చిన్న చిన్నవే కానీ….

రచన: మణి గోవిందరాజుల

“యెన్నిసార్లు చెప్పాలి ఆ సెంట్ కొట్టుకోవద్దని? నాకస్సలు నచ్చదని నీకు తెలుసుకదా?” విసుక్కున్నాడు శేఖరం.
వుత్సాహంగా బయల్దేరబోతున్న సంధ్య మొహం చిన్నబోయింది.
నిజమే శేఖర్ చెప్తుంటాడు తనకు సెంట్ వాసన నచ్చదని, కాని మొదటినుండీ . తనకేమొ చక్కగా తయరయ్యి కొద్దిగా పెర్ఫ్యుం స్ప్రే చేసుకోవడం ఇష్టం. ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని. అందుకని చాలా లయిట్ గా స్ప్రే చేసుకుంది. అయినా పట్టేసాడు.
మౌనంగా లోపలికి వెళ్ళబోయింది చీర మార్చుకోవడానికి.
“ఇప్పుడు మళ్ళీ సింగారాలు మొదలెట్టావంటే ఇక మనం ఫంక్షన్ కి వెళ్ళినట్లే. పద పద టైం అవుతుంది. ” మళ్ళీ సెటైర్ వేసాడు.
ఇప్పుడు యేకంగా కళ్ళల్లో నీళ్ళే తిరిగాయి సంధ్యకి. తల వంచుకుని కళ్ళల్లో యేదో నలక పడ్డట్లుగా కళ్ళు నలుపుకుంటూ శేఖర్ కంటే ముందే వెళ్ళి బైక్ దగ్గర నిలబడింది.
ముక్కుకి అడ్డంగా కర్చీఫ్ కట్టుకుంటూ వచ్చి బైక్ స్టార్ట్ చేస్తూ “ఇదిగో కాస్త దూరంగా కూర్చో” చెప్పాడు శేఖరం.
చివుక్కుమన్న మనసు వెనక్కి వెళ్ళిపొమ్మని చెప్పినా, సంస్కారం బైక్ యెక్కమంది.
రయ్యిన వెళ్తున్న బైక్ సడన్ గా ఆగింది. అలవాటు ప్రకారం దిగి వెళ్ళి బడ్డీకొట్టుకు కాస్త పక్కగా నించుంది మనసులో విసుక్కుంటూ. బడ్దీకొట్టు మంచి రష్ తో వుంది . అందరూ సిగరెట్లు కొనుక్కుని అక్కడే నించుని తాగుతున్నారు. అందుకని బైక్ ని చాలా దూరంగా పార్క్ చేయాల్సొచ్చింది. తాను కూడా ఆ కంపులో యెందుకని వెళ్ళి బైక్ పక్కగా నించుంది. కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక సిగరెట్ కొనుక్కుని అక్కడే వున్న వెలుగుతున్న తాడుతో అంటించుకుని తన్మయత్వంగా గట్టిగా ఒక దమ్ము లాగాడు. అలాగే ఒక అయిదు నిమిషాల పాటు ఆ సిగరెట్ ని ఆస్వాదించి చివరికి మిగిలిన ముక్కని కిందపడేసి కాలితో తొక్కి వచ్చి బైక్ స్టార్ట్ చేసి సంధ్య ని చూసాడు యెక్కమన్నట్లుగా.
కొద్ది దూరం పోగానే మల్లెపూల వాసన ఘుభాళించింది. “యేమండీ ఒక్క నిమిషం బైక్ ఆ పూల దగ్గర ఆపండి . యెంత బాగున్నాయో మల్లెలు. ”
“ఇప్పుడవసరమా? నీకెప్పుడేది అడగాలో తెలీదు. మనమసలే పార్టీకి లేట్ అయ్యాము. ఇప్పుడా జనంలో ఆగామంటే ఇక కదిలే పని వుండదు. ” అప్పుడే తాగిన సిగరెట్ కంపు గుప్పుమంది .
ముక్కు మూసుకుంటూ, పూలకోసం ఆగమని అడిగినందుకు తనను తాను తిట్టుకుంది సంధ్య. ఇప్పుడక్కడ సిగరెట్ కోసం పావుగంట ఆగితే అది తప్పు కాదు కాని తాను పూల కోసం ఆగమంటే తనకేమీ తెలీకపోవడం. మనసులోనే గొణుక్కుంది. తన సెంట్ వాసన ఆయనకి నచ్చకపోతే తాను మానెయ్యాలి. ఆ సిగరెట్ కంపు తాను భరించాలి. మళ్లీ గొణుక్కుంది.
సంధ్య శేఖర్ లకు పెళ్ళై పదేళ్ళయింది. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. కాన్వెంట్ కి వెళ్తున్నారు. శేఖర్ కి యెప్పుడూ తాను యేదైనా చాలా కరెక్ట్ గా చేస్తానని ఒక గొప్ప నమ్మకం.
అందుకే సంధ్య యేది చేసినా యేదో ఒకటి అని వెక్కిరిస్తుంటాడు. దానికి సమయం సందర్భం , కొత్తవాళ్ళా కాదా అని యెమీ వుండదు. అలాగని చెడ్దవాడేమీ కాదు. వెక్కిరించి, వెక్కిరించిన సంగతి మర్చిపోతాడు. యెందుకంటే తాను మనసులో యేమీ పెట్టుకుని అనడు. అసలు తన మనసులో యెలాంటి చెడు భావనలే వుండవు అని శేఖర్ ప్రగాఢ నమ్మకం. కాని పడ్డవాళ్ళకు అలా కాదు కదా ? గుర్తుండిపోతుంది. ఒకసారి పెళ్ళైన కొత్తలో ఇలాగే సంధ్య కూడా యేదో అన్నది. శేఖర్ అది మనసులో పెట్టుకుని వారం మాట్లాడలెదు. నేనూ సరదాకే అన్నాను నాకూ మనసులో యేమీ లేదు అన్నా కూడా వినిపించుకోలేదు. ఇక ఆ తర్వాత సరదా అన్న పదాన్ని తన వరకు మర్చిపోయింది సంధ్య.
అలా ఇన్నాళ్ళూ యేమన్నా పట్టించుకోవడం మానేసింది. కానీ ఈ మధ్య అలా అంటుంటే తొందరగా మనసు చిన్న బుచ్చుకుంటున్నది. యెంత వద్దనుకున్నా బాధ కలుగుతున్నది. దాంతో యే పని మీదా శ్రద్ద కలగడం లేదు. ఒక విధమైన నిరాసక్తత కలుగుతున్న లక్షణాలని గమనించుకున్న సంధ్య యెక్కడో ఒకచోట దీన్ని ఆపకపోతే తన పిల్లలకు తాను దక్కనేమో అని కంగారు పడుతున్నది.
ఒకసారి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దంపతులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చక్కగా కాలక్షేపం జరిగింది. యెంతో సరదాగా గడిచింది ఆ సాయంకాలం. యెలాగూ రాత్రవుతున్నది కదా భోజనం చేసి వెళ్ళమన్నారు . వాళ్ళ పిల్లలు కూడా సంజూ సాకేత్ లతో బాగా ఆడుకుంటున్నారు. వెళ్తామని లేచేసరికి నలుగురు పిల్లలూ యేడుపు మొహం పెట్టారు. సరే ఇంటికెళ్ళి చేసేది కూడా యేమీ లేదని ఆగిపోయారు.
వెంటనే ఆవిడ హడావుడిగా వంట మొదలెట్టేసి యేదొ పప్పులో వేసేసి వంకాయ కూర చేసి చారు పెట్టింది. అప్పడాలు వడియాలు వేయించింది. వద్దంటున్నా వినకుండా ఇంకా యెనిమిది కూడా కాలేదు అంటూ టమాటో పచ్చడి చేసి యెనిమిదిన్నరకల్లా అన్నీ టేబుల్ మీద సర్దేసింది. తాను కూరలు తరుగుతానన్నా ఒప్పుకోలేదు. చాలా మొహమాటం అనిపించినా ఆవిడ చకచకా చేసిన తీరు నచ్చింది. భలే చేసారండి అని కూడా మెచ్చుకుంది తాను.
అందరూ భోజనాలకి వచ్చారు. మొదలు పిల్లలకి మొగవాళ్ళకి పెట్టి వాళ్లదయ్యాక తాము కూర్చుందామని అనుకున్నారు.
ఇక మొదటి ముద్ద నోట్లో పెట్టింది మొదలు పొగడ్తలు మొదలు పెట్టాడు శేఖర్. అయినా కూడా యెంతన్నా పొగుడుకోనీ తనకేమీ సమస్య లేదు. మహా అయితే కొద్దిగా జెలసీ ఫీల్ అవుతుంది. కానీ ఆమెని పొగడ్డంతో పాటు “అబ్బ! వంకాయ కూర యెంత బాగుందో… మా ఆవిడా చేస్తుంది . అది వంకాయ కూరా లేక కాటుక ముద్దా అర్థం కాదు. ఇలాంటి చారు మా అమ్మ తప్ప యెవరూ చేయలేరనుకున్నాను . మా అమ్మతో అన్నాళ్ళున్నా సంధ్యకు అలవాటు కాలేదు చేయడం” (నేర్చుకుని పెడితే మేము కూడా ఆ చారు పోసుకుంటాము కదా?) ఈ తరహాలో సాగింది శేఖర్ పొగడ్తల పర్వం.
దాంతో అప్పటిదాకా ఆనందించిన క్షణాలన్నీ ఆవిరయ్యాయి. తాము తినడానికి కూర్చుని తింటుండగానే అర్థమయింది ఆ వంటలు తినలేనంత విపరీతంగా లేకున్నా ఓ…అని . పొగిడేంత గొప్పగా కూడా లేవు. ఆప్యాయంగా పెట్టేవి యేవైనా రుచిగా వుంటాయి అందులో సందేహం లేదు. తన మాట యెత్తకుండా వున్నట్లయితే తాను కూడా తన వంతు పొగడ్తలని అందించేది.
ఇక ఆ తర్వాత వాళ్ళతో సరిగ్గా మాటలు కూడా మంచిగా కలపలేకపోయింది. ఇంటికొచ్చి పిల్లలు పడుకున్నాక తన వుక్రోషాన్నంతా బయట పెట్టింది.
“ఆమె అంత ఆప్యాయంగా వున్నందుకు మన మెచ్చుకోవాలి. మెచ్చుకుని తీరాలి కదా అందుకని అలా అన్నానే కాని నా మనసులో యేమీ లేదు, నిన్ను చిన్న బుచ్చడం నా వుద్దేశ్యమూ కాదు. ఇక నువ్వు అలా అనుకుంటే నేను చేసేదేమీ లేదు” చెప్పేసి ముసుగు కప్పుకున్నాడు శేఖర్.
తాను కూడా చేసేదేమీ లేక నిద్రాదేవి కరుణించేదాకా యెదురు చూసింది .
ఇది ఒక చిన్న వుదాహరణ మాత్రమే. ఇలాంటివి యెన్నిసార్లు జరిగాయో లెక్క లేదు. ఇప్పుడిప్పుడే మనసు ప్రతిఘటించడం మొదలు పెట్టినప్పటినుండీ ప్రతి సంఘటననీ విశ్లేషించడం ప్రారంభించింది. అప్పటి నుండీ ప్రశాంతత కూడా కరువయ్యింది
ఆడవాళ్ళెపుడు అయోమయావస్థలో వుంటేనే సంసారం హాయిగా వుంటుందేమో? యెందుకు యేమిటీ అన్న ప్రశ్నలు తనలో రానంతవరకు పట్టించుకోకుండా హాయిగా(?? )
వుంది. ఇప్పుడెందుకని ……
“ఇక దిగుతావా? ఫంక్షన్ హాల్ వచ్చేసింది” శేఖర్ భుజాన్ని తట్టడంతో ఈ లోకంలోకి వచ్చి బైక్ దిగింది సంధ్య.
“యే లోకం లో వుంటున్నావు? యీ మధ్య యెప్పుడు చూసినా యేదో ఆలోచిస్తూ వుంటున్నావు. ఇప్పుడు మనం వెళ్ళే చోట కూడా అలా పరధ్యాన్నంగా వుండకుండా కాస్త నవ్వుతూ వుండు” బైక్ పార్క్ చేస్తూ చిరాకు పడ్డాడు శేఖర్.
మౌనంగా లోపలికి వెళ్తున్న అతన్ని అనుసరించింది సంధ్య.
అది ఫ్రెండ్ కూతురి సంగీత్ పార్టీ. జోర్ దారుగా వుంది వాతావరణం. మ్యూజిక్ తారాస్థాయిలో వుంది . దాన్ని మించి ఆనందంగా అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. డ్యాన్స్ వచ్చా రాదా అనేది సమస్య కాదు. ఆ ఆనందాన్ని యెంతవరకు యెంజాయ్ చేస్తున్నారనేదే అక్కడ ప్రధానం. సంతోషాన్ని దోసిళ్ళతో విరజిమ్ముతున్నారక్కడ.. ఖాళిగా వున్న ఒక కుర్చీ చూసుకుని కూర్చుంది. చుట్టూ సముద్రం వున్నా తాగడానికి నీరు లేనట్లుగా చుట్టూరా అంత కోలాహలం వున్నా దాన్ని ఆస్వాదించలేకపోతున్నది సంధ్య . సంగీత్ పార్టీ అనగానే పిల్లలిద్దరూ వుత్సాహపడిపోయారు. కానీ తెల్లవారితే సంజూకి యేదో పరీక్ష వుందని ఇద్దర్నీ వద్దనేసాడు శేఖర్. ఇంతా చేస్తే అది చదివేది అయిదో తరగతి…. వచ్చుంటే ఇద్దరు బాగా యెంజాయ్ చేసే వాళ్ళు . దిగులుగా అనుకుంది పిల్లల్ని తల్చుకుని.
“కాస్త అందర్నీ పలకరించుకుంటూ యెంజాయ్ చేయి.”దగ్గరగా వినపడ్ద మాటలకు వులిక్కి పడింది సంధ్య. అప్పటికే స్టార్ట్ చేసినట్లున్నాడు చేతిలో మందు గ్లాసు వుంది. వాసన కూడా వస్తున్నది దగ్గరగా రావడంతొ…
చెప్పేసి తన పని అయిపోయినట్లుగా వెళ్ళిపోయాడు …
మొత్తమ్మీద పార్టీ అయ్యేసరికి పదకొండయ్యింది . అందరికీ బై బై చెప్పి బయటకొచ్చేసరికి ఇంకో పావుగంట. బయటకి రాగానే బైక్ కీస్ సంధ్య చేతిలో పెట్టాడు శేఖర్. ఇప్పుడు మాత్రం తాను పనికొస్తాను కోపంగా అనుకుంది బైక్ స్టార్ట్ చేస్తూ….
తాళం తీసుకుని లోపలికి రాగానే అత్తగారి గదిలోకెళ్ళి చూసింది. బామ్మని కౌగిలించుకుని పడుకున్నారు పిల్లలిద్దరూ.
గదిలోకి కోడలొచ్చిన అలికిడి కాగానే కళ్ళు తెరిచారు సుభద్రమ్మగారు. “ఈ రాత్రికి నా దగ్గర పడుకుంటారు కాని నువ్వెళ్ళు.” చెప్పి పిల్లలిద్దర్నీ ఇంకా పొదువుకుని కళ్ళు మూసుకున్నారు . దగ్గరకెళ్ళి పిల్లలిద్దర్నీ ముద్దాడి బయటికి వచ్చేసింది …

****

రాత్రి తొమ్మిదయింది . ఇప్పుడే వస్తానంటూ బయటకెళ్ళాడు శేఖర్. నలుగురైదుగురు ఫ్రెండ్స్ కలుస్తారు రోజూ ఈ టైముకి . ఒక అరగంట కాలక్షేపం చేస్తారు అందరూ. వంట ఇల్లు సర్దేసి అత్తగారి గదిలో మంచినీళ్ళు పెట్టి పిల్లల గదిలొ కెళ్ళింది. ఇద్దరూ కూడా నిద్రకి తూగుతున్నారు. వాళ్లదగ్గర కాసేపు కూర్చుని కబుర్లు చెప్తుండగానే నిద్రపోయారిద్దరూ. వాళ్ళని సరిగా పడుకోబెట్టి దుప్పటి సర్ది తమ గదిలోకొచ్చింది. ఇంకా శేఖర్ రాలేదు. ఆ రొజే వచ్చిన వారపత్రికని పట్టుకుని మంచం మీద ఒరిగింది…
సడన్ గా వచ్చిన వాసనకి మెలుకువ వచ్చింది సంధ్యకి… పక్కన సర్దుకుని పడుకుంటున్నాడు శేఖర్…
“సిగరెట్ వాసన నాకు పడదు. చాలాసార్లు చెప్పాను మీకు దూరంగా వెళ్ళండి” అసంకల్పితంగా చెప్పింది.
“యేంటీ? రివెంజా?” వెటకారంగా అంటూ ఇంకాస్త దగ్గరకొచ్చాడు శేఖర్.
“చూడండీ. మీతో కాసేపు మాట్లాడదామనుకుంటున్నాను. ఒక పది నిమిషాలు వినాలి” లేచి కూర్చుంటూ చెప్పింది.
యే కళనున్నాడో వెంటనే తను కూడా సర్దుకుని కూర్చుని చెప్పమన్నట్లుగా చూసాడు.
యెలా మొదలు పెట్టాలో తెలీక కొద్ది క్షణాలు తటపటాయించింది.
“సరే నేను పడుకుంటున్నాను”
“నేను చెప్పేది వినేదాకా మీరు పడుకోవడానికి వీల్లేదు” స్థిరంగా ధ్వనించింది సంధ్య స్వరం.
ఆశ్చర్యంగా చూసాడు శేఖర్. పెళ్ళైన ఇన్నేళ్ళలో ఇలా మాట్లాడ్డం మొదటిసారి మరి.
“మన పెళ్ళై యెన్నేళ్ళయింది?”
“పదేళ్ళు” అయినా అర్థమ రాత్రి మద్దెల దరువులాగా ఈ క్విజ్ ప్రోగ్రాం యేంటే?”
“మీకు మందు సిగరెట్ అలవాటు యెప్పటినుండి?”
“పెళ్ళికి ముందు నుండి. కాని వ్యసనం కాదు.” సిన్సియర్ గా జవాబు చెప్పాడు.
“ నాకు తెలుసు. మరి పెళ్ళయ్యాక నాకిష్టం లేదని చెప్పినా యెందుకు మానెయ్యలేదు?”
“హ !హ్హా!. నా కిష్టము . అయినా నీకంటే ముందునుండీ అవి నాతో వున్నాయి. యెలా మానేస్తాను?…”పొయెటిక్ గా చెప్పాననుకున్నాడు.
“ఓకే. మరి కొద్దిగా పెర్ఫ్యూం స్ప్రే చేసుకోవడం, హాయిగా పాటలు పాడుకోవడం . అంత బాగా పాడలేకపోవచ్చు . కాని ఇంకా కొన్ని చిన్న చిన్న అలవాట్లు నాక్కూడా పెళ్ళికి ముందునుండే వున్నాయి. మరి అవి వద్దని మీరెలా నన్ను అనగలుగుతున్నారు?. మందే కంపనుకుంటే దాంతో పాటు సిగరెట్ కూడా తాగి దగ్గరకొస్తారు కదా? ఆ వాసనలను నేను భరించాలి . ఒక్కసారన్నా ఆలోచించారా? ఈ వాసనలు పడవుకదా వదిలేద్దాము అని? సరే ఆ సంగతి వదిలేద్దాము. మనము యెన్నోసార్లు మీ ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళాము. వారి దగ్గర మిమ్మల్ని అవమానించేలా నేను యెట్టి పరిస్థితుల్లో మాట్లాడను. నాకు మీరెంతో నేను మీకంతే కదా? మరి నన్నెందుకు అందరితో పోల్చి అవమానిస్తారు?”
“ఓయ్! నా మనసులో అలాంటి వుద్దేశ్యము వుండదన్నాను కదా?”
“నిజమే మీ మనస్సులో అలా నన్ను అవమానించే వుద్దేశ్యము లేదు . కాని జరుగుతున్నది అదే కదా?మీకు వాళ్ళని మెచ్చుకునే వుద్దేశముంటే మెచ్చుకుని మేక తోలు కప్పండి. కాని నన్ను పక్కింటి వాళ్ళతో యెదురింటి వాళ్ళతో, ఆఖరికి పనిమనిషిని మెచ్చుకోవాలన్నా నేనే దొరుకుతాను . ఒక్కసారి వూహించుకుని చూడండి . పక్కింటి వాళ్ళనో, యెదురింటి వాళ్ళనో ప్లీజ్ చేయటానికి మిమ్మల్ని వాళ్ళతొ పోల్చడం? ఒక్క నిమిషం పట్టదు మిమ్మల్ని అలా అనడానికి…. కాని మిమ్మల్ని తక్కువ చేయడమంటే నన్ను నేను తక్కువ చేసుకోవడమే. నాకు ఇష్టం లేదు.
నా వల్ల కావడం లేదు మీరలా అంటుంటే నవ్వుతూ వినడం. బయటికి వెళ్తే మీరెక్కడ నుండి నన్ను గమనిస్తున్నారో? యేమి అంటారో అన్న ఆందోళనలో నేను వుండలేకపోతున్నాను. యెవరైనా సరే నువ్విలా నవ్వావు, అలా నవ్వకూడదు, నువ్విలా మాట్లాడావు అల్లా మాట్లాడకూడదు,, నీకేం చేతకాదు ఆ యెవరో ఆమె బాగా చేస్తుంది, నీకు డ్రెస్ సెన్స్ లేదు వాళ్ళెవరో బాగా డ్రెస్ చేసుకుంటారు అని పదే పదే చెప్తుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. ఆఖరికి మీక్కావల్సిన దానికోసం ఆగడం మీకు అన్నీ తెలుసు కాబట్టి కాని ఒక మూర పూల కోసం ఆగుదామనుకోవడం నా కెప్పుడేమి అడగాలో తెలీకపోవడం ఇదేమి న్యాయం? సంస్కారవంతులనుకుంటున్న మీకు ఇది యెందుకు తెలీటం లేదో నాకర్థం కావడం లేదు. పదేళ్ళు భరించాను. ఇక నా వల్ల కాదు. ఇవన్నీ చిన్న చిన్నవే కాని ఒక మనిషి ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడానికి ఇవి చాలు…
కాస్త గమనించుకుంటే మీకు మనకూ కూడా మంచిది. తెల్లవార్లూ ఆలోచించుకుని చూడండి. బై ద వే నాకా వాసన నచ్చదు” చెప్పి అటు తిరిగి ముసుగు పెట్టింది సంధ్య తెల్లబోయి వింటున్న శేఖరాన్ని వదిలేసి.

***********

కాంతం_కనకం – ఒక చెత్త కథ….

రచన: మణి గోవిందరాజుల

దుప్పటీ ముసుగు తీసి నెమ్మదిగా తల పక్కకి తిప్పి చూసాడు కనకారావు. కాంతం కనబడకపోయేసరికి గుండె గుభిల్లుమంది. “అప్పుడే వెళ్ళిందా వాకింగ్ కి?” నీరసంగా అనుకున్నాడు. అయినా ఆశ చావక “కాంతం” అని పిలిచాడు , పిలిచాననుకున్నాడు. యేదో తుస్ తుస్ మని సౌండ్ వచ్చిందే కాని పిలుపు బయటికి రాలేదు.
గొంతు సవరించుకుని మళ్ళీ పిలిచాడు కొంచెం గట్టిగా”కాంతం”..
“వస్తున్నానండి” అంటూ వచ్చి చిరునవ్వులు రువ్వుతూ తన యెదురుగా నిలిచిన కాంతాన్ని చూసి లేవబోతున్నవాడల్లా దయ్యాన్ని చూసి దడుచుకున్న వాడల్లే పెద్ద కేక పెట్టి మంచం మీద అడ్డంగా పడిపోయాడు పాపం కనకారావు.
అదంతా ముందే వూహించినట్లుగా తీసుకొచ్చిన నీళ్ళు మొహాన కొట్టి
“కనకం …కనకం..”అని ప్రేమగా పిలిచింది. నాగస్వరం విన్న నాగుపాములా వెంటనే లేచి కూర్చున్నాడు.లేచాడే కాని మొహంలో ప్రేతకళ ఇంకా అలానే వుంది.
“కాంతం యేంటే ఇది? నాకెందుకే ఈ శిక్ష? నువ్వు ఈ వేషం లో బయటికి వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారే.ఇది పెద్ద క్రైం. నా మాట వినవే నా బంగారం” కాంతం కనకారావు బలహీనత..గట్టిగా యేమీ అనలేడు.
“ పోలిసులకి యెవరు చెప్తారు? ..పదండి వాకింగ్ కి” ఆర్డరేసింది.
“నేను రానే ఈ రోజు.” భీష్మించుకున్నాడు
“అయితే ఓకే! మీరు కాఫీ కలుపుకుని తాగి నాకు ఫ్లాస్క్ లో పోసి వుంచండి” కులాసాగా చెప్పి విలాసంగా బయలుదేరబోయింది.
మళ్ళీ పడిపోయాడు కనకారావు..
***************
మొన్నంటే మొన్నటివరకు కనకం జీవితం కాంతం సన్నిధిలో చాలా హాయిగా వుండేది… యే చీకూ చింతా లేని జీవితం ఒకరంటే ఒకరికి ప్రాణం.చిలుకా గోరింకల్లా కువకువలాడుతూ వుండేవాళ్ళు. ఇద్దరు పిల్లలు, పెళ్ళి చేసుకుని విదేశాల్లో వున్నారు. అంతకు ముందంతా ఇల్లూ, పిల్లలూ పనీ పనీ అంటూ క్షణం తీరిక లేకుండా వున్న కాంతానికి బోలెడు ఖాళీ దొరికింది. దాంతో టీవీ చూడ్డం మొదలు పెట్టింది. కాని మనుషుల్లో రాక్షసత్వాన్ని ప్రేరేపిస్తున్న సీరియళ్ళు నచ్చేవి కాదు. అందుకని కనకం చూస్తుంటే న్యూస్ ఛానెళ్ళు చూసేది. అందులో కాంతాన్ని బాగా ఆకర్షించింది మోడీ గారి స్వచ్ఛ్ భారత్ వుద్యమం. చూడగా చూడగా తాను కూడా దేశం స్వచ్చంగా వుండడానికి తన వంతు కృషి చెయ్యాలని నిశ్చయించుకుంది.
నిశ్చయించుకోవడమే కాకుండా తాను అవిశ్రాంతంగా స్వచ్చ్ భారత్ కోసం కృషి చేసినట్లూ , యెన్నో కష్ట నిష్టురాలకోర్చి దేశాన్ని నందనవనంలా తీర్చి దిద్దినట్లూ ప్రపంచ దేశాలన్నిటికంటే ముందువరసలో పరిశుభ్రమైన దేశంగా భరతదేశం వున్నట్లూ అందుకు ప్రధాన కారణమైన తాను ప్రధాని చేతులమీదుగా అవార్డులందుకున్నట్లూ కూడా వూహించుకుంది. అందుకోసం చాలా రకాల ప్రణాళికలు రచించుకుంది. అదిగో సరిగ్గా .అప్పటినుండే కనకారావుకి కష్టాలు మొదలయ్యాయి….

********************

“నువ్వు! వాకింగ్ కా??” తనతో పాటు తయారైన కాంతాన్ని ఆశ్చర్యంగా అడిగాడు .. కాంతం అర కిలో మీటరు నడవాలన్నా వూబర్ పిలుచుకుంటుంది.అందుకని ఆశ్చర్యం…
“యేమీ ?నేను మటుకు నాజూగ్గా అవ్వద్దా?”దబాయించింది.
“అయ్యో! అంతమాట అనగలనా?వెల్కం వెల్కం” అమాయకంగా ఆహ్వానించాడు.
నవంబర్ నెల..ఇప్పుడిప్పుడే చలి స్టార్ట్ అవుతున్నది. వాతావరణ కాలుష్య పొర అడ్డుకోవడం వల్ల సూర్యకిరణాలు భూమిని చేరడం లేదు.
రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల చుట్టు అప్పటికే జనాలు చేరిపోయారు.
సడన్ గా ఒక ఇడ్లీ బండి వేపు వెళ్తున్న కాంతాన్ని ఆపుతూ”కాంతం ..రిటర్న్ లో తీసుకెళ్దాము ఇడ్లీలు..ఇప్పుడే తీసుకుంటే చల్లారి పోతాయి” చెప్పాడు .
కాని కాంతం వినిపించుకుంటేగా…చిన్నగా వెళ్ళి ఒక పక్కగా నిలబడి హడావుడిగా తింటున్న ఒక ఐటీ అబ్బాయి దగ్గరకెళ్ళి చెయ్యి గోకింది. చేతి మీద యేదో పడ్డట్లుగా చెయ్యి విదిలించుకుని ఆత్రంగా తినసాగాడా అబ్బాయి. మార్నింగ్ షిఫ్ట్ టైం అవుతున్నది మరి..
“ఇదిగో అబ్బాయ్!” మళ్ళీ గోకింది…
ఈసారి తింటూనే యెగాదిగా చూసాడు…
చూసి యేంటన్నట్లు తలెగరేసాడు…
“నేనో మంచి మాట చెప్తాను వినబ్బాయ్..”
“యియయానికి యాకు యైం యేదు” (వినడానికి నాకు టైం లేదు) నోటి నిండా వున్న ఇడ్లీ అతని మాటను సరిగ్గా ప్రసారం చేయలేదు..
“అయ్యో పాపం మాటలు సరిగా రావేమో!” పైకే అనేసింది అప్రయత్నంగా..
ఆ అబ్బాయి “యాయలు యచ్చు…ఇయ్యీ వుయ్యి య్యోయ్యో!”(మాటలు వచ్చు.ఇడ్లీ వుంది నోట్లో) కోపంగా చూస్తూ అన్నాడు. మళ్ళీ అర్థం కాలేదు మన కాంతానికి. చాలా జాలేసింది ఆ అబ్బాయి మీద యేదో మందు తీసుకుంటే మాటలొస్తాయని చెప్పబోయి.. తన కర్తవ్యం గుర్తొచ్చింది.
“పోనీలే యెక్కువ మాట్లాడకు”అనునయంగా చెప్పింది…వాడికి వెర్రి కోపం వచ్చి గుర్రుమన్నాడు…చేతిలోని ప్లేట్ ని నేల కేసి కొట్టి అర్థం కాకుండా యేదో అరుస్తూ వెళ్ళిపోయాడు..
“మాటలు రాని వాళ్ళతో నీకు సరిగా మాటలు రావంటే ఇలానే కోపం వస్తుంది.” జనాంతికంగా అంది చుట్టు వున్నమిగతావాళ్ళను చూస్తూ. ఆ చుట్టు వున్నవాళ్ళు తినడం మర్చిపోయి కాంతాన్నే చూస్తున్న వాళ్ళల్లా యేదో పని వున్నట్లు అక్కడనుండి పారిపోయారు. బండి వాడు లబలబ లాడాడు.”యెవరమ్మా నువ్వు?నా వ్యాపారమంతా పోగొట్టటానికి పొద్దున్న పొద్దున్నే వచ్చావ్?”
“మంచిగా అడిగితే చెప్తుందా?కర్రతో అడగాలి ఈ పిచ్చి వాళ్ళను” బండివాడి భార్య కోపంగా కర్ర కోసం వెతకసాగింది.
అప్పటిదాకా బిత్తరపోయి చూస్తున్నవాడల్లా కనకారావు భార్య చేతిని అందుకుని పరుగు ప్రారంభించాడు. కర్రతో వెంటపడుతున్న ఆమెని చూసి ఇక యేమి మాట్లాడకుండా తాను కూడా పరుగు అందుకుంది కాంతం. కర్ర కంటిచూపుకి అందనంతవరకు పరిగెత్తి ఆయసపడుతూ పేవ్మెంట్ మీద కూర్చున్నాడు కనకం.
“యేంటే కాంతం?ఈ వింత చేష్టలేంటే??ఆ అబ్బాయిని అలా గోకడమేమిటి? యేమయిందే నీకు?” యేడుపొక్కటే తక్కువ కనకానికి..
“అలా వింతగా యేదన్నా చేస్తేనే వాళ్ళందరి అటెన్షన్ మన వేపు తిరుగుతుంది.” గొప్ప ఆత్మవిశ్వాసంతో చెప్పింది
“వాళ్ళ అటెన్షన్ మన వేపు యెందుకే తిరగడం?”అయోమయంగా అడిగాడు
“మరి అలా తిరిగితేనే కదా? నేను చెప్పాలనుకున్నది చెప్పగలుగుతాను?”
“యేమి చెప్పాలనుకున్నావే?” ఒక్క క్షణం డౌట్ వచ్చింది రాత్రికి రాత్రి పిచ్చెక్కలేదు కదా అని.
“స్వచ్చ్ భారత్ గురించి.. అయ్యో! పిచ్చి నా శ్రీవారూ…గుర్తు చేసుకోండి. ఆ ఇడ్లీ బండి చుట్టు యెంత చెత్త వున్నది?
“ఆ వున్నది. ఐతే?”
“పాపం వాళ్ళంతా ఆ చెత్తలో నిలబడే తింటున్నారు”
“ఐతే?” అడిగే ఓపిక కూడా పోయింది..
“ఇప్పుడూ నేనెళ్ళి బాబూ ఇలా చెత్తలో తినకండి. మీరు బండివాడికి గట్టిగా చెప్పండి, బండి చుట్టుపక్కల నీట్ గా వుంటేనే తింటాం అని , అంటే వింటారా? ఇలా యేదన్నా వింత చేష్ట చేస్తే వాళ్ళ దృష్టిలో పడతాను. అప్పుడు నే చెప్పేది వాళ్ళు వింటారు.”
“అందరూ పారిపోయారు కదే?ఇంక వినేదెవరు?” వెర్రి చూపులు చూసిన కనకం గట్టిగా నిర్ణయించుకున్నాడు కాంతాన్ని పిచ్చి డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలని.
“పోతే పోయారు. మళ్ళీ రేపొస్తాను కదా?” ధీమాగా చెప్పింది.
కాంతాన్ని రోడ్డు మీద చూసి పారిపోతున్న జనాలు కనబడ్డారు కనకానికి.బైర్లు కమ్మబోతున్న కళ్ళను గట్టిగా తుడుచుకుని
“సరేలే ఇప్పుడు ఇంటికి పోదాం పద. మొహం కనబడకుండా ఆచున్నీ కప్పుకో” అన్నాడు.
తిరుగు ప్రయాణం అయ్యారు ఇద్దరు. అంతలో కాంతం దృష్టిని ఒక చిన్నబడ్డీకొట్టు, చైనీస్ కౌంటర్ లాంటిది ఆకర్షించింది. ఆ కొట్టువాడు తరుగుతున్నది కాంతానికి కనపడలేదు. కాని ఆ కొట్టు చుట్టు కింద వున్న చెత్త బాగాఆఆఅ… కనపడింది.
ఆ కొట్టు దగ్గరికి వెళ్తున్న భార్యని చూసి “కాంతానికి మాంసం కొట్టుతొ యేమి పనబ్బా? అయినా మళ్ళీ యే గొడవ తెస్తుందో” అనుకుంటూ “కాంతం ఆగవే” అని పిలుస్తూ భార్యని గబ గబా అనుసరించాడు.
ఈసారి యే వింత చేష్టా చెయ్యలేదు.చాలా మర్యాదగా “చూడు బాబూ” అని పిలిచింది.
వాడు చేస్తున్న పని ఆపకుండా “కిలో రెండొందల్” అన్నాడు.
కాంతం వాడు చెప్పేది వినిపించుకోకుండా “ చూడు బాబూ నీ షాప్ దగ్గరకొచ్చి అందరూ తింటారు కదా కింద చూడు యెంత చెత్త వుందో? కాస్త శుభ్రం చేసుకుంటే యెంత బాగుంటుంది?మా లాంటి వాళ్ళం కూడా వచ్చి తింటానికి బాగుంటుంది” యెంతో మర్యాదగా చెప్పింది.
వాడు ఒక్క క్షణం తల యెత్తి చూసి చేస్తున్న పని ఆపి లోపలికి వెళ్ళాడు. తిరిగొస్తున్న వాడి చేతిలో చీపురు చూసి సంతోషపడింది. వెనకే వున్న మొగుడి వేపు గర్వంగా చూసి తలెగరేసింది.. ఈ లోపల షాపతను ముందుకు రమ్మన్నట్లుగా చెయ్యూపాడు. యెందుకో అని ముందుకెళ్ళిన కాంతానికి అక్కడ తరుగుతున్న మాంసం ముక్కలు కనపడి వొళ్ళు జలదరించింది. ఈ లోపల షాపువాడు కౌంటరు మీదనుండి ముందుకు వంగి కాంతం చేతిలో చీపురు పెట్టి వూడవమన్నట్లుగా సైగ చేసి మళ్ళీ మాంసం కొట్టడం మొదలు పెట్టాడు.ఈ సారి భర్త లాగకుండానే చీపురక్కడ పడేసి మొదలు పెట్టిన పరుగు ఇంటిదగ్గరకొచ్చి ఆపింది కాంతం.
గుడ్డు కూడా చేత్తో ముట్టుకోని కాంతానికి షాపువాడు, తరుగుతున్న చేతులతో చీపురు అందించటం వల్ల ఆ వాసన చేతులకి కూడా అంటుకుంది..
దాంతొ పొట్టలో కలిగిన అలజడి అంతా ఇంతా కాదు. ఆ అలజడి ఫలితంగా ఆ రోజంతా వాంతులవుతూనే వున్నాయి..
***************
“యేంటే?మళ్ళీ ఈ రోజు తయారయ్యావు?”కంగారుగా అడిగాడు కనకం మరునాడు మళ్ళీ తనతో పాటు తయారైన కాంతాన్ని చూసి..
“అవును వాంతులు తగ్గాయిగా అందుకని బయలు దేరాను.”
“సమస్య వాంతులు కాదే. నువ్వే.. నిన్ను రోడ్డు మీద చూసి బతకనిస్తారా? అయినా నిన్న ఆ షాపతను చీపురుతో వచ్చాడు కాబట్టి సరిపోయింది.అదే కత్తి బట్టుకుని వెంటపడితే మనం స్వేచ్చగా ఆకాశంలో యెగురుతుండే వాళ్ళం..కొత్తగా ఈ గోలేంటే ”
“ఓసోస్… ఈ మాత్రానికే దడుచుకుని నా వుద్యమాన్ని ఆపేస్తానా?అలా భయపడి గాంధీగారు ఆపినట్లైతే మనకు స్వాతంత్రం వచ్చేదా? నేను కూడా అలానే పోరాడదలిచాను మన దేశం స్వచ్చమైన భారత దేశంగా అవతరించేవరకు” ఒక రకమైన వుద్వేగంతో అన్నది.
తల పట్టుకున్నాడు కనకం. “కాంతం తినే వాళ్ళకు తెలీదా?నువు చెప్పాలా? అయినా గాంధీ గారితో నీకు పోలికేంటే?”
“థింక్ హై అన్నారు పెద్దలు. అలాంటి గొప్ప వారితో పోల్చుకుంటె మనం కొద్దిగా అయినా చేయగలం …”
“ అయినా వాళ్ళకు తెలీదని కాదు.కాని యెవరో ఒకళ్ళు సమస్యని లేవనెత్తితే కొంతమందైనా ఆలోచిస్తారు .కనీసం తాము అలా చెత్తలోనె నిలబడి తింటున్నప్పుడు, తిన్న ప్లేట్స్ ని అప్పటికే పూర్తిగా నిండి పొర్లి పోతున్న డస్ట్ బిన్ లో వేసేటప్పుడు, అడుగుతారు కొత్త కవరు వేయమని. ఇంకోటేంటంటే అక్కడ తినే వాళ్ళంతా మూడొంతులు ఐటీ వుద్యోగస్తులే, బాగా చదువుకున్న వాళ్ళే పాపం ” జాలిగా చెప్పింది.
“ వేగవంతమైన ఈ జీవితంలో వాళ్ళకు ఇవన్నీ ఆలోచించే టైం వుండదే. ఆ క్షణానికి పొట్ట నిండిందా అని మాత్రమే వాళ్ళు చూసుకోగలుగుతారు. కాని నాకో డౌట్ స్వచ్చ్ భారత్ అంటే రోడ్డు మీదా రోడ్డుకి అటు ఇటూ పరిశుభ్రంగా వుండడం, వుంచేలా చూడడం. కాని నువు ఈ బండ్ల వాళ్ళ మీద పడ్డావేంటి?” కుతూహలంగా అడిగాడు.
“అలా అడగండి చెప్తాను. మీరు గమనించారా? ప్రతి పది అడుగులకు ఒక టిఫిన్ బండి కాని, కొబ్బరిబోండాల వాళ్ళు కాని, పూల వాళ్ళు కాని,రొట్టెలు చేసే వాళ్ళు కాని యేదో ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళు వున్నారు. మొదలు వాళ్ళ వ్యాపారం వల్ల యేర్పడిన చెత్తా చెదారం రోడ్డుని ఆక్రమించకుండా వాళ్ళు చేయగలిగితే, అలా శుభ్రం చెయ్యమని మనం అంటే కస్టమర్లం పదే పదే చెప్తే వాళ్ళు తప్పక వింటారు. అప్పుడు రోడ్డు మీద నాట్యం చేసే సగం చెత్త తగ్గుతుంది.”
మెచ్చుకుంటే రెచ్చిపోతుందని “అయినా సరే నువు వాళ్ళ జోలికి వెళ్ళనంటేనే నాతో వాకింగ్ కి రా బంగారం” అనునయంగా చెప్పాడు.
ఒక క్షణం ఆలోచించుకుని సరే అంది కాంతం.
“ఆ రూట్ కాకుండా వేరే వెళ్దాము.” డిమాండ్ చేసాడు.
దానికీ సరే అంది తనలో తాను నవ్వుకుంటూ.
రోడ్డు మీద వెళ్తూ యెప్పుడూ చూసేదే అయినా ఈసారి ఇంకా యెక్కువగా గమనించసాగింది.
రోడ్దుకి అటు ఇటూ మంచి కొలతలతో ఫుట్ పాత్ వున్నా కూడా అందరూ రోడ్డు మీదనే నడవాల్సి వస్తున్నది కారణం..ఫుట్ పాత్ అంతా కూడా చెట్లూ చేమలు, చెత్త , బిల్డింగ్ వేస్టేజ్ తో నిండి వున్నది. కొద్దో గొప్పో ఖాళీగా వుంటే దాన్ని వీధి వ్యాపారస్తులు ఆక్రమించుకున్నారు. అందుకని రోడ్డు మధ్యలో నడవాల్సి వస్తున్నది.ఒక్కసారి అదంతా చక్కగా చేస్తే యెలా వుంటుందో వూహించుకుంది.తన వూహలో ఆ వీధంతా కూడా యెంతో అందంగా కనపడుతున్నది.అలా వుండాలంటే అందరూ కూడా ఆలోచించాలి..,ఆచరించాలి.
ఇంతలో కాంతం దృష్టిని స్వీపర్లు ఆకర్షించారు .వాళ్ళు చాలా సుతారంగా చెత్త హర్ట్ అవుతుందే మో అన్నట్లుగా వూడుస్తున్నారు. వాళ్ళకి ఒక పక్కగా యెన్నాళ్ళనుండి తీయలేదో పగిలిన ట్రాష్ బ్యాగ్స్ అందులో నుండి తొంగి చూస్తున్న అన్నిరకాల ట్రాష్ తమ తమ సుగంధాలతో పరిసరాలను చైతన్య పరుస్తున్నాయి. నాలుగైదు కుక్కలు వాటిల్లోనే దొర్లుతున్నాయి. నడిచే వాళ్ళందరూ కూడా ముక్కులు మూసుకుని వాటి పక్కనుండే వెళ్తున్నారు.
కాంతానికి నాలుగు దిక్కుల నుండి స్వచ్చభారత్ నినాదం వినపడసాగింది.యేదో వుత్తేజం, యేదొ చెయ్యాలన్న తపన ముందురోజు వాంతుల్లాగా తన్నుకుని రాసాగింది. నడుస్తున్నదల్లా ఆగిపోయింది..
“యెందుకే ఆగావు?గాభరాగా అడిగాడు.
“ఒక్కక్షణం…” భర్తకు చెప్పి ఆ స్వీపరు దగ్గరకెళ్ళింది.
“చూడమ్మా!” యెందుకైనా మంచిదని చీపురుకి దూరంగా నిలబడింది.
పని ఆపడానికి ఒక కారణం దొరికిందని అలసిపోయిన దానిలా ఆగింది వూడ్చే ఆవిడ.
“ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నావు? నీ డ్యూటీ నువు సరిగా చెయ్యాలి కదా? చూడు మీ చుట్టూతా యెంత చెత్త పేరుకుని వుందో?మంచిగా వూడవొచ్చు కదా? ఇలా వుంటేనే అంటు రోగాలు పెరిగేది. అలా రోగాలు వచ్చేవాళ్ళల్లో మేము వుండొచ్చు,లేదా మీరు వుండొచ్చు. అందుకని మీ డ్యూటీ మీరు బాధ్యతగా చేయాలి ” చాలా వినయంగా పొలైట్ గా చెప్పింది.
యెందుకు పిలిచిందో అని ఆగిన ఆ స్వీపరుకి వొళ్ళు మండింది కాంతం సూక్తి సుత్తావళిని వినేసరికి. “పో పోవమ్మా పెద్ద చెప్పొచ్చావు. యేళ్ల తరబడి మేమిలానే చేస్తున్నాము. ఇంతవరకు మమ్మల్ని యెవరూ అడగలేదు. నువ్వేమన్నా మాకు జీతమిస్తున్నవా అడిగేటందుకు? జీతమిచ్చేవాళ్లే అడగరు. నీకేమి పట్టింది?…ఇంక గట్టిగ అన్నవంటే మాపులిక్కడ పడేసి స్ట్రైక్ చేస్తం. యేమనుకున్నవో?” బెదిరించింది.
అదంతా వెర్రిమొహం వేసుకుని చూస్తున్నాడు కనకం.
వాళ్ళతో లాభం లేదని తమ దోవన తాము ముక్కు మూసుకుని నడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది.
“కాంతం! నాకు మాట ఇచ్చావు యెవళ్ళ జోలికి వెళ్ళనని” దీనంగా చూసాడు
“అవును “యెవళ్ళ ” అంటే నిన్న వెళ్ళిన వాళ్ళ జోలికి వెళ్ళనన్నాను కాని వీళ్ళ జోలికి కాదు..” ఈ మాత్రం తెలీదా అన్నట్లు చూసింది.
“వద్దే ఇంటికి వెళదాం రావే” ఇంకా దీనంగా అడిగాడు.
“మీకు దేశం మీద బొత్తిగా ప్రేమ భక్తి లేవు.”
“నీ మీదుందే ప్రేమ. అందరూ నిన్నలా మాట్లాడుతుంటే చూడలేనె కాంతం. మనకెందుకు చెప్పు?”
“అదిగో ఆ మాటే వద్దన్నాను. మనకెందుకేంటి? మీరు ఈ దేశపౌరులు . అయినా మీకెందుకు మీరలా చూస్తూ వుండండి” ధైర్యంగా వెళ్ళింది.
వీళ్ళు మాట్లాడినంత సేపు వీళ్ళను తప్పించుకుని నడుస్తున్నవాళ్లంతా భార్యాభర్తలు యేదో గొడవపడుతున్నరులే అనుకుని వెళ్ళిపోతున్నారు.
కనకంతో మాటలాపి వెళ్ళేవాళ్ళని ఆపింది కాంతం.
“దయచేసి మీ భార్యా భర్తల గొడవలో మమ్మల్ని లాగకండి”ఆగిన వాళ్ళన్నారు మొహమాటపడుతూ..
“మా గొడవేంటి?” అయోమయంగా అడిగారు ఇద్దరూ..
“అదే మీరేదో విషయం గురించి వాదించుకుంటున్నరు కదా?”
ఇద్దరికీ ఒక్కసారిగ నవ్వొచ్చింది.
“సరే మా సంగతి కాదు .దయచేసి కొద్ది సేపు ఆగండి”
“చూడండీ!చెత్త యెలావుందో?” చుట్టూ వున్న చెత్తను చూపుతూ అంది.
వాళ్ళు చుట్టూ చూసి “అవును చెత్త చెత్త లాగే వుంది” అన్నారు.మిగతా వాళ్ళంతా కూడా కోరస్ పాడారు.
“ఇలా వుంటే మీకు బాగుందా?”
“ఇలా వుంటే యెవరికన్నా బాగుంటుందా?” వాళ్ళకు కోపం వచ్చింది
కాంతానికి హుషారొచ్చింది “అందుకే మనం అందరం కలిసి ఈ సమస్య పరిష్కారానికి యేమన్నా చెయ్యాలి.”
“మా కంత తీరిక లేదు” సగం మంది విషయం వినగానే వెళ్ళిపోయారు.
“చూడండీ అందరం తీరిక లేదు అని వెళ్ళిపోతే ఈ సమస్య యెలా పరిష్కారం అవుతుంది?”
ఆ వెంటనే మిగతా సగం మంది వెళ్ళగా ఒకతను మాత్రం ఆగాడు
“యెవరం యెంత చేసినా దానికి పరిష్కారం అంటే ఒకటి ప్రజల్లో మార్పన్నా రావాలి లేదా అందర్నీ భయపెట్టటానికి మన చేతుల్లో పవర్ అన్నా వుండాలి.. పవర్ చేతుల్లో వున్న వాళ్ళందరూ పట్టించుకోరు. మనం యేమీ చేయలేము.” నిన్నటి నుండీ వీళ్ళను గమనిస్తున్న అతను కాంతాన్ని జాలిగా చూస్తూ చెప్పాడు..
*****************
కనకానికి నిద్ర లేదు కాని కాంతాన్నిఆ” పవర్” వుండాలి అన్నదొకటీ అమితంగా ఆకర్షించింది. దాని ఫలితమే కనకారావు కి కళ్ళు బైర్లు కమ్మి కిందపట్టం….
యెలా సంపాయించిందొ తెల్లారేసరికల్లా ఒక ఇన్స్పెక్టర్ డ్రెస్ సంపాయించింది. పైనుండి మిసెస్ కాంతం, యెస్ ఐ….అని ఇంగ్లీషులో రాసిన ఒక బ్యాడ్జ్ కూడా తగిలించుకుంది. ఇంకా ఒక లాఠీ లాంటి కర్ర కూడా…విలాసంగా వూపుకుంటూ…..
కింద పడ్డ కనకాన్ని మళ్లీ తట్టి లేపింది కాంతం.
“కాంతం..కాసిని మంచి నీళ్ళివ్వవే”అడిగాడు.
తెచ్చి కనకం కూర్చోవడానికి సాయం చేసి నీళ్ళ గ్లాస్ ఇచ్చింది.
తాగి గ్లాస్ పక్కన బెట్టి “ కాంతం ఇలా కూర్చో నా పక్కన నీకు కొన్ని మంచి మాటలు చెప్తాను….కాస్త విను ఆ తర్వాత కూడా అల్లానే వెళ్తానంటే నీ ఇష్టం. నీ ఇష్టం యేదన్నా నేనెప్పుడన్నా కాదన్నానా?”ప్రేమగా అడిగాడు.
బుద్దిగా లేదన్నట్లు తల వూపింది.
“నీ ఆశయం చాలా గొప్పది. దానికొక పద్దతి వుంటుంది. మొదటగా యెన్నో యేళ్ళబట్టి ఇక్కడ వుంటున్నాము. నువ్వెవరో కొద్దిమందికైనా తెలిసే వుంటుంది. రాత్రికి రాత్రి నువ్వు ఇన్స్పెక్టర్ అయ్యావంటే యెవరు నమ్మరు..ఇదేమీ సినిమా కాదు. నువ్వీ వేషంతో వెళ్ళి యెవరినన్నా బెదిరించావంటే కడుపుమండిన యెవడో కేసు కూడా పెట్టక్కరలేదు పోలీసులతో చెప్పినా చాలు నిన్ను తీసుకెళ్ళి శాశ్వతంగా కటకటాల్లో తోసేస్తారు. నీ ఆశయం అక్కడ సమాధి, నేనిక్కడ సమాధి కావాల్సిందే”
గభాలున కనకం నోరు మూసింది అశుభం మాట్లాడొద్దన్నట్లు.
చేయి తప్పించి చెప్పసాగాడు “అంచేత కాంతం చెప్పొచ్చేదేమిటంటే.. నువు నిన్న మొన్నా యెన్ని వేషాలు వేసినా అవి నేరాలు కావు. కాని ఇది నేరం వద్దు మనకీ ప్రయత్నాలు.”
“మరెలా?కటకటాల్లోకి వెళ్ళక పోయినా నా ఆశయం సమాధి అయ్యేట్లుందిగా?” నిరుత్సాహపడింది.
“జరిగేదేమిటంటే సూపర్వైజర్ అడగడం లేదని స్వీపర్లు పట్టించుకోరు. తమ పైవాళ్ళు వాళ్ళ గొడవలో వాళ్ళుంటారని సూపర్వైజర్లు పట్టించుకోరు. ప్రభుత్వం అడగడం లేదని అధికారులు పట్టించుకోరు.”
“ప్రజలు అడగడం లేదని ప్రభుత్వం పట్టించుకోదు” పూర్తి చేసింది కాంతం. మెచుకోలుగా చూసాడు .
“కనుక కాంతం దీని గురించి యేమి చెయ్యాలా అన్నది మన కాలనీ వాళ్ళం కొంత మందిమి కలిసి చర్చిద్దాము. ఇది సమిష్టి కృషి.ఒక్కళ్ళతో కాదు …ప్రస్తుతానికి ఆపేసి నాకు మాంచి కాఫీ ఇవ్వు బంగారం” గోముగా అడిగాడు కనకం.
“అయ్యో! ఈ యావలో పడి మీకు కాఫీ ఇవ్వటమే మరిచాను. చిటికెలో తెస్తాను డియర్” తన ఆశయం పూర్తిగా మూతబడదు అన్న హుషారుతో వంటింట్లోకి వెళ్ళింది కాంతం.
“హమ్మయ్య గండం గడిచి పిండం బయటపడింది” నిస్త్రాణగా వెనక్కి వాలాడు కనకం……రెండు రోజులుగా నిద్రలేని కనకారావుకి వెంటనే నిద్ర పట్టింది, కాంతం కాఫీ తెచ్చేలోగానే…

**********శుభం*********