విశ్వపుత్రిక వీక్షణం – 2035 లో…?!!

రచన: విజయలక్ష్మీ పండిట్

 

మా నాలుగో అంతస్తు అపార్ట్‌మెంట్  బాల్కనిలో రాత్రి 8 గం. సమయంలో కూర్చొని చూస్తున్న నాకు, బషీర్‌బాగ్‌  ఫ్లై ఓవర్‌పై వచ్చే వాహనాల లైట్లు మిణుకు మిణుకుమంటూ క్రిందికి జారుతూంటే కార్తీక పౌర్ణమినాడు నదిలో వదలిన దీపాలు అలలకు మెల్లగా కదులుతూ నదీ ప్రవాహంతో కూడా క్రిందికి ప్రయాణిస్తున్నట్టు అందంగా తోచాయి. ఆ దృశ్యాన్ని తిలకిస్తూ అలాగే ఆస్వాదిస్తూ వున్నాను.

అంతలో రెండు రోజుల ముందు నాతో పదవతరగతి చదువుతున్న నా మనుమడు జయ్‌ జరిపిన సంభాషణ గుర్తుకొచ్చింది.

ఆ రోజు జయ్‌ ఇంటికి వచ్చి ఫ్రెషప్‌ అయి టీవీ చూస్తూన్న నా పక్కన కూర్చున్నాడు.

”హాయ్‌ అమ్మమ్మా…’ అంటూ..,

”హాయ్‌ నాన్నా జయ్‌, వాట్ ఈజ్‌ ద టుడేస్‌ న్యూస్‌ అబౌట్ యువర్‌ స్కూల్‌. ఈ రోజు మీ స్కూల్‌ విశేషాలేంటి చెప్పు” అన్నాను.

తెలుగు భాష కూడా అర్థం కావాలని రెండు భాషల్లో అడుగుతూ, మాట్లాడుతుంటాను. స్కూల్స్‌లో ఎలాగూ అంతా ఇంగ్లీష్‌లోనే కదా మాట్లాడుకుంటారు. మన తెలుగు భాషను మరిచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను తెలుగులో సంభాషణకు దింపుతాను. మధ్యలో అర్థం కాకపోతే ఇంగ్లీషులో చెప్పి తెలుగు అర్థాలు చెపుతూ. మన మాతృభాష తెలుగును బతికించుకోడానికి మనం పాటించాల్సిన పద్ధతనిపించింది నాకు. ముఖ్యంగా అమెరికాలో పెరిగి ఇండియాకు వచ్చిన పిల్లలకు.

”అమ్మమ్మా ఈ రోజు మా స్కూల్‌లో చాలా వండర్‌ఫుల్‌ డిస్కషన్‌ జరిగింది మా ఫిజిక్స్‌ క్లాస్‌లో. మా టీచర్‌ సెల్‌ఫోన్స్‌, నెట్వర్క్స్‌ను, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంపాక్ట్‌ గురించి మాతో డిస్కస్‌ చేస్తూ, ఒక ప్రశ్న వేశారు” అంటూ ఆగి..

”క్యాన్‌ యు ఇమాజిన్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ ద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ 5జి  టెక్నాలజీ నెట్వర్క్‌ మొబైల్స్‌ ఆన్‌ హూమన్‌ సొసైటీ? ఇమాజిన్‌ ద పిక్చర్‌ ఆఫ్‌ ద సొసైటీ ఇన్‌ 2035” అని అడిగారు. అంటే కృత్రిమ మేధస్సు, 5 జి టెక్నాలజీ సెల్‌ఫోన్స్‌ యొక్క ప్రభావం మానవ సమూహాలపై ఎలా వుంటుందో, 2035 సంవత్సరం నాటికి మానవ జీవితాన్ని గూర్చి ఊహించగలరా? అని ప్రశ్నించారు. మా ఫ్రెండ్స్‌ నలుగురైదుగురు మ్లాడినాక నేను 2035లో హుమన్‌ సొసైటీ ఎలాగుంటుందో, ఎదుర్కొనే సమస్యలేవో నా ఇమాజినేషన్‌ను చెప్పాను. నా సమాధానం విని మా టీచర్‌ నన్ను అప్రిషియేట్ చేశారు అమ్మమ్మా” అన్నాడు జయ్‌.

”అవునా నాన్నా.. వెరీగుడ్‌..” అని ” ఏంటి  నీ సమాధానం జయ్‌ ఎలా ఉంటుంది 2035లో మన సొసైటీ. ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, 5 జి టెలికమ్యూనికేషన్‌ నెట్వర్క్‌లు తెచ్చే మార్పులు ఏమి చెప్పు” అన్నాను.

జయ్‌.., ”నేను మొదట, ప్రపంచ దేశాలు ముఖ్యమైన ఇన్నోవేషన్స్‌ చేపట్టాల్సి వుంటుందన్నాను. అదేమంటే మనిషికి ఆకలి లేకుండా చేయడం. మనిషి శరీరాన్ని పోషించే పోషకాలు చెట్టులాగ మనిషే తన శరీరంలో తయారు చేసుకొనే జీవరసాయన పరిశోధనలు చేయాల్సి వుంటుంది” అన్నాను.

”ఎందుకు అలా అనుకుంటున్నావు జయ్‌”అని అడిగారు మా టీచర్‌.

” ఎందుకంటే 2035/2040కి దాదాపు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోట్స్  ప్రపంచంలో విద్య, వైద్య వ్యవసాయం, ఫుడ్‌ ప్రొడక్షన్‌ దాదాపు అన్ని రంగాలలో మనుషులు చేసే పనులన్ని మెషీన్స్‌ చేపట్టటం జరుగుతుంది. వాహనాలు డ్రైవర్స్‌ లేకుండా నడుస్తాయి. హోటల్స్‌లో, రెస్టారెంట్స్ లో వంట మనుషులు, క్యాటరర్స్‌ లేకుండా మిషన్స్‌ను రోబోట్స్ ను కంట్రోల్  చేయడానికి ఇద్దరు ముగ్గురు మనుషులుంటే చాలు.  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ సహాయంతో రోబోట్స్  చేతనే అన్ని పనులు జరిగిపోతాయి. ఒకసారి మెషిన్స్‌పై ఇన్‌వెస్ట్‌ చేశాక చాలామంది మనుషుల సేవలు అవసరం లేకుండా లాభాలు గడిస్తారు పరిశ్రమల, అన్ని రంగాల పెట్టుబడిదారులు. మనిషికి సంపాదనకు  ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఉద్యోగాలు లేక డబ్బులు లేకపోతే వారికి ఆకలి ఎలా తీరుతుంది? ఎలా పోషించుకుంటారు కుటుంబాలను.  జనాభా ఎక్కువగా ఉన్న మన దేశం, చైనా దేశంలోని ప్రజలకు ఉపాధి, ఆదాయం కోల్పోయే పరిస్థితి వస్తుందేమో. ఇక 5జి టెక్నాలజీతో పరిశ్రమలలో ఇప్పటికంటే దాదాపు వందరెట్లు వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసే నెట్వర్క్‌ వచ్చి మనుషుల ఇన్‌వాల్వ్‌మెంట్ ను డ్రాస్టిక్ గా తగ్గిస్తాయి. మైక్రో సెకండ్స్‌లో అతి వేగంగా డేటా అంది ఒక దాని వెంబడి ఒకటి పనులన్ని మిషన్స్‌ చేసే సిస్టమ్స్‌ వస్తాయి. ఇక ప్రజలకు ఉపాధి ఏది? ప్రజలకు ఆకలెలా తీరుతుంది? నిరుద్యోగం వల్ల అరాచకాలు పెరుగుతాయి. మరి ఇక ఉన్న సొల్యూషన్‌ మనిషికి ఆకలి లేకుండా చేయడమే కదా? శరీర వృద్ధికోసం తన  ఆహారం తానే వృక్షాల్లాగా తయారు చేసుకోవడంతో ఎన్నో సమస్యలు లేకుండా పోతాయి కదా అమ్మమ్మా? నా సమాధానానికి మా టీచర్‌, క్లాస్‌మేట్స్  పెద్దగా నవ్వుతూ క్లాప్స్‌ కొట్టారు.” అని మరలా జయ్‌..,

”అమ్మమ్మా.. 2030/40 నాటికి భూమిపై అప్పటి వాతావరణం మార్పులు విపరీతంగా వుంటాయి. రాబోయే పరిస్థితులను ఊహిస్తే మనుషులు ఎక్కువ ఇంటిపట్టునే ఉండే పరిస్థితి వస్తుంది. ఇంటివద్దనుండే పనులు సర్వీసెస్‌ చేయడం వల్ల ఎక్కువ వాహనాలు నడువవు. ట్రాన్స్‌పోర్ట్‌ కొరకు కార్ల డిమాండ్‌, తయారి తగ్గుతుంది. పెట్రోలు బాధలు వుండవు. వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యం తగ్గుతుంది. సర్వీసెస్‌ ఇంటివద్దనుండే చేస్తారు. కాని అన్ని రంగాలలో  మనిషి అవసరం లేకుండా క్రమంగా రోబోలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మెషిన్స్‌ మనిషి చేసే పనులు చేయడం మొదలు పెడితే మనిషి ఎలా బతుకుతాడు సంపాదన లేకుండా? ఇప్పటికే కొన్ని పెద్ద పెద్ద హోటల్స్‌లో రోబోలు వండటం, వడ్డించడం చేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆపరేషన్స్‌ చేయడానికి గంటలు, గంటలు నిలబడి చేయలేక, ఇతర అసిస్టెంట్స్  ఖర్చులు తగ్గించుకోవడానికి డాక్టర్స్‌ రోబోలను ఆశ్రయిస్తున్నారు. విద్యారంగంలో కూడా ‘లర్నింగ్‌ త్రూ రోబో’ అని భవిష్యత్‌లో ఆన్‌లైన్‌లోనే చదవడం, రోబోల ద్వారా పరీక్షలు వ్రాయడం అన్ని జరిగిపోతే టీచర్స్‌ అవసరం లేకుండా పోతుందేమో కదా అమ్మమ్మా..” అన్నాడు జయ్‌.

నేను జయ్‌ మాటలు వింటూ అలా చూస్తూండి పోయాను వాడివైపు. ఎంత ఎదిగిపోయారు ఈ కాలం పిల్లలు. మన సమాజంలో వచ్చే మార్పులను ఎంతగా గమనిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ తెచ్చే మార్పులు యువతను ఆకట్టుకుంటున్నాయి, అనుకుంటూ..,

”ఎక్కడ ఎప్పుడు చదివావురా నాన్నా.. ఈ కొత్త టెక్నాలజీల గురించి” అన్నాను.

”నేను ఎక్కువ లేటెస్ట్‌ టెక్నలాజికల్‌ డెవలప్‌మెంట్స్  గురించి నెట్ లో చదువుతుంటాను. అవన్నీ చదువుతున్నప్పుడు, రాబోయే ప్రపంచ పరిస్థితులను ఊహిస్తూ ఉంటాను అమ్మమ్మా” అన్నాడు.

మా ఇద్దరి ఆ సంభాషణతో నా మెదడు నుండి ఒక పాత జ్ఞాపకం జారిపడింది. ఆ జ్ఞాపకం నా చిన్ననాి, నేను చదివిన ఒక కథల పుస్తకం నా మెదడులో అప్పుడప్పుడు మెదలుతుండేది. ఆ కథ పేరు ‘అంతా గమ్మత్తు’. ఇప్పుడు జయ్‌ ఊహించిన భవిష్యత్‌ కాల పరిస్థితులు దాదాపు ఏభై అరవై సంవత్సరాల ముందే నేను చదివి ఆశ్చర్యపోయిన  కలలాిం ఆ కథ గుర్తుకొచ్చి జయ్‌తో అన్నాను.

”జయ్‌ నా చిన్నప్పుడు దాదాపు నీ వయసులో మా ఊరి లైబ్రరీలో చదివిన ‘అంతాగమ్మత్తు’ అనే కథ గుర్తుకొస్తూందిరా నాన్నా నీ ఊహా ప్రపంచాన్ని వింటూంటే” అన్నాను.

” ఏంో ఆ కథ చెప్పు అమ్మమ్మా” అన్నాడు జయ్‌.

ఆ కథను నెమరు వేయడానికి నా మెదడు, అదే నా జ్ఞాపకాలు ఏభై ఏండ్లు వెనక్కి నడిచాయి టైం మెషిన్‌లో. ఆ కథను చెప్పసాగాను.

*****

”అంతా గమ్మత్తు’ కథ ఎవరు రాసారో గర్తులేదు నాకు కాని ఆ కథ చదివినప్పుడు ముద్రించిన చిత్రాలు నా మెదడులో బలమైన జ్ఞాపకాలుగా మిగిలి పోయాయి జయ్‌”

”ఆ కథలో ఒక మనిషి దాదాపు నిర్మానుష్యంగా వున్న భూమిపై నుండి భూమిలోకి ప్రయాణించే ఒక టన్నెల్‌ ద్వారా భూ గర్భంలోకి దిగుతాడు. దిగిన దారి ఒక భూగర్భ పట్టణ వీధిలో నిలబెడుతుంది అతన్ని. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంాయి. అతనికి మండిపోతున్న వేడిగాలులు వీస్తున్న భూతలంపైనుండి భూగర్భంలో కొంచెం చల్లగానే అనిపిస్తుంది. అంతలో ఒక కారు వచ్చి అతని ముందు నిలబడుతుంది. కారులో ఎవ్వరూ వుండదు. డ్రైవర్‌ కూడా లేకుండా ఆ కారు నడిచింది. డోర్‌ తెరుచుకుని లోపలకూర్చో మని ఇన్‌స్ట్రక్షన్‌ వినిపించడంతో అతడు కారులో ఎక్కి కూర్చుంటాడు. ఆ కారు అతన్ని ఒక అరగంట తరువాత ఒక భవనం ముందు దింపుతుంది లోపలికి వెళ్ళమని ఆదేశిస్తూ. అతడు కారు దిగి లోపలకు వెళతాడు. మనుషులెవరూ కనిపించరు. లోపల నడిచి వెళుతుండగా ఎదురుగా ఉన్న పెద్ద గది నుండి ‘లోపలికి రండి’అన్న పిలుపు వినిపిస్తుంది. అతడు మెల్లగా తలుపు తెరుచుకుని లోపలకు వెళతాడు. ఆ గదిలో గోడలపై చుట్టూ టీవి స్క్రీన్‌లు, మధ్యలో పరుచుకున్న ఒక పెద్ద కీ బోర్డుల ముందు ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. కీ బోర్డు నొక్కుతున్న మనిషికి రెండు వేళ్లు మాత్రమే ఉంటాయి చెరొక చేతికి.

రమ్మని తలవూపి తన పని, కీ బోర్డ్‌ ఆపరేట్ చేస్తూ ”ఎక్కడ వుంటావు” అని అడుగుతాడు. హోటల్‌ పేరు చెపుతాడు. వచ్చిన మనిషి ‘మీ పట్టణంలో మనుషులు కనిపించలేదని’ అడుగుతాడు. మా దేశంలో జనాభా చాలా తక్కువ. దాదాపు ఇరవై సంవత్సరాల ముందు భూమి మీద వాతావరణ కెలామిటీల వల్ల జనం చాలామంది చనిపోయారు. అందరు భూగర్భంలోని ఇండ్లలోనే వుంటారు. వేడిగాలుల వల్ల ఎక్కువ బయటకు తిరగడం తక్కువ. అందరికి అన్ని ఇంటికి సప్లై అవుతాయి మెషిన్స్‌ ద్వారా. ఆ వాతావరణాన్ని తప్పించుకోడానికి భూగర్భంలో సిటీలను నిర్మించాము. అంతా ఎక్కువ మిషన్స్‌తో నడుస్తుంది అని ముగిస్తాడు. వచ్చిన అతను తిరిగి బయటకు వెళ్ళినపుడు తాను వచ్చిన కారు అతన్ని హోటల్‌ ముందు దింపుతుంది. హోటల్‌ ప్రక్కన ఉన్న షాపులోకి వెళతాడు. మనిషిని బోలిన ఆకారంలోని మిషన్‌  స్వాగతం చెప్పి ఏమి కావాలని అడిగి టైప్‌ చేసుకుని అన్ని తెచ్చి పెడుతుంది. అతను ఆ రోబో ఇచ్చిన బిల్లును చెల్లించి హోటల్‌ లోకి వెళతాడు. హోటల్‌ రిసెప్షన్లో కూడా రోబోనే చెకిన్‌ ఏర్పాట్లు చేస్తుంది. ఆ మనిషి అనుకుంటాడు ఈ సిటీలో అంతా గమ్మత్తుగా ఉందే అని.

”ఆ కథ నా జ్ఞాపకాలలో నిలిచిపోయి ఒక కలలాగా అనిపించినా, ఇప్పుడు నీ భవిష్యత్‌ ఊహల ప్రపంచాన్ని తలపిస్తుంది జయ్‌”అన్నాను.

”వెరీ ఇంటరెస్టింగ్‌ అమ్మమ్మా.. ఫిఫ్టీ, సిక్స్‌టీ ఇయర్స్‌ ముందు వ్రాసిన కథ అంటే ఆ రైటర్‌ ఫ్యూచర్‌ను ఎంత బాగా ఇమేజిన్‌ చేశాడో కదా! అమ్మమ్మా. నీవు చదివిన ఆ కథలోని పరిస్థితులు మార్పులు వస్తాయేమో క్రమంగా. వాతావరణ మార్పుల వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగిపోయి, నీరు లేక జననష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక నివాసాలన్నీ అండర్‌ గ్రౌండ్‌లో వెలుస్తాయేమో, అంతేకాదు ఇంకో గ్రహానికి ”మార్స్‌” గ్రహంపై మానవ నివాసానికి ప్రయోగాలు జరుగుతున్నాయి” అని జయ్‌ అంటుండగా షాపింగ్‌ చేసుకుని వాళ్ళ అమ్మ రావడంతో ”హాయ్‌ అమ్మా…” అంటూ లేచి వెళ్ళాడు జయ్‌.

*****

ఇప్పుడు బాల్కనీలో ఆ దీపాల ధారలాగా మిణుకుమిణుకు మని మెరుస్తూ జారుతున్న కార్లను చూస్తుంటే.. సన్నగా వస్తున్న కార్ల శబ్దం వింటుంటే.. ఇంకో పది ఇరవై సంవత్సరాలకు కార్ల సంఖ్య తగ్గి కారు నడవడం తగ్గిపోతుందా? ముందు ముందు వేగవంతమైన సాంకేతిక మార్పులతో ప్రజల జీవితంలో ఏ అనూహ్య మార్పులు చోటు చేసుకో నున్నాయో. వాతావరణం మార్పులతో మనుషులు ఏ అవాంతరాలు ఎదుర్కోవలసి వస్తుందో అని ఒక రకమయిన భయంతో కూడిన ఆలోచనలు చుట్టుమ్టుాయి నన్ను.

బాల్కనీకి దగ్గరగా లైట్ల వెలుగులో మా వీధికి ఇరువైపులా ఉన్న చెట్లు నాకు అకస్మాత్తుగా చెట్టు ఎత్తున్న పదిచేతులు పైకి చాచి నిలుచున్న పచ్చని దేహాలతో ఉన్న మనుషులుగా తోచారు.

జయ్‌ చెప్పినట్లు మనుషులు కూడా చెట్లలాగా స్వయం పోషకాలుగా మారిపోతే ఈ ఈతిబాధలు  సమిసిపోతాయా అనే ప్రశ్న నా మనసులో ఉదయించింది.

 

******

కాంతం సంఘసేవ

రచన: మణికుమారి గోవిందరాజుల

 

 

కాంతానికి దిగులెక్కువయింది. ముఖ్యంగా “స్వచ్ఛ్ భారత్ వుద్యమం “ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన దగ్గరనుండి తాను దేశానికి యేమీ చేయలేక పోతున్నాను అన్న బాధ యెక్కువయ్యి అన్నం కూడా సయించడం లేదు.

వూహ తెలిసినప్పటి నుండి కూడా కాంతానికి సొసైటీకి యేదో ఒకటి చేసి మాతృదేశానికి తన వంతు సేవ అందించాలనేది చాలా గాఢమైన కోరిక. అదేమి చిత్రమో యేది చేద్దామన్నా యేదో ఒక అడ్డంకి వచ్చేది. యెవరికన్నా చెప్తే నవ్వుతారేమో అని భయంతో కూడా తన ఆలోచనలు తనలోనే పెట్టుకునేది. యెవరింటికన్నా వెళ్ళి రెండు రోజులు వుండడం జరిగితే మాత్రం  వాళ్ళ ఇంట్లొ పనివాళ్లకి రూపాయో అర్థ రూపాయో ఇచ్చి వచ్చేది. కొద్దిగా మొహం దీనంగా పెట్టి యేదన్నా వాళ్ళ అవస్ధలు చెప్పారంటే ఇక ఇంతే సంగతులు. తండ్రి యేమన్నా కొనుక్కోమని ఇచ్చిన పదో పరకో వాళ్ళ చేతుల్లో పెట్టి వచ్చేసేది. . . యేమయ్యాయే డబ్బులు అని నాన్న యెప్పుడూ అడిగేవాడు కాదు.

ఒకసారి యేమయిందంటే ….  కాంతం అప్పుడు ఆరో ,   యేడో చదువుతున్నది. బాబాయివాళ్ళ ఇంట్లో పెళ్ళికి కుటుంబ సమేతంగా వారం ముందుగా వెళ్ళారు. వాళ్ళది పల్లెటూరు ఇంటి నిండా నౌకర్లు చాకర్లు బోల్డుమంది.

కాంతానికేమో యెక్కడికన్నా వెళ్ళగానే పనివాళ్ళెవరా? యెక్కడున్నారా?యెంతమంది వున్నారా? అని వెతుకుతాయి కళ్ళు. అలా పనివాళ్ళకోసమై వెతకటానికో ఫ్లాష్ బ్యాక్ వుంది

మన కాంతానికి విపరీతమైన పుస్తకాల పిచ్చి. స్కూల్లో జాయిన్ చేయగానే ఆమె వయసు వాళ్ళు అ ఆ లు చదివే స్టేజ్ లోనే వుంటే మన కాంతం ఒకటో తరగతి చదివేసి స్కూల్లో చదవడానికి యేమీ లేక యే పుస్తకం దొరికితే అది చదవడం మొదలు పెట్టింది. అదిగో అప్పుడే యజమానులు పనివాళ్ళను బానిసలుగా చూడడం,  లేదా సరిగా చూడకపోవడం,   అలాంటి కథలు యెక్కువగా చదివింది. దానితో వాళ్ళకు యేమన్నా చేయాలని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ఓ…. . ఫీల్ అయి పోతుండేది.

సరే మళ్ళీ పెళ్ళి కొద్దాము. వెళ్ళగానె కాంతం తండ్రి,   పిన్ని పిల్లలూ,  బాబాయి పిల్లలూ అలా పిల్లలందరికీ తలా ఒక అయిదు రూపాయలు,   నోట్లు కాకుండా చిల్లర ఒక చిన్న గుడ్డ సంచిలో వేసి ఇచ్చి ఆ పెళ్ళికి అక్కడ వున్న నాలుగు రోజులూ పెద్ద వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా అయిసు ఫ్రూట్లు,  జీళ్ళు కొనుక్కమని ఇచ్చాడు. ఆయనకదో సరదా. పిల్లలందరూ ఆయన్ని ఓ. . పొగిడేసి యెగిరి గంతులేసారు. ఆ రోజుల్లో అయిదు రూపాయలంటే మాటలు కావు కదా.  ఆ డబ్బుల్ని చూడగానే. చిన్ని కాంతానికి ఒకటర్థమయింది అవన్నీ అక్కడ వున్న పని వాళ్ళకే సరిపోతాయని. మరి తనెలా యేమి కొనుక్కోవాలి?కాంతం బుజ్జి బుర్ర ఆలోచనలతో వేడెక్కింది.

ఇంతలో అందరూ పొలోమంటూ  జీళ్ళు కొనుక్కోడానికి బయల్దేరుతూ కాంతాన్ని కూడా లాక్కు పోయారు. ఇందులో కాంతానికి ఇంకో అలవాటు కూడా వుంది. అందరి దగ్గరా డబ్బులున్నాయి కదా?యెవరిది వాళ్ళు కొనుక్కోవచ్చు కదా?కాని దుకాణం దాకా  వెళ్ళేసరికి కాంతం లోనిఅతి మంచితనం నిద్ర లెస్తుంది. లేచింది వూర్కోకుండా కాంతాన్ని వుక్కిరి బిక్కిరి చేస్తుంది. . ఫైనల్ గా వాళ్ళు కొనుక్కున్న వాటికి కూడా తనే డబ్బులిచ్చేస్తుంది. అందరికీ తెలుసా సంగతి. అందుకే వాళ్ళు రావే అంటూ లాక్కెళ్తారు.

సరే మొత్తం యాభై పైసలు పోగా నాలుగు రూపాయల యాభై పైసలున్న గుడ్డ సంచిని జాగ్రత్తగా గౌను జేబులో పెట్టుకుని దాన్ని పిన్నీసుతో గౌనుకి జత చేసింది. ఈ తతంగమంతా పూర్తయ్యి తలెత్తి చూసేసరికి యెవ్వరూ కనపడలేదు. వుసూరుమంటూ ఒక్కత్తే పెళ్ళింటికొచ్చింది. మధ్యాహ్నసమయం . పెద్దలందరూ కునుకు తీస్తున్నారు. చేసేదేమీ లేక పెరటి దొడ్డి గడపమీద కూర్చుని తన వంతు జీడి ని నెమ్మదిగా తినసాగింది. ఇంతలో అటుగా వెళ్తున్న పాలేరు “యేంది! కాంతమ్మగోరూ! ఒక్కరే జీళ్ళు తింటున్నారు?మాకేదండో” అనడిగాడు.

“అయ్యో! వెంకాయ్! నేనెంగిలి చేసేసాను. పోనీలే నీకో అయిదు పైసలిస్తాను. కొనుక్కొ యేం?” అని తను తింటున్న జీడి పక్కన పెట్టి జాగ్రత్త గా పిన్నీసు తీసి,  సంచీని బయటికి తీసి అందులో నుండి అయిదు పైసలు తీసి వెంకాయ్ కిచ్చింది.

“అమ్మాయిగోరెంత మంచోరో?” మెచ్చుకుని వాడెళ్ళి పోగానే మళ్ళీ సంచీ ప్రాసెస్ అంతా పూర్తి చేసి తన జీడి తీసుకుని తలెత్తేసరికి అక్కడ పని చేస్తున్న పాలేర్లందరూ వలయాకారంగా నించుని వున్నారు.

“మాకేదండీ కాంతమ్మగోరూ?”అందరూ ఒక్కసారిగా అడిగారు. . ఇక ఆ తర్వాత చెప్పడానికి యేమీ లేదు.

మర్నాడు అందరూ ఐస్ఫ్రూట్స్ కొనుక్కోడానికి వెళ్తుంటే అడగడానికి అభిమానం అడ్డొచ్చి ఇంట్లోనే వుండిపోయింది పాపం.

జీళ్ళు కొనడానికి డబ్బుల్లేకపోయినా ఆ తర్వాత పాలెర్లు మంచి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు మన కాంతానికి. అది వేరు సంగతి.

ఇది ఒక వేపు. ఇంకోటేంటంటే వీధిలో,  సిగ్నల్స్ దగ్గరా,   రైల్వే స్టేషన్ల దగ్గరా అడుక్కునే వాళ్ళను చూస్తే వాళ్ళకు యేదో జ్ఞానబోధ చెయ్యాలన్న ఆరాటం పీ టీ ఉషలా వురుక్కుంటూ వస్తుంది హృదయంలో నుండి.

ఒకసారి హైదరాబాదు నుండి పూణే వెళ్తుంటే సీట్ల కింద ,  మధ్య ఒక పాత గుడ్డేసుకుని తుడుస్తూ ఒక కుర్రవాడు కనపడ్డాడు. పదేళ్ళుంటాయేమొ. పక్కన కూర్చున్న తన కొడుకు ఈడువాడే. వాడు హడావుడిగా తుడిచేసి ఆ గుడ్డని భుజం మీద వేసుకుని దీనమొహంతో అడుక్కోవడం మొదలు పెట్టాడు. ట్రైన్ పెద్ద రష్ గా లేదు. అక్కడక్కడా వున్నారంతే. వాడికి పెద్ద గిట్టుబాటు కావడం లేదు. మన కాంతం లోని మాతృహృదయం వువ్వెత్తున యెగసి పడింది. వాడిని తీసుకెళ్ళి తన కొడుకుతో పాటు చూసుకోవాలని ఆరాటపడింది. సరే వాడందరి దగ్గరా అడుక్కుంటూ కాంతం దగ్గరికి కూడా వచ్చి చేయి చాపాడు.

“బాబూ! నీ పేరేంటి?” అడిగింది ప్రేమగా.

“షారూఖ్ ఖాన్” జుట్టెగరేస్తూ చెప్పాడు. జాలిగా పెట్టిన మొహం యెక్కడికి పోయిందో.

“భలే వుంది నీ పేరు. సరే గాని ఇలా రోజూ అందరి దగ్గరా అడుక్కోవడం యెందుకూ?నాతో పాటు వస్తావా? నీకిలా అడుక్కునే పని తప్పుతుంది. చక్కగా నా కొడుకుతో పాటు స్కూల్ కి వెళ్ళొచ్చు. మంచిగా చదువుకుంటే బాగా సంపాయించుకోవచ్చు. అప్పుడెవ్వరినీ అడుక్కోవక్కరలేదు. ”భవిష్యత్తుని అందంగా చూపించింది.

వాడు యెగాదిగా చూసాడు కాంతాన్ని. పక్కన వున్న కాంతం కొడుకుని చూసాడు.   “నీ కొడుకేనా?”

“అవును”

“యెంత సంపాయిస్తడు?”

“అప్పుడే సంపాదన యేంటి?చదువుకుంటున్నాడు”

“మరి నేను నెలకు మూడువేలు సంపాయిస్త. నీ ఇంటికొస్తే యేమొస్తది?పని చేపించుకుంటవ్” షాక్ నుండి తేరుకుని చూసేటప్పటికి వాడు కనపడలేదు. పక్కనే వున్న కూతురు ఇచ్చిన మంచినీళ్ళను గట గటా తాగేసింది.

పోనీ అలా అయిందని వూర్కుందా?

ఒకసారి ఆటోలో యెక్కడికో వెళ్తున్నారు. సిగ్నల్ పడడంతో ఆగిన ఆటోల దగ్గరికి పిల్లలందరు వచ్చి అడుక్కోసాగారు. అలాగే వీళ్ళ ఆటో దగ్గరికి కూడా ఒక పిల్ల వచ్చింది.

“ఒక రూపాయుంటే ఇయ్యమ్మా” అని అడిగింది.

“ఈ రూపాయి లెక్కేంటి?”అడిగింది కాంతం.

“అట్టా డిసైడ్ చేసినం. ” నిర్లక్ష్యంగా చెప్పింది.

“ఎందుకని?”

“షాపులోళ్ళు అర్థరూపాయి తీసుకోవట్లేదు. ”

అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చి నిజమే కదా అనుకుంది అమాయకంగా.

ఒకరోజు హోటల్ నుండి బయటికి వచ్చి రోడ్డు దాటబోతుండగా ఒకామె వచ్చి చేయి చాపింది. పర్స్ లో నుండి చేతికి వచ్చిన ఒక కాయిన్ తీసి ఆమె చేతిలో వేసి ట్రాఫిక్ కాస్త తగ్గడంతో గబ గబా ముందుకు కదిలి రోడ్డు సగంలో కొచ్చేసరికి వెనక నుండి యెవరో పిలుస్తున్నట్లుగా అని పించి వెనక్కి చూసేసరికి ఇందాక చేయి చాపినామె వురుక్కుంటూ వచ్చింది.

“ఇదిగోమ్మో! నీ డబ్బులు. అర్థరూపాయి ఇస్తే ఎవడు తీసుకుంటరమ్మో?” కాంతం చేయి లాగి ఆ చేతిలో కాయిన్ పెట్టేసి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది.

చుట్టూ హారన్ల మోతకి గాని తేరుకోలేకపోయింది.

“ఓ అమ్మో రూపాయి” మళ్ళీ గుర్తు చేసిందా పిల్ల.

పడుకున్న మాతృదేవత మళ్ళీ నిద్ర లేచింది.

“అలా కాదుగానమ్మా. చక్కగా నాతొ పాటు రా. మీ కోసం ప్రభుత్వమే కాక చాలామంది ఎన్నో చేస్తున్నారు. మా ఇంట్లో వుంచుకోవడమో లేక వాళ్ళ దగ్గరికి నిన్ను చేర్చడమో చేస్తాను. బాగా చదువుకోవచ్చు” ఎంతో దయగా చెప్పింది. కాదు చెప్పా ననుకుంది.

సిగ్నల్ ఇక ముప్పై సెకన్ల లోకి వచ్చింది. ఆ అమ్మాయికి నచ్చ చెప్పటానికి ఆటో దిగడానికి  రెడీ అయింది. ఈ లోపల

“ఒక్క రూపాయి ఇయ్యనీకి నూరు పెస్నలడగబట్టె . గీయమ్మంట నన్నుతోల్కెళ్ళి సదివిస్తదంట” అప్పుడే వచ్చిన ఇంకో పిల్లతో యెగతాళిగా చెప్తూ ఈ పిల్ల వెళ్ళిపోవడమూ,  సిగ్నల్ వచ్చి బయట పెట్టబోయిన కాలు లోపలికి లాక్కునే లోపల ఆటో ముందుకు కదలడమూ,  పక్కన కూర్చున్న మేనకోడలు . పకా పకా నవ్వడమూ అన్నీ ఏకకాలంలో జరిగాయి.

ఇన్ని జరిగినా ఇంకా కాంతం మనసు ఆరాటపడుతూనే వున్నది. యేదో చెయ్యాలనే ఆరాటం అణగటం లేదు. కాకపోతే ఒక్కటర్థమయింది. అడుక్కోటానికి వచ్చిన వాళ్ళకు యేదో చెప్పబోతే వినే ఓపిక వుండదు. వాళ్ళకు కావల్సింది . నువ్వేసావా లేదా అనే.

ఈ జ్ఞానోదయం కాగానె “అరె!నాకీ విషయం ఇంతవరకు తట్టలేదే” అని బోల్డు ఆశ్చర్యబోయింది. ఇక ఈసారి ఆ పొరబాటు అస్సలు చేయకూడదు. డబ్బులిచ్చి చెబ్దాము అని నిర్ణయించుకుంది.

ఆ వెంటనే కొన్నాళ్ళకి విజయవాడ వెళ్ళడానికి నాంపల్లి స్టేషన్ లో దిగడమేమిటి ఒకామె చంకలో ఒక పిల్ల, చేత్తో పట్టుకుని ఒక పిల్లడు, ఆమె చీర ఒక చేత్తో పట్టుకుని రెండో చేయి నోట్లో వేసుకుని ఇద్దరు పిల్లలు అందరూ కూడా అయిదేళ్ళలోపు వాళ్ళే వుండగా “అమ్మా పిల్లలకి ఆకలెస్తందమ్మా ,  ”అంటూ కాళ్ళకి అడ్డం పడింది.

ముందు అనుభవంతో ముందు జాగ్రత్తగా పర్సులో నుండి పది నోటు తీసి ఆమె చేతిలో పెట్టింది. అక్కడికి పనై పోయింది వెళ్ళొచ్చుగా అలా యెలా వెళ్తుంది? అందుకని డబ్బులుచ్చుకుని వెళ్తున్న ఆమెని ఆపి

“యేమమ్మా పిల్లలకి పెట్టడానికి లేదంటున్నావు. మరి ఇంతమందిని యెందుకు కన్నావు?ఒకళ్ళిద్దరితో ఆపొచ్చుగా?”అనునయంగా అడిగాననుకుంది.

వూహించలేదు ఆమెకంత కోపం వస్తుందని

“యేమమ్మో నువ్విచ్చిన పది రూపాయలతొనే నా పిల్కాయల్ని సాత్తానా?అయినా నువ్వెట్టా కన్నావో నేనట్టె కంటి. ఆ మాత్రం తెలీదా ఆడుదానివై వుండి?” పిల్లాడ్ని వదిలేసి చేయి తిప్పుకుంటూ అరిచింది.

సిగ్గుతో చచ్చినంత పనై ఇక మాట్లాడకుండా వెళ్ళి పోయింది కాంతం ఆమె ఇంకా వెనకాలనుండి యేమో అంటున్నా.

ఇన్ని అనుభవాలతో తల పండినా ఈ మధ్యే అయిన స్వచ్చ్ భారత్ ప్రాజెక్ట్ తో బొప్పి కట్టినా కాంతం ఆరాటం ఆగటం లేదు . యెవరన్నా సంఘ సేవ చేస్తున్న వాళ్ళను చూస్తుంటే ఆరాధన. వాళ్ళు అంత కరెక్ట్ గా అవసరం వున్న వాళ్ళని యెలా కని పెడతారో,   ఆ అవసరం సమయానికి యెలా తీర్చ గలుగుతున్నారో అని గొప్ప ఆశ్చర్యం. అందుకే అలాంటి వాళ్ళను కలిసినప్పుడు తనకు తోచిందేదో ఇస్తూ వుంటుంది.

*********************

“యేంటి కాంతం?అలా కామెడీ షో చూస్తున్నదానిలా మొహం సీరియస్ తో కూడిన దిగులుతో పెట్టుకుని కూర్చున్నావు?”అడిగాడు కనకం లోపలికి వస్తూ.

తన మనసులో వున్న ఆలోచన తన దిగులు అన్నీ చెప్పింది.

“కాంతం! వాళ్ళు చూస్తున్న ప్రపంచం వాళ్ళకు మనుషుల్ని నమ్మక పోవడం నేర్పింది. సడన్ గా ఆటోలో కూర్చుని వెళ్తూ నీతో పాటు రమ్మంటే యెలా రాగలరు?నిన్నెలా నమ్మడం?అందుకే నీతో పాటు రారు. వాళ్ళల్లో నమ్మకం కలిగించాలంటే వాళ్లను కలుస్తుండాలి. నీ మీద వాళ్ళకు నమ్మకం యేర్పడాలి. నువు వాళ్ళకు యేదో చేస్తావు అన్న ఆశ వాళ్ళకి రావాలి. ఇవ్వన్నీ ఆ క్షణంలో యేర్పడవు. దానికి చాలా డెడికేటేడ్ గా వర్కవుట్స్ చెయ్యాలి. అవి మనలాంటి సామాన్యుల వల్ల కాదు. అందుకే. అవి చేసేవాళ్ళకు మన వంతు చేయూత మనం ఇవ్వగలిగితే అదే మనం దేశానికి చేసే సేవ. ” వివరంగా చెప్పాడు కనకం

అర్థమయినట్లుగా తల వూపింది కాంతం.

మరునాడు పొద్దున్న టిఫిన్ల కార్యక్రమం అయ్యాక  పెద్ద క్యారేజి పట్టుకొచ్చి “పదండి” అన్నది కాంతం.

“యెక్కడికే?” అడిగాడు కనకం.

“మీరేగా వాళ్ళల్లో నమ్మకం కలిగించాలన్నారు? అందుకే సిగ్నల్ దగ్గర పిల్లలకి వంట చేసి క్యారేజి సర్దాను. వాళ్ళకి పెట్టొద్దాము పదండి” హుషారుగా కదిలింది కాంతం.

తీసుకెళ్ళిన క్యారేజి అన్నం సరిపోక వాళ్ళందరు కాంతం మీద పడుతున్న సీను వూహించుకున్న కనకం కళ్ళు తిరిగి ఢామ్మని పడిపోయాడు.

 

****************

 

 

కౌండిన్య హాస్యకథలు – ప్రేమాయణం

రచన: రమేశ్ కలవల


‘రెండు రోజుల నుండి చూస్తున్నా మిమ్మల్ని! ఏంటి చెత్త మా ఇంటిలోకి విసురుతున్నారు?’ అని చిరుకోపంతో అడిగింది పక్కింటి అలేఖ్య.

చెత్త కాదండి. తొక్కలు విసిరాను. ‘తొక్కలో… ‘ అనేలోగా ఆ అమ్మాయి అడ్డుకొని ‘మాటలు జాగ్రత్త’ అంది కోపంతో వేలు చూపిస్తూ

‘నే చెప్పేది వినండి. అసలు తొక్కలో ఏముంది అనుకుంటాం కదా. తొక్కలు వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి మీకు తెలుసా? అందుకే మీ తోటలో మొక్కలకోసం విసిరాను’ అన్నాడు పక్కింట్లో అద్దెకుంటున్న రోహిత్.

‘మీ తొక్కల సహాయం మాకు అక్కర్లేదు, మా ఇంట్లోకి చెత్త విసరద్దు. మీ ఇంట్లో మొక్కలకు కావలసినన్ని విసురుకోండి. నేనేమీ అనుకోను’ అంటూ లోపలికి వెళ్ళిబోతుంటే ‘నా పేరు రోహిత్. ఏ జీ బియెస్సీ చేసాను. యమ్మెస్సీ కోసం వచ్చాను అని పరిచయం చేసుకున్నాడు. లోపలికి వెళ్ళిందల్లా బయటకు వచ్చి రోహిత్ కు సారీ చెప్పి చెయ్యి కలిపింది. “అందుకేనేమో ఈ మొక్కలకు వేసే తొక్కల గురించి బాగా తెలుసు మీకు’ అంది నవ్వుతూ. అలా మొదలయ్యింది వాళ్ళ ప్రేమాయణం. ముందుగా అలేఖ్యే ప్రేమించింది.

————

ఆ రోజు పొద్దున్నే రోహిత్ పేపర్ చదువుకుంటున్నాడు. పక్కనే కూర్చున్న వాళ్ళ బాబు దగ్గరకు అలేఖ్య వచ్చి ‘ఇదిగో కన్నా ఆరెంజ్ తిను. అవి తిన్న తరువాత ఆ పీల్ తేసినవి ఆ గార్డెన్లో మొక్కలకు పడేయమ్మ మంచిది’ అంటూ ఆ పేపర్ కు తన చీర కొంగు తగిలేలా నడుస్తూ వెళ్ళింది. మాటలలో కొంచెం వెటకారం తెలుస్తూనే ఉంది రోహిత్ కు.

‘ఒరేయ్ ఏం అక్కర్లేదు ఆ బిన్లో పడేయ్.. ఓ రోజు అలా పడేసే నా బతుకు ఇలా ఏడిసింది. ఆ రోజు నా మొహం మీద మీ అమ్మ వేలు చూపించినపుడే గుర్తించలేక పోయాను కోపిష్టిదని. మా చెడ్డకోపం’ అన్నాడు. ఇద్దరి మొహాలు చూసి వాటిని ఏం చేయాలో తెలియక వాడు వాటిని జేబులో వేసుకున్నాడు.

‘చెక్కు తీసిన సొరకాయ తొక్కలు పారేయకు, ఉంచు. అయ్యగారికి ఇష్టం, పచ్చడి చేస్తాను ఈ రోజు క్యారేజీలోకి’ అంది ఆ కూరలు తరుగుతున్న వంటావిడతో రోహిత్ కు వినపడేలా.

‘సరే అమ్మగారు’ అంది ముసిముసినవ్వుతో.

అది విని ‘అందుకే రా నేను రోజూ ఆఫీసు దగ్గర హోటల్లోన్ భోంచేస్తాను. ఈ మాట అమ్మతో అనకు’ అన్నాడు తనకు వినపడకుండా కొడుకుతో

‘మరి అమ్మ ఇచ్చిందేం చేస్తావు నాన్నా?’ అని అడిగాడు.

‘మా ఆఫీసులో ఒకాయన ఉన్నాడులేమ్మ. ఆయన మీ అమ్మకి సరిగ్గా సరిపోతాడు. పచ్చగడ్డితో చేసిన పచ్చడైనా లొట్టలేసుకుంటూ తింటాడు” అన్నాడు

రోహిత్ స్నానానికి లోపలకు నడుస్తుంటే, వాళ్ళబ్బాయి బాక్సులో పెట్టడానికి అరటి పండు వొలిచి ఆ తొక్క ఆయన నడిచి వచ్చే దారిలో పడేసి ‘ఏమండి చూసుకోండి జాగ్రత్త, ప్లీజ్.. అది కొంచెం తీసి పెరట్లో విసురుతారా’ అంది.

‘జారి పడుంటే?’ అన్నాడు కోపంగా రోహిత్.

తను పట్టించుకోనట్లు నటిస్తుంటే ఎందుకొచ్చిన రాద్దాంతం అని దాన్ని తీసి బిన్లో పడేసి విసుగ్గా తల అటూ ఇటూ ఊపుతూ నడిచాడు.

లాభం లేదు. ఏదోకటి చేయాలని నిశ్చయించుకున్నాడు కానీ ఏమీ చేయలేడని తనకూ తెలుసు.

———

యధావిథిగా ఆఫీసుకు చేరుకున్నాడు. రోహిత్ రావడం చూసి వెంటనే పరిగెత్తుకొచ్చాడు తోటి ఉద్యోగి వెంకట్. తనకు ఇంకా పెళ్ళి కాలేదు.

రోహిత్ రాగానే వెంకట్ చేసే మొదటి పనేంటంటే ఆ క్యారేజీ తీసి చూడటం. ఆ పని చేస్తుంటే ‘మా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ అయ్యింది. నువ్వు ఇల్లు చూస్తున్నావుట కదా చేరతావేంటి? రోజూ నీకిష్టమైన మా ఆవడ ఆర్గానిక్ వంట తినవచ్చు’ అన్నాడు.

‘తప్పకుండా గురువుగారు. కొంచెం మాట్లాడి పెట్టండి’ అన్నాడు వెంకట్.

‘సరే’ నన్నాడు రోహిత్. ఓ వారం రోజుల్లో పక్కింట్లో సెటిల్ కూడా అయ్యాడు. కూటి కోసం కోటి తిప్పలు అన్నట్లుగా, అలవాటైన అలేఖ్య వంట సాయంత్రం కూడా దక్కేలా పరిచయం పెంచుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. తన వంటల గురించి వెంకట్ కు అంతగా తెలియడంతో ఎక్కడో అనుమానం కలిగింది అలేఖ్య కు.

ఆదివారం పొద్దున్న సమయం పదకొండయినా ఆదమరిచి నిద్రపోతున్నాడు వెంకట్. కిటికీ లోనుండి సరిగ్గా మొహం మీదకు అరటిపండు తొక్క పడి పెదాలకు తియ్య తియ్యగా తగులుతోంది. నిద్ర మత్తులో చిన్నగా దాన్ని తీసాడు. లేచి ఆ కిటికీ వైపుకు నడిచాడు.

ఆ కిటికీ లోనుండి బయటకు చూడగానే ఎవరో కొత్త అమ్మాయి లాగా కనపడుతోంది. ఆ అమ్మాయి రోహిత్ వాళ్ళ చంటోడిని ఎటు పడేసావ్ అని అడగడం గమనించాడు, వాడు అటు కిడికీ వైపు చూపించాడు. ఆ అమ్మాయి తనవైపు చూసేలోగా తను కనిపించకుండా తప్పుకున్నాడు వెంకట్. మసక కళ్ళతో చూసినా చూడటానికి  అందంగా కనిపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది బెస్ట్ ఇంప్రెషన్ కదా మెదడు చురుగ్గా పనిచేసింది అనుకున్నాడు. నిద్ర మత్తులో ఆమెని సరిగా చూడనే లేదు కానీ తన చెవులకు వేలాడుతున్న గంటల దుద్దులు మాత్రం తన మనసు మీద చెరగని ముద్ర వేసాయి. వెంటనే గుడి గంటలు మ్రోగినట్లుగా హృదయంలో ప్రేమ గంటల చప్పుడులు వినిపించాయి. ఆమె గురించి తెలుసుకుందామని తయారవ్వడం మొదలుపెట్టాడు వెంకట్.

రోహిత్ బయటకు వచ్చి సుమేథతో వెడదాం అన్నట్లు సైగలు చేసి చంటోడిని కూడా తీసుకొని బయటకు బయలుదేరాడు. సుమేథ అలేఖ్య వాళ్ళ చెల్లెలు.

కొంతసేపటికి వెంకట్ కుంటి సాకుతో అలేఖ్య దగ్గరకు వచ్చాడు. ఊరక రారు మహానుభావులని అలేఖ్య పెద్దగా పట్టింకోలేదు.

‘మీ ఇంటికి చుట్టాలు వచ్చినట్లున్నారు?’ అని అడిగాడు.

పరిస్థితి అర్థమయ్యింది అలేఖ్యకు, అందుకు వెంకట్ తో ‘అవునండి మా అమ్మమ్మ ఊరినుండి వచ్చారు’ అంది ఏమాత్రం గమనించాడో తెలుసుకోవటానికి.

‘అబ్బే మీ అమ్మమ్మ గారి సంగతి కాదండి, ఇంకో ఆవిడ చిన్నగా, సన్నగా ఉన్నారు, గంటల దుద్దులు పెట్టుకొని ఉన్నారు చూసారు ఆవిడ గురించి’ అని నోరు జారేసాడు.

‘ఓహో. చెవులకు ఏమి వేసుకొందో అవి కూడా గమనించారా వెంకట్ గారు’ అంది అలేఖ్య.

కంగారు పడుతూ ‘అంటే..మీ ఇంటి నుండి మంచి వంటల సువాసనలు వస్తుంటే కిటికీ లోంచి చూసినపుడు ఆవిడ కనిపించారు’ అని ఇబ్బందిగా మొహం పెట్టాడు.

ఆ రోజు ఇంకా వంట మొదలే అవలేదు. ‘అవునులేండి. మా వంటల సువాసనలు మీ ఇంటి వరకూ వచ్చుంటుంది ‘ అంది మనసులో నవ్వుకుంటూ.

వెంకట్ కు మనసులో  ఇష్టాదైవం వెంకన్న గుర్తుకువచ్చాడు. స్వామి, ఎలాగైనా ఈ రోజు ఆ అమ్మాయి మళ్ళీ కనపడేలా చేసే భారం నీ మీదేమోపుతున్నాను అంటూ ఆకాశం కేసి చూసి మొక్కుకున్నాడు.

అది గమనించిన అలేఖ్య ఈ రోజు వాతావరణం మీకు అనుకూలంగానే ఉండేటట్లు ఉందిలేండి అంది.

నేను ఆ భగవంతుడితో అదే కోరుకుంటున్నానండి అన్నాడు వెంకట్. ఎక్కడో ఓ మూల మంచి కుర్రాడే అన్న అభిప్రాయం లేక పోలేదు అలేఖ్య కు. దగ్గర వరకే వెళ్ళారు కూర్చోండి అనే లోగా రోహిత్ వాళ్ళు తిరిగి రావటం వెంకట్ మొదటి సారిగా సుమేథ ను కలిసాడు. తనే చనువుగా పలకరించడంతో పాటు ఇంటిలో కూడా చకచకా పనులు చేస్తూ గలగలా మాట్లాడటంతో తనంటే సదభిప్రాయం కలిగింది. ఆలస్యం అమృతం విషం అని తరువాత రోజే రోహిత్ తో తన అభిప్రాయం వ్యక్తం చేసి ఇష్టమైతే గనుక తల్లితండ్రులతో సుమేథ విషయం మాట్లాడుతానని చెప్పాడు. అలేఖ్య తో కూడా రోహిత్ మాట్లాడి పెద్దలతో నిశ్చయించి సంబంధం ఖాయం చేసారు. సమయం ఇట్టే గడిచింది. రెండు నెలలు నిండేలోగా సుమేథ కూడా అక్కయ్య పక్కింట్లో కాపురానికి చేరింది.

—————

 

కొత్త జంట అన్యోన్యంగా ఉండటం సహజం కానీ అక్క అలేఖ్య బావగారైన రోహిత్ తో చిటపట లాడటం గమనించక పోలేదు సుమేథ.

పెళ్ళికాక ముందు సొరకాయ తొక్కల పచ్చడి నచ్చినా పెళ్ళయిన తరువాత సుమేథ చేసే సొరకాయ పచ్చడి తప్ప ఇంకేమీ నచ్చడం లేదు వెంకట్ కు.

ఇదివరలో వెంకట్ క్యారేజీ తణిఖీ చేసేవాడు. ఇపుడు వెంకట్ ఆఫీసుకు రాగానే రోహిత్ క్యారేజీ తీసి చూడటం మొదలుపెట్టాడు. అదీ కాకుండా అలేఖ్య వంటలు రోజూ అంటగడుతుండటంతో వెంకట్ ఓ రోజు థైర్యం చేసి అడిగాడు రోహిత్ ని ‘గురువుగారు, ఎప్పటినుండో అడుగుదామను కుంటున్నాను మీ తొక్కల వంటకాల గురించి వివరిస్తారా.’  అని అడగగానే సరే ఇటు కూర్చోమంటూ రోహిత్ వివరించడం మొదలుపెట్టాడు.

చూడు వెంకట్, నా ఉద్దేశం లో భర్త అనేవాడు తొక్కతో సమానం అన్నాడు. ‘అదేంటి గురువు గారు! అంత మాట అనేసారు’, అన్నాడు వెంకట్. చెబుతాను వినవయ్యా అంటూ మా ఆవిడకు ఒకరి మీద ఆధారపడడం ఇష్టం లేదోయ్ కానీ ఓ సారి దాంపత్యం మొదలైన తరువాత ఒకరి అవసరం ఇంకొకరికి ఎంతైనా అవసరం. కాయకు గానీ పండుకు కానీ తొక్క అవసరం ఎంతో ఉందయ్యా. అదే గనుక లేకపోతే కాయ గానీ పండు గానీ నిలవ గలుగుతుందా? అన్నాడు. ఈ సిద్దాంతాన్ని ఎపుడైతే తనకు బోధించానో దానితో ఏకీభవించక పోగా రోజూ తొక్కలతో వంటకాలు చేసి ఇవ్వడం మొదలుపెట్టింది మీ వొదిన గారు అన్నాడు. సమయానికి నువ్వు పరిచయం అయ్యావు కాబట్టి సరిపోయిందోయ్ వెంకట్ అన్నాడు. మళ్ళీ తను ఎమైనా అనుకుంటాడేమోనని మాట మార్చాడు.

మీ ఇంటి తొక్కలు తిన్న విశ్వాసం గురువు గారు కాబట్టి మిమ్మల్ని దీని నుండి విముక్తుడిని చేసే బాధ్యత నాది అంటూ శబథం చేసాడు వెంకట్.

———

వెంకట్ ఆ రోజు ఆఫీసుకు వెళ్ళేముందు అలేఖ్యను కలిసాడు. తను చెప్పదలుచుకున్నదంతా చెప్పాడు. సాయంత్రం సుమేథ ప్రేమగా వడ్డిస్తోంది. ఒక్కోటి తినడం మొదలుపెట్టిన తరువాత అర్థం అయ్యింది పొద్దున్న చేసిన తప్పు, పక్క వాళ్ళ సంసారంలో వేలు పెడితే కలిగే మొప్పు.

తలెత్తి చూసాడు తన చెవులకు మిరపకాయ తొడిమలు నిరసనగా పెట్టడం గమనించి ఈ అక్కా చెల్లెళ్ళతో పెట్టుకుంటే ఏ అడవిలోనో ఆకులు  అలమలు తినాల్సి వస్తుందనుకున్నాడు.

————

తరువాత రోజు క్యారేజీలు వదిలి ఇద్దరూ కలిసి హోటల్ భోజనానికి వెళ్ళి రావడం చూసి బాసు అడిగాడు. పరిష్కారం నేను చూపుతానన్నాడు.  ఓ వారంలో ఆఫీసు పార్టీ రిసార్టులో పత్నీ సమేతంగా విచ్చేసినపుడు ఏం చేయాలో చెవిలో చెప్పాడు.  మీరు ప్రాక్టీసు చేయడం ఎంతైనా అవసరం అని చెప్పాడు. చెట్లు గట్రా.. అయినా మీరే చూస్తారుగా మా నటన అంటూ ఇద్దరు హుషారుగా ఉన్నారు.

ఆఫీసు ఫంక్షనుకు అందరూ ముస్తాబయ్యి వచ్చారు. అందరూ అన్నీ తింటూ పలకరించుకుంటూ సరదగా గడుపుతున్నారు. వీరిద్దరూ మాత్రం మిగతావి ఏమీ తినకుండా తొక్కలు తినడం ప్రారంభించారు.  ఇంతలో పథకం ప్రకారం ప్రక్కన కూర్చున్న బాసు లేచాడు. వీళ్ళను చూస్తుంటే కొత్తరకం రోగం వచ్చిన వాళ్ళలో అనిపిస్తున్నారు అన్నాడు. సుమేథ అడిగింది ఇంతకీ మీరెవరు? అని ‘నేను డాక్టర్ ని’ అన్నడు. వెంటనే ‘నేను యాక్టర్’ అన్నాడు వెంకట్,  రోహిత్ కాలు తొక్కాడు. గొంతు సవరించుకొని ‘అదే మా ఆఫీసు డాక్టరుగారు’ అన్నాడు. బాసుగారు దగ్గరకు వచ్చి ఏవి మీ చేతులు చూపించండి అని అడిగాడు. ఇద్దరూ ముందుగా రంగులు రాసుకోవడంతో చూసారా ఇది మొదటి దశ కాకపోతే కొన్ని రోజులు పోతే వీళ్ళు పదికాలాలూ పచ్చగా కనపడతారు అన్నాడు. అక్క అలేఖ్య వైపుకు సుమేథ కొంచెం దిగులుగా చూసింది.  ఎవరూ చూడకుండా రోహిత్ వెంకట్ కు కన్ను కొట్టాడు. ఉన్నపళంగా వెంకట్ ఆ పక్కనే ఉన్న చెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. బాసు గారు ‘అయ్యో రెండో దశ మొదలయ్యింది చూసారా ? అంటూ కంగారు పెట్టడం మొదలు పెట్టడంతో అలేఖ్యకు చిర్రెత్తి గట్టిగా ’ఆపండీ ఈ తొక్కలో గోల’ అరిచింది. ఆ అరుపుకు కంగారుపడి కొంత ఎక్కిన వాడల్లా కిందకు దూకాడు వెంకట్. సుమేథ పరిగెత్తుకు వెళ్ళింది వాళ్ళయన దగ్గరకు. ఇంకెప్పుడు అలా చేయనండి అంది.

అలేఖ్యకు ‘అర్థమయ్యింది. ఇంక ఇప్పటినుండి ఈ తొక్కల వ్యవహారం చక్కబెట్టుకుంటాము లేండి’ అంది. హమ్మయ్య అంటూ అందరూ నవ్వేసారు.

ఇంతలో అలేఖ్య వాళ్ళ చంటోడు ‘మమ్మీ వీటిని ఏంచేయను ? అంటూ వాడు తిన్న తొక్కలు చూపించాడు’

‘నాకు ఇవ్వమ్మ’ అంటూ బాసు లాక్కొని జేబులో వేసుకున్నాడు, అందరూ ఫక్కున నవ్వేసారు.

 

శుభం భూయాత్!

 

ఆసరా.. 1.

రచన: పద్మజ యలమంచిలి

 

అమ్మగారూ…అమ్మగారూ…మన పక్కింటి ఆవిడ  ఇద్దరి పిల్లలతో బావిలో దూకేసిందట…  ఈతగాళ్లను బెట్టి తీయించేరట… పెద్ద పానం దక్కింది కానీ పసి పాణాలు ఎల్లిపోనాయి.. ఇక ఆయమ్మ బతికినా సచ్చినా ఒకటే… రత్తాలు ఊపిరి తీసుకోకుండా చెప్పుకుపోతానే ఉంది..

నా గుండె ఆగినంత పనైంది..తేరుకుని ఇప్పుడే వస్తానని పక్కింట్లోకి పరిగెత్తాను..
ఎప్పుడూ నవ్వుతూ ఇంటి పని, వంటపని చేస్తూనే బీఎడ్ కి ప్రిపేర్ అవుతూ  పిల్లలతో నిమిషం తీరికలేకుండా ఉండే నీరజ ఎందుకిలా చేసింది.. ఎప్పుడూ బాధలున్నట్టు కూడా కనపడలేదే..తను స్నానానికి వెళ్ళేటప్పుడు నన్ను పిలిచి పిల్లల్ని చూస్తుండండి ఆంటీ అని అప్పజెప్పేది.. ఇద్దరూ తెల్లగా బొద్దుగా చూడగానే ఎత్తుకోవాలనిపంచేలా ముద్దుగా వుండేవారు..ఈ మధ్యే   పిల్లాడికి  రెండో పుట్టినరోజని  నాతో అక్షింతలు వేయించింది..పిల్లకి 5వ నెలనిండిoది .ఆరవ నెల అన్నప్రాసన చెయ్యాలని,తనకు  ఎటూ విజయవాడ లో  సెంటర్ పడింది కాబట్టి పరీక్ష వ్రాసేసి పిల్లకి అన్నవరం లో అన్నప్రాసన చేసి తీసుకొస్తామని చెప్పి వెళ్ళింది.. ఇలా పిల్లలు లేకుండా తిరిగొచ్చిందేమిటి??   ..
పక్కనుంచి నీరజ చెల్లెలట.. అక్కకి బావంటే ఇష్టం లేదు కోపంతో దూకేసింది..మరో ప్రక్క పిన్ని అసలు ఇద్దరికీ పడితే కదా..కాపురమే చెయ్యడం లేదట..ఊరంతా అప్పులున్నాయంట..పిల్లల పాలకి కూడా డబ్బులు లేవంట అని ఒక పెద్దావిడ ఎవరికి తోచినట్టు వారుచెప్పుకుంటూ,చెవులు కొరుక్కుంటున్న చుట్టాల మధ్య ఎవరితోనూ సంబంధం లేనట్టు నిర్లిప్తంగా కళ్ళొదిలేసి చూస్తున్న నీరజను చూడగానే గుండె తరుక్కు పోయింది..
పిల్లలు కళ్ళల్లో మెదులుతుంటే వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని తన తల నిమురుతూ ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను…అప్పటిదాకా తమాయించుకుందేమో  అంటీ..ఈ రాబంధువుల నుండి    నన్ను తీసుకుపోండి అంటూఒక్కసారే బావురుమంది…కొద్దిసేపు మాఇంట్లో పడుకోబెట్టి తీసుకు వస్తానని అక్కడున్న వారికి చెప్పి ఇంటికి తీసుకువచ్చా..
రత్తాలు కాఫీ పెట్టిచ్చి వింతగా చూస్తూ వెళ్లిపోయింది. .. కడుపులో దుఃఖం తీరేదాకా ఏడవనిచ్చి నీరజ మొహంలోకి చూసి నెమ్మదిగా..మనసులో ఉన్న బాధ ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం భారం తగ్గుతుంది..      ఎందుకింత అఘాయిత్యానికి ఒడి గట్టావు..చేతనైతే చేయుతనిస్తా..బలవంతం లేదు…నీ కిష్టమైతే ఏం జరిగిందో చెప్పుతల్లీ..అని లాలనగా ఆడిగేసరికి కదిలిపోయింది…
ఆంటీ అందరి ఆడపిల్లల లాగే కోటి ఆశలతో పెళ్ళి చేసుకుని కొత్త జీవితంలో కి అడుగుపెట్టాను..మొదటిరోజు రాత్రే..నేనొక అమ్మాయిని ప్రేమించాను..వాళ్ళ అంతస్తుకు తగనని వేరే అబ్బాయికిచ్చి పెళ్ళిచేసారు.. నేను ఆ అమ్మాయిని మరిచిపోలేక పోతున్నాను.. ఈ పెళ్ళి కేవలం సొసైటీ కోసం చేసుకున్నాను అన్నారు.. నాకసలు ఎలా స్పందించాలో అర్ధం కాలేదు..
రెండోరోజు రాత్రి  నీకేమీ ప్రేమకథలు లేవా..జస్ట్ సరదాగా చెప్పు అన్నారు.. ఒక అబ్బాయి వెంట పడేవాడు.. కానీ నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ కలుగలేదని చెప్పా..
ఇచ్చిన కట్నం,బంగారం అన్నీ అయిపోయేదాకా బాగానే వున్నాడు.. తర్వాత
నుండి నా కష్టాలు మొదలు..
అతనికి చదువులేదు,ఆస్తి లేదు..పెళ్ళి చేస్తే దారికి వస్తాడని వాళ్ళ పెద్దలు వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఒక పెళ్ళి చేయాలనే సామెతను ఋజువు చేస్తూ,ఆ తంతు కానిచ్చేసారు.
ప్రేమ వున్నా లేకపోయినా మగాడికి కోరికలకు కొదవ వుండదుకదా.ఫలితంగా ఇద్దరి బిడ్డలకు తల్లిని..
ఇంటిని నడపడానికి నేను మార్కెటింగ్ చేస్తున్నా.. ఎలాగోలా బీఎడ్ పూర్తి చేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని నా ప్రయత్నంలో నేనుంటే..
తన మొదటి లవర్ ఒక బిడ్డను తీసుకువచ్చి ఇది మన ఇద్దరి బిడ్డ..అతనితో ఉండలేను..ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని గొడవ చేస్తోందట.. అందుకే ఈయన నన్ను వదిలించుకోడానికి నువ్వు పిల్లలని తీసుకుని పుట్టింటికి పో,లేకపోతే నువ్వుకుడా నీవెంట పడ్డ వాడితో పో, ఎందులో అయినా దూకి చావు అంటూ సూటిపోటి మాటలు..
అందరిముందు జస్టిస్ చక్రవర్తిలా వుండే ఆయన వ్యవహారం  మాఇంట్లో చెప్పినా  స్పందించలేదు,సరికదా ఆసరాకూడా ఇవ్వలేదు! ఆయన గారి తండ్రికి, అక్కకి తెలిసినా ఇంటి గుట్టు రట్టు చేసుకుంటారా.. ఎలాగో మీరే పడండి అంటూ ఆయన్ని సపోర్ట్ చేస్తూ నన్ను తేలికగా చూడటం మొదలెట్టారు..
ఈ మానసికహింస తట్టుకోలేక
చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను..  పుస్తెలతాడు తాకట్టు పెట్టి  డబ్బులు తీసుకుని అన్నప్రాసన అంటూ బయలుదేరాను.. తీర్థయాత్రలు అన్నీ అయ్యాక చచ్చిపోవాలని అనిపించలేదు ఆంటీ..కానీ విజయవాడలో అక్కా తమ్ముళ్లు ఇద్దరూ కలిసి నన్ను ఇంటినుండి బయటకు పోయేలా చేశారు..తప్పలేదు..
నేను బ్రతికి బయటపడతానని కలలో కూడా అనుకోలేదు..ఎందుకు రక్షించారో..పిల్లలు లేని ఈ జీవితం నాకొద్దు అంటూ బోరున ఏడ్చింది నీరజ..
ఒక్కసారిగా నా కాళ్ళ క్రింద భూమి కంపించినట్టయింది..
యుగాలు మారినా ఆడదాని కష్టాలు మారవు అనుకుంటూ..చావు అన్నింటికి పరిష్కారం కాదు
నేను నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డాను.. ఆత్మగౌరవంతో ఇలా వంటరిగా మిగిలిపోయా..
నా కథ తర్వాత చెపుతాలే కానీ ముందు
మళ్ళీ ఎటువంటి పిచ్చి పనులు చేయనని మాటివ్వు అంటూ చేతిలో చేయి వేయించుకున్నా!
అందరూ కావాలనుకోవడం స్త్రీ సహజగుణం తప్పులేదు..
మన  బ్రతుకు మగవాడిమీదే ఆధారపడి ఉంది అనుకోవడం ఏమీ చేతకాని బేలతనం!ఇది పనికిరాదు… అక్షరం ముక్క రానివారు కూడా బ్రతకగలుగు తున్నప్పుడు, చదువుకున్నదానివి ఇలా  బెంబేలు పడిపోతే ఎలా..
మనల్ని వద్దన్న వాడు మనకూ వద్దు అనుకుని ధైర్యంగా విశాల ప్రపంచంలోకి ముందడుగు వేశావా..దేవుడిచ్చిన ఆయుష్షు  పూర్తి అయేలోపు ఎన్నో సాధించవచ్చు అని  కొద్దిసేపు పడుకోమని చెప్పి ..ముందు నీరజను రేపటినుంచి తనతో పాటు స్కూల్ కి తీసుకెళ్లాలి.. పిల్లలకు పాఠాలు చెపుతూ కాస్త గతాన్ని మరిచిపోగలుగుతుంది అనుకుంటూ  తృప్తిగా ఫీల్ అయా…..
సశేషం..

 

‘నా కొడుకా’ అని ఒక్కసారి పిలువమ్మా!

రచన : సోమ సుధేష్ణ

 

 

“కొత్త ఇంట్లో చాల బావుంది శ్రీను.” అంటూ హిమ ఫేమిలీ రూమ్ లో నలుమూలలా తాను చేసిన అలంకారాలు సరి చేసుకుంటూ అంది.

శ్రీనివాస్ కు కూడ అలంకరణ నచ్చింది. రాబోయే తల్లిదండ్రులకోసం అన్ని సిద్దంగా ఉన్నాయి. తృప్తిగా తలాడించాడు. ఇద్దరూ ఆ పక్కనే ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్ళారు. కింగ్ సైజు బెడ్ దానికి రెండు వైపులా టేబుల్స్ పై లాంప్స్ ఉన్నాయి. బెడ్ కు ఎదురుగా ఒక పక్క డ్రెస్సింగ్ టేబుల్, మరో పక్క  డ్రాయర్స్ తో చెస్ట్ ఉన్నాయి. మరో వైపు గోడకు అనుకుని రెండు కుర్చీలు ఉన్నాయి. శ్రీను ఒక దాంట్లో కూర్చుని చూసాడు. మెత్తగా ఒరగడానికి వీలుగా ఉంది. గది నిండుగా అందంగా ఉంది.  గోడల పైన భారత నారీలు, చక్కటి పొలాల పెయింటింగ్స్ అందాన్ని ఇనుమడిస్తున్నాయి. తల్లిదండ్రుల కోసం ఈ రూమ్ కేటాయించాడు.

‘అమ్మానాన్న పడ్డ కష్టమంతా మరిచిపోయేట్టు చేస్తాను. వాళ్ళని నా దగ్గరే ఉంచుకుని జీవితంలోని ఆనందాలు వాళ్ళకి చూపిస్తాను. రామవరం ఒక ప్రపంచం కాదు, ప్రపంచంలో రామవరం ఒక చిన్న ఊరు. దాన్ని మించిన అందమైన ప్రపంచం ఉందని ఈ ప్రపంచంలోకి తీసుకు రావాలి. వేలు కదపనివ్వకుండా సదుపాయాలు అన్నీ చేసి పెట్టాలి.’ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు శ్రీనివాస్.

‘నేను చాల అదృష్టవంతుణ్ణి, తల్లి దండ్రులను దగ్గర ఉంచుకుని వారి మంచి చెడ్డలు చూసే అవకాశం నాకు కలుగుతోంది. నా తల్లి దండ్రులు దేవుండ్లు. వాళ్ళ జీవితం ధారపోసి నన్ను ఈ స్థితికి తెచ్చారు. వాళ్ళకు ఎంత చేసినా తక్కువే.’ శ్రీను గుండె నవ్వుకుంది.

*****

ఆ రోజు శనివారం ఉదయం-

హిమ ఇంకా పడుకునే ఉంది. శ్రీనుకు మాత్రం కంటిమీద కునుకు పడలేదు. మనసు నిండా ఆలోచనలే. నిద్ర రావడం లేదు కానీ లేవాలని కూడా లేదు. అలాగే వెల్లకిలా పడుకుని కళ్ళు తెరిచినా, మూసినా ఒకేలా ఉన్న చీకటిలోకి చూడలేక కళ్ళు మూసుకున్నాడు. నిశీదంలో నిశ్శబ్దం. నిశ్శబ్దంలో శూన్యం. మనమంతా శూన్యంలోనే కదా ఉన్నాము మరి శూన్యం ఇంత నిరాసక్తంగా, నిర్లిప్తంగా ఉందేమిటి! ఆలోచనలతో మొదలయిన అలజడి దాంతో రాత్రంతా నిద్ర రాక శివరాత్రే అయ్యింది.

నిశ్శబ్డాన్ని చేధిస్తూ అలారం మ్రోగింది. అలారం నిద్రలో ఉన్న వాళ్ళకు కాని మెలకువ ఉన్నవాళ్ళకెందుకు! హిమ వీకెండుకు అలారం ఆఫ్ చేస్తుంది, ఎక్కువసేపు పడుకోవచ్చని. ఈ రోజు ఆఫ్ చేయడం మరిచి పోయినట్లుంది. హిమ కదిలి పక్కకి తిరిగి  అలారం టక్కున ఆఫ్ చేస్తూ దిండులను ఎత్తుగా పేర్చి వాటికీ ఒరిగి ఉన్న భర్తను చూసి,

“ఎప్పుడు లేచావు శ్రీను?” అడిగింది.

“పడుకుంటే గదా లేవడానికి. నిద్ర రాలేదు.” నీరసంగా పలికాడు.

“ఇప్పుడైనా కాసేపు నిద్ర పో?”

“ఆల్రెడి ఆరున్నార్ అయింది.ఇప్పుడిక నిద్దర రాదుగాని నే వెళ్లి కాఫీ పెడతా .”

తనూ లేచి బాత్రుంలోకి వెళ్తూ హిమ “ఓ కే” అంది .

“ఎందుకు నిద్దర రాలేదు? వర్క్ గురించి ఏదైనా వర్రీనా?” రీక్లైనర్ లో వెనక్కి వాలి కూర్చున్న శ్రీను పక్కనే కూర్చుంటూ అంది. నిద్ర రానంత డిస్టర్బ్ ఎప్పుడు కాలేదు.

“కొత్త సంగతేమి కాదు హిమా, నిన్నటి నుండి మన ఊరు, అమ్మ, నాయన గుర్తొస్తున్నరు. రాత్రి చాలా డిస్టర్బ్ గా ఉండి నిద్ర పట్టలేదు.”

“ఫోన్ చేసి మాట్లాడితే మనసు కుదుటపడేది కదా. కాఫీ చల్లారిపోతుంది” టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పు అందిచ్చింది.

“ట్రై చేసాను, ఎవరు ఫోన్ ఎత్తలేదు.” నిట్టూర్చాడు. మనసు బాగా లేకపోతే ఈ కాఫీ, టీలతో వచ్చే హుషారు ఏమి పని చెయ్యవు. ఆలోచనల్లోంచి మనసులోకి వచ్చి భావాలై నిలిచిన ఆ హుషారు ముందు అన్నీ ‘హుష్! కాకియే.’

“ఏదైనా ప్రోబ్లం ఉంటే అన్న ఫోన్ చేసేవాడే గద శ్రీను. వర్రీ గాకు. మొన్నే కదా మాట్లాడావు.” అంటూ లేచి ఫోన్ ట్రై చేసింది. లైను కలవలేదు.

“ఓ గంట ఆగి మల్లి ట్రై చేస్తాను.”

“వాళ్ళు అందరూ బాగానే ఉండి ఉంటరు. అదేమో మరి మనసు నెమ్మది అనిపించడం లేదు.”

“పది రోజుల్లో వాళ్ళు మన దగ్గర ఉంటరు. వాళ్ళు వస్తారనే ఎక్గ్జయిట్ మెంటులో నీ కలా అనిపిస్తుందేమో.”

శ్రీను మనసులో ఏదో తెలియని ఆరాటం, అలజడి. జ్ఞానం వచ్చిన నాటినుండి జీవితాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. మేఘాలు కదిలినట్టుగా ఆలోచనలు తరుచుగా అలా మనసులో కదులుతూనే ఉంటాయి. మానవ జన్మ అన్నింటి కంటే ఉత్తమమైనదని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈ ఉన్నతమైన మానవ జన్మలో కూడా ఈ తారతమ్యాలేమిటి! ఎంతోమంది మహానుభావులు ఈ భూమి మీద జన్మించారు కదా-వారిలో ఏ ఒక్కరూ ఈ తారతమ్యాన్ని సరిదిద్దలేకపోయారా! ఉత్తమమైన ఈ మానవుడు తోటి మానవుడిని గుర్తించడానికి ఎందుకింత కష్టపడుతున్నాడు. పెద్ద దొర మనసెంత పెద్దది, అందరి మీద ప్రేమే. తల్లితండ్రి పెద్దదొరను దేవుడు అనుకుంటారు. పెద్దదొర వాళ్ళని ఎప్పుడూ అవసరానికి ఆదుకుంటూనే ఉంటాడు.

ఆలోచనల్లోకి ఒదిగి పోయిన శ్రీను మనసులో మమతాను బంధంతో ముడిపడిన జీవన తరంగాలు అలలు అలలుగా లేస్తున్నాయి. ఒడుదుడుకుల బాటలతో గడిచిన ఊరి జీవితం ఆ గతుకులను చూపిస్తూ కళ్ళ ముందు తరుచుగా కదులుతూనే ఉంటుంది.

‘ఆ జీవితపు పరిధుల్లోంచి నన్ను దాటించి, తల్లి, దండ్రులు నా కందిచ్చిన ఈ ప్రశాంతతను వాళ్ళ జీవితంలోకి తీసుకు రావాలి.’ శ్రీనులోని ఆరని దూప, తీరని ఆకలి.

‘అమ్మ ఊరిలో పెద్ద దొర ఇంట్లో వంట, అన్ని పన్లు చేసి, ఆ వీధిలనే ఉన్న చిన్నరెడ్డి దొర ఇంట్ల గూడ పని జేస్టది. అమ్మ తెల్లారక ముందే పనికి వొయ్యి సందే దిగినంక గాని ఇంటికి రాదు. నాయన పొలం పన్లకు పోతడు. కావలిసింది తిండి, బట్ట. భూమి పగిలినా, ఆకాశం ఇరిగినా, పెయ్యి సల సల కాలుతున్న ఆగకుండ ఇద్దరు పనికి పోతర్. అన్న,ఎంకటేసు లగ్గం జేస్కొని అత్తగారింటి కాడ అక్కన్నే బతుకుతుండు. ఆయన బామ్మరిదికి వాతం వొచ్చి కాళ్ళు చేతులు పడిపోయ్యినయ్. అత్తగారికి ఎవ్వరు దిక్కులేరు. అన్ననే దిక్కు.  అక్క, లలితకు పన్నెండెండ్లకే లగ్గం జేసిండ్రు. బావ తాలుకాల కిరానా దుక్ నం సూసుకుంటడు. మంచిగనే ఉన్నరు తిండికి, బట్టకు కరువు లేదని అమ్మ జెప్తది. మనకు అన్నం పెట్టె పెద్దోల్లకు దండం బెట్టాలే, ఆల్లను మరువొద్దు కొడుకా, అని నాకు ఊకే సేప్తది అమ్మ.

పెద్ద దొర మనుమలు, మనుమరాండ్లు ఊరికి వొస్తే మస్తు మజా అనిపించేది నాకు. ఇల్లంత సందడే. అందరూ లచ్చిమి..లచ్చిమి అని అమ్మను ఇష్టంగా పిలుస్తరు. అంత పెద్ద ఇంట్ల పెద్ద దొర ఒక్కడే ఉంటడు. ముగ్గురు కొడుకులు, వాళ్ళ పిల్లలు పట్నంలనే ఉంటరు. నేను రోజు బడి నుంచి రాంగనే పెద్ద దొరతోనే ఉంట. అందరూ పెద్ద దొర అని పిలిస్తే నేను కూడా పెద్ద దొర అనే పిలుస్త. ఆయన పేరు వేంకట నరసింహ్మా రేడ్డి. దొర ఏం పని జెప్తే అది చేస్త, ఆయన ఎనకాలనే తిరుగుత, దొరతో మాట్లాడుతుంటే పుస్తకాలు సదివినట్టే ఉంటది సీనుకు. నాకు ఇంగ్లీషు, మాత్స్ ఇంక తెలుగు మంచిగ మాట్లాడుడు దొర సేప్పిండు. పెద్ద దొర్సానమ్మ చాల చాల మంచిదున్దేనంట. నేను సూడలేదు. మా యమ్మకు పిల్లలు పుట్టంగనే పెద్ద దోర్సానే మాకు  పేర్లు పెట్టిందట. మా అదృష్టం అని అమ్మ ఊకే అంటుంటది.

“నా దగ్గరకు వస్తున్నావు ఇప్పుడు, నేను పోయాక ఏం చేస్తావురా సీను?” నన్ను పెద్ద దొర సీను అని పిలుస్తడు. నా కట్లనే శాన ఇష్టం.

“నువ్వేక్కడ్కు వోతె అక్కడికి నన్నుగూడ తీస్కపో. నువ్వెం జేయ్యమంటే అదే జేస్త దొర.” అని జవాబు చెప్పిన సీనుకు దొర చెప్పిందే వేద వాక్కు. పెద్ద దొర ఎప్పుడు సీను తల నిమిరేవాడు. అవే దీవెనలై శ్రీనును తీర్చి  దిద్దాయి. పెద్ద దొర రాత్రి పండ్లు తింటడు అంతనే. అందుకే సందె కాంగనే ఇంటికి ఉరికి పొయ్యి అన్నం దిని ఒస్త. రాత్రి పెద్ద దొర భగవద్ గీత సదివి పండుకుంటడు. రోజ్ ఇని ఇని నాగ్గూడ కొన్ని కంటపాఠం అయినవి. పెద్దదొర మంచం పక్కనే పండుకుంట.’

“ఈసారితో ఊళ్ళో ఉన్న చదువు అయిపోతుంది. పక్క ఊరిలో హైస్కూల్ ఉన్నా పోయి రావడం కుదరదురా. నీకు తెలివి ఉంది, బాగా చదువుకుని పైకి రావాలి. హైదరాబాదులో మురళి దగ్గర కెళ్ళి చదువుకుంటావా?పై  చదివులు చదివి మంచి ఉద్యోగం చేస్తూ నీ తల్లి, దండ్రులను సుఖ పెట్టాలిరా. అప్పుడే బ్రతుకుకు అర్థం  ఉంటుంది.”

“ నువ్వు ఏం చదువుమంటే అదే చదువుత. నువ్వు గూడ వస్తవా దొర?”

“నాకిక్కడే ప్రశాంతంగా ఉంటుంది. సెలవులకు ఊరికి వచ్చి మీ అమ్మ, నాన్నను, నన్ను చూద్దువుగాని.”

పెద్ద దొర అనుకున్నట్టుగానే శ్రీనును పెద్ద కొడుకు మురళి దగ్గరకు పంపాడు. తల్లి, తండ్రుల పేరిట రెండెకరాల భూమి రాసినాడు. చదువు అంతా అయేదాకా మురళి సారుకు నన్ను సూసుకోమని సెప్పిండు. పెద్ద దొర దేవుడు. ఒకనాడు నాయనను పిలిచి,

“యాదగిరి! సీనును చదివించమని అన్నావు. హైదరాబాదులో మురళి దగ్గర ఉండి చదువుకుంటడు. ఏమంటవు?”

“అట్టనే దొర. మీరేం జేయ్యమంటే అది చేస్తం. లచ్చిమి గూడ అట్టనే అంటది. మీరే జెయ్యలే దొర.”

పెద్ద దొర అన్నట్టుగానే,

“వాని తల్లి, తండ్రి కోరిక ప్రకారం వాడికి చదువు చెప్పిస్తే వాల్ల మంచి తనానికి, సంవత్సరాల తరబడి మన  కుటుంబానికి సేవ చేసినందుకు ఋణం తీరుతుంది.” అని పెద్ద కొడుకు మురళికి చెప్పాడు.

శ్రీనుకు హెస్కూల్ లో మొదట కష్టంగానే ఉన్నా త్వరగానే అలవాటు పడ్డాడు. సెలవలకు ఊరికి పోగానే సంచి అక్కడ్ పడేసి పెద్ద దొర దగ్గరకు పరుగెత్తి వస పిట్టలాగ కబుర్లు చెప్పేవాడు. శ్రీనులోని మార్పును చూసి తల్లి,దండ్రి

“వీడు దొరల ఇంట్ల పుట్టాల్సినోడు. మన అదృష్టం కొద్ది మన కడుపున బుట్టిండు.” యాదగిరి అంటే

“పోయిన జన్మల మస్త్ పున్నెం జేసుకున్నం. ఆని మాటలట్లనే, ఆ తెలివి అట్లనే ఉంది.” అనుకుంట మురిసి పోయింది లచ్చిమి.

“కొడుకా! ఇట్ల వోస్తవ్, అట్ల పోతవ్. నిన్ను సూసినట్టే ఉండదు. కోడి తిన్నట్టు నాలుగు గింజలు తింటవు.

జల్ది రా, నాయ్ న్తోని కూసోని తిందువుగాని.” కొడుకు వచ్చాడు ఏదో చెయ్యాలనే ఆరాటం, కడుపులో దాచుకోవాలని ఆరాటం, ప్రపంచంలోకి పంపాలని ఉబలాటం ఆ తల్లికి.

“పట్నంల నేను మంచిగానే ఉన్న అమ్మా. మీరు ఇద్దరు ఫిఖర్ చెయ్యొద్దు. మీరు మంచిగ ఉండండ్రి.” శ్రీనుకు  వాళ్ళలోని ఆరాటం తెలుసు.

ఆదాయం లేని పేద కుటుంబం కాబట్టి శ్రీను కాలేజి చదువంతా ఉచితంగానే ఉండేది. మురళి సార్ ఇంట్లో  ఏ పని చెప్పినా  డ్రైవింగ్ తో పాటు అన్ని పనులు చేసేవాడు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చేస్తున్నపుడే పెద్ద దొర ఆరోగ్యం బాగా లేదని హైదరాబాదుకు తీసుకొచ్చారు. శ్రీను రాత్రనక, పగలనక చేసిన సేవ అ కుటుంబంలో అందరి మనసులను కదిలించింది. ఆయన ఆయుష్షు తీరి కన్ను మూసాడు. శ్రీనుకు తేరుకోవడానికి చాల రోజులు పట్టింది.  పెద్ద దొర మాటలు, చేతలు తనలో పదిలంగా దాచుకున్నాడు.

*****

ఒక రోజు కాల్ సెంటర్ చూడడానికి వెళ్ళిన శ్రీను అక్కడ  హిమను కలిసాడు. స్నేహితులయ్యారు. తరుచుగా   కలుసు కున్నారు. ఇద్దరిలోనూ ప్రేమ చిగురించింది.  బీద కుటుంబంలో పుట్టడం మనుషులు చేసిన తప్పుకాదు. జరిగి పోయిన రోజుల గురించి తనకే బాధ లేదు కాని ముందు జీవితం మీద చాల ఆశ ఉంది అని తన అన్న దగ్గర ఉన్న తల్లి ఖర్చులకు కొంత సాయం చేయాలని ఉన్నట్టు హిమ తన మనసులోని మాటను తెలిపింది. ఇద్దరికి తమ కోరిక సమంజసంగానే అనిపించింది.

హిమ ఒక రోజు తన అన్న రఘుకు శ్రీనును పరిచయం చేసింది. రఘుకు, వాళ్ళ అమ్మకు  శ్రీను చాల నచ్చాడు. రఘు బి.ఏ. చదివాక మంచి జాబ్ దొరకక ఊబర్ నడుపుతున్నడు. మీ ఇద్దరికీ పెళ్ళి చేస్తామని రఘు అనగానే శ్రీను తన కుటుంబంలో అందరికి వార్త చెప్పడం, డేట్ కుదర్చడం, పెళ్ళిలో అందరు కుటుంబ సభ్యులు ముఖ్యంగా మురళి సార్ ఫేమిలీ దగ్గర ఉండి పెళ్ళి జరిపించారు.

పెళ్ళి అవగానే అనుకున్న ప్రకారం అమెరికాలో దొరికిన జాబ్ లో జాయిన్ అయ్యాడు శ్రీను. నెల రోజుల్లోనే హిమ కూడా అతన్ని చేరింది. శ్రీను తల్లిదండ్రులకి తరుచుగా డబ్బు పంపుతూనే ఉంటాడు. హిమ దృష్టిలో అది చాల మాములు విషయం. అదృష్టం అంటే ఇదే గాబోలు అనుకున్నాడు శ్రీను.

నేను చాల అదృష్టవంతుణ్ణి కాబట్టే దేవుడు నాకు ఆ తల్లిదండ్రులు, పెద్ద దొర, మురళి సార్ లాంటి మంచి మనుషులను, హిమలాంటి భార్యను నా చుట్టూ ఉంచి నాకు మంచి దారి చూపించాడు. ఇవి చాలు నాకు. దేవుడు ఇచ్చిన ఈ ఆనందాన్ని అందరికి పంచాలి తనలో తానే ఎన్నోసార్లు అనుకోవడమే కాకుండా హిమతో అన్నప్పుడు,

“ నాకు తెలుసు. అందుకే నిన్ను పెళ్ళి చేసుకున్నాను” నవ్వింది హిమ.

శ్రీను ఆలోచనలకు  బ్రేకు వేసాడు.

కాఫీ పూర్తి చేసి “హిమా! ఈ రోజు ప్రోగ్రాం ఏముంది?”

“ఈ రోజు సుశీల వాళ్ళింట్లో డిన్నరు ఉంది. మీకు మూడు బాగా లేకపోతే ఫోన్ చేసి ఎక్స్ క్యూజ్ చేయమని చెప్తాను.”

“సాయంత్రం కదా, వెళ్దాంలే.”

‘తల్లిదండ్రి ఒక పది రోజుల్లో ఇక్కడ ఉంటారు. వారి ప్రేమ ముందు నేను చూపే ప్రేమ పండితుని ముందు ఓనమాలు చదివినట్టే. డబ్బుకు పేదరికమేమో గాని ప్రేమ వారిలో పుష్కలంగా ఉంది.’

సాయంత్రం పార్టికి రెడి అయి బయల్దేరే ముందు “అనిల్ వాళ్ళ  కొత్త ఇంటి అడ్రస్ ఇవ్వు. ఐఫోన్ లో ఎక్కిస్తే గూగుల్ చెయ్యొచ్చు” అంటూ శ్రీను కార్ కీస్ తీసుకున్నాడు.

“నా ఫోన్ లో ఉంది షేర్ చేస్తాను.” హేండ్ బేగ్ లోంచి ఫోన్ తీసింది.

అప్పుడే ఇంటి ఫోన్ రింగయింది. హిమ వెళ్లి ఫోన్ తీసుకుంది.

“శ్రీను ఫోన్ ఇండియానుండి. లోపలికి రా” డోర్ తెరిచి గరాజ్ లోకి వెళ్ళబోతున్న శ్రీనుతో గట్టిగా అనేసి ఫోన్ లో

“హలో” అంది.

“శ్రీనివాస్ ఉన్నడా?”

“ఎవరు మాట్లాడుతున్నారు? నేను శ్ర్రేనివాస్ భార్య హిమను. మీరెవరు?”

“నేను భోనగిరి నుండి మాట్లాడుతున్న, ఇక్కడ కారు ఏక్సిడెంట్ అయ్యింది.”

“ఏక్సిడెంటా! ఎవరికి ఏక్సిడెంట్?” హిమ గాబరాగా అడిగింది.

వెనక్కి తిరిగి ఒక్క అంగలో వచ్చిన శ్రీను హిమ చేతిలోంచి ఫోన్ తీసుకుని

“నేను శ్రీనివాస్ ను, ఎవరు మాట్లాడుతున్నారు? ఏక్సిడెంట్ ఎవరికి అయ్యింది?” శ్రీను చేతులు వణుకుతున్నాయి.

“నేను వెంకటేశ్ దోస్తు రాఘవను. నీ అమ్మ నాయిన ఎలుగుపల్లికి పొయ్యి మీ అక్కను చూసి వొస్తున్నారు. బోనగిరి అడ్డ దగ్గర లారి ఎదురుంగ వొచ్చి కొట్టింది. అక్కడికక్కడే కార్ల అందరి పానాలు పొయినాయ్. బస్సోడు ఆగకుండ కొట్టుకపొయ్యిండు. పోలీ ..”

శ్రీను చేతిలోంచి ఫోన్ కింద పడింది. శ్రీను అక్కడే నేల మీదకు కుప్పలా కూలిపోయాడు.

“శ్రీను..శ్రీను..” ఏడుస్తూ హిమ ఒరిగిపోతున్న శ్రీను తలను తన గుండెలపై అనించుకుంది.

ఏ భావమూ లేని శ్రీను కళ్ళలోంచి నీళ్ళు కారుతున్నాయి తప్ప చలనం లేదు. హిమ నీళ్ళు తెచ్చి మొహం మీద చిలకరించింది. గ్లాసుతో నీళ్ళు తగించడానికి ప్రయత్నించింది కాని శ్రీను తాగలేక పోయాడు. ఇద్దరూ శిలలై అలాగే ఉన్నారు.

“’నా కొడుకా’ అని ఒక్కసారి పిలువమ్మా!”  శూన్యంలోకి చూస్తూ అన్న శ్రీను మాటలు చిన్నగా వినిపించాయి.

 

_______________

 

 

 

 

 

 

 

 

 

సమర్ధత

రచన:   నిష్కల శ్రీనాథ్

 

గడియారంలో  పెద్ద ముల్లు పన్నెoడు దగ్గరికి  చిన్న ముల్లు ఆరు దగ్గరికి రాగానే సీటులోంచి లేచాను . ఈరోజు మధ్యాహ్నం బాక్స్ కూడా తీసుకురాలేదని ఏమో ఆకలి కాస్త ముందుగానే వేసింది. ఇక ఆలస్యం చేయకూడదు అని ఆఫీస్ బయటకు నడిచాను, దగ్గరలోనే హోటల్ ఉంది త్వరగా వెళితే మంచిది అనుకుంటూ నాలుగు అడుగులు వేశానో లేదో విజయ్ కనిపించాడు. వాడి ఆఫీస్ కూడా మా ఆఫీస్ కి దగ్గరే బహుశా వాడు కూడా హోటల్ కే వెళ్తున్నట్టు ఉన్నాడు .

నన్ను చూసి పలకరించాడు “ఏరా ! ఎలా ఉన్నావ్? పక్కనే ఆఫీస్ ఉన్నా కలవడం కుదరటం లేదు ఇద్దరికీ “అన్నాడు నవ్వుతు, ఎందుకో వాడి నవ్వులో ఎదో వెలితి కనిపించింది. “బాగానే ఉన్నాను రా”అంటూ వాడి భుజం తట్టి ఇద్దరం కలిసి హోటల్ లోకి కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాం . నాకు వాడు ఎదో ఇబ్బందుల్లో ఉన్నాడు అనిపించింది కాని వాడిని ఆ విషయం ఎలా కదపాలో తెలియలేదు.

నా మౌనం వాడు అర్ధం చేసుకున్నాడు ఏమో వాడే మాట్లాడటం మొదలు పెట్టాడు “ఎలా ఉంది రా ఉద్యోగం? పాప బాగుందా? స్కూల్ లో జాయిన్ చేసావా?”అని అడిగాడు “ఉద్యోగం పర్లేదు రా బాగానే ఉంది . పాప స్కూల్ కి వెళ్లిపోతుంది మా ఆవిడ కూడా ఈమధ్య ఉద్యోగంలో జాయిన్ అయింది, నీకు తెలుసుగా అమ్మ పాపని చూసుకోలేదు అని ఉద్యోగం మానేసింది ఇప్పుడు అమ్మ పోయి 6 నెలలు కావస్తోంది పాప స్కూల్ కూడా తనకి ఆఫీస్ దగ్గరే కాబట్టి స్కూల్ అయిపోగానే వాళ్ళ ఆఫీస్ లో ఉన్న డే కేర్ లో ఉంచుతుంది తనూ వచ్చేటప్పుడు తీసుకువస్తుంది . పాప కూడా పెద్దది అయింది కదా అందుకే సులువు గా ఉంది కొంచెం “అన్నాను.

“మంచిపని చేసావు రా ! ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తేనే ఈ సిటీ లో కాస్త గౌరవంగా ఉండగలం. లేదంటే భవీష్యత్తు మాట అటుంచి నెల వారి ఖర్చులకే అటూ,ఇటూ చూసుకోవాలి. ఇప్పుడు నా జీవితం అలాగే గంధరగోళంగా ఉంది ఏమి చేయాలా? అని తల పట్టుకోవలసి వస్తుంది” అని వాపోయాడు . విజయ్ నా కాలేజీ రోజుల నుండి స్నేహితుడు అప్పటి మా స్నేహం అలాగే కొనసాగుతూ వస్తుంది అయితే బాధ్యతల నడుమ స్నేహం అయితే కొనసాగుతుంది గాని తరచుగా కలవడం మాత్రం కుదరడం లేదు అలా చాలా నెలల తరువాత మళ్ళీ ఇప్పుడు కలిసాం ఇద్దరం. ఎప్పుడు సరదాగా ఉండే విజయ్ పెళ్ళి అయ్యి బాధ్యతలు పెరిగాక చాలా డీలా పడిపోయాడు.

“ఏమైంది రా? “అని అడిగాను “బంధాలు కొత్త బాధ్యతలను ఇస్తాయి అవి నెరవేర్చి ఆ బంధాలను కాపాడుకోవాలి అంటే డబ్బు కావాలి ప్చ్ మనకి వచ్చే జీతాలతో అన్ని అవసరాలు తీరాలంటే మాటలా “అంటూ ఏదేదో మాట్లాడటం మొదలు పెట్టాడు. వెంటనే నేను టేబుల్ మీద ఉన్న లోటాలో నీళ్ళు గ్లాస్ లోకి పోసి వాడికి అందించాను “అసలు నీ సమస్య ఏంటో సరిగ్గా చెప్పరా?”అన్నాను.

ఆ నీళ్ళు గట గటా తాగి చెప్పడం మొదలుపెట్టాడు “నీకు తెలుసు కద రా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి మా ఊరుకి వెళ్లిపోయారు . నా ఉద్యోగం వల్ల వాళ్లతో వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అప్పుడప్పుడు పండగకో, ఇంకేమైనా ఫంక్షన్స్ కో వెళ్ళేవాడిని . ఆ తరువాత నా పెళ్ళి నీరజతో అవ్వడం వెంట వెంటనే ఇద్దరు పిల్లలు నీరజ పాప పుట్టగానే ఉద్యోగం మానేసింది ఇంక బాబు పుట్టాక ఉద్యోగం ఆలోచన కూడా చేయలేదు. కిందటి సంవత్సరం వరకు అంతా బాగానే అయిపోయింది ఉన్న దానితోనే ఎదో సర్దుకుని ఆనందంగా ఉండేవాళ్ళం. పిల్లలు పెద్దవాళ్లు అయ్యేలోగా సొంత ఇల్లు తీసుకోవాలి అని ఏవేవో అనుకున్నాను.నాన్నగారు రిటైర్ అయ్యే వరకు ఇవే మా ఆలోచనలు కాని నాన్నగారు రిటైర్ అయ్యాక మా ఆలోచనలు అన్నీ తలక్రిందులు అయిపోయాయి”అంటూ గ్లాస్ లో ఉన్న మిగతా నీళ్ళు కూడా తాగి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు.

“నాన్నగారికి అప్పటికే బీపీ ఉంది దానికి షుగర్ కూడా తోడు అవ్వడంతో తరుచు గా చెక్ అప్ చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చే వాళ్లు వాళ్ళ రానుపోను ఖర్చులు డాక్టర్ ఫీజులు,మందులు తడిసి మోపెడు అయ్యేవి అయినా కొడుకు గా అది నా బాధ్యత అని సర్దిపెట్టుకున్నాను ఎందుకంటే నాన్నగారికి వచ్చే పెన్షన్ తక్కువ చెల్లి పెళ్ళి కి లోన్, ఇంకా చిన్న చిన్న అవసరాలకు పెట్టిన లోన్స్ వల్ల పెన్షన్ తక్కువ వస్తుంది అది వాళ్లకు అక్కడ బతకడానికి సరిపోతుంది . ఆపై ఖర్చులన్ని నేనే పెట్టుకోవాలి నాన్నగారి ఆరోగ్య రీత్యా మేము ఊరు వెళ్ళడం కూడా ఎక్కువ అయింది అలా ఖర్చులు పెరగడం మొదలుపెట్టాయి “అంటూ ఆపాడు.

“అయితే ఎలాగూ అంకుల్ రిటైర్ అయ్యారు కదా, ఇక్కడే మీతో పాటే ఉంటే మీకు ఈ వయసులో వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో? అన్న ఆందోళన తగ్గుతుంది ప్రయాణం ఖర్చులు కూడా తగ్గుతాయి కద రా “అని అన్నాను.

దానికి వాడు చిన్న నవ్వు నవ్వి “అదే చేశాను రా ప్రయాణాలు చేయడం మనకే కష్టం అలాంటిది వాళ్లకు ఇంకా కష్టం అందుకే వాళ్లు రాక ముందే రెండు బెడ్రూం లు ఉన్న ఇల్లు తీసుకున్నా కాని రెండు నెలల తరువాత మనుషులు ఎక్కువ మంది ఉన్నారు నీళ్ళు ఎక్కువ వాడుతున్నారు అంటూ ఓనర్ గోల పెట్టేసరికి ఇల్లు మారాము. అక్కడ పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు. అమ్మ చెల్లిని పండగ కి పిలవాలి ఇంటి ఆడపడుచు వచ్చి వారం అయినా ఉండాలి. అప్పుడు ఇల్లు సరిపోదు అంటూ పెద్ద ఇల్లు చూడమని పోరు పెట్టింది, ఇంక చేసేది లేక మూడు బెడ్రూంలు ఉన్న ఇల్లు తీసుకున్నా కాస్త లోపలికి కాబట్టి అడ్వాన్స్ తక్కువే తీసుకున్నాడు కానీ ప్రతి నెల అద్దె పాతికవేలు కట్టేసరికి దేవుడు కనిపిస్తున్నాడు. పోనీ ఇంట్లో అయినా ప్రశాంతత ఉందా? అంటే అది లేదు”అంటూ చెప్తుంటే వెయిటర్ వచ్చి భోజనం ఇచ్చి వెళ్లాడు.

మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు విజయ్ “అమ్మ పద్దతి నీరజకు నచ్చదు, నీరజ పద్దతి అమ్మకు నచ్చదు. ఇన్నాళ్లు అప్పుడప్పుడు వచ్చేవారు కాబట్టి మా వరకు వచ్చేవి కాదు. కాని ఇప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేసరికి గొడవలు మొదలు అయ్యాయి అమ్మ ఎక్కడ బాధ పడుతుందో అని అమ్మ వైపు మాట్లాడతాను . అయితే నీరజ కు కి కోపం వస్తుంది అయినా ఇప్పుడు పిల్లల ను చదివించే పని తప్పింది నాన్న గారు చూసుకుంటున్నారు . అన్నిటికి ఇప్పుడు మెషిన్లు ఉన్నాయి అయినా ఈ ఆడవాళ్లకు బద్ధకం ఎప్పుడో ఒకసారి వచ్చే తల నొప్పి ఇప్పుడు ప్రతి వారం వస్తుంది అప్పుడప్పుడు పలకరించే నడుం నొప్పి వారానికి రెండు సార్లు వస్తుంది. అమ్మ ఏమో పొద్దునే అన్నీ శుభ్రం చేసుకుని పూజ చేసుకుని అప్పుడు వంట గదిలోకి వెళ్ళ మంటుంది, నీరజ ఏమో అన్నీ చేసుకుంటూ కూర్చుంటే పిల్లలకు స్కూల్ కి ఆలస్యం అవుతుంది అంటుంది కాస్త పెoదలాడే లేస్తే అన్నీ అవుతాయి అంటుంది అమ్మ, మరి నాకు విశ్రాంతి వద్దా అంటుంది నీరజ . ఇద్దరు కరెక్టే అనిపిస్తుంది నాకు ఏమి చేయాలో తేలిక ఒక్కోసారి బయటకు వచ్చి కాసేపు అలా తిరిగి వెళ్తున్నా,వచ్చే నెల పిల్లల టర్మ్ ఫీజు కట్టాలి ఎలా కట్టాలో అర్ధం కావట్లేదు”అంటూ బాధ అంతా వెళ్ళగక్కాడు . బాధ అంతా బయటకు చెప్పగానే గుండె బరువు తగ్గిoదేమో తినడం మొదలు పెట్టాడు.

నేను ఆలోచిస్తూ తినడం మొదలు పెట్టాను,వాడు నా వైపు చుస్తూ తింటున్నాడు నా సమాధానం గురించి ఎదురు చూస్తున్నాడు అని అర్ధం అయింది వెంటనే చెప్పడం మొదలు పెట్టాను “విజయ్ ని పరిస్ధితి అర్ధం చేసుకోగలను కాని నిన్ను ఇన్ని సంవత్సరాల గా చూస్తున్నాను కాబట్టి నీ దగ్గర చనువు ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను “అన్నాను.

“నా సమస్య కి పరిష్కారం దొరుకుతుంది అంటే తప్పకుండా వింటాను కాకపోతే అమ్మ,నాన్నని వెనక్కి పంపించడం అనే సలహా మాత్రం వద్దు “అంటూ వేడుకున్నాడు.

వాడి సమస్య నాకు పరిష్కారం నాకు వాడు చెప్తున్నప్పుడే తట్టింది కాని ముందుగా వాడి అలవాట్లలో మార్పు రావాలి అనే ఉద్దేశం తో చెప్పడం మొదలు పెట్టాను “విజయ్ మీ అమ్మ గారిని లేదా నీరజ ని అనే ముందు నీ అలవాట్లు ఒకసారి చూసుకో నువ్వు ఆఫీస్ కి వెళ్ళి రావడం కాకుండా ఇంటి పనులు అసలు ఎన్ని చేస్తున్నావ్? సహాయం మాట అటుంచి కనీసం నీ పనులు అయినా నువ్వు చేస్తున్నావా? ముందుగా నీరజ సంగతి చూద్దాం ముందు ఇంట్లో నలుగురు ఉండేవాళ్ళు భర్త, పిల్లలే కాబట్టి పని అంతా అయినా కాస్త విశ్రాంతి దొరుకుతుంది ఎందుకంటే మీరు అందరు బయటికి వెళ్ళి పోయేవాళ్ళు, కాని ఇప్పుడు మరొక ఇద్దరు సభ్యులు అదనం గా చేరారు ఇంటి పని ఎక్కువ అవుతుంది అంతే కాక చక్కర వ్యాధి, రక్త పోటు ఉన్న వాళ్ళకి అందరి లా ఉప్పు కారాలు సరి పడవు అందు కోసం వేరేగా వంట చేయాలి అంతే వంట పని ఎక్కువ అవుతుంది. దీనికి తోడు ఇంత పని చేస్తున్నా ఎదో ఒకటి తప్పు పడుతుంటే ఆమెకు మాత్రం ఎంత సహనం ఉంటుంది చెప్పు? అవును ఏమఁన్నావ్ రా! అన్నిటికి మెషిన్ లు ఉన్నా ఆడవాళ్ళకి బద్ధకమా? వాషింగ్ మెషిన్ లో బట్టలు నువ్వు వేసి పౌడర్ వేస్తే అది బట్టలు ఉతుకుతుంది కాని దానికి అదే దండెం మీద ఆరబెట్టుకొదు ఎంత డ్రైయర్ ఉన్నా మనమే ఆరబెట్టి మడత పెట్టి లోపల పెట్టాలి . మిక్సీ లో గాని గ్రైండర్ లో గానీ అంతే పిండి దానికి అదే వేసుకొదు మనమే వేసి పిండి అయ్యాక తీసి కడిగి పెట్టుకోవాలి కాబట్టి వాళ్లకు శ్రమ తగ్గింది ఏమో గానీ పని తగ్గలేదు పైగా నువ్వు తిన్న కంచం కూడా తీయవూ, అన్నీ పనులు చేస్తూ మళ్ళి ఉద్యోగం చేసి నీకు ఆర్ధిక ఆసరా ఇవ్వాలి అని అనుకుంటున్నావు “అని చెప్పడం ఆపి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుని టేబుల్ దగ్గరికి వచ్చాను విజయ్ తింటూనే నా గురించి ఎదురు చూస్తున్నాడు .

“నాకు నీరజ ఉద్యోగం చేయాలి అని ఉంది అని నీకు చెప్పలేదు కద రా “అన్నాడు అప్పటికే వాడి విషయం లో ఎక్కడ లోపం ఉందో అర్ధం అవ్వ సాగింది విజయ్ కి.

“నువ్వు చెప్పలేదు కానీ నీ మాటల ద్వారా అర్ధం అయింది.  అవును, నాకొక విషయం చెప్పు ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేసారా? లేదా అద్దె కు ఇచ్చారా?”అని అడిగాను.

“రెండు కాదు ఏవో సామానులు ఉన్నాయి అని ఇక్కడ సరిపోవు అని ఉంచారు ఇప్పుడు ఇల్లు మారాము కదా తీసుకురావాలి”అన్నాడు విజయ్.

“సరే రా టైం అయింది ఆఫీస్ కి వెళ్లాలి సాయంత్రం మీ ఆఫీస్ కి వస్తాను మనం ఒక చోటు కు వెళ్లాలి నీ సమస్య కు పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది “అంటూ హోటల్ బయటకు వచ్చాను వాడు నవ్వుతు చెయి ఊపాడు . నేను కూడా నవ్వి ఆఫీస్ లో ఉన్న పని గురించి ఆలోచిస్తూ భారం గా నిట్టూర్చి నడక మొదలు పెట్టాను.

****************

“ఇల్లు బాగుంది రా ఒక బెడ్రూం ఫ్లాట్ అయినా విశాలం గా ఉంది . ముందు నుండి ఈ ఏరియా అంటే ఇష్టం నాకు కాని నా బడ్జెట్ లో ఇక్కడ ఇల్లు దొరక లేదు . అవును, మీ ఇల్లు బాగానే ఉంటుంది కదా మళ్ళి ఎందుకు మారుతున్నావు “అని అడిగాడు విజయ్ . ఆఫీస్ నుండి ఒక 10 కిలోమీటర్ దూరం లో ఉన్న ఏరియా లో ఉన్న అపార్ట్మెంట్ లో ఒక ఖాళీ ఫ్లాట్ ని చూస్తూ వాడి మది లో మెదిలిన ప్రశ్న కు సమాధానం గా చిరునవ్వు నవ్వి బయటకు తీసుకువచ్చాను .

అదే అంతస్థు లో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి అన్నీ ఒక బెడ్రూం ఫ్లాట్స్ “అదిగో ఆ ఫ్లాట్ కూడా ఖాళీ గానే ఉంది “అన్నాను. వాడికి నా ఆంతర్యం అర్ధం అయింది ఏమో భయం గా “అరేయ్ పరిష్కారం అంటే ఇదా రా !”అన్నాడు .

“విజయ్ కొన్నేళ్ల క్రితం నాది కూడా ఇప్పుడు ఉన్న నీ పరిస్థితే నాన్న గారు పోయిన తరువాత అమ్మ మా దగ్గరకు వచ్చేసింది అప్పుడే పాప పుట్టింది ప్రియ కూడా ఉద్యోగం మానేసింది . ప్రియ కు ఒక్కసారిగా ఒంటరి తనం కమ్ముకుంది ఇంక అమ్మ అన్నీ పద్దతి ప్రకారం జరగాలి ప్రియ కు చిన్న పిల్ల తో అయ్యేది కాదు రోజంతా ఇంట్లో వేరు వేరు పద్ధతుల్లో పెరిగిన వాళ్లు ఉంటే కచ్చితం గా గొడవలు వస్తాయి . అమ్మ గత కొన్ని సంవత్సరాల గా ఓకే విధం గా ఉండటం అలవాటు అయ్యి ప్రియ ఏమి చేసినా నచ్చేది కాదు . అందులో నా తప్పు కూడా ఉంది ఇంటి పనుల్లో కల్పించుకోక పోవడం ఇంకా అమ్మ ఒంటరి తనాన్ని గుర్తించలేక పోవడం . ఇలా కాదు అని అమ్మ ను రోజు దగ్గర లో ఉన్న గుడి కి తీసుకు వెళ్ళడం మొదలు పెట్టాను కాస్త కష్టం అయినా అమ్మ సమస్య ఏంటో అర్ధం అయింది . ఆ ఊరి కి బాగా అలవాటు పడిన అమ్మ ఇక్కడ ఇమడ లేక పోతుంది అని “.

విజయ్ ఆసక్తి గా వినడం చూసి మళ్ళీ మొదలు పెట్టాను “తక్కువ సమయం లోనే అందరి తో కలిసి పోయింది గుడి లొనే ఎక్కువ సమయం గడపడం వల్ల ఇంటి పనుల్లో ప్రియ కు పూర్తి స్వాతంత్రం వచ్చింది నేను కూడా సహాయం చేయడం మొదలు పెట్టాను. కొద్దీ రోజుల్లో నే ఇంటి వాతావరణం లో మార్పు వచ్చింది . వాళ్ళ ఇద్దరు బాగా కలిసి పోయారు ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవడం మొదలు పెట్టారు . అందుకే అమ్మ పోయాక ప్రియ ఇంట్లో ఒక్కర్తే అయిపోతుంది అని ఉద్యోగం లో చేరమన్నాను “.

“మరి నాది కూడా ఇంచుమించు నీ సమస్య లాంటిదే కదరా! మరి నాకు మాత్రం ఇలాంటి పరిష్కారం చూపించావు? “అన్నాడు విజయ్ ఆలోచిస్తూ. నాకు తెలుసు వాడు ఇలా అడుగుతాడని “అన్నీ ప్రశ్నల కు ఒకే సమాధానం రాయలేము కదా,అలాగే అన్నీ సమస్యలకు ఒకే పరిష్కారం ఉండదు . నీ విషయానికి వస్తే నీకు అమ్మ,నాన్న ఇద్దరి బాధ్యత ఉంది, అంతే కాక అన్నయ్య గా బాధ్యత గా చెల్లి ని,ఆమె కుటుంబాన్ని గౌరవించి పుట్టింటి ప్రేమ ను పంచాలి. నా విషయంలో ఇవి లేవు కాబట్టి అమ్మ ఒంటరి తనాన్ని పోగొట్టి ఆమె కు ఒక కాలక్షేపంను ఇవ్వడమే నా బాధ్యత అనుకున్నాను. మీ అమ్మ, నాన్న మరొక ఇంట్లో ఉన్నంత మాత్రానా వాళ్ళను నువ్వు దూరం పెట్టినట్టు కాదు, అదే అంతస్థు కాబట్టి వాళ్లకు దగ్గరగా ఉంటావు . ప్రాక్టికల్ గా మాట్లాడాలి అంటే మీ అమ్మ గారికి, నీరజకు ఎవరి పనుల్లో వారికి స్వాతంత్రం వస్తుంది . మీ చెల్లి వచ్చినా అమ్మ,నాన్న దగ్గర ఉంటుంది వాళ్లకి మనస్ఫూర్తి గా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.అన్నిటి కన్నా నీకు సంతోషం కలిగించే విషయం ఏంటి అంటే, రెండు ఇళ్లకు కలిపి అద్దె 18,000 కాబట్టి నీకు డబ్బు సమస్య కాస్త తగ్గుతుంది “.

విజయ్ ఏమనుకున్నాడో ఏమో తల పంకించాడు. సమాధానంగా నేను నవ్వి వాడి భుజం తట్టి “వెళ్దాం పద ! ఇప్పటికే ఆలస్యం అయింది “అన్నాను.

**************

“హాయ్ రా! బాగున్నావా “అంటూ వచ్చాడు విజయ్ మా ఆఫీస్ కి వాడిని కలిసి దాదాపు అయిదు నెలల పైనే అయింది అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడటమే కాని ముందు కలిసినప్పటి కన్నా మనిషి హుషారు గా ఉన్నాడు.

“బాగున్నాను రా! నువ్వు ఎలా ఉన్నావు? చాలా మార్పు వచ్చింది నీలో, సంతోషం గా ఉంది . ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? “అని చిరు నవ్వుతో అడిగాను .

“నేను బాగున్నాను రా! అరేయ్ రేపు పాప పుట్టిన రోజు మీ ముగ్గురు తప్పకుండా రావాలి నీరజ మరి మరి చెప్పింది ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయిస్తాను తనతో “అని అన్నాడు.”ఎందుకు లే రా ! నువ్వు చెప్పావు గా చాలు మేము వస్తాము . అది సరే ఇంట్లో పరిస్ధితి ఎలా ఉంది రా? “అన్నాను.

“బాగుంది రా ఇలా నేను చెప్పడానికి కారణం నువ్వే అంటే నువ్వు ఇచ్చిన పరిష్కారం . ఇంట్లో చాలా మార్పు వచ్చింది. మొదట్లో అమ్మ,నాన్న చాలా బాధ పడ్డారు మేము నీకు భారమాఁ అని,కాని వేరేగా వెళ్ళాక వాళ్లకి కొంచెం తేడా తెలిసింది . నాన్న మా పిల్లల కు తెలుగు చెప్పడం విని తెలుగు మాస్టార్లు తక్కువైన ఈ రోజుల్లో నాన్న గారు దొరకడం అదృష్టం అనుకుని అపార్ట్మెంట్ లో వాళ్ళ పిల్లల ను నాన్న దగ్గరికి ట్యూషన్ పంపడం మొదలు పెట్టారు . ఊర్లో ఉన్న ఇల్లు అద్దె కు ఇచ్చేసి సామాన్లు ఇక్కడికి తీసుకు వచ్చేసారు . అమ్మ పిండి వంటలు బాగా చేస్తుంది కదా, అక్కడ ఉన్న ఇద్దరి, ముగ్గురు తన వయసు వాళ్లతో కలిసి ఈ పిండి వంటలు పెళ్ళి లకు, మిగతా శుభకార్యాలకు సప్లై ఇవ్వడం మొదలు పెట్టింది. అలా వాళ్ళ ఆదాయం తో వాళ్ళు సంతోషం గా ఉన్నారు. ఆర్దిక సమస్యలు కొంచెం తగ్గాయి. నీరజ కూడా ఇంటి నుండే తన కు తగ్గ ఉద్యోగం వెతుక్కుంది . ఈమధ్య నిన్ను కలవలేక పోయా సారీ రా, ఇంటి పనుల్లో కూడా సాయం చేయడం తో నాకు చిరాకు తగ్గింది అందుకే అసలు టైం దొరకట్లేదు ఈ పనులతో  . ఆరోజు ధైర్యం చేసి అడుగు ముందుకు వేయకపోతే ఇప్పటికి అలాగే ఉండేవాడిని ఏమో. నీకు చాలా చాలా థాంక్స్ రా”అంటూ నా చేతులూ పట్టుకున్నాడు ఆనందంగా అన్నాడు.

“మంచి విషయం చెప్పావు అయితే అందరు ఆనందంగా ఉన్నారు కదా, అంతే రా మన శరీరానికి, మెదడుకు నిరంతరం పని ఉండాలి లేదంటే అనవసరమైన ఆలోచనలు, భయంకరమైన రోగాలు ఆపైన అవసరానికి మించి మందులు . విజయ్ మాములుగా ఆడపిల్లలకు జాగ్రత్తలు చెపుతారు పెద్దవాళ్ళు ఇంటి బాధ్యతలు,బంధాలు సమర్ధవంతంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలి అని కానీ మనకి అంటే మగ వాళ్లకు అలా బంధాలను సమర్ధవంతంగా నిర్వహించడం  రావట్లేదు కారణం పెళ్ళి వల్ల ఆడవాళ్ళకు మాత్రమే జీవితంలో మార్పు వస్తుంది అనే భావన. అందుకే అటూ తల్లితండ్రులకు ఇటు భార్యకు మధ్య నలిగి పోతున్నాం . కొడుకుగా, భర్తగా, తండ్రిగా ఇన్ని బాధ్యతలు సక్రమంగా చేయాలి అంటే మనకి మనం ఏర్పరచుకున్న బంధాల మధ్య సమతుల్యత పాటించాలి . ఇప్పుడు చూడు ఎవరికీ వారికి వారి వారి పనుల్లో స్వాతంత్రం లభించింది కాబట్టి బంధాల మీద గౌరవం పెరిగింది నీరజకు కూడా శ్రమ తగ్గింది తన పనికి విలువ పెరిగింది నీ దగ్గర కాబట్టి నీకు, నీ వాళ్లకు గౌరవం ఇస్తుంది, ప్రేమను పంచుతుంది. అన్నిటి కన్నా పెరిగిన ఆదాయం ఖర్చులను తట్టుకునేలా ఉండటంతో మీ జీవితంలో ఇలాంటి చిన్న, చిన్న సరదాలు ఉన్నాయి . ఇది తెలియక చాలా మంది బంధాలను తెంపుకుని జీవితాల ను నాశనం చేసుకుంటున్నారు “అన్నాను విజయ్ కు అర్ధం అయినట్టు తృప్తి గా నవ్వాడు.

 

 

**********సమాప్తం**********

 

 

 

 

 

 

హిమవత్పద్యములు-2

 

రచన:  జెజ్జాల కృష్ణ మోహన రావు

 

కందగీతి – బేసి పాదములు – తేటగీతి మొదటి మూడు గణములు, సరి పాదములు – తేటగీతి పాదము

ప్రేమ యామనిన్ బెంపొందు

ప్రేమ నీరామనిన్ నిండి – పెల్లుబుకును

ప్రేమ శిశిరపు రంగులౌ

ప్రేమ హేమంత కాలపు – వెచ్చదనము

 

కమలగీతి – సూ/సూ/సూ – సూ/సూ

రవి వెలుంగు తగ్గె – రాత్రి హెచ్చె

భువిని చెట్టులెల్ల – మ్రోడువారె

దివిని పులుఁగు వలను – దెసకుఁ బోయె

అవుర హిమము గురియు – నవనిపైన

 

కవికంఠభూషణము – స/జ/స/స/స/జ/గ 19 అతిధృతి 177900 (ప్రాసయతి)

మలపైన మంచు – చలి నిండెను గం-బళ మొండు కావలెన్

జలిలోన వేడిఁ – గలిగించఁగఁ గౌ-గిలి నాకు నీవలెన్

మెలెమెల్లగాను – నళిణేక్షణ న-న్నలరించ రావలెన్

జలి పారిపోవు – వలపందున వె-న్నెలఁ జిల్కి పోవలెన్

 

కాంచన – భ/న/య/లల UIIII – IIU UII 11 త్రిష్టుప్పు 1663

మంచు విరులు – మణులై పూచెను

కాంచన రవి – కళలన్ దోఁచెను

చంచలముగ – జలముల్ బారఁగ

కాంచ నుషయు – కవితాకారము

 

కుముద – న/భ/న/భ/న/న/న/లగ III UII III UII – III IIII IIIU 23 వికృతి 4193684

మలలపై మెల కురిసె వెన్నెల – మసృణ హిమములు మెఱయఁగా

కొలనిపై మెల కురిసె వెన్నెల – కుముదములు పలు తడియఁగా

వెలఁదిపై మెల కురిసె వెన్నెల – విరుల సరములు వెలుఁగఁగా

కలలపై మెల కురిసె వెన్నెల – కవనములు పలు చెలఁగఁగా

 

గీతిక – బేసి పాదములు – ఇం/సూ/ఇం, సరి పాదములు – ఇం/ఇం – సూ/ఇం

సుమముతో రంగవల్లులే

యమరు నీ మనసులో – నమరవల్లిగా

హిమముతో స్ఫటికవల్లులే

యిముడు నీ మనసులో – హేమవల్లిగా

 

గీతికాకందము – బేసి పాదములు – ఇం/సూ/ఇం, సరి పాదములు – ఇం/ఇం/సూ – సూ/ఇం

గీతికాకంద మందమై

ప్రీతితో వ్రాయనా నీకుఁ – బ్రేమఁ బాడనా

శీతల మ్మయ్యె భూమి, యీ

చేతమో యయ్యెఁగా వేడి – చెలియ తియ్యఁగా

 

గుణ “వృత్త్తము” – 1,2,4 పాదములు – చ/చ/చ/గ, 3 పాదము – చ/చ/చ/భ

కలలో వ్రాసిన – కవితయు నా

యలలో యనఁగా – నలరెనుగా

మలపైఁ దెల్లని – మంచు హసించెను

తళతళ లాడుచుఁ – దళుకులతో

 

చమరీచర – న/న/ర/న/ర III III UI – UIII UIU 15 అష్టి 11968

కలల కడలిలోనఁ – గామమణు లుండునా

మలల పయిన మంచు – మానికము లుండునా

శిలల హృదయమందుఁ – జేతనము లుండునా

పిలుపు సడులయందుఁ – బ్రేముడియు నుండునా

 

చామరము – ర/జ/గ UI UI UIU 7 ఉష్ణిక్కు 43

నింగిలోని యంచులా

శృంగమందు మంచులా

భృంగమందు వన్నెలా

రంగులందుఁ జిన్నెలా

మ్రంగు పూలతీగలా

గంగనీటి పొంగులా

కొంగ ఱెక్క ఱింగులా

నన్ గనంగ రా హలా

 

జగతీకందము – ప్రతి పాదారాంభములో జ-గణము, మిగిలినవి కంద పద్యపు లక్షణములు

దిగంతమం దుదయించెను

జగమ్మునకు వెలుఁగు నిచ్చు – సవితృఁడు మఱలన్

నగమ్ము వెలింగె మణులన

జిగేలుమని హిమము మెఱయఁ – జెలువముతోడన్

 

జలదరసితా – న/స/య/య/లగ IIIII UIU – UIU UIU 14 శక్వరి 4704

గగనమునఁ జంద్రుఁడా – కంటివా నావిభున్

పొగలవలె మంచులో – మోహనుం డెక్కడో

రగిలె నొక జ్వాలయే – రాత్రి యీ డెందమం

దగపడఁడు వాఁడు నా – యాశలే ధూపమా

 

తేటగీతి –

రంగు రంగుల టోపీల – హంగు మీఱ
దాల్చి రాచిన్ని పిల్లలు – దలలపైనఁ
గేక వేసిరి చెంపలఁ – గెంపు లలర
మంచు బంతుల నాడిరి – మలసి కలిసి

 

తేటగీతి వద్యము – (వద్యము – వచన పద్యము)

కరిగిపోయాయి మెల్లగా

కళ్ల యెదుట కనబడే మంచు కుప్పలు

కలుగుతుంది మనకు సందేహము

అసలు మంచు

రెండు రోజులకు ముందు పడినదా

రుజువు లేదు

 

అసంపూర్ణ తేటగీతి వద్యము – (వద్యము – వచన పద్యము)

వదలినది అనుకొన్నాము

వదలలేదు

నేను ఉన్నాను అంటుంది

మేను చలికి వణికి పోతుంది ఇంకా

చివరికి గెలుపు చలికి

హేమంత ఋతువుకు!

 

తేటగీతి – మధురగీతి (త్ర్యస్రగతిలో)

మధురగీతి – సూ/సూ/సూ – సూ/సూ/సూ

తేటగీతి – సూ/ఇం/ఇం – సూ/సూ

మమత నిండిన చిన – మాట – మధురతరము

కమలనేత్రుఁడు నను – గాంచఁ – గలుగు వరము

హిమము గురిసెను ధర-యెల్ల – హేమమయము

రమణ రా గృహమవ – రమ్య – రాసమయము

 

తేఁటిబోటి – ఆటవెలఁది బేసిపాదము + చంద్రగణము – సూ/సూ/సూ – ఇం/ఇం – చం

చెంగుమంచు నడచు – చిన్న దూడలు లేవు – సీమయందు

చెఱకు లేదు పళ్ల – కొఱకఁగా నిచ్చట – దొఱకవే

భోగి మంట లేదు – ప్రొద్దుట వాకిలి – ముందు జూడ

నిది ప్రతీచి, ధవళ – హిమము నిండిన దీర్ఘ – హేమంతము

 

దమనక – న/న/న/లగ 11 త్రిష్టుప్పు 1024

త్ర్యస్ర గతిలో – III III – III IU

సుమము విరియ – సొగసు గదా

హిమము గురియ – హితవు గదా

విమల మతియు – వెలుఁగు గదా

కమలనయనుఁ – గనుము సదా

 

పై పద్యమే చతురస్ర గతిలో – IIII IIII IIU

సుమములు విరియఁగ సొగసుల్

హిమములు గురియఁగ హితవుల్

విమలము మతి యవ వెలుఁగుల్

గమలపు చెలువము గనులన్

 

ద్విపద – ఇం/ఇం – ఇం/సూ

కురియుచుండెను మంచు – కుప్పలై చూడు
మురియుచుండుట యింట – మోదమే నేఁడు
బడి మూఁతపడ నేఁడు – బాగుబాగనిరి
విడకుండ టీవీని – బిల్లలు గనిరి

 

ఏ చిత్రకారుండు – నెట్లు చిత్రించె

యీ చిత్రమును జాల – యింపు మీఱంగ

 

ఈ హేమలతలందు – నెంతయో సొంపు

నీహారహారమ్ము – నిండు సౌష్ఠవము

 

నటహంస – ర/త/న/స/గ UIU UUI – IIIII UU 13 అతిజగతి 2019

ఆడనా నృత్యమ్ము – నతి మధుర రీతిన్

పాడనా గీతమ్ముఁ – బరవశము సేయన్

నేఁడు హేమంతమ్ము – నిశి బిలుచుచుండెన్

నేఁడు రా నన్ గూడ – నెనరు మది నిండున్

 

నవవత్సర – న/వ/వ/త/స/ర లేక న/జ/మ/న/త/గ  IIII UIU – UUI IIU UIU 16 అష్టి 20016

హిమములు రాలఁగా – నీభూమి ధవళ మ్మయ్యెఁగా

సుమతతి యింటిలో – సొంపార విరియన్ రంగులే

ద్యుమణియు వెచ్చఁగా – ద్యోతమ్ము నొసగన్ హాయియే

రమణియు రమ్యమై – రాగమ్ము పలుకన్ జందమే

 

 

తేనెలొలుకు తెలుగు-ఆమ్రేడిత శోభ

 

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

 

 

~~~~~~~~~~~~~

“గలగలా గోదారి కదలిపోతుంటేను

బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే

~~~~~~~~~~

 

ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను జ్యోతి వలబోజుగారి సందేశం రాకముందే ‘చకచకా’ వ్యాసం రాసి పంపించాలని. కాని కొంత పనుల నెపం, మరికొంత బద్ధకం.  ‘గబగబా’ ఏదో రాయటం కాదుగదా. అసలే రాసేది తేనెలొలుకు తెలుగు గురించి. తెలుగు భాష తియ్యదనం గురించి.

సరే ఈసారి ఆమ్రేడితాల గురించి మాట్లాడుకుందామనిపించింది.  వేరే భాషల గురించి తెలియదు కాని

తెలుగులో ఆమ్రేడితాల పాత్ర తక్కువేమీ కాదు. ఆమ్రేడితమంటే కొంతమందికి తెలియక పోవచ్చుకానీ చదువుకున్నవారయినా, చదవుకోనివారయినా మాట్లాడేప్పుడు  ఏదో సందర్భంలో వాడకుండా మాత్రం ఉండలేరు. మెల్లగా నడిచే పిల్లల్ని ‘గబగబ’ నడువు అంటారు.  మెరిసే వస్తువుల్ని చూసినప్పుడు ‘తళతళ‘ మెరుస్తుంది అంటాం.  ఉదాహరణకు కంచం తళతళ లాడుతుంది అనటం సహజం. అదే ఆకాశంలో చుక్కలు ’మిలమిల’ మెరుస్తున్నాయి అనటం చూస్తాం.  ఇప్పుడర్థమయ్యింది కదా ఆమ్రేడితాలంటే.  ఒకే పదం ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగిస్తే వ్యాకరణ పరంగా అలాంటి పదాలను ఆమ్రేడితాలంటారు.  సర్వ సాధారణంగా ఆమ్రేడితాలను నొక్కి చెప్పటానికి వాడుతాం.  కాని అవి తెలియకుండానే భాషకు అందాన్ని భావానికి ప్రాధాన్యాన్ని చేకూరుస్తాయి.

 

ఇక ఉదాహరణలు కోకొల్లలు.

 

నీళ్లు ‘సలసల’ కాగుతున్నాయి.

వాడు ‘చరచర’నడుచుకుంటూ వచ్చాడు.

తండ్రిని చూస్తే చాలు ఆ అబ్బాయి ‘గడగడ’ వణికికిపోతాడు- ఇది భయ సూచకం.  అదే చలి బాధయితే అయ్యో పాపం చలికి ‘గజగజ’ వణికి పోతున్నాడు.

కాయితం‘పరపర’చింపేశాడు,

’కసకస’కత్తితో పొడిచాడు.

’బుసబుస’కోపం పొంగుకు వచ్చింది.

ఆమె ‘రుసరుస’లాడుకుంటూ వెళ్లి పోయింది.

అమ్మాయి’గునగున’నడుస్తూ వస్తున్నది.

వాళ్లిద్దరేవో ‘గుసగుస’ లాడు కుంటున్నరు. ఇలా. . . .

‘పకపక’ నవ్వేవాళ్లు కొంతమంది.

’గలగల’ నవ్వేవాళ్లు కొంతమంది.

మళ్లీ ఇదే ‘గలగల ‘గాజుల శబ్దానికివాడుతాం.  అలాగే గలగలా నది ప్రవహిస్తున్నది అంటాం.

 

శబ్ద సంబంధమైన ఆమ్రేడితాలు చాలానే ఉన్నాయి.

గజ్జెలు ‘ఘల్లుఘల్లు’ మన్నాయి.

’గణగణ’ గంట మ్రోగింది. ’,

’బడబడ’చప్పుడు చేస్తూ రైలుపోతున్నది.

ఎవరో ‘దబదబ’తలుపు కొడుతున్నరు.

’టపటప’చినుకులు రాలినయ్.

లేకపోతే ఆ తిట్లకు ఆమె కన్నుల నుండి ‘టపటప’ కన్నీట చుక్కలు రాలిపడినయ్.

జాతీయ జండా ‘రెపరెప’లాడుతున్నది.

ఇలా చాలా సందర్భాలలో మనకు తెలియకుండానే ఆమ్రేడిత శబ్దాలు వాడుతాం.

క్రియా పదాలకు విశేషణాలుగానే ఆమ్రేడితాలు ఎక్కువగా వాడబడతాయి. ’టకటక’ తలుపుకొట్టడానికీ, నడువడానికీ వాడటం జరుగుతుంది.

 

’బిరబిర’, ’జరజర’, ’కరకర’, ’మెరమెర’, ’పెరపెర’, ’గరగర’, చరచర’, చురచుర’, ’బరబర’, ’బురబుర’, ’సురసుర’, ’పిటపిట’, ’గుటగుట’, ’గటగట’, పటపట’, ’వటవట’, ’వెలవెల’, ’ఫెళఫెళ’’, ’కిచకిచ’, ’కిలకిల’, ’మలమల’, ’బొలబొల’, ’ములముల’, ’కులకుల’, ’పలపల’, ’వలవల’, ’విలవిల’, ’ఢమఢమ’, ’తిమతిమ’, ధుమధుమ’, ’ఘుమఘుమ’, ’దబదబ’, ’లబలబ’, ’కుతకుత’, ‘తుకతుక’, ఇలా వెతుకుతూ పోతే బోలెడన్ని ఆమ్రేడితాలు తెలుగు భాషా సౌందర్యానికి వన్నెలద్దుతాయి.

 

అన్నం ఉడుకుతుంది అనడానికి,  అన్నం ‘తుకతుక’ ఉడుకుతుంది అనటానికి భేదం మనకు తెలుసు. ఆమ్రేడితాలు చాలా సందర్భాలలో మాటల్లో దృశ్యీకరణ చేస్తాయి. లాక్కుపోవడానికీ ‘గొరగొర’ గుంజుకు పోయిండు అన్నదానికి సన్నివేశ చిత్రణలో మార్పు తెలుస్తుంది. బాధను వ్యక్తం చెయ్యడానికి ‘విలవిల’లాడిండు అంటాం. కోపం ప్రకటించడానికి -వాణ్ని ‘కరకర’ నమిలి మింగెయ్యాలన్నంత కోపం వచ్చింది అంటాం.  అలాగే చురచుర చూసిండు అంటాం.

కొన్ని ఆమ్రేడితాలు ఒక్కోసారి వేరువేరు సందర్భాలలో వాడటం జరుగుతుంది.  చూశారా ‘వేరు వేరు’ కూడా ఆమ్రేడితమే.  ‘గడగడ’ అనే దాన్ని  పాఠం చదవిండనీ చదవటానికీ, గడగడవణికి పోయిందని భయపడటానికీ,  గడగడ గ్లాసుడు నీళ్లు తాగిండు అని తాగడానికీ వాడటం చేస్తుంటాం. ఏది ఏమైనా సర్వ సాధారణంగా పనిలోని వేగాన్ని,  తీవ్రతను తెలియపరుస్తుంది ఆమ్రేడితం. బుర్రకథల్లో ఉత్ప్రేక్షగా

‘చరచరచరచర’ కత్తి దూసెరా

‘పటపటపటపట’ పండ్లు కొరికెరా

వంటి ప్రయోగాలున్నాయి.

 

ప్రారంభంలో నాంది వాక్యంగా రాసిన ప్రసిద్ధ గీతపాదం శంకరంబాడి సుందరాచారి రాసిన “మా తెలుగు తల్లికీ మల్లె పూదండ”లోనిదన్నది  అందరికీ తెలిసిన విషయమే. అందులోని గలగలా గోదారి, బిరబిరా కృష్ణమ్మ తెలుగు వారి నాలుకల మీద ఎప్పుడూ ఆడే ఆమ్రేడితాలు.

 

ఆమ్రేడితాలను పద్యంలో పొందుపరచిన  కవులున్నారు. ఉదాహరణకు వానమామలై వరదాచార్యులు ఒక పద్యంలో

 

చం. జలజల పూలు రాలినటు చల్లనిమెల్లని పిల్ల తెమ్మెరల్

తెలతెలవాఱి  వీచినటు తియ్యని కమ్మని పాలనీగడల్

తొలితొలి తోడు విచ్చినటు తోరపు సిగ్గున ముగ్ధ కందొవల్

వలపుల జిమ్మినట్లు చెలువమ్మొలికించు భవత్కవిత్వముల్ .

ఆమ్రేడతాలుపయోగించడంతో  పద్యం శోభాయమానమైంది.

 

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 35

 

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

కీర్తనలో అన్నమయ్య వాదన బహు చిత్రవిచిత్రంగా ఉంటుంది. మనిషి యొక్క పాపపుణ్యాలకు కారణమైనది మనసు. మనస్సును నియంత్రించేది భగవంతుడే కదా!  అలాంటప్పుడు పాప పుణ్యాలను చేయించే బుద్ధిని  తప్పు మానవులది ఎలా అవుతుంది?  అందువల్ల ఆయన్నే అడగాలి. మనం చనిపోయాక మన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తునిచే            చదివించి యమధర్మరాజు శిక్షించే పద్ధతిని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. చిత్తగించండి.

కీర్తన:

పల్లవి: అతని నడుగవో చిత్రగుప్త నాయందలి యౌఁగాము లన్నియును

అతఁడే మీ కుత్తరము చెప్పెడిని యన్నిటికిని మముఁ దడవకుమీ

 

.1. కరచరణాదులు నాకుఁ గల్పించిన యతఁడే

గరిమల నా వుభయకర్మసంఘములకుఁ దాఁ గర్తా

సరుగఁ బ్రాణము లొసఁగి చైతన్య మతఁడే

పరగఁగ నాయపరాధంబులు పరిహరించఁ గర్తా          అత॥

 

.2. రమణతో ననుఁ బుట్టించి రక్షించే యతఁడే

అమరఁగ నన్ను వహించుక నా వళుకంతయుఁ దీర్చఁగఁ దాఁ గర్తా

ప్రమదమున నాయంతరాత్మయై పాదుకొన్నయతఁడే

మమతల మీలోకము చొరకుండా మాటలాడుకొనఁ దానే కర్తా          అత॥

 

.3. యెప్పుడుఁ బాయక దాసునిఁగా నేలుకొన్న యతఁడే

తప్పక యిహముఁ బరమునిచ్చి వొరులు దడవకుండఁ జేయగఁ గర్తా

చెప్పఁగ నాపాలి దేవరా శ్రీవేంకటేశుఁ డతఁడే

అప్పణిచ్చి మిము సమ్మతి సేయుచు నటు మముఁ గావఁగఁ దానే కర్త         అత॥

(రాగం: లలిత, సం.2. సంకీ.294, రాగిరేకు 161-2)

 

విశ్లేషణ:

 

పల్లవి: మనిషిచేసే మంచిచెడులన్నిటికీ మనస్సే కారణం. మనస్సును నియంత్రించేది భగవంతుడే కదా! మనిషి మరణించాక యమధర్మరాజు చిత్రగుప్తునిచే మన మంచి చెడ్డల చిట్టా విప్పి చదివించి శిక్షలు వేయడం ఏమి న్యాయం? శ్రీవెంకటేశ్వరుడు మన బుద్ధులను నియంత్రిస్తున్నాడు కనుక ఆయననే అడగాలి విషయాలు మమ్ము విచారించవద్దు అనే క్రొత్త వాదన వినిపిస్తున్నాడు అన్నమయ్య.

 

.1. కరచరణాదులు నాకుఁ గల్పించిన యతఁడే

గరిమల నా వుభయకర్మసంఘములకుఁ దాఁ గర్తా

సరుగఁ బ్రాణము లొసఁగి చైతన్య మతఁడే

పరగఁగ నాయపరాధంబులు పరిహరించఁ గర్తా

నాకు కాళ్ళు చేతులు సర్వ అంగములను ఇచ్చినది భగవంతుడే కదా! నా కర్మలకు సైతము ఆయనే కర్త కదా! నా సంచిత, ఆగామి కర్మలన్నీ ఆయన అధీనమే కదా! నా ప్రాణములను నిత్య చైతన్యవంతం కలిగించేది సర్వేశ్వరుడే కదా! మరి నా అపరాధములు పరిహరించే కర్తవ్యం కూడా ఆయనదే కదా! నా పాపములను పరిహరణ చేయకుండా నన్నే పాపిగా దోషిగా నిలబెట్టడం ఏమిటి దేవా? ఇందులో నా దోషం ఇసుమంతైననూ లేదు.

 

.2. రమణతో ననుఁ బుట్టించి రక్షించే యతఁడే

అమరఁగ నన్ను వహించుక నా వళుకంతయుఁ దీర్చఁగఁ దాఁ గర్తా

ప్రమదమున నాయంతరాత్మయై పాదుకొన్నయతఁడే

మమతల మీలోకము చొరకుండా మాటలాడుకొనఁ దానే కర్తా

          నను చక్కగా పుట్టించేది, రక్షించేది శ్రీహరే కదా! నాకు సంబంధించిన మంచి చెడ్డలను చూసుకునే బాధ్యత వహించినట్టే కదా! నాకు సంబంధించిన అన్ని వ్యవహారములకు ఆయనే కర్తయై ఉన్నాడు. నా అంతరాత్మలో నెలకొన్న పరంధాముడే మీతో మాట్లాడు కుంటాడు. సరైన ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ఆయంకు తెలియనివి కాదు కదా! అన్నిటికినీ ఆయనే కర్త అంటున్నాడు అన్నమయ్య.

 

.3. యెప్పుడుఁ బాయక దాసునిఁగా నేలుకొన్న యతఁడే

తప్పక యిహముఁ బరమునిచ్చి వొరులు దడవకుండఁ జేయగఁ గర్తా

చెప్పఁగ నాపాలి దేవరా శ్రీవేంకటేశుఁ డతఁడే

అప్పణిచ్చి మిము సమ్మతి సేయుచు నటు మముఁ గావఁగఁ దానే కర్త

 

 

            పరంధాముడు మమ్ము ఎన్నడూ విడచిపెట్టడు. మా మంచిచెడ్డలన్నీ ఆయనే కాచుకుని ఇహపర సుఖాలను ప్రసాదిస్తాడు.ఇతరులు బాధలనందకుండా తనను నమ్ముకున్న భక్తులు దు:ఖించకుండా చూసుకునే కర్త ఆయనే కదా! నా పాలి దైవమైన శ్రీవేంకటేశ్వరుడు మిమ్ములను సద్భుద్దిగల వారుగా చేస్తాడు. తానే అన్నిటికీ కర్తృత్వం వహించి మీరు తనకు దాసులుగా ఆత్మార్పణము చేసే విధంగా చూసుకొంటాడు. కనుక శ్రీహరిని త్రికరణసుద్ధిగా నమ్మితే పై విధంగా అన్నివిధాలా మనలను రక్షిస్తాడు మోక్షగాములను చేస్తాడు అని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.

 

ముఖ్యమైన అర్ధాలు    ఔగాములు  = మంచిచెడ్డలు; తడవకుమీ! = వెదకవద్దు సుమా! అనగా మాకు సంబంధం లేని విషయంలో మా జోళికి రావద్దు అని చెప్పడంకరచరణాదులు = కాళ్ళు, చేతులు మొదలైన అవయవములు; ఉభయ కర్మములు = సంచిత,ఆగామి అనే కర్మలు; సరుగ = వర్ధిల్లు, వృద్ధిపొందు; పరగు = ప్రసరించు; పరిహరణ = ఛేదనము, విచ్ఛేదనము, సంభేదము; రమణ = మనోజ్ఞత, అందము; వళుకు = తగవు, కయ్యము, పోట్లాట; ప్రమదముఆనందము, సంతోషము; పాదుకొన్న = నెలకొన్న; పాయక = విడువక; సమ్మతిజేయు = అంగీకరించు, ఆమోదించు; అప్పణ = ఉత్తరువు, సెలవు.

-0o0-

NALEDI – ఒక బుజ్జి ఏనుగు కథ.

రచన: చక్రధర్

ఈ ప్రపంచంలో మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులు పక్షులు కీటకాలు సూక్ష్మజీవులు సముద్ర జీవులు ఉన్నాయి. దగ్గరగా ఉండి గమనిస్తే ప్రతి జీవి చేసే జీవన పోరాటం వాటి సాంఘికజీవనం ఆ జీవనంలో
ఎదురయ్యే సమస్యలు శారీరక మానసిక బాధలు అన్ని అందరికీ ఒకటే.
చూడటానికి భారీకాయులైనా మానసికంగా చాలా సున్నితమైన స్వభావం కలిగినవి ఏనుగులు. ఇవి శాకాహారులు. అనాదిగా మనిషితో స్నేహంగా ఉంటూ అతనికి ఎన్నో విధాల సాయపడిన జీవులు.
ముఖ్యంగా భారీ వస్తువుల రవాణా లో, యుద్ధాల్లో ‘గజదళం’ గా సాయపడిన ఏనుగులు, తర్వాతి కాలంలోగుళ్ళల్లో మూలవిరాట్టును ఊరేగించడానికి గుడి ఆస్థాన జంతువులుగా ఉంటున్నాయి. భారతీయ
సంస్కృతిలో ఏనుగు ని వినాయకుడు గా పూజిస్తారు.
ఆఫ్రికాలో బోట్స్వానా లో అబూ క్యాంప్ అనేది ఒక ఏనుగుల సఫారీ క్యాంప్ . సర్కస్ లో నుంచి, జూ లలోనుంచి, ఇంకా వివిధ ఇతర భయంకరపరిస్థితుల్లోంచి వచ్చిన ఏనుగులని అక్కడ పరిరక్షిన్తుంటారు. వాటి
శారీరక మానసిక స్థితిగతులను పరీక్షించి తిరిగి వాటిని ఆటవిక జీవనం కొనసాగించే దిశగా పనిచేస్తుంటారు.
ఆ క్యాంపులో కిటి అనే ఒక అనాధ ఏనుగు గర్భవతిగా ఉండి నేడో రేపో ప్రసవం అన్నట్టుగా ఉంటుంది. పర్యవేక్షణకి ఇద్దరు డాక్టర్లు వస్తారు. పుట్టబోయే ఏనుగు కోసం నలేదీ అనే పేరును సెలెక్ట్ చేస్తారు. రోజూఎదురు చూస్తున్న కిటి మాత్రం ప్రసవించదు. అలా 13 రోజులు గడిచిన తర్వాత 14వ రోజు రాత్రి ఒక బుజ్జి ఏనుగు పిల్లకి జన్మనిస్తుంది. చిన్ని తొండంతో కాళ్ళు కొట్టుకుంటూ నెలేదీ ఈ ప్రపంచంలోకి వస్తుంది.
కాసేపు అటు ఇటు దొర్లి మెల్లిగా లేచి నిలబడుతుంది. సహజ మాతృత్వంతో కిటి నలేదీని అక్కున చేర్చుకుంటుంది.
చిన్ని తోకనీ తొండాన్ని అటూ ఇటూ తిప్పుతూ బుడిబుడిగా నడుస్తున్న ఆ ఏనుగు పిల్లని చూసి అందరూ ముచ్చట పడతారు. చాల సంతోషంగా ఫీల్ అవుతారు. గత 20 సంవత్సరాలుగా అదే క్యాంపు లో పనిచేస్తున్న ఒకతను అది తన కూతురు లాంటిదని చెప్పుకొస్తాడు. అతని జీవితమంతా ఏనుగులతో పెనవేసుకు పోయింది మరి.
అలా ఏనుగుల సమూహంలోకి కొత్తగా నలేదీ చేరుతుంది. మిగతా ఏనుగులు కూడా దాన్ని బాగానే స్వీకరిస్తాయి. రోజు పొద్దున్నే ఏనుగులని అలా అడవిలో తిప్పడం సాయంత్రానికి మళ్ళీ క్యాంప్ చేరుకోవడం
జరుగుతుంటుంది. అలా ఆ ఏనుగులకి ఆటవిక వాతావరణాన్ని అలవాటు చేసి మెల్లిగా అడవులలో వదిలేస్తారు.
నలేదికంటే ముందే కిటి కి లోరటో అనే ఆడ ఏనుగు ఉంటుంది. నలెడి తన అక్కయ్య, మిగత సహచరులతో కలిసి హాయిగా ఉంటుంది.
అంతా సవ్యంగా ఉంది అనుకున్న సమయంలో హటాత్తుగా కిటి కి అనారోగ్యం సంభవించడం జరుగుతుంది. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించక కిటీని కోల్పోవాల్సి వస్తుంది. అక్కడ సిబ్బందికి ఎంతో ప్రీతిపాత్రమైన కిటి
లేకపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది అది చనిపోయిన విషయం వాళ్ళు నమ్మలేరు అడవి నుంచి తిరిగి వస్తుందేమో అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంటారు.
ఆరు వారాల్లోనే బుజ్జి నలేది తల్లిని కోల్పోయి అనాధగా మారిపోతుంది. ఒంటరిదై పోతుంది. దాని మనసులో బాధ ఊహించరానిది. మరిచిపోలేని ఆ బాధ నుంచి అది బయట పడుతుందని ఎదురుచూస్తుంటారు సిబ్బంది.
సర్కస్ నుంచి రిస్క్ చేయబడిన ఏనుగు కేతీ తనకంటూ బిడ్డ లేకున్నా అక్కడుండే మిగతావాటికి అమ్మలాంటిది. నలేది మెల్లగా కేతీ దగ్గరకు చేరుకుంటుంది. కేతీ కూడా నలేదిని అక్కున చేర్చుకుని పాలు ఇస్తుంది. బిడ్డ లేకుండానే పాలు ఉండటం వల్ల సరిపోయినంత పాలు ఉండవు. ఆ పాలలో పోషక విల్లువలు కూడా చాల తక్కువగా ఉంటాయి. కొద్దిరోజుల్లోనే బక్కపడిపోయిన నలేదీన్ని చూసి సిబ్బందికి అర్థమైపోతుంది దానికి కావలసిన పాలు పోషకాలు అందట్లేదని. అప్పుడు దానికి ఆహారం అందించడమే సమస్య అవుతుంది. తల్లిపాలు తప్ప తాగని ఆ చిన్ని కూన సీసా పాలు ముట్టదు. సిబ్బంది చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. మరోవైపు తన బిడ్డ కాదు గనక కేతి నెలేదీ ని పెద్దగా పట్టించుకోదు. దాంతో శారీరకంగా,
మానసికంగా నెలెదీ చిక్కిపోతుంది. దాని కాపాడాలంటే దాన్ని గుంపు నుంచి వేరుచేసి పాలు తాగించే ప్రయత్నం చేయడం ఒక్కటే మార్గం అని సిబ్బందికి అనిపిస్తుంది. నలేదీ తీసుకుపోతుంటే మిగతా ఏనుగులు అరుస్తూ అడ్డుపడుతూ అభ్యంతర పెడతాయి, ముఖ్యంగా నెలేదీ అక్కయ్య. కాని ఎలాగోలా నలేదీ ని జీప్ లో ఎక్కించుకొని వేరే చోటుకి తీసుకెళతారు.
కొత్తగా తీసుకొచ్చిన ప్రదేశంలో ఆ చిన్న ఏనుగు నిలబడలేదు. ఏడుపు, అరుపులు, బాధ ఆక్రందన. కానీ సిబ్బంది నిస్సహాయులు. దాన్ని ఎలా పాలు తాగేట్టు చేయాలో వాళ్ళకీ తెలిదు. కాని దానికి తల్లి ప్రేమా కావాలని, అలాంటి ప్రేమని అందించగలిగితే అది పాలు తాగి బతికే అవకాశం ఉన్నదని భావిస్తారు. దాంతోనే సాంతం గడపడం, తనతోపాటే ఉంటున్నారన్న భావన కలిగించడం చేయాలి. అందుకే వాళ్లు అన్ని ప్రయత్నాలు చేస్తారు. దాన్ని ప్రేమగా చూస్తారు ఆడుకుంటారు. దాంతోపాటే రాత్రి పడుకుంటారు తాను
ఒంటరిని అన్న భావన కలిగిన మరుక్షణం అది చనిపోతుంది అని సిబ్బందికి తెలుసు. అలా దానితో ఒక అనుబంధం ఏర్పరచుకుంటే తప్ప అది మామూలు కాలేదు. దానికి కూడా మెల్లిగా వాళ్ళు తనవాళ్ళే అనే భావన కలుగుతుంది. వాళ్ళ మీద తన ప్రేమని చూపుతుంది. మెల్లిగా పాలు తాగటం మొదలు పెడుతుంది.
ఇహ సిబ్బంది ఆనందానికి అంతు లేదు. ఇలా ఆఫ్రికాఖండంలో ఇలా అనాధలై తల్లి ప్రేమ లేక చనిపోతున్న చిన్న ఏనుగులు ఎన్ని ఉన్నాయో అనేది ఆలోచనకి వస్తుంది ఆ సిబ్బందికి. ఆ పాయింట్ ని తమ రిసెర్చ్ లో పెట్టుకుంటారు. అలా రోజు నలేదీ పాలు పట్టటం,.. అలా తిప్పుకొని రావటం, ఆట పాటలటో దాన్ని మామూలుగా చేస్తారు.
అది ఇప్పుడు అందంగా ఆరోగ్యంగా తయ్యారవుతుంది. ఇప్పుడ మళ్లీ దాని ఇదివరకటి గుంపులో వదిలేయాలి. దానికోసం ఒక పథకం వేస్తారు. ఏనుగులు కొత్తవాటిని తమ గుంపులోకి తొరగా అంగీకరించవు. కానీ నలేదీ నాలుగు నెలలుగా గుంపు నించి వేరు అయింది కనక .. దాన్ని గుంపులోకి అంగీకరించటం అంత సులభం కాదు. మెల్లిగా నలేదీకి ఒక్కో ఏనుగుతో కలిపిస్తారు. మొదట్లో అక్క లోరటో, నలేదిని చూసి
దగ్గరికి రాదు. ఎదో వింత జంతువుని చూసినట్టు చూస్తుంది. కానీ రెండో రోజు, రసిక అనే మరో ఏనుగుతోకలిసి వచ్చి… నలేదిని గుర్తిస్తుంది. అలా అన్ని ఏనుగులు మెల్లిగా నలేదిని తమలో కలుపుకుంటాయి.
తొండముతో ఒకరిని ఒకరు రాసుకుంటూ ప్రేమని తెలుపుకుంటాయి. ఇదంతా వాటికీ మనకీ ఒక గొప్ప భావోద్వేగ సంఘటన.
అలా గుంపులో కలిసిన నలేది నేర్చుకోవలసింది చాలా ఉంది. ఏది తినాలి ఏది వదిలేయాలి, ఏయే జంతువులూ హానికరం, వేటితో సమస్య ఉండదు లాంటి విషయాలు ఎన్నో నేర్చుకోవాలి. గుంపు విడిచి దూరంగా వెళ్ళకుండా చూసుకోవాలి. తన అక్కయ్యల సంరక్షణలో.. నలేది హాయిగానే ఉంటుంది. కుంటల్లోజలకాలు, చిన్న జంతువులని తరుముతూ ఆడుకోవటం.. తొండం ఉపుతూ అటు ఇటు పరుగులు. మొదటి సంవత్సరం గడిచి బర్త్ డే జరిపిస్తారు సిబ్బంది. కొవ్వత్తి ఊదేసి కేకు తింటుంది నలేది. అంతా సవ్యంగా ఉంది అనుకున్న సమయంలో ఎదో అనారోగ్యంతో ఏమి తినకుండా తాగకుండా కనిపిస్తుంది. అజీర్తి, మలబద్దకం అనుకుని మందులిస్తారు. కానీ రోజులు గడుస్తున్న పరిస్థితుల్లో మార్పు రాదు. రోజురోజుకీ బలహీన పడిపోతుంది. సర్జరీ చేయటం వల్లే బ్రతికే ఛాన్స్ ఉంది. అది కూడా చాలా తక్కువ శాతం
అంటాడు డాక్టరు. డాక్టర్లు సర్జరీ కి ఏర్పాటు చేస్తారు. అందరిలోనూ ఏదో ఆందోళన, భయం. ఎం జరుగుతుందో.. చిన్నారి నలేది బతుకుతుందా లేదా ? స్వంత కూతురికి ఆపరేషన్ అయినంతగా బెంగ పడుతుంటారు.
అనస్తీషియా ఇవ్వటం అనేది మనుషులకైనా … జంతువులకైనా కొంచం ప్రమాదకరమే. కోమాలోకి వెళ్లిపోవచ్చు. కొంతం అటు ఇటు అయితే ప్రాణం పోవచ్చు. నలేదీకి అనస్తీషియా ఇస్తారు. నలేదీ శ్వాస క్రమంగా సన్నబడుతుంది. ఆక్సిజన్ పెడతారు. వివిధ రకాల మందులు వేస్తారు. మరో వైపు గుండె కొట్టుకోటానికి అదుముతుంటారు. కాని నలేదీ చడీచప్పుడు కాకుండా పడుంటుంది. అలా కొంత ప్రయత్నం తరవాత ఒక పెద్ద శ్వాస తీస్తుంది. అందరు సంతోషించి.. ఆపరేషన్ మొదలెడతారు. దాని పొట్ట నించి.. రెండు మీటర్ల పొడవున్న palm ఆకులు( ఈత జాతి) బయట పడతాయి. అది పొట్టలో చిక్కుకు పోయినందువల్లే నలేదీ అనారోగ్యం పాలైంది. ఆపరేషన్ తో దాని తీసివేస్తారు. చిన్న ఏనుగులు ఆ ఆకులని ఎక్కువగా తింటే
జీర్ణించుకోలేవు. అందుకే నలేదీకి ప్రమాదం సంభవించింది. కాని సకాలంలో గుర్తించి ఆపరేషన్ చేయటం వల్ల బతకగలిగింది. ఆపరేషన్ నించి కోలుకునే వరకు నలేదీని అడవుల్లోకి పోనివ్వరు. కానీ సాయంత్రం కాగానే
తన సహచరులు రాగానే …మళ్ళీ ఆటలు పాటలు. !!
ఒక్క ఏనుగును బతికించు కోవటానికి ఇంత కష్టమయింది. ఇలా ఏనుగులు సహజంగా జీవించడానికి ఎన్నోఅవరోధాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతరించిపోతున్న అడవులు ఒకవైపు సమస్య అయితే, దంతాల
కోసం ఏనుగుల చంపేసే స్వార్థ మనుషులు మరోవైపు. కాని ఆఫ్రికా నిండా..ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తం మీద దంతాల కోసం చంపపడుతున్న ఏనుగులు ఎన్నో. తుపాకులతో కాల్చి, సైనేడ్ నీళ్ళు తగించి, విషం
పూసిన బాణాలు వేసి ప్రతి రోజు ఏనుగుల్ని చంపుతూనే ఉన్నారు. నలేదీ లాంటి ఎన్నో పిల్లలని అనాధలని చేస్తూనే ఉన్నారు. ప్రతి పదిహేను నిమిషాలకి ఒక ఏనుగును కోల్పోతున్నాం. అలా సంవత్సరానికి 25వేల
నుంచి 30 వేల ఏనుగుల వరకు చనిపోతున్నాయి. మనం ఇంట్లో గర్వంగా పెట్టుకునే ఒక ఏనుగు దంతపు బొమ్మ వెనక ఒక ఏనుగు శవం ఉన్నట్టు లెక్క. ఆఫ్రికా అడవుల్లో ప్రతి కిలోమీటరు కు ఒక ఏనుగు శవం
కనపడుతోందంటే ఎంత దారుణం జరుగుతుందో ఆలోచించుకోవచ్చు. ఇప్పటికైనా మానవజాతి మేలుకొని ఏనుగు దంతాల వినియోగం నిలిపేసి , ఏనుగుల్ని చంపటం ఆపేయకపోతే .. భూమ్మీద ఏనుగు అనే అందమైన భారీ జంతువు ఉనికి మరిచిపోవాల్సి వస్తుంది.

Geoffrey Luck, Ben Bowie దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ చిత్రం అద్బుత నేపథ్య సంగీతంతో ఆకట్టుకుంటుంది. చిన్నారి నలేదీ కథ అందరికీ నచ్చుతుంది. డాక్యుమెంటరీ చిత్రమే అయినా సినిమాకి
కావలసిన అన్ని భావోద్వేగాలు ఇందులో నిండుగా ఉన్నాయి. మొదటిసారి చూడగానే నలేదీతో మనం ప్రేమలో పడిపోతాం. ముచ్చటైన నలేదీ , దాని చిలిపి వేషాలు, జీవిత పోరాటం మనలో భావోద్వేగాలు నింపుతాయి. తద్వారా ఏనుగులు ఎదుర్కొంటున్న సమస్యలు, మానవ జాతి స్వార్థం కూడా మనకి
తెలిసొస్తుంది. పిల్లలు, జంతు ప్రేమికులు తప్పకుండా చూడవలసిన చిత్రం . !!