ట్రాఫిక్ కంట్రోల్

రచన:  మణి గోవిందరాజుల….

కారు చాలా స్మూత్ గా వెళ్తున్నది రెండేళ్ళ తర్వాత విదేశాల నుండి వచ్చిన గౌరవ్ కిటికీ లో నుండి కనపడుతున్న సిటీ ని చూసి  చాలా ఆశ్చర్యపోయాడు.   “అరేయ్ ప్రకాశ్ నన్నొకసారి గిల్లరా? ఇది కలా నిజమా? ఇది హైదరాబాదేనా? లేక నేను ఇంకా యూయెస్ లోనే వున్నానా?” అడిగాడు

“నువు హైదరాబాద్ వచ్చావు.   నేను నిన్ను తీసుకుని ఎయిర్పోర్ట్ నుండి ఇంటికెళ్తున్నాను.   ఇది నిజం.   ముమ్మాటికీ నిజం” హాస్యంగా చెప్పాడు ప్రకాశ్.

“పోనీ ఇది చెప్పు నేనెళ్ళి ఒక పాతికేళ్ళు అయిందా? లేదా సినిమాల్లో చూపినట్లు నేను గత పాతికేళ్ళుగా నిద్ర పోతునే వున్నానా?అదీ కాకపోతే యే మాంత్రికుడో నన్నెత్తుకెళ్ళి ఇప్పుడు విసిరేసాడా?” ప్రశ్నాపత్రం సంధించాడు గౌరవ్.

“యేంట్రా? నీ గోల? చావగొడుతున్నావు ఇందాకటినుండి? అవును మరి నువ్వో భట్టి విక్రమార్కుడివి.   నిన్ను బలిఇస్తే అన్ని తాంత్రిక శక్తులు వశమవుతాయని నిన్నెత్తుకెళ్ళాడు మాంత్రికుడు” వెక్కిరించాడు ప్రకాశ్ .   “నువెళ్ళి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయ్యాయి.   అయినా బాబ్బాబు నీకు పుణ్యం వుంటుంది.   నా బుర్ర తినకు.   ఇంట్లో నీ కోసం చాలా మంది యెదురు చూస్తున్నారు.  వాళ్ళవి తిను.  ” హాస్యంగా అంటూనే కారు రయ్యిన పోనిచ్చాడు ప్రకాశ్.   యెప్పుడూ ఇల్లు చేరడానికి గంటన్నర పట్టేది.   అరగంటలో ఇల్లు చేరే సరికి దిమ్మ తిరిగి పోయింది గౌరవ్ కి.

ఇల్లంతా పెళ్ళికళతో కళ కళ లాడుతున్నది ఇంటినిండా బంధుజనం సందడి.  ఇంట్లోకి వెళ్తూనే అందరూ గ్రాండ్ గా వెల్కం చెప్పారు.   అందర్నీ చూసి సంతోషంతో మాట్లాడుతున్నా మనసు ఒకవేపు గందరగోళం తో కొట్టుమిట్టాడుతున్నది.

“ఇప్పుడు చెప్పరా? యేమి జరిగింది? మన జనరేషన్ చూడలేమనుకున్న వింతని యెలా చూడగలుగు తున్నాము? ఎలా జరిగింది? యెవరు దీనికి కారణం?” ఎంతో ఆతృతగా అడిగాడు ఆ రాత్రి బెడ్ రూం లోకి చేరాక.

“నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తే నాకేంటంటా?”

“సమాధానం ఇస్తే నీకేంటో నాకు తెలీదు కాని ఇవ్వకపోతే మటుకు నీకు ఖచ్చితంగా తన్నులే.  ” ప్రకాశ్ నడ్డి మీద ఒక్కటిచ్చాడు గౌరవ్.

“చచ్చాన్రా బాబూ! నాయనా గౌరవా చెప్తాను కాని నన్ను తన్నమాక.   అయినా ఇంటల్లుడిని కాబోతున్నాను.   మర్యాద మర్యాద” నడ్డి సవరించుకుంటూ వేడుకుంటూనే డిమాండ్ చేసాడు ప్రకాశ్.

“అదంతా పెళ్ళయ్యాక.  ఇప్పుడు కాదు” కాళ్ళు లాగబోయాడు గౌరవ్.

ప్రకాశ్ గౌరవ్ మేనత్త మేనమామ పిల్లలు.   ఒకరంటే ఒకరికి ప్రాణం.  పుట్టినప్పటినుండి కూడా ఒకరిని వదిలి ఒకరు ఉన్నది లేదు.  కలిసి చదివారు,పెరిగారు తిరిగారు.   ఇప్పుడు ప్రకాశ్ గౌరవ్ కి బావగారు కూడా కాబోతున్నాడు.   అదిగో ఆ సందర్భంగానే గౌరవ్ స్వదేశాగమనం.  .  .  గౌరవ్ కి చాలా సంతోశంగా వుంది.   బాల్య స్నేహితుడే బావ కాబోతున్నందుకు.   యెంత మేనల్లుడైనా ఇంటల్లుడు కాబట్టి మర్యాద ఇవ్వాలని తల్లీతండ్రీ చెప్తే ఇష్టం లేకపోయినా ఒకసారి ఫోన్ చేసినప్పుడు మర్యాదగా మాట్లాడబోతే ప్రకాశ్ వారం రోజులు మాట్లాడలేదు.   ఈ మర్యాదల చట్రం లో ఇరుక్కుపోతే బాల్యస్నేహితాన్ని కోల్పోతామేమోనని ప్రకాశ్ భయం.   అందుకే ఇప్పుడు ఇద్దరూ మొదటిలాగే హాయిగా మాట్లాడుకోగలుగుతున్నారు.

“ఓకే! బాబా! ఓకే… సరే ఒకసారి నువు ఇక్కడున్న రోజులని రింగులు తిప్పుకుంటూ చూసుకో.  .  ఈ లోగా నేనో నిద్ర తీస్తాను.  తెల్లవారుఝామున్నే లేపారు నన్ను” ఆవలిస్తూ ముసుగు కప్పాడు ప్రకాశ్.

ప్రకాశ్ అన్నట్లుగానే గౌరవ్ కళ్ళముందు రింగులు తిరగసాగాయి.  .

*************

“ఛీ!” గట్టిగా స్టీరింగ్ మీద కొట్టాడు గౌరవ్ కోపంతో.

“అరేయ్ అలా కోపం తెచుకుంటే నీ స్టీరింగే విరుగుద్ది.   అప్పుడదో బొక్క నీకు.  తన కోపమే తన శత్రువు అని వూర్కే అనలేదు.   చిల్ బాబా చిల్” శాంత పరచబోయాడు ప్రకాశ్.

“అరేయ్ వెళ్ళి ఒక్కొక్కళ్ళని బండనా బూతులు తిట్టాలని ఉందిరా.   ఆటో వాళ్ళెళ్తున్నారంటే పోనిలే అనుకోవచ్చు.   వాళ్ళకు మొదటినుండీ అలవాటు.   కాని ఈ చదువుకున్న మూర్ఖులు, అందరూ సాఫ్ట్ వేర్ యెంప్లాయీస్ లాగానే వున్నారు.   వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో కాకపోతే యెలా? ఇప్పుడు చూడు మనకి ఫ్రీ లెఫ్ట్.   అయినా మననెవ్వరూ పోనివ్వరు.   ఆఖరికి స్కూల్ బస్సులు ఆర్ టీ సీ బస్సులు కూడా అడ్డం వస్తాయి.   స్కూలు బస్సులే అలా పోతే ఇక పిల్లలకి వారేమి నేర్పిస్తారు?”

“చెప్పింది చాలుకానీ.  ఇక పోనివ్వు.  ఇక్కడ నీ మాటలు విని మెచ్చుకుని మేకతోలు కప్పేవాళ్ళు యెవరూ లేరు.  ”

సీరియస్ గా కార్ పోనిస్తూ “ఎప్పుడు మారుతుందిరా మనదేశం? అటు చూడు అంత యెత్తుగా వున్న డివైడర్ ని యెక్కి ఇటు దూకుతున్నారు.   పైనుండి చంకలో పిల్లాడు,చేతిలో పిల్ల.  అది యెంత ప్రమాదం? యేమన్నా జరిగితే మళ్ళీ కారు వాళ్ళు కన్నూ మిన్నూ కానక డ్రైవ్ చేసారంటారు.   పెద్ద వాళ్ళు ఏది చేస్తే పిల్లలదే చేస్తారు.   రేపు ఈ పిల్లలు పెద్దవాళ్ళు లేకుండా కూడా ఇలానే రోడ్ క్రాస్ చేస్తారు.  ” ఆవేదనగా అంటూ ట్రాఫిక్ ని తప్పించుకుంటూ నెమ్మదిగా డ్రైవ్ చేయసాగాడు గౌరవ్.

“అందరూ యెలా వెళ్తున్నారో ,మనమూ అలానే వెళ్ళాలి.   అంతకంటే చేసేదేమీ లేదు.  ” ఓదార్పుగా చెప్పాడు ప్రకాశ్.

“అయినా ప్రభుత్వం కూడా రూల్స్ ని కఠిన తరం చేసింది కదా? మార్పు ఒక్కసారిగా రాదురా. టైం పడుతుంది.  ”

“ఎంతకాలం రా? సిగరెట్ పెట్టెమీద “సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్” అని రాసినట్లే వున్నాయి మన ప్రభుత్వపు రూల్స్.   అదిగో అటు చూడు వాడికి ప్రభుత్వం ఏమీ చేయలేదన్న నమ్మకం ఎంత లేకపోతే బైక్ మీద స్పీడ్ గా వెళ్తూ మొబైల్ ని తలకు చెవులకు మధ్య పెట్టుకుని మాట్లాడుతూ వెళ్తాడు?వాడికి తెలీదా వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడితే జరిమానా వుందని? కాని నమ్మకం, తననెవరూ పట్టుకోరులే అని.  ఒకవేళ పట్టుకున్నా డబ్బులిస్తే యెవడికోసం వదిలిపెడతాడులే అనే నమ్మకం.  .   అయినా రూల్ అనికాదు, జరిమాన పడుతుందని కాదు కాని కనీస పౌరుడిగా తన బాధ్యత తనకు గుర్తు లేకపోతే ఎలా?.   మన దేశ పౌరుల్లో మార్పు రావాలంటే కనీసం పాతికేళ్ళు పడుతుంది.  ” నిస్పృహగా అన్నాడు గౌరవ్.

అలానే రోజూ తిట్టుకుంటూ కాలం గడుపుతుండగా గౌరవ్ కి యూయెస్ లో జాబ్ వచ్చింది.   అదిగో అప్పుడెళ్ళి మళ్ళీ ఈ పెళ్ళి సందర్భంగా ఇప్పుడొచ్చాడు.

“యేరా రింగులు ఇంకా ఆగలేదా?” కళ్ళముందు చిటికలేస్తూ అడుగుతున్న ప్రకాశ్ మాటలతో ఈ లోకం లోకి వచ్చాడు గౌరవ్.  సమయం చూస్తే పన్నెండు అయింది.

“ఆపేసావు కదా రింగుల్ని.   ఇప్పుడు చెప్పరా యేమి జరిగిందొ.   మధ్య మధ్య అమ్మావాళ్ళు చెప్తున్నా ఏదో కొద్దిగా బాగైనా మనకదే గొప్ప కదా అనుకున్నాను.   కాని ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు.   నిజంగా చాలా హాయిగా వుంది సిటీ” చాలా సంతోషపడ్డాడు గౌరవ్.

“నువ్వింకోటి గమనించినట్లు లేవు.   ఎక్కడన్నా బిచ్చగాళ్ళు కనపడ్డారా?”

“అవున్రా! కరెక్టే.  ఎక్కడా తగల్లేదు.  ఎలా? ఇంత ప్రపంచ తొమ్మిదో వింత ఎలా జరిగింది?”

“తొమ్మిదోదా?ఎనిమిదోదేంటి?”

“ఎనిమిదోది మన హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవడం” ఇద్దరూ నవ్వుకున్నారు.

“నిజం రా మన దేశ ప్రజలు నిజమైన పౌరులుగా ఇలా వుండాలి అనేది నా కల.   ఎంత హాయిగా వుంది అందరూ అలా వుంటె?”

“ఈ ఊరింపులు కాదు కాని చెప్పు ఏమి జరిగిందొ”.  .

“ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎన్నో రకాల ఫైన్ లు విధించింది కదా? నువు ఉన్నావా అప్పుడు? రూల్స్ ఫాలో కాకపోతే పేరెంట్స్ కి శిక్ష అనే రూల్ పెట్టిందీ?”

“అవును అప్పుడు కూడా ఇంకెవరినో తీసుకొచ్చి మేనేజ్ చేయడం మొదలు పెట్టారు.   ఇంకా రక రకాలుగ ఫైనులు విధించినా దానికి ప్రత్యమ్నాయం ఏదో ఒకటి వుండేది.   అందుకే సక్సెస్ కాలేకపోయింది.   ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను.  ”

“ అదిగో ఆ సమయం లోనే కొత్త కమీషనర్ వచ్చాడు.   ఆయనొచ్చాక కూడా ఒక నెల రోజుల వరకు పెద్ద తేడా ఏమీ లేదు.   కాని ఆ తర్వాత మొదలయింది అసలు డ్రామా.  ”

“అరేయ్! నీ బోడి సస్పెన్సూ నువ్వూను.   విషయానికిరా”

“ఎంత డబ్బు ఫైన్ కింద పెట్టినా కూడా ఉన్నవాళ్ళకు లక్ష్యం లేదు.  కట్టలేని వాళ్ళు సాధారణ సగటు ఉద్యోగి అంత డబ్బు ఎలా కట్టగలడు అని ఎదురుదాడికి దిగుతున్నారాయె.   అంతే కాని కొద్ది ముందుగా బయలుదేరి ఆఫీసుకు టైం కి చేరుకుందాము ఎటువంటి ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేయకుండా అనుకునే వాళ్ళే లేరు.  .  పోనీ అని పేరెంట్స్ కి శిక్ష అంటే మారతారేమో అనుకుంటే హమ్మయ్య నా కొడుక్కు జైల్ శిక్ష తప్పింది కదా అని సంతోష పడే వెర్రి తలితండ్రులున్న దేశం మనది.   మొబైల్ మాట్లాడుతూ వెళ్తే ప్రమాదం తనకొక్కడికే కాదు తోటి ప్రయాణికులకు కూడా అన్న చిన్న విషయం తెలుసుకోలేని యువత ఉన్న దేశం మనది.   అందుకే కొత్తగా వచ్చిన కమీషనర్ ముఖ్యంగా ఈ రెండు ప్రాబ్లమ్స్ మీదే దృష్టి పెట్టాడు.   ఆ నెలరోజులూ ఆయన ఖాళీగా ఏమీ లేడు.   ట్రాఫిక్ సమస్యని ఎలా తీర్చాలి అన్న దాని మీదే దృష్టి పెట్టాడు.  ”

“సోదాపి సంగజ్జెప్పు.  ”

“అదిగో అలా అరిస్తే నేను చెప్పను” రెండు చేతులతో నోరు మూసుకున్నాడు ప్రకాష్.

“అయితే సరే చక్కిలిగిలి పెడతా నీ ఇష్టం” బెదిరించాడు.  చక్కిలి గిలి పెడితే ప్రకాశ్ అస్సలు తట్టుకోలేడు.

“బాబోయ్! వద్దులే విను.   నెల తర్వాత సిటీ లో ఉన్న బిచ్చగాళ్ళందరినీ , ట్రాఫిక్ దగ్గర అమ్ముకునేవాళ్ళనీ కూడగట్టాడు.   ప్రతి సిగ్నల్ దగ్గరా పదిమంది దాకా ఉంటారు.  ఎవరైనా సరే ట్రాఫిక్ క్రాస్ చేస్తున్నా,మొబైల్ మాట్లాడుతూ కనపడ్డా వీళ్ళెళ్ళి వాళ్ళ చుట్టూ నిలబడి చప్పట్లు కొట్టుకుంటూ పాటపాడతారు.   అది ఫొటో/వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టేసే వాళ్ళు.   “ట్రాఫిక్ రూల్ ని అతిక్రమిస్తూ బిచ్చగాళ్ళకు/స్ట్రీట్ వెండర్స్ కి దొరికిన వ్యక్తి” అంటూ.  .  ఫైన్ మామూలె.  .  ఆ తర్వాత వాళ్ళు కట్తే ఫైన్ వాళ్లకు పంచేవారు.  వీళ్ళను మానిటర్ చెస్తూ ఒక ట్రాఫిక్ పోలీస్ ఉండేవాడు.   ఫుల్లు ట్రాఫిక్ లో కూడా నేర్పుగా తిరిగే టాలెంట్ బిచ్చగాళ్ళ సొంతం.   అందుకే ఎంత తప్పించుకుందామన్నా రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళు దొరికి పోయేవారు.   మొదట్లో బాగా గొడవ చేసినా తర్వాత్తర్వాత ట్రాఫిక్ కి అలవాటు పడ్డారు.

“మొదట్లో అడుక్కునేదానికన్నా బాగా తక్కువ డబ్బులొస్తున్నాయని బిచ్చగాళ్ళు చాలా గొడవ చేసారు.   కానీ మరి ఆయన ఎలా ఒప్పించాడో తెలీదు గప్ చుప్.  .  .  .  ట్రాఫిక్ బాగా కంట్రోల్ అయింది.   అప్పుడు వారందరినీ చెత్తని కంట్రోల్ చేసే వారికింద మార్చాడు రోడ్డు మీద ఎవరన్నా చెత్త వేస్తూ కపడితే సేం ట్రీట్ మెంట్.   ఇప్పుడు వారందరికీ ప్రభుత్వ జీతాలు .  ”

పడీ పడీ నవ్వసాగాడు గౌరవ్.  ”అయ్యో నేనెంత మిస్ అయ్యాను.   మా లాబ్ లో సోషల్ నెట్వర్క్ ఉండదు.   వారానికి ఒకసారి అమ్మవాళ్లతో మాట్లాడ్డమే.   అప్పుడు కూడా కొద్ది సమయమే ఇచ్చేవారు అందుకే తెలీలేదు.   సరే ఒకసారి బయట తిరిగొద్దాము పద”

కారు అద్దాలు తీసుకుని డ్రైవ్ చేయసాగాడు గౌరవ్.   చల్లని గాలి చక్కిలిగిలి పెడుతున్నది.   వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.   రోడ్ సైడ్ ఇడ్లీ దోస సెంటర్స్ చాలా శుభ్రంగా వెంటనే వెళ్ళి తినాలనేంత నీట్ గా వున్నాయి.   హాయిగా వెనక్కి వాలి నిదానంగా వెళ్తుంటే ఒక దృశ్యం ఆకర్శించింది గౌరవ్ ని.   “అరేయ్ ఎన్ని మారినా జనాలు రోడ్ మీద యూరినేట్ చేయడం మానరు కదా?” విసుక్కున్నాడు.

“అలా అనకురా! ఒక్కసారి మొత్తం మార్పు రాదురా.  బయట తిరుగుతున్న వెండార్స్ యెక్కడ వెళ్తారు? రోజంతా ఇంటికెళ్ళేదాకా ఆపుకుంటే హెల్థ్ ప్రాబ్లమ్స్ వస్తాయి.   దీన్ని ఒక ఉద్యమం లాగా చెయ్యాలి.  ప్రభుత్వం వారు పబ్లిక్ టాయిలెట్స్ ని విరివిగా నిర్మించాలి.   మళ్ళీ దాన్ని మెయింటెయిన్ చెయ్యాలి.   వాటిని కొంత డబ్బు పే చేసి వాడుకుందాము అన్న గ్రహింపు వీళ్ళకు రావాలి.   సులభ్ వాళ్ళు చేసారు కాని అందులో కూడా శుభ్రత తక్కువ.   ఇదంతా ఒక సర్కిల్.  .   మళ్ళీ ఎవరో వస్తారు ఇలాగే” చెప్పాడు ప్రకాశ్.

చల్లగాలిని తనలో నింపుకుంటూ పూలరథం లా వెళ్ళసాగింది కారు.

 

 

 

 

 

 

చీకటిలో చిరుదివ్వె

రచన: మణికుమారి గోవిందరాజుల

పడక్కుర్చీలో కూర్చుని ఊగుతూ తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నది శాంత.. చేతిలో తమ్ముడు ఎర్రడు రాసిన వుత్తరం అలానే ఉంది. అప్పటికి ఎన్నిసార్లు చదివిందో. చదివిన ప్రతిసారీ గుండెల్లో బాధ రెట్టింపవుతున్నది..
ఏడాదిగా మర్చిపోయిన గతాన్ని అది కూకటి వేళ్ళతో పైకి లాగుతున్నది.వద్దనుకున్న బంధాలను వదిలించుకోలేవంటున్నది. బాధ పడటం నీ జన్మహక్కు..కాదనుకుంటే కుదరదంటున్నది. కళ్ళల్లోనుండి నీళ్ళు కారుతున్నది కూడా తెలియటం లేదు.
ఇంతలో లాండ్ లైన్ ఫోన్ మోగింది. కళ్ళుతుడుచుకుని యెవరా అని చూస్తే ఇండియా నంబరు. తీయాలా వద్దా అని కాసేపు ఆలోచించింది.ఈలోపు ఆగిపోయింది. హమ్మయ్య అని మళ్ళీ కళ్ళుమూసుకునే లోపే తిరిగి మోగడం ప్రారంభమయింది.
రిసీవరు తీసి పక్కన పడేసి కళ్ళు మూసుకుంటే వద్దనుకున్న గతం తలుపులు తెరుచుకుని తలపుల్లోకొచ్చింది. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది శాంత..
“అయ్యా! నాకు ఫ్రీ సీటొచ్చింది. కాలేజిలో చేరమని ఉత్తరమొచ్చింది” సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి భూక్యాకి చెప్పింది శాంత.
చుట్ట కాలుస్తున్న భూక్యా ఏ ఎక్స్ ప్రెషనూ చూపించలేదు. మనసులో బాధ పడ్డా
ఉరుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళింది.
పొయ్యూదుతున్న తల్లితో కూడా అంతే సంతోషంగా చెప్పింది. అక్కడ కూడా అదే తీరు.
అదేంటో గూడెం లో అంత మందుంటే చదువుల తల్లి సరస్వతి శాంతతో చెలిమి చేసింది. ప్రాణ స్నేహితురాలై పోయింది. నిన్నొదలనంటున్నది.…గూడెం ల అయిదువరకుంటే నాలుగేళ్ళల్లో అయిదు క్లాసులూ చదివేసింది. అక్కడ చదువు చెప్పిన టీచరే తండ్రి భూక్యాని ఒప్పించి తీసుకెళ్ళి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేర్పించి చక్కా పోయాడు.శాంత అన్న పేరు కూడా అతనే పెట్టాడు. వాళ్ళే నడుపుతున్న స్కూల్లో పది వరకు చదివింది. అక్కడ ఎంత ఇబ్బందిగా వున్నా చదువు మీద మమకారంతో చదువే లోకంగా చదివింది. స్టేట్ ఫస్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు ఇంటరు వందశాతం ఫ్రీగా చదివిస్తామని ఆఫర్ ఇచ్చారు.
ఇదిగో ఇప్పుడా ఉత్తరం పట్టుకునే తలితండ్రులతో సంతోషాన్ని పంచుకోవాలనుకుంటే వాళ్ళ తీరు అలా వుంది.
“ఇదిగో !ఇప్పుడే చెప్తున్నా విను. రాజన్న కబురు చేసిండు. ఓలె కింద రెండెకరాల పొలం ,మనందరికీ బట్టలు,ఇస్తాడంట . జీవితమంతా హాయిగా గడిచిపోతుంది. ఇంకా ఊరంతా కల్లు కుండలు పంచుతనన్నడు. ఊళ్ళె నా పరపతి పెరుగుతది చదువూ లేదు గిదువూ లేదు.నోర్మూసుకుని రాజన్నతో పెళ్ళికి సిద్దంగుండు.. మారు మాట మాటాడితే నరికి పోగులు పెడత.” లోపలికి వచ్చిన భూక్యా బిడ్డతో చెప్పాడు
తండ్రి మాటలు విని భయంతో వణికి పోయింది శాంత.. తనకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడు, నల్లగా ఆరడుగుల రెండంగుళాల ఎత్తుతో,నూటా యాభై కిలోల బరువుతో భూమి అదిరేట్లు నడిచే రాజన్నతో రెండో పెళ్ళనగానే నిలువునా నీరై పోయింది.
“నాకు పెళ్ళొద్దయ్యా! నేను డాక్టరీ చదువుత. మనకేమీ డబ్బు ఖర్చు కాదు.చదివినంక గవర్నమెంట్ హాస్పిటల్ల ఉద్యోగమొస్తే కూడా మన జీవితం హాయిగా గడిచిపోతుంది. ఒప్పుకో అయ్యా!” ఒక్కసారిగా తండ్రి కాళ్ళు పట్టుకుని బావురుమంది.
దూరంగా పడేట్లు ఒక్క తన్ను తన్నాడు వెళ్ళి గోడకు కొట్టుకుంది. “ అప్పటిదాకా ఎట్ల పెంచాలే మిమ్మల్నందరినీ? రేపు చీకట్ల మనువు.తయారుగుండు” చెప్పి తలుపేసి వెళ్ళిపోయాడు భూక్యా.
ఏమైనా సరే చదువుకోవాలి. ఆ పెళ్ళి చేసుకుని ఈ గూడెం ల తన జీవితాన్ని సమాధి చేసుకోవద్దు అన్న ఒకే ఒక గాఢమైన కోరిక శాంతకి ఎక్కడలేని శక్తిని ధైర్యాన్ని ఇచ్చింది.చిన్న చేతి సంచిలో రెండు జతల బట్టలు సర్దుకుని అందరూ నిద్ర పోయేవరకు తను కూడా నిద్ర నటించింది. సర్టిఫికెట్లు స్కూల్లోనే వున్నాయి ఇంకా నయం అనుకుంది. ఇద్దరు తమ్ముళ్ళను,ఇద్దరు చెల్లెళ్ళను,తల్లిని తండ్రిని కడసారి చూసుకుని యెక్కడో మారుమూల వున్న ఆ తండానుండి ,ఆ చీకటిలో చిరుదివ్వెలాగా కనపడుతున్న కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ బ్రతుకు ప్రయాణాన్ని ప్రారంభించింది శాంత.
ఇల్లు వదిలి వచ్చిన శాంతకి స్నేహితులంతా కూడా ధైర్యం చెప్పారు. శాంత తెలివితేటలను గమనించిన ఒక ఫ్రెండ్ తండ్రి తాను గార్డియన్ గా వుంటానన్నాడు. అతనే తన కూతురుతో పాటు శాంత ని కూడా హైదరాబాద్ పంపాడు. అందువల్ల చదువు ఆటంకం లేకుండా కొనసాగించింది. ఫీజ్ ఒక్కటే వుండదు కానీ మిగతా అవసరాలకు డబ్బు కావాలి కదా? ఒకటే లక్ష్యం చదువు.అందుకని పాచి పనులదగ్గరనుండి రకరకాల పనులు చేసింది.బాగా చదువుతున్న పిల్ల అవడంతో పని చేస్తున్న ఇంటి వాళ్ళందరూ కూడా తమ వంతు సాయమందించి ఇంకా ప్రజల్లో మానవత్వం వుందని నిరూపించుకున్నారు.
శాంత ఇల్లొదిల్న మర్నాడు గూడెం లో తెల్లారి కూతురు కనపడక పోవటం తో భూక్యా గూడేం అంతటా వెతికాడు. శాంత చదివిన వెల్ఫేర్ హాస్టల్ కెళ్ళి ఆరా తీసాడు .కాని శాంత జాడ చెప్పలేదు . అంతటా వెతికాడు కాని హైదరాబాద్ దాకా వెళ్ళి వుంటుందన్న ఆలోచన లేకపోవడంతో శాంతని కనుక్కోలేకపోయాడు భూక్యా. రెండేళ్ళు గడిచాయి. ఎక్కడో దూకి ప్రాణం తీసుకుని వుంటుందనుకున్నాడు. మెడికల్ ఎంట్రన్స్ లో స్టేట్ ఫస్ట్ రావడంతో అన్ని మెడికల్ కాలేజీల వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. శాంత మెడికల్ కాలేజీ లో చేరిన రెండేళ్ళకి యెవరో చెప్పడంతో కూతురి అడ్రస్ పట్టుకుని భూక్యా కూతుర్ని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాడు. కోపంతో ఉడికి పోతున్నాడు భూక్యా.
ఆరొజు శాంత ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత పిల్లనిస్తానని మాట తప్పినందుకు జరిమానా కట్టలేకపోవడం తో గూడెం కట్టుబాటు ప్రకారం ఇంటిల్లపాదీ కొరడా దెబ్బలు తినాల్సివచ్చింది. వారం రోజులు గూడెం బయట వుండాల్సొచ్చింది.గూడెం ల పరువుపోయిందన్న కోపం, నాలుగేళ్ళనుండి కనపడకుండా వుందన్నకసితో వున్నా కూడా భూక్యా కూతురు కనపడగానే మొదలు ప్రేమగా పలకరించాడు.
“బిడ్డా! నిన్ను తీసుకెళ్ళనీకే వస్తి. మీ యమ్మ నీ కోసం యేడ్సి యేడ్సి పేనాలకి తెచ్చుకునె.ఇయ్యాలో రేపో అన్నట్లుండే. రా బిడ్డా . నిన్ను సూసి కన్ను మూస్తది.” పంచతో కళ్ళద్దుకున్నాడు భూక్యా..
తప్పు చేసినట్లుగా తలడిల్లి పోయింది శాంత.వెంటనే తండ్రి తో బయల్దేరింది. కోపంతో వుడికిపోతున్న భూక్యా గూడెంల బస్సు దిగుతూనే శాంత ని కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఇంట్ల బడేసిండు. .
అప్పుడర్థమయింది శాంతకు తండ్రి కుట్ర.ఒంటి మీద దెబ్బలు పడుతున్నా యేడుపు రావడం లేదు. మనసంతా మొద్దుబారిపోయింది.తీసుకొచ్చి గదిలో పడేసింది కాని , తలుపులేసింది కాని తెలీడం లేదు . కిందటి తడవలాగా పారిపోతుందేమోనని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతులేసుకుని కాపలా వుంటున్నారు. వాళ్ళకు తెలీటం లేదు..ఈ ప్రపంచం మీదా ,మనుషుల మీదా నమ్మకం పోయిన శాంతకు కదలాలన్న ఆలోచనకూడా రావడం లేదని..రెండురోజులు గడిచాయి తింటున్నదా?తినటం లేదా?స్పృహలో వుందా?లేదా?యేమీ తెలీటం లేదు. తండ్రి చేసిన నమ్మకద్రోహం తల్చుకుంటుంటే పొగిలి పొగిలి యేడవాలనిపిస్తున్నది కానీ అదేంటో యేడుపే రావడం లేదు..
మూడవరోజు వచ్చి తలుపులు తీసిన భూక్యా నెమ్మదిగా వచ్చి బిడ్డ దగ్గిర కూసున్నడు.
“బిడ్డా కోపం ల నిన్ను కొట్టితి. మనసుల పెట్టుకోకు.శాన అపమానించె రాజన్న. గదో గంద్కె నీ మీన మస్తు కోపమొచ్చె. మనసుల పెట్టుకోకు బిడ్డా!”
యేమీ మాట్లాడలెదు శాంత.
“మల్ల అదె శెప్పెడిది మనసుల వుంచుకోకంటి కద? ఇక్కడి తీసుకొచ్చి నిన్ను కొట్టినంక నా కోపమంత పాయె. శేసిన పాపం శెప్తె పోతది. రాజన్న ఆరెకరాల పొలం పదేలు రొక్కం ఓలి కింద ఇస్తననే.. ఆ ఆశతో నిన్ను లాక్కొస్తి.కాని ఇప్పుడూ సోచాయించంగ నాకనిపించింది. నువు సదూకుంటెనే మంచిదని.లే బిడ్డ నిన్ను దింపొస్త”
తండ్రి మాటలు బుర్రకెక్కలేదు .. అలానే కూర్చుంది శాంత.
భూక్యా చాలా ఓపికగా చాలాసేపు చెప్పాక ఒక రోజుకి కాని తండ్రి అంటున్నదేమిటో అర్థం కాలేదు. అర్థమయ్యాక కూడా నమ్మకం కలగలేదు. తల్లి చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా చాలా ఆప్యాయంగా వుంటున్నారు. యెంత వున్నా అది రాజన్నతో పెళ్ళికే నాటకమాడుతున్నారు అనుకుని నిర్లిప్తంగా వుండిపోయింది. భూక్యా వెంటబెట్టుకుని బలవంతాన బస్టాండ్ కి తీసుకొచ్చేసరికి అప్పుడు నమ్మకం కలిగి సంతోషంగా సిటీకి తిరిగివచ్చిన శాంత మిగిలిన కోర్సు హాయిగా పూర్తి చేసింది.
బస్ యెక్కేముందు కూతుర్ని కూర్చొబెట్టుకుని చెప్పాడు భూక్యా “ బిడ్డా!రాజన్న ఇస్తనన్నవాటికి ఆసపడి నిన్ను సదువు మానమంటి.కాని స్కూల్ల మాశ్టారు జెప్పె నీ సదువు యెంత గొప్పదో . రాజన్నతో పోట్లాడి నిన్ను పంపుతుంటి. ఇప్పుడు నిన్నిట్ల పంపినందుకు మల్లా మాకు కొరడా దెబ్బలుంటయ్. అయినా కూడా నువు అనుకున్నట్లుగా సదూకుంటే సాలు”కళ్ళు తుడుచుకునాడు.
“అయ్యా!”యెక్కిళ్ళు పెట్టింది శాంత.తప్పుచేసినట్లుగా వున్నది శాంతకు.గుండె నీరవుతున్నది తండ్రికి పడే శిక్ష తల్చుకుంటే..కాని చదువు మీది మక్కువ దాన్ని అణచి వేస్తున్నది.
నాకు తెలుసే తల్లీ నువెంత బాధ పడతావో..పసోళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేరు.పోయిన తడవ జొరాలొచ్చి పదేను దినాలు కళ్ళు తెరవకపాయె.బత్కుతరనుకోలె. జీవముండి బతికె..ఇంగ మీ యమ్మకైతే నువు పోయిన బెంగ, దెబ్బలు తిన్న బాధ యాడాది బట్టె కోలుకోనీకి”
“వద్దయ్యా! చెప్పకు నన్ను క్షమించయ్యా!” తండ్రి కాళ్ళు పట్టుకుని పెద్దగా యేడ్చేసింది.
“పిచ్చిపిల్లా!యెన్ని బాధలు పడ్డా నువు డాక్టరీ సదివి వచ్చినంక నిన్ను సూసుకున్నప్పుడు అయన్నీ గ్యాపకముండవు.ఇంగ నీ తమ్ముళ్ళను సెల్లెళ్ళను నువ్వే సూసుకుంటవ్ ఇంగ నాకేంది సెప్పు? నువు ధైర్నంగ ఎల్లి సదూకో బిడ్డా!”
“ కాని ఒక్క మాట! నీకు పంపెనీకి మా దగ్గర ఏమీ లేదు.గిప్పటి దన్క ఎట్ట సదుకున్నవొ అట్టనే సదూకోవాలె. పీజులకి పైకం బంపలేను..ఇంగ నీ మీదనె మా ఆశలన్నీ.”
“అదేమీ కాదయ్యా! నా సదూకేమీ ఇబ్బంది లేదు. మీరందరూ జాగ్రత్త గుండుండ్రి.పోయొస్త”
అప్పుడే వచ్చిన బస్సెక్కింది శాంత. ఇప్పుడు శాంత మనసు హాయిగా వుంది తండ్రి మారాడు
అంతే చాలు. తాను చూసుకుంటుంది తమ్ముళ్ళను చెల్లెళ్ళను అయ్యనీ అమ్మనీ.తృప్తిగా అనుకుంది శాంత.
శాంత అక్కడనుండి వచ్చినంక ఒక నెలకు తండ్రి దగ్గరనుండి ఉత్తరమొచ్చింది. సంతోషం గా ఓపెన్ చేసిన శాంత నీరసపడిపోయింది.ఉత్తరం అంతా కూడా రాజన్న తమని యెంత కష్ట పెట్టాడొ శాంత హృదయం ద్రవించేలా రాయించాడు భూక్యా. నిజంగానే శాంతకు చాలా దుఃఖం కలిగింది. తనవల్లనే కదా వాళ్ళకన్ని కష్టాలు అని బాధపడింది.వెంటనే స్నేహితుల దగ్గర కొంత తీసుకుని వాళ్ళకు మనియార్డరు చేసింది.ఇక అది మొదలు భూక్యా కూతురు దగ్గర జలగ అవతారం యెత్తాడు. ప్రతి ఉత్తరం లో రాజన్న పెట్టే కష్టాలే ఉండేవి.
ఇక అప్పులు చేస్తే లాభం లేదని చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలు పెట్టింది. కాని యెక్కడి డబ్బులూ చాలటం లేదు.ఒక్కోసారి తాను పస్తులుండి దాచేది తండ్రికి పంపడం కోసం. ఇవన్నీ గమనిస్తున్న స్నేహితులు శాంతను హెచ్చరించారు. కాని తండ్రి మారాడని నమ్ముతున్న శాంతకు స్నేహితుల మాటలు చెవికెక్కలేదు.ఈ విధంగా కష్టాలూ,కన్నీళ్ళు, ఎన్ని ఉన్నా కూడా సరస్వతీ దేవి శాంత కౌగిలి వదలడం లేదు. అందువల్ల శాంత చదువు ఏ ఆటంకమూ లేకుండా గోల్డ్ మెడల్ అందుకుని పూర్తి చేసింది. ఆ తర్వాత ఎమ్మెస్ అన్నీ పూర్తి చేసుకుని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేరింది.
ఈ మధ్యలో కుటుంబమంతా హైదరాబాదు చేరారు.. మగపిల్లలకి అసలే చదువబ్బలేదు. అల్లరి చిల్లరిగా తిరగడం అలవాటయింది సదూకున్న దానివి నీకెట్లన్న పెండ్లి అయితదని చెప్పి తర్వాత .ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్ళిల్లు చేసారు. కాని అల్లుళ్ళతో సహా అందరూ ఇక్కడే వుంటారు. మగ పిల్లలకి మంచి ఘనంగా ఓలె ఇచ్చి గూడెం వాళ్ళతోనె పెండ్లి చేసి కోడళ్ళను ఇక్కడికే తెచ్చుకున్నాడు.ఈ విధంగా శాంత శాంత స్వభావాన్ని అందరూ వాడుకున్నారు. వాళ్ళకు శాంత ఒక డబ్బు సంపాదించే యంత్రం మాత్రమే. అయినా కూడా శాంత కు వాళ్ళ మీద అనుమానం రాలేదు. కాని ఒకసారి పెద్ద దెబ్బే తగిలింది.
ఆ రోజు హాస్పిటల్ నుండి బయటకొస్తుంటే ఒక భారీ ఆకారం అడ్డొచ్చింది.
“బాగున్నవా శాంతమ్మా?” అని అడుగుతున్న ఆ ఆకారాన్ని యెవరా అని చూసింది.యెత్తుగా లావుగా వున్న ఆ ఆకారాన్ని వెంటనే పోల్చుకుంది. “రాజన్న”…
“ అవునమ్మ నేనే బాగున్నవ?” అతను మామూలుగానే అడుగుతున్నాడు.
“ఆ బాగున్న! యేంటిలా వచ్చావు?”
“నా బిడ్డకు బాగలేదు.ఇక్కడికి తీస్కపొమ్మనె. నువ్విక్కడనె చేస్తున్నవ?”సంతోషంగా అడిగాడు.
శాంతకు కోపం తెచ్చుకోవడం రాదు. అయినా అప్పుడెప్పుడొ జరిగినదానికి ఇప్పుడు అతనిమీద కోపం చూపించటం అవివేకం. ఆ విజ్ఞత శాంతకు వుండబట్టి రాజన్న కూతురు వివరాలన్నీ కనుక్కుంది. రాజన్నా నీకేమీ భయం లేదు నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పింది.
హాయిగా వూపిరి పీల్చుకున్నాడు. “వెళ్ళొస్తా శాంతమ్మా! మీ అయ్య అందరు బాగున్నరా?అన్నట్లు నీ పెనిమిటిని మాకు యెప్పుడు సూయిస్తవ్?” అడిగాడు
ఒక్కసారిగా శాంత మొహం మ్లానమైంది. “మా ఆయనేంది రాజన్నా?నాకింకా పెళ్ళే కాలేదు”
తడబడుతూ చెప్పింది.
వెళ్ళేవాడల్లా ఆశ్చర్యంగా నిలబడిపోయాడు రాజన్న.”అదేంది శాంతమ్మా? నీచెల్లె పెండ్లప్పుడు మేమడిగితిమి. పెద్దబిడ్డ పెండ్లి చేయకుండ చిన్న బిడ్డ పెళ్ళి చేస్తున్నవేందని? నువు చెప్పకుండ పెండ్లి చేసుకున్నవనీ , నీ పేరెత్తననీ, అందుకే నిన్ను పెండ్లికి పిలవలేదని జెప్పె.”
కాళ్ళకింద భూమి కదలాడినట్లయింది..తాను కూర్చున్న కుర్చీ గిర గిరా తిరిగిపోతున్నట్లనిపించి కుర్చీ కోడుని గట్టిగా పట్టుకుంది. అందుకా తనను యే పెళ్ళికీ తీసుకెళ్ళలేదు?యెంతో బ్రతిమలాడింది వస్తానని. కాని గూడెంల అందరూ వెక్కిరిస్తారని చెప్పి వద్దన్నాడు.కళ్ళూ,మనసు వెక్కిపడుతున్నాయి తండ్రి ద్రోహం తల్చుకుని.
జాలేసింది రాజన్నకి. “శాంతమ్మా!నీకు అందరం ద్రోహం చేస్తిమి..కాని యెప్పుడైతే నువు డాక్టరీ చదువుతున్నవని తెల్సిందో నీకు నేను సరి కాదని వద్దంటి.” చెప్పాడు.
“అదేంటి నువు మా అయ్యని డబ్బుల కోసం చాల యేండ్లు పీడించావు కదా? “ ఆశ్చర్యంగా అడిగింది.
“అయ్యో అలా చెప్పెనా? నాబిడ్డ మీదొట్టు. నిన్ను సదువు మానిపించి తీసుకొచ్చినప్పుడే నేను వద్దంటి. కాని నేనిస్తనన్న పొలం కోసం వెంటబడె. అప్పుడు స్కూల్ల అయ్యగారు చెప్పె నీ సదువు అయినంక నీకు డబ్బు బాగొస్తదని. అందుకే మల్ల నిన్ను సదువుకు బంపె.”వివరంగా చెప్పాడు .
“రాజన్నా నేను పుట్టిననప్పటినుండి నీకు తెలిసే వుంటుంది కదా?నేను మా అయ్య కన్న బిడ్డనేనా?” దీనంగా అడిగింది.
చాలా జాలేసింది రాజన్నకు.డాక్టరుగా ఆమెకి ఉన్న పేరు ప్రతిష్టలు ఇక్కడ హాస్పిటల్లో చూస్తుంటే బాగా అర్థమయింది. అంతటి మనిషి అలా అడుగుతుంటే కళ్ళనీళ్ళు తిరిగాయి రాజన్నకు కూడా. శాంత తలనిమిరి వెళ్ళిపోయాడు కళ్ళొత్తుకుంటూ.
నిరామయంగా అలా వుండిపోయిన శాంత సిస్టర్ వచ్చి హెచ్చరించాక ఇంటికి వచ్చిందే కాని యెవ్వరితో మాట్లాడాలనిపించలేదు. డబ్బులకోసమే వున్న ఇంట్లోని వారందరికీ శాంతలో కలిగిన అలజడిని గమనించే ఆసక్తి లేకపోయింది. ఇక ఆతర్వాత హాస్పిటలే ప్రపంచంగా బ్రతకసాగింది
శాంత విపరీతంగా సంపాదిస్తున్నదే కాని కాని ప్రశాంతత మటుకు ఆమడదూరం వుండిపోయింది. సంపాదన అంతా తండ్రికి అందనీయకుండా కొంత జాగ్రత్త మొదలు పెట్టగానే యెవరికి వారు తమ పిల్లల్ని శాంతకి దత్తత ఇవ్వాలనే ప్రయత్నం మొదలు పెట్టారు. అదింకా చిరాగ్గా వుంది శాంతకి..
ఆ రోజు తన రూం లో కూర్చుని మెడికల్ జర్నల్ తిరగేస్తున్నది శాంత.
లోపలికి వచ్చిన సిస్టర్ రూబీ “మేడం! లండన్ నుండి వచ్చిన డాక్టర్ స్టీఫెన్ మిమ్మల్ని కలవడానికి పర్మిషన్ అడుగుతున్నారు”అని చెప్పింది.
ఒక్కసారిగా హృదయం లయ తప్పింది.సంభ్రమంగా లేచి నిల్చుంది. రమ్మను అని చెప్పేలోపలే వచ్చేశాడు లోపలికి “ సాంతా!” అంటూ. స్టీఫెన్ కి శాంత అనడం రాదు..
కిందపడతానేమో అనిపించి టేబుల్ ని పట్టుకుని నించుంది. చిరునవ్వుతో ఎదురుగా నించున్న స్టీఫెన్ ని తనివితీరా చూస్తున్నది శాంత .. మేడం నే విచిత్రంగా చూస్తున్న సిస్టర్ కి వెళ్ళమని సైగ చేసాడు స్టీఫెన్.
ఏదీ కనిపించటం లేదు శాంతకి. ఐదేళ్ళ క్రితం “ఐ లవ్ యూ సాంతా.. యు ఆర్ మై లైఫ్”” అంటున్న స్టీఫెనే కనపడుతున్నాడు .ఆసరా కోసం అన్నట్లుగా చేయి చాపింది.. ఆ చేతిని అందుకుని ముద్దు పెట్టుకుని భుజాల చుట్టూ చేతులేసి చిన్నగా కుర్చీలో కూర్చోబెట్టాడు.
“సాంతా ! వర్కేమీ లెకపోతే నేను తాజ్ కృష్ట్నా లో దిగాను వస్తావ నాతో?” ప్రేమగా అడిగాడు.
మౌనంగా లేచి బ్యాగ్ సర్దుకుంది.
హోటల్ రూం లో అడుగుపెడుతూనే అక్కడున్న కుర్చీలో కూర్చుండిపోయింది. తలుపేసి దగ్గరకొచ్చిన స్టీఫెన్ శాంత మోకాళ్ళమీద తల పెట్టుకుని కింద కూర్చున్నాడు.ఒళ్ళో వున్న అతని తల మీది జుట్టును నిమురుతూ కళ్ళు మూసుకుంది శాంతి. మూసిన కళ్ళల్లో నుండి కారిన భాష్పధారలు స్టీఫెన్ తలను అభిషేకిస్తున్నాయి.
“సాంతా !ప్లీజ్.. డోంట్ క్రై… టెల్ మీ ఇప్పటికైనా నీవొక నిర్ణయానికి వచ్చావా?”
శాంత జవాబు చెప్పే పరిస్తితుల్లో లేదు .ఐదేళ్ళ క్రితం ..
“ హే !సాంతా వుడ్ యు లైక్ టు కం విత్ మి?”
తన రూం లో నుండి బయటకు రాబోతూ ఆ మాటలు విని తలఎత్తింది శాంత..
“ఫర్ డేటింగ్?” కంప్లీట్ చేసాడు ఎదురుగుండా వున్నతను.
ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి శాంతకి. యెంత ధైర్యం? కోపంగా ఏదో అనబోయింది కాని చాతకాక నవ్వేసింది.
“స్టీఫెన్! యూ నాటీ బాయ్..”
“సాంతా! ఎన్నిరోజులిలా వుంటావు?డేటింగ్ కి రమ్మంటే రావు.పోనీ పెళ్ళి చేసుకుందామంటే కుదరదంటావు. నేను వెళ్ళే రోజు దగ్గరపడుతున్నది.”
శాంతకి కాస్త మనశ్శాంతి దొరుకుతన్నదంటే అది స్టీఫెన్ దగ్గరే. మొహం లో చిరునవ్వు వెలిసేది కూడా స్టీఫెన్ చెంత వున్నప్పుడే స్టీఫెన్ ని వన్ ఇయర్ కోసం ఇంగ్లండ్ నుండి శాంత పని చేస్తున్న హాస్పిటల్ వాళ్ళు ప్రత్యేకంగా పిలుచుకున్నారు. హార్ట్ స్పెషలిస్ట్. గుండెకి సంబంధించిన ఎటువంటి ఆపరేషన్ అయినా అవలీలగా చేసేస్తాడు. ఎప్పుడు చూసినా నవ్వుతూ నవ్విస్తూ వుండే స్టీఫెన్ ని ఎప్పుడూ తనపనేదొ తాను చేసుకుంటూ వెళ్ళే శాంత ఆకర్షించింది. తనే పలకరించి స్నేహం చేసుకున్నాడు. స్నేహమే అనుకున్నాడు కాని యెప్పుడు జరిగిందో తెలీదు స్టీఫెన్ హృదయాన్నంతా ఆక్రమించుకుంది శాంత . తండ్రి కిచ్చిన మాట కోసం తనకోసం ఆరాటపడుతున్న స్టీఫెన్ కి యస్ చెప్పలేకపోతున్నది శాంతి.
“అప్పుడే వెళ్ళిపోతున్నావా స్టీఫెన్?” దిగులుగా అడిగింది ..సంభాషణ అంతా ఇంగ్లీష్ లో సాగుతున్నది.
ఇద్దరూ క్యాంటీన్ లో ఒక మూలగా కూర్చున్నారు.
“సాంతా ! ,నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కాని మనం ఎవరికన్నా సహాయం చేస్తున్నామంటే అది వాళ్ళకు అవసరమైతేనే చెయ్యాలి. కాని మీ వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు. వాళ్ళకు నీ శాలరీ మీద తప్ప నీ మీద ప్రేమ లేదు. ఓకే.నువెంత సహాయమన్నా నీ వాళ్ళకు చేసుకో..కాని నీ జీవితం గురించి కూడా ఆలోచించుకో. ఐ లవ్ యూ సో మచ్.. నాకు నువ్వు నచ్చావు. మీ కస్టమ్స్ చాలా నచ్చాయి. మన ఇద్దరమూ లైఫ్ లాంగ్ కలిసి వుందాము.ప్లీజ్ సే యస్. నీ మనీ నాకు అవసరం లేదు. వాళ్ళకు కావాలి. వాళ్ళకే పంపుకో.” శాంత చేతులను తన చేతుల్లోకి తీసుకుని ప్లీజింగ్ గా ప్రేమగా అడిగాడు స్టీఫెన్.
తండ్రి బెదిరింపులు గుర్తొచ్చిన శాంత ఏమీ మాటాడలేకపోయింది. ఎంత వాగ్ధానాలు చేసినా ఒకసారి పెళ్ళి చేసుకుని దేశం దాటి వెళ్తే ఇక తమని చూడదనే భయంతో చెప్పకుండా పెళ్ళి చేసుకుంటే తామంతా విషం మింగి చస్తామనీ,కారణం శాంత అని రాసి మరీ చస్తామని కుటుంబం లోని అందరూ బెదిరించారు. సిటీకి వచ్చాక ఇలాంటి తెలివితేటలు బాగా వచ్చాయి అందరికి . అలా రాయడం కోర్టులో నిలవకపోయినా తన భవిష్యత్తుని, అది పునాది రాళ్ళతో కప్పెట్టేస్తుందని తెలుసు శాంతికి.
అర్థమయింది స్టీఫెన్ కి.. “ఓకే సాంతా ! ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తాను.. అప్పటివరకు నేను నీ కొరకు వెయిట్ చేస్తాను.ఈ లోపు మీ పేరెంట్స్ నీ మ్యారేజ్ చేస్తామంటే ఇట్స్ ఓకే..లేదంటే కాల్ మి . ఇరవై నాలుగ్గంటల్లో నీ ముందర వుంటాను.”
అతని ప్రేమకి మనసు వశమవుతున్నా, గుండె తడి అవుతున్నా తండ్రి కౄరత్వం గుర్తొచ్చి హడిలిపోతున్నది శాంత..
స్టీఫెన్ కి కూడా అది అనుభవమే అయినా శాంతని వదులుకోవాలని లేదు.
శాంత యెస్ చెప్పటం లేదని ఒకరోజు స్టీఫెన్ శాంత తండ్రిని అడగడానికి వెళ్ళాడు. విన్నట్లే విని కొడుకుల్ని పిలిచి బాగా కొట్టించి పంపటమే కాక ఇంకోసారి వస్తే శాంత ప్రాణాలు దక్కవని హెచ్చరించి పంపాడు. స్టీఫెన్ కేస్ పెడతానన్నాడు కాని అప్పుడు శాంత బ్రతిమాలి ఆపేసింది.
ఇప్పుడు స్టీఫెన్ వెళ్ళిపోతూ మళ్ళీ అడగడానికి వచ్చాడు.
“సాంతా! నా మాట విను వాళ్ళకు నీ మీద యేమాత్రం ప్రేమ లేదు. చేసినన్నాళ్ళు చేసావు. అందరి పెళ్ళిల్లు అయ్యాయి.. వాళ్ళు లక్జరీకి అలవాటు పడ్డారు అందుకే నిన్ను వదలడానికి సిద్దంగా లేరు.పోనీ ఒక పని చేద్దామా?” ఆశగా అడిగాడు.
“ఏంటి “అన్నట్లు చూసింది.
“కమ్ విత్ మి” గభాల్న చెప్పేసాడు.
ప్రేమగా అతని వేపు చూసి బ్యాగ్ పట్టుకుని లేచింది. అతని దగ్గరకెళ్ళి తల ముందుకు లాక్కుని నుదుటి మీద చుంబించింది.ఒక్కసారి హగ్ చేసుకుని వదిలేసింది. అప్పటికే ఆమె నిర్ణయం అర్థమైన స్టీఫెన్ ఏమీ అడ్డుచెప్పలేదు.
“వెళ్ళొస్తా స్టీఫెన్” చెప్పి వెనక్కి చూడకుండా వెళ్ళి పోయింది. అదిగో అప్పుడు విడిపోయిన తర్వాత ఇప్పుడే రావడం.
“నేను మధ్యలో గుర్తు రాలేదా స్టీఫెన్?ఒక ఫోన్ కూడా చేయలేదు?” వెక్కిళ్ళు వచ్చాయి శాంతకి.
ఇంకా దగ్గరగా జరిగి ఆమె నడుము చుట్టూ చేతులేసి కూర్చున్నాడు.
“నువు చేయొచ్చు కద అని అడగను నేను. కాని నువు చేయని కారణమే నాదీను.ఈ రోజు కోసం చూస్తున్న ఎదురుచూపుల్లో నువు నా తలపుల్లో నిండిపోయి దూరంగా వున్నావన్న స్పృహే లేదు నాకు. తెలుసా నీతో డ్యూయెట్లు కూడా పాడుకున్నాను”తల ఎత్తి శాంత కళ్ళల్లోకి చూస్తూ అల్లరిగా నవ్వాడు.”మై హార్ట్ ఈజ్ బీటింగ్. మై హార్ట్ ఈజ్ బీటింగ్” హం చేసాడు.
తనూ నవ్వింది. వర్షం లో సూర్యబింబం లా వుంది శాంత వదనం..
ఒక అరగంట సేపు ఇద్దరూ కూడా మౌనంగా ఒకరి సన్నిధిని ఒకరు ఆస్వాదిస్తూ వుండిపోయారు.
“నేనొచ్చేస్తాను స్టీఫెన్” సడన్ గా అంది శాంత..
“యేమన్నావ్? మళ్ళీ అను?” తలెత్తి శాంతని చూస్తూ అపనమ్మకంగా అడిగాడు స్టీఫెన్
“నేనొచ్చేస్తాను స్టీఫెన్” మళ్ళీ చెప్పింది. “బాగా అలసిపోయాను .”
శాంతకి కొద్దిగా దూరంగా జరిగి శాంతనే చూస్తూ వుండిపోయాడు. క్షణాలు గడుస్తున్న కొద్దీ తాను విన్నది నిజమే అన్నట్లుగా స్టిఫెన్ పెదాల మీదికి చిరునవ్వు వఛింది.సన్నగా వీస్తున్న గాలి సుడిగాలి అయినట్లుగా పెదాల మీది చిరునవ్వు మొహమంతా పాకింది.స్టీఫెన్ మొహం లో కలుగుతున్న మార్పులను చిరునవ్వుతో గమనిస్తున్న శాంతని లేపి అమాంతం ఎత్తుకుని గిర గిరా తిప్పసాగాడు.
“ఏయ్! ఆగు స్టీఫెన్ కళ్ళు తిరుగుతున్నాయి” అతన్ని గట్టిగా పట్టుకుని పెద్దగా అరుస్తూనే సంతోషంగా నవ్వసాగింది శాంత. ఇద్దరి నవ్వులతో ఆ గది సంతోషానికి నిలయమయింది.
“ఐయాం సో లక్కీ సాంతా..థాంక్యూ డియర్..” కొద్దిసేపయ్యాక తన చేతిలో వున్న శాంత చేతినిసున్నితంగా ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు.
.. ఒప్పుకున్న ఆపరేషన్ లు పూర్తి చేసి ఒక పక్క ఆనందం ఒకపక్క భారమైన మనస్సుతో స్టీఫెన్ తో జీవితాన్ని పంచుకోవడానికి పదిహేను రోజుల తర్వాత లండన్ విమానం ఎక్కింది శాంత.
యాభైకి దగ్గర పడుతున్న శాంత జీవితం లో ఈ సంవత్సరం మాత్రమే సంతోషంగా గడిపిందేమో..
“సాంతా!” అంటూ లోపలికి వచ్చి లైట్ వేసాడు స్టీఫెన్ ..
ఆ వెలుగుని భరించలేనట్లుగా కళ్ళు మూసుకుని చేతులడ్డం పెట్టుకుంది శాంత.. లండన్ వచ్చాక మొదటిసారి శాంతని అలా చూడడం. అసలా టైం లో ఇంట్లో వుండదు. అలాంటిది ఇంటికి రా అన్న శాంత మెసేజ్ ని చూస్కుని కంగారుగా ఇంటికి వచ్చిన స్టీఫెన్ కళ్ళకింద నీళ్ళ చారికలతో ఉన్న శాంతని చూసి నిర్ఘాంతపోయాడు.
“శాంతా!!” ఒక్క ఉదుటున వచ్చి శాంత ని పట్టుకున్నాడు.”వాట్ హాప్పెండ్ సాంతా?” కంగారుగా అడిగాడు. చిన్నగా ఉత్తరం లో వున్న విషయాలన్నీ చెప్పింది.
అంతా విని కొద్దిగా రిలీఫ్ గా నిట్టుర్చాడు.కొండంత అనుకుంది దూదిలా తేలిపోయినట్లుగా ఉంది స్టీఫెన్ కి..”ఇందుకే అయితే నువు యేడవాల్సిన పని లేదు. నీకేమన్నా అయిందేమోనని యెంత కంగారుగా వచ్చానో తెలుసా. నువు బాగున్నావు చాలు .మిగతావన్నీ చిన్న విషయాలే..వాళ్ళకు నీ డబ్బు మీద తప్ప నీ మీద లేదు. అందుకె నువు వాళ్ళనొదిలి ఇక్కడ సంతోషంగా వుండడాన్ని తట్టుకోలేక పోతున్నారు.యెవరి ద్వారానో మన అడ్రెస్ కనుక్కోవటానికి వన్ ఇయర్ పట్టింది . ఆ కోపం కసి తట్టుకోలేక నీ తండ్రి పోవటానికి నువే కారణం అంటున్నారు. విలువైన కాలమంతా వాళ్ళకోసం సాక్రిఫై చేసావు.. అఫ్కోర్స్ అందువల్లే నువు నాకు దక్కావు.థాంక్స్ టు దెం..ఇక ఇప్పటినుండి ఇది నీ జీవితం. కాదు కాదు మన జీవితం.. యెక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నీ ఇష్టం ..వాళ్ళకు హెల్ప్ చేస్తానంటే అది నీకు తృప్తిగా వుంటుందంటే చేసుకో నువు సంతోషంగా వుండడమే నాకు కావాలి..కాని వాళ్ళకు బ్రతకడం నేర్చుకునే చాన్స్ ఇవ్వు.. “ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని నెమ్మదిగా విస్పరింగ్ గా చెప్తున్న స్టీఫెన్ మాటలు శాంతకు మనసుకు తగిలిన గాయానికి వెన్న రాస్తున్నట్లుగా వుంది.. నిజమే కదా అనిపిస్తున్నట్లుగా వుంది. అప్పటికి తన ఆలోచనలను వాయిదా వేసి సంతోషంగా స్టిఫెన్ ని చూసి నవ్వింది పున్నమి వెన్నెల మొహమంతా ఆక్రమించుకోగా…

***************************************శుభం************************************************************

నిన్నే ప్రేమిస్తా………

రచన: మణికుమారి గోవిందరాజుల

“యేమిటలా చూస్తున్నావు?”
“స్ఫటికం లాంటి నీ మనసుని. యెంత స్వచ్చంగా మెరిసిపోతూ కనపడుతున్నదో” తన్మయంగా అన్నది.
“నా మనసులో యేముంది? నిన్ను నువ్వు చూసుకో యెంత అందంగా కనపడతావో?”
“నేనా? అందంగానా? వెక్కిరిస్తున్నావా? యెటుపోయింది ఆ అందమంతా?” దుఃఖంతో గొంతు పూడుకు పోయింది.
“మై డియర్ సాజీ నాకు ఇప్పుడు నువు వేరేగా కనపడవు. అప్పుడెలా వున్నావో ఇప్పుడూ అలానే కనపడతావు”
“అయినా ఇదిగో ఇలా మాట్లాడావంటే నేను నీ దగ్గరికే రాను” బెదిరించాడు.
“లేదు..లేదు.. ఇంక అలా మాట్లాడను.” చున్నీతో కళ్ళు తుడుచుకుంది.
“చూడు శ్రీ ఇన్నాళ్ళకు భగవంతుడు నా కళ్ళు నేనే తుడుచుకుందుకు చేతులిచ్చాడు” నవ్వింది.
“ఓకే ..ఓకే.. ఇక అలా మాట్లాడను” అలిగినట్లుగా పోజు పెట్టి కూర్చున్న శ్రీకర్ ని చూస్తూ చేతులు చాపింది.
యెదురుగా ఇంకో కుర్చీలో కూర్చున్న శ్రీకర్ లేచి వచ్చి ఆమె పక్కన కింద కూర్చుని చాపిన ఆ చేతులను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆ చేతులను తన మెడ చుట్టూ వేసుకుని ఆమె మోకాళ్ళమీద తల పెట్టుకున్నాడు.
“శ్రీ “
“ఊ!”
“ఇదంతా నిజమే నంటావా?నా చేతులకు తగులుతున్న నీ శరీర స్పర్శ నిజమేనంటావా? నా కళ్ళకు కనపడుతున్న నువ్వు నిజమేనంటావా?కల కాదు కదా?”బేలగా అడిగింది.
తన మెడ చుట్టూ వేసుకున్న ఆమె యెడమ చేతిని తన కుడి చేత్తో పట్టుకుని సున్నితంగా తన చెంప మీద కొట్టుకున్నాడు.
“నా చెంప పగిలినంత నిజం సరేనా?”
తన రెండు చేతులతో శ్రీకర్ మొహం, నుదురు,కళ్ళు, పెదాలు, గడ్దం నిమురుతూ “నిజంగా నిజం. నిజంగా నిజం” అనుకోసాగింది.
“అమ్మాయ్! ఇక నన్నొదిలితే ఆఫీసుకు వెళ్ళొస్తాడీ దీనుడు.”
“ఇంకొద్ది సేపు వుండొచ్చుకదా?”
“నాకు మటుకు వెళ్ళాలనుందేమిటి? కానీ తప్పదు కదా?”
“నా వల్లే కదా నీకీ కష్టాలు? నీకు అవసరం లేని బాధ్యత నెత్తిన వేసుకున్నావు.” బాధగా అన్నది. కళ్ళల్లో నుండి అశ్రువులు రాలాయి.
“నేనిది బాధ్యత అనుకోవడం లేదు సాజీ” ప్రేమగా ఆమె కళ్ళు తుడిచి ముంగురులు సవరించాడు. “నన్ను నేను కాపాడుకుంటున్నాను”
“అవును కానీ ఈ రోజు ఫిజియోథెరపిస్ట్ వచ్చి వెళ్ళిందా? ఆమె చెప్పినట్లు చేస్తున్నావా? చాలా బాధ వుంటుంది కాని గుడ్ గర్ల్ లాగా ఆమె చెప్పినట్లు చేసెయ్యాలి మరి. నువు యెంత తొందరగా కోలుకుంటే మనం అంత తొందరగా కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు మరి.” మాట మార్చి వూరించాడు.
“నువు నా గురించి పడుతున్న కష్టం ముందు నేను పడే బాధ యేపాటిది శ్రీ? యెంత బాధనైనా భరించే శక్తి నీ అపారమైన ప్రేమ నాకంద చేస్తున్నది. అయినా యెందుకు? యెందుకు శ్రీ? నా గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? ఇప్పటికి నాలుగు సంవత్సరాలయింది ..వేరే సరదాలు వేరే ప్రపంచం లేకుండా నా గురించే ఆరాటపడ్డావు, పడుతున్నావు. నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకుని వొంటరి పోరాటం చేసావు. యెంత సర్దుకుందామన్నా నీ బాధ చూస్తుంటే తట్టుకోవడం నా వశం కావడం లేదు. ఇంకా యెన్నాళ్ళిలా అనే ప్రశ్నకు బదులే లేదు. వదిలేయ్ శ్రీ.. నా మానాన నన్ను వదిలేసి నువన్నా హాయిగా వుండు..”
“వదిలేసి పోవడానికి, నువు బాగున్నప్పుడు నువు అందంగా వున్నావని నిన్ను కామించలేదు సాజీ..అప్పుడూ ప్రేమించాను. ఇప్పుడూ ప్రేమిస్తున్నాను.ఈ మాట యెన్నిసార్లు చెప్పడానికైనా నాకు ఓపిక వుంది. చెప్తూనే వుంటాను… ఐ లవ్ యూ..ఐ లవ్ యూ…” గట్టిగా అన్నాడు.
“యెన్ని వూసులు చెప్పుకున్నాము? యెన్ని కలలు కన్నాము? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించు కున్నాము. అదంతా అంతా బాగుంటేనేనా? ఇప్పుడు నీకు బాలేదని నిన్ను వదిలేసి నా దోవ నేను చూసుకుంటే దాన్నేమంటారు? నిన్ను వదులుకుంటే నన్ను నేను వదులుకున్నట్లే. ప్రేమంటే నమ్మకం. ప్రేమంటే భరోసా.. ఆ నమ్మకం, ఆ భరోసా మన ఇద్దరి మధ్యా మనం జీవించి వున్నంత కాలం వుండాలి..,వుంటుంది… అయినా అన్నీ బాగుండి అంతా బాగుంటేనేనా ప్రేమ నిలిచేది? నా అదృష్టం బాగుంది కాబట్టి నీకేమీ కాలేదు.” తృప్తిగా నిట్టుర్చాడు…
“నాకేమీ కాలేదా? మూడేళ్ళు కోమాలో వున్నాను. తెలివొచ్చి ఆరు నెలలు మంచంలో వున్నాను. అయిదు నెలల క్రితం వరకు కళ్ళు తప్ప యే అవయవం కదల్లేదు. నాలుగు నెలల క్రితం వరకు మాట కూడా లేదు. మూణ్ణెల్ల నుండే కదా లేచి కూర్చుంటున్నాను. ఇంకా నడక రానే లేదు. యెక్కడి నుండి డబ్బు యెలా తెస్తున్నావో తెలీటం లేదు .యెలా అయిపోయావో చూడు?”
“ఇదిగో చూడు ..పలుకులకు చిలకలు ఇప్పించలేదనే కదా నీ గొడవ ఇప్పిద్దాములే.. అడుగులకు అరిశలు కూడా ఇప్పిస్తాను సరేనా?” నవ్వుతూ తేల్చేసాడు.
“అయినా నువు చెప్పిన దాన్ని బట్టే తెలుస్తున్నది కదా ఇంప్రూవ్ మెంట్ యెంత బాగా వున్నదీ?..డబ్బు దేముంది? అంతా పోయినా కూడా నువు జీవంతో వున్నావు. అదే పదివేలు. యెప్పటికైనా లేచి తిరుగుతావు అన్న వూహే నాకు బలాన్ని ఇస్తున్నది. సాజీ… నా చేతిలో విద్య వున్నది. గుండెల్లో నువున్నావనే ధైర్యం వున్నది. నీకేమన్నా అయిన నాడు నేను కూడా వుండను..”
చటుక్కున శ్రీకర్ నోటికి చేయి అడ్డం పెట్టింది అలా మాట్లాడొద్దన్నట్లుగా.. చేయి తప్పించి మళ్ళీ చెప్పసాగాడు..
“కోమాలో నుండి బయటపడ్డాక నీ పరిస్తితి యెలా వుంటుందో చెప్పలేమన్నారు డాక్టర్లు. యెంత భయపడ్డానో…యెన్ని..యెన్ని రాత్రుళ్ళు నిన్నే చూస్తూ గడిపానో … యెంతమంది ..దేవుళ్ళకు మొక్కు కున్నానో..యే దేవుడు కరుణించాడో నీకు తెలివి రావటమే కాకుండా అన్నీ చక్కగా గుర్తున్నాయి.. చక చక నడిచేసేయ్…ఇద్దరం కలిసి వెళ్ళి అన్ని మొక్కులూ తీర్చుకుందాము.” వుత్సాహపరిచాడు.
“సాజీ ! ప్లీజ్. నువు సంతోషంగా వుంటేనే తొందరగా కోలుకుంటావు. లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్తావు..డాక్టర్స్ మరీ మరీ చెప్పారు. నువు మనసులో కూడా బాధ పడకూడదని.. నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వాళ్ళను నేనేమీ వదులుకోలేదు. వాళ్లు నన్ను వదల్లేదు. వాళ్ళ సహకారం లేకుంటే నేనేమీ చేయలేకపోయేవాడిని. మొదట్లో యేదో అన్నారు ..తలిదండ్రులు కదా వాళ్ళకేవో ఆశలు వుంటాయి మరి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు.. అందుకే నా కంటే వాళ్లే నిన్ను యెక్కువగా కనిపెట్టుకుని వుంటున్నారు.” ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు.
“ఒక తపస్సు లాగా నిన్నీ స్థితికి తెచ్చుకున్నాను డియర్ . ఇక అలసిపోయాను. సాజీ.. నేను డిప్రెషన్ లోకి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత నీదే మరి. లేదంటే మళ్ళీ మన జీవితంలోనుండి నాలుగేళ్ళు మైనస్ అవుతాయి. ఛీరప్ బేబీ…. ఇప్పుడు కాస్త వీల్ ఛెయిర్ లో తిరుగుతున్నావు కదా ?త్వరలోనే నీ కాళ్ళ మీద నీవు నిలబడతావు. తొందరలో మనం ఇంటికెళ్తాము ప్రామిస్…ప్లీజ్ నిరాశను నీ దరి చేర నివ్వకు..అది నిన్నూ నన్నూ కూడా తినేస్తుంది. నాకు ఆఫీస్ టైం అవుతున్నది. పరిగెత్తుకుని సాయంకాలం వస్తాను సరేనా?రోజంతా నీ పక్కనే వుండాలనిపిస్తున్నది డియర్…కాని వుద్యోగ ధర్మం తప్పదు ” నుదుటి మీద చుంబించి వదిలేసాడు.
“ఓకే! మరి నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళు… ఈ రోజు ఇంకో గంట యెక్కువ కూర్చుంటాను.”
“గుడ్ గర్ల్” మెచ్చుకున్నాడు.
అలా సాజీని యెత్తి అపురూపంగా వీల్ ఛెయిర్ లో కూర్చోబెట్టాడు.
“ఓకే! బై బై డియర్..” చెప్పి వదల్లేక వదల్లేక వదిలి వెళ్ళాడు శ్రీకర్.
********************
సహజ కోమాలో నుండి బయటకు వచ్చాక అన్ని నెలలు మంచంలో నిద్ర పోతున్నట్లు వున్నా మనం చెప్పేవి తనకు వినపడి అర్థం చేసుకో గలుగుతుందని , ప్రమాదం విషయం కూడా చెప్పమనీ అందువల్ల పూర్తి తెలివి వచ్చాక దాని ఇంపాక్ట్ తక్కువుంటుందనీ డాక్టర్లు చెప్పడంతో శ్రీకర్ పక్కనే కూర్చొని సహజ వినే దానితో సంబంధం లేకుండా యెన్ని కబుర్లో చెప్పేవాడు. అందువల్ల శ్రీకర్ ఒక విషయం కాదు మామూలు మనుషులతో యెలా మాట్లాడతారో అలా అన్ని విషయాలు మాట్లాడేవాడు. డాక్టర్లు చెప్పినట్లుగానే అన్నీ అర్థమవుతుండేవి సహజకు. కానీ కన్ను కూడా కదల్చ లేకపోయేది. అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో సడన్ గా ఒక రోజు కళ్ళు తెరిచి అందర్నీ చూడటం మొదలు పెట్టింది. మెడికల్ హిస్టరీలోనే చాలా ఆశ్చర్యమనీ అంతా శ్రీకర్ కృషి ఫలితమనీ వైద్యులు చెప్పారు.
తెలివి వచ్చిందే కాని కొద్దిగా లేచి కూర్చోగలగడానికి తొమ్మిది నెలలు పట్టింది. కొద్దిగా కూర్చొని కాళ్ళు చేతులు కదిలించడం మొదలు పెట్టగానే లాప్ టాప్ తెచ్చివ్వమంది. శ్రీకర్ కి సహజ తెలివితేటల మీద గొప్ప నమ్మకం వుంది. అందుకే వెంటనే అడిగినవన్నీ సమకూర్చాడు. ఒక పదిహేను రోజులు కంప్యూటర్ నాలెడ్జి అంతా రీకలెక్ట్ చేసుకుంది. పదిహేను రోజులు అన్ని జాబ్స్ కి అప్ప్లై చేస్తూ కూర్చుంది. చివరికి పెద్దది కాకపోయినా టైంపాస్ జాబ్ దొరికింది.. యేదైనా మొదలు మెదడుకి మేతలాగా యేదో ఒక పని చేయకపోతే ఆలోచనలు యెక్కువవుతాయని శ్రీకర్ అభ్యంతరం చెప్పలేదు
చిన్నగా వీల్ ఛెయిర్ ని జరుపుకుంటూ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళింది సహజ. వెళ్ళిందే కాని పని మీద ధ్యాస నిలవడం లేదు.
చదువుకునే రోజుల్లో కాలేజీలో పరిచయమయ్యాడు శ్రీకర్.
శ్రీకర్ వ్యక్తిత్వం, స్త్రీలను గౌరవించే విధానం యెంతో ఆకట్టుకున్నాయి సహజను.
సహజ రూప లావణ్యాలే కాకుండా , ఆమె స్నేహస్వభావము,అందరితోను కలుపుగోలుగా వుండడం , వెనుకా ముందూ చూడకుండా అందరికీ సహాయం చేసే తీరు చూసి ముగ్ధుడయ్యాడు శ్రీకర్. యెప్పుడు జరిగిందో తెలీకుండానే ఒకరినొకరు ఇష్టపడటం మొదలయింది. సాధారణ కుటుంబమని మొదలు వద్దన్నా తప్పదని ఒప్పుకున్నారు తలితండ్రులు. పెళ్ళి ఇక నెల రోజుల్లో కొచ్చేసింది.
ఆ రోజు గుర్తొచ్చేసరికి భయంతో వొళ్ళు జలదరించింది సహజకు.
ఆ రోజు శ్రీకర్ తానూ కలిసి షాపింగ్ చేసుకుని ఎంఎంటీసీ కోసమని స్టేషన్ కి వచ్చారు. ట్రైన్ వస్తున్నట్లుగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. ప్లాట్ఫామ్ మీదికి రైల్ వచ్చేస్తున్నది.ఇంతలో ఒక మూడేళ్ళ బాబు, తలితండ్రులు యేమయ్యారో, బంతితో ఆడుకుంటూ ప్లాట్ ఫారం చివరికి వెళ్ళిపోయాడు. చేతిలో వున్న బంతి కిందపడి దొర్లుకుంటూ పట్టాలమీదికి వెళ్ళిపోయింది. బంతి కోసమని యేడుస్తూ ప్లాట్ ఫాం దిగడానికి ట్రై చేయబోతున్నాడు బాబు.అందరూ అరుస్తూ కేకలు పెడుతున్నారు.
పక్కనే శ్రీకర్ తో మాట్లాడుకుంటూ ఆ కేకలు విని అదాటుగా అటు చూసిన సహజకు గుండాగినంత పనయింది. పరుగునా వెళ్ళి బాబుని లాగి ఇవతలికి పడేసింది. ఆ వూపులో అప్పుడే వస్తున్న రైలుకి ప్లాట్ ఫాం కి మధ్యలో పడటం రైలు కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్ళి వదిలేయడం కన్ను మూసి తెరిచినంతలో జరగడంతో శరీరం లో ప్రాణం వుందే కాని విరగని యెముక లేదు. సహజకు ఆ క్షణంలో తల వెళ్ళి రైలుకు కొట్టుకోవడం వరకే స్పృహలో వుండడంతో గుర్తుంది. మళ్ళీ మూడేళ్ళ తర్వాత తెలివి రావడమే.
కోమాలోకి వెళ్ళడమంటే ప్రాణం పోయిన వాళ్ళతో సమానమని సహజ పేరెంట్స్ తో సహా యెంత మంది చెప్పినా శ్రీకరు సహజ చెయ్యి, ఆమెకు బాగవుతుందన్న ఆశ వదల్లేదు. తనకొచ్చిన వాటామొత్తం అమ్మేసి హాస్పిటల్ బిల్లు కట్టాడు. ఈ విశయాలన్నీ రోజు సహజ కోమాలో వున్నప్పుడూ,ఆ తర్వాత కళ్ళు తెరిచాక చెప్తూ వుండేవాడు శ్రీకరు.
అన్నీ కాకపోయినా కొన్ని గుర్తుండేవి. కళ్ళతో పాటు మెమొరి కూడా రావడంతో తర్వాత అన్నీ గుర్తు వచ్చాయి సహజకు. తనకు పునర్జన్మనిచ్చిన శ్రీకరు మీద,అంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని తనకు దగ్గర చేసిన దేవుడి మీదా చాలా ప్రేమ భక్తి కలిగాయి సహజకు. ఆలోచనల్లో సమయం తెలియలేదు …..
“హల్లో సహజా..యెలా వుందీ రోజు?”పలకరించుకుంటూ లోపలికి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ ని చూసి
“హలో ఆశా ! బాగున్నాను..హౌ ఆర్ యు?” తను కూడా నవ్వుతూ పలకరించింది..
“యేడి?మీ హీరో?ఇంకా రాలేదా?”
హాస్పిటల్లో అందరికీ కూడా శ్రీకర్ ని చూస్తే హీరో వర్షిప్..అందరూ హీరో అని పిలుస్తుంటారు
“వచ్చే టైం అయింది..ఇప్పుడు మన టైం కదా ?ఇదవ్వగానే వస్తాడు.మొదలు పెడదామా”
ఆశాకి సహజ ఇచ్చే కో ఆపరేషన్ యెంతో నచ్చుతుంది…రెగ్యులర్గా చేయించేవన్ని చేయించి వెళ్ళిపోయింది. నర్స్ వచ్చి స్నానం చేయించి చక్కగా పక్క దులిపి చిన్నగా పక్క మీద పడుకోబెడుతుండగా శ్రీకరు వచ్చాడు.
లోపలికి వస్తున్న శ్రీకరుని కళ్ళ నిండుగా చూసుకుంది సహజ.దగ్గరికి రమ్మన్నట్లుగా చెయ్యూపింది ..ఆ లోపలే వచ్చి పక్కన కూర్చున్నాడు
“శ్రీ! యే జన్మలో యే పుణ్యం చేసుకున్నానో ఇంత అదృష్టవంతురాలనయ్యాను. ఇంతగా ప్రేమించటం యెవరివల్ల నన్నా అవుతుందా? డబ్బు అందం చదువు ఇప్పుడు ఆకారంలో ,అన్నిటిలో నేను చాలా సామాన్యురాలిని. శ్రీ! నిన్నందుకునే అర్హత నాకు లేదు. ఇది చివరివరకూ వుంటుందా అని భయంగా వుంటుంది” కళ్లు భయంతో రెపరెప లాడాయి.
యెంతటి ట్రౌమా నుండి సహజ బయట పడిందో శ్రీకరుకి తెలుసు. ఆ భయంలో యెటువంటి అనుమానాలొస్తాయో వూహించగలడు.
“పిచ్చి సాజీ! నువు మాటా పలుకూ లేనప్పుడే నీ చెయ్యి వదల్లేదు. ఇప్పుడు వదుల్తానా?నో వే! కోటి సార్లు చెప్పనా నిన్నే ప్రేమిస్తా అని? చూడు నా గుండె లబ్ డబ్ బదులు సాజీ సాజీ అని కొట్టుకుంటుంది” సహజ తలని సుతారంగా యెత్తి తన గుండెకు ఆనించుకున్నాడు.
“అన్నయ్యా పబ్లిగ్గా ఈ వేశాలేంటి?మేమొప్పుకోము” నవ్వుతూ లోపలికి వచ్చారు శ్రీకర్ చెళ్ళెళ్ళిద్దరూ.. ఆ వెనకే “హ్యాపీ బర్త్ డే డియర్ సాజీ” పాడుతూ సహజ పేరెంట్స్, ఫ్రెండ్స్, శ్రీకర్ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ లీడ్ చేస్తూ శ్రీకర్ తల్లితండ్రులూ వచ్చారు….
శ్రీకర్ కి తెలుసు సహజ ఇక జీవితాంతం నడవలేదన్న సంగతి. కాని ప్రేమించటం మాత్రమే తెలిసిన శ్రీకరుకి సహజ నడవగలుగుతుందా లేదా, అందంగా వుందా లేదా అన్న దానితో సంబంధం లేదు.. కాని ఆశ మాత్రం వుంది తన ప్రేమతో నడిపించగలనని….
శ్రీకరు ఆశ తీరాలని మనం కూడా ఆశపడదాము మరి.

శుభం..

కాంతం వర్సెస్ కనకం……

రచన: మణికుమారి గోవిందరాజుల

 

ఆ రోజు వాళ్ళ పెళ్ళిరోజు.   పొద్దున్నే  పట్టిన ముసురులా కాంతానికి  కనకానికి మొదలైన పోట్లాట ఇంతవరకు తెగడం లేదు. ఇద్దరూ కూడా నువ్వంటే నువ్వని అనుకోవడంతోనే సరిపోతున్నది  . యెవరేమి చేసారో   సోదాహరణ ఉదాహరణలతో సహా చెప్పుకుంటున్నారు.  ఎవరికి వారు తమ మాటే నెగ్గాలని  పట్టుమీదున్నారు.  పైన అద్దెకున్న వాళ్ళొచ్చి సంధి కుదర్చబోయారు కానీ వాళ్ళను కరిచినంత పని చేసి వెళ్ళగొట్టారు.

ముప్పయేళ్ళ సంసార జీవితంలో  చాలాసార్లు యేదో ఒక విషయానికి గొడవపడే వారు. కాకపోతే ఆ గొడవ చాలా తమాషాగా వుండేది. పక్కింటి వాళ్ళ కుక్క యెన్ని పిల్లల్ని పెడుతుంది అన్న సమస్య మీద ఆ కుక్క డెలివరీ అయిందాకా పోట్లాడుకుంటారు.  మేడ మీద  నుంచుని చూస్తుండగా యెదురింటి వాళ్ళు సినిమాకెళ్తున్నామోచ్ అని కేకేసి చెప్తే వాళ్ళొచ్చిందాకా వాళ్ళే సినిమాకెళ్ళారు అన్న మాట మీద వాదించుకుంటారు.  నాలుగిళ్ళ అవతల వున్నామె వేస్తున్న ముగ్గు యెన్ని చుక్కలుంటుంది అన్న విషయం మీద ఒకరి మీద ఒకరు కేకలేసుకుంటారు.  పైన అద్దెకున్న వాళ్ళ ఇంటికి యెవరన్నా వస్తే వాళ్ళెన్ని రోజులుంటారు అన్న దాని మీద చిట్టిలు తీసుకుంటారు. అందుకే వాళ్ళ గొడవని  యెవరూ  పట్టించుకునే వాళ్ళు కారు.  వాళ్ళకు తెలుసు అవన్నీ టైంపాస్ గొడవలని.

అంతే కాని కుటుంబ విశయానికొస్తే…. . .

ప్రతి పనీ ఇద్దరూ సంప్రదించుకునే చేసుకునేవాళ్ళు. ఒకటే మాట ఒకటే బాట ఇద్దరిదీ.  ఒక్కరోజు నువు చేయాలంటే నువు చేయాలని  కూడా పోటీ పడేవాళ్ళూ కారు. అలాంటిది ఇద్దరికీ తీవ్రమైన గొడవ అదీ పెళ్ళి రోజున అవుతున్నదంటే సమస్య ఏదో చాలా తీవ్రమైనదే అయి వుంటుంది.   అదేంటో  తేలాలంటే మనకి కనకం సంగతి మొదటినుండీ తెలియాలి.

కనకానికీ కనకం  బామ్మకీ కనెక్షన్ ఇనుపగొలుసులంత గట్టిది . బంగారపు గొలుసంత విలువైనది.  బామ్మకి  కనకం అంటే ప్రాణం. కనకం కాల్లో ముల్లు గుచ్చుకుంటే బామ్మని ఓదార్చేసరికి  కొడుకులు కోడళ్ళకి ప్రాణం  అన్నుబట్టి పోయేది. ఇక  కనకానికి బామ్మ  బామ్మే కాక గురువు,గాడ్  మదర్, మెంటర్ ఇంకా ఇలాంటివి ఏవుంటే అవి.

బామ్మకి ముగ్గురు కొడుకులు.  ఆఖరి కొడుకు కొడుకు కనకం. పైన ఇద్దరూ వాళ్ళ మగపిల్లలకు కనకం అన్న పేరు పెట్టడానికి  ఇష్టపడకలేదు.  ఇక ఆఖరి చాన్స్.  మూడో కోడలికి రెండో కాన్పు. మగ పిల్లాడే  పుట్టాలని కోడలు నీళ్ళోసుకున్నప్పటి నుండి పూజలు వ్రతాలు చేయగా పుట్టిన ఆఖరి మనవడికి  కనకం అని పేరు పెట్టుకుంది.  ఇంతకీ కనకం పేరు బామ్మగారి భర్తగారిది  అందుకే కనకం అంటే ప్రాణం. . . కనకం పుట్టినప్పటినుండీ అడుగులేసేదాకా బామ్మ ఒడిలోనే పెరిగాడు.

కనకానికి కొద్ది ఊహ వచ్చినప్పటినుండీ రాత్రుళ్ళు తనదగ్గర పడుకున్న మన చిన్న కనకానికి  బామ్మ తనని వాళ్ళ తాత యెంత అపురూపంగా చూసుకున్నాడొ  యెలా గౌరవించేవాడో చాలా ఇష్టంగా కథలు కథలుగా చెప్పేది. ఆ వయసులో  కనకానికి పెద్దగా అర్థం కాకపోయినా  వయసు పెరుగుతున్న కొద్దీ జీవితం లో భార్య ప్రాముఖ్యత ఎంత?,తననే నమ్ముకుని వచ్చిన  జీవితభాగస్వామితో ఎలా మెలగాలో, ఆనందంగా . . ఎలా జీవించాలో ఒక అవగాహనకి వచ్చేసాడు. .

కనకానికి కాంతంతో పెళ్ళి కూడా చాలా చిత్రంగా అయింది.

ఒకసారి అప్పుడు పదేళ్ళు ఉంటాయేమో  పక్కింట్లో పెళ్ళి జరుగుతున్నది.  ఆ పెళ్ళికి బామ్మతో పాటు వెళ్ళిన కనకం బామ్మ నడిగాడు “బామ్మా పెళ్ళంటే ఏమిటని?”

బామ్మ భళ్ళున నవ్వి.  “ ఆరి భడవా ! రోజూ నేను చెప్తున్నదేమిటిరా?”

“బామ్మా ఏదో చెప్తుంటావు రోజూ.  నాకర్థం కావటం లేదు”బిక్కమొహం పెట్టి తలకాయ గోక్కున్నాడు.  బామ్మకి బోలెడు ప్రేమ వచ్చేసింది మనవడి మీద.

“పోనీ పెళ్ళంటే నీకేమి తెలుసో  చెప్పు”  అడిగింది.

“పెళ్ళంటే చుట్టాలందరూ వస్తారు.  పెళ్ళంటే బోలెడు పిండి వంటలు.   పెళ్ళంటే కొత్తబట్టలు. ” హుషారుగా తనకు తెలిసినవన్నీ చెప్పబోయాడు.

“అరేయ్ పెళ్ళంటే అవన్నీ వుండే మాట నిజమే అయినా పెళ్ళంటె రెండు జీవితాలు ఒక్కటై ,ఒక్కటైన జీవితం  మూడు లేక  నాలుగు అవడం” పొయెటిక్ గా  చెప్పబోయింది.

“బామాఆఆఆఆఆ…. ”మళ్ళీ బిక్కమొహమేసాడు “నువ్వేంటో చెబుతున్నావు మళ్ళీ. నా కర్థం కాకుండా”

“సరే నీకర్థమయ్యేట్లు చెబుతాను.  ఒకవేళ ఇప్పుడర్థం కాకపోయినా గుర్తుంచుకో. . ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కడెక్కడో పెరుగుతారు.  సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి లకు  పెళ్ళై ఆ రెండు జీవితాలు ఒక్కటై కల్సిపోతాయి.  అప్పుడు వారికొక బంధం యేర్పడుతుంది.  అలా ఏర్పడిన బంధాన్ని ,కలిసిన జీవితాల్ని ,ఒకే  జీవితంగా జీవించాలి.  ఇప్పుడు నీకర్థం కాకపోయినా  నా మాటలు గుర్తుంచుకో . . పెద్దయ్యాక అర్థమవుతాయి. పెళ్ళంటె నమ్మకం.  . పెళ్ళంటే రక్షణ.  నిన్నే నమ్ముకుని వచ్చి,నీ జీవితంలో భాగమైన స్త్రీ మూర్తికి నువు ఆ రక్షణ,నమ్మకం ఇవ్వాలి. ”

“అన్నీ నేనే ఇవ్వాలా?మరి ఆ అమ్మాయి ఏమీ ఇవ్వక్కర్లేదా?” కుతూహలంగా అడిగాడు

“ తల్లీ తండ్రులను వదిలి  పెళ్ళి అన్న బంధం తో అమ్మాయి మన ఇంటికి వస్తుంది.  అందుకని మొదలు మనమే ఆ నమ్మకం అమ్మాయికి ఇవ్వాలి.  అప్పుడు ఆ అమ్మాయికి “నేను అందర్నీ వదిలి వచ్చినా ఇక్కడ అమ్మ దగ్గరున్నంత హాయిగా నేనుండగలను” అన్న నమ్మకం కలుగుతుంది. ” చెప్తుంటే బామ్మ కళ్ళు చెమ్మగిల్లాయి.  కొంగుతో కళ్ళు తుడుచుకుంది.

“అయితే”

పెళ్ళి హడావుడిలో వున్నారందరూ.  వీళ్ళిద్దరు పెళ్ళి తంతును గమనిస్తూ మాట్లాడుకుంటున్నారు.

ఈ హడావుడిలో తమ ముందు తిరుగుతున్న ఒక అమ్మాయి మీదికే  మాటి మాటికీ కనకం చూపు పోతున్నది .  ఆ అమ్మాయి పట్టులంగా  జాకెట్టేసుకుని, లంగా కాళ్ళకు అడ్డం పడకుండా పట్టుకుని మిగతా పిల్లలందరితో ఏవో ఆటలు ఆడుకుంటున్నది.  ఎందుకో అంతమంది అమ్మాయిల్లో ఈ అమ్మాయే మన కనకాన్ని ఆకర్శించింది.

“అయితే ఏముంది ఆ అమ్మాయికి  ఎప్పుడైతే ఆ నమ్మకం కలుగుతుందో  నీకు తను కూడా ఆ నమ్మకం ఇస్తుంది. నిన్ను ప్రేమిస్తుంది.  నీ జీవితాన్ని నందనవనం చేస్తుంది. ” బామ్మ కి  గొంతు మూగబోయింది.

“ అయితే బామ్మా!  నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోనా? నువు చెప్పినట్లే వుంటాను”  తమ ముందు తిరుగుతున్న పట్టులంగా అమ్మాయిని  చూపిస్తూ.  కాన్ఫిడెంట్ గా సిగ్గుపడుతూ బామ్మ చెవిలో రహస్యంగా అడిగాడు

గొంతులో సుళ్ళుతిరుగుతున్న బాధ ఎటుపోయిందో మనవడిని “ఓరి భడవా!” అంటూ కావిలించుకుంది గట్టిగా నవ్వుతూ.

“ఇదిగో నువు బాగా చదువుకోవాలి. .  మంచి ఉద్యోగం లో చేరాలి.  అప్పుడు,  ఆ అమ్మాయి పేరు కాంతం.  ,  కాంతాన్ని  చేసుకుంటానని ధైర్యంగా ఆ అమ్మాయి తలితండ్రులకి చెప్పాలి.  అప్పుడు పెళ్ళి”

“ ఒహో! ఆ అమ్మాయి పేరు కాంతం అన్నమాట.  అబ్బో పెళ్ళికి చాలా రోజులాగాలి” ఆ అమ్మాయినే చూస్తూ మనసులో అనుకున్నాడు కనకం. కనకానికి చాలా ఆతృతగా వుంది బామ్మ చెప్పిన విధంగా వుండి చూపించాలని.

ఆ తర్వాత కొన్నాళ్ళకి కాంతం తండ్రి  ఒక  ఆక్సిడెంట్ లో చనిపోయారని తెలిసి బామ్మ వెళుతూ కనకాన్ని కూడా తీసుకెళ్ళింది.

వీళ్ళు వెళ్ళేప్పటికి అన్ని కార్యక్రమాలు అయ్యాయి.  అందరూ కాంతం తల్లి  చుట్టూ కూర్చుని ఓదారుస్తున్నారు.  తల్లిని ఆనుకుని కూర్చుని  ఏడుస్తూ  వుంది కాంతం.

కనకం బామ్మ కూడా  తనకు తోచిన మాటలేవో చెప్పసాగింది.

ఇంతలో ఎవరో.  “పాపం ఆడపిల్లని ఎలా పెంచుతావో  . . సరిగ్గా ఎదిగే పిల్లకి  రక్షణ ఇవ్వాల్సిన సమయం లో ఆ దేవుడు తండ్రిని దూరం చేసాడు నీ కూతురికి”  సానుభూతిగా అన్నారు.

రక్షణ అన్న మాట వినపడగానే  కనకానికి ఒక రకమైన ఆవేశం వచ్చింది.  అప్పటికే కాంతం అంటే ఎందుకో తెలియని ఇష్టం ఏర్పడి పోయింది మరి.

“నేనిస్తాను రక్షణ” ఈ మాటలు చెబుతూ వెళ్ళి కాంతం చుట్టు చేయి వేసి నుంచున్నాడు.

అప్పటి వరకు విచార వదనాలతో  వున్నవారికి నవ్వొచ్చింది  కాంతం అయితే ఏకంగా ఏడుపు మర్చిపోయింది.

“ఎట్లిస్తావేంటి” ఎవరో అడిగారు.

“ఎట్లివ్వడమేంటి? పెళ్ళి చేసుకుని. .  మా బామ్మ చెప్పింది పెళ్ళి చేసుకున్న అమ్మాయికి రక్షణ ఇవ్వాలని.  అందుకని  పెళ్ళి చెసుకుంటాను” తలెగరేస్తూ ధీమాగా చెప్పాడు.

చుట్టూ కూర్చున్న మిగతా వారు అందరూ నవ్వేశారు.

“నవ్వుతారెందుకూ? నేను నిజంగానే చేసుకుంటాను. కానీ మా బామ్మ చెప్పింది.  నేను పెద్దవ్వాలని.  నేను పెద్దయ్యి ఉద్యోగంలో చేరాక చేసుకుంటాను”

తాత్కాలికంగా తన దుఃఖాన్ని మర్చిపోయింది కాంతం తల్లి. . . పిల్లలిద్దర్నీ దగ్గరికి తీసుకుంది మౌనంగా.

తన చేతిని పట్టుకుని  తన చుట్టూ చెయ్యేసి సినిమాలో హీరోలా మాట్లాడుతున్న కనకం తెగ నచ్చేసాడు కాంతానికి.   అప్పుడు కాంతం వయసు తొమ్మిదేళ్ళు.

ఆ తర్వాత ఉద్యోగంలో జాయిన అయ్యాక, పాతికేళ్ళ వయసు రాగానే వెళ్ళి నిజంగానే అడిగి మరీ చేసుకున్నాడు కాంతాన్ని.

బామ్మ చెప్పిన ప్రకారమే  కనకం నడుచుకున్నాడు.  ఇచ్చిన మాట ప్రకారం అన్నేళ్ళ తర్వాత కూడా తన్నే చేసుకున్న కనకం అంటే కాంతానికి ప్రాణం. తను ఇచ్చిన మాట నమ్మి  యెన్ని సంబధాలొచ్చినా పెళ్ళి చేసుకోకుండా  తనకోసమే వున్న కాంతం అంటే  చెప్పలేనంత ఇష్టం కనకానికి.

పెళ్ళి  చేసుకుని హాయిగా సంసారం చేసుకుంటున్న మనవడిని, ఆ మనవడిని తనంత  ప్రేమగా చూసుకుంటున్న మనవరాలిని చూసి పొంగిపోయేది బామ్మ.   అంతే కాని తన స్థానం తగ్గించి మనవడు పెళ్ళాన్ని ఇష్టపడుతున్నాడని , తనమీద మనవడికి ప్రేమ తగ్గిపోతుందేమోనని  ఇప్పటి అత్తగార్లలా అభద్రతా భావం ఫీల్ అవలేదు.  ఇప్పుడు బామ్మకి మనుమడెంత  ప్రాణమో  మనవరాలు అంత ప్రాణం.  తనముందు కువ కువ లాడుతూ తిరుగుతున్న ముచ్చటైన జంటకు దిష్టి తగులుతుందేమో నని  రోజూ దిష్టి తీసేది వాళ్ళకు.   ముని మనుమడిని చూసి వాడికి  బంగారపు వుగ్గుగిన్నె బహుమతిగా ఇచ్చింది .  వాళ్ళ పెళ్ళయిన పదేళ్ళకు తృప్తిగా కన్ను మూసింది బామ్మ.

ఇంతలా హాయిగా వున్న కనకానికి కాంతానికి గొడవలెందుకొస్తాయంటే అవి వాళ్ళకి టైం పాస్. కానీ ఈసారొచ్చింది టైం పాస్ కాదు.  జగడమే. . .  జగడమే … బామ్మ ఉన్నంత కాలం ఆమే వీళ్ళ గొడవలకు జడ్జి.  అందుకని తొందరగానే తేలిపోయేవి. . కాని ఇప్పుడు?

ఇంతకీ యేంటి సంగతంటే? నేను చెప్పడమెందుకు చూద్దాం పదండి.

ఆ  రోజు వాళ్ళ పెళ్ళిరోజని కాంతం చాలా  హుషారుగా వుంది.  “నాకు ఇంత మంచి భర్త నిచ్చిన నీకు,  కృతజ్ఞతలు ఏ విధంగా చెప్పుకోవాలో తెలీటం లేదని”  పదే పదే భగవంతుడికి చెప్పుకుంది.

కనకం కూడా చాలా  హుషారుగా వున్నాడు.  ముందురోజే తెలిసింది తనకు వచ్చిన ప్రమోషన్ సంగతి.  రిటైర్మెంట్ ముందర ప్రమోషన్ వున్న ఊళ్ళోనే అని చాలా సంతోషించారు ఇద్దరూ.  పెళ్ళి రోజుకి శుభవార్త తెలిసింది అని కనకం  చాలా ఉత్సాహంగా వున్నాడు.   అసలు కనకం  చాలా  చాలా ఇష్టంగా  ఇష్టపడి కాంతాన్ని పెళ్ళి చేసుకున్నాడు కదా . అందుకే కనకం కూడా దేవుడికి బోలెడన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

జీవితం ఆనందంగా హాయిగా గడిచిపోతున్నది.  పిల్లలు చక్కగా చదువుకుని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు.  చీకూ చింతా లేని సంసారం.  ఒక స్త్రీకి పురుషుడికి అంతకన్నా యేమి కావాలి?

అందుకని కనకం వెళ్ళి  “కాంతం . . కాంతం.  మరే మన  పెళ్ళై  ముప్పైయేళ్ళయింది కదా? నేను నిజంగా చాలా అదృష్టవంతుడ్ని. నీలాంటి అనుకూలవతి అయిన భార్య లభించింది. ఇంత అదృష్టాన్ని నాకిచ్చిన దేవుడికి  కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా .  గుడికెళదామా “అని కాంతాన్ని అడిగాడు.

అప్పటివరకు కాంతం కూడా అదే అనుకుంటున్నది కదా? సరే వెళ్దాం అనొచ్చు కదా? కాని   కనకం మాట వినేసరికి కొద్దిగా చిన్నబుచ్చుకుంది.

“యేమండి! యెంత మాట అనేశారు?. ఇప్పుడే నేను కూడా అదే అనుకుంటున్నాను. .  మీలాంటి  ప్రేమ మూర్తిని  నాకిచ్చిన ఆ దేవదేవుడికి వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.  ఇప్పుడు చెప్పండి మీరా ?నేనా అదృష్టవంతులు? మీ లాంటి భర్త దొరికితే  ఎవరైనా నాలానే వుంటారు.   నేనా మీరా? ఆ దేవ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది? . ” అన్నది కొద్దిగా బాధ నిండిన గొంతు తో.

“ముమ్మాటికి నువే గొప్ప.  నేనే అదృష్టవంతుడిని.  అందులో డౌట్ లేదు”  స్థిరంగా చెప్పాడు కనకం.

ఈసారి కొద్దిగా కోపం వచ్చింది కాంతానికి.   “నేనస్సలు ఒప్పుకోను. ”  గట్టిగా చెప్పింది.

ఈసారి కనకం కూడ కోపం తెచ్చుకున్నాడు.  “మొండిగా వాదించకు.   ప్రతి చిన్న దానికి నీకు నాతో వాదనలు యెక్కువయ్యాయి. పెద్దతనం వస్తున్నకొద్దీ చాదస్తం ఎక్కువవుతున్నది.  యెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.  మీ పెద్దవాళ్ళు నీ పెళ్ళికి తొందరపెడుతున్నా నా కోసం  ఆగి నా జీవితం లోకి వచ్చి నా ప్రతి కష్టం సుఖం లలో నాకు తోడుగా వున్నావు.  మరి నేనెంత అదృష్టవంతుడిని?”

“అదే కదా నేను చెప్పేదీను?మీ పెద్దవాళ్ళు బోలెడు కట్నం తో వచ్చే అమ్మాయిని చూపించినా కాదని నా కోసం అవన్నీ వద్దనుకోవడం సామాన్యం కాదు.   అది నా అదృష్టం కాదా?” ముక్కు యెగబీల్చింది కాంతం.

“సరే చెప్తుంటే  వినిపించుకోవట్లేదు కదా?. .  ఇంకో మాట చెప్తా ఒప్పుకోక చస్తావా. . నన్ను ప్రాణంగా  ప్రేమించే మా బామ్మకి చివరి సమయం లో యెంత సేవ చేసావు? బామ్మ,  అమ్మా నాన్నల  దగ్గర వుండకుండా  మన పెళ్ళైన కొత్తల్లోనే మన దగ్గరే వుంటా నని వస్తే ఆమెని ఎంత సంతోషంగా ఆహ్వానించి ఆప్యాయంగా చూసుకున్నావు? కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు?. అందుకే కదా ఆమె తృప్తిగా కన్ను మూసింది.  ఇంకోళ్ళయితే పెళ్ళైన కొత్తల్లోనే అలా అత్తగారి అత్తగారు వస్తే ఊరుకునేవాళ్ళా? అత్తగారికి  చేయడానికే బాధపడిపోతున్నారు.  అలాంటిది అత్తగారి అత్తగారు.  ఇక చెప్పక్కరలేదు . . అంత సేవ చేసే వాళ్ళా?  చిన్నప్పటినుండీ నా కోసం ఆమె పడ్డ తాపత్రయానికి ,బామ్మని నువు చూసుకున్న విధానానికి నేను నా జీవితమంతా  మీ ఇద్దరు స్త్రీలకు రుణపడి వుంటాను” కనకం కంఠం రుద్ధమైంది.

“చెప్తుంటే వినిపించుకోనిది నేనా మీరా? బామ్మని నేను “చూసుకోవడం ఏంటి? ”మిమ్మల్ని ఇంత సంస్కార వంతంగా తీర్చిదిద్దిన బామ్మకి జన్మ జన్మలకి నేను  రుణపడి వుంటాను.  ఆమెకి ఎంత సేవ చేస్తే ఆ రుణం తీరాలి?ఆమె మన దగ్గరే వుంటానని రావడం నా అదృష్టం. దాన్ని గూర్చి మీరెత్తకండి.  మీకా అర్హత లేదు.  అయినా  మీరు మాత్రం? మా అమ్మని చూసుకోలేదా? తన వాళ్ళ  నొకరకంగా భార్యవేపు వాళ్ళనొకరకంగా చూసుకునే ఈ ప్రపంచంలో మా అమ్మని మీ అమ్మతో సమానంగా మీరు చూడడం లేదా?మరి దాన్నేమంటారు?” తనకి కూడా ఒక పాయింటు దొరికిందన్న ఉత్సాహంతో అడిగింది కాంతం.

“అసలు అర్థముందా?మా అమ్మేంటి?మీ అమ్మేంటి? మనిద్దరమూ యెప్పుడైతే ఒకటయ్యామో  వాళ్ళు మనవాళ్ళవుతారు నీ వాళ్ళు  నా వాళ్ళూ కాదు.  నేను చేసిందీ అదే” అదో పాయింటు కాదన్నట్లు నాలుక చప్పరించాడు కనకం.

ఇంతలో పిల్లలు ఫోను చేసారు గ్రీటింగ్స్ చెప్పడానికి.  వాళ్ళిద్దరూ ముందే అనుకుని కాన్ఫరెన్స్ కాల్ చేసారు. ఫోన్ ఎత్తుతూనే “ చూడరా మీ అమ్మ” అని తండ్రి,  “చూడరా మీ నాన్న”  అని తల్లి  మాటలు మొదలు పెట్టగానే పరిస్తితి అర్థమయింది ఇద్దరికీ.  “బాబోయ్” అనుకుని

“అమ్మా! నాన్నా మళ్ళీ చేస్తాము  హాపీ మారేజ్ డే” చెప్పి  వెంటనే కాల్ కట్ చేసారు.  వాళ్ళకు తెలుసు ఈ సమయంలో అస్సలు వారితో టచ్ లో వుండకూడదని. ఇద్దరిలో యెవర్ని సపోర్ట్ చేసినా రెండో  వారికి చేయలేదని గొడవ చేస్తారు.   ఒకరిమీద  ఒకరికున్న  తలితండ్రుల నిష్కల్మషమైన ప్రేమ పిల్లలకి  తెలుసు.  అయినా ఇది సమయం కాదు కదా? అందుకే పారిపోయారు.

అప్పుడే కాంతానికి గుర్తొచ్చింది చేసిన స్వీటు ఇంకా భర్తకు తినిపించలేదని.  “అయ్యో నా మతి మండా “అని తిట్టుకుంటూ గబగబ లోపలికి వెళ్ళి ఒక ప్లేటు లో పులిహోరా, చక్రపొంగలి తీసుకొచ్చింది.

“మీకు  మన పెళ్ళిరోజు శుభాకాంక్షలు” చెప్తూ “ఇదిగో మీకిష్టమని చక్రపొంగలి  చేసాను. తిని యెలా వుందో చెప్పండి” ప్లేట్ చేతికిచ్చింది.

“నీకేది మరి?” అడిగాడు ప్లేట్ అందుకుంటూ “అయిన ఇంకో ప్లేట్ అక్కర్లేదులే ఇందులోనే షేర్ చేసుకుందాము రా“ పిలుస్తూ “ఆహా! అచ్చు మా బామ్మ చేసినట్లే వుందే” తన్మయత్వంగా ఆ  టేస్ట్ ని ఆస్వాదిస్తూ చెప్పాడు.

కాంతం మొహం వెలిగిపోయింది.   “నిజంగానా?బామ్మ చెసినట్లే వుందా?” అడిగింది ఆనందంగా.

“కావాలంటే తినిచూడు” స్పూన్ తో చక్రపొంగలి కాంతం  నోట్లో పెట్టాడు ఆప్యాయంగా.

“నిజమేనండోయ్. . . బాగా కుదిరింది”. తను కూడా ఆ రుచిని ఎంజాయ్ చేస్తూ ఒప్పుకుంది.

“అబ్బ! పులిహోర కూడా అధ్భుతంగా వుంది.  ఎంతైన నీ చెయ్యే చెయ్యి .  అమృతం ఒలికిస్తుంది…”

“చాల్లేండి” ఆ పొగడ్తని ఆస్వాదిస్తూనే అందంగా మూతి తిప్పింది కాంతం.

“మరదే ఒక పక్క టిఫిన్ పెట్టి ఇంకో పక్క ఆ మూతి తిప్పుడేంటి? నేనసలే ఇప్పుడు కోపంలో వున్నాను” కసురుకున్నాడు కనకం.

వాళ్ళిద్దరినీ చూస్తే అప్పటివరకు పోట్లాడుకుంది వీరేనా అన్నట్లున్నారు.

“వుండండి కాఫీ తాగాక మళ్ళీ మొదలెట్టుకుందురు కాని” అని లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చిచ్చింది.

“అంటే అన్నానంటారు కానీ మీ మగ వాళ్ళకున్నంత తిక్క మా ఆడవాళ్ళకుండదు.  ఎంతసేపటికీ మీదే కరెక్టంటారు. కనీసం జీవితంలో ఒక్కసారైనా మా మాట వొప్పుకోవాలి కదా?.  ఇప్పుడు నేనేమన్నానని మీరంత ఓ …. ఇదై పోవాలి.  వున్న మాటే కదా అన్నాను?  నేనదృష్టవంతురాలిని  కాబట్టి  దేవుడికి నేనే కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నాను అంతే కదా? ఇన్నేళ్ళ జీవితం లో నేనేనాడు  మీ గురించి యెందుకు చేసుకున్నానురా భగవంతుడా  అనుకున్న సందర్భం లేదు.  అందుకు ఎవరు కారణం మీరు కాదా? మీరు నా గురించి తీసుకునే శ్రద్ద ,నన్ను ప్రేమించే తత్వం, నా మనసుకు కష్టం కలిగించకూడదని మీరు  ఆలోచించడం?  ఎవరైనా  వుంటారా అలా?”  చేతులు తిప్పుతూ అడిగింది… “ అయినా ఇన్నేళ్ళలో  ఎప్పుడూ  నా మాట ఒప్పుకోక పోవడం అనేది లేదు? ఇప్పుడెందుకు ఒప్పుకోరు?”  డిమాండ్ చేసింది  కనకం.

“ అంటే నేను మాత్రమే నీ గురించి  శ్రద్దా,ఆలోచనా చేసానా? నువ్వేమీ చేయలేదా?  మీ ఆడవాళ్ళంతా ఇంతే . .  మేము చేసినవి మటుకు ఎత్తి చూపిస్తారు.  మీరు చేసినవి మటుకు ఒప్పుకోరు.   జాణలే మీరు. .  అయినా నేను మాత్రం అనుకున్నానా?ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానురా భగవంతుడా అని? యేమ్మాట్లాడుతున్నావు?  నేను రాసిస్తాను. . ఇన్నేళ్ళ జీవితంలో నేను కలలో కూడా అనుకోలేదు అలా. . ఇక ముందు అనుకోను. .  అలా అనుకోక పోవడానికి కారణం ఎవరు? నువ్వు కాదా?” కాస్త గట్టిగానె అడిగాడు కనకం.

“ కాదూ కాదూ కాదూ. .  “ తను కూడా తగ్గట్లేదు కాంతం.

“అయినా యేమండీ !ఈ రోజు మన పెళ్ళి రోజు.  నన్నిలా బాధపెట్టడం న్యాయమా?”

“నేనూ అదే అడుగుతున్నాను .  నీకిది న్యాయమా అని”

ఇద్దరూ ఒకరినొకరు దీర్ఘంగా చూస్కున్నారు.

“కాంతం” చేతులు చాపాడు . .

“ఏమండీ” వచ్చి ఆ చేతుల్లో వాలింది కనకం…

ఇహ గుడికెళ్దామా?” ఇద్దరూ ఒక్కసారే అడిగారు.

ఒకళ్ళను ఒకళ్ళు చూసుకుని ఫక్కున నవ్వుకున్నారు.

ప్రేమకు పంతాలు  పట్టింపులు ఉండవు మరి.  .

హమ్మయ్య ఈ రోజుకి కామా పడింది. . . కాని చదువరులారా  మీకైనా అర్థమయిందా ఎవరు గొప్ప అనేది?. . . . . . . . . . .

(ఇంతకీ బామ్మకి  గొంతులో బాధ యెందుకు సుళ్ళు తిరిగిందో?)

****************

 

 

 

 

నవరసాలు..నవకథలు.. రౌధ్రం 7

రచన: మణికుమారి గోవిందరాజుల

ఆదిశక్తి

“ఆంటీ నేను ఇక్కడ మీతో పాటు కూర్చోనా నేనెక్కిన కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా వుంది. నాకు భయమేస్తున్నది. మీరున్నారని చెప్పి టీసీ నన్నిక్కడికి పంపారు”
ఆడపిల్ల గొంతు విని తలెత్తింది సుకన్య. ఇరవై యేళ్ళుంటాయేమో రిక్వెస్టింగ్ గా అడుగుతున్నది.
“అయ్యో దానికి నన్నడగడమెందుకు? నా బెర్త్ కాదుగా నువ్వడిగేది? ”నవ్వింది.
నిజమే ఈ రోజేంటో అన్ని కంపార్ట్మెంట్సూ ఖాళీగా వున్నాయి. టీసీ అదే చెప్పి తలుపులు తెరవొద్దని చెప్పి యేమన్నా అవసరం వుంటే పిలవమని ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడూ తాము కూర్చున్న చోట కూడా తామిద్దరే. అబ్బ పక్కన యెవరూ లేకపోతే బోర్ గా వుంటుందే అనుకుంటుంటే ఈ అమ్మాయి వచ్చింది. హమ్మయ్య అనుకుంది సుకన్య.
శ్యాం సుందర్ నవ్వాడు భార్యని చూసి నీకో బకరా దొరికింది కదా అన్నట్లుంది ఆ నవ్వు.
అదేమీ పట్టించుకోకుండా ఆ అమ్మాయిని పరీక్షగా చూసింది. కనుముక్కు తీరు చక్కగా వుంది. పొందిగ్గా వున్న శరీరం తీరు చక్కటి అమ్మాయి అనిపించేస్తుంది. కళ్ళెందుకో భయంతో రెప రెప లాడుతున్నాయి. మాటి మాటికీ తానొచ్చిన వేపు చూస్తున్నది.
“అక్కడెవరన్నా వస్తే వెళ్దామనా? పర్లేదులే అన్ని బెర్త్ లూ ఖాళీగానే వున్నాయి. అర్థ రాత్రొచ్చి నిన్నెవ్వరూ లేపరులే” చెప్పింది సుకన్య.
ఆ అమ్మాయి అటు చూడ్డము మానుకుని సర్దుకుని కూర్చుని బ్యాగ్ లో నుండి వాటర్ బాటిల్ తీసి సగం నీళ్ళు గట గటా తాగేసింది.
“నీ పేరేంటమ్మాయ్? ఎక్కడిదాకా”
“ చిద్రూపి అండీ. వరంగల్ వెళ్తున్నాను! ” వినయంగా చెప్పింది.
“అమ్మవారి పేరు. బాగుందమ్మా! ” మెచ్చుకుంది.
చిద్రూపి సుకన్యకి చాలా నచ్చేసింది. అప్పుడే తన కొడుక్కి సూటవుతుందా లెదా అని లెక్కలేయసాగింది.
“సుక్కూ నీ కొడుక్కి ఇంకా పెళ్ళి వయసు రాలేదు” చక్కటి అమ్మాయి కనపడగానే సుకన్య అలానే ఆలోచిస్తుందని తెలిసిన శ్యాం సుందర్ గుర్తు చేసాడు.
“ ఉఊ” మూతి తిప్పింది. భర్త ని పట్టించుకోకుండా చిద్రూపి వేపు తిరిగి ,
“బాగుందమ్మా! చత్రపూర్ మీ సొంతూరా ? నీ వయసెంత? చూస్తుంటే తెలుగమ్మాయి లాగా వున్నావు? ఎంతమంది మీరు? అన్నా తమ్ములు? అక్క చెల్లెళ్ళూ? ”
“సుక్కూ! ఇప్పుడే కదే వచ్చింది మనం ఇంకా చాలా ప్రయాణం చేయాలి. కొద్దిగా వూపిరి తీసుకోనివ్వవే? ” విసుక్కున్నాడు శ్యాం సుందర్. “అమ్మాయ్! అక్కడ కూర్చున్నా బాగుండేది. ఇక్కడి కొచ్చి పడ్డావు ఇక నీకు టార్చరే. తాను నిద్రపోదు. నిన్ను నిద్రపోనివ్వదు. ” వెక్కిరించాడు భార్యని.
“నాకదే కావాలి” అనుకుంది చిద్రూపి.
“బాగుంది. ఎంతో దూరం ప్రయాణం చేయాలి. ఒకళ్ళకొకళ్ళం పరిచయమైతే ఒక ఆత్మీయత వుంటుంది. చెప్పమ్మా”
“మాది వరంగల్ ఆంటీ. చత్రపూర్ లో మా వాళ్ళుంటే సెలవులకి వచ్చి వెళ్తున్నాను. , మా వాళ్ళకి అర్జెంట్ గా కలకత్తా వెళ్ళాల్సిన పని పడింది. అందుకే తప్పని సరై ఒక్కదాన్ని పంపుతున్నారు”
“అదేమన్న మాట ఆడపిల్లలు ఒక్కళ్ళమే అనుకోకూడదు. ధైర్యంగా వుండాలి. మగపిల్లలనుకుంటారా అమ్మో ఒక్కళ్ళమే అని? మనం మటుకు ఎందుకనుకోవాలి. అందులో అమ్మవారి పేరు పెట్టుకున్నావు”
“యేమే! అల్లాంటి పిచ్చి ధైర్యాలు నేర్పకు. రోజులన్నీ ఒక్కలాగా వుండవు. మన జాగ్రత్తలో మనం వుండాలి. ”
“మీరన్నది నిజమే. రోజులన్నీ ఒక్కలాగా వుండవు. అందుకే అవసరం వచ్చినప్పుడు స్త్రీ ఆదిశక్తి అవతారం కావాలి. మొన్నటికి మొన్న చూడండి ఒకడెవడో పెట్రోల్ పోసి అమ్మాయిని తగలబెట్టడమే కాక అంటుకున్నదా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంతసేపు అక్కడే వున్నాట్ట. ఈ లోపు ఆ అమ్మాయి వెళ్ళి వాణ్ణి గట్టిగా పట్టుకున్నట్లయితే వాడు కూడా అంటుకునే వాడు కదా? ” ఆవేశపడింది.
“కరెక్టే కాని అప్పటి పరిస్తితులేంటో మనకు తెలీదు కదా? ”
“అందుకే చెప్తున్నాను ఏ పరిస్తితుల్లోనయినా మనకు చెడు చేసేవాణ్ణి మనం ఎంతవరకు దెబ్బ తీయగలం అని ఆలోచించాలి. శరీరం లోని ప్రతి అవయవం ఒక ఆయుధం కావాలి. శారీరకంగా వున్న ఆడవారి ఒక్క బలహీనతని మగవాళ్ళు వాడుకుంటున్నారు. ఇక ముందు అలా జరగనీయకూడదు. ”
వాళ్ళ మాటలు వింటుంటే ఏదో ధైర్యం ఆవహించసాగింది చిద్రూపిని. “నిజమే ఆంటీ మీరన్నది. ఇక ముందు అలా జరగనీయకూడదు. ” అన్నది. “నిజంగా జరగనీయకూడదు” త నలో తాననుకుంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుంది.
ఏవేవో అడగసాగింది సుకన్య. వినయంగా జవాబులిస్తున్నది చిద్రూపి..
కొద్ది సేపయ్యాక చిన్నగా సైగ చేసాడు శ్యాం సుందర్.
చిద్రూపీ ! కొద్దిగా పక్కకి వెళ్తావామ్మా? బెడ్ ప్యాన్ తీస్తూ అడిగింది.
“అంకుల్ కి యేమయిందాంటీ? ” తిరిగొచ్చాక అడిగింది.
“ఆక్చువల్ గా మేము టూర్ కి వచ్చాము. భువనేశ్వర్ లో మెట్ల మీంచి పడి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి.. వుండమన్నారు కాని అక్కడ వుండలేక. కట్టు కట్టించుకుని వెళ్తున్నాము. అప్పటికీ వారం వున్నాము. ” చెప్పింది సుకన్య “చిన్నగా కర్ర పట్టుకుని నడుస్తా అంటున్నారు కాని నేనే వద్దంటున్నాను, ట్రైన్ కదుల్తూ వుంటుంది కదా పడతారేమో అని దానికి తోడు మా కోసమే అన్నట్లుగా ట్రైన్ ఖాళీగా వుంది.. వద్దన్నా సరే కర్ర మాత్రం పక్కనుంచుకుంటారు. నా మీద కంటే కర్ర మీద నమ్మకమెక్కువ” నవ్వింది పక్క సర్దుతూ. శ్యాం సుందర్ చేతికి కాలికి సిమెంట్ కట్లున్నాయి. నడుముకో పెద్ద బెల్ట్ వుంది.
వాళ్ళను చూస్తే గొప్పగా అనిపించింది చిద్రూపికి..
ఇంతలో రైల్ శ్రీకాకుళం రోడ్ స్టేషన్ లొ ఆగింది. అక్కడ కూడా ఎవరూ ఎక్కలేదు రైల్ కదలగానే డిన్నర్ ప్యాక్ బయటికి తీసింది సుకన్య.
“చిద్రూపీ! రా డిన్నర్ చేద్దాము. ” పిలిచింది.
“నేను కూడా తెచ్చుకున్నానాంటీ” తన బాక్స్ ఓపెన్ చేయబోతూ చెప్పింది.
ఇంతలోచిద్రూపి బాక్స్ ఎగిరి అంత దూరం పడింది. అదిరిపడి తల ఎత్తేసరికి అంతకు ముందునుండీ వేధిస్తున్న కుర్రాళ్ళిద్దరు వికటంగా నవ్వుతూ యెదురుగుండా వున్నారు. చిద్రూపి వాళ్ళనుండి తప్పించుకోవడానికే వీళ్ళ దగ్గరికి వచ్చింది.
“మా దగ్గరనుండి తప్పించుకుని ఈ ముసలాళ్ళ దగ్గరకొచ్చి హాయిగా వున్నాననుకుంటున్నావా? ఎలా తప్పించుకుంటావో మేము చూస్తాము. రావే. ! ” అంటూ చేయి పట్టుకున్నారు.
నిర్ఘాంతపోయారు సుకన్యా శ్యాం సుందర్.
“వదలండ్రా.. ”తన చేతిలో వున్న అన్నాన్ని వాళ్ళమీదికి విసురుతూ అరిచింది సుకన్య.
మీద పడబోతున్న అన్నాన్ని తప్పించుకుంటూ వెకిలిగా నవ్వారు వాళ్ళిద్దరూ.
శ్యాం సుందర్ గబ గబా టీసీ కి ఫోన్ చేద్దామని ఫోన్ తీసాడు.
“ టీసీ ని పిలుద్దామనా? వాడా బాత్ రూం లో కొట్టుకుంటున్నాడు వచ్చేవాళ్ళెవరూ లేరు. కంపార్ట్మెంట్ లో కూడా ఎవరూ లేరు. వీళ్ళిద్దరూ ఏదో పెద్ద హీరోలమనుకుంటున్నారు. కట్టి పడేయరా వాళ్లని” అరుస్తూ చిద్రూపి ని దగ్గరికి దగ్గరికి లాక్కుంటున్నాడు ఒకడు. . జేబులో నుండి సన్నని ప్లాస్టిక్ వైర్ తీసి సుకన్య ను కట్టడానికి ఒకడు వీళ్ళ దగ్గరకొచ్చాడు.
చిద్రూపి మీద జరుగుతున్న అఘాయిత్యాన్ని చూసి ఆపుకోలేని ఆవేశంతో వూగిపోయింది సుకన్య. తన దగ్గరికి రాబోతున్న వాడికి అందకుండా వెనక్కి జరిగి టిఫిన్ బాక్స్ లో వున్న పచ్చడి అన్నాన్ని వాడి మీదికి విసిరేసింది. ముందే గ్రహించినట్లుగా వాడు తప్పుకుని ఈడ్చి సుకన్య చెంప మీదఫెఢీ ఫెఢీ మని కొట్టి తాడుతో కట్టేయసాగాడు. యాభై ఏళ్ళు దాటిన సుకన్య శరీరం ఆ దెబ్బలకి తట్టుకోలేక తాడుకి కట్టుబడ్డా మనసులోని ధైర్యం తగ్గట్లేదు, కోపం ఆగడం లేదు. తన చేతనయినంత వరకు ప్రతిఘటిస్తూనే ఉంది.. పక్కనే కూర్చున్న శ్యాం సుందర్ ఒక చేత్తో వాడిని నెట్టసాగాడు. కట్టు కట్టిన శ్యాం సుందర్ చేతిని కాలిని బలంగా మెలి పెట్టి వెనక్కు నెట్టాడు ఆ రాక్షసుడు.
“అమ్మాఆఆ….. ”ఆర్తనాదం చేస్తూ వెనక్కి పడిపోయాడు శ్యాం సుందర్.
ఈ లోపు మొదటి వాడు చిద్రూపి డ్రెస్ చింపడానికి పయత్నిస్తున్నాడు. అంతకు ముందు తెచ్చుకుందామనుకున్న ధైర్యం ఎటు పోయిందో చిద్రూపి ఏడుస్తూ బతిమాలసాగింది తనని వదిలేయమని. . కాని వాడు వినిపించుకోవట్లేదు. ఇంకా ఇంకా దగ్గరికి లాక్కుని కింద పడేసాడు
“చిద్రూపీ సిగ్గులేదా ఎదిరించు మన ప్రాణం ఉన్నంత వరకు వాడికి అవకాశం ఇవ్వకూడదు. ఇందాకే కదా అనుకున్నాము. నీలోని శక్తిని మేల్కొలుపు లే. వాడికి అవకాశం ఇవ్వకు నీశక్తినంతా కూడగట్టుకో “అరిచింది సుకన్య.
శ్యాం సుందర్ కళ్ళనీళ్ళతో నిస్సహాయంగా చూస్తున్నాడు లేవ లేని తానేమీ చేయలేనని.
తగ్గుతున్న ధైర్యం సుకన్య మాటలతో కొద్ది కొద్దిగా ప్రోది కాసాగింది చిద్రూపికి. తన మీదికి వంగి మొహం లో మొహం పెట్టబోతున్న వాడిని దగ్గరికి రానిచ్చి మోకాళ్ళతో వాడి కాళ్ళ మధ్య బలంగా తన్నింది. అబ్బా అని వాడు లేవబోయాడు.
అంతకు ముందు సుకన్య ఇచ్చిన ధైర్యమే పని చేసిందో. ……..
మగవాళ్ళ అరాచకాలకి మంటల్లో కాలిపోతున్న తన తోటి స్త్రీలే కళ్ళ ముందు మెదిలారో? .. . . . . . . . .
ఎవడో వచ్చి తన మీద చెయ్యేసి తనని ఆక్రమించుకోవాలని చూస్తుంటే అలాంటి వాడిని ఎందుకు వదిలేయాలనే స్పృహే కలిగిందో……
తనని ప్రాణంగా పెంచుకుంటూ తనకేమన్నా అయితే తల్లడిల్లి పోయే తల్లీ తండ్రులే గుర్తొచ్చారో…
ఇప్పుడు వాడు తననేమన్నా చేస్తే పోయే తన శీలం కంటే కుళ్ళబొడిచే సంఘమే గుర్తొచ్చిందో , అంత బలం ఎలావచ్చిందో
లేవబోతున్న వాడు లేచేలోపల మళ్ళీ తన్నింది బలంగా.
“పిశాచీ” కేకలు పెడుతూ లేచాడు మొదటి వాడు. వాడితో పాటే లేచి పక్కనే వున్న శ్యాం సుందర్ చేతికర్ర అందుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది. దెబ్బలు తట్టుకోలేక వాడు భయంకరంగా కేకలు వేయసాగాడు. ఇది చూసి రెండో వాడు దగ్గరికి రాబోయాడు.
“ఖబడ్దార్. దగ్గరికి వచ్చావంటే చచ్చావే. యేమనుకుంటున్నార్రా? ” రౌద్ర రూపిణి అయి ఆవేశంతో వూగిపోతు , చేతిలోని కర్రని తిప్పుతూ వేయి చేతులున్న ఆదిశక్తి అవతారం లా కనపడుతున్న చిద్రూపి దగ్గరికి రావడానికి జంకాడు రెండో వాడు.
లేవలేని వాడు తన్నేమి చేస్తాడులే అనుకుని శ్యాం సుందర్ ని కట్టేయకపోవడంతో. శ్యాం సుందర్ గబ గబా సుకన్య కట్లు విప్పాడు. సుకన్య కూడా ఫ్రీ అయ్యేసరికి రెండో వాడు పారిపోయాడు
మొదటివాడు మాత్రం అరుస్తూ దొర్ల సాగాడు. వాడి అరుపులను పట్టించుకోకుండా, స్త్రీల మీద దౌర్జన్యం చేయాలనే ఆలొచన కూడా మగవాడికి రాకుడదన్నట్లుగా , మళ్ళీ మళ్లీ కొట్టసాగింది చిద్రూపి. .
ఎలాగో తలుపులు తెరుచుకుని వచ్చిన టీసీ కాని, ఫ్రీ అయిన సుకన్య కాని, అశక్తుడుగా వున్న శ్యాం సుందర్ కాని చిద్రూపిని ఆపలేకపోతున్నారు…..

కాంతం సంఘసేవ

రచన: మణికుమారి గోవిందరాజుల

 

 

కాంతానికి దిగులెక్కువయింది. ముఖ్యంగా “స్వచ్ఛ్ భారత్ వుద్యమం “ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన దగ్గరనుండి తాను దేశానికి యేమీ చేయలేక పోతున్నాను అన్న బాధ యెక్కువయ్యి అన్నం కూడా సయించడం లేదు.

వూహ తెలిసినప్పటి నుండి కూడా కాంతానికి సొసైటీకి యేదో ఒకటి చేసి మాతృదేశానికి తన వంతు సేవ అందించాలనేది చాలా గాఢమైన కోరిక. అదేమి చిత్రమో యేది చేద్దామన్నా యేదో ఒక అడ్డంకి వచ్చేది. యెవరికన్నా చెప్తే నవ్వుతారేమో అని భయంతో కూడా తన ఆలోచనలు తనలోనే పెట్టుకునేది. యెవరింటికన్నా వెళ్ళి రెండు రోజులు వుండడం జరిగితే మాత్రం  వాళ్ళ ఇంట్లొ పనివాళ్లకి రూపాయో అర్థ రూపాయో ఇచ్చి వచ్చేది. కొద్దిగా మొహం దీనంగా పెట్టి యేదన్నా వాళ్ళ అవస్ధలు చెప్పారంటే ఇక ఇంతే సంగతులు. తండ్రి యేమన్నా కొనుక్కోమని ఇచ్చిన పదో పరకో వాళ్ళ చేతుల్లో పెట్టి వచ్చేసేది. . . యేమయ్యాయే డబ్బులు అని నాన్న యెప్పుడూ అడిగేవాడు కాదు.

ఒకసారి యేమయిందంటే ….  కాంతం అప్పుడు ఆరో ,   యేడో చదువుతున్నది. బాబాయివాళ్ళ ఇంట్లో పెళ్ళికి కుటుంబ సమేతంగా వారం ముందుగా వెళ్ళారు. వాళ్ళది పల్లెటూరు ఇంటి నిండా నౌకర్లు చాకర్లు బోల్డుమంది.

కాంతానికేమో యెక్కడికన్నా వెళ్ళగానే పనివాళ్ళెవరా? యెక్కడున్నారా?యెంతమంది వున్నారా? అని వెతుకుతాయి కళ్ళు. అలా పనివాళ్ళకోసమై వెతకటానికో ఫ్లాష్ బ్యాక్ వుంది

మన కాంతానికి విపరీతమైన పుస్తకాల పిచ్చి. స్కూల్లో జాయిన్ చేయగానే ఆమె వయసు వాళ్ళు అ ఆ లు చదివే స్టేజ్ లోనే వుంటే మన కాంతం ఒకటో తరగతి చదివేసి స్కూల్లో చదవడానికి యేమీ లేక యే పుస్తకం దొరికితే అది చదవడం మొదలు పెట్టింది. అదిగో అప్పుడే యజమానులు పనివాళ్ళను బానిసలుగా చూడడం,  లేదా సరిగా చూడకపోవడం,   అలాంటి కథలు యెక్కువగా చదివింది. దానితో వాళ్ళకు యేమన్నా చేయాలని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ఓ…. . ఫీల్ అయి పోతుండేది.

సరే మళ్ళీ పెళ్ళి కొద్దాము. వెళ్ళగానె కాంతం తండ్రి,   పిన్ని పిల్లలూ,  బాబాయి పిల్లలూ అలా పిల్లలందరికీ తలా ఒక అయిదు రూపాయలు,   నోట్లు కాకుండా చిల్లర ఒక చిన్న గుడ్డ సంచిలో వేసి ఇచ్చి ఆ పెళ్ళికి అక్కడ వున్న నాలుగు రోజులూ పెద్ద వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా అయిసు ఫ్రూట్లు,  జీళ్ళు కొనుక్కమని ఇచ్చాడు. ఆయనకదో సరదా. పిల్లలందరూ ఆయన్ని ఓ. . పొగిడేసి యెగిరి గంతులేసారు. ఆ రోజుల్లో అయిదు రూపాయలంటే మాటలు కావు కదా.  ఆ డబ్బుల్ని చూడగానే. చిన్ని కాంతానికి ఒకటర్థమయింది అవన్నీ అక్కడ వున్న పని వాళ్ళకే సరిపోతాయని. మరి తనెలా యేమి కొనుక్కోవాలి?కాంతం బుజ్జి బుర్ర ఆలోచనలతో వేడెక్కింది.

ఇంతలో అందరూ పొలోమంటూ  జీళ్ళు కొనుక్కోడానికి బయల్దేరుతూ కాంతాన్ని కూడా లాక్కు పోయారు. ఇందులో కాంతానికి ఇంకో అలవాటు కూడా వుంది. అందరి దగ్గరా డబ్బులున్నాయి కదా?యెవరిది వాళ్ళు కొనుక్కోవచ్చు కదా?కాని దుకాణం దాకా  వెళ్ళేసరికి కాంతం లోనిఅతి మంచితనం నిద్ర లెస్తుంది. లేచింది వూర్కోకుండా కాంతాన్ని వుక్కిరి బిక్కిరి చేస్తుంది. . ఫైనల్ గా వాళ్ళు కొనుక్కున్న వాటికి కూడా తనే డబ్బులిచ్చేస్తుంది. అందరికీ తెలుసా సంగతి. అందుకే వాళ్ళు రావే అంటూ లాక్కెళ్తారు.

సరే మొత్తం యాభై పైసలు పోగా నాలుగు రూపాయల యాభై పైసలున్న గుడ్డ సంచిని జాగ్రత్తగా గౌను జేబులో పెట్టుకుని దాన్ని పిన్నీసుతో గౌనుకి జత చేసింది. ఈ తతంగమంతా పూర్తయ్యి తలెత్తి చూసేసరికి యెవ్వరూ కనపడలేదు. వుసూరుమంటూ ఒక్కత్తే పెళ్ళింటికొచ్చింది. మధ్యాహ్నసమయం . పెద్దలందరూ కునుకు తీస్తున్నారు. చేసేదేమీ లేక పెరటి దొడ్డి గడపమీద కూర్చుని తన వంతు జీడి ని నెమ్మదిగా తినసాగింది. ఇంతలో అటుగా వెళ్తున్న పాలేరు “యేంది! కాంతమ్మగోరూ! ఒక్కరే జీళ్ళు తింటున్నారు?మాకేదండో” అనడిగాడు.

“అయ్యో! వెంకాయ్! నేనెంగిలి చేసేసాను. పోనీలే నీకో అయిదు పైసలిస్తాను. కొనుక్కొ యేం?” అని తను తింటున్న జీడి పక్కన పెట్టి జాగ్రత్త గా పిన్నీసు తీసి,  సంచీని బయటికి తీసి అందులో నుండి అయిదు పైసలు తీసి వెంకాయ్ కిచ్చింది.

“అమ్మాయిగోరెంత మంచోరో?” మెచ్చుకుని వాడెళ్ళి పోగానే మళ్ళీ సంచీ ప్రాసెస్ అంతా పూర్తి చేసి తన జీడి తీసుకుని తలెత్తేసరికి అక్కడ పని చేస్తున్న పాలేర్లందరూ వలయాకారంగా నించుని వున్నారు.

“మాకేదండీ కాంతమ్మగోరూ?”అందరూ ఒక్కసారిగా అడిగారు. . ఇక ఆ తర్వాత చెప్పడానికి యేమీ లేదు.

మర్నాడు అందరూ ఐస్ఫ్రూట్స్ కొనుక్కోడానికి వెళ్తుంటే అడగడానికి అభిమానం అడ్డొచ్చి ఇంట్లోనే వుండిపోయింది పాపం.

జీళ్ళు కొనడానికి డబ్బుల్లేకపోయినా ఆ తర్వాత పాలెర్లు మంచి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు మన కాంతానికి. అది వేరు సంగతి.

ఇది ఒక వేపు. ఇంకోటేంటంటే వీధిలో,  సిగ్నల్స్ దగ్గరా,   రైల్వే స్టేషన్ల దగ్గరా అడుక్కునే వాళ్ళను చూస్తే వాళ్ళకు యేదో జ్ఞానబోధ చెయ్యాలన్న ఆరాటం పీ టీ ఉషలా వురుక్కుంటూ వస్తుంది హృదయంలో నుండి.

ఒకసారి హైదరాబాదు నుండి పూణే వెళ్తుంటే సీట్ల కింద ,  మధ్య ఒక పాత గుడ్డేసుకుని తుడుస్తూ ఒక కుర్రవాడు కనపడ్డాడు. పదేళ్ళుంటాయేమొ. పక్కన కూర్చున్న తన కొడుకు ఈడువాడే. వాడు హడావుడిగా తుడిచేసి ఆ గుడ్డని భుజం మీద వేసుకుని దీనమొహంతో అడుక్కోవడం మొదలు పెట్టాడు. ట్రైన్ పెద్ద రష్ గా లేదు. అక్కడక్కడా వున్నారంతే. వాడికి పెద్ద గిట్టుబాటు కావడం లేదు. మన కాంతం లోని మాతృహృదయం వువ్వెత్తున యెగసి పడింది. వాడిని తీసుకెళ్ళి తన కొడుకుతో పాటు చూసుకోవాలని ఆరాటపడింది. సరే వాడందరి దగ్గరా అడుక్కుంటూ కాంతం దగ్గరికి కూడా వచ్చి చేయి చాపాడు.

“బాబూ! నీ పేరేంటి?” అడిగింది ప్రేమగా.

“షారూఖ్ ఖాన్” జుట్టెగరేస్తూ చెప్పాడు. జాలిగా పెట్టిన మొహం యెక్కడికి పోయిందో.

“భలే వుంది నీ పేరు. సరే గాని ఇలా రోజూ అందరి దగ్గరా అడుక్కోవడం యెందుకూ?నాతో పాటు వస్తావా? నీకిలా అడుక్కునే పని తప్పుతుంది. చక్కగా నా కొడుకుతో పాటు స్కూల్ కి వెళ్ళొచ్చు. మంచిగా చదువుకుంటే బాగా సంపాయించుకోవచ్చు. అప్పుడెవ్వరినీ అడుక్కోవక్కరలేదు. ”భవిష్యత్తుని అందంగా చూపించింది.

వాడు యెగాదిగా చూసాడు కాంతాన్ని. పక్కన వున్న కాంతం కొడుకుని చూసాడు.   “నీ కొడుకేనా?”

“అవును”

“యెంత సంపాయిస్తడు?”

“అప్పుడే సంపాదన యేంటి?చదువుకుంటున్నాడు”

“మరి నేను నెలకు మూడువేలు సంపాయిస్త. నీ ఇంటికొస్తే యేమొస్తది?పని చేపించుకుంటవ్” షాక్ నుండి తేరుకుని చూసేటప్పటికి వాడు కనపడలేదు. పక్కనే వున్న కూతురు ఇచ్చిన మంచినీళ్ళను గట గటా తాగేసింది.

పోనీ అలా అయిందని వూర్కుందా?

ఒకసారి ఆటోలో యెక్కడికో వెళ్తున్నారు. సిగ్నల్ పడడంతో ఆగిన ఆటోల దగ్గరికి పిల్లలందరు వచ్చి అడుక్కోసాగారు. అలాగే వీళ్ళ ఆటో దగ్గరికి కూడా ఒక పిల్ల వచ్చింది.

“ఒక రూపాయుంటే ఇయ్యమ్మా” అని అడిగింది.

“ఈ రూపాయి లెక్కేంటి?”అడిగింది కాంతం.

“అట్టా డిసైడ్ చేసినం. ” నిర్లక్ష్యంగా చెప్పింది.

“ఎందుకని?”

“షాపులోళ్ళు అర్థరూపాయి తీసుకోవట్లేదు. ”

అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చి నిజమే కదా అనుకుంది అమాయకంగా.

ఒకరోజు హోటల్ నుండి బయటికి వచ్చి రోడ్డు దాటబోతుండగా ఒకామె వచ్చి చేయి చాపింది. పర్స్ లో నుండి చేతికి వచ్చిన ఒక కాయిన్ తీసి ఆమె చేతిలో వేసి ట్రాఫిక్ కాస్త తగ్గడంతో గబ గబా ముందుకు కదిలి రోడ్డు సగంలో కొచ్చేసరికి వెనక నుండి యెవరో పిలుస్తున్నట్లుగా అని పించి వెనక్కి చూసేసరికి ఇందాక చేయి చాపినామె వురుక్కుంటూ వచ్చింది.

“ఇదిగోమ్మో! నీ డబ్బులు. అర్థరూపాయి ఇస్తే ఎవడు తీసుకుంటరమ్మో?” కాంతం చేయి లాగి ఆ చేతిలో కాయిన్ పెట్టేసి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది.

చుట్టూ హారన్ల మోతకి గాని తేరుకోలేకపోయింది.

“ఓ అమ్మో రూపాయి” మళ్ళీ గుర్తు చేసిందా పిల్ల.

పడుకున్న మాతృదేవత మళ్ళీ నిద్ర లేచింది.

“అలా కాదుగానమ్మా. చక్కగా నాతొ పాటు రా. మీ కోసం ప్రభుత్వమే కాక చాలామంది ఎన్నో చేస్తున్నారు. మా ఇంట్లో వుంచుకోవడమో లేక వాళ్ళ దగ్గరికి నిన్ను చేర్చడమో చేస్తాను. బాగా చదువుకోవచ్చు” ఎంతో దయగా చెప్పింది. కాదు చెప్పా ననుకుంది.

సిగ్నల్ ఇక ముప్పై సెకన్ల లోకి వచ్చింది. ఆ అమ్మాయికి నచ్చ చెప్పటానికి ఆటో దిగడానికి  రెడీ అయింది. ఈ లోపల

“ఒక్క రూపాయి ఇయ్యనీకి నూరు పెస్నలడగబట్టె . గీయమ్మంట నన్నుతోల్కెళ్ళి సదివిస్తదంట” అప్పుడే వచ్చిన ఇంకో పిల్లతో యెగతాళిగా చెప్తూ ఈ పిల్ల వెళ్ళిపోవడమూ,  సిగ్నల్ వచ్చి బయట పెట్టబోయిన కాలు లోపలికి లాక్కునే లోపల ఆటో ముందుకు కదలడమూ,  పక్కన కూర్చున్న మేనకోడలు . పకా పకా నవ్వడమూ అన్నీ ఏకకాలంలో జరిగాయి.

ఇన్ని జరిగినా ఇంకా కాంతం మనసు ఆరాటపడుతూనే వున్నది. యేదో చెయ్యాలనే ఆరాటం అణగటం లేదు. కాకపోతే ఒక్కటర్థమయింది. అడుక్కోటానికి వచ్చిన వాళ్ళకు యేదో చెప్పబోతే వినే ఓపిక వుండదు. వాళ్ళకు కావల్సింది . నువ్వేసావా లేదా అనే.

ఈ జ్ఞానోదయం కాగానె “అరె!నాకీ విషయం ఇంతవరకు తట్టలేదే” అని బోల్డు ఆశ్చర్యబోయింది. ఇక ఈసారి ఆ పొరబాటు అస్సలు చేయకూడదు. డబ్బులిచ్చి చెబ్దాము అని నిర్ణయించుకుంది.

ఆ వెంటనే కొన్నాళ్ళకి విజయవాడ వెళ్ళడానికి నాంపల్లి స్టేషన్ లో దిగడమేమిటి ఒకామె చంకలో ఒక పిల్ల, చేత్తో పట్టుకుని ఒక పిల్లడు, ఆమె చీర ఒక చేత్తో పట్టుకుని రెండో చేయి నోట్లో వేసుకుని ఇద్దరు పిల్లలు అందరూ కూడా అయిదేళ్ళలోపు వాళ్ళే వుండగా “అమ్మా పిల్లలకి ఆకలెస్తందమ్మా ,  ”అంటూ కాళ్ళకి అడ్డం పడింది.

ముందు అనుభవంతో ముందు జాగ్రత్తగా పర్సులో నుండి పది నోటు తీసి ఆమె చేతిలో పెట్టింది. అక్కడికి పనై పోయింది వెళ్ళొచ్చుగా అలా యెలా వెళ్తుంది? అందుకని డబ్బులుచ్చుకుని వెళ్తున్న ఆమెని ఆపి

“యేమమ్మా పిల్లలకి పెట్టడానికి లేదంటున్నావు. మరి ఇంతమందిని యెందుకు కన్నావు?ఒకళ్ళిద్దరితో ఆపొచ్చుగా?”అనునయంగా అడిగాననుకుంది.

వూహించలేదు ఆమెకంత కోపం వస్తుందని

“యేమమ్మో నువ్విచ్చిన పది రూపాయలతొనే నా పిల్కాయల్ని సాత్తానా?అయినా నువ్వెట్టా కన్నావో నేనట్టె కంటి. ఆ మాత్రం తెలీదా ఆడుదానివై వుండి?” పిల్లాడ్ని వదిలేసి చేయి తిప్పుకుంటూ అరిచింది.

సిగ్గుతో చచ్చినంత పనై ఇక మాట్లాడకుండా వెళ్ళి పోయింది కాంతం ఆమె ఇంకా వెనకాలనుండి యేమో అంటున్నా.

ఇన్ని అనుభవాలతో తల పండినా ఈ మధ్యే అయిన స్వచ్చ్ భారత్ ప్రాజెక్ట్ తో బొప్పి కట్టినా కాంతం ఆరాటం ఆగటం లేదు . యెవరన్నా సంఘ సేవ చేస్తున్న వాళ్ళను చూస్తుంటే ఆరాధన. వాళ్ళు అంత కరెక్ట్ గా అవసరం వున్న వాళ్ళని యెలా కని పెడతారో,   ఆ అవసరం సమయానికి యెలా తీర్చ గలుగుతున్నారో అని గొప్ప ఆశ్చర్యం. అందుకే అలాంటి వాళ్ళను కలిసినప్పుడు తనకు తోచిందేదో ఇస్తూ వుంటుంది.

*********************

“యేంటి కాంతం?అలా కామెడీ షో చూస్తున్నదానిలా మొహం సీరియస్ తో కూడిన దిగులుతో పెట్టుకుని కూర్చున్నావు?”అడిగాడు కనకం లోపలికి వస్తూ.

తన మనసులో వున్న ఆలోచన తన దిగులు అన్నీ చెప్పింది.

“కాంతం! వాళ్ళు చూస్తున్న ప్రపంచం వాళ్ళకు మనుషుల్ని నమ్మక పోవడం నేర్పింది. సడన్ గా ఆటోలో కూర్చుని వెళ్తూ నీతో పాటు రమ్మంటే యెలా రాగలరు?నిన్నెలా నమ్మడం?అందుకే నీతో పాటు రారు. వాళ్ళల్లో నమ్మకం కలిగించాలంటే వాళ్లను కలుస్తుండాలి. నీ మీద వాళ్ళకు నమ్మకం యేర్పడాలి. నువు వాళ్ళకు యేదో చేస్తావు అన్న ఆశ వాళ్ళకి రావాలి. ఇవ్వన్నీ ఆ క్షణంలో యేర్పడవు. దానికి చాలా డెడికేటేడ్ గా వర్కవుట్స్ చెయ్యాలి. అవి మనలాంటి సామాన్యుల వల్ల కాదు. అందుకే. అవి చేసేవాళ్ళకు మన వంతు చేయూత మనం ఇవ్వగలిగితే అదే మనం దేశానికి చేసే సేవ. ” వివరంగా చెప్పాడు కనకం

అర్థమయినట్లుగా తల వూపింది కాంతం.

మరునాడు పొద్దున్న టిఫిన్ల కార్యక్రమం అయ్యాక  పెద్ద క్యారేజి పట్టుకొచ్చి “పదండి” అన్నది కాంతం.

“యెక్కడికే?” అడిగాడు కనకం.

“మీరేగా వాళ్ళల్లో నమ్మకం కలిగించాలన్నారు? అందుకే సిగ్నల్ దగ్గర పిల్లలకి వంట చేసి క్యారేజి సర్దాను. వాళ్ళకి పెట్టొద్దాము పదండి” హుషారుగా కదిలింది కాంతం.

తీసుకెళ్ళిన క్యారేజి అన్నం సరిపోక వాళ్ళందరు కాంతం మీద పడుతున్న సీను వూహించుకున్న కనకం కళ్ళు తిరిగి ఢామ్మని పడిపోయాడు.

 

****************

 

 

డే కేర్..

రచన: మణికుమారి గోవిందరాజుల

“ వర్ధనమ్మా డే కేర్” లోపలికి వస్తూ ఆ బోర్డుని ఆప్యాయంగా చూసుకుంది సరళ . వర్ధనమ్మ సరళ తల్లేమో అనుకుంటే పప్పులో కాలేసారన్నమాటే. . అత్తగారిని తల్చుకుని మనసులోనే దండం పెట్టుకుంది.
ఆ రోజు వర్ధనమ్మా డే కేర్ వార్శికోత్సవం. అందుకే డే కేర్ అంతా చాలా హడావుడిగా వుంది .
లోపలికి వెళ్ళి మధ్య హాలులో నిల్చుని చుట్టూ చూసింది. . అత్తగారు నవ్వుతూ చూస్తున్నట్లు అనిపించింది. చిన్నగా ఆఫీసు రూంలోకి వెళ్ళి కూర్చుంది.
మధ్యలో పెద్ద హాలు. హాలు నానుకుని లోపలి వరకు వరుసగా పది గదులు ఒక్కొక్క గదిలో ఇద్దరు పెద్దవాళ్ళు వుండడానికి చక్కటి యేర్పాట్లు. పరిశుభ్రమైన వాతావరణం. . ఇంతలో శైలి శారద లోపలికి వచ్చారు.
“ అమ్మా! యేమాలోచిస్తున్నావు?బామ్మ గుర్తొచ్చిందా? నాన్నా చూడు ప్రతి సంవత్సరం బామ్మ పోయిన రోజు అమ్మని వోదార్చేసరికి మాకు తల ప్రాణం తోకకి వస్తుంది. ” వాళ్ళకి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“మీకేమి తెలుసే మా ఇద్దరి అనుబంధం?ఇంతమంది పెద్దవాళ్ళు చల్లగా వుండమ్మా అని దీవిస్తున్నారంటే అది మీ బామ్మ వల్లే కదే?
“బాబోయ్! అమ్మా మొదలు పెట్టకు. పద పదబయట అందరూ యెదురు చూస్తున్నారు. మిగతా బ్రాంచెస్ నుండి రాగలిగిన వాళ్ళు వచ్చారు” తొందర చేశారు శారదా శైలి. ఇద్దరూ కూడా యెంత పని వున్నా ఈ రోజు మటుకు తప్పని సరిగా ఇంటికి వస్తారు.
బయట గార్డెన్ యాభైమంది హాయిగా కూర్చోవడానికి వీలుగా వుంది. కూతుళ్ళతో భర్తతో గార్డెన్ లోకి వచ్చేసరికి అందరూ వచ్చి కుర్చీల్లో కూర్చుని వున్నారు. అప్పటికే అల్లుళ్ళిద్దరూ యేర్పాట్లన్నీ చేసి వుంచారు. సరళ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళీ ప్రేమగా పలకరీంచి వచ్చి తను కూడా ఒక కుర్చీలొ కూర్చుంది.
శారద, శైలి, అల్లుళ్ళు దివాకర్, వేణు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెద్దవాళ్ళందరితో కొన్ని గేమ్స్ ఆడించారు. ఆ తర్వాత వడ్డనలు జరిగాయి. తినగలిగే వాళ్ళు తింటుండగా సొంతంగా తినలేని వాళ్ళకి కేర్ టేకర్స్ తినిపించారు.
వాళ్ళందరినీ చూస్తుంటే మనసు తృప్తిగా అనిపిస్తున్నది. . “ఈ యేర్పాటు వల్ల మేము అన్నీ యెంజాయ్ చేయగలుగుతున్నాము. మేము రిలాక్స్ అయి వచ్చాక మా పెద్దవాళ్ళని ఇంకా ప్రేమగా చూసుకోగలుగుతున్నాము” అని ఇక్కడ పెద్ద వాళ్ళని దింపిన వాళ్ళ పిల్లలు చెప్తుంటే తమ ఆనందం కోసం అత్తగారు పడిన తాపత్రయం గుర్తొచ్చింది.

****************

“ పిల్లలు యెటన్నా బయటికి వెళ్దాం అంటున్నారండీ” భర్త జనార్ధన్ కి బట్టలిస్తూ చెప్పింది సరళ.
”ఇవాళ కుదరదు మీటింగ్స్ వున్నాయి”. చొక్కా గుండీలు పెట్టుకుంటూ చెప్పాడు జనార్ధన్.
“ ఈ రోజు కాదు. వాళ్ళకు క్రిస్మస్ సెలవులిచ్చారు కద . యెటన్న వెళ్దాము అంటున్నారు. ”
“ బుద్దుందా పిల్లలకి?వాళ్ళకు లేకపోయినా నీ బుద్ధేమయింది అడిగినపుడు? మళ్ళీ నా దాక తెచ్చావు మాటర్ ని? అమ్మనొదిలి యెలా వెళ్తామనుకున్నారు?”
“అయ్యబాబోయ్ ! నేను చెప్పానండీ బాబూ…ఒక్కసారి నాన్నతో చెప్పు. . అన్నీ నువ్వే చెప్పేస్తావు అని వెంటపడ్డారు. సరే నాదేమి పోయింది?చెప్తే పోలా అని చెప్పానంతే. ఇక మీ తండ్రీకూతుళ్ల ఇష్టం. . . ”
“ కుదరదులే. అమ్మ నొదిలి వెళ్ళలేము కదా?పోనీ పిల్లలు నువు వెళ్ళి రాండి. అమ్మను నేను చూసుకుంటాను. ”
“మీరు లేకుండా మేమెక్కడికి? అంత అర్జెంట్ యేమీ లేదు. . మన పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళే. ”
అంతటితో ఆ సంభాషణకి పుల్ స్టాప్ పడింది. చాటు నుండి అంతా వింటున్న పిల్లలకి బోల్డు నిరాశ కలిగింది.
“చీ! నాన్న యెప్పుడూ ఇంతే. . యెక్కడికి వెళ్దామన్న వద్దంటారు. ” బామ్మంటే ప్రాణమైనా అందరూ వెళ్తారు తాము యెక్కడికీ వెళ్ళట్లేదని చిన్నది శైలి నిరాశగా అంది.
“మరి బామ్మని వదిలేసి యెలా వెళ్తాము? ఒక్కర్తీ యెలా వుండగలదు? అందుకే నాన్న వద్దంటున్నారు. పోనీలే మన సెలవులు ఇక్కడే యెంజాయ్ చేద్దాము. ”పెద్దరికంగా చెల్లెల్ని ఓదార్చింది శారద.
వాళ్ళ మాటలు వింటూ దగ్గరికి వెళ్తే యేమని ఓదార్చాలో తెలీక పిల్లల్ని తప్పించుకుని వంట ఇంట్లోకి వెళ్ళింది సరళ.
వర్ధనమ్మకి జనార్ధన్ ఒక్కడే కొడుకు. తల్లి అంటే జనార్ధన్ కి చాలా ప్రేమ గౌరవాలు వున్నాయి. జనార్ధన్ కి అయిదు సంవత్సరాలప్పుడు తండ్రి చనిపోతే తల్లి కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. పెద్దగా వెనక ఆస్తులు లేవు. చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచరు వుద్యోగం చేస్తూ కొడుకుని చదివించింది జనార్ధన్ కూడా తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్నవాడే. అందుకని బుద్దిగా డిగ్రీ వరకు చదువుకుని బ్యాంక్ పరీక్షలు రాసి ఆఫీసరుగా వుద్యోగం సంపాదించుకుని తల్లి చూపించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇద్దరు అమ్మాయిలకు తండ్రయ్యాడు. వర్ధనమ్మ పాతకాలం మనిషైనా భావాలు మటుకు ఆదర్శణీయం. ఇప్పటి అత్తగార్లలా ఆమెకి కొడుకు గురించిన అభద్రతా భావం యేమీ లేదు. కొడుకుని కొంగుకి కట్టేసుకుంటుందని కోడలు గురించిన అనుమానమూ లేదు.
పెళ్ళై ఇంటికొచ్చిన కోడలిని కూర్చో బెట్టుకుని ”అమ్మా! సరళా మనిద్దరం బాగుంటే వాడు సంతోషపడతాడు. వాడి సంతోషమే మన ఆనందం. కన్నవారినీ, తోడబుట్టిన వారినీ వదిలి వచ్చావు. భార్యాభర్తలు సర్దుకుని మసలడం యెంత అవసరమో అత్తా కోడళ్ళు కూడా సర్దుకోవడం అంత అవసరం. చాలా సమస్యలు మాట్లాడుకోవడం వల్ల పరిష్కారమవుతాయి. యే సమస్య వచ్చినా మన మధ్యే పరిష్కారం అవ్వాలి. నా వల్ల నీకు యే మాత్రం అసౌకర్యం కలిగినా నాకే చెప్పు. నేను అర్థం చేసుకుంటాను. అలాగే నీ వల్ల నాకు యేమన్న ఇబ్బంది అనిపిస్తే నీకే చెప్తాను అర్థం చేసుకో, ఆలోచించు. అంతే కాని నీ గురించి నేనెవరికో చెప్పి నా బాధ తీర్చుకుని వాళ్ళ దగ్గర సానుభూతి పొందడం నేను నా కొడుకుని అవమానించడమే. ఆనందంగా వుందాము కలిసి” అనునయంగా చెప్పింది. సరళకు చాలా సంతోషమనిపించింది.
“అలాగే అత్తయ్యా. . తప్పకుండా మీరన్నట్లే వుందాము.” అని మాట ఇవ్వడమే కాకుండా అలానే వుంది కూడాను.
వర్ధనమ్మ కూడా యే విధంగానూ కొడుకు కోడలు జీవితంలో ఇన్వాల్వ్ అయ్యేది కాదు. అడిగితేనే సలహా చెప్పేది. పెద్దది కాబట్టి తన మాటే నెగ్గాలనే ఆరాటం ఆమెకి లేదు. కరెక్టే అనిపిస్తే చిన్నదైనా కోడలి మాట వినేది. దాంతో అత్తగారంటే గౌరవం యెక్కువయ్యింది సరళకు. ఒక ఆరునెలలు గడిచేసరికి అత్తాకోడళ్ళా తల్లీ కూతుళ్ళా అనేట్లు అయ్యారు ఆ అత్తకోడళ్ళు. ఇంటి మహలక్ష్మిలా వచ్చిన కోడలితో ముందుగా మంచిగా వుండవలసింది అత్తగారు. ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అత్తగారుంటే కోడళ్ళు నెత్తిన పెట్టుకుంటరనే వాక్కుకి ఈ అత్త కోడళ్ళే వుదాహరణ.
కోడలిగా ఆ ఇంటికి సరళ వచ్చి పదిహేనేళ్ళు అయింది. ఇన్నేళ్ళు గడిచిన వాళ్ళు అప్పుడెలా వున్నారో ఇప్పుడూ అంతే. చిన్న యాక్సిడెంట్ లో నడుము విరిగి మంచాన చేరింది వర్ధనమ్మ. తల్లిలా చేరదీసిన అత్తగారికి తనే తల్లయింది సరళ. తన గురించి కోడలు యెక్కడికీ కదలకుండా అయిందని బాధపడుతుంది వర్ధనమ్మ.
వర్ధనమ్మ లేవలేదనే కాని చెవులూ కళ్ళూ బాగా పని చేస్తాయి. పక్క గదిలో మనవరాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఆవిడ విననే విన్నది.
“యేమయ్యా!ఒక్క కొడుకునిచ్చి హడావుడిగా యేదో పనున్నట్లు వెళ్ళావు. ఇంకా కొంతకాలం వుండి ఇంకోళ్ళని ఇవ్వొచ్చుగా?” యెదురుగా గోడమీదున్న మొగుడిని విసుక్కున్నది.
“శైలీ, శారదా! యేమి చేస్తున్నరమ్మా?”కేకేసింది మనవరాళ్ళని.
“వస్తున్నాము బామ్మా!” మాటతో పాటే ఇద్దరూ లోపలికి వచ్చారు. సెలవులు కాబట్టి ఇది వాళ్ళ ముగ్గురికీ ఆడుకునే టైము. రోజూ ఈ టైముకు బామ్మతో పచ్చీసో, అష్ట చెమ్మో లేదంటే పేకాటొ , అంతాక్ష్యరొ యేదో వొకటి బామ్మని కూర్చోబెట్టి ఆడుతారు మనవరాళ్ళిద్దరూ.
వస్తూనే ఇద్దరు చెరో వేపునుండి బామ్మ భుజాల కింద చేతులేసి నెమ్మదిగా పైకి లాగి కూర్చో బెట్టారు. ”మా బంగారాలే. . యెంత బాగా కూర్చోబెడుతున్నరో. ” పిల్లలిద్దరినీ ముద్దు చేసింది.
“బామ్మా! ఈ రోజు యేమి ఆడదాము?” పెద్దది అడిగింది.
“ ఈ రోజు అష్టా చెమ్మా ఆడదాము . . గ్యారంటీగా ఈ రోజు నేనే గెలుస్తాను. ”
“రోజూ యేదో మమ్మల్ని గెలవనిస్తున్నట్లు?”
“పోనీ లేవే చిన్నది” చిన్న మనవరాలిని వెనకేసుకొచ్చింది .
ఇంతలో భర్తని ఆఫీసుకు పంపి సరళ కూడా వచ్చింది ఆడుకోవడానికి.
ఒక అరగంట ఆరోగ్యకరమైన నవ్వులు పువ్వులై విరిసాయి.
చిన్న పిల్లలనుకుంటారు కాని పిల్లలు తల్లిని ఇతరులు యెలా గౌరవిస్తున్నరనేది చాలా బాగా గమనిస్తుంటారు. తల్లితో బామ్మ యెంత బాగా వుండేదీ. తల్లి బామ్మని యెంత బాగా గౌరవిస్తున్నదీ చూస్తుండ బట్టి పిల్లలు బామ్మతో యెంతో హాయిగా వుంటారు. పెద్దవాళ్ళ ప్రవర్తనే పిల్లలకి సంస్కారం నేర్పిస్తుంది. దానికి తోడు వర్ధనమ్మ పిల్లలతో యెంతో ప్రేమగా వుంటుంది. తానెప్పుడూ పిల్లల్ని కోప్పడదు. తల్లి కోప్పడితే అడ్డం పోదు. కాని సమయం వచ్చినప్పుడు తల్లి మాట యెందుకు వినాలో చాలా అనునయంగా చెప్తుంది. అందుకే పిల్లలకు బామ్మంటే ప్రాణం.
“అమ్మా! ఆకలేస్తున్నది. ” ఇద్దరూ ఒక్కసారి అడిగారు.
“అత్తయ్యా! కాసేపు నడుము వాల్చండి. శారదా బామ్మని పడుకోబెట్టండి. ఈ లోపు నేను అందరికీ కారప్పూస ఇక్కడికే తెస్తాను” చెప్పి లోపలికి వెళ్ళింది. సరళ. మళ్ళీ పిల్లలిద్దరూ బామ్మని జాగ్రత్తగా పడుకోబెట్టారు. ఈ లోపు సరళ అందరికీ కారప్పుస , మిఠాయి తెచ్చిపిల్లలిద్దరికీ చెరో ప్లేట్ ఇచ్చింది.
“అక్కకి యెక్కువ ఇచ్చావు. ” శైలి పేచీ మొదలు పెట్టింది.
“తింగరి బుచ్చీ. యేదో పేచీ పెట్టంది నీకు తోచదా?కావాలంటే డబ్బాలు తెచ్చి నీ దగ్గర పెడతాను. ప్రస్తుతం నోర్మూసుకుని తిను”
“నోర్మూసుకుని యెలా తింటారేం?”కిసుక్కున నవ్వింది శైలి.
మనవరాలి మాటలకు హాయిగా నవ్వుకుంది వర్ధనమ్మ.
“అత్తయ్యా మీరు కూడా తింటూ వుండండి నేను కాఫీ తెస్తాను. ”అత్తగారి చేతికి దగ్గరగా ప్లేట్ పెట్టింది సరళ.
“ఇప్పుడేమీ తినలేను కానీ కాస్త కాఫీ ఇవ్వు చాలు” వర్ధనమ్మకు నడుము పడిపోయిందే కాని మిగతా యే ప్రాబ్లమ్స్ లేవు. అయినా కాని ఆహారం విషయంలో చాలా మితంగా వుంటుంది.
వంట ఇంట్లోకి వెళ్ళి తనకి అత్తగారికి కాఫీ తెచ్చేలోగానే పిల్లలు తినేసి వాళ్ళ ఆటలకి వెళ్ళిపోయారు.
“టీవీ పెట్టనా అత్తయ్యా?” వర్ధనమ్మ నోట్లో కాఫీ పోస్తూ అడిగింది.
“వద్దులే కానీ సరళా నేనొకటి చెప్తాను విను. పిల్లలిద్దరూ సరదా పడుతున్నారు. నన్నెవరి దగ్గరన్నా వుంచి మీరొక్క నాలుగు రోజులు యెటన్నా వెళ్ళి రాండి”
“యెవరి దగ్గర వుంటారత్తయ్యా?” చిరునవ్వుతో అడిగింది
“నిజమేనే . . వెధవ జీవితం. . నేనూ ఒక్కదాన్నే. మీ మామగారూ ఒక్కరే. . నీ దురదృష్టం మీ ఆయనా ఒక్కడే. ఇప్పుడే మీ మామగారిని అరుస్తున్నా ఇంకోళ్ళని ఇవ్వకుండా యెందుకెళ్ళావని” నవ్వింది వర్ధనమ్మ. ఇద్దరున్నట్లయితే కాస్త నీకు వెసులుబాటు వుండేది” నిట్టూర్చింది. ”వెధవ ప్రాణం పోనన్నా పోదు. . వచ్చిన పని అయిపోయింది. ఇంకా యెందుకు చెప్పు?”
“అత్తయ్యా యెందుకు బాధపడతారు? యెన్నాళ్ళు వుంటామనేది మన చేతుల్లో లేదు కదా?మా వల్ల మీకేమన్నా బాధ కలుగుతున్నదా? తప్పని దానికి తల వంచాలని మీరే కదా చెప్పారు?ఇప్పుడు మన చేతుల్లో యేమీ లేదు. . వీలైనంతవరకు ఆనందంగా వుండడం తప్ప” మృదువుగా అత్తగారిని వోదార్చింది.
కోడలి ప్రేమకు కళ్ళు చెమర్చాయి . “సరళా ఒక్క నాలుగు రోజులు మీరెటన్నా వెళ్ళొస్తే నా ప్రాణం హాయిగా వుంటుందే. . నన్నెవరన్నా ఒక నాల్రోజులు వుంచుకుంటె బాగుండును. పిల్లలకు లాగే పెద్ద వాళ్ళకు కూడా డే కేర్ వుంటే బాగుండేది. ”
“డే కేర్ అంటే పొద్దున వెళ్ళి సాయంత్రం రావడం. . నాల్రోజులుండడం కాదు అత్తమ్మా” వెక్కిరించింది.
“నాకు తెలుసు లేవే. వాళ్ళే అవసరమైతే వుంచుకునేట్లన్నమాట. ” “ అయినా సరళా అలాంటిది నువ్వే ఒకటి మొదలు పెట్టొచ్చు కదే?”
“యేమి మాట్లాడుతున్నారు?అదంతా అయ్యే పని కాదు. చూద్దాం లేండి అత్తయ్యా! పడుకోండి. . ”
“పడుకోవడం కాదు. నిజంగానే చెప్తున్నాను. అలాంటిది ఒకటి స్టార్ట్ చేసావనుకో . . అప్పుడు నన్ను చూసుకోవడానికి వాళ్ళుంటారు కాబట్టి మీరు కావాలన్నప్పుడు యెటన్నా వెళ్ళొచ్చు”
ఒక్క పూట యెక్కడికన్నా వెళ్తే తనను వొంటరిగా వదిలి తిరగడానికి వెళ్ళిందని గోల గోల చేసే అత్తగార్లున్న ఈ రోజుల్లో తమని యెక్కడికైనా పంపి సంతోష పడాలనే అత్తగారి ఆరాటానికి మనసు ఆర్ద్రమయింది సరళకు.
“మీరు చెప్పేది వినటానికి బాగుంది అత్తయ్యా . ప్రాక్టికల్ గా చాలా కష్టం. . మీ అబ్బాయి కూడా వచ్చాకా ఆలోచిద్దాము లెండి”అప్పటికి సర్ది చెప్పి వంట చేయడానికి వెళ్ళింది

********************
వర్ధనమ్మ విషయాన్ని వదిలి పెట్టలేదు. సాయంత్రం కొడుకు రాగానే మళ్ళీ మొదలు పెట్టింది. జనార్ధన్ కూడా అదే అన్నాడు ప్రాక్టికల్ గా చాలా కష్టమని. కాని వర్ధనమ్మ చెప్తూనే వుంది. యెన్నడూ దేనికీ బలవంతం చేయని అత్తగారు ఇన్ని సార్లు చెప్తుంటే వినగా వినగా సరళకు కూడా అది చాలా మంచి ఆలోచన అనిపించింది.
“నిజమే! ఇలా యెంత కాలం వుండగలం?అత్తయ్య చెప్పినట్లు డే కేర్ స్టార్ట్ చేస్తే అత్తయ్యకీ కాలక్షేపం. వుద్యోగాలకి వెళ్ళాల్సొచ్చి పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టి వెళ్ళలేకా, వుద్యోగం మానలేకా అవస్థపడే వాళ్ళకి ఇది మంచి అవకాశం”భర్తని వొప్పించింది.
అత్తాకోడళ్ళిద్దరూ కలిసి చిన్న ప్రకటన తయారు చేశారు
“ దంపతులు వుద్యోగం చేస్తున్నారా?మీ పెద్ద వాళ్ళని ఇంట్లో వదిలి వెళ్ళలేని పరిస్థితా?ఇదిగో పరిష్కారం. “వర్ధనమ్మా డే కేర్” మీ పెద్దవాళ్ళని వుదయం మా చెంత వదలండి. సాయంకాలం మీతో తీసుకెళ్ళండి.”
“మీ దంపతులు పిల్లలతో విహార యాత్రలకి వెళ్ళాలనుకుంటున్నారా?ఇంట్లోని పెద్దవాళ్ళని మీతో తీసుకు వెళ్ళలేని పరిస్థితా?ఇదిగో పరిష్కారం”వర్ధనమ్మా డే కేర్”
వారం రోజుల వరకు మీ పెద్దవాళ్ళు మా సంరక్షణలో ప్రశాంతంగా వుంటారు. మీరు మీ యాత్రని ఆనందంగా పూర్తి చేసుకుని మీ వాళ్ళని ఇంకా ప్రేమగా చూసుకోండి. . ”
పెళ్ళికి వెళ్ళాలన్నా, యే ఫంక్షన్ కి వెళ్ళాలన్నా మీ వాళ్ళని భారంగా తలచకండి. ఆ భారం మాకొదిలి మీరు హాయిగా వుండండి”
దీన్ని వాట్సఅప్ ద్వారా ఫ్రెండ్స్ కి పంపి వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపమన్నారు. పిల్లలు కూడా వుత్సాహంగా తమ ఫ్రెండ్స్ కి వాట్సప్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి చూపించమన్నారు.
విచిత్రంగా అనూహ్య స్పందన వచ్చింది.
సొంత ఇల్లే కాబట్టి ముందున్న పెద్ద హాల్లో అరడజను మంచాలేసి పక్కన మందులు పెట్టుకోవడానికి వీలుగా చిన్న టేబుల్స్ యేర్పాటు చేసింది. ఆలోచన వర్ధనమ్మది. ఆచరణ సరళది. . మధ్య మధ్య అవసరమైన సలహాలు ఇస్తూ జనార్ధన్ కూడా బాగా యెంకరేజ్ చేసాడు. ఒక డాక్టర్ ని, ఒక లీగల్ ఆఫీసర్ ని నెల జీతం మీద మాట్లాడుకున్నారు. రిజిష్టర్ చేయించి ఒక శుభ ముహూర్తాన సెంటర్ ని ప్రారంభించారు. తను లేవలేదన్న సంగతి కూడా మర్చిపోయి వుత్సాహ పడిపోయింది వర్ధనమ్మ. మొదటి రోజు ఒక్కరే వచ్చారు. ఆ రోజు ఆవిడకీ , వర్ధనమ్మకీ కూడా బోలెడు టైం పాస్. నెల తిరిగేసరికి సంఖ్య అయిదుకి పెరిగింది. మంచి పనివాళ్ళు దొరకడం వల్ల అలసట అనిపించడం లేదు. . ఒక్కో రోజు యెవ్వరూ రారు ఒక్కో వారం వూపిరాడకుండా వుంటారు. అందుకని ఇద్దరు వంటవాళ్ళని కూడా పెట్టుకుంది. కొద్దిగా అలవాటయ్యి అంతా బాగుంది అనుకున్నాక వర్ధనమ్మ కొడుకు వెంటపడి అందర్నీ విహారయాత్రకి పంపింది.
వెళ్ళొచ్చిన మనవరాళ్ళ మొహాల్లో ఆనందం చూసాక బామ్మకి తృప్తిగా అనిపించింది. ఇద్దరూ పోటీ పడి విశేషాలు చెప్తుంటే సంతోషంగా విన్నది.
“సరళా నేననుకున్నది నెరవేరిందే. నా మనవరాళ్ళ సంతోషం చూడలేనేమో అనుకున్నాను. యెందుకీ జీవితం అని బెంగ పడ్డాను. ఇక పర్వాలేదే. ”
చిన్నపిల్లలా తానే వెళ్ళొచ్చినంతగా సంబరపడ్డారు. అత్తగారి సంతోషం చూసి తాను కూడా హ్యాపీగా ఫీలయింది సరళ.
తన కళ్ళ ముందే సెంటరు దిన దినాభి వృద్ది చెందడం చూసి ఆ తర్వాత అయిదు సంవత్సరాలకి హాయిగా దాటిపోయింది వర్ధనం.
“మనం మనుషులం. యెన్నో కోరికలుంటాయి. పిల్లకు యెన్నో ఆశలుంటాయి. పెద్దవాళ్ళ వల్ల అవి తీరడం లేదంటే ఆ పెద్దవాళ్ళు యెప్పుడు పోతారా అని యెదురుచూసే సందర్భం వస్తుంది . అలా కాకుండా చిన్న చిన్న సరదాలు తీరుతుంటే మనసు తృప్తిగా వుంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళమీద ప్రేమ పెంచుకుంటారు. ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళను వదిలించుకోవడం లేదు. కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నారు. అంతే. రెట్టింపు వుత్సాహంతో , ప్రేమతో తమ వాళ్ళని చూసుకుంటున్నామని వారు చెప్తున్నారు కూడాను” వృద్దాశ్రమాలు రావడం ఒక దౌర్భాగ్యం కదా అని ఒకరడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేది వర్ధనమ్మ…. .

శ్రమజీవన సౌందర్యం

రచన: మణికుమారి గోవిందరాజుల

“ప్రతి ఒక్కళ్ళూ కూడా తమ స్వార్ధం తాము చూసుకోకుండా కాస్త అందరికీ సహాయపడటం అలవాటు చేసుకోవాలి. ఒక వెయ్యి సంపాయించామంటే కనీసం ఒక్క రూపాయన్న యెవరి సహాయనికైనా ఇవ్వగలగాలి. యెన్నాళ్ళుంటామో తెలియని ఈ జీవితంలో మనం పోయాక కూడా మనల్ని జీవింపచేసేది అలా చేసిన సాయమే. సహాయం పొందిన వాళ్ళు మనని తల్చుకుంటే వాళ్ళ మనసుల్లో మనం జీవించి వున్నట్లే కదా?అదన్నమాట. నా వరకు నేనైతే యెవరికే సహాయం కావాలన్నా ముందుంటాను. అలా అని డప్పు కొట్టుకుంటున్నా అనుకునేరు. నాకు అస్సలు ప్రచారం ఇష్టం వుండదు. నేను నా ప్రతి పుట్టిన రోజుకు తప్పని సరిగా అన్నదానం చేస్తాను. యెప్పుడన్నా చెప్పానూ నీకు?అంతెందుకు?మొన్నటికి మొన్న పక్కవూరి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు వర్షాకాలం వస్తున్నదని గొడుగులు రెయిన్ కోట్లు పంచి వచ్చాను. నీతో చెప్పానూ నేను. ?చెప్పా కదా నా కసలు ప్రచారం ఇష్టం వుండదని?” శాంతకుమార్ వాక్ప్రవాహం అలా సాగిపోతూనే వుంది.
వింటున్న కృష్ణమోహన్ ప్రణతిలకు చాలా బోరింగ్ గా వుంది. కాని ఇంటికొచ్చిన వాడిని నొప్పించడం ఇష్టం లేక మొహం మీద నవ్వు పులుముకుని వింటున్నారు. వీళ్ళు వింటున్నారు కదా అని శాంతకుమార్ విజృంభిస్తున్నాడు. అదే సమయంలో దేవుడిలా వచ్చాడు పాలవాడు బిల్లుకోసం.”హమ్మయ్య”అనుకుని లేచి వెళ్ళిపోయింది ప్రణతి
“ఇప్పుడే వస్తాను” తను కూడా యేదో పనున్నట్లుగా వెళ్ళాడు వెనకే వెళ్ళాడు కృష్ణమోహన్.
శాంతకుమార్ మనిషి మంచివాడే కాని ఒకటి చేస్తే పది చెప్పుకునే రకం. వీళ్ళ ఫ్లాట్స్ లోకి కొత్తగా వచ్చి వీళ్ళకు తగులుకున్నాడు. యెవరినీ నొప్పించలేని ఆ దంపతులు అతన్ని యెవాయిడ్ చేయలేకపోతున్నారు.
“మీతో ఒక విషయం చెప్పడానికే వచ్చాను. తొందరేమీ లేదు.”టీ పాయ్ మీద వున్న పేపర్ అందుకుంటూ చెప్పాడు శాంతకుమార్.
“హతోస్మి అనుకుని పాలవాణ్ణి పంపించి శాంతకుమార్ కి మళ్ళీ కాఫీ కలుపుకుని వచ్చింది ప్రణతి.
“యెంతైనా నీ కాఫీ తర్వాతే యెవరి కాఫీ అయినా . అధ్భుతహః” కాఫీని యెంజాయ్ చేస్తూ చెప్పసాగాడు.
“సంగతేంటంటే మొన్నటి వర్షాలకు వరంగల్ జిల్లాలోని ఒక కుగ్రామంలో రైతులకు తీవ్ర పంట నష్టం జరిగింది. చాలామంది రోజూ ఆహారం కోసం కూడా కష్ట పడుతున్నారు. పూరిళ్ళు కూడా చాలా వరకు కూలిపోయాయట. మీకు తెలుసు కదా యెవరికైన యేదైనా అవసరం అంటే నేను ముందుంటానని?(బాబోయ్! మళ్ళీ మొదలు పెట్టాడు”మనసులో భయపడ్డారు ఇద్దరూ)అయితే ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. అందుకని నేను కూడా ఒక ఆర్గనైజేషన్ తరపున వర్క్ చేస్తున్నాను. అందులో భాగంగా నా వంతుగా కొంత సొమ్ము కలెక్ట్ చేసి పంపాలి అని నిర్ణయించారు. మీరు కూడా మీ కంట్రిబ్యూషన్ ఇస్తే చాలా సంతోషిస్తాను. బహు సంతాన కుటుంబీకులు మీరు. మిమ్మల్ని అడగటం భావ్యం కాదని తెలిసినా మళ్ళీ చెప్పలేదంటారేమోనని చెప్తున్నాను. మీరు యెక్కువగా యేమీ ఇవ్వల్సిన పని లేదు. యెంత ఇచ్చినా పర్లేదు.”వుదారత చూపాడు
“యే వూరు?” అడిగాడు కృష్ణమోహన్.
చెప్పాడు శాంతకుమార్.
ఆశ్చర్యపోయాడు కృష్ణమోహన్ ఆ వూరి పేరు వినగానే.
“ఆ వూరా?అక్కడ అంత ఇబ్బందులేమీ వున్నట్లు లేవే?”
“మీకు ఇల్లు ఆఫీస్ తప్ప యేమీ పట్టదాయే. మీకెలా తెలుస్తుంది?”
“మీరెళ్ళి చూసారా?”
“నేనూ వెళ్ళలేదు. కాని నాకు అన్ని వేపులనుండి సమాచారం అందుతుంది. ఒక్కసారే వాళ్ళకు సహాయం చేయగలిగినప్పుడే వెళ్తే బాగుంటుంది కదా అని ముందు కలెక్షన్స్ మొదలుపెట్టాను. యేదైనా చెప్పడం కంటే చేయడం మంచిది కదా?నేనసలే చేతల మనిషిని.”అతిశయంగా అన్నాడు శాంతకుమార్.
మౌనంగా లోపలకు వెళ్ళి వెయ్యి రూపాయలు తెచ్చిచ్చాడు మోహన్.
“మోహన్ వెయ్యి అవసరం లేదు. మళ్ళీ ఇబ్బంది పడతావు. అయిదువందలు చాలు.”
“ పర్లేదులే. వుండనివ్వు.”అన్యమనస్కంగా చెప్పాడు మోహన్.
“సరే మరి వస్తాను. ఒకటి రెండు రోజుల్లో ఇది ముగించుకుని వీలైనంత తొందరలో అక్కడికి వెళ్తాను. వస్తానంటే నిన్ను కూడా తీసుకెళ్తాను.”
“సరే!” తల వూపాడు మోహన్.
*****************************
కృష్ణమోహన్ ప్రణతిలది అన్యోన్య దాంపత్యం. ఆ ఫ్లాట్స్ లో గత రెండు సంవత్సరాలుగా వుంటున్నారు. ఘట్కేసర్ దగ్గరలో ఇండిపెండెంట్ ఇల్లు తయారవుతున్నది. ఇప్పుడున్న వాళ్ళ ఇల్లు మధ్య తరగతి ఇల్లులా వుంటుంది. కానీ ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఒక రకమైన ప్రశాంతత ఆవరించి దేవాలయంలోకి వచ్చామా అన్న భావన కలుగుతుంది ప్రతి ఒక్కరికి. పిల్లలు కూడా అందరూ బుద్దిమంతులు. ఈ రోజుల్లో వుండే వెర్రి వేషాలు యెవరిలోనూ కనపడవు. కానీ చదువులో మటుకు ముందుంటారు. వాళ్ళ ఇంట్లో యెప్పుడూ కూడా తలి దండ్రులకు పిల్లలకు మధ్య ఒక ఆహ్లాదకర వాతావరణం నెలకొని వుంటుంది. ఇద్దరు కలిసి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు. ఇద్దరూ యెంత బిజీగా వున్నా పిల్లలతో గడపటానికి యే బిజీ అడ్డు రాదు. చక్కటి క్వాలిటీ టైం గడుపుతారు పిల్లలతో. అంత కంపెనీ వున్నా పిల్లలు యెక్కువ కాబట్టి సాధారణ జీవితం గడుపుతున్నాడని అందరూ అనుకుంటారు. అందుకే అతనికి ఇంకో పేరుంది కుటుంబరావు అని. ఈ రోజుల్లో కూడా అయిదుగురు పిల్లల్ని అదీ ఆడపిల్లల్ని కంటారా యెవరన్నా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు వాళ్ళను చూసి. యెవరేమన్నా ఆ దంపతులు పట్టించుకోరు మా పిల్లలే మా సౌభాగ్యం అనుకుంటారు.
**************************
శాంతకుమార్ వెళ్ళిపోయాక కొంతతడవు ఆలోచిస్తూ వుండిపోయాడు కృష్ణమోహన్. తరువాత యేదో నిశ్చయానికి వచ్చినట్లుగా”ప్రణతీ ! వూరెళ్దాం వస్తావా?”అడిగాడు వంటింటి దగ్గరగా వెళ్ళి.
“అర్జెంటుగా ఇప్పుడేమిటి?”ఆశ్చర్యపోయింది ప్రణతి.
“ఒకసారి వెళ్ళి చూడాలనిపిస్తున్నది . యేమంటావ్?”
“ఒక్క అరగంట టైం ఇవ్వు మోహన్ . వంట చెసిపెట్టేసి వస్తాను. పిల్లలు ఆకలికి ఆగలేరు.”
“సరే” అని చెప్పి హాల్లోకి వెళ్ళిపోయాడు మోహన్
అన్నట్లుగానే అరగంటలో టేబుల్ మీద అన్నీ సర్దేసి డ్రెస్ మార్చుకుని వచ్చింది ప్రణతి.
“మనీషా! మేము రాత్రికల్లా వచ్చేస్తాము. జాగ్రత్త. తలుపులేసుకుని ఇంట్లోనే వుండండి.”చెప్పి బయలుదేరారు ఇద్దరూ.
***********************
కారు వూళ్ళో ప్రవేశించగానే దిగి ఆ మట్టిని తాకి పరవశించిపోయాడు.
వుద్యోగరీత్యా హైదరాబాదులో వున్నా అతని మసెప్పుడూ ఆ వూరి చుట్టూతానే తిరుగుతూ వుంటుంది. జననీ జన్మభూమి కదా. .
వస్తూనే మొదలు ఆ వూరికి పెద్దదిక్కుగ వున్న కృష్ణమోహన్ బాబాయి శంకరయ్య దగ్గరికి వెళ్ళారు ఇద్దరూ. దారిపొడుగూతా వీళ్ళ కారును చూసి గుర్తుపట్టి అందరూ నమస్కారాలు చేసి పలకరిస్తూనే వున్నారు.
“అయ్యో! నాకు కబురన్నా చేయలేదేమిటి?”వీళ్లను చూస్తూనే యెదురొస్తూ అడిగాడు శంకరయ్య.
“ అందరినీ ఒకసారి చూడాలనిపించింది. అప్పటికప్పుడు అనుకుని వచ్చేసాం బాబాయ్! ముందు చెప్తే ఇంకేమన్నా వుందా?”నవ్వుతూ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.
“యేదో వాళ్ళ అభిమానం లేరా? వద్దనకూడదు మరి.”
అప్పటికే శంకరయ్యతో మాట్లాడడానికి వచ్చి అక్కడ కూర్చున్న వారందరూ కూడా వీరిని చూసి వినయంగా లేచి నిలబడ్డారు.
“బాబాయ్! గ్రామంలో పరిస్థితి యెలా వుంది?మొన్నటి వర్షాలకు యెవరన్నా ఇబ్బంది పడ్డారా?ఒక వేళ అలాంటి పరిస్థితే వుంటే నాకెందుకు తెలియ చేయలేదు?మన ట్రస్ట్ లో ఫండ్స్ తక్కువయ్యాయా?”ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు కృష్ణమోహన్.
“అరే ! వుండరా బాబు. ఇప్పుడే వర్షాలు తగ్గాయనుకుంటే నువ్వలా ప్రశ్నల వర్షం కురిపిస్తే యెలా?నువ్వెందుకు అడుగుతున్నావో కాని, ఇక్కడ అందరూ బాగున్నారు. మొన్నటి వర్షాలకు కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా వీళ్ళు వీళ్ళే సర్దుబాటు చేసుకుని విషయాన్ని నీ దాకా రానివ్వద్దన్నారు. రోడ్లు కొంత పాడైనా యువకులు కొంతమంది స్వచ్ఛందంగా బాగుచేసుకున్నారు. అయినా ప్రతి గ్రామానికి నీలాంటి వాడొక్కడుంటే చాలు రాష్ట్రం అన్నపూర్ణ పేరును సొంతం చేసుకుంటుంది.”
పరిస్తితి తాను విన్నట్లుగా లేనందుకు మనసులోని కలత తీరింది.”ఒక్కసారి అందరినీ కలిసి మేము బయలుదేరుతాము.”
“భోజనాల వేళ. స్వయంగా ఆది దంపతులే మా ఇంటికి వచ్చారు మరి . యెలా వదుల్తాము? యేమోయ్. . వడ్డించు మరి”లోపలికి చూస్తూ కేకేసాడు
***********************************************************************************
వూళ్ళో అందరినీ పలకరించుకుంటూ నెమ్మదిగా వెళ్ళసాగారు ఇద్దరూ. ఆ వూరిని చూస్తున్న కొద్దీ మనసంతా తృప్తితో నిండి పోతున్నది. పరిశుభ్రమైన రోడ్లు. యెక్కడా కూడా మురికి అన్నదే కనపడటం లేదు. ఓపెన్ డ్రైనేజ్ సిస్టం ఐనా చక్కగా పారేలా చేసిన యేర్పాట్లు. పిల్లలు ఆడుకోవడానికి అక్కడక్కడ చిన్న చిన్న పార్కులు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు చల్లటి నీడనిస్తున్నవి. చిన్నప్పుడు చదివిన చందమామ కథలోని వూరిలా వుంది. అలా నడుస్తూ అందరినీ పలకరించుకుంటూ కాలనీకి చేరారు ఇద్దరూ.
కాలనీ మొదట్లోనె ఆర్చీ మీద రాసిన”శ్రమ జీవన సౌందర్యానికి స్వాగతం” అన్న అక్షరాలు సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. వీరిని చూస్తూనే అందరూ తమ తమ పనులను ఆపేసి ఆనందంతో యెదురు వచ్చారు. వాళ్ళ పనులకు ఆటంకం కలిగించకూడదనుకుని అక్కడి నుండి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. కృష్ణమోహన్ కి ఆ వూరిని చూసిన ప్రతిసారీ తన అన్ని సంవత్సరాల శ్రమఫలితం పుష్పించి విరగబూసి సుగంధాలు వెదజల్లుతున్నట్లుగా వుంటుంది.
నెలరోజులు గడిచిపోయాయి. మధ్య మధ్య వచ్చి వెళుతూనే వున్నాడు శాంతకుమార్. కానీ వూరెళ్ళే విషయం యేమీ యెత్తటం లేదు. అతన్ని టీజ్ చేయటానికి యెప్పుడెళ్దాం అంటున్నాడు కృష్ణమోహన్. యేదో చెప్పి తప్పించుకుంటున్నాడు శాంతకుమార్.
ఆరోజు ఆదివారం . యెప్పటిలాగే వచ్చి కాఫీ తాగుతూ ఛానెల్స్ మారుస్తున్నాడు శాంతకుమార్. సడన్ గా ఒక ఛానెల్లో మోహన్ ఫొటొ ప్రత్యక్షమైంది.”యేయ్! మోహన్! ఇదేంటి నీ ఫొటో టీవీలో వస్తున్నది చూద్దువు గాని రా”అని అప్పుడే లోపలికి వెళ్ళిన మోహన్ని కేకేసాడు. అదివిని పిల్లలు ప్రణతి అందరూ హాల్లోకి వచ్చారు. స్క్రీన్ మీద”శ్రమ జీవన సౌందర్యానికి స్వాగతం” అని రాసి వున్న ఆర్చ్ కనబడుతున్నది. చిన్నగా కాలనీ లోకి వెళుతున్నది కెమేరా.
“మా ఛానెల్ వాళ్ళం ఒక కొత్త వొరవడికి శ్రీకారం చుడుతూ ప్రజలకోసం శ్రమించి ప్రజల హృదయాల్లో నివాసం యేర్పరుచుకున్న వ్యక్తికి అవార్డ్ ఇవ్వదలిచాము. అందులో భాగంగా గత కొంత కాలంగా మా విలేకరి ఈ ప్రాంతాల్లో పర్యటించి తెలుసుకున్న వివరాల ప్రకారం ఇక్కడ అందరూ ముక్తకంఠంతో చెబుతున్న ఒకే ఒక్క పేరు కృష్ణమోహన్. ఈ కాలనీ ఇంత ఆరోగ్యంగా ఆనందంగా కళకళ్ళాడుతూ వుండడానికి, తాము పిల్లా పాపల్తో సుఖంగా వుండడానికి కృష్ణమోహన్ సారే కారణమని వారందరూ చెబుతున్నారు. ఈ కాలనీయే కాదు ఈ వూరి మొత్తాన్ని పరిశీలిస్తే మనం యే విదేశాల్లోనో వున్న అనుభూతి కలుగుతుంది. అంత సిస్టమేటిక్ గా అంత హాయిగా వున్నదీ గ్రామం. ఇంతకీ ఈ కృష్ణమోహన్ అన్న వ్యక్తి యెవరసలు?వివరాల్లోకి వెళితే…”చెప్పుకుంటూ పోతున్నది మైక్ పట్టుకున్న అమ్మాయి. చిన్నగా తల పక్కకి తిప్పి చూసాడు శాంతకుమార్. తలిదండ్రులిద్దర్నీ కావిటేసుకున్నట్లుగా పట్టుకుని వారిని కమ్ముకుని కూర్చున్నారు పిల్లలు. అందరి మొహాలు ప్రశాంతతతో వెలిగిపోతున్నాయి. తమ ఇల్లు గుర్తొచ్చింది. పొద్దున్న లేస్తూనే అరుపులు కేకలతో మొదలవుతుంది.
“ఇది అంతా ఒక్కరోజు కృషి కాదనీ తామందరినీ ఈ విధంగా తీర్చి దిద్దటానికి ఆయన చాలా శ్రమపడ్డారని, మొదట్లో తామసలు ఆయన మాట వినేవారం కాదనీ, బతిమాలి బెదిరించీ, అన్నపానాలు మానేసి తనమాట వినేట్లు చేసుకున్నారనీ వారు చెబుతున్నారు.
మొదటి నుండీ తమది చెప్పులు కుట్టే వృత్తి కాబట్టి తమచేత చెప్పుల పరిశ్రమ ఓపెన్ చేయించారని, తమ ఆడవారి చేత చిన్న చిన్న వస్తువులు తయారు చేయించి వాటిని మార్కెటింగ్ చేయించే మెళకువలు నేర్పించారని అన్నిటికంటే ముఖ్యంగా వంద శాతం అక్షరాస్యత తమ సొంతమని వారు గర్వంగా చెబుతున్నారు. మమ్మల్ని ఇంత తీర్చి దిద్దిన సారు మా వాడని చెప్పుకోవడాని మేము గర్విస్తున్నామని వారు చెప్పారు. గోరంత చేసి కొండంత చెప్పుకునే ఈ కాలంలో కొండంత చేసినా కూడా గోరంత చెప్పుకోవడానికి ఇష్టపడని వారున్నారంటే నమ్మలేము. కాని నమ్మక తప్పదు. మా ఛానెల్ నుండి ప్రప్రధమంగా “వుత్తమపౌరుడు” అవార్డుకి మిష్టర్ కృష్ణమోహన్ పేరు ప్రకటించటాన్ని మేమందరమూ యెంతో హర్షిస్తున్నాము.” మాట్లాడుకుంటూ పోతున్నది ఆ అమ్మయి.
ఆ మాటలు తనకు గుచ్చుకున్నట్లుగా అయ్యాయి శాంతకుమార్ కి.”యేంటి మోహన్ ఇదంతా?” మూగవోయిన గొంతు పెకలించుకుని అడగ్గలిగాడు. మోహన్ యేదో చెప్పబోయే లోగానె
ఆ వార్త చూసినట్లున్నారు ఫ్లాట్స్ లోని వాళ్ళంతా బిల బిల మంటూ వచ్చేసారు అభినందనలు తెలుపుతూ.
అందరూ కూడా పట్టు బట్టారు ఆ వూరి విశేషాలు చెప్పాలనీ, అక్కడికి తీసుకెళ్ళాలనీ.
“సరే లంచ్ అయ్యాక బయల్దేరుదాము. ఒక్కమాట చాలా మందికి కార్లున్నాయి కాబట్టి అందరూ కార్లు తీయండి. పట్టినంతవరకు వెళ్ళిపోదాం”చెప్పాడు కృష్ణమోహన్. సంతోషంగా వొప్పుకున్నారు అందరూ.
*********************************************************************************
వాహనాలన్నీ స్పీడ్ గా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆగాయి. అప్పటికే విషయం తెల్సిన కాలనీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ రాత్రి భొజనాల యేర్పాట్లు చేసి వుంచారు. రాత్రి యెనిమిది గంటలయింది. వెన్నెల పుచ్చపువ్వులా విరగబూస్తున్నది. అందరికీ కాలనీలో వున్న ఖాళీ స్థలంలో మంచాలు, కుర్చీలు, చాపలుయెలా వీలైతే అలా వేసి వుంచారు. అక్కడ చేస్తున్న మూన్ లయిట్ డిన్నర్ అందరికీ యెంతో నచ్చింది. ఒకళ్ళిద్దరు టీవీ ఛానెళ్ళ వాళ్ళు కూడా వచ్చారు.
“వూరు యెంతో అందంగా వుంది. ఇదంతా చేయటానికి మీరు పడ్డ శ్రమ, వేసిన పథకాలు చెప్పండి” అందరూ కృష్ణమోహన్ని డిమాండ్ చేసారు.
“చెప్పటానికి యేమీ లేదు. నాకు చిన్నతనం నుండీ కూడా ఈ ఆర్ధిక అసమానతలు అర్థమయ్యేవి కాదు. యెందుకిలా అనుకునేవాణ్ణి. అందుకే నాకు చేతనైంది చేశాను. అయితే ఒక్కటి. యెవరికైనా ఒకరోజు అన్నం పెడితే సరిపోదు. ఆ అన్నం సంపాయించుకునే మార్గం తెలియచేయాలి అనేదాన్ని నేను నమ్ముతాను. అదే వీరందరూ కూడా నేర్చుకున్నారు.” సింపుల్ గా తేల్చేసాడు.
అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఇంతలో కాలనీ వాసుల్లోని ఒక పెద్దాయన లేచి”మా శంకరయ్య సార్ ని చెప్పమనండి. మీకు అన్నీ సక్కంగ తెలుస్తాయి” అని చెప్పాడు.
అందరూ శంకరయ్యను చుట్టుముట్టారు.
“మాకు యెన్ని సార్లు చెప్పుకున్నా తనివి తీరదు. అవడానికి కృష్ణమోహన్ మా అన్నకొడుకే అయినా నాకు గురువుగారు. ఇప్పుడు మనం వున్న ఈ ప్రదేశమంతా వీరి పూర్వీకులదే. ఒట్టి బంజరు భూమి. చిన్నతనంలో వీరందరితో తిరుగుతున్నారని వీరి తల్లితండ్రులు కృష్ణమోహన్ ని చదువులకు విదేశాలకు పంపేసారు. కాని యెప్పుడు సెలవులకు ఇంటికొచ్చినా వూరంతా చుట్టొస్తుండేవారు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న మోహన్ కి ఇక్కడి పరిస్తితులు చాలా బాధ కలిగించాయి.”
అక్కడినుండి శంకరయ్య చెబుతున్నట్లుగా కాకుండా గతంలోకి వెళ్ళి తాము చూస్తున్నట్లుగా అనుభూతి చెందసాగారు శ్రోతలు.
“వూళ్ళో వున్న పరిస్తితులు చూసి నాకెందుకు అనుకోలేకపోయాడు కృష్ణమోహన్. అదే సమయంలో వూళ్ళో స్థలాలను ఆక్రమించారని కింద తరగతి వాళ్ళని వెళ్ళగొట్టారు వూళ్ళోని పెద్దవాళ్ళు. తండ్రితో పోట్లాడి బంజరు భూమిలో వాళ్ళకు నివాసాలు యేర్పాటు చేసాడు. కాని ఒకసారి వెళ్ళి చూసేసరికి అపరిశుభ్రత ఆకలి వాళ్ళను ఆక్రమించుకుని వున్నాయి. ఇంట్లో వున్న వెండి బంగారాలు అమ్మి వాళ్ళ ఆకలి తాత్కాలికంగా తీర్చినా ఇలా యెన్నాళ్ళు అన్న ప్రశ్న అతన్ని వేధించసాగింది. ఒక రోజు అందర్నీ కూర్చో బెట్టుకుని చెప్పాడు
“మీ అందరినీ నేనొక్కడిని యెంతోకాలం పోషించలేను. కాని మీ అంతట మీరు హాయిగా బ్రతికే యేర్పాటు నేను చేస్తాను. అందుకు మీరు మీకు సహకరించుకోవాలి. ఒక ఆరునెలలు చూస్తాను. యెంతో కొంత ప్రగతి కనపడాలి. లేదంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను”బెదిరించాడు.
కాని నిరక్షరాస్యత, బద్దకం, సోమరితనం ఆక్రమించుకుని వున్న వాళ్ళు తిండికి వచ్చేవాళ్ళు కాని పనికి పారిపోయేవాళ్ళు. బెత్తం పట్టుకుని వాళ్ళ వెనకాల పడి వాళ్ళను ఒక దారిలో పెట్టడానికి చాలాకాలం పట్టింది. ఒకసారి మాటవినడం మొదలయ్యాక ఇక వెనక్కి చూసుకోలేదు. వీరందరూ కూడా తమకోసం సారు పడుతున్న శ్రమను గుర్తించారు. ఆయన వెళ్ళిపోతే ఇక తమ గురించి పట్టించుకునే వారు వుండరన్న సత్యం గ్రహించారు. ప్రతి వాళ్ళలోను యేదో ఒక ప్రతిభ దాగి వుంటుంది. తమలోని ఆ ప్రతిభను వారు గుర్తించేట్లుగా చేసాడు మోహన్. తర్వాత మోహన్ గ్రామంలోని యువకులను కూడగట్టుకుని పరిసరాల పరిశుభ్రత, చెట్లు నాటడం మీద అవగాహన కల్పించాడు. చిన్నపిల్లలకు చదువు నేర్పే బాధ్యత ఆ యువకులకు అప్పగించాడు. మొదలు గ్రామం లోని పెద్దవాళ్ళు తమ పిల్లలను పాడు చేస్తున్నాడని ఆగ్రహించినా జరుగుతున్న అభివృద్దిని చూసి తాము కూడా గ్రామాభివృద్దిలో భాగస్వాములయ్యారు.
బంజరు భూమిలో పంటలు పండవు కాబట్టి చెప్పులు కుట్టే వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ముడిసరుకుని వాళ్ళకు అందచేసి కుటీర పరిశ్రమలు పెట్టించి ఆదాయం యేర్పాటు చేసాడు. ప్రభుత్వం చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి మంచినీటి పథకానికి శాశ్వత రూపకల్పన చేసాడు.”
“ ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా సులభంగా వున్నాయి. కాని యెన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలుసు. వీరి దిగులుతోనే తలిదండ్రులు దాటిపోయారు. అప్పుడే ప్రణతి వీరి భావాల పట్ల ఆకర్శితురాలై కావాలని కోరి పెళ్ళి చేసుకుంది. తమకు పిల్లలు వద్దనుకుని రకరకాల ప్రమాదాల్లో అనాధలైన ఆ పిల్లలను దత్తత చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళది ఒక్కో గాధ. దారానికి కట్టిన పూవుల వలె ఒక్క చోట చేరి దేవుని మెళ్ళోని మాలలయ్యారు. ఇప్పుడు ఇక్కడ వీరంతా స్వయం సమృద్దిని సాధించారు. అందుకే వారు ధైర్యంగా పిల్లల చదువులకోసం హైద్రాబాద్ వెళ్ళిపోయారు. అయినా కూడా వారి ఆదాయం లో ఇరవై శాతం ఇక్కడి ట్రస్ట్ కి పంపుతారు . మేమందరమూ కూడా మా ఆదాయం లోఇరవై శాతం ట్రస్ట్ కి ఇస్తాము. యే బ్యాంకుల నుండి మేము లోన్ తీసుకోము. యెవరికి పెట్టుబడి కావాల్సినా అందులోనుండి తీసుకుని మళ్ళీ తీర్చేయాలి. తెలుసా ఇప్పుడు మా వుత్పత్తులు మేము వేరే దేశాలకు యెగుమతి చేస్తున్నాము కూడా. ఇక గ్రామ పరిశుభ్రత గురించి చెప్పాలంటే దాని ఆవశ్యకతను గ్రామ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆచరిస్తున్నారు. ముఖ్యంగా శ్రమించడంలోనే అందం , ఆనందం వున్నదని మేము తెలుసుకున్నాము.”
ఒక మంచి సినిమా చూస్తున్నట్లుగా నిశ్శబ్దంగా వింటూ వుండి పోయారు అందరూ. చెప్పడం ఆపగానే కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి.
“నన్ను క్షమించు మోహన్…నేను చెప్పేవాడిని అయితే నువు చేతల వాడివి”అభినందించాడు శాంతకుమార్ మోహన్ ని.
ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు మోహన్.
మనసంతా విశాలమవుతుండగా కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలని వువ్విళ్ళూరుతూ తిరుగు ప్రయాణం అయ్యారు అందరూ. .

*****