ఆధునిక మీరా – జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత మహాదేవి వర్మ

రచన: ఎ.జె. సావిత్రీమౌళి

అభివ్యక్తీకరణ కాంక్ష మానవుని సహజ ప్రవృత్తి. మానవుడు తన హృదయంలోని భావాలు, సుఖ దుఃఖాలు మొదలయిన జీవితపు వివిధ చిత్రాలను అభివ్యక్తంచేసి, ప్రపంచ అనుగ్రహాన్ని అభిలషిస్తాడు. తద్వారా ధన్యులౌతారు. ఈ భావన సనాతనమైనది.

అన్య భాషలలో వలెనే ఆధునిక హిందీ సాహిత్యంలో కూడా కమనీయమైన కల్పనలతో కావ్యాలందించిన మహానుభావులు అసంఖ్యాకులు. వారిలో శ్రీమతి మహాదేవి వర్మ హిందీ కావ్యాకాశపు మహోజ్వల తారికగా పరిగణింపబడెదరు. ఆమెనెరుగనివారు హిందీ సాహిత్యమందేకాక, అన్య భాషాకోవిదులలో కూడా లేరు. ఆమె చింతనశీలి. విదగ్ధత పూర్ణమైన భావుక మహిళారత్నం.

భావ కవితా జగత్తులో అధికమైన అనుభూతి, ప్రభావోత్పాదకమైన అభివ్యంజనా శక్తి ఈమెలో దృగ్గోచరమౌతవి.

ఈమె ఫరూఖాబాదులో 1907 సం. లో శ్రీమంతుల కుటుంబంలో జన్మించారు. తల్లి శ్రీమతి హేమరాణీదేవి. తండ్రి శ్రీ గోవింద ప్రసాద్ వర్మ. తన 11 వ ఏటనే ఈమె వివాహం డా. స్వరూప నారాయణ వర్మతో జరిగినది. వివాహమనెడి పరిమితమైన పరిధిలో పరిభ్రమించడం ఈమెకు సుతరామూ ఇష్టము లేదు. సాహిత్య సేవ చేయటమే ఈమె ముఖ్య అభీష్టము.

ఉదాత్తమైన సాహితీ సేవకై ఈమె తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రయాగలోని క్రస్టవేట్ గరల్స్ కాలేజీలో బి.ఎ. ఫిలాసఫీతోనూ, సంస్కృతంలో యమ్.ఎ. చదివి, అచటనే మహిళా విద్యాపీఠంలో కాలేజీ ప్రిన్సిపాల్ గా నియమితురాలయినారు. బాల్యంనుండి అత్యంత సూక్ష్మ బుధ్ధి మరియు గంభీరమయిన మనఃప్రవృత్తిగల స్త్రీ ఈమె.

సాహిత్యకార్ అను సంస్ధ స్ధాపించి, తద్వారా అనేకమంది రచయితలకూ, కవులకూ, సన్మాన, సత్కారాలు జరిపించిన మహిళ ఈమె. నిజమైన కళాకారులను ప్రభుత్వంగాని, ప్రజలుగాని త్వరగా గుర్తించలేరు. గుర్తించే రోజుకు ఆ కళాకారుడు భువినుండి దివికేగటం జరుగుతుంది. అట్టి కళాకారులు శ్రీమంతుల కుటుంబంలో జన్మించక పోయినచో, ఆ జన్మమూ నిత్య దరిద్రులుగానే గడుపుతారు. తమ కళలకు కాంతులను దిద్దనోచుకోలేరు. అట్టి కళాకారులకు సమయానికి కాస్త అన్నం పెట్టి, వ్రాయడానికి ఒక కలం, కాగితాలు అందించి, వారి కళకి జీవంపోసే సంస్ధయే ఈ సాహిత్యకార్. నిజంగా కళాకారులకు మహాదేవి పెన్నిధవంటిది.

మాధుర్యం, కోమలత్వం మరియు వ్యధ ఆమె హృదయాంతరాలలోని నిధులని చెప్పవచ్చుని. వేదన ఈమెకు చిరంతనమైన సఖి. వ్యధలేకుండా ఈమె బ్రతుకజాలదు. ఆ వేదనలోనే తన ప్రియుని (భగవంతుని) అన్వేషిస్తుంది. ఆ పరబ్రహ్మ ప్రత్యక్షమైనా సరే ఆయనలోని వేదననే వెతకాలని అంటుంది. ఈమె హృదయం అన్ని వేళలా భావాన్వేషణలో అత్యంత వ్యాకులత చెందుతూ వుంటుంది.

“…. ఇన్ లలచాయీ పలకోం పర్ పహరా,

జబ్ ధా వ్రీడాకా సామ్రాజ్య ముఝే

దే డాలా వున్ చితవన్ నే పీడాకా…….”

కవయిత్రికి ప్రియతముడు దర్శనమిచ్చినప్పుడు, “ఆశతో నిండిన కనురెప్పలపై లజ్జ పహరా యిస్తూండటంవలన, కనురెప్పలు పైకెత్తి, కళ్ళారా ఆయనని చూడలేకపోయినా, చరణ సౌందర్య సందర్శనం నన్ను వేదనా సామ్రాజ్యానికి పట్టమహిషిగా చేసింది” ….అంటుంది.

మహాదేవి తనలో తనను, భౌతిక జగత్తును దర్శించుకుంటుంది. అండ, పిండ, బ్రహ్మాండ, పిపీలికాది పర్యంతం ప్యాప్తమై, అనంతమైన ప్రకృతి సౌందర్యంలో వాసితమయ్యే నిరాకార స్వరూపుడైన ఈశ్వరోపాసకురాలు ఈమె.

జీవితపు గంభీర దార్శనిక తత్వాలు అంతర్నిహితాలై ఈమె కవిత్వాల్లో మనకి గోచరిస్తాయి. జీవితం ఎపుడూ సమంగా వుండక, వైషమ్యాలతో అది మునిగి తేలుతూ వుంటుంది. అందుకే ఈమె భగవంతుణ్ణి యిలా ప్రార్ధిస్తుంది. “ …జీవితంలో శాశ్వతంగా అసంతృప్తి వుండితీరాలి. దఃఖంలోనే సుఖం అంతర్నిహితమైవుంది. నిరాశనుండియే ఆశాకిరణాలు వుదయిస్తూ వుంటవి …”అని.

కవయిత్రి నీరజా , సాంధ్యాగీత్ అను ప్రారంభిక కావ్యాల్లో సుఖ దుఃఖాలు సమానంగా అభివ్యంజితమైనాయి. నీహార్ , రశ్మి అనే కావ్యాల్లో ఈమె నిరాశ, నిస్పృహలతో ఆభీభూతమైన హృదయపు దయార్ద రూపం గోచరిస్తుంది. దీపశిఖ కావ్యంలో ప్రణయ సంక్షోభితం దృష్టిగతమవుతుంది. ఈమె గీతి కావ్యాల్లో మాధుర్య, సంగీతాల సమన్వయం కనబడుతుంది. ఈమె కవితలు వాస్తవికతకి దూరంగా వుంటవి. భౌతికంనుండి అభౌతికంవైపు ఈమె రచన పురోగమించింది.

ఈమె భావ తన్మయత, కాల్పనిక రమ్యత, సూక్ష్మభావజన్య మాదకత్వం ఎంతో తీవ్రమైనవి

“మధుర మధుర మేరే దీపక్ జల్

యుగ యుగ ప్రతి దిన్ ప్రతి క్షణ్ ప్రతి పల్” …. అంటూ ఓ మధురమూర్తియైన నా హృదయదీపికా! నీవు ఎల్లప్పడూ, యుగ యుగాల తరబడీ ప్రియతముని ఆగమన పధాన్ని ఆలోకితమొనర్చుము అంటారు ఈమె.

ఈమె కొన్ని గద్య రచనలు కూడా చేశారు. శృంఖిలాకే కడియా , అతీత్ కే చలచిత్ర్ అందులో ముఖ్యమైనవి. వీటిలో ఈమె చెడులో దాగిన మంచికోసం తరచి చూచింది. ఈమె కావ్య కళా ఖండికలు సాహిత్య విభూతి అజరామరాలు.

ఈమె ప్రముఖ రచనలు నీహార్ , రశ్మి , నీరజా , సాంధ్యాగీత్ మరియు దీపశిఖ, ముఖ్యమైనవి. పైన చెప్పబడిన మొదటి నాలుగు గ్రంధాలలోని 185 గేయాలను స్వీకరించి యామా అను గ్రంధం 1939 సం. లో రూపొందించబడింది – ప్రచురించటం జరిగింది. ఈ గ్రంధానికి 1982 సం. లో జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. 1956 సం. లో భారత ప్రభుత్వం శీమతి వర్మగార్కి పద్మ భూషణ బిరుదునిచ్చి సత్కరించింది. ఈమె తన రచనలకు లభించిన పారితోషికాన్ని రచయితల, కవుల శ్రేయస్సుకోసం ఖర్చు చేసేది. 1987 సం. సెప్టెంబరు 11 వ తేదీన ఈ కరుణామూర్తి కన్ను మూసింది.

ఆమె ఓ కవితా సరితా

ఆత్మవేదనా జ్వలితా .. కాదు..కాదు

మహాదేవి వర్మ ఒక యోగిని. హిందీ సాహితీ కుసుమదీపిక. నారీ లోకానికే మహోజ్వల తారిక.

నీ”వై” నా “వై”

వై. శ్రీరాములు

ఏదైనా కానీ, ఏమైనా కానీ మరణం దాకా ప్రేమించడమే జీవితానికి అర్ధం
ప్రేమ తోడుంటే తుఫానులైనా లోకం ఏమనుకున్నా ప్రేమే, ప్రేమే పరమార్ధం.

ప్రేమించడమంటే అంత సులభం కాదు! నిన్ను నువ్వు అర్పించుకోనిదే అది అర్ధం కాదు
ప్రతి క్షణం హృదయాన్ని వెలిగించే వుండాలి ! వేరే ఆలోచనకు తావే లేదు.

అటు అలజడి, ఇటు అలజడి
ఎటు అడిగిడితే అటు గుండె సడి
తణువు అణువణువు భావాల పూల పుప్పొడి
మనువులో వెన్నెల నిప్పుల అనుభవాల వేడి
హృదయంలో మల్లెల మాటల సువాసనల తడి.

మంచివారు ఎప్పుడూ ఇలాగే వుంటారేమో!
పూలలో పరిమళాలై దాగివుంటారేమో!
దేశమంతా గుండెతడి కోల్పోతున్న ఎడారి
హృదయదాహంతో సాగుతున్న నేనో బాటసారి
నీవు నాకోసమే పొంగిపొర్లే గోదావరి.

నమ్మకం ఒకరోజు అపనమ్మకం అవుతుందేమో
నిమ్మలించడానికి హృదయాన్ని కాస్త సిద్ధం చేసుకుంటా!
గుండెలయ నాకు చెప్పకనే తప్పుతుందేమో జాగ్రత్తగా మెలకువనై వుంటా!
ప్రేమించడం అంత సులభంకాదని తెలుసు.

అందుకే కన్నుల్లో కన్నీటిని జీవితాంతం నిలువ వుంచుకుంటా!
కవిత్వ రహస్యం తెలిసిన వారికే ప్రేమించడం చేతనవుతుందని తెలిసి
నీకోసం జీవితకాలం ఎదురుచూస్తుంటా!

ఉదయం సాయంత్రం కాలం ఊపే ఊయల
ప్రేమ నిండిన హృదయం తరగని చెరగని
ధూప దీప నైవేద్యం అందుకునే కోవెల
తెల్లవారకనే మీకోసం కవితా గానం చేస్తుంది ఈ కోయిల.

పొద్దుపై వెలుగు కవిత లిఖిస్తూ సూర్యుడు
చీకటిపై వెన్నెల కథ రచిస్తూ చంద్రుడు
పగలూ రేయి జీవితాన్ని రచిస్తూ మీ కవి మిత్రుడు

మేల్ అబార్షన్

మేల్ అబార్షన్ – పురుషుడికి తండ్రి అవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం..!!

మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించండి. ఒక స్త్రీ, తనకు ఇష్టము లేక పోయినా గర్భాన్ని ధరించవలసి వచ్చింది. బహుశా ఆమె ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకొని ఉండొచ్చు. దానికి ఆమె కారణాలు ఆమెకుండొచ్చు. దురదృష్టవశాత్తూ ..ఆమె ఆ గర్భాన్ని తొమ్మిది నెలలు మోసి, బిడ్డకు జన్మ నివ్వడం తప్ప వేరే మార్గం లేదనుకుందాం. మరొక సందర్భాన్ని తీసుకుంటే, స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నా .. తన వారు దాని అంగీకరించట్లేదు. వారు భర్తైనా కావచ్చు మరెవరైనా కావచ్చు, ఆమె ఖచ్చితంగా అబార్షను చేయించుకోవలసిందే. ఆమెకు మరో మార్గం లేదు. ఈ విధంగా, స్త్రీలకు తన గర్భం మీద ఎటువంటి నిర్ణయాధికారం లేకపోవడాన్ని సమాజము స్త్రీ-పురుషుల మధ్య సమానత్వానికి చిహ్నంగా వర్ణిస్తే, ఆ సమాజములో స్త్రీల స్థానం ఏమిటి? ప్రస్తుతం సమాజములో పురుషుడి స్థానం ఏమిటో అదే అవుతుంది.

ఒకమ్మాయి, అబ్బాయి కలిసి తిరిగారు. కలిసి సుఖపడ్డారు. దాని ఫలితంగా అమ్మాయి గర్భవతి అయింది. తనతో తిరిగిన అబ్బాయికి విషయం చెప్పింది. కానీ ఆ అబ్బాయికి అప్పుడే తండ్రి అవడం ఇష్టం లేదు. అసలు ఆమెకు పుట్టే పిల్లాడికి తండ్రిగా ఉండడం అసలే ఇష్టం లేదు. అందుకే అబార్షన్ చేయించుకోమన్నాడు. అమ్మాయి మాత్రం అబార్షనుకు ససేమిరా అంది. అప్పుడు ఆ అబ్బాయి, నువ్వే కనుక బిడ్డను కంటే .. ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు పొమ్మన్నాడు. ఇలాంటివి మనం ఎన్నో చదివుంటాం. ఎన్నో సినిమాలలో చూసుంటాం. నిజజీవితములో కూడా కొంత మందికి ఇలాంటి వ్యక్తులు తారస పడి ఉండవచ్చు. ఇక్కడ అందరూ అబ్బాయిదే తప్పంటారు. అతన్ని మోసగాడిగా, హీనుడిగా చిత్రీకరిస్తారు.

ఇప్పుడు ఇదే సంఘటనను కొంచెం మార్చి చూద్దాం. అమ్మాయికి ఆ గర్భం ఇష్టం లేదు. అబార్షన్ చేయించుకోవాలనుకుంది. అబ్బాయికి మాత్రం అబార్షన్ ఇష్టం లేదు. ఆమె కడుపులో పెరుగుతున్నది తన వంశాంకురం కాబట్టి అబార్షను చేయించుకోవడానికి వీలు లేదు అని ఆ అబ్బాయి కోరాడు. కానీ, ఆ అమ్మాయి అబార్షను చేయించుకోవడానికే మొగ్గు చూపింది. ఇక్కడ తప్పెవరిది? ఖచ్చింగా ఆ అమ్మాయిది మాత్రం కాదు. కనీసం చట్టపరంగా లేదా ప్రస్తుతం ఉన్న స్త్రీవాదుల భావజాల పరంగా. ఎందుకంటే, ఒక స్త్రీకి ఆమె శరీరం మీద పూర్తి హక్కులున్నాయి. ఆమె శరీరానికి సంభందించిన గర్భం పై ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు కేవలం ఆమెకు మాత్రమే ఉంది కాబట్టి.

పై రెండు సందర్భాలలో మనం గ్రహించ గలిగేది ఏమిటంటే, బిడ్డకు జన్మనివ్వడం లేదా ఇవ్వకపోవడం కేవలం స్త్రీకి మాత్రమే సంబందించిన విషయం. మగవారి భావాలకు కానీ, వారి అభిప్రాయాలకు కానీ విలువుండదు. హక్కులన్నీ ఆడవారివి, భాద్యతలు మగాడివి. ఒక సారి ఆ అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, అతనికి ఇష్టమున్నా లేక పోయినా అతను తండ్రిగా ఆ బిడ్డ బాధ్యతలు స్వీకరించాలి. ఆ బిడ్డకు సంబందించిన అవసరాలను తీర్చాలి. అవి సామాజికమైనవి కావచ్చు, ఆర్థికమైనవి కావచ్చు. లేదా, మోసగాడనే అపవాదుతో పాటు, శిక్షను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. మగవారికి సంతానాన్ని పొందడం విషయములో ఎలాంటి హక్కులు ఉండవు. తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పుట్టిన బిడ్డ తరపున భాద్యతలు మాత్రం ఉంటాయి. దీన్నే మన స్త్రీవాదులు సమానత్వం అని ముద్దుగా పిలుచుకుంటుంటారు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒకరి హక్కులు మరొకరి హక్కులకు భంగకరం కాకుండదు. మరి ఏమి చేయాలి. స్త్రీల హక్కులను గౌరవిస్తూనే, మగవారు తమ హక్కులను సాధించుకోవడం ఎలా?

మేల్ అబార్షన్: స్త్రీ-పురుషులిరువురికీ బిడ్డను కనడం ఇష్టం లేదనుకోండి. అప్పుడు ఎటువంటి సమస్యా ఉండదు. స్త్రీ అబార్షను చేయించుకుంటే సరిపోతుంది. లేదా, స్త్రీ – పురుషులిరువురికీ బిడ్డను కనడం ఇష్టమే అనుకోండి, అప్పుడు కూడా ఎటువంటి సమస్యా లేదు. హాయిగా స్త్రీ బిడ్డను కనవచ్చు.ఒక వేళ, స్త్రీకి గర్భం ఇష్టం లేదు అనుకోండి, ఆమె తన హక్కులకు ఎటువంటి భంగమూ కలగకుండా అబార్షను చేసుకోవచ్చు. పురుషుడి నిర్ణయముతో సంబందము లేకుండా. (ఈ సందర్భములో పురుషుడు ఏమి చేయాలి అనేది, ఈ వ్యాసం పరిధిలో లేదు).

ఒకవేళ స్త్రీకి బిడ్డకు జన్మనివ్వడం ఇష్టమై, పురుషుడికి ఇష్టం లేకపోతే మాత్రం, ఆ స్త్రీ అబార్షనన్నా చేయించుకోవాలి లేదా ఆ పుట్టబోయే బిడ్డ విషయములో పురుషుడికి ఎటువంటి బాధ్యతా లేకుండా ఉండాలి. అంటే, ఆ పురుషుడు ఆ పుట్టబోయే బిడ్డకి తండ్రి కాదు. ఆ బిడ్డకు కేవలం తల్లి మాత్రమే ఉంటుంది. ఇది విచిత్రంగా అనిపించవచ్చు. బిడ్డ పుట్టిన తరువాత తల్లి తండ్రి లేకుండా ఎలా ఉంటారు, అనే సందేహం రావచ్చు. తండ్రి ఉన్నా, అతను తండ్రిగా ఎటువంటి బాధ్యతలు తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే, ఒక స్త్రీకి తను తల్లి అవ్వాళా లేదా అని పురుషుడితో సంబంధము లేకుండా నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నప్పుడు, పురుషుడికి మాత్రం తాను తండ్రి అవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు ఎందుకు ఉండకూడదు? ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ విధంగా పురుషుడికి తాను తండ్రి అవ్వాలా లేదా అని నిర్ణయించుకునే హక్కు కల్పించడమే మేల్ అబార్షను ముఖ్య ఉద్దేశ్యం.

ఇక్కడ ఖచ్చితంగా చాలా సందేహాలు వస్తాయి. పురుషులకు తమ బాధ్యతలనుండి తప్పుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనిపించొచ్చు. లేదా మోసగాళ్లైన మగవాళ్లకు ఇది ఆయాచిత వరంగా మారుతుందని అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. పుట్టిన బిడ్డకు తండ్రిని లేకుండా చేయడం కౄరత్వం అవుతుంది అని వాదించొచ్చు. అసలు, దీన్ని సక్రమంగా అమలు చేయడం వీలవ్వదని కూడా అనిపించొచ్చు. కొంచెం కష్టమే అయినా దీన్ని ఆచరించడం వీలవుతుంది. స్త్రీ-పురుషులిరువురూ బాధ్యతగా వ్యవహరిస్తే పైన చెప్పుకున్న సమస్యలలో చాలా వాటిని అధిగమించవచ్చు. మన దేశ చట్టం ప్రకారం, స్త్రీ 20 వారాలలోపు అబార్షను చేయించుకోవచ్చు. ఒక వేళ పురుషుడికి బిడ్డను కనడం ఇష్టం లేకపోతే, ఏమి చేయాలి అన్నది నిర్ణయించుకోవడానికి ఆ స్త్రీకి తగినంత సమయం ఉంటుంది. పురుషుడి అంగీకారం పెద్దల సమక్షములో కానీ, అధికారికంగా గానీ రిజిస్టరు చేయిస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవు.

సెంటిమెంటల్ రేజర్

( రచన: డి.వి.హనుమంతరావు.)

’అయ్యో! అయ్యో!…” అంటూ పెరట్లోంచి మా ఆవిడ గావుకేక పెట్టింది…నా కంగారులో
చివరి మాటలు సరిగా వినపడలేదు. పెరట్లోకి పరిగెత్తాను..
“ఏమిటి? ఎక్కడ? పాము కుట్టిందా, తేలు కరిచిందా”  పెళ్ళికానుక  సినీమాలో
రేలంగిలా అడిగా!
“అదికాదండీ–మా అన్నయ్య రేజర్ మరచిపోయాడండీ”
“ఓస్! ఇంతేనా? చంపావు కదే!”.
“ఇంతేనా అంటూ అలా తీసిపారేస్తారేమిటండీ..అది మా తాత గారి టైములో రేజరండీ…
అన్నయ్య గెడ్డం గీసుకోవడానికి ముందు…గెడ్డం గీసుకున్నాకా కూడా  నాన్నగార్నీ,
మా తాతగార్నీ తలచుకుని నమస్కరించుకుని మరీ వాడతాడు దాన్ని..
….అయినా మా అనుబంధాలు ప్రేమలూ మీకెలా తెలుస్తాయి లెండి?”
“నేనుమాత్రం యేమన్నాను..నీకేమైనా అయిందేమోనని నా కంగారు..అంతే!”
“పెరట్లో అద్దమెందుకన్నాను.మీరు నా మాట వినలేదు..వాష్ బేసిన్ దగ్గర అది క్లాస్
గాడిద గుడ్డూ అన్నారు..”
“అదేమిటోయ్?మధ్యలో నా మీద పడతావేమిటి?”
“అవును మరి! అద్దం పెరట్లో మీరు పెట్టబట్టి కదా…అన్నయ్య పెరట్లో గెడ్డం
గీసుకున్నాడు..గీసుకోవటం వల్ల కదా అక్కడ మరచిపోయాడు.
మరచిపోబొట్టికదా నేను చూసాను. చూసానుకాబట్టి కదా గావుకేక పెట్టాను.
పెట్టబట్టి కదా..మీరు వచ్చారు..”..అని సుదీర్ఘమైన లెక్చర్ ఇచ్చింది మా ఆవిడ.
“ఇప్పుడేం చెయ్యాలి?వాడేం ఇబ్బంది పడుతున్నాడో”
“తనేమీ ఇబ్బంది పడడు..ఎవరిదో వాడుకుని వాళ్ళని ఇబ్బంది పెడ్తాడు”
అది ఆవిడ అంది …….ఇది నేననుకున్నా
“ఇప్పుడేం చేద్దాం…”
“విజయవాడ నుంచి…వెనక్కి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ దిగమని
ఫోన్ చేద్దాం” అంటూ మా బావమరదికి మొబైల్ నుంచి రింగ్ చేసా. “హలో!” అని
అక్కడ అనగానే ఇక్కడ మా ఆవిడ ఫోన్ లాగేసుకుంది….
“అన్నయ్యా! చాలా బాధగా వుందిరా.. నీ రేజర్ ఇక్కడ మర్చిపోయావురా…”
“ఆఁ…. రేజరా? అవునమ్మా మరచిపోయాను.మళ్ళీ దానికోసం పాపం ఫోన్ చేసావా?”
“అవునురా! మన తాతగారి ద్వారా వారసత్వంగా వచ్చిందికదా పాపం యేం
ఫీలవుతున్నావో అని”
“పర్వాలేదమ్మా! మా ఫ్రెండుదుందిలే పని జరిగిపోతోంది…సరేలే ఆ గొడవెందుగ్గానీ
చెల్లెమ్మా! మంచి పాట ఒకటి పాడు..చాల రోజులయినట్టుంది విని.”
“అన్నయ్యా! నువ్వు చాలా గ్రేట్ రా…ఇంత బాధలోనూ నా పాటని అడిగావంటే నిజంగా
స్థితప్రఙ్ఞుడివిరా” అని ఓ పాట పాడింది..
.’వెళ్ళేటప్పుడు దిగి రేజరు తీసుకెళ్ళరా అన్నయ్యా” అని చెప్పింది.
“టైముండదేమోనే చెల్లాయ్”  అన్నాడు.
“పోనీలే స్టేషనుకి ఈయన తెస్తారులే ..పని యేమీ లేదు” మా ఇంటికి
స్టేషనుకూ అయిదు కిలోమీటర్ల దూరం… మాటల సవ్వడి, పాటలసవ్వడి అయ్యాక
ఫోన్ ఖర్చు ఇరవై రూపాయలు చూపించింది.
చెప్పిన రోజు. చెప్పిన ట్రైన్ కి రెడీ అవుతుండగా …మా ఆవిడ
ఆ పవిత్ర రేజరు ఓ ప్లాస్టిక్ కవర్లో కట్టి  దాన్ని ఓ గుడ్డ సంచిలో
పవిత్రంగా పెట్టింది, వాళ్ళ అన్నయ్యకు ఇష్టమైన స్వీట్ చేసి దానికో పెద్ద పార్శిల్!
ఆ రేజరూ ఈ స్వీటూ నాకు ఇచ్చి ….”జాగ్రత్తగా పట్టుకెళ్ళండి..దారిలొ ఎక్కడో
కబుర్లెట్టుకుని కూర్చోకండి..వినపడుతోందా…వెళ్ళేదారిలో శివలాల్ కొట్టులో చేగోడీలు
ఓ కెజి పట్టుకెళ్ళండి..అన్నయ్యకు పాపం ఇష్టం.” అని పురమాయించింది…రాముడు
మంచి బాలుడిలా బయల్దేరా!  స్కూటర్ తీద్దునుకదా…వెనక టైరులో గాలి తగ్గి పోయి
బూరిలావుండే టైరు..చపాతీలా అయిపోయింది….ట్రైన్ టైమ్ అయిపోతోందని ఆటో
బేరమాడా…యాభై తక్కువ రానన్నాడు…మళ్ళీ మాట్లాడితే అరవై అన్నాడు…వాడు
పాటలో రేటుపెంచకుండా యెక్కి కూర్చున్నా…దారిలో మెకానిక్కుకి కొంచెం టైరు
సంగతి చూడమన్నా.  ఓ యాభై యిచ్చి చేగోడిలు కొన్నా..రత్నాచల్ మూడవ
ప్లాట్ ఫారం అని అన్నిభాషలలోను ఒకే స్టేట్ మెంట్ స్వర బేధాలతో అనౌన్స్ మెంట్
వచ్చేస్తోంది…వంతెనెక్కి ఆ ప్రక్క కు వెళ్ళా…ట్రైన్ వచ్చింది…నేను మా
గ్రీకువీరుడికోసం వెతికా… ఓ చేతిలో పవిత్ర రేజర్ ఒలింపిక్ టార్చిలా మెరిసిపోతూవుంటే
చేగోడీల పొట్లాం మరో ప్రక్క కమ్మటి వాసనలు వెదజల్లుతూ వుంటే…అవీ
స్వీటు ప్యాకెట్టూ ఒడుపుగా పట్టుకుని వెతికా. మా ముద్దులబావమరది
కనపడలా. ఆ మూలనుంచి ఈ మూలకు ఆయాసపడుతూ ముందుకీ వెనక్కీ వెతికా…
ఊఁహూ!  ఏమిటిచేయడం..రైలు వెళ్ళేదాకా ఆగి ఇక తిరుగు ముఖం
పట్టా..గేటుదగ్గర టీ.సి ఆపాడు..టిక్కట్ అన్నాడు.
“మా బావమరది…ట్రైను ..రాలేదు..నో పాసింజర్” అని ముక్కలు ముక్కలుగా మాట్లాడాను.
ఆ పేకట్ యేమిటన్నాడు. అందులో యే బాంబెన్నా పెట్టావా అన్నట్టు
చూసాడు…”ఓపెన్ చేయ్” అన్నాడు….నాకు భయమేసింది…అందులో వున్న రేజర్ ని
యే మారణాయుధంగానో రిపోర్ట్ రాసేస్తే నా గతేమిటి? వాణ్ణి బ్రతిమాలి బామాలి వాడి
చేతిలో ఓ వంద కుక్కి. ప్లాట్ ఫామ్ టిక్కట్ కొనని ప్రాయశ్చిత్తాన్నించి బయటికి వచ్చా..
మళ్ళీ ఆటో…తప్పదుకదా? …ఈ సారి డెభై…ఏం అంటే….ఆ మూలకి వచ్చాక తిరిగి
వచ్చేటప్పుడు బేరాలుండవుసార్..అంటాడు…ముందు చూపుగలవారు కదా
మనఆటోవారు. సరే గుమ్మంలోకి వెళ్ళగానే మా ఆవిడ క్లాస్ పీకింది….”మీకు అంత
మతిమరుపేమిటి? వెళ్ళేటప్పుడు మీ మొబైల్ తీసుకెళ్ళలేదేం” అంటూ
“అవును స్మీ…పట్టికెళ్ళలేదు” అని చెప్పి
“మీ అన్నయ్య రత్నాచల్ కి రాలేదోయ్” అన్నా..
“నే చెప్పేది అదే…వినిపించుకోరు……రత్నాచల్ కన్నా ముందర ఏదో స్పెషల్
వచ్చిందిట… అనవసరంగా మిమ్మల్నియిబ్బంది పెట్టడం యెందుకు ముందువచ్చి
రేజరు తీసుకువెళ్దామనుకున్నాడు..అదండీ  మా అన్నయ్య అంటే! ..”
“నిజమే పాపం అనుకో… మరి ఈ రేజరేంచేద్దాం?” ‘పాపం’ యెక్కడ పెట్టాలో?
“అది కొరియర్ లో పంపేయమన్నాడు పాపం..”
“ఆ విషయం ముందే యేడవచ్చుకదా?” మనసులోనే !
“అవునూ క్రింద నా స్కూటరు లేదు, మెకానిక్కు యింకా తేలేదా?”
“తెచ్చాడండీ..మీరు మెకానిక్కు కి చెప్పడం మంచిదైందండోయ్”
“..ఏం?”
కనుకనే రైలు టైమయిపోతోందని అన్నయ్యని ఆస్కూటర్ పై స్టేషన్ కు
వెళ్ళి శాస్త్రిగారింట్లో పెట్టేయమన్నాను. శాస్త్రిగారిల్లు స్టేషను దగ్గరే కదా?
మీకు చెప్దామంటే మీరేమో మొబైల్ పట్టుకెళ్ళలేదాయిరి… మీరెంచక్కా
ఆటో మీదెళ్ళిమీ స్కూటరు తెచ్చుకోవచ్చు శాస్త్రిగార్ని కూడా
చూసినట్టుంటుంది.” ఆవిడ వుచిత సలహా ఇచ్చింది.
“సరేలే టిఫిన్ పెట్టు.”
“బ్రెడ్ ఫ్రిజ్ లో వుంది తీసుకోండి…”
“అదేమిటోయ్ జీడిపప్పు వేసి ఉప్మా చేస్తానన్నావుగా, చెయ్యలేదా?”
“చేసానండి…అన్నయ్యకు పెట్టా చాలా బావుందంటూ మెచ్చుకున్నాడు పాపం వాడికిష్టం.
“అయ్యో పాపం తిన్నాడా…ఆనందపడ్డాడా? పాపం..పాపం”….పళ్ళుకొరుక్కున్నాను.
య్యాభై యిచ్చిఆటోలో శాస్త్రి ఇంటికి వెళ్ళి స్కూటర్ తీసుకొని కొరియర్ కి వెళ్ళా…
“ఇలా యెలా పంపిస్తాం? అట్ట పెట్టెలో పెట్టండి.” అన్నారు శ్రీ కొరియర్ వారు.
పాతికరూపాయల అట్టపెట్టె ప్యాకింగ్, తర్వాత యాభై రూపాయలిస్తే కొరియర్  చేసాడు.
అక్కడికి.. కొరియర్లకు, ప్యాకింగులకు, ఫోన్ లో పాఠాలకు టీసీకి, చేగోడీలకు నాలుగొందలపైన ఆ పైన..
నాకు నష్టం జీడిపప్పు ఉప్మా  టీ.సీ దగ్గర పరువు, విలువైన కాలం…”ఆ రేజర్ ఖరీదు అంత వుంటుందా”
అంటే మా ఆవిడ “సెంటిమెంటల్ రేజ” రంటుంది అంచేత ఆ మెంటల్ గొడవ
మనకెందుకు?…..వచ్చేదారిలో దేముడికో కొబ్బరి కాయ నా ఖాతాలో కొట్టి యింటికొచ్చా….

ఇంటి భాషంటే ఎంత చులకనో!

 

భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మా గ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, అసలు గ్రంథాల్లోకి ఎక్కతగని భాషగా చిత్రీకరిస్తూ, భాష సంపన్నం కాకుండా గతంలో అడ్డుతగిలారు. అలా అడ్డుతగిలే పని ఈనాటికీ చేస్తూనే ఉన్నారు.

మన పల్లె భాషను గౌరవించుదాం. మన పక్కెలు, జెల్లలు, గెడ్డలు, మదుములు, పరసలు, పరజలు,… ఇంకా నీచమని భావించి మన సంస్కృతాభిమాన పండితులు వదిలేసిన తెలుగు పదాలన్నీ తెలుగు నిఘంటువుల్లోకి ఎక్కిద్దాం.

కొల్లేరు ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగుతుందో చూద్దామని వెళ్ళిన విలేఖరులకు అక్కడి ప్రజలు ఎన్ని రకాల చేపలు, పక్షుల పేర్లు చెప్పారో చూడండిః మట్టగిడస, కర్రమోను, బొమ్మిడాయి, శీలావతి, గొరక, ఇంగిలాయి, జెల్ల, బొచ్చె, జడ్డువాయి, చేదు పరిగె, కొరమీను, వాలుగ, పండుకప్ప, గండి బొగడ, కొయ్యంగ, మునుగపాము, గడ్డు గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకరొయ్య, గడ్డికొయ్య, మాల తప్పడాలు, ఏటిజెల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజెల్ల, పారాటాయి….

పరజ, గూడ, ఆసాబాతు, కళాయి, చేతన బాతు, నల్లముక్కులు, సముద్రపు చిలుక, నత్తకొట్టుడు….

“భాషాసమృద్ధే స్వతంత్రతా భీజం” అన్నారెవరో. పై పదాలన్నీ తెలుగు పదాలు కావా? వృత్తి పదకోశాల్లోకి ఎక్కించడానికి గతంలో కొంత ప్రయత్నం చేశారు. ఏడాదికి సగటున 5 కొత్త యూనివర్శిటీలు ఏర్పడుతున్నా భారతదేశంలో 7 శాతం మించి పి.జి స్థాయికి చేరటం లేదు. దానికి కారణం పేదరికం కాదు, ఇంగ్లీషు భాషపై పట్టులేకపోవటమేనని రాష్ట్ర ఉన్నత విద్యాచైర్మన్ కె.సి రెడ్డి అన్నారు. (ఆంధ్రజ్యోతి 18-10-2005)

అంటే ఇంగ్లీషు భాష మీద పట్లులేకపోతే మన దేశంలో ఏ వ్యక్తీ, అతనికి ఎంత జ్ఞానం, విజ్ఞానం ఉన్నప్పటికీ ఉన్న విద్యలోకి ప్రవేశించలేడన్నమాట. ఇంగ్లీషొస్తేనే జ్ఞాని, విద్యావంతుడు. ఇంగ్లీషు రాకపోతే అజ్ఞాని, అనాగరికుడు అని మనమే నిర్ధారించుకుంటున్నాం. ఇంగ్లీషే అన్నింటికీ మూలం అన్నట్లుగా మారింది పరిస్థితి.

తెలుగును ప్రాచీన భాషగా ప్రకటించాలని అన్ని పార్టీలవాళ్లూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కోర్టుకు గూడా వెళ్ళారు. కొద్ది రోజులకే జార్జిబుష్ హైదరాబాద్ రావటం, సిలికాన్ వ్యాలీలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయ ఉద్యోగుల్లో ఒకరు ఆంగ్లప్రదేశ్‍కు చెందిన వారేనని తేల్చటం, దిల్‍కుష్ అతిథి భవనంలో అమెరికా వెళ్ళటానికి వీసాలిచ్చే కేంద్రం పెడతామనటం, మన మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇంగ్లీషు ఉచ్చు బిగించిపోవటం చకచకా జరిగి పోయాయి. మరోసారి తాజాగా తెలుగుతల్లి సాక్షిగా ఉద్యోగాల కోసం మన పెద్దలు మోకరిల్లారు; ఇలా ఆంగ్లాన్ని స్తుతించారుః

ఆంగ్లమేరా జీవితం – ఆంగ్లమేరా శాశ్వతం

ఆంగ్లమే మనకున్నది – ఆంగ్లమేరా పెన్నిధీ

ఆంగ్లమును ప్రేమించు భాయీ – లేదు అంతకు మించి హాయీ   ॥ఆంగ్ల॥

తెలుగును విడిచీ – ఆంగ్లము నేర్చీ

అమెరికా పోదామూ – బానిసలౌదామూ

డాలర్లు తెద్దామూ      ॥తెలుగు॥

అంటూ పాటలు కూడా పాడుతున్నారు. తెలుగుకంటే ఇంగ్లీషెందుకు ముద్దో కారణాలతో సహా వివరిస్తున్నారుః

 1. తెలుగులో పెద్దగా విజ్ఞాన సాహిత్యం లేదు. తెలుగు భాషా దురభిమానం ప్రదర్శించటం తప్ప మన పాలకులు, పండితులు మన భాషలో పాలనకు పెద్దగా ప్రోత్సహించటం లేదు. తెలుగులో చదివితే ఉద్యోగాలూలేవు.
 2. పెద్ద కులాల వాళ్ళు, ఆస్థిపరులు ఇంగ్లీషులో చదువుకుంటూ, పేదకులాల వాళ్ళకు ఇంగ్లీషు చదువులు దక్కకుండా చేయటానికి తెలుగు భాషా ఉద్యమాలు చేయిస్తున్నారు.
 3. నిర్భంద చట్టాలతో తెలుగుభాషను తేవాలని చూసినా, పారిభాషిక పదజాలం యావత్తూ సంస్కృతమయం చేస్తూ, పండితులు తెలుగుభాషను తెలుగువాళ్ళకు రాకుండా చేస్తున్నారు. తెలుగు చదువు కృత్రిమమై ఇంగ్లీషు చదువే సులువుగా ఉంటోంది.
 4. దేశం మొత్తానికీ కలిపి ఒకే లిపిలేదు. మరో రాష్ట్రం వెలితే దుకాణాల బోర్డుల పేర్లు చదవాలన్నా ఇంగ్లీషు రావాల్సిందే. హిందీ కూడా అందరికీ రాదు. ఆంగ్ల లిపి పిల్లలకు సులభంగా వస్తుంది.
 5. యవ్వనం వచ్చాక బాల్యావస్థకు తిరిగి వెళ్ళగలమా? ఇంగ్లీషొచ్చాక తెలుగెందుకు? ఆధునిక ప్రామాణిక తెలుగు భాష వచ్చాక ఎవరైనా ఇంటి భాషను కోరుకుంటారా? ఆంగ్ల పాలనలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన మన తెలుగుజాతి మళ్ళీ తిరిగి తెలుగుకు పరిమితమై కుంచించుకుపోవాలా? పడ్డచన్నులెత్త బ్రహ్మవశమే?
 6. కంప్యూటర్‍కు ఆంగ్లం అవసరం. ఇంగ్లీషు రానివాళ్ళు ఎందుకూ పనికిరాని వాళ్ళవుతారు. మనం విశ్వమానవులం. అధునాతన విశ్వ చైతన్యాన్ని అందిపుచ్చుకోవాలంటే తెలుగును బలిచేసైనా ఇంగ్లీష్ నేర్వాలి.
 7. అప్పడగా బోయిందీ అదీ ఒక తప్పా? ఇప్పుడు తెలుక్కొచ్చిన ముప్పేమీలేదు. మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుళ్ళతో తెలుగు సంస్కృతికొచ్చే నష్టం ఏంటట? భాషోద్యమాలతో ఎందుకీ గోల? ఇదంతా ప్రాంతీయ దురభిమానంతో చేస్తున్న వేర్పాటువాదం. ఆంగ్లం వల్ల అధికారం, అధికారం వల్ల భాగ్యం కలుగుతాయి.

ఇక “మనం తెలుగువాళ్ళం” అనీ, “మన తెలుగును రక్షించుకుందాం” అనీ పోరాడే తెలుగు వీరులు చెప్పే సమాధానాలు ఏమిటి?:

 1. మాతృభాషను కాపాడుకోవటం భాషా దురభిమానం ఎలా అవుతుంది? అలాగయితే ఇంగ్లీషువాళ్ళది భాషా సామ్రాజ్యవాదం కాదా? సొంతభాష కంటే మనకు ఇంగ్లీషే గొప్పగా కనబడటం బానిస మనస్తత్వం కాదా?
 2. మన పాలకులు, అధికారులు డబ్బు సంపాదించటానికి మాత్రమే ఆంగ్ల విద్యను ప్రోత్సహించటం పడుపు కూడు తినటంతో సమానం. అత్యధిక జనాభా మాట్లాడేభాషను నాశనం చేస్తూ పరాయిభాషకు పట్టం గట్టడం అంటే పరస్త్రీ ముందు భార్యను అగౌరవ పరచటం లాంటిది. ఇది భాషా వ్యభిచారం, అనైతికం, అసహజం, తెలుగు జాతి ప్రజల హక్కుల ఉల్లంఘన.
 3. మన భాషను రక్షించుకోవాలంటే నిర్భంద చట్టాలు ఉండాల్సిందే. ఇంటి భాషకు సైతం చోటు కల్పిస్తూ పారిభాషక పదజాలం మనం సమకూర్చుకోవాలి. ఇంగ్లీషుకంటే తెలుగే సులువుగా వస్తుంది. మన లిపిని కంప్యూటర్‍కు అనుకూలంగా మార్చుకోవాలి. అవసరమైతే ఆంగ్లలిపినే తెలుగుభాషకు వాడుకుందాం.
 4. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్లమంది తెలుగు వాళ్ళున్నారు. 110 దేశాలకంటే మన తెలుగు నేల పెద్దది. ఎన్నో యూరోపియన్ దేశాల భాషలు తెలుగుకంటే చిన్నవే. వాటికున్న గౌరవం మర్యాదకూడా తెలుగుకు రాదా? మనల్ని మనమే కించపరచుకోవటం ఏమిటి?
 5. తెలుగు పనికిమాలిన భాషా? దెబ్బ తగిలితే మమ్మీ అని కాకుండా అమ్మా అని ఎందుకరుస్తారు? వచ్చీరాని ఇంగ్లీషు నడమంత్రపు సిరిలాంటిది. బాల్యంలో తీరని కోరికల్ని యవ్వనంలోనైనా తీర్చుకోవాలి గానీ ఆంగ్ల ప్రావీణ్యం అనే యవ్వన గర్వంతో బాల్యాన్ని మరిచి, తల్లిభాషను అధోగతికి దిగజార్చటం ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం.
 6. మన సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం, విద్య, పరిపాలన మన భాషలోనే ఉండాలి. కంప్యూటర్ కోసం తెలుగును బలి పెట్టటం ఎలుకలున్నాయని ఇంటికి తగులబెట్టడంతో సమానం. కంప్యూటర్‍నే తెలుగులోకి వంచుతాం. ఎన్నో భాషల గ్రంథాలు ఇంగ్లీషులోకి అనువదించుకున్నారు. అవసరం అటువంటిది.
 7. ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి సేవలు చేసే మనస్తత్వం స్వజాతికి ద్రోహం. తెలుగులోనే ఇంజినీరింగు, వైద్యశాస్త్రాలు చదివి తెలుగు ప్రజలకే సేవచేయగలిగితే మన భాషతో పాటు మన జాతి వికసిస్తుంది గదా? మీ భోగ భాగ్యాల కోసం తెలుగు ప్రజలందర్నీ ఇబ్బందులకు గురి చేస్తారా? వారి మీద మోయలేని భారం మోపుతారా? వారి భాషను నాశనం చేసి వాళ్ళను మూగవాళ్ళుగా చేస్తారా? మాతృభాషకు ప్రాథమిక విద్యలోకూడా స్థానం లేకుండా చేసే వాళ్ళది ఇంటి కూడా తిని ఎవరి వెంటో పడే తత్వం కాదా? ఇది ప్రజాద్రోహం కాదా?

“మాతృభాషాతృణీకారం మాతృదేవీ తిరస్కారం” అన్నారు మహాత్మాగాంధీ. “మాతృభాష సరిగా నేర్చుకోని వాళ్ళకు ఇతర భాషలు కూడా సరిగా రావు” అన్నారు జార్జి బెర్నార్డ్‍షా.

మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంఘ్వీ ఇలా అన్నారుః “మాతృమూర్తికి ఎంతటి గౌరవం ఇస్తామో మాతృభాషకు అంతటి సమున్నత స్థానం దక్కాలి. నేను తల్లితో సమానంగా తల్లిభాషనూ గౌరవిస్తాను. అందరూ మాతృభాషలో మాట్లాడండి. న్యాయస్థానాల్లో వాదనలు కార్యకలాపాలు ఆంగ్లంలో కొనసాగడమేంటి? ఇంకా ఎంతకాలం ఈ దారుణం? న్యాయస్థానాల్లో వ్యవహారాలు సామాన్యుడి భాషలో కొనసాగినప్పుడే సామాన్యుడికి న్యాయం అందివ్వగలం.” (“అమ్మనే మరుస్తారా!” ఈనాడు 27-2-2006)

అమ్మభాషను మనవాళ్ళు మరచిపోతుంటే ఫ్రాన్సు నుండి పెద్దాపురం వచ్చి బుర్రకథ మీద, తెలుగుభాష మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ డానియల్ నెగర్స్ ఇలా అంటున్నారుః “తెలుగునేల మీద విదేశీ భాషలు నేర్చుకోవడానికి సీఫెల్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి గానీ, తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించలేదు. అమెరికా పలుకుబడి, ఆంగ్లభాష ప్రపంచంలోని అన్ని భాషా సంస్కృతులకు నష్టం కలిగిస్తోంది. ప్రపంచీకరణ పేరుతో ప్రతి ప్రాంతానికీ ఈ ప్రమాదం విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో రెండువేల భాషలున్నాయి. మరో వందేళ్ళు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులుతాయి.  భాషల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ అవసరం. ఫ్రెంచి, తెలుగు భాషలు దాదాపు ఒకే సమయంలో సాహిత్య భాషలుగా పరణతి చెందాయి. అయితే ఫ్రెంచి భాషను ప్రపంచంలో ఎక్కడయినా నేర్చుకునే వీలుందికానీ తెలుగును తెలుగు నేలపై నేర్చుకోవడమే కష్టంగా ఉంది. ఎంతో ప్రాచీనమైన తెలుగుభాష ఉనికిని కాపాడుకోవాలి. ఆంగ్లభాషను రుద్దడం వల్ల భాషల మధ్య ఘర్షణ తప్పదు.” (ఆంధ్రజ్యోతి 22-2-2006)

ప్రపంచంలోని అన్ని భాషల కంటే ఎక్కువగా ఆంగ్లభాషలో 7,90,000 పదాలున్నాయట. వాటిలో 3 లక్షల పదాలు సాంకేతికమైతే, 4,90,000 పదాలు వాడుకలో ఉన్నాయట. అయితే భాషా శాస్త్రజ్ఞుల లెక్క ప్రకారం ఏ ఒక్కరూ తమ జీవితకాలంలో 60 వేలకు మించి రాయడంలోకానీ, చదవడంలో కానీ ఉపయోగించలేరట. అంటే అరవై వేల అవసరమైన పదాలను రాయడంలో, చదవడంలో ఉపయోగిస్తూ ఉంటే భాషను సజీవంగా కాపాడుకోవచ్చు.

మెదక్ జిల్లా రాయికోడు మండలం షంషుద్దీన్ పూర్ గ్రామనివాసి ఏర్పుల కమలమ్మ 50 రకాల విత్తనాలు సాగుచేసి సరఫరా చేస్తోందట. విత్తనాల పేర్లు చూడండిః “తైదలు, ఉలవలు, సజ్జలు, పచ్చజొన్నలు, తోక జొన్నలు, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, బుడ్డజొన్న, అత్తకోడళ్ళ జొన్న, నల్లతొగరి, ఎర్రతొగరి, తెల్లతొగరి, అనుములు, కొర్రలు, బొబ్బర్లు, పెసర్లు, వడ్లు, తెల్లనువ్వులు, ఎర్రనువ్వులు, గడ్డినువ్వులు, పుంట్లు, శనగలు, ఆవాలు, తెల్లకుసుమ, ధనియాలు, వాము, బటాని, సిరిశనగ, మిరప, కోడిసామలు, పల్లీలు, గోధుమ, సాయిజొన్న, నల్లకుసుమ, అవశలు, లంకలు, సిరిశనగ.” (వార్త 6-3-2006)

ఈ తెలంగాణా తల్లికి ఏమి ఇంగ్లీషొచ్చు? అయినా ఈ తెలుగు నేల తల్లులు ఎన్నో వందల ఏళ్ళనుండి మొక్కల పేర్లు, విత్తనాల పేర్లు మక్కువగా గుర్తు పెట్టుకొని వ్యవసాయం నడపలేదా? ఇంగ్లీషు, లాటిన్ పదాలకిచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత మన తెలుగు పదాలకు కూడా ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి? మనం మనకి అర్థం కాకపోయినా, ఇంగ్లీషు వాళ్ళకు అర్థం కావాలి. ఈ బాబులు దేశంలో భారతీయులంతా ఒకరికొకరు అర్థం కావాలంటే ఇంగ్లీషే మంచిదనే నిర్ణయానికొచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా అంటే మొగలులు, బ్రిటీష్ వాళ్ళు రాకముందున్నట్లుగా ఉంటే ఎవరిభాషకు వాళ్ళు పట్టం గట్టేవాళ్ళే. ఇప్పుడది సాధ్యం కాదు కాబట్టే మన భాషలకు ఇంగ్లీషు సారథ్యం వహిస్తోంది.

తెలుగు భాషకు మూలపురుషులు ఎవరు? యానాదులు. తెలుగుభాషను నిత్యమూ వాడుతూ బ్రతికిస్తున్నది ఎవరూ? వివిధ కులవృత్తుల్లో ఉన్న శ్రామికులు, గ్రామీణులు. అరవైవేలు కాదు దాదాపు 3 లక్షల పదాలు వీళ్ళంతా కలిసి వాడుతున్నారు. వీళ్ళందరూ వాడుతున్న పదాలలో చాలా వరకూ వివిధ పదకోశాల్లోకి ఎక్కాయి. ఇంకా రక్షించుకోవాల్సిన పదజాలం ఎంతో ఉంది. మాటకు ప్రాణము వాడుక. వాడుక ఎప్పుడు జరుగుతుంది? మన పంచాయితీలు, న్యాయ స్థానాలు, అసెంబ్లీ అన్నీ తెలుగులో నడిచినపుడు. కనీసం మన పిల్లలకు ప్రాథమిక విద్య అయినా తెలుగులో అందించినప్పుడు.

ప్రైవేట్ స్కూళ్ళు తెలుగు నేర్పవు. మార్కుల కోసం కళాశాల విద్యార్థులు సంస్కృతం రెండోభాషగా తీసుకుంటున్నారు. సంస్కృత పరీక్షలో జవాబులు తెలుగు, ఇంగ్లీషు లిపుల్లో దేంట్లోనైనా రాయొచ్చట. మార్కులు బాగా వేస్తారట. హిందీ పరీక్షకైతే 20 మార్కులు తెచ్చుకున్నా పాస్ చేస్తున్నారు. మరి ఈ రకం రాయితీలు, ప్రోత్సాహకాలు మన తెలుగు భాషకే ఇవ్వవచ్చుగదా? కర్నాటకలో కన్నడ మాతృభాషకాని వాళ్ళైనా సరే కన్నడాన్ని మూడో భాషగానైనా చదవాల్సిందేనట. మరి మన రాష్ట్రంలో?

కర్నాటకలో కన్నడం లేకుండా హైస్కూలు విద్య పూర్తికాదు. పైగా 15 శాతం మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో ఎనిమిదవ తరగతిదాకా తమిళాన్ని ఒక భాషగా నిర్భందం చేశారు. కోయ, గోండు, కొలామి, ఆదివాసి, ఒరియా, సవర, బంజారా, కొండ, కువి మొదలైన గిరిజనులకు వారి మాతృభాషల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధిస్తోంది. ఇదే పని తెలుగు పిల్లలకు కనీసం అయిదో తరగతి వరకు నిర్భందం చేస్తే బాగుంటుంది. ప్రైవేట్ స్కూళ్ళ మీద కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో మన ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాలి.

“భాషను సాహిత్యానికీ కవిత్వానికీ పరిమితం చేస్తే భాషతోపాటు దాన్ని మాతృభాషగా కలిగిన వారు కూడా వెనుకబడిపోతారు. భాషను ఉపాధితో ముడిపెట్టండి” అన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్

గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గానూ, కాళోజీ జయంతి సెప్టెంబరు 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గానూ జరుపుకుంటున్నాము. ఇంటిభాస ఎసుంటిదైనా మందే కదా? ఆదరిచ్చుదాం. ఇంపుగా నేరుద్దాం. ఇంగిలీసు నేర్చుకోటల్లా? అట్టా.

 

వేగుచుక్కలు వేమన వీరబ్రహ్మాలు

మానవుడితోపాటు ప్రతీ జీవి సుఖాన్ని, భోగాన్ని కోరుకుంటుంది. సుఖసంతోషాలతో ఉండాలని,  ఇహంతోపాటు పరాన్ని కూడా సాధించాలని అనుకుంటాడు ప్రతి మనిషీ. కాని మనం అనుభవించే సుఖం శాశ్వతం కాదనీ, చివరికి మిగిలేది దుఖఃమేననీ  తేల్చేస్తారు వేదాంతులు. చరిత్రకారులు స్వర్ణయుగమని చెప్పుకునే విజయనగర చక్రవర్తుల తుది దిశలో సామాన్యుల బ్రతుకు కడగండ్ల పాలైంది. మండలాధీశుల భోగలాలసత్వం, అధికారుల దౌర్జన్యం, దోపిడీలు .. దానికితోడు జనులలో పేరుకుపోయిన అమాయకత్వం, అజ్ఞానం వారి జీవితాలను మరింత దుర్భరంగా చేసాయి. అర్ధం లేని ఆచారాలు, దురాచారాలు, అధికారబలం, దబాయింపులతో ప్రజలను మోసం చేసి అణచిపెట్టేవారు. భయపడి నీళ్లు నమిలేవాళ్లేగాని నిలదీసి అడిగే ధైర్యం , తాహత్తు కాని ఎవరికీ లేవు. చెదురుమదురుగా ఎదుర్కొన్నా చివరివరకూ ఎవరూ నిబ్బరంగా నిలబడలేదు.

అటువంటి చిమ్మ చీకటి  తెరలను చీల్చుకుని వెలిగిన వేగు చుక్కలు యోగి వేమన, పోతులూరి వీరబ్రహ్మము.  (1608 – 1693). ఇద్దరూ సమకాలీకులైనా, ఒకరికొకరు ముఖపరిచయం లేకున్నా ఒకే ఆశయంతో తమ ఉద్యమాలను నడిపించి సంచలనం సృష్టించారు. ఇరువురూ సంస్కర్తలే, సత్కవులే. తమ అనుభవాలను తత్వదృష్టితో ,  కవితారూపంగా,    పద్యాలు, పాటలు పాడి  సామాన్యజనాన్ని మేల్కొలిపారు. ఇక్కడ మరో విషయం గమనించదగ్గది. ఈ విశాల ప్రపంచంలోకి ఎందరో మత ప్రవక్తలు, సంస్కర్తలు పశుపాలకవర్గం నుండి వచ్చినట్టుగా తెలుస్తుంది. శ్రీకృష్ణుడు గోపాలకుడు,  ఏసుక్రీస్తు గొడ్లచావిడిలో పుట్టాడు. ఇస్లాం మతప్రవక్త మొహమ్మద్ ఒంటెల వ్యాపారి కాగా  వేమన, వీరబ్రహ్మం కూడా గొర్రెకాపరులే.

 

ఈ సృష్టికి మూలమైన శక్తి ఒకటి ఉందని వేమన, వీరబ్రహ్మం ఇద్దరూ అంగీకరించారు. అతి సామాన్యమైన తెలుగు పలుకులతో సూటిగా, సులభంగా అర్ధమయ్యే విధంగా , అందరికి సన్నిహితమైన ఉపమానాలతో తమ వాణిని వినిపించారు. “పెక్కు చదువులేల? చిక్కు వివాదములేల? అని ప్రశ్నించి, “వేనవేలు చేరి వెర్రి కుక్కలవలె అర్ధహీన వేదమరచుచుంద్రు, కంఠశోషకంటె కలిగెడి ఫలమేమి? అని పండితులను నిగ్గదీసి “చావు తెలియలేని చదువేటి చదువురా?” అని చదువు పేర, శాస్త్రాల పేరిట గొప్పలు చెప్పుకునే పుస్తకాల పురుగులపై అక్షింటలు చల్లాడు వేమన. పుస్తకాలు వల్లించినంత మాత్రాన పుణ్యం దొరకదని, అత్తెసరు చదువుల అయ్యల ఆర్భాటాలు అద్రాటపు నీటిమూటలని బ్రహ్మం చెప్పాడు ..

ఒక మతం మీదకాని, శాఖ మీద కాని, తెగమీద కాని వీరిద్దరికీ ప్రత్యేకాభిమానం అంటూ లేదు. తప్పు ఎక్కడున్నా తప్పే అంటారు. ఏ మతములోనున్న తప్పులనైనా నిష్కర్షగా, నిర్భయంగా ఎత్తి చూపారు. జాతి, వర్ణ, ఆశ్రమ, కుల, గోత్ర రూపాలన్నవి వట్టి భ్రమలు. కాని లోకంలో వాటికి చాలా బలం ఉంది. అందుకే “కులము గోరువాడు గుణహీనుడగును” అని నిరూపించి, “ఎరుక గలవాడె ఎచ్చైన కులజుడు.” అని ఎలుగెత్తి చాటాడు. “కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్యచేత విఱ్ఱవీగువారు పసిడికలుగువాని బానిస కొడుకులు” అని కులగోత్రాల గురించి స్పష్టం చేసాడు వేమన.”కులము గోత్రమనుచు కూసేటి మలపల” దగుల్బాజీ తనాన్ని తూర్పారబట్టాడు వీరబ్రహ్మం. “కులము కులమటంచు గొణిగెడి పెద్దలు చూడరైరి తొల్లి జాడలెల్ల, మునుల పుట్టువులకు మూలంబు లేదండ్రు” అని నిక్కచ్చిగా చెప్పాడు బ్రహ్మం. కులము కంటే గుణము గొప్పదని నమ్మారు వీరిద్దరూ. “ఉర్వివారికెలనొక్క కంచము బెట్టి పొత్తు గుడిపి కులము పొలియజేసి తలను చెయిబెట్టి తగనమ్మ జెప్పరా” అన్నాడు వేమన. అంతేగాక “అంద రొకట గలియ అన్నదమ్ములె కదా” అన్న సమైక్యభావన వేమన చూపగా, ” ఏ జాతియైన సద్గురుసేవన్ , బ్రతికిన బ్రాహ్మణ వరుడగు” అనీ, ” అన్ని కులములు ఏకమయ్యీనయా” అని బ్రహ్మం మాటలలో కనిపిస్తుంది.

చిత్తశుద్ధిలేని భక్తిని, చిత్తములేని విగ్రహపూజను కూడా వీరు తీవ్రంగా నిరసించారు. “శిలను ప్రతిమను చేసి చీకటిలో బెట్టి మ్రొక్కవలవ దికను మూఢులార” అని కోప్పడి, “నిగిడి శిలను మ్రొక్క నిర్జీవులగుదురు” అని భయపెట్టాడు వేమన. “నల్లఱాళ్లు దెచ్చి గుళ్లు కట్టి మ్రొక్కులిడిన బ్రతుకు చక్కపడగబోదు”, “చెట్టుపుట్టలకును చేయెత్తి మ్రొక్కుచు వట్టి మూటలిట్లు వదరనేల” అని ప్రశ్నిస్తూ, “చిలిపిరాళ్ల పూజ చేయబోక” అని చిత్తశుద్ధిలేని పూజలను బ్రహ్మం ఎన్నో మార్లు ఈసడించుకున్నారు. చిల్లర ఱాళ్లకు మొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే.. చిత్తము నందలి చిన్మయజ్యోతిని చూచుచునుండుట సరే సరే.. అని చిత్తములేని విగ్రహారాధనను వీరబ్రహ్మం ఆక్షేపించాడు.

నిరర్ధకమైన కర్మకాండను ఈ ఇద్దరూ నిరసించారు. ఆత్మజ్ఞానం లేకుండా చేసే స్నానాలు ఉపవాసాలు నిరర్ధకమని హేళన చేశారిద్దరూ. “నీళ్ల మునుగనేల నిధుల మెట్టగనేల.. కపట కల్మషములు కడుపులో నుండగా” అని వేమన నిలదీస్తే “నీటను మునిగి గొణుగుచునుంటే నిలకడ చెడునుర ఒరే ఒరే” అని బ్రహ్మం కూడా ఆ మాటనే చెప్పారు. “కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు సేయు కుక్షిమలము, కూడు విడిచి మలము గుడుచురా యుపవాసి ” అని వేమన ఉపవాసవ్రతాన్ని ఆక్షేపించాడు. ఒకసారి ఒళ్లు మండి ” ఒక్కపొద్దులున్న ఊరబందై పుట్టు” అని కసితీరా తిట్టాడు. “ఒక్కప్రొద్దులని ఎండుచునుంటే ఒనరగ చెడుదువు ఒరే ఒరే! అని బ్రహ్మం కూడా బూటకపు ఉపవాస వ్రతాలవల్ల లాభంలేదని స్పష్టం చేశాడు. నియమనిష్ట లేని తీర్థయాత్రలు, క్షేత్ర నివాసాలు దండగమారి పనులని, ముక్తి సాధనాలు కావని “ఆసనాది విధుల నధమ యోగంబురా” అని వేమన చాలా చోట్ల ప్రకటించాడు. “ఆఁకులెల్ల దిని మేఁకపోఁతుల కేల కాకపోయెనయ్య కాయసిద్ధి” అని గాలి, ఆకులు తినే యోగులను వేమన సవాలు చేస్తే ” ఆకులు తిన్నందుచేత నడవిని తిరిగే మేఁకలకెల్లను మోక్షము రాకేలను పోయెనయ్య” అని వీరబ్రహ్మం కూడా ప్రశ్నించాడు.

అదే విధంగా బారెడేసి జడలూ, బుజాల ముద్రలూ, బూడిదపూతలూ, బోడితలలూ వగైరా బాహ్య చిహ్నాలు మోక్షసాధనాలు కావని, ఆత్మశుద్ధిలేని వేషధారిని విశ్వసించగూడదని ఇద్దరూ హెచ్చరించారు. “పొడుగు గలుగు జడలు పులితోలు భూతియు కక్షపాలలు పదిలక్షలైన మోత చేటెకాని మోక్షంబు లేదయా” అని మాయవేషాలు వేసుకుని ప్రజలను మోసగించేవారిని వెక్కిరించారు. “కొండగుహలనున్నా, కోవెలలందున్నా మెండుగాను బూది మెత్తియున్నా దుష్టబుద్ధులకును దుర్భుద్ధి మానునా” అని అమాయకులను పీడించి, తమ స్వలాభము చూసుకునే తాంత్రిక, మాంత్రికులనూ తూర్పారబట్టారు.

“నాస్తి తత్వం గురోః పరం” అని పూర్వులు భావించినట్టుగానే గురువులేనిదే సాధకునకు దీక్ష కుదరదని , ముక్తి లభించదని ఇద్దరూ స్పష్టం చేశారు. “గొప్పగురుని వలన కోవిదుడగు”, “గురువు లేక విద్య గుఱుతుగా దొరకదు”, గురువుదెలియనట్టి గుఱుతేమి గుఱుతయా”, గురుని గూడ ముక్తి కరతలామలకమౌ” అన్న వేమన పలుకులు ప్రతి ఒక్కరికి శిరోధార్యము. ఆచరణీయము. ” గురుమూర్తియే సమర్ధుడనీ, గురుడే తల్లియు తండ్రియు గురుడే బ్రహ్మంబు” అని , పరమార్ధ నిరూపణకు గురువచనమూ, స్వానుభవమూ తప్పనిసరి అని బ్రహ్మం కూడా నిరూపించాడు. సాధకుడు తన అస్థిరమైన శరీరాన్నే ఆధారంగా చేసుకొని, చెట్టుకొమ్మలు ఆధారంగా వేలాడుతూ కోతి కొండకోనల్లో తిరిగినట్లు తమ అంతశ్శక్తిని, జ్ఞానజ్యోతిని వీక్షించాలి అని ఇద్దరూ ప్రకటించారు. బ్రహ్మజ్ఞానం కంటె మిన్నయైనది వేరొకటి లేదని వేమన , వీరబ్రహ్మం ఇద్దరూ ఎలుగెత్తి చాటారు.

ఆ చూపుకర్ధమేందీ….

కొత్త పత్రిక మొదలు పెడుతున్నాము నీకు తోచింది రాసి పంపివ్వమని భరద్వాజ గారు అడగడం తో ఆలస్యం చేయకుండా ఒక “వ్యాసం” లాంటిది పంపించాను. బాగా రాసావు అన్న తిరుగు టపా ఉత్తరం వస్తుందనుకుంటే “నిన్ను పంపమన్నది ఒక చిన్న కధ గాని కావ్యం కాదు ” అన్న చివాట్లు వచ్చాయి. ముందు చెప్పడం ఏమో నీకు తోచింది రాయి అన్నారు రాస్తేనేమో చివాట్లు. బొత్తిగా కళాపోషణ లేని వారు. అయినా దాన్లో నేను ఏం రాసానండీ? నన్ను గత పదిహేనేళ్ళనుండి వెంటాడుతున్న ప్రశ్నకి సమాధానం కై వెతుకులాట ఎలా సాగిందో చెప్పాను. కనీసం చదివిన ప్రేక్షక మహాబుభావులనుండి సమాధానం వస్తుందేమో అన్న ఎక్కడొ ఏదో మూలనున్న బుల్లి ఆశ.

నేను మొదటి సారిగా సొంత ఊరు అయిన హైదరాబాదు నుండి ఒక్కదాన్నే మా శ్రీవారు ఉన్న బాస్టన్ ఊరికి బయలుదేరినప్పుడు మొదలయ్యింది ఈ ప్రశ్న జవాబు ఆట. చాలా సినిమాల్లో సినిమా హీరోయిన్లు అంతా సెక్యూరిటీ దాటే ముందు ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తారు కదా నేను అలా చూడకపోతే మొదటి సారిగా ఫ్లయిటు ఎక్కుతున్నా అని అందరికీ తెలిసిపోతుందేమో, తెలిస్తే ఇంక నా ప్రెస్టీజూ ఏం కాను అసలే అమేరికా వెల్తున్నా అన్న ఒక వీర ఫీలింగుతో వెనక్కి తిరిగి చూసాను. అంతే , పీడా విరగడయ్యిందన్న చూపుటో నా వంక సంతోషంగా చూస్తున్న మా తమ్ముడు కనిపించాడు. ఆ చూపుకి అర్ధం ఏమయ్యుంటుంది? నేను అనుకున్నదేనా? లేక ఇంకేదయినా నా?

బాస్టన్ చేరుకున్నాక ఇమ్మిగ్రేషను లైను చూస్తే చాంతాడంత కనిపించింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడతారేమో రెకమండేషను తో చక చకా బయటకి వెళ్ళిపోవొచ్చు అనుకున్నా కానీ అదేంటో ఒక్కల్లు కనుపించలేదు. ఒస్సూరంటూ లైన్లో నిలబడి లగ్గేజుని ఈడ్చుకుంటూ నా టర్ను వచ్చే దాకా ఆగి పాస్పోర్టు వగైరా కాయితాలు ఇమ్మిగ్రేషను చేసే అమ్మాయి చేతిలో పెట్టాను. ఆవిడ అవి తీసుకుంటూనే ” How was your flight Maam?” అని అడిగింది. ఇంతసేపటికి నా కష్టాలు అడిగే “నాధి” (నాధుడికి స్త్రీలింగం అన్న మాట) తగిలింది తస్సచక్కా నేను లక్కు లో పడ్డాను అని అనుకున్నా. Food సరిగ్గా పెట్టలేదు, తలగడలు సరైనవి ఇవ్వలేదని, అసలు ఆ ఫ్లైట్లో Ladies Only సీట్లు అస్సలు లేవని , పెళ్ళైన అమ్మాయిలని ఎవరి పక్కన పడితే వాళ్ళ పక్కన కూర్చో పెడితే ఎంత ఇబ్బందో అర్ధం చేసుకోరా ఈ ఎయిరు లైను వాళ్ళు . ఇలా నేను పడ్డ నా నా యాతనలు ఒక ఐదు నిమిషాల పాటు చెప్పుకొచ్చాను. ఈ లోగా నా కష్టాలన్నీ విని ఆవిడ నా కాయితాలు పాస్పోర్టు నాకు ఇచ్చేస్తూ”Next time when someone asks you this question all you have to say is either it was good/ok/not bad. You don’t have to tell them everything you went through on the flight. Bless your husband and you have a good day maam” అని ఒక చూపు చూసింది. ఆ చూపుకర్ధమేందీ .. అని మళ్ళీ అనిపించిన క్షణమది.

నన్ను తీసుకెళ్ళటానికి సినిమా హీరో లా పేద్ద పూల గుచ్చ తో ఎదురొస్తారనుకున్న మా వారు కారు తాళాలు తప్ప ఏమి పట్టుకోకుండా నిలబడ్డం చూసి కాస్త నిరుత్సాహం గా అనిపించింది. నాకు పుట్టిన ఊరు దాటటం అదే మొదటి సారి అవ్వటం తో ఆ ఎయిర్ పోర్టంతా అద్భుతం గా అనిపించింది. వచ్చే పోయే వాళ్ళంతా హాయ్, హెల్లో అని మా ఆయన్ని పలకరిస్తుంటె, అమ్మో మా ఆయనకి సర్కిలు బాగా ఉంది ఎంతమంది తెలుసో కదా అని సంతోషమేసింది ఒక రకం గా చెప్పాలంటే గర్వం గా అనిపించింది. సంతొషమొచ్చినా, బాధేసినా బయటకి చెప్పేయటం అలవాటుండం తో పిచ్చి మొహాన్ని నోరు మూసుకోకుండా “యేవండీ మీకు బాగా ఇంటెల్లిజెంటు, మాంచి యూనివెర్సిటీ లో చదువుతున్నారు అని మాత్రమే చెప్పారు పెళ్ళికి ముందు మా వాళ్ళు. కాని మీకు ఇంత పలుకుబడి ఉందని , మీరు ఇంత పాప్యులర్ అని తెలీదేమో. అసలు ఇలా అందరూ హాయ్ హల్లో లు చెప్పకుండా మీ ముందు నుండి కదలరు అని మా వాళ్ళకి చెప్తే ఎంత ఆనంద పడతారో.” అన్న నా మాటలకి మల్లీ అదే చూపు ఎదురయ్యింది. మల్లీ ఆ చూపుకర్ధమేందీ….అనుకున్నా. అడిగే లోపే ఇక్కడ ఎవరు ఎవరికి తెలియక పోయినా హాయ్ చెప్పటం Courtesy అని చకచకా కారు దగ్గరకి లాక్కెళ్ళారు.

ఆ రోజు శ్రీవారు ఆఫీసుకి వెళ్ళాక ఒంటరిగా అపార్టుమెంటులో ఉన్న మొదటి రోజు. స్నానం చేసి , దేవుడికి ఆ చూపుకర్ధమేందో త్వరలో తెలిసేట్టు చేయమని దణ్ణం పెట్టుకుని తలకి చుట్టుకున్న తుండుని బయట బాల్కనీ లో ఆరేస్తుంటే పక్క ఫ్లాటతను నా వైపు ఒక చూపు విసిరాడు. మల్లీ ఆ చూపుకర్ధం బుర్రకి తట్టలేదు. సర్లే ఏడ్చాడు వెధవ అని ఇంట్లోకి వచ్చి తరవాత పనేంటో చూస్తున్నా. సింకు నిండా అంట్ల గిన్నెలు కనిపించాయి. డిష్ వాషరులో వేస్తే ఒక పనై పోతుందని గబ గబా అంట్లన్నీ తీసి దాన్లో సర్ది పక్కనే ఉన్న డిష్ వాషింగ్ liquid పోసి స్టార్టు బట్టను నొక్కేసా. టీ వీ లో వస్తున్న ఫ్రెండ్స్ సీరియలు చూస్తున్న దాన్ని కాసేపటికి వంటింట్లో ఏదో తేడాగా సౌండ్ వస్తుంది ఏంటా అని చూస్తే , వంటిల్లంతా అంతా నురగ, సబ్బు నురగ. మా ఆయనకి ఫోను చేసి ఈ విషయం చెప్పుదామని అనుకున్నా కాని చస్స్ ఇంత చిన్న దానికి ఆయన్ని ఇబ్బంది పెట్టటం దేనికని Management (Apartment) వాళ్ళకి ఫోను కొట్టి Dish washer in my unit is not working and needs to be repaired right now. This is an emergency as soap water is flowing అని చెప్పాను. నేను చెప్పింది అంతే కాని వచ్చింది ఓ పేద్ద ఫైరింజను, ఒక ఆంబ్యులెన్సు, ఒక పోలీసు కారు. వాళ్ళంతా వస్తూనే who is in danger? Are you doing alright ? లాంటి ప్రశ్నలు సంధించారు. ఇంట్లో ఎవరూ లేరు, ఉన్న నేనొక్కదాన్ని బానే ఉన్నాను , నా డిష్ వాషరే పాడయ్యింది అన్న నన్ను , అప్పుడే ఇంట్లో కి అడుగు పెట్టిన మా వారు, నా ఫోనుకి రెస్పాండ్ అయ్యి వచ్చిన వాళ్ళంతా కూడ ఒక చూపు చూసారు. అదిగో మల్లీ అదే చూపు..ఆ చూపుకర్ధమేందీ???..

ఇలా మూడు నెలలు ఎలా గడిచాయో తెలియనే లేదు. ఈ మూడు నెలల్లో ఇరుగు పొరుగు వాళ్ళతో స్నేహం కుదిరి ఒక రోజున ఒకావిడ ఫోను చేసి మా ఇంట్లో పాట్ లక్కు పెట్టుకుంటున్నాం ఈ వీకెండు మీరు ఏమైనా తీసుకు రాగలరా అని అడిగింది. వాళ్ళింట్లో లక్కీ డిప్ పెట్టుకుని నన్ను ఏదైనా తీసుకు రమ్మనటం ఏంటీ విడ్డూరం గా..బహుసా డ్రా లో పాల్గొనటానికి టిక్కట్లకి డబ్బులేమో అనుకుని మా వారిని అడిగి చెబుతా అని పెట్టేసా. శ్రీవారు రాగానే ఏమండీ ఈ ఊర్లో లక్కీ డిప్ కి టిక్కట్లు ఏ మాత్రం ఖరీదుంటాయి అని అడిగితే అయోమయం గా చూసి అసలు విషయం అడిగి తెలుసుకున్నారు. అంతా విని మల్లి అదే చూపు నా వైపు ఒక సారి విసిరి పాట్ లక్ అంటే లక్కీ డిప్ అని కాదు ఆహ్వానితులు అంతా ఏదో ఒక ఐటం చేసుకుని తీసుకెల్లి పార్టీ చేసుకుని పార్టీ చేసుకుంటారని అర్ధం అని వివరించారు. పాట్ లక్ అంటే అర్ధం అయ్యింది గాని మనం ఆ పార్టీ కి “జాలపీనోస్” తో మిరపకాయ బజ్జీలు తీసుకెల్దాం అని అన్న మాటకి వాటిని “ఆలపీనోస్” అంటారు అని చెప్పి నా వంక చూసిన చూపుకి అర్ధమేంటో తెలియలేదు.

ఇలా కొన్నాళ్ళకి మా వారు నిన్ను ప్రతి చోటికీ తీసుకెళ్ళలేకపోతున్నా ఈ డ్రైవరుగిరీ నేనింక చేయలేను డ్రైవింగు నేర్చుకో అని చెప్పటం తడవుగా పట్టు వదలని విక్రమార్కుడి పెద్ద చెల్లెలు గా ఒక నెలలోగా నేర్చేసుకోవటం లైసెన్సు తెచ్చుకోవటం కూడా జరిగిపోయింది. చంద్రమండలం ఎక్కినంత గర్వం గా అనిపించింది. అమ్మకి ఫోను చేసి, నాకు లైసెన్సు వచ్చేసింది మీ అల్లుడిని ఇంక నేనే రోజు ఆఫీసుకి దిగబెట్టి తీసుకు రావొచ్చు, కనకదుర్గమ్మ కి కొబ్బరి కాయ కొట్టి అర్చన చేయించు. మన కాలనీలో స్వీట్లు పంచి పెట్టు. అందరికీ చెప్పు నేను టయోటా కరోలా అనే పేద్ద కారు నడిపిస్తున్నా , లాంటివి పురమాయించి నా డ్రైవింగు పర్వానికి శ్రీకారం చుత్తాను. ఒక వారం రోజుల పాటు అటు ఇటు గా తిరుగుతు, గ్రాసరీలనీ, బ్యూటీ పార్లర్లనీ , కారేసుకుని తిరగటం హైవే లాంటివి ఎక్కటం కూడా చేసానండోయ్. ఇలా ఉండగా ఒక రోజున నెను మా వారు బయటికి వెల్లాం. హైవే ఎక్కాడం అది మొత్తం ట్రాఫిక్ జాం అవ్వటం చూసి మా వారు విసుక్కుని ఈ టైములో వస్తే ఇంతే ఇలాగే జాం లో ఇరుక్కోవాలి అని నసుగుతున్నారు. నేను డ్రైవింగు చేస్తున్నాను కదా నాకు రూట్లు తెలుసు అన్న ధీమా తో యేవండీ మనం తీసుకోవాల్సిన ఎక్జిటు ఒక్క మైలే ఉన్నది. ఇటు పక్కన ఉన్న లేనులో నుండి వెల్లండి ఎవరు ఉండరు, నేను వెల్లే దారే అది అని గర్వం గా, మీకన్నా నాకు కాస్త బాగానే తెలుసు అన్న ఆట్టిట్యూడు తో చెప్పాను. మొదట ఖంగు తిని ఏ లేను, ఆ పక్క లేనే నా అని అడిగారు? అవునని అన్న నా సమాధానం విని నీకు లైసెన్సు ఎవడిచ్చాడు రా బాబోయ్ , అది షోల్డరు లేను, దాన్లో నుండి ఎవరు వెల్లరు ఒక్క పోలీసు తప్ప అని ఒక చూపు చూసారు. నా మెదడులో మల్లీ అదే ప్రశ్న…ఆ చూపుకర్ధమేందీ??

పదిహేనేళ్ళ తర్వాత కూడా అప్పుడప్పుడు అలాంటి చూపులు విసురుతూనే ఉండటం వారికి అలవాటయ్యింది గాని నాకు మటికి ఆ చూపుకర్ధమేందీ అన్న ప్రశ్న ప్రశ్న లాగానే మిగిలిపోయింది!!!

అనగనగా ఒక రోజు..

“రేపు బోల్డంత పని ఉంది.. తలచుకుంటేనే నీరసం వస్తుంది!”

“ఇప్పుడేగా చేపల పులుసు బావుందంటూ అన్నం తిన్నారు! నీరసమై ఉండదు.. భుక్తాయాసమేమో?! మీరసలే తెలుగులో వీక్.”

“నా తెలుగుకొచ్చిన ప్రోబ్లెమేమీ లేదు కానీ రేపు నేను గరాజ్ క్లీనింగ్ చేసుకోవాలి.”

“దాందేముంది.. నేను హెల్ప్ చేస్తాను.. మీరు కూడా క్లీనింగ్ లో ఓ చెయ్యేయండి.. మీరే అంటారుగా టీం వర్క్ టీం వర్క్ అని.”

“అమ్మో, నువ్వు మాత్రం నా పనిలో చేయి పెట్టకు.. అంతకుముందు నేను ఊర్లో లేనప్పుడు చూసి నా టూల్స్ అన్నిటినీ సర్దేశావ్.. ఆ తర్వాత ఏది ఎక్కడుందో వెతుక్కోలేక నేనైపోయాను.. నా పని నేను చేసుకుంటాను కానీ రేపొక్కరోజు మాత్రం you have to manage all the cleaning and mopping!”

“వెతుక్కోలేక మీ పని అయిపోయిందా? ట్రాన్స్పరెంట్ బాక్స్ లు తెచ్చి అన్నిటిని ఆర్గనైజ్డ్ గా సర్ది బయట లేబుల్స్ కూడా అతికించాగా?”

“అదే, ఆర్గనైజ్డ్ గా అని నువ్వనుకుంటావు.. నీకసలు టూల్స్ గురించేమీ తెలీదు.. ఒకేలా కనిపించాయి కదా అని ఒక బాక్స్ లో పెట్టేస్తావు.”

“ఓ! ఒకేలా కనబడితే వాటిని వేరే వేరే బాక్సుల్లో పెట్టి, కొన్ని వంటిట్లో నా పోపుల డబ్బా పక్కన, ఇంకొన్ని బాత్రూం లో మీ షేవింగ్ కిట్ కింద పెట్టాలి కాబోలు!”

“ఛ నీకంతా వేళాకోళమే.. అయినా ఆ బండ పనులు నీకు చెప్పడం నాకిష్టంలేదు.”

“అవును! జీడిపప్పు, బాదాం పప్పు వేరుచేసినట్లు ఒక చోట కూర్చుని ఆ నట్లూ బోల్ట్లూ వేరు చేయడం బండ పని.. ఇల్లంతా వాక్యూం చేసి, మాప్ చేయడం.. తళతళాలాడేలా బాత్రూం లు తోమడం నాజూకు పని!”

“నట్లూ, బోల్ట్లూ నా! అసలు వాటి విలువ తెలుసా నీకు!”

“విలువేమో కానీ వయసు మాత్రం బాగా తెలుసు! మా అమ్మమ్మ బారసాలప్పుడు తయారు చేసినవేమో అవి!”

“వాటినే యాంటీక్స్ అంటారే పిచ్చిమొహమా!”

“ఓ యాంటీక్ స్క్రూ డ్రైవర్, రెంచ్ లూ కూడా ఉంటాయన్నమాట.. ఎప్పుడో మీరు లేని రోజు చూసి వేలం వేసి పడేస్తా!”

“ఓయ్ అంతపని చేశేవు.. మళ్ళీ తర్వాతెప్పుడో నా మీద కోపమొచ్చి నువ్వు తట్టాబుట్టా సర్దుకునెళ్ళిపోతే నీకు రావాల్సిన భరణం నువ్వే పోగొట్టుకున్నట్లుంటుంది!”

“ఛ అదేం కాదు.”

“నాకు తెల్సమ్మా.. ఎప్పటికీ నీ తోడూ నీడా నేనే అనుకుంటావని.. నన్నొదిలి వెళ్ళవనీ.”

“గాడిద గుడ్డేం కాదూ!ఆ పాత ఇనప సామాను ఇస్తారా నాకు భరణం కింద!”

“నువ్వు చాలా ఎదిగిపోతున్నావే!”

“బాబూ, ఈ గొడవంతా ఎందుకుగానీ మీ పని మీరు చేసుకోండి.. ఏవో తంటాలు పడి ఇంట్లో పనంతా నేను చేసుకుంటాను.. ఏదో మన గెస్ట్ లు వచ్చేది ఎల్లుండే కదా, రేపొక్కరోజు తప్ప పనంతా చేయడం కుదరదని మీమీద ఆశ పెట్టుకున్నాను.”

“వాళ్ళు గెస్ట్ లేంటి.. మన ఇంట్లో వాళ్ళే కదా.. వాళ్ళొస్తుంటే కూడా సర్దడం అవసరమా? అయినా పోయిన శనివారమే కదా క్లీన్ చేశాము!”

“నిజమే మరీ ప్రతీ వారం ఎందుకులేండీ ఇల్లు తుడుచుకోవడం.. సీజన్ కోసారి చేసుకుంటే సరిపోతుంది.. సర్లే నాకు నిద్రొస్తోంది.. పడుకుందామా?”

“నువ్వెళ్ళు నేను కాసేపు క్రికెట్ చూసొస్తాను.”

*******

“గుడ్ మార్నింగ్ హనీ, బ్రేక్ ఫాస్ట్ బయటనించి తీసుకురానా?”

“అక్కర్లేదు, దోసెలు పిండి ఉంది.”

“ఆ మళ్ళీ అంతసేపు నించుని ఏం వేస్తావులే.. అసలే మనకి చాలా పనుంది ఈ రోజు.”

“ఆమాటేదో నిన్న రాత్రి టూల్సూ వాటి విశిష్టత గురించి మాట్లాడుతునప్పుడే చెప్పొచ్చు కదా.. పొద్దున్నే లేచి ఆ కొబ్బరి పచ్చడి చేసిన టైంని వేరేదానికి వాడుకునేదాన్ని!”

“ఎలా అయినా టైం మేనేజ్మెంట్ నీదగ్గర నించే నేర్చుకోవాలి.. అవునూ, అదేం వర్డ్ హనీ, ‘విశిష్టతా’.. భలే ఉందే! అర్ధం ఏమిటంటావ్?”

“ఓవర్ యాక్షన్ తో పొద్దున్నే వికారం తెప్పించకండి.. మీరు మీ గరాజ్ లోకి కదిలితే నేను దోసెల పని కానిస్తాను.”

“సరే సరే.. ఓ కప్పు కాఫీ తీసుకుని I’ll be out of your way.”

********

“ఇదేంటీ, నానారాకాల టూల్సూ, వాటికి సంబంధించిన డబ్బాలూ నేలంతా పరిచేశారు? నాకైతే సర్దుతున్నట్లనిపించడం లేదు.. ప్లే ఏరియాలో ఆడుకుంటున్నట్లుంది!”

“చూశావా! ఎంత పని ఉందో చూడు.. చెప్తే అర్ధం చేసుకోవు.”

“అదేంటీ, ఎందుకలా వాటన్నిటినీ అలా మూలకి తోస్తున్నారు?”

“కింద డర్టీగా ఉంది.. ఒకసారి గబగబా ఊడ్చేసి అప్పుడు సర్దడం మొదలుపెడతాను.”

“ఓ అవన్నీ కింద పరిచాకగానీ మీకర్ధం కాలేదా నేలంతా దుమ్ము ఉందని?!”

“అబ్బా! నా పని నన్ను చేసుకోనీ.. మధ్యలో నీ నసేంటి.. నేనెలాగో చేసుకుంటాను కానీ నీ పని నువ్వు చేసుకో వెళ్ళి.”

“….చేసేదేం లేదు కానీ మళ్ళీ ఆ కోపమొకటి!”

**********

(ఒక ఇరవై నిమిషాలయ్యాక..)

“బంగారాలూ, ఏం చేస్తున్నావే?”

“ ……”

“నిన్నే హనీ.”

“విషయం చెప్పండి!”

“డిన్నర్ ఇటాలియన్ ఆర్డర్ చేసుకుందామా?”

“పొద్దున్నపదకొండింటికి డిన్నర్ సంగతెందుకుగానీ అసలు విషయం చెప్పండి.. నాకు పని ఉంది.”

“అదేదో నీ బాక్స్ అనుకుంటా, ఫ్లవర్ వేజ్ లా ఉంది.”

“అవును, మా కోవర్కర్ బర్త్ డే గిఫ్ట్ అది.. ఉండండి కార్లో పెట్టేసుకుంటాను.”

“అది కాదు బంగారాలూ.. బాక్స్ పైన బొమ్మ చూస్తే యాష్ ట్రే లా కనిపించింది.”

“ఫ్లవర్ వాజ్ మీకు యాష్ ట్రే లా అనిపించిందా?!?!”

“అంటే కరెక్ట్ గా అలానే కాదనుకో.. కానీ తీసి చూస్తే పోలా అనిపించి బయటకి తీసి చూశాను.”

“అప్పుడైనా మీ సందేహం తీరిందా? ముందది కార్లో పెట్టేయండి మహానుభావా!”

“అక్కడికే వస్తున్నా.. చూసి పక్కన పెట్టి మళ్ళీ నా పనిలో పడిపోయాను.. అంతలో చేయి తగిలి పడింది..”

“ఏంటీ!! పడిందా? పగిలిందా??”

“పూర్తిగా పగల్లేదనుకో.. జస్ట్ గ్లాస్ క్రాక్ అయింది.”

“జస్ట్ క్రాక్ అయిందా! ఇంక అదెందుకు పనికి వస్తుంది.. అసలు మీ పని మీరు చూసుకోక నా వస్తువుల జోలికి ఎందుకు వెళ్ళారు??”

“ఎందుకలా అరుస్తావ్? ఏదో అక్కడుంది కదాని తీసి చూశాను.. నువ్వు ఎక్కడబడితే అక్కడ పడేసి ‘ఎందుకు తీశావ్.. ఎందుకు చూశావ్’ అంటే ఎలా? అయినా ఇల్లంతా సరిపోలేదా? ఈ వేజ్ లూ బొచ్చెలూ తెచ్చి తెచ్చి గరాజ్ లో పెట్టడానికీ?”

“అంటే గరాజ్ లో మీ వస్తువులొక్కటే ఉండాలా?”

“అలా అన్నానా? అదేదో జాగ్రత్తగా పక్కన పెట్టుకోవచ్చుగా?”

“నిజమే, మా ఇంట్లో మూడు పదులు దాటేసిన ముక్కుపచ్చలారని పసిపిల్లాడు ఉన్నాడు, వస్తువులన్నీ అందకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్న విషయం నేనే మర్చిపోయాను.”

“అదిగో ఇప్పుడు నేనేమన్నాననీ అంత కోపం?”

“మీతో నాకు వాదనలొద్దుగానీ నేను కాసేపు బయటికెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకుంటాను.”

“సరే.. ఎదో ఒకటి చెయ్యి.. నా పని ఎక్కడిదక్కడే ఉంది.”

**********

“హల్లో హనీ! ఇంకా రాలేదే! మిస్సింగ్ యు, యూ నో!”

“మళ్ళీ ఏం కావాలీ?”

“అసలు సిసలు బెటర్ హాప్ఫ్ నువ్వే హనీ,నా అవసరాలన్నీ టక్కున పట్టేస్తావ్.”

“సుత్తాపి విషయం చెప్పండీ.”

“ఏం లేదు, ఇంకా స్టొర్ లోనే ఉన్నావా?”

“అవును.. ఏం?”

“నీ లంచ్ సాలడ్స్, అలానే ఫ్రూట్స్ తెచ్చుకోవడం మర్చిపోకు.. ఇప్పుడు ఫ్రెష్ గా పైనాపిల్స్ వస్తున్నాయి.”

“అదే చేత్తో మీకోసం ఓ పనసకాయ కూడా తెస్తున్నా!”

“పనసకాయా? ఎందుకూ? పప్పులో వేస్తావా?”

“లేదు ఊరగాయ పెడతాను.. ఇంతకీ అసలు సంగతి చెప్తారా?”

“ఏం లేదు, కాస్త నా బీర్ తీసుకు రా ప్లీజ్”

“బీరా! ఐ కాంట్.. నా ఐడీ ఇంట్లోనే వదిలేసొచ్చాను”

“సో…. నిన్నెందుకు ఐడి అడుగుతారు?”

“అంటే?”

“చిన్నపిల్లలా కనిపిస్తే డౌటొచ్చి ఐడి అడుగుతారు హనీ!”

“అదే, మీ ఉద్దేశ్యం ఏంటీ అని?!”

“అంటే నువ్వు… ఓ.. ఓ.. మై! ఛ నా ఉద్దేశ్యం అస్సలది కానే కాదు.. ప్లీజ్.”

“హ్మ్మ్.. బీరొక్కటేనా? ఇంకో ఐదునిమిషాలాగి ‘అగ్గిపెట్టె హనీ’ అని మళ్ళీ కాల్ చేస్తారా?”

“నాకింకేమీ అక్కర్లేదు కానీ నువ్వు ఐస్క్రీం కూడా తెచ్చుకో.. చాలారోజులైంది తిని పాపం.”

“నేను ఏమేమి ఎన్నెన్ని రోజులు తింటున్నానో గమనిస్తున్నారన్నమాట! గుడ్ టు నో! ఇంక ఉంటా!”

********

“ఇంకా సర్దడం అవ్వలేదా?”

“ఇంకెంతసేపు.. ఇదిగో అలా sort చేసి ఇలా సర్దేస్తాను.”

“నేను బయటకెళ్ళినంత సేపూ ఏం చేశారు?!”

“జేన్ ఏదో హెల్ప్ కావాలంటేనూ వాళ్ళింటికెళ్ళి చేసొచ్చాను.”

“ఆవిడొచ్చి అడిగిందా?”

“లేదే పాపం ఆవిడెందుకు అడుగుతుంది? డాగ్ ని వాక్ కి తీసుకెళ్తుంటే చూసి నేనే పలకరించి అడిగాను, ఏమన్నా పనుంటే చెప్పమని.”

“మీరే అడిగారా????”

“అవునే, పాపం ఈసారి మనకి క్రిస్మస్ గిఫ్ట్ అందరికంటే ముందే ఇచ్చేసింది కదా! అందులో పెద్దావిడ కూడా”

“………..”

“అంత కోపమెందుకు? చిన్న పనే.. డెకరేషన్ లైట్లేవో సరిచేయాల్సొచ్చింది.”

“వాటెవర్.. ఇంకా ఇంట్లో సగం పని అలానే ఉంది.. చివర్లో కాస్తన్నా చెయ్యేస్తారా?”

“నువ్వలా వెళ్ళి చేస్తుండు.. అరగంటలో వచ్చేస్తా.”

*************

“హనీ.. హనీ.. ”

“Is that you? Where are you?”

“I’m here at Chris’s place, can you please pass the flash light I bought the other day?”

“what the !@#$%, అక్కడేం చేస్తున్నారూ?”

“అమ్మో, అదేంటే అలా బూతులు తిడతావ్? వీడి టివి సౌండ్ పనిచేయడంలేదంట.. కాస్త చూడమని కాల్ చేశాడు.”

“అదే మరి! తమరు మన కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ మానేజర్ కదా.. ఒక నిమిషంలో అక్కడ వాలిపోయుంటారు!”

“అది కాదే, పాపం ఇంకాసేపట్లో పేట్రియాట్స్-రెడ్ స్కిన్స్ గేం ఉంది… అందుకే వచ్చాను.”

“ఇంకేం తమరు కూడా గేం చూసి, అక్కడే తిని, తొంగోండి.”

“అంత విసుగెందుకు చెప్పు.. కాస్త ఆ ఫ్లాష్ లైట్ నా మొహాన పడేస్తే వెళ్ళి ఒక్క నిమిషంలో వాడి పని చూసొస్తాను.”

“మీతో ఇక మాటలనవసరం.”

“అమ్మో, పడెయ్యమంటే నిజంగానే అలా విసిరేశావేంటీ!!”

*************

“ఇవాళ డిన్నర్ సంగతేంటీ?”

“ఇటాలియన్ అని తమరే సెలవిచ్చారుగా!”

“అబ్బా, ఇప్పుడు ఆ బయట ఫుడ్ మీద అస్సలు మూడ్ లేదు.. చక్కగా ఇంట్లోవే తినేద్దాము.. ఫ్రిజ్ లో ఏమేం కూరలున్నాయి?”

“గుత్తి గుమ్మడికాయ.. బగారా బంగాళదుంప.”

“you mean no proteins!!!”

“sorry, మర్చిపోయా.. ఆ డబ్బాలో కిలో కందిపప్పు కూడా ఉంది!”

“పొద్దున్నించీ పనిచేసి అలిసిపోయిన మొగుడికి చక్కని చికెన్ కూరతో తిండి కూడా సరిగ్గా పెట్టలేవన్నమాట!”

“…….”

“అదేంటీ, అంత కోపం!! btw, కోపంలో నీ ఫేస్ అస్సలు బాగోదు.. యాక్.”

“whaaaat!!!”

“am just being honest. నేను ఏమన్నా నీ మంచి కోసమే హనీ!”

“……..”

“ఇంకా కోపమేనా? చెప్పా కదా నేను చేసేవన్నీ నీ మంచి కోసమే అని!”

“ఇంటెడు పని నామీద పడెయ్యడం నా మంచి కోసమా?!?!”

“మరి! నామీద కోపంతోనే కదా అన్ని పనులు.. అవసరమైనవీ, అవసరంలేనివీ టకటకా చేసేసుకున్నావ్.. ఇక నీకు వారం వరకూ ఎక్సర్సైజ్ అవసరం లేదు.. మన గెస్ట్స్ వెళ్ళేవరకూ నీ Curves జిమ్ము మొహం చూడక్కర్లేదు. అసలు నీ curves కి ఏం తక్కువైనాయని మళ్ళీ ఆ జిమ్ముకి పడీ పడీ వెళ్తావ్?”

“తక్కువై కాదు ఎక్కువై వెళ్తున్నా!”

“Seriously honey, you look perfect.”

“ఇప్పుడే ఏదో యాక్.. థూ.. ఛీ.. అన్నట్లు గుర్తు?!”

“అబ్బా, అది కాదు కానీ పొద్దున్న నేను మధ్యలో ఏదో పని మీద ఇంట్లోకొచ్చినప్పుడు హగ్ చేసుకోలేదూ? ఎందుకూ, క్యూట్ గా కనిపించావనే కదా?”

“అప్పుడు నేను బాత్రూం సింక్ లు కడుగుతున్నట్టు గుర్తు!”

“మల్లెపూలూ, తెల్లచీరా కట్టుకున్నప్పుడు బావున్నావని లొట్టలేస్తూ అందరూ చెప్తారమ్మా!”

“జిడ్డోడుతున్నప్పుడు చెప్పడమే మీ స్పెషాలిటీ అంటారు!”

“నిజం హనీ, అలా పనులన్నీ చక చక చేసేస్తూ, ఇంటి మహరాణిలా కనబడుతుంటే ఎంత ముద్దొస్తావో తెలుసా?”

“చిన్నప్పుడు చందమామలు చదవని ఎఫెక్ట్ అన్నమాట! లేకపోతే మహారాణి చేత బాత్రూం సింక్ లు కడిగించేవారా?”

“అప్పుడు చదవకపోతేనేం.. ఇప్పుడు నువ్వు చెప్పు, రోజూ రాత్రి పడుకునేప్పుడు.. నా మహారాణిని ఎంతబాగా చూసుకోవాలో నేర్చుకుంటాను”

“(చిరునవ్వు)”

“wow! ages అయినట్లుంది నీ నవ్వు చూసి!”

“వీటికేం తక్కువలేదు.. పనంతా నాతో చేయించి చివర్లో ఇలా బటర్ పూయడం”

“అది కూడా ‘I can’t believe it’s not Butter’ హనీ”

“(నవ్వు)”

“బైదవే, పొద్దున్న జేన్ వాళ్ళ పోర్చ్ మీద లైట్స్ ఫిక్స్ చేస్తుంటే ఆవిడ నీకో కాంప్లిమెంట్ ఇచ్చింది”

“ఏంటంట”

“నువ్వు చాలా లక్కీ అంట”

“ఎందుకో?”

“ఇంకెందుకూ, నాలాంటి అన్ని పనులూ తెల్సిన హజ్బెండ్ దొరకడం వల్ల”

“(!$%#^*(!@#(*$^)”

“అదిగో మళ్ళీ ఆ ఫేసేంటీ.. అలా?!?! సర్లే, ఇప్పుడు ఆవిడ సంగతెందుకు గానీ గుత్తి పనసకాయ కూరేదో ఉందన్నావు కదా, దాంతో తినేద్దాం.. ఇవాళ్టికి ప్రోటీన్స్ వద్దులే.. సరేనా?”

“………………………………………………………………………………………………………”

మిషన్ నిద్ర

కిం కర్తవ్యం అతణ్ణి నిర్దాక్షిణ్యంగా లొంగదీసుకోవడం. అతని మస్తిష్కాన్ని నిస్తేజం చేసి, శరీరాన్ని నీరసింపజేసి, కంటినిండా నిండి, రెప్పలను బరువెక్కించి, మెడలు వంచి, నిద్ర పుచ్చాలి. అదీ నా మిషన్!

“హే, అతణ్ణి చూడు!” అన్న మాటలు అతడి చెవిన పడ్డాయి; మ్రోగుతున్న గుడిగంటలు, వాహనాల రణగొణధ్వనులు, పాపాయి ఏడుపుతో సహా.  అప్పటివరకూ, ఖాళీగా ఉన్న వెనుక సీటును పూర్తిగా ఆక్రమించేసుకొని, బైక్ హాండిల్ మీద తల వాల్చినవాడల్లా, ఇప్పుడు ముందు సీటులో నిటారుగా  కూర్చొని, నన్ను  వదిలించుకోడానికి ప్రయత్నిస్తూ, కంటి కొస చివర్నుండీ ఇందాక ఆ మాటలు అన్నది ఎవరా అని గమనించడానికి ప్రయత్నించాడు. ఆటోలో ఒక ఆడపిల్ల తాలూకూ ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఆమె పక్కన ఉన్నది ఆడో మగో తెలీటం లేదు, కాని ఇద్దరూ ఇటుకేసే చూస్తున్నారని స్పష్టమయ్యింది అతడికి. మరింత నిటారుగా కూర్చోడానికి ప్రయత్నిస్తూ, గుచ్చుకుపోతున్న కళ్ళతో  ట్రాఫిక్ సిగ్నల్ పైన కనిపిస్తున్న అంకెలను చూసాడు. ఇంకా ఇరవై సెకన్లు ఉన్నాయని గ్రహించి, నేలపై కాలు ఆన్చి,  బండిని కాస్త కాస్తగా వెనక్కి నెడుతూ, వెలుగుతున్న వీధి దీపం కింద ఏర్పడ్డ నీడలోకి చేరుకున్నాడు.  ఇంకో పది సెకన్లో పచ్చ రంగు వెలగబోతుంనగా  గట్టిగా ఊపిరి పీల్చుకొని, నన్ను పూర్తిగా వదిలించుకోడానికి బలంగా తల విదిలించాడు. పట్టుజారిపోతున్నా పట్టు విడవకుండా నేనతణ్ణి పట్టుకొని ఉన్నాను. గ్రీన్ సిగ్నల్ వచ్చీ, రాగానే అతను ముందుకు పోయాడు, నన్ను వెనక్కి నెడుతూ. ట్రాఫిక్ లేని దారుల్లో రయ్యమంటూ దూసుకుపోయాడు. కంట్లో కుదరక, నేనతని లోపల ఎక్కడో నక్కాను.

ఇంటికి చేరుకున్నాం. అసలైతే ప్రతి రాత్రి ఆరేడు గంటలైనా మేం కలిసి ఉండాలన్నది ఎప్పుడో నిర్ణయించబడింది.   అలాంటిది అతనూ, నేను కలవక ఇదప్పుడే మూడోరాత్రి. ఇప్పటికైనా నన్ను దరిచేరనివ్వక ఒప్పందం ఎలా ఉల్లంఘిద్దామా అని ఆలోచిస్తునట్టున్నాడు. ఈ పూట నేను వదలదల్చుకోలేదు. ప్రతి రాత్రీ వచ్చి, నిద్రపుచ్చడానికి రాత్రంతా శ్రమించి, నిర్లక్ష్యానికి గురై, తెల్లారినా వదిలి వెళ్ళలేక, రోజంతా ఆ జీవితోనో వేలాడ్డం నాకెంత నరకమో మీరు ఊహించగలరా? దీనికన్నా ముప్పొద్దులా నిద్రపోయేవాడు మేలు గద, కనీసం పని సఫలం అన్న తృప్తి అన్నా ఉంటుంది.  అదే మీ బాస్ మిమల్ని రాత్రనకా, పగలనకా పని ఇచ్చీ ఇవ్వకుండా, ఆఫీసులోనే ఉండిపోమంటే మీరెలా తిట్టుకుంటారంట! మీ మీ ప్రియురాళ్ళూ, భార్యల దగ్గర కిమ్మనకుండా ఉంటారే. అర్రే! మీ మేలు కోరు మీ దరి చేరితే, నన్ను ఇంత నిర్దయగా చూస్తారేం?! మీకెప్పుడూ మీకున్న గొడవల గొడవే! మీకు వాటిల్లిన నష్టాలకూ, జరిగిన నేరాలకూ, తీరని కోరికలకూ ఏ పాపం తెలీని నన్ను బలిస్తారు. ఏ సమస్య తలెత్తినా, తిండి మీదో, నా మీదో ప్రతీకారం తీర్చుకోవడం పరిపాటి మీ మనుషులకు. ఆకలి నాకన్నా కాస్త బలమైంది కాబట్టి, దాని దగ్గర మీ ఆటలు ఎక్కువ సేపు సాగవు. ఎంతో కొంత సర్దుకుపోయే అలవాటుంది నేనే కనుక, దాన్ని అలుసుగా తీసుకొని  నన్ను కాస్త కాస్త తగ్గిస్తూ, దూరంగా తోసేస్తారు. కాలేజీల్లో పరీక్షలు బాగా రాయాలనుకుంటూ, టీ కాఫీలతో నన్ను నిద్రపుచ్చుతారు. ఇహ, జీవితం ఇచ్చే ప్రశ్నాపత్రాలకు బదులివ్వలేక, ఆ అసహనాన్ని నా మీద ప్రయోగిస్తారు.  వలపుల్లోనూ, విరహాల్లోనూ, వియోగాల్లోనూ నాకు దూరడానికి సందు కూడా ఇవ్వరు.  హమ్మ్.. నేను కూడా ఏంటి? మీ మనుషుల్లాగా దండుగ మాటల మీద పడ్డాను. కిం కర్తవ్యం అతణ్ణి నిర్దాక్షిణ్యంగా లొంగదీసుకోవడం. అతని మస్తిష్కాన్ని నిస్తేజం చేసి, శరీరాన్ని నీరసింపజేసి, కంటినిండా నిండి, రెప్పలను బరువెక్కించి, మెడలు వంచి, నిద్ర పుచ్చాలి. అదీ నా మిషన్!

“రాజ్.. రాజ్”.

“రా…జ్….”

“ఏంటి? వంట్లో బాలేదా?” అంటూ మంచం మీద జారిపోయిన భుజాలతో కూర్చున్న  అతడి నుదుటి మీద చేయి వేసి చూసింది. వంటి వేడి సరిగ్గానే ఉండడంతో, తల నిమిరి,  “త్వరగా ఫ్రెషప్ అయ్యి రా, భోం చేద్దాం!” అంది.

పురుషుణ్ణి మెల్లిగా ఆవహించటం మొదలెట్టేసాను కాబట్టి, అన్నీ వినిపిస్తున్నా, సమాధానం చెప్పాలనిపిస్తున్నా, అతని వల్ల కాదీ క్షణాల్లో..

“నాకు విపరీతంగా నిద్ర వస్తుంది. భరించలేనంత. నువ్వు నమ్మవూ……. ” అంటూ ఏదో చెప్పబోయి మర్చిపోయినవాడిలా ఆమెకేసి చూశాడు. “ఏంటి?” అన్నట్టు చూస్తూ తల నిమిరింది. నుంచున్న ఆమెను చేతుల్లో చుట్టి  దగ్గరకు తీసుకున్నాడు. పల్చటి వస్త్రం చాటున సుతిమెత్తని శరీరాన్ని చెంపకు తాకుతోంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఊయలగా మారాయి. ఆమె లాలనగా అతని చెవి వెనుక జుట్టులో వేళ్ళు జొప్పించి నిమరడం మొదలెట్టింది. కళ్ళు మూసుకొని  ఆదమరుస్తున్న అతడి మీద కసితీరా పంజా విసిరాను. దుప్పటి కొస ముక్కుకు తగిలి క్షణకాలం మెదిలి, మళ్ళీ సర్దుకొని పడుకునే పసిపాపడిలా కదిలాడు. కొన్ని నిముషాలకి పెద్దగా చప్పుడు వచ్చింది. అతడికి వినిపిస్తున్నా పట్టించుకోలేదు.  మరి కాసేపటికి మళ్ళీ శబ్దం వినిపించింది. అయినా అతడిలో చలనం లేదు. మూడో సారి శబ్దం వచ్చేసరికి, ఆమె ఒక్క ఉదుటున అతణ్ణి విడిపించుకుంది.

“కుక్కర్ అయ్యిపోయింది.. కూర పది నిముషాల్లో చేసేస్తాను. ఈ లోపు ఫ్రెష్ అయ్యి రా”

“ఐ నీడ్ స్లీప్.. బాడ్లీ” – కొత్త పరిశోధన ఫలితం ప్రకటించినట్టుగా చెప్పాడు.

“నాకు అన్నం వద్దు.. ఏమీ వద్దు.. ఐ జస్ట్ నీడ్ స్లీప్.. నథింగ్ బట్ స్లీప్” అని గొణుక్కుంటూ బాత్‍రూంలోకి దూరాడు.

ఇప్పుడతను షావర్ కింద నిలబడతాడు. వేన్నీళ్ళ వంటిమీద పడగానే బడలికంతా మర్చిపోతాడు. ఓ గంట సేపు జలకాలాడి నూతనోత్సాహంతో బయటకొస్తాడు. అప్పుడిక కుటుంబసభ్యులతోనే, వదిలిన వచ్చిన పనితోనో, టివితోనో గడిపేస్తూ, ఓ పక్క తెల్లారిపోతుండగా నామమాత్రంగా వచ్చి పడుకుంటాడు . ఈ పూట ఈ కుట్ర సఫలం కాకుండా నేను జాగ్రత్త పడాలి. షవర్ తెరవడానికి దాన్ని కుడి వైపుకి తిప్పబోతుండగా నేను అతణ్ణి బలంగా పూనాను. నా దాడి ప్రభావం వల్ల, చేతుల్లో చేవ చాల్లేదు. నాకు ఉత్సాహం వచ్చింది. మరింత విజృభించాను. అతడి కంటిరెప్పలు మెల్లిమెల్లిగా వాలేసరికి షావర్ కూడా మెల్లిమెల్లిగా కనుమరగయ్యిపోయింది. కళ్ళు పూర్తిగా మూతపడిన క్షణాన,  ాడు. రెప్పల చాటున అలుముకుంటున్న చీకటిలో షావర్ తెరవబోయిన అతని చేయి కాసేపు స్పష్టంగా కనిపించి, మెల్లిగా కరిగిపోయింది. ఇదే అదననుకొని నేనతడి వళ్ళంతా పాకుతూ నరనరాల్లో నిస్సత్తువును నింపాను. చైతన్యం నశిస్తోంది. నా మైకం తీవ్రత వల్ల అతని ఒళ్ళు కంపించినట్టయ్యింది, లో వోల్టేజి వల్ల టివిలో బొమ్మ ఊగినట్టు. తూలాడు. షావర్ ని గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల అది తెర్చుకుంది. టపటపా నీళ్ళు అతని తల మీద పడ్డం మొదలవ్వగానే, అతనికి పూర్తిగా మెలకువ వచ్చేసింది. కొంచెం నీరసంగానే, నన్ను విదిలించుకున్నాడు. స్నానం చేస్తున్నాడు. అది పూర్తయ్యేవరకూ నేనూ ఆగాలి.

స్నానం చేసొచ్చి, డైనింగ్ టేబుల్ దగ్గరకు అతి కష్టం మీద చేరుకున్నాం. నేనెక్కడా కాస్త వదులు కూడా ఇవ్వటం లేదు. అన్ని వైపుల నుండీ పకడ్బందీగా చుట్టుముట్టడం వల్ల కుర్చీలో కూర్చొని కంచాలు పెట్టుకొనే చోటే తల వాల్చాడు. నేను దాడి తీవ్రతరం చేయబోతున్న సమయంలో, ఆమె ఘుమఘుమలాడుతున్నదేదో తీసుకురావడంతో అతనిలోని ఆకలి నిద్రలేచింది.

“ఇదో, అన్నం తినను అన్నావ్ గా.. అందుకే సూప్! ఇది తాగేసి, సలాడ్ తినేసి, బజ్జో, సరేనా?” ఆమె మాటలు వినిపిస్తున్నా, బదులివ్వడానికి సమయం పట్టింది.

“ఏంటో.. పాడు నిద్ర! రెప్పను రెప్పకు దూరం చేయడం నా వల్ల కావటం లేదు.”

“కమాన్.. నువ్వు నిద్రపోయి మూడు రాత్రులవుతుంది. ఇవ్వాళ త్వరగా వచ్చావు కాబట్టి, త్వరగా నిద్రపో!” అని ఆమె అనేలోపే, అతని సూప్ తాగేయడం అయ్యిపోయింది.

“నాకింకేం వద్దూ” అంటూ ఆమె దగ్గరగా వెళ్ళి “గుడ్ నైట్” అని చెప్పేసి గదిలోకి నడిచాడు.

మంచం మీద ఎలా పడిపోయాడో అతనికేం తెలీదు. అతను నాకు లొంగిపోవడానికి పూర్తి సహకారం ప్రకటించేయడంతో నా పని సులువయ్యింది. దొరికిందే సందని నేనూ అతనికేం తోచనివ్వలేదు. మరో ఆలోచన లేకుండా, పాపం నీరసపడున్నాడు గా, అచేతనావస్థలోకి జారిపోయాడు.

ఈ మనిషిని ఇక్కడ దాకా తీసుకురాగలిగాను అంటే, బ్రహ్మాండమే! కాని ఇలా నిరాటంకంగా కనీసం ఒక ఐదారు గంటలు గడవాలి.  అప్పుడుగాని నేను పనిజేసినట్టు లెక్కలోకి రాదు. ఏదీ? కిటికీ నుండి ఎవరో గట్టి గట్టిగా పోట్లాడుకుంటున్న శబ్దాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇతడికి మెలకువ వచ్చేస్తే?! హయ్యో! ఎలా? హమ్మయ్య.. ఆమె వచ్చింది.  కిటికీ తలుపులు మూసేసి, ఏసి ఆన్ చేసి, అతడికి దుప్పటి కప్పి, గదిలో దీపాలన్నీఆర్పి, తలుపు దగ్గరగా జార్చి వెళ్ళిపోయింది.

ఓ గంట గడిచింది. అతడు మంచి నిద్రలో ఉన్నాడు. నేనూ కాస్త వెనక్కి జారబడి, కాస్త ఊపిరి పీల్చుకుందాం అనుకున్నాను. ఇంతలోపు ఆమె గదలోకి వచ్చింది. వచ్చి బెడ్ లాంప్ వేసి, అతడి పక్కన పడుకుంది. పడుకొని, మసక వెలుతురులో అతడికేసే చూస్తుఎసి శబ్దాలు, వారిద్దరి ఊపిర్లూ తప్ప మరో శబ్దం లేదు. అతడికి మరింత చెరువుగా జరిగింది, జరిగి, దుప్పటి కిందకు తీసింది. తీసి, షర్ట్ మధ్యలో నుండి అతడి ఛాతీ పై చేయి వేసింది. వేసి.. ఇంకా ఏమీ చేయటం లేదు. ఏం చేస్తుందోనని ఊపిరి బిగబెట్టుకొని చూస్తున్నాను. ఇప్పటిదాకా నేను పడ్డ శ్రమ మీద నీళ్ళు చల్లదు కద! ఆమె అతడి ఛాతీపై నుండి చేయి తీయకుండానే వెనక్కి తిరిగి బెడ్ లాంప్ ఆపి, అతడికి దగ్గరగా జరిగి, ఒద్దికగా పడుకుంది. ఆమె వెంట్రుకలు అతడి చెంపల్ని తాకీ తాకనట్టు కదులుతున్నాయి. కాసేపటికీ ఆమె కూడా నిద్రపోయింది. గండం గడిచింది అనుకున్నాను.

ఇంకో రెండు గంటలు, అంతే! అవిగానీ పూర్తయితే, నేను చేసిన యజ్ఞం దాదాపుగా పూర్తవుతుంది. వరుసగా మూడు రోజుల విఫలయత్నాల తర్వాత, ఈ పూట ఈ మాత్రం అయినా సఫలం అయ్యాను అంటే మహదానందంగా ఉంది. ఏట్లాగో, మరో రెండు గంటలు, కాదు, ఐదు నిముషాల తక్కువ రెండు గంటలు గడిచిపోతే, ఆ పై ఏమైనా నాకేం నష్టం లేదు.

కాసేపటికి – ఎంత సేపటికో ఖచ్చితంగా చెప్పలేను- ఏదో చప్పుడవుతున్నట్టనిపించింది. సుదూర తీరాల నుండి వస్తున్న అలికిడి, ప్రయాణపు బడలిక వలన నీరసించిన స్వరంతో కర్ణభేరిని సుతారంగా తాకీ తాకనట్టు తాకి, జారుకుంటుంది. సుధీర్ఘ విరహానంతరం కలిసిన ప్రేమికుల ఆలింగనంతో, అంగుళం కూడా దూరం కాలేని దేహాల వలె కంటి రెప్పలను విడిపోనివ్వకుండా నేను పట్టుంచాను.

ఇంకాస్త చప్పుడయ్యినట్టుంది. ఇంకా అవుతోంది? ఏంటీ అలికిడి? శబ్ధం నిజంగానే హెచ్చిందా? లేక నా మీద అతడి మెదడు చేసే కుట్రా? “ఎక్కడోలే..” అనుకుంటే పోతుందనుకున్నాను.

”లేదు.. ఇక్కడే! సమీపానే! ఈ ధ్వని కూడా తెల్సినట్టే ఉంది. ఏమై ఉండచ్చు?’ – నేను భయపడుతున్నట్టే అతడి ధ్యాస అటుగా మళ్ళింది.

ఏదో ఆగాధంలో నుండి వస్తున్నట్టున్నాయి ధ్వనులు. చెవిని చేరేసరికి కొనూపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. తమ ఉనికిని నిలబెట్టుకోడానికి విశ్వప్రయత్నం చేస్తూ కర్ణభేరిని కదిలించలేక ఊసూరుమంటున్నాయి. చేజిక్కిన ఉగ్రవాది ఉరితీయకుండా, ప్రాణం నిలిపి పాలు పోస్తే ఏనాటికైనా పుట్ట దగ్గరకు తీసుకుపోతుందనే ప్రభుత్వ విధానాన్ని “తధా ప్రజా” అంటూ పాటిస్తూ, ఆ ధ్వనుల గని చిరునామా తెలీకుండా పోదే అనుకుంటూ, శ్వాసను బిగబెట్టి, కరుడుగట్టిన నిశ్శబ్ధంగా మారి, శబ్దాలను వినడంపై అతని ధ్యాస కేంద్రీకృతమై ఉంది. నేను అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిదే! ఏమిటో ఆ శబ్దాలని నేనూ చెవులు నిక్కపొడుచుకొని వినడానికి ప్రయత్నించాను.

చెక్క కిర్రు కిర్రుమనే శబ్దం. ఇనుప రాపిడి శబ్ధం. కీచ్-కీచ్ అనే శబ్ధం. ఎవరో తలుపు కొడుతున్న శబ్ధం. నెటికలతో తలుపు కొట్టే శబ్ధమా అది? కాదు. అరచేతిని తలుపుకేసి బాదడమా? అది కూడా కాదే! అసలు ఎవరో ఒకరు తలుపు కొడుతున్న శబ్దమే కాదది. కానీ తలుపునుండే, తలుపు వలనే వస్తున్న శబ్దమది. ఎవరో తలుపు తడుతున్న శబ్ధం. ఏమయ్యుంటుందా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. “ఇక్కడుండి ఉజ్జాయింపులతో పని అయ్యేలా లేదు. శబ్ధం వస్తున్న దారినే ఎదురెళ్ళి చూడాలి.” అని అతడు ఆ దిశకేసి పోతున్నాడు. నేనూ అతణ్ణి అనుసరించాను.

దారి కరుగుతున్న కొద్దీ శబ్ద తీవ్రత పెరుగుతోంది. తలుపు నుండి వస్తుందన్న నా అనుమానం నిజమే! వెళ్ళగా వెళ్ళగా ఓ తలుపు కనిపించింది. చాలా పాత చెక్కతో చేసిన తలుపు. పైన ఇనుప గొలుసుల గొళ్ళెం. మధ్యన చెక్కతో చేసిన అడ్డు. ఏ చెక్కకా చెక్క ఏ క్షణాన అయినా ఊడుచ్చేస్తుందేమో అన్నంత బలహీనంగా ఉందా తలుపు. రెండో అనుమానమూ నిజమే! ఎవరూ తలుపు బాదటం లేదు. ఎవరో మాటిమాటికీ తలుపుకి తట్టుకుంటున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా చేసే ప్రయత్నం కూడా కాదనుకుంటా. ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక ఉబికివచ్చేయాలన్న ప్రయత్నఫలితం ఆ శబ్దాలు.

నేను ఊపిరి బిగబెట్టుకొని చూస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అతడిని నా ప్రభావం నుండి తప్పించుకునే వీలు కల్పించటం లేదు. కానీ ఈ శబ్ధాల తీవ్రత అతని ధ్యాసను ఆకర్షిస్తోంది. ఈ ఆకర్షణ ఏ విపత్తు తెస్తుందోనని నాకు భయంగా ఉంది.

ఆ తలుపేమిటో, దాని వెనుక ఏముందో నాకింకా తెలీటం లేదు. అతని కాళ్ళల్లో సన్నని వణుకు ప్రారంభమైందని గ్రహించగలిగాను. బహుశా, పొంచున్న ప్రమాదం తెలుసుకొని అతడు వెనుదిరుగుతాడేమోననిపించింది. కాని అతడు ఇంకాస్త ముందుకెళ్తున్నాడు. కోరి కోరి ఊబిలో అడుగేస్తున్న వెర్రివాడిలా అనిపిస్తున్నాడు. కానీ, నేను అతణ్ణి నివారించలేను. అతడు చుట్టూ కలియచూసి, చక్కలూ, కర్రలూ తీసుకొని తలుపుకి అడ్డంగా పెడుతున్నాడు, రానున్న ప్రళయాన్ని ఆపడానికి తలుపుకి ఊతం ఇస్తున్నాడు. మరో చెక్కముక్క కోసం చూస్తున్నాడు. వెనక్కి తిరిగాడు. ఒక్కసారిగా అతని గుండె వేగం హెచ్చింది. నరనరాల్లో రక్తం వేగం పుంజుకుంది. ఏమయ్యిందా అని తొంగి చూశాను.

దే…వు…డా!

అతడి వెనుక పెద్ద అగాధం. తలుపు నుండి అడుగు మాత్రమే నేల ఉంది, ఆ తర్వాతంతా లోతైన అగాధం. ఏముందా అని తొంగిచూశాడు. కళ్ళు గిర్రున తిరిగి, తలుపుకేసి తట్టుకున్నాడు. తలుపు ఏ క్షణంలోనైనా తెరుచుకునేలా ఉంది. మడం తిప్పటానికి కూడా చోటు లేదు. మడం పైకెత్తి, కాళ్ళ వేళ్ళ ఆసరాతో అక్కడ నుండి బయటపడదామని, కుడి అరికాలి ముందు భాగాన్ని ఈడ్చాడు. బల్ల చివర్న స్ప్రింగును నిలబెట్టి, దాని కిందిభాగాన్ని గట్టిగా పట్టుకొని, పై భాగాన్ని గాల్లోకి వంచినట్టు, అతను నేలపై ఆన్చిన అరికాలు తప్పించి, మిగితా శరీరమంతా గాల్లో తేలుతోంది. తిరగబడ్డ కళ్ళకు అంతా అగాధంగానే తోచింది. తలకిందులుగా గాల్లో తేలటంతో శరీరమంతా తేలిగ్గా అయ్యి, తల భరించలేనంత బరువుగా మారింది. ఏదైనా ఆసరా దొరుకుతుందేమోనని గుడ్డిగా గాల్లో చేతులు ఆడించడానికి ప్రయత్నించాడు. కుడి చేయి బిగుసుకుపోయి, పైకి లేవలేదు. ఎడమ చేతిని గాల్లో ఆడించాడు. ఆర్తనాదాలు చేయడం మొదలెట్టాడు, ఎవరైనా సహాయం చేస్తారేమోనని. అరచి అరచి గొంతెండిపోతోంది. శరీరంలోని ప్రతి భాగం నుండీ వెనక్కి వస్తున్న రక్తం అతని తలలో గడ్డకట్టుకుపోతోంది.

అతడింకా వేలాడుతూనే ఉన్నాడు. ఎదురుగా అన్నం, కూర ఉన్న కంచం కదలాడింది. దాన్ని పట్టుకోబోయాడు. ఇందాకటిలా చేతులాడిస్తుంటే, అతని వేళ్ళ కొసలకు మరేదో తాకింది. ఆగాధం అతణ్ణి అన్నివైపుల నుండీ ముట్టడిస్తోంది. తల్లకిందులుగా గాల్లో వేలాడుతూ అయినా సరే, బతికేద్దాం అనుకున్న అతనికి, ఆగాధం పూడుకుపోతూ తన్ని ఆక్రమించటం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అతడి గావుకేకలు పెట్టడం మొదలెట్టాడు. ఆగాధం మరింత మూసుకు పోతుంది. అతని చేతులని నిటారుగా చాచాడు. గాల్లో వేలాడుతున్న అతడి శరీరాన్ని ఇప్పుడు మట్టిని తాకుతోంది. అతని శరీరాన్ని నాలుగువైపుల నుండీ వస్తున్న మట్టిగోడ లాంటిది ఒత్తడంతో అతడు సత్వహీనుడయ్యాడు. అతడికి అంతం సమీపిస్తోందని తేటతెల్లమై, బిగ్గరగా అరిచాడు.

“రాజ్… రాజ్!” – ఆమె కంగారుగా పిలుస్తోంది. అతడింకా పలకటం లేదు. మూలుగుతున్నాడు. ఆమె చేతిలోకి అతడి చేయి చేరింది. ఇంకా మూలుగుతూనే ఉన్నాడు. మరో చేత్తో అతడి భుజాలను బలంగా కుదిపింది. గట్టిగా అరిచింది. మెలుకోని అతడికి ఆమె కంఠం కొత్త ఊపిరినిచ్చింది. అగాధంలో వేలాడుతున్నట్టే భ్రమలో ఉన్నా ఆమె చేతులను గట్టిగా పట్టుకొని, బయటకు రావటానికి ప్రయత్నించాడు. ఇహ, నేను పక్కకు తప్పుకోక తప్పలేదు. రెప్పలు వీడగానే, “రాజ్.. ఏమయ్యింది? ఏదీ, ఇటు చూడు” అంటూ అతణ్ణి పూర్తిగా మెలకువ వచ్చేలా చేసింది. అతడు లేచి కూర్చున్నాడు. ముందు అతణ్ణి కౌగలించుకొంది. కొన్ని నిముషాల తర్వాత గ్లాసుతో మంచినీళ్ళిచ్చింది. అతను గుటక వేయకుండా తాగడానికి ప్రయత్నించాడు, వంటి మీదంతా నీళ్ళు వలికిపోయాయి.

“ఆర్ యు ఓకే?” అంటూ అతణ్ణి ఆమె కౌగలించుకుంది, మళ్ళీ! అతడేమీ సమాధానం ఇవ్వలేదు. ఆమెను గట్టిగా పట్టుకున్నాడు ఈ సారి. భయాందళోనల వల్ల ప్రకంపించిన ప్రత్యణువూ, ఇప్పుడామె శరీరాన్ని ఆసరా చేసుకున్నాయి.

“ఏదో పీడకల వచ్చినట్టుంది… అంతే! ఏం కాలేదు. ఒట్టి పీడకల!” – సన్నగా వణుకుతున్న అతడిని దగ్గరకు తీసుకొని, వీపు మీద నిమిరింది. అతని గుండె దడదడ ఇంకా తగ్గనే లేదు. మరి కాసిన్ని మంచినీళ్ళు నిదానంగా పట్టించి, అతడి గుండెలపై చేయి వేసి, పడుకోమన్నట్టు వెనక్కి నెట్టింది సుతారంగా. అతడు కర్రముక్కలా ఉండిపోయి, వెనక్కి వాలలేదు. మళ్ళీ నిద్రపడితే పాడు కల ఎక్కడ వస్తుందేమోనని అతని భయం. ఆ భయంతో ఇక నన్ను దగ్గరకు రానివ్వడు.

“నిద్రపోవద్దు.. ఊరికే పడుకో..” అందామె. ససేమీరా అన్నట్టు తలూపాడు.

“సరే అయితే.. ఇద్దరం కూర్చొందాం” అనంటూ ఆమె కూడా అతడి పక్కకు చేరి కూర్చొంది అతడి భుజం పై తల వాల్చి. అతడు కలనూ, కలలో జరిగిన సంఘటలను పునశ్చరణ చేసుకుంటున్నాడు. జీవితంలో ఏవిటికి ప్రతీకలై కలలో అవ్వన్నీ కనిపించాయోనని విశ్లేషణ మొదలెట్టాడు. విశ్లేషణకు కావాల్సిన వివరాలన్నింటిని కోసం మెదడుపై వత్తిడి పెంచుతూ కలను మరల మరల గుర్తుచేసుకుంటున్నాడు.

“ఆకలి” అని వినీవినిపించనట్టు అంటూ, ఆమెకేసి చూశాడు. నిద్రపోతోంది. ఆమెను పడుకోబెట్టి, గది బయటకు నడిచాడు. ఫ్రిజ్ లో ఉన్నవేవో కెలికి, ఒక ఆపిల్ తీసుకొని, తింటూ టివి ఆన్ చేశాడు. ఒకటి నుండి నాలుగొందల తొంభై తొమ్మది, మళ్ళీ వెనక్కి ఛానెల్స్ పెట్టుకుంటూ వచ్చాడు. నేను మెల్లిగా అతని చెంతకు చేరటం గమనించి, టివి కట్టేసి, లాప్ టాప్ ఆన్ చేశాడు. హార్డ్ రాక్ మ్యూజిక్, చెవుల్లో హోరెత్తిస్తుంటే, చిమ్మచీకటి గదిలో లాప్‍టాప్ స్క్రీన్ నుండి వెలువడుతున్న వెలుగు, లాప్‍టాప్ ఒళ్ళో పెట్టుకోవడం వల్ల వేడీ.. ఇవ్వన్నీ నన్ను తరిమేయడానికే! ఆ సమయంలో ఛాటింగ్ మొదలెట్టాడు, హిహిహి, హహహ అనుకుంటూ. అతని కోసం కాసుకొని కూర్చున్నాను. మూడు రాత్రుల్లు నిద్రలేని వాడు, నీరసపడైనా నాకు లొంగాలి. ఈ జీవి లొంగడు! మొండిఘటం.

ప్రయత్నించగా, ప్రయత్నించగా ఎప్పటికో చేజిక్కాడు. అప్పటికి రాత్రి చరమాంకంలో ఉంది. దొరికిందే చాలననుకొని నా పని కానిచ్చాను.

“ఓయ్య్.. ఇక్కడికి ఎప్పుడొచ్చావ్? వెళ్ళి మంచం మీద పడుకో” అని నిద్ర లేపింది. భళ్ళున తెల్లారినా, ఆ గదినంతా చీకటి చేసి పెట్టింది. వెళ్ళి పడుకున్నాడు. అతణ్ణి చూస్తే మాత్రం, స్ఫృహ లేకుండా పడున్నాడని అనిపిస్తుంది.

**************************

వీధిదీపాల వెలిసిపోయిన నారింజ వెలుతుర్లో బైక్ మీద పడుకున్న మనుష్యాకారం అస్పష్టంగా కనిపిస్తున్న ఫోటో, “రోడ్ల పై నిద్రిస్తున్న నగర యువత!” అన్న శీర్షకతో పేపరులో పడింది.