హిమవత్పద్యములు 1

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

మన భూమిపైన ఉత్తర ప్రాంతాలలో, ముఖ్యముగా అమెరికాలో, కనడాలో, యూరోపులో జనవరి, ఫిబ్రవరి నెలలలో ఎక్కువగా మంచు కురుస్తుంది. మంచు (snow స్నో) అంటే మెల్లగా ఘనీభవించిన నీరు. మేఘాలలోని నీళ్లు నేలను తాకడానికి ముందు వాయుమండలములో స్ఫటికరూపములో మారుతుంది. అంటే ఉష్ణోగ్రత సున్న డిగ్రీల సెల్సియస్ (అనగా -32 డిగ్రీల ఫారన్‌హైట్) కంటె తక్కువ ఉంటుంది. నేలపైన మళ్లీ నీరుగా మారకుండా ఉండాలంటే దాని ఉష్ణోగ్రత కూడ సున్న డిగ్రీలకన్న తక్కువగా ఉండాలి. ఈ నేల ఉష్ణోగ్రత చాల తక్కువగా ఉంటే మంచు పిండిలా తేలికగా ఉంటుంది. అది సున్నకంటె కొద్దిగా తక్కువగా ఉంటే మనకు బరువైన మంచు ఏర్పడుతుంది. బరువైన మంచు ఐదు లేక ఆఱు అంగుళాలు ఒక అంగుళపు వర్షపు నీటితో సమానము. తేలికగ ఉండే పిండి మంచు సుమారు 10 అంగుళాలు ఒక అంగుళపు వాన నీటితో సమానము. బరువైన మంచును పాఱతో ఎత్తి దారులను శుభ్రపఱచడము కష్టతరమైన కార్యము. తేలిక మంచును త్వరగా తీసివేయవచ్చును. ఈ మంచు స్ఫటికాలు భూమిని తాకడానికి ముందు నీరుగా మారి మళ్లీ ఘనీభవిస్తే దానిని sleet అంటారు. ఇవి చిన్న గులక రాళ్లలా ఉంటాయి. అంతే కాక ఉష్ణోగ్రత సున్న కన్న తక్కువగా నున్నప్పుడు నీటి ఆవిరి frostగా మారి గాజు మున్నగువాటిపైన పొరగా కప్పుతుంది. ఉదయము లేవగానే కారుపై frostను గీచకుండ దానిని drive చేయలేము. ఈ frost స్ఫటికాకృతిని తీసికొంటే అది hoarfrost అవుతుంది. ఇవి తీగెలవలె ఉంటాయి. వాన నీళ్లు నేలపైన పడి ఘనీభవించి స్ఫటికరూపముగా కాక మంచు పొరలయితే దానిని ice storm అంటారు. అన్నిటికన్న ఇది చాల అపాయకరమైనది. వాహనములను drive చేస్తున్నప్పుడు ఈ ఐస్ పైన చక్రాలు వెళ్లినప్పుడు వాహనము మన స్వాధీనములో నుండదు. విపరీతమైన స్నోతో గాలి కూడ (గంటకు 35 మైళ్లకన్న ఎక్కువగా) కలిస్తే దానిని blizzard అంటారు. సుమారు 6 అంగుళాలకన్న ఎక్కువ స్నో ఉంటే అది winter storm క్రింద వస్తుంది లేకపోతే winter weather advisory క్రింద ఉంటుంది ఆ సంఘటన. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల ముందు నేలపైన సుమారు నాలుగైదు అడుగుల పరిమాణములో స్నో ఉండినది మా ఊరిలో!

నేను వృత్తి రీత్యా స్ఫటికశాస్త్రజ్ఞుడిని. స్ఫటికాకృతిలో ఉండే ప్రకృతిసిద్ధమైన నీరు షడ్భుజ రూపములో ఉంటుంది. ఒక స్ఫటికములా మఱొకటి ఉండదు. ఈ హిమ స్ఫటికాలను ఒక శతాబ్దముముందు విల్సన్ బెంట్లీ (Wilson Bentley) అనే ఒక వెర్మాంట్ (Vermont) రాష్ట్రపు కర్షకుడు ఒక microscopic cameraను తానే design చేసి చిత్రములను తీసినాడు. ఒక స్ఫటికపు కాలావధి సుమారు రెండు నిమిషములు మాత్రమే. ఈ స్వల్ప సమయములో చిత్రమును తీయాలి. అతడు వేలాది ఫోటోలను తీసినాడు. అందులో కొన్ని పుస్తక రూపములో నున్నది ( https://www.amazon.com/Snow-Crystals-Dover-Pictorial-Archive/dp/0486202879 ). అతనిని గుఱించిన విశేషాలను ఇక్కడ చదువ వీలగును –
(
https://siarchives.si.edu/history/featured-topics/stories/wilson-bentley-pioneering-photographer-snowflakes

http://snowcrystals.com

https://en.wikipedia.org/wiki/Wilson_Bentley
)

నేను గడచిన 15 సంవత్సరాలలో మంచునుగుఱించి ఎన్నీయో పద్యములను వ్రాసినాను. సుమారు వంద పద్యాలు వివిధ ఛందస్సులలో ఉన్నాయి. వాటిని ఒకే చోట సేకరించి ఇప్పుడు మీకు ఒక సంకలన రూపములో అంద జేస్తున్నాను. భారతీయ భాషలలో మంచును లేక హిమమును గుఱించి వ్రాయడము కష్టము. ఎందుకంటే మనకు పదములు లేవు. dew అన్నదానికి మంచు పదమే, snow అన్నదానికి మంచు పదమే. కారణము మనకు భారతదేశములో హిమాలయ ప్రాంతాలలో తప్ప మిగిలిన చోటులలో ఈ హిమపాతములు లేవు, లేకపోతే అరుదు. నేను frost, hoarfrost అనే పదమునకు హేమలత అని వాడినాను. ఈ పద్యములను అకారాదిగా చూపియున్నాను. చదివి ఆనందించండి.

అంబుధివీచీ – మ/భ/స/స/గ UUUU – IIII UII UU 13 అతిజగతి 1777
శృంగమ్మందున్ – సిరివలె మంచుల కుప్పల్
బంగార మ్మా – ప్రవిమల భాస్కర కాంతుల్
నింగిన్ గంటిన్ – నెగడెడు పక్షుల శ్రేణుల్
సంగీతమ్మై – స్వరములు నామది లేచెన్

అనంగప్రియా – స/జ/త/స/గ IIUI UIU – UIII UU 13 అతిజగతి 1836
సొగసైన వేళలో – సోమకిరణ మ్మా
నగమందు శ్వేత సూ-నమ్మువలె మంచుల్
నగుమోము జూడఁగా – నా మనసు నిండెన్
సగమైన రాత్రిలోఁ – జాల సుగ మయ్యెన్

అపరాజితా – న/న/ర/స/లగ III III UI – UII UIU 14 శక్వరి 5824
ద్యుమణి వలను బోయె – ద్యోతము తగ్గెఁగా
సుమము విరియ దింక – సొంపులు నిండఁగా
ద్రుమము లవని నింక – మ్రోడుగ మారుఁగా
హిమము గురియు నింక – నిచ్చటఁ జల్లఁగా

అమృతగీతి ద్విపద – 11, 11 మాత్రలు, పాదాంత లఘువు
నయమగు సిగ్గును నేను – నగవుల నిగ్గువు నీవు
భగభగ మంటలు నేను – సొగసగు హిమములు నీవు
మొగిలున వానను నేను – గగనపు హరివిలు నీవు
సగమగు రేయిని నేను – జగతికి కాంతివి నీవు

ఆటవెలఁది –
కొయ్య బల్లమీద – కూర్చుండి జారిరి
చిన్ని పిల్ల లెంతొ – చెన్నుగాను
మంచుఁ బెల్లగించి – మనిషిని జేసిరి
యింటిముందు పిల్ల – లింపుగాను

ఆటవెలఁది షట్పది –
నింగిఁ జలువఱేఁడు
రంగు లిడెను నేఁడు
శృంగమందుఁ జూడు – సిరుల మంచు
చెంగలువల తావి
భృంగములకు నీవి
రంగఁ డూఁదుఁ గ్రోవి – రహిని ముంచు

ఇంద్రనీల – 5, 4 – 5, 4 మాత్రలు
ఆనంద వాక్యము – లావిర్భవించన్
మాణిక్య వీణయు – మార్మ్రోఁగుచుండన్
నేనొక్క నాకపు – నిశ్రేణి నెక్కన్
మేనందెఁ బుల్కల – మేఘముల హిమమున్

ఆమనియు మొదలవ – నవనిపై హిమమా
ఆ మంచు దూదిగ – నగుపించెఁ దరులన్
ధామనిధి మబ్బుల – దాగె నీ దినమున
నేమియో ప్రకృతిని – నెఱుగంగ వశమా

ఉత్సాహ – (సూ)4 – (సూ)3/గ
ఆకసమ్మునుండి రాలె – నందమైన ముత్తెముల్
స్వీకరించెఁ బుడమిదేవి – చిత్రమైన సేసలన్
నాకమదియు నందమొంది – నగ్నమైన భూమితో
నేకమయ్యె రజనివేళ – హృదయమలర వసుధకున్

ఋతుచక్రము – చ/చ/చ – చ/చ
ఎప్పుడు ముదమున నా కిట – హృదయము విరియునొ
అప్పుడె వచ్చును వాకిట – నామని మురియుచు
ఎప్పుడు వాడిన యాశల – హృదయ మ్మెండునొ
అప్పుడె గ్రీష్మము కాలుచు – నారని మంటల
ఎప్పుడు శోకాశ్రువులను – హృదయము రాల్చునొ
అప్పుడె నుఱుముల నా నీ-రామని వచ్చును
ఎప్పుడు శాంతుల నా యీ – హృదయము నిండునొ
అప్పుడె శరదాగమన – మ్మగు నది పండుగ
ఎప్పుడు రంగుల యాశలు – హృదిలో నెండునొ
అప్పుడె శిశిరము బ్రదుకున – నార్తియు నిండును
ఎప్పుడు పారక హిమ మగు – హృదయ స్రవంతియు
అప్పుడె యునికి తమస్సగు – నది హేమంతము

ఎత్తుగీతి – ఇం/సూ/సూ
ఆమని లక్ష్మి నీవు
హేమంత రాత్రి నేను
కోమల సుమము నీవు
ఆ మరుభూమి నేను

కందము –
వాహనమునఁగల చక్రము
లాహా యామంచు కుప్ప-లందునఁ జిక్కన్
సాహసమునఁ ద్రోసిరి తమ
దేహములందుఁ జలి చెమట – దిగి జాఱంగన్
దారుల నిండిన మంచును
బాఱలతోఁ బెల్లగించి – ప్రక్కన నింపన్
జేరెనది పెద్ద కుప్పగ
నౌరా హిమపాత మొసఁగు – నధికశ్రమమున్

మంచు కురియు వేళ యిదియు
చంచలమగు హేమమణులు – జ్వలియించెనుగా
మంచములో నిన్ను విడిచి
కుంచితగాఁ గుందుచుంటిఁ – గుటిలా చలిలో – నెమ్మికందము – 48

రవి యుదయించును గ్రుంకును
భువిపై హేమంత మగును – బూవులకారున్
రవి యస్తమించ డెప్పుడు
నవలా మన ప్రేమ జగతి – ననకారు సదా – నెమ్మికందము – 216

కురిపించు మంచు చుక్కల
విరుల కపోలమ్ములందు – విడక రజనియున్
కురిపించు నగ్గి చుక్కల
విరహిణుల కపోలమందు – విడక రజనియున్ – నెమ్మికందము – 537

బిందువు బిందువుగ హిమము
చిందెనుగా మొగముపైన – జెలువము లొలుకన్
సుందర శీతకమున హిమ
కందుకముల నాటలవియుఁ – గడు మోదముగా – నెమ్మికందము – 605

ఆమని యొక యనుభవమగుఁ
బ్రేమము గల హృదయమందు – ఋతువామనియే
యామనిలో విరులున్నను
బ్రేమము లేకున్న నదియు – హేమంతమ్మే – నెమ్మికందము – 671

ఉండని యూరికిఁ మార్గము
నెండిన నదిలోని యలల – యింపగు సడులన్
మండిన ప్రేమకుఁ బూవుల
కుండీలను వెదకుచుంటిఁ – గురిసెడు హిమమున్ – నెమ్మికందము – 741

కంద వద్యము – (వద్యము – వచన పద్యము)
అవునీ శిశిరము ఆమని
అవునీ ఆమనియు గ్రీష్మ
మది వర్షమవును
అవునా వర్షము శరదగ
అవునా శారదయు
మంచు లగు కాలముగా

ప్రాస కంద వద్యము –
ఒక నాడీ చలి తగ్గును
ఒక నాడీ చలికి బదులు
సుకముగ రవియును
రకరకముల విరులను గ-
ళ్లకు చూపును గాంతి నింపు
నిక యామనియే

దీపావళి పద్యములు

రచన: జెజ్జాల కృష్ణ మోహనరావు

దీపావళికి సంబంధించిన పదములతో ఉండే వృత్తములను ఏరి పండుగ సందర్భముగా శుభాకాంక్షలతో ఇక్కడ అందిస్తున్నాను. అన్య నామములను కుండలీకరణములలో చూపినాను. * గుర్తుతో నున్నవి నా కల్పనలు. ప్రతి ఛందమునకు రెండు ఉదాహరణములను ఇచ్చినాను. ఇందులో వాడబడిన ఛందములు 20, అవి – దీప్తా, లక్ష్మీ, అర్చిస్సు, భాస, దీపకమాలా, మౌక్తికమాలా, కాంతి, మణిమాలా, ప్రభా, బభ్రులక్ష్మీ, నిగ్గు, దీపక, భామ, భాతి, హరిణీ, కలాపదీపక, దీపికాశిఖ, దీపార్చి, జ్యోతి, దీప.

దీప్తా – స/ర/గ IIU UI UU
(భూరిధామా, హంసమాలా)
7 ఉష్ణిక్కు 20

రగులన్ గ్రొత్త కాంతుల్
సుగముల్ నిండ శాంతిన్
మొగముల్ దీప్తమయ్యెన్
జగముల్ దీప్తమయ్యెన్

విరబూయంగఁ బువ్వుల్
సరసమ్మైన నవ్వుల్
గరమందుండు దివ్వెల్
సిరులై వెల్గు రవ్వల్

లక్ష్మీ – ర/ర/గల UIU UIU UI
8 అనుష్టుప్పు 147

మాగృహమ్మందు నర్తించ
భోగభాగ్యమ్ము లందించ
వేగమో లక్ష్మి రమ్మిందు
రాగపీయూషముల్ చిందు

పూల నీకిత్తు మో యమ్మ
లీలగా మమ్ము జూడమ్మ
పాల యా పొంగుగా రమ్ము
మేలు సౌభాగ్యముల్ తెమ్ము

*అర్చిస్సు – త/ర/మ UUI UI – UU UU
9 బృహతి 25

ఆడంగ నేఁడు – హాళిన్ గేళుల్
చూడంగ నేఁడు – సొంపుల్ రంగుల్
పాడంగ నేఁడు – పాటల్ పద్యాల్
కూడంగ నేఁడు – కూర్మిన్ మిత్రుల్

స్వానమ్ము ల్మెందు – సానందానన్
ధ్యానమ్ము లెందుఁ – దల్లిన్ గొల్వన్
గానమ్ము లెందు – గంగా స్నానా-
హ్వానమ్ము లయ్యె – స్వామిన్ గొల్వన్

గర్భిత కందము –
స్వానమ్ము ల్మెందు సానం-
దానన్, ధ్యానమ్ము లెందుఁ – దల్లిన్ గొల్వన్
గానమ్ము లెందు గంగా
స్నానాహ్వానమ్ము లయ్యె – స్వామిన్ గొల్వన్

భాస – భ/భ/స UII UII IIU సార్థకనామ గణాక్షర వృత్తము
(ప్రియతిలకా)
9 బృహతి 247

భాసము లెల్లెడ మెఱయన్
హాసము లెల్లెడఁ బరవెన్
దేశమునందున దివె లా-
కాశమునందున నుడుపుల్

దివ్వెల పండుగ యిదియే
రివ్వున బాణము లెగిరెన్
బువ్వుల వానల జడిలో
నవ్వుచు రా ప్రియతిలకా

దీపకమాలా – భ/మ/జ/గ UII UU – UI UIU
10 పంక్తి 327

దివ్వెలు వెల్గెన్ – దిక్కుదిక్కులన్
రవ్వలవోలెన్ – రమ్య తారకల్
నవ్వుల మింటన్ – నాట్యమాడె నేఁ-
డివ్వసుధన్ శ్రీ -లిచ్చు దైవముల్

చూపుల కింపై – సుందరమ్ముగా
దీపకమాలల్ – దృష్టమయ్యెగా
రేపది దీపా-లీ దినమ్ము, నా
యీ పురి యౌ దే-వేంద్రలోకమై

మౌక్తికమాలా – భ/త/న/గగ UII UU – IIII UU
(అనుకూలా, ప్రత్యవబోధా, శ్రీ)
11 త్రిష్టుప్పు 487

నవ్వుల పువ్వుల్ – నగరములోనన్
దివ్వెల వెల్గుల్ – దెరువులలోనన్
మువ్వల మ్రోఁతల్ – ముదితలు చేరన్
గెవ్వున కేకల్ – గెరలుచునుండెన్

అంతము లేదీ – యనుపమ సృష్టిన్
వింతగఁ దారల్ – వెలుఁగుల పూవుల్
పుంతల ప్రోవుల్ – ముదముల త్రోవల్
గాంతుల నిచ్చెన్ – గగనమునందున్

కాంతి – త/జ/జ/లగ
(మోటక, మోటనక, గీతాలంబన, కలితాంత, కాంత)
11 త్రిష్టుప్పు 877

UUIIU – I IU I IUవిఱుపుతో
ఈ చీఁకటిలో – హృదయ మ్మలరన్
ఈ చీఁకటిలో – నెడఁదల్ వెలుగన్
ఈ చీఁకటిలో – ఋతముల్ విరియన్
ఈ చీఁకటిలో – నిలయే మురియన్

UUI I UI I – UI IUవిఱుపుతో
వెల్గించెద దివ్వెల – వెల్లి వలెన్
గల్గించెద గాంతులఁ – గన్నులకున్
దెల్గించెద మోదముఁ – దెల్లముగాఁ
దొడ్గించెద నందముఁ – ద్రుళ్ళుచు నేన్

మణిమాలా – త/య/త/య UU IIUU – UU IIUU
(అబ్జవిచిత్రా, పుష్పవిచిత్రా)
12 జగతి 781

సొంపుల్ బ్రకటించెన్ – జూడన్ మణిమాలల్
గంపించుచు నాడెన్ – గాంతుల్ మిసి మీఱన్
గెంపుల్ మెఱయంగన్ – గేళిన్ జెలరేగెన్
రంపిల్లెడు గీతుల్ – రమ్యమ్ముగ నేఁడే

పాపాలకు ఱేనిన్ – భామామణి చంపెన్
కాపాడును గాదా – కంజాక్షుఁడు భూమిన్
దీపావళి నేఁడే – దీపాలకు వీడే
దీపమ్ముల కాంతిన్ – దేశమ్మగు శాంతిన్

ప్రభా – న/న/ర/ర III III – UIU UIU
(గౌరీ, చంచలాక్షీ, ప్రముదితవదనా, మందాకినీ)
12 జగతి 1216

విరులు విరిసె – వెల్గులై రంగులై
సిరుల పడతి – చిందెఁగా నవ్వులన్
చిఱుత లలరి – చిందులన్ వేయఁగా
మురిసెఁ బ్రభల – భూమి దీపావళిన్

నభము వెలుఁగు – నవ్వులన్ బువ్వులన్
శుభము గలుగు – సుందరమ్మై సదా
విభుని నగవు – ప్రేమతో నిండఁగాఁ
బ్రభలు గురియు – రమ్యమై రంగులన్

బభ్రులక్ష్మీ – ర/ర/త/త/గగ UIU UIU – UUI UUI UU
14 శక్వరి 2323

ఊఁవఁగా మానస – మ్మో బభ్రులక్ష్మీ శుభమ్మై
జీవనోద్ధారమై – శ్రీరూపమై పావనమ్మై
కావఁగా మమ్ములన్ – కారుణ్యరూపా ప్రశాంతిన్
దేవి రా యింటికిన్ – దీపావళిన్ దివ్య కాంతిన్

అందముల్ చిందఁగా – నానంద దీపమ్ము లెందున్
విందుతో నింటిలో – బ్రేమమ్ము మోదమ్ము గూడెన్
సందడుల్ శబ్దముల్ – సాయంత్రమందున్ వినంగా
మందహాసమ్ములే – మాయింట మ్రోఁగెన్ రమించన్

*నిగ్గు – న/న/న/మ/మ, యతి (1, 7) III III III – UU UU UU సార్థకనామ గణాక్షర వృత్తము
15 అతిశక్వరి 512

మిలమిలమని మెరిసె – మింటన్ బారుల్ దారల్
తళతళమని వెలిఁగె – తారాజువ్వల్ నేలన్
కిలకిలమని నగిరి – కేళిన్ బాలల్ లీలన్
కలకలమునఁ గదలె – కాంతుల్ నిగ్గుల్ మ్రోఁతల్

చెలువములకు నిరవు – చిందుల్ గీతుల్ కేళుల్
గలగలమని పరవె – గంతుల్ మాటల్ నవ్వుల్
వలయములగు వెలుఁగు – భ్రాంతిన్ నింపెన్ రాత్రిన్
లలనల తెలి నగవు – లాస్యానంద మ్మయ్యెన్

దీపక – భ/త/న/త/య UII UU IIII – UU IIU U
15 అతిశక్వరి 6631

దీపకమాలల్ మెరిసెను – దివ్యమ్ముగ భూమిన్
చూపుల విందయ్యెను గద – చొక్కిల్లెను గన్నుల్
గోపురమయ్యెన్ దివియల – గుత్తుల్ వెలుగంగా
తీపిగ దీపావళి యరు-దెంచెన్ బఱగంగా

చక్కని వెల్గుల్ నభమున – చంద్రుం డిఁక రాఁడే
దిక్కులఁ గప్పెన్ దిమిరము – దీపమ్ముల దండల్
రక్కసుఁ జంపెన్ నెలఁతయు – రాసాధిపుతోడన్
దక్కెను శాంతుల్ సుఖములు – ధాత్రేయికి నేఁడే

భామ – భ/మ/స/స/స UII UU UII – UII UII U
15 అతిశక్వరి 14023

భామయు చూడన్ జప్పున – పక్కున నవ్వును దాఁ
బ్రేమయు డెందమ్మందున – వేగమె పొంగు లిడన్
స్వామియు చల్లన్ గొప్పగ – చల్లని వీక్షణముల్
భూమికి భామాకృష్ణులు – మోదము నిత్తురుగా

భామలు గూడన్ గానము – పారె విలాసములన్
ప్రేమయు పొంగెన్ నిండుగ – వింతగు లాసములన్
కామము నిండెన్ మెండుగఁ – గన్నుల పండుగగా
నేమని చెప్పంగానగు – నీహృది దీపములే

*భాతి – భ/భ/త/త/త, యతి (1, 7) UII UII – UUI UUI UUI సార్థకనామ గణాక్షర వృత్తము
15 అతిశక్వరి 18743

రంగులె యెల్లెడ – రాజిల్లు రత్నాలొ వజ్రాలొ
పొంగెను ధారుణి – మోదాల నాదాల నందాల
బంగరు శోభల – భాసిల్లి నర్తించె శ్రీదేవి
నింగియు నేలయు – నిండంగ నా భాతితో నేఁడు

ధూమము నిండెను – దూరమ్ముఁ గానంగ రాదయ్యె
శ్యామల రాత్రిని – సందీప్తమై సేసె దీపాలు
మోముల నిండెను – భోగమ్ముతో నందమై భాతి
సోముఁడు లేదల – సొంపైన దీపావళిన్ నేఁడు

హరిణీ – న/స/మ/ర/స/లగ IIIIIU – UUUU – IUI IUIU
(వృషభచరిత, వృషభలలిత)
17 అత్యష్టి 46112

హరిణిఁ గొలువన్ – హర్షమ్మాయెన్ – హరించును పాపముల్
సిరుల నొసఁగన్ – శ్రీదేవీ సు-స్థిరమ్ముగ నుండ రా
హరిహృదయమౌ – హారిద్రాంగీ – యనంతసుఖప్రదా
కరుణ గురియన్ – గంజాతా నీ – కరమ్ముల గావుమా

సరసహృదయుల్ – స్వారస్యమ్మై – స్వరమ్ములఁ బాడఁగాఁ
గురియు ముదముల్ – గూర్మిన్ జిందన్ – గుడమ్మనఁ దియ్యఁగా
నరకవధయున్ – నారీగాథన్ – నవమ్ముగఁ దల్వఁగా
మురియు మనముల్ – మోదాంభోధిన్ – బునర్ణవమై సదా

కలాపదీపక – ర/జ/ర/జ/ర/జ/గ
19 అతిధృతి 174763

UI UI UI UI UI – UI UI UI UI U విఱుపుతో
పండు గాయె నేఁడు వేడ్కతోడఁ – బట్టుచీర లెందు జూడఁగా
నిండు గాయె నేఁడు కన్నుదోయి – నేలపైని రంగవల్లులన్
వెండివోలె తళ్కు లీనె నభ్ర – వీథిలోన తారకామణుల్
దండిగా కలాపదీపకమ్ము – ధారుణిన్ వెలింగె శోభతో

UI UI UI – UI UI UI – UI UI UI U విఱుపుతో
పెళ్లియయ్యె నాఁడు – పిల్ల వచ్చె నేఁడు – ప్రీతి యింట నిండఁగా
నల్లునిన్ గనంగ – నత్త మామలందు – హర్షధార నిండఁగా
మెల్లమెల్లఁగాను – మేలమాడి రెల్ల – మేఱలేని నవ్వుతోఁ
జల్లనయ్యె సంధ్య – చంద్రహీన రాత్రి – సవ్వడుల్ వెలుంగుతో

దీపికాశిఖ – భ/న/య/న/న/ర/లగ UI IIIII UUI – III IIUI UIU
20 కృతి 360063

కాల గగనమున నందాల – కలలవలె దీపికాశిఖల్
చాల సొగసులను జూపంగ – సరసతరమౌ మయూఖముల్
నేల సొబగులకుఁ దావయ్యె – నెనరు లగు నాద చాపముల్
మాల లన వెలిఁగె దీపాలు – మమత లగు మోద రూపముల్

అందముగ వెలుఁగు నిండంగ – నమరపురి డిగ్గివచ్చెనో
బృందముగ దివెలు భాసిల్ల – వెలుఁగు విరి మాలలయ్యెనో
వందలుగ పరిక లుండంగ – భవనములు చిత్రమయ్యెనో
చిందులిడ చిఱుత లెందెందుఁ – జెలఁగెఁ బలు దీపికాశిఖల్

దీపార్చి – మ/స/జ/స/జ/స/జ/గ, యతి (1, 12)
22 ఆకృతి 1431385

UUU IIUI UIII – UIUI IIUI UIU విఱుపుతో
పాపమ్ముల్ తొలగంగ స్నానమును – బ్రాలుమాలకను జేయు నాఁడుగా
శ్రీపాదమ్ముల గొల్వఁ బుష్పముల – సేకరించు తరుణమ్ము గూడెఁగా
దీపమ్ముల్ వెలిగించి శ్రేణులుగఁ – దీర్చి దిద్దు శుభవేళ నేఁడెగా
దీపార్చిన్ గన రండి రంజిలుచు – దివ్య దీప్తి ధరపైన నాడెఁగా

UUU IIUI UIII UI – UI IIUI UIU విఱుపుతో
దీపమ్ముల్ వెలుగంగ మేదిని నమాస – దేహములు పుల్కరించుఁగా
దీపార్చిన్ దిమిరమ్ము మాయమవఁ గాంతి – దిక్కులను నిండుఁగా సదా
యీపర్వమ్మున సత్యమే జయమునొందు – హృద్యముగ విచ్చు డెందముల్
శాపగ్రస్తులు శాంతితోడ నమృతత్వ – సాధనము నందవచ్చునో

*జ్యోతి – బేసి పాదాలు – ఇం/ఇం/ఇం, సరి పాదాలు – ఇం/ఇం/సూ

రంగులన్ జిమ్మె నా జ్యోతులే
రంగులన్ జిమ్మె నీ నిగ్గు
పొంగె నీ మనములన్ బ్రీతులే
నింగిలో భేదిల్లు ముగ్గు

క్రొత్తగా నల్లుండు వచ్చెఁ దా
నత్తవారింటికి నేఁడు
చిత్తమందునఁ గూఁతురికి హాయి
ముత్తెముల్ నవ్వులన్ వీడు

దీప – పది మాత్రలు, చివర న/లగ, అంత్యప్రాస

ఈ పృథు దినము నందు
మాపై సుధలు చిందు
దీపము వెలిఁగెఁ జూడు
పాపము తొలగు నేడు

లలిత లలితము రాత్రి
వెలుఁగు నలరిన ధాత్రి
కలలు నిజమగు నేఁడు
మెలగు సిరులను వీడు