ఒక చిన్న చెల్లి ఆత్మకధ 1

రచన: ???? (అనామిక)

ఆడపిల్లగా పుట్టడం నేరమైతే ఆ తప్పు నాది కాదు. అందులో ఆఖర్లో అక్కరలేని సంతానంగా పుట్టడంలో కూడా నా తప్పు లేదు. నా పుట్టుకకు సంతోషించిన వాళ్ళెవరూ లేరు. నా కన్నా ముందు పుట్టినవాళ్ళు తమకు దొరికేవాటిలో మరో భాగస్వామి వచ్చినందుకు బాధపడ్డవాళ్ళే.
పధ్నాలుగవ సంతానం కింద పుట్టిన నాకు చిన్నతనం అపురూపంగా మాత్రం లేదు. అందరిళ్ళల్లో ఆఖర్న పుట్టిన వాళ్ళకు గారాలూ ముద్దు ముచ్చట్లు ఎక్కువని కాస్త పెద్దయ్యాక తెలిసింది. ఇంకా పెద్దయ్యాక అక్కలూ అన్నలూ చిన్న చెల్లంటే ఎంతో ప్రేమగా చూసుకుంటారని ఆమె ఆడింది ఆట పాడింది పాటగా జరుగుతుందని తెలిసింది.
కానీ నా విషయంలో అలా ఎందుకు జరగలేదన్నది పెద్దయ్యాక కూడా అర్ధం కాలేదు. అలాంటి అయోమయంలో నా బాల్యం గడిచింది. నా కన్నా ముందు పుట్టిన అక్కలకు కొంత మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అక్క పిల్లలు నా కన్నా పెద్దవాళ్ళు.
అమ్మ పాలు తాగిన గుర్తు కానీ అమ్మ ఒడిలో పడుకున్న గుర్తుకానీ లేదు. దానికి కారణం రెండో అక్కయ్య పురుడుకు రమ్మని బావ ఉత్తరం రాసారుట. అమ్మ నన్ను నాలుగో నెలలో వదిలి అక్క పురిటికి వెళ్ళిపోయింది. ఈ విషయం కొంచెం పెద్దయ్యాక అత్త చెప్పింది.
అత్త అంటే సొంత అత్త కాదు. నాన్నగారి బాబయ్య కూతురు. ఆవిడ, చిన్నక్క నీళ్ళు పోసి పాలు పట్టారట. అని వాళ్ళు చెప్పారు. ఎవరు నీళ్ళు పోసారు ఎవరు లాలించారు అది కూడా నాకు గుర్తు లేదు. అమ్మ చేతి గోరు ముద్దలు తిన్న గుర్తుకూడా లేదు. నాకు గుర్తు లేకపొయినా అమ్మ కానీ అక్కయ్యలు కానీ నా బాల్యం లోని మధుర ఘట్టాలు వర్ణించలేదు. చెప్పుకోదగ్గవి ఉంటే చెప్పరూ?.
అత్త ప్రేమ మాత్రం నాకు గుర్తే. నాకు ఊహ వచ్చేదాకా మా ఇంట్లో ఉండేది. స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోసం వచ్చిందిట. అమ్మకు ఆమె ఉండడం ఇష్టం ఉండేది కాదు. కారణం నాకు తెలియదు. ఇంకో మనిషి ఖర్చు భరించడం కష్టమనేమో?
ఒక రోజు పాల కోసం ఏడుస్తున్నానట. ఇంట్లో పాలు లేవు. ఏం చెయ్యాలో అత్తకూ, అక్కయ్యకూ అర్ధం కాలేదట. అప్పుడు అత్తకు ఉడుకుతున్నఅన్నం, పైకి వస్తున్న గంజి చూడగానే తెల్లగా ఉన్నగంజి పాలల్లా కనిపించిందట. వెంటనే గరిటతో ఆ ఉడుకు గంజి తీసి చల్లార బెట్టి చక్కెర వేసి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నోట్లో ఉగ్గు గిన్నె తో పోసిందిట. ఇది కూడాఅ అత్తే చెప్పింది.
నా చిన్ననాటి ముచ్చట్లంటూ ఏమైనా ఉంటే అవి అత్త నోట విన్నవే. అప్పుడప్పుడు అత్త మాటలు మీతో పంచుకుంటాను. ట్రైనింగ్ అయిపోయాక అత్త మా ఇంటి నించి వెళ్ళిపోయింది. ఉద్యోగం వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యింది. మధ్యలో ఎప్పుడైనా మా ఇంటికి వచ్చేది. అలా వచ్చినప్పుడు కొన్ని నాకు ఆరేళ్ళు వచ్చినప్పుడు కొన్ని, నేను కాస్త పెద్దయ్యాక కొన్ని తనకు తెలిసిన నా ముచ్చట్లు నాకు చెప్పేది.
సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మకు మడి ఆచారాలు ఎక్కువ. ఇంటి నిండా వచ్చేపోయే బంధువులు. పిల్లలకోసం వండిన వంట ట్రైన్ దిగిన బంధువుల విస్తళ్ళల్లో వడ్డించి కన్నపిల్లల కంచాల్లో ఆ రోజు ఆమె కన్నీరు తో బాటు ఆవకాయ నంజుకున్న ఆ పిల్లలకు అమ్మ ఏం పెట్టినా అమృతం అనుకుని తింటున్నా కడుపులో సుళ్ళు తిరుగుతున్న బాధను దిగమింగడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చేది.
అందమైన బాల్యం మధురమైన బాల్యం అన్నప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అందుకు కారణం నా బాల్యం అలా జరగలేదన్న బాధ.
స్కూల్లో వేసారు. అక్షరాభ్యాసంలాంటిది జరిగిందో లేదో గుర్తు లేదు. ఇంటికి దగ్గర ఉన్న స్కూల్ లో వేసారు. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఆ స్కూల్ ని ఇద్దరు అన్నదమ్ములు కలిపి నడిపేవారు. అక్కడేం నేర్చుకున్నానో నాకు గుర్తు లేదు. తెలుగు అక్షరాలు పూర్తిగా వచ్చాక ఒకటవ క్లాస్ పుస్తకం చదవడం మొదలు పెట్టాక, నాన్నగారు ఇంగ్లీష్ అక్షరాలు పలక మీద దిద్దించారు. ఇంగ్లీష్ పుస్తకం చూడగానే నాలో ఏదో మక్కువ. అసలవి ఎలా పలుకుతారో తెలియక పోయినా నాకొచ్చిన భాషలో పలకడానికి ప్రయత్నం
అలా ఒకసారి చదువుతుండగా నాన్నగారు విని నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని “ ఏదీ బంగారూ మళ్ళీ ఒక్కసారి చదువు” అన్నారు.
నేనేదో గొప్పగా చదివేసానన్న ఆనందం, నాన్నగారి ఒళ్ళో కూర్చున్నానన్న సంబరం లో పెద్దగా గొంతెత్తి
‘Leg’ ‘కల్’ కాలు. Chair ‘కుర్స్’ కుర్చీ అన్నాను.
నాన్నగారు పగలబడి నవ్వారు. నాన్న ఎందుకు నవ్వుతున్నారో అర్ధం కాలేదు.
“అలా చదవాలని నీకు ఎవరు చెప్పారమ్మా” అన్నారు.
“అలా చదవ కూడదా నాన్నగారూ. తెలుగులో కాలు ని అలా అంటారు గా ఇంగ్లీష్ లో అలా అంటారనుకున్నాను. నాకు అక్షరాలు వచ్చాయి కానీ చదవడం తెలియదు” అన్నాను.
“చాలా మటుకు ఆ అక్షరాలని బట్టే పలకడం ఉంటుంది. ఉదాహరణ కు తెలుగు లో ‘కాలు’ క కు దీర్ఘం ఇస్తే కా ‘ల’కి ఉకారమిస్తే లు ‘కాలు’ అంటావు కదా!అలాగే ఇంగ్లీష్ లో ‘leg’ ని లెగ్ అని చదవాలి.
ప్రతీ భాషకూ ఉఛ్చారణ వేరుగా ఉంటుంది” అని చెప్పారు.
నాన్నగారు అప్పుడు చెప్పినది అర్ధం కాలేదు. తరువాత ఎప్పుడో మాటల వరుసలో చిన్నప్పుడు ఇలా చదివావమ్మా అని చెప్పినట్లు గుర్తు.
మా స్కూల్ మరీ పెద్దదేం కాదు. ఎన్ని గజాలుంటుందో నాకు తెలియదు కానీ మాస్టారు గారు ఉండడానికి రెండు గదులూ వంటిల్లూ ఉండేవి. మా క్లాస్ రూమ్ లన్నీ పాకలే. బెంచీలు మాత్రం ఉండేవి. మాస్టారు పాఠం మాత్రం బాగా చెప్పేవారు.
మా స్కూల్లో ఆడపిల్లలూ మగపిల్లలూ ఇద్దరూ ఉండేవారు. అన్నదమ్ములు కాక ఇంకా ఇద్దరు టీచర్లు ఉండేవారు. మా స్కూల్లో ఐదవ తరగతి వరకే ఉంది. మా అన్నయ్యలు కూడా ఆ స్కూల్లోనే చదివారట. చివర్న పుట్టిన ఇద్దరక్కలూ మాత్రం ఆడపిల్లల బళ్ళో చదివారు. పెద్దక్కలందరికీ “ అష్టవర్షే భవేత్ కన్యా” అని ఎనిమిదేళ్ళు నిండకుండా పెళ్ళిళ్ళు. పదమూడవ ఏట కాపరానికి అత్తవారింటికి పంపడం, ఆ తరువాత వరసగా పిల్లా, పాపా గొడ్డూ, గోదాలతో ఊపిరి సలపని పనుల్లో ములిగి పోవడం.
చిన్నన్నయ్య బినాకా గీత్ మాలా వినేవాడు. అలాగే పాటలు కూడా బాగా పాడేవాడు. అన్నయ్య వెనకాతల పాడేదాన్నిఅలా చాలా పాటలు నాకు వచ్చేసాయి. అలా పాటలంటే తెగ పిచ్చి .
పక్కింటివాళ్ళ రేడియోలో పాటలు వస్తున్నాయి. మిస్సమ్మ లోని పాట “ రావోయి చందమామ” అంటూ. నేను ఆ పాటను నా సన్న గొంతు తో పాడడం మొదలు పెట్టాను.
“ఛట్ నోరుముయ్యి వెధవ కీచుగొంతుకూ నువ్వూనూ” అన్న చిన్నన్న మాట తో నోటికి తాళం పడింది. ఆ పాటంటే ఎంతో ఇష్టం నాకు. నా గొంతు సన్నగా ఉంటుంది దాన్ని కీచు గొంతు అన్న అన్నయ్య మీద బాగా కోపం వచ్చినా ఏమీ చెయ్యలేని అసహాయత. నాకన్నా పద్దెనిమిదేళ్ళు పెద్ద అయిన అన్నగార్ని ఏమనగలను?
కారణం ఉన్నా లేకపోయినా మొట్టికాయలు మొట్టే నాలుగో అన్ననూ ఏమీ చెయ్యలేను. చిన్నపిల్లని కదా!
అలాగే కోపం వచ్చినప్పుడు జడ వెయ్యనని అక్క మొట్టికాయలు మొట్టేది. అక్క జడ వెయ్యకపొతే
అమ్మవేసే జడ నాకు నచ్చదు. అమ్మ బిగుతుగా వేస్తుంది మర్నాటి దాకా ఉండాలంటూ. మడి అని చెప్పి అరటి తడపలతో జడ వేస్తుంది. అది విప్పి మళ్ళీ రిబ్బన్ పెట్టుకోవడం నాకు చాత కాదు. అలా అమ్మ వేసిన జడ తో స్కూల్ కి వెడితే స్నేహితులు ఎగతాళి చేస్తారు
అందుకని అక్క తిట్టినా కొట్టినా ఆమె తోకలా ఉండేదాన్ని. నా కధలో అందరి అక్కల పేర్లూ అక్కరలేదు కానీ ఈ అక్క గురించి చాలా విషయాలు మీతో పంచుకోవాలి. అందుకని ఈ అక్కకు ఓ పేరు పెట్టేసుకుందాము. అబ్బ ఏం పేరబ్బా ఒరిజనల్ పేరొద్దు. సుబ్బమ్మ వెంకమ్మా బాగుండవు అక్క అంటే కొంచెం కోపం ఉన్నా ఎంతైనా అక్క కదా! అందుకని పిచ్చి పేరు వద్దు. పద్మాసిని అని పెడదాం ముద్దుగా ఇక మీదట మా పద్దక్క అని చెపుతూ ఉంటాను.
దసరా పండగ వచ్చిందంటే ఎంత సంబరమో! దానికి కారణం ఇంచక్కా రంగు కాగితాలు కట్టిన విల్లులూ బాణాలూ పట్టుకుని ముందు రోజే ఎవరెవరి పిల్లల తల్లితండ్రులు రమ్మంటారో మాస్టారు తో బాటు అలా పిలిచిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం చేసేవాళ్ళం.
అలా వెళ్ళిన మాకు ఆ ఇంటి వాళ్ళు పిల్లలకు చాపలు, మాస్టారుకి కుర్చీ వేసి కూర్చోబెట్టాక, మాస్టారు చెప్పగానే,
ఏదయా మీదయా మా మీద లేదు ఇంతసేపుంచుట ఇది మీకు తగునా! దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక రేపురా మాపురా మళ్ళీ రమ్మనక ఇప్పుడే లేదనక ఇవ్వరేమనక అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు
అంటూ ఏక కంఠంతో పాడేవాళ్ళం. ఆ ఇంటివాళ్ళు నవ్వుకుంటూ మళ్ళీ రమ్మనంలెండి అంటూ మాకు పళ్ళెంలో పప్పు బెల్లాలు తెచ్చి దోసెళ్ళల్లో పోస్తే మేం తెచ్చుకున్న రుమాళ్ళల్లో మూట కట్టుకుని మళ్ళీ దోసిలిలో కొన్ని తీసుకుని తినేవాళ్ళం.
మరమరాల్లో గుల్ల సెనగపప్పు (పుట్నాల పప్పు) బెల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు కలిపి ఇచ్చేవారు. ఆ పప్పుబెల్లాలు భలే రుచిగా ఉండేవి. అయ్యవారికి అంటే మాస్టారికి తాంబూలంలో డబ్బు పెట్టి ఇచ్చేవారు. కొంతమంది పంచెల చాపు కూడా పెట్టేవారు.
అలా మా ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం నాన్నగారు చాలా హడావుడి చేసేవారు. పప్పుబెల్లాల తో బాటు పిల్లలకు మా పెరట్లో కాసిన అరటిపళ్ళు (అమృతపాణి)కూడా ఇచ్చేవారు. మా స్నేహితులందరిలో ఆ
రోజు నేను గొప్పదాన్నన్నమాట. ఒకసారి అమ్మ పాలకోవా కూడా పిల్లలకు ఇచ్చినట్లు గుర్తు. అందరూ పంచెలు పెడితే అన్నీ ఏం చేసుకుంటారని, నాన్నగారు మాస్టారికి పాంట్, చొక్కా గుడ్డ ఇచ్చేవారు.
“నాకు తెలుసున్న దర్జీవాడున్నాడయ్యా చవకగా బాగా కుడతాడు నా పేరు చెప్పు” అనేవారు.
నాన్నగారు మాస్టార్ని నువ్వని ఎందుకంటారో అర్ధమయ్యేది కాదు. తరువాత తెలిసింది మాస్టారు కన్నా నాన్న పెద్దవారని. మాకు పెద్దగా డబ్బులెక్కువ లేకపోయినా నాన్నగారికి చదువుకునే వాళ్ళన్నా చదువు చెప్పేవాళ్ళన్నా చాలా ఇష్టం.
మా స్కూల్ బైట పీచు మిఠాయి వాడు, ఒక తాత కర్ర కు కట్టిన రంగు రంగుల జీడి పాకం ముద్ద తో వాచీలు పిట్టలూ చేసి ఇచ్చేవాడు. కొద్ది సేపు చూసి ఆనందించి ఆ తరువాత తినేసేవాళ్లు. తియ్యగా ఉండేది. బటానీలు కూడా అమ్మేవాడు. కొంత మంది పిల్లలు కొనుక్కునేవారు. కానీ నా దగ్గర డబ్బులు లేవుగా అందుకని వాళ్ళు తింటుంటే నేను చూస్తూ తింటున్నట్లు ఫీలయ్యేదాన్ని.
ఒకసారి అలా చూస్తూ నించున్నప్పుడు చిన్నన్నయ్య చూసాడు. ఇంటికి బర బరా లాక్కొచ్చి ఒక్క లెంపకాయ కొట్టాడు. అమ్మ ఎందుకురా కొడుతున్నావు? అని అడిగితే “లేకి దానిలా వాళ్ళు కొనుక్కు తింటుంటే చొంగలు కారుస్తూ చూస్తూ ఉంది అసహ్యంగా” అన్నాడు.
మనకి తినాలని ఉన్నది తినడానికి దొరక్కపోయినా ఎవరైనా తింటుంటే అలా చూడకూడదా? తప్పని అన్నయ్య చెప్పాడు. తప్పేమో మరి. అమ్మ కూడ తప్పమ్మా. “ఎప్పుడైనా డబ్బులిస్తాలే అప్పుడు కొనుక్కుందువు గాని” అంది.
“నిజంగానా!” అన్నాను ఆనందంగా అవునన్నట్లు తలవూపి పనిలోకి వెళ్ళిపోయింది.
అన్నట్లుగానే అమ్మ ఒకరోజు ఒక కానీ ఇచ్చింది. ఆ కానీ చూడగానే సామ్రాజ్యం గెలిచినంత ఆనందం. దాన్ని పోగొట్టుకుంటానేమో అని ఖర్చుపెడితే అయిపోతుందేమో అని దాచుకున్నాను. ఇప్పుడు కావాలంటే నేను పీచు మిఠాయి కొనుక్కోగలను. వాచీ కూడా కొనుక్కోవాలి. అది చేతికి పెట్టుకుని ఎవరైనా టైమ్ ఎంతయ్యిందంటే ఇంచక్కా చెప్పచ్చు.
అలా కలలలు కనేసి ఇంకా ఎక్కువ రోజులు దాచుకుంటే ఎవరైనా తీసేసుకుంటారేమో అన్న భయం తో మర్నాడు స్కూల్ ఐపోయాక జీడి పాకం తాత దగ్గరకు వెళ్ళి దాని తో ఒక వాచీ ఒక పిల్లి బొమ్మ చెయ్యమన్నాను తరువాత పీచు మిఠాయి అబ్బాయితో పీచు మిఠాయి ఇమ్మని చెప్పాను.
అప్పట్లో మేం దీన్ని తాయిలం అనేవాళ్ళం. ఈ పీచు మిఠాయి, తాయిలాల గురించి తరువాత చెప్తానే.