దుఃఖ విముక్తి

రచన:- రామా చంద్రమౌళి

అతనికి చాలా దుఃఖంగా ఉంది
పంచుకోడానికి ఎవరూ లేరు.. చుట్టూ వెదికాడు
అంతా అరణ్యం
నాభిలోనుండి తన్నుకొస్తున్న ఆక్రోశంతో ఆకాశం దద్ధరిల్లేలా అరిచాడు
సకల దిశలూ ప్రతిధ్వనించాయి
కాని దుఃఖం తగ్గలేదు
పరుగెత్తి పరుగెత్తి.. ఒక మనిషిని చేరాడు
మధ్య మద్యం సీసాను తెరిచి పెట్టుకుని
దుఃఖ గాథ నంతా వర్షించాడు.. దుఃఖం రెట్టింపయింది
శరీరమంతా కరిగి కరిగి.. అంతా కన్నీరే
వెళ్ళి ‘ యూ ట్యూబ్ ‘ లో
కళ్ళు మూసుకుని విషాదగీతాలనూ, కృతులనూ విన్నాడు
లావా కరుగుతూ నరాల్లో ప్రవహిస్తున్న అనుభూతి
శరీరం అంతర్ధానమౌతున్నట్టు తప్తత
కాని .. అశ్రు అవశేషాలేవో ఇంకా మిగిలే ఉన్నాయి
సంగీతం విన్నాడు .. సంభాషణలు విన్నాడు
ఉద్యమ గీతాలనూ, విషాదానంద బ్రహ్మ ప్రవచనాలనూ విన్నాడు
కాని లోపలి నిప్పు ఆరడంలేదు
లేచి .. ఒంటరిగా.. ఏకాంతంగా.. ఆఖరి మెట్టుపై కూర్చుని
కళ్ళు మూసుకుని లోపలి ప్రపంచంలోకి ప్రవేశించాడు
అంతా నిశ్శబ్దం .. నిరంతరమైన శుద్ధనిశ్శబ్దం
నిశ్శబ్దంలో లీనమౌతున్నకొద్దీ
దుఃఖం మెల్లగా తెల్లని పావురమై.. ఎగిరిపోతూ.. అదిగో
విముక్తత –
*

దీపం

రచన: కృష్ణ మణి

నింగిలోంచి
భూమికి దగ్గరగా వచ్చినప్పుడు తెలిసింది
ఎంత అందంగా ఉందోనని !
అన్ని గ్రహాలు ఉన్నట్లు గుండ్రంగా ఉన్నా
ఆ అందాల ప్రక్రుతి హొయలు
మనసుని కట్టిపడేసింది

తెల్లని మబ్బుల ఊయలలు
డోలాయమానం అంటే ఏంటో రుచి చూపించాయి
అ నీలి సంద్రం మధ్యలో పచ్చటి మైదానపు ప్రదేశాలు
అక్కడక్కడ గోదుమరంగు ఇసుక ప్రాంతాలు
కన్నుల పండుగనే చెప్పాలి

మబ్బుల్ని దాటి భూమిపైకి వస్తుంటే
ఏవో రేకుడబ్బాలు చువ్వలు దాడి చేసాయి
భూమికి రక్షణగా
ఎదో శక్తి ఇలా చేస్తుందని అనుకున్నాను

మొత్తానికి వాటినుండి తప్పించుకొని
ఒక చక్కని పచ్చని ప్రాంతంలో దిగి
అక్కడి ప్రాణుల్ని గమనించాను
ఒక ప్రాణిపై మరో ప్రాణి ఆధారపడి బతుకుతున్నాయని
బతకడానికి ఎదుటి ప్రాణిని చంపుకు తింటున్నాయని
ఆకును పండును కాయను తినే సాత్విక జీవులు కొన్నైతే
రక్తమాంసాలకై కోరలు, గోర్లతో క్రూరంగా ఉన్నా జీవులు

బయటికి కనిపించే రంగురంగుల పక్షులకు
ఎగిరిగంతులేసే అమాయక జంతువులకు
కిచ్ కిచ్మనే చిట్టిపొట్టి పురుగులకు
జీవన్మరణ పోరాటమే నిత్యం
ఆధిపత్య క్రూరత్వం వల్ల
ఆధిపత్యమంటే ఎవరిదని చూస్తే తెలిసింది
మనిషనే ప్రమాదకర విష జంతువుదని

తెలివి పెంచుకొని అడవిని అలికి
అందమైన కోటలను
పేక మేడలను కట్టి
ఆకాశానికి విషపుగోట్టాన్ని తగిలించి
తానూ చెడింది కాక
లోకాన్ని చెరుస్తున్నాడీ మూర్ఖుడు

వాడికి వాడే పోటి పడి
భూమికి గీతాలు గీసి
పంచుకొని యుద్ధాలు చేస్తున్నాడు
ప్రకృతిని చిదిమి దీపం పెట్టుకుంటున్నాడు
సకల జీవాలకూ పెడుతున్నాడు

కోపం తట్టుకోలేక శపించాను
ఒక్క క్షణంలో ఈ మనిషి వెయ్యి ముక్కలవ్వుగాక అని
వెంటనే పెద్ద శబ్దంతో ఒక విస్పోఠనం
ఉలిక్కిపడి లేచాను నిద్రలోంచి
నాపై నేనే సిగ్గుపడుతూ

వనితా ఎన్నాళ్లీ వ్యధ?

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

బాల్యంలో పొందాల్సిన లాల్యంలో
అనూహ్యంగా మగపిల్లాడికంటే తక్కువే,
చెందాల్సిన హక్కుల విషయంలో
అత్యంత అసహజంగా ఆమె లోకువే.
యవ్వనంలో నాన్న వెనకేసుకొచ్చినా
అణకువ, అణిగిఉండటం తనకు మాత్రమే
సంబంధించినవి అన్నట్లున్న బోధలు,
తను మాత్రమే అనుసరించి తీరాలనే నిబంధనలు.
తప్పుచేయకున్నా తప్పనిసరి బాధలు,
నియమాల గట్టు దాటకున్నావదలని వ్యధలు.
అడుగడుగునా ఆమెకు షాకులు,
వీధిలోకెళ్తే వెధవల వెర్రిచూపుల బాకులు,
వికారం కలిగించే చిత్తకార్తి కుక్కల చొంగ కార్పులు.
కళాశాలకెళ్తే కాటేయటానికి సిద్ధంగా ఉండే విషనాగులు,
క్యాబెక్కుతే కబళించటానికి కాచుకు కూర్చున్న కామపిశాచులు.
కట్నం తేలేదని కాల్చివేతలు,