మజిలీ

రచన: డా.కె.మీరాబాయి

మారుతీ కారు గుత్తి బస్ స్టేషన్ లో హోటల్ ముందు ఆగింది. “ఇక్కడ దోసె బావుంటుంది.” కారులోనుండి దిగుతూ అన్నాడు మాధవమూర్తి.
మంజుల చిన్నగా నవ్వింది. మాధవమూర్తి భోజన ప్రియుడు. ఎప్పుడో పదేళ్ళ క్రిందట నెల్లూరు మనోరమ హొటల్ లో తిన్న పూరీ కూర రుచి ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడు..
మంజుల చేతి గడియారం చూసుకుంది. రెండు గంటల సేపు ఎక్కడా ఆపకుండా కారు నడిపిన అలసట భర్త ముఖంలో కనబడింది. ఎండ ఎక్కక ముందే వూరు చేరుకోవాలని వుదయం ఆరు గంటలకల్లా కర్నూలులో బయలుదేరారు.
“అంత దూరం మీరెందుకు అవస్థ పడడం. డ్రైవర్ ని పిలుద్దాము ” అంది మంజుల. కానీ స్వంత కారు స్వయంగా నడుపుకుంటూ తన వూరు వెళ్ళాలి అని మాధవమూర్తి ఉత్సాహ పడేసరికి కాదనలేక వూరుకుంది.
మూడువందల జీతంతో మొదలుపెట్టి ఇద్దరూ ముప్ఫై ఏళ్ళు పనిచేసి ఇరవై వేల సంపాదనతో పదవీ విరమణ చేసాక మూడొ పిల్ల పెళ్ళికి ముందు మూడు లక్షల లొపు వున్న మారుతీ కారును అప్పు చేయకుండా కొనడం గొప్ప లక్ష్యాన్ని సాధించిన అనుభూతిని ఇచ్చింది వాళ్ళిద్దరికీ.
అప్పు లేనివాడు అధిక ధనవంతుడు అన్న సూత్రాని నమ్మిన ఆ ఇద్దరూ ముగ్గురు పిల్లలను పెద్దచదువులు చదివించి, పెళ్ళి చెయడానికి తమ చిన్న చిన్న సరదాలు సై తం వదులుకున్నా ఎప్పుడూ విచారించలేదు.
ఎర్రగా కాల్చి పైన వెన్న పూస వేసిన మసాలా దోసె తిని , చిక్కని ఫిల్టర్ కాఫీ తాగి బయటకు వచ్చి కారెక్కారు ఇద్దరూ.
మన్రో సత్రం మీదుగా వెళ్ళి పేట రోడ్డులో ఎడమ వైపు తిరిగి కాస్త దూరం వెళ్ళి కారు ఆపాడు మాధవమూర్తి.
“నేరుగా అనంతపురం రహదారి పట్టక ఇదేమిటి వూళ్ళోకి వచ్చారు? ” ఆశ్చర్యంగా అడిగింది మంజుల.
సమాధానం ఇవ్వకుండా బండి దిగి అక్కడున్న ఇళ్ళ వైపు పరీక్షగా చూస్తున్న భర్త వాలకం అర్థం కాక తానూ దిగి అతని వెనుక నడిచింది.
“ఆ. ఇదే ఈ ఇల్లే ! ” మెరిసే కళ్ళతో చూస్తూ , సంతోషం తొణుకుతున్న గొంతుతో అన్నాడు మాధవమూర్తి.
ఎక్కడో పోయిందనుకున్న ఆటబొమ్మ మళ్ళీ కనబడినప్పుడు పసి పిల్లవాడి ముఖంలో తొంగిచూసే ఆనందం వెల్లివిరిసింది అతని వదనంలో.
“ఎవరి ఇల్లండీ ఇది ? ” జరుగుతున్న దేమిటో అర్థం కానీ మంజుల అయోమయంగా అడిగింది.
” మాదే మంజూ. ఇదే మా ఇల్లు.” ఒకవిధమైన పరవశత్వంతో అన్నాడు.
మాధవమూర్తి గుత్తిలో పుట్టాడు అని తెలుసుగానీ వాళ్ళకు అక్కడ మేడ వున్నట్టు ఆమెకు చెప్పలేదు అతను.
ఈ ఇల్లా? ” నమ్మలేనట్టు చూసింది. కొత్త గా రంగులు వేసి కనబడుతున్నది మేడ.
“అంటే ఇక్కడే , ఈ స్థలం లోనే మా తాతగారిల్లు వుండేది. అక్కడే నేను పుట్టాను. ” అంటునే ఆ ఇంటి వైపు అడుగులు వేసాడు.
” ఆగండీ. ఇది ఎవరి ఇల్లో ఏమో. ఎప్పుడో యాభై ఏళ్ళ క్రిందట ఇక్కడ మా ఇల్లు వుండేది అంటే నవ్వి పోతారు. పదండి వెళ్ళిపోదాము. అనవసరంగా అవమానం పాలు కావొద్దు. ” భర్తను వారించింది మంజుల.
రెండేళ్ళ క్రిందట తన స్నేహితురాలు మీనాక్షికి జరిగిన పరాభవం గుర్తుకు వచ్చింది ఆమెకు. మీనాక్షి వాళ్ళ తాతగారిల్లు అనంతపురం కోర్ట్ రోడ్ లో చివరన వుండేదట. ఏదో అవసరానికి ఆయన ఆ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు వాడుకున్నాడు. ఆ తరువాత అసలు మాట అటు వుంచి వడ్డీ కూడా కట్టలేదు. దానితో అప్పిచ్చిన అతను ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. ఆ బెంగతోనే ముసలాయన కళ్ళు మూసాడు. తాతగారిల్లు అంటే మీనాక్షికి ఎంతో ఇష్టం. ఒకసారి అనంతపురం వెళ్ళినప్పుడు ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూడాలనిపించి తలుపు తట్టిందంట. ఆ ఇంట్లో అద్దెకు వున్న అతను ఈమెను బిచ్చగత్తెను విదిలించి కొట్టినట్టు కసురుకున్నాడట. ఆ అవమానం గురించి చెప్పి మీనాక్షి కళ్ళనీళ్ళు పెట్టుకున్న విషయం మంజుల మనసులో మెదిలింది.
అంతలో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. నలభై అయిదేళ్ల వయసులో వున్న వ్యక్తి బయటకు వచ్చాడు. అత్తా కోడలు అంచు జరీ పంచలో హుందాగా వున్నాడు.
“ఎవరు కావాలండి? ” మర్యాదగా అడిగాడు ఆ ఇద్దరినీ పరిశీలనగా చూస్తూ.”అంతసేపూ ఉత్సాహంగా వున్న మాధవమూర్తి ఒక క్షణం మూగబోయాడు.
మంజుల ముందుకు అడుగు వేసింది. “మేము కర్నూలు నుండి వస్తున్నామండి. ఇద్దరము ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసాము. ”
” మీకెవరు కావాలమ్మా ? ” ఈ ఉపోద్ఘాతం ఎందుకో అర్థంకాని అతను మళ్ళీ అడిగాడు.
అంతలో ఉద్వేగాన్నుండి తేరుకున్న మాధవమూర్తి అందుకున్నాడు.
“క్షమించండి. నా చిన్నప్పుడు ఇక్కడ మా తాతగారిల్లు వుండేది. నేను పుట్టింది ఇక్కడే. వూరికే చూసి పోదామని ఆగాము. వస్తాను.” అంటూ వెనుదిరిగాడు.
“అయ్యో అలా వెళ్ళిపొతారేమిటి? లోపలికి రండి. చూసి వెళ్ళండి. ” అంటూ మర్యాదగా ఆహ్వానించాడు ఆయన.
మొహమాటంగానే ఇద్దరూ లోపలికి వచ్చారు.
“కూర్చోండి. మంచినీళ్ళు తీసుకు వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళాడు.
ఖరీదైన సోఫాలు, తలుపులకు కిటికీలకు సిల్కు తెరలు , గొడ మీద దండలు వేసివున్న పూర్వీకుల ఫోటోలు; వేంకటేశ్వర స్వామి ,పట్టాభిరాముడు పటాలు – ఆధునికత పాత సంప్రదాయం కలగలిసినట్టుగా వుంది ఇంటి అలంకరణ.
లొపలికి నుండి ఆయన భార్య కాబోలు మంచినీళ్ళు తీసుకువచ్చి అందించింది. వెంకటగిరి జరీ చీరలో ,మెడలో నల్లపూసల గొలుసు, చెవులకు రాళ్ళ కమ్మలతో ఆ ఇంటి లక్ష్మిలా వుంది ఆమె.
“మేము ఈ ఇల్లు కట్టించి పది ఏళ్ళు అవుతోంది. మీరు ఇటువైపు వచ్చినట్టు లేదు.”అన్నాడు ఇంటి యజమాని.
” మేము ఉద్యోగరీత్యా ఉత్తరాదిలో వుండిపోయాము. ఈ మధ్యనే వచ్చి కర్నూల్ లో వుంటున్నాము. ఇక్కడ అనంతపురంలో మా బంధువులు వున్నారు. వాళ్ళను చూడాలనే ఈ ప్రయాణం. ” సమాధానం చెప్పాక ఇక కూర్చోలేనట్టు లేచాడు మాధవమూర్తి. మనసు నిండి పొర్లిపోతున్న ఆనందం అతన్ని నిలువనీయడం లేదు.
” ఇదిగో మంజులా ఈ మూలగదిలోనే మా అమ్మ నన్ను కన్నది. “అంటూ ఆ గది వైపు వడివడిగా నడిచాడు..” ఆ పక్కన పూజ గది వుండేది. ఓ మీరూ ఇక్కడే పూజకు ఏర్పాటు చేసారన్నమాట. అటు ఉత్తరం వైపు నేల మాళిగ ఉండేది. అందులో ధాన్యం నిలవ చేసేవారు. ” ఒక విధమైన ఉద్విన్నతతో అది పరాయి వాళ్ళ ఇల్లు ఆన్న స్పృహ లేకండా ఇల్లంతా కలయ తిరుగుతున్న భర్త వైపు చిరునవ్వుతో చూస్తున్న ఆ ఇంటి దంపతులను చూస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతోంది మంజుల.
“మీరు ఏమీ అనుకోక పోతే ఇంటి వెనుక చెట్లు వుండాలి ఒకసారి చూస్తాను ” అని వాళ్ళ సమాధానం కోసం ఆగకుండానే వంట గది దాటి ఇంటి వెనుక వైపుకు నడిచాడు మాధవమూర్తి.
భర్త ఉత్సాహానికి అడ్డు కట్ట వేయడం ఇష్టం లేనట్టు అతన్ని వెంబడించింది మంజుల.
మాధవమూర్తి చెప్పినట్టు అక్కడ చెట్లు ఏమీ లేవు. పారిజాతం, మందార, గన్నేరు , మల్లి వంటి పూల మొక్కలు ఉన్నాయి.
” అయ్యో! చెట్లు అన్నీ కొట్టేసినట్టున్నారు.. ఇక్కడ ఉసిరి చెట్టు వుండేది. ఒకసారి ఏమయ్యిందనుకున్నావు మంజూ! ఉసిరి కొమ్మ తలకు తగులుతున్నదని పడేళ్ళ పిల్లవాడ్ని పెద్ద మొనగాడిలాగా గొడ్డలి తీసుకుని నరకబోయాను. ఆది కాస్తా కాలిమీద పడి ఇంత లోతున గాయమయ్యింది. తాతకు తెలిస్తే తంతాడని కుయ్యిమనకుండా ఇంత పసుపు అద్ది కట్టు కట్టేసుకున్నాను. కానీ మా మామ కనిపెట్టెసాడు. తిడతాడేమో అనుకుంటే ” శహబాష్ నా మేనల్లుడివి అనిపించావు ” అని వీపు తట్టి మెచ్చుకున్నాదు.” మాధవమూర్తి కన్నులలో మెరుపు , ముఖంలో ఉద్విగ్నత , పెదవుల మీద దరహాసం చూస్తుంటే మంజులకు కళ్ళలో నీరు తిరిగింది.
” ఇంకో తమాషా చెప్పనా మంజూ ! మా అమ్మమ్మ దసరాకి బొమ్మల కొలువు పెట్టేది. అందులో సీతా రామ లక్ష్మణులతో బాటు ఆంజనేయుడి ఇత్తడి బొమ్మలు వుండేవి. నాకు హనుమంతుడంటే చిన్నప్పటి నుండీ ఇష్టం. ఒకసారి ఆ హనుమంతుడి బొమ్మను చాటుగా తీసుకుని ఇక్కడ ఈ మూల మట్టిలో దాచి పెట్టాను. తరువాత దానికోసం వెదికితే దొరకనే లేదు. అమ్మమ్మ ఆ ఆంజనేయుడి కోసం ఇల్లంతా వెదికింది పాపం. నేనేమో తేలు కుట్టిన దొంగలా వూరుకున్నాను” ఏదో పూనకంలో వున్నట్టు చెప్పుకు పోతున్నాడు మాధవమూర్తి.
మాధవమూర్తి వెనకే పెరటిలోకి వచ్చిన ఇంటి యజమాని ముఖంలో ఈ వుదంతం వినగానే సంభ్రమం తొంగి చూసింది.
“మాస్టారూ! మీ తాతగారి పేరేమిటో చెప్పారు కాదు.” మధ్యలో కల్పించుకుంటూ అడిగాడు ఆయన.
” ఆయన పేరు వెంకట సుబ్బయ్య అండి. అన్నట్టు నా పేరు మాధవమూర్తి. నా భార్య మంజుల. ” అప్పుడు తమ గురించి పరిచయం చేసుకున్నాడు.
“నా పేరు రత్న స్వామి. నా భార్య కోమలవల్లి. ” అని చెప్పి ముందుకు వచ్చి సంతోషంతో మాధవమూర్తి చేతులు పట్టుకుని ” ముందు మీరు లోపలికి వచ్చి కూర్చోండి. ఇది మీ ఇల్లే అనుకోండి ” అంటూ అతిథులు ఇద్దరినీ ముందు గదిలోకి నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు
” అయ్యగారికి అమ్మగారికి కాస్త పాలు ఫలహారం తీసుకురా వల్లీ” అని భార్యకు పురమాయించాడు.
తను వచ్చి మాధవమూర్తి. కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు.
” అయ్యో అదేమిటండీ మీరు నేలమీద కూర్చోవడం… ” అంటూ లేవబోయాడు మాధవమూర్తి.
” మీ దగ్గర ఇలా కూర్చోవడం వల్ల నాకు ఆంజనేయుడికి రాముడి పాదాల చెంత కూర్చుంటే కలిగే సంతోషం కలుగుతోంది ” అని కోమలవల్లి తెచ్చిన పళ్ళూ , పాలు అందించాడు ” ముందు మీరు ఫలహారం కానివ్వండి.” అన్నాడు.
మాధవమూర్తి , మంజుల మరేమీ మాట్లాడకుండా అరటి పండు తిని పాలు తాగారు. ” అయ్యా ఇలా రండి ” అని వారిద్దరిని ఇంటి ప్రధాన ద్వారం బయటకు తీసుకు వెళ్ళాడు రత్న స్వామి.
“మా ఇంటికి పెట్టిన పేరు చూసారా? ” అంటూ ఇంటి ముందు వున్న ఫలకం వైపు చూపించాడు. అక్కడ ‘ వెంకట నిలయం’ అన్న పేరు నల్లని ఫాలరాయి మీద చెక్కి వుంది.
“అది మీ తాతగారి పేరే స్వామీ ” వినయంగ చెప్పి వాళ్ళిద్దరినీ తిరిగి లోపలికి తీసుకు వచ్చాడు
“మా తాతగారు మీకు తెలుసా ? ఎలా ? నాకేమీ అర్థం కావడం లేదు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు మాధవమూర్తి ” మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మ గారి ఇంట్లో చిన్నమ్మ అనే ఆమె ఇంటి పనీ, వంట పనీ, చూసుకుంటూ అమ్మమ్మ గారికి తోడుగా వుండేది గుర్తుందా మీకు? “ రత్నస్వామి అడిగాడు.
మాధవమూర్తికి చట్టున చిన్నమ్మ ముఖం కళ్ళ ముందు తోచింది.
“అవును. నేను పసి పిల్లవాడిగా వున్నప్పుడు నన్ను తన కాళ్ళ మీద వేసుకుని నీళ్ళు పోసేదట. అమ్మ చెప్పింది. నాకు పదేళ్ళప్పుడు కూడా తలంటి పోసేది. నాకు ఇష్టమని మురుకులు, నిప్పట్లు చేసి పెట్టేది . నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది.” ప్రేమగా తలచుకున్నాడు మాధవమూర్తి.
” ఆ చిన్నమ్మ మనవడినే నేను. తాతగారు చిన్నమ్మకు రాసి ఇచ్చిన ఎకరం చేను మా నాయనకు వచ్చింది. ఆ చేను అమ్మి ఈ స్థలం కొన్నాను. నా కష్టార్జితంతో ఈ ఇల్లు కట్టాను. ఆదీ మా నాయనమ్మ ఆత్మశాంతికోసమే.” రత్న స్వామి కళ్ళు చెమరించాయి.

“మా నాయనకు అన్నం పెట్టాలని చేని గట్టుకు పోయిన చిన్నమ్మ తాతగారు కన్ను మూసిన ఘడియలోనే , అక్కడే గుండె పోటుతో కూలిపోయిందని మా నాయన చెప్పాడు. తాత పోయే ముందు చిన్నమ్మ ఎక్కడ అని అడిగారట. అన్నం ఇచ్చి వచ్చేదానికి చేనికి పోయింది వచ్చేస్తుంది. ఆని చెప్పినారంట. అట్లనే వీధి వాకిలి వైపు చూస్తూనే ప్రాణం విడిచి పెట్టినాడంట. ఇరవై అయిదేండ్లు ఈ ఇంట గడిపిన ఆయమ్మ ఆత్మ ఈ ఇంట్లోనే తిరుగుతుందని అనేవాడు మా నాయన. ” రత్న స్వామి కళ్ళు తుడుచుకున్నాడు.
” మా అమ్మ చెప్పేది చిన్నమ్మ మా అమ్మమ్మను పండుకోమని పంపించి రాత్రి తెల్లవార్లు తాత కాళ్ళు పట్టేదంట ” మాధవమూర్తి గుర్తు చేసుకున్నాడు..
“మీ అమ్మ గారికి మామయ్యకు ఏదో మాట పట్టింపు వచ్చి అమ్మగారు ఇక్కడికి రావడం మానుకున్నారట. ఆమ్మమ్మ గారిని మాత్రం చివరిదాకా తన దగ్గరే పెట్టుకున్నారట.” రత్న స్వామి చెప్పుకుపోతున్నాడు.
” అవును. నాకు గుర్తు వుంది. ఆమ్మమ్మ మరో రెండేళ్ళలో పోయింది. తరువాత కొన్నేళ్ళకే మా అత్త చనిపోవడంతో మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. మా మామకు సంతానం లేదు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంతో ముద్దు చేసేవాడు. తనకు గుర్తు వున్నది చెప్పాడు మాధవమూర్తి.
” అవునండి. మీ మామయ్య గారే నన్ను చదివించారు. ఇల్లు అమ్మేసి ఆ డబ్బు అన్నదాన సత్రానికి ఇచ్చి వెళ్ళి పోయారు. ఆయన చలవ వలననే నాకు చదువు అబ్బి , ఉద్యోగం రావడం. మీ మామ మా నాయనను తమ్ముడిలా చూసుకునేవారు. మా నాయన పోయేముందు ” ఒరే నాయన! నువ్వు ఎట్లాగూ చేని పని చేయ లేవు. ఆ ఎకరం అమ్మేసి అయ్యగారి ఇల్లు కొనుక్కుని అక్కడే వుండు. స్వర్గాన వున్న మీ నాయనమ్మ ఆత్మ సంతోషపడుతుంది ” అని చెప్పి పోయినాడు.” కళ్ళు ఒత్తుకున్నాడు రత్న స్వామి.
“మీ మామ గుర్తు గా ఈ ఫోటో మిగిలింది నాకు.” ఆంటూ లేచి వెళ్ళి ఒక ఫోటో తీసుకు వచ్చి పై కండువాతో తుడిచి అందించాడు..
“కుడి వైపున వున్నది మీ మామ గారండి. ఎడమ పక్కన వున్నది మా నాయన.” అ మాటలు అంటున్నప్పుడు రత్నస్వామి గొంతులో గౌరవం ,అభిమానం తొంగి చూసాయి.
ఆ ఇద్దరినీ పక్క పక్కన చూస్తుంటే అన్నదమ్ములలా వున్నారు.
చిన్నప్పుడు తనను ఎత్తుకుని తిప్పిన మేనమామ స్పర్శ అనుభవిస్తున్నట్టు ఆ ఫొటోను గుండెకు హత్తుకున్నాడు మాధవమూర్తి.
” రండి స్వామీ. మీ భార్యాభర్తలు మా పూజ గదిలోకి అడుగుపెట్టి ఒక నిముషం కూర్చుంటే మా ఇల్లు పావనం అవుతుంది ” లేచి నిలబడి ఆ దంపతులను ఆహ్వానించాడు.
మనసు నిండిపోయి మాటలు రాని మౌనంతో దేవుడి గదిలోకి అడుగు పెట్టారు ఇద్దరూ. కన్నుల పండుగగా అలంకరించి వున్న దేవుని పటాలకు నమస్కరించారు. పటాలకు కుడి వైపు గోడ మీద మాధవమూర్తి తాత అమ్మమ్మ వున్న ఫోటొకు కుంకుమ పెట్టి దండ వేసి వుంది.అక్కడ కింది మెట్టు మీద వున్నఆంజనేయస్వామి బొమ్మను చూసిన మాధవమూర్తి తన కళ్ళను తానే నమ్మకం లేక పోయాడు.
“ఈ ఆంజనేయుడు.. ” అంటూ వుండగానే రత్నస్వామి అందుకున్నాడు
” మీరు భూమిలో దాచుకున్న హనుమంతుడే స్వామీ. ఈ ఇల్లు కట్టించినప్పుడు పునాదులు తవ్వుతుంటే దొరికాడు. ఈ రోజు మిమ్మల్ని అనుగ్రహించాడు. తీసుకోండి. ” అంటూ ఆ విగ్రహం మాధవమూర్తి చేతిలో పెట్టాడు రత్నస్వామి. ” వద్దనడానికి మనస్కరించక ఇష్టంగా అందుకున్నాడు. భర్త ముఖంలో కనబడుతున్న ఆనందం చూసి మంజుల కళ్ళు తడిసాయి.
” మా ఇంట దీపం వెలిగించిన తాతగారి వారసులు మీరు మా ఇంటికి వచ్చిన ఈ రోజు మాకు పండుగ రోజు అయ్యగారూ. మా తృప్తి కోసం ఈ పూట ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి.. మా మాట కాదనకండి.” ఆంతవరకు జరుగుతున్నవన్నీ ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయిన కోమలవల్లి వారిద్దరికీ నమస్కరిస్తూ అంది.
“అయ్యగారూ, బాబు గారు అంటూ మమ్మల్ని దూరం పెట్టకండమ్మా. మాకు దేవుడు ఇచ్చిన ఆత్మ బంధువులు మీరు. ఆలాగే కానివ్వండి. ” చనువుగా అన్నాడు మాధవమూర్తి.
” మీరు కూడా వీలు చూసుకుని మా ఇంటికి తప్పకుండా వచ్చి వెళ్ళాలి ” మంజుల కోమలవల్లి భుజాల చుట్టు చేయి వేసి ఆత్మీయంగా అంది.
ఆ పూటకు అక్కడే భోజనం చేసి , వాళ్ళు ఇచ్చిన కొత్త చీర , పంచల చాపు, తాంబూలం అందుకుని కారెక్కారు మాధవమూర్తి , మంజుల.
” ఇది మీ ఇల్లే అనుకోండి స్వామీ మీరూ రావడం మా భాగ్యం. ” బయలుదేరే ముందు మరొకసారి చెప్పాడు రత్న స్వామి.
అనుకోని ఈ మజిలీ ఇచ్చిన అనుభూతులను నెమరు వేసుకుంటూ సంతోషంతో నిండిన మనసులతో ప్రయాణం కొనసాగించారు మాధవమూర్తి , మంజుల. వాళ్ళిద్దరి ముందు కారు డెక్ మీద అభయమిస్తూ నిలబడి వున్నాడు ఆంజనేయుడు.
————– ———— ———–

చిన్నారి మనసు….

రచన: మణి గోవిందరాజుల

అత్తకు, అత్త పిల్లలకు జరుగుతున్న వైభోగాన్ని కుతూహలంగా ఇంతలేసి కళ్ళేసుకుని పరిశీలిస్తున్నది ఎనిమిదేళ్ళ చిన్నారి. నిన్ననే దర్జీ వాడొచ్చి అత్తకు కుట్టిన కొత్త జాకెట్లూ ,అత్త పిల్లలకు కుట్టిన పట్టు లంగాలూ ఇచ్చి వెళ్ళాడు. . “పట్టు లంగాలైతే ఎంత బాగున్నాయో చెప్పలేను. ఒక్కసారి ముట్టుకుని చూట్టానికి కూడా ఇవ్వలేదు” గొణుక్కుంది చిన్నారి మనసులో. నాక్కూడా కావాలని చిన్నారి గొడవ చేసింది. కాని అమ్మ పక్కకు తీసుకెళ్ళి నోరు మూసి రహస్యంగా తొడపాశం పెట్టింది. చాలా ఏడుపొచ్చింది. నోర్మూసుకుని బోలెడు ఏడ్చుకుంది.
అయినా అమ్మ మటుకు ఏమి చేస్తుంది?అత్తా వాళ్ళకు అవన్నీ తేవాల్సిందేనని బామ్మ హుకుం చేసిందట. బామ్మ మాటంటే మాటే. నాన్నకు అవన్నీ తేవడానికి బోలెడు అప్పు చేయాల్సొచ్చిందట. మేనత్త, పిల్లలు వచ్చి నెల అవుతున్నది. ఈ నెలకే బోలెడు ఖర్చయిందట. ఇక తనకు కూడా పట్టు లంగా యేమి కొంటారు. ? తనను తానే ఓదార్చుకుంది చిన్నారి.
మామయ్యకు యెక్కడో ఢిల్లీలో అట వుద్యోగం. చాలా దూరమట. రైల్లో వస్తేనే రెండురోజుల ప్రయాణమట. మరి “బైల్ గాడీలో వస్తేనో” అని కుతూహలంగా తానడిగిన ప్రశ్నకు అందరూ పక పకా నవ్వారు. దీనికేం తెలీదు. “వుట్టి మడ్డిమొహం “ అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు.
వాళ్ళ వేషధారణ కూడా చిత్రంగా వుంది మోకాళ్ళ మీదికి లంగాలు. బిగుతుగా వున్న జాకెట్లూను. ఇక అత్తయ్య అయితే చేతుల్లేని జాకెట్లు పొట్టి కొంగుతో గమ్మత్తుగా వుంది. మామయ్య యేమో యేంటో హిందీ అట ఆ భాషలో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. మా కర్థమయ్యేట్లు మాట్లాడండి మామయ్యా అని అడిగితే ఏదో అన్నారు. తరువాత తెలిసింది ఆయన ఢిల్లీ వెళ్ళి మనం మాట్లాడుకునే మాటలు మర్చిపోయారుట.
కాని వాళ్ళొచ్చిన దగ్గరనుండి బామ్మ హడావుడి హడావుడి కాదు. ఎప్పుడో అయిదేళ్ళక్రితం వచ్చారట. మళ్ళీ యెప్పుడొస్తారో తెలీదట . అందుకే అస్తారు వైభోగంగా(అంటే ఏంటో తెలీదు. అందరూ అలానే అనుకుంటున్నారు. ) చూసుకుంటున్నారట. గడ్డ పెరుగులు, గ్లాసుల గ్లాసుల పాలు పిల్లలకి ఇస్తుంటే మనసంతా అటే లాగుతున్నది. ఇంకా ఇవే కాక రోజూ ఆలుగడ్డ వేపుడు కూడాను. తనకెంతిష్టమో ఆలుగడ్డ వేపుడంటే పోనీలే వాళ్ళ వల్ల తాను కూడా ఆలుగడ్డ వేపుడు తింటున్నది. తృప్తి పడింది మనసు.
ఇక అత్తయ్యకు అయితే మహారాణి వైభవమట(ఇది కూడా చూసిన వాళ్ళంటున్నారు మరి. ). కాలు కింద పెట్టకుండా మంచం దగ్గరికే అన్నీ అందిస్తూ అమ్మ క్షణం కాలు నిలవకుండా తిరుగుతున్నది. అమ్మ తిరగడమే కాకుండా నన్ను కూడా “వాళ్ళకు అదిచ్చి రాపో, ఇదిచ్చి రాపో,” అంటూ తిప్పడమే కాకుండా “అమ్మో అలా చెయ్యకు అత్తయ్యకు కోపం వస్తుంది. ఇలా చెయ్యకు అత్తకు కోపం వస్తుంది . యేయ్ చిన్నారీ వాళ్ళు వుండే నాలుగు రోజులు హఠం చేయకు. ” అంటూ ఆంక్షలు కూడా పెడుతున్నది.
రేపెళ్ళి పోతున్నారట అత్తావాళ్ళు. (హమ్మయ్య ) అందుకని ఈ రోజే వాళ్ళకు తెచ్చిన కొత్తబట్టలు పెట్టేస్తున్నారు. చిన్నారికి మనసంతా పట్టులంగాల మీదికే పోతున్నది. పిల్లలు పట్టులంగాలేసుకుని గిర గిరా తిరుగుతుంటే సగం ఆశగా సగం నిరాశగా వాళ్ళనే చూస్తూ “నాక్కూడా కొనిపించుకోవాలి”అనుకుంది.
**************
“చిన్నారీ అమ్మమ్మా వాళ్ల వూరెళుతున్నాము రేపు. మీ స్కూల్లో చెప్పిరా” పదేళ్ళ చిన్నారికి చెప్పింది అమ్మ. సంతోషంతో మనసు యెగిరి గంతులెసింది. రెండేళ్ళ క్రితం వచ్చెళ్ళిన అత్త కుటుంబానికి జరిగిన మర్యాదలు గుర్తొచ్చి అమ్మమ్మ దగ్గరికెళ్తే తమక్కూడా అలానే జరుగుతాయి కదా అని గాల్లో తేలిపోయింది.
ఇంట్లోకి వస్తున్న అక్కను అక్క పిల్లలను ఆపేక్షగా ఆహ్వానించాడు మేనమామ.
“తమ్ముడూ బాగున్నావారా?” తమ్ముణ్ణి పలకరిస్తూ లోపలికెళ్ళింది అమ్మ.
చిన్నారికి ఊహ తెలిశాక ఇప్పుడే రావడం. అందుకని అత్త బామ్మ దగ్గర కూర్చున్నట్లు అమ్మ కూడా అలానే కూర్చొని అన్నీ చేయించుకుంటుందని అనుకుంది. కాని అమ్మ అలా చేయించుకోలేదు. అప్పటికీ చిన్నారి రహస్యంగా అడిగింది. నువెందుకు అత్తలా చేయించుకోవటం లేదని? లేదని. అమ్మ నవ్వి అలా చేయించుకోవడం తప్పని చెప్పింది. మరి ఆ తప్పు అత్తెందుకు చేసిందో చెప్పలేదు.
ఇప్పుడు మామయ్య కూతురు ఓణీల ఫంక్షనట దానికొచ్చారు తామిప్పుడు. తనూ మామయ్య కూతురీడు పిల్లే కదా?. ”మరి ఇంటికెళ్ళాక నాకు చేస్తావా?” ఆశగా అడిగింది. నవ్వింది అమ్మ. అది చాతకాని నవ్వని కొన్నేళ్ళ తర్వాత తెలిసింది.
తర్వాత అమ్మనడిగింది. బామ్మింట్లో నేమో అత్త పిల్లలకి చేస్తారు. అమ్మమ్మ ఇంట్లోనేమొ మామ పిల్లలకి చేస్తారు మరి నాకెందుకు ఎక్కడా చెయ్యరు అని. కాని సమాధానం లేని ప్రశ్నయింది.
“మా నాన్నకు నేనంటే యెంత గారాబమో. నేనేదడిగితే అదిస్తారు. మా అమ్మయితే నన్ను కాలు కింద పెట్టనివ్వదు” స్కూల్లో స్నేహితులు గొప్పగా చెప్తున్నప్పుడు తనూ ఒక్కతే కూతురు కదా నలుగురన్న దమ్ముల మధ్య ?నన్నలా చూడరే అనిపించినా “వున్న సంతానంలో అలా ఒక్కళ్ళని వేరే ప్రేమగా చూడడం నాకు నచ్చదు. తలితండ్రులుగా మాకందరూ సమానమే” అని తండ్రి యెవరితోటో మాటల సందర్భంలో అన్నప్పుడు అవును కదా నిజమే కదా అనిపించింది. కానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావడం లేదే అన్న మనసులో ఆర్తి, కోరిక తీరడం లేదు. యేదో కావాలి అది ప్రేమా?ఆదరణా?యేమో? మామూలు పొగడ్తా? యేమో మరి. .
గుర్తింపు కొరకు ఆరాటపడుతున్న మనసుకు స్వాంతన లభించడం లేదు. రోజులు గడుస్తున్నాయి.
కాలేజీలో చదువుతున్నప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను. నువు లేనిదే జీవించలేను అని
మగపిల్లలు వెంటపడితే గర్వంగా ఫీల్ అయింది. నీ కోసమే అంటూ వాళ్ళు చెపుతున్న మాటలు ఎడారిలో ఒయాసిస్సులా, మండు వేసవిలో శీతలపవనాల్లా సేదతీర్చాయి. కాని ఆ మాటల వెనుక ఉన్న అర్థం తెలిశాక వాళ్ళను దూరం పెట్టేసింది. అప్పటివరకు గాల్లో తేలిన మనసు గాల్లోనే పేలిపోయింది. ఇంకా నయం మోసపోయాను కాదు అనుకుని దేవుడికి దండం పెట్టుకుంది. .
అన్నల పెళ్ళిల్లు అయ్యాయి, అన్నా వదినల అన్యోన్యతను చూసినప్పుడల్లా సంతోషంగా అనిపించేది. అన్నలు వదినల పట్ల చూపిస్తున్న ప్రేమ, వాళ్ళకిస్తున్న గౌరవం చూస్తూ పొంగిపోయేది. అమ్మ ఎదుర్కొన్న పరిస్తితుల వల్ల అయితేనేమి సహజంగా అమ్మ స్వభావం వల్ల అయితేనేమి అమ్మ కూతురూ కోడళ్ళూ అన్న భేధభావం లేకుండా చూడటం ఒక విధంగా గర్వకారణం అనిపించేది. కాని నీ కంటే కూడా నాకు కోడళ్ళే యెక్కువ అన్నప్పుడు మాత్రం కాస్త ఈర్ష్యగా అనిపించేది. కూతురుగా నాకు ప్రత్యేకత ఇవ్వకపోతే పోనీ కోడళ్ళెక్కువ అనడం యెందుకో మనసులో వుడుక్కుంది.
కాలం గడుస్తున్నది డిగ్రీ పూర్తి కాగానే బ్యాంక్ పరీక్ష రాసి ప్రొబేషనరీ ఆఫీసరుగా జాయిన్ అయింది.
ఏడాది వ్యవధిలో తన పెళ్ళీ అయింది
”వదిన్లతో ప్రేమగా ఉండు అన్న సంతోశంగా వుంటాడు. పుట్టింటి ఆదరణ వుంటుంది. అత్తింటి వారితో ఆప్యాయంగా, బాధ్యతగా వుండు మొగుడు సంతోషంగా వుంటాడు” అని చెప్పిన అమ్మ మాట ప్రకారం రెండు వేపులా ప్రేమగా ,బాధ్యతగానే వుంది. కాని పుట్టింట్లో మాదిరిగా ఇక్కడ అంతా సమానం కాదు. బామ్మ తరం లాగే వుండేది. ఇంకా చెప్పాలంటే అమ్మకి కోడళ్ళెక్కువ అయితే అత్తగారికి కూతుళ్ళెక్కువ . ఇంటి ఆడపిల్లలకే ప్రాముఖ్యత. కోడలెప్పుడూ సెకండరీ నే. పని మాత్రమే చేయాలి. కాని అమ్మ చెప్పింది కదా మొగుడు సంతోషంగా వుండాలంటే అత్తింటివారితో బాధ్యతగా వుండాలని (భార్య సంతోషంగా వుండక్కర్లేదా? అలానే వదినతో ప్రేమగా వుండు అని అత్తగారు ఆడపడుచులకు చెప్పలేదా?) అలానే వుంటుంది తాను. మొగుడు సంతోషంగా వున్నాడా అంటే యేమో? కాని జీవితం హాయిగా యే వొడిదుడుకులూ లేకుండా నే గడిచిపోతున్నది.
ఫైనల్ గా ఒక్కతే కూతురైనా పుట్టింట్లో కూతురనే ప్రత్యేకతా లేదు. ఒక్కత్తే ` కోడలైనా అత్తింట్లో కోడలనే ప్రత్యేకత లేదు. అలాగని ఆరళ్ళూ లేవు.
కాని మనసులో యేదో వెలితి పోవడం లేదు. ఇప్పుడింకో సమస్య. అందరూ మా ఆయన నాకోసం ఇది కొన్నారు అది కొన్నారు అని చెప్పినప్పుడు అరే అలా కూడా వుంటారా అనిపిస్తుంది. మరి మా అయనకు నేనెందుకు ప్రత్యేకంగా కనపడను అనుకుంటుంది. ఒకసారి ఆపుకోలేక అదే ప్రశ్న అడిగితే నాకలా యెవరూ ప్రత్యేకం అంటూ వుండదు. నాకందరూ సమానమే అని జవాబు. అలా ఎలా?తోడపుట్టిన వారెప్పుడూ ముఖ్యమే. కాని తనవారిని వదిలి వచ్చి తోడు పంచుకుంటూ వున్న తాను కొద్ది ఎక్కువ కాదా? ఉసూరుమంది ప్రాణం ఇక అడగబుద్ది కాలేదు.
ఏపని చేసినా డెడికేటెడ్ గా చేస్తుంది కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా త్వరగానే వచ్చాయి. అదే విధంగా జీవితంలో కూడా.
తనను అమ్మను చేసిన కూతుర్ని మొదటిసారిగా చూసి, స్పృషించి, గుండెకు హత్తుకున్నప్పుడు సృష్టిలోని ఆనందమంతా నాదే కదా అనిపించింది చిన్నారికి. మురిసిపోయింది. కళ్ళల్లో నుండి ఆనంద భాష్పాలు రాలాయి. ఆ చిన్ని చేతులను చెంపలకు రాసుకుంటుంటే ఆ భగవంతుడే వచ్చి సేద తీరుస్తున్నట్లుగా వుంది. అచ్చంగా ఈ చిట్టి తల్లి నాదే. నా కోసమే దేవుడు పంపాడు నా ఆర్తిని తీర్చడానికి అని దేవుడికి వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంది.
గుక్కపట్టి ఏడుస్తూ కూడా తన మాట యెటు వినపడితే అటు ఇంతలేసి కళ్ళేసుకుని చూస్తూ గుర్తుపట్టి హాయిగా నవ్వుతున్నబిడ్డ నెత్తుకుని మాతృత్వంలోని మాధుర్యాన్ని చవిచూస్తూ ఇదే కదా జీవితం అనుకుంది. నిలబడటం నేర్చుకుని పడుతూ లేస్తూ బుడి బుడి అడుగులు వేస్తూ అమ్మా ! అని తన కోసం వెతుక్కుంటుంటే దాన్నెత్తుకుని నా కోసమే అల్లాడుతున్నది. నన్ను మోసం చేసే ప్రేమ కాదు ఇది అని మనసంతా భారం చేసుకుంది. ఒక్కళ్ళు చాలు ఇంక నా ప్రేమను షేర్ చేయలేననుకుంది. టన్నుల కొద్దీ ప్రేమను కూతురు మీద చూపించాలనిపించేది.
కాని దేవుడి నిర్ణయం ఇంకో లాగా ఉంది. ఇంకొక్కళ్ళు కూడా వద్దనుకుంటే కవలలను ఇచ్చాడు. మొదటిసారి తల్లైనప్పుడు అమ్మతనంలోని ఆనందాన్ని యెలా అనుభవించిందో, అప్పటివరకు ఒక్కళ్ళు చాలు అనుకున్నదల్లా ఇద్దర్నీ గుండెలకు హత్తుకుని మళ్ళీ మొదటిసారిలాగే దేవుడు నా ఆనందాన్ని మూడింతలు చేసి ఇచ్చాడు అని దేవుడికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంది.
అదేమి విచిత్రమో ఒక్కళ్ళమీద యెలా వుందో ముగ్గురి మీదా అలానే వుండేది తన తల్లి ప్రేమ. అలానే తండ్రి చెప్పిన మాట ప్రకారం ముగ్గురినీ ఒకే లాగా పెంచుకుంది.
ముగ్గురూ చుట్టూ తిరుగుతూ అమ్మా! మాకది కావాలి మాకిది కావాలి అంటూ ఉంటే పొంగిపోయింది. వాళ్ళ కిష్టమైనవన్నీ అమరుస్తూ తనకేమి కావాలో మరచిపోయేది. తను ఒక్క రోజు ఊరికెళ్తే ఊండలేకపోయామని పిల్లలు ఏడుస్తూ చెప్తుంటే వాళ్ళని దగ్గరకు పొదువుకుని తాను కూడా కన్నీళ్ళు పెట్టుకుంది. ”ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను” అని ప్రమాణాలు చేసింది. ఒక్క క్షణం వాళ్ళనొదిలిపెడితే వాళ్ళేమవుతారో అని భయపడింది
వాళ్ళకోసమే జీవిస్తూ వాళ్ళగురించే ఆలోచిస్తూ. వాళ్ళ సంతోషమే తన సంతోషం అనుకుంటూ ఇదే నా జీవితం. ఇంతకన్నా యేమి కావాలి అనుకుంది. హమ్మయ్య ఇన్నాళ్ళకి నా మనసులో కోరిక తీరింది కదా అని సంబరపడింది. ఇంతగా తనకోసం తల్లడిల్లే తన పిల్లలు తననొదిలేసి యెక్కడికీ వెళ్ళరు అని గర్వపడింది.
కాని పిల్లలకి ఊహ తెలిసి వాళ్ళ జీవితంలో తల్లి ప్రాధాన్యత తగ్గి వాళ్ళ లోకం వాళ్ళకేర్పడగానే , వాళ్ళ జీవన విధానం మారి తల్లికి తక్కువా స్నేహితులకు యెక్కువ ప్రాధాన్యత మొదలు అయి చుట్టూ గమనించడం ప్రారంభించగానే మళ్ళీ మొదటికొచ్చింది చిన్నారి సమస్య. పిల్లల పట్ల తమ ప్రేమ మారదు కదా? అని అనుకున్నా మనసు దేనికోసమో వెతుకుతూనే వుంది. ఆర్తిగా ఎదురుచూస్తూనే వుంది.
ఆడపడుచుల పెళ్ళిళ్ళు, పురుళ్ళు పుణ్యాలు, ముగ్గురు పిల్లలు, పిల్లల పెళ్ళిళ్ళు కాలం యెలా గడిచిందో తెలీలేదు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కష్టాలు సుఖాలు, కన్నీళ్ళు, ఆనంద భాష్పాలు. కాలం వడి వడిగా నడుస్తూనే వుంది. కళ్ళు తెరిచి చూసేసరికి అంత ఇంట్లో తామిద్దరే ఒకరికి ఒకరు తోడుగా. అత్తగారు మామగారు దాటిపోయారు. ముగ్గురు పిల్లలూ వారి జీవిత గమ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అమ్మ చేసి చూపించినట్లుగానే కూతురూ కోడలూ అన్న భేధం లేకుండా వుండసాగింది. కాకపోతే తల్లిలా కూతుర్ని తక్కువా చేయలేదు. అత్తగారిలా కోడల్నీ తక్కువ చేయలేదు.
ఇంతకాలం నిద్రపోయిన ఆర్తి మళ్ళీ లేచింది. అదేంటి పిల్లలను అంత ప్రేమగా పెంచుకున్నాను కద ?అలా ఎలా వెళ్ళిపోయారు మమ్మల్ని ఒంటరిగా వదిలేసి అని ఆల్లోచనలను నింపుకుని అల్లల్లాడింది. కాని వెంటనే సర్దుకుంది తప్పదు కదా రెక్కలొచ్చిన పక్షులు ఎగిరి వెళ్ళాల్సిందే అని. అంతవరకు సందడిగా గడిచిన కాలం, క్షణం తీరిక లేని కాలం. ఇంటి నాలుగు మూలల నుండీ వినపడిన పిల్లల నవ్వులు, కేకలూ యెటు నుండీ యేమీ కనపడక వినపడక మనసు తల్లడిల్లిపోయింది.
అంతా శూన్యం. ఈ శూన్యంలో ఆనందాన్ని వెతుక్కోవల్సిందే. పిల్లల్ని వచ్చి కొన్నాళ్ళుండమంటే అమ్మో కుదరదంటారు. నిజమే కదా?తాను మటుకు అమ్మ యెన్నిసార్లు పిలిచినా వెళ్ళగలిగిందా? వీళ్ళూ అంతే కదా?. కాలం యెవరి గురించీ ఆగదు. ఇంతలో తామిద్దరి రెటైర్మెంట్ దగ్గరకొచ్చింది. అమ్మో! ఉద్యోగం కూడా లేకపోతే కాలం ఎలా గడుస్తుంది? అని కంగారు పడిపోయింది.
ఇంతలో కూతురు ఫోన్ చేసి “అమ్మా! మీరు అమ్మమ్మా తాతయ్యా కాబోతున్నారు. బాగా వేవిళ్ళు వున్నాయి. తిన్నదేదీ కడుపులో నిలవడం లేదు” అనేసరికి భూమ్మీద కాలు నిలవలేదు. అర్జెంటుగా వెళ్ళి కూతురికి కావాల్సినవి చేసి పెట్టాలన్న ఆరాటం మొదలయింది.
అప్పటివరకు ఉద్యోగ బాధ్యతలు కూడా లేకపోతే ఎలా అని కంగారు పడిందల్లా “అబ్బా! ఇన్నాళ్ళు చేసాను ఇంకా ఎన్నాళ్ళు చేస్తాను? పిల్లలకు అవసరమప్పుడు వాళ్ళ దగ్గర లేకపోతే ఇక తానెందుకు?”అనుకుని వన్ ఫైన్ డే వాలంటరీ రెటైర్మెంట్ తీసేసుకుని “హమ్మయ్య ఇప్పుడు కూతురు దగ్గరకు వెళ్ళడానికి తనకేమి అడ్డులేదు” అని ఎగిరి వెళ్ళి కూతురు దగ్గర పడింది. అక్కడికి వెళ్ళిందే కాని ఇంటి దగ్గర భర్త తింటున్నాడో లేదో అని ఆరాటపడింది మనసు. ఆయన నేను బానే వున్నాను అన్నా వినిపించుకోలేదు. సెలవు పెట్టి వచ్చిందాకా పోట్లాడింది.
తిన్నదేదీ ఇమడక వాంతులు చేసుకుంటున్న కూతుర్ని చూసి, తానూ ఆ స్టేజ్ లో నుండే వచ్చింది అన్న సంగతి మర్చిపోయి కన్నీళ్ళు పెట్టుకుంది. తన కూతుర్ని ఇబ్బంది పెడుతున్న పొట్టలో నున్న బేబీని ముద్దుగా కోప్పడింది.
తొమ్మిది నెలలూ నిండి కూతురికి కొడుకు పుట్టాడు. చిట్టి తండ్రిని చేతుల్లోకి తీసుకోగానే వొళ్ళు పులకరించింది. అప్పటిదాకా కూతుర్ని ఇబ్బందిపెట్టాడని కోపగించుకున్న మనవడు అపురూపంగా అనిపించాడు. సృష్టిలోని అందాన్నంతా మూటగట్టుకుని వచ్చిన మనవడిని యెత్తుకోగానే మళ్ళీ అమ్మ అయిన భావన కలిగింది.
మనవడి ముద్దు ముచ్చట్లతో ఇహ లోకాన్ని మర్చిపోయింది. వాడు నీక్కాదు కొడుకు, వాళ్ళ పిల్లాడిని వాళ్ళకు వదిలెయ్యి పాపం అని భర్త వెక్కిరిస్తున్నా పట్టించుకోలేదు. కాని ఎన్నాళ్ళు? ఆరునెలలు కాగానే ఇంటికి రావాల్సొచ్చింది. మనవడిని వదల్లేక వదల్లేక వదిలి వచ్చిందే కాని మళ్ళీ ఆరునెలలు కాగానే రెక్కలు కట్టుకుంది.
తన వేలు పట్టుకుని నడుస్తూ పడుతూ లేస్తూ “మ్మ… మ్మ… మ్మ” అంటూ శబ్దాలు చేస్తుంటే “అమ్మమ్మా అని నన్నే నన్నే పిలుస్తున్నాడు నా మనవడు” అని వాడిని ముద్దులతో ముంచెత్తింది. వాడి వొళ్ళు వెచ్చబడితే విల విల లాడింది. తగ్గేవరకు దేవుడికి ఎన్ని మొక్కులో మొక్కుకుంది . తగ్గిన తరువాత వాడి మొహంలోని నవ్వులు చిన్నారి మోములో పువ్వులై విరిశాయి.
అలా వాడి ఆటపాటలతో మైమరిచిపోతున్నచిన్నారికి హఠాత్తుగా ఒకరోజు ఒకటర్థమయింది. అది అర్థమవుతూనే మనసులోని వేదన అలా చేత్తో తీసినట్లుగా మాయమయ్యింది.
“ఆశించడం” అదే ఇన్నాళ్ళూ తనను శాసించింది. చిన్నతనంలో అందరితో పాటు సమానమైన గుర్తింపు నాశించింది. కొద్దిగా ఊహ తెలిశాక తలితండ్రుల దగ్గర ప్రాముఖ్యతని ఆశించింది. పదహారేళ్ళ వయసులో ప్రత్యేకతని ఆశించింది. పెళ్ళయ్యాక తాను చేసిన సేవలకి రిటర్న్ ఆశించింది. మధ్యలో ఎందరికో చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఆశించింది. తోడుగా వుండి కష్టసుఖాలలో పాలుపంచుకున్నందుకు భర్త దగ్గర ప్రత్యేక ప్రేమను ఆశించింది. సంతానం దగ్గర కొచ్చేటప్పటికి అప్పటివరకు తనే లోకంగా బ్రతికిన పిల్లలకు, ఊహ తెలిశాక వాళ్ళ జీవితంలో తన ప్రాధాన్యత తగ్గిపోవడం ఫీల్ అయింది. అంటే ప్రాధాన్యతను ఆశించింది.
అన్నిటికీ మనసే కారణం. యెప్పుడూ యెవరో ఒకరి దగ్గరనుండి యేదన్నా ఆశించిన క్షణమే అసంతృప్తికి తలుపు తెరుచుకుంటుంది. ఒక్కసారి అసంతృప్తి పాదం మోపిందీ అంటే ఇనుప పాదమే అది . గుండెను తొక్కి ఛిద్రం చేసిందాకా వదలదు. ఆ ఒక్క ఆశించడం అనేది లేకపోతే జీవితం సంతోష సాగరమే అవుతుంది.
ఒక్క మనవడి దగ్గర మటుకు అసలు యేదన్నా ఆశించాలన్న ఆలోచన కూడా రావటం లేదు. ఇది అన్ కండిషనల్ లవ్. అందుకే తాను చాలా హాయిగా వుంది. ఈ చిన్న సంగతి అర్థమైనాక చిన్నారి జీవితంలో మరి వెలితి కనపడలేదు. ఆర్తి ఆకాశంలోకి ఎగిరిపోయింది.
యెవరిని ప్రేమించినా, యెవరికి ఏమి చేసినా రిటర్న్ఆశించకపోతే , అసలు ఆశించడం అనేది లేకపోతే తన జీవితంలో అసంతృప్తికి తావుండదు. తనలోని వేదనని మూలాలతో సహా పెకిలించగలగడానికి కారణమైన మనవడిని అపురూపంగా చూసుకుంటూ అనుకుంది చిన్నారి….

******శుభం******

నేను…

రచన- డా లక్ష్మి రాఘవ

నన్ను అందంగా తయారు చేస్తున్నారు అన్న ఆనందం నన్ను నిలవనీయడం లేదు.
నా ముఖం ఇంకా ఎంత అందంగా ఉండాలో అని మాట్లాడుతూంటే సిగ్గుపడి పోయాను.
అసలే నా నిండా అందమైన ఆలోచనలు, వాటికి తోడు అలంకరణతో అద్బుతంగా అవుతుందంటే ఎవరికీ ఆనందం కలగదు? పైగా “ఎంత ఖర్చయినా పరవాలేదు ఎంత బాగుండాలంటే చూడగానే కావాలని అనిపించాలి” అన్నారు నా వాళ్ళు.
ఇక నా ఆనందానికి హద్దులు లేవు! చూడ్డానికి బాగుండటానికి, క్షణంలో నచ్చడానికి ఎంత ఖర్చు అయినా పరవాలేదు’ అన్న మాటలు చాలవా నాకు? ఇక అలా తయారవడాని కోసమై హైదరాబాదు దాకా ప్రయాణం అలసట అనిపించలేదు.
హైదరాబాదులో వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్ళారు. ప్రతి చోటా నా అందానికి మెరుగులు దిద్దడమే. నా గురించే ప్రత్యేకంగా పని చేయడమే.
అందుకని నన్నుఎన్నిసార్లు ముట్టుకున్తున్నా నాకేమీ అనిపించలేదు. ఎప్పటికప్పుడు సరిదిద్ది , మెరుగులద్దుతుంటే పులకించిపోయానంతే. నాకు కూడా చాలా కోరికలున్నాయన్న మాట!!
ఇదంతా జరగడానికి రెండు నెలలు టైం పట్టింది. నాకేమో ఎప్పుడెప్పుడు పూర్తిగా ముస్తాబై ఇల్లు చేరతానా అన్న ఆత్రుత వుంది.
ఒక రోజున నేను సంపూర్ణంగా ముస్తాబైనట్టు అనిపించింది. నన్ను హైదరాబాదు వాళ్ళు చాలా అందంగా ఉన్నానని మెచ్చుకున్నారు.
ఇక మా ఇంటికి ప్రయాణమే మిగిలింది. ప్రయాణానికి సిద్దం చేశారు.
నాకు ఎక్కడా అసౌకర్యం కాకుండా భద్రంగా మా ఇంటికి చేర్చారు. నన్ను చూడటానికి మా ఇంటి వాళ్ళు పోటీ పడ్డారు.
అందరి చేతిలోనూ నేనే! “అరె ఎంత బాగుందో!!” అనడాలే!! మురిసి పోయాను. మొదటిగా దేవుడి గదికి తీసుకెళ్ళారు.
తరువాత నన్ను ఎక్కడ, ఎక్కడ పంపాలో నిర్ణయించారు. “ఇంత బాగా ఉన్నదాన్ని అందరూ ఆదరిస్తారు” అన్న మాటలు వినడానికి హాయిగా వున్నాయి.
ఒక వారం లోపల నన్ను అందరికీ పరిచయం చెయ్యాలని ఒక సభ చేసారు. ఆ సభలో అందరి దగ్గరా నేనే! అందరు మాట్లాడిందీ నాలోని ఆలోచనలూ, అందమైన ముఖాన్ని గురించే! ఓహ్! ఎంతో గర్వంగా వుంది…
న్యూస్ పేపర్స్ లో నా ఫోటోలు వేసారు. నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
ఇక నేను మేఘాలలో తెలియాడుతున్న సమయంలో నన్ను ఇంకా ఎంతమందికో పరిచయం కావడానికి ప్రిపేర్ చేసారు.
వివిధ ప్రాంతాలకు చేరాను. అందరూ బాగా ఆదరించారు!!
అలా కొన్నేళ్ళు రాజరికం అనుభవించాను.
తరువాత నన్ను అందరూ పట్టించుకోవడం మానేశారు.
ఎక్కడైనా ఎక్కడో ఒక మూల ఉంటున్నాను.
చివరకు ఇంట్లో వద్దని కొంతమంది బయటవారికి అమ్మేసారు! వారూ సరిగా చూసుకోలేదు…
కొత్తలో ఎప్పుడో రాత్రిపూట కాస్సేపు చేతిలో ఉంచుకుని నన్ను చూసినవారు, తరువాత రోజుల్లో అది కూడా కరువై గిరవాటు వేస్తే, పాత పేపర్ల వాడి చలవతో ఫుట్ పాత్ చేరాను.
భరించ లేనంత ఎండ! అలా పుట్ పాత్ పై ఎండకు మాడుతున్న సమయంలో ఒక చల్లని చెయ్యి నన్ను తాకింది. సుతారంగా సృశిస్తూ నన్ను బేరం చేసింది. మా యజమాని కూడా నన్ను ఎలాగైనా వదిలించు కోవాలని చాలా తక్కువ ఖరీదుకు నన్ను ఆ వ్యక్తికి అమ్మేశాడు. అదే నయం. కనీసం నీడపట్టున ఉండొచ్చు అనుకుంటూ అతడితో వెళ్ళిపోయాను..
ఇంటికి వెళ్ళగానే నన్ను ఒక్కసారి చూసి గిరవాటు వేస్తాడేమో అన్న అనుమాన౦గా వుంది. కానీ అతను నన్ను చాలా ఆప్యాయతతో బట్టతో శుభ్రం చేసి నాకు ఒక కొత్త ముసుగు వేసి బాగా బైండింగ్ చేయించాడు. అట్ట మీద చెరిగిపోయిన నా పేరుని మరింత అందంగా రాసాడు.
ఒక్కసారి మృదువుగా పెదవులకు ఆనించుకుని అల్మారాలో తన చిన్ని పుస్తకాల లైబ్రరీ లో చోటు కల్పించారు.
అవును నేను అనాదరణకు గురయ్యి తిరిగి ఉద్దరించబడ్డ పుస్తకాన్ని!!

******!

జలజాక్షి.. సంగీతం కోచింగ్..

రచన: గిరిజారాణి కలవల

ఎప్పుడో చిన్నప్పుడు.. కాసిని వర్ణాలూ.. ఇంకాసిని కీర్తనలూ గట్రా.. ఏవో నేర్చుకుంది మన జలజం.. వాళ్ళ బామ్మ బతికున్ననాళ్ళూ సంగీత సాధన చేసాననిపించి.. ఏవో కొన్ని రాగాలని ముక్కున పట్టింది. ఇంటి ఆడపిల్ల చక్కగా సంగీతాలాపన చేస్తోంటే.. సరస్వతీదేవి నట్టింట వీణ వాయించినట్టే వుంటుందని బామ్మ పట్టుబట్టి.. మాష్టారిని ఇంటికి పిలిపించి.. జలజాక్షికి సంగీతం నేర్పించింది. ఆ మాష్టారు కూడా.. జలజానికి తగిన మనిషే… శంకరాభరణం సినిమాలో దాసు కేరక్టరే అనుకోండి.. చక్కటి పాటలని ముక్కలు ముక్కలుగా చేసి నేర్పేవాడు.. ‘ బ్రోచే.. వా..రెవరురా.. టటటడటయ్..’ ఆయన నేర్ఫినట్టే మన జలజం ఆ ముక్కలని ముక్కున పట్టింది. అంతే.. ఆ తర్వాత బామ్మా పోయింది.. సంగీత సాధనా అయిపోయింది.. హార్మోనియం పెట్టిని అటకెక్కించేసింది జలజం.
జలజానికి పెళ్ళి ఈడు వచ్చింది.. సంబంధాలు రావడం మొదలయ్యాయి. పెళ్ళి చూపులప్పుడు… ఎవరైనా సంగీతం నేర్చుకున్నావా? పాటలు పాడడం వచ్చా? అని అడుగుతారేమో అని జలజం వాళ్ళ అమ్మ.. ఆ పెట్టిని కిందకి దింపి బూజులు దులిపింది.
పదమూడో సంబంధం.. ఎవరనుకుంటున్నారూ… ఇంకెవరూ .. మన హీరో జలజాపతే..
కాఫీలూ, ఫలహారాలు ముగిసాయి.. ఒకరినొకరు ఓర చూపుల బాణాలు వేసుకోవడమూ అయింది.. పెద్దోళ్ళు అన్ని కోణాలూ చూడడం అయింది.. ఆలోచించి జాతకాలూ, కట్నాలూ మాట్లాడుకోవడాలూ ముగిసాయి.. ముహూర్తాల దగ్గరకి వచ్చేసరికి.. అదిగో సరిగ్గా అప్పుడే… జలజాపతి బామ్మ… ” ఏదీ.. పిల్లా.. సంగీతం నేర్చుకున్నావని ఆ పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు.. ఓ పాటందుకో..” అంది.. ఏదో అప్పచ్చుల పళ్ళెం అందుకో అన్నట్టుగా…
ఇక తప్పదుగా… హార్మోనియం పెట్టి శృతి చూసుకుని.. తన గొంతు సవరించుకుని… ఏడో క్లాస్ లో వదిలేసిన కీర్తనలని గుర్తు చేసుకుంటూ.. మొదలెట్టేసరికి.. ఆ హార్మోనియం పెట్టిలో స్ధిరనివాసం ఏర్పరచుకున్న బల్లి ఫేమిలీ లోని చంటిబల్లి ఒక్క సారిగా పైకి ఎగిరి.. జలజాపతి బామ్మ నెత్తిన పడింది.. ఆ దెబ్బకు ఆవిడ కాస్తా అదిరిపడి.. కెవ్వున కేకతో.. అంతెత్తుకి ఎగిరింది. దాంతో తోక తెగిన బల్లిలా గెంతడం మొదలెట్టింది. జ. ప తల్లికి మాత్రం.. కొద్దిగా బల్లి శకునాలు పెద్ద బాలశిక్షలో చదివిన గుర్తుంది.. నెత్తిన పడితే…. అత్తగారు ఇక పైకి టికెట్ తీసుకున్నట్టే… హమ్మయ్య అనుకుంది… పైకి మాత్రం అయ్యో బల్లి.. అయ్యో బల్లి అంటూ.. సోఫా ఎక్కి గెంతులేయడం మొదలెట్టింది.
వెంటనే.. జలజం తండ్రి… ” శారదా ఆపు” అన్న లెవల్లో ” జలజా ఆపు” అని గావుకేక పెట్టారు. ఈ కంగారులో జలజం పాట ఎప్పుడు ఆపిందో కూడా తెలీలేదు.
బల్లి హడావుడి సర్దుమణిగాక.. పెళ్లి మాటలు మొదలెట్టారు.. బల్లి భయంలో వున్న జ. ప. బామ్మ మళ్లీ మాట్లాడలేదు.. ఓ పదిహేనురోజుల్లో ఎంగేజ్మెంట్ .. ఆ తర్వాత నెల్లాళ్ళకి పెళ్ళి జరిగిపోవడం.. నెల తిరక్కుండా జలజం అత్తారింట అడుగు పెట్టడం జరిగిపోయింది. జలజాపతి బామ్మ మాత్రం.. జలజాన్ని పాటలు పాడమని మాత్రం అడగలేదు ఎప్పుడూను.

ఇంతలో జలజాపతికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడంతో.. భార్యభర్తలు ఇద్దరూ అక్కడ కాపురం పెట్టారు. తమతోపాటు బామ్మని తీసుకెడదామనుకున్నాడు కానీ.. జలజం సంగీతానికి భయపడి ఆవిడ వెళ్ళనంది. మనవడు ఆఫీసుకి వెళ్ళి పోయాక.. తన పాటలతో .. వాయించేస్తుందేమో అని భయపడి బామ్మ రానని చెప్పింది.
జ. ప ఆఫీసు కి వెళ్ళాక జలజానికి ఖాళీయే.. పనేం వుండేది కాదు.. ఏం తోచక ఏంచేయాలా అని ఆలోచిస్తూ వుండేది. కాలేజీలో స్నేహితురాలు విజయ ఒకసారి సినిమా హాల్లో కనపడి.. పలకరింపులు అయ్యాక.. ఇంటి అడ్రస్ లు తీసుకుని వారం వారం కలుసుకోవడం మొదలెట్టారు.
అటువంటి సమయంలో విజయ.. ఖాళీ సమయాన్ని ఎలా వినియోగించాలో చెప్పింది బానే వుందనిపించింది జలజానికి. ” కాస్తోకూస్తో సంగీతం నేర్చుకున్నావు కదా… ఇంటి దగ్గర చిన్న పిల్లలకి సంగీతం క్లాసులు తీసుకో.. వారానికి రెండు క్లాసులు తీసుకున్నా.. ఒకొక్కరి దగ్గర.. వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు.. పదిమంది వచ్చినా ఈజీగా పదివేలు నెలకి సంపాదించవచ్చు..” అని చెప్పేసరికి ఇదేదో బావుందే అనుకుంది జలజం. వెంటనే అమలులో పెట్టేసింది.. అదే అపార్ట్ మెంట్ లో చుట్టుపక్కల ఇళ్లలో చెప్పేసరికి.. ఓ పదిమంది పిల్లలు సంగీతం క్లాసుకి రావడం మొదలెట్టారు. అయితే ఒక నెల తిరక్కుండానే.. ఆ పిల్లల తల్లిదండ్రులు.. జలజం దగ్గర క్లాస్ లు మాన్పించడమే కాదు.. పైన.. సా.. అనగానే.. పైన ఇంటి వాళ్ళు, కింద.. రీ.. అనగానే కింద ఇంటి వాళ్ళూ.. వాళ్ళే ఇళ్లు మారిపోయారు జలజం సంగీతం దెబ్బకి..
ఇది వర్క్ అవుట్ కాకపోయేసరికి… ఇలా డైరక్ట్ గా కాకుండా… ఆన్ లైన్ క్లాసులు తీసుకుందామనే ఆలోచన వచ్చింది జలజానికి. పాపం ఇద్దరు ముగ్గురు దొరికారు.. జలజం సంగతి తమ దాకా పాకనివారు..
అందులో ఓ పిల్లని వాళ్ళమ్మ లాప్ టాప్ ముందు.. జలజం క్లాస్ కి కూర్చోపెట్టి.. లోపల తన పని చూసుకుంటూ వుండేది.. ఈ పిల్లకి కుదురేదీ… అటుపోనూ.. ఇటుపోనూ… జలజం వాళ్ళమ్మకి ఫోన్ చేయడం.. ఆవిడ పిల్లని మళ్లీ ఇక్కడ కుదేయడం…. వెంటనే అది మళ్లీ పారిపోవడం..
” మీ పిల్లకి కుదురు లేదండీ.. తాళం కూడా వెయ్యడం లేదు..ఇలా అయితే ఎలా నేర్పించాలీ ” అని జలజం ఆ పిల్ల తల్లికి కంప్లైంట్ చేసేసరికి….
మన జలజం కంటే ఘనురాలు ఆ తల్లి…. పిల్లని లాప్ టాప్ ముందు కుర్చీలో కుదేసి కూర్చోపెట్టి.. తాడేసి కట్టేసి… ఆ రూముకి తాళం వేసి.. జలజానికి ఫోన్ చేసింది…” ఇక మా అమ్మాయి కదలనే కదలదు… తాళం కూడా వెయ్యమన్నారుగా.. వేసేసాను..రూముతలుపులకి గాడ్రెజ్ తాళం.. ఇక మొదలెట్టుకోండి క్లాస్ ని”.. అంది.
అంతే ఇక జలజం నోటికి తాళం పడిపోయింది.

*****

చిన్నారితల్లి నా చిట్టితల్లి

రచన: తులసి భాను

నాన్నా అంటూ వెనుకనుంచీ మెడచుట్టూ చేతులు వేసి గారాలు పోతోంది 28 యేళ్ళ చిట్టితల్లి, తన తండ్రి ఆనంద్ దగ్గర. ఏమ్మా ఏం కావాలీ అన్నాడు ఆనంద్ తన పని ఆపేసి. నాన్నా ఇప్పుడు పెళ్ళి వద్దు నాకు అంది దిగులుగా రేణుక తండ్రి చెవుల్లో రహస్యంగా. తల్లి వింటే తిడుతుందని భయం మరి,ఇన్నేళ్ళొచ్చాయి, పెళ్ళి వద్దు వద్దు అని ఇన్నేళ్ళు సాగదీసావు, ఇంకా ఇప్పుడు కూడా దాటేయాలని చూస్తే ఊరుకోను అని నిన్ననే స్ట్రాంగ్ గా బెదిరించింది తల్లి నిర్మల.
ఇప్పటికే నా బుజ్జితల్లికి 28 యేళ్ళు వచ్చేసాయి, ఇంక ఇప్పటికయినా పెళ్ళి చేసుకోకపోతే ఎలారా. అన్నాడు ఆనంద్ సర్దిచెబుతూ. . రేణుక తల దించుకుని కూర్చుని ఉంది, సమాధానం ఏమీ ఇవ్వట్లేదు. కూతురు అలిగింది అనిపించి, గడ్డం కింద చెయ్యి పెట్టి కూతురు మొహాన్ని పైకెత్తాడు. రేణుక కళ్ళ నిండా నీళ్ళు. . తల్లీ, ఏమయ్యిందిరా అని కంగారుపడిపోయాడు ఆనంద్. అతనికి కూడా, కూతురి కళ్ళలో నీళ్ళు చూసి ఏడుపు గొంతు పడింది. వీళ్ళకు కనపడకుండా ఫ్రిజ్ అవతల నుంచుని వీళ్ళ మాటలు వింటున్న నిర్మలకు కూడా కూతురు ఏడుస్తోందని అర్ధమై కళ్ళు నీటిచెలమలైపోయాయి, తన చీరకొంగుతో కళ్ళు వత్తుకుంటూ కూతురు ఏం చెబుతుందా అని ఆత్రంగా వింటోంది. నాన్నా మీ దగ్గర ఉన్నట్టు నాకు ఇంకెక్కడా బాగోదు, మీ దగ్గరే ఉండిపోతాను నాన్నా, హాయిగా అమ్మవళ్ళో బజ్జుని, నీ గొంతు వింటుంటే, పొద్దున్నుంచీ రాత్రి ఎనిమిందింటివరకూ నేను జాబ్ లో పడ్డ అలసటంతా తీరిపోతుంది. . అక్కడ నన్నెవరు చూసుకుంటారు నాన్నా అంత బాగా, అమ్మ నువ్వూ చూసుకున్నట్టు ఎవ్వరికీ రాదు తెలుసా. అంటోంది. .
రేణూ నువ్వసలు నీ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ వేనా, ఇంత బేలగా ఉంటే ఎలా చెప్పు. జీవితంలో ఒక్కొక్క దశ మారుతూ ఉంటుంది, అది సహజంగా జరిగిపోవాలి, ఇలా ఇదే తరహాలో ఆలోచిస్తే, నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళ లేవు. అన్నీ ఒకటొకటిగా అలవాటు అవుతాయి చిట్టితల్లీ, అని ధైర్యం చెబుతూ రేణుక తలను తన గుండెలకు కత్తుకున్నాడు ఆనంద్. . ఇంతలో కూతురి మాటలకు, మనసు బరువెక్కి, నిర్మలకు చాలా ఏడుపొచ్చి, వెక్కిళ్ళు పెడుతోంది. ఆ వెక్కిళ్ళ శబ్దం తండ్రీ కూతురికి వినపడింది. చకచకా వచ్చి చూసారు, నిర్మల ఏడుపు ఆపుకోవాలనుకుంటున్నా, తన వలన కావట్లేదు. . అది చూసి రేణుక, ఓయ్ అమ్మా , గయ్యాళి లా నాలుగురోజుల నుంచీ, పెళ్ళొద్దంటున్నానని నా వెంట తిడుతూ తిరుగుతున్నావు, ఇవ్వాళేంటి ఇలా ఆ. అని రేణుక తల్లిని నవ్వించాలని చూస్తోంది. . తల్లి నిర్మల, రేణుకని మ్రృదువుగా తన చేతుల లోకి తీసుకుంది. ఎంత ప్రేమ ఉన్నా ప్రతీ కూతురూ పెళ్ళి చేసుకుని వెళ్ళాల్సిందే కదరా. . అని తనకి ధైర్యం చెప్పుకుంటూనే, కూతురికీ సర్దిచెబుతోంది. .
పసుపు రాయడం, కూతురిని పెళ్ళికూతురుని చేయడం, గోరింటాకు సంబరం చేయడం, చేతినిండా గాజులు వేసి అందరూ సరదాగా పాటలు పాడటం. . ఇలా అన్నీ వేడుకగా జరిగేటప్పుడు, ఆ సందడిలో రేణుక హుషారుగానే ఉంది. . ఒక్కొక్క వేడుక ముందుకు వెళుతున్న కొద్దీ ఆనంద్, నిర్మలకి కూతురు, తమని వదిలి, అత్తారింటికి వెళ్ళిపోతుంది అనిపించినప్పుడల్లా, చుట్టూ అందరినీ, అన్నీ మరిచిపోయి మరీ, కూతురినే కళ్ళారా చూసుకుంటూ, కళ్ళల్లో దిగులు పేరుకుంటుండగా, కూతురినే చూసుకుంటూ బొమ్మల్లా నిలబడిపోతున్నారు.
హ్రృదయాలు వేరైనా, తల్లీ తండ్రిగా ఇరువురూ ఒకే బాధను అనుభవిస్తున్నారు కూతురి కోసం. . నిర్మల చెల్లెలు సాహితీ, అన్ని సందర్భాలలోనూ ఫొటో లు తీస్తోంది తన మొబైల్ ఫోన్ లో, చాలా ఫొటోల్లో బావ మొహంలో దిగులు స్పష్టంగా తెలుస్తోంది, ఇహ అక్క అయితే, కూతురి చెంపకి తన చెంప ఆనించో, కూతురి భుజానికి తన మొహాన్ని తాకించుకుని దిగిన ఫొటోల్లో ఇహ కన్నీరు కంటి అంచుల్లోంచీ రాబోతోంది అన్నట్లే ఉంది. .
ఇద్దరూ ఇంత మరీ దిగులు పడుతున్నారే అనిపించి, ఇద్దరికీ ఫొటో లన్నీ చూపించి, కాస్త నవ్వండి ఫొటోల్లో అని సలహా చెప్పింది. . ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని, కళ్ళతోనే ఊరడించుకుని సరే సరే అని నవ్వుతూ చెప్పారు సాహితీకి. .
పెళ్ళి ధూం ధాం గా బాగా జరిగింది. . హనీమూన్ కి పారిస్ వెళ్లొచ్చారు కొత్త జంట. . దిగులు దిగులు అన్న చిన్నారితల్లి, మొదట్లో పూటకి ఒకసారి ఫోన్ చేసేది. . ఒక్కొక్కరితో, అరగంటకి తక్కువ కాకుండా ఓ గంటసేపు మాట్లాడేది. . తరువాత తరువాత రోజుకి ఒకసారి, అదీ ఒక అరగంట. . హనీమూన్ అయింది. .
కొత్తకాపురం మొదలయ్యింది. . వారానికి రెండుసార్లు ఫోన్ లు వస్తున్నాయి. . శని, ఆదివారాలు అమ్మా నాన్న దగ్గరికే వచ్చేవారు. .
నెమ్మదినెమ్మదిగా రేణుక, నిర్మల, ఆనంద్. ముగ్గురూ అలవాటు పడ్డారు, దిగులును స్వీకరించి సర్దుకుపోవడానికి. .
మూడు నెలల తరువాత రేణుక కోపంగా తల్లి ఇంటికి వచ్చింది, అరగంట తేడాలో అల్లుడు విశ్వ వచ్చాడు. . నిర్మల ఇద్దరికీ వేడిగా దోశలు వేసి ఇచ్చింది, ఇద్దరూ మౌనంగా తింటున్నారు. .
గంట తరువాత అటు రేణుక, నిర్మలతో, ఇటు విశ్వ, ఆనంద్ తో చెబుతున్నారు. . రేణుక ఫేవరెట్ హీరో ప్రభాస్ సినిమాకి వెళదామని అడిగింది, రెండ్రోజుల ముందు బుక్ మై షో లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. . తీరా ఈ రోజు సినిమా టైమ్ కి రేణుక తనకి ఇష్టం అయిన డ్రెస్ వేసుకుని టిప్ టాప్ గా రెడీ అయి కూర్చుంది, విశ్వ కి ఫోన్ చేసింది, లేట్ చేయద్దు, ముకేష్ ఆడ్ తో సహా పేర్లు నుంచీ ఏ ఒక్కటీ మిస్ అవకుండా చూడాలి నేను, లేకపోతే సినిమా చూసినట్టుండదు నాకు అని స్పష్టంగా ముందుగానే చెప్పింది రేణుక, విశ్వ గంట ముందు రావాల్సింది, పదిహేను నిముషాలు లేటుగా వచ్చాడు, ఈ పదిహేను నిముషాలలో నిముషానికి ఒక డిగ్రీ చొప్పున, రేణుక కోపం పెరిగిపోయింది. .
ఇహ యుధ్ధానికి సిద్ధంగా కూర్చుని ఉంది విశ్వ ఇంటికొచ్చే టైమ్ కి. . నా డిసప్పాయింట్ కి నీకు అసలు కొంచెం కూడా గిల్టీ లేదు, నేను ఇంకెప్పుడూ సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోనూ, ఇదే మా అమ్మా నాన్న అయితే రెండు గంటలు ముందే రెడీగా ఉంటారు నాకోసం, వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ లో అయినా ఉండనీ అని ఒకటే అలక, కోపం, తిట్లు విశ్వ మీద. . చూసాడు చూసాడు విశ్వ, అరే ఇప్పుడు కూడా మనం టైమ్ కి చేరిపోతాం, బయల్దేరు అంటే, ఆ పిచ్చి కోపంలో రేణుక వినిపించుకుంటేనా. . ఇహ విశ్వ కి కోపం వచ్చి ఇంత మూర్ఖత్వం మంచిది కాదు అన్నాడు రేణుకతో. అంతే, నన్ను అంత మాట అంటావా అనేసి, పుట్టింటికి పరిగెత్తుకొచ్చేసింది. .
ఆనంద్, నిర్మలకి అసలే రేణుక అంటే అపురూపం, తనో మాట రేణుకని అనేసాడని వారికి, తన మీద ఎక్కడ కోపం వస్తుందో అని, తనను వారేమి అంటారో, అది విని తనకు ఇంకా కోపం వస్తుందేమో అనిపించి కంగారుగా ఉంది విశ్వకు. .
ఆనంద్ సీరియస్ గా విన్నాడు. . విశ్వ ఆనంద్ మొహంలో మారుతున్న ముఖకవళికలను గమనిస్తున్నాడు. . అంటే మా అమ్మాయి మూర్ఖురాలు అంటావు అన్నాడు ఆనంద్ విశ్వ తో. . భర్త అల్లుడిని తొందరపడి ఏమంటాడో అని, నిర్మల కంగారుపడుతూ భర్త దగ్గరకు వస్తోంది, ఏమనద్దు అన్నట్టు అడ్డంగా తలూపుతూ భర్తని చూస్తూ. .
ఆనంద్ భళ్ళుమని గట్టిగా నవ్వేసాడు. . నవ్వుతూ ఉన్నాడు. . విశ్వకి, నిర్మలకి, రేణుకకి ఏమీ అర్థం కాలేదు, ఆనంద్ ఎందుకు అలా నవ్వుతున్నాడో. .
విశ్వా, ఇలానే, అచ్చు ఇలానే మీ అత్తగారు, ఇదే విషయం మీద నాతో మొదటిసారి గొడవేసుకుంది. అప్పట్లో తనకి నాగార్జున అంటే ఇష్టం. మజ్ను సినిమాకి తీసుకెళ్ళమంది, నాకూ ఒక పదే పది నిముషాలులేట్ అయింది. . ఇహ కైకేయి లెవెల్లో అలకాగ్రృహం సీను చూపించింది. . మరి మీ ఆవిడకి మాత్రం, మా ఆవిడ పోలికేగా వచ్చేది. . ఏదేమైనా అల్లుడూ, ఈ విషయం లో నేను నీ వైపేనయ్యా, ఎందుకంటే సాటి భర్తగా, భార్యలు అలిగినప్పుడో, మనతో వాదించేటప్పుడో, ఒక భర్త పడే బాధ ఏంటో నాకు బాగా అనుభవం. అప్పుడంటే నాకు మా మావగారి సపోర్ట్ తీసుకోవాలని తెలీలేదు, ఒకవేళ నేను అడిగుంటే మా మావగారు ఏమనేవారో కానీ నేను ఏ రోజూ ఆయన సాయం కోరలేదు, ఈ రోజు మాత్రం నువ్వు అడగకపోయినా నేను నీ పార్టీనే అనేసాడు ఆనంద్ నిజాయితీగా. .
అదంతా విని నిర్మల నోరు తెరుచుకుని ఆశ్చర్యం గా చూస్తూ ఉండిపోయింది, రేణుకేమో, అమ్మా అని ఏడుపు మొదలుపెట్టబోయింది. . హేయ్ రేణు రేణు ఏడవకు, సారీ సారీ నేను, నిన్ను, అలా ఇంకెప్పుడూ అనను, ఇప్పుడైనా త్వరగా బయల్దేరితే నైట్ టెన్ ఓ క్లాక్ షో కి వెళ్ళచ్చు మనం. అని బతిమలాడాడు. . ఫో నాన్నా నీతో పచ్చి, నీతో కటిఫ్ అని, ఆనంద్ తో చిన్నపిల్లలా అనేసి, రేణుక, విశ్వ తో కలిసి సినిమాకు బయలుదేరింది. .
వాళ్ళు అలా వెళ్ళారో లేదో నిర్మల గిన్నెలు దడా దడా విసిరేస్తూ, ఆనంద్ మీద కోపం ప్రదర్శిస్తోంది. . అబ్బా, కూతురి పెళ్ళి హడావుడి లో పడి, నీ గిన్నెల సంగీతం విని చాలా రోజులయ్యిందోయ్, మళ్ళీ ఇవాళ వింటున్నా. అన్నాడు నోరారా నవ్వుతూ. .
అల్లుడి ముందు నా పరువు తీసేసి, నన్ను రాక్షసిని చేసేసి ఇప్పుడు బావుందా మీకు అంది బాధగా నిర్మల. . ఓ నిముషం మౌనంగా ఉన్నాడు ఆనంద్. భర్త ఏం చెబుతాడా అని ఎదురుచూస్తోంది. . నిర్మలా, కూతురి కోసం, అల్లుడుని ప్రశ్నించకూడదు, అనవసరంగా ఓ మాట అనకూడదు, నేను అతని పక్షాన నిలవగానే, అతనికి వాదించే అవసరమే లేకుండా అయ్యింది, కూతురిని తప్పు పట్టలేక, మనిద్దరి విషయాన్ని ప్రస్తావించాల్సివచ్చింది, అలా చేయటం వలన ఇది అందరి భార్యాభర్తల మధ్యా సహజమే అని వారికీ తెలిసొచ్చింది. . ఇప్పుడు రేణుక ఎంతో విశ్వా కూడా అంతే, మనకు, ఎవరికి ఏమి చెప్పాలన్నా, ఒకటే బాధలా అనిపించింది, అందుకే మరి అన్నాడు,. నిర్మల వైపు అర్థం చేసుకుంటావుగా అన్నట్టు చూస్తూ ఆనంద్. . ఏమనిపించిందో కోపంతో ఎర్రబడ్డ నిర్మల మొహంలోకి సన్నని చిరునవ్వు వచ్చింది. . అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా అని పాటందుకున్నాడు ఆనంద్. అబ్బో నేనో అమ్మాయి, మీరో అబ్బాయి అంది నిర్మల సరదాగా. .

అత్తగారు – అమెరికం

రచన: సోమ సుధేష్ణ

గణ గణ మోగుతున్న ఫోను అందుకుని “హలో వదినా, నేనే ఫోను చేద్దామని కుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. నీకు నూరేళ్ళ ఆయుష్షు. రేపు రవీంద్ర భారతికి వెళ్తున్నావా?” అంది అరుణ.
“నూరేళ్ళు వద్దులే అరుణ. ఉన్నన్ని రోజులు కాళ్ళు చేతులు బాగుండి పోయేరోజు వరకు మంచం ఎక్కకుండా ఉంటే చాలు. నువ్వు, లలిత రావడం లేదు. నేనొక్క దాన్నే రవీంద్ర భారతికి ఏం వెళ్ళను చెప్పు. రేపు ఏం చేస్తున్నావు? ఇక్కడికిరా, లలితను కూడా రమ్మంటాను.” లక్ష్మి బతిమాలుతున్నట్టుగా అంది.
అమరేందర్, లక్ష్మి పెళ్ళయినపుడు అరుణ అప్పుడే కాలేజీలో చేరింది. అరుణ తన అన్న పెళ్ళిలో పెత్తనం చేసిన ఆనందం కంటే లక్ష్మిని చూసి ఎక్కువ ఆనందించింది. వాళ్ళిద్దరూ మొహాలు చూసుకున్న ఘడియ అనే చెప్పాలి, లక్ష్మీ నాలుగేళ్ళు పెద్దదయినా ఇద్దరూ మంచి స్నేహితుల య్యారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రాణం. అరుణ భర్త రఘురాం కూడా అక్కా అని పిలుస్తూ లక్ష్మితో చనువుగా ఉండేవాడు. అమరేందర్ అరవైయ్యో ఏట వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి చని పోయాడు. అప్పుడే బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న పవన్ హైదరాబాదులోనే జాబు చూసు కున్నాడు. అప్పటి నుండి లక్ష్మి తన కొడుకు పవన్, కోడలు హిమతో జూబిలీ హిల్స్ లో ఉంటోంది. కూతురు ప్రగతి అమెరికాలో ఉంటోంది. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా వదినా మరదళ్ల మధ్య బంధం పెరిగిందే కానీ తరగలేదు.
“మనసేం బాగా లేదు. ఇంట్లోంచి కదలాలని లేదు వదినా.”
“ఏమయింది? అఖిల్ గుర్తుకోచ్చాడా? రఘు గుర్తు కొచ్చాడా? నాదగ్గర ఒక వారం రోజులుండి పోదువుగాని రా.”
“వాళ్ళిద్దరు ఎప్పుడు మనసులో ఉండే వాళ్ళే గదా. ఇప్పుడు రాను. నేను లలితకు ఫోన్ చేస్తాను రేపు మీరిద్దరు ఇక్కడికే రండి. ఇక్కడే లంచ్ తిందాం. రాత్రికి వీలయితే ఇక్కడే ఉండేట్టు రా వదిన.”
“ఈ సారి కాదు. పవన్ బెంగుళూరులో మీటింగ్ కు వెళ్ళాడు. హిమ కూడా వర్క్ లో బిజీగా ఉండి లేటుగా వస్తోంది. మరో రోజు నైట్ గడపడానికి వస్తాలే. రేపు గుత్తి దొండకాయ కూర తెస్తాను నీకిష్టం కదా!”
రఘు ఆలోచనలు అరుణ మనసును తొలిచేస్తున్నాయి. రఘు గురించి ఆలోచించకుండా ఉండలేదు, ఆలోచనలు వచ్చినప్పుడు బాధ కలగకుండా ఉండదు.
ఉన్న ఒక్క కొడుకు పెళ్ళి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యాడు. కొడుకు పిలుపుకు, కంటికి అందనంత దూరంలో ఉన్నాడని అప్పుడప్పుడు అనిపించినా ఈ రోజుల్లో యువతరం అంతా అమెరికాకు వెళ్తే తప్ప బ్రతుకే లేదన్నట్టు అందరూ అక్కడికే వలస పోతున్నారు. నా కొడుకూ అంతే అనుకుని స్థిమిత పడ్డారు అరుణ, రఘురాం.
‘చనిపోతే నన్ను ఫ్రీజర్ లో పెట్టకురా కన్నా’ అని ఒకసారి కొడుకుతో చెప్పుకున్నాడు రఘురాం. చాలామంది పిల్లలు విదేశాల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. చనిపోగానే పరదేశాల్లో ఉన్న కొడుకు రావాలనో, కూతురు రావాలనో చనిపోయిన వాళ్ళ శవాన్ని తీసుకెళ్ళి ఐసు డబ్బాల్లో ఫుడ్ ఫ్రీజ్ చేస్తున్నట్టు బాడీలను ఫ్రీజ్ చేస్తున్నారు. ఆ ఆలోచన మనసులోకి వస్తేనే రఘురాంకు ఒళ్ళు జలదరిస్తోందనేవాడు. ఆ చుట్టు పక్కల స్నేహితులకు, బంధువులకు జరిగే ఆ చివరి అంకంలోని తంతు పెద్దతరం వాళ్ళ మనసులో ముద్ర వేసుకుని కలవర పెడ్తోంది. అఖిల్ వెంటనే, ‘డాడ్ మీ హెల్త్ ఫర్ఫెక్ట్ గా ఉంది. మీరలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంది. నన్ను అమెరికా నుండి వచ్చేయమంటే వచ్చేసి ఇక్కడే జాబ్ చూసుకుంటాను.’ అన్నాడు.
‘తొందరపడి అలాంటి పనులు ఏమి చేయొద్దు కన్నా. ఏదో మనసు కొన్నిసార్లు అలా లోయల్లోకి వెళ్లి పోతుంది. అయినా చావొచ్చినా, తుఫానొచ్చినా ఆగదుగా! ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నే పోయాక నీ మమ్మీని బాగా చూసుకో.’ అన్నాడు.
రఘురాంకు కూడా కొడుకు అమెరికా వెళ్ళాడంటే ఏదో జీతం లేని ప్రమోషన్, కనిపించని ఎత్తు పెరిగినట్టుగా ఉంది. ముఖ్యంగా కొడుకు దేనికీ కొరత లేకుండా హాయిగా ఉంటాడని నమ్మకం.
కొన్ని రోజుల్లోనే హటాత్తుగా గుండె పోటుతో మరణించిన రఘురాం మృతదేహాన్ని ఐసుబాక్స్ లో పెట్టక తప్పలేదు. అఖిల్ వెంటనే బయల్దేరినా రావడానికి టైం పట్టింది. తండ్రి కోరిక తీర్చలేదని చాల బాధపడ్డాడు. కానీ అసమ్మతమైన కాలానికి లొంగక తప్పలేదు.
తండ్రి అంతిమ దశలో జరగవలసిన కార్యక్రమాలన్ని సక్రమంగా ముగిసాక,
“మమ్మీ! నువ్వొక్కదానివి ఇక్కడేలా ఉంటావు నాతో వచ్చేయ్యి.” అఖిల్ కు తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి సుతరాము ఇష్టం లేదు.
“ఇప్పుడు కాదులే నాన్నా! నాకిక్కడ అలవాటైన ఇల్లు, స్నేహితులు ఉన్నారు. నన్ను ప్రేమగా చూసుకునే వదిన ఉంది. నాకెమీ ఫర్వాలేదు. నువ్వు దిగులుపడకు.”
“నువ్వు ఒక్కర్తివే ఇక్కడుంటే దిగులు పడకుండా ఎలా ఉంటాను మమ్మీ!”
“నేను పెళ్ళి చేసుకుని ఈ ఇంట్లోకే వచ్చాను. నువ్వు పెరిగిన ఇల్లు ఇది. నీ పెళ్ళయ్యాక సరితను తీసుకొచ్చిన ఇల్లు ఇది. ఈ ఇంట్లో మీ అందరి జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. నాకేమీ కాదు.”
“అవన్నీ డాడ్ ఉన్నప్పుడు చెబితే వినేవాణ్ణి . ఇప్పుడు నువ్వొక్కదానివే, ఎన్ని చెప్పినా వినేది లేదు.” మొరాయించాడు అఖిల్.
“ఇప్పుడప్పుడే కాదు కన్నా, కొన్నాళ్ళ తర్వాత వస్తాను. నువ్వేమి బెంగ పడకు.” ఊరడింపుగా అంది.
“అరుణా! నువ్వు అఖిల్ తో యుఎస్ వెళ్ళడమే మంచిదనిపిస్తోంది. కనీసం కొన్నాళ్ళు వెళ్లిరా. నువ్విక్కడే ఉంటె నాకంటే ఎక్కువ సంతోషించేవాళ్ళు ఎవ్వరూ ఉండరని నీకు తెలుసు. కానీ వెళితే నీకు స్థల మార్పుతో మనసు కొంత తేరుకుంటుంది.” లక్ష్మి నచ్చ చెప్పింది.
“ఇప్పుడు కాదులే వదినా. నాకేం, ఇనప గుండులా ఉన్నాను. అన్నింటికీ నాకు నువ్వున్నావు, పవన్, హిమ, లలిత, పార్వతి ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళం కిట్టి పార్టీలకు కలుస్తూనే ఉంటాం. మీరంతా ‘హల్లో’ అంటే క్షణంలో నా ముందు వాలుతారు.”
ఆమె నిర్ణయం మార్చడం కష్టమని అఖిల్ కు అర్థం అయ్యింది. ఎన్నో ఏళ్ళు గడిపిన ఆ ఇంట్లో అందునా తండ్రి పోయిన తర్వాత వెంటనే ఆ ఇంటిని వదలి దూరంగా వెళ్ళడం కష్టమే. తల్లి స్నేహితులకు, ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న నెయిబర్సుకు అప్పగింతలు చెప్పి , అన్ని వసతులు తల్లికి అనువుగా అమర్చి అమెరికా వెళ్లి పోయాడు.
అరుణకు ఒంటరితనం కొంత బెదిరించినా–తనకు తానే ధైర్యం పుంజుకుంది. సాయంత్రం వరండాలో రఘురాం కూర్చునే రాకింగ్ కుర్చీ పక్క కుర్చీలో కూర్చుని రాకింగ్ కుర్చీని చెయ్యితో ఊపి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. రఘురాం బట్టలు అన్నీ తీసి డబ్బాలో పెడ్తుంటే తన చర్మాన్ని ఒలి చేస్తున్నట్టుగా బాధ పడింది.
“ఈ బట్టలు ఎంత చక్కగా హేంగ్ చేసావు మేరే జాన్!” పొగుడుతూ మురిసిపోయే రఘు కనిపించేవాడు.
రఘురాం ముందు నుండి సందడి చేసే మనిషి, అరుణ వెనక చిన్న పిల్లాడిలా తిరుగుతూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. రిటైర్ అయ్యాక ఇద్దరు మరీ క్లోజ్ అయ్యారు.
అరుణ వంట చేస్తూంటే పక్క వరండాలో పచార్లు చేస్తూ కబుర్లు చెప్పేవాడు. అరుణ ఎప్పుడూ న్యూస్ పేపరు ఎక్కువగా చదవదు కానీ వార్తలన్నీ తెలుస్తాయి- రఘురాం చాలా వార్తలు వంటింట్లోనో, భోజనా లయ్యాక తీరిగ్గా సోఫాలో కూర్చున్నపుడో రీలే చేసేవాడు. ఇద్దరూ భోజనాలయ్యాక వరండాలో కూర్చుని బంధువుల, మిత్రుల జీవితాలు నెమరు వేసుకునేవారు. ‘ఒంటరిగా ఎలా ఉంటాననుకుని నన్నోదిలి వెళ్లి పోయావు రఘూ’ అరుణ కంటి నీరు పెట్టింది.
******************
మరునాడు లక్ష్మి, లలిత వచ్చారు. అరుణ బాధ తగ్గించడానికే వాళ్ళిద్దరూ ప్రయత్నించారు. కాస్త సరదాగానే గడిచింది. వాళ్లు వెళ్ళగానే మళ్ళీ వంటరితనం చుట్టుముట్టింది. మనసులో ఉన్న ఒంటరితనం బయట ఉన్న మనుషులతో పోదుగా!
అఖిల్ రోజూ వర్క్ కు వెళ్తూ ఫోన్ చేసి తల్లితో కాసేపు కబుర్లు చెబుతాడు. ఆగని కాలం కదిలిపోతూనే ఉంది. రఘురాం లోకం వదిలి ఆరు నెలలు గడిచిపోయాయి. అఖిల్ ఒక వారంరోజుల కోసం ఇండియా వచ్చాడు. ఈసారి తల్లి వీసాకు అప్లై చేసాడు.
“మమ్మీ! వీసా రాగానే తెలిసిన వాళ్ళెవరైనా వస్తూంటే అదే డేట్ కు నీ టికెట్టు బుక్ చేస్తాను. ఇంటి విషయం పవన్ బావ చూసుకుంటాడు. నువ్వు దేనిగురించి ఆలోచించాల్సిన పని లేదు, నీకు కావాల్సిన నీ వస్తువులు మాత్రమే తీసుకొనిరా. నా మాటకు నువ్వేమి అడ్డు చెప్పొద్దు.”
“అరుణా! నువ్వు అఖిల్ మాట విను. వాళ్లతో కలిసి ఉంటే నీకు బావుంటుంది. కొన్నాళ్ళ తర్వాత నీకు ఇక్కడికి రావాలనిపిస్తే తప్పకుండా రా. కానీ నువ్వు వెళ్ళకపొతే నేను నా మకాం పూర్తిగా ఈ దగ్గరకు మార్చాల్సి వస్తుంది. నీకు తెలుసు పవన్ ను చూడకుండా నేను ఎక్కువ రోజులు ఉండలేను, అయినా వస్తానంటున్నాను. నువ్వు ఆలోచించు ఏం చేస్తావో. నన్ను రమ్మంటావా లేక నువ్వు …” అల్టిమేటం ఇచ్చింది లక్ష్మి.
అరుణకు ఒంటరితనం కష్టంగానే ఉంది. కొడుకు దగ్గరకు వెళ్ళాలనే ఆలోచన వైపే మొగ్గింది మనసు. మరో మాట లేకుండా ‘సరే’ అంది.
“ఇక్కడ ఇల్లరికం వెళ్లి ఇల్లు మారుస్తారు. నన్ను అమెరికం వెళ్లి దేశం మారమంటున్నావా వదినా!” పరిహాసం చేసింది.
“అలాగే అనుకో” నవ్వుతూ అంది లక్ష్మీ. లక్ష్మీ గత నాలుగేళ్ళ లో రెండుసార్లు అమెరికా వెళ్లి వచ్చింది. ఆమె
ద్వారా అమెరికా కబుర్లు విని ఉన్న అరుణకు అమెరికా ప్రయాణమంటే సంకోచం లేదు కానీ పరిపూర్ణ మనస్సుతో ప్రయాణ సన్నాహాలు చేసుకోలేక పోతోంది. ఆత్మీయ బంధం ఏదో తనను వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తోంది అరుణకు. ఒంటరి తనంలో కలిగే బాధ కంటే నా అనే అన్నింటినీ వదిలి పోతున్నానే బాధ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రఘు ఉనికికి దూరం వెళ్ళడం, ఉన్నఆత్మ బంధువులను వదులుకుని పోవాలంటే మామూలు మాట కాదుగా! వేర్లు పెకిలించు కుని పోవాలి. లక్ష్మీ సహాయంతో అరుణ ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టింది.
రఘురాంకు అమెరికా చూడాలని చాల కోరికగా ఉండేది. అతని కోరిక తీరనేలేదు. ‘నన్నొదిలి నువ్వు తొందరగా వెళ్లి పోయావు రఘూ’ అరుణ కళ్ళంబట నీటి ధారలు.
********************
విమానంలో అన్ని గంటలు కూర్చుని అరుణకు వళ్ళంతా నొప్పులు, నిద్ర లేక, (రాక) తలనొప్పి వచ్చిందే కానీ దిగాల్సిన ఊరు మాత్రం రాలేదు. ఇంత దూర ప్రయాణం! మన పురాణాల్లో చెప్పినట్టు మాయ తివాసీలు, అదృశ్య అశ్వాలు ఈ సైంటిస్టులు కనిపెట్టినట్టు లేరు ఇంకా. అది మన ఇండియా వాళ్ళ తెలివి కదా వీళ్ళకు అంత అలోచన వచ్చి ఉండదులే అనుకుంది.
ఎయిర్ పోర్టులో కనిపించిన అఖిల్, సరితను చూడగానే దుఃఖం ఆపుకోవడం అరుణ వల్ల కాలేదు.
అంతా కలలాగ ఉంది.
అఖిల్ ఇల్లు పెద్దది, అందులో ఉండే మనుషులు ఇద్దరే. అరుణ కోసం వేరుగా అమర్చిన గది, అందులోని సదుపాయాలన్నీ చూపించాడు అఖిల్. అన్ని చక్కగా అమర్చి ఉన్నాయి. మధ్యాహ్నం నిద్దర పోవడం, మధ్య రాత్రికి లేచి కూర్చోవడం చేస్తోంది అరుణ. దయ్యాలు రాత్రి మెలుకువగా ఉంటాయట. బాడి క్లాక్ అడ్జస్ట్ కావాలని తెలుసు అయినా అమెరికా రాగానే దయ్యం అయి నట్టున్నాను అనుకుని నవ్వుకుంది..
ఒకరోజు రాత్రి పడుకోబోయే ముందు,
“మాం! రాత్రి కూడా పళ్ళు బ్రష్ చేసుకుంటే పళ్ళు శుభ్రంగా గట్టిగా ఉంటాయి” అంటూ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఎలా వాడాలో చూపించాడు. అమ్మకు అమ్మై పోయాడు నా కొడుకు అనుకుంది.
“ఇన్ని ఏళ్లలో నేను రాత్రి ఎప్పుడూ పళ్ళు తోముకోలేదు కన్నా. రాత్రి తిన్నాక నీటితో బుక్కిలిస్తాను అంతే. ఉన్న పళ్ళను ఊడకుండా చూసుకోవాలిగా, అలాగే చేస్తాలే.”
అలంకారాల గురించి వింది కాని బాత్రూంలో చూస్తుంటే మరీ బావుంది. అరుణ కళ్ళు పెద్దవి చేసి అన్నీ ముచ్చటగా చూసింది.
“కన్నా! బాత్రుంలు కూడా ఇంత అందంగా అలంకరించుకుంటారా హోటల్లో లాగ?”
“అవును మమ్మీ. బాత్రూం కూడా ఇంట్లోనే ఉందికదా. ఇల్లంతా అలంకరించినపుడు బాత్రూం ఎందుకు అలంకరించ గూడదు!”
నిజమే కదా అనుకుంది. ‘రఘు ఉంటే ఇంకా ఎన్నో చెప్పేవాడు’ నిట్టూర్చింది. రఘు, అరుణ ఒకసారి డిల్లీ ట్రిప్ వెళ్ళినపుడు వెళ్ళిన ప్రతి చోటల్లా దానికి సంబధించిన చరిత్ర అరుణకు చెప్పేవాడు. రఘు పక్కనుంటే బావుండునని అరుణ మనసు తల్లడిల్లింది.
మరునాడు స్నానానికి ముందుగా సరిత వచ్చి వేడి నీళ్ళు , చన్నీళ్ళు షోవర్ లో తుంపరలు, పెద్ద చినుకులు, చిన్న చినుకులు, పెద్ద వాన, వరద అన్నీ అందులో ఎలా సెట్ చేసుకోవాలో చూపించి,
“మాం! నేను ఈ పక్కనే ఉంటాను. ఏదైనా కావాలంటే పిలవండి.”
“సరితా! నీ పని చూసుకో. నాకేం ఫర్వాలేదులే.” పైకి అందే కానీ మనసులో మాత్రం నా స్నానం అయ్యేవరకు ఇక్కడే ఉండమ్మా అనుకుంది అరుణ. షావర్ లోంచి వాన తుంపరలు పడ్తున్నై. చిన్న పిల్ల వానలో తడుస్తున్న భావన కలిగింది అరుణకు.
మొదటి వారం అంతా అఖిల్ ఇంటినుండే పనిచేసాడు. ఒకరి తర్వాత ఒకరు సెలవు తీసుకొని కొన్ని రోజుల పాటు అరుణకు అలవాటు అయ్యేవరకు తోడు ఉన్నారు. వాళ్ళ రోజంతా ఉద్యోగాల దగ్గిరే గడిచి పోతుంది. సరిత మొదటి రెండు రెండు రోజులు ఇంటినుండే పని చేసింది. కొడుకు, కోడలిని చూసి అరుణ సంబరపడింది.
“నన్నొదిలి నువ్వు తొందరగా వెళ్లి పోయావు రఘూ. వీళ్ళిద్దరినీ ఇలా చుస్తే ఎంత సంతోషించేవాడివో.” బరువుగా కన్నీళ్ళు రాలాయి.
సరిత వంట చేస్తూంటే అరుణ ఆ పక్కనే ఉండి “నేను కట్ చేస్తాను ఆ ఉల్లిపాయ ఇలా ఇవ్వు”
“మాం! మీరు రెస్టు తీసుకోండి. కొంచెం అలవాటయ్యాక చేద్దురు.” ఎంత చక్కగా మాం అని పిలు స్తుంది. అఖిల్ పిలుస్తుంటే తనకు పిలవాలనిపిస్తుందేమో. తను కూడా నా బిడ్దేకదా! మనసు తేలికగా అనిపించింది.
ఓ వారం తర్వాత అరుణ పరిసరాలకు చాలా వరకు అలవాటు పడింది. రఘు గుర్తు వచ్చినపుడు మాత్రం రూములో కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. ఇండియాకు ఫోన్ చేసి లక్ష్మితో ప్రతీది వివరించేది. దాంతో మనసు కాస్త తేలికగా అనిపించేది. ఫోన్ చేసి స్నేహితుల బాగోగులు పేరు పేరునా ఒక్కొక్కరి గురించి మాట్లాడేది.
అరుణ వంటింట్లో అన్నీ ఎక్కడ ఏముంటాయో తెలుసుకుంది. ఐపాడ్ ఎలా వాడాలో చూపించాడు అఖిల్. పాటలు ఎలా పెట్టుకోవాలి, టివి ఎలా చూడాలి తెలుసుకుంది అరుణ. ప్రతి దానికి అరడజను బటన్లు, ఆ టీవి చుట్టూ వల అల్లినట్టుగా అన్ని వైర్లే. నెమ్మదిగా అన్నీ వాడడం నేర్చుకుంది. అరుణకు ఇష్టమని రీడర్స్ డైజెస్ట్, ఉమెన్స్ డే, మార్తా స్తువార్డ్ మేగజీన్ లు తెప్పిస్తున్నారు. ఇండియాలో తెలుగు నవలలు, మేగజీన్స్ లో కథలు చదివేది. ఇండియాలో ఉన్నప్పుడు ఇంగ్లీషు చదవడం తక్కువే ఇప్పుడు అవి కూడా చదివి కొత్త విషయాలు తెలుసుకోవచ్చని మంచి కాల క్షేపం అనుకుని మురిసి పోయింది. లక్ష్మీ కూడా ఫోనులో అదే అంది.
సరిత వంట చేయడం తక్కువే. నాలుగు మైళ్ళ దూరంలో ఒక తెలుగావిడ వంట చేస్తుందిట, ఆవిడ దగ్గరే తెచ్చుకుంటారు. ఆవిడ వంటల్లో నూనె కుమ్మరించకుండా, రుచికోసం మసాలాలు దిమ్మరించకుండా మనం ఇంట్లో చేసుకున్నట్టే వండుతుందని చాలా మంది కొనుక్కుంటారట. హోటల్లో కంటే నయం అని అఖిల్ అంటాడు. ఫ్రిజ్ లో అన్నీ ఆవిడ వండినవే ఉన్నాయి.
“నేనుండగా బయటి నుండి ఫుడ్ తేవద్దు.” తల్లి మాటలకు ఇద్దరూ తలాడించారు.
సరిత వంట చేస్తున్నపుడు అఖిల్ టీవి చూడ్డమో, ఫోనులోనో ఉండేవాడు. సరితకు కాస్త హెల్ప్ చేస్తాను అంటూ లేచిన తల్లితో,
“మాం! రోజూ ఇద్దరికి ఏం వంటలే అని తెచ్చుకుంటాం కాని అవి తిని విసుగొచ్చినపుడు రీటా వంట చేస్తుంది. చాల ఫాస్ట్ గా వంట చేస్తుంది.”
“ఇంటికొచ్చేసరికే చాల ఆలస్యమవుతుంది. అప్పుడు వంట చేసే ఒపిక ఉంటుందా!”
“మాం! సరిత అన్నీ మానేజ్ చేసుకోగలదు. ఇంట్లోనే కాదు ఫైనాన్స్ కూడా చూసుకోగలదు.”
“అన్ని పనులు వచ్చి ఉంటే మంచిదే.” అలోచించి పని లోకి దిగింది అత్తగారు అరుణ.
సరిత జాబులో చాల బిజీగా ఉన్నా, అలసి పోయినా దారిలో హోటల్ లోంచి డిన్నరు తెచ్చుకోవడం బాగా అలవాటు. అరుణ అది పూర్తిగా మానిపించేసింది. అలా అని సరదాగా తినడానికి ఆపదు. పైగా తనే ఎంజాయ్ చేయడానికి వెళ్ళమంటుంది.
అఖిల్ ఇంట్లో పని చేస్తూ బ్రేక్ తీసుకున్నప్పుడు అరుణ మాట్లాడిస్తూ చిన్న చిన్న పనులు- కూరలు కట్ చేయడం- లాంటివి చేయించింది. అలవాటు లేక ఇబ్బంది పడ్తున్న అఖిల్ ను చూసి మనసులో బాధ కలిగినా పైకి ఎమీ అనలేదు. చిన్నప్పుడే పనులు చేయడం అలవాటు చేస్తే ఇప్పుడు సులభంగా ఉండేది. మన సంఘంలో మగవాళ్ళు వంటింటి పనులు చేస్తే చిన్నతనమని ఒక స్టిగ్మా ఉంది. అరుణ కొడుకుని చాల గారాబంతో ఏ పని ముట్టుకోనివ్వలేదు. గడిచి పోయిన వాటిని జడ్జ్ మెంటు కోటాలో పెట్టి వగచే కంటే ప్రస్తుతంలో మార్పు ఎలా ప్రవేశ పెట్టాలో చూడాలి. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నపుడు ఇద్దరికి పని వచ్చి ఉంటే వాళ్ళకే సుఖం. వీకెండుకు తల్లి, కొడుకు కలిసి వంట చేస్తూంటే సరిత ఇబ్బందిగా అఖిల్ ను పక్కకు జరగమని తాను సాయం చేసేది.
“అఖిల్ ను నేర్చుకోనివ్వు సరితా. మగవాడయినంత మాత్రాన వంట నేర్చుకోగూడదని ఎక్కడుంది.”
సరితకు మొదట్లో ఇబ్బందిగా ఉండేది. తన తల్లి అలా అంటే అర్థం చేసుకోగలదు కానీ అఖిల్ తల్లి…నెమ్మదిగా అరుణ మనసు తెలుసుకున్న సరిత చాల సంతోషించింది.
రెండు నెలలు గడిచి పోయాయి. అఖిల్ ఇంట్లో ఉన్నప్పుడు అరుణ పని చేస్తూంటే ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటాడు. అలా చేస్తుంటే అరుణకు గర్వంగా ఉంది. వీకెండ్ డిన్నర్ పార్టీలకు అరుణ కూడా వెళ్తోంది. అక్కడ కొంత మంది పేరెంట్సు, ఇన్లాస్ కలిసారు.
“మాం! వినుత ఇన్లాస్, రజిత పేరెంట్సు, మాలిని మదర్ మన వీధిలోనే ఉంటారు. మీరు మధ్యాహ్నం కలుసుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం మనం వాకింగ్ కు వెళ్లి వాళ్ళను కలుద్దాం. నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. వాళ్ళందరికీ వీలయితే రేపు లంచ్ కు కలుసుకోవచ్చు. ఏమంటారు?” సరే అంది అరుణ.
సరిత ఫోన్ చేసి సాయంత్రం వాకింగ్ ప్రోగ్రాం చేసింది. మరునాడు పెద్దవాళ్ళంతా లంచ్ కు కలుసుకున్నారు. అందరూ వయస్సులో, పద్ధతులలోను, భాషలోను వేరైనా వచ్చింది మాత్రం గ్రాండ్ కిడ్స్ కోసమే. ఆ తర్వాత ఒకరితో ఒకరు తరుచుగా ఫోన్ లో మాట్లాడుకున్నారు. బయట ఎండగా ఉంటే చాల బావుంది అంటూ బ్రేక్ ఫాస్ట్ తిని అందరూ కాసేపు వాకింగ్ కేళతారు. నెలకొకసారి పాట్ లక్ పెట్టుకుని కలుసుకుంటారు. అఖిల్ వంట చేయడం నేర్చుకుంటున్నాడని అరుణ చెప్పగానే విని తోటివారంతా మొహం తేలేసారు. అమెరికా వచ్చి కొడుక్కు వంట నేర్పుతున్నావా! అని ముక్కు మీద వేలేసుకున్నంత పన్జేసారు.
“అందులో తప్పేముంది. నేను చిన్నప్పుడే నేర్పాల్సింది. కనీసం ఇప్పుడైనా నేర్చుకుంటున్నాడు. వంటే కాదు ఇంట్లో ఏ పనైనా సాయం చేస్తున్నాడు. రోజూ బయటినుండి ఫుడ్ తెచ్చుకుని తినేకంటే ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ రోజుల్లో ఆడవాళ్ళ పనులు, మగవాళ్ళ పనులు అని కేటాయించి లేవుగా. అన్ని పనులు కలిసి చేసుకుంటే సుఖం. ఇండియాలో కంటే ఇక్కడ మగవాళ్ళు పని చేయడం కాస్త సులభంగా అనిపిస్తుంది. సరిత జాబ్ లో బిజీగా ఉంటే గ్రాసరీ స్టోర్ కెళ్ళి మొన్న కూరగాయలు, పళ్ళు తెచ్చాడు. పళ్ళు ఫర్వాలేదు గాని కూరగాయలు ఇంకా సరిగ్గా చూసి తేవడం తెలీదు. ఒకసారి వెంట వెళ్లి చూపించాలి.” అరుణ మాటలు అందరికి నచ్చలేదు.
“ఎలా ఒప్పించావు? ఆ కిటుకేదో మాకు చెప్పు. రజిత అటు ఉద్యోగం ఇటు ఇంట్లో పని చేయలేక ఇద్దరు ఎప్పుడూ కస్సర బిస్సర అనుకుంటూనే ఉంటారు. నేను నెమ్మదిగా చేస్తానని నన్ను వద్దంటుంది.”
అరుణ నవ్వుతూ “మనం సరదాగా మాట్లాడుతూ మనం చేస్తూ వాళ్ళను పనుల్లోకి దించాలి” అని నవ్వుతూ చెప్పింది. కొందరు ఉత్సాహంగా చూద్దాం మనమెంత చేయించగలమో అని సవాల్ చేసుకుంటూ వెళ్ళారు.
అరుణకు టైం ఇట్టే గడిచి పోతోంది. మేగజీన్లు, టీవి, ఫ్రెండ్స్, ఇంట్లో ఏదో ఒక పనిచేస్తూ తోచని రోజంటూ లేదు. అరుణ తన దినచర్య లక్ష్మికి చెప్పగానే,
“నిజంగానే అమెరికం వెళ్లి పోయావు అరుణా. సరిత మంచి అమ్మాయి లాగుంది.”
“వాళ్ళిద్దరూ నా బిడ్డలే కదా వదిన. కొడుకు సంతోషంగా ఉండాలంటే కోడలు సంతోషంగా ఉండాలి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. రఘు ఉంటే చూసి ఎంత సంతోషించేవాడో!”
“నిజమే రఘు మురిసేవాడు. నీ మనసు మంచిది అరుణ. మనసులో మంచి ఆలోచనలు ఉంటే నోటి వెంట చెడ్డ మాటలు రానేరావు. ఎదుటి వారిలో కూడా మార్పు వస్తుంది. అదే మన జీవిత రహస్యం. తెలుసుకుంటే భూలోకంలోనే స్వర్గం కనిపిస్తుంది. అఖిల్ వంట ఎంత వరకు వచ్చింది?”
“సరిత బిజీగా ఉన్న రోజు అఖిల్ ఇంటికి రాగానే ‘ఇవ్వాళ్ళ డిన్నరుకు ఏం చేసుకుందాం మాం?” అంటాడు. మొన్న ఒకరోజు బటర్ చికెన్, చిక్ పీస్, రైతా, పులావ్ చేసి సరితకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. నన్ను కూచోబెట్టి ఒక్కడే అన్నీచేసాడు, చాల రుచిగా ఉన్నాయి. నేను ఇండియా వచ్చినా బయటి ఫుడ్ రోజూ తినకుండా మేనేజ్ చేసుకోగలరు. ఇప్పుడు బయట ఫుడ్ తెచ్చుకుని తినడం చాలా తగ్గిపోయింది. ఇంట్లో సరితకు కూడా పనుల్లో సహాయం చేస్తున్నాడు. నాకు గర్వంగా ఉంది. నువ్వు వచ్చినపుడు చూద్దువు గాని. ఎప్పుడు వస్తున్నావు వదినా!”
“పిల్లలకు వేసవి సెలవులు ఉన్నపుడు వస్తే పిల్లలను చూసుకోవచ్చు. అరుణా! నీ ఐడియా చాల మంచిది. మేమెవ్వరము ఆలోచించనిది నువ్వు అమలులో పెట్టావు. ఇండియాలో కూడా అందరం మగ, ఆడ తేడా లేకుండా అన్ని పనులు చేసుకుంటే బావుంటుంది. నేను నెమ్మదిగా పవన్ మీద ప్రయోగం చేస్తాను. వంటే కాదు ఇంటి పనుల్లో చేయూత నివ్వడం మంచిదే. అయినా ఆ పాత ఆలోచనలు పక్కన పెట్టి ఉత్సాహంతో మార్పులు చేసు కుంటూ ముందుకు కదలాలి.” ఉత్తేజంగా అంది లక్ష్మీ.
మన పధ్ధతి మనమే మార్చుకోవాలి. మనసులు మారితే మనుషులు మారుతారు. మనం మారాలి, మనతో బాటు పురుషులను కూడా మన వెంట ముందుకు తీసికేళ్ళాలి. తరతరాలుగా ఉన్న అనవాయితీని మార్చడం ఒక్క రోజులో కాదు, ఒక్కరితో కాదు. వంటింట్లోనే కాదు ప్రతి పనిలో ఇద్దరి చేతులు కలిసి ఉంటేనే జీవితం బాలెన్స్ అవుతుంది. మనస్పర్థలకు అవకాశ ముండదు. చదువు, ఉద్యోగాలు ఒక్క ధనాభి వృద్దికే కాదు, సామరస్యంతో మనో వికాసానికి, బంధుత్వ అభివృద్ధిని పెంపొందించి నపుడే పురోగతి అనిపించు కుంటుంది.

***** సమాప్తం *****

‘తల్లి ప్రేమమయి, గొప్పది అంటారు. నిజమే. కానీ భార్య కూడా గొప్పది. భార్య కూడా ప్రేమ మయి. భార్యకు పనుల్లో సహాయం చేసే మగవారు ఎంతమంది! ఎంతమంది తల్లులు కొడుకులకు
ఇంటి పని, వంట పని నేర్పిస్తున్నారు? భార్యకు పనుల్లో సహాయం చేయడం తప్పుకాదు అని

ఎంతమంది తల్లి, తండ్రి నేర్పిస్తున్నారు.’ అని ఒక సవాల్ సంఘంలోకి విసిరారు మమత రఘువీర్
గారు, ఒక సంఘ సేవికురాలు, స్త్రీ సహాయాభి వృద్ధికై కంకణం కట్టుకున్న మహిళ
“వసుంధర పురస్కారం” అవార్డ్ గ్రహీత. ఆమెకు నా అభివందనాలు.
మన వేష భాషలోనే కాదు, మన ఆలోచనల్లో, మన చేతలలో మార్పు రావడమే ఆమెకు జవాబు.

******************

ఆత్మీయ బంధాలు

రచన: కె. మీరాబాయి

పసుపు రాసిన గడపలు, గుమ్మాలకు మామిడి తోరణాలు, ఇంటి ముందు పచ్చని కొబ్బరి ఆకుల పందిరి అమరేసరికి ఇంటికి పెళ్ళికళ వచ్చేసింది. పెళ్ళి జరిగేది కల్యాణ మండపంలోనే అయినా ఇంటి ముందు పందిరి , రంగవల్లులు వుంటేనే అందం శుభకరం.
పెళ్ళికి నాలుగు రోజుల ముందే రమ్యని పెళ్ళికూతుర్ని చేసారు. ఆ రోజు ఉదయాన్నే రమ్యను, రమ్య అమ్మ నీరజను, నాన్న శ్రీనివాస్ ని పీటలమీద కూర్చోబెట్టి నుదుట , కుంకుమ పెట్టి, హారతి ఇచ్చి , వాళ్ళు తలంటి పోసుకోవడానికి తలకు నూనె పెట్టింది నీరజ వాళ్ళ చిన్నక్క కమల. సున్నం పసుపు నీళ్ళలో కలిపి ఆ ఎర్ర నీళ్ళతో వాళ్ళకు ద్రిష్టి తీసింది నీరజ ఆడపడుచు. తోడికోడళ్ళు, బావగార్లు, భర్త పిల్లలతో బాటు వచ్చిన ఆడబడుచులు ఇంటి నిండా బంధువులు కల కలలాడుతూ తిరుగుతున్నా నీరజ మనసులో మాత్రం వెలితి గానే వుంది. ఆందుకు కారణం అమ్మ లాటి అక్క పార్వతి రాక పోవడం.
ఒకవేళ నిజంగానే ఆమె రాక పోతే అత్తవారింటి వారి ముందు చులకన కాకూడదని పార్వతి తరఫున చదివించడానికి మంచి ఖరీదైన పట్టు చీర , జరీ పంచల చాపు తెప్పించి పెట్టింది నీరజ.
బరువుగా నిట్టూర్చింది నీరజ. అమ్మ మనసులో రేగుతున్న అలజడి అర్థం చేసుకున్న పెళ్ళికూతురు రమ్య అమ్మ చేయి సున్నితంగా నొక్కింది . ‘దిగులు పడకు వస్తుందిలే అన్నట్టు. . ‘
ఆడవాళ్లు అలంకరణ ముగించేసరికి పురోహితుడు రానే వచ్చాడు. ఆయన వెనకాలే మేళగాళ్ళు వచ్చేసారు. ” శ్రీ గణపతిని సేవింపరారే “అంటూ సౌరాస్ట్ర రాగంలో కీర్తనతో పది నిముషాలలో మంగళ వాద్యాలు మొదలయ్యాయి. సన్నాయి, మృదంగం డొలు వంటి వాద్యగోష్టి హోరులో పెళ్ళి ఇంట్లో ఒకరి మాటలు మరొకరికి వినబడడం లేదు.
” కార్యక్రమం మొదలు పెట్టాలి . పెళ్ళికుమార్తె, తల్లి, తండ్రి వచ్చి పీటలమీద కుర్చోండమ్మ “అంటూ హడావిడి చేస్తున్నాడు పురోహితుడు.
“వస్తున్నాము” అన్నట్టు సైగ చేసి ఆశ వదులుకోలేక వీధి గుమ్మంలోకి వచ్చింది నీరజ. అక్క వచ్చే జాడ కనబడుతుందేమో అని చూస్తూ. నిరాశగా వెనక్కి వస్తూ ఎదో తోచినట్టు ఫోనులో పార్వతి నంబరు నొక్కింది. “రారా మా ఇంటిదాకా రఘువీర సుకుమార ” అంటూ అసావేరి రాగంలో వాయిస్తున్న భజంత్రీల ముందు వుంచింది ఫోను.
ఈ సందడి విని అయినా అక్క మనసు కరగకపోతుందా ఆన్న ఆలోచనతో నీరజ కళ్ళు చెమరించాయి.
అటువైపు ఫోనులో ఆ మంగళ నాదాలు వినగానే పార్వతి గుండె నీరయిపోయింది. ముప్ఫై ఏళ్ళ క్రిందట తన చేతులతో స్వయంగా పెళ్ళికూతురుగా అలంకరించిన నీరజ ముద్దు మొగం మనసులో మెదిలింది. ఫోను పక్కన పేట్టి అలా కూర్చుండిపోయింది. ఆడపిల్లలు లేని పార్వతి తోడబుట్టిన చెళ్లెళ్ళను కడుపున పుట్టిన కూతుళ్ళలా చూసుకుంది. ఆమ్మ పోయాక తనే వాళ్ళకు అమ్మ అయ్యింది. ఏ సమస్య వచ్చినా తండ్రికంటే ముందు ఆమెకే చెప్పుకునేవారు కమల, నీరజ .
ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణ అర్థం అయినట్టు పార్వతి తల మీద చేయి వేసి నిమిరాడు ఆమె భర్త సారధి.
“వాళ్ళంటే ప్రాణం పెడ్తావు. ఈ పంతాలు పట్టింపులు ఎందుకు?” లాలనగా అన్నాడు సారథి.
“వాళ్ళు నన్ను అవమానిస్తే నేను పట్టించుకుని వుండేదాన్ని కాదండీ ! మా వాళ్ళకు ఎంత చేసారు మీరు? అదంతా మరచిపోయి ఎంతమాట అన్నారు మిమ్మల్ని? ”
తండ్రి దక్ష ప్రజాపతి ఆయన తలపెట్టిన యాగానికి తనను పిలవక పోయినా సహించిన శచీదేవి శంకరుడిని తండ్రి అవమానిస్తే తట్టుకోలేక పోయినట్టు సారథిని వాళ్ళు ఆన్న మాట పార్వతి గుండెకు చేసిన గాయం ఇంకా మానలేదు.
గణపతి పూజ అయ్యాక ముత్తైదువలతో పందిరి పూజ చేయించాడు పురోహితుడు.
కొబ్బరి ఆకులు చుట్టిన పందిరి గుంజలకు పూలు చుట్టి, పసుపు కుంకుమలు పెట్టి అన్ని శుభంగా జరగాలని మొక్కుకుంటున్న నీరజ కళ్ళు ఎవరి రాక కోసమో ఎదురుచూస్తున్నట్టు మాటికి ప్రహరీ గుమ్మం వైపు చూస్తున్నాయి.
తన పిచ్చి గానీ పెద్దక్క పార్వతి పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఈ పెళ్ళికి వస్తుందనే? నిరాశ తొంగి చూసింది నీరజ మనసులో.
మూడేళ్ళ్ల క్రిందట పెద్ద కూతురు పెళ్ళిలో అంతటా ఆమే అయి తిరుగుతూ, పెళ్ళి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది పార్వతి.
“అక్కా ! ఇద్దరు ఆడపిల్లల పెళ్ళి ఎలా చేస్తానో ఏమో. ఆసలే నాకు ఆ పద్ధతులు, శాస్త్రాలు అంతగా తెలియవు. ” అని నీరజ దిగులు పడినప్పుడు వెంటనే ధైర్యం చెప్పింది పార్వతి “పక్కన నేను వుంటాను కదే అన్నీ నేను చూసుకుంటాను . నీకెందుకు చింత? ” అంటూ చెల్లెలికి భరోసా ఇచ్చింది .
ఇచ్చిన మాట ప్రకారం నీరజ పెద్ద కూతురు రాధిక పెళ్ళికి వారం ముందే వచ్చిన పార్వతి అన్ని బాధ్యతలు మీద వేసుకుని జరిపించింది.
నిజానికి పార్వతి వాళ్ళ అమ్మ పోయాక ఇద్దరు చెళ్ళెళ్ళు, తమ్ముడు బరువు బాధ్యతలు తన భుజాల మీద వేసుకుని కమల , నీరజ , రఘుల చదువులు , పెళ్ళిళ్ళు అన్నిటిలోనూ తండ్రికి చేదోడు వాదోడుగా నిలబడింది పార్వతి. ఇవన్నీ పార్వతి చేయగలిగింది అంటే అది ఆమె భర్త సారధి సహకారం వలననే. ఆ తరువాత కూడా కమల, నీరజలకు పురుళ్ళు పుణ్యాలు అన్నిటికీ పార్వతి ముందు వుంది. తండ్రిని చివరి రోజులలో సారధి సహకారంతో తన దగ్గరే పెట్టుకుని ఆలనా పాలనా చూసుకుంది పార్వతి.
బుగ్గన చుక్క , నుదుట కల్యాణ తిలకం, పూలజడతో మెరిసిపోతూ పెళ్ళికూతురు రమ్య వచ్చి పీటల మీద కూర్చుంది. కలశ పూజ, ఇంటి దేవుడి పూజ అయ్యాక పీటల మీద కూర్చున్న వారికి బట్టలు చదివించే కార్యక్రమం మొదలు అయ్యింది. ముందు నీరజ తమ్ముడు రఘు పుట్టింటి వారి తరఫున అక్క బావలకు, రమ్యకు కొత్త బట్టలు చదివించాడు. నీరజ కనుసన్నతో చిన్నక్క కమల లోపలికి వెళ్ళి నీరజ కొనివుంచిన చీర , పంచలు తీసుకు వచ్చి పురోహితుడికి అందించింది.
“పెళ్ళికుమార్తె పెద్దమ్మ పార్వతి, పెద్దనాన్న సారధి ఆశీర్వదించించి చదివిస్తున్న పట్టు వస్త్రాలు అంటూ ఆ పళ్ళెం నీరజ, రమ్య ల చేతికి అందించాడు. శ్రీనివాస్ భార్య వైపు మెచ్చుకుంటున్నట్టు చూసాడు. మిగతా దగ్గరి వాళ్ళ చదివింపులు అయ్యాక వధువును, ఆమె తలితండ్రులను కొత్త వస్త్రాలను ధరించి రమ్మన్నాడు పంతులు గారు
“అదేమిటి అన్ని శుభకార్యాలకు ముందు వుండే మీ పెద్దక్క పార్వతి ఇంకా రాలేదు? నీరజ భయపడుతున్నట్టుగానే ప్రశ్నించింది పెద్ద తోడికోడలు.”
“కొంచం నలతగా వున్నదట . ఎదురుకోళ్ళ సమయానికి వచ్చేస్తుంది.” గొంతులో జీర కనబడకుండా జాగ్రత్త పడుతూ సమాధానం చెప్పింది నీరజ.
మధ్యాన్నం భోజనాలకు ముందు ఆ రోజు వండిన తీపి పదార్థం పూర్ణం పోళీలలో ఒకటి పందిరి మీద వేయించాడు పంతులు గారు . పదహారు రోజుల పండుగ తరువాత పందిరి తీసే రోజున అలాగే చేయమని సూచించాడు.
పైకి అందరితో నవ్వుతూ కబుర్లు చెబుతూ హడావిడిగా తిరిగేస్తున్నా నీరజ మనసు ఆలోచిస్తూనే వుంది. పెద్ద కూతురు రాధిక పెళ్ళిలో జరిగిన సంగతులు మెదులుతున్నాయి.
ముహూర్తం ముందురోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
*****
శుభ ముహూర్తం తెల్లవారు ఝామునే వుండడం వలన ముందురోజు సాయంత్రం ఎదురుకోలు సంబరం ముగిసాక రాత్రి ఎనిమిది గంటలనుండి రిసెప్షన్ ఏర్పాటు చేసారు. రిసెప్షన్ కు అనుకున్న దానికన్న ఎక్కువ మంది రావడం జరిగింది. తీరా మగ పెళ్ళివాళ్ళు భోజనాలకి వచ్చేసరికి కూరలు తక్కువ పడ్డాయి. మారు వడ్డించలేదని పెళ్ళివారు అనడంతో నీరజ బావగారు , పార్వతి భర్త అయిన సారధి కేటరింగ్ చేసిన వంటవాళ్ళ మీద కోపం చూపించాడు. దానితో వంట వాళ్ళు సహాయ నిరాకరణ మొదలు పెట్టి కూర్చుండి పోయారు
రసాభాసం కాకూడదని ఆడపెళ్ళి వాళ్ళు వియ్యంకులకు సర్ది చెపుతూ తామే వడ్దనకు దిగారు.
పార్వతి, ఆమె భర్త సారధి వంటవాళ్ళను శాంతింప చేసారు. . ఇంతలోనే బంధువులలో ఒకరు మాట తూలారు ” ఎంతయినా ఆడ పెళ్ళివారు కదా ఆ సారధి కాస్త అణిగి వుండక అంత దురుసుగా నోరు పారేసుకోవడం దేనికి? కొంచం వుంటే గొడవైపోయి పెళ్ళి అభాసు పాలయ్యేది. ” అని.
“మా బావగారికి కొంచం కోపం ఎక్కువ. కాస్త శాంతంగ వుండాల్సింది ” అంది నీరజ. ఆ మాట పార్వతి చెవినబడింది.
“మా ఆయన నడ్డి విరిగేట్టు చాకిరీ చేసింది ఎవరికీ కనబడలేదుగానీ వంటవాళ్ళను కోప్పడినందుకు ఆయన గారిని ఆడి పోసుకుంటున్నారు. ఆసలు ఈ పెళ్ళికి వచ్చి తప్పు చేసాము. ఇంకోసారి నీ గుమ్మం తొక్కితే ఒట్టే” అనేసి రాత్రికి అభొజనంగా వుండిపోయింది.
మరుచటి రోజు పెళ్ళి సలక్షణంగా జరిగింది. భోజనాలు అయ్యాక సంప్రదాయం ప్రకారం అమ్మాయిని అప్పగింతలు పెట్టడం , రాత్రికి శోభనం అన్నీ నిర్విఘ్నంగా పూర్తి అయ్యాయి.
నీరజతో మాట్లాడకండానే ఏ విషయంలోనూ లోటు రాకండా చూసుకుంది పార్వతి.
వాళ్ళు బయలుదేరేటప్పుడు సారధికి , పార్వతికి బట్టలు పెట్టి కాళ్ళకు నమస్కరించారు నీరజ, శ్రీనివాస్ . ” తెలియక మీ మనసు కష్టపెట్టి వుంటే క్షమించండి” అంది నీరజ. మౌనంగా వెళ్ళి బండి ఎక్కింది పార్వతి.
ఆంతే ఈ మూడేళ్ళుగా ఒక్క సారి కూడా ఫోనులొ పలుకలేదు పార్వతి.
రమ్య పెళ్ళి అనుకోకుండా పదిహేను రోజుల్లో పెట్టుకోవలసి వచ్చింది. పత్రిక పంపించి ఫోనులో ఆప్యాయంగా ఆహ్వానించింది నీరజ . వినడం తప్ప అటునుండి మౌనమే సమాధానం.
నీరజ భయపడినట్టే రమ్యను పెళ్ళికూతుర్ని చేసే రోజుకు కూడా రాలేదు పార్వతి.
” అమ్మా ! నేను , మీ అల్లుడు శ్రీశైలం వెళ్ళి వస్తాము” అని ప్రయాణమయ్యింది నీరజ పెద్దకూతురు రాధిక. ఎల్లుండి పెళ్ళి వారొస్తున్నారు. ఇప్పుడెందుకే? అన్న అమ్మ మాటకు “ఒక్క రోజులో రామూ?” అనేసి వెళ్ళింది.
అన్నట్టుగానే మరుసటి రోజు వచ్చేసింది రాధిక . వెళ్ళిన ఇద్దరు మరో నలుగురిని తీసుకు వచ్చారు.
పార్వతి, సారథి, వాళ్ళ కొడుకు కోడలు కూడా రావడం చూసి నీరజకు ఆనందంతో నోట మాట రాలేదు.
“అక్కా! నువ్వూ వచ్చేసావు ఇది చాలు అక్కా నాకు. “అంటూ అక్కని కౌగలించుకుంది నీరజ.
“రాకుండా ఎలా వుంటానే పిచ్చిదానా? ఏదో మాట మాటా అనుకున్నంత మాత్రాన ఆత్మీయ బంధాలు తెగిపోతాయా? నువ్వలా చూస్తు వుండు అన్నీ నేను చూసుకుంటాను. ఇంతకీ నా చిన్న కూతురు అదే పెళ్ళికూతురు ఏదీ? ఆంటూ లోపలికి నడిచింది పార్వతి.
తల్లికి శ్రీశైలం వెళ్తున్నట్టు చెప్పి విజయవాడలో పెద్దమ్మ పార్వతి ఇంటికి వెళ్ళింది రాధిక. హటాత్తుగా వచ్చిన రాధికను చూసి ఆశ్చర్య పోయింది పార్వతి.
“పెద్దమ్మా , పెద్ద నాన్నా మీరిద్దరూ దగ్గర వుండి నా పెళ్ళి జరిపించారు. మొత్తం బాధ్యత మీరిద్దరే మోసారు అని అమ్మ నాన్నా ఈ రోజుకూ తలచుకుంటారు. మీరు రాకపోతే అమ్మకు రమ్య పెళ్ళి ఆన్న సంతోషమే లేదు. మా అమ్మగానీ నాన్నగానీ మీ మనసు కష్టపెట్టి వుంటే చిన్నవాళ్ళు అని క్షమించేయండి. మీరు నాతో రాకపోతే మేమిద్దరం కూడా వెళ్ళము. ఇక్కడే వుండిపోతాము” చిన్న పిల్లలాగా పార్వతిని రెండుచేతులతో చుట్టేసి అన్నది. రాధిక. కరిగిపోయింది పార్వతి.
ఆప్యాయంగా సారథి భుజం మీద చేయి వేసి లోపలికి నడిపించాడు శ్రీనివాస్ .
ఆత్మీయ బంధాలు అల్లుకున్న పెళ్ళి వారిల్లు మరింత శోభను సంతరించుకుని కళ కళ లాడింది .

శుభం

ఖజానా

రచన : సోమ సుధేష్ణ

రాత్రి నిద్రలో వచ్చిన కలల తాలూకు ఛాయలు ఉమ మోహంలో నీలి నీడల్లా కదులు తున్నాయి. ఆ నీడలను దులి పెయ్యాలని ఉమ కాఫీ కలుపుకుంది. కూతురికి లంచ్ బాక్స్ తీయాలని ఫ్రిజ్ డోర్ తీయబోయి అలవాటుగా డోర్ పై పెట్టిన ‘ఈ రోజు చేయాల్సిన పనుల’ లిస్టు చూసింది. సరసి డాన్స్ క్లాసు ఐదింటికి, వచ్చే దారిలో కొనాల్సినవి- పాలు, ఆరెంజ్ జ్యూస్, లంచ్ స్నాక్, డ్రై క్లీనర్స్ దగ్గర సూట్ పికప్ – అని ఉంది. అదే కేలెండర్ లో ఫిబ్రవరి 11th నాడు గుండె ఆకారం వేసి ఉంది. కేలెండర్ లో చిన్నగా ఉన్న ఆ సంఖ్య పెద్దదై ఉమ గుండెల్లో గునపంలా గుచ్చుకుంది. ఎనిమిదేళ్ళ క్రితం అదే రోజు నాడు…బాధ శూలంలా దూసుకు వచ్చింది. మనసులో వెలితిగా తోచి, చిన్న పిల్లలా ఒంటరితనం ఫీలయింది. నాన్నగారికంటే రెండేళ్ళ ముందే తల్లి శరీరాన్ని వదిలింది. తండ్రి కూడా ఇక లేడు అనుకుంటే ఆనాధలా అనిపించింది ఉమకు. ఇండియాకు తనకు బంధం తీరి పోయింది. ఆ ఆలోచనకే ఊపిరి అడలేదు.
“ఏమిటలా ఉన్నావ్?” కాఫీ మగ్ లోకి కాఫీ నింపుకుంటున్న సతీష్.
టోస్టర్ అవెన్ లోంచి మఫ్ఫిన్ తీసి స్ట్రాబెర్రి జాం రాసి ప్లేటులో పెట్టి అతనికిచ్చింది.
“షర్ట్ మీద క్రంబ్స్ పడుతున్నాయి.” తింటున్న సతీష్ కు నేప్ కిన్ అందిచ్చింది.
“ఎందుకలా ఉన్నావు చెప్పలేదు.”
“వచ్చేప్పుడు డ్రైక్లీనర్స్ లో మీ సూటు పికప్ చేయండి.” ఫ్రిజ్ పై మాగ్నెట్ కు అతుక్కున్న కాగితం తీసి అతని కందిచ్చింది.
“దీని కోసం అలా ఉన్నావా? పికప్ చేస్తాలే. నో ప్రాబ్లం. అదికాదులే నీ మోహంలో ఏదో కాస్త బాధ కదిలినట్టుగా అనిపిస్తోంది.” మాటల్లో ప్రేమ తోణికిసలాడింది.
“ఏదో కలల కలకలం.” బలవంతపు నవ్వు. అంతలోనే
“గుడ్ మార్నింగ్ లివింగ్ గాడ్స్!” గంపెడు బుక్స్ ఉన్న బేగ్ ను నేలమీద పెట్టి గబగబా వచ్చి తల్లి అందిస్తున్న పాలగ్లాసు, మఫ్ఫిన్ అందుకుని,
“థాంక్స్ మాతాజీ!” హడావుడిగా మఫ్ఫిన్ తింటూ పాలు తాగింది సరసి. ఉమ నవ్వింది.
“డాడ్! షర్ట్ పాకెట్ లో అలా పెన్ను పెట్టుకోకు బావుండదు. గ్రాండు పేరెంట్సు పెట్టుకుంటారు.”
సతీష్ షర్ట్ పాకెట్ లోంచి పెన్ను తీసేసింది.
“ఒక పెన్ను నా దగ్గర ఎప్పుడూ ఉండాలి అదిటివ్వు. నా బంగారు తల్లివి కదూ !”
“నా బంగారు తండ్రివి కదూ, షర్ట్ పేకేట్టులో పెట్టుకోనంటే ఇస్తాను. నీ బర్త్ డేకు అంత మంచి పెన్ సెట్ ప్రజెంట్ చెసాను, అది డ్రాయర్ లో పడేసి ఈ పిచ్చి పెన్ షర్ట్ పెకేట్టులో పెట్టు కుంటావు.” బుంగ మూతి పెట్టింది సరసి.
“నా ప్రేషేస్ ప్రిన్సెస్ వి కదూ, ఇటివ్వు.”
తండ్రి, కూతుర్ల మాటలను మందహాసంతో వింటూ అక్కడే నుంచున్నఉమకు ఖాళి మగ్ అందిచ్చి వెళ్లి బ్రీఫ్ కేసు అందుకున్నాడు.
“ఇది యక్కి పెన్” సరసి మొహం వికారంగా పెట్టింది.
“నువ్వు కూడా అందంగా ఉన్నావు.”నవ్వుతూ కూతురి చేతిలోని పెన్ లాక్కుని అలవాటు ప్రకారం షర్ట్ పేకెట్ లో పెట్టుకున్నాడు.
“ఈ సారి ఆ పెన్ తీసి పడేస్తాను నా ప్రేషస్ పాపడం.”
“కమాన్, లెట్స్ గో మిస్ ఇండియా.” హడావుడి చేసాడు.
“డాడ్ డ్రైవ్ చేస్తున్నపుడు పెద్దగా ఆర్గ్యుమెంటు పెట్టుకోకు. సతీష్ ఎవరైనా ఓవర్ టెక్ చేస్తే చిరాకు పడకు.” ప్రేమతో అప్పగింతలు పెట్టింది ఉమ. ఇద్దరు ఉమకు కిస్ తో బై చెప్పి బయల్దేరారు.
“ఐయాం రడీ పితాజీ. ఆ నర్డ్ ఇంకా అలాగే నన్ను చూసి నవ్వుతున్నాడు.”
సరసి డాడ్ తో ఏదైనా చెప్పగలదు. అ షర్ట్ వేసుకుంటే నర్డ్ లా ఉన్నావు, తల అలా కాదు ఇలా దువ్వుకుంటే హేన్ద్సం డాడ్ లా ఉంటావు. స్లీపోవర్ కు వద్దంటే ‘టిపికల్ కన్సర్వేటివ్ ఇండియన్ డాడ్ లా మాట్లాడుతున్నావు.’ అంటుంది. ఈ జీవితంలోంచి ఆ చనువు అందుకుంది సరసి.
కారు వైపు వెళ్ళుతున్న వాళ్ళ మాటలు తెరిచి ఉన్న కిటికీ లోంచి వినబడుతూనే ఉన్నాయి ఉమకు. కూతురిని స్కూల్లో డ్రాప్ చేసి అఫీసు కేల్తాడు సతీష్. కిటికిలోంచి వాళ్ళిద్దరిని అలా చూస్తూ సింక్ లో ఉన్న మురికి గిన్నెలు అన్ని డిష్ వాషర్ లో పెట్టి బెడ్ రూమ్ లో కెళ్ళింది. సతీష్ షర్ట్ ఐరన్ చేసి ఐరన్ ప్లగ్ తీసేయలేదు. ‘ఈ రోజు ఉదయం నుండే నేను పరధ్యానం పంతులమ్మను’ ఐరన్ ప్లగ్ ఊడలాగింది.
ఫ్రెష్ కాఫీతో వచ్చి బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆ పక్కనే ఉన్న ఫ్రిజ్ పై కాలెండర్ లోని 11th డేట్ ‘హలో’ అంది. ఉమ మనసులో దొర్లుతున్న అలనాటి ఆలోచనలను ఆహ్వానించింది.
‘నాన్నగారు ఏ వేళలో ఏం చేస్తారో ఇంట్లో అందరికి తెలుసు. ఉదయమే లేచి కాల కృత్యాలు పూర్తి చేసుకుని యోగ చేసి తర్వాత కాసేపు పేపరు చూసి స్నానం చేస్తారు. నేను, ఉదయ్ బ్రేక్ ఫాస్ట్ తింటున్నప్పుడు నాన్నగారు కూడా వచ్చి మాతోపాటు కలిసి తినేవారు. అమ్మ నాన్నగారి కోసం వెండి పళ్ళెం, నీళ్ళ గాజు గ్లాసు, కాఫీకప్పు విడిగా ఉంచేది. ప్రతి రోజు అందులోనే తినేవారు. మాకెందుకు వెండి పళ్ళెంలో పెట్టవు అని గునిసేదాన్ని. ‘నీ పెళ్ళిలో ఇస్తాను, ఆ తర్వాత నువ్వు అందులోనే తినొచ్చు.’ అమ్మ నవ్వింది. నాకిప్పుడే కావాలని ఒక రోజు మారాము చెసాను. పెళ్ళి చేసుకోకపోతే నాకు వెండిగిన్నె ఇవ్వరేమో అని చాల రోజులు దిగులు పడ్డాను కూడా. బ్రేక్ ఫాస్ట్ తినగానే నాన్నగారు వెళ్లి ఆఫీసు గెటప్ లో టిప్ టాప్ గా రడీ అయి వచ్చి కాఫీ తాగేవారు. ఇస్త్రీ చేసిన తెల్లని షర్ట్, నలగని పేంటు, శాండిల్స్ తో ఉన్న నాన్నగారు ఆఫీసర్ లాగ హాండ్సమ్గా కనిపించేవారు.
వెళ్లే ముందు, టీ తాగి ఆ కప్పు టేబుల్ పై పెట్టి, “హోం వర్క్ బుక్ బేగ్ లో పెట్టుకోవడం మరిచి పోకండి.” ఇద్దరం తలాడించేవాళ్ళం. మా తలపై చేతితో నిమురుతూ నవ్వుతూ ‘గుడ్..గుడ్. అమ్మను విసిగించకండి.’ అంతసేపు కారు కీస్ చేతిలో కదులుతూ ఉంటుంది. ‘బై’ నవ్వుతూ వెళ్లి పోయెవారు. ఈనాటికీ అది నిన్న జరిగినట్టుగానే ఉంది.
ఉదయ్ కాస్త అల్లరి చేస్తే ఎలా బాగుపడతాడో ఏమో అని అమ్మ దిగులు పడేది. ఉదయ్ ని అందరూ ‘పోకిరి’ అనేవారు కానీ సరసి చేసే అల్లరి ముందు ఉదయ్ చాలా నెమ్మది.
‘సరసిని చూస్తే నాన్నగారు ఎంత మురిసి పోయేవారో! గ్రాండు పేరెంట్స్ తో గడపగలగడం కూడా ఒక అదృష్టమే.’ దీర్ఘంగా నిట్టూర్చింది.
‘సరసి తీరే వేరు. తల్లి, తండ్రితో చనువుగా ఉంటూ ఫ్రీగా మనసులో ఉన్నది మాట్లాడు తుంది. ‘ఐ లవ్ యూ’ అని రోజుకు ఎన్ని సార్లైనా చెప్ప్పగలదు. సంతోషంగా ఉంటె వెంటనే కౌగలించుకుని ముద్దు పెడ్తుంది. నేనెప్పుడూ అమ్మకు గాని నాన్నగారికి గాని ‘ఐ లవ్ యు’ అని చెప్ప్పిన గుర్తు లేదు. నాన్నకు నేను, ఉదయ్ అంటే ఎంతో ప్రేమ ఉండేది. నేను, తమ్ముడు ‘నాన్నగారు’ అని పిలిచే వాళ్ళం. అదేమో కానీ మరో విధంగా పిలవడం ఊహకే అందేది కాదు. ప్రేమకు మాత్రం ఎక్కడా లోటుండేది కాదు. ఏదైనా కావాలంటే అడగడంలో, అల్లరి చేయడంలో మేము నాలుగు ఆకులు ఎక్కువే చదివాం. తండ్రి తన నుదుటిపై ముద్దు పెట్టు కోవడం, తలపై ప్రేమగా నిమరడం ఎంతో ఆత్మీయత కనిపించేది.’ అది గుర్తు రాగానే తండ్రిని దగ్గరగా చూడాలని ఉమ మనసెంతగానో తపించింది. చిన్నప్పుడు ఉమను ఎత్తుకుని గిర్రున తిప్పి “నా బంగారు తల్లి” అనేవారు.
ఆయన సంతోషం ఇల్లంతా వ్యాపించేది. కుటుంబంలోని మనుషుల మధ్య అనుబంధాలే వేరుగా ఉండేవి. భావాలన్నీ తెలిసినా బహిరంగంగా చెప్పలేని అదృశ్య నిబంధన. మనుష్యుల మధ్య లేదనిపించే దూరం ఉండేది. కానీ మనసులు కలిసి పోయి ఉండేవి. బందుమిత్రులు అందరూ చేయి చాపితే అందేంత దూరంలో ఉంటూ, పిలిస్తే వచ్చేసేవారు.’
ఆలోచనలు ఆడుకుంటున్నాయి .
‘నాన్నగారు సాయంత్రం రాగానే మాతో కాసేపు ఆడుకునేవారు. అప్పుడప్పుడు మాకోసం పళ్ళు, మిఠాయి, పూలు కొనుక్కొచ్చేవారు. గులాబీలు, మల్లెలు అంటే నాన్నగారికి చాల ఇష్టం. దొడ్లో రెండు గులబీ చెట్లు నాటారు. మొదటిసారి తెల్ల గులాబీ పూవులు పూసినపుడు రెండు తెచ్చి ఒకటి నాకు మరోటి అమ్మకు ఇచ్చారు. మల్లె చెట్టుకు పందిరి కూడా వేసారు. క్రోటన్ మొక్కలను గుండ్రంగా బంతి ఆకారంలో కత్తిరించేవారు.. మేము హోంవర్క్ చేస్తుంటే నాన్నగారు న్యూస్ పేపర్ లేదా ఏవో బుక్స్ చదువుతూ మా పక్కనే కూర్చునేవారు. ఎక్కువగా వివేకానంద బుక్స్ చదవేవారు. అవి పెద్దగా, బరువుగా ఉండటం నాకు బాగా గుర్తు. ఎప్పుడేనా నాన్నగారు పుస్తకంలోని పేజీలు గబగబా తిప్పుతూంటే కోపంగా ఉన్నారని మాకు తెలిసి పోయేది. ఉదయ్, నేను కిక్కురు మనకుండా హోం వర్క్ చేస్కునేవాళ్ళం.
సరసి ఆలోచనే వేరు. సతీష్ కాస్త సీరియస్ గా ఉంటే చాలు రెండు నిమషాల కంటే ఎక్కువసేపు భరించలేక ‘అలా సీరియస్ గా ఉంటే నాకేం బాలేదు. నాకు దిగులుగా ఉంది.’ అని బిక్క మొహం పెడ్తుంది. వెంటనే సతీష్ నవ్వేసి కూతురితో కబుర్లు చెబుతాడు. సరసి కాబట్టి అలా జరిగింది.
నాన్నగారి పుట్టినరోజు నాడు బ్రేక్ ఫాస్ట్ లో తినడానికి ఒక్క గోధుమ రొట్టె నా చేతులతో స్వయంగా చేసి పెనం మీద కాల్చి వడ్డించాను. నాన్నగారు ఎంత ఇష్టంగా తిన్నారో నాకు ఇంకా గుర్తున్నది. దగ్గర ఉండి కూర కూడా వడ్డించాను. స్కూల్లో నా స్నేహితులందరికి చెప్పాను. తర్వాత అమ్మ నాకు రొట్టె చేయడం నేర్పించినపుడు చెప్పింది మందంగా చేస్తే రొట్టె కాలక పిండి పిండిగా ఉంటుందని. పెద్దయ్యాక చాలాసార్లు చేసాను. కానీ నేను నాన్నగారికి చేసి వడ్డించడం నా ఖజానాలో దాచుకున్నాను.
కొన్నిసార్లు అందరం పార్కుకు వెళ్ళేవాళ్ళం, వచ్చేప్పుడు హోటల్లో డిన్నర్ తిని వచ్చేవాళ్ళం.
అది నా ఫెవరేట్ డే. అమ్మ, నాన్న కలిసి సాయంత్రాలు బయట కెళ్ళడం తక్కువే. ఎప్పుడేనా వెళ్ళడానికి అమ్మ తయారవుతూ ఉంటే నేను అమ్మ దగ్గరే నుంచుని చూసేదాన్ని. నీలం చీర, ముత్యాల గొలుసు, ముత్యాల కమ్మలు పెట్టుకుని అమ్మ చాల అందంగా ఉంది. నాన్నగారు కూడా తెల్ల బట్టలు వేసుకుని విజిల్ వేస్తూ కారు కీస్ ఊపుతూ నిలబడ్డారు. ఎడేళ్ళున్న నాకు నేను వేసుకున్న ఆకుపచ్చ ఫ్రాకు బరువై పాతదనిపించింది. వాళ్లతో వెళ్ళనందుకు అలా అనిపించిందని తర్వాత తెలుసుకున్నాను. నాన్న నన్ను దగ్గరగా తీసుకుని ‘రాములమ్మను విసిగించకుండా తమ్ముడితో ఆడుకో. నీకు మిఠాయి తెస్తాగా అమ్మకు చెప్పకు.’ అని నా చెవిలో రహస్యం చెప్పారు. నా రెండు చేతులు పట్టుకుని సుతారంగా ‘లాలలా లాలా’ పాట విజిల్ వేస్తూ ఇంగ్లీషు మూవీలో లాగ డాన్స్ చేసాం. ‘నా బంగారు తల్లివి.’ అని ముద్దిచ్చారు. అవి నా జీవితంలోని బంగారు ఘడియలు. నాన్న నా ఎవర్ గ్రీన్ హీరో.
శనివారం వేంకటేశ్వరుని గుడికి వెళ్లి నపుడు అమ్మ అన్నం లడ్డూలు చేస్తుంది. నాకు అవి చాల ఇష్టం. అన్నం, ఆలుగడ్డలు ఇంకా చాలా వేసి వండాక నాన్నగారు, అమ్మ ఇద్దరూ కలిసి వాటితో పెద్ద లడ్డూలు కట్టేవారు. నా రెండు చేతులలో కూడా పట్టనంత పెద్దగా ఉండేవి. వాటిని గుడి ముందు కూచునే బిచ్చగాళ్ళకి ఒక్కొక్కరికి ఒకోటి పేపర్లో పెట్టి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు సంతోషంగా తింటూంటే నేను, ఉదయ్ కూడా ఉత్సాహంతో ఇచ్చి ఆ తర్వాత గుళ్ళో కేల్లెవాళ్ళం. ‘వాళ్ళ కడుపులో దేవుడుంటాడు. మనం ఇచ్చిన ఆహరం తిని ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు’ అని నాన్నగారు చెప్పారు. అలాంటి సంఘటనలు ఎన్నింటినో నా ఖజానాలో దాచుకున్నాను.
*****************
“మాం!” స్కూల్ నుండి వచ్చిన సరసి తల్లి మొహం చూసి,
“మదర్ థెరీసా! సేవలతో అలసి పోయావని ఫేస్ చెప్తోంది. నేను హెల్ప్ చేస్తాను, ఏ పని చేయాలి?”
“నేను చేసుకుంటాలే. నువ్వెళ్లి నీ హోమ్ వర్క్ చేసుకో. ఈ రోజు నా ఖజానా తెరిచి నా నాన్నగారిని ఆహ్వానించాను.”
“నేను కూడా గ్రాండ్ పాను మిస్సవుతున్నాను మమ్మీ. ఉంటే ఎంత బావుండేది. సియ గ్రాండ్ పా లాగే నాక్కూడా అన్నీ కబుర్లు చెప్పుకోవడానికి బావుండేది.”
“అవును, ఉంటే చాలా బావుండేది. ఎనిమిదేళ్ళ క్రితం ఈ రోజు నేను గ్రాండుపా దగ్గిరే ఉన్నాను.”
“అప్పుడు నన్ను సియ వాళ్ళింట్లో వదిలి వెళ్ళావు. నాకు గుర్తుంది మమ్మీ.”
“అవును ఇండియా నుండి వచ్చిన మూడు నెలలకే మళ్ళి వెళ్ళాల్సి వచ్చింది.”
సరసి తల్లికి దగ్గరగా వెళ్లి హగ్ కిస్ ఇచ్చి, తల్లి మొహంలోకి కాసేపు చూసి హోమ్ వర్క్ లో మునిగిపోయింది.
ఎనిమిదేళ్ళ క్రితం ఉన్నట్టుండి తండ్రిని చూడాలనే బలమైన కోరిక కలగడంతో వెంటనే సరసిని తీసుకుని ఇండియా వెళ్ళింది ఉమ. ఆరునెల్ల క్రితమే ముగ్గురూ వచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్ళారు. ఉమ కూతురితో మళ్ళి రావడం, సతీష్ వెంట లేకపోవడంతో చూసి కూతురిని గుచ్చి గుచ్చి ప్రశ్నలేసాడు తండ్రి. చూడాలని అనిపించి వచ్చానంది. తండ్రిలో వచ్చిన మార్పు చూసి గాబరాపడింది. ఒక్కుమ్మడిగా వయస్సంతా వచ్చి మీద పడ్డట్టుగా చిక్కిపోయి ఉన్నాడు. విజిల్ వేస్తూ ఎంతో తీయగా పాటలు వినిపించే నాన్న ఇప్పుడు ఊపిరి తీయడానికే బాధ పడ్తున్నారు.
డాక్టరు దగ్గరకు వెళ్దామని ఉమ ఎంత వత్తిడి చేసినా ఆరోగ్య సమస్య ఏమీ లేదు. వయస్సు నాతో పరాచికాలాడుతోంది అంటూ నవ్వాడు. తరుచుగా అలసిపోయి వెళ్లి విశ్రాంతి తీసుకునేవాడు. అతనిలో తిండి మీద అయిష్టం, మనుషుల మీద నిరాసక్తత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో, ఒంటరిగా ఉండటం విషయంలో ఉదయ్ ఎన్నిసార్లు వాదించినా, ప్రేమగా చెప్పినా అతను అసలు పట్టించు కునే వాడు కాదు’.
ఉమ, సరసి ఉన్న మూడు వారాలు సంతోషంగా గడిపాడు. తిరిగి అమెరికా ప్రయాణం రెండు రోజుల్లో ఉంది. ఉమ మనసులో అలజడి. డేట్ మార్చుకుని ఇంకా కొన్ని వారాలు ఉండాలనుకుంది. కానీ తండ్రి ససేమిరా కుదరదు సతీష్ ఒక్కడే ఉంటాడు వెళ్ళాల్సిందే అన్నాడు.
ఎయిర్ పోర్టులో ఓపిక లేకున్నా చాలా సేపు అలా నిలబడి ఉమను, సరసిని చూస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.‘నాన్నగారు! మీ ఆరోగ్యం జాగర్తగా చూసుకోండి.’ అంటున్న ఉమను గుండెలకు హత్తుకున్నాడు. ‘నా బంగారు తల్లి’ అంటున్న నాన్నగారి కళ్ళ ల్లోంచి నీటి చుక్కలు రాలాయి.’
ఏనాడూ తండ్రి కళ్ళల్లోంచి నీళ్ళు రావడం చూడని ఉమకు గాబరాగా అనిపించింది. కంటిలో ఊరె నీటిని వెంట వెంటనే తుడుచుకుంటున్నాడు. -ఆ కొద్ది క్షణాలు కనిపించే బిడ్డలను స్పష్టంగా చూడాలని గాబోలు. ఉమ కూడా కన్నీటిని తుడుచుకుంటూ తండ్రిని అతను ఊపే చేతిని చూస్తూ తండ్రి ప్రతిమను మనసులో నిలుపుకుంది. కనుమరుగయ్యే వరకు ఊపుతున్న తండ్రిని చూస్తూ తాను చెయ్యి ఉపుతూ వెనక్కి మరీ మరీ చూస్తూ ఉమ ముందుకు కదిలింది. అదే ఆఖరి చూపు అవుతుందని ఉమ అనుకోలేదు.
ఆ తర్వాత మూడు నెలలకే తండ్రి సీరియస్ అని ఉదయ్ చెప్పడంతో ఉమ వెంటనే ఇండియా వచ్చినా స్పృహలేని తండ్రిని ఐ సీయులో చూసింది.
తండ్రి చిక్కి పోవడానికి కారణమేమిటోఉదయ్ చెప్పే వరకు ఉమకు తెలీదు. నాన్నగారికి డిప్రెషన్ ఒక వ్యాధిలా ముదిరిందని డాక్టర్ చెప్పాడట. అమ్మ చనిపోయాక నాన్నగారు ఎప్పుడూ సంతోషంగా లేరు. వాళ్ళ పెళ్ళయ్యాక నాణేనికి రెండు వైపులా ఉండే బొమ్మ, బొరుసులాగ బతికారు. ఎటూ వెళ్ళినా, ఏం చేసినా ఇద్దరూ కలిసే చేసేవాళ్ళు. అమ్మ లేని జీవితం ఎంత శూన్యంగా ఉందో! తిండి మీద ధ్యాస లేదు. మనుషుల మీద ఆసక్తి లేదు. అన్నాళ్ళ అనుబంధం! అతన్ని తీరని మనోవేదన తినేస్తోంది.
‘నాతో వచ్చేయండి నాన్నగారు’ విషాదాన్ని దాచుకోవాలని ప్రయత్నిస్తూ, ‘అమ్మ పోయిన ఇంట్లోంచే నేను పోతానమ్మా, నాకిక్కడే ఉండాలని ఉంది. ఉదయ్ కు కూడా ఈ మాటే చెప్తున్నాను.’
‘ఆ మాటల విన్నాక మరెప్పుడూ నాతో రమ్మని అడగలేదు. దేనికి బలవంతం చేయలేదు’. ఎంత శక్తిని పుంజుకుని ఎయిర్ పోర్టుకు వచ్చి ఉంటాడో తలుచుకుని ఉమ రోదించింది.
ఈ పరదేశం వెళ్ళడం, ఈ దూరాలు ఎందుకు ఏర్పరచుకున్నాము అని ఉమ మనసు విల విల లాడింది. ‘విదేశాలకు వెళ్తుంటే ఆప్తులను వదిలి వెళ్ళాలి, ప్రాణాలు పొతే ఆప్తులను వదిలిపోవాలి. అందల మెక్కిస్తూ, అధః పాతాళానికి తోసే ఈ ఆత్మీయత, ఈ అనుబంధం ఎందుకు సృష్టించావు భగవంతుడా! ఈ మనఃస్తాపాన్ని దాటటానికి ఆధ్యాత్మిక చింతన అన్నావు కాని ఆ జ్ఞానం లేని వాళ్లు కోకొల్లలు ఇలా నలిగి పోవలసిందేనా!’ ఉమ మనసు బాధతో సుళ్ళు తిరిగింది.
పియానో చప్పుడు వినిపించి ఉమ తానున్న ప్రపంచంలోంచి బయటికి వచ్చి కళ్ళు తుడుచుకుంది. ఉమ మనసు ఇప్పుడు కాస్త తేలికగా ఉంది. ఉదయమంత బరువుగా లేదు.
సరసి పాడుతూ పియానో ప్లే చేస్తోంది.
“మాం! నా హోమ్ వర్క్ అయిపొయింది. ఓ..నువ్వింకా అలాగే ఉన్నావా! మమ్మీ! తాతయ్య అరవై ఏళ్లకే చనిపోయాడు. సియ తాతయ్య డేబ్బైఐదు ఉంటాడు. సియతో చాల గేమ్స్ ఆడతాడు. నా తాతయ్యకు ఏమయింది మమ్మీ?”
“అందరు ఒక్కలాగే ఉండరు. కొందరు ధృడంగా ఉండి ఎక్కువకాలం జీవిస్తారు. తాతయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చింది. బలహీనంగా ఉండటంతో తట్టుకోలేకపోయారు. మన అదృష్టం నువ్వు, నేను వెళ్లి మూడు వారాలు తాతయ్యతో సంతోషంగా గడిపాం.”
“తాతయ్యను మన దగ్గరనే ఉంచుకుంటే మనం జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం కద మమ్మీ.”
“అవును. తాతయ్యకు ఆ ఇల్లు వదిలి ఎవరి దగ్గరా ఉండటం ఇష్టం లేదు. అందుకే తాతయ్య బెంగుళూరులో ఉన్న ఉదయ్ మామ దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఆ ఇంట్లోనే ఉండాలని అతని కోరిక.”
ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనే ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, ఒంటరి తనాన్ని భరించలేక డిప్రెషన్ లో జీవిస్తున్నాడని ఆ బలహీనతలో హార్ట్ ఎటాక్ ను తట్టుకోలేక పోయాడని సరసికి ఎలా చెప్పాలో ఉమకు తట్టలేదు.
నా మనసులోని ఖజానా తెరిచి దుఃఖించే నా మనసును ఓదార్చాను.
‘నాలాగా సరసికి కూడా మరపురాని సంఘటనలు ఉంటాయా! నాలాగే ఖజానాలో దాచు కుంటుందా!’
ప్రదర్శించే పద్దతి వేరైనా ఆనాడు ఈనాడు అంతే ప్రేమ అంతే ఆత్మీయతలు ఉన్నాయి. ఆశలు, అవకాశాలు తన మనసును లొంగ దీసుకోకుండా ఉంటే సరసి కూడా నాలాగే అతి ప్రియతమమైన బంధాలను తన ఖజానాలో దాచుకుంటుంది.
మనసులో ప్రేమ ఉండాలే కాని బంధాలు నిలవడానికి ఏ పద్ధతి అయితేనేమి! భగవంతుడి పై మనసుండాలే కానీ యోగమైనా, యాగమైనా– సన్యాసమైనా, సంసారంమైనా గమ్యం ఒక్కటే. అన్నింటికి మనసు ఉండాలి, ఆ మనసులో ఉండే పవిత్రమైన ప్రేమ ముఖ్యం.

***** సమాప్తం *****

నిన్నే ప్రేమిస్తా………

రచన: మణికుమారి గోవిందరాజుల

“యేమిటలా చూస్తున్నావు?”
“స్ఫటికం లాంటి నీ మనసుని. యెంత స్వచ్చంగా మెరిసిపోతూ కనపడుతున్నదో” తన్మయంగా అన్నది.
“నా మనసులో యేముంది? నిన్ను నువ్వు చూసుకో యెంత అందంగా కనపడతావో?”
“నేనా? అందంగానా? వెక్కిరిస్తున్నావా? యెటుపోయింది ఆ అందమంతా?” దుఃఖంతో గొంతు పూడుకు పోయింది.
“మై డియర్ సాజీ నాకు ఇప్పుడు నువు వేరేగా కనపడవు. అప్పుడెలా వున్నావో ఇప్పుడూ అలానే కనపడతావు”
“అయినా ఇదిగో ఇలా మాట్లాడావంటే నేను నీ దగ్గరికే రాను” బెదిరించాడు.
“లేదు..లేదు.. ఇంక అలా మాట్లాడను.” చున్నీతో కళ్ళు తుడుచుకుంది.
“చూడు శ్రీ ఇన్నాళ్ళకు భగవంతుడు నా కళ్ళు నేనే తుడుచుకుందుకు చేతులిచ్చాడు” నవ్వింది.
“ఓకే ..ఓకే.. ఇక అలా మాట్లాడను” అలిగినట్లుగా పోజు పెట్టి కూర్చున్న శ్రీకర్ ని చూస్తూ చేతులు చాపింది.
యెదురుగా ఇంకో కుర్చీలో కూర్చున్న శ్రీకర్ లేచి వచ్చి ఆమె పక్కన కింద కూర్చుని చాపిన ఆ చేతులను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆ చేతులను తన మెడ చుట్టూ వేసుకుని ఆమె మోకాళ్ళమీద తల పెట్టుకున్నాడు.
“శ్రీ “
“ఊ!”
“ఇదంతా నిజమే నంటావా?నా చేతులకు తగులుతున్న నీ శరీర స్పర్శ నిజమేనంటావా? నా కళ్ళకు కనపడుతున్న నువ్వు నిజమేనంటావా?కల కాదు కదా?”బేలగా అడిగింది.
తన మెడ చుట్టూ వేసుకున్న ఆమె యెడమ చేతిని తన కుడి చేత్తో పట్టుకుని సున్నితంగా తన చెంప మీద కొట్టుకున్నాడు.
“నా చెంప పగిలినంత నిజం సరేనా?”
తన రెండు చేతులతో శ్రీకర్ మొహం, నుదురు,కళ్ళు, పెదాలు, గడ్దం నిమురుతూ “నిజంగా నిజం. నిజంగా నిజం” అనుకోసాగింది.
“అమ్మాయ్! ఇక నన్నొదిలితే ఆఫీసుకు వెళ్ళొస్తాడీ దీనుడు.”
“ఇంకొద్ది సేపు వుండొచ్చుకదా?”
“నాకు మటుకు వెళ్ళాలనుందేమిటి? కానీ తప్పదు కదా?”
“నా వల్లే కదా నీకీ కష్టాలు? నీకు అవసరం లేని బాధ్యత నెత్తిన వేసుకున్నావు.” బాధగా అన్నది. కళ్ళల్లో నుండి అశ్రువులు రాలాయి.
“నేనిది బాధ్యత అనుకోవడం లేదు సాజీ” ప్రేమగా ఆమె కళ్ళు తుడిచి ముంగురులు సవరించాడు. “నన్ను నేను కాపాడుకుంటున్నాను”
“అవును కానీ ఈ రోజు ఫిజియోథెరపిస్ట్ వచ్చి వెళ్ళిందా? ఆమె చెప్పినట్లు చేస్తున్నావా? చాలా బాధ వుంటుంది కాని గుడ్ గర్ల్ లాగా ఆమె చెప్పినట్లు చేసెయ్యాలి మరి. నువు యెంత తొందరగా కోలుకుంటే మనం అంత తొందరగా కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు మరి.” మాట మార్చి వూరించాడు.
“నువు నా గురించి పడుతున్న కష్టం ముందు నేను పడే బాధ యేపాటిది శ్రీ? యెంత బాధనైనా భరించే శక్తి నీ అపారమైన ప్రేమ నాకంద చేస్తున్నది. అయినా యెందుకు? యెందుకు శ్రీ? నా గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఇప్పటికి నాలుగు సంవత్సరాలయింది ..వేరే సరదాలు వేరే ప్రపంచం లేకుండా నా గురించే ఆరాటపడ్డావు, పడుతున్నావు. నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకుని వొంటరి పోరాటం చేసావు. యెంత సర్దుకుందామన్నా నీ బాధ చూస్తుంటే తట్టుకోవడం నా వశం కావడం లేదు. ఇంకా యెన్నాళ్ళిలా అనే ప్రశ్నకు బదులే లేదు. వదిలేయ్ శ్రీ.. నా మానాన నన్ను వదిలేసి నువన్నా హాయిగా వుండు..”
“వదిలేసి పోవడానికి, నువు బాగున్నప్పుడు నువు అందంగా వున్నావని నిన్ను కామించలేదు సాజీ..అప్పుడూ ప్రేమించాను. ఇప్పుడూ ప్రేమిస్తున్నాను.ఈ మాట యెన్నిసార్లు చెప్పడానికైనా నాకు ఓపిక వుంది. చెప్తూనే వుంటాను… ఐ లవ్ యూ..ఐ లవ్ యూ…” గట్టిగా అన్నాడు.
“యెన్ని వూసులు చెప్పుకున్నాము? యెన్ని కలలు కన్నాము? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించు కున్నాము. అదంతా అంతా బాగుంటేనేనా? ఇప్పుడు నీకు బాలేదని నిన్ను వదిలేసి నా దోవ నేను చూసుకుంటే దాన్నేమంటారు? నిన్ను వదులుకుంటే నన్ను నేను వదులుకున్నట్లే. ప్రేమంటే నమ్మకం. ప్రేమంటే భరోసా.. ఆ నమ్మకం, ఆ భరోసా మన ఇద్దరి మధ్యా మనం జీవించి వున్నంత కాలం వుండాలి..,వుంటుంది… అయినా అన్నీ బాగుండి అంతా బాగుంటేనేనా ప్రేమ నిలిచేది? నా అదృష్టం బాగుంది కాబట్టి నీకేమీ కాలేదు.” తృప్తిగా నిట్టుర్చాడు…
“నాకేమీ కాలేదా? మూడేళ్ళు కోమాలో వున్నాను. తెలివొచ్చి ఆరు నెలలు మంచంలో వున్నాను. అయిదు నెలల క్రితం వరకు కళ్ళు తప్ప యే అవయవం కదల్లేదు. నాలుగు నెలల క్రితం వరకు మాట కూడా లేదు. మూణ్ణెల్ల నుండే కదా లేచి కూర్చుంటున్నాను. ఇంకా నడక రానే లేదు. యెక్కడి నుండి డబ్బు యెలా తెస్తున్నావో తెలీటం లేదు .యెలా అయిపోయావో చూడు?”
“ఇదిగో చూడు ..పలుకులకు చిలకలు ఇప్పించలేదనే కదా నీ గొడవ ఇప్పిద్దాములే.. అడుగులకు అరిశలు కూడా ఇప్పిస్తాను సరేనా?” నవ్వుతూ తేల్చేసాడు.
“అయినా నువు చెప్పిన దాన్ని బట్టే తెలుస్తున్నది కదా ఇంప్రూవ్ మెంట్ యెంత బాగా వున్నదీ?..డబ్బు దేముంది? అంతా పోయినా కూడా నువు జీవంతో వున్నావు. అదే పదివేలు. యెప్పటికైనా లేచి తిరుగుతావు అన్న వూహే నాకు బలాన్ని ఇస్తున్నది. సాజీ… నా చేతిలో విద్య వున్నది. గుండెల్లో నువున్నావనే ధైర్యం వున్నది. నీకేమన్నా అయిన నాడు నేను కూడా వుండను..”
చటుక్కున శ్రీకర్ నోటికి చేయి అడ్డం పెట్టింది అలా మాట్లాడొద్దన్నట్లుగా.. చేయి తప్పించి మళ్ళీ చెప్పసాగాడు..
“కోమాలో నుండి బయటపడ్డాక నీ పరిస్తితి యెలా వుంటుందో చెప్పలేమన్నారు డాక్టర్లు. యెంత భయపడ్డానో…యెన్ని..యెన్ని రాత్రుళ్ళు నిన్నే చూస్తూ గడిపానో … యెంతమంది ..దేవుళ్ళకు మొక్కు కున్నానో..యే దేవుడు కరుణించాడో నీకు తెలివి రావటమే కాకుండా అన్నీ చక్కగా గుర్తున్నాయి.. చక చక నడిచేసేయ్…ఇద్దరం కలిసి వెళ్ళి అన్ని మొక్కులూ తీర్చుకుందాము.” వుత్సాహపరిచాడు.
“సాజీ ! ప్లీజ్. నువు సంతోషంగా వుంటేనే తొందరగా కోలుకుంటావు. లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్తావు..డాక్టర్స్ మరీ మరీ చెప్పారు. నువు మనసులో కూడా బాధ పడకూడదని.. నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వాళ్ళను నేనేమీ వదులుకోలేదు. వాళ్లు నన్ను వదల్లేదు. వాళ్ళ సహకారం లేకుంటే నేనేమీ చేయలేకపోయేవాడిని. మొదట్లో యేదో అన్నారు ..తలిదండ్రులు కదా వాళ్ళకేవో ఆశలు వుంటాయి మరి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు.. అందుకే నా కంటే వాళ్లే నిన్ను యెక్కువగా కనిపెట్టుకుని వుంటున్నారు.” ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు.
“ఒక తపస్సు లాగా నిన్నీ స్థితికి తెచ్చుకున్నాను డియర్ . ఇక అలసిపోయాను. సాజీ.. నేను డిప్రెషన్ లోకి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత నీదే మరి. లేదంటే మళ్ళీ మన జీవితంలోనుండి నాలుగేళ్ళు మైనస్ అవుతాయి. ఛీరప్ బేబీ…. ఇప్పుడు కాస్త వీల్ ఛెయిర్ లో తిరుగుతున్నావు కదా ?త్వరలోనే నీ కాళ్ళ మీద నీవు నిలబడతావు. తొందరలో మనం ఇంటికెళ్తాము ప్రామిస్…ప్లీజ్ నిరాశను నీ దరి చేర నివ్వకు..అది నిన్నూ నన్నూ కూడా తినేస్తుంది. నాకు ఆఫీస్ టైం అవుతున్నది. పరిగెత్తుకుని సాయంకాలం వస్తాను సరేనా?రోజంతా నీ పక్కనే వుండాలనిపిస్తున్నది డియర్…కాని వుద్యోగ ధర్మం తప్పదు ” నుదుటి మీద చుంబించి వదిలేసాడు.
“ఓకే! మరి నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళు… ఈ రోజు ఇంకో గంట యెక్కువ కూర్చుంటాను.”
“గుడ్ గర్ల్” మెచ్చుకున్నాడు.
అలా సాజీని యెత్తి అపురూపంగా వీల్ ఛెయిర్ లో కూర్చోబెట్టాడు.
“ఓకే! బై బై డియర్..” చెప్పి వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళాడు శ్రీకర్.
********************
సహజ కోమాలో నుండి బయటకు వచ్చాక అన్ని నెలలు మంచంలో నిద్ర పోతున్నట్లు వున్నా మనం చెప్పేవి తనకు వినపడి అర్థం చేసుకో గలుగుతుందని , ప్రమాదం విషయం కూడా చెప్పమనీ అందువల్ల పూర్తి తెలివి వచ్చాక దాని ఇంపాక్ట్ తక్కువుంటుందనీ డాక్టర్లు చెప్పడంతో శ్రీకర్ పక్కనే కూర్చొని సహజ వినే దానితో సంబంధం లేకుండా యెన్ని కబుర్లో చెప్పేవాడు. అందువల్ల శ్రీకర్ ఒక విషయం కాదు మామూలు మనుషులతో యెలా మాట్లాడతారో అలా అన్ని విషయాలు మాట్లాడేవాడు. డాక్టర్లు చెప్పినట్లుగానే అన్నీ అర్థమవుతుండేవి సహజకు. కానీ కన్ను కూడా కదల్చ లేకపోయేది. అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో సడన్ గా ఒక రోజు కళ్ళు తెరిచి అందర్నీ చూడటం మొదలు పెట్టింది. మెడికల్ హిస్టరీలోనే చాలా ఆశ్చర్యమనీ అంతా శ్రీకర్ కృషి ఫలితమనీ వైద్యులు చెప్పారు.
తెలివి వచ్చిందే కాని కొద్దిగా లేచి కూర్చోగలగడానికి తొమ్మిది నెలలు పట్టింది. కొద్దిగా కూర్చొని కాళ్ళు చేతులు కదిలించడం మొదలు పెట్టగానే లాప్ టాప్ తెచ్చివ్వమంది. శ్రీకర్ కి సహజ తెలివితేటల మీద గొప్ప నమ్మకం వుంది. అందుకే వెంటనే అడిగినవన్నీ సమకూర్చాడు. ఒక పదిహేను రోజులు కంప్యూటర్ నాలెడ్జి అంతా రీకలెక్ట్ చేసుకుంది. పదిహేను రోజులు అన్ని జాబ్స్ కి అప్ప్లై చేస్తూ కూర్చుంది. చివరికి పెద్దది కాకపోయినా టైంపాస్ జాబ్ దొరికింది.. యేదైనా మొదలు మెదడుకి మేతలాగా యేదో ఒక పని చేయకపోతే ఆలోచనలు యెక్కువవుతాయని శ్రీకర్ అభ్యంతరం చెప్పలేదు
చిన్నగా వీల్ ఛెయిర్ ని జరుపుకుంటూ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళింది సహజ. వెళ్ళిందే కాని పని మీద ధ్యాస నిలవడం లేదు.
చదువుకునే రోజుల్లో కాలేజీలో పరిచయమయ్యాడు శ్రీకర్.
శ్రీకర్ వ్యక్తిత్వం, స్త్రీలను గౌరవించే విధానం యెంతో ఆకట్టుకున్నాయి సహజను.
సహజ రూప లావణ్యాలే కాకుండా , ఆమె స్నేహస్వభావము,అందరితోను కలుపుగోలుగా వుండడం , వెనుకా ముందూ చూడకుండా అందరికీ సహాయం చేసే తీరు చూసి ముగ్ధుడయ్యాడు శ్రీకర్. యెప్పుడు జరిగిందో తెలీకుండానే ఒకరినొకరు ఇష్టపడటం మొదలయింది. సాధారణ కుటుంబమని మొదలు వద్దన్నా తప్పదని ఒప్పుకున్నారు తలితండ్రులు. పెళ్ళి ఇక నెల రోజుల్లో కొచ్చేసింది.
ఆ రోజు గుర్తొచ్చేసరికి భయంతో వొళ్ళు జలదరించింది సహజకు.
ఆ రోజు శ్రీకర్ తానూ కలిసి షాపింగ్ చేసుకుని ఎంఎంటీసీ కోసమని స్టేషన్ కి వచ్చారు. ట్రైన్ వస్తున్నట్లుగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ప్లాట్ఫామ్ మీదికి రైల్ వచ్చేస్తున్నది.ఇంతలో ఒక మూడేళ్ళ బాబు, తలితండ్రులు యేమయ్యారో, బంతితో ఆడుకుంటూ ప్లాట్ ఫారం చివరికి వెళ్ళిపోయాడు. చేతిలో వున్న బంతి కిందపడి దొర్లుకుంటూ పట్టాలమీదికి వెళ్ళిపోయింది. బంతి కోసమని యేడుస్తూ ప్లాట్ ఫాం దిగడానికి ట్రై చేయబోతున్నాడు బాబు.అందరూ అరుస్తూ కేకలు పెడుతున్నారు.
పక్కనే శ్రీకర్ తో మాట్లాడుకుంటూ ఆ కేకలు విని అదాటుగా అటు చూసిన సహజకు గుండాగినంత పనయింది. పరుగునా వెళ్ళి బాబుని లాగి ఇవతలికి పడేసింది. ఆ వూపులో అప్పుడే వస్తున్న రైలుకి ప్లాట్ ఫాం కి మధ్యలో పడటం రైలు కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్ళి వదిలేయడం కన్ను మూసి తెరిచినంతలో జరగడంతో శరీరం లో ప్రాణం వుందే కాని విరగని యెముక లేదు. సహజకు ఆ క్షణంలో తల వెళ్ళి రైలుకు కొట్టుకోవడం వరకే స్పృహలో వుండడంతో గుర్తుంది. మళ్ళీ మూడేళ్ళ తర్వాత తెలివి రావడమే.
కోమాలోకి వెళ్ళడమంటే ప్రాణం పోయిన వాళ్ళతో సమానమని సహజ పేరెంట్స్ తో సహా యెంత మంది చెప్పినా శ్రీకరు సహజ చెయ్యి, ఆమెకు బాగవుతుందన్న ఆశ వదల్లేదు. తనకొచ్చిన వాటామొత్తం అమ్మేసి హాస్పిటల్ బిల్లు కట్టాడు. ఈ విశయాలన్నీ రోజు సహజ కోమాలో వున్నప్పుడూ,ఆ తర్వాత కళ్ళు తెరిచాక చెప్తూ వుండేవాడు శ్రీకరు.
అన్నీ కాకపోయినా కొన్ని గుర్తుండేవి. కళ్ళతో పాటు మెమొరి కూడా రావడంతో తర్వాత అన్నీ గుర్తు వచ్చాయి సహజకు. తనకు పునర్జన్మనిచ్చిన శ్రీకరు మీద,అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని తనకు దగ్గర చేసిన దేవుడి మీదా చాలా ప్రేమ భక్తి కలిగాయి సహజకు. ఆలోచనల్లో సమయం తెలియలేదు …..
“హల్లో సహజా..యెలా వుందీ రోజు?”పలకరించుకుంటూ లోపలికి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ ని చూసి
“హలో ఆశా ! బాగున్నాను..హౌ ఆర్ యు?” తను కూడా నవ్వుతూ పలకరించింది..
“యేడి?మీ హీరో?ఇంకా రాలేదా?”
హాస్పిటల్లో అందరికీ కూడా శ్రీకర్ ని చూస్తే హీరో వర్షిప్..అందరూ హీరో అని పిలుస్తుంటారు
“వచ్చే టైం అయింది..ఇప్పుడు మన టైం కదా ?ఇదవ్వగానే వస్తాడు.మొదలు పెడదామా”
ఆశాకి సహజ ఇచ్చే కో ఆపరేషన్ యెంతో నచ్చుతుంది…రెగ్యులర్గా చేయించేవన్ని చేయించి వెళ్ళిపోయింది. నర్స్ వచ్చి స్నానం చేయించి చక్కగా పక్క దులిపి చిన్నగా పక్క మీద పడుకోబెడుతుండగా శ్రీకరు వచ్చాడు.
లోపలికి వస్తున్న శ్రీకరుని కళ్ళ నిండుగా చూసుకుంది సహజ.దగ్గరికి రమ్మన్నట్లుగా చెయ్యూపింది ..ఆ లోపలే వచ్చి పక్కన కూర్చున్నాడు
“శ్రీ! యే జన్మలో యే పుణ్యం చేసుకున్నానో ఇంత అదృష్టవంతురాలనయ్యాను. ఇంతగా ప్రేమించటం యెవరివల్ల నన్నా అవుతుందా? డబ్బు అందం చదువు ఇప్పుడు ఆకారంలో ,అన్నిటిలో నేను చాలా సామాన్యురాలిని. శ్రీ! నిన్నందుకునే అర్హత నాకు లేదు. ఇది చివరివరకూ వుంటుందా అని భయంగా వుంటుంది” కళ్లు భయంతో రెపరెప లాడాయి.
యెంతటి ట్రౌమా నుండి సహజ బయట పడిందో శ్రీకరుకి తెలుసు. ఆ భయంలో యెటువంటి అనుమానాలొస్తాయో వూహించగలడు.
“పిచ్చి సాజీ! నువు మాటా పలుకూ లేనప్పుడే నీ చెయ్యి వదల్లేదు. ఇప్పుడు వదుల్తానా?నో వే! కోటి సార్లు చెప్పనా నిన్నే ప్రేమిస్తా అని? చూడు నా గుండె లబ్ డబ్ బదులు సాజీ సాజీ అని కొట్టుకుంటుంది” సహజ తలని సుతారంగా యెత్తి తన గుండెకు ఆనించుకున్నాడు.
“అన్నయ్యా పబ్లిగ్గా ఈ వేశాలేంటి?మేమొప్పుకోము” నవ్వుతూ లోపలికి వచ్చారు శ్రీకర్ చెళ్ళెళ్ళిద్దరూ.. ఆ వెనకే “హ్యాపీ బర్త్ డే డియర్ సాజీ” పాడుతూ సహజ పేరెంట్స్, ఫ్రెండ్స్, శ్రీకర్ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ లీడ్ చేస్తూ శ్రీకర్ తల్లితండ్రులూ వచ్చారు….
శ్రీకర్ కి తెలుసు సహజ ఇక జీవితాంతం నడవలేదన్న సంగతి. కాని ప్రేమించటం మాత్రమే తెలిసిన శ్రీకరుకి సహజ నడవగలుగుతుందా లేదా, అందంగా వుందా లేదా అన్న దానితో సంబంధం లేదు.. కాని ఆశ మాత్రం వుంది తన ప్రేమతో నడిపించగలనని….
శ్రీకరు ఆశ తీరాలని మనం కూడా ఆశపడదాము మరి.

శుభం..

వీరి తీరే వేరయా…

రచన: పద్మజ యలమంచిలి

నోరాడినట్టు రాలాడుతుంది అంటే ఏమిటో కొంతమందిని చూస్తే అర్ధమైపోతుంది!
ఏమాత్రం వళ్ళు వంచరు.. సుఖాలకు, జల్సాలకు అలవాటు పడిపోయి ఎంతకైనా దిగజారిపోతారు. సంఘంలో ఇలాంటి చీడ పురుగుల వల్ల మొత్తం స్త్రీ జాతినే అసహయించుకునే పరిస్థితి వస్తుంది..అయినా అది వారికి పట్టదు!

*********

చిన్నప్పటినుండీ ఇద్దరమూ ఒకే స్కూల్లో చదవడం వల్ల దుంధుభిని దగ్గరనుండి గమనించేదాన్ని.
తనకు కావాల్సింది కష్టపడకుండా ఎదుటివారిని ప్రలోభాలకు గురిచేసో, మాటలతో బురిడీ కొట్టించో సాధించుకునే తత్వం!
తెల్లగా, బారుగా వివిధ అలంకరణతో అందంగానే కనిపిస్తుంది .
జయసుధలా ఉన్నానని అందరూ తన వెంట పడుతున్నారు అని మురిసిపోయేది..
అలా వెంటపడిన ఒకరితో ప్రేమలో పడింది కానీ…
పెళ్ళిపేరెత్తేసరికి ఒక్కరూ కనపడకపోవడంతో తండ్రి చూసిన సంబంధమే చేసుకోవాల్సివచ్చింది..
తండ్రి పేరున్న రాజకీయనాయకుడి తమ్ముడే అయినా ఆర్ధిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే.. ముగ్గురి ఆడపిల్లలకు గంతకు తగ్గ బొంతలను చూసి పెళ్ళిళ్ళు చేసేసాడు.
మిగిలిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నదాంట్లో పొదుపుగా గుట్టుగా సంసారం చేస్తూ బాగా కూడబెట్టి స్థిరపడ్డారు .
దుంధుభి మాత్రం చాలా అసహనంగా..తన అందానికి తగ్గ సంబంధం కాదని నిరుత్సాహంగానే ఉండేది .. పెళ్ళైన కొత్తమోజులో కొద్దిరోజులు కాపురం చేసి ఓ పిల్లాడికి తల్లైంది..
ఆ తర్వాతే తనలో ఉన్న అసంతృప్తి భగ్గుమంది..భర్త శంకర్‌ను నానా మాటలతో హింసించడం మొదలు పెట్టింది, , చేతనైంత వరకు అన్ని సౌకర్యాలు సమకూర్చినా ఆమెను తృప్తి పెట్టలేకపోయాడు. సరికదా చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడవటం వల్ల కృంగిపోయాడు తప్ప భార్యను అదుపులో పెట్టుకోలేకపోయాడు..
పర్యవసానంగా విచ్చలవిడితనానికి అలవాటు పడి డబ్బున్న మరో ఆసామితో పిల్లాడితో పాటు వున్నవూరు వదిలి పెద్ద సిటీలో కాపురం పెట్టింది…వాడొక పెళ్ళాం వదిలేసిన జల్సారాయుడు. మోజు తీరాకా వదిలేసి పోయాడు..అయినా ఏమాత్రం ఖర్చులు తగ్గించుకోలేదు..పిల్లాడిని సరైన దారిలోనూ పెంచలేదు.

స్వతహాగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది కనుక తండ్రి పేరును ఉపయోగించుకుని నెమ్మదిగా రాజకీయాల్లోకి ప్రవేశించి పెద్ద పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగి పక్కనపెట్టుకుని, చిన్న చిన్న పైరవీలతో జీవితాన్ని పోషించుకుంటూ గడిపేస్తోంది..
అలా సాగిపోతే ఎవ్వరికీ బాధలేదు..కానీ మరో వింత ప్రవర్తన అందరి జీవితాలను నాశనం చేసేస్తోంది. చిన్ననాటి ఫ్రెండ్స్ ని అందర్నీ కలవడం, వారి ఆర్ధిక, కుటుంబ పరిస్థితులను తెలుసుకోవడం..వారు బావుంటే ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అది తిరుగుబోతు ఇలా సంపాదించింది, అలా సంపాదించింది…పొగరెక్కి బ్రతుకుతుంది అని లేని పోనీ చాడీలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పడం వల్ల నిజమేనేమో..దూరంగా ఉంటే మేలు అని ఎవరికి వారు వేరైపోవడంతో పాటు కుటుంబాల్లో అనుమానపు చిచ్చులు రేగాయి.. తను మాత్రం అందరితోనూ కలుస్తూ పనులు సాధించుకుంటూ తిరుగుతూనే ఉంది.
తన అసంతృప్తి ఈ రకమైన శాడిజంగా మారిందని నేను గ్రహించాను.
ఒక దుర్ముహూర్తాన ఏదో తెలియని జబ్బు వల్ల ఆపాస్మారకస్థితిలో దుంధుభిని అకస్మాత్తుగా హాస్పిటల్ లో జాయిున్ చెయ్యాల్సి వచ్చింది..దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో కొడుకు బెంబేలు ఎత్తిపోయి నాకు ఫోన్ చేశాడు..
సరే తప్పదు కదా అని చూడటానికి వెళ్ళా..భోరుమని ఏడుస్తూ..తన తిరుగుళ్ళ వల్ల కొడుక్కి సరిగ్గా చదువు అబ్బలేదని, ఉద్యోగం సద్యోగం లేక గాలికి తిరుగుతున్నాడని, ఇప్పుడు తన ఆరోగ్యం పాడైపోయింది..వాడి భవిష్యత్తు ఎలా అని భయమేస్తోంది అని శోకాలు తీసింది.
సరే అయిపోయిందేదో అయిపోయింది.. ఇప్పటికైనా భార్యాభర్తలు కలిసి వాడిని ఒక దారిలో పెట్టుకోండి అని వాళ్ళాయనకు ఫోన్ చేసి పిలిపించా..
అన్ని పనులు చేయించుకుని, ఆరోగ్యం చక్కబడే వరకు అతనితో బానే ఉంది..కాస్త కుదుటపడగానే..ఈ వయస్సులో నేను నీకు వండి పెట్టలేను..నీ పని నువ్వు చూసుకో నా పని నేను చేసుకుంటా అని మళ్ళీ మొదలికి వచ్చింది…

********

ఇదొక అంతులేని కథ.. స్త్రీవాదులు వీరిది స్వేచ్చావాదం అని వెనకేసుకొచ్చిన సందర్భాలు కూడా కోకొల్లలు! ఇలాంటి వాళ్ళు కాళ్ళు చేతులు బాగున్నంతవరకు, ..మాటల గారడితో అందాన్ని కక్కుర్తి గాళ్ళకు ఏరవేసి , సంఘంలో మంచి పేరును ముసుగేసుకుని ఎలాగోలా వైభవంగానే బ్రతికేస్తారు.. వారిని వేలెత్తి చూపిన వారిని దుర్మార్గులుగా లోకం ముందు నిలబెట్టగల లౌక్యం వీరి సొంతం!
********
అంతిమసమయం ఆసన్నమైనప్పుడు, విధి వక్రీకరిస్తే మాత్రం…
వీరి శవాలను ఏ మున్సిపాలిటీ కుక్కల బండిలోనో తరలించాల్సి వస్తుందనేది కాదనలేని సత్యం!