ఎల్. జి. బి. టి.

రచన – శ్రీకాంత గుమ్ములూరి.

అనాది నుండి మన సమాజంలో
ఎన్నెన్ని వర్ణాలు !!!
కులం మతం జాతి లింగం
ఎన్నెన్నో విభాగాలు.
వీటన్నింటినీ సంతరించుకుని
వైషమ్యాల కక్షలు !!

ఒక అతివ మరొక అతివను మోహించిందని
ఒక పురుషుడు వేరొక పురుషునితో రమించాడని
ద్విలింగాత్మక మైధునంలో లైంగికానుభూతి బడసారని
పురుషుడు స్త్రీ వలె మరి స్త్రీ పురుష ప్రవృత్తి చూపారని
నపుంసకత్వపు పుటకను పొందిన వారు నష్ట జాతకులని
వారంతా ప్రకృతికే విరుద్ధమని వారి జీవనమే వ్యర్ధమని
స్త్రీ పురుష సంబంధం మొక్కటే స్రృష్టిలో ఉత్కృష్టమనీ
తక్కినవన్నీ హీనమని నిషిద్ధ వైఖరి ప్రదర్శించి
పక్షపాత ధోరణితో నీచాతి నీచంగా వారి పట్ల వివక్ష సలిపి
నిలువ నీడ నీయక, వారిని జాతి బహిష్కృతులను గావించి
తామే అధికులమని, మనుధర్మ శాస్త్ర పారంగతులమని
ఎలుగెత్తి చాటుటయే ప్రశంసనీయమైన జీవనమా ?
జన్యుశాస్త్రపు విధముల నియంత్రించ వారి తరమా?
వారి వారి పుట్టుకలకు బాధ్యులు మనుజులా? దైవమా?

పురాణేతిహాసాలు కించపరచలేదు బృహన్నలనీ, శిఖండీనీ
విష్ణువు మోహినియైనా, శివ కేశవులు రమించినా
హరిహర పుత్రుడు అయ్యప స్వామిగా అవతరించినా
హర్షించి పూజించిన లోకానికి ఇపుడెందుకీ వైషమ్యం ?

లైంగిక ధోరణిపై వివక్ష అంటే వాక్ స్వాతంత్ర్యమును
భావ స్వాతంత్ర్యమునూ ఉల్లంఘించినట్లే కదా
నపుంసక పుటక ప్రకృతి విరుద్ధమూ కాదు
స్వలింగ సంపర్కం మానసిక రుగ్మతా కాదు
మనుజులలో పైశాచిక ప్రవృత్తిని మించిన రోగమా ఇది ?
పరస్పర సమ్మతితో గల ప్రేమకు నిరాదరణ ఎందుకు ?
హాని కొలుపు విధములను తప్పక ఖండించ తగును
అధికాంశుల అభిప్రాయాలు, ప్రసిద్ధ నైతికత చెల్లవు మరి

ప్రతియొకరూ అర్హులే ప్రాధమిక మానవ హక్కులను పొంద
ఈ నిజ జీవితానికి పరమార్ధం సకల జనులకూ సమానతత్వం
మారుతున్న సమాజంలో మారుతున్న వ్యవస్థలను
మనసారా అంగీకరించు మానవతను ప్రదర్శించు
పక్షపాత వైఖరిని పారద్రోలి ప్రతి జీవిని నీలో ఒకరిగ సమీకరించు
పురాతన భావాలను విసర్జించి అభ్యున్నతిని సాధించు
అత్యున్నత న్యాయస్థానం అందించిన తీర్పును గౌరవించు.

———————-