మధ్యమహేశ్వర్

రచన: కర్రా నాగలక్ష్మి

ఓఖిమఠ్ మఠ్ నుంచి కారులో సుమారు 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ‘ ఉనియాన ‘ గ్రామం చేరేం. అక్కడ రాత్రి చిన్న గదిలో బసచేసుకొని మరునాడు పొద్దున్నే మధ్యమహేశ్వర్ వెళ్లాలనేది మా సంకల్పం. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరితే రాత్రికి మధ్యమహేశ్వర్ లో బసచేసుకొని, మరునాడు పొద్దుట తిరిగి బయలుదేరి ఉనియానా చేరాలనేది మా ఆలోచన. రాత్రి మా బస యజమానిని మధ్యమహేశ్వర్ దారి యెలావుంటుంది వగైరా వివరాలు అడిగేం. పొద్దున్నే మరో రెండుకిలోమీటర్ల ప్రయాణం చేస్తే కొండ మొదలవుతుందని అంతవరకు కారులో వెళ్లవచ్చని తొమ్మిది లోపున అక్కడకి వెళితే గుర్రాలు దొరకవచ్చని, తరవాత గుర్రాలను మట్టిపనికి తీసుకువెళతారని, యాత్రీకులు యెక్కువగా వుండరు కాబట్టి సౌకర్యాలు యేమీ వుండవని చెప్పేరు.
మరునాడు పొద్దున్నే మేం నడక దారి మొదలయిన ప్రాంతానికి చేరుకున్నాం. మా అదృష్టం బాగుండి గుర్రాలు దొరికేయి, మొత్తం రానుపోను 38 కిలో మీటర్లు గుర్రాలమీద ప్రయాణించాలి. సాహసమే పంచకేదారాలు చూద్దాం అనుకున్నప్పుడు తప్పదుకదా ?.
ఓ జత బట్టలు బిస్కెట్స్ పెట్టుకున్న చిన్న చేతి సంచులు గుర్రం యజమాని పట్టుకోగా మేం గుర్రాలమీద జాగ్రత్తగా కూర్చొని ప్రయాణం సాగించేం. సుమారు 11,400 అడుగుల యెత్తున వున్న మందిరం చేరాలి, సుమారు ఓ కిలోమీటరు తప్ప అంతా యెక్కడమే.
ఈదారి కూడా కేదార్ దారిలాగే అంతా కొండలే కాకపోతే కేదార్ కి యాత్రీకుల రద్దీ యెక్కువ వుండడం వల్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్ర మొదలయే సమయానికి రోడ్డు విశాలంగా చేసి రాకపోకలు సులువుగా జరిగేటట్లు అన్ని యేర్పాట్లూ చేస్తారు. కాని తుంగనాధ్ మధ్య మహేశ్వర్ వీటికి మొత్తం యాత్ర సీజన్లతో కలిపి సుమారు యాభై మంది రావడం కూడా గొప్పే అది యీ మధ్య చాలామంది వేసవిలో ట్రెక్కింగ్ చేస్తూ వుండడం వల్ల యీ పాటిగా వస్తున్నారు, దారంతా పెద్ద పెద్ద రాళ్లు పడి వాటిని దాటేటప్పుడు గుర్రం కాలు జారితే మా గుండె జారేది. భయం పోగొట్టుకోడానికి గట్టిగా నా కొచ్చిన స్తోత్రాలు చదువుకోడం, పళ్లు కరచుకునేంత భయం కలిగితే ‘ నమశ్సివాయ ‘ అని గొణుక్కోవడం చేస్తూ మూడు కిలోమీటర్లు ప్రయాణించేం. నడ్డి విరిగినంత నొప్పి అనిపించింది, ఉనియాన పేరుకు వూరేగాని ఒక్క యిల్లు, నాలుగు గదులు వరుసగా రోడ్డు పైకి కట్టి వున్నాయి అది తప్ప మరేమీ లేదు, తినడానికి మధ్యాహ్నం రాత్రి రొట్టి తప్ప మరేమీ దొరకదు, పొద్దున టీ కూడా దొరకని ప్రదేశం కావడం వల్ల మాకు కడుపులో యెలకల గోల మొదలయింది. గుర్రాలబ్బాయితో యెక్కడైనా టీ దొరికే చోట ఆపమని చెప్పేం. ‘ రాన్సి ‘ గ్రామం లో టీ దొరుకుతుందని చెప్పేడు. ఒకే ఒక రేకు గది వున్న ప్రదేశం దగ్గర ఆపి యిదే రాన్సి గ్రామం అన్నాడు. ఆ షెడ్డులో అప్పటికే ఓ బెంగాలీ జంట మా వయసువారే బస చేసి వున్నారు. ఓ పక్కగా కర్రల పొయ్య, దానిమీద టీ పెట్టి మాకు యిచ్చేడు. ఆ బెంగాలీ దంపతులు నడిచి మధ్య మహేశ్వర్ వెళ్లి వస్తారట, ఆ రోజు అక్కడ బస చేసి మరునాడు తిరిగి బయలుదేరి యెక్కడ కష్టమనిపిస్తే అక్కడ బస చేసుకుంటూ వెళ్తారట, టీ తాగడం అవగానే అక్కడ నుంచి బయలుదేరేం.

అక్కడ నుండి మరో రెండు కిలోమీటర్ల తర్వాత నాలుగిళ్లున్న వూరు వచ్చింది అక్కడ మాకు ‘ మేగీ ‘ వేడివేడిగా చేసి పెట్టేరు. అది తిన్న తరువాత మాకు కాస్త ఉత్సాహం వచ్చింది. మరో నాలుగు కిలో మీటర్ల తరువాత ‘ గౌధర ‘చేరుకున్నాం, యిక్కడ రాత్రి బస చెయ్యడానికి మూడు నాలుగు గదులున్నాయి. ఇది దాటితే మరెక్కడా బస చేసే వీలులేదు. బసలంటే వాళ్లుంటున్న గదిలోని ఓ మూల పక్క వేసి రజ్జాయిలు యిస్తారు. ఆ రజ్జాయిలు కొన్న తరువాత ఒక్క వుతుకుకీ నోచుకోనివి, ఓ మారు యెప్పుడైనా సన్నని యెంత పొడ వస్తే మాత్రం యెండలో వేస్తారు. కాబట్టి ఉత్తరాఖండ్ యాత్రలకు వెళ్లేవారు వారి సామానులతో పాటు రెండు దుప్పట్లుకూడా సర్దుకుంటే మంచం మీద వేసుకోడానికి ఒకటి రజ్జాయికింద అంటే మన శరీరానికి ఆనేది మన దుప్పటి అయితే సగం చర్మరోగాలను అరికట్టగలం, యేమంటారు ?.
అదే సుమారు ఆప్రాంతాలకు ఆఖరు జనావాసాల గ్రామం. ఈ కొండలలో వున్న వారు వారికి కావలసిన ధాన్యం, కూరగాయలు కొండచరియలలో పండించుకుంటూ, మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు, ముఖ్యాంగా వీరు శాఖాహారులు. గౌధర్కి ఓకిలోమీటరు దూరంలో ‘ బంతోలి ‘ అనే గ్రామం, జనావాసాలు లేని వాటిని గ్రామం అనొచ్చా ? యేమో, మన సౌకర్యం కోసం ప్రదేశం అందాం , యీ బంతోలీ అనే చోట మధ్యమహేశ్వర్ గంగ, మర్కన గంగ సంగమంచే ప్రదేశం. ఆ సంగమం చూసుకొని ముందుకు ప్రయాణించసాగేం. ఒకరో యిద్దరో ట్రెక్కర్లు తప్ప వేరే యెవ్వరూ లేరు. మా పుణ్యం బాగుంది వర్షం పడలేదు. పచ్చని చెట్లమధ్య నుంచి చల్లగాలి శరీరానికి తగులుతూ సేదదీరుస్తూ వుంది. అడవి లోంచి వీస్తున్నగాలి యెవేవో వాసనలను మోసుకు వస్తోంది. కలుషితం కాని గాలి పీలుస్తూ సాగింది మా ప్రయాణం సాయంత్రం అయిదింటికి మధ్యమహేశ్వర్ చేరుకున్నాం.
మందిర ట్రస్టు వారి ఆధ్వైర్యం లో నడపబడుతున్న నాలుగు గదులు మాత్రం వున్నాయి, సంతోషం యేమిటంటే ఎటాచ్డ బాత్రూము వుంది నీటి సదుపాయం వుంది కరెంటులేదు. ఒకచిన్న పాక హొటలు ట్రస్ట్ మెంబరుదే వుంది, అక్కడ దొరికిన టీ అని పిలువబడ్డ వేడినీళ్లు తాగి గది తాళం తీసుకొని దర్శనానికి వెళ్లేం, ఆరున్నరకి శయన హారతి అప్పుడు రండి అన్న పూజారిగారి మాటతో మళ్లా మా రూముకి వచ్చేం, పక్క రూములో అప్పటికే నలుగురు ట్రెక్కర్స్ వున్నారు. వారు అప్పటికే డిన్నరు ముగించేరు, ఆరున్నరకి హోటలు మూసేస్తారు అని చెప్పేరు, మేం కూడా మా డిన్నరు కానిచ్చి మందిరంలో సాయంత్రాలు పూజా విధులు చూడ్డానికి వెళ్లేం. మందిరం చాలా పాత రాతికట్టడం, కేదార్ మందిరాన్ని పోలి వుంది, యిక్కడ శివలింగం నాభిని పోలి వుంటుంది, బయట రెండు చిన్న మందిరాలలో ఒకటి పార్వతీ దేవికి, మరొకటి అర్ధనారీశ్వరులకి కట్టేరు, రాతి విగ్రహాలు వున్నాయి. ఈ మందిరం భీముడు స్వయంగా కట్టించినట్లు చెప్తారు. పక్కగా పాలరాయి సరస్వతీ దేవి విగ్రహం వుంది సరస్వతీ దేవి విగ్రహం కొత్తదనం, యీ మధ్యకాలంలో పెట్టినట్లుంది.
ఇక్కడ స్థలపురాణం చాలా మార్లు చెప్పిందే అయినా యీ సంచికను మాత్రమే చదివేవారికోసం మరోమారు చెప్తాను.
మహా భారత యుధ్దంలో పాండవులచే యెన్నోవేలమంది బ్రాహ్మణులు, గోత్రీకులు చంపబడతారు, ఆ పాప పరిహారం కొరకు కృష్ణుడి సలహా మేరకు శివుని పూజించుకోడానికి కేదార్ నాధ్ వైపుగా ప్రయాణిస్తారు. సగోత్రహత్య, బ్రహ్మహత్యలుచేసిన పాండవులపై కోపముతో వున్న శివుడు పాండవుల రాక తెలుసుకొని వారినుంచి పారిపోవాలనే తలంపుతో నంది రూపముదాల్చి పారిపోతాడు. శివుని కొరకై వెతుకుతున్న పాండవులకు శివుడు కనిపించకపోవడం తో శివుని వెతుకుతూ యీ కొండలలో సంచరిస్తూవుండగా గుప్తకాశివైపు పయనిస్తున్న నందిని భీముడు పోల్చుకొని తరుముతాడు, నంది రూపములలో వున్న శివుడు గుప్తకాశిలో పాతాళానికి పోతూవుండగా భీముడు నంది వెనుకకాళ్లను పట్టుకొని బయటకు లాగుతాడు, ఆ విసురుకు నంది అయిదు ఖండములయి అయిదు ప్రదేశాలలో పడింది ముఖం పడ్డభాగం ‘ రుద్రనాధ్ ‘, ముందుకాళ్లు పడ్డ ప్రదేశం ‘ తుంగనాధ ‘, మూపురం పడ్డప్రదేశం కేదార్ నాధ్, నాభి పొట్ట పడ్డ ప్రదేశం మధ్యమహేశ్వర్, వెనుకకాళ్లు తోక పడ్డ ప్రదేశం కల్పేశ్వర్ మహదేవ్. ఆ అయిదు ప్రదేశాలు పంచకేదారాలుగా ప్రసిధ్ది చెందేయి. పంచకేదారాలలో శివుని పూజించుకొని పాపవిముక్తులయిన పిమ్మట పాండవులు సర్గారోహణానికి వెళతారు.
ఈ ప్రాంతాలలో వున్న అన్ని శివమందిరాలలోనూ ఆది శంకరాచార్యులచే నియమించబడ్డ అతని శిష్యుల సంతతి వారు పూజారులుగా వున్నారు కాని యీ మందిరంలో కర్నాటక నుంచి వచ్చిన లింగధారులు ( జంగం ) పూజలు నిర్వహిస్తున్నారు. ఇతను బ్రహ్మచారి, అతనికి కేటాయించిన గదిలో వుంటూ, అతనే వండిన అన్నప్రసాదలు నివేదిస్తున్నారు.
సూర్యుడు పడమటలో కుంగే సరికి చలి విపరీతంగా పెరిగనారంభించింది , వున్న ఒక్క బడ్డీ హొటలు మూసేయగానే మేము మా పక్క గదిలో వున్న ట్రెక్కర్స్ తో బాతాఖానీ చెయ్యసాగేం. వారు మొత్తం యీ కొండలలో వున్న చార్ ధామ్ లే కాక మిగతా అన్ని శివకోవెలలూ చూసుకొని బదరీనాధ్ చేరుతారట, కొండలలో నడక దారి వేరుగా వుందట, అలా వారు సుమారు 20 రోజులు నడిచి బదరీనాధ్ చేరుతారట, కొండలలో మొత్తం 250 కిలోమీటర్లు నడుస్తారట. చాలా తొందరగా చీకటి పడ్డంతో చేసే పనేమీ లేక రూములోకి వెళుతూవుండగా మా కొత్త ఫ్రెండ్స నిద్రరాకపోయినా గదులోనే వుండండి గాని గదిబయటకు రావొద్దు కృూరమృగాలు తిరుగుతూ వుంటాయి అని హెచ్చరించేరు.
రూములోకి చేరగానే మంచి నిద్ర పట్టేసింది. ఆరుకు లేచి బయటకు వచ్చి చేస్తే చుట్టారా మంచు బిందువులతో మెరుస్తున్న గడ్డి, పొగమంచులో మసకమసకగా కనిపిస్తున్న కోవెల, చల్లగా వున్న వాతావరణం మరో లోకంలో వున్న అనుభూతినిచ్చింది.
మా ట్రెక్కర్లు అప్పటికే తయారయి నడక ప్రారంభించేరు. మేం వేడివేడి టీ చప్పరిస్తూ వారు యెక్కడకి వెళుతున్నారో అడిగేం, అక్కడకి మరో మూడు కిలో మీటర్లు పైకి వెళితే బూఢా మహదేవ్ కోవెల, చక్కని సరస్సు వున్నాయి వాటిని చూడ్డానికి వెళ్తున్నాం అన్నారు. అక్కడనుంచి చేస్తే చౌకంబా, నీలకంఠ్, కేదార్ శిఖరాలు అధ్బుతంగా కనిపిస్తాయని చెప్పి వాళ్లు బయలుదేరేరు.
ఆ శిఖరాలు మేమున్నచోటునుంచి కూడా బాగానే కనిపిస్తున్నాయి. చెప్పకపోడమేం గాని నాకు మనసు పీకింది, యెలాగోలా పడుతూ లేస్తూ వెళదాం అనిపించింది. గబగబా తయారయేం, యీ రెండు మందిరాలకు పూజారివొకరే, ఆయన రోజూ నడిచి వెళ్లి పూజలు నిర్వహించుకొస్తారట, మాకు రూములిచ్చిన మందిర ట్రస్టు మెంబరు మమ్మల్ని నిరుత్సాహ పరచడంతో మేము తయారయి మరో మారు మందిరం దర్శించుకొని చుట్టుపక్కల ఓ మారు నడిచి, ప్రకృతిని కళ్లలో దాచుకొని గుర్రాల కోసం యెదురు చూడసాగేం.
ఓ గంట ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేక గుర్రాలతను వచ్చేడు. మరోమారు ఆ పరిసరాలను కళ్లనిండుగా చూసుకొని బయలుదేరేం. గుర్రాలతనితో పాటు మరోఅబ్బాయి ( స్థానికుడు ) కూడా నడుస్తూ కొండదిగసాగేడు.

ఉత్తరాంచల్ లోని మిగతా మందిరాలలాగా యీ మందిరం కూడా శీతాకాలంలో మూసెస్తారు. ఉత్సవవిగ్రహాన్ని ఓఖిమఠ్ లో వున్న ఉషామఠ్ లో నుంచి పూజలు చేస్తారు.
గుర్రాలమీద కూర్చొని కొండలు యెక్కడం యెంతకష్టమో దిగడం దానికి రెట్టింపు కష్టంగా వుంటుంది.
ముందురోజు ‘ మాగి ‘ తిన్నచోట భోజనం చేసుకున్నాం, అప్పుడు మాకు తెలిపిన విషయం మేమిటంటే ఉత్తరాఖంఢ్ లో వరన్నం మాత్రమే తింటారని, రోటీ చెయ్యడం రాదు అన్నం కావాలంటే వండుతానని అంటే మాకు ప్రాణం లేచొచ్చింది. పెరట్లో పండిన కాయగూరలుతో కూర, అన్నం, పప్పు, పెరుగు తో వడ్డించేరు. మనకి అంతకన్నా యింకేం కావాలి. తృప్తిగా భోజనం చేసి తిరిగి బయలు దేరేం.
సాయంత్రానికి కిందకి దిగిపోయేం. అయితే మాగుర్రాలబ్బాయితో పాటు వచ్చిన కుర్రాడు భుజం మీద మూట పట్టుకు మోస్తున్నాడు, రాత్రి చిరుత మేకలమందలో దూరి మేకను కొట్టిందట, యింట్లో వాళ్లు లేచి చిరుతను అదిలించడంతో చిరుతకు మేకను తీసుకుపోయే అవకాశం దొరకలేదు, యీ కొండలలో వారు శాఖాహారులవడంతో కుర్రాడు ఆ చచ్చిన మేకను మోసుకొని కిందకు వచ్చి ఉనియాన దగ్గర వున్న బజారులో యెక్కడో అమ్ముకొని మరునాడు తిరిగి యింటికి వెళతాడట.
ఈ అడవులలో చిరుతల సంచారం చాలా యెక్కువగా వుంటుందట, అది వినగానే మాకు కాస్త భయం అనిపించింది. అయితే మరో అద్భుతమైన యాత్రను చేసేమన్న తృప్తిముందు భయం పారిపోయింది.

తేనెలొలుకు తెలుగు – పర్యాయ పదాలు, నానార్థాలు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు

గత నెల తెలుగుభాషలో ఆమ్రేడితాల గురించి చర్చించుకున్నాం. ఒక భాష సుసంపన్నం, సుందరంగా రూపొందాలంటే అనేక విషయాలు పాటించాలి. భాషా సౌందర్యం మనం వాడే పదాల ఎంపికతో ఇనుమ డిస్తుంది. దానికి భాషలోని అనేక పదాలమీద అవగాహన, సాధికారికత ఉండాలి. అవసరమైనప్పుడు, ఎక్కువ విశదంగా చెప్పటం, అవసరంలేనప్పుడు సంక్షిప్తంగా చెప్పటం ఆవశ్యకం. సాధ్యమైనంతవరకు భావం పునః ప్రస్తావన రాకుండా, పదాలు పునరుక్తి కాకుండా, శబ్దాలంకారము, యతి ప్రాసలు మొదలైనవాటి మీద దృష్టి ఉంటే ఆ రచన చదివాలనిపిస్తుంది. ఎంత ఆకలి లేని వారికైనా బాగా రుచికరమైన పదార్థం నోటికి తగిలితే తినాలనే కోరిక కలుగుతుంది. మాట ఇంపు రావాలంటే పునరుక్తులు లేకుండా ఉండటం కూడా పరిగణనీయ మైన అంశమే.
పునరుక్తి ఎప్పుడు సంభవిస్తుంది?. ఒకే విషయం అనేకసార్లు చెప్పాల్సి వచ్చినపుడు. అంటే ఒక నది గురించో, ఒక ప్రదేశం గురించో, ఒక వ్యక్తి గురించో చెప్పాల్సి వచ్చినపుడు, సర్వనామం కొంత పునరుక్తిని తగ్గిస్తుంది. కాని అదే పనిగా సర్వనామం వాడినా చదువరికి విసుగు పుడుతుంది. అలా విసుగు కలుగకుండా ఉండాలంటే పర్యాయ పదాలు వాడాలి. మరి పర్యాయ పదం అంటే ఏమిటి? పర్యాయపదమంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే పదం బదులుగా వాడబడే పదం. ఉదాహరణకు ‘ఇల్లు’ అనే పదం ఉంది. ఇల్లు అనే పదానికి పర్యాయంగా, గృహము, నివాసము, వాసము, గేహము మొదలైనవి ఉన్నాయి. అలాగే సూర్యుడు అనే పదానికి కొన్ని తెలిసిన పర్యాయ పదాలు చూస్తే రవి, అర్కుడు, భానుడు, ప్రభాకరుడు, భాస్కరుడు, మిత్రుడు
మార్తాండుడు వంటివి చాలా ఉన్నాయి.
అలాగే రాజు అనే పదానికి ప్రభువు, నృపతి, భూపతి, ఏలిక, నరపతి, మహీపతి, క్ష్మాపాలుడు, క్షితిపతి, ధరణీపతిఇలా చాలా ఉంటాయి. ఇంకా భూమికి, ఆకాశానికి సముద్రానికి, పర్వతానికి, అగ్నికి, గాలికి, నీటికి, ఆవుకు, అమ్మకు, నాన్నకు, కొడుకుకు, కూతురుకు, తిండి. పదార్థాలకు, జలచరాలకు, పాముకు, కప్పకు, ఇలా అనేక విషయాలకు పర్యాయపదాలు ఉంటాయి. ముఖ్యంగా పద్యరచన చేసేవారికి పర్యాయ పదాల అవసరం ఎక్కువ. గణాలలో భావానికి సరిపడిన పదం వెయ్యాల్సి ఉంటుంది. సంస్కృతంలో నామలింగాను శాసనం లేదా అమరకోశం అని పర్యాయ పద నిఘంటువు ఇప్పటికీ ఎంతో ప్రాచు ర్యంలో ఉంది. తెలుగులో కూడా పద్యరూ పకంగా కొన్ని, నిఘంటు రూపంలో కొన్ని పర్యాయ పదాల సంకలనాలు ఉన్నాయి.
ఇక పర్యాయ పదవినియోగానికి వస్తే
ఈ పద్యం చూడండి. ఆంధ్ర మహాభారతం విరాట పర్వంలో ఉత్తరగోగ్రహణ సందర్భం. కౌరవుల పన్నాగంతో విరటుని కొల్వున రాజాంతఃపురస్త్రీలు మాత్రమే ఉన్నారు.
యువరాజు ఉత్తరుడు బృహన్నల రూపంలో అర్జునుడు ఉన్నప్పుడు కౌరవసేన అజ్ఞాతంలో ఉన్న పాండవులను కనుగొనాలని కురుముఖ్యులందరూ ఉత్తర గోగ్రహణానికి వచ్చారు . ప్రగల్భాలు పలికే ఉత్తరుణ్ని తీసుకుని అర్జునుడు బయలుదేరుతుంటే విరాటరాజు పుత్రిక ఉత్తర కౌరవవీరుల తలపాగాల కుచ్చులు తెమ్మని సోదరుడు ఉత్తరునికి చెబుతుంది. ఓస్ అదెంత పని అన్న ఉత్తరుడు తీరా రణరంగం దరికి చేరేసరికి బెంబేలెత్తుతాడు. గడగడవణుకుతున్న ఉత్తరునికి ధైర్యం చెప్పి సమ్మోహనాస్త్రం ప్రయోగించగానే కౌరవ సేనంతా మూర్ఛలోకి పోతారు. అప్పుడు అర్జునుడు ఉత్తరుణ్ని వెళ్లి తలపాగాల కుచ్చులు తన చెల్లెలుకోసం తెచ్చుకొమ్మని పంపిస్తూ కౌరవముఖ్యులు ఎవరెవర్ని ఎలా గుర్తు పట్టాలో తెలిపే పద్యం ఇది.

సీ. కాంచనమయవేదికాకనోత్కేతనోజ్వల
విభ్రమమువాడు కలశజుండు
సింహలాంగూల భూషిత నభోభాగ కేతు
ప్రేంఖణమువాడు ద్రోణ సుతుడు
కనకనోవృషసాంద్రకాంతి పరిస్ఫుట
ధ్వజసముల్లాసంబువాడు కృపుడు
లలితకంబు ప్రభాకలిత పతాకావిహా
రంబు వాడు రాధాత్మజుండు
గీ. మణిమయోరగ రుచిజాల మహితమైన
పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర ఘన
శిఖరతాళ తరువగు సిడమువాడు
సురనదీ సూనుడేర్పడ జూచికొనుము

ఈ పద్యంలో కౌరవవీరుల రథాల పైన ఎగురుతున్న జండాలను చూపిస్తూ ఒక్కొక్క వీరుణ్ని పరిచయం చేయడం రసరమ్యంగా ఉంది. పద్యంలో కేతనము, ప్రేంఖణము, ధ్వజము, పతాకము, పడగ, సిడము అనే పర్యాయపదాలతో అందమైన పద్యం రూపొందింది.
ఇది పర్యాయ పదావినియోగానికి ఒక మచ్చు తునక మాత్రమే. పర్యాయపద దృష్టితో కావ్యాలు పఠిస్తే పర్యాయ పద సౌందర్యం కనుపిస్తుంది.
అలాగే నానార్థాలు కూడా అంతే. ఇవి ఒక రకంగా పర్యాయ పదానికి విపర్యయం లాంటివి. అక్కడ వస్తువును సూచించే అనేక పదాలయితే, ఇక్కడ ఒకే పదం సూచించే అనేక అర్థాలు. పదం ఒకటే ఉండి అనేక అర్థాలున్న పదాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పదాలకున్న అనేక అర్థాలను నానార్థాలు అంటారు.
ఒక వాక్యం చూద్దాం. ఉదా: చచ్చిన తేలు నీటిపై తేలుతుంది.
ఇక్కడ తేలు కీటకాన్ని సూచించే నామవాచకంగానూ, తేలుట అనే క్రియా పదంగానూ వాడబడింది. నానార్థాలు కలిగిన పదాలు కను-చూచు, ప్రసవించు, రుచి-చవి(పదార్థగుణం నాలుకతో గ్రహించేది), కాంతి, కాలు-శరీరావయం, కాలుట అగ్ని సంబంధమైనది, కాలుడు (ఉదా:కాలుని దున్నపోతు చిరుగంటలమ్రోతకుగాక సంధివాక్యాలకు వీనులొగ్గుదురటయ్య-విజయశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి) అంటే యమధర్మ రాజుకూడా. ఇలా నానార్థాలతో అందమైన పాటలు రాసిన సినీ కవులున్నారు.
అచ్చెరువున అచ్చెరువున అనే పాటలో ఆశ్చర్యంతో ఆ చెరువులోని అనే అర్థంతో భావించి వినగానే ఆనందం కలుగుతుంది.
అలాగే మరో పాట ‘శివశివ శంకర’(భక్త కన్నప్ప) లో ‘మారేడు నీవని ఏరేరి తేనా మారేడు దళములు నీసేవకు’ అంటాడు కవి. ఇది కృతక పదమే అయినా మారేడు అంటే ఒక అర్థం మా రాజువనీ, మరో అర్థం శివునికిష్టమయిన మారేడు దళాలనీ తీసుకుంటే కలిగే హాయి అనిర్వచనీయం. నానార్థ పద నిఘంటువులు కూడా ఉన్నాయి.
తిరువేంగళనాథుడనే ఆయన పద్యాలలో నానార్థ నిఘంటువు తయారు చేశాడు. అందులో ఒక పద్యం చూడండి.
కం. కచమన కొప్పును బాహువు
కచమనగా ముఖము ముక్కు కౌనును నడుమున్
కచమన పాపెట బొట్టును
కచమన రాకిణియు బొట్టు గణుతింపదగున్

ఇలా భాషలోని సర్వాంగాలను పరిశీలిస్తూ ప్రసిద్ధ కవులు రచయితల ప్రయోగాలను పరికిస్తే పర్యాయపదాలు, నానార్థాల సొబగు తెలుస్తుంది.

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 36

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

 

మానవుడు కన్ను, ముక్కు, చెవి, చర్మము, నోరు అనే పంచేంద్రియాలకు లోబడి వ్యవహరిస్తుంటాడు. కాలం గడిచే కొద్దీ వీటిపై వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. వాటికి బానిసలై వ్యవహరిస్తాం. కానీ వీటిని ఎలా జయించాలి?  అని కీర్తనలోవాపోతున్నాడు అన్నమయ్య.

 

కీర్తన:

పల్లవి: ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే

బట్టరానిఘనబలవంతములు

 

.1. కడునిసుమంతలు కన్నులచూపులు

ముడుగక మిన్నులు ముట్టెడిని

విడువక సూక్ష్మపువీనులు యివిగో

బడిబడి నాదబ్రహ్మము మోచె           ఎట్టు

 

.2. అదె తిలపుష్పంబంతనాసికము

కదిసి గాలి ముడెగట్టెడని

పొదిగి నల్లెడే పొంచుక నాలికె

మొదలుచు సర్వము మింగెడిని        ఎట్టు

 

.3. బచ్చెనదేహపుపైపొర సుఖమే

యిచ్చ బ్రపంచం బీనెడిని

చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరు

దచ్చి తలచగా దరిచెరెడిని                 ఎట్టు

(రాగం: కన్నడగౌళ, సం.3. సంకీ.47)

 

 

 

విశ్లేషణ:

పల్లవి: ఎట్టు గెలుతు బంచేంద్రియముల నే

బట్టరానిఘనబలవంతములు.

హయ్యో! శ్రీనివాసా! నేను పంచేంద్రియాలను ఎలా జయించగలను? ఇవి పట్టి బంధించ వీలుకాకున్నది. ఇవి నానాటికీ నన్ను వశం చేసుకుని ఆడిస్తూ ఉన్నవి.

 

.1. కడునిసుమంతలు కన్నులచూపులు

ముడుగక మిన్నులు ముట్టెడిని

విడువక సూక్ష్మపువీనులు యివిగో

బడిబడి నాదబ్రహ్మము మోచె  

కన్నులు చిన్నవైనా చాలా గొప్ప వాడిగా ఉన్నవి. వీటి పస ఏమాత్రం తగ్గక ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. చెవులు ఎంత సూక్ష్మమైన చిన్న శబ్దజ్ఞానాన్నైనా విడిచిపెట్టడంలేదు. వెంటనే అందిస్తున్నవి. ఇవి నాదబ్రహ్మమైన సర్వేశ్వరుని అంశగలవైనప్పటికీ వాటికి ఇష్టం వచ్చిన శబ్దాన్ని మాత్రమే అవి గ్రహిస్తున్నవి. భగన్నామము విన ఇచ్చగించుటలేదు అని అన్యాపదేశంగా చెప్పడం.

 

.2. అదె తిలపుష్పంబంతనాసికము

కదిసి గాలి ముడెగట్టెడని

పొదిగి నల్లెడే పొంచుక నాలికె

మొదలుచు సర్వము మింగెడిని

ముక్కు చూడడానికి నువ్వు పుష్పమంత ఉంటుంది. ముక్కు గాలిని కూడా పన్నువలె కట్టించుకొంటూ ఉంటుంది. దానికి దగ్గరలో ఉన్న నాలుక పని చెప్పనక్కరలేదు. తనకు ఇచ్చ వచ్చినదానినల్ల ఎప్పుడూ మింగ్రుతూనే ఉంటుంది.

 

.3. బచ్చెనదేహపుపైపొర సుఖమే

యిచ్చ బ్రపంచం బీనెడిని

చెచ్చెర మనసిది శ్రీవేంకటేశ్వరు

దచ్చి తలచగా దరిచెరెడిని

ఇక రంగు రంగుల దేహముందికదా! ఇది పై పొరలో మాత్రమే స్పర్శజ్ఞానం కలిగి ఉంటుంది. కానీ దాని సుఖలాలత్వము, సుఖేచ్ఛ చూడాలంటే ప్రపంచాన్నే ప్రసవించేదానిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఐదు ఇలా ఇష్టరీతిలో ప్రవర్తిస్తుండగా ఇక మనస్సు వాటికి సదా దాసోహమంటూ సహాయం చేస్తూ ఉంటుంది. కానీ మనస్సు శ్రీవెంకటేశ్వరుని ప్రయత్నపూర్వకంగా ధ్యానించి దగ్గరైతే అంతకు మించిన ఫలమేమున్నది అంటున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు   బట్టరాని = పట్టుకోవీలుగాని, బంధించలేని; బలవంతములు = బలీయమైనవి, విడిఫించుకోవీలులేని; ఇసుమంత = చాలా చిన్నవైన, ఇసుకరేణువంత; ముడుగక = సంకోచించక, ముట్టెడివి = తాకెడివి; వీనులు = చెవులు; మోచు = తాకు; తిలపుష్పము = నువ్వుపూవు (నాసికను నువ్వు పూవుతోను, సంపెంగ పూవుతోను పోల్చుట పరిపాటి); కదిసి  = దగ్గరగు; ముడిగట్టు  = అతిజాగ్రత్తగా దాచు; మొదలు  = కదులు; బచ్చెన  = పూత,వర్ణము; ఈనుట  = ప్రసవించుట; చెచ్చెర  = తొందరగా.

-0o0-

మహాకవి శ్రీశ్రీ ని గురించి కొందరు ప్రముఖులు

రచన: శారదాప్రసాద్

 

ఒక్కడే మహాకవి, అతని పేరు శ్రీశ్రీ –శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు

“ఆనందం ఆర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం. ”

గిరి-అహో, ఏమిగీతం. ఎంత సొగసుగా వుంది. కవిత్వాన్ని వడబోసినట్లుందే. ఎవరయ్యా ఈ పాట రాసింది?
హరి-ఈ పాట వ్రాసినతని పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.
గిరి-కొత్త కవుల్లో ఇంతటి మహాకవులుంటారా?
హరి-అట్టే మాట్లాడితే ఈ క్రొత్తకవుల్లో ఒక్కడే మహాకవి. అతని పేరు శ్రీశ్రీ.
గిరి-అయితే శ్రీశ్రీ వంటి నవ్యకవిలో కూడా అలంకారాలు వుంటాయంటావా?
హరి-అయ్యో! ఉన్నదీ అతని కవిత్వంలో. శబ్దాలంకారాలనివుంటాయి. ఇక దాని పేరు వృత్యనుప్రాసము. ఈ వృత్యనుప్రాసము యొక్క ప్రాబల్యమే శ్రీశ్రీ కవిత్వంలోని మొదటి సొగసు. అంత్య ప్రాస కూడా ఒక శబ్దాలంకారం. అది లేకపోతే వీళ్ళ నడక లేదుగా. శ్రీశ్రీ చంద్రవంకను చూచి కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగ ఉందన్నాడు. ఇది ఉపమాలంకారం. ఎట్లాంటిది?’మృఛ్చకటికం’లో నీటిలో మునిగి ఏనుగు ఎత్తిన రెండు దంతములవలె చంద్రవంక ఉన్నదన్నాడే అంత గొప్ప ఉపమానం.
గిరి-అయితే శ్రీశ్రీ మహారధి, అతిరధుడు అన్నమాట. అతనిననుసరించిన వాళ్లెవరైనా వున్నారా?
హరి-అందరూ అతనిననుసరించిన వాళ్ళే.
గిరి-ఇంతకూ ఈ యుగ పురుషుడెవరంటావు?
హరి-ఎవరేమిటోయి పిచ్చివాడా! ఈ గీతం ఎవడు వ్రాశాడో వాడు.
గిరి-ఎవడు వ్రాశాడు?
హరి-నేను చెప్పను, గీతం విను–
“మరో ప్రపంచం, మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు, పదండి త్రోసుకు!
పోదాం పోదాం పైపైకి! ”
(‘హేతువాద యుగం’-భారతి, జూన్ 1962 )

*************

 

 

సంస్మరణ-డా. సి. నారాయణరెడ్డి

ఆధునిక విప్లవ కవితోద్యమాలకు సారధ్యం వహించిన శ్రీశ్రీ భావాల కవితా పంక్తులు తెలుగు పత్రికలలోని వార్తల్లో, సంపాదకీయాల్లో, రాజకీయ వ్యాఖ్యల్లో అసంఖ్యాకంగా కనిపిస్తుంటాయి. శ్రీశ్రీని విమర్శించాలన్నా, దుమ్మెత్తిపోయాలన్నాఆయన మాటలే శరణ్యం అయ్యేటంతగా ఆయన భావాలు పరివ్యాప్తమయ్యాయి. ప్రజాకవులను సృష్టించిన ప్రజాకవి శ్రీశ్రీ (‘ఈనాడు, 18-06-1983)
శ్రీశ్రీ తెలుగు సాహిత్యానికి ముట్టాతవంటి వారు. మూడుతరాలకు ఆయన ప్రతినిధి. తరతరాలకు తరగని సాహిత్యానిది శ్రీశ్రీ. శ్రీశ్రీ సూర్యునివంటివాడు. సూర్యుడు మరుగవుతాడు కానీ మాయం కాడు. సూర్యుడు మరల మరల ఉదయిస్తాడు. అతనే శ్రీశ్రీ. శ్రీశ్రీ తిరిగిన లెనిన్ గ్రాడ్ యెంత శాశ్వతమైనదో, శ్రీ శ్రీ కవిత్వం కూడా అంతే శాశ్వతమైనది. (ఆంధ్రప్రభ, 17 -06 -1983 )
మరోప్రపంచం పిలుపును తెలుగు జాతి కందించిన మహాకవి శ్రీశ్రీ మరోప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఆ మరోప్రపంచం స్వరూపం మనకు తెలియదు. కానీ, అయన తెలుగు కవితాజగత్తులో ప్రతిష్టించిన మరోప్రపంచం మాత్రం అభ్యుదయ శక్తులకూ, విప్లవదీప్తులకూ అక్షర నిలయంగా మిగిలిపోయింది. ఆలోచనలకు అసిధారలనూ,
ఆవేశాలకు అగ్నికీలలనూ అంటించిన క్రాంతిమూర్తి శ్రీశ్రీ. గత 35 ఏళ్ళుగా ఆధునిక తెలుగు కవిత్వాన్ని నడిపిస్తున్న నిత్య చైతన్యస్ఫూర్తి శ్రీశ్రీ. రెండు సరికొత్త కవితోద్యమాలకు నాయకత్వం వహించిన ఘనత కూడా శ్రీశ్రీకే దక్కింది. ఆ మహాకవి ఈనాడు మనలో లేడు. ‘నింగివైపు పొంగి దూకే ఆ కళ్ళు, నేలపై అంగుళం పైకి నడిచే ఆ కాళ్ళు మళ్ళీ కనిపించవు. ఆ పాటలు ప్రభంజన స్వరంతో పలుకుతాయి. తెలుగుజాతి సమైక్యకంఠాన్ని వినూత్న విప్లవఘోషతో పలికిస్తాయి. (ఆంధ్రభూమి, 18 -06 -1983 )

 

 

 

ఈ శతాబ్దానికి ఒకే ఒక్క శ్రీశ్రీ–శ్రీవడ్డెర చండీదాస్

ఎవరి నీడలో ఈ శతాబ్దపు ‘ఆధునిక’ తెలుగు కవిత్వం(సాహిత్య ప్రక్రియలన్నీ కాదు) తన ఉనికిని ప్రోది చేసుకుందో, ఎవరి’మహాప్రస్థానం’ తెలుగులో’ఆధునిక’ కవులను ఉద్భవింపజేసిందో, ఎవరి’మహాప్రస్థానం’ చాలా పదాలికి అర్ధాలు తెలియకపోయినా బలంగా కదిలించిందో, ప్రగాఢ అనుభూతి కంపించిందో, ఎవరి’మహాప్రస్థానం’ తన జాతిజనులు పాడుకునే ‘మంత్రంగా’ నిలిచిందో ఆ వ్యక్తి-శ్రీశ్రీ. తన ఆవేదనలనూ, ఆక్రోశాలనూ, అన్వేషనలనూ, ప్రాకులాటలనూ, వివాదాలనూ, ప్రబోధాలనూ, మహాత్మ్యాలనూ, అల్పత్వాలనూ, అనితర సాధ్యాలనూ వదిలేసి కుబుసం విడిచి వెళ్ళిపోయాడు. ఆ మొన్నచారిత్రక అమరత్వంలోకి. ఒక వీరుడు మరణిస్తే వెయ్యిమంది వీరులు పుట్టుకు రావచ్చునేమోగానీ, ఒక శ్రీశ్రీ పొతే వెయ్యిమంది శ్రీశ్రీల మాట అలావుంచి, కనీసం మరొక్క శ్రీశ్రీ అయినా పుట్టుకు రాడు. (ఆంధ్రజ్యోతి, 08 -07 -1983)

 

 

 

 

 

శ్రీశ్రీ పుట్టిన రోజు–శ్రీ డీ. వీ. నరసరాజుగారు

శ్రీశ్రీకి మరణమా?అబద్ధం!
ఎవరో అజ్ఞానులు పుట్టించిన పుకారు
శ్రీశ్రీ దరిదాపులకు రావడానికి
మృత్యువుకు ఎన్ని గుండెలు
వస్తే మృత్యువే చస్తుంది!
బ్రద్దలైన శ్రీశ్రీ అగ్నిపర్వతపు లావాలో
మృత్యువు కాలి మసి అయిపోతుంది
శ్రీశ్రీ చిరంజీవి! చిరంజీవికి చావేమిటి?
శ్రీశ్రీ యిక మనకి కనబడంటారా?
అవును కనబడడు
కనబడనిది ఆయన భౌతిక కాయం
కానీ, ఆయన కీర్తి కాయం అది అజరామరం
ఇప్పుడు అసలు జరిగిందిది
కనబడే కాయం విడిచి కనబడని కాయంతో
ఆయన మరో జీవితం ప్రారంభించాడు.
ఆ’మరోజీవితం’అనటం.
ఆ అనంత జీవితానికి ఇది ఆరంభ దినం
అందుకే నిజానికి ఈ వేళ
మరో శ్రీశ్రీ పుట్టిన రోజు(ఆంధ్రజ్యోతి, 08 -07 -1983)

 

 

 

శ్రీశ్రీకి చావేమిటి?–శ్రీ జయధీర్ తిరుమలరావు గారు

శ్రామికస్వేదంతో
కవితకి కిరీటం తొడిగిన వాడికి
కొత్త రక్త మాంసాలతో
కొండంత భరోసాతో
కొత్త వూపిరి పోసిన వాడికి
చావేమిటి?!
దారిపొడవునా జనపోరాటాలకు
అక్షరాల మైలురాళ్ళని నిలప
ఎంతో మంది శ్రీశ్రీలు నడిచే బాతకి
సోపానం వేసిన వాడికి
కనుమరుగేమిటి?
చావు–
వ్యవహారదూరమైన భాషకుంటుంది
చావు–
వాడుకలో లేని అక్షరానికుంటుంది.
చావు–వాటినే నమ్ముకునే పండితునికుతుంది
చావు–
ఎవరికీ పట్టని భావాలు
సృష్టించే వాడికుంటుంది.
చావు–
నాగలికి లేదు, /యంత్రాలకి లేదు
వాటిని నడిపే చేతులకి లేదు
వాటి శ్రమదోచే మనుషులకు తప్ప!
శ్రీశ్రీ భాష జనం ఘోష!
శ్రీశ్రీ అక్షరాలూ జనం విడిచే ఊపిర్లు!
శ్రీశ్రీ భావాలు జనం ఆశయాలు
శ్రీశ్రీ కవిత మరయన్త్రాల పిడికిళ్ళు
శ్రీశ్రీ కవిత నాగేటి చాళ్ళు!
శ్రీశ్రీకి చావేమిటి?(యువ, అక్టోబర్, 1983 )

 

 

అదృష్టదీపక్ కోకిలమ్మ పదాలు

మార్క్సిస్టు విజిగీష
మార్పుకై రానఘోష
గెలుపు శ్రీశ్రీ భాష
ఓ కోకిలమ్మా!
శబ్దార్ధముల మేటి
శర పరంపర ధాటి
లేరు శ్రీశ్రీ సాటి
ఓ కోకిలమ్మా! (నవ్య, 03 -03 -2010)

(మహాకవి శ్రీశ్రీకి నివాళిగా కొందరు ప్రముఖులు కొన్ని పత్రికలలో వెలిబుచ్చిన భావాల ‘సంకలనం’–సేకరణ)

కాముని పున్నమి

రచన: లక్ష్మీదేవి

ఫాల్గుణ పూర్ణిమ నాటికి పువ్వుల రంగులతో చిగుళ్ళ ఎఱుపుతో వెన్నెల నిండిన నింగీ నేలా వసంతాలాడు కుంటుంటాయి.
ఫాల్గుణాలలో తెలివెన్నెలలు కురిసే కామునిపున్నమి (హోళీ) ఆమని రంగిలి శోభించడానికి ముందుమాట/ స్వాగత గీతం వంటిదే.
నిండుగా పూచిన వేప , మామిడి, కానుగ అనేముంది, తరువులన్నీ, తనువులన్నీ పూలగుచ్ఛాలై శుభాకాంక్షలు అంది పుచ్చుకుంటుంటాయి.
సంజె వేళల్లో వీచే ఆహ్లాదకరమైన పిల్లగాలుల వేణునాదాలకు మదిలోని తలపులు పదాలు పలుకుతుంటే పెదాలు ఒద్దికగా ఒదిగిపోతూ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి.
ఊహల సాగరంలో అనుభూతుల సంగమాలు ముచ్చటగొలుపుతూ ఆనంద నర్తనాలకు రంగస్థలాలుగా మనసులను ఆయత్తం చేస్తున్నాయి.
చూసే కన్నులకు మనసుండాలే కానీ శిశిరాల్లో రాలుతున్న పండుటాకులూ , కొత్తగా తొడుగుతున్న చిగురులూ కూడా పువ్వుల కన్నా అందంగా అలంకారాలౌతుంటాయి.
లేత ఎండలూ, శీతవాయువులూ ఇలాంటి అరుదైన ఋతుకాలాలలోనే చిరకాలం తర్వాత కలిసే మిత్రుల్లా కరచాలనం చేసుకుంటాయి.
పూత రాలుతున్నా ఆశావాదాలకు ఆలవాలంగా కొమ్మలు, తీవెలూ అలరారుతుంటాయి.
——–
ఈ ఉత్సవం మునుపటి కాలంనుంచీ కూడా వారం పాటు వసంతోత్సవం, మధుకేళి అనే పేరుతో ఉత్సాహంగా జరుగుతున్నదే. ఈ పండుగల్లో జరిగే రంగులు చల్లుకోవడం, పరస్పరం వినోదకార్యక్రమాల్లో అందరూ కలిసి ఆనందించడం, కవిగోష్ఠులు నిర్వహించడం వంటి కార్యక్రమాల వర్ణన మనోహరంగా శ్రీనాథుని హరవిలాసంలోనూ, భీమేశ్వరపురాణంలోనూ కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఉగాది రోజు, శ్రీరామనవమి రోజు ఈ రంగులు చల్లుకోవడం కూడా మన ఊళ్ళలో కనిపిస్తూ ఉంటుంది.
కాముని పున్నమికి ధర్మవరంలో కొలువుతీరిన కామన్న కామక్క.

వినోదాలూ విలాసాలూ కూడా ప్రకృతిలో భాగమే, ప్రకృతికి అందమే.
——
నాడూ నేడూ కూడా ముళ్ళను తప్పించుకుంటూ అడుగులు వేసే ప్రయాణాలలో మాత్రమే ప్రతి మజిలీ సంతసాన్నీ, సార్థకతనూ అందిస్తూ ఉన్నాయి.

కష్టాలూ, కన్నీళ్ళూ , నవ్వులూ , సంతోషాలూ అన్నీ ఋతువుల్లాగే మదివనంలో వంతులు వేసుకుని వస్తూ పోతూ ఉంటాయి.
ఏ ఋతువు ఇచ్చే కాయలూ ,పళ్ళూ, పువ్వులూ ఆ ఋతువులో అందుకొని ఆరోగ్యంగా ఉన్నట్టే, మదివనంలో వచ్చే పోయే ఋతువులలో అందే అన్ని ఉద్వేగాలనూ అందుకుంటూ ఆరోగ్యంగా ఉందామంతే. అవి మనకే కట్టుబడి ఉండనట్టే మనమూ వాటికే కట్టుబడి ఉండడమెందుకు? అన్నీ అందుకుంటూ, వదలుకుంటూ సాగిపోదాం.
——–

విశ్వపుత్రిక వీక్షణం – భూమి ద్వారం మూసుకపోతోంది

రచన: విజయలక్ష్మి పండిట్.

మన దేశంలో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళలలో చిన్నవయసులోనే 15-45 ఏండ్ల లోపే గర్భసంచి తొలగింపుకు లోనవుతున్నారని, ఇది మహిళలలను ఆరోగ్య సమస్యలకు గురిచేయడమే కాకుండా కొన్ని బీద, వెనుకబడిన, నిరక్షరాస్య మానవ సమూహాలు, జాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్న నిజాలు.

ఇటీవల మహిళా దినోత్సవ సధర్భంగా “ వసుంధర “ పురస్కార గ్రహీత గైనకాలజిస్టు డా. వెంకట కామేశ్వరి గారి ప్రత్యక్ష అనుభవం ఆమె మాటలలో మనలో తీవ్ర ఆలోచనలను రేపుతుంది. ఇది పెరుగుతున్న స్రీల
ఆరోగ్య, ఆర్థిక, మానవ జనాభా, జాతి అంతరించిపోయే వైపు నిశ్శబ్ధంగా అడుగులేస్తున్న తీవ్ర సమస్య.
ఆమె పంచుకున్న నిజాలు నాలో రేపిన భయాలోచనలు ఈ నా కవితాక్షరాలుగా రూపు దిద్దుకున్నాయి.

***

“భూమి ద్వారం మూసుకపోతోంది”

“ఇదిగో ఇటు చూడండి
నన్ను చూడండి ..,
నిర్ధయగా నన్ను కోసి పారేసిన
నా దుర్గతిని తిలకించండంటూ”…
గుట్టలుగా గుట్టలుగా పడి
గడ్డకట్టిన రక్తమాంసాల దిబ్బ
ఏడుస్తూ పిలుస్తూన్న భావన..!?

కొంచెం దగ్గరకెళ్ళి పరిశీలించి
అవాక్కయినాను..అర్థమయింది
ఆ ఆర్థనాదాలెవరివో…
ఎవరో కాదు.., అవి
నిర్జీవంగా పడివున్న
మాతృమూర్తి మందిరాలు
మనిషికి ప్రాణంపోసే జీవామృతకలశాలు
ప్రకృతిని వికశింపచేసే ఆలయాలు
అవి స్త్రీ పవిత్రగర్భాశయాలు…!

ఎవరిదీ అజ్ఞానాంధకార చర్య?
ఎవరీ అమానుష కార్యకర్తలు..?!
మనిషి మూర్ఖత్వం స్వార్థం
పడగవిప్పి బుస కొడుతున్న వైనం
గుడిలో గర్భాలయాన్ని పడగొట్టినరీతి
మాతృమూర్తుల శరీరాలయాలలో
పవిత్ర గర్భాశయాన్ని విడగొడుతున్నారు..,

మనిషి జాతి మనుగడకు
తెరదించు తున్నారు
కవిపించడంలేదా..?!
మాతృమూర్తుల గర్భాశయాల నాశనం
వినిపించలేదా ఆ …గర్భాశయాల గోష.?!
భూమిపై మూసుకుపోతూంది
మనిషి సంక్రమణ ద్వారం..?!

నిరక్షరాస్యత చీకటి వలయంలో చిక్కుకున్న
అభంశుభంఎరుగని అమాయక పడతులు
తమ అర్ధాయుషును ఆ దిబ్బలో వదలి
నడిచిపోతున్నారు జీవశ్చవాలై..,

అదిగో అటుచూడండి
భూమిపై గుంపులు గుంపులుగా
నిష్క్రమిస్తున్నాయి గర్భాశయాలు
మాతృమూర్తి ఆలయాలు
గర్భాలయంకూలిన శిధిలాలయాలు
స్త్రీ శిధిలాలయాలు
శిధిలాలయాలు..?!

యోగాసనం 2

రచన: రమా శాండిల్య

హరి ఓం

భద్రాసనం

భద్రాసనం అంటే ఆసనం పేరులోనే భద్రత యిముడ్చుకున్నది. అంటే ఆ ఆసనం వేయడం వలన మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది అని వేరే చెప్పక్కరలేదు కదా.

భద్రాసనం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది అరుగుదల ఆహారం ఆరగడానికి పనికి వస్తుంది. కాంష్టిపెషన్ ఉండదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ , ఇన్డేజెషన్ ఇలాంటి వాటికి కూడా చాలా మంచిది.

ఈ రోజుల్లో ప్రతివారికి నడుము నొప్పి ఉంటోంది ఆ నొప్పికి మందు ఈ భద్రాసనం.

కాళ్ళు , తొడలు, పొత్తికడుపు దగ్గరవున్న కొవ్వు కరగడానికి ఈ ఆసనం చాలా ఉపయోగం. చిన్నగా మొదలు పెట్టి ఎంతసేపు కూర్చోగలిగితే అంతే సేపు చెయ్యాలి. ఆసనంలో ఉన్నంతసేపు శ్వాసను గమనించాలి. ఆలోచనల మీద ధ్యాస పెట్టొద్దు.

కొంతమంది ధ్యానం గురించి , మరి కొందరు ప్రాణాయామం చెప్పమని అడుగుతున్నారు.

వారందరు కూడా మొదట శాంతిగా కూర్చోవడం వస్తే గాని అవి చెయ్యలేరు. అందుకే మొదట ఆసనంలో కూర్చోవడం సాధన చేయాలి.

ఆసనం వెయ్యడం అనే నియమంతో సాధన చేస్తున్నాము మనం.

పద్మాసనం

ఈ ఆసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొందాం
పద్మాసనం వేయడానికి ముందుగా కాళ్ళు రెండు చాపి కూర్చోవాలి. తరువాత ఒక కాలుని చాపి, రెండవకాలు మడిచి తొడమీద పాదం వచ్చేలా పెట్టుకోవాలి. అదే విధంగా రెండవ కాలు కూడా పెట్టుకోవాలి.
ఈ ఆసనం వేయడం వల్ల తొడల దగ్గర నడుములో పెరిగిన కొవ్వు కరిగి, కూర్చోవడానికి శక్తి పెరుగుతుంది.
వెన్నుముక గట్టి పడుతుంది. ఆసనం వేయడం మొదలైనప్పటి నుంచీ విశ్రమ స్థితి వరకు శ్వాస మీద ధ్యాస ఉండాలి. పై పెదవి మీద గాలిని గమనిస్తూ ఉండాలి.

ఇంక పద్మాసనం రెండవ స్థితి.

మొదట పద్మాసనం వేసి కూర్చున్నాక అరచేతిలో బొటన వేలు పెట్టి చూపుడు వేలిని వదిలేసి మిగిలిన మూడు వేళ్ళతో మూసి గన్ ఫోజు పెట్టి కూర్చోవాలి. చూపుడు వేళ్ళతో చెవులను గట్టిగా మూసుకొని నోరు కూడా బంధించి ఉంచి గొంతుతో శబ్దం చెయ్యాలి.
ఆ శబ్దం మనసుతో ఓం అని వింటూ ఉండాలి. ఈ రకంగా శబ్దం చేసే సమయంలో శ్వాసమీద ఆంటే మన పై పెడవిమీద మాత్రమే ధ్యాస ఉండాలి.
ఈ రకంగా 2నిముషాల నుంచి 5నిముషాల సమయం ఉండొచ్చు. ఈ క్రియ చేసిన వెంటనే కళ్లు తెరవ వద్దు. 5 నిమిషాలు శ్వాసను, శరీరాన్ని గమనిస్తూ ఉండాలి.
పద్మాసనం వేయలేనివారు సుఖాసనంలో చేయవచ్చు. క్రింద కూచోలేనివారు కుర్చీలో కూడా కూర్చుని చేయవచ్చు.
ఇలా 40 రోజులు చేయడం వల్ల పొట్టను తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. బరువు తగ్గుతుంది ఇబ్బంది పెట్టే ఆలోచనలు తగ్గుతాయి.
పద్మాసనంతో చేస్తే ఫలితం తొందరగా చూడొచ్చు కాకపోతే కొంచెం ఆలస్యమయే అవకాశం ఉంటుంది.
దీనితో పాటు 11 గాని, 21 గానీ ఓం కారం పెద్ద శబ్దంతో చేసి 10 నిముషాలు మనము ఏ శబ్దం పైకి చేసామో, అదే శబ్దాన్ని మనసుతో వింటూ కూర్చోవాలి.

పద్మాసనం – శాంతి మంత్రం

పద్మాసనంలో చేసే రెండవ క్రియను శాంతి మంత్రము అంటారు.రెండూ చేయడం వలన బాధపెట్టే ఆలోచనల నుంచీ స్వాంతన పొందవచ్చు. 5 నిమిషాల సమయం నుంచీ పదిహేను నిమిషాలు వరకు చేయవచ్చు.

పద్మాసనంలో అలా కూర్చోవడం వలన, ధ్యానం మీద ఏకాగ్రత పెరుగుతుంది. మన వెన్నుపూస నిటారుగా ఉండడాని సహకరిస్తుంది. కాళ్ళు రెండు మడవడం వలన, పొత్తికడుపులో అగ్ని ప్రజ్వలన జరిగి, మనం తిన్న ఆహారం అరగడానికి ఉపయోగపడుతుంది. మన నరాలు మరియు కండరాల పై ఒత్తిడి తగ్గి, blood pressureని కూడా నియంత్రిస్తుంది.

తర్వాత ఆసనం మార్జాలాసనం. లేదా గోవాసనం.

Cat pose or cow pose ఈ ఆసనం వేయడం వలన నడుము నొప్పి పూర్తిగా తగ్గుతుంది.
నడుము నొప్పి ఉన్నవారు కూడా వేయడానికి ట్రై చేయచ్చు కానీ శరీరము సహకరించి నంతవరకు మాత్రమే మరీ నొప్పి ఉంటే వేయక పోవడం మంచిది.
నడుము నొప్పి లేనివారికి ఆసనం వేయడం వలన వెన్నుముకకు వీపు మొత్తం బలంగా వుంటాయి. ఈ ఆసనం వేసే పద్ధతి పది నెలల పిల్లలు మోకాళ్ళ మీద పాకడానికి మొకాళ్ల మీద వంగి, నడుము క్రింద భాగం కొంచం పైకి ఎత్తి, ఆ టైమ్ లో ముందు తల్లీ నుంచుని పిలిస్తే తల పైకెత్తి చూస్తారు. అలాంటి స్థితిలో ఉండడమే ఈ ఆసనం స్థితి పిల్లిలా ఉండగలగడం. ఈ ఆసనం కూడా రెండు నిమిషాలు నుండి పదిహేను నిమిషాలు వరకు చేయవచ్చు.
ఆసనం మొదలు పెట్టినప్పుడు శ్వాసమీద దృష్టి పెట్టి ఆసనం మరియు విశ్రాంతి స్థితి వరకు కూడా శ్వాస మీద దృష్టి ఉండాలి. పై పెదవి మీద గాలిని గమనిస్తుండాలి. మొదటి రోజు నేర్చుకున్న ఒక విషయం మళ్లీ గుర్తు చేసుకుందాం. ఆసనానికి మూడు స్థితులు ఆసనం వేయాలి అని శరీరాన్ని, మనసుని సిద్ధం చేయడం. ఆసనం వేసిన స్థితి, విశ్రమస్థితి ఆసనానికి ఇవి మూడు తప్పనిసరి.
ఎక్కువ ఆసనాలు తక్కువ సమయం కాకుండా తక్కువ ఆసనాలు ఎక్కువ సమయం ఉండేలా చూడండి ఫలితం ఎక్కువగా వుంటుంది. శ్రీ గురుభ్యోనమః

అంబ -శిఖండి వృత్తాంతము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు.


మాహా భారతములో అనేక పాత్రలలో కారణజన్మురాలై భీష్ముడి మరణానికి కారణము అయిన అంబది చాలా ప్రత్యేకమైన పాత్ర ఈమె కాశీ రాజు ముగ్గురు కుమార్తెలలో పెద్దది ఈవిడ సాళ్వుని ప్రేమించింది ఇద్దరు వివాహము చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు ఈవిడకు భీష్ముడి మరణానికి గల సంబంధము ఏమిటో తెలుసు కుందాము.

శంతనుడు మరణించాక రాజ్యపాలన భారము సత్యవతి పుత్రుల పరము అయింది భీష్ముడు తన ప్రతిజ్ఞ వల్ల రాజ ప్రతినిధిగా ఉండి సత్యవతి పుత్రులకు రక్షగా ఉండి పాలన సాగిస్తున్నాడు ఆ సమయములో కాశీ రాజుతన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు విషయము తెలుసుకున్న భీష్ముడు తన తమ్ముడు సత్యవతి పుత్రుడైన విచిత్రవీర్యునికి భార్యగా చేయటానికి ముగ్గురు కాశీరాజు కుమార్తెలను తెచ్చి రాజమాత సత్యవతి ఎదుట నిలుపగా విచిత్రవీర్యునికి వాళ్ళను ఇచ్చి వివాహము చేయమని చెపుతుంది
కాశీరాజు కుమార్తెలలో పెద్దదైన అంబ తానూ సాళ్వుడిని ప్రేమిస్తున్నానని తనను అతని సమక్షానికి పంపమని భీష్ముడిని వేడుకుంటుంది ఈ విషయాన్ని భీష్ముడు సత్యవతికి తెలిపి అంబను పుట్టింటి ఆడబడుచులాగా లాంఛనాలతో సాల్వుడి దగ్గరకు పంపుతాడు కానీ సాళ్వుడు అంబను పెళ్లిచేసుకోవటానికి నిరాకరించి మళ్ళా అంబను హస్తినకు పంపిస్తాడు హస్తిన వచ్చిన అంబ తనను పెళ్లిచేసుకోమని భీష్ముడిని అడిగిపోతే తానూ వివాహమాడనని ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసాను కాబట్టి కుదరదు అని నిష్కర్షగా చెపుతాడు ఇటువంటి పరిస్తితులలో తన జీవితమూ భీష్ముడి వలన అన్యాయము అయింది అని భావించిన అంబ భీష్ముడిపై కక్షను పెంచుకుంటుంది కానీ ఆబల నిస్సహాయురాలు అవటం వలన భీష్ముడిని ఎదుర్కోవటానికి తపస్సే శరణ్యము అని భావించింది. ఆమె దీనగాథను విన్న మునివర్యులు “సుకుమారివి రాకుమారివి నీకు తపస్సు ఎందుకు?” అని నిరుత్సాహపరిచారు.

అంబకు తాత వరుస అయిన శాలిహోత్రుడు అనే మునివర్యుడు అంబ దీనగాథను విని దుఃఖితుడై ఆమెను తన మనమరాలిగా గుర్తించి ,”ఇప్పుడు నీవు చేయవలసినది తపస్సుకాదు ముందు పరుశ రాముడిని కలుద్దాము అయన భీష్ముని గురువు కాబట్టి వ్యవహారాన్ని చక్కదిద్దగలడు భీష్ముడు కూడా గురువు మాట కాదనడు”, అని అంబను ఒప్పించేప్రయత్నము చేస్తాడు అ సమయములోనే పరశురాముని శిష్యుడు అకృతవణుడు పరుశరాముడు శాలిహోత్రుని కలవటానికి వస్తున్నట్లుగా తెలియజేస్తాడు ఇది విన్న శాలిహోత్రుడు అంబ మిక్కిలి సంతోషిస్తారు.

వచ్చిన పరుశరామునికి సకల మునిజనులు సాదరముగా ఆహ్వానించి అర్ఘ్యపాదాలు ఇచ్చి భక్తి ప్రపత్తులతో ఆయనను సేవించారు తదుపరి శాలిహోత్రుడు అంబను తన దౌహిత్రిగా పరిచయము చేసి జరిగిన వృత్తాంతాన్ని వివరించి అంబకు న్యాయము చేయవలసినదిగా వేడుకున్నాడు అంతా విన్న పరుశరాముడు భీష్ముడిని అంబను వివాహమాడవలసినదిగా శాసిస్తాను అని అంబకు శాలిహోత్రునికి మాట ఇచ్చి భీష్ముడిని కలవటానికి కొందరు మునివర్యులతో బయలుదేరాడు సరస్వతి నది తీరానికి చేరి తన రాకను భీష్ముడికి తెలియజేయగా సకల మర్యాదలతో తన గురువును సేవించుకోవటానికి భీష్ముడి సరస్వతి నది తీరానికి తరలి వచ్చాడు. శిష్యుని రాకతో సంతసించిన గురువు పరుశరాముడు తన రాకకు గల కారణాన్ని తెలియజేశాడు.

“నా మాట మన్నించి అంబను నీ తమ్మునికి ఇచ్చి వివాహము చేయి లేదా నీవు వివాహము చేసుకొని అంబకు న్యాయము చేయి లేనిపక్షంలో నీవు నాతో యుద్ధము చేయవలసి వస్తుంది”,అని పరుశరాముడు భీష్ముని హెచ్చరిస్తాడు. “ధర్మాత్ములైన మీరు నన్ను అధర్మ మార్గములో నడవమని శాసించటం సమంజసము కాదు మీరు నన్ను కరుణించి ఈ ఉపద్రవము నుండి నన్ను రక్షించండి”అని భీష్ముడు గురువుగారిని వేడుకున్నాడు “పిరికివానిలా నిస్సహుయుడిలా ప్రవర్తించకు నా ఆజ్ఞను పాటించు లేదా నాతొ యుద్దానికి సన్నద్ధమవు” అని పరశురాముడు భీష్ముడిని తీవ్రముగా మందలిస్తాడు. అయినప్పటికీ భీష్ముడు తానూ గురుద్రోహిని కాను అని, ధర్మపక్షపాతిని అని తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండేవాడిని అని గురువుగారికి సవినయముగా తెలియజేస్తాడు అప్పుడు యుద్దానికి సిద్దము అవమని గురుదేవులు ఆనతి ఇస్తారు.

భీష్ముడు అవశ్యము అని తల్లియైన సత్యవతికి విషయము చెప్పి అస్త్రశస్త్రాలతో పరుశరాముని సన్నిధికి వస్తాడు. విషయము తెలిసిన గంగ వారి చెంతకు వచ్చి ఇరువురిని యుద్ధము వలదని కోరింది కానీ ఇరువురు వారి వారి పట్టుదలల కు అంకితమయినారు భీష్ముడు గురుదేవులకు ప్రదక్షిణ నమస్కారము చేసి ,”నేను రధము మీద, మీరు భూమి మీద నిలబడి యుద్ధము చేయుట యుద్ధ నీతి కాదు కాబట్టి నేను కూడా నేలపై నిలబడి యుద్ధము చేస్తాను అని గురువుగారితో అంటే గురువుగారు తన తపోబలముతోమహత్తరమైన రధాన్ని సమకూర్చుకొని యుద్దానికి సన్నద్దమయినాడు. ఇరువురి మధ్య యుద్ధము ప్రారంభమయింది.

క్రమముగా భీకర సమరముగా మారింది ఇరవై రెండు రోజులపాటు సాగిన ఈ యుద్ధము ప్రళయానికి దగ్గర అవుతున్న సమయములో ఇరువురి వంశకర్తలు వచ్చి వారిని \శాంతింపజేశారు.పరుశరాముడు తన అపజయాన్ని ఆసక్తతను అంబకు తెలిపి,”అమ్మా చూశావు కదా నా లోపము లేని యుద్దాన్ని”అని చెప్పగా అంబ ,”మీ ప్రయత్నమూ మీరు చేశారు సంతోషము కృతజ్ఞురాలిని”అని వినయముగా పరుశరామునితో చెప్పింది “తపస్సు చేసైనా ఈ జన్మకాకపోతే మరోజన్మకైనా ఈ భీష్ముని నాశనము చేస్తాను “అని అంబ ప్రతిజ్ఞ చేసి తీవ్రమైన తపస్సు ఈశ్వరుని కోసము చేసింది.గంగ వలదని వారించినా అంబ వినలేదు ఈశ్వరుడు అంబ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై,” ఈ జన్మలో నీవు అనుకున్నది సాధించలేవు మరుజన్మలో ద్రుపదునికి కూతురుగా పుట్టి కొన్ని కారణాల వల్ల మగవానిగా మారి భీష్మునిపై గల కక్ష్యను తీర్చుకుందువు”,అని ఈశ్వరుడు సెలవిస్తాడు

ద్రుపదుని కూతురుగా పుట్టిన అంబ పురుషునివలె పెరుగుతుండి వయస్సు వచ్చిన ఆమెకు దశార్ణ దేశాధి పతి కుమార్తెతో వివాహము చేస్తారు. తీరా ఇద్దరి ఆడవారి మధ్య వివాహము అభాసు పాలవుతుంది. అవమానము భరించలేక ద్రుపదరాజు పుత్రిక అడవిలోకి వెళ్లి ప్రాణత్యాగము చేయాలనీ నిర్ణయించుకుంటుంది. అడవిలో స్థూలకర్ణుడు అనే యక్షుడు ఈమె పరిస్థితికి జాలిపడి తన పురుషత్వాన్ని ఆవిడకు ఇచ్చి తానూ స్త్రీత్వాన్ని పొందుతాడు. పదిరోజుల తరువాత ఎవరి రూపాలకు వారు వచ్చేటట్లు నిర్ణయానికి వస్తారుకానీ కుబేరుని అనుచరులు స్థూలకర్ణుని కోసము వెతుకుతూ ఉంటె స్త్రీ రూపములో ఉండి సిగ్గుపడుతూ ఉండే స్థూలకర్ణుని చూసి కుబేరునికి తెలియజేస్తారు. కుబేరుడు స్థూలకర్ణుని చూసి “నీకు ఈ రూపము బావుంది ఇలాగే ఉండిపో”అని అంటాడు. ఇది విన్న స్థూలకారణుడు బావురుమంటాడు. కుబేరుడు ‘తప్పదు పురుషునిగా మారిన అంబ(శిఖండి) జీవించి ఉన్నంతకాలము నీకు ఈ స్త్రీ రూపము తప్పదు. తదుపరి నీకు నీ పురుష రూపము వస్తుంది. శిఖండిని అడ్డుపెట్టుకొని చేసే యుద్దము ద్వారా స్వచ్చంద మరణము కలిగిన భీష్ముడు మరణిస్తాడు. ఈ రహస్యాన్ని భీష్ముడి అర్జునికి మహాభారత యుద్ధ సమయములో చెపుతాడు. ఆ విధముగా అంబ శిఖండిగా మారటం అనేది, భీష్ముని తనువూ చాలించటానికే. ఎందుకంటే భీష్ముడు లాంటి పరాక్రమవంతుడిని ధర్మ నిష్టాపరుడిని ఏ రకమైన శస్త్రాలు, ఎవరు సంహరించలేరు.
ఇది శిఖండి కధ.

మహాభారత యుద్దములో అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని చేసిన యుద్ధము వలన భీష్ముడు అస్త్ర సన్యాసము చేసి అంపశయ్యపై చేరటముతో అంబ(శిఖండి) చరిత్ర ముగుస్తుంది. అంబ మొత్తానికి తన పంతము నెగ్గించుకుంటుంది.

విశ్వనాథ వారి భ్రమరవాసిని

రచన: రాజన్


అలల సవ్వడులలతో హోరెత్తుతూ.. తిరిగి నెమ్మదించి, ప్రశాంతత పొందిందనే లోపుగనే మరింత ఉధృత కెరటాలతో ఎగసిపడి, కల్లోలము నుండి ప్రశాంతతకు, ప్రశాంతత నుండి కల్లోలానికి తన పథాన్ని మార్చి మార్చి, నురగల నగవులో లేక నశ్రువులో చిందించే సాగరానికి సైదోడు… మనిషి మనస్సు. ఆలోచనల, కోరికల పుట్టినిల్లయిన అటువంటి మనస్సును గూర్చి, దాని స్వభావమును గూర్చి ఒక ఆలోచన చేయించి, ఆంతరిక ప్రపంచ జ్ఞానమును, బాహ్య ప్రపంచ విజ్ఞానమును కలబోసి, అక్షరములుగా పోతపోసి మనకందించిన ఋషులవంటి మహనీయులున్నారు. గత వంద, రెండువందలేండ్ల కాలములో చూసినట్లయితే అటువంటి మహారచయిత ఒకరు పవిత్ర కృష్ణానదీ తీరాన జన్మించి, మనసుకు ఆహ్లాదాన్ని, బుద్ధికి విజ్ఞానాన్ని, ఆత్మకు ఆనందాన్ని కలిగించగల తన రచనలతో కవికుల సమ్రాట్టుయై, రాశీభూత విజ్ఞానమై, ఆంధ్రుల మహద్భాగ్యమై ప్రకాశించెను. ఆ ప్రభావశీల ప్రకాశరేఖలు నేటికీ అనేకుల మనస్సులలో.. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గురువరేణ్యుల రూపమున మూర్తికట్టి వెలుగొందుచున్నవి. పురాణవైర గ్రంథమాల, కాశ్మీర రాజవంశ చరిత్ర, వేయిపడగలు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, చెలియలికట్ట మొదలైన అనేకానేక నవలలు కలియుగ రాజవంశ నిజ చరిత్రను, లౌకిక విజ్ఞానాన్ని, ఇంకా మనిషి ఆలోచనపు లోతులను మనకందిస్తాయి. అంతేకాక మనస్సును పట్టి కుదుపుతూ, దానిని దాటి మరింత లోతుగా వెళ్లడానికి ప్రయత్నించే భావనాతరంగమొకటి పుస్తకం చదువుచున్నంతసేపు మనలో కదలాడుతూనే యుంటుంది. అటువంటి రచనలలో నొకటి… కాశ్మీర రాజవంశ చరిత్ర నందలి ఆరవ మరియు ఆఖరి నవల… భ్రమరవాసిని.
కాశ్మీరాధిపతి రణాదిత్యుని శోభనపు గదిలో కథ మొదలౌతుంది. నూత్న వధువు రణరంభాదేవి రాకకై ఎదురుచూస్తున్న రణాదిత్యుని మనస్సును… అప్పటివరకూ జరిగిన సంఘటనలు, గోడలపై చిత్రాలు, ద్వారబంధము ప్రక్కనే ముమ్మూర్తులా రణరంభాదేవిలా యున్న ఒక శిల్పము కలవరపెడుతుంటాయి. అటుపై ఆమె గదిలో అడుగిడిన తదుపరి వారి మధ్య జరిగిన సంభాషణ, రాజును మరింత విస్మయానికి గురిచేస్తుంది. రణరంభాదేవి, తాను సాక్షాత్ శ్రీమహాలక్ష్మి స్వరూపమగు భ్రమరవాసినినని, రణాదిత్యుని కోరిక మేరకు రణరంభగా జనించి ఆతని భార్యనైతినని, ఆమెనాతడు స్పృశింప సాధ్యము కాదని చెప్పును. అంతియేకాక, అతనిని మోహవశుడను జేసిన ద్వారబంధము దగ్గరి ప్రతిమను మంచముపై పరుండబెట్టు మని చెప్పి, తాను భ్రమరమై భ్రమరీనినాదము జేయుచూ ఆతనిని నిద్రపుచ్చుటతో కథ ప్రథమ భాగము పూర్తియగును.
పెండ్లి జరిగిన కులూతదేశము నుండి కాశ్మీరానికి బయలుదేరిన పెండ్లి బృందముతో కులూతదేశ యువరాణి అమృతప్రభ ను కూడా తీసుకువచ్చిన రణరంభాదేవి, మార్గమధ్యములో సర్వాంగీకారముతో ఆమెకు రణాదిత్యునకు వివాహము జరిపించును. శ్రీనగరము చేరిన పిమ్మట రణాదిత్యుడు స్వప్నములలో తన పూర్వజన్మ కథయంతయూ తెలుసుకొనును. అతడు క్రితం జన్మమున మధుసూధనుడను సంపన్న బ్రాహ్మణుడు. పెద్దల బలవంతము మీద ఇష్టము లేకున్ననూ రూపవతి కానటువంటి నీలమణిని వివాహమాడతాడు. నాలుగేండ్ల వారి వివాహజీవితములో అతడామెతో సంసార సుఖమనుభవించడు. కాలక్రమాన వ్యసనపరుడై ఆస్థి యందలి పెద్ద మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. నీలమణి మాత్రం భర్త తెచ్చిన మహాలక్ష్మీ విగ్రహాన్ని ధూపదీపనైవేద్యాలతో ఆరాధిస్తూ, శుక్రవారం పూజలు చేస్తూ తన్మయత్వాన్ని అనుభవిస్తుంటుంది. భార్యను అమ్మాయని పిలుచుట ప్రారంభించిన భర్తతో నీలమణి నిష్ఠూరంగా అన్నట్టి “మీకు అమ్మ భార్య. భార్య అమ్మ” మాటలు ఒక శాపంగా పరిణమించి భవిష్యద్కథకు దోహదం చేస్తాయి. మధుసూధనుడు పరివర్తన దశలో యుండగానే, నీలమణి తన సవతి తల్లి అసూయకు బలైపోతుంది. విరక్తుడై తిరుగుచున్న మధుసూధనుడు, అనుకోకుండా ఒకనాడు తన ఇంట పూజామందిరంలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని చదువుతాడు. అందులో వివరింపబడిన అతి క్లిష్టమయిన భ్రమరవాసినీ వ్రతాన్ని బూని, ఇంటినీ, ఉరునీ విడచి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, చివరకు దేవిని ప్రసన్నం చేసుకుంటాడు. అమ్మ అనుగ్రహించేవేళ సమ్రాజ్యాధిపత్యముతోపాటు, వివేకహీనుడై ఆ అమ్మనే భార్యగా కోరతాడు. దయామయి అయిన అమ్మ అనుగ్రహించి అంతర్హితురాలౌతుంది. ఇదీ రణాదిత్యుని స్వప్న వృత్తాంతం. అప్పటి మధుసూధనుడే ఇప్పటి రణాదిత్యుడు, నీలమణియే అమృతప్రభ, సాక్షాత్ శ్రీ వైష్ణవీ మహామాయయగు భ్రమరవాసినియే రణరంభాదేవి.


ఆ తరువాత రణాదిత్యునితో జైత్రయాత్ర గావింపజేసిన రణరంభాదేవి, అతనిని సామ్రజ్యాధిపతిగా, భారత చక్రవర్తిగా చేస్తుంది. చివరగా రణాదిత్యునికి పాతాళలోక వాసముననుగ్రహించి, తాను శ్వేతద్వీపమున వింధ్యపర్వత గుహాంతర్భాగములో భ్రమరవాసినిగా భక్తులననుగ్రహిస్తూ వెలుగొందుతుంటుంది. ఇదీ స్థూలంగా భ్రమరవాసిని కథ.
కథ గొప్పదనం ఒకెత్తయితే, కథకుడు దానిని నడిపిన వైనం రెండెత్తులనవచ్చును. విశ్వనాథ వారి ప్రతిరచన యందు ఒక విశిష్టత యుంటుంది. పాత్రల మధ్య సంభాషణలతో ఒక విషయాన్ని చర్చించి అవకాశమున్నంత వరకూ వాదానికిరువైపులా పదునుపెట్టించి పరుగులెత్తించి చివరకు సత్యాన్ని రూఢీ చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఈ కథలో కూడా భ్రమరవాసినీ రణాదిత్యుల మధ్య సంభాషణలటువంటివే. ఇక పాత్ర చిత్రీకరణల విషయానికి వస్తే… రణరంభాదేవి దయాస్వరూపిణి, తనను కోరిన భక్తుని అవివేకాన్ని మన్నించి ననుగ్రహించిన తల్లి. అతని కోరికీడేర్చుటకు మానవకాంతగ జనించి, రణాదిత్యుని పట్టమహిషియై ఆతనికి సామ్రాజ్యత్వమును కట్టబెట్టిన వైష్ణవీ మహాశక్తి. రణాదిత్యుని పాత్ర ఓ తరహా వైచిత్రి కలిగిన పాత్ర. అతడెంతటి మహావీరుడైనప్పటికీ కథలో ముప్పావుపాలు అయ్యేవరకూ జరిగేదంతా ఎందుకు జరుగుచున్నదో, తనకు వచ్చే కలల రహస్యమేమిటో తెలియక సంధిగ్థంలో నడిచే పాత్ర. సౌందర్యం, అమాయకత్వం రంగరించబడిన పాత్ర అమృతప్రభది. భర్త తిరస్కారానికి గురైనప్పటికీ, భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, మహాలక్ష్మీ ఆరాధనలో తన్మయత్వాన్ని పొందే పాత్ర నీలమణిది. నచ్చని పెళ్లి చేసుకుని, వ్యసనపరుడై తిరిగి పరివర్తన చెంది దేవ్యనుగ్రహాన్ని పొందినవాడు మధుసూధనుడు. ఇలా ప్రతిపాత్ర అద్భుతంగా మలచబడి నడపబడినవే.
ఇది యంతా కథేమిటో చెప్పడానికి ఉపయోగపడుతుంది గానీ, కథామాధుర్యాన్ని చవిచూడాలంటే మాత్రం భ్రమరవాసిని చదవవలసినదే. తన్మయమొందిన హృదయముతో నిద్దురలో భ్రమరీనినాదము వినవలసినదే.

కవితా నీరాజనమైన నివేదన

రచన: సి.ఉమాదేవి

కవయిత్రి కవితా చక్ర పలికించిన నివేదన, రాగాలు పలికిన కవితాఝరి. అక్షర ఆర్తితో లిఖించిన ప్రతి పదము రచనాపూదోటలో కవితాసుమమై మధురిమలను వ్యాపింపచేస్తుంది. కలము, గళము యుగళగీతమై అందించిన కవితార్చనలోని తాత్వికత, తాదాత్మ్యతకు గురిచేస్తుంది. పుస్తకం శీర్షిక నివేదన, కాని ప్రతి వాక్యములో ఆరాధన, ఆవేదన సమ్మిళితమైన నివేదనగా రూపుదిద్దుకున్న రచన.
‘దోసిటనిండిన ఆశల పూలరెక్కలు మాయమై హృదయభారాన్ని మిగిల్చాయనడంతో’ నివేదన అక్షరానికి ఊపిరవుతుంది.
‘నేను నడిచే దారుల్లో నీమాటల పూవులు నన్ను తాకుతున్నాయి, నీకై వెదుకుతూ నడిచాను, దారి అంతు చిక్కలేదు, నీ ఆనవాలూ కనిపించలేదు’ అని అనడంలో మాటల పువ్వులతో కవయిత్రి అక్షరమాలలే అల్లారు. ‘నీటికుండతో గుమ్మంలో ఎదురు చూస్తూనే ఉన్నా! నీటికుండలో నీరు తొణకలేదు. . తడిసిన గుండెలో కన్నీరూ ఇంకలేదు. ’చక్కటి ప్రయోగం కన్నీరూ ఇంకలేదు అనడంలో పాఠకుడికి అందులో శ్లేషార్థం కూడా కనబడుతుంది. కన్నీరు గుండెనిండుగా ఉందనడమేకాదు, ఇక ఏడవడానికి కన్నీరు ఇక లేదనిపిస్తుంది. ‘నీ రాక జాడ తెలియలేదు కానీ స్పందన మాత్రం కంటిలో చెమ్మైంది!’అని చెప్పడంలో మనసు కురిసిన కన్నీటి చినుకులే కదా కంటిని తడిపింది అనిపిస్తుంది. ‘అక్షరాలవనంలో నీకోసం పూసిన పదదళాల్ని నీ పాదాలచెంత నివేదిస్తున్నాను. ’రచనా ఒరవడిలో వికసించిన పదాలన్నీ పూలరెక్కలై పరిమళిస్తాయి. ‘ఇంద్రధనస్సులో సప్తవర్ణాలేకాని మనసున ఎన్ని రాగవర్ణాలో అనడం రాగరంజితమే. మగత నా వేలు పట్టుకుని స్వప్నసీమలో నిన్ను చూపుతూ నీ దరి చేరుస్తున్నది. మేలుకుని చూసాను నీవు లేని శూన్యత కళ్లలో మాత్రం నీ రూపం నింపిన వెలుగు. ’ కలయో వైష్ణవమాయో అనే భావన మన మనసును లీలగా స్పృశిస్తుంది. ‘కనుల కాటుక కరిగీ గాజుల సవ్వడీ సద్దుమణిగి బాహ్యాలంకరణ వసివాడింది, నీ దర్శనార్థం వేచి ఉన్న హృదయాలంకరణ మాత్రం
-2-
తేజోవంతంగా కాంతులీనుతూనే ఉంది’ అంటారు. బాహ్యప్రపంచాన్ని మరచి అంతరాత్మలో అంతర్యామితో మమేకమైన భావన పొటమరిస్తుంది. ‘బంధాలే సమస్తమైన నాకు స్వేచ్ఛైక విశ్వజనీన ప్రేమను చవి చూపావు. . . నింపారమైన నీ చూపు కవచంలో బందీనే’ అని నివేదించడం కళ్లు చూపులతో బంధిస్తాయన్న నిజానికి చక్కని దృష్టాంతం. ‘ఏ దిక్కునుండి, ఏ సమయంలో వస్తావో తెలియక ఆకసాన్ని చూస్తూ పొద్దుపొడుపేదో, పొద్దుగూకేదో మరచి నీ కోసం అల్లుతున్న మనోమాలికలో ఎన్నో చిక్కుముడులు. ’ అని చెప్పడంలో మనసున ఉద్భవించే ఆలోచనల సుడిగుండాన్ని తలపుకు తెస్తుంది. ‘వాలిన నా కళ్లలో మాత్రం నీ పాదముద్రలు నిక్షిప్తమయ్యాయి. నువ్వు లేవు అలౌకిక భావపు అంచున నేను. ఇహపరముల సమ్మోహనమిది. నీ గమనంలో వేగం పెరిగిందని వాయువేగం సందేశం చేరవేసింది, నువ్వు చేరే గమ్యం నేనే అన్న ధీమా, అనంతమైన కాంతితో ప్రజ్వలిస్తోంది. ’ నివేదన చివరి రూపు సంతరించుకునే దిశగా ఆశ మొలకెత్తుతుంది.
‘నీ పాదాలను అలంకరించాలని ఒక్కో అశ్రుబిందువును మాలగా కూర్చాను పక్షుల కువకువలు నీ రాకకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభాతస్వప్నం సంధ్యాసమయంలో కరిగిపోతున్నా అలుపులేక నా గొంతు నీ గీతాలనాలపిస్తూనే ఉంది. ’ కల కనుమరుగైనా మనసుపలికే రాగాలను అడ్డుకోలేం కదా అనే భావం చదువరిని ఆకట్టుకుంటుంది. ‘నువ్వు మౌనం వహించావు. . . ఆ మౌనంలోనే భాషను వెతుక్కుని, నీతో సంభాషిస్తున్నాను. ’ మౌనభాష్యమెపుడు మనసుభాషే. ‘కాలచక్ర ప్రవాహ గమ్యమేమిటో తెలియదు గానీ ఈ కాల గమనంలో అడుగడుగునా నీ సందేశమే. ’మన మనసులో ఉత్పన్నమయే ఆరాధనా భావాలకు జవాబెపుడు కోరుకున్న సందేశమే అవుతుంది. ప్రతిపుటలోను అనురాగమాలికలు పేని కాలచక్ర పరిభ్రమణంలో ఆర్ద్రత నిండిన నివేదనతో అక్షరపుష్పాలను వికసింపచేసిన కవితా చక్రకు అభినందనలు.