భాషను ప్రేమించరా!

రచన: నాగులవంచ వసంతరావు

భాషను ప్రేమించరా బతుకును పండించరా
బాష నేర్చుకుంటే నీ బతుకే బంగారురా!

భాషే మన మెతుకురా భాషే మన బతుకురా
భాష రాకపోతే మన బతుకే ఆగమ్మురా

మాతృభాష మాధుర్యం మదినిండా నింపరా
హృదిలోని భావాలను అలవోకగ తెలుపరా

వృత్తియందు మెప్పు పొంద భాష కీలకమ్మురా
భాషతోటి ‘బాసు’ మనసు బాగ దోయవచ్చురా!

ఉద్యోగం వ్యాపారం వృత్తి ఏదైనగాని
భాషయందు ప్రావీణ్యత బాగ ఉపకరించురా

మదిలోని భావనలు మనసునిండ ముసురుతుంటె
బహిర్గత పరచుటకు భాష సాధనమ్మురా

మనసులోని భావనలు మాటలుగా పూయించి
భగవంతుని పాదాలకు భాషలోన సమర్పించి

శ్లోకాల రూపంలో స్తోత్రాలుగ కీర్తించి
సృష్టికర్త కృపనుబొంద భాష కీలకమ్మురా

భాష ఏదైనగాని భావమొక్కటేనురా
భాష విలువ లెక్కించ ఎవరితరము గాదురా

భాషలోని పరిమళాలు బాగ చిలుకరించరా
భాషామతల్లి సిగలోన బాగ గుభాళించరా

భాషలోని లాలిత్యం యతిప్రాసలోని ఔచిత్యం
పదములలో పొందుపరచి పాఠకులకు పంచరా

ఆస్థాన కవులు అవధానులు ఆలపించిన భాషరా
మేధో సంపత్తినంత వెలికితీసిన ఖ్యాతిరా

అచ్చతెలుగు నుడికారం భాషమీది మమకారం
కవిగాయక పాండిత్యం కవితలలో చూపరా

రకరకాల అక్షరాలు పదములలో ఏర్చికూర్చి
భాషలోని సౌందర్యం బహుచక్కగ తెలుపరా

భాషలు బహువిధములుండ భావమొక్కటేనురా
భావజాల ప్రకటనకు భాషే తొలిమెట్టురా

రాయలు మెచ్చిన భాష రమ్యమైన యతిప్రాస
శ్రోతలనలరింపజేయు శ్రావ్యమైన పరిభాష

పరీక్షల రాతలకు ఉపన్యాస పోటీలకు
భాషమీద పట్టుంటే బహుమతులన్ని నీవిరా

కడుపులోని కాదారం కట్టలు తెంచుతు ఉంటె
భాషామతల్లి రూపంలో బయటకు నెట్టాలిరా

ఘనమైన గత చరిత్ర అక్షరాల రూపంలో
గ్రంథాలుగ ముద్రించి భద్రంగా దాచరా

మంచిని కాపాడుటకు చెడును చెండాడుటకు
అక్షరాల ఆయుధాలు అనునిత్యం సంధించరా
***

చిటికెన వ్రేలు

రచన: రామా చంద్రమౌళి

వాడు బుడిబుడి అడుగులతో పరుగెత్తుకొచ్చి
‘అమ్మా’ మోకాళ్లను చుట్టుకుపోతాడు. పైగా నవ్వు ముఖం నిండా
‘అమ్మ నాదీ’ అన్న వ్యక్తీకరణ
ఈ చంద్రుడు నాది.. ఈ ఆకాశం నాది.. ఈ సమస్తమూ నాదే.. వలె…

ఔను మనిషి తనను తాను స్పష్టంగానే చెప్పుకోవాలి
‘నేను దు:ఖిస్తున్నాను. నేను సంతోషంతో పొంగిపోతున్నాను.
నేను నీకోసం పరితపిస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను.
నువ్వు నాకు కావాలి
నీ కోసం యుగయుగాలుగా ఇక్కడ
ఇదిగో ఈ తీరంపై నేను నిరీక్షిస్తున్నాను
యిక్కడ నేనొక ఒంటరి తెగిన గాలిపటాన్ని
యిక్కడ నేనొక పూచిన చోటనే రాలిన పువ్వునూ.. వలె

వద్దు.. లోలోపల ఏదీ దాచుకోవద్దు
మనిషి పొంగి పొర్లాలి బైటకు పోటెత్తిన కెరటమై
Express like an ocean
రాత్రుళ్ళు పడకపై దొర్లుతున్నప్పుడు
నువ్వు అద్దంపై రాలి జారుగున్న హిమబిందువువు,
అలా వరండాలో నిలబడి కళ్లనిండా శూన్యంతో దిగంతాల్లోకి చూస్తున్నపుడు
నువ్వు నీటి అడుగున ఒక బొక్కెనవు
నిన్ను నువ్వు చేదుకుని చేదుకుని
నిన్ను నువ్వే చెప్పుకో .. విప్పుకో.. ప్రకటించుకో.. వ్యక్తీకరించుకో
కం.. రా.. వచ్చెయ్
ఎప్పుడో.. ఎవరో ఒకరు.. నిన్ను అర్ధం చేసుకుని.. కళ్లనిండా ప్రేమతో
ఒక చిటికెన వ్రేలు నందిస్తారు… ఊం…

మీమాంస ..

రచన: శ్రీకాంత గుమ్ములూరి

మస్తిష్కానికి మనసుకు మీమాంస !!

మస్తిష్కపు మట్టిలో
చిన్న విత్తనం …
నాటిన వాని ఊహకే
అనూహ్యం !
గోరంతలు కొండంతలు చేసిన
నైజం..
మానసిక సంతులాన్ని
తిరగదోసిన వైనం ..
మానవ నైజపు వాసనలు చేసిన
అంకురార్పణం ..
అంకురించిన
అనుమానపు బీజం ..
వేరు తన్నిన వెర్రి ఊహల
విజృంభణం ..
సాదృశమైన దౌర్భాగ్యపు
కలుపు మొక్కల భాషాజాలం ..
విస్తరించిన చీడ
కొమ్మలనలముకొన్న విషం ..
కొత్త ఆశల ఆకులు
మరి చిగురించవు నిజం ..
ప్రాప్తి లేదు
మనో పుష్ప వికాసం ..
భావ పర్యవసానాలు చేస్తాయి
భాగ్య వృక్షాన్ని అంతం !!

నీ భాగ్యాన్ని మలచుకోగలగడం
నీకే సాధ్యం..
స్వయం కృషి చెయ్యగలదు
అసాధ్యాన్ని సాధ్యం ..
జీవన పునరుద్ధరణకై మార్చు
నీ ఆలోచనా విధానం ..
మనః పూర్వకంగా సమ్మతించు
పరులకుపకారం ..
నిశ్చయమైన వైఖరి ప్రదర్శించు
ప్రతి క్షణం ..
పెరికి వెయ్యి అనుమానపు
కలుపు మొక్కలు మొత్తం..
పెరగనియ్యకు
అరిషడ్వర్గాల అరణ్యం ..
తీర్చిదిద్దు
చెలిమి ఉద్యానవనం ..
విస్తరించు కొమ్మలతో
పంచు మంచితనం ..
ప్రతి హృదయం
పరిమళాలు పంచి పెట్టు చంపక పుష్పం !!!

*********************

జీవిత పరమార్థం

రచన: నాగులవంచ వసంతరావు

అనంత కాలచక్రంలో
జీవితకాలం అల్పమే ఐనా
శతకోటి సుగంధాల
పరిమళ మాల జీవితం

ఉత్సాహంగా పనిచేస్తూ
ఆనందంగా జీవిస్తూ
సాటివారికి సాయం చేయడమే
సరియైన జీవితం

సద్భావనలు పెంచుకొని
సన్మార్గాన పయనిస్తూ
సమత, మమత, మానవతలు
పరిఢవిల్లేదే జీవితం

ఆదర్శాలను ఆచరణలో
ప్రతిపనిలో ప్రతిబింబిస్తూ
తెరచిన పుస్తకంలా ఉండేదే
అసలైన జీవితం

దురలవాట్లతో దిగజార్చుకుంటే
దు:ఖ సాగరమౌతుంది
మలచుకోగల నేర్పు ఉంటే
మహోన్నత శిఖరమౌతుంది

సంసార సాగరంలో
సమస్యల తిమింగలాలు
అలజడులు రేపినా
అల్లకల్లోలాలు సృష్ఠించినా
సుడిగుండాలుగా మారి
సునామీలా విరుచుకుపడినా
మొక్కవోని ఆత్మవిస్వాసంతో
మనగలిగేదే జీవితం

ఆదర్శాలను ఆచరణలో
అమలు జరుపబోతే
సహించలేని సభ్యసమాజం
తూలనాడినా అభాంఢాలు వేసి
అభాసుపాలు చేసినా
గుండె నిబ్బరంతో
ముందుకు సాగేదే జీవితం

నీవు నమ్మిన సిద్దాంతాలతో
ఎవరూ ఏకీభవించకున్నా
అంతరాత్మ ప్రభోదానికి
అనుగుణంగా ఉన్నప్పుడు

ప్రపంచమంతా ఏకమై ఎదిరించినా
నిందించి నీరుగార్చినా
అహర్నిశలు ఆత్మోన్నతికి
శ్రమించడమే అసలైన జీవితం

మనసును నిగ్రహించి
అరిషడ్వర్గాలను జయించి
అనునిత్యం ఆత్మానందంలో
మునగడమే దివ్యజీవనం

“బలమే జీవితం –
బలహీనతయే మరణం”
అనిచాటిన స్వామి వివేకానంద
సింహగర్జనకు స్పందించి
పరిపూర్ణమైన ఆరోగ్యంతో
మానసిక వికాసంతో
విశాల హృదయంతో
వర్తించగలిగినదే విలువైన జీవితం

బహుజన్మల పుణ్యపాకవశాన
భగవంతుడిచ్చిన వరం
84 లక్షల జీవరాసులలో
ఉత్కృష్ఠమైనది మానవజన్మ
విషయ వాసనలను విసర్జించి
స్థితప్రజ్ఞతను సాధించి
ఆత్మజ్ఞానాన్ని సంపాదించినదే
పరిపూర్ణ జీవితం

***

గమ్యం

రచన: మహేశ్ కుమార్ విశ్వనాధ

ఏ మార్గం
నా ప్రతి రక్తనాళంలో
దేశభక్తిని నింపుకుని
యుద్ధంలో గెలుస్తుందో
అదే నా గమ్యం

ఏ మార్గం
శాస్త్రాన్ని జ్ఞాన ఆయుధంగాజేసి
అవైదికాన్ని ధర్మకురుక్షేత్రంలో
ప్రతిఘటిస్తుందో
అదే నా గమ్యం

ఏ మార్గం
మనోమయ విద్యను
విశ్వజగతిలో జీవకాంతులతో
నింపుతుందో
అదే నా గమ్యం

ఏ మార్గం
విశ్వప్రజాలోచనజేసి
స్వరాజ్యపు జనావాహినిలో
సంచరించే నా సోదరిని రక్షిస్తుందో
అదే నా గమ్యం

ఏ మార్గం
కాలకంఠుని కాళరాత్రి కార్చిచ్చుకు
బెదరక జనవాహినిలో
అన్యాయాన్ని ఎదిరిస్తుందో
అదే నా గమ్యం