సీత… సీమచింత చెట్టు

రచన : సుప్రజ

 

‘ఓయ్..రామ చిలుకలూ..ఇదిగో చూడండీ..చెప్పానా అమ్మనడిగీసారి పచ్చ గౌనూ ఎర్ర రిబ్బన్లూ కొనించుకుంటానని .. ఇప్పుడు మనందరం ఒకటే. మీరూ ఈ చెట్టూ నా గౌనూ పచ్చా.. మీ ముక్కూ, ఆ కాయలూ నా రిబ్బన్లూ ఎరుపూ… కదూ’  సీమ చింత చెట్టు  కిందికొస్తూనే  చూపించా నా గౌను చిలుకలకి.

కొరికేసిన కాయలు రాల్చి గోల గోలగా లేచెగిరిపోయాయి  చెట్టు మీద రామ చిలకలన్నీ. నా  చిలుకాకు పచ్చ గౌను కుచ్చులు విప్పుకున్నట్టుంది  వాటి రెక్కల్లో….. ఎంతందము ఆ రెక్కల్లో! ఎంత గర్వమో అలా  ఎగరడంలో. ముక్కుల్లో ఆ ఎరుపెక్కడిదో వీటికి.!   సీమ చింత కాయలది కాబోలు. అబ్బురంగా చూస్తూండిపోయాను చిలుకల వైపు.

చెట్టు  వైపు  తిరిగా. జిలేబీలని దారాలకి కట్టి వేలాడ దీసారా అన్నట్టున్నాయి  పచ్చగా ఎర్రగా సీమ చింతకాయలు వేలాడుతూ. చెట్టు మురిసిపోతూ చూస్తున్నట్లే అనిపించింది నన్ను .. అచ్చం అమ్మలా. గర్వంగా నాన్నలా. ఎప్పుడూ  తోడుండే నా నేస్తంలా. ‘ఎంతిష్టమో నాకు నువ్వంటే…  చూడు నీ పేరు నా పేరు ఎంత బాగా కలిసిందో. నీ మొదటక్షరం చివరక్షరం కలిస్తే నేను!  అమ్మెందుకు  పెట్టిందో నాకీ పేరు. మరి నీకెవరు పెట్టారా పేరు? అమ్మ నడిగితే చెప్పింది నీ విత్తనాలు వేరే దేశం నించి తెచ్చి ఇక్కడ నాటారంటా! . నాకు భలే ఆశ్చర్యమేసింది తెలుసా ఎక్కడినుంచో నువ్వు నా కోసమే ఇంత దూరం వచ్చినట్లు’ చెట్టు తో కబుర్లు మొదలెట్టా..

‘సీతా..’ అమ్మ పిలుపది.

‘వస్తున్నానమ్మా’ చిలుకలు  రాల్చిపోయిన కాయలు ఏరుకుంటూ అమ్మతో చెప్పా..

‘వచ్చేయ్ త్వరగా  . పద్మ కూడా వచ్చేసింది’ అమ్మ మళ్ళీ పిలిచింది.

‘ఉండమని చెప్పు పద్మనీ.ఇదిగో ఇప్పుడే వస్తున్నా’ ఏరుకున్న కాయలు  గౌనులో పోసుకుంటూ అన్నా అమ్మతో..

ఎర్రగా పండిన కాయలు. చుట్టలు చుట్టలుగా భలే  ఉన్నాయి.. పొట్టలు పగిలి లోపల నల్లటి గింజలు కనబడుతూ సీమ చింతకాయలు నవ్వుతున్నట్టుంది.  నా పచ్చ గౌనులో పోసుకున్నాక చూసుకుంటే పచ్చగా ఎర్రగా తెల్లగా నల్లగా  ఆ చెట్టు  దిగి ఈ  చెట్టెక్కినట్టున్నాయి కాయలు..

‘ఎందుకే అవన్నీ.. మళ్ళీ అన్నం తినవూ’ గోంగూర  పచ్చడి మీగడా వేసి కలిపిన అన్నం ముద్దలుగా చేసి పెడుతూ అంది అమ్మ.

‘తింటా గాని ..అమ్మా, నాకూ.. ఈ సారి కూడా పచ్చ పరికిణీ… దానికి ఎర్రంచుండాలి ..సరేనా… ‘ అమ్మ  ముద్దలు పెడుతుంటే కాసిని సీమ చింతకాయలు పుస్తకాల సంచిలో సర్దుకుంటూ గుర్తు చేశానమ్మకి.

‘సరే గాని..పద్మ నీకోసం ఎదురు చూస్తుంది. టిఫిన్లో నీకిష్టమైన ముద్దపప్పూ గోంగూరా  పెట్టా. మొత్తం తినేయాలి.. బడయిపోయాక నేరుగా ఇంటికొచ్చేయి. ఈ రోజు చెరుకు తోటకి నాన్న బండి కడతానన్నారు..’ బొట్టు దిద్దుతూ చెప్పింది అమ్మ.

‘నిజమా! పద్మ ని  కూడా తీసుకెల్దామా  మనతో పాటు..ఏ పద్మా ‘ పద్మకేసి తిరిగా.

సరేనంది పద్మ. అమ్మ చేతికిచ్చిన బాక్సు పుస్తకాల సంచిలో  సర్దుకుని సీమ చింత కాయల్ని  మరో సారి చూసుకుని పద్మతో కలిసి రోడ్డెక్కాను.

‘పద్దూ, ఇవి మొలకొస్తాయి  కదూ ‘ సంచీలో పోసి తెచ్చికున్న సీమ చింత కాయలు వొలిచి అందులో నల్లటి గింజలు  తీసి  దారి పొడవునా అక్కడోటి అక్కడోటి విసురుతూ అన్నా పద్మతో.

వొగురొగురు  సీమ చింతకాయలు తిన్నవి తిని మిగతా వొలిచేసి గింజలు అలా దారంతా చల్లుతూ  నడుస్తుండేదాన్ని  బడికి.

‘సీతా, నిన్న మా అత్త వాళ్ళింటికి పోతున్నప్పుడు రోడ్డు పక్కన ఈ అగ్గిపెట్ట దొరికిందే!’ బద్రంగా దాచుకున్న అగ్గిపెట్టె సంచీలో నుండి తీసి లేబుల్లని జాగ్రత్తగా చింపుతూ  చూపిచ్చింది పద్మ..తామర పువ్వు బొమ్ముంది  లేబులు పైన. రకరకాల  అగ్గిపెట్టెల లేబుళ్ళు సేకరించడం మాకు అలవాటు,,,

దానసలు పేరు పద్మజ. పద్దూ , పద్మా అని పిలుస్తుంటా. మూడో తరగతి చదువుతున్నాం మేమప్పుడు. మేమిద్దరం కలిసే ఎక్కడైనా. పద్మతో తొక్కుడు బిళ్లా, చెరుకు తోట గట్ల మీద  అమ్మ దగ్గర నేర్చుకున్న మట్టి  బొమ్మలూ, గడ కర్ర తో వెళ్లి వొడి నింపు కొచ్చిన సీమచింత కాయలూ.  ఆనంద్. వినోద్, జీవన్ విజయ్ అన్నయ్యలతో  వీధి దీపాల కింద పొద్దు పోయే దాకా ఆటలూ, గాలి పటాలూ, గడ్డివాముల్లో మాగిన ఈత పండ్లూ, పశువుల వెంట పరుగులూ, బెల్లం బట్టీల చుట్టూ ఆశర్యాలు. అమ్మా నాన్నా అన్నయ్యా………… అన్నిటిని మించి నా సీమచింత చెట్లూ …చిలుకలు…….. అదొక అందమైన లోకం.

 

**************************************

 

‘రజితా.. కొద్దిగా వేయనా నా అన్నం కూడా’  లైనులో వెళ్లి  పెట్టించుకొచ్చిన గోదుమన్నం పళ్ళెంతో  రజిత పక్కన కూచ్చుంటూ అడిగా..

‘వొద్దు సీతా..ఇదే ఎక్కువైపోద్ది.’  నా గుడ్ల నిండా నీరు చూసాక జాలి పడిపోయింది.

‘అబ్బ వేసుకోవే.. నీకీ రోజుకూడా కోవా బిళ్ళ కొనిస్తాగా’..కోవా బిళ్ళ ఆశ చూపించి రోజూ నా పళ్ళెం లో  అన్నం రజితకి పెట్టేస్తుండేదాన్ని

రజిత గిన్నె నా వైపుకి జరిపితే గబగబ నా పళ్ళెంలో  అన్నమంతా అందులో  వేసేసా.. ఈ లోగా ఎక్కడ చాలంటుందో అని భయం.

 

నేను మూడో తరగతి అయిపోయాక అమ్మ నాన్న అన్నయ్యా  అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాము. నాన్న అక్కడ చెరుకు తోటలూ ఇల్లూ అన్నీ అమ్మేసాడనీ  ఇక ఆ ఊరు వెళ్ళమనీ తెలియలేదు అప్పుడు.  అమ్మమ్మ వాళ్ళూరిలో బడిలేదు. పక్క ఊరు నడిచి వెళ్ళాలి. మామయ్యల పిల్లలంతా బోర్డింగ్ స్కూళ్ళల్లో చదువుతున్నారు అప్పటికే. అమ్మ నన్నూ  అన్నయ్యని కూడా బోర్డింగు స్కూల్లో చేర్పించింది. ట్రంకు పెట్టె, కొత్త బట్టలూ, పుస్తకాలూ, అంతా సరదాగా అనిపించిందప్పుడు  హాస్టలు కి వెళ్ళడం. కొత్త కదా..

 

 

అమ్మకి సీత  వ్రాయునది,

అమ్మా నాకిక్కడసలు  ఉండాలని లేదు. ఆ గోదుమన్నం మింగుడు పడట్లేదమ్మా. దొడ్డుగా  జిగటగా ఉంటుంది. ముక్క పురుగులూ ఉంటాయి. మధ్యాహ్నమూ రాత్రి పెట్టె అన్నమూ అంతే. ముద్ద మింగుడు   పడనీకుండా కన్నీళ్ళ న్నీ  గొంతులో అడ్డం పడుతున్నట్లే ఉంటుంది. వార్డెను  తలుపు దగ్గరే నుంచుంటుంది . ఖాళీ ప్లేటు చూపిస్తే గానీ బయటికి వదలదు. పది  పైసలు పెట్టి కోవా బిళ్ళ కొనిస్తే గాని రజిత ఆ అన్నం వేసుకోదు. నువ్వేమో రోజుకి పది పైసలే గా కొనుక్కోమన్నావూ . ఆకలేస్తుందమ్మా…

నాలుగు రోజులకోసారి మొక్క జొన్న గటక  పెడతారు. అది భలే ఉంటుంది కానీ అందులో  వేసే గోంగూర పచ్చడే. అస్సలు బాగోదు. నువ్వు నాకోసం గోంగూర పచ్చడి చేసేదానివిగా. అది తలుచుకుని తింటున్నా.. మరి నువ్వెప్పుడూ గోధుమన్నం  ఎందుకు వండలేదూ. నువ్వు వండినదే  అనుకుని తినేదాన్నిగా రోజూ … అమ్మా, ఒకటగానా నిన్ను .. ఈ వార్డన్లూ  టీచర్లూ మంచిదే తింటారుగా.మరి  మాకెందుకు ఇలాంటిది  పెడుతున్నారు?..

బాత్రూం పోవాలంటే భయం. పెద్ద పెద్ద బల్లులున్నాయ్ గోడల  మీద. అవి దయ్యాలంట. అక్క వాళ్ళు చెప్తుంటే ఎంత భయమేసిందో.  నీళ్ళు కూడా ఉండవు. పాచి పట్టేసి ఎక్కడో అడుగునుంటాయి తొట్టిలో.  స్నానం చేసి పది రోజులైంది. తలనిండా పేలు కూడా.

పనులన్నీ చేపిస్తున్నారు మా చేత. మన జ్యోతి అయితే పేడ ఎత్తుతుంది పాపం. ఇటుకలు  మోయిస్తారు. గడ్డి కోపిస్తున్నారు. మొన్న నా వేలు తెగింది గడ్డి కోస్తుంటే.. మొక్కలకి ఎన్ని నీళ్ళు మోయాలో..  చీకట్లోనే నిద్ర లేపుతారు. నాకేమో ఇంకా నిద్రొస్తూ ఉంటుంది.

గేటు దాటి ఎక్కడికీ వెళ్ళే వీల్లేదు. కట్టేసినట్టుగా ఉందిక్కడ నాకంతా. మనమెందుకొచ్చాం మనూరొదిలి . అక్కడే బాగుంది. పద్దూకి  ఎన్ని అగ్గిపెట్టెలు కొత్తవి దొరికాయో. పాపం అదెంత దిగులు పడుతుందో నేను లేక.

మా బడి వెనక ఓ  సీమ చింత చెట్టుంది. ఇప్పుడు దానికింద కూర్చునే నీకీ ఉత్తరం రాస్తున్నా. ఇక్కడ కూచ్చున్నంత సేపే  నాకు బాగుంటుంది. ఇదొక్కటే నాకిక్కడ తోడు. కానీ పెట్టె తెరిచి పచ్చ గౌను కనిపిస్తే ఏడుపొస్తుంది. ఎర్ర రిబ్బన్లెవరో కొట్టేసారు. నీకోటి చెప్పనా అమ్మా. మా డాన్సు టీచరు  నేను డాన్సు బాగా నేర్చుకుంటున్నాను అన్నారు. టీచరు మెచ్చుకుంటుంటే సంతోషమేసింది. కాని డాన్సు స్కూల్లో ఏదైనా  పండగోస్తేనే నేర్పిస్తారట. ఎప్పుడూ ఉండదు.

ఇంకా చాలా చాలా చెప్పాలి నీకు. నువ్వు త్వరగా వస్తావు కదూ…

-సీత

 

నోటు బుక్కులో మధ్య పేజీలు  చింపి అమ్మకుత్తరం రాసా. ఉత్తరం రాయడమైతే తెలిసింది గాని ఆ తర్వాత అదేం చెయ్యాలో తెలియలేదు. అడ్రస్ తెలియదూ, పోస్ట్ చేయడం తెలియదు. అలాగే పట్టుకుని కూర్చున్నా చెట్టు కింద.

‘సీతా.. రా.. గంటకోట్టేసారు అన్నానికి’ రజిని పిలిచింది.

రజిని రజితా అక్కా చెల్లెళ్ళు. వాళ్ళ నాన్న రిక్షా లాగుతుండేవాడు. అదేంటో ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అన్నం ఎంత పెట్టినా తినేసేవారు. నాకున్న మరో దిక్కు వీళ్ళిద్దరే అక్కడ. అన్నం పడేస్తే కొడతారు మరి.

‘ఏం చేస్తున్నావు’ రజిని దగ్గరికొస్తూ  అడిగింది.

‘మా అమ్మకి ఉత్తరం రాసా.. ఇదిప్పుడు ఏం చేయాలో తెలీట్లేదు’ చెప్పాను రజినీ తో.

‘ఒక అక్క చెప్పిందీ. మనకి అడ్రస్ తెలియక పోతే ఉత్తరం రాసి ఓ రాయి కింద పెట్టాలంట. కళ్ళు  మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటే  చేరాల్సిన వాళ్లకి దేవుడే  ఇచ్చేస్తాడటా. అలా చేద్దామా’ అంది..

‘నిజమా’ నమ్మకం కలగక అడిగాన్నేను.

‘అవును, కావాలంటే మూడు రోజులు తర్వాత వచ్చి చూడు ఇక్కడ మీ అమ్మ రాసిన  ఉత్తరం ఉంటుంది.’ నమ్మకంగా చెప్పింది రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ళ రజిని

ఉత్తరం మడిచి సీమ చింత చెట్టు మొదట్లో  జాగ్రత్తగా పెట్టి దానిమీదో రాయి పెట్టి ఎండిన సీమ చింత ఆకులు కప్పి పెట్టాను. చేతులు జోడించి కళ్ళు మూసుకుని ‘సీమ చింత చెట్టుని’ తలుచుకున్నా!

 

నాలుగో రోజు పొద్దున్నే పరిగెత్తాను చెట్టు దగ్గరికి. ఆ రాత్రి కురిసిన వానకి  ఆకులన్నీ కొట్టుకు పోయి  మడతలు చెదిరి మరకలు పడి కనిపించిందో కాయితం. తడిసి అంటుకున్న ఆకుల్ని ఏరేసి అమ్మ రాసిందేమో నని చూసా. ఏమీ తెలీలేదు. అక్షరాలూ చెరిగిపోయాయి. నా ఉత్తరం అమ్మకి చేరిందా నా చేతిలో ఉన్నది అమ్మ పంపిన ఉత్తరమా  అయోమయంగా చూసా చెట్టు కేసి.  మౌనమునిలా నున్చునుంది చెట్టు ఎప్పట్లానే!  ‘నా సీమ చింత చెట్టు’. దిగులు నిలువునా కమ్మేసినా  ఏడుపైనా వచ్చింది కాదు.

 

వచ్చి నాలుగు నెలలయ్యింది అప్పటికి. నెలకోసారి అమ్మో నాన్నో వచ్చేవారు చూడ్డానికి. నెలంతా  ఎదురు చూస్తే తీరా వచ్చాక ఎన్నో చెప్పాలనున్నా మాటకేదో అడ్డం పడేది. . అమ్మని చూసిన  ఉద్వేగంలోనో కాసేపుండి వేల్లిపోతుందన్న దిగులో!.. అమ్మ వెళ్లిపోతుంటే గేటు చువ్వలు పట్టుకుని అమ్మ కనిపించినంత దూరమూ చూస్తూ నిలబడి పోయేదాన్ని.

ఆ తర్వాత ఎవ్వరి తోనైనా మాట్లాడడమే మానేసాను. కోపమోచ్చేది కాదు ద్వేషముండేది కాదు ఎవరి మీద…   ఉన్న ఒక్క ఓదార్పు ఆ సీమ చింత చెట్టు.  కాయలు దక్కేవి కాదు చిలుకలు వాలేవి కావు……..బయటంతా అందమైన లోకం అన్నట్టు, లోపల నేను రెక్కలు తెగి పడ్డట్టూ  వేల వేల ప్రశ్నలు రాత్రీ పగలు నా తోడై ఉండగా పదవతరగతి వరకూ గడిచింది బోర్డింగు స్కూల్లో.

 

‘సీతెప్పుడూ  అంత దిగులుగా ఉంటుందే’…’అవునూ. ఎప్పుడూ  నవ్వదూ   ఎవరితోనూ మాట్లాడదూ…ఎందుకో’ .. పదో తరగతిలో ఉండగా నా  తోటి అమ్మాయిలు మాట్లాడుకుంటుంటే విన్నాను.. నిశబ్దంగా అక్కడ్నించి వెళ్ళిపోయాను

 

**************************************

 

బస్సు దిగి ఊర్లోకి  నడుస్తున్నా.. ఊరంటే  అదో  మధ్యరకం టౌను. అటు పెద్దదీ కాదు ఇటు చిన్నదీ కాదు.

టౌన్లో సినిమా హాళ్ళూ, పెద్ద పెద్ద షాపులూ, కాలేజీలూ, రైల్వే స్టేషన్  ఉన్నాయి. ఓ  పెద్ద షుగరు ఫాక్టరీ కూడా ఉంది టౌను మొదట్లో.  మొత్తానికి ఆ టౌను  పట్నం పిల్ల పరికిణీ ఓణీ కట్టుకున్నట్టు ఉంటుంది చుట్టూ వరి  పొలాలూ, చెరుకు తోటలూ, పరుచుకున్న పచ్చదనంతో. ఆ పిల్ల నడుముకి వడ్డాణం లా ఓ వైపు పారుతున్న వాగు.

నడుస్తుంటే అడుగడుగునా ఏదో ఆత్మీయ స్పర్శ హత్తుకుంటున్నట్లే  ఉంది.

నడుస్తూ నడుస్తూ

‘జయశ్రీ’ ఇల్లు దాటుతుండగా  సీత కనిపించింది నాకు . బొమ్మరిల్లు పేరుస్తున్నారిద్దరూ .. నా మనసు మళ్ళీ పిళ్ళై  గంతులేసింది ఆ ఇద్దర్నీ చూసి.

‘శ్రీ వెంకటేశ్వరా ట్యుటోరియల్స్.’ స్కూలు గేటు దగ్గరికి రాగానే అంత మంది పిల్లల్లో సీత కోసం వెదికాయి నా కళ్ళు. అదిగో  ఒప్పుల కుప్ప ఆడుతోందక్కడ… ఆనందమేసింది నాకు.

‘రైలు పట్టాలు’ పక్కగా రోడ్డు మీద నడుస్తుండగా .. రైలు పెట్టెలు లెక్కబెడుతూ కనిపించారు  సీతా ఇంకా తన  గుంపులో పిల్లలంతా….  నాలో ఉత్సాహం రెక్కలు విప్పుకున్నట్లైంది

‘గడియారం బంగాళా’ దాటాను. అదో పాత బంగళా. దాని గోడకి పెద్ద గడియారమోటి ఉంటుంది. అందుకే దాన్నలా  పిలుస్తారు.  బడెగ్గొట్టి తన జట్టంతా బంగాళా వెనక ఏట్లో  చేపలు పడుతుంటే వాళ్ళు చూడకుండా వెనగ్గా చేప  పిల్లల్ని తిరిగి ఏట్లో  వదులుతుంది సీత. నాకైతే  వెళ్లి సీతకో  ముద్దివ్వాలని పించింది.

‘ఈసు పుల్లయ్య ఇల్లు’ దాటాను  గోరింటాకు దూసుకుంటున్న   పద్మా సీత ని చూస్తూ..

‘శివాలయం’ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ  కనిపించారు మళ్ళీ ఆ ఇద్దరే! …….ఓ క్షణమాగి నేనూ దణ్ణం పెట్టుకున్నాను..

‘రాజమ్మ హోటలు’..అదో గుడిసె హోటలు. సీత వాళ్ళ నాన్నతో కారపు చుట్టలు  కొనిచ్చుకుంటుంది అక్కడ.

‘శీను కొట్టు’ ఉన్న మలుపు తిరుగు తుండగా .. కొట్టులో  అంప్రో బిస్కెట్టు పాకెట్టు  కొనుక్కుని తుర్రుమంటోంది  ‘సీనూ సీనూ  సిగరెట్టూ సీనూ పెళ్ళాం బిస్కేట్టూ……….’ పాడుకుంటూ సీత. శీను కొట్టులో  శీను నవ్వుకుంటున్నాడు……..అల్లరి పిల్ల!

‘కుమ్మరి కనకయ్య’ ఇంటి ముందు ఆగా. చక్రం  తిరుగుతుంటే మట్టిముద్దని కనకయ్య  కుండగా మలుస్తున్న వైనాన్ని ఆశర్యంగా చూస్తోంది సీత పక్కనే గొంతి కూర్చుని. ముచ్చటేసింది నాకు.

‘చిన్న తాతయ్య ఇల్లు’ అబ్బో ఇంటి చుట్టూ సీమ చింత చెట్లే!. ఓ సీమ చింత చెట్టు చాటుగా సీత కేసి దిగులుగా చూస్తున్నాడు నందూ.  ‘ఇక మీ ఊరెళ్ళి పోతున్నావా  తిరిగి  కనబడవా’  అన్నట్లుంది అతని చూపు. ఏదో చెప్పాలనీ, అది చెప్పలేకా ఎన్నో భావాలు కళ్ళ నింపుకుని చూస్తున్నాడు సీతనే. పరికిణీ ఓణీలో ముచ్చటేస్తోంది సీత. అదేంటో మరి  అతని వైపోసారి చూసి తలొంచుకొని  వెళ్ళిపోతోంది……. నోచ్చుకున్నాను నేను.

 

ఎటు చూసినా సీతే కనిపిస్తుంది కదూ..!

 

ఇంతకీ ఎవరు ఈ ‘నేను’ అనుకుంటున్నారా..నేనేనండీ. ఆ సీతనే!

నేను పుట్టిన ఊరు ఇది. ఊరెంతో  మారినా చెరగని  ముద్రలా మిగిలిన గుర్తులని  తడుముకుంటూ నడుస్తుంటే ‘నా చిన్నప్పటి నేను’ కనిపిస్తుంది ప్రతి చోటా.   ముప్పైయేళ్ల  తర్వాత ఈ ఊరొస్తున్నాను సీమచింత చెట్టుని చూడ్డానికి. ఓ సారొచ్చాను  లెండి పదో తరగతి అయిపోయాక వేసవి సెలవల్లో. అప్పుడిక్కడ  అత్త వాళ్ళింట్లో గడిపింది మూడు రోజులే. ఆ మూడు రోజుల పరిచయమే అత్త కొడుకు ఫ్రెండు నందూ!

 

ఇక సీమచింత చెట్టు సంగతి ఏం చెప్పమంటారు.. ఏ ఊరైనా  వెళ్తున్నప్పుడు బస్సు లోంచో ట్రైన్ లోంచో చూడటం తప్ప…. వెళ్లి హత్తుకోవాలనుంటుంది. నిజ్జం.. ఒక్క సారైనా అసలు తాకలేదు కూడా. ఇక కాయలేం తింటాను. ఓ సారి అమ్మమ్మ వాళ్లూరిలో  అదే ఇప్పుడు మేముంటున్న  ఊరిలో మా ఇంటి గోడ పక్కన ఓ సీమ చింత మొలక కనిపించింది నేను పదో క్లాసు లో ఉన్నప్పుడు. అక్కడెక్కడా అలాంటి చెట్లు లేవు. మరదక్కడ ఎలా మొలిచిందో ! నేను మళ్ళీ సెలవులకి వచ్చే సరికది  లేదు. అప్పట్నించీ ఇప్పటివరకూ సీమ చింత చెట్టుకీ  నాకూ మధ్య దూరమే..

 

అదండీ సంగతి! అవునూ ఇక్కడ వరుసగా సీమ చింత చెట్లుండాలేవీ?. కొట్టేసి ఇంతెత్తున  గోడ కట్టించేసినట్టుంది  చిన్న తాతయ్య. ఇందాక జయశ్రీ వాళ్ళింటి ముందు కూడా కనిపించలేదు. భాస్కర్ మామయ్యా వాళ్ళ చెట్టూ.. ఇప్పుడు లేదు … పద్దూ వాళ్ళ ఇంటి వెనకో..  అదేంటి పొలాలు ఇక్కడి వరకూ వచ్చేసాయి! ఊరవతల  పొలాల మధ్య పాత బంగాళా ఏది? ఆ గోడలలో సీమ చింత చెట్లుండాలి అప్పుడు.  ఓ  రైసు మిల్లోచ్చేసిందే ఇక్కడా!. జయత్త వాళ్ళ బావి దగ్గరిదో..అరె బావి ఎప్పుడు పూడ్చేసారో.

ఒక్కటీ కనిపించదే..

 

సరే, ఈ రోజుకి బడి దాకా వెళ్లొస్తాను.  రాజమ్మ హోటలు దాటి, ఈసు పుల్లయ్య ఇంటి మలుపు తిరిగి, శివాలయం రోడ్డెక్కి, పొలాలు దాటితే, చెరువు ఆ కట్టవతల  మా  స్కూలు!  శివాలయం  పక్కన అప్పటి ఖాళీ జాగాలో ఇప్పుడు  ఇల్లు పడ్డాయే. ‘హరిజన వాడ’ అట. బోర్డుంది. ..అదిగో అక్కడోటి రోడ్డు పక్కగా…. ఓ  సీమచింత చెట్టు!!

గభ గభా  అతడుగులేసాను అటువైపు. పచ్చ రంగు చీరకట్టుకున్న పడుచు పిల్లలా కళ కళ  లాడుతోంది చెట్టు.  కొమ్మల్లో వేలాడుతున్న దోర పండిన సీమ చింత కాయల గుత్తులు చిరు గాలికి ఊగుతున్న ఆ పిల్ల ఎర్ర రాళ్ళ జూకాల్లా ఉన్నాయి. చిలుకలు అల్లరల్లరిగా కబుర్లాడుకుంటున్నాయి చెట్టు కొమ్మల్లో..  వీచిన గాలితో పాటు ఓ ఊహ ఉక్కిరి బిక్కిరి చేసింది నన్ను.  ఆ వెంటనే ఓ అనుమానం..అది నిజమే అయితే. ఈ చెట్టు వయసు ఓ ముప్పై మధ్య ఉంటె ..అంటే ఇది……………నేను చల్లుకుంటూ పోయిన విత్తనాల్లో  ఒకటా! …. చెట్టు కేసి చూసా ..నా సీమ చింత చెట్టు! గర్వంగా చూస్తోంది.

 

బ్రతుకు జీవుడా

రచన : శర్మ జీ. ఎస్.

నరలోకానికి, నరకలోకానికి, తేడా పైకి కనిపించే ” క ” అక్షరం మాత్రమే కాదు ,ఎంతో తేడా ఉన్నది. ఆ నరకలోకం మన కళ్ళకు కనపడనంతదూరంలో , ఊహకి కూడా అందనంత దూరంలో ఉన్నదని ధృఢంగా  చెప్పవచ్చు.ఈ రెంటికీ చాలా  చాలా దగ్గర సంబంధమున్నది. ఆ నరకలోకం యమధర్మరాజు ఆధీనంలో, ఆతని ఏకైక హోల్ & సోల్ అకౌంటెంట్ చిత్రగుప్తుని పర్యవేక్షణలో అచటి దైనందిన కార్యక్రమాలు నడుస్తుంటాయ

సర్వలోకాల సృష్టికర్త బ్రహ్మదేవుల వారు , ఈనరలోక కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించారిలా   .

1 ) కృతయుగం 2 ) త్రేతాయుగం 3 ) ద్వాపరయుగం 4 ) కలియుగం.

మొదటిదైన కృతయుగం 25 శాతంగా నిర్ణయించారు. ఈ కృతయుగానికే మరో పేరే సత్యయుగం. ఈ యుగంలో అందరూ పుణ్యకర్మలు చేయటం వలన నరకలోకంలో ఒక్క కేసు కూడా నమోదు చేసుకోలేక పొయింది , అందరినీ స్వర్గ సీమకే పంపించారు.

రెండవదైన త్రేతాయుగం 50 శాతంగా నిర్ణయించబడింది. అదే నిష్పత్తిలో పాపుల కర్మలు అధికమై , పుణ్య కర్మలు అల్పమైనాయి. ఆ కారణంగా నరకలోకంలో మొట్ట మొదటిసారిగా పాపుల కేసులు నమోదు చేయబడ్డాయి.

మూడవదైన ద్వాపరయుగం 75 శాతంగా నిర్నయించబడింది.అదే నిష్పత్తిలో పాపుల కర్మలు అధికమై , పుణ్యకర్మలు అల్పమైనాయి.

ఇంక నాలుగవదైన కలియుగం నూరు శాతంగా నిర్ణయించబడ్డది.అదే నిష్పత్తిలో పాపుల కర్మలు అధికమై , పుణ్య కర్మలు అల్పమైనాయి.

ఈ యుగాలన్నిలా విభజించటంలో ఎంతో అంతరార్ధం ఇమిడివుంది.

మొదటిది 15 శాతం తన సృష్టి , మిగిలిన 10 శాతం నరుల ప్రతి సృష్టి. నాటి నుంచి యుగయుగానికీ నరులు ప్రతిసృష్టి చేసుకొంటూ జీవితాలు సాగిస్తున్నారు.

ఆ నిష్పత్తిలోనే ఈ కలియుగం నాటికి నరులలో ప్రతిసృష్టి కాంక్ష అధికమై యుగశాసనాన్ని దాటి వెళ్తుంటే గడ్డు సమస్య అయింది  సృష్టికర్త అయిన బ్రహ్మదేవులవారికి. అందువలననే , రకరకాల మారణాయుధాలని ఆ నరుల చేతనే  సృష్టించి కలియుగాన్ని  కల్తీయుగంగా మార్చి నూరు శాతంగానే ఉంచటానికి ఎప్పటికప్పుడు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నరలోకం / భూలోకం / ప్రపంచం అని పిలవబడ్తుంటుంది. ఈ ప్రపంచంలో అన్ని దేశాలకు, ఈ నరకలోకం ఒక్కటే ఏకైక కార్యాలయం.. జీవము కోల్పోయిన  తరువాత ఆందరూ ఇచటకు వచ్చి వెళ్ళవలసిన వాళ్ళే. పాపజీవులను , పుణ్యజీవులను ఇచ్చట తపాలా కార్యాలయంలో వచ్చిన అన్ని ( ప్రదేశాలనుంచి )టిని వేటికి వాటికి విడీ విడిగా పేర్చినట్లు చేసి , పాపులను యమసీమ లోనే ఉంచేసి , పుణ్యాత్ములను దివిసీమకి తరలించేస్తారు వారి కర్మల ఫలాలను అనుభవించటానికి.

 

****                                                                                             ****

 

యమసీమలో ఎటు చూసినా నూనె గానుగలంతా పేద్ద పేద్ద బాండీలు , పేద్ద పేద్ద గాడి పొయ్యిల మీద దర్శనమిస్తున్నాయి. కొంతమంది యమభటులు మంటలను ఎగద్రోస్తున్నారు. ఇంకొంతమంది ఖాళీ అయిన నూనె డ్రమ్ములను  , దొర్లించుకుంటూ వెళ్లి  నూనె గోడౌన్ల వద్ద పేరుస్తున్నారు . మరల నిండు డ్రమ్ములను  తీసుకుని ఆ నూనె బాండీల ప్రక్కనే ఉంచుతున్నారు. ఆ బాండీల ముందర ఈ డ్రమ్ములు చిన్న చిన్న కొబ్బరినూనె బాటిల్స్ లా కనపడుతున్నాయి .ఇప్పటికే చాలా డ్రమ్ములు పోశాం , ఇంకా ఎన్ని పోయాలిరా బాబో అన్నాడో యమభటుడు

అక్కడున్న తోటి  యమభటుడితో.

ఇవి చాలవుట , ఇంకా కనీసం ఇరవై అయినా పొయ్యాలిట అని జవాబు ఇచ్చాడు.

ఎన్ని శవజీవాలు  వస్తున్నాయేమిటి ఈ దినం?

ఇన్ని అని ఖచ్చితంగా చెప్పలేదుగాని , లక్షలలోనే అనీ , అదీ అన్నికంట్రీస్ నుంచి వస్తున్నాయిట అనీ గుప్తా సారు సెలవిచ్చారు.

అలాగయితే మనకున్న పరివారం సరిపోదుగదా , మరి పెంచమంటే పోలా .

చెప్పి చూశాను , కాని ప్రయోజనము లేదురా . ఆ మాత్రం మాకూ తెలుసులేవోయ్ అన్నారు  ఆ  సారు.

నేనూ ఓ మారు చెప్పి చూడనా ?

నీ ఇష్టం నేను కాదంటానా , కాకుంటే ఆయన వేసే శిక్షకు సిద్ధంగా వుండాలి సుమా.

ముందే చెప్పి మంచిపని చేశావు, లేకుంటే ఆ శిక్షలకి డూటీ ఎగగొట్టి మందేసుకొని పడుకోవలసి  వచ్చేది.

అంత అవకాశం మనకు లేదులేరా . మొత్తం మందు నరలోకానికి తరలించేశారుగా.

ఎందుకట ?

ఈ మధ్య ఎన్నికలు పదే పదే వచ్చేస్తున్నాయట  , వాటికే మధ్యంతర ఎన్నికలంటూ నామకరణం చేసి ఆనందిస్తుంటారు. .

ఎన్నికలకి , మందుకి సంబంధమేమిటో నాకర్ధం కావటం లేదురా

నరలోకంలో ఒక్క ఎన్నికలకే కాదురా, అన్నింటితో సంబంధముంటుంది  ఆ మందుకి .

అన్నింటితోనా ! ఇన్నాళ్ళు మనకే అనుకొన్నా, ఈ నరులకు గూడా బాగా అలవాటై   పోయిందన్నమాట.

అలవాటేమిటిరా బాబూ , అందులోనే మునిగి తేలుతున్నారురా .

ఎన్నికలలో గెలవాలనుకున్న వారు , ఓటర్లని , కార్యకర్తలను మందులో ముంచుతారు .గెలిచిన తరువాత కూడా అందరు కలసి మళ్లీ ఆనందానికి చిహ్నంగా మందులో మునిగి తేలతారు. ఓడిన వాళ్ళు కూడా మందులో మునుగుతారు, ఆ బాధను మరచిపోయేటందుకు .ఉద్యోగం రావాలంటే , ప్యూను దగ్గర నుంచి , పై అధికార్ల వరకు అందర్నీ మందులో ముంచాల్సిందే . ఒక్క ఉద్యోగం రావటానికే అనుకొంటే ,పొరపడినట్లే . ప్రమోషన్లు రావాలన్నా , బదిలీలు కావాలన్నా మందే  ముందుంటుంది .

ఒక్క చోటేమిటిరా బాబూ , పని అయినా మందె , కాకున్నా మందె, పుట్టినరోజుకి మందే  ,గిట్టినరోజుకి మందే .

ఇందుగలదందు లేదను

సందేహమ్ము వలదు

సందు గొందులందు

ఎందెందు వెతికినా

అందందే కానవచ్చు ఈ మందు

అని తనకు తెలిసిన విషయాన్ని వివరంగా వివరించాడు.

“మందు తరలిపోయిందని బాధపడుతున్నారంటారా ? కంగారు చెందకండి. మనలోకంలోని ఆ మందు పంపలేదు ఆ నరలోకానికి. అది మన హద్దులు దాటి పోరాదట , ఎక్సైజు , కష్టమ్స్  శాఖలు బల్లగుద్ది మరీ మరీ నుడివాయట. అందుకని వారికి విశ్వామిత్రుల వారు సృష్టించిన నకలు  మందుని పంపించాను.ఆ మందు మోతాదు మించితే మనిషిని చంపేస్తుంది,

త్వరగా కానీయండిరా … అపుడే ప్రవేశించిన చిత్రగుప్తులవారు సెలవిచ్చారిలా .

సారూ ఆ శవజీవాలు ఎపుడొస్తున్నాయి ?

మూకుమ్మడిగా వచ్చిపడతాయి.

అలాగయితే  మన పరివారాన్ని మరికొంతమందిని పెంచితే బాగుంటుంది సారూ .

న్యూ ఢిల్లీ నుంచి తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. అసలు గమ్యస్థానం చెన్నై ,  కాని మన గమ్యస్థానం

మాత్రం నెల్లూరు .అందరూ గాఢ నిద్రలో ఉండగా అగ్నికి ఆహుతి కాబోతున్నారు.

అందుకే గదరా అందరిని ఒక్కసారే ఇచ్చటకు తీసుకు రాకుండా, కొంతమందిని కొన ఊపిరితో కొట్టుకునేటట్లుగా చేయటం ఇంకొంతమందిని వరదనీటిలో కొట్టుకుపోయేలా చేసి , ఏ చెట్ల కొమ్మలలో ఇరుక్కునేటట్లు చేయటం, మరికొంతమందిని ఇసుకదిబ్బలలోకి నేట్టేయటం ,ఎడారులలో,ఆసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకుంటూ కోలుకుంటున్నట్లు  భ్రమింపచేయటం లాంటి వెన్నో అమలుజరుపుతుంటాం . ఇలా చేయటం వలన  మీ పరివారాన్ని పెంచవలసిన అవసరం రాదు.

ఇన్ని అవస్థలు పడే బదులు పరివారాన్ని పెంచుకుంటే సరిపోతుంది గదా సారూ, ఒక్కమారు పని అయిపోతుంది గదా సారూ.

నేనూ అదే ఆలోచించి పెదసారుకి వివరించా. ఆయన బ్రహ్మదేవుని అనుమతి తీసుకోవాలిట.

ఇంకేం త్వరగా తీసుకుంటే పోతుందిగా సారూ .

అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది. ఆ బ్రహ్మదేవుడు గారుండేది స్వర్గసీమ ,  మనముండేదేమో యమసీమ . ఈ రెండు దగ్గరా, దాపు కాదాయె. అక్కడికి  పెదసారు  వాహనం మీదనే వెళ్లాలాయే . తన వాహనమైన  మహిషమేమో ఘెరావ్  చేస్తున్నదట.

దేనికి సారూ ?

మన మహిషానికి బియ్యం , బార్లీ వంటి వాటితో తయారు చేయబడిన పోషక పదార్ధాలున్న ఆహారమే కావాలిట,అంతే గాదు.. అచ్చమైన బీరు కావాలిట.

నిన్న మొన్నటిదాకా ఉలవలు,కొబ్బరిచెక్క,తవుడు,బెల్లం,కాగితాలు లాంటివి తినేది కదా, ఉన్నట్లుండి ఇలా ఎందుకు మార్పు కోరుతుంది సారూ ?

సృష్టి ప్రారంభం నుంచి తను అవే తింటూ ( బోర్ కొడుతున్నా) అలానే సర్దుకుపోతూ వస్తున్నదట. తనను ఓ వైపు మా జాతికంతటికి మూలవిరాట్టంటుంటే , తనను చాలా బాగా గౌరవిస్తున్నారని ఎంతగానో మురిసిపోయేదట. ఆ మధ్య అంటే మే నెలలో బ్రహ్మదేవులవారు  పక్షపు సభ జరుపుతున్నపుడు ,తను వాకిట్లో అటూ ఇటూ పచార్లు చేస్తుంటే, బల్లపైన ఈనాడు దినపత్రిక కనపడి , తిందామని తలవంచితే , తమ జాతి వాటికి బియ్యం,బార్లీ వంటి పోషక పదార్ధాలు పెడ్తున్నారట నరులు . అంతే  కాదు బీరు కూడా  పడ్తున్నారుట ,ఫోటోతో సహా చూసిందిట. అంతే ఆలోచనలో పడిందిట.పట్టుమని పాతికేళ్ళు జీవించే తన జాతివాటిని , నిండా నూరేళ్ళు ఆయుష్షు కూడా లేని మానవులు యింత శ్రద్ధగా చూసుకొంటున్నారంటే,మరి మరణమే లేని తనను మరి ఎంత బాగా  చూసుకోవాలి మన పెదసారు అని అనుకొని, పెదసారు వెలుపలికి రాగానే ,మాట్లాడకుండా పెదసారుని ,ఆయన భవంతి వద్ద దించి వెళ్ళిపోయిందట.మరల పెదసారు సభకు వెళ్ళాల్సి , మహిషం  మొబైల్ కు కాల్ చేస్తే రింగ్ అవుతుంది, బదులుగా   సబ్స్క్రైబెర్ ఈజ్ నాట్  రెస్పొండింగ్ ఆర్ నాట్ ఇన్ కవరేజ్ ఏరియా , ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సం టైం అని వస్తున్నదట ఎన్నిమారులు ట్రై చేసినా అలాగే వస్తున్నదట. పెదసారు ఏమి చేయలేక తుదకు సభకు ఎగనామం పెట్టారట.పెదసారు ఆర్డర్ మేరకు నే  వెళ్లి చూస్తినిగదా ! మహిషం ఎచ్చటికీ వెళ్ళలేదు, తన బంగళాలోనే ఉన్నది. ఓ  ప్రక్కన  మొబైల్ , ఇంకో ప్రక్కన ఈనాడు తెలుగు దినపత్రికని చూస్తూ కన్నీరు కారుస్తున్నది. నేనెంతగానో బామాలి,  బ్రతిమలాడిన మీదట , ఇదంతా వివరించింది.

పెదసారుకి అంతా వివరించగా ఏమి చేయాలో తోచక, కాలుగాలిన పిల్లిలా అటు, ఇటు అచ్చటనే తిరుగుతున్నారు మరొక మార్గంలేక. ఎచ్చటకు వెళ్ళాలన్నా వాహనం చాలా చాలా ముఖ్యం

తెలియకడుగుతున్నా చిన్నసారూ , వేరే ఇంకేవరిదైనా వాహనం వాడవచ్చుగా తాత్కాలికంగా.

ఎవరి వాహనాన్ని వారే వాడాలి, మరొకరి వాహనాన్ని వాడకూడదు. అందుకే ఈ లోకాలలో ,ఒకరికి నిర్ణయించబడ్డ వాహనాన్ని మరొకరికి నిర్ణయించబడదు నరలోకంలో లాగా . ఇవన్నీ నమూనాలు మాత్రమే. మిగిలినవన్నీ నరలోకంలోనే వుంటాయి. నరుల వాహనాలు అడపా తడపా ఇబ్బందులు పెట్టి ఆగిపోతుంటాయి.  అందుకని వాళ్ళు  మాత్రం ఏ వాహనాన్నైనా, ఎపుడైనా, ఎచ్చటికైనా వాడవచ్చు. వాళ్ళ  జీవిత కాల పరిమితి బహు స్వల్పం..  ఆ లోపల వాళ్ళు  చేయవలసిన కర్మలు ( పనులు ) పూర్తిచేయవలసిన బాధ్యతా వాళ్ళ  పైనే ఉంటుంది. వాళ్ళకి   పని అవటమే ప్రధానం, మనకు అలా కాదు, మన వాహనాలు ఆగిపోవటమంటూ జరుగదు. మనకు  పద్ధతే ప్రధానం సుమా. అందుకే బ్రహ్మదేవుల వారు ఇలా నిర్ణయం చేశారు. కనుక మీరే అదనపు డ్యూటీ ఛెయ్యండి,  మీకే మరో  వేతనం ఇప్పిస్తాను అని నెమ్మదిగా సెలవిచ్చారు చిత్రగుప్తుల వారు.

మరో వేతనం కాదు సారూ,  డబుల్  వేతనమిప్పించండి. లేకుంటే సమ్మె చేస్తాం .

ఇలా అడగటం కొంచెం కొత్తగా, ఇంకొంచెం చెత్తగా ఉంది.అసలేమయ్యింది మీకు ?

అదనపు డ్యూటి మామూలు  వేతనానికి చేయటం తప్పని ఆ మధ్యనే తెలిసినా, ఇంతదాకా అడగలేకపోయాము .

ఎలా తెలిసింది ? ఆ నారదులవారేమైనా అంటించారా  అన్న తన సందేహాన్ని వెలిబుచ్చారు చిత్రగుప్తులవారు.

పాపం ఆ సారునేమనకండి హరినామస్మరణ తప్ప అన్యమెరుగని మా మంచి మారాజు .

ఇలా మీరు వెనకేసుకుని రావటం చూస్తుంటే ,  ఇంకా  నా సందేహం స్ట్రాంగుగా బలపడుతుంది.

ఆ సారుని అనుమానించకండి , నిజం చెప్పేస్తాం. ఆ మధ్య నరలోకం నుంచి వచ్చిన  శవజీవాలలో ఎన్.టి.రామారావు అనే ఒక అన్న కూడా ఉన్నారు.ఆ సమయంలో మేము అదనపు డ్యూటీ చేస్తున్నాము, మమ్మల్ని చూసి , పరామర్శించి , ఇలా మామూలు  వేతనానికే అదనపు డ్యూటి చెయటం తప్పని , డబుల్  వేతనం డిమాండ్ చేయమని సలహా ఇచ్చారు. అది ఎలా సాధించాలో నా “యమగోల” సినిమా చూస్తే తెలిసి పోతుందని వివరంగా చెప్పారు .

అదా సంగతి ! ఇదంతా ఆ మహానుభావుని నిర్వాకమా ! అసలు సినిమా అంటేనే వినోదం. ఆ వినోదం కొరకు, వారు ( నరులు ) ఎవరిమీదనైనా జోకులు వేస్తుంటారు. వెనుకా , ముందర చూడరు , తమను స్రుష్తించిన బ్రహ్మదేవుల వారి మీద గూడా జోకులు  వేసుకొని  ఆనందిస్తుంటారు. అది  వారి గొప్పతనంగా భావిస్తుంటారు. మీరు మాత్రం  అదనపు డ్యూటి  మామూలు వేతనానికే చెయ్యక తప్పదు.

ఆ సినిమాలోలా మమ్మల్నందరిని ఒక సంఘంగా ఏర్పాటు చేసుకొమ్మన్నారు. కలసికట్టుగా శ్రమించమన్నారు అపుడే విజయం మీ వెంటే  అన్నారు.  ఆయన ఏ లోకంలో వున్నా , అలా అనటం ఆయన హీరోయిజం. అంతమాత్రాన మీరు ఆ  డైలాగులకు పడిపొకూడదు. అలా కొత్త వారెవరైన పడిపోతారని పెదసారు నిర్ధారించుకొని ,ఆయనను జూనియర్ ఎన్.టి.ఆర్  లో ఆవహించమని  ,ఆ హీరోయిజమేదో అచ్చటే ప్రదర్శించమని మరల నరలోకానికే పంపించేశారు. నరుల మాటలు నమ్మి మోసపొకండి , లేనిపోని కొత్త  సమస్యలలో కూరుకుపోకండి . హాయిగా మీ డ్యూటీలు మీరు చేసుకోండి. బ్రహ్మదేవుల వారికివేమీ తెలియవనుకోకండి.రెప్పపాటు వ్యవధిలో అవసరమైనంత మందిని సృష్టించి ,తక్షణమే ఇచటకు పంపిస్తారు. ఆ మరుక్షణమే ఈ  నరకలోకం నుంచి నరలోకానికి తొసేస్తారు మిమ్ములను మళ్ళీ మళ్ళీ జన్మల మీద జన్మలెత్తాలి, ఆ  తరువాత , నరులకెంతటి శిక్షల్ని అమలుజరుపుతామో అవన్నీ మీకు అమలు జరుపాల్సి వస్తుంది. మరోమారు ఆలోచించుకోండి. ఈ విషయాన్ని పెదసారుకి గాని, బ్రహ్మదెవుల వారికి గాని తెలియ నీయకండి.

ఆయన అంత ఎమొషనల్ గా చెప్తుంటే , నిజమే కాబోలు, మనమూ ఓ రాయి వేసి చూద్దాం, తగలకపోతుందా అనుకున్నామే గాని, తిరిగి ఆ రాయి మాకే తగులుతుందని ఊహించలేక పోయాం. పొరపాటు అయిపోనాది. తమరు చెప్పినట్టుగానే ఇకముందు నడచుకొంటాం అన్నారా  యమభటులు.

సరే త్వరగా ఆ శవజీవాల్ని తీసుకురండి అని తొందర చేశారు చిత్రగుప్తుల వారు.

 

***          ***                  ***

 

యమధర్మరాజు  గత సభకు గైర్హాజరు కావటమే కాకుందా , రెస్పాన్స్ సరిగా లేకపోవటంతో , బ్రహ్మదేవుల వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైనుకి  కన్నెక్ట్ అవగా ,గత్యంతరం లేక యమధర్మరాజు  లైనులొకి రాక తప్పింది కాదు.

డోంట్ వర్రీ యమధర్మరాజా , ఈ జరిగినది నాకు తెలియదనుకోకండి. ఇందులో నీవు ఫీల్ అవవలసినది ఏమీ లేదు. మహిషం అలా కోరటంలో దాని తప్పూ ఏమీ లేదు. ఇదంతా నా సృష్టి లీల. సృష్టి రహస్యం  ఇంతవరకు ఎవరికీ  తెలియదు. ఇప్పుడు చెప్పక తప్పదు. నరుల జీవితాలు నీతి బుడగలు , వారి ఆయుః పరిమాణం బహు స్వల్పం. ఆ లోతు పూడ్చటం కొరకు నేనెప్పటికప్పుడు ఏదో కొత్తదనాన్ని స్రుష్టించి అందించి వాళ్ళను ఆనందింపచేస్తుంటాను. వాళ్ళు ఆనందిస్తుంటారు. వాళ్ళకు తెలుసు, ఈ జీవితం క్షణభంగురమని, అందుకే వాళ్ళూ ఎదురుచెప్ప ( లే ) క చక్కగా రిసీవ్ చేసుకొంటుంటారు . ఆ ఆనందంలో  తేలియాడుతుంటారు, ఆ సమయంలో మన పని మనం  చేసుకొంటుంటాం. మనలోకంలో సృష్టించబడ్డ వాటికి నాశనమంటూ లేదు.శాశ్వతంగా ఉండిపోతాయి. అశాశ్వతమైన   వాటికే ఎప్పటికప్పుడు , ఎన్నో వింతలు,విడ్డూరాలు ఎరగా చూపాల్సివస్తుంది. ఇదే  కాదు , నరలోకంలో ఇంకా చాలా చాలా వింతలు జరుగుతాయి. అర్ధం చేసుకొని , అలక మాని తక్షణమే ఎవరి హోదాలను వారు నిలబెట్టుకోండి అంటూ వీడియో కాన్ఫరెన్స్ ఆనాటికి ముగించేసారు బ్రహ్మదేవుల వారు.

యమధర్మరాజు స్విచ్ ఆఫ్ చేసి టర్న్ అవుతుండగా మొబైల్  ఎస్ ఎం ఎస్ అలర్ట్ ఇచ్చింది . మహిషం తను తక్షణమే బయలుదేరుతున్నట్లు  తెలియచేసింది. హమ్మయ్య అనుకొన్నారు యమధర్మరాజు ” బ్రతుకు జీవుడా ” అనుకుంటూ ఎంతో నూతన జీవం పొందినంతగా  ఆనందించారు.

*****           ****        సమాప్తం        ****           ****

చీరల సందడి

రచన   – శశి తన్నీరు

 

హ్మ్..చీ..చీ…గుమ్మం లో చెప్పులు విసిరేస్తూ అంది ఉమ

విసుగ్గా.”ఏమైందే”అమాయకంగా అడిగాడు విభుడు.

(ఆయన పేరు అవసరం లేదు ప్రస్తుతానికి ఇది చాలు)

”ఏమి కావాలి మిమ్మల్ని కట్టుకున్న పాపానికి అన్నీ అవమానాలే  శ్రీశైలం డ్యాం నిండితే విరుచుకు పడ్డట్లు ..కోపాన్నంతా కుమ్మరించింది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని తెలిసినవాడు కాబట్టి మెల్లిగా జారుకున్నాడు…

 

కాసేపు వంటింట్లో గిన్నెలు మిక్సీ లో పప్పులు వేసి మూత మరిచిపోయి ఆన్ చేస్తే ఎగిరినట్లు, తాలింపులో ఆవాలు వేగించినట్లు కధాకళి. కాసేపటికి వంటిల్లు శాంతించి అన్నం ,పప్పు ,రసం పళ్ళెం లోకి  వచ్చి చేరాయి.హమ్మయ్య ఇవైనా దక్కాయి ఆత్మా రాముడికి అని సంతోషించి వెళ్లి కూర్చున్నాడు. ఉన్నట్లుంది నాలుకకి ఘుమఘుమలు. ఇదేమిటి ముక్కుకి కదా అంటే ….పాపం ఇలాటి కన్ఫ్యూషన్ టైంలో ఎడమ కన్ను అదిరినప్పుడు అవి కూడా వాటి పనులు మార్చుకుంటాయి. భయపడుతూనే చూసాడు.

నిజమే మినుముల పచ్చడి. అదీ రుబ్బినది. ఎప్పుడు చేసినది చెప్మా?

పక్కనే ఆదరువుగా నెయ్యి,పచ్చి ఉల్లిపాయి నంచుకునేందుకు . నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. కక్కుర్తి పడకురా వెదవా అంది మనసు కీడు శంకిస్తూ. పోవే అని మనసుని నెట్టేసి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి కలిపి ఒక్క సారి వాసన పీల్చాడు.ఆహా స్వర్గానికి బెత్తెడు దూరమే…

‘ఏవండి”చిన్న మిరపకాయ ముక్క లాగా …ఉలిక్కి పడి చూసాడు.”ఆ కావ్య కి భలే పొగురు అండి”అన్నది. ”అవును అవును..చిన్నగా వేళ్ళు నాకుతూ అన్నాడు.

అబ్బా! మళ్ళా తిందురుగాని వినండి…విసురుగా చెయ్యి లాగి అంది.

”చెప్పు, చెప్పు”తన చేతిలో ఇరుక్కుపోయిన తన చేతి పైన ధ్యాస ఉంచి చెప్పాడు.

”హ్మ్…మీ కసలు నా మీద ప్రేమే లేదు” ముక్కు నుండి, కళ్ళ నుండి అదే పొంగటం గోదారో, గంగమ్మో తెలీకుండా ఏక కాలంలో.

బిత్తర పొయ్యాడు.”ఏమైందే నీ వంట తింటున్నాను కదా…అదీ లొట్టలు వేస్తూ “ వేళ్ళ వైపు  చూస్తూ అన్నాడు.అంత ఏడుపులో కూడా చెయ్యి వదలటం లేదు పాపం. ఇక్కడేమో పచ్చడి అన్నం రమ్మని పిలుస్తూ.

”అది కాదు ఆ కావ్య కొత్త  చీర కట్టుకొని పేరంటం లో ఏమి కులికిందో మీకు ఏమి తెలుసు?అందరు ఆమె చుట్టూ మూగి

ఆహా..ఓహో…ఆవిడ ఇకిలింపులు”మూతి మూడు వంకరలు తిప్పింది.

”ఓస్ అంతే కదా…నువ్వు కూడా కొనుక్కో”ఆశగా కంచం వైపు

చూస్తూ వదలమన్నట్లు చూసాడు.”మరి డబ్బులు”దబాయించింది.

”పర్సులో’ ఇచ్చేసాడు. చెయ్యి వదిలింది .హమ్మయ్య  అనుకుంటూ పచ్చడి తినడంలో మునిగిపోయాడు.వెదవ డబ్బులు పొతే పోయాయి…అనుకుంటూ.

అప్పుడు మొదలు అయ్యింది సందడి. ఒక్కొక్కరికి ఫోన్లు రింగు రింగు మంటూ”వదినా షాపింగ్ కి వస్తారా?”దాదాపు యాబై మందికి చేస్తే పది మంది ఖరారు అయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు ”చీరల వదన”షాప్ దగ్గర కలుసుకొని చీర సెలెక్షన్ చెయ్యాలి.

నాలుగు కొట్టసరికి  ఆ షాప్ అతనికి స్పాట్ దగ్గర పడింది. ఇంత మందిని చూడగానే రొట్టె విరిగి నేతిలో పడింది అనుకున్నాడు..కుర్ర సేల్స్ మాన్.”రండి ..రండి”అని వాళ్ళను తీసుకెళ్ళి ఏమి కావాలి  అడిగాడు వినయంగా. (ఓనర్ దగ్గర మంచి పేరు తెచ్చేసుకోవాలని ఉత్సాహం లో రోట్లో తలపెడుతున్నాని తెలుసుకోలేక)

”ఏమున్నాయో చూపించు”అడిగారు.అప్పుడు మొదలైంది ….

కృష్ణుడు ద్రౌపదికి పంపినట్లు చీరలు చీరలు…గుట్టలు గుట్టలుగా…

కుర్ర సేల్స్ మాన్ పక్కన ఉన్న పాత సేల్స్ మాన్ ని చూసి కళ్ళు ఎగరేసాడు చూడు నా ప్రతిభ అని …పాపం పాత అతను జాలిగా చూసాడు …పోనీ పాపం అని దగ్గరకు వచ్చి మూడు చీరలు ఎవరికి కనపడకుండా తీసి టేబుల్ కింద దాచాడు. కుర్ర సేల్స్ మాన్ కి అర్ధం కాక పోయినా చూడనట్లు గమ్ముగా ఉంది పొయ్యాడు.ఇక మొదలయ్యాయి పాట్లు.

”బాబు ఇది పాత డిజైన్ లాగా ఉందే…వదినా ఇది పోయిన నెలలో ఆ పక్కింటి వనజ కొనిందే కదా” ”అవును అలాగే ఉంది”

”ఛీ ఛీ ఇలాటివి నేను కొనను…కొంచెం హై రేంజ్ చూపించు”

మళ్ళా గుట్టలు గుట్టలు….”వార్నీ యెంత ధర ?అక్క ఇది ఇంత ఉంటుందా?మరీ ఇక్కడ రేట్స్ ఎక్కువ లాగున్నాయే” ”కాదండి” సేల్స్ మాన్ జవాబు. రాక రకాలుగా చెపుతున్నాడు ఏదో ఒకటి కొనిపించాలని. చివరాకరికి అన్ని అలమారాలు ఖాళీ అయినాక ఒక చీర నచ్చినట్లే ఉంది చేతికి తీసుకున్నారు.

హమ్మయ్య అనుకున్నాడు .దాని గూర్చి పొగడటం ప్రారంభించాడు.”అది ఏమి చీర అనుకున్నారు  ..ఇంగ్లీష్ వింగ్లీష్ లో శ్రీదేవి కట్టింది” ”ఛీ ఛీ నాకు శ్రీ దేవి ఇష్టం లేదు.అయినా ఎవరి దగ్గర లేని చీర నా ఫేవరట్ కలర్ లో చిన్న ధరలో కావాలి”  పోయి హిమాలయాలకి సుగంద పుష్పం తీసుకొని రా అన్నట్లు వినపడింది సేల్స్ మాన్  కి. మళ్ళా ఒకటి తీసి చూపించి చేతిపై వేసుకొని లైటింగ్ దగ్గరకు తెచ్చి చూపించాడు.అసలు ఈ కలర్ చూడండి. ఎవరికైన నచ్చాల్సిందే …. అందులో మీలాంటి వాళ్లకి.. చూపించాడు.

పక్కకు చూస్తే …వెనక్కు తిరిగి కి.కి…కి…అంటున్నాడు పాత సేల్స్ మాన్ . నవ్వు..నవ్వు ..అమ్మిన తరువాత చెపుతాను రోషంగా చూస్తూ అనుకున్నాడు.

అతని మాటలకి మెత్తబడినట్లే ఉంది.”అవును మంచి కలర్”పక్కకు తిరిగి అందరి వైపు చూసింది. ఆర్దినేన్స్ జారి చేస్తున్నట్లు. ఒప్పుకుంటూ  అందరు తలలు ఊపారు..ఒక్కరు తప్ప. ఉలిక్కి పడి అటు చూసాడు సేల్స్ మాన్  ….

ఆమె కూడా ఒప్పుకుంటే కాళ్ళు పట్టుకోవటానికి రెడీ అన్నట్లు. అందరు అడ్డంగా  తిప్పిన తల వైపు చూసారు.”దీనికి అడ్డం గళ్ళు ఉన్నాయి మొదట చూసామే దానికి నిలువు గళ్ళు ఉన్నాయి అది బాగుంది”

అందరు అతని వైపు చూసారు. అర్ధం అయింది. గుట్టలోకి దూరాడు. అభిమన్యుడిలా ఇరుక్కొని పోకుండా ఒక చీర పట్టుకొని బయటకు వచ్చాడు.”అదే..అదే”అరిచింది ఇందాక అడ్డంగా తిరిగిన తల .

అందరు వంగి చీర వైపు చూసారు. రెండు చీరలు పక్క పక్కన పెట్టి చూసారు…చుక్కలు సరిపోయ్యాయి.సంతృప్తిగా తలలు ఆడించారు.

చంద్రమండలం చేరినంత సంతోష పడిపొయి సేల్స్ మాన్ పక్కన ఉన్న పాత అతనిని చూసి భుజాలు ఎగరేసాడు చూసావా అన్నట్లు…

ముందుండి ముసళ్ళ పండుగ …అనుకుని నవ్వుకున్నాడు పాత సేల్స్ మాన్.

”మేడం ప్యాక్ చేయించామంటారా?”ఉత్సాహంగా అడిగాడు.

”ఊహూ”అడ్డంగా ఊగాయి తలలు ఒకే తాళంతో. ‘ఏమైంది”బిత్తర పొయ్యాడు చిట్టా వ్రాస్తూ దొరికిపోయిన కుర్రాడి

మొహంతో….”ఇదే రకం  చీర నువ్వు ఇందాక చూపించిన కలర్ లో కావాలి. తెస్తే తీసుకుంటాము.మాకు ఇంక ఓపిక లేదు.”తృప్తిగా చెప్పారు…..మొసళ్ళ చెరువులో దూకి తామర పువ్వు తీసుకు రమ్మన్నట్లు .పాపం కళ్ళు తిరుగుతున్నాయి ఆ అబ్బాయికి…

శక్తి ఉడిగి పాత అతని వైపు చూసాడు”కావవే వరద …సంరక్షింపు బద్రాత్మక”అతను అభయ హస్తం ఇస్తున్నట్లు దగ్గరకు వచ్చాడు.

మెల్లిగా వాళ్ళ దగ్గరకు వొంగి రహస్యం చెప్పినట్లు చెప్పాడు.

”మేడం మీ లాంటి అభిరుచి గల వాళ్ళను ఇంత వరకు చూడలేదు. మూడు చీరలు ఇప్పుడే వేరే వాళ్ళు పక్కన పెట్టుకొని వెళ్ళారు. కాకుంటే వాళ్లకు ఏమి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.” జాలి కలిగేటట్లు చెప్పాడు.

”ఏవి చూపించు ”ఆసక్తిగా అడిగారు.

చూపించాడు. ఇంతలో పక్కన కొనే ఆడవాళ్ళు అసక్తిగా చూసారు ఇటు వైపు. టకీమని దాచి పెట్టేసారు చూడకుండా….ఇవే కావాలి ప్యాక్ చేయించు

బోలేడు ఉత్సాహంతో హమ్మయ్య అనుకోని బతుకు జీవుడా అనుకుంటూ

వెళ్ళాడు కొత్త సేల్స్ మాన్  ……

.కాలనీ లో ఇంకో ఇంట్లో ….ఇంకో అలక రంగం ప్రారంభం….చీర కోసం .

 

@@@@@@@@

వాయువు

రచన:  రసజ్ఞ

 

పంచభూతాలలో రెండవది, మానవ మనుగడకి అత్యంత ఆవశ్యకమయినది వాయువు. దీనినే వ్యవహారికంగా గాలి అంటాము. దీనికి శబ్ద, స్పర్శ అనెడి ద్విగుణాలున్నాయి. భాగవతం ప్రకారం ఆకాశం నుండీ వాయువు ఉద్భవించినది. వాయువుకి అధిదేవత వాయుదేవుడు. ఈయన వాయువ్యానికి దిక్పాలకుడు. ఈయన భార్య అంజన, వాహనం దుప్పి, ఆయుధం ధ్వజం, నివాసము గంధవతి. తైత్తరీయోపనిషత్తులో వాయువుని “త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి” (నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి) అని సంబోధించారు. సర్వదా చరిస్తూ ప్రతీచోటా నిండి ఉన్నా, వాయు ప్రవర్తన అన్ని వేళలా ఒకే విధముగా ఉండదు. ప్రాణవాయువై ప్రాణులకి జీవాన్ని పోస్తుంది, ఎన్నో వ్యాధుల నుండీ రక్షణనిస్తూ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, పిల్ల తెమ్మెరలతో మానసికోల్లాసాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగిస్తుంది, బరువెక్కిన మేఘాలను ఆత్మీయంగా తాకి వర్షాలను కురిపిస్తుంది, ఎన్నో కబుర్లను, రుచులను చేరవేస్తుంది, వెదురులో చేరి సంగీతాన్ని పలికిస్తుంది, అప్పుడప్పుడు భయంకరంగా మారి భీభత్సాలను, ఉత్పాతాలను సృష్టిస్తుంది. అందువలననే పర్వతాలను, భూమిని సైతం పెకిలిస్తూ (టెక్టోనిక్ ప్లేట్ లో కదలికలు రావటం వలన భూకంపాలు వస్తాయి) ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయగల వాయు శక్తిని ఒక దేవతగా అభివర్ణించారని ఋగ్వేదంలో చెప్పబడింది. ఈ వాయువు యొక్క గుణాలను ఆధారంగా చేసుకుంటే ఇవి దేవయానాలు (రాజస గుణ వాయువులు), పితృయానాలు (తామస గుణ వాయువులు) అని రెండు రకాలుగా ఉంటాయి.

వాయువులని మరుత్తులు అని కూడా అంటారు. వీరి జనన, నామకరణ వృత్తాంతం అంతా రామాయణంలో బాలకాండలో విశాలనగరంలో దితి తపస్సు చేసిన చోటుని చూసిన రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు చెప్తునట్టు వస్తుంది. ఆ ప్రకారముగా, దేవ దానవ యుద్ధములో దానవులంతా ఇంద్రుడి చేత సంహరింపబడితే, ఆ బాధతో, పగతో, దితి తన భర్తయిన కశ్యప ప్రజాపతిని శక్ర హంతారం (ఇంద్రుడిని చంపే కొడుకు) కావాలంటుంది. దానికాయన వెయ్యి సంవత్సరాలు నియమ నిష్టలతో, శుచిగా తపోనిష్టలో ఉంటే అటువంటి పుత్రుడు పుడతాడు అని వరమిస్తూ దితిని స్పృశించి తపస్సుకి వెళిపోతాడు. ఇంద్రుని మీద పగ తీర్చుకోవాలని శుక్లప్లవనమునకు వెళ్ళి తపస్సు మొదలుపెడుతుంది దితి. ఆమెకు ఎన్నో సపరియలు చేస్తూ ఆమె తపస్సు చేస్తున్న ఆశ్రమంలోనే ఇంద్రుడు ఆమెను కనిపెట్టుకుని ఉంటాడు. ఇహ తపస్సు పూర్తవ్వడానికి సరిగ్గా పది సంవత్సరాలు ఉందనగా (అనగా ౯౯౦ సంవత్సరాలు గడిచాక) దితి కాళ్ళు పెట్టుకునే వైపు తల పెట్టుకుని నిద్రపోతుంది. అది చేయకూడని పని కనుక ఆమె అశుచి అవుతుంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి గర్భంలోని పిండాన్ని ఏడు ముక్కలు క్రింద కోసేస్తాడు. ఆ నొప్పికి తట్టుకోలేని పిండాలు ఏడుస్తుంటే ఇంద్రుడు “మా రుద” (ఏడవద్దు) అని అంటాడు. ఇదంతా తన గర్భంలో జరిగేసరికి దితికి మెలకువ వచ్చి ఇంద్రుడిని బయటకి రమ్మంటుంది. బయటకి వచ్చిన ఇంద్రుడు తన తప్పేమీ లేదనీ, ఆమె అశుచి అవ్వటం వలనే ఇలా చెయ్యవలసి వచ్చిందనీ చెప్తాడు. అది విన్న దితి తన తప్పుని ఒప్పుకుని, తన గర్భస్థ పిండాన్ని చంపినందుకు గాను ఇంద్రుడిని వరం కోరుకుంటుంది.

” బ్రహ్మలోకం చరత్వేకః ఇంద్రలోకే తధాపరః
దివి వాయురితి ఖ్యాతః త్రితయోపి మహాశయాః
చత్వారస్తు సురశ్రేష్ఠ దిశోవై తవశాసనాత్
సంచరిష్యతి భద్రంతే దేవభూతాః మమాత్మజాః
స్వత్కృతేనైవ నామ్నా మారుతాయితి విశృతాః “

ఆ ఏడుగురిలో ఒకరు బ్రహ్మలోకంలో, ఇంకొకరు ఇంద్రలోకములో, మరొకరు భూమి మీద వాయువు అనే పేరుతో ఉంటూ ఈ ముగ్గురూ మహాయశస్సు పొందాలి. మిగిలిన నలుగురూ నాలుగు దిక్కులలో ఉంటూ నువ్వు చెప్పినట్టు వింటూ ఉండేలా చేసి వీరందరినీ దేవతా గణాలలో చేర్చుకో. వీరిని “మా రుద” అని నువ్వు అన్నట్టే మరుత్తులుగా నిశ్చయించాను. ఇకనించీ వీరంతా మారుదులు (మారుతులు) లేదా మరుత్తులుగా ఖ్యాతి పొందేలా చేయి అని కోరుకుంటుంది. దానికి అంగీకరించిన ఇంద్రుడు అలానే దీవిస్తాడు. ఆ విధముగా ఒక రాక్షసుడు కావలసిన వాడు ఏడు దేవతా గణాలు అయ్యి మరుత్తులు జన్మించారు.

 

విష్ణు పురాణం ప్రకారం ఈ ఏడుగురి పేర్లూ అవహము, ప్రవహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము, పరావహము.

అవహము: మేఘ మండలానికీ, భూమండలానికీ మధ్యన ధ్వనిస్తూ, అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఈ వాయువు వలననే సూర్యచంద్రులు, నక్షత్రాల గమనాలు (ఉదయించటం, అస్తమించటం) జరుగుతాయి.

ప్రవహము: సూర్య మండలానికీ, మేఘ మండలానికీ మధ్యన ఉంటుంది. మెరుపు మెరిసినప్పుడు ఆ మెరుపుకి వచ్చే కాంతి ఏదయితే ఉందో అది ఈ వాయువు వలననే కలుగుతుంది.

సంవహము: నక్షత్ర మండలానికీ, చంద్ర మండలానికీ మధ్యన ఉంటుంది. అసామాన్యమయిన వేగాన్ని కలిగి పర్వతాలను సైతం నుజ్జు నుజ్జు చేసే శక్తి కలిగి ఉంటుంది. వృక్షాలలో, చెట్లలో జీవరసం ఏర్పడటానికి ప్రధానమయినది కూడా ఇదే అవటం విశేషం.

ఉద్వహము:  చంద్ర మండలానికీ, సూర్య మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువు చాలా బలమయినది. మేఘాలు వర్షించేలా చేయటమే కాక దేవ విమానాలను (పుష్పక విమానం, మొ) నడిపేది కూడా ఈ వాయువే.

వివహము: గ్రహ మండలానికీ, నక్షత్ర మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువు దివ్యజలాలకు (ఆకాశగంగ, మొ) నిలయం. అమృత నిధి అయిన చంద్రుడు చల్లగా ఉండటానికీ, సూర్య రశ్మి భూమిని చేరటానికి కూడా ఈయనే కారణం.

పరివహము: ధృవ మండలానికీ, సప్తర్షి మండలానికీ మధ్యన ఉంటుంది. ప్రాణాధారుల (ప్రాణము కలిగి ఉన్న ప్రతీదీ) ప్రాణాలను చివరి దశలో తొలగించేది ఇదే. ఈ (పరివహ) వాయు ధర్మం ప్రకారమే మృత్యువు, యముడు నడుచుకుంటారు.

పరావహము: సప్తర్షి మండలానికీ, గ్రహ మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువును ఎవరూ అతిక్రమించలేరు అంటూ వీరు నిత్యం నెరవేరుస్తున్న కార్యాలను నారద పురాణము వివరిస్తోంది.

దితి పుత్రులు మరుత్తులు అయ్యారు అని తెలిసింది కదా! మరి దితికి (వైవస్వత మన్వంతరానికి) ముందు ఉన్న మన్వంతరాలలో మరుత్తులు ఎవరు? అన్న సందేహం ఒకసారి నారద మహామునికి కలిగి, పులస్త్యుని వద్ద వ్యక్తం చేస్తాడు. దానికి సమాధానంగా పులస్త్యుడు ప్రతీ మన్వంతరంలో వారి జన్మ వృత్తాంతాలను వివరిస్తాడు.

స్వాయంభువ మన్వంతరం: స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు, అతని కుమారుడు సవనుడు. ఈ సవనుడు పిల్లలు లేకుండానే మరణిస్తాడు. దానితో అతని భార్య సుదేవ (సునాభ కుమార్తె) పిల్లలు లేకుండానే చనిపోయాడే అని బాధపడుతుంది. అప్పుడు అశరీరవాణి చెప్పినట్టుగా భర్త చితి మీద ఈమె కూడా కూర్చుని దగ్ధమవుతుంది (సతీ సహగమనం అనమాట). అప్పుడు ఈ దంపతులిరువురూ ఆకాశానికి ఎగిరి వెళ్ళి, అక్కడ సంభోగం చెందగా వచ్చిన శుక్రం ఆకాశం నుండి జారి భూమి మీద పడిపోతుంది. అలా జరగగానే వీరిరువురూ బ్రహ్మ లోకానికి వెళిపోతారు. అయితే ఆకాశం నుండి జారి పద్మంలో పడిన ఆ శుక్రాన్ని సమాన, నళిని, వపుష్మతి, చిత్ర, విశాల, హరిత, అళిని అనే సప్తర్షుల భార్యలు అమృతమని భ్రమపడి, దానిని త్రాగవలెను అన్న కోరికను వారి భర్తలతో చెప్పి, భర్తలను పూజించి త్రాగేస్తారు. త్రాగిన వెంటనే వారంతా బ్రహ్మ తేజాన్ని కోల్పోతారు. అలా దూషిత శీలలు అయిన ఈ ఏడుగురినీ తమ భర్తలు వదిలేస్తారు. ఆ ఏడుగురికీ పుట్టిన పిల్లలు భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. వారిని “మా రుద” (ఏడవద్దు) అనటం వలన వారు మరుత్తులుగా స్థిరపడ్డారు. ఆ విధముగా స్వయంభువ మన్వంతరంలో వెలసిన వారు ఆది మరుత్తులు.

స్వారోచిష మన్వంతరం: స్వారోచిష మనువు కుమారుడు క్రతుధ్వజుడు. అతని ఏడుగురు కుమారులూ (అగ్ని సమానులు) ఇంద్రపదవి కోసం బ్రహ్మను గూర్చి తపస్సు చేయటానికి మహా మేరు గిరికి వెళతారు. ఈ విషయం తెలిసి భయపడిన ఇంద్రుడు తపోభంగం కలిగించడానికి అప్సరసలలో శ్రేష్ఠురాలయిన పూతనను పంపిస్తాడు. క్రతుధ్వజుని ఏడుగురు కుమారులూ నదిలో స్నానమాచరిస్తున్న సమయములో పూతన కూడా అదే నదిలో స్నానమాచరించడంతో వీరి మనసు అదుపు తప్పి వారి వీర్యం ఆ నదిలో పడిపోతుంది. ఈ విధముగా తపోభ్రష్టులయిన ఆ ఏడుగురూ తమ రాజ్యానికి వెళిపోతారు. నదిలో పడిన వీరి వీర్యం మహాశంఖుడు అనే మొసలి భార్య శంఖిని మ్రింగేస్తుంది. కొన్ని రోజులకి జాలరి వాళ్లకి ఈ మొసలి (శంఖిని) దొరకడంతో క్రతుధ్వజునికి ఆజ్ఞ ప్రకారంగా ఆ మొసలిని తీసుకెళ్ళి వారి ఇంటి వద్దన ఉన్న బావిలో వేస్తారు. కొంత కాలానికి ఆ శంఖినికి ఏడుగురు పిల్లలు పుడతారు. వారు గట్టిగా, భయంకరంగా ఏడుస్తూ ఉండగా “మా రుద” (ఏడవద్దు) అనటం వలన వారు మరుత్తులుగా స్థిరపడ్డారు.

ఉత్తమ మన్వంతరం: నిషధ దేశాధిపతి వపుష్మానుని పుత్రుడైన జ్యోతిష్మంతుడు పిల్లల కోసం మందాకినీ నదీ తీరంలో తపస్సు చేస్తుండగా అతని భార్య సుందరి (దేవ గురువు పుత్రిక) కూడా భర్తకు పరిచర్యలు చేస్తూ, సమిధలు, పుష్ప ఫలాలు సమకూరుస్తూ ఆమె కూడా అరణ్యవాసం చేస్తుంది. దీని వలన ఆమె బాగా కృశించి, శల్యమై పోతుంది. తపస్తేజముతో వనములో తిరుగుతున్న ఈమెను చూసిన సప్తర్షులు “మీ సద్గుణాలకు మా అనుగ్రహం తోడై మీ కోరిక నెరవేరి, పుత్ర సంతానం కలుగుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి” అని వరమిస్తారు. వారివురూ వారి ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులకి ఆవిడ గర్భం ధరించడం, భర్త మరణించడం, అది సహించలేని ఆవిడ కూడా సహగమనానికి సిద్ధపడి, తన భర్త చితాగ్నిలో దూకేయటం జరుగుతాయి. అలా దూకటం వలన ఆమె గర్భములో నుండీ ఒక మాంస ఖండం ఎగిరి బయట నీళ్ళల్లో పడి, శైతల్యానికి ఏడు భాగాలుగా విడిపోతుంది. దాని నుండీ ఉద్భవించిన వారే మరుత్తులు.

తామన మన్వంతరం: ఋతుధ్వజుడు అనే రాజు కుమారుల కోసం యజ్ఞం మొదలు పెట్టి, అగ్నిలో తన రక్త, మాంస, అస్థి, రోమ, కేశ, స్నాయువు, మజ్జ, శుక్రం, అన్నిటినీ హోమం చేస్తాడు. సరిగ్గా శుక్రం అగ్నిలో వేసే సమయములో “వద్దు వద్దు వేయద్దు” అనే మాటలు వినపడతాయి. వెంటనే ఆ రాజు చనిపోతాడు. దానితో ఆ అగ్ని (హవ్య వాహనుడు) నుండీ ఎంతో తేజస్సుతో ఏడుగురు శిశువులు ఏడుస్తూ బయట పడతారు. వారే మరుత్తులు.

రైవత మన్వంతరం: రైవతుని వంశంలో రిపుజిత్తనే రాజు, పుత్రులు లేనందున భాస్కరుని ఉపాసించి సురతి అనే పుత్రికను పొందుతాడు. వారివురూ ఒకరి పట్ల మరొకరు ఎంతో వాత్సల్యంతో ఉండేవారు. కొన్నాళ్ళకి రిపుజిత్తు మరణించగా, పితృ వియోగాన్ని భరించలేని ఆమె, సప్తర్షులు వద్దని వారిస్తున్నా వినకుండా చితిని పేర్చుకుని అందులో దగ్ధమవుతుంది. తగలబడుతున్న ఆమె శరీరం నుండీ ఏడుగురు బాలకులు ఉద్భవించగా, వారికి బ్రహ్మ మరుత్తులు అని నామకరణం చేసి దేవతా గణాలలో చేరుస్తాడు. అలా రైవత మన్వంతరంలో మరుద్గణాలు వెలిశారు.

చాక్షుష మన్వంతరం: సప్త సారస్వత తీర్థంలో శుచి వ్రతుడు, సత్యవాది అయిన మంకి అనే తపోధనుడు ఘోరతపస్సులో ఉండగా విఘ్నం కలిగించడానికి తుషితదేవతలు వపు అనే సుందరిని పంపిస్తారు. వపు ఆయన మనస్సును లోబరచుకోగా, ఆయన వశం తప్పడం వలన శుక్రం జారి ఆ సప్త సారస్వత జలాలలో పడుతుంది. వెంటనే తెలివి తెచ్చుకున్న ఆయన ఆగ్రహించి వపును శపించి, తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ జలములో నుండీ ఏడుగురు పుత్రులు ఏడుస్తూ జన్మిస్తారు. వారే ఆ మన్వంతరంలో మరుత్తులు.

ఈ విధముగా ఒక్కో మన్వంతరంలో ఒక్కో విధముగా మరుత్తులు ఉద్భవించారు. అయితే ప్రతీ సారీ కూడా మా రుద (ఏడవకు) అనటం వలనే మరుత్తులు అయ్యారని తెలుస్తోంది. మరుత్తుల జన్మ వృత్తాంతాన్ని విన్నా, చదివినా పాప పరిహారం కలుగుతుందని వామన పురాణములో వివరించబడింది.

అగ్ని పురాణం ప్రకారం మన శరీరంలో ఉండే మూలాధార చక్రం నుండీ నాడులు బయలుదేరతాయి. వీటిలో ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వా, పృథా, యశా, ఆలంబుషా, కుహూ, శంఖిని అనేవి ప్రాణ వాయువులని ప్రసారం చేస్తాయి కావున ప్రముఖమయినవి. ఆ పది రకాల ప్రాణ వాయువులూ ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయాలు. వీటి స్థాన చలనాలు:

 

” హృది ప్రాణం గుదేపానం ఉదానో నాభి దేశకః
సమానో కంఠ దేశస్థః వ్యాన సర్వ శరీరగః
వాగ్ద్వారే నాగ ఆఖ్యాతః కూర్మాదున్మీలనం స్మృతం
కృకరాత్ క్షుధాజ్ఞేయః దేవదత్తాత్ విజృంభణం
మృతస్యాపి న జహాతి సర్వవ్యాపి ధనంజయః “

ప్రాణ వాయువు: హృదయంలో ఉంటూ జీవాత్మను వృద్ధి చేస్తుంది. ఇది శరీరంలో ఉండే శూన్యత్వాన్ని పూర్తి చేస్తూ మిగతా ప్రాణ వాయువులన్నిటినీ ప్రేరేపిస్తూ ఉంటుంది కావున ఇది మిగతా వాయువులన్నిటికీ అధిపతి. మన శ్వాస రూపములో ఉండేది ఈ వాయువే. ప్రాణి ఆయుర్దాయం తను తీసుకునే ఉచ్ఛ్వాశ, నిశ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని ప్రాణాయామం ద్వారా అదుపు చేయగలిగితే మనిషి ఆయుర్దాయం పొడిగించవచ్చును.

అపాన వాయువు: ఇది శరీరములో పశ్చిమ భాగములో (గుదము వద్ద) ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి, మల, మూత్ర, శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. అపానయానం (తొలగించటం) చేస్తుంది కనుక అపాన వాయువు అయ్యింది.

ఉదాన వాయువు: ఇది నాభి (బొడ్డు) వద్ద ఉంటూ దేహములో సగ భాగాన్ని పెంచుతుంది. స్పందన (ముఖ, పెదాల, కళ్ళ కదలికలు, మొ.,) కలిగించే వాయువు ఉదానము.

సమాన వాయువు: ఇది కంఠము వద్ద ఉంటూ సర్వ నాడుల పని తీరుని చూసుకుంటుంది. తిన్న ఆహారాన్నీ, త్రాగిన ద్రవాలనీ, వాసన చూసిన వాటినీ రక్త, పిత్త, వాత, కఫములుగా మార్చి సర్వాంగాలకూ సమానముగా పంచుతుంది కనుక సమాన వాయువు అయ్యింది.

వ్యాన వాయువు: ఇది శరీరమంతా ఉంటుంది. శరీర భాగాలను పీడించటం, గొంతు బొంగురు పోయేలా చేయటం, వ్యాధిని ప్రకోపించటం దీని విధులు. వ్యాపన శీలంతో ఉండటం వలన వ్యానము అయ్యింది.

 

ఈ అయిదూ ప్రధాన వాయువులు కాగా మిగతా అయిదూ ఉప వాయువులు. అవే నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలు. వాగ్ద్వారము వద్దన ఉండి మాట వచ్చేలా చేసేది, త్రేన్పు, వాంతి వంటివి తెప్పించేది నాగ వాయువు. కూర్మ వాయువు మనం తిన్నవాటినీ, త్రాగినవాటినీ, మ్రింగటానికే కాక కను రెప్పలు మూసి, తెరవటానికి ఉపయోగపడుతుంది. ఆకలి, దాహం మొదలయిన వాటిని కలిగించేది, తుమ్ము తెప్పించేది కృకర వాయువు. ఆవలింతలు తెప్పించేది దేవదత్త వాయువు. ఇహ మనిషి చనిపోయాక కూడా మానవ శరీరంలోనే కొంతసేపు ఉండగలిగే వాయువు ధనంజయ వాయువు. ఈ ధనంజయ వాయువు వలననే చనిపోయిన శవం కొంతసేపటి తరువాత ఉబ్బుతుంది. ఇవే కాక, ప్రజాపత్య వాయువు అని ఒకటుంటుంది. ఆ వాయు పీడనం వలననే శిశువు తల్లి గర్భము నుండీ బయటకు వస్తుందనీ మార్కండేయ పురాణం చెప్తోంది. ఇలా బయటకు వచ్చే ప్రక్రియలో అలసిపోయిన శిశువుకు ఉత్తేజాన్ని ఇచ్చేది కూడా వాయువే కదా! అలసిన ఒంటికి చక్కని లాలన వాయువు.

 

అథర్వణ వేదంలో మరికొన్ని వాయువుల ప్రస్తావన ఉంది. అవి: సుదనవ వాయువు (మనలో భక్తి భావాన్ని పెంచుతుంది), చిత్రభనవ వాయువు (అగ్నితో మమేకం అవుతుంది), హస్తిన వాయువు (అతి వేగముతో ప్రయాణిస్తూ ఈదురుగాలులను, సుడిగాలులను కలిగిస్తుంది), అహిమన్యవ వాయువు (ఇక వర్షాన్ని కురిపించు అని చెప్పడానికి సంకేతంగా మేఘాన్ని తాకి తొలి చినుకులను విడుదల చేస్తుంది), యువన వాయువు (ఈ వాయువు కారణంగానే మెరుపులు చలిస్తాయి), అధిగ్రవ వాయువు (అపారమయిన ధైర్యాన్ని, శత్రువులని ఎదిరించి నిలబడే సామర్ధ్యాన్నీ ఇస్తుంది), అజ్జోభి వాయువు (అగ్ని త్యాగాలు అనగా సహగమనాలు, అగ్ని ప్రవేశాలు, మొ., వాటిలో ఉంటుంది), వక్షసు వాయువు  (వక్షస్థలం వద్ద ఉంటుంది), చిత్రేయ వాయువు (ఇది కాళ్ళూ, చేతులూ కదల్చడానికి ఉపయోగపడుతుంది), నిమిముక్షు వాయువు (వేటినయినా దగ్గరకి చేర్చడానికి ఉపయోగపడుతుంది, మండేటప్పుడు ఒక్కో అగ్ని కణాన్నీ, వాన కురిసేటప్పుడు మేఘాలనీ దగ్గరకు చేర్చే ముఖ్య వాయువు ఇదే), హిరణ్యేయ వాయువు (దీనినే హిరణ్యేయం అని కూడా అంటారు. ఏ రూపంతోనూ చేరకుండా, పరిభ్రమిస్తూ ఉంటుంది), నర వాయువు (ఇది ఏదో ఒక రూపముతో కలుస్తుంది. అగ్నితో కలిసినప్పుడు “అస్య” అనీ, సూర్యునితో కలిసినప్పుడు “కుక్షి” అనీ రక రకాలుగా పిలుస్తారు), అజ్ర వాయువు (ఎక్కువగా రాత్రిపూట చలిస్తుంది), ఇలా ఎన్నో రకాల వాయువులు మన చుట్టూ ఉంటూ మనకు పరి పరి విధాలుగా ఉపయోగపడుతున్నాయి.

 

పంచభూతాలు ఒకదాని నుంచి మరొకటి ఏర్పడతాయి, ఒక దానితో మరొకటి హరింపబడతాయి, అలానే అదే క్రమములో పునరావృతం అవుతాయి. ఈ మార్పులన్నీ జరగడానికి ముఖ్య కారణం ప్రాణశక్తి. మానవ శరీరం కూడా పంచ భూతాలతో చేసినదే కనుక మనలో ఉండే పంచభూతాలను నడిపేది కూడా ప్రాణశక్తే. మన దేహం అస్వస్థతకు లోనవడానికి ఈ ప్రాణశక్తిలో వచ్చే మార్పులే కారణం. శరీరంలో ఏ భాగానికయినా తగినంత ప్రాణశక్తి అందనప్పుడు (క్రమేణా ఆ భాగం నిర్వీర్యమవుతుంది) లేదా అవసరానికి మించి ప్రాణశక్తి లభించినప్పుడు (అధిక శ్రమకు లోనై) అనారోగ్యం వస్తుంది. ఈ అసమతుల్యాన్ని నివారించాలంటే మనలోని వాయువులన్నీ సక్రమంగా పని చేస్తూ సమతుల్యతతో ఉండాలి. అప్పుడే మన శరీర భాగాల పనితీరు సవ్యంగా ఉండి, సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. అదే విధముగా మన పర్యావరణం కూడా సక్రమంగా పని చేస్తూ, ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా వాయువులన్నీ సమతుల్యతతోనే ఉండాలి. అప్పుడే సుభిక్షతతో వర్ధిల్లుతాము.

 

“ధ్వజ హస్తాయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్”

 

 

వన్ బై టు కాఫీ

రచన  – భండారు శ్రీనివాసరావు

 

నలభై ఏళ్ళ కిందటి మాట.

 

ఆ రోజుల్లో విజయవాడ గాంధీ నగరంలోని వెల్ కం హోటలుకు కాఫీ తాగడానికి ఓ రోజు వెళ్లాను. నా పక్క టేబుల్ దగ్గర కూర్చున్న ఓ పెద్ద మనిషి ప్రవర్తన నన్ను ఆకర్షించింది. సర్వర్ ను పిలిచి వన్ బై టు కాఫీ తెమ్మన్నాడు. ఆయన వెంట మరెవరయినా వున్నారా అని చూసాను. ఎవరూ లేరు. ఆయన ఒక్కడే రెండు కప్పుల్లో తెచ్చిన ఒక్క కాఫీని కాసేపు అటూ ఇటూ మార్చుకుంటూ తాగి వెళ్ళిపోయాడు.

 

మరో సారి కూడా ఆ హోటల్లో అదే పెద్దమనిషి తారస పడ్డాడు. మళ్ళీ అదే సీను. ఒక్కడే మనిషి. వన్ బై టు కాఫీ. ఇక మనసు ఉగ్గపట్టుకోలేకపోయాను. కలిసి కదిలిస్తే కదిలిన కధ ఇది.

 

ఆయనో ఎలిమెంటరీ స్కూలు మాస్టారు. ఒక్కడే కొడుకు. లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతీ దేవి కరుణ అపారం. క్లాసులో ఫస్ట్. స్కూల్లో ఫస్ట్. హోల్ మొత్తం ఆ ఏరియాలోనే చదువులో ఫస్ట్. ఇరుగు పొరుగు పిల్లాడిని మెచ్చుకుంటూ మాట్లాడే మాటలే వాళ్లకు కొండంత బలం ఇచ్చేవి. ‘పిల్లాడంటే మీ వాడు మాస్టారు. మా పిల్లలూ వున్నారు ఎందుకు తిండి దండగ” అంటుంటే ఆ తలిదండ్రులు మురిసి ముక్కచెక్కలయ్యేవారు.

 

కొడుకు చదువుపై మాస్టారికి కాణీ ఖర్చు లేదు. అంతా స్కాలర్ షిప్పుల మీదనే నడిచిపోయింది. అతగాడు కూడా – చిన్న చదువులప్పుడు మాత్రమే కనిపెంచిన వారితో కలసి వున్నాడు. ఆ తరువాత పొరుగూర్లలోని పెద్ద కాలేజీల్లో పెద్ద చదువులు చదివాడు. కొన్నాళ్ళకు అవీ అయిపోయాయి. పై చదువులు చదవడానికి ఈ చిన్న దేశం సరిపోలేదు. అమెరికా వెళ్లాడు. అక్కడా చదువులో మెరిక అనిపించుకున్నాడు. ఆ చదువులకు తగ్గ పెద్ద ఉద్యోగం అక్కడే దొరికింది. కానీ, ఇండియాకు వచ్చి తలిదండ్రులను చూసే తీరిక దొరకలేదు. అది దొరికే లోపలే అక్కడే ఓ దొరసానిని పెళ్ళిచేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ల ఫోటోలు చూపిస్తూ ‘మా మనవళ్ళు’ అని వూళ్ళో వాళ్లకు చెప్పుకుని మురవడమే ఆ ముసలి తలిదండ్రులకు మిగిలింది. డబ్బుకు కొదవలేదు. అమెరికా నుంచి వచ్చిన డాలర్లు ఇండియా బ్యాంకులో రూపాయల పిల్లలు పెడుతున్నాయి. కానీ ఒక్కగానొక్క పిల్లాడు కళ్ళెదుట లేకుండా, ఎక్కడో దూరంగా వుంటూ పంపే ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియని పరిస్తితి. ఇది వాళ్లకు కొత్తేమీ కాదు. చిన్నప్పటినుంచి చదువుల పేరుతొ పరాయి చోట్లనే పెరిగాడు. పట్టుమని పది రోజులు కలసివున్నది లేదు.

 

పరాయి దేశంలో వున్న వాళ్లు  ‘ఇంకా వస్తారు వస్తారు’ అనుకుంటూ వుండగానే, పిల్లాడిని, వాడి పిల్లల్ని కళ్ళారా చూడకుండానే ఆ కన్న తల్లి కన్ను మూసింది.

 

కబురు తెలిసి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని అమెరికానుంచి ఆర్చుకుని, తీర్చుకుని వచ్చేసరికే కర్మకాండ అంతా ముగిసిపోయింది.

 

వచ్చిన వాళ్లకు ఇంట్లో సౌకర్యంగా వుండదని వున్న నాలుగు రోజులు పెద్ద హోటల్లో గదులు అద్దెకు తీసుకుని వున్నారు. మనుమళ్లని దగ్గరకు తీసుకోవాలని వున్నా ఏదో జంకు. ‘తిస్ యువర్ గ్రాండ్ పా’ అని తండ్రి పరిచయం చేస్తే ‘య్యా! హౌ డూ’ అని పలకరించారు. వాళ్లు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే జవాబు చెప్పలేని అశక్తత. రెండో తరగతి టిక్కెట్టు కొనుక్కుని ఫస్ట్ క్లాసులో ప్రయాణిస్తున్న అనుభూతి.

 

అమెరికా తమతో రమ్మన్నారు. తాను రానన్నాడు. భార్య కలిసిన మట్టిలోనే కలసిపోవాలన్నది తన కోరిక.

 

వొంటరి జీవితంతో వొంటరి పోరాటం మళ్ళీ మొదలు.

 

కానీ, ఈసారి మొదలుపెట్టే జీవన యానంలో తాను వొంటరి కాదు. తనతో పాటు మరొకరు వున్నారు.

ఆ వ్యక్తి పర లోకానికి వెళ్ళిన భార్యా? పరాయి  దేశానికి వెళ్ళిన కొడుకా? యేమో.

 

‘అందుకే ఈ వన్ బై టు కాఫీ’ ముగించాడు ముసలాయన.

ఇలాగే ఇలాగే సరాగమాడితే..

 

రచన – మధురవాణి

 

“ఇదిగో చిట్టెమ్మా.. ఆ అంట్లు కడిగే పని తర్వాత చూడొచ్చు గానీ ముందు నువ్వు ఈ టిఫినూ, కాఫీ పట్టుకెళ్ళి ఉత్తరపు గదిలో ఉన్న చుట్టాలకిచ్చిరా.. అలాగే, వచ్చేటప్పుడు ఆ పక్క గదిలో మన చిన్న రాకుమారి గారి మేలుకొలుపు సేవ కూడా చూడు.. పది నిమిషాల్లో నేనటొచ్చేసరికి దాన్ని మంచం మీద కనపడకూడదన్నానని గట్టిగా చెప్పు..”

“అమ్మాయ్ సంధ్యా.. ఇలా రా.. తలకి కొబ్బరినూనె పెడతాను. ఇదిగో.. ఈ పనయ్యాక చిట్టెమ్మ చేత టిఫిను పంపిస్తాను గానీ అది తినేసి స్నానం చేసి అల్మారాలో పెట్టి ఉంచిన చిలకపచ్చ రంగు సిల్కు లంగావోణీ వేసుకుని తయారుగా ఉండు. తొమ్మిదిన్నరకల్లా రమ్మనమని రత్న పిన్ని చెప్పింది. అక్కడ పెళ్లి కూతురిని చేశాక మళ్ళీ మంగళ స్నానం అదీ అయ్యాక కట్టుకోడానికి పిన్ని కొత్త చీర సిద్ధం చేసుంచిందట. ఇందాకే ఫోనులో మళ్ళీ చెప్పింది. నేనెళ్ళి ముందు మన రాకాసిని నిద్ర లేపి బయలుదేరదీస్తాను. ఇప్పటి నుంచి మొదలెడితే అప్పటికి గానీ తెమలదు గారాల తల్లి..”

“ఇదిగో.. చిట్టెమ్మా.. టిఫినుతో పాటూ, మంచినీళ్ళూ, కాఫీలూ అన్నీ సరిగ్గా అమర్చి పెట్టి వచ్చావా అందరికీ.. చిత్ర నిద్ర లేచిందా?”

“ఆ.. అన్నీ సర్దిపెట్టానండీ.. చిన్నపాప గదిలో కనిపించలేదండీ..”

“గదిలో లేదా.. లేక ఏమవుతుంది.. కొంపదీసి ఏ స్నానాల గదిలోనో చేరి నిదరోతోందేమో వరాల తల్లి.. అయినా అంత తొందరగా లేచే ఆవకాశం లేదే! సర్లే.. నేనెళ్ళి చూస్తాన్లే గానీ నువ్వు కూడా వెళ్ళి టిఫిను పెట్టుకుని తిని ఆ తర్వాత మిగిలిన అంట్ల పని చూడు.”

“చిత్రా.. చిత్రా.. చిత్రా….

ఓ ఓ ఓ…. రామచంద్రా… ఎవరూ.. నేను చూస్తోంది మా చిత్రనేనా?.. కలగనడం లేదు కదా!”

“నువ్వు మరీనమ్మా.. మరీ అంత ఆశ్చర్యం అక్కర్లేదు. నువ్వు చూస్తోంది నన్నే..”

“ఆశ్చర్యం కాకపోతే మరేవిటే.. రోజూ కనీసం పదిసార్లన్నా పట్టి పట్టి లేపనిదే నిద్ర లేవవు.. ఏవిటీ రోజు విశేషం.. అప్పుడే లేచి తలస్నానం చేసి పట్టు లంగా ఓణీ సింగారిస్తున్నావే.. ఏంటీ కథ!”

“కథా లేదూ.. సినిమా లేదూ.. నువ్వేగా రోజూ తెగ నస పెడుతున్నావ్.. ఇంట్లో అక్క పెళ్లి పెట్టుకుని కనీసం ఈ నాలుగు రోజులన్నా పద్ధతిగా ఆడపిల్లలా ఉండొచ్చుగా.. అని ఓ తెగ ఇదైపోతున్నావ్ కదా! సర్లే పాపమని నేను కష్టపడి నిద్ర లేచి చక్కగా నీకు నచ్చినట్టు తయారై ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ నన్నే అంటావేం?”

“అది సరే.. ఉన్నట్టుండీ.. ఎప్పుడూ లేనిది ఈ లంగా ఓణీ ముస్తాబు మీదకి పోయిందేవిటీ రాణీ గారి మనసు..”

“నువ్వే కదమ్మా.. ఎప్పుడూ గోల పెడుతుంటావూ.. సంప్రదాయం, సంస్కృతీ అనీ.. అదీ గాక మన ఒక్కగానొక్క సొంతక్క పెళ్ళి టైములో కాకపోతే ఇంకెప్పుడు వేసుకోగలం చెప్పు..”

“అబ్బో.. చాలా జ్ఞానం వచ్చేసిందే నీకీ రోజు.. అంతా బానే ఉంది గానీ..”

“అబ్బా.. అమ్మా.. నువ్విక్కడ నాతో సోది పెట్టుకుంటూ కూర్చుంటే ఎలా.. అవతల టైమైపోతోంది.. ముందు నా మువ్వల పట్టీలు తీసివ్వు బీరువాలోంచి. నాకు తెలీదు ఎక్కడున్నాయో.. అమ్మా.. అలాగే.. మరేమో.. నాకు వెండి జడగంటలతో జడేస్తావా ఈ రోజు..”

“ఏవిటే.. ఇవాళ నీకేమైంది.. ఆరోగ్యం బాగానే ఉందా? ఉన్నట్టుండి ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నావేవిటే? పట్టు లంగా ఓణీ ఏంటో, మువ్వల పట్టీలేంటో, జడగంటలేంటో.. అయినా పొరపాటున ఏమన్నా తికమక పడ్డావేమో.. ఇప్పుడు పెళ్లి నీక్కాదే అక్కకి కదా!”

“అమ్మా ఆ ఆ ఆ.. నువ్వెప్పుడూ ఇంతే.. లంగా ఓణీ వేసుకోను మొర్రో అంటేనేమో వేసుకోలేదని గోల చేస్తావు.. సరేలే నువ్వు ఆనందిస్తావ్ కదాని ఎంచక్కా నీకు నచ్చినట్టు తయారవుదామనుకుంటే మళ్ళీ నువ్వే ఇలా హింసిస్తావు.. నీ డొక్కు జడ గంటలు నాకేం అక్కర్లేదులే పో.. నేనసలు పిన్ని వాళ్ళింటికి రానిప్పుడు.. ఈ లంగా ఓణీ కూడా తీసేసి జీన్స్ వేసుకుని మరీ పడుకుని నిద్దరపోతా.. పో ఇంక ఇక్కడ నుంచీ.. రాక్షసీ..”

“మరీ అంత బెట్టు అక్కర్లేదులేవే.. ఉన్నట్టుండి ఇంత పెద్ద మార్పేవిటా అని..”

“అదిగో మళ్ళీ ఉన్నట్టుండి అంటావ్.. నువ్వేగా ఇన్ని రోజుల నుంచి నా బుర్ర తినేశావ్.. ఇంతకీ ఇప్పుడు నన్ను బట్టలు మార్చుకోమంటావా వద్దంటావా.. తొందరగా తేల్చు ఏ సంగతీ..”

“అమ్మా.. రాణీకాసుల రంగమ్మా.. ఇప్పుడు నీతో పోట్లాడే ఓపిక నాకు లేదు తల్లీ.. నాకవతల బోల్డు పనుంది. నువ్వెళ్ళి అక్కనడుగు. మువ్వల పట్టీలు తీసిస్తుంది. ఒక్క అరగంట ఆగావంటే ఈ లోపల జుట్టు తడారిపోతుంది. నేనొచ్చి తమరి జడగంటల సింగారం సంగతి చూస్తాను. ఈ లోపు కాస్త టిఫిన్ తినండి నువ్వూ, అక్కా ఇద్దరూనూ.. సరేనా!”

“ఊ.. సర్లే.. నువ్వింత ఇదిగా బతిమాలుతున్నావ్ కాబట్టి.. ఈసారికి లంగా ఓణీ ఉంచుకుంటాలే.. ఇంకా అక్క పెళ్ళికి నాలుగు రోజులుంది కదా.. ఎంచక్కా నాకున్న లంగా ఓణీలన్నీ వేసుకుంటాలే.. ఇంకలా దీనంగా జాలి చూపులు చూడకు పాపం నువ్వు..”

“గడుసు రాకాసీ.. ఏదో పేద్ద నన్ను ఉద్ధరించేస్తున్నట్టూ..”

“అబ్బ.. మరి కాదేంటీ! తల్లిని సంతోషపెట్టడమే కుమార్తె ధర్మము మాతా.. దీనినే మాతృవాక్యపరిపాలన అందురు.. పద పద.. నడువ్ ముందిక్కణ్ణుంచీ.. అవతల టైమైపోతుంటేనూ..”

“అక్కా.. అక్కా.. అక్కోయ్… నా మువ్వల పట్టీలు ఏ కా డా?”

**********

 

“అమ్మా.. మనం పిన్నీ వాళ్ళింటి నుంచీ మళ్ళీ ఇంటికొచ్చేసరికి ఏ టైమవుతుంది.. మధ్యాహ్నం అన్నాల టైముకి వచ్చేస్తామా?”

“ఇప్పుడు వెళ్ళగానే వచ్చిన పేరంటాళ్ళందరితో కలిసి రత్న పిన్ని అక్కని పెళ్లి కూతుర్ని చేస్తుంది. నలుగు పెట్టడం, మంగళ స్నానం అయ్యాక కొత్త చీర కట్టుకుని మళ్ళీ అందరి చేతా పసుపు కుంకుమలూ, గంధాక్షతలూ, ఆశీర్వచనాలూ తీస్కోవాలి. చివర్లో మంగళ హారతి. అన్నట్టు, హారతికి చక్కటి దేవుడి పాటేదన్నా పాడాలి నువ్వు. ఆ తర్వాత పిన్ని భోజనాలు కూడా ఏర్పాటు చేస్తోంది. మీరిద్దరూ అక్కడే ఉండి భోజనాలయ్యాక నెమ్మదిగా రండి. సునందత్త వాళ్ళు వస్తారు మధ్యాహ్నానికి. వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో ఉండకపోతే ఎలా.. అందుకని నేను ముందు ఇంటికెళ్ళిపోయి మళ్ళీ డ్రైవరుని కారిచ్చి పంపిస్తాను. తర్వాత మీరు తీరిగ్గా వద్దురు గానీ.. అన్నట్టు మీరు ఇంటికొచ్చేప్పుడు దారిలో టైలర్ దగ్గరికెళ్ళి మిగిలిన బట్టలు తీసుకుని రండి.”

“అంటే అమ్మా.. నువ్వొక్కదానివీ ఉంటే సరిపోతుందా.. సునందత్త వచ్చేసరికి మేము ఇంట్లో లేకపోతే పాపం అత్త నొచ్చుకోదూ!”

“మరేనమ్మా.. ముద్దుల కోడలివి నువ్వు వాకిట్లో ఎదురొచ్చి స్వాగతం పలకలేదని మీ అత్త ఇంట్లోకి రానని అలిగి వెనక్కి వెళ్ళిపోతుంది పాపం!”

“అయినా అమ్మా.. అసలు నాకో సందేహం.. చిత్ర ఎదురు రాలేదని అత్త నొచ్చుకుంటుందో లేకపోతే..”

“అక్కా.. అసలు అమ్మేం చెప్పిందే నీకు.. పెళ్లి కూతురివి.. నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నట్టు ఎప్పుడూ మూగమొద్దులా నోర్మూసుకు కూర్చోవాలని చెప్పలేదూ! ఎందుకే మధ్యలో వచ్చి మాట్లాడతావూ.. ఇలా అయిందానికీ కానిదానికీ ఓ పడీ పడీ మాట్లాడేస్తుంటే చూసే వాళ్ళందరూ నిన్నసలు పెళ్ళికూతురనుకోరు తెల్సా.. కదా అమ్మా!”

“చూశావామ్మా.. తమరి చిన్న కుమార్తె చిత్రాదేవి వారి గడుసుదనం.. నాకే సుద్దులు చెప్తోంది..”

“సర్లే.. ఇంకాపవే నా మీద చాడీలు చెప్పడం.. అదిగో పిన్ని వాళ్ళ ఇల్లొచ్చేసింది. డ్రైవర్.. ఇక్కడ కారాపు..

ఇదిగో అక్కా.. ముందే చెప్తున్నా నీకు.. ఇంక ఇప్పుడన్నా బుద్ధిగా ఏం మాట్లాడకుండా ఉండు.. అప్పుడందరూ నిన్ను కూడా చిత్రలా మంచమ్మాయి అనుకుంటారు.”

“పిల్ల రాక్షసీ..”

“హి..హ్హి.. హ్హీ..”

**********

 

“సునందత్తా ఆ ఆ… ఎలా ఉన్నావూ..?”

“అబ్బ.. ఊడిపడిందండీ ముద్దుల కోడలూ.. ఏవే.. ఎప్పుడనగా వస్తే ఇప్పుడా కనిపించేది?”

“నన్నేం అనకత్తా.. ఇదిగో అమ్మే.. అక్కతో ఉండు అని నన్నక్కడే వదిలేసి వచ్చింది. పైగా నువ్వు ఎదురేగి స్వాగతం పలక్కపోతే మీ అత్తేం వెనక్కి వెళ్ళిపోతుందా ఏవిటీ? అంది కూడానూ..”

“నిజమా.. ఏం వదినా.. అలా అన్నావా?”

“మరేనమ్మా.. నీ వరాల కోడలు తలచుకుంటే పాతికేళ్ళలో ఎప్పుడూ పల్లెత్తు మాట కూడా అనుకోని మనిద్దరి మధ్యా కురుక్షేత్రం సృష్టించెయ్యగలదు..”

“ఏవే కోడలా.. అంతటి ఘనురాలివా నువ్వు.. మీ అమ్మకి అత్తగారు లేని లోటు తీరుస్తున్నావా అయితే?”

“ఏంటత్తా  నువ్వు కూడా మరీనూ.. ఇంతకీ మావయ్యెక్కడ? నువ్వొక్కదానివే వచ్చావా?”

“మావయ్యకి రావడం కుదరలేదు. రెండ్రోజులాగి వస్తానన్నారు. ఇప్పుడు నేనూ, బావా వచ్చాం.”

“అంతేలే.. అమెరికా నుంచి కొడుకొచ్చేసరికి పాపం మావయ్యని ఒక్కడినీ ఇంట్లో వదిలేసి వచ్చావన్నమాట!”

“మరే.. మీ బావసలే నాలుగేళ్ళకి ఇంటికొచ్చాడు కదా.. అందుకని అమ్మాకొడుకూ ఇద్దరం కలిసి ఎంచక్కా షికార్లు చేద్దామని మధ్యలో మీ మావయ్య ఎందుకులే అడ్డం అని ఆయన్ని ఇంట్లో అట్టిపెట్టేసి వచ్చాం. ఎంతైనా గారాల కోడలివి కదా.. నువ్వెళ్ళి పాపం మీ మావయ్య బాగోగులు చూసుకో అమ్మడూ..”

“ఊ.. దానికేం భాగ్యం.. మావయ్య నన్ను రమ్మని పిలవాలే గానీ వెళ్ళనా ఏంటీ పెద్దా.. మీలాగా కాదమ్మా నేను.. అది సరే గానీ.. ఎక్కడా మీ ఇంటి మునగ చెట్టు..”

“ఇక్కడే ఉండాలే.. ఇంతకు ముందే ఎవరో కుర్రాడు బజారు దాకా వెళ్ళొద్దాం అని పిలిస్తే వెళ్ళినట్టున్నాడు.. కాసేపట్లో వస్తాడులే..”

“అయినా అత్తా.. బావ ఇండియాలో లేకే నాలుగేళ్ళు, ఇంక మా ఊరికి రాక ఐదారేళ్ళ పైనే అయింది కదూ.. అసలు బావకి అందరూ గుర్తున్నారంటావా?”

“ఏమోనమ్మా.. నేనైతే బాగానే గుర్తున్నాను మరి.. నీ సంగతి నాకు తెలీదు.”

“నేనేం నా గురించి అడగట్లేదు.. చుట్టాలందరూ గుర్తున్నారా అని అడుగుతున్నా అంతే.. అయినా మీ మునగ చెట్టుని మాత్రం చూడగానే అందరూ గుర్తు పట్టేస్తారా ఏవిటీ?”

“మునగ చెట్టో, మావిడి చెట్టో నాకేం తెల్సు.. నువ్వే పోల్చుకో వచ్చాక..”

“అసలయినా అప్పట్లోనే పాపం ఎవరింటికెళ్ళినా అందరి గుమ్మాలూ నుదురుకి కొట్టుకునేవి.. ఇంక ఇప్పుడైతే ఎంత ఎత్తైపోయాడో ఏంటో కదా పాపం!”

“ఊ.. మరేనమ్మా పాపం.. నువ్వైతే మీ నాన్ననడిగి ఒక నిచ్చెన తయారు చేయించుకోవాలి మా అబ్బాయితో మాట్లాడాలంటే..”

“అబ్బా.. పోదూ బడాయి.. పేద్ద మీ అబ్బాయి తప్ప ఇంక దేశంలో ఎవరూ ఎత్తైన అబ్బాయిలే లేనట్టు..”

“ఇది మరీ బావుంది.. నువ్వే కదే అడిగావు వాడి సంగతి.. అయినా ఏమనుకుంటున్నావో ఏమో మా కాలనీలో అమ్మాయిలందరికీ మా వాడే హీరో తెలుసా?”

“ఆహా.. అంత లేదు.. మునగ చెట్లూ, వెదురు బద్దలూ ఏ అమ్మాయిలకి అస్సలు నచ్చరు తెలుసా?”

“….”

“ఏంటత్తా.. ఏం మాట్లాడకుండా అలా నవ్వుతావేం? ఆలోచించి చూస్తే పాపం ఎంత మీ అబ్బాయి గురించైనా నీక్కూడా నే చెప్పేది నిజమేననిపిస్తోంది కదూ!

అరే.. ఎందుకలా నవ్వుతున్నావ్? చెప్పత్తా.. చెప్పి నవ్వమ్మా తల్లీ.. అదేంటో చెప్తే మేము కూడా నవ్వుతాం కదా..”

“….”

“అదేంటీ ఏం చెప్పకుండా అలా చూస్తావేం? ఏంటలా అయిపోయావ్.. ఉన్నట్టుండి..”

“మరేం లేదులే.. నీ వెనకాల మునగ చెట్టో మావిడి చెట్టో మొలిచినట్టుంటేనూ..”

“…….”

“ఎవరమ్మా ఈ అమ్మాయి?”

“అదేంట్రా.. నువ్వు గుర్తు పట్టలేదూ? చిన్నప్పుడు బావా బావా అని ఎప్పుడూ నీ చుట్టూనే తిరిగేది, నీతోనే ఆడుకునేది కదరా..”

“ఓ.. తనా.. తనైతే నాకెందుకు గుర్తు లేదు.. చిన్నప్పుడు నాక్కూడా తనంటే చాలా ఇష్టం కదమ్మా.. బావున్నావా సమీరా?”

“అబ్బా.. సమీర కాదురా.. సమీరంటే రాజు మావయ్య వాళ్ళమ్మాయిరా.. వాళ్ళూ ఈ ఊర్లోనే ఉంటారు గానీ ఇప్పుడు మనం వచ్చింది కృష్ణ మావయ్య వాళ్ళ పెద్దమ్మాయి సంధ్య పెళ్ళికి.. ఇది చిత్ర.. వాళ్ళ రెండో అమ్మాయి..”

“ఓహో అవునా.. చూసి చాలా యేళ్ళయిందిగా.. నేను సరిగ్గా పోల్చుకోలేకపోయాన్లేమ్మా..”

“అయినా ఆడపిల్లలు యిట్టే ఎదిగిపోతార్లే.. నువ్వెప్పుడో ఐదారేళ్ళ కిందట చూసినట్టున్నావ్..”

“సారీ చిత్రా.. నిన్ను వెంటనే గుర్తు పట్టలేకపోయాను. ఇప్పుడు ఏం చదువుతున్నావ్ నువ్వు?”

“….”

“ఏం మాట్లాడవేమే కోడలు పిల్లా.. ఇంతసేపూ గవ్వల బొమ్మలా గలగలా మాట్లాడావే..”

“వంటింట్లో నుంచి అమ్మ పిలుస్తున్నట్టుంది అత్తా.. నేను మళ్ళీ వస్తానేం..”

“కూర్చోవే కాసేపు.. చిత్రా.. చిత్రా..”

“ఇదిగో… ఇప్పుడే వస్తానత్తా..”

**********

 

“చిత్రా.. చిత్రా.. ఇంటి ముందు వసారాలో నాన్న అత్తావాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నారు. నువ్వెళ్ళి ఈ ఫలహారాలు అందరికీ ఇచ్చేసి రా.. అలాగే, కాఫీలు ఇప్పుడే కావాలా, కాసేపయ్యాక పంపించమంటారో అడిగేసి రా..”

“నేనే వెళ్ళాలా.. చిట్టెమ్మతో పంపించొచ్చు కదా..”

“అదేంటే అలా అంటావూ.. అత్తావాళ్ళకి మర్యాదలూ అవీ దగ్గరుండి చూస్కోడం మన బాధ్యత కాదూ.. వెళ్ళిరా తల్లీ.. ఇంత చిన్న చిన్న పనులన్నా సాయం చెయ్యకపోతే ఎలా నువ్వసలు. రేపొద్దున్న నన్నంటారు అందరూ ఇంత గారం చేసి కూతుర్ని పెంకిగా తయారు చేసిందని..”

“అబ్బా అమ్మా.. మళ్ళీ క్లాసులు మొదలెట్టకు మాతా.. నేనేం నీ పేరు చెడగొట్టనులే.. ఇప్పుడేంటీ.. ఇవన్నీ తీస్కెళ్ళి అందరికీ ఇచ్చి రావాలంతే కదా.. ఇటివ్వు..”

“ఏంటో పిల్లవి.. అస్సలు అర్థం కావు కదా.. చెంగు చెంగున గంతులేస్తావు.. అంతలోనే చిటపటలాడి పోతావు.”

“నాన్నా.. ఇవిగో.. అమ్మ ఈ స్వీట్స్ ఇచ్చి రమ్మంది.”

“చిత్రా.. నువ్వు కూడా కాసేపు ఇక్కడే కూర్చుని అత్తతో కబుర్లు చెప్పకూడదూ..”

“అదెక్కడ కూర్చుంటుంది అన్నయ్యా.. లేడి పిల్లలా క్షణం కాలు నిలవదు నీ కూతురికి.”

 

“ఇంకేంట్రా కిరీటీ సంగతులు.. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ ఎన్నేళ్ళకి వస్తావు? ఈసారి నీ పెళ్ళికేనా?”

“ఎక్కువ సెలవలు ఉండవు మావయ్యా అక్కడ. ఊరికూరికే రావడానికి వీలుపడదు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇండియాలో మా కంపెనీలో పని ఉండటం వల్ల అనుకోకుండా వచ్చాను. ఇన్ని రోజులు ఉండే వీలు కుదిరింది. ఈ సారి మళ్ళీ మన చిత్ర పెళ్ళికి వస్తాన్లే మావయ్యా.. పెళ్ళి కుదరగానే ముందు నాకే చెప్పండి.”

“ఆడపిల్లల పెళ్ళిళ్ళు వెంట వెంటనే చెయ్యడం అంటే మాటలనుకున్నావురా..”

“ఇప్పుడే చెయ్యమని కాదు మావయ్యా.. ఇప్పట్లో ఉండదు కాబట్టే మళ్ళీ అప్పటికి వస్తానంటున్నా..”

“భలే వాడివేరా నువ్వు.. చూసావా సునందా నీ కొడుకు ఎంత తెలివిగా చెప్పాడో మళ్ళీ ఇప్పుడప్పుడే రానని..”

“ఓ.. మర్చిపోయాను. అమ్మ మళ్ళీ వచ్చి కాఫీలు తీసుకెళ్ళమని చెప్పింది. నేనిక్కడే కూర్చుండిపోయా.. ఇప్పుడే వస్తానత్తా..”

 

“కాఫీలు ఇప్పుడే తెమ్మన్నారా?”

“ఊ.. కానీ నేను తీసుకెళ్ళను. ఈ సారికి నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు. నాకు పనుంది. డాబా ఎక్కి సన్నజాజి మొగ్గలు కోసుకొచ్చుకోవాలి. నే వెళ్తున్నా..”

“అబ్బో.. అదో పెద్ద రాచకార్యం మరి.. అయినా, ఈ పనయ్యాక అది చేస్కోవచ్చుగా..”

“ఉహూ.. నేనిప్పుడే వెళ్తా..”

“సరే నీ ఇష్టం తల్లీ.. నిన్నీ రకంగా నిమిషానికోసారి బతిమాలే బదులు అన్నీ పనులూ నేను చేస్కోడం నయం..”

 

**********

 

“ఓ.. ఇక్కడున్నావా.. నీ కోసం ఇల్లంతా వెతికీ వెతికీ చివరికి డాబా మీదకొచ్చాను తెలుసా!”

“….”

“ఏంటీ.. సన్నజాజి మొగ్గలు కోస్తున్నావా? నీకిష్టమా?”

“……”

“మిస్ చిత్రభాను గారూ.. మిమ్మల్నే పిలిచేది..”

“….”

“అబ్బా.. వదులు.. నా ఓణీ.. ”

“ష్ష్.. అలా దెయ్యంలా అరవకు..”

“నాకిలా అరవడమే వచ్చు.. నా ఓణీ ఎందుకు లాగావ్?”

“పిలిస్తే పలకవేం మరి.. ఇలా అయితే ఖచ్చితంగా బదులొస్తుంది కదా.. అందుకే..”

“అయినా నాతో నీకేం మాటలుంటాయ్?”

“అబ్బా.. ఎంత వాడి చూపులు.. నన్ను చంపేస్తావా ఏంటీ?”

“నిన్ను చంపడానికి నాకేం హక్కుంది?”

“అమ్మో.. అంటే హక్కుంటే చంపేద్దామనేనా..”

“…”

“ఏం మాట్లాడవేం.. మధ్యాహ్నం అంతలా విసిరావే మాటలు..”

“నేను కిందకి వెళ్ళాలి.. అమ్మ ఎదురు చూస్తుంది..”

“వేరే ఇంకేదన్నా అతికే సాకు చెప్పు..”

“…”

“ఇందాకేమన్నావ్ మా అమ్మతో.. నేను ఏ అమ్మాయిలకీ అస్సలు నచ్చనా?”

“ఏమో.. నాకేం తెల్సు..”

“నువ్వేగా ఆ మాటన్నావ్..”

“దేశం మీదున్న అమ్మాయిలందరూ నీ కోసమే పడి చచ్చిపోతార్లే.. ఇప్పుడు సరా?”

“ఊహూ.. సరిపోదు..”

“సరిపోకపోతే వేరే గ్రహాల మీదున్న అమ్మాయిల వెంట కూడా పడు వెళ్ళి.. నాకేం సంబంధం?”

“సరే అయితే.. ఇప్పుడే వెళ్ళి ఆ పనిలో ఉండమంటావా మరి?”

“ఉంటావో ఊరేగుతావో నీ ఇష్టం.. నన్నెందుకు అడగడం మధ్యలో..”

“నేనేం అంత కష్టపడి ఎవరి వెంటా పడక్కర్లేదు.. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది తెల్సా..”

“మంచిది..”

“అవును.. తను చాలా మంచిది.. నీకెలా తెల్సు ఆ సంగతి?”

“నేను కిందకెళుతున్నా..”

“అరె.. ఎందుకంత మొండితనం.. ఉండు..”

“ప్చ్.. మర్యాదగా నా చెయ్యొదులు.. చెయ్యి గట్టిగా విదిలిస్తే సన్నజాజి తీగకున్న ఎండిన కొమ్మలు గీసుకుపోతాయి ముందే చెప్తున్నా..”

“ఉహూ.. వదలను..”

“రౌడీ వేషాలెయ్యకు.. పో అసలు.. అయినా నీతో నాకు మాటలేంటి.. నేనెవరో తెలీదన్నావ్ గా..”

“సరే.. ఎలాగూ రౌడీనంటున్నావ్ గా నువ్వే.. ఇప్పుడస్సలు వదలను.. నువ్వే విడిపించుకుపో చేతనైతే..”

“……..”

“అబ్బా..”

“ముందే చెప్పానా.. కొమ్మలు గీసుకుపోతాయని..”

“గీసుకుపోయింది కొమ్మ కాదు.. నువ్వు విదిలించి కొట్టినందుకే నీ చేతి గాజు గీసుకుంది..”

“మంచిది.. ఇకనైనా నా చెయ్యి వదులుతావా..”

“సరే.. నాకు ఐదు నిమిషాలు టైమివ్వు.. ఒక్క విషయం చెప్పేసి వదిలేస్తా.. సరేనా!”

“…..”

“ఒకసారేమైందో తెలుసా.. మా చిన్నప్పుడు ఒకసారి మేము దొంగ పోలీస్ ఆడుతున్నామన్నమాట.

ఆటలో  పోలీస్ వేసిన వాడు యాభై లెక్కెట్టి వచ్చే లోపు అందరం దాక్కోవాలి కదాని గబా గబా తలో దిక్కుకీ పరిగెత్తుకుంటూ వెళుతున్నాం. అప్పుడొక పొట్టి పిల్ల ఉండేదిలే. తను మాత్రం ఏ ఆటలోనైనా సరే నేను ఎటు వెళితే అటే నా వెనకే తోకలా తిరిగేది. అప్పుడు కూడా అలాగే “నేనూ నీతో పాటే దాక్కుంటా బావా” అంది.

అప్పుడు మేమిద్దరం కలిసి మేడ మీదున్న తాతగారి గదిలో బోల్డు పుస్తకాలు పేర్చి ఉండే చెక్క బీరువా పక్కన బీరువాకీ, గోడకీ మధ్యనున్న ఇరుకు సందులో దాక్కుందామనుకున్నాం. అసలక్కడ ఒకళ్ళు దాక్కోడమే కష్టం. అలాంటిది ఎలాగో కష్టపడి ఇద్దరం కలిసి నక్కాం. ఆటలో మమ్మల్నెవరూ కనిపెట్టలేకపోయారు. మా తోటి పిల్లలెవరూ ఎంతకీ రాకపోయేసరికి ఇంక చూసీ చూసీ మాకే విసుగొచ్చి అసలు ఆటేమైందో, వీళ్ళందరూ ఏమైపోయారో చూద్దామని ఆ సందులోంచి బయటికొద్దామని ప్రయత్నిస్తే చాలా కష్టమైపోయింది.

ఇంతలో తనేమో ఏడుపు మొహం పెట్టుకుని “బావా.. మనం ఇక్కడే ఇరుక్కుని ఉండిపోతామా.. ఇంక బయటికి పోలేమా.. పోనీ అమ్మా వాళ్ళని గట్టిగా అరిచి పిలుద్దామా” అని ఒకటే గొడవ. తనని ఊరుకోబెట్టి ఎలాగో నానా తంటాలు పడి ఆ బీరువా సందులోంచి మేమిద్దరం బయటపడేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది.

అక్కడ నించున్నప్పుడు నేనేమో గోడ వైపూ, తనేమో బీరువా వైపు ఆనుకుని ఎదురెదురుగా నించున్నాం. అప్పట్లో ఆ పొట్టిపిల్ల పరికిణీ, పొడుగు జాకెట్టూ వేసుకునేదిలే.. ఆ సందులోంచి బయటపడే ప్రయత్నంలో ఆ చెక్క బీరువా మీద సన్నగా లేచిన చెక్క ముక్కొకటి తన జాకెట్టుకి తగులుకుపోయింది. గట్టిగా లాగితే చిరుగుతుందేమోనని దాన్ని జాగ్రత్తగా తియ్యడానికి చాలాసేపు కష్టపడ్డాం ఇద్దరమూ.

ఎలాగో అది వదిలించుకుని బయటికొచ్చి పడ్డాంరా దేవుడా అనుకునేలోపు, ముందుకి వేసుకున్న పిలక జడ ఒకటి జాకెట్టుకున్న హుక్కుకి ఇరుక్కుపోయిందని మళ్ళీ బిక్క మొహమేసింది ఆ పొట్టి పిల్ల “బావా.. నా జడ..” అంటూ. మళ్ళీ ఎలాగోలా తిప్పలు పడి అది తీయనైతే తీశాను గానీ ఆ ప్రయత్నంలో ఆ హుక్కు నా కుడి చేతి బొటనవేలు గోరులో గుచ్చుకుపోయి రక్తమొచ్చింది. ఇంకేముందీ.. అప్పుడా పొట్టి పిల్ల ఏడుపే ఏడుపు.. “బావా.. రక్తం.. రక్తం.. నీ చేతికి రక్తమొచ్చేస్తోందీ బావా..” అని. తర్వాత ఐదు నిమిషాల్లో “బావకి దెబ్బ తగిలిందీ.. రక్తమొచ్చేస్తోందీ..” అంటూ అరిచి గగ్గోలు పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ పోగేసింది. తాతగారు నా చెయ్యి కడిగి మందు వేసి చిన్న కట్టు కట్టారు. తగ్గిపోతుందిలే, నొప్పి తగలకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు.

ఆ దెబ్బ పూర్తిగా మానిపోయేదాకా కనీసం ఓ వారం రోజుల దాకా ఆ పొట్టిపిల్ల ప్రతీ క్షణం నా వెనకే తిరుగుతూ “బావా.. నీ చెయ్యి జాగ్రత్త బావా.. నీకేం కావాలన్నా నాకు చెప్పు బావా.. నన్ను అడుగు బావా..” అంటూ బోల్డంత ప్రేమతో నా ప్రాణాలు తోడేసింది. అదన్నమాట పొట్టిపిల్ల కథ!”

“నేనేం పొట్టిపిల్లని కాదు.”

“మరి.. పేద్ద.. పొడుగు పిల్లవా?”

“ఊ.. కాదా మరి! అయినా అందరూ నీలాగా అంతెత్తున ఉంటారేంటీ మునగ చెట్టులాగా?”

“మీ ఊర్లో అన్నీ చెట్ల కంటే మునగ చెట్లే ఎత్తుగా ఉంటాయా?”

“ఊ..”

“హ..హ్హ.. హ్హా…”

“……

బావా…”

“హమ్మయ్యా.. ఇప్పటికి బయటికొచ్చిందా ఆ పిలుపు..”

“బావా.. నిజంగా నీకు మన చిన్నప్పటి సంగతులన్నీ గుర్తున్నాయా?”

“ఊ..”

“నిజ్జంగా నిజమా.. ఒట్టు?”

“ఊ.. నీ మీదొట్టు..”

“మరెందుకలా ఎవరో తెలీనట్టు మాట్లాడావ్ మధ్యాహ్నం..”

“ఊరికే.. నువ్వేమంటావో చూద్దామని..”

“నువ్వు నన్ను నిజంగానే మర్చిపోయావని నాకెంత ఏడుపొచ్చిందో తెల్సా..”

“ఊ.. తెలుసు..”

“దొంగ మొహం.. నువ్వేం మారలేదురా అసలు.. నన్నేడిపించడానికి నువ్వూ, నీ డొక్కు పరీక్షలూనూ.. అవి కూడా ఏం మారలేదు.”

“ఊ..”

“చెయ్యాల్సిందంతా చేసేసి మళ్ళీ ఏం ఎరగనట్టు బుద్ధిమంతుడిలా ఊ కొట్టడం కూడా అస్సలేం మారలేదు.”

“ఊ..”

“అసలు నిన్నూ……… ఓ…..య్.. వదులూ.. రౌడీ పిల్లోడా.. అరె.. ని.. న్నే….. నేను చిన్నప్పటిలా మంచిదాన్ని కాదు ఇప్పుడు ఏమనుకుంటున్నావో…. దెబ్బలు పడతాయ్.. ఒ.. రే.. య్…. వదలమంటుంటే.. ఊ.. హూ…హూ…..”

 

**********

సామెతల్లో మూఢనమ్మకాలు,కులవివక్ష,అవహేళన

రచన : నూర్ బాషా రహంతుల్లా

 

ప్రజలకు విషయం మరింత సులువుగా అర్ధమవడానికి ఉపన్యాసాల్లోనూ, రచనల్లోనూ సామెతలూ, ఉపమానాలూ వాడతారు . ఇవన్నీ భాషను పరిపుష్టం చేసేవీ, అలంకారమైన అంశాలే. సామెతలంటే సమాజం పోకడలలో హెచ్చు తగ్గులు అవకతవకలు అతిక్లుప్తంగా చెప్పే అక్షరసత్యాలు.ఆనాటి పెద్దలచే చెప్పబడిన అనుభవసారాలు.ప్రత్యక్షంగా చెప్పలేనివి పరోక్షంగా చెప్పటానికి వీటిని చురకలుగా ఉపయోగించారు.సామెతలు ఏమి చెప్తున్నాయి అన్నది తెలుసుకోవడం ముఖ్యమే కానీ అవి స్త్రీలని,కులాలనీ,మతాలనూ హేళనచేసేవైతే? సామెతల్లో భక్తి,వైరాగ్య,శృంగార,నీతి,విజ్ఞాన,చమత్కారాల వలెనే ,మూఢనమ్మకాలు,కులవివక్ష,అవహేళనా సామెతలు కూడా ఉన్నాయి. కొన్ని సామెతలు స్త్రీలనూ, నిమ్నవర్గాలనూ, వికలాంగులనూ కించపరిచేవిగా ఉన్నాయి.ఇప్పటికే అనేక పుస్తకాలలో కొన్నివేల సామెతలతో పాటు ఇవికూడా గ్రంధస్తమై ఉన్నాయి.కొత్తగా వస్తున్న పుస్తకాలలో కూడా ఇంకా ఇలాంటి సామెతలను ప్రచురిస్తూనే ఉన్నారు.ఇప్పుడు వీటిని మనం వాడలేము.వాడితే ఊరుకోరు. ఇలాంటి సామెతలు ఆయా కులాలమీద  మీద అపహాస్యంగా చులకన భావంతో పుట్టించినా ఆ నాటి సాంఘిక పరిస్థితులు ఆయా కులాలు మతస్థుల మధ్య ఉండే విపరీత వివక్ష ఈ సామెతల ద్వారా  అర్ధం అవుతుంది. ఇప్పుడు జనం ఈ సామెతలు బయటికి అనలేరు.కానీ మన గత చరిత్ర ఎలా నడిచిందో ఆ చరిత్రను ఈ సామెతలు తెలుపుతాయి.మన పూర్వీకులు ఆనాడు ఎదుర్కొన్న అనుభవాలు ఈ సామెతలు మన కళ్ళకు కడతాయి.ఆకాలంలో చెల్లాయిగానీ ఈనాడు ఏవిధంగానూ సమర్ధించలేని పలుకలేని పలుకరాని సామెతలివిగో:

వివిధ కులాల మీద సామెతలు :

 

నల్లబ్రామ్మడినీ ఎర్రకోమటినీ నమ్మకూడదు

 • ముందువెళ్ళే ముతరాచవాడినీ ప్రక్కన బోయే పట్రాతి వాడినీ నమ్మరాదు
 • ముందుపోయే ముతరాచవాడినీ వెనుకవచ్చే ఈడిగ వాడినీ నమ్మరాదు
 • నీ కూడు నిన్నుతిననిస్తే నేను కమ్మనెలా ఔతాను?
 • తుమ్మనీ కమ్మనీ నమ్మరాదు, తుమ్మను నమ్మిన కమ్మను నమ్మకు
 • రెడ్లున్నఊరిలో రేచులున్న కొండలో ఏమీ బ్రతకవు
 • నరంలాంటివాడికి జ్వరం వస్తే చెయ్యి చూచినవాడు బ్రతకడు
 • తురకల్లో మంచివాడెవరంటే తల్లికడుపులో ఉన్నవాడు గోరీలో ఉన్నవాడు
 • మాలవానిమాట నీళ్ళమూట
 • చాకలి అత్త మంగలి మామ కొడుకు సాలోడైతేనేమి సాతానోడైతేనేమి?
 • విధవముండకు విరజాజి దండలేల?
 • కాశీలో కాసుకొక లంజ
 • నంబీ నా పెళ్ళికి ఎదురురాకు
 • నియోగి ముష్టికి బనారసు సంచా?
 • మాలదాన్ని ఎంగటమ్మా అంటే మదురెక్కి దొడ్డికి కూర్చుందట
 • కులం తక్కువ వాడు కూటికి ముందు
 • చాకలిదాని అందానికి సన్యాసులు గుద్దుకు చచ్చారు
 • మాలలకు మంచాలు బాపలకు పీటలా?
 • మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
 • ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెడుస్తాడు

·         తురక సాయిబుల మీద సామెతలు

 • తురకా దూదేకుల తగాదాలో మురిగీ ముర్దార్ [మంచిదాన్నీ చెడ్డదనుకుంటారు]
 • మేకలు తప్పిపోతే తుమ్మల్లో, తురకలు తప్పిపోతే ఈదుల్లో (ఈతచెట్లలో) [ఆ అనుబంధం అలాంటిది]
 • తురకా కరకా రెండూ బేధికారులే. మొదటిది దగ్గరకు వస్తేనే చాలు, రెండోది లోపలికి పోవాలి. [అంత బెదురన్నమాట]
 • తురక కొట్టవస్తే చుక్కెదురని కదలకుంటారా? [కుండలేదని వండుకుతింటం మానేస్తామా?]
 • తురక దయ్యము మంత్రించినట్లు [ఏ కులందయ్యం ఎవర్ని పడుతుందోమరి]
 • తురకదాసరికి ఈతమజ్జిగ [బాంచేతు దేవుడికి మాదర్చోదు పత్రిలాగా]
 • తురకమెచ్చు గాడిదతన్ను [రెండూ అంతగట్టిగా ఉంటాయన్నమాట]
 • తురకలసేద్యం పెరిక లపాలు [రాజులసొమ్ము రాళ్ళపాలు లాగా]
 • తురకవాడకు గంగెద్దు పోతే కోసుకు తిన్నారట [అవసరం అసుంటిది,ఎవరి అలవాటు వారిది ]
 • ఇదేందోయ్ పెంట తినే కోమటీ అంటే, పోవోయ్ బెల్లంతినే సాయిబా అన్నాడట.అట్లా అంటావేంటి కోమటీ అంటే ఎవరి అలవాటు వారిది అన్నాడట
 • తురక వీధిలో సన్యాసి భిక్షలాగా [కుంటోడైనా ఇంటోడు మేలు]
 • తురక వీధిలో విప్రుడికి పాదపూజ చేసేమి చెయ్యకేమి?[విప్రుల వీధిలో తురకాయనకు చేస్తే సరి]
 • తురక మరకా తిరగేసి నరకా [ఎల్లిశెట్టిలెక్క ఏకలెక్క]
 • తురకలలో మంచిఎవరంటే తల్లికడుపులో ఉన్నవాడూ,గోరీ లో ఉన్నవాడు [పగవాణ్ణి పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నాడట]
 • తురక ఎంతగొప్పవాడైనా ఇంటికి పేరులేదు,తలకు జుట్టు లేదు, మొలకు తాడు లేదు [ఎంత పెద్దకులస్తులకైనా ముడ్డి పీతికంపే]
 • పాకీదానితో సరసం కంటే అత్తరుసాయిబు తో కలహం మేలు [ గూని దున్న కంటే గుడ్డి దున్న మేలు]
 • సాయిబూ చిక్కిపోయావేంటంటే,ఇంకా చిక్కుతాం,మరీ చిక్కుతాం,మనసువస్తే చచ్చిపోతాం నీకేం అన్నాడట [ ఒంటేలు కి పోయి ఇంతసేపేంటిరా అంటే రెండేళ్ళు కు వచ్చింది అన్నాడట]
 • సన్నెకల్లు కడగరా సయ్యదాలీ అంటే కడిగినట్లే నాకినా కుదా తోడు అన్నాడట
 • ఆవో అంటేనే అర్ధంగాక అగోరిస్తుంటే కడో అనేదాన్ని అంటగట్టావా? [ఒకరుంటే దేవులాట ఇద్దరుంటే తన్నులాట ]
 • ఫకీరుసాయిబును తీసుకొచ్చి పక్క లో పడుకోబెట్టుకుంటే లేచిలేచి మసీదు లోకి వెళ్ళాడట
 • ముద్ద ముద్దకీ బిస్మిల్లా నా?
 • నమాజు చెయ్యబోతే మసీదు మెడమీద పడిందట
 • ఉర్సు లకు పోతే కర్సులకు కావాలి [ గోకుడు కి గీకుడు మందు ]
 • ఊదు వేయనిదే పీరు లేవదు [ గోల గోవిందుడిది అనుభవం వెంకటేశ్వర్లుది]
 • మునిగింది ముర్దారు తేలింది హలాలు [ గుంత కు వస్తే మరదలు మిట్ట కు వస్తే వదిన ]
 • కాజీ ని ఫాజీ గా ఫాజీని కాజీగా మార్చినట్లు [ గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు]
 • ఖానా కు నహీ ఎల్లీకి బులావ్ అన్నట్లు
 • గుర్రం పేరు గోడా ఐతే గోడా  పేరు గుర్రం గదా? ఇక నాకు ఉర్దూ అంతా వచ్చేసింది అన్నాడట
 • నవాబు తల బోడి నా తలా బోడేనని వితంతువు విర్రవీగిందట
 • దర్జీ వాణ్ణి చూస్తే సాలె వాడికి కోపం

దూదేకుల సాయిబుల మీద సామెతలు

 • దూదేకులవానికి తుంబ తెగులు (అందుకే ఆ వృత్తి జిన్నింగ్ మిల్లులకొదిలేశారు)
 • దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? (ఏంలోటూ లేదు ఇంకో పని చేసుకొని బ్రతకొచ్చు)
 • తురకలు లేని ఊళ్ళో దూదేకులసాయిబే ముల్లా (ఏచెట్టూలేనిచోట ఆముదంచెట్టులాగా)
 • కాకర బీకర కాంకు జాతారే అంటే దూబగుంటకు దూదేకను జాతారే అనుకున్నారట. (ఉర్దూ రాక పాట్లు)

మూలాలుః

 • తెలుగు సామెతలు: కెప్టెన్ ఎం.డబ్ల్యు.కార్, వి. రామస్వామి శా స్త్రులు 1955
 • తెలుగు సామెతలు: సంపాదక వర్గం- దివాకర్ల వెంకటావధాని, పి.యశోదా రెడ్డి, మరుపూరి కోదండరామరెడ్డి.- తెలుగు విశ్వవిద్యాలయం మూడవ కూర్పు పునర్ముద్రణ 1986
 • తెలుగు సామెతలు: సంకలనం – పి. రాజేశ్వరరావు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 1993.
 • తెలుగు సామెతలు: గీతికా శ్రీనివాస్, జే.పి.పబ్లికేషన్స్ 2002
 • తెలుగు సామెతలు:సంకలనం- రెంటాల గోపాలకృష్ణ, నవరత్న బుక్ సెంటర్ 2002
 • లోకోక్తి ముక్తావళి అను తెలుగు సామెతలు (షుమారు 3400 సామెతలు)- సంకలనం: విద్వాన్ పి.కృష్ణమూర్తి – ప్రచురణ: మోడరన్ పబ్లిషర్స్, తెనాలి
 • సాటి సామెతలు (తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ భాషలలో సమానార్ధకాలున్న 420 సామెతలు) – సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కె. నాయర్
 • సంపూర్ణ తెలుగు సామెతలుః మైథిలీ వెంకటేస్వరరావు,జె.పి.పబ్లికేషన్స్,విజయవాడ 2011

నూర్ బాషా రహంతుల్లా

వికృ(త)తి రాజ్యం

రచన : రావి రంగారావు

 

 

వీణ్ణి చూసి

వీడి  దేహాన్ని చూసి

వీడి  బతుకును చూసి

వాడు జాలిపడ్డాడు…

 

వీణ్ణి ఎలాగైనా బాగుచేయాలని

వాడు తీర్మానించుకున్నాడు…

పథకం ప్రకారం మత్తు పెట్టి

వీడి  వెన్నెముక విరిచాడు…

 

వీడి ఎముకల్లోని మూలుగు

వాడు కమ్మగా జుర్రుకున్నాడు,

వీడికి ఉత్త ఎముక లిచ్చి

ప్రేమగా  తిను అన్నాడు,

 

వీడి మనసు సోలయింది, మానికయింది,

వీడి అభిమానం “బ్యానర్’ అయింది,

గుడ్డిగా  భజన చేయటం  “మానర్” అయింది,

వాడికి వీడు ఇప్పుడొక చెప్పు,

వాణ్ణి జాగ్రత్తగా మోసే పల్లకీ,

వాడికి వీడొక బుల్లెట్ ప్రూఫ్ కోటు,

వాడికి వాడి వారసులికి నెత్తురు  స్వీటు…

 

ఈ లోగా ఎపుడో

ఆ మత్తు దిగిపోగానే

కూలిపోతున్న తన ఎముకల గూడు…

కాలిపోతున్న తన హృదయం పువ్వు…

ఆక్రమించబడిన  నడిచే  త్రోవ…

కబ్జా చేయబడిన  కాలిక్రింది నేల…

గాలిని దోచారు, నీటిని దాచారు…

 

ఎన్నో సునామీలు…

చరిత్రలో ఎన్నో తిరుగుబాట్లు…

అకస్మాత్తుగా సంచలనాలు తప్పవు…

ఆపాలనుకొన్నా  ప్రభంజనాలు  ఆగవు…

వికృతి వేసుకున్న  ప్రకృతి వేషం వెలిసిపోతోంది,

వికృతిలో ముంచబడిన ప్రకృతిమూర్తి  బయటపడుతుంది .

 

 

 

ఇంటర్‌నెట్-2

రచన: నరేష్ నందం

 

 

ఏంటి, ఇంటర్‌నెట్ 1 ఎక్కడ, ఎప్పుడు మిస్ అయ్యాం అని వెదుక్కుంటున్నారా?

కంగారు పడకండి! మీరు ఇప్పుడు వాడుతున్నదే ఇంటర్‌నెట్ 1.

మీరు ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయటానికి, అంటే maalika.org, lekhini.org, google.com, naukri.net, blogspot.in, yahoo.co.in ఇలా టైప్ చేసి ఉంటారు కదా. వీటిని డొమైన్ నేమ్స్ అంటారు. వీటిలో .com, .net, .org, .infoతో పాటు .biz, .pro, .name వంటి ఏడింటినీ జనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్ (gTLD)అనీ,  .in, .us, .ca, .ru, .uk వంటి ఎక్స్‌టెన్షన్స్‌ను కంట్రీ కోడ్ టాప్ డొమైన్ నేమ్ (ccTLD, సుమారు 250 ఉన్నాయి) అనీ, .edu, .mil, .gov, .int, .aero వంటి వాటిని స్పాన్సర్డ్  జనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్ (sgTLD) అనీ, .asia, .cat లను జియోగ్రఫిక్ జనరిక్ టాప్ లెవెల్ డొమైన్స్ (ggTLD, ఇవి రెండే) అనీ, .co.in, .co.uk వంటి వాటిని సెకండ్ లెవల్ డొమైన్స్ (SLD) అనీ వర్గీకరించారు. ఇది అంతా ఇంటర్‌నెట్ ముందు దశలో జరిగినది.

 

మొదటి డొమైన్ నేమ్ symbolics.com (అందులో ఇంటెరెస్టింగ్ స్టఫ్ ఉంది) పేరుతో 15 మార్చ్ 1985న రిజిస్టర్ అయింది. అలా మొదలైన డొమైన్ నేమ్ ప్రవాహం 1992నాటికి 15000 డొమైన్ నేమ్స్‌తో పిల్లకాలువ సైజుని మించి, 2010నాటికి 19కోట్ల వెబ్ సైట్‌ల చేరికతో పేద్ద సముద్రమైంది.

 

ప్రతి ఒక్కరికి ఇంటర్‌నెట్, ఈ-మెయిల్ అత్యవసరమైన ఈ దశలో, తమ పేరు మీద ఓ వెబ్ సైట్ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. తీరా డొమైన్ రిజిస్టర్ చేద్దామని చూస్తే, అప్పటికే ఇంకెవరో రిజిస్టర్ చేసుకుని ఉండటం కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించటానికి, డొమైన్ నేమ్‌ కొరతను తీర్చటానికి ఎప్పటికప్పుడు ఇంటర్‌నెట్ నేమ్స్ ఆథరైజేషన్ & ఇన్ఫర్మేషన్ సెంటర్ (INAIC) ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో  ఇంటర్‌నెట్ కార్పొరేషన్ ఫర్ ఎసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ ICANNA, ఇంటర్‍నెట్ ఎసైన్డ్ నంబర్స్ అథారిటీ IANA సహకారమందిస్తున్నాయి. అలాంటి ప్రయత్నాల్లో భాగమే, ఒక్కో దేశానికి ప్రత్యేకమైన డొమైన్ నేమ్. ఉదా: .in, .co.in, .uk వంటివి. ఇప్పుడు అవీ చాలటం లేదు. అలాంతి సందర్భంలో వచ్చిన ప్రత్యామ్నాయం.. ఇంటర్నేషనలైజ్డ్ టాప్ లెవెల్ డొమైన్ (iTLD). వీటికి మరో పేరు మల్టీ లింగ్వల్ టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్. సింపుల్‍‌గా చెప్పాలంటే, మీకు నచ్చిన, వచ్చిన భాషలో డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. (కాకపోతే, ఆ భాషలోని అక్షరాలను మన కంప్యూటర్లపై టైప్ చేయగలిగి ఉండాలి). ఉదాహరణకి, naresh.comను ఎవరో రిజిస్టర్ చేసుకున్నారు. అందుకని, నరేష్.comను నేను రిజిస్టర్ చేసుకోవచ్చు. అవి రెండూ వేర్వేరు వెబ్‌సైట్లుగా ఇంటర్‌నెట్‍‌లో కనిపిస్తాయి. ఎందుకంటే నరేష్.comను కంప్యూటర్ xn--jpcqv7d5a.comగా చూస్తుంది. ఇలాంటి అక్షర, అంకెల కాంబినేషన్‌లోకి ఇతర భాషలను తర్జుమా చేసుకోవటం వల్ల కొన్ని కోట్ల కొత్త డొమైన్లను 2005నుంచి INAIC అందుబాటులోకి తెచ్చింది. ఇదంతా.. ఇంటర్‌నెట్ 1 & 2 సంధి దశ.

 

ఇప్పుడు మనం ఇంటర్‌నెట్ 2లోకి ప్రవేశిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో వెబ్‌సైట్ అవసరం వస్తోంది. మీరు ఒక జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారనుకోండి. naukri.com లేదా timesjobs.com లాంటి ఓ జాబ్ సైట్‌ను ఓపెన్ చేస్తారు.  ఏ TCSలోనో, CTSలోనో జాబ్ కోసం అప్లై చేయాలనుకుంటే వాళ్ల వెబ్‍సైట్స్ tcs.com, లేదా cognizant.com ఓపెన్ చేసి మీ రెజ్యూమెను అప్‍లోడ్ చేస్తారు. అంటే జాబ్ చూపించే వాడూ, ఇచ్చేవాడూ ఒకే TLD, .com వాడుతున్నాడు. దీంతో అనవసరమైన .comలని తగ్గించేందుకు .jobsకు INAIC పర్మిషన్ ఇచ్చేసింది. అలాగే, ప్రతి అవసరానికి పనికొచ్చేలా .world, .town, .city, .village, .area, .xxx, .merchant, .night, .inside, .escort, .region, .tracks, .rome, .everest, .farm, .engineer, .wow వంటి కొత్త డొమైన్ నేమ్ ఎక్స్‌టెన్షన్స్ వేల సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో సుమారు 2000కు పైగా డొమైన్లకు జూన్ 13, 2012న ఇంటర్‌నెట్ కార్పొరేషన్ ఫర్ ఎసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్, ICANN ఆమోద ముద్ర వేసింది. అంటే ఇకనుంచి వెబ్‌సైట్ల వర్గీకరణ మొదలవుతుందన్నమాట!

 

అయితే, ఈ ఇంటర్‌నెట్2ను మీరందరూ యాక్సెస్ చేయలేరు. మీ కంప్యూటర్లు ఎంత కొత్తవైనా, అల్ట్రా మోడర్న్ అయినా కొన్నింటిలో ఈ కొత్త డొమైన్ ఎక్స్‌టెన్షన్లను ఓపెన్ చేయలేరు. అందుకు ఒక కారణం.. DNS. మీ ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీలానే కొత్త టెక్నాలజీని వెంటనే అందిపుచ్చుకునే రకమైతే, వారి దగ్గర DNS ప్లగిన్ అప్‌డేట్ చేసి ఉంటాడు. అప్పుడు మీరు ఇంటర్‍నెట్2ను, సరిగా చెప్పాలంటే.. పూర్తి ఇంటర్‌నెట్‌ను ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉపయోగించుకుంటారు.

 

మరి, మీకు ఇంటర్‌నెట్ పూర్తిగా అందుబాటులో ఉందా, లేదా ఎలా తెలుస్తుంది?

మీరు మరీ అండి, ఇన్ని చెప్పిన వాడిని అది మాత్రం చెప్పనా ఏంటి?

http://naresh.world ఓపెన్ చేయండి. మీకు నా బ్లాగ్ “అంతర్వాహిని” కనిపిస్తే.. ఓకే, మీ ISP, మీ కంప్యూటర్ రెండూ అప్‌టుడేట్‌గా ఉన్నాయి.

మరి లేకపోతే? ..సింపుల్!!

1. విండోస్ xp ప్లగ్‍ఇన్ ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.

http://iniac.com/Internet2.exe

2. ఇన్‌స్టాల్ చేసి రీస్టార్ట్ చేయండి.

 

3. ఇప్పుడు మీరు కచ్చితంగా http://naresh.world ఓపెన్ చేయగలరు.

4. DNS ప్రాపగేషన్‌కి 10నిమిషాలు టైమ్ పడుతుంది. ఓపిక పట్టండి. 🙂

మీది విండోస్ xp కాకపోతేనో.. అది ఇంకా సింపులండి. మీది విండోస్ xp అయినా కాకపోయినా,

1. జస్ట్ మీ నెట్ వర్క్ కనెక్షన్ ఓపెన్ చేసి,  ప్రాపర్టీస్‍లోని tcp/ipని ఎంచుకోండి.

2. ఆ tcp/ip ప్రాపర్టీస్‌లో DNS అని ఉంటుంది చూడండి. అక్కడ, “Use the following DNS server addresses” అని ఉన్న చోట ఈ రెండు IP అడ్రసులు ఇవ్వండి.

84.22.106.30

84.22.100.9

అయిపోయింది. ఇప్పుడు మీ బ్రౌజర్ రిఫ్రెష్ చేయండి. అంతే.. నా బ్లాగ్ మీ ముందు ప్రత్యక్షమవుతుంది.

(బ్లాగ్ అప్‌డేట్ చేసి సంవత్సరాలు అవుతోంది కాబట్టి, కంగారు పడకండి. కావాలంటే, పాత పోస్ట్‌లు తిరగెయ్యచ్చు. ఏదో, మీకో ఉదాహరణ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నాను, అంతే)

ఇంకా అనుమానముందా? మరికొంచెం వివరాలు కావాలా?

http://inaic.com/index.php?p=public-internet-access చూడండి.

హమ్మయ్య, ఇప్పుడు మీరు ఇంటర్‌నెట్‍2కి సిధ్దం. ఇంకో ఒకటి, రెండేళ్లలో ఉప్పెనలా వచ్చి పడే వెబ్‌సైట్లను ఓపెన్ చేయటానికి మీరు ఇప్పటి నుంచే తయారుగా ఉన్నారు మరి. ఇంకేం, పూర్తి ఇంటర్‌నెట్‌ను బ్రౌజ్ చేయండి.

But Remember, I told you FIRST!

 

 

 

చింపాజీలపై పరిశోధనలో అగ్రగామి – జేన్ గుడాల్

రచన : శ్రీనివాస చక్రవర్తి

 

 

స్త్రీ స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉన్న యుగంలో, ఇంకా ఇరవైలు దాటని ఓ చక్కని బ్రిటిష్ యువతి, ఒంటరిగా ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ, చింపాజీల ప్రవర్తన గురించి లోతుగా అధ్యయనాలు చేస్తూ, చింపాజీలకి, మనిషికి మధ్య ఉన్న పరిణామాత్మక సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకుని, ఆ రంగంలో అగ్రగామి అయిన శాస్త్రవేత్తగా ఎదిగింది. ఆ యువతి పేరే జేన్ గుడాల్.

1934 లో లండన్ లో పుట్టిన జేన్ కి చిన్నప్పట్నుంచి జంతువులంటే మహా ఇష్టం ఉండేది. జంతువులతో ఆడుకుంటున్నట్టు, మాట్లాడుతున్నట్టు కలలు కనేది. ‘టార్జాన్,’ ‘డాక్టర్ డూలిటిల్’ (ఈ మనుషుల డాక్టరు మనుషుల కన్నా జంతువులకే ఎక్కువగా చికిత్స చేస్తూ ఉంటాడు) వంటి పిల్లల పుస్తకాలు చిన్నతనంలో ఈమెకి ఎంతో స్ఫూర్తి నిచ్చేవి. అందరిలాగానే ‘పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్’ అవ్వమన కుండా తన తల్లి ‘వాన్నే’ కూతుర్ని తనకి నచ్చిన దారిలోనే ముందుకి సాగమని ప్రోత్సహించేది. “నీకు ఏం కావాలంటే అది అవ్వు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో  బాగా పైకొస్తావని నాకు తెలుసు,” అనేది ఆ తల్లి.

ఇరవై రెండేళ్ల వయసులో జేన్ కి తన జీవితాన్ని మార్చేసే ఓ గొప్ప అవకాశం దొరికింది.  ఓ లండన్ ఫిల్మ్ స్టూడియో తో పాటు ఆఫ్రికాకి వెళ్లే అవకాశం దక్కింది. అయితే ప్రయాణానికి కావలసిన ఖర్చులు కూడా తన వద్ద లేవు. వెంటనే ఓ హోటల్ లో వెయిట్రెస్ గా పనిలోకి దిగి, రాత్రనక పగలనక పని చేసి నాలుగు డబ్బులు వెనకేసింది. తగినంత ధనం పోగవగానే ప్రయాణానికి సిద్ధం అయ్యింది.

ఆ ప్రయాణం 1957 లో మొదలయ్యింది. ముందుగా ఆఫ్రికాలోని మొంబాసా లో దిగింది. మొంబాసాలో ‘లూయీ లీకీ’  అనే పేరుమోసిన పురావస్తు శాస్త్రవేత్త ఉండేవాడు. జేన్ ఆయన్ని కలుసుకుని తన ఆశయాల గురించి విన్నవించుకుంది. జేన్ లోని ఉత్సాహం, శక్తి, జంతువుల పట్ల ఆమెకి సహజంగా ఉండే ప్రేమ మొదలైన లక్షణాలు ఆయన్ని అకట్టుకున్నాయి. వెంటనే తనకి అసిస్టెంటుగా పనిచేసే ఉద్యోగం ఇచ్చాడు. టాంజానియాలో ఓ చెరువు సమీపంలో ఉండే చింపాజీలని అధ్యయనం చేసే పనిలో ఆమెని పాల్గొనమన్నాడు. చింపాజీల జీవన రహస్యాలు అర్థమైతే మనిషి యొక్క పరిణామ గతం గురించి ఎన్నో రహస్యాలు తెలుస్తాయని ఆయన ఆలోచన.

ఈ అధ్యయనాలు 1960 లో మొదలయ్యాయి. ఆ రోజుల్లో జేన్ తల్లి కూడా కూతురుతో పాటు పర్యటించేది. యవ్వనంలో ఉన్న స్త్రీ ఆఫ్రికా అడవుల్లో ఒక్కర్తీ పర్యటించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనుక కూతురితో పాటు ఈ పర్యటనలు ఆ తల్లికి తప్పలేదు. మొదటి రెండు వారాలు జేన్ కి కలిగిన అనుభవాలు కాస్త నిరుత్సాహ పరిచాయి. తనని అంత దూరంలో చూడగానే చింపాజీలు పరుగు అందుకునేవి. పోనీ తను చూసినంత మేరకు కూడా చింపాజీల ప్రవర్తనలో తనకి విశేషంగా ఏమీ కనిపించలేదు. వచ్చిన పని విఫలమయ్యింది అన్న బాధ మనసులో దొలిచేస్తుండగా అనుకోకుండా ఓ సంఘటన జరిగింది.

చింపాంజీలు శాకాహారులు అని అంతవరకు జేన్ అనుకునేది. కాని ఒకరోజు ఓ విచిత్రమైన సంఘట కనిపించింది. ఓ చింపాజీ ఓ చెదల పుట్ట పక్క కూర్చుని ఓ పొడవాటి పుల్లని పుట్టలోకి దూర్చి దాంతో చెదలు “పట్టి” తింటోంది. పుల్లని ఓ పనిముట్టుగా వాడి, దాంతో ఆ పురుగులని “వేటాడి” తినడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది. గిట్టలు, కొమ్ములు, ముక్కులు, పంజాలు మొదలైన దేహాంగాలని కాకుండా మరో వస్తువుని పనిముట్టుగా వాడి ఆహారాన్ని సేకరించడం జంతులోకంలో అరుదైన విషయం. ఆ రోజుల్లో పెద్దగా తెలియని విషయం.  పనిముట్లు వాడే దశ ఆదిమానవుడి పరిణామ క్రమంలో ఓ ముఖ్యమైన మలుపుగా చెప్పుకుంటాం. అలాంటి పనిముట్ల వినియోగం ఈ జంతువులలో కనిపించడం విశేషం.

చింపాజీలలో ఈ పనిముట్ల వినియోగం గురించి ప్రొఫెసర్ లీకీ కి వివరంగా ఉత్తరం రాసింది. ఆయన సంతోషం పట్టలేకపోయాడు. “ దీంతో ‘పనిముట్టు’, ‘మనిషి’ మొదలైన పదాలకి కొత్త నిర్వచనాలు ఇవ్వాలి, లేదా చింపాజీలు మనిషితో సమానమని ఒప్పుకోవాలి,” అంటూ ఆయన ఉత్సాహంగా జవాబు రాశాడు.

తరువాత జేన్ ధ్యాస చింపాజీలలో సాంఘిక  జీవనం మీదకి మళ్లింది. మనుషులలో లాగానే చింపాజీలలో కూడా విస్తృతమైన సాంఘిక పారంపర్యం ఉంటుంది. ‘నువ్వెక్కువా? నేనెక్కువా?” అన్న భేటీ మగ చింపాజీల  మధ్య తరచు వస్తుంటుంది. బలప్రదర్శనతో మగ చింపాజీలు ఇతర చింపాజీల మీద  తమ ఆధిక్యతని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ బలాబలాల పోటీ గెలిచిన మగ చింపాజీని ‘ఆల్ఫా మేల్’ (మొదటి మగాడు!) అంటారు. అతడే ముఠా నాయకుడు అవుతాడు. అయితే అంతకన్నా బలమైన చింపాజీ రంగప్రవేశం చేసినప్పుడు, ఇంద్రపదవి లాగా ఈ పదవి చేతులు మారిపోతుంటుంది!

చింపాజీలు సాధు జంతువులు ససేమిరా కాదని తెలుసుకుని జేన్ నిర్ఘాంపోయింది. చింపాజీ ముఠాల మధ్య కొట్లాటలు తరచు జరుగుతుంటాయి. ఒక “ముఠా నాయకుడు” తన ముఠాతో సహా వెళ్లి శత్రు ముఠా మీద యుద్ధం ప్రకటిస్తాడు.

ఆ యుద్ధంలో బలమైన చింపాజీలు బలం తక్కువైన చింపాజీలని తీవ్రంగా గాయపరచి, ఆ గాయలతోనే ప్రాణాలు వొదిలే స్థితికి తెస్తాయి. మనుషుల్లో ‘గ్యాంగ్ వార్’ లకి ఈ కలహాలకి పెద్దగా తేడా ఉన్నట్టు లేదు.

జేన్  చేసిన ఈ ప్రప్రథమ అధ్యయనాలన్నీ చక్కని ఫోటోలతో సహా ఆ రోజుల్లోనే ‘నేషనల్ జ్యాగ్రఫీ’ పత్రికలో అచ్చయ్యాయి. ఆ ఫోటోలు తీసిన హ్యూగో వాన్ లావిక్ ని ఆమె తరువాత వివాహం చేసుకుంది. ఇద్దరి కృషి ఫలితంగా అక్కడ “గోంబే స్ట్రీమ్ రీసెర్చ్ సెంటర్” అనే గొప్ప పరిశోధనా కేంద్రం  వెలసింది. కొన్ని దశాబ్దాలుగా ఈ కేంద్రం చింపాంజీల పరిశోధనలో ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలిచింది. కేంద్రంలో సిబ్బంది పెరిగారు. చింపాంజీల జీవన విధానంలో ఎన్నో అంశాలని ఈ బృందం క్రమబద్ధంగా అధ్యయనం చేస్తూ వచ్చింది. ఇరవై అయిదేళ్ల పాటు ఆమె చేసిన పరిశోధనలు 1986  లో “గోంబే చింపాజీస్ – పాటర్న్స్ ఆఫ్ బిహేవియర్” (గోంబే చింపాంజీలు – వాటి ప్రవర్తనలో విశేషాలు) అనే పుస్తకంగా వెలుడ్డాయి.  జేన్ గుడాల్ కృషి నుండి స్ఫూర్తి పొందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు చింపాంజీల మీద పరిశోధనలు చేసి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. జేన్ గుడాల్ చేసిన వైజ్ఞానిక కృషికి గుర్తింపుగా ఎన్నో జంతు జాతుల, వృక్ష జాతుల పేర్లలో ఆమె పేరు కలిపారు. ఆమె సుదీర్ఘ వైజ్ఞానిక జీవితంలో ఆమె పొందిన అవార్డులు కోకొల్లలు.   స్త్రీలు వైజ్ఞానిక రంగాల్లో కేవలం రాణించడమే కాదు, తలచుకుంటే వారి వారి రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉండగలరని జేన్ గుడాల్ నిదర్శనం మనకి స్పష్టం చేస్తోంది.