రెండో జీవితం 11

రచన : అంగులూరి అంజనీదేవి

శృతికను చూశాక సంవేదకి ఒక్కక్షణం ఏమి అర్థంకాలేదు. బయట మనం కొనుక్కునే బొమ్మల్లో కూడా కొంచెం ఫీలింగ్స్‌ కన్పిస్తాయి. ఈమెలో ఒక్క ఫీలింగ్‌ కూడా కన్పించలేదు బొమ్మను మించిన బొమ్మలా వుంది. ఇదేంటి ఇలా? ద్రోణ గారు బొమ్మలు వేసి, వేసి భార్యను కూడా ఓ బొమ్మను చేశారా? లేక ఆమె మనస్తత్వమే అంతనా? అయినా ఆవిడ గురించి నాకెందుకులే…ఆయన భార్యను చూడాలన్న కోరికైతే తీరింది. అది చాలు. అనుకుంటూ శృతిక చూపించిన గదిలోకి వెళ్లి కూర్చుంది.
నిముషాలు గడుస్తున్నా సంవేద వున్న గదిలోకి ద్రోణ రాలేదు.
కుర్చీలోంచి లేచి ముందుగా గోడలకున్న బొమ్మల్ని చూసింది. ఆ తర్వాత కర్టన్‌ తొలగించి అక్కడ కూడా కొన్ని బొమ్మలు వున్నట్లనిపించి లోపలకెళ్లింది.
ఒక్కో బొమ్మ ఒక్కో కళాఖండం. అద్భుతం, అమోఘం.
ఒక బొమ్మలో ఒక అమ్మాయి మందారచెట్టు దగ్గర నిలబడి పూలుకోస్తూ శూన్యంలోకి చూస్తుంది. ఆ బొమ్మపక్కనే ఓ కాప్షన్‌ రాసి ఉంది. ఆ బొమ్మ ఎంత అపూర్వంగా వుందో దాని పక్కన రాసిన ఆ వాక్యాలు కూడా అంత మహత్తరంగా వున్నాయి.
”…నువ్వొక ఆకాశం.. అర్థం కావు. నువ్వొక సముద్రం… అర్థం కావు. నువ్వొక నిత్యనూతనపు తలంపువి… అర్థం కావు. అయినా కానీ ఏదో, ఏదో అర్థం వుందన్న మైమరపులో పుట్టిన పులకింతల చిరుసవ్వడితో నన్ను స్పర్శిస్తున్నావు.
అందుకే నువ్వు నా అంతరంగపు అనంత జలపాతంలో తడిసి, తడిసి ముద్దయి, ముగ్ధలా, స్నిగ్ధలా, స్థితప్రజ్ఞలా నా ఎదవాకిట్లో నిలబడి అరమోడ్పు కళ్లతో నన్నే చూస్తున్న భావనలో మునిగివున్నాను. ద్రోణ” అని రాసివుంది.
ఆ వాక్యాలను చదువుతూ అలాగే నిలబడింది సంవేద.
.. ఎప్పుడొచ్చాడో ద్రోణ! ఆమె వెనక నిలబడి, ఆమె తలమీద నుండి ఆమె ఏమి చూస్తుందో అదే చూస్తున్నాడు. అంతలో ఒక పూర్ణపురుషుని ఎదను తాకేంత దగ్గరగా నిలబడి వున్నానన్న భ్రమ కలిగి, అది భ్రమ కాదు నిజమని తెలిసి దిగ్భ్రమ చెంది, తనకు తెలియకుండానే చిరుకదలికతో, ఓ చిరునవ్వుతో అతన్ని పలకరించింది.
ఆ పలకరింతకి అతనిలోని కళా హృదయం ఒక్కక్షణం రంగుల కుంచెలా విప్పుకొని హరివిల్లయి, సుమరాగ రంజితమై, అరవిందమై చందన శకలమైంది.
అతన్నలా చూస్తుంటే సముద్రాన్ని అతి దగ్గరగా చూస్తున్న భావన కలిగింది సంవేదలో… కొందరు నదిని సముద్రమనుకుంటారు. సముద్రాన్ని నది అనుకుంటారు. సముద్రాన్ని సముద్రంగా గ్రహించటం వివేకం..
”ఎప్పుడొచ్చారు?” అన్నాడు ద్రోణ మృదుమధురంగా ఆమె ఆలోచనలని చెదరగొడ్తూ…
”ఇప్పుడే వచ్చాను మీరు రావటం ఆలస్యం కావొచ్చని మీ పర్మిషన్‌ లేకుండానే ఈ కర్టన్‌ దాటి లోపలకి వచ్చి ఇవన్నీ చూస్తున్నాను.” అంది
”నిజానికి ఇక్కడికి ఎవరూ రారు. శృతిక కూడా.. అయినా నాదగ్గర మీకు పర్మిషనేంటి? కూర్చోండి!” అంటూ నాలుగడుగులు వెనక్కి వేసి… అతను కూర్చుంటూ ఆమెకు కుర్చీ చూపించాడు.
ఆమె కూర్చుంది. ఆ కూర్చున్న విధానంలోని ఒద్దిక, పొందిక ఎంతో గొప్పగా అన్పించింది ద్రోణకి… ఆమెనే చూస్తే బావుండదని చూపు తిప్పుకున్నాడు.
హృదయంలో లేని వాళ్లను కౌగిలించుకోవాలంటే ఎంత కష్టమో, హృదయంలో వున్న వాళ్లకి ఓ అడుగు దూరంలో వుండటం కూడా అంతే కష్టమని ద్రోణకి అర్థమయినా స్థిర చిత్తంతో చూస్తున్నాడు.
ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ…”నిశిత పెళ్లి సర్‌! ఇన్విటేషన్‌ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీరు తప్పకుండా రావాలి. మామయ్యగారు తన పిలుపు కూడా నన్నే పిలవమన్నారు.” అంటూ శుభలేఖను అతని చేతికిచ్చింది
ప్రశాంతంగా చూస్తూ ” అబ్బాయి ఏం చేస్తాడు?” అన్నాడు ఎంతో ఆత్మీయంగా.
”గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌ అని చెప్పారు” అంది సంవేద. అంతకన్నా వివరాలు తెలియనట్లు చూసింది.
సంవేద ముఖంలో అసంతృప్తి ఎంత శాతం వుంది. తృప్తి ఎంత శాతం వుంది తెలుసుకోవాలన్నట్లు సూటిగా ఆమె ముఖంలోకి చూశాడు ద్రోణ.
అతని చూపులు ఆమెను గుచ్చుకున్నట్లై కడిగిన ఆకాశంలా వుండానికి విశ్వప్రయత్నం చేస్తూ అతని కళ్లకి దొరికిపోయింది.
”చెప్పు సంవేదా ! నువ్వు హ్యాపీగా వున్నావా?” అన్నాడు సడన్‌గా.
అతను తీసుకుంటున్న ఆ చనువుకి ఆమె ఆశ్చర్యపోయింది. అయినా దాన్ని యాదృశ్చికంగా భావిస్తూ.. ”నిశిత పెళ్లి జరిగితే అంతకన్నా హ్యాపీ వుండదు సర్‌! అది మీ ద్వారానే జరుగుతోందిప్పుడు…” అంది తలవంచుకొని.
నీకు సంతోషాన్ని కల్గించే ఏ చిన్నవిషయమైనా నేను చేయటానికి సిద్ధంగా వున్నాను అది నీకెలా తెలియాలి? అన్నట్లు చూశాడు.
ద్రోణ చూపుల్ని గమనించకుండా ”సర్‌! మీరు అన్ని రకాల బొమ్మలు వేస్తున్నారు. అన్ని బొమ్మల్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం నాకెలా తెలుసంటే నన్నోసారి ఆముక్త మీ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ తీసికెళ్లింది. ఈ ఆర్టిస్ట్‌ మన కాలేజీలోనే చదివాడు అని కూడా చెప్పింది… కానీ ఆ కర్టన్‌ అవతల వున్న బొమ్మని ప్రదర్శించడం లేదు. ఎందుకని?” అంది.
ద్రోణ మాట్లాడలేదు.
ఆమె నొచ్చుకుంటూ ”మీకు చెప్పాలని లేకుంటే వద్దులెండి!” అంది.
ఆమెను నిరాశపరచటం ఇష్టం లేక… ”మీకు చెప్పటంలో ప్రయోజనం లేనట్లే చెప్పకుండా వుండటంలో కూడా అర్థం లేదు. నాకు ఆ బొమ్మలోని అమ్మాయితో మానసికంగా చాలా దగ్గర సంబంధం వుంది.” అన్నాడు.
”నేనొకి అడగాలనుకుంటున్నా… ఏమీ అనుకోరుగా?” అంది.
”అడగండి ! పర్లేదు…” అన్నాడు ద్రోణ రిలాక్సడ్‌గా కూర్చుంటూ.. ఆమె అలా ఏదో ఒకటి మాట్లాడుతుంటే అతనికి ఇంకా వినాలని వుంది. ఎంత వద్దనుకున్నా ఒక మనిషిలో కలిగే మానవ సహజమైన ఫీలింగ్‌ అది…
”మీరామెను ప్రేమించారా?” అంది. ఆమెకు చాలా కుతూహలంగా వుంది. ముఖ్యంగా అతని నోటితో చెబితే వినాలని వుంది.
”ప్రేమించాను. కానీ ఆ విషయం ఆ అమ్మాయితో చెప్పలేదు” అన్నాడు నిజాయితీగా.
”ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మన మనసులో ఏదైనా ఒక మార్పు జరుగు తున్నప్పుడు ఆ మాత్రం స్పృహలే కుండా వుంటుందా? మనుషులం కదా!” అంది.
”చెప్పేంత అనుకూలమైన వాతావరణం లేదప్పుడు.. చెప్పినా లాభం లేదని మౌనంగా వుండిపోయాను” అన్నాడు
బోరున ఏడ్వాలనిపిస్తోంది సంవేదకి…
తన ఇంట్లో ప్రతిక్షణం ఏడుపు వస్తున్నా ఓదార్చేవాళ్లు లేక ఆపుకునేది. ఇప్పుడు ఏడిస్తే ద్రోణ తన బలమైన బాహువుల్లోకి తీసుకొని తన బాధను క్షణంలో మాయం చేస్తాడు. కానీ తను ఏడవకూడదు. కంట్రోల్ చేసుకోవాలి. ఈ జీవితం ఇక ఇంతే అని సరిపెట్టుకోవాలి. తనకు ఏది ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే లభించిందని తృప్తిపడాలి.
తృప్తికి మించిన జీవనసూత్రం లేదు కదా! అనుకుంటూ అతని ముఖంలోకి చూడలేకపోతోంది.
కారణం ఆ బొమ్మలో వుండే అమ్మాయిలో వున్న పోలికలన్నీ తనవే…
…ఆణిముత్యం దొరికితే బావుండని సముద్రతీరాన వెళ్తుంటే గుడ్డిగవ్వ దొరికినప్పుడు చేసేది ఏముంటుంది? చేతుల్లోకి తీసుకొని ఇదే ముత్యం అనుకోవాలి. ఇదే సర్వం అనుకోవాలి అలా ఎంతమంది అనుకోవటం లేదూ! ఎంతో నిస్సారంగా జీవితం గడుపుతూ కూడా ఎంతో సారవంతమైన నవ్వుల్ని నటిస్తూ నటనే జీవితంగా మార్చుకుంటున్నారు. తనేమైనా పొడిచొచ్చేపొద్దా! నడిచొచ్చే శిల్పమా! అతి మామూలు సాదాసీదా సంవేద! అంతే! తను కూడా వాళ్లతో సమానమే…
”ఏమి ఆలోచిస్తున్నారు?” అన్నాడు ద్రోణ ఆమె మౌనాన్ని చూసి..
”ఏడుపెందుకు రావటం లేదా అని…” అంది.
షాకింక్‌గా చూశాడు ద్రోణ.
”కొందరు ఆడవాళ్లు పరిపూర్ణంగా ప్రేమించే మనిషిని కళ్ల ముందు వుంచుకొని పొరపాటున కూడా ప్రేమించని భర్తతో కాలాన్ని నెట్టుకొస్తూ అదే జీవితంలా, పరమార్థం వున్న జీవితంలా పైకి నటిస్తుంటారు. మగవాళ్లు కూడా కొందరు అంతే! ఏదో ఏదో లోలోపల దాచేసుకొని త్యాగాలు చేస్తుంటారు. దీనివల్ల చివరకు మిగిలేది ఏమిటి సర్‌!” అంది సంవేద సూటిగా.
ఆ మాటలు ద్రోణ గుండెల్ని గురి చూసి తాకాయి. వెంటనే తేరుకొని ”అది కాలం నిర్ణయిస్తుందని కాలానికే వదిలేసి బ్రతకటమే చివరికి మిగిలేది” అన్నాడు ద్రోణ.
”మీరింత గొప్పగా ఎలా నటిస్తున్నారు?” అంది సంవేద ఇక ఆగలేక…
”నాది నటన కాదు. మనోనిబ్బరం… నిశ్చలత..” అన్నాడు ఇన్ని రోజులు అతనికో బాధ వుండేది తన మనసులో ఆమె వున్నట్లు ఆమెకు తెలియకుండానే ముగిసిపోతుందేమో అని. ఇప్పుడా బాధ తగ్గింది.
ఈ సంఘటనతో ఆమెకు కూడా నన్ను ప్రేమించే ఓ వ్యక్తి రహస్యంగా వున్నాడన్న ఊరట లభించింది.
”నేనిక వెళ్తాను సర్‌! ఇంట్లో ఎదురు చూస్తుంటారు.” అంది సంవేద.
”అలాగే!” అంటూ లేచి ఆమెవెంట నాలుగడుగులు వేసి ఆగిపోయాడు.
*****
నిశితను పెళ్లి పీటపై చూస్తుంటే శ్యాంవర్ధన్‌ మనసు దహించుకుపోతోంది. ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతే బావుండనుకుంటున్నాడు.
”ఈ పెళ్లి జరగడానికి వీలులేదు” అంటూ దూరప్రాంతంనుండి అప్పుడే వచ్చిన వాళ్ల బంధువు ఒకామె పెళ్లి మధ్యలో వెళ్లి నిలబడింది.
”ఎందుకు? ఎందుకు?” అంటూ మహదానందాన్ని మనసులోనే నొక్కిపెట్టి ముందుకొచ్చాడు శ్యాంవర్ధన్‌.
శ్యాంవర్ధన్ని ఓ నెట్టు నెట్టి గంగాధరం దగ్గరకి వెళ్లి ”ఏమయ్యా! గంగాధరం! మా వాడికి నీ మాయమాటలతో కట్నం ఆశ చూసి కుంటిదాన్ని అంటగట్టాలని చూస్తావా? అయినా దాన్ని పోషించటానికి నువ్విచ్చే ఆ ముష్టి ఏబైవేలు ఏ మూలకి వస్తాయి ఇంక ఏమేమి ఆశలు చూపావు?” అంటూ కేకేసింది.
తల కొట్టేసినట్లైంది గంగాధరానికి…
పెళ్లికి వచ్చిన వాళ్లంతా బిత్తరపోయి చూస్తున్నారు.
”మర్యాదగా మాట్లాడండి! అతనే మా అమ్మాయిని చేసుకుంటానని ముందుకొచ్చాడు. ఆశ చూపటం లాంటి చిల్లర మనుషులం కాదు…” అన్నాడు గంగాధరం.
”తెలుస్తూనే వుంది. కుంటిదాని కోసం ఎవరైనా వస్తారా? దానికేమైనా తల్లిదండ్రులా? అన్నదమ్ములా? నాలుగురోజులు కూడా తక్కువ కాకుండా జీవితాంతం పోషించాలి. అవి దాన్ని చేసుకొని అష్టకష్టాలు పడాల్సిన ఖర్మమావాడికేంటి?” అంది.
”మానసిక రోగులకన్నా మా నిశిత ఎంతో మేలు. చేతిమీద కురుపు లేస్తే చేయిని నరుక్కుంటామా? కాలు లేనంత మాత్రాన జీవితమే లేకుండా పోతుందా? దయచేసి నా మాట విని ఈ పెళ్లి జరగనివ్వండి!” అన్నాడు ప్రాధేయపడ్తూ గంగాధరం.
”వాళ్లను బ్రతిమాలొద్దు మామయ్యా! నేనీ పెళ్లి చేసుకోను” అంటూ పక్కనున్న ఆడవాళ్ల సాయంతో లేచి నిలబడింది నిశిత.
ఆ మాటతో – పెంపుడు జంతువును లాక్కెళ్లినట్లు పెళ్లికొడుకును లాకెళ్లిందామె… అది చూసి నిశ్చేష్టులయ్యారు గంగాధరం, సంవేద.
శ్యాంవర్ధన్‌కి ఆనందతాండవం చేయాలనివుంది. ఆఫీసునుండి అర్జంటుగా రమ్మని కాల్‌ రావటంతో వెళ్లాడు.
నిశితను ఓదార్పుగా అక్కున చేర్చుకొంది దేవికారాణి. ఆమెకు ధైర్యం చెబుతూ భార్య పక్కనే కూర్చున్నాడు గంగాధరం. ఆయనకి ఈ సంఘటన చాలా అవమానకరంగా వుంది. పెళ్లి చూడాలని వచ్చిన వాళ్లు ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు.
సంవేద కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే పక్కకి తీసికెళ్లి కూర్చోబెట్టింది ఆముక్త. అది గమనించిన ద్రోణ వాళ్ల దగ్గరకి వెళ్లాడు.
సంవేదకి – ఆమెను అర్థం చేసుకొని, ఆమె తప్ప ఇంకో స్త్రీ అవసరం లేదనుకునే భర్త దొరికి వుంటే ఈ సమస్యలు వుండేవికావు. తనకి ఆమెను ఓదార్చాలని వున్నా, నీకేం పర్వాలేదు నేనున్నానని చెప్పాలని వున్నా – భూమికి, పాదానికి మధ్యలో చెప్పులా ఏదో శక్తి అడ్డుగా వుంది ద్రోణకి…
చిన్న కాగితం మీద గొప్ప చిత్రాన్ని వేయగలిగిన ద్రోణ ఈ బ్రతుకు చిత్రానికి ఏ కాగితం సరిపోతుందో, ఏ రంగులు కావాలో అంచనా వేయలేక పోతున్నాడు. వ్యక్తంలోంచి అవ్యక్తంలోకి వెళ్లినట్లు ఆలోచిస్తున్నాడు. జీవితమనేది కొందరికి ‘కల’ అయితే కొందరికి ‘ఆట’. కొందరికి వినోదమైతే.. కొందరికి విషాదం… కానీ ప్రతి వ్యక్తికి కొన్ని కష్టాలు, బాధలు అవసరం. పడవలో అడుగున కొంత బరువెయ్యందే అది నిలకడగా ప్రయాణం చెయ్యదు. పడినప్పుడే లేస్తాం. భంగపడ్డప్పుడే పోరాడతాం. అందుకే జీవితం ఓ అసాధారణ వ్యాపారం. అందులో ఎలా జీవించాలన్నది గొప్పకళ. దాన్ని నేర్చుకోవటమే కాదు, నేర్పటం కూడా అవసరం అనుకొని…
”సంవేదా! ఈ పెళ్లి ఆగిపోయినందుకు సంతోషించు…” అన్నాడు ద్రోణ.
వెంటనే తలెత్తి ఎందుకన్నట్లు చూసింది సంవేద.
ఆమెను చూస్తుంటే భూమిలోకి కుంగిపోతున్న దానిలా వుంది.
”నిశితకి మీరు చెయ్యాల్సింది పెళ్లికాదు. అలాంటి ప్రయత్నం మీరు చేసినప్పుడల్లా ఆమె మనసు గాయపడటం తప్ప ఇంకేం వుండదు. పెళ్లే సెక్యూరిటీ అని కూడా అనుకోవద్దు. మనిషి చెయ్యవలసిన పనులు చాలా వున్నాయి. మన పనులే మనకి సెక్యూరిటీ…” అన్నాడు ద్రోణ.
”తనేం చెయ్యగలదు పనులు?” అంది నిరుత్సాహంగా
”నిశితలో కాలు సహకరించపోవటమనేది పెద్ద లోపం కాదు. అన్ని పనులు కాకపోయినా కొన్ని పనులు చక్కగా చేసుకోగలదు. ఆ కొన్నినే అనుకూలంగా మలుచుకొని కొంత సాధన చేయించి చూద్దాం.” అన్నాడు.
”ఎంతయినా నా చెల్లెలు చిల్లుకుండ సర్‌! ఆ కుండతో తోటనేం తడుపుతుంది?” అంది సంవేద.
”చిల్లుకుండతో కూడా ఉపయోగం వుంటుంది సంవేదా! వెయిట్ అండ్‌ సీ…” అన్నాడు స్థిరంగా.
అతని మాటలు వింటుంటే నిశిత జీవితానికి ఏదో దారి కన్పిస్తున్నట్లు, ఇంకా ఏదో స్పష్టతరాని ఆశల అల్లిక ఆమె కళ్లముందు మెదిలింది.
”ఇక నేను వెళ్తాను. ఇంకో గంటలో నేను ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ దగ్గరకి వెళ్లాలి.” అన్నాడు.
ద్రోణ ఇంకొద్దిసేపు వుంటే బావుండని సంవేద మనసు ఆశించింది. ఆమె ఫీలింగ్‌ ఆమెకే విచిత్రంగా అన్పించి ”సరే ! సర్‌!” అంది రెండు చేతులు చాలా పద్ధతిగా జోడించి.
ద్రోణ ‘బై’ చెబుతూ తను చెప్పిన ఆ నాలుగు మాటలకే ఆమె ముఖం తేటగా మారటం గమనించాడు.
”నేను ఆటోలో వెళ్తాను ద్రోణా!” అంది ఆముక్త.
అతనేం మాట్లాడలేదు. ఆటోను పిలిచి ఆమెను ఎక్కించాడు.
అతను కారెక్కి డ్రైవ్‌ చేసుకుంటూ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌కి వెళ్లాడు.
*****
ద్రోణ వేసిన నిశిత బొమ్మకి జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది. అలా వచ్చినట్లు అన్ని పత్రికలు ప్రకటించాయి.
ఎందరో కళాకారులు, కళాభిమానులు ద్రోణను అభినందిస్తూ అతని మొబైల్‌కి మెసేజ్‌లు పంపుతున్నారు.
అందరికన్నా చైత్రిక పంపిన యెస్సెమ్మెస్‌లో ఓ ప్రత్యేకత వుంది.
ఆముక్త ఫోన్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
సంవేదనుండి ఓ ఫోన్‌కాల్‌ కాని, చిన్న ఎస్సెమ్మెస్‌ కాని లేదు. ద్రోణలో అదోలాంటి నిరాశ, వెలితి…
…మనిషికి ఏదీ అనుకున్నట్లు జరగదు. జరిగేది అనుకున్నది కాదు. అదే జీవితం అని ద్రోణకి తెలియంది కాదు. కానీ మనిషి మనసు విచిత్రం… రహస్యంగానే తనకేం కావాలో అది కోరుకుంటూనే వుంటుంది. అది జరగదని తెలిసినా అలా కోరుకోవడం మానుకోదు. ఆ కోరికలో కలిగే స్పందన తాలూకు రసానుభూతి ఎంత డబ్బు సంపాయిం చినా రాదు.ఎంతమందితో మ్లాడినా రాదు. అదో అలౌకిక స్థితి… ముఖ్యంగా కొందరు కళాకారులు ఇలాంటి స్థితిలోనే ఎక్కువగా జీవిస్తుంటారు. ఆ ఇన్సిపిరేషన్‌ వాళ్లలోని కళకి, సమర్థతకి జీవంపోస్తుంది. అదొక అసాధారణ చర్య…
సంవేద తాలూకు ఆలోచనలు అతని అంతఃచక్షువుని ఎప్పుడూ తడుముతూనే వుంటాయి. అదొక రహస్య నిధి.
అవార్డు తాలుకూ ఆహ్వాన పత్రాలు అందరికి అందాయి.
*****
అవార్డు సభ ప్రారంభం కాబోతోంది.
ఆహూతుల సమక్షంలో ఆడిటోరియం కళకళలాడుతోంది. కళాభిమానులు, కళాకారులు, నగరంలో ప్రముఖ వ్యక్తులు ఆ సభలో కూర్చుని ద్రోణలోని ప్రజ్ఞను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
ముందుగా సరస్వతీదేవి విగ్రహం ముందు జ్యోతి వెలిగించారు.
కార్యదర్శి మైక్‌ముందు నిలబడి ఒక్కో వక్తను పేరు, పేరున పిలిచి వేదికను అలంకరించమని గౌరవపూర్వకంగా చెబుతున్నాడు.
ఒక్కొక్కరే వెళ్లి వేదికపై ఆశీనులయ్యారు.
అధ్యకక్షులు మాట్లాడి కూర్చున్నాక – ఒక్కో వక్త లేచి ద్రోణలోని ప్రత్యేకతను, ఆయన కుంచె నడిపిన తీరును ప్రశంసిస్తూ, బొమ్మల్ని గీయటంలో అతను ఎలాంటి మెళుకువల్ని ఎలా వడిసి పట్టుకున్నాడో చెప్పారు.
ఇంత చిన్న వయసులో అతనెంత గొప్ప అభివృద్ధిని సాధించాడో, ఒక కళలో నిష్ణాతులు అవ్వదలుచుకున్న వాళ్లలో ఎలాంటి లక్షణాలు వుండాలో అవన్నీ ద్రోణలో వున్నాయన్నారు.. అన్నికన్నా పోటీలలో నిలబడానికి అతను ఎంచుకున్న కళారూపం ఎంత ఉదాత్తమైనదో చెబుతూ…
ఆ చిత్రాన్ని గీయడంలో అతనిలోని ఆవేశపూరితమైన మనో ఆకాశం ఉక్కిరిబిక్కిరై ఇక ఆగలేక అంతిమక్రియగా ఎలా గర్జించుకుంటూ కురిసిందో, దానికి అతను వాడిన కాగితం విప్పుకొని విస్తరించిన సముద్రంలా ఎలా మారిందో అద్భుతంగా వర్ణిస్తుంటే ఆడిటోరియంలో చప్పట్లు మారుమ్రోగాయి.
”చూశారా మీలోని కళ మీకెంత గుర్తింపు నిచ్చిందో” అన్నట్లు చైత్రిక కళ్లు మెరిశాయి.
ద్రోణ పట్ల అభినందనతో సంవేద కళ్లు తడిసి తళుక్కుమన్నాయి.
ఆముక్త కళ్లు ఆశ్చర్యంతో ఆవులించాయి.
శృతిక కళ్లు – అభావంగా తన చీరమీద ఏదో మరక వున్నట్లు అన్పించి దాన్నే చూసుకుంటున్నాయి.
వేదికపై కూర్చుని వున్న ద్రోణ వాళ్ల నలుగుర్ని గమనిస్తూ తన కళ్లని ఒక్కక్షణం సంవేద మీద నిలిపాడు. ఎంత సాధించినా ఇంకా ఏదో మిగిలే వుంటుంది కళాకారులకి… కానీ సంవేద కళ్లలోని తడి.. ఆ తడిలోని తృప్తి ద్రోణ మనోమందిరాన్ని తడిపి బీటలు వారిన అతని హృదయ భూమిని చిత్తడి, చిత్తడి చేసింది.
ఈ క్షణంలో ఇంతకన్నా తనకింకేం కావాలనిపించట్లేదు. ఈ తృప్తి చాలనిపిస్తోంది. ఈ తృప్తే కాదు… సంవేదలోని మానసిక వ్యధను తొలగించి ఆమెను సంతోషపెట్టాలంటే ఇంకా తను చేయదగిన పనులు ఏమున్నాయో ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన కూడా అతనికి ఆనందంగానే వుంది.
ప్రేమించే మనసుపడే పరితపన, పరితాపం… ప్రేమింపబడే వాళ్లకి అజ్ఞాత రక్షణగా వుంటుందనానికి ద్రోణ ఆలోచనలే నిదర్శనం…
ముందు వరుసలో కూర్చుని వున్న ద్రోణ తల్లిదండ్రులు విమలమ్మ, సూర్యప్రసాద్‌ పుత్రుని అభివృద్ధిని చూసి పొంగిపోతున్నారు.
ద్రోణ స్పందనని ఎప్పుడెప్పుడు విందామా అని ఆహుతులైన శ్రోతలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
చివరగా ద్రోణ మాట్లాడతాడని అధ్యక్షులు చెప్పటంతో…
తలపండిన పెద్దవాళ్ల పక్కన కూర్చుని వున్న యువకుడైన ద్రోణ లేచి నిలబడగానే మళ్లీ చప్పట్లు మోగాయి.
…ద్రోణ ”సభకు నమస్కారం!” అంటూ మొదలుపెట్టి… ఆర్ట్‌ అంటే ఏమి దానివల్ల కలిగే ఉపయోగాలు ఏమి అన్న అంశంపై అనర్గళంగా మాట్లాడుతూ… దానికి ఎలాంటి ఇన్సిపిరేషన్‌ కావాలి. ఎలాంటి డెడికేషన్‌ కావాలి. ఎలాంటి వాతావరణం కావాలి అన్నది కళ్లముందు కన్పిస్తున్నట్లు మాట్లాడాడు. ఆ తర్వాత…
నేను ఈ రోజు ఈ అవార్డు అందుకోటానికి కారణాలు ఎన్ని వున్నా అందుకు నిశిత అనే అమ్మాయి రూపమే ప్రధాన కారణమని నేను నమ్ముతున్నాను. అ అమ్మాయి లేకుంటే ఈ రోజు నాకీ అవార్డు లేదు. అందుకే ఈ అవార్డుతో పాటు నాకు ఇస్తున్న ఈ డబ్బుని ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం వినియోగించాలనుకుంటున్నాను.” అన్నాడు.
ద్రోణ ఆ మాట అనగానే సంతోషంతో కూడిన చప్పట్లు ఆడిటోరియంను అదరగొట్టాయి.
ఒక్కక్షణం ఆగి ద్రోణ మాట్లాడటం మొదలుపెట్టాడు.
”నిశిత తనకి కాలు లేదని, తనో ఓటి కుండనని అనుకుంటోంది. తనమీద తనే జాలిపడ్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. కానీ అది తప్పు… ఎలా అంటే!
ఒక తోటమాలికి తన కావడిలో ఒకి మంచికుండ ఇంకోటి చిల్లికుండ వున్నాయట. ఏి నుండి నీళ్లు తెస్తున్నప్పుడు మంచికుండ తోటను తడిపితే చిల్లికుండ తోటకెళ్లే దారిలో వుండే మొక్కల్ని తడిపేదట… ఆ విషయం ఆ తోటమాలికికాని, చిల్లికుండకి కాని తెలియదు. దారిలో వున్న పూలమొక్కలు ఎన్నో అందమైన పూలు పూసి ఎంతో మంది స్త్రీల శిగలను అలరిస్తుంటే – తోటమాలి చిల్లికుండను ప్రేమతో దగ్గరకి తీసుకొని ‘పగిలిపోయిన నిన్ను నిజానికి పారేయాలి. కానీ నీ మీద నాకున్న ప్రేమ అందుకు అనుమతించదు. అందుకే నాకు తోచిన పద్ధతిలో నిన్ను వాడుకొని నీ ఉపయోగం. ఎంతవరకు వుందో అంతవరకు నిన్ను ఉపయోగించుకుంటాను.’ అని తోటకెళ్లే దారిలో మంచి, మంచి పూలమొక్కల్ని నాటి చిల్లికుండను తన కావడిలోంచి తియ్యకుండా వుంచుకున్నాడట…
దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ”పనికిరాని కొండకన్నా పగిలిన కుండమిన్న” అని…
నిశిత లాంటి వాళ్లు ఎందరో వున్న ఒక సేవా సంస్థను కలిసి మాట్లాడి వచ్చాను. అక్కడవాళ్లు చేస్తున్న పనుల్ని గమనించి ఆశ్చర్యపోయాను. వాళ్లు చేస్తున్న ప్రతి పనిలో ఉపయోగం వుంది. ఆర్థికపరమైన లాభాలున్నాయి. మానసికమైన ఉల్లాసం వుంది. అదొక బడి, అదొక గుడి అదొక పరిశ్రమ.
నిశిత తరుపున నేను డొనేట్ చేస్తున్న ఈ డబ్బుతో రేపటి నుండి నిశిత అక్కడే వుంటుంది. అలా వుండేందుకు అన్ని ఏర్పాట్లు నేను చేసి వచ్చాను. ఇకపై నిశిత ఎవరికి బరువుకాదు. తనని తను పోషించుకుంటుంది. తనకు తనే సెక్యూరిటిగా నిలబడ్తుంది. నిశితే కాదు. నిశితలాంటి వాళ్లు ఎందరో అక్కడ ఆత్మస్థయిర్యంతో ఆనందంగా వున్నారు. ఈ విషయంపై నిశిత కుటుంబ సభ్యులతో మాట్లాడవలసి వుంది. వాళ్ల అంగీకారంతోనే ఈ పని జరుగుతుంది.” అన్నాడు ద్రోణ.
ద్రోణలోని మానవత్వంతో కూడిన ఆ చర్యని అభినందిస్తున్నట్లు మళ్లీ చప్పట్లు మారుమోగాయి.
సంవేదకి ద్రోణ పాదాలని తాకాలని వుంది.
ఆ భావనకన్నా మించిన ఇంకో భావన ఏదైనా వున్నా బావుండనిపిస్తోంది. అదికూడా సరిపోదేమో అనిపిస్తోంది. ఉబుకుతున్న కన్నీరు ఆనందభాష్పాలై చెంపల్ని తడుపుతుంటే – పక్కనున్న ఆముక్త సంవేద తలని తన భుజానికి అదుముకొంది.
శృతిక వెంటనే డ్రైవర్‌కి ఫోన్‌చేసి ఒక్కతే లేచి ఇంటికెళ్లిపోయింది. శృతిక ఫోన్‌ చెయ్యటం, వెళ్లిపోవటం వేదిక మీద కూర్చుని వున్న ద్రోణ చూస్తున్నాడు. ఆమె అలా ఎందుకెళ్లిపోయిందో అతనికి అర్థం కాలేదు.
చైత్రిక ద్రోణ మీదనుండి తనచూపుల్ని తిప్పుకోలేక పోతోంది. ఆశ్చర్యానందంలోంచి తేరుకోలేకపోతోంది. తన కళ్లముందే ద్రోణ ఉన్నత శిఖరాలను అందుకోవటం చూసి గర్వంగా ఫీలవుతోంది.
సభ ముగిసింది.
కారులో కూర్చున్నాక…
”నిశిత వచ్చి వుంటే బావుండేది” అన్నాడు ద్రోణ నిశిత రానందుకు వెలితిగా ఫీలవుతూ.
”రావాలని చాలా ఉత్సాహం చూపింది సర్‌! ఒంట్లో బావుండలేదు. మీరు సభలో ప్రకటించిన విషయం తెలిస్తే సంబరపడిపోతుంది. మీరు దానికి ఇంత మంచి దారి చూపుతారని అది కలలో కూడా వూహించి వుండదు…” అంది సంవేద.
”అదెవ్వరు ఊహించరు.. కొన్ని అలా జరిగిపోతుంటాయి. ఊహలకి అందకుండా…” అంది చైత్రిక.
”ఏది ఏమైనా నేను కూడా ఓ గొప్ప అభ్యుదయ కవిత రాసి ద్రోణ చేత బొమ్మ గీయించుకోవాలి. ఈ రాత్రికే కవిత రాయటం మొదలుపెడతాను” అంది ఆముక్త.
”కవితలకి గీసిన బొమ్మలకి కూడా అవార్డులిస్తారా సర్‌?” అంది సంవేద సందేహంగా ద్రోణవైపు చూస్తూ…
”ఆముక్త రాయబోయే కవిత మీద నాకు చాలా నమ్మకం వుంది. అది తప్పకుండా అవార్డు స్థాయిలోనే వుంటుంది.” అన్నాడు ద్రోణ.
ఆ మాటలకి ఆముక్తకన్నా సంవేదనే ఎక్కువ సంతోషించింది.
గుండెలనిండా సంతోషం, మనసునిండా ఆనందం ఆ కారులో వున్న వాళ్లందరి సొంతమైంది.
ద్రోణ తల్లిదండ్రులు తమ కారులో తమ ఇంటికి వెళ్లారు.
”మీరు ముగ్గురు నాతోపాటు మా ఇంటికి రండి! ఈ సంతోష సమయంలో మా శృతిక మీకో మంచి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత మా డ్రైవర్‌ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తాడు.” అన్నాడు ద్రోణ.
”సరే” అన్నారు ముగ్గురు ఒకేసారి.
ద్రోణ ఇల్లు రాగానే నలుగురు దిగి ఒకరి వెంట ఒకరు లోపలకి నడిచారు
*****
లోపలకి వెళ్లి హల్లోకి అడుగుపెట్టగానే అక్కడ శృతికను చూసి.. ఊహించని దృశ్యాన్ని చూసినట్లు ద్రోణ మనసు మండుతున్న పెట్రోల్‌ బావిలా అయింది. శృతికను సడన్‌గా కుర్చీలోంచి లేపి చెంప చెళ్లుమనిపించాడు
చెంపను చేత్తో పట్టుకొని కొండ విరిగిమీద పడ్డట్లు ఊపిరి ఆగిపోతున్న దానిలా నిలబడింది శృతిక వెంటనే తేరుకొని ఎర్రబడ్డకళ్లతో కోపంగా చూస్తూ ”నన్నెందుకు కొట్టారు?” అంది.
ఆముక్త, చైత్రిక, సంవేద నిశ్చేష్టులై నిలబడ్డారు.
శృతిక బావ అనిమేష్‌ చంద్ర పరిస్థితి కూడా అలాగేవుంది.
”నన్నెందుకిలా కొట్టారు? అందరిలో నన్ను అవమానించాలనా?” అంది బుసలుకొడ్తూ శృతిక భర్తనే చూస్తూ…
”నిన్ను నలుగురి ముందే కొట్టి అవమానించాను. నువ్వు నన్ను అనేకమంది ఆహూతుల సమక్షంలో అవమానించావు. సభలో నేను మాట్లాడుతుండగా నా భార్య సభా మర్యాదల్ని అతిక్రమించి మధ్యలో లేచి వెళ్లిపోతే నాకెంత తలవంపో తెలుసా నీకు? భర్తంటే లెక్క వుందా నీకు?” అన్నాడు ద్రోణ.
”భర్తంటే లెక్క లేంది నాకా? మీ చుట్టు తిరిగే వీళ్ల ముగ్గురికా?” అంది వాళ్ల ముగ్గురివైపు వేలు తిప్పి చూపిస్తూ శృతిక.
ద్రోణ ఆ ముగ్గురి వైపు ఓసారి చూసి, తిరిగి శృతిక వైపు చూస్తూ…
”ఆముక్తకి ఆర్ట్ అంటే ఇష్టం… ఆమె రైటర్‌. నాకు అవార్డు రావటం ఎంతో ఆనందాన్నిచ్చి ఆమె భర్త ఆమెను ఆడిటోరియం దగ్గర వదిలివెళ్లాడు. ఆయనకి నేనంటే గౌరవం… చైత్రిక నా బెస్ట్ ఫ్రెండ్‌! నా అభివృద్ధిని తన కళ్లతో చూసుకోవాలని ఇంట్లో పర్మిషన్‌ తీసుకొనే వచ్చింది. ఇకపోతే సంవేద! ఆమె నాకు ఏమీకాదు. వాళ్ల చెల్లి బొమ్మ ఏ స్థాయిలో పదిమందిలోకి వెళ్లిందో స్వయంగా చూసుకోవాలన్న సంతోషంతో వాళ్ల మామగారు పంపగా వచ్చింది.
ఇప్పుడు వాళ్లను సేఫ్టీగా ఎవరి ఇళ్ల దగ్గర వాళ్లను వదిలే బాధ్యత నాది… ఇకపోతే అవార్డుకి వచ్చిన డబ్బుతో నిశిత జీవితాన్ని కాపాడటం కోసం ఎందుకు వాడాను అంటే ఒక ఆర్టిస్ట్‌ గా ఆ పని నాకెంతో సంతృప్తిని ఇచ్చింది కాబట్టి… మరి నువ్వు నా పర్మిషన్‌ తీసుకోకుండా మధ్యలో లేచి ఎందుకొచ్చావ్‌?” అన్నాడు చాలా వివరంగా… నీ జవాబు నాకు వెంటనే తెలియాలి అన్నట్లు కోపంగా చూశాడు.
”నాకు ఆ సభలో కూర్చోవాలనిపించలేదు. ఇరిటేషన్‌ అనిపించింది. వచ్చేశాను తప్పేంటి? ఇదేమైనా చెంప పగలగొట్టేంత నేరమా?” అంది చెంపను తడుముకుంటూ.
”అంత వరకైతే అవసరం లేకపోవచ్చు… కానీ నువ్వు మీ బావతో రహస్యంగా గడపాలని ఎవరూ లేని టైంలో అతనికి కాల్‌చేసి రప్పించుకున్నావు. అది నేరం కాదా? మమ్మల్ని అక్కడే వదిలేసి నీ ప్రైవసీ నువ్వు చూసుకున్నావు. ఇది అబద్దమా? అందుకే కొట్టాను.” అన్నాడు గంభీరస్వరంతో స్థిరంగా.
వినలేనట్లు చెవులు మూసుకొంది శృతిక.
ఇంతవరకు చూసిన ద్రోణ వేరు ఇప్పుడు చూస్తున్న ద్రోణ వేరు. అన్నట్లుగా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఆముక్త, చైత్రిక, శృతిక.
అనిమేష్‌ చంద్ర నోట మాటపడిపోయినట్లు కళ్లప్పగించి చూస్తున్నాడు.
”అతను మా బావ. మా అక్క భర్త. మీరేమంటున్నారు? మీ కసలు…” అంటూ సందేహంగా చూసింది.
”నాకన్నీ పనిచేస్తున్నాయి. అర్థాలు కూడా తెలుస్తున్నాయి. ఏమన్నావిప్పుడు? అతను మీ అక్క భర్తనా? ఏ మగవాడైనా ఒక ఆడదానికి భర్తే అవుతాడు. అంత మాత్రాన ‘పనికి’ రాడా? అసలేంటి నీ ఉద్ధేశ్యం?” అన్నాడు సూిగా.
రెండు చేతులు జోడించి దండం పెడ్తూ… ”నన్నలాంటి భావంతో ఊహించి చూడకండి! నాకు అసహ్యంగా వుంది.” అంది శృతిక. ఆమె నరనరం మెలిపెడ్తున్నాయి ఆ మాటలు వినలేక..
”నేను ఊహిస్తున్నానా? పచ్చి నిజాన్ని పట్టుకొని వూహాంటావా? ఎవరూ లేని టైంలో మీ ఇద్దరు ఇలా పక్కపక్కన కూర్చుని టీ.వి.చూస్తుంటే మిగతా కార్యక్రమాలు వూహించుకోక ప్రాక్టికల్‌గా చూడలేంగా?” అన్నాడు అసహ్యంగా చూస్తూ…
భూమి చీలి వున్న పళంగా కూరుకుపోతే బావుండనిపిస్తుంది శృతికకు…
”ఇక ఆగు ద్రోణా! ఆవేశపడకు. అసలేం జరిగిందో నేను కనుక్కుంటాను. శృతిక అలాంటిది కాదు.” అంటూ ముందుకొచ్చింది చైత్రిక తన స్నేహితురాలి బాధను చూడలేక…
”ఎలాంటిదో ఒకప్పుడైతే నమ్మేవాడిని… ఇప్పుడు నమ్మను చైత్రికా! ఒక పుస్తకం పై భాగంలో వుండే అట్టను చూసి లోపల ఎంతో బాగుండవచ్చని కొన్నట్లు శృతికను కట్టుకున్నాను. లోపల వున్న కాగితాలు, ప్రింటయిన విషయాలు పనికిమాలినవని పుస్తకం తెరిచి లోపల కెళ్లాకనే తెలిసింది.” అన్నాడు
శృతిక చురకత్తిలా చూస్తూ… ”అలాంటి పుస్తకాన్ని నేను కాదు. ఈ చైత్రిక… నాకు బుద్దిలేక మిమ్మల్ని టెస్ట్‌ చెయ్యమంటే మీకు దగ్గరైంది. రుత్విక్‌ను మోసం చేసింది. దీని మీద నేనో పెద్ద లెటర్‌ కూడా రాశాను. అయినా అతనేం పట్టించుకోలేదు. నేను ఏ తప్పు చేయకుండానే మీరింత రాద్దాంతం చేస్తున్నారు.” అంది శృతిక.
శృతిక మాటలు చైత్రిక చెంప చెళ్లుమనిపించాయి… ఎర్రబడ్డ కళ్లతో శృతిక వైపు చూస్తూ…. ”ఆ లెటర్‌ నాకు రుత్విక్‌ పోస్ట్‌ చేసి ‘నీ ఫ్రెండ్‌ ఎంత పనికిమాలిందో చూడు… అలాంటి మనిషికి హెల్ప్‌ చెయ్యాలనా నా దగ్గర పర్మిషన్‌ తీసుకొని ద్రోణను టెస్ట్‌ చెయ్యాలనుకున్నావ్‌! ఇంకెప్పుడూ ఇలాంటి వాళ్లను స్నేహితులుగా చెప్పుకోకు…’ అన్నాడు శృతికా! కానీ ద్రోణలోని సంస్కారం చూసి ఆయనతో స్నేహం చేస్తున్నాను. రుత్విక్‌ కూడా ద్రోణకి ఫ్రెండయ్యాడు. మా ఆలోచనలు, అనుబంధాలు చాలా ఆరోగ్యంగా వుంటాయి. నీలాగా మొగుడికో కాల్‌ రాగానే పుట్టింటికెళ్లి వాళ్లను ఏడ్పించేంత తక్కువ స్థాయిలో వుండవు…” అంది చైత్రిక. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను అన్నట్లు అందరివైపు చూసింది.
”అయితే… ఇప్పుడు మీరేమంటున్నారు? మా బావతో నేను తప్పు చేస్తున్నాననా?” అంది శృతిక ఉడుక్కుంటూ ఊపిరికూడా పీల్చటం అవసరం లేనంత వేగంగా…
”తప్పొప్పులు దైవ నిర్ణయాలు. మేము నీలాగ ఆలోచించం… నీలా అవమానించం… నీలా అనుమానించం…” అంది చైత్రిక.
ఉప్పెనలాంటి ఆగ్రహంతో.. ”నేనిక్కడో క్షణం కూడా వుండను. మీరందరు ఒకటయ్యారు”. అంటూ శృతిక బయటకి పరిగెత్తబోతుంటే…
అనిమేష్‌ చంద్ర ఆమెను గట్టిగా పట్టి ఆపుతూ… ”ఎక్కడి కెళ్తావ్‌? ఈ తొందరపాటే నిన్నీస్థితికి తీసుకొచ్చింది. ఎదుటివాళ్లను ఎందుకంత వ్యక్తిత్వం లేనివారిలా ఆలోచిస్తావ్‌? అసలు ద్రోణని టెస్ట్‌ చెయ్యమనటం తప్పుకాదా? రుత్విక్‌కి అలా లెటర్‌ రాయటం తప్పుకాదా? ద్రోణను తిరుగుబోతుగా ఊహించుకోవటం తప్పుకాదా? స్నేహాన్ని స్నేహంలా చూడకపోవటాన్ని ఏమనాలి?” అన్నాడు ఆవేశంగా….
”బావా! నువ్వు కూడా వాళ్ల వైపే మాట్లాడుతున్నావా?” అంది నీరసంగా చూస్తూ…
”ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? నేనిక్కడికి రావటమే పెద్ద తప్పని పిస్తోంది. ఆరోగ్యంగా ఆలోచించలేని నీలాంటి మనిషికి బావనని చెప్పుకోవటానికే సిగ్గుగా వుంది. నువ్వు వాళ్లను ఏ స్థాయిలోకి జారి ఆలోచించి అవమానించావో నిన్ను కూడా వాళ్లు అదే స్థాయిలో ఆలోచిస్తున్నారు. నేను నీ బావను కాబట్టి నీ తండ్రి స్థానంలో వుండి నీకో మాట చెబుతాను…” అంటూ ఆగాడు.
‘ఏమి మాట?’ అన్నట్లు చూసింది శృతిక.
మిగతావాళ్లు కూడా ఉద్విగ్నంగా చూస్తున్నారు.
”ఆకాశం మీద ఉమ్మెయ్యాలని చూస్తే అది తిరిగి మన ముఖం మీదనే పడ్తుంది. ఇదెంతవరకు నిజమో ఈపాటికి నీకు తెలిసే వుంటుంది.” అన్నాడు అనిమేష్‌ చంద్ర.
వెంటనే ఆముక్త కాస్త ముందుకొచ్చి ”చూడండి! సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. శృతికను కూడా మనం అర్ధం చేసుకుందాం! ఎందుకంటే కళాకారులను ఎవరైనా దేవుళ్ళలా భావిస్తారు. దగ్గరవ్వాలని చూస్తారు. ఆ మధ్యన ఒక సాహిత్య సభలో ఒక కవితో నాకు పరిచయం అయింది. ఒక కవయిత్రిగా కవులతో పరిచయాలు మంచిదే అన్న ఆలోచనలో వున్న నాకు అదో మంచి అవకాశమనుకున్నాను… ఆ కవిది మారుమూల పల్లెటూరు. ఆయన దగ్గర ఓ సెల్‌ఫోన్‌ వుంది. చుట్టూ పుస్తకాలు, పేపర్లు వుంటాయి. ఆయన భార్య నడవలేదట. కారణాలు నాకు తెలియవు… నాతో రోజూ ఫోన్లో మాట్లాడేవాడు. రోజుకి రెండుసార్లు, మూడుసార్లు ఆ తర్వాత లెక్కలేనన్ని సార్లు… సాహిత్య కబుర్లు కావు అవి. నన్ను ఆయన భార్య స్థానంలో వూహించుకుంటూ చెప్పే మాటలు… నాకు ఎలర్జీ అన్పించి పక్కకి తప్పుకున్నాను. ఆ తర్వాత ఆయన తాగినప్పుడు కొందరు సాహిత్యకారులతో నామీద చెడుగా ప్రచారం చెయ్యటం మొదలుపెట్టాడట. ఈ విషయం మా కవయిత్రుల ద్వారా తెలిసి బాధపడ్డాను. వాళ్లేమన్నారంటే – ”నువ్వు కొత్తదానివి కాబట్టి ఆయన్ని త్వరగా నమ్మావు. మేము కూడా నీలాగే ఆయన ఫోన్‌కాల్స్‌ ని, చెడు ప్రవర్తనని గ్రహించి ప్రతిఘటించాం. అందుకే మనమంటే ఆయనకి చిన్నచూపు. బయట మనల్ని అదీ, ఇదీ అనే సంభోదిస్తాడట… ఆయన మనకి తెలుసని చెప్పుకోవటమే మనకి అవమానం. ఇప్పుడు మనం చెయ్యగలిగింది ఏమీలేదు. కొత్తగా రాసేవాళ్లకి ఆయన దగ్గర జాగ్రత్తగా వుండమని మాత్రం చెబుదాం… ఒక్క మాటలో చెప్పాలంటే దొంగస్వాములకి ఆ కవి ఏమాత్రం తీసిపోడు” అన్నారు. ఒక్కరు కాదు. ఇలా ఐదారుమంది కవయిత్రులు చెప్పారు.
దీన్నిబట్టి తెలుసుకునేది ఏమీలేదు అని కాకుండా ఒక్కసారి ఆలోచించండి! ఇలాంటి ఒక్కరివల్ల మిగతా అందరు కవులమీద నమ్మకంపోతుంది. దగ్గరకాలేము. వాళ్లలో వుండే తెలివి తేటల్ని, విజ్ఞానాన్ని ఆస్వాదించలేం. నలుగురికి పంచలేం… ఇదిగో ఇలాంటి వాళ్లను చూసినా, విన్నా మన శృతికలాంటివాళ్లు తమ భర్తలు ఎంత మంచివాళ్లైనా అనుమానిస్తారు, అవమానిస్తారు… మంచి అయినా, చెడు అయినా, అనుమానమైనా, అవమానమైనా ఎక్కడో పుట్టదు. మనలోంచే పుడ్తుంది. అది మన సృష్టే. దాన్ని మనమే జీర్ణించుకోవాలి . ఉలిక్కిపడకూడదు. పారిపోకూడదు. దొంగస్వాములు ఊరంతా ఉండరు కదా! ఎక్కడో ఓ చోట మాత్రమే తళుక్కున మెరిసి చివరికి మసిపెంకులా అన్పిస్తారు. నేను చెప్పిన కవి కూడా అలాంటివాడే…
కానీ ఒక్కోసారి అన్పిస్తుంది – కొందరు కవులు, కళాకారులు చేసుకునేంత ఆత్మవంచన ఎవరూ చేసుకోరని… వాళ్ల భాషలో వున్నంత భావుకత్వం వాళ్ల మనసులో వుండదని.. కాగితాల పైన ‘పిట్టకూసింది, చెట్టు వంగింది, మబ్బు కరిగింది. ఆమె నవ్వింది’ అని రాసినట్టు వాళ్ల స్వభావాలు వుండవని… కాని ఎవరికైనా రెండు జీవితాలు ఉంటాయి. ఒకటి భౌతికం, ఇంకోటి అభౌతికం. ఇవి రెండూ ఉన్నతంగా వున్నప్పుడే చుట్టూ వున్న పరిసరాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి” అంది.
ద్రోణ వైపు చూడలేక, వస్తున్న ఏడుపును ఆపుకోలేక – తన గదిలోకి వెళ్లి బెడ్‌ మీద బోర్లాపడిపోయింది శృతిక.
వెంటనే శృతిక దగ్గరకి చైత్రిక వెళ్లబోయింది. అసలే ఆవేశపరురాలైన శృతిక ఏమవుతుందోనని…
”మీరు వెళ్లకండి? మేఘం కురిసి, కురిసి అలసిపోతే ఆకాశం తేటతెల్లగా మారుతుంది. అలాగే వదిలెయ్యండి కొద్దిసేపు శృతికను…” అన్నాడు అనిమేష్‌ చంద్ర వెంటనే ద్రోణవైపు తిరిగి.
”ద్రోణా! ఇవాళ సిటీలో నీ పోగ్రాం వుందని నాకు తెలియదు. నేను కవరేజ్‌ ఏరియాలో లేకపోవటం వల్ల మీ ఫోన్‌కాల్స్‌ నాకు రాలేదు. లేకుంటే డైరెక్ట్‌ గా ఆడిటోరియం దగ్గరకే వచ్చేవాడిని… నేను వచ్చింది కూడా ఇప్పుడే … నేను లోపలకి అడుగుపెడ్తూ మీ కారు రావటం కూడా చూశాను.” అన్నారు నేనిప్పుడే వచ్చానన్న అర్థం వచ్చేలా….
ద్రోణ మాట్లాడలేదు.
”కాలుష్యం మరో కాలుష్యానికి దారితీస్తూ ఊర్లను, నదులను, సముద్రాలను చెత్తకుండీలుగా చేస్తే, – నేల, నీరు, గాలి, భూగర్బ జలాలు ఎలా కలుషితం అవుతాయో … మనసులో అనుమానపు కాలుష్యం చెరితే జీవితం చెత్త, చెత్తగా రోత, రోతగా తయారవుతుంది. కానీ ద్రోణా నువ్వొక విషయాన్ని గమనించు. మనిషి జీవితం శూన్యానికీ, శూన్యానికీ మధ్యలో వుండే ఒకటే లాంటిది… కోపం, బాధ, అసూయ, అనుమానం… ఇలాంటివన్నీ ఎడమ పక్క వుండే సున్నాలు. ఒకటికి ఎడమపక్క ఎన్ని సున్నాలున్నా వాటికి విలువలేదు కదా! అలాగే అనుకొని శృతికను క్షమించు.. గతంలో ఆమె చేసిన తప్పుల్ని కళ్లముందుకి తెచ్చుకోకు…” అంటూ ఒక్క క్షణం ఆగాడు అనిమేష్‌ చంద్ర.
అనుమేష్‌ చంద్రను ప్రక్కకు తీసుకెళ్లి హగ్‌ చేసుకొని ”సారీ అన్నయ్య ఆమెలో మార్పు రావాలనే నేనిలా బిహేవ్‌ చేసాను అంతే కాని అన్నాడు.” ద్రోణ. ”ఏదైనా మన మంచికే జరిగిందనుకుందాం.” అంటూ ద్రోణ భుజం తట్టి వెళ్లిపోయాడు అనిమేష్‌ చంద్ర.
ఆముక్త, సంవేద, చైత్రిక ద్రోణ కారులో ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లారు.
*****
ద్రోణ తన గదిలో అటు, ఇటు తిరుగుతున్నాడు
శృతిక అలాగే పడుకొని వుంది.
ద్రోణ సెల్‌కి సంవేదనుండి కాల్‌ వచ్చింది.
ఫోన్‌లో సంవేద గొంతు విన్పించగానే సెల్‌ని చెవి దగ్గర అలాగే పట్టుకొని హాల్లోకి వెళ్లి అటు, ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు ద్రోణ.
”మీకు నిశిత ఏదో చెప్పుకోవాలంటుంది సర్‌! ముందు దానితో మాట్లాడండి! తర్వాత నాతో మాట్లాడుదురు.” అంది సంవేద మొబైల్‌ని చెల్లి చేతికి ఇస్తూ ద్రోణతో…
”అలాగే” అంటూ… ”హలో నిశితా! బాగున్నావా?” అన్నాడు వెంటనే ద్రోణ ఎంతో ఆత్మీయతను తన గొంతులోంచి మాటల్లోకి ప్రవహింపచేస్తూ…
”బాగున్నాను సర్‌! నేను ఈ జన్మలో మీ ఋణం తీర్చుకోలేను.” అంది హృదయపూర్వకంగా… కృతజ్ఞతతో కూడిన తడితో ఆమె గొంతు జీరబోతోంది.
”ఇందులో ఋణం ఏముంది నిశితా! నీ జీవితం బాగుండాలి. నేను నీకు ఇవ్వబోయే ‘నీడ’ నీకు హాయిగా అన్పించాలి. అదే నేను ఆశించేది” అన్నాడు.
”తప్పకుండా వుంటుంది సర్‌! నాకా నమ్మకం వుంది. ఇన్ని రోజులు ‘ఏ నీడన దాగను నేను’ అని అర్ధరాత్రులు లేచి కూర్చుని బోరున ఏడ్చుకున్న రోజులు వున్నాయి. బహుశా నా ఆక్రందన దేవునికి విన్పించి మీ ద్వారా నాకీ నీడను చూపిస్తున్నట్లుంది. ఇది నాలాంటి వాళ్లకి అరుదైన, అద్భుతమైన ‘నీడ” అంది. ఆ మాటలు ఆమె హృదయంలోంచి తన్నుకొస్తున్నాయి.
కదిలిపోయాడు ద్రోణ. జీవితంలో తను చేసిన పనుల్లో ఎక్కువ తృప్తిని ఇచ్చిన మంచిపని ఇదేనేమో అనుకున్నాడు.
”సర్‌! నన్ను పడగనీడలోంచి తప్పించబోతున్నందుకు మరోసారి నా కృతజ్ఞతలు.. ఫోన్‌ అక్కకి ఇస్తున్నాను. మాట్లాడండి సర్‌!” అని ఎంతో అభిమానంగా, గౌరవంగా చెప్పి… వెంటనే మొబైల్‌ని సంవేద చేతికి ఇచ్చి పక్కకెళ్లింది నిశిత.
”హలో సర్‌!” అంది సంవేద.
”చెప్పు సంవేదా!” అన్నాడు ద్రోణ… అతనంత దగ్గర వ్యక్తిలా ‘చెప్పు’ అనటం బాగుంది సంవేదకి…
”మా అందరి ముందు మీ మిసెస్‌ని మీరలా కొట్టటం ఏదోగా వుంది సర్‌! మీరసలు భార్యను కొడతారన్న విషయాన్నే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే మీరు నా మనసులో చాలా ఎత్తున ఉన్నారు. నా దృష్టిలో మీరు అందరిలాంటి వారు కాదు కూడా…” అంది సంవేద.
”నీ అభిమానానికి థ్యాంక్స్‌ సంవేదా! కానీ నేనొక కళాకారుడ్ని… అలౌకిక స్థితిలోకి వెళ్లి ప్రేరణ పొందుతూ దాన్ని ఒక కళారూపంలోకి ప్రజెంట్ చెయ్యాలంటే వాతావరణం చాలా ఫ్రశాంతంగా వుండాలి. ఆ టైంలో ఏ సమస్య వచ్చినా తల్లడిల్లిపోతాను. నా ఏకాగ్రత దెబ్బతింటుంది. అలాంటి నన్ను ఇన్ని రోజులు నేను ఊహించని రీతిలో ఇబ్బంది పెట్టింది. అది చెప్పినా అర్థంకాదు. ఎందుకంటే నా సమస్య నీకు తేలిగ్గా అన్పించవచ్చు… అలాగే నిన్ను బాధపెట్టే సమస్య నాకూ అలాగే అన్పించవచ్చు. అందుకే చెప్పటం వృధా!” అన్నాడు ద్రోణ.
సంవేద మాట్లాడలేదు. అతను మాట్లాడితే వినాలన్నట్లు ”ఊ” అంటోంది ఆసక్తిగా. అతనికి కూడా చెప్పుకోవాలని పిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మానసికమైన తోడు భగవంతుడు ఇస్తేనే దొరుకుతుంది. బహుశా ఇది ఆయనకు సరియైనది అన్పించే సంవేదను ఇలా దగ్గర చేసి వుంటాడు. ఇలాంటి బంధాలు ఇచ్చే స్పూర్తితో ఎంతి సంక్లిష్ట స్థితిని అయిన అధిగమించవచ్చు. అని మనసులో అనుకుంటూ…
”జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఇంత బీభత్సం చేశాడేంటి అన్పిస్తోంది కదూ! నిజమే సంవేదా! గృహహింస మంచిదికాదు. చాలా చోట్ల అది విజృంభించి మానవ హక్కుల రెక్కల్ని సైతం కత్తిరిస్తోంది. కానీ ఒక సెలబ్రిటీగా శృతికతో బాగా విసిగిపోయి దీనికి ఇదే సరైన పరిష్కారం అన్నట్లు కొట్టాను.” అన్నాడు ద్రోణ.
ప్రశాంతంగా వింటోంది సంవేద.
”నేను కొట్టటానికి ఇంకో బలమైన కారణం కూడా వుంది. చైత్రిక శృతిక బెస్ట్‌ ఫ్రెండ్‌! ఆ అమ్మాయిని ఎవరూ ఉపయోగించుకోని విధంగా ఉపయోగించుకోవాలనుకొంది. చివరకు ఆ అమ్మాయి ఉడ్‌బీకి ఓ లెటర్‌ రాసి చైత్రికను క్యారెక్టర్‌ లేని వ్యక్తిని చేసింది. ఇది తప్పుకాదా? ఇకపోతే ఇప్పుడు నువ్వున్నావు. ఫ్యూచర్లో నా బొమ్మల్ని చూసి ఫోన్‌ చేస్తావు. చూడాలనిపించి ఇంటికొస్తావు. తను భరించలేదు. ఎందుకంటే అనుమానం… నాకు నువ్వూ… చైత్రిక, ఆముక్త అందరు కావాలి. మీరు నా అభిమానులు, మిమ్మల్ని దూరం చేసుకోలేను.
ఎవరికైనా జీవిత భాగస్వామి అవసరమే. ఆమెకు చాలా విలువ కూడా ఇవ్వాలి. అలా అని భార్యే జీవితం కాదు. భార్యే సొసౖటీ కాదు. ఒక సెలబ్రిటీగా నాకు అందరు కావాలి. ఎవరో ఒకరు ఏదో ఒక థాట్ లో నాకు అవసరం అవుతూ వుంటారు. ఒక్కోసారి భార్యతో చెప్పుకోలేనివి ఇతరులతో పంచుకోవలసి వస్తుంది. అలా అని భార్యను ప్రేమించనట్టు, విలువ ఇవ్వనట్టు కాదు. శృతిక నన్ను అర్థం చేసుకోలేకపోయింది. అందుకే ముళ్లును ముళ్లుతోనే తీయాలి అన్నట్లు కొట్టాను. నేను కొట్టటం తప్పంటావా? కొట్టకుండా కూడా చెప్పొచ్చంటావా? చెప్పు!” అన్నాడు.
చెప్పటానికి తన దగ్గర ఏమీ లేదన్నట్లుగా ఒక్కక్షణం ఆగి ”మరిప్పుడు ఆమెను ఓదార్చారా? అలాగే వుంచారా?” అని మాత్రం అంది సంవేద.
”అదే చూస్తున్నా.. ఏ టైప్‌లో ఓదార్చాలా అని ఆలోచిస్తున్నా. మరి నేను వుండనా? బై, సంవేదా!” అన్నాడు ద్రోణ.
ఆమె కూడా ‘బై’ చెప్పి కాల్‌ క్‌చేసింది.
*****
ఆముక్త నిద్ర మధ్యలో లేచి కూర్చుని కవిత రాయటం మొదలుపెట్టింది… ఏదో రాయాలని దానికో రూపం రావాలని ఊపిరి బిగబట్టి ఆలోచిస్తోంది. కళాకారులు మొండివాళ్లంటారు. తాము రాయబోయేది ఎంత కష్టమైనా తెగించి శ్రమిస్తారంటారు. అలాగే ఆముక్త కూడా తన మనసు లోతుల్ని తాకుతూ ఆలోచిస్తోంది.
కవిత రాయటం అంటే ఏవో తోచిన నాలుగు వాక్యాలను రాసుకుంటూ పోవటం కాదు. కళ్లముందు జరిగే నేరాలను, ఘోరాలను, అవమానాలను, అన్యాయాలను ఎదిరించేలా అలా ఎదిరించి నిలబడేలా వుండాలి అనుకొంది ఆముక్త.
ప్రస్తుతం బ్రతుకులో బాధల బస్తాలను మోసే ఎద్దులబండిలా అన్పిస్తున్న తన భర్తే తనకి ఇన్సిపిరేషన్‌ అనుకొంది. గుండె బరువును ఆపుకోలేక పోతోంది. ఎన్ని పుస్తకాలను చదివితే వస్తుంది ఇంతి ప్రేరణ? నా అనుభవమే నన్ను నడిపించే ఉత్తమ గురువు అన్న చందంగా ఆమె కలం కాగితంపై నెమ్మదిగా పోరాడుతోంది… మనసుతో రాయటం అలవాటైన కలంలా ఊహల రథాన్ని నేలమీదకి దింపి దారినిండా ప్రజ్వలించే ఆలోచనల విత్తనాలను చల్లుకుంటూ వెళ్తోంది…..
”చెక్కిన బాణం నేరుగా వచ్చి
నిర్ధాక్షిణ్యంగా గుచ్చుకున్నట్లు
గుండెలోతుల్లోంచి చీల్చుకెళ్లి
మనసు పొరల్ని ఛేదించుకొని
అతి సున్నితమైనదేదో తునాతునలైనట్లు
ఎదలోతుల్లో ఎక్కడో నిర్ధయగా
నిప్పుల తుంపర కురుస్తున్న భావన-
ఒకవైపు ప్రపంచపు భారాన్ని మోసే అట్లాస్ లా మనిషి
ఇంకోవైపు తీరిగ్గా విశ్రమించేందుకు నిర్విరామంగా
కృషిచేస్తున్న స్పృహ…
ఒకవైపు మానసిక వత్తిడి, ఇంకోవైపు శారీరక ఇబ్బంది
ఏదో అస్పష్టమైన నిస్పృహ నిండిన నడక.
బాధల బావుల ఊటల్లోంచి బాధ్యతల మొసళ్లు
మనసును మౌనంగా చుట్టుముట్టినట్లు దారుణమైన హింస.
అందుకే అన్పిస్తోంది…
జీవితం పాలరాతిపై నడక కాదుగా అని-
యాసిడ్‌ దాడులుంటాయ్‌ ! సునామీలుంటాయ్‌! స్వైన్‌ప్లూలుంటాయ్‌!
అర్ధాంతర చావులు, కష్టాలు, కన్నీళ్లు…
అన్నినీ మించి…
గుప్పెడంత గుండెలో సముద్రమంత దుఃఖాన్ని
సమ్మెట దెబ్బలా భరిస్తూ నిట్టూర్పుల జ్వాలలు
ఏది ధారబోస్తే తీరుతుంది.
నిరంతరం తడుస్తున్న కళ్లలోని నిర్వేదం?
ఆత్మవిశ్వాసాన్ని చేతులుగా మార్చుకొని
మట్టిని పిసికితేనా?
కల్తీ నవ్వుల్ని కౌగిలించుకొని
మనసుని నలిపితేనా?
దీని మూలాలను వెతుక్కోవటం కోసం
దేన్ని పొందాలి?
దేన్ని పోగొట్టుకోవాలి?” అని
వచన కవితను రాయటం పూర్తిచేసింది ఆముక్త…..
రేపే వెళ్లి ద్రోణకి ఇవ్వాలి. తప్పకుండా బొమ్మవేస్తాడు. అనుకొని ఒకటికి రెండుసార్లు ఆ కవితను మళ్లీ చదువుకొని,… బావుందనుకుంటూ భర్త పక్కన పడుకొని హాయిగా నిద్రపోయింది.
*****
రోజులు శరవేగంగా కదులుతున్నాయి.
ఆరోజు నిండు పౌర్ణమి… వెన్నెల ఒళ్లు విరుచుకొని ఊర్లని, అడవుల్ని తడుపుతోంది.
ద్రోణ ఎప్పిలాగే డాబామీద కెళ్లి తన స్టాండ్‌బోర్డ్‌ ముందు నిలబడి బొమ్మ గీస్తున్నాడు.
ఆ నిశ్శబ్దం, ఆ వాతావరణం, ఆ వెన్నెల అతనికి గొప్పస్పూర్తి. ఓ మూర్తిని సృష్టించానికి అతను పడే ఆరాన్ని అర్థం చేసుకున్నట్లు ఓ ఒంటరినక్షత్రం నేలమీదకి అద్భుతంగా జారి కళ్లను మిరమిట్లు గొలుపుతుంటే…
అతనికి సంవేద చేసిన ఫోన్‌ కాల్‌ గుర్తొచ్చింది.
నిశితను కారుణ్య సేవా సంస్థలో జాయిన్‌చేసి వచ్చానని. తనతో అత్తగారు, మామగారు వచ్చారని… శ్యాంవర్ధన్‌ మొదట్లో వద్దన్నా మామగారు కోప్పడటంతో మెత్తబడ్డారని … ఇప్పుడు తను చాలా సంతోషంగా వున్నానని… ఆ సంతోషానికి ”మీరే కారణం’ అని గద్గద స్వరంతో చెప్పింది.
ప్రేమంటే అవతల వ్యక్తి మన దగ్గర లేనప్పుడు కూడా గుర్తుచేసుకోవటం… ఆ వ్యక్తి ఎక్కడున్నా సుఖంగా వుంటే చాలని సంతృప్తి చెందటం… సంతోషంగా వున్నానని తెలిస్తే మరింత ఆనందపడటం… అదే స్థితిలో వున్నాడు ద్రోణ.
తర్వాత చైత్రిక చేసిన కాల్‌ గుర్తొచ్చింది.
”రుత్విక్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌ కంప్లీట్ అయిందని… లండన్‌ నుండి రాగానే పెళ్లి చేసుకోబోతున్నామని …తను రాసిన ఎగ్జామ్స్‌ అన్నీ ఎయిటీ పర్సెంట్ మార్క్స్‌ తో పాసయ్యానని..” అన్నీ శుభవార్తలే చెప్పింది.
వెంటనే ఆముక్త చేసిన కాల్‌ గుర్తొచ్చి మెల్లగా నవ్వుకున్నాడు.
”నేను రాసిన అభ్యుదయ కవిత నచ్చిందా ద్రోణా నచ్చితే బొమ్మ ఎప్పుడు వేస్తున్నావు? వేశాక దాన్నెప్పుడు పోటీకి పంపుతావు?అని .. ఆముక్తకి అన్నీ తొందరే. కానీ ఆముక్త రాసిన కవిత చాలా బావుంది. తప్పకుండా బొమ్మ వేయాలి. అని మనసులో అనుకుంటుండగా..
ఒక్కో మెట్టు మెల్లగా ఎక్కి చీర కట్టుకున్న మోడల్లా పాల గ్లాసు చేత పట్టుకొని ద్రోణ దగ్గరకి వచ్చింది శృతిక… అతనికి వెనగ్గా నిలబడి, అతను వేస్తున్న బొమ్మలోకి ఆసక్తిగా చూసింది.
”ఏమండీ!” అంటూ ఎప్పుడు పిలవనంత ప్రేమగా, ఆర్తిగా, సంబరంగా పిలిచింది.
ఆ పిలుపు ఎక్కడో తాకి శతతంత్రుల్ని మీటినట్లయి, అంతవరకు వున్న శూన్యాతి శూన్యస్థితిలో భావరహితంగా నిర్ణయిస్తున్న హృదయం తన దుఃఖాన్ని కడిగేసుకుంది… తేలిగ్గా శ్వాసించి, కుంచె పక్కన పెట్టి వెనుదిరిగి భార్యవైపు చూశాడు.
పాలగ్లాసు అందివ్వబోయింది. అతనా గ్లాసు అందుకోకుండా ముందుగా ఆమె చేతిలోవున్న కాగితాన్ని తీసుకొని చూసి ఆశ్చర్యపోయాడు.
”ఇది ఆముక్త కవిత కదూ! నీ దగ్గర ఎందుకుంది?” అన్నాడు అర్థంకాక కనుబొమలు కాస్త ముడిచి.
”సాయంత్రం మీరు దీనిమీద పేపర్‌ వెయ్‌ట్ పెట్టకపోవటంతో చెత్తలో పడిపోయింది. నేను చూసి చదివాను. నాకు చాలా నచ్చింది. బొమ్మల కోసం మీ దగ్గరకి వచ్చిన కవితలన్నికన్నా ఈ కవిత బాగుంది. ముందుగా ఈ కవితకే బొమ్మ వెయ్యండి!” అంది శృతిక.
జీవితంలో ఎప్పుడూ చూడనంత ఆశ్చర్యానందంతో భార్యవైపు చూస్తూ పక్కనే వున్న స్టాండ్‌ ఊయలమీద కూర్చుని చిరుదరహాసాన్ని పెదవులమీదకి తెచ్చుకున్నాడు. వైట్ నైట్ డ్రస్‌లో అతను చంద్రోదయాన్ని తలపింప చేస్తున్నాడు.
భర్తనలా చూస్తుంటే దుఃఖమొచ్చేలా ఆత్మీయత కల్గుతోంది. విడిచి వుండలేనేమో అన్నంత బాధ కల్గుతోంది.
పాలగ్లాసుని టీపాయ్‌ మీద పెట్టి మెల్లగావెళ్లి భర్త ముందు మోకాళ్ల మీద కూర్చుంది శృతిక. అతని కాళ్ల చుట్టూ చేయివేసి ఆర్థత నిండిన మనసుతో అతని మీద తల ఆన్చి, ఒక్క నిముషం కళ్లు మూసుకుంది. ఆమె చాలా ఉద్విగ్నంగా, ఉల్లాసంగా వున్నట్లు ఆమె అంతరాంతరాల్లో ఇంతకన్నా ఇంకేమీ వద్దు అన్న భావన వున్నట్లు అర్థమవుతోంది.
నెమ్మదిగా తలెత్తి భర్త కళ్లలోకి చూసింది. అతను కూడా ఆమెనే చూస్తున్నాడు.
”ఏమండీ! ఇప్పుడు మీరు వేస్తున్న ఆ బొమ్మలో నా పోలికలే వున్నాయి కదండీ! అంటే నేను మీ మనసులో పరిపూర్ణంగా వున్నట్లేగా… ఇప్పుడు నాకెంత ఆనందంగా వుందో తెలుసా?” అంటూ తడినిండిన కళ్లతో ఆర్తిగా అతని కడుపుమీద తల ఆన్చి కళ్లు మూసుకొంది.
ఆమె తలనిమురుతూ చేయి చాపి పాలగ్లాసు అందుకున్నాడు ద్రోణ.

-: అయిపోయింది :-

రెండో జీవితం 10

”బాధపడకు ముక్తా! కిందపడ్డప్పుడే పైకి లేచే అవకాశాలు వుంటాయి కదా! దాంతో వేగంగా కెరియర్‌లో ఇంప్రూవ్‌ అవ్వచ్చు. అందరి గౌరవం పొందొచ్చు. కీడులో మేలన్నట్లు ఇదికూడా ఓ ఇన్‌స్పిరేషన్‌ అనుకోండి” అంది సంవేద.
వెంటనే సంవేద చేతిని మెల్లగా తాకి ”అది ఒక్కరోజులో రాత్రికి రాత్రే సాధ్యమయ్యేది కాదు వేదా! మణిచందన్‌ తన జీవితాన్ని తనకోసమే జీవించాలనే వ్యక్తి… తన జీవితాన్ని తనే శాసించాలి. తన సక్సెస్‌, తన పెయిల్యూర్‌ తన సంతోషం, తన కన్నీరు తనకే సొంతం అనుకుంటాడు. అంతేకాని ఎవరికోసమో ఎవరి మెప్పుకోసమో జీవించటం ఆయనకి రాదు. అందుకే తనెంతో కష్టపడి ఒక్కోరాయి పేర్చుకుంటూ ఓ కొండను తయారు చేసుకొంటే ఆ కొండనెవరో బాంబులుపెట్టి పేల్చినట్లు బాగా దుఃఖిస్తున్నాడు. డిప్రెషన్‌లో వున్నాడు.” అంది ఆముక్త.
సంవేద ఇంకేం మాట్లాడలేక చుట్టూ చూసింది. ఎదురుగా చిన్న స్టౌ, రెండుగిన్నెలు గోడకున్న సెల్ఫ్‌లో వాళ్లిద్దరి బట్టలు అంతకన్నా ఇంకేం లేవక్కడ..
”నీ బుక్స్‌! నువ్వు రాసుకునే పేపర్స్‌ ఏవి ముక్తా?” అంది సంవేద వాటికోసం కళ్లతోనే వెతుకుతూ…
”అవన్నీ అక్కడే వదిలేసి వచ్చాను. అవేకాదు. వాటితో పాటు నా జ్ఞాపకాలను కూడా వదిలేసి వచ్చాను. అప్పుడు నా రాతల్లో నేను చూపించిన జీవితం వేరు. ఇప్పుడు నేను చూస్తున్న జీవితం వేరు… శ్రీశ్రీ చెప్పినట్లు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదన్నది నిజంగానే గొప్పసత్యం, ఆ సౌందర్యం ఎలా వుంటుందో ఒకప్పుడు నా కళ్లకి కన్పించేది కాదు. ఇప్పుడు స్పష్టంగా కన్పిస్తోంది.” అంది ఆముక్త.
ఈ కొద్దిరోజుల్లోనే ఎంతో జీవితానుభవం చూసినట్లు ఆముక్త మాల్లో ఒకరకమైన స్థితప్రజ్ఞత కన్పించింది సంవేదకి..
”చాలా మారావు ముక్తా!” అంది సంవేద
”మార్పు దానంతటది రాదు వేదా! ఎన్నో ఎదురుదెబ్బలు తగలాలి. మనిషిని మార్చటమనేది రాళ్లను నీటితో కోసినంత తేలిక కాదని నా అనుభవంతో నేను తెలుసుకున్నాను. సరే! వేదా! ఇంకేంటి చెప్పు! ఎందుకిలా వచ్చావు? నా గురించి తెలిసి పరామర్శించానికి వచ్చావా?” అంది జీవంలేని చూపులతో ప్రశ్నిస్తూ..
”అలా రావటానికి నువ్వేమైనా నాకు ఫోన్‌ చేశావా? ఎలా తెలుస్తుంది? నిన్ను చూసేంత వరకు నీ గురించి తెలియనే తెలియదు” అంది సంవేద.
”అలాగా!” అని తనలో తను అనుకుంటూ … సంవేదకు కాఫీ ఇద్దామంటే పాలులేవు కదా అనుకొంది మనసులో…
ఆ ఇద్దరిమధ్యన మళ్లీ భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది.
దాన్ని ఛేదిస్తూ ”చెప్పు వేదా! ఏదో పని వుంటేనే వస్తావు నువ్వు… ఏమి పని?” అంది ఆముక్త.
”ఈ పరిస్థితిలో నీకు చెప్పే పని కాదులే అది… అసలు నిన్ను చూడగానే ఆ పని మాట కూడా మరచిపోయాను. అంత బాధగా వుంది నాకు.. బాధేకాదు. నిన్నిలా చూస్తుంటే కష్టానికే కష్టం వచ్చినట్లనిపిస్తోంది.” అంది కళ్లు తడుస్తుంటే పక్కకి తిరిగి తుడుచుకుంటూ సంవేద.
సంవేద బాధపడ్తున్నట్లు అర్థమై ”భూముల్ని నమ్ముకొని వ్యాపారం చేశాం కాబట్టి ఆ భూములే మళ్లీ మమ్మల్ని కాపాడతాయన్న నమ్మకం నాకుంది వేదా! ఎందుకంటే మా డబ్బంతా భూముల రూపంలో వుంది. కోట్లలో కొన్న భూములు లక్షల్లోకి దిగాయి. అయినా వాటినిప్పుడు కొనేవాళ్లు లేరు… అక్కడేదో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌ వస్తాయని తెలిసి భారీ ఎత్తున కొన్నాం. ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు క్యాన్సిల్‌ అయ్యాయి. దానితో భూముల రేట్లు పూర్తిగా పడిపోయాయి. చివరికి ఇప్పుడు తిండికి కూడా కష్టంగా వుండే స్థాయికి చేరుకున్నాం.. భూముల్ని కొనటమే కాదు. వాటిని అమ్ముకోానికి కూడా వీలుగా వుండేటట్లు సెలక్ట్‌ చేసుకొని కొనాలని అప్పట్లో అన్పించటకపోవటమే ఈ రోజు మా ఈ దుస్థితికి కారణం…” అంది ఆముక్త.
సంవేద మాట్లాడలేదు.
”నిశిత ఎలా వుంది.” అంది ఆముక్త.
అప్పటివరకు ఆపుకున్న ఏడుపు నిశిత పేరు విన్పించగానే కట్టలు తెంచుకున్న నదిలా ప్రవహించసాగింది సంవేదలో…
”ఎందుకేడుస్తున్నావు వేదా? కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి ఏడవకూడదట… మావాళ్లు నాకీ మాట చెప్పి, చెప్పి రాయిని చేశారు. నువ్వేంటి ఇలా?” అంటూ చాలా క్యాజువల్‌గా, గంభీరంగా మాట్లాడింది ఆముక్త.
కళ్లు గట్టిగా తుడుచుకొని, చేతివేళ్ల వైపు చూసుకుంటూ ”నిశితకి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి ఆముక్తా! ఏభై వేలు కావాలి. నిన్ను అడుగుదామని వచ్చాను. నీ పరిస్థితి నాకన్నా భయంకర భీభత్సంగా వుండటం చూస్తుంటే ఏడుపు ఆగటంలేదు.” అంది సంవేద.
సంవేద చేతిని ఓదార్పుగా నిమురుతూ..’ఏభైవేలంటే జోక్‌ కాదు వేదా? అదే నా పరిస్థితి ఎప్పటిలా వుండి వుంటే నేను హెల్ప్‌ చేసి వుండేదాన్ని… కానీ నీకు నేనో దారి చూపిస్తాను. ఆ దారిన వెళ్లగలవా?” అంది ఆముక్త.
”ఏంటో చెప్పు ముక్తా! అది ఎంత కష్టమైన దారైనా వెళ్తాను. ఎందుకంటే నిశిత ముఖ్యం నాకు… నిశిత ఇప్పుడు ఎలాంటి ఆపదలో వుందో తెలుసా? అంటూ శ్యాంవర్ధన్‌ నిశిత పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో, నిశిత ఎంత వేదనతో కూడిన మానసిక ఘర్షణలో వుందో చెప్పింది సంవేద. నిశితను ఆ వాతావరణంలో వూహించ లేకపోయింది ఆముక్త.
ఎలాగైనా నిశితకి సహాయం చెయ్యాలనుకొంది.
పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించాలనుకొంది.
”నాకో రోజు టైమివ్వు వేదా! నీకు పూర్తి వివరాలు చెబుతాను” అంది ఆముక్త. చాలాసేపు అక్కడే కూర్చుంది సంవేద.
*****
శృతిక తనంత తనే రావటంతో – తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ద్రోణ.
ఈ మధ్యన ద్రోణకి ఆఫర్స్‌ ఎక్కువగా రావటంవల్ల వచ్చిన వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వాళ్లెలా అడుగుతున్నారో అలాగే బొమ్మల్ని వేసి ఇస్తుండడం వల్ల క్షణం తీరిక లేకుండా గడచిపోతోంది.
బొమ్మ వేస్తూ శృతిక గురించి ఆలోచిస్తున్నాడు ద్రోణ. శృతికది చిన్నపిల్లల మనస్తత్వమని, బాధపెట్టకూడదని అనుకున్నాడు. తనకి తెలియకుండానే బాధపెడ్తున్నానేమో అనికూడా అనుకున్నాడు.
వేస్తున్న బొమ్మలో చేతివేళ్లకి పినిషింగ్‌ టచ్‌ ఇస్తూ.. శృతిక వేళ్లను గుర్తుచేసుకున్నాడు. ఆమె వేళ్లు మెత్తగా, తెల్లగా, పట్టుకోగానే పచ్చని గడ్డిపై చేతుల్ని ఆన్చినంత హాయిగా అన్నిస్తాయి. ఆ స్పర్శ గుర్తురాగానే కుంచె పక్కన పెట్టి తన గదిలోకి వెళ్లాడు.
అప్పుడు రాత్రి పది దాటుతోంది..
శృతిక గాఢనిద్రలో వుంది.
…నైటీలో వున్న శృతిక నిండైన బుగ్గలతో, పచ్చనిమేని ఛాయతో ఎడమ చేయిని పొట్టకి గుండెకి మధ్యలో పెట్టుకొని,కుడిచేతిని నుదుటిపై పెట్టుకొని కళ్లు మూసుకొని వుంటే పాలరాతి బొమ్మకు ఊపిరిపోసినట్లుంది. నున్నగా, తెల్లగా మెరుస్తున్న ఆ చేతులు ”నేను చాలా అందగత్తెను కదా! నీ బొమ్మల్లో వుందా నా అంతసౌందర్యం?” అన్నట్లు అతని కళ్లను ఆకట్టుకుంటోంది.
గ్లాస్‌డోర్‌ మూసి, ఎ.సి. ఆన్‌చేసి నెమ్మదిగా వెళ్లి శృతిక పక్కన పడుకున్నాడు.
శృతికలో ఓ గుణం వుంది.
అది చాలా దారుణమైన గుణం.
అప్పుడప్పుడు ద్రోణ ఆ గుణానికి బలైపోతుంటాడు.
అదేమిటంటే! నిద్ర మధ్యలో లేపితే గబుక్కున లేచి కూర్చుంటుంది. ”ఇప్పుడు నాకు నిద్రెలా పట్టాలి?” అంటూ గంట క్లాస్‌ తీసుకుంటుంది. ”ఇంకెప్పుడు అలా లేపొద్దు.” అంటుంది. ‘లేపను’ అని ఒప్పుకునేంతవరకు మాట్లాడుతూనే వుంటుంది. ప్లోట్లాడుతూనే వుంటుంది. అందుకే ఆమె పక్కన పడుకున్నాడే కాని ధైర్యం చెయ్యలేకపోతున్నాడు.
అప్పుడు కళ్లు విప్పింది శృతిక.
నెమ్మదిగా నుదుటి మీదవున్న తన చేయి తీసి భర్తవైపుకి తిరిగింది. . వైట్ డ్రస్‌లో వున్న ద్రోణ ఆమె కళ్లకి బలమైన భుజాలతో దృఢమైన చేతులతో ఆత్మీయమైన చూపుతో – నీ పర్మిషన్‌ కోసమే నా ఈ ఎదురుచూపు అన్నట్లు అన్పిస్తున్నాడు. అది గమనించగానే ఇంకాస్త దగ్గరకి జరిగి లేతగా నవ్వింది శృతిక.
ఇంతకు మించిన ఆహ్వానపులేఖ ఇంకొకి వుంటుందా? పులకించి పోయాడు ద్రోణ. అతనికెంతో ఇష్టమైన ఆమె చేతుల్ని తన చేతిలోకి తీసుకొన్నాడు. ఆమె రెండు చేతులు అతని ఒకే చేతిలో ఇమిడిపోయి లావుగా, బలంగా వున్న అతని చేతివేళ్లతో పూర్తిగా బంధించబడ్డాయి.
”నీ చేతివేళ్లు చాలా బావుంటాయి శృతీ! నేను బొమ్మ వేస్తున్నప్పుడు కూడా నీ వేళ్లే మనసులో మెదులుతుంటాయి. ఒక్కొక్కళ్లలో ఒక్కో స్పెషాలిటీ వున్నట్లు నీలో వుండే ఈ స్పెషాలిటీ నన్ను అప్పుడప్పుడు కట్టి పడేస్తుంటుంది.” అన్నాడు.
”కట్టి పడేయానికి ఇవి తాళ్లుకావు. వేళ్లు…..” అంది టప్పున ముఖంమీద కొట్టినట్లు…
”తెలుసులే శృతీ! ఏదో కాస్త హ్యాపీ మూడ్‌లో వున్నాను కదా! నిన్ను బాగా ఇంప్రెస్‌ చెయ్యాలనిపించి నీలో ఏది వర్ణించాలా అని చూస్తుంటే ఈ వేళ్లు కన్పించాయి. అంతలోపలే దాన్ని క్రాస్‌ చేసి కామెంట్ చెయ్యాలా?” అన్నాడు.
”ఎందుకో అంత హ్యాపీ! తెలుసుకోవచ్చా?” అంది ఉత్సాహంగా
ఆమెనలా చూస్తుంటే తను చెప్పేది వినానికి ఆమె రెడీగా వున్నట్లనిపించింది ద్రోణకి… ఇప్పుడామెను నిరుత్సాహపరచకుండా తన సంతోషాన్ని ఆమెతో పంచుకుంటే ఆ తర్వాత తనని సంతోషపెడ్తుందని చెప్పటం ప్రారంబించాడు.
ఆమెనే చూస్తూ ”నేనెందుకింత సంతోషంగా వున్నానో చెప్పనా?” అంటూ ఉడికించాడు.
”ఊ…చెప్పండి!” అంటూ ఇంకాస్త దగ్గరకి జరిగింది.
ఆమె అలా జరగటంతో అతనిలో ఇంకా ఇంట్రెస్ట్‌ పెరిగింది.
”నేనీ మధ్యన బొమ్మలు చాలా బాగా వేస్తున్నాను శృతీ! వాటికి నేను ఆశ్చర్యపోయే రీతిలో డబ్బులొస్తున్నాయి. పేరు కూడా…” అన్నాడు.
ఆమెకెంతో అసంతృప్తిగా అన్పించి ‘ఆ బొమ్మల గురించి నాకేం తెలుసని… ఇంకేమైనా మాట్లాడొచ్చుకదా!’ అని మనసులో అనుకుంటూ ఇంకేదో ఆశిస్తూ అతని ఎదపై గుబురుగా వున్న వెంట్రుకలపై కుడిచేత్తో తడిమింది.
అతనప్పటికే అలౌకిక స్థితిలోకి వెళ్లినట్లు చూస్తూ…”నేనిక జీవితంలో బొమ్మలు వెయ్యననుకున్నాను. అదోరకమైన నిరాశ, నిస్పృహలోకి వెళ్లాను. అటువంటి సమయంలో చైత్రిక అనే అమ్మాయి ఓ అద్భుతంలా నాకు ఫోన్లో పరిచయం అయింది. స్తబ్దంగా వున్న నా ఆలోచనలను చైతన్యం చేసింది. ఏదో సాధించాలన్న తపనను నాలో పెంచింది నా కుంచెకు ఇక తిరుగులేదు అనే స్థాయికి నన్ను చేర్చింది. నా పూర్వవైభవాన్ని నేను మళ్లీ సంపాయించుకున్నాను అంటే కారణం చైత్రిక. ఇది రెండోజీవితం నాకు…” అంటూ ఆగాడు.
‘చైత్రికా! అంత దగ్గరయ్యారా వీళ్లు…?’ లోలోన అదిరిపడింది శృతిక.
అతనామె ముఖంలోకి చూసి వుంటే మాటల్ని కొనసాగించేవాడు కాదు. కానీ అతను ఫోటో చూస్తున్నాడు. శ్రద్దగా ఆలోచిస్తున్నాడు. చైత్రిక గురించి ఎంత చెప్పినా చాలదనిపించి ఇంకా చెప్పాలనుకున్నాడు.
అతనేదో చెప్పబోతుంటే. ”మీరింకేం చెప్పకండి! ఏది చెప్పినా నేను ఒప్పుకోను. బొమ్మలు వేసినా, మానినా అది మీ ఇష్టం. దానికెవరు కర్త కాదు. కర్మకాదు. క్రియకాదు” అంది శృతిక.
అతనందుకు తలాడించకుండా ”జీవితం నుదుటున అనుభూతి బొట్టు మనిషికి ఎంత అందాన్ని, నిండుదనాన్ని ఇస్తుందో చైత్రిక నా ఆర్ట్ కి అంత ఆయువు పట్టు అయింది… కోల్పోయిన అనుభూతిని తన మాటల మాధుర్యంతో నా మనసులోకి ధారలు, ధారలుగా ఒంపింది. చిరుగాలి సున్నితంగా నదికెరాలను తడిమినట్లు నాలోని నైరాశ్యాన్ని నిమిరింది… సన్నజాజిపై మంచుబిందువు కదిలినట్లు నాలోని కళను మెల్లగా తట్టి లేపింది..” అన్నాడు.
శృతిక కళ్ళు ధారలై కురుస్తున్నాయి. రెండు బండరాళ్ల మధ్యన ఇరుక్కపోయినట్లు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
”ఇప్పుడు నెంబర్‌వన్‌ ఆర్టిస్ట్ ను నేను…అన్నట్లు! నువ్వు చైత్రికను చూడలేదు కదూ! రేపొస్తుంది నా బొమ్మ చూడడానికి. పరిచయం చేస్తానులే” అన్నాడు.
కాస్త తేరుకుని ”చైత్రిక నాఫ్రెండ్‌ ! పరిచయం అవసరం లేదు”
“అవునా!” ఆశ్చర్యపోయాడు.
ఆమె ఇంకేం మాట్లాడకపోవటంతో ఆమె ముఖంలోకి చూశాడు. అతనిలో ఊహించని షాక్‌.. వెంటనే తేరుకొని ”ఏంటి శృతీ! ఏడుస్తున్నావ్‌?” అంటూ ఆమె చెంపలపై తడిని చేతితో తుడిచాడు.
”ఏడవటం లేదు. అంత ఖర్మ నాకేంటి? కన్నీళ్లొస్తున్నాయి. ఉదయంనుండి ఒకటే తలనొప్పి… ఇప్పుడు నిద్ర మధ్యలో లేచాను కదా! ఇంకా ఎక్కువైంది అంతే!” అంది
అతనికేదో అర్థమైనట్లు అన్పించి ”నేనింక నోరుమూసుకొని పడుకోవలసిందేనా?” అన్నాడు తిన్నగా ఆమెనే చూస్తూ…
”పడుకోవటం ఎందుకు? ఉందిగా ఇన్సిపిరేషన్‌! పిలుస్తోంది వెళ్లి గీసుకోండి!” అంది వ్యంగ్యాన్ని పెదవి చివరన దాచి…
”గీసుకోవటం నాకు తెలియదా? నువ్వు చెప్పాలా?” అన్నాడు కోపంగా…
”అంతే లెండి! ఇంట్లో వాళ్లు చెబితే ‘నాకు తెలియదా!’ అంటారు బయటవాళ్లు చెబితే ‘ఇన్సిపిరేషన్‌’ అంటారు. ఇది వుండేదేగా మీలాంటి ఆర్టిస్ట్ లకి… ” అంది విసురుగా అటు తిరిగి పడుకుంటూ…
చేసేది లేక ద్రోణ ఇటు తిరిగి పడుకున్నాడు.
శృతిక మనసంతా మహారణ్యమై మండుతోంది.
కారణం చైత్రిక…
అస్త్రసన్యాసం చేసిన మనిషి చేతికి అస్త్రాన్ని అందించినట్లు ద్రోణ చేతికి మళ్లీ కుంచె అందించి, ఋషిని చేసింది. పోయిందనుకున్న సమస్యను మళ్లీ ప్రారంభమయ్యేలా చేసింది. అంతేకాదు ఇప్పుడతను పొందుతున్న కీర్తికి సంపాయిస్తున్న డబ్బుకి చైత్రికే కారణం అంటున్నాడు. గొప్పగా పొగుడుతున్నాడు. అది విని పిచ్చిదానిలా ఏడుస్తోంది. ఇలా ఎంత కాలం?
…భర్త కొట్టినా, అత్త తిట్టినా, ఆడపడుచు మొట్టినా, తోడికోడలు నవ్వినా బహుశా ఇంత బాధ వుండేది కాదేమో… అయినా పుట్టింటికి వెళ్లాలంటే ముఖం చెల్లటంలేదు.
…కన్నతల్లి లేకుంటే ఆ బిడ్డను భూదేవి కూడా మోయలేదన్నట్లు భర్తకి దూరమైన ఆడవాళ్లను పక్కింట్లో, ఎదురింట్లోనే కాకుండా సొంత ఇంట్లో కూడా చిన్నచూపు చూస్తున్నారు… భర్త ప్రవర్తనను మరచిపోయి భర్తను మాత్రమే గుర్తుంచుకోమంటున్నారు. చిన్న నలక మీదనే దృష్టి పెట్టి గ్లాసుడు పాలను పారబోసుకోవద్దంటున్నారు.
అందుకే తను మళ్లీ వచ్చింది. లేకుంటే ఏముందిక్కడ? చైత్రిక తప్ప… అంతా చైత్రిక మయం. చైత్రిక మహిమ. అని మనసులో అనుకుంటూ సముద్రం గాఢంగా శ్వాసించినట్లు నిట్టూర్చింది శృతిక.
*****
ఆముక్త భర్త మణిచందన్‌ తన రియల్‌ఎస్టేట్ బిజినెస్‌లో బాగా దెబ్బతిన్నాక.. భార్యతో కలిసి బయట కెళ్లలేకపోతున్నాడు. బంధువుల్లో కలవలేకపోతున్నాడు కారణం
…మణిచందన్‌ ఆశకి పోయి, ఉన్న పొలాలన్నీ కొని అడుక్కిపోయాడని… మనిషికి మరీ అంత అత్యాశ పనికిరాదని… హద్దుల్లేని ఆశతో ఇప్పుడు చూడు ఎలా రోడ్డునపడ్డాడో అని… చెవుల్లో పడేలా అంటుంటే వింటూ వూరుకోవటం తప్ప ఇంకేం చెయ్యలేకపోతున్నారు.
ఆర్థికంగా దెబ్బతిన్న బాధకన్నా ఇతరుల నిందల్ని తట్టుకోలేక – బయట ప్రపంచానికి దూరమై, ఉన్నంతలోనే ఉన్నతంగా బ్రతకాలని, ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని మాట్లాడుకున్నారు. వాళ్లు మాట్లాడుకున్నదే పాటిస్తున్నారు. చాలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నారు.
…మనిషి చనిపోతే ఒకరోజు ఏడుస్తారు. చనిపోయిన వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి అయితే ఏడవటానికి ఇంకో రెండు రోజుల కేయించుకుంటారు. అంతేకానీ ఆ ఏడుపును, బాధను పొడిగించుకుంటూ పోయి తమ పనులకి అంతరాయం కల్గించుకోరు.
కానీ ఆర్థికంగా నష్టపోతే మాత్రం ఒకరోజు ఏడ్చినా ఆ నష్టం తీరదు? రెండురోజులు ఏడ్చినా ఆ నష్టం తగ్గి కష్టం గట్టెక్కదు. ఒక వ్యక్తి రాత్రికి రాత్రే గొప్పవాడు కావటం ఎలా జరగదో ఈ ఆర్థిక నష్టాన్ని అదిగమించటం కూడా అలాంటిదే… ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా చలామణి అయినవాళ్లకి కూడా ఏదో ఒక స్టేజీలో కష్టాలు వస్తుంటాయి. పోతుంటాయి. కష్టాలకి దేవతలు కూడా అతీతుల కారు. అని సన్నిహితులు, స్నేహితులు చెప్పి ఆముక్త వాళ్లను ఓదారుస్తున్నారు.
ఓదార్పులతో ఆకలి బాధలు తగ్గితే పేదవాళ్లు రోజూ తమ కడుపుల్ని మృష్టాన్న భోజనంతో నింపుకుంటారు కదా! ఈమధ్యన ఓదార్పు కన్నా సానుభూతి చూపేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. కొంతమంది చూపే సానుభూతి కించపరిచేలా మనసును నలిపేస్తుంటే.. ఇంకొంత మంది చూపే సానుభూతి సందర్భానికి తగినట్లు ఆత్మీయతను పంచుతోంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతోంది.
మణిచందన్‌ సిమ్‌ెం ప్యాక్టరీలో పనిచేస్తుంటే ఆముక్త ఇంో్లవుండి, చుట్టుపక్కల ఆడవాళ్ల చీరెలకి ఫాళ్లు కుడుతుంది. ఏదో ఒక సంపాదన వుంటే కనీసం కర్‌ెం బిల్లుకైనా వస్తుంది కదా అని ఆమె ఆలోచన.
అప్పుడప్పుడు రాత్రివేళ్లలో నిద్రరాక…
బడుగుజీవుల జీవితాల గురించి వచ్చిన నవలలను చదువుతుంది. అవి చదువుతుంటే స్థితిగతుల మార్పు అర్థమవుతోంది. ఒకప్పుడు చదవలేక పక్కన ప్టిెన పుస్తకాలు అవి… ఇప్పుడు అపురూపంగా మళ్లీ, మళ్లీ చదువుతూ జీవితాలను చదువుతున్న అనుభూతికిలోనై రచయితలు ”భవిష్యత్‌ బ్రహ్మలా” అని ఆశ్చర్యపోతుంది. రచన అంటే ఇలా చదవగానే ‘ఇది మనదే’ అన్న అభిప్రాయం కలగాలని తెలుసుకొంది.
అవి చదువుతుంటే గొప్ప ఊరటతో పాటు ఆత్మవిశ్వాసం లాింది కలిగి – తుఫానుకి సైతం లొంగని గడ్డిపోచలా తయారైంది ఆముక్త.
భర్త ప్యాక్టరీ నుండి రాగానే కాఫీఇచ్చి…
”సంవేద చాలా ఇబ్బందుల్లో వుందండి! ఏభైవేలు కావాలంటుంది. మనం ఎలాగూ ఇవ్వలేం… ద్రోణ ఒకసారి తన బొమ్మకి మోడల్‌గా వుంటే డబ్బు ఇస్తానన్నాడు. సంవేద అందం మనకు తెలిసిందే! అతని బొమ్మకి కరక్ట్‌గా సరిపోతుంది. నేను ఇవాళ వెళ్లి ద్రోణతో మాట్లాడి వస్తాను.” అంది ఆముక్త.
”సరే ! వెళ్లిరా!”అన్నాడు మణిచందన్‌.
అలవాటులేని పనివల్ల అతనికి ఒళ్లంతా నొప్పులొస్తున్నాయి. ఒళ్లు విరుచుకుంటూ.. ‘ఆ డోర్‌ కాస్త దగ్గరకి వేసివెళ్లు…” అని పడుకున్నాడు మణిచందన్‌.
అప్పికే రెడీ అయివున్న ఆముక్త ద్రోణ దగ్గరకి వెళ్లింది.
జ జ జ జ జ
ద్రోణకి ఎదురుగా కూర్చుని… ”ద్రోణా! సంవేద నా బెస్ట్‌ఫ్రెండ్‌ అని నీకు తెలుసుకదా! ఇప్పుడు తను ఆపదలో వుంది. డబ్బుకావాలి… నీ బొమ్మకి మోడల్‌గా వుంటే నువ్వు డబ్బు ఇస్తావని చెప్పాను. తను అందుకు సిద్ధమే అంది…వెంటనే నీనుండి ఆహ్వానం వచ్చే ఏర్పాటు చెయ్యమంది. గతవారం రోజులుగా మాఇంి కొచ్చి వెళ్తోంది. నాకే తీరికలేక, ఆర్థిక వత్తిళ్లతో మనసు బాగాలేక నిన్ను కలవటంలేదు..” అంది ఆముక్త.
ఒక్కక్షణం ఆశ్చర్యపోయాడు ద్రోణ.
ఆముక్తను చూస్తుంటే జాలిపడాలో… అభినందిచాలో తెలియటంలేదు. అతనికి … ఒకవైపు తను బాధలో వుండి కూడా దాన్నిపైకి కన్పించనీయకుండా స్నేహితురాలికోసం వచ్చి, తనతో మాట్లాడటం గొప్పవిషయం.
”నిజానికి ఆ బొమ్మను నేను ఇప్ప్లో వేయదలచుకోలేదు ఆముక్తా! కానీ నీ స్నేహితురాలుపట్ల నువ్వు చూపుతున్న శ్రద్ధ… స్నేహానికి నువ్వు ఇచ్చే గౌరవం చూస్తుంటే తప్పకుండా వేయాలనిపిస్తుంది. రేపినుండే ఆబొమ్మ వేయటం ప్రారంభిస్తాను. రమ్మను…” అన్నాడు.
తేలిగ్గా ఊపిరి పీల్చుకొంది ఆముక్త. క్షణం క్రితం వరకు వున్న వెలితి ఇప్పుడు లేదామెకు.
”కానీ… ఒక్క విషయంలో నాకు హామీ ఇవ్వాలి.” అన్నాడు.
”ఏమిటది?” అంది ఆముక్త.
”ఆమె నా దగ్గర మోడల్‌గా వుండానికి ఎవరి అభ్యంతరం వుండకూడదు” అన్నాడు.
”అదంతా తను మేనేజ్‌ చేసుకుంటుంది. మనకెలాిం ప్రాబ్లమ్స్‌రావు.” అంటూ హామీ ఇచ్చింది ఆముక్త.
అతను ఒప్పుకున్నాడు.
ఆముక్త అతని దగ్గర సెలవు తీసుకొంది.
ఆమె గుమ్మం దాటుతుండగా … గిన్నెలు బయటేసుకుంటున్న పనిపిల్ల శృతికను రమ్మని సైగచేసింది. శృతిక వెంటనే వచ్చింది.
”ఆ వెళ్తున్న అమ్మగారు మీకు తెలుసామ్మా?” అంది పనిపిల్ల.
”నాకు తెలియదు. సార్‌కి తెలుసు ఏం?” అంది శృతిక ఆముక్తను చూడగానే ముఖం అదోలా మాడ్చుకుంటూ.
ఇప్పుడు మీకో కథ చెబుతాను వినండి అన్నట్లుగా శృతికవైపు చూస్తూ ”ఆముక్తమ్మగారు నేలమీద నడవగా మేము చూడలేదు. మాలాింవాళ్లు చేయి చాపి అడిగితే ఏనాడు లేదన్న మనిషికాదు. ఆమెకే ఇప్పుడు కష్టాలు వచ్చాయి. మాకు దగ్గర్లోనే వుంటున్నారిప్పుడు… అప్పుడప్పుడు వెళ్లి చూసి పలకరించి వస్తుాంము. వాళ్ల గురించి మేమంతా ఓ చోట చేరి కథగా చెప్పుకుాంము. సినిమాలో జరిగినట్లే జరిగిందమ్మా వాళ్ల జీవితం…” అంది పనిమనషి.
ఆముక్త ప్రస్తుతం ఎలాిం స్థితిలో వుందో అర్థమైంది శృతికకు.. ”ఈమధ్యన నాబొమ్మలకి డబ్బు బాగా వస్తోంది శృతీ!” అన్న భర్త మాటలు వెంటనే చెవుల్లో రింగయ్యాయి.. నడుస్తూ, నడుస్తూ హఠాత్తుగా బురదలో పడిన మనిషిని చూసినట్లు ఆముక్తను వెనకవైపునుండి చూస్తూ…
”ఇలాిం వాళ్లకు ఎలాిం శాస్తి జరగాలో ముందేరాసి ప్టిె వుంటుంది. లేకుంటే అమ్మో! అమ్మో! నన్నెంత బాధప్టిెంది ఒకప్పుడు? ఇప్పుడు కూడా బాధప్టోనికే వచ్చింది.” అంది ఈర్ష్యగా శృతిక.
అర్థంకాలేదు పనిపిల్లకి…
పనిపిల్లకి అర్థమయ్యేలా చెప్పాలని ”ఇప్పుడెందుకొచ్చిందో తెలుసా? మీ అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకోానికి… ఆవిడ ఏడిస్తే ఆయన తట్టుకోలేరు. చూస్తుండు… తొందర్లోనే మళ్లీ కార్లో తిరుగుతుంది.” అంది శృతిక.
శృతిక మాటలు కొద్ది కొద్దిగా విన్పిస్తున్నాయి కాని…క్లియర్‌గా అర్థంకాలేదు ఆముక్తకి… గేటు దాి రోడ్డెక్కి నడవడం ప్రారంభించింది.
ఆముక్తనలా కించపరచటం పనిపిల్లకి నచ్చక… వెంటనే ాప్‌ తిప్పి పోర్స్‌గా పడ్తున్న నీళ్లకింద బక్కెట ప్టిె అక్కడే కూర్చుంది.
శృతిక లోపలకెళ్లింది.
‘చైత్రిక ఒకవైపు ఆముక్త ఇంకోవైపు తనను ఎందుకిలా చెండుకు తింటున్నారు? ఆముక్త సరే! చైత్రిక క్లోజ్‌ ఫ్రెండయికూడా తనని బాగా మోసం చేసింది కదా!’ అనుకొంది శృతిక..
చైత్రికను కలవానికి హాస్టల్‌కి వెళ్దామన్నా, ఫోన్‌ చేద్దామన్నా మనస్కరిం చటంలేదు. అయినా ఇంకా ఏముఖం పెట్టుకొని చైత్రిక స్నేహాన్ని నమ్మాలి? తనని నమ్మించి ఎలా మోసం చేసిందో తనుకూడా చైత్రిక జీవితాన్ని భీబత్సం చెయ్యాలి. తనేమైనా చేతకాని మనిషా?
ఏమైనా సరే ఈసారి భర్తను విడిచి ఎక్కడికీ వెళ్లకూడదు. తను అనుకున్నది చెయ్యాలి. చైత్రిక అంతు చూడాలి. తను కోల్పోయిన ఆనందాన్ని చైత్రికకు కూడా లేకుండా చేయాలి.
గ్టిగా నిర్ణయించుకొంది శృతిక.
జ జ జ జ జ
శృతిక బాగా ఆలోచించింది. భర్తను వదిలి వెళ్తే అందరిలో చులకనవుతానని గ్రహించి, అలాిం సాహసాలు ఇక చెయ్యొద్దనుకొంది. అలా అని అతను దగ్గరకి వచ్చినప్పుడు ఏడవకుండా కూడా వుండలేకపోతోంది. రోజూ ఇదే తంతు. తన ఈబాధకు చైత్రికే కారణం అనుకుంటూ ఇది తప్ప ఇంకో మార్గం లేనట్లు…
రుత్విక్‌!
బాగున్నావా! చైత్రిక నీకు టచ్‌లో వుందా? ఎందుకంటే ఒక మనిషిని వదిలేసి ఇంకో మనిషికి దగ్గర కావానికి ఆరు మెసేజ్‌లు, నాలుగు ఫోన్‌ కాల్స్‌ చాలు.. ఇది నిజమని కొన్ని జీవితాలు ఋజువు చేస్తున్నాయి. అందులో చైత్రిక ఒకి.. అయినా చైత్రిక ఇంతవీక్‌ అని నేను అనుకోలేదు రుత్విక్‌! చైత్రిక నా ఎక్స్‌పెక్టేషన్ని తారుమారు చేసింది. స్టడీగా వుండలేకపోయింది. మా వారికి అమ్మాయిల్ని మౌల్డ్‌ చేసుకోవటం చాలా ఈజీ అని తనికి ముందే చెప్పాను. అయినా కంోల్‌ చేసుకోలేక పోయింది.
ఇది పద్ధతిగా వుందా రుత్విక్‌! చైత్రికపై నమ్మకంతోనే మావారిని టెస్ట్‌ చేసే బాధ్యతను తనపై ప్టోను. అది మరచిపోయి ఆయనకి దగ్గర కావొచ్చా? మనిషి ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో స్వచ్ఛత లేకుంటే బ్రతికి వేస్ట్‌ కదా!
…నువ్వెలాగూ తనని పెళ్లి చేసుకుాంవు. కాకుంటే కాస్త టైం తీసుకుాంవు. ఈలోపలే ఇలాిం అనుభవాలను ఆశించటం అవసరమా? అవకాశం దొరికింది కదాని నామొగుడ్ని కావాలనుకోవటం తప్పుకదా!
ఆయన నాపక్కన పడుకొని ప్రతిక్షణం నా ఈ ప్రోగ్రెస్‌కి చైత్రికే కారణం. అంటుంటే ఒక భార్యగా నామూడ్స్‌ ఎలా వుాంయో అర్థం చేసుకో… ఇన్నాళ్లు చైత్రిక నా బెస్ట్‌ఫ్రెండ్‌ అనుకునేదాన్ని… ఇప్పుడు నా ఫస్ట్‌ ఎనిమీ అయింది.
ఒక చిన్న రిక్వెస్ట్‌ రుత్విక్‌! చైత్రిక నీకు టచ్‌లో వుంటే ద్రోణని వదిలెయ్యమని చెప్పు. ఇది నా అర్థింపు. అర్థం చేసుకో. ప్లీజ్‌! నీ అడ్రస్‌ మీ చెల్లిని అడిగి తీసుకున్నాను.
ఇట్లు
శృతిక
అని ఓ ఉత్తరం రాసి స్ట్స్‌ేలో వున్న రుత్విక్‌కు పోస్ట్‌ చేసింది. ఆ ఉత్తరం పోస్ట్‌ చేశాకనే ఆమె కడుపు ఉబ్బరం తగ్గింది.
కానీ పర్యవసానం ఎమి అని ఆమె అప్పుడు ఆలోచించలేదు.
జ జ జ జ జ
నిశిత నిద్రలో కలవరిస్తూ, అరుస్తూ లేచికూర్చుంది. ఆ అరుపుకి గంగాధరం లేచి బయటకొచ్చాడు.
శ్యాంవర్ధన్‌ వున్నాడేమోనని చుట్టూ చూశాడు గంగాధరం. అతనులేడు. నిశిత ఒక్కటేవుంది. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. నిశిత వీపు నిమిరి ధైర్యం చెప్పాడు. మంచినీళ్లు తెచ్చి తాగించాడు.
ఒకప్పుడు ఆయనకూడా నిశితలాగే నిద్రలోలేచి అరిచేవాడు. ఇప్పుడు అరవటం మానేశాడు. కారణం సెక్యూర్డ్‌ ఫీలింగ్‌ వచ్చింది. కానీ నిశితకి కూడా తనకి వచ్చినంత సెక్యూరిీ ఫీలింగ్‌ ఎప్పుడు రావాలి? అసలు వస్తుందా? అలాిం నీడ దొరుకుతుందా అన్నదే ఆయన ఆలోచన..
”లే! నిశితా! మా గదిలో పడుకుందువు… ఇక్కడ ఒక్కదానివి భయపడ్తావు.”అన్నాడు గంగాధరం.
ఆయనలోని ఔదార్యానికి ఆమెకళ్లు చెమర్చాయి. ముఖంలోకి జీవకాంతి వచ్చింది.
కొడుకు మీద కోపంగా వుంది గంగాధరానికి… కానీ చెయ్యెత్తి క్టొాలంటే చిన్నవాడు కాదు. నోరెత్తి త్టిలంటే వీధిరౌడీ కాదు. కన్పించకుండా తిరిగే కట్లపాము. ఎప్పుడు కాటేస్తాడో తెలియదు.
గంగాధరం వెంటనడచి గదిలోకి వెళ్లింది నిశిత.
అప్పుడే నిద్రలేచింది దేవికారాణి.
ఏమైంది అర్థం కాలేదామెకు… కళ్లునులుముకుంటూ చూసింది.
దేవికారాణి ఏమంటుందోనని భయభయంగా చూస్తోంది నిశిత.
”దేవీ! నిశిత నిద్రలో భయపడ్తోంది. ఇక్కడైతే మనం తోడుగా వుాంమని తీసుకొచ్చాను. నీపక్కన పడుకో బెట్టుకో…” అన్నాడు.
భర్త మీద గౌరవంతో…
”సరే!” అంటూ పక్కకి జరిగి నిశిత పడుకునేంత స్థలం ఇచ్చింది.
నిశిత పడుకొంది. ఆమెకిప్పుడు నిశ్చింతగా వుంది.
జ జ జ జ జ
రాత్రి ఏంజరిగిందో తెలుసుకొంది సంవేద.
అత్త, మామల మానవత్వానికి చేతులెత్తి దండం ప్టిెంది.
కానీ ఎన్నిరోజులిలా? ఎన్ని రాత్రులు ఇలా? ఈసమస్యకి పరిష్కారం ఎప్పుడు? తలపగిలిపోయేంతగా ఆలోచించింది సంవేద. చెల్లికి తెలియకుండా ఏడ్చుకొంది.
చివరకి ద్రోణ బొమ్మకి మోడల్‌గా వుంటే ఏబైవేలు ఇస్తాడట అని మామగారితో చెప్పింది. ఆయన ఎలా చెబితే అలా చేద్దామన్నట్లు జవాబుకోసం ఎదురుచూసింది. ఆయన ఒప్పుకున్నాడు.
వెంటనే ఆముక్త ఇంికి వెళ్లింది సంవేద.
సంవేదను చూడగానే.. ”నేను ద్రోణ దగ్గరకి వెళ్లి మాట్లాడివచ్చాను వేదా! నువ్వు వెళ్లి అతన్ని కలువు. తప్పకుండా హెల్ప్‌ చేస్తాడు. అతను మన కాలేజీలోనే చదివాడు. నిన్నొకసారి పరిచయం కూడా చేశాడు..” అంది ఆముక్త.
సంవేద మాట్లాడలేదు.
”నువ్వు నా బెస్ట్‌ఫ్రెండని కూడా చెప్పాను. అక్కడ నీకు ఎలాిం ఇబ్బంది వుండదు. గీయడం పూర్తి కాగానే వచ్చేయ్యొచ్చు. బహుశా రెండు సింగులు వుంటుందేమో! అతనికి కోఆపరేటు చెయ్యి… ఇదిగో అతని ఇంి అడ్రస్‌…” అంటూ విజింగ్‌ కార్డ్‌ ఇచ్చింది ఆముక్త.
ఆకార్డ్‌ తీసుకొని కృతజ్ఞతగా చూసింది సంవేద.
”మనం ఫ్రెండ్స్‌! మన మధ్యన అలాిం ఫీలింగ్స్‌ వద్దు” అంటూ భుజం త్టి గేటు వరకు వచ్చింది ఆముక్త.
సంవేద ఆోలో కూర్చుంది.
ఆోవెళ్లి ద్రోణ ఇంి ముందు ఆగింది.
జ జ జ జ జ
కుంచెను ట్రేలో ప్టిె నాలుగడుగులు కికీవైపు వేశాడు ద్రోణ. ఎప్పిలా కికీకున్న కర్టన్‌ తొలగించి బయటకి చూశాడు.
ఆగివున్న ఆోలోంచి తెల్లని పాదం బయటకొస్తూ నేను చాలా అద్భుతమైన రూపాన్ని అన్పించేలా ఎల్లో కలర్‌ శారీలో వున్న సంవేద మెల్లగా ఆో దిగి నిలబడి, ఆోవాడికి డబ్బులిస్తుంటే నిశ్ఛేష్టుడయ్యాడు ద్రోణ.
ఆమెనలా చూస్తుంటే ఎంతయినా నువ్వు నన్ను జయించలేవుగా అన్నట్లు ఓ మధురమైన జ్ఞాపక శకలం వచ్చి మనసును గుచ్చుకొంది. దానితో అద్వితీయమైన ఆనందం యొక్క ప్రభావం శరీరం మొత్తం హాయిగా వ్యాపించింది.
ఆమెను చూసి ఎంతోకాలం కాకపోయినా యుగాలైనట్లు, గాలి, నేల, కడలి, రంగులు ఇంద్రదనస్సు అయి కన్పించినట్లు ఒక్కసారిగా అతని మనసు కళ్లు విచ్చుకున్నాయి.
ఆమె అడుగులో అడుగేసుకుంటూ నేరుగా లోపలకి నడిచి వస్తుంటే అతనిలోని నరాలన్నీ అగ్నిలా జ్వలిస్తున్నట్లై ‘ఇది జీవితం ! తనకీ అనుభూతి తగదు’ అనుకున్నాడు.
బహుశా ఆముక్త విషయంలో కూడా విష్ణు ఇలాగే అనుకున్నాడేమో! మొన్న కన్పించి ఆముక్త పరిస్థితి విని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు… ”ప్రపంచంలో ఎవరూ ఎవరి గురించి ప్టించుకోరు. ప్రేమతో తపించి, తపించి అలసిపోయి దూరమైన హృదయం తప్ప” అని అతనే అన్నాడు. కానీ… ”మనం అంటుకట్టానికి వీలుకాని మొక్కల్లా కంచె అవతల వున్నామని” కూడా అన్నాడు. అప్పుడర్థమైంది ద్రోణకి… అడుగులేని గిన్నె వలె కొన్ని జీవితాలు ఇంతే! అని…
అంతేకాదు. జీవితం సాఫీగా జరిగిపోవాలంటే ఇంతవరకే చాలనుకోవాలి. సుఖంగా వున్నామని సరిపెట్టుకోవాలి. ఎవరైనా చూస్తే నవ్విపోతారని అందరికి నచ్చినట్లు బ్రతకాలి.
…నిశ్శబ్దంగా వున్న అతని గదిలోకి అడుగుప్టిె ”నమస్తే!” అంది సంవేద
”నమస్తే! కూర్చోండి! ఆముక్త చెప్పింది మీరొస్తున్నట్లు…” అన్నాడు గంభీరంగా – మీరాక తాలుకు మెసేజ్‌ నాకు ముందుగానే అందింది అన్నట్లు.
ఆ మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చాయి.
ఆమెకో కుర్చీ చూపించి, ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు ద్రోణ.
ఆమె కాస్త తలవంచుకొని చేతివేళ్లను పరీక్షగా, ఆలోచనగా చూస్తోంది.
ద్రోణ చూపులు ఆమెను చాలాసున్నితంగా తడుముతూ, కుశల ప్రశ్నలతో తాకి, తాకి అలసిపోతున్నాయి.
ఆమెకూర్చున్న తీరు అందమైన చిత్రాన్ని తలపింపజేస్తుంటే…
”ఎలా వున్నావు సంవేదా?” అన్నాడు ద్రోణ. ఆ నిశ్శబ్దంలో అతని గొంతు గుండెను చీల్చుకుంటూ వచ్చినట్లు స్పష్టమవుతోంది.
ఆ పిలుపుకి ఉలిక్కిపడింది సంవేద.. ”ఈపిలుపిేం ఇంత మధురంగా, హృదయాన్ని నునుతట్టుతో నిద్రలేపేలా వుంది?” ఒళ్లంతా గమ్మత్తుగా పులకించి ఏదో హాయిని నిగూఢంగా అనుభవిస్తూ వుండగా ఆమె మనసు హెచ్చరించింది. ”అతను క్యాజ్‌వల్‌గానే అడిగాడు. అంతా నీ భ్రమ.” అని.
”బాగున్నాను సర్‌?” అంది వెంటనే…
ఆమెను చూస్తుంటే తనని గుర్తుపట్టనట్లనిపించి ”నేను కౌముది తమ్ముడ్ని గుర్తుప్టారా?” అన్నాడు. గుర్తుప్టినట్లు తలవూపింది సంవేద.
…నెమ్మదిగా లేచి ఆమెకు దగ్గరగా వెళ్లి రెండు చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకొని… అలసిపోయి, వాలిపోతున్న ఆమె కళ్లపై పెదవులతో అద్ది, హృదయానికి హత్తుకొని, నది ఒడ్డున కూర్చుని నీిని స్పృశించినంత హాయిగా సమస్త సంపదను తాకినంత తృప్తిగా – ఒక ఆత్మీయత, ఒక ఆదరణ, ఒక గాఢానుబంధాన్ని ఆస్వాదిస్తూ… స్పర్శకుండే ఆమహత్తర శక్తిని అనుభూతిస్తూ చర్మరంధ్రాల గుండా, కణాల గుండా, రక్తనాళాల గుండా అంతా అల్లుకుంటూ గుండెకు చేరుతున్న దుఃఖంతో బాధతో, ప్రేమతో పండిపోయిన మనిషిలా – ఇద్దర్ని కలిపే ఒక అద్బుత శక్తి అయిన ఆ స్పర్శను దూరం నుండే ఊహించుకుంటూ ఆమె దగ్గరకి వెళ్లకుండా మునిలా మౌనంగా చూస్తున్నాడు.
…అలా ఓ నిముషం గడిచాక బరువుగా నిట్టూర్చి… ”ఆముక్త మీకు అన్నీ చెప్పిందనుకుాం…” అన్నాడు ద్రోణ.
”చెప్పింది సర్‌!” అంది సంవేద చాలా వినయంగా చూస్తూ…
…ముందుగా ఆమె భుజాలవైపు చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా శంఖాన్ని పోలిన మెడనుండి ఒంి ముత్యం దిద్దులతో వున్న చెవులనుండి నిండైన బుగ్గల మీదుగా ప్రయాణించి సంపెంగను పోలిన నాశిక, చురుగ్గా అంతలోనే సౌమ్యంగా మారే ఆ కనుదోయిని ఓక్షణం ఆర్తిగా చూసి, నుదుిమీద హుందాగా నిండు ముత్తయిదువుగా వున్న కుంకుమ బొట్టును, పాపిటలో సింధూరాన్ని చూసి ఓక్షణం మైమరచి, ఒత్తయిన ఆమె తలకట్టుకి వశమైనట్లు వివశుడై… ఇంత అందాన్ని తన ప్రేములో బిగిస్తే కళాభిమానులు తమ కళా పిపాసతో ఎన్ని కాసుల వర్షాన్ని కురిపిస్తారో కదా!
ఒక్క డబ్బుతో కాదు. ప్రపంచ కళాఖండంలోనే ఇదో కళాఖండమై పోతుంది. ముఖ్యంగా సంవేద కళ్లలోని ఆగ్రేస్‌ని కనుక తను తన కుంచెతో పట్టుకోగలిగితే ఒక ఆర్టిస్ట్‌గా తన జన్మధన్యమైనట్లే… ఇంత అపురూపమైన, అపూర్వమైన, అద్భుతసౌందర్యం ఇలా తన కళ్లముందు, ఇంత దగ్గరగా కూర్చుని మీ కుంచెతో నన్ను స్పృశించండి అనడం తనకో వరం.
…ఆమెను ఒకప్పుడు తన మనసుతో స్పృశించినప్పుడు తను ఓ స్టూడ్‌ెం మాత్రమే.. మనసును డైరీకే పరిమితం చేసి పైకి చెప్పుకోలేని భావ సంచలనాన్ని గుండెల్లో దాచుకొని, ఆశకి-నిరాశకి మధ్య ఊగిసలాడిన ఓ పెళ్లికాని అబ్బాయి…
అతనలా ఆలోచిస్తూ తనవైపు చూస్తుంటే… తన బొమ్మను వేయానికి ఇంకా ఎంతసేపు అలా చూడవలసి వస్తుందోనని… అతని చూపులకి ఏమాత్రం భంగం కల్గించకుండా… కదిపితే అతని మూడ్‌ పోతుందని అలాగే మౌనంగా, నిశ్చలంగా కూర్చుంది సంవేద.
అతను లేచి స్టాండ్‌బోర్డువైపు కదిలాడు, దానికున్న పేపర్నితీసి వేరే పేపర్ని స్‌ె చేశాడు.
ఎలా కూర్చువాలో-దూరంగా నిలబడే వివరిస్తూ, ఓ భంగిమను చెప్పాడు… ఆ భంగిమ చాలా హుందాగా వుంది.
సంవేదకి ఆ భంగిమ నచ్చింది.
ఆమెకిదో అద్భుతమైన అనుభవంలా వుందే కాని ఇబ్బందిగా లేదు. అందుకు కారణం ద్రోణ నైస్‌ బిహేవియర్‌.
ఆముక్త చెప్పినప్పుడు భయపడింది. పరాయివ్యక్తి ముందు ‘నా అందాన్ని మీకుంచెకి అప్పజెప్పాను. ఇక మీ ఇష్టం.’ అన్నట్లు ఎలా కూర్చోవాలి? అతనెలాింవాడో? ఎలా రీశీవ్‌ చేసుకుాండో? తన అవసరాన్ని అడ్వంటేజ్‌గా తీసుకొని ఒక స్టెప్‌ ఎక్కువ వేస్తాడేమో? అప్పుడు తనేం చేయాలి? డబ్బు అవసరమే కాని ఇలాిం సాహసం అవసరమా? అని అనుకున్న క్షణాలే ఎక్కువ…
ఆమె ఊహించిన ప్రమాదాలేమీ అక్కడ కన్పించలేదు. ‘ఓ జీవితకాలం ఇలా కూర్చునే అవకాశం వచ్చినా హాయిగా కూర్చోగలను.’ అనుకొంది నిశ్చింతగా.
ఆమె ఛుబుకాన్ని కాస్త ఎత్తమన్నప్పుడు ఆమె కళ్లు అతని కళ్లతో కలిశాయి. ఆ క్షణంలో అతనిలో కలిగిన అలజడి అంతా, ఇంతా కాదు. అతి చురుగ్గా కదులుతున్న అతని కుంచె సడన్‌గా ఆగింది.
అతని శోధన, శోకంగా అన్పిస్తూ.. జీవితంలో వున్న ఏదో అంతస్సంబంధం అర్థమైనట్లు ఆలోచిస్తూ తన కుంచెతో ఆమెను గాయం చేస్తూ తన మనసును గాయం చేసుకోవటం ఇష్టంలేని వాడిలా తలవిదిలించాడు.
కుంచెను ీపాయ్‌ మీదప్టిె ఆమెకి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు.
”మీ బొమ్మను వెయ్యలేకపోతున్నాను. మీరు వెళ్లొచ్చు.” అన్నాడు ద్రోణ మర్యాద వ్టుిపడే స్వరంతో.
ఆమె గుండెను రాయితో నొక్కి, చిదిమినట్లు ఒక్కక్షణం శ్వాస ఆగి మళ్లీ కొట్టుకొంది.
అతను కూర్చున్న తీరు, మాట్లాడుతున్న విధానం చూస్తుంటే తన బొమ్మను ఇక వెయ్యడని అర్థమైంది.
ఆమె కదలకుండా కూర్చోవటం చూసి ”బొమ్మవెయ్యక పోయినా నేను మీకు ఇస్తానన్న మనీ ఇస్తాను.” అంటూ వెంటనే చెక్‌బుక్‌ తీసుకొని అమ్‌ౌం రాసి సంతకం ప్టిె ఇచ్చాడు.
ఆమె ఆ చెక్‌ తీసుకోలేదు
”నావల్ల మీకెలాిం ఉపయోగం లేకుండా మీరిచ్చే ఈ ఫ్రీమనీ నాకొద్దు…” అంటూ అక్కడ నుండి లేచి నాలుగడుగులు వేసి మళ్లీ ఆగిపోయింది సంవేద.
అతను అలాగే చూస్తున్నాడు.
ఆమె తిరిగొచ్చి కూర్చుంది.
అర్థంకాక ఆమెనే చూశాడు ద్రోణ.
”నాకు డబ్బు చాలా అవసరం సర్‌! కానీ ఫ్రీగా వద్దు. ప్రస్తుతం ఒక హౌస్‌వైఫ్‌గా అంత డబ్బును బయట ఎక్కడ తేవాలన్నా నావల్ల కావటంలేదు. …ప్లీజ్‌! నా బొమ్మను వెయ్యండి!” అంది అర్థింపుగా.
”నా హృదయంలో వుండే బొమ్మను కాగితంపై పెట్టటం నాకిష్టంలేదు. ఇది నాది అని నాఅంతరంగంలో పదిలపరుచుకున్న అద్భుత రూపాన్ని అందరిముందు వుంచలేను. అది సాధ్యంకాదు.” అని ఆమెతో అనలేక మౌనంగా చూశాడు… తన మనసులోని భావం బయటకి రాకుండా నొక్కిపట్టటం కోసం అతనులోలోన భయంకరంగా సంఘర్షిస్తున్నాడు.
అతని మౌనం చూస్తుంటే తన కోరిక తీరదని అర్థమైంది సంవేదకి.
”ఆముక్త మీతో చెప్పిందో లేదో…!” అంటూ అర్థాంతరంగా తన మాటను ఆపింది సంవేద.
ఆముక్త తనకి చెప్పని విషయం ఏదో సంవేద చెప్పబోతుందని అతను అంచనావేస్తూకాస్త ముందుకి వంగి, ఆసక్తిగా చూస్తూ! ”చెప్పండి!” అన్నాడు.
అతనికి చెప్పాలా? వద్దా? అని ఆలోచిస్తోంది సంవేద.
”చెప్పండి! ఫర్వాలేదు.” అన్నాడు మీరేం చెప్పినా శ్రద్ధగా వింను ప్రాధాన్యత కూడా ఇస్తాను. చెప్పండి అన్నట్లు చూశాడు. అతనంత సన్నిహితంగా అన్పిస్తుంటే.. సంవేదకి ధైర్యం వచ్చింది.
”మా చెల్లిని మీరు చూసివుాంరు, నిశిత. హేండిక్యాప్‌డ్‌!” అంటూ అతని ముఖంలోకి చూసింది సంవేద.
”చూశాను.” అన్నాడు జవాబుగా
”తనకి పెళ్లి చెయ్యాలి. అందుకే ఈడబ్బు… ఈ పెళ్లి చెయ్యలేకపోతే నేను అదీ కలిసి చనిపోయే పరిస్థితి…”అంటూ ఆగింది.
”అంటే! నాకు అర్థంకావటంలేదు. కాస్తవివరంగా చెప్పగలరా?” అన్నాడు.
”మా ఆయన మాచెల్లితో మిస్‌ బిహేవ్‌ చేస్తున్నాడు. నెగివ్‌ సిెంమ్స్‌ెంని డెవలప్‌ చేసుకొని దానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఇదిలాగే సాగితే నిశితకి మెంటల్‌ వచ్చేలా ఉంది. ఇప్పికే రాత్రిపూట భయంతో అరుస్తోంది.” అంది.
అతని మనసంతా శూన్యంగా మారింది. వినలేక, వినకుండా వుండలేక ఆమె మాటల్ని విని తీవ్రమైన అలజడికి లోనయ్యాడు.
తన భార్య శృతికతో పోల్చుకొని – సంవేదలోని సహనానికి చేతులెత్తి దండం ప్టోలనుకున్నాడు.
ఈ రోజుల్లో ”కూరెందుకు వండలేదనో, వండిన కూరలో ఉప్పు ఎక్కువైందనో,” భర్త అనగానే కొందరాడవాళ్లు వెంటనే ఆో ఎక్కి ప్యామిలీ కోర్టుకెళ్తున్నారు. భర్త మాట్లాడకపోయినా, మానసికంగా హింసిస్తున్నాడని ”గృహహింస” కేసుకింద లోపలేపిస్తున్నారు. అదేమంటే వ్యక్తి స్వేచ్ఛ అంటున్నారు. విడాకులంటున్నారు.
అటువిం వాతావరణంలో వుండికూడా, ఇంో్ల అంతి బడబానలాన్ని భరిస్తూ నోరెత్తకుండా, భర్తను నొప్పించకుండా, గొడవపెట్టుకోకుండా ఎంత రహస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటుందో గ్రహించి ఆశ్చర్యపోయాడు ద్రోణ.
”మీ ప్రాబ్లమ్‌ నాకు అర్థమైంది. నిశితను నాదగ్గరకి తీసుకురాగలరా?” అన్నాడు చాలా స్మూత్‌గా
ఉలిక్కిపడింది సంవేద.
…నిశితను ఇతనేం చేసుకుాండు? తన భర్త చూసినట్లే చూస్తున్నాడా? మగవాళ్లంతా ఇంతేనా? అని అనుకోలేక అతని వైపు చూస్తే తన మనసులోని భావం బయటపడ్తుందేమోనని అతనివైపు చూడలేక ఓ క్షణం సతమతమైంది.
”ఎందుకు సర్‌?” అని సంవేద అనే లోపలే… అతని తలపులన్నీ శుభ్రపడ్డట్లు ఒక్కక్షణం కళ్లుమూసుకొని తిరిగి ఆమెను చూస్తూ….
”నిశిత వీల్‌ చెయిర్‌ నాకు బాగా జ్ఞాపకంవుంది. సంవేదా! నేను అప్పుడప్పుడు మీఇంివైపు చూస్తుండేవాడిని,.. మీరు, మీ అమ్మగారు నిశితకి చెరోవైపు చేరి అన్నం తినిపిస్తుండేవాళ్లు. నిశిత మీ ఆత్మీయతను పూర్తిగా ఆస్వాదిస్తూ మీ ఇద్దరి రెక్కల చాటున అపురూపంగా పెరుగుతున్న పక్షిపిల్లలా అన్పించేది నాకు… ఆ దృశ్యం నామనసులో అలాగేవుండి పోయింది. నాకుంచెతో దానికోరూపాన్ని ఇవ్వాలని నాకు ఎప్పి నుండో వుంది. కానీ… పర్‌ఫెక్ట్‌నెస్‌ రావటం లేదు. ఒకసారి నేను నిశితను చూడాలి…” అన్నాడు.
వెలుగువింది ప్రవేశించింది సంవేదలో… జీవం నింపుకొన్న ఆమెకళ్లు అతనివైపు ప్రశాంతంగా చూశాయి.
”తప్పకుండా సర్‌!” అంది సంవేద.
”నేను మీకోటైమిస్తాను. ఆటైంలో తీసుకురండి” అన్నాడు
”అలాగే సర్‌! కానీ…” అంటూ ఆగిపోయింది
”ఎనీ డ్‌ౌ…?” అన్నట్లుగా చూశాడు.
”మీరెక్కువ టైం తీసుకుాంరేమో… నాకు మనీ అర్జ్‌ం” అంది తన అవసరాన్ని మళ్లీ గుర్తుచేస్తూ…
ఒక్కక్షణం ఆలోచనగా పెదవి కొరుకుతూ కిందకి చూశాడు. జీవితంలో అన్నీ మనకు కావల్సినట్టుగా జరగవు. కావల్సినట్టుగా జరగట్లేదు కాబ్టి జీవించటం మానలేం. ఏది జరిగినా దాన్ని మనకు సంతోషం కలిగించేదిగా మలుచుకోవాలి. గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేం.. అందుకే ఏదైనా ఒక వెలితిని పూరించాలన్నా, సంతోషించాలన్నా మనలోపల మనం ఉన్నతంగా ఊహించుకుంటున్న వ్యక్తికి హెల్ప్‌ చేసే అవకాశం దొరకటంలో వుంటుందాంరు. దొరికిందా అంతకన్నా మహదానందం ఇంకొకి వుండదు. దీన్ని ద్రోణ మంచి అవకాశంగా భావించాడు.
”రేపు మార్నింగ్‌ లెవెన్‌కి తీసుకురండి!” అన్నాడు ద్రోణ. లేచి నిలబడింది సంవేద. అతనికి ‘నమస్తే’ చెబుతున్నట్లు రెండు చేతులు ఓచోట చేర్చి… ”వెళ్లొస్తాను సర్‌!” అంది.
”అలాగే” అన్నట్లు అతను కూడా లేచి ఆమెతో రెండడుగులు వేశాడు. అంతకన్నాఎక్కువ వేస్తే శృతిక చూస్తుంది అదీకాక వెయ్యాల్సిన అవసరాన్ని బ్టి ఎన్నో యోజనాల దూరంలో ఓ ఎడారిలో నిలబడినట్లనిపించి… ”ఒక మార్మిక లోకంలో నుండి నన్ను వినీ వినీ నాగుండెలపై ఒదిగిపోతావా.” అని ఒకప్పుడు ద్రోణ తన డైరీలో సంవేదను ఉద్దేశించి రాసుకున్న వాక్యాలను గుర్తు చేసుకున్నాడు.
ప్రేమించేవాళ్లు వున్నారని తెలియటం ఓ వరమైతే తెలియకపోవటం ఓ శాపం కదా! అతని మనసు అగ్ని సరస్సు అయి వేడినిట్టూర్పుని మిగిల్చింది.
జ జ జ జ జ
సంవేద ఇంికెళ్లగానే ఆత్రంగా ఆమె చేతికి కూరగాయలున్న బుట్టనిచ్చి ”మీ అత్తయ్య నిన్ను ఎక్కడికెళ్లావని అడుగుతోంది. మార్క్‌ె కెళ్లానని చెప్పు” అన్నాడు గంగాధరం.
వెంటనే ఆమె కళ్లలో నీళ్లు చిప్పిళ్లి ”మామయ్యా!” అంది.
”నీకేం పర్వాలేదు. నేనున్నాను కదా!” అన్నట్లు చూశాడు.
ఈ విషయంలో మామయ్య తనకెంత హెల్ప్‌ చేస్తున్నాడో సంవేదకి తెలుసు . అదీకాక ఒక మగ ఆర్టిస్ట్‌ దగ్గరకి వెళ్లి నీ బొమ్మను వేయించుకు రమ్మని ఏ మామ పర్మిషన్‌ ఇవ్వడేమో! ప్రపంచాన్ని చూసిన గంగాధరం ఏదితప్పో, ఏది ఒప్పో గ్రహించగల నేర్పరే కాక. తనలోని పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని గౌరవించగల సంస్కారి కావటం కూడా తన అదృష్టంగా భావించిందామె….
అదే శ్యాంవర్ధన్‌కి తెలిస్తే మెడకోస్తానాండు.
దేవికారాణికి తెలిస్తే నోితో పాటు గుండెలుకూడా బాదుకుంటుంది. ఇద్దరితో ప్రమాదమే! అందుకే… అవసరం అన్ని భయాలను జయిస్తుందన్నట్లు ధైర్యాన్ని కూడదీసుకుంటూ మామా-కోడలు కలిసి మెల్లగా వంటగదిలోకి నడిచారు.
వెళ్లిన పని గురించి ఆతృతగా అడిగాడు గంగాధరం.
”ఆయన నా బొమ్మను వెయ్యనన్నాడు. నిశిత బొమ్మను వేస్తానన్నాడు మామయ్యా!” అంది.
”అదేిం! ఎందుకలా!” అన్నాడు ఆశ్చర్యపోయి.
”ఎప్పినుండో అలాిం బొమ్మ వెయ్యాలని ఇష్టమట.. వీల్‌ చెయిర్‌ని కూడా తీసుకురమ్మన్నారు. దానిమీద నిశితను కూర్చోబ్టెి వేస్తారట” అంది.
ఈయన నవ్వి ”అసలు కారణం అదికాదు. అలాిం బొమ్మలు వేస్తే! కొన్ని సంస్థలు ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు కొాంయి. నేరుగా ప్రజల్లోకి దూసుకుపోతాయి. అవార్డులాిం వాికి సులభంగా నిలబడతాయి. అతనికి పేరొస్తుంది. డబ్బు వస్తుంది. అదీ అతని స్వార్థం.” అన్నాడు.
”కానీ ఆయన్ని చూస్తుంటే చాలా పద్ధతిగా అన్నించాడు మామయ్య! మీ దగ్గర పర్మిషన్‌ తీసుకొని వెళ్లినాకూడా ‘అతను మగవాడు కదా! ఎలా బిహేవ్‌ చేస్తాడో’ అన్న ఆలోచన భయంగానే వుండింది. కానీ అలాిం వాతావరణమేమి లేదక్కడ… ” అంది సంవేద
”అందరు నా కొడుకు లాగే వుాంరా? అక్కడక్కడ మంచి ముత్యాలు కూడా వుాంయి. అన్నీ కూి ముత్యాలే అయితే మనుషుల మనుగడ విషతుల్యం కాదూ!” అనిపైకి అనలేక మనసులోనే దాచుకున్నాడు.
”కానీ మీ సందేహం అతను వ్యాపార దృష్టితో ఆలోచిస్తున్నాడనా మామయ్యా?” అంది సంవేద.
”అతని ఆలోచనలు అతనికి వుాంయిలే సంవేదా! ప్రస్తుతం మన అవసరం తీరితే చాలు.. దానితో అతనెంత వ్యాపారం చేసుకుంటేనేమి! ఎంత సంపాయించుకుంటే నేమి! మనకది అవసరంలేదు. అతనెప్పుడు అపాయ్‌ింమ్‌ెం ఇస్తే అప్పుడు తీసికెళ్ళు నిశితను…” అన్నాడు అతిమామూలుగా గంగాధరం.
”అలాగే మామయ్యా! మీకు, అత్తయ్యకు కాఫీ కలిపిస్తాను. నిశిత ఎక్కడుందో ఏమో! కూరలు తరిగిస్తుంది. నిశీ!” అంటూ గ్టిగా కేకేసింది సంవేద.
అక్కడే వున్న నిశిత మెల్లగా స్టిక్‌ పట్టుకొని నడుస్తూ వచ్చింది.
గంగాధరం వెళ్లి భార్య గదిలో కూర్చున్నాడు.
ఆమె ఈమధ్యన భగవద్గీతను వదలకుండా చదువుతోంది. ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. మనుషుల్లో మార్పు ఇంత సహజమా అనుకున్నాడు. సహజమే కాదు అవసరంకూడా… దాని ద్వారా క్రమశిక్షణ అనేది తెలియకుండానే అలవడుతుంది. అనుకున్నాడు గంగాధరం.
జ జ జ జ జ
తెల్లవారింది.
ద్రోణ చెప్పిన టైంకు – నిశితను తీసుకొని అతని ఇంికి వెళ్లింది సంవేద. వాళ్లు వెళ్లిన టైంకు ద్రోణ సిద్ధంగా వున్నాడు.
పలకరింపులు అయ్యాయి. పరిచయాలు అయ్యాయి.
నిశితను వీల్‌చెయిర్‌లో కూర్చోబ్టెి ద్రోణ స్టాండ్‌బోర్డ్‌ ముందు నిలబడ్డాడు.
అతను చక, చక స్కెచ్‌ గీశాడు. ఆ తర్వాత రంగులు కలుపుకున్నాడు. ఏకాగ్రతతో బొమ్మవేస్తూ బోర్డ్‌కి అభిముఖంగా నిలబడ్డాడు. కుంచెను పట్టుకున్న అతని చేతివేళ్లు చురుగ్గా కదులుతున్నాయి. ఆ కుంచె స్పర్శకి సముద్రతరంగాలు తాండవ నృత్యం చేసినట్లు ఆ బోర్డ్‌నిండా నిశితరూపం ఆక్రమించుకుోంంది.
నిశితకి వెనకాల నిలబడి ద్రోణని శ్రద్ధగా గమనిస్తోంది సంవేద. ద్రోణ బిహేవియర్‌ని అంచనా వేస్తూ ఆలోచిస్తోంది.
‘ఇతనేిం ఇంత సిన్సియర్‌గా, ఇంత డీస్‌ెంగా వున్నాడు? లోకంలో వుండే మగవాళ్లంతా ఇలాగే వుాంరా? ఇలా వుంటే తన భర్త ఒక్కడే అలా ఎందుకు వుంటున్నాడు ? ఏది ఏమైనా ఇతనిది అరుదైన పర్సనాలి… ఇంతి స్థిత ప్రజ్ఞత కలిగిన వాడిని భర్తగా పొందిన అతని భార్య ఎంత అదృష్టవంతురాలో కదా! ఒకసారి ఆమెను చూస్తే బావుండు’ అని అనుకోకుండా వుండలేకపోయింది.
నిముషాలు గంల్లోకి మారుతుంటే….
ద్రోణ వేస్తున్న బొమ్మకి ఓ రూపం వస్తోంది.
నిశితకి ఆ అనుభవం అద్భుతంగా వుంది.
అంత గొప్ప ఆర్టిస్ట్‌ ముందు కూర్చుని అలా తన బొమ్మను వేయించుకోవటం గర్వంగా కూడా వుంది.
బొమ్మ వేయటం పూర్తి చేశాడు ద్రోణ…
పినిషింగ్‌ టచ్‌ మిగిలింది.
కుంచె పక్కన ప్టిె, వాష్‌ బేసిన్‌ దగ్గరకెళ్లి చేతులు వాష్‌ చేసుకొని వచ్చాడు.
చెక్‌ రాసి సంవేదకి ఇస్తూ. థ్యాంక్స్‌ చెప్పాడు.
”మీ మేలు మరచిపోలేము సర్‌!” అంటూ ఇద్దరు ఒకేసారి కృతజ్ఞతగా చూశారు.
”ఫర్వాలేదు…”అన్నాడు మృదు గంభీరంగా.
వాళ్లు వెళ్లాక – సంవేద. అంతవరకు నిలబడి ఖాళీ అయిన స్థలం దగ్గరకి వెళ్లి ఆగాడు ద్రోణ… బాగా ఇష్టపడి ప్రేమించిన వాళ్లే దేన్నైనా ఆర్తితో ఆస్వాదిస్తారు. ఆరాధిస్తారు. ఏ విషయంలోనైనా ఆ వ్యక్తిపట్ల ముందుకి వస్తారు. ఏ సాయం చేయానికైనా మనస్పూర్తిగా స్థిరపడ్తారు.. అది అతను గమనించి, తనలోకి తను తొంగి చూసుకున్న వాడిలా సంతోషించాడు.
జీవితంలో లభించే అన్ని సంతోషాలు ఒకేచోట, ఒకే సమయంలో దొరకవు. వేరు వేరు సందర్భాలలో, వేర్వేరు వ్యక్తుల ద్వారా, వేర్వేరు పరిస్థితులలో లభిస్తాయి. తనకు లభించిన అరుదైన సంతోషం సంవేదకి హెల్ప్‌ చెయ్యటం అనుకున్నాడు ద్రోణ.
జ జ జ జ జ
రోజులు గడుస్తున్నాయి.
శుభలేఖలపై అడ్రస్‌లు రాసి, పోస్ట్‌ చెయ్యాలని గంగాధరం, సంవేద ఆపనిమీదే కూర్చున్నారు. పసుపు పూసి అడ్రస్‌ రాస్తోంది సంవేద కోడలు అడ్రస్‌ రాసిన వాిని ఓ చోట చేర్చి….
”సంవేదా! ఈ శుభలేఖపై ద్రోణ అడ్రస్‌ రాయమ్మా!” అంటూఓ శుభలేఖను ఆమె చేతికి ఇచ్చాడు.
”రాస్తాను మామయ్యా! కానీ…” అంటూ ఆగింది.
”అడ్రస్‌ మొత్తం అవసరంలేదు. లోకలే కదా! పేరు మాత్రమే రాయి. పర్వాలేదు” అన్నాడు.
ద్రోణ పేరును ముత్యాల్లాిం అక్షరాలతో రాసింది. ఆ రాయటంలో కూడా బోలెడు కృతజ్ఞత కన్పిస్తోంది.
”వీినిప్పుడు పోస్ట్‌ చెయ్యానికి వెళ్లినప్పుడు…. ద్రోణ దగ్గరకి వెళ్లి సతీసమేతంగా రమ్మని ఓమాట చెప్పి ఈ శుభలేఖను ఇచ్చిరా సంవేదా! ఈ పెళ్లి జరగానికి కారణం ఆయనే కాబ్టి పిలుపు కాస్త గ్టిగా ప్రత్యేకంగా వుంటే బావుంటుందని నిన్ను వెళ్లమంటున్నారు. వెళ్లిరా…!” అన్నాడు.
”సరే! మామయ్యా!” అంటూ పోస్ట్‌ చెయ్యాల్సినవి కవర్లో పెట్టుకొని – వాిపక్కనే ద్రోణకి, ఆముక్తకి ఇవ్వాల్సినవి కూడా పెట్టుకొని…
”వెళ్లొస్తాను మామయ్యా! నిశిత జాగ్రత్త! ” అంది
ఎప్పుడూ చెప్పనిది నిశిత జాగ్రత్త అని చెబుతుంటే గంగాధరం ఉలిక్కిపడి చూశాడు. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకొని ధైర్యం చెప్పాడు.
గేటు దాి రోడ్డెక్కింది సంవేద.
కొద్దిదూరం వెళ్లగానే పోస్ట్‌ఆఫీసు వచ్చింది. వాిని పోస్ట్‌చేసి, ద్రోణ ఇల్లు అక్కడికి దగ్గర కావటంతో నడుచుకుంటూ వెళ్లింది.
గేటు తీసుకొని లోపలకి వెళ్లగానే శృతిక కన్పించింది.
ఆమె ద్రోణ భార్య కాబోలు అనుకొని ‘నమస్తే’! అంది సంవేద. దానికి శృతికలో ఎలాిం కదలికలేదు… ఎవరు నువ్వు? ఎవరుకావాలి? అన్న ప్రశ్నలు లేకుండా – లోపలకి రమ్మన్న ప్రేమతో కూడిన పలకరింపు లేకుండా ”అటు వెళ్లి కూర్చోండి!” అన్నట్లు అదోలాిం నిర్లక్ష్యంతో కూడిన సైగచేసి, చటుక్కున లోపలకెళ్లింది శృతిక.

రెండో జీవితం 9

రచన: అంగులూరి అంజనీదేవి

కోపం మనిషిని పశువును చేస్తుందని విమలమ్మకి తెలియంది కాదు…
”ఆయన బాధంతా ఆయన కొడుకు గురించే అన్నయ్యా! మనం అర్థం చేసుకోవాలి కాని, ఇలా పంతాలకి పోతే కాపురాలు నిలవ్వు… అయినా ఎంత మంది భర్తలు ఉద్యోగరీత్యా బయట ఊళ్లలో గడిపిరావటం లేదు. అంతమాత్రాన వాళ్ల భార్యలు విద్వంసాన్ని సృష్టించుకుంటున్నారా? ఆర్టిస్ట్‌ అన్న తర్వాత అభిమానులు, యాడ్‌ ఏజన్సీలు, సన్మానాలు చేసేవాళ్లు, ఎగ్జిబిషన్లవాళ్లు ఇలా ఎందరెందరో ఫోన్లు చేస్తుంటారు. అందులో ఆడవాళ్లు కూడా మాట్లాడుతుంటారు. అంతమాత్రాన అలిగి పుట్టింట్లో వుండటం… మంచి పద్ధతి కాదు.
ఈ పాటికి మీకంతా అర్థమైవుంటుంది. శృతికకు నచ్చచెప్పండి! అంతేకాని శృతికతోపాటు నన్ను కూడా మీ దగ్గర వుంచుకోవాలని చూడొద్దు… ఇక్కడ నాకో విషయం బాగా అర్థమవుతోంది! అదేమిటంటే మీరు తినగా మిగిలింది తిన్నా నా జీవితం వెళ్లిపోతుంది. నేను మీకు పెద్దభారం కూడా కాను. కానీ నా జీవితం నాకు బరువు అవుతుంది. ఎందుకంటే ఎక్కడ ప్రశాంతంగా ఓ ముద్ద దొరికితే అక్కడ తింటూ కాలం గడుపుదాములే అనుకొనే పిచ్చి శృతికను కాను కాబట్టి…” అంటూ ఆగింది.
చెల్లెలి వైపు అలాగే చూస్తున్నాడు నరేంద్రనాధ్‌.
”నేను వెళ్లి నా ఇంట్లో కార్తీకదీపాలు వెలిగించుకోవాలి. వెళ్లొస్తాను అన్నయ్యా! వెళ్లేముందు ఓమాట! పిల్లల తప్పుల్ని పెద్దవాళ్లు సవరించాలి. సపోర్ట్‌ చెయ్యకూడదు.” అంటూ ఆమె వెళ్తుంటే ఆపలేకపోయాడు.
వాళ్లు మ్లాడుకుంటున్న ప్రతిమాట పక్కనుండి వింటున్న సుభద్రకి తన కూతురు ఏం కోల్పోతుందో అర్థమై మనసు కళుక్కుమంది.
******

రింగ్‌ రాగానే మృదువుగా నవ్వి… కాల్‌బటన్‌ నొక్కి, మొబైల్‌ని చెవి దగ్గర పెట్టుకొని…
”హలో చైత్రికా ఎలా వున్నావ్‌?” అన్నాడు ద్రోణ.
”బాగున్నాను. నువ్వెలా వున్నావు ద్రోణా?” అంది చైత్రిక.
”నేనా ? అదోలా వున్నాను. నువ్వీ మధ్యన ఫోన్‌ చెయ్యట్లేదు కదా! అందుకని … ”అన్నాడు.
నవ్వింది చైత్రిక… వాళ్ల స్నేహం గడ్డిపరక మీద పడ్డ వానచినుకులా ప్రారంభమై ఉదృతంగా వర్షించి జలపాతంలా, నదులుగా, సాగరంలా సాగింది. సాగుతూనే వుంది.
స్నేహమంటే ఒకసారి మాట్లాడితే సరిపోదని. అది ఒక అంతులేని, అంతంలేని అనుభూతని తెలుసుకున్నారు. ‘దేవుడా! ఎవరిని ఎవరికి వశం చేయకు. చేశావా జీవితాంతం వారిని దూరం చేయకు.’ అని వేడుకున్నారు. అలా వాళిద్దరు తమ జీవితపు మలుపు దగ్గర ఆగి బాగా ఆలోచించుకున్నాకనే ఈ స్నేహాన్ని శాశ్వతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
”కానీ నాకు ఎగ్జామ్స్‌ వున్నాయి ద్రోణా! అందుకే ఫోన్‌ చేయ్యలేదు. చాలా సీరియస్‌గా చదువుతున్నాను. ఈసారి నా మార్క్స్‌ విషయంలో నా ఎక్స్‌పెక్టేషన్‌ హైలో వుంది.” అంది.
”ఓ.కె. ఓ.కె. ఎగ్జామ్స్‌ ఎలా రాస్తున్నావ్‌?” అన్నాడు.
”ఇవాళే లాస్ట్‌ ఎగ్జామ్‌ రాశాను. కాలేజినుండి హాస్టల్‌కి రాగానే నేను చేస్తున్న మొదటి పని నీకు కాల్‌ చెయ్యటం… నువ్వేం చేస్తున్నావు ద్రోణా? బొమ్మ వేస్తున్నావా?” అంది.
”అలాంటి పని ఇక చెయ్యనని చెప్పాను కదా!” అన్నాడు. ఆ మాటలు చైత్రికకు నచ్చటంలేదు.
”పట్టుదల అనేది పని చెయ్యటంలో వుండాలి కాని ‘పని’ చెయ్యకుండా బద్దకాన్ని కొని తెచ్చుకోవటంలో వుండకూడదు. నువ్వేమైనా అనుకో ద్రోణా! నువ్వు బద్దకానికి బాగా వశమైపోయావు. మళ్లీ పని చెయ్యాలంటే చెయ్యలేక పోతున్నావ్‌!” అంది.
మాట్లాడలేదు ద్రోణ.
”నువ్వొక మహాకవి గురించి చెప్పావు గుర్తుందా? ఆ కవి అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమించి – ఆ అమ్మాయికి పెళ్లై పోవటంతో జీవితాంతం పెళ్లి చేసుకోకుండా, కవితల్ని రాయకుండా, వున్న ఆస్తుల్ని అమ్ముకుంటూ తాగుతూ లైఫ్‌ని కొనసాగిస్తున్నాడని… ఇప్పుడు నువ్వు చేస్తున్న పని కూడా అలాంటిదే. దానివల్ల ఏమి ప్రయోజనం? పుట్టాక.. అందులో ఆర్టిస్ట్‌గా పుట్టాక తమలో వున్న ఆర్టిస్ట్‌ని తమ కృషితో బయటకి లాగి పదిమందికి పంచాలి కదా! కానీ నువ్వో మంచి పని చేశావులే… దానికి సంతోషించాలి.” అంది.
”ఏంా మంచి పని? ” అన్నాడు అర్థంకాక
”నా పనులు నేను చేసుకోగలను కదా! ఇక పెళ్లెందుకు? పెళ్లి చేసుకుంటే నామనసులో మనిషికి ద్రోహం చేసినట్లు కదా అని ఆ మహాకవిని ఆదర్శంగా తీసుకోలేదు” అంది.
ద్రోణ నవ్వి… ”అంత ఋష్యత్వం నాలోలేదు చైత్రికా! జీవితం కోసం కొన్ని వదులుకోవాలనుకున్నాను. నా ప్రేమను వదులుకొని శృతికను చేసుకున్నాను. అయినా తనకేం తక్కువ చెయ్యలేదు. కానీ తనకే నామీద ప్రేమ లేదు. అదేవుంటే ఈ అపార్థాలు, అనుమానాలు విడి, విడిగా వుండాలనుకోవాలు వుండవు కదా!” అన్నాడు.
”నెమ్మదిగా నేర్పుకోవాలి” అంది
”ప్రేమ నేర్పిస్తే వచ్చేది కాదు.” అన్నాడు
”అఫ్‌కోర్స్‌! కానీ మాటల ప్రభావం కూడా మనిషిని మంచి వైపు మళ్లించే అవకాశం వుంది. అలా నాకు తెలిసిన ఎగ్జాంపుల్స్‌ చాలా వున్నాయి.” అంది తన స్నేహితురాలైన శృతిక పట్ల ద్రోణకి మంచి అభిప్రాయం కలిగేలా చెయ్యాలన్న తాపత్రయంతో…
”నేను అవి వినదలుచుకోలేదు. టాపిక్‌ మార్చు చైత్రికా!” అన్నాడు ద్రోణ.
”సరే! నన్ను నీ పెళ్లిలో సరిగ్గా చూడలేదన్నావ్‌గా.. ఇప్పుడు చూడాలని వుందటున్నావ్‌! అలా నన్ను చూడాలీ అంటే నేను నీదగ్గరకి రావాలి. నేను రావాలి అంటే నువ్వు బొమ్మ వెయ్యాలి. నువ్వు బొమ్మ ఎప్పుడు వేస్తే అప్పుడు వస్తాను.” అంది. ఎలాగైనా అతని చేత మళ్లీ బొమ్మలు గీయించాలని వుందామెకు.
”ఇలాంటి లిటిగేషన్స్‌ పెట్టకు. నాకు నిన్ను చూడాలని వుంది. నా బొమ్మకు, దానికి సంబంధంలేదు.” అన్నాడు
”నేను నీకన్నా మొండిదాన్ని…” అంది.
‘నువ్వనుకున్నట్లు జరగాలీ అంటే నాకు ఇన్సిపిరేషన్‌ కావాలి చైత్రికా! అదంత ఈజీకాదిప్పుడు.. ” అన్నాడు.
”ఒకప్పటి నీ ప్రేయసిని ఊహల్లోకి తెచ్చుకో ద్రోణా!” అంది.
”ఇప్పుడది నావల్ల కాదు.” అన్నాడు సిన్సియర్‌గా.
…ఎలాగైనా పూర్వ వైభవాన్ని ద్రోణకి తేవాలన్న కృషి, పట్టుదల పెరిగి ”నేనో చిత్రాన్ని చెబుతాను. దాన్ని ఆధారం చేసుకొని ఆ టైప్‌లో ఓ చిత్రాన్ని గీయి.” అంది చైత్రిక.
”ఏమిటది?” అన్నాడు ఆసక్తిగా
”ఏపుగా ఎదిగిన కొమ్మలు. వాటికి అందమైన పూలు. ఆ పూలపై వాలటానికి సిద్ధంగా వున్న రంగు, రంగుల సీతాకోకచిలుక… ఇదీ మన కళ్లతో చూస్తే కన్పించే చిత్రం. కానీ మనసుతో చూస్తే… పువ్వు పెదవిలా విచ్చుకుంటుంది. ఆకు కన్నుగా మారుతుంది. ముక్కుస్థానంలో సీతాకోకచిలుక వుంటుంది. మొత్తంగా ముచ్చట గొలిపే ఓ అందమైన మోము మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది…
ఈ చిత్రాన్ని రీసెంట్ గా నేనో మేగజైన్‌లో చూశాను. చాలా బావుంది కదూ! ఆ క్రియేటివిటీ?” అంది.
”ఓ.. అదా! అది ఆక్టావియో అనే చిత్రకారుడు గీసిన బొమ్మ. ఆయన చిత్రించిన అద్భుతమైన చిత్రాల్లో అదో చిత్రం..” అన్నాడు.
”అలాంటి చిత్రాలను ఇన్సిపిరేషన్‌గా తీసుకో ద్రోణా! నువ్వు స్పందించి గీయాలే గాని ఎన్ని అద్భుతాలు లేవు చెప్పు! ప్రస్తుతం నీకై నువ్వు నిర్మించుకున్న ఆ చీకటి ప్రపంచంలోంచి బయటకి రా!” అంది.
”ఈ ప్రపంచమే నాకు కరక్ట్‌ అన్పిస్తోంది.” అన్నాడు ద్రోణ.
అతను చాలా డిప్రెషన్‌లో వున్నట్లు, అందులోంచి బయటకి రావటానికి అతను సుముఖంగా లేనట్లు అర్థమైంది చైత్రికకి..
”ద్రోణా! ఒక్కసారి కళ్లుమూసుకొని దట్టమైన అరణ్యాన్ని వూహించుకో.. అందులో అప్పుడే మొలకెత్తిన చిన్నమొక్కను ఊహించు… దాని చుట్టూ స్నేహితుల్లా పెద్ద, పెద్ద చెట్లుంటాయి. వచ్చిపోయే అతిదుల్లా, కాకులు, చిలకలు కనబడ్తుంటాయి. దగ్గర్లో చిన్న సెలయేరు పారుతుంటుంది. పకక్షులు పాడుతుంటాయి. జంతువులు ఆడుతుంటాయి.
ఆ మొక్కతో చల్లగాలులు ఆత్మీయంగా సంభాషిస్తుంటాయి. ఇది కూడా ఆ మాటలు వింటూ తలవూపుతూ వుంటుంది. వీటన్నితో స్నేహం చేస్తూ ఆ చిన్న మొక్క క్రమంగా ఎదుగుతుంది. దానికి అవసరమైన సారాన్ని భూమి ఇస్తుంది. ఆ బలాన్ని తాకుతూ మొక్క చెట్టుగా మారుతుంది. దాని వేళ్లు నేలలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. చుట్టుపక్కల విస్తరిస్తాయి. అది ఎత్తులో మేఘాలను అందుకుంటుంది. ఆ చెట్టు ఎంత ఎదగగలిగితే అంత ఎదగటానికి అవసరమైన వాతావరణాన్ని ఆ అడవి దానికి కల్పిస్తూ వుంటుంది.
ఆకాశమే హద్దుగా ఎదగగలిగే ఆ మొక్కను ఒక కుండీలోనాటితే! దాని శాఖలను ఎదగకుండా కత్తిరిస్తూ పోతే?
ఆ మొక్క ప్రపంచం చిన్నదైపోతుంది ద్రోణా! దానికి అందాల్సిన సారానికి పరిమితి ఏర్పడుతుంది. దాని సహజమైన ఆకారం దానికి రాకుండా పోతుంది… నీ విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది” అంది చైత్రిక.
నిజమే అన్పించింది ద్రోణకి.
”ద్రోణా! నువ్వు బొమ్మవేసిన వెంటనే వచ్చి నీకు కన్పిస్తాను. నాకోసమైనా వేస్తావు కదూ! ఓ.కె బై.” అంటూ కాల్‌ క్‌ చేసింది.
ద్రోణలో ఏదో సంచలనం బయలుదేరింది.
ఎవరీ చైత్రిక?
నాన్నలా క్లాస్‌ పీకుతోంది. అమ్మలా అక్కున చేర్చుకుంటుంది. అన్నలా అప్యాయతను పంచుతోంది. తమ్ముడిలా తగవులాడుతోంది. మొత్తానికి ఓ మంచి స్నేహితునిలా ‘ఇదికాదు… ఇంకా ఏదో వుంది ప్రయత్నించు.’ అంటూ ఆత్మ స్థయిర్యాన్ని తనలోకి నింపుతోంది.
వెంటనే చైత్రికను చూడాలి. ”నువ్వు కల్గించిన స్పూర్తితోనే నేను మళ్లీ ఈ బొమ్మ వేశాను. వచ్చి చూడు.” అంటూ ఆమెను ఆహ్వానించాలి అనుకుంటూ కుంచెతో రంగుల్ని కలిపాడు.
అక్కడే ఠీవిగా నిలబడివున్న కేన్వాస్‌ అతను తనపై చల్లబోయే రంగుల్ని వూహించుకుంటూ అతని కుంచె స్పర్శకి పులకించింది.
*****

శృతికకి తనమీద తనకే జాలిగా వుంది.
ఇంట్లో ఏ పని చేయబోయినా ”నీకేం రాదు. నువ్వాగు. చెడగొడతావ్‌!” అంటుంది సుభద్ర. అలా అంది కదాని చెయ్యకుండా నిలబడితే ”ఏ పనీ చెయ్యకుంటే ఆ పనెప్పుడు కావాలి?” అని విసుక్కుంటుంది. అటువంటప్పుడు అమ్మలో ఆత్మీయత కాకుండా అధికారం, చిరాకు కన్పించి ఏడుపొస్తోంది.
కూతురు ఏడుపు ఏ మాత్రం పట్టించుకోనట్లు చాలా మామూలుగా వుంటుంది సుభద్ర.
ఇదిలా వుండగా చైత్రికతో ఫోన్‌ కాంటాక్ట్‌ లేకుండా అయింది. ఇదింకా బాధగా వుంది. అసలే చైత్రిక నిండుకుండ. అనవసరంగా భర్తను అప్పగించానేమో! ఎంతో విలువైన క్షణాలను, ఫీలింగ్స్‌ను తన భర్తతో తనకి తెలియకుండా పంచుకుంటుందేమో! ఇదికూడా తను ఇచ్చిన అవకాశమే కదా! అనుకొని లోలోన నిప్పుల ఉప్పెన పొంగినట్లై భరించలేక….
సుమ ఇంటికి వెళ్లి… ”సుమా! నీ సెల్‌ ఇయ్యవే! చైతూకి మిస్‌డ్‌ కాల్‌ ఇస్తాను”. అంది శృతిక.
”ఏం నీ సెల్‌ ఇంకా దొరకలేదా?” అంది సుమ.
”లేదే! సెల్‌ మిస్‌ అయితే ఎక్కడైనా దొరుకుతుందా? డాడీని అడిగాను ఇంకో సెల్‌ కొనిమ్మని… ‘కాస్త ఆగు బిజీగా వున్నాను. కొనిస్తాను.’ అన్నారు. ఆ సెల్‌ పోయినప్పటి నుండి నాకు చైత్రికతో కమ్యూనికేషన్‌ పోయింది.” అంది శృతిక… చైత్రిక ఎవరో సుమకి తెలియదు. సుమవాళ్లు శృతిక పెళ్లి అయ్యాక వచ్చారీ ఊరు.
”ఇదిగో సెల్‌ ! ఆ గదిలోకి వెళ్లి మాట్లాడుకో! మా నాన్న చూస్తారు. ఆయనకి ఇలాంటివి నచ్చవు.” అంది సుమ.
సెల్‌ అందుకొంది శృతిక.
కాల్‌ బటన్‌ నొక్కే లోపలే ప్రచండ గర్జనలా సుమతండ్రి గొంతు విన్పించి హడలిపోయి సెల్‌ పట్టుకున్న చేతిని గుండెలపై పెట్టుకొంది శృతిక.
‘భవ్యా!’ నిద్ర లేచినప్పటినుండి మీ వదిన ఒక్కటే అవస్థపడ్తోంది. వెళ్లి పనిలో హెల్ప్‌ చెయ్యొచ్చుగా… అదేం అంటే ఎగ్జామ్స్‌ వున్నాయంటావ్‌! మా పనులే గాక నీ పనులు కూడా మేమెక్కడ చేస్తాం…” అన్నాడు బైరవమూర్తి. ఆయన మాట్లాడే విధానం చాలా కటువుగా వుంది.
అవతల నుండి మాటలు విన్పించటంలేదు.
తొంగి చూసింది శృతిక…
పెద్ద బుక్‌ని ముందు పెట్టుకొని బుక్‌లోకే చూస్తూ కూర్చుని వుంది భవ్య.
…భవ్య బైరవమూర్తి ఆఖరి చెల్లెలు. సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతోంది.
”డబ్బుకి లోటులేదు నీకు.. నీ మొగుడు ఆర్మీలో వుండి హాయిగా సంపాయిస్తున్నాడు. వెళ్లి ఏదైనా హాస్టల్లో చేరు. ఎంత అన్ననైతే మాత్రం ఎన్ని రోజులు వుంటావిక్కడ? ఇదే రోజూ చెప్పాలనుకుంటున్నా… తెలుసుకుంటావులే అని చూస్తున్నా…” అంటూ వెళ్లిపోయాడు బైరవమూర్తి.
శిలలా నిలబడివున్న శృతిక వైపు చూస్తూ…
”మా నాన్న ధోరణి అదో టైప్‌ శృతీ! మొన్నటి వరకు అత్తయ్యను మాతో సమానంగానే పెంచి, చదివించాడు. పెళ్లిచేసి ఆవిడ పాకిస్తాన్‌ నేను రాజస్తాన్‌ అంటున్నాడిప్పుడు… అప్పటికి అత్తయ్య పాపం రిక్వెస్ట్‌ చేస్తూనే వుంది. ‘ఈ ఒక్క నెలే అన్నయ్యా! హాస్టల్లో ఎలా వుంటుందో ఏమో! అలవాటు పడాలంటే టైం పడ్తుంది. పైగా నాది కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌’ అని. మా నాన్న వినటంలేదు. బహుశా ఇవాళో, రేపో హాస్టల్‌కి వెళ్తుంది అత్తయ్య” అంది సుమ.
శృతిక బిత్తరపోతూ ”ఇదిగోనే నీ సెల్‌! తర్వాత వచ్చి మాట్లాడతా! నాకెందుకో భయంగా వుంది.” అంటూ ఇంటికెళ్లి పడుకొంది శృతిక.
*****

శృతిక నిద్రలేచి బాల్కనీలోకి రాగానే భవ్య తన లగేజిని ఆటోలో పెట్టుకొని హాస్టల్‌ వైపు వెళ్లటం కన్పించి షాక్‌ తిన్నది.
ఆ షాక్‌ లోంచి శృతిక తేరుకోకముందే ”ఏం చూస్తున్నావే అక్కడ? నీకీ మధ్యన ఏం చేయాలో తోచటం లేనట్లుంది. ఎక్కడ నిలబడితే అక్కడే వుంటున్నావ్‌!” అంది సుభద్ర తలకొట్టుకుంటూ…
”అదేం లేదు మమ్మీ! భవ్య హాస్టల్‌కి వెళ్తుంటే చూస్తున్నా… వాళ్లన్నయ్య మరీ అంత కఠినంగా వుండక పోతేనేం? చెల్లెలేకదా! అనుకుంటున్నా…” అంది అమ్మవైపుకి తిరిగి శృతిక.
ఆమె కూతురివైపు చూడకుండా ”నువ్వనుకుంటే సరిపోతుందా? వాళ్ల ఇబ్బందులు ఎలా వున్నాయో ఏమో! ఆడపిల్లను ఒకసారి బయటకి పంపాక మళ్లీ ఇంట్లో పెట్టుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే వుంటుంది. పైగా పుట్టింటికొచ్చి తిష్టవేసే వాళ్ల దగ్గర తిండికని, అవసరాలకని డబ్బు తీసుకోలేరు. ప్రీగా పెట్టాలంటే పెట్టలేరు. అది అర్థం చేసుకొని ముందే భవ్య హాస్టల్లో వుండి వుంటే సరిపోయేది. ఇప్పుడు వెళ్తుంది కాబోలు… ఇందులో అంత ఫీలవ్వాల్సిందేమి లేదు. అన్నిచోట్ల ఇప్పుడు అలాగే జరుగుతోంది.” అంది సుభద్ర.
”కానీ … మమ్మీ! భవ్య కష్టపడి తను అనుకున్న స్థాయిని రీచ్‌ అయిందంటే త్వరలోనే కలెక్టర్‌ అవుతుంది. అప్పుడు సుమ తండ్రి ఏమవుతాడు?” అంది శృతిక.
”ఏమీ కాడు. కలెక్టర్‌ భవ్య నా చెల్లెలు అని నలుగురికి చెప్పుకుంటాడు.” అంది సుభద్ర.
”సుమ తండ్రిది ఇంత చిన్నబుద్దా మమ్మీ? ఆయనతో పోల్చుకుంటే డాడీ ఎంత మంచివాడు. ఇప్పటిక్కూడా అత్తయ్యల్ని గౌరవిస్తాడు.” అంది.
”అత్తయ్యల్నే కాదు. నిన్నుకూడా గౌరవిస్తాడు.” అంటూ లోపలకెళ్లింది. ఉలిక్కిపడింది శృతిక మనసు…
ఏమిటో ఈ మనుషులు! మనీమనుషులై పోతున్నారు. మనిషికీ, మనిషికి మధ్యన గౌరవభావం లేకపోతే లోపల ఎంత మమకారం వుండి ఏం లాభం… ఇన్నాళ్లు హద్దులు, సరిహద్దులు అనేవి దేశానికి వుంటాయికాని మనుషులకి, మనసులకి వుండవు అనుకునేది కానీ అవి వుండేదే మనుషుల మధ్యన అని ఇప్పుడు తెలిసింది.

*****

ఆముక్త చాలా రోజుల తర్వాత ద్రోణను చూసి ఆశ్చర్యపోయింది.
”ద్రోణా! నువ్వు మళ్లీ బొమ్మవేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. నిన్ను కదిలించి, నీచేత మళ్లీ కుంచె పట్టించిన ఆ మహత్తర శక్తి ఏంటో తెలియదు కాని నాకు ఆనందంగా వుంది. నా కవితకు ఎప్పుడు వేస్తావు?” అంది ఆముక్త అతనికి ఎదురుగా కూర్చుని ఉత్సాహంగా.
నవ్వాడు ద్రోణ.
”సరే! నీ ఇష్టం! నీకు ఎప్పుడు వెయ్యాలనిపిస్తే అప్పుడు వెయ్యి నాకేం అభ్యంతరం లేదు.” అంది. నన్ను మించినవాళ్లు లేరు అన్నంత హుందాగా కూర్చుని, స్టైల్‌గా చేతులు వూపి…
చేతులు వూపటం, ఆ స్టైల్‌ చూసి గట్టిగా నవ్వాడు ద్రోణ.
ద్రోణనే చూస్తూ… ‘ఎన్ని రోజులైంది ద్రోణ నవ్వి… ఎంత హాయిగా నవ్వుతున్నాడు. ఆ నవ్వులో ఎంత తృప్తి. దేన్నో జయించినపుడు ఆ విజయం గుర్తొచ్చినప్పుడు నవ్వే నవ్వులో వుండే వెలుగు అది. అది మామూలు నవ్వు కాదు.
”ఈ మధ్యన యాడ్‌ ఏజన్సీ వాళ్లు ఓ అమ్మాయి బొమ్మను వెయ్యమన్నారని తెలిసింది. ఎప్పుడు వేస్తున్నావు ద్రోణా?” అంది ఆముక్త.
”దానికింకా టైముంది ఆముక్తా! ఆ అందం కోసమే అన్వేషిస్తున్నాను. అదెలా అంటే ఒక అందమైన అమ్మాయి నాకు మోడల్‌గా దొరికినప్పుడు దాన్ని ప్రారంభిస్తాను.” అన్నాడు.
”ఉత్తినే దొరుకుతారా అమ్మాయిలు?” అంది ఆముక్త.
”దొరకరు దొరికితే కొంత డబ్బు ఇస్తాను. నా దగ్గర ఆ అమ్మాయి కొన్ని గంటలు కూర్చోవలసి వుంటుంది.” అన్నాడు.
”కొండ ప్రాంతాల్లో దొరుకుతారేమో ట్రై చెయ్యలేక పోయావా?” అంది.
”ఇంకా టైముందని చెప్పానుగా ఆముక్తా! ఇప్పుడు వేరే బొమ్మ వేస్తున్నాను. ఇది పూర్తి అయ్యాక దానిపని చూస్తాను” అన్నాడు.
”ఒకసారి నావైపు చూడు ద్రోణా! నాలాంటి అందం అయితే సరిపోతుందా? నన్ను మోడల్‌గా వుండమంటారా?”అంది.
పెదవి విరిచాడు ద్రోణ.
మూతి ముడుచుకొంది ఆముక్త.
”నా కవితకి ఎలాగూ బొమ్మ వెయ్యట్లేదు. కనీసం నా రూపమైనా నీ బొమ్మల్లో రూపుదిద్దుకుంటుందని ఆశపడ్డాను. అది కూడా పోయింది.” అంది నిరాశగా.
”బాధపడకు ఆముక్తా! నువ్వు బాగా రాస్తావు. ఒక కవయిత్రిగా మంచిపేరు సంపాయించుకుంటావు. దేనికైనా టైం రావాలి.” అన్నాడు.
”నిజంగా ఆ టైం వస్తుందా ద్రోణా?” అంది ఆశగా ముందుకి వంగి…
”వస్తుంది. డౌట్ లేదు.” అన్నాడు
”శృతికెప్పుడొస్తుంది?” అంది సడన్‌గా.
అతని ముఖం వివర్ణమైంది.
ఇకపై ఏ మాత్రం మాటలు పెరిగినా కొడుకు ముఖంలో రంగులు మారతాయని, ప్రశాంతతను కోల్పోతాడని ”ఆముక్తా! ఇలారా!” అంది హాల్లో కూర్చుని టి.వి.లో స్టార్‌ మహిళ పోగ్రాం చూస్తున్న విమలమ్మ.
”ఆంటీ పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తాను వర్షిత్‌!” అంటూ లేచి హాల్లోకి వెళ్తుంటే ఆముక్త వేసుకున్న డ్రస్‌కాని, ఖరీదైన అలంకరణ కాని రాశిపోసిన డబ్బులకట్టని తలపింప చేసేలా వున్నాయి… మణిచందన్‌ గారి బిజినెస్‌ టాలెంటంతా ఆమెలో కన్పిస్తుంది.
”ఆంటీ! ఏంటి? పిలిచారు…”అంటూ చాలా ఉత్సాహంగా వెళ్లి ఆమె పక్కన కూర్చుంది.
” ఈ స్టార్‌ మహిళ పోగ్రాం చూస్తున్నప్పుడు నువ్విందులో పాల్గొంటే తప్పకుండా విన్‌ అవుతావని అన్పిస్తుంది ఆముక్తా!” అంది విమలమ్మ ఆముక్తను డైవర్ట్‌ చెయ్యాలని…
ఆముక్త కళ్లు లైట్ హవుసుల్లా తళుక్కుమన్నాయి. అంతలోనే…
”కానీ ఆంటీ! నాకెందుకో ద్రోణతో బొమ్మ వేయించుకునే స్థాయిలో కవిత రాస్తే చాలనిపిస్తుంది. దాని ముందు ఇలాంటివన్ని నార్మలే… కానీ నేనలా రాయలేనేమో” అంటూ అప్పటికప్పుడే డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆమెను అందులోంచి బయటకు తీసుకురావాలని…
”చూడమ్మా! మనిషికి ఆశ అవసరం… ఒక ఆశావాది విమానాన్ని కనిపెడితే నిరాశావాది పారాచూట్ ని కనిపెడతాడు. ఆశకి, నిరాశకి మధ్యన వున్నవాడు నేలమీదనే నిలబడి ఆ ఇద్దరిలో తప్పుల్ని వెతుకుతాడు. ముగ్గురు చేసేది పనే. దేన్ని సాధించాలన్నా ప్రయత్నలోపం వుండకూడదు కదా! నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అదీకాక మనుషులు నేలమీద వున్నంత సేపు స్థిరంగానే వుంటారు. వాళ్లను ఎవరూ పట్టించుకోరు. పైకి ఎదిగే కొద్ది ప్రత్యేకంగా కన్పిస్తారు. అది కూడా నువ్వు గమనించాలి. నువ్వేం కోరుకుంటున్నావో కూడా నీకు తెలియాలి. కోరికలో బలం వుంటే తప్పకుండా నెరవేరుతుంది.” అంది విమలమ్మ.
నిజమే కదా! అన్నట్లు ఆమెనే చూస్తూ, ఆమె మాటల్ని వింటూ కూర్చుంది ఆముక్త.
రాత్రి పన్నెండు దాటాక…
భార్య పక్కన పడుకొని వున్న శ్యాంవర్ధన్‌ నిద్రలేచి, సడన్‌గా బెడ్‌ దిగి, నేరుగా నిశిత దగ్గరకి నడిచాడు.
గంగాధరం పడక దేవికారాణి గదిలోకి మారినప్పటి నుండి శ్యాంవర్ధన్‌కి నిశిత దగ్గరకి వెళ్లానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయింది.
ఎప్పుడెళ్లినా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుందే కాని సహకరించటంలేదు.
తనేమైనా – ఇంద్రుడు కవచ కుండలాలు యిమ్మని కర్ణున్ని అడిగినట్లు… ద్రోణాచార్యులు బొటనవేలు ఇమ్మని ఏకలవ్యుడ్ని అడిగినట్లు… ఆమె శరీరంలో ఓ భాగాన్నేమైనా కోసిమన్నాడా? అలాంటిదేంలేదే! చిన్నకోరిక… అదీ ఒకే ఒకసారి.. ఆ తర్వాత అది కొనసాగకపోయినా పర్వాలేదు. దాన్నే ఓ జ్ఞాపకంగా మిగిల్చుకుందాం అని కూడా అన్నాడు. వినటం లేదు. ఇవాళ ఎలాగైనా భయపెట్టో, బ్రతిమాలో దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు.
… హాల్లో లైటార్పి వుంది. చుట్టూ చీకటి… బయట రోడ్డుమీద వెలుగుతున్న స్ట్రీట్ లైట్ వెలుగు కిటికీలోంచి లోపలకి ప్రసరిస్తూ నిశిత పడుకున్న దగ్గర పడ్తోంది.
నిశిత కదిలింది. ఆమెకు ఈ మధ్యన సరిగా నిద్రరావటంలేదు.
బావ ఎప్పుడొస్తాడో, ఏం చేస్తాడో! తనను తను ఎలా రక్షించుకోవాలో తెలియక ఊపిరిబిగబట్టి నిద్రలో లేచి కూర్చుంటోంది. కారడవిలో ఏదో మృగం తరుముతున్నట్లు రోజూ అదే భయం, అదే కలవరింత. ఎవరి గదుల్లో వాళ్లు నిద్రపోతూంటే…కళ్లు తెరిచి చూస్తున్న ఆమెకు తనవైపే వస్తున్న బావ కన్పించి ఇది నిజమా!’ అని వణికిపోతూ చూసింది.
”నాకోసం ఎదురు చూస్తున్నావా నిశీ! వెరీగుడ్‌!” అంటూ ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు శ్యాంవర్ధన్‌.
అతన్నలా చూడగానే భయంతో చేష్టలుడిగి ఆమె గొంతు తడారిపోయింది. కట్టెలా బిగుసుకుపోయింది. అతనదేం గమనించకుండా, ఆత్రంగా ఆమెనే చూస్తూ…
”ఏం చేయను? ఆఫీసులో వర్క్‌ చేస్తున్నంతసేపు నీ ధ్యాసే… ఇంటికొచ్చాక నీ పక్కనే వుండాలనిపిస్తుంది. మా అమ్మా, నాన్న, మీ అక్క చూస్తారని భయం. అయినా నిన్ను చూడందే మాట్లాడందే వుండలేకపోతున్నా… నడుస్తున్నా గుర్తొస్తావ్‌! కూర్చున్నా గుర్తొస్తావ్‌! నిద్రలో గుర్తొస్తావ్‌! అర్థం చేసుకో…”అన్నాడు. అతని గొంతులో మాటల్లో విన్పిస్తున్న బలీయమైన మార్పుకి ఆమె గుండె జల్లుమంది.
”బావా! నేను స్వతహాగా కుంటిదాన్ని… తల్లీ, తండ్రి లేనిదాన్ని… మీరు, అక్కా తప్ప నాకు ఎవరూ లేరు. అందుకే మీ దగ్గర అంత తిండి తిని తలదాచుకుంటున్నాను. నా నిస్సహాయత మీకు తెలుసు. నాకు రక్షణ ఇవ్వండి. ముఖ్యంగా ఓ స్త్రీ ఎలాటి నీడను కోరుకుంటుందో మీనుండి అలాంటిదే ఆశిస్తున్నాను.” అంది అర్థింపుగా చేతులు జోడించి….
తెల్లగా, పొడవుగా, నాజూగ్గా వున్న ఆమె చేతులవైపే చూస్తూ…
”నన్ను కూడా అర్థం చేసుకో నిశీ! ఒక మగవాడు ఏం కోరుకుంటాడో తెలుసుకోలేని చిన్నపిల్లవు కావు నువ్వు… మీ అక్క స్థానాన్ని నీకు ఇవ్వలేకపోయినా ఆ స్థానంలో నిన్ను ఊహించుకుంటున్నాను. నీకేం తక్కువ చెయ్యను. మీ అమ్మా! నాన్నా పోయినప్పటినుండి నేనే కదా నిన్ను చూస్తున్నది. ఆ మాత్రం నమ్మకం లేదా నీకు?” అన్నాడు
”వుంది మీ సహాయాన్ని మరచిపోను”అంది.
”దానివల్ల నాకేంటి లాభం…? చూడు నిశీ! అవసరాన్ని అవసరంతోనే పంచాలి. ఉపయోగాన్ని ఉపయోగంతోనే తీర్చాలి. ప్రస్తుతం నీకు తిండి, నీడ కావాలి. నీ దగ్గర డబ్బు లేదు. అది నేను ఇస్తున్నాను. మరి నాకేమి ఇస్తావు నువ్వు? ఏదో ఒకటి ఇచ్చి తీర్చుకోవాలి కదా! ఇలా మొండికేసి ఋణ భారాన్నెందుకు పెంచుకుంటున్నావు?” అన్నాడు.
మాట్లాడలేని నిశిత మనసు రోదిస్తుంటే తలవంచుకొంది.
”నిన్ను బలవంతం చేసి అనుభవించటానికి క్షణం పట్టదు. అలాంటి అనుభవం నాకొద్దు. నువ్వు కూడా నన్ను కోరుకోవాలి. అయినా నాకేం తక్కువ?” అన్నాడు
”మా అక్కకేం తక్కువని నా వెంటపడ్తున్నారు?” సూటిగా చూస్తూ అడిగింది.
”మీ అక్కలో ఆడతనం లేదు” అన్నాడు
”అబద్దం ….” అంటూ గట్టిగా అరిచింది నిశిత.
ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి పిట్టగోడ దగ్గర నిలబడి శ్యాంవర్ధన్ని గమనిస్తున్న గంగాధరం | సంవేద ఆ అరుపుకి ఉలిక్కి పడ్డారు.
”అబద్దమేం కాదు. ఇంట్లో చెబితే మావాళ్లు మళ్లీ పెళ్లి చేస్తారని… సంవేదను వెళ్లగొడతారని ఆలోచిస్తున్నాను.. నువ్వు ఒప్పుకుంటే నువ్వూ-సంవేద ఇక్కడే వుండొచ్చు. ఆలోచించుకో. తొందరేం లేదు.” అంటూ నిశిత గుండెలో ఓ విస్పోటనం పేల్చి, లేచి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు… అతని కళ్లకి నిశిత అందమైన ముఖం తప్ప ఇంకేం కన్పించటంలేదు.
అతనలా వెళ్లగానే గుండెలనిండా గాలి పీల్చుకొని ‘హమ్మయ్యా!’ అనుకుంటూ – వేలు కూడా బయకి కన్పించకుండా నిండుగా దుప్పి కప్పుకుంది నిశిత.
…వెనుదిరిగిన గంగాధరం సంవేదను చూసి ‘నువ్వా!’ అంటూ స్థాణువయ్యాడు.
”అవును మామయ్యా నేనే!” అంది లోస్వరంతో
”నువ్వెప్పుడొచ్చావ్‌?” అన్నాడు తడబడుతూ.. కొడుకు నిర్వాకం కోడలికి తెలిస్తే కాపురం వుండదని భయపడ్తున్నాడు గంగాధరం.
”మీ వెనకాలే వచ్చాను మామయ్యా!” అంది. ఆమె మానసిక స్థితి అప్పటికప్పుడే చాలా నీరసంగా మారింది.
ఆమెను అర్థం చేసుకున్నాడు గంగాధరం…
ఇలాంటి పరిస్థితిని ఏ ఆడపిల్లా ఓర్చుకోలేదు. వెంటనే వెళ్లి భర్త కాలర్‌ పట్టుకొని అటో, ఇటో తేల్చుకొని వుండేది. కానీ సంవేదలోని సహనం భూదేవిని మించి కన్పిస్తోంది. అంతేకాదు ఆమె అంతరంగంలో ఏర్పడ్డ అల్లకల్లోలాన్ని అణచుకుంటూ నిండు గోదావరిని తలపింపజేస్తోంది.
ఆమెనలాగే చూస్తూ ”సంవేదా! నీ మౌనం చూస్తుంటే నాకు భయంగా వుంది. గట్టిగా ఏడువు తల్లీ! కొంతయినా ఆ భారం తగ్గితే మామూలు మనిషివవుతావు.” అన్నాడు
చీకటి వెలుగులో ఆయన్నలా చూస్తుంటే ఎంతో ఆత్మీయంగా అన్పించి ముఖాన్ని దోసిలితో కప్పుకొని వుదృతంగా ఏడ్చింది.
కొద్దిసేపు గడిచాక… ఉప్పెన ఆగి ప్రకృతి చల్లబడ్డట్టు పవిట కొంగుతో కళ్లు తుడుచుకొంది.
”ఇలా కూర్చో సంవేదా!” అంటూ ఆ ఇద్దరు పిట్టగోడపై కూర్చున్నారు.
కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి.
”మామయ్యా!” అంటూ మెల్లగా పిలిచింది సంవేద.
”ఏమిటో చెప్పు సంవేదా?” అన్నాడు
”ఒంట్లో ఓ భయంకరమైన వ్యాధిని పెట్టుకొని తెలిసికూడా పైకి చెప్పుకోలేని రోగిలా బాధపడ్తోంది నిశిత… ఒకవైపు నా జీవితం, ఇంకోవైపు ఆమె జీవితం రెండు అర్థరహితంగా కన్పిస్తూ ఆమెను భయపెడ్తున్నాయి. ఇప్పుడేం చేద్దాం మామయ్యా?” సలహా అడిగింది సంవేద.
”నిశితకి పెళ్లి చేద్దాం సంవేదా!” అన్నాడు గంగాధరం.
”నిశితను పెళ్లెవరు చేసుకుంటారు మామయ్యా!” అంది నీరసంగా
”మీ బంధువులకి చెప్పి చూడు. నేను కూడా నాకు తెలిసిన వాళ్లతో మాట్లాడతాను. మనకి మంచి సంబంధంగా అన్పిస్తే ఇచ్చి చేద్దాం… వీలైనంత త్వరగా చేద్దాం…” అన్నాడు.
”పెళ్లంటే మాటలు కాదు. పైగా అది హ్యాండిక్యాప్‌డ్‌ అని తెలిస్తే దాన్నెవరు చేసుకోరు. పెళ్లి కాకుండా ఇంకేదైనా దారివుంటే చూడండి మామయ్యా” అంది.
”సహజంగా ఆడవాళ్లకి పెళ్లే సెక్యూరిటీ! అందులో నిశితకి అదే ఎక్కువ సేఫ్టీ… ఆలోచించు” అన్నాడు.
”స్వతహాగా గొప్ప మానవత్వంతో కూడిన మనిషైతేనే దాన్ని చేసుకోటానికి ముందు కొస్తాడు. అలాటి వ్యక్తి దొరుకుతాడా మామయ్యా?” అంది సందేహంగా.
”రకరకాల వ్యక్తులతో కూడిన ప్రపంచం ఇది. వెతికితే తప్పకుండా దొరుకుతాడు.” అన్నాడు.
”వెతకానికి డబ్బు కావాలిగా మామయ్యా!” అంటూ అసలు విషయం బయటపెట్టింది సంవేద.
”మీ నాన్నగారు నిశిత కోసం ఏమి దాచివెళ్లలేదా? ” అన్నాడు.
”లేదు మామయ్యా! ఆయన సంపాదన ఆయన తాగుడికి పోగా మిగిలింది ఇంటి ఖర్చులకి సరిపోయేది. ఆ తర్వాత నాకు పెళ్లి చేశారు. ఇంకేం మిగల్చకుండానే వెళ్లిపోయాడు.” అంది బాధగా.
”బాధపడకు. నాకు తెలిసిన చాలా ప్యామిలీలు ఇలాగే వున్నాయి. కానీ ఇలాంటి టైంలోనే తట్టుకొని నిలబడాలి. నువ్వు నిలబడగలవు. నీ మానసికస్థాయి ఎంత బలమైందో ఇంతకుముందే చూశాను.” అన్నాడు. తన భర్తను అలాంటి స్థితిలో చూసి కూడా పెదవి కదపకుండా మౌనసముద్రంలా నిలబడిన కోడల్ని చూసి… ఇప్పటికీ ఆశ్చర్యంగా వుందాయనకి…
తన కొడుకులో మాత్రం పైకి కన్పించరుకాని – రావణుడు, నరకాసురుడు, జరాసందుడు కలిసికట్టుగా వున్నారు. ఏమాత్రం సందేహంలేదు.
ఆమె మౌనం చూసి ”నా దగ్గర కొంత డబ్బు వుంది. అప్పట్లో ఆ డాక్టర్‌గారు నా జీతంలోంచి కొంత డబ్బును బ్యాంక్‌లో వేశాడు. దాన్ని దీనికి వాడతాను. వెళ్లి పడుకో సంవేదా!” అన్నాడు ఆయన అక్కడ నుండి లేచి వెళ్తూ.
సంవేద వెళ్లి భర్త పక్కన పడుకొని నిద్రరాక కదులుతోంది.
”ఏంటా కదలటం? ఇరిటేషన్‌ వస్తోంది. కదలకుండా పడుకో.. అసలే హెడేక్‌గా వుంది.” అన్నాడు శ్యాంవర్ధన్‌.
కంగుతిన్నది సంవేద. ‘ఇతనింకా మేలుకొని వున్నాడా?’ అని మనసులో అనుకొని కర్రలా బిగుసుకుపోయి పడుకొంది.
నిశితను ఎలా కాపాడాలి? అన్న ప్రశ్న ఆమె బుర్రలోకి చేరి తేనేటీగలా కుడుతోంది.
పెళ్లిచేసి పంపటమనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. అందుకే కొద్దిరోజులు బంధువుల ఇంట్లో వుంచాలనుకొంది. ‘ఏ బంధువు ఇల్లయితే బావుంటుందా!’ అని ఆలోచించింది. ఆమె సర్వే ప్రకారం ప్రతి ఇంట్లో మగవాళ్లున్నారు.. భర్తో, తమ్ముడో, అన్నో, బావో, మరిదో ఇలా ఎవరో ఒకరు ప్రతి ఇంట్లో వున్నారు.
వాళ్లందరికన్నా శ్యాంవర్ధన్‌ బెటర్‌… ఏదో ‘నీ ఇష్ట ప్రకారమే నిన్ను తాకుతా’ అని చెప్పాడు. ఇది కొంతమేలైంది. పశువులా పైన పడకుండా అనుకొని నిద్రలోకి జారుకొంది సంవేద.
*****
శృతికవైపు బాణాలను సంధిస్తున్నట్లు చూస్తూ…
”ఈ పనిచేసే పద్ధతి ఇదేనా? ఇలాగే చేస్తారా ఎవరైనా? ఏ పని ఎలా చెయ్యాలో తెలియదా? ఇంకా చిన్నపిల్లవేనా నువ్వు?” అంది సుభద్ర.
బిత్తరపోయింది శృతిక…
తల్లిలో కొత్తతల్లిని చూస్తున్నట్లై ”నేను బాగానే చేశాను మమ్మీ! దాన్నోసారి చూడు!” అంది తల్లి సరిగ్గా చూడకుండానే తనను అంటుందన్న సత్యాన్ని జీర్ణించుకోలేక…
శృతికను ఇంకా తీక్షణంగా చూస్తూ… ”సరిగ్గా చూడకుండానే మాట్లాడుతున్నాననుకుంటున్నావా?” అంది.
”అది కాదు మమ్మీ! నువ్వెందుకిలా కోప్పడుతున్నావ్‌? కనీసం అదైనా చెప్పు?” అంది ఏ మాత్రం భయపడకుండా తల్లినే చూస్తూ…
”అన్నీ చెప్పాలి నీకు? ఒక్కపని కూడా సరిగ్గా చెయ్యవు. నీకన్నా హేండిక్యాప్‌డ్‌ పిల్లలు నయం.. ఏదో కుంటు కుంటూనైనా చక్కగాచేస్తారు.” అంటూ అక్కడనుండి లోపలకి వెళ్లింది సుభద్ర.
ముఖంమీద పేడనీళ్లు చల్లినట్లు ఏడుపొచ్చింది శృతికకు.
నరేంద్రనాధ్‌ ఆఫీసునుండి రాగానే కూతురు కన్పించకపోవటంతో…
”శృతీ!” అన్నాడు. ఎక్కడున్నా రమ్మన్నట్లు…
”వస్తున్నా డాడీ!” అంటూ ఆయన గొంతు వినగానే ఒక్క అడుగులో వచ్చినట్లు వచ్చింది శృతిక… తండ్రి తప్ప ప్రపంచంలో అందరు రాక్షసుల్లా కన్పిస్తున్నారు శృతికకు.
శృతిక కన్నా ముందే భర్త ముందు నిలబడి ”దాన్నెందుకు పిలుస్తారు? ఏం పని దాంతో? ఏదైనా వుంటే నాకు చెప్పండి! దానికి ఏ పనీ సరిగ్గా రాదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు?” అంది విసుగ్గా చూస్తూ…
”ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే దానికి నువ్వు తల్లిలాలేవు. అత్తలా అన్పిస్తున్నావు. నా చిట్టితల్లికి పనెందుకు చెబుతాను? సెల్‌ఫోన్‌ కొనిద్దామని పిలిచాను. ఇవాళ అందుకే ఆఫీసునుండి ముందుగా వచ్చాను.” అన్నాడు శృతిక వైపు మురిపెంగా చూస్తూ నరేంద్రనాధ్‌.
”దానికిప్పుడు సెల్‌ఫోన్‌ అవసరమా?” అంది ఉరిమి చూస్తూ సుభద్ర.
”ఏంటి అలా ఉరిమి చూస్తావు? నేనేదో గన్‌ కొనిస్తానన్నట్లు…”
”గన్‌ కొనిచ్చినా తప్పులేదు. సెల్‌ కొనిస్తే పిల్లలు ఏ టైంలో ఎలా మారతారో తెలియటంలేదు. ఇదే విషయం మీద తల్లిదండ్రులు టీ.వీల్లో పత్రికల్లో వాపోతున్నారు.” అంది.
”నీకీ మధ్యన ఇలాంటి భయాలు బాగా ఎక్కువయ్యాయి. నువ్వు భయపడి, మమ్మల్ని భయపెట్టకు…” అన్నాడు జోవియల్‌గా చూస్తూ…
”అంత జోగ్గా ఎలా మాట్లాడుతున్నారో…! ఎలా నవ్వుతున్నారో…! అసలు మీకు నిద్రెలా పడ్తుందో నాకర్థం కావటంలేదు.” అంది సుభద్ర.
”చూడు సుభద్రా! చదువుకునే అమ్మాయిలకి సెల్‌కొనిస్తే చదువు పాడయ్యే అవకాశాలున్నాయి. కాని మనమ్మాయికి పెళ్లయింది. నువ్వు నిశ్చింతగా వుండు.” అన్నాడు.
”నిశ్చింతగా వుండానికి అది మొగుడి దగ్గరలేదు. మొగుడ్ని వదిలేసి పుట్టింట్లో వుంది. అది మరచిపోయి తెగ మురిసిపోతున్నారు.” అంది.
అక్కడే నిలబడివున్న శృతిక తల్లి మాటలు వింటున్నా ఏం మాట్లాడలేక చూస్తోంది.
”దానిముందే ఎందుకలా మాట్లాడతావ్‌! అది బాధపడ్తుంది. మొగుడ్ని వదిలేశానని అదేమైనా మనతో చెప్పిందా? ఏదో నాలుగు రోజులువుండి వెళ్తుంది. అంతమాత్రాన ఎందుకంత కఠినంగా మ్లాడతావ్‌?” అన్నాడు మందలింపుగా
”మీలాంటి వాళ్లు నిజాలను అంతత్వరగా గ్రహించరులెండి! అందుకే మీకు పైన వుండే చొక్కా తప్పలోపల వుండే బొక్కల బనీను కన్పించదు. అంత లోతుగా చూసే ఓపిక మీకెక్కడిది..? ఏదో తిన్నాం పడుకున్నాం. పని చేసుకుంటున్నాం. బ్రతుకుతున్నాం. అంతే! ఎలా బ్రతుకుతున్నామో అవసరంలేదు” అంది
”సుభద్రా! నువ్వేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావ్‌!” అన్నాడు నరేంద్రనాద్‌.
”నా మనసులో ఏంలేదు. ఇప్పుడు దానికి సెల్లెందుకు? అదెవరితో మాట్లాడాలని? భర్తకి దూరంగా వుంది. కొత్త పరిచయాలేమైనా అయితే కష్టంకదా! అసలే కొత్త, కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొచ్చి పిల్లల మనసులతో ఆడుకుంటున్నాయి. అర్థం చేసుకోండి!” అంది సుభద్ర.
ఆ మాటలకి రోషంగా, కోపంగా చూస్తూ ”మమ్మీ! ఎందుకలా మాట్లాడతావ్‌! ద్రోణకి దూరంగా వున్నంత మాత్రాన తప్పుచేస్తాననా? నాకా అవసరంలేదు.” అంది గ్టిగా శృతిక.
”నేనలా అనటంలేదు. అయ్యే అవకాశం వుంది కదా! ఆడపిల్ల తండ్రిగా ఆయన జాగ్రత్తలో ఆయన్ని వుండమని చెబతున్నాను.సమస్య చిన్నదా! పెద్దదా! అన్నది కాదిక్కడ ప్రశ్న… జీవితాలను భీబత్సం చేయానికి ఎంతదైతేనేం?” అంది సుభద్ర.
”డాడీ! నాకిప్పుడు సెల్‌ఫోన్‌ అవసరంలేదు. మమ్మీ ఇన్నిన్ని మాటలు అంటుంటే నాకు షేమ్‌గా వుంది.” అంటూ కోపంగా అక్కడనుండి వెళ్లింది.
నరేంద్రనాద్‌కి మరోమాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సుభద్ర వంటగదిలోకి వెళ్లింది.

నరేంద్రనాధ్‌ లేచి భార్య వెంట వెళ్లాడు.
”సుభద్రా! మాట్లాడేముందు ఆలోచించాలి. నీకెందుకంత కోపం? అది మన కూతురు. పరాయివాళ్లను కూడా అంత డైరెక్ట్‌గా మాట్లాడలేమేమో! ఎందుకలా మాట్లాడుతున్నావ్‌! అదెంత బాధపడ్తుందో అర్థం చేసుకున్నావా?” అన్నాడు కాస్త వంగి ఆమె భుజం మీదుగా ఆమె ముఖంలోకి చూస్తూ….
ఆమె కళ్లలో చెమ్మతప్ప నోట్లోంచి మాటరావటంలేదు.
”అదంటే నాకు ప్రాణం సుభా! అదలా బాధపడ్తే నేను చూడలేను. ఎవరైనా దాన్ని ఒక్కమాట అన్నా ఓర్చుకోలేను. నాముందే నువ్వు దాన్ని అలా అంటుంటే నాకు చాలా బాధేసింది.” అన్నాడు.
…కళ్లను గట్టిగా మూసుకొని ఏడుపును కంట్రోల్ చేసుకుంది సుభద్ర.
”కూతురంటే ఏ తండ్రికయినా ప్రాణంగానే వుంటుంది.. అదెందుకిలా మనింట్లో వుందో అడిగారా దాన్ని…? అదెప్పుడు వచ్చిందో డేట్ రాసి పెట్టుకున్నారా? నేను రాసిపెట్టాను. ఇప్పటికి చాలా రోజులైంది. ఇలా నేను కూడా మా పుట్టింటికి వెళ్తే మీరు ఒంటరిగా వుండగలరా? తోడు కావాలని ఎవరికైనా వుంటుంది. ద్రోణ గురించి కూడా ఆలోచించండి!” అంది సుభద్ర.
”ద్రోణ ఎక్కువగా బయటకెళ్తుంటాడు. బోర్‌గా వుంది డాడీ అంది. నేను ‘సరే’అన్నాను. మొన్న విమల కూడా ఇలాగే మాట్లాడింది. కానీ చూస్తూ, చూస్తూ నాకక్కడ బోర్‌గా వుంది డాడీ అని చెప్పాక కూడా కాస్త అర్థం చేసుకోవాలి. చూసి, చూడనట్లు వదిలెయ్యాలి. మాటలతో బాధపెట్టటం ఎందుకు? వున్నన్ని రోజులు వుంటుంది. ఇక్కడ బోర్‌ కొట్టాక అదే వెళ్తుంది. దాన్నిలా బాధపెట్టకు…” అన్నాడు నరేంద్రనాధ్‌.
”అది జీవితాన్ని బోర్‌గా ఫీలవుతున్నప్పుడు తండ్రిగా మీరు చెప్పాల్సిన మాటలు మీరు చెప్పండి! ఆ భావం దానిలో లేకుండా చూడండి! మగవాళ్లకి సంపాదన కావాలి కాబట్టి భర్తలు ఎక్కువగా బయటే వుంటారు. అంతేకాని భార్య ఓ స్టిక్‌ పట్టుకొని సిట్ స్టాండ్‌ అంటుంటే కూర్చుంటూ, లేస్తూ ఆడే బొమ్మలు కాదుగా భర్తలు…!” అంది సుభద్ర.
”ఏదో లేవే! చిన్నపిల్ల ఎందుకంత సీరియస్‌ అవుతావు?” అన్నాడు.
”…మీకో విషయం తెలుసా? మనబ్బాయికి పిల్లనిస్తామన్న వాళ్లు మన గురించి మన పక్కింట్లో ఎంక్వయిరీ చేశారట… వాళ్లమ్మాయి ఎప్పటికీ పుట్టింట్లోనే వుంటుందా? విడాకులేమైనా తీసుకుందా? మేం వాళ్లబ్బాయిని అనుకున్నప్పటినుండి పుట్టింట్లోనే వుంది కదా! అసలు విషయమేమి? అన్నారట. మీరేమో అది చిన్నపిల్ల… అదంటే నాకు ప్రాణం.. దానికక్కడ బోర్‌గా వుందట… అంటూ మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటున్నారు.” అంది అసలు విషయం ఇదీ అని స్పష్టం చేస్తూ…
ఈసారి నరేంద్రనాధ్‌ మాట్లాడలేదు
ఆలోచనగా తిరిగి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు.
*****

రోజుల గడుస్తున్నాయి.
సుభద్రలోని తల్లి మనసు చచ్చిపోయి శృతికను గాయపరిచిన రోజునుండి శృతిక మనసు డోలాయమానమైంది.
ద్రోణకి కాల్‌చేసి, ద్రోణ దగ్గరకి వెళ్లాలనుకొంది. ఆ నిర్ణయం తీసుకోటానికి నవనాడుల్ని నలగ్గొట్టుకొంది.
వెంటనే సుమ దగ్గరకి వెళ్లి సెల్‌ తీసుకొని ద్రోణకి కాల్‌ చేసింది.
లాంగ్‌ రింగ్‌పోయి నో ఆన్సరింగ్‌ అని వచ్చింది.
మనసంతా చితికినట్లై ఇంటి కొచ్చింది.
తల్లిలో అదే నిరసన… అదే రౌద్రం….
…మళ్లీ సుమ ఇంటికి వెళ్లింది. ఈసారి చైత్రికతో మాట్లాడాలనుకొంది.
సుమ తండ్రి భైరవమూర్తి గొంతు స్పీకర్‌ పెట్టినట్లు మోగుతుంటే బయటే నిలబడింది శృతిక…లోపలకెళ్లాలంటే భయమనిపించింది.
సుమ ఏదో చెప్పబోతుంటే ”నోర్ముయ్‌! వారానికోసారి నీ సెల్‌ఫోన్లో నెంబర్స్‌ని, మెసేజ్‌లని చెక్‌ చేస్తానని తెలిసి కూడా నువ్వింత బరి తెగించావంటే నిన్నేమనుకోవాలి. చదివించేది. ఇందుకేనా నిన్ను? నీకిప్పుడు బాయ్‌ఫ్రెండ్‌ కావలసి వచ్చాడా? ఇలాంటి ఫ్రెండ్‌షిప్‌లు కావాలనుకున్నప్పుడు కాలేజీల కెందుకెళ్లటం…? పబ్‌లలో, పార్క్‌లకో వెళ్తే సరిపోతుందిగా! రేపటినుండి కాలేజి మానేసి సిటిలో ఎక్కడెక్కడ నీకు తిరగాలనిపిస్తుందో అక్కడంతా తిరుగు. ఇంటికి రాకు… నాకింకా ఆడపిల్లలు వున్నారు.” అన్నాడు భైరవమూర్తి ఉగ్రనరసింహ రూపం దాల్చి.
”నాన్నా! నన్ను కాస్త మాట్లాడనిస్తావా? ఆ నెంబర్‌కి కాల్‌ చేసింది నేను కాదు అతనెవరో కూడా నాకు తెలియదు. శృతిక చేసింది” అంది సుమ.
”తప్పు చేయ్యటమే కాక అబద్దాలు కూడా నేర్చుకుంటున్నావా? వాళ్ల ఇంట్లో ఫోన్లులేక నీదగ్గరకి వచ్చిందా?” అన్నాడు.
”ప్రామిస్‌ నాన్నా…! నేను చెప్పేది అబద్దం కాదు. వాళ్ల ఇంట్లో తెలియకుండా మాట్లాడాలని మన ఇంటికి వచ్చి, మాట్లాడివెళ్లింది. కావాలంటే నేను తనని పిలిచి మాట్లాడిపిస్తాను.” అంది ఈ ప్రమాదం నుండి ఎలాగైనా బయటపడాలని…
సుమ మాటల్లో నిజాయితీ కన్పించింది భైరవమూర్తికి.
ఆయన వెంటనే మామూలు మనిషయ్యాడు
సుమకి దగ్గరగా వెళ్లి తల నిమురుతూ ”వద్దులేమ్మా! నువ్వలా రహస్యంగా ఫోన్లో మాట్లాడి చెడిపోతున్నావేమో నని భయపడ్డాను. నువ్వలాంటి పనులు చెయ్యవు నాకు తెలుసు” అన్నాడు గర్వంగా, సుమ తేలిగ్గా గాలి పీల్చుకొంది.
”కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో.. మనం ఈ మధ్యనే ఈ ఊరు వచ్చాం కాబ్టి శృతిక ఎలాంటిదో మనకి తెలియదు.. ఎవరో ద్రోణ అనే అబ్బాయితో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడుపుతోంది. నీ సెల్‌లో వున్న నెంబర్‌కి కాల్‌చేస్తే ‘ద్రోణను మాట్లాడుతున్నా’ అన్నాడు. నేనతనితో మాట్లాడకుండా కట్ చేశాను. భర్తను వదిలేసి వచ్చి, ఇంట్లోవాళ్లకి తెలియకుండా నీ ఫోన్లో మాట్లాడుతోంది. ఇవన్నీ బలుపుతో కూడిన పనులు.. ఇలాంటివాళ్లు ఏమాత్రం విలువలులేని జీవితాన్ని గడుపుతూ – కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా బ్రతుకుతుంటారు. నువ్వింకెప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడకు. ఇంటికి రానీయకు..” అన్నాడు వార్నింగ్‌ ఇస్తూ…
”సరే నాన్నా! ఈసారి వస్తే రావొద్దని చెబుతాను.” అంది సుమ
భైరవమూర్తి మాటలకి – బయట నిలబడివున్న శృతిక మనసు విలవిల్లాడింది. తల తిరుగుతున్నట్లైంది. అక్కడే నిలబడితే కిందపడిపోతానేమోనని వెనుదిరిగి సుడిగాలిలా ఇంటికెళ్లింది.
ఓ గంట గడిచాక…
”మమ్మీ! నేను మా ఇంటికి వెళ్తున్నా…” అంది శృతిక
ఆకాశం వురిమినట్లు ఉలిక్కిపడింది సుభద్ర.
తను కర్కశంగా ప్రవర్తించి కూతురు ఇండిపెండెన్సీ మీద దెబ్బతీసినట్లు భయపడింది. అత్తగారింటికెళ్లి క్షణికావేశంలో ఏమైనా చేసుకుంటుందేమోనని ”డాడీని రానీ ! వెళ్దువుగాని! ” అంటూ అడ్డుపడింది. ఎంతయినా తల్లికదా అన్నట్లు ప్రాధేయపడింది.. తల్లి కంగారుచూసి తనని వెళ్లనివ్వదని ”ద్రోణ కాల్‌ చేశాడు. నేను వెళ్లాలి.” అంటూ అబద్దం చెప్పి, ఒక్కక్షణం కూడా ఆగకుండా ఇంట్లోంచి బయటకొచ్చింది శృతిక.
*****

రెండో జీవితం 8

రచన: అంగులూరి అంజనీదేవి

ఏది ఏమైనా తన బొమ్మల్ని అభిమానిస్తుంది కాబట్టి తన అభిమానురాలే… అభిమానం ఓవరం! కానీ అభిమానులతో మాట్లాడేంత ఉల్లాసంగా తను లేడు. అనుకుంటూ వెంటనే ఆ మొబైల్‌ని పక్కన పెట్టాడు.
కానీ ఆ మెసేజ్‌లు మాత్రం అతని గతం తాలుకు భావరేఖల్ని కదిలించి ‘మా సంగతేంటి? నీ బొమ్మల్లో మమ్మల్నెప్పుడు ఒలికిస్తావు.’ అన్నట్లు తొందర చేస్తున్నాయి.
పైకి కన్పించేది ఒకటి… అంతర్లీనంగా దోబూచులాడేది ఒకటి… అంతర్లీనంగా వున్నదాన్ని అవసరాన్ని బట్టి అణగదొక్కాలని చాలా రోజులనుండి ప్రాక్టీస్‌ చేసుకుంటూ వచ్చాడు ద్రోణ. దానివల్ల గెలిచానా? ఓడానా? అన్నది ముఖ్యం కానట్లు తప్పుకు తిరుగుతుంటే ఇప్పుడీ మెసేజ్‌లు అతని గుండెను గుప్పెట్లో పట్టుకున్నట్లు బిగిస్తున్నాయి.
బిగించటమే కాదు – స్తబ్దుగా వున్న అతని భావోద్వేగాలను కదిలించి కొత్త, కొత్త భావాలను, అందాలను, ఆనందాలను గుర్తుకొచ్చేలా చేస్తున్నాయి.
గుర్తురావటమేకాదు – రెండు చిగురాకులు ఒకదాన్ని ఒకటి ఆలవోకగా సృశిస్తున్నట్లు… ఆ ఆకులకొనల వేలాడే మంచుబిందువులు పలకరింపుగా నవ్వుతున్నట్లు… పచ్చని గడ్డిపోసలు వెన్ను విరుచుకొని ఆకాశాన్ని చూసి ‘హాయ్‌!’ అన్నట్లు … నీలిమేఘాలు సెలయేటి నీటితో ఆగి, ఆగి మాట్లాడుతున్నట్లు… కనబడకుండా విన్పించే నిశ్శబ్ద కవిత్వంలా అతని వెంటబడ్తున్నాయి.
అసలీ చైత్రిక ఎవరు? ఎవరైతేనేమి! తెలుసుకోవలసిన అవసరం తనకి లేదు అని ద్రోణ అనుకుంటుండగా… అతని మొబైల్‌ రింగయింది.
మొండి ధైర్యంతో చైత్రిక చేసిన ఫోన్‌ కాల్‌ అది.
వెంటనే బటన్‌ నొక్కి ‘హాలో’ అన్నాడు ద్రోణ.
చైత్రిక గుండె దడ దడ కొట్టుకుంటుండగా… ”నేను చైత్రికను…”అంది.
అతను ముఖం చిట్లించి,… ”చైత్రికంటే? నా సెల్‌కి మెసేజ్‌లు పంపుతున్నది మీరేనా?” అన్నాడు.
ఆమె గొంతు తడారిపోతోంది. మంచినీళ్లు దొరికితే బావుండన్నట్లు అటు, ఇటు చూస్తూ, ”అవునండి!” అంది.
”ఒకి అడుగుతాను. ఏమీ అనుకోరుగా?” అన్నాడు
”అనుకోను అడగండి!” అంది యాంగ్జయిటీగా.
”మీరెవరినైనా ప్రేమించారా? మీ మెసేజ్‌లను బట్టి చూస్తే మీ పోకడ అలా అన్పించింది నాకు… కరేక్టెనా?”అన్నాడు.
”మిమ్మల్ని ప్రేమించాను…” అంది ఈ విషయంలో శృతిక పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ఏం మాట్లాడాలనుకుందో అదే మాట్లాడింది.
నవ్వాడు ద్రోణ… ఆ నవ్వు ”మీ ప్రపోజల్‌కి నేను రెడీ”అన్నట్లుగా లేదు. ఆ నవ్వు ఆపి..
”నేను ఫోన్‌ పెట్టేస్తున్నానండీ! నాకు పనుంది” అన్నాడు
షాక్‌ తిన్నది చైత్రిక.
ఇన్ని మెసేజ్‌లు పంపినా, ప్రేమిస్తున్నానని చెప్పినా ఏమాత్రం చలించని ద్రోణ ఆకాశంలో సగంలా అన్పించి..
”ఏం పని?” అంది వెంటనే చైత్రిక.
”నిద్రపోయే పని!” అన్నాడు.
”ఓ… ఆపనా! నేనింకా బొమ్మ గీస్తారేమో అనుకున్నా…”
”నేనిప్పుడు బొమ్మలు గియ్యట్లేదండీ!”
”ఏం ! ఎందుకని?”
”మీకు చెప్పాల్సిన అవసరం నాకులేదు”
”ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నాకు చెప్పాలి..”
”అన్ని నిర్ణయాలు మీ అంతట మీరే తీసుకునేటట్లున్నారుగా! ప్రేమించడమంటే ముందు నాలుగు మేసేజ్‌లు పంపటం.. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడటం.. ఇదేనా?” అన్నాడు ద్రోణ.
”మరింకేంటి? అంది చైత్రిక.
”అది నేనిప్పుడు చెప్పాలా? ప్రేమతప్ప మరో పనిలేదా మీకు?”
”ఉన్న పనులన్నీ చేస్తామా? నాకింకా ఏజ్‌బార్‌ కాలేదు కాబట్టి ప్రేమించే పనిలో వున్నాను. అయినా ఈ వయసులో ఇంతకు మించిన పనులు కూడా ఏంలేవు…”
”చదువుకోవచ్చు. కెరీర్‌ని డెవలప్‌ చేసుకోవచ్చు. పెళ్లిచేసుకొని భర్తతో ఉండొచ్చు. ఇవన్నీ వదిలేసి నావెంట పడ్డారేంటి?” అన్నాడు గట్టిగా కోప్పడుతూ.
ఆమె దానికి ఏమాత్రం చలించకుండా ”మీరు నన్ను ప్రేమించకపోతే టి.వి. 9 కి చెబుతా!” అంది.
అతని కోపం తారాస్థాయికి చేరింది. టి.వి.9కి చెబితే మిమ్మల్ని ప్రేమిస్తానా? మీ మీద ప్రేమ పుడ్తుందా? జోగ్గాలేదు? మీరు ఫోన్‌ పెట్టెయ్యండి! నాకు విసుగ్గా వుంది” అంటూ ఫోన్‌ క్‌ చేశాడు ద్రోణ.
తలపట్టుక్కూర్చుంది చైత్రిక.
*****
ద్రోణ తండ్రి సూర్యప్రసాద్‌ కొడుకు దగ్గర కూర్చుని…
”ద్రోణా! ప్రతి గొర్రెల గుంపులో ఓ నల్లగొర్రె వుంటుందన్నట్లు మనుషుల్లో కూడా మిగతావారి కన్నా డిఫరెంట్ గా ప్రవర్తించేవాళ్లు ఒకరిద్దరు వుంటూనే వుంటారు.. శృతికది డిఫరెంట్ మెంటాలిటీ. తను అనుకున్నట్లే వుండాలనుకుంటుంది. నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నువ్వెళ్లి ఒకసారి పిలిస్తే రావాలనుకుంటుందేమో.. ఆడపిల్లలకి అభిమానం వుంటుందిరా!” అన్నాడు.
”నేను మనశ్శాంతిగా వుండటం మీకిష్టం లేదా నాన్నా…?” అన్నాడు ద్రోణ.
”ఇదా మనశ్శాంతి ద్రోణా! మనశ్శాంతిగా వుందని సెలయేటి ఒడ్డున ఎంతసేపు కూర్చోగలవు? కాపురం అన్నాక అనేక సమస్యల అడవుల్ని దాటి… కష్టాల సముద్రాలను ఈదాలి…అప్పుడే నువ్వు గెలుపు అనే విజయానందాన్ని చవిచూస్తావు…” అన్నాడు.
”శృతిక నన్నో క్యారెక్టర్‌ లేని వెదవను చూసినట్లు చూస్తోంది. నాకా గెలుపు అవసరంలేదు. ఇంకా విషయాన్ని వదిలెయ్యండి నాన్నా…!” అన్నాడు ద్రోణ స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నవాడిలా…
ఒక్కక్షణం ఆగి ”యాడ్‌ ఏజన్సీ వాళ్లు వచ్చి వెళ్లారు ద్రోణా! బొమ్మ వెయ్యమన్నారట కదా! మళ్లీ కలుస్తామన్నారు.” అన్నాడు సూర్యప్రసాద్‌.
”నేను వెయ్యనని అప్పుడే చెప్పాను నాన్నా.!ఇంకో ఆర్టిస్ట్‌ను చూసు కుంటారులే… ఇప్పుడా విషయం ఎందుకు?” అన్నాడు నిర్లిప్తంగా
”అవకాశాలు ఆర్టిస్ట్‌లకి వరాలు ద్రోణా! వాటినెప్పుడు దూరం చేసుకోకూడదు” అన్నాడు
”నేను దేన్నీ దూరం చేసుకోలేదు నాన్నా…! వాటంతటవే దూరమైపోతున్నాయి. నేనేం చెయ్యను చెప్పు!” అన్నాడు ద్రోణ.
”ఏదైనా మనమే చెయ్యగలం ద్రోణా! ఎలా సంపాయించుకుంటామో అలా పోగొట్టుకుంటాం… ఎలా పోగొట్టుకుంటామో అలా సంపాయించుకోవాలి … ఏది పోగొట్టుకున్నా ఆత్మస్థయిర్యాన్ని పోగొట్టుకోకూడదు నిరాశవల్ల ఏదీ రాదు..” అన్నాడు
అప్పటికే ద్రోణ సెల్‌ చాలాసార్లు రింగవుతుంటే కట్ చేస్తున్నాడు ద్రోణ.
అది గమనించి ”కాలొస్తున్నట్లుంది మాట్లాడు” అంటూ అక్కడనుండి లేచి బయటకెళ్లాడు సూర్యప్రసాద్‌
*****
అది చైత్రిక కాల్‌.
తన జీవితంలోకి ఈ చైత్రిక ప్రవేశం ఏమిటో అర్థం కావటంలేదు ద్రోణకి.
మాట్లాడతామన్నా వినేవాళ్లు లేని, వింటామన్నా మాట్లాడే వాళ్లులేని ఈ స్పీడ్‌ యుగంలో చైత్రిక తనతో మాట్లాడానికి ఎందుకు ఇంతగా ఇంట్రస్ట్‌ చూపుతుంది? ఆమెతో మాట్లాడేవాళ్లు లేకనా? లేక తన బొమ్మల పట్ల అభిమానమా? లేక నిజంగానే తనని ప్రేమిస్తుందా? అని మనసులో అనుకుంటూ
”హలో ! ద్రోణను మాట్లాడుతున్నా! చెప్పండి!” అన్నాడు చైత్రిక కాల్‌ లిఫ్ట్‌ చేసిద్రోణ.
”మీరు నా కాల్‌ కట్ చేస్తుంటే అక్కడ మీకేమైందోనని ఇక్కడ నాకు ఒకటే కంగారు. అసలేమైంది ద్రోణగారు మీకు..? అంది చైత్రిక తన గుండెలోని బాధను గొంతులోకి తెచ్చుకుంటూ…
”నాకేం కాలేదండీ! మీకేమైనా అయితే మాత్రం నా బాధ్యతేంలేదు. ఎందుకంటే అసలే ఈమధ్యన టి.వి.9 లాంటి ఛానల్స్‌ అందరికి అందుబాటులోకి వస్తున్నాయి. అసలే నాబాధల్లో నేనున్నా… ఇంకో బాధను నేను యాక్సెప్ట్‌ చెయ్యలేను…” అన్నాడు
”నేను మిమ్మల్ని బాధపెట్టే మనిషిలా అన్పిస్తున్నానా? నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోవటంలేదు.” అంది.
”అర్థం చేసుకొని ఏం చేయాలో చెప్పండి?” అన్నాడు.
”అదేంటండీ! అలా అంటారు? అర్థం చేసుకోవటంలోనే కదా అంతరార్ధం వుండేది. అదే లేకుంటే ఇంకేముంది? బూడిద తప్ప…!” అంది చైత్రిక.
కాలిపోయిన తన బొమ్మలు గుర్తొచ్చి ”నాకు బూడిదను గుర్తుచెయ్యకుండా మీరు ఫోన్‌ పెట్టెయ్యండి! ఏదో ప్రపంచం చూసినవాడ్ని కాబట్టి… మాట్లాడకపోతే బాధపడ్తారని మాట్లాడుతున్నాను. ఇంకెప్పుడు నాకు ఫోన్‌ చెయ్యకండి!” అన్నాడు ద్రోణ సీరియస్‌గా
”నాకేమో మాట్లాడాలనిపిస్తుంది. కాంటాక్ట్‌లో వుండాలనిపిస్తుంది. మీరేమో ఫోన్‌ చెయ్యొద్దంటారు. ఇదేనా నామీద మీకుండే ప్రేమ?” అంది.
”మీ మీద నాకు ప్రేమేంటి? అసలేం మాట్లాడుతున్నారు? నేను చెప్పానా మీమీద నాకు ప్రేమవుందని? ” అన్నాడు.
”నేను చాలా అందంగా వుంటాను తెలుసా?” అంది.
”అయితే మాత్రం ప్రేమ పుడ్తుందా?” అన్నాడు ద్రోణ.
”మరెలా పుడ్తుంది?” అంది చైత్రిక
”అది అనుభవిస్తే తెలుస్తుంది చైత్రికా! ఇలా చెబితే ఆర్టిఫీషియల్‌గా వుంటుంది” అన్నాడు చాలా నెమ్మదిగా
”ఆ అనుభవాన్ని నాక్కూడా అందివ్వొచ్చుగా! ఏం చేతకాదా?” అంది రెచ్చగొడ్తున్నట్లు…
అదిరిపడ్డాడు ద్రోణ.
ఒక్కక్షణం ఆలోచించాడు
ఈ అమ్మాయి తనవెంటబడటం ఆగిపోవాలంటే ‘తనేంటో’ చెప్పాలను కున్నాడు.
”మీరేదో అందుకుంటారని అందివ్వానికి అదేమైనా వస్తువా చైత్రికా! ప్రేమ…ప్రేమనేది భూమిని చీల్చుకుంటూ మొలకెత్తే మొక్కలా మనసును పెకలించుకొని బయటకి రావాలి. అది కూడా ఒకసారే పుడుతుంది. ఒకసారి ముగిశాక మళ్లీ దానికి పునరపి జననం వుండదు” అన్నాడు
”అదేంటండీ! కొత్తగా మాట్లాడుతున్నారు? నాకు తెలిసిన అమ్మాయిల్లో కొంతమంది ఒక్కొక్కళ్లు ఎన్ని సార్లో ప్రేమిస్తున్నారు. ఎన్నెన్ని గిఫ్ట్‌లో ఇచ్చి పుచ్చుకుంటున్నారు..” అంటూ ఇంకా ఏదో అనబోయింది.
ద్రోణ వెంటనే రెండు చేతులు జోడించి… అయినా జోడించిన తన చేతులు ఫోన్లో కన్పించవని…
”మీకు ఏ టైప్‌లో నమస్కారం పెట్టమంటే ఆ టైప్‌లో పెడతాను. నన్ను వదిలెయ్యండి చైత్రికా! మీకు నాకు చాలా దూరం…” అన్నాడు.
”దగ్గరయ్యే చాన్సేలేదా?
జాలిగా అన్పించి ”మీకు నా గురించి తెలిస్తే మీరిలా మాట్లాడరు” అన్నాడు.
”తెలిస్తే కదా! మాట్లాడకుండా వుండటానికి?” అంది.
”నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఇక నాతో మాట్లాడకండి!” అన్నాడు.
”అమ్మాయిల్ని ప్రేమించిన అబ్బాయిలతో వేరే అమ్మాయిలు మాట్లాడకూడదన్న రూలేమైనా వుందా?” అంది.
”రూల్‌ లేదు. ఏంలేదు. మాట్లాడండి! వింను. ఇలాంటి ఫోన్‌ బిల్లులు కట్టటానికి మీలాంటివాళ్ల బాబులు ఎన్ని ఓవర్‌టైంలు వర్క్‌ చేయ్యాలో ఏమో?” అన్నాడు.
”డౌట్లు మీకే కాదు. నాక్కూడా వస్తున్నాయి. ఒక ఆర్టిస్ట్‌ అయివుండి ”ప్రేమించడం” తప్పుకాదా?” అంది
”మీ తప్పు మీకు తెలియట్లేదా?” అన్నాడు వెంటనే
”నా విషయం వదిలెయ్యండి? గతంలో మీరొక అమ్మాయిని ప్రేమించినట్లు మీ భార్యకి తెలిస్తే మీరేమవుతారు? ముందు నాప్రశ్నకి జవాబు చెప్పండి?” అంది.
”ఇది నా భార్యకి తెలియాలని చెప్పలేదు. మీకు తెలిస్తే నావెంట పడకుండా వుంటారని… తెలిసిందా?” అన్నాడు
”అంత గొప్పదా మీ ప్రేమ?” అంది. అలా అంటున్నప్పుడు ఆమె గొంతు కాస్త వణికింది.
”ప్రేమ అనేది అందరి విషయంలో ఒకలా వుండదు చైత్రికా! అది అనుభూతి చెందేవాళ్లను బట్టి, స్పందించే స్థాయిని బట్టి వుంటుంది” అన్నాడు ద్రోణ.
ఆమె మాట్లాడలేదు
అతనికి ఆమెతో మాట్లాడాలని వుంది. మాట్లాడుతున్న కొద్ది మొదట్లో వున్న విసుగులేకుండా పోయింది. ఏదో రిలీఫ్‌ అన్పిస్తోంది.
”ఆగిపోయారేం? మాట్లాడండి చైత్రికా?” అన్నాడు ఆమె మౌనాన్ని గమనించి…
”నేనిప్పుడు మాట్లాడే స్థితిలో లేనండీ! మీరు ప్రేమించిన ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కన్పిస్తే మీరెలా రియాక్ట్‌ అవుతారో నన్న సస్పెన్స్‌లో వున్నాను” అంది.
”సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తే నువ్వు వెయిట్ చెయ్యానికి ఇది నవల కాదు. జీవితం…!” అన్నాడు.
”జీవితంలో లవ్‌కి ఇంత పర్‌ఫెక్షన్‌ వుంటుందా?” అంది
”పర్‌ఫెక్షన్‌ అంటే యుమీన్‌ గాఢత, స్వచ్ఛత. అదేనా? అది వుండబట్టే ఆ ఇన్సిపిరేషన్‌తో నేను ఎన్నో బొమ్మలు సృష్టించగలిగాను. నా ప్రేమే నా ఆర్ట్‌కి పునాదిరాయిలా మారి నన్ను మోటివేట్ చేసింది”. అన్నాడు.
”ఆమె ఎక్కడుందో ఇప్పుడు తెలుసా మీకు.”? అంది. యాంగ్జయిటీని ఆపుకోలేక పోతోంది చైత్రిక.
” నా తలపుల్లో వుంది. ఆమె తలపులు నా మనసులో ఓ తరంగిణిలా ప్రవహిస్తుంటే ఎన్ని రోజులు గడిచినా ఆమెకోసం నా మనసులో ఇంకా కాస్తస్థలం మిగిలే వుంటుందనిపిస్తోంది. మనిషి దూరంగా వున్నా ఆ మనిషి ఇచ్చే స్ఫూర్తి ఎంత మహత్తరంగా వుంటుందో నేను అనుభవించాను” అన్నాడు
అతని మాటలు వింటుంటే – అతని భావాల ముందు తనో గడ్డి పరక అనుకొంది చైత్రిక.
”అందుకే చెబుతున్నా చైత్రికా! ప్రేమా, ప్రేమా అంటూ నాకు ఫోన్లు చెయ్యొద్దు…” అన్నాడు.
”ప్రేమ వద్దు… పెళ్లి చేసుకోండి!” అంది
”నాకు పెళ్లి అయింది.”
”అయినా ఆమె మీ దగ్గరలేదుగా..!”
”వస్తుంది… భార్యా, భర్త అన్నాక చిన్న, చిన్న గొడవలు లేకుండా వుండవుగా…” అన్నాడు
”మీ గొడవలు అలాంటివి కావట… విడాకులదాకా వచ్చేలా వున్నాయట… బయట టాక్‌… అలాంటిదేమైనా జరిగితే నన్ను పెళ్లి చేసుకుంటారుగా…!”
”భార్య స్థానాన్ని శృతికకు తప్ప ఇంకెవరికి ఇవ్వను.”
”మరి నాకేమిస్తారు?”
”చూడు చైత్రికా! మన బంధం ఒక బిందువు. అది విస్తరించదు. అదృశ్యం కాదు. కావాలంటే ఓ స్నేహితురాలిగా వుండు. నాక్కూడా నిన్ను వదులుకోవాలని లేదు. నువ్వు మంచి వ్యక్తివి..” అన్నాడు.
అతని మాటల్లో చనువు వుంది. అభిమానం వుంది అంతేకాదు ఎంతోకాలంగా నువ్వు నా నేస్తానివి… అప్పుడెప్పుడో తప్పిపోయి ఇప్పుడు దొరికావు అన్న ఆత్మీయతతో కూడిన లాలింపు వుంది. అతని గొంతులోని తడికి కదిలి…
”నాకెందుకో ఏడుపొస్తుంది ద్రోణా!” అంది.
”గట్టిగా ఏడ్చేస్తే ఆ పని కూడా అయిపోతోందిగా చైత్రికా!” అన్నాడు.
”మీ పెళ్లికి ముందు మీ ప్రేయసిని కూడా ఇలాగే ఏడవమన్నారా?” అంది ఉడుక్కుంటూ…
”మీకో విషయం చెప్పనా? నేను ప్రేమించినట్లు నా ప్రేయసికి తెలియదు. మేమిద్దరం ఎప్పుడూ ప్రేమ గురించి మాట్లాడుకోలేదు.”
షాక్‌లో మాట రాలేదు చైత్రికకి…
నెమ్మదిగా తేరుకొని ”బహుశా మీది ఆకర్షణేమో ద్రోణా!” అంది. ”కావొచ్చు. కానీ మరణించే వరకు ఆకర్షణలో వుండటమే ప్రేమ… నా ప్రేయసి ఆకర్షణ చెక్కు చెదిరేది కాదు. మరణించేవరకు ఆ ఆకర్షణలోనే వుండి పోతాను నేను…” అన్నాడు.
మళ్లీ షాక్‌ తిన్నది చైత్రిక…
*****
ఆ రోజు ఆముక్తకి తోడుగా వెళ్లిన నిశిత మణిచందన్‌ రాకపోవటంతో అక్కడే వుంది.
”మనం ఈ పెళ్లి అయ్యాక – ఇంటికెళ్తూ దారిలో ఆగి, నిశితను తీసికెళ్దాం వేదా! బహుశా ఇవాళ మణిచందన్‌గారు రావొచ్చు. నిన్ననే ఫోన్‌ చేసినట్లు చెప్పారు ఆముక్త!” అన్నాడు శ్యాంవర్దన్‌.
అలాగే అన్నట్లు తలవూపి ”మనం వచ్చేముందు అత్తయ్యగారికి ఒంట్లో బావుండలేదండి! ఎలా వుంటుందో ఏమో!” అంది బాధగా సంవేద.
”తగ్గిపోతుందిలే… నువ్వేం టెన్షన్‌ పెట్టుకోకు.” అంటూ పెళ్లిలో ఎవరో పిలిస్తే వెళ్లాడు శ్యాంవర్ధన్‌.
కొడుకు, కోడలు పెళ్లికి వెళ్లకముందు నుండే – కడుపులో తిప్పినట్లు, కళ్లు తిరిగినట్లు, అదోరకమైన ఇబ్బందితో అవస్థ పడ్తోంది దేవికారాణి. ఆ బాదను పైకి చెప్పుకోవాలని వున్నా ఇంట్లో తను బద్దశత్రువులా భావిస్తున్న భర్త తప్ప ఇంకెవరూ లేకపోవటంతో మౌనంగా భరిస్తోంది.
బయటకొస్తే ఆయన ముఖం చూడాల్సి వస్తుందని, లోపల ఊపిరాడనట్లు అన్పిస్తున్నా, ఓర్చుకుంటూ అలాగే తన గదిలో కూర్చుంది.
కడుపులో నలిపినట్లవుతోంది…
వాంతి వచ్చినట్లయి గదిలోంచి బయటకొచ్చింది…
బయటకొచ్చాక నాలుగడుగులు కూడా వెయ్యలేక వాష్‌బేసిన్‌ దగ్గరకి వెళ్లకముందే వాంతి చేసుకొంది. నిలబడే శక్తి లేని దానిలా చెవుల్ని చేతులతో మూసుకుంటూ కింద కూర్చుంది.
గంగాధరం కంగారుగా చూస్తూ, ఒక్కఅడుగులో ఆమెను చేరుకోబోయాడు.
…దగ్గరకొస్తున్న భర్తను చూడగానే అసహ్యంగా ముఖం పెట్టింది శక్తిని కూడదీసుకొని లేవబోతూ ‘నా దగ్గరకి రావొద్దు’ అన్నట్లు చేత్తో సైగ చేసింది… మళ్లీ కళ్లు తిరిగి కిందపడింది.
ఆమె నిరసన భావం అర్థమైంది గంగాధరానికి… కానీ ఆ స్థితిలో ఆమెను చూస్తుంటే జాలిగావుంది.
వాంతి చేసుకున్నచోట వాసనగా వుంది. ఆమె దాని పక్కనే ఆయాసపడ్తూ చూస్తోంది.
”ఎలా వుంది దేవీ?” అన్నాడు. ఆత్రంగా ఆమెనే చూస్తూ…
ఎందుకూ పనికిరాని వ్యక్తిని చూసినట్లు చూసిందే కాని మాట్లాడలేదు
”డాక్టర్‌ దగ్గరకి వెళ్దామా?” అన్నాడు ఆమెనుండి సమాధానం లేదు.
ఆమెకు ఒళ్లంతా చెమటపోస్తోంది.
నేలమీద ఈగలు వాలుతుంటే గంగాధరం బక్కెటతో నీళ్లు తెచ్చి, పినాయల్‌ వేసి బట్ట పెట్టి తుడిచాడు.
అక్కడేం జరుగుతుందో గ్రహించిందామె. ఆందోళనగా తనవైపే చూస్తున్న భర్తను చూసింది. నెమ్మదిగా లేచి తన గదిలోకి వెళ్లి పడుకొంది.
ఆమెకింకా వామిటింగ్‌ సెన్సేషన్‌ తగ్గలేదు.
”ఆటో పిలుస్తాను. హాస్పిటల్‌కి వెళ్దామా?” అన్నాడు గంగాధరం… గది బయటే నిలబడి.
ఆమె మాట్లాడలేదు. ఆమెకేదో బాధగా వుంది.
‘నేనిక్కడే వుంటాను అవసరమైతే పిలువు.” అంటూ ఆమె గది బయటనే ఓ కుర్చీవేసుకొని కూర్చున్నాడు.
దేవికారాణి కళ్లలో ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు ఉబుకుతున్నాయి. వాటిని ఆపుకోవాలని కాని, తుడుచుకోవాలని కాని ఆమెకు అన్పించలేదు.
భర్తకి ఒక చేయి లేకపోయినా, ఇంకో చేత్తో నీళ్లు తెచ్చి వాంతి చేసుకున్నది కడుగుతుంటే – ముఖ్యంగా ఆయన ముఖంలో ఎలాటి విసుగు లేకపోవటం చూసి, కదిలిపోయింది. ”నీ కోసం నేనున్నాను. భయపడకు” అన్న ఫీలింగ్‌ని చూసి ‘నిజంగా తనకి కావలసింది ఇదే’ అనుకొంది.
రాత్రి తొమ్మిదిగంటలు అవుతుండగా గంగాధరం వేడి, వేడిపాలు తెచ్చి, గది బయటే నిలబడి…
”ఈ పాలు తాగు దేవీ! కాస్త శక్తి వస్తుంది” అన్నాడు.
దుఃఖం పొంగుకొచ్చింది దేవికారాణికి.
ఆకలి గురించి అమ్మ ఆలోచిస్తుంది. భర్తలో అమ్మ కన్పించింది.
వెంటనే గ్లాసు అందుకొని పాలు తాగింది.
ఆమె ఏదో మాట్లాడాలనుకునే లోపలే కరెంట్ పోయింది. చీకటంటే భార్యకి ఎంత భయమో గంగాధరానికి తెలుసు. ఆ చీకట్లోనే తడుముకుంటూ వెళ్లి, క్యాండిల్‌ వెలిగించి భార్య చేతికి ఇచ్చాడు. ఆమె గదిలోపల నిలబడే దాన్ని అందుకొని కిటికీ పక్కన పెట్టుకుంది.
పాలు తాగటంతో హాయిగా అన్పించి డోర్‌పెట్టుకొని, వెంటనే నిద్రపోయింది.
గంగాధరం మాత్రం కొడుకు, కోడలు ఎప్పుడొస్తారో అని ఎదురుచూస్తూ కుర్చీలో కూర్చున్నాడు.
అంతలో… దేవికారాణి గదిలోంచి పొగలు రావటం చూసి అదిరిపోయాడు గంగాధరం.
అసలే ఆవేశపరురాలు. అతని ఉనికిని భరించలేక తనను తను తగలబెట్టుకుంటుందేమోనని అనుమానపడ్డాడు.
వెంటనే లేచి కికీ దగ్గరకి వెళ్లి లోపలకి తొంగిచూశాడు.
ఆమె అటు తిరిగి పడుకొని వుంది.
ఆయన అనుకున్నదేం జరగలేదక్కడ!
కిటికీ కున్న కర్టన్‌ కొద్ది, కొద్దిగా కాలుతోంది. దానిపక్కనే వెలుగుతున్న క్యాండిల్‌ రెపరెపలాడుతోంది.
కిటికీలోంచి చేయి లోపలకి పెట్టి గడియ తీశాడు.
మంట ఎక్కువై ఆమెను చేరుకునే లోపలే ఆయన లోపలకి ప్రవేశించాడు.
ఆమెను బలంగా కదిలించి లేపాడు. ఆమె ఏదో మాట్లాడబోతుంటే, ‘మాటలకిది సమయం కాదు. నువ్వు చాలా ప్రమాదంలో వున్నావు’ అన్నట్లు ఆమె భుజంకింద చేయివేసి లేపి, మెరుపు వేగంతో బయటకి తీసికెళ్లాడు.
ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటుంటే అసలేం జరిగిందో అర్థమై నోటమాట రాలేదామెకు. గదివైపు చూసి వణికి పోతూ, బోరున ఏడ్చింది.
ఓదార్పుగా ఆమె భుజంపై చేయి వేసి నిమిరి, వెంటనే ఆ గదిలోకి వెళ్లి, నీళ్లుచల్లి, మంటల్ని ఆర్పాడు గంగాధరం.
గదినిండా నల్లటి మసితో, గంగాధరం చల్లిన నీళ్లతో తడిసి, అసహ్యంగా అన్పిస్తూ నివాసయోగ్యంగా లేదు.
పొద్దుటినుండి ఒంట్లో బావుండక శరీరం శక్తిహీనమై కదలలేకుండా వుంది. ఎక్కువసేపు కూర్చోలేక పడుకోవాలనిపిస్తోందామెకు.
”లే! దేవి! అలా ఎంతసేపు కూర్చుంటావు? వెళ్లి అబ్బాయి గదిలో పడుకో…” అన్నాడు ఆమెనలా చూడలేక…
మెల్లగా లేచింది దేవికారాణి.
ఆమె కాళ్లు నెమ్మదిగా శ్యాంవర్ధన్‌ గదివైపు వెళ్లలేదు. భర్త బెడ్‌ వైపు వెళ్లాయి. మౌనంగా ఆ బెడ్‌పై పడుకొని కళ్లు మూసుకొంది.
ఆశ్చర్యపోయాడు గంగాధరం.
మనిషి గొప్పతనం పంతాల్లో కాదు మంచితనంలో వుంటుందని భర్త చేతల్లో చూసింది దేవికారాణి. కరుణ చూపించటంలో ఖరీదు లేకపోవచ్చుకాని దానివల్లవచ్చే ఫలితాలు, ఆత్మతృప్తి అద్భుతం అనుకొంది.
ముఖ్యంగా జీవితంలో ఏమాత్రం విలువలేని అతిశయోక్తులకి, ఆడంబరాలకి, అత్యాశకి తలవంచకూడదని గ్రహించింది.
ఏ జ్ఞానమైనా చివరికి ఆత్మజ్ఞానానికి దారితీసినట్లు తన పక్కన భర్తకి కూడా పడుకోటానికి కాస్త చోటిచ్చి నిశ్చింతగా నిద్రపోయింది.
పెళ్లి చూసుకొని, దారిలో ఆముక్త ఇంటికి వెళ్లి నిశితను తీసుకొని వచ్చారు సంవేద, శ్యాంవర్ధన్‌.
ఇంట్లోకి రాగానే షాకింగ్‌గా చూస్తూ ”అత్తయ్యేంటి మామయ్య పక్కన పడుకొంది?” అని పైకే అంటూ అత్తయ్య గది చూసి మళ్లీ షాకయింది. సంవేద.
అలికిడికి నిద్రలేచిన గంగాధరం జరిగింది మొత్తం చెప్పాడు కోడలితో…
”అయ్యో! అత్తయ్యకోసం చెయ్యి కాలుతుందని కూడా పట్టించుకోలేదు మామయ్య!” అంటూ బర్నాల్‌ తెచ్చి గంగాధరం చేయి కాలిన దగ్గర పూస్తూ కన్నీళ్లు పెట్టుకొంది నిశిత… ఇలాంటి బంధాలు ఆధ్యాత్మికం నుండి అలౌకిక స్థితికి చేరుకుంటాయనటానికి ఆ కన్నీళ్లే సాక్షి.
కీడులో మేలన్నట్లు అంతా బాగానే వుంది. అత్తయ్య, మామయ్య కలిసిపోయారు. కానీ రేపినుండి తను ఒక్కటే ఒంటరిగా ఎలా పడుకోవాలి? బావను ఎలా తప్పించుకోవాలి? ఇదే ఆలోచన చేస్తోంది నిశిత…
*****
రెండు రోజులు గడిచాక…
స్కూల్‌ పిల్లలు, ఇంటికెళ్తూ బస్‌కోసం పరిగెత్తుతుంటే బాల్కనీలో నిలబడి తదేకంగా చూస్తోంది నిశిత. చూసి, చూసి….
లోపలకెళ్దామని తిరిగి చూస్తే ఆమె స్టిక్‌ లేదక్కడ. కంగారుపడింది నిశిత. స్టిక్‌ లేకుంటే ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేదు.
ఆమెనే చూస్తూ శ్యాంవర్ధన్‌ ఆమె పక్కనే ఓ అడుగు దూరంలో నిలబడివున్నాడు.
షాక్‌ తిన్నట్లు చూసింది నిశిత.
ఇతనెప్పుడు వచ్చాడు!!
”ఇప్పుడే వచ్చాను నిశీ! నువ్వు చూస్తున్న ప్రతిది నాకు చూడాలనిపిస్తుంది. ఆ విషయం నీకు తెలుసు. అందుకే నీతోపాటు నేనూ నిలబడి అటే చూస్తున్నాను…” అన్నాడు.
అతను తనపట్ల ఎంత ఇంట్రెస్ట్‌ చూపుతున్నాడో, ఎంత దాహంగా వున్నాడో ఆమెకి అర్థమవుతోంది.
”నిశీ!” అంటూ లోపలనుండి సంవేద కేకేసింది. ‘అమ్మో!’ అక్కయ్య పిలుస్తోంది. ఎలా వెళ్లాలి? అనుకుంటూ, నడవలేక ఒంటికాలిపై నిలబడింది.
”ఈ యాంగిల్‌లో చూడముచ్చటగా వున్నావు నిశీ! నీ స్టిక్‌ని నేనే దాచాను. కొద్దిసేపు నన్నే నీ స్టిక్‌ని చేసుకొని నడువు.” అన్నాడు ఆమెకి దగ్గరగా జరిగి.
అతని ప్రవర్తన ఆమెకి నరకంగావుంది.
”నా స్టిక్‌ నాకివ్వండి బావా!” అంది. అంతకన్నా ఇంకేం అనలేక.
”నేనివ్వను నన్ను పట్టుకొని నడువు…” అన్నాడు ఇంకా దగ్గరవుతూ.
”ఎలా సాధ్యం బావా?” అంది తనలో తనే నిస్సహాయంగా నలుగుతూ…అతన్ని అక్క తప్ప ఇంకెవరూ పట్టుకోకూడదన్న అభిప్రాయం ఆమె కళ్లలోకి నీళ్లు తెప్పించాయి.
ఆమెనంత దగ్గరగా చూసి మైమరచిపోతూ, చనువుగా ఆమె చేయి పట్టుకొని లాగి…
”ఇదిగో ఇలా పట్టుకో…” అంటూ ఆమె చేయిని తన నడుంచుట్టూ వేసుకున్నాడు. గాలిలేని ట్యూబ్‌లా ఆమె చేయి బిగుసుకోలేదు. వెంటనే అతని చేయి ఆమె నడుం చుట్టుచేరి బిగుసుకొంది.
”ఊ… నడువు.. నడిపిస్తాను” అన్నాడు
పిం బిగువున పెదవుల్ని బిగబట్టి ఏడుపుని ఆపుకుంది నిశిత. కానీ మనసులో మహారణ్యాలు తగలబడ్తుంటే ఇక ఆగలేమంటూ వెచ్చని కన్నీరు జలజల రాలి కిందపడ్డాయి.
అది గమనించిన గంగాధరం గబగబ వెళ్లి కొడుకు దాచిన స్టిక్‌ తెచ్చి నిశితకి ఇవ్వబోతుండగా ”ఎంతసేపు పిలవాలే నిన్ను? ఏం చేస్తున్నావక్కడ?” అంటూ బయటకొచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి…
”నిశితకేమైందండి? మీరు నడిపిస్తున్నారు?” అంది ఆందోళనగా.
”ఏం లేదు వేదా! స్టిక్‌ ఎక్కడో పడిపోతే నేను నడిపిస్తున్నాను. ఈ లోపల మా నాన్న స్టిక్‌ తెచ్చి ఇచ్చాడు.” అంటూ అక్కడనుండి శ్యాంవర్ధన్‌ వెళ్లిపోతుంటే కొడుకునే చూస్తూ…
‘ఓరి త్రాస్టుడా! నాకళ్లతో నేను చూస్తూనే వున్నాను కదరా! నువ్వేం చేస్తున్నావో! నీ గురించి కోడలితో చెప్పలేను. నిన్ను నాలుగు దులపలేను. భూదేవి లాంటి సహనంతో వున్న ఈ నిశితను చూస్తూ తట్టుకోలేను… ఇక్కడ కొచ్చి పడ్తున్న ఈ బాధకన్నా ఆ రౌడీల చేతుల్లో చనిపోయి వున్నా బావుండేది…’ అని మనసులో అనుకుంటుంటే…
”మీలాగే మీ అబ్బాయిది కూడా చాలా మంచి మనసు మామయ్యా! మీ ఇంటికి కోడలిగా రావటం నా అదృష్టం…” అంటూ పొంగిపోతూ నిశితను లోపలకి తీసికెళ్లింది సంవేద.
‘ఏమిటో! నిజం తెలియనంత వరకు శవం పక్కనైనా నిశ్చింతగా పడుకోవచ్చు అనటం ఇదే కాబోలు…’ అనుకున్నాడు గంగాధరం.
*****
శృతిక పుట్టింటినుండి రాకపోవటంతో సూర్యప్రసాద్‌ భార్యమీద కోప్పడ్డాడు. ”అన్న కూతుర్ని తెచ్చి పెళ్లిచేసి నా కొడుకు జీవితాన్ని చిందరవందర చేశావు” అన్నాడు. అగ్నిపర్వతం బద్దలైనట్లు మా మా పెరిగింది.
”నేనే వెళ్లి మా అన్నయ్యతో చెబుతా వుండండి! ఇంత వయసొచ్చినా నేనంటే మీకు లెక్క లేకుండా వుంది. అప్పుడేదో ద్రోణ చిన్నవాడని వాడి మనసు బాధపడ్తుందని మీ దగ్గరే వున్నాను. ఇంకొక్క క్షణం కూడా వుండను.” అంది.
”వెళ్లు! మీ అన్నయ్య నీకు ఎన్ని రోజులు పెడతాడో చూస్తాను” అన్నాడు
”అలాటి ఆలోచనలేం పెట్టుకోకండి! మీరలా అంటారనే ఎప్పుడు రావాలో నిర్ణయించుకునే వెళ్తున్నాను” అంటూ బట్టలు సర్దుకొని నిజంగానే పుట్టింటికి వెళ్లింది విమలమ్మ.
షాక్‌ తిన్నాడు సూర్యప్రసాద్‌.
సుభద్ర, విమలమ్మ వంటగదిలో కూర్చుని – ఏ వంట ఎలా చేయాలో, ఏది ఎంత మోతాదులో వేస్తే అ వంటకి రుచి వస్తుందో మాట్లాడుకుంటుంటే – శృతికకు ఆ కబుర్లు అంతగా రుచించక ఎదురింట్లో వుండే తన ఫ్రెండ్‌ సుమ దగ్గరికి వెళ్లింది.
సుమ కాలేజికి వెళ్లలేదు.
శృతికను చూడగానే ఎమోషన్‌ ఆపుకోలేక.. హాస్టల్లో వీలుకాదని బాయ్‌ఫ్రెండ్‌ కోసం బయట రూం తీసుకొని వుంటున్న తన ఫ్రెండ్‌ లవ్‌స్టోరీని ఎక్కడ మిస్‌ కాకుండా చెప్పింది.
శృతిక న్యూస్‌రీల్‌ చూస్తున్నట్లు ఉత్కంఠతో విన్నది
అంతా విన్న తర్వాత ఇంకో కోణంలో ఆలోచించటం మొదలుపెట్టింది
…పైకి ఎంతో మంచిగా కన్పిస్తూ ఇలా కూడా చేస్తారా? వాళ్ల మనసు ఎలా ఈడిస్తే అలా వెళ్తున్నారే కానీ తల్లిదండ్రుల గురించి కొంచెం కూడా ఆలోచించరా? వెంటనే ద్రోణ గుర్తొచ్చాడు.
ద్రోణకూడా అంతేగా! భార్యనైన తనగురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాడు? మనసు ఎలా లాగితే అలా వెళ్తుంటాడు. అంతరాత్మ ఎలా చెబితే అలా వింటుంటాడు. అదే సులభం ఇలాంటి వాళ్లకి… ఎదుటివాళ్లని అర్థం చేసుకుంటూ వాళ్లకి అనుగుణంగా బ్రతకాలంటే కష్టంగా భావిస్తారు.
…ఇప్పుడేం చేస్తుంటాడో ద్రోణ? ఇంకేం చేస్తారు?
ఈ కార్తీక మాసపు వెన్నెల్లో ఓ అభిమానురాలుని కారులో ఎక్కించుకొని ఊరి చివరిదాకా ప్రయాణం చేస్తాడు.. డ్రైవ్‌ చేస్తూనే ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. కొద్దిసేపు కౌగిట్లో ఇముడ్చుకుంటాడు. నచ్చిన చోట స్వేచ్చగా సృశిస్తూ ఆమెనే చూస్తూ గడుపుతాడు… ఇంకా చూడాలనిపిస్తే అతను కార్లో కూర్చుని ఆమెను కారు ముందు నిలబెట్టుకొని ఆర్ట్‌లుక్‌తో చూస్తాడు.
ఆ వెన్నెల తృష్ణ అలాంటిది. ఇలాంటి సౌందర్య దాహంతో నిరంతరం తపించే ఇలాంటి వాళ్లను ఏం చెయ్యాలి?
అసలేంటి ఈ సమస్యలు? ఇవి చిన్నవా, పెద్దవా అన్నది ముఖ్యం కానట్లు మనసును విపరీతంగా పీడిస్తున్నాయి… ఈ సెంటిమెంట్సేంటి ? ఈ త్యాగాలేంటి? ఈ అనురాగాలేంటి?
ఎంత వద్దనుకున్నా ఇలాంటి ఊహలు శృతిక మనసును కుదిపేస్తుంటే పైకి క్యాజువల్‌గానే సుమ చెప్పే మాటల్ని వింటూ అక్కడే కూర్చుంది.
శృతిక సుమ దగ్గరకి వెళ్లటం చూసి, శృతిక గురించి వదినతో మాట్లాడాలనుకొంది విమలమ్మ. కానీ… రేపు కార్తీకపౌర్ణమి కావటంతో దానికి సంబంధించినవి సమకూర్చుకోవటంలో ఆమె మునిగివుంది. అక్కడ వీలుకాక…
”అన్నయ్యా!” అంటూ నరేంద్రనాథ్‌ దగ్గరకి వెళ్లి కూర్చుంది విమలమ్మ.
”ఏంటి విమలా! ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా?” అన్నాడు చేతిలో ఫైల్‌ని పక్కనపెడ్తూ నరేంద్రనాధ్‌.
”అవునన్నయ్యా!” అంది.
చెప్పమన్నట్లు చూశాడు. ఆయనకి చెల్లెలంటే మొదటినుండి చాలా ఇష్టంతో కూడిన గౌరవ భావం ఉంది.
”శృతిక పెళ్లికి ముందు నువ్వు నా రెండు చేతులు పట్టుకొని ఏమన్నావో గుర్తుందా అన్నయ్యా?” అంది విమలమ్మ మర్చిపోయాడేమో ఓసారి గుర్తు చేద్దామన్నట్లుగా.
”గుర్తుందా అంటే గుర్తు లేకపోవచ్చు. ఏమిటో చెప్పు విమలా? నేనేమైనా శృతిక విషయంలో తక్కువ చేశావా? నీకు ముందే చెప్పాను. అడుగు అని,.. డబ్బా? ఫర్నీచరా? ఏదో చెప్పు విమలా? శృతిక చిన్నపిల్ల… పెద్దవాళ్లకి తెలిసే అవసరాలు తనకి తెలియవు కదా! డబ్బు విషయంలో నాకెలాంటి ఇబ్బందులు లేవు. అది సుఖంగా వుంటే చాలు..”
”ప్రాబ్లమ్‌ డబ్బు గురించో, ఫర్నీచర్‌ గురించో అయితే ఇంకోరకంగా వుండేదేమో అన్నయ్యా! ఇది మనసుకి సంబంధించింది” అంది.
”అంటే ? ” అన్నాడు అర్థంకాక…
”శృతికది దూకుడు స్వభావం. నీ ఇంటి కోడలైతే దాని తప్పుల్ని మన్నించి, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటావు. నామాట కాదనకుండా దాన్ని ద్రోణకి చేసుకో అని నువ్వు అడిగినప్పుడు ‘స్వభావాలదే ముందిలే అవి మనల్ని దాటిపోతాయా?’ అనుకున్నాను. కానీ శృతిక ద్రోణని అడుగడుగునా చీప్‌గా తీసివేస్తోంది. మాటకు ముందు నాకు ‘మా నాన్న వున్నాడు’ అంటూ మీ దగ్గరకి వస్తోంది. ఇక ఇంతేనా అన్నయ్యా! ఎన్ని రోజులు ఇలా!” అంది.
”నాకిదంతా ఏం తెలియదు విమలా! శృతికనే ఒకరోజు ‘ద్రోణ ఎప్పుడు చూసినా ఆర్ట్‌ ఎగ్జిబిషన్లు వున్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతుంటాడు నాన్నా! నాకు ఇంట్లో బోర్‌గా వుంటుంది. అందుకే ఇక్కడికి వచ్చాను.’ అంది సరే! అన్నాను.” అన్నాడు అసలు విషయం తెలియనట్లు… ఇప్పుడు తెలిసినా ఇంటికొచ్చిన కూతుర్ని ఎలా వద్దనగలడు అన్న నిస్సహాయత కూడా ఆయన ముఖంలో కన్పిస్తోంది.
”బొమ్మల్ని తగలబెట్టి వచ్చిందన్నయ్యా!” అని చెబుదామని పర్యవసానం వూహించి ఆగిపోయింది.
”మాట్లాడు విమలా!” అన్నాడు. ఆమె మౌనం తట్టుకోలేనట్లు…
”ఈ విషయంలో ఆయన నన్ను బాగా కోప్పడుతున్నారు అన్నయ్యా! తన కొడుకు జీవితాన్ని నేను నాశనం చేశానంటున్నారు. నన్నుకూడా వెళ్లి నీ దగ్గరే వుండమంటున్నాడు.” అంది.
రోషం పెల్లుబికినట్లు ఒక్కక్షణం బిగుసుకుపోయి చూస్తూ..
”అంత మాట అన్నాడా! ఏం నిన్ను నేను పోషించుకోలేనా? నా చెల్లెలు నాకు ఎక్కువ కాదని చెప్పు! ఇక్కడే వుండు. వెళ్లకు. మనం పౌరుషంలేని వాళ్లమేం కాదు…” అన్నాడు కోపంగా.

ఇంకా వుంది.

రెండో జీవితం – 7

రచన: అంగులూరి అంజనీదేవి

”నేను ఆర్‌.టి.సి. బస్‌లో పనిచేస్తున్న రోజుల్లో నా భార్య డబ్బు మీద ఆశతో నన్ను బాగా సంపాయించమనేది. జీతాన్ని మించిన సంపాదన నాకెలా వస్తుంది? రోజుకోరకంగా, ఏదో ఒకటి లేదంటూ తనలోని వెలితిని బయటపెట్టి బాధపడేది. నన్ను బాధపెట్టేది. రాను రాను ఇంటికి రావాలంటేనే భయపడేవాడిని… అప్పటికే శ్యాం పుట్టాడు. శ్యాం కోసమైనా నేను నా భార్య మాట వినాలి. లేకుంటే నన్ను ఇంటికి రానివ్వదు. బస్‌లో టికెట్స్ ఇవ్వకుండానే ప్రయాణీకుల దగ్గర డబ్బులు తీసుకోవటం మొదలుపెట్టాను… నా భార్యకి నెలకోసారి ఇచ్చే జీతంకన్నా నేను రోజూ ఇచ్చే పది, ఇరవై చూసి ఎక్కువ సంతోషించేది. ఆ సంతోషాన్ని దూరం చెయ్యలేక నేను ఆ ఉద్యోగానికి దూరమయ్యాను. అంటే స్వాడ్‌ వచ్చినప్పుడు దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకున్నాను.
… పోయిన ఉద్యోగం మళ్లీ రాలేదు. భార్యా, బిడ్డలను పోషించుకోవాలంటే డబ్బులేదు. ప్రొద్దున లేచి ఏదో ఒక పనికి వెళ్లేవాడిని… నేను చెయ్యని పనిలేదు. పడని కష్టం లేదు.
నేను చేసిన తప్పుకి అనుభవిస్తున్న శిక్షను చూసి నామీద నాకే జాలేసేది. ఒకరోజు దొరికిన పని ఇంకోరోజు దొరికేది కాదు.. క్వారీలల్లో రాళ్లు తీసేపని దగ్గరనుండి రైల్వేస్టేషన్లో మూటలు మోసే పనిదాకా అన్ని పనులు చేశాను. చివరికి బరువైన పనులు చెయ్యలేని స్థితికి వచ్చాను. కారణం నాలో కాల్షియం లోపించిందన్నారు డాక్టర్లు.
…అప్పుడు నాకో వ్యక్తితో పరిచయం అయింది. ఆయన పేరు డా||కె.కె. నాయుడు ఆయన నన్నో కోరిక కోరాడు.” అంటూ ఆగాడు గంగాధరం.
”ఏమి మామయ్యా ఆ కోరిక?” అంది నిశిత ఆసక్తిగా..
”వర్షాకాలంలో పొలాల గట్లపై తుంగగడ్డి మొలస్తుంది. ఎక్కడైనా ఆ గడ్డిని కోసి పశువులకి మేతగా వేస్తారు. లోపల గడ్డలు విస్తరించి ఎంత కోసినా ఆ తుంగ మళ్లీ మొలకెత్తటం దాని నైజం. ఆ తుంగను బలంగా పీకితే గడ్డలు బయటపడ్తాయి. ఆ గడ్డల్ని ఎలాగైనా సంపాయించి తనకి సప్లై చెయ్యమని కోరాడు.. నేను పనికెళ్లి రాళ్లు మోస్తే వచ్చే డబ్బుకన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. నేను ఒప్పుకున్నాను…
…ఇంట్లో నా భార్యతో చెప్పాను. సరే వెళ్లమంది. నెల మొత్తంలో నేనెక్కువగా అక్కడే గడపాల్సి వచ్చేది. ఆ తుంగగడ్డల్ని తీసికెళ్లి ఒకరూంలో వుంచి దానికి నేనే కాపలా వుండేటట్లు ఏర్పాటు చేశారు. ఆ తుంగగడ్డల్ని ఎండబెట్టి ఆ గడ్డలనుండి సుగందద్రవ్యాన్ని తయారు చేయ్యాలన్నదే ఆయన ప్రయోగం… అది నిర్విఘ్నంగా సాగుతోంది.
ఆయన నన్ను పూర్తిగా నమ్మి – ఆ గదిని, అందులోని ఇన్‌స్ట్రుమెంట్స్ ని నామీద వదిలి ఇంటికెళ్లేవాడు. నేను ఇంటికెళ్లకుండా రాత్రంతా అక్కడే కాపలా వుండేవాడిని… పగలంతా తుంగగడ్డల్ని సేకరించి ఎండబెట్టేవాడిని. అక్కడ ఆ తుంగగడ్డలకన్నా ఆ డాక్టర్‌గారి ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా ఖరీదైనవి కాబట్టి నేను వాటికి గట్టి కాపలా కాసేవాడ్ని…
ఒకరోజు రాత్రి…
నిద్రకి ఆగలేక టీ తాగుదామని, ఒక చెట్టుకింద టీ కాస్తుంటే నడుచుకుంటూ అక్కడికి వెళ్లాను. అక్కడ అప్పటికే టీ తాగుతూ నిలబడివున్న నలుగురు యువకులు అదే రోడ్డుపై ఆ రాత్రి రెండుగంటలకి వెళ్లే ఓ బస్‌ను దోచుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. వాళ్ల గురించి అప్పుడప్పుడు పేపర్లో రావటం నేను చదవటం వల్ల వెంటనే వాళ్ల ఎత్తుగడల్ని అర్థం చేసుకోగలిగాను.
అప్పటికప్పుడు వాళ్లను ఎదుర్కొనే శక్తి, పట్టించే నేర్పు లేక మౌనంగానే వుండిపోయాను. ఆ రాత్రికి ఆ బస్‌ దోపిడీలో నగలు, డబ్బు దోచుకోవటమే కాక ఇద్దరు చంటిపిల్లల్ని చంపెయ్యటం నన్ను బాగా కదిలించింది. నా మౌనం మంచిది కాదనుకున్నాను. జీవితంలో నేనేంత కష్టపడ్డా నా భార్య, కొడుకుకే ఉపయోగపడ్తాను. వీళ్లను పోలీసులకి పట్టిస్తే చాలామందిని బ్రతికించగలుగుతాను. అని ఓ నిర్ణయానికి వచ్చాను.
చాలా కష్టపడి వాళ్లను ఫాలో అయ్యాను. పోలీసులకి పట్టించాను. వాళ్లలో ఒకడు మాత్రం తప్పించుకున్నాడు. పట్టుపడిన వాళ్లకి వాళ్ల వాళ్ల నేరాలను బట్టి శిక్షలు పడ్డాయి. ఒకడికి యావజ్జీవకారాగార శిక్ష కూడా పడింది.
తక్కువ శిక్షపడ్డవాళ్లు కొద్ది రోజులకే బయటకొచ్చారు. వాళ్లు బయటకి రాగానే ముందుగా తప్పించుకున్న వాడు వాళ్లతో కలిసి నా వెంటపడ్డాడు.
మబ్బుపట్టి, గాలికొట్టి, వానపడ్తు నేలంతా బురదగా వుంది. పెద్దకాలువ కట్టదాటి రోడ్డెక్కిన నేను వాళ్లను తప్పించుకుందామని ఒకప్పుడు హాస్పిటల్‌ కోసం కట్టి పాడుబడిపోయిన బంగ్లాలోకి దూరాను. వాళ్లుకూడా లోపలకి వచ్చారు.
నా చేతిలో సంచిని లాక్కుని విసిరికొట్టారు.. వాళ్లలో క్రోధం, కసి పెట్రేగి పోయి ముగ్గురు కలిసి నా మీద పడ్డారు. నేను ఎంత ప్రయత్నించినా వాళ్లను విడిపించుకోలేకపోయాను. బయటకి అరుపులు విన్పించకుండా నా నోట్లో గుడ్డ కుక్కారు. నేను కళ్లు మూసి తెరిచేలోపలే ఒకడు వెనక నుండి కత్తితీసి నా చేయి నరికాడు. నేను సృహ కోల్పోయాను.. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
హాస్పిటల్లో డా||కె.కె. నాయుడు గారు నాకు వైద్యం చేయించారు. అప్పటికే నేను ఇంటికెళ్లక చాలాకాలమైంది. నాభార్యా, బిడ్డ గుర్తొస్తున్నారు. కానీ, వాళ్ల గురించి ఆలోచించే ఓపిక కూడా లేకుండా అయింది. గాయం పచ్చిగానే వుంది.
కానీ ఈ మధ్య మళ్లీ వాళ్లు నన్ను చూశారు. నన్ను చంపేవరకు నిద్రపోయేలా లేరు. వాళ్ల చేతుల్లో చావటం ఇష్టంలేక ఇలా వచ్చాను.
ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు.
ఇప్పుడు ఇక్కడ నా భార్యా, నాకొడుకు, నా కోడలు – ముఖ్యంగా నువ్వు వున్నారు. చిన్నదానివైనా – ఒక చెయ్యి పూర్తిగా లేని నన్ను అర్థం చేసుకొని, సేవచేసి నా గాయాన్ని నయంచేశావు. పెద్దవాడినన్నది మరచిపోయి నీకు చేతులెత్తి దండం పెట్టాలని, ఒకసారి నీ పాదాలను తాకాలని ఎన్నోసార్లు అన్పించింది. రాగద్వేషాలతో వుండే మానసిక వికలాంగులకన్నా నువ్వు గొప్పదానివి నిశితా!” అన్నాడు.
నిశిత అలాగే విస్తుపోయింది… ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని, కుటుంబానికి దూరమై శారీరకంగా, మానసికంగా ఆయన ఎంత చిత్రహింసకు గురయ్యాడో అర్థంచేసుకొని మనసులో ఏడ్చింది.
”నిశితా! ఆ దురదృష్ట సంఘటన, ఎంత మరచిపోదామన్నా నన్ను వెంటాడి బాధిస్తోంది. అప్పుడు అరిచిన అరుపులు ఇంకా అలాగేనా మైండ్‌లో సెట్ అయి రిపీట్ అవుతున్నాయి. నువ్వు భయపడకు…” అన్నాడు.
”అలాగే ! మామయ్యా! ఇదంతా అత్తయ్యతో, బావతో, అక్కతో చెబుతాను. అందరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరెంత నరకాన్ని అనుభవించారో ముఖ్యంగా అత్తయ్యకి తెలియాలి. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న భర్తని ఇంకా ఎక్కువ సంపాయించమని టార్చర్‌ పెట్టే ఆడవాళ్లకి తెలియాలి.” అంది నిశిత.
గంగాధరం మాట్లాడలేదు
”పడుకోండి మామయ్యా! ఇంకేం ఆలోచించకండి! మేమంతా వున్నాం కదా! ప్రశాంతంగా వుండండి!” అంటూ ధైర్యం చెప్పి, ఆయన పడుకోగానే దుప్పటి కప్పి ఫ్యాన్‌ స్పీడ్‌ పెంచింది.
తండ్రి పడుకోవటం చూసి శ్యాంవర్ధన్‌ వచ్చాడు.
”మా నాన్న కేకలతో నీకు చాలా ఇబ్బందిగా వున్నట్లుంది కదూ?” అంటూ ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు శ్యాం.
”అలాంటిదేం లేదు బావా! అసలేం జరిగిందంటే..!” అంటూ గంగాధరం చెప్పిన విషయం చెప్పబోయింది.
”జరిగిందాన్ని గురించి ఇప్పుడెందుకు? జరగబోయేది కావాలి” అన్నాడు ఒకరకంగా చూస్తూ…
మగవాడి చూపులు తన మీద నిలిచినప్పుడు, అవి ఏ దృష్టితో నిలిచాయన్నది స్త్రీ వెంటనే పసిగడ్తుంది. బావ తనని కోరుకుంటున్నాడని, అది ధర్మం కాదని, అక్కకి అన్యాయం చెయ్యబోతున్నాడని అర్థం చేసుకొంది. అందుకే ఈ మధ్యన అతను ఎప్పుడు కన్పించినా ఇబ్బందిగా విసుగ్గా అన్పిస్తోంది.
”మీరు వెళ్లండి బావా! నాకు నిద్రొస్తుంది” అని అనలేక వెంటనే
”మామయ్యా! పడుకున్నారా ! మీ అబ్బాయి వచ్చాడు.” అంది నిశిత గంగాధరం వైపు చూస్తూ…
శ్యాం కంగారుగా చూస్తూ… ”ఆయన్నెందుకు లేపటం? పడుకోనీయ్‌!” అన్నాడు
…టక్కున దుప్పటి తొలగించి లేచి కూర్చున్నాడు గంగాధరం.
”ఏం శ్యాం! నిద్రరావటంలేదా?” అన్నాడు.
”వస్తోంది నాన్నా! నువ్వేదో అరిచినట్లుంటే వచ్చాను.” అన్నాడు శ్యాం
”అరిచి చాలాసేపయింది” అన్నాడు గంగాధరం.
ఒక్కక్షణం మౌనంగా వుండి ”నేను వెళ్తాను నిద్రొస్తోంది.” అంటూ లేచాడు శ్యాంవర్ధన్‌. అతను వెళ్లగానే
”పడుకో నిశితా! అవసరమైతే నన్నులేపు. భయపడకు.” అన్నాడు గంగాధరం.
దేవుడు మనిషి రూపంలో వుంటాడనానికి గంగాధరమే నిదర్శనంగా అన్పించి – తండ్రి పక్కన పడుకున్నంత ధైర్యంగా పడుకొంది నిశిత.
*****
ఆ రోజు ద్రోణ మీద కోపంతో ఇంట్లోంచి బయటకెళ్లి ఆటో ఎక్కిన శృతికకు ఎటెళ్లాలో అర్థంకాలేదు.
అక్కకన్నా ఆత్మీయులు, తన గురించి ఆలోచించేవాళ్లు ఎవరున్నారు అని అక్క దగ్గరకి వెళ్లింది.
కృతిక ఇంకా ఆఫీసునుండి రాలేదు.
పిల్లలు నానమ్మ పెట్టిన టిఫిన్‌ తింటున్నారు… పిన్నిని చూడగానే ”హాయ్‌” చెప్పారు. శృతిక ఓ నవ్వు నవ్వి… ”బావున్నారా అత్తయ్యా?” అంటూ వంటగదిలోకి వెళ్లింది. ఆవిడ తిట్టిన తిట్లు ప్రస్తుతం గుర్తురాలేదామెకు…
”నేనేదో హాస్పిటల్లో వున్నట్లు ఏమి పరామర్శ? అడగకూడదు కాని ఎందుకొచ్చావిప్పుడు ? ఏదైనా పని కాని, పంక్షన్‌ లాంటిది కాని వుండి వచ్చావా? ద్రోణ ఏడి? ఒక్కదానివే వచ్చావా? నీకలవాటేగా ఇలా రావటం…!” అంటూ ప్రశ్న మీద ప్రశ్న వ్యంగ్యంగా వదిలింది.
బిక్క చచ్చిపోయింది శృతిక. వెంటనే తేరుకొని…
”ఒక్కదాన్నే రాకూడదా? నాకు దారి తెలియదా?” అంది బింకంగా
”దారి తెలిసినా పెళ్లయ్యాక ఆడవాళ్లు ఒంటరిగా ఎటూ వెళ్లరు. వెళ్తే భర్తకి ఇబ్బంది కదా! కలిసి వెళ్తారు. మీకలాంటి ఇబ్బందులేం లేవు కాబోలు…” అంటూ ఇంకో వ్యంగ్యబాణాన్ని విసిరింది.
”నానమ్మా ! మాకు టైమవుతుంది. త్వరగా పాలివ్వు…” అంటూ కేకేశారు పిల్లలు.
”వస్తున్నా! అదిగో! మొన్న నీ చెయ్యి విరగొట్టి వెళ్లిందే మీ పిన్ని! ఆవిడొస్తే మాట్లాడుతున్నా… అన్నట్లూ! నువ్వేం పనిమీద వచ్చావో, అది చూసుకొని వెళ్లు.. తొందరేం లేదు. పిల్లల్ని మాత్రం బయట తిప్పకు. నీకసలే స్పీడెక్కువ.. అదే మా బాధ… నువ్వంత తింటే పోదు. నా కొడుకు, నాకోడలు ఇద్దరు సంపాదనపరులే…” అంది.
ఆ మాటలు శృతిక చెంప చెళ్లుమనిపించాయి.
‘అయినా ఈవిడ మాటలకేంటి… ఇలాగే అంటుంది. ఇవన్నీ పట్టించుకోకూడదు.’ అని మనసులో అనుకొంది.
…కానీ పిల్లలు తనని చూడగానే ‘హాయ్‌!’ చెప్పి ఏ మాత్రం హ్యాపీ లేనివాళ్లలా మౌనంగా ట్యూషన్‌కి వెళ్లటం మనసు చివుక్కుమనిపిస్తోంది. ఇదంతా వాళ్ల నానమ్మ ట్రైనింగే… ‘మీ పిన్ని రాక్షసి నీ చేయి విరగ్గొట్టింది. ఎప్పుడొచ్చినా సరిగా మాట్లాడకండి’ అని చెప్పి వుంటుంది.
మెల్లగా పిల్లలకి నచ్చచెప్పాలి. ‘నేను మీపిన్నిని, మీ అమ్మలాగా నాక్కూడా మీరంటే ప్రేమ వుంటుంది. యాక్సిడెంట్లు అనేవి అనుకోకుండా జరుగుతుంటాయి. అవి కామనే…’ అని వాళ్లను దగ్గరకు తీసుకోవాలనుకుంది.
కృతిక ఆఫీసునుండి, పిల్లలు ట్యూషన్‌ నుండి రాగానే అందరు కలిసి భోంచేశారు.
భోంచేస్తున్నప్పుడు, ఆఫీసు విషయాలు ఆలోచించుకుంటూ పిల్లలతో కాని, శృతికతో కాని మాట్లాడలేదు కృతిక…
అక్క మాట్లాడితే బావుండని ఆశించింది శృతిక.
అక్క మాట్లాడకపోవటంతో అసంతృప్తిగా వుంది.
”ఇవాళ ఆఫీసులో బాగా స్ట్రెయిన్‌ అయ్యాను శృతీ! పడుకుంటాను. మళ్లీ మీ బావ వస్తే ఆయన పని చూడాలి…” అంటూ తన బెడ్‌రూంలోకి వెళ్లింది.
ఆమె అలా వెళ్లిన కొద్దిసేపటికే ఆమె భర్త వచ్చాడు.
అతను ముఖం కడుక్కుని ప్రెషెప్‌ అవుతుంటే ”త్వరగా రండి! వడ్డిస్తాను!” అంటూ నిద్రకళ్లతోనే కేకేలేస్తోంది కృతిక.
పిల్లలు హోంవర్క్‌ చేసుకొని, వాళ్ల గదిలో వాళ్లు పడుకున్నారు. నానమ్మ వాళ్ల గది ముందుండే హాల్లో పడుకొంది.
శృతిక వెళ్లి పిల్లల దగ్గర పడుకొంది… పిన్ని వచ్చి పడుకున్నట్లు ఒక్క కన్ను మాత్రమే తెరిచి గమనించిన మోనా మెల్లగా లేచి వెళ్లి నానమ్మ పక్కన పడుకొంది. శృతిక ఆశ్చర్యపోయింది. టీనా గాఢనిద్రలో వుంది.
మోనా వచ్చిపడుకోగానే.. ”నిద్రరావటం లేదా?” అంటూ పైన చేయివేసింది లాలనగా నానమ్మ.
”పిన్ని మా గదిలోకి వచ్చింది అందుకే ఇలా వచ్చాను.” అంది మోనా.
”వస్తే ఏం? పడుకోవలసింది పిన్నియే కదా!” అంది నానమ్మ
”అప్పుడు చెల్లి చెయ్యి పిన్ని వల్లనే కదా విరిగింది. అందుకే పిన్నిని చూస్తే భయం నాకు… నేను బాబాయ్‌తో చెబుతాను. పిన్నిని ఇలా పంపొద్దని..” అంది మోనా.
”పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు. మీ మమ్మీతో ఏదైనా పనివుండి వచ్చిందేమో!” అంది నానమ్మ. ఆమె సందర్బాన్ని బట్టి కటువుగా మాట్లాడుతుందే కాని పిల్లలు పెద్దవాళ్లను గౌరవించకపోతే హర్షించదు.
”పనేంలేదు నానమ్మా! వాళ్లిద్దరేం మాట్లాడుకోలేదు” అంది టక్కున మోనా.
పిల్లలు పెద్దవాళ్లను ఎంతగా గమనిస్తారో అర్థమైంది నానమ్మకి.
వాళ్లకిప్పుడు ఏది చెబితే అది గ్రహించే శక్తి వుంటుంది.
మంచీ-చెడు అనేవి వెంటనే వాళ్ల మనసులోతుల్లోకి వెళ్లి బాగా పనిచేస్తాయి.
”నానమ్మా! బాబాయ్‌ లేకుండా పిన్ని ఒక్కతే వస్తే తప్పా?” అంది మోనా.
”మంచి ప్రశ్న వేశావు. తప్పులేకపోవచ్చు. కానీ పెళ్లయ్యాక ఆడప్లిల తన సంసారాన్ని అంకితభావంతో చూసుకోవాలి… ‘ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి’ అంటూ పెళ్లిలో భర్తచేసిన ప్రమాణానికి ‘నాతిచరితవ్యం’ అంటూ భార్య ప్రతి ప్రమాణం చేస్తుంది.
…దాన్ని జీవితాంతం పాటించాలి. భర్తతోనే వుండాలి. అవసరాన్ని బట్టి భర్తతోనే బయటకి రావాలి. అంతేకాని అక్కలదగ్గర, చెల్లెళ్ల దగ్గర గడపకూడదు. అలా గడిపితే ఎంత దగ్గరివాళ్లయినా చిన్నచూపు చూస్తారు” అంది నానమ్మ.
అవునా అన్నట్లు చూసింది మోనా.
”ఏ రోజుల్లో అయినా… అంటే ఇప్పటి కంప్యూటర్‌ యుగంలోనైనా సరే పెళ్లయ్యాక ఒడిదుడుకులు వుంటాయి. తట్టుకోవాలి. స్వాతంత్య్రం కూడా తగ్గుతుంది. కట్టుబడాలి. అందరితో అవసరాలు వుంటాయి. అర్థం చేసుకోవాలి.
…ఇతరుల అవసరాల కన్నా భర్త అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంతోషపెట్టాలి. దగ్గరవ్వాలి. అలా అని భర్తంటే భయభక్తులతో ప్రతిక్షణం మనసు చంపుకోమని కాదు. కలిసి, మెలిసి వుండాలి” అంది.
ఇప్పుడు మోనాకు భర్తతో పనిలేకపోయినా భర్తతో ఎలావుండాలి అనేది భవిష్యత్తులో తెలుసుకుంటుందని నానమ్మ ఆలోచన.
మోనా కూడా ఆసక్తిగానే వింటోంది.
”ముఖ్యంగా వ్యక్తిగత జీవితం కన్నా సంసారం బాగుండాలి అనుకోవాలి. అనుమానాలు, చికాకులు వుండకూడదు. అవివుంటే అరిష్టం. అన్ని అరిష్టాలకు మూలం ఆవేశం…” అంది నానమ్మ.
మోనా వింటూ నిద్రపోయింది
శృతికకు నిద్రరాలేదు.
*****
తెల్లవారింది.
తనలోని ఆవేదనను అక్కతో చెప్పుకుంటే కొంతయినా తగ్గుతుందని అక్క దగ్గరకి వెళ్లింది శృతిక… ఆఫీసుకెళ్లే తొందరలో శృతిక చెప్పేది వినకుండానే ఆఫీసుకెళ్లింది కృతిక. బావ కూడా అంతే హడావుడితో తన ఆఫీసుకి వెళ్లాడు. పిల్లలు స్కూల్‌కి వెళ్లారు.
స్నానంచేసి చీరకట్టుకొని హాల్లోకి వచ్చిన శృతిక నానమ్మను చూసి షాకైంది.
కారణం నానమ్మ చెవిదగ్గర సెల్‌ఫోన్‌ పెట్టుకొని పోటో చూస్తోంది. కళ్లార్పితే అవతల మాటలు మిస్సవుతానేమో నన్నట్లు కళ్లుకూడా ఆర్పకుండా అతిశ్రద్ధగా వింటోంది.
‘…ఈ వయసులో ఈవిడ కూడా సెల్‌ఫోన్‌ పట్టుకొని పోటో చూడాలా? ఈవిడకు కూడా ఫీలింగ్స్‌ వుంటాయా? భర్తలేడు. మరెవరితో మాట్లాడుతోంది? చిన్నప్పటి బాయ్‌ఫ్రెండా? అయివుండొచ్చు. ఈ సెల్‌ఫోన్ల పుణ్యమా అని ఎక్కడెక్కడి వాళ్లు లైన్లోకి వస్తుంటారు. అంతటి అవకాశం ఈ సెల్‌ఫోన్ల వల్లనే దొరుకుతోంది.
రాత్రి ఎంతో చక్కగా భార్యా, భర్త అంటూ మోనాతో డైలాగులు చెప్పింది. ఇప్పుడేమో అందరు వెళ్లాక బుద్దిగా కూర్చుని, ఓల్డ్‌ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ తరిస్తోంది. ఇలాంటి వాళ్లను వయసుతో పనిలేకుండా ఏది దొరికితే అది తీసుకొని కొట్టాలి.’ అనుకొంది మనసులో శృతిక.
నానమ్మ మాత్రం అప్పటివరకు సెల్‌ఫోన్‌లో ‘ఓం గణేశా! వందనం!’ అన్న యాడ్‌ని విని.,. విన్నది చాలదన్నట్లు ‘ఇంకా కొద్దిసేపు మాట్లాడితే వాడి సొమ్మేం పోయిందో అప్పుడే ఆపేశాడు’ అని పైకే తిట్టుకుంటుంటే…
శృతిక ”ఆ…” అని ఆశ్చర్యపోతూ ”ఛీ.. ఛీ ఈ ఇంట్లో ఒక్కక్షణం కూడా వుండకూడదు. ఎక్కడికి పోయినా ఇదే గోల” అని మనసులో అనుకుంటూ నానమ్మతో చెప్పకుండానే బయటకొచ్చి ఆటో ఎక్కింది.
*****
ఆటో దిగి శృతిక నేరుగా తను చదువుకుంటున్నప్పుడు వున్న హాస్టల్లోకి వెళ్లింది.
ఆ హాస్టల్లో రకరకాల అమ్మాయిలు వున్నారు. వాళ్లలో చాలావరకు ఆ చుట్టుపక్కల ఊర్లనుండి చదువులకోసం చదువులు ముగించుకొని, ఉద్యోగాలకోసం వచ్చినవాళ్లు వున్నారు. పిల్లల్ని ఉన్నతమైన స్థానాల్లో చూడాలని, అందుకు తగిన స్వాతంత్య్రాన్ని ఇచ్చిన వాళ్ల తల్లిదండ్రుల ఆశలకి వక్రభాష్యం చెప్పకుండా బాగా చదివి వారి లక్ష్యసాధన కోసం ఎంతో పట్టుదలతో శ్రమిస్తూ, కోరుకున్న స్థానాలకు చేరుకోవాలని చూసేవాళ్లే ఎక్కువగా వున్నారు.
ముఖ్యంగా వాళ్లలో చిన్న చిన్న ఊళ్లలో క్రమశిక్షణతో పెరిగిన అమ్మాయిలే ఎక్కువగా వున్నారు. బయట కృత్రిమ వాతావరణం కన్పిస్తున్నా – కన్నవారితో కట్టుబాట్ల మధ్యన పెరిగిన రోజుల్ని మరచిపోకుండా అర్ధరాత్రి వరకు బయట తిరగటం, అబద్దాలు చెప్పటం లాంటి వ్యసనాలకు దూరంగా వుంటూ… చక్కగా చదువుతూ కోరుకున్న భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు.
వాళ్లలో చైత్రిక ఒకతి…
చైత్రిక చూడానికి సున్నితంగా వుండి, మెత్తని స్వభావం గల అమ్మాయిలా అన్పించినా మనోదారుఢ్యంతో ఏ పని అయినా భయపడకుండా కచ్చితంగా చేయగలిగేలా వుంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో వివేకంగా వుండి సరిగా స్పందిస్తుంది.
హాస్టల్లోకి వెళ్లగానే ”నేను చైతూతో మాట్లాడాలి. మీరు కొంచెం బయటకి వెళ్తారా?” అంది మర్యాదగా ఆ రూం మేట్స్ ని ఉద్దేశించి శృతిక. వాళ్లు ”అలాగే” అంటూ బయటకెళ్లి హాల్లో పార్టీషన్‌ చేసిన గదిలో కూర్చున్నారు.
చైత్రికను పట్టుకొని ఏడ్చింది శృతిక.
చైత్రిక శృతికకు బెస్ట్‌ ఫ్రెండ్‌.
ఏడుస్తూనే జరిగింది మొత్తం చెప్పింది. రాజీలు, సహనాలు, ఆత్మవంచనలు బాగా తెలిసినవాళ్లే ద్రోణ దగ్గర వుండగలుగుతారని కూడా చెప్పింది.
”ఏయ్‌! పిచ్చీ! ఏడుపు ఆపు. ఇందులో ఏముందని అంతగా ఏడుస్తున్నావ్‌? నీకసలు బాధలు అంటే ఏమిటో తెలుసా?” అంది చైత్రిక శృతిక గడ్డంపట్టుకొని…
”నీకు తెలుసా?” అంది శృతిక ముక్కుని కర్చీప్‌తో తుడుచుకుంటూ…
”తెలుసు. ఈ ఏడాది రుతుపవనాలు సరిగ్గా పనిచేయక అనేక జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. అదలా వుండగానే మన సి.ఎం. హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. అందులోంచి తేరుకోకముందే కనీవినీ ఎరుగని వరదలతో అనేక జిల్లాలు కొట్టుకుపోయి జనం వీధిన పడ్డారు…” అంది చైత్రిక.
”ఇది పేపర్‌ న్యూస్‌ నాక్కూడా తెలుసు…” అంది శృతిక.
చైత్రిక మాట్లాడలేదు.
”చైతూ! నా ఏడుపు చూడవే. నాగురించి ఆలోచించవే!” అంది శృతిక చైత్రిక భుజం పట్టి కదుపుతూ…
”నీకు కష్టమంటే ఏమిటో తెలిస్తే కదా నేను ఆలోచించటానికి… చాలామంది ఆడవాళ్లు కన్నీళ్లతో నిత్యం తడుస్తున్నారు. దారి తెలియక, ఎటు వెళ్లాలో తెలియక, ఎలా వెళ్లాలో తెలియక చీకటి దుఃఖంలో, దుఃఖపు చీకటిలో బేలగా మారి… గుప్పెడు మాటలకోసం, పిడికెడు మెతుకులకోసం ఎదురుచూస్తూ వున్నారు. వాళ్ల గురించి ఆలోచించేవాళ్లు లేరు. వెన్నుదన్నుగా నిలబడేవాళ్లు లేరు…” అంది చైత్రిక ఆలోచనగా.
”చైతూ ప్లీజ్‌! నీ మాటలతో నాకు ఆర్ట్‌ ఫిలిం చూపించకే. ద్రోణ బయట ఆడవాళ్లతో వున్నంత ప్లజంట్ గా నాతో వుండటంలేదు. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. బాధను బాధగా చూడవే..” అంది.
”అది బాధెలా అవుతుంది. అతను ఆర్టిస్ట్‌. మనసులో ఎన్ని బాధలు వున్నా అవి పైకి కన్పించకుండా నవ్వుతాడు. మట్లాడతాడు. అందరి అభిమానాన్ని పొందుతాడు. అదే అతని పెట్టుబడి…నీదగ్గర అలాంటిదేం అవసరంలేదు. అందుకే నటించడం లేదు.” అంది చైత్రిక.
గట్టిగా చైత్రిక చేతి మీద కండవూడేలా గిల్లింది శృతిక.
”అబ్బా…” అంది వెంటనే చైత్రిక.
”ఎందుకలా అరుస్తావ్‌! నేను గిల్లింది నటన అనుకొని ఎంజాయ్‌ చెయ్‌!” అంది శృతిక.
ఎర్రగా కందిన చేతిని చూస్తూ ‘ఉఫ్‌’ అనుకొంది చైత్రిక ఆ బాధకి చైత్రిక కళ్లలో సన్ని నీటిపొర కదిలి మాయమైంది.
*****
ఆ ఇద్దరు అలా ఓ గంటసేపు మాట్లాడుకోలేదు. ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు.
”చైతూ! నన్నర్థం చేసుకోవే! మునీంద్ర అనే రచయిత నీకు గుర్తున్నాడు కదా! ” అంది శృతిక.
”ఎందుకు గుర్తులేడు! మన ఫ్రెండ్‌ దీపిక ఆయనకి గ్రేట్ ఫ్యాన్‌ కదా! అది ఆయన్ని ప్రేమించి ఆయన తన ఒక్కదానికే సొంతం అని మనతో వాదించేది. మనం ఎంత చెప్పినా వినేది కాదు. ఒకరోజు ఆ రచయిత శాతవాహనాలో వస్తున్నాడని తెలిసి అది వెళ్తుంటే మనం కూడా ఆయన్ని పరిచయం చెయ్యమని వెళ్లాం. ఆయన మనల్ని చూడగానే దాన్ని వదిలేసి మనకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చాడు. అది చూసి దీపిక హర్టయింది. ఆయన ప్రేమ నుండి డైవర్ట్‌ అయింది. అయితే ఏంటి?” అంది.
”ద్రోణ అలాంటివాడే అని నా అనుమానం” అంది శృతిక
”అది తప్పు. అందరు ఒకేలా వుండరు. అందరి అనుభవాలు ఒకేలా వుండవు. నీకో ఎగ్జాంపుల్‌ చెబుతాను విను. ఒక ప్రముఖ కవి మా పిన్నితో ఆయన బయట వున్నంతసేపు ‘నువ్వే నా ప్రాణం’ అంటాడు. ఇంటికెళ్లాక ‘ఇక్కడ నా ప్రాణం పోతుంది’ అని పిన్ని ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చెయ్యడు. కారణం భార్య పక్కన వుంటుంది కాబట్టి.. ఇదేం జీవితంరా బాబు అని మనకి అన్పించవచ్చు. ‘అదే జీవితం’ అనుకుంటారు వాళ్లు…” అంది చైత్రిక.
”కానీ ద్రోణ అలా కూడా చెయ్యటంలేదు. ఇంట్లో నన్ను వదిలేసి ఫోన్‌ పట్టుకొని బయటకెళ్తాడు” అంది శృతిక.
”నీకు ఇబ్బంది అని వెళ్తున్నాడు. కాని ఆ కవిలాగా దొంగ వేషాలు వెయ్యటం లేదు. అలా వేసేవాడే అయితే ఆడవాళ్ల ఫోన్‌కాల్స్‌ ఇంటికి రాకుండా చూసుకుంటాడు” అంది చైత్రిక.
”ఏది ఏమైనా నేనోపని చెయ్యదలచుకున్నాను చైతూ! మన ఫ్రెండ్‌ స్వప్నికను మానవ బాంబులా ద్రోణ మీదకి ప్రయోగించాలనుకుంటున్నాను.” అంది శృతిక.
చైత్రిక ఆశ్చర్యపోతూ ”ఇలాంటి తిక్క ఆలోచన నీకెందు కొచ్చిందో నాకు తెలియదు. కానీ ఆత్మాహుతి దళంలో చేరానికి తన చుట్టూ తన చేతులతోనే బాంబులు పెట్టుకొని వెళ్తున్న అమ్మాయిలా అన్పిస్తున్నావు నువ్వు… ఎందుకంటే స్వప్నిక…” అని ఏదో అనబోయే లోపలే తలుపు నెట్టుకుంటూ గదిలోకి వచ్చింది స్వప్నిక.
శృతికను చూడగానే ”హాయ్‌! శృతీ!” అంటూ చేతిలో వున్న కవరు బెడ్‌మీద పడేసి శృతిక మీదపడి వాటేసుకొంది స్వప్నిక.
”హాయ్‌!” అంది కాని నవ్వలేదు శృతిక.
శృతికను వదిలి ”ఏంటే అలా వున్నావ్‌! ఇంట్లో ద్రోణ దగ్గర నవ్వి, నవ్వి వున్న నవ్వంతా అక్కడే వదిలేసి వచ్చావా?” అంది స్వప్నిక.
శృతిక ఇబ్బందిగా కదిలింది.
”చెప్పు! ఎలావుంది నీవైవాహిక జీవితం? హ్యాపీనా? మేం కూడా పెళ్లి చేసుకోవచ్చా? పర్వాలేదా చెప్పు?” అంది స్వప్నిక తెగ ఉత్సాహపడ్తూ.
‘ఇది ఇలా కూడా ఇంటర్వ్యూ చెయ్యగలదా’ అన్నట్లు చూస్తోంది చైత్రిక.
”ద్రోణతో అప్పుడప్పుడు బయటకెళ్తున్నావా? ఎక్కడెక్కడ తిరిగారు? తిరిగిన ప్రతిచోట నువ్వెలా ఫీలయ్యావ్‌? చెప్పవే? ఏదీ నీ ఫోనింకా రింగ్‌ కాలేదే! మీ ఆయనకి నువ్వు గుర్తురాలేదా ఏం?” అంది స్వప్నిక.
శృతిక మాట్లాడలేదు
”ప్లీజ్‌! స్వప్నీ! దాన్ని వదిలెయ్‌! తలనొప్పిగా వుందట…” అంది చైత్రిక.
స్వప్నిక తను తెచ్చిన కవరు విప్పి…”ఈ గిఫ్ట్‌ ఎలా వుంది?” అంటూ చైత్రిక చేతిలో పెట్టింది. చైత్రిక ఏకాగ్రతతో ఆ బొమ్మనే చూస్తోంది.
అది సజీవ ప్రకృతి చిత్రం.
ఆ చిత్రంలో సాయం సంధ్యవేళ పచ్చని పంటపొలం, ఆ పొలం గట్టున వున్న రెండు తాటితోపుల మధ్యలోంచి అస్తమిస్తున్న సూర్యబింబం. ఆ సాయం సమయంలో అద్భుతంగా అన్పిస్తున్న వాతావరణం.
”చూపు మరల్చుకోలేకపోతున్నావ్‌! అందులో ఏం కన్పిస్తోంది చైతూ?” అంది స్వప్నిక. ఆమెకు పల్లెటూర్లు, పంటపొలాలు నచ్చవు.
ఆ బొమ్మ కింద ద్రోణ పేరును చూస్తూ. ”ద్రోణ బొమ్మలు వేస్తాడని తెలుసుకాని ఇంత బాగా వేస్తాడని తెలియదు.” అంది ఎమోషనల్‌గా చూస్తూ. నెంబరుంటే వెంటనే అబినందించాలనిపించింది చైత్రికకు.
శృతిక ఇలాంటి ఫీలింగ్స్‌ని పట్టించుకోదు. ఆయనేదో గీస్తాడు. వీళ్లేదో చూస్తారు. ఇద్దరు పిచ్చోళ్లే ఆమె దృష్టిలో…
”అయినా నీ బాయ్‌ఫ్రెండ్‌కి ఈ గిఫ్టేం బావుంటుందే…” అంది పెదవి విరిచి చైత్రిక.
”మొన్నటి వరకు బాయ్‌ఫ్రెండే అనుకున్నా చైతూ! కాదని చెప్పేశాడు నిన్న. అందుకే ఇదివ్వాలని తెచ్చాను.” అంటూ షాపులో సెల్‌ఫోన్‌ పెట్టి మరచిపోయినట్లు గుర్తొచ్చి హడావుడిగా బయటకెళ్లింది స్వప్నిక.
”ఇప్పుడు చెప్పు! ద్రోణను స్వప్నికకు అప్పజెప్తే హీటర్‌ని తలమీద పెట్టుకున్నట్టు కాదా? అదేమైనా బొమ్మలు పెట్టి ఆడుకోవటం లాంటిది అనుకుంటున్నావా? తెగ సంబరపడిపోతున్నావ్‌? పిచ్చి, పిచ్చి గేమ్‌లు ఆడకు.” అంది తన స్నేహితురాలు సముద్రంలో మునగబోతుందని తెలిసి తప్పించాలన్నట్లు…
”అదేం కాదులే! స్వప్నిక ద్రోణకి ఫోన్‌చేసి అతని ఫ్యాన్‌లా మాట్లాడుతుంది. అతని మూమెంట్స్, రియాక్షన్స్‌, ఫీలింగ్స్‌ ఎలావుంటాయో నాకు చెబుతుంది. ఆ రోజు దీపిక ఉడ్‌బీ ఎలాంటివాడో టెస్ట్‌చేసి చెప్పింది కూడా స్వప్పికనే… దానివల్ల దీపిక కెంత ఉపయోగమయిందో మనందరికి తెలుసు. ఇదికూడా అంతే!” అంది శృతిక.
”అతను స్టూడెంట్! అతని వెదవ్వేషాలు అక్కడక్కడ విన్నాం కాబట్టి చూస్తూ, చూస్తూ దీపికను అతనకివ్వటం ఇష్టంలేక టెస్ట్‌ చేశాం. ద్రోణ అలా కాదు. పెళ్లయి భార్యవున్న బాధ్యతగల భర్త….” అంది చైత్రిక.
”అంత సీన్‌లేదు. అదేవుంటే ఈ ఇది ఎందుకు నాకు.. అతనికి అమ్మాయిల పిచ్చి వుందని, వెరయిటీ కోరుకుంటాడని నిరూపించటానికి ఇదొక్కటే మార్గం నాకు…” అంది.
”ఇదేంటే బాబూ! ఏదైనా ఒక లక్ష్యం కోసం తపించే వాళ్లున్నారు. పదిమందిలో ఒకరిగా వుండేందుకు తమలో ఏదో ఒక ప్రత్యేకత కన్పించాలని ఆరాటపడే వాళ్లున్నారు. బ్లెడ్‌ టెస్ట్‌ చేసినట్లు ఈ టెస్టేంటి? ఈ అన్వేషణేంటి?” అంది చైత్రిక.
”నన్ను చంపేస్తానన్నాడు. మాట్లాడే అర్హత లేదన్నాడు. తనముందు నిలబడొద్దన్నాడు. ఇంతకన్నా అవమానం ఏం కావాలి? అతని మనసులో బలంగా ఎవరో ఒకరు వుండబట్టేగా ఇదంతా?” అంది శృతిక.
”మనసులోకి తొంగి చూసే యంత్రాలు ఇంకా తయారుకాలేదు శృతీ! కానీ ఎంతోకాలంగా అతను వేసుకున్న బొమ్మల్ని నువ్వలా డేమేజ్‌ చేసివుండాల్సింది కాదు. అతని ప్త్లేస్‌లో ఎవరున్నా అలాగే చేస్తారు. నువ్వు ఇంటికెళ్లి ద్రోణకి సారీ చెప్పు!” అంది చైత్రిక.
”గంటలు, గంటలు గాళ్‌ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడేవాడికి సారీ చెప్పాలా?” అంది శృతిక నిరసనగా చూస్తూ…
”నువ్విక ఈ ఫీలింగ్‌ లోంచి బయటపడవా?” అంది
”పడతాను. కానీ ద్రోణ ఎలాంటివాడో నువ్వు టెస్ట్‌చేసి చెప్పు! ద్రోణను ప్రేమిస్తున్నట్లు తాత్కాలికంగా నటించు..” అంది సడన్‌గా.
స్థాణువైంది చైత్రిక. ఒక్కక్షణం ‘వింటున్నది నిజమా’ అన్నట్లు చూసింది.
”నువ్వు నా ఫ్రెండ్‌వి చైతూ! ఆ మాత్రం హెల్ప్‌ చెయ్యలేవా? ఎలాగూ నీ మనసులో రుత్విక్‌ వున్నాడు కాబట్టి దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది వుండదు.” అంది శృతిక.
శృతిక వదిలేలా లేదని… ”ద్రోణ మరీ అంత వీకా? నేను ప్రేమిస్తున్నానంటే నమ్మానికి? అయినా నేనలా నటించాలన్నా అతనితో మాట్లాడాలన్నా నాకు ఇన్సిపిరేషన్‌ రావొద్దా!” అంది చైత్రిక, నేనీ పని చెయ్యనని ముఖం మీద చెప్పలేక…
”దానికేం! ద్రోణ అందగాడేగా! పెళ్లిలో చూసి ముందుగా ఆయన్ని పొగిడింది నువ్వే… మాట బాగుంది, నవ్వు బాగుంది అని మన ఫ్రెండ్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేశావు. నేను చూస్తూనే వున్నా నీ అల్లరిని… ”మీ ఆయన్ని ఇదెప్పుడో లేపుకెళ్లిపోతుంది జాగ్రత్త.” అని కూడా మన ఫ్రెండ్స్‌ అన్నారు నాతో… ఆ ఇన్సిపిరేషన్‌ చాలదా? ఆయనతో నువ్వు మాట్లాడటానికి…? అంది శృతిక.
అసలే శృతిక ఆనుమానపు పీనుగ… ఇందులో నేను ఇరుక్కుంటే ఎటుపోయి ఎటు తేల్తానో అన్న భయంతో ఏం మాట్లాడలేదు చైత్రిక.
”మాట్లాడు చైతూ!” అంది రిక్వెస్ట్‌గా శృతిక.
”నేను ద్రోణతో మాట్లాడితే నువ్వేమీ అనుకోవుగా…? ఒక్కసారి నీ మనసులోతుల్లోకి వెళ్లి ఆలోచించి చెప్పు! ఎందుకంటే ఇది ‘ప్రేమ’ వ్యవహారం… ఇద్దరి మధ్యన రకరకాల మాటలు దొర్లుతుతుంటాయి. కట్టె, కొట్టె, తెచ్చెలా వుండదు మరి…” అంది చైత్రిక.
ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా చైత్రికపై నమ్మకంతో.. ఉద్వేగంగా చూస్తూ… ”మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నా నేనేమీ అనుకోను.” అంది దృఢంగా.
”నువ్వు వినవు కాబట్టి నీకలాగే అన్పిస్తుంది. కానీ నువ్వు మాఇద్దరి మాటలు వింటావు. ముందు నీకు కాల్‌చేసి తర్వాత ద్రోణకి కాల్‌ చేస్తాను. నీ ఫోన్‌కి కాన్ఫ్‌రెన్స్‌ కలుపుతాను. ప్రతిమాట, ప్రతిఫీలింగ్‌ నువ్వు వినాలి. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధంలేదు.” అంది చైత్రిక. స్వప్నిక చేతిలో ద్రోణ బలికాకుండా వుండాలంటే తనకీ రిస్క్‌ తప్పదనుకుంటూ…
”ఓ.కె. అలాగే కానివ్వు…”అంది శృతిక.
”ద్రోణ నెంబరివ్వు… ” అంది చైత్రిక.
వెంటనే చైత్రిక మొబైల్‌ని తీసుకొని ద్రోణ నెంబర్‌ని సేవ్‌ చేసి ఇచ్చింది శృతిక.
”ఇక నేను వెళ్తాను చైతూ!” అంటూ లేచి నిలబడింది శృతిక.
”అప్పుడే ద్రోణ గుర్తొచ్చాడా? వెళ్తానంటున్నావ్‌?” అంది చైత్రిక
”నేను వెళ్లేది ద్రోణ దగ్గరకి కాదు.” అంది శృతిక.
”మరి…?” అంటూ ఆశ్చర్యపోయింది చైత్రిక.
”మా పేరెంట్స్ దగ్గరకి… నేను దూరంగా వుండి ద్రోణకి నా విలువ తెలిసేలా చెయ్యాలి…” అంది.
ఏం మాట్లాడలేక అలాగే చూసింది చైత్రిక.
*****
ఆముక్త – సంవేద ఇంటికి వెళ్లింది.
కాలుమీద కాలు వేసుకొని, ఫైబర్‌ కుర్చీలో కూర్చుని కుడిచేత్తో పేపర్‌పట్టుకొని చదువుకుంటున్న గంగాధరం – ఒక చేయి లేకపోయినా ఇస్త్రీ చేసిన ఖద్దర్‌ బట్టల్లో ఇప్పుడే ఏదో సోషల్‌వర్క్‌ మీటింగ్‌ నుండి బయటకొచ్చిన ప్రజా నాయకుడులా వున్నాడు.
ఆయన పక్కనే వీల్‌ చెయిర్లో కూర్చుని సంవేద శారీకి పూసలు, అద్దాలు కుడుతోంది నిశిత.
గంగాధరాన్ని చూడగానే గౌరవభావం కల్గిన దానిలా.. ”మీ మామగారా?” అంది ఆముక్త.
”అవును. అప్పుడు చెప్పానుగా ఊరినుండి మా మామగారు వచ్చారని… కూర్చో ఆముక్తా!” అంటూ ఇంకో కుర్చీ తెచ్చి నిశిత పక్కన వేసింది సంవేద.
”నా పేరు ఆముక్త! సంవేద స్నేహితురాలిని…” అంటూ గంగాధరానికి తనని తను పరిచయం చేసుకొంది ఆముక్త.
ఆయన ‘అలాగా’ అన్నట్లు నవ్వి కూర్చోమన్నట్లు కుర్చీవైపు చేయి చూపాడు.
ఆముక్త కూర్చుంది.
”మామయ్యా! ఆముక్త బాగా రాస్తుంది” అంటూ ఆముక్తలో వున్న స్పెషల్‌ క్వాలిటీని గంగాధరానికి పరిచయం చేసింది సంవేద.
”అవునా! నేను బస్‌లో పనిచేస్తున్నప్పుడు బాగా చదివేవాడిని… ఇప్పుడు మానేశాను. ఓపిక తగ్గి కాదు. పుస్తకాల రేట్లు బాగా పెరిగాయి మన రేషన్‌ రేట్లులాగే.. అన్నట్లు మీరు ఏ టైపు రాస్తారు? పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకాలా? లేక నవలలా?” అన్నాడు ఆమెవైపు మర్యాదగా చూస్తూ.
”నావి అలావుండవండి! ఏవో చిన్న, చిన్న కవితలు. అదీ భావకవితలు మాత్రమే” అంది.
”పోన్లే! ఏదో నీ సంతోషం కోసం నువ్వు రాసుకుంటున్నావు. మంచిదే.” అంటూ ఆమె కవిత్వాన్ని చదవకపోయినా తన అభిప్రాయాన్ని చెప్పాడు.
”అంటే ! భావకవిత్వం, రాసేవాళ్లంతా కేవలం వాళ్లకోసమే రాసుకుంటున్నారా? ప్రజలకోసం కాదా? వాటిని చదివేవాళ్లు ప్రజలు కాదా?” అంది ఆముక్త.
”ప్రజలు అన్నీ చదువుతారు. కొన్ని మాత్రమే మనసులో నిక్షిప్తం చేసుకుంటారు.” అన్నాడు గంగాధరం.
”నిక్షిప్తం అంటే?” అంది అర్థమైకానట్లు చూస్తూ…
ఆమె ముఖంలోకి ఓసారి చూసి… ”నేను కృష్ణశాస్త్రి, ఊర్వశి, విశ్వనాధ కిన్నెర చదివాను. అవి చదువుతున్నప్పుడు సూర్యాస్తమయంలోని అద్భుతాన్ని, చంద్రోదయంలోని సౌందర్యాన్ని చూసినంతగా పొంగిపోయాను. మహానుభావులు వాళ్లు. లోకంలో సంచరిస్తూ దొరికిన ప్రతి సౌందర్యశకలాన్ని ఏరుకొని వచ్చి సృష్టించారు. అది కేవలం రసాస్వాదన.
…దానివల్ల స్పష్టమైన లక్ష్యాలు, శక్తిమంతమైన సందేశాలు దొరకవు. వ్యక్తిగత, వృత్తిగత సామర్థ్యం పెరగదు. మనిషికి ఏది ఎంతవరకు అవసరమో మనసులో ఏది నిక్షిప్తం చేసుకుంటే ఎంతవరకు వుపయోగపడ్తుందో ఆలోచించే స్థాయికి ఇప్పటి పరిస్థితులు మనిషిని మార్చివేశాయి. నిక్షిప్తం అంటే ఇప్పుడర్థమైందనుకుంటాను.” అన్నాడు.
ఆముక్త ఎప్పుడైనా అర్థం చేసుకునేంత లోతుగా ఆలోచించి కష్టపడదు. మనసుకి నొప్పి కల్గించుకోదు… ఏదో అలా, అలా జరిగిపోవాలి లైఫైనా, రచన అయినా అనుకుంటుంది.
”రచనలనేవి మనిషి లక్ష్యాలకి, సాధించవలసిన వాటికి సమగ్రమైన వెలుగులా పనిచెయ్యాలి. ఇంకా, ఇంకా ప్రేరేపించి మనిషిలోని జడత్వాన్ని మాయం చెయ్యాలి. అప్పుడు మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు” అన్నాడు. ఆయనకు పుస్తకాలు చదివిన అనుభవం చాలా వుంది. అందుకే అలా మాట్లాడగలిగాడు.
తలదిమ్మెక్కినట్లైంది ఆముక్తకి. ఈ లక్ష్యాలేంటో, ఈ ఉన్నతాలేంటో బొత్తిగా అర్థంకాలేదు. కొద్ది రోజులు పోతే ‘నండూరి ఎంకి తెలుసా?’ అని అడిగితే మా వీధిలో లేదంటారు. ‘కాళిదాసు ఎవరని’ అడిగితే అతనిది మా వూరే అంటారు అనుకొంది ఆముక్త. ఒక్కక్షణం చింతిస్తున్న దానిలా తన చేతివేళ్ల వైపు చూసుకుంటూ..
”నేనిక వెళ్తాను వేదా!” అంది వచ్చిన పని మరచిపోయి ఆముక్త.
”అప్పుడేనా కూర్చో ఆముక్తా!” అంది సంవేద
ఆముక్త భావాలు అర్థమైనవాడిలా ఇంకేం మాట్లాడలేదు గంగాధరం.
తనొచ్చిన పని గుర్తుచేసుకుంటూ.. ”వేదా! మావారు ఊటీ వెళ్లారు. బిజినెస్‌ పార్టనర్స్‌తో కలిసి… అందుకే నన్ను తీసికెళ్లలేదు. ఇంట్లో ఒంటరిగా వుంటున్నాను. పక్కప్లాట్ లో ఎవరూలేరు. భయంగా వుంది. నిశితను తీసికెళ్తాను. ఒక్క మూడురోజులే… మావారు ఇక్కడ ప్లైట్ దిగగానే నిశితను తీసుకొచ్చి వదులుతాను.” అంది ఆముక్త.
అందరు విన్నారు ఒక్క దేవికారాణి తప్ప…
ఆముక్తకి తోడుగా నిశితను పంపిన సందర్భాలు గతంలో వున్నాయి. వెంటనే ఒప్పుకోవాలని వున్నా – అత్తగారితో, మామగారితో ఓమాట చెప్పాలని ”నిశితను ఆముక్తతో పంపమంటారా అత్తయ్యా?” అంది దేవికారాణి దగ్గరకి వెళ్లి సంవేద.
”ముదనష్టం, దరిద్రం త్వరగా పంపు. శాశ్వతంగా ఎప్పుడు పంపుతావో ఏమోదాన్ని… నాకైతే దాన్ని చూడటమే కష్టంగా వుంది. ఈ మధ్యన కొత్తగా ఇంకో మేళం తోడైంది. వాళ్లతో నువ్వెలా వేగుతున్నావో ఏమో!” అంది ఈ మధ్యన నిశిత తనపనులు చెయ్యటం లేదన్న కోపంతో…
ఆమె ఇంకో కొత్తమేళం అని ఎవరిని అన్నదో సంవేదకి తెలుసు. గంగాధరం కూడా ఆ మాటల్ని విన్నాడు. భార్యకి తన రాక ఎంత కష్టంగా వుందో అర్థంకాని క్షణం లేదు. గాయపడని సందర్భంలేదు.
”వాళ్లు మనల్ని ఏం చేస్తున్నారు అత్తయ్యా? వాళ్లవల్ల నాకైతే ఎలాంటి ఇబ్బందిలేదు” అంది
”ఎందుకుంటుంది? కాళ్లు లేనివాళ్లతో, చేతుల్లేని వాళ్లతో వుండటం నీకు అలవాటేగా! ఆ దరిద్రాన్ని నేనైతే భరించలేకపోతున్నా.,..” అంది.
వినసొంపైన మాటల్ని అయితే వినాలనిపిస్తుంది కాని దేవికారాణి ఎప్పుడు నోరెత్తినా ‘నీకో దండం. నే నెళ్లిపోతా!’ అన్నట్లుగా చూడాలనిపిస్తుంది సంవేదకి. కానీ అలా వెళ్లిపోయే బంధం కాదుగా తమది. అత్తాకోడళ్ల ఐరన్‌ రిలేషన్‌..
”నీ చెల్లికి ఈ మధ్యన తలపొగరు ఎక్కువైంది. ఏది చెప్పినా చెయ్యటంలేదు. చెప్పిన మాట వింటేనే బ్రతకటం కష్టమని చెప్పు!” అంది దేవికారాణి.
చెల్లిమీద కోపంవస్తే అక్కతో చెప్పటం.. అక్కమీద కోపమొస్తే చెల్లితో చెప్పి తిట్టడం ఆమెకి అలవాటైపోయింది.
”సరే ! అత్తయ్యా! ఇప్పుడు దాన్ని ఆముక్తతో పంపి వస్తాను.” అంటూ ఆ గదిలోంచి బయటపడింది సంవేద.
”మీరేమంటారు మామయ్యా?” అంది మామయ్యను పక్కకి పిలిచి.
”పంపించు, సంవేదా! ఒంటరిగా వుండలేకనే అడుగుతోంది. మనం ఎదుటివారికి సహాయం చేస్తే ఆపదకాలంలో మనకు కూడా సహాయం చేసేవాళ్లు దొరుకుతారు” అన్నాడు గంగాధరం. ఆయనకు స్నేహం విలువ, సహాయంవిలువ బాగా తెలుసు.
అక్క చెప్పగానే లేచి వర్క్‌ చేస్తున్న శారీని కవర్లో పెట్టుకొని, ఆముక్తతో వెళ్లింది నిశిత.
*****
నిశిత అలా వెళ్లగానే ఆఫీసునుండి వచ్చాడు శ్యాంవర్ధన్‌.
రాగానే ”నిశిత ఏది?” అన్నాడు
”ఆముక్త దగ్గరకి వెళ్లింది” చెప్పింది సంవేద.
”ఎప్పుడొస్తుంది? ” అన్నాడు త్వరగా చూడాలనిపిస్తుంది అతనికి… రోజూ ఈ టైంలో ఏదో ఒక పనిచేస్తూ కన్పించేది. చూడగానే అదోలాంటి రిలీఫ్‌. పదే, పదే కావాలనిపించే రిలీఫ్‌ అది… ఆ ప్రాణానికి అలా అలవాటైంది.
”మూడు రోజుల వరకు రాదు.” అంది సంవేద.
”మూడు రోజులా! ఏదో ఒక్కరోజంటే అప్పుడప్పుడు పంపుతుండే దానివి… ఐనో. కానీ మూడురోజులంటే మాటలుకాదు. ఎవరినడిగి పంపావు?” అన్నాడు కోపంగా.
”అత్తయ్యను, మామయ్యను అడిగే పంపాను. అయినా ఈ విషయంలో ఎందుకింత సీరియస్‌ అవుతున్నారు?” అంది భర్తవైపు చూస్తూ.
”సీరియస్‌ ఎందుకుండదు? ఆడపిల్లల్ని బయటకి పంపే రోజులా ఇవి…? అందులో రాత్రివేళల్లో వేరే ఇళ్లలో పడుకోటానికి పంపటమేంటి? నీకు ఆ మాత్రం ఆలోచించే జ్ఞానం వుండక్కర్లేదా?” అన్నాడు మరికాస్త కోపంగా.
”మీరు అనవసరంగా ఆవేశపడ్తున్నారు. ముందు భోంచేయండి! ఆకలి తగ్గితే ఆవేశం తగ్గుతుంది” అంది సంవేద.
”నీకు నేను చిన్నపిల్లాడిలా కన్పిస్తున్నానా? ” అన్నాడు.
”అని నేను అన్నానా? ” అంది.
”అనకపోయినా అలాగే అన్పిస్తుంది నాకు… లేకుంటే వెళ్లేముందు నాకు కాల్‌ చేయాలని తెలియదా? చేసుంటే వెళ్లొద్దని అప్పుడే చెప్పేవాడిని… ఇప్పుడీ బాధలేకుండా పోయేది.” అన్నాడు.
”ఇప్పుడంత బాధ పడాల్సిందేంలేదు. అది హాయిగా వుంటుందక్కడ..” అంది
”అక్కడ హాయిగా వుంటే ఇక్కడ నేనుండొద్దా? రేప్పొద్దున ఏం జరిగినా బావను నేనుండి ఏం చెయ్యగలిగినట్లు? ఇలాంటి విషయాలు నీకు తెలియవు. నువ్వు తప్పుకో, నేను వెళ్లి నిశితను తీసుకొస్తాను.” అంటూ సంవేద భుజంపట్టి పక్కకి నెట్టి నాలుగడుగులు వేశాడు.
”ఆగు శ్యాం! నేనే వెళ్లమన్నాను. వస్తుందిలే. నువ్విలా వెళ్తే బావుండదు” అన్నాడు అప్పివరకు కొడుకు వాదనను విన్న గంగాధరం.
”బావుండక పోవటానికి ఏముంది ఇందులో… నేను నిశిత కోసం వెళ్తున్నా … ఆముక్త గారి కోసం కాదుగా!” అన్నాడు వ్యంగ్యంగా.
నిశిత మీద తన భర్తకి ఇంత అభిమానం వుందా అని నివ్వెరపోయింది సంవేద. భర్త చాలా ఎత్తులో కన్పించాడు ఆమెకు…
”నువ్వు నిశిత కోసమే వెళ్తున్నావ్‌! కాదనను కానీ ఇది సమయం కాదు.” అన్నాడు గంగాధరం.
”నేనెవరి మాట వినను. నిశితను పరాయి ఇంట్లో వుంచటం నాకిష్టం లేదు అందుకే వెళ్తున్నా …” అన్నాడు గ్టిగా
అతను నిశితకోసం వెళ్తుంటే సంవేద కళ్లు చెమర్చాయి ప్రేమతో…
గంగాధరం సంవేదవైపు చూస్తూ.. ‘పిచ్చిదానా! నీ మొగుడిది అభిమానమనుకుంటున్నావా! కాదు కామం. ఆ కామదాహం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఆ దాహంలో నిశిత జీవితం కొట్టుకుపోయేలా వుంది. ఇది నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. నేనేమో నీకు చెప్పకుండా ఈ అగ్నిని నా మనసులో ఆపుకోలేకపోతున్నా’ అని మనసులో అనుకుంటూ కోడలితో దీన్నెలా చెప్పాలి? చెప్పకుండా ఎలా దాచాలి? అని చూస్తున్నాడు.
”ఆయన మన మాట వినేలా లేరు మామయ్యా!” అంది తనవైపు నిస్సహాయంగా చూస్తున్న మామయ్యను ఉద్దేశించి సంవేద.
…చేసేదిలేక గంగాధరం పడుకున్నాడు.
*****
శ్యాంవర్ధన్‌ ఆముక్త ఇంటికి వెళ్లాడు.
గేటు దగ్గర వున్న గుర్ఖా శ్యాంని చూడగానే సెల్యూట్ చేశాడు.
ఆ ఇల్లు చాలా మోడరన్‌గా వుంటుంది. అంతేకాదు…
గేటు దగ్గరనుండి ఇంటి గుమ్మంవరకు ఓ చిన్న బాటలావుండి, ఆ బాటకి అటు, ఇటు క్రోటన్‌ మొక్కలు హుందాగా నిలబడి ‘హాయ్‌’ అన్నట్లు చూస్తూంటాయి. ఇంటి చుట్టూ లోపల వాళ్లు కన్పించేలా గ్లాసెస్‌ వుంటాయి. కర్టెన్స్‌ వేసి వుంటాయి కాబట్టి లోపలివాళ్లు బయటకి కన్పించరు.
…నేరుగా వెళ్లి అక్కడే ఆగిపోయాడు శ్యాంవర్ధన్‌
కారణం లోపల కూర్చుని శారీకి అద్దాలు కుడుతోంది నిశిత. తలకాస్త వంగి వుండటంతో ఆమె జడలో పెట్టిన ముద్దబంతిపువ్వు అందంగా కన్పిస్తోంది. నిశితకి ఎదురుగా కూర్చుని పుస్తకం చదువుతూ, మధ్య, మధ్యలో నిశిత మాటల్ని వింటోంది ఆముక్త.
…శ్యాంవర్ధన్‌ కూడా ఉత్కంఠతో వింటున్నాడు.
”నిశితా! ఈ మాటలన్నీ నీకెవరు చెప్పారు? ఇంత మెచ్యూర్డ్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నావ్‌?” అంది ఆశ్చర్యపోతూ ఆముక్త.
”మా గంగాధరం మామయ్య రోజూ నిద్రపోయే ముందు చెప్తుంటాడు అక్కా! నేను అవన్నీ గుర్తుపెట్టుకుంటాను.” అంది నిశిత.
”అవునా? మీ మామయ్య మంచి అనుభవజ్ఞానిలా వున్నాడు కదూ?” అంది ఆముక్త.
”అవును. ఆయన అనుభవాలు వింటుంటే కన్నీళ్లొస్తాయి. అభిరుచితో వినాలే కాని ఆ కన్నీళ్లు చెప్పే కథలు కోకొల్లలు.” అంది నిశిత.
చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి నిశితవైపు చూసింది ఆముక్త.
”అవునక్కా! జీవితంలో ప్రతి ఒక్కటీ ప్రాముఖ్యత కలిగి వుంటుందట… ఒక్కోసారి ఇదెంతలే అని దానికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వకుండా తక్కువ అంచనా వెయ్యకూడదట… ఏదైనా మన చేతికి అందేంత దూరంలో వుంటే దాని విలువ గ్రహించం కదా! అదే చేయిదాటిపోతే బాధపడ్తాం… అందుకే ఏదైనా చేజారిపోయిన తర్వాత బాధపడేకంటే ముందుగానే దాని విలువ తెలుసుకోవటం ముఖ్యమని చెబుతాడు.
…అంతేకాదు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా మనలో మనమే బాధపడుతూ కూర్చోకుండా మనమంచి కోరే స్నేహితులకో, ఆత్మీయులకో చెప్పుకోవాలంటాడు. అప్పుడు సమస్య తీరకపోయినా కొంత ప్రశాంతత కలుగుతుందని కూడా చెబుతాడు మామయ్య” అంది నిశిత.
దానికి ఆముక్త ఏమాత్రం ఏకీభవించని దానిలా చూస్తూ.. ”సమస్య ఎప్పుడైనా సమస్యే! చెప్పినంత మాత్రాన తీరదు. అలా చెబితే చీప్‌ అయిపోతాము” అంది.
”అలా అనుకోకూడదక్కా! సమస్య ఎప్పుడూ కష్టంగానే వుంటుంది. కష్టం వచ్చిందని కృంగిపోకుండా ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోవాలి అంటే దానికి ఆత్మీయులు అండ అవసరం అంటాడు మామయ్య!” అంది నిశిత.
”చూడు నిశితా! నువ్వు సమస్య గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెబుతున్నా… జీవితంలో అన్ని సమస్యల్ని పైకి చెప్పుకోలేం. కొన్నిమాత్రమే చెప్పుకోగలం… అదిగో బయట మీ బావ కన్పిస్తున్నాడు. ఒక్క నిముషం…! అంటూ లేచి వెళ్లి పూర్తిగా కర్టెన్‌ తొలగించి శ్యాంవర్ధన్‌ని చూసి ఓ నవ్వు నవ్వి… తలుపుతీసి ఆ నవ్వుతోనే లోపలకి ఆహ్వానించింది.
లోపలకి వచ్చి కూర్చున్నాడు.. ఎ.సి. సౌండ్‌కి, ఆ చల్లదానికి ఆ వాతావరణం గమ్మత్తుగా, మత్తుగా వుంది.
”ఎంతసేపయింది మీరొచ్చి?” అంది ఆముక్త.
”ఇప్పుడే ! మా నిశిత చాలా క్లవర్‌గా మాట్లాడుతుంటే వినాలనిపించి డిస్టర్స్‌ చెయ్యకుండా అక్కడే ఆగిపోయాను” అన్నాడు.
నిశిత, ఆముక్త ఒకరినొకరు చూసుకున్నారు.
ఆముక్త వైపు చూస్తూ ”మా నిశితను తీసికెళ్దామని వచ్చాను” అన్నాడు
ఉలిక్కిపడ్డట్లు చూసి ”ఎందుకు?” అంది ఆముక్త.
”మా నాన్నగారు తీసుకురమ్మన్నారు.” అంటూ అబద్దం చెప్పాడు. అతనికి నిశితను తన బైక్‌మీద కూర్చోబెట్టుకొని వెళ్లాలని, దారిలో ఏదైనా ఓ రెస్టారెంట్లో కూర్చోబెట్టి, తన మనసులో కోరికను బయటపెట్టాలని వుంది.
”మణిచందన్‌ ఊటీ వెళ్లారు. ఒంటరిగా వుండలేక నిశితను తీసుకొచ్చాను ప్లీజ్‌! మీ నాన్న గారికి నచ్చచెప్పండి! నిశిత ఇక్కడే వుంటుంది.” అంది ఆముక్త.
మాట్లాడలేకపోయాడు. శ్యాంవర్ధన్‌. మణిచందన్‌ లేడు కాబట్టి నిశితను వుంచాలంటే అభ్యంతరం లేదు. కానీ నిశిత లేకుంటే తనుండలేక పోతున్నాడు. ఈ బలహీనత ఎలా జయించాలో అతనికి అర్థం కాకుండా వుంది.
”కొన్ని బలహీనతలు మనిషిని తనవైపుకి బలంగా అాక్ట్‌ చేసుకుంటాయంటే ఇన్ని రోజులు నేను నమ్మేవాడ్ని కాదు ఆముక్తగారు ! ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది. మా నాన్నగారి బలహీనత నిశిత! ఎందుకంటే చిన్నపనికి, పెద్దపనికి నిశితపై ఆధారపడ్తున్నాడు. అదే చెప్పాడు”. అంటూ మొత్తం తండ్రి పైకి నెట్టివేస్తూ తెలివిగా మాట్లాడాడు.
”మామయ్య పనులన్నీ అక్క చేస్తానంది బావా!” అంది నిశిత. ఆమెకు వెళ్లాలని లేదు. కనీసం ఈ మూడు రోజులైనా బావలోని రాక్షసకోరికతో నిండిన చూపుల్ని తప్పించుకుందామని వుంది.
”ఎంతయినా నువ్వున్నట్లు వుంటుందా నిశితా!” అన్నాడు ఆమె కళ్లలోకి సూటిగా, కొంటెగా చూస్తూ…
”ఎలాగోలా అడ్జస్ట్‌ అవుతాడు లెండి! మూడురోజులేగా!” అంది ఆముక్త.
ఇది నిశితను తీసికెళ్లే సందర్భం కాదని అర్థమైంది శ్యాంకి.
అతను మౌనంగా వుండటం చూసి… ”నిశిత నా దగ్గర సేఫ్‌గా వుంటుంది. కావాలంటే అప్పుడప్పుడు మీరు వచ్చి చూసివెళ్లండి!” అంది ఆముక్త.
ఇది నచ్చింది శ్యాంవర్ధన్‌కి.
”నేను రేపు ఆఫీసునుండి ఇటే వస్తానండి! మణిచందన్‌గారు లేరు కాబట్టి మీకేదైనా అవసరం రావొచ్చు. మిమ్మల్ని మా సంవేదతో పాటు నేను కూడా అర్థం చేసుకోగలను. నిశితను వుంచుకోండి!” అన్నాడు శ్యాంవర్ధన్‌.
అతనంత సడన్‌గా మారిపోవటం ఆముక్తతోపాటు నిశితకి కూడా ఆనందం వేసింది.
‘గుడ్‌నైట్…’ చెబుతూ నిశిత వైపు దాహంగా చూశాడు శ్యాం. కంపరంగా అన్పించి ఒళ్లు గగుర్పొడిచింది నిశితకి.
అతను వెళ్లగానే గ్లాస్‌డోర్‌ మూసి, కర్టెన్స్‌ దగ్గరకి లాగి వెనుదిరిగిన ఆముక్త నిశితను చూసి ఆశ్చర్యపోయింది.
నిశిత అనీజీగా గోళ్లు కొరుకుతోంది. చురుగ్గా నేలవైపు చూస్తోంది.
”ఏమి నిశితా అలావున్నావ్‌?” అంది ఆముక్త.
‘వీడు.. వీడు.. మా అక్క భర్త కాకపోయివుంటే బావుండేది’ అనిపైకి అనలేక మనసులో అనుకొంది.
మనసులో మాటను మనసులోనే తొక్కి, గోళ్లు కొరకటం ఆపి, సన్నగా ఓ నవ్వు నవ్వీ… ”ఏంలేదక్కా!” అంది.
కానీ పైకి చెప్పుకోలేని సమస్య నిశితలోని నరనరాన్ని నలిపేస్తున్నట్లు ఆముక్త అంచనా వెయ్యలేకపోయింది.
*****
”ద్రోణతో మాట్లాడావా చైతూ? ఇంకాలేదా? ఈ విషయంలో ఎందుకింత లేట్ చేస్తున్నావు? భయపడ్తున్నావా? నేనే చెప్పినప్పుడు భయం దేనికి? అయినా నాకెప్పుడు ఇలాగే అన్యాయం జరగుతోంది. అప్పట్లో ఎంత చదివినా క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేది కాదు. దానితో మా ఇంట్లోవాళ్లు తృప్తిపడకుండా ఎప్పుడు చూసినా హాస్టల్లోనే వుండి చదివి ర్యాంక్‌ కొట్టమనేవాళ్లు… అక్కయ్యతో పోల్చి చూసేవాళ్లు. ఒకవిధమైన నిర్లిప్తతతో, మొండితనంతో హాస్టల్లో వుండకుండా ఎప్పుడు చూసినా స్కూటీమీద తిరిగేదాన్ని…
పెళ్లయ్యాక ద్రోణకి నా వంట నచ్చేది కాదు. విమలత్తలాగ చెయ్యమనేవాడు. ఆ తరం వంటల్ని చెయ్యటానికి నేను చాలా ట్రైనింగవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేనెంతగా అతన్ని ప్రేమించినా అతని ప్రేమ నామీద వున్నట్లు కన్పించటంలేదు… స్వతహాగా అతనెలాంటి వాడో టెస్ట్‌ చెయ్యవే అంటే నువ్వేమో చాలా క్యాజ్‌వల్‌గా తీసుకుంటున్నావ్‌! కనీసం ఇవాళైనా ద్రోణతో మాట్లాడవే! ప్లీజ్‌!” అంది చాలా బ్రతిమాలుతూ శృతిక.
స్నేహితురాలికి హెల్ప్‌ చెయ్యాలనివుంది చైత్రికకి…
కానీ ద్రోణ సెలబ్రిటీ కాబట్టి ఫోన్‌ చేస్తే అతని రిసీవింగ్‌ ఎలావుంటుందో అని ఆగిపోయింది. శృతిక వదిలేలా లేదు. తను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అంటోంది.
చివరకు ఓ నిర్ణయానికి వచ్చి – ద్రోణకి గొప్ప ఫీలింగ్‌తో కూడిన మెసేజ్‌ ఇద్దామని మొబైల్‌ని చేతిలోకి తీసుకొంది.
”హాయ్‌! ద్రోణా! ఐయాం చైత్రిక… మంచుపొగల్ని, వెన్నెలముక్కల్ని కలగలిపినట్లున్న మీ బొమ్మల అందాలు, సూక్ష్మాతిసూక్ష్మమైన రేఖల్లో ఒదిగిన ఆ అద్భుతాలు నన్ను తమలో మమైకం చేసుకొని, నా మనసును మీ భావనలో మునిగిపోయేలా చేశాయి. మీ హృదయభాషను నా మనోనేత్రంతో స్పర్శించి మౌన ప్రణామం చేస్తున్న… అందుకోండి ద్రోణా!” అని ద్రోణ సెల్‌కి మెసేజ్‌ సెండ్‌ చేసింది.
ఒకరోజంతా ఎదురు చూసింది అతని ప్రతిస్పందనకోసం…. సమాధానం లేదు. ఆమెకు నిద్రరావటంలేదు.
‘ఇప్పుడెలా? ఏంచేయాలి?’ అని బాధగా అనుకొని…
”ద్రోణా మీ తలపే నా హృదయస్పందన అయిన క్షణంనుండి ఒక్కక్షణం కుదురుగా వుండలేక పోతున్నాను. అనుక్షణం మీ ధ్యాసే నా ఊపిరైంది. అందుకే నా మనసును ఈ మెసేజ్‌గా పంపిస్తున్నా… దీన్ని మీ పెదవులతో చదువుతుంటే నా మనసును సృశిస్తున్నట్టే వుంటుంది. మిస్‌యు…” అంటూ ద్రోణ సెల్‌కి ఇంకో మెసేజ్‌ ఇచ్చింది.
ఈ మెసేజ్‌ని ఇస్తున్నప్పుడు పర్యవసానం ఎలా వుంటుందన్నది ఆమె ఆలోచించలేదు. శృతికనుండి పుల్‌ పర్మిషన్‌ వుండటంతో దేనికీ వెనుకాడటంలేదు. ఎక్కుపెట్టిన బాణంలా ద్రోణ మీదకి తన భావాలను సంధిస్తోంది
ఈ రోజు కూడా అతని నుండి ఆన్సర్‌ లేదు.
మళ్లీ మొబైల్‌ అందుకొంది. ఈసారి ఆమెలో ఇంకా పట్టుదల పెరిగింది.
”మీ తలపుల దుప్పిలో నన్ను నేను కప్పుకొని మీరంటే ఎంతిష్టమో మీతో చెప్పమని తెల్లని మేఘంలోని ఓ తునకను బ్రతిమాలి మీ దగ్గరకు పంపాను. అందలేదా ద్రోణా? కనీసం మీ మెసేజ్‌ కోసం ఎదురుచూస్తున్నానని అక్కడున్న సన్నజాజి, చల్లగాలి అయినా మీకు గుర్తు చెయ్యటం లేదా? నేనిప్పుడు దుప్పటిలోంచి బయటకొచ్చి, కికీలోంచి చూస్తుంటే… బయటంతా వెన్నెల కురుస్తూ ఆకాశం అద్భుతంగా వుంది. నా ప్రాణంలో ప్రాణమైన మిమ్మల్ని గంగనుండి నీరు తెచ్చి అభిషేకించాలనో ఏమో మేఘాలన్నీ వేగంగా పరిగెడుతున్నాయి… అది చూసి నా మనసు ఉత్సాహంగా, ఆకాశం,భూమి కలిసేచోట కన్పించే గీతలా మారి మీ మెసేజ్‌ కోసం నిరీక్షిస్తుంది.” అని మేసెజ్‌ సెండ్‌ చేసింది.
అతని నుండి సమాధానంలేదు.
*****
నిద్రలేచింది చైత్రిక…
లేవగానే ద్రోణ వర్షిత్‌ గుర్తొచ్చాడు తనకేమైనా మెసేజ్‌ ఇచ్చాడేమోనని ముందుగా మొబైల్‌ అందుకొని చూసింది.
ఒక్క మెసేజ్‌ కూడా రాలేదు. కనీసం కర్టెసీ కోసమైనా రిప్లై ఇవ్వాలనుకోలేదా ఈ ద్రోణ? నేనెవరో అడగాలని కూడా అన్పించలేదా? ఎందుకో గిల్టీగా అన్పించింది చైత్రికకి… తనలోని అహాన్ని మెడలు విరిచినట్లు, అభిమానాన్ని తనంతటతనే చంపుకుంటున్నట్లు కొద్దిక్షణాలు ఇన్‌సల్టింగ్‌గా ఫీలయింది.
ఏ అమ్మాయి అయినా ఒక వయసు వచ్చాక – ‘మగపిల్లలు తాము పిలిస్తే పలుకుతారని, ఏ పని చెప్పినా చేస్తారని, కనుసైగకే పడిపోయి ఇంట్రస్ట్‌ చూపిస్తారని, ముఖ్యంగా ఫోన్‌ చేస్తే పడి చస్తారని’ అనుకుంటారు కానీ ద్రోణ విషయంలో అవన్నీ తలక్రిందులయ్యాయి.
”ద్రోణా! రాత్రంతా నిద్రలేదు. నాకెందుకో మీరు నన్ను అవమానిస్తున్నట్లనిపిస్తోంది. ఒక అమ్మాయి అంత క్రియేటివిటీతో మెసేజ్‌లు పంపితే మీ అంత మౌనంగా ఎవరూ ఉండరనిపిస్తోంది. అంత అద్భుతమైన ఆర్టిస్ట్‌ అయివుండి ఇదేనా ఒక అమ్మాయి మనోభావాలకు మీరిచ్చే ఇంపార్టెన్స్‌? కానీ ద్రోణా ! ఒక్క నిజం చెప్పనా? మనకు తెలియకుండా ఊపిరి తీసుకోవటం ఎంత సహజమో మీరు నా ఊహల్లో మునిగిపోవటం కూడా అంతే సహజం… ” అంటూ ద్రోణ మొబైల్‌కి మెసేజ్‌ సెండ్‌ చేసింది.
నో రెస్పాన్స్‌…!
నిముషాలు గడుస్తున్న కొద్ది చైత్రిక మనసంతా శూన్యం.. ఎందుకో తెలియదు.
ఏదో తెలియని భావం తన పలకరింతతో, స్పర్శతో ఆమెను ఆక్రమిస్తూ, వ్యాపిస్తూ, మనసును అలజడిగా, ప్రజ్వలితంగా చేస్తోంది.
ఇక ఆగలేక – ధైర్యం తెచ్చుకొని, అతనితో మాట్లాడాలని కాల్‌ చేసింది.
‘హాలో….’ అంది విమలమ్మ
ఒక్కక్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు చైత్రికకి… వెంటనే ”ద్రోణ వర్షిత్‌ గారున్నారా?” అంది చైత్రిక.
”ఒక్క నిముషం లైన్లో వుండమ్మా!” అంటూ అప్పుడే నిద్రలేచిన ద్రోణ దగ్గరకి సెల్‌ తీసికెళ్లి ఇచ్చింది విమలమ్మ. అతను సెల్‌ తీసుకొని ‘హాలో’ అనే లోపలే భయంతో కాల్‌ కట్ చేసింది చైత్రిక.
అతను బెడ్‌ చివరకి జరిగి బోర్లా పడుకొని నేలమీద మొబైల్‌ పెట్టి నెంబర్లు నొక్కుతూ మెసేజ్‌లు చూస్తున్నాడు.
అతను పడుకున్న తీరు ఎంత నిర్లక్ష్యంగా వున్నా, ఒత్తైన క్రాపు, గుండ్రి బలమైన భుజాలు యవ్వన శోభను ప్రస్ఫుటం చేస్తున్నాయి.
కొడుకును లేపటం కష్టంగా వుంది విమలమ్మకి. నిద్రలేచినా మళ్లీ పడుకుంటున్నాడు. తిండీ, నీళ్లు ముట్టుకోడు. కాలిపోయిన బొమ్మల్నే గుర్తుతెచ్చుకుంటున్నాడు. బయట ప్రపంచానికి దూరమయ్యాడు. మళ్లీ కుంచె పట్టలేదు.
”లే! నాన్నా! టైమంతా నిద్రలో గడిపేస్తే నీకంటూ టైమేముంటుంది?” అంది కొడుకు తల నిమురుతూ విమలమ్మ.
ద్రోణ ఒకరకంగా నవ్వి… ”నాకిప్పుడు టైమెందుకమ్మా? ఒకప్పుడు ఆ టైం కోసం… అంటే! నాకంటూ కొంత టైం కావాలని, నాదైన ప్రపంచంలో నేనుండాలని, సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవాలని, ఇంట్లోవాళ్లు, మిగతా ప్రపంచం నిద్రలేవక ముందే లేచి బోర్డు ముందు నిలబడి అలౌకిక స్థితిలోకి వెళ్లి, నాకంటూ ఓ శైలిని సంపాయించుకొని బొమ్మల్ని గీసేవాడిని… అలా నా సుదీర్ఘ కఠోర శ్రమ చివరికి నాకేం మిగల్చిందో చూశావుగా…! ఇంకా నాకెందుకీ టైం…?” అన్నాడు.
”అలా అనకు ద్రోణా! పోయినదాన్ని తిరిగి సంపాయించుకో!” అంది విమలమ్మ.
”అది ఒక్కరోజులో ఒక్కరాత్రిలో వచ్చేదికాదు. అయినా నాకు జరిగిన లాస్‌ గురించి మీరెవరు మాట్లాడలేదు. ఎందుకంటే శృతిక నీకు కోడలు కన్నా ముందు నీ అన్నకూతురు. దేన్నైనా కడుపులో పెట్టుకోటానికే ప్రయత్నిస్తారు.” అన్నాడు నిష్ఠూరంగా.
కొడుకు మాటలకి బాధపడ్తూ… ”బూడిద గురించి ఎంత మాట్లాడి ఏం ప్రయోజనం ద్రోణా! ఒక్కోసారి అనుకోకుండా వచ్చే నష్టంలాంటిదే ఇది. కడుపులో పెట్టుకోక తప్పదు. మన వేలు, మన కన్ను పొడుచుకుంటే మన కన్నే పోతుంది.” అంది విమలమ్మ.
”సరే! అమ్మా! నేను మామూలు మనిషిని కావాలంటే నాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు నన్నిలా ఒంటరిగా వదిలెయ్యి…” అన్నాడు.
కొడుకు గదిలోంచి నెమ్మదిగా కదిలి హాల్లోకి వచ్చి కూర్చుంది.
*****
బాగా ఆలోచించి శృతిక తండ్రి నరేంద్రనాధ్‌కి ఫోన్‌ చేసింది విమలమ్మ.
”అన్నయ్యా! శృతికను పంపు…! ఇంకా ఎన్ని రోజులు వుంచుకుంటారు?” అంది విమలమ్మ కోపంగా. కోపమేకాదు. ఏడుపుకూడా వస్తుందామెకు.
”వస్తుందిలేమ్మా! తొందరేముంది?” అన్నాడు చాలా ప్రశాంతంగా.
”ఇంకెప్పుడు? చెరొకచోట వుండటానికా మనం పెళ్లి చేసింది. కలిసివుంటేనే కదా కష్టాన్నైనా, సుఖాన్నైనా భరించే శక్తివస్తుంది? ఇలా వుంటే ఒకరికొకరు ఎలా అర్థమవుతారు?” అంది.
ఆ మాటకి ఆశ్చర్యపోతూ…”ఇంకా అర్థం చేసుకునే స్థితిలోనే వున్నారా వాళ్లు? ” అన్నాడు.
”జీవితాన్ని పూర్తిగా చూసిన వృద్ధదంపతులు కూడా మనసులు కలవక ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకానికి ప్రయత్నిస్తుంటే వాళ్లకేం వయసుందని అన్నయ్యా? మన కళ్లముందు పుట్టారు. నెమ్మదిగా అర్థం చేసుకుంటార్లే… మనం చూస్తూనే వున్నాంగా…! పుట్టాక.. కొంతమంది పిల్లలు త్వరగా నడవలేరు. మాట్లాడలేరు. వీళ్లుకూడా ఆ కోవకు చెందినవాళ్లే…” అంది.
నరేంద్రనాధ్‌ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు.
”శృతికకి ఫోనివ్వు అన్నయ్యా! మాట్లాడతాను.” అంది
”అది ఇంట్లో లేదు విమలా! మీరు చిన్నప్పుడు మన ఇంటి వెనక రింగ్‌బాల్‌ ఆడే స్థలంలో తన ఫ్రెండ్స్‌తో కూర్చుని పాటలగేమ్‌ లాగా మాటలగేమ్‌ ఆడుతూ బిజీగా వుంది… దాని సెల్‌కి చెయ్‌!” అన్నాడు. ఆడపిల్లల్ని ప్రేమించే తండ్రుల్లో అతడొకడు.
వెంటనే శృతిక సెల్‌కి కాల్‌ చేసింది విమలమ్మ.
”ఒక్క నిముషం మీరుండండే… మా అత్తయ్య కాల్‌ చేస్తోంది మాట్లాడి వస్తాను.” అంటూ పక్కకెళ్లి…
”హాలో! అత్తయ్యా! బాగున్నావా?” అంది శృతిక.
”నేను బాగున్నాను. నువ్వెలా వున్నావ్‌?” అంది విమలమ్మ.
”నేను బాగున్నాను అత్తయ్యా!”
”ఇక్కడ నా కొడుకే బాగలేడు.”
”అది ఆయన చేసుకున్నదే!”
”నువ్వు చేసిందేం లేదా?”
”నేను చేసిన దానికన్నా ఆయన నాకు చేసిందే ఎక్కువ. ఒక్కరోజు కూడా ఆయన దగ్గర నేను మనశ్శాంతిగా లేను. నాగురించి ఆలోచించరేం. అత్తయ్యా! పెళ్లికి ముందు నేను స్పీడుగా వున్న మాట వాస్తవమే. పెళ్లయ్యాక పొంగిపోయే పాలు, మాడిపోతున్న పప్పే జీవితంలా మారాను. అర్థం చేసుకోరేం?” అంది శృతిక.
ఓ నిట్టూర్పు వదిలి ”నీకు భర్త విలువ తెలుసా శృతీ?” అంది విమలమ్మ.
”ఎందుకు తెలియదు. నా భర్త చిటికేస్తే నౌకర్లు పరిగెత్తుకుంటూ రావాలని, ఆయన ఎక్కడికెళ్లినా రెడ్‌కార్పెట్ స్వాగతాలు ఎదురవ్వాలని, ప్రతిరోజు అంతర్జాతీయ స్థాయి చర్చల్లో ఆయన మునిగి వుండాలని నేను కోరుకోవటం లేదు. నా స్థాయి విలువల్లోనే నా భర్తను చూడాలనుకుంటున్నాను. ” అంది శృతిక.
”నువ్వు నాకు అర్థం కావటంలేదు శృతీ!” అంది
”ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది అత్తయ్యా! మొదటినుండి నేను చెబుతూనే వున్నాను. ఆయన లోకం ఆయనదే నా మాట వినరని… అయినా మీరు పట్టించుకోవటం లేదు. ఆయనేం చిన్నపిల్లవాడు కాదుగా ఓ కన్నేసి వుండానికి… ”నేను మీ అభిమానిని” అని ఏ అమ్మాయి పిలిచినా వెళ్తాడు. ఇంట్లో వున్నంతసేపు ఒకటే ఫోన్‌ కాల్స్‌…! ఏ అమ్మాయి భరిస్తుంది. అత్తయ్యా ఇలాంటి భర్తని? మీరే చెప్పండి!” అంది శృతిక.
”ఎవరి ప్రొపెషన్లో వాళ్లకి పరిచయాలు, స్నేహాలు వుంటాయి. అంతమాత్రాన అనుమానించాలా? మీ మామగారు ఉమెన్స్‌ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఎందరో అమ్మాయిలు ఇంటికి వస్తుండేవాళ్లు. డౌట్స్ క్లారిఫై చేసుకొని వెళ్లేవాళ్లు. నేనెప్పుడైనా నీలాగ మా పుట్టింటికి వెళ్లానేమో మీ నాన్నని, అమ్మని అడుగు. ఒకవేళ వెళ్లినా ఆయనతో కలిసి వెళ్లి వచ్చేదాన్ని… నీలాగ వెళ్లేదాన్ని కాదు.” అంది విమలమ్మ.
”నాలాగ వెళ్లటం అప్పట్లో మీకు రాలేదు. పుట్టింటిని ఎలా యూజ్‌ చేసుకోవాలో తెలియలేదు. అక్కడే వుండి అన్ని బాధలు పడ్డారు. నాకేంటి నీలాగ అడ్జస్ట్‌ కావలసిన అవసరం? మా అమ్మా, నాన్నవున్నారు. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. అది చాలు నాకు…” అంది.
”చూడు శృతీ! నిన్ను ఒకరు ప్రేమగా చూడాల్సిన వయస్సు కాదు నీది. నువ్వొకర్ని చూడాల్సిన వయసులో వున్నావు. ఇక్కడ నీ ఇల్లు, నీ బాధ్యతలు వున్నాయి. వచ్చి వాటిని చూసుకో…” అంది.
”నేను రాను…” అంది కచ్చితంగా
”నా కొడుకు బాధలో వున్నాడు. నువ్వొచ్చి ఆ బాధలోంచి వాడ్ని బయటకు తీసుకురా! అది నీ బాధ్యత. బాధలు ఎప్పుడూ వుండవు. అవి వున్నప్పుడే మనిషి అవసరం ఎంతగానో వుంటుంది. ముఖ్యంగా మనవాళ్లని మనం చూసుకోవటం కనీస ధర్మం. ద్రోణ నీ భర్త – పరాయివాడు కాదు. పంతాలకు ఇది సమయం కూడా కాదు.” అంది విమలమ్మ.
‘నాకు రావాలని లేదు.”
”ఎందుకు లేదు. ఎప్పుడు చూసినా – నేనూ, నా సమస్య, నా అనుమానం ఇదేనా నీకు కావలసింది? ఇంకేం అక్కర్లేదా? భర్త కావాలని అనిపించదా?”
”అనిపిస్తుంది. అది నాకు తగినది కాదనిపించి దూరంగా వున్నాను.”
”నువ్వు తప్పు చేస్తున్నావు శృతికా!”
”తప్పు తెలుసుకున్నాను అత్తయ్యా!”
”కాదు … పెద్దదానిగా నామాటలు నేను చెబుతున్నాను విను. జీవితంలో ఎన్నో విషమ పరిణామాలు వుంటాయి. తట్టుకోవాలి. చెప్పినా వినలేని భయంకరమైన అలవాట్లు, స్వార్థాలు, ఆత్మవంచనలు వుాంయి. అవన్నీ వుంటేనే జీవితం… ఇవిలేని జీవితాలు ఎక్కడా వుండవు. కానీ ద్రోణ మంచివాడు. అది నీ అదృష్టం చేయిజారనీయకు…” అంటూ కాల్‌ కట్ చేసింది విమలమ్మ.
ఆమెకు తన కొడుకు జీవితం ఇలా అయినందుకు బాధగావుంది. పైకి ఎంత సున్నితంగా అన్పిస్తుందో అంత కఠినమైన సమస్య ఇది.
*****
ద్రోణ మొబైల్‌లో ఇంకా కొన్ని కొత్త మెసేజ్‌లు యాడై ‘నన్ను చూడు..’ అన్నట్లు సౌండ్‌ చేస్తూ వచ్చి చేరుతున్నాయి.
ఆసక్తిలేకపోయినా మొబైల్‌ అందుకొని చూస్తున్నాడు ద్రోణ.
అవి కూడా చైత్రిక పేరుతోనే వున్నాయి.
‘చైత్రిక! చైత్రిక! చైత్రిక! ఎవరీ చైత్రిక? ఇంత ఫీలింగ్‌తో, ఇంత డైరెక్ట్‌గా ఎలా సెండ్‌ చెయ్యగలుగుతోంది? ప్రేమిస్తుందా? తను పెండ్లైనవాడినని తెలియదా?

ఇంకా వుంది…

రెండో జీవితం 7

రచన: అంగులూరి అంజనీదేవి

ఒకసారి ఆమె ముఖంలోకి జాలిగా చూసి, ‘సమస్యల్ని సృశించే నేర్పుకూడా ఓ కళేకదా!’ అని మనసులో అనుకొని, ఏమనాలో తెలియక ‘ఆల్‌ ద బెస్ట్‌’ అన్నాడు. అంతలో…
పేర్స్‌ెం నుండి కాల్‌ రావటంతో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అని ఆముక్తతో చెప్పి పక్కకెళ్లి మ్లాడి వచ్చాడు.
ఆమె చాలా సేపు ద్రోణ దగ్గరే కూర్చుంది.
* * * * *
అర్ధరాత్రి దాక – అందరు నిద్రపోతున్న సమయంలో గంగాధరం మళ్లీ అరుస్తూ లేచాడు.
నిశిత బెదిరిపోయి లేచి కూర్చుంది. ఆమె వణకటం చూసి…
”నిశితా భయపడకు..” అని మాత్రం అన్నాడు గంగాధరం.
”భయంగా వుంది మామయ్యా! మీరు రోజు ఇలాగే అరుస్తున్నారు. ఎందుకని?” అంది గుండెలపై చేయివేసుకొని.,..
నిశితకి చెప్పాలి! తనేోం చెప్పాలి. ఏం*రిగిందో చెప్పాలి. ఇన్నిరోజులు వినేవాళ్లులేక, ఆత్మీయులుగా అన్పించక చెప్పలేదు ఇప్పుడు చెప్తే కనీసం నిశిత అయినా ధైర్యంగా తనపక్కన వుంటుంది. లేకుంటే తన అరుపులకి భయపడ్తూ ఎన్ని రోజులు ఇలా?
భార్య ఎలాగూ తనని దగ్గరకి రానీకుండా దూరంగా వుంది. అది ఏ*న్మలో చేసుకున్న పాపమోకదా!
ఆయన చెప్పానికి సిద్ధమయ్యాడు.
అది గమనించి మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది నిశిత.
అవి తాగి చెప్పటం ప్రారంభించాడు.
”నేను ఆర్‌.టి.సి. బస్‌లో పనిచేస్తున్న రోజుల్లో నా భార్య డబ్బు మీద ఆశతో నన్ను బాగా సంపాయించమనేది. జీతాన్ని మించిన సంపాదన నాకెలా వస్తుంది? రోజుకోరకంగా, ఏదో ఒకటి లేదంటూ తనలోని వెలితిని బయటపెట్టి బాధపడేది. నన్ను బాధపెట్టేది. రాను రాను ఇంటికి రావాలంటేనే భయపడేవాడిని… అప్పటికే శ్యాం పుట్టాడు. శ్యాం కోసమైనా నేను నా భార్య మాట వినాలి. లేకుంటే నన్ను ఇంటికి రానివ్వదు. బస్‌లో టికెట్స్ ఇవ్వకుండానే ప్రయాణీకుల దగ్గర డబ్బులు తీసుకోవటం మొదలు… నా భార్యకి నెలకోసారి ఇచ్చే జీతంకన్నా నేను రోజూ ఇచ్చే పది, ఇరవై చూసి సంతోషించేది. ఆ సంతోషాన్ని దూరం చెయ్యలేక నేను ఆ ఉద్యోగానికి దూరమయ్యాను. అంటే స్వాడ్‌ వచ్చినప్పుడు దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకున్నాను.
… పోయిన ఉద్యోగం మళ్లీ రాలేదు. భార్యా, బిడ్డను పోషించుకోవాలంటే డబ్బులేదు. ప్రొద్దునలేచి ఏదో ఒక పనికి వెళ్లేవాడిని… నేను చెయ్యని పనిలేదు. పడని కష్టం లేదు.
నేను చేసిన తప్పుకి అనుభవిస్తున్న శిక్షను చూసి నామీద నాకే జాలేసేది. ఒక రోజు దొరికిన పని ఇంకో రోజు దొరికేది కాదు.. క్వారీలల్లో రాళ్లు తీసేపని దగ్గరనుండి రైల్వేస్టేషన్లో మూటలు మోసే పనిదాకా అన్ని పనులు చేశాను. చివరికి బరువైన పనులు చెయ్యలేని స్థితికి వచ్చాను. కారణం నాలో కాల్షియం లోపించిందన్నారు డాక్టర్లు.
అప్పుడు నాకో వ్యక్తితో పరిచయం అయింది. ఆయన పేరు డా||కె.కె. నాయుడు ఆయన నన్నో కోరిక కోరాడు.” అంటూ ఆగాడు గంగాధరం.
”ఏమి మామయ్యా ఆ కోరిక?” అంది నిశిత ఆసక్తిగా..
”వర్షాకాలంలో పొలాల గట్లపై తుంగగడ్డి మొలస్తుంది. ఎక్కడైనా ఆ గడ్డిని కోసి పశువులకి మేతగా వేస్తారు. లోపల గడ్డలు విస్తరించి ఎంత కోసినా ఆ తుంగ మళ్లీ మొలకెత్తటం దాని నైజం. ఆ తుంగను బలంగా పీకితే గడ్డలు బయటపడ్తాయి. ఆ గడ్డల్ని ఎలాగైనా సంపాయించి తనకి సప్లై చెయ్యమని కోరాడు.. నేను పనికెళ్లి రాళ్లు మోస్తే వచ్చే డబ్బుకన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. నేను ఒప్పుకున్నాను…
…ఇంట్లో నా భార్యతో చెప్పాను. సరే వెళ్లమంది. నెల మొత్తంలో నేనెక్కువగా అక్కడే గడపాల్సి వచ్చేది. ఆ తుంగగడ్డల్ని తీసికెళ్లి ఒకరూంలో వుంచి దానికి నేనే కాపలా వుండేటట్లు ఏర్పాటు చేశారు. ఆ తుంగగడ్డల్ని ఎండబెట్టి ఆ గడ్డలనుండి సుగందద్రవ్యాన్ని తయారు చేయ్యాలన్నదే ఆయన ప్రయోగం… అది నిర్విఘ్నంగా సాగుతోంది.
ఆయన నన్ను పూర్తిగా నమ్మి – ఆ గదిని, అందులోని ఇన్‌స్ట్రుమెంట్స్ ని నామీద వదిలి ఇంటికెళ్లేవాడు. నేను ఇంటికెళ్లకుండా రాత్రంతా అక్కడే కాపలా వుండేవాడిని… పగలంతా తుంగగడ్డల్ని సేకరించి ఎండబెట్టేవాడిని. అక్కడ ఆ తుంగగడ్డలకన్నా ఆ డాక్టర్‌గారి ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా ఖరీదైనవి కాబట్టి నేను వాటికి గట్టి కాపలా కాసేవాడ్ని…
ఒకరోజు రాత్రి…
నిద్రకి ఆగలేక టీ తాగుదామని, ఒక చెట్టుకింద టీ కాస్తుంటే నడుచుకుంటూ అక్కడికి వెళ్లాను. అక్కడ అప్పటికే టీ తాగుతూ నిలబడివున్న నలుగురు యువకులు అదే రోడ్డుపై ఆ రాత్రి రెండుగంటలకి వెళ్లే ఓ బస్‌ను దోచుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. వాళ్లగురించి అప్పుడప్పుడు పేపర్లో రావటం నేను చదవటం వల్ల వెంటనే వాళ్ల ఎత్తుగడల్ని అర్థం చేసుకోగలిగాను.
అప్పటికప్పుడు వాళ్లను ఎదుర్కొనే శక్తి, పట్టించే నేర్పు లేక మౌనంగానే వుండిపోయాను. ఆ రాత్రికి ఆ బస్‌ దోపిడీలో నగలు, డబ్బు దోచుకోవటమే కాక ఇద్దరు చంటిపిల్లల్ని చంపెయ్యటం నన్ను బాగా కదిలించింది. నా మౌనం మంచిది కాదనుకున్నాను. జీవితంలో నేనేంత కష్టపడ్డా నా భార్య, కొడుకుకే ఉపయోగపడ్తాను. వీళ్లను పోలీసులకి పట్టిస్తే చాలామందిని బ్రతికించగలుగుతాను. అని ఓ నిర్ణయానికి వచ్చాను.
చాలా కష్టపడి వాళ్లను ఫాలో అయ్యాను. పోలీసులకి పట్టించాను. వాళ్లలో ఒకడు మాత్రం తప్పించుకున్నాడు. పట్టుపడిన వాళ్లకి వాళ్ల వాళ్ల నేరాలను బట్టి శిక్షలు పడ్డాయి. ఒకడికి యావజ్జీవకారాగార శిక్ష కూడా పడింది.
తక్కువ శిక్షపడ్డవాళ్లు కొద్ది రోజులకే బయటకొచ్చారు. వాళ్లు బయటకి రాగానే ముందుగా తప్పించుకున్నవాడు వాళ్లతో కలిసి నా వెంటపడ్డాడు.
మబ్బుపట్టి, గాలికొట్టి, వానపడ్తూ నేలంతా బురదగా వుంది. పెద్దకాలువ కట్టదాటి రోడ్డెక్కిన నేను వాళ్లను తప్పించుకుందామని ఒకప్పుడు హాస్పిటల్‌ కోసం కట్టి పాడుబడిపోయిన బంగ్లాలోకి దూరాను. వాళ్లు కూడా లోపలకి వచ్చారు.
నా చేతిలో సంచిని లాక్కుని విసిరికొట్టారు.. వాళ్లలో క్రోదం, కసి పెట్రేగి పోయి ముగ్గురు కలిసి నా మీద పడ్డారు. నేను ఎంత ప్రయత్నించినా వాళ్లను విడిపించుకోలేక పోయాను. బయటకి అరుపులు విన్పించకుండా నానోట్లో గుడ్డకుక్కారు. నేను కళ్లు మూసి తెరిచేలోపలే ఒకడు వెనక నుండి కత్తితీసి నా చేయి నరికాడు. నేను సృహ కోల్పోయాను.. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
హాస్పిటల్లో డా||కె.కె. నాయుడు గారు నాకు వైద్యం చేయించారు. అప్పటికే నేను ఇంటికెళ్లక చాలాకాలమైంది. నాభార్యా, బిడ్డ గుర్తొస్తున్నారు. కానీ వాళ్ల గురించి ఆలోచించే ఓపిక కూడా లేకుండా అయింది. గాయం పచ్చిగానే వుంది.
కానీ ఈమధ్య మళ్లీ వాళ్లు నన్ను చూశారు. నన్ను చంపేవరకు నిద్రపోయేలా లేరు. వాళ్ల చేతుల్లో చావటం ఇష్టంలేక ఇలా వచ్చాను.
ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు.
ఇప్పుడు ఇక్కడ నా భార్యా, నా కొడుకు, నా కోడలు – ముఖ్యంగా నువ్వు వున్నారు. చిన్నదానివైనా – ఒక చెయ్యి పూర్తిగా లేని నన్ను అర్థం చేసుకొని, సేవచేసి నా గాయాన్ని నయంచేశావు. పెద్దవాడినన్నది మరచిపోయి నీకు చేతులెత్తి దండం పెట్టాలని, ఒకసారి నీ పాదాలను తాకాలని ఎన్నోసార్లు అన్పించింది. రాగద్వేషాలతో వుండే మానసిక వికలాంగులకన్నా నువ్వు గొప్పదానివి నిశితా!” అన్నాడు.
నిశిత అలాగే వింటోంది… ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని, కుటుంబానికి దూరమై శారీరకంగా, మానసికంగా ఆయన ఎంత చిత్రహింసకు గురయ్యాడో అర్థం చేసుకొని మనసులో ఏడ్చింది.
”నిశితా! ఆ దురదృష్ట సంఘటన, ఎంత మరచిపోదామన్నా నన్ను వెంటాడి బాధిస్తోంది. అప్పుడు అరిచిన అరుపులు ఇంకా అలాగేనా మైండ్‌లో సెట్ అయి రిపీట్ అవుతున్నాయి. నువ్వు భయపడకు…” అన్నాడు.
”అలాగే ! మామయ్యా! ఇదంతా అత్తయ్యతో, బావతో, అక్కతో చెబుతాను. అందరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరెంత నరకాన్ని అనుభవించారో ముఖ్యంగా అత్తయ్యకి తెలియాలి. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న భర్తని ఇంకా ఎక్కువ సంపాయించమని టార్చర్‌ పెట్టే ఆడవాళ్లకి తెలియాలి.” అంది నిశిత.
గంగాధరం మాట్లాడలేదు
”పడుకోండి మామయ్యా! ఇంకేం ఆలోచించకండి! మేమంతా వున్నాం కదా! ప్రశాంతంగా వుండండి!” అంటూ ధైర్యం చెప్పి, ఆయన పడుకోగానే దుప్పటి కప్పి ఫ్యాన్‌ స్పీడ్‌ పెంచింది.
తండ్రి పడుకోవటం చూసి శ్యాంవర్ధన్‌ వచ్చాడు.
”మా నాన్న కేకలతో నీకు చాలా ఇబ్బందిగా వున్నట్లుంది కదూ?” అంటూ ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు శ్యాం.
”అలాటిందేం లేదు బావా! అసలేం *రిగిందంటే..!” అంటూ గంగాధరం చెప్పిన విషయం చెప్పబోయింది.
”జరిగిందాన్ని గురించి ఇప్పుడెందుకు? జరగబోయేది కావాలి” అన్నాడు ఒకరకంగా చూస్తూ…
మగవాడి చూపులు తన మీద నిలిచినప్పుడు, అవి ఏ దృష్టితో నిలిచాయన్నది స్త్రీ వెంటనే పసిగడ్తుంది. బావ తనని కోరుకుంటున్నాడని, అది ధర్మం కాదని, అక్కకి అన్యాయం చెయ్యబోతున్నాడని అర్థం చేసుకొంది. అందుకే ఈ మధ్యన అతను ఎప్పుడు కన్పించినా ఇబ్బందిగా విసుగ్గా అన్పిస్తోంది.
”మీరు వెళ్లండి బావా! నాకు నిద్రొస్తుంది” అని అనలేక వెంటనే
”మామయ్యా! పడుకున్నారా ! మీ అబ్బాయి వచ్చాడు.” అంది నిశిత గంగాధరం వైపు చూస్తూ…
శ్యాం కంగారుగా చూస్తూ… ”ఆయన్నెందుకు లేపటం? పడుకోనీయ్‌!” అన్నాడు
టక్కున దుప్పటి తొలగించి లేచి కూర్చున్నాడు గంగాధరం.
”ఏం శ్యాం! నిద్ర రావటంలేదా?” అన్నాడు.
”వస్తోంది నాన్నా! నువ్వేదో అరిచినట్లుంటే వచ్చాను.” అన్నాడు శ్యాం
”అరిచి చాలా సేపయింది” అన్నాడు గంగాధరం.
ఒక్కక్షణం మౌనంగా వుండి ”నేను వెళ్తాను నిద్రొస్తోంది.” అంటూ లేచాడు శ్యాంవర్ధన్‌. అతను వెళ్లగానే
”పడుకో నిశితా! అవసరమైతే నన్ను లేపు. భయపడకు.” అన్నాడు గంగాధరం.
దేవుడు మనిషి రూపంలో వుంటాడనానికి గంగాధరమే నిదర్శనంగా అన్పించి – తండ్రి పక్కన పడుకున్నంత ధైర్యంగా పడుకొంది నిశిత.
* * * * *
ఆరోజు ద్రోణ మీద కోపంతో ఇంట్లోంచి బయటకెళ్లి ఆటో ఎక్కిన శృతికకు ఎటెళ్లాలో అర్థంకాలేదు.
అక్కకన్నా ఆత్మీయులు, తన గురించి ఆలోచించేవాళ్లు ఎవరున్నారు అని అక్క దగ్గరకి వెళ్లింది.
కృతిక ఇంకా ఆఫీసునుండి రాలేదు.
పిల్లలు నానమ్మ పెట్టిన టిఫిన్‌ తింటున్నారు… పిన్నిని చూడగానే ”హాయ్‌” చెప్పారు. శృతిక ఓ నవ్వు నవ్వి… ”బావున్నారా అత్తయ్యా?” అంటూ వంటగదిలోకి వెళ్లింది. ఆవిడ తిట్టిన తిట్లు ప్రస్తుతం గుర్తురాలేదామెకు…
”నేనేదో హాస్పిటల్లో వున్నట్లు ఏమి పరామర్శ? అడగకూడదు కాని ఎందుకొచ్చావిప్పుడు ? ఏదైనా పని కాని, పంక్షన్‌ లాటింది కాని వుండి వచ్చావా? ద్రోణ ఏడి? ఒక్కదానివే వచ్చావా? నీకలవాటేగా ఇలా రావటం…!” అంటూ ప్రశ్న మీద ప్రశ్న వ్యంగ్యంగా వదిలింది.
బిక్క చచ్చిపోయింది శృతిక. వెంటనే తేరుకొని…
”ఒక్కదాన్నే రాకూడదా? నాకు దారి తెలియదా?” అంది బింకంగా
”దారి తెలిసినా పెళ్లయ్యాక ఆడవాళ్లు ఒంటరిగా ఎటూ వెళ్లరు. వెళ్తే భర్తకి ఇబ్బంది కదా! కలిసి వెళ్తారు. మీకలాటి ఇబ్బందులేం లేవు కాబోలు…” అంటూ ఇంకో వ్యంగ్యబాణాన్ని విసిరింది.
”నానమ్మా ! మాకు టైమవుతుంది. త్వరగా పాలివ్వు…” అంటూ కేకేశారు పిల్లలు.
”వస్తున్నా! అదిగో! మొన్న నీచెయ్యి విరగ్గ్టొటి వెళ్లిందే మీ పిన్ని! ఆవిడొస్తే మాట్లాడుతున్నా… అన్నట్లూ! నువ్వేం పనిమీద వచ్చావో, అది చూసుకొని వెళ్లు.. తొందరేం లేదు. పిల్లల్ని మాత్రం బయట తిప్పకు. నీకసలే స్పీడెక్కువ.. అదే మా బాధ… నువ్వింత తింటే పోదు. నా కొడుకు, నా కోడలు ఇద్దరు సంపాదనపరులే…” అంది.
ఆ మాటలు శృతిక చెంప చెళ్లుమనిపించాయి.
‘అయినా ఈవిడ మాటలకేంటి… ఇలాగే అంటుంది. ఇవన్నీ పట్టించుకో కూడదు.’ అని మనసులో అనుకొంది.
కానీ పిల్లలు తనని చూడగానే ‘హాయ్‌!’ చెప్పి ఏ మాత్రం హ్యాపీ లేనివాళ్లలా మౌనంగా ట్యూషన్‌కి వెళ్లటం మనసు చివుక్కుమనిపిస్తోంది. ఇదంతా వాళ్ల నానమ్మ ట్రైనింగే… ‘మీ పిన్ని రాక్షసి నీ చేయి విరగ్గ్టొటింది.ఎప్పుడొచ్చినా సరిగా మాట్లాడకండి’ అని చెప్పి వుంటుంది.
మెల్లగా పిల్లలకి నచ్చచెప్పాలి. ‘నేను మీ పిన్నిని, మీ అమ్మలాగా నాక్కూడా మీరంటే ప్రేమ వుంటుంది. యాక్సిడెంట్లు అనేవి అనుకోకుండా జరుగుతుంటాయి. అవి కామనే…’ అని వాళ్లను దగ్గరకు తీసుకోవాలనుకుంది.
కృతిక ఆఫీసునుండి, పిల్లలు ట్యూషన్‌ నుండి రాగానే అందరు కలిసి భోంచేశారు.
భోంచేస్తున్నప్పుడు, ఆఫీసు విషయాలు ఆలోచించుకుంటూ పిల్లలతో కాని, శృతికతో కాని మాట్లాడలేదు కృతిక…
అక్క మాట్లాడితే బావుండని ఆశించింది శృతిక.
అక్క మాట్లాడకపోవటంతో అసంతృప్తిగా వుంది.
”ఇవాళ ఆఫీసులో బాగా స్ట్రెయిన్‌ అయ్యాను శృతీ! పడుకుంటాను. మళ్లీ మీ బావవస్తే ఆయన పని చూడాలి…” అంటూ తన బెడ్‌రూంలోకి వెళ్లింది.
ఆమె అలా వెళ్లిన కొద్దిసేపికే ఆమె భర్త వచ్చాడు.
అతను ముఖం కడుక్కుని ప్రెషెప్‌ అవుతుంటే ”త్వరగా రండి! వడ్డిస్తాను!” అంటూ నిద్రకళ్లతోనే కేకేలేస్తోంది కృతిక.
పిల్లలు హోంవర్క్‌ చేసుకొని, వాళ్ల గదిలో వాళ్లు పడుకున్నారు. నానమ్మ వాళ్ల గది ముందుండే హాల్లో పడుకొంది.
శృతిక వెళ్లి పిల్లల దగ్గర పడుకొంది… పిన్ని వచ్చి పడుకున్నట్లు ఒక్క కన్ను మాత్రమే తెరిచి గమనించిన మోనా మెల్లగా లేచి వెళ్లి నానమ్మ పక్కన పడుకొంది. శృతిక ఆశ్చర్యపోయింది. టీనా గాఢనిద్రలో వుంది.
మోనా వచ్చిపడుకోగానే.. ”నిద్రరావటం లేదా?” అంటూ పైన చేయివేసింది లాలనగా నానమ్మ.
”పిన్ని మా గదిలోకి వచ్చింది అందుకే ఇలా వచ్చాను.” అంది మోనా.
”వస్తే ఏం? పడుకోవలసింది పిన్నియే కదా!” అంది నానమ్మ
”అప్పుడు చెల్లి చెయ్యి పిన్ని వల్లనే కదా విరిగింది. అందుకే పిన్నిని చూస్తే భయం నాకు… నేను బాబాయ్‌తో చెబుతాను. పిన్నిని ఇలా పంపొద్దని..” అంది మోనా.
”పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు. మీ మమ్మీతో ఏదైనా పనివుండి వచ్చిందేమో!” అంది నానమ్మ. ఆమె సందర్బాన్ని బట్టి కటువుగా మాట్లాడుతుందే కాని పిల్లలు పెద్దవాళ్లను గౌరవించకపోతే హర్షించదు.
”పనేం లేదు నానమ్మా! వాళ్లిద్దరేం మాట్లాడుకోలేదు” అంది టక్కున మోనా.
పిల్లలు పెద్దవాళ్లను ఎంతగా గమనిస్తారో అర్థమైంది నానమ్మకి.
వాళ్లకిప్పుడు ఏది చెబితే అది గ్రహించే శక్తివుంటుంది.
మంచీ-చెడు అనేవి వెంటనే వాళ్ల మనసు లోతుల్లోకి వెళ్లి బాగా పనిచేస్తాయి.
”నానమ్మా! బాబాయ్‌ లేకుండా పిన్ని ఒక్కతే వస్తే తప్పా?” అంది మోనా.
”మంచి ప్రశ్న వేశావు. తప్పులేకపోవచ్చు. కానీ పెళ్లయ్యాక ఆడప్లిల తన సంసారాన్ని అంకితభావంతో చూసుకోవాలి… ‘ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి’ అంటూ పెళ్లిలో భర్తచేసిన ప్రమాణానికి ‘నాతిచరితవ్యం’ అంటూ భార్య ప్రతి ప్రమాణం చేస్తుంది.
…దాన్ని జీవితాంతం పాటించాలి. భర్తతోనే వుండాలి. అవసరాన్ని బట్టి భర్తతోనే బయటకి రావాలి. అంతేకాని అక్కలదగ్గర, చెల్లెళ్ల దగ్గర గడపకూడదు. అలా గడిపితే ఎంత దగ్గరివాళ్లయినా చిన్నచూపు చూస్తారు” అంది నానమ్మ.
అవునా అన్నట్లు వింటోంది మోనా.
”ఏ రోజుల్లో అయినా… అంటే ఇప్పటి కంప్యూటర్‌ యుగంలోనైనా సరే పెళ్లయ్యాక ఒడిదుడుకులు వుంటాయి. తట్టుకోవాలి. స్వాతంత్య్రం కూడా తగ్గుతుంది. కట్టుబడాలి. అందరితో అవసరాలు వుంటాయి. అర్థం చేసుకోవాలి.
…ఇతరుల అవసరాల కన్నా భర్త అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంతోషపెట్టాలి. దగ్గరవ్వాలి. అలా అని భర్తంటే భయభక్తులతో ప్రతిక్షణం మనసు చంపుకోమని కాదు. కలిసి, మెలిసి వుండాలి” అంది.
ఇప్పుడు మోనాకు భర్తతో పనిలేకపోయినా భర్తతో ఎలా వుండాలి అనేది భవిష్యత్తులో తెలుసుకుంటుందని నానమ్మ ఆలోచన.
మోనా కూడా ఆసక్తిగానే వింటోంది.
”ముఖ్యంగా వ్యక్తిగత జీవితం కన్నా సంసారం బాగుండాలి అనుకోవాలి. అనుమానాలు, చికాకులు వుండకూడదు. అవి వుంటే అరిష్టం. అన్ని అరిష్టాలకు మూలం ఆవేశం…” అంది నానమ్మ.
మోనా వింటూ నిద్రపోయింది
శృతికకు నిద్ర రాలేదు.
* * * * *
తెల్లవారింది.
తనలోని ఆవేదనను అక్కతో చెప్పుకుంటే కొంతయినా తగ్గుతుందని అక్క దగ్గరకి వెళ్లింది శృతిక… ఆఫీసుకెళ్లే తొందరలో శృతిక చెప్పేది వినకుండానే ఆఫీసుకెళ్లింది కృతిక. బావకూడా అంతే హడావుడితో తన ఆఫీసుకి వెళ్లాడు. పిల్లలు స్కూల్‌కి వెళ్లారు.
స్నానంచేసి చీరకట్టుకొని హాల్లోకి వచ్చిన శృతిక నానమ్మను చూసి షాకైంది.
కారణం నానమ్మ చెవిదగ్గర సెల్‌ఫోన్‌ పెట్టుకొని టీవీ చూస్తోంది. కళ్లార్పితే అవతల మాటలు మిస్సవుతానేమో నన్నట్లు కళ్లుకూడా ఆర్పకుండా అతిశ్రద్ధగా వింటోంది.
‘…ఈ వయసులో ఈవిడ కూడా సెల్‌ఫోన్‌ పట్టుకొని టీవీ చూడాలా? ఈవిడకు కూడా ఫీలింగ్స్‌ వుంటాయా? భర్తలేడు. మరెవరితో మాట్లాడుతోంది? చిన్నప్పటి బాయ్‌ఫ్రెండా? అయివుండొచ్చు. ఈ సెల్‌ఫోన్ల పుణ్యమా అని ఎక్కడెక్కడి వాళ్లు లైన్లోకి వస్తుంటారు. అంత అవకాశం ఈ సెల్‌ఫోన్ల వల్లనే దొరుకుతోంది.
రాత్రి ఎంతో చక్కగా భార్యా, భర్త అంటూ మోనాతో డైలాగులు చెప్పింది. ఇప్పుడేమో అందరు వెళ్లాక బుద్దిగా కూర్చుని, ఓల్డ్‌ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ తరిస్తోంది. ఇలాటిం వాళ్లను వయసుతో పనిలేకుండా ఏది దొరికితే అది తీసుకొని కొట్టాలి.’ అనుకొంది మనసులో శృతిక.
నానమ్మ మాత్రం అప్పటివరకు సెల్‌ఫోన్‌లో ‘ఓం గణేశా! వందనం!’ అన్న యాడ్‌ని విని.,. విన్నది చాలదన్నట్లు ‘ఇంకా కొద్దిసేపు మాట్లాడితే వాడి సొమ్మేం పోయిందో అప్పుడే ఆపేశాడు’ అని పైకే తిట్టుకుంటుంటే…
శృతిక ”ఆ…” అని ఆశ్చర్యపోతూ ”ఛీ.. ఛీ ఈ ఇంట్లో ఒక్కక్షణం కూడా వుండకూడదు. ఎక్కడికి పోయినా ఇదే గోల” అని మనసులో అనుకుంటూ నానమ్మతో చెప్పకుండానే బయటకొచ్చి ఆటో ఎక్కింది.
* * * * *
ఆట దిగి శృతిక నేరుగా తను చదువుకుంటున్నప్పుడు వున్న హాస్టల్లోకి వెళ్లింది.
ఆ హాస్టల్లో రకరకాల అమ్మాయిలు వున్నారు. వాళ్లలో చాలావరకు ఆ చుట్టుపక్కల ఊర్లనుండి చదువులకోసం చదువులు ముగించుకొని, ఉద్యోగాలకోసం వచ్చినవాళ్లు వున్నారు. పిల్లల్ని ఉన్నతమైన స్థానాల్లో చూడాలని, అందుకు తగిన స్వాతంత్య్రాన్ని ఇచ్చిన వాళ్ల తల్లిదండ్రుల ఆశలకి వక్రభాష్యం చెప్పకుండా బాగా చదివి వారి లక్ష్యసాధన కోసం ఎంతో పట్టుదలతో శ్రమిస్తూ, కోరుకున్న స్థానాలకు చేరుకోవాలని చూసేవాళ్లే ఎక్కువగా వున్నారు.
ముఖ్యంగా వాళ్లలో చిన్న చిన్న ఊళ్లలో క్రమశిక్షణతో పెరిగిన అమ్మాయిలే ఎక్కువగా వున్నారు. బయట కృత్రిమ వాతావరణం కన్పిస్తున్నా – కన్నవారితో కట్టుబాట్ల మధ్యన పెరిగిన రోజుల్ని మరచిపోకుండా అర్ధరాత్రి వరకు బయట తిరగటం, అబద్దాలు చెప్పటం లాటిం వ్యసనాలకు దూరంగా వుంటూ… చక్కగా చదువుతూ కోరుకున్న భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు.
వాళ్లలో చైత్రిక ఒకతి…
చైత్రిక చూడానికి సున్నితంగా వుండి, మెత్తని స్వభావం గల అమ్మాయిలా అన్పించినా మనోదారుఢ్యంతో ఏ పని అయినా భయపడకుండా కచ్చితంగా చేయగలిగేలా వుంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో వివేకంగా వుండి సరిగా స్పందిస్తుంది.
హాస్టల్లోకి వెళ్లగానే ”నేను చైతూతో మాట్లాడాలి. మీరు కొంచెంబయటకి వెళ్తారా?” అంది మర్యాదగా ఆ రూం మేట్స్ ని ఉద్దేశించి శృతిక. వాళ్లు ”అలాగే” అంటూ బయటకెళ్లి హాల్లో పార్టీషన్‌ చేసిన గదిలో కూర్చున్నారు.
చైత్రికను పట్టుకొని ఏడ్చింది శృతిక.
చైత్రిక శృతికకు బెస్ట్‌ ఫ్రెండ్‌.
ఏడుస్తూనే జరిగింది మొత్తం చెప్పింది. రాజీలు, సహనాలు, ఆత్మవంచనలు బాగా తెలిసినవాళ్లే ద్రోణ దగ్గర వుండగలుగుతారని కూడా చెప్పింది.
”ఏయ్‌! పిచ్చీ! ఏడుపు ఆపు. ఇందులో ఏముందని అంతగా ఏడుస్తున్నావ్‌? నీకసలు బాధలు అంటే ఏమిటో తెలుసా?” అంది చైత్రిక శృతిక గడ్డంపట్టుకొని…
”నీకు తెలుసా?” అంది శృతిక ముక్కుని కర్చీప్‌తో తుడుచుకుంటూ…
”తెలుసు. ఈ ఏడాది రుతుపవనాలు సరిగ్గా పనిచేయక అనేక జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. అదలా వుండగానే మన సి.ఎం. హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. అందులోంచి తేరుకోకముందే కనీవినీ ఎరుగని వరదలతో అనేక జిల్లాలు కొట్టుకుపోయి జనం వీధిన పడ్డారు…” అంది చైత్రిక.
”ఇది పేపర్‌ న్యూస్‌ నాక్కూడా తెలుసు…” అంది శృతిక.
చైత్రిక మాట్లాడలేదు.
”చైతూ! నా ఏడుపు చూడవే. నా గురించి ఆలోచించవే!” అంది శృతిక చైత్రిక భుజం పట్టి కదుపుతూ…
”నీకు కష్టమంటే ఏమిటో తెలిస్తే కదా నేను ఆలోచించానికి… చాలామంది ఆడవాళ్లు కన్నీళ్లతో నిత్యం తడుస్తున్నారు. దారి తెలియక, ఎటు వెళ్లాలో తెలియక, ఎలా వెళ్లాలో తెలియక చీకి దుఃఖంలో, దుఃఖపు చీకిలో బేలగా మారి… గుప్పెడు మాటలకోసం, పిడికెడు మెతుకులకోసం ఎదురుచూస్తూ వున్నారు. వాళ్ల గురించి ఆలోచించేవాళ్లు లేరు. వెన్నుదన్నుగా నిలబడేవాళ్లు లేరు…” అంది చైత్రిక ఆలోచనగా.
”చైతూ ప్లీజ్‌! నీ మాటలతో నాకు ఆర్ట్‌ ఫిలిం చూపించకే. ద్రోణ బయట ఆడవాళ్లతో వున్నంత ప్లజంట్ గా నాతో వుండటంలేదు. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. బాధను బాధగా చూడవే..” అంది.
”అది బాధెలా అవుతుంది. అతను ఆర్టిస్ట్‌. మనసులో ఎన్ని బాధలువున్నా అవి పైకి కన్పించకుండా నవ్వుతాడు. మాట్లాడతాడు. అందరి అభిమానాన్ని పొందుతాడు. అదే అతని పెట్టుబడి… నీ దగ్గర అలాటిందేం అవసరంలేదు. అందుకే నటించడం లేదు.” అంది చైత్రిక.
గట్టిగా చైత్రిక చేతి మీద కండవూడేలా గిల్లింది శృతిక.
”అబ్బా…” అంది వెంటనే చైత్రిక.
”ఎందుకలా అరుస్తావ్‌! నేను గిల్లింది నటన అనుకొని ఎంజాయ్‌ చెయ్‌!” అంది శృతిక.
ఎర్రగా కందిన చేతిని చూస్తూ ‘ఉఫ్‌’ అనుకొంది చైత్రిక. ఆ బాధకి చైత్రిక కళ్లలో సన్నటి నీటిపొర కదిలి మాయమైంది.
* * * * *
ఆ ఇద్దరు అలా ఓ గంటసేపు మాట్లాడుకోలేదు. ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు.
”చైతూ! నన్నర్థం చేసుకోవే! మునీంద్ర అనే రచయిత నీకు గుర్తున్నాడు కదా! ” అంది శృతిక.
”ఎందుకు గుర్తులేడు! మన ఫ్రెండ్‌ దీపిక ఆయనకి గ్రేట్ ఫ్యాన్‌ కదా! అది ఆయన్ని ప్రేమించి ఆయన తన ఒక్కదానికే సొంతం అని మనతో వాదించేది. మనం ఎంత చెప్పినా వినేది కాదు. ఒకరోజు ఆ రచయిత శాతవాహనాలో వస్తున్నాడని తెలిసి అది వెళ్తుంటే మనం కూడా ఆయన్ని పరిచయం చెయ్యమని వెళ్లాం. ఆయన మనల్ని చూడగానే దాన్ని వదిలేసి మనకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చాడు. అది చూసి దీపిక హర్టయింది. ఆయన ప్రేమనుండి డైవర్ట్‌ అయింది. అయితే ఏంటి?” అంది.
”ద్రోణ అలాటింవాడే అని నా అనుమానం.,” అంది శృతిక
”అది తప్పు. అందరు ఒకేలా వుండరు. అందరి అనుభవాలు ఒకేలా వుండవు. నీకో ఎగ్జాంపుల్‌ చెబుతాను విను. ఒక ప్రముఖ కవి మా పిన్నితో ఆయన బయట వున్నంతసేపు ‘నువ్వే నా ప్రాణం’ అంటాడు. ఇంటి కెళ్లాక ‘ఇక్కడ నా ప్రాణం పోతుంది’ అని పిన్ని ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చెయ్యడు. కారణం భార్య పక్కన వుంటుంది కాబట్టి.. ఇదేం జీవితంరా బాబు అని మనకి అన్పించవచ్చు. ‘అదే జీవితం’ అనుకుంటారు వాళ్లు…” అంది చైత్రిక.
”కానీ ద్రోణ అలా కూడా చెయ్యటంలేదు. ఇంట్లో నన్ను వదిలేసి ఫోన్‌ పట్టుకొని బయటకెళ్తాడు” అంది శృతిక.
”నీకు ఇబ్బంది అని వెళ్తున్నాడు. కాని ఆ కవిలాగా దొంగ వేషాలు వెయ్యటం లేదు. అలా వేసేవాడే అయితే ఆడవాళ్ల ఫోన్‌కాల్స్‌ ఇంటికి రాకుండా చూసుకుంటాడు” అంది చైత్రిక.
”ఏది ఏమైనా నేనోపని చెయ్యదలచుకున్నాను చైతూ! మన ఫ్రెండ్‌ స్వప్నికను మానవ బాంబులా ద్రోణ మీదకి ప్రయోగించాలనుకుంటున్నాను.” అంది శృతిక.
చైత్రిక ఆశ్చర్యపోతూ ”ఇలాటిం తిక్క ఆలోచన నీకెందు కొచ్చిందో నాకు తెలియదు. కానీ ఆత్మాహుతి దళంలో చేరానికి తన చుట్టూ తన చేతులతోనే బాంబులు పెట్టుకొని వెళ్తున్న అమ్మాయిలా అన్పిస్తున్నావు నువ్వు… ఎందుకంటే స్వప్నిక…” అని ఏదో అనబోయే లోపలే తలుపు నెట్టుకుంటూ గదిలోకి వచ్చింది స్వప్నిక.
శృతికను చూడగానే ”హాయ్‌! శృతీ!” అంటూ చేతిలో వున్న కవరు బెడ్‌మీద పడేసి శృతిక మీదపడి వాటేసుకొంది స్వప్నిక.
”హాయ్‌!” అంది కాని నవ్వలేదు శృతిక.
శృతికను వదిలి ”ఏంటే అలా వున్నావ్‌! ఇంట్లో ద్రోణ దగ్గర నవ్వి, నవ్వి వున్న నవ్వంతా అక్కడే వదిలేసి వచ్చావా?” అంది స్వప్నిక.
శృతిక ఇబ్బందిగా కదిలింది.
”చెప్పు! ఎలావుంది నీ వైవాహిక జీవితం? హ్యాపీనా? మేం కూడా పెళ్లి చేసుకోవచ్చా? పర్వాలేదా చెప్పు?” అంది స్వప్నిక తెగ ఉత్సాహపడ్తూ.
‘ఇది ఇలా కూడా ఇంటర్వ్యూ చెయ్యగలదా’ అన్నట్లు చూస్తోంది చైత్రిక.
”ద్రోణతో అప్పుడప్పుడు బయటకెళ్తున్నావా? ఎక్కడెక్కడ తిరిగారు? తిరిగిన ప్రతిచోట నువ్వెలా ఫీలయ్యావ్‌? చెప్పవే? ఏదీ నీ ఫోనింకా రింగ్‌ కాలేదే! మీ ఆయనకి నువ్వు గుర్తురాలేదా ఏం?” అంది స్వప్నిక.
శృతిక మాట్లాడలేదు
”ప్లీజ్‌! స్వప్నీ! దాన్ని వదిలెయ్‌! తలనొప్పిగా వుందట…” అంది చైత్రిక.
స్వప్నిక తను తెచ్చిన కవరు విప్పి…”ఈ గిఫ్ట్‌ ఎలా వుంది?” అంటూ చైత్రిక చేతిలో పెట్టింది. చైత్రిక ఏకాగ్రతతో ఆ బొమ్మనే చూస్తోంది.
అది సజీవ ప్రకృతి చిత్రం.
ఆ చిత్రంలో సాయం సంధ్యవేళ పచ్చని పంటపొలం, ఆ పొలం గట్టున వున్న రెండు తాటితోపుల మధ్యలోంచి అస్తమిస్తున్న సూర్యబింబం. ఆసాయం సమయంలో అద్భుతంగా అన్పిస్తున్న వాతావరణం.
”చూపు మరల్చుకోలేకపోతున్నావ్‌! అందులో ఏం కన్పిస్తోంది చైతూ?” అంది స్వప్నిక. ఆమెకు పల్లెటూర్లు, పంటపొలాలు నచ్చవు.
ఆ బొమ్మ కింద ద్రోణ పేరునుచూస్తూ. ”ద్రోణ బొమ్మలు వేస్తాడని తెలుసు కాని ఇంత బాగా వేస్తాడని తెలియదు.” అంది ఎమోషనల్‌గా చూస్తూ. నెంబరుంటే వెంటనే అబినందించాలనిపించింది చైత్రికకు.
శృతిక ఇలాటిం ఫీలింగ్స్‌ని పట్టించుకోదు. ఆయనేదో గీస్తాడు. వీళ్లేదో చూస్తారు. ఇద్దరు పిచ్చోళ్లే ఆమె దృష్టిలో…
”అయినా నీ బాయ్‌ఫ్రెండ్‌కి ఈ గిఫ్టేం బావుంటుందే…” అంది పెదవి విరిచి చైత్రిక.
”మొన్ని వరకు బాయ్‌ఫ్రెండే అనుకున్నా చైతూ! కాదని చెప్పేశాడు నిన్న. అందుకే ఇదివ్వాలని తెచ్చాను.” అంటూ షాపులో సెల్‌ఫోన్‌ పెట్టి మరచిపోయినట్లు గుర్తొచ్చి హడావుడిగా బయటకెళ్లింది స్వప్నిక.
”ఇప్పుడు చెప్పు! ద్రోణను స్వప్నికకు అప్పజెప్తే హీటర్‌ని తలమీద పెట్టుకున్నట్టు కాదా? అదేమైనా బొమ్మలు పెట్టి ఆడుకోవటం లాటింది అనుకుంటున్నావా? తెగ సంబరపడిపోతున్నావ్‌? పిచ్చి, పిచ్చి గేమ్‌లు ఆడకు.” అంది తన స్నేహితురాలు సముద్రంలో మునగబోతుందని తెలిసి తప్పించాలన్నట్లు…
”అదేం కాదులే! స్వప్నిక ద్రోణకి ఫోన్‌చేసి అతని ఫ్యాన్‌లా మాట్లాడుతుంది. అతని మూమెంట్స్, రియాక్షన్స్‌, ఫీలింగ్స్‌ ఎలావుంటాయో నాకు చెబుతుంది. ఆ రోజు దీపిక ఉడ్‌బీ ఎలాటివాడో టెస్ట్‌చేసి చెప్పింది కూడా స్వప్పికనే… దానివల్ల దీపిక కెంత ఉపయోగమయిందో మనందరికి తెలుసు. ఇదికూడా అంతే!” అంది శృతిక.
”అతను స్టూడెంట్! అతని వెదవ్వేషాలు అక్కడక్కడ విన్నాం కాబట్టి చూస్తూ, చూస్తూ దీపికను అతనికివ్వటం ఇష్టంలేక టెస్ట్‌ చేశాం. ద్రోణ అలా కాదు. పెళ్లయి భార్యవున్న బాధ్యతగల భర్త….” అంది చైత్రిక.
”అంత సీన్‌లేదు. అదేవుంటే ఈ ఇది ఎందుకు నాకు.. అతనికి అమ్మాయిల పిచ్చి వుందని, వెరయిటీ కోరుకుంటాడని నిరూపించటానికి ఇదొక్కటే మార్గం నాకు…” అంది.
”ఇదేంటే బాబూ! ఏదైనా ఒక లక్ష్యం కోసం తపించే వాళ్లున్నారు. పదిమందిలో ఒకరిగా వుండేందుకు తమలో ఏదో ఒక ప్రత్యేకత కన్పించాలని ఆరాటపడే వాళ్లున్నారు. బ్లెడ్‌ టెస్ట్‌ చేసినట్లు ఈ టెస్టేంటి? ఈ అన్వేషణేంటి?” అంది చైత్రిక.
”నన్ను చంపేస్తానన్నాడు. మాట్లాడే అర్హత లేదన్నాడు. తన ముందు నిలబడొద్దన్నాడు. ఇంతకన్నా అవమానం ఏంకావాలి? అతని మనసులో బలంగా ఎవరో ఒకరు వుండబట్టేగా ఇదంతా?” అంది శృతిక.
”మనసులోకి తొంగిచూసే యంత్రాలు ఇంకా తయారుకాలేదు శృతీ! కానీ ఎంతోకాలంగా అతను వేసుకున్న బొమ్మల్ని నువ్వలా డేమేజ్‌ చేసివుండాల్సింది కాదు. అతని ప్త్లేస్‌లో ఎవరున్నా అలాగే చేస్తారు. నువ్వు ఇంటికెళ్లి ద్రోణకి సారీచెప్పు!” అంది చైత్రిక.
”గంటలు, గంటలు గాళ్‌ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడేవాడికి సారీ చెప్పాలా?” అంది శృతిక నిరసనగా చూస్తూ…
”నువ్విక ఈ ఫీలింగ్‌ లోంచి బయటపడవా?” అంది
”పడతాను. కానీ ద్రోణ ఎలాటింవాడో నువ్వు టెస్ట్‌చేసి చెప్పు! ద్రోణను ప్రేమిస్తున్నట్లు తాత్కాలికంగా నటించు..” అంది సడన్‌గా.
స్థాణువైంది చైత్రిక. ఒక్కక్షణం ‘వింటున్నది నిజమా’ అన్నట్లు చూసింది.
”నువ్వు నా ఫ్రెండ్‌వి చైతూ! ఆ మాత్రం హెల్ప్‌ చెయ్యలేవా? ఎలాగూ నీమనసులో రుత్విక్‌ వున్నాడు కాబ్టి దీనివల్ల ఎవరికి ఎలాటిం ఇబ్బంది వుండదు.” అంది శృతిక.
శృతిక వదిలేలా లేదని… ”ద్రోణ మరీ అంత వీకా? నేను ప్రేమిస్తున్నానంటే నమ్మటానికి? అయినా నేనలా నటించాలన్నా అతనితో మాట్లాడాలన్నా నాకు ఇన్సిపిరేషన్‌ రావొద్దా!” అంది చైత్రిక, నేనీ పని చెయ్యనని ముఖం మీద చెప్పలేక…
”దానికేం! ద్రోణ అందగాడేగా! పెళ్లిలో చూసి ముందుగా ఆయన్ని పొగిడింది నువ్వే… మాట బాగుంది, నవ్వు బాగుంది అని మన ఫ్రెండ్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేశావు. నేను చూస్తూనే వున్నా నీ అల్లరిని… ”మీ ఆయన్ని ఇదెప్పుడో లేపుకెళ్లిపోతుంది జాగ్రత్త.” అని కూడా మన ఫ్రెండ్స్‌ అన్నారు నాతో… ఆ ఇన్సిపిరేషన్‌ చాలదా? ఆయనతో నువ్వు మాట్లాడానికి…? అంది శృతిక.
అసలే శృతిక ఆనుమానపు పీనుగ… ఇందులో నేను ఇరుక్కుంటే ఎటుపోయి ఎటు తేల్తానో అన్న భయంతో ఏం మాట్లాడలేదు చైత్రిక.
”మాట్లాడు చైతూ!” అంది రిక్వెస్ట్‌గా శృతిక.
”నేను ద్రోణతో మాట్లాడితే నువ్వేమీ అనుకోవుగా…? ఒక్కసారి నీ మనసు లోతుల్లోకి వెళ్లి ఆలోచించి చెప్పు! ఎందుకంటే ఇది ‘ప్రేమ’ వ్యవహారం… ఇద్దరి మధ్యన రకరకాల మాటలు దొర్లుతుంటాయి. కట్టె, కొట్టె, తెచ్చెలా వుండదు మరి…” అంది చైత్రిక.

ఇంకా వుంది..

రెండో జీవితం – 6

రచన: అంగులూరి అంజనీదేవి

ఆముక్త కారుదిగి లోపలకి వస్తుంటే చూసి మండేనిప్పుల కణికలా అయింది శృతిక. రెండడుగులు ఎదురెళ్లి ఉరిమి చూస్తూ….
”ఆయన ఇంట్లో లేరు” అంది అక్కడే ఆగు అన్నట్లు.
అర్థంకాక బిత్తరపోయింది ఆముక్త. అభిమానంతో అడుగు వెనక్కి తీసుకొని, వెనుదిరిగి కారెక్కి వెళ్లిపోతూ ద్రోణకి కాల్‌ చేసింది. అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో వుంది.
ఆ రోజు ఫోన్లో కృతికతో శృతిక మాట్లాడటం విని, వెళ్లిపోయిన ద్రోణ ఇంతవరకు ఇంటికి రాలేదు శృతిక ఆ బాధలో వుండగా ఆముక్త ఇలా రావటం ఆగ్రహాన్ని తెప్పించింది. అడవిలో ఎండిన చెట్టుకి నిప్పంటుకున్నట్టు భగభగ మండింది. ఆ టైంలో తనేం చేస్తుందో తనకే అర్థంకాని పనిచేసింది శృతిక. ఆ పనివల్ల పర్యవసానం ఎలా వుంటుందోనని ఆలోచించలేదు. ఎవరైనా తనలాగే చేస్తారని తనని తను మభ్యపెట్టుకుంది.
వెంటనే బయటకొచ్చి తలుపుకి తాళంపెట్టి ఆటో ఎక్కింది.
ఓ గంట ప్రయాణించాక ఆటో దిగి లోపలకెళ్లి…
”అత్తయ్యా!” అంటూ గట్టిగా పిలిచింది శృతిక.
”ఎందుకే అంత గట్టిగా పిలుస్తావ్‌! నాకేమైనా చెవుడా?” అంది విమలమ్మ కోడలివైపు తిరిగి చూస్తూ…
”మీ అబ్బాయి నన్ను వదిలేసి శాంతినికేతన్‌ వెళ్లినట్లుంది. వెళ్లే ముందు నాకు చెప్పలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఎగ్జిబిషన్‌ వున్నా నాకు చెప్పే వెళ్తాడు. ఫోన్‌ చేస్తే కట్ చేస్తున్నాడు. ఇప్పుడెలా? నాకు భయంగా వుంది.” అంది శృతిక.
షాక్‌ తిన్న దానిలా చూసింది విమలమ్మ.
”మాట్లాడరేం అత్తయ్యా! నాకు చాలా కంగారుగా వుంది. మామయ్యగారితో చెబుదాం!” అంటూ ఆయనకోసం కళ్లతోనే వెతికింది శృతిక.
”ఆయన ఇప్పుడే బయటకెళ్లారు. కూర్చో శృతీ! కంగారెందుకు?” అంది నెమ్మదిగా
శృతిక ఆశ్చర్యపోతూ.. ”మామయ్య మీతో చెప్పకుండా ఎటో వెళ్లి, ఫోన్‌ కట్ చేస్తుంటే కంగారుపడరా..?” అంది.
”ఆయనలా వెళ్లరు. చెప్పే వెళ్తారు” అంది విమలమ్మ
”ఈయన అలాకాదు. ఏం చెయ్యను నా ఖర్మ… ఇసుక తోడితే నీళ్లొస్తాయని నమ్మి పిచ్చిదానిలా తోడి, తోడి వేళ్లు పోతున్నాయ్‌! గోళ్లు పోతున్నాయ్‌! నీళ్లు రావటంలేదు. నిప్పులు రావటంలేదు.” అంది నీరసంగా చూస్తూ…
తన కొడుకునలా విమర్శిస్తుంటే బాధగా వుంది విమలమ్మకు వచ్చినప్పటినుండి కొడుకు ఎందుకంత డల్‌గా వున్నాడో ఇప్పుడర్థమైందామెకు…
శృతిక గొంతు విని గదిలోంచి బయటకొచ్చాడు ద్రోణ.
ద్రోణను చూసి ఆశ్చర్యపోతూ ”మీరిక్కడున్నారా? చెప్పరేం అత్తయ్యా! మీరు కూడా మీ కొడుకులాగే ఏడ్పించాలని చూస్తున్నారా?” అంది విమలమ్మ వైపు చూస్తూ…
”నిన్నెవరు ఏడ్పించరు. నువ్వే ఏడ్పిస్తున్నావు…” అన్నాడు ద్రోణ.
ద్రోణవైపు చూడకుండా ”మీరు పెద్దవారు.. ఆయన నాతో గొడవపడి వచ్చినప్పుడు నచ్చచెప్పి ఇంటికి పంపొద్దా? ఇక్కడే వుంచేసుకుంటారా ఎప్పటికి.?” అంది అత్తయ్యనే చూస్తూ పెద్దగా అరుస్తు…
ఏం మాట్లాడాలో తోచలేదు విమలమ్మకి…
ఎదుటిమనిషిని అకారణంగా నిందించటం, విమర్శించటం, ఫిర్యాదులు చెయ్యటం ద్రోణకి నచ్చదు. దేనిలోనైనా నిజాయితీ వుండాలంటాడు.
అందుకే… ”చూడు! శృతీ! నాకు తెలిసున్న పెద్ద యాడ్‌ ఏజన్సీ మేనేజర్‌ నన్ను కలుస్తానన్నారు. ఆ మేనేజర్‌ లేడి! నీకు ఆడవాళ్లు కన్పిస్తే భరించలేవు కదా! అందుకే ఇక్కడ వుంటాను. మీటవ్వమని చెప్పాను. ఆమెకు హోటల్స్‌లో కలుసుకోవటం ఇష్టం వుండదు.” అన్నాడు.
ద్రోణవైపు ఒకరకంగా చూసి.. ”అత్తయ్యా! నన్ను ఈయనకెందుకిచ్చి పెళ్లి చేశారు? ఈ బాధలన్నీ పడానికా? ఎప్పుడు చూసినా బొమ్మలతో, ఆడవాళ్లతో గడుపుతుంటే నా కళ్లతో నేనెలా చూడాలి?” అంది.
కోడలికెలా నచ్చచెప్పాలో తెలియలేదామెకి..
”మనిషికి ఇంత అసంతృప్తి, ఇంత గందరగోళం అవసరం లేదు. తెల్లకాగితంలా వుంచుకోవలసిన హృదయం నిండా పిచ్చిగీతలు గీసుకొని చిన్నాభిన్నం చేసుకుంటున్నావు. గాజుపలకలా వుంచుకోవలసిన మనసుని నీ చేతులతో నువ్వే పగలగొట్టుకుంటున్నావ్‌! ఇందుకు నేను ఏమాత్రం బాధ్యుడ్ని కాదు..” అంటూ తను అక్కడో క్షణం కూడా నిలబడకుండా తన గదిలోకి వెళ్లాడు.
శృతికను అక్కడే వదిలి కొడుకు దగ్గరకి వెళ్లింది విమలమ్మ.
”ద్రోణా! నాలుక కత్తికంటే పదునైంది. అది రక్తం చిందకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది. ఆ బాధేంటో నాకు తెలుసు. కానీ శృతిక ఏడుస్తోంది. నువ్వు లేకుండా గంట కూడా వుండలేనంటోంది.” అంటూ ద్రోణ పక్కన కూర్చున్నాడు తండ్రి సూర్యప్రసాదు.
”అలాగే అంటుంది నాన్నా…! తర్వాత బాగా విసిగిస్తుంది.” అన్నాడు ద్రోణ.
”విసిగిపోయానని విసిరికొట్టానికి ఇదేమైనా క్రికెట్ బంతా! కాపురం. కోడలి ముఖం చూస్తే జాలిగా వుంది” అన్నాడు
”మీ కోడల్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాన్నా! క్షణక్షణం అనుభవించినవాడ్ని. చదువుకున్నానన్న సృహకూడా వుండదామెలో…” అన్నాడు ద్రోణ.
”నిన్ను కోరి – తన కూతుర్ని నీ చేతిలో పెట్టాడు మీ మామయ్య. నువ్వైతే బాగా చూసుకుంటావని.. ఆయన్ని బాధపెట్టకురా!” అంది విమలమ్మ.
”చూసుకుంటానని కాదమ్మా! భరిస్తానని..” అన్నాడు ద్రోణ.
”ఏదో ఒకటి… కోడల్ని ఇంటికి తీసికెళ్లు. తొందరపడకు.” అంటూ నచ్చ చెప్పాడు సూర్యప్రసాద్‌.
”నేనేం తొందరపడ్తున్నాను నాన్నా! నాకు బయటనుండి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని మనసులో పెట్టుకొని వాళ్ల అక్కయ్య ఇంటికెళ్లి స్కూటీ యాక్సిడెంట్ లో నీనా చెయ్యి విరగ్గొట్టింది. వాళ్ల అత్తయ్య నోటికొచ్చినట్లు మాట్లాడితే భయపడి నావెంట వచ్చింది… ఫోన్‌కాల్స్‌ని చూసి ఫీలవుతోందని వాటిని కట్ చేస్తూనే వున్నాను.
కానీ విదేశాలనుండి వచ్చేకాల్స్‌ని, యాడ్‌ ఏజన్సీ వాళ్ల కాల్స్‌ని, పత్రికాఫీసుల కాల్స్‌ని కట్ చేస్తుంటే నన్ను ఆర్టిస్ట్‌ అంటారా? అందరికి అందుబాటులో వుండాల్సిన నేను అలా ఫోన్‌కాల్స్‌ని కట్ చేస్తే ఎలా వుంటుంది? పోకస్‌డ్‌గా డెవలప్‌ కావలసినవాడ్ని అలా మౌనంగా వుండి నా కాళ్లను నేనే విరగ్గొట్టుకున్నట్లు నా కళను నేనే అణచుకోవాలా?” అన్నాడు.
”నువ్వు నాకు అర్థమవుతున్నావు ద్రోణా!” అన్నాడు సూర్యప్రసాద్‌ అంతకన్నా ఇంకేం మాట్లాడలేక…
”నన్ను ఇంట్లోనే వుంచుకొని నాలుగురోజుల నుండి ఇంట్లో లేనని చెప్పటం నన్ను బ్లేమ్‌ చెయ్యటం కాదా? నా క్యారెక్టర్‌పై అవతలవాళ్లకి చిన్న చూపు కలగాలనేగా! అవమానించినా పడొచ్చుకాని, అనుమానించటం నరకం…” అన్నాడు
భార్యవైపు చూశాడు సూర్యప్రసాద్‌.
”ఏమోనండి! ఎవరి సమస్యల్లో వాళ్లు కొట్టుకుపోతున్నారు. మనమేం చెప్పగలం!” అంది రోగం బాగా ముదిరిన రోగుల్ని చూస్తున్న డాక్టర్‌లా చూస్తూ విమలమ్మ.
”అనుమానం ప్రేమవున్న చోటే వుంటుంది ద్రోణా!” అన్నాడు సూర్యప్రసాద్‌.
”అదేం ప్రేమ నాన్నా..? నేను ఎటు చూస్తే అటే చూస్తుంది. అక్కడెవరైనా అమ్మాయి వుందేమోనని… నేను వేసే అమ్మాయిల బొమ్మల్ని-చూసి.. ఇది మీరే వేశారా? ”ఈ బొమ్మను మీ కుంచే కదా తాకింది?” అంటుంది చురకత్తిలా చూస్తూ … ఇదేం ప్రేమో తట్టుకోలేక పోతున్నాను.” అన్నాడు ద్రోణ.
”మీ అమ్మకూడా శృతిక అంత వయసులో అలాగే వుండేదిరా! పోలికలు వస్తాయిగా! మీ అమ్మకి నేనంటే ప్రాణం ద్రోణా! దాన్ని భరించటంలో కూడా ఓ ఆనందం వుంది…” అన్నాడు సూర్యప్రసాద్‌.
ద్రోణ ఇంకేం మాట్లాడలేదు

*****

ఇంటికెళ్లాలని శృతికతో కలిసి కారులో కూర్చున్న ద్రోణను చూసి సంతోషించారు ద్రోణ తల్లిదండ్రులు…
కారులో కూర్చున్నాక శృతిక, ద్రోణ సరదాగా మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకున్నారు.
ముందుగా కారు దిగిన శృతిక తలుపుకి తాళం తీసి నేరుగా వంటగదిలోకి వెళ్లింది.
కారుని పార్క్‌ చేసి హుషారుగా, ఉత్సాహంగా అడుగులు వేస్తూ నిత్యం తను బొమ్మలు వేసే గదిలోకి ప్రవేశించి స్థాణువయ్యాడు ద్రోణ.
ఆ గదిలో బూడిద తప్ప ద్రోణ వేసిన బొమ్మలు లేవు.
ఒక్కక్షణం తన కళ్లను తను నమ్మలేనట్లు గదంతా కలియజూశాడు. ఈ గది నాదేనా అన్న అనుమానంతో ఇది నీ గదే అన్నట్లు స్టాండ్‌ బోర్డ్‌ కన్పించటంతో షాక్‌ తిన్నాడు.
అంతత్వరగా తేరుకోలేని షాక్‌ అది.
నిలబడే శక్తి లేనట్లు కుప్పకూలిపోయాడు.
తను వెళ్లాక తన గదికి షార్ట్‌సర్క్యూట్ అయిందా? అనుకున్నాడు. అలా అనుకోవానికి ఆధారాలు బలంగా లేవు.
మరి ఏం జరిగింది?
తన బొమ్మలెందుకలా తగలబడిపోయాయి?
ఈ బొమ్మలు ఒక్కగంట, ఒక్కరోజులో వేసినవి కావు. నెలలు, సంవత్సరాలు శ్రమపడి వేసిన బొమ్మలు… ఈ మధ్యన ఎగ్జిబిషన్‌లో కొన్ని అమ్ముడుపోగా మిగిలినవి భద్రంగా ఇల్లు చేర్చుకున్నాడు. కొన్ని బొమ్మలు విదేశాలకు పంపాలని ప్యాక్‌ చేసి రెడీగా వుంచాడు. అవి కూడా కాలిపోయాయి. పత్రికలవాళ్లు పంపిన స్క్రిప్టులు కూడా కాలిపోయాయి. అందులో యాడ్‌ఏజన్సీ వాళ్లకోసం వేసిన బొమ్మలు కూడా వున్నాయి. ఇది ఏ ఆర్టిస్ట్‌కి జరగకూడని అన్యాయం… ఇదెలా జరిగింది?
వ్యాపారంలో నష్టమొస్తే కోలుకోవచ్చు. ఏదైనా జబ్బు వస్తే డాక్టర్‌ దగ్గరకి వెళ్లి నయం చేయించుకోవచ్చు… కానీ క్షణమో రకంగా ఫీలయి నెలలు, సంవత్సరాలుగా గీసిన ఈ బొమ్మల్ని ఈ జన్మలో తను మళ్లీ గీయగలడా?
జరిగిపోయిన సృష్టి మళ్లీ రాదు. జరగబోయే సృష్టికి జరిగిపోయిన సృష్టికి చాలా తేడా వుంటుంది. గతజన్మను ఎలా చూసుకోలేడో తన బొమ్మల్ని కూడా తనిక చూసుకోలేడు.
తల పగిలిపోతుంది ద్రోణకి…
శృతిక స్టౌ దగ్గర నిలబడి కాఫీ కలుపుతూ – ఇకపై తన భర్తతో హాయిగా గడపాలని… రోజుకో రకం చీర కట్టుకొని ఆయనకి నచ్చిన విధంగా వుండాలని… ఆయన అప్పుడప్పుడు అడిగే సన్నజాజులు తలలో పెట్టుకొని, పాతతరం అమ్మాయిలా, ఆయన గీసుకునే బొమ్మలా వుండాలని అనుకొంది.
కాఫీ కప్పు పట్టుకొని భర్త వున్న గదిలోకి వెళ్లింది. అక్కడ ద్రోణ సర్వం పోగొట్టుకున్న వాడిలా కూర్చుని వున్నాడు.
సన్నగా నవ్వుతూ అతనికి దగ్గరగా వెళ్లింది. ఆ బూడిదవైపు చేయి చూపి ” ఈ బొమ్మల కోసమేగా ఆడవాళ్లంతా పడి చచ్చి, మీకు ఫోన్లు చెయ్యటం… మీ చుట్టూ తిరగటం.. ఇవే లేకుంటే ఏముందిక్కడ? వట్టి బూడిద. అందుకే వీటిని బూడిద చేశా…” అంది నవ్వుతూ…
వెంటనే కొండను ఢీకొన్న పెనుకెరటంలా లేచి ఆమె చెంప చెళ్లు మనిపించాడు. ఆ దెబ్బ తీవ్రతకి కాఫీ కప్పుతో పాటు ఆమె కూడా తిరిగింది. కాఫీ మొత్తం గదినిండా పడ్డాయి.
నిలబడాలంటే కళ్లు తిరుగుతున్న దానిలా కాస్త తడబడి, నెమ్మదిగా కంట్రోల్‌ చేసుకొని నిలబడి…
”నన్ను కొడతారా?” అంటూ చెంపమీద చేయిపెట్టుకొంది.
”చంపేస్తాను…” అన్నాడు ఆవేశంగా.
”ఏం చేశానని నన్ను చంపుతారు?” అంది
”ఎన్నో సంవత్సరాల నా తపస్సుని పాడుచేశావు. నేను పడ్డ శ్రమనంతా ఒక్కక్షణంలో తగలబెట్టి బూడిద చేశావు.” అన్నాడు
”మీరు రోజూ నా మనసును బూడిద చెయ్యటం లేదా? అంతకన్నా ఇది ఎక్కువా?” అంది
”నీకు మనసుంటే కదా! బూడిద కావటానికి?” అన్నాడు
”నాకు మనసు లేకుంటే మిమ్మల్నింతగా ప్రేమిస్తానా?” అంది.
”నా వినాశనాన్ని కోరే నీ ప్రేమ నాకవసరంలేదు. నా భార్యగా నా పక్కన వుంటూ నామీద నువ్వింత అసూయను పెంచుకున్నావని తెలుసుంటే అప్పుడే మీ ఇంటికి పంపివుండేవాడ్ని…” అన్నాడు.
”నాకు ముందే తెలుసు. మీలాంటి వాడ్ని మార్చటం కష్టమని…” అంది.
”నీకు నాతో మాట్లాడే అర్హతలేదు. చేసిన బూడిద చాలు. నా ముందు నిలబడకు…” అన్నాడు. టెన్షన్‌తో అతని నరాలు పగిలిపోయేలావున్నాయి.
కోపంగా అక్కడనుండి వెళ్లింది శృతిక… కోపం తెచ్చుకునే ముందు పరిణామాలు కన్పించవు. కోపం మనిషిని పశువును చేస్తుంది. విచక్షణను కోల్పోయేలా చేస్తుంది.
సమస్యలు పెద్దవి కావటానికి కారణం కూడా కోపమే. ఆ రోజు భర్తమీద కోపంతో బొమ్మల్ని తగలబెట్టింది. ఇప్పుడు భర్త నిరసనను తట్టుకోలేకపోతోంది.
పర్యవసానం ఆలోచించకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది శృతిక.

*****

దోసిళ్లతో స్వచ్ఛమైన సెలయేటి నీళ్లు తాగినట్లుండాలి జీవితం అనుకున్న ద్రోణకి ఉలకని, పలకని అమ్మ వెంటపడి మొత్తుకున్నట్లుంది. నిప్పుపెదవులపై ముద్దాడి భయపడ్తున్నట్లుంది.
ద్రోణ తలపై చేతులు పెట్టుకొని…. ‘తనకింకేం మిగల్లేదు’ అన్న బాధతో కూర్చుని వున్నాడు.
అప్పుడొచ్చింది ఆముక్త కారు దిగి లోపలకి…
గదిలోకి రాగానే… ”ద్రోణా! నీ బొమ్మలేమయ్యాయి? గదినిండా ఈ బూడిదేంటి? ఫ్యానేస్తే ముఖంమీదకి వచ్చేలా వుంది. అసలేం జరిగింది?” అంది షాకింగ్‌గా చూస్తూ…
ఆముక్తకి ఏంచెప్పాలో ఒక్కక్షణం అర్థంకాలేదు ద్రోణకి.. అబద్ధం చెప్పేకన్నా నిజం చెబితే మంచిదనుకున్నాడు. జరిగింది చెప్పాడు. వేదనగా చూసింది ఆముక్త.
నాదీ అనుకున్నది ఎవరికి దక్కకూడదన్న ఆగ్రహంతో తారాస్థాయిలో తెగించిన శృతిక – ఇంత అతితో కూడిన తన ప్రేమను అవతలవాళ్లు తట్టుకోలేరని గ్రహించి వుండదు. అందుకే ఇలా చేసింది.
ద్రోణ ముఖంలోని వైరాగ్యం ఆముక్త హృదయాన్ని నొక్కి పెట్టినట్టైంది. ఒక కళాకారుని బాధ తోటి కళాకారులకి వెంటనే అర్థమవుతుంది.
బాధంటే ఏమిటో…. బాధపడటం అంటే ఏమిటో… సమస్యలు ఎలా వుంటాయో… ఆ సమస్యలు పైకి చిన్నగా కనిపిస్తూ మనసుని ఎంత పెద్దగా కోస్తాయో ఆముక్తకి ఇన్నిరోజులు తెలియదు. ఇప్పుడు ద్రోణను చూస్తుంటే అంతటి భావకవి అయిన కృష్ణశాస్త్రి – ”నాకు యుగాదులు లేవు. ఉషస్సులు లేవు.” అని ఎందుకు రాశాడో అర్థమయింది. ద్రోణ లాంటి వాళ్లే ఆయన హృదయాన్ని అప్పట్లో కదిలించి వుంటారు.
ఆవేశంగా ద్రోణవైపు చూస్తూ…. ”ఇది పెద్ద విధ్వంసకచర్య వర్షిత్‌ ! నేను మీడియా వాళ్లకి ఫోన్‌ చేస్తాను. దీన్ని పదిమందికి తెలిసేలా చేద్దాం! న్యాయం కావాలని ప్రజల్నే మనం అడుగుదాం! వాళ్ల సమాధానమే మనకి కొండంత అండ…” అంది ఆముక్త.
ఉలిక్కిపడి చూశాడు ద్రోణ…
”నువ్వు నా గురించి బాధపడ్తున్నందుకు థ్యాంక్స్‌ ఆముక్తా! నా సమస్యకి నువ్వు చూపే సొల్యూషన్‌ కరక్ట్‌ కాదు. నన్నిలా వుండనివ్వు.” అన్నాడు
”నీ బాధ చూడలేకపోతున్నాను వర్షిత్‌!” అంది జాలిగా
”మన ప్రమేయంలేకుండా దేన్నైనా కోల్పోయినప్పుడు బాధగానే వుంటుంది ఆముక్తా! జీవితంలో తెలిసి కోల్పోయేవి కొన్ని, తెలియక కోల్పోయేవి కొన్ని వుంటాయి కదా! ఏది ఏమైనా కోల్పోయింది నేను… నువ్వు బాధపడకు. ఇప్పుడేం రాస్తున్నావు?” అన్నాడు దీనిమీద ఇక ఏం మాట్లాడినా అనవసరమే అన్పించి…
”నా ఫ్రెండ్‌ సంవేద మొన్న కొన్ని సమస్యల్ని చెప్పి రాయమంది. ‘సమస్యలు సమస్యలే కదా! ప్రత్యేకించి రాయటం ఎందుకు?’ అని ఆలోచిస్తున్నాను. సపోజ్‌ ఆదాయం లేనివాడు అప్పులు చేస్తాడు. వాడు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని ఆలోచించి కష్టపడే తత్వాన్ని పెంచుకుంటే సమస్య సాల్వ్‌ అవుతుంది. కాని దానిమీద నేను నాలుగు పేజీలు రాస్తే అప్పులు తీరవు కదా! అందుకే నేనా సమస్యను రాయదలచుకోలేదు. ఏదైనా న్యూ సబ్జక్ట్‌ దొరికితే రాస్తాను” అంది.
తలకొట్టుకునే ఆసక్తికూడా లేనట్లు మౌనంగా వున్నాడు.
అటు, ఇటు చూసి ”శృతిక లేదా?” అంది
”వెళ్లిపోయింది” అన్నాడు
”ఎక్కడికి?” అంది
”ఏమో! తెలియదు” అన్నాడు.
”ఇప్పుడెలా?” అంది
”దాని గురించి ఆలోచించే స్థితిలో లేను…” అన్నాడు.
”అందరికి ఒకసారి ఫోన్లు చెయ్యండి! మనం కూడా వెతుకుదాం! భార్య లేకుంటే కష్టం కదా!” అంది.
”కష్టం వచ్చినప్పుడు పడాలి.. కష్టం కదా! అంటే వచ్చిన కష్టం పోతుందా? పోనీ మనం కూడా దాన్నుండి పారిపోలేం. ధైర్యంగా నిలబడితే చూసి, చూసి అదే పారిపోతోంది.” అన్నాడు
అతని ముఖంలోని గంభీరతనే చూస్తూ… ”భార్య లేకుంటే ఎన్ని కష్టాలో ఓ కథ రాస్తాను.” అంది ఉద్వేగంగా.
నిట్టూర్చాడు ద్రోణ.
”నా జీవితం నీకు కధలా వుందా?” అన్నాడు
”నువ్వే కదా జీవితాల్లోకి వెళ్లి రాయమంటావు. సంవేద కూడా అప్పుడప్పుడు అదే చెప్తుంది.” అంది.
ఒకసారి ఆమె ముఖంలోకి జాలిగా చూసి, ‘సమస్యల్ని సృశించే నేర్పుకూడా ఓ కళే కదా!’ అని మనసులో అనుకొని, ఏమనాలో తెలియక ‘ఆల్‌ ద బెస్ట్‌’ అన్నాడు. అంతలో…
పేరెంట్స్ నుండి కాల్‌ రావటంతో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అని ఆముక్తతో చెప్పి పక్కకెళ్లి మాట్లాడి వచ్చాడు.
ఆమె చాలా సేపు ద్రోణ దగ్గరే కూర్చుంది.
*****

అర్ధరాత్రి దాక – అందరు నిద్రపోతున్న సమయంలో గంగాధరం మళ్లీ అరుస్తూ లేచాడు.
నిశిత బెదిరిపోయి లేచి కూర్చుంది. ఆమె వణకటం చూసి…
”నిశితా భయపడకు..” అని మాత్రం అన్నాడు గంగాధరం.
”భయంగా వుంది మామయ్యా! మీరు రోజు ఇలాగే అరుస్తున్నారు. ఎందుకని?” అంది గుండెలపై చేయివేసుకొని.,..
నిశితకి చెప్పాలి! తనేంటో చెప్పాలి. ఏం జరిగిందో చెప్పాలి. ఇన్నిరోజులు వినేవాళ్లు లేక, ఆత్మీయులుగా అన్పించక చెప్పలేదు. ఇప్పుడు చెప్తే కనీసం నిశిత అయినా ధైర్యంగా తనపక్కన వుంటుంది. లేకుంటే తన అరుపులకి భయపడ్తూ ఎన్ని రోజులు ఇలా?
భార్య ఎలాగూ తనని దగ్గరకి రానీకుండా దూరంగా వుంది. అది ఏ జన్మలో చేసుకున్న పాపమోకదా!
ఆయన చెప్పానికి సిద్ధమయ్యాడు.
అది గమనించి మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది నిశిత.
అవి తాగి చెప్పటం ప్రారంభించాడు.

*****

ఇంకా వుంది

రెండో జీవితం .. 5

రచన: అంగులూరి అంజనీదేవి

ఆకులు కదిలినట్లనిపించి ఇటు తిరిగాడు ద్రోణ.
వెన్నెల నీడ కొబ్బరాకుల సందుల్లోంచి శృతిక మీదపడి కదులుతుంటే ఆమె వేసుకున్న లైట్ బ్లూ కలర్‌ నైటీ మీద నల్లపూసల దండ మెరుస్తోంది. ఒక్కక్షణం అతని కళ్లు అలాగే నిలిచిపోయాయి.
”ఒక్క నిముషం శృతీ! వస్తున్నా”… అంటూ కాల్‌ కట్ చేసి భార్య వైపు రెండడుగులు వేశాడు.
”వస్తారులెండి! ఏదో ఒక టైంకు… ఇక్కడేం జరుగుతుందో చూద్దామని వచ్చాను” అంది శృతిక.
ఏం జరుగుతోందని చుట్టూ చూసి, ‘ఏం లేదిక్కడ’ అన్నట్లు భుజాలు ఎగరేశాడు.
అతని భుజాల కదలిక చూడానికి గమ్మత్తుగా అన్పించినా, మనసు మండుతోంది శృతికకు…
”ఇది తట్టుకోలేకనే మా అక్కయ్య వాళ్ల ఇంటికెళ్లి ఖర్మకాలి పాప చెయ్యి విరగ్గొట్టి వచ్చాను. మా నాన్న నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. ఇంకెప్పుడూ అక్క దగ్గరకి వెళ్లొద్దన్నాడు. మొన్న వాళ్లత్తగారు నోటి కొచ్చినట్లు మాట్లాడారట. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లాలి. ఇక్కడ వుండలేకపోతున్నా..” అంటూ తల పట్టుకొని ఒక్క వుదుటన కింద కూర్చుంది. మనసంతా వికలమైన దానిలా కుంగిపోతోంది.
”నువ్వు డిస్టర్బ్‌ అవుతావనే పైకొచ్చాను. ఇప్పుడు నీకేంటి ఇబ్బంది?” అన్నాడు. అంతకన్నా ఇంకేం మాట్లాడాలో అతనికి తోచడంలేదు.
”నేను డిస్టర్బ్‌ అవుతానని కాదు. మీ ఇద్దరి మాటలకి ప్రైవసీ కోసం పై కొచ్చారు. నేనేం చిన్నపిల్లను కాను. నాకిలాంటివి బాగా తెలుసు. నేను హాస్టల్లో వుండి చదువుతున్నప్పుడు కొందరమ్మాయిలు మీలాగే ఎప్పుడు చూసినా మొబైల్‌లో మాట్లాడుతుండే వాళ్లు..” అంది పిచ్చిదానిలా అరుస్తూ.
ద్రోణ బిత్తరపోతూ…” ఎవరితో…?” అన్నాడు.
”వాళ్ల లవర్స్‌తో… వాళ్లకో టైమంటూ వుండేది కాదు. పక్కవాళ్లకి డిస్ట్రబెన్స్‌ అనేది లేదు. ఇదిగో ఇలాగే మీలాగే వాళ్లుకూడా నావల్లకాదు ఇలాగైతే…’ అంది ఆవేశంతో రొప్పుతూ లేచి నిలబడి.
…అతను సూటిగా ఆమెనే చూస్తూ… ”ఆముక్త నా లవర్‌ కాదు. రైటర్‌. మాకొచ్చే డౌట్స్ ను క్లియర్‌ చేసుకుంటున్నాం… అంతే ఇంకేం లేదు” అన్నాడు చాలా నిజాయితీగా.
”నాకు నా హాస్టల్‌ ఎక్స్‌పీరియన్స్‌ లేకుండా వుంటే నేను కూడా అలాగే అనుకునేదాన్ని… ఇప్పుడలా అనుకోను. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తిని మనసులో వుంచుకున్నప్పుడు ఇంకో వ్యక్తితో మనసు పంచుకోలేరు. మీరలా కాదు. మీ బొమ్మల్ని మెచ్చుకున్న ప్రతి ఒక్క స్త్రీకి మీ మనసుని, మాటల్ని పంచేస్తారు.” అంది చాలా స్థిరంగా..
అసహనంగా చూశాడు. ఆమెనెలా నమ్మించాలో అర్థంకాక..
”ఆముక్త నాకన్నా వయసులో పెద్దది. ఇంకెప్పుడూ మా ఇద్దర్ని ఆ దృష్టితో చూడకు…” అన్నాడు.
”సీత కూడా రాముడికన్నా వయసులో పెద్దదట… మన క్రికెట్ ప్లేయర్‌ సచిన్‌ భార్యకూడా అతనికన్నా పెద్దదేనట. ఇలాంటి కబుర్లు నాతో చెప్పకండి! నాకు ప్రపంచం బాగా తెలుసు” అంది.
”అవున్లే! హాస్టల్లో వుండి చూశావుగా…” అన్నాడు వ్యంగ్యంగా.
…అతని వ్యంగ్యాన్ని గమనించకుండా ”ఈసారి ఆముక్త వచ్చి మీ గదిలో కూర్చుందనుకోండి! అప్పుడు చెబుతా!” అంది బెదిరిస్తూ…
”ఏం చెబుతావ్‌?” అన్నాడు.
”వ్యాక్యుమ్‌ క్లీనర్‌తో కొడతా!” అంది.
”కొడతావా? కొత్తగా వేసిన నా బొమ్మని చూడ్డానికి రేపే వస్తానంది.” అన్నాడు లోలోన కంగారుపడ్తూ… ఆ బొమ్మని మంచి కాన్సెప్ట్‌తో, గ్రేస్‌తో వేశానని దాన్ని ముందుగా ఆముక్త చూసి కాంప్లిమెంట్ ఇవ్వాలని అతను ఆశిస్తున్నాడు.
”రానీ! చెబుతా!” అంది ఊగిపోతూ.
ఆ మాటతో ఒక్కక్షణం ఆలోచించాడు.
అతనలా ఆలోచిస్తుంటే…
”జోకనుకుంటున్నారేమో! మొన్న తన చీరమీద కావాలనే కాఫీ పోశాను. మీరు పొరపాటున పడ్డాయనుకుంటున్నారు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటంలేదు” అంది
…లోలోన ఆశ్చర్యపోతూ మెల్లగా ఆమెను దగ్గరకు తీసుకొన్నాడు. మాటలతో ఆమెలోని ఫైర్‌ను తగ్గించాడు.
”ఓ.కె. శృతీ! నీకు నచ్చని పని నేనేం చెయ్యను” అన్నాడు.
”మరి ఫోన్‌ కాల్స్‌?”
”కట్ చేస్తా…!”
హాయిగా నవ్వింది శృతిక. ఆ నవ్వులోని జీవానికి వెన్నెల కూడా వెనుకంజవేసింది.
”మరి ఇంటి కొచ్చిన వాళ్ల మీద కాఫీ పొయ్యటం, వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో కొట్టటం లాంటివి చెయ్యకూడదు.” అన్నాడు.
”అలాగే ! చెయ్యను”. అంది
”మాట ఇవ్వు…” అంటూ చేయి చాపాడు
చేతిలో చెయ్యివేసి మాట ఇచ్చింది
”రేపు ఆముక్త వస్తుంది. నువ్వు మాట నిలుపుకోవాలి” అన్నాడు
”ఆ… ” అంటూ కళ్లూ, నోరు ఒక్కసారే తెరిచింది. వెంటనే అతను ఆమె కనురెప్పలపై తన పెదవులతో చేసిన మౌన మృదంగానికి ఆమె పెదవులు నెమ్మదిగా మూసుకున్నాయి.
*****
ఆముక్త ఫోన్‌ చెయ్యగానే లిఫ్ట్‌ చేసి, ఆమె చెప్పిన మాటలు విని స్టాచ్యూలా నిలబడింది సంవేద.
ఒక్క క్షణం మాటలు రాలేదు ఆమెకు.
వెంటనే అత్తగారి దగ్గరకి వెళ్లి.. ”మీరు నిశితను బయటకు పంపారా అత్తయ్యా?” అంది
దేవికారాణి నిర్లక్ష్యంగా తలతిప్పి మాట్లాడలేదు. సంవేద ‘ఉఫ్‌’ అంటూ సహనాన్ని కూడదీసుకుని… ”మీకేదైనా అవసరమైతే నాకు చెప్పండి! నేను వెళ్లి తెస్తానని చాలాసార్లు చెప్పాను. మీరెందుకిలా దాన్ని బయటకి పంపుతున్నారు?” అంది.
”హు… నువ్వా!! నువ్వు ఈ రోజు తెమ్మంటే రేపు తెస్తావు. ఇప్పుడు పిలిస్తే ఇంకోగంటకి పలుకుతావు. నీ సంగతి నాకు తెలియదా?” అంది
”ఇదో నెపం నానెత్తిన పెట్టి దాన్ని పంపుతారా? దానికేమైనా జరిగితే?” అంది. సంవేద కళ్లలో నీళ్లు కదులుతున్నాయి.
”ఏం జరుగుతుంది? మరీ ఆకాశం నుంచి వూడిపడలేదు నీ చెల్లెలు… ఆ కుంటిదాని జోలికి ఎవరూ పోర్లే అయినా నువ్వు చెయ్యక, అది చెయ్యక ఎవరు చేస్తారు నా పనులు?”
”పనులు ! పనులు ! ఇది తప్ప ఇంకోమాట రాదా? ఛ, ఛ…” అంది ఇరిటేషన్‌గా చూస్తూ సంవేద.
” మూతెందుకు అన్ని వంకర్లు తిప్పుతావ్‌?” అంది దేవికారాణి.
”వంకర్లు తిప్పానా? వక్ర దృష్టితో చూస్తే అన్నీ వంకర్లే కన్పిస్తాయి లెండి!” అంది వత్తి పలుకుతూ సంవేద.
”అత్తను పట్టుకొని అండీ అంటావా? ఇదిగో! నా మెతకతనాన్ని చూసి, తెగరెచ్చిపోతున్నావు నువ్వు…” అంది దేవికారాణి.
”మీరు మెతకా? నవ్విపోతారు వింటే! ఎవరూ లేకనే కదా దాన్ని నా దగ్గర వుంచుకొంది. కాలులేదన్న జాలికూడా లేకుండా బయట పనులు దానితో చేయిస్తారా? అసలు మీకు హృదయం వుందా? మూసుకుపోయిందా? అంది సంవేద.
”అమ్మో ! అమ్మో! నా గుండె మూసుకుపోయిందంటావా? ఊపిరాడక నేను చచ్చిపోవాలనేగా.. అసలే జ్వరమొచ్చి నేను బాధపడ్తుంటే..! మీకు నాలాంటి అత్తకాదే బండబూతులు తిట్టే అత్త కావాలి. అప్పుడు కాని దారిలోకి రారు…” అంది చేతులు చాలా హుషారుగా తిప్పుతూ…
”ఇప్పుడు దారిలో లేమా?” అంది సంవేద.
”ఏం దారి మీ దారి? తల్లీ,దండ్రీ లేనప్పుడు అణిగి, మణిగి వుండాలని తెలియదా? నా ఇంటి కోడలిగా వచ్చి నువ్వూ – నీతో పాటు వచ్చి అది అదృష్టవంతులైపోయారు. లేకుంటే ఈ రోజుల్లో కొంతమంది అత్తలు రెండో కంటికి తెలియకుండా కోడళ్లను ఎలా హింసిస్తున్నారు?
మాటకుముందే ముక్కుమీద కొట్టి అది బెదిరి రక్తమొస్తే అదేదో రోగమంటున్నారు. సుత్తులతో తలమీద కొట్టి కుట్టుకూడా వేయించకుండా దూదిపెట్టి వుంచుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ‘నా కోడలికి పిచ్చి పట్టిందని’ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరుస్తున్నారు. ఇవన్నీ మీకెలా తెలుస్తాయ్‌ బయటకెళ్లి చూస్తే కదా! చిన్నపని చెప్పినా అదేదో గడ్డపార చేతికిచ్చి బావి తవ్వమన్నట్లు మాట్లాడుతుంటారు…” అంది దేవికారాణి.
” మీ నోట్లోంచి గడ్డపారలు, సుత్తులు వస్తున్నప్పుడు నేనేం మాట్లాడాలి అత్తయ్యా! ఆడపిల్ల పుట్టింటినుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు అక్కడ తీసి ఇక్కడ నాటిన పూలమొక్కతో సమానమంటారు. వేర్లు కుదురుకుని, కుదుటపడే దాకా మంచిపోషణ, ఆదరణ అవసరం… అలాటిది మరచిపోయి, అనాదల్ని చూసినట్లు చూస్తుంటే ఏం చేయాలి?
ఈ రోజు ఆముక్త చూడకుంటే ఆ నలుగురు మగపిల్లల చేతుల్లో నిశిత ఈ పాటికి చచ్చిపోయి వుండేది…” అంది సంవేద.
ఏమిటి! మగపిల్లలు వెంటపడ్డారా?” అంటూ జీవితంలో ఎప్పుడు పోనంతగా ఆశ్చర్యపోయింది దేవికారాణి.
”అవునట… కాలేజీ అబ్బాయిలు…” అంటూ సంవేద ఏదో చెప్పబోతుంటే…
”అర్థమయిందిలే… అదేదో ర్యాగింగంటారే.. అదయివుంటుంది. అయినా వాళ్ల కాలేజి అమ్మాయిల్ని చేసుకోవాలి కాని దీని వెంటెందుకు పడటం? ఆ.. ఇలాంటివన్నీ మామూలే…” అంది.
”మీరింత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నారత్తయా?” అంది సంవేద.
”ఏముందక్కడ జుట్టుపీక్కోటానికి?”
”మీరెందుకు పీక్కుంటారులెండి జుట్టు!”
”నువ్వేదో తేడాగా మాట్లాడుతున్నావ్‌ సంవేదా!”
”తేడా ఏముంది ఇందులో.. నలుగురబ్బాయిలు నిశితను కార్లో ఎక్కించుకోబోతుంటే ఆముక్త చూసి కాపాడింది. ఇప్పుడది ఆముక్త ఇంట్లోనే వుంది. అందుకే దాన్ని బయటకు పంపొద్దంటున్నాను.” అంటూ సంవేద విసురుగా అక్కడ నుండి వెళ్లబోతుంటే….
”ఆగు…” అంది గట్టిగా దేవికారాణి. ఆగింది సంవేద.
పక్కరూంలో నిద్రపోతున్న శ్యాంవర్ధన్‌ ఆ అరుపుకి నిద్రలేచి వాళ్ల దగ్గరకి వచ్చాడు.
”కాలు లేదనే గాని చూట్టానికి అది బావుంటుందని నేను చెప్పలేదా? ఎవరి కళ్లు దానిమీద పడినా తిప్పుకోవటం కష్టం… దాన్ని కాపాడటం మావల్ల కాదు. రేప్పొద్దున ఏదైనా జరిగితే మాకు మాటలొస్తాయి. వెంటనే పంపించివెయ్‌!” అంది దేవికారాణి.
”ఎక్కడికి?”
”ఎక్కడికని నన్ను అడుగుతావేం?”
”మాకెవరూ లేరు. దానికి నేను – నాకు అది తప్ప…” అంది సంవేద వాళ్లెందుకు వాదన పెట్టుకుంటున్నారో అర్థంకాక… ”అసలేం జరిగింది?” అంటూ వాళ్లిద్దరి మధ్యలోకి వెళ్లి నిలబడ్డాడు శ్యాంవర్ధన్‌.
జరిగింది చెప్పింది సంవేద.
”నేను వెళ్లి నిశితను తీసుకొస్తాను. మీ ఇద్దరు గొడవ ఆపి పనులు చూసుకోండి!” అంటూ షర్ట్‌ వేసుకొని ఆముక్త ఇంటికెళ్లాడు.
దారిలో ఓసారి నిశిత ముఖాన్ని గుర్తుచేసుకోవటానికి ప్రయత్నించాడు. స్పష్టత రానట్లు కష్టంగా అన్పించినా మళ్లీ, మళ్లీ ఆమె ముఖాన్ని తన అంతః చక్షువుతో తడిమి చూశాడు… వాళ్లు అనుకోవటమే కాదు. నిశిత అతని కళ్లకి కూడా అందంగానే కన్పించింది.
శ్యాంవర్ధన్‌ వెళ్లేటప్పటికి… ఆముక్త పెట్టిన అన్నం తిని, తనను తీసికెళ్లానికి ఎవరొస్తారా? అని ఎదురుచూస్తోంది నిశిత. ఆమె ముఖం చూస్తుంటే బాగా భయపడినట్లనిపిస్తోంది.
జాలిగా అన్పించింది శ్యాంవర్ధన్‌కి..
…అంతేకాదు నిమ్మాకు రాసుకొని నిగనిగలాడుతున్నట్లు కన్పిస్తున్న నిశిత ముఖాన్ని అందమైన చేతుల్ని ఒక్కక్షణం తన చూపులతో కొత్తగా, రహస్యంగా తడిమాడు. అతని చూపులు అతనికే చిత్రంగా అన్పించాయి.
ఎయిర్‌ కండిషన్డ్‌ రూంలో మెత్తి కార్పెట్ మీద హుందాగా నడుచుకుంటూ వచ్చి… ”నిశితను ఒంటరిగా ఎక్కడికి పంపకండి! బయట ద్విపాదమృగాలు ఎక్కువయ్యాయి.” అంది ఆముక్త.
అలాగే అన్నట్లు తలవూపి… నిశితను తన బైక్‌ మీద కూర్చోబెట్టుకొని, ఇంటి ముఖం పట్టాడు శ్యాంవర్ధన్‌.
దారిలో ఏదైనా హోటల్‌కి తీసికెళ్లి నిశితతో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది. తను తప్ప నిశితకి ఎవరూ లేనట్లు, అన్నీ తనే అయినట్లు, అదో విధమైన ఫీలింగ్‌కి లోనౌతున్నాడు. దాన్ని పైకి ప్రదర్శించకుండా, తన కొలీగ్‌ ఎదురై నవ్వుతూ చేయి వూపటంతో బైక్‌ ఆపాడు శ్యాంవర్ధన్‌.
”మీ మిసెస్‌ వెరీ నైస్‌ మిస్టర్‌ శ్యాంవర్ధన్‌!” అని ఆవిడ అంటుంటే అతని నరాలు చిన్న షాక్‌కి గురై తీయగా పులకించాయి.
”నా మరదలండీ!” అంటూ ఆమెకు నిశితను పరిచయం చేశాడు.
నిశిత బైక్‌ మీద కూర్చోవటంతో కాలుమీద చీర కవరైపోయి, అంగవైకల్యాన్ని దాచేసింది. అది గమనించాడు శ్యాంవర్ధన్‌,
ఇల్లు రాగానే… బావ దేవుడులా అన్పించాడు నిశితకి.
*****
ద్రోణ బొమ్మ వేస్తున్నాడు.
ఆముక్త రావటం అతను గమనించలేదు.
అతని డెడికేషన్ని చూడటం… తనకి ఓ ఇన్సిపిరేషన్‌ అన్నట్లు ఏకాగ్రతతో చూస్తూ నిలబడింది.
ఓ నిముషం గడిచాక వెనక్కి తిరిగి ఆముక్తను చూశాడు ద్రోణ.
”కూర్చో.. ఆముక్తా! ఎంతసేపు నిలబడతావు?” అన్నాడు మెల్లగా నవ్వి…
ఆశ్చరపోతూ…”నేను వచ్చింది నువ్వు చూశావా ద్రోణా? అంది కూర్చుంటూ.
అవునన్నట్లు తల వూపాడు.
”ఎలా?” అంది ఇంకాస్త ఎక్కువగా ఆశ్చర్యపోతూ.
”అంతర్నేత్రంతో..” అంటూ మళ్లీ ఓ నవ్వు నవ్వి, ఆమెకి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు.
”మీ డెడికేషన్‌ అద్భుతం!” అంది అంతకన్నా నాదగ్గర పదాలు లేవన్నట్లు చూస్తూ…
అతనేం మాట్లాడలేదు. తీరైన భంగిమలో అతను కూర్చున్న విధానం చాల హుందాగా, రిలాక్స్‌డ్‌గా వుంది.
”బొమ్మలెయ్యటం ఎలా, ఎప్పుడు మొదలుపెట్టారు? మీ ప్యామిలీలో ఎవరైనా వున్నారా? లేక ఎవరినైనా చూసి ఇన్సిపయిర్‌ అయ్యారా?” అంది యాంగ్జయిటీని ఆపుకోలేక ఆముక్త.
”నువ్వు కూర్చున్న తీరు, అడుగుతున్న విధానం చూస్తుంటే ఇంటర్వ్యూ చేస్తున్నట్లుంది. పత్రికలో ఇస్తావా? చానల్లో ఇస్తావా?” అన్నాడు సరదాగా…
”నాకు మాత్రమే తెలుసుకోవాలని వుంది.” అంది కాలుమీద కాలు వేసుకొని ఇంకాస్త ఠీవిగా కూర్చుంటూ
”… నేను విద్యార్థిగా వున్నప్పటినుండి ఎక్కువగా సముద్ర తీరాలకి వెళ్తుండేవాడిని. నదుల్ని కూడా వదిలేవాడిని కాదు. అక్కడ ఏ రాయి కన్పిస్తే ఆ రాయిపై చాలా సేపు పడుకొని గడిపేవాడిని… నేనలా ఎందుకుండే వాడినో మా ఇంట్లో వాళ్లకి అర్థమయ్యేది కాదు.
…పోర్టులకి వెళ్లినప్పుడు పెద్ద, పెద్ద నౌకలు, మత్స్యకారులు అక్కడి వాతావరణం నన్ను బాగా ఆకట్టుకునేవి. కుంచె పట్టాను. రంగులు కలిపాను. నాతోపాటే నాలోని రంగులు కూడా పరిణతి చెందాయి.. మిక్స్‌డ్‌ మీడియాలో ప్రయోగాలు చెయ్యటం మొదలుపెట్టాను. క్లాత్‌, పేపర్‌, ఉడ్‌, క్యాన్వాస్‌లపై నేను చేసే గ్రాఫిక్‌ ఎఫెక్ట్స్‌ ప్రత్యేకంగా కన్పించటంతో నాలో ఇంట్రస్ట్‌ పెరిగింది. నేను చదివింది సి.ఎ. అయినా ఇప్పుడు ఇదే నా ప్రొపెషన్‌ అయింది.” అన్నాడు చాలా ప్రశాంతంగా.
ఎప్పటినుండో తెలుసుకోవాలనుకుంటున్న విషయాలని తెలుసుకుంటున్నట్లు ఆసక్తిగా వింటోంది.
”ప్రకృతిలోని అందాలనే కాక, శ్రమైక సౌందర్యాన్ని, మార్మిక సౌందర్యాన్ని నాదైన శైలిలో ఒడుపుగా పట్టుకొని… ప్రకృతితో మనిషికి వున్న అనుబంధానికి రంగులు అద్దుతుంటాను.. అంతేకాదు కొంతమంది వ్యక్తుల్ని గీస్తున్నప్పుడు వాళ్ల మనసు కూడా తెలిసేటట్టుగా గీస్తుంటాను. అలా బాహ్యరూపంతో పాటు ఇన్నర్‌ ఫీలింగ్స్‌ కనపడాలంటే క్యారికేచర్‌లో బాగా ఎక్స్‌ర్‌సైజు చేయాలి. అలా అనేకం చేశాను.
స్వతహాగా నా మనసు కుంచెలోంచి హాస్యం, కరుణ, ఉద్రేకం, నైరాస్యం, ప్రేమ, బాధ, భయం, జాలువారటం, అందుకు బాగా సహకరించింది. లేకుంటే మన ఆర్టిస్టులం రాసే రాతల్లో కాని, గీసే గీతల్లో కాని స్పష్టత లేకుంటే విమర్శకులు చెంప చెళ్లుమనిపిస్తారు కదా!” అన్నాడు.
చెంప తడుముకుంది యాధృశ్చికంగానే…
”ఇప్పుడేం గీస్తున్నారు?” అంది కాన్వాస్‌ వైపు చూస్తూ
”ఇరవై అయిదుమంది చిత్రకారులం కలిసి ఇంక్‌…. ఆక్రిలిక్‌.. ఆయిల్‌ కలర్స్‌తో రంగులద్ది హైదరాబాదులోని ‘గ్యాలరీ స్పేస్‌’లో పెడ్తున్నాం. ఈ ప్రదర్శన ఇంకో నెలరోజులపాటు జరుగుతుంది. ఇది ట్రావెలింగ్‌ ఎగ్జిబిషన్‌ కాబట్టి ఈ రంగులు ఇక్కడ నుండి ఢిల్లీ, బెంగుళూరుకు తరలివెళ్తాయి. దానికోసమే ఈ బొమ్మ గీస్తున్నాను…” అన్నాడు ద్రోణవర్షిత్‌.
”మరి నా కవితకు బొమ్మ ఎప్పుడు గీస్తారు?” అంది ఆముక్త.
దాని విషయం అప్పుడు గుర్తొచ్చిన వాడిలా…”దాన్ని మళ్లీ ఓసారి చదవాలి ఆముక్తా!” అన్నాడు. అతను బొమ్మ గీస్తాననలేదు. గియ్యను అనలేదు.
ఆమె దృష్టి మూలనున్న చెత్తకుప్ప మీద పడింది… అప్పుడప్పుడు ద్రోణ బొమ్మగీసి, కుదరక చింపేసిన కాగితాలు ఆ చెత్తకుప్పలో వున్నాయి. వాటిమీద దుమ్ము బాగా వుంది. ఆ దుమ్ములో ఆముక్త రాసిన కవిత వుంది. వెంటనే వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకొని దులుపుకుంటూ వచ్చి కూర్చుంది.
”మనకున్న దుమ్ము చాలదని ప్రతిరోజు అంతరిక్షం నుండి పది టన్నుల దుమ్ము భూమిపై పడుతుందట కదా!” అంది ఆ దుమ్మునే చూస్తూ ఆముక్త.
”కరక్ట్‌ ఆముక్తా! అది మనసు మీద పడకుంటే చాలు” అన్నాడు ద్రోణ. తన భార్యను గుర్తుచేసుకుంటూ… ఆ కాగితాన్ని దుమ్ములో వేసింది శృతికనే అని అతనికి తెలుసు.
”మన శరీరం వెయ్యికి పైగా జాతుల బాక్టీరియాకి ఆవాసమని విన్నాను. కాని మనసు మీద దుమ్ము గురించి వినలేదు.” అంది ఆశ్చర్యంగా చూస్తూ.
”భావాలను కలుషితం చేసుకొని, వక్రదృష్టితో ఆలోచించే వాళ్ల మనసునిండా దుమ్మే వుంటుంది ఆముక్తా! దాన్ని దులుపుకోవటం వాళ్లకి రాదు. ఇతరులు వెళ్లి దులపలేరు” అన్నాడు.
ఆముక్త విరోధించింది. అంతటితో ఆ విషయాన్ని వదిలేశాడు.
”నీ కవితకి బొమ్మవెయ్యాలని చాలాసార్లు ట్రై చేశాను. కానీ.. నీ కవిత నేను బొమ్మగీసే స్థాయిలో లేదు. నువ్వింకా ఎదగాలి. సమస్యల్ని సృశించాలి. మార్పుకోసం ఆరాటపడి రాయాలి..” అన్నాడు.
ఆముక్త ముఖంలో రంగులు మారాయి.
వెంటనే తన చేతి వేళ్ల వైపు చూసుకుంటూ…
”కరెక్టే ద్రోణా ! మనం బాగా ఫీలయ్యి రాయాలంటే ప్రయాణాలు ఎక్కువ చెయ్యాలని, అందమైన దృశ్యాలను చూడాలని అంటున్నారు. ఆ ఫీలింగ్‌ కోసం నన్ను లాస్‌ఏంజిల్‌కి తీసికెళ్లమని మావారిని అడుగుతున్నాను. అక్కడకెళ్లి చూశానంటే ఇంకా బాగా రాయగలుగుతాను కదూ! అందరి మన్ననలు పొందగలుగుతాను కదూ!” అంది ఆశగా.
”నువ్వు లాస్‌ఏంజిల్‌ వెళ్లినా రామప్ప వెళ్లినా ఇలాగే రాస్తావు. ఎందుకంటే నువ్వు చూసే దృక్పథంలో, రాసే సబ్జక్ట్‌లో ఎవరూ తాకని కొత్తదనాన్ని పట్టుకోలేక పోతున్నావ్‌!” అన్నాడు నిక్కచ్చిగా.
నిరాశగా చూసింది.
”ప్రయాణం చేస్తే, వర్షం పడితే, సముద్రాన్ని చూస్తే రాసేది రచన కాదు. నీ కవితల్లో ఎక్కువగా మంచుతెరల్లోంచి ఎగసివస్తున్న సూర్యబింబం.. సముద్ర తీరంలో చెంపల్ని నిమిరే చల్లగాలి.. చిగురు కొమ్మల్లోంచి మంద్రంగా కూసే కోకిల కన్పిస్తుంది. అలా కాకుండా ఇది తనదే అన్న ఫీలింగ్‌ వచ్చేలా రాయాలి. అప్పుడు అది చదివి ఆలోచిస్తారు.” అన్నాడు ద్రోణ. ఆమె చేత గొప్పగా రాయించాలని వుంది అతనికి.
అలాగే చూస్తోంది ఆముక్త…
”నీ కవితా చూపులతో… ఆవులించే దిక్కుల్ని చూడగలగాలి. తలలు వంచుకొని ఆలోచిస్తూ నిలబడి వుండే చెట్లను చూడాలి.. పరిసరాలు ఎలా స్థంబిస్తాయో చూడగలగాలి…” అంటూ ఆగాడు.
ఆమెలో ఏదో అలజడి మొదలైంది.
ద్రోణ తన కవితకి బొమ్మ వెయ్యటం డౌటే అనుకొంది.
”మనసు మర్మాలపుట్ట ఆముక్తా! దాని ఎక్స్‌పెక్టేషన్‌ దానికి వుంటుంది. ఇకముందు నువ్వు రాసే కవితలో అభ్యుదయం, నైతికత్వం, వేదాంతం, వుండేలా చూసుకో.. గతంలో వచ్చిన ప్రముఖుల సాహిత్యాన్ని చదువు ఇంకా సాధ్యమైతే జీవితాన్ని చదువు… అప్పుడు నీ కవిత కారు అద్దంపై వర్షం నీటిని తుడిచే వైపర్‌లా వుంటుంది. కళ్లతో పాటు, గుండెకూడా కరుగుతుంది. ” అన్నాడు.
”అప్పటి వరకు నా కవితకి బొమ్మ వెయ్యవా ద్రోణా?” అంది బేలగా.
”నీ కవితకి బొమ్మవేస్తే – నా బొమ్మకి విలువ పెరగాలి. నీకిది సృజనాత్మకమైన సవాలు…” అన్నాడు
మాట్లాడలేదు ఆముక్త.
”నేను ఊహించిన రీతిలో రాయగలిగే శక్తి నీలోవుంది ఆముక్తా! కానీ నీ మెదడు లోపలవున్న ఆలోచనలను నువ్విలా నునుతట్టుతో లేపితే అవి బయటకురావు. అలా లేపగలిగే మంత్రదండం కూడా లేదు. ప్రయత్నమనే గడ్డపారల్ని ప్రయోగించి పెకలించాలి. అప్పుడు పుడ్తాయి నిలబడే కవితలు.. సృష్టికైనా, మనోదృష్టికైనా బద్దకం పనికి రాదు…” అన్నాడు.
”నేను వెళ్తాను వర్షిత్‌…!” అంది ఊపిరాడనట్లు చూస్తూ ఆముక్త.
”వెళ్లే ముందు ఓ మాట.. నీ కవితకు బొమ్మ వేయాలని వుంది. నా భావాలకి తగినట్టుగా రాయి. కాఫీ తాగి వెళ్లు శృతిక తెస్తుంది” అన్నాడు చాలా మర్యాదగా.
ఒక్కక్షణం భయంగా తన చీరె వైపు చూసుకుంటూ…
”వద్దు వెళ్లాలి వర్షిత్‌! బై…” అంది ఆముక్త.
*****
దేవికారాణి ఉదయం నుండి … ”నాకు ఊపిరి ఆడటం లేదు నిశితా! ఫ్యాన్‌ గాలి తగిలితే ఒళ్లంతా వేడెక్కి పోతోంది. ఇదిగో ఈ అట్టముక్క పట్టుకొని కాస్త విసురు” అంటూ పడుకొంది.
వెంటనే వెళ్లి ఆమె చెప్పినట్లు చేస్తోంది నిశిత.
అక్క చూస్తుందేమోనని లోలోపల ఆమెకు పీకుతోంది.
అటు వెళ్తూ చూడనే చూసింది సంవేద. ఆగ్రహంతో కళ్లెర్రచేసి చూస్తూ గది బయటే నిలబడి… ”నా చెల్లికి కాలు లేదన్న జాలికన్నా అమ్మా, నాన్నా లేరన్న చులకనే ఎక్కువుంది మీకు.. అందుకే దాన్నిలా వేధిస్తున్నారు. ఇదెంత పాపామో మీకిప్పుడు తెలియదు.” అంది.
గాఢనిద్రలో వున్న దేవికారాణి టప్పున కళ్లు విప్పింది. ఆమె నోరు విప్పేలోపలే ఆ గదిలోంచి బయటకొచ్చింది నిశిత.
”అక్కా! గొడవెందుకు? ఇప్పుడు నేనేం కష్టపడ్తున్నాను. ఆవిడ దగ్గర కూర్చోవటమేగా… నువ్వు ఆవేశం. తగ్గించుకోకపోతే ఆమె నన్నిక్కడ వుండనివ్వదు. బయటకెళ్లి ఎన్ని బాధలు పడాలో నీకర్థం కాదు. మొన్న ఆముక్తక్క నన్ను చూడకపోతే నేనేమయ్యేదాన్ని…?” అంది నిశిత.
”ఆవిడ ఆరోగ్యంగా వుండి కూడా నీ చేత సేవలు చేయించుకుంటుంది… మనకు అమ్మా, నాన్న లేరని ఇన్‌డైరక్ట్‌గా భయపెట్టిస్తోంది. ఎందుకిలా మనం భయపడాలి?” అంది సంవేద బాధగా.
”ఇలా కొశ్చన్స్‌ వేసుకోవటం కన్నా అడ్జస్ట్‌ కావటం మంచిది.” అంది నిశిత మెల్లగా.
”ఎందుకు అడ్జస్ట్‌ కావాలి? ఆవిడ పనులేమి నువ్వు చెయ్యకు. ఏం చేస్తుందో చూద్దాం…” అంది.
”నామీద నీకున్న ప్రేమతో నువ్విలా అంటున్నావు కాని, తర్వాత దాని పర్యవసానాన్ని పేస్‌ చేయ్యాలంటే నువ్వు చెయ్యలేవు. నామాట విని నువ్వు లోపలకి వెళ్లక్కా!” అంది నిశిత బ్రతిమాలుతూ
”ఆవిడా గదిలో కూర్చుని, ఏ పనీ చెయ్యకుండా టైంకి తినటంలో తప్పులేదు. కానీ… నీ చేత ఇలా కాళ్లు పట్టించుకోవటం, బట్టలు ఉతికించుకోవటం, ఫ్యానాపేసి అట్టముక్కతో విసరమనటం నాకు నచ్చటం లేదు. చూస్తుంటే బాధగా వుంది. అమ్మ నిన్నెలా చూసుకునేది.” అంది ఆవేశాన్ని కాస్త తగ్గించుకుంటూ…
”ఎప్పుడు ఒకే రోజులు వుంటాయా? ఎండాకాలంలో ఎండాలి. వానాకాలంలో తడవాలి. తప్పించుకోవటం సాధ్యమా! నువ్వు పీలవ్వటం తగ్గించుకుంటే నేను హాయిగా వుంటాను. లేకుంటే ఆవిడ మధ్యా, నీ మధ్య నలిగిపోతాను.” అంది నిశిత.
”ఏమి మీ ఇద్దరి గుసగుసలు..? నా గురించేనా? మీ గురించి ఆలోచించుకోండి! అసలే రేట్లు మండిపోతున్నాయి. బ్రతకటం కష్టంగా వుంది. మనిషికి మనిషి బరువై పోతున్నారు. మీ చెల్లిని ఎక్కువ రోజులు వుంచకు…” అంది దేవికారాణి.
ఉలిక్కిపడింది సంవేద.
”నేను చెప్పలేదా! ఆవిడ రియాక్షన్‌ ఎలా వుంటుందో?” అన్నట్లు అక్కవైపు చూసింది నిశిత.
గంట, గంటకి ఈవిడగారి బెదిరింపుని తట్టుకోవటం కష్టంగా వుంది. అటో, ఇటో తేల్చుకోవాలి అని సంవేద అనుకుంటుండగా ఫోన్‌ రింగయింది.
నాలుగడుగుల వెనక్కి వేసి ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది నిశిత.
”హలో…” అంది నిశిత. అవతల వ్యక్తి మాట్లాడాక.
”దేవిని పిలవమంటున్నాడు అత్తయ్యా! మీకే ఫోన్‌!” అంది నిశిత.
”దేవి నా ! ఎవడే వాడు? అంత అమర్యాదగా పిలుస్తున్నాడు. వుండమను … వస్తున్నా…” అంటూ ఒక్క ఉదుటన లేచి కోపంగా ఫోన్‌ దగ్గరకి వెళ్లింది దేవికారాణి.
…ఆమె హలో అనగానే
”నేను దేవీ! గంగాధరాన్ని…” అన్నాడు అవతలవైపు నుండి ఆ పేరు వినగానే స్థాణువైంది. ”నువ్వా??” అంది ఆశ్చర్యంతో…
”నేనే దేవీ!” అన్నాడు. ఆయన గొంతులోని మార్ధవాన్ని ఆస్వాదిస్తూ… జ్ఞాపకాల వర్షంలో తడుస్తున్న దానిలా ముఖం పెట్టి…
”రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే ఇంత జీవితం అయిపోయిందా అనుకున్నాను. మళ్లీ ఇప్పుడు నీ కంఠం విన్పిస్తున్నావు. ఎక్కడున్నావు? ఇన్నాళ్లు ఏమైపోయావు? నీ జాడ తెలుసుకుందామని ఎంతగానో ప్రయత్నించాను.” అంది ఉద్వేగంగా.
సంవేద, నిశిత ప్రేక్షకుల్లా నిలబడ్డారు.
దేవికారాణి కసురుకున్నట్లు ”మీరెళ్లి మీ పనులు చూసుకోండి!” అని వాళ్లవైపు ఉరిమి చూడకుండా ఫోన్లో మాట్లాడుతోంది.
ఆమె అలా తన ద్యాసలో తనుండటం చూసి.. అవతల వ్యక్తి ఆమెకి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడని అర్థమైంది వాళ్లకి… ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియట్లేదు.
దేవికారాణి ఫోన్లోనే – కొద్దిసేపు ఏడ్చింది, కొద్ది సేపు బాధపడింది. కొద్దిసేపు నవ్వింది. అలా రకరకాల ఫీలింగ్స్‌తో ఫోన్‌ పట్టుకొని అలాగే కొద్దిసేపు నిలబడింది.
”నువ్విప్పుడెక్కడున్నావ్‌?” అంది చివరగా కళ్లు తుడుచుకుంటూ…
”బస్టాండ్‌లో వున్నాను దేవీ! ఇప్పుడే బస్‌ దిగి నీకు కాల్‌ చేస్తున్నాను.” అన్నాడు.
”నువ్వు నాకు మూడు కిలోమీటర్ల దూరంలోవున్నావు. మన ఇంటి అడ్రస్‌ చెబుతాను. వెంటనే ఆటో ఎక్కి నేరుగా వచ్చెయి…” అంటూ అడ్రస్‌ చెప్పింది. ఆమెకెంతో ఆనందంగా వుంది.
”ఇదిగో ! సంవేదా! మీ మామయ్య వస్తున్నాడు…” అంది సంబరంగా దేవికారాణి.
… ఆ మాటతో శిల్పాలు కదిలినట్లు కదిలారు సంవేద, నిశిత.
”మామయ్య అంటే?” అంది పూర్తిగా అర్థంకాక సంవేద
”నా భర్త ! నీ మొగుడికి తండ్రి…” అంది అలా అంటున్నప్పుడు ఎప్పుడూ కన్పించనంత సంతోషం కన్పించిందామెలో…
”అవునా!!” అంటూ ఉక్కిరిబిక్కిరయ్యారు.
ప్రైమ్ మినిష్టర్‌ వస్తున్నాడంటే మిగతా నాయకుల్లో కలిగే కంగారులాంటిది వాళ్లలో కలిగింది. వెంటనే అత్తగారి గదిలోకి వెళ్లి అవసరం లేని సామాన్లని బయట పడేసి, మామగారికోసం ఇంకో బెడ్‌వేసి రెడీగా వుంచారు.
ఆ టైంలో వాళ్లిద్దరూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఇల్లంతా వాళ్లే అయి తిరుగుతుంటే చూడముచ్చటేసింది దేవికారాణికి… ఆమెకిప్పుడు ప్రపంచమంతా తనకి అనుకూలంగా మారి, అందంగా అన్పిస్తోంది.
కొద్ది నిముషాలు గడిచాక ఇంటిముందు ఆటో ఆగింది.
ఆటోలోంచి గంగాధరం దిగాడు.
పెరిగిన గడ్డంతో, అక్కడక్కడ తెల్లవెంట్రుకలతో, మాసిన బట్టలతో వున్నాడాయన… ఎడమచేయి భుజంవరకు తెగిపోయి కట్టు కట్టి వుంది. ఇంకా ఆ గాయం మానలేదు పచ్చిగానే వుంది. నెమ్మదిగా నడుచుకుంటూ లోపలకి వస్తున్న భర్తను చూసి కళ్లు తిరిగాయి దేవికారాణికి.
భర్త తనకి దూరమైనప్పుడు అచ్చు ఇప్పటి శ్యాంవర్ధన్‌ లాగే వుండేవాడు. శ్యాంవర్ధన్‌ని చూస్తుంటే రోజు ఆమెకు తన భర్తే గుర్తొస్తుంటాడు. ప్రస్తుతం భర్తలో వచ్చిన, మార్పు వికృతంగా, భరించరాని విధంగా వుంది.
తల తిరిగినట్లై, తమాయించుకోలేక – కింద పడబోయి గేటు పట్టుకొని నిలదొక్కుకుంది దేవికారాణి.
”అత్తయ్యా! మీరు కాస్త పక్కకి తొలగండి! మామయ్యగారిని మీ గదిలోకి తీసికెళ్తాం…” అంది సంవేద. నిశిత కూడా అక్క పక్కనే వుంది.
దేవికారాణి కంగారుపడ్తూ… ”వద్దు, వద్దు, నా గదిలోకి వద్దు. నిశిత గదిలోకి తీసుకెళ్లు.” అంది ఆయన్ని అంత దగ్గరగా చూసి తట్టుకునే శక్తి లేనిదానిలా…
”ఇప్పటివరకు మామయ్యగారి కోసం ఎదురు చూశారుగా అత్తయ్యా! మీ గదిలో ఆయనకో బెడ్‌ కూడా వేశాం…” అంది సంవేద అర్థంకాక..
ఆ మాటలు గంగాధరానికి విన్పిస్తున్నాయి.
”ఆయన నన్ను అర్థాంతరంగా వదిలి వెళ్లారు. నా గదిలో ఎందుకు? దూరంగానే వుండనీయ్‌! అలవాటవుతుంది.” అంటూ ఆయన దగ్గరకెళ్లి పలకరించకుండానే తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకొంది దేవికారాణి.
”వదిలేసి వెళ్లినా భర్త భర్తే కదా! ఏమిటో ఈవిడ గారి మనస్తత్వం. గడియ, గడియకి మారిపోతుంటుంది.” అని మనసులో అనుకుంటూ గంగాధరాన్ని నిశిత గదిలోకి తీసికెళ్లింది సంవేద.
అది పెద్ద గదేమీ కాదు. ఒకప్పుడు స్టోర్‌ రూం నిశితకోసం దాన్ని గదిగా మార్చారు. నిశిత ముడుచుకొని పడుకుంటే ఇంకొకరు ఫ్రీగా పడుకోవచ్చు. అక్కడ బెడ్‌ లాటి సౌకర్యాలేమి లేవు. ఒక పక్కప్లాస్టిక్‌ కవర్లో నిశిత బట్టలున్నాయి. ఆమె కూర్చునే వీల్‌ చెయిర్‌ వుంది.
గంగాధరానికి ఆ గది చూపించారు.
ఆయన ఆ గదిలోకి వెళ్లి తన బట్టలున్న ఓ చిన్న కవరును ఓ మూలన పెట్టాడు. సంవేద బాత్‌రూం చూపించటంతో, కట్టు దగ్గర తడవకుండా స్నానం చేసి వచ్చాడు.
అన్నం ప్లేటు ఆయన ముందుపెట్టి – ”నేను మీ కోడల్ని మామయ్యా! నాపేరు సంవేద. ఇది నా చెల్లెలు నిశిత” అంది సంవేద.
వాళ్లిద్దర్ని అలా చూస్తుంటే తినకముందే కడుపునిండినట్లయింది గంగాధరానికి.. తింటూ నిశిత గురించి ఆప్యాయంగా మాట్లాడాడు. ఆయనలా తన చెల్లి గురించి అడుగుతుంటే హాయిగా, ఓదార్పుగా వుంది సంవేదకు.
కానీ… ఇంతకాలం తర్వాత భర్త ఇంటికొస్తే, ఆయన దగ్గర కూర్చుని నాలుగు మాటలు మాట్లాడని అత్తగారి మనస్తత్వాన్ని ఎలా బేరీజు వేసుకోవాలో అర్థం కాలేదు సంవేదకి..
*****
రోజులు గడుస్తున్నాయి.
చేస్తున్న పనిలో కొద్దిమందికే ఆనందం దొరుకుతుందాంరు. నిశితకి అలాంటి ఆనందం గంగాధరం ద్వారా దక్కింది. సంవేద బిజీగా వున్నప్పుడు గంగాధరం పనులు నిశిత చేస్తుంది. సంవేద అభ్యంతరం చెప్పటం లేదు. ఆయనంటే సంవేదకి మంచి అభిప్రాయం, అభిమానం వుంది.
నిశిత స్టిక్‌ సాయంతో నడిచినా, యాక్టివ్‌గా వుంటుంది ఏ పని అయినా అవలీలగా, అలసట లేకుండా చేస్తుంది. ”అయ్యో! ఆమెతో పని చేయించుకోవటం ఎలా?” అన్న భావన కలగదు. పని చేస్తున్నంత సేపు చేస్తుంది. ఆ తర్వాత వీల్‌ చెయిర్లో కూర్చుని చదువుకుంటూ గడుపుతుంది.
గంగాధరం భుజం గాయం మానింది.
నిశిత ఎంతో అంకితభావంతో ఆయన పనులు చేస్తుంటే ‘ఇది’ ఏనాటి బంధమో అన్న తలంపు ఆయనలో అప్పుడప్పుడు కల్గుతుంది.
తండ్రి రాక శ్యాంవర్ధన్‌కి సంతోషాన్నిచ్చింది.
ఆఫీసునుండి రాగానే తండ్రిదగ్గర కొద్ది సేపు కూర్చోవటం అలవాటు చేసుకున్నాడు. అది నిశిత కోసమే అని… ఆ ఉత్సాహం కూడా నిశితకు దగ్గరగా మసలుకోవటం వల్లనే అని త్వరగానే గ్రహించాడు గంగాధరం.
దేవికారాణి మాత్రం ‘ఆయన వుండే పరిసరాల్లో నేను సంచరించను’ అన్నట్లు అటువైపు చూడడమే మానేసింది. ఒక చెయ్యి పూర్తిగా లేకుండా ఇంకో చేత్తో బ్రతుకు దుర్భరంగా సాగిస్తున్న భర్తను ”ఇలా ఎందుకు జరిగింది?” అని అడగాలన్న ధ్యాస కూడా లేని దానిలా వుండటం చూసి ఆయన మనసు చివుక్కుమంది. భార్య మౌనాన్ని భరించలేక.. ఒకరోజు ఆమె గది ముందు నిలబడి ”దేవీ!” అంటూ పిలిచాడు. ఆమె ఆయనవైపు చూడలేదు. ”అసలేం జరిగిందంటే!” అంటూ ఇంటినుండి దూరమయ్యాక ఏం జరిగిందో చెప్పబోయాడు. ఆమె వినకుండా డోర్‌ పెట్టుకుంది.
అప్పటినుండి ఆమె గదివైపు వెళ్లటం మానేశాడు.
ప్రతి మనిషికి ఓ సొంత ప్రపంచం వుంటుంది. అందులో ఆటలు, స్కూలు, అల్లర్లు, చదువు, కెరీర్‌, అభిరుచులు, ఆనందాలు, జ్ఞాపకాలు.. సుదీర్ఘమైన జీవితానుభవం వున్న గంగాధరం ఆశకీ – నిరాశకీ మధ్యన ఎంత వేదాంతముందో దాన్ని జీర్ణించుకుంటూ.. మరచిపోలేని మజిలీలను గుర్తుచేసుకుంటూ పడుకున్నాడు.
నిద్రలోనే – ఆ భయంకరమైన అనుభవం గుర్తొచ్చి గట్టిగా, ఆ గది అదిరేలా అరిచాడు గంగాధరం…
ఆ అరుపుకి – పక్కనే పడుకుని వున్న నిశిత గుండె అదిరింది. కళ్లు తెరిచి వెంటనే లేచి కూర్చుంది. మెల్లగా చేయి చాపి స్టిక్‌ అందుకొని, నాలుగడగులు వేసి గంగాధరం బెడ్‌ దగ్గరకి వెళ్లి.. ‘మామయ్యా!’ అంటూ చేతిమీద తట్టింది.
నిశిత చేతి స్పర్శ కన్నతల్లిలా అన్పించి, ఆ పీడకలలోంచి బయటకొచ్చి – ”అమ్మా ! నిశితా!” అన్నాడు ఆమె కళ్లలోకి చిన్నపిల్లాడిలా చూస్తూ… ఆయన ఇంకా భయపడ్తూనే వున్నట్లు ఆయన అధరాలు కంపిస్తున్నాయి.
”ఎందుకు మామయ్యా! భయపడ్తున్నావ్‌? ఏదో ఆపదలో వున్నట్లు అరుస్తున్నావ్‌ ఏం జరిగింది?” అంది నిశిత.
”ఏం లేదు, ఏంలేదు నువ్వు కంగారు పడకు నిశితా! ఏదో పీడకల” అన్నాడు. కానీ ఆయన అలా ఎన్నో రోజులుగా నిద్రలో అరుస్తూనే బతుకుతున్నాడని ఆమెకు తెలియదు.
ఆ అరుపు విని – తలుపు తీసుకొని తండ్రి ద్గగరకి వచ్చాడు శ్యాంవర్ధన్‌. పక్కనే వున్న నిశిత వైపు చూస్తూ… ”ఏం జరిగింది?” అన్నాడు
”అదే అడుగుతున్నాను బావా! నాకూ తెలియదు ఏదో పీడకల అంటున్నాడు మామయ్య”. అంది.
”మంచి నీళ్లు తీసుకురా!” అన్నాడు.
నిశిత వెళ్లి మంచినీళ్లు తెచ్చింది. ఆమె చేతిలోంచి గ్లాసు అందుకొని ‘నాన్నా! మంచినీళ్లు తాగి పడుకో…” అంటూ గంగాధరాన్ని లేపి గ్లాసందించాడు శ్యాంవర్ధన్‌.
మంచినీళ్లు తాగి పడుకున్నాడు గంగాధరం.
పేషంట్ పొజిషన్ని గమనిస్తూ కూర్చున్న డాక్టర్‌లా తండ్రి బెడ్‌కి కాస్త దూరంగా వున్నకుర్చీలో కూర్చున్నాడు శ్యాంవర్ధన్‌.
పడుకుంటే బావుండదని తను కూడా గంగాధరాన్ని చూస్తూ అక్కడే కూర్చుంది నిశిత. బావగారు తండ్రి పట్ల అంత బాధ్యతను ప్రదర్శించటం నిశితకి నచ్చింది. గౌరవం కలిగింది.
తండ్రి నిద్రపోయాడనుకొని నిశిత వైపు తిరిగాడు శ్యాంవర్ధన్‌. అందరు అంటుంటే ఏమో అనుకున్నాడు కాని నిశితలో చక్కని రూపం వుంది. ఆమె చూపు, నవ్వు, మాట – దగ్గరగా చూస్తుంటే హాయిగా అన్పిస్తున్నాయి. నెమ్మదిగా ఆమెతో మాటలు ప్రారంభించాడు.
గంగాధరం నిద్రపోతున్నాడని గమనించి బావగారు మాటలు పెంచటం ఇబ్బందిగా వుంది నిశితకి… కానీ అతని మాటల్లో ఎక్కడా వల్గారిటీ లేదు. అయినా ఏదో అసహజమైన ఫీలింగ్‌… ఆ ఫీలింగ్‌లో కూడా అతని మాటల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యనిదానిలా వినసాగింది.
ఎందుకంటే ఆశ్రయం దొరికిన చోట అతిథిలా ఒదిగి పోతున్న తను అంతకన్నా ఏం చేయలేక…!
”నువ్వు మీ పేరెంట్స్ ని మరచిపోలేక పోతున్నావని సంవేద చెప్పింది. ఈ మధ్యన మా నాన్నగారు వచ్చాక ఆయన పనిలో పడి మీ పేరెంట్స్ ని, మరిచిపోతున్నావని కూడా చెప్పింది. అవునా..?” అన్నాడు శ్యాంవర్ధన్‌ ఆమెనే చూస్తూ
పేరెంట్స్ గుర్తురాగానే నిద్రమత్తు ఎగిరిపోయింది.
”మరచిపోవటమంటే! తాత్కాలికంగా డైవర్ట్‌ అవుతామే కాని, పూర్తిగా పోని బాధంటూ వుందంటే అది తల్లిదండ్రుల్ని కోల్పోవటమే బావా! ఆ బాధ ముందు ఏ బాధ అయినా తక్కువే…” అంది నిశిత.
”ఏదైనా మనం ఆలోచించేదాన్ని బట్టి వుంటుంది. కొంతమందికి శారీరకమైన బాధలు వుంటాయి. కొందరికి మానసికమైన బాధలు వుంటాయి” అన్నాడు.
”నాకు రెండు వున్నాయిగా బావా!” అంది. ఆమెకే జాలిగా వుంది. కదిలిస్తే చాలు తన మనసులోని బాధను పంచాలని చూస్తోంది. ఓదార్పును కోరుతుంది. ఆ విషయంలో ఎంతివాళ్లైనా స్థితప్రజ్ఞతను సాధించలేరు.
… ఆమె భావాన్ని అర్థం చేసుకున్నవాడిలా ”మరిపించే వాళ్లుంటే అవి పెద్ద బాధలేం కాదు…” అన్నాడు
ఆమె మాట్లాడలేదు
”ఇచ్చి పుచ్చుకోవటం వల్ల కూడా కొంత బాధ తగ్గుతుంది…” అన్నాడు ఆమె ముఖంలోకి లోతుగా చూస్తూ…
”పుచ్చుకోవడమేకాని, ఇవ్వటానికి నా దగ్గర ఏముంది?” అంది.
”డబ్బులేదన్న ఫీలింగ్‌ నిన్ను బాధపెడ్తున్నట్లుంది. మేమున్నాముగా నీకెందుకా బాధ?” అన్నాడు.
ఎప్పుడూ మాట్లాడని బావ ఇప్పుడింత అభిమానంగా మాట్లాడుతుంటే – వీళ్లంతా నా మనుషులు అన్న ధైర్యం కల్గింది.
”డబ్బుతో సంబంధం లేకుండా ఇచ్చి, పుచ్చుకునే పద్దతిలో ఎన్ని లాభాలు వున్నాయో చెబుతాను విను…” అన్నాడు నీకో మంచి విషయం చెబుతాను విను అన్నట్లు…
వింటున్నట్లు చూసింది నిశిత.
”చెట్లవల్ల శాకాహార జంతువులకు ఆహారం లభిస్తే ఆ జంతువుల వల్ల చెట్లలో పరపరాగ సంపర్కం జరుగుతుంది. అలాగే మొసళ్లు నోరు తెరుచుకొని కూర్చుంటే కొన్ని రకాల పకక్షులు వాి దంతాల మధ్యన ఇరుక్కున్న మాంసం ముక్కల్ని లాక్కుని తింయి. దీనివల్ల మొసలికి నోరు శుభ్రమవుతుంది. అటు పక్షికి ఆహారం దొరుకుతుంది. కొన్ని లతలు పెద్ద, పెద్ద చెట్లను అల్లుకుంటూ ఎగబాకుతాయి. దానివల్ల లతలకు ఒక ఆధారం దొరుకుతుంది. లతలకు పూచే పూలకు ఆకర్షింబడి వచ్చే కీటకాల వల్ల చెట్లుపూలతో సమర్థవంతమైన పరపరాగ సంపర్కం… ” అని అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే సంవేద వచ్చింది.
”ఏంటి? దానికి సైన్స్‌ లెసన్‌ చెబుతున్నారు ఈ టైంలో..! మామయ్యగారు నిద్రపోవద్దా?” అంది.
మా నాన్న నిశితను స్కూల్‌కి వెళ్లనిచ్చేవాడు కాదు. మీరు ఆఫీసునుండి వచ్చాక ఫ్రీ టైంలో దానిక్కాస్త చదువు నేర్పితే బావుండు అని అప్పుడప్పుడు భర్తతో చెప్పటం గుర్తొచ్చి, ఇప్పుడు చదువు చెబుతున్నాడనుకొంది సంవేద.
”ఆయన నిద్రపోకుండా అరుపులతో, కేకలతో మమ్మల్ని నిద్రలేపి కూర్చోబెట్టారు. నిన్ను డిస్టర్బ్‌ చెయ్యటం ఎందుకులే అని మేమిద్దరం ఇలా కూర్చున్నాం… మధ్యలో మళ్లీ అరుస్తాడేమోనని చూస్తున్నాం.” అన్నాడు శ్యాంవర్ధన్‌
…నిద్రపోతున్న వాడిలా పడుకొని వున్న గంగాధరం వైపు చూసి తలకొట్టుకుంటూ ”ఆయన హాయిగా నిద్రపోతున్నారు మీరేమో అరుపులకోసం చూస్తున్నారు. ఆయనకేం కాదు లేవే! ఎందుకంత బెంగ? మీరు రండి! వెళ్దాం!” అంది సంవేద.
అతనికి వెళ్లాలని లేదు….
భార్య చేయి భుజం మీద పడటంతో ఇక తప్పదన్నట్లు లేచి వెళ్లాడు శ్యాం.
గంగాధరం లేచి మళ్లీ అరుస్తాడేమోనని వణుకుతూ పడుకొంది నిశిత.
*****
బ్రష్షులు, కలర్స్‌ అందుబాటులో పెట్టుకొని, ఏకాగ్రత ఏమాత్రం దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకొని, పెయింటింగ్‌ వేస్తూ… అందం, ఆనందం, అంతం, అనంతం, శబ్ద, నిశ్శబ్దం అన్నీ తన బొమ్మలో చూసుకుంటూ అలై, గాలై ఆటై, పాటై సాగిపోతున్నాడు ద్రోణ…
…మొబైల్‌ రింగవుతుంటే స్పీడ్‌గా రెండడుగులు వేసి, మొబైల్‌ అందుకొని ‘హాలో…’ అంది శృతిక.
”బాగున్నావా శృతీ?” అని అవతల కంఠం అనగానే నాన్‌స్టాప్‌గా మాట్లాడటం మొదలుపెట్టింది శృతిక…
”ఆగాగు! ఏం మాట్లాడుతున్నావు శృతీ?” అంటూ ఆశ్చర్యపోయిందామె.
”అవును! ఆయన సమక్షం నాకలాగే అన్పిస్తోంది ఏం చెయ్యను చెప్పు ఎటైనా పారిపోవాలనిపిస్తోంది…” అంది శృతిక.
”పారిపోవటం పరిష్కారం కాదు.. మొన్న ద్రోణ ఏం చెప్పాడో తెలుసా? ఈ మధ్యన నువ్వు మరీ చిన్నపిల్లలా బిహేవ్‌ చేస్తున్నావట… ఏం కావాలో చెప్పవట.. స్వేచ్ఛగా మాట్లాడవట… ఏది చెప్పినా ఫాలో అవ్వవట.. మళ్లీ, మళ్లీ చెబితే మౌనంగా చూస్తావట… ఏం మాట్లాడినా వినబడనట్లు చూస్తావట… అదేం అంటే నన్నిలాగే వదిలెయ్‌ అన్నట్లు ఒంటరిగా కూర్చుంటావట… ఇలా అయితే అతని పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించు…” అంది కృతిక.
”ఆయన పరిస్థితికేం బ్రహ్మాండ తాండవం.. రోజుకెన్ని ఫోన్స్‌! ఎందరు అభిమానులు! అదేం చిత్రమో అందరు ఆడవాళ్లే! కొందరైతే నేరుగా ఇంటికే వస్తుంటారు.” అంది శృతిక. అక్కతో చెబితే ఎలావుంటుందో అని ఇన్నిరోజులు చెప్పలేదు కాని ఇప్పుడు చెబితేనే బావుంటుందనుకొంది.
”ఎంతో బ్రాడ్‌ థింకింగ్‌తో స్పీడ్‌, స్పీడ్‌గా వుండే నువ్వు ఎందుకిలా అయ్యావు? ఒంటరిగా ఓ చిన్న సర్కిల్‌లో కూర్చుని ఆలోచించకుండా కాస్త బయటకు రావే… వచ్చి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకో.. లేకుంటే నీ మనసే నిన్ను చంపేస్తుంది మానసికంగా…” అంది కృతిక.
”స్పీడా? నేను స్పీడా? దేన్లో? స్కూటీని నడపటం లోనా? ఆ స్పీడు వల్ల అవయవాలు మాత్రమే పోతాయి. కానీ ఈయన దగ్గరకి వచ్చేవాళ్ల స్పీడు చూశావంటే మతే పోతుంది. ఒక్కసారి చూస్తే జీవితంలో తిరిగి లేచే స్థితిలో వుండము. అంత స్పీడు. ఆ అభిమానం! ఆ ఆరాటం! ఆ ఆనందం! ఓహ్‌ చెప్పలేం!” అంది శృతిక.
”చూడు శృతీ! వాళ్ల కళారంగంలో అభిమానుల పాత్రే ఎక్కువగా వుంటుంది. వాళ్లు వాళ్ల కళలో ఎదగటానికి ఇన్సిపిరేషన్‌ అభిమానుల అభిమానమే… ఆ పొగడ్తలు, ఆ ఎంకరేజ్‌మెంట్ లేకుంటే వాళ్లు అక్కడే ఆగిపోతారు.. ఏదో ఒక జాబ్‌ చేసుకుంటూ ఇదిగో నాలాగ! ఇప్పుడు నేనెంత మందికి తెలుసు చెప్పు! మహా అయితే మా ఆఫీసులో… మన ఫ్యామిలీ మెంబర్లకి అంతేగా! మరి ద్రోణా?” అంది కృతిక.
”ఆయన తెలిసిన ఆడవాళ్లందరికి తెలుసు…” అంది వెంటనే శృతిక.
”ఆడవాళ్ల గురించి ఆలోచిస్తున్నంత సేపు నువ్వు ద్రోణను గుర్తించలేవు. అతనేంటో నీకు అర్థం కాదు.” అంది కృతిక.
”అర్థంకాని అమోఘం ఏముందక్కడ?” అంది వెటకారంగా.
”నువ్వు అతనితో కలిసి బయట కొస్తేగా నీకర్థమయ్యేది. ఎప్పుడు చూసినా ఏదో నేరం చేసిన ఖైదీలా నాలుగు గోడల మధ్యన వుంటే ఏం తెలుస్తుంది? ఆ మధ్యనొక కాస్ట్లీ… ఏరియాలో ద్రోణచేత ‘నేచర్‌ ఆర్ట్‌ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్‌ పెట్టించారు. లక్కీగా ఎందరెందరో సందర్శకులు వచ్చారు. వచ్చిన వాళ్లలో అమెరికన్స్‌, ఆస్ట్రేలియన్స్‌, జర్మన్స్‌ కూడ వుండటం విశేషం. వాళ్లకి నచ్చిన పెయింటింగ్స్ ని లక్షల్లో కొనుగోలు చేసి పట్టుకెళ్లారు. చూస్తున్న నాకే వండరైంది.” అంది కృతిక.
”అది బిజినెస్‌! ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్లు అలా డబ్బుల్ని పోగేసుకుంటుంటారు.” అంది శృతిక.
”చ…చ… నీకెలా చెబితే అర్థమవుతాడే ద్రోణా? అతన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు నువ్వే అర్థం కాకుండా పోతావు. అతని లైఫ్‌ ప్రస్తుతం నువ్విచ్చే మనశ్శాంతి మీదనే ఆధారపడివుంది. అతన్ని బాధపెట్టకు.” అంది.
”నేనేం బాధపెడ్తున్నా … అతనే నన్ను బాధపెడ్తున్నాడు. నాలుగురోజుల నుండి ఇంటికే రాలేదు తెలుసా? ఒంటరిగా వున్నాను.. పడుకోవాలంటే భయంగా వుంది. నీ దగ్గరికి వద్దామంటే మీ అత్తొకటి!” అంది శృతిక.
”అవునా!!” అంటూ నోరెళ్ల బెట్టింది కృతిక.
అది వినగానే షాక్‌ తిన్నాడు ద్రోణ. క్షణంలో తేరుకొని, కుంచె పక్కన పెట్టి… ‘ఇది అనుమానం కాదు. బలుపు’ అనుకుంటూ హాల్లోకి వచ్చాడు.
అప్పటికే కాల్‌ కట్ చేసి వంటగదిలోకి వెళ్లబోతున్న శృతిక చేయి విసురుగా పట్టుకొని… ”ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడావ్‌? నాలుగు రోజులనుండి నేను ఇంట్లో లేనా?” అన్నాడు కోపంగా.
”ఎందుకంత గట్టిగా పట్టుకుంటారు? నా చెయ్యి విరిగి పోతుంది. వదలండి! మా నాన్న నా కాళ్లు, చేతులు బాగుండాలనే నన్ను మీకిచ్చారు. మీ ప్రవర్తన నన్నెలాగూ మానసిక రోగిని చేసింది. ఈ కాళ్లూ, చేతులు కూడా వుంచరా నాకు.?” అంటూ మోకాళ్లమీద కూర్చుని చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది.
అప్పటికప్పుడే ఈ ఏడ్పేంటి? రివర్స్‌లో మాట్లాడే ఈ మాటలేంటి? తట్టుకోలేక ఆమె చేయి వదిలేశాడు.
”ఈసారి మీ దగ్గరకి మీడియావాళ్లు వస్తారుగా… అప్పుడు మీ భార్యగా నేనెంత రగిలిపోతున్నానో, ఎంత కుమిలిపోతున్నానో చెబుతాను” అంది ఏడుస్తూనే.
ద్రోణ తల పట్టుకూర్చున్నాడు అతనికి బొమ్మపై కాన్‌సన్‌ ట్రేషన్‌ పోయింది. ఆమెతో రోజూ ఇలా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకరకంగా డిస్టర్బ్‌ అవుతూనే వున్నాడు.. అతనికి అక్కడ వుండాలనిపించలేదు. క్షణంలో బయటకి నడిచి – కారెక్కి వేగంగా వెళ్లిపోయాడు.
*****
మహాకవి శ్రీశ్రీ ని అప్పట్లో చూసిన కవులంతా ‘శ్రీశ్రీ గురించి మాట్లాడుకుందాం’ అన్న ప్రత్యేక సభను ఏర్పాటు చేసుకొని, దానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను తెలిసిన మిత్రుడొచ్చి ద్రోణకి ఇచ్చి వెళ్లాడు.
ఆ సభకి ఆముక్తని వెళ్లమని చెప్పాడు ద్రోణ… దానివల్ల ఒక కవయిత్రిగా ఆమెకెంత ఉపయోగమో చెప్పాడు. ప్రముఖ కవులతో పరిచయాలు అవుతాయని చెప్పాడు.
ఆముక్త వెళ్లింది.
వేదికపై అభ్యుదయకవులు, దిగంబరకవులు, విరసం రచయితలు, స్త్రీవాద రచయిత్రులు వున్నారు… సాహితీ ప్రియులతో ఆ సభ కిక్కిరిసి పోయి వుంది.
ముందుగా అధ్యక్షులు తొలి పలుకులు విన్పించారు.
ఆ తర్వాత ఓ విరసం సభ్యుడు మైక్‌ ముందు నిలబడి…
”మహా ప్రస్థానం అంటే విప్లవం.. ‘మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం.. గంటలు! గంటలు! గంటలు! పోనీ, పోనీ పోతే పోనీ! సతుల్‌, సుతుల్‌, హితుల్‌ పోనీ!’ అన్న శ్రీ శ్రీ కవితలో ఎంత విప్లవంవుందో నాకు తెలియదు కాని, నేనా కవితకి బాగా కదిలిపోయాను…” అన్నాడు.
వెంటనే ఓ దిగంబరకవి లేచి – శ్రీ శ్రీ వ్యక్తిత్వం ఎంత విలక్షణమైందో చెబుతూ… శ్రీశ్రీ ని ఒక పసిపిల్లవాడిగా, నిరంతర పాఠకుడిగా, ఒక విదూషకుడిగా, అక్షర ప్రహేళికలతో క్రీడించిన వ్యక్తిగా అభివర్ణించారు.
అంతలో ఓ అభ్యుదయ కవి మైక్‌ పట్టుకొని – ”నేను విశ్వనాధ, కృష్ణశాస్త్రి, టాగోర్‌ల కవిత్వంలో పరవశించిపోతున్న రోజుల్లో మొదటిసారిగా శ్రీశ్రీ మహాప్రస్థానం చదివాను.. శ్రీశ్రీ ఒక ఆరని మంట. ఆగనియుద్ధం. అక్షర హిమనగం. అభ్యుదయ స్వప్నార్ణవం. ప్రపంచ ప్రజలకై ఎత్తిన బావుా…” అంటూ ఆవేశంగా మాట్లాడుతుంటే సభలో చప్పట్లు మారుమోగాయి.
ఆముక్త అలాగే చూస్తోంది.
అసలీ మహాప్రస్థానం అంటే ఏమిటో ఆముక్తకి అర్థం కావటంలేదు.. పక్కనెవరో అడిగారు. ” మహాప్రస్థానం చదివారా?” అని
తడబడింది ఆముక్త.
చదవలేదంటే ఎలా వుంటుంది? ‘కలం పట్టి కవితలు రాస్తూ కూడా ఇంకా చదవలేదా?’ అంటారేమోనని అటూ, ఇటూ కాకుండా తలవూపి తప్పించుకొంది. ‘అమృతం కురిసిన రాత్రి’ చదివాను” అంటూ వెంటనే చెప్పింది.
”అది కూడా మంచి పుస్తకమే.. కానీ ఈ రోజుల్లో సాహిత్యపరమైన పుస్తకాలు భూతద్దం వేసి వెతికినా కన్పించటం లేదు. ఒకప్పుడు వంటగదితో పాటు విధిగా పుస్తకాల గది వర్థిల్లేది. ఇప్పుడు ఏ మధ్యతరగతి ఇళ్లలో చూసినా ఎంసెట్ పుస్తకాలు, జావాలు, సి-ప్లస్‌ పుస్తకాలు కన్పిస్తున్నాయి” అందామె అదో పెద్ద తీరని అగాథంలా ముఖం పెట్టి…
ఆ సభలో అప్పటి తరానికి చెందిన కవులేకాక ఇప్పటి తరానికి చెందిన యువకవులు, యువకయిత్రులు కూడా వున్నారు మహావృక్షాల ముందు లేతమొక్కల్లా…
వేదికపై ‘కవిత ఎలా వుండాలి? మినీకవిత ఎలా వుండాలి?’ అనే చర్చ సాగుతోంది. ఆ చర్చలో సాహిత్యాన్ని చదువుతున్నారు. తాగుతున్నారు. పీలుస్తున్నారు. జుర్రుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ సాహిత్యాన్నంతా అక్కడ పోగేసుకొని భాషపై పట్టురావాలంటే ప్రబందాలను వదలొద్దంటున్నారు. ఒకప్పుడు శ్రీశ్రీ ‘కవిత్వం తీరని దాహం’ అంటే ఇప్పుడు ‘కవిత్వం నా ఊపిరి’ అంటున్నారు కొందరు.. ‘కవిత్వం నా వ్యసనం’ అంటున్నారు ఇంకొందరు… ‘కవిత్వమంటే ప్రతిరోజు నా కలంలోంచి రాలే గుప్పెడు అక్షరాలు’ అంటున్నారు ఇంకా కొందరు … ‘కవిత్వం అతిసహజంగా నాలోంచి వూరే వూటల తేట’ అంటున్నారు మిగిలిన వాళ్లు…
‘కవిత్వం అంటే ఇదా?’ అనుకొంది ఆముక్త. ద్రోణ తనని ఈ సభకి ఎందుకెళ్లమన్నాడో ఇప్పుడర్థమైంది.
సభ ముగిశాక – దారిలో కారాపుకొని విశాలాంధ్ర బుక్‌షాపుకి వెళ్లి కొంతమంది ప్రముఖ కవుల కవితా సంపుటాలను కొని ఇంటికి తీసికెళ్లింది.
ఏసి ఆన్‌ చేసి పడుకోగానే సంవేద గుర్తొచ్చింది ఆముక్తకి.
‘జీవితాన్ని తడమటమంటే ఏమి వేదా?’ అని తను అడిగినప్పుడు సంవేద ఏమాత్రం తడబడకుండా.. ”అగ్నిపూజ చేస్తే వర్షాలు పడ్తాయని నేతి డబ్బాలను నిప్పుల్లో పోస్తున్నారు కదా! మధ్యాహ్న భోజనంలో పిల్లలకి నెయ్యి ఎందుకు వెయ్యరో.. నీ కవిత్వంతో అడుగు ముక్తా? అలాగే ముఖంమీద వచ్చే ముడతలు వయసు వేస్తున్న ముద్రలని తెలిసి కూడా బ్యూటీషియన్లను తిడుతూ, తమ శరీరచ్ఛాయను మాసిపోకుండా చేయమని వాపోతుంటారు. ఇవన్ని చిన్నగా అన్పించినా ఎంత చికాకుగా వుంటాయో తెలియజెయ్యి” అంది సింపుల్‌గా.
ద్రోణకూడా అంతే! అలాగే మాట్లాడతాడు
ఇవి రాయటానికి భాష కావాలి. చదవమంటాడు.
వెంటనే తన వెంట తెచ్చుకున్న పుస్తకాలను ఆత్రంగా చూస్తూ ఒక్క గంటలో అంతా నేర్చుకోవాలన్నట్లు అందులోని పదాలవెంట పరిగెత్తసాగింది.
ఆ పుస్తకాల్లో .. భావోన్మాదం, యుద్దోన్మాదం అంటూ కొరుకుడుపడని పదాలు కన్పించటంతో వాటిని పక్కన పెట్టి నిరంతర సౌందర్యాన్వేషకుడు కృష్ణశాస్త్రి పుస్తకం అందుకొంది.
ఇప్పుడు హాయిగా వుంది.
కృష్ణశాస్త్రి తన ఆరాధన, అన్వేషణ, ఆలాపనలో నవలావణ్య లతిక ఊర్వశిని ఎలా దర్శించాడో చదువుతూ కూర్చుంది. ఆయన అన్వేషణ ‘అనంతమైనది. అమరమైనది, అతి మధురమైనది’ అని మనసులో అనుకొంది.
ఎప్పుడైనా సౌందర్య నీలివెన్నెల్ని కోరుకునే ఆముక్త సంవేద చెప్పినట్లు, ద్రోణ చెప్పినట్లు రాయలేకపోతోంది. చదవలేకపోతోంది
రేపు వెళ్లి ద్రోణను కలవాలి. సభలోని సంగతులు చెప్పాలి అనుకొంది ఆముక్త.
*****

రెండో జీవితం 4

రచన: అంగులూరి అంజనీదేవి

ఆమె దృష్టిలో ప్రేమ కామం కాదు. ఇంకేదో…! మరి పురుషునిలో తండ్రి అంశ వుండదు. ప్రేమ అంటే కామమే… ఎవరైనా మనిషి చనిపోతే ఏడుస్తారు. కానీ తాగుబోతుల భార్యలు నిత్యం ఏడుస్తూనే వుంటారు.
వంటగదిలో వున్న శకుంతల – భర్త పిల్లల్ని తిట్లే తిట్లు వినలేక, దేవుడు ఈ చెవులను ఎందుకు ఇచ్చాడా అని బాధపడ్తోంది.
తిట్లు ఆగిపోయాయి.
కుక్కర్‌ విజిల్‌ రెండు సార్లు రాగానే ఆపేసింది.
”మమ్మీ! మమ్మీ!” అంటూ ఆపదలో వున్న దానిలా నిశిత గొంతులోంచి ఆర్తనాదం విన్పించగానే బయటకి పరిగెత్తింది శకుంతల.
ప్రభాకర్‌ కూర్చున్న చోట లేడు. నిశిత దగ్గరకి వెళ్లాడు నిశితను పట్టుకొని నెడుతున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థంకాక షాకైంది శకుంతల. క్షణాల్లో తేరుకుని భర్తను చేయి పట్టుకొని ఇవతలకి లాగుతూ…
‘ఏం చేస్తున్నావ్‌ దాన్ని? తాగిన మైకంలో కళ్లు మూసుకుపోయాయా?” అని అరుస్తూ, ఏడుస్తూ ఆయన్ని బలంగా లాగింది.
ఆ విసురుకి నిశితను వదిలి భార్య మీద పడ్డాడు. వాళ్లిద్దరు పెనుగులాడటం మొదలైంది. ఒకరిమీద ఒకరు విరుచుకుపడ్డారు. పై అంతస్థు నుండి విసురుగా కిందవున్న రాళ్ళపై పడటం వల్ల తలలు పగిలి కొద్దిసేపట్లోనే ప్రాణాలు విడిచారు.
అంతా క్షణాల్లో జరిగిపోయింది.
నిశిత అలాగే చూస్తూ, నిస్సహాయంగా అరుస్తోంది. ఆ అరుపులు విని చుట్టుపక్కల వాళ్లొచ్చారు.
ఆ వాతావరణం అరుపులతో, కేకలతో, ఏడుపులతో నిండి – విధిని తలపింపచేస్తోంది.
….కొంతమంది” అయ్యో! అయ్యో! ఇదేం ఘోరం? ఇంతకు ముందేగా ఇద్దర్ని ప్రాణాలతో చూశాం! ఇంతలోనే ఇదేం మాయ? ఇదేం విపరీతం?” అని గుండెలు బాదుకుంటూ నిశిత దగ్గరకి వచ్చారు.
వాళ్లంతా ఒక్కసారిగా అలా రావటంతో… నిశిత కళ్లు, నోరు, ఆవులిస్తున్నట్లు పెట్టి శిలలా అయింది. ఆ షాక్‌లోంచి ఆమెను బయటకు తీసుకురావాలని చూశారు. ఆమె భుజాలు పట్టుకొని కదిలించారు. ఆమె మాట్లాడలేదు. నెమ్మది, నెమ్మదిగా…
కుర్చీలోనే పక్కకి ఒరిగింది.
కంగారుపడి నిశితకూడా చనిపోయిందనుకున్నారు.
ఆత్రంగా ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ ఒకరు…చేయిపట్టి నాడి చూస్తూ ఒకరు.. గుండెలపై చేయివేసి ఇంకొకరు… చూశారు. శ్వాస ఆడుతుండటంతో బ్రతికే వుందని నిర్ధారణ చేసుకున్నారు.
తర్వాత కార్యక్రమం ఏంటి? ఎలా చెయ్యాలి? అనుకుంటూ.. కొంతమంది కిందవున్న శవాల దగ్గర వున్నారు. వెంటనే శ్యాంవర్ధన్‌ సెల్‌నంబర్‌ తెలుసుకొని – కాల్‌చేసి విషయం చెప్పారు.
నిశిత ముఖంపై నీళ్లు చల్లారు.
ఆమె కళ్లు తెరిచి ఏడుస్తుంటే… అక్కడున్న ప్రతి ఒక్కరు ‘అయ్యో పాపం!’ అంటూ కళ్లు తుడుచుకుంటున్నారు.
*****
మనిషి జీవితం ముగిశాక చివరి గమ్యం శ్మశానం…
శకుంతల, ప్రభాకర్‌ల శవాలను శ్మశానం వైపు తరలిస్తుంటే సంవేద, నిశితల ఏడుపులు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు అక్కడున్నవాళ్ల హృదయాలను పిండాయి.
ఒక దృశ్యం రెప్పపాటు కాలంలో చేజారిపోయినట్లు చూస్తుండగానే తల్లిదండ్రులు కనుమరుగై గతంలోకి చేరిపోయారు.
అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చేయించి, ఓ బాధ్యత అయిపోయినట్లు భార్యతో ఊరెళ్లిపోవానికి సిద్ధమయ్యాడు శ్యాంవర్ధన్‌.
నిశితవైపు చూసింది సంవేద.
ఎండలు పెరిగి, నీళ్లు ఎండిపోయి, పొలాలు బీటలువారి, పశువులు బక్కచిక్కిపోతే ఒక ఊరు ఎలా తల్లడిల్లి పోతుందో అలా వుంది నిశిత.
ఒంటరిగా మిగిలిపోయిన నిశితను ఏం చేయాలో అర్ధంకావటంలేదు సంవేదకు. పోయినవాళ్లు ఎలాగూ తిరిగిరారు. నిశితకు తను తప్ప ఎవరున్నారు? ఒక అక్కగా నిశిత గురించి తీవ్రంగా ఆలోచిస్తూ…
”నిశితను ఏం చేద్దామండీ?” అంది మెల్లగా సంవేద.
”మీ వాళ్లెవరైనా తీసికెళ్తారేమో అడిగి చూడు వేదా?” అన్నాడు క్యాజువల్‌గా అతను నిశిత గురించి ఏమాత్రం ఆలోచించటం లేదని అర్ధమై ఆమె మనసు చివుక్కుమంది.
”అడిగి చూశాను. వాళ్లెవరు ముందుకు రావటంలేదు కనీసం. సలహా కూడా ఇవ్వటంలేదు.” అంది
”ఎందుకలా? ” అన్నాడు.
”వ్యర్ధం చేయవద్దు, దేబిరించవద్దు అని ఓ సామెత వుంది. కొందరు తమ దగ్గర వున్న డబ్బునిగాని, వనరులనుగాని, ముందూ వెనకా చూడకుండా ఖర్చుచేస్తారు. అలా ఖర్చుపెట్టేటప్పుడు వాటి అవసరాన్ని, విలువను గుర్తించరు. అలాంటి వాళ్లలో మా నాన్న ఒకడు. ఆయన ఇంతకాలం పనిచేసింది ప్రైవేటు కంపెనీలో కాబట్టి అంతో ఇంతో వచ్చిన డబ్బంతా ముందే వాడేసుకున్నాడట.. ఇప్పుడు నిశితను ఎవరూ పట్టించుకోవటంలేదు. మబ్బులు ఎప్పుడు వర్షిస్తూనే వుండవు కదా! నీళ్లను స్టోర్‌ చేసుకోవాలని నాన్నకి తెలియలేదు.” అంది సంవేద నిస్సహాయంగా చూస్తూ….
భార్య అంతగా క్రుంగిపోయి ఎప్పుడూ కన్పించలేదు.
మానవసంబంధాలు ఎంత బలీయమైనవో, అవి మనుషుల్నెంతగా బాధిస్తాయో అర్ధమవుతోంది శ్యాంవర్ధన్‌కి.
కొద్దిదూరంలో వున్న నిశిత దీర్ఘాలోచనలో మునిగి, ఎవరూలేని అనాధలా, ఏకాకిలా ఒంటరిగా చక్రాల కుర్చీలో కూర్చుని వుంది. ఆమెనలా చూస్తుంటే ఎలాంటి వారికైనా హృదయం కరిగేలా వుంది.
భర్త ఏం సమాధానం చెబుతాడా అని ఎదురుచూస్తోంది సంవేద.
సమాధానం లేనివాడిలా తలవంచుకొని, కాలి బొటనవేలితో నేలను కెలుకుతూ ఆలోచిస్తున్నాడు.
”నిశితను చూస్తుంటే ఏడ్వటం తప్ప నాకింకో ఆలోచన రావటంలేదు. అందుకే మీరేం చెబుతారోనని…!” అంది అతని వైపు ఆశగా, ఆత్రుతగా చూస్తూ…
”చెప్పానికి ఏముంది.? ఏదైనా పనిలో వుంచుదామా అంటే మీ చెల్లెలు ఏ పనీ చేయలేదు. చక్కగా పనులు చెయ్యగలిగివాళ్లకే పనులు ఇవ్వటానికి సందేహిస్తున్నారు. నీకు తెలియంది ఏముంది?” అన్నాడు శ్యాంవర్ధన్‌.
”నిశిత పనిచేసి తనను తను పోషించుకోగలిగితే నాకింత ఆలోచనదేనికి? అలాంటిది లేకనే కదా!” అంది తనలో తను అనుకున్నట్లే…
శ్యాంవర్ధన్‌ మాట్లాడలేదు. నిశిత విషయంలో ఆ ఇద్దరి ఆలోచనలు కలవటంలేదు.
సహచర్యం అనేది సేమ్‌ఫేజ్‌లో వుంటేనే ఇంజనీర్స్‌ మానిటర్స్‌ చేసినట్లు సరైన స్థాయిలో వుంటుంది. లేకుంటే పనికిరాని కాగితాన్ని వుండలా చుట్టి విసిరెయ్యాలనిపించేలా వుంటుంది. కానీ విసిరేయలేరు.
”దాన్ని మనింటికి తీసికెళ్దామండీ!” అంది ధైర్యంచేసి సంవేద.
”ఒకరిని పెళ్లిచేసుకొని ఇద్దర్ని వెంటబెట్టుకొచ్చావ్‌? దేనికి పనికొస్తుందని ఈ కుంటిదాన్ని తెచ్చుకున్నావ్‌? అంటుంది మా అమ్మ. మా అమ్మ సంగతి నీకు తెలియదు” అన్నాడు.
”అంత కుంటిదేం కాదండీ! ఒక కాలిపై నిలబడి సింక్‌ దగ్గర గిన్నెలు తోమగలదు. ఇంట్లో అవసరమైన చిన్న, చిన్నపనులు చెయ్యగలదు. అంత తిండి పెడితే చాలు.. నాకు పనిలో సాయంగా వుంటుంది. మనం దానికి షెల్టర్‌ ఇచ్చినట్లవుతుంది. అక్కను నేనుండి దాన్ని అనాధలా వదిలివెయ్యానికి నా మనసెందుకో ఒప్పుకోవటంలేదు” అంది.
”నీ ఆలోచన నీకు బాగానే వుంది. కానీ మా అమ్మ గురించి ఆలోచించు…” అన్నాడు.
”అత్తయ్యకి నేను నచ్చచెప్పుకుంటాను. మీరిప్పుడు ఒప్పుకొని దాన్ని మనవెంట తీసికెళ్తే చాలు…” అంది.
”కానీ ఎన్ని రోజులు అలావుంచుకోవాలి?” అన్నాడు ఏమాత్రం ఇష్టంలేని వాడిలా.
”దానికి ఏదో ఒక నీడ దొరికేంతవరకు. ఆ తర్వాత ఒక్కక్షణం కూడా వుండదు” అంది నన్ను నమ్మండి అన్నట్లు..
”ఓ.కె.” అంటూ పర్మిషన్‌ ఇచ్చాడు.
నిశితను తమవెంట తీసికెళ్లానికి రెడీ చేసింది సంవేద. ఇంటిఅద్దె, కరెంటు బిల్లు బ్యాలెన్స్‌ వుంటే క్లియర్‌ చేసింది. ఉన్న ఆ కొద్దిపాటి సామాన్లను తెలిసిన వాళ్ల ఇంట్లో పెట్టింది. వెంటనే బయలుదేరారు.
నిశితకి వాళ్లవెంట వెళ్తుంటే – అక్కలో తల్లి, బావలో తండ్రి కన్పించాడు. తన తండ్రిలాంటి వాడు మాత్రం కాదు.
*****
కృతిక అత్తగారు రాలేదన్న కారణంతో శృతిక అక్క దగ్గరే వుంది. ద్రోణ కాల్‌ చేసినప్పుడు అదే విషయం చెప్పింది.
”కృతిక అత్తగారు ఎప్పటికీ రాకుంటే అక్కడే వుండిపోతావా? దీనికి సొల్యూషన్‌ ఇదేనా…” అన్నాడు ద్రోణ.
”అబ్బే.. అలాంటిదేం లేదండి! జస్ట్‌ హెల్ప్‌ అంతే!” అంది. ఆమె తన మనసుకి నచ్చినదాని గురించే ఆలోచిస్తోంది. కానీ ఆమె అభిలాషను, ఆలోచనలను సమర్థించి, సానుభూతి చూపే స్థితిలో లేడు ద్రోణ.
కారణం ఆమెపట్ల అతని మనసు ఒక గాలిలా స్పర్శించి వెళ్లటంలేదు. మహోదృతమైన ఉప్పెనలా పొంగుతోంది. ఆమె మాత్రం మూసిన గుప్పెటలా మౌనంగా వుంటోంది… ఎంతో సున్నితంగా పూసే పూతలా, కాసే కాతలా వుంటుందనుకున్న ఆమె ప్రవర్తన నోటి పూతలా మారి రహస్యంగా బాధపెడ్తోంది. అది ఎవరితో చెప్పుకోలేక ఒంటరిగా కూర్చుని, తర్వాత సాధారణ స్థితికి వచ్చి బొమ్మవెయ్యటంలో మునిగిపోతుంటాడు.
పిల్లల్ని రెడీ చేస్తూ ద్రోణనుండి వచ్చిన కాల్‌ని కట్ చేసింది శృతిక. అతను మళ్లీ కాల్‌ చేశాడు. అప్పుడు మాట్లాడింది పొడి, పొడిగా..
కొలీగ్‌ మేరేజ్‌కి వెళ్లి రాత్రి లేటుగా వచ్చిన కృతిక ఉదయాన్నే బద్దకంతో లేవలేకపోతుంటే… అక్కకి దగ్గరగా వెళ్లి.
”అక్కా! నువ్వు లేచి ఆఫీసుకి రెడీ అవ్వు… నేను వెళ్లి పిల్లల్ని స్కూల్‌ దగ్గర దింపి వస్తాను.” అంది శృతిక.
”హమ్మయ్యా! ఒక పని తప్పింది. ఈరోజు అసలే ముందుగా రమ్మన్నాడు ఆఫీసులో పెద్దబాస్‌…” అని మనసులో అనుకుంటూ డ్రస్సింగ్‌ టేబుల్‌ వైపు చేయి చూపి…
”అదిగో! అక్కడ నా స్కూటీ కీస్‌ వున్నాయి. తీసికెళ్ళు” అంది కృతిక కళ్లు తెరకుండానే.. రోజు ఆఫీసుకెళ్లే ముందు కృతికనే పిల్లల్ని స్కూల్లో వదిలివెళ్తుంది. ఈరోజు అక్క డ్యూటీని శృతిక తీసుకుంది.
పిన్నితో స్కూల్‌ కెళ్లటం అంటే ఆ పిల్లలకి చాలా ఉత్సాహంగా వుంటుంది… మమ్మీ అయితే చాలా క్యాజువల్‌ గా వదిలి ఆఫీసుకి వెళ్తుంది. పిన్ని అలా కాదు ముద్దుచేస్తుంది. అవీ, ఇవీ మాట్లాడుతుంది. కొత్తగా అద్భుతంగా అన్పించిన చోట స్కూటీని ఆపి చూపిస్తుంది. ఏది అడిగినా వద్దు అనకుండా కొనిస్తుంది.
శృతికకు కూడా ఆ పిల్లల్తో సరదాగా గడిచిపోతోంది.
స్కూటీమీద పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్న శృతికకు నిన్న టీనాను ట్యూషన్లో వదలానికి వెళ్లినప్పుడు.. ఆ టీచర్‌ ఇంట్లో గోడలకి ద్రోణ వేసిన పెయింటింగ్స్ వుండటం గుర్తొచ్చింది. ఆమె ఆలోచనలు అటు మళ్లాయి.
”టీచర్‌! ఆ పెయింటింగ్స్‌ మా బాబాయ్‌ వేసినవి…” అంది అప్పుడే కొత్తగా కన్పించిన ఆ పెయింటింగ్స్‌ని చూస్తూ టీనా. అలా అంటున్నప్పుడు టీనా కళ్లలో ఒకవిధమైన లైట్ కన్పించింది టీచర్కి..
”బాబాయ్‌ అంటే మీ వారా?” అంది శృతికవైపు చూసి టీచర్.
అవునన్నట్లు తలవూపింది శృతిక.
భర్త ాల్‌ెం బయటవాళ్లకి అద్భుతమే కావొచ్చు. కానీ ఆమెకి మాత్రం అంత ఉత్సాహంగా అన్పించదు.
తనంత ఆత్రుతగా అడుగుతుంటే ఈవిడేిం ఇంత నార్మల్‌గా వుంది అని టీచర్కి అన్పించినా… గొప్ప వాళ్లెప్పుడూ ఇలాగే వుాంరు అనుకొంది.
”ఈ పెయింటింగ్స్ ని నిన్ననే ఎగ్జిబిషన్‌లో కొన్నాం… ఇవి పెట్టాక మా ఇంట్లో కొత్త కళ ప్రవేశించింది. ఎవరు చూసినా అడుగుతున్నారు ఇవి ఎక్కడ కొన్నారు? అని… ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆర్టిస్ట్‌ను నిన్న ఎగ్జిబిషన్లో చూశాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్టిస్టులనే వాళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేసేవాళ్ళుకదా! అందుకే ఆ ఫీలింగ్‌…” అంది టీచర్.
”ఇట్స్ ఓ.కె.” అంది శృతిక సింపుల్‌గా.
”మీరు ఆయన మిసెస్‌ అని తెలిసి ఎగ్జయిటింగ్‌గా వుంది. జస్ట్‌ ఎ మినట్! మీరిలా కూర్చోండి!” అంది ద్రోణ వర్షిత్‌ తన ఇంటికి వచ్చినంత ఆనందంగా…
…ఏమిటో ఈ ఆనందం? అనుకొని ”నేను వెళ్లాలి…” అంది శృతిక.
ద్రోణకి ఎవరు ఇంపార్టెన్స్‌ ఇచ్చినా శృతికకు నచ్చదు. అది తెలియక తన ఎమోషన్లో తను మాట్లాడుతోంది టీచర్. గోడకి తగిలించివున్న పెయింటింగ్‌ వైపు చూస్తూ…
”ఏదో అన్వేషిస్తున్నట్లున్న ఈ బొమ్మలో పైకి కన్పించని గుండె బరువు, ఎవరూ ఆపలేని దుఃఖం ఒలుకుతోంది. ఆ దుఃఖాన్ని దోసిళ్లతో పట్టి ఆపగలిగే స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్న ఆమెలో ఎంత ఆశ”.. చాలామంది వేసిన బొమ్మల్ని చూస్తుంటాం… కానీ ద్రోణగారి బొమ్మల్లో వున్న ఆర్తి, ఆర్థ్రత, రసనైవేధ్యంలా అన్పించటం విశేష ఆకర్షణ… అందులో కన్పించే మెసేజ్‌ అమోఘం.” అంది టీచర్. ఆమె టీచర్ కాబట్టి తనెలా ఫీలవుతుందో అది చక్కగా ప్రజంట్ చేస్తోందని శృతికకు తెలుసు. ఎదుటివాళ్ల ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని ఆపకూడదనుకొంది.
కానీ తన ఫీలింగ్స్‌ తనకి ముఖ్యం.
ద్రోణ తన ఒక్కదానికే సొంతం.
ఇది నాది అని అనుకోవటంలో వుండే రుచి ఆమెకు తెలుసు.
నాకేవుండాలి. నాకే చెందాలి. మరొకరికి దీనివల్ల ఉపయోగం వుండకూడదు. ఆ స్వార్ధంతోనే కొద్దిరోజులు దూరంగా వుంటే అతను దారిలోకి వస్తాడని ఇలా వచ్చింది.
భర్తలో మార్పువచ్చి వుండొచ్చు. అక్కతో చెప్పి రేపే అతని దగ్గరకి వెళ్లాలి. వెళ్లాక – ఒక్క ఫోన్‌కాల్‌ వచ్చినా వూరుకోకూడదు. భర్తను ఓ ముద్దనుచేసి పిడికిట్లో పెట్టుకోవాలి అనుకుంటూ స్కూటీని డ్రైవ్‌ చేస్తుంటే…
వెనకనుండి స్పీడ్‌గా వస్తున్న స్కూటర్‌ శృతిక స్కూటీకి డ్యాష్‌ ఇవ్వటంతో వెనకనుండి పిన్నిని పట్టుకొని కూర్చుని వున్న టీనా కిందపడింది.
వెనక్కి చూసింది శృతిక.
డ్యాష్‌ ఇచ్చిన స్కూటరతను వేగంగా ముందుకెళ్లి పోయాడు.
కిందపడ్డ టీనా బాధతో గిల, గిల కొట్టుకుంటోంది. ఆ భయంలో ఏంచేయాలో తోచలేదు శృతికకు.
ముందున్న మోనాను వెనక కూర్చోమని, టీనాను ముందు కూర్చోబెట్టుకొని, గట్టిగా పట్టుకొని ఒక చేత్తో డ్రైవ్‌ చేస్తూ హాస్పిటల్‌కి తీసికెళ్లింది.
టీనా ఏడుస్తోంది. ఎడమ చెయ్యి విరిగి చేతివేళ్లు బాగా నలిగి రక్తం కారుతున్నాయి.
యాక్సిడెంట్ కేసు అని – హాస్పిటల్‌ వాళ్లు వెంటనే వైద్యం చేయలేదు.
శృతిక ఫోన్‌ చెయ్యగానే కృతిక వచ్చింది.
భయంతో శృతికకు చెమట్లు పోస్తున్నాయి.
ఈ రోజు తన పొరపాటేం లేదని శృతికకు తెలుసు. తప్పంతా స్కూటరతనిదే.. స్పీడ్‌గా డ్రైవ్‌ చేస్తూ. ఎవరో అమ్మాయికి ‘హాయ్‌!’ చెబుతూ తన స్కూటీకి డ్యాష్‌ ఇచ్చాడు.
ఒకప్పుడు తనుకూడా ఇలా స్పీడ్‌గా వెళ్లి యాక్సిడెంట్లు చేసి తండ్రిని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు టీనా చెయ్యి తన వల్లనే విరిగిందని తెలిస్తే తండ్రి ఏమంటాడో? తల్లేమంటుందో? చూసేవాళ్ళు ఏమనుకుంటారో? అనుకుంటూ టీనా వైపు ఆందోళనగా చూస్తోంది శృతిక.
శృతిక భుజంపై చేయివేసి కంగారుపడకు అన్నట్లుగా తట్టింది కృతిక. అయినా కృతిక కళ్లలో కన్నీళ్లు వూరుతున్నాయి. తల్లికదా!
అక్కడ జరగవలసిన ప్రాసెస్‌ అంతా జరిగాక…
టీనా చేతికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి కట్టు కట్టారు. మత్తు ఇంజక్షన్‌ ఇవ్వటంతో టీనా మత్తుగా పడుకొంది.
ద్రోణ వర్షిత్‌ వచ్చాడు. అతను రాగానే ఆత్రంగా అతని చేయిపట్టుకొని టీనా దగ్గరకి తీసికెళ్లి చూపించింది శృతిక. అతన్ని వదలకుండా అతని ప్రక్కనే నిలబడింది. ఆమెకు చాలా భయంగా వుంది. ఇప్పుడు తలపెట్టుకోటానికి ఆమెకో భుజం కావాలనిపిస్తోంది.
టీనా నానమ్మ గుండెలు బాదుకుంటూ వచ్చింది. లిఫ్ట్‌ పని చెయ్యకపోవటంతో మెట్లన్నీ ఎక్కి పైకొచ్చినట్లు రొప్పుతోంది. అందరు ఒక్కసారే ఆమెవైపు చూస్తున్నా – ఎవర్నీ పట్టించుకోకుండా మనవరాలి దగ్గరకి వెళ్లి విరిగిన చేతిని చూసి బోరున ఏడ్చింది. వెంటనే శృతికవైపు చూసి…
”నువ్వున్నావని తెలిసి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నాను. చిన్న పిల్లల్ని ఎక్కించుకొని బండి నడిపేతీరు ఇదేనా? ఇంకా చిన్నపిల్లవా నువ్వు?” అంది కృతిక అత్తగారు రామేశ్వరి.
సిగ్గుగా వుంది శృతికకు..
”స్కూటీని స్పీడుగా నడపటం నీకు కొత్తకాదు. నువ్వు చేసే యాక్సిడెంట్లకి భయపడి నువ్వెక్కడ కాళ్లూ, చేతులు విరగ్గొట్టుకుంటావోనని మీ నాన్న పెళ్లి చేసి గాలి పీల్చుకున్నాడు. ఇక్కడ కొచ్చి దీని చెయ్యివిరగొట్టావు. ఏం తల్లీ ఓ చోట తిన్నగా వుండలేవా?” అంది రామేశ్వరి అక్కడెవరైనా వింటారన్న వెరపు లేకుండా..
టీనాకి దెబ్బ తగిలిందన్న బాధ ఒకవైపు, రామేశ్వరి మాటలతో చేస్తున్న అవమానం ఇంకోవైపు శృతికను రాళ్లతో కొట్టినట్లనిపిస్తున్నాయి.
చెల్లెల్ని ఏమీ అనలేకపోయినా, పాపను చూస్తుంటే కృతికకు కూడా బాధగానేవుంది.
ఉదయాన్నే క్షణక్షణం గుర్తొస్తుంటే.. ”ఎప్పుడొస్తున్నావు శృతీ?” అని ద్రోణ వర్షిత్‌ ఫోన్‌ చేశాడు. ఆమెకు వెళ్లాలని వున్నా…’ఆ ఒక్కటి అడక్కు’ అన్నట్లుగా అందీ అందనట్లు మాట్లాడింది.. ‘ఇప్పుడు చూడు ఏమైందో! పెద్దావిడ ఎన్ని మాటలు అంటున్నా నోరెత్తలేని పరిస్థితి తెచ్చుకున్నావ్‌!’ అన్నట్లు శృతికవైపు చూడటం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాడు ద్రోణ.
”ఏదో జరిగిపోయింది. ఎన్ని అన్నా ఏముందిప్పుడు…! చెల్లి మాత్రం చెయ్యాలని చేసిందా! ఇలా జరిగినందుకు దానిక్కూడా బాధగానే వుంది. ఊరుకోండి అత్తయ్యా!” అంది కృతిక చెల్లి ఫీలవ్వటం చూసి…
”నీకేం తెలియదు వూరుకో… అంతా నాదే అనుకుంటావ్‌! పిల్లలున్న వాళ్లకే తెలుస్తాయి ఇలాంటి బాధలు. ఇల్లూ, మొగుడు పట్టనట్లుండే వాళ్లకి ఏం తెలుస్తాయ్‌!” అంది రామేశ్వరి.
ఇలాంటి సందర్భాల్లో అత్తగారి నోటిముందు ఎలాంటి కోడలైనా మౌన మూర్తిలా మారటం అతి సహజం.
…ఇక తట్టుకోలేక భర్త చేతిని గట్టిగా పట్టుకొంది శృతిక.
”నేను మా ఇంటికి వెళ్తున్నా అక్కా!” అంది శృతిక అక్క ఇబ్బందిని గమనించి…
”మమ్మీ! డాడీ వస్తున్నారు. వాళ్లొచ్చాక వెళ్లు శృతీ!” అంది కృతిక.
”ఈవిడ మాటలకన్న వాళ్ల మాటలింకా ఘోరంగా వుంటాయి. నేనేమైనా కావాలని చేశానా? ఎందుకిలా అంటారు? ఒకప్పుడు జరిగిన యాక్సిడెంట్లు నా స్పీడు వల్లనే జరిగాయి. కానీ ఇది నావెనక వస్తున్న స్కూటరతను స్పీడువల్ల జరిగిందంటే అర్థం చేసుకోరేం? ఎప్పుడో ఏదో చేశానని ఇప్పుడు కూడా ఇలా అనటం ఏంటి? నాకు మాత్రం టీనా విషయంలో బాధలేదా? ఆవిడకి ఒక్కదానికే బాధవున్నట్లు మాట్లాడుతుందేం..?” అంది రోషంగా శృతిక.
”పెద్దవాళ్లు అలాగే అంటారు. నువ్వేం పీలవ్వకు..”అంది కృతిక.
”సరే! మేము వెళ్తాం వదినగారు!” అన్నాడు ద్రోణ భార్య మనసు మారకముందే అక్కడనుండి వెళ్లాలని కాదు. ఆ వాతావరణంనుండి భార్యను తప్పించటం కోసం…
‘అలాగే’ అన్నట్లు వాళ్ల వెంట హాస్పిటల్‌ బయటవరకు వచ్చింది కృతిక.
ఆటోలోంచి ఆందోళనగా దిగుతూ కన్పించారు నరేంద్రనాధ్‌, సుభద్ర.
వాళ్లను చూడగానే శృతిక… ”డాడీ వాళ్లొస్తున్నారు. మనం ఆగొద్దు రండి! వెళ్దాం!” అంది తొందరచేస్తూ…
”ఏంటా కంగారు? పలకరించి వెళ్దాం…” అన్నాడు ద్రోణ.
”వాళ్లు నన్ను తిడతారు. నేను వెళ్తాను…” అంది భయపడ్తూ.
”చూసి కూడా మాట్లాడలేదనుకోరా! సరే! నువ్వెళ్లి కార్లో కూర్చో… నేను వాళ్లను కలిసి వస్తాను.” అన్నాడు.
”వద్దు! రండి! వెళ్దాం’!” అంది చెయ్యి పట్టి లాగుతూ.
‘ఈ దిక్కుమాలిన భయం ఇప్పుడంత అవసరమా?’ అన్నట్లు ఆమెవైపు చూస్తే మరింత బాధపడ్తుందని.
శృతికను తీసుకొని నేరుగా కారు దగ్గరకి వెళ్లాడు ద్రోణ.
కార్లో కూర్చుని డోర్‌ వేస్తుంటే
”ద్రోణా!” అంటూ పిలిచాడు నరేంద్రనాధ్‌ అప్పుడే ద్రోణని చూసి..
అప్పటికే కారు కదిలింది.
”హమ్మయ్యా!” అనుకొంది శృతిక.
*****
తల్లి నోటినుండి అప్పుడప్పుడు … ‘జీవితం ఇంతే అనుకుంటే నరకం ఎంతో అనుకుంటే స్వర్గం’ అన్న మాటలు వింటుండేది నిశిత. ఇప్పుడా మాటలు గుర్తు చేసుకుంటూ…
తనకి ఒక కాలు సరిగ్గా పని చెయ్యదన్న విషయాన్ని పూర్తిగా మరచిపోయిన దానిలా అక్క పక్కన తిరుగుతూ, అక్క చెప్పిన పనులు శ్రద్ధగా, చేస్తూ అక్క వంట చేస్తుంటే సింక్‌ దగ్గర ఒక కాలిపై నిలబడి గిన్నెలు కడిగి ఇస్తుంది. కూరలు కట్ చేస్తుంది. వేలు కట్ చేసుకున్నప్పుడు అక్కకు తెలియకుండా బాధను దిగమింగుతుంది…
సంవేదను పిలిచి, పిలిచి విసుగొచ్చింది దేవికారాణికి…
”నిశితా ! ఇలారా! జ్వరమొచ్చినప్పటి నుండి తిరగలేకపోతున్నా… ఆకలిగా వుంది. పాలు ఇవ్వు…” అంది.
నిశిత వెంటనే వంటగదిలోకి వెళ్లి స్టౌ మీద వున్న పాలు గ్లాసులో నింపుకొని హార్లిక్స్‌, చక్కర కలిపి తెచ్చి ఇచ్చింది.
అమృతంలా తాగి, హాయిగా అన్పించటంతో ప్రేమగా నిశిత వైపు చూసింది దేవికారాణి.
”మంచి పాలు కలిపి ఇచ్చావు నిశితా! మీ అక్క పాలల్లో నీళ్లు కలపందే ఇవ్వట్లేదు ఈమధ్యన… అదేమంటే.. మీ అమ్మగారిని మెప్పించటం చాలా కష్టం. చల్లగా ఇస్తే వేడి చెయ్యమంటుంది. వేడిగా ఇస్తే చల్లగా చెయ్యమంటుంది. అసలివ్వకుంటే రంకెలేస్తుంది. ఆవిడ్ని చూస్తుంటే నాకు భయంగా వుంది. అని మీ బావతో చెబుతుంది. మనిషిని మనిషిలా చూడటం మానవ ధర్మం.. అత్తనయినంత మాత్రాన కన్పించని కసితోపాటు అంత నిరసన అవసరమా నిశితా! అయినా మీ అక్కను నేనేం చేశాను?” అంది దేవికారాణి.
నిశిత మాట్లాడలేదు.
దేవికారాణి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. బాగుంటే మాత్రం సంవేదను బెదిరిస్తుంది. అంతేకాదు తన నోటి ప్రతాపంతో ఏడిపిస్తుంది. ఆ తర్వాత తీపి, తీపి కబుర్లు చెప్పి ‘నేను చాలా మంచిదాన్ని..’ అన్న అభిప్రాయం కల్గిస్తుంది.
సంవేద కూడా ఒక్కోసారి తనేంటో అత్తగారికి కూడా తెలియాలిగా అన్నట్లు ర్యాష్‌గా వుంటుంది. మళ్లీ ఏం జరగనట్లే ‘అత్తయ్యా! అత్తయ్యా!’ అంటూ కమ్మగా పిలుస్తుంది. ఆ పిలుపుకి ఎలాంటి అత్త అయినా పులకించి పోవలసిందే.
అలా పులకించి పోవడమే కాదు… ‘నీ అంత వయసులో నేనూ ఒక ఇంటికి కోడలినే వేదా! అప్పుడు మా అత్త నన్ను పెట్టిన బాధలు ఇప్పుడు నిన్ను పెట్టను” అంటుంది దేవికారాణి.
అత్తగారు అలా అనగానే మురిసిపోతూ.. ”మీ అంత వయసు రాగానే నేనూ ఒక కోడలికి అత్తనవుతాను. అందుకే మిమ్మల్నిప్పుడు బాగా చూసుకుంటాను” అంటుంది సంవేద.
ఆ క్షణంలో.. ఆ ఎమోషన్‌లో అలా మాట్లాడుకున్నా ఆ తర్వాత ఎవరి పాత్రలో వాళ్లు లీనమై అత్తా, కోడళ్ల ఆటని పోటీ పడి ఆడుతుంటారు.
పైకి ఎంతో గుంభనగా కన్పిస్తున్న వాళ్లిద్దరి మధ్యన వుండే రాజకీయాలు ప్రపంచ రాజకీయాలను మించి కన్పిస్తుంటాయి.
అందుకే దేవికారాణి వైపు చూడకుండా నేలవైపు చూస్తోంది నిశిత
”మీ అమ్మా, నాన్నా పోగానే నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని నేనే చెప్పాను… మీ అక్కకి నీమీద ప్రేమ లేదు.” అంది రహస్యం చెబుతున్నట్లు దేవికారాణి.
అది నిజం కాదని తెలుసు నిశితకి. ఆరోజు అక్క తనని ఇక్కడికి తీసుకురావానికి దేవికారాణిని ఫోన్లో ఎంత రిక్వెస్ట్‌ చేసిందో తెలుసు.
”నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నిశితా! మీ అక్క నిన్నెలా చూసినా నీకు నేనున్నాను కదా! ఇంకేం ఆలోచించకు… సరేనా?” అంది చిన్నపిల్ల నోట్లో చాక్లెట్ పెట్టినట్లు.
అక్కకు నా మీద ప్రేమ లేదా? ఆశ్చర్యపోయి నోరు తెరిస్తే పేగులు లెక్కపెడుతుందేమోనన్న భయంతో పెదవి కదపలేదు నిశిత.
”కళ్లు తిరుగుతున్నాయి నిశితా! రెండు రోజులుగా విప్పిన బట్టలు అలాగే వున్నాయి. కాస్త ఉతికిపెడతావా?” అంది దేవికారాణి.
”అలాగే ! ఉతుకుతాను…” అంటూ స్టిక్‌ సాయంతో, ఆ గది వెనకాల బాత్‌రూం పక్కన వున్న టాప్‌ దగ్గరకి వెళ్లి దేవికారాణి బట్టల్ని వాష్‌ చెయ్యాలని కూర్చుంది నిశిత.
టాప్‌ తిప్పగానే నీళ్లు రాలేదు. లేచివెళ్లి మోటర్‌ స్విచ్‌ ఆన్‌ చేసి నీళ్లకోసం ఎదురుచూస్తూ అలాగే ఎండలో కూర్చుంది. ఒకప్పుడు అక్కడో చెట్టు వుండేది. ఆకులు రాలి చెత్తపడుతోందని దేవికారాణి కొట్టించింది. ఇప్పుడక్కడ నీడకరువైంది.
నీరెండలో మెరిసిపోతూ – ఎండతాకిడికి కందిపోతూ నీళ్లకోసం వెయిట్ చేస్తున్న నిశితను చూసి…
”నువ్వెందుకే అక్కడ కూర్చున్నావ్‌? రా లోపలకి…” అంది విషయం తెలియని సంవేద.
…చెబితే కోప్పడుతుందని… ”నువ్వెళ్లు! నేనొస్తాను” అంది నిశిత. ఏదో దాస్తున్నట్లు అన్పించి నిశిత దగ్గరకి వెళ్లింది సంవేద. అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకొని వెంటనే వెనక్కి వెళ్లి…
”మీ బట్టల్ని రోజు నేనే కదా వాష్‌ చేసేది. దానికెందుకు చెప్పారాపని? ఇప్పటికే అది అన్ని పనులు చేస్తోంది. ఇలాంటి పనులు కూడా చెప్పాలా?” అంది అత్తగారి ముందునిలబడి.
”ఇలాంటి పనులు అంటే! అవి పనులు కావా? పనుల్లో కూడా తేడాలుంటాయా?” అంది దేవికారాణి.
”అమ్మ ఒక్కపని కూడా దానిచేత చేయించేది కాదు.” అంది సంవేద.
”ఇప్పుడుందా అమ్మ? అయినా పనులు చేసుకుంటే తప్పేంకాదు. చెయ్యకుండా తింటేనే చిన్నతనం… ” అంది కఠినంగా.
”అది అందరిలా వుంటే ఎంతపని చేసినా ఏంకాదు. దానికో కాలు లేదు. ఏదో ఇక్కడ వున్నానన్న భయంతో నేను చెప్పిన పనులన్నీ చేస్తూనే వుంది. మీరు కూడా దానికి పనులు చెప్పాలా? నేను చేస్తాను కదా మీ పనులు…” అంది సంవేద.
”ఆ.. నువ్వు చేస్తావ్‌! ఎంత పిలిచినా తిరిగి చూడవ్‌! పనులేం చేస్తావ్‌! అయినా ఇంత ఖర్మేంటి మాకు..? ఒక పనిమనిషిని పెట్టుకుంటే సరిపోతుంది. మీ చెల్లిని పంపించి వెయ్‌” అంది.
”మా చెల్లిని పంపించి వెయ్యమని ఇంకెప్పుడు అనకండి! దానికి నేను తప్ప ఇంకెవరు లేరు. మీ పనులన్నీ మీ కోడలిగా నేను చేస్తాను. దానికి చెప్పకండి!” అంది కచ్చితంగా.
”నువ్వు చేస్తే నాకు నచ్చటం లేదు. నీకన్నా నీ చెల్లెలే బాగా చేస్తుంది. కాలు లేదనే కాని నీకన్నా అదే అందంగా వుంటుంది.” అంది దేవికారాణి.
అందం గురించి వినాలన్నా, మాట్లాడాలన్నా మనసు చాలా ఆహ్లాదంగా వుండాలి. ఒక్కసారిగా తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని, అత్తగారు ఏ క్షణంలో ఏం మాట్లాడతారో తెలియని స్థితిలో వున్న వాళ్లకు అందం గురించి వినాలంటే ఆసక్తిగా లేదు.
ఆవేశంలో అక్క ఏదైనా అంటే – ఉన్న ఈ ఒక్క ఆధారం పోతుందన్న భయంతో అక్క చేయి పట్టుకొని ”రా ! అక్కా ! వెళ్దాం! ఆమెతో గొడవెందుకు?” అన్నట్లు లాగుతోంది నిశిత.
ఏం మాట్లాడాలో తోచనట్లు నిలబడింది సంవేద.
”అది కుంటిది కాకుండా వుండి వుంటే మా శ్యాంకు దాన్నే చేసుకుని వుండేవాళ్లం. నా కళ్లకి అది అంత అందంగా కన్పిస్తుంది” అంది తృప్తిగా నిశిత వైపు చూస్తూ దేవికారాణి.
”చూడండి! అత్తయ్యా! నామీద ఏదైనా కోపం వుంటే నన్నే డైరెక్ట్‌గా పిలిచి తిట్టండి! నా చెల్లికి కాలులేదని వూరికే గుర్తు చెయ్యకండి! జరిగిందేదో జరిగి పోయింది. ఇప్పుడీ అందాల ప్రసక్తి దేనికి?” అంది కోపాన్ని దిగమింగుతూ సంవేద.
అందాల పోటీలో మార్కులు వేస్తూ మధ్యలో డిస్టర్బ్‌ జరిగినట్లు ఫీలయింది దేవికారాణి.
”గుర్తు చెయ్యానికి అదేమైనా మరచిపోయిన పాఠమా! స్పష్టంగా కళ్లముందు కన్పిస్తుంటే… కుంటిదాన్ని కుంటిదనక మీ వీధిలో ఇంకేమైనా అంటారా? నీ పెళ్లప్పుడు కూడా నీకో కుంటి చెల్లెలు వుందని ముందే చెప్పారు. నేనన్న దానిలో పెద్ద నేరమేం లేదు” అంది.
కొడుకు వస్తున్నట్లు అన్పించి, అక్కడేం జరగనట్లు సైలెంట్ గా అయింది దేవికారాణి. కొడుకు బయట కష్టపడి వస్తాడు కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా వుంచాలనుకుంటుందామె.. ఆ ప్రశాంతత రావాలంటే ఏం చేయాలో తెలియదు.
శ్యాంవర్ధన్‌ రాగానే నేరుగా బెడ్‌రూంలోకి వెళ్లాడు. అతని వెంట వెళ్లింది సంవేద.
ఏం జరిగిందన్నట్లు వెంటనే ఆమె ముఖంలోకి చూశాడు.
ఏదో జరిగిందన్న విషయం ఆమె ముఖంలో అతనికి తెలిసిపోతుంది.
సంవేద హైపర్‌ సెన్సిటివ్‌.. ఏం జరిగినా ఎమోషనల్‌ అయిపోతుంది. అప్పుడే ఏడుస్తుంది. అప్పుడే నవ్వుతుంది. ఏదీ ముఖంలో దాచుకోలేదు. అన్ని భావాలు స్పష్టంగా కన్పిస్తాయి.
”ఏంటలా వున్నావ్‌? ఏం జరిగింది?” అన్నాడు ఆమె భుజాలను పట్టుకుని కుదుపుతూ.. ఆమె మౌనంగా వుంది.
”అమ్మ ఏమైనా అందా?” అన్నాడు
”నిశితకి పని చెబుతుంది. రాత్రయ్యేసరికి అది బాగా స్ట్రెయిన్‌ అయి మూలుగుతూ పడుకుంటుంది.” అని అనలేక…
” ఆ… అన్నది నా చెల్లి నాకన్నా అందంగా వుంటుందట. కాలు బాగుంటే మీకు చేసుకునేదట…” అంది తలవంచుకుని, అలా అనే ముందు పరిణామాల గురించి ఆలోచించలేదామె.
”ఓస్‌! ఇంతేనా! ఏదో నేను చేసుకున్నట్లే ఫీలవుతున్నావే!” అంటూ తలమీద ముద్దుగా తట్టాడు.
*****
అప్పటివరకు బొమ్మ గీసి ఆ గదిలోంచి బయటకొచ్చాడు ద్రోణ.
మొబైల్‌ని చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ వచ్చాడు.
అంతవరకు భర్తతో ఏదో చెప్పాలని, ఆ చెప్పేదేదో రొటీన్‌లా వుండకుండా చాలా వెరయిటీగా వుండాలని మ్యాటర్‌ని రెడీ చేసి పెట్టుకున్న శృతిక అతన్నలా చూడగానే కరెంట్ పోయి చీకట్లో కూర్చున్న దానిలా అయింది.
”ఈయన ఇక మారడా? ఇంతేనా?” అనుకొంది.
అతను భోంచేస్తున్నప్పుడు కూడా ఒకటి, రెండు కాల్స్‌ మాట్లాడి పెట్టేశాడు.
”తింటున్నప్పుడు కాల్‌ కట్ చెయ్యొచ్చు కదండీ?” అంది శృతిక.
”అదేమైనా యాడా కట్ చెయ్యాటానికి… ఇంపార్టెంట్ కాల్‌ శృతీ!” అంటూ బెడ్‌రూంలోకి వెళ్లి పడుకున్నాడు.
శృతిక – టీనా చెయ్యి ఎలా వుందో అని టీనాను గుర్తు చేసుకుంటూ పడుకొంది.
కాల్‌ రాగానే లిఫ్ట్‌ చేసి.. ”చెప్పు! ఆముక్తా!” అన్నాడు చాలా క్యాజువల్‌గా … అతని పెదవులు ఆ పేరునలా ఉచ్ఛరిస్తూంటే బిగుసుకుపోయింది శృతిక.
ఆముక్త మాట్లాడుతోంది.
ఆమె ఆ రోజు ఏ సందర్భంలో ఎలా స్పందించిందో, దాన్ని కవిత రూపంలోకి తేవటానికి ఎంత కష్టపడిందో చెబుతూంటే శృతికకు ఇబ్బంది అవుతుందని నెమ్మదిగా డోర్‌ తీసుకొని పైకెళ్లాడు.
వెన్నెల్లో తిరుగుతూ మాట్లాడుతున్నాడు.
వైట్ నైట్ సూట్ లో వున్న అతను అక్కడ తిరుగుతున్న తీరు స్థిరమైన వ్యక్తిత్వాన్ని చాటుతోంది.
అతనలా వెళ్లగానే లేచి అతనివెంటే పైకెళ్లి, దొంగలాగా కొబ్బరాకుల నీడలో నిలబడింది శృతిక.
అతను అటు తిరిగి నిలబడి ఆముక్త చెప్పేది ”ఊ” అంటూ వింటున్నాడు. ఆ నిశబ్దంలో అతని గొంతు మృదుగంభీరంగా విన్పిస్తోంది.
కళాకారులు చాలా విషయాల్లో చిన్నపిల్లల్లా వుంటారు. అమాయకంగా అన్పిస్తారు. ఏ బాధలు లేని వాళ్లలా నవ్వుతారు. మాట్లాడతారు. ఇది ఎదుటివాళ్లకి ఒక్కోసారి ఆశ్చర్యంగా కూడా అన్పిస్తుంది.. వాళ్లలో ఎంత కళ వున్నా, ఎన్నో అద్భుతాలను సృష్టించగలిగే శక్తి వున్నా కొన్ని సందర్భాల్లో ఇంత నిగర్వులుగా వుంటారా అని…
…తినటం, పడుకోవటం లాంటి రొటీన్ షెడ్యూల్‌ని పక్కనపెడితే – మిగతా టైమంతా ఏదో ఒక ఐటమ్‌ని మనసులోకి తెచ్చుకొని, స్టాండ్‌ బోర్డుకి అమర్చిన కాగితంపై ఆలవోకగా కుంచెను కదుపుతూనే వుంటాడు. తన మనసు దాహాన్ని తీర్చుకోవటం కోసం ఆర్ట్‌లో మరింత మునిగి మునకలేస్తూ వుంటాడు.
తనకి మంచి పేరు తెచ్చిన పెయింటింగ్స్ ని అప్పుడప్పుడు చూసుకుంటూ.. ఎంతో ఇష్టంగా కష్టపడి మరింత కృషిచేసి ఒక స్థానాన్ని సంపాయించుకోవాలనుకుంటాడు. అభిమానుల ఫోన్‌ కాల్స్‌ కూడా ఒక్కోసారి అతనికి గొప్ప రిలీఫ్‌ని, ఇన్సిపిరేషన్‌ని ఇస్తుంటాయి. అందుకే ఎంత బిజీగా వున్న తనలోని ఆర్ట్‌కి జీవం పోసే తోటి కళాకారుల, కళాభిమానుల ఫోన్‌కాల్స్‌ని మాత్రం మిస్‌ కాడు.
అదీకాక.. ఆర్ట్‌కి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలన్నా, సాధన లోపం లేకుండా సాగిపోవాలన్నా – ఎంతో వ్యయ ప్రయాసలకి ఓర్చి దూరప్రాంతాలకి వెళ్లకుండానే ఈ ఫోన్‌కాల్స్‌ సహకరిస్తుంటాయి ద్రోణకి.

ఇంకా వుంది

రెండో జీవితం 3

రచన: అంగులూరి అంజనీదేవి

ఆముక్తను చూడగానే చిరునవ్వుతో విష్‌ చేసి.. కూర్చోమన్నట్లు కుర్చీ చూపించాడు ద్రోణ.
కూర్చుంది ఆముక్త.
ద్రోణ వేసిన బొమ్మల్ని చూసి మెచ్చుకుంది ఆముక్త. మన బిడ్డల్ని ఎవరైనా ఇష్టపడ్డప్పుడు మన ఆనందం ఆకాశాన్ని ఎలా తాకుతుందో అదేస్థాయి ఆనందంలో వున్నాడు ద్రోణ.
ద్రోణ చాలా చిన్న వయసునుండే చిత్రాలు గీస్తున్నాడు. ప్రతి చిత్ర ప్రదర్శనలో తన చిత్రాలను ఎంట్రీ చేస్తుంటాడు. అతని చిత్రాలు మిగిలిన వాళ్లకన్నా విభిన్నంగా వుంటూ కళాప్రియులకు గొప్ప అనుభూతిని అందిస్తుంటాయి. ఊహలు, భ్రమలు కాకుండా స్పష్టమైన వాస్తవాలను తన బొమ్మల్లో ప్రజెంట్ చేస్తుంటాడు. ఇప్పటికి అనేక ప్రదర్శనల్లో పాల్గొని అందరి మెప్పు పొందడమే కాక అక్కడక్కడ వున్న ఆర్ట్‌ గ్యాలరీ స్పేస్‌లో అతని బొమ్మలను ప్రదర్శణకి వుంచటం విశేషం…
రీసెంటుగా అతను చేసిన ప్రయోగాలు కళాభిమానులనే కాక, తోటి చిత్రకారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తి వారి అభినందనల వర్షంలో తడిసిపోతున్నాడు.
ద్రోణ చిత్రకళలో పిజి చేశాడు. అంతేకాదు ముంబాయిలోని పాయింట్ ఆఫ్‌ వ్యూ గ్యాలరీలో జరిగిన ప్రదర్శనలో అతని చిత్రాలు గొప్పగా వెలుగుచూశాయి. జైపూర్‌, భూపాల్‌ కోల్‌కత్తా, బెంగుళూరు, న్యూఢిల్లీ లాంటి నగరాలే కాక… లండన్‌, ఫ్రాన్స్‌, శ్రీలంక, న్యూజర్సీ లాంటి ఇతర దేశాల్లో కూడా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లలో అతని బొమ్మల్ని వుంచాడు.
”ఈ కవిత చదువు ద్రోణా! ఇందులోని నా భావాన్ని మీ బొమ్మ రూపంలో చూసుకోవాలని వుంది.” అంది ఆముక్త.
వెంటనే ఆ కవితను తీసుకొని చదవటం మొదలుపెట్టాడు ద్రోణ. కవిత చదవటం పూర్తి కాగానే దీర్ఘంగా నిట్టూర్చాడు. కుర్చీలో వెనక్కివాలి, కళ్ళు మూసుకుకున్నాడు. ఆ కవిత పట్ల అసంతృప్తి ఉన్నట్లు, అతని ముఖంలో కన్పించకుండా చేయి అడ్డు పెట్టుకున్నాడు.
”ఏంటి ద్రోణా! నా కవిత అంతగా ఆలోచింపజేస్తుందా? నువ్వలా అన్నావనుకో… నాకు చాలా గర్వంగా వుంటుంది.” అంది ఆముక్త.
”అలా అని నేనేం అనలేదు ఆముక్తా! నీ కవితలో భావం బాగుంది. కానీ…” అంటూ అసంతృప్తిగా చూశాడు.
ఆమె మనసు కుంచించుకుపోయింది.
”ఇంకా ఏమైనా స్పష్టత రావాలంటావా ద్రోణా?” అంది లోగొంతుకతో… ఇప్పటికే ఆ కవితకి పడ్డ కష్టం అంతా, ఇంతా కాదు. ఇంకా కష్టపడాలంటే తన వల్ల కాదేమో అన్నంతగా కష్టపడింది.
”నీకెలా చెప్పాలో తెలియని సందిగ్ధతలో వున్నాను ఆముక్తా! నీ కవితకి బొమ్మ గురించి తర్వాత ఆలోచిద్దాం….” అన్నాడు
”ఆలోచించాలి అంటే! నా కవితలో అంత ఇన్సిపిరేషన్‌ లేదనేగా దాని అర్థం..?” అంది … ద్రోణకి ఏదీ నచ్చదు అన్నట్లు…
”ఇన్సిపిరేషన్‌ అంటే పికాసో లాంటి చిత్రకారుడికి గాగిన్‌ నైపుణ్యం స్పూర్తినిస్తే ఆయన జీవితం సోమర్‌సెట్ మామ్‌ లాంటి రచయితను చలింపజేసి పుస్తకం రాసేలా చేసిందట… ఇప్పుడు చెప్పు ఇన్సిపిరేషన్‌ అంటే ఎలా వుండాలో… నువ్వెందుకు ట్రై చెయ్యకూడదూ?” అన్నాడు.
ఏదో అద్భుతమైన ఫీలింగ్‌తో ఆమె హృదయం ఉప్పొంగింది. అంతలోనే తనలోకి తను చూసుకున్నట్లై…
”నా ముఖం నేనేంటి! నాకు వాళ్లతో పోలికేంటి ద్రోణా?’ అంది ఆశ్చర్యపోతూ…
ఒక్క క్షణం ఆమె ముఖంలోకి సూిగా చూశాడు.
”గొప్ప వాళ్లంతా ఒకప్పుడు నీలాగ అనుకున్నవాళ్లే…. సరైన కోణంలో ఆలోచించి, సరైన శిక్షణ పొంది, క్రమశిక్షణతో కృషిచేస్తే సాధ్యం కానిదేది లేదు. అలా కృషి చేస్తేనే కాలంతోపాటు నిలబడిపోతాం.. దేనికైనా డెడికేషన్‌ అవసరం…” అన్నాడు.
ఏదో ఊహించుకుంటూ, నాలుగు వాక్యాలు రాసి, చుట్టుపక్కల వాళ్లు దాన్ని మెచ్చుకోగానే అదో గొప్ప కవితలా ఫీలయ్యే ఆమెకి ద్రోణ మాటలు కొరుకుడు పడటంలేదు. పైగా తన స్థాయిని ఈ విధంగా ఆమె ఎప్పుడూ అంచనా వేసుకోలేదు.
”మన కళాకారుల ప్రపంచం చాలా విచిత్రంగా వుంటుంది ఆముక్తా! నేను చిత్రకారుడ్ని కాబట్టి నా ఆలోచనలన్నీ నాకన్నా ముందు కృషి చేసిన చిత్రకారుల చుట్టే తిరుగుతాయి. వాళ్లెలాంటి మెలుకువల్ని పాటించారు. వాళ్లు గీసుకున్న చిత్రాలు, ఆ చిత్రాలకి వేసిన పెయింట్, రంగుల్ని కలుపుకోవటంలో చూపిన కొత్తదనం పరిశీలిస్తాను. అలాగే నువ్వు కూడా కవితలు రాసేముందు గొప్పవాళ్లు రాసిన పుస్తకాలను బాగా చదవాలి. వాళ్లేం చెప్పారో పరిశీలించాలి…” అన్నాడు
చెక్కిట చేయి చేర్చి వింటూ..
”ఇన్నాళ్లు చిత్రకారుడంటే నువ్వే అనుకున్నాను. ఐ మీన్‌ నాకు తెలిసిన ప్రపంచం చిన్నది కావొచ్చు. రైటర్స్‌లాగా చిత్రకారులు కూడా ఎక్కువమంది వుంటారా?” అంది
”ఎక్కువమంది వున్నా కాలంతోపాటు నిలబడేవాళ్లు చాలా తక్కువమంది వుంటారు ఆముక్తా! వాళ్లలో ‘మోనాలిసా’ చిత్రాన్ని మనకి బహుమతిగా ఇచ్చాడు లీనార్డో… ఆయన చిత్రాలకి మొట్టమొదట ఆయిల్‌ పెయింట్ వాడొచ్చన్న విషయాన్ని కనుక్కున్నాడట.
తర్వాత మైకెలాంగిలో … ఈయన వంద అడుగుల ఎత్తున చర్చి అంతర్బాగపు పై కప్పు మొత్తాన్ని బొమ్మల్తో చిత్రీకరించటం కోసం నాలుగు సుదీర్ఘమైన సంవత్సరాలు ఒక్కడే ‘మంచె’ పై వెల్లకిలా పడుకొని అవిరామంగా పనిచేసి వెన్నెముక పోగొట్టుకున్న చిత్రకారుడట.
ఆ తర్వాత పికాసో అనే చిత్రకారుడు ఏదైనా ఒక చిత్రాన్ని చూడాలంటే కళ్లతో కాదు మెదడుతో అని తన చిత్రాల్లో అందాన్ని తగ్గించి క్లిష్టతను పెంచాడట..
ఇవన్నీ నాకెలా తెలుసని అనుకుంటున్నావా? కొందరు రాసిన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను. అన్నాడు ద్రోణ.
”వాళ్లెప్పటి వాళ్లు? ఆ పేర్లు కూడా అదోలా వున్నాయి..” అంది ఆముక్త ఆసక్తిగా.
”చెప్పానుగా! ప్రతిభ వున్న కళాకారులు కాలంతోపాటు జీవిస్తారని.. మనలాంటి వాళ్లకి మైలురాళ్లు” అన్నాడు.
”మరి మనం వాళ్లలా కాగలమా?” అంది
”ఒక్కరోజులో, ఒక్కరాత్రిలో కాలేము. అహోరాత్రులు నిద్రమానుకొని కష్టించిన కళాకారులే ఇప్పుడు మనకి కన్పిస్తున్న ఈ మెరుపులు…” అన్నాడు.
”ఒక్క నిముషం ద్రోణా! రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అనే పాటలో రవివర్మ పేరుంది కదా! ఆయన కూడా చిత్రకారుడేనా?” అంది ఆముక్త.
”అద్భుతమైన చిత్రకారుడు. ఆయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు. ఎవరి సాయం లేకుండానే తొమ్మిదేండ్లపాటు స్వయంకృషి సాగించి, పరిశోధనలు చేసి, వైఫల్యాలను తట్టుకొని తనకు తానుగా రంగుల మిశ్రమాన్ని నేర్చుకుని పూర్తిగా చిత్రకళకే అంకితమైపోయాడు..” అన్నాడు.
”ఏం సాధించాడు?” అంది ఆముక్త.
”చాలా సాధించాడు. 1873లో తన కురులను మల్లెమాలతో అలంకరించుకుంటున్న నాయర్‌ వనితను చిత్రించాడు. దాన్ని మద్రాసు ‘పైన్‌ ఆర్ట్స్‌ ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శిస్తే స్వర్ణ పథకం గెలుచుకొంది. 1874లో శరబత్‌ వాద్యాన్ని వాయిస్తోన్న తమిళ మహిళ చిత్రానికి కూడా మద్రాసులో జరిగిన ప్రదర్శనలో ప్రథమ బహుమతి లభించింది.
1875లో పారదర్శకమైన ఒక తెరకింద శయ్యమీద పవళించిన ఒక మళయాళీ సుందరి తన సహచరితో జలక్రీడ నెరుపుతోన్న చిత్రం.. మళ్లీ 1876లో ‘దుష్యంతుడికి ప్రేమలేఖ రాస్తోన్న శకుంతల.’ ఇది భారతీయ చిత్రకళా చరిత్రలో అపూర్వం. మద్రాసులో జరిగిన ప్రదర్శనలో ప్రదర్శించబడిన చరిత్ర ప్రసిద్ధ చిత్రం.
ఈ విధంగా రవివర్మ చిత్రలేఖనా పరిధి బాగా విస్తరించి స్వదేశాల్లో, విదేశాల్లో అభిమానులు పెరిగి అతని చిత్రాలను కొనేవాళ్లు ఎక్కువయ్యారు. ఇంతకన్నా ఓ కళాకారుడు సాధించవలసింది ఏముంది.” అన్నాడు ద్రోణ.
”దీన్ని బట్టి నాకు తెలిసింది ఏమిటంటే రాజా రవివర్మ చిత్రాలకి ఆడవాళ్ల సౌందర్యమే ఇన్సిపిరేషన్‌ అయిందని… ఎంతయినా మా ఆడవాళ్లం గ్రేట్!” అంది ఆముక్త గర్వంగా.
మౌనంగా వుండిపోయాడు ద్రోణ,
కర్టెన్‌ తొలగించుకొని రెండు కాఫీ కప్పులతో వచ్చి, ఒకి భర్తకి, రెండవది ఆముక్తకి ఇవ్వబోయి కప్పులోని కాఫీ అంతా ఆముక్త చీరపై పోసింది శృతిక.
ఆ వేడికి చురుక్కుమని, టక్కున లేచి నిలబడి కర్చీఫ్‌తో చీరపై కాఫీ మరకల్ని తుడుచుకొంది ఆముక్త.
”అయ్యో! లోపలకెళ్లి వాష్‌ చేసుకో ఆముక్తా!” అంటూ నొచ్చుకున్నాడు ద్రోణ. భర్త ముఖంలోని ఆ ఫీలింగ్‌ని భరించలేకపోయింది శృతిక. కాఫీయే కదా పడింది. అదేదో యాసిడ్‌ పడినట్లు ఏంటా ఎక్స్‌ప్రెషన్‌ అనుకొంది. తను కావాలని పోసినట్లు వాళ్లకి తెలియకుండా గమనిస్తూ…
”సారీ” అంటూ ”రండి! వాష్‌బేసిన్‌ చూపిస్తాను.” అంది శృతిక.
శృతిక వెంట నడిచింది ఆముక్త.
ఆముక్త వివరాలు తెలుసుకోవాలని…
”మీ వారేం చేస్తారు?” అంది మెల్లగా శృతిక
”రియల్‌ ఎస్టేట్ బిజినెస్‌..” అంది ఆముక్త.
ఇంకేం అడగాలో తోచక అంతకుమించి మోహమాటంగా అన్పించి ”అదిగోండి! అదే వాష్‌బేసిన్‌! అటు వెళ్లండి!” అంటూ చాలా క్యాజువల్‌గా తనకేదో పని వున్నట్లు పక్కకెళ్లింది శృతిక.
ట్యాప్‌ తిప్పి, కాఫీ మరకల్ని కడుక్కుని, వచ్చి ద్రోణ దగ్గర కూర్చుంది ఆముక్త. ఆమెకింకా చిత్రకారుల గురించి తెలుసుకోవాలని వుంది.
”బాపు బొమ్మలా వుంది అంటారు. ఆయన బొమ్మలకి ఎందుకంత ప్రత్యేకత?” అంది ఆముక్త.
”అదొక ప్రత్యేకమైన శైలి. అందుకే బాపు ప్రజల నాలుకపై వుండిపోయాడు. నాకు నచ్చిన వాళ్లలో ప్రస్తుతం బాపు తర్వాత కరుణాకర్‌ ఒకరు. ఆయన బొమ్మలు బావుంటాయి” అన్నాడు ద్రోణ.
”మరి నా కవితకి బొమ్మ…” అని ఆమె అడగబోతుంటే.. ఆ రూంని క్లీన్‌ చేద్దామని శృతిక వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో లోపలకి వచ్చింది. ఎప్పుడైనా ఆ గదిని టైం ప్రకారం శృతికనే క్లీన్‌ చేస్తుంది. వర్కర్‌ని రానివ్వదు.
”చూద్దాం ఆముక్తా! ఆ కవిత గురించి నేను తర్వాత మాట్లాడతాను” అంటూ లేచాడు ద్రోణ.
ఆముక్త ‘నమస్తే’ చెప్పి ఇంటికెళ్లింది.
* * * * *
నిండు పౌర్ణమి కావటంతో వాతావరణం ఆహ్లాదంగా వుంది. స్టాండ్‌, బోర్డ్‌, కలర్స్‌ డాబా మీదకి తీసికెళ్లి, ట్యూబ్‌లైట్ అమర్చుకొని, బొమ్మ వేస్తున్నాడు ద్రోణ.
కొద్ది నిముషాలు గడిచాక కరెంట్ పోవటంతో వెలుగుతున్న ట్యూబ్‌లైట్ ఆరిపోయి వెన్నెలే మిగిలింది.
ఇంట్లో క్యాండిల్‌ దొరక్క చీకట్లో భయమనిపించి, భర్తను వెతుక్కుంటూ ఒక్కో మెట్టు ఎక్కి డాబాపై కొచ్చింది శృతిక.
శృతికను గమనించలేదు ద్రోణ.
అప్పుడే ఏదో కాల్‌ రావటంతో డాబాపై తిరుగుతూ మ్లాడుతున్నాడు. అతను చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు.
మండింది శృతికకు.. ఆ కాల్‌ ఆముక్తదే అనుకొంది. భర్తను చూసి వెన్నెలంటే ఇతనికి ఇష్టం కాబోలు.. వెన్నెల్లో, మెరుపుల్లో, మేఘాల్లో కొందరు సౌందర్యాన్ని వెతుక్కొని ఆరాధిస్తారు, ప్రేమిస్తారు, జీవిస్తారు కదా! తన భర్త కూడా అలాగే అనుకొంది. ఎంతయినా ఆర్టిస్ట్‌ కదా! ఆ మాత్రం రసానుభూతి తప్పకుండా వుంటుందని కూడా అనుకొంది.
కానీ ఇలా తనకి తెలియకుండా డాబాపైకి చేరి ఫోన్లో ఆడవాళ్లతో మ్లాడుతూ తిరుగుతుంటాడని తెలియదు.
ఇప్పుడు తెలిసి – అగ్ని హోత్రినిలా ఓ చూపు చూసి కోపంగా, కసిగా నేలపై కాలితో తన్నింది. ఒక్కో మెట్టు దిగి గదిలోకి వెళ్లింది.
ఆమె మనసంతా చీకటైంది. బయట చీకటిని గమనించే స్థితిలో లేదు. వెలుగు అనేది ఎదురు చూసినా వస్తుంది. చూడకపోయినా వస్తుంది. అలాగే కరెంట్ వచ్చి లైట్లు వెలిగాయి.
ఓ గంట తర్వాత కిందకెళ్లి శృతిక పక్కన పడుకున్నాడు ద్రోణవర్షిత్‌. అతనికి మళ్లీ ఫోన్‌ వచ్చింది. రింగ్‌ విని వెంటనే మొబైల్‌ ఆన్‌ చేసి ‘హలో’ అన్నాడు.
అతని గొంతు వింటుంటే నరనరం మెలిపెట్టినట్లు మొత్తుకోవటంతో అప్పటివరకు ఆపుకొని వున్న కోపాన్ని బయికి లాగింది శృతిక… ఒక్క వుదుటన లేచి కూర్చుని…
”ఎవరి దగ్గరనుండి వచ్చిందండీ ఆ ఫోన్‌?’ అంది గట్టిగా
”ఒక్క నిముషం…” అంటూ శృతిక వైపు చూసి, ఎడిటర్‌ దగ్గరనుండి.. ఏదో సీరియల్‌ పంపుతారట. దానికి నన్ను బొమ్మలు వెయ్యమంటున్నారు” అని చెప్పి…
”ఓ.కె. సర్‌! గుడ్‌నైట్!” అంటూ మొబైల్‌ ఆఫ్‌ చేసి టీపాయ్‌ మీద పెట్టాడు ద్రోణ
”చచ్చిపోతున్నా మీ ఫోన్‌కాల్స్‌తో రాత్రీ, పగలూ…” అంది పిచ్చెక్కినట్లు తలపట్టుకొని శృతిక.
”ఏమైంది శృతీ! ఏంటలా వున్నావ్‌?” అన్నాడు ద్రోణ విషయం అర్థంకాక … ఇవాళెందుకో శృతికలో చాలా మార్పు కన్పిస్తోంది ద్రోణకి.
”ఉదయం నుండి మీ ఇద్దరు గదిలో కూర్చుని మాట్లాడుకుంటూనే వున్నారు. మళ్లీ ఈ ఫోన్లేంటి? నేను వుండాలా వద్దా?” అంది
ఇప్పుడర్థమైంది ద్రోణకి.. ఆముక్త గురించి అతిగా ఆలోచిస్తోందని..
”నేను ఆర్టిస్ట్‌ని శృతీ! నా దగ్గరికి అమ్మాయిలొస్తారు, అబ్బాయిలొస్తారు, ఫోన్లు కూడా చేస్తారు. ఎవర్ని చూసినా, ఏ ఫోన్‌ విన్నా నువ్విలా హర్టయి, రియాక్ట్‌ కావటం పద్ధతి కాదు. నేనేదో తప్పుచేస్తున్నవాడిలా నీకు సంజాయిషీ ఇచ్చుకోవటం నాకు నచ్చని పని… ఇంకెప్పుడూ నువ్విలా ఫీల్‌ కాకు…” అన్నాడు అతి ముఖ్యమైన విషయం చెబుతున్నట్లు…
పొగరుగా తలెగరేసింది
”మేనత్త కొడుకు నెత్తినపెట్టుకొని చూస్తాడని మావాళ్లు నాకెన్నో ఆశలు పెట్టి ఈ పెళ్లి చేశారు. ఒక్క రోజన్నా నేను మనశ్శాంతిగా లేను. ఎంత ఆర్టిస్ట్‌ అయితే మాత్రం ఈ అమ్మాయిలేంటి? ఈ ఫోన్లేంటి?” అంది.
”నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావ్‌ శృతీ!” అంటూ నచ్చ చెప్పబోయాడు.
”నన్ను తాక్కండి! ఈ ముసుగు బతుకులంటేనే నాకు చిరాకు.. ఎందుకండీ ఈ దొంగ నాటకాలు? ఎవర్ని సంతోషపెట్టాలని…?” అంది.
”ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. పడుకో…” అన్నాడు ద్రోణ.
”నేను పడుకుంటే మళ్లీ ఫోన్లో మ్లాడుకుంటారు. అంతేగా?” అంది. ఆమె కళ్లు ఎర్రగా మారి ఆమె బుగ్గలతో పోటీపడ్తున్నాయి.
”నీకెంత చెప్పినా అర్థం కానప్పుడు నేనేం చెయ్యలేను. నేను పడుకుంటున్నా.. లైటాపు” అన్నాడు.
ఆమె కదల్లేదు. లైటాపలేదు. అతనే లేచి స్విచ్‌ ఆపి, పడుకున్నాడు. అతను పడుకున్నా.. ఆమె మాట్లాడుతూనే వుంది.
నిద్రపోతున్నట్లు అతని ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు చూసి ఉడికిపోతున్న దానిలా లేచి నిలబడింది.
ఆ గదిలో వాకింగ్‌ చేస్తున్న దానిలా సీరియస్‌గా అటు, ఇటు తిరిగింది. తిరుగుతూనే వుంది.
… ఒక కన్ను కొద్దిగా తెరిచి శృతికను చూశాడు ద్రోణ
ఇలా అర్ధరాత్రులు కూడా వాకింగ్‌ చెయ్యొచ్చని తెలిస్తే – ఆడవాళ్లు అర్ధరాత్రులు బయటకెళ్లి షాపులు తెరిపించి, షాపింగ్‌ చేస్తారు కాబోలు. అప్పుడు మొదలవుతాయి కదా ఆర్థిక మాంద్యం బాగాలేదనే మగవాళ్లకి కష్టాలు…!
నేనిప్పుడు నిద్ర నించకపోతే శృతిక తన నోటి వాక్‌ పరిమళాల వడదెబ్బల రుచి చూపిస్తుంది. అయ్యో! నా బాషేంటి ఇలా తయారయింది? నా చేతిలో వుండేది కలమా? కుంచా? అని మనసులో అనుకుంటూ తెరిచిన ఆ ఒక్క కన్నును కూడా టక్కున మూసుకున్నాడు.
శృతికకు నిద్రరావటం లేదు.
చక్కగా జీవితాన్ని అనుభవించాల్సినప్పుడు భర్తతో అనుకూలత లేక మనసును అనుమానమనే రంపంతో కోసుకుంటూ మౌనంగా, ఒంటరితనంతో స్నేహం చెయ్యాలంటే ఏ స్త్రీకైనా కష్టమే.. ప్రేమ, ఆశ, నమ్మకం ఇవి వుంటేనే జీవితం. ఇవి లేనప్పుడు సారంలేని మట్టిలో వేసిన మొక్కలా వెలవెలపోతుంది. అది అర్థం చేసుకోకుండా తను ఏదనుకుంటే అదే నిజమని భర్త బిహేవియర్‌ని నెగెటివ్‌ కోణంలో చూడటం అలవాటు చేసుకున్నాక ఏది కష్టమో, ఏది కష్టం కాదో తెలుసుకునే స్థితిని దాటిపోతుంది ఏ భార్య అయినా… అదే స్థితిలో వుంది శృతిక.
భర్త నిద్రపోతుంటే.. మతిస్థిమితం లేకుండా ఆ గదిలో ఒంటరిగా తిరుగుతూనే వుంది శృతిక.
*****
కొడుకును బి.టెక్‌లో జాయిన్‌చేసి, హాస్టల్లో వదిలి కూతురు దగ్గరికి వచ్చాడు నరేంద్రనాధ్‌.
భోంచేసి డాబామీద కెళ్లి పడుకున్న తండ్రి దగ్గరకి వెళ్లి…
”నాన్నా… పడుకున్నారా?” అంది శృతిక.
”లేదు శృతీ! ఇప్పుడే ద్రోణ మాట్లాడివెళ్లాడు. ఆర్ట్‌లో అతని ప్రోగ్రెస్‌ వింటుంటే మనసంతా హాయిగా అన్పిస్తోంది. ఈ రోజు ఈ స్థితిలో వున్న ద్రోణ వెనక ఎంత సాధన, తపన వున్నాయో చూడకపోయినా తెలుస్తోంది” అన్నాడు. అల్లుడ్ని చూస్తుంటే ఆయనకెంత గర్వంగా వుందో అంతకన్నా ఎక్కువ తృప్తి వుంది.
‘ఆర్ట్‌ పేరుతో ఆయన దగ్గరకి వచ్చే అమ్మాయిల్ని, ఆయనకి వచ్చే ఫోన్‌కాల్స్‌ని తట్టుకోలేకపోతున్నాను నాన్నా… నీ మాటవిని, హాస్టల్లోవుండి నా చదువుని అలాగే కంటిన్యూ చేసి వుంటే బావుండేది. ఇప్పుడు పశ్చాత్తాప పడ్తున్నాను.’ అని తండ్రితో చెప్పలేక…
”అమ్మ ఎలావుంది నాన్నా. నన్ను గుర్తు చేసుకుంటుందా?” అంది.
”అవును శృతీ! పెద్దదేమో హాయిగా భర్త, పిల్లల్తో వుంటూ జాబ్‌ చేసుకుంటోంది. చిన్నది కూడా చదువు మానుకోకుండా జాబ్‌ వచ్చేంతవరకు చదివి వుంటే బావుండేది అని ఒక్కోసారి బాధపడినా అనేకసార్లు ద్రోణలాంటి భర్త అందరికి దొరుకుతాడా?” అని మురిసిపోతోంది మీ అమ్మ. చుట్టుపక్కల వాళ్లకి కూడా ఇలాగే చెప్పుకుంటోంది” అన్నాడు నరేంద్రనాద్‌.
ఆ మాటలు నచ్చనట్లు ముఖం కాస్త ముడుచుకొని..
”నేను అక్క దగ్గరకి వెళ్తాను నాన్నా…” అంది.
”ఎందుకు?” అన్నాడు ఆమెనే చూస్తూ నరేంద్రనాద్‌
”చూడాలని వుంది. పైగా కాల్‌ చేసింది” అంది.
”అది అలాగే చేస్తుంది లేమ్మా! మొన్ననేగా మీ అమ్మ వెళ్లొచ్చింది. నువ్వెళ్తే ఇక్కడ వర్షిత్‌కి ఇబ్బంది అవుతుంది”’ అన్నాడు. అల్లుడు మీద ప్రేమ పెరిగినప్పుడు వర్షిత్‌ అని పిలవటం ఆయనకి ఇష్టం.
తండ్రి ఇష్టాలు శృతికకు తెలియనివి కావు.
”నాకు తెలియదా నాన్నా! ఆయనకి నేను లేకుంటే ఎంత ఇబ్బందో! కాకుంటే అక్కను చూడాలని వుంది. ఆయన కూడా ఇంట్లో వుండట్లేదు. ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ వుందని ఢిల్లీ వెళ్తున్నారు.” అంది
”ఇంకేం ! నువ్వుకూడా ఢిల్లీ వెళ్లు…” అన్నాడు
”నేను వెళ్లట్లేదు…” అంది.
”ఏం! ఎందుకు? వర్షిత్‌ వద్దన్నాడా?”
”ఆయన రమ్మంటున్నాడు నాన్నా…నాకు ఇంట్రస్ట్‌ లేదు. అందుకే వెళ్లటం లేదు.” అంది.
”మరి వర్షిత్‌ ఏమన్నాడు?”
”ఎలాగూ ఢిల్లీ రానంటున్నావ్‌ కదా! ఒక్కదానివి ఇక్కడేం చేస్తావ్‌? మీ అక్కదగ్గరికి వెళ్లు అన్నాడు” అంది ముఖాన్ని తండ్రికి కన్పించకుండా పక్కకి తిప్పుకొని..
”సరే!” అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు నరేంద్రనాద్‌.
”రేపు మీతో వస్తాను నాన్నా ! నన్ను అక్క దగ్గర వదిలి మీరు ఇంటికెళ్లండి’ అంది శృతిక.
”అలాగే శృతీ! వెళ్లి పడుకో!” అంటూ శృతిక చెంప నిమిరాడు నరేంద్రనాద్‌.
తండ్రి అలా అనగానే వెళ్లి బట్టలు సర్దుకొంది.
ఆ రాత్రి ద్రోణ ఎంత బ్రతిమాలినా అతని మాట వినలేదు శృతిక.
*****
తెల్లవారింది.
భర్తకి చెప్పి, తండ్రితో బయలుదేరింది శృతిక.
శృతికను కృతిక ఇంట్లో దింపి, తన ఇంటికెళ్లాడు నరేంద్రనాధ్‌. శృతికను చూడగానే… ”సుత్తి పిన్నొచ్చింది” అంటూ ఎదురెళ్లి ఆమె కాళ్లను చుట్టుకొంది ఫోర్త్‌ క్లాసు చదువుతున్న టీనా. టీనాకి ‘శృతి’ పలకటం స్పష్టంగా రాదు. ఎన్నిసార్లు చెప్పినా సుత్తిని జోడించందే సింగిల్‌గా ‘పిన్ని’ అని పిలవదు. అక్క కూతురు కదా ఎలా పిలిచినా శృతికకు ముద్దుగానే వుంటుంది.
అంతలో కృతిక పెద్దకూతురు మోనా వచ్చింది. పిన్నికి దగ్గరగా వచ్చి… ”పిన్నీ! మమ్మీ ఇంకా ఆఫీసునుండి రాలేదు. మమ్మీ కన్నా ముందు మేమే వచ్చాం… రోజూ ఇలాగే వస్తుంటాం.” అంది హ్యాపీగా మోనా. మోనా ఎయిత్‌ క్లాస్‌ చదువుతోంది.
”అలాగా!” అంటూ వాళ్ల తలలు నిమిరి… వెంటనే కొంగును నడుం దగ్గర దోపి… ”మీరు కాళ్లూ, ముఖం కడుక్కుని డ్రస్‌ మార్చుకోండి! నేను మీకు టిఫిన్‌ రెడీ చేసి పెడతాను” అంటూ ఫ్రిజ్‌లోంచి దోశపిండి తీసి చకచక దోశలు వేసి పిల్లలకి పెట్టింది.
పిల్లలు పాలు తాగుతుండగా వచ్చాడు శృతిక బావ అనిమేష్‌ చంద్ర. అతనిది క్యాంపులు తిరిగే ఉద్యోగం కావటం వల్ల ఇంట్లో గడిపే రోజులు తక్కువగా వుంటాయి. జర్నీవల్ల కాబోలు నలిగిన బట్టల్లో అలసిపోయినట్లు కన్పిస్తున్నాడు అనిమేష్‌ చంద్ర.
శృతికను చూడగానే పలకరించాడు. తను కూడా ఇప్పుడే వచ్చినట్లు చెప్పింది శృతిక.
”నానమ్మేది మోనా? కన్పించటంలేదు?” అన్నాడు పెద్దకూతురు వైపు చూసి అనిమేష్‌ చంద్ర.
అతను క్యాంపునుండి రాగానే తల్లి వచ్చి కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతున్నంత సేపు కొడుకునే చూస్తూ అక్కడే నిలబడుతుంది. ఇది అనిమేష్‌ చంద్రకి చాలా ఇష్టం. వంట కూడా తల్లే ఎక్కువ చేస్తుంది. అదేమని అంటే ‘కృతికని ఆఫీసుకి వెళ్లనీరా! వంటదేముంది…” అంటుంది.
”నానమ్మతో మమ్మీ గొడవపెట్టుకొని వెళ్లగొట్టింది డాడీ” అంది మోనా
”కాదు డాడీ! నానమ్మే మమ్మీతో గొడవపెట్టుకొని వెళ్లింది” అంది టీనా.
ఎవరిది కరక్టో తెలుసుకోలేక వాళ్లు రెడీ అయినట్లు అన్పించి…
”సరే! మీరు ట్యూషన్‌కి వెళ్లండి! టైమయింది.” అంటూ అతను స్నానానికి వెళ్లాడు.
మోనా పెద్దది కాబట్టి ఒక్కతే వెళ్లగలదు. వెళ్లిపోయింది. టీనా వెళ్లలేదు. టీనాను రోజూ వాళ్ల నానమ్మనే స్కూల్‌కి, ట్యూషన్‌కి తీసికెళ్తుంది.
అది తెలిసిన శృతిక టీనాను ట్యూషన్లో వదిలి వచ్చింది
ఆఫీసునుండి ఇంటికొచ్చిన కృతిక శృతికను చూసి హాయిగా ఊపిరి పీల్చుకొంది.
”తల పగిలిపోతోంది శృతీ! కాఫీ యివ్వు…” అంటూ వాష్‌బేసిన్‌ దగ్గరకెళ్లి ముఖం కడుక్కొని, డ్రస్‌ మార్చుకొని వచ్చి ఫ్యాన్‌కింద కూర్చుంది కృతిక.
”ఇదిగో అక్కా! కాఫీ…” అంది శృతిక కాఫీ కప్పును అక్క చేతికి ఇస్తు…
కాఫీ సిప్‌ చేస్తూ…
”థ్యాంక్స్‌! శృతీ! ఇవాళ మా అత్తగారు నేనుండనంటూ వెళ్లిపోయినప్పటినుండి ఒకటే కంగారుగా వుంది. మా ఆఫీసార్డర్‌ మారినప్పటినుండి పని ఎక్కువై ఇంటికి లేటుగా వస్తున్నాను. ఈ పిల్లలతో ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో నువ్వొచ్చి ఆదుకున్నావు…” అంది బోలెడంత కృతజ్ఞత కురిపిస్తూ….
… ఒక చిన్న స్మైలిచ్చి ” ఇట్స్ ఓ.కె అక్కా! నువ్వేం కంగారుపడకు..” అంది శృతిక.
అక్కంటే అపురూపం శృతికకు…
చిన్నప్పుడు తను చేసిన తప్పులన్నీ అక్క తనమీద వేసుకొని, తనకెంత సపోర్ట్‌గా వుండేదో శృతికకు ఇంకా గుర్తుంది.
కృతిక ఆఫీసు విషయాలు చెబుతూంటే వింటూ కూర్చుంది శృతిక.
*****
ఆమె మాట్లాడలేదు. పని వత్తిడివల్లనేమో ఆమె ముఖంపై చిరు చెమట ముత్యాలు అద్దినట్లు మెరుస్తోంది. గమ్మత్తుగా అన్పించింది ద్రోణకి…
నెమ్మదిగా ఆమెను ఓ చేత్తో బంధించి, ఇంకో చేత్తో ఆమె తల వెనకభాగాన్ని మృదువుగా పట్టుకొని ఆమె వూహించని విధంగా చెమటలతో తడిసిన ఆమె ముఖాన్ని పెదవులతో అద్ది, సుగంధ పరిమళాన్ని రాస్తుంటే దాన్ని ఏమాత్రం ఆస్వాదించలేని దానిలా మెల్లగా విడిపించుకొని…
”ఇప్పుడు అక్కయ్య పిల్లలొస్తారు. వాళ్లను రెడీ చేసి ట్యూషన్‌కి పంపాలి. అక్క ఆఫీసు నుండి వచ్చేలోపల వంట చేయాలి. పిల్లలు ట్యూషన్‌ నుండి వచ్చాక వాళ్లతో హోంవర్క్‌ చేయించాలి. బావకూడా లేడు. అక్క బాగా అలసిపోతోంది ఆఫీసు పనితో… ” అని పైకి అనలేక.
”నాకు హెడ్డేక్‌గా వుంది. ఇప్పుడు రాలేను” అంది
”టాబ్‌లెట్ వేసుకొని కాఫీ తాగు, అదే తగ్గుతుంది. అది చూడదగిన ఎగ్జిబిషన్‌. చాలామంది ఆర్టిస్ట్‌లు వస్తున్నారు. వాళ్లలో ఎంతోమంది ప్రముఖులున్నారు. నిన్ను వాళ్లకి పరిచయం చేస్తాను.” అన్నాడు.
అక్కడికొచ్చే అనేకమందిలో తనో ప్రముఖమైన వ్యక్తిలా తిరుగుతున్నప్పుడు పక్కన తన భార్య వుండి తనని గమనిస్తూంటే అదో అంతు తెలియని పులకింత ద్రోణకి… సొంతవాళ్ల అభినందనలు కన్పించని బలం కళాకారులకి.
”నేను రాను. నాకు పడుకోవాలని వుంది.” అంది శృతిక.
అతను బలవంత పెట్టలేదు.
”ఓ.కె. బై…” అంటూ అతను వెళ్లబోతూ, అంతలోనే తిరిగి చూసి…
”నువ్వెప్పుడొస్తున్నావు మన ఇంటికి…” అన్నాడు
”అక్కయ్య పిల్లల్తో ఒక్కతే చేసుకోలేక పోతోంది. బావకూడా ఇంట్లో సరిగ్గా వుండటంలేదు. వాళ్లత్తగారు వచ్చేంతవరకు వుండి వస్తాను. నాన్నతో కూడా అదే చెప్పాను” అంది.
నరేంద్రనాధ్‌ అంటే ద్రోణకి గౌరవం. ఆ గౌరవాన్ని ఆయనెప్పుడు పోగొట్టుకోలేదు.
”సరే!” అన్నట్లు తలపంకించాడు ద్రోణ.
”మరి నేను అప్పటివరకు ఇక్కడే వుండనా?” అంది. కారణం అది కాకపోయినా అదే అన్నట్లు ముఖం పెట్టి…
”వాళ్లత్తగారు రాగానే కాల్‌చెయ్యి నేనొచ్చి తీసికెళ్తాను” అన్నాడు
”అలాగే…” అంది
అతను వెళ్లాక – లోపలకెళ్లి వంట చేసింది.
పిల్లలొచ్చాక – అన్నం పెట్టి, హోంవర్క్‌ చేయించింది.
ఇంకా రాని అక్క కోసం ఎదురుచూస్తోంది.
అప్పుడొచ్చింది కృతిక.
లేటయిందేమని అడగలేదు శృతిక. ఆఫీసన్నాక లేటు కాకుండా వుంటుందా? డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకి వెళ్లి, ఇద్దరి పేట్లలో అన్నం పెట్టి కూరలు వేస్తుండగా…
”తలనొప్పిగా వుందన్నావట… ద్రోణ చెప్పాడు. ఎలా వుంది శృతీ?” అంది వాష్‌ చేసుకున్న చేతుల్ని తుడుచుకుంటూ నిలబడి కృతిక.
”తగ్గిందక్కా! వచ్చి కూర్చో! తిందాం! ఆకలిగా వుంది” అంది మనసులో మాత్రం ద్రోణ ఎక్కడ కలిశాడు అక్కకి అనుకుంది శృతిక.
”ద్రోణ ఫోన్‌ చేస్తే ఆఫీసునుండి డైరెక్ట్‌గా ‘ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌’ దగ్గరకి వెళ్లాను శృతీ! మా కొలిగ్స్‌ కూడా వచ్చారు. చాలా గ్రాండ్‌గా వుందక్కడ! అన్ని బొమ్మలు బాగున్నాయి. ముఖ్యంగా ద్రోణ బొమ్మలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మా కొలీగ్స్‌కి నచ్చి కొన్ని కొనుక్కెళ్లారు. నేను ద్రోణ వర్షిత్‌ వదినను అని చెప్పుకోవటం నాకెంతో గర్వంగా అన్పించింది.” అంది టేబుల్‌ ముందున్న చెయిర్‌ కొద్దిగా జరిపి కూర్చుంటూ…
శృతిక విోంంది.
”నువ్వు కూడా వచ్చి చూసి వుంటే బావుండేది” అంది అన్నం కలుపుతూ
”ఆయన గదిని శుభ్రం చేస్తూ ఆ బొమ్మల్ని రోజూ చూస్తూనే వున్నాను కదక్కా! కాకుంటే ఆయన మది గదిలో లేననే నా బాధ…” అని పైకి అంటే అక్క బాధపడ్తుందని మౌనంగా అన్నం కెలుకుతోంది శృతిక.
అది గమనించలేదు కృతిక. అలసిపోయి వుండటంతో గబగబ తిని, పిల్లల పక్కన పడుకొని నిద్రపోయింది.
శృతిక మాత్రం నిద్రపట్టక అటు, ఇటు కదులుతూ పడుకొంది.
*****
శ్యాంవర్ధన్‌ తాగకపోతే బావుంటాడు. అలాంటప్పుడు ధైర్యంగా దగ్గరకి వెళ్తుంది సంవేద. తాగినప్పుడు మాత్రం అడుగుదూరంలో వుంటుంది. దగ్గరకి రమ్మని బలవంతం చేస్తాడు. అతని దగ్గర వచ్చే వాసనను భరించలేక ఆమె వెళ్లదు. తాగనప్పుడు కూడా అదే వాసనను ఊహించుకొని భయపడ్తుంది. లోపలనుండి తన్నుకొచ్చే యావగింపును పెదవి చివరన ఆపుకుంటుంది.
ఎన్నోసార్లు వాంతి చేసుకుంది. అతను చేసుకున్న వాంతిని ఎత్తిపోసింది.
ఈ మధ్యన మరీ ఎక్కువగా తాగుతున్నాడు. ఆఫీసుకి వెళ్లకుండా రెండు రోజుల నుండి ఇంట్లోనే పడుకున్నాడు.
ఈ తాగడమనే పనిని భర్త ఇంత సిన్సియర్‌గా ఎందుకు చేస్తున్నాడో సంవేదకి అర్థం కావటంలేదు. అతను తాగే విధానం చూస్తుంటే… ఎవరో తాగమని ప్రోత్సహిస్తున్నట్లు, తరుముతున్నట్లు, తిడుతున్నట్లు, శాపనార్థాలు పెడ్తున్నట్లు, తాగకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తామన్నట్లు, ఎంత తాగితే అంత విజయమన్నట్లు వుంటుంది. అలా తాగితే గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని తెలిసి కూడా తాగుతున్నాడు.
”పెళ్లికి ముందు నా కొడుకు ఇలా లేడు. ఇప్పుడు ఇలా ఒళ్లు తెలియకుండా తాగి పడిపోతున్నాడు. ఇదేనా మొగుడ్ని మలచుకునే పద్ధతి?” అంటూ ఎప్పుడు కన్పిస్తే అప్పుడు చెంపమీద కొట్టినట్లు మాట్లాడుతోంది సంవేద అత్తగారు దేవికారాణి.
అత్తగారు ఏదో బాధతో అంటోంది అని అనుకోకుండా తన కర్మలా భావించి చాటుకెళ్లి ఏడ్చుకొంది సంవేద. ఎంత ఏడ్చుకున్నా మలచుకోవటం అంటే ఏమిటో ఆమెకు తెలియలేదు.
‘అతను మనిషి కదా! రాయి అయితే ఇంకో రాయితో కొట్టి ఆకారాన్ని మలవొచ్చు. మాటలు చెప్పటం తేలికే.. తనదాకా వస్తేనే తెలుస్తాయి లొసుగులు. అన్నట్లు ఆవిడే మాత్రం మలుచుకుందో తన భర్తను’ అని లోలోపల అనుకుంటూ…
”ఏమండీ! మీరిలా తాగుతుంటే అందరు నన్ను అంటున్నారు. నేను మిమ్మల్ని మార్చుకోలేక పోతున్నానట… అందుకే ఇలా తయారయ్యారట. అయినా ఒకరు మారిస్తేనే మారటమేంటి? మీ అంతట మీరు తాగకుండా వుండలేరా? మీ తాగుడుకన్నా వాళ్ల మాటలే నన్ను బాధపెడ్తున్నాయి…” అంది సంవేద.
”ఏంటి టీచరమ్మా! నీ లెక్చర్‌ నిన్నిలా చూస్తుంటే చేతిలో బెత్తమొక్కటే తక్కువనిపిస్తోంది. ఏదీ ఇలారా!” అన్నాడు చాలా క్యాజువల్‌గా, ఎగతాళిగా…
ఆమె రాలేదు. చేయి చాపి జడ అందుకున్నాడు గట్టిగా లాగటంతో.. ”అబ్బా” అంటూ జడ మొదట్లో పట్టుకొని నెమ్మదిగా అతని దగ్గరకి వెళ్లింది.
అదోలా నవ్వి… ”ఇన్ని రోజులు ఇంత పెద్ద జడతో ఏం పని, ఆయిల్‌ దండగ అనుకునేవాడిని.. ఇప్పుడు చూడు దీని ఉపయోగం ఎంతవుందో…!” అంటూ ఆ జడను అలాగే పట్టుకొని ముఖం మీదకి వంగాడు.
”నాకు కడుపులో తిప్పుతోంది. ఒకసారి నాతోరండి! మీకిప్పుడు కౌన్సిలింగ్‌ అవసరం…” అంది ప్రాధేయపడ్తూ అప్పటికే అనేకసార్లు చెప్పి, ఇక ఇదే ఆఖరిసారి అన్నట్లు చెప్పింది.
ఆమె జడను వదిలి… ”సరే! వేదా! నీమాట ఎందుకు కాదనాలి.. వస్తాను అక్కడ నన్ను కూర్చోబెట్టి నాలుగు మాటలు చెబుతారు. అవసరమైతే ట్రాన్స్‌లోకి తీసికెళ్తారు. .. అంతమాత్రాన నా ఎంజాయ్‌మెంట్ ని వదులకుంటా ననుకుంటున్నావా?” అన్నాడు.
చిన్నవయసునుండి సామాజికపరంగా, ఆర్థికపరంగా, కుటుంబపరంగా ఎన్నో బావోద్వేగాలను చవి చూసి, ఎలాంటి వాతావరణానికైనా తట్టుకొని నిలబడగలిగే శక్తిని సాధించిన దానిలా ఒక్కక్షణం ఓర్పుగా కళ్లు మూసుకొని, తిరిగి అతనివైపు చూస్తూ…
”ఇది ఎంజాయ్‌మెంట్? ఈ కంపు ఎంజాయ్‌మెంట్ ? ఒకసారి అద్దంలో చూసుకోండి! అందులో మిమ్మల్ని మీరు చూసుకోలేక దాన్ని పగులగొడతారు”అంది.
లోలోన ఉలికిపాటుతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు శ్యాంవర్ధన్‌ ‘నువ్వు బాగలేవు’ అంటే అతను తట్టుకోలేడు అతనిపట్ల అతనికి ప్రేమ వుంది. శ్రద్ధ వుంది. ఎంత తాగినా గ్లామర్‌ తగ్గకూడదన్న ఇది వుంది. అందుకే…
”నిజంగానే నేను బాగాలేనా వేదా?” అన్నాడు ముఖాన్ని చేతులతో తడుముకుంటూ….
”బాగుండటమంటే ఇలాగేనా ! ఆ ముఖం చూడండి! ఎలా ఉబ్బిందో…! ఆ కళ్లేమో నెత్తుటి ముద్దల్లా…! ఆ జుట్టేమో అస్తవ్యస్తంగా…! ఒళ్లేమో దీర్ఘరోగిలా తూలుతూ…! ఇలావుంటే బావున్నట్లా?” అంది ఇనుమును వేడి మీద వున్నప్పుడే వంచాలన్న సూత్రం తెలిసినదానిలా…
అతని ముఖం పాలిపోయింది.
”ఒక్కసారి ఆలోచించి చూడండి! ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే తప్పేం లేదుగా. ఒకవేళ మీరు మారతారేమో…” అంది.
”నేను కావాలనే తాగుతున్నాను. ఇది రోగం కాదు. మందులు వేసుకుంటే తగ్గటానికి … వ్యసనం. అంత త్వరగా తగ్గదు” అన్నాడు.
” ఏ వ్యసనానికైనా ‘మానసిక రుగ్మతే’ కారణం. మంచి మానసిక నిపుణులతో వైద్యం చేయించుకుంటే త్వరగానే తగ్గుతుంది. ఇదేమైనా ఆర్థిక లోపమా ఒక్కరోజులో జయించలేకపోవటానికి…” అంది. ఆమెలో కలుగుతున్న ఉద్విగ్నతను, వ్యాకులతను, పొంగిపొర్లే దుఃఖాన్ని మిళితం చేసి అతని హృదయం కరిగేలా వ్యక్తం చేసింది.
ఇద్దరు కలిసి హెల్పింగ్‌ హ్యాండ్‌ స్వచ్ఛంద సంస్థ వాళ్లు నడుపుతున్న మద్యపాన వ్యసనవిముక్తి కేంద్రానికి వెళ్లారు.
అక్కడ పూలమొక్కలతో నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లతో హాయిగా అన్పిస్తోంది. లోపలకి వెళ్లగానే ఎదురుగా కూర్చుని వున్న ఓ వ్యక్తి సంవేదను, శ్యాంవర్ధన్‌ను ప్రేమగా పలకరించాడు. కూర్చోమని బెంచీ వైపు చూపించాడు.
వాళ్లు కూర్చున్నారు.
అక్కడ రెండు బెంచీలపై తాగుడికి బానిసలైన మగవాళ్లు, వాళ్ల తాలూకు ఆడవాళ్లు కూర్చుని వున్నారు. వాళ్లలో కొంతమంది లివరు సైతం పాడై, చెంపలు లోతుకి పోయి వికార స్వరూపంతో వున్నారు.. కొంతమందికి ట్రీట్మెంట్ పనిచేసినట్లు ఇప్పుడిప్పుడే కొత్తకళను సంతరించుకొని వున్నారు.
కొంతమంది తాగుబోతుల భార్యలు తమ భర్తలకి ఏదో నచ్చచెబుతూ వాళ్లతో కొట్టించుకొని ఏడుస్తున్నారు. ఆ ఏడుపుకి శ్యాంవర్ధన్‌ చలించాడు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలాంటి సమస్యనే పక్కవారు ఎలా పరిష్కరించుకుంటున్నారో తెలుసుకోవాలన్నట్లు ఆసక్తిగా ఎలా చూస్తారో అలా చూస్తోంది సంవేద.
ఒకతన్ని కూర్చోబెట్టి సైకాలజిస్ట్‌ మాట్లాడుతున్నాడు.
”మొదటి డ్రింకు ఎప్పుడు మొదలు పెట్టారు? అప్పట్లో ఎంత తాగేవారు? ఇప్పుడెంత తాగుతున్నారు? ప్రస్తుతం తాగి వున్నారా?” అని ప్రశ్నించాడు సైకాలజిస్ట్‌.
అతను సమాధానాలు చెబుతున్నాడు.
”మీరిక్కడ నెలరోజులు వుండవలసి వస్తుంది. రెండు, మూడు సిట్టింగ్‌లు తీసుకుంటాం…” అన్నాడు సైకాలజిస్టు.
”నెల రోజులా! నేను వుండను. వున్నా మీమాట వినను. నన్నెవరూ మార్చలేరు. మీరే కాదు. ఆ దేవుడు కూడా … నేను కావాలనే తాగుతున్నాను. నన్నెలా మాన్పిస్తారు?” అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. అతనికింకా తాగిన మత్తు వదల్లేదు.
”మా దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్ తో చాలామంది తాగుడు మాని సంతోషంగా వున్నారు. అలాగే మీరు కూడా ” అన్నాడు సైకాలజిస్ట్‌.
అంతలో ఓ యువకుడు వచ్చి సంవేద ముందు నిలబడి, ఆమెనే చూస్తుంటే – శ్యాంవర్ధన్‌ బిత్తరపోయి… ‘ఎవరు నువ్వు? అన్నట్లు చూశాడు.’ సంవేద కూడా అర్థం కానట్లు చూసింది.
సంవేద కళ్లలోకి చూస్తూ… ” నాకోసమే చూస్తున్నావు కదూ! సారీ! లేటయింది. పద ఇంటి కెళ్దాం.” అంటూ సంవేద చేయి పట్టుకోబోయాడు.
క్షణంలో అలర్టయిన శ్యాంవర్ధన్‌ ఆ యువకుడి కాలర్‌ పట్టుకొని…
”ఎవడ్రా నువ్వు? నా భార్యను పట్టుకోబోతున్నావ్‌!” అంటూ ఆ చెంపా, ఈ చెంపా వాయించాడు.
ఆ చర్యకి అందరు లేచి నిలబడి అవాక్కయి చూస్తున్నారు. భర్త తాగి వుంటే? ఇలా తనని సేవ్‌ చెయ్యగలిగి వుండేవాడా అనుకొంది సంవేద.
సైకాలజిస్ట్‌ వెంటనే లేచి వచ్చి శ్యాంవర్ధన్‌న్ని పట్టుకొని ఆపుతూ…
”కోప్పడకండి! అతనిక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మేమిచ్చిన మెడికల్‌ ట్రీట్మెంట్ వల్ల ఆల్కహాల్‌ ప్రభావం తగ్గి భ్రమలు వచ్చి మగతగా, మత్తుగా విపరీత ధోరణిలో మాట్లాడుతున్నాడు… మీరేమీ అనుకోకండి!” అంటూ తిరిగివెళ్లి అతని స్లీో కూర్చున్నాడు.
శ్యాంవర్ధన్‌ ఆ యువకుడ్ని వదిలేశాడు.
అక్కడ చాలామంది అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేం ప్రపంచంరా అన్నట్లు.. ఆ పరిసరాలను చూస్తూ, ఆ మనుషుల మధ్యన కూర్చోలేనట్లు సంవేద చేయిపట్టుకొని.
”రా! వెళ్దాం!” అంటూ ఆమెను అక్కడ నుండి లాక్కెళ్లాడు శ్యాంవర్ధన్‌
తనతో తాగుడు మాన్పించాలన్న ఆశతోనే కదా సంవేద ఇలాంటి చోటుకి వచ్చి, ఇలాటి సిట్యువేషన్‌ని ఎదుర్కోవలసి వచ్చింది? తాగుడువల్ల మనుషులు ఇంత భీభత్సంగా మారతారా? సంవేద బాధను అర్థం చేసుకోటానికి తన మనసును తను ఒప్పించుకొని, తను మారితే వచ్చే లాభాలేమిటో బేరీజు వేసుకుంటున్నాడు శ్యాంవర్ధన్‌.
రోడ్డుమీద కొందరు వ్యక్తులు గుమిగూడి వుండటం చూసి ఏమి అని అక్కడ ఆగి వాళ్లవైపు వెళ్లారు శ్యాంవర్ధన్‌, సంవేద.
ఒకతను నేలమీద పడివున్నాడు. శ్వాస ఆడుతున్నా స్పృహలో లేడు. డ్రస్‌ను బట్టి చూస్తే ఆఫీసర్‌లా ఉన్నాడు.
”తప్పతాగి పడిపోయాడు. ఎవరో ఏమో! జేబులో విజింగ్‌ కార్డుందేమో చూసి వాళ్లకి ఫోన్‌ చెయ్యండి!” అని అనేవాళ్లే కాని చేసేవాళ్లు లేరక్కడ.. నలుగురు చూసి వెళ్తుంటే ఇంకో నలుగురు చేరుతున్నారు. ప్రపంచంలో వుండే అసహ్యాన్ని, దరిద్రాన్ని చూసినట్లు చూసి ముఖం అదోలా పెట్టుకొని వెళ్తున్నారు. వాహనాలకి అడ్డంగా వుంటే తొక్కేస్తాయని జాలితో అతని చేతులు పట్టుకొని లేపలేక పక్కకి ఈడ్చి వదిలి వెళ్లారు.. నిషాలో చచ్చినట్లు పడి వున్నాడు.
ఉత్కంఠతో మనుషుల మధ్యలోంచి తొంగి చూశారు ప్రేక్షకుల్లా సంవేద, శ్యాంవర్ధన్‌.
”బాగా తాగినట్లున్నాడండీ!” అంటూ అక్కడ ఎక్కువసేపు నిలబడకుండా చాలా క్యాజువల్‌గా భర్త వైపు చూసి ”రండి! వెళ్దాం!” అంది.
ఆ దృశ్యాన్ని చూస్తుంటే శ్యాంవర్ధన్‌ కళ్లలో సన్ని నీటిపొర కదిలింది. కొద్దినిమిషాల క్రితం ఇదే స్థితిలో తనుండి వుంటే తన భార్యను కాపాడుకోగలిగేవాడా? నీళ్ల టబ్‌లో చేయిపెట్టి కెలికినట్టు మనసంతా వికలమైంది. ఎవరో గుండెను తడుతుంటే శరీరమంతా ప్రతి స్పందించినట్లు ఒక విధమైన అలజడి ప్రారంభమైంది.
సంవేదతో మాట్లాడకుండా మౌనంగా ఇల్లు చేరుకున్నాడు.
వెళ్లగానే బాత్‌రూంలోకి వెళ్లి షవర్‌ తిప్పి దానికింద కూర్చున్నాడు.
అలా ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు.
సంవేద తలుపు కొడుతుంటే విని కొత్త జన్మ ఎత్తినట్లు బయటకొచ్చాడు.
మార్పుకి యుగాలు అవసరంలేదు. క్షణాలు చాలు.
”ఇప్పుడు చాలా ప్రశాంతంగా, హాయిగా వుంది వేదా! అన్నం పెట్టు ఆకలవుతుంది.” అన్నాడు.
వెంటనే అత్తగారితో పాటు భర్తకి వడ్డించి తనుకూడా తిన్నది సంవేద.
కొడుకులో కొత్తమనిషి కన్పిస్తుంటే తింటున్నంతసేపు ఆనందిస్తూనే వుంది దేవికారాణి.
గదిలోకి వెళ్లి బెడ్‌మీద పడుకున్నాడు శ్యాంవర్ధన్‌. రెండు చేతుల్ని వెనక్కి పోనిచ్చి, తలకింద పెట్టుకొని సీలింగ్‌ వైపు చూస్తున్నాడు.
‘…మనిషన్నాక ప్రేమించాలి. ప్రేమించబడాలి. స్త్రీలను ప్రేమించాలి. పిల్లల్ని ప్రేమించాలి. పూలను ప్రేమించాలి. రాళ్లను కూడా ప్రేమించాలి. కానీ తాగుడును మాత్రం ప్రేమించకూడదు. అలాగే! నవ్వించాలి. కోప్పడాలి. కసురుకోవాలి. ఏడ్పించాలి. కానీ ఆ ఏడుపు ఓ తాగుబోతు భార్య ఏడ్చే ఏడ్పులా మాత్రం వుండకూడదు.’ అని మనసులో అనుకుంటూ సంవేద త్వరగా వస్తే బావుండను కున్నాడు.
సంవేద మెల్లగా తలుపు తీసుకొని లోపలకి వచ్చి భర్తను చూసి ఆశ్చర్య పోయింది… అతనంత ఫ్రెష్‌గా, మాన్లీగా ఎప్పుడులేడు.
ఆమెకోసమే వేచి వున్నట్లు ఆమె రాగానే కాస్త కదిలాడు.
అతనికి బాగా దగ్గరగా వెళ్లింది. ఎప్పటిలా కాకుండా.. అతను ఏమాత్రం అడగకుండానే అతని ముఖాన్ని ఊహించని విధంగా తన ముఖంతో కప్పేసింది. ఆ చర్యతో ఇన్నిరోజులు భార్య ప్రేమను పొందలేని, సరిగ్గా పొందలేని, మనసారా పొందలేని అసంతృప్తిని జయించాడు.
తాగి, తాగి కుడితిలో పడ్డ ఎలుకలా తడిసేకన్నా ఈ అనుభవం అద్భుతంగా వుంది అనుకొని నెమలి పింఛంలా విప్పుకొని తనపై పరుచుకున్న ఆమె కురుల నీడలో మౌనంగా దాగాడు శ్యాంవర్ధన్‌.
అంతేకాదు. ఆ ఆనందానికి మందేమిటో తెలుసుకొని, దాని ప్లగ్‌ ఎక్కడుందో గుర్తించి రీఛార్జీ చేసుకుంటున్నాడు.
*****
రాళ్లూ, రప్పలు మారతాయో లేదో తెలియదుకాని, తన భర్త మాత్రం లేతమొక్కలా వంగాడని, ఆ సంతోషాన్ని ఆముక్తతో పంచుకోవాలని వెళ్లింది సంవేద.
కాలింగ్‌ బెల్‌ రింగ్‌ విని తలుపుతీస్తూ.. సంవేదను చూసి.. మీటగానే వీణపై తీగ కదలినట్లు ”హాయ్‌ వేదా!” అంది ఆముక్త. వెంటనే సంవేద నీటిలో కదిలిన చేపపిల్లలా నవ్వి ”హాయ్‌ ముక్తా!” అంది.
ఆముక్త సంవేదనే చూస్తూ… ”నీ అందంలో ఒక పర్సెంట్ నాకు వచ్చివున్నా బావుండేది కదా!” అంటూ సంవేద చేయిపట్టుకొని అప్యాయంగా లోపలకి తీసికెళ్లింది ఆముక్త.
సన్నగా నవ్వి… ”నా దృష్టిలో అందానికి వ్యక్తిత్వం, తెలివితేటలే కొలమానం. శరీరం కాదు. అయినా నీకు మాత్రం ఏం తక్కువ?” అంది సంవేద.
”నీ అంత లేదుగా.!” అంది ఆముక్త.
”అలా మనం అనుకోకూడదట. దేవుడు ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడట… ” అంటూ కలియజూసింది సంవేద.
ఒకవైపు ఇంటీరియర్ డిజైనర్‌ ఇల్లంతా లేటెస్ట్‌గా డిజైన్‌ చేస్తోంది. ఫ్యాషన్‌ డిజైనరేమో ఆముక్త శారీస్‌కి డిజైన్‌ చేస్తోంది. చాలా అధునాతనంగా కన్పిస్తోంది అక్కడి వాతావారణం.
ఆముక్త శారీస్‌ని, ఇంటికి చేస్తున్న డెకరేషన్‌ని మెచ్చుకోకుండా వుండలేకపోయింది సంవేద.
ఆముక్తకి బోర్‌ కొట్టినప్పుడు కారుని మార్చినట్లే, ఇంటీరియర్ డిజైన్స్‌ని కూడా ఛేంజ్‌ చేపిస్తుంది.
ఆముక్తకి సంవేదతో చాలా విచిత్రంగా స్నేహం ఏర్పడింది. దాన్ని దోసిట్లో కోడిపిల్లను పట్టుకున్నంత పదిలంగా కాపాడుకుంటున్నారు. వాళ్లిద్దరు ఒకచోట కూర్చుంటే కాలాన్నే మరచిపోయి చిన్నపిల్లల్లా మాట్లాడుకుంటారు. సినిమా నుండి జీవితం దాకా అన్నీ మాట్లాడుకుంటారు. ఒకరికి తెలిసింది ఒకరితో పంచుకుంటారు. మైత్రి అన్నాక ఎంతో కొంత స్నేహ రాజకీయాలు వుంటాయి. కానీ వీళ్ల మధ్యన అవి లేకపోవటం విశేషం.
”జీవితం అరిటాకులో పరమాన్నం పెట్టుకొని నెయ్యితో తినటంలా వుంటుందని చూడటం ఇదే మొదటిసారి ముక్తా ! నీ జీవితం నిజంగానే వెన్నెల పాన్పుపై ఓ రాకుమారి పడుకొని నిద్రించే నిద్రలాంటి అందమైన హరివిల్లు…” అంది సంవేద.
”నా కవిత్వం నీకొచ్చినట్లు మాట్లాడుతున్నావు వేదా!” అంది ఆశ్చర్యపోతూ ఆముక్త… ”స్నేహ మహిమ కావొచ్చు…” అంది సంవేద.
”ఈ మధ్యన చాలా రోజులైంది నువ్వు రాక.. ఇన్ని రోజులు నాకు కన్పించకుండా ఎలా వుండగలిగావు వేదా!” అంది ఆముక్త.
”నాకెన్ని పనులు ! ఎన్ని బాధలు …! అవన్నీ చూసుకొని రావాలి కదా!” అంది సంవేద.
”నీకు బాధలేంటి వేదా! నిన్ను చూస్తుంటే బాధల మనిషిలా లేవు…” అంది ఆముక్త.
”బాధలు పడేవాళ్లను నువ్వెప్పుడైనా చూశావా ముక్తా? కనీసం ఆర్ట్‌ ఫిలిమ్స్‌ చూస్తున్నప్పుడు కూడా అలాంటి జీవితాలు వున్నాయని ఊహల్లోకి కూడా రానియ్యవనుకుంటాం… ఎందుకంటే! అలా వస్తే నీ ఊహల్లో వుండే అందమైన వాతావరణం బెదిరిపోతోంది. ముఖ్యంగా నువ్వెంతో ఇష్టంగా చదివే శరత్‌, తిలక్‌ సాహిత్యం కూడా….” అంది సంవేద.
ఒక్కక్షణం సంవేద వైపు చూసి గతం గుర్తుతెచ్చుకొంది ఆముక్త.
సంవేద ఇంటర్‌ చదువుతున్నపుడు.. ఒకరోజు వర్షంలో నిశితను చేయిపట్టుకొని నడిపిస్తూంటే సంవేద తెల్లని పాదాలు మట్టిలో కూరుకుపోవటం చూసి కారాపి ఎక్కమంది ఆముక్త. అప్పుడు ఆముక్త డిగ్రీ సెకండియర్‌లో వుంది. ఆ రోజు తను చూసిన సంవేదయేనా ఇప్పుడు తన ముందున్నది అన్నట్లు చూస్తోంది ఆముక్త. ఇద్దరి మధ్యన మంచి స్నేహం వున్నా – సంవేద పర్సనల్‌ విషయాలను ఆముక్త ఎప్పుడూ అడగదు.
”నీకు తెలిసిన బాధలు వేరు ముక్తా ! నిజానికి అవి బాధలు కావు. జ్వరం వచ్చినప్పుడు టాబ్లెట్ లేకపోవటం, ఆకలి అయినప్పుడు అన్నం దొరకపోవటం అసలైన బాధలు. ఇవి ఎలా వుంటాయో నేను అనుభవించాను. కారణం మా నాన్న తాగుబోతు.
ఆయనకి వచ్చే జీతంలో ఎక్కువ శాతం తాగుడుకే వినియోగించుకునేవాడు. ఇంట్లో ఖర్చులకి చాలా తక్కువ ఇస్తాడు. అమ్మ దాన్ని చూసి, చూసి ఖర్చుచేసేది. అలాంటప్పుడు పెద్దదాన్ని కాబట్టి నా అవసరాలకే ఎక్కువ ఉండేవి. అమ్మ పడ్తున్న బాధను చూడలేక చెల్లి నాలాగ ఇబ్బంది పడకూడదని ఎక్కువ శాతం నేను చెల్లి గురించే ఆలోచించేదాన్ని. ఇప్పుడు కూడా నా మనసు నిశిత గురించే బెంగపడ్తుంది.” అంది సంవేద.
”మీ చెల్లి చాలా లక్కీ కదా!” అంది ఆముక్త.
”లక్‌ అనే పదం మా జీవితాల్లో వుండదు.” అంది సీరియస్‌గా ఎటో చూస్తూ సంవేద.
”ప్రేమ వుంది కదా! అంతకన్నా ఏం కావాలి?” అంది ఆముక్త.
”ప్రేమ అనేది ఎంతవరకు పనికొస్తుంది ముక్తా! అది దేన్ని కొనివ్వగలదు చెప్పు! వీల్‌చెయిర్‌ లేనిదే మా చెల్లి వుండలేదు. చాలాకాలం వరకు మా నాన్న దానికి వీల్‌చెయిర్‌ కొనివ్వలేదు. అమ్మ ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పొద్దంటుంది. నాన్న ఎలా వున్నా బయట గొప్పగా చెబుతుంది. అందరిలాగే తను కూడా పరిపూర్ణంగా బ్రతుకుతున్నట్లు కన్పిస్తుంది. ఒక్కోసారి అమ్మ ఏమంటుందో తెలుసా?” అంటూ ఆగింది సంవేద. ఆమెకెందుకో ఈరోజు అన్ని విషయాలు ఆముక్తతో పంచుకోవాలని పిస్తోంది.
ఆముక్త కూడా ఇలాంటి ప్రపంచం తెలియని దానిలా కొత్తగా చూస్తోంది.
”ఇదిగో ఈ బొట్టులేకుండా నా ముఖం బాగుండదు వేదా! ముఖం కడిగాక బొట్టులేకుండా అద్దంలో చూసుకోవాలంటేనే భయం నాకు. దీనికోసమే మీ నాన్నను నేను గౌరవించేది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెంటిమెంట్ ఏంటి అని ఎగతాళిగా చూడకు. ఏ రోజుల్లో నైనా భర్త అనే పదం ఇచ్చే ప్రొటక్షన్‌ భర్త వుండే స్త్రీలకు దక్కే మర్యాద గొప్పగా వుంటుంది. అతను తాగుబోతా! తిరుగుబోతా! జూదగాడా! అన్నది ఎవరూ పట్టించుకోరు. భర్తకు ప్రత్యాన్మాయం లేదు అనేది అమ్మ….” అంది సంవేద.
ఆముక్త అలాగే చూస్తోంది.
”నేను నా తండ్రివల్ల నా అవసరాలనే కాదు ప్రేమాభిమానాలను కూడా కోల్పోయాను. అత్తగారింట్లో బాధలు పడలేక కొద్దిరోజులు అమ్మఒడిలో సేద దీరుదామని వెళ్తే మా నాన్న గారి అభిప్రాయం ఎలా వుంటుందో చెప్పనా ముక్తా! పరాయి ఇంటికి అమ్మేసిన గొడ్డు తాడు తెంపుకొని తిరిగి వస్తే.. తరిమికొట్టినట్లు వుంటుంది.” అంటూ తండ్రి తనను ఎలా చూసేవాడో చెప్పి… తన భర్త శ్యాంవర్ధన్‌ చేత ఈ మధ్యన తాగుడు ఎలా మాన్పించిందో చెప్పింది సంవేద.
ఆముక్త ఒళ్లు జలదరించింది.
ఆమెకు తెలిసిన ప్రపంచం వేరు. అందులో మగవాళ్లంతా బిజినెస్‌ మాగ్నెట్ లు – ఆడవాళ్లేమో మహారాణులు.
మగవాళ్లలో నిరంతర కృషి, శ్రమ, సర్వీస్‌ దాగి వుంటాయి. ఆత్మవిశ్వాసంతో, ప్లానింగ్‌తో, తామెంతో ముఖ్యమైన వ్యక్తులమన్న కమిట్మెంట్ తో వుంటారు. ఇతరులకంటే డిఫరెంట్ గా వుండాలని వ్యూహాత్మకంగా ఆలోచిస్తుంటారు. ప్రయత్నిస్తుంటారు. డబ్బు సంపాయించటానికి, సౌకర్యాలను పెంచుకోటానికి, సరైన గుర్తింపు తెచ్చుకోటానికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అని మార్గాలను అన్వేషిస్తుంటారు.
తన భర్త ఆ కోవకి చెందినవాడే.. ‘సక్సెస్‌ అందరికి రాదు,. ఆయాచితంగా అసలే రాదు. ఎన్నో అవకాశాలను విస్తృతం చేసికొని శ్రమించాలి.’ అని చెబుతుంటాడు… సక్సెస్‌ కాలేని వారి గురించి ఎవరు పట్టించుకోరు. వారి ఆదాయం, సంపాదన గురించి ఆలోచించరు. ఎవరి సామర్థ్యాన్ని వాళ్లు గుర్తించుకొని వాళ్లను వాళ్లు నమ్ముకొని సాగిపోతుంటారు. డబ్బే లక్ష్యంగా, ఆ లక్ష్యమే జీవితంగా, ఊపిరిగా నరనరాన జీర్ణించుకొని టార్గెట్ అనే మహాశక్తిని వెంట బెట్టుకొని చిత్తశుద్ధితో సీరియస్‌గా జీవిస్తుంటారు.
”ఏంటి ముక్తా! ఆలోచిస్తున్నావ్‌!” అంది సంవేద.
”ఏం లేదు వేదా!” అంటూ ఆ టాపిక్‌ని అంతటితో వదిలేసి-
”ఇదిగో వేదా! ఈ పత్రికలో ఈ వారం కవితగా నా కవితను ప్రచురించారు. చదివి చెప్పు! ఎలా వుందో…!” అంది ఆముక్త.
కూర్చుని చదివింది సంవేద.
ఆ కవిత నిండా బావుకత.. ప్రకృతి అందాలు.
”ముక్తా! నీలో బాగా రాయగలిగే శక్తి వుంది. ఇలా వూహించి రాయకుండా మాలాంటి వాళ్ల జీవితాల్లోకి తొంగిచూసి వాస్తవానికి దగ్గరగా రాసి మా బాధల్ని ప్రజెంట్ చెయ్యరాదూ.” అంది సంవేద రిక్వెస్ట్‌గా చూస్తూ…
”బాధల్ని, కన్నీళ్లని ఎవరు చదువుతారు వేదా! జీవితంలో ఎప్పుడూ వుండేవేగా ఈ బాధలు…! రాతల్లో కూడా ఇవేనా అనుకుంటారు. ఏడుపు గొట్టు కవితల్ని రాసి ఏడ్పించటం ఎందుకు చెప్పు! నా వరకు నేను ఏమనుకుంటానో తెలుసా! నేను రాసింది చదవగానే హాయిగా ప్యాన్‌కింద కూర్చునో.. పార్కులో కూర్చునో… రెస్టారెంట్ లో కూర్చునో రిలాక్స్‌ అవుతున్న ఫీలింగ్‌ కలగాలి. ఆ ఫీలింగ్‌ కూడా అద్భుతంగా అన్పించాలి”. అంది ఆముక్త.
కష్టపడకుండా అన్నిరకాల రుచుల్ని వడ్డించుకుని తినేవాళ్లకే ఆముక్త మాటలు బావుంటాయి. తండ్రివల్ల, భర్త ద్వారా మానసికంగా బాగా నలిగిన సంవేదకు, ఆముక్త మాటలు అసహజంగా అన్పిస్తున్నాయి.
”నువ్వు ఒకే కోణంలో ఆలోచిస్తున్నావు ముక్తా! ప్రపంచంలో అనేక కోణాలు ఉన్నాయి. వాటిని ఎందుకు చూడవు నువ్వు..? చూడగలిగే శక్తి వుండి కూడా ఒకే దారిలో నడవాలనుకుంటున్నావ్‌! అదీ బాగా నలిగిన దారిలో నడుచుకుంటూ పోతున్నావు.
బాధల్ని కూడా అందంగా చెప్పొచ్చు. అందంగా అనుభవించవచ్చు అంటే నీ కవిత్వం బాధల్లో వున్నవాళ్లను కూడా ఇన్సపైర్ చెయ్యగలగాలి. వాళ్లు ఆ బాధల్లోంచి బయటకొచ్చి సేదతీరాలి. నువ్వు రిప్రజెంట్ చేసే ప్రతి వాక్యంలో నిత్యం మనల్ని మనం చూసుకోగలగాలి. అది చూసి ఎవర్నివాళ్లు ప్రమోట్ చేసుకోగలగాలి. డైనమిక్‌గా మలుచు కోగలగాలి… నీ కవిత్వం వల్ల ఎలాంటి ఉపయోగాలు వున్నాయో అప్పుడు అర్థమై మళ్లీ ఈ భావుకత వైపు వెళ్లవు..” అంది సంవేద.
”నాకు భావుకత అంటే చాలా ఇష్టం వేదా! నా కన్నా ముందు రాసిన భావ కవులంతా యోధానుయోధులుగా ప్రకటింపబడింది పూల గురించి, ప్రకృతి గురించి రాసేకదా!” అంది ఆముక్త.
”వాళ్లు పూలలో కన్నీళ్లను చూశారు. నువ్వు నిప్పుల్ని చూడు” అంది సంవేద చాలా ప్రశాంతంగా చూస్తూ.
”నిప్పుల్ని చూడటం.. మానసికంగా సంఘర్షించటం.. ఆకలిని తీసుకొని, నిత్యం కడుపులో రగిలే జఠరాగ్నిలా వూహించి. దాన్ని అడవిలో వ్యాపించే కార్చిచ్చుతో, సముద్ర గర్బంలో దాగి వుండే బడబాగ్నితో పోల్చిరాయడం వట్టి హంబగ్‌. ఆకలి అనేది అతి సహజమైన క్రియ. కాగితాలపై అంత గొప్పగా రాసేంత పెద్ద అంశమేం కాదు దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బాధలని, ఆకలని, చావుకేకలని, కన్నీటి సంతకాలని, ఏవేవో ప్రజంట్ చేసి పాఠకుల్ని ఈ కవులెందుకు చంపుతారో నాకు అర్థం కావటంలేదు..” అంది విసుగ్గా చూస్తూ ఆముక్త…
ఆ క్షణంలో… ఆముక్త కవిత్వంలో సంవేద చూడాలనుకున్న మార్పు వేళ్ల సందుల్లోంచి కారిపోతున్న నీళ్లలా జారిపోయింది. కవిత్వమనేది గాయపడిన వాళ్లకి ఆయింట్మెంట్ రాసేలా వుండాలి కాని, సోమరివాళ్లను జోకొట్టేలా వుండకూడదని ఆముక్త ఎప్పటికి తెలుసుకోగలదు. మనసులో అనుకుంటూ అనాసక్తిగా చూస్తే బావుండదని, ఆ పత్రికని రాజుబిడ్డలా పదిలంగా పట్టుకొని…
”ఈ పత్రికను పట్టుకెళ్లి మా ఎదురింట్లో, పక్కింట్లో ఇచ్చి చదవమని చెబుతాను ముక్తా! బై… ” అంటూ లేచింది సంవేద. సంతోషపడ్తూ – సంవేదతో గేటువరకు నడిచింది ఆముక్త.
*****
శకుంతల, ప్రభాకర్‌ పదిరోజుల క్రితం పై అంతస్తులోకి మారారు. ఇంటి ఓనర్స్‌ వయసులో పెద్దవాళ్లు కావటంతో మెట్లెక్కి దిగాలంటే కష్టంగా వుందని కిందకి మారారు.
శకుంతల వాళ్లు మారిన ఇంటిని కొత్తగా కడుతుండటంతో ఇంకా పని మిగిలి వుంది. గోడలకి వెలుపల వైపు ప్లాస్టింగ్‌ చేసి, పిట్టగోడలు కట్టాలి. పై అంతస్థు కావటంతో, ఇంకా వర్క్‌ మిగిలి వుండటం వల్ల అద్దె కాస్త తగ్గించారు. ఇది బాగా ప్లస్‌ అయింది శకుంతలకి… ఆ డబ్బుతో నిశిత అడిగింది కొనివ్వాలని ఆమె ఆశ…
”మమ్మీ! ఈసారి నాకు మంచి స్టిక్‌ కొనివ్వు… నాన్న తెచ్చిన స్టిక్‌కి క్వాలిటీ లేక బ్యాలెన్స్‌ ఆగటం లేదు.”అని ఆ మధ్యన నిశిత అన్న మాటలు గుర్తొచ్చాయి.
చికెన్‌ వండమని చెప్పి తాగుతూ కూర్చున్నాడు ప్రభాకర్‌. వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ తన ధ్యాసలో తనుంది. భర్త తాగుడుకి బానిస కాకుండా వుండి వుంటే తనకింత సమస్య వుండేదికాదు. ఈ మధ్యన ఒక టైమంటూ లేకుండా గొంతుదాకా తాగి కూలబడిపోతున్నాడు. ఏది ఏమైనా ఇంకొద్దిగా డబ్బుని పోగుచేసుకుంటే నిశితకి మంచి స్టిక్‌ వస్తుందని ఆలోచిస్తోంది. శకుంతల.
నిశిత చక్రాల కుర్చీలో కూర్చుని, చేతుల సాయంతో దాన్ని నెట్టుకుంటూ గదిలోంచి బయకి వచ్చింది. రాత్రి ఎనిమిది దాటటంతో చుట్టుపక్కల నిశ్శబ్దంగా అన్నిస్తూ, అక్కడంతా తెల్లని హంసరెక్కలా వెన్నెల కురుస్తోంది. ఆ వాతావరణాన్ని మౌనంగా ఆస్వాదిస్తూ దారినవెళ్లే మనుషుల్ని చూస్తూ కూర్చుంది. స్ట్రీట్ లైట్ వెలుగుతోంది.
ప్రభాకర్‌ కొద్ది కొద్దిగా తాగుతూ, మధ్య మధ్యలో వాగుతున్నాడు.
”పెద్దదేమో వున్నన్ని రోజులు వుండి, మొన్న చెప్పకుండానే వెళ్లింది. పెళ్లయ్యాక రోషం ముదిరి, దానికి నా విలువ తెలియటం లేదు. బలుపంటే అదే… కుంటిదేమో పిలిచినా పలకదు. దీనికి పొగరెక్కువైంది. కళ్లు పైకెక్కాయి. ఏం చూసుకునో వీళ్లకింత..?” అంటూ తిట్ల వర్షం కురిపిస్తున్నాడు.
ఎప్పుడైనా స్త్రీలో తల్లి హృదయం వుంటుంది.

ఇంకా వుంది.