే గణాన్ని రాక్షస సంహారమునకు పంపుతాడు, శామ్ రాక్షస సంహారం గావించి అవతారం చాలిస్తాడు. ఈ ప్రదేశం జాగేశ్వర మహదేవ మందిరానికి 2 కిలోమీటర్ల దూరంలో వున్న ‘ కోటి లింగాలు ‘ అనే ప్రదేశం లో జరిగినట్లు చెప్తారు. ఇది జటగంగ శామ్ గంగల పవిత్ర సంగమ ప్రాంతం కావడం మరో విశేషం. శంకరాచార్యులవారు యిక్కడ నాగేశం మందిరాన్ని నిర్మించ దలచేరట, మందిరం సగం నిర్మించిన తర్వాత కూలిపోయిందట, ఇప్పటికీ అక్కడ పడి వున్న శిథిలాలను చూడొచ్చు. స్థానికుల నమ్మకం ప్రకారం కోటిలింగాలలో శివుడు యిప్పటికీ తపస్సమాధిలో వున్నట్లు కలియుగంలో తన 28 వ అవతారంగా ‘ లకులిష ‘ అనే పేరుతో మానవులను కలిప్రభావమునుండి రక్షించడానికి వస్తాడని, ఆ అవతారంలో శివుడు తన జడలలో కర్రతో చేసిన సుత్తి ఆకారాన్ని బంధించి తిరుగుతూ వస్తాడని కోటిలింగాల ప్రాంతంలో అతనికి మందిర నిర్మాణం చెయ్యమని శివుడు కోరినట్లుగా చెప్తారు, సోమనాధ్ ప్రాంతంలో వున్న గుజరాతీలలో కూడా యీ కథ గురించి నమ్మకం వుంది, ఆనమ్మకంతోనే కొంతమంది గుజరాతీలు 3, 4 తరాలకు పూర్వం యిక్కడకు వలస వచ్చేరు. శివుడు కోరిన ప్రకారం మందిరనిర్మాణం చేసేరట.
స్థానికల మరో కథనం ప్రకారం ‘ లకులిష ‘ అవతారం ఉద్భవించిందని బాలునిగా వున్నప్పుడు బాల జాగేశ్వర లోని మందిర సముదాయంలో సంచరించే వాడని మధ్య వయసువరకు జాగేశ్వర్ లోనూ ముసలి వయసులో వృద్ద జాగేశ్వర్ లో గడిపి అవతారం చాలించేడని, అతని శిష్యులను ‘ లకులిషులు ‘ అంటారని చెప్తారు. వీరు విభూతి ధారులై జడలతో మనకి యీ ప్రాంతాలలో కనిపిస్తారు.

వృద్ద జాగేశ్వర్ చిన్న గుట్టమీద వున్న చిన్న మందిరం, లోపల శివలింగం మందిరం పక్కనే పూజారి యిల్లు, రోజూ నైవేద్యం పెట్టి ఆ సమయంలో మందిరంలో భక్తులకు ప్రసాదం యిస్తూ వుంటారు. ఇక్కడ నాకు నచ్చిన విషయం యేమిటంటే దక్షిణ కోసం పూజారులు పీడించకపోవడం, ఈ మందిరాలు యే ట్రస్టు ఆధ్వర్యంలోనూ లేవు, భుక్తికి యెలా అనే ప్రశ్నకు సమాధానం శివుడుని నమ్ముకున్నవారికి భుక్తి శివుడే యిస్తాడు అని సమాధానమిచ్చేరు.
సాయంత్రం ఒక దర్శనం, పొద్దున్న మరో దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయేం.

బ్రహ్మకమలాల పుట్టిల్లు వేలీ ఆఫ్ ఫ్లవర్స్ హేమకుంఢ్ సాహెబ్

రచన: కర్రా నాగలక్ష్మి

ఉత్తరా ఖండ్ అంటేనే యెత్తైన కొండలు , గలగలలను ప్రవహించే సెలయేళ్లు , భగీరధిని చేరుకోవాలని పరుగులు పెడుతున్న అలకనంద అందాలు , తెల్లని మంచు కప్పబడ్డ పర్వతాలు గుర్తుకొస్తాయి .
ఎత్తైన కొండల వెనుక యెన్నెన్నో అద్భుతాలు , యెన్ని సార్లు యీ కొండలలో తిరిగినా యింకా యెన్నో చూడవలసిన ప్రదేశాలు మిగిలే వుంటాయి .
అలాంటిదే జోషిమఠ్ నుంచి బదరీనాధ్ వెళ్లే దారిలోవున్న ‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ .
‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ వెళ్లాలంటే ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో వున్న గోవింద్ ఘాట్ నుంచి కొండలలో నడక ద్వారా చేరుకోవాలి .
హెలికాఫ్టరు సేవ వున్నా మనం గుర్రాలనో , డోలీలలో ఆశ్రయించడమే మేలు . ఎందుకంటే యీ ప్రాంతాలలో హిమపాతం , వర్షపాతం రెండూ యెక్కువగానే వుంటాయి , అందువల్ల హెలికాఫ్టరు సేవ రద్దు చెయ్యబడుతూ వుంటాయి . గోవింద ఘాటు నుంచి హేమకుంఢ్ సాహెబ్ కి చాలామంది హిందువులు , శిక్కులు కూడా దర్శనార్థం వెళుతూ వుంటారు .
ఢిల్లీ కి 200 కిలో మీటర్లు దూరంలో వున్న హరిద్వార్ రైలు మార్గం ద్వారా గాని , రోడ్డు మార్గం ద్వారా గాని చేరుకోవచ్చు . హరిద్వార్ కి సుమారు 296 కిలో మీటర్ల దూరం లో వున్న గోవింద ఘాట్ కి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలం . హరిద్వార్ నుంచి ప్రైవేటు రంగం వారి బస్సులు , ఉత్తరాఖండ్ ప్రభుత్వం చే నడుపబడుతున్న బస్సులు , టాక్సీలు లభిస్తాయి . బస్సులలో ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడుకున్నది , యెక్కువ సమయం తీసుకుంటుంది . టాక్సీలు ఖర్చు యెక్కువ , మనకి కావలసిన చోట కావలసినంతసేపు గడిపే వీలుంటుంది . ఒకరో యిద్దరో కాకుండా నలుగురు అంతకన్న యెక్కువ మంది బయలు దేరి నపుడు టాక్సీ యే సుఖంగా వుంటుంది . మేం మొత్తం ఆరు జోడీలు బయలు దేరేం . ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు రెండు ‘ ఇన్నోవా ‘ లు మాట్లాడు కున్నాం .
మొదటి రోజు ప్రయాణం లో ఉత్తరాఖండ్ శ్రీనగరు చేరుకున్నాం . రాత్రి అక్కడ బస చేసి మరునాడు ఆరింటికి బయలు దేరి మధ్యాహ్నం జోషిమఠ్ చేరుకున్నాం . జోషిమఠ్ దగ్గర దారి మూసి వేసేరని యాత్రీకులను ముందుకు వెళ్లేందుకు అనుమతించలేదు . ఆ రోజు జోషిమఠ్ మఠ్ లో బస చేసి మరునాడు గోవింద ఘాట్ కి దారి తెరువబడగా మేం జోషిమఠ్ నుంచి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి గోవింద ఘాటు చేరుకున్నాం . జోషిమఠ్ నుంచి బదరీనాధ్ వెళ్లే ముఖ్య మార్గాన్ని ఆనుకొని వుంటుంది గోవింద ఘాట్ . ముఖ్య మార్గం నుంచి ఓ కిలోమీటరు ప్రయాణించేక గోవింద ఘాటు చేరుకుంటాం . అక్కడ అన్ని తరగతుల వారికి అందుబాటులో హోటల్స్ వున్నాయి . మరో పక్క అలకనంద వొడ్డున గురుద్వారా వుంది , అందులో యాత్రీకులకు ఉచిత భోజన , పార్కింగ్ , నివాసాలు వున్నాయి . అక్కడ నుంచి కాలిబాట మొదలవు తుంది .
ఓ అర కిలో మీటరు నడిచేక అక్కడ నుంచి గుర్రాలు , డోలీలు , సామానులు మేసేవారు లభిస్తారు .
గురుద్వారా దగ్గర రెండు రోజులకు సరిపడా బట్టలు మొదలయిన నిత్యావసరవస్తువలు చిన్న చిన్న తేలికైన బేగులలో సర్దుకొని మిగతావి మా టాక్సీలలో విడిచి పెట్టి నడక మొదలు పెట్టేం . గురుద్వారాలో మన లగేజీ దాచుకొనే వీలువుంది , అక్కడ కూడా వుంచుకోవచ్చు .
ఇలాంటి యాత్రలు చేసేటప్పుడు ముఖ్యంగా మనం సర్దుకోవలసిన వస్తువులు యేమిటో చూద్దాం . మోయిశ్చరైజింగు క్రీము , సన్ స్క్రీను , చాలినన్ని చలిబట్టలు , రైన్కోటు , కొండలలో నడకకు వీలుగా వుండే షూస్ , చీరలు గుర్రాలు యెక్కడానికి వీలుగా వుండవుకాబట్టి వీలుగా వుండే దుస్తులు , రుగ్మతలు వున్నవారు వారి మందులు , సామాన్య రుగ్మతలకు మందులు వుంచుకోవాలి . మంచి వెలుగునిచ్చే టార్చ్ , చిన్నచిన్న పోలిథిన్ బాగులు .


మా గ్రూపు వేలీ ఆఫ్ ఫ్లవర్స్ , హేమకుంఢ్ సాహెబ్ రెండూ దర్శించుకుందామని నిర్ణయించుకున్నాం . మా గ్రూపులో యెక్కువగా యాత్రలు చేసింది మా దంపతులమే కావడం తో మమ్మల్ని గ్రూపు లీడర్లను చేసేరు . అందరం గుర్రాలమీద యాత్ర చేసుకోవాలనే ముందుగానే అనుకోడంతో గుర్రాలను మాట్లాడుకొని ప్రయాణం సాగించేము . మేము సుమారు 12 కిలో మీటర్లు ప్రయాణించి గంఘారియా చేరుకోవాలి . అక్కడకు చేరుకున్న తరువాత వెంటనే ‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ కి బయలుదేరాలనేది మా ఆలోచన .
మట్టి , బురద మీద కొంతదూరం యెత్తైన బండరాళ్ల పైనుంచి కొంతదూరం మరీ యెత్తు యెక్కువగా వున్న చోట్ల గుర్రాలమీద నుంచి దిగి గుర్రం యజమాని చేయి వూతతో నడుస్తూ ఆపసోపాలు పడసాగేం . వందలలో శిక్కులు అయిదేళ్ల పిల్లల దగ్గర నుండి 70 , 80 యేళ్ల వయసు వారు కూడా సులువుగా నడుస్తూ వుండడం మాకు ఆశ్చర్యాన్ని కలుగ జేసింది. వారికి అంతబలం యెక్కడది అనుకుంటే వారి గురువులమీద వారికి వున్న భక్తే వారికి అంత బలాన్నిచ్చింది అని తట్టింది .
అతి కష్టమైన 12 కిలో మీటర్ల ప్రయాణం ముగియగానే చక్కని పచ్చిక మైదానం చిన్నచిన్న సెలయేళ్లు ప్రవహిస్తూ కనువిందు చేసే ప్రదేశంలో మరో రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి గంఘారియాలో మాబస చేరుకున్నాం . గోవింద ఘాట్ నుంచి సుమారు ఆరు గంటల సమయం పట్టింది .
ఘంగారియా భైందర లోయలోని భైందరగంగ , పుష్పవతి నదుల సంగమ ప్రదేశంలో వున్న ప్రదేశం . భైందరగంగ , పుష్పవతి నదులు సంగమించి లక్ష్మణ గంగగా ప్రవహించి గోవింద్ ఘాట్ దగ్గర అలకనందతో కలుస్తుంది .
టెంటు నివాసాలు , మట్టి నివాసాలు మాత్రమే వున్నాయి . అందులోనే భోజనసదుపాయాలు , పడకలు అన్నీ వున్నాయి . ఈ గంఘారియా వేలీ ఆఫ్ ఫ్లవర్స్ కి , హేమకుంఢ్ సాహెబ్ కి కూడలి లాంటిది . గోవింద్ ఘాట్ తరువాత నివాస , భోజన సదుపాయాలు కలిగిన ప్రదేశం యిదే . అయితే యిక్కడి హోటల్స్ ఆరుగంటలకు మూసివేస్తారు , ఆ లోపునే భోజనాదులు ముగించుకోవాలి .
మా నివాసంలో మా సామానులు పడేసి వేడి టీ లైట్ స్నేక్స్ తీసుకొని ‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ కి బయలుదేరేం . మధ్యాహ్నం మూడు తరువాత యీ లోయలోకి ప్రవేశం అనుమతించరు . ప్రవేశ ద్వారం వద్ద టికెట్లు తీసుకొని నడక మొదలు పెట్టేం . ఒకసారి తీసుకున్న టికెట్టు మూడురోజులు వేలీ లోకి ప్రవేశాన్ని కలుగ జేస్తుంది .

ఉత్తరాంచల్ లోని చమోలి జిల్లాలో సుమారు 3,660 మీటర్ల యెత్తున వున్న కనువిందైన లోయ యిది .
వేలీ ఆఫ్ ఫ్లవర్స్ కి మూడు కిలో మీటర్ల యెగుడు దిగుడు కొండలమీద నడక అనంతరం ‘ నందాదేవి నేషనల్ పార్క్ ‘ లో ప్రవేశిస్తాం . వేలీ లోకి ప్రవేశించే దారి యెక్కువగా కురుసే వర్షాలకి కొండరాళ్లు దొర్లుకుంటూ రావడంతో చాలా కష్టతరం గా వుంటుంది .
మూడు కిలో మీటర్లు నడవడానికి మేం వేసుకున్న అంచనా తప్పడంతో సూర్యాస్తమయం అయేసరికి ‘ నందాదేవి నేషనల్ పార్క్ ‘ గేటు చేరుకున్నాం . చీకటి రాత్రిలో యెంతవరకు లోయలో తిరుగగలం , దారిలేని కొండలలో వెనుకకి క్షేమంగా చేరగలమా అనే ప్రశ్నలు తలెత్తడంతో తిరిగి మరునాడు రావాలని నిర్ణయించుకొని వెనుతిరిగేం .
మరునాడు పొద్దున్నే అయిదు గంటలకి డోలీలు కట్టించుకొని బయలుదేరేం . ‘ నందాదేవి నేషనల్ పార్క్ ‘ లో ప్రవేశించడానికే మూడు కిలో మీటర్ల నడక అంటే రాను పోను ఆరు కిలో మీటర్లు , అంత నడక అలవాటు లేదు , అదీకాక లోయలో తిరిగితే కాని యేమీ చూసినట్టుగా కాదు కదా ? నందాదేవి పార్క్ వరకు రానూపోనూ డోలి కట్టించుకున్నాం , వారే మాకు లోయలో మార్గదర్శకులు కూడా .
ఓ అరగంటలో పార్క్ గేటు దగ్గరకి చేరేం అక్కడ నుంచి వేలీ అంతా మైదానం కాబట్టి నడక కష్టం కాలేదు
లేలేత సూర్యుని కిరణాలు హిమాలయాలపై పడి పరావర్తనం చెందుతూ విరజిమ్ముతున్న బంగారు వన్నె కాంతిలో పూల లోయ అందాలు వర్ణించడం మహాకవులవల్ల తప్ప నావల్ల అవుతుందా ? ఒక్కో రంగు పువ్వులను ఒకేచోట వరుసగా నాటినట్టున్నాయి . అలా నడుస్తూ ఒక్కోరంగు పూలతోటలను దాటసాగేం , ఇంద్రధనుసు రంగులలో పూవులు , మధ్యమధ్యలో పిల్ల సెలయేళ్లని దాటుతూ పోతున్నాం . ఒకటి రెండు కిలోమీటర్లు దాటిన తరువాత రంగు రంగుల క్రోటన్స్ మొక్కలు . అంటే పూలమొక్కల మధ్యలో ఆకుల మొక్కలు పూల అమరికలో మనం పూలు , ఆకులను అమర్చినట్లుండం ఆశ్చర్యాన్ని కలుగ జేసింది .
దూరం నుంచి చూస్తే రంగురంగు చారల తివాసి పరిచినట్లు గా కనిపిస్తోంది నేల . పూలలోయ కి గోవింద ఘాట్ నుంచి వాతావరణం అనుమతించే రోజులలో హెలికాఫ్టర్ సర్వీసు వుంటుంది . మేం గోవింద ఘాట్ మీదుగా యెప్పుడు బదరీ వెళ్లినా హెలీకాప్టరు సర్వీసు బోర్డులే తప్ప హెలీకాఫ్టర్లునడుస్తూ మాత్రం కనిపించలేదు .


ఎంతదూరం నడిచినా నాలుగు వైపులా కనుచూపు మేర వరకు రంగు రంగుల పూలతో తీర్చిదిద్దినట్లుగా వుండి కనువిందు చేస్తూ వున్నాయి , అలా సెలయేళ్లు దాటుకుంటూ పూలవనంలో యెంత దూరం ప్రయాణించేమో తెలియలేదు , వెనక్కి వెళ్లాలంటే మనసు వొప్పలేదు , నడిచినంతదూరం వెనక్కి వెళ్లాలని వివేకం హెచ్చరించింది .
ఎదురుగా యేదో చిన్న సమాధి కనిపించింది . దాని పైన జాన్ మార్గెరెట్ అనే ఆమెదని , ఆమె 1939 లో యిక్కడ దొరికే అరుదైన పుష్పజాతుల పైన అధ్యయనం చేసేందుకు వచ్చి ప్రమాదవశాన మరిణించిందని రాసి వుంది . తరవాతి కాలంలో ఆమె చెల్లెలు అక్కగారి జ్ఞాపకార్థం సమాధినిర్మాణం చేసిందని మా డోలి వాళ్లిచ్చిన సమాచారం .
ఈ పూల విత్తనాలు ప్రతీ యేడాది గాలి , నీళ్ల వల్ల దూర ప్రాంతాలకు చేర్చబడి మొలకెత్తి పుష్పిస్తాయట . ఈ సంవత్సరం వున్న రంగుల వారి పూలచెట్ల అమరిక మళ్లా సంవత్సరం మారిపోతుందన్నమాట .
ఇక్కడ పూచే ప్రతీ పూవు , ఆకు వైద్యగుణాలు కలిగివున్న వని అంటారు . రామాయణం లో హనుమంతుడు తీసుకొని వచ్చిన సంజీవని పర్వతం యీ పూల లోయలోనిదేనని అంటారు . ఈ పూల మీంచి వీచేగాలిని పీల్చినా చాలా రోగాలు హరించబడతాయి అని అంటారు . అది నిజమేననడానికి చిన్న సాక్షంగా కొందరు స్థానికులు , బైరాగులు కొన్ని మొక్కలను సేకరిస్తూ కనిపించేరు .
ఈ పూల లోయ సుమారు 8కిలోమీటర్ల పొడవు , 2 కిలో మీటర్ల వెడల్పు కలిగి ఝంకారు మరియు హిమాలయా పర్వత శ్రేణుల మధ్య విస్తరించి వుంది . పూలలోయ కి తూర్పున నందాదేవి అభయారణ్యం వుంది . చాలా మంది ట్రెక్కర్లు నందాదేవి అభయారణ్యానికి పొద్దున్నే వెళ్లి సాయంకాలానికి తిరిగి వస్తూ వుంటారు . ఇక్కడ స్నొలెపర్డ్ , నల్ల యెలుగుబంట్లు , యెర్ర నక్కలు , నీలి గొర్రెలు , కస్తూరీమృగాలు వుంటాయి . మారే జంతువులు కనబడలేదు .
ఈ పూలలోయలో చిన్న కొంగలు , డేగలు తో పాటు రంగురంగుల యీకలతో వుండే మోనల్ పక్షులు కనువిందు చేసేయి .
అంత అందమైన లోయను వదలలేక మరికాస్త దూరం ముందుకు నడిచి మా డోలి వారి హెచ్చరికతో వెనుకకు మరలేం .
గంఘారియా చేరేక మేం బ్రేక్ఫాస్ట్ చెయ్యలేదని పొట్ట గుర్తుచెయ్యగా వేడివేడిగా నూడిల్స్ తిని టీ తాగి హేమకుంఢ్ సాహెబ్ కి బయలుదేరేం .
గోవింద్ ఘాట్ నుంచి ప్రయాణించిన 12 కిలోమీటర్లు వొకయెత్తైతే గంఘారియా నుంచి హేమకుంఢ్ వరకు వున్న 5 కిలో మీటర్లు ఒక యెత్తు . ఈ కిలో మీటర్ల లెక్క యెప్పుడూ ఒకేలా వుండదు . తరచు కురిసే వర్షాలవల్ల ముందువున్న దారిమూసుకు పోవటం కొండరాళ్లమథ్య నుంచి దారిచేసుకుంటూ యాత్ర చేసుకోవడం యీ కొండలలో అలవాటే . గంఘారియా వద్దకు చేరేసరికి సుమారు 3660 మీటర్ల యెత్తుకు చేరుతాం , హేమకుంఢ్ చేరేసరికి మనం 4640 మీటర్ల యెత్తుకి చేరుతాం .
నిటారుగా వున్న కొండలు యెక్కడం వల్ల ఆయాసం బాగా పెరుగుతుంది , యీ కొండలపై యెటువంటి చెట్టు చేమలు లేకపోవడం వల్ల గాలిలో ఆక్సిజన్ తగ్గడం వల్ల కూడా మనకి ఊపిరి తీసుకోడం చాలా కష్టంగా వుంటుంది . శ్వాసకోశ సంబంధ యిబ్బందులు వున్నవారు ఆక్సిజన్ సిలిండర్లు వెంట వుంచుకోవడం మంచిది .
చిన్నపాటి వాన పడుతూ మబ్బులు శరీరాన్ని తాకుతూ వణుకు పుట్టిస్తూ వుంటుంది వాతావరణం .
భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రయాణం సాగించేము .

మరో రెండు కిలోమీటర్ల ప్రయాణం తరువాత ఆ యెత్తైన కొండలలో అతి దుర్లభమైన బ్రహ్మకమలాల మొక్కలు పూలతో కనిపించేసరికి మా ఆనందానికి హద్దు లేకపోయింది . మేం వెళ్లింది సెప్టెంబరు మాసం కావడం వల్ల బ్రహ్మకమలాలను చూడగలిగేం . ఉత్తరాఖండ్ గవర్నమెంటు వీటిని రక్షిత పూ సంపదగా ప్రకటించేరు . పూలను ఫొటోలు తీసుకొని తృప్తి చెందేం . మిగతా ప్రయాణం కష్టంగా వున్నా బ్రహ్మకమలాలను చూసుకుంటూ సాగించేము .
మొత్తం అయిదు కిలో మీటర్లూ రెండు రెండున్నర గంటలలో పూర్తిచేసేం .
గుర్రాలు దిగి గురుద్వారా వైపు నడక సాగించేము . గురుద్వారా బయట లంగరులో వేడివేడి టీ , ఖిచిడీ రోటీ , కూరా యాత్రీకులకు అందజేస్తున్నారు శిక్కులు .
గురుద్వారాకి పక్కగా చిన్న సరస్సు వుంది దీనినే హేమకుంఢ్ అని అంటారు . శిక్కుల పదవ గురువైన గురు ‘ గోవింద్ సింగు ‘ ద్వారా రచింపబడ్డ దశమగ్రంధం లో గురునానక్ హిందూ పురాణాలలో త్రేతాయుగంలో రాముడు అవతారం చాలించి వైకుంఠానికి మరలి పోగా లక్ష్మణుడు యిందజిత్తు మొదలయిన వారిని వధించుట వల్ల సంభవించిన పాపం పరిహారం కానందువల్ల అవతారం పరిసమాప్తి కాలేదు . అప్పుడు లక్ష్మణుడు హిమం తో కప్పబడిన యేడు కొండల మధ్య వున్న సరస్సు వొడ్డున తపస్సాచరించి పాప పరిహారం చేసుకొని వైకుంఠానికి మరలిపోయిన వృత్తాంతం చదివి ఆ ప్రదేశాన్ని వెతుకుతూ వచ్చి యిక్కడ తపస్సాచరించినట్లు , ఆ విషయం గురుగ్రంధ్ సాహెబ్ లో రచించగా దానిని చదివి ఆ ప్రదేశ వర్ణన ప్రకారం యీ ప్రదేశాన్ని గుర్తించినట్లు రచించేడు . 1960 లో యీ గురుద్వారా నిర్మింప ఎబడింది . అప్పటినుంచి ప్రతీ యేడాది యాత్రీకులకు ఉచిత భోజనయేర్పాట్లు కలుగ జేస్తున్నారు . 2013 లో సంభవించిన వరదలలో చాలా మంది యాత్రీకులు , గురుద్వారా సేవకులు మరణించేరు .
సరస్సు చుట్టూరా యేడు కొండలు వాటిపైన శిక్కుల మతపరమైన ద్వజాలు కనిపిస్తాడు . వీటిని ‘ నిశాన్ సాహెబ్ ‘ అని అంటారు . వీటిని వారి గురువుల ఆదేశానుసారం , ఓ పవిత్ర మైన రోజున పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తుల నడుమ మారుస్తారు .
ఓ ఫర్లాంగు దూరంలో చిన్న మందిరం అక్కడ చిన్న బోర్డుమీద లక్ష్మణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం అని రాసి వుంటుంది .
ఆ యెముకలు కొరికే చలిలో శిక్కులు ఆ సరోవరం లో స్నానాలు చెయ్యడం ఆశ్చర్యం కలిగిస్తుంది .

పెద్దహాలులో వుంచిన ‘ గ్రంధ్ సాహెబ్ ‘ ( పవిత్ర గ్రంథం , దానికి వారు పూజలు చేస్తారు ) దర్శనం చేసుకొని కాసేపు రజ్జాయిలలో శరీరాన్ని వేడి చేసుకొని వెనుతిరిగేం . బయట వేడి టీ తాగి మా గుర్రాలనెక్కి గంఘారియా వైపు బయలు దేరేం .
వంద సంఖ్యలో ఆ చలిలో పెద్దపెద్దపొయ్యల మీద టీ ఖిచిడీ మొదలయిన ఫలహారాలను వండి యాత్రీకులకు పెడుతున్న వారి శ్రద్ధకు మెచ్చుకోకుండా వుండలేక పోయేం . ప్రతీ రోజు ప్రొద్దుట 5 కిలో మీటర్లు నడిచి పైకి చేరి వంటలు మొదలు పెడతారు , మళ్లా రెండుగంటలకి తిరుగి కిందకి 5 కిలోమీటర్లు నడిచి గంఘారియా చేరుతారు . రాత్రి హేమకుంఢ్ లో యెవ్వరూ వుండకోడదు అని అంటారు . అలాగే ప్రతీరోజూ గంఘారియాకి వచ్చెస్తారు కూడా ! రాత్రి దేవతలు ఆ సరస్సులో స్నానం చెయ్యడా కి వస్తారు కాబట్టి దేవతలను చూసిన మనుష్యులు ప్రాణాలతో వుండరు అనేది మన పూర్వీకులు చెప్పే కథ అయితే రాత్రి పూట అక్కడ ఆక్సిజన్ వుండదు కాబట్టి రాత్రి అక్కడ వున్న వారు మరణిస్తారు అనేది యిప్పటి సైంటిస్టులు చెప్పేమాట , యేది యేమైనా అక్కడ రాత్రి పూట యెవరూ వుండరన్నది మాత్రం నిజం .
హేమకుంఢ్ సాహెబ్ కి బయలుదేరేటప్పుడు మాకు లక్ష్మణుడు తపస్సు చేసుకున్న ప్రదేశం అక్కడ వున్నట్లు తెలీదు . ఆ మధ్య యీ విషయం ఒక పెద్దాయనతో అంటే రాముడు అక్కడ తపస్సు చేసుకొని రావణబ్రహ్మను సంహరించిన పాపం నుండి విముక్తి పొందేడు , లక్ష్మణుడు యిక్కడ తపస్సుచేసుకొని ఇంద్దజిత్తుని సంహరించిన పాపం పోగొట్టుకున్నాడు అని వాల్మీకి రామాయణం లో లేదు , మీరు చెప్పింది నిజం అనడానికి ఋతువులు చూపించగలరా అన్నారు . అక్కడ పెట్టిన బోర్డ్స్ చదివినది చెప్పగలం గాని ఋజువులు యెక్కడనుంచి తేగలం .
మొత్తం మీద మా యీ యాత్ర సాహసయాత్రని మాత్రం చెప్పగలను . కొండలపై ట్రెక్కింగు యిష్టపడేవారు , ప్రకృతిలోని వింతలను చూడాలనుకునేవారు యీయాత్రలు చెయాలని చెప్పగలను .
ఈ యాత్ర వల్ల కలిగిన ఆనందం ఓ జీవితకాలం నెమరు వేసుకోడానికి సరిపోతుంది .
ఆ రాత్రి గంఘారియాలో గడిపి మర్నాడు మాలో కొంతమంది గుర్రాలపై స్వారీ చెయ్యలేకపోడంతో వారికి డోలీ యేర్పాటు చేసి , మిగతావారం ముందుగా మాట్లాడుకున్న గుర్రాలమీద గోవింద ఘాట్ చేరి అక్కడనుంచి మా టాక్సీలలో జోషిమఠ్ చేరుకున్నాం .

శివ ఖోడి ( గుహ )

రచన: కర్రానాగలక్ష్మి

భక్తునికి భయపడి గుహలో దాక్కున్న శివుడి గురించి విన్నారా?. ఎవరైనా శతృవుకి భయ పడతారు కాని భక్తుడికి భయపడడమా? అదీ ముల్లోకాలను కాపాడే పరమ శివుడు భక్తునికి భయపడి గుహలో దాక్కోడమా?, అదెలా జరిగింది, ఎక్కడ జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం యెందుకు పూర్తిగా యీ వ్యాసం చదవండి. మీకే తెలుస్తుంది.


ఉత్తర భారత రాష్ట్రమైన జమ్మూ కశ్మీరులో జమ్మూ నగరానికి 110 కిమీ..దూరంలో, ‘ రియాసి’ జిల్లాలలో వున్న ‘ రంసూ’ గ్రామానికి సుమారు 3 లేక 4 కిమీ కొండదారిలో నడిచి వెళ్తే యీ గుహాలయం చేరుకోవచ్చు. కశ్మీరిలో ‘ఖోడి’ అంటే గుహ అని అర్ధం. శివుడు వున్న గుహ అని అర్ధం.
జమ్మూ నుంచి యీ గుహాలయం చేరుకోడానికి రెండు దారులు వున్నాయి. మొదటిది అష్ఠాదశ పిఠాలలొ ముఖ్యమైన వైష్ణవదేవికి ట్రెక్ మొదలయ్యే కట్రా టౌన్ మీదుగా, రెండవది జమ్మూ ‘అఖ్ నూర్ ‘ మీదుగా ‘రాజోరి’ వెళ్ళే దారిలో ‘ఖండా మోర్హా ‘ జంక్షన్ నుంచి 6 కిమీ ప్రయాణం చేస్తే ‘ రంసూ ‘ గ్రామం చేరుకోవచ్చు.
వైష్ణవదేవి కోవెల ట్రష్టు వారు యీ కోవెల మేనేజ్ మెంటు కూడా తీసుకొని రోడ్డులు, భోజన సదుపాయాలు, వసతులు యాత్రీకులకు అందుబాటులోకి తెస్తున్నారు. వైష్ణవ దేవి యాత్రీకులు యీ గుహాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ‘ కట్ర’ బస్ స్టాండు నుంచి బస్సు, టాక్సీ సదుపాయాలు వున్నాయి.
‘ కట్ర’ నుంచి ‘రంసూ’ కి 70 కిమీ ఘాట్ రోడ్డు ప్రయాణం. నాకు ఘాట్ రోడ్డు ప్రయాణం అంటే చాలా యిష్థమ్. కొండల మీంచి దూకుతూ, దుముకుతూ ప్రవహించే సెలయేళ్లు, వో పక్క కిందుగా లోయలో ప్రవహించే నదులు, మరో పక్క యెత్తుగా గర్వంగా మేమెవ్వరికీ అందం అంటున్నట్టు వున్న పర్వతాలు చూడ్డం ఎంతో బావుంటుంది.
జమ్మూలో ఎండలు ఎక్కువగా వున్నా ‘ కట్ర’ దగ్గర నుంచి వాతావరణం చల్లగా మారిపోతుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ, విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ప్రయాణం సాగించేము. యెందుకంటే శివ పంచాక్షరి తప్ప శివ స్తోత్రాలు రావు. శివాయ విష్ణు రూపాయ అని అనుకుంటూ చెంపలు వాయించుకొన్నాం. దారిలో చిన్న చిన్న గ్రామాలు 2, 3 దాటేక బాబా ధన్సర్ అనే చిన్న గుహాలయం చూసేం. ఆ గుహలో ధన్సర్ అనే సన్యాసి తపస్సు చేసుకొన్న ప్రదేశంగా స్తానికులు చెప్పేరు. యిక్కడ పై నించి సన్నని ధారలుగా నీరు పడుతూ రాళ్ల పైన ఏర్పడుతున్న ఆకారాలు వున్నాయి. అది చూసుకొని తిరిగి మా ప్రయాణం కొనసాగించేం.

రంసూ కూడా చిన్న గ్రామం. అక్కడ నుంచి గుహ వరకు నడక దారి. గత కొద్ది సంవత్సరాలుగా యాత్రికులు రావడంతో ఇప్పుడిప్పుడే మందిర్ ట్రస్ట్ వారు యాత్రికుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా యాత్రీకులను కోవెల వరకు తీసుకు వెళ్లేందుకు గుర్రాలు, డోలీలు దొరుకుతున్నాయి. యింకా రోడ్డు వెయ్యవలసి వుంది. యాత్రికుల వసతి భోజన సదుపాయాలూ కుడా ఏమి లేవు.
సుమారు 3, 4 కిమీ.. గుర్రం మీద ప్రయాణం తరువాత మెట్ల దారి, మాలాగే వైష్ణవి దేవిని దర్శించుకున్న యాత్రీకులు శివఖోడి ని దర్శించు కోవడంతో యిక్కడ కుడా భక్తుల తాకిడి ఎక్కువగా వుంటోంది.
మెట్లు ఎక్కి గుహ లోపలకి చేరుకున్నాం, గుహ లోపల సుమారు 300 మంది పట్టేంత పెద్దదిగా వుంటుంది. అక్కడ నుంచి లోపలి ముణుకుల పైన పాక్కుంటూ వెళ్ళవలసి వుంటుంది. కొన్ని చోట్లు పాములా అంటే పొట్ట నెలకు ఆనించి పాక వలసి వుంటుంది. అలా పాక్కుంటూ వెళ్ళేక నిలబడ గలిగేంత వెడల్పు అవుతుంది గుహ. యింక అక్కడంతా అద్భుతమే, పార్వతి, వినాయకుడు, నారదుడు, శివుని ఝటాఝూటం, పద్మం యిలా దేవిదేవతా మూర్తులు ప్రాకృతికంగా యేర్పడ్డాయి. వాటిని చూస్తువుంటే మనలో భక్తి పారవశ్యం కలుగక మానదు. తలెత్తి పైన వున్న కొండని అంటే చెయ్యెత్తితే అందేంత యెత్తులో వుంటుంది, అక్కడ మరింత అద్భుతంగా యేర్పడ్డ ఆది శేషుని చూడొచ్చు. లోపల కొంతదూరం వెళ్ళేక దారి రెండుగా చీలుతుంది. అక్కడ వున్న సెక్యూరిటీవారు ఆ దారిలోకి వెళ్లనివ్వక యాత్రీకులను రెండో దారిలోంచి పంపుతున్నారు. 200 మీటర్ల పొడవు, 3 మీటర్ల యెత్తు, ఒక మీటరు వెడల్పు వున్న యీ గుహలలోకి శ్వాశ సంబంధ రుగ్మతలు వున్నవాళ్ళు ఆక్సిజెన్ సిలిండర్ తీసుకు వెళ్లాలనేది డాక్టర్ల సలహా. లోపల నాలుగు అడుగుల యెత్తున్న స్వయంభూ శివలింగం నిరంతరం శివలింగాన్ని అభిషేకిస్తున్న ప్రాకృతికమైన పాల రంగులో వుండే జల వూట మనస్సుని భక్తి పారవశ్యంలో ముంచేస్తుంది. దర్శనానతరం అక్కడ పూజాదులు నిర్వహిస్తున్న సాధువులను స్థలపురాణం అడుగగా వారు చెప్పిన కధ యిది —

భస్మాసురుడు అనే రాక్షసుడు, పరమ శివ భక్తుడు, దేవతలపై విజయం సాధించాలనే కోరికతో తనకి మరణం లేకుండా వుండేటట్లు వరం పొందాలని శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపశ్శక్తి కి ముల్లోకాలు అల్లకల్లోలమై కంపించసాగేయి. ఆ ప్రకంపనలు శివ నివాసమైన కైలాసాన్ని కుడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. శివుడు భస్మాసురుని తపస్సుకు మెచ్చి, భస్మాసురుని వద్దకు వెళ్లి వత్సా నీ కోరిక ఏమిటని అడుగగా, తనకు మృత్యువు లేకుండునట్లు వరమిమ్మని భస్మాసురుడు కోరుతాడు, మరణం లేకుండా ఉండేటట్లు వరమివ్వుటకొరకు తాను ఆశక్తుడనని శివుడు మరేదైనా వరం కోరుకోమని అంటాడు. దానికి భస్మాసురుడు తాను యెవరి తలపై చెయ్యి పెడితే వారు భస్మం అయేటట్లు వరం అనుగ్రహించమంటాడు . శివుడు భస్మాసురుని కోరిక తీరుస్తాడు. భస్మాసురుడు శివుడు యిచ్చిన వరప్రభావాన్ని శివుని పైనే ప్రయోగించి చూడాలనే తలంపుతో శివుని తలపై చెయ్యిపెట్టడానికి శివుని వెంట పడతాడు. శివుడు భస్మాసురుని తప్పించుకొని పారిపోతూ విష్ణుమూర్తిని రక్షించమని వేడుకుంటాడు. భస్మాసురుడు శివుని తరుముతూ వుంటాడు. మూర్ఖులకు వినాశకారకమైన వరాలు అనుగ్రహించకూడదు అని తెలుసుకొన్న శివుడు యీ గుహలో దాక్కుంటాడు. శివుడిని తరుముతూ గుహ వైపు వస్తున్న భస్మాసురుని మోహినీ రూపంలో వున్న విష్ణుమూర్తి అడ్డుకుంటాడు. మెహినీ రూపానికి ఆకర్షితుడైన భస్మాసురుడు తనను పెండ్లాడమని మోహినిని కోరుతాడు. దానికి మోహిని తనతో సమానముగా నర్తించిన వారినే తాను పరిణయమాడుతానని అంటుంది. అందుకు సమ్మతించిన భస్మాసురుడు మోహిని నర్తించినట్లే నర్తించి తన వర ప్రభావమును మరచి మోహిని చూపిన భంగిమను నటిస్తూ తన తలపైన చేయ్యిపెట్టుకొని భస్మమౌతాడు.
యిలా శివుడు భక్తునికి భయపడి యీ గుహలో దాక్కున్నాడట. యిదీ యిక్కడి స్థల పురాణం.
కాలాంతరాన వో గొర్రెల కాపరి తప్పి పోయిన గొర్రెను వెదుకుతూ యీ గుహలోకి వచ్చి యిక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులను చూచి అతను కూడా శివభక్తుడిగా మారి, అతను కూడా అక్కడే వుండి తపస్సు చేసుకుంటూ ఆ గుహలోనే వుండిపోతాడు. కొన్నేళ్ళ తరువాత యింటి పైకి మనసు పోగా తపస్సు చాలించి యింటికి వెళ్లదలుచుకుంటాడు. అప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువులు శివుడు స్వయంభూగా వున్న యీ ప్రదేశం గురించి యెవరికి తెలియనివ్వవద్దని అతని వద్ద మాట తీసుకుంటారు, మాట మీరితే అతనికి మరణం సంభవిస్తుందని చెప్తారు.
కాపరి పుట్టుకతో ముస్లిం. అతను శివభక్తుడుగా మారడం నచ్చని అతని యింటివారు కారణం అడుగగా అతను శివదర్శనం అయినట్లు మాత్రమే చెప్తాడు. పశువులకాపరి బంధువులు కూడా శివదర్శనం చెయ్యదలచి ఆ ప్రదేశమునకు తమని కూడా తీసుకుపొమ్మని వత్తిడి తెస్తారు. వారి వత్తిడికి తలవొగ్గి కాపరి వారిని గుహవద్దకు తీసుకొని వెళ్తాడు, మాట తప్పినందుకు గుహ చేరగానే కాపరి మరణిస్తాడు. యిప్పుడు కూడా యిక్కడ తపస్సు చేసుకుంటూ సాధువులు కనిపిస్తూ వుంటారు.
ఎక్కడైతే సెక్యూరిటీ వారు వెళ్లనివ్వని దారి గురించి సాధువుగారిని అడుగగా ఆ గుహదారి అమర్ నాథ్ గుహకి కలిసి ఉంటుందని, అషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణిమ వరకు జరిగే అమర్ నాథ్ యాత్ర సమయంలో అమర్ నాథ్ గుహలో పుజలందుకొనే శివుడు మిగతా సమయంలో యీ గుహలో యోగ సమాధిలో వుంటాడని స్థానికుల నమ్మకం. అందుకే యీ క్షేత్రాన్ని ” బూఢా అమర్నాథ్ ” అని కూడా పిలుస్తారు. అమర్ నాధ్ లో లాగే యిక్కడ కూడా పావురాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది అని భక్తుల నమ్మకం. కొన్ని సంవత్సరాల క్రిందట యీ గుహ మార్గం మధ్యలో కూలిపోయిందని యిప్పుడు అక్కడనుంచి ప్రవేశం రద్దు చేసేరు.

గుహలోంచి బయటికి వచ్చేక మా మనస్సులు భక్తి పారవశ్యంతో నిండిపోయేయి. జాగ్రత్తగా లోయలోకి దిగి అక్కడ పాల వలే తెల్లగా స్వచ్చంగా ప్రవహిస్తున్న ‘ దూధ్ గంగ ‘ నీళ్లు తలపై జల్లుకొని తిరుగు ప్రయాణం అయ్యేం.
మా గుర్రాల యజమాని బలవంతం మేరకు ప్రభుత్వం వారి డాక్ బంగ్లాకి చేరుకున్నాం. విశ్రాంతి తీసుకోడానికి కాదు. గుర్రాల వాళ్లు అద్భుతం చూపిస్తామంటే డబ్బులు ఎక్కువ వసూలు చేసేందుకు అలా మమ్మల్ని మభ్య పెడుతున్నారనే అనుమానం. వారున్న స్థితికి మరో 50/ యిచ్చినా మనకేమీ నష్ఠమ్ లేదు. యింతకీ వాళ్లు డబ్బుల గురించి మాట్లాడనేలేదు. అక్కడకి చేరుకున్న తరువాత మా అనుమానాలు పటాపంచలయేయి. మా కళ్లు మహాద్భుతాన్ని చూసేయి. అదే “దూధ్ గంగ” పుట్టిన చోటు. భూమి లోపల నుంచి వురుకుతూ తెల్లని నురుగుతో పెద్ద హోరుతో వస్తున్న ” దూధ్ గంగ”. నోట మాట లేకుండా వుండిపోయేము. ఇలాంటి అద్భుతాన్ని మరెక్కడా చూడలేదు. గుర్రాల వాళ్లకి మా సంతోషం 100/ చొప్పున యిచ్చి తెలియజేసేం.
అద్భుతాలు, ఆహ్లాదాలు, ఆనందాలు మూట కట్టుకొని తిరుగు ప్రయాణం యేం. వీలు చేసుకొని మీరూ యివన్నీ దర్శించుకొని ఆనందించం.

రఘునాథ మందిరం

రచన: నాగలక్ష్మి కర్ర

హిందువులు అతి భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర శుద్ధ నవమిని శ్రీరాముడు జన్మించిన తిథిగా, శ్రీరామనవమిగా జరుపుకోవడం హిందువులకు అనాదిగా వస్తున్న ఆచారం.

ఆంధ్రప్రదేశ్ ఆంద్ర, తెలంగాణగా విభజన జరిగిన తరువాత ఆంధ్ర లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎక్కడ జరపాలి ఒంటిమిట్టలోనా? లేక రామతీర్ఠాలులోనా ? అనే విషయం మీద యెన్నో తర్జన భర్జనలు జరిగిన తరువాత ‘ఒంటిమిట్ట’లో జరపాలని రాజకీయ నాయకులు నిర్ణయించేరు. శ్రీరామనవమిని కుడా రాజకీయం చేసేరు ఇలాంటి నేపధ్యంలో మనం ఉత్తరాఖండ్ లో వుండి తెలుగు పుజారులచే పూజలందుకుంటున్న రఘునాధ్ దేవాలయం గురించి తెలుసుకుందాం.

వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే 108 దివ్య దేశాలలో 106 వ దివ్య దేశంగా చెప్పబడే రఘునాధ్ మందిరం యిదే. ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని తెహ్రి ఘరేవాల్ జిల్లాలో దేవప్రయాగ లో ఈ దివ్యదేశం వుంది. హరిద్వార్ కి సుమారు 100 కిమి.. దూరంలో శివాలిక్ పర్వత శ్రేణులలో వున్న పుణ్యక్షేత్రం ఇది.

హరిద్వార్ నుంచి ‘చార ధామ్ ‘ యాత్రగా పిలువబడే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరి నాథ్ యాత్రలు మొదలవుతాయి. హరిద్వార్ కి సుమారు 25కిమీ దూరంలో వున్న ఋషికేష్ నుంచి శివాలిక్ పర్వత శ్రేణులు మొదలౌతాయి. హరిద్వార్ నుంచి బదరీనాథ్ వరకు వున్న ముఖ్యమైన పంచ ప్రయాగలలో ముఖ్య మైనది ఈ దేవప్రయాగ. రెండు ముఖ్యనదులు కలిసే చోటుని సంగమం లేదా ప్రయాగ అని అంటారు.

మన దేశానికి టిబెట్ వైపున వున్న సరిహద్దులో గల సతోపంత్ మరియు భాగీరథి కారక్ అనే హిమనీ నదములలో పుట్టి అలకనందగా బదరీనాధ్ మీదుగా ప్రవహించి విష్ణు ప్రయాగలో దౌళి గంగని కలుపుకొని అలకనందగా ప్రవహించి, నంద ప్రయాగలో నందాకిని నదితో కలిసి అలకనంద గా ప్రవహించి కర్ణ ప్రయాగలో పిండారీ గంగతో కలిసి అలకనందగానే ప్రవహించి రుద్ర ప్రయాగలో మందాకినీ నదిని కలుపుకొని అలకనంద గ ప్రవహించింది. గోముఖ్ దగ్గరనున్న గంగోత్రి మరియు ఖట్లింగ్ అనే హిమనీనదముల నుండి పుట్టిన భాగీరథి నది హిందూ పురాణాల ప్రకారం భాగీరథుడు తన పూర్వజుల సద్గతులకోసం ఘొరతపస్సు నాచరించి గంగను భూలోకంలోకి తెప్పించెననే కధ ప్రచారంలో వుంది.భాగీరధుని ద్వారా రప్పించ బడింది కాబట్టి ఈ నదికి భాగీరధి అనే పేరు వచ్చింది. దేవప్రయాగలో అలకనంద మరియు భగీరథి సంగమించి గంగ గా పిలవబడుతూ హృషికేష్, హరిద్వార్ మొదలైన పుణ్యక్షేత్రాలలో ప్రవహిస్తూ భక్తులను పునీతులని చేస్తోంది. ఈ సంగమాన్ని అత్తా కోడళ్ళ సంగమంగా కుడా స్థానికులు వ్యవహరిస్తూ వుంటారు. రెండు నదులు రెండు వైపులనుంచి వచ్చి వేరువేరు రంగుల నీళ్ళు కలుస్తూ చూపరులను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతుంది.

అలకనంద భగీరథి నదుల సంగమం ఇదే ఈ సంగమ ప్రదేశంలో వున్న పట్టణాన్ని”దేవనగరి ” అని పేరు. ఇక్కడ చేసే పూజలు, ముక్కోటి దేవతలు అందుకుంటారని స్థానికుల నమ్మకం. పురాణకాలం లో దేవశర్మ అనే రుషి ఇక్కడ తపస్సు చేసెనని ఈ ప్రదేశాన్ని దేవనగరి అని పిలువబడుతోంది.ఈ సంగమానికి యెదురుగా వున్న శివలింగాన్ని తొండేశ్వర్ మహదేవ్ అని ధనేశ్వర్ మహాదేవ అని పిలుస్తారు. సంగమం నుంచి నీటిని తెచ్చి ఈ శివలింగాన్ని అభిషేకించుకుంటూ వుంటారు. దేవనగరి గిద్దాంచల్, నృశింగాంచల్ , దశరథాంచల్ అనే మూడు పర్వతాల మధ్యన వుంది. రఘునాధ్ మందిరం వెనుక వైపున గిద్దాంచల్ పర్వతం వుంది, ఎదురుగా నృశింగాంచల్, సంగంకి యెదురుగా దశరథాంచల్ వున్నాయి. హృషికేష్ నుంచి బదరీనాథ్ వెళ్ళే జాతీయ రహదారిని ఆనుకొని వున్న బజారు లోంచి సుమారు 700కిమి.. దూరంలో రఘునాథ్ మందిరం వుంది.

శ్రీరాముడు లవకుశులను పట్టాభిషిక్తులని చేసిన అనంతరము శ్రీరాముడు రావణుని సంహరించుట వలన కలిగిన బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టుకొనుటకు తపస్సు చేసుకోనుటకై భాగీరథి,అలకనంద నదుల సంగమ ప్రదేశాన్ని యెంచుకొని యిక్కడ తపస్సు చేసుకొని యాగం నిర్వహించేడని దానికి ప్రమాణంగా తన పాదగుర్తులను విడిచి అవతారం చాలించేడని యిక్కడి పూజారులు చెప్పేరు. కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం హిమాచల్ లో వున్న “కుల్లు”ని పరిపాలించిన రాజు తాను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకొనే వుద్దేశ్యం తో రామజన్మస్థానమైన అయోధ్య నుంచి దొంగిలించి రాముని విగ్రహం తెచ్చి యిక్కడ ప్రతిష్తించెనని ఇక్కడి స్థలపురాణం చెప్తోంది. ఇప్పుడున్న కోవేలని 1835 సం|| లో అప్పటి జమ్మ – కాశ్మీర్ రాజైన గులాబ్ సింగ్ కట్టించడం మొదలుపెట్టగా అతని కుమారుడైన మహారాజా రణబీర్ సింగ్ ద్వారా 1860 లో పూర్తి చెయ్యబడింది. ఈ కోవెలలో బౌద్ధ, దక్షిణ భారత శిల్పకళల మిశ్రమంగా కనిపిస్తుంది. కోవెలలో రాముని విగ్రహంతోపాటు సీతా, లక్ష్మణ విగ్రహాలు కుడా కొలువై వున్నాయి. రామ, కృష్ణ లీలలు బంగారు వెండి రేకులపై చెక్కి కోవేల లోపలి గోడలకు తాపించబడ్డాయి. శ్రీమహావిష్ణు ప్రతిరూపాలుగా చెప్పబడే శాలిగ్రామాలు ఈ కోవెల లోపలి గోడలకు వందల సంఖ్యలో తాపించబడి వున్నాయి.

ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఈ కోవెల పూజారులు తెలుగువారు. ఇంత దూరం వారు యెలా వచ్చేరు అని అడుగగా శంకరాచార్యులవారు జోషిమఠ్ వచ్చినపుడు అక్కడి రాజులు తమ రాజ్యంలో వేదవిధులు నిర్వర్తించేందుకు బ్రాహ్మణులు కావాలని శంకరులని అర్ధించగా, శంకరులవారు తనతో కూడా వచ్చిన కొందరు బ్రాహ్మణులను యిక్కడ వుంచెనట. ఇప్పుడున్న వారు వారి సంతతేనట. వీరిని స్థానికులు “పండా” లుగా వ్యవహరిస్తారు .

ఇక్కడకి సుమారు ఒకటి లేక రెండు కి.మీ.. దూరంలో వున్న ” పుండా “గ్రామంలో దుర్గాదేవి భువనేశ్వరి మాతగా పూజలందుకుంటోంది . ఈ కోవెల చిన్నగానే వుంటుంది కాని అమ్మవారిపై స్థానికుల విశ్వాసం అచంచలం .

ఆచార్య పండిట్ చక్రధర్ జోషి జ్యోతిష్ శాస్త్ర , నక్షత్ర గ్రహశాస్త్ర అధ్యయన కర్త 1946 లో నక్షత్ర వేదశాల ధశరథాంచల్ పర్వతంపైన నిర్మించేరు . ఇందులో పురాతన అధ్యయన పద్ధతులైన సూర్యగతి , జలగతి , ద్రువగతి లతో పాటు రెండు టెలిస్కోపులు కాక నక్షత్ర , జ్యోతిష అధ్యయనానికి కావలసిన అనేక గ్రంధాలను కుడా ఇక్కడ ఉంచేరు . ఇందులో 3000 లకు మించిన వ్రాత గ్రంధాలు కుడా వున్నాయి . ఇవి 1470 సం .. నుంచి గ్రంధస్థం చెయ్యబడినవి సేకరించి జాగర్త చెయ్యబడినవి , దేశం నలుమూలల నుంచి సంగ్రహింపబడినవి యిక్కడ నిక్షిప్తం చెయ్యబడినవి .

ఇక్కడి ప్రకృతి సౌందర్యం చెప్పడానికి మాటలు లేవు . అనుభవించ వలసిందే . ఏడాదిలో ఆరు నెలలు చల్లగా , మిగతా ఆరు నెలలు అతి చల్లగా వుంటుంది . బద్రినాథ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఒకరోజు వుండి రఘునాథ్ మందిరాన్ని చూసుకొని దేవప్రయాగలో పూజలు చేసుకొని ప్రకృతిని కళ్ళారా అనుభవించమని మనవి .

మధ్యమహేశ్వర్

రచన: కర్రా నాగలక్ష్మి

ఓఖిమఠ్ మఠ్ నుంచి కారులో సుమారు 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ‘ ఉనియాన ‘ గ్రామం చేరేం. అక్కడ రాత్రి చిన్న గదిలో బసచేసుకొని మరునాడు పొద్దున్నే మధ్యమహేశ్వర్ వెళ్లాలనేది మా సంకల్పం. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరితే రాత్రికి మధ్యమహేశ్వర్ లో బసచేసుకొని, మరునాడు పొద్దుట తిరిగి బయలుదేరి ఉనియానా చేరాలనేది మా ఆలోచన. రాత్రి మా బస యజమానిని మధ్యమహేశ్వర్ దారి యెలావుంటుంది వగైరా వివరాలు అడిగేం. పొద్దున్నే మరో రెండుకిలోమీటర్ల ప్రయాణం చేస్తే కొండ మొదలవుతుందని అంతవరకు కారులో వెళ్లవచ్చని తొమ్మిది లోపున అక్కడకి వెళితే గుర్రాలు దొరకవచ్చని, తరవాత గుర్రాలను మట్టిపనికి తీసుకువెళతారని, యాత్రీకులు యెక్కువగా వుండరు కాబట్టి సౌకర్యాలు యేమీ వుండవని చెప్పేరు.
మరునాడు పొద్దున్నే మేం నడక దారి మొదలయిన ప్రాంతానికి చేరుకున్నాం. మా అదృష్టం బాగుండి గుర్రాలు దొరికేయి, మొత్తం రానుపోను 38 కిలో మీటర్లు గుర్రాలమీద ప్రయాణించాలి. సాహసమే పంచకేదారాలు చూద్దాం అనుకున్నప్పుడు తప్పదుకదా ?.
ఓ జత బట్టలు బిస్కెట్స్ పెట్టుకున్న చిన్న చేతి సంచులు గుర్రం యజమాని పట్టుకోగా మేం గుర్రాలమీద జాగ్రత్తగా కూర్చొని ప్రయాణం సాగించేం. సుమారు 11,400 అడుగుల యెత్తున వున్న మందిరం చేరాలి, సుమారు ఓ కిలోమీటరు తప్ప అంతా యెక్కడమే.
ఈదారి కూడా కేదార్ దారిలాగే అంతా కొండలే కాకపోతే కేదార్ కి యాత్రీకుల రద్దీ యెక్కువ వుండడం వల్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్ర మొదలయే సమయానికి రోడ్డు విశాలంగా చేసి రాకపోకలు సులువుగా జరిగేటట్లు అన్ని యేర్పాట్లూ చేస్తారు. కాని తుంగనాధ్ మధ్య మహేశ్వర్ వీటికి మొత్తం యాత్ర సీజన్లతో కలిపి సుమారు యాభై మంది రావడం కూడా గొప్పే అది యీ మధ్య చాలామంది వేసవిలో ట్రెక్కింగ్ చేస్తూ వుండడం వల్ల యీ పాటిగా వస్తున్నారు, దారంతా పెద్ద పెద్ద రాళ్లు పడి వాటిని దాటేటప్పుడు గుర్రం కాలు జారితే మా గుండె జారేది. భయం పోగొట్టుకోడానికి గట్టిగా నా కొచ్చిన స్తోత్రాలు చదువుకోడం, పళ్లు కరచుకునేంత భయం కలిగితే ‘ నమశ్సివాయ ‘ అని గొణుక్కోవడం చేస్తూ మూడు కిలోమీటర్లు ప్రయాణించేం. నడ్డి విరిగినంత నొప్పి అనిపించింది, ఉనియాన పేరుకు వూరేగాని ఒక్క యిల్లు, నాలుగు గదులు వరుసగా రోడ్డు పైకి కట్టి వున్నాయి అది తప్ప మరేమీ లేదు, తినడానికి మధ్యాహ్నం రాత్రి రొట్టి తప్ప మరేమీ దొరకదు, పొద్దున టీ కూడా దొరకని ప్రదేశం కావడం వల్ల మాకు కడుపులో యెలకల గోల మొదలయింది. గుర్రాలబ్బాయితో యెక్కడైనా టీ దొరికే చోట ఆపమని చెప్పేం. ‘ రాన్సి ‘ గ్రామం లో టీ దొరుకుతుందని చెప్పేడు. ఒకే ఒక రేకు గది వున్న ప్రదేశం దగ్గర ఆపి యిదే రాన్సి గ్రామం అన్నాడు. ఆ షెడ్డులో అప్పటికే ఓ బెంగాలీ జంట మా వయసువారే బస చేసి వున్నారు. ఓ పక్కగా కర్రల పొయ్య, దానిమీద టీ పెట్టి మాకు యిచ్చేడు. ఆ బెంగాలీ దంపతులు నడిచి మధ్య మహేశ్వర్ వెళ్లి వస్తారట, ఆ రోజు అక్కడ బస చేసి మరునాడు తిరిగి బయలుదేరి యెక్కడ కష్టమనిపిస్తే అక్కడ బస చేసుకుంటూ వెళ్తారట, టీ తాగడం అవగానే అక్కడ నుంచి బయలుదేరేం.

అక్కడ నుండి మరో రెండు కిలోమీటర్ల తర్వాత నాలుగిళ్లున్న వూరు వచ్చింది అక్కడ మాకు ‘ మేగీ ‘ వేడివేడిగా చేసి పెట్టేరు. అది తిన్న తరువాత మాకు కాస్త ఉత్సాహం వచ్చింది. మరో నాలుగు కిలో మీటర్ల తరువాత ‘ గౌధర ‘చేరుకున్నాం, యిక్కడ రాత్రి బస చెయ్యడానికి మూడు నాలుగు గదులున్నాయి. ఇది దాటితే మరెక్కడా బస చేసే వీలులేదు. బసలంటే వాళ్లుంటున్న గదిలోని ఓ మూల పక్క వేసి రజ్జాయిలు యిస్తారు. ఆ రజ్జాయిలు కొన్న తరువాత ఒక్క వుతుకుకీ నోచుకోనివి, ఓ మారు యెప్పుడైనా సన్నని యెంత పొడ వస్తే మాత్రం యెండలో వేస్తారు. కాబట్టి ఉత్తరాఖండ్ యాత్రలకు వెళ్లేవారు వారి సామానులతో పాటు రెండు దుప్పట్లుకూడా సర్దుకుంటే మంచం మీద వేసుకోడానికి ఒకటి రజ్జాయికింద అంటే మన శరీరానికి ఆనేది మన దుప్పటి అయితే సగం చర్మరోగాలను అరికట్టగలం, యేమంటారు ?.
అదే సుమారు ఆప్రాంతాలకు ఆఖరు జనావాసాల గ్రామం. ఈ కొండలలో వున్న వారు వారికి కావలసిన ధాన్యం, కూరగాయలు కొండచరియలలో పండించుకుంటూ, మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు, ముఖ్యాంగా వీరు శాఖాహారులు. గౌధర్కి ఓకిలోమీటరు దూరంలో ‘ బంతోలి ‘ అనే గ్రామం, జనావాసాలు లేని వాటిని గ్రామం అనొచ్చా ? యేమో, మన సౌకర్యం కోసం ప్రదేశం అందాం , యీ బంతోలీ అనే చోట మధ్యమహేశ్వర్ గంగ, మర్కన గంగ సంగమంచే ప్రదేశం. ఆ సంగమం చూసుకొని ముందుకు ప్రయాణించసాగేం. ఒకరో యిద్దరో ట్రెక్కర్లు తప్ప వేరే యెవ్వరూ లేరు. మా పుణ్యం బాగుంది వర్షం పడలేదు. పచ్చని చెట్లమధ్య నుంచి చల్లగాలి శరీరానికి తగులుతూ సేదదీరుస్తూ వుంది. అడవి లోంచి వీస్తున్నగాలి యెవేవో వాసనలను మోసుకు వస్తోంది. కలుషితం కాని గాలి పీలుస్తూ సాగింది మా ప్రయాణం సాయంత్రం అయిదింటికి మధ్యమహేశ్వర్ చేరుకున్నాం.
మందిర ట్రస్టు వారి ఆధ్వైర్యం లో నడపబడుతున్న నాలుగు గదులు మాత్రం వున్నాయి, సంతోషం యేమిటంటే ఎటాచ్డ బాత్రూము వుంది నీటి సదుపాయం వుంది కరెంటులేదు. ఒకచిన్న పాక హొటలు ట్రస్ట్ మెంబరుదే వుంది, అక్కడ దొరికిన టీ అని పిలువబడ్డ వేడినీళ్లు తాగి గది తాళం తీసుకొని దర్శనానికి వెళ్లేం, ఆరున్నరకి శయన హారతి అప్పుడు రండి అన్న పూజారిగారి మాటతో మళ్లా మా రూముకి వచ్చేం, పక్క రూములో అప్పటికే నలుగురు ట్రెక్కర్స్ వున్నారు. వారు అప్పటికే డిన్నరు ముగించేరు, ఆరున్నరకి హోటలు మూసేస్తారు అని చెప్పేరు, మేం కూడా మా డిన్నరు కానిచ్చి మందిరంలో సాయంత్రాలు పూజా విధులు చూడ్డానికి వెళ్లేం. మందిరం చాలా పాత రాతికట్టడం, కేదార్ మందిరాన్ని పోలి వుంది, యిక్కడ శివలింగం నాభిని పోలి వుంటుంది, బయట రెండు చిన్న మందిరాలలో ఒకటి పార్వతీ దేవికి, మరొకటి అర్ధనారీశ్వరులకి కట్టేరు, రాతి విగ్రహాలు వున్నాయి. ఈ మందిరం భీముడు స్వయంగా కట్టించినట్లు చెప్తారు. పక్కగా పాలరాయి సరస్వతీ దేవి విగ్రహం వుంది సరస్వతీ దేవి విగ్రహం కొత్తదనం, యీ మధ్యకాలంలో పెట్టినట్లుంది.
ఇక్కడ స్థలపురాణం చాలా మార్లు చెప్పిందే అయినా యీ సంచికను మాత్రమే చదివేవారికోసం మరోమారు చెప్తాను.
మహా భారత యుధ్దంలో పాండవులచే యెన్నోవేలమంది బ్రాహ్మణులు, గోత్రీకులు చంపబడతారు, ఆ పాప పరిహారం కొరకు కృష్ణుడి సలహా మేరకు శివుని పూజించుకోడానికి కేదార్ నాధ్ వైపుగా ప్రయాణిస్తారు. సగోత్రహత్య, బ్రహ్మహత్యలుచేసిన పాండవులపై కోపముతో వున్న శివుడు పాండవుల రాక తెలుసుకొని వారినుంచి పారిపోవాలనే తలంపుతో నంది రూపముదాల్చి పారిపోతాడు. శివుని కొరకై వెతుకుతున్న పాండవులకు శివుడు కనిపించకపోవడం తో శివుని వెతుకుతూ యీ కొండలలో సంచరిస్తూవుండగా గుప్తకాశివైపు పయనిస్తున్న నందిని భీముడు పోల్చుకొని తరుముతాడు, నంది రూపములలో వున్న శివుడు గుప్తకాశిలో పాతాళానికి పోతూవుండగా భీముడు నంది వెనుకకాళ్లను పట్టుకొని బయటకు లాగుతాడు, ఆ విసురుకు నంది అయిదు ఖండములయి అయిదు ప్రదేశాలలో పడింది ముఖం పడ్డభాగం ‘ రుద్రనాధ్ ‘, ముందుకాళ్లు పడ్డ ప్రదేశం ‘ తుంగనాధ ‘, మూపురం పడ్డప్రదేశం కేదార్ నాధ్, నాభి పొట్ట పడ్డ ప్రదేశం మధ్యమహేశ్వర్, వెనుకకాళ్లు తోక పడ్డ ప్రదేశం కల్పేశ్వర్ మహదేవ్. ఆ అయిదు ప్రదేశాలు పంచకేదారాలుగా ప్రసిధ్ది చెందేయి. పంచకేదారాలలో శివుని పూజించుకొని పాపవిముక్తులయిన పిమ్మట పాండవులు సర్గారోహణానికి వెళతారు.
ఈ ప్రాంతాలలో వున్న అన్ని శివమందిరాలలోనూ ఆది శంకరాచార్యులచే నియమించబడ్డ అతని శిష్యుల సంతతి వారు పూజారులుగా వున్నారు కాని యీ మందిరంలో కర్నాటక నుంచి వచ్చిన లింగధారులు ( జంగం ) పూజలు నిర్వహిస్తున్నారు. ఇతను బ్రహ్మచారి, అతనికి కేటాయించిన గదిలో వుంటూ, అతనే వండిన అన్నప్రసాదలు నివేదిస్తున్నారు.
సూర్యుడు పడమటలో కుంగే సరికి చలి విపరీతంగా పెరిగనారంభించింది , వున్న ఒక్క బడ్డీ హొటలు మూసేయగానే మేము మా పక్క గదిలో వున్న ట్రెక్కర్స్ తో బాతాఖానీ చెయ్యసాగేం. వారు మొత్తం యీ కొండలలో వున్న చార్ ధామ్ లే కాక మిగతా అన్ని శివకోవెలలూ చూసుకొని బదరీనాధ్ చేరుతారట, కొండలలో నడక దారి వేరుగా వుందట, అలా వారు సుమారు 20 రోజులు నడిచి బదరీనాధ్ చేరుతారట, కొండలలో మొత్తం 250 కిలోమీటర్లు నడుస్తారట. చాలా తొందరగా చీకటి పడ్డంతో చేసే పనేమీ లేక రూములోకి వెళుతూవుండగా మా కొత్త ఫ్రెండ్స నిద్రరాకపోయినా గదులోనే వుండండి గాని గదిబయటకు రావొద్దు కృూరమృగాలు తిరుగుతూ వుంటాయి అని హెచ్చరించేరు.
రూములోకి చేరగానే మంచి నిద్ర పట్టేసింది. ఆరుకు లేచి బయటకు వచ్చి చేస్తే చుట్టారా మంచు బిందువులతో మెరుస్తున్న గడ్డి, పొగమంచులో మసకమసకగా కనిపిస్తున్న కోవెల, చల్లగా వున్న వాతావరణం మరో లోకంలో వున్న అనుభూతినిచ్చింది.
మా ట్రెక్కర్లు అప్పటికే తయారయి నడక ప్రారంభించేరు. మేం వేడివేడి టీ చప్పరిస్తూ వారు యెక్కడకి వెళుతున్నారో అడిగేం, అక్కడకి మరో మూడు కిలో మీటర్లు పైకి వెళితే బూఢా మహదేవ్ కోవెల, చక్కని సరస్సు వున్నాయి వాటిని చూడ్డానికి వెళ్తున్నాం అన్నారు. అక్కడనుంచి చేస్తే చౌకంబా, నీలకంఠ్, కేదార్ శిఖరాలు అధ్బుతంగా కనిపిస్తాయని చెప్పి వాళ్లు బయలుదేరేరు.
ఆ శిఖరాలు మేమున్నచోటునుంచి కూడా బాగానే కనిపిస్తున్నాయి. చెప్పకపోడమేం గాని నాకు మనసు పీకింది, యెలాగోలా పడుతూ లేస్తూ వెళదాం అనిపించింది. గబగబా తయారయేం, యీ రెండు మందిరాలకు పూజారివొకరే, ఆయన రోజూ నడిచి వెళ్లి పూజలు నిర్వహించుకొస్తారట, మాకు రూములిచ్చిన మందిర ట్రస్టు మెంబరు మమ్మల్ని నిరుత్సాహ పరచడంతో మేము తయారయి మరో మారు మందిరం దర్శించుకొని చుట్టుపక్కల ఓ మారు నడిచి, ప్రకృతిని కళ్లలో దాచుకొని గుర్రాల కోసం యెదురు చూడసాగేం.
ఓ గంట ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేక గుర్రాలతను వచ్చేడు. మరోమారు ఆ పరిసరాలను కళ్లనిండుగా చూసుకొని బయలుదేరేం. గుర్రాలతనితో పాటు మరోఅబ్బాయి ( స్థానికుడు ) కూడా నడుస్తూ కొండదిగసాగేడు.

ఉత్తరాంచల్ లోని మిగతా మందిరాలలాగా యీ మందిరం కూడా శీతాకాలంలో మూసెస్తారు. ఉత్సవవిగ్రహాన్ని ఓఖిమఠ్ లో వున్న ఉషామఠ్ లో నుంచి పూజలు చేస్తారు.
గుర్రాలమీద కూర్చొని కొండలు యెక్కడం యెంతకష్టమో దిగడం దానికి రెట్టింపు కష్టంగా వుంటుంది.
ముందురోజు ‘ మాగి ‘ తిన్నచోట భోజనం చేసుకున్నాం, అప్పుడు మాకు తెలిపిన విషయం మేమిటంటే ఉత్తరాఖంఢ్ లో వరన్నం మాత్రమే తింటారని, రోటీ చెయ్యడం రాదు అన్నం కావాలంటే వండుతానని అంటే మాకు ప్రాణం లేచొచ్చింది. పెరట్లో పండిన కాయగూరలుతో కూర, అన్నం, పప్పు, పెరుగు తో వడ్డించేరు. మనకి అంతకన్నా యింకేం కావాలి. తృప్తిగా భోజనం చేసి తిరిగి బయలు దేరేం.
సాయంత్రానికి కిందకి దిగిపోయేం. అయితే మాగుర్రాలబ్బాయితో పాటు వచ్చిన కుర్రాడు భుజం మీద మూట పట్టుకు మోస్తున్నాడు, రాత్రి చిరుత మేకలమందలో దూరి మేకను కొట్టిందట, యింట్లో వాళ్లు లేచి చిరుతను అదిలించడంతో చిరుతకు మేకను తీసుకుపోయే అవకాశం దొరకలేదు, యీ కొండలలో వారు శాఖాహారులవడంతో కుర్రాడు ఆ చచ్చిన మేకను మోసుకొని కిందకు వచ్చి ఉనియాన దగ్గర వున్న బజారులో యెక్కడో అమ్ముకొని మరునాడు తిరిగి యింటికి వెళతాడట.
ఈ అడవులలో చిరుతల సంచారం చాలా యెక్కువగా వుంటుందట, అది వినగానే మాకు కాస్త భయం అనిపించింది. అయితే మరో అద్భుతమైన యాత్రను చేసేమన్న తృప్తిముందు భయం పారిపోయింది.

ట్రావెలాగ్ – వారణాసి యాత్ర

రచన: చెంగల్వల కామేశ్వరి

మన దేశం లో కాల భైరవుడు క్షేత్రపాలకుడుగా పార్వతీ పరమేశ్వరులు కొలువయిన వారణాశిని దర్శించడం పూర్వ జన్మ సుకృతం ఎంతో అదృష్టం ఉండాలి. అన్నిటికన్నా మనకి ఆ పుణ్యక్షేత్ర దర్శనం కావాలంటే కాలభైరవుని అనుగ్రహముండాలి. అందుకే మనం వారణాశి వెళ్లాలి అనుకుంటే కాలభైరవాష్టకం చదువుకోవాలి. నిరాటంకంగా మన వారణాశి యాత్ర చక్కగా జరుగుతుంది
వారణాశికి బెనారస్ అని, కాశీ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లో ఉంది.
పూర్వం కాశికెళ్లినవారు కాటికెళ్లిన వారు ఒకటే అనేవారు.. పిల్లల బరువు బాధ్యతలు తీరినవారు మాత్రమే వెళ్లేవారు
ఇప్పుడు రహదారులు, రైలు మార్గాలు అన్ని ఏర్పడి వయసుతో సంబంధం లేకుండా అందరూ దర్శిస్తున్నారు. అలాంటి అదృష్టంతోనే నేను ముమ్మారు కాశీ యాత్ర చేసుకున్నాను.
మొదటి సారి ఎవరో నిర్వహించిన కాశీయాత్ర లో, రెండోసారి మా సత్యం అన్నయ్య. మా మరిది రామారావు గారు మా బంధువులందరితో కలిసి వేసిన కాశీయాత్రలో పాలు పంచుకున్నాను. ఆ రెండుసార్లూ కాశీయాత్రకు సంబంధించిన విషయాలు అన్నీ కూలంకషంగా తెల్సుకున్నాను. ఎందుకంటే రెండు దశాబ్దాలుగా ఎన్నో యాత్రలు కండక్ట్ చేసాను నేను ఎవరితో ఎక్కడికెళ్లినా మిగతావాళ్లు గొడవ పెట్టేస్తారు. అందుకే నేను ఏది చూసినా మా వాళ్ల కోసం మళ్లీ టూర్ వేస్తాను
అలాగే మొన్న కార్తీక మాసంలో శైవ క్షేత్రం గంగాస్నాన పునీతం కావాలన్న ఆకాంక్షతో “కార్తీక మాస కాశీ యాత్ర” తొమ్మిది రోజులు వారణాశి తదుపరి త్రివేణి సంగమం, సీతామర్హి, వింధ్యాచల్, నైమిశారణ్యం, గయ, అయోధ్య
అని ఎనౌన్స్ చేసానో లేదో మేమొస్తాము మేమొస్తాము అని ఒక ముప్పైఅయిదు మంది రెడీ అయిపోయారు
16-11-2016 నుండి 1-12-2016 దాకా మొత్తం ట్రిప్…
అందులో ముఖపుస్తక మిత్రులు ఉమా కల్వకోట దంపతులు, వారిజా బాలాజీ దంపతులతో పాటు వారి స్నేహితులు కొందరు కూడా మాతో జాయిన్ అయ్యారు.


నేను యాత్రలు కండక్ట్ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తాను అదేమిటంటే ఆహార వ్యవహారాల విషయం. ఏదో ఒకటి రెండు రోజుల కోసం పర్వాలేదు కాని పదిహేను రోజుల టూర్. ఎవరికి ఏ తేడా చేసినా కష్టం. కొందరు పెద్దవారు, మధ్యవయసువారు అందరూ నలభై సంవత్సరాల పై వారే
అందుకే నేను బుక్ చేసే హొటల్ లో కిచెన్ ఇస్తామన్న సాహు హొటల్ లోనే రూమ్స్ బుక్ చేసాను కుక్ నాగేశ్రరరావు, అసిస్టెంట్ ప్రసాద్, హెల్పర్స్ రామలక్ష్మి, సుజాత. సుగుణ + నేను మొత్తం నలభైమంది కాగానే బుకింగ్స్ క్లోజ్ చేసాను. ఆ తర్వాత వచ్చిన వారందర్నీ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది
ఇంక అక్కడికి తీసుకెళ్లాసిన సామాన్లన్ని పెట్టడానికి రెండు పెద్ద బ్యాగ్స్ కొన్నాను. గ్యాస్ స్టౌ, సిలిండర్ హొటల్ అతనే ఇస్తాడు కాబట్టి ఇడ్లీ పాత్ర పెద్దది నలభై ఇడ్లీలు అయ్యేది, నాలుగు పెద్ద గిన్నెలు, వంటకి గిన్నెల సెట్స్, వండిన వంట తీయడానికి డబ్బాల సెట్స్, గరిటెలు అన్నీ సర్దాము. లేకుంటే అక్కడ అద్దె సామానుల షాప్స్ చుట్టూ తిరిగే కన్నా ఉన్న మటుకు పట్టుకెళ్లితే మంచిది కదా.
కూరగాయలు ప్రొవిజన్స్ అవీ అక్కడే కొనుక్కోవచ్చు కదా అనుకున్నాను
అన్నట్లు సరిగ్గా మా ప్రయాణానికి వారం ముందే నోట్ల రద్దు. ఇంక చూడండి వారంరోజులు కష్టపడి బ్యాంకులలో పాత నోట్లు మార్చడం, వాళ్లెంత ఇస్తే అంత డ్రా చేసుకోవడం అదో ప్రహసనం, అమౌంటు ఇవ్వవలసిన వారినందరినీ వారణాశిలో కొత్తనోట్లే ఇచ్చేలా ప్లాన్ చేసుకుని ఆ సమస్యని దాటేసాను. హొటల్ వాళ్లకు, బిగ్ బజార్ ట్రావెల్స్ వాళ్ళకి కార్డ్ గీయటమే! పాపం వాళ్లు బాగానే కోపరేట్ చేసారు కొంత క్యాష్ ఇచ్చాము కాబట్టి వాళ్లు సర్దుకున్నారు.
ఇంక రోజుకో రకం పచ్చళ్ళు మొత్తం పన్నెండు రకాలు. అల్లం, గోంగూర, టమాట, చింతకాయ, ఉసిరికాయ, దోసావకాయ, ఆవకాయ, కొరివికారం, మాగాయ, కొత్తిమీర, కంది పొడుం, మామిడల్లం పచ్చడి, తొక్కుడు పచ్చడి, నిమ్మకాయ అన్నీ పట్టుకెళ్లాము.
ఇందులో తొమ్మిది రకాలు మాత్రం “”అమ్మమ్మ పచ్చళ్లు” అని తార్నాకలో ఆర్డర్ చేసాను. వాళ్లకే మేము ఎక్కే పాట్నా ఎక్స్ ప్రెస్ కి అందించేలా లంచ్ ఆర్డర్ ఇచ్చాను. నైట్ కి రోటీ, ఆలూ కూర మా కాలనీలో ఉన్న శకుంతలకు ఆర్డర్ ఇచ్చాను. వాటర్ బాటిల్స్ స్టేషన్ లోనే కొన్నాము. కనీసం ట్రైన్ లో ఉండే మూడు పూటల్లో రెండు పూటలకు మాతోనే తీసుకెళ్లాలని అనుకున్నాను. లేకుంటే ట్రైన్ ఫుడ్ మూడు పూటలా తినలేము కదా!
అనుకున్నట్లుగానే అందరూ చక్కగా చెప్పిన టైమ్ కే అందరూ స్టేషన్ కి వచ్చేసారు.


ఎవరి టికెట్స్ వారికి, దాంతో పాటు ప్రయాణించే వారందరి పేర్లు ఫోన్ నెంబర్స్ ఉన్న జిరాక్స్ కాపీలు ఇచ్చాను. అందరికీ అందరూ తెలియాలని.. ఎవరి గ్రూపులకు సంబంధించిన గ్రూప్ ల ప్రకారం వాళ్లు ఆయా కంపార్డ్మెంట్ల లో ఎక్కాము. అలా మా కాశీ యాత్ర మొదలయింది. వచ్చిన వాళ్లందరూ సరదాగా ఉండే వాళ్లవడం వలన చాలా బాగా ప్రయాణం సాగింది.
మర్నాడు ట్రైన్ కేటరింగ్ అతనికి ఆర్డర్ ఇచ్చిన కాఫీలు, టిఫిన్స్, లంచ్ అన్నీ మా హెల్పర్స్ సహాయంతో వాళ్లందరికీ అందించగలిగాము.
మర్నాడు మధ్యాహ్నం మూడు గంటలకు వారణాశి చేరాము.
స్టేషన్ కి మా వాట్సప్ గ్రూప్ ఫ్రెండ్ అనుపమ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది.సామానంతా కూలీలను మాట్లాడి ముందుగానే మాట్లాడుకున్న మూడు వింగర్స్ లో చేర్చుకుని అందరం హొటల్ కి చేరాము.
హోటల్ నెంబర్ ప్రింట్ ఉన్న కార్డ్స్ అందరికీ ఇచ్చి ఎప్పుడయినా ఎవరయినా మనలో మిస్ అయితే కంగారు పడకుండా విశ్వనాధ్ టెంపుల్ లైన్ కి వచ్చేయండి మన హోటల్ కనిపిస్తుంది అని చెప్పాము. అలాగే ఒక ఇద్దరు ఒక గుడి దగ్గర తప్పిపోయినా ఆ కార్డ్ వల్ల క్షేమంగా వచ్చేసారు. రాత్రిళ్లు అందరికీ టిఫిన్సే కాబట్టి హొటల్ నుండి తెప్పించేసాము.
బిగ్ బజార్ కి వెళ్లి కావల్సినవన్నీ తెచ్చాము అనుపమ నేను. మర్నాడు ఉదయం గంగానదికి స్నానానికి వెడ్తుంటే అందరికీ ఆనందం గంగా ప్రవాహంలా పరవళ్లు తొక్కింది
ఇలా అందరం గంగమ్మ ఒడిలో జలకాలాడి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుకుని స్నానాలు ముగించుకుని హొటల్ కి వచ్చి రెడీగా ఉన్న టిఫిన్స్ తిని కాఫీలు సేవించి కాశీ విశ్వేశ్వరుని దర్శనార్ధం గుడికి బయల్దేరాము.


………………………..
మా గుడికి గంగానదికి షాపింగ్ కి దగ్గరగా ఒకే లైన్ లో ఉండటం వలన మా వాళ్లందరికీ మహా సంతోషమయింది. మొదడి రోజే మాతో వచ్చారు ఆ తర్వాత ఎవరికి వీలయిన టైమ్ లో వాళ్ల వాళ్ల ల గ్రూప్ లతో గంగా నదికి, గుడికి షాపింగ్స్ కి వెళ్లేవారు
రాత్రిళ్లు, తెల్లవారుఝామున అభిషేకాలు దర్శించి భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోయారు అందరూ.
విశ్వేశ్వరుడు, విశాలాక్షి అన్నపూర్ణాదేవిని దర్శించుకుని మా రూమ్స్ కి వచ్చేసరికి హొటల్ డైనింగ్ హాలు లో వంట రెడీ వడ్డించడానికి మా రామలక్ష్మి, సుగుణ, సుజాత రెడీ

లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని గంగాహారతికి వెళ్ళాము

అదొక అద్భుతమయిన అనుభవం చల్లని గాలి తెమ్మరలు గంగా నది ఒడ్డున గణ గణ గంటారావాలతో రంగురంగుల విద్యుత్కాంతుల మేళవింపుతో వివిధ దేశాలనుండి, మన దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన జనసందోహంతో, శివస్తుతులతో ఇచ్చే గంగాహారతి చూడటం వినటం ఎన్నో జన్మల పుణ్యఫలం.
అదయ్యాక మా రూమ్స్ కి వచ్చేసాం.


ఆ మర్నాడు వారణాశిలోని కాలభైరవాలయం, గవ్వలమ్మ గుడి, వ్యాసకాశి, బౌద్ద ఆరామాలు, సారనాధ్, తిల భాండేశ్వర గుడి, చింతామణి గణపతి, జంగంవాడి గుడి, దుర్గదేవి గుడి, సావిత్రి వారాహి, ఇవన్నీ వ్యాస్ కాశీ చూసాము కాని కొన్ని దగ్గరున్నవి మధ్యమధ్యలో చూసాము.
జంగంబడి గుడి వారణాశిలో అడుగడుగునా ఒక గుడి ఉంది కేదారేశ్వరుడి గుడి


గంగా నది ఒడ్డనే ఉంది లలితా దేవి గుడి కూడా లలితాఘాట్ లో ఉంది
అలా వెళ్లిన రోజు ఒక ప్రమాదం తప్పింది. చెన్నయి నుండి వచ్చిన సుగుణ గారి మెడలో చెయిన్ లాగడానికి ఒకడు విఫలప్రయత్నం చేసాడు
అదృష్టం బాగుండి ఆ రోజు ఆమెకేమి కాలేదు కాని మెడ అంతా గీరుకు పోయింది. దెబ్బకి అందరం విడి విడిగా నడవడం మానేసి గుంపులుగా నడవడం మొదలు పెట్టాము
అలా ఆ రోజంతా చూసి మర్నాడు అలహాబాద్ కి హొటల్ వాళ్లు బుక్ చేసిన 40 సీట్ల బస్ లో ఉదయమే బయలు దేరాము
మా కుక్ చేసిచ్చిన ఉప్మా దారిలో తినేసాము. అలహాబాద్ వెళ్లగానే అందరికీ బోట్స్ లో తీసుకువెళ్లి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి ఒడ్డున ఉన్నపందిరిలో తొమ్మిదిజంటలు శాస్త్రోక్తంగా వేణీ దానమహోత్సవం చూడముచ్చటగా జరిగింది

అక్కడే మరో పక్క పితృకార్యాలు తర్పణాలు పిండ ప్రధానాలు మరి కొంతమంది నిర్వహించుకున్నారు. మరి కొందరు చేసిన. తమకు తెలియకుండా జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తం జరిపించుకున్నారు.
ఆ పక్కనే ఉన్న శయనావస్థలో ఉన్న బేడీ ఆంజనేయస్వామిని, ప్రయాగ లలితను దర్శించాము. తర్వాత బస్ లో ప్రయాణం. మధ్యలో పచ్చని చెట్ల దగ్రర మా కుక్ ఇచ్చిన పులిహోర, ధధ్యోజనం, అరటి పళ్లు లాగించాము. ఈ ప్రయాణంలో జోకులు, పాటలు, మాటలతో అందరికి అందరు తెలిసి పోయారు. వింధ్యవాసినీదేవి కొలువున్న శక్తి పీఠం, ఆ పైన సీతామర్హి అన్నప్రదేశం కి వెళ్ళాము. సీతాదేవి ప్రాణ త్యాగం చేసి భూమిలోకి వెళ్లిన ప్రదేశం చూసాము. పైన మహారాణి సర్వ సులక్షణ జత సీత కాగా క్రింద భూప్రవేశం చేసిన సీతామహాతల్లి ని చూస్తే గుండె చెరువయి కళ్ల లోకి వచ్చింది.


ఆమె చూపులోని భావాలు ఆ మహాతల్లికి జరిగిన అవమానానికి అద్దం చూపుతాయి. అంత సహజంగా ఉంది ఆ మూర్తి
మధ్యలో డిన్నర్ కి ఆగి కాశీ చేరేసరికి పదకొండయింది
ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఒక రోజు వారణాశిలో వున్న పద్నాలుగు ఘాట్స్ చూడటానికి ఒక బోటు మాట్లాడుకున్నాము.
ప్రధాన ఘాట్స్ అయిన దశాశ్వమేధ ఘాట్, లలితా ఘాట్, కేదార్ ఘాట్, హరిచంద్ర ఘాట్ లలో స్నానం చేసి చివరగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవతలు దిగివచ్చే సమయంలో మణికర్ణిక ఘాట్ లలో స్నానం చేసి అక్కడ సంకల్పంతో స్నానం చేసి బోటు వాడికి శివుడు ఇమ్మన్నట్లుగా గుప్తదానం ఇచ్చాము.

చాలా గుళ్ళు చూసాము. తిరిగాము. ఎక్కడా బోర్ అనిపించకుండా ఏదో రూమ్ లో చేరి కబుర్లు చెప్పుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, దర్శనాలకు, షాపింగ్ లకు, గంగా స్నానాలకు కలిసి వెళ్లడం వల్ల అందరం ఒక కుటుంబంలా కలిసిపోయాము
ఇరవయి అయిదో తారీఖుకల్లా కాశీలో మా తొమ్మిది నిద్రలు అయ్యాయి.
ఆ మరునాడు 26-11-3016 న బయలుదేరి గయ వెళ్లాము. వెళ్లేటప్పుడు దారిలో టిఫిన్ తిన్నాము. పిండప్రధానం చేసే జంటలు తినలేదు. గయలో వున్న మాంగళ్య గౌరీ టెంపుల్ దర్శనం చేసుకున్నాము.
గయ వెళ్లి కుక్ కి గ్యాస్ సిలిండర్, స్టవ్ ఇప్పించి వంట చేయింఛాము. సాయంకాలం బుద్ద గయ కూడా దర్శించాము. ప్రశాంతమయిన పాలరాతి సౌధంలో తధాగతుని చరిత్ర అంతా చెప్పడానికి ఒక గైడ్ ని మాట్లాడుకున్నాము. అతను చాలా చక్కగా వివరించి చెప్పాడు..

లంచ్ చేసి నైట్ అక్కడే ఉందామనుకుంటే మీరు నైట్ బయల్దేరితేనే రేపు మధ్యాహ్నానికి అయోధ్య వెళ్లగలం లేకుంటే రేపు రాత్రికి వెడితే అయోధ్యలో ఏమి చూడలేరు అని డ్రైవర్ చెప్పాడు.. అంతే వెంటనే ప్యాకప్ అన్నాను
విషయం అర్ధం కానివారు కొందరు చిందులు వేసారు కాని మర్నాడు మధ్యాహ్నం (27-11-2016) అయోధ్యకు చేరేసరికి వాళ్ళకే అర్ధమయింది.
అసలు వారణాశి నుండే గయ వెళ్లొచ్చు కాని డిస్టెన్స్ వల్ల నైట్ కి చేరకుంటే తొమ్మిది రాత్రుల నిద్రకు భంగమవుతుంది. అని అలా వెళ్లలేదు. వారణాశికి ఒక వైపు గయ మరో వైపు అయోధ్య. అయోధ్యకు నైమిశారణ్యం దగ్గరే అందువల్ల గయనుండి వారణాశి, వారణాశినుండి అయోధ్య చూసామన్న మాట.
అయోధ్యలో పటిష్టమయిన, నిర్భేద్యమయిన పోలీస్ బందోబస్త్ లో ఉన్న రామ జన్మభూమి చూసాము. అక్కడ ఉన్న రామ మందిరాలు కూడా దర్శించాము
రాత్రికి కుక్ కి మళ్లీ గ్యాస్ సిలిండర్ స్టవ్ ఇప్పించి వంట చేయించాము.
ఒక హొటల్ వాళ్లు వాళ్ల కిచెన్ ఇచ్చారు. అక్కడే ఉన్న బెంచీల మీద కూర్చుని చలిలో వేడి భోజనం తినడం ఒక ధ్రిల్ అందరికీ.
ఏవో రెండు ఐటమ్స్ అన్నం వండేవాడు కుక్ నాగేశ్వరరావు. ఏడువారాల నగల్లాగా ఒక్కోరోజు ఒక్కో పచ్చడితో భోజనం. పెరుగు ఎక్కడ పడితే అక్కడే దొరికేది. కేవలం వంట సామగ్రి గిన్నెలతో మా కుక్ రడీ. అద్దెకి గ్యాస్ స్టవ్ ఇంకేమి కావాలి. అందరికీ ఆరోగ్యకరమైన హోమ్లీ ఫుడ్.
దానికే ఎంతో సంతోషించారు ఈ యాత్రకు వచ్చినవారంతా.. ఆరోగ్యమయిన భోజనం చాలు పంచ భక్ష్య పరమాన్నాలు అవసరం లేదు అనేవారు. ఆ కోపరేషన్ లేకుంటే మనం కూడా ఏమీ చేయలేము కదా!
రాత్రికి నైమిశారణ్యం చేరుకున్నాము. అప్పటికే బుక్ చేసిన సాయి ధామ్ ( సాయి బాబా గుడి) లో రూమ్స్ తీసుకున్నాము. మర్నాడు ( 28–21-2016) కొన్నిజంటలు సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నారు


108 చక్రాలశ్రీచక్ర కుండ్

శ్రీకృష్ణుడు పూరీ జగన్నాధుడు గుడి కూడా అక్కడే వుంది చూసాము

సూత గద్దె గోమతీ నది, వ్యాసగద్దె లలితాదేవి గుడ, ధదీచి కుండ్, రుద్ర కుండ్ ( ఈ కుండంలో పాలు మారేడు దళాలు పళ్లు పూలు నీళ్ల ల్లో ఉన్న శివలింగానికి సమర్పించి ప్రసాదం ఇమ్మని అడగాలి. అప్పుడు ఏదొక పండు పైకి వస్తే తీసుకోవాలి)
వెంకటేశ్వరస్వామి గుడి శ్రీ చక్రతీర్ధం అన్నీ దర్శించుకుని సాయిధామ్ లో వారు పెట్టిన భోజనం చేసి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం. ఛలో వారణాశి అనుకుని బయలు దేరాము. మధ్య మధ్యలో అగుతూ మర్నాటికి( 29-11-2016) వారణాశి చేరాము ఆ రోజు అరోజున అన్నపూర్ణా దేవి ఆలయంలో భోజనం చేసాము. ఆవాళంతా రెస్టే.
30-11-2017 న మిగతా షాపింగ్స్, ప్యాకింగ్స్, పేమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. నో టిఫిన్ అనుకుని 11 గంటలకే భోజనం రెడీ. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంటకే హొటల్ నుండి మాట్లాడుకున్న వింగర్స్ లో మొగల్ సరాయ్ స్టేషన్ కి వెళ్లాలి మా ట్రైన్ కి అది స్టార్డింగ్ పాయింట్.
కాశీలో ఎక్కువ సేపు ఆగదు. గంటన్నర ప్రయాణం. అయినా లగేజిలతో ఏ ఒకరు ఎక్కలేకున్నా కష్టం అని మూడింటికి అక్కడ చేరాలి. అందుకే డైరెక్ట్ లంచ్. రాత్రికి చపాతీ ఫ్యాకింగ్స్ షరా మామూలే.
ఇంతకి ఆ లంచ్ దగ్గర చూడాలి అందరూ డల్ అయిపోయారు.
చిత్తూరు నుండి వచ్చిన శ్రీనివాస్( వారిజా బాలాజీల ఫామిలీ ఫ్రెండ్)
అందర్నీ వాళ్ల ఫీలింగ్స్ చెప్పమన్నారు. చెప్తున్నవారు చెప్తున్నారు. ఒక పక్క సుగుణ మరో పక్క అనుపమ మరో పక్క ఇంకొకరు కళ్లనీళ్ల పర్యంతమయి పోయారు. బాలాజీగారు చెప్పిన మాటలు.. ఇక్కడినుండి కొందరు వస్తువులు, మరి కొందరు దుస్తులు, మరి కొందరు పూసలు, ఇలా పట్టుకెడతారు నేను మాత్రం కొన్ని జ్ఞాపకాలు పట్టుకెడుతున్నాను అన్నారు


ఎక్క డ పుట్టామో ఎక్కడ పెరిగామో! కామేశ్వరి గారు కండక్ట్ చేసిన ఈ టూర్ వలన ఇలా కలుసుకున్నాము. పదిహేను రోజులు కలిసి మెలిసి ఒక కుటుంబంలా ఉన్నాము. విడిపోవాలంటే చాలా బాధగా ఉంది అని అందరూ సజల నేత్రాలతో చెప్పారు నాకూ అదే ఫీలింగ్ ఇన్నిరోజులు వీరందర్నీ నావాళ్లుగా చూసుకున్నాను కదా!
దానికి వారందరూ సంతోషించడం నాకూ ఆనందమే కదా!
అంతా భగవంతుడి దయ అనుకున్నాను
ఇలా అందరు ఆత్మీయులతో మా యాత్ర దిగ్విజయంగా ముగించుకుని వచ్చేసాము.
ఇది నేను నిర్వహించిన కాశీ యాత్ర

చెంగల్వల కామేశ్వరి