జీవన వారధులు

రచన: డా.విజయలక్ష్మీ పండిట్

”అమ్మా.. ఆత్మహత్య అంటే ఏంటి? ఎందుకు చేసుకుంటారు?”
ఈనాడు న్యూస్‌ పేపర్‌ మధ్య పేజీలను పక్కన పెట్టి అక్కడే కాఫీ తాగుతున్న వాళ్ళమ్మనడిగింది పన్నెండేళ్ళ దివ్య.
ఈనాడు మెయిన్‌ పేపర్‌ చదువుతూ కాఫీ తాగుతున్న సునీత, కూతురు ప్రశ్నకు కండ్లు పెద్దవి చేసి దివ్యను చూస్తూ వెంటనే ఏం జవాబు చెప్పాలో తోచలేదు సునీతకు. జవాబుకోసం దివ్య వాళ్ళ అమ్మ మొహంలోకి చూస్తూ కూర్చుంది.
” ఆత్మహత్య అంటే మనల్ని మనం చంపుకోవడం అంటే. మనం ధైర్యాన్ని కోల్పోయి పిరికితనంతో మన వ్యక్తిత్వాన్ని మనం చంపుకోవడం. సమస్యను ఎదుర్కొనే నేర్పు ఓర్పు లేక తొందరపాటు నిర్ణయం తీసుకుని మన నిండు జీవితాన్ని మన చేతులారా బలి చేసుకోవడం” అని జవాబు చెప్పింది.
కూతురిలో ధైర్యాన్ని పెంచాలనే ఆవేశంతో సునీత చెప్పుకుపోతున్న చాలా పెద్ద జవాబును విన్న దివ్య తలలో ఇంకా ఎన్నో ప్రశ్నలు మొలకెత్తాయి.
ఆరో క్లాస్‌ చదువుతున్న దివ్య తెలుగు కొంచెం బాగానే చదవగలుగుతుంది. ఇంట్లో అమ్మ కూడా తెలుగు భాష అక్షరాలు, గుణింతాలు నేర్పించడం వల్ల, కూడబలుక్కుని చదవడానికి ప్రయత్నిస్తూంది. రోజు న్యూస్‌ పేపర్‌ హెడ్‌లైన్స్‌ నీకు తోచినవి చదువుతూండు తెలుగు భాష ఇంప్రూవ్ అవుతుందని అమ్మ నాన్న చెప్పినప్పటినుండి టైం దొరికినప్పుడు న్యూస్‌ పేపర్‌ తిరగేయడం మొదలు పెట్టింది. తెలుగుభాష అర్థాలు తెలుసుకోవడానికి ఇంగ్లీషులో కూడా అడుగుతూంటుంది.
”అమ్మా.. పిరికితనం అంటే బోల్డుగా లేకపోవడమా? పిరికితనం అంటే కవడిష్‌ అని అర్థమా!” అని అడిగింది దివ్య.
”అవును నాన్నా.. పిరికితనం అంటే కవడిష్‌.. అంటే బోల్డుగా లేకపోవడం.” మన తెలుగు భాషకు ఇంగ్లీషులో అర్థాలు చెప్పాల్సిన గతి పట్టింది మన పిల్లలకని మనసులో అనుకుంటూ జవాబిచ్చింది సునీత.
” ఓర్పు నేర్పు అంటే ఏమిటి”అని మరలా ప్రశ్నించింది దివ్య.
” ఓర్పు.. అంటేనే ఓపిక.. పేషన్స్‌. నేర్పు అంటే ఓపికతో ఏదైనా ఒక సమస్య వస్తే ఎమోషనల్‌ అయిపోకుండా.. కొంచెం ఆలోచించి, ఆ సమస్య ఎందుకొచ్చింది? ఆ సమస్యకు పరిష్కారాలేమి? అంటే ప్రాబ్లమ్‌కు సొల్యూషన్‌ ఏమిటి అని అనలైస్‌ చేసుకొని పరిష్కరించుకోవడానికి, సాల్వ్‌ చేసుకోవడానికి తెలివితో ప్రయత్నించాలి, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా.. అంటే ప్రాబ్లమ్‌గా చిత్రించుకోవడమే అసలు సమస్య. మన జీవితం జీవించడానికి కాని, మన జీవితాన్ని మనమే అంతం చేసుకోడానికి కాదు.. అనే ఆలోచనా విధానాన్ని, ధైర్యాన్ని చిన్నతనం నుండి అలవరచుకొంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను మనము నేర్పుతో పరిష్కరించుకుంటూ ఆనందంగా జీవించవచ్చు..” అని చిన్న ఉపన్యాసమిచ్చింది సునీత.
అమ్మ మాటలు విన్న దివ్య నిటారుగా కూర్చుని.. ”ధైర్యంగా వుండడం చాలా అవసరం కదమ్మా.” అని అడిగింది.
”అవును ఆడపిల్లకైనా, మగ పిల్లలకైనా ధైర్యం ఎంతో అవసరం. ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యం, ఆత్మస్థైర్యంతో పెరగాలి. మన చరిత్రలో ఎంతో మంది మహిళలు.. అంటే ఆడవాళ్ళు ఝూన్సీ లక్ష్మీ బాయి, రుద్రమదేవి రాణులుగా రాజ్యాలు ఏలినారు, ఎంతో మంది మహిళలు మన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ, నెహ్రూజీ కూతురు ప్రధానిమంత్రి అంటే ప్రైమ్‌ మినిష్టరుగా దాదాపు రెండు దశాబ్దాలు పాలించారు” అనింది కూతురును దగ్గర కూర్చోబెట్టుకుంటూ.
విన్న తరువాత దివ్య ఇంకో ప్రశ్న వేసింది..
”పేపర్‌లో ఆ అమ్మాయి ఇంటర్‌ మీడియట్ పరీక్ష బాగా రాయలేదని, వాళ్ళ నాన్న తిట్టాడని ఆత్మహత్య చేసుకునింది.. కదా? వాళ్ళ నాన్న తిట్టకూడదు కదా!”
”నిజమే.. వాళ్ళ నాన్న అలా తిట్టుండకూడదు.. పరీక్ష సరిగా రాయలేదని బాధ ఒకవైపు, నాన్న తిట్టాడనే బాధ, అవమానం ఇంకోవైపు ఆ అమ్మాయిని మనస్తాపానికి గురి చేసుంటాయి.. బాగా చదివే అమ్మాయి పరీక్ష సరిగా రాయకపోయినందుకు కారణాలేవో తెలుసుకోవాలి.. ఆ సందర్భంలో కూతురుని ఓదార్చి, మరలా గట్టి ప్రయత్నం చేయవచ్చులే అని ధైర్యం చెప్పి ఆ బాధ తగ్గించాలి. చదువులో ఆ సబ్జక్టులో కూతురు ఎందుకు వెనకపడిందో తెలుసుకొని ట్యూషన్‌ పెట్టి కావాల్సిన సపోర్ట్‌ ఇవ్వాలి” అని ఆగి మరలా ”చదువుకంటే ముందు పిల్లల్లో ధైర్యాన్ని, జీవితం, సమస్యల పట్ల కాలం తెచ్చే మార్పుల పట్ల అవగాహన కలిగించాలి. చావు సమస్యలకు పరిష్కారం కాదు అని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో జీవితంపట్ల ఓ ఆశావాదాన్ని పెంపొందించే ప్రయత్నం జరగడం లేదు”అని అనింది సునీత.
దివ్య ఎంతో ఆరాధనా భావంతో అమ్మ మొహంలోకి చూస్తూ.. చటుక్కున లేచి అమ్మ మెడను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది.
తన మాటలు దివ్యకు ఎంతో ధైర్యాన్ని, రిలీఫ్‌ని ఇచ్చాయని సునీత గ్రహించింది. తనూ కూతురుని దగ్గరకు తీసుకుని చెంపలపై ముద్దాడింది.
”నీలాగ, నాన్నలాగా ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్నా అర్థం చేసుకుని ధైర్యం చెప్పుకుంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేది కాదు కదమ్మా!…” అని అనింది దివ్య.
”అవును’.. అని సమాధానమిచ్చింది సునీత. అంతలో తన ఆఫీస్ రూమ్‌లో నుంచి వాళ్ళ నాన్న ‘దివ్యా..” అని పిలవడంతో ” ఏం. నాన్నా..” అని లోపలికి పరుగుతీసింది.
వాళ్ళ సంభాషణ విన్న రామకృష్ణ, కూతురి సున్నితమైన మనస్సు ఆ ఆత్మహత్యల న్యూస్‌తో ఎంత గాయపడిందో ఊహించి ఓదార్పు మాటలు, నవ్వించే మాటలు చెప్పి డైవర్ట్‌ చేయడానికి పిలిచుంటాడని సునీత ఊహించింది. జీవితం పట్ల రామకృష్ణకున్న పాజివ్‌ ఆటిట్యూడ్‌ సునీతకు తెలుసు. పిల్లలను అర్థం చేసుకుని సున్నితమైన మనసులు గాయపడకుండా.. వాళ్ళతో రోజు కొంత సమయం గడుపుతూ జీవితం పట్ల.. సమస్యల పట్ల అవగాహన కలిగించే కబుర్లు, కథలు చెబుతూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని చెపుతుంటాడు. తల్లిదండ్రులు మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకుంటూ సమాజంలో సంస్కృతిలో వచ్చే మార్పుల దుష్ప్రభావాలనుండి పిల్లలను కాపాడుకుంటూ వారికి వాస్తవాల పట్ల అవగాహన కలిగిస్తూ మంచి నడవడిక, ఆత్మస్థైర్యంతో కూడిన వ్యక్తిత్వానికి బాటలు వేయాలంటాడు.
అతనిలో ఆ ఆశావాద దృక్పథంతోపాటు కూతురు పెంపకం పట్ల అంత శ్రద్ధ తీసుకోడానికి కారణం అతని చెల్లెలు రాధ మరణం.. కాదు, ఆత్మహత్య..
సునీత ఆలోచనలు గతంలోకి పయనించడం మొదలుపెట్టాయి.
అది సునీత పెండ్లయి దాదాపు ఒకటిన్నర సంవత్సరం. సునీత చెన్నైలో ఒక కాలేజీలో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా పనిచేస్తూంది. కాలేజీకి తయారయి బ్యాగ్‌ సర్దుకుంటున్న సునీత ఫోన్‌ రింగ్‌ అవ్వడంతో హాల్‌లోకి వెళ్ళి ఫోన్‌ ఎత్తి ‘హల్లో..” అంది.
ఆ వైపు రామకృష్ణ వాళ్ళ పిన్నమ్మ, అన్నపూర్ణమ్మ చెల్లెలు అనసూయ ఏడుస్తూ.. ”రాధ చనిపోయింది సునీత.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.” అని ఏడుస్తూ చెపుతుంటే సునీత కాళ్ళు చేతులు అదిరాయి.
”అయ్యో.. ఎట్లయింది? ఎందుకు చేసుకుంది?”అని కంగారుగా ప్రశ్నల వర్షం కురిపిస్తూండగా ఫోన్‌ డిస్‌ కనెక్ట్‌ అయింది.
” ఏమండీ రాధ చనిపోయిందట ఆత్మహత్య చేసుకుంది. చిన్నత్తమ్మ ఫోన్‌ చేశారు” అంటూ.. ఆఫీసుకు తయారవుతున్న భర్తకు చెప్పింది.
”ఆ…” అంటూ హతాశుడై నిలబడిపోయిన రామకృష్ణ ప్రక్కనే వున్న బెడ్‌పై కూర్చొని.. భోరున ఏడ్వడం మొదలు పెట్టాడు.
సునీత రామకృష్ణ దగ్గరకు వచ్చి ఎదుట నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటూ అతని తలను తనకు అదుముకుని తలపై చేయివేసింది సముదాయిస్తూ.
చెల్లెలంటే రామకృష్ణకు చాలా ఇష్టం. ఇద్దరికీ వయసులో ఐదు సంవత్సరాలు తేడా.
రామకృష్ణ, తనూ చెన్నై నుండి రెండు గంటల ప్రయాణం దూరంలో నెల్లూరు దగ్గర ఉన్న వాళ్ళ సొంతూరుకు కారులో బయలు దేరారు డ్రైవర్‌ని మాట్లాడుకుని.
రాధ హైదరాబాదులో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఒక సంవత్సరం నుండి ఉద్యోగం చేస్తూంది. ఈ మధ్యనే రాధకు పెండ్లి చేయాలని రెండు సంబంధాలు చూశారు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న వెంకటరామయ్యకు రాధ పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇంటర్‌ మీడియట్ అవగానే పెండ్లి చేయాలనుకున్నాడు. అతను నెల్లూరు జిల్లాలో ఇరవై ఎకరాల మంచి మోతుబరి రైతు, బి.ఏ చదివినా.. ముందు కాలం మనిషి. సాంప్రదాయాలని, ఆడపిల్లలకు పెద్ద చదువెందుకు పిల్లలకు చదువు చెప్పుకొనే వరకు చదివితే చాలనుకునేవాడు. కూతురికి ఆస్తి, అంతస్తు వుండి, తమ కులంలో సాంప్రదాయమైన కుటుంబంలో ఇవ్వాలని ఇంటర్‌ మీడియట్ అయిపోగానే సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. కాని రాధ తాను బి.టెక్‌. చేస్తానని పట్టుదల పట్టింది. అన్నతో చెప్పించుకుని నాన్నను ఒప్పించుకుని ఎమ్సెట్ పరీక్షరాసి మంచి ర్యాంక్‌తో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ సీటు తెచ్చుకుంది. కష్టపడి చదువుకుని, మంచి మార్కులతో పాసయి, హైదరాబాద్‌లో క్యాంపస్‌ సెలక్షన్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని చేరింది.
ఆ మధ్య ఒకసారి మేమంతా కలిసినప్పుడు రాధ తాను తన కొలీగ్‌ శ్రీధర్‌ను ఇష్టపడుతున్నట్టు, అతనికి తనంటే ఇష్టమని, మంచివాడని మాతో చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న స్కూల్‌ టీచర్స్‌ అని, వాళ్ళది ఇంటర్‌ కాస్ట్‌ మ్యారేజ్‌ అని, తండ్రి ఎస్‌.సి., తల్లి ఓ.సి. అని చెప్పింది. అతనికి ఇంటర్‌ చదువుతున్న తమ్ముడు వున్నట్టు చెప్పింది. ఇద్దరం పెండ్లి చేసుకోవాలనుకుంటున్నామని మాతో అంది.
రామకృష్ణ వెంటనే ”అమ్మా నాన్నతో చెప్పావా”అని అడిగాడు.
”అమ్మతో అన్నాను కాని అమ్మ మీ నాన్న ఒప్పుకోడు వేరే కులమని తొందరపడొద్దు ఆలోచించుకోమ్మా”అని అనిందని చెప్పింది.
రామకృష్ణకు వాళ్ళ నాన్న తత్వం తెలుసు. అమ్మ ఆ తరానికే చెందినదయినా కాలంతోపాటు వస్తున్న మార్పులు పిల్లలపై వాటి ప్రభావాన్ని గమనిస్తూ పిల్లల భవిష్యత్తును మంచి చెడులను దృష్టిలో పెట్టుకుని కాలానికనుగుణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ఫ్లెక్సిబిలిటీ అమ్మలో వుంది. కాని నాన్నకు కొన్ని నిర్దిష్టమయిన ఇష్టా అయిష్టాలు వున్నాయి. తన పట్టుదల పర్యవసానాల గురించి పట్టించుకోడు.
సునీత వెంకటరామయ్యకు చిన్నప్పటి స్నేహితుడి కూతురు. స్నేహితుని ఇంట్లో సునీతను చూసి వచ్చిన వెంకటరామయ్యకు కోడలిగా చేసుకోవాలనిపించింది. అన్నపూర్ణమ్మ, రామకృష్ణలతో మాట్లాడి రామకృష్ణకు పెండ్లి చేశాడు. సునీతను చూసిన తరువాత రామకృష్ణకు కూడా నచ్చడంతో పెండ్లి జరిగిపోయింది. వెంకట రామయ్య ఎంతో సంతోషంగా ఘనంగా చేశాడు పెండ్లి వాళ్ళదగ్గర కట్నం ఆశించకుండా.
రామకృష్ణకు వాళ్ళ నాన్న గురించి బాగా తెలుసు కాబట్టి ఆలోచిస్తూ వెంటనే ఏమీ మాట్లాడలేదు.
కొంత సేపయినాక, ”రాధా! శ్రీధర్‌ను, వారి కుటుంబాన్ని గురించి ఇంకా వివరాలు తీసుకుని నేను సునీత మేమిద్దరం ఒకసారి కలిసి మాట్లాడి తరువాత ఆలోచిద్దాం. తొందరపడి నిర్ణయం తీసుకోకు”అని చెప్పాడు.
రాధ సరే అన్నట్టు తలవూపింది.
అంతా నెల ముందు జరిగిందీ సంభాషణ.
నిన్ననే రాధ ఫోన్‌ చేసిందని చెప్పాడు రామకృష్ణ తన పెండ్లి విషయం గురించి. రెండు రోజులు సెలవు పెట్టి వెళ్ళి శ్రీధర్‌ను, వాళ్ళ అమ్మ నాన్నను కలవాలని అనుకున్నాము. ఇంతలోనే రాధ అలా జీవితాన్ని అంతం చేసుకోడానికి కారణమేమి? అనే ఆలోచనలు సునీత మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి.
*****

ఇల్లు చేరేటప్పటికి ఇంట్లో బంధుమిత్రులు, పొరుగువారు పోగయినారు. విషయం తెలిసి పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని వెళ్ళినట్టు రామకృష్ణ వాళ్ళ పిన్నమ్మ, చిన్నాన్న చెప్పారు.
హాల్లో రాధ శవాన్ని చూసి రామకృష్ణకు దుఃఖం ఆగలేదు. రాధ తలపై చేయివేసి భోరున ఏడ్చాడు. అర్థగంట తరువాత నెమ్మదిగా దుఃఖాన్ని తమాయించుకుని ప్రక్క రూములో గోడకానుకుని ఏడుస్తున్న అమ్మ దగ్గరకు పోయి ప్రక్కన కూర్చుని “అమ్మా ఏం జరిగిందసలు”అని అడిగాడు. అన్నపూర్ణమ్మ వెంటనే ఏమీ మాట్లాడలేదు. అమ్మ ఇంకా చెల్లి హఠాత్‌ మరణంతో షాక్‌లో ఏమి జవాబు చెప్పలేదని గ్రహించాడు. రామకృష్ణ వాళ్ళ చిన్నాన్న వచ్చి రామకృష్ణను చేయిపట్టుకుని మిద్దెపైకెళ్ళాడు. వారితో కూడా వాళ్ళ పిన్నమ్మా, తనూ వెళ్ళాము.
మిద్దెపైన వెనుకవైపు బాల్కనీలో ఈజీ చైర్‌లో వెనక్కివాలి కండ్లు మూసుకుని వున్నాడు రామకృష్ణ వాళ్ళ నాన్న. మొహంలో దిగులు, అలసట. అలికిడి అవ్వడంతో కండ్లు తెరచి మా వైపు చూసి, కొడుకును చూడగానే చేతులు చాచి ”రామూ! రాధ చూడరా మనల్ని వదలి పోయింది. ఎంత పని చేసిందో, నేను అలా చేస్తుందనుకోలేదురా”.. అంటూ చిన్న పిల్లవాడిలా ఏడ్వడం మొదలు పెట్టాడు. కుర్చీలోనుండి లేవబోతుంటే రామకృష్ణ వాళ్ళ నాన్నను పొదిమిపట్టుకున్నాడు. మాకూ ఏడుపాగలేదు. ఆ వయసులో పెండ్లి కావాల్సిన కూతురును పోగొట్టుకుని, కూతురుపై ప్రేమంతా కట్టలు తెంచుకుని ఏడుపై పైకుబికిందనిపించింది. తనూ మామయ్య కుర్చీ పక్కన కూర్చుంది. తన ఆలోచనలు పిల్లల పెంపకంపై వెళ్ళాయి…
” పిల్లలెంత ఎదిగినా, వాళ్ళు తమ పిల్లలే, చిన్నవాళ్ళనుకుంటూ చిన్నప్పుడు ఆట వస్తువులో, చాక్లెట్లో ఇచ్చి మనసు మళ్ళించినట్టే పెండ్లీడు వచ్చినా.. కూడా అట్లే తలపోసే తండ్రి ఆయన. మామయ్య కరుడు కట్టిన సాంప్రదాయ ఆలోచనా విధానం ఆయన్ని కాలంతోపాటు పిల్లల మనస్తత్వంలో వచ్చిన మార్పులను గమనించి, వాటికి విలువనీయకుండా చేసింది. అందుకు కారణం శతాబ్దాలుగా సంఘంలో జీర్ణించుకుపోయిన స్త్రీల పట్ల నిరాదరణే కదా!”అని అనిపించింది సునీతకు…
కొడుకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మగబిడ్డలు పుట్టకుంటే ఆడవాళ్ళే బాధ్యులని, మగపిల్లలను కనేంతవరకు కోడళ్లను మానసికంగా, శారీరకంగా బాధలు పెట్టడం. ఆడ, మగ బిడ్డలను నిర్ణయించే క్రోమోసోమ్‌ దాత మగవాడే అనే అవగాహనాలోపం వల్ల, మగబిడ్డయితే పున్నామ నరకం నుండి రక్షిస్తాడనే తరతరాల గుడ్డినమ్మకం, ఆడబిడ్డ ఎప్పటికి ఆ యింటి బిడ్డ (అత్తగారింటి బిడ్డ) అని, మగవాడు మన బిడ్డ అనే బూజుపట్టిన ఆలోచనలతో పుట్టినప్పటి నుండి ఆడపిల్లలకు ఇంట్లో మగ బిడ్డల తరువాత రెండవ స్థానాన్ని ఇస్తూ, ఇంటి పనులు, వంటపనులు, పిల్లలను పెంచే పనులన్నీ ఆడవారివే అనే ఆలోచనా విధానం. పుట్టినప్పటినుండి ఆ వివక్షతో కూడిన పెంపకం ప్రతి అమ్మాయి, అబ్బాయిలో జీర్ణించుకొని పోయి అదే సాంప్రదాయానికి, కట్టుబాట్లకు ప్రాధాన్యతనిస్తూ తరతరాలుగా ఆ సాంప్రదాయాల, కట్టుబాట్ల చాలలో బంధింపబడ్డాయి. ఆ తరాలలో వారి ఆలోచనలు, స్త్రీలకు చదువు లేకపోవడం, పురుషాధిక్య సమాజ ప్రభావంలో అదే మన జీవన విధానం అనే భ్రమలో ఆ రెండు మూడు తరాల తల్లితండ్రులు మూసపోసిన ఆ భావజాలం పిల్లల పెంపకంపై, వారి ముఖ్యమయిన జీవిత మలుపులు; విద్య, వివాహంపై తలితండ్రులు తీసుకునే నిర్ణయాలన్నికీ ఆ సాంప్రదాయ ఆలోచనా విధానమే కారణం. కాలానుగుణంగా సుమారు ఓ రెండు తరాల చదువుకున్న తల్లిదండ్రుల అవగాహనల్లో కొంచెం మార్పు వున్నా, వచ్చే అల్లుడు, అత్తింటి వారి ఆలోచనలూ కూడా అదే విధంగా వుంటాయన్న ఆలోచనతో వుంటూ ఆడపిల్లల పెంపకంలో పాత భావాలను వదులుకోలేకున్నారు” అని ఆలోచించుకుంటూ కూర్చుంది తాను.
*****

రాధ దహన సంస్కారాలన్నీ ముగిశాక రామకృష్ణ చిన్నాన్న, పిన్నమ్మ, అత్తమ్మలద్వారా తెలిసింది సునీతకు. రాధ వారం రోజుల క్రితం ఒక వారం శని ఆదివారాలతో కలుపుకుని లీవు పెట్టి ఇంటికి వచ్చింది అమ్మ నాన్నతో గడపాలని. వచ్చిన రోజు రాత్రి భోజనాల సమయంలో వాళ్ళ నాన్న తాను విచారించిన రెండు సంబంధాలను గురించి రాధతో చెప్పాడు. చదువు, ఉద్యోగం ఉండి ఆస్తిపాస్తులు బాగా వున్న కుటుంబాలు, మీ అన్న వదినలను కూడా రమ్మని వెళ్ళి చూసి వద్దామని. రాధ ఏమి సమాధానం చెప్పకుండా వాళ్ళమ్మవైపు చూస్తూంది. అన్నపూర్ణమ్మ కండ్లతోనే ఏమి మాట్లాడవద్దని సైగ చేయడంతో రాధ ఏమీ మాట్లాడలేదు. వెంకటరామయ్యకు రాధ ప్రేమ విషయం తెలియదు. ఆడపిల్లలకు సహజంగా వుండే బిడియం అనుకుని రాధ మౌనాన్ని అంగీకారంగా అనుకుని భోజనం ముగించి లేచి వెళ్ళాడు వెంకట రామయ్య. రాధ, అన్నపూర్ణమ్మ వంటింట్లో అన్ని సర్దుకుని ఇద్దరు మిద్దెమీదకు వెళ్ళారు.
రాధ తన మనసులోని భావాల్ని వాళ్ళమ్మకు ఏకరువు పెట్టుకుంటూంది, ”నేను శ్రీధర్‌నే పెండ్లి చేసుకుంటానమ్మా.. మంచి వాడు. నాన్నని ఒప్పించండమ్మా” అంటూ బ్రతిమాలుకుంటూంది.
” ఎట్లా చెప్పమంటావు రాధా! వేరే కులం, ఆస్తులు లేవంటే మీ నాన్న అసలిష్టపడడు. నాకు భయంగా వుంది మీ నాన్నకు చెప్పాలంటే” అని ముగిస్తుండగా అప్పుడే కూతురు, భార్య మిద్దెపైనున్నారని వారితో కూడా కాసేపు కూర్చుందామని పైకి వస్తూ తలుపు దగ్గరకు రాగానే రాధ వాళ్ళ మాటలు వెంకటరామయ్య విన్న సంగతి వారికి తెలియదు.
వారి ముందుకు వచ్చి ”రాధా ఏమంటున్నావు ప్రేమించావా? వేరే కులంవాడా? ఏమంటున్నావే” అని కోపంగా అడిగాడు.
రాధ మొదలు భయపడిపోయి.. కాస్త తమాయించుకుని తన వయసు, చదువు, బయటి ప్రపంచం పోకడలతో, కాలంతో వచ్చిన స్వంతత్ర భావాలతో, వాళ్ళ నాన్న మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోని స్థితిలో, నాన్నకు తనపైనున్న ప్రేమతో నాన్నను ఒప్పించుకోవచ్చనే ధైర్యంతో, తను శ్రీధర్‌ ప్రేమించుకున్న విషయం, వాళ్ళ కుటుంబ విషయాలన్నీ వాళ్ళ నాన్నతో చెప్పి శ్రీధర్‌తో పెండ్లి జరిపించమని వాళ్ళ నాన్ననడిగింది. మరుక్షణమే రాధ చెంప ఛెళ్ళుమనింది.
రాధ చెంప మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ క్రిందకు వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ ఏడుస్తూ, ” ఏంటండీ ఇది, రాధ చిన్నపిల్ల కాదుకదా కొట్టడానికి. మెల్లగా నచ్చ చెప్పాలి కాని,”అని ముగించకముందే..
”నీవు నోరు మూసుకుని వుండు. అదంటే చిన్నపిల్ల, తల్లిగా నీవెందుకు ముందే కూతురిని విచారిస్తూ అలాంటి ఆలోచనలు మానుకోమని చెప్పలేదు. అందుకే ఆడపిల్లలకు పై చదువులు, ఉద్యోగాలు వద్దన్నాను. ప్రేమంటూ.. ముందు చూపు లేకుండా, కులము సాంప్రదాయాన్ని వదిలి, ఆడపిల్ల వెనకపడి నాలుగు ప్రేమ మాటలు చెపుతూనే అన్ని మరచిపోయి, ఆకర్షణకు లోనయి వాడి వెనకాల పడతారు. నాకు ఇష్టం లేదు ఆ ఆలోచన వదులుకోమను”అని చరచర వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మకు ఆ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియలేదు. కండ్లు తుడుచుకుంటూ మిద్దె దిగి రాధ రూముకు వెళ్ళింది. రాధ మెల్లగా ఏడుస్తూ పడుకుని వుంది.
రాధ దగ్గరికెళ్లి భుజం మీద చేయివేసి” ఊరుకో రాధ, మీ నాయన సంగతి తెలిసి ఎందుకు అలా నిర్ణయించుకున్నావు. నీవు కూడా ఆలోచించుకోమ్మా: మీ నాన్నను కాదని ఏమి చేయగలం”అన నచ్చ చెప్పాటానికి ప్రయత్నించింది.
రాధ ఏమీ మాట్లాడ లేదు.
రాధ అమ్మా, నాన్నా ఎక్కువ చదువుకోలేదు. అన్నపూర్ణమ్మ స్కూలు ఫైనల్‌లో వున్నప్పుడు మంచి సంబంధమని వాళ్ళ నాన్న పెండ్లి చేశారు. వెంకామయ్య బి. ఏ. పాస్‌ అయి వ్యవసాయంపై మక్కువతో వాళ్ళ నాన్నకు సహాయం చేస్తూ, డైరీ ఫామ్‌ చూసుకుంటూ ఉండిపోయాడు. వాళ్ళ నాన్నకు ఒక్క కొడుకు కావడం వల్ల, వ్యవసాయం స్వంత మనిషి పట్టించుకుంటేనే సాగుతుందని ఆయనకు తెలుసు కాబట్టి పై చదువు గురించి ఆలోచించకుండా కొడుక్కు పెండ్లి చేశాడు. అన్నపూర్ణ దూరము చుట్టపు సంబంధమే.
వారిరువురికి, బయటి ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పుల గురించి అవగాహన తక్కువే, ప్రపంచీకరణ ప్రభావంతో సాంకేతిక, సమాచార అభివృద్ధి, అంతర్జాల యుగంలో యువతపై సోషియల్‌ మీడియా ప్రభావం, వేగంగా విరుచుకుపడుతున్న పాశ్చాత్య సంస్కృతి, స్వతంత్ర భావజాలము, తాము చదువుకుని ఉద్యోగాలు చేయాలనే ఆడపిల్లల తపన, వైవాహిక జీవితంపై వారి ఆలోచనల్లో వచ్చిన మార్పులు, ఇవి పెద్దగా గమనించడం, వాటిగురించి సీరియస్‌గా ఆలోచించే తత్వం కాదు వెంకటరామయ్యది. కాలంతో పాటు మారే సాంఘిక పరిణామాలను బేరీజు వేసుకుంటూ, పిల్లలను గమనించుకుంటూ, వారి ఆలోచనలను పట్టించుకుని మంచి చెడ్డల గురించి వారితో మాట్లాడే టైము, ఆలోచన లేని వెంకామయ్య తత్వం అన్నపూర్ణమ్మకు బాగా తెలుసు. అందుకే ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలిరా దేవుడా అనుకుంటూ బాధపడింది.
రామకృష్ణను రమ్మని రాధ పెండ్లి విషయం మాట్లాడాలని మనసులో అనుకుంటూ, తాను కూడా రాధ గదిలోనే పడుకుంది.
మరుసటి రోజు అన్నపూర్ణమ్మ కొడుకుకు ఫోన్‌ చేసి రమ్మనమని వెంకటరామయ్యతో అనింది.
”వాడినెందుకు రమ్మనడం. నేను ఆ పెండ్లి వీలుకాదంటున్నాను కదా! వాడొచ్చి నాకు నచ్చచెబుతే నేను మారిపోతానా, అంతా పిల్లచేష్టలుగా ఉన్నాయి. ఏమి అవసరం లేదు”అని కొట్టిపారేశాడు. మరలా ”నేను వీలు చూసుకుని వాడిని రమ్మంటాను. నేను చూసిన ఆ సంబంధాల గురించి మాట్లాడి రాధకు నచ్చచెప్పమని”, అని టిఫిన్ తినటం ముగించి చేతులు కడుక్కుని పొలం దగ్గర పనుందని వెళ్ళిపోయాడు.
అన్నపూర్ణమ్మ రాధతో ‘అన్న రానీయమ్మా మాట్లాడుదాము” అని అప్పటికి రాధను సమ్మతపరిచే మాటలు అంటూ, ”రాధా టిఫిన్ తీసుకుందాము రా” అంటూ పిలిచింది.
రాధ ఏమీ మాట్లాడకుండా డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చి కూర్చొని అమ్మ పెట్టన నాలుగు ఇడ్లీలలో రెండు తీసి పెట్టి నెమ్మదిగా తినసాగింది. అమ్మ నాన్న సంభాషణ విన్న రాధకు వాళ్ళ నాన్న ఎంత పట్టుదల మనిషో అర్థం కాసాగింది. ఇంజనీరింగ్‌ చేస్తానంటే నాన్న వద్దన్నప్పుడు అన్నతో చెప్పి నాన్నను ఒప్పించుకుని చదివి, ఉద్యోగం చేస్తున్నట్లే పెండ్లి విషయంలో కూడా నాన్నను ఒప్పించ వచ్చనే ఆలోచనలో వున్న రాధకు తన పెండ్లి విషయంలో వాళ్ళ నాన్న వద్దని తెగేసి చెప్పేయడం, ఆ విషయంపై ఇంకేమీ తర్జన, బర్జనలొద్దని, రామకృష్ణను పిలిపించి ఈ విషయమై మ్లాడాల్సిన అవసరం లేదని వాళ్ళ నాన్న కచ్చితంగా అన్నపూర్ణమ్మతో చెప్పడంతో తన అన్న రామకృష్ణ మాటలు, సపోర్ట్‌ నాన్న దగ్గర పనిచేయవని తెలిసొచ్చింది. అయినా.. రామకృష్ణకు ఫోను చేసి రమ్మని చెప్పాలని అనుకుంటూ అదే విషయం వాళ్ళ అమ్మతో అనింది.
”అమ్మా! అన్నకు ఫోన్‌లో విషయం చెప్పి రమ్మని చెప్తాను”అని. అన్నపూర్ణమ్మకు ఏమి చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో, రాబోయే ఉపద్రవాన్ని భరించే శక్తి లేకో.. ” ఎందుకు ఆలోచించకుండా, మాతో ముందే విషయాలు చర్చించకుండా పెండ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నావు రాధా! ఇప్పుడు చూడు మీ నాయనేమో ఆయన మొండి పట్టుదల వదలడు. మీ అన్న వచ్చి ఏమి నచ్చచెపుతాడు అలాంటి మనిషికి. అయినా ఆ అబ్బాయి ఎలాంటి వాడో, వాళ్ళ విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా, ముఖ్యంగా వేరే కులంలో ఇచ్చి చేయడం మీ నాన్న ససేమిరా అంటాడు. ఏమి చేయాలిప్పుడు”అని నిస్సహాయంగా బాధపడింది అన్నపూర్ణమ్మ.
రాధకు వాళ్ళమ్మ పరిస్థితి కూడా అర్థమయ్యింది. కులాలు, మతాలు, పాతుకుపోయిన సంస్కృతి, సంప్రదాయాలను దాటిపోయి ఆహ్వానించేంత విశాల భావాలతో, ఆ భావజాల వాతావరణంలో అమ్మ నాన్న పెరగలేదు. నేనే తొందరపడి నిర్ణయించుకున్నానా! అని ఒకసారి ఆలోచించసాగింది. రెండు తరాల మధ్య ఆలోచన, అవగాహన అంతరాల వల్ల ఇలాంటి ప్రేమ వివాహాలు అంత సులభంగా జరగవన్న వాస్తవం గోచరమవుతూంది రాధకు.
అమ్మ నాన్నలను ఒప్పించి పెండ్లి చేసుకోవాలా! వద్దంటే … శ్రీధర్‌ను పెండ్లి చేసుకొనే ఆలోచన మానుకోవడమా! అనే మానసిక సంఘర్షణలో పడిపోయింది రాధ. ఇంట్లో అందరినీ కాదని వెళ్ళిపోయి పెండ్లి చేసుకునే ధైర్యం లేదు. అలా అని అమ్మా నాన్నను కాదని పెళ్ళి చేసుకోవడం రాధకు ఇష్టం లేదు. శ్రీధర్‌ పట్ల ఆకర్షితురాలై వీటన్నింటిని గురించి లోతుగా ఆలోచించలేదు. అందుకే అన్నారు ‘ప్రేమ గుడ్డిదని’ అని తలపోసింది.
ఆ రోజు రాధ, ‘రామకృష్ణకు ఫోన్‌ చేసింది. విషయం చెప్పి నాన్నతో మాట్లాడమని. రామకృష్ణ ”మేము, నేను మీ వదిన రెండు రోజుల్లో ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ ని కలిసి, చూసి, వాళ్ళతో మాట్లాడి వస్తామని చెప్పాము కదా రాధా, మేమెవరు చూడకుండా నాన్నతో ఎట్లా మాట్లాడేది”అని ఆగి ‘నీవు హైదరాబాద్‌ వెళ్ళిపో మేము వెళ్ళి శ్రీధర్‌తో మాట్లాడిన తరువాత మాట్లాడుదాం నాన్నతో సరేనా” అని పెట్టేశాడు ఫోన్‌ రామకృష్ణ. రాధ మనస్సులో నిస్పృహ, నిరుత్సాహం, నిస్సహాయత! ఈ విషయం ఇంత జఠిలమయిందా! అని తనను తానే ప్రశ్నించుకుంది. ఏమి చేయాలో తెలియన అయోమయ పరిస్థితిలో పడిపోయింది రాధ.
నేను ఇవన్నీ ఆలోచించకుండా శ్రీధర్‌పట్ల ఆకర్షితురాలయి, పరిచయాన్ని పెంచుకుని అమ్మ నాన్నను ఒప్పించి పెండ్లి చేసుకోవచ్చనే ధీమాతో ఎందుకిలా నిర్ణయం తీసుకున్నాను? నాన్నకు కులం పట్టింపు ఇంత గాఢంగా వుంటుందని ఊహించలేదు అని తనలో తర్కించుకోవడం మొదలు పెట్టింది. వేరే సంబంధం, నాన్న చూపెట్టిన మనిషిని పెండ్లి చేసుకోవడానికి మనసొప్పడం లేదు.
తన మనస్సులోని సంఘర్షణను ఆ రాత్రి వాళ్ళమ్మ ముందు పెట్టింది.
”ఈ ఆలోచన ముందే చేయాల్సింది రాధా, మేమంతా మా అమ్మ నాన్న కుదిర్చిన వ్యక్తులను పెండ్లి చేసుకుని సంసారం చేయడం లేదా”! అని అంది అన్నపూర్ణమ్మ.
రాధకు ఏమనాలో అర్థం కాలేదు. అమ్మ నాన్న పుట్టి పెరిగిన ఆ తరం ఆలోచనా విధానం అది అనే విషయం రాధకు స్పష్టమయింది. వారు ఆ సాంప్రదాయ ఆలోచనా చట్రం నుండి బయటపడి పెండ్లికి ఒప్పుకోవడం కష్టమనేది కూడా గ్రహించింది. తాను ఒక అగాధంలో పడిపోయి బయటపడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ.
”కాలంతోపాటు పెద్దలందరి మనసులు, ఆలోచనలూ మార్పు చెందవు. ఆ మార్పుకు దోహదం చేసే కారకాలు, కారణాలు, నేపద్యం అందరికి ఒకేలాగుండవని, సంఘంలో పాతుకు పోయిన కుల, మత హోదా, ఆస్తులు ఇవన్నీ ఆడపిల్లల వివాహాలకు ముఖ్యమయిన నిర్ణయాత్మ కారకాలనేది నాకు ఇప్పుడు అర్థమవుతూందమ్మా. వాటి ప్రభంజనానికి ప్రేమ గాలిలో కొట్టుకు పోవాల్సిందేనా?” అని రాధ నిరాశగా మాట్లాడిందని అత్తమ్మ చెప్పారు.
అన్నపూర్ణమ్మకు రాధ అంత ఆలోచించి, విడమర్చి వాళ్ళమ్మతో మాట్లాడడం ఆమెకు సంతోషమేసింది. రాధ మనసు మార్చుకుంటుందిలే, నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయనుకుంది. అదే విషయం ఆ రోజు రాత్రి అన్నపూర్ణమ్మ భర్తతో, ”రాధ ఆలోచిస్తూంది, మనసు మార్చుకుంటుందిలేండి, చూద్దాము,”అని అక్కడే పడుకుంది.
మరుసటి రోజు తెల్లవారే సమయానికి అన్నపూర్ణమ్మకు మెలకువ వచ్చి రాధ రూమ్‌లోకి పోయింది పలకరిద్దామని.
పైన ఫ్యాన్‌కు ఉరివేసుకుని వ్రేలాడుతున్న రాధను చూసి ” ఏమండీ రాధ…” గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి క్రింద పడిపోయింది అన్నపూర్ణమ్మ. వెంకటరామయ్య వచ్చి నిశ్చేష్టుడై నిలబడి పోయాడు.
*****

అంతా విన్న సునీతకు మనసులో బాధ, ఆందోళన, ఆలోచన సంఘంలో కాలం మోసుకొస్తున్న వేగవంతమయిన మార్పులకు తల్లిదండ్రులు, రాధలాంటి యువత ఎంతమంది ఎదుర్కొంటున్నారో ఇలాంటి సమస్యలు. సమస్యల నెదుర్కొనే ధైర్యం, నేర్పు, ఓర్పు లేకపోవడం. తల్లితండ్రుల అవగాహన, ఆలంబన కొరవడి ఇలాంటి
ఆత్మహత్యలు ఎక్కువవడం. దీనికి పరిష్కారమేది?”అని ఆలోచించసాగింది సునీత.
ఈ తరం యువతను ఎంతగానో ప్రభావితం చేస్తుంది సోషల్‌ మీడియా. ప్రపంచంలో యువత ఆలోచనలు, నడవడిక, చదువు, ఉద్యోగం, వివాహ విషయాలలో అంతర్జాలం అందించే సమాచారాలతో సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా వారొక ప్రత్యేకమయిన తరంగా తయారవుతున్నారు. ఇదొక విపరీత కాలదోషంగా తోచింది సునీతకు. ఈ కాల మార్పుల్లోని సాధక బాధకాలను తల్లి తండ్రులు కూడా పరిశీలించాలి, పిల్లల క్రొత్త ఆలోచనలను, వ్యక్తిత్వాలను గౌరవించి వారి జీవిత నిర్ణయాలు వాళ్ళు తీసుకునే విధంగా పిల్లల వ్యక్తిత్వాలను మలచుకోవాలి. ఈ కాలానుగుణంగా పిల్లల పెంపకంపై ఒక ప్రణాళికాబద్ధమయిన ఆలోచన ఈ తరం తల్లిదండ్రులు చేయాల్సి వుంది, లేకపోతే తరాల ఆలోచనాంతరాలు రాను రాను యువతను, తల్లిదండ్రులను చాలా మానసిక సంఘర్షణలకు లోను చేసి ఎటూ నిర్ణయించుకోలేక, పరిస్థితులతో రాజీ పడలేక ఆత్మహత్యే మార్గమని యువత మనో దౌర్బల్యానికి గురవుతున్నారు. తల్లితండ్రుల్లో ఈ అవగాహనా రాహిత్యంతో పిల్లల చదువు, వివాహం విషయాలలో తల్లితండ్రుల మోరల్‌ సపోర్టు లేకపోవడం వల్లనే ఈ ఆత్మహత్యలన్నీ. ఇవి ఈ కాలం, సంఘం చేస్తున్న హత్యలా…? అనే ప్రశ్న ఉదయించింది సునీత మనస్సులో. ఉదృత కాల ప్రవావహంలో నిర్జీవంగా కొట్టుకుపోతున్న యువత కండ్ల ముందు మెదిలారు సునీతకు.
ఆ ఉధృత నదీ ప్రవాహానికి కొట్టుకొని పోకుండా తట్టుకొని నిలబడి ప్రజలను ఆవలిగట్టుకు చేర్చే దృఢమైన వంతెనలాగ, తల్లితండ్రులు పాత, కొత్త తరాల మధ్య కాలప్రవాహ ఒడుదుడుకులను తట్టుకుని తమ పిల్లలను ఆవలి తరానికి క్షేమంగా చేరవేసే బలమైన జీవన వారధులు కావాలనిపించింది సునీతకు.
అంతలో దివ్య ”అమ్మా.. టిఫిన్ పెట్టు” అంటూ దగ్గరకు రావడంతో సునీత ఆలోచనలకు తెరపడింది. దివ్యను ప్రేమతో పొదివి పట్టుకుని కూతురితో కూడా డైనింగ్‌ హాల్‌లోకి నడిచింది సునీత.

నాదీ అద్దె మనసే

రచన: నూవుశెట్టి కృష్ణకిషోర్

అలా కుర్చీలో నిస్సత్తువగా కూర్చుని నావైపు దీనంగా చూస్తున్న నాన్నని చూస్తుంటే తనని నేను ఎలాంటి ప్రశ్న అడిగానో నాకు అర్ధం అయింది. అలాగే తన ముఖం చూసి తను చెప్పకుండానే నాకు జవాబు కూడా తెలిసి పోయింది, నా అనుమానం నిజమే అని కూడా అర్ధం అయింది. రాత్రి నుంచి ఎదో మూల కొద్దిగా ఆశగా ఉండేది, నేను విన్నది నిజం కాదేమోనని కాని తనని ఇప్పుడు ఇలా చూస్తుంటే ఒక్కసారిగా నా నవనాడులు కృంగిపోయాయి, ఎందుకో ఆ ఇంటినుంచి నన్ను నేను బయటకు విసిరేసుకున్నట్లుగా అనిపించి మనసు మొత్తం మొద్దుబారి పోయింది. తను ఊగుతున్న రాకింగ్ కుర్చీ చిన్నగా చేస్తున్నశబ్దం తప్ప రూం అంతా నిశ్శబ్దంగా ఉంది. అయినా నేను అలా తనని నేరుగా అడగకుండా ఉండాల్సింది, నా ప్రశ్న తన మనసును చాలా బలంగా తాకి ఉంటుందని తెలుసు ….అయినా అడగక తప్పలేదు.
నేనడిగింది “నాన్నా! నేను అమ్మ కడుపులో పెరిగి పుట్టలేదా?” అన్న ఒకే ఒక ప్రశ్న.
ప్రశ్న చిన్నదే కాని జవాబు నా జీవితం అంత పెద్దది.
కొద్ది క్షణాలు గడిచాయి, ఆ కొద్దిసేపు మా మధ్యలో మౌనమే మాటగా మారింది. చిన్నగా తలెత్తి తన వైపు చూశాను, తన చూపు ఎదురుగా ఉన్న నా చిన్నప్పటి ఫోటో మీద ఉంది. అది నా రెండో సంవత్సరం పుట్టినరోజు తీసిన ఫొటో ఎందుకో అదంటే తనకి చాలా ఇష్టం . నేను తనవైపే చూస్తున్నాను. నేను తననే చూస్తున్నానని తనకి తెలుసు కాని తను నా వైపు చూడకుండా కళ్ళు మూసుకున్నాడు, తన కళ్ళల్లో తడి తెలుస్తుందనేమో మరి . ఈ పరిస్థితి నాకూ ఇబ్బందిగానే ఉంది. ఆ నిశబ్దాన్ని చంపుతూ చిన్న గొంతుతో తనే చెప్పాడు.
అవును నిజమే. నువ్వు సరోగేట్ బేబివి, అయినా అదేమీ నేరంకాదే. దాచిపెట్టాలని అనుకోలేదు, అలాగని ప్రత్యేకంగా పిలిచి చెప్పాలని కూడా అనుకోలేదు , అలా రోజులు గడిచి సంవత్సరాలు అయ్యాయి అంతే. నా వైపు చూడకుండానే చెప్పాడు.
అయినా ఇప్పుడు నీకిది…చివరలో మాట మింగేశాడు.
రాత్రి…నిన్న రాత్రి అమ్మ నువ్వు నా గురించి వాదులాడుకుంటుండగా కొన్నిమాటలు వినపడ్డాయి. అప్పుడు అర్ధమైంది . చెప్పాను.
అప్పటికి నువ్వు ఇంటికి వచ్చేశావా ?
అప్పుడే వచ్చాను.
మీ మాటల ద్వారా అర్ధం అయింది మీరు బాగా డ్రింక్ చేసి ఉన్నారని.. అందుకే అప్పుడు మాటలాడలేకపోయాను, అడగలేకపోయాను .
అవును నిజమే రాత్రి కొద్దిగా ఎక్కువే తాగాను , నిన్న నీ పుట్టిన రోజు.
“నీ పుట్టిన రోజు అని కూడా మర్చిపోయి తను క్లబ్ మీటింగ్స్ అంటూ వెళ్లి ఎప్పుడో వచ్చింది అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను, కాని నీ దాకా వస్తుందనుకోలేదు, అసలు చిన్నప్పుడే నీకు చెప్పి ఉంటే సరి పోయేది ఇప్పుడు అది ఆరడుగుల ప్రశ్నగా మారింది జవాబు చెప్పాలంటే కష్టంగా ఉంది “అంటూ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు.
“నువ్వు మోసి కని ఉంటే వాడి పుట్టిన రోజున ఇలా క్లబ్ మీటింగ్స్ కి వెళ్లి ఇప్పుడు వస్తావా” అని అమ్మతో అన్నట్లున్నారు? పక్కనున్న మంచినీళ్ళ బాటిల్ తన చేతికిస్తూ అడిగాను .
బాటిల్ తీసుకుని తాగకుండా పక్కన పెట్టి అవును అన్నాను.. చెప్పానుగా కొద్దిగా డ్రింక్ ఎక్కువైంది అని అయినా అది మందు ఎక్కువైనప్పుడు అన్న మాట. నిజానికి నువ్వు తన బిడ్డవే, తన ప్రేమలో కూడా తేడాలేదు, పైకి చూపించదు అంతే , దానికి తోడు కొద్దిగా తనకి కీర్తి కండూతి ఎక్కువే , అందుకే అన్ని పైనేసుకుని క్లబ్బులు మహిళా మండళ్ళు అంటూ ఇంటిపట్టున ఉండకుండా తిరుగుతూ ఈ స్థాయికి వచ్చింది.ఇంత బిజి అయింది.
ఈ బిజీలోనేనా నన్ను ఓ తొమ్మిది నెలలు మోయలేక అద్దె మనిషిని ఎంచుకుంది ? కాస్త కసిగా అడిగాను.
అటునుంచి జవాబులేదు వెంటనే, కళ్ళు తెరిచి ఈసారి నావైపు చూసి చెప్పాడు చిన్నగా గొణిగినట్లుగా, అదేంలేదు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం కూడా, అన్ని కలిసొచ్చాయి. కాని నువ్వు.. నువ్వు మా రక్తానివే ఆ మాట చెబుతున్నప్పుడు ఇబ్బందిగా కుర్చీలో అటూఇటూ కదిలి పక్కనున్న నీళ్ళ బాటిల్ తీసుకుని కొద్దిగా తాగి పక్కన పెట్టాడు .
నిజానికి నాకూ ఇష్టం లేదు ఇంతకంటే పొడిగించటానికి అందుకే వాతావరణం చల్లబరచడానికి చిన్నగా నవ్వాను. అవతలివారితో వాదించడం ఇష్టం లేకపోతే కూడా ఇలా నవ్వుతానని తనకి తెలుసు. అందుకేనేమో తరువాత తనేమి ఎక్కువగా మాట్లాడలేదు.
ఇంతకీ తన పేరు ఏమిటి? అదే నన్ను ఆ తొమ్మిది నెలలు మోసిన అద్దె అమ్మ పేరు ? నా గొంతు కొద్దిగా వణికింది, అద్దె అమ్మ అంటున్నప్పుడు.
ఆమె పేరు వందన . తరువాత ఎప్పుడూ కలవలేదు.
ఎంత తీసుకుంది నన్ను మోయటానికి?
ఎం మాట్లాడకుండా మౌనంగా నా వైపు అదోలా చూసాడు , ఈ సారి ఆ చూపులో తను గెలిచిన ఆనందం ఉంది. ఒక్క నిమిషం అంటూ పైకి లేచి తన రూమ్ లోకి వెళ్లి కొద్దిసేపటి తరువాత బయటకు వచ్చాడు, చేతిలో ఓ కవర్ ఉంది. చాలా పాతదిలా ఉంది.
ఓపన్ చేసి చూడు ఎంత తీసుకుందో నీకే తెలుస్తుంది. కవర్ చేతికిస్తూ చెప్పాడు.
ఓపన్ చేసి చూశా, లక్ష రూపాయలకు వందన అనే పేరు మీదున్న చెక్ క్రింద నాన్న సంతకం. నే పుట్టిన రోజున తనకి ఇచ్చిన చెక్ లాగా ఉంది సంతకం క్రింద ఉన్న డేట్ నా పుట్టినరోజు డేట్ ఒకటే . వెనక్కి తిప్పి చూసాను చిన్నాకి అమ్మ అని రాసి క్రింద వందన అని తన సంతకం ఉంది. అసంకల్పితంగా చేతితో ఆ సంతకం మీద అలా తడిమాను ఏదో తెలియని ఆనందం, నన్ను తను మోస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఇలా తన పొట్టపై నుంచి నన్ను తడుముకుందో ..ఎందుకో తనని ఎలాగైనా ఒక్కసారి చూడాలనిపించింది.
అది తనకి నేనిచ్చిన లక్షరూపాయలు, పైసా కూడా తీసుకోకుండా తన గుర్తుగా ఆ డబ్బులు నీ పేరు మీద బాంక్ లో వేయమని చెప్పి వెళ్ళిపోయింది.
క్రింద కారు చప్పుడు అమ్మ వచ్చినట్లు ఉంది., నాకు నిజం తెలిసిన విషయం అమ్మకి తెలియాల్సిన అవసరం లేదనిపించింది.
చివరగా అడిగాను తను ఇప్పుడు ఎక్కడ ఉంది?
తెలియదు.
కనీసం ఆ హాస్పిటల్ పేరు డాక్టర్ పేరు అయినా గుర్తు వుందా?
ఉంది, అమృత హాస్పిటల్, డాక్టర్ అమృత. వైజాగ్ యం వి పి కాలని . వందన తన దగ్గరే పనిచేసేది తను చాల మంచిదనే తనని వప్పించింది డాక్టర్. ఒకప్పుడు ఆ డాక్టర్ మీ అమ్మ ఫ్రెండ్.
మెట్ల దగ్గర చప్పుడు అమ్మ పైకి వస్తున్నట్లుగా, నాన్న కళ్ళు తుడుచుకున్నాడు. నేను నా రూం లోకి వెళ్లి పోయాను. నాకు తెలుసు నాన్నకూడా అమ్మకి ఈ విషయం చెప్పడని, నేనూ తనని అడగదలుచుకోలేదు.
అలా ఓ పది పదిహేను రోజులు గడిచాయి. రాను రాను ఆ ఇంట్లో ఉంది నేను కాదు అనిపించసాగింది, నన్ను నేను కోల్పోయినట్లు ఫీలింగ్. ఎందుకో తెలియదు ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా నాన్నకి నాకూ మాటల దూరం పెరిగింది, అది ఇద్దరికీ స్పష్టంగా అర్ధమవుతుంది. అమ్మ మామూలే తన బిజిలో తను ఉంది.
ఓ రోజు ఇద్దరూ ఉన్నప్పుడు సడన్ గా చెప్పాను కంపెనీ పనిమీద అమెరికా వెళుతున్నానని, ఓ మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ అని.
నాన్న మౌనంగా నా వైపు చూసాడు. కళ్ళలో ఏ భావాలూ లేవు సరే అన్నట్లుగా తలూపాడు తనకీ నేను కొద్దిరోజులు దూరంగా ఉండటం మంచిదనిపించిందేమో. అమ్మ మామూలే అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ లిస్ట్ చేతిలో పెట్టింది ఏదైనా సమస్య వస్తే కలవమని చిటికలో చేసి పెడతారని, తన మాటలలో తనకున్న పరపతి పవర్ తనకి తెలియకుండానే బయటకొచ్చేస్తుంటుంది.
అమెరికా వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది ఈ లోగా నాకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకున్నాను, అమ్మ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే డిల్లీ వెళ్ళింది . నాన్న ఎయిర్ పోర్ట్ దాకా వస్తానంటే బలవంతంగా ఆపాను. చేతిలో చేయివేసి వీడ్కోలు యిచ్చాడు, ఎందుకో నాలో ఏ భావం లేదు మౌనంగా బయటకి నడిచాను. బయటకి వచ్చి ఇంటిని ఓ సారి బాగా చూసుకున్నాను మళ్ళీ ఎప్పుడో మరి.
రాగానే సేఫ్ గా చేరాను అని కాల్ చేసి చెప్పాను . నిదానంగా రోజులు నెలలయ్యాయి అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేవాడిని కాని ఆ తరువాత ఆ అప్పుడప్పుడు కూడా ఎప్పుడో అయిపోయింది. ఎక్కడో ఏదో తెలియని దారం తెగి పోయినట్లనిపించింది. రొటీన్ లైఫ్ లో పడి పోయాను. నెలలు సంవత్సరాలు గా మారాయి.
కాలం కొన్నిటిని బలపరిస్తే కొన్నిటిని బలహీన పరుస్తుంది. అమ్మ శారీరకంగా బలహీన పడింది , ఇల్లు గుర్తుకొచ్చినట్లుంది. దానితోపాటు బంధాలు అనుబంధాలు కూడా, ఇప్పుడు తనే ఫోన్ చేస్తూ తరుచుగా ఇంటికి రమ్మని పిలవడం మొదలుపెట్టింది. ఓ రోజు సడన్ గా లీవ్ పెట్టిరా అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము అంది. ఆలోచించకుండా చెప్పేసాను కసిగా ఓ అబద్దం నాకు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు ఓ బాబు అని డీటైల్స్ చెప్పి ఫోన్ పెట్టేసాను.
అంతే ఓ మూడు నెలలు ఏ ఫోనూ లేదు ఊహించగలను వాళ్ళ కలలసౌధం పూర్తిగా కూలిపోయి ఉంటుందని, నాకు కావాలిసింది కూడా అదే. . ఎందుకంటే నా దృష్టిలో వారు చేసింది నేరం.
ఓ రోజు నాన్న నుంచి కాల్, బాగోగులు మాట్లాడాక చిన్నగా చెప్పాడు అమ్మకి పరాల్సిస్ స్ట్రోక్ వచ్చిందని వచ్చి కూడా రెండు నెలలు దాటిందని బెడ్ మీదే ఉందని, అందుకే ఎక్కువగా ఫోన్ చేయలేదని, భావరహితంగా విన్నాను. గొంతు బొంగురు పోతుంటే చెప్పాడు ఒక్కసారి నిన్ను, కోడలిని, మనవడిని చూడాలనుకుంటుంది వచ్చి ఓ నాలుగు రోజులు ఉండి పొండి తనూ సంతోషంగా వెళ్ళిపోతుంది, తనకి అత్తయ్యా, నానమ్మా అని పిలిపించుకోవాలని బాగా కోరికగా ఉంది. బహుశా ఇదే తన చివరి కోరిక కూడా కావచ్చు గొంతు బొంగురులో ఎక్కువ మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పక్కన పెట్టి నేనూ ఓ క్షణం కళ్ళు మూసుకున్నాను. వంటింట్లో తను గిన్నెలు సర్దుతున్న చప్పుడు. ఎందుకో ఆ చప్పుడంటే నాకు చాలా ఇష్టం .
బాగా ఆలోచించి వెళదామని మనసులో నిర్ణయం తీసుకున్నా, కాని ఎలా? ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నా, నా మనసంతా నాన్న చెప్పిన మాట మీదే తిరుగుతుంది “తనకి అత్తయ్యా, నానమ్మా అని పిలిపించు కోవాలని బాగా కోరికగా ఉంది” ఆ మాట దగ్గర వచ్చిన చిన్న ఆలోచన కొద్దిసేపటికి పెద్దదై నాకు తెలియకుండానే నిర్ణయంగా మారింది. అవును అద్దె తల్లులే దొరకంగా అద్దె కోడలు, మనవడు దొరకరా? కాస్త ప్రయత్నించాలి అంతే, అతి కొద్ది ఖర్చుతో సులభంగానే దొరికారు.
ఓ నాలుగు రోజులు కోడలిని మనవడిని దగ్గరకు తీసిన తరువాత వాళ్ళిద్దరూ తన కోడలు, మనవడు కాదు అని తెలిసిన క్షణం వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో చూడాలని కసితో కూడిన చిన్న కోరిక. వెంటనే నాన్నకి కాల్ చేసి చెప్పాను అందరం వస్తున్నట్లుగా.
కాని ఊహించినవన్ని జరగవు అని నాకు వారం తరువాత తెలిసింది.
ఇద్దరూ కాలం కొలిమిలో బాగా కాలి పోయినట్లుగా ఉన్నారు. వారిని చూడగానే షాక్. అమ్మ దగ్గర అప్పటి రూపుగాని మాటగాని లేవు. చిన్నపిల్లలకి బొమ్మలిస్తే ఆనందపడినట్లు ఆనందపడింది మమ్మల్ని చూసి. నన్ను, తన మనవడిని వళ్ళంతా తడుముకుంది. కోడలిని దగ్గర కూర్చుండ పెట్టుకుని మురిపంగా చూసుకుంది. నాన్నఆనందం అయితే చెప్పనవసరం లేదు హడావుడి అంతా తనదే. బాగా కలిసి పోయారు కోడలితో, మనవడిని అయితే క్రిందకి దించడం లేదు . వారి ఆనందం చూస్తుంటే ఒక్క క్షణం మనసులో ముళ్ళు గుచ్చినట్లుగా అయిపోయింది ఇద్దరూ బాగా ముసలివాళ్ళలాగా ఉన్నారు క్రమంగా ఇప్పటి రూపు అప్పటి వారి రూపుని నా మనసులో నుంచి తుడిపేయ సాగింది, దానితో పాటు నా ఆలోచనలు కూడా తుడిచి పెట్టుకొని పోతున్నాయి ఒక్కొక్కటిగా.
అప్పటి నా మానసిక పరిస్థితి వీరికి శిక్షగా మారి వీళ్ళని త్వరగా ముసలోళ్ళను చేసిందా అనిపించసాగింది. ఆలోచనల స్నానం మొదలైంది . ఎక్కడో ఏదో తప్పు చేసిన భావన శత్రువు ఎవరో తెలియకుండా పొరాడానా అని అనిపించింది. విచిత్రంగా ఒకప్పటి నా మానసిక పరిస్థితి ఇప్పుడు దూరంగా నిలబడి నువ్వు నువ్వేనా అని నన్నే ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. నీదీ అద్దె మనసే రా అని వెక్కిరిస్తోంది.
ఓ నాలుగు రోజులు ఇట్టే గడిచి పోయాయి. ఇక బయలు దేరాల్సిన రోజు రానే వచ్చింది ఒక నిర్ణయానికి వచ్చాను, వాళ్ళు తమ కోడలు మనవడే అన్న భావన వాళ్లకి అలాగే ఉంచేసి ఏమి చెప్పకుండానే అందరం బయలుదేరాము . ఎందుకో ఆ ఆనందాన్ని ఇప్పుడు వారికి దూరం చేయాలనిపించలేదు.
వీధి మలుపులో తల వెనక్కి తిప్పి చూశాను నాన్న తన చేయి ఊపుతూ ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. అమ్మ కిటికీలోనుంచి చూస్తూ ఉంది , వారిద్దరి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయని తెలుసు, వాళ్ళ కన్నీళ్ళు తుడవలేని నా చేతితో నా కళ్ళు తుడుచుకుంటూ చేయి బయట పెట్టి బై చెప్పాను. కారు ముందుకు సాగింది.
నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది, ఆ తృప్తి వాళ్ళిద్దరిని అద్దెకు తెచ్చానని చెప్పనందుకు వచ్చింది మాత్రమే కాదు, నన్ను నవమాసాలు మోసిన అద్దె అమ్మ వందనమ్మ ఎప్పటినుంచో నాతో పాటు అమెరికాలో ఉన్న విషయం కూడా చెప్పనందుకు వచ్చిన తృప్తి .
అమ్మా! నీ మీద కోపంతో నీ అమ్మతనాన్ని సగం చేసి అమెరికాలో ఉంచాను అని చెప్పనందుకు వచ్చిన తృప్తి.
ఎందుకో ఇప్పుడు వంట రూములో ఆ అమ్మ చేసే నా కిష్టమైన గిన్నెల చప్పుడులో ఈ అమ్మ చేయి కూడా కనిపించసాగింది.
కారు వేగంగా వెళుతుంది విమానాశ్రయం వైపు, దూరమైన నా అద్దె మనసును ఇక్కడే వదిలేసి.

________

నా కూతురు..

రచన: విశాలి పెరి

“”నాన్నా.. ప్లీజ్ పెళ్ళి విషయంలో నాకో ఆలోచన ఉంది.. ప్లీజ్ మీరు చెప్పిన సంబంధం నేను చేసుకోను ” అని స్పష్టంగా అంది ధన్య.
ఒక్కసారి నిశేష్టులయ్యాము..
“అది కాదూ ధన్య.. ” అని ఏదో చెప్పబోతే…
“నాన్న.. ప్లీజ్ రేపు అన్నీ విషయాలు మాట్లాడతాను.. నేను ఏవి అనుకుంటున్నానో, నా నిర్ణయమేమిటో కూడా రేపే విందురు, రేపు సాయంత్రం ఐదు గంటలకు నా నిర్ణయం చెబుతాను ” అని మాట తుంచేసి లోపలకి వెళ్ళిపోయింది ధన్య.
నిజంగా ఇదొక పెద్ద షాక్ నాకూ, రఘుకి. నోట మాట రాలేదు మా ఇద్దరికి. కళ్ళు అప్పగించి అలా చూస్తూ ఉండిపోయాము. ఏం జరుగుతోందో రెండు నిమిషాల వరకు మాకేం అర్ధం కాలేదు. ధన్యని ఇంత సీరియస్ గా ఎప్పుడూ చూడలేదు. “నాన్నా నువ్వు ఎంత చెబితే అంతా ‘ అని సూది పిన్నీసు నుంచి సెల్ ఫోన్ వరకు అన్నీ నాన్న మాటలే వినే ధన్య ఇప్పుడు జీవితంలో అది పెద్ద నిర్ణయంలో రఘుని ఇన్వాల్వ్ కావద్దని సూటిగా చెప్పడం నిజంగా షాకే!
రఘుకి ఏడుపొక్కటే తక్కువ.. తన గారాల పట్టి, తను ఎంత చెబితే అంతే అనే తన ముద్దుల కూతురు ఇప్పుడు పెళ్ళి విషయంలో ఇంత వ్యతిరేకంగా ఉంటుందని అనుకోలేదు. నిద్ర అస్సలు పట్టడం లేదు తనకి. అటు ఇటూ తిరుగుతూనే ఉన్నాడు రాత్రంతా. ఇదంతా నేనూ గమనిస్తునే ఉన్నాను, ఏంటో నాకు కూడా సరిగ్గా నిద్రపట్టడం లేదు. ఒకవైపు నుండి చూస్తే ఎన్నో ఏళ్లుగా నేను ఎదురు చూస్తున్న సందర్భం ఇది. ధన్య, రఘుకి ఎదురు తిరగడం చూడాలన్న నా జీవిత వాంఛ తీరిన క్షణమది.. కానీ ఏంటో ఒక ఆందోళన. రఘు ఇలా మొహం వాలేసుకుంటే చూడటం కష్టంగానే ఉంది నాకు. ఇలాంటి సందర్భాన్నా నేను కోరుకుంది?

***********

సరిగ్గా ఇరవై రెండేళ్ళ క్రితం రఘు నా చేతిలో ఒక అందమైన కుందనపు బొమ్మని తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు. నేను చేతిలోకి తీసుకొన్న వెంటనే ఒక చిరునవ్వు నవ్వింది… చాలు ఆ నవ్వు ఎన్నో వసంతాలు నా జీవితంలోకి తీసుకొని రాడానికి. దాని బుజ్జి బుజ్జి చేతులతో నన్ను తాకినప్పుడు ఓ అద్వితీయమైన అనుభూతి. చిన్న చిన్న గులాబి రంగులో ఉన్న కాళ్లతో తన్నితే ఒళ్ళంతా తీయని పులకరింత. ఇది మన జీవితంలోకి రావడమే మన జీవితం ‘ధన్యమ ‘య్యింది.. దీన్ని ‘ధన్య ‘ అనే పిలవాలి అన్నారు రఘు. ఒక్కసారి అలా చూస్తూ ఉండిపోయాను. నాకు ఆ పేరు నచ్చిందో లేదో కూడా అడగలేదు. నా నిర్ణయంతో పనేముంది? ధన్య.. రఘు కూతురు.

***********

తరవాత ధన్యకి బేబీ ఫుడ్స్ అని ఏవేవో చిన్న చిన్న సీసాలు తీసుకొచ్చారు రఘు.
“ఇవన్నీ ఎందుకు, ఇప్పుడేగా అన్నప్రాస అయ్యింది. గుజ్జులా అన్నము, రాగి, పళ్ళు, కూరలు ఉడికించి, అవి పెడితే చాలు. ఈ బేబీ ఫుడ్స్ లో ఏ ప్రిజర్వేటివ్స్ ఉంటాయోనండి. ఇలాంటి వద్దు ” అని అన్నాను.
” నీవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు, నా ధన్యకేమి కావాలో నాకు తెలుసు ” అని తను కొన్న తిళ్ళే తినిపించసాగారు. అదేంటో రెండు రోజులకే ధన్యకి వాంతులు, విరోచనాలు. ఇంక ఆ బయట తిళ్ళు మానిపించాకే అవి తగ్గాయి. ధన్యని మామూలు పిల్లని చెయ్యటానికి పదిరోజులు పట్టింది . ఆ తరవాత ధన్య తిండి విషయం మళ్ళీ నా మాట జవదాటలేదు. నేను వండడం వరకే.. దాన్ని తినిపించేది మాత్రం రఘుయే! సరిగ్గా పెడుతున్నానో లేదో ఎప్పుడూ తనకి అనుమానమే! ఎంతైనా ధన్య రఘు కూతురు కదా!
ఆ తరవాత ధన్య డ్రస్సుల విషయం. అన్నీ జిగ్ జిగ్ మనే డ్రస్సులే కొనేవారు రఘు. అవి గుచ్చుకొని ధన్య ఏడుస్తూనే ఉండేది. లోపల ఒక మెత్తటి కాటన్ డ్రస్సు వేసి అప్పుడు ఆయన కొన్నవి వేసేదాన్ని. అంత మంచి డ్రస్సులు ఇటు రఘునీ నొప్పించక, ధన్యకి నొప్పి కలిగించక ఏవో పాట్లు పడుతుండేదాన్ని. ఆ డ్రస్సు వేసేవరకే నా పని. అది ముస్తాబవ్వగానే దాన్ని ఎత్తుకొని బయటకెళ్ళిపోయేవారు నేను రెడీ అయ్యే లోపల.. హ్మ్మ్.. నేనెందుకు ఆ తండ్రీ కూతుర్ల మధ్యలో?
దాని ఇంటర్ అయ్యక అప్పుడు చదువు విషయంలో మళ్ళీ రాద్ధంతం మొదలయ్యింది. అది హాస్టల్ కి వెళ్ళి చదువుకుంటానని. దానికి ఆయన కూడా వంత పాడారు. ఊర్లో ఉంటూ హాస్టల్ ఎందుకని నా ఉద్దేశం. నా మాటకి ఎవరు ప్రాముఖ్యత ఇస్తారు? తండ్రీ కూతురు ఇద్దరూ ఒకటే! అది హాస్టల్ కి వెళ్ళింది. అది వెళ్ళిన రెండో రోజు దానికి ఇస్టమని ‘మజ్జిగ పులుసు ” చేసి పట్టుకెళ్లాము. కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. మళ్ళీ రెండు రోజుల తరవాత గులాబ్ జామూన్ చేసి పట్టుకెళ్ళాము.
” అమ్మా… నువ్వు ఇలా ప్రతి వారం వచ్చేస్తే నా చదువుకి డిస్టబ్ అవుతుంది ” అని అంది.
ఆ మాట కాస్త నొప్పించిన మాట వాస్తవమే కానీ… దాని చదువు కోసం నేను దూరంగా ఉండటం తప్పదు. జీవితంలో కొన్ని సార్లు డిటాచ్ అవ్వాలి. పిల్లల విషయంలో ఇది ఎప్పుడూ మరచిపోకూడదు. చిన్నప్పుడు అన్నీ పట్టించుకుంటే ఊరుకొనే పిల్లలు కాస్త వయసు వస్తే అతి జోక్యాన్ని ఒప్పుకోరు. ఎప్పటికైనా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకొన్న నిర్ణయం మంచిదో కాదో గ్రహించే విజ్ఞత మాత్రం మనమే ఇవ్వాలి. ఇంక అప్పటి నుంచి ధన్య హాస్టల్ కి నెలకోసారి వెళ్లసాగాము. ఒక ఆరు నెలలు హాస్టల్లో ఉండి ” నాన్నా.. నేను ఇంక హాస్టల్లో ఉండను.. ఇంట్లోనే ఉండి చదువుకుంటా ” అని తన నిర్ణయం చెప్పింది.
ఇదీ ఒకందుకు మంచిదే. తనంతట తానే ఏదీ మంచో తెలుసుకుంది.
ఒకరోజు ధన్య, రఘు సినిమా ప్రోగ్రాం పెట్టారు. తీరా వెళ్ళిన సినిమా నాకేమీ కొత్తగా అనిపించలేదు. సినిమా పేరు “ఆకాశమంతా” రోజూ చూస్తున్నదే అక్కడా కనిపించింది. కాస్త విసుగ్గా అనిపించింది. సినిమాలో కూడా తల్లి పాత్రకి ప్రాధాన్యత లేదు. త్రిషా ఎవడో ఒక సర్దార్ ని తీసుకొచ్చి బాయ్ ఫ్రండ్ గా పరిచయం చేసిన సీన్ వచ్చేటప్పుడు రఘు ముఖ కవళికలు నాకు తెగ నచ్చేశాయి. అస్సలు నచ్చలేదు ఆ సీన్ రఘుకి. నాకు మాత్రం సినిమాలో అదే రసవత్తర ఘట్టంలా అనిపించింది. అలాంటి సీను మా ఇంట్లో ఎప్పుడొస్తుందా అని ఇన్నేళ్లు ఎదురు చూశాను. ధన్య కూడా ఎవరో ఒకర్ని ఇష్టపడాలి. తండ్రి నిర్ణయాలకే పెద్ద పీట వేస్తే ధన్య అప్పుడు “నాన్న నా ఇష్టం నాది ” అనాలి, రఘు మొహం ప్రకాశ్ రాజ్ మొహం లా ఏడ్వలేక నవ్వలేక అలా పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్టుగా ఉండాలి… అబ్బా… ఊహే ఎంత మధురంగా ఉంది.
ధన్య చదువు అయ్యిపోయింది. చుట్టాలలోనే బోలెడు సంబంధాలు రాసాగాయి. రఘుకి ఇవేవీ నచ్చలేదు. ఒక మాట్రిమోనీలో ధన్య పేరు రిజిస్టర్ చేయించారు. ఈ విషయం ఆరు నెలల తరవాత నాకు తెలిసింది. నాకు మాత్రం రఘు ఫ్రండ్ ప్రసాద్ గారి అబ్బాయి నచ్చాడు. చిన్నప్పటి నుంచి చూస్తోన్నవాడు. ఫామిలీ కూడా బాగా తెలుసు. ఇదే విషయం రఘుకి చెప్పకూడదనే అనుకుంటూనే చెప్పాను.
వినిపించుకున్నట్టు లేరు ….
“అది కాదండి. ఇంత ముద్దుగా పెంచుకొన్న కూతుర్ని ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి ఎలా చేయగలము? స్టాటసా… అదీ మనకి తెలిసిన వాళ్ళలోనే చుట్టాలలోనే ఉంటారు. కాస్త సమయం తీసుకుని వెతుకుదాము. గొప్ప గొప్ప చదువులూ, అందం, స్టాటస్ ఉన్న ఈ మాట్రీమానీ వాడు మంచివాడయ్యి ఉంటాడని ఎంటీ నమ్మకం? దేశం కానీ దేశంలో మన పిల్లని ఆ ముక్కూ మొహం తెలియని వాడికి ఇచ్చి ఎలా వదిలేస్తామూ? కుటుంబం అదీ తెలిసిన వాడైతే మంచిది అని నా ఉద్దేశం , అయినా పెళ్ళికి ఇప్పుడేం తొందరొచ్చింది? మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వనీయండి. ఇంకో రెండేళ్ళ తరవాత చెద్దాము ” అని రఘు విన్నా వినకపోయినా నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను.
” ధన్య పెళ్ళి విషయంలో నాది. ధన్యదే నిర్ణయం ” అని నా మాటకు విలవ ఇవ్వలేదు.
నిన్న అదే విషయం దాని దగ్గర ప్రస్తావించారు ” ధన్య ఇదిగో ఈ అబ్బాయి ప్రొఫైల్ చూడు యూ. ఎస్ లో సెటిల్ అయ్యాడు… నీకు సరిపోతాడు అన్ని విషయాలలో. వెల్ సెటిల్డ్ , తల్లీ తండ్రులు కూడా లేరు.. ఎవరి పోరూ ఉండదు ” అని ఎవరో అబ్బాయి ప్రొఫైల్ చూపించారు.
“అయ్యో అయ్యో… ఎవరూ లేని వాడికా ఇచ్చేది పిల్లని. ఈ రోజుల్లో అత్తగారి ఆరళ్ళు ఎక్కడున్నాయండి? అత్తగారు , మావగారు ఉంటేనే ముచ్చట్లు. అవి లేని వాడికి ఎలా ఇస్తాము పిల్లని? రేపు ఏదైనా మంచి చెడు మాట్లాడటానికి పెద్దవారు లేకపోతే ఎలా? ” అని ఆవేశంగా అన్నాను… అది ఆయన పట్టించుకుంటేగా!
“చూడు వాణీ! సంతలా కుటుంబ సభ్యులు సినిమాలలో ఉంటే సినిమా హిట్ అవుతుంది… కానీ నిజంగా ఉంటే ఒళ్ళు హూనమౌతుంది. ఇలాంటివి నా కూతురికి ఉండటం నాకు ఇష్టం లేదు. అది ఆడింది ఆట పాడింది పాటగా రాజ్యమేలాలి ” అని అన్నారు రఘు
” ధన్య.. అమ్మ మాటలేవీ పట్టించుకోకు… ఈ సంబంధం నీకు కూడా నచ్చుతుందని నాకు తెలుసు.. నా మాటే నీ మాట కదా.. ఒక్కసారి నువ్వు ‘ఊ ” అంటే ఆ అబ్బాయిని కాంటాక్ట్ చేస్తాను ” అని అన్నారు రఘు
అప్పుడు ధన్య ” నాన్నా.. ప్లీజ్ పెళ్ళి విషయంలో నాకో ఆలోచన ఉంది.. మీరు చెప్పింది నేను చేసుకోను ” అని అంది.

************************************

ఇంకొన్ని గంటలలో ధన్య నిర్ణయం చెబుతుంది. రఘుకి ఆ మాటలు జీర్ణించుకోలేక ఆకలి లేదు. నాకు జరిగే తమాషా చూడాలన్న ఆతృతతో ఆకలి లేదు. ధన్య ఎలాంటి వాడిని ఎంచుకుంటుంది? అన్నిటికీ తొందర నిర్ణయాలు తీసుకొనే ధన్యకి చాలా బాగా ఆలోచించగలిగే వాడు కావాలి. ముక్కు మీద కోపం ఎక్కువ ఉన్న ధన్యకి కాస్త ఓర్పు కలవాడు, ఆలోచనాపరుడు కావాలి. ఎంత కోపం ఉన్నా ధన్య మాత్రం చాలా మెచూర్డ్ గాళ్ . చూడాలి అది ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుందో? అయినా ఇవన్నీ నాకెందుకు? అది రఘు కూతురు. నేను ఈ తమాష చూసి ఆనందించాలి. ఏంటో అదొక రాక్షసానందం అనిపించింది నాకు.
సాయంత్రం నాలుగు నలభై కి ధన్య ‘ టీ ‘ చేసి తీసుకొచ్చింది.
“నాన్నా! టీ తీసుకో.. అమ్మా.. నువ్వూ తీసుకో ” అని ఇచ్చింది.
నా చూపులన్నీ వీధి వైపే ఉన్నాయి.. ఏ సర్దార్ జీ వస్తాడో అని. ఒక్కడే వస్తాడా? లేక సర్దార్ జీ వాళ్ళ అమ్మ, నాన్న , చెల్లి, బీజీ (ఆకాశమంత సినిమాలో నాన్నమ్మ ని బీజీ అంటారని తెలిసింది) కూడా వస్తారా? పంజాబీ వాళ్లది ఎక్కువ పెద్ద ఫామిలీలే ఉంటాయిట. ఒక పది మంది సంతానంలో నాలుగో వాడిని ధన్య ఇష్టపడితే బాగుండును. ఆ ఫామిలీనీ చూసి రఘు చిరాకు పడితే… భలే భలే….
రఘు టైం చూసుకొని ధన్య వైపు చూసి ” నీ నిర్ణయం చెబుతానన్నావు… ” అని ముక్తసరిగా అన్నారు.
“నాన్న! నా చిన్నతనం నుంచీ నాకు ఏది కావాలన్నా నువ్వే చూసుకొన్నావు ” అంటే ఇప్పుడు ఇంక చూడాల్సిన అవసరం లేదన్న మాటేగా, ఇదే మాట ధన్య అంటే వినాలని ఉంది.
” కొన్ని నా నిర్ణయాలు తొందరతో తీసుకొన్నా, నువ్వు వాటినే సమర్ధించావు, అప్పుడు నువ్వు నాకు చాలా నచ్చేసేవాడివి, కానీ అమ్మ ప్రతీ విషయంలోనూ మనది తప్పు అని తన నిర్ణయం చెప్పేది, అప్పుడు అమ్మ అంటే నాకు చాలా కోపం వచ్చేది. కానీ నాన్నా మనం ఎన్ని నిర్ణయాలు తీసుకొన్నా చివరకు అమ్మ నిర్ణయమే కరక్ట్ అయ్యేది ”
ఒక్కసారి కళ్ళు పెద్దవి చేస్తూ ధన్య వైపే చూస్తూ ఉండిపోయాను…
” నాన్నా… ఇంత వరకు తీసుకొన్న నిర్ణయాలు మళ్ళీ వెనకు తీసుకొనే అవకాశమున్నవి. కానీ పెళ్ళి జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చేది. ఇది తప్పుడు నిర్ణయంతో మా ఇద్దరి జీవితాలే కాదు నాతో పాటు మీవి కూడా బాధకరం అవుతాయి. అమ్మ కి చిన్నప్పటి నుంచి నా విషయంలో ఏ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఇవ్వలేదు మీరూ నేను. కాబట్టి నా పెళ్ళి విషయంలో అమ్మదే తుది నిర్ణయం. అమ్మ ఎవర్ని చూపించి పెళ్ళి చేసుకోమన్నా నేను రెడీ ” అని అంది ధన్య.
నాకు కంఠంలో ఏదో అడ్డుపడినట్టు ఉంది. ధన్య ఇలా మాట్లాడి నన్ను మూగదాన్ని చేసేసింది.
” అమ్మా.. హాపీ మదర్స్ డే, హాపీ బర్త్ డే! నువ్వు పుట్టినరోజే నాకు మదర్స్ డే అమ్మా ” అని అంది..
“అరే ఈ రోజు నా పుట్టినరోజా… అస్సలు గుర్తులేదురా ” అని మాటలు కూడ బెట్టుకొని అన్నాను.
“ఇదే నీ బర్త్ డే గిఫ్ట్ అమ్మా ” అని అంది ధన్య … రఘు కూతురు… కాదు .. నా కూతురు.. నా కన్న కూతురు…

*****

కట్టుకుపోతానే…..

రచన: అనురాధ నాదెళ్ల

దీర్ఘ తపస్సులో ఉన్న కోటేశ్వర్రావుకి హఠాత్తుగా చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు తెలిసింది. ఎక్కడినుంచో చల్లని, సువాసనలు వెదజల్లే గాలులు అతని శరీరాన్ని తాకాయి. తపస్సు ఫలించి దేవుడు స్వర్గంలోంచి దిగి వస్తున్నట్టున్నాడు.
ఇంతలో చెవులకింపైన స్వరం ఒకటి వినిపించి కళ్లు తెరిచాడు.
“చెప్పు కోటీ, నీకేంకావాలో ”ఎదురుగా కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్న దేవుణ్ణి చూసి ఒక్కసారిగా ఆనందబాష్పాలతో నమస్కరించాడు కోటేశ్వర్రావు.
“స్వామీ, నేను నగరంలో ఉన్న ధనవంతుల్లో ఒకణ్ణని నీకు తెలుసు కదా, ”అన్నాడు కోటి ఉపోద్ఘాతంగా. దేవుడి మందహాసం చూసి,
“స్వామీ, నాదొక కోరిక, మీకు విన్నవించుకుందుకే ఇంత తపస్సు చేసాను ”
“చెప్పుకోటీ, భక్తుల కోర్కెలు తీర్చేందుకే నేనున్నది, ఇంకా సంపాదించాలనుకుంటు న్నావా? నగరంలో అందరిలోకీ నువ్వే ధనవంతుడివయ్యేలా చెయ్యమంటావా? “
“స్వామీ, అది కావాలనుకుంటే సాధించగలను. నేను కోరుకునేది అది కాదు ”
“మరి నీ కోరికేమిటో త్వరగా చెప్పు కోటీ ”
కోటి చిన్నబుచ్చుకున్నాడు.
“స్వామీ నేను అంత తపస్సు చేసి నీ దర్శనం చేసుకుంటే నువ్వు విసుక్కుంటున్నావు ” అన్నాడు బాధగా.
“కోటీ నువ్వు అర్థం చేసుకోవాలి. నేను నీలాటి భక్తులెందరినో కలవాలి, ఎందరి కోర్కెలో తీర్చాలి. ఇల్లు ఎప్పటికి చేరాలి చెప్పు. లక్ష్మీ దేవి రోజూ నా ఆలస్యానికి అలుగుతుందే కానీ అలిసిపోయి ఆలస్యంగా వచ్చిన నన్ను అర్థం చేసుకోదు. ”ఆయన తన గోడు వెళ్లబుచ్చు కున్నాడు. కోటి ఆశ్చర్యపోయాడు, మనుషుల్లాగే దేవుళ్లకి కూడా ఇలాటి కష్టాలుంటాయి కాబోలు.
“భక్తా… ”అంటూ దేవుడు మరో మారు హెచ్చరించాక ఉలిక్కిపడి కోటి తన కోర్కెను దేవుడి ముందు పెట్టేసాడు……..
“స్వామీ, నేను కష్టపడి సంపాదిస్తుంటే నా భార్య, పిల్లలు ఎలాటి కష్టం లేకుండా హాయిగా ఆ డబ్బుని అనుభవిస్తున్నారు. వాళ్లకి నా మీద కాస్త కూడా ప్రేమ లేదు. వాళ్లలా బ్రతికే తీరిక నాకు లేదు. కనీసం నేను చనిపోయాకైనా నేను సంపాదించుకున్ననా ధనాన్ని నాక్కావలసినట్టు తీరిగ్గా అనుభవించే వరాన్నివ్వు స్వామీ ”తన గుండెలో దినదిన ప్రవర్థ మానంగా పెరుగుతున్న కోర్కెని దేవుడికి చెప్పేసాడు కోటి.
దేవుడికి నోట మాట రాలేదు. ఇదేం కోర్కే? ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ కోర్కెని కోరలేదే. ఇదెలా సాధ్యం?
“భక్తా, నీకు తెలుసు, చనిపోయిన మనిషి తనతో ఏమీ వెంట తీసుకెళ్లలేడు. తాను అన్నాళ్ళూ మోసిన శరీరాన్ని కూడా వదిలే వెళ్లాలి. నువ్వు ఎంత సంపాదించినా, ఏమి దాచుకున్నా అది బ్రతికుండగానే అనుభవించాలి. అంతే. ”
“అందుకే కదా స్వామీ ఇంత తపస్సు…………. ”మరింకేదో చెప్పబోతున్న కోటిని ఆపి, “అది కాకుండా ఇంకేదైనా కోరుకో ”అన్నాడు దేవుడు.
“నాకు మరింకేం కోర్కెలు లేవు స్వామీ. ఈ వరాన్నివ్వు. చాలు ”వినయంగా చెప్పేడు.
“నువ్వు ఇకపైన సంపాదన వెంట పరుగులు ఆపి , హాయిగా జీవితాన్ని అనుభవించు. నీ డబ్బుతో కావలసిన సుఖాల్ని పొందు. ”
“లేదు స్వామీ, బ్రతికున్నన్నాళ్లూ నాకు సంపాదించటంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ లేదు. సంపాదన లేకుండా ఒక్క రోజు గడపలేను. ”
“నువ్వు పెట్టిన ఫ్యాక్టరీలు, నీ బ్యాంకు డిపాజిట్లు నీకు నిత్యం ఆదాయాన్ని తెస్తూనే ఉన్నాయి కదా. అది సంపాదన కాదా వెర్రివాడా?ఇంకా సంపాదించాలన్న తాపత్రయం ఎందుకు ”
“సంపాదించటం నా బలహీనత స్వామీ, అర్థం చేసుకో” అన్నాడు కోటి.
“ఇది ఇంతవరకు ఎవరూ అడగాలేదు, నేను ఇవ్వాలేదు. దానిలో ఉండే లాభనష్టాలు ఆలోచించుకున్నావా?” అనుమానంగా అడిగేడు దేవుడు.
“ఆలోచించుకున్నాను స్వామీ. ఇలాటి వరం పొందితే ఒక చరిత్రని సృష్టించినవాడినవు తాను.” గర్వంగా చెప్పాడు.
“సరే, మరోసారి ఆలోచించుకోమని మాత్రం సలహా ఇవ్వగలను. ఆ వరమే కావాలంటే ఇస్తాను. మళ్లీ ఈ వరం వద్దని తపస్సు చెయ్యనని మాటివ్వు నాకు ” దేవుడు దీవించాడు.
ఆనందంగా దేవుడి మీద తనకొచ్చిన శ్లోకాలన్నీ చదివి కోటి తన కృతజ్ఞతను తెలుపు కున్నాడు.
హిమాలయాల్లో కెళ్లి తపస్సు చేసి సాధించిన వరం గురించి ఆలోచించుకుంటూ ఆనందంగా ఇల్లు చేరాడు కోటి. ఎప్పటికన్నా చాలా హుషారుగా ఉన్న భర్తను చూసి ఈ వయసులో మరో పెళ్లి చేసుకు రాలేదు కదా అని వరలక్ష్మి కాస్త అను మానపడింది. తండ్రి హిమాలయాల్లో కెళ్లి వచ్చేక మరింత ఆదర్శతండ్రి అయిపోయాడని పిల్లలు సంతోషించారు.
ఓరోజు రాత్రి అలిసి పోయి ఇంటికొచ్చాడు కోటి. భోజనానికి కూర్చుంటూ భార్య వచ్చి వడ్డిస్తుందేమోనని చూసి, చూసి తనే వడ్డించుకున్నాడు. ఆవిడ తమ క్లబ్ సభ్యులు అందరినీ సింగపూర్ తీసుకెళ్ళాలనకుంటున్నాననీ, అలా తీసుకెళితే ఇంకో నాలుగు నెలల్లో జరిగే క్లబ్ ప్రెసిడెంటు ఎన్నికల్లో తను నెగ్గుతాననీ చెప్పి భర్తతో కాదనిపించుకుని కోపంతో సాధిస్తోంది.
కూతురు ఎప్పుడూ స్నేహితులతో, విలాసాలలో మునిగి ఉంటుంది. కొడుక్కి వ్యాపారాన్ని అప్పగిద్దామంటే బాధ్యతలొద్దు అంటూ విసుక్కుంటాడు. వీళ్లు ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉన్నారో. తను ఏనాడూ ఇలా కాలాన్ని నిర్లక్ష్యంగా గడపలేదు. తెల్లవారుతూనే కుటుంబ సభ్యుల్ని పిలిచి, ”ఇకపైన నేను మీకు నెలకింతని లెక్కగా మాత్రమే ఇస్తాను.” అన్నాడు.
“డాడీ, ఎటూ మీరు సంపాదించేదంతా మాకోసమే.” అన్నాడు కొడుకు నిర్లక్ష్యంగా.
కోటి కోపంతో తను చనిపోయాక జరగబోయే విషయాన్ని వాళ్లకి చెప్పేసాడు. భార్య, పిల్లలు తెల్లబోయారు. “మర్చిపోయినట్టున్నారు. ఆస్తులన్నీ మా పేరున మా అధీనంలో ఉన్నాయి” భార్య ధీమాగా చెప్పింది.
“నీ తెలివికి నాకు గర్వంగా ఉంది, కానీ నా సంపాదన నా వెనుకే వస్తుంది.” కోటి నవ్వాడు.
మర్నాటి నుంచి భార్య, పిల్లల్లో వచ్చిన మార్పు చూసి తన మాటలతో దారిలోకి వచ్చారని సంతోషించాడు. కానీ ముందు జాగ్రత్తగా కోటి శాశ్వతంగా బ్రతికి ఉండేందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించే పనిలో వాళ్లు మునిగి ఉన్నారని కోటికి తెలియదు.
ఇహలోక జీవితం చాలించి తనదైన జీవితం అనుభవించాలన్న ఆత్రం ఎక్కువైంది కోటికి. దేవుడు ఆత్మహత్య లాటిదేదీ చేసుకోకూడదని ముందే షరతు పెట్టాడు.
కోరుకున్నట్టుగానే ఒకరోజు కోటి జీవితం సమాప్తమైపోయింది. ఎప్పుడు విముక్తమవుదామా అని చూస్తున్న కోటి శరీరం శ్మశానికి తరలించే ప్రయత్నాలేవీ జరగ లేదు. చుట్టుప్రక్కల వాళ్లు ఆ విషయం పోలీసుల దృష్టికి తెచ్చారు. “వాళ్ల కుటుంబీకులకు చెప్పండి, మేము ఏం చెయ్యగలం. ”అనేసారు వాళ్లు.
ప్రాణం పోయిన వంద గంటలలోపు తన ఆఖరి యాత్ర పూర్తి అవ్వాలని దేవుడు చెప్పాడు. సమయం గడుస్తుంటే శరీరాన్ని అంటి పెట్టుకున్న కోటికి చెమటలు పడుతున్నాయి. ప్రజల ఒత్తిడి ఎక్కువై కోటి కుటుంబ సభ్యుల్ని పట్టుకుని నిలదీసారు పోలీసులు.
“మా చేతిలో పైసా లేదు. అనాథ ప్రేత సంస్కారం మీరే చేసెయ్యండి ”అన్న కొడుకు మాటలతో కోటికి అప్రయత్నంగా తల్లి గుర్తొచ్చింది. భోరుమని ఏడ్వటం మొదలెట్టాడు.
చేతిమీద తట్టినట్టైంది కోటికి. ప్రాణం పోయాక స్పర్శ ఎవరిది? ఆశ్చర్యంతో కళ్లు విప్పాడు, చూడగలుగుతున్నాడు. ఎదురుగా వరలక్ష్మి.
“ఏమైంది. ఎందుకా ఏడుపులు? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా?” విసుక్కుంది.
తను బ్రతికే ఉన్నాడా? ఔను, మంచం మీద, తన గదిలోనే ఉన్నాడు. అయితే, తన తపస్సు, వరం, చనిపోవటం అంతా ఒట్ఠి కలే.
తల్లి జ్ఞాపకం మాత్రం నిజం. కోటి తండ్రి చిన్నప్పుడే పోతే తల్లి కష్టపడి పిల్లల్ని పెంచుకొచ్చింది. ఉన్నంతలో ఇరుగుపొరుగు వాళ్లకి సాయం చేస్తుండేది. “మనకే ఒక ఆధారం లేదు, అందరి సంగతి నీకెందు” కంటూ తల్లితో పోట్లాడేవాడు కోటి
“మనకేం తక్కువరా కోటీ. మీ నాన్న లేకపోయినా, ఆయన కట్టించిన ఇల్లుంది. అంతో ఇంతో తినేందుకుంది. ఆమాత్రం తోటి వాళ్లకు చేతనైన సాయం చేస్తేయేం? ఉన్నదేదో నలుగురితో కలిసి తినాలి, కానీ కట్టుకుపోతామా? ”అంటూ కొడుక్కి హితబోధ చేసేది. అతనికి ఆ మాటలు చెవికెక్కేవి కావు. “నేను కట్టుకుపోతానే ”అంటూ విసుక్కునేవాడు. కోటి సంపాదించటం మొదలెట్టాక డబ్బంటే విపరీతమైన వ్యామోహం పెంచుకున్నాడు. కుటుంబంలోని వాళ్లు ఖర్చు చేస్తున్నా సహించలేక పోయాడు. అదే ఈ కలకి కారణం అని అర్థమైంది. లేచి బాల్కనీలోకి వచ్చాడు.
తెలవారుతున్న సూచనగా తూరుపు దిక్కు ఎరుపెక్కుతూ ప్రపంచాన్ని నిద్ర లేపుతోంది. తన శక్తినంతా ధారపోసి నిత్యం లోకానికి వెలుగులు పంచే సూర్యుణ్ణి చూసేందుకు అతనికి అపరాధ భావం అడ్డొచ్చింది. తనకున్న దాన్ని నలుగురితో కాదు, నమ్ముకున్న భార్యాబిడ్డలతో కూడా పంచుకునేందుకు ఇష్టపడని స్వార్థపరుడు మరి. కానీ ఈ పశ్చాత్తాపం క్షణికమని కోటికి తెలుసు.

రంగుల ‘భ్రమ’రం..

రచన, చిత్రం, కవితాగానం : కృష్ణఅశోక్

ఈ మైక్ మీద క్లిక్ చేసి  కవితను వింటూ చదువుకోండి.

అప్పుడప్పుడు…
ఆకాశంలో ఉల్కలు రాలిపడినప్పుడో, భూమ్మీద సునామీలు చెలరేగినప్పుడో, నాలోకి నేను ప్రయాణం చేస్తుంటాను… కారణం లేకుండానే!
జ్ఞాపకాలు హృదిలో కదలాడే వేళ మొదట కనిపించేది నీవే…
నగ్నంగా… అవును! నగ్నంగానే…
నిన్ను మొదటిసారి నగ్నంగా చూసినప్పుడు “నా న్యూడ్ పెయింటింగ్ వేస్తావా!?” అని ఆకాశంలో ఏదో వెదుకుతున్నట్టు చూస్తూ అడిగావ్… గుర్తుందా!…” భౌతికంగా కాకుండా, మనో నగ్నత్వం తో చూస్తేనే నిన్ను నగ్నంగా చిత్రించగలను” అని చెప్పాను…
నీకు గుర్తుండదు…
హు!.. అర్ధం కూడా అయి ఉండదు.
*** *** ***
ఆ రోజు మనిద్దరం మధువు తాగి, తనువుల తకధిమి ఆడుకున్నాము. పరవశాన తేలిపోతున్న తరుణంలో.. నా గుండె మీద తల వాల్చి, ఒక భక్తుడు భగవంతుడిని చూస్తున్నట్లు కళ్ళు పైకెత్తి, ఆనందం అతిశయించి మత్తెక్కిన చూపులతో నా కళ్ళల్లోకి చూస్తూ అన్నావు. “యు ఆర్ గుడ్ ఎట్ లవ్ మేకింగ్” అని… అస్పష్టంగా అన్నావు, కానీ.. అది నాకు చాలా స్పష్టంగా వినిపించింది.
అది నా మది చెవికి చేరింది. నాలో ఓ సంఘర్షణాత్మక పరిశీలన మొదలైంది…
మనసుల కలయికని love (ప్రేమ) అంటారని తెలుసు, కానీ తనువుల కలయికని ‘లవ్’ అంటారని అప్పటివరకూ నాకు తెలీదు…
మనసులోని భావాలు, అనుభూతులు ఒకటొకటీ పంచుకున్నాక, ఒక పరిమళ కుసుమం వికసిస్తుంది,
దాన్నే ప్రేమ అంటారు అనే పాత కాలపు ఆలోచనలు తప్ప, ‘లవ్ మేకింగ్’ అనే మాటకు అర్ధం తెలియని, అవసరం కూడా లేని సంగతి అది ఆనాటికి…!
ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమతో ఆత్మల ఆలింగనంతో పాటుగా ఒకరిలో ఒకరు ఒదిగిపోవడం, ఆత్మీయానుబంధ అనురాగంతో ఎగసిన ప్రేమోద్వేగాలను ఒకరినొకరు చల్లార్చుకోవడం, కాంక్షల కెరటాలను తనువుల పరిష్వంగాలతో ఓదార్చుకోవడం… ఇది… నాకు తెలిసిన ప్రేమైక శృంగారం…

*** *** ***

ఆ రోజు… సిటీలోని ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలో నా చిత్ర ప్రదర్శన ఇనాగ్రేషన్. ఓ ఆర్ట్ హిస్టారియన్ చీఫ్ గెస్ట్, దీపం వెలిగించి షో ని ప్రారంభించారు. విజిటర్స్ పెయింటింగ్స్ ని చూస్తూ ఉన్నారు.
గ్యాలరీలో ఒక మూల రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో వేసిన పెయింటింగ్ దగ్గర కొందరు తదేకంగా గమనిస్తూ ఉన్నారు. విజిటర్స్ కి ఆ పెయింటింగ్ థీమ్ వివరిస్తున్నాను. అంతలో ఒక మీడియా రిపోర్టర్ చేతికి మైక్ ఇచ్చి, “ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ పెయింటింగ్” అన్నాడు… వివరిస్తున్నాను…ఖచ్చితంగా కెమరామెన్ వెనక రెండు ‘కలువ కళ్ళు’ అందంగా నవ్వాయి. చిలిపితనం, చెలిమితనం, ప్రేమ తత్వం అన్ని భావాలు ఒక్కసారిగా కురిపిస్తున్నట్లు ఆ నీ చూపులు!
మనసు తడబడటం అంటే అదే…నా ఈ నలభయ్యేళ్ళ జీవితంలో మొదటిసారి!
ఆ కలువ కాంతి చూపులు నన్ను తాకగానే మనోగమనం ఒక్కసారి ఆగింది…
తరచూ టి.వి.లో కనిపించే నాకిష్టమైన ఓ సెలెబ్రెటీ నర్తకి నా ఆర్ట్ షోలో కనిపించడం ఆనందంతో కూడిన ఆశ్చర్యం…
అక్కడ మొదలైన మన పరిచయంతో ప్రేమ ప్రయాణం…
ఎన్నో అరుణోదయ కాంతుల్లో మధురోహల పంపకాలు…
ఏటి గట్లు, సెలయేర్లు…
పచ్చిక బయళ్ళ సాక్షిగా ఊసులాటలు…
అందమైన స్టార్ హోటల్ డిన్నర్లు…
చిలిపితనపు లాంగ్ డ్రైవ్లు…
ప్రేమ విహంగాలమంటూ విమానపు ప్రయాణాలు…
సముద్రాలు దాటుకుంటూ విదేశీ యానాలు…
ఇద్దరి మధ్య పాటల కచేరీలు, ఆధ్యాత్మిక చింతనలు, కళల పైన చర్చలు ఒక్కటేమిటి ఎన్నో…
ఒక యోగిలా నిశ్శబ్దంగా కుంచె చేతబట్టి తెల్లని కాన్వాస్ ల పైన ఏకాగ్రతగా చిత్రాలకు రంగులద్దుకొనే నన్ను చిత్రంగా మార్చావు, ఎమార్చావు… మాటల గారడీలు చేసావో, మత్తు మందులే చల్లావో..
నిరంతర నీ ఆరాధకుడిగా మలచావు… నా చిత్రాల్లో నాయకిగా వెలిసావు..!!
నీ ప్రేమ మత్తు పొగమంచులా నా చుట్టూ వ్యాపించింది. కనులకు వేరేది కానరాని గమ్మత్తైన స్థితి…
నా మనో పరిభ్రమణానికి నీవే కేంద్ర బిందువయ్యావు.
ధర్మార్థ కామ మోక్షాలకు అతీతమైన ఆత్మానంద అనుభూతి.
కాలంతో పాటు, మధురమైన రాత్రుళ్ళు, పగళ్ళు…
రసాస్వాదనల ఇంద్ర ధనుస్సులు, సరాగాల ప్రయాణం…
ఏ రాక్షస చక్షువుల వీక్షణాలు నను వరించాయో, పదిలంగా అల్లుకున్న ప్రేమ అల్లిక దారాలు, దారాలుగా విడిపోయి తెగిపోవడం మొదలయింది…
కారణం తెలియని… ఓ కారణం!
మన ఇద్దరి మధ్య దూరం!!
రోజులో ప్రతీ నిముషం ఒకరికొకరం పంచుకునే కమ్యునికేషన్ పలచబడటం మొదలైంది…
సాయంత్రాలు మనం కలుసుకునే చోటు నన్ను వొంటరిగా చూసి వెక్కిరించడం మొదలెట్టాయి…
వెన్నెల చందమామ ఎన్నోసార్లు ప్రశ్నించేది, ‘ఏది నీ కలువ భామ’ అంటూ…
కారులో పక్క సీటు దేవురిస్తున్నట్టు నా వంక చూసేది. నీవు లేవే అని!!
మనసు మౌనమయింది…
మూగగా రోదించింది…
వేగంగా ప్రయాణిస్తున్న రైలుకి సడన్ బ్రేక్ వేసి ఎవరో ఆపే ప్రయత్నం చేస్తున్నట్లు ఒక్కసారిగా నా గమనంలో అల్లకల్లోలం…
అందమైన కాన్వాస్ చిత్రం పై ఎవరో కన్ను కుట్టి, నల్ల రంగు పోసినట్టు నా జీవన చిత్రం వివర్ణమైంది. మ్లానమై మసిబారిపోయింది. స్టాండ్ లోని కుంచెలన్నీ నా వంక జాలిగా చూస్తున్నాయి.

*** *** ***

బాగా గుర్తుంది… అది మార్చ్ 12, 2013,
నీ ఆలోచనలతోనే నెమ్మదిగా కార్ డ్రైవ్ చేస్తూ వెళుతున్న నాకు… నమ్మలేని ఒక చేదు దృశ్యం నా కళ్ళ ముందు…
ఎదురుగా వెళుతున్న కార్ లో నీవు వేరొక వ్యక్తి తో కేరింతలు, కవ్వింతలు, ముద్దులు, కౌగిలింతలు… అన్నీ కార్ లోనే…
నా కళ్ళను నమ్మలేకపోయాను… నువ్వు వెళుతున్న ఆ కార్ ని దాటుకుని వేగంగా వెళ్లి గమనించాను…
అవును… నువ్వే… అది నువ్వే…కానీ, నీతో వేరెవరో…
అబ్బా… ఒక్కసారిగా మనస్సు ‘ఓ….’ అని పెద్దగా అరుపు. ఆగని రోదన.
గుండెని ఒక ఇనుప గుండుతో బాదినట్లు… భరించలేని వ్యథ… కన్నీటి ప్రవాహం…
ట్రాఫిక్ ని దాటుకుంటూ కారు ఓ పక్కన ఆగింది నాకు తెలీకుండానే.

*** *** ***

అది పౌర్ణమి…
నిస్తేజంగా చందమామనే చూస్తున్నాను,
చీకటి మనసున వెలుగు కోసం ఎదురు చూస్తూ…
నీవన్న మాట గుర్తొచింది “యు ఆర్ గుడ్ ఎట్ లవ్ మేకింగ్”… మళ్ళీ మళ్ళీ ఆ మాటే చెవిలో వినిపిస్తోంది. నెమ్మదిగా దానర్ధం స్పురించడం మొదలయింది.
తనువుల కలయికే నీ దృష్టిలో ప్రేమ అని, మేట్ చేసిన ప్రతి వ్యక్తినీ సోల్ మేట్ అంటావనీ…
నీ ఈ తత్వానికి నీవు పెట్టుకున్న పేరు ‘ప్రేమ’ ఏమో కానీ నాకది పచ్చి వ్యామోహం అనిపిస్తుంది…
ఏది ఏమైనా ఇటీస్ ఎన్ ఎపిసోడ్… ముగిసిన ఒక అందమైన అంకం… ఛీ… అందమైన అని అనలేని ఒక అంకం…ముగిసింది.

*** *** ***

కాలం ప్రవహిస్తూనే ఉంది. నీ జ్ఞాపకాల ప్రవాహపు జోరు తగ్గడం మొదలైంది. నాలో ప్రేమ పట్ల పరమార్థం మారిపోయింది…
కాన్వాస్ పై రంగుల ప్రయాణం సాగుతూనే ఉంది, జీవన సత్యం రంగుల రూపంలో..
తెల్లని కాన్వాస్ ఫై ఏ రంగు కాంతి పరావర్తనం చెంది మన కాంతిని చేరుతుందో, ఆ వర్ణంలో మనకు ఆ చిత్రం కనిపిస్తుంది.
ఎంత చిత్రమో….!!
మనసు నిశ్శబ్ద గమనం చేస్తూనే ఉంది… ప్రేమ అనే ఓ రంగుల ‘భ్రమ’ చెదిరిపోయింది.

*** *** ***

అది మే 18, 2015
మళ్ళీ… అవును మళ్ళీ…
భాషా, భావం తెలియని ఓ భావన చిగురించింది. ఓ అందమైన అమ్మాయి పరిచయంతో ఓ రంగుల భ్రమరం నాలో ప్రవేశించింది.
కాలం నాకు మరో కొత్త రంగుల భ్రమ ని అల్లుతోంది…
‘భ్రమ’ ఆనందంగానే ఉంటుంది…!!

భూరితాత

రచన: భాస్కరలక్ష్మి సంభొట్ల

అర్ధరాత్రి రెండు అయినట్టు ఉంది, టెలిఫోన్ చప్పుడికి ఇంట్లో అందరం హాల్లోకి వచ్చాము. మా అబ్బాయి తేజ పేరున్న హృదయవ్యాది నిపుణుడు కావడంతో మాకు ఇవి మామూలే. ఎదో అత్యవసర పరిస్థితిట, హాస్పిటల్ నుండి సందేశం, హడావిడిగా అబ్బాయి వెళ్ళిపోయాడు. నాకు, మా ఆవిడకి వెంటనే నిద్ర పట్టలేదు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ, టీవీ చూస్తూ ఉన్నాము. ఇంతలోనే తేజ వచ్చేశాడు. ఎవిట్రా అంటే ఐదేళ్ల చిన్న కుర్రాడికి నిన్న సాయంత్రం శస్త్ర చికిత్స
చేశారుట, ఆ పిల్లాడికి ఇందాక ఒక్కసారిగా ఊపిరి బిగపెట్టడంతో మావాడు చికిత్స చేసి పిల్లాడిని గండం నుండి కాపాడాడుట.

హమ్మయ్య అని ఇద్దరం మంచినీళ్లు తాగి, పడుకుందాం అని లోపలి వెళ్తున్నాం. ఈసారి కాలింగ్ బెల్ మోగింది . మా వాడు తలుపు తెరవగానే ఆ ఐదేళ్ళ పిల్లాడి తల్లిట, ఏడుస్తూ మావాడి కాళ్ళ మీద పడి తను కటిక బీదరాలు అని, భర్త ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడని, ఈ ఆపరేషన్ కి డబ్బులు లేవు అని మొరపెట్టుకుంది. డబ్బులు ఇస్తే కానీ పిల్లాడిని ఇంటికి పంపమని హాస్పిటల్ వాళ్ళు చెప్పారని, మీరు చెప్తే ఒపుక్కుంటారు అని బతిమాలింది. మా వాడు వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేసి డబ్బు విషయంలో వారిని ఇబ్బంది పెట్టదని, పూర్తిగా నయం అయ్యాకనే పిల్లాడిని ఇంటికి పంపమని చెప్పాడు. ఆ తల్లి కోటి దండాలు పెట్టి, కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళింది.

నిజము చెప్పద్దూ నాకు పుత్రోత్సాహం పొంగుకు వచ్చి, చాలా గర్వంగా అనిపించింది.

కానీ ఆ పిల్లాడి తల్లిని చూస్తే ముప్పైఏళ్ళ క్రితం నన్ను నేను చూసుకునట్టు అనిపించింది. గర్వం అణిగిపోయింది. మా భూరితాత గుర్తుకువచ్చారు, అస్సలు మార్చిపోతే కదా గుర్తు రావడానికి, మా జీవితాలే ఆయన పెట్టిన భిక్ష.

మనస్సు గతంలోకి వెళ్ళిపోయింది.

ముప్పైఏళ్ల క్రితం, రాజోలు మున్సిపాలిటీలో గుమాస్తాగా పని చేసే నాకు, నిడదవోలుకి బదిలీ అయింది. ఐదేళ్ళ మా తేజ, నా అర్దాంగితో కలిసి అక్కడ మూడు డాబాల వీధిలో చిన్న ఇంట్లోకి అద్దెకు దిగాము. అది వర్షాకాలం కావడంతో, దిగిన మర్నాడే మా వాడికి చలిజ్వరం వచ్చింది. నీళ్ళ తేడా ఏమో అనుకుని ఇంటివైద్యం చేసినా గుణం కనపడకపోగా ఇంకా ఎక్కువ అవసాగింది. ఇక లాభం లేదు అనుకుని అక్కడ ప్రభుత్వ వైద్యశాలకి తీసుకుని వెళ్ళాం, అది పచ్చకామెర్లని, వెంటనే రాజమండ్రి తీసుకుని వెళ్లాలని సూచించారు. ఇంటికి వచ్చి అన్నీ సద్దుకుని వెళ్ళేలోపలే భోరున వర్షం, కుంభవృష్ఠి. ఇంతలో ఊరు ఊరు అంతా అల్ల కల్లోలం. గోదావరి వరదలని, ఎక్కడి వారు అక్కడ ఉండాలని సూచనలు జారీ చేసారు. ఊరిలో విద్యుత్ , టెలిఫోన్ సరఫరా నిలిపివేసారు. పిల్లాడిని చూస్తే దక్కేలా లేడు. ఏమి పాలుపోక దిక్కుతోచని స్థితి లో ఏడుస్తూ ఉండగా గొడుగు వేసుకుని, మోకాళ్ళ లోతులో ఉన్న వరదలో ఈదుకుంటూ, రామంగారు వచ్చారు. ఆయిన సందు చివర్లో ఉండే ఆయుర్వేద వైద్యులు భూరితాత గారి అబ్బాయి. మా పక్కింటివాళ్ళు మా అబ్బాయి విషయం చెపితే, వైద్యం దొరకక ఇబ్బంది పడుతున్నాము అని తెల్సి, కామెర్లకి ఆయుర్వేదంలో గోమూత్రము, గోవు పేడతో చేసిన మందులు తెచ్చి, వాటిని ఆవుపాలు బెల్లం కలిపిన అన్నంతో వేసుకోవాలని చెప్పి,ఇలా మూడురోజులు పత్యం చేస్తే పిల్లాడికి ఎలాంటి ప్రాణ పాయం లేదని భరోసా ఇచ్చి వెళ్లారు. వెళ్తూ వారి ఇంటి గోశాలలో ఉన్న ఆవు పాలు, శ్రేష్టమయిన నల్ల బెల్లం కూడా ఇచ్చి వెళ్ళారు, ఈ వరదల్లో మాకు అవి దొరుకుతాయో లేవో అని. నిజంగా ఆ శ్రీనివాసుడే మా ఇంటికి వచ్చి మాకు దారి చూపించాడు అన్నట్టు తోచింది. భూరితాత గారి మందులు మా వాడి మీద పనిచేశాయి. మావాడు మూడు రోజుల్లో కొలుకున్నాడు. మా ఆవిడ చేత చక్కెర పొంగలి చేయించి, దేవుడికి నైవేద్యం పెట్టి, భూరితాతగారి ఇంటికి కృతజ్ఞతపూర్వంగా బయలుదేరాను.

ఆయిన గురించి, ఆయన ఇంటి గురించి విన్నదే కానీ ఇంతవరకు చూసింది లేదు. మూడు డాబాల వీధిలో మొదటి ఇల్లు వారిదే. అది ఐదువందల గజాల ఇల్లు. ఇల్లు కన్నా పర్ణశాల అంటే బావుంటుంది. గేటు తెరిచుకుని లోపలకి వెళ్ళగానే ఎడమచేతి వైపు ఒక వారుగా గోశాల. కుడిచేతి వయిపు మొత్తం ఆయుర్వేద మొక్కలు, ఆయుర్వేద మందులు తయారు చేసే గది, ఎత్తయిన వేప,రావి , రకరకాల పండ్ల చెట్లు. మధ్యలో ఇల్లు. ఇంటి వెనక ఒక వారకి బావి, మధ్యలో తులసమ్మ, ఇంకో వారకి కూరలు పండించే మడి. ఇంటి మొదట్లో పెద్ద వసార. అక్కడ పదిహేను మంది పిల్లలకి భూరిగారి అబ్బాయి రామంగారు వారి ఆవిడా ఉచితంగా విద్యా బోధనలు చేస్తున్నారు. వారిరువురు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకులు. ఇవి కాకుండా తీరిక సమయంలో ఆయుర్వేద మందులు చేయడంలో, గోశాలని శుభ్రపరచడంలో, తోటపనిలో నిమగ్నులయి ఉంటారు. ఇంటి చివర్లో పెంకుటిల్లుతో చేసిన విశాలమైన వంట గది ఉంది.

అది నిత్యాగ్నిహోత్రం, మరి రోజుకి కనీసం పది మంది వారాలు చేసుకునే అబ్బాయిలు అక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు. భూరితాత గారి సతీమణి అన్నపూర్ణ గారు పేరుకు తగ్గట్టుగా వందలమందికి అక్కడ వండి వారుస్తూ ఉంటారు.

వసార దాటి ఇంటి లోపలికి వెళ్ళగానే పెద్ద హాల్ లో పడక కుర్చీలో తెల్లని పంచె, తెల్లటి జుబ్బా ,అంతకన్నా తెల్లటి ఛాయలో నుదుటి విభోది పెట్టుకుని కాశీ విశ్వేశ్వరుడిలా మెరిసిపోతున్న భూరితాతని చూసి అచేతనంగా ఉండిపోయాను. ఆయిన మనవలు ఆయనకి అన్నం తినిపిస్తున్నారు. నన్ను చూసి కూర్చోమని సంజ్ఞ చేశారు. ఇంతలోనే రామంగారు వచ్చి కూర్చోమని చెప్పి, మంచినీళ్లు ఇచ్చారు. నా ప్రశ్నార్ధకమయిన మోహము చూసి రామంగారే బదులు ఇచ్చారు, భూరితాతకి పక్షవాతం వచ్చి ఏడాది అయింది అని, ఎడమ వయిపు మొత్తం చలనం లేదని, మాటకూడా స్పష్టంగా రావట్లేదని, అయిన్నప్పటికి చురుగ్గా అని పనులు చేస్తూ, మందులు ఎలా చేయాలో చెప్తూ, పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారని చెప్పారు.

ఆయిన జీవితం, ఆయిన కుటుంబం రెండూ ఎంత స్ఫూర్తి దాయకం , కొన్ని వందల మందికి ఉచితంగా వైద్యం , భోజనం, విద్య అందిస్తున్నారు. మా అబ్బాయిని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం అని వెళ్ళాను. కానీ నా కర్తవ్యం వేరే ఉంది అని గుర్తించాను. చక్కెర పొంగలి అన్నపూర్ణ గారికి ఇచ్చి , ఆదిదంపుతులు ఇద్దరికీ నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చాను.

ఆ తరువాత నిడదవోలులో ఏడాది కన్నా ఎక్కువ కాలం ఉండదలేదు. ఉద్యోగరీత్యా ఊర్లు బదిలీ కావాల్సి వచ్చింది. ఆఖరికి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని రిటైర్ అయ్యాను. మా అబ్బాయి భూరితాతని స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి డాక్టర్ చదివాడు. ప్రముఖ వైద్యశాలలో పని చేస్తున్నాడు. ఈ మధ్యనే వివాహం కూడా చేసాము.

ఎన్ని ఊర్లు వెళ్ళినా భూరితాతని నేను , మా కుటుంబం మర్చిపోలేదు. మేము ఊరు వదలి వచ్చిన మూడేళ్లకి భూరితాత కాలం చేసారు అని తెల్సి వెళ్ళాము. ఆయినని కడసారి చూసుకోడానికి వచ్చిన జన సంఖ్యని చూసి చెప్పచ్చు ఆయిన చేసిన మంచి అంత ఇంత కాదని. రామంగారితో అప్పుడు అప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. ఈనాటికి భూరితాతగారి మనవలు, మనవరాళ్ళూ అవే సేవలు అందిస్తున్నారు అని తెల్సి చాల సంతోషించాను.
‘ఏవండి కాఫీ’ అనే పిలుపుతో గతం నుండి ప్రస్తుతానికి వచ్చాను. కాఫీ తాగి, స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని నా రోజు వారి దినచార్యలోకి దిగాను. ముందుగా ఇంటి గేటు పక్కనే ఉన్న గోశాల లోకి వెళ్లి మేము పెంచుకుంటున్న మూడు గోమాతలకి గ్రాసం వేసి , చుట్టూరా శుభ్రం చేసి వచ్చాను. ఇంట్లో ఒక వారకి పెంచుకుంటున్న పూల మొక్కలకి, కూర మొక్కలకి నీళ్ళు పోసాను. ఇంటి వెనకాల ఉన్న వేప, రావి, ఉసిరి, మవిడికాయ చెట్లకి కూడా నీళ్ళు పోసాను.

ఇంటి చుట్టూరా ఉన్న ఎండి పోయిన ఆకుల్ని ఏరి చెట్లకి ఎరువుగా వేసాను.ఇంతలో మా ఆవిడా, కోడలు వంట పూర్తి అయిందని అనగానే మేము నలుగురం కలిసి అల్పాహారం చేసాము.

అబ్బాయి తేజ హాస్పిటల్ కి వెళ్ళిపోయాక, ఇంటి ముందున్నకొద్దిపాటి స్థలంలో బల్లలూ, కుర్చీలు వేసి , వండిన అల్పాహారం, భోజనం అన్ని సిద్ధం చేసి పెట్టాను. మధ్యాహ్నం లోపు మేము కాకుండా కనీసం ఒక పది మందికి సరిపడేలా వంట చేసి ఉచితంగా భోజనం పెట్టడం మా దినచర్య లో భాగమే. ఇంటి బయట ఉచితంగా అన్న దానం అని చిన్న బోర్డు పెట్టాను. మా సందులోకి వచ్చిన చిన్న చిన్న వ్యాపారస్తులు , ఏమి లేని ముష్టివాళ్ళు , మా అబ్బాయి కోసం వచ్చే రోగులు , వారి బంధువులు మా ఇంటి అతిధులు.

భోజనాలు అయ్యాక కొద్దిగా విశ్రాంతి తీసుకున్నాను. సాయంత్రం ఐదింటికి పది మంది పేద పిల్లలకి పాఠాలు చెప్పి , వాళ్ళని పంపించి, తేజ కోసం ఎదురు చూడ సాగాను.

ఆరున్నరకి తేజ రాగానే కాసేపు విశ్రాంతి తీసుకుని ఇద్దరం, డాబా పయిన ఉన్న గది తలుపు తెరిచి కూర్చున్నాము. అది తేజ రోగులని చూసే గది. రోజు ఏడింటి నుండి తోమ్మిదింటి దాకా ఉచితంగా రోగులని చూస్తుంటాడు. ప్రైవేట్ వైద్యశాలలో పని చేస్తున్నా , రోజు ఇంట్లో ఇలా ఉచితంగా వైద్యసేవ చెయ్యడం, ఉచితంగా లేని వారికి శస్త్ర చికిత్స చెయ్యడం, వారాంతంలో మారుమూల పల్లెటూర్లలో ఉచిత చికిత్స శిబిరాలు పెట్టడం వాడికి అలవాటు.

ఇంతలోనే ఎవరో ‘ సారూ, ఇది భూరి నిలయం ఏనా, డాక్టర్ గారు ఉన్నారా అండి’ అని వినపడి ‘ ఇదే బాబు లోపలకి రా’ అంటూ పయినుండి అరిచాను, కానీ మనసులో మాత్రం ‘అవును ఇదే భూరినిలయం, అచ్చం భూరితాత ఆలోచనలతో , ఆదర్శలతో కట్టుకున్న ఇల్లు. ఇంతకన్నా భూరితాత రుణం ఎలా తీర్చుకోవాలో తెలియలేదు మరి’ అనుకున్నాను.

*******