‘చందమామ’ విజయగాథ

రచన : కె. రాజశేఖర రాజు.

 


భారతీయ సాహిత్యాకాశంలో కథా కాంతులు మెరిపించిన గొప్ప చరిత్ర చందమామ సొంతం. కోట్లాది మంది పిల్లల, పెద్దల మనో ప్రపంచంపై దశాబ్దాలుగా మహత్ ప్రభావం కలిగిస్తున్న అద్వితీయ చరిత్ర చందమామకే సొంతం. గ్రామఫోనూ, రేడియో తప్ప మరే ఇతర వినోద విజ్ఞాన సాధనమూ లేని కాలంలో చదువగలిగిన ప్రతి వారికి చక్కటి వినోద సాధనంగా పనిచేసిన చరిత్రకు సజీవ సాక్ష్యం చందమామ.

చందమామ ఆవిర్భవించి అప్పుడే ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇలాంటి కథల పత్రిక ప్రపంచంలో మరొకటి లేదని సామాన్యులు, మాన్యులు కూడా ముక్తకంఠంతో దశాబ్దాలుగా ఘోషిస్తున్నారు. చందమామ పత్రిక పఠనంతో తమ జ్ఞాపకాలను అపూర్వంగా పంచుకుంటున్నారు. ఆధునిక తరం అవసరాలకు అనుగుణంగా రూపొందిన పిల్లల పత్రికలు ఎన్ని వచ్చినా; కంప్యూటర్లూ, సెల్‌ఫోన్లూ, ఐప్యాడ్‌లూ వంటి ఆధునిక సాంకేతిక, వినోద ఉపకరణాలు ఎన్ని ఉనికిలోకి వచ్చినా పిల్లలూ, పెద్దలూ, వయో వృద్ధులూ.. ఇలా అన్ని వయస్సుల వారినీ, తరాల వారినీ అలరిస్తూ వస్తున్న ఏకైక కథల పత్రిక అప్పుడూ ఇప్పుడూ కూడా చందమామే.

తెలుగు నేలమీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం, నేటి తరం పాఠకులు ఎవ్వరూ కూడా చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు. చందమామ కథలతో పాటే పెరిగిన పిల్లలు జీవితంలో ఎన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. దేశీయ భాషలకు చెందిన సమస్త పాఠకులూ ఈనాటికీ చందమామ కార్యాలయానికి పంపుతున్న లేఖలూ, అభిప్రాయాలే దీనికి తిరుగులేని సాక్ష్యం.

తొలి సంచిక ప్రారంభమైన 1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినిపిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడంలో ఇసుమంత అతిశయోక్తి లేదు.

తెలుగునాడులో, భారతదేశంలో కొన్ని తరాల పిల్లలు, పెద్దల కాల్పనిక ప్రపంచాన్ని చందమామ కథలు ఉద్దీప్తం చేశాయి. నాగిరెడ్డి-చక్రపాణిగార్ల మహాసంకల్పం, కుటుంబరావు గారి అద్వితీయ -గాంధీ గారి-శైలి చందమామ కథలకు తిరుగులేని విజయాన్నందించింది. ఆ కథల అమృత ధారలలో దశాబ్దాలుగా ఓలలాడుతూ వస్తున్న వారు చందమామ కథాశ్రవణాన్ని తమ తదనంతర తరాల వారికి కూడా అందిస్తూ ఒక మహత్తర సంస్కృతిని కొనసాగిస్తూ వస్తున్నారు.

మారుతున్న కాలం, మారుతున్న తరాలు, పిల్లల అభిరుచులకు అనుగుణంగా దశ, దిశలు రెండింటినీ మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న చందమామను వెనక్కి పట్టి లాగి మూలం నుంచి పక్కకు పోవద్దని హెచ్చరిస్తూ, ధ్వజమెత్తుతూ, దూషిస్తూ కూడా చందమామ సారాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్న పాఠకుల వంటి వారు మరే భారతీయ పత్రికకూ కూడా లేరు.

యాజమాన్యం చేతులు మారినా చందమామ మూల రూపం మారితే సహించబోమంటూ నిరసన తెలుపుతూ, ఉత్తరాలు, ఫోన్లు, ఈమెయిళ్లు, ఎస్ఎమ్ఎస్ ల ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తున్న అరుదైన పాఠకులు చందమామకు తప్ప ప్రపంచంలో మరే పత్రికకు కూడా లేరని చెప్పవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే చందమామ దాని సంస్థాపకుల ‘చందమామ’ కాదు. దాని యజమానుల ‘చందమామ’ కాదు. అది ప్రజల ‘చందమామ’. పాఠకుల ‘చందమామ’. అభిమానుల ‘చందమామ’. ‘చందమామ పిచ్చోళ్లు’ అనిపించుకోవడానికి కూడా సిద్ధపడిపోయిన వీరాభిమానుల చందమామ.

ఆకాశానికీ చందమామకీ ఉన్న అనుబంధం ఎలాంటిదో, చందమామ పాఠకుల బాల్యానికీ, చందమామ పత్రికకు ఉన్న అనుబంధం అలాంటిది. వెన్నెల కోసం ఎదురు చూసినట్లు, పౌర్ణమి కోసం ఎదురు చూసినట్లు చందమామ కథల కోసం వేలాది, లక్షలాది పాఠకులు ఎదురు చూసేవారు.

“చందమామ నా ప్రాణనేస్తం. అమ్మ తన చిన్నప్పుడు చందమామ, తోకచుక్క, పాతాళదుర్గం, చదువుతూ పెరిగింది. నేను అక్క, అన్న, చందమామ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాళ్లం.” అంటూ నాలుగైదు తరాలుగా పిల్లలు చందమామతో తమ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు.

 

చందమామ కథల గొప్పతనం

చందమామ పత్రిక ఎందుకింత ఘనతర చరిత్రను సంపాదించుకుంది అంటే ఒక్కముక్కలో చెప్పలేం.

– ప్రపంచ సాహిత్యాన్ని చిన్నారి పాఠకులకు పటిక బెల్లంలా పంచిపెట్టింది చందమామ.

– పంచతంత్ర కథల్ని పంచభక్ష్య పరమాన్నాల్లా వండి వడ్డించింది చందమామ.

-ఊహలకు రెక్కలు తొడిగిన అద్భుత చిత్రాలతో కోట్లాదిమందిని మంత్రముగ్ధులను చేసింది చందమామ.

– నీతిమార్గం ఏమిటో, నైతిక జీవితాన్ని ఎలా గడపాలో మనోరంజకంగా తెలియజేసిన అద్భుత కళావాస్తవాల గని చందమామ .

– పసిపిల్లలకు మంచి చెడులు నేర్పుతూ నీతిముద్దలు పెడుతుంది “చందమామ’.

– జీవితంలో అనేక అనుభవాలు చవి చూచిన పెద్దవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించే తరహా కథలను అందించింది చందమామ.

– చిన్నపిల్లలతోపాటుగా పెద్దలకూ మానవత్వపు విలువలను, మంచితనాన్నీ, సద్గుణాలనూ గుర్తుచేసే పత్రిక చందమామ.

– విక్రమార్కుడి కథల దగ్గర్నుంచీ, మర్యాద రామన్న కథల వరకు ప్రతి కథలో నీతిని తేనెలో తియ్యదనంలా రంగరించి అందించింది చందమామ.

– పిల్లలు నిద్రలోనూ కలవరించి, పలవరించిన మెగా సీరియల్స్ -తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు వగైరా… లను అందించింది చందమామ.

– యాభైయ్యారు సంవత్సరాలుగా బేతాళుడిని చెట్టెక్కిస్తూ, దింపుతూ రికార్డు సృష్టించింది చందమామ.

– దయ్యాలనూ, భూతాలనూ పిల్లల ప్రియ నేస్తాలుగా మార్చింది చందమామ.

– మూఢవిశ్వాసాల ఉనికిని గుర్తిస్తూనే హేతువాదాన్ని తరాల పాఠకులకు బోధిస్తూ వచ్చింది చందమామ.

– దయ్యాలు, భూతాలు, భయంకర రాక్షసుల నడుమ మనిషికి, మానవ ప్రయత్నానికే గెలుపు అందించింది చందమామ.

– పన్నెండు భాషల్లో పిల్లలూ, పెద్దలూ పోటీలు పడి, దాచుకుని, దాచుకుని చదువుతున్న ఏకైక కథల పత్రిక చందమామ.

– టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్‌వర్క్‌లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు వినోదాత్మకమూ, విజ్ఞానదాయకమూ అయిన కాలక్షేపంగా నిలిచింది చందమామ.

– ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలు, విశిష్టమైన రచనలు, మహా పురాణాలు, అద్భుత కావ్యగాథలూ, నాటకాలు అన్నిటినీ కథలుగా మార్చి అందించింది చందమామ.

– 60 ఏళ్ల సంచికలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అన్ని భాషల పాఠకులకు ఉచితంగా అందిస్తోంది చందమామ

– అనితరసాధ్యమైన శైలిని, ఒరవడిని సృష్టించుకుని దశాబ్దాలుగా కొనసాగిస్తున్న అరుదైన పత్రిక చందమామ.

చదవడం అన్నది ఉన్నంతవరకు చందమామ వంటి పత్రికల అవసరం ఉండితీరుతుందని పెద్దల ఉవాచ.

 

చందమామను ఇంతవరకూ చూడలేదా..! చదవలేదా.. !!

అయితే ఇప్పుడే చూడండి… ఇప్పుడే  చదవండి… మీ స్వంత భాషలో… 12 భారతీయ భాషల్లో…

భారతీయ సాంస్కృతిక వారసత్వం చందమామ. అది మీదీ, మాదీ, మనందరిదీ…

‘చందమామ కథ’ చదువుదాం రండి.

 

 

అమలాపురం నుంచి అమెరికా దాకా షడ్రుచులు.

రచన : మంధా భానుమతి        

 

అమలాపురంలో..

యస్సెస్సల్సీ పరీక్ష రాశాక సెలవల్లో వెళ్ళినప్పుడు.. చైత్రమాసం: బహుళ పాడ్యమి. ఉగాది పర్వదినం. తెల్లారకట్ల ఐదయింది. అమావాస్య రాత్రి కదా.. చంద్రుడు, వెన్నెల ఏం లేవు.

 

అప్పుడప్పుడే మంచు విడుతోంది. మామిడిపూత ముదిరి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. మా పెరట్లో కుడి పక్కన గోడ నానుకుని పెద్ద వేపచెట్టు. దానికి పది అడుగుల దూరంలో మామిడి చెట్టు.

 

పెద్ద మామయ్య నీళ్ళపొయ్యి వెలిగించి, కొబ్బరి డొక్కా, కర్ర పేళ్ళూ వేస్తున్నాడు. పెద్ద రాగి డేగిసా. మూడు వంతులు భాగం నల్లగా ఉంటుంది. అందుకే ఇంటి పక్కనే ఉన్న మునిసిపల్ బళ్ళో చేరిన కొత్తల్లో రాగి ఏ రంగు అంటే నలుపు అని చెప్పా! అందరూ ఒకటే నవ్వులు.. “కావాలంటే వేణ్ణీళ్ళ డేగిసా చూసుకోండి మీ ఇళ్ళకేళ్ళి..” అని రోషంగా అంటే.. ఇంకాస్త నవ్వేసి, నా బుగ్గ గిల్లారు మా నారాయణ మేష్టారు. ఇంకా ఆ బుగ్గ నెప్పెడుతూనే ఉంది..

 

ఇంతకీ డేగిసాలో నీళ్ళు సలసలా మరుగుతుంటే తలంటేసుకుని, ఒక్కొక్కళ్ళం పోటీ పడి రాత్రి రాలిన వేప్పువ్వులు ఏరుతుంటే, చిన్నన్నయ్య గోడ మీంచి వేపచెట్టెక్కి ఫెళఫెళా పది కొమ్మలు విరుచుకొచ్చాడు. ఆ పువ్వులన్నీ కొమ్మల్నుంచి, కాడలు కొంచెం కూడా రాకుండా విడదీసి బాల్చీలో నీళ్ళల్లో వేసి, తెల్లగా మెరిసిపోతుంటే చాటలో పోసి వంటింట్లో అడ్డగోడ మీద పెట్టాం ప్రభా, నేనూ. మా మణి, శేషూ లేత మామిడికాయలు ఏరుకొచ్చి కడిగి పెట్టారు. కొట్టుగదిలో గెల ముగ్గిందేమో చూసి నాలుగరిటిపళ్ళు తెమ్మంది సీతంపిన్ని. కుండలో శేరు నీళ్ళు పోసి, నిమ్మకాయంత చింతపండుండలు రెండు వేసి నానబెట్టింది అమ్మ. ఓ అరగంటయ్యాక చింతపండు పిసికి, చెయ్యి పొడిగా తుడుచుకుని ఐదువేళ్ళూ ఉప్పు జాడీలోకి దింపి చేతికి పట్టినన్ని ఉప్పురాళ్ళు తీసి అందులోకి విదిల్చింది. మళ్ళీ చాలవేమోనని ఇంకో పది రాళ్ళు వేసింది. బెల్లపచ్చోటి రోట్లో వేసి దంచి, పావుశేరు గొట్టంతో అర్ధపావు పొడి చింతపండు నీళ్ళల్లో వేసింది. సన్నగా తరిగిన అరటి పండు ముక్కలు ఒక పావుశేరు, మామిడి ముక్కలు పావుశేరువేసి బాగా కలిపింది. మరి అసలుది వేపపువ్వు.. చేత్తో ఒక పిడికిడు తీసి కలిపింది. చేటలో మూడువంతులు పైగా అలాగే ఉన్నాయి, మేం కష్టపడి కాడలు తీసిన పూలు.

 

“అంత కష్టపడి తెస్తే అన్నేనా వేప్పూలు..” కొంచెం కినుకగా అడిగాను సీతంపిన్నిని.

 

“చేదు ఉండీ ఉండక నాలిక్కి తగలాలి కానీ.. ఆ పువ్వంతా వేస్తే ఇంకేవైనా ఉందా.. నోట్లో పెట్టుకోగలవా? జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఫరవాలేదు కానీ మొత్తం కష్టాలయితే ఎలా..”.

 

“అంటే..”

“నీకిష్టం లేని పనేది చెప్పు..”

 

“ఆర్నెల్లకోసారి ఆవదం తాగి, రోజంతా చారన్నం తినడం. ఆ పైన అస్తమానూ పెరట్లోకి పరుగెట్టడం.”

 

పకపకా నవ్వింది పిన్ని.

 

“చూశావా.. వంటికి మంచిదే కానీ ఏడాదికి రెండు సార్లు కంటే చెయ్యలేం. అలాగే వేప్పువ్వు కూడా.. పేగుల్లో పురుగుల్ని చంపడానికి ఆ పాటి చాలు. షడ్రుచులూ ఏది ఎంతెంత ఉండాలో అంతే ఉండాలి.” అంటూ లావుగా పొట్టిగా ఉన్న పచ్చి మిరపకాయలు రెండు సన్నగా, చూరులా తరిగి కుండలో వేసింది.

“ఇందులో ఏమేమి రుచులు ఎందులో ఉన్నాయో చెప్పు పిన్నీ.”

 

“పులుపుకి చింతపండు,మామిడి ముక్కలు, ఉప్పు, తీపికి బెల్లం, కారంకి పచ్చిమిరప ముక్కలు, చేదు.. తెలుసు కదా.. ఇంక షడ్రుచుల్లో వగరు మిగిలింది..”.

 

“మరి వగరు కేం చేస్తావ్?”

 

“అరటి పువ్వులో కొప్పెన్న దాచా నిన్న. అది సన్నగా ముక్కలు తరిగి వేస్తా. మామిడి కాయ జీడి కూడా చిటికెడు పొడి శాస్త్రానికి వేసుకోవచ్చు.” అరటి పువ్వు రేకులు, పువ్వులు అన్నీ తీసెయ్యగా మిగిలిన చివరి మొగ్గ లాంటిది తెస్తూ అంది. కొప్పెన్న పైన సగం కోసేసి, సన్నసన్న పువ్వులున్న భాగం సన్నగా తరిగి వేసింది.

 

 

అందరూ స్నానాలు, దేముడి దగ్గర పూజలు అయ్యాక, తలో అరటిదొన్నెడు ఉగాది పచ్చడి ఇచ్చింది మా వదిన. వేపువ్వుకూడా మిగిలిన రుచుల్లో నాని అంత చేదనిపించలే.. ఇంకా ఆ రుచి నాలిక్కి తగులుతున్నట్లే ఉంది.

 

 

అయిద్రాబాద్లో..

ఇదే ఉగాది పచ్చడి మా అబ్బాయిలిద్దరూ చిన్నపిల్లలప్పుడు.. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ఒక మామ్మగారింట్లో అద్దెకున్నప్పుడు.. పొద్దున్నే తలంట్లకి రమ్మంటే ఒకడేమో పువ్వులు కోస్తానని వేపచెట్టెక్కి, ఇంకోడు మామిడి పిందెలకోసం మామిడి చెట్టెక్కీ కూర్చుంటే, నోరునొప్పెట్టేలా అరుస్తూ అశోక్‍నగరు సత్యనారాయణ కొట్లో కొన్న చింతపండు దగ్గరగా చేసి నొక్కి నిమ్మకాయంత ఉండ చేసి, చిన్న దబరాగిన్నెలో నానబెట్టి పులుసు తీశా.

 

అంతలో ఓనరు మామ్మగారు.. “ఏమండీ మీ పిల్లలు చెట్లెక్కి కొమ్మలు విరిచేస్తున్నారు.. ఇలా అయితే వచ్చే ఒకటో తారీక్కల్లా మీరిల్లు ఖాళీ చెయ్యవలసిందే.” అని వార్నింగిచ్చారు.

అంత వరకూ కొమ్మల్లో ఎక్కడ దాక్కున్నాడో కనిపించని మా పెద్దబ్బాయి, నిండా పువ్వులున్న రెండుకొమ్మలు కోసుకొచ్చి ఒకటి మామ్మగారి చేతిలో పెట్టాడు.. ఈ చెవినుంచి ఆ చెవిదాకా నోరు సాగదీసి నవ్వుతూ. ఆవిడ రుసరుసలాడుతూ రెండు కొమ్మలూ పుచ్చుకుని చక్కా పోయింది. వాడింత మొహం చేసుకుని బుద్ధిగా తలంటుకి బాత్రూంలోకి దూరాడు, నేను స్టౌ మీంచి వేణ్ణీళ్ళు తెచ్చేలోగా. ఒళ్ళంతా చక్కగా నూనె రాయించుకుని, పిండి నలుగు పెట్టించుకుంటాడు కానీ, కుంకుడుకాయ గిన్నె తెచ్చి తలమీదికి తీసుకెళ్తుంటే ఎవరో కొడ్తున్నట్లు గట్టిగా రంకెలు పెట్టేస్తాడు. కళ్ళకి గంతలు కట్టి కష్టపడి తలరుద్ది వచ్చేసరికి నాకు నీరసం పట్టుకుంది.

 

పెద్దాడ్ని బట్టలేసుకోమని చెప్పి కాఫీ కలుపుకుని తాగుతుంటే అప్పుడు వచ్చాడు చిన్నాడు ఎక్కడ్నుంచో నాలుగు మామిడికాయలు పట్టుకుని. వాడు మామ్మగారికి దొరక్కుండా తప్పించుకుంటాడెప్పుడూ. తలంటుకూడా నాన్న చేత పోయించుకున్నాడు.. తను తెచ్చుకున్న షాంపూతో. అది అగ్రజుడికి తెలిసి ఆ తర్వాత.. ఎందుకులెండి! ఆ పై ఏడు నుంచీ అందరం షాంపూలే వాడ్డం మొదలుపెట్టాం.. ప్రతీవారం లేనిపోని గొడవలెందుకని.. జీతాలు కూడా కొద్దిగా పెరిగాయి..

 

సుల్తాన్‍బజార్లో కొనుక్కొచ్చిన వాడిపోయిన వేపకొమ్మల్లోంచి ముడుచుకుపోయిన పువ్వులు లెక్కపెట్టి పది ఏరి, అరటిపండులో సగం చిన్న ముక్కలు చేసి, సగం మామిడికాయ (చిన్నాడు కొట్టుకొచ్చింది కాదు) కోరి, ఒక చదరపు అంగుళం బెల్లమ్ముక్క అమాందస్తాలో దంచి.. చెంచాడు స్వస్తిక్ మార్కు ఉప్పుతో అన్ని కలిపాను. వగరుకి అరటికాయ తొక్కు కొద్దిగా కోరి వేశాను. చూశారా మరి, ఉపాయం ఉంటే ఊళ్ళేలచ్చని మా పిన్ని అంటుండేది.

 

దేవుడలమారు దగ్గర అందరం ఇరుక్కుని కూర్చుని పూజ చేసుకుని, తలా చెంచాడు ఉగాది పచ్చడి తినిపించేసరికి దేవుళ్ళందరూ కనిపించారు. అది తినకపోతే పులిహోర, సేమ్యా పాయసం, ఆలు ఫ్రై దొరకవని బెదిరించాను మరి. ఆ తరువాత సొంత ఇంట్లోకి మారినప్పట్నుంచి, నాలుగిళ్లవతలున్న మా వదినగారు, తెల్లారకుండా చక్కని ఉగాది పచ్చడి చిన్న స్టీలు డబ్బాలో తెచ్చిపెట్టేసేవారు చాలా ఉగాదిలకి. చెప్పద్దూ అది నేను చేసిందానికంటే ఎన్నో రెట్లు బాగా ఉండేది.

 

అమెరికాలో..

అబ్బో! చాలా హడావుడి.. తెలుగు వాళ్ళంతా కలిసి పాటలూ, ఆటలూ! కాకపోతే ఉగాది ఏవారం వచ్చినా సరే శనివారం మాత్రమే పండుగ. పాపం ఇక్కడ ఉగాదికి సెలవివ్వరు కదా!

 

“ఇవేళ ఉగాది కాదు కదా! పండుగ చేసుకుంటాం కానీ పచ్చడి తినక్కర్లేదు ఎంచక్కా.” పెద్దాడు ఆనందంగా సెలవిచ్చాడు పొద్దున్నే.

 

“అదేం కుదరదు.. పండుగ ఎప్పుడు చేసుకుంటే అప్పుడు పచ్చడి కూడా చెయ్యాల్సిందే.. తినాల్సిందే. ఆంటీ బాగా చేస్తారు.” కోడలు వెంటనే రిటార్ట్. అసలు తను ఎప్పుడూ నా ఊ- పచ్చడి తినలేదు. ఎందుకేనా మంచిదని ఓ కాంప్లిమెంట్ పడేస్తుంటుంది.

 

మా ఇద్దరికీ లాగానే వీళ్ళకి కూడా ఒక్కక్షణం పడదు. సరిగ్గా ఆపోజిట్ టేస్ట్‍లు.

ఉగాది అయినా కాకపోయినా శనివారం పొద్దున్నే తలంట్లు తప్పవు. ఎనిమిదేళ్ళ అమోగ్, వాడంతట వాడే షావర్ చేసేసి.. తల్లోంచి నీళ్ళు కార్చుకుంటూ బైటికి వచ్చాడు.

 

“జలుబు చేస్తుంది రా.. సరిగ్గా తుడుచుకో.” నేను మొత్తుకుంటూనే ఉన్నా.

 

“ఇట్స్ ఓకే నాన్నమ్మా! నథింగ్ హాపెన్స్..” డియస్ పట్టుకుని బాక్ యార్డ్ లోకి తుర్రుమన్నాడు.

 

“ఓ…ఓ..” అంటూ బాత్రూంలోంచి శోకాలు.. కంటినిండా టియర్లెస్ షాంపూ పోసేసుకుని నాలుగేళ్ళ అనిక కళ్ళు నులుముతూ ఏడుస్తోంది, వాళ్ళమ్మ వచ్చే లోపు.

 

“షాంపూ కళ్ళల్లో పోసుకుంటే మండదా? నెత్తికి రుద్దుకోవాలి కానీ.. అంటూ మొహం కడిగి, తల రుద్ది బైటికి తీసుకొచ్చా.

 

“టియర్‍లెస్ అంటే ఏంటి నాఅన్మా?”అంది గడుగ్గాయి. అది ఆ షాంపూచేసిన వాళ్ళనే అడగాలి అనుకుంటూ వంటింట్లోకి నడిచాను.

 

గోళీ కాయంత గింజల్లేని చింతపండు, సీరియల్ బౌల్‍లో వేసి మునిగేంత నీళ్ళు పోసి మైక్రోవేవ్‍లో అరనిముషం పెడ్తే మెత్తగా అయింది. దాన్ని చెంచాతో కలిపి ఫిల్టర్ చేసి రసం తీశా.(చేతులు వాడితే.. అమోగ్ గోల చేస్తాడు. వాడు నోట్లో పెట్టుకున్న వేళ్ళు ఫుడ్‍లో పెట్టకూడదని రూలింగ్.. అది నాక్కూడా వర్తిస్తుంది వాడి ప్రకారం.)

 

చిన్నసైజు గుమ్మిడికాయంతున్న మామిడికాయ తీసుకొచ్చాడు మావాడు.. మెక్సికోదిట. సేఫ్‍వేలో దొరికింది అంటూ. సరిగ్గా చెంచాడు సన్నని ముక్కలు తరిగి చింతపండు రసంలో వేశాను.

 

“అంత కష్టపడి తెస్తే అంతేనా?” మా వాడి కినుక.

 

“అసలు పచ్చడే ఔన్సుడు లేదు.. అయినా ఈ కాయకి మామిడి వాసన కూడా లేదు.” నాలిక్కరుచుకున్నాను, ఏమంటాడో అని భయంగా చూస్తూ. ఏకళ నున్నాడో.. ఏం మాట్లాడలేదు. లేపోతే.. అంత కష్టపడి.. అంటూ అరగంట లెక్చర్.

 

పావు స్పూన్ అయొడైజ్‍డ్ ఉప్పు, చెంచాడు బ్రౌన్ షుగర్..(అపార్ధం చేసుకోకండి. బెల్లంపొడిని అలా పిలుస్తారు.. మత్తెక్కించే ఆ బ్రౌన్.. కాదు.), అతి సన్నగా కోసిన పచ్చిమిరపకాయ ముక్కలు నాలుగు.. చింతపండు రసంలో వేశాను. మున్నాలాల్ పచారీ కొట్టునుంచి కొనుక్కొచ్చిన ఎండు వేంపువ్వులు నాలుగు పొడిచేసి కలిపాను. ఇంక వగరు.. ఏం చెయ్యాలి?

 

దగ్గుకి మంచిదంటే మున్నాలాల్ కొట్టునుంచే కరక్కాయలు తీసుకొచ్చా. ఒకటి కొద్దిగా చిదిమి చిటికెడు వేశాను.

 

అమెరికా ఉగాది పచ్చడి తయార్.

 

గారెలు, ఆవడలు, పిల్లలకి ఇష్టమైన సూప్(గుమ్మడికాయ తియ్య పులుసు), సేమ్యా పాయసం ఎట్సెట్రాలు బల్ల మీద అందంగా సర్ది.. భోజనాన్కి కూర్చునే ముందు, తలా అరచెంచాడు ఉగాది పచ్చడి నోట్లో పెట్టుకున్నారు అందరూ.. కోడలికేసి కోరగా చూస్తూ.

 

మావాడు ముక్కు మూసుకుని మింగాడు.. మా చిన్నప్పుడు డాట్రుగారు కార్బొనేట్ మిక్స్చర్ నోట్లో వేసినట్లుగా. కోడలు కనుబొమ్మలు ముడిచి నోటితో నవ్వుతూ.. కళ్ళలో వర్ణించలేని భావాలు పలికిస్తూ చప్పరించింది. అమోగ్‍కి కొంచెం మొహమాటం ఎక్కువ.. అందులో నాన్నమ్మంటే ఇష్టం.. నేనేమైనా అనుకుంటానేమో అన్నట్లు..

 

“ఇట్స్ ఓకే. థిస్ టేస్ట్స్ ఫన్నీ దో..” ఒక్క చుక్క నాలిక మీద వేసుకున్నాడు. “ఐ హావ్ టు యూజ్ బాత్రూం..” చెంచాతో సహా పరుగెత్తాడు.

 

చూడ్డానికి ఏమిటేమిటో తేలుతూ తమాషాగా ఉన్నాయి కాబోలు.. అనిక తీక్షణంగా తన చెంచాని స్టడీ చేసి.. నోట్లో పెట్టుకుంది.

 

“ఐ హేట్ దిస్ స్టఫ్..” అంటూ వంటింట్లో సింక్ దగ్గరికి వెళ్ళి వాక్ అని ఉమ్మేసి, నోరు కడుక్కుని వచ్చింది.

 

ఇంక తప్పుతుందా.. మేమిద్దరం కూడా నాకాల్సి వచ్చింది.

 

అందరం బుద్ధిగా పళ్ళు బ్రష్ చేసుకుని, నోరు సుబ్భరంగా కడుక్కుని, పిండివంటలమీద పడ్డాం.

 

అదండీ షడ్రుచుల కథ.

 

 

*—————*

 

 

 

 

నాదీ ఓ సినిమా కధే

ఒక ఆదివారం తీరుబడిగా కూర్చుని, కాఫీ తాగుతూ, సిగరెట్టు కాలుస్తూ ఆలోచిస్తున్నాను. ఏమిటి ఆలోచిస్తున్నావు అంటే ఏం చెప్పాలి. టాటా గార్కి అన్ని కోట్లు ఎందుకు ఉన్నాయి? నెలాఖరికి నాజేబులో ఓ పదిరూపాయలు ఎందుకు ఉండవు? పక్కింటి సాఫ్ట్ వేరు ఇంజినీరు తండ్రి , ఆట్టే చదువుకోక పోయినా విమానాలు ఎందుకు ఎక్కుతాడు? నేను కష్టపడి PG చేసినా టికెట్టు కొనకుండా సిటీ బస్సు లో ఎందుకు ప్రయాణం చేస్తాను?

65 ఏళ్ళు వచ్చినా ఆ హీరో జుట్టు నల్లగా ఎందుకు ఉంటుంది? 35 ఏళ్లకే నా జుట్టు ఎందుకు తెల్లబడి రాలి పోయింది? మా ఎదురింటి ఆయన మాట్లాడితే పది మంది చేరి ఎందుకు పగలబడి నవ్వుతారు? అత్యవసరమైతే తప్ప మా ఆవిడ కూడా నాతోటి ఎందుకు మాట్లాడదు? ఇన్ని సమస్యలు చుట్టుముట్టు తుంటే ఆలోచించక ఏమిటి చెయ్యడం? ఆలోచించి ఆయాసపడతాను.

ఈ రోజున ఆలోచిస్తుంటే ఙ్ఞానోదయమైంది . మా నాన్న గారు పరమ పదించే ముందు నాతోటి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. “నాయనా ప్రద్యుమ్నా, మన పూజా మందిరం లోని సింహాసనం కింద..  ” అని ఇంకేదో చెప్పబోతుండగానే ఆయన కీర్తి శేషులు అయిపోయారు. ఆతర్వాత నేను ఆ సింహాసనం కింద చూశాను. ఏమి లేదు. ఆ విషయం అంతటితో నేను మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ సుమారు 30 ఏళ్ల తర్వాత అది గుర్తుకు వచ్చింది. పితాశ్రీ గారు ఏమి చెప్పబోయారు అని కడు దీర్ఘముగా నాలోచించితిని. ఆలోచించి చించి, చించడం మానేసి వెళ్ళి ఆ సింహాసనం తీశాను. అంతే ఎక్కడినించో అశరీరవాణి అరిచింది. అశరీరవాణి అంటే మా ఆవిడ శ్రీమతి ప్రభావతి దేవి అన్నమాట. ఆవిడ ఎక్కడున్నా నేను చేసే ప్రతీ పనీ ఇట్టే కనిపెట్టేస్తుందన్న మాట. “ఆ సింహాసనం ఎందుకు ముట్టుకున్నారు ఆ వెధవ చేతులతో. అది అక్కడ పెట్టేసి ఆ చేతులు ఒక మాటు కాల్చుకోండి. “ అంది. ఆవిడ నిత్యాగ్నిహోత్రులు శ్రీ సోమయాజుల గారి పుత్రికా శ్రీ. వాళ్ళ ఇంట్లో నిప్పులు కూడా కడుక్కుంటారుట, అని ఆవిడే చెప్పింది. ఈ లాజిక్కు నాకు అర్ధం కాదు. నా చేతులు అపవిత్రమైనవే కావచ్చు, సింహాసనం మహా పవిత్రమైనదే అవవచ్చు. ముట్టుకుంటే నా చేతులు పవిత్ర మవ్వాలి లేకపోతే సింహాసనం అపవిత్రమవాలి. మరి నాచేతులు ఎందుకు కాల్చుకోవాలి. అపవిత్రమైతే సింహాసనం నే పవిత్రం చెయ్యాలి కదా. కానీ మా ఆవిడ ఉవాచ అంటే సుప్రిము కోర్టు తీర్పు అన్నమాట. No appeal అని భావం. జీవితంలో ఒక్కమాటైనా లక్ష్మణ రేఖ దాటాలి, లేకపోతే మన రామాయణం లిఖించ బడదు. కాబట్టి నా జీవితాన్ని పణం గా బెట్టి, రేఖ మీదనించి దూకేసాను. ఆ సింహాసనం అధిష్టించిన శ్రీ రమా సహిత వెంకటేశ్వర స్వామి ని, చిన్న విఘ్నీశ్వరుడిని, శ్రీల క్ష్మీ దేవి ని తీసి పక్కన పెట్టి, ఆ సింహాసనాన్ని శుభ్రం గా తోమి, కడిగి పరీక్షించాను.

సింహాసనం మామూలుగానే ఉంది. బాగా తోమి కడిగాను కాబట్టి మెరుస్తోంది. సింహాసనం కింద అని మా పితాశ్రీ గారు చెప్పినది గుర్తు తెచ్చుకొని తిరగేసి చూశాను. ఏమి విశేషం గా కన్పించలేదు. ఈ మాటు తీక్షణంగా వీక్షించి కింద అంచుల మీదుగా చేతితో పరీక్షగా రాశాను. ఒక చోట కొంచెం తేడాగా అనిపించింది. అక్కడ నొక్కి విడదీయడానికి ప్రయత్నించాను. కుదరలేదు. నాలో పట్టుదల పెరిగింది. ఈ వేళ ఇదేదో తేల్చుకోవాల్సిందే నని తీర్మానించుకున్నాను. ఓ సుత్తి తెచ్చి రెండు దెబ్బలు వేసాను. ఇంతలో అశరీరవాణి నాముందు ప్రత్యక్షమైంది. “అయ్యో , ఏం పనండి అది, బుద్ధి లేదా మీకు, వందల ఏళ్లగా ఇంట్లో ఉన్న బంగారం లాంటి వెండి సింహాసనం పగల కొట్టేస్తారే మిటి? మీకేమైనా దెయ్యం పట్టిందా” అని మొదలు పెట్టి దండకం చదవడం సాగించింది. మా ఆవిడ దండకం కూడా పద్ధతి ప్రకారం పాడుతుంది. మొదట తెలుగు తర్వాత సంస్కృతం ఆపైన ప్రాకృతం భాషలలొ సుదీర్ఘం గా సాగుతుంది దండకం. ఆవిడ తెలుగు లో ఉన్నంత కాలం మనకి జీవితం మీద విరక్తి కలిగి, సంసారాన్ని త్యజించి సన్యాసుల్లో కలిసిపోవాలనో, హిమాలయాల్లోకి పోయి తపస్సు చేసుకోవాలనో అనిపిస్తుంది. ఇదా జీవితం అని ఏడుపు వస్తుంది. ఆవిడ సంస్కృతంలోకి దిగితే, ఆత్మహత్యే శరణ్యం అనిపిస్తుంది. చెరువులో దూకడమా, పురుగుల మందు తాగడమా, కిరసనాయిలు మీద పోసుకొని అంటించుకోవడమా లేక ఉరి వేసుకొని తనువు చాలించడమా అని అనేక ఆత్మహత్యా ప్రయత్నాల మీద చర్చ సాగుతుంది. మనసు అల్లకల్లోలం అయిపోతుంది. కడుపులో అనేక గరిటలు ఏక కాలం లో తిప్పుతున్న ఫీలింగు కలుగుతుంది. ఎవరూ ఆపకపోతే ఏదో ఒక ప్రయత్నం చేసేస్తాం. ఆవిడ ఇంక ప్రాకృతంలోకి ప్రోగ్రెస్ అయితే మనస్సు నిర్మలంగా అయిపోతుంది. మనస్సు ఏకీకృతమై పోతుంది. మన ప్రమేయం లేకుండానే మన శిరస్సు వెళ్ళి గోడలకి కొట్టుకోవడం లేదా మనచేతులు రుబ్బురోలు పొత్రము తీసుకొని మన శిరస్సు ని మర్దనా చేయడమో జరిగిపోతుంది. ఆపైన సర్వేశ్వరుడి దయ అన్నమాట.

మా ఆవిడ సంస్కృతం లోకి ప్రాకృతం లోకి వెళ్ళక ముందే పని కానిచ్చేద్దామని, నా బలం అంతా ఉపయోగించి బలంగా నాల్గు దెబ్బలు వేసాను. ఉన్నట్టుండి ధడేల్ మని ఓ మెరుపు మెరిసింది. ధడేల్ మని మెరుస్తుందా అని ఆశ్చర్యపడకండి. నేను కొంచెం వెరైటీ గా ఆలోచించడం నేర్చుకున్నాను పెళ్లి అయిం తర్వాత. మెరవగానే సింహాసనం కింది భాగం ఊడిపడింది. దానితో బాటు ఒక తాళపత్రం దానికి అంటుకొని ఉన్న ఒక రాగి ఉంగరం కింద పడ్డాయి. మా ఆవిడ దండకం ఆపేసి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తోంది. నేను విజయ గర్వంతో తల ఎగరవేసి జయ నవ్వు నవ్వాను. అంటే జయ అనే ఆవిడ నవ్వు కాదు. జయజయ విజయీభవ నవ్వు అన్నమాట. అంటే ఆనందం వస్తే నేను కొంచెం అనుమానం పడతాను. ముందు, ఇందులో మతలబు ఏమైనా ఉందా అని క్షుణ్ణంగా పరిశోధించి కానీ ఆనంద పడను.

ఇది పెళ్ళైన మొదటి ఏడాది నించే అలవాటు అయింది. ఆ కాలం లో ఆఫీసు నించి ఇంటికి రాగానే మా ఆవిడ ఒక ప్లేటు లో నాలుగు మైసూరు పాకులు, రెండు మినప సున్ని ఉండలు,రెండు కజ్జికాయలు పెట్టి ఇస్తే, వెఱ్ఱివాడిని కాబట్టి ఓహో భార్యా రత్నమా నేనంటే నీకెంత లవ్వు, ఎంత కష్టపడి చేశావు ఇవన్నీ అని సంబర పడి పోయేవాణ్ణి. అవన్నీ ఆరగించి ఫ్రెష్ గా చేసిన ఫిల్టరు కాఫీ తాగి “నను పాలింపగ నడచి వచ్చితివా అఖిలాండేశ్వరి, భ్రమ్మాండేశ్వరీ ” అని పాడుతుంటే అప్పుడు, అంటే నేను స్వర్గానికి ఇదే దారి అని మహదానంద భరితుండ నై ఉండగా, శ్రీ వెంకయ్యావధాన్లు పౌత్రి , శ్రీ సోమయాజులు పుత్రి , మదీయ పత్ని శ్రీమతి ప్రభావతీ నామధేయి కుడికాలి బొటన వేలు తో నేలమీద బరుకుతూ, ఎడమ చేతి చూపుడు వేలికి పైట చెంగు కుడి చేతి తో చుట్టుతూ, మనోహరంగా చిరునవ్వులు ఒలికిస్తూ xterracyprus అనేది. “నా ప్రియతమా పద్దూ, ఈ వేళ పక్కింటి ప్రతిక్షా బొర్ఘోహైన్ మైసూరు సిల్కు చీర తీసుకొంది. చాలా బాగుంది. అల్లాంటిది ఇంకొక్కటే ఉంది ట ఆ కోట్లో . చవకే 445 మాత్రమే, నాక్కూడా తెచ్చి పెట్టమని చెప్పాను” అని మంద్ర స్వనంతో తెలియబరిస్తే, నందన వనంలో విహరిస్తున్న పద్దూ గాడు ఒక్కమాటుగా కిందకు పడితే, నాల్గు పాకులు , రెండు ఉండలు మరో రెండు కాయలు=445 అని తెలిసిన మరుక్షణం పడిన మనోవేదన, మళ్ళీ మళ్ళీ పడ్డాను కాబట్టి ఆనందం అంటే కొంచెం ఆలోచించి కానీ పడను. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఆలోచించ కుండానే, విజయానందం, జయ నవ్వు కలిసి వచ్చేసేయి.

ఆశ్చర్యం గా ఆ తాళ పత్రం మీద తెలుగులో వ్రాసి ఉంది. “నాయనా ప్రద్యుమ్నా నేను శ్రీ సచ్చిదానంద శాస్త్రి ని, నీకు ముందు 162 వ తరం వాడిని. నేను మోక్షకామి నై 12465 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాకు మరణానంతరం మోక్షము + ఈ రాగి ఉంగరం ప్రసాదించాడు. ఈ రాగి ఉంగరం మహా మహితాన్వితమైనది. ఇది కుడిచేతి మధ్య వేలుకి ధరించి, బొటన వేలు తో గీకుతూ, ఎడమచేతి బొటన వేలు చూపుడు వేలు తో నీనెత్తి మీద ఒక వెంట్రుక పీకి పడవేసిన చో ఒక యక్షుడు ప్రత్యక్షమై నీ చిన్న కోరికలు తీర్చును. నీకు జయమగు కాక “ అని వ్రాసి ఉంది. ఇది నేను చదివిన వెంటనే మా ఆవిడ మొదలు పెట్టింది. “ఈ పక్కనో నాలుగు, ఆపక్కనో నాలుగు, వెనక రెండు మిగిలినదంతా మైదానం. మీ తలమీద వెంట్రుకలతో ఏమౌతుంది. సరిగ్గా చదివారా మీ వెంట్రుకలేనా , మీ ఆవిడ నెత్తి మీద వెంట్రుకలని ఉందా మళ్ళీ ఒక మాటు చూడండి” నాకు మండుకొచ్చింది. నావే అని ఘంటా పధం గా చెప్పేను.

మా ఆవిడ అన్నదని కాదు కానీ నాకూ అనుమానం వచ్చింది. బుఱ్ఱ తడిమి చూసు కున్నాను. మా అశరీరవాణి మాట నిజమే అనిపించింది. ఉన్న శిరోజములు సాగదీసి మధ్యకి దువ్వితే కొంచెం ఎక్కువ ఉన్నట్టు నేను భ్రమ పడతాను కానీ ఉన్నవి 10 మాత్రమే అని లెఖ్ఖ తేలింది. అందులో కూడా అన్నీ ఒకే సైజు లో లేవు. కొన్ని పొట్టి, కొన్ని ఒక మాదిరిగా, పొట్టి పొడుగు కానివి, మిగిలినవి పొడుగు అని చెప్పలేను కానీ మిగతా వాటి మీద ఇంకో సెంటీమీటరు ఉంటాయేమో. వీటన్నిటికి ఒకే మాదిరి ఫలితం ఉంటుందా అనే సంశయం కూడా వచ్చేసింది. చిన్న కోరికలు అని వ్రాసి ఉంది కదా, ధన కనక వస్తు వాహనాదులు పెద్ద కోరికలా లేక చిన్నవా? యక్షుడు గారిని అడిగితే ఫ్రీ గా చెప్పుతాడా లేక ఒక వెంట్రుక ఖర్చు రాస్తాడా? యక్షుడి లెఖ్ఖలు ఆకాలం నాటివా ఈ కాలం నాటివా? ఇల్లా అనేక అనుమానాలు నా మనస్సును తొలిచి వేస్తున్నసమయం లో ఉన్నట్టుండి నా నెత్తి మీద చురుక్కుమంది. చూస్తే మా ఆవిడ చేతిలో నావి ఓ అరడజను వెంట్రుకలు. బలంగా పీకిందేమో నా నెత్తిమీద ఇంకా చురుక్కు మంటూనే ఉంది. పొడుగ్గా ఉన్నాయనుకొన్న మూడు వెంట్రుకలు కూడా ఆవిడ చేతిలో.

కొన్ని కొన్ని విషయాలలో మా ఆవిడ రేపటి పని ఇప్పుడే చేసేస్తుంది. ఆలస్యం అసలు సహించదు. తొందర ఎక్కువ. మీరు ఆ ఉంగరం గీకండి, నేనో వెంట్రుక కింద పడేస్తాను అంది. ఏం కోరుతావు అని అడిగాను. మీ కెందుకు, మీరు గీకండి అంది. నేను ఉంగరాన్ని కుడిచేత

ఆంధ్ర భారత భారతి – 2

( కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతంలోని హృద్య పద్యాలకు వ్యాఖ్యానం – 2 )

– డా. ఆచార్య ఫణీంద్ర

“విమల మతిం బురాణములు వింటి ననేకము; లర్థ ధర్మశా
స్త్రముల తెరం గెరింగితి; నుదాత్త రసాన్విత కావ్య నాటక
క్రమముల  పెక్కు సూచితి – జగత్పరిపూజ్యములైన ఈశ్వరా
గమముల యందు నిల్పితి బ్రకాశముగా హృదయంబు భక్తితోన్!”

ఈ పద్యం  ఆదిపర్వం ప్రథమాశ్వాసంలోని అవతారిక లోనిది. పరమ ధర్మవిదుడు, వర చాళుక్యాన్వయాభరణుడు అయిన రాజరాజనరేంద్రుడు – నిత్యసత్యవచనుడు,సుజనుడు అయిన నన్నపార్యుని చూచి, కృష్ణద్వైపాయనుడు దేవభాషలో రచించిన మహాభారతాన్ని తెనుగున రచించుమని చేసిన ప్రార్థనకు ముందుమాట ఇది.
“విమలమైన బుద్ధితో ఎన్నో పురాణాలను విన్నాను. ధర్మార్థ శాస్త్ర సూక్ష్మాలను తెలుసుకొన్నాను. ఉదాత్త విషయాలతో రసపూరితాలైన పెక్కు కావ్య నాటకాలను చూచాను. లోక పూజ్యాలైన శైవాగమాల పైన భక్తితో మనసు నిలిపాను” అని నన్నయ భట్టారకునితో ఈ పద్యంలో చెప్పి, ” అయినా, మహాభారతంలోని విషయాన్ని వినాలని నాకు పెద్ద అభిలాష ” అని వివరిస్తాడా భూపతి.
రాజరాజ నరేంద్రుడు పురాణాలను, ధర్మార్థ శాస్త్రాలను, కావ్య నాటకాలను పేర్కొన్నాడంటే – అదంతా సంస్కృత వాజ్ఞ్మయం గురించి అన్నమాట. తెలుగులో అంతకు ముందు కావ్యసృజన జరుగలేదు కదా! ముఖ్యంగా సంస్కృత భాషా సాహిత్యంలో ” కావ్యేషు నాటకం రమ్యం” అంటూ ప్రసిద్ధి గాంచిన పెక్కు నాటకాలను ఆయన వీక్షించాడన్న విషయం – ఆయనన్న ” ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమముల  పెక్కు సూచితి” అన్న మాట ద్వారా స్పష్టమవుతుంది.
నన్నయ ఈ పద్యంలో కావ్య నాటకాలకు రెండు ప్రధాన లక్షాణాలను నిర్దేశించాడు. ఒకటి ఉదాత్తమై యుండుట; రెండు రసాన్వితమై ఉండుట.
— £££ —

శ్రావణ పౌర్ణమి సంచికకు స్వాగతం

మాలిక మూడవ సంచికకు స్వాగతం. ఈ ప్రత్యేక సంచిక ఎన్నో వ్యాసాలు, కథలతో, పోటీలతో ముస్తాబై వచ్చింది. ఈ సంచికలో ప్రముఖుల రచనలు, బ్లాగర్ల అద్భుతమైన కథలు, వ్యాసాలు, అసలు బ్లాగులంటేనే తెలీనివారి రచనలు కూడా పొందుపరచాము. అవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాము. మీ విమర్శలు, సలహాలు మాకు సదా శిరోధార్యం.

అనివార్య కారణాల వల్ల రావు బాలసరస్వతిగారి ఇంటర్వ్యూ ప్రచురించడంలేదు. దీపావళి సంచికలో ప్రచురిస్తాము.

ఈ సంచికలో రెండు పోటీలు నిర్వహిస్తున్నాము. రెంటికీ నగదు బహుమతి ఉంది. పదచంద్రికను తప్పులు లేకుండా పూరించినవారికి నగదు బహుమతి వెయ్యి రూపాయలు. మరో పోటీ ఏంటంటే… ఈ సంచికలో ఒకే రచయిత/త్రి రాసిన రచనలు ఒకటికంటే ఎక్కువ ఉన్నాయి. ఆ శైలిని మీరు గుర్తుపట్టగలరేమో చూడండి. రచయిత/త్రి ని గుర్తించండి -బహుమతిగా 500 రూపాయలు తీసుకోండి.

వచ్చే నెల సెప్టెంబర్ 21 న గురజాడ నూట యాభయ్యవ జయంతి జరుపుకోబోయే సందర్భంగా గురజాడివారి రచనలపై విశ్లేషణతో కూడిన రచనలు రెండు సమర్పిస్తున్నాం.చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

మాలిక పత్రికలో మరో నలుగురు కొత్త సభ్యులు చేరారు. సుజాత , కల్లూరి శైలబాల, కుమార్.ఎన్ & కౌటిల్య.

వచ్చే సంచిక కోసం మీ రచనలు ఈ చిరునామాకు పంపగలరు editor@maaila.org

ఈ పత్రికకు తమ రచనలు పంపినవారందరికీ ధన్యవాదాలు. మీ నుండి మరిన్ని అమూల్యమైన రచనల కోసం మాలిక ఎదురుచూస్తోంది!

ఈ సంచికలో ప్రచురింపబడిన రచనలు:

1. శ్రావణ పౌర్ణమి సంచికకు స్వాగతం
2. సంపాదకవర్గం నుండి: ఒక చిన్నమాట!!
3. పెళ్లి చేసి చూపిస్తాం! మేమూ పెళ్లి పెద్దలనిపిస్తాం!!!
4. అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే
5. మీనా
6.పుత్రోత్సాహము తండ్రికి
7. చెప్పబడనిది, కవితాత్మ!
8.మహా సాధ్వి – గార్గి
9. అన్నమయ్య – ఒక పరిచయం
10. హిందోళరాగం
11. విశ్వనాధవారి నాయికలు – రణరంభాదేవి
12. ప్రళయమూ, ఆ తరువాతి జీవితమూ
13. ఓ పాలబుగ్గల జీతగాడా
14. రామానుజ
15. భారతంలో బాలకాండ
16. మనుచరిత్ర కావ్యారంభ పద్యము
17. కందిగింజ
18. అమలాపురం నుంచి అమెరికా దాకా షడ్రుచులు
19. ‘చందమామ’ విజయగాథ
20. నయాగరా! కవితా నగారా!
21. రఘునాథ నాయకుని గ్రీష్మర్తు వర్ణన
22. చిన్న భాషల్ని మింగేస్తున్న పెద్ద భాషలు
23. మనసులో మాట నొసటన కనిపించెనట
24. సహజ భాషా ప్రవర్తనం – 2
25. జయించు జగాన్ని
26. గురజాడ అంతరంగ నివేదనే – మధురవాణి పాత్ర
27. మొక్కగా వంగనిది
28. సత్రవాణి
29. స్త్రీ విద్యాభిలాషి గురజాడ
30. కూచిపూడి – నాతొలిఅడుగులు
31. ఏ రాయైతేనేం? 
32. ఆహా! ఆంధ్రమాతా? నమో నమ: 
33. తెల్లరంగు సీతాకోక చిలుకలు
34. ఆదర్శసతి సీత
35. చేపకి సముద్రం-భాషకి మాండలికం
36. ఓనమాలు
37. గిన్నీస్ రికార్డ్
38. మాలికా పదచంద్రిక – 3: 1000 రూపాయల బహుమతి

శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం, యనమదుర్రు

రచన: పి.ఎస్.లక్ష్మి.

ఆధ్యాత్మికతవెల్లివిరిసే మన దేశంలో ఎన్నో అపురూపమైన దేవాలయాలు, వాటి గురించి ఇంకెన్నో అద్భుతమైన కధనాలు…తెలుసుకున్నకొద్దీ ఆశ్చర్యం..తరచి చూసినకొద్దీ అద్భుతం. ఇలాంటి అద్భుతాల గురించి తెలుసుకుని, వాటిని దర్శించి, గౌరవించాల్సిన కనీస బాధ్యత ఈ దేశ ప్రజలమైన మనది. అయితే మన దురదృష్టమేమిటంటే మన అశ్రధ్ధనండీ, తెలియకపోవటంవల్ల కానీయండీ, తెలుసుకోవాలనే ఆసక్తిలేకపోవటంవల్లకానీయండీ, సమయాభావంవల్ల కానీయండీ, మన సంప్రదాయాలూ, ఆలయాల పట్ల మనకు తగ్గుతున్న ఆసక్తివల్లకానీయండీ, ఏ ఇతర దేశాలకీ లేనటువంటి ఇంత కళా సంపదను మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఐతిహాసిక గాధలకీ, మన భారత దేశానికీగల సంబంధ బాంధవ్యాలను మనం విస్మరిస్తున్నాం. తద్వారా మన భావి తరాలకు వాటి విలువ తెలియకుండా చేస్తున్నాం.

మీ చుట్టుపక్కలే ఎన్నో అపురూపమయిన, అతి పురాతనమైన ఆలయాలు అద్భుత శిల్ప సంపదతో, అనేక విశేషాలతో, అలరారేవెన్నో వున్నాయి. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రు గ్రామంలో వున్న శ్ర్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం..

పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణానికి 5 కి.మీ. ల దూరంలో వుంది యనమదుర్రు గ్రామంలోని ఈ ఆలయం. అయితే ఎందుకనో భీమవరంలోని భీమేశ్వరాలయం, మావుళ్ళమ్మ ఆలయం ప్రసిధ్ధి చెందినట్లుగా ఈ శక్తీశ్వరాలయం ప్రసిధ్ధి చెందలేదు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు వున్నాయి. వంద ఏళ్ళ క్రితంవరకు ఈ ఆలయం గురించి ఎవరికీ తెలియదు. వంద ఏళ్ళ క్రితం త్రవ్వకాలలో త్రేతాయుగంనాటి ఈ ఆలయం బయటపడింది. అంతేకాదు. ప్రపంచానికి శివ, శక్తుల సమానత్వాన్ని నిరూపించటానికా అన్నట్లు ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమార స్వామి విగ్రహాలు బయల్పడ్డాయి. పార్వతీ దేవి శక్తి. ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడ అమ్మది. బహుశా పార్వతీదేవిని ఈ భంగిమలో ఇంకెక్కడా చూడమేమో.

అలాగే శివుడుకూడా ఏమీ తక్కువతినలేదు. తనూ ఒక ప్రత్యేక భంగిమలో వెలిశాడు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలెయ్యటమేకాక సాకార రూపంలోకూడా వైవిధ్యం చూపించాడు పరమేశ్వరుడు. అవునండీ. శీర్షాసనంలో తపో భంగిమలో కనబడతాడు శివుడు ఇక్కడ. మళ్ళీ చదవక్కరలేదు. మీరు చదివింది కరెక్టే. శివుడేమిడీ, శీర్షాసనమేమిటీ అంటారా. మీ కోసమే ఆ విగ్రహాల ఫోటో. ఈ భంగిమలు జాగ్రత్తగా గమనించి, బాగా గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళండి ఆ ఆలయానికి. చూడండి..శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు. ఈ వ్యాసం చదివిన వాళ్ళంతా ఈ దంపతుల అత్యద్భుతమైన ఈ భంగిమలు చూడటానికే ఈ ఆలయానికి వెళ్ళి వస్తారనే నమ్మకం వుంది. ఇంతకూ ఈ పార్వతీ పరమేశ్వరులు అంతర్జంటుగా ఎలా వున్నవాళ్ళ అలాగే ఇక్కడ వెలియటానికి కారణంగా ఒక కధ కూడా చెప్తారు. ఆ కధేమిటంటే….

మీరు యమధర్మరాజు గురించి వినే వుంటారు. భయమేస్తోందా. పాపం యమధర్మరాజుకికూడా ఒకసారి తను చేసే పని మీద విసుగు వచ్చిందిట. పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారాయే. అందుకనే మార్గాంతరంకోసం శివుడుకోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భవిష్యత్ లో యమధర్మరాజు ఒక రాక్షసుడిని చంపిన తర్వాత తమని ఇక్కడ ప్రతిష్టిస్తాడనీ, తమని దర్శించిన వారికి దీర్ఘ రోగాలు వుంటే సత్వరం నయం అయి, ఆరోగ్యంగా వుంటారనీ, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడేకాదు, దీర్ఘకాల రోగాలను నయంచేయగలవాడుకూడా అని ప్రజలచేత కొనియాడబడతాడు అని వరమిచ్చాడు.

పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం. ఇక్కడ శంబిరుడనే రాక్షసుడుండేవాడు. రాక్షసుడంటే వాడి అకృత్యాలూ, మునులను హింసించటాలూ వగైరా షరా మామూలే. పాపం ఆ మునులు ఇవ్వన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరకెళ్ళి వాణ్ణి చంపెయ్యమని మొరబెట్టుకున్నారు. యముడుకూడా పాపం మునులంతా అడిగారుకదా అని ఆ రాక్షసుడిని చంపటానికి చాలా ప్రయత్నం చేసి, అతని చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు. అప్పుడు శివునికోసం తపస్సు చేశాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో వుండటంతో ప్రత్యక్షంకాలేదు. పార్వతీదేవి యముని తపస్సుకి మెచ్చి, తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది. తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు

యమధర్మరాజు. అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి, భవిష్యత్ లో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించటానికి వీలులేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు. యముని కోరికమేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో,. యోగనిష్టలో వున్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది.

దీనికి ఆధారంగా ఈ జిల్లాలో నరసాపురం తాలూకాలోని శంబరీవి అనే ద్వీపాన్ని చెప్తారు. ఈ శంబరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రేతాయుగంనాటివాడు. అందుకనే ఈ ఆలయం త్రేతాయుగంనాటిదిగా ప్రసిధ్ధికెక్కింది.

ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు వుంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువుచుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండబెట్టారుట. ఆ సమయంలో స్వామివారి నైవేద్యంకోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం వుడకలేదుట. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట త్రవ్వగా నీరు వచ్చిందిట. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే వుడికిందట. అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు. ఈ శక్తికుండములోని నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగానదిలోని ఒక పాయ అందర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తున్నదని జియాలజిస్టులు చెప్పారంటారు. అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైనదంటారు.

దక్షిణకాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. అంటే సర్పం. ఈ ఆలయానికి, చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు ఇటీవలి కాలందాకా వుండేవని పూజారి చెప్పారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకెళ్ళిపోవటం చూసినవారున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రెండు నాగు పాము పిల్లలు తిరుగుతుంటాయి. ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని వుంటాయట. అయితే అవి ఎవరినీ ఏమీ చేయవు.

ఆలయ తూర్పు ద్వారానికి ప్రక్కగా వున్న నందీశ్వరుని మూతి, ఒక కాలు విరిగి వుంటాయి. తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చూసుకోవడానికి అక్కడున్న నంది మూతిని, కాలిని నరకగా అందులోనుండి రత్నాలు బయటపడ్డాయిట. ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు వుంటే ఆలయంలో విగ్రహంలో ఎన్నున్నయ్యోనని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కప్పుకూలి అతనిమీద పడి మరణించాడుట. ఆ శిధిలాలు ఆలయం వెనక వున్నాయి.

పంచారామాలకన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయంగురించీ, శక్తీశ్వరుని గురించీ, మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68 శ్లోకాలలో స్తుతించాడుట. భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సల్పినట్లూ, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంధంలో స్పష్టంగా వుందిట. శ్రీనాధ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలోకూడా ఈ ఆలయ ప్రశస్తి వున్నదిట.

శంబరుని వధానంతరం యమునికి పార్వతీదేవి ఇచ్చిన వర ప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసినవారికి అపమృత్యు భయం వుండదనీ, అకాల వ్యాధులు రావనీ, దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్నవాళ్ళు ఈ కుండంలోని నీరు మంచినీటితో కవిపి సేవించటంవల్ల ఆ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

చూడటానికి చిన్నదిగా వున్నా, ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని అవకాశం దొరికినప్పుడు తప్పక దర్శించండి.

మాలికా పదచంద్రిక – 2

మీ సమాధానాలు మాకు ( admin@maalika.org ) పంపించటానికి చివరి తేదీ మే 31, 2011

 

ఆధారాలు:

అడ్డం:

1 . ఇటీవల సలీంకు సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన నవల! (4,4)

4. సంజయుడు చెప్పినది (3,3)

9. ఆలు మగల _ _ _ /అంత మొందిన రేయి /అనుమానపు హాయి/ ఓ కూనలమ్మ – ఆరుద్ర ఉవాచ (3)

10. కాంతి (1)

11. అరవపు సుబ్రహ్మణ్య స్వామి కాస్త తడబడ్డాడు.(3)

12. బొడ్డు (3)

13. వెనుదిరిగిన సురభి (5)

15. శింజిని లేదా జాతి,కులం (2)

16. శోభ (1)

17. పెద్ద పెద్ద కొండలను ఇలా పిలవ్వచ్చు (5)

19. గంగానదే మరో పేరుతో! (5)

21. కాయ కాని కాయ ఈ ముఖాస్రము (4)

23. తెలుగు సైకాలజీ! (2,3,2)

25. రాశిచక్రము UII (4)

26. లాయర్లకు ఇది ఉంటే రాణిస్తారు (2,3)

28. వార్తాకము, కారవేల్లము (2,3)

31. విషము (1)

33. కరశాఖ సహస్రములా? (2)

34. ఇంటి తలుపులపై ఇలా రాస్తే దెయ్యాలు రావని ఓ గుడ్డి నమ్మకం (1,1,2,1)

35. తుమ్మెద కుడి నుండి ఎడమకు (3)

37. మన బ్లాగర్ శరత్ గారికి యిష్టమైన యిల్లు 🙂  (3)

39. అమృతము (1)

40. ప్రావీణ్యము గలది/ గలవాడు (3)

41. చంద్రబోస్, సీతారామశాస్త్రి లేదా అనంత్ శ్రీరామ్ దీనికి ఒక ఉదాహరణ (2,4)

42. మాటంటే నీదేలే… మనిషంటే నువ్వేలే… అని సి.నా.రె అని వ్రాసిన పాట ఈ సినిమా లోనిది. (4, 4)

 

నిలువు

1. పరమశివుడే. కోకాకోలాగ్రీవుడు కాదు సుమా 🙂 (6)

2. రాయిని తలపించే భూషావిశేషము (3)

3. దేవిక కూతురు కనకది వాలుజడ అయితే రాజేంద్ర ప్రసాద్‌ది? (4)

5. ఒకప్పటి సుప్రసిద్ధ శృంగార నృత్య తార ఈ జగన్మోహిని. (5)

6. ఇది పురుష లక్షణం అంటే ఇప్పుడు స్త్రీలు ఒప్పుకోరు.(3)

7. పేకాటే కాస్త గౌరవప్రదంగా (4,4)

8. ఒకటి రెండు విజయాలు చవిచూస్తే మన సినీ తారలకు వచ్చేది? కళ్ళు నెత్తికెక్కడం వంటిదే.(2, 3)

14. మడకశిర పట్టణంలో నాగలి లభ్యమౌతుంది.(3)

15. సంజీవ్ దేవ్ జీవిత చరిత్ర.(3,4)

17. కాముని పున్నమి (5)

18. రత్నాలు పొదిగిన దుప్పటి కలగాపులగం అయ్యింది(5).

20. మీరూ మేమూ పల్టీ కొట్టాం.(2)

22. ధర్మసంస్థాపనార్థాయ అంతా కొత్తవాళ్ళతో ఓ కొత్త దర్శకుడు తీసిన ఓ కొత్త సినిమా!(4,2,2)

24. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు దీనికి సమానమైన సామెత కన్నడలో పనిలేని కరణం

విప్పినట్లు.[తలక్రిందలైంది](2)

27. _ _ _ సాంగత్యాన్ని కోరుకుంటే ఎంత మహా వీరుడైన ఎంత భక్తాగ్రేసరుడైనా ఎంత విద్వత్సంపన్నుడైనా చివరకు ఆతని జీవితం ఎలా ముగుస్తుందో రామాయణం కళ్లకు కట్టింది.(2,1)

29. పర్యేష్టి (5)

30. హరికథా పితామహుడు ఆదిభట్ల!(4,2)

32. అయస్కాంతము (3, 2)

36. షిర్డీలో నెలకొన్న సాధువు ఫకీరు. చాలామందికి దైవస్వరూపుడు.(4)

38. నిగమశర్మ అక్క  లబోదిబోమన్నది ఇది పోయిందనే! (3)

40. విగ్రహము (3)

 

సమాధానాలు:

ఎంత ఘాటు ప్రేమయో!

— మధురవాణి

అనగనగా ఒక ఊర్లో మహా రద్దీగా ఉండే ఒక వీధి. ఆ వీధి ఎల్లప్పుడూ తూనీగల్లాగా ఝూమ్మని బైకులేసుకు తిరిగే కుర్రాళ్ళతోనూ, రంగుల రంగుల దుస్తుల్లో మెరిసిపోతూ నవ్వుతూ, తుళ్ళుతూ అందమైన సీతాకోకచిలుకల్లా విహరించే అమ్మాయిలతోనూ కళ కళలాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఊర్లోనే పేరుపొందిన రెండు అతి పెద్ద కాలేజీలు అక్కడే ఉన్నాయి మరి!

ఆ రెండు కాలేజీల్లో కలిపి వేలల్లో ఉంటారు విద్యార్థులు. పేరుకి విద్యార్థులే అయినా కూడా విద్య కోసం అర్థించడం మానేసి ఏ వింధ్యనో, సంధ్యనో అర్థిస్తూ తిరిగే అబ్బాయిలే ఎక్కువగా కనిపిస్తుంటారు అక్కడ. యీ సదరు ప్రేమార్థులు కాలేజీ లోపలకన్నా కాలేజీ వీధిలోనే ఎక్కువగా తచ్చాడుతూ ఉండటం వల్ల, ఇహ చేసేదేం లేక పాపం ఆ వీధి కాస్తా ఊర్లోకెల్లా మహా రద్దీ అయిన వీధై కూర్చుంది.

తల నున్నగా దువ్వుకుని, సాదాసీదా బట్టలేసుకుని, వీపుకి పుస్తకాల బ్యాగు తగిలించుకుని, అటూ ఇటూ దిక్కులు చూడకుండా, రోడ్డు మీద ఎక్కడా ఆగి పెత్తనాలు చేయకుండా నేరుగా కాలేజీకొచ్చే బుద్దిమంతులు కొందరైతే, వానాకాలంలో కూడా చలవ కళ్ళద్దాలు తీయకుండా, ఆ సదరు మొహాన్ని అద్దంలో చూడడం వల్ల భయంతో బిక్క చచ్చిపోయి నిటారుగా నించున్న క్రాఫుతో, ఒక చిన్న పుస్తకాన్ని ఆట వస్తువులా చేసి చేతుల్లో గిరగిరా తిప్పుకుంటూ, అమ్మాయిల మీద తప్పించి వేరెక్కడా ఏకాగ్రత నిలపలేని ప్రబుద్ధులు మరికొందరు.

ఇవ్విధమున పలు పలు రకాలైన యువజనులతో హరివిల్లులోని రంగులన్నీ ఒకేచోట అలరారుతున్నట్టుండే ఇలాంటి కాలేజీ వీధుల్లో మనం తరచి చూడాలే గానీ  నిత్యం ఎన్నెన్ని ఘాటు ప్రేమలో, ఎన్నెన్ని బూటు ప్రేమలో! మచ్చుకి అలాంటి ఓ ఘాటు ప్రేమకథని చూసొద్దాం పదండి.

 

**********

రోజుట్లాగే ఆ రోజు మధ్యాహ్నం కాలేజీలో క్లాసులయ్యాక ఇంటికి బయలుదేరింది శృతి. మేడ మెట్లెక్కి వాళ్ళుంటున్న గది గుమ్మం ముందుకి వచ్చేసరికి పూజ ఆపాటికే వచ్చేసి లోపల నిశాంత్ తో మాట్లాడుతోంది.
నిశాంత్ ఎవరంటే, ఆ ఊర్లోనే ఉంటున్న పూజ వాళ్ళ పెద్దమ్మ కొడుకు. పూజ కంటే ఓ రెండేళ్ళు పెద్దయినా ఇద్దరూ స్నేహితుల్లానే మసలుతుంటారు. అంతే కాదు పూజతో సమానంగా శృతితో కూడా స్నేహంగా ఉంటాడు నిశాంత్. ఒంటరిగా యీ ఊర్లో ఉండి చదువుకుంటున్న యీ ఇద్దరమ్మాయిలనూ అప్పుడప్పుడూ వచ్చి పలకరించి వెళ్తుంటాడు.

అప్పుడే వచ్చి గుమ్మంలో నించున్న శృతిని చూసి నిశాంత్ ‘హాయ్’ అంటూ పలకరించాడు.
శృతి కూడా తిరిగి నవ్వుతూ పలకరిస్తూ చెప్పులు విడిచెయ్యడానికి వంగినప్పుడు యథాలాపంగా వీధి వైపు చూసింది. వీధిలో బైకు మీద ఇద్దరు కుర్రాళ్ళు చాలా నెమ్మదిగా సైకిలు మీద వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు. శృతి నవ్వు మొహంతో అటువైపు చూసేసరికి బైకు వెనకాల కూర్చున్న కుర్రాడు మొహవంతా కళ్ళు చేస్కుని శృతి వైపే చూస్తూ నవ్వుతూ కనిపించాడు.
ఆ కుర్రాడి తీరుకి ఆశ్చర్యపోయిన శృతి లోపలికొస్తూ “ఆ బైకు మీద వెళ్ళే వాడెవడో మహా తింగరోడిలా ఉన్నాడు. ముక్కూ మొహం తెలీని నన్ను చూసి అంతలా నవ్వుతాడేంటీ!” అంది.
“ఆ బైకు వీరుడికి నీ ముక్కూ మొహవేం ఖర్మ, ఏకంగా నీ జీవిత చరిత్రంతా తెలుసు” అల్లరిగా అంది పూజ.
శృతి వెంటనే పూజ వంక చురుగ్గా చూస్తూ “ఇంక చెప్పవే.. చెప్పు.. నా మీద కవితలూ, కాకరగాయలూ కూడా రాసేస్తున్నాడని చెప్పు” ఎద్దేవా చేస్తున్నట్టుగా అంది.
“నువ్వు మరీ అమ్మమ్మల కాలంలో ఉన్నావే శృతీ..” అంటూ పూజ ఏదో చెప్పబోతుండగానే శృతి మధ్యలో అడ్డుకుని “పోనీ.. అది కాకపోతే నా మీద ఏకంగా సీరియళ్ళూ, సినిమాలూ గట్రా తీస్తున్నాడంటావా అయితే?”
“మన బైకు వీరుడిని నువ్వు మరీ తక్కువా అంచనా వేస్తున్నావ్ శృతీ! యీ హైటెక్ యుగంలో పాత చింతకాయ పచ్చడిలా అలాంటివెందుకు చేస్తాడు. నీ పేరు మీద ఏ వెబ్సైటో తయారు చేస్తాడు గానీ!”
“హబ్బా పూజా.. నన్నొదిలెయ్యవే బాబూ! నేనేదో మాటవరసకంటే, నువ్వేంటే ఆ తింగరోడి మీద ఏకంగా చర్చాకార్యక్రమం పెట్టేస్తున్నావ్!” అంటూ విసుక్కుంది శృతి.
వీళ్ళిద్దరి మాటలు వింటూ నిశ్శబ్దంగా నవ్వుతూ కూర్చున్నాడు నిశాంత్.
శృతి వెంటనే నిశాంత్ వైపు చూస్తూ “ఏంటీ.. మూకీ సినిమా చూసినట్టు చూస్తున్నావ్.. ఏం మాట్లాడకుండా” అని అడిగింది.
“శృతీ.. ముందు నేను చెప్పేది మొత్తం విను. అప్పుడు వీడిలా ఏం మాట్లాడకుండా ఇలా పిల్లిలా కూర్చుని ఆ ముసిముసి నవ్వులెందుకు రువ్వుతున్నాడో నీకే అర్థమౌతుంది” అంటూ పూజ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.
“శృతీ.. ఊరికే ఊసుపోక కాదు ఇదంతా చెప్పేది. కారణముంది కాబట్టే ఇప్పుడీ చర్చ. నిజానికి యీ విషయం గురించి నేనే నీకు చెప్దామనుకుంటున్నాను. ఈలోపు అనుకోకుండా నువ్వే యీ ప్రస్తావన తెచ్చావు. ఇందాక నువ్వు తింగరోడన్నావే, ఆ బైకు మీద కనిపించిన అబ్బాయి గత పది రోజుల నుంచీ రోజుకి నాలుగు సార్లు నువ్వు ఇంటికీ కాలేజీకి తిరిగేప్పుడు బాడీగార్డు లాగా నీ వెనకాలే తిరుగుతున్నాడు. యీ విషయం నాకప్పుడే తెలుసు. కానీ, ఎలాగూ కొన్ని యుగాల తరవాతైనా నీ అంతట నువ్వే యీ విషయం గమనించకపోవు. అప్పుడెలాగూ కంగారు పడతావు కదా! ముందే చెప్పి ఇప్పటి నుంచే నిన్ను కంగారు పెట్టడం ఎందుకులే అని ఊరుకున్నా!” అంటూ అసలు విషయం చెప్పింది పూజ.
శృతి కంతా అయోమయంగా అనిపించింది. “ఏదో సరదాగా ఓ మాటంటే, ఇదేంటీ ఏకంగా ఇంత పెద్ద కథ వినిపిస్తుందీ పూజ..” అనుకుని నమ్మలేనట్టు చూస్తోంది. మళ్ళీ పూజ చెప్పడం కొనసాగించింది.
“అన్నట్టు, ఆ బైకు మీద తిరుగుతున్న తింగరోడికి ఓ పేరుంది, మనోహర్. మన కాలేజీకి వెళ్ళే దార్లో ‘కే-నెట్’ అని ఓ ఇంటర్నెట్ సెంటరుంది కదా. ఆ సెంటరు ఓనరే యీ మనోహర్. అసలు నెట్ సెంటర్ పెట్టాడంటేనే ఏ పనీ పాటా లేని యోగ్యుడైన యువకుడని అర్ధం కదా! పైగా యీ మనోహర్ ఆ షాపు లోపల కన్నా బయటే ఎక్కువసేపు కూర్చుని మన కాలేజీ రోడ్డులో వచ్చి పోయేవాళ్ళని చూస్తూ కాలం గడుపుతూ ఉంటాడన్నమాట!
అలా ఓ రోజు సాయంత్రం పనేమీ లేక ఆ నెట్ సెంటర్ ముందు ఫ్రెండ్స్ తోకూర్చుని మిరపకాయ బజ్జీలు తింటున్నప్పుడు నిన్ను చూశాడట. అప్పటిదాకా కారంగా అనిపించిన మిరపకాయ బజ్జీలు కాస్తా ఉన్నట్టుండి  మైసూరుపాకులా తియ్యగా రుచించాయట. అదీ మనోహర్ ఒక్కడికే!
ఇంకేముందీ! ఇంత వింతా, విడ్డూరం జరిగిందంటే, ఇది అదేనని తేల్చారట సదరు మనోహర్ మరియు పక్కనున్న చెంచా బృందం.. అదే మిత్ర బృందం. అంతే, అప్పటిదాకా పనీ పాటా లేని మనోహరుడికి ఆ శుభ ముహూర్తం నుంచి ఇహ చేతి నిండా పనే పని!
ఎంతో కష్టపడి ఆ బైకుని సైకిల్లా నడపగలిగిన నైపుణ్యమున్న ఓ బైకుసారథిని పెట్టుకుని రోజుకి నాలుగుసార్లు నీ వెనకాల తిరుగుతూ నీ కళ్ళల్లో పడటం కోసం మహా ఇదైపోతున్నాడు. ప్చ్.. పాపం! ఇప్పుడర్థమయిందా నీ పేరు మీద వెబ్సైటు ఎందుకు వెలిసిందో!
టూకీగా ఇదన్నమాట.. నీ ప్రేమ కోసం మొహం వాచిపోయున్న ఆ బైకుదాసు కథా కమామీషు!” అంటూ నిట్టూర్చింది పూజ.

ఇంతలో నిశాంత్ కలగజేసుకుంటూ “శృతీ! పూజ ఇలా వెటకారంగా చెప్తోంది గానీ, మనోహర్ నిజంగా చాలా బుద్ధిమంతుడు. నిన్ను చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాడు. యీ పది రోజుల్లోనే వాడు నీ గురించిన అన్నీ వివరాలు తెలుసుకున్నాడు తెలుసా! డబ్బు, హోదా, కులం లాంటి పట్టింపులేం లేకుండా నిన్ను ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడో తెలుసా!” అంటూ ఇంకా ఏదో చెపుదామని మాటల కోసం వెతుక్కుంటూ ఓ క్షణం ఆగాడు.
వెంటనే పూజ అందుకుని “అవునే శృతీ.. పాపం ఆ మనోహర్ నిన్ను ఘోరాతి ఘోరంగా, దీనాతి దీనంగా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడూ ఏ పనీ పాటా లేకుండా తిరిగేవాడు కాస్తా ఇప్పుడు పొద్దున్నే కాలేజీ టైమయ్యేసరికి ఎంచక్కా ‘మనోహర్ మంచి బాలుడు’ అన్న టైపులో పక్క పాపిట తీసి క్రాఫు నున్నగా దువ్వుకుని, మొహానికి బాగా పౌడరు దట్టించి, నోట్లో వేలేసుకుని ఆ నెట్ సెంటర్ ముందు కూర్చుని నీ కోసం పడిగాపులు కాస్తున్నాడు. ప్చ్ ప్చ్.. పాపం ఎంత ఘాటు ప్రేమయో!” అంటూ అల్లరిగా చెప్పింది.
పూజ వెటకారంగా అన్న మాటలకి నిశాంత్ ఉడుక్కుంటూ ఏదో అనబోతుండగా శృతి వాళ్ళిద్దరినీ వారించి “ఆగండాగండి..

ముందు నేనడిగిన వాటికి సమాధానం చెప్పండి. ఆ తరవాత తీరిగ్గా మీరిద్దరూ పోట్లాడుకోవచ్చు” అంది.
“అసలు యీ బైకుదాసు ప్రేమ గురించి మీ ఇద్దరికీ ఎలా తెలిసింది. ముందది చెప్పండి” అని వాళ్ళిద్దరినీ నిలదీసింది శృతి.
“ఇంకెలా తెలుస్తుంది? ఓ వారం క్రితం యీ నిశాంత్ గాడే వచ్చి చెప్పాడు. ఉట్టినే చెప్పడం కాదు, ఆ మనోహర్ అప్లికేషను నీకు గట్టిగా రికమెండ్ చేయమని కూడా అన్నాడు. నేనా పని చేయలేదని ఇవ్వాళ నేరుగా వాడే దిగబడ్డాడు తానే స్వయంగా వ్యవహారం చక్కబెట్టడానికి” చెప్పింది పూజ.

ఇంతలో నిశాంత్ ఆవేశంగా “హే శృతీ.. నువ్వే చెప్పు. ఇందులో తప్పేం ఉంది. మనోహర్ నిన్ను నిజాయితీగా, మనస్ఫూర్తిగా…” అంటూ ఏదో చెప్పబోతుండగా శృతి మధ్యలోనే ఆపేసి “అదేలే.. మనస్ఫూర్తిగా, కడుపు నిండుగా.. ఇలా రకరకాలుగా మహా బీభత్సంగా ప్రేమించేస్తున్నాడంటావ్. అంతేగా! సరే సరే.. నాకు ఆ విషయం అర్థమయ్యింది. అందులో ఏం తప్పు లేదు కానీ, నేను కూడా ఆ అబ్బాయిని ప్రేమించాలిగా మరి! నాకలాంటి ఉద్దేశ్యాలేమీ లేవు. అవునూ.. ఇదంతా సరే గానీ అసలు నీకూ, ఆ అబ్బాయికీ ఎలా పరిచయం?’ అని అడిగింది.
వెంటనే పూజ ఉత్సాహంగా “దీనికి సమాధానం నేను చెప్తా నేను చెప్తా!” అంటూ గొడవ చేసింది.
“నిశాంత్ ని అడుగుతుంటే నువ్వు హడావుడి పడిపోతావేంటే..” అని శృతి విసుక్కోబోతుండగా పూజ బుంగమూతి పెట్టి “మరేమో నేను బజర్ రౌండ్ అనుకున్నాలే! అందుకే నేను చెప్తా నేను చెప్తా అని ముందుగా అరిచా..” అనగానే శృతి మోహంలో విసుగంతా పోయి నవ్వుతూ పూజ తలపై ఓ మొట్టికాయ వేసి “సరే నువ్వే చెప్పు” అంది.
“క్రీస్తు పూర్వం ఆ మనోహర్ ఇంటర్ మూడో సంవత్సరం చదూకునే రోజుల్లో క్లాస్మేట్ అయిన ఓ అబ్బాయి అన్నయ్య వాళ్ళ ఫ్రెండుకి మన నిశాంత్ వాళ్ళ డిగ్రీ క్లాస్మేటు ఒకడు ఫ్రెండు. ఆ మనోహర్ బ్యాచ్ నీ గురించి చేసిన పరిశోధనలో మన నిశాంత్ గురించి తెల్సుకుని, వెంటనే వీడిని తమ ప్రాణస్నేహితుడుగా మార్చుకుని ఇలా ‘నిశాంత రాయబారం’ నడిపిస్తున్నారన్నమాట!” అంటూ నవ్వుతూ చెప్పింది పూజ.
“అబ్బో.. అయితే నాగార్జునా సిమెంట్ లాగా చాలా ధృడమైన స్నేహబంధమేనన్నమాట వీళ్ళది. సర్లే నిశాంత్.. నాకలాంటి అభిప్రాయమేమీ లేదని మీ ఫ్రెండుకి చెప్పెయ్యి..సరేనా!’ అంది శృతి నిశాంత్ వంక చూస్తూ.
అది విన్న నిశాంత్ మొహం వేళ్ళాడేస్కుని “ఏంటి శృతీ అలా అనేశావ్! మా వాడిని చూసి ఓ నాలుగైదు సార్లు నవ్వావంట కూడా కదా! ఇప్పుడేంటి అలా ‘నో’ అని తేల్చిపారేసావ్?” అన్నాడు.
నిశాంత్ మాటలకి శృతి “నేనా.. ఆ అబ్బాయిని చూసి నవ్వానా.. అదీ నాలుగైదు సార్లు.. ఎప్పుడు, ఎక్కడ!? అసలు ఆ అబ్బాయిని చూడ్డం ఇవ్వాళే మొదటిసారి నేను” అంటూ ఆశ్చర్యపోయింది.

మళ్ళీ పూజ అందుకుంది. “మళ్ళీ బజర్ రౌండ్.. నేను చెప్తాను. మరేమో నువ్వొకసారి మన వీధి మూలనున్న పెద్ద చెత్తకుండీలో చెత్త పడేస్తూ అటువైపుగా వచ్చిన మనోహర్ వంక ‘చెత్త చూపులు’ చూశావ్! మరోసారేమో, మన కాలేజీ దగ్గరున్న సాయిబాబా గుడిలో ప్రసాదం తీస్కుంటూ మనోహర్ కేసి చూస్తూ ‘దద్దోజనం నవ్వు’ నవ్వావ్! అదే గుడిలో మరోసారి కొబ్బరి చిప్ప పగలగొడుతూ ‘చిప్ప చూపులు’ చూశావ్! ఇంకోసారేమో కాలేజీ రోడ్డులో చాక్లెట్ తింటూ నడుస్తూ ‘చాక్లెట్ చూపులు’ చూశావ్! అంతెందుకు.. ఇందాక ఇంట్లోకొచ్చేప్పుడు నువ్వు చెప్పులు విప్పుతూ రోడ్ మీద బైకు పైన వెళ్తున్నమనోహర్ ని చూసి ‘చెప్పు నవ్వులు’ నవ్వలేదూ! చెప్పు శృతీ చెప్పు.. యీ నానా రకాల చూపులూ, నవ్వులూ నువ్వు మనోహర్ పైన విసిరావా లేదా.. నీ గుండె మీద చెయ్యేసుకుని ఆత్మసాక్షిగా నిజం చెప్పు శృతీ!’ అంటూ ఆవేశం అభినయించింది పూజ.
“కాస్త వెటకారంగా చెప్పినా సరే, పూజ చెప్పింది నిజమే కదా! ఆయా సందర్భాల్లో నువ్వు మనోహర్ వంక చూడ్డం, నవ్వడం నిజం కాదా?” అన్నాడు నిశాంత్.
దానికి సమాధానంగా శృతి రెండు చేతులు జోడించి “అయ్యా, అమ్మా! యీ గోలంతా నాకస్సలు అర్ధం కావట్లేదు. నేనెవరివైపూ చూస్తూ చిప్ప చూపులూ, చెప్పు నవ్వులూ రువ్వలేదు. నేనేదో యథాలాపంగా చూసినప్పుడు ఆ అబ్బాయి అక్కడుంటే, నేను అతన్ని చూసి నవ్వినట్టేనా? ఆ అబ్బాయి అలా అనేస్కుంటే నాకేమీ సంబంధం లేదు. అయినా, ఇప్పటినుంచి రోడ్డు మీద అసలు తలెత్తకుండా నడుస్తాను. సరేనా! ఇదిగో నిశాంత్.. నేను గట్టిగా చెప్తున్నా! నాకిలాంటి వ్యవహారాల్లో అస్సలు ఆసక్తి లేదు. యీ సంగతి నువ్వెళ్ళి అర్జెంటుగా మీ స్నేహితుడికి చెప్పెయ్యి. యీ కథకి ఇక్కడితో మంగళం పాడేస్తున్నా. అంతే ఇంక.. జైహింద్!” అంటూ వాళ్ళిద్దరి నోళ్ళూ మూయించేసింది శృతి.

**********

కానీ, కథ అక్కడితో సమాప్తం కాలేదు. ఇన్ని రోజులు శృతికి నా ప్రేమ విషయం తెలియకపోయినా, ఇప్పటికైనా తెలిసిందని రూఢీ అయింది కాబట్టి, ఎలాగైనా సరే శృతిని మెప్పించాలని నానా పాట్లు పడటం మొదలెట్టాడు మనోహర్.

ఓ రోజు పొద్దున పూట శృతి, పూజ ఇద్దరు కాలేజీకి వెళ్తుంటే “శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ..” అంటూ చక్కటి పాట వినిపిస్తోంది.
అది విని ఆశ్చర్యపోతూ “అదేంటే పూజా.. మన కాలేజీ రోడ్డులో ఎప్పుడూ ఏ భాషో కూడా కనిపెట్టలేని పాటలు వినిపిస్తుంటాయి కదా! అలాంటిది ఉన్నట్టుండి ఇంత శ్రావ్యమైన సంగీతం మీద గాలి మళ్లిందేంటి జనాలకి” అడిగింది శృతి.
దానికి సమాధానంగా పూజ నవ్వుతూ “సంగీతం మీద శ్రద్ధా, గాడిద గుడ్డా.. అదంతా నీ మీద ఆ బైకుదాసుడు కురిపిస్తున్న ప్రేమధార! మళ్ళీ ఒకసారి విను ఆ పాట. నీకే అర్థమవుతుంది. ఆ పాట వాళ్ళ నెట్ సెంటర్ నుంచే వినిపిస్తోంది గమనించావా? ఇలాంటి పాటలు వినిపించేస్తే నువ్వు మురిసి ముక్కలైపోయి అతగాడ్ని ప్రేమించేస్తావని ఆ చెంచా బృందంలో ఎవరో బడుద్దాయి ఉపదేశించి ఉంటాడు. దాని ఫలితమే ఇది” అంది.
ఆ తరవాత వరసగా నాల్రోజుల పాటు శృతి కాలేజీ రోడ్డులో కనిపించినప్పుడల్లా అదే పాటని ముప్పూటలా వినిపిస్తూ వాయగొట్టేశారు.

ఒక రోజు నిశాంత్ కలిస్తే పూజ అడిగింది. “ఏంట్రా నిశాంత్.. మీ ఫ్రెండ్ మనోహర్ తనకెలాగూ శృతిని శృతి చెయ్యడం చేతకావట్లేదని జ్ఞానోదయం అవ్వడం చేత మనసు మార్చుకుని ఎవరో భారతి అని ఓ కొత్తమ్మాయి వెంట పడుతున్నాడటగా! ఆ అమ్మాయి కనపడ్డప్పుడల్లా ‘భారతీ..’ అంటూ ఏవో పాటలు కూడా వినిపిస్తున్నారటగా! మా క్లాస్మేట్ ఒకబ్బాయి చెప్పాడులే” అంటూ ఆట పట్టించింది.
ఆఘమేఘాల మీద యీ వార్త మనోహర్ కి చేరిపోయింది. ఆ దెబ్బకి ఇంక పాటలు వినిపించే ప్రోగ్రాం మానుకున్నారు. “హమ్మయ్యా.. ఒక హింస తప్పింద”ని ఊపిరి పీల్చుకుంది శృతి.

ఆ తరువాత మరో నాల్రోజులకి ఓ సాయంత్రం పూట శృతి, పూజ కలిసి గుడికి బయలుదేరారు. మనోహర్ నెట్ సెంటర్ ముందు నుంచే ఆ గుడికి వెళ్ళాలి. అప్పుడే పూజ అంది “ఇంకాసేపట్లో నీ బైకుదాసుడు గుళ్ళో ప్రత్యక్షం అవుతాడు చూడు” అని.
పూజ అన్నమాటని నిజం చేస్తూ వీళ్ళిద్దరూ గుడికెళ్ళిన కాసేపటికి మనోహర్ బృందం ప్రత్యక్షమయ్యారు గుళ్ళో. దేవుడి దర్శనం చేస్కుని గుడి ప్రాంగణంలో ఆరుబయటకొచ్చి కూర్చున్నారు శృతి, పూజ. వాళ్లకి మాటలు వినపడేంత దూరంలో మనోహర్ వాళ్ళున్నారు.
“మనోహర్.. మనోహర్.. అరే మనోహర్.. నిన్నేరా! ఏంట్రా ఎంత పిలిచినా పలకవు. అంత దీక్షగా ఎవర్ని చూస్తున్నావురా?” అని ఒకడంటే, “అరే.. అసలు మన మనోహర్ కి ఎంత దైవభక్తిరా.. ప్రతీ రోజూ దేవుడికి పూజ చేయకుండా కనీసం పచ్చి కోక్ అయినా ముట్టడు” అని మరొకడు. “అరే మనోహర్.. నీ డ్రెస్ చాలా బాగుందిరా.. మొన్న మీ అన్నయ్య ఫారిన్ నుంచి వచ్చినప్పుడు తెచ్చాడు కదూ..అయినా మీకేంట్రా లక్షాధికారులు”, “అరే మనోహర్ మొన్నొకరోజు మనిద్దరం మాట్లాడుతుంటే మా క్లాస్ అమ్మాయిలు చూసారట. ఆ రోజు నుంచీ ఒకటే గొడవరా బాబూ నీ వివరాలు చెప్పమని” అంటూ ఆ చెంచా బృందమంతా పలువిధాలుగా ‘మనోహర్ సకల గుణాభిరాముడు.. కావున ఆలసించిన ఆశాభంగం’ అన్నట్టుగా ఊదరగొట్టేస్తున్నారు.

“వీళ్ళెక్కడ దొరికారే బాబూ మన ప్రాణానికి.. గుడికొస్తే ప్రశాంతంగా కూర్చోనీకుండా విష్ణుసహస్రనామ పారాయణంలాగా యీ మనోహర్ భజనేంటీ..” విసుక్కుంది శృతి.
“వీళ్ళకి ఇవ్వాళ పైత్యం మరీ ప్రకోపించినట్టుంది. పోనీ, నేవెళ్ళి నాలుగు ఝాడించేసి రానా?” ఆవేశంగా అంది పూజ.
“వద్దులే పూజా! ఆ అబ్బాయి నేరుగా మన జోలికి రాలేదు కదా ఇప్పటిదాకా. మనం అనవసరంగా కల్పించుకోడం ఎందుకు. మనం ఇంటికెళ్ళిపోదాం” అని వారించింది శృతి.

 

********

ఆ తరవాత అడపాదడపా మనోహర్ బృందం అక్కడక్కడా ఇలాంటి భజనలు చేస్తూనే ఉన్నారు. ఏవో పరీక్షల హడావిడిలో శృతి, పూజ ఇద్దరూ బాగా బిజీ అయిపోయి యీ మనోహర్ విషయం తాత్కాలికంగా మర్చిపోయారు.
పరీక్షలైపోయాక పండుగ కోసమని ఊరెళ్ళిన శృతి, పూజ ఓ వారం రోజుల సెలవుల తర్వాత తిరిగొచ్చారు. ఆ మరుసటి రోజు ఇద్దరూ కలిసి కాలేజీకి  వెళుతుంటే దోవలో మనోహర్ మిత్ర బృందం కనిపించింది.
వాళ్ళని చూడగానే “మళ్ళీ మొదలయ్యాయే బాబూ.. నీ బైకుదాసుడి ప్రేమలీలలు” అంటూ నిట్టూర్చింది పూజ. “హబ్బా.. మళ్ళీ తప్పదు కాబోలు మనకీ వాయింపు..” అంది శృతి నీరసంగా!
కానీ చిత్రంగా వాళ్ళెవరూ కనీసం మనోహర్ పేరైనా ఎత్తకుండా నిశ్శబ్దంగా వీళ్ళిద్దరినీ దాటుకుని వెళ్ళిపోయారు. “ఉన్నట్టుండి వీళ్ళలో ఇంత మార్పెలా వచ్చిందా!” అని తీరిగ్గా ఆశ్చర్యపోవడం వీళ్ళిద్దరి వంతైంది.
“వారం రోజులు నువ్వు కనిపించకపోయేసరికి పాపం.. నీ మొహం మరిచిపోయి గభాల్న పోల్చుకోలేకపోయారేమోనే శృతీ!  అంతేలే మరి అలవాటు తప్పిందిగా!” అంది పూజ నవ్వుతూ.
“నువ్వు గమనించావా మనోహర్ లేడు వాళ్ళతో. అసలు కథానాయకుడు పక్కన లేడు కదా అని అలా మౌనం దాల్చారేమో పాపం యీ మిత్రబృందం!” అంటూ శృతి కూడా నవ్వింది.
తర్వాత్తర్వాత  వాళ్ళని మరింత ఆశ్చర్యపరుస్తూ స్వయంగా మనోహరే ఎదురుపడ్డా కూడా ఇన్నాళ్ళూ రెప్ప వాల్చకుండా తదేకంగా చూసిన అతను ఇప్పుడు మాత్రం శృతి ఎవరో తనకు తెలీదన్నట్టు తప్పుకుని పక్కకి తొలగిపోసాగాడు.
“కేవలం మిత్రబృందమే కాదు, హీరో గారు కూడా నీ మొహం మర్చిపోయినట్టున్నాడే!” అంటూ అల్లరి చేసింది పూజ.

అప్పటికేదో సరదాగా అలా అనుకున్నాగానీ రోజులు గడుస్తున్న కొద్దీ మనోహర్ బృందం కనబరుస్తున్న వింత ప్రవర్తన కాస్త భయపెట్టింది వాళ్ళిద్దరినీ. మనోహర్ స్నేహితులు రోడ్డు మీద ఎక్కడన్నా ఎదురుపడితే కొరకొరా కోపంగా చూస్తున్నారు. అలాగని పల్లెత్తు మాట కూడా అనట్లేదు. అకస్మాత్తుగా ఇంత మార్పుకి కారణం ఏమయ్యుంటుందా అని స్నేహితురాళ్ళిద్దరికీ అర్థం కాలేదు.

ఈ అయోమయం గురించే తరచి తరచి ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి శృతికొక భయం గొలిపే ఊహ వచ్చింది. “కొంపదీసి అతన్ని ప్రేమించలేదని చెప్పి మన మీద ఏ యాసిడ్ దాడో చెయ్యాలని చూస్తున్నారేమోనే పూజా.. నాకు భయంగా ఉంది వాళ్ళంతా మనకేసి అలా తేడాగా చూస్తుంటే..” అని తన మనసులో ఉన్న భయాన్ని బయటపెట్టింది శృతి.
“నువ్వు మరీ అంత బెంబేలుపడిపోకు శృతీ.. పోనీ నీకంత అనుమానంగా ఉంటే ఎందుకైనా మంచిది.. మనం మన ప్రిన్సిపాల్ కి గానీ, మా పెదనాన్న గారికి గానీ చెప్దామా ఈ విషయం..” అంది పూజ.
“అహా.. వద్దు వద్దు.. అప్పుడు మరీ పెద్ద రచ్చయిపోతుందేమో! నిజానికి, ఆ అబ్బాయి నేరుగా వచ్చి మనతో ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదుగా! ఒకవేళ నేనే ఎక్కువ ఊహించుకుని భయపడుతున్నానేమోనని కూడా చిన్న సందేహం! ఒకవేళ ఇదంతా కేవలం నా అనుమానమే అయితే అనవసరంగా ఆ అబ్బాయిని రెచ్చగొట్టినట్టు అవుతుందేమో కదా అని ఆలోచిస్తున్నా” అంది శృతి.
“అదీ నిజమేలే! అయితే ఒక పని చేద్దాం.. నేను నిశాంత్ ని రమ్మని పిలుస్తాను. ముందు ఒకసారి వాడితో మాట్లాడితే తరవాత ఏమి చెయ్యాలో మనకి స్పష్టత రావచ్చు. రేపే వాడిని రమ్మంటాను. నువ్వు మాత్రం ఇదంతా మనసులో పెట్టుకుని కంగారుపడకు. సరేనా!” అంటూ అనునయంగా శృతికి ధైర్యం చెప్పింది పూజ.

మరుసటి రోజు సాయంత్రం నిశాంత్ వచ్చాడు వాళ్ళని కలవడానికి. ముగ్గురూ కలిసి ఇంటి ముందు వసారాలో కూర్చుని కబుర్లాడుతూ ఉండగా మాటల్లో మనోహర్ ప్రస్తావన తీసుకొచ్చింది పూజ.
“ఏంట్రా నిశాంత్.. నీ ప్రాణ స్నేహితుడు మనోహర్ ఏమంటున్నాడు?” సరదాగా అడిగింది పూజ. ఆ మాట వినగానే అప్పటి దాకా నవ్వుతున్నవాడల్లా చప్పున గంభీరంగా మొహం పెట్టాడు నిశాంత్.
“ఎలాగూ శృతికిష్టం లేదని చెప్పిందిగా! ఇంకా ఎందుకు వాడి గురించి ఆరా తీయడం” అన్నాడు కించిత్ కోపంగా.
నిశాంత్ అలా అనేసరికి మరింత కంగారుగా అనిపించింది శృతికి. అది గమనించిన పూజ కళ్ళతోనే శృతికి భరోసా ఇస్తూ “ఎలాగైనా నిశాంత్ తో గట్టిగా మాట్లాడి ఈ విషయం తేల్చెయ్యాలి. లేకపోతే ఈ పిచ్చిపిల్లకి ఇంక నిద్ర కూడా పట్టదు” అనుకుంది మనసులో.
వెంటనే “అబ్బ ఛా! ఇన్నిరోజులేమో మేం వద్దు మొర్రో అన్నా చెప్పి మా బుర్ర తినేసావ్. ఇప్పుడేమో ఏదో మాటవరసకి అడిగితే అంత విసుగెందుకు బాబూ?” అంటూ గట్టిగా అడిగింది పూజ.
“సరే, అయితే చెప్తా విను. ఇంక వాడు శృతి జోలికే రాడు” అన్నాడు నిశాంత్.
“అబ్బో! అంతటి జ్ఞానోదయం అయిందా యువరాజా వారికి. పోన్లే మంచిదేగా! ఇంతకీ నువ్వేనా నాయనా యీ పుణ్యం కట్టుకుంది” అంది వెటకారంగా పూజ.
“నేనేం చెప్పలేదు. పాపం అంత దీనంగా అన్ని రోజులు శృతి వెంట తిరిగినా తను పట్టించుకోలేదని వాడంతట వాడికే జ్ఞానోదయమయ్యింది. అందుకే అలా మారిపోయాడు” అని చెప్పుకుపోతున్నాడు నిశాంత్.

అంతలో రోడ్డు మీద వెళ్తున్న కుర్రాడెవరో నిశాంత్ ని చూసి ఆగిపోయి “అరే నిశాంత్.. రేపొద్దున వస్తున్నావుగా! మనమే దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూస్కోవాలి. అన్నీ అనుకున్నట్టు సరిగ్గా జరక్కపోతే మనోహర్ గాడు ఊరుకోడు.

ఎనిమిదింటికల్లా వచ్చేసెయ్” అంటూ రోడ్డు మీద నుంచే అరిచి చెప్పి వెళ్లిపోయాడు.
అది చూసాక పూజ చాలా కోపంగా “ఈ మనోహర్ ఆ బైకుదాసుడేగా! అయినా నాకు తెలీకడుగుతాను.. నువ్వు అంత దగ్గరుండి మరీ విరగబడి ఏర్పాట్లు చేసేంత రాచకార్యాలేమిట్రా నీకు వాళ్ళతో? నేను పెదనాన్న గారికి చెప్తానుండు. నువ్విలా పనికిమాలిన వాళ్ళతో కలిసి వెధవ వేషాలు వేస్తూ తిరుగుతున్నావని” అంటూ గట్టిగా బెదిరించింది.
వెంటనే నిశాంత్ రెండు చేతులూ జోడించి “అమ్మా పూజమ్మ తల్లీ! నీకో దండం. నీకు పుణ్యం ఉంటుంది.. అంత పని మాత్రం చెయ్యకు మాతా! నిజం చెప్పేస్తానుగా! రేపు ఉదయం మనోహర్ గాడి నిశ్చితార్ధం. ఆ ఏర్పాట్ల గురించే వాడు వాగింది. ఇంకో రెండు వారాల్లో మనోహర్ పెళ్లి. అదీ సంగతి! అంతేగానీ వేరే ఏం కాదు. నన్ను మాత్రం ఇంట్లో ఇరికించకు” అంటూ కాళ్ళ బేరానికొచ్చాడు నిశాంత్.

నిశాంత్ మాటలు విని నమ్మలేనట్టు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు శృతి, పూజ ఇద్దరూ.
వెంటనే తేరుకుని “హమ్మ నిశాంత్.. ఇన్ని రోజులూ ఎన్ని మాయ మాటలు చెప్పావు! మరి నిజాయితీగా, మనస్ఫూర్తిగా, కడుపు నిండుగా నన్నే ప్రేమించేస్తున్నాడన్నావ్! అన్నీ అబద్దాలు చెప్పావు కదా మాకు” నిలదీసింది శృతి.
“బాబోయ్ తల్లుల్లారా.. నిజం చెప్తున్నాను. నన్ను నమ్మండి. అప్పుడలాగే చెప్పాడు వాడు. ఎన్ని రోజులైనా నువ్వు తన వైపు చూడట్లేదని ఇంక వాళ్ళింట్లో వాళ్ళు చూసిన అమ్మాయికి ‘ఓకే’ అనేసానని చెప్పాడు” నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు నిశాంత్.
“ఏంటీ! యీ కొన్ని రోజుల్లోనే, అదీ అసలు శృతి తో నేరుగా కనీసం ఒక్క ముక్కయినా మాట్లాడకుండానే అంత జీవిత సత్యం తెలిసిపోయిందంటనా ఆ అపర ప్రేమికుడికి!” దెప్పిపొడిచింది పూజ.
కాసేపు శృతి, పూజ ఇద్దరూ కలిసి కాసేపు నిశాంత్ కేసి తినేసేలా చూసి అంతలోనే పడీ పడీ నవ్వసాగారు. నిశాంత్ కి వాళ్ళెందుకు అంతలా నవ్వుతున్నారో అర్థం కాక బిత్తరచూపులు చూస్తూ ఉండిపోయాడు.
వీళ్ళిలా నవ్వుల్లో మునిగి ఉండగానే బయటపడడం ఉత్తమం, మళ్ళీ వాళ్ళ మూడ్ మారిపోతే తనని ఎక్కడ ఉతికేస్తారోనని బెదిరిపోయి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు నిశాంత్.

“హమ్మయ్యా.. ఏదయితేనేం ఓ పెద్ద హింస తప్పిపోయింది మన ప్రాణానికి. ఇకమీదట పాటల పైత్యం, వెర్రి మొర్రి భజనలూ వినే దుస్థితి తప్పింది. ఇంక హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు” అంటూ ఇంకా నవ్వుతూనే ఉంది శృతి.
ఉన్నట్టుండి చప్పున నవ్వడం ఆపేసింది శృతి. ” పోనీలే పూజా.. ఇక నుంచి అతన్ని హేళన చెయ్యొద్దు మనం. నిన్న మనం అనుమానించినట్టు అతన్ని ప్రేమించలేదన్న కోపంతో మన పట్ల దురుసుగా ఏమీ ప్రవర్తించలేదు కదా పాపం! ఇష్టపడ్డాను అన్నాడు.. కాదనేసరికి బుద్ధిగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రేమించకపోతే మేము చస్తాం లేదా మిమ్మల్ని చంపుతాం అంటూ చిత్రవధ చేసే ప్రేమికుల కంటే ఈ మనోహర్ లాంటి వాళ్ళు కోటి రెట్లు నయం. ఇన్నాళ్ళూ విసుక్కున్నా ఇప్పుడు మాత్రం ఆ అబ్బాయి మీద నాకు గౌరవం కలుగుతోంది ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకున్నందుకు. అలాంటి వాళ్ళ గురించి మనం నవ్వుకోడం మన సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంటుందేమో!” ఏదో ఆలోచనల్లోంచి మాట్లాడుతున్నట్టు భారంగా అంది శృతి.
“అది సరే శృతీ!  కానీ, నా బాధల్లా ఏంటంటే.. ఇక మీదట ‘ఎంత ఘాటు ప్రేమయో.. ఎంత తీవ్ర పైత్యమో..’ అని మనం పాడుకుని మురిసిపోయే అవకాశం తప్పిపోయింది కదా అని విచారిస్తున్నా ప్చ్..!” అంటూ విచారం అభినయిస్తూ వాతావరణం తేలికపరిచే ప్రయత్నం చేసింది పూజ.
“అబ్బబ్బా.. పూజా.. నీ అల్లరికి హద్దూ అయిపూ లేకుండా పోతోంది ఈ మధ్య!” అంటూ తేలిగ్గా నవ్వేస్తూ స్నేహితురాలిని మురిపెంగా విసుక్కుంది శృతి.

వర్ణ చిత్రాల మాంత్రికుడు వడ్డాది

రచన : సురేఖ అప్పారావు

 

మనకు ఎందరో చిత్రకారులున్నారు. కానీ వడ్డాది పాపయగారి చిత్రరచనాశైలి వేరు ! ఆయన కుంచె అనే మంత్ర దండంతో చేసే మాయావర్ణ చిత్రవిన్యాసాలు అద్భుతం! శ్రీ వడ్డాది పాపయ్య చిత్రకారుడిగా ఎంతమందికి తెలుసో అలానే ఆయన గురించి తెలియని వాళ్ళూ మన తెలుగు దేశంలోఉన్నారు. 1945లో ప్రారంభించిన బాలన్నయ్య , బాలక్క్యయ్యల “బాల”లో ఆయన ముఖ చిత్రాలతో బాటు లోపలి బొమ్మలూ వేశారు. ఆయన “లటుకు-చిటుకు” శీర్షికకు లటుకు చిటుకుల బొమ్మను వేశారు. “వపా” అన్న రెండు అక్షరాలతో ఆయన చేసిన సంతకం  పిల్లలపత్రిక “చందమామ”, “యువ” మాస పత్రిక, ఈనాటి ప్రఖ్యాత వార పత్రిక “స్వాతి”  పాఠకులకు పరిచయమే.


ఆ “వపా” అన్న రెండక్షరాలను తిరగేసి దానికి “ని”నే అక్షరాన్ని చేర్చి కొన్ని బొమ్మలకు ఆయన “పావని” అని కూడా సంతకం చేసేవారు.
1921లో శ్రీకాకుళంలో జన్మించిన శ్రీ వడ్డాది పాపయ్య చిన్నతనం నుండే బొమ్మలు గీయటం మొదలు పెట్టారు. ఆయన వివిధ విషయాలపై రకరకాల బొమ్మలు గీశారు.

పురాణ స్త్రీలు, పురుషులు , కావ్య కన్యలు, పల్లెపడుచులు, ఆధునిక యువతులు, జానపద నాయకీ నాయకులు, రుతువులు, కాలాలు,ఇలా వివిధ విషయాలపై   మరపురాని వర్ణ చిత్రాలు ఆయన కుంచెనుంచి జాలు వారాయి. ఆయన ఎక్కువగా నీటి వర్ణాలనే తన చిత్రాలకుఉపయోగించారు. ఆయన రంగులను రకరకాలుగా మిశ్రమం చేసి చిత్రాలనువర్ణరంజితం చేశారు. ఆయన వర్ణ చిత్రాలే కాకుండా ఇండియన్ ఇంకుతో తెలుపు నలుపుల్లో “యువ” మాస పత్రికలో కధలకూ చిత్రాలు గీశారు..

” యువ “మాస పత్రికకు ముఖ చిత్రంతో బాటు, కవరుపేజీ లోపల కూడా వపా వివిధ విషయాలపై చిత్రాలు వేసేవారు. వాటిలో ఆయన వేసిన “జలదరంజని”అన్న బొమ్మ ప్రత్యేకంగా అభిమానుల ప్రశంసలను అందుకొంది. వడ్డాది పాపయ్య గారికి రావలిసినంత ఖ్యాతి రాలేదేమోననిపిస్తుంది.దామెర్ల రామారావు, అడవి బాపిరాజు,వరదా వెంకటరత్నం, లాంటి చిత్రకారులతో సరితూగగల ఈయనకు అంతటి గుర్తింపు రా కపోవటం అయన మరో తెలుగువాడిగా పుట్టడమేనేమో అనిపిస్తుంది. 1959 లో “చందమామ”లో ఆర్టిస్టుగా ప్రవేశించి తన అపురూప వర్ణ ముఖ చిత్రాలతో “చందమామ”కు కొత్త అందాలు తెచ్చారు. “చందమామ”ను బొంబాయి వ్యాపారవేత్తలు కొనుగోలు చేశాక ఆ సంస్థ ఇతర చిత్రకారుల బొమ్మలతో
బాటు వపాగారి బొమ్మలును కూడా చేర్చి రెండు సంపుటాలు గా “చందమామ ఆర్ట్ బుక్ “పేరిట విడుదల చేశారు. పెద్ద సైజులో మంచి ఆర్ట్ పేపరు పై విడుదలయిన ఈ పుస్తకాలలో వపాగారి అభిమానులకు ఒకే చోట చందమామ లో ఆయన చిత్రించిన ముఖచిత్రాలు కన్నుల పండుగ చేస్తాయి. వడ్దాది పాపయ్యగారు చిత్రకళారంగంలో
చిరంజీవి.

ఆయన చిత్రకేళీవిలాసాలు చూద్దామా మరి…

 

 

అవార్డులిస్తాం! చందా కట్టండి!

రచన: పాణంగిపల్లి విజయ భాస్కర శ్రీరామ మూర్తి.
పార్వతీపురం.

 

ప్రియరంజనీ రావుకు గొప్ప టెంక్షన్ గా ఉంది. అప్పటికే పది మంది పెళ్ళికొడుకుల ముందు కూర్చొని ఓ.కే.అనిపించుకోలేని పెళ్ళి కూతురులా ఉంది అతని మానసిక పరిస్థితి. గొప్ప అలజడిగా ఉంది. ఆందోళనగా ఉంది. అల్ల కల్లోలంగా ఉంది. గాలికి చెదిరిన జుట్టులా నక్స్లైట్లు పేల్చేసిన ప్రభుత్వ కార్యాలయంలా దీపావళి మరునాటి ఉదయపు వీధుల్లా.
ఇలాంటి పరిస్థితి అతనికి చాలా కాలంగా అలవాటయిపోయింది.
ఎక్కడ ఏ కథల పోటీ కనిపించినా దానికి ఓ కథ పంపటం, దానికి గ్యారంటీగా ఫష్టు ప్రైజు వస్తుందనుకోవటం, అది తుస్సుమనటం, ఏ చివర్లోనో సాధారణ ప్రచురణ జాబితాలో చోటు చేసుకోవటం ఎగిరెగిరి సిటీ బస్సులో ఫుట్పాత్ మీద సీటు సంపాదించినట్టు ! దానికే తృప్తి పడటం జరుగుతున్నదే. ! అదేం పాపమో ఇటీవలి కాలంలో సాధారణ ప్రచురణలలో కూడా స్థానం లభించటం కరువైంది.
అయితే ఈ సారి పోటీలో అతని కేదో ప్రైజు తగుల్తుందనేఅనుకొన్నాడు. ఎండిపోతున్న చెరువులో ఓ చేప పిల్లైనా దొరకదా అని కొంగ ఆశ పడినట్లు.
కారణం లేకపోలేదు. ఈ సారి పోటీకి ఎటేస్ట్రెచ్ రాసేయక మూడు నాలుగు సార్లు కథను మార్చి వ్రాసి పెద్ద రచయితలకు చూపెట్టి మరీ ఫెయిర్ చేసాడు. అంత కంటే మరో ముఖ్య విషయం ఉంది. ఆ పత్రిక నిర్వహిస్తున్న కథల పోటీకి న్యాయ నిర్ణేతల పేర్లను కూడా ముందుగా ప్రకటించింది. అందువల్ల ముందుగా ముగ్గురు న్యాయ నిర్ణేతలకీ ఉత్తరాలు వ్రాసాడు కాస్త లౌక్యంగా. మీ రచనలంటే నాకెంతో అభిమానమని, చెవి కోసుకుంటానని, దానికి వాళ్ళు థేంక్స్ చెప్పి లెటర్లు స్వదస్తూరీతో రాసారు.
అందుకే ఈ సారి తప్పనిసరిగా తన గాలానికి ఏదో చేప తగలొచ్చనుకున్నాడు. కాని ఫలితాల గడువు దగ్గర పడుతోన్న కొలదీ టెన్షన్ అధికమై పోయింది.
అసంఖ్యాకంగా కథలు రావటం వల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమైందని తెలియ చేయటానికి చింతిస్తున్నాము అని మూడు వారాల ముందు వచ్చే వారమే ఫలితాల ప్రకటన చేస్తున్నట్లు వారు ప్రకటన చేసారు. ఆరోజు టెలిగ్రాం కోసం ఎదురు చూసాడు. ఓ రోజు టెలిగ్రాం రానే వచ్చింది. కానయితే అది అత్తగారికి సీరియస్ గా ఉందని., ఢీలా పడిపోయాడు. పేలని బాంబులా అయ్యాడు. అతనికి ఎందుకో ఆశ చావ లేదు. ఈ సారి అసంఖ్యాకంగా రావటం వలన ఆలస్యమయిందని అన్నాడు. కాబట్టి పత్రిక ద్వారానే ఫలితమిస్తాడేమోనని.
పత్రిక కొన్నాడు. లేటు లేకుండా అనుకున్న టైంకే రావటం వల్ల ! చేతులు వణుకుతున్నాయి. అయిసుముక్క పట్టుకున్నట్టు వేళ్ళు కొంకర్లు పోతున్నాయి.
పేజీలు త్రిప్పాడు. ఎడిటర్ రిమార్కు, న్యాయ నిర్ణేతల వివరణలు ముందు పేజీలలో చదివాడు. కథలు వాసిలోను రాశి లోను బాగున్నాయి. దళిత వాదం , స్త్రీ వాదం మీద మంచి కథలు వచ్చాయి. వర్ధమాన రచయితలు, లబ్ధ ప్రతిష్టులకు దీటుగా క్రొత్త రచయితలు పోటీ పడ్డారు. అందుకే ఈ సారి పోటీలలో అందరూ క్రొత్త వారే ఎన్నిక కావటం విశేషం. అయిదారు వడపోతల తరువాత మా అభిమతాల మేరకు ఈ కథలు నిర్ణయించాం.
క్రింది వివరణ : వివరాలకు పేజీలు తిరగేయండి.
ఆనందంఅర్ణవమయింది.
అంతరంగం సంబర పడింది.
ఇంతకీ తన వర్ధమాన రచయితా? లబ్ధప్రతిష్టుడా? క్రొత్తవాడా? ఔను. తను చాలా మంచి కథలే వ్రాసాడు. కనుక లబ్ధ ప్రతిష్టుడే. ప్రస్తుతం తనకింకా రావసిన పేరు రాలేదు. కాబట్టి వర్ధమాన రచయితకే ఒక ప్రైజు రాలేది కాబట్టి క్రొత్త రచయితే.
ఏడు కొండల వాడా! వేంకట రమణా! నన్ను క్రొత్త రచయితగా దీవించి ఓ ప్రైజు పారేసి సర్ప్రైజు చెయ్యి. మనసులో భజనలు.
పేజీలు తిరగేసాడు. మొహం జేవురించుకు పోయింది. మాడిపోయింది.
వీళ్ళందరికీ ఇదే తొలి రచనట.
క్రొత్త రచయితలారా! ఆత్మ వంచన చేసుకోకండి. న్యాయ నిర్ణేతలారా! అబద్ధమాడకండి. ఎడిటర్ గారూ! నిజం చెప్పండి. నిజంగా నిజంగా మీరు గుండె మీద రెండు చేతులు గట్టిగా పెట్టుకొని చెప్పండి? క్రొత్త రచయితలూ! మీరు ఎడిటర్ గారికి ఏమీ కారా? ఇందులో లాలూచీ లేమీ లేవా?
నో. ఇదంతా మోసం దగా అని గట్టిగా అరిచాడు.
ఏదిసార్! పుస్తకాలవానితో పాటు చుట్టూరా ఉన్న వ్యక్తులు ఖంగారుగా అడిగారు.
అబ్బెబ్బేఏమీ లేదు. అని తడబడుతూ అక్కడనుంచి కదిలాడు. వాళ్ళు పిచ్చాణ్ణి చూసినట్టుగా అతన్ని చూడ్డం. ప్రియరంజనీ రావుకు తల తీసేసినట్లయింది.
పత్రికను ముక్క ముక్కలు చేసి కాలవలో పారేయాలనుకున్నాడు. కాని విదేశీ వస్ర బహిష్కరణలా తన డబ్బును తాను కాలువలో పారేయటం సముచితంగా కనిపించ లేదు.
ఇంటికి వెళ్తే కనీసం శ్రీమతైనా చదువుతుంది. కాగితాలు ఏ పొట్లం కట్టడానికైనా పనికొస్తాయి. ఇంటికెళ్ళాడు. కుర్చీలో కూలబడ్డాడు. ఆకలిగా ఉంది. శ్రీమతి ప్రక్కింటికెళ్ళింది. పిల్లలు మీద కస్సుమన్నాడు. దూరంగా విసిరేసిన పత్రికను తిరిగి తీసుకున్నాడు. పేజీలు తిరగేసాడు.
అతని కళ్ళకి ఓ అద్భుతం కనిపించింది.
అతని మనసుకో పులకింత కలిగించింది ఆ ప్రకటన.
మీరు రచయితలా? ఉపాధ్యాయులా? కళా కారులా? సంఘ సేవకులా? ఐతే పది రోజులలోగా మా సంస్థ ఇచ్చే ఉగాది పురస్కారాలకు ధరకాస్తు చేసుకోండి. వివరాలకు క్రింది చిరునామాకు స్వంత చిరునామా గల రూపాయి స్టాంపు అతికించి కవరు జతపరచి పంపండి అని.
ఎగిరి గంతేసాడు.
దేవుడు దయ తలచాడు.
వెంకన్న వరమిచ్చాడు.
అతనికి జేబులో రడీగా స్టాంపులుంచుకోవటం చేత అప్పటికప్పుడు వివరాలకి స్వంత చిరునామా గల అంటించిన స్టాంపు కవరులో పంపించాడు. వారం రోజులలో పది పేజీల కర పత్రం వచ్చింది. మీలో ప్రజ్ఞ ఉంది. ఐనా ఈ బూర్జువా పత్రికలు మిమ్మల్ని గుర్తించటం లేదు. ఔనా? మీరావేదన పడవద్దు. మీలాంటి మేధావులను ప్రజ్ఞావంతులను ఎంచి, సేకరించి, గౌరవించటానికే ప్రజా రంజని సంస్థ ఏర్పరించాము. మీరు రచయితలే ఐతే ఇంత వరకు మీరు వ్రాసిన కథ లేయే పత్రికలలో వచ్చాయి? తేదీల వివరాలతో జిరాక్స్ కాపీ అవసరం లేదు. మీ హామీ పత్రం చాలు . పంపండి. రెండు ఫొటోలు పంపండి. మీ బయోడేటా వివరంగా పంపండి. అంటూ రెండు వందలే క్రాస్ద్ డీడీ పంపండి. ఈ కర పత్రం అందిన వారం రోజులలో పంపండి. మాకు అసంఖ్యాకంగా వచ్చిన ఎంట్రీల పరిశీలనకు గడువు సరిపోవటం లేదు. అని కరపత్రం చదివిందే చదివాడు.
రెండు వందలు పంపాలా? మనసు విరిగింది. తీరా పంపితే మాత్రం అవార్డ్ వస్తుందని గ్యారంటీ ఏమిటి? చిన్నప్పుడు పేపర్లో ఫజిల్ నింపి పంపితే ఏమయింది? రెండొందలకు వీ.పీ. వచ్చింది. విడిపిస్తే రెణ్ణెల్లు పలికే రేడియో వచ్చింది. ౨౦ సంవత్సరాలు నాన్న తిడుతూనే ఉన్నాడు. ఇది అలా కాదు కదా?
కాదు? దీనిలో ఎందుకో అలాంటి మోసం కనిపించలేదు ఆలోచిస్తే మనసు మారిపోతుంది. ఎందుకైనా మంచిదని తన పత్రికలో వ్రాసిన ఉత్తరాలు, జోకులు, మినీ కవితల దగ్గరనుంచీ జిరాక్స్ కాపీలు నూట ఏభై ఖర్చైనా వెనుకాడక, తీసి పంపాడు. రెండొందలు డీడీ పంపాడు. రిజిష్టర్డ్ పోష్ట్లో పంపాడు. పది రోజులలో ప్రియ రంజనీ రావుకు కొరియర్ లో ప్రజా రంజని సంస్థ నుండి ఉత్తరం వచ్చింది. పిక్క బలంతో తన్నిన ఫుట్బాల్ లాగ ఎగిరి గంతేసాడు. ఉత్తరం చదివాడు, గట్టిగా అరిచాడు పిడుగు పడినట్లు. వంట చేస్తున్నవాళ్ళావిడ సిలండరు పేలిపోయిందో, కుక్కరు ఎగిరి పడిందో నని భయపడి పరుగుపరుగున వచ్చి బయట పడింది.
ఏమే! నాకు అవార్డు వచ్చిందే.
ఏ ఎవార్డండి? ఆమెది వానా కాలం చదువు. అందుకే అలాగంది. నీ ముహం సంతకెళ్ళ. నీలాంటి దెయ్యంను నే కట్టుగో బట్టే. నేను ఎదగ లేకపోయాను.
మీరెదగడమేంటండి? మీరేమైనా ఆడపిల్లా? గెదె పెయ్యా? అంది అమాయకంగా . అది కాదే . నాకు బహుమతి వచ్చిందన్నాడు. ఆమెను గట్టిగా వాటేసుకొన్నాడు. భర్త ఆనందానికి ఆమె కూడా ముగ్ధురాలయి ” ఎంతండి” అంది.
గతుక్కుమన్నాడు. నిజమే? ఎంతిస్తారు? చెప్మా? అని కాగిత పూర్తిగా చదివాడు. దానిలో ఎక్కడా వివరం లేదు.
దానిలో వ్రాసిందల్లా ఉగాదికి రెండు రోజులు బొంబాయి రావాలట. ప్రసిద్ధ హిందీ సినీ నటి కిస్మిస్ చేతుల ద్వారా బహుమతి ఇస్తారని చెప్పారు. భార్య సంతోషించింది.
వెంటనే బేంకుకెళ్ళాడు.
ద్డబ్బు విత్ డ్రా చేసాడు. ష్టేషన్ కెళ్ళాడు టిక్కెట్టు రిజర్వు చేసాడు.
త్వరలో తనకు ప్రజారంజని సంస్థ పురస్కారాన్నిస్తున్న విషయం పత్రికా విలేఖరులకు తెలియ చేసాడు.పాస్పోర్టు ఫొటో ఇచ్చాడు. మర్నాడే అన్ని పత్రికలలో న్యూస్ వచ్చింది. మిత్రులంతా కంగ్రాట్స్ తెలిపారు. ఎంతిస్తారు? అని అడిగారు. ఏమో! పదివేలైనా ఇవ్వచ్చు. అంత పెద్ద సంస్థ అన్నాడు. ఉగాదికి ముందు బొంబాయి చేరుకొన్నాడు. ఎడ్రస్ కనుక్కొని వెళ్ళాడు.. అది జనమా? కాదు, ప్రవాహమా! ఇసుకను లారీతో తిరగేసినట్లు, కొబ్బరి కాయను పోగులు పోసినట్లు రకరకాల ద్వారాలు. ముందు ద్వారంలో దూరగానే సార్! మీ కార్డ్ చూపెట్టండి సార్! అనిఅంది ఒక అమ్మాయి ఇంగ్లీషులో వీణ మీటినట్లు. కార్డ్ చూపెట్టాడు. కంగ్రాట్స్ సార్! అసంఖ్యాక రచయితల్లో మీకు ఈ అవార్డ్ వచ్చిందంటే మీరెంత గొప్పవారో అర్థమౌతుంది. బైదిబై మీరో ఫిప్టీ పే చెయ్యాలి సారా! అంది.
ఎందుకు ? అన్నాడు.
సార్! మీకు గార్లెండ్ వేయాలి కదా సార్! బొకే ఐతే ఇరవయ్యే.
మాట్లాడకుండా ఏభై ఇచ్చాడు.
మరో ద్వారం తిరిగాడు. మళ్ళీ ఓ అమ్మాయి సితార గొంతు పలికించింది. ఓ ఐదొందలు ఇవ్వాలి సార్! అన్నది. ఎందుకు? సందేహంగా అడిగాడు.
ఇంత దూరం వచ్చిశాలువా లేకుండా వెళ్ళొచ్చా? అంది.,కోపంగా చూస్తాడు. అక్ఖర్లే అనాలనుకొన్నాడు. అన్లేక పర్సు తీసి ఐదొందలు ఇచ్చాడు. మరో ద్వారం దగ్గరకు చేరాడు. మరో అమ్మాయి వంశీ వాయించింది. కంగ్రాట్స్ చెప్పింది. ముద్దు పెట్టుకొంది. వెయ్యే పే చేయమంది. దేనికి? వీడియో కవర్ చేస్తాం అన్ని పేపర్లలో, టీవీలలో, వార్తల్లో వచ్చేట్లు ఏర్పాటు చేస్తాం అంది.
ప్రియ రంజనీ రావుకి ఏడుపు వచ్చింది. అక్కడికక్కడ గుండె ఆగిపోతే బాగుణ్ణనిపించింది.
కాని విచిత్రం అప్రయత్నంగా చేతులు పర్స్ ను తీసాయి. డబ్బులిచ్చేసాయి. పర్స్ పల్చబడిపోతోంది. గుండె వేగం హెచ్చుతోంది. మరేద్వారమూ తగల్లేదు. హాలు నిండా కుర్చీలు కుర్చీల్లో జనం.
ఉదయం పది గంటలకు ప్రారంభమయింది అవార్డుల ప్రదానం. అలా పిలుస్తూనే ఉన్నారు. వస్తూనే ఉన్నారు. అందుకుంటూనే ఉన్నారు. మధ్యాహ్నం నాలుగు గంటలకి ఒక అమ్మాయి తనకి దండ వేసింది. ఓ అమ్మాయి శాలువా కప్పింది. కెమేరాలుక్లిక్కుమన్నాయి. కిస్మిస్ వచ్చింది. ఒక చెక్కమొమెంటోసుతారంగా అందించింది అంతే. ఎంతో కష్ట పడి తిరుపతి వెళ్ళితే దేవుణ్ణి చూసామా?లేదా? అన్న భ్రమలో ఉన్నాడే కాని బైటకు నెట్టబడినట్లు ష్టేజి మీదనుంచి నెట్టేసారు. సార్ పది రూపాయిలొస్తాయి అన్నాడో వ్యక్తి.
ఎందుకు? ఇక్కడ టీ, బిస్కట్ తీసుకున్నారు కదా? నేను తీసుకోలేదే! నువ్వే యిచ్చావు! ఔను సార్! రస్పెక్ట్ గా ఇస్తాం. మీరిచ్చేయండి అన్నాడు. అతనితో వాదులాడ్డం ఇష్టం లేక ఇచ్చేసాడు. అతనికి గొప్ప చికాకుగా ఉంది. అసహనంగా ఉంది. ఆక్రోశంగా ఉంది. అవార్డ్ ప్రదానోత్సవ సభ ముగిసింది..
కమిటీ చైర్మెన్ మైకు దగ్గరకు వచ్చి అవార్డ్ గ్రహీతలు దయచేసి ఉండండి మీతో ఐదు నిమిషాలు పనుంది అన్నాడు. డబ్బులిస్తాడెమోనని ప్రియరంజనీరావులో మళ్ళీ ఆశ! బట్ట తలమీద వెంట్రుకలు మొలవ్వా? అని ఆస పడ్డాడు. అందరూ వెళ్ళాక చైర్మెన్ వేదికెక్కాడు. అవార్డ్ గ్రహీతలకు శుభా కాంక్షలు తెలిపాడు. ఆతరవాత తన సంస్థ చేసిన సేవలు వివరించాడు. అవార్డ్ విజేతలారా! మీకో విన్నపం. ఈ సంస్థ గురించి మీ ప్రాంతంలో తెలియ జేయండి. జనాన్ని ప్రోత్సహించండి. పదిమందిని తీసుకు రాగలిగితే మీకు చందా లేకుండా సన్మానం చేస్తాం. వంద మందిని తేగలిగితే ఇక్కడే ఏ కలక్షన్లూ వసూలు చేయం. వెయ్య మందిని తీసుకు రాగలిగితే రాను పోను చార్జీలు మేమే భరిస్తాం. అని అతను చెప్తున్నాడు. ప్రియరంజనీరావు బుర్ర గిర్రుమని ఫేన్ లాగ తిరుగుతోంది. బీపీ రేజైపోతోంది. అక్కడ ఉండ లేక లేచిపోయాడు. ఉంటే మళ్ళీ టీ ఇస్తారో, టిఫినే యిస్తారో, భోజనమే పెడతారో నన్న భయంతో .
ఐతే కుళ్ళిపోయిన బత్తాయిపండులా అయిన అతని మనసులో ఓ తళతళ మన్న మెరుపు ఆలోచన. ప్రియరంజనీ అవార్డ్ పేరునతనూ ఓ సాహిత్య సేవా సంస్థను హైదరాబాదులో ఎందుకు నెల కొల్పరాదు? అని.