ట్రాన్స్ జెండర్ ….

రచన: శ్రీకాంత గుమ్ములూరి

మార్కెట్లో కూరలూ పళ్ళూ కొన్నాక ఆటోలో ఇంటికి తిరుగుముఖం పట్టాము నేనూ, రాణీ, వాళ్ళ అమ్మమ్మతో. రెడ్ సిగ్నల్ రావడంతో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఆటో ఆగింది. ఇంతలో ఒక ట్రాన్స్ జెండర్ ఆటో దగ్గరికి వచ్చి చప్పట్లు చరుస్తూ చెయ్యి చాపింది.
మొగ లక్షణాలు మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గాడీగా, పెద్ద పువ్వులున్న పసుపు పచ్చటి చీర కట్టుకుంది. మొహాన పెద్ద స్టిక్కర్ బొట్టు, పెదాలకి లిప్ స్టిక్ , చేతుల నిండా గాజులూ, తలా నిండా పువ్వులూ.
రాణీ కాళ్ళదగ్గరున్న బరువైన సంచీలోంచి ఒక బాదామీ మామిడిపండు తీసి దాని చేతిలో పెట్టింది. ఆమె రాణీ తలమీద చెయ్యి పెట్టి,” పిల్లా పాపలతో చల్లగా వుండు” అని దీవించి , “అరే సంతోష్ ! అజా పోరా ! ఆమ్ ఖా ” అంటూ పక్కనే మట్టిలో ఆడుకుంటున్న చిన్న కుర్రాడి చెయ్యి పట్టి లేవదీసి పేవ్మెంట్ మీద కూచోబెట్టి, నోటితో తొక్క ఊడదీసి, పండు వాడి మూతికి అందించింది.
రాణీ అమ్మమ్మ నిశ్చేష్టురాలై, “అదేం పనే? ఓ రెండు రూపాయలు పారేస్తే సరిపోయేదిగా !” అంది.
“అమ్మమ్మా!! ఎందుకు పారెయ్యాలి? ఒక పండు ఇస్తే నేం? ఇంటికి వచ్చిన ఆంటీలకి నువ్వు మాత్రం పళ్ళు ఇవ్వవూ బొట్టు పెట్టి?” అంది రాణీ.
“అంటే పునిస్త్రీలకీ, నపుంసకులకీ తేడా లేదూ? ”
“అయితే నపుంసకులకి మామిడి పండు తినే అర్హత లేదా? వాళ్ళ జన్మా మనిషి జన్మేగా ?”
“సరే, నీతో వాదన నాకనవసరం.”
“నాతో వాదన కాదు. నీకు తోటి మానవుడి గురించి గ్రాహ్యం అవసరం అమ్మమ్మా. పురాతన భావాలూ, జాతి, లింగ విభేదాలూ పక్కకి పెట్టి, కాస్త సహృదయంతో ఆలోచించాలి మరి” అంటూ లెక్చర్ మూడ్ లోకి వెళ్ళిపోయింది రాణీ.
ఎందుకసలు పాపం వాళ్ళని అడుక్కునే వాళ్ళు, ఇతరులని భయపెట్టి డబ్బు దోచుకునే దుష్టులు, చరిత్ర హీనులు అంటూ ఇలాంటి కళంకాలన్నీ ఆపాదించి చిన్న చూపు చూడ్డం? వాళ్ళు చెయ్యని నేరానికి, దేవుడు వాళ్ళ కటువంటి జన్మ నిచ్చినందుకు సమాజమే కాకుండా స్వంత తల్లితండ్రుల చేత కూడా వెలి వెయ్యబడి, ఎంత నికృష్టమైన జీవితానికి గురి అవుతారో అంచనా వెయ్యగలమా?
అనాధ బతుకు. ఆకలి ఎలాంటి పనైనా చేయిస్తుంది. ముష్టెత్తుకోడం, దొంగతనం, సెక్స్ వర్కర్ల లా పనిచెయ్యడం. సమాజంలో స్థానం లేనివాళ్లు మరి ఏ విధంగా బతగ్గలరు? చదువు సంధ్యలూ, బతుకుతెరువు కోసం పనులూ, వాళ్ళ కోసం కాదని మొహాన రాసి పెట్టి ఉందిగా. అన్ని క్షేత్రాల్లోనూ వంచితులే . దానికి కారణం మనమే మారని సమాజం! దేశం పురోగతి కోసం అందరం పాటుపడాలని వ్యాఖ్యానిస్తాం. కానీ మన భావవైఖరి ఎంత అధోగతిలో వుందో ఎవ్వరం పట్టించుకోము.
కళ్ళకి కనబడితే అసహ్యించుకుంటాం., తిరస్కారంతో వాళ్ళని తప్పించుకోడానికి తలుపులు మూసేస్తాం, , వాళ్ళ అవయవాలను గురించి అవహేళన చేస్తాం,. లేదంటే మనవాళ్ళెవరికీ అటువంటి జన్మ వొద్దు కనక పెళ్లికూతుర్లకీ, గర్భిణీ స్త్రీలకీ వాళ్ళ చేత దిష్టి తీయిచడానికి పిలుస్తాం. అసలు వాళ్ళ మనసేమిటి, దిన దినమూ ఎలాంటి అవమానాలకు గురి అవుతున్నారు అని ఆలోచించగలిగే మానవత్వాన్ని మనలో పెంచుకున్నామా? మార్పు ముందు మనం తెచ్చుకుని మన చుట్టూ వుండే వాళ్లలో కూడా తేవడానికి ప్రయత్నించాలి.
నేనూ రాణీ మాటలతో ఏకీభవిస్తూ, నాకున్న పరిజ్ఞానంతో చెప్పడం మొదలు పెట్టాను.
అసలు మన పురాణ ఇతి హాసాలలో నపుంసకులకు గౌరవనీయమైన స్థానం లేకపోలేదు. ఒకానొక వాల్మీకేతర రామాయణంలో ఉన్న ఒక కథ ఏమిటంటే శ్రీరాముడు పదునాలుగేళ్ళ వనవాసానికి వెళ్తున్న సమయాన అయోధ్యా ప్రజ ఆయనపై గల అనురాగంతో దుఃఖితులై ఆయన వెంట అడవులదాకా అనుసరించారు. అది గమనించిన శ్రీరాముడు వారందరినీ సమాయత్త పరిచి, అయోధ్యావాసులైన స్త్రీ పురుషులందరూ దుఃఖాన్ని విడనాడి, వెనుదిరిగి తమ నివాస స్థానములకు పోవలసిందని అర్ధించి, సీతా,లక్ష్మణసమేతుడై తన కార్యసిద్ధికి వెళ్ళిపోతాడు. పదునాల్గు సంవత్సరముల తర్వాత అయోధ్యకు వెనుదిరిగి వచ్చి, మళ్ళీ అదే అడవిలో ప్రవేశించినపుడు స్త్రీ పురుష జాతికి చెందని, అయోధ్యావాసులైన హిజ్రాలు ఆ స్థలం నుంచి కదలక అక్కడే ఉండిపోవడం గమనించి, తన తప్పిదాన్ని గ్రహించి, భావోద్రేకుడైన శ్రీరాముడు వారికి వివాహం, శిశుజన్మ సంబంధమైన శుభ కార్యాలలో అందరినీ ఆశీర్వదించగల ఉన్నతస్థానం వారికి కలిగేట్లుగా వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచీ, వారు ఈ సంఘటనను ఉద్ఘాటిస్తూ, పెళ్లిళ్లలో పాడుతూ, దీవించటం పరిపాటి.
మహాభారతంలో అర్జునుడు కూడా అజ్ఞాతవాసంలో, బృహన్నలగా, నపుంసక ధారణను పొంది వివాహాది శుభ కార్యాలలో పాల్గొన్నాడని వింటాం.
కానీ నేడు మాత్రం మన సమాజంలో వాళ్ళు అత్యంత హీనదశలో ఉన్నారు.
“నిజానికి 2014 వ సంవత్సరంలో సుప్రీం కోర్టు స్త్రీ పురుష లింగాలతో పాటు నపుంసక లింగాన్ని మూడవ లింగంగా గుర్తించడం భారత సంవిధాన శాసనంలో గర్వించదగ్గ విషయం. అయినా సమాజం మాత్రం వాళ్లకి సంఘంలో సమాన స్థానాన్ని ఇవ్వడానికి బదులు అంటరానితనాన్ని సంఘ బహిష్కరణని ఇంకా అమలు పరుస్తూనే వుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో సుమారుగా 500,000 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నట్లు తీర్మానించారు. అంత పెద్ద సంఖ్యలో వున్నా వారిని మైనారిటీ గ్రూపుగా అంగీకరించి, వారి కనీస హక్కులు వాళ్లకి దక్కేటట్లు చెయ్యడానికి వెనకాడుతున్నాం.
కలకత్తాకు చెందిన మానవీ బంధోపాధ్యాయ అనే ట్రాన్స్ జెండర్ మహిళ పరిస్థితులను ఎదిరించి, ఉన్నత విద్యల నభ్యసించి, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, కృష్ణగోర్ ఉమన్స్ కాలేజీకి ప్రిన్సిపాల్ పదవిని సంపాదించింది. ‘కష్టపడితే ఎవరైనా, దేన్నైనా సాధించ వచ్చు’ అనే సత్యాన్ని నిరూపించి, ప్రధానాధ్యాపకురాలి పదవిని పొందగలిగిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ మహిళ !
కానీ, సహకారం, సహృదయత లేని సహచరుల మధ్య నెగ్గుకు రావడం చాలా కష్టం. కొందరు ఆమెను సమర్ధించినా, మరి కొందరు సహోపాధ్యాయులూ , విద్యార్థులూ ఆమెకు ప్రతికూలంగా ప్రవర్తించి, స్ట్రైకులూ, ఘెరావులూ సృష్టించి, ఆమెను తీరని మనస్తాపానికి గురి చేశారు. ఇవన్నీ తట్టుకోలేని ఆమె రెండు సంవత్సరాల లోపునే పదవీవిరమణ చెయ్యవలసి వచ్చింది.
అంత స్ఫూర్తిదాయకంగా ఎదిగిన ఆమెను సమాజం కూకటి వేళ్ళతో తొలగించివేసింది . ఎంత దైన్య పరిస్థితి !
మానవత్వంతో కొందరు లీడర్షిప్ క్వాలిటీస్ వున్నవాళ్లు సమాజంలో అందరికీ ట్రాన్స్ జెండర్స్ గురించి అవేర్నెస్ తేవాలనీ, వాళ్ళ సంఘానికి ఒక స్థానాన్ని ఏర్పరచాలనీ పాటుపడుతున్న వాళ్ళూ వున్నారు. ఈ మధ్యనే ‘టైమ్స్ అఫ్ ఇండియా’ లో చదివాను. 73 ఏళ్ళ మంగళ అహిర్ అనే మహిళ ‘డాన్సింగ్ క్వీన్స్’ అనే ఒక ప్రొఫెషనల్ ట్రాన్స్ జెండర్ డాన్సింగ్ ట్రూప్ ని తయారు చేసింది. వాళ్ళు తమ నాట్యప్రతిభ ద్వారా సమాజంలో సమాన హక్కులు అర్ధించడానికి, తమ సంఘాన్ని పటిష్టం చేసుకోడానికి ధన సముపార్జనకీ సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. వారికి తమ అంగీకారాన్ని, సమర్ధతనీ తెలుపుతూ ఎల్. జీ . బీ . టీ . సెక్షన్ వారందరూ కూడా పూర్తి మద్దతు నిచ్చారు.
ఒకసారేం జరిగిందంటే , వారి నాట్య ప్రదర్శనని చూసిన తర్వాత ఒక దంపతుల జంట తమ కృతజ్ఞతను తెలుపుతూ సోషల్ ఆక్టీవిస్ట్ అయిన, మంగళా ఆహిర్ పాదాలను తాకి ధన్యవాదాలు చెప్పారు. నాట్య నిష్ణాతురాలైన ఆమెకు తెలిసిందేమంటే వాళ్ళూ తనలాగానే ట్రాన్స్ జెండర్ బిడ్డకి తల్లి తండ్రులు. అదే ట్రూపులో నాట్యంలో పాల్గొన్న తమ కొడుకు లింగత్వంతో ఏవిధంగా వ్యవహరించాలో సతమతమవుతున్న సమయాన “డాన్సింగ్ క్వీన్స్ ” గురించి విని, వారిని కలిసి, వారి ప్రోత్సాహం ద్వారా తమ బిడ్డకు కూడా ఒక అస్తిత్వాన్ని కలిగించ గలిగే అదృష్టాన్ని పొందినవారు.
2009 లో, అభినా అహిర్ ద్వారా స్థాపించబడిన ఈ సంస్థ ద్వారా వీళ్ళు ఒక దశాబ్ద కాలం నుంచీ నాట్యప్రదర్శనాలు ఇస్తున్నారు. నాట్య మాధ్యమంతో సమాజంలో ట్రాన్స్ జెండర్స్ కి సమాన స్థాయి కలిగించడం వారి ముఖ్యోద్దేశం. పలు ప్రదర్శనల ద్వారా, సమాజం , బంధు మిత్రుల నుంచీ వెలివేయబడ్డ ట్రాన్స్ జెండర్స్ యొక్క మంచి చెడ్డల కోసం అత్యంత కృషి చేస్తున్నారు. వారి స్థితి గతులను, వారు ఎదుర్కొనే కష్ట నష్టాలనూ అందరి గ్రహింపుకీ తెస్తున్నారు. ఫామిలీ సపోర్ట్ ఎంత అవసరమో నొక్కి వక్కాణిస్తున్నారు.
ఈ సంస్థను స్థాపించక ముందు ఈ డాన్సింగ్ క్వీన్స్ , రహదారులలో అడుక్కునో, వేశ్యావృత్తితోనో తమ జీవనం సాగించేవారు. మరి కొందరు బార్ డాన్సర్లుగా వుండి, పెళ్లిళ్లలోనూ , పండగ ఉత్సవాలలోనూ నాట్యం చేసేవారు. అదే మనసులో పెట్టుకుని , అవహేళన చేస్తూ, సమాజం వారిని చిన్న చూపు చూస్తుంది. నిజానికి ప్రదర్శనను తిలకించే వారు పాతభావాలను పక్కకి పెట్టి, ట్రాన్స్ జెండర్స్ కి అంటగట్టబడిన స్టిగ్మాను మర్చిపోయి, వారి లింగత్వాన్ని, పూర్వ జీవితాన్ని గమనించకుండా వారిని నాట్య ప్రదర్శకులుగా మాత్రమే ఎంపిక చెయ్యగలిగిన నాడు వారి బతుక్కొక పరమార్ధం ఏర్పడినట్లు భావించవచ్చు. తోటి మానవునిగా మనమూ వారి ఉనికిని గ్రహించి, మనలో ఒకరిగా పరిగణించి, లింగ విభేదాలను మరచి సహానుభూతితో చేయూతనందించడం మన కర్తవ్యంగా భావించడం ఎంతైనా అవసరం.” అంటూ ముగించాను.
రాణీ మళ్ళీ అంది , “మనకి సిగ్నల్ దగ్గర కనబడిన ఆమె ఏం చేసింది ? తనకి దొరికిన చిన్న సంతోషాన్ని తాను అనుభవించకుండా, అది దొరకని చిన్ని సంతోష్ నోటికి అందించింది. తనకి దొరకని సంతోషాన్ని ఆ చిన్నవాడిని సంతోష పెట్టడం ద్వారా పొందుతూ మనకంటే తానే ఉన్నత స్థాయిలో ఉన్నదని నిరూపించుకుంది.”
రాణీ మాటలలో సత్యం ఆమెను సిగ్గుపడేలా చేసింది.
నిజమే ! బూజు పట్టిన పాత భావాలున్న వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయమేగా మరి !!!