నిన్నలేని అందం

రచన : డా.శ్రీనివాస చక్రవర్తి

సౌమ్యకి కాళ్ళకింద నేల చీలినట్టయ్యింది.

తటాలున యే గ్రహశకలమో భూమిని ఢీకొంటే ఆ ఘాతానికి భూమి తలక్రిందులై, ధృవాలు తారుమారై, రాత్రి పగలై, పగలు రాత్రై అల్లకల్లోలం అవుతుందంటారు. అది అసంభవం కాదు. అగ్రరాజ్యాలు ఘర్షణ పడితే జరిగే అణుయుద్ధంలో ఆకాశమంతా పొగచూరితే వచ్చే శాశ్వత శీతాకాలంలో జీవలోకమంతా ఘనీభవించి పోతుందంటారు. అదీ సంభవమే. తిండితిప్పలు లేకుండా బ్రతుకు వెళ్ళబుచ్చిన బైరాగులున్నారు. తృటిలో మేధావులైన మూర్ఖులున్నారు. చచ్చి బ్రతికిన వాళ్ళున్నారు. ఇవన్నీ కూడా సంభవమే. కాని, ఇప్పుడు తన కళ్ళతో తాను చూసిన దృశ్యం….

అనురాగ్ యెందుకిలా చేశాడు?

ఆరోజు పెళ్ళయ్యాక తన మొదటి పుట్టినరోజు. ఎప్పుడూ ఎనిమిదికి ముందు లేవంది, ఇవాళ అనూకన్నా ముందే లేచింది. నలుగు అంటేనే అలిగే తను చక్కగా నలుచుకుని స్నానం చేసింది. పోనీ ఇవాళ ఒక్కరోజుకి అని “పోనీ”వొదిలేసి జడ వేసుకుంది, అనూకి ఇష్టమని. ఎప్పట్లా దుపట్టా-సల్వార్ కాకుండా పెళ్ళినాటి ఎఱ్ఱంచు తెల్లచీర కట్టుకుంది. ఆవగింజంత బొట్టు అర్థరూపాయంత అయ్యింది. మొట్టమొదటి సారి అనూ గిఫ్ట్ చేసిన దుద్దులు పెట్టుకుంది. సిలబస్ లో యేదీ వొదలకుండా ఎంట్రన్స్ కి శ్రద్ధగా ప్రిపేరయిన ఇంటర్మీడియట్ స్టూడెంట్లా చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని, అనూకి ఇష్టమైన స్ట్రాంగ్ అల్లం టీ కప్పు ఉన్న ట్రేతో, అణచుకోలేని ఉద్విగ్నతతో బెడ్రూమ్ లో నిద్రపోతున్న అనూని సమీపించింది.
“అనూ!” తట్టి లేపింది.

ఆ రూపంలో తన ’సుమీ’ ని చూసి మెరిసే అనూ కళ్ళను చూసి మురిసిపోవాలనుకుంది. అనూ పెదవులపై చిరునవ్వుల పువ్వుల్ని తన తలలో మురిపెంగా తురుముకోవాలనుకుంది. చెవి దుద్దుల్ని చూడగానే వద్దన్నా చెవిని పెట్టక ముద్దులు కురిపిస్తాడనుకుందీ. అల్లంటీని కూడా పక్కనపెట్టి వల్లమాలిన అల్లరి చేస్తాడనుకుంది.

కాని ఇవేమీ చేయలేదు అనూ. ఓ సారి నిర్లిప్తంగా సౌమ్య వైపు చూసి, మంచం దిగి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు.
సౌమ్యకి కాళ్ళ క్రింద నేల చీలినట్టయ్యింది.

ఆ రోజు ఎన్నో చెయ్యాలని ప్లాను వేసుకుంది. కాని ఇప్పుడు అవేమీ చేసే మూడ్ లేదు. మెల్లగా ఇంటిపనికి ఉపక్రమించింది. పక్కలు సర్దుదామని బెడ్రూమ్లోకి వెళ్ళింది. జరిగింది కళ్ళ యెదుట మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది. అసలది జరిగిందని నమ్మలేకపోతోంది. ఎంత అణచుకున్నా యేడుపు ఆగలేదు. పక్కమీద వాలి వెక్కి వెక్కి యేడ్చింది. యేడ్చి యేడ్చి మెల్లగా నిద్రలోకి జారుకుంది.

అలా యెంతసేపు నిద్రపోయిందో తెలీదు. లేచి చూసేసరికి బాగా మధ్యాహ్నం అయినట్టు వుంది. లేవబోతుంటే, దిండు కింద యేదో తగిలింది. చూస్తే అనూ డైరీ. అనురాగ్ కి డైరీ రాసే అలవాటుంది.
అయితే డైరీ తెరిచి వుండడం చిత్రంగా అనిపించింది. ఒక పక్క కోపంగానే వున్నా చదవాలన్న కోర్కెని అణచుకోలేకపోయింది.

…………………………..

ఏప్రిల్ 24,1996
ఇవాళ మా రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ కి ఓ కొత్త విజిటర్ వచ్చింది.
మా జియోఫిజిక్స్ జగన్నాథానికి కజిన అట. ఎమ్.ఏ. ఇంగ్లీష్ లో చేరుతోందట. ఇవాళ్టినించి క్లాసులు మొదలు. దిగబెట్టడానికి వచ్చాడు. మామూలుగా కాంటీన్లో కనిపించే స్త్రీ పాత్రల్లో లేని ప్రత్యేకత యేదో ఈ అమ్మాయిలో వుంది. చాలాసేపు తననే గమనిస్తూ కూర్చున్నాను.
పున్నమి చందమామ రంగు స్కర్ట్, బ్లౌజ్ వేసుకుంది. అదే రంగు హీల్స్ వేసుకుంది. సన్నగా పొడవుగా నాజూకుగా వుంది. అసలు ఆ తీరు, తెన్ను చూస్తే తెలుగుపిల్లలా లేదు. ఆంధ్రదేశానికి పర్యటనకి వచ్చిన యే బెల్జియన్ రాకుమార్తెలాగానో ఉంది. కొద్దిగా కోలమొహం, తీరైన కనుబొమ్మలమీద మచ్చలేని పాలవన్నె ఫాలభాగం స్వచ్ఛమైన మనసును సూచిస్తోంది. ఆ ముఖంలో చెరగని ప్రసన్నత తన హృదయంలోని సంతృప్తిని వెల్లడిచేస్తోంది. తనకళ్ళలో తొణికిసలాడే విస్మయం అతిసామాన్యమైన విషయాలపట్ల కూడా పసిపిల్లలకుండే ఉత్సుకతని ప్రకటిస్తోంది. మొత్తంమీద చూడగానే ఆకట్టుకునే ముఖం. దానికి కారణం కోటేరేసిన ముక్కు,అద్దాల చెక్కిళ్ళు,కలువల కళ్ళు కాదు. మనసుపెట్టి చూసినపుడు ఆ ముఖంలో తారాడే అరుదైన,అలవిగాని మంచిదనం.

నాలుగు టేబుల్స్ కలిపి చుట్టూ మా బృందం అంతా సమావేశం అయ్యాం. జగ్గు, ఆ కొత్తపిల్ల కూడా మాతోనే కూర్చున్నారు. సెగలు కక్కుతూ ’ ఎస్పి టీ’ వచ్చింది. ఎప్పుడూ లేంది ఇవాళ చక్కెర కొంచెం తక్కువైంది. అంజిగాడు ఓ కప్పుతో చక్కెర తెచ్చి పెట్టాడు. చకచక చక్కెర చేతులు మారుతూ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి చెయ్యిచాచి అందుకోబోతుంటే అంతలో మా మోటుమురళి తన జోక్కి తానే గట్టిగా నవ్వుతూ ఎటో చూస్తూ ఆ కప్పు లాక్కున్నాడు. తను వేసుకోగానే తననుంచి మరొకడు తీసుకున్నాడు. అందరిదీ అయ్యాకయినా కప్పుకోసం అడుగుతుందని ఆసక్తిగా చూశాను. అలాంటి ప్రయత్నమేమీ చెయ్యలేదు. చుప్ చాప్ అనకుండా తనకప్పు ఖాళీ చేసింది.
ఎండలో,ధూళిలో జోగుతున్న పల్లెను సైతం ఒక్క చిరుజల్లు నెమ్మది తెమ్మెరలతో, మెత్తని కొత్త పూలెత్తిన నవవసంత సీమగా మార్చగలిగినట్టు ఆ అమ్మాయి రాకతో మా రాజేశ్వరీవిలాస్ నిన్నలేని యేదో కొత్త అందాన్ని సంతరించుకుంది. ఎందుకో ఆ రోజు మా అంజిగాడు కూడా చాలా హాండ్సమ్ గా కనిపించాడు.

తరువాత తెలిసింది. ఆ అమ్మాయి పేరు సౌమ్యట!

* * *

అది చదవగానే తన మనసులో భారం అంతా ఎవరో ఉన్నపళంగా తీసేసినట్టు అనిపించింది. టీ తాగాలనిపించింది. డైరీ పట్టుకుని వంటగదిలోకి వెళ్ళింది.
టీ తాగాక కొంచెం ఉత్సాహం వచ్చింది. డైనింగ్ టేబుల్ వద్ద ఇంకా డైరీ చదువుతూ కూర్చుంది. మరో పేజీ –

మే 19,1997

ఇవాళ మనసేం బాగోలేదు. నాన్నగారి పరిస్థితి విషమిస్తోంది. రెండేళ్ళుగా మంచంమీద రాయిలా పడివుండటం శుద్ధనరకం. ఇవాళ పొద్దున్న నా పేరు పిలవడానికి కూడా పెనుగులాడారు. క్రమంగా మాట కూడా పడిపోవచ్చన్నాడు డాక్టరు. తనకు సుపరిచితమైన పరిసరాల్ని, అయినవాళ్ళని, ఇంపైన దృశ్యాలని, ప్రియమైన ధ్వనులని, జవసత్వాలని, శారీరక పటుత్వాన్ని, అంతెందుకు ఎంత అధముడికైనా వుండే మానవత్వం అనే కనీస ఐశ్వర్యాన్ని కూడా మిగల్చకుండా ఎవరో అంచెలంచెలుగా, అతిక్రూరంగా ఆ మనిషినుండి దోచుకుపోతున్నట్టుగా వుంది. ఆ దొంగ యెవరో నా చేతికి చిక్కితే దారుణంగా హత్య చెయ్యాలనుంది. ” నా కిష్టుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు”, అంటూ కలవరించేవారు. పిచ్చినాన్న! ఇప్పుడు ఆ కలవరించే శక్తిని కూడా తీసుకుపోయాడు కిష్టుడు. యుథనేషియా భాగ్యానికి ఇంకా మనదేశపు రోగులు నోచుకోలేదు.

ఈ గోలంతా మరచిపోవడానికే సాయంత్రం దుర్గ గుడికి వెళ్ళాను. గుళ్ళో దేవుళ్ళ మాటెలా వున్నా, గుడి ఆవరణ, పరిసరాలు బావుంటాయి. ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు, రాముడు, కృష్ణుడు ఆ బలగం అంతా వున్నారో లేదో తెలీదుగాని ప్రాణులన్నిటిని కనిపెట్టుకుని కడతేర్చే ఓ మాతృమూర్తి, ఓ అమ్మ వుందని మాత్రం యెప్పుడూ అనిపిస్తుంది. ఆ తల్లి యెక్కడుంటుందో తెలీదు, యెలా వుంటుందో తెలీదు. కాని వుందని మటుకు తెలుసు. వెళ్ళి దుర్గమ్మ సమక్షంలో కూర్చున్నాను. మండపంలో పూజారి, నేను, ప్రాంగణంలో ఓ మూల దగ్గుతూ ఓ ముసలి సాధువు మాత్రమే వున్నాం. ఏదో దట్టమైన, శక్తివంతమైన నిశ్శబ్దం ఆ ప్రదేశమంతా వ్యాపించి వుంది.(అలా యెంత సేపు వున్నానో తెలీదు.) మనసులోని అలజడంతా యెవరో చేత్తో తీసేసినట్టు మాయమైపోయింది. చీకటి పడుతోంది. ఇంటికి బయలుదేరాను.

గుడి బయటకి వస్తుండగా కనిపించిందా దృశ్యం. గుడిచుట్టూ ఓ చిన్న సెలయేరు వుంటుంది. దానిమీద ఓ బుల్లి వంతెన. ఆ వంతెన మీద వస్తూ అలవోకగా నీటివైపు చూశాను. అడుగు వెడల్పు వున్న ఓ అందమైన అరవిందం. ఆ దారివెంట యెన్నోసార్లు నడిచాను. ఎప్పుడూ పద్మాలు కనిపించలేదు. “ఈ లోకంలోనే పుట్టినా, ఈ లోకానికి చెందను సుమా”,అన్నట్టుగా నీటిమట్టంనుండి ఇంతెత్తున పైకి లేచి ఠీవిగా నవ్వుతోంది. నిజమే. ఈ వ్యాధులు, చావులు, యుథనేషియాలు,డాక్టర్లు, మెడికల్ ఇన్సూరెన్సులు – ఇవేవీ లేని మరో అద్భుతలోకం నుండి రాలిపడినట్టుందా పువ్వు. అరుణకాంతుల మౌనవిస్ఫోటం ఆ పువ్వు. చావుమీద పోరాటానికి యెగరవేసిన బావుటా. జీవితం మీద ఆశకి ఆకృతి….

వంతెన మీంచి వంగి ఆ పూవునే ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయాను. రేకులు ఇరవై, ముప్ఫై దాకా వుంటాయేమో. రేకులన్నీ రెండు శ్రేణులుగా వున్నాయి. ఒక శ్రేణిలో పళ్ళెంలా అన్ని దిక్కులా విస్తరించి వున్నాయి. రేకుల మధ్య కోణాలన్నీ యెంత సమంగా, నిర్దుష్టంగా వున్నాయంటే ఏ దేవలోకపు సివిలింజనీరో చాలా శ్రమపడి తీర్చిదిద్దినట్టుంది.

ఆ రేకుల్ని చూస్తుంటే యేదో గుర్తొస్తోంది. అదేంటబ్బా… ఆఁ! సౌమ్య వేళ్ళ. అవును, వేళ్ళు గమ్మత్తుగా కదిలిస్తూ మాట్లాడుతుందా అమ్మాయి.

సౌమ్య..భలే అమ్మాయి…

* * *

పేజీలు తిప్పుతున్న తన వేళ్ళవైపు ఆశ్చర్యంగా చూసుకుంది. నిజంగానే ఈ వేళ్ళు కలువరేకుల్లా వున్నాయా?
డైనింగ్ రూమ్లో వుక్క పోస్తోంది. వెళ్ళి తోటలో ఒక పెద్ద మందారం మొక్క నీడలో కుర్చీ వేసుకుని డైరీ చదవడం కొనసాగించింది.

* * *

మార్చి 29,1998

ఇవాళ సభ్యులందరం రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ లో సమావేశమయ్యామ్.ఎప్పుడూ జరిగే సమావేశాలకి, ఇవాళ్టి సమావేశానికి తేడా వుంది. ఎప్పుడూ జరిగే సమావేశం ఇంకా లోకం రుచి తెలియని కుఱ్ఱకారు సమావేశం. అందులో తుళ్ళింత వుంది. కేరింత వుంది. హద్దుల్లేని అల్లరి వుంది. జీవితమంతా ఇలాగే ఏ బాదరబందీ లేకుండా మూడు పెసరట్లు, ఆరు పుల్లట్లలా హాయిగా వుంటుందనే అమాయకపుటాశ వుంది.

కాని ఇవాళ్టి సమావేశం వేరు.

చదువు అనే స్వర్గంలాంటి దశని వొదిలి స్వర్గమో నరకమో తెలీని జీవితమనే అనిశ్చిత దశలోకి అడుగుపెడుతున్నారంతా. అందరి జీవితాలూ సినిమా పరిభాషలో చెప్పాలంటే క్లైమాక్సుకు చేరుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాలు, బ్యాంకు లోనులు, యూ.ఎస్.వీసాలు, వ్యవసాయాలు, ఒకరికొకరు సాయాలు, కట్నం లేని పెళ్ళిళ్ళు, మామూలు పెళ్ళిళ్ళు, పేచీలు – ఇలా వుంది వ్యవహారం.

సభ్యులందరూ ఒకరినొకరు ఇంటర్వూ చేసుకున్నారు. అందరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న, ” ఇప్పుడేం చెయ్యడం?”.

ప్రమోద్ ఎప్పుడో యూ.ఎస్. లో తువ్వాలు వేసుకున్నాడు. తువ్వాలంటే మామ కూతురన్నమాట. యూ.ఎస్.లో సెటిలైన తన మామకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఒక కూతురు కూడా ఉంది. తన కంపెనీలో ప్రమోద్ కి ఉద్యోగం వేయిస్తాడు. పిల్ల మెళ్ళో ప్రమోద్ చేత మూడు ముళ్ళూ వేయిస్తాడు.

అందరం శేఖర్ ని అడిగాం. తను బి.ఇడి చేశాడు. వాళ్ళది ఆముదాల వలస. అదే వూళ్ళొ ఓ ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్లో టీచరు ఉద్యోగంలో చేరుతున్నాడు.

“మరి నువ్వు ప్రమోద్ లా యూ.ఎస్. కి వెళ్ళవేమిట్రా?” యెవడో తుంటరి అడిగాడు.

” వాడు నయాగారా ఫాల్స్ కళ్ళారా చూస్తాడు. నేను కళ్ళకు కట్టినట్టు పాఠం చెబుతాను. ఇదే కదరా తేడా.” ప్రమోద్ తో పాటు అందరం నవ్వేం.

ఇక సౌమ్య వంతు వచ్చింది. తనది ఎమ్.ఏ. అయిపోతోంది.
“డిగ్రీ పూర్తయ్యాక యేంజేస్తావేం?” ఎవడో నీరసంగా అడిగాడు.

“నువ్వు కూడా లెక్చరర్ అవుతావా?” ఎవడో కళ్ళింత చేసుకుని అడిగాడు.
“విక్టోరియన్ ఎరా గురించి విడమరచి చెబుతావా?”
“షేక్స్పియర్ సానెట్స్ సమ్ఝాయిస్తావా?”…

మా వాళ్ళ ఉద్దేశంలో సౌమ్య కేవలం ఒక కొండపల్లి బొమ్మ. మరి కొండపల్లి బొమ్మలు డిగ్రీ అయ్యాక పెద్దగా యేమీ చెయ్యవు.

“పెళ్ళి చేసుకుంటాను!”
“ఆ తరువాత?” యెవడో తుంటరి అడిగాడు.
“మా ఆయన్ని అడిగి చెబుతాను.”
అందరూ నవ్వేరు. అది జోకు కాదని అర్థమైనది నాకొక్కడికే అనుకుంటా.

ఇక అందరూ నా మీద పడ్డారు.
“ఏదో చేస్తాలేరా బాబూ. అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం”, ప్రశ్న దాటేయాలని చూశాను.
“వాడికేం రా స్టయిల్ కొడతాడు. అప్పుడే మూడు చోట్లనుండి ఫిజిక్స్ లెక్చరర్ గా ఆఫర్లు వచ్చాయి..యేరా! వైజాగ్ లోనే చేరతావా?”
“నేనింకా యేం అనుకోలేదురా బాబూ, నన్నొదిలేయండి. అసలు నాకు ఉద్యోగం అంటేనే బోర్.”
“ఉద్యోగం చెయ్యకపోతే మరేం చేస్తావేం?”
“ఎస్.టీ.డీ. బూత్ పెడతావా?”
“పోనీ ఇంటర్నెట్ కఫే?”
“సుబ్రంగా పెళ్ళి చేసుకోరాదూ?”
“అవున్రా! క్రాంతి ట్యుటోరియల్స్ ఓనరుకి తెల్లని,సన్నని, గాజుబొమ్మలాంటి కూతురుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ అని మా ముద్దుపేరు. నువ్వు సై అంటే….”

అలా రాగింగ్ నిర్విరామంగా కొనసాగుతుండగా అంతలో సౌమ్య –
“ఏయ్! అనూ! ఇవాళ నీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవాలి. పదపద!” అంటూ నేను బదులు చెప్పేంతలో చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళింది. బయటికెళ్ళగానే అడిగింది.
“నిన్ను సేవ్ చేసినందుకు నాకేమిస్తావు?”
” ఓ అదా! అబ్బ, బ్రతికించావు.సరేగాని, ముందు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి.పద అలా వాక్ కి వెళ్దాం.”

యూనివర్సిటిలో జువాలజీ, బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లని కలుపుతూ ఓ సన్నని దారి ఉంది. అది జీవశాస్త్రానికి చెందిన ఎన్నో విభాగాలని ఆ శాస్త్రంలాగానే మెలికలు తిరుగుతూ కలుపుతుంది. దారికి ఇరు ప్రక్కల flame of the forest చెట్లు ఉంటాయి. ఆ చెట్లు నారింజరంగు పూరేకులు, పసుపు, ఆకుపచ్చని ఆకులు క్రిందపడి దారంతా రంగవల్లులు తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది.

ఎంతో సేపు ఇద్దరం యేం మాట్లాడుకోలేదు.

“ఏదో అడుగుతానన్నావు?” నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ అడిగింది సౌమ్య.
“డిగ్రీ అయ్యాక ఏం చేద్దామనుకుంటున్నావు?”
“ఏయ్! నువ్వూ మొదలెట్టావా వాళ్ళలాగ?”
“లేదు, సీరియస్ గా అడుగుతున్నాను.”
“పల్లెటూళ్ళకి వెళ్ళి అక్కడి పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిద్దామనుకుంటున్నాను.”
“పల్లెటూరి పిల్లలకి ఇంగ్లీషా?”
ఎంత ఆపుకుందామనుకున్నా నవ్వాగలేదు.
మీరింకా చాలా యెదగాలి మాస్టారూ, అన్నట్టు ఓ చూపు చూసి ఇలా అడిగింది.
“మన దేశంలో అన్నిటికన్నా ప్రధానమైన సామాజిక సమస్య యేది?”
“నిరక్షరాస్యత.”
“కదా? అక్షరాస్యత వల్ల లాభం యేమిటి?”
“ప్రకృతిని గురించిన స్పృహ. సమాజం పట్ల,సాటి మనిషి పట్ల మరింత అవగాహన. ఓ చెట్టులా బతకడానికి, ఓ మనిషిలా బతకడానికి మధ్య తేడా చదువుతో వస్తుంది.”
“నిజమే,కాని ఆ కారణాలు పల్లెల్లో అంతగా వర్తించవేమో.”
“ఇంకా స్థూలమైన కారణాలు కావాలంటే – ఉద్యోగం,డబ్బు,జీవనోపాధి వగైరా.”
“కరెక్ట్. ఇక పల్లెటూరి పరిస్థితులలో ఎస్.ఎస్.సి. చదవగలిగితే గొప్ప. ఎస్.ఎస్.సి. సర్టిఫికెట్ వుంటే ఎన్నో చిన్నచిన్న ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. మరి ఎస్.ఎస్.సి. సిలబస్లో పల్లెటూళ్ళ వాళ్ళకి అన్నిటికన్నా కష్టంగా అనిపించే సబ్జెక్ట్ ఏంటో తెలుసా?”
“సైన్స్ అయ్యుంటుంది.”
“మొదట్లో నేనూ అలాగే అనుకునేదాన్ని. కాని నువ్వు నమ్మవు…. ఆ సబ్జెక్ట్ ఇంగ్లీష్. తక్కిన సబ్జెక్టులు ప్రాంతీయభాష అయిన తెలుగులో ఉంటాయి. ఒక్క ఇంగ్లీషే వాళ్ళకి సింహస్వప్నంలా వుంటుంది. ఎందుకంటే అది పరాయి భాష. ఇంగ్లీష్ పరిజ్ఞానంతో ఆధునిక ప్రపంచంలోకి, ఆధునిక విజ్ఞానంలోకి వాళ్ళకి ప్రవేశం దొరుకుతుంది. వాళ్ళ ప్రస్తుత జీవనస్థాయిలో మౌలికమైన మార్పు రావాలంటే దానికి ఇంగ్లీష్ పరిజ్ఞానం అనివార్యమవుతోంది. అందుకే పల్లెటూళ్ళలో చదువుకునే పిల్లలకి ఇంగీష్ మీద భయం పోగొట్టి, సులభమైన పద్ధతుల్లో ఇంగ్లీష్ నేర్పించి, ఎస్.ఎస్.సి పరీక్షల్లో నెగ్గేట్టు కృషి చెయ్యాలని ఎప్పట్నుంచో ఆశగా ఉంది.”
నాకు ఒక అరవై సెకన్లు నోటంట మాట రాలేదు.
ఆ అందమైన కళ్ళ వెనుక ఇంత లోతైన ఆలోచనలు ఉన్నాయని నాకూ అంతవరకు తెలీదు.
“మరి ఇదంతా అక్కడ వాళ్ళతో యెందుకు చెప్పలేదు?” కొంచెం ఉద్వేగంగా అడిగాను.
“చెప్పాలనిపించలేదు.”
“చెప్పాలనిపించకపోవడం కాదు. అవతలివాళ్ళని నొప్పించలేకపోవడం.”
“ఏం కాదు.”
“మనని మనం డిఫెండ్ చేసుకోవడం, మన భావాలని మనం ధైర్యంగా చెప్పడం కూడా అవతలివాళ్ళని నొప్పించడమే అనుకునే ఒక విధమైన పిచ్చితనం…. ప్రమాదకరమైన మంచితనం…”
తనేం మాటాడలేదు. నడక ఆపి తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ అన్నాను.
“ఇలాగైతే ఎలా సౌమ్యా? ఈసారి ఎవడైనా అలా తిక్కగా మాటాడితే బిక్కమొహం వెయ్యకూడదు. అక్కసు తీరేట్టు వాడి మాటలతో వాడి మొహం రక్కెయ్యాలి.”
” మరి నాకు గోళ్ళు లేవుగా”, అంది చక్కగా ట్రిమ్ చేసుకున్న తన చేతివేళ్ళని చూబించి నవ్వుతూ.
“అదా! క్షణంలో ఏర్పాటు చేస్తాను.”
క్రిందపడ్డ ఓ flame of the forest పువ్వు యేరి, గోళ్ళ ఆకారంలో ఉండే దాని తొడిమల్ని తెంపి వాటిని సౌమ్యవేళ్ళ మీద నొక్కి మృదుల కృత్రిమ నఖాలుగా మార్చాను.
“అరె! మెత్తని గోళ్ళు”, అంటూ చిన్నపిల్లలా తన వేళ్ళవైపు చూసుకుంటూ మురిసిపోయింది.
కాని ఆ మురిపెం రెండి నిముషాలే. తిరిగి ఆ ’గోళ్ళు’ పీకి నా చేతులో పోస్తూ అంది,
“నాకు యే గోళ్ళూ వద్దు. అంతగా కావాలంటే నీ గోళ్ళు అరువు తీసుకుంటాలే గాని, ముందు నీ సంగతి చెప్పు. ఏం ఉద్యోగం చెయ్యవా? బద్ధకమా?”
“ఉద్యోగం ఇష్టం లేదన్నాను గాని, పని ఇష్టం లేదనలేదు. కేవలం డబ్బు కోసం మనసుకి నచ్చని, మనిషికి నప్పని యేదో పని చెయ్యడం ఇష్టం లేదు. అసలీ ఉద్యోగం జాడ్యం మనుషులకే ఉంటుంది.జంతువులు చూడు. దేని ప్రవృత్తిని బట్టి అది సహజంగా బతుకుతూ పోతుంది. పెద్దయ్యాక యేం చెయ్యాలి అని పులి తల బద్దలు కొట్టుకోదు. ఏ క్షణానికాక్షణం సహజంగా,సజావుగా,దర్జాగా బ్రతుకుతుంటుంది.”
“కాని బ్రతుకు తెరువు కోసం యేదో ఒకటి చెయ్యాలిగా? ఏ క్షణానికాక్షణం అంటే బ్రతకడం ఎలా?”

“నింగిలా, భూమిలా
ఎల్లలే తెలియక
హాయిగా,ఠీవిగా
వేల్పులా బ్రతకాలి.

కాంతిలా వెలగాలి,
గాలిలా మసలాలి.
ఎత్తైన కొండలా,
నిండుగా బ్రతకాలి.
వలపే ఊపిరిగా
తెగువే కవచంగా
ఊహల దారులవెంట
ధీమాగా ఉరకాలి
ధీరుడిలా బ్రతకాలి.”

కళ్ళింత చేసుకుని ముందు కాస్త ఆశ్చర్యంగా చూసింది. తరువాత బొమలు ముడివేసి కాస్త అనుమానంగా చూసింది.” నా మనసులో దాచుకున్న భావాల్ని నీ మాటలెప్పుడు దొంగిలించాయి నేస్తం?” అన్నట్టుంది ఆమె ముఖంలోని భావం. అప్రయత్నంగా కళ్ళు తుడుచుకుంది.
ఎందుకో ఆరోజు ఎంతో కాలంగా పరిచయమైన మనిషిలా అనిపించిందా అమ్మాయి.

* * *

చదువుతున్న సౌమ్య కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. గతం గుర్తొచ్చింది. ఇంట్లో చెప్పకుండా అనూ, తను ఎలా పెళ్ళి చేసుకున్నది గుర్తొచ్చింది. తన ఇంట్లో వాళ్ళందరూ గుర్తొచ్చారు. వెంటనే అమ్మని చూడాలనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది సుజాతకి నెలరోజుల క్రితమే పెళ్ళయ్యిందన్న విషయం. పాపం సుజాత ఎలా వుందో? ఆ వచ్చినవాడు మంచివాడో లేక పుట్టినరోజు నాడు పెళ్ళినాటి చీర కట్టుకుని టీకప్పుతో ఎదుట నిలబడితే మొహం తిప్పుకునే పాషాణ హృదయుడో?

ఆ విరుల సాంగత్యంలో కోపం చాలా మటుకు ఆవిరైపోయింది. ఇంకా చదవసాగింది.
మే10,1998
సాయంకాలం 4:30.

ఈ రోజు సౌమ్య పార్కుకి అరగంట ఆలస్యంగా వచ్చింది.వాడిన మల్లెలా వుంది మొహం. చూడగానే విషయం అర్థమయ్యింది. ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోలేదు.

పర్సుని పశ్చిమానికి, చెప్పుల్ని ఈశాన్య, నైఋతులకి విసిరి మాట్లాడకుండా వెళ్ళి ఓ రాయి మీద చతికిలబడింది. మోకాళ్ళమీద తల ఆన్చి, ముఖం నాకు కనిపించకుండా అటు తిప్పి కూర్చుంది. ఓ నవ్వులేదు, పలకరింపు లేదు. రాగానే యేదో జోక్ చెప్తుంది యెప్పుడూ. అదీ లేదు. ఇక తక్కిన లాంఛనాల మాటే యెత్తక్కర్లేదు. అరగంట అయ్యింది. అస్సలు చలనం లేదు. కొంపదీసి తిరుపతి శ్రీనివాసుడిలా శిలగా మారిపోయిందేమోనని ఆలోచన వచ్చి వొణుకు పుట్టింది. విషయం తేల్చుకుందామని తనకి అటు వెళ్ళి కూర్చున్నాను. లిప్తలో రెప్పలు కాస్తంత తెరిచి, నన్నోమారు చూసి మళ్ళీ రెప్పలు దించేసింది. హమ్మయ్య! శిల కాదు, మా సౌమ్యే. గ్రహణం విడుపుకోసం చీకటి ఆకాశం వైపు గుడ్లప్పగించి చూసే ఖగోళ శాస్త్రవేత్తలా, విచారం అలముకున్న ఆ ముఖాన్నే చూస్తూ ఉండిపోయాను.

సౌమ్య ముఖాన్ని చూస్తూ వుండిపోవడం నాకు కొత్తేమీ కాదు. ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అయితే వెళ్ళి కాసేపు తన ముఖం చూస్తాను. అంతా సర్దుకుంటుంది. ఇంట్లో సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేసినా సౌమ్య ముఖమే ఆదుకుంటుంది. అలాగే యూనివర్సిటీలో గైడు పెట్టే చిత్రహింసలకీ అదే నా పెయిన్ బామ్. నా జీవితంలో యెన్నో సమస్యలకి ఏకైక సులభ పరిష్కారం – సౌమ్య ముఖదర్శనం. ఎప్పుడూ లేనిది ఈ రోజు కొంచెం డల్ అయినా మునుపులేని కొత్త అందమేదో తనలో పొటమరిస్తోంది. విచారవదనంలో ఇంత లోతు, గాంభీర్యం, దివ్యమైన రాజసం వున్నాయని ఇవాళే తెలిసింది.మారాంలోనూ మురిపించగలిగే మనోజ్ఞమైన అందం తనది. చిన్నబోయినా బొండు మల్లెలా వన్నెపోని లావణ్యం.

పార్కులో గడియారం కొట్టిన గంటకి ధ్యానభంగం అయ్యింది. టైము 5:30. తనకెలా వుందోగాని, నాకైతే అస్సలు బోరు కొట్టడం లేదు. అందమైన వస్తువును తదేకంగా చూస్తున్నపుడు ఆలోచనలు సద్దుమణిగి మనసు నిశ్చలమవుతుంది. ఆ స్థితిలో యేదో నిర్మలమైన ఆనందం మనసుని నింపివేస్తుంది. అలాంటి మనసుకి తోచకపోవడం వుండదు.

ఎలాగూ ఈ సాయంకాలం ఇక చెయ్యబోయేదేమీ లేదు. చెప్పడానికి కథ లేనప్పుడు వర్ణనలోకి దిగే రచయితలా, కాసేపు నాకు నేనే సౌమ్యవదన వర్ణనా వైభవాన్ని ప్రదర్శించుకున్నాను. వర్ణించే వాణ్ణీ, విమర్శించే వాణ్ణీ నేనే అయ్యాను. మా సంవాదం ఇలా సాగింది.

వర్ణించే వాడు ( అంటే నేను) :- ముద్ద మందారం, విరియని మల్లెమొగ్గ, సంపెంగ? విమర్శించేవాడు ( అదీ నేనే) :- ఉహు, పేలవంగా ఉంది.
వ :- ముకుళిత శతదళ కమలం?
వి :- అతి భారంగా వుంది. మరేదైనా చెప్పు.
వ :- వెతని వెల్లడి కానీకుండా కుంచించుకుపోతూ, మనసు లోతుల్లోంచి యే ఈశ్వరుడికో పిలుపునిస్తున్న తన ఆంతర్యం, గుప్పెటలా ముడుచుకుపోతూ తన కేంద్రంలోనే వున్న లింగాన్ని ఆరాధించే నాగలింగం పువ్వులా వుంది.
వి :- భలే! ఫరవాలేదు. భవిష్యత్తు ఉంది. కాని, కాసేపు పువ్వుల జోలికి వెళ్ళకుండా మరేదైనా చెప్తావా?
వ:- సరే కాసుకో,
తెల్లారేసరికి బండెడు లెక్కలు హోమ్ వర్కు నెత్తిన పడగా, ఎప్పుడూ అడక్కుండానే యెంతటి జటిల హోమ్ వర్కైనా చిటికలో చేసిపెట్టే అమ్మ ఈ రోజు తనను పట్టించుకోకుండా “ఈనాడు సినిమా” కి అతుక్కు పోవడం చూసి ఇక గత్యంతరం లేక తనుకూడా దిగులుగా “ఈనాడు సినిమా” చూస్తూ కూర్చుండిపోయిన ఆరోక్లాసు పిల్లలా వుంది.

దెబ్బకి విమర్శకుడు అంతర్ధానమైపోయాడు.
ఆ ఆరోక్లాసు పిల్లని ఊహించుకుంటూ ఆపుకోలేక బయటికి నవ్వేశాను.
అదివిని చుఱ్ఱుమని ఓ చూపు రువ్వింది సౌమ్య.” ఏం చెయ్యాలో దిక్కు తోచక నేనింత తలమునకలవుతుంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదేం? పాషాణ హృదయుడా! ” అని ఆ చూపులోని సమాచారం. ఇక లాభం లేదు. ఈ తపస్సునిక భంగం చెయ్యాలి.

“మారాం చేసే మా రామచిలకా, మాట్లాడవే!” అర్థించి చూశాను.

ఉహు. ఉలుకు పలుకు లేదు. సౌమ్యది గలగలా మాట్లాడే స్వభావం. తన మాటలు వింటుంటే సంతోషంగా వుంటుంది. పోనీ మాటాడకపోయినా ఊరికే తన పక్కన కూర్చున్నా చాలు యెంతో హాయిగా వుంటుంది. బోరు కొట్టకపోవడానికి ఇది రెండో కారణం.

అంతలో ఎక్కణ్ణుంచి వచ్చాయోగాని, అంతవరకు నిశ్చలంగా వున్న ఆ కళ్ళలోంచి రెండు కన్నీటి చుక్కలు క్రిందికి జారాయి. ఇక లాభం లేదు. పరిస్థితి చేజారి పోతోంది. ఏదో విరుగుడు ఆలోచించాలి.

“ఐస్క్రీమ్ తింటావా?” అడిగి చూశాను. జవాబు లేదు. అంటే కావాలన్నమాట. తనకిష్టమైన బటర్ స్కాచ్ తెచ్చాను. గుళ్ళో ప్రసాదంలా ముచ్చటగా మూడు స్పూన్లు తిని కప్ ని దక్షిణంగా విసిరేసింది.

మళ్ళీ మౌనం. మోయలేని నైశ్చల్యం.

ఏడయ్యింది. ఇక ఈ మౌనకాండకి ముక్తాయింపు చెప్పాలి. మెల్లగా దగ్గరికి జరిగి తన చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని అన్నాను.

“చూడు రామచిలకా! పెళ్ళి అనగానే నస పెట్టడం పెద్దవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అది మనకి తెలీందికాదు. పాపం వాళ్ళూ మనుషులే కదా. కొంచెం టైము ఇద్దాం. మరీ సాగదీస్తే మనం మాత్రం యేం చెయ్యగలం? మన కర్తవ్యం మనం నెరవేర్చి తరువాత వాళ్ళ దగ్గరికెళ్ళి చేతుల్లో ఇన్ని అక్షింతలు పోసి దీవించమని రిక్వెస్ట్ చేద్దాం. సరేనా?”

అదేం అంత సులభంకాదన్నట్టు తల యెత్తకుండానే అటూ ఇటూ ఊపింది.
“అదేం అంత సులభం కాదంటావా. నువ్వే చూద్దువుగానిగా, అన్నీ యెంత సవ్యంగా జరుగుతాయో.”
ఏంటంత ధీమా, అన్నట్టు నా వైపు ఓసారి విస్తుపోయి చూసింది.
” ఏం లేదు. చాలా సింపుల్. నువ్వు నాకు చెందిన దానివని నా హృదయంలో స్పష్టంగా తెలుస్తోంది. బయటకూడా రేపు అదే నిజమవుతుంది.”
అప్పుడు తన ముఖంలో కనిపించిన సంతోషాన్ని వర్ణించడానికి నాకైతే మాటలు లేవు.
అప్పుడప్పుడే మెరీనా బీచ్ మీంచి పడిలేస్తూ నెమ్మదిగా మావంక వస్తున్న నెలవంక అంతకు ముందే నాగేశ్వర్రావు పంతులు పార్కులో జరిగిపోయిన చంద్రోదయాన్ని చూసి గతుక్కుమన్నాడు.

* * *

అది చదివి అప్రయత్నంగా చేతులతో తన ముఖం తడుముకుంది. ఆ క్షణం తన ముఖం తనకి ఏదో కొత్త, అపురూపమైన వస్తువులా తోచింది.

కోపం ఇంచుమించుగా పూర్తిగా మరచిపోయింది. అనూ ఆఫీస్ నుండి వచ్చే వేళయ్యింది. వెళ్ళి మళ్ళీ తలస్నానం చేసింది. బంగారు పువ్వులున్న సింధూరం రంగు పట్టుచీర కట్టుకుంది. మళ్ళీ టీ చేసుకుని ఆ కప్పుతో వరండాలో అనూ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. అలా ఓ గంట గడిచి వుంటుంది.

అంతలో ఎవరో గేటు తీసుకుని లోపలికి రావడం కనిపించింది. ఆ మనిషి చేతిలో ఏదో పార్శిల్ వుంది. ఇంత లేటుగా పోస్ట్ మాన్ రాడు. అంటే కొరియర్ వాడే! ఈ కొరియర్ వాళ్ళకి పెళ్ళాం, పిల్లలు వుండరేమో!

దగ్గరికి వచ్చి, పార్సిల్ చేతిలో పెట్టి, ఓ కాగితం చూబించి,”సంతకం పెట్టండి.” అన్నాడు, అవతల కొంపలు భగభగ తగలబడి పోతున్నాయన్నంత హడావుడిగా.

వాణ్ణి పంపించేసి పార్సిల్ విప్పింది. ఫోటో ఆల్బమ్! సుజాత పెళ్ళి ఫొటోలు అయ్యుంటాయి. మొదటిపేజీ తెరిచింది.
పెళ్ళిచీరలో సుజాత, అబ్బ యెంత అందంగా వుందో! అరె, తనలాంటిదే ఎర్రంచు తెల్లపట్టు చీర. అరె! ఒక్క నిమిషం. తనలాంటిది కాదు, తనదే. తనే! అది సుజాత కాదు, తనే! ఎప్పుడు తీసిన ఫొటో ఇది? ఎవరు తీశారు?

ఇంకా పేజీలు తిప్పింది. అన్నీ తన ఫొటోలే. ఎర్రంచు తెల్లపట్టు చీరలో ఒంటరిగా వంటగదిలో డైరీ చదువుతున్న ఫొటో. అరుణ కిరణాలు పారాడుతున్న ఏకాంత మహోన్నత హిమవన్నగంలా ఉంది తను. మొక్కల మధ్య ఉర్చీ వేసుకుని డైరీ చదువుతున్నప్పుడు, వంత మరచిపోతూ పూల చెలియల చెంత ఊరడిల్లుతున్న విరిబాలలా ఉంది. సింధూరం రంగు చీరలో వరండాలో అనూకోసం ఎదురుచూస్తున్నప్పుడు సంజెకాంతిలో నిశ్చలంగా ప్రకాశిస్తున్న నిశాంత నీరవ నదీతీరంలా వుంది. అన్నీ ఆరోజు తీసినవే. ఎన్నెన్నో ఫొటోలు. ఒక్కరోజులో తనమీద ఎవరో హడావుడిగా రాసిన దృశ్యప్రబంధంలా వుందా ఆల్బమ్. ఆ ప్రబంధకవి ఎవడో కనిపిస్తే చొక్కా పట్టుకుని కడిగెయ్యాలి. ఇలాంటి ఆకతాయిలని ఊరికే వదిలేస్తే సంఘానికే ముప్పు.

ఇంతలో ఆల్బమ్ లోంచి ఓ కాగితం పడింది. తెరిచి చూసింది. ఉత్తరం తనకే –
“నా బంగారు సుమీ,
ఈపాటికి కోపం కొంచెం చల్లారింది అనుకుంటాను. ఎన్నాళ్ళగానో నాలో ఓ కోరిక వుంది. కొంచెం దారుణమైన కోరిక.
ఇన్నేళ్ళూ నీ అందంలో ఎన్నోరుచులు చవి చూశాను. నవ్వినప్పుడు బావుంటావు. అలిగినపుడు అదిరిపోతావు.కోపం వచ్చినపుడు ఈకోపం కాసేపు అలాగే వుంటే బావుణ్ణు అనిపించేట్టు వుంటావు. కాని, నీ అందానికి ఒక అరుదైన ముఖం వుంది. విచారంగా వున్నప్పుడు నీ ముఖంలో కనిపించే నైశ్చల్యం, లోతు,దివ్యమైన గాంభీర్యం… అది ఒక్కసారే చూశాను. తరించాను. పెళ్ళయ్యాక మళ్ళీ అలా నిన్నెప్పుడూ చూడలేదు.

ఈ రోజు యెలాగైనా నీలోని ఆ అరుదైన అందాన్ని చూడాలన్న నా ఈ చిన్ని దురాలోచనని క్షమిస్తావు కదూ?

– నీ,

అనూ.”

అంతలో యెక్కణ్ణుంచి వచ్చిందో ఓ దుమారం ఉప్పెనలా తనని క్రమ్మి పొడవైన చేతులతో ఆమెని అమాంతం పైకెత్తి నవ్వుతూ తనని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఇక అటువంటి విపరీత పరిస్థితులలో యెంతటి జితేంద్రియులకైనా కిమ్మనకుండా ఆ దుమారం చల్లని యెదలో గువ్వలా ఒదిగిపోవడం తప్ప గత్యంతరం లేదని పాపం ఆ అమ్మాయి త్వరలోనే అర్థం చేసుకుంది.

• * *

మనుచరిత్ర కావ్యారంభ పద్యము

రచన : లంకా గిరిధర్

మనుచరిత్ర కావ్యారంభ పద్యము

ఈ లఘువ్యాసము పండితజనరంజకము కానేరదు. తెలుగు కావ్యపఠన ప్రారంభించి అవగాహన జ్ఞానసముపార్జనలో తొలిమెట్టు మెట్టి ప్రాచీనకృతులలో మాధుర్యాన్ని చవిచూడడం నేర్వబూనిన విద్యార్థి కలమునుండి అట్టి జ్ఞానార్థులకోసం వెలువడిన వ్యాసముగానే పరిగణించ వలెనని ప్రార్థన.
అందుకు మనుచరిత్రలోని కావ్యారంభ పద్యమును ఎన్నుకోవడంలో వింతలేదు. మన ప్రాచీన కవులు కావ్యాది పద్యాలను శుభసూచకములుగా ఆగామివస్తుసూచకములుగా వ్రాసేవారు. అంటే కృతినిర్మించిన వారికి కృతిని స్వీకరించిన వారికి శుభము కలిగేవిధంగా శాస్త్రసమ్మతమైన పంథాలో మొదటి పద్యము రచించబడేది. మున్ముందు పాఠకులు చవిచూడబోయే ముఖ్యమైన రసమేదో తెలియజేసే విధముగానూ ఉండేది. రసవిషయపరిచయంతో పాటు కథలోని గూడార్థాన్ని నిక్షిప్తము చేసుకన్న పద్యాలూ ఉన్నాయి ఇవి కవిప్రతిభకు తార్కాణాలు. ఇవి సాధించిన పిదప పద్యాన్ని మరింత చమత్కారపూరితం చేయగలగడం గొప్పకవులకే సాధ్యం. ఇవన్నీ పెద్దన మనుచరిత్ర కృత్యాది పద్యములో సాధింపబడ్డవి.
మొదటి పద్యము శ్రీకారముతో కూర్పబడినట్లైతే సకల శుభములొసగు నని ఛందోశాస్త్రము చెపుతోంది. అమృతాక్షరాలు, ఘోషాక్షరాలు, విషాక్షరాలు మున్నగునవి గమనించి అవి ఏయేస్థానాలలో నిలుపవచ్చునో ఎచ్చట నిలుపరాదో కూడా తెలియజేస్తోంది. ఉదాహరణగా శ్రీకారము ఉండనే ఉంది. మఱొకటి తకారము. తకారాన్ని కృత్యాది పద్యములో ఆఱవస్థానంలో నిలిపితే అది శాపనార్థమవుతుంది. ఇలాంటి తప్పటడుగులు ఛందోశాస్త్రమును అవపోసన పట్టిన కవులు వేయరు.
అక్షరాలకే కాకుండా గణాలకి కూడ లక్షణాలు చెప్పబడ్డాయి. శివుని మూడు కన్నుల నుండి పుట్టిన మూడు గురువుల కలయికైన ఆదిగణము మగణమును పద్యాదిలో నిలిపితే అగణితశుభములు నెలకూడునని ఛందోశాస్త్రము చెపుతోంది. మగణానికి ఉన్న లక్షణాలు ఏమిటంటే
౧.మగణము పురుషగణము
౨.మగణారంభ పద్యము వలన కృతికర్తకు ఆయురారోగ్యైశ్వర్యములు సిధ్ధిస్తాయి.
౩.మగణముతో మగణము కలిసివస్తే కృతిభర్తకు సకలవిజయాలు, సగణముతో కలిసివస్తే కీర్తిప్రతిష్టలు, జగణముతో కలిసివస్తే శత్రువిజయములు కలుగుతాయి.

అంటే శార్దూరవిక్రీడితముతో కావ్యాన్ని ప్రారంభిస్తే కవికీ కావ్యకన్యను చేపట్టిన ప్రభువుకీ శుభదాయకమే. పెద్దన మనుచరిత్రను ఆరంభించినది శార్దూలముతోనే.

పద్యము.
శ్రీవక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా
దేవిన్ తత్కమలాసమీపమునఁ ప్రీతిన్ నిల్పినాఁడో యనం
గా వందారు సనందనాది నిజభక్తశ్రేణికిన్ దోఁచురా
జీవాక్షుండు కృతార్థుఁజేయు శుభదృష్టిన్ గృష్ణరాయాధిపున్

స్థులంగా భావము.
శ్రీదేవి వాడిన కస్తూరి శ్రీమన్నారాయణుని వక్షస్థలమున లేపితమై అందముగా కనిపిస్తున్నది.ఆ కస్తూరిని చూచి సనందనాది భక్తులు నారాయణుడు గుండెలపై లక్ష్మీదేవితోపాటు భూదేవిని నిలిపికొన్నాడని భ్రమపడినారు. అట్టి భ్రమకలిగించిన భగవంతుడు కృష్ణదేవరాయునికి విజయములు చేకూర్చును.
పద్యము శుభసూచకమని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరము లేదు.
ఆగామివిషయార్థసూచకమేమిటో అని తఱచి చూస్తే తెలియవచ్చేది భ్రమ. ఇదివఱకే విశ్లేషకులు ఈ భ్రాంతిపై పలువిషయాలు తెలియజెప్పారు.కావ్యాది భాగములో వరూధిని ప్రవరుని చూచి మోహించి మాయాగంధర్వుడే ప్రవరుడని భ్రమపడి సంభోగించి స్వరోచిని కన్నది.స్వరోచిలో బ్రాహ్మణతేజస్సు కీ భ్రమయే కారణభూతము.ఇదియే స్వారోచిషుడు మనువై భువినేలడానికి కావలసిన లక్షణములను జనియింపజేసినది.
ఇదియే కాకుండా మఱొక విషయమూ ఉన్నది.ఈ కావ్యము పైకి శృంగార కావ్యమువలె కనిపించిననూ కేవలము శృంగారకావ్యమే అనుకుంటే అది భ్రమయే. స్వరోచి వైరాగ్యప్రవృత్తి, స్వారోచిషమనువు యొక్క క్షాత్రధర్మపాలనము కూడ చివఱి మూడు అధ్యాయములలో చెప్పబడినవి. పెద్దన శృంగార వైరాగ్యములలో కడపడి ప్రవృత్తికే విజయమును సూచించినాడని విమర్శకుల అభిప్రాయము.

పెద్దన ఊహించి ఉండని పరిణామమొకటి కావ్యవ్యవహారిక నామములో తటస్థించింది. అది మనువు యొక్క చరిత్ర అని భ్రమము కలిగించే పేరు కావ్యానికి సార్థకమవడం.
ఇక పద్యాన్ని సూక్షమంగా చూస్తే తెలిసేది చమత్కారము. ఇమిడి ఉన్న భావసాంద్రతని విడగొడితే కనబడేవాటిల్లో మొదటిది రాసలీల. అందునే లక్ష్మీదేవి వక్షములయందున్న కస్తూరి విష్ణువు గుండెలపై లేపితమైనది. రెండవది అమాయకత్వము. మూడవది దానిచే జనించిన భ్రాంతి.
బ్రహ్మమానసపుత్రులైన సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు బ్రహ్మచారులు. శృంగారములో వారికి ఆసక్తి గాని అనురక్తి గానీ లేవు, తెలియనిదనమే ఉంది. శరీరాంలకారము వారికి విభూతిలేపనమే. పరిమళపు వస్తువంటే గంధము తప్పు వేఱొండు వారికి తెలిసియుండదు. కురంగనాభమును శృంగారాలంకార వస్తువు గుర్తించకపోవడం వారి ప్రవృత్తికి సహజమే. కురంగము అంటే జింక, కురంగనాభము అంటే జింకబొడ్డునుండి వచ్చినది. అదే ప్రపంచానికి వేలాది సంవత్సరాలుగా తెలిసిన సహజపరిమళపదార్థము. చూడడానికి అది నల్లని బంకమట్టిని పోలి ఉంటుంది. దానిని చూచి వారు భూదేవి యొక్క ఆకారమని భ్రమపడడంలో వింతలేదు. మఱొక విషయము కూడా ఉన్నది. పెద్దన పదాలు ఆచితూచి వాడడంలో నేర్పరి. బ్రహ్మ పద్మనాభుని పుత్రుడు, సనందనాదులు బ్రహ్మమానసపుత్రులు – అంటే, వారు విష్ణుమూర్తికి నిజంగా నిజభక్తులే. ఇటువంటి చమత్కారాన్ని పద్యంలో పొందుపఱచిన పెద్దన గొప్పతనము ఎంత పొగడినా తక్కువే.

వెతికిన కొలదీ కావ్యశిల్పవిశేషాలు మనుచరిత్ర పద్యాలలో ఎన్నో వెల్లడి అవుతాయి. అందుకే కృష్ణరాయలు పెద్దనను అతుల పురాణ ఆగమ ఇతిహాసకథార్థస్మృతియుత ఆంధ్రకవితాపితామహు డని పేర్కొన్నది.

మాలికా పదచంద్రిక – 3

కోడిహళ్ళి మురళీమోహన్ గారు కూర్చే పదచంద్రికలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది – సరిగా పూరించినవారికి 1000 రూపాయల బహుమతి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే బహుమతి అందరికీ సమానంగా పంచబడుతుంది. ఒకవేళ విజేతలు అయిదుగురికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదుగురికి బహుమతి సమానంగా పంచబడుతుంది. మీ సమాధానాలకోసం ఎదురుచూస్తున్నాం. సమాధానాలు ఈమెయిల్ చెయ్యవలసిన చిరునామా: editor@maalika.org

– సంపాదకవర్గం

 

 

  

 

ఆధారాలు 

అడ్డం: 
1.తెలుగు స్టయిలు (2)
3.పిడకా కాదు పిడుగూ కాదు ముద్ద (3)

5.కేంద్ర హోం మంత్రి/తమిళనాడులోని నటరాజ ఆలయం వున్న ప్రసిద్ధ స్థలం.(4)

8.కలువల ఱేడు.(2)

10.చిన్న కొండను త్రిప్పి చూడుము (2)

11.వెస్ట్‌బెంగాల్(3,2,2)

14.అటునుంచి ఆలకించుము(3)

16.వెనుక నుండి గొయ్యి చేయుము.(2)

17.రక్షించు(3)

19.తెలంగాణా యాసలో పప్పులు. ఏకవచనంలో తడబడింది.(3)

21.హృదయాన్ని రంజింప చేసేది.(3,4)

22.విదుల్చెదనని చెప్పమంటే చల్లని ఎద పైనా అని కంగారు పడతావేం?(3)

23.కంపరములో వణకు (3)

24.పండు(అకర్మక క్రియ)(2)

27.మన వేమనే కాస్త అటూ ఇటూ అయ్యాడు(3)

29.ఏడు సాగరములను వెనుకనుంచి చూడుము (2,5)

32.ఓగుకు జతయైనది; మేలు (2)

34.ఉరుదూ కోపము (2)

35.పక్షులను కొట్టుటకు ఉపయోగించు పనిముట్టు తెలిదేవర భానుమూర్తి వ్రాస్తున్న కాలమ్ పేరు.(4)

36.ఆనవాయితీ (అన్యదేశ్యము) (3)

37.వ్యాసాలయితే పానుగంటి వారివి. పత్రిక అయితే జగన్‌ది. (2)

నిలువు:

1.కళేబరముతోడి బాల్యము (4)

2.శిరోమాలి ఆద్యంతాలతో వానపాము రివర్సులో (2)

4.ఎన్టీవోడి సైన్మా ఉల్టా అయ్యింది (3)

6.పుట్టినప్పుడు ఇది కట్టలేదు. పోయేటప్పుడు అది వెంటరాదు అని సినిమా వేదాంతం(2)

7. తిరునాళ్లలో పిన్నా పెద్దా తిరిగేది (3,3)

9. నిప్పులేనిదే ఇది ఎట్లా వస్తుంది?(2)

11.ఎన్.టి.రామారావు, గుమ్మడి, జమున, చంద్రకళ తదితరులు నటించిన 1971 నాటి చిత్రరాజము (3,4)

12. అనువంశికము, తరతరము (7)

13. ప్రారంభ సమావేశము కాదు చివరిది. అస్తవ్యస్తమయ్యింది. (7)

15. ఒక తృణ విశేషము (2)

17. జీవనం. (3)

18. యమునికి వికృతి అటు ఇటు అయ్యింది. (3)

20. ఒసే వయ్యారి రంగి నా మనసే కుంగి పాడిందే కన్నీటి పాట... ఈ పాట ఈ సినిమాలోనిదే
(4,2)

25. తలక్రిందలుగా ఇకిలించు (2)

28. అంతరాత్మ (4)

30. ధనం (2)

31. అస్తవ్యస్తమైన కంపు, గబ్బు (3)

33. గుడిసెలో కోవెల (2)

34. క్రింద నుంచి పైకి వెళ్ళు (2)

ఆఖరు తేదీ: సెప్టెంబరు 20, 2011


 

Categories Uncategorized

గిన్నీస్ రికార్డ్

రచన : డి.వి.హనుమంత్ రావు.

పాత్రలు :  భార్య — శ్రీమతి విజయలక్ష్మి.. భర్త .. శ్రీ డి.వి.హనుమంత్ రావు..

 

 

భార్య.. (పాట)వాసంత సమీరంలా .. నులివెచ్చని గ్రీష్మంలా….. సారంగ సరాగంలా ..అరవిచ్చిన లాస్యంలా.. ఒక శ్రావణమేఘంలా…. సాధించాలి

భర్త : ఈ గోల మొదలైపోయింది..

భార్య : ఈసారి ఎలాగైనా సాధించాలి…

భర్త :(మధ్యలో ఆపి) అమ్మా! తల్లీ! ఈసారేమిటమ్మా నీ సంకల్పం?

భార్య: కస్తూరి..కస్తూరి.. (వినిపించుకోకుండా పాట కంటిన్యూ చేస్తూ వుంటుంది)

భర్త : ఏమిటి? ఏవిటి చేయదలుచుకున్నావు?

భార్య: ఇరవై నాలుగ్గంటలూ శాస్త్రీయ సంగీతం  పాడి గిన్నీస్ బుక్కులో కెక్కిన మహానుభావులు ఉన్నారా?

భర్త : ఊ వున్నారు. వున్నారు.

భార్య: అలాగే ఇరవై నాలుగ్గంటలూ నాట్యప్రదర్శన చేసి గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన మహానుభావులూ వున్నారు ?

భర్త : అవును..మహానుభావులు…కెక్కారు..కెక్కారు…

భార్య:   (ఆవేశంతో) అలాగే…వారి అడుగుజాడల్లో నడిచి నేను కూడా..ఇరవై నాలుగ్గంటలు. టి.వి.సీరియల్స్‌ టైటిల్ సాంగ్స్ పాడి, గిన్నీస్ బుక్‌లో కెక్కి ఆ  రికార్డులన్నీ బ్రద్దలు కొడ్తాను. ఇదే…ఇదే నా శపధం. (ఆవేశంతో ఊగిపోతుంది).

భర్త :   ఓర్నాయనోయ్ … ఓర్నాయనోయ్ …  ఎప్పటికయ్యేనిది..

భార్య:(పాట) అంతరంగాలూ.. అనంత మానస చదరంగాలూ..

భర్త : ఓ!  అనంతలక్ష్మీ.. ఈ లోపల  కాస్త కాఫీ ఇచ్చి పుణ్యం కట్టుకో తల్లి!

భార్య:(పాట) మెట్టెల సవ్వడి.. ఓ. ఆ..మెట్టెల సవ్వడీ..

భర్త : మెట్టెల సవ్వడి సరే..కాఫీ ఇయ్యమ్మా!

భార్య : మెట్టెల సవ్వడీ .ఓ.. మెట్టెల సవ్వడి…మెడలో మాంగల్యం.. మదిలో అలజడులు..

భర్త : కాఫీ సరే…పోనీ కనీసం భోజనమైనా పెట్టేదుందా? అదీ లేదా?

భార్య:(పాట) ఎండమావులే నీ గుండెలోని ఆశలూ..

భర్త : బోజనం తల్లీ ఎండమావులంటావేం?

భార్య:(పాట కంటిన్యూ చేస్తూ) ఎండమావులే..నీ మనసులోని ఆశలు…

భర్త: ఆశ కాదమ్మా.. ఆకలి బాధ..క్షుద్బాధ..

భార్య : ఎందుకో నాకు ఈ ఆశలు…ఎందుకో నాకు ఈ ఆశలు..

భర్త : ఆకలి..ఆకలి..

భార్య: వంటవ్వలేదండి..

భర్త : ఇంకా వంటవ్వలేదా? నాకు తొమ్మిదిన్నరకే అలవాటు ? అప్పుడే పన్నెండున్నరైపోయింది .. ఇంకా వంటవ్వలేదా?

భార్య:(పాట)  మనసంటే మమతల నిలయం మమతంటే తీరని బంధం..

భర్త : ఎప్పుడు చేస్తావ్? ఎప్పుడు వండుతావ్? ఎప్పుడు పెడతావ్? అబ్బెబ్బే!! దిమ్మెత్తిపోతుంది..

భార్య:  ఏవండి! ఐదు నిమిషాల్లో వండి అక్కడ పడేస్తాను. ఏం వండమంటారు చెప్పండి?

భర్త : ఏవిటి? ఇప్పుడు అడుగుతున్నావా? (వ్యంగ్యంగా) ఏం వం డ మం టా రూ అంటూ.. ఎప్పటికి పెడతావ్??

భార్య:చెప్పండి .. ఆనపకాయా? అరటికాయా? ఏం వండమంటారు?

భర్త (కోపంతో) నాకు  .చిర్రెత్తిపోతోంది  తలకాయ వండు….

భార్య: ఆవేసి చేయనా? వేయించనా??

భర్త: ఆ..ఆ…

 

*******************************

 

ఓనమాలు

రచన : ఆదూరి సీతారామమూర్తి

 

ముందుగా ఊహించిన సంగతే అయినా శివరామయ్యగారి కావార్త కొండంత ఆనందాన్నే కలుగచేసింది.

ఎంత బడిపంతులు పని చేస్తూ పేద బ్రతుకు బ్రతుకుతున్నా ఆ క్షణం అతని మనోసామ్రాజ్యం అంతటా నిండి, పొంగిపోతున్న సంతోషపు వెల్లువలో ప్రపంచాన్ని జయించిన గర్వం తొణికిసలాడింది.

విద్యను నమ్ముకుని బ్రతుకుతూన్నందుకు సరస్వతీదేవి తనకు అన్యాయం చెయ్యలేదు.

తూర్పు వాకిట్లో పారిజాతం మొక్క దగ్గరగా యీజీఛైర్లో కూర్చున్న శివరామయ్యగారికి ఆ తొలిసంధ్యలో ఎన్నో కొత్త అందాలు గోచరించాయి.

వ్రేళ్ళు నాటుకుని పెరుగుతూన్న భావికాలపు వృక్షానికి కొత్త చిగురులు కనిపించాయి.ఎప్పుడూ ఏ ఆశలూ,ఆవేదనలూ ఎరుగని ఆకాశం అవతార పురుషుల మేని రంగులో నీలంగా నిర్మలంగా ఉంది – రోజూ చూసే సూర్యోదయమే అయినా అందులోని వింతకాంతి, రేపటి ఆశలకిరణంలా ద్యోతకమయిందతనికి. అదే సూర్యోదయంలో కాలచక్ర ప్రగతి కనిపించింది.జ్ఞానం కనిపించింది. తమ జీవితాలకి వెలుగును చూపే భగవానుడు కనిపించాడు. ఎగిరే పక్షుల్లోనూ, వీచే గాలిలోనూ స్వేచ్ఛ కనిపించింది. శివరామయ్య గారి మనస్సు ఆనందంతో పులకరించింది.

ఆ అనుభూతికీ, ఆ ఆనందానికీ కారణం ఆయనగారి రెండో పుత్రరత్నం శ్రీను పదోతరగతి పరీక్ష ప్రథమశ్రేణిలో పాసవడమే! తూర్పు ఆకాశంలో లేతవెలుగులు విరజిమ్మే సమయానికి న్యూస్ పేపరు పట్టుకొచ్చి ఆ సంతోషవార్తను ఆయన చెవిన వేశాడు శ్రీను.

దేవుడి గదిలోంచి గంట వినిపించడంతో లేచి, లోపలికి నడిచారు శివరామయ్యగారు. పారిజాత కుసుమాలతో కృష్ణ విగ్రహాన్ని అలంకరించి, పూజ పూర్తిచేసి వస్తూన్న మహాలక్ష్మమ్మగారు లక్ష్మీదేవిలా కనిపించారాయన కళ్ళకి. ఆమె వదనంలోనూ ఆనందమే!

 

ప్రసాదాన్ని ఆయనకందిస్తూ –

” విన్నారా! ఈ ఏడు పాతికశాతమే పాసయ్యారట! అందులో మనవాడు ఫస్టొచ్చాడంటే గొప్పే” అంది.

” గొప్పకాక? వాడెవరనుకున్నావ్? నిత్యం వందలాది విద్యార్థులకు విద్యాదానం చేసే ఉపాధ్యాయుడి కొడుకు. యింట ఎఱ్ఱయేగానీ లేకపోయినా విద్యచేత గొప్పవారమే మనం” అంటూ వంకీకున్న లాల్చీని తీసి వేసుకుని బయటకు నడిచారాయన.

తనక్కావలసిన వాళ్ళకీ, తన మేలును కాంక్షించేవాళ్ళకీ, తన కష్టసుఖాల్లోనూ ఆలోచనల్లోనూ పాలు పంచుకునే ఆప్తులకీ పుత్రరత్నం పాసైన సంగతి చెప్పి ఒక్కగంటలో తిరిగొచ్చారాయన.

” మీవాడు ఫస్టున రాకపోతే ఇంకెవరొస్తారూ? చదువు, సంస్కారం, విజ్ఞత వున్న వంశంమీది. ఆ కుటుంబంలోంచి వచ్చినవాడు ఆ తెలివితేటల్ని పుణికి పుచ్చుకోకుండా ఎలా ఉంటాడు” అన్నారంతా.

అవును మరి. ఆర్థిక స్థితిగతులూ, కుటుంబసమస్యలూ – తనను – చదువుకోనివ్వలేదుగాని లేకుంటే తను యూనివర్సిటీలో ప్రొఫెసరే అయివుండేవాడు…

పెద్దవాడు కృష్ణమోహన్ మాత్రం? తెలివి తక్కువవాడేం కాదు. కాలేజీలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి స్కాలర్‍షిప్‍ల మీద చదివేడు. తిండి, బట్ట ఖర్చు మినహా వాడి చదువుకేం తను ఖర్చు పెట్టలేదు. వాడు కలెక్టరవ్వాలని వాళ్ళమ్మ ఆశపడేది. ఐ.ఎ.ఎస్.కి వెళితే అందులో నిలిచేవాడే. కానీ ఎన్ని తెలివితేటలున్నా దాని వెనుక అదృష్టం కూడా కల్సి రావాలి. నొసట గీతప్రకారం జీవిత గమనం నిర్దేశించబడుతుందని నమ్మేవాళ్ళలో తనొకడు. అనుకోకుండా వచ్చిన బేంకు ఉద్యోగంలో కృష్ణమోహన్ స్థిరపడిపోయాడు. స్వయంకృషి, పట్టుదల ఉన్నవాడు ఏ రంగంలో వున్నా రాణించగలడు. ఆ నమ్మకం తనకుంది. దూరంగా ఒక్కడూ ఉంటున్నాడన్న బాధతప్పితే మరో చింతలేదు వాడిగురించి. నెమ్మదిగా వాణ్ణి ఓ యింటివాణ్ణి చేసేస్తే ఆ బాధా తీరిపోతుంది. ఇద్దరు కొడుకుల మధ్యా ఉన్నది ఒకేఒక ఆడపిల్ల సరస్వతి. ఎలాగో దానికి తగిన వరుడిని వెతుక్కోపోలేడు!

శివరామయ్యగారి తలపులు పరిపరివిధాల పోతున్నాయి.

“వంటయింది. వడ్డించెయ్యమంటారా” అంటూ వచ్చారు మహలక్ష్మమ్మగారు.

ఆలోచనల్ని అంతటితో కట్టిపెట్టి లేచారు శివరామయ్యగారు-

మధ్యగదిలో శ్రీను ఏదో పుస్తకం చదువుతూ కన్పించాడాయనకు. శ్రీను అందరి పిల్లల్లాంటి ఆటధ్యాస పిల్లాడు కాడు. వాడికి చదువుమీద ఎంతశ్రద్ధో! సమయం దొరికితే చాలు ఏదో ఒక పుస్తకం తీసి చదువుతూనే వుంటాడు. అదృష్టం కలిసిరావాలేగాని వాడు వాళ్ళమ్మ ఆశయం మేరకు ఐ.ఎ,ఎస్ పాసై కలెక్టర్ తప్పకుండా అవుతాడు. శివరామయ్యగారి కళ్ళు మెరిశాయి ఆనందంతో.

భోజనం చేసి యథాప్రకారం స్కూలుకు బయల్దేరేరు. ఆ రోజంతా సరస్వతీదేవి ఆవహించినట్లే పిల్లలకు పాఠాలు చెప్పారు. సాయంకాలం యింటికి తిరిగొస్తుంటే పోస్ట్ మేన్ కనిపించి, ” మాష్టారూ మీకో ఉత్తరముంది” అని ఓ కవరందించాడు.

ఆ కవరుపైనున్న దస్తూరి చూడడంతోనే శివరామయ్యగారికి మనసులోంచి సంతోషం పొంగుకొచ్చింది. హైదరాబాద్ నుండి పెద్దకొడుకు కృష్ణమోహన్ రాసినదది.వెంటనే తీసి ఏం రాసేడో చదివేయాలనిపించింది.కానీ ఆతృతను అణుచుకుని కవర్ని లాల్చీ జేబులో పెట్టుకున్నాడు. కృష్ణమోహన్ అందర్లా అక్కడ క్షేమం, యిక్కడ క్షేమం అంటూ నాలుగు పొడిముక్కలు రాసి ఉత్తరం ముగించెయ్యడు. వాడు రాసిన ఉత్తరం చదువుతూంటే వాడితో మాట్లాడుతున్న అనుభవం కలుగుతుంది. అంత చక్కగా ఉత్తరాలు రాస్తాడు. వివరాల్నీ విశేషాల్నీ కళ్ళకు కట్టినట్టు రాస్తాడు. అటువంటి ఉత్తరాల్ని ఆదరాబాదరాగా చదివితే లాభం లేదు.

నడకలో వేగం హెచ్చించి యింటికొచ్చి కాసింత కాఫీతాగి, తాపీగా ఉత్తరం చదవడం మొదలుపెట్టేరు. ఉత్తరమంతా చదివేక, ఆశించిన దానికంటే ఎక్కువ ఆనందం కలిగిందాయనకు. పెళ్ళి ప్రస్తావన ఎప్పుడు తెచ్చినా దాటేస్తూ “ఇప్పుడు నాకేం తొందర” అనేవాడు. యీ ఉత్తరంలో ఆ సంగతి వ్రాయడం ఆశ్చర్యమనిపించింది. ఆ వెంటనే భార్యని పిలిచి ఉత్తరాన్ని పూర్తిగా చదివి వినిపించారు –

“పోన్లెండి. మనవాళ్ళూ, మనూరి పిల్లా. మీ అంగీకారమైతే చూసుకుందికెట్లాగూ వస్తానంటున్నాడు – శుభం – రమ్మని ఓ కార్డు రాసి పడెయ్యండి” అందావిడ.

భార్య మాటలకు సరేనన్నట్లు తలూపి సంతృప్తిగా నిట్టూర్చారు శివరామయ్యగారు.

 

*     *     *

 

శ్రీనివాస్ చాలా హుషారుగా ఉన్నాడు.

ఆరోజు కాలేజీలో చేరే రోజు. ఉన్న ఒక్కగానొక్క ఫేంటూ, టెరికాటన్ చొక్కా ఉతికి ఇస్త్రీ చేయించుకున్నాడు. పదో తరగతి పాస్ సర్టిఫికెటూ, మార్కులలిస్టూ, తదితర సర్టిఫికెట్లూ, పాస్‍పోర్టు సైజు ఫోటోలూ, కాలేజీవారు పంపిన ఇంటిమేషన్ కార్డూ…. కాలేజీ అడ్మిషన్ టైమప్పుడు కావల్సిన అన్ని సర్టిఫికెట్లూ ఒక ఫైల్లో పెట్టుకున్నాడు. అవికాక హైస్కూల్లో తను డిబేటింగ్‍లోనూ, ఎస్సే రైటింగులోనూ పాల్గొని ఫస్టులు తెచ్చుకున్న సర్టిఫికెట్లు కూడా వాటి అడుగున పెట్టాడు. వాటన్నిటిని సంతృప్తిగా చూసుకుంటూ మార్కుల జాబితాను మరొక్కమారు చూసుకున్నాడు. సగటున ఎనభైయ్యారు శాతం మార్కులొచ్చాయి. ఏ ఒక్క సబ్జెక్టులోనూ ఎనభైకి తగ్గలేదు.

అందుకే ఊళ్ళో మొత్తం మూడు జూనియర్ కాలేజీలున్నా మూడింటిలోనూ మంచికాలేజీ అనుకున్న ఒక్క కాలేజీకే ఎప్లయ్ చేసి ఊరుకున్నాడు. ఎంత కాంపిటీషన్ ఉన్నా తనకు మాత్రం సీటు రావటం ఖాయమనుకున్నాడు. తన స్నేహితులు చాలామంది మూడింటికీ ఎప్లయ్ చేసి , ఏ కాలేజీలో సీటొచ్చినా చాలన్నట్లు చూశారు. తను అనుకున్నట్లే తనకు సీటొచ్చింది.

ఈ రెండేళ్ళ కాలేజీ చదువూ తన భవిష్యత్తును నిర్ణయిస్తుందంటారు నాన్నగారు.

ఏమైనాసరే తను యింతకంటే బాగా చదవాలి. నలుగురిలోనూ పేరు తెచ్చుకోవాలి! అనుకున్నాడు.

అతని మనస్సు ఆ క్షణంలో ఆనందడోలికలూగింది.

కాలేజీలో ప్రిలిమినరీ యింటర్వూ పదిగంటలకు కాబట్టి తొమ్మిది గంటలకే యింటిదగ్గర బయల్దేరారు తండ్రీ,కొడుకూ.

శివరామయ్యగారు ఆ పూట స్కూలుకి శెలవు పెట్టేశారు. ఆయన కాలేజీలో అడుగు పెట్టేసరికి కాలేజీ ఆవరణంతా కోలాహలంగా ఉంది.అక్కడో బోర్డుమీద మెరిట్ ప్రకారం సెలెక్టు చేసిన విద్యార్థుల లిస్టు ఉంది. ఆతృతగా దాన్ని పరికించారు శివరామయ్యగారు.అందులో నాలుగో పేరే శ్రీనివాస్‍ది.

సరిగ్గా పదిగంటలయ్యేసరికి యింటిమేషన్ కార్డులన్నీ కలెక్టు చేసి వరుసగా పిలవడం మొదలెట్టారు. శ్రీనివాస్ పేరు పిలవగానే శివరామయ్యగారు కొడుకుని తీసుకుని లోపలికెళ్ళారు. అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేస్తున్నాడో వృద్ధ జంబూకం. అతన్ని చూస్తే అలానే అనిపించింది శివరామయ్యగారికి. అన్నిసర్టిఫికెట్లూ చూశాక,”అప్లికేషన్ ఫారాన్ని ప్రిన్సిపాల్‍గారి సంతకంకోసం పంపిస్తాం. యీలోగా మీరు ఫీజు చెల్లించిరండి” అంటూ ఓ చిన్న స్లిప్‍ను శివరామయ్యగారి చేతికందించాడతను.

“ఫీజు ఎంతకట్టాలో సెలవిస్తే….” అంటూ ఆగిపోయారాయన.

“అందులోనే ఉంటుంది చూడండి” అని తనపనిలో తాను లీనమయ్యాడాయన.

స్లిప్ వంక చూశారు శివరామయ్యగారు. అందులో రెండే అంకెలున్నాయి. మొదటిది రిజిస్ట్రేషన్ నెంబరు. రెండోది చెల్లించాల్సిన ఫీజు.అతని నవనాడులూ ఒక్కసారి కృంగిపోయినట్లయ్యాయి.ఆ అంకె ఆరువందల ఎనభై!

శివరామయ్యగారికి ఒక్కక్షణం అంతా అయోమయమైపోయినట్లు తోచింది.ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.లేదా తన లెక్కయినా తప్పయి వుండాలనుకున్నారు.

“ఇది జూనియర్ ఇంటర్మీడియట్‍కి కట్టాల్సిన ఫీజేనా?” అడిగేరు అనుమానంగా.

“అవును” అన్నాడతను తలెత్తకుండానే.

“మరి…మీరిచ్చిన ప్రాస్పెక్టస్ ప్రకారం నూటఎనభయ్యే అవుతుంది కదా”

ఈమారు వృద్ధజంబూకం కుందేలుపిల్ల వైపు మృగరాజు చూసినట్లు కోపంగా చూశాడు శివరామయ్యగారి వంక.

“అవును.ఫీజు నూట ఎనభయ్యే. కాలేజి బిల్డింగ్‍ ఫండు ఐదువందలు. డొనేషన్ల విషయం ప్రాస్పెక్టస్‍లో ఉండదు కదా” అన్నాడు అతి సౌమ్యంగా మారిపోతూ.

“మరి డొనేషన్ చెల్లించకపోతే?…” అమాయకంగానే వుందా ప్రశ్న.

“ఈ కాలేజీలో చేరాలంటే అది చెల్లించాల్సిందే” – జవాబు మాత్రం కరుకుగావుంది.

శివరామయ్యగారికి ఏం చెయ్యడానికీ పాలుపోలేదు. గది బయటకొచ్చేసి, ఆవరణలో నీడనివ్వకుండా ఎత్తుగా పెరిగిన అశోక చెట్ల దగ్గర నిలబడ్డారు. పూర్వం తను చదువుకున్న స్కూల్లో ప్రహరీగోడంచునా మామిడి,సపోటా,జామ మొదలైన ఫలవృక్షాలుండేవి. అవి పిల్లలకు పళ్ళనిచ్చేవి. నీడనిచ్చేవి. ఇప్పుడా రోజులు మారిపోయాయి. నాగరికత ప్రబలిపోయింది. కాగితం పూల అందాలే నిజమైన అందాలయ్యేయి. ఈ నీడనివ్వని నిరుపయోగమైన చెట్లలాగే, యీ అందమైన ఎన్నో అంతస్థులున్న కాలేజీలుకూడా విద్యనర్ధించే సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయా అనిపించింది. అదే నిజమైతే విద్యకు డబ్బువిలువ కాక మరేముంటుంది? విద్యను బోధించే ఒక ఉపాధ్యాయుడై వుండి కూడా తనవంటివారు దానిని సమర్థించి సహించవలసిందేనా? శివరామయ్యగారి మనసులో గాంభీర్యం, హృదయంలో నిబ్బరం,ధైర్యం ఒక్కమారు నిండుగా తొణికిసలాడేయి. అంతే! మరుక్షణంలో ఆయన ప్రిన్సిపాల్‍గారి రూంలో ఉన్నారు.

“యస్.కమిన్” అని లోనికాహ్వానించి కూర్చోమని కుర్చీ చూపించారు ప్రిన్సిపాల్ గారు.కుర్చీలో కూర్చుంటూ ఆయనవంక చూశారు శివరామయ్యగారు.

వయసు ఏభై అయిదేళ్ళుండొచ్చు. ఎర్రగా దృఢంగా ఉన్నారు. నెరసిన క్రాపింగూ, నుదుట విభూతీ, తెల్లని పంచె,లాల్చీ,కండువాలో హుందాగా ఉన్నారు.

తన ముందున్న అప్లికేషన్లమీద సంతకాలు చేసి పంపేసి, “చెప్పండి” అంటూ శివరామయ్యగారి వేపు చూశారాయన.

” మా అబ్బాయి శ్రీనివాస్ ని మీ కాలేజీలో చేర్పిద్దామని వచ్చాను – టెంత్‍లో ఎనభైయ్యారు పర్సంట్ మార్కులొచ్చాయి.మీరు ఎన్నిక చేసిన మెరిట్ లిస్టులో నాలుగోవాడు.”

“వెరీగుడ్ చేర్పించండి. ఫీజు కట్టేసేరా?”

“బిల్డింగ్ ఫండ్ ఐదొందల రూపాయలు కంపల్సరీగా కట్టాలంటున్నారు. నేనందుకు ప్రిపేరై రాలేదు. మీరనుమతిస్తే ప్రస్తుతం ఫీజుమాత్రం కట్టగలను” అన్నారు.

ప్రిన్సిపాల్‍గారు ఆశ్చర్యంగా చూశారు. ఆయనకీ కేసు కొత్తగా అనిపించింది.ఫీజు ఎంతంటే అంత, ఎప్పుడంటే అప్పుడు క్యూలో నిలబడి కట్టేవారేగాని యిలా కట్టలేనని చెప్పేవారింతవరకూ తారసపడలేదాయనకు.

“చూడండి సార్. ఈ కాలేజీ స్థాపించి అయిదేళ్ళయింది. ఇంత తక్కువ వ్యవధిలోనే విద్య చేత, క్రమశిక్షణ చేత మంచి కాలేజీ అని పేరు సంపాదించుకుంది. ఒకమంచి విద్యాసంస్థను అభివృద్ధి పరచడానికి సహృదయులైన మీవంటివారి సహకారం లేకపోతే ఎలా?” అని ప్రశ్నించారు.

“నిజమే. విద్యాసంస్థను అభివృద్ధి చేయడానికి అందరూ సహాయ సహకారాలనందజేయాలి. కాని అది నిర్బంధంగా కాకుండా, సహకరించేవారి ఆర్థిక స్థితిగతులను బట్టివుంటే బావుంటుందని నా అభిప్రాయం. కొన్ని కాలేజీల్లో డొనేషన్లు తీసుకుంటారని నేనూ విన్నాను. కానీ మెరిట్ విద్యార్థులనుండి కూడా యింత ఎక్కువమొత్తం వసూలు చేస్తారని ఊహించలేకపోయాను. నా మట్టుకు నాకు కేవలం ఫీజులు చెల్లించి, పుస్తకాలు కొని చదివించడమే గొప్ప. కాకుంటే కాస్త వ్యవధి తీసుకుని శక్తానుసారం విద్యాసంస్థకు తోడ్పడగలను. మీకు తెలుసు, యీ దేశంలో స్కూలు మాస్టారెంత స్థితిపరుడో! నేనొక స్కూలు మాష్టార్ని. నా గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తారనే మిమ్మల్ని కలుసుకున్నాను” అన్నారు శివరామయ్యగారు.

ఒక్కక్షణం ప్రిన్సిపాల్‍గారేం మాట్లాడలేదు. ఆ తర్వాత అన్నారు:

“చూడండి మాష్టారూ. మీకీపాటికి విద్యాసంస్థల నిర్వహణలోని లోటుపాట్ల గురించి తెలిసే ఉండాలి. మాదొకరకంగా ప్రైవేటు సంస్థే. ప్రభుత్వం గుర్తించిందేగాని నిధులివ్వటం లేదు. అంచేత ఫండ్స్ సమకూర్చుకోవడం తప్పనిసరి అవుతోంది. మీ అబ్బాయిలాంటి తెలివైన విద్యార్థి మా కాలేజీలోనే చదవాలి.చదివి గొప్పవాడు కావాలి. మీకూ మాకూ పేరు తేవాలి. అందుకోసమైనా మీరీ ఖర్చు పెట్టక తప్పదు – అయితే యిక్కడ మీరొక్క సంగతి గుర్తించాలి. నిర్బంధంగా ఫండ్ వసూలు చేస్తున్నామని దీన్ని మీరొక వ్యాపార సంస్థగా భావించకూడదు. ఇక్కడ సీటొచ్చిన విద్యార్థి తప్పకుండా ఏ సైంటిస్టో,ఇంజనీరో,డాక్టరో, కలెక్టరో అయి తీరుతాడు. ఆ గౌరవ ప్రతిష్టలు నిలుపుకోడానికే ఎంతోమంది ఫండ్ పేరిట సీటుకోసం, వేలకువేలు గుప్పిస్తామన్నా మేము తెలివైన విద్యార్థులనే తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆలోచించండి – పిల్లల అభివృద్ధి కోసం, చదువుకోసం మనం కొన్ని కష్టనష్టాలను భరించక తప్పదు” అంటూ ఆగేరాయన.

అది ఒక చిన్నపిల్లాడికి చేసిన హితబోధలా ఉందేగాని ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ఒక విద్యార్థి తండ్రితో మాట్లాడినట్లు లేదనిపించింది శివరామయ్యగారికి.

ఎన్ని కారణాలున్నా డొనేషన్ రూపంలో తను ఐదువందల రూపాయలు కట్టడం అసంభవం. తలకు మించినపని. కట్టకపోతే పని అయ్యేట్టు లేదు. ఏం చెయ్యాలి? జరిగేదేదో జరుగుతుంది. అంచేత మనసులోని మాటను దాచుకోవాలనుకోలేదు.

“చూడండి సార్ – నా గురించి చెప్పుకోవడం కాదుగానీ రెండేళ్ళక్రితం ఉత్తమ ఉపాధ్యాయ బిరుదాన్ని ప్రభుత్వం నుంచి అందుకున్నవాణ్ణి. చదువు చెప్పటమేగాని దానిద్వారా డబ్బు సంపాదించాలన్న కోరికలేనివాణ్ణి. డబ్బే జీవితానికి ముఖ్యం కాదనుకున్నవాణ్ణి. మధ్యతరగతి కుటుంబీకుణ్ణి. మనమంతా సరస్వతీ పుత్రులమని నమ్మినవాణ్ణి. ఆ దృష్టితో చూసి అయినా మీరు నా అభ్యర్థనను మన్నించాలి. కేవలం డొనేషన్ కట్టలేదన్న కారణంగా ఒక మంచి విద్యాసంస్థ ఒక తెలివైన విద్యార్థిని వెనక్కు పంపేయడం న్యాయంకాదు.విద్యాలయాలు తెలివైన పేద విద్యార్థులకు చేయూతనివ్వాలి. డబ్బుంటేనే చదువు అన్న అపోహను పోగొట్టాలి. మీరు మార్కులకే ప్రాధాన్యతనిస్తారని యిక్కడసీటు ఖాయమని మరోచోట దరఖాస్తు చేయలేదు. నా అసమర్థత కారణంగా విలువైన వాడి సంవత్సరకాలాన్ని వృధా చేయలేను. మీరు మన్నిస్తే ఏ బాధలైనా పడి ఓ రెండొందలు మీ ఫండ్ కి చెల్లిస్తాను. ఓ నెల గడువివ్వండి” – అని సమాధానంకోసం ఆత్రంగా ప్రిన్సిపాల్‍గారి  ముఖంలోకి చూశారు శివరామయ్యగారు.

ఒక్కక్షణం ఏం మాట్లాడలేదు ప్రిన్సిపాల్ గారు. ఆ తర్వాత దించిన తలను ఎత్తకుండానే యిలా అన్నారు:

“మాష్టారూ! ఎంత ప్రిన్సిపాల్ నయినా, ఎన్ని వ్యక్తిగత అభిప్రాయాలున్నా నేనూ ఉద్యోగినే ఇక్కడ. మీ అభిప్రాయాలలో కొన్నిటితో నేనూ ఏకీభవిస్తాను – కానీ కొన్ని కారణాల చేత నేనశక్తుడిని. నా చేతిలో ఉన్నది, నేనొక యాభై రూపాయలు తగ్గించగలను. మీకోసం ప్రత్యేకించి రెండురోజుల గడువివ్వగలను. అంతే నేను చేయగలిగింది. మీ వాడికి మంచి భవిష్యత్తు కలగాలని ఆశీర్వదిస్తున్నాను” అంటూ తనపనిలో తాను లీనమయ్యారు.

నిస్సహాయంగా లేచి బయటకొచ్చేశారు శివరామయ్యగారు.

 

*      *       *

 

ఇల్లు చేరిన శివరామయ్యగారి మనసు మనసులో లేదు – జరక్కూడనిదేదో జరిగినట్లు భావించారు. ఓటమితోనూ, అవమానంతోనూ కుంచించుకుపోయారు.

” మరి యీ యేడాదికి కాలేజీలో చేరేది లేదా నాన్నా” అనడిగాడు శ్రీను కాలేజీ గడప దాటుతుంటే. వాడి రెండు కళ్ళల్లోనూ సుళ్ళు తిరుగుతున్న బాధను చూడలేక పోయాడు. తను ఏం చెప్పగలడు? ఎలా ఓదార్చగలడు వాడిని? మౌనమే అన్నిటికీ సమాధానం. సాయంకాలం వరకూ ఎక్కడెక్కడో తిరిగాడు. ఎవరెవర్నో కలుసుకున్నాడు. మనసు మరింత బరువెక్కిందేగాని తేలికవలేదు. ఆకలవటంలేదని అన్నం కూడా మానేసి మంచంమీద మేను వాల్చాడు. అప్పుడాయన మదిలో పెద్దకొడుకు కృష్ణమోహన్ మెదిలాడు. లేచి, డైరీలో దాచిన కొడుకు రాసిన ఉత్తరాన్ని మరొక్కమారు తీసి చదవడం మొదలుపెట్టేరు –

నాన్నా!

మీకో కొత్త సంగతి తెలియజేయాలనే యీ ఉత్తరం రాస్తున్నాను. ఎన్నాళ్ళగానో మీరూ, అమ్మా నా పెళ్ళిని గురించి ఆలోచించమని రాస్తూ వచ్చారు. పెళ్ళిని గురించి నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి కనుకనే యిన్నాళ్ళూ మౌనం వహించాను. నాకు అన్నివిధాలా నచ్చి, నా ఆలోచనలకు సరిపోయే అమ్మాయి తారసపడక మీకు నేనేం జవాబు చెప్పలేదు. ఇప్పుడు తారసపడిందనే అనుకుంటున్నాను. వాళ్ళది మనవూరే – మనవాళ్ళే – చదువు, సంస్కారమూ ఉన్న కుటుంబమే. మీరంగీకరిస్తే ఆ అమ్మాయిని మీకు చూపించడానికి వచ్చేవారం వస్తాను – ఏమైనా మీ నిర్ణయమే తుది నిర్ణయం.

– మీ కృష్ణ.

 

ఉత్తరం చదివిన శివరామయ్యగారి మనసులో ఆనందంతోపాటు ఒకింత గర్వంకూడా చోటు చేసుకుంది. నా పిల్లలు రత్నాలు. పెద్దల మాటలకు విలువిచ్చే సంస్కారులు అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో మరో ఆలోచన కూడా మెరుపులా మెరిసింది. అవును! వచ్చేది రేపేగా! శ్రీను విషయమై వాడొక పరిష్కారాన్ని ఆలోచించకపోడు అనుకున్నారు – ఆ సమయంలో ఆయన దృష్టి ముందుగదిలో చాపమీద బోర్లా పడుకున్న శ్రీను మీద పడింది. పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వెక్కుతున్నాడు వాడు.

శివరామయ్యగారి మనసు ఒక్కసారి ద్రవించిపోయింది. లేచి కొడుకు దగ్గరకు వెళ్ళి వాడి తల నిమురుతూ, ” ఒరేయ్ శ్రీనూ, ఎన్ని యిబ్బందులెదురైనా నీ చదువు మాత్రం ఆపెయ్యనులేరా. నన్ను నమ్ము” అన్నారు.

శ్రీను తలెత్తి ఆయన ముఖంలోకి వింతగా చూశాడు. వాడి కళ్ళలో ధారాపాతంగా నీళ్ళు!

“అవును. నన్ను నమ్ము!” అంటూ తన కళ్ళలో తిరుగుతున్న నీటిని ఆ పసివాడికి చూపించడం యిష్టంలేక గిరుక్కున వెనుదిరిగి వచ్చేశారాయన. ఆ రాత్రి కలత నిద్రే అయింది.

మర్నాడు ఉదయం ట్రైన్‍లో వచ్చేడు కృష్ణమోహన్. ఇంట్లో మార్పు లేకపోయినా మనుషుల్లో కొత్తగా వచ్చిన గాంభీర్యాన్ని పసిగట్టేడు. చెల్లెల్ని చాటుగా పిలిచి విషయాల్ని సేకరించేడు. ఆర్థికపరిస్థితులు చెల్లెలు ద్వారానే తెలుసుకుంటాడతను. ఎంత యిబ్బందొచ్చినా తండ్రి తనతో డబ్బు ప్రస్తావన తేడని అతనికి బాగా తెలుసు.

అందుకే పరిస్థితిని బాగా అర్థం చేసుకుని మధ్యాహ్న భోజనమయ్యాక తండ్రి గదిలోకివెళ్ళి ఆ విషయాన్ని ప్రస్తావించేడు. అప్పుడే నీకెట్లా తెలిసింది విషయం అన్నట్లు చూశారాయన.

“శ్రీను చదువు విషయమై మీకు సమస్యేం లేదు నాన్న. ఇక్కడ కాకపోతే వాడు నా దగ్గరుండి చదువుతాడు. ఇవాళ కాకపోయినా మరో సంవత్సరం పోయాకైనా మీరంతా నా దగ్గరకొచ్చేసే వారేగా. అనవసరంగా మనసు పాడుచేసుకోకండి” అంటూ ఎంతో తేలిగ్గా ఆ సమస్యను పరిష్కరించేసిన కొడుకువైపు చూస్తూ మాటలు రాని బొమ్మల్లే ఉండిపోయారు శివరామయ్యగారు.

 

*        *        *

 

గుమ్మంలో అడుగు పెడుతూనే పెళ్ళికూతురు తండ్రిగా పరిచయమైన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోలేదు శివరామయ్యగారు – ఆయన ప్రిన్సిపాల్ గారు! కానీ ప్రిన్సిపాల్ గారు మాత్రం ఒక్కక్షణం మాటలురాని పరిస్థితిలో కొయ్యబారిపోయి, తర్వాత తేరుకుని పశ్చాత్తాపపడి వారిని సాదరంగా లోపలికాహ్వానించారు.

పెళ్ళిచూపుల ఏర్పాట్లు ఘనంగానే ఉన్నాయి. చూపులూ, ఫలహారాలూ అయ్యాక మధ్యవర్తిగా ఉన్నాయన మధ్యలోకొచ్చి, ” పెళ్ళికూతురు అన్నదమ్ములూ, పెళ్ళికొడుకూ స్నేహితులు కాబట్టి, పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ అంతకుముందే చూసుకుని ఇష్టపడ్డారు కాబట్టి వారిద్దర్నీ ఒకటి చేసే ప్రయత్నంలో మిగతా విషయాలు మాష్టారుగారు నిర్మొహమాటంగా మాట్లాడితే బావుంటుందని నా అభిప్రాయం” అన్నాడు.

“ఇందులో యింక మాట్లాడేదేముంది?” అన్నారు శివరామయ్యగారు. – ఆ మాటకు ప్రిన్సిపాల్ గారూ, కృష్ణమోహన్ ఆయన వంక అదోలా చూశారు.

“అది కాదు మాష్టారూ! పిల్లలెలాగూ యిష్టపడ్డారు. కాబట్టి కట్నకానుకల విషయం మీరు తేలిస్తే ముహూర్తాలు పెట్టుకుందాం. అబ్బాయి ఉద్యోగయోగ్యతలను బట్టి పదిహేను వేలవరకూ కట్నం ఎవరైనా యిస్తారు – కానీ నాకంత శక్తిలేదు. పదివేలిచ్చి పెళ్ళి చేయగలను. మీరు అంగీకరిస్తే అది మా అదృష్టమే” అన్నారు ప్రిన్సిపాల్ గారు ఆయన వైపు ఆశగా చూస్తూ.

శివరామయ్యగారు అతని కళ్ళలోకి చూశారు. అభ్యర్థిస్తున్నట్లు ఉన్నాయా కళ్ళు. కొడుకు వైపు చూశారాయన. ” నాకు నచ్చింది. మీ నిర్ణయమే తుదినిర్ణయం” అన్నట్లున్నాయి అతని చూపులు.

” ఇవి జీవితాలు బావగారూ, ఇందులో వ్యాపారసరళిలో డబ్బు ప్రసక్తి రాకూడదు. నేను నా కొడుకుని నా బాధ్యతమేరకు చదివించి పెద్దవాణ్ణి చేశాను. వాడి అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగమొచ్చింది. నాకూ ఒక ఆడపిల్ల ఉంది. కానీ కూతురి పెళ్ళి కొడుక్కి తీసుకున్న కట్నంతో చేయాలన్న ఊహ నాకు లేదు. ఎవరి జీవితాలు వారివి! డబ్బు అవసరం ఎంతున్నా వాడి యిష్టాన్ని కాదనలేను – మీ అమ్మాయి వాడు కోరుకున్న జీవిత భాగస్వామి – జీవితాలకి డబ్బు అవసరమే, కాని డబ్బే జీవిత సర్వస్వంకాదు – నా యీ అభిప్రాయంలో ఎప్పుడూ మార్పురాదు. ముహూర్తాలు పెట్టించండి” అంటూ లేచారు.

అందరి ముఖాల్లోనూ ఆనందం తాండవించిందా క్షణంలో.

మర్నాడే ముహూర్తాలు పెట్టించుకొచ్చి శివరామయ్యగార్ని యేకాంతంగా కలిశారు ప్రిన్సిపాల్ గారు – ” నన్ను క్షమించండి మాష్టారూ! అభిప్రాయాలెన్ని ఉన్నా మీలా పాటించడం చేతకాలేదిన్నాళ్ళూ. మనుషులలోని విజ్ఞానాన్ని, మంచితనాన్ని డబ్బుతో కొలవలేమన్నది నిజం. నేనారోజు ఆ స్థానంలో ఉండి అలా జవాబు చెప్పినందుకు సిగ్గుపడుతున్నాను. జీవితమనే చదువులో యీనాడు మీ దగ్గర ఓనమాలు నేర్చుకున్నాను. నా అభిప్రాయాలను నేను గౌరవించే స్థితికెదగాలని నిశ్చయించుకున్నాను. అందుకే నేనా కాలేజీ ఉద్యోగానికి రాజీనామా చేశాను”

నమ్మలేనట్లు అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూశారు శివరామయ్యగారు. ఆయన నయనాలు శాంతిగా, కాంతిగా మెరుస్తున్నాయి!

 

 

చేపకి సముద్రం-భాషకి మాండలికం

రచన :   వై.   శ్రీరాములు-అనంతపురం

సంస్కృతం నేర్చుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల్ని వినియోగించిన మనం, ఆంగ్లం నేర్చుకోవడానికి కొన్ని వందల సంవత్సరాల్ని వినియోగిస్తున్నమనం మాండలిక పదాల్ని గమనించడానికి క్షణాలలో విసుగును ప్రదర్సిస్తున్నాం. మాండలికంలో రచనలు చేస్తే ఎంతమందికి అర్థం అవుతుందనే
వాదనలోనే మనం పయనించినంత కాలం ఆప్రాంత ప్రజల జీవనాన్ని ఆప్రాంత ప్రజల సంస్కృతిని ఆప్ర్రాంత ప్రజలకే దూరం చేసినవారుగా మనం మిగిలిపోతున్నాం.

 

వెంటనే అర్థం కావడానికే ప్రాధాన్యత జరుగుతోంది గాని ఈనాటికీ వెంటనే ఎంతమందికి సంస్కృత భూషితపదాలు, పద్యాలు అర్థమవుతున్నాయి.   ఎందరికి వెంటవెంటనే ఆంగ్లం అర్థమవుతోంది.   ఎందరికి వెంటనే కంటిచూపు తగలగానే ఎలక్ట్రానిక్స్ అర్థమవుతోంది.  ఆంగ్లంలో వున్న శాస్త్రాలన్నీ అర్థమయ్యే శాస్త్రాలుగా మనం చెప్పుకుంటున్నందుకు మన భాషపట్ల మనం శాస్త్రపరంగా ఆలోచించడం లేదన్నది సత్యం. ఆంగ్లం, స్పానిష్,  ఫ్రెంచి,  రూసీ పరభాషలకు ఇస్తున్న ప్రాధాన్యత మాతృభాషకు మూలమైన మాండలిక భాషకు, సాహిత్యానికీ ఇవ్వడానికి మాత్రం మనం వెనుకడుగేస్తున్నాం,  వేస్తూనే వుంటామన్నది పచ్చినిజం.

నాగరికత ముసుగులో విదేశీ ఆర్థికతకి ఇస్తున్న విలువ మన సంస్కృతికి సాంప్రదాయానికి మనం వీసమెత్తు కూడా ఇవ్వడం లేదన్నది స్పష్టం.

మాండలిక పదాల్ని రచనల్లో, శాస్త్రాల్లొకి తీసుకోవడానికి సంశయిస్తున్నంతకాలం వాటినుంచి కొత్త పదాల్ని రూపుదిద్దుకునే పాదాల్ని విస్మరిస్తున్నంతకాలం  మన సాహిత్యం మన అభివృధ్ధి ఎక్కడ వేసిన రాయి అక్కడే పాతేసిన విధంగా తయారవుతుందనడంలో సందేహం అవసరంలేదు.   ఇంకా లోతుగా గుంత తవ్వి సజీవభాషను పాతిపెట్టిపాతర వేసిన విధంగా జరుగుతుందనడంలో ఏమాత్రం సంశయం అక్కర్లేదు.

అమెరికాకి వెళ్లాలంటే, ఇంగ్లండ్ కి వెళ్లాలంటే మన పిల్లలకి నర్సరీనుండే అ, ఆ లకు బదులు

ఎ, బి, సి, డిలు -ఒకటీ రెండూ మూడులకు బదులు వన్, టూ, త్రీలు నేర్పించే  బళ్లలో (స్కూల్స్) వదులుతున్నాం.   అంటే ప్రాథమిక దశనుంచే ప్రథమాక్షరం నుంచే, ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే దిశగా మన పిల్లల్ని శ్రధ్ధగా తయారు చేస్తున్నాం.   కాని మన ప్రాంతీయత, సంస్కృతి, సంప్రదాయం భాష విషయాల్లో మాత్రం మనం వీసమెత్తు శ్రధ్ధ్ద కనపరచకపోవటం వ్యక్తిత్వమే లేకపోవడంతో సమానం అన్నవిషయం గమనించకపోవడం ఆత్మహత్యా సదృశ్యం.   కేవలం ఆర్థికతమీదే.   ఆర్థిక అంశాలపైనే మన దృష్టి వుంది గాని సృష్టిలో మనం మన జీవితవిధానంపై ఏమాత్రం స్పష్ఠత లేకపోవడం కాదు, కనపరచకపోవడం దురదృష్టకరం.

ఆంధ్రదేశం నుండి మనపిల్లలు అమెరికా వెళుతున్నారన్న ఆనందం, అక్కడ లక్షలకు లక్షలు

సంపాదిస్తున్నారన్న మహదానందం, వెనుక అక్కడ మనవాడు తయారుచేసే సూత్రము (ఫార్ములా) ఉత్పత్తి(ప్రాడక్టు)ఆంధ్రదేశములో దిగుమతి చెంది మనమందరం ఎంత భారీగా మూల్యం చెల్లిస్తున్నామో మనం గమనించడం లేదు.

మన పిల్లలకు పరిజ్ఞానం తయారుచేసే విధానం ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకున్నప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో మన పెట్టుబడులతో మనభూమిలో పండిన పంటలతో కడుపునింపుకుని మనభాషను విడిచిపెట్టి విదేశీ భాషను నేర్చుకుని మన దేశం విడిచి పరదేశం చేరి ఇక్కడ మన రాష్ట్రంలో చదువుకున్న చదువును పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నది ఎంతంటే ఒక్క శాతం కూడా లేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఒక సూత్రం (ఫార్ములా)తో ఒక ప్రాడక్టు ఉత్పత్తి కొన్ని సంవత్సరాలు అమ్మకాలు జరిపినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరిగినప్పుడు ఆ వస్తువును వినియోగదారులు వినియోగిస్తున్నంత కాలం ఆ సూత్రము ఆ ఉత్పత్తి మీద ఎన్నికోట్లకోట్లు సంపాదిస్తారో ఊహించడానికి కూడా ఊహకందని విషయం.   అంటే ఒక వ్యక్తో లేదా పదిమందో కలసి ఒక(ఫార్ములా)తయారుచేస్తే దాని ఆధారంగా  (ఒక టీ.   వి, ఒక ఫ్రిజ్, ఒక సెల్, ఒక కంప్యూటర్, ఒకలాప్ టాప్) ప్రపంచవ్యాప్తంగా ఎన్ని

సంవత్సరాలు ఆ సూత్రంతో తయారయిన వస్తువు విక్రయించబడుతుందో, అందువల్ల ఎన్నికోట్లు ఆ దేశ వ్యాపారస్తులు ఆ దేశం ఎంత సంపాదిస్తుందో తలచుకుంటే విస్తుపోవడం మూర్ఛపోవడం ఒక్కసారే జరుగుతుంది.

మనం వినియోగిస్తున్న భాష మనకుగాక, మనచదువులు మనకు గాక, మాన బుధ్ధి, విజ్ఞానం, ఆలోచించే విధానం, ఆచరించే విషయపరిజ్ఞానం మనకు తీవ్రమైన నష్టాన్ని, మన ప్రాంతపు వనరులను సంపదలని మనకు గాక విదేశాలకే లాభం చేకూరిస్తున్న విషయం మనం అర్థం చేసుకోలేకపోవడం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడంతో సమానంగాక మనకు మిగిలేదేముంది.

ఆఅలను విస్మరించడం, ఎబిసిడిలను స్మరించడం.   ఒకటిరెండు మూడు పక్కనబెట్టటం, వన్ టూ త్రీ లను అక్కునచేర్చుకోవడం, అమ్మను మొత్తడం, మమ్మీని నెత్తికెత్తుకోవడం, మన కళ్లని మనం నమ్మలేకపోవడం, మరొకరి కాళ్ళకి అడుగులకు మడుగులొత్తడం, అచ్చమైన భాషను విడిచి స్వఛ్ఛతను కోల్పోయి స్వేచ్చని చేతులారా కాలరాసుకోవడం, పచ్చని అరణ్యాల సౌందర్యాన్ని విడిచిపెట్టి పచ్చకాగితాల్ని యేరుకునే జనారణ్యంలోకి ప్రవేశించాలనుకునే మనస్తత్వం వున్నన్నినాళ్ళు మనిషికి అవస్థ, భాషకు దురవస్థ తప్పదు.   ఈవ్యవస్థ రెండుభాగాలుగా వుండకతప్పదు.

ప్రజా బాహుళ్య భాషల్లో మాండలికం ప్రతి ఉత్పత్తిపై తన ముద్రను వేసుకునేంతవరకు వస్తువుల ధరలు తగ్గవు.  రచనల్లో ప్రాంతీయ జనజీవనాన్ని జీవితాన్ని మాండలిక భాషల్లో ప్రతిఫలించనంతవరకు సంపూర్ణ అత్య్త్తుత్తమ సాహిత్యం రావడం జరగదు.

ప్రాంతీయ భాష మాండలిక వినియోగం యొక్క ఉపయోగం ప్రతిఫలం సాహితీసాంస్కృతిక రంగాలకే కాదు, ఆర్థిక సాంఘిక సామాజికరంగాలకు ఎంతో ప్రయోజనకరం.   ఈవిషయంలో ప్రస్తుతం అత్యంత ప్రయోజనం పొందుతున్నది రాజకీయరంగమని మనం గమనిస్తే తెలుస్తుంది.  ప్రాంతీయ పార్టీలు పెట్టిన సందర్భంలో ప్రాంతీయభాషా వినియోగం, వక్తలు ప్రాంతీయభాషల్లో మనల్ని ఉత్తేజం పెంపొందించినట్టు మరే ఇతర జాతీయ, అంతర్జాతీయ భాషలు మనల్ని ఉత్తేజపరచకపోవడం మనం గమనిస్తూనే వున్నాం.   అయితే ప్రాంతీయ తత్వాన్ని జాతీయఅంతర్జాతీయ తత్వనాయకత్వంతో ముడివేసుకుని అనుకరించినప్పుడే పార్టీలు, నాయకులు విఫలమవడం మనం గమనించవచ్చు.   ఈ విషయంలో ఇంతవరకు తమిళనాడు చేస్తున్న ప్రయోగం, భాష, సంస్కృతుల పరంగా చేస్తున్న అధికార వినియోగం ఆదర్శం.

వ్యక్తిత్వమన్నది తాము ప్రవచించే ప్రాంతీయభాషలోనే వుందని గమనించిన నాయకులు మరో జాతీయపార్టీని కాని వారి నాయకుల్ని గాని శాసిస్తూ తమకు అవసరమైన ఆర్థిక పరిపుష్టిని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నస్థితిని మనం చూస్తున్నామన్నది మనమెరిగిన పచ్చినిజం.

ఒకరికొకరు అధికారాలు, విజయాలు ఇచ్చుకుంటారు, పంచుకుంటారు గాని మరే జాతీయపార్టీకి తమవిజయాన్ని పట్టం కట్టరు.   విడిగా అయిదుగురు నూరుగురు వారిలోవారేగాని, ఎవరైనా ఎదురు పడితే నూట అయిదుగురు అన్న సత్యం తమిళనాడు ప్రాంతీయత, భాష, సంస్కృతి సాధించిన అత్యున్నత అపూర్వవిజయం.

సాహిత్యం అన్న విషయానికొస్తే అది ప్రజలకు సంబంధించిన అంశంగా గాక సాహితీపరులకు

సంబంధించిన అప్రస్తుత విషయంగా ప్రజల మనోభావాల్లో నాటుకొనిపోయింది.   ఒక విషయాన్ని చెప్పిందే చెప్పడం, కొత్తగా చెప్పలేకపోవడం, నూతనపదాల నిర్మాణంతో నిర్మించకపోవటం
జరుగుతోంది, కారణం నాగరికత ముసుగులో పట్టణభాషను వినియోగించడంతోనే సాహిత్యానికి తీరని ద్రోహం జరుగుతోంది, గ్రంథస్థ పదాల్ని అటుఇటు మార్చి అప్పడప్పుడే మార్చి చెప్పడం వలన నీరసంగా, నిర్వీర్యంగా సాహిత్యం తయారయ్యింది.

ఒకపదానికి అయిదు పర్యాయపదాల కంటే ఎక్కువవాడడానికి మనల్ని మనం వెతుక్కునే

స్థితి వస్తుండటంతో వాక్యం నూతనంగా బలంగా ఎలా రూపొందుతుందో అర్థంకాదు.   కాబట్టి చెప్పిందేచెప్పడంతో వినడానికి, చదవడానికి ప్రజలకి మనస్కరించకపోవడం జరుగుతోంది.   ఒకే భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నప్పుడు ఆ భావతీవ్రతకు అవసరమయ్యే భాషాపటిమ కూడా అంతే బలంగా వుంటే తప్ప ఆవాక్యానికి జవసత్వాలు కలగవు.   బాణం ఎంత పదునుగా వున్నా విల్లు బాగా వంగినప్పుడే దూరంగా వున్న లక్ష్యాన్ని బాణం ఛేధించగలదు.   వీక్షణం వుధృతమయినప్పుడు అక్షరం తీక్షణమయినప్పుడు రెండింటి కలయికతో భావం మన గుండెను బలంగా తాకక తప్పదు.   ఆ విషయంలో మాండలికాల్ని ఉపయోగిస్తే వాక్యానికి ఎంత బలం చేకూరుతుందో చెప్పక్కర్లేదు.

చంద్రున్ని ఒక సందర్భంలో వినియోగించుకునేటప్పుడు “నెలవంక” “జాబిలి” “శశి””చందమామ” అని ఆ వెలుగును “వెన్నెల” ” పున్నమి” అని వాక్యనిర్మాణంలో వుపయోగించు కోగలమే గాని ఇతరత్రా వేరేపదాలు పర్యాయపదాలు ఏవైనా వుంటే సంస్కృతం నుంచి ఒకటో రెండో అయిదోపదో దిగుమతి చేసుకుంటామే గాని ఇతరత్రా మన ఊహలకే అందని స్థితిలో వుంటాం.   మన చదువుల్ని రాతల్లో కోతల్లో అంతవరకే వినియోగించుకునే బందీలమై పోతాం.

ఈ విషయంలో విచిత్రమేమంటే నెల్లూరు జిల్లాలో వున్న జాలర్ల మాండలిక భాషలో చంద్రునికి నూటాయాభై పదాలు పర్యాయపదాలు వున్నాయని తెలిసి ఆశ్చర్యం, ఆనందం కలిగింది.   ఇక్కడ ‘చదువుకొన్న’వాడికి ‘చదువుకున్న’వాడికి అక్షరాలా చదువు లేనివాడికి తేడాఎంతుందో తెలుస్తుంది.   మనపాఠశాలలు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు సాహిత్యాన్ని కాపాడటానికి ఏమాత్రం పనికి రావని తెలుస్తుంది.

ఒక వృత్తిలో ఒక్క పదం నూటాయాభై పదాలుగా లభిస్తున్నప్పుడు వివిధవృత్తులలొ ఆ ఒక్క పదం ఎన్నివేల పదాలుగా ఎన్ని లక్షల పర్యాయపదాలుగా విస్తరించివుంటుందో వూహిస్తే ఆ పదాల్ని మనం  సాహిత్యంలో శాస్త్రాల్లో వినియోగిస్తే ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని, శాస్త్రాల్ని సృష్టించవచ్చో

నిర్మించవచ్చో తలచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది, కళ్ళు మిరుమిట్లకు లోనవుతుంది.   శతకోటికాంతి పుంజాలతో    శరీరం సర్వస్వం వెలుగుమయమవుతుంది.   ఒక సాహిత్యకారునికి, ఒక శాస్త్రజ్ఞునికి ఒక చరిత్రకారునికి ఇంతకంటే ఏం కావాలనిపిస్తుంది.   నిజమైన సాహితీపరునికి, శాస్తజ్ఞునికి ప్రజల్ని, ప్రజాజీవితాల్ని ప్రేమించేవారికి పదసంపద కంటే ధనసంపద ఏపాటిది?

ఒక వాక్యాన్ని నిర్మించే దశలో అయిదు పదాలకన్నా నూటాయాభై పదాలు మనముందు కదలాడుతూంటే ఎంత ఆనందంగా వుంటుందో ఆ అనుభూతిని అందంగా ఆవేశంగా విడుదల చేసేందుకు ఆస్కారముంటుందో ఊహిస్తేనే హృదయం ఉక్కిరిబిక్కిరి అవుతుంది.   .   కెవ్వుకేక.

ఒక కత్తిని పదును(సాన) పెట్టేటప్పుడు బండకేసి రాయికేసి అయిదుసార్లు తీటితే ఆకత్తి ఎంత పదునెక్కుతుందో వాక్యమూ అంతే!అంతేకాదు మాండలిక  పదాలతో తయారయిన భాష, సాహిత్యానికే కాదు,  సాంస్కృతిక,  రంగానికే కాదు భౌతిక, రసాయనిక, సాంకేతిక, వైజ్ఞానిక ఆర్థిక సకల శాస్త్రాలకు అంతే గొప్పగా వుపయోగపడుతుంది.   మాండలికం అన్ని శాస్త్రాలలో అలవొకగా యిమిడిపోతుంది.   అన్ని శాస్త్రాలకి అనువైన భాష మాండలికమే.   ఎందుకంటే మాండలికం ఆకాశమంత విస్తృతం కాబట్టి.

మర్రి చెట్టుకు ఊడలే వేళ్ళుగా, వేళ్ళే ఊడలుగా విస్తరిస్తూ పోయే తత్వమున్నట్టే వ్యావహారిక భాషలో మాండలికం వుపయోగిస్తే సాహిత్యం మహా వృక్షంగా తయారవుతుంది.  మాండలిక పదాల సేకరణతో పాటు వినియోగం అత్యవసరం.  అందుకు ఇప్పటికే ఆలస్యమయిందని గ్రహించి భాషను మహోద్యమ ప్రాతిపదికన మాండలిక భాషను వినియోగంలోకి తీసుకురావాలి.   మారుమూల పల్లెల్లో కొందల్లో కోనల్లో అడవుల అణువణువులో వున్న అన్ని పదాల్ని వెలికితీయాలి. విస్తృతమైన పరిశోధన మాండలిక పదాలపై పరిశోధన జరిపినప్పుడే భాషకు భావనికి ప్రాంతానికి అభివృధ్ధికి ఆర్థికతకి మనం మంచిచేసిన వారమవుతాం.

మాండలికాల్ని భాషాశాస్త్రాల్లో, సాహిత్య రచనల్లొనే కాక భౌతిక, రసాయనిక, వైజ్ఞానిక, వైద్య, సాంకేతిక, ఆర్థిక ఒక్కటేమిటి సకల శాస్త్రాల్లో వినియోగించినప్పుడే మనం మన ప్రాంతాన్ని మనల్ని అభివృధ్ధి పరచుకున్న వారమవుతాము, లేదంటే పరభాషా బానిసలుగా భావస్వాతంత్ర్యం లేని అస్వతంత్రులుగా, పరాధీనులుగా,  విదేశీగడప ముందు  దీనులుగా అన్ని విషయాల్లో పేదలుగా బ్రతకాల్సి వస్తుంది.   ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య అభివృధ్ధిని పొందాలంటే పద్దెనిమిది కోట్లమంది తెలుగుప్రజలు ముప్ఫై ఆరు అరచేతులమధ్య మాండలిక  పదాల అఖండ జ్యోతుల్ని ఆరిపోకుండా కాపాడుకోవాలి.   రైతు పంటని, తల్లి గర్భాన్ని నిరంతరం జాగురకతో, ఎరుకతో శ్రద్ధగా చూసుకున్న విధంగానే మాండలికాన్ని  మనం చూసుకోవాలి.

వై.   శ్రీరాములు-అనంతపురం

99856 88922

 

ఆదర్శసతి సీత

రచన : డా. వి.వి.రాఘవమ్మ

భారతీయ సాహిత్యమునందేగాక విశ్వసాహిత్య వీధులలో కూడా  రామాయణం మహేతిహాసంగా నిస్తుల ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది.  వాల్మీకి మహర్షి ఉత్తమ ఆదర్శానికి ఉదాత్త దర్శనానికి ఇది ప్రతిరూపం.  అవతారపురుషులలో ఉత్తముడు, ఉదాత్తుడు అయిన శ్రీరామచంద్రుని అపురూపమైన చరితం.  రామాయణం ప్రపంచితమైనది.  “సీతాయాశ్చరితం మహత్”అని వాల్మీకియే ప్రవచించాడు. సీతారాములిద్దరు ధర్మకర్మల్ని ఆచరించి చూపారు.  నాటి నుంచి నేటివరకు అగ్రతాంబూలం అందుకుంటున్నారు. రాముడు ఆచరించినట్లు,శ్రీకృష్ణుడు ప్రభోధించినట్లు చేయండని విజ్ఞుల విజ్ఞాపన. గీర్వాణ భాషలో మధురాక్షర సమన్వితమై కావ్యంగా ప్రాశస్త్యాన్ని గడించినదీ ‘రామ’ఆయానం.

 

“కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్

ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్”

 

అంటూ ఆదికవికి అభివందన చేయడమేగాదు ఎందరో శ్రీరామ కథామృతాన్ని ఆస్వాదించి రచనలు చేశారు. చేస్తూనే వున్నారు. ఇక జానపదుల రచనలవి లెక్కకు మిక్కిలి. సీతారాములను తల్లిదండ్రులుగా భావించి కీర్తించారు. “పాఠ్యేగేయేచ మధురమ్మని”తంత్రీలయ సమన్వితమని పేరుగాంచిన ఈ కావ్యం ప్రాక్పశ్చిమాల్లో కూడా  ఇంతే వైవిధ్యాన్ని,వైశిష్ట్యాన్ని కలిగి వున్నదని ఎందరో భావించారు. కారణం ఇది భారతీయులకు జీవనాడి వంటిది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు,నైతికవిలువలకు కాణాచి.

 

రామకథా రచయితలెందరో అయినా రచయిత్రులు కొందరే. అందరిలో “మొల్లమ్మ”రచన అగ్రగణ్యం. తెలుగు సాహిత్యాన్ని తేనెలూరు తీయనిమాటలతో ముద్దులొలుకు గద్యపద్యాలతో ‘చంపూ’కావ్యంగా మలచినది. తాను పలికిన పలుకులు తెలుగుమాటల మాధుర్యానికి ఎంత సన్నిహితమో చూడండి.

 

“కందువ మాటలు సామెత

లందముగా గూర్చి చెప్పనది తెలుగునకుం

బొందై ఎఉచియై వీనుల

విందై మరి కానిపించు విభుదుల మదికిన్”(పీఠిక18)

 

అంటుంది మొల్ల.  . సాలంకారంగా పాండితీస్ఫోరకంగా, పాత్రౌచిత్యంగా అలతిపదాల్లో అనల్పార్థ రచనావిభవంతో వ్రాసి ప్రౌఢ కవుల సరసన నిలచిన ఏకైక రచయిత్రి గడుసుదనంతో పాఠకులను ప్రశ్నిస్తుంది.  రామకథనే ఎందుకు చెప్పాలి అంటారేమోనని ఇలా అంటుంది.

 

“ఆదరమున విన్నగ్రొత్తయై లక్షణ సం   — విన్న గ్రొత్తయై మధ్య అరసున్నా ఉండాలి

పాదమ్మై పుణ్యస్థితి వేదమై తోచకున్న వెర్రినె చెప్పన్”–వెర్రినై అన్నపుడు బండిరా ఉండాలి

 

అంటూ వితర్కించినది. 24వేల శ్లోక పరిమితమైన రామకథను కేవలం వేయిపద్యాలు కూడాలేని సంక్షిప్త రచనలో కుదించినది. కథనెక్కడా కుంటుపడనీయలేదు. అగస్త్యుడు సముద్రజలాలను పుడిసిలించినంత గొప్పపని యిది. పైపెచ్చు మార్పులు చేర్పులు కూడా . వాల్మీకేతరాలు,సమకాలీన కావ్యమర్యాదలు ఉన్నాయి. ఇవి ఆమె చాతుర్యానికి స్వతంత్రభావస్ఫోరకానికి నిదర్శనం. వాల్మీకంతో మొల్ల  కవితను అనుసంధించి సీతమ్మ చరిత్రను పరిశీలించుట ఆ వ్యాస ముఖ్యోద్దేశం.

 

సాహిత్య చరిత్రలో స్థూలంగ స్త్రీపాత్రలు,పురుషపాత్రలని విభజన వుంటుంది. వీటిలో మరల ప్రధాన,అప్రధానాలుగా  విభజన కథానాయిక సీతపాత్ర ప్రధాన పాత్ర. ఆమె స్వరూప స్వభావ వర్ణనలతో చర్చించుకుందాం. ముఖ్యంగా వాల్మీకి (ఇక్కడ బు ఈ రుషి ఉండాలి)రుషి తనకావ్యపాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అందుకే నేటికీ ఆదర్శమైన ప్రతిబింబాలుగా నిలిచివున్నాయి. బహుపాత్ర సమన్వితమైన రామకథలో  పాత్రల మనస్తత్వాలను వివిధదశలలో సునిశితంగా తెలిసికోవాలంటే వాళ్లకు రామాయణ కావ్యమే పెన్నిధి. శ్రీరాముడి విజయానికి కారకులైన స్త్రీలెందరో వున్నారు. వారందరిలో సీత ప్రథమురాలు. ఆమె లేనినాడు రామాయణమే లేదు. “ధర్మాదర్థశ్చకామశ్చ నాతిచరామి”అనే ధర్మ సూత్రాలను దృఢంగా బిగించినపుడు నడుమచిక్కి నలిగిపోయే కోటానుకోటి వ్యక్తులలో సీతమ్మ కూడా  ఒక్కతే”అంటారు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు. చాలమంది ‘సీత’అనేపేరు తమపిల్లలకు పెట్టుకోవడానికి భయపడతారు. ఆలోచిస్తారు. ఆమె పేరులో వున్న పరమార్థాన్ని గాని ఆమె గుణశీలాలను గాని తెలియని అర్భకులే అట్టివాళ్ళు అనడం తప్పుకాదేమో!మానవజీవనవిధానంలో అనుకోని అవాంతరాలు,అందునా కుటుంబంలోని,పరిసరాలలోని వ్యక్తులవల్ల ఎదురయ్యే భయానకమైన సన్నివేశాలు నిరంతరం వుంటూనే వుంటాయి. వాటిని ఎలా అధిగమించాలో,ఆచరించాలో అనుభవించాలో స్వానుభవంతో లోకాలకు సాటిచెప్పి కీర్తికిరీటాన్ని ధరించిన దంపతులు సీతారాములు. పుటపాక బంగారాలు,పరస్పర భావసంఘర్షణలతో దివ్యసందేశాత్మకమై వెలిగినది. నిత్యస్మరణీయమైనది సీతచరిత.

నిత్యనవీనం,అనంతం అయిన కాలవాహినిలో యుగాలు గడచినా మానవసమాజంలో ఆదర్శవంతంగా నిలచిన పాత్రలు కేవలం కావ్యనాయికానాయకులే గాదు శ్రీరాముడిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసిన ఖ్యాతి స్త్రీపాత్రలెన్నింటికో దక్కినది.  ధరమేవ జయతే అని ధర్మానికి జయం అధర్మానికి నాశనం తప్పదని నిరూపించిన పాత్రచిత్రణలు. నిరపరాధులెలా నిందల పాలౌతారో,భోగశీలురు త్యాగశీలులు కావలసివస్తుందో నిరూపించినది. ముఖ్యంగా సీత తన ప్రాతివత్య ధర్మం చేత అధర్మానెదిరించడానికి ఎలా కడగండ్ల పాలయినదో చక్కగా నిరూపించినదీ కావ్యం. శ్రీరామ చరితలో నాయికయే గాని,ఒక మహేతిహాసాన్ని సృష్టించిన దివ్యపాత్ర ఆమెది. ధర్మాచరణ వైశిష్ట్యమే ఆమెను అంతటి ఉన్నతపథానికి చేర్చినది. ఇది లోకవిదితం. ఆమె నిర్వహించిన భూమిక అంతటి దివ్యమైనది.

ఆమె భారతీయ సతీత్వానికి మాతృత్వానికి ప్రతీక. గృహయజమానికి సర్వశుభాలు అందించిన గృహిణి. అనుకూలవతి ఆదర్శమూర్తి. పుణ్యభారతంలో పూత చరితలలో మేటి. ఇది వాల్మీకి,మొల్ల రామాయణాల తులనాత్మక పరిశీలన. ఐతిహాసిక,కావ్యనాయిక గానే గాదు సమకాలీనమైన ప్రబంధ కావ్యనాయికా లక్షణాలను గూడ జోడించి రచన చేసినది. వర్ణనామిళితమైన హరివిల్లు జీవన ఔన్నత్యంతో కూడిన సంస్కృతీ సంప్రదాయబద్దమైనది. సాంఘిక మర్యాదలకు, సమిష్టి కుటుంబపు తీరుతెన్నుల కపురూప కల్పన కావ్యత్వాన్ని సంతరించుకున్నది,రసానంద జనకమైనది.

శాస్త్రకావ్యార్ధ ప్రతిబింబితమై ఒప్పుచు ఆమె జీవితవృత్తమే ఒక ఇతిహాసమైనది. చరిత్రపుటల్లో చెరగని శిలాక్షరమైనది. అట్టి సర్వలక్షణ సంపన్న ఇతిహాసిక నాయిక జనకజ. లాక్షణికులు చెప్పిన స్వీయాది నాయికా భేదాలను పరిశీలిస్తే సీత స్వీయనాయికా లక్షణోపేత.

“సంపత్కాలే విపత్కాలే యానముంచతి వల్లభం

శీలార్ణవ గుణోపేత సా స్వీయా పరికీర్తితా”

అంటూ భరతుడు స్వీయనాయికను పరిచయం చేశాడు. కష్టసుఖాది ద్వందాల్లో రుజువర్తనం (ఇక్కడ బు ఈ రు ఉండాలి)కలిగి సఛ్ఛీల సద్గుణాలతో నాథుని అనుసరించి నడుచుకునే స్త్రీమూర్తి

సీత స్వీయనాయిక. వలదని వారించినా రాముని మునివేషధారణ తానుకూడా  స్వీకరించి వనగమనం చేసినది. పురుష చిత్తమెరిగిన గుణశీల. ఉత్తమ స్త్రీ ప్రవృత్తికిది తార్కాణం.  సాధారణంగా కావ్యనాయిక శృంగార రసతపస్విని. అట్టి రసానందంతో మునిగిలేదు.  పతిఅనురాగాది జీవితానుభవాలతో సీత ముగ్ధ,మధ్య,ప్రౌఢాది నాయికా భేదాలెన్నిటినో పొందుపరచుకున్న సంపూర్ణ వ్యక్తిత్వం గల స్త్రీ. శక్తివంతం,స్వయంప్రకాశం కలది. శక్తిసామర్థ్యాలతో శాస్త్రజ్ఞాన సంపదలతో కావ్యలక్షణాలన్నింటిని పుణికిపుచ్చుకున్నట్టిది. జనకరాజపుత్రిగ,దశరథమహారాజు కోడలిగా రామభధ్రుని యిల్లాలుగా తన స్థితిని భద్రపరచుకున్న వనిత,రావణ మారణ సంగ్రామానికి నాంది అయినది.

 

ప్రతినాయకునిచే అపహృతయై సంఘర్షణ సమావేశాలకు మూలమైనది. స్వధర్మపాలనలో బద్ధకంకణ,లోకోత్తర సౌందర్యమే గాదు,లోకధర్మాలను ప్రతిష్ఠించినది. స్వాధీనపతికయై,ధీరాధీరయై తరతరాలలో కీర్తింపడుబచున్నది. అనుపమాన గుణాలంకారశోభిత,అసమాన శక్తిస్వరూపిణి,లోకపూజ్య అయోనిజ పవిత్రతకు పరాకాష్ఠ దివ్యాంశతో కూడిన క్షత్రియకాంత.

 

త్రిలోక సుందరి.  వీర్యశుల్క.  ఏకపత్నీవ్రతుడైన రాముడిచే ఆరాధింపబడినది. పతిపరాయణ,నిత్యానపాయిని. తాను తరించి అతడిని తరింపచేసినది.  స్త్రీలు అబలలని శారీరకశక్తిని బట్టి అంటారు. అవసరమైన వేళలో నైతిక,మానసిక బలప్రదర్శనలు చేయగల సబలలని ఎందరో నిరూపించుకున్నారు. మన సీతమ్మ కూడా  అలాంటి ధీరవనితయేనని నిరూపించుకున్నది. ఈ సతి వ్యక్తిత్వాన్ని మొల్ల రామాయణంలో సంపూర్ణంగా తెలియడానికి అవకాసం తక్కువ. సంక్షిప్త రచనగదా!వాల్మీకి ఋషిమాత్రం సంపూర్ణంగా కావ్య్నాయికా గుణశీలవర్ణన చేసి చూపాడు. వాల్మీకి రచనయే ఆధారమైనది. అయోధ్య సుందర,యుద్ధ యిత్యాదులలో ఆమె మానసిక రూపాన్ని చక్కగా తెలిసికోవచ్చును.

 

ఆమె లౌకిక జ్ఞానసంపదకు విచక్షణతో కూడిన మర్యాదలకు,ఆలోచనలకు ధర్మాధర్మా ప్రసంగాలకు నెలవు. వ్యక్తిత్వానికి నికషోపలం ఈ కావ్యం. అరణ్యంలో,అశోకవనిలో రావణునితో భాషించిన తీరు ధీరత్వానికి,ధృఢసంకల్పానికి,పవిత్రభావాలకు ఆలవాలం. హనుమంతునితో మాట్లాడిన విధం పశ్చాత్తాపానికి పరాకాష్ఠ. పూత చరితకు నిదర్శనం. పతిని అనుసరించి అడవులకేగినది గాక బంగారులేడిని కోరి మరికొన్ని కష్టాలు తెచ్చుకున్నది. మానవజీవన వాహినిలో ఎదురయ్యే ఒడిదుడుకులను అనుభవించి జీవితమంటే ఏమిటో వివరించినదనవచ్చు. ఉచితానుచిత సంభాషణ చేయగల జ్ఞాని. సమయస్ఫూర్తితో ప్రవర్తించగల నేర్పు,ఆత్మ ఔన్నత్యం, కర్తవ్య ప్రబోధం చోట కఠినంగా మాటాడి ధర్మపరిరక్షణ చేయగల కౌశలం. ఎన్ని తెలిసినా “బుద్ధిఃకర్మానుసారిణీ” అన్నట్లు మాయలవాడి మాటలు నమ్మి భిక్షపెట్టి మోసపోయినది. స్త్రీ సహజ చిత్తవృత్తిని పలుతావుల వాల్మీకి చక్కగా నిరూపించాడు. 

 

ఆమె పతిపరాయణ. భర్తతో కలసి జీవించడమే సతీధర్మమని చాటిన యిల్లాలు. “అనన్యారాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథా’సూర్యుని చుట్తి వుండే కాంతిపుంజం వలె తాను తన రాముడిని ఏ స్థితిలోనూ విడిచి ఉండలేనిది. జీవితంలో భార్యకు గల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తూ అడవికి రావలదనిన రాముడికి హితోపదేశం చేసినది. నొప్పించి అయినా చివరకు ఒప్పించే చతురుపాయశాలిని. హితైషిణి. బానిసను గాదు భాగస్వామిని అని నిర్దేశించిన దేశిక. రాజస ప్రవృత్తి కంటె కర్తవ్యపాలన,ధర్మదీక్షా,వాక్పటుత్వం ఆమె లక్షణాలుగ నిరూపించుకున్నది. రాజసతామసాహంకారాలు మృగ్యం. 

 

“నేదానీం త్వదృతే సీతే స్వర్గోపి మమరోచతే”అంటూ ఆమె అనురాగాన్ని అభినుతించాడు రాముడు.

సాత్వక గుణసంపన్న గదా!అత్త కౌసల్య తనకొడుకును అరణ్యవాసంలో జాగ్రత్తగ చూచుకొమ్మని స్తీజనోచితబుద్ధిని  వివరిస్తుంది. నెమ్మదిగా కౌసల్యను అనునయించి ఆమె ఆంతర్యాన్ని అవగాహన చేసుకుని ప్రశాంతంగా సంభాషిస్తుంది. అనార్య అయిన స్త్రీని కానని వివరించినది. భర్తకు దూరమైన భార్యజీవితం శోభాయమానం కాదని  అనార్య్లులైన స్త్రీలు మాత్రమే భర్తను కష్టాల్లో వదిలి వుంటారని కులస్త్రీలు అలా చేయరని అనార్యలతో తనను పోల్చవలదని హెచ్చరిస్తుంది. ఇక్కడ వినయం గోచరించినా అత్తగారిమాటలకు తనమనసు నొచ్చుకున్న తీరును మెత్తగా వివరించినది జానకి. సీతాదేవి హృదయ ఔన్నత్యం ఎలాంటిదో అర్థం అవుతుంది. ఏ కావ్యనాయికలో కనిపించని రమణీయ సంభాషణ యిది. పరిణిత మానసిక ప్రవృత్తి అదే ఆమె హృదయ సౌందర్యం.

 

మొల్ల తనరామాయణంలో స్వీయనాయికా లక్షణాలతో ప్రకాశించే సీత ప్రవర్తనలకు అవకాశమే కల్పించలేదు. సీత హృద్గ్తత భావాలకు వాల్మీకి రామాయణం నీరాజనం పట్టినది. స్త్రీజనుల పట్ల వాల్మీకికి గల ఆదరణ అంత గొప్పది. మొల్ల కాలం నాటికి సామాజికమార్పులు కలిగి వుండవచ్చునేమో!తాను రచయిత్రి అయికూడా  సామాజిక వ్యవస్థను ధిక్కరించు ధైర్యం లేనిదై వుండాలి. స్త్రీకిసమానత్వాన్ని కల్పించి ఆ వ్యక్తిత్వ నిరూపణ చేయలేకపోయినది. సీత రాముడితో కౌసల్యతో  సంభాషించిన విధం ఆమె హృదయౌన్నత్యానికి నిదర్శనం. ఇలాంటి తావుల్లో సంభాషణల్లో తావు కల్పించకపోయినా శ్రీరాముని ఆంతర్యమెరిగి ప్రవర్తించిన స్థ్తితి ఆమెది. ఇంగితజ్ఞానసంపన్న అని తెలియును. “శ్రీరాముడు రాజచిహ్నంబు త్యజించి”అనే మాటలలోనే గ్రహించగలిగినదై  “తోడం జనుదేర”(మొ. రా అ30ప)ఇలాంటి పట్టున సంక్షిప్త సీత పాత్రచిత్రణకు కొంతలోటు తెచ్చినది. ఆత్మజ్ఞాన వికాసం ఆత్మీయతానుబంధం పరిచయమవుతున్నాయి.

 

వశిష్ఠాది ఆర్యజనుల,భరధ్వాజ,అత్రి వంటి మహర్షుల,అనసూయాది పతివ్రతల మన్ననలు అందినది సీత. ప్రశంసాపాత్ర క్లుప్తంగా చెప్పినా ఆమె ప్రవృత్తిని సూచించడం గమనార్హం.

 

పతిని గౌరవించి గౌరవించబడినది. భర్తను కార్యసాధనకు పురమాయించి కర్తవ్యపరాయణ అయినది. పతి ఆంతర్యం తెలిసి అడవికి బయలుదేరినదేగాని అయోధ్యలో ఆమెనెవ్వరు వెళ్లమని చెప్పినట్లు తెలియరాదు. అది ఆమె త్యాగశీలానికి ఋజువు. “సదాశాంత సదాశుద్ధా గృహఛ్ఛిద్ర నివారిణీ”అయిన సీత గృహఛ్ఛిద్ర నివారణకై భర్తను అనుసరించినది.

 

“సీతా సత్యాచరుక్మిణీ”అని లక్ష్మీ సహస్రనామస్తోత్ర కదంబంలో మహాదేవిగా ప్రస్తుతించబడుతుంది. ఒక దివ్య

శక్తి స్వరూపిణి. ఆధ్యాత్మరామాయణంలో కూడా “ప్రణవ ప్రకృతి రూపత్వాత్సాసీతా ప్రకృతిరుచ్యతే”(ఆ. రా. పు,48,49)

 

సీతయనగ ప్రకృతి. అంటే శక్తి. శ్రీరాముడు పురుషుడు. చిత్తు ఈ చిచ్చక్తుల సమైక్యరూపమే రామ లేక రామాచరితం అని నిరూపించబడినది.

 

“ప్రణిపాత ప్రసన్నాహిమైథిలీ జనకాత్మజా”(వా. రా. సుం. కాం. 46,47)అన్న వాల్మీకి వాక్కులు కూడా  దేవీత్వ ప్రతిపాదనమే. దయాదాక్షిణ్యాల నిలయమాతృ వాత్సల్యానికి మాతృక. చెరబట్టిన రావణుని కూడా  రక్షింపదలచి రాముణ్ణి శరణు కోరమని హితవుపదేశించిన క్షమాగుణసంపన్న. ఈ విషయంలో మొల్ల ఆమె దాక్షిణ్యాన్ని నిరూపించక రావణుని ఉపేక్షించిన తీరు వర్ణించినది. ఉపేక్షించినా లోక కంటకమని ఆమె నిర్దాక్షిణ్య హృదయంలోని నిష్ఠూరాలకు తావిచ్చినది.

 

“ఆరూఢ ప్రతిమాన విక్రమ కళాహంకారతేజోనిథిన్”(మొ. రా. సుం67ప)అంటూ రాముణ్ణి కీర్తిస్తూ ధీరాతిధీరగ పలికినది సీత,ప్రౌఢవచోప్రగల్బ్యయై నిర్జన వనంలో రావణుని తిరస్కరించినది. స్త్రీ హృదయానికి మొల్ల దర్పణం పట్టినది. చిఛ్చక్తుల అవినాభావ సంబంధమైన సత్యదర్శన నిరూపణమే రామాయణంలోని సీతాదేవి పాత్రచిత్రణం. రావణుడు చిత్తును వదలి శక్తిని చెరపట్టాడు. అతడి చెల్లెలు శూర్పనఖ శక్తిని వదిలి చిత్తును చేపట్టినది. ఇద్దరికి భంగపాటు తప్పలేదు.

 

“ప్రణిపాత ప్రసన్నాహిమైథిలీ జనకాత్మజా”అని వాల్మీకి నిరూపణ ఆదికావ్యంలో గదా!ఆమె కేవలం మానవమాత్రురాలు గాదు. దివ్యశక్తి అని విశ్వనాథ వారి వాణి కూడా  వినిపించినది. ఉపనిషత్తులు కూడా  సీతారాములను పరతత్వ రూపాలుగా శక్తివంతులుగా వర్ణించాయి. దైవాంశాలను అంతర్నిబిడంగా పోషించారు కావ్యకర్తలు.

 

దేవీభాగవతం కూడా  సీతమ్మను శక్తిస్వరూపిణిగానె నిర్ణయించినది. గాయత్రీరూపమే సీతగా మూర్తీభవించినదట. “మందా హిమవతఃసృష్ఠేగోకర్ణే భద్రకళా. చిత్రకూటే తథాసీతా వింధ్యే వింధ్యాధికారిణీ”(దేవీ భాగవతం). గాయత్రీపటలమందలి అష్టోత్తర శతనామాలలో సీతనుద్దేశించి

 

“శుభ్రాంశవాసా సుశ్రోణీ సంసార్ణవతారిణీ సీతా(160)”సర్వాశ్రయా సంధ్యాసఫలా

సుఖదాయినీ వైష్ణవీ విమలాకాలా మహేంద్రా మాతృరూపిణీ”

 

అని దేవీ భాగవతకర్త గాయత్రీ నామావళిని ిర్దేశిస్తూ(12సం 6వ ఆధ్యా)”జాతరూపయయీ జిహ్వ జానకీ జగతీజరా”(57శ్లో)దండకారణ్యా నిలయాదండినీ దేవ పూజితా మానవీ మధు సంభూతా మిథిలాపురవాసినీ”(124శ్లో),రామచంద్ర పదాక్రాంతా రావణఛ్చేదకారిణీ(137శ్లో)వ్యాసప్రియా వర్మధర్మావాల్మీకి వరసేవితా(144శ్లో)అని షోడశి18వ పుటలో సీత పరాశక్తి రూపాన్ని స్పష్టపరచినది. అశోకవనిలో ధ్యానసంలగ్నమానసయైన సీతను గూర్చి వాల్మీకి సుందరకాండలో ‘కృశాంమలిన దిగ్దాంగీం విద్యాంప్రతిపదీమివ(సుం. కాం. 15-35)ఇందులో “విద్యా”అనే శబ్దం పరాశక్తి అనే అర్థాన్ని తెలియజేస్తున్నది. విజ్ఞులకు విదితమే ’విద్యాయైనమః అని లలితాసహస్రం. ప్రతిపత్తునాటి విద్యయంటే పరాశక్తి అని సౌందర్యలహరిలో కూడా  ఉపమించడం చాల తావుల్లో పరిచయమవుతున్నది. “అవ్యక్తరేఖామివ చంద్రరేఖ” అని(వా. సు. కాండ 5స 26శ్లో)వాల్మీకులు. అవ్యక్తాయైనమఃఅంటూ లలితసహస్రనామావళి ప్రసన్న తారాధిపతుల్యదర్శన అని కూడా  వాల్మీకియే నిర్ణయించాడు. రావణుడు మనసుపడ్ద సీతావర్ణనలివి (సు. కాం. 13,68)స ీతాదేవిని అగ్ని రాముడికి అప్పగిస్తూ “రక్తాంబరధారిణీం”అని పలికి ఆమె దేవీత్వాన్ని ప్రకటిస్తాడు. కుండలినీ యోగశక్తియే సీతగా వివరించారు శేషేంద్రశర్మ. 

 

“తరుణాదిత్యసంకాశః తప్తకాంచనభూషణామ్

రక్తాంబరధరాంబాలం నీలకుంచిత మూర్ధదామ్’

(వా. రా. యు. కాం. 121-3)

 

అనిన మాటలలో లోకకళ్యాణార్థమై జన్మించిన  ఆదిపరాశక్తి అపరాంశమే సీత అని ఆదికవియే నిర్ణయించాడు. పరమప్రమాణ వాక్యాలు ఇతరం ఇంకేల?ఇలా తాత్వికదృష్టితో పరతత్వగా నిరూపించినా సామాన్యజనానీకం భారతభారతేతరాల్లో కూడా  ఆమెనొక ఆదర్శస్త్రీమూర్తిగానే ఆరాధిస్తున్నది. ఆమె నడవడిక స్త్రీ జనానికి ఉజ్జ్వలమణిదీపంగా భాసించినది. దయాసత్యాలు,నియమనిష్ఠాపాలనలు,శౌర్యధైర్యాలు,సాహసౌదార్యాలు మానవాళికి మార్గనిర్ధేశకమైనాయి. జీవితనాటక రంగంలో మనిషిగా పుట్టినవాడి పాత్రధారణలో ఎన్ని విధాలైన

దశలుంటాయో వాటి పరిమాణామాలెలా ఉంటాయో ఈ కావ్యపాత్రలలో చక్కగా ఎఱుకపరచాయి.

 

జనకరాజ పుత్రి పతిసేవా పరాయణత్వం,ధర్మైక దీక్ష నాన్యతోదర్శనీయం. ఆ నిరుపమాన శీల విభవం భరతభూమిని భాగ్యవంతం చేసినది. ఉత్తమ మహిళ,అనుకూలవతి అయిన అర్థాంగిగా,షట్కర్మయుక్తగా, కార్యాచరణల్లో ఆదర్శంగా జీవించి సమాజానికి తనప్రవృత్తిని ప్రభోదం చేసి,నెనరు పూవుల నివాళుకందుకుంది.

 

“సీతా అహల్యా ద్రౌపతీతారామండోదరీ తథా

పంచకన్యాఃస్మరేత్ నిత్యం సర్వపాప ప్రణాశనీః”అంటున్నారు పెద్దలు. ఈశ్లోకంలో కూడా  అగ్రస్థానం ఆమెదే. “ఇఛ్ఛా జ్ఞానక్రియశక్తి రూపాత్రిగుణాత్మికైవ”అని రామాయణ సారోధ్దారం. సకార,ఈకార,తకారాల కలయిక సీతాపదం.

 

ఇందులో సత్యం అనే వాచకం ఉన్నదని వాలకొలను సుబ్బారావు గారు పేర్కొన్నారు. ’సేతు’వనగా అడ్దగించునది అనిగాక సముద్రజలాన్నో,నదీజలాన్నో ఆధారంగా ఆ దరి నుంచి ఈ దరికి చేర్చునది అనే అర్థం ప్రధానమైన సాధనం అని చెప్పారిట. దేని సహకారంతోటి మర్త్యులమర్త్య్లలౌతారో అది సతియం. ’సీతేయం’లోని సకారం మీది ఈ కారం తకారం మీది ఏకారం తొలగించిన మిగిలేది సతియం అట. ’సేతువు చేసే కార్యమే గదా పురుషకారమైన లక్ష్మి సీత చేయునది ’శ్రీమదాదంధ్రవాల్మీకి రామాయణం (బా. కాం. 637,38పుటలు). సీత అనగా సంసారార్ణవం నుంచి యజమానిని తరింపచేసేదని భావం. శక్తి యుతమే గాదు పరమపవిత్రం ఈ పదం. ఈమె అన్వర్థ నామధేయ.  ‘సీత’అనగ నాగేటి చాలు. యజ్ఞవాటిలో నాగేటిచాలు నుండి లభించినదని ఎల్లరకు విదితమే. అందుకే జనకర్షి ఆమెకా పేరు స్థిరపరచాడు. తనబిడ్ద నాగేటి చాలువంటి సక్రమమైన నడవడిక గలది కావాలని ఆ పేరు నిర్ణయించినట్లు విదితం అవుతున్నది. జనకరాజ వంశీయులు సీరధ్వజులు. ధ్వజం నందలి గుర్తు యజ్ఞార్థమై భూమిని దున్నునపుడు సీరాగ్రం తగిలి చేతికి అందిన బిడ్డ. అందుకే ఆమెకా పేరు పెట్టినట్లు విశ్వామిత్రునితో జనకుడు స్వయంగా చెప్పాడు. ఆమె ఉనికిని బట్టి ఇతర నామధేయాలెన్ని ఉన్నా మిథ్లేశ్వరునకు మిక్కిలి ప్రీతి అయినదీనామమే అని వాల్మీకి ఉద్దేశం. మిల్ల తన కావ్యంలో సీతా అనేపదాన్ని కొన్ని పదులసార్లు ప్రయోగించడం గమనార్హం.

 

“పుష్పములెన్ని యున్నా మల్లెకు గల మధుర పరిమళము మల్లెదే. సంపెంగకు గల సౌరభం సంపెంగదే. . . . . ’

 

అంటూ పేరులో వున్న గొప్పదనాన్ని ఆచరణలో నిరూపించుకున్నది జానకి అంటారు కల్లూరి చంద్రమౌళి గారు. ఇక సీతాదేవి జన్మసంబంధిత విషయాలను మొల్ల చాలా సంక్షిప్తంగా చెప్పినది. తనకాలానికే బహుళప్రచారంలో వున్నరామాయణాన్ని తనకుదింపు రచనకు వీలుగ చెప్పడం సహజమేననవచ్చు. ఆమెను సీరోధ్బవగానే పరిచయంచేయడం జరిగినది.

 

“ధరణీసుత యగు సీతకు పరిణయమొనరింప జనక పార్థివుడిల. . . “(మొ. రా. భా. కాం. 55)

 

ఆమె అయోనిజయని నాగేటిచాలు జన్మస్థానమని సూచించినది. సీతను లక్ష్మీఅంశ సంభూతగ గూడ పేర్కొన్నది. “శ్రీరామచంద్రు డాదినారాయణుడు సీత ఆదిలక్ష్మీ”(మొ. రా. యు. కాం. 1-24)సీతాదేవి అగ్నిప్రవేశ వేళ బ్ర్హహ్మ స్వయంగా సీతారాముల అవతారతత్వాన్ని నిరూపించాడు.

 

“సీతాలక్ష్మీర్భవాన్ విష్ణుర్దేవః కృపః ప్రజాపతిః

వదార్థం రావణస్సేహ ప్రవిష్ణో మానుషీంతను”(వా. రా. యు. కాం. 121-28)

 

అంతదాక సీతారాములను మానవమాత్రులుగానే వ్యవహరించారు. ఈదివ్యాంశ నిరూపణ ప్రయత్నం కంటె ఆదర్శ మానవులగానే చిత్రించడం వాల్మీకి అభిమతం. జనకుడు చంద్రవంశజుడు. జనకుని యింట పెరిగినందున జానకీ అయినది. ఔరస పుత్రికగానే పెంచి పెద్దచేసాడు. సీతను పెంచిన తర్వాత జనకుని భార్య సుమేధకు లక్ష్మీనిధియనే కుమారుడు కలిగినట్లు రామాయణసారోద్దారములో విదితం. మొల్లసీతమ్మ బాల్యక్రీడలను కూడా వర్ణించలేదు. ఆనంద అద్భుత జానపద రామాయణాలలో ఈ క్రీడలు వర్ణితం.

తనకు కావలివున్న రాక్షస కాంతలవలన విని హనుమంతుని తోకకు అంటించిన నిప్పుని చల్లబరచేందుకు అగ్నిదేవుణ్ణి వేడుకుంటుంది. ఆమెసమయస్ఫూర్తికి ప్రత్యుపకార బుధ్ధికి ఉచితానుచితజ్ఞతలకు నిదర్సనం. పాత్రమెరిగి దానిమిచ్చుట అమెలోని నేర్పు(మొ. రా. సుం. కాం. 220).

 

రాక్షసుల మధ్య అవస్థలు పడుతున్న సీతతో హనుమ ఆమెను తనవీపున ఎక్కించుకుని లంక నుంచి తీసుకుపోయి క్షణంలో రాముని దగ్గరకు చేర్చగలనని పలికాడు. ఆమె ఎంత సున్నితమైన సమాధానం ఇచ్చినదో చూడండి

.

“నీవంతవాడవగుదువు. దొంగిలికొని పోవదగునే దొరలకు నెందున్. . . “(మొ. రా. సుఃకాం121,129)

 

అనిపలికి రావణుడి దొంగతనాన్ని రాముడి దొరతనాన్ని ఏకరువు పెడ్తుంది. లౌకికజ్ఞానం ధర్మనిరతి హితోపదేశం,విచక్షణ వెల్లడియగుచున్నది.

 

ఆనాటి స్త్రీల వలె సీతకు కూడా  సంధ్యావందనాలు,గాయత్రీమంత్రజపాదులు నేర్చిన వర్ణనలు కూడా  రామకథ తెలియజెప్తున్నది. సీతను అన్వేషించడానికి వెళ్ళిన హనుమ ఆమెను కనుగొన్నాక తానామెతో ఏభాషలో మాట్లాడితే బావుంటుందని వితర్కించినందువల్ల చాల భాషలు తెలిసిన దానిగ చెప్పవచ్చు. ఆమెను బాధిస్తున్న రాక్షసస్త్రీఅలను శిక్షిస్తానని పలికిన హనుమ ప్రయత్నాన్ని వారిస్తుంది. పురాణాలలోని ఉపాఖ్యానాలు వినిపిస్తుంది. అపకారం చేసినవాళ్ళకైనా తిరిగి ఉపకారమే చెయ్యాలంటుంది. (వా. రా. అరణ్యకాం. 8-18,19)

 

ఉదా. రామాదులు శరభంగాది ఋషుల ఆశ్రమంలో వున్న సమయాల్లో రాక్షస సంహారానికి పూనుకున్నాడు రాముడు. క్రూరులైనా మనజోలికి రానంతవరకు వాళ్ళను దండించే హక్కు ధర్మవరులకు లేదని హెచ్చరిస్తుంది.

 

ఈమాటలు కుశాగ్రబుధ్ధికి విద్యావినయశీలానికి ప్రతీక పెరిగిన వాతావరణం,తల్లిదండ్రులిచ్చిన సుశిక్షణ గాక వ్యక్తిగత హృదయ సంస్కారం మాత్రమే లౌకిక జ్ఞానసంపదకు కారణం. ఊర్మిళ,మాండవీ శ్రుతకీర్తులే గాక లక్ష్మీనిధియనే సోదరుడు గూడా ఉన్నాడు. పూర్వం స్త్రీలకు గాయత్రీమంతజపమేగాక,మౌంజీబంధనాలు ధరింపచేసి వేదాధ్యయనాలు నేర్పించారు. జపతపాలకు అర్హత కలిగినవాళ్ళని కూడా  తెలుసుకున్నాం. ప్రార్థనలు,యజ్ఞయాగాది కర్మలన్నింటినీ చిన్ననాటనే (విద్యలు)నేర్చినవాళ్ళను “సద్యోవధువు”లంటారు. క్రతువు నిర్వహణకు అవసరమైన వేదమంత్రాలు నేర్పుతారు. కౌసల్య, తారా, సీతా యిట్టివాళ్ళేనట.

 

బ్రహ్మజ్ఞానవిలసితుడైన జనకుని ఆత్మ్జజగ జానకి ప్రశంసనీయ వైష్ణవీయశక్తియే సీత. మనువు స్త్రీల బుధ్ధివికాసానికి వివాహమే ప్రధానకారణమంటాడు. స్త్రీలకు యజ్ఞయాగాది క్రతువులతోగాని ఉపవాసాది దీక్షలతోగాని పనిలేదన్నాడు. పరి శుశ్రూషలతో కూడిన వివాహవిధియే వైదిక సంస్కారమని గురుకుల విద్యాభ్యాసమని తీర్మానించాడు. గృహకృత్యాత్ అగ్నికార్యాలని చెప్పినతీరులు కూడా  సీతనడవడిలో గమనార్హం. రానురాను స్త్రీలకు ఈ విషయాల్లో సడలింపు. అందుకే ఇప్పుడివి లేవు.  సీతారాములు దానశీలం కలవారు. అడవికి బయలుదేరే ముందు బ్రాహ్మణులను సత్కరించి సుయజ(ఇక్కడ సరిచెయ్యాలి) పూజించారు. పిమ్మట భర్త అనుమతితో సీత తారహారాదులు కొన్ని అతనిభార్యకు యిచ్చినది. బ్రాహ్మణాశీర్వాదాలు అత్తమామల ఆశీర్వాదాలు తీసుకుని బయలుదేరినది. పెద్దల యెడల గురువుయెడ గల భక్తి నిరూపణ. సత్యంవద ధర్మంచర అనే శ్రుతి ప్రమాణబధ్ధయైన విశుధ్ధచారిత్రం గలది.

 

“ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవః అయిన శ్రీరాముని యిల్లాలు తండ్రికంటె తల్లికి కరుణ,జాలి

యెక్కువ అనేమాట సంకీర్తనాచార్యుల మాటలలో చక్కగా తెల్లమవుతుంది. “నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి. . . ”

 

అని ఆర్తితో అమ్మకు విన్నవించుకోలేదు గోపన్న.  దైవభక్తికూడా  మానవుడికి ఎంతావసరమో చాటి చెప్పిన కథ యిది. మానవబలానికి దైవబలం తోడైననాడే సమర్థవంతంగా పనులు చేయగలుగుతారు. ఆచరించి చూపారీ దంపతులు. నిత్యదేవతారాధన పనులు,దైవభక్తి,పాపభీతి అవసరమని నిరూపించారు. అష్టదిక్పాకులను,నదీనదాలను,వృక్షాలను గుట్టలను పుట్టలను ప్రార్థించినపుడు భారతీయ సంస్కృతీ,ఆచారాలు గోచరిస్తాయి. సీతమ్మ జనకజ. చంద్రవంశజ. గౌతమ గోత్రజ. 

 

శ్రీరాముడు సూర్యవంశజుడు. వశిష్ఠ గోత్రజుడు. శ్రీరాముడితో పరిణయం లోకారాధ్యమైనది.  ఆమె చేతలలో బాహ్యరూపంలో వున్నట్టి అందానికి ఎన్నోరెట్లు గొప్పదైన సౌందర్యం మరొక్కటున్నది. అది లోకోత్తర చరితను సృష్టించిన అమె మానసిక సౌందర్యం. (Women in Valmiki page 128)లో సీతారామమూర్తి గారు ఆ సౌందర్యాన్ని వర్ణించిన తీరు చూద్దాం. “Sita is not of this world at all. She is denizen of the heavenly abode. Nay the divine mother herself. She has chosen to come into this world,if only to set an example to women kind in simple living,high thinking and noble going. she is the crown gem of unexcelled brilliance,among women of all clines and of all times”ఎంత చక్కటి తీర్మానమో!ఇది చాలు. అమె ఎవరో తెలియని వాళ్లకు.

 

ఇక వాల్మీకి ఋషిపలుకులలో ఆ సౌందర్యం అత్యున్నతం. బాహ్యంగా ఆమె రాముడితో సమానమైన అందగత్తె అని  వాల్మీకి పదేపదే పలికినా నిసర్గసుందరమైన ఆమె స్వభావం ఎన్నోరెట్లు గొప్పది. అంతగా ‘రామ’చరితాన్ని సృష్టించాడు ఆ మహాకవి. స్త్రీ పాత్రలకే అధికప్రాధాన్యం అందించిన గొప్పఋషి.  “సుతారాం ఉదన్తిసుందరః” అని సౌందర్యానికి అర్థమని గదా. హృదయాహ్లాదకారం నయనానంద జనకం అయిన ప్రతివస్తువు సుందరమైనదే. “విశ్వాతిసాయి సుభగత్వాతో”అని శంకరులన్నట్లు చరాచర ప్రకృతిలో అణువణువు అందమైనదే. చూచి ఆనందించె హృదయం ఉంటే చాలు. అయితే ప్రకృతి అందాలెలా వున్నా ఆహ్లాదకరమై సౌందర్యాతిశయమైనది స్త్రీమూర్తి మానసిక సౌందర్యం ఒక్కటే. స్త్రీలందరికీ ఇది వర్తించకపోవచ్చు. సీతమ్మ గుణగణాలేవేరు. స్వభావానికి తోడుగ రూపం ఆమెకు వన్నెకూర్చినదనడం సువిదితం. ఆ ఆభిజాత్యం అలాంటిది.

 

“ఆత్మసౌందర్యమన పాత్రివ్రత్యం,భగద్భక్తి,పాపభీతి,పెద్దల గురువుల యెడ పూజ్యభావము,మిడిసిపాటుతనము లేకుండుట,నమ్రత,అణకువ,భయభక్తులు కలిగియుండుట,స్వధర్మ నిర్వాహణ,త్రికరణ పారిశుధ్ధత,ఆత్మనిగ్రహము, క్షమ,ప్రసన్నహృదయము,ప్రశాంతచిత్తము,పవిత్ర పరోపకార శీలము”మొదలగునవి కలిగి ఉండడం ప్రాపంచిక కలిమిలేమి,కష్టసుఖాది ద్వందాలలో సహనం,ప్రేమ,కనికరం,దయగలిగిన సమ్మిశ్రితమైన దైవిక లక్షణాల యొక్క అతిశయించిన సొబగే అంటారు. (స్త్రీలకు సౌభాగ్యసందేశము,శామ్తి 1961పు746)

నశించేది బాహ్యం తరాలకు మిగిలివుండేది ఆంతర్యం. అలాంటి సుందరమూర్తి జానకి. ఆమె సౌశీల్య,సౌందర్య,సౌభాగ్య,సౌమనస్య సహృదయాలే ఆమెను ఒక విలక్షణ పాత్రగ తీర్చిదిద్దాయి. భూజాత అయిన  ఈ బంగారు శలాక సధ్ధర్మపరుడైన జనకచక్రవర్తి అనే స్వర్ణకారుని చేతికి చిక్కి చిత్రం అనుపమానం అయిన అమూల్య ఆభరణమై నగిషీలు పొదిగిన స్వర్ణసీత అయినది. కావ్యనాయికా వర్ణనలో రెండుపధ్ధతులు. భౌతిక సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు మానవకాంతను వర్ణిస్తే కేశపాశాది పర్యంతంగా,దేవతా

స్త్రీ వర్ణన అయితే నఖశిఖ పర్యంతం వర్ణనచేస్తారు కవులు. మొల్ల కూడా  వాల్మీకి వలె సీతను ఈ రెండు పధ్ధతుల్లో వర్ణించి చూపినది. బాల,అయోధ్య,అరణ్య,కిషింధకాండలలో సూచనాప్రాయంగా ఇతరపాత్రలచే చెప్పించినది.  భౌతికవర్ణన. ఆమె ఆంతరంగిక సౌందర్యాన్ని మాత్ర సుందర యుధ్ధకాండలలో రచన చేసినది సీతారావణ,హనుమత్సీతా సంభాషణలలో మరియు త్రిజటాది రాక్షసాంగనలతో సాగిన సంభాషణతీరులో చిత్తవృత్తిని అద్భుతంగా రూపుకట్టించినది.  ఒక చక్కటి వర్ణమిళిత చిత్రంలా భాసింపచేసినది.

 

జానకీ లోకోత్తర సౌందర్యాన్ని అతిగడుసుదనంతో,వ్యంగార్ధ భాషణలతో,చమత్కారంగా వర్ణించినది. సీత శిరీషకుసుమపేశలగాత్రి,అసూర్యంపశ్య రాజకాంత. అరణ్యవాసంలో అలాంటి సుకుమారి భౌతికంగా పొందిన అవస్థలను కన్నులకు రూపుకట్టించినది. నఖశిఖ వర్ణనలతో దివ్యస్త్రీగ నిరూపించినది. అరణ్యకాండలో శూర్ఫనఖ సీతమ్మ సౌందర్యవర్ణన చేసిన విధం ఆశ్చర్యం.  శత్రుభావన,ద్వేషపూరిత అయిన రక్కసి కూడా  ఆమె సౌందర్యానికి నీరాజనీయడం గీటురాయి. “ఆరాముభార్య విభ్రమమేరాజతనూజలందు నెరగము విని మున్”(అరణ్య మొల్ల 21-25)అంతటితో తనివారని మొల్ల “బంగరు నీరు నిలువున. . .: అంటూ పలికితేగాని శూర్పనఖ వదలని సౌందర్యమది. వాల్మీకి కూడా  త్రిలోకాలలో కానరాని ఆ సౌందర్యాన్ని గురించి:

 

“శుభాం రుచిరదంతోష్టీం పూర్ణచంద్రనిభాననా

అసీనాం పర్ణశాలాయాం బాష్పశోకాధిపీడితా”(వా. రా. అరణ్య 46-11-22) అన్నాడు.

 

అరణ్యవాసంలోనే అంత అందంగా ఉన్న ఆమె రాణివాసంలో ఆ సౌందర్యం ఎంతమనోహరమో గదా! ఆయా సందర్భాలలో స్త్రీసహజమైన సామాన్యజీవన విధానం ఎలాంటిదో పరిశీలించుదాం. ముఖ్యంగా పతిబాసిన వేళ కులస్త్రీ ధర్మాలెలా వుంటాయో లంకలో వున్న సీతను చూచిన హనుమకు అర్థమవుతుంది. “కట్టిన వస్త్రంబు కట్టుకొంగె తప్ప జీర్ణించిపోయిన చీరతోడ. . . “(మొ. రా. సుం. కాం246) పతివియోగం చేత కుందుచున్న సీతాసతి హృదయంలోని పవిత్రభావాలకు దర్పణం. రావణునితో చేసిన సంభాషణ ఆమె శీలవిభవానికి రుజువు. వరిష్ఠాసర్వనారీణామ్ అన్నాడు కదా వాల్మీకి కూడా .

 

ఇక సీతమ్మ వివాహ సందర్భంగా కొన్ని సన్నివేశాలు. “శంకరు చాపమెక్కిడిన సత్వఘనుండగు వానికిత్తు నీ పంకజనేత్ర సీత. . . “(బా. కాం. 70మొల్ల)స్వయంవరం చాటినందున ఉత్తమ క్షత్రియకాంతగ తెలియవస్తున్నది. అయోనిజ సీత భూపుత్రిక. ఈవివాహం లోకకళ్యాణమే గదా!భారతీయుల వివాహవ్యవస్థను వాల్మీకి ఈ సందర్భంలో చక్కగా క్రోడీకరించాడు. శ్రుతిప్రమాణమైనది. గృహస్థాశ్రమ ధర్మ సంస్థాపనకే వాల్మీకి ఆనాడు రామకథను సృష్టించాడనడం తప్పు కాదేమో!ఇది వ్యక్తిగత సంస్క్రారాలలో ఒకటి. సామాజిక బంధం. వ్యాసవాల్మీకులు గార్హస్థ్య ధర్మజీవనం ఆలుమగల ఔన్నత్యం ఎలా వుండాలో ఆయా సందర్భాలలో చక్కగా పేర్కొన్నారు. పౌరలౌకిక,వంశోధ్ధరణ ఇత్యాది విధులకు వివాహమే మూలమని మనువుకూడా  ఉట్టంకించడం విజ్ఞులకు విదితం. జీవితం ఒక పూర్ణభావం. ఆపూర్ణభావం యొక్క తత్వమే దంపతులు. ధర్మబధ్ధ జీవనం గడిపిననాడు పూర్ణత్వం అందుకుంటారు. తారతమ్యాలు త్యజిస్తారు. గృహ్యసూత్రాలలో అష్టవిధ వివాహ పధ్ధతులున్నాయి. పెద్దల ప్రేరణతో జరిగినది సీతారాముల వివాహం. స్వయంవరానంతరం ఆర్షబధ్ధంగా ప్రాజపత్యమనే వివాహభేదంతో జరిపించబడిన వైవాహిక క్రియ వీళ్ళది. వాల్మీకి విపులంగా చెప్పిన ఈ సన్నివేశం మొల్ల క్లుప్తపరచినది. “సహధర్మం చరత ఇతిప్రాజాపత్యః”అని అశ్వలాయనుడు “సంయోగ మంత్రః ప్రాజాపత్యే సహధర్మచర్యతామ్”అని గౌతముడు “ఆచ్చాద్యాలంకృతైషా సహధర్మం చర్యతామితి ప్రాజపత్యః అని బోధాయనుడు ఈ ప్రాజాపత్య వివాహలక్షణాలను వివరించారు. వివాహవేళ సీతను రాముడికి అప్పగిస్తూ జనకుడు పలికిన పలుకులు కూడా  ప్రాజాపత్యమే.

 

“ఇయం సీతా మమసుతాసహధర్మచరీతవ

ప్రతీఛ్ఛచైనాం భద్రంతేపాణిం గృహ్ణీష్వపాణినా’(వా. రా. అయోధ్య్య70-26,27)

 

ఈసీత నాకూతురు. నేటినుంచి నీ సహధర్మచారిణి పాణిని గ్రహించి భద్రంగా ఏలుకో. ఈమెపతివ్రత,మహాభాగ్యశాలినీ నీడవలె నిన్ను అనుసరించి నడవగలదు. అన్నప్పుడే ఎలా మసలుకోవాలో వివరించాడు. తనవలె రాముడికి కూడా  ఆమెను చేపట్టినందున సర్వశ్రేయాలు కలుగుతాయంటాడు.

 

’పుత్రాఛ్ఛ్గత గుణం పుత్రీం’అన్నట్లు

 

కొడుకువలన కలిగేకీర్తికంటే కూతురివలన నూరింతలు అధికంగా తండ్రికి కీర్తి లభిస్తుందట. స్త్రీలకు పుట్టినింటి చరిత్ర కంటె అత్త యింటి చరిత్ర ద్వారానే కీర్తి ఇనుమడిస్తుందట. అందుకేనేమో ప్రతిపెళ్ళిపత్రికలోసీత గూర్చి ప్రింటర్స్ వ్రాస్తుంటారు. భావం తెలిసోతెలియకో గాని చాలమంచి ఆలోచన అది.

 

శ్రీరామపత్నీ జనకస్యపుత్రీ సీతాంగనా సుందరకోమలాంగీ

భూగర్భ్జజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదాభవన్తు”.

 

ఆమె ఆభిజాత్యం అంతా ఒక్కశ్లోకమే పట్టి యిస్తుంది. అలాంటి ఆదర్శజీవనం గడపాలనే ఉద్దేశం వధూవరులు గ్రహించాలి. ఎంతఖరీదైన పత్రిక అచ్చువేసుకున్నా ఈ పై శ్లోకమే ఆ జంటకు పరమావధిగా చూడాలి.

 

సీతామహాసాధ్వి వైవాహిక,సాంసారిక జీవనవిధానం ఎలాంటిదో చూద్దాం. మొల్లమ్మ అన్నింటిని కుదించిన కథాంశమే గాబట్టి వాల్మీకం ప్రధానంగానే చర్చించుకుందాం. మొల్లరామాయణంలో శ్రీరామచంద్రుడు రాజచిహ్నంబులు త్యజించి జటావిభూతి,వల్కలంబులు దాల్చి ధనుర్ధరుండై యున్నంత లక్ష్మణుండును భూపుత్రియును అని పలికినందున విపులంగా విషయం అందదు. తర్వాత కొన్ని కాండలలో వివరాలు కొన్ని తెలుసుకొనగలం. అరణ్యంలో “హా లక్ష్మణా!” అనే మాటలు విని సీత ఆందోళనలు,ఆవేశాలతో కూడిన చిత్తవృత్తి పరిచయం అవుతుంది. రాజసంతో రాముడి రక్షణకై లక్ష్మణుడిని పర్ణశాల విడిచివెళ్లమని ఆజ్ఞాపించినది. అన్నగారిమాటలు దాటరానివై ఇరుకునపడిన లక్ష్మణుడు తన మాటలు పాటించనందున కోపోద్రిక్తయైనది. కర్ణశూలాలైన మాటలతో బాధించినది. వాల్మీకంలో కూడా  “సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమపివత్. . . . . ” అంటూ దూషించినది సంశయించినది. ఒకసామాన్య మానవకాంత మాట్లాడినట్లు

ఎంతో నిష్ఠూరమైన పలుకులు వినిపించిన స్త్రీ మనోగతం అది.

 

అంతటితో ఆగక “రామంవినాక్షణమపినహి జీవమిభూతలే”అంటూ నువ్వువెళ్ళనిచో ఈ క్షణమే యిప్పుడే నాప్రాణాలు తీసుకుంటానని బెదిరించినది. లక్ష్మణుని పని అడకత్తెరలోని పోకచెక్క చందం అయినది. సీతను కాపాడమంటే వదలివచ్చాడని రాముడు కూడా  చివాట్లుపెట్టాడు.

 

“పొడగని గుండె ఝల్లుమన. . . . నొంటియై బడతుక డించి రాదగునె వన్యమృగోత్కర మధ్యసీమకున్. . .

“అంటూ మొల్ల కూడా  ఈ సన్నివేశాన్ని చిత్రీలరించినది(మొ. రా. అరణ్య 48ప). సామాన్య మానవజీవన వృత్తాంతం ఎలాంటిదో ఇక్కడ స్పష్టంగా ఉన్నది. “పితృకృతాఃబ్రాహ్మ వివాహ సదృశవివాహేన పితృదత్తాఃసఏవ వివాహస్సర్వదాశ్లాఘ ఇతిభావః”అని మహేశ్వరులన్నట్లు పెండ్లి అయిన తర్వాత వధూవరులు అన్యోన్య ప్రేమానురాగాలతో జీవించడం భారతీయ సనాతన పధ్ధతి. అలా ఉన్నది వీరిఅనురాగం.

 

సీత అవసరవేళలో నిష్ఠురోక్తులతో రాముడిని హెచ్చరించినది. ధర్మోక్తులు పలికినది. రావణుడు తనను ప్రలోభపెట్టినప్పుడు ఆమె హృదయం సమ్మెటపోటులు తిన్న బంగారు శలాకయే నిష్కపట ప్రేమమూర్తి.

 

“శక్యాలోభయితుం నాహమైశ్వరేణ్యధనేనావా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ యధాప్రభా”(వా. రా. సుం. 21-15)

 

తాను భాస్కరుణ్ణి చుట్టివుండే కాంతివంటి దాననని రామునికే దక్క ఇతరులకు దక్కనిదానినని ఏ ఐశ్వర్యాదులుతనని ప్రలోభపెట్టలేవని రావణుడిని తిరస్క్రరించింది. రాక్షసస్త్రీలు అందగాడు ఐశ్వర్యవంతుడు అయిన రావణుడిని వరించి సుఖించమని రామునిపై ఆశలు వదకుకోమని పలికిన సందర్భంలో సీత హృదయంలో ఉన్నత భావాలెంత ఆదర్శనీయమో చూడండి.

 

“దీనోవారాజ్యహీనువా యోమే భర్తా సమే గురుః

తం నిత్యమనురక్తాస్మియథా సూర్యం సువర్చలా”(వా. రా. సుం. 24-9)

 

దీనుడైనా,రాజ్యహీనుడైనా తనభర్త తనకు చాలా గొప్పవాడని ఈ దేహాన్ని ఖండించినా నాకిష్టమేగాని రాక్షసేంద్రుడిని వరించుదానను కాదని నిక్కచ్చిగా పలికిన మేలిమిబంగరు తల్లి. అయోధ్యలో ఎంత సుఖంగా వున్నదో అరణ్యవాసంలో కూడా  అంతే ఆనందంగా సుఖంగా ఉన్నది అంటాడు సుమంతుడు కౌసల్యతోభర్త సన్నిధికి మించిన భోగాలు ఇతరాలెవీ లేవంటుంది సీతమ్మ అంటాడు.

 

“విజనేపివనం సీతావాసం ప్రాప్యగృహ్యేష్వివ. . . . తధైవరమతేసీతా నిర్జనేషువనేష్వతి

బాలేన రమతే సీతాబాలచంద్ర నిభాననా. . . “(వా. రా. అయోధ్య60-7-10)భర్తహీనస్థితిలో

 

ఉన్నప్పటికీ ఎప్పటివలె ఆదరించి ప్రేమించి గౌరవించే గుణం గల స్త్రీ ఒక్క సీతమాత్రమేనేమో. ఆమె అరణ్యంలో కష్టాలుపడడం రాముడు సహించలేకపోయాడు. ఆసమయంలో సీతపలికిన అనునయ వాక్యాలు రమణీయం. శీతల వాయుగంధాలను ఆఘ్రాణిస్తూ,పక్షుల కూజితాలను వింటూ మందాకిని జలాలశంలో స్నానమాడుతూ వినోదించే అవకాశం తనకు కల్పించినందుకు ఆనందించానని,భర్తృసాన్నిధ్యమే కొండంత వెలుగు తనజీవితానికి అని పలుకుటలో ఆ హృదయమార్దవం వెల్లడి అవుతుంది. మారుమాట లేక తనను తాను దిద్దుకుంటూ,‘నేదానీం త్వదృతేసీతే స్వర్గోపిమమరోచతే. . . ’అంటూ సీత రాముడు పలకడంలో సీత ఆంతర్యం తెలియదలచిన రాముడి మనస్తత్వం బయటపడుతుంది. రామాయణకర్త దంపతుకిద్దరకు సమాన ప్రతిపత్తినే కల్పించి రచనచేసాడు. కాని ఒకరికి మరొకరు బానిసగా బ్రతకాలని చెప్పదలుచుకోలేదు. బాహ్యాంతర రూపలావణ్యాలు,ఆలాపనలు అన్నీ సమంగా మలచుకుని జీవించాలన్నదే ఈ కావ్యరహస్యం. ప్రణయం,అన్యోన్యత,స్వాధీనపతిక అయిన భార్యగలవాడికి  బ్రతుకు సుఖమయం,గౌరవప్రదం అవుతుందని చాటిచెప్పిన కావ్యం. ఒకరిపై ఒకరికిఆధిక్యత గాదు అన్యోన్యం అవసరం అని తెలియచెప్పినది రామాయణం.

మొల్లమ్మ సీతమ్మ చిత్తవృత్తాన్నిసంపూర్ణంగా ఆవిష్కరించలేకపోయినా ప్రధానాంశాలన్నింట వాల్మీకులనే ఆదర్శంగా తీసుకు చెప్పినమాటలు వాస్తవం. అరణ్యవాసంలో భరధ్వాజ మనకు దర్శనమపుడు,అత్రిఆశ్రమంలో అనసూయతో ఎన్నో అంశాలు ముచ్చటిస్తుంది. తనతండ్రి తనకు సకాలంలో పెండ్లిచేయలేనేమోనని విత్తనాశం చెందినవాడివలె మిక్కిలి చిత్తక్లేశాన్ని పొందాడట. దేవేంద్రసముడైనా కుమార్తెకు సకాలంలో వివాహం చేయలేకపోతే నిందలపాలగుతాడనుట. మనువు మాటను సీతనోట వాల్మీకి పలికించాడు. చిత్రకూటంలో సీతారాములున్నారని తెలిసి జనకుడు చూచిరావడానికి వెళ్ళాడు. అరణ్యవాసం పూర్తిచేసుకుని రాముడు తిరిగివచ్చునంతదాక మిథిలకు వచ్చి తనదగ్గర ఉండమని కోరుకుంటాడు. అప్పుడు పెళ్ళినాటిప్రమాణాలను, రాముడికి తనను అప్పగించిన పలుకులు గుర్తుచేసి రాముణ్ణివదలి రాజ్యసంపదలు అనుభవించలేనని రానని తండ్రితో పలికినది. ఆమాటలు విన్న జనకుడు కూతురి సత్ప్రవర్తన వలన తనవంశం ఉధ్ధరింపబడినదని,కీర్తి వియన్నదియై ప్రవహించగలదని పలికాడు. రాముడి వంటి పురుషుడు సీతవంటి స్త్రీమాత్రమే దేశానికి అవసరం. ఆదర్శం అని పలికి వెళ్ళిపోయాడు. సామాన్యస్త్రీ అయితే తండ్రిని చూడగానే బోరునవిలపించి రాజభోగాలకై అర్రులుచాచి ఉండేది.

 

శ్రీరాముడు యుధ్ధభూమిలో నాగపాశబధ్ధుడైయున్న విషయం తెలిసి తనబాధనటుంచి తన అత్తగారైన కౌసల్య ఈ విషాదాన్ని ఎలా భరించగలదోనని వాపోవడం. ఆమెకు అత్తయింటిలోని పెద్ద్లలపై గల గౌరవాదరాలు తెలియవచ్చు. దయాదాక్షిణ్యాలు,సద్గుణాలు,సహకారసేవాబుధ్ధులు ఉన్నట్టి త్యాగమూర్తి లక్ష్మణుడిని కన్న సుమిత్రను ధన్యచరితగ కీర్తించినది. పూర్వం తాను మరిదిని తూలనాడినందుకు పశ్చాత్తాపంతో కూడినపలుకులు. ఆమె కైకమ్మ విషయంలో కొంచెం నిష్ఠూరాలు వినిపించడం మానవ సహజచిత్తానికి ప్రతీక. 

 

అత్త యింటిలో సేవక జనాన్ని కూడా  ఆదరించి మన్నించినది. మైథిలి నిగర్వి. తనవలె తన అత్తలందరు తనను ప్రేమించినవారే. ఆదరించినవారే. ఆపదలలో భర్తను అనుగమించి సేవిస్తున్న కోడలి పట్ల అపారమైన అభిమానం కౌసల్యాది అత్తలకు. అడవికి బయలుదేరే సీతను వారించమని రాముడిని ఆమెలో చూచుకుని బ్రతుకుతానని దశరథుణ్ణికోరిన కౌసల్య ప్రేమాభిమానాలు చూరగొన్నది సీత. ఈ ఆవ్యాజానురాగానికి వాల్మీకిపలికించిన పలుకులు చూడండి. “లావణ్యవతి. శీతోష్ణాలనెట్లు సహించగలదు మృష్టాన్నాలు ఆరగించినది కందమూలాలు ఎలా తినగలదు. రాజాంతఃపురవాసిని అరణ్యంలో క్రూరమృగాల మధ్య బాధలు ఎలా పడగలదని అరణ్యవాసాన్ని నివారించమని వేడుకుంటుంది కౌసల్య. వనవాసానంతరం కూడా  వనవాసక్లేశంతో కృశించిన శరీరంగల కోడలిని చూచి కౌగలించి దుఃఖించినది. ఇది అపురూపం అపూర్వం అయిన అనుబంధం. దశరథుడు కూడా  ఆమెను పుత్రికా వాత్శల్యంతోనే అభిమానించాడు. సీతను అడవులకు వెళ్లమని తాను చెప్పలేదని రాముణ్ణి అడవికి పంపుచున్న పాపం మూట కట్టుకున్నది చాలక సీతను కూడా  అడవికెందుకు పంపుచున్నావని కైకను నిందిస్తాడు. నారచీరలు వద్దని విలువైన వస్త్రాభరణాదులు యిచ్చిపంపించమన్నాడు. భర్తకు ఏది నిర్ణయమో దానినే ఆమె స్వీకరిస్తానని పలుకుట ఆ నిత్యానపాయినికే తగియున్నది.

 

ఈ సందర్భంలో కులగురువు వశిష్టుడు ఒక చక్కటి తీర్మానం చేసి వినిపించాడు. అడవులకు వెళ్ళక రాముడికి బదులుగా అయోధ్యారాజ్యంలో ఉండి ఏలుకోగలదని పలికాడు. ఒకవేళ ఆమె అంగీకరించని యెడల అయోధ్యానగరమే ఆమె వెంట వెళ్లగలదని చెప్పిన పలుకులు అయోధ్యా నగరంలో ఆమెకు గల గౌరవాదరాలు విదితమవుతున్నవి. అరణ్యానికి బయలుదేరి వెళ్తున్న సీతారాములను చూచి అయోధ్యానగరమే దుఃఖిస్తుంది. కన్నీళ్ళుమున్నీళ్ళుగ శోకిస్తున్న పురజనులు సీతను గూర్చి

 

 

“కృతకృత్యాహి వైదేహీ ఛాయేవనుగతాఫలమ్

నజహాతిరతాధర్మీ మేరుమర్కప్రభాయథా”  అంటారు.

 

ధర్మచారిణి సీత అదృష్టవంతురాలు. మేరువును  విడిచి సూర్యకాంతి ఉండనట్లు శ్రీరాముడి ఎడబాయని జానకి ధన్యచరిత అంటూ ప్రశంసించారు. ఇలాంటి కూతురు మరి కులముధ్ధరించదా?పశ్చాతప్త అయి బాధపడిన తీరు  పరికిస్తే మానవ నైజానికి జానకి అతిసన్నిహితంగానే ప్రవర్తించినది.  హనుమంతుడితో లంక నుంచి “జనకుని వర్తమానాలు పంపుతో బంగరులేడి విషయంలో మరదిని నిందించినందుకు ఏఫలితం అందుకుందో వివరించినది.

 

“జనకుని భంగి రామనృపచంద్రుని నన్నును తల్లిమారు మదినెంచిన. . . .

నామాటలు మదినుంచక నామానము గావుమనుచు నయవినయ గుణోద్దామ. . . ”

 

అంటూ ఖేదపడినది. పుణ్యశీలుడైన మరదిని నిందించిన ఫలితం అనుభవిస్తున్నానని చెప్పమంటుంది. ఆవినుత మహాఫలము తాను అనుభవించితినని వర్తమానము పంపుతుంది. మానవ మనస్తత్వాన్ని చక్కగ నిరూపించాడు. ఆవేశం తగ్గిన తర్వాత తన తప్పు తాను తెలుసుకుని వేదనపడతాడు జీవుడు.

 

“కులం తారయతే తాతసప్త సప్తచ సప్తచ”అనే స్మృతివాక్యాన్ని జానకీ జీవితంలో ఋజువుచేసుకున్నది. “పతిభక్తి పరాసాధ్వీ శాంతా సా సత్యభాషిణి”

అనేమాటలు కూడా  మైథిలికి నూరుశాతం వర్తిస్తాయి. శీలవతియగు పుత్రిక వల్ల కులం ఇరువది ఒక్క తరాలవరకు ఉధ్ధరింపబడుతుందట. ధర్మగ్లాని కలుగకుండ ఆమె చరిత్రను నడిపించాడు వాల్మీకి. మొల్ల సూచన చేసినది. ఆయా సందర్భాలలో పతినెదిరించినది. కరణేషు మంత్రి అనే భావాలను ఋజువు చేసుకున్నది.

 

“రామస్యదయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా

సీతాప్యనుగతా రామ శశినం రోహిణీ యథా”(వా. రా. బా. 1-26-27)

చీకటి వెలుగులరేడు చంద్రుడు అలాంటిదే మానవజీవనం. కష్టసుఖాల్లో ఎవరువిడిచిపెట్టినా భార్యాభర్తలు ఒకరినిఒకరు విడిచి ఒకరుండకూడదనే భావం.

 

అడవికి బయలుదేరేముందు రాముడు,తనదీక్ష పూర్తిచేసుకుని తిరిగి అయోథ్యకు రాగలనని సీతతో పలికాడు. అంతదాక అత్తమామలను సేవించుకోమంటాడు. ఆమాటలకు జానకి మనస్సున ఏదో పెద్దబాధ. వెంటనే “కిమిదం భాషసే రామవాక్యలఘుతయాధ్రువమ్’(వా. రా. అ. 27-2)రామా!ఏంమాట్లాడుతున్నావు నాకు నవ్వు పుట్టిస్తున్నాయి. సహధరమచరీతవ అనిన నాతండ్రి మాటలు మరచావా?నీతోకలసి అడవులలో చరించడం నా ధర్మం. కొనిపోవుట నీధర్మం. దాంపత్యబంధాన్ని మరచి మాట్లాడకు. ఇరువంశాలకు కీర్తిదాయకం అవుతుంది. భర్తకు దూరమైన భార్యను లోకం నిందిస్తుంది. నీకొకధర్మం నాకొక ధర్మమా?నిన్ను అడవికి వెళ్లమంటే నన్నుకూడా అనే గదా అర్థం. శుభాశుభాలన్నింట సగభాగం భార్యదే గదా!అదే అర్థనారీశ్వరత్వం. “నస్త్రీకో ధర్మమాచరేత్”అనిగదా సూక్తి. ఉత్తమ స్త్రీకి పతియే సర్వస్వం. అతడి యోగక్షేమాల తర్వాతనే ఇతరులు. భర్తతోసమానమైన వాళ్ళు స్త్రీకి ఇతరులెవరూ లేరు. ’ఇహప్రేత్యచనారీణాం పతిరేకోగతిస్సదా”(వా. రా. అయోధ్య. 27) 5)సాధువర్తనం,స్వతంత్ర భావనాబలం,ధర్మైక నిష్ఠ,శాస్త్రార్ధప్రకటన చేసి వలదన్న రాముణ్ణి ఒప్పించినది. పాఠకలోకం నొచ్చుకునేటట్టు మాట్లాడినది అనుకోవచ్చు. మాట్లాడించినవాడు వాల్మీకి. అవసరవేళలో ధీరయై బ్రతకాలి గదా స్త్రీ అనేగదా, శ్రీకట్టమంచి రామలింగారెడ్డిగారన్నట్లు చురుకుతనం లేనిది ఉత్తపేలపిండి వంటిది గాదు. అవసరమున్న చోట గట్టిగా చురకలు అంటించగల నేర్పరి అని రామకథ వెల్లడి చేస్తూనే వున్నది. “అర్థోవాయేష ఆత్మనోయత్పతీ”అనే శ్రుతివాక్యం తెలిసినది. “భద్రంతేపాణిమ్ గృహ్ణీష్వపాణినా . . . “అనే తనతండ్రిమాటలనెప్పుడు మరవనిది. “భోగభాగ్యాలను వదలి కంటకశిలలను ఏ స్త్రీ ప్రేమిస్తుంది?

 

ఈ త్యాగశీలం ఇక్ష్వాకులలో అనువంశికంగా ఉన్నదేనేమో!అని అనుకోవలిసినదే. “ప్రజాయై గృహ మేథులు,త్యాగాయ సంభృతార్దులునైన రఘువంశం లొని మహా పురుషులను,మహిళలను తలపించే ఈమెప్రవర్తన మిక్కిలి ప్రశంసాపాత్రం”అంటారు శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతంమ్మ. ఆమెరచన ఆదర్శ రామరాజ్యంలో (శాంతి పుట 715)కథానాయికా నాయకుల్నే గాదు ఇతరపాత్రలలో కూడా  చాలవరకు ఎదుటివాళ్ళ సుఖాలకే జీవితాన్ని పణంగా పెట్టారనవచ్చు. సహాయసహకారాలు చేయగలిగారు. ’ప్రజానాంహితేరతులే’అందరు. కష్టసుఖాదిద్వందాల్లో సహకారం,పవిత్రప్రణయభావాలు ప్రతి భారతీయుడు అంతేనా,భారతేతరులు కూడా  మరువరానివి.

 

ముల్లోకాలలోని భాగ్యాలిచ్చినా వద్దు నీతోనే కలసి అరణ్యంలో వుంటానని ఎంత చెప్పినా పలుకు ఉలుకు లేని రాముది చిత్తవృత్తిని బాగా ఆకళింపు చేసుకుని మిక్కిలి గడుసుతనంతో పలుకుతుంది.

 

“సుఖంవనేని వత్స్యామి యథైవా భవనే పితుః

అచింతయంతేత్రీన్ లోకాన్ చింతమంతీ పతివ్రతమ్’(వా. రా. అయోధ్య 27-11)

 

స్త్రీలకు తల్లిదండ్రులు గాని,పుత్రులుగాని,సోదరులుగాని,కోడలుగాని భర్తతో సమానమైన

ఆనందాన్నీయలేరు. కొందరికీమాతలు సీతనొక బానిసగ రాముడికి అందించాడా ఏమి వాల్మీకి అనే దుర్భావన కలుగకమానదు. వాల్మీకి ముందే చెప్పాడు. ఒకరింకొకరికి బానిసలు గారు. సమానత్వమే  ఇక్కడ అని నిరూపించాడు.

 

రామాయణకాలం నాటికి ఏడుగడయైనవాడు భర్త అని కావ్యాలు నినదించాయి. మరి నేడు ఎవరివలన కూడా స్త్రీకి రక్షణ, గౌరవం, సుఖం, శాంతులు లేవని ప్రస్తుత యుగధర్మాలు చాటుకుంటున్నాయి. అధర్మశీలవృత్తం ప్రబలినకాలం గదా!మరి తీగ తెగిన వీణవలె,చక్రంలేని రథం వలె భర్తకు దూరమైన భార్య జీవితం రాణించదు. నూర్గురు పుత్రులున్నా భర్తవలన భార్యకు లభించే ఆనందం సుఖం దొరకదని కౌసల్యతో సీత పలికి అయోధ్య వదలి అడవికి బయలుదేరిన వీరధీతవనితగ చతురపాయ శాలినిగ విదితమవుతుంది.

 

“క్రియాణాం ఖలు ధర్మాణాం సపత్నోమూలకారణమ్మని” కాళిదాసు మహాకవి అన్నట్లు సహధర్మ చర్వీతమే సౌభాగ్యహేతువు. అగస్త్యాశ్రమానికి సీతారామాదులు వెళ్ళినప్పుడు కష్టాల్లో విడువక భర్తను అనుగమించిన సీతను చూచి నీ భార్య నిన్నిట్లు అనుసరించి రావడం నీ అదృష్టానికి పరాకాష్ఠ అంటూ ప్రశంసించాడు (వా. రా. అరణ్య 13-5,6). అంతేకాదు గరుడవాయు వేగాలను మించిన చంచలచిత్త్తం గలవాళ్ళు స్త్రీలు.  కాని ఈ జానకిలో అలాంటి దోషం లేదు. అసాధారణస్త్రీమూర్తియైన జానకిని నీవు భద్రంగా,ఆదరంగా చూచుకొమ్మని హెచ్చరించాడు. అసాధారణపదం వల్ల ఆమె మానవమాత్రురాలు గాదని రాబోయే కాలంలో ఎదురయ్యే ఉపద్రవాన్ని మహర్షి సూచనగా చెప్పినట్లున్నాయి ఈ మాటలు ’అనుకూలాం,విమలాం,కులజాం,కుశలాం,సుశీల సంపన్నాం, పంచలకారాం భార్యాం పురుష పుణ్యోదయాల్లభతే”అనే ఆర్యజనుల సూక్తికి పుంసాం మోహనరూపుడైన రాముడి జీవితం ఆలంబనం అయినదట. 

 

రామాయణ కావ్యానికే హృదయం సుందరకాండ. మొల్ల కూడా  అంత ప్రాధాన్యమినిచ్చి వ్రాసినది. వైదేహి హృదయ సౌమనస్యానికి జానకి కుశాగ్రబుద్ధికి నిశిత పరిశీలనా వైదగ్ధ్యానికి,సంభాషణా చాతుర్యానికి, ధీరత్వానికి,పాతివ్రత్యానికి పరాకాష్ఠ. సీతాదేవి చరితకు మణిదీపాలవంటి పద్యాలు కూర్చినది మొల్ల. ఆమె చసిత్రను సజీవ శిల్పసౌందర్యంగా మలచినది. లంకాధిపతి మాటలలోని నీచత్వాన్ని ఖండించే పట్టుల మైథిలీ మానసం స్ఫటికం కంటె తెల్లన. మొల్ల కవితాశక్తి కూడా  ద్యోతకం అవుతుంది.

 

స్త్రీసహజచిత్త వృత్తుల్ని “దీవించుడు మునియేయని భావింపుచు జేరవచ్చు భామినినపుడా. . . ” ఇత్యాదివర్ణనలో చూపినది. సమయస్ఫూర్తితో ఋష్యమూకంపై నగలు జారవిడిచినది. రాముడికి తనజాడ ఎవరిద్వారానైగా తెలిస్తే రక్షించగలడనే భావన. నియతకులోచితమైన సత్స్వభావమే శీలం “శీలం స్వభావే సద్వృత్తే” ఆత్మజ్ఞాన తేజోవిలసిత మూర్తి సీత. కామాంధకార ఉన్మత్తుడు రావణుడు. తేజం వున్నచోట చీకటి వుండదుగదా!

 

ఈజ్ఞాన దీపానికి ఆ కామాంధుడు దరికి కూడా  రాలేకపోయాడు. వేలమంది వెంటబడి వరించారు. వేలమందిని తాను చెరబట్టాడు. ఈ సీత ఒక లెక్కలోనిదా అనుకుంటాడు. అందం,ఐశ్వర్యం అనే మదంతో కూడిన అహంకారి. చివరకు భంగపాటే మిగిలినది. అతడి ప్రలోభాలన్ని అగ్నిలోపడిన మిడుత దండుగా చెప్పాలి. మొల్ల స్త్రీ హృదయం ఈ సందర్భంలో అపురూపంగా భాసించినది. ఆచంద్రార్కకీర్తిని ఆర్జించుకున్నది. విచక్షణాశీలంతో నయవినయ వాక్కులకు లొంగనినాడు ప్రతీకార బుధ్ధితో ప్రవర్తిస్తుంది సీత. వాల్మీకి కూడా  సీతమ్మనే ముద్దుగ తీర్చిదిద్దాడు. జనకుడు మిథిలాయాం

ప్రదగ్ధాయాం సమీకించిత్ ప్రదహ్యతే . . . “అని పలికినా,తన కూతురి వలన యశోధనమే చాల గొప్పదిగ భావించాడు. ఆ ధర్మ సతీధర్మాలు స్థాపించి ఆ చంద్రార్క కీర్తికాంత అయినది తన కూతురు.

 

సీతమ్మను గూర్చి “పూర్వాపర సాహిత్యాలను పరిశీలించినప్పుడు మరియొక సీత సాక్షాత్కరించదని అట్టి దివ్యసాధ్వి మహాకవి లేఖిని నుండి ఒక్కమారే ఉదయించినదని స్వామి వివేకానందుడు గొప్పగా ప్రశంచించాడు. సర్వకాలాలకు సీత మాత్రం ఒక్కతే. తనను ప్రలోభపెట్టిన రావణుడితో మాట్లాడటమే పాపంగా యెంచి ఒక గడ్డిపరకను అడ్డుగా పెట్టి సంభాషించినట్లు మొల్ల చెప్పిన తీరు అపూర్వం. ఎంతటి సంపన్నుడివైనా నా రాముడితో పోల్చిన నీవు గడ్దిపరక వంటివాడవని చేతలతోనే నిరూపించిన ప్రజ్ఞాధురీణ సీత. శౌర్యవంతుడు తనను తాను పొగడుకోదని పరస్త్రీని దొంగలించడని అతడిని తృణప్రాయంగా తూలనాడుతుంది.

 

ఆంజనేయుడు సీతను చూచి లంకలో తనను రాముడి బంటుగా పరిచయం చేసుకుంటాడు. రాక్షసమాయలచే వేగిపొయి వున్నందున విశ్వసించదు. శ్రీరాముడి గుణగానం చేయమంటుంది. అతడి నిజస్వరూపం చూచిన తర్వాతనే శిరోరత్నాన్నిచ్చి అంగుళీయకాన్ని గ్రహించినది. ప్రత్యుపకారబుధ్ధితో హనుమను రక్షించాలని అగ్నిని వేడుకుంటుంది. ప్రాణాన్ని లెక్కచేయక శీలసంరక్షణ చేసుకుంటూ ప్రతీకార దీక్షతో కుండలినీయోగంలో అశోకవనిలో గడిపినది. హనుమతో తాను లంకను వీడివెళ్లడం లోకం మెచ్చదని దెలిపి శ్రీరాముడు రావణసంహారంతో చెరవిడిపించడమే తగిన విధం అంటూ పలికిన సీత లౌకికజ్ఞాని. సాధారణంగా లోకంలో ఆత్మస్తుతి,పరనింద చేస్తుంటారు. కాని ఈమె ఆత్మనింద పరస్తుతి చేయగలిగినది. క్షమాగుణంలో అపకారాలు చేసిన వాళ్లను మన్నించినది. ఏజన్మలోనో చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నానని భావిస్తుందేగాని ఎవరిని తూలనాడలేదు. పెల్లుబికిన బాధలో కైకమ్మనేమైనా అనినా అది మానవమానసిక బలహీనతకు ఉదాహరణగా చెప్పవచ్చు.

 

ఎవరెలా అనుకున్నా వసుంధరపై కేవలం అయిదుగురు భారతీయులే మిగిలినా,వాళ్లుపామరులైనా పండితులైనా అ కంఠాలలో సీతాదేవి చరిత్రమాత్రమే నినదిస్తుంటుంది అనిన వివేకానంద స్వామీజీ ఎంత గొప్పగా ఆమెను కొనియాడాడో చూడండి. ఈ జాతిమీద ఆ మహాసాధ్వి చరిత్రకు గల ప్రభావం అలాంటిది. జానకితో పోల్చదగిన స్త్రీలు గాని,రాముడి వంటి పురుషుడుగాని లేరు. క్షమయే సీత సీతయే క్షమ,మైథిలీ అన్వర్థ నామధేయ. పుడమిపుత్రిగా  మిథిలవాసిగా కూడా  ఆమె సార్థకత సంపాదించినది. ఈపావని జగదారాధ్య “త్వంమాతా సర్వభూతానామ్” అని పరాశరుడన్నట్లు జగదేకమాత. పవిత్రమూర్తియైన స్త్రీ అగ్నితుల్యయని ఆమెను సమీపించినవాడు మిడతవలె బూడిద కాగలడని పౌరాణికస్త్రీమూర్తులెందరో నిరూపించుకున్నారు. కలకంఠి కంటకన్నీరొలికితే ఏమౌతుందో చరిత్రలు నిరూపించాయి. ఎందుకాంతలవమానింపబడుదురో వారి కార్యాలన్ని ఫలశూన్యాలు.  స్త్రీలు ఎవ్వరియెడ దుఃఖిస్తారో వారికి వంశం ఉండదట. కాంతా శప్తాలైన గేహాలు శక్తిచే నశింపబడి లక్ష్మీశూన్యాలై వృధ్ధిపొందలేవని భారత గ్రంథకర్త చెప్పినట్లు,ఈ అయోధ్యాపురంధ్రి,మహాసాధ్వి,ఆదర్సమహిళా,సతీమతల్లి జీవితచరిత్ర చక్కగా నిరూపించినది. (లంకారాజ్యమే దీనికి తార్కాణం). 

 

“యావత్ స్థాస్యంతిగిరయస్సరితశ్చమహీతలే

తావత్ సీతా చరితమ్ వైలోకేషు ప్రచరిష్యతి”

 

ప్రకృతి నిలిచివున్నంతకాలం “రామా’చరిత్ర మార్ర్మోగుతుంటుంది. పుణ్యభూమి భరతఖండం యొక్క ఔన్నత్యాన్ని దశదిశల వెదజల్లుతూనే వుంటుంది. ఇన్నిమాటలెందుకు ఆదర్శసతి సీతా జీవితచరిత్రయే స్త్రీలకు గీతామృతసారం.

తెల్లరంగు సీతాకోక చిలుకలు

రచన: స్వాతికుమారి బండ్లమూడి

అనుమానం;

చిన్నరేఖ పక్కన మరగుజ్జు గీతలు

కంటికి సమాంతరంగా సాగని చూపులు

ఎక్కడానికీ, దిగజారడానికీ అవే మెట్లు

 

—–

 

నమస్కారం;

తిరుగు రైలు లేదని తెలిసీ మా ఊరొచ్చిన స్నేహితులకి

మనిషిగా ఎదగమని అడ్డుతొలగిన ఆనందానికి

వైరాగ్యాన్ని అలవాటు చేసినందుకు వంచనకి

 

—–

 

అవసరం;

గాయపడని చోట ముందు చూపుతో కాస్త మందు

ఆత్మను కాపాడుకోడానికి అహానికో చెంపదెబ్బ

ఇంకా నేర్చుకోని పాఠాలకి కాసేపు విరామ చిహ్నం

 

—–

 

 

సంపాదకవర్గం నుండి: ఒక చిన్నమాట!!

రచన : సుజాత

 

దశాబ్దాల తరబడి అలవాటు పడిపోయాం! అడుగు పెట్టిన ప్రతి చోటా అవినీతి స్వాగతం చెప్తుంటే కొన్నాళ్ళకి అదేదో మామూలు విషయంగా మారిపోయి దాన్ని పెంచి పోషిస్తూ, అప్పుడప్పుడూ మనమూ దానికి కొమ్ము కాస్తూ, నిత్య జీవితంలో దాన్ని ఆక్సిజన్ కంటే అవసరంగా మార్చుకున్నాం! అయినా లోపల ముల్లుగా గుచ్చుతున్న అసౌకర్యాన్ని మాత్రం కడుపులో నిప్పులా భరిస్తూ వచ్చాం! అతి తక్కువ స్థాయి ఉద్యోగి నుంచీ మంత్రులూ, దేశపాలకుల వరకూ అవినీతి మంత్రం జపిస్తూ ఉంటే సామాన్యుడి గుండె చప్పుడు ఎవరికీ వినపడలేదని కేకలు పెట్టాం!

అవినీతి గురించి మాట్లాడి, ఉపన్యాసాలు దంచి,ఫేసు బుక్కులూ ట్విట్టర్లూ,బ్లాగులూ బజ్జులూ రాసి కొంత కసి తీర్చుకున్నాం! అదృష్టం..నిజానికి ఇవన్నీ లేకపోతే అవినీతికి వ్యతిరేకంగా ఇంతమంది పోరాడ్డానికి సిద్ధంగా ఉన్నారని ఎలా తెలుస్తుందేం? ఆ ముసలాయన లేచి ముందడుగు వేశాక మేమూ ఉన్నాం పదమని మనమూ ఆయన వెనుక పదడుగులు వేసి ఊరూరా, వాడవాడలా,ఎంతో కొంత బహిరంగ వ్యతిరేకత చూపించామంటే వర్చువల్ ప్రపంచమని మనం ఆడిపోసుకునే ఈ సోషల్ నెట్ వర్కులు ఎంతో దోహదం చేశాయనే చెప్పాలి. ఒకటే ఆలోచనలున్న వారు నలుగురు కలిస్తే అదే ఉద్యమం! అదే పోరాటం! అదే స్నేహం! అదే స్ఫూర్తి!

ఒక వీరుడు మొదలుపెట్టిన ఈ పోరాటం ఇవాళ వీధి వీధికీ వ్యాపించింది. అట్టడుగు స్థాయినుంచీ చైతన్యం పెల్లుబికింది. అందుకే, హజారే దీక్షకు ఇంతటి ఆదరణ! ఇక్కడ ప్రతి మనిషికీ ఎవరో వచ్చి ఏదో చేయాలనే కోరికే! అందుకే ఎవరో వచ్చేదాకా ఎదురు చూశారు. కానీ మోసపోలేదు. వయోవృద్ధుడైన హజారే తర్వాత ఈ పోరాటం లోక్ పాల్ బిల్లు తో ఆగిపోకుండా నిరంతరం ఎలా కొనసాగుతుందనే సందేహం ఇప్పుడు లేదు. కిరణ్ బేడీ లాంటి నిజాయితీపరులు ఈ ఉద్యమాన్ని నడిపించడానికి సామాన్యుడికి తోడుగా ఉన్నారు.

వేలు,లక్షల కోట్ల ప్రజాధనం లూటీ! ఒక మనిషి కడుపు నిండా తిని,పని చేస్తూ సౌకర్యంగా బతకడానికెంత డబ్బు కావాలి? ఎందుకింత దాహం? వాళ్ళే కాక వాళ్ల మనవలూ ముని మనవలూ కూడా రాజభోగాల్లో తేలి సోలేంత సంపద ఈ హయాంలోనే సంపాదించి పాతరేయాలన్న దురాశ? ఎక్కడి నుంచి పుడుతుందీ కోరిక?  పిడికెడు మెతుకులకూ, చారెడు నీడకూ నోచుకోక రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద బతికే అభాగ్యులు ఇలాంటి డబ్బు పోగేస్తున్నపుడు ఒక్కసారైనా గురుతుకు రారా వీళ్ళకి? ఇవన్నీ సామాన్యుడి మనసులో రేగే ప్రశ్నలు! ఎవరూ జవాబు చెప్పని పట్టించుకోని ప్రశ్నలు!

అవినీతిని వ్యతిరేకించడమే కాక సామాన్యుడు “ఈ పరిస్థితికి నా వంతు సహకారం ఏమిటి?ఇందులో నా పాపం వాటా ఎంత?” అనే ప్రశ్న తనకు తనే సంధించుకోవడం కూడా ఆశావహ సూచనే! మొన్న హైటెక్ సిటీ దగ్గర ఒక జాబ్ వెబ్ సైట్ వాళ్ళు “Iam not corrupt” అని ముద్రించి ఉన్న కారు స్టిక్కర్లు ఉచితంగా పంచుతుంటే తీసుకోడానికి కొందరు జంకడం మరి కొంతమందిని ఆలోచింపజేసింది.  కనీసం “నేను కరెప్టా కాదా?” అనే ప్రశ్న వాళ్ళు వేసుకుంటున్నారన్నమాట! ఇంతకంటే శుభ వార్త ఏముంది?

అన్నా హజారే వేసిన అడుగు సామాన్యుడినే కాదు,న్యాయ వ్యవస్థనూ కదిలించినట్టుంది. లోకాయుక్త అటు యడ్యూరప్పను,గాలి సోదరుల్ని ఖంగు తినిపించినా, ఇటు రాజకుమారుల లక్ష కోట్ల ఆస్థికి న్యాయ స్థానం చెక్ పెట్టడానికి దారులు వేసినా,కనిమొళి చేత ఊచలు లెక్కపెట్టించినా…..ఇదే స్ఫూర్తి!

అవినీతి పూర్తిగా అంతమెప్పుడవుతుందనే ప్రశ్న మాత్రం అర్థ రహితం! ఎందుకంటే అవినీతంటే కేవలం లంచాలు, అక్రమ సంపాదన మాత్రమేనా? అక్రమ ప్రవర్తన కూడా అవినీతే! రెడ్ సిగ్నల్ జంప్ చేయడం నుంచి, క్యూలో నిల్చోకుండా నిల్చున్న టికెట్ సంపాదించడం వరకూ, హెల్మెట్ పెట్టుకోకపోవడం నుంచీ,రాంగ్ రూట్లో వెళ్లడం వరకూ, ఐదొందలకి పని మనిషి ఇంటిపనంతా చేయట్లేదని బాధ పడుతూనే, ఏడాదికి రెండు ఇంక్రిమెంట్లన్నా ఉండాలని మరో రకంగా బాధ పడటం______ఇవన్నీ అవినీతి కాదేంటి?

అందువల్ల అవినీతి మన రక్తంలో ఉంది! దీన్ని పూర్తిగా నివారించలేం! కానీ ఒక స్థాయిలో ఎవరో ఒకరు మొదలు పెడితే_______కొన్నాళ్ళకు అది మనలో ఆలోచనల్ని రేకెత్తించవచ్చు! పూర్తిగా కాకపోయినా ఎప్పటికప్పుడు మన ప్రవర్తనలో మార్పుని మనం బేరీజు వేసుకుంటూ ఉంటే..మనలోని అవినీతి భూతాన్ని చంపలేకపోయినా కనీసం కోమాలోకి పంపగలిగితే దాన్ని మరిహ లేవకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు!

ఏమంటారు?

ఆహా! ఆంధ్రమాతా? నమో నమ:

— రచన:  ?????? (మీరే చెప్పాలి)

 

మన బ్లాగ్లోకంలో వంటలు రాసేవాళ్ళు చాలా మందే ఉన్నారు….అదేంటీ, వంటలు వండుతారుగాని రాయటమేమిటీ అంటారా…..ఏమో మరి వాళ్ళంతా రాస్తుంటారు(నిజంగా వండుతారో లేదో తెలీదుగాని..;)..)…..ఒకాయన “బ్లాగునలుడూ”, ఇంకొకాయన  “బ్లాగుభీముడూ”…… ఒకావిడ ఆరో, పదారో,నూటయాభైయ్యారో “రుచులు”తెగ రాసేస్తుంటుంది…..మరొకావిడ “రుచులు” అని చెప్పి తెగ టెంప్ట్ చేసేస్తుంటుంది…..:)….. మరి వాళ్ళందరూ రాయగాలేంది నేను రాస్తే తప్పేవిఁట్టా! ఆహాఁ ఏంటీ తప్పు అనడుగుతున్నా….అందుకని వాళ్ళకన్నా గొప్పగా వండలేకపోయినా సారీ రాయలేకపోయినా, వాళ్ళల్లో ఒకళ్ళగానన్నా కాకపోతానా అనుకుని రాసేద్దామని డిసైడైపోయా….

ఇక వాళ్ళలా కాకుండా కాస్త సిన్సియర్గా వండిమరీ రాద్దామని బాగా ఇదిగా అనేసుకున్నా…కాని ఎక్కడ రాయాలి???….. గోడలమీదా,గొబ్బెలమీదా రాస్తే ఎవరు చూస్తారు? పైగా మా ఇంటిఓనరు పట్టుకు తంతాడు…బ్లాగొకటి తెరిచి రాద్దామా అనుకుంటే మనం మహావీర బద్దకస్తులం కదా…”ఉన్న మూణ్ణాలుగు బ్లాగులే సరిగ్గా మెయింటైన్ చెయ్యట్లా, ఇప్పుడు కొత్తగా మరోటి మొదలెట్టి, అదికూడా గాలికొదిలేస్తే, బ్లాగ్లోకంలో ఇప్పుడున్న కాస్తపరువు కూడా పోతుంద”ని మా –.బ్లా.స. మిత్రులు హెచ్చరించారు….ఏ పత్రిక్కో పంపిద్దామా అంటే మనవాళ్ళు చూసే పత్రికలేం ఉంటాయ్, పైగా ఆ పత్రికలవాళ్ళు మన వంటకం వేస్తారని గ్యారంటీ ఏం లేదుకదా అని తెగ ఆలోచించేస్తుంటే ఓ అవిడియా తట్టింది…..

మన “మాలిక పత్రిక” వాళ్ళు, కొత్తవాళ్ళని, వాళ్ళ టాలెంటుని ఎంకరేజ్ చేస్తారని, విభిన్నమైన అంశాలకి ప్రాముఖ్యతనిస్తారని తెలుసు కదా! సో వాళ్ళని డవిరెక్టుగా కాంటాక్టు చేశా… వాళ్ళదసలే విశాల హృదయం…నా విషయం చెప్పగానే, “మీకెందుకు, మీరు రాసి పంపండి.వేసేస్తాం..”అని నాకు అభయహస్తం ప్రకటించేశారు….అద్గదీ ఇంకేముంది! హాయిగా ఊపిరి పీల్చుకుని రాయటానికి ప్రిపేరై పోయా…….

హ్మ్! రాయాలంటే మరి వండాలికదా… “ఆ! మరీ చెప్తావ్! రాయాలంటే నిజంగానే వండాలా ఏంటీ, ఏదో ఒకటి రాసేస్తే పోలా, చదివే వాళ్ళంతా నిజంగా చూడొచ్చారా పెట్టారా?”అన్నారు మా –.బ్లా.స. మిత్రులు….ఊఁహూఁ! నే ఒప్పుకోలా, మరి నేను చాలా సిన్సియర్ కదా! అందుకని నిజంగా వండాక రాద్దాం అనుకున్నా….ఐతే ఇంతకీ ఏం వండాలి? అని తెగ ఆలోచించా……
ఇంతలో మా బికీలీక్స్ బృందం ఓ మాంఛి ఇన్పర్మేషన్ తెచ్చారు…..ఆ సదరు బ్లాగుభీముడుగారు ఒక వెరైటీవంటకం చేసి మరొకాయనకి పార్సెలు ఇచ్చారంట. అది ఇంకా ఆయన బ్లాగులో పెట్టలా, ఇప్పుడప్పుడే పెట్టే ఆలోచన కూడా లేనట్టుంది….. ఇంతకీ ఆ వంటకం ఏంటనుకున్నారు, “పులిహోరగోంగూర పచ్చడి”……ఓస్! అదే కదా అనిపించింది….ఆయనేనా చేసేది, మేం చెయ్యలేమా,రాయలేమా అనుకున్నా…..పైగా మొదలెట్టటమే “ఊరగాయలతో”, అదీగాక నాకు అత్యంత ప్రాణప్రదమైన మన “ఆంధ్రమాత” గోంగూరతో మొదలెడితే మనకీర్తి దశదిశలా వ్యాపిస్తుంది కదా అనిపించి ఉబ్బితబ్బిబ్బై ,”శభాష్” అని నా జబ్బ నేనే చరిచేసుకున్నా…….:)……

ఇక పచ్చడి ఎలా పెట్టాలి, ఏమేం సంభారాలు కావాలి అని ఆలోచించా….. మా అమ్మ,పెద్దమ్మ కలిసి పెట్టేవాళ్ళు ఆ పచ్చడి…..వాళ్ళు పెట్టిన పచ్చడి సప్తసముద్రాలవతలక్కూడా ప్రయాణం చేసొచ్చేది…..అమ్మకో ఫోనుకొట్టి ఎలా పెట్టాలో, ఎంతెంత కొలతలో కనుక్కున్నా…పైగా వాళ్ళు పెడుతుంటే ఏళ్ళ తరబడి చూసిన అనుభవంకూడా బోలెడుంది కదా…ఇంకేముంది అన్నీ తెచ్చుకుని రంగంలో దూకేశా…..

ఏమేం తెచ్చుకున్నానంటే :-

1)     మాంఛి ముదురుగోంగూర – ఒక కేజీ
2)    చింతపండు – నూటాయాభై గ్రాములు
3)    ఎండు మిరపకాయలు – రెండొందల గ్రాములు
4)    ధనియాలు – చారెడు
5)    మెంతులు – రుచికి సరిపడా (అంటే ఒక రెండు స్పూనులనుకోండి)
6)    నూనె – అరకేజీ
7)    వెల్లుల్లి పాయలు –  వలిచిన రెబ్బలు ఒక చారెడు
8)    ఉప్పు – పావుకేజీ
9)    ఇంకా తాలింపుకి ఇంగువ, తాలింపు గింజలు

ఎలా చేశానంటే :-

•    ముందు గోంగూరని శుభ్రంగా కడిగేసి ఆరనిచ్చి బాండీలో సరిపడా నూనె వేసి వేయించాను.
•    గోంగూర వేగుతుండగానే, ముందే బాగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు బాగా పిసికి పులుసు తీసి పొయ్యిమీద పెట్టి పులిహోర పులుసులా కుతకుతా ఉడికించా…..ఉడికాక దించి పక్కన పెట్టా… వేగిన గోంగూరని కూడా…
•    ఇప్పుడు ఎండు మిరపకాయలు మరికాస్త నూనెవేసి బాగా వేయించా…అవి బాగా వేగేప్పుడు చివర్లో  ధనియాలు,మెంతులు వేసి అన్నీ బాగా వేగగానే దించేశా….
•    ఇప్పుడు ఈ మిరపకాయలు,ధనియాలు,మెంతులు,ఉప్పు కలిపి మిక్సీలో వేసి, బాగా మెత్తగా అయ్యేలా చేసి ఆ “కారం” పక్కన పెట్టుకున్నా…
•    ఇక పైన వేయించి పెట్టుకున్న గోంగూర, ఉడకబెట్టిన చింతపండు పులుసు, కొట్టిపెట్టుకున్న కారం అన్నీ కలిపి గ్రైండర్లో వేసి రుబ్బాను….
•    వెడల్పాటిబాండీ పొయ్యిమీద పెట్టుకుని మిగిలిన నూనె అంతాపోసి బాగా కాగనిచ్చి తాలింపు గింజలు,ఇంగువ వేసి చిటపటలాడగానే దించి ఈ నూనె ముందు రుబ్బిపెట్టుకున్న పచ్చడికి కలిపాను….
•    చివర్లో ఆ చారెడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపి ఆరాకా తీసి బుల్లిజాడీకి పెట్టాను….
•    అంతే! ఘుమ్మని వాసనలు కొడ్తున్న “పులిహోర గోంగూర” తయారైపోయింది…….

ఈ పచ్చడి ఎలా తినాలంటే :-

కంచంలో వేడివేడన్నం పెట్టుకుని, ఈ పచ్చడేసుకుని్, మాంఛి వెన్నపూసేసుకు తింటుంటే ఉందీ నా సామిరంగా…అబ్బబ్బ…యమాగా ఉందిలే……. ఇది జొన్నసంకట్లోగాని, రాగిసంగట్లో గాని ఏసుకుతింటూ మజ్జెన ఉల్స్ కుమ్ముతూ ఉంటే ఇంకా యిరగదీసేస్తదంతే…..;)

మీరు చేసుకునేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :-

ఏం లేదండీ, ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే పచ్చడి రుచీ అదిరిపోద్ది, ఎక్కువనాళ్ళూ ఉంటది….
•    మొదట గోంగూర బాగా ముదురాకు తీసుకోవాలి…ఎందుకంటే లేతాకు వేయించగానే లేహ్యంలా ఐపోతుంది….. ముదురాకైతేనే తాళ్ళుతాళ్ళుగా ఉండి బాగుంటుంది…ఇక లేతాకే దొరుకుతుందనుకోండి ఎక్కువ రుబ్బాల్సిన పన్లేదు….బాగా కలిపినా సరిపోతుంది….. ఏ ఆకైనా మిక్సీలు,గ్రైండర్ల కంటే రోట్లో రుబ్బితేనే బాగుంటది…..
•    ఆకు కేజీ అంటే వలిచిన ఆకు, కట్టలతో కాదు…:)….. ఆకుని ఎక్కువగా కడగొద్దు, ఒక్కసారి నీళ్ళల్లో ముంచి దులిపి తీసెయ్యండి..ట్యాపుల కింద ఎక్కువసేపు పెట్టి కడగొద్దు….అలా చేస్తే ఆకుకి ఉన్న పులుసు కారిపోతుంది…అప్పుడు రుచీ పచీ ఉండదు..నిలవకూడా ఉండదు…….
•    ఇక పై కొలతలన్నీ నేను ఉజ్జాయింపుగా చెప్పినవే… ఎందుకంటే అమ్మ అన్నీ కట్లు,అరసోలల లెక్కన చెప్పింది…:)
•    చింతపండు పులుసు పిసకక పోయినా, బాగా ఉడికించి అది మిక్సీ పట్టేస్తే తొక్కంతా కూడా కలిసిపోతుంది…పులుసుకూడా చిక్కగా ఉంటుంది…
•    ఇక కారం…. పైన నేను చెప్పినట్టు అప్పటికప్పుడు కొట్టుకున్నా సరే లేకపోతే మామూలు పచ్చళ్ళకారమైనా వాడుకోవచ్చు…అప్పుడు కారం కొలత – అరసోల, అంటే షుమారు ౩౦౦మిలీ గ్లాసుతో కొలిస్తే ఎంత వచ్చిద్దో అంత, ఉప్పు కూడా అంతే….ఆ కారానికి ధనియాలు,మెంతులూ సరిపడా కలిపి కొట్టుకోవాలి… కాని వేయించికొట్టిన కారమే రుచి….ఉప్పుకూడా కళ్ళుప్పైతేనే బాగుంటుంది…..
•    నూనె కూడా చూసుకుని కలుపుకోవాలి…ఆకుని బట్టి మారుతుంది కలుపుకోవాల్సిన కొలత…..వేరుశనగనూనె ఐతేనే కమ్మగా ఉంటుంది…..గోంగూర ఎంత నూనె పోసినా, ఎన్ని మిరపకాయలు పోసినా వద్దనదని వెనకటికెవరో ఓ కవిగారు చెప్పారు…:)
•    తాలింపు గింజల్లో మినప్పప్పూ,పచ్చనగపప్పూ,ఆవాలూ,ఎండు మిరపకాయలూ, ఇంగువా వేసుకోవాలి…..జీలకఱ్ఱ్రా,కరివేపాకూ అవసరం లేదు……
•    ఇక వెల్లుల్లి ఇష్టమున్నవాళ్ళు వేసుకోవచ్చు,లేకపోతే లేదు….
•    ఇక అన్నిటికన్నా ముఖ్యం తడిచేతులు,తేమ అస్సలు తగలనివ్వొద్దు….పచ్చడి బాగా ఆరాకే డబ్బాకో,జాడీకో పెట్టండి…..ఇలా చేస్తే తేలిగ్గా నాలుగైదునెలలుంటుంది, మీరు ఉండనిస్తే…;)……ఫ్రిజ్జులో అయితే సంవత్సరంపాటుంటుంది……
•    పచ్చడి రెండురోజులు ఊరనిచ్చి తింటే సరిపోతుంది మరి…నేనిక్కడ తెగ లాగించేస్తున్నా, మీరూ బరిలోకి దిగండి మరి.

ఇట్లు,
మీ
(చెప్పుకోండి చూద్దాం.. రోజూ నన్ను చూస్తూనే ఉంటారు. ఆ మాత్రం చెప్పుకోలేరా. ఇంతమంచి గోంగూర పచ్చడి చెప్పాను. అది చేసి తినేసి వచ్చి నేనెవరో చెప్పుకోండి)