సహస్ర స్క్వైర్ అవధానం …..

రచన : శశి తన్నీరు

 

ట్రింగ్…ట్రింగ్…మంటూ మోగే అలారం నెత్తిన ఒక్కటిచ్చాను. దెబ్బకి నెత్తిన బుడిపను తడుముకుంటూ నోరు మూసుకుంది.

సరే ముందు కొంచం సేపు ధ్యానం చేద్దాం అని శ్వాస గమనిస్తూ ఉన్నాను……”ఇడ్లీ కి చట్ని వేయకపోతే కరెంటు పోతుందేమో”……ఐదున్నరేగా ….ఆరుకి కదా కరెంటు పోయేది.

“పప్పులోకి టొమాటోలు ఉన్నాయా?”….ఒకటుందిలే…..శ్వాస మీద  ధ్యాస….పెట్టు….

“పాప తొందరగా లేపమంది…. లేచేటప్పటికి పాలు ఇస్తే తాగుతుంది”…ఇక లాభం లేదు..పద వంటిట్లోకి……

ముందు బ్రష్  చేసుకొని మొహం కడుక్కున్నాను.

కొంచం పేపర్ చూద్దాం. ఎప్పుడు పనేనా….అయ్యా బాబోయ్…

ఈ రోజు శనివారమ్…కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

ఇప్పుడు కాదు ముందు చట్నీ వేయాలి….ఆ పని ముందు కానిచ్చి ….పొయ్యి పై పాలు పెట్టి ….ఈయన లేచినట్లున్నారు…..బయటి తలుపు తీసి పాలు , పేపర్ లోపలికి తెచ్చారు….”ఆ పేపర్ వాడికి చెప్పు.. నీళ్ళల్లో వేస్తున్నాడు పేపర్” అన్నారు.

సరే …పాలు తీసుకొని లోపలి వెళ్లి పొయ్యి మీదుంచాను.

ఆరుంపావు….ముందు పాపని లేపాలి…కుక్కర్  రెడీ చెయ్యాలి, ఇడ్లి పెట్టాలి, చట్నీ తాలింపు వేయాలి….వేన్నీళ్ళు పెట్టాలి…..కెవ్వ్……

“రేయ్ ఇద్దరు లేవండి….టైం..టైం….అయిపోతుంది”

(మాంటిసోరి, గిజుబాయి వాళ్ళను  కలల లోకం నుండి లాగుతున్నారు)

కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

ఇప్పుడు ఇంకేం చెయ్యాలి…..పాలలో తాలింపు వేసి, కుక్కర్ లో హీటర్  వేసి ఇడ్లీ లో టీ పొయ్యాలి…..

కెవ్వ్….కాదు కాదు….గబా గబా…ఇడ్లీ పెట్టి , తాలింపు వేసాను….పిల్లలకు . ఈయనికి బూస్ట్ ఇచ్చిగబా గబా కుక్కర్  రెడీ చేసాను. హయ్యో బయట తుడిచి ముగ్గు పెట్టాలి……సరేలే…..అరచేయ్యంత ముగ్గు…అదైన వెయ్యోద్దా?

కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

ఈ లోపల కేక….”నీ అరియర్స్ సంగతి స్కూల్ లో కనుక్కో”

సరే…..బాబోయ్…ఏడు….కల్లాపి లో కుక్కర్ పెట్టి, ఇడ్లీ లో అరియర్స్  వేసి స్నానానికి  వెళ్ళాలి.ముందు ఈ రాక్షసులు వెళ్ళారో లేదో…..రేయ్ నాకు అడ్డం రాబాకండి….ప్లీజ్….

“మా నా క్యారియర్ కూడా పెట్టేయ్యి”పాప ఆర్డర్….

మెల్లిగా టైం వంక చూసాను….ఏడు నలబై ఐదు…..చచ్చాన్రా దేవుడా…..రేయ్…రాక్షసుడా….(పిల్లల సైకాలజిస్టుల్లారా!) కాసేపు కళ్ళు మూసుకోండి…..కాదు…చెవులు…కాదు ఏదో ఒకటి….)

నా వేన్నీళ్ళు నువ్వు తీసుకెళ్ళవాకు……

హు…వెళ్లి పోయాడు…బాబోయ్ కుక్కర్ విజిల్స్…ఆపేసి….ఇడ్లీ కూడా….మాడితే….గోవింద….ర.రేయ్ నువ్వు తొందరగా రారా బాబు….

కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

చెట్నిలో కారం వేసి, పాలు గిన్నెలో  పోసి తాలింపు వేసి, కుక్కర్ దించి ఉప్పు వేసి పేపర్ బాయ్ కి చెప్పాలి….

హమ్మయ్య అన్ని పనులు అయిపోయాయి…..

క్యారియర్ని పోపు  పెట్టి, పర్సుని నీళ్ళ బాటిల్ లో వేసి ఇడ్లీని అరియర్స్ లో వేసి పేపర్ బాయ్ కి ఇచ్చి తాళం పక్కింటి ఆమెకి ఇచ్చి …స్కూటీ ఎక్కేసాను…..

ఇంక పది నిమిషాలు…..నో ఆలోచంస్….మేఘాలలో….

స్కూల్ గేటు లో కి వెళుతూ….మళ్ళీ మొదలు….పదికి త్రికోణమితి , తొమ్మిదికి వర్గ మూలాలు, ఎనిమిదికి గ్రాఫ్ లు

చెప్పాలి….అసెంబ్లీ…..జనగణమన…..

“మేడం””ఏమిటి”

“పదో తరగతి నామినల్ రోలేస్ చూడాలి….పుట్టినరోజులు, పుట్టుమచ్చలు చూడాలి”సూపరిండెంట్ గారి రెక్యెస్ట్……

సరె పదో తరగతికి వెళ్లి ….త్రికోణమితి లొ విమానం పైన  తిరిగి వర్గమూలాల్లో తేలి పుట్టు మచ్చలతో గ్రాఫ్ లకు వచ్చాను.

మళ్ళా పిలుపు …..ప్రిన్సిపల్ మేడం పిలుపు……..

హు…ఇక అయినట్లే….సరే అమ్మాయిలు …మీరు రెండు గ్రూప్లు …..ఒకరు బిందువు చెప్పాలి….ఇంకోరు అది బోర్డ్

మీద గుర్తించాలి……సరిగా గుర్తిస్తే పాయింట్స్…..స్పాంటెనియస్  క్రియేటివిటితో  చెప్పేసాను…..

కౌసల్యా సుప్రజా రామా…పూర్వా ….

“యేమిటి మేడం”

“కొత్త డి.యే. విషయం కనుక్కో….ఇంకా స్లొ లర్నర్స్ రికార్డ్ వ్రాయండి”

“సరే”…..గ్రాఫ్ లో డి.యే. పెట్టి పుట్టుమచ్చలు వెసి….రికార్డ్ వ్రాయాలి.”మేడం….కొంచం నా మొబైల్ రీచార్జ్ చేయించరా?”  పక్క మేడం రిక్వెస్ట్.

“సరే”……..

“యేమండీ”

“చెప్పబ్బా….యెందుకు ఫోన్ చేసావు?”

“మరేమొ యేమిటొ డి.యే.పర్టికులర్స్ కావాలంట….

“ఇందుకా ఫొన్ చేసావు?”

“ఇంకో మెడమ్ కి రీచార్జ్ చెయ్యాలి”

“నీకేమి వద్దా?”

“కావాలి….ఉల్లిపాయలు,మిర్చి”

“నీ యెన్కమ్మ….సర్లే ఫొన్  పెట్టు….లోకం తెలీని దాన్ని లీడర్ గా పెట్టుకున్న వాళ్ళను అనాలి”….పెట్టేసారు.

లోకంలోకి పంపితే జ్ఞానం వస్తుంది…..జ్ఞానం వస్తే గాని పంపరు…..తాగితే మరువగలను…తాగలేను….

అవును తాగితే లొకజ్ఞానం వస్తుందా?

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్…….తాగటం యేమిటి?

క్షమస్తత్వం …..క్షమస్తత్వం …..శేష శైల శిఖామణే…..

బెల్ మోగింది. గుర్తు పెట్టుకొన్నాను…..లంచ్ బెల్….

అందరం గుండ్రంగా కూర్చున్నాము…కూరల వాసనకు కబుర్ల గుబాళింపు……మమత పెళ్ళికి ఎవరు వెళతారు?

మాధురి వాళ్ళ అబ్బాయికి చాలా పెద్ద ఆపరేషన్ …..చెన్నైలో ఉన్నాడు…..మజ్జిగ  చారు తాలింపు వేడి మీద వెయ్య కూడదు….

“మేడం” ఇహం లోకి వచ్చి చూసాను….”మేము ఏమి చెప్పామో  చెప్పండి”

పరీక్ష…….

ఏముంది మమతకు తాలింపు వేసి చెన్నై కి పంపాలి….

నయాగరా జలపాతాన్ని మించిన నవ్వుల జలపాతం …

“మేడం …ఈ లోకం లోనే లేదు”…. కొట్టేస్తారా ఏమిటి?

ఆయనే నయం …..లోకం తెలీదు అన్నారు….వీళ్ళు ఈ లోకంలోనే లేనంటున్నారే…….హర్షాల మధ్య ఆప్యాయతల వర్షం…..గుత్తి వంకాయ వేసుకోండి…వడియాలు….మజ్జిగ చారు…

“నా పప్పు సంగతి”…

“మేము వేసుకుంటాములే ”

కౌసల్య సుప్రజ రామా…పూర్వా ….

ఎప్పటికి పూర్తయ్యేను సుప్రభాతం….

మళ్ళీ బెల్..

క్లాస్సులలోకి పొమ్మని…..హమ్మయ్యా కాలాన్ని నెట్టేసాను….లాంగ్ బెల్……

పుట్టుమచ్చల్ని మజ్జిగ చారులో వేసి… మమతని గ్రాఫ్ లో ఉంచి, పిల్లల్ని ప్రిన్సిపాల్ కి ఇచ్చి

ప్రిన్సిపాల్ని సూపరింటెండెంట్ కి ఇచ్చి బయట పడిపోయాను…

హమ్మయ్య….ఇంక స్కూటీ మీద పది నిమిషాలు మనవే…..

అరే!  మల్లె పూలు….ఇప్పుడా? …కొందాము….మళ్ళా ఈయన కూడా తెస్తే…..ఆ పెద్ద అంతర్జాతీయ సమస్య…..రేపు కూడా  పెట్టుకుంటే  పోయే….

హమ్మయ్య అందరు అన్నం తినేసారు….రేపటికి బియ్యం  ఏరాలి…..హబ్బో మా హోంజాకి పాటలు పెట్టేసారు….

“వెన్నలవే…..వెన్నెలవే …నువ్వే సాగి వస్తావా?”

సరే…సరే….బాబుకు వేన్నీళ్ళు తాగిస్తే బాగుండు…..పెడదాము….

“రావోయి చందమామ…..తన మతమేదో తనది…..పర మతం అసలే పడదోయి….మనది మనదను మాటే…

ఎవరి ఎదుట లేదోయ్”

సరే….సరే…..దోసె పిండిలో ఉప్పు కలిపానా…….

“మంటలు రేపే నెలరాజా….ఈ తుంటరితనము నీకెలా?…

ఈ శీలా పై రాలిన పలమేమి”

కెవ్వ్వ్వవ్వ్వ్వవ్వ్వ్   …..సన్యాసులలో కలిసిపోతారా?

ఏమిటి?వచ్చే….వచ్చే….

వేన్నీళ్లలో రాళ్ళు వేసి…..కుక్కర్ లో దోస పిండి కలిపి…చట్నీ కి….పప్పు నానేసి…..టీ కోసం అన్నం పెట్టి…..

ఇదుగో వచ్చే…వచ్చే…..నాన్ స్టాప్ ….అవధానం…..

 

మంగళాశాసన పరై మధాచార్య పురోగమై…….

 

డూప్లెక్స్ భోగం

రచన: సుజాత బెడదకోట

ఇల్లంతా తిరిగి చూసి మెట్లు దిగి కింద హాల్లోకి వచ్చి తృప్తి గా నిట్టూర్చింది రాధ! “ఎస్, మై డ్రీమ్ హోమ్” అనుకుంది వందో సారి! బయట రాధ మొగుడు గోపాలం లాన్ వేయిస్తున్నాడు కాబోలు గట్టిగా మాటలు వినపడుతున్నాయి.

గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ ఇల్లు…రాధ చాన్నాళ్ల నాటి కల! ఇన్నాళ్ళకు నెరవేరింది. లోను పూర్తిగా రాకపోయినా ఎక్కడో ఊర్లో ఉన్న స్థలం అమ్మి మరీ డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టి కమ్యూనిటీ మధ్యలో ఉన్న ఇల్లు ఎన్నుకుంది. ఎందుకంటే అక్కడి నుంచి పూల్ వ్యూ ఉంటుంది. పూల్ చుట్టూ ఫౌంటెన్లు, వగైరాలు! ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నిల్చుని సాయంత్రం వేళ కాఫీ తాగుతూ కాళ్ళు చాపుకుని పడక్కుర్చీలో కూచుంటే ..ఎంత హాయిగా ఉంటుంది…!

చక్కని లేత గోధుమ రంగుకు ఇండిగో కాంబినేషన్ లో గోడలకు రంగులు వేయించారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రెండు బెడ్ రూముల్లో ఒకటి తమకు, ఒకటి పిల్లలకు. పిల్లల గదిలో వాళ్ళిష్టం ప్రకారం థీమ్ సెలెక్ట్ చేసుకుని రంగులు వేయించుకున్నారు. కింద హాలు, ఒక విశాలమైన బెడ్ రూము, 10X10 సైజులో వంటింటి కి, గెస్ట్ బెడ్ రూముకీ మధ్య స్టోర్ రూము, విశాలమైన ఓపెన్ కిచెన్,..ఎంతో హాయిగా ఉంది ఇల్లు! గెస్ట్ బెడ్ రూములో గొప్పగా ఉండాలని వాల్ టు వాల్ కార్పెట్ వేయించేసింది రాధ. సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ డబుల్ బెడ్డు అదనపు అందం! అత్తా మామలు ఆ పల్లెటూరు వదిలి రానంటున్న్నారు. ఎప్పుడైనా వస్తే వాళ్ళుంటారు. అంతే! కాబట్టి కార్పెట్ పాడవదు.

అట్టహాసంగా గృహప్రవేశం జరిగింది. చుట్టాలూ స్నేహితులూ వచ్చారు. రాధ లాంటి పెళ్ళాం దొరికినందుకు గోపాలాన్ని చూసి కుళ్ళుకున్నారు. గోపాలం వద్దన్నా వినకుండా “డూప్లెక్స్ ఇల్లు లేకపోతే స్నేహితుల్లో తన పరువు నిలబడ”దని పోరి ఆ ఇల్లు కొనిపించింది మరి!
ఆ వేళ రాధ వాళ్ళ లైనంతా వాళ్ళ బధువుల, స్నేహితుల కార్లే!
కొందరు చాటుగా “అబ్బ, ఇహ రాధను పట్టలేం కాబోలు! అసలే టెక్కు” అని చెవులు కొరుక్కున్నారని రాధకు చూడకుండానే తెల్సు!

వచ్చిన వాళ్ళందరికీ ఇల్లంతా తిరిగి చూపించి, ఒకటికి పది సార్లు ఎక్కీ దిగీ సాయంత్రానికి కాళ్ళు పడిపోయాయి  రాధకి. పురోహితుడు ఆ రోజు అక్కడే నిద్ర చేయాలన్నాడు. “అమ్మో, నేను పైకి ఎక్కలేనిహ ఇవాళ” అంటూ కింది గెస్ట్ బెడ్ రూములో సర్దుకోబోయింది. అత్తా మామలిద్దరూ అప్పుడే అక్కడ పవళించి విష్ణుమూర్తి, లక్ష్మీ దేవిలా దర్శనం ఇచ్చారు.

గుండె గుభేలుమంది. వెర్రి నవ్వోటి మొహానికి పులుముకుని ఎలాగో మెట్లెక్కింది.

కొత్తింట్లోకి వచ్చి, సామానంతా సర్దుకున్నారు. పైన బెడ్ రూములోని వార్డు రోబుల్లో బట్టలు సర్దారు రాధా, గోపాలం! రెండో పిల్ల మరీ రెండేళ్ళది కావడంతో దాని బట్టలు తమ రూములోనే సర్దారు.

పన్లో పనిగా మావగారు “కమ్యూనిటి బాగుందమ్మాయ్! మేమూ ఇక్కడే ఉంటాం ఒకేడాది” అని ప్రకటించేసి భార్యతో కింద బెడ్ రూములో సెటిలైపోయారు. ఆయనకు ప్రతిదీ అందించి మర్యాదలు చేయకపోతే చుట్టాల్లో గోల గోలైపోతుంది.అంత పట్టింపు మనిషి!

ఇంట్లో దిగిన నెల రోజులకల్లా రాధలో నిరాసక్తత చోటు చేసుకుంది. తొమ్మిది కల్లా పైకి చేరి కాసేపు టీవీ చూసి పడుకోవాలని ఉంటుంది. మావగారికేమో అది అవమానం! “మేము ఇంకా పడుకోకుండానే?” అంటారు. అందరం కింద సరదాగా టీవీ చూద్దాం అని ఆపేస్తారు. ఆ జీడిపాకం సీరియళ్ళు చూడలేక రాధ వంటింట్లో సర్దినవే సర్దుతుంది.

డూప్లెక్స్ ఇంట్లోకి చేరాక రోజుకు వంద సార్లు పైకెక్కి దిగాల్సి వస్తోంది.పొద్దున్నే వంటా అదీ చేయాలంటే స్నానం చేశాకే చేయాలంటారు అత్తగారు.కింద వంట చేస్తుంటే వంద సార్లు పిలుస్తాడు గోపాలం. “నా సాక్సులేవీ, దువ్వెనెక్కడ పెట్టావూ? పాపాయి లేచింది చూడూ” అంటూ!

ఎక్కా… దిగా!ఇదే పని!

ఆఫీసుకు రెడీ అయి కిందకొచ్చాక గుర్తొస్తుంది…ఫోన్ పైనే మర్చిపోయిందని! ఈ మధ్య మోకాళ్ల నొప్పులు కూడా మొదలయ్యాయి. ఎక్కుతున్నా దిగుతున్నా కలుక్కుమంటున్నాయి.

ఆదివారం ఒకరోజు పొద్దున్నే మెట్లు దిగుతూ ఉంటే నిద్ర మత్తులో నైటీ కాళ్ళకు అడ్డం పడి రాధ కాలు జారి ధబేలున పడింది. పాపం సినిమాల్లో చూపించినట్టు దొర్లుకుంటూ కిందికి రాలేదు గానీ, గ్లాస్ పాలిష్ చేయించిన మార్బుల్ మెట్ల మీద ఆపుకోలేక మూడు మెట్లు జారి కూలబడి పోయింది. మడమ కాస్తా బెణికింది.

“అదేవిటమ్మాయ్, అలా ఎలా పడ్డావూ?” అంది అత్తగారు అర్థం లేకుండా!
మండిపోయింది రాధకి! “ఇంకోసారి పడ్డప్పుడు చూద్దురు గానీ” అంది కన్నీళ్ళాపుకుంటూ!

నాల్గు రోజులు రాధ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలంటే గోపాలం సాయం తీసుకోవాల్సి వచ్చింది ప్రతి సారీనూ!

మర్నాడు వంటింట్లో కాఫీ కలుపుతూ ఎందుకో ఇవతలికి వచ్చిన రాధ గుండె ఆగిపోయింది. అప్పుడే నిద్దర్లేచిన యువరాణీ వారు పై మెట్టు చివరి అంచు మీద నిలబడి కళ్ళు నులుముకుంటోంది. ఎవరిని పిలిచినా పిల్ల కంగారు పడి కింద పడుతుందేమో!

శబ్దం చేయకుండా ఒక్కో మెట్టూ కూడబలుక్కుని ఎక్కేసరికి రాధకి దేవుళ్ళంతా లైన్లో కనపడ్డారు. ఆ కోపంలో పిల్లదాన్ని ఒక్కటి పీకింది! అది గయ్యిమని గోల!

నాల్రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉండాలనీ నిర్ణయించుకుంది. పొద్దున్నే ఫోను తీసుకుని కిందకొచ్చి ఇహ మళ్ళీ రాత్రికే పైకి వెళ్దామని మధ్యహ్నం  హాల్లోనే సోఫాలో నడుం వాల్చడం మొదలుపెట్టింది, అత్తగారు పెట్టే సీరియల్ హింసను భరిస్తూ!

ఈ లోపు ఆవిడ ఒకరోజు మధ్యాహ్నం “అమ్మాయ్ రాధా, నీ ఆకుపచ్చ కు పింక్ అంచు పట్టు చీర ఎన్నాళ్ళయిందో చూసి, పట్రా ఓ సారి చూద్దాం” అంది. “ఇప్పుడా?” అన్లేదు రాధ! చచ్చినట్టు తీసి చూపించాలి. లేదంటే మర్నాడు ఆడపడుచు ఆడపోలిసు మల్లే ఫోన్ చేసి “ఏవిటీ, పాపం అమ్మ నీ చీరె చూడాలని ముచ్చటపడితే తర్వాత అన్నావుటా? పాపం పెద్దవాళ్ళు కదోయ్ రాధా, ఓపిక చేసుకోవాలోయ్, పాపం, మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో చిన్నప్పుడు! బొగ్గుల కుంపటి మీద వంట కూడా చేసింది” అని నీతి చంద్రిక వల్లిస్తుంది. దానికంటే ఆ చీరేదో చూపించడమే నయం!

మరో రోజు ఏదో మాటల్లో పడి టీవీరిమోట్ పట్టుకుని కిదకొచ్చేసిన రాధ దాన్ని కిందే మర్చిపోయింది. రాత్రి టీవీ చూడ్డానికి లేదు. గోపాలానికి మరీ బద్ధకం! “ప్లీజోయ్, వెళ్ళి పట్రా” అన్నాడు బద్ధకంగా చూస్తూ!

బెడ్ రూము పైన ఉండటం ఎంత హింసో రాధకి నెమ్మదిగా అర్థమవుతోంది. గోపాలం ఆఫీసుకు రెడీ అయి కిందకు దిగి, “రాధా, రాధా” అని కొంపలు మునిగినట్టు కేకలు పెడతాడు. ఏవిటా అని బాల్కనీలోంచి తొంగి చూస్తే “నా లాప్ టాప్ బాగ్ మర్చిపోయాను, పట్రావా ప్లీజ్?”
ఆఫీసుకెళ్ళే మనిషి లాప్ టాప్ ఎలా మర్చిపోతాడో రాధకి అర్థం కాదు. పోనీ అదేవన్నా కర్చీఫా, పెన్సిలా పై నుంచి విసిరేయడానికి! చచ్చినట్టు దిగాలి!దిగడంతోనే అవదుగా, మళ్ళీ ఎక్కాలి!

అత్తా మామలు కదిలి ఊరెళ్ళే పరిస్థితి ఏవైనా కనపడితే రాధ కింది బెడ్ రూముకి మారిపోయి పై బెడ్ రూము అతిధులకు ఇచ్చేందుకు సిద్ధపడింది. వాళ్లకా ఉద్దేశం ఉన్నట్టు కనపళ్ళేదు సరి కదా, పల్లెలో ఇల్లు పంతులు గారికి అద్దెకిచ్చేమని ఎవరికో ఫోన్లో చెప్తుంటే విని నీరసం వచ్చి పడింది.

మూడు బెడ్ రూముల అప్పార్ట్మెంట్లో హాయిగా రాజభోగాలు అనుభవించిన రోజులు కళ్ళముందు కనిపించాయి రాధకి! అసలు లిఫ్ట్ లో తప్ప ఎప్పుడైనా మెట్లు వాడిందా తను? ఛీ, వాడినా బాగుండేది…కాస్త ప్రాక్టీసన్నా ఉండేది.

ఇష్టమైనట్టు వుడ్ వర్కూ అదీ చేయించుకున్నాం కదాని పుస్తకాలూ డీవీడీలూ అన్నీ తమ రూములోనే ఉంచారు. సీరియల్స్ బోరు కొట్టిన అత్తగారు ఒకరోజు ఆ డీవీడీలన్నీ కిందకు తెమ్మన్నారు. ఇహ అవి కిందే వదిలేసింది రాధ!

మోకాళ్ల నొప్పులు మరీ ఎక్కువ కావడంతో  డాక్టర్ దగ్గరికెళ్ళక తప్పలేదు. డాక్టర్ ఒక సుత్తి తీసుకుని రెండు మోకాళ్ళ మీదా నాలుగేసి దెబ్బలేసి, అన్నాడు “లాభం లేదు, మీ మోకాళ్ళు అరిగిపోయాయి. ఇప్పుడే ఆపరేషన్ వద్దులే గానీ, జాగ్రత్తగా ఉండాలి మరి”

“జాగ్రత్తంటే?”

“ఏముంది? మెట్లెక్కకూడదు”

అదిరిపడింది రాధ! “మెట్లెక్కకూడదా?”
“అవును, ఎక్కువ వాకింగ్ కూడా వద్దు. ఇంట్లోవరకే! మెట్లెక్కడం, అప్ లో నడవడం కొన్నాళ్ళు పూర్తిగా అవాయిడ్ చెయ్యాలి మీరు”

ఇంటికొచ్చాక ఈ ప్రసక్తి రాగానే అత్తామామలు తమ రూములోకెళ్ళి టీవీ చూడ్డం మొదలు పెట్టారు.

చూస్తూ చూస్తూ వాళ్లని పైన బెడ్ రూములో ఉండమని చెప్పాలేదు. నిజానికి ఆ రూము ఇవ్వడానికి మనసే ఒప్పదులే తనకి!

తర్జన భర్జనలు పడ్డాక ఇప్పుడు రాధ____________________
కిచెన్ పక్కనే ఉన్న 10X10 స్టోర్ రూములో ఒక దీవాన్ కాట్ వేసుకుని దాని మీద పడుకుంటోంది రోజు! అక్కడే ఒక పాత చెక్క బీరువా పడేసి ఉంటే దాంట్లో బట్టలు సర్దుకుంది.

అదీ డూప్లెక్స్ వైభవం!

రాధ మొహంలో ఇదివరకున్న ఉత్సాహం, సంతోషం లేవు. అప్పుడప్పుడూ “ఏం డూప్లెక్స్ ఇల్లో! హాయిగా ఒకటే ఇల్లు ఐదారు బెడ్ రూముల్తో వేసుకున్నా బాగుండేది” అని గొణుగుతుంది.

ఈ మధ్య ఎవరన్నా గేటెడ్ కమ్యూనిటీలో విల్లా________అంటే చాలు వెర్రి కేక పెట్టి “అమ్మో, ఒద్దొద్దు! తీసుకోవద్దు. తీసుకున్నా…మీరు కింద బెడ్ రూము ఉంచేసుకోండి”  అని
తలా తోకా లేకుండా అరగంట మాట్లాడుతోంది ఆపకుండా!

రేడియో చమత్కారాలు

 

రచన: డా. ఏల్చూరి మురళీధర రావు ,’

న్యూ ఢిల్లీ

 

 

హాసము ఆరోగ్యానికి లక్షణం. “దుఃఖంతో నిండి ఉన్న ప్రపంచంలో నవ్వు అనేదే లేకపోతే విసుగూ అసహ్యమూ పుట్టి మానవజీవితం దుర్భరమైపోతుంది” అని మహాకవి వేదుల సత్యనారాయణశాస్త్రిగారు ఒకచోటన్నారు. అందువల్ల, నిత్యానుభవంలో సైతం ప్రతివాడూ ఏదో విధంగా నవ్వడానికే ప్రయత్నించడం సహజం. చమత్కారం స్ఫురించేటప్పుడు కూడా నవ్వలేనివాడు హృదయం లేనివాడో రోగగ్రస్తుడో అయివుంటాడని పెద్దలంటారు. నవ్వు హృదయనైర్మల్యానికి స్నిగ్ధసంకేతం. మనస్సుకు వికాసాన్ని కలిగించే జీవశక్తి అందులో ఉంటుంది. వికాసశీలమైన చిత్తానికి నవ్వుకంటె విశ్రాంతీ, హాయీ మరొకటి లేదు.

1978లో నేను విజయవాడ ఆలిండియా రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్సిక్యూటివ్ గా ఉద్యోగంలో చేరాను. రేడియో స్టేషను ఎప్పుడూ యాతాయాతవిద్వత్సమాజం ప్రగల్భహాస్యోక్తులతో,సహోద్యోగుల నిత్యచ్ఛలోక్తులతో, కుశలప్రత్యుక్తులతో, రసవదర్థాలతో నవ్వుల పువ్వులతోటలా పరిమళిస్తుండేది. అందులోనూ పద్యనాటక నటులు, సంగీతవేత్త వి.ఎస్. నారాయణమూర్తిగారు,మెహమూద్ ఖాన్ గారు, నల్లూరి బాబూరావు, కవయిత్రీమణి ఝాన్సీ కె.వి. కుమారి, కళాకృష్ణ, సిద్ధిరాజు అనంత పద్మనాభరావు; వాచికాభినయప్రవీణులైన అనౌన్సర్లలో ఆర్ముళ్ళ బ్రహ్మానందరెడ్డి (ఎ.బి. ఆనంద్) గారు, ఎస్.బి. శ్రీరామమూర్తి గారు నిత్యం హాయిగా కలకల నవ్వుతూ, నవ్విస్తూ ఉంటే ఎటువంటివారికీ కాలం పోకడ తెలిసేది కాదు. ఇక పెద్దలు సి. రామమోహనరావుగారు,నండూరి సుబ్బారావుగారు, ఎ. లింగరాజుశర్మగారు, పేరి కామేశ్వరరావుగారు, ఎం. వాసుదేవమూర్తిగారు (వీరి తండ్రి మంచావజ్ఝల సీతారామశాస్త్రిగారు గొప్ప కవి, తిరుపతి వెంకటకవుల ప్రత్యక్షశిష్యులు, కొప్పరపు కవుల వివాదసందర్భంలో వారు చెప్పిన వ్యంగ్య హాస్య పద్యాలలోని వెక్కిరింతల పదును వింటే గాని తెలియదు), ఇక ఉషశ్రీ గారు, సంస్కృతాంధ్రాంగ్ల విద్వాంసులు,ప్రముఖకవి ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు, వెంపటి రాధాకృష్ణగారు, చక్కటి కథకులు శ్రీ పి.వి. రమణరావు గారు, రంగస్థల ప్రయోక్త ఎం. పాండురంగరావుగారు, కొప్పుల సుబ్బారావుగారు, ప్రముఖ రచయిత ప్రయాగ రామకృష్ణగారు, విదుషీతల్లజ ప్రయాగ వేదవతిగారు (వీరి ద్వారా హరికథాప్రవీణులు, విఖ్యాత కవి, వినుత గాయకులు, రంగస్థల నటులు, ప్రయోక్త, హాస్యకుశలి శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రిగారిని కలుసుకొనే అవకాశం, ప్రసంగించే అదృష్టం కలిగాయి), గాయక సార్వభౌములు ఓలేటి వెంకటేశ్వర్లుగారు, అన్నవరపు రామస్వామిగారు, దండమూడి రామమోహనరావుగారు తమ జీవితంలోని సరసప్రసంగాలను నెమరువేసుకొంటుంటే నవ్వుతెరను ఆపుకొనడం సాధ్యం కాకపోయేది. ఆ తర్వాత నిరంతర హాస్యోక్తిపరాయణులు, ప్రవీణులు, ప్రముఖవిద్వాంసులు డా. రేవూరి అనంత పద్మనాభరావుగారిని కలుసుకొన్నాను.  

నేనిక్కడ పేర్కొన్నవి ఏవో అలవోకగా జ్ఞాపకం చేసుకొన్న కొన్ని యాదృచ్ఛిక ఘటితాలు మాత్రమే. ఆ హాస్యకలశరత్నాకరంలో నుంచి ఎన్ని పేర్కొన్నా తక్కువే మరి!

 

ముద్దంటే చేదా?
1973లో అనుకొంటాను, మద్రాసు రేడియో వాళ్ళొకసారి నరాల రామారెడ్డి గారి అష్టావధానం ఏర్పాటు చేశారు. పృచ్ఛకులు – నిషేధాక్షరికి శ్రీశ్రీ గారు, సమస్యకు ఆరుద్ర గారు, ఆశువుకు డా. మాడభూషి నరసింహాచార్య గారు, వర్ణనకు కొంగర జగ్గయ్య గారు, న్యస్తాక్షరికి రావూరి దొరసామిశర్మ గారు, వ్యస్తాక్షరికి సినీరచయిత్రి విజయలక్ష్మి గారు, దత్తపదికి వినుత వ్యాకరణ విద్వాంసురాలు ఆచార్య లలిత గారు మొదలైన ఉద్దండులు. అప్రస్తుతప్రసంగం డి.వి. నరసరాజు గారు. అంతా మహామహా విద్వాంసులకే గంగవెఱ్ఱులెత్తించే దిగ్దంతులు.
రామారెడ్డి గారు మంచి కవి. అంతమందినీ రంజింపజేస్తున్నారు. శ్రీశ్రీ గారు మధ్య మధ్యలో అవధాని గారి కంటె ముందుగా తానే సమాధానాలు చెబుతూ చమత్కారాలు కురిపిస్తుంటే సభంతా హాస్యకళామందిరం అయింది.
అవధాని గారు అంతమందిలో సభను మెప్పిస్తున్నారు కాని – నరసరాజు గారిని ఎదుర్కొనటం మాత్రం ఎవరివల్లా కాలేదు. ఆయనెక్కడున్నా అంతే. చుట్టూ ఉన్నవారికి నవ్వి, నవ్వి కడుపునొప్పి రావలసిందే. పైగా – ఆయన ప్రశ్న అడగటం, వెంటనే జోక్యం చేసుకొని శ్రీశ్రీ గారు సమాధానం చెప్పటం, దానికి ఆరుద్ర గారి కొసమెఱుపులు. అవధానాన్ని హాస్యం ముంచెత్తివేస్తున్నదని అందరూ అనుకొన్నారు.
సభ పెద్దయెత్తున జరిగింది. వందలమంది ప్రేక్షకులు. సభలో కళాసాగర్ అధ్యక్షులు, ప్రఖ్యాత వైద్యులు డా. ముద్దుకృష్ణారెడ్డి గారున్నారు.
మాటల మధ్య నరసరాజు గారడిగారు: “డాక్టరు ముద్దుకృష్ణారెడ్డి గారికీ, డాక్టరు నారాయణరెడ్డి గారికీ తేడా ఏమిటి?” అని.
తడుముకోకుండా రామారెడ్డి గారన్నారు: “నారాయణరెడ్డి గారివి రాతలు; ముద్దుకృష్ణారెడ్డి గారివి కోతలు” అని. అందరూ ఆ ఛలోక్తికి పకపక నవ్వారు. నారాయణరెడ్డి గారు గొప్ప కవి, ముద్దుకృష్ణారెడ్డి గారు గొప్ప శస్త్రవైద్యనిపుణులు అని భావం.
జగ్గయ్య గారు సరదాగా, “డాక్టరును తెలుగులో ‘మందరి’ అనాలి” అని చెప్పారు. “మందరి ముద్దుకృష్ణారెడ్డి గారు అంటే బాగుంటుంది” అన్నారు. ఆరుద్ర గారు కొంటెగానే, “మందు (ఔషధం), అరి = కలవాడు “మందరి” అన్నమాట” అని ఆ మాటను వివరించారు. జనమంతా ఒప్పుకోలుగా దరహాస చంద్రహాసాలు మెరిపించారు.
వెంటనే శ్రీశ్రీ “ఏ మందు?” అని అడిగారు. సభలో మళ్ళీ నవ్వులు విరిశాయి. ప్రక్కనే కూర్చొన్న విజయలక్ష్మి గారు “శ్రీశ్రీ గారే చెప్పాలి” అన్నారు. అంతటా మళ్ళీ ముసిముసి నవ్వులు.
శ్రీశ్రీ గారు ఊరికే ఉంటారా? ఆమెకేసి చూసి, “మందరి ముందరి సుందరి” అని అంటించారు. సభంతా కరతాళధ్వనులతో నిండిపోయింది.
అప్పుడు డి.వి. నరసరాజు గారన్నారు: “డాక్టరు నారాయణరెడ్డి, డాక్టరు ముద్దుకృష్ణారెడ్డి లో “డాక్టరు”, “డాక్టరు”  ఒకటే. “రెడ్డి”, “రెడ్డి” ఒకటే. “నారాయణా”,”కృష్ణా” ఒక్కటే. పోతే, “నారాయణరెడ్డి”లో “ముద్దు” లేదు” అని.
హాస్యానికి అన్న మాటలే అవన్నీ. ఆ కవులు, సభాసదులు అందరికీ నారాయణరెడ్డి గారంటే అభిమానమే. సభలో ఇక నవ్వుల పండగే ఆ రోజు.
అవధానం దిగ్విజయంగా జరిగింది.

 

మందీ – మంచూ
మద్రాసు ఆలిండియా రేడియోలో రసజ్ఞుల సమక్షంలో కవిసమ్మేళనం జరుగుతోంది. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, కొసరాజు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, చల్లా రాధాకృష్ణశర్మ, సాయికృష్ణ యాచేంద్ర మొదలైన ప్రసిద్ధ్లులతోపాటు ఆ రోజు నేనూ పాల్గొనే  అవకాశం వచ్చింది.
స్టూడియో అంతా ఆహూతులతో కిటకిటలాడుతున్నది. ఎయిర్ కండిషనింగ్ చేసినప్పటికీ గాలి ఆడక ప్రేక్షకులు చేతిలో కాగితాలతోనూ, పుస్తకాలతోనూ అసహనంగా విసురుకొంటున్నారు.ఎవరో లేచి అడిగారు: “ఏవండీ! రేడియోవాళ్ళు ఎ.సి. వేశారా లేదా?” అంటూ.
మహాకవి ఆరుద్ర చమత్కార సంభాషణలకు పెట్టింది పేరు. ఆయన వెంటనే అన్నారు, “మంది ఎక్కువైతే ‘మంచు’ కూడా పల్చనే” అని! క్షణకాలం సభ అంతా నవ్వులతో చల్లబడింది.

 

సంపాదకత్వ శిక్షణ
1978లో, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను ఉద్యోగిగా చేరిన మొదటి రోజు – చేరి ఇంకా గంటకూడా కాలేదు – స్పోకెన్‌వర్డు ప్రొడ్యూసర్‌గా ఉన్న సుప్రసిద్ధులు ఉషశ్రీ గారు వచ్చి నన్ను పలకరించి, ఏ ఉపోద్ఘాతమూ లేకుండానే, “నీకు స్క్రిప్టు ఎడిటింగు వచ్చునా?” అని అడిగారు. ఆయన మా నాన్నగారికి ఆప్తమిత్రులు. నేను సమాధానం చెప్పే లోపునే, ఒక రచయితను పరిచయం చేసి, “పదమూడు నిమిషాల ప్రసంగం. స్క్రిప్టు పెద్దదయింది. నువ్వు సరిచెయ్యి” అని చెప్పి వెళ్ళిపోయారు.
విషయం ‘నన్నయ భారతంలో ఉపమ’. వక్త అమలాపురం నుంచి వచ్చిన తెలుగు లెక్చరరు. రేడియోలో అదే మొదటి ప్రసంగమట. వ్యాసం సుమారు డెబ్భై పేజీల పైనే ఉంది. ఎక్కడెక్కడివో విషయాలను సేకరించి, పొందికగా రాసుకొచ్చారు. నేను శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాను. గంటయింది. మధ్య మధ్య సహోద్యోగులు వచ్చి పలకరించటం, అభినందనలు, అభివాదాలు, పరస్పర పరిచయాలతోనే కాలం గడిచిపోతోంది.
అంతలో ఉషశ్రీ గారు వచ్చారు. “పూర్తయిందా?” అని అడిగారు. “సార్ చదువుతున్నారు” అని ఆ ప్రసంగకర్త, పాపం జవాబిచ్చారు. “పావుగంట వ్యాసం చదవటానికి గంటసేపా? పద, స్టూడియోకి!” అంటూ మమ్మల్ని ఉషశ్రీ గారు టాక్ స్టూడియో లోపలికి తీసుకెళ్ళారు.
“ఒకటి, రెండు, మూడు” అంటూ, మొదటి నాలుగు పేజీలు బైటికి లాగి, “ఇవి చదవండి.” అని ఆయన చేతిలో పెట్టారు.
పాపం ఆయన హడిలిపోయాడు. నేను బిక్కుబిక్కుమని చూస్తున్నాను. “ఇది వ్యాసం మొదలేనండీ! ముగింపు చెయ్యాలి కదా” అంటున్నాడు.
“అవసరం లేదు. మాకు ‘అనవసరం’ (ఎనౌన్సరుకు ఉషశ్రీ గారి తెలుగు. ఎనౌన్సరం అన్నట్లు పలికేవారు) అని ఒకడుంటాడు. మీ ప్రసంగం అయిపోయిందని చివర్లో చెబుతాడు. జనానికి తెలుస్తుంది. ఈ నాలుగు పేజీలూ చదివితే చాలు.” అన్నారాయన.
“బాబ్బాబ్బాబ్బాబు! క్షమించండి. ఒక్క పదిహేను నిమిషాలు టైమివ్వండి … ముగింపు కూడా చేరుస్తాను.” అంటూ ఆయన ఉషశ్రీ గారి కాళ్ళమీద పడిపోయాడు.
ఎలాగో కష్టపడి అంతా సరిచేశాక ఆయన చదవటం మొదలుపెట్టారు. రికార్డింగు సరిగ్గా పదమూడు నిమిషాలకి ఆపేశాము.
ఆకాశవాణి “ఎడిటింగు”లో నా ట్రెయినింగు పూర్తయింది!
మానవ వనరుల నిర్వహణ
చమత్కారదృష్టి అంటూ ఉండాలే కాని, జీవితంలో చల్లని హాస్యానికి కొదవుండదు.
ఆ వారమే రేడియోలో ‘నేనూ – నా రచనలు’ అన్న కార్యక్రమాన్ని ముగ్గురు మహిళా రచయిత్రులతో నిర్వహించారు. ఉషశ్రీ గారు దాన్ని ఎలాగో తీరిక చేసుకొని నేనే రికార్డు చెయ్యాలని – నాకు అప్పజెప్పారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు, ఆర్. వసుంధరాదేవి గారు, మరొక ప్రసిద్ధ నవలా రచయిత్రి. ఆ చివరామె తన ప్రసంగమే ముందుండాలని పట్టుబట్టింది. “లక్ష్మీకాంతమ్మ పేరే జనం యెరగరు. వసుంధరాదేవి ఇప్పుడంతగా రాయటం లేదు. అంతా నాకోసమే వింటారు. నేనే మొదటుండాలి.” అని ఆమె వారిద్దరి ఎదుటే గట్టిగా వాదించింది. విద్వత్కవయిత్రి లక్ష్మీకాంతమ్మ గారు చిన్నబుచ్చుకొన్నారు. వసుంధరాదేవి గారేమీ మాట్లాడలేదు. నాకు దిక్కు తోచలేదు.
ఉషశ్రీ గారప్పుడు ఆఫీసులో లేరు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారిని అడిగాను.
శర్మగారు గలగల నవ్వుతూ, “రికార్డింగు ఎవర్ని ఎప్పుడు చేస్తేనేం? ప్రసారం మీకు కావల్సినట్లే వరస మార్చి చేసుకోవచ్చుగా?” అన్నారు.
సమస్య పరిష్కారమయింది. మానవ వనరుల నిర్వహణలో శిక్షణ పూర్తయింది!

 

సోమపానం – వామపక్షం
1981లో విజయవాడ ఆకాశవాణి స్మరణీయమైన కవిసమ్మేళనాన్ని నిర్వహించింది. కార్యక్రమాన్ని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించారు. ఆ తర్వాత అది రేడియోలో ప్రసారమయింది.
కార్యక్రమానికి ఆహూతులైన కవులలో శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, పువ్వాడ శేషగిరిరావు గారు, జ్ఞానానందకవి గారు వంటి మహామహులున్నారు. అందులోనూ శ్రీశ్రీ గారు విజయవాడకు వచ్చి ఇరవయ్యేళ్ళు దాటిందట. అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
నాకు శ్రీశ్రీ గారిని గ్రంథాలయానికి తీసుకొనివచ్చే బాధ్యతను అప్పజెప్పారు. ఆయన ‘స్వాతి’ పత్రికాఫీసు మొదటి అంతస్తులో బసచేశారు. నేను ఉదయమే వారికి అంతా వివరించి, సాయంకాలం వచ్చి తీసుకొనివెళ్తానని చెప్పాను. ఆయన సరేనన్నారు.
సాయంకాలం ఎందుకైనా మంచిదని, మూడింటికే అక్కడికి వెళ్ళాను. గదిలో శ్రీశ్రీ గారొక్కరే ఉన్నారు. మధ్యాహ్నం ఎవరో వచ్చి వెళ్ళారని ఆఫీసు బాయ్ చెప్పాడు. శ్రీశ్రీ గారు స్పృహలో లేరు. ఎంతో కష్టం మీద లేపవలసి వచ్చింది. నేనూ, కారు డ్రైవరు కలిసి కూచోబెట్టాము. విశ్వప్రయత్నం చేసి, స్పృహలోకి తెచ్చి, దుస్తులు మార్పించేసరికి నాలుగున్నరయింది. నాకు భయం వేసింది. ఆరింటికి కవితాసభ! చెరొక భుజం పట్టుకొని మెల్లగా నడిపిస్తూ మెట్లు దించి, గేటు దగ్గరికి వచ్చాము.
“కారుందా?” అని అడిగారు.
విశ్వనాథ సత్యనారాయణ గారికీ, మల్లాది రామకృష్ణశాస్త్రి గారికీ ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా కారు పంపించాలనే నియమం ఉండేది. మల్లాది వారయితే మరీనూ. ఒకసారి టి.నగర్లో వారింటిముందే ఒక సినిమా కంపెనీ వెలిసింది. ఇంటి ముందు – అంటే, రెండిళ్ళ ముందరి గేట్లూ ఒకదానికొకటి ఎదురన్నమాట. మధ్యలో ఒక సన్నని రోడ్డు మాత్రమే. సినిమావాళ్ళు శాస్త్రి గారితో పాట రాయించాలని వారింటికి వచ్చి కలిశారు. “రేపు పొద్దున్న ఆఫీసులో కలుద్దాము. కారు పంపించండి” అన్నారాయన. వాళ్ళు తెల్లపోయారు.
ఉదయాన్నే కారు వచ్చి శాస్త్రిగారి ఇంటిముందు నిలబడింది. శాస్త్రిగారు కారు వెనుక తలుపు తీసి లోపలికి వెళ్ళి, ఆ వైపు తలుపు తీసి కిందికి దిగి ఆఫీసులోకి వెళ్ళారు.
శ్రీశ్రీ గారికి అటువంటి ఆర్భాటాలేవీ లేవు. అయినా ఆ రోజు, “కారుందా?” అని అడిగారు.
నేను కారు తెలుపు తెరిచి పట్టుకొని, శ్రీశ్రీ గారికి కూర్చొనేందుకు సాయం చెయ్యబోయాను. ఆయన వద్దు వద్దని, తలుపు మూసి, కారు డిక్కీని పట్టుకొని నెమ్మదిగా అడుగులు వేస్తూ అవతలి వైపుకు వెళ్ళి, తలుపు తీసి లోపలికెక్కి కూర్చొన్నారు.
నాకేమీ అర్థం కాలేదు.
“I am a leftist – I always get in from the left” అన్నారాయన! నాకు ప్రాణం లేచివచ్చింది.
కారులో కూర్చొన్నాక, “నీకు విమానాలకు చౌకగా రంగువెయ్యటం ఎలాగో తెలుసునా?” అని శ్రీశ్రీ గారడిగారు. “ఏం లేదు, విమానం పైకి వెళ్ళాక చిన్నదైపోతుంది కదా? అప్పుడు వెయ్యాలి రంగు” అన్నారు, కలకల నవ్వుతూ.
సాయంత్రం సభలో వందలమంది వస్తారనుకొంటే – శ్రీశ్రీ గారికోసం వేలమంది విరగబడ్డారు. ఇసుకవేస్తే రాలని జనం.
అప్పుడు వచ్చింది నాకు జ్ఞాపకం. “మీ దగ్గర కవిత ఏదీ?” అని అడిగాను.
“లేదు” అన్నారాయన నవ్వుతూ.
నాకు గుండె ఆగిపోయింది. ఏం చెయ్యటం? వేలమంది జనం. ఆరుద్ర గారప్పటికే సభకు వచ్చేశారు. పువ్వాడ వారున్నారు. ఆకాశవాణి ఉద్యోగులు, తక్కిన కవులు ఉన్నారు.
“నీ దగ్గర కలం, కాగితం ఉన్నాయా?” అన్నారు శ్రీశ్రీ గారు.
ఎవర్నో అడిగి ఒక కలం తీసుకొన్నాను. తెల్ల కాగితం దొరకలేదు. శ్రీశ్రీ గారు సిగరెట్టు పొట్లాం తీసి, దాని చాందినీ వెనుక ఉల్లిపొర కాగితం మీద గబగబ రాయటం మొదలుపెట్టారు. ఇంతలో మిత్రులొకరు కాగితం తెచ్చి యిచ్చారు. ఆయన పూర్తిచేశాక నేను తెల్ల కాగితం మీద దానికి శుద్ధప్రతిని వ్రాసి, చదవటం కోసం శ్రీశ్రీ గారికిచ్చి, అక్షరలక్షలు చేసే శ్రీశ్రీ గారి అక్షరాలున్న ఆ రచనను నాకోసం దాచుకొన్నాను.
ఆ రోజు శ్రీశ్రీ గారి కవితాపఠనం ముందు మహామహా పద్యకవుల రాగాలాపన కూడా వెలవెలపోయింది. అద్భుతంగా చదివారు. అంతర్జాతీయ బాలల సంవత్సరం కాబట్టో, బాలల కోసమే రాశారో. బాల్యాన్ని కోల్పోతున్న పసిపిల్లల మీద గేయం.
విజయవాడ శ్రీశ్రీ గారికి దాసోహం పలికింది. జయజయధ్వానాలు మిన్నుముట్టాయి.
ఆ మధురానుభూతి, ఆ చల్లని హాస్యోక్తులు నా మదిలో నిలిచిపోయాయి.

 

గంగా భాగీరథి
ఒకనాటి రేడియో ప్రసంగంలో ప్రఖ్యాత హాస్య రచయిత, రంగస్థల నటులు పుచ్చా పూర్ణానందం గారు చెప్పారు:
కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు గొప్ప సరస సల్లాప నిపుణులు. హాస్యకుశలి. అది ఆయన హుందాతనానికి తగిన, సంస్కారవంతమైన హాస్యం.
అనారోగ్యం పైకొని నేడో రేపో అన్న పరిస్థితి చివరి క్షణాల్లోకి దిగాక ఆయన్ను చూడటానికి మిత్రుడొకడు వెళ్ళాడట.
వెళ్ళి కూర్చోగానే ఆయన, “మంచినీళ్ళు కావాలా?” అని అడిగారట.
ఆ వచ్చినాయన కావాలన్నట్లు చూశాడట. “నీళ్ళు కావాలంటే నీళ్ళు నములుతావేమిటి?” అంటూ ఆయన భార్యను పిలిచి, నీళ్ళు తెమ్మన్నారట.
నీళ్ళు తాగాక, సరిపోలేదని గ్రహించి ఆయన “ఇంకా కావాలా?” అన్నారట. కావాలనటానికి ఆయన మొహమాటపడుతున్నాడు.
కృష్ణారావు గారు భార్యతో, “ఏమే! ఇంకో అరగంటలోనో గంటలోనో గంగా భాగీరథీ సమానురాలివి కాబోతున్నావు. చెంబు నిండా నీళ్ళు పట్టుకురా” అన్నారట.

 

కారం – గారం
చివరిగా, గృహస్థాశ్రమంలో జరిగిన ఒక స్వీయానుభవమూ చెబుతాను:
ఆకాశవాణి విదేశీ ప్రసారవిభాగంలో శ్రీ ముకుందశర్మ గారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని బైరాగి గారి కవిత్వాన్ని గురించి ప్రసంగం రికార్డు చేసి, అఱ్ఱాకలితో ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేసరికి – ఆ రోజు కూరంతా గొడ్డుకారం. కళ్ళనీళ్ళపర్యంతం అయింది. ఆశువుగా అర్ధాంగలక్ష్మిని అడిగాను –
ఉ. పోరికిc గాలుదువ్వితినొ? పూనితినో భవదీయవాక్య ని
స్సారత నెత్తిచూపుటకు? చారుగుణాన్విత వీవు గావులే,
యో రమణీలలామ! యని యొప్పు వచించితినేమి, కూరలోc
గారము కూరినా వకట, కాంతరొ! ప్రల్లద మేమిచేసితిన్?
అని!

దానికి శ్రీమతిగారి ప్రత్యుత్తరం: “కూరలో కారం కూరితే వచ్చేవి కన్నీళ్ళు; కూరలో గారం కూరితే రావల్సినవి ఆనందబాష్పాలు కదా!”

మాలికా పదచంద్రిక – 5: రూ. 1000 బహుమతి

కూర్పు : కోడిహళ్లి మురళీమోహన్

 

కోడిహళ్ళి మురళీమోహన్ గారు కూర్చే పదచంద్రికలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది – సరిగా పూరించినవారికి 1000 రూపాయల బహుమతి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే బహుమతి అందరికీ సమానంగా పంచబడుతుంది. ఒకవేళ విజేతలు అయిదుగురికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదుగురికి బహుమతి సమానంగా పంచబడుతుంది. మీ సమాధానాలకోసం ఎదురుచూస్తున్నాం. సమాధానాలు ఈమెయిల్ చెయ్యవలసిన చిరునామా:  editor@maalika.org  ..

సమాధానాలు పంపడానికి ఆఖరు తేది.. ఫిబ్రవరి 20

 

 

అడ్డం:

1. చంద్రలతగారి ప్రసిద్ధ నవల ఏకవచనంలో (3,2)

3. ఎడబాయుట(5)

7. ఘనము, కన్నుల పండుగ గరంగరంగ(4,3)

9. పతివ్రత అక్షరలోపంతో చెడింది (3)

10. విక్రమ్ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన వ్యక్తి (3)

11. రెండణాలు (3)

13. ఈ మధ్య వేలం వెర్రిగా వినబడుతున్న సూప్ సాంగ్ (4)

14. నెత్తురు(4)

16. బుద్ధి(3)

19. పింగళి సూరన సృష్టించిన ప్రబంధ నాయిక (3)

20. రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందిన వ్యక్తి తడబడ్డాడు పాపం (3)

21. పూలవంటివి కవితలు కనుకనే వాగ్దేవిని కవులు వీటితో పూజిస్తారు (7)

24. మహీధర నళినీ మోహన్ వ్రాసిన గేయనాటిక (3,2)

25. తమిళనాడులో రాజకీయనాయకుడిగా ఎదిగిన సినిమా నటుడు (5)

 

 

నిలువు:

1. బలరాముడు (5)

2. మహిళా సాహిత్య పత్రిక. ఆఫ్‌కోర్స్ ఆన్‌లైన్లో (3)

4. మన రాష్ట్రపతి (3)

5.చాన చొరబడ్డ మేఘం (5)

6.  రామ్‌చరణ్ తేజ నటించిన సూపర్ హిట్ సినిమా (4)

7. నిలువు 2 దీనికి ఒక ఉదాహరణ (4,3)

8. ఆడ సంతానాన్ని ఇలా అనలేమా?(7)

11. వృత్త క్షేత్రము యొక్క చుట్టురేఖ (3)

12. నిధిని కోల్పోయిన కనిమొళి నాన్నగారు (3)

15. పాతకాలపు నెక్లెస్ (5)

17. తోడల్లుడు (4)

18. అడ్డం పదమూడు పాడినాయనకు ఈయన పిల్లనిచ్చాడు (5)

22. తిరుమలకు, తీహార్ జైలుకు వీరి తాకిడి ఎక్కువ 🙂 (1,1,1)

23. మహారాజును సంబోధించడంలో లోభిత్వం చూపుతావేం?(3)

అల్లరి కార్టూన్ల శ్రీవల్లి !

 

చాలా ఏళ్ళ క్రితం తెలుగు వార, మాస పత్రికల్లో ‘శ్రీవల్లి’ పేరుతో కార్టూన్లు వస్తుండేవి.  కార్టూన్ల హవా బాగా వెలిగిపోయిన, కార్టూనిస్టులు తామరతంపరగా పుట్టుకొచ్చిన రోజులవి.  అయితే ఇంతమందిలో కూడా శ్రీవల్లి కార్టూన్లు చాలామంది పాఠకులకు గుర్తుండిపోయాయి!

 

కార్టూన్ గీత లావుగానూ,  హాస్యస్ఫోరకంగానూ ఉండటం, విభిన్నమైన కోణాన్నుంచి అల్లరిగా దూసుకొచ్చే హాస్యధోరణి , సంతకం కూడా ప్రత్యేకంగా ఉండటం-  ఇవన్నీ దీనికి కారణాలు కావొచ్చు. బొమ్మకి ప్రాధాన్యం ఇస్తూ కాప్షన్ తక్కువుండేలా ప్రయత్నించటం,  సామాజిక స్పృహ ను జోడించినప్పటికీ  ‘స్పార్క్’ మిస్ కానివ్వకపోవటం ఈ కార్టూనిస్టులో కనపడే లక్షణాలు.

 

‘శ్రీవల్లి’ పేరును చూసి లేడీ కార్టూనిస్టుగా పొరబడే అవకాశముంది. అసలు పేరు పోలిశెట్టి వీరభద్రరావు.  తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో  పుట్టిపెరిగి, కార్టూనిస్టుగా ఎదిగాడు.  హైదరాబాదులో ఓ పత్రికలో ఆర్టిస్టుగా స్థిరపడ్డాడు.  ఓ ప్రముఖ దినపత్రిక  హైదరాబాద్ సిటీ ఎడిషన్లో  రాజకీయ, సామాజిక అంశాలతో చాలా కార్టూన్లు వేశాడు.

 

శ్రీవల్లి  ‘కుంచె’ పేరు వెనక కథేమిటి? అతడి మాటల్లోనే విందాం. ‘మా అన్నయ్య కూతురు ఓ గడుగ్గాయి ఉండేది. ఆమె పేరే శ్రీవల్లి. ఆ పేరుతోనే కార్టూన్స్ మొదలుపెట్టి తర్వాత నా అసలు పేరుకి మార్చుకుందాం అనుకున్నాను. కానీ అందరూ ఆ పేరే బాగుందనడం- సంతకం కూడా డిఫరెంట్ గా ఉంటుందీ- మార్పు వద్దనడంతో శ్రీవల్లిగానే కంటిన్యూ అయ్యాను.’

మొట్టమొదటి కార్టూన్

20 సంవత్సరాల క్రితం, 1981లో  ఆంధ్ర సచిత్రవార పత్రికలో అతడి  తొలి కార్టూన్ వచ్చింది.  అప్పటి నుంచీ ఉత్సాహంగా  ఎన్నో పత్రికల్లో వేల కార్టూన్లు వేశాడు.  పోలీసులు, హేర్ కటింగ్ సెలూన్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, పోస్టుబాక్సులు, దొంగలు, పేదలు, బిచ్చగాళ్ళు, బాబాలు, మగ, ఆడవాళ్ళ మనస్తత్వాలు.. నిత్యజీవితంతో సంబంధమున్న ఇలాంటి అంశాలే ఇతడి కార్టూన్లకు ముడిసరుకులయ్యాయి.

‘నవ్వు ! నవ్వించు!! ’ అనే పేరుతో కార్టూన్ల సంకలనం 12 ఏళ్ళక్రితం వెలువరించాడు. వేల కార్టూన్లలోంచి ఎంపిక చేసిన కొన్నిటికి మాత్రమే ఈ పుస్తకంలో స్థానం కల్పించాడు.

 

హాస్య చిత్రాలకు చిరునామా అయిన జంధ్యాల ఈ కార్టూన్లను (చవి) చూసి అభినందించారు. ‘కొన్ని ఆకర్షణీయమైన గీతల్నీ, కొన్ని అందమైన రాతల్నీ కలబోసి చక్కని బొమ్మల్నీ, చిక్కని హాస్యాన్నీ చిలికించిన శ్రీవల్లికి నా అభినందనలు’ అని వెన్నుతట్టారు.

సినీ సంభాషణల ‘పన్’డితుడు తనికెళ్ళ భరణి అభిప్రాయంలో ‘అతని కుంచె అడుగున ఓ గుండుసూది కూడా ఉంది. అది బావుంది!’

 

ప్రతిరోజూ  ‘ఇదీ సంగతి’ అంటూ రాజకీయనేతలకు చురకలు పెట్టే ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్  ‘ఊహించని సబ్జెక్టులపై వేశాడు. అబ్బురపడతాం’ అని  శ్రీవల్లి కార్టూన్లను  మెచ్చుకున్నారు.

ఈ కార్టూన్ల  సంకలనం విడుదలయ్యేనాటికే  కార్టూన్లకు ముఖం చాటుచెయ్యటం మొదలుపెట్టాయి పత్రికలు.  కార్లూన్ల స్థలాన్ని గాలి రాతల గాసిప్పులూ,  అశ్లీల ఛాయా చిత్రాలూ దురాక్రమించేశాయి.  ఇంకా ముందుకెళ్ళి కథల,  సీరియల్స్ స్థలంలోకి కూడా  అవి చొచ్చుకెళ్ళిపోయాయనుకోండీ!  కార్టూనిస్టుల సంగతి సరే,  కార్టూన్ ఇష్టుల సంగతిని కూడా  పట్టించుకోలేదు  పత్రికా సంపాదకులు.  దీంతో ఎంతోమంది కార్టూనిస్టులు  అస్త్ర సన్యాసం చేశారు.  వారిలో శ్రీవల్లి  కూడా ఉన్నాడు!

అసలు  తెలుగు పత్రికారంగంలో కార్టూన్ల అధ్యాయం 1992 తోనే ముగిసిందంటాడు శ్రీవల్లి.  ‘శాటిలైట్ ఛానల్స్ తోనే పత్రికల  పతనం ప్రారంభమైంది. 1995కి రీజినల్ చానల్స్ వచ్చాక నెలకు 50 నుంచి వంద ఇస్తే కాలక్షేపం 24 గంటలూ చూపిస్తున్నపుడు ప్రజల్లో పత్రికలు కొని చదవాల్సిన అవసరం, చదివేంత టైం కూడా లేకపోయింది.’… అంటాడు.  అందుకే క్రమంగా కార్టూన్లు వేయటం తగ్గించేశాడు. అలా దీర్ఘ విరామం వచ్చింది.

సరదా ధోరణి

కార్టూనిస్టులందరూ సరదాగా ఉండరు. కొండొకచో సీరియస్ గానూ ఉంటారు.  కానీ శ్రీవల్లి తన సుతిమెత్తని చురుకైన వ్యంగ్య వ్యాఖ్యలతో చుట్టూ ఉండే వాతావరణాన్ని తేలికపరుస్తుంటాడు.  ఎంతటి  సీరియస్ సందర్భాన్ని అయినా ఛలోక్తుల జల్లుతో హాస్యభరితం చేయటం ఇతడి ధోరణి.  జర్నలిస్టులూ, ఆర్టిస్టుల గురించీ,  పత్రికల గురించీ, వివిధ వ్యక్తుల మ్యానరిజమ్స్ గురించీ  ఇతడు  పేల్చే ఇన్ స్టంట్ జోకులు బోలెడు నవ్వులు కురిపిస్తుంటాయి.

 

కార్టూన్ విరామానికి సెలవిచ్చి, మళ్ళీ విరివిగా కార్టూన్లు వేయటం మొదలుపెట్టాలని  శ్రీవల్లి చాలాకాలంగా అనుకుంటున్నాడు.  ఆ ఆకాంక్షను ఇప్పుడు ఆచరణలో పెట్టేశాడు కూడా…  ‘మాలిక పత్రిక’ కోసం తాజాగా వేసిన ఈ కార్టూన్లతో!

 

శ్రీవల్లి ఈ-మెయిల్ : raopvb@yahoo.com

 

—————————————————-

 

 

 

 

 

చింతామణి -సినిమా గోల

రచన : స్వాతి శ్రీపాద

 

పాపం చింతామణి పేరు నిజానికి అది కాదు. అప్పలమ్మా , వెంకాయమ్మ అసలే కాదు. అలాంటి పేర్లున్నవాళ్ళే నాజూగ్గా శ్రావ్య, శృతి అనీ మార్చుకుంటుంటే సీతామణి పేరు చింతామణి గా మారిపోవడం దురదృష్టమే కదా !

చిన్నప్పుడు వాళ్ళమ్మా నాన్న పెట్టిన పేరు సీతామణే. తెల్లారితే పుడుతుందనగా ఆ సాయంత్రం సీత వాళ్ళమ్మ లవకుశ సినిమా కెళ్ళొచ్చింది. సీతమ్మవారి కష్టాలన్నీ పక్కన పెడితే  కాంతి పుంజంలా మెరిసిపోతున్న బంగారు సీత విగ్రహం చూడగానే వాళ్ళమ్మ మనసులో ఓ మెరుపు తళుక్కుమంది. పుట్టే పిల్లకి  ఆ రంగుండాలి. తస్సదియ్య లోకం మొత్తం దాసోహమనదూ! ఆ రాత్రి ఆవిడకు నిద్ర పడితే ఒట్టు! అటేడు తరాలూ ఇటేడుతరాలూ పచ్చని పసిమి ఛాయ స్వర్ణ సీత గలవారిని స్మరించుకుంటూ, ఛామన ఛాయ, కాస్త రంగు తక్కువగా, నలుపు మరింత గాఢమై కర్రిమొహాల్లా వున్న వాళ్ళందరినీ తిట్టుకుంది, ఈ కాకి మొహాలు మా చుట్టాల్లోనే పుట్టాలా? మరో కొంపలో పుట్టేడవచ్చుగా అని విసుక్కుంది.  కన్ను మూత పడితే ఎక్కడ కొరివిదయ్యాల్లా ఆ నల్లటి చుట్టాలు కల్లోకొస్తారో , ఎక్కడ కల్లోకొస్తే పిల్లకా రంగు వచ్చేస్తుందోనని రాత్రి నిద్రపోలేదు. తెల్లారీ తెల్లారకముందే నొప్పులు మొదలయ్యాయి.

సాయంత్రానికి పుట్టిన పిల్ల బంగారు బొమ్మే.  సీతలా మిలమిల లాడే పిల్ల రంగుచూసి స్వర్ణ సీత అనే పేరు పెడదాం అనుకుంది. ఆమాటే భర్తకు  చెప్పింది. ” రెండు పేర్లెందుకే , సువర్ణ , సీతా….” చదువంతగా అబ్బక వ్యవసాయం చేసుకునే ఆమె భర్తకు నోరు తిరగలేదు,అర్ధమూ కాలేదు. అతను సరే సరి , అత్తగారికి వినిపించాడామాటే ..ఇహ చూడాలి .. కదల్లేనని గొణుక్కునే ఆవిడ ఎగిరి గంతేసి బాలెన్స్ చేసుకోలేక కూలబడి , నొప్పెట్టిన నడుం రుద్దుకుంటూ  ” అవునొరేయ్ .. ఎంతైనా కోడలు తెలివి గలది, నా చిన్నప్పుడు మా చిన్న చెల్లికి అమ్మవారు పోసి ఆర్నెల్లకే కన్నుమూసింది. దాని పేరు సువర్నే పేరు పెట్టు కోవలసిందే… మీ నాన్న పేరు కలిసి వచ్చేలా సీతారావసుబ్బమ్మ అని కూడా కలుపుకుందాం. ” మొగుడి పేరు ఉచ్చరిస్తున్నానని కూడా తోచలేదావిడకు ఆ ఉత్సాహంలో .. అత్తగారు చూడకుండా తలబాదుకుంది సీతామణి తల్లి.

అందుకే చివరకు సీతామణి పేరుతో రాజీ పడిపోయింది. అది కాస్తా స్కూల్లో వేసే సమయంలో బడికి పోనని ఏడ్చిఏడ్చి బలవంతాన వెళ్ళాక ముక్కెగ బీలుస్తూ చెప్పిన పేరు చింతామణిగా వినిపించి అదే రాసి పారేశాడు ఆ మాస్టారు.

అలా చింతామణిగా స్థిరపడి పోయిందామె పేరు.

 

పేరేదైతేనేంగాక, అంగరంగ వైభవంగా పెరిగింది చింతామణి. రోజూ బుట్టేడు మిరపకాయలు దిష్టి పేరిట పొయిలోకి వెళ్ళాల్సిందే.. ఆ ఘాటుకు ఊరు ఊరంతా ఖంగు ఖంగున దగ్గవలిసిందే …

పిల్లపుట్టాక తండ్రికి కలిసి వచ్చి పట్టిందల్లా బంగారమే అయ్యిందాయె. అంతవరకూ చిన్నకారు రైతుగా వున్న ఆయన రాజకీయాల్లోకి దిగడం కోట్లకు పడగలెత్తడం చింతామణి అదృష్టమేగా మరి.

 

( మనలో మనమాట రాజకీయాలంటేనే దూరం జరుగుతాం. ఉద్యోగాలకోసం వాళ్ళవెంట తిరిగేది, ట్రాన్స్ ఫర్లకు వాళ్ళ మద్దతు కోరడం ఈ బదులు మనమే రాజకీయాల్లోకి వెళ్తేబాగుండు కద….వల్ల కాదంటారా! డోంట్ వర్రీ రాజకీయాలకూ క్రాష్ కోర్స్ అందించే రోజు అట్టే దూరంలో లేదు.)

ముఖ్యంగా రాజకీయ నాయకుల పిల్లలకెలాగూ చదువూ సంధ్యా అబ్బవు . అందుకే వాళ్ళకు చిన్నప్పటినుండే శిక్షణనివ్వడం ఉత్తమం కదా… ఏమో పెద్ద జనాలకూ ఎప్పుడేమవుతుందో… ముందు చూపు చాలా మంచిది కదూ మళ్ళీ అనుభవం లేదనీ టాలెంట్ లేదనీ ఎవరూ అనకుండా…)

అంతేనా ఆపిల్ల తరువాత మరి సంతానం కలక్కపోవడమూ కలసి వచ్చిన అదృష్టమే..

నాలుగో తరగతిలో ఉండగా కాబోలు అల్లరి పిల్లలు చింతామణీ చింతామణి అంటూ పాటలు కట్టి ఏడిపించారు . అంతే !

మరిక స్కూల్ కి వెళ్ళనని మొండి కేసేసింది చింతామణి. చింత పిక్కలాట , బిళ్ళంగోడు ఆటలకు కాలం చెల్లిపోయి టీవీ రోజులొచ్చేసాయిగనక , చాలా రోజులు టీవీ కి కళ్ళు అతికించేసి కూచునేది. తల్లి అటు పోయి ఇటొచ్చి కధ ఏమైందే అంటే  “అబ్బ, కధెవడు చూసాడు ” అనేది. ” కధ కాక మరింకేం చూశావని అడిగితే … అదిగో ఆ కళ్యాణి కట్టుకున్న చీరలు , ఫలానా సీరియల్లో ఆ నాయకీ నగలు .”అంటూ గంటలకొద్దీ వర్ణించేది. అక్కడితో ఆగితే కధే లేదు మరి. టీవీ చూసి చూసి బోర్ కొట్టాక మరో ఆలోచన వచ్చింది చింతామణికి.

నేనే హీరోయిన్ ని ఎందుక్కాకూడదు -అని..

అంతే రోజుకోరకం హీరోయిన్ లా తయారయ్యేది.. ఓ రోజు వాణిశ్రీ .. ఆ రోజంతా అందరూ ఆమెను వాణిశ్రీ అనే పిలవాలి. మరో రోజు శ్రీదేవి… ఇంకోరోజు ఇలియానా … చివరకు అదీ బోర్ కొట్టేసి ఏం చెయ్యాలో తోచనప్పుడు పట్నం నించి పక్కింటి విశాలాక్షి కూతురు పెద్ద హంగూ ఆర్భాటంతో దిగింది.

సినిమాల్లో వేషాలు వేస్తుందటా -అదీ దాని గర్వానిక్కారణం. అబ్బే దానికో రంగూ లేదు హంగూ లేదు. వెలిసిపోయిన నల్లమబ్బు ముక్కలా , చప్పిడి ముక్కు, ఎత్తు పళ్ళూ, ఓ మాదిరి లావు దానికే సినిమాల్లో వేషాలు దొరికితే ఇహా తనలాంటి పుత్తిడి బొమ్మకో …. మనసులో ఎంత మెరమెరగా వున్నా దాన్ని కలిసి సినిమా వేషాలకు దారి కనుక్కోవాలన్నకోరికతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించి దానింటికి బయల్దేరింది.  ఎంతో సవర దీసి మునగ చెట్టెక్కించాక గాని చెప్పడానికది దిగిరాలేదు.  ఒకటేమిటి ఎన్ని రకాలుగా వర్ణించిందో …అబ్బో దీన్నో మహారాణిలా చూసుకుంటారటా….కొండమీద కోతి నడిగినా తెచ్చిస్తారటా…. ఇలా అది చెప్తూ పోతుంటే చింతామణికి వేళా పొద్దూ తెలియలేదు. ఆకలీ దాహమూ తెలియలేదు.

ఆ పైన ఒళ్ళు తెలియలేదు. అంతే ఇంటికి వచ్చి అలిక్కూచుంది. పట్నం వెళ్ళి సినిమాల్లో వేషం వెయ్యాలి.

” అబ్బే దీనికింత రాద్ధాంతం ఎందుకు ? సినిమాలనే మన ఊరికి రప్పిద్దాం … “అన్నాడు తండ్రి.

ఆఘ మేఘాలమీద కబురెళ్ళింది. సినిమా వాళ్ళొచ్చి విడిది చేసారు.. వాళ్ళల్లో హీరో అనిపించిన వాడితో మాట కలిపింది. మరింక ఆలస్యం లేకుండా చింతామణి చుట్టూ చుట్టూ తిరిగి మాటల్తో సినిమా కోట కట్టేసాడు.

అతని పేరు అభిరామ్. ఎర్రగా బుర్రగా హీరో పేరుకి తగ్గట్టుగా ఉన్నాడు. మనిద్దరం హీరో హీరోయిన్లమయితే ఇహ సినిమా కేరాఫ్ మనిల్లే అన్నాడు. రకరకలా ఫోజుల్లో చింతామణి ఫోటోలు తీసి ప్రతి హీరోయిన్ నీముందు దిగదుడుపే అన్నాడు. ఈ పల్లెటూళ్ళో ఏముంది పెళ్ళి చేసుకుని సిటీ వెళ్ళిపోదామన్నాడు. అన్నిటికీ వశీకరణకట్టులో ఉన్నట్టు తలూపింది చింతామణి.

ఇంకేం పెళ్ళు మంటూ పెళ్ళి జరిగిపోయింది. అతని అమ్మా నాన్న అందరూ వచ్చారు వెళ్ళారు. మూడునిద్దర్లు, పదహార్రోజుల పండగ అయిపోయాక , ఓ రోజు గునుస్తూ అడిగింది చింతామణి

” మరి మరి మనం సిటీ కెప్పుడు బయల్దేరుతున్నాం? ”

“ఇంకెక్కడి సిటీ కే పిచ్చిమొహమా… నాలాంటి వాడికే టీలు అందించే పని దొరికితే ఇహ పట్నం వెళ్ళి ఏం చేస్తాం? అయినా మీ అమ్మా నాన్నను వదిలి ఎలా వెళ్తాం… మరో నాల్రోజులు పోయాక మీ నాన్న వెనకాల వెళ్తాలే. నాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప … ఓ మా అమ్మా నాన్నానా? వాళ్ళు సినిమా వాళ్ళేలే నాటకమాడారు.. ఇది మీ నాన్నకూ తెలుసు ” అన్నాడు సవిలాసంగా.

 

*************

 

 

 

తెలివైన దొంగ

రచన : మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ఓ ఖరీదైన రెస్టారెంట్‌లో బిజినెస్ లంచ్ చేస్తూ అనేకమందితో చర్చించాడు. బిల్ పే చేసి ఆఫీస్‌కి వెళ్లాక, తన లాప్ టాప్‌ని రెస్టారెంట్‌లో మర్చిపోయానని గ్రహించాడు. వెంటనే ఆదుర్దాగా వెనక్కి వచ్చాడు. అది రెస్టారెంట్‌లో తను కూర్చున్న చోట లేదు. దాంతో తన లాప్‌టాప్ పోయిన సంగతి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
“వాడు తెలివైన దొంగలా ఉన్నాడు. రెస్టారెంట్‌లోని అందరి కళ్ళు కప్పి ఎలా దాని ఎత్తుకెళ్ళాడో?”
“అవును. ఇది ఎవరో దొంగ పనే. ఇలా ఎక్కడైనా నేను దాన్ని మర్చిపోతే దొరికినవాళ్లు ఫోన్ చేస్తారని నా విజిటింగ్ కార్డ్‌ని లాప్‌టాప్ బేగ్‌కి అతికించాను. కాని ఎవరూ ఇంతవరకు ఫోన్ చేయలేదు. ” అతను చెప్పాడు.
ఆ రాత్రి అతనికి ఫోన్ వచ్చింది.
“మీ లాప్‌టాప్ దొంగిలించిన వాడిని పట్టుకున్నాం. మీ లాప్‌టాప్ పాస్‌వర్డ్ చెప్తే అది మీదో కాదో తెలుస్తుంది.”
“కాని దానికి అతికించిన నా విజిటింగ్ కార్డ్ వల్ల అది నాదని మీకు తెలుస్తుందిగా?”
“అలాగా? కాని దానికి ఏ విజిటింగ్ కార్డూ అతికించి లేదే?”
తన పాస్‌వర్డ్‌ని ఆ పోలీస్ ఆఫీసర్‌కి చెప్పాడా ఎం.డి.

మర్నాడు ఉదయం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ని తొమ్మిదిన్నరకే పోలీస్ స్టేషన్‌కి రమ్మని చెప్పాడా పోలీస్ ఆఫీసర్. ఉదయం అతను స్టేషన్‌కి వెళ్లి తన లాప్‌టాప్ గురించి అడిగితే ఇంకా దొంగని పట్టుకోలేదని వాళ్లు చెప్పారు. వెంటనే అతను గత రాత్రి పోలీస్ స్టేషన్ నించి వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పాడు.
“ఐతే ఇది ఆ దొంగ పనే అయి  ఉంటుంది. మేమెవరం మీకు ఫోన్ చేయలేదు. మాకింకా మీ లాప్‌టాప్ దొరకలేదు.” జవాబు చెప్పారు పోలీసులు.

సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్!

రచన:  ఎన్. రహ్మతుల్లా

 

“ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగ చుక్కకు గతి లేదు” అన్నట్లు సెయింట్ల కాన్వెంట్లలో చదువు మహా డాబుసరి వ్యవహారంగా తయారయింది. ఇంటికూడు తిని, ఎవరి వెంటో పడినట్లుగా కాన్వెంట్ల యాజమాన్యం ప్రవర్తిస్తున్నది. అసలు ఈ ప్రపంచంలో ఏ మూల ఏ ప్రక్రియ సక్సెస్ అవుతుందో దాన్ని మనవాళ్లు ఇట్టే స్వతంత్ర్యం చేసుకుంటారు. ఆనవాలు పట్టడానికి కూడా వీలు లేకుండా దానికి నకిలీ తయారు చేస్తారు. నాణ్యతలో తప్ప మరి దేనిలోనూ తేడా మనకు కనపడదు.

 

ఏదో నాలుగు తెలుగక్షరాలు నేర్చుకొని కుదురుగా చదువుకొంటున్న మా అమ్మాయిని ఇంగ్లీసు మీడియం చదివించాల్సిందేనని మా ఆవిడ పట్టుపట్టింది. ఎందుకంటే మా పక్కింటివాళ్లమ్మాయి పొద్దున్నే బూట్లు, టై, బ్యాడ్జీ మరేవేవో వేసికొని టిప్‌టాప్‌గా కాన్వెంటుకు వెళ్లేది. ఇంటికొచ్చి “బటర్‌ఫ్లై.. బటర్ ఫ్లెయి” అని అరుస్తూ ఉండేది. పక్కింటివాళ్ల పిల్ల అరుపులు విన్న మా ఆవిడ ఒక్క ఉదుటున నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి “మన పిల్లను కూడా కాన్వెంటులో చేరుస్తారా లేదా? అని నిగ్గదీసేది. ఈ ఇంటిపోరు పడలేక చివరికి కాన్వెంట్ల వేటలో పడ్డాను. దారిలో ఓ మిత్రుడు తోడయ్యి అచ్చంగా కాన్వెంట్లే ఉండే ఒక బజారుకు తీసికెళ్ళాడు.

 

అన్ని కాన్వెంట్లూ తిరిగి చూసాం. కొద్దో గొప్పో తేడాతో అందరూ మూడువేలదాకా ముట్టజెప్పుకోమని అడిగారు. మూడు రూపాయల ఖర్చు కూడా లేకుండా మా వూరి వీధి బడిలో చేరి చదివానే. ఇక్కడేంటి మూడు వేలు ఫీజంటున్నారు? ” అని వెంటొచ్చిన మిత్రుణ్ణి అడిగాను.

 

“ఊదు వేయందే పీరు లేవదోయ్ బాషా! అయ్యెలిమెంటరీ స్కూళ్ళూ, ఇయ్యేమో సెయింట్ స్కూళ్ళు. ఆటికి ఈటికి తేడాలేదా?” అన్నాడు సెయింట్ అనే మాటకు అంత విలువ ఉందట. “సెయింటంటే ఏందని అడిగాను. “సన్యాసి, రుషి లేదా ముని” అని తడుముకోకుండా జవాబిచ్చాడా బైరాగి. సన్యాసుల స్కూళ్ళకు సంపాదనాశ మెండా?”అని అనబోయి కూడా ఆపుకున్నాను.

 

ఇంకాస్త ముందుకొస్తే అతి విచిత్రమైన బోర్డు కనబడింది. అది “ఆల్ సెయింట్స్ హైస్కూల్” నాకు  నానార్ధాలు గోచరించాయి.. ఇదేం పేరురా మిత్రమా ఇలా  ఉంది? అన్నాను. అవునోయ్ రోజుకొక కాన్వెంట్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో కొత్త కొత్త సెయింట్ల పేర్లు వాటికి తగిలిస్తున్నారు. ఉదాహారణకు సెయింట్ వాణి, సెయింట్ రాణి, సెయింట్ జాక్‌పట్, సెయింట్ ఆయిషా, సెయింట్ ఖాదర్ వలీ, సెయింట్ ఫకీర్‌సాహెబ్, సెయింట్ లిల్లిపుట్.. ఇలా అడ్డమైన పేర్లన్నీ పెట్టేస్తున్నారు కదా? వీళ్లందర్నీ భూత, వర్తమాన భవిష్యత్కాలంలో చావుదెబ్బ తీయడానికి ఈ మహానుభావుడు “ఆల్ సెయింట్స్” అని పెట్టుకున్నాడు. తప్పేమిటి?” అని ఎదురు ప్రశ్న వేసాడు.

 

సరే ఆ రోజుకు పని కాలేదు ఇంటికి తిరిగొచ్చాను. పక్కింటి పాపాయిని పిలిచి, “పాపా! నీవు చదివే స్కూలు పేరేంటమ్మా?” అని అడిగాను. “సెయింట్ వోణి” అనుకుంటూ ఆ పిల్ల పరుగు తీసింది. “స్కూలు పేరడిగితే సెంటూ, వోణీ అంటుందేమిటి ఆ పిల్ల?” అని మా ఆవిడ ప్రశ్నించింది. అదేలే “సెంట్ వాణి” అన్నాను. “మధ్యలో ఆ సెంట్ ఏమిటండి. ఎంచక్కా వాణి కాన్వెంటో, వాణి స్కూల్ అనో పెట్టుకోక” అంది. “ఆ సెంటు లేకపోతే స్కూలు వాణికి విలువలేదే పిచ్చిమొగమా!” అన్నాను. నా ఫ్రెండుతో గడించిన జ్ణానాన్ని ఉపయోగించుకొని ఆ సెంట్ అంత ఖరీదైనదా? మళ్ళీ ప్రశ్న. చివరికెలాగో ఒక గంట సుధీర్ఘోపన్యాసం చేసి ఆమె చేత “అలాగా” అనిపించాను.

 

మరునాడు అమ్మాయిని తీసికెళ్ళి కేవలం రెండొందలు మాత్రమే అడ్మిషన్ ఫీజు తీసుకొన్న సెయింట్ చెన్నారెడ్డి ఇంగ్లీషు మీడియం స్కూలులో చేర్పించాను. పక్కింటి పాపాయితో ధీటుగా మా పిల్లను తయారుచేసి బండెడు పుస్తకాలను వీపుమీదకెత్తి పంపించాము. అలా సంవత్సరం గడిచింది. అమ్మాయి ఇంగ్లీషులో మాట్లాడేదింకెప్పుడు? అని నాకు ఆదుర్దాగా ఉండేది. “అమ్మా మీ స్కూల్లో టీచర్లు ఇంగ్లీషులో మాట్లాడతారా? ఆపుకోలేక అడిగాను “లేదు నాన్నా, ఎంచక్కా తెలుగులోనే మాట్లాడుకుంటారు. పాఠం మాత్రం ఇంగ్లీషులో చెబుతారు” అంది. ఇంతకు ముందు తెలుగులో పాఠాలు చదివి అర్ధం చేసుకునేది. ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగు ఏదీ పూర్తిగా రావటంలేదు అనుకొన్నా. మా పక్కింటి పాపయ్య భార్యతో అంటున్నాడు. “సెంట్ వాణిలో అంతా తెలుగోళ్ళే. లాభం లేదు. సెంట్ పంగనామం స్కూలులో చేర్పిస్తేగాని పిల్ల బాగుపడదు. అక్కడ అంతా అరవోళ్లు..

నేను నా పాట్లు (పాటలు)

 

రచన :  హబీబుల్లా అహ్మద్

ఇండియాలో ఉన్నపుడే స్కూల్లోనూ కాలేజీలో బాగా పాటలు పాడేవాడిని. బాల సుబ్రహ్మణ్యం పాటల పుస్తకాలు కొని ప్రాక్టీస్ చేస్తుండేవాడిని.  కాలేజీలో మగ పిల్లలకంటూ వెయింటింగ్ రూములు ఆడపిల్లలకున్నట్టు లేకపోవడంతో ఖాళీగా ఉన్న క్లాసురూములు దొరకడం ఆలస్యం నాలాంటి ఔత్సాహికులు కబ్జా చేసి పాటలు పాడేస్తుండేవాళ్ళం!

హైద్రాబాదులో ఉజ్జోగం వచ్చిన కొత్తల్లో త్యాగరాయ గాన సభ దగ్గరా, రవీంద్ర భారతి  దగ్గరా తచ్చాడుతూ ఉండేవాడిని. అక్కడైతే ఎప్పుడూ పాటల ప్రోగ్రాములు జరుగుతాయి. పాడు వాళ్ళూ పరిచయమౌతారు. నేనూ ఎవరి పరిచయంతోనో ఏదో ఒక ట్రూపులో చేరితే సరి! బ్రహ్మాండంగా దున్నేసెయ్యొచ్చని అనుకున్నా  కొన్నాళ్ళు ప్రేక్షకుడిగా, శ్రోతగా ఉండాలని నిశ్చయించుకున్నా! అందుకు తగ్గట్టే త్యాగరాయ గాన సభ దగ్గర మాత్రం ప్రతి ఆదివారమూ బ్లాక్ బోర్డు మీద రాసి ఉండేవి ప్రోగ్రాములు. సినిమా పాటలు పాడించే సంస్థల పేర్లు భలే తమాషాగా ఉండేవి.  “నేను పాడతా” “నేను పాడొద్దా ఏంటి?” “వాయిస్ బాంక్” ” సుస్వర నిధి” ఇలాంటి పేర్లతో అందరూ మహా మహా గాయకులే ఉంటారని భ్రమ పడేలా ఉండేవి. ఒకసారి సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక, అలా త్యాగరాయ గాన సభ వైపు వెళ్లాను. ఇంకా ప్రోగ్రాము మొదలు కాకపోవడంతో ఔత్సాహిక గాయకులంతా గ్రీన్ రూములో చేరి ప్రాక్టీస్ చేస్తుండగా ఉత్సాహంగా అక్కడికి వెళ్ళాను. ఎవరో ఒకాయన తప్పుగా పాడుతుంటే చూళ్ళేక “అలాక్కాదండీ, అక్కడ ఇలా పాడాలి” అని పాడి చూపించా.
ఆ సంస్థ కు లీడర్ లాంటాయన ఆశ్చర్య పడి “మీరూ పాడకూడదూ” అన్నాడు. అందుకే వచ్చానని చెప్తే బాగోదని “అబ్బే, నాకంత టైమెక్కడిదీ” అని తప్పించుకోబోయినట్టు నటించాను. “మాకు మాత్రం టైముందా? (ఇది నిజం కావొచ్చు), ఏదో కళా సేవ (ఇది అబద్ధం), రేపోసారి కనపడండి” అన్నాడాయన.

తర్వాత నాకూ వాళ్లతో పరిచయాలు పెరిగాయి. తర్వాత ప్రోగ్రాములో పాడాలని నిర్ణయించుకున్నాను! సినిమాల్లోను, టివీల్లోనూ పాడాలని ఉత్సాహపడేవాళ్ళు బోల్డు మంది ఉంటారు. అందరికీ అవకాశాలు రావు. అలా రాని వాళ్ళు ఇలా సంస్థలు పెట్టేసి పాడాలనే ఉత్సాహాన్ని తీర్చుకుంటారని అర్థమైంది. నిజానికి వాళ్ళలో అద్భుతంగా పాడేవాళ్ళ నుంచి అత్తెసరు గా కూడా పాడలేని వాళ్లున్నారు. సరే, ఏం చేస్తాం? ప్రేక్షకుల ఖర్మ!

ఆ రోజు నేను పాడబోయే మొదటి ప్రోగ్రాము! అన్నీ ఘంటసాల, సుశీల,లీల…వీళ్లంతా పాడిన పాత పాటల ప్రోగ్రాము! నాకేమో హిమగిరి సొగసులు…మురిపించెను మనసులు..పాట ఇచ్చారు. ఎవరో ఒక గాయనీ మణి నాతో జత! ఎలాగో ఇద్దరం ప్రాక్టీస్ చేశాము. మరి కాసేపట్లో ప్రోగ్రాము మొదలవుతుందనగా కూడా గ్రీన్ రూములో చేరి మధ్యలో ఆలాపనలు సరి చూసుకుంటున్నాం! అప్పట్లో హైద్రాబాదులో అందునా త్యాగరాయ గాన సభ అనగానే ABCDలు సిద్ధంగా ఉండేవారు సభకు అధ్యక్షత వహించడానికి! వాళ్ళ ఊకదంపుడు ఉపన్యాసాలు అయ్యేసరికి మనకు ఆలాపన మీద పట్టు వచ్చేస్తుందిలే అని ధైర్యం గా ఉంది.!
మొదట రెండు పాటలు అయ్యాక “ఇప్పుడు మీ అందరికీ ఇష్టమైన పాట…హిమగిరి సొగసులు..”అని వ్యాఖ్యాత అనౌన్స్ చేసి అంతటితో ఊరుకోక…ఆ పాట ఎప్పుడు ఎలా తీశారో, హిస్టరీ అంతా చెప్పి, కాసేపు భీముడి అందాన్నీ, ద్రౌపది లావుగా ఉండటాన్నీ ప్రస్తావించి ఆ ఉపన్యాసంలో పడి మమ్మల్ని మర్చి పోయాడు. చేతిలో పాట సాహిత్యం ఉన్న కాయితాలు పట్టుకుని చెమట్లు తుడుచుకుంటున్నాం, నేనూ, అమెచ్యూర్ సహ గాయనీ!

ఎవరో ఒకాయన వచ్చి ఆ వ్యాఖ్యాతని నోరు మూసేసి తెర వెనక్కి లాక్కుపోవడంతో మేమిద్దరం స్టేజీమీదకు తోయ బడ్డాము!

స్టేజీ నిండా లైట్లు! ఎదురుగా హాలు నిండా ప్రేక్షకులు! ఆ చుట్టు పక్కల ఉండే రిటైర్ అయిన వాళ్ళంతా సాయంత్రాలు కాస్త టైం పాస్ అవుతుందని ఇక్కడికే వస్తారు కాబోలు, హాలంతా నిండుగా ఉంది.మొదటి పది వరసల్లో వాళ్ళు గాయనీ గాయకుల బంధువులూ, మిత్రులూనని ఊహించలేకపోయాను!
అంతమంది ప్రేక్షకుల ముందు నన్ను ఊహించుకోగానే, కాళ్ళు వదులుగా అయిపోయాయి.చెవుల్లో హోరు! వేళ్ళు టక టకా టైప్ చేస్తున్నట్టు కొట్టుకోవడం మొదలైంది. కడుపులో ఏదో కలవరం! గుండె చప్పుడు స్టీరియో ఫోనిక్ (అప్పట్లో డాల్బీ లేదు మరి) సౌండ్ తో వినపడుతోంది. కళ్ళ ముందు చీకట్లు, చారలు, గీతలు, చుక్కలు ప్రత్యక్షం అయ్యాయి.

ఈ లోపు కీ బోర్డు ఆర్టిస్టు శృతి ఇవ్వడంతో సహ గాయని పాట కు ముందు వచ్చే ఆలాపన అందుకుంది. ఆవిడ స్టేజీకి పాతే! మనవే కొత్త!

“హిమ గిరి సొగసులూ..మురిపించెను మనసులు
చిగురించెనేవేవో ఊహలూ” అని ఆపింది.

అప్పుడు నాకేదో డైలాగ్ ఉండాలి! ఏంటది?ఏంటది? గుర్తు రావడం లేదు. చేతిలో పేపర్ చూడాలని తట్టలేదు. గుర్తొచ్చింది. తడుముకోకుండా “ఏం , పాడావేం? ఆపు”అన్నాను ఎలాగో!

సభ యావత్తూ గొల్లుమంది. సహ గాయని తెల్లబోయింది. కానీ దాన్ని కవర్ చేస్తూ వెంటనే పాట అందుకుంది. ఆ తర్వాత పాట ఎలా పూర్తయిందో నాకు తెలీదు. ఇవతలికొచ్చి పడ్డాక లీడర్ గారు నా చేయి పుచ్చుకుని లాక్కుపోయి “ఏంటండీ మీరు? అలా చేశారేంటీ” అన్నాడు కోపంగా, అయోమయంగా చూస్తూ!
అప్పటిక్కూడా…ఏం చేశానో వాళ్ళు చెప్తే గానీ తెల్సింది కాదు.

భీముడిగా ఉన్న రామారావు “ఏం, ఆపావేం? పాడు ” అంటాట్ట ! నేనేవన్నానో ఒకసారి పైకెళ్ళి చదువుకోండి!

హాలంతా ఎందుకు గొల్లుమందో అప్పటిక్కాని అర్థం కాలేదు.

మరో సారి, నాకు “మనసు గతి ఇంతే..” పాట ఇచ్చారు. ఆ పాట సాహిత్యం ఒక కాగితం మీద రాసిచ్చారు.

పాట స్టేజీమీద భయపడకుండానే పాడగలను. కాస్త అనుభవం వచ్చిందిగా! పాడాను.

“సాకీ తాగితే మరువ గలను, తాగనివ్వదు” అని మొదట్లో నాగేస్రావు చెప్పే డైలాగు బాగానే చెప్పాను. అయినా మళ్ళీ హాలంతా గొల్లు మంది. మళ్ళీ పాట ముగించాక చీవాట్లు పడ్డాయి.

“సాకీ తాగడం ఏంటండీ మీ బొంద” అన్నాడు లీడరు.
“కావాలంటే చూడండి, నా కిచ్చిన కాయితంలో అలాగే ఉంది” అనిచూపించా! ఆయన మళ్ళీ తల పట్టుకున్నాడు.

అది “సాకీ తాగడం కాదయ్యా మగడా! పాటకు ముందు ఏదైనా వచనం ఉంటే దాన్ని “సాకీ” అంటారు. నీకిచ్చిన కాయితంలో “సాకి: తాగితే మరువ గలను….” అని డైలాగంతా రాసిచ్చారు. నువ్వు మొత్తం కలిపి “సాకీ తాగితే” చేశావు ” అని మండి పడ్డాడు.
ఒక గాయని “పచ్చని మన కాపురం, పాల వెలుగై, మరిదీపాల వెలుగై” అని సుశీల పాట పాడుతుంటే “మరిది పాత్ర ఎవరు వేశారండీ ఆ సినిమాలో?” అనడిగి చీవాట్లు తిన్నా ఒక సారి!

అలాగే  మరో సారి బృందావనమది అందరిదీ ఎవరో పాడుతుంటే “సున సూయలంటే ఏవిటండీ” అని ఒక కవి గారిని అడిగి అడ్డంగా దొరికి పోయా!

మరో సారి “మేడంటే మేడా కాదూ గూడంటే గూడూ కాదూ, పదిలంగా అల్లూకున్న పొదరిల్లూ మాది” అని ఎవరో ప్రాక్టీస్ చేస్తుంటే విని పక్కన కూచున్న పెద్దావిడని “ఏవండీ, లంగా అల్లుకోడం ఏమిటండీ? అందులోనూ పది లంగాలు” అన్నా సాలోచనగా! ఆవిడ నా వైపు భయం భయం గా చూస్తూ లేచెళ్ళి పోయింది ఎందుకో అర్థం కాలా!

హే కృష్ణా ముకుందా మురారీ…పాటలో “కృష్ణాము” “కుందాము” అంటే తెలీలా! “పాడు కుందాము” “ఆడుకుందాము” లాగే “కృష్ణాముకుందాము” అనుకున్నా! అలా అనుకున్నా…మరి “కృష్ణాము” అంటేనో? ఇదే అడిగా ఒక గాయక మనవడికి తోడుగా వచ్చిన ఒక ఔత్సాహిక బామ్మని. ఆవిడ నాకు తీసుకున్న క్లాసు ఈనటికీ మర్చిపోలేను.

ఆ తర్వాత ఒక శుభ సందర్భాన నాకు శానోస్ లో (దీన్ని కూడా మొదట్లో శాన్ జోస్ అని పిల్చా కొన్నాళ్ళు) ఉజ్జోగం రావడంతో తెలుగు పాటల ప్రోగ్రాముకు తెర పడింది. ఇక్కడా పాడుతూనే ఉంటా…హిందీలో! అందుకే పెద్దగా సమస్య రాలేదు.

ద బెస్ట్ ఆఫ్ బాపు కార్టూన్స్ !

రచన – వేణు

 

బాపు కార్టూన్లలో  నాలుగో,  పదో, ఇరవయ్యో  చూపించేసి ‘ఇవి బెస్ట్’ అనెయ్యటమా?  ‘హెంత ధైర్యం?’ అని ఎవరికైనా కోపాలొచ్చేస్తే  అది వారి  తప్పేమీ కాదు.

కానీ  ‘నాకు నచ్చిన తెలుగు  కార్టూన్లేమిటబ్బా!’  అని ఆలోచించి చూస్తే ఎక్కువ  గుర్తొచ్చినవి బాపువే!   మిగిలిన కార్టూనిస్టులవి కూడా కలిపేసి కలగూరగంపగా  ఇచ్చే కంటే…  కొంటె నవ్వులు చిలికించే  బాపు  కార్టూన్లలో  కొన్నింటిని  ఎంచుకుని  ఓసారి తల్చుకుంటే బాగుంటుందనిపించింది.

 

బాపు గీసిన వందల వేల కార్టూన్లలో  ‘అత్యుత్తమం’ అంటూ కొన్నిటిని  ఎంచటం ఎవరికైనా  కష్టమే.  విశాలాంధ్ర వారు ప్రచురించిన బాపు కార్టూన్ల పుస్తకాల్లోని పేజీలను  తిప్పుతూ  ట్రాఫిక్ సిగ్నల్స్ లా  నిలబెట్టేసే  కార్టూన్లను నోట్ చేస్తుంటే  పొడుగాటి జాబితా తయారవుతూ వచ్చింది.  నిర్దాక్షిణ్యంగా  షార్ట్ లిస్టు చేయటానికి  కొంత ప్రయాస పడాల్సివచ్చింది.

 

గుర్తొస్తే చాలు…  దరహాసాల,  పరిహాసాల పరిమళాలు వెదజల్లే కార్టూన్లు  కొన్నే ఉంటాయి.  వీటికి కాలదోషం  అంటదు.  ఏళ్ళు గడిచినా గిలిగింతలు పెట్టే లక్షణాన్ని ప్రమాణంగా పెట్టుకుని  ఆ రకంగా  నాకు అమితంగా నచ్చిన వాటిలో తగ్గించి తగ్గించి  ఎంచుకుంటే  చివరకవి తొమ్మిదిగా  తేలాయి.  ‘టాప్ టెన్’అవటం  కోసం  మరొక్కటి  చేరుద్దామంటే…  మిగిలిన కార్టూన్లు ‘మాకేం తక్కువ?’ అంటూ తగూకొచ్చేస్తాయి. అందుకే  ఆ ప్రయత్నం విరమించాను!

 

కార్టూన్లకు వ్యాఖ్యానం అవసరమా

 

అవసరమేమీ లేదు.  కానీ ఏదైనా మంచి  సినిమా చూశాక, దాంట్లో కొన్ని సన్నివేశాలను తల్చుకుని,  చెప్పుకుని మరీ  సంతోషిస్తుంటాం కదా? అలాగే  ప్రతి కార్టూన్ తర్వాతా  నే రాసిన  నాలుగు ముక్కలు  చేరుస్తున్నాను.    కార్టూన్ రామాయణంలో  ఈ  పిడకల వేట ఎందుకనుకునేవారు హాయిగా…  నేరుగా బాపూ  కార్టూన్లనే  ఎంచక్కా ఎంజాయ్ చేసెయ్యండి! వీటిలో

 

పోకిరి  పోజు      

 

 

వీధుల్లో,  ఆఫీసుల్లో  అమ్మాయిలను చూసి లొట్టలేసుకు చూసే  పోకిరి  మగాళ్ళను చిత్రించటంలో బాపుది  ప్రత్యేక ముద్ర.  అమ్మాయిని చూస్తూ పరిసరాలు మర్చిపోయి  గోతిలో అమాంతం పడిపోతున్న కుర్రాళ్ళ కార్టూను గుర్తుందా?  ( ‘పక్కకు తప్పుకో, మరోడు వస్తున్నాడం’టూ- గోతిలో అప్పటికే పడిపోయివున్నవాళ్ళలో  ఒకడు పక్కవాడితో అంటుంటాడు) .

 

ఈ కార్టూన్ లో హెడ్డు గుమాస్తా మొహంలో ఎక్స్ ప్రెషన్స్ గమనించండి.  కుర్చీ, చెత్తబుట్టా,  ఎగిరిపోతున్న కాయితాలూ సరే సరి.  కొత్త ఉద్యోగిని అమాయక చూపూ,  తాపీగా చెపుతున్న ఆఫీసరు రూపూ!

———————

 

కాపురం కళ

 

ఈ కార్టూన్ ని ‘జోకు’గా  ఎన్నిసార్లు,  ఎంతమందికి చెప్పి నవ్వించానో లెక్కలేదు.  ‘మళ్ళీ పడ్డారూ’ అనే పదబంధం అందం చూడండి.  ఆమె చిరాకూ, ఆయన నిస్సహాయపు  విసుగూ చూసి తీరాల్సిందే!

———————

గృహస్థు అవస్థ

 

 

 

ఆ  ఇల్లాలు పాటగత్తె అవతారమెత్తి  ఎలుగెత్తి  ఆకాశం కేసి చూస్తూ చేసే సంగీత సాధన ఒక ఎత్తయితే….  ఇటుపక్కకు తిరిగి  నెత్తిన గుడ్డ వేస్కునీ, పేపర్ ని  కసిగా నలిపేస్తూ  ఆ గృహస్థు పడే నరక యాతన మరో ఎత్తు.  ఎంతకాలం గడిచినా మరపుకు రాని కార్టూన్ ఇది!

 

———————

గానం… గాత్రం

 

 

ఇది కూడా శ్రవణ హింస కార్టూనే. ఆ గృహిణి పాడతానని  గోముగా అడగటం,  ఆ భర్త పేపర్ నుంచి తలైనా తిప్పకుండా రాబోయే తిప్పలను తెలివిగా  తప్పించుకోవటం… (రెండు సార్లూ తగిన కారణాలనే చెపుతూ )-  చాలా బాగుంది కదూ?

———————

ఇంటింటి పోట్లాట 

couple4.jpg

 

అతిథి దేవుళ్ళు  వస్తారని  అంతర్యుద్ధాలు ఆగవు కదా?  ఇక్కడ గృహ రణాన్ని కళ్ళారా చూస్తూ ఆనందిస్తూ ఆ చుట్టాల దంపతుల మొహ కవళికలు ఎంతగా వెలిగిపోతున్నాయో చూడండి… ‘బిజీగా ఉన్నట్టున్నారు…’ అనటంలో ఎంతెంత వ్యంగ్య వైభవం!

 

———————

వంట…తంటా

 

 

వంటొచ్చిన మగవాడి అగచాట్లు.  కులాసాగా  ప్రశ్న అడిగిన పూల చొక్కా మిత్రుడికీ;  కూరగాయల సంచీని  వీపు వెనక దాచేసి బింకంగా అమాయకంగా  జవాబిస్తున్న వ్యక్తికీ మధ్య  ఆకారాల్లోని తేడా గమనించారా?

———————

మైకు మైకం

 

వేదికా… ప్రేక్షకులూ… ముఖ్యంగా  మైకు ఎదురుగా  ఉంటే రాజకీయ నాయకులకు ప్రసంగావేశం తన్నుకుని రాకుండా ఉంటుందా? ఇక ఆ  నిరంతర వాక్ స్రవంతిని  ఆపటం ఎవరితరం?  ఇక్కడ మైకును లాగేసుకుంటున్న నిర్వాహక వస్తాదుల మొహాల్లోని క్రౌర్యం,  విసిగించకుండా విరమిస్తానని సౌమ్యంగా చెపుతూనే  మైకును ఉడుంపట్టు పట్టిన నాయకుడి  మైకం చూడండి….

 

———————

గుళిక.. ప్రహేళిక 

 

రిటైరైన ఉద్యోగికి  పింఛను  కంటే మించి అత్యంత ప్రియమైనదీ, ముఖ్యమైనదీ వేరే ఉండదేమో!  వయసైనా,  సొగసైనా దానిముందు  దిగదుడుపే.  ఈ కార్టూన్లో  గుళికలను విక్రయించే వ్యక్తివీ,  పార్కులో బెంచీలో కూర్చున్న  వృద్ధుడివీ  ఎక్స్ ప్రెషన్స్ గమనించారా?  అద్భుతమైన హాస్యంతో పాటు సహజ మానవ ప్రవృత్తి ఈ వ్యంగ్యచిత్రంలో  ఎంతగా ఒదిగిపోయిందో కదా!

———————

పుష్కర పరిచయం

 

ఇంతటి గొప్ప  కార్టూన్ నాకు మరెక్కడా తారసపడలేదు.  అచ్చతెలుగు కార్టూన్ ఇది.   పుష్కరాల్లో  గుంపుగా కలిసివచ్చినవాళ్ళే  ఒకరినుంచి ఒకరు  తప్పిపోతుంటారు.  ‘ఇంకెవరో అనుకుని’ పొరపాటున పలకరించిన వ్యక్తి పన్నెండేళ్ళ తర్వాత  పుష్కరాల్లో  మళ్ళీ తారసపడటం,   ఆ ‘పాత పరిచయం’గుర్తుంచుకుని మరీ  పలకరించటంలో ఎంత విచిత్ర చమత్కృతి!

 

 

–  బాపు కార్టూన్లను పుస్తకాలుగా  ప్రచురించిన ‘విశాలాంధ్ర’  సౌజన్యంతో.