ఆకుదొక కథ!

రచన:లక్ష్మీదేవి

నేనిక్కడికెప్పుడు వచ్చానో, ఇంత అందమైన ప్రపంచంలోకి ఎలా చేరానో మరి, చల్లగాలిలో అమ్మ కొమ్మ తాను ఊగుతూ నన్ను ఉయ్యాలలూపుతోంది. నా చుట్టూ నా తోబుట్టువులు సంతోషంగా కనిపిస్తున్నారు. అప్పుడే రాలిన చినుకులలో తడిసి మరింత కొత్తగా మెరిసి పోతున్నారు. ఎన్ని ముఖాలో, ఎన్ని ఆకారాలో, వాటిల్లో ఎన్ని వికారాలో! చుట్టూ జరిగేదాన్ని గమనిస్తూ , ఆలోచిస్తూ ఉండడమే నా స్వభావం.
ఆకాశపుటంచులనుండి నా స్నేహితులు మమ్మల్నంతా ఆనందతరంగాల్లో ముంచేయడానికి అప్పుడప్పుడూ వస్తుంటారు. వారికోసమే మా ఎదురుచూపులు. సంవత్సరమంతా ఎదురుచూసేది ఒక్క శలవుల పండగల కోసమే. వారికి శలవు దొరికినపుడు వచ్చేస్తారు. ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందంటే ఒక్కోసారి మేమంతా అందులో మునిగే పోతాము. ఇంకోసారి లోకాన్ని మరచి తేలే పోతాము.
ఏమైనా మా ఎదురుచూపులు ఆగవు. ఊపిరి ఆగేవరకూ ఆగవు. ఒక్కసారి వారు వస్తున్న బండ్ల దీపాలు, మ్రోతలు పైనుంచీ వినపడగానే, కనపడగానే మా గుండెలు మ్రోగుతాయి, ప్రతిస్పందనగా. అందరం చేతులూ ఆడిస్తూ, నాట్యాలాడుతూ స్వాగతం పలుకుతాము మా మిత్రులకు.
ఒక్కోసారి ఇంకెక్కడికో వెళుతూ చుట్టపుచూపుగా అలా చూసి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు కూడా మేం వారిని నిందించము. ప్రతీసారీ సరిక్రొత్తగా అనిపించే మరిచిపోలేని పరిమళాలతో స్వాగతాలు పలుకుతాము.
మా స్నేహితులు ఒక్కొక్క సారి ఎన్ని రోజులో ఉంటారు మాతోపాటు. ఆడుతూ, పాడుతూ, దోబూచు లాడుతూ, నవ్విస్తూ, ఏడిపిస్తూ మాతో కలిసి చేసే అల్లర్ల కోసం లోకమే ఎదురుచూస్తుంది. నిజానికి మేముంటేనే వాళ్ళు, వాళ్ళుంటేనే మేము ఉండగలిగేది. వాళ్ళెప్పటికీ రానిచోట్ల మేం జీవించనేలేము. మా ఉనికే లేనిచోటకు వాళ్ళు రమ్మన్నా రారు. తెలుసా! అంత గొప్ప స్నేహబంధం మాది. అంతులేని దూరాలున్న నింగిని , నేలను కలిపే బాంధవ్యం మాది. ఆ కర్తవ్యమూ మాదే.
అరె, అదేమిటి ఆ చివరనున్న మా పెద్దన్న అలా పాలిపోయిన ముఖంతో దీనంగా కనిపిస్తున్నాడే? ఏమయిందో తనకు? చలేస్తుందేమో చినుకులలో తడిసి వీస్తున్న గాలివల్ల! అయ్యో , నేను చూస్తూ ఉండిపోతున్నానే ఏమీ చేయలేకపోతున్నానే, తన కెంత బాధగా ఉందో తనూ మాతో పాటు ఆటపాటలలో పాల్గొనలేకపోతున్నందుకు. నాకైతే తననూ చేయి పట్టుకొని లాక్కొని రావాలనుంది.
మా చిన్ని తమ్మునికివేమీ పట్టవు. తన లోకమే తనది. అక్కచెల్లెళ్ళతో దోబూచులాటలు, వాళ్ళకు కావలసినవి ఎండల్లో వానల్లో కూడా తెచ్చివ్వడం , అమ్మకొమ్మను మురిపించడమే వాడి ప్రపంచం.
అల్లంత దూరంలో ఉన్న మా అన్నకు నేనే సాయమూ చేయలేకపోతున్నాను. ఏమవుతుందో ! ఏమయిపోతాడో! ఎవరు నాకు సరైన సలహా ఇవ్వగలరు? నేనెవర్ని అడగగలను? ఎవర్ని నమ్మగలను? అయ్యో, సమయము మించిపోతున్నది. అల్లల్లాడి పోతుంటే చూడలేకపోతున్నాను.
అన్నా, నిన్ను చూసే నేను పెరిగాను. నీతోనే ఆటపాటలు నేర్చుకున్నాను. నాకే సందేహం వచ్చినా భయపడినా నా దిక్కు నీవేనని నీవైపు చూస్తుంటాను. మరి ఈ పొద్దు నీకే ఇంత కష్టం వచ్చిందే? నేనేమి చెయ్యాలి? నా వల్ల ఏమవుతుంది? ఈ రోజు నా స్నేహితుల పలకరింపులు కూడా నాకు ఉల్లాసం కలిగించలేకపోతున్నాయి. నా దృష్టి అంతా నీమీదే ఉంది.
ఆ..అయ్యయ్యో! అయ్యో! ఏమవుతోంది! అమ్మ కొమ్మను వీడి, మా అన్న ఎక్కడికి వెళ్తున్నాడు? అంతేనా, ఇలా రాలిపోవడమే జీవితానికి ముగింపా? ఇందుకోసమేనా ఇన్ని మురిపాలు, ముచ్చట్లు! ఒకనాడంతా ముగిసిపోతుందా? ఈ లోకమంతా నాదేనంటూ, నేను లేకపోతే లోకానికే ఉనికి లేకుండా పోతుందేమో నన్నంతగా ఈ లోకాన్ని ప్రేమించానే? చుట్టూ ఉన్నవాళ్ళంతా నాకోసమే, నేను వాళ్ళ కోసమే అనుకున్నానే. ఇదంతా నాటకం ముగిసినట్టు ఒకనాడు ముగిసిపోతుందా? ఇలాగే తెరపడిపోతుందా?
గాలిలో తేలుతూ రాలుతూన్న అన్న గొంతు గాలివాటుగా వినిపిస్తోంది.
“లేదు తమ్ముడూ! ఈ నాటకానికి ఆది, అంతూ ఉండవు. తెర పడడం మళ్ళీ లేవడానికే. లేచిన కెరటాలు పడక మానవు, పడిన కెరటాలు ఉవ్వెత్తున లేవకా మానవు. కేవలం ఒకరి తర్వాత ఒకరు పాత్రలుగా వచ్చి వారి వంతు నాటకం పోషించి తెరవెనక్కు వెళ్తుంటాము.
అంతేకాదు. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానని బాధపడకు. అమ్మ కొమ్మను వీడుతున్నానని బెంగపెట్టుకోకు. వీడితే ఎక్కడికెళతాను? అమ్మలనందరినీ గన్న అమ్మ ఈ భూమమ్మ ఒడిలోకే కదా చేరుతున్నాను. మళ్ళీ వస్తాను. ఈ భూమమ్మ నన్ను, నాలాంటి తన మనవళ్ళను,మనవరాళ్ళను అందరినీ చూడాలనిపించి పిలిపించుకుంటుంది. ఎప్పుడో అమ్మకు పురుడు పోసినపుడు కదా చూడడం! మరి చూడాలని ఉండదూ మనవలను?
మన అన్న దమ్ములను, అక్కచెల్లెండ్రను పిలిపించుకొని, ముద్దుమురిపాలతో తన దగ్గర ఉంచుకొని, మళ్ళీ సుష్ఠు గా మనలను తయారుచేసి మళ్ళీ ఇక్కడికే గదా పంపుతుంది? నీకు నాపై, నాకు నీపై మనకు మన లోకం అన్న మోహాలున్నంత వరకూ ఇలాగే వచ్చిపోతుంటాము.
ఈ సత్యాన్ని తెలుసుకోవడం కాక ఆకళింపు కూడా చేసుకొన్న రోజున ఇక భూమమ్మ తనలోనే కలిపేసుకుంటుంది. కొండలుగా, బండలుగా, మట్టిలో మట్టిగా కలిపేసుకుంటుంది. అప్పుడు నీవు, నేను అనే కాదు మొత్తం విశ్వమే మనము, మనమే విశ్వము అన్న పెద్ద మాటలు కూడా అర్థమౌతాయి. “
మాటలన్నీ ముగిసిన వేళ భూమమ్మ ఒడిలో గెంతులేస్తూ ఆడుతున్న అన్న కనిపించాడు.

—–అంతే——-

కథకుడు – పచ్చటి లేతాకు.

ఆకాశపుటంచు నుంచి వచ్చే స్నేహితులు—చినుకులు.
బండ్ల మ్రోతలు, దీపాలు- ఉరుములు, మెరుపులు.
మరిచిపోలేని పరిమళాలు- తొలకరిలో మట్టి పరిమళాలు.
పెద్దన్న—రాలబోయే పండుటాకు/ఎండుటాకు.
చిన్ని తమ్ముడు –చిగురుటాకు.
అక్కచెల్లెళ్ళు—పువ్వులు,మొగ్గలు.
కావలసినవన్నీ తెచ్చివ్వడం—పత్రహరితపు ఆహారం.
అమ్మ—కొమ్మ
అమ్మలందరినీ గన్న అమ్మ-భూమమ్మ- భూమి
*****

ఇస్లాం మతం

రచన: శారదా ప్రసాద్

భారతదేశంలో హిందూమతం తరువాత ఇస్లాం రెండవ స్థానంలో ఉంది . 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు ఉన్నారు.ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా మరియు పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు. ఇస్లాం తొలుత అరబ్బు వర్తకుల ద్వారా శాంతియుతముగా భారతదేశంలో ప్రవేశించింది.ఇస్లాం అనేది మానవజాతి కోసం అల్లాహ్ నిర్ణయించిన ధర్మం. దేవుడు ఒక్కడే అనే ప్రాతిపదిక పైన ముహమ్మద్ ప్రవక్త (ఆఖరి ప్రవక్త) స్థాపించిన మతం కాదు ఇది . ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం.140 నుండి 180 కోట్ల జనాభాతో ప్రపంచంలో క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం.ఇస్లాం అనే పదానికి మూలం అరబ్బీ భాషాపదం ‘సిల్మ్’, అనగా శాంతి, స్వఛ్ఛత, అర్పణ, అణకువ మరియు సచ్ఛీలత.ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం
అనగా భగవంతునికి సర్వ సమర్పణ.అంతేకాదు,ధర్మానికి అనుగుణంగా నడచుకోవటం.ముస్లిం అనగా శాంతి కాముకుడు, శాంతి స్థాపకుడు.మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మార్గాన్ని, ధర్మాన్ని అవలంబించేవాడు ముస్లిం.వీరికి పరమ పవిత్రం అయినవి దేవుని (అల్లాహ్) వాక్కు,ఆదేశము ఖురాన్,మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు. అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. ముహమ్మద్ చివరి ప్రవక్త.ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, భగవంతుడు (అల్లాహ్) తన ఆఖరి ప్రవక్త ముహమ్మద్ ను ఉపదేశకుడుగా పంపాడు, ఖురాను (పవిత్ర గ్రంథం) అవతరింపజేశాడు. ఇస్లాం ఐదు మూలస్తంభాలుగా పరిగణించబడే నమ్మకాలు–షహాద (విశ్వాసం),సలాహ్ (నమాజ్ లేదా ప్రార్థన),సౌమ్ (ఉపవాసం),జకాత్ (దాన ధర్మం),హజ్ (పుణ్య యాత్ర). అల్లాహ్ ఆ సర్వేశ్వరుడి నామం. సకల చరాచర జగత్తును సృష్టించిన మహాసృష్టికర్త.ఇస్లాంలో ఏకేశ్వరోపాసన కఠోర నియమము. వీరిలో విగ్రహారాధన లేదు. ఈ ఒక్క కారణంగా రాజారాంమోహన్ రాయ్ లాంటి బ్రహ్మసమాజీకులు ఇస్లాం మతాన్ని గౌరవించారు.అల్లాహ్ పై
విశ్వాసప్రకటనను షహాద అని,ఏకేశ్వర విశ్వాసాన్ని తౌహీద్ అంటారు.అల్లాహ్ యొక్క 99 విశేషణాత్మక నామవాచకాలు కలవు. ముస్లింలు భగవన్నామస్మరణ చేయునపుడు ఈనామాలన్నీ స్మరిస్తారు.ఇస్లాం ప్రవక్తలలో ఆఖరి ప్రవక్త ముహమ్మద్ క్రీ.శ. 570 ఏప్రిల్ 20 న మక్కా నగరంలో జన్మించారు. తండ్రి ‘అబ్దుల్లా’ తల్లి ‘ఆమినా’. తన 40 యేట వరకూ సాధారణ జీవితం గడిపిన ముహమ్మద్ ప్రవక్తకు, హిరా గుహ యందు ధ్యానంలో ఉండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ ఆదేశాలను మరియు ఖురాన్ యొక్క మొదటి సూరాను అవతరింపజేశారు. ఈ సూరా ‘ఇఖ్రా బిస్మి రబ్బుకల్లజి ఖలఖ్’ అనే ఆయత్ తో ప్రారంభమైనది. దీనర్థం “(ఇఖ్రా) చదువు, అల్లాహ్ ఒక్కడేనని, అతడే సర్వాన్నీ సృష్టించాడని….”. ఈ అవతరణ పొందిన ముహమ్మద్ తన ప్రవక్త జీవితం ప్రారంభించారు. బహుఈశ్వరాధకులైన అరబ్ పాగన్లు ముహమ్మద్ ని నానా కష్టాలు పెట్టారు.క్రీ.శ. 622 లోమక్కా నుండి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్ళారు.ఈ సంవత్సరం నుండే ఇస్లామీయ కేలండర్ ఆరంభమైనది. మదీనాలో స్థిరపడిన ముహమ్మద్ కు మక్కా వాసులనుండి అగచాట్లు తప్పలేదు. ఇస్లామీయ రీతి నచ్చని మక్కావాసులు మదీనా వాసులపై అనేక యుద్దాలు చేశారు.ఈ యుద్ధాలకు నాయకత్వం వహించిన ముహమ్మద్ ఒకటీ రెండూ యుద్ధాలు తప్ప అన్నింటిలోనూ విజయాలను చవిచూసారు.ఆఖరికి ముస్లిం సమూహాలు మక్కానూ కైవసం చేసుకున్నారు.క్రీ.శ. 632 లో ముహమ్మద్ ప్రవక్త పరమదించారు. ముహమ్మద్ ప్రవక్త ఆచరణలను సున్నహ్ అనీ ఉపదేశాలను హదీసులు అనీ వ్యవహరిస్తారు. ఖురాన్ ఆదేశాల తరువాత సున్నహ్ మరియు హదీసులే ముస్లింలకు ప్రామాణిక ఆదేశాలు.ముస్లిం కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రతీ ఒక్కరు ముస్లిం కాలేరు. ఒక డాక్టర్ ఇంట జన్మించిన వారిని ఏవిధంగానైతే డాక్టర్ అనరో , అదే విధంగా ముస్లిం ఇంట జన్మించిన వారిని ముస్లిం అనరు.నిజ దేవుడు ఒక్కడు అని నమ్మి , అ నిజ దేవుడు పంపిన అంతిమ ప్రవక్తను(మహమ్మద్) విశ్వసిస్తే, అతనిని ముస్లిం (దైవ విధేయుడు) అని పిలువవచ్చు.ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ నిజ దేవుడైన అల్లాహ్ ను కాకుండా దర్గానో లేక ఇతర సృష్టితాలనో పూజిస్తే అతను అల్లాహ్ దృష్టిలో ముస్లిం దైవ విధేయుడు కాదు. అతని పేరు, అతని వేషధారణ ముస్లింగా ఉన్నప్పటికీ అతను అల్లాహ్ దృష్టిలో ముస్లిం (దైవ విధేయుడు ) కాదు. అతను అల్లాహ్ దృష్టిలో ముషిర్క్(దైవ అవిధేయుడు, బహుదేవారాధకుడు). ఇస్లాం ప్రకారం అల్లాః ఒకడే దేవుడు, ఆయనకు సమానముగా ఎవరిని చూడరాదు. ఆయనకు సమానముగా ఎవరికీ దైవత్వం
అపాదించరాదు.అల్లాః మాత్రమే ప్రార్థనలను స్వీకరించును.ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు.దురదృష్టవశాత్తు నేడు కొంతమంది ముస్లిం యువకులు తప్పుడు బోధనలకు ప్రభావితులై ‘జిహాదీ’ పేరుతో విధ్వంస కాండను సృష్టిస్తున్నారు.నిజానికి ఇస్లాం మతం ఉగ్రవాదాన్ని అంగీకరించదు.ఇస్లాం మతంలో మానవతా విలువలు,శాంతి, సద్భావనలు ఉన్నాయని, ఉగ్రవాదాన్ని ఈ మతం తిరస్కరిస్తుందని మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ బహిరంగంగా చేసిన ప్రకటనను మన దేశంలోని ముస్లింలు, మైనారిటీ పార్టీల నేతలు, ముస్లిం మతపెద్దలు గమనించాలి. ప్రపంచంలోని మత పెద్దలంతా ఉగ్రవాదాన్ని ఖండించాలి. ఉగ్రవాదాన్ని తమ మతం అంగీకరించదంటూ ఇస్లాం మతపెద్దలు ప్రకటిస్తే మంచి స్పందన వస్తుంది. అలా ప్రకటిస్తే, ఇస్లాం మతం ఉగ్రవాదాన్ని అంగీకరించదన్న సందేశం సమాజంలోకి వెళుతుంది.ప్రపంచంలో శాంతి వెల్లివిరుస్తుంది.ముస్లిములలో సున్నీలు,షియాలు అనే రెండు ప్రధాన తెగలు ఉన్నాయి.వీరు కొన్ని సందర్భాల్లో (చాలా సందర్భాల్లో)ఒకరినొకరు ద్వేషించుకున్న సంఘటనలు ఉన్నాయి. భారతదేశంలో ముస్లింలు ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ ఆక్టు 1937, (షరియా చట్టాలు) ద్వారా తమ సాంఘీక జీవితాలు గడుపుతారు.ఈ చట్టం ముస్లింల వ్యక్తిగత విషయాలైన నికాహ్, మహర్, తలాక్ (విడాకులు), నాన్-నుఫ్ఖా (విడాకులు తరువాత జీవనభృతి), బహుమానాలు, వక్ఫ్, వీలునామా మరియు వారసత్వాలు, అన్నీ ముస్లిం పర్సనల్ లా ప్రకారం అమలుపరచ బడుతాయి. భారతదేశంలోని న్యాయస్థానాలన్నీ ఈ షరియా నియమాలను ముస్లింలందరికీ వర్తింపజేస్తాయి. ఈ ముస్లిం పర్సనల్ లా ను సమీక్షించేందుకు, పరిరక్షించేందుకు, ప్రాతినిధ్యం వహించేందుకు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్థాపించబడింది.ఇస్లామీయ సమాజంలో మూలవ్యవస్థ విషయం “కుటుంబం”. ఇస్లామ్ ఈ కుటుంబ సభ్యులందరికీ తగురీతిలో హక్కులను కల్పిస్తున్నది. కుటుంబ వ్యవస్థలో యజమాని ‘తండ్రి’. ఇతను కుటుంబపు బరువు బాధ్యతలు, ఆర్థిక విషయాలను,ఆలన పాలన పోషణలు చూస్తాడు. ఖురాన్ లో వారసత్వపు విషయాలన్నీ క్షుణ్ణంగా పొందుపరచబడ్డాయి.కుటుంబంలోని ఆస్తిలో స్త్రీహక్కు, పురుషుడి హక్కుతో సమానం.అనగా సగం ఆస్తి స్త్రీకి చెందుతుంది. అన్ని హక్కులూ సగం కల్పించబడ్డాయి. ఇస్లాంలో పెళ్ళి లేదా నికాహ్ అనునది, పౌర-ఒడంబడిక. ఈ నికాహ్ కొరకు, ఇద్దరు సాక్షులు అవసరం. పెళ్ళికొడుకు పెళ్ళికుమార్తెకు భరణం
“మహర్” చెల్లించాలి. మహర్ అనునది, పెళ్ళికుమారిడి తరపున పెళ్ళికుమార్తెకు ఇచ్చే ఒక బహుమతి.ఈవిషయం “నికాహ్ నామా”లో వ్రాయవలసి ఉంటుంది.ఒక పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. కానీ వారికి సమాన హక్కులు, పోషించగలిగే స్థితిని పురుషుడు కలిగి ఉండాలి. స్త్రీ ఒక పురుషుడిని మాత్రమే భర్తగా కలిగి ఉండాలి. భర్తతో విడాకులు పొంది ఇంకో పెళ్ళి చేసుకొనవచ్చు. ఇస్లాంలో విడాకులుకు “తలాఖ్” అని వ్యవహరిస్తారు.స్త్రీలు హిజాబ్ లేదా పరదా పద్దతిని పాటించాలి. దీనినే “ఘోషా” పద్దతి అని వ్యవహరిస్తారు,ఈ పద్దతి స్త్రీలను హుందాగా జీవించేందుకు దోహదపడుతుందని భావిస్తారు.ఈ నియమంపై పలు వివాదాలు ఉన్నాయి. అంగీకారాలు కూడా ఉన్నాయి . కానీ అంగీకారాల శాతమే ఎక్కువ. నగర ప్రాంతాలలో ఈ ఘోషాపద్దతి కొద్ది తక్కువ కానవస్తుంది. చాలామంది ముస్లిం మహిళలకు బయటి ప్రపంచం తెలియదు.వారి జీవితం నాలుగు గోడలకే పరిమితం.దారుణం ఏమిటంటే ఇదంతా ఇస్లాం పేరుమీద నిరాటంకంగా కొనసాగుతోంది.నేటి ముస్లిం సమాజంలో స్త్రీలను కనీసం ప్రార్ధనా స్థలాలకు కూడా అనుమతించరు.ఇస్లాం గతాన్ని గనుక మనం ఒకసారి నిశితంగా పరిశీలించి చూస్తే పురుషులతో సరిసమానంగా మహిళలూ వివిధ రంగాల్లో పాల్గొన్నారన్న వాస్తవాన్ని తెలుసుకోగలం.మహిళల సహకారంలేని ఏ జాతి విముక్తి సాధించలేదు. స్త్రీలను కేవలం వంటగదులకు,పడకగదులకే పరిమితం చేయడంవల్ల ఇస్లాం కానీ, మరే ఇతర మతమైనా కానీ వారు ఆశించిన సామాజిక విప్లవాన్ని సాధించలేదు.ఇక బహుభార్యత్వం,’తలాక్'(విడాకులు)– దీనికి కూడా ముస్లిం మత పెద్దలు ఒక పరిష్కారాన్ని కనుగొంటే ,సాధారణ ముస్లిం స్త్రీలకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని చాలామంది అభిప్రాయం.ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో “అల్లాహ్” అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. ముస్లింలు క్రైస్తవుల, యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలామంది అనుకుంటారు.కానీ నిజానికి ఇదంతా ఒక అపోహ మాత్రమే.ఎందుకంటే “అల్లాహ్”అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ ఒక్కడే. అల్లాహ్ మానవులకు అనుగ్రహించిన వరాలు అనంతం. వాటిని గురించి వర్ణించడం, ఊహించడం అసాధ్యం. అలాంటి అసంఖ్యాక వరాల్లో ‘నోరు’ (నాలుక) కూడా ఒకటి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే, అమృతపు జల్లు కురుస్తుంది. అల్లాహ్ దృష్టిలో నోటి దురుసుతనం , దుర్భాషణ,అశ్లీలమైన పనులు తీవ్రమైన నేరాలు. వీటి ఫలితంగా ఇహలోకంలో పరాభవం, పరలోకంలో నరకశిక్ష అనుభవిస్తారనేది ముస్లిముల నమ్మకం .ముహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పాడు,” ‘ప్రళయదినాన విశ్వాసి త్రాసులో ఉంచబడే అత్యంత బరువైన, విలువైన వస్తువు అతని సుత్ప్రవర్తనే! నోటితో అశ్లీల మాటలు పలికేవారిని, దుర్భాషలాడేవారిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు.” అందుకే దేహంలోని అవయవాలన్నీ ఉదయం లేవగానే నోటితో(నాలుకతో)ఇలా మొరపెట్టుకుంటాయట,”నాలుక తల్లీ! నువ్వు ఆచి తూచి జాగ్రత్తగా ఉండు. దైవానికి భయపడుతూ ఉండు!నీవు దైవానికి భయపడుతూ ఆచితూచి మాట్లాడాలి . లేకపోతే అనేక అనర్థాలు కలుగుతాయి!”భక్తులు అన్ని విధాలా ఉత్తమంగా మసలుకుంటారు. నలుగురికి ఉపయోగపడే మంచిపనులను చేస్తారు.మానసికంగానూ, భౌతికంగానూ పరిశుద్ధంగా ఉంటారు.తప్పు చేస్తే దాన్ని గుర్తించి పశ్చాత్తాప పడుతుంటారు.ధర్మం, న్యాయాలను అనుసరిస్తుంటారు. సహనం వహిస్తారు. ఏదైనా తలకు మించిన భారమైన పని గురించి అల్లాహ్‌ మీదనే భారం వేస్తారు.తనను నమ్ముకున్న వారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.మోసం చేసేవారిని, అధర్మ పరులను,అహంకారం, గర్వం గలవారిని, అల్లాహ్‌ ప్రేమించడు. దుబారా ఖర్చులు చేసేవారిని కూడా అల్లాహ్‌ ప్రేమింపడు.దానధర్మాలు చేయడంలో కూడా కూడా హద్దుమీర కూడదు. అల్లాహ్‌కు ఇష్టం కానివారు ముగ్గురున్నారు. 1. పనికి రాని ప్రశ్నలు వేసేవారు. 2. జ్ఞానం లేని మాటలు పలికేవారు. 3. దుబారా ఖర్చు చేసేవారు. దివ్యఖుర్‌ఆన్‌ బనీ ఇస్రాయీల్‌ సూరా 27వ వాక్యంలో దుబారా ఖర్చుచేసేవారు షైతాను సోదరులు.
“అల్లాహ్” దయకు అందరూ పాత్రులు అగుదురుగాక!
శారదాప్రసాద్

బోనాలు

రచన: జ్యోతి వలబోజు
ఆడియో: డా.శ్రీసత్య గౌతమి

బోనాలు ఆడియో ఈ లంకెలో వినండి.. BONALU

భారతావనిలో పండగలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండగ వెనుక ఓ ప్రాముఖ్యత ఉంటుంది. పండగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటి ఒక ముఖ్యమైన పంఢగ బోనాలు. తెలుగువారి ముఖ్యంగా తెలంగాణా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాల పండగ. బోనాల పండగ అనగానే కోలాహలం, ఉరకలెత్తే సంతోషం, కొత్తబట్టలు, పసుపు కుంకుమలు, వేపాకు తోరణాలు . ప్రతీ వీధిలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఎవరికి వారు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు అందరూ కలిసి గుడికి వెళతారు. బోనాల పండగరోజు ఆలయాల దగ్గర వినిపించే తెలంగాణ జానపద పాటలుకూడా అమ్మను స్తుతిస్తూ ఉత్తేజపరిచేలా ఉంటాయి. ఆ పాటలకు తాళం వేస్తూ చిందులు వేయక తప్పదు. ఎటువంటి అరమరికలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండగ ఇది.

అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకుని సరియైన మార్గంలో పయనిస్తాడు. అదే అమ్మకు పిల్లలకు ఉన్న అనుబంధం. అదే విధంగా ప్రకృతిమాత లేదా ఆ అమ్మలగన్నయమ్మకు కోపం వస్తే కూడా మనని దండిస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. అంటురోగాలు ప్రబలుతాయి. 1869 సంవత్సరంలో హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాలలో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను ప్రసన్నపరచడానికి ఉత్సవాలు , జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాలు. ఈ పండగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాదు, సికిందరాబాదులోనే కాక మరికొన్ని తెలంగాణా ప్రాంతాలలో ఈ పండగ చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ ముఖ్య ఉద్ధేశ్యం కలరా, ప్లేగు, మశూచి వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా, పాడిపంటలను, తప పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తారు. ఉగాది తర్వాత చాలా రొజులకు వచ్చే మొదటిపండగ ఇదే.

బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకుని దానిని ఘటంలో అంటే మట్టికుంఢ లేదా ఇత్తడి గుండిగలో వుంచి దానికి పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు తోరణాలు కడతారు. అన్నంలో పసుపు లేదా పాలు చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఆ పాత్ర పైన ఒక ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని, పూలు,నగలు అలంకరించుకుని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో సంప్రదాయిక నృత్యాలు చేస్తారు. ప్రతీ సమూహం వెదురుబద్దలు, రంగు కాగితాలతో తయారుచెసిన తొట్టేలను(ఊయల) కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మకు బోనాలు, తొట్టెల సమర్పించి కల్లుతో సాక పెడితే అమ్మ శాంతించి తమను, తమ పిల్లలను చల్లగా చూస్తుందని అందరి నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణ మార్పు వల్ల కూడా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఎలాగూ ఉంటుంది.

బోనాన్ని తలకెత్తుకున్న మహిళలు ఆ అమ్మయొక్క శక్తి , అంశ అని గౌరవిస్తూ ప్రజలు ఆ మహిళ కాళ్ల మీద నీళ్లు పోస్తారు. అలా చేస్తే అమ్మవారు శాంతిస్తుందని వాళ్ల నమ్మకం.

అదే కాక మరో నమ్మకం కూడా ఉంది. ఆషాడ మాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది. తమ కూతుళ్లు పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్టే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి ప్రేమగా భోజనం పెడతారు. తెలంగాణా ప్రజలు అమ్మవారిని తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తారు.

అమ్మవారి సోదరుడైన పోతరాజుది ఈ సంబరాలలో ముఖ్య పాత్ర. బలిష్టుడైన వ్యక్తి ఒళ్లంతా పసుపు రాసుకుని , వేపాకు మండలు కట్టుకుని , నుడుత కుంకుమ బొట్టుతో , కాలికి గజ్జెలతో కొరడా ఝలిపిస్తూ పూనకం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు. అమ్మవారికి సమర్పించే పలహారపు బళ్ళను అతనే ముందుండి నడిపిస్తాడు.

హైదరాబాదు, సికిందరాబాదులో ఈ పండగా వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు రోజులలో జరుగుతుంది. బోనాల పండగ ఆషాడ మాసంలోని ఆదివారం రోజే జరుపుకుంటారు. ఈ పండగ ఆషాడ మాసం మొదటి ఆదివారం రోజు గోల్కొండ కోటలోని జగదంబ ఆలయంలో మొదలవుతుంది. నిజాం నవాబుల కాలం నుండి ఈ ఆనవాయితి కొనసాగుతూ వస్తుంది. రెండో ఆదివారం సికిందరాబాదులోని ఉజ్జయినీ మహంకాళీ మందిరంలో జరుగుతుంది. అప్పుడు సికిందరబాదు వాసులందరూ ఈ పండగ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. మూడవ ఆదివారం హైదరాబాదులోని అన్ని ప్రాంతాలలో ఈ పండగ ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతీ వీధి కళకళ లాడిపోతుంది. చివరి ఆదివారం గన్ ఫౌండ్రిలో ఈ పండగ జరుపుకుంటారు. దీనితో బోనాల పండగకు తెర పడుతుంది. ఏ పండగైనా ప్రజలంతా ఒకేరోజు జరుపుకుంటారు. కాని బోనాల పండగను మాత్రం వారానికో ప్రాంతంలో నెలంతా కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

అమ్మవారిని ఎన్నో పేర్లతో కొలుస్తారు. మైసమ్మ, పోచమ్మ, యెల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మా, పోలేరమ్మ, మారెమ్మ, యెల్లమ్మ .. అమ్మే కదా యే పేరుతో పిలిచినా పలుకుతుంది , తమని ఆదుకుంటుంది అని ప్రజల ప్రగాఢ విశ్వాసం.. ఆదివారం బోనాలు సమర్పిస్తారు. ఇంతటితో పండగ ఐపోలేదు. మరునాడు ఉదయం రంగం అనే కార్యక్రమం ఉంటుంది. రంగం చెప్పడమంటే అమ్మవారు ఒక అవివాహిత శరీరాన్ని ఆవహించి ఆమె ద్వారా నగర ప్రజలకు రాబోయే ఏడాదిలో జరగబోయే మంచిచెడులను చెబుతుంది. రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చికుండపై నిలబడి, పూనకంతో ఊగిపోతూ భవిష్యత్తు చెబుతుంది. అలాగే ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబిస్తుంది. వేలాదిమంది భక్తులు ఈ భవిష్యవాణి వినడానికి గుంపు కడతారు.

బోనాల సంబరాలలో చివరి అంకం ఘటం ఊరేగింపు. రంగం తర్వాత సాయంత్రం ప్రతీ ప్రాంతం నుండి వేర్వేరు ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది . హైదరాబాదులోని పాతబస్తీలో వీధులన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. అలంకరించిన వాహనాలపై అమ్మవారిని ఘటం రూపంలో ఉంచుతారు. ఊరేగింపుగా వెళ్తారు. ఒక్కటొక్కటిగా అన్ని ఘటాల ఊరేగింపులు కలిసిపోయి ఒక్కటిగా సాగుతాయి. ఈ ఊరేగింపులో వివిధ వేషధారణలు, పాటలు, నాట్యాలు, గుర్రాలు కూడా కోలాహలం సృష్టిస్తాయి. ఈ రెండు రోజులు ఎంతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ జానపద గీతాలు ప్రముఖమైనవి. విన్నవారందరిని చిందులేయించే పాటలు ఎన్నో . డప్పుల దరువుతో సాగిపోయే కోడిబాయె లచ్చమ్మదీ, చుట్టూ చుక్కల చూడు, అమ్మ బయలెల్లినాదే… ఆటపాటలతో సాగిపోయిని ఈ ఘటాలన్నింటిని నయాపుల్ లోని మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో బోనాల పండగ సంబరం ముగుస్తుంది. ఇక సంవత్సరమంతా తమ పంటలను , పిల్లలను చల్లగా ఆ అమ్మ చల్లగా చూసుకుంటుంది అని నిశ్చింతగా ఇళ్లకు తిరిగి వెళతారు భక్తులు..

బ్రాహ్మణుడంటే ఎవరు?

రచన: శారదా ప్రసాద్(టీవీయస్.శాస్త్రి)

రాజకీయాలలోనే కాదు అన్ని వేదికలమీద కూడా కొందరు తామే హిందూ మతోద్ధారకులమని చెప్పుకుంటూ ఒకరినొకరు అభినిందించుకునేవారున్నారు. వారికివారే డబ్బాలు కొంటుకుంటారు! హిందూమతం ఎవరూ ఉద్ధరించే నీచస్థితిలో ఇప్పుడూ లేదు,ఇక ముందు కూడా ఉండబోదు! భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు హిందూమతంలో ఉండటమే, హిందూమతం యొక్క విశిష్టత, ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఉండబట్టే హిందూమతం నిరంతరం ప్రవహిస్తుంది! మతోద్ధారకులమని చెప్పుకునే వారికి ఇతరుల భావాలను గౌరవించటం చేతకాదు! వారి భావాలకు భిన్నమైన భావాలను వ్యక్తపరిస్తే వారు సహించలేరు! అందరికీ వారికున్న అభిప్రాయాలే ఉండాలని అనుకోవటం వారి అజ్ఞానం! అంతేకాదు బాగా చదువుకున్నామని(?) అనుకునే సంస్కార విహీనులు వ్యక్తిగత దూషణకు, ఎదురుదాడికి కూడా దిగుతారు! ఈ మధ్య సమాజంలో ఈ దాడులు మరీ ఎక్కువయ్యాయి! వారి కుసంస్కారానికి చింతించటం తప్ప మరి ఏమీ చేయలేం! ఈ హిట్లర్ సంస్కృతికి మూలాలు ఎక్కడివో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు! వీరు గాంధీ,నెహ్రూలను దూషిస్తారు.అది వారికి ఫాషన్ అయిపొయింది.ఎవరైనా హిందూ మతానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులను విమర్శిస్తే,


విమర్శించే పత్రికలకు జాతీయత లేదని భాష్యం చెబుతారు! కొంతమంది ఇతర మతస్తులను ‘బైబిల్ అన్నలని’, ‘దేవపుత్రులని’ ….మతం పేరుతో వారిని దూషిస్తారు! కులమతాలతో వ్యక్తులను దూషించేవారు భావదాస్య సంకెళ్లను వారికి వారే వేసుకుని ఉంటారు.ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు ఎవరో నిరక్షరాస్యులు కాదు,బాగా చదుకున్నామని అహంకరించేవారే ! వీరిలో ప్రొఫెసర్స్ కూడా ఉండటం దారుణం! వీరు నకిలీస్వామి నిత్యానందను కూడా పొగుడుతారు.అదీ వారి విజ్ఞత! ఇతర మతాలను గౌరవించటం తెలిసిన వారే,తమ మతాన్ని కూడా గౌరవించుకోగలరు! ఎందుకంటే గౌరవించటం అనే మౌలిక సూత్రం వారి నైజం కాబట్టి! ఇతర మతాలను, మతస్తులను మతం పేరుతో ద్వేషిస్తే హిందూమతం ఔన్నత్యం పెరుగుతుందా? వారి భావాలకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే ,దానికి ఒకాయన సమాధానం ……. “మనవాళ్లే ఇలా అంటే ఎలా?”అని! ఇక్కడ మనవాళ్లే అంటే బ్రాహ్మణులు అనే అర్ధాన్ని మీకు విడమరచి చెప్పనవసరం లేదనుకుంటాను! వారి భావన ప్రకారం ఎవరైనా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే వారు బ్రాహ్మణులు కారనేది వారి భావన,అవగాహనారాహిత్యం! ఈ సమాజాన్ని సంస్కరించిన బ్రాహ్మణులు ఎందరో ఉన్నారు. కందుకూరి, గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిలాంటి వారే నాలాంటి వారికి స్ఫూర్తిప్రదాతలు. ఇప్పుడు మతోద్ధారకులమని చెప్పుకుంటున్న బ్రాహ్మణులు కుహనా బ్రాహ్మణాలు! నిజమైన బ్రాహ్మణుడిని అందరూ గౌరవిస్తారు.మనమధ్యనే నివచించిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితం ,మరికొందరి జీవితాలే ఇందుకు నిదర్శనం. ఆయన నివసించిన చందోలులో ముస్లిములు ఎక్కువ.వారు కూడా ఆయన ఆశ్రమానికి తలా ఒక బస్తా ధాన్యం ఇచ్చేవారు.ఆయన ఎవరినీ ఎప్పుడూ ఏదీ అడగలేదు, గౌరవంతో సహా.ఆయన చందోలులో నడచి వెళుతుంటే అందరూ కులమతాలకు అతీతంగా లేచి నిలుచుంటారు.Respect should be commanded, not demanded! ఇప్పుడు కొందరు అహంకారులు అన్నీ వారికే తెలుసని అనుకుంటారు.అన్నీ తెలుసని అనుకునే వారే అసలైన మూర్ఖులు. తెలుసుకోవలసింది చాలావుంది, తెలిసింది చాలా సూక్షం అనుకునే వారు నిజమైన జ్ఞానులు.డంబం,దర్పం ప్రదర్శించే వారికి కనీస జ్ఞానం కూడా ఉండదని చెప్పటానికి చింతిస్తున్నాను! ఇటువంటి డంబాలు ప్రదర్శించే వారిని గురించేనేమో ‘నడమంత్రపు వైష్ణవానికి నామాలెక్కువ! ‘అనే సామెత వచ్చింది.అసలు,”నువ్వు బ్రాహ్మణుడివే కాదు”అని నన్ను అన్నారు కొందరు! కాకపోతే ఫరవాలేదు,నేను ఇలాగే ఉంటాను.నిజానికి వారితో పోలిస్తే నేను నిస్సందేహంగా నిజమైన ‘బ్రాహ్మణుణ్ణి’ ! భావదారిద్య్రం ఉన్నవాళ్లు మతోన్మాదులు చెప్పిన ప్రతిదానికి చప్పట్లు కొడుతారు! నాకు అటువంటి భావదారిద్య్రం లేదు.ఎవరి భావాలనో మోసుకుని తిరిగే కట్టుబానిసను కాను! అటువంటి మాటలు విని చెవుల్లో పూలు పెట్టుకోవటానికి నేను ఏ కాబేజీ శాస్త్రినో కాదు! నేను ఇంతకు ముందు తెలియచేసిన భారతంలోని అరణ్యపర్వంలోని నహుషుడి కథ, ధర్మవ్యాదుడి కథ,యక్ష ప్రశ్నలు మరియూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’అనే కథలోనూ బ్రాహ్మణుల కుల ప్రస్తావన వచ్చింది. బ్రాహ్మణత్వాన్ని నిర్ణయించేది కులమా? గుణమా? అని ఎవరైనా నన్నడిగితే గుణమే అని నిస్సందేహంగా చెబుతాను.ఒక వ్యక్తి పుట్టుకతో బ్ర్రాహ్మణుడై ఉండవచ్చు. కాని అతనిలో అహంకారం,దర్పం,విచ్చలవిడి జీవితం,విలాసాల మీద కోరికలు,అబద్దపు నడవడిక ఉంటే అతడు బ్రాహ్మణుడుగా పరిగణించబడడు. ఇంకొకడు ఇతరకులాలలో పుట్టినప్పటికీ, అతనిలో ఈ లక్షణాలు లేకపోతే అతన్ని బ్రాహ్మణుడుగానే పరిగణించవచ్చు. ఇక బ్రాహ్మణకులంలో పుట్టి, పై దుర్గుణాలు లేనివాని మాట చెప్పేదేమున్నది?అతను అత్యుత్తముడు! “జన్మనా జాయతే శూద్ర:సంస్కారాద్ ద్విజ ఉచ్యతే,వేదపాఠీ భవేద్విప్ర:బ్రహ్మ జానాతి బ్రాహ్మణ : “అని స్మృతులు చెబుతున్నాయి.దీని అర్ధం ఏమిటంటే,పుట్టుకతో అందరూ శూద్రులే. అనగా అజ్ఞానంతోనే అందరూ జన్మిస్తారు.సత్కర్మల ద్వారా, తపస్సాధనల సంస్కారాల ద్వారా వారు ద్విజులవుతారు. వేద గ్రంధ పఠనం వలన జ్ఞానాన్ని పొంది విప్రులవుతారు.

విప్రులలో కూడా పరబ్రహ్మను సాక్షాత్కరించుకున్న వారు మాత్రమే బ్రాహ్మణులు లేదా బ్రహ్మజ్ఞానులు అనబడుతారు.బ్రాహ్మణత్వం అనేది కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని బట్టి నిర్ణయించబడుతుందని అరణ్యపర్వంలోని కథల ద్వారా తెలుసుకున్నాం! పుట్టుకతో వచ్చిన ఈ లక్షణాలను వారు అభ్యాసం ద్వారా చక్కగా వృద్ధిచేసుకోకపోతే అవి దుస్సాంగత్యదోషంవల్లా, కుహనాగురువుల వల్ల క్రమేణా నశించిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారిని ప్రస్తుతం కొంతమందిని మనం చూస్తున్నాం! Emergency విధించిన తరుణంలో శ్రీమతి ఇందిరా గాంధికి శ్రీ చంద్రశేఖరసరస్వతీ స్వామి వారు దర్శనం ఇవ్వలేదు.మరి నేటి చాలామంది పీఠాధిపతులు ‘అనుగ్రహభాషణం’ చేసేది(అవినీతిపరులైన) రాజకీయ నాయకులతోనే! చాలామంది స్వాములు, పీఠాధిపతులు అవధూతలు వచ్చారు. కానీ వారు వివేకానందుని లాగా,రామతీర్థ లాగా–ప్రజలలోకి చొచ్చుకొని పోయి ప్రజలను జాగృత పరచటంలో పూర్తిగా వైఫల్యం చెందారు అని చెప్పటంలో నాకు ఎటువంటి దురుద్దేశ్యం లేదు.వేదికనెక్కి గంటలకొద్దీ ఏది పడితే అది అనర్గళంగా మాట్లాడే ఈ సాధుపుంగవులు ప్రజలను ఎందుకు చైతన్యవంతులను చెయ్యటానికి ప్రయత్నించరు?125 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రపంచపు గొప్ప నాటకాలలో ఒకటైన ‘కన్యాశుల్కం’ లో అనేకమైన బ్రాహ్మణ పాత్రలు ఉన్నాయి. అగ్నిహోత్రావధాన్లు, బుచ్చమ్మ, లుబ్ధావధానులు, రామప్ప పంతులు,గిరీశం, సౌజన్యారావు పంతులు గారు మొదలైన ముఖ్య పాత్రలను తీసుకొని విశ్లేషించుకుందాం!
అగ్నిహోత్రావధాన్లు–పిలక పెట్టుకొని విభూతి రాసుకొని త్రికాల సంధ్యలు, అగ్నిహోత్రం చేస్తాడు ఈయన.నిత్య నైమిత్తిక కర్మలను యధావిధిగా ఆచరిస్తూ ఉంటాడు. ఇంటిలో ఒక బాలవితంతువైన ఒక కూతురిని పెట్టుకొని, మరో కూతురిని
(బాలికను)డబ్బులకు అమ్ముకునే దౌర్భాగ్యుడు అయిన అగ్నిహోత్రావధానులు బ్రాహ్మణుడా?
లుబ్ధావధానులు-చావుకు కాళ్ళు చాచుకొని,జ్యోతిష్యాన్ని నమ్ముకొని నాలుగో పెళ్ళికి సిద్ధపడి ,డబ్బులిచ్చి ఒక బాలికను వివాహ మాడటానికి సిద్ధపడ్డ,ఇతనూ బ్రాహ్మణుడేనా? ఇతని ఇంటిలో కూడా ఒక బాల వితంతువైన కూతురు ఉంది.
రామప్ప పంతులు–లౌక్యానికి,మోసానికి తేడాను తెలిపిన ఘనుడు ఈయన.అందిన చోటల్లా కమీషన్ రాబట్టుకుంటాడు. వేశ్యాలోలుడు.ఆ వేశ్యలకు డబ్బులు కూడా ఇవ్వడు.లుబ్ధావధానులు యొక్క విధవకూతురితోనూ,పూటకూళ్ళమ్మతోనూ,మధురవాణితోనూ ..ఇలా చాలా మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు గలవాడు ఇతడు. ఆ మాటకొస్తే,పురుషులతో కూడా సక్రమమైన సంబంధాలు ఉండవు ఇతగాడికి.మరి,ఇతడు కూడా బ్రాహ్మణుడేనా?
గిరీశం–శీలంలేని ఒక ఆషాఢభూతి ఇతడు! మరి ఇతడూ బ్రాహ్మణుడేనా?
సౌజన్యారావు పంతులు గారు–సంస్కరణాభిలాషి,నిజాయితీపరుడు,శీలవంతుడు.నిత్య నైమిత్తిక కర్మలను వేటినీ ఆచరించడు.జీవితమే ఒక యోగం,యాగంగా గడిపిన మహనీయుడు.సహజంగా జీవించటం,అందరినీ సమదృష్టితో చూడటం తెలిసిన ఈ మహనీయుడే నిజమైన బ్రాహ్మణుడు.శ్రీ గురజాడ వారు ,ఆనాటి కొంతమంది జాతి బ్రాహ్మణులకు
ఉన్న అహంకారాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక వేశ్య అయిన మధురవాణి చేత సౌజన్యారావు పంతులు గారిని ఉద్దేశించి, ఇలా అనిపిస్తారు—“బ్రాహ్మణులలో కూడా గొప్ప వారుంటారన్న మాట! ”ఎంత వ్యంగ్యంగా చెప్పి కొరడా ఝళిపించి ‘కుహనా బ్రాహ్మణులకు’దేహశుద్ధి చేసారు!
అయినా నేటికీ కొంతమందికి ఇంకా దురాహంకారం పోలేదు. అన్నట్లు మరిచాను,ఇంత గొప్ప నాటకం వ్రాసిన శ్రీ గురజాడ వారిని మించిన ‘బ్రాహ్మణుడు’ వేరే ఉంటాడా?’ఇలాంటి తవ్వాయి వస్తే’కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు నిజమైన బ్రాహ్మణుడు.అంతదాకా ఎందుకు సంస్కరణాభిలాష కల ప్రతివాడు బ్రాహ్మణుడే! ఒకసారి చరిత్రను పరిశీలించండి, బ్రాహ్మణుడంటే ఎవరో మీకే తెలుస్తుంది! ఈ వ్యాసం నా ఆవేదనలో నుంచి పుట్టింది! మీ ఆశిస్సులుంటే ఇటువంటి మరెన్నో వ్యాసాలను ఇక ముందు కూడా వ్రాయగలను!
సర్వే జనా: సుఖినోభవంతు!
(ఈ వ్యాసం ఎవరినీ ఉద్దేశించి వ్రాసింది కాదు.నన్ను బ్రాహ్మణుడు కాదన్న వారికి ఇది సమాధానం! ఇది నా ఆవేదన ! నా కలానికి,గళానికి వాడి, వేడి,పదును ఎక్కువ! ! అనవసరంగా ఎవరైనా భుజాలు తముఁడుకుంటే నేనేమీ చేయలేను! )
నేనొక దుర్గం…
నాదొక స్వర్గం…
అనర్గళం… అనితరసాధ్యం… నా మార్గం!
అన్న శ్రీశ్రీ కవితా వాక్యాలతో దీన్ని ముగిస్తున్నాను!

దైవప్రీత్యర్థం విధ్యుక్త ధర్మాచరణం

రచన: జి సందిత

మానవులు జన్మనుసార్థకంచేసుకోవటం అంటే భగవంతుని మెప్పుపొందటమే!
అందుకోసం మనుషులకై నిర్దేశించిన అనుసరించవలసిన కర్మాచరణ విధివిధానశాస్త్రమే ధర్మము. కర్మాచరణం కూడా త్రికరణశుద్ధిగా చేయవలసి వుంటుంది. అప్పుడే అది ధర్మంమవుతుంది.
త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా వైరుధ్యం లేక పోవటమే! ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి భోజనంపెట్టటం మన ధర్మం అనుకుందాం
అప్పుడు
వండి సిద్ధం చేయటం వడ్డించటం శరీరకర్మ. అతిథిని భోజనానికి ఆహ్వానించటం తదుపరి ఏమేమి ఉన్నాయో తెలిపి కొసరికొసరి అడగటం వాచా కర్మ. అలా చేస్తున్నందుకు తృప్తిపడుతూ ఆనందించటం మానసిక కర్మ. అటువంటి పూర్ణ ధర్మాచరణమే దైవప్రీతమైన కార్యమన బడుతుంది. ఇలా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే కర్మాచరణంతో ముడివడిన ధర్మాచరణం సంపూర్ణసార్థక్యం చెందుతుంది.
ఇచ్చట మనసే ప్రధానమైనది. మనసులో అయిష్టత వైరుధ్యం వున్నప్పుడు వండటంలోనూ, వడ్డించటంలోనూ, భోజనానికి పిలవటంలోనూ, కొసరటంలోనూ, మాటల్లోనూ, తృప్తిగా ఆనందించటంలో, మనసులోనూ, భోజనం పరిమాణం, రుచులు, నాణ్యతలలోను ప్రభావం కనిపించవచ్చు. అటువంటి ధర్మాచరణం మానవులదృష్టిలో ధర్మ కార్యమన బడవచ్చును కాని దైవం మెచ్చదు.
దైవప్రీత్యర్హమైన ధర్మాచరణం ఒకచో — విధ్యుక్త ధర్మం- స్వీయకర్తవ్యం కావచ్చును. ఐనప్పటికిని -అది పూజలు, వ్రతాలకన్ననూ, జపతపాదికాలకన్ననూ, యజ్ఞహోమాదికాలకన్ననూ అత్యంతపవిత్రమైనదై దైవాన్ని మెప్పిస్తుంది. ముఖ్యంగా వృత్తిరీత్యా దీనులను ఆదుకునే స్థానంలో కర్తవ్యాన్ని, విధ్యుక్తధర్మాలను నిర్వహించే వారైనా ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా ఇతరత్రా స్వయంగా అటువంటి బాధ్యతలు నిర్వహించే వారైనా —తమకు ప్రాప్తించిన అధికారాన్ని, వృత్తినైపుణ్యాన్ని దేవుడు మనకు ఇచ్చిన వరంగా ప్రసాదించిన మహిమగా భావించాలి.
ఆ విధంగా మనకు తన మహిమల్ని మనకు ఇచ్చి — మనుషుల దైన్యాలను దూరం చేసే అవకాశాన్ని మనకు ఇచ్చాడని గ్రహించాలి.
ఆ విధంగా మనుషులకు సేవ చేస్తూ దేవునికి దేవుని కృపకు దీనులను మరింత చేరువచేస్తూ భగవంతుణ్ణి మనం మెప్పించ గలగాలి. అప్పుడే మన జన్మసార్థకమౌతుంది.
దీనులంటే రోగములచే గాని ఇతరత్రా కష్టములచే గాని పీడింపబడుతూ భగవంతుని శరణువాడే వారే కదా! వారు బాధలనుండి రక్షిస్తారన్న ఆశతో వైద్యులవద్దకుకాని, సంబంధిత అధికారుల వద్దకు గాని వస్తూవుంటారు. అలా బయలుదేరుతూ వారు–
“దేవుడా! మేము వెళ్ళిన చోట ఆ వైద్యులు లేదా అధికారులు సిద్ధంగా వుండేట్లు చూడు వాళ్ళు వెంటనే మా బాధల్ని తొలగించేట్లు చూడు” అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తారు. అలా కష్టాలు తీరితే–
” దేవుని దయవల్ల సులభంగా మాకు మేలు జరిగింది” అని దేవుణ్ణి తలుచుకుంటారు.
దేవుడు కూడా “ఫలానా వ్యక్తికి వైద్యునిగా లేదా అధికారిగా విధులు నిర్వర్తించే అవకాశం, శక్తి, మహిమ ఇచ్చినందువలన లోకానికి మంచి జరిగింది ” అని భావిస్తాడు. ఆ విధంగా విధ్యుక్తధర్మం, కర్తవ్యం సక్రమంగా నిర్వర్తించేవారికి మరో జన్మలో కాని అదే జన్మలో గాని ఇంకా మంచి వృత్తినైపుణ్యాలను, అధికారాలను ప్రసాదిస్తాడు దేవుడు.
దేవుడు అటువంటి వారికి అత్యున్నత స్థితులను కల్పిస్తూ ఇహలోక సంబంధమైనమైన అష్టైశ్వర్యాలను స్వర్గసుఖాలను కల్పిస్తాడు.అటుపై ఏకంగా అటుపై మోక్షప్రాప్తినిస్తాడు.
అందుకు విరుద్ధంగా కర్తవ్యాలను విస్మరించే వారు దీనులకు తటస్థిస్తే దీనులు దిక్కుతోచక “దేవుడా నీవు దీనబాంధవునివని నిన్ను ప్రార్థించి బయలుదేరితిమే ఎందుకు ఇలా చేసితివి తండ్రీ! నీ దయ మాపై చూపలేదేమి “అంటూ దేవునితో మొఱపెట్టుకుంటారు. దయతో ప్రసాదించిన విద్యావకాశములచే ఉద్యోగావకాశములచే దీనుల కష్టాలనుతీర్చే శక్తిని మహిమను అధికారములను పొందిన వారు –ధర్మాన్ని మరచిపోయిన ఫలితంగా
మరుజన్మంటూ వుంటే వారికి దైవీయమైన పై నైపుణ్యాలను అధికారాలను ఎట్టి పరిస్థితులను ప్రసాదించడు.
దైన్యం అంటే ఏమిటో వారికి అర్థం అయ్యేలా అటువంటి కర్తవ్యద్రోహులకు దీనాతి దీనులుగా జన్మను ప్రసాదించి తనను ప్రార్థించి తనకు చేరువై దీనజన రక్షణావశ్యకతను గుర్తించేలా అనుగ్రహిస్తాడు.
మానవులమైన మనమైనా మనకు చెడ్డపేరు తెచ్చిపెట్టే కన్నబిడ్డలకైనా అధికారాలను బాధ్యతలను అప్పగించలేముకదా!
*** ** ***
దీనబాంధవుడైన భగవంతుని ప్రీత్యర్థం కర్తవ్యపాలనంలో భాగమైన విధ్యుక్త ధర్మాల్ని
త్రికరణశుద్ధిగా నెరవేర్చటం మన ధర్మం. అదే మానవధర్మం కూడానూ.

ఫీల్ గుడ్ మీడియా..

రచన: జి.ఎస్.లక్ష్మి

మన నట్టింట్లో తిష్టవేసి, మనలను వినోదింప చేయవలసిన టీవీతో మనలో చాలామంది అనుభవిస్తున్న నిత్య సంఘర్షణ అందరికీ తెలిసినదే.
వేలకువేలు పెట్టి టీవీలు కొంటున్నాం. ప్రతినెలా వందలకి వందలు కేబుల్ కనెక్షన్ కి కడుతున్నాం. దానివల్ల యింట్లో మనము కోరుకున్న ప్రసారాలు వస్తున్నాయా? ఈమధ్య ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.
రోజురోజుకీ సమాజపు విలువలను దిగజారుస్తున్న టీవీ కార్యక్రమాలపై ప్రేక్షకులు చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబమంతా కూర్చుని చూసే ఆ కార్యక్రమాలకి ఒక ప్రామాణికత వుండాలని కోరుకుంటున్నారు. అలాంటివారందరూ కలిసి ఒక సమూహంగా యేర్పడినదే ఈ “ఫీల్ గుడ్ మీడియా” గ్రూప్.
2017 మార్చిలో మొదలుపెట్టిన ఈ గ్రూప్ కి చక్కటి స్పందన వచ్చింది. రెండునెలలలోపే వేయిమందికి పైగా సభ్యులు చేరారంటే ఈ సమస్య గురించి అందరూ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అందుకనే అడ్మిన్స్ అసలు ప్రేక్షకులకు ఎటువంటి కార్యక్రమాలు కోరుకుంటున్నారోననే ఉద్దేశ్యంతో ఏప్రిల్ నెలలో ఒక సర్వే నిర్వహించారు. చాలామంది యెంతో ఉత్సాహంతో ఆ ప్రశ్నావళిని పూర్తిచేసారు.
టీవీ లో వచ్చే కార్యక్రమాలు యెలా వుంటే బాగుంటాయో, వాటి ప్రామాణికతను పెంచుకుందుకు యెటువంటి పనులు చేయాలో సభ్యులందరూ వారి వారి అభిప్రాయాలను ఈ గ్రూప్ లో స్పష్టంగా తెలిపారు.
అంతేకాక మే21. 2017 న గ్రూప్ సభ్యులతో మొట్టమొదటి సమావేశం జరిగింది. హైద్రాబాదు లో శివమ్ రోడ్ లోని cess రీడింగ్ రూమ్ లో జరిగిన ఈ సమావేశానికి జి.ఎస్.లక్ష్మీ, మాలతి, కనకదుర్గ, పి.ఎస్.ఎం.లక్ష్మీ, ఏలేశ్వరపు కనకదుర్గ, రాజ్యలక్ష్మి, కేశవరావు గారు, శైలజ హాజరయ్యారు..
ఆ సమావేశంలో గ్రూప్ అడ్మిన్ అయిన G.S.Lakshmi గారు మాట్లాడుతూ Feel Good Media గ్రూప్ మొదలు పెట్టటానికి దారి తీసిన పరిస్థితులు వివరించారు. ఎవరికి వారం మేము తెలుగు చానెల్స్ చూడము, మాకు ఇబ్బంది లేదు అనుకోవడం కాదు. సమాజంలో T.V. లో వచ్చే సీరియల్స్ మరియు రియాలిటీ షోస్ ల చెడు ప్రభావం గురించి అవగాహన ఉన్న వారు ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు.
ఇంకొక అడ్మిన్ అయిన మాలతి గారు మాట్లాడుతూ సమాజనికి మన బాధ్యతగా మంచి చెయ్యాలని Feel Good Media ప్రయత్నిస్తుంది అన్నారు. T.V. లో వచ్చే చిన్న పిల్లల షో ల లో వుండే అనారోగ్యకరమైన పోటీ వలన వారి కి ఎమోషనల్ గా మంచిది కాదు అని అన్నారు.
T.V ఛానెల్స్ వలన చాలా మంది కి జీవనోపాధి కలుగుతున్న మాట నిజమే అయినా,TV చాలా పవర్ ఫుల్ మీడియాగా మారిందని, దాని యొక్క ప్రభావం, ముఖ్యముగా యువత మీద చాలా ఉందని ఆవిడ చెప్పారు
జొన్నలగడ్డ కనకదుర్గ మాట్లాడుతూ, చిన్న గ్రూపులు గా ఏర్పడి కాలనీలలో T.V. లో వచ్చే ప్రోగ్రామ్స్ గురించి అవగాహన ఏర్పరచాలని అన్నారు.
ఇంట్లో ఉండే పెద్దవారు వేరే ఏమి కాలక్షేపం లేక ఒంటరితనం దూరం చేసుకోవటానికి T.V. చూస్తారని…అందుకని వారికి, పిల్లలకి constructive activities లో engage చేయవలసిన బాధ్యత ఇంట్లో వాళ్లకి ఉందని చెప్పారు.
TV లో సెన్సార్ తో పాటు ప్రోగ్రామ్స్ కి censor certification వుంటే బాగుంటుంది అని కూడా ఆవిడ సూచించారు.
శైలజ విస్సాంసెట్టి మాట్లాడుతూ చిన్నపిల్లలు చేసే డాన్స్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళతో చేయించే విన్యాసాల వల్ల వారు శారీరకంగా, మానసికంగా బాధపడే అవకాశం ఉంది అన్నారు..మహిళలు, కాలేజ్ స్టూడెంట్స్ T.V. కి targeted audience అని… Serials లో చూపించే విలనీలు ,కుతంత్రాల తో లీనమై వారిని ఆ స్థానంలో ఊహించుకునే అవకాశం ఉంది అన్నారు ఆవిడ. ఒక మంచి మార్పు కోసం ఏర్పడిన Feel Good Media గ్రూప్ ఒక ఒక బిందువు చేరి సంద్రం లాగా మారాలని ఆవిడ ఆకాంక్షించారు.
కేశవరావు గారు మాట్లాడుతూ రిటైర్ అయిన వారికి T.V. బాగా కాలక్షేపం గా ఉంటుందని అన్నారు. ఆయన ఎక్కువ భక్తి ఛానెల్స్ చూస్తారని.. ఏదైనా పండుగలు, ఉత్సవాలు లాంటివి జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూడలేని వారు ఈ భక్తి చానెల్స్ లో డైరెక్టుగా చూసే అవకాశం కలుగుతుంది అన్నారు. పాడుతా తీయగా లాంటి మంచి ప్రోగ్రామ్స్ వలన చాలా మందికి మంచి జరుగుతుంది అన్నారు.
రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ఇంట్లో రెండు T.V. లు ,రెండు డిష్ కనెక్షన్ లు పెట్టుకుని, యు ట్యూబ్ చానెల్స్ చూస్తున్నామని అన్నారు. సీరియల్స్ లో కుతంత్రాలు, హిందు ధర్మాలు విరుద్ధముగా తాంత్రిక సీరియల్ ప్రతి ఛానల్ లోను ఆనవాయితీ గా మారిందనీ, రియాలిటీ షోస్ వెకిలిగా ఉన్నాయి అని అన్నారు.
యేలేశ్వరపు కనకదుర్గగారు మాట్లాడుతూ పిల్లలకు ,పెద్దలకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక కాలక్షేపానికి వేరే దారి లేక. T.V. చూడడమే ప్రధాన కాలక్షేపం అయింది అంటూ, మన టీవీ ప్రోగ్రామ్స్ లో ఇంకా పరిణితి రావలసి వుంది అని చెప్పారు.
పి.ఎస్.ఎమ్.లక్ష్మీ గారు మాట్లాడుతూ చదువుకున్నతల్లితండ్రులున్న పిల్లలకి యేది మంచో, యేది చెడో తెలుస్తుంది… చదువురానివాళ్ళకి ఆ విచారణ వుండదు అన్నారు. ప్రభుత్వం తరపున టీవీ లో వచ్చే ప్రోగ్రామ్స్ కి తగు guidelines మరియు censor ఉండడం చాలా అవసరం అని. అందుకు తగిన కృషి చేయవలసిన అవసరం ఉంది అన్నారు.
ఈ సమావేశం లో అందరూ కలిసి తీర్మానించినదేమంటే..
1. నెలకి ఒకసారి అందరూ కలుసుకొని ఈ విషయమై చర్చలు జరపడం.
2. చిన్న చిన్న స్కిట్స్ మరియు నాటికలు. -మన సంస్కృతి ,సంప్రదాయాలు మరియు మంచి హాస్యంతో కూడినవి మన సభ్యులలో ఉన్న రచయిత్రులు, రచయితలు రాయగా, వాటిని అడియో, వీడియో కార్యక్రమాలుగా రూపొందించడం..
3. ప్రభుత్వ పరంగా టీవీ చానల్స్ పై సెన్సార్ గురించి ప్రయత్నం చేయడం.

కుటుంబంలో విలువలు నిలబడితేనే సమాజం బాగుంటుంది. అటువంటి సమాజ నిర్మాణానికై బాధ్యతగల పౌరులుగా అందరినీ కలిసి రమ్మని ఈ ఫీల్ గుడ్ మీడియా కోరుకుంటోంది.

నీటిని పొదుపుగా వాడుకుందాం!

రచన: శారదాప్రసాద్ (టీవీయస్. శాస్త్రి)

నీటిని పొదుపుగా వాడేవారు ధనాన్ని కూడా పొదుపుగా వాడుతారట!నీటిని దుబారా చేసే వారు డబ్బును కూడా అలానే దుబారా చేస్తారట. ఈ భూమి మీద లభిస్తున్న మొత్తం నీటిలో 97 శాతానికి పైగా సముద్రజలం. అది ప్రాణులకు ప్రత్యక్షంగా ఉపయోగపడేది కాదు. మరో రెండు శాతానికి పైగా మంచు రూపంలో ఉంది. మిగిలిన ఒక్క శాతంకన్నా తక్కువే ప్రాణులకు పనికివచ్చేది. అదే మంచినీరన్న మాట! ఇప్పుడా మంచినీటికి పెద్ద ముప్పు ఏర్పండింది. అధిక జనాభా తదితర వాస్తవాల వల్ల నీటి వినియోగం పెరిగి చాలీచాలని పరిస్థితి ఒకటైతే, దారుణమైన కాలుష్యం మరొకటి!వాతావరణం కాలుష్యం పెరిగి మంచుమీద ఒత్తిడి మొదలైంది. భూగోళం మీది సమతుల్యానికి మంచు కూడా ఒక ఆధారం. అది కాస్తా కరిగిపోతే, జలప్రళయం సంభవించి నేల తుడిచిపెట్టుకు పోతుంది. నీరే మన జీవనానికి ఆధారం. నదీ పరివాహక ప్రాంతాలలోనే నాగరికత, సంస్కృతీ అభివృద్ధి చెందటం మనకు తెలిసిన విషయమే! నీరు మనకు ఆహారం. నీరే మనకు ఆధారం. రవాణా వ్యవస్థకు కూడా మనం నీటిని వాడుకుంటున్నాం. నీటి కోసం జరుగుతున్న ఉద్యమాలను చూస్తున్నాం. రాబోయే కాలంలో వచ్చేవి ‘జలయుద్ధాలే’! ప్రకృతితో ఇకనైనా పరిహాసాలు ఆపేసి, ప్రకృతి వనరులను అతి పవిత్రంగా చూసుకోవటం నేటి మన తక్షణ కర్తవ్యం. అడవులను ఆక్రమించుకుంటున్నాం. స్మశానాలను ఆక్రమించుకుంటున్నాం. చెరువులు ఇతర జలాశయాలను నగరాల్లో ఎప్పుడో ఆక్రమించారు హిరణ్యాక్షుడివర ప్రసాదులు! నిజం చెప్పాలంటే మనమే నీటిని తరిమివేసాం . చాలా నదులు అంతర్ధానం అయిపోయి, అంతర్వాహినులుగా ఉన్నాయి. వాటిలో మన రాష్ట్రంలోని శ్రీ కాళహస్తిలోని సువర్ణముఖి నది ఒకటి.

ఇటువంటి నదులు మనదేశంలో షుమారు 50 కి పైగా ఉన్నాయని అంచనా!భూమిలోకి వెళ్ళిపోయిన ఆరావళీ పర్వత ప్రాంతాలలో శుష్కించిపోయిన అయిదు నదులను బతికించిన ‘జలబ్రహ్మ’ జలభాష, ఘోషను అర్ధం చేసుకోగల మహామనీషి, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత, తరుణ్ భారత్ సంఘ్ అధినేత అయిన శ్రీ రాజేంద్రసింగ్ ను గురించి మనలో ఎంతమందికి తెలుసు? క్షామపీడిత గ్రామసీమలకు నీటిని రప్పించి సస్యశ్యామలం చేసిన జలదాత ఆ మహానుభావుడు!ఆయన స్ఫూర్తితో తెలుగులో ‘జలగీతం’ అనే 110 పుటల దీర్ఘ కవితను(తెలుగులో వచ్చిన మొదటి దీర్ఘ కవిత ఇదే!) అద్భుతంగా వ్రాసి నాలాంటి ఎందరినో ఉత్తేజపరచిన డాక్టర్. యన్. గోపి గారికి అభినందనలు తెలియచేసుకుంటున్నాను. మనకు రోజుకి కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కానీ ఇప్పటికీ 88. 4 కోట్ల మంది ( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది. బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు. నీరు లభించని ప్రాంతాలలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది. పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.

ఉన్న మంచినీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించిన వారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. అరకిలో కాఫీ తయారవడానికి 11, 000 లీటర్ల నీరు అవసరం. కార్పొరేట్ కంపెనీలు ఆరోగ్యానికి హాని కలిగించే శీతల పానీయాల కోసం వృధా చేస్తున్న మంచి నీటికి ఇక లెక్కే లేదు. కొన్ని రాష్ట్రాలు ఈ శీతల పానీయాలను నిషేధించాలని కూడా చూస్తున్నాయి. ప్రపంచ జనాభాలో భారత్ జనాభా 16 శాతంగా ఉంది. కానీ ప్రపంచ నీటి వనరుల్లో భారత నీటి వనరులు కేవలం నాలుగు శాతంగానే ఉన్నాయి. ప్రస్తుతమున్న వెయ్యి మిలియన్ల జనాభాకు తలసరి నీటి లభ్యత సంవత్సరానికి ఒక్కో వ్యక్తికి 1. 170 క్యూబిక్ మీటర్లుగా ఉంది. తీవ్రంగా ఉన్న నీటికొరత అవసరాలకు వాడుకునే వారి మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో నీటి యుద్ధాలు ఖాయమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మన దేశంలో మాత్రం ఇప్పటికే నదీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. జల వివాదాలకు పెరుగుతున్న నీటి వినియోగమే ప్రధాన కారణం. వర్షాలు తగ్గడం, నదీ ప్రవాహంలో తేడా, అనుమతులు లేకుండా డ్యామ్ల నిర్మాణానికి ప్రయత్నించడం మరి కొన్ని కారణాలు. 2050 నాటికి బ్రహ్మపుత్ర, బారక్, తపతి నుంచి కన్యాకుమారి వరకు పశ్చిమ దిశలోకి ప్రవహించే నదుల్లో మాత్రమే తగినంత నీరు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు . నీటి విలువను తెలిపే పవర్ పాయంట్ ప్రజంటేషన్ ను మరో మహామనీషి, మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాంగారు తయారు చేసి ఎప్పుడో present చేసారు.

జలం మన బలం. నీటిని వృధా చేయకండి. నీటిని వృధాచేస్తే ఆఖరికి ‘కన్నీరు’కూడా కరువవుతుంది!
నా ఈ చిన్ని వ్యాసం శ్రీ రాజేంద్రసింగ్ గారికే అంకితం!

పయనం

రచన: కామేశ్వరీదేవి చెల్లూరి

కెనడాలోని Ottawa నగరం

సెప్టెంబర్ నెల వచ్చింది. సాయంకాలం ఆరు గంటలయంది. బ్లైండ్స్ తీసి బయటికి చూశాను. కళ్ళు చెదిరే వెలుగు. చూడలేక బ్లైండ్స్ మూసేశాను. హు ! ఇంకో గంట పోతేకానీ వాకింగ్ కి వెళ్లలేను. ఇప్పుడు ఏడు గంటలకి కానీ సూర్యాస్తమయం అవదు. ఇక్కడ మే నెల నుంచీ వీళ్లకి పండగే. ఆరు నెలలుగా మంచులో మునిగి, మోడై న చెట్లు కొద్ది నెలల్లోనే చిగురించి పచ్చగా తయారవుతాయ. కంటికి కనబడకుండా పోయన లిల్లీలు, టొమాటోలు, ట్యూలిప్స్ మేమూ ఉన్నామంటూ ఎంచక్కా బయటికి వచ్చి వొళ్ళు విరుచుకుంటాయ. ప్రతీ ఇల్లు , పచ్చని మొక్కలతో, రంగురంగుల పూలతో కళకళ్లాడిపోతాయ.

ఏడు గంటలైంది. బయట చల్లబడింది.’ అమ్మాయీ ! వాకింగ్ కి వెళ్లి వస్తా ‘ అన్నాను షూస్ వేసుకంటూ. ‘సరేనమ్మా! రోడ్లు గుర్తున్నాయిగా ‘ అంది. ఆ !ఆ! అంటూ తలుపు దగ్గరకి నొక్కి బయలుదేరాను.

చుట్టూ అందమైన ఇళ్ళు. ఇంటి ముందు స్తంభాలతో చక్కని అందమై న బాల్కనీలు రాజమందిరాలను గుర్తుకు తెస్తాయి. మంచు జారడానికి వేసిన కప్పులు, మన పెంకుటిళ్లని గుర్తుకు తెస్తాయి. లోపల విశాలంగా అన్ని సౌకర్యాలతో ఉన్న గదులు విదేశీ ఉన్నతిని తలపిస్తాయి.

ఇంతలో చిన్న నిక్కరు, టై ట్ టాప్ వేసుకొని, పోనీ టైల్ ఇటూ అటూ ఊగుతుండగా జాగింగ్ చేసుకంటూ పాతికేళ్ల చిన్నది ఎదురయింది. నన్ను చూసి “హాయ్” అంది నవ్వుతూ. నేను కూడా హాయ్ అన్నాను నడుస్తూనే.
అద స్నేహపూర్వకమైన పలకరింపు. నేనెవరో ఆమెకి తెలీదు. తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉండదు. కాని పలకరిస్తారు. మా కాలనీలో ఇండియన్స్ ఒకరో, ఇద్దరో ఉన్నారు. చాలామంది చిన్నపిల్లలున్నవాళ్లు ఉన్నారు. తల్లితండ్రులు తమ పిల్లలను మనలాగే ప్రేమగా చూసుకుంటారు. తల్లో, తండ్రో పిల్లలని స్ట్రోలర్ లో తిప్పుతూనో, పార్క్ లో ఆడుతూనో కనిపిస్తారు.
నడుస్తూ ఉండగానే సూర్యాస్తమయం అయింది. ఆకాశం కాషాయం, ఎర్రని రంగులు పులుముకుని చూడముచ్చటగా ఉంది. పక్కకి నిల్చుని నా సెల్ ఫోన్ లోని కెమెరాతో ఆ అందాలని బంధించాను.

ప్రతీ సందుకి స్టాప్ బోర్డు ఉంటుంది. మనుషులున్నా, లేకపోయినా, పోలీసు లేకపోయినా అక్కడ కొన్ని సెకనులు ఆగే వెళ్తాయి కార్లు. ఎవరైనా రోడ్డు దాటుతుంటే, వాళ్లు వెళ్లేదాకా ఆగి అప్పుడు నడుపుతారు. ఎవరూ చూడకపోయినా చెత్త రోడ్డు మ ద పడేయడం వంటివి చేయరు. ఎందుకో? రూల్స్ మనకోసమే అని పాటిస్తే మనకే మంచిదని తెలుసుకున్నారు కనుక. అంతబాగా రూల్స్ పాటిస్తారు కనుకే పిల్లలు, పెద్దలు రోడ్డు మీద తిరగగలుగుతున్నారు.
నెమ్మదిగా చీకటి పడింది. స్ట్రీట్ లైట్స్ వెలిగాయి. జనసంచారం తగ్గిపోయింది. రోడ్డు మీద అక్కడక్కడ కార్లు ఆగి వున్నాయి. నాకు మన దేశం గుర్తొచ్చింది. ఇంత చీకట్లో, జనసంచారం లేని చోట, మెడలో గొలుసు, చేతికి గాజులతో మా కాలనీలో ఐతే ఇలా తిరగగలిగేదాన్నా? ఏ పక్కనుంచి ఎవడు వచ్చి ఉన్నవి లాక్కుపోతాడేమో అని భయం. అంతేకాదు ఏ కారులోనుంచైనా ఎవడైనా ఒక్క లాగు లాగి, నోరు నొక్కి, ఎక్కడికో తీసుకుపోయి ఏ అఘాయిత్యమైనా చేస్తాడేమో అని భయం. రోజూ న్యూస్ లో ఎన్ని చూడ్డంలేదూ? చిన్నా చితకా, ముసలీ ముతకా ఎవరైనా సరే ఆడది అంటే చాలు మానభంగం చేసి చంపేసే రాక్షసులు ఉన్నారు. బయటకు వెళ్లిన ఆడపిల్లలు ఇంటికొచ్చేదాకా తల్లితండ్రులకు బెంగే. ఎందుకీ జనం ఇలా అయిపోయారు?


ఏమయింది నా చిన్నప్పటి దేశం? ఎంత స్వేచ్ఛగా తిరిగేవాళ్లం. మెడలో బంగారు గొలుసు, చేతులకి గాజులు, చెవులకు లోలకులు పెట్టుకుని పదహారేళ్ల వయసులో ఉన్నా నిర్భయంగా మైలు దూరంలో ఉన్న స్కూలుకి నడిచి వెళ్లేవాళ్లు. అప్పుడు లేరా మగపిల్లలు. వచ్చేవారు వెనకాల. సరదాగా కామెంట్స్ చేసేవారు. కానీ ఇంత ఘోరంగా ఉండేవారు కాదు. స్నేహితులరాలింటికి వెళ్లి చీకటి పడినా భయం లేకుండా ఇంటికి వచ్చేవాళ్లం. అప్పుడు మాత్రం బీదవారు లేరా? ఏమైపోతోంది నా దేశం?
ఆడపిల్లలు ఈ విదేశాల్లోనే హాయిగా భయం లేకుండా ఉన్నారనిపిస్తుంది. ఇక్కడి వస్త్రధారణ విపరీతంగా కనిపించవచ్చు. ఇష్టమైనవారు వారికిష్టమైనట్టు ఉండవచ్చు. కానీ ఇతరులకి అపకారం తలపెట్టరు. మనసులో స్వచ్ఛతను కోల్పోకూడదు. అది అన్నివిధాలా వినాశనానికి దారి తీస్తుంది.
నా దేశంలో కూడా అందరూ మంచివారు ఉండాలి, లంచగింతనం ఉండకూడదు. ప్రజలందరూ శుభ్రతని పాటించాలి. ఆడపిల్లలు నిర్భయంగా బ్రతకాలి, నా దేశం గురించి నేను ఎక్కడైనా గొప్పగా చెప్పుకొని గర్వపడాలి. ఈ మార్పు ఎప్పుడొస్తుందో అని ఆలోచిస్తూ ఇల్లు చేరుకున్నాను

రైలు పక్కకెళ్ళొద్దురా డింగరీ! డాంబికాలు పోవద్దురా! !

రచన: శారదాప్రసాద్

(గత ఆరునెలల్లో ఆరు ఘోరమైన రైలు ప్రమాదాలు జరిగాయి. కొన్ని వందలమంది ఈ ప్రమాదాల్లో మృతిచెందినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. మరెందరో గాయపడ్డారు! ప్రభుత్వం, ఇవి విద్రోహ చర్యలని చేతులు దులుపుకుంటున్నది! సంస్థాగత లోపాలను గురించి రైల్వే అధికారులు, మంత్రివర్గం పట్టించుకోలేదు. . ఈ సందర్భంలో వ్రాసిన చిన్న వ్యంగ్య రచనను ఈ దిగువన చదవండి! )

*******
“ఏమోయ్! అర్జంట్ గా ఇటురా! రెండు జతల బట్టలు వగైరా సద్దు. నేను అర్జంట్ గా చెన్నైకు వెళ్ళాలి”
“ఇంత రాత్రి సడన్ గా ఎలా వెళుతారండీ ?”
“హైదారాబాద్- చెన్నై ఎక్ష్ప్రెస్స్ లో.”
“అంత అర్జంట్ పని ఏమిటో?”
“మనవళ్ళను, మనవరాళ్లను చూడాలనిపించింది!”
“నేను మీకు ఏమి అన్యాయం చేశానని నామీద ఇంత కోపం?”
“కోపం ఏమిటి? కొత్త పల్లవిని ఎత్తుకున్నావు!”
“లేకపోతే, మరేమిటి? బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా రైలు ప్రయాణాలు చేస్తారా ఈ రోజుల్లో”
“మరైతే శ్రీ కాళేశ్వరి వారి బస్సులో వెళ్ళుతా”
“అది మరీ దారుణం. ఆ బస్సులు రోడ్ మీద నడవవట, కాలువల్లో, లోయల్లో గుండా వెళ్ళుతాయట!”
“మరి ఎలా వెళ్ళాలి?”
“మా ఊరినుండి మా పొలం పనిచేసే రైతును కబురు చేస్తాను. హాయిగా ఎద్దులబండిలో ఇద్దరమూ వెళ్లుదాం.”
“అలా వెళితే చెన్నైకు వెళ్ళటానికి ఒక నెల పడుతుంది.”
“అయితే ఏమి పోయింది. క్షేమంగా చేరుతాం కదా! అదీగాక, దారిలో ఉన్న పుణ్య క్షేత్రాలను కూడా చూడవచ్చు. అన్నిటినీమించి, మీకు కూడా పనీపాట లేదుగా! (అంటే రిటైర్ అయ్యానని ఆమె భావం)”
“పోనీ అమ్మాయి వాళ్ళను రమ్మంటే?”
“రిటైర్ అయిన తరువాత మీ బుర్ర సరిగా పనిచేయటం లేదనిపిస్తుంది. వాళ్ళు రావటానికీ పై సమస్యలేగా కారణం. అదీగాక వాళ్లకు ఎద్దులబండిలో వచ్చే అవకాశం కూడా లేదు.”
“ఈ ఎద్దులబండి ప్రయాణం నేను చెయ్యలేను. ఎక్కడి వాళ్ళం అక్కడే ఉందాం. ఫోనులో మాట్లాడుకుందాం”
“ఇప్పుడు సరిగా ఆలోచించారు. మొన్నటి దాకా, ఎవరికైనా జీవితం మీద విరక్తి కలిగితే, రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు. ప్రస్తుతం ఆ అవసరాన్ని తప్పించి ప్రభుత్వం వారు రైలులోనే చనిపోయే సదుపాయం కల్పిస్తున్నారు.”
“ప్రభుత్వపు పనితీరు భేషుగ్గా ఉంది. చనిపోయినవాని కుటుంబ సభ్యులకు అయిదు లక్షలు కూడా ఇస్తున్నారు.”
“ఇంతకీ అది ప్రమాదమా? విద్రోహకచర్యా?”
“ప్రభుత్వం వారు రైల్వే వారి పనితీరులో లోపం అంటున్నారు. మరి రైల్వేవారు ఏమంటారో?”
“మరి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?”
“శవాలను పీక్కుతినే రాబందుల్లా వచ్చి పోతున్నారు. ఆ ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అంటున్నారు”
“ఎంత ఘోరం?”
“మా చిన్నప్పుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో, ఒక చిన్న రైలు ప్రమాదానికి కలతచెంది తన పదవికి రాజీనామా చేసారు. అంత త్యాగధనుడు ఆయన.”
“మరి ఇప్పటి రైల్వే మంత్రి ఏమి చేసారు? రాజీనామా చేసారా?”
“ఇప్పటి మంత్రులకు ‘నామాలు’ పెట్టటమే తెలుసు. మొన్నఆ మధ్య ఒక రాష్ట్ర మంత్రికి న్యాయస్థానంవారు, ఆయన గతంలో చేసిన ఒక నేరానికి జైలుశిక్ష, జరిమానా వేసారు. అందుకు ఆయన స్పందన ఏమిటో తెలుసా? నేను అప్పుడెప్పుడో వ్యభిచారం చేసాను, ప్రస్తుతం పచ్చి పతివ్రతనని చెప్పుకుంటున్నాడు. గతంలో ఒకసారి జగజీవన్ రాం గారు రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఎక్కువ రైలు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాలకు తాను బాధ్యుడను కానని చెప్పుకున్నారు ఆయన. ఆ సమయంలో పార్లమెంట్ లో శ్రీవాజపేయి గారు ఇలా అన్నారు “ప్రస్తుతం మనం రైలు ప్రయాణం చేయటమంటే, ‘జగ్ ఔర్ జీవన్ రాం రాం’అనుకోవలసిందేనని”.
“అసలు విషయానికి వస్తాను. మీరు ఒట్టేసి చెప్పాలి. ఇకనుండి రైళ్లల్లో, బస్సుల్లో ప్రయాణం చేయనని!”
” సరేలే! కాస్త ఆ కంట తడి ఆపు.”
అలా ప్రస్తుతానికి ప్రయాణాలు ఆగిపోయి, ఫొన్ లోనో, నెట్ ద్వారానో పిల్లలను చూస్తూ హాయిగా మాట్లాడుకోవటం ఎంతో ఉత్తమం అనిపించింది. అదీ గాక , మన ప్రభుత్వం వారు మనకు సమాజపు బరువు, బాధ్యతలను తెలియచేయటంకోసం బస్సు చార్జీలు, రైలు చార్జీలు దారుణంగా పెంచారు.