మాయానగరం 50

రచన: భువనచంద్ర

“షీతల్” ఉద్వేగంతో వణికిపోయాడు కిషన్. రుషి షాక్ తిన్నాడు. ఠక్కున వెనక్కి తిరిగింది షీతల్. కిషన్‌ని చూసి సర్వం మర్చిపోయి అతని కౌగిట్లో ఒదిగిపోయింది. ఆమెని అలాగే పొదివి పట్టుకుని మండపం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. అతని గుండె ఎగసి పడుతోంది. కళ్లవెంట ధారగా నీరు కారుతోంది.
‘రుషి సైలెంటుగా, శబ్దం రాకుండా గుడిలో వున్న అవధానిగారి దగ్గరకు చేరాడు. బిళహరి అక్కడే వున్నది. జరిగిన విషయాన్ని లోగొంతుకతో బిళహరికీ, అవధానిగారికీ చెప్పాడు రుషి.
“మనంతట మనం ఏమీ అడగవద్దు. ఇద్దరూ హిందీ(గుజరాతీ)వాళ్ళే., అసలు వారిద్దరి మధ్య వున్న సంబంధం ఏమిటో మనకి తెలియదు గదా. ఏదో కష్టంలో వుండి ఇక్కడి కొచ్చింది షీతల్. ఆ కష్టాన్ని తీర్చి ఆయన ఆమెని తీసికెళ్ళొచ్చు. ఏదేమైనా వారంతట వారు చెప్పేవరకూ మనం సైలెంటుగా వుండటమే మంచిది” తనకి తోచింది చెప్పింది బిళహరి.
“మంచి ఆలోచన బిళహరిగారూ.. అలాగే చేద్దాం” సమ్మతించాడు రుషి. తల పంకించారు అవధానిగారు.
ఓ గంట సేపు బిళహరి, అవధానిగారూ, రుషి గుడిలోనే కూర్చున్నారు. బయటికి వస్తే ఆ అలికిడికి షీతల్, కిషన్ డిస్టర్బ్ అవుతారని. ఆ తరవాత ఎవరో భక్తులొచ్చి గంట కొట్టారు.
అప్పుడే స్పృహ వచ్చినట్టు విడివడ్డారు కిషన్.. షీతల్.
“సారీ, ఇన్నాళ్ల తర్వాత చూసిన ఆనందంలో మొదట మాకు మాటలు రాలేదు. ఆ తరవాత షీతల్‌ని అడిగాను. తను మీ గురించి చెబితే టైం గుర్తురాలేదు.రుషిజీ.. మిమ్మల్ని ఎలా గౌరవించాలో, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు నిజంగా తెలియడంలేదు. అసలు షీతల్ బ్రతికి వుంటుందనే ఆశే నాలో ఇంకిపోయింది. ఈమెకి నా వలన జరిగిన అన్యాయానికి మా యింట జరిగిన అవమానానికి నాలో నేనే కృశించిపోతున్నాను. ఇన్నాళ్లకి మళ్లీ చచ్చిపోయిన మనిషి ప్రాణం వచ్చినట్లయింది.” రుషి రెండు చేతులూ పట్టుకుని చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు కిషన్. “ఇందులో నాదేమీ లేదు కిషన్‌జీ. ఈ గుడికి మీరొచ్చారు. ఈమె మీకు కనిపించింది. నాదేం వుందీ. ఒక్క మాట సత్యం. షీతల్ నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తి. అణకువ, అభిమానం,, అనురాగం మూర్తీభవించిన వ్యక్తి యీమె.” ఆమె మీది తన గౌరవాన్ని ప్రకటించాడు రుషి.
“అవును. ఆమె మీకు ఏమవుతుందో తెలీదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఈమె చాలా సాత్వికురాలు.” చాలా అభిమానంగా షీతల్‌ని చూసి అన్నారు అవధానిగారు.
“పండిత్‌జీ.. యీమె నాకు ఏమవుతుందని అడిగితే నేనూ ఏమీ చెప్పలేను. అన్ని బంధాలకీ అతీతమైన బంధం అని మాత్రం చెప్పగలను. అయ్యా. నా విన్నపం ఒక్కటే. షీతల్ కొన్నాళ్లపాటు ఇక్కడే వుంటుంది. పరిస్థితుల్ని చక్కబెట్టి నేను నాతో తీసికెళ్లడానికి కొంతకాలం పడుతుంది. ఈ క్షణం నించీ ఆలయం తాలూకు సర్వవిషయాలు నేను చూసుకుంటాను. మీకేమి సమస్య వచ్చినా నాకొక్క కబురు అందిస్తే చాలు.” అంటూ జేబులోంచి చెక్ బుక్ తీశాడు కిషన్.
“అయ్యా.. డబ్బు అవసరం లేదు. మాకే కాదు.. షీతల్‌కి కూడా కేటరింగ్‌కి సహాయం చేసినందుకు రుషిగారు మా ఇద్దరికీ ఎప్పటికప్పుడు లెక్కకట్టి ఇస్తూనే వున్నారు. అవి మేము బేంకులో వేసుకున్నాం” వినయంగా అన్నది బిళహరి.
చెక్ బుక్ తియ్యగానే, షీతల్ బిళహరివంక ఇబ్బందిగా చూస్తూ కనుసైగ చెయ్యడమే బిళహరి మాట్లాడడానికి కారణం.
“అవును” అన్నది షీతల్.
చాలాసేపు కిషన్ అక్కడే వున్నాడు. వాళ్లిద్దరినీ వొదిలేసి మిగతావారు లోపలికెళ్లి వంట ప్రయత్నాలు చెయ్యసాగారు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ వివరంగా షీతల్‌కి చెప్పాడు కిషన్.
“ఒక్క నిముషంలో వస్తాను”కిషన్‌కి చెప్పి వంటశాలలోకి పరిగెత్తింది షీతల్.
“అక్కా.. కొన్ని నే చేస్తాను”బిడియంగా అనంది షీతల్.
“అమ్మయ్యా.. హిందీ వంటలెలా చెయ్యాలా అని కంగారు పడుతున్నా. హాయిగా నువ్వే చెయ్యి” పీటమీంచి లేచింది బిళహరి.
“కడుపునిండా భోంచేసి కొన్ని నెలలైపోయింది.”తృప్తిగా తిని అన్నాడు కిషన్.
“ఇవి ఇంటికి” విస్తరిలో పేక్ చేసిన ఆలూ పరోటాలూ, కూరలు నీట్‌గా ఓ సంచీలో పెట్టి అందించింది షీతల్.
ఇంకా వుంది.

మాయానగరం 49

రచన: భువనచంద్ర

“మీరొక్కసారి మా ఆలయాన్ని చూడండి బాబూజీ. చూశాక మీకే అర్ధమవుతుంది” జరిగిన విషయాలన్నీ చమన్‌లాల్‌కి వివరించి అన్నాడు రుషి. ప్రభుత్వం కదలాలన్నా, ప్రభుత్వ యంత్రాంగం పని చెయ్యాలన్నా ‘పరపతి’ వున్నవాళ్ళని ఆశ్రయించక తప్పదు.
జిల్లా కలెక్టరుకి వివరంగా చెప్పాడు. కలెక్టరు ఎలా పరిచయం అంటే కలెక్టరుగారి అబ్బాయి ఒడుక్కి ఆయన రుషికి కేటరింగ్ ఆర్డర్ ఇవ్వడం వల్ల. కలెక్టర్ చాలా పాజిటివ్‌గా స్పందించి విషయాన్ని స్వయంగా చూచి వారం రోజుల్లోగా రిపోర్టు అందించాలని పి.ఏ.కి ఇన్స్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. పి.ఏ. దేవాదాయ శాఖకి, తదితర శాఖలకి వెంటనే కలెక్టరువారి ఆర్డర్‌ని పాస్ చేశాడు.
ఎందుకయినా మంచిదని, అవసరం అయితే పొలిటీషియన్స్‌ని కూడా రంగంలోకి దించాలంటే చమన్‌లాల్ వంటి ‘బదాబాబుల’కి మాత్రమే సాధ్యమౌతుందనీ యోచించి రుషి చమన్‌లాల్‌కి విషయాన్ని వివరించాడు.
“తప్పకుండా రుషి. నా అల్లుడ్ని కాపాడావు. నా కూతురి మూర్ఖత్వం వల్ల రోజుల తరబడి మంచాన పడి వున్నావు. నేను నూటికి నూరుపాళ్లూ నీకు సహాయం చేస్తాను. సారీ. నీకు కాదు. నూటికి నూరుపాళ్లూ నాకు నేను సహాయం చేసుకుంటాను. బాబూ, నా వొంట్లో ప్రవహించేది రక్తం కాదు. పేదవాళ్ల చెమట. వడ్డీల రూపంలో నేను తాగి తాగి జీర్ణించుకున్న విషం. ఈ పుణ్యకార్యం వల్లనైనా నాక్క్కొంచెం మనశ్శాంతి లభిస్తుందేమో. పోయేలోగా నా కూతుర్ని నేను చూడగలనేమో?” కళ్లల్లోంచి కన్నీరు జాలువారుతుండగా అన్నాడు చమన్‌లాల్.
“బాధపడకండి బాబూజీ. దేవుడు కరుణామయుడు. తప్పక మీకు భగవంతుని కరుణ లభిస్తుంది. మీ సమస్యలు అన్నీ తీరతై” రుమాలుతో చమన్‌లాల్ కన్నీటిని తుడుస్తూ అన్నది మదాలస. రోజురోజుకి చమన్‌లాల్ బేలగా మారిపోవడం ఆమెకి అత్యంత బాధ కలిగిస్తోంది.
“కిషన్‌ని పిలువమ్మా”నిట్టూర్చి అన్నాడు చమన్‌లాల్.
వెళ్లి పిలుచుకొచ్చింది మదాలస.
“కిషన్.. రుషిగారితో వెళ్ళి ఆలయాన్ని చూసి రా నాయనా. అక్కడ ఏమేమి అవసరమౌతాయో అన్నీ స్వయంగా గమనించి డబ్బుకి వెనుకాడకు. ఖర్చంతా నాదే” మెల్లగా అన్నాడు చమన్.
“అలాగే బాబూ! పదండి రుషీజీ” రుషితో బయతికి నడిచాడు కిషన్‌చంద్ జరీవాలా.
“సుందరి తిరిగి వస్తుందామ్మా” బేలగా అని, “ఏమో. అది చాలా మొండిది. ఎంత మొండిదైనా నా ఒక్కగానొక్క కూతురు. నా గారాబమే దాన్ని చెడగొట్టింది ” కళ్లు మూసుకున్నాడు ధమన్. అతని మాటల్లో అంతులేని వేదన.
మదాలస ఏదో చెప్పబోతుండగా ఫోన్ మ్రోగింది.
“బాబూజీ ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు. నాకు సరిగ్గా అర్ధం కావడం లేదు” అంటూ ఫోన్ చమన్‌లాల్‌కి ఇచ్చింది. “ఆ..!” రెండు నిమిషాలు విని “భగవాన్” అంటూ ఫోన్ పెట్టేశాడు చమన్‌లాల్. మొహమంతా చెమటలు పట్టినై. మదాలస అర్జెంటుగా ఓ ఆస్ప్రిన్, ఓ సార్బిట్రేట్ మాత్ర తీసి ఆయన్ని నోరు తెరవమని నాలుక క్రింద పెట్టీంది. నీళ్లు ఓ అరగుక్క తాగించి డాక్టర్‌కి ఫోన్ చేసింది.
“వద్దమ్మా. సుందరి బాంబే హాస్పిటల్లో వుందని ఫోనొచ్చింది. అర్జంటుగా వెళ్లాలి”” అంత నీరసం, మగతలోనూ లేవబోతూ అన్నాడు చమన్‌లాల్.
“ఒక్క క్షణం ఆగండి బాబూజీ. డాక్టర్ వచ్చాక ఆయన పరిమిషన్ తీసుకుని మీరు ప్రయాణం చేయగల స్థితిలో వున్నారంటే తప్పక వెడదాం. నేనూ మీ వెంట వస్తా. లేకపోతే కిషన్‌గార్ని రుషితోపాటు పంపిద్దాం.” అనునయంగా అన్నది మదాలస.
“కిషన్ ని చూస్తే అదింకా పెచ్చురేగిపోతుంది. నేనే వెళ్ళాలి”బేలగా అన్నాడు చమన్%లాల్.
“డాక్టరొచ్చాక నిర్ణయిద్దాం. ఒకవేళ కిషన్‌గారు వద్దనుకుంటే మాధవక్కని, మాకు తెలిసిన బోస్‌గారినీ తీసుకుని నేనే వెడతా..” చెయ్యి నిమురుతూ అన్నది మదాలస. ‘బోస్’ నాన్ బెయిలబుల్ వారెంటు మీద అరెస్టయ్యాడని మదాలసకి తెలీదు. కారణం ఎక్కువ సమయం కిషన్‌చంద్ పిల్లలకి కేటాయించవలసి రావడం. తెలుగు పేపర్లు ఇంటికి రాకపోవడం.
“దైవేచ్చ”కళ్లు మూసుకుని వెనక్కి వాలాడు చమన్‌లాల్.
*****
“రొయ్య బాబూ. నువ్వు చాలా గొప్పోడివే కాదు తెలివైన వాడివి. ఎలాగైన ఆరాచకం సృష్టించి బోసుబాబుని అన్‌పాపులర్ చెయ్యాలని శామ్యూల్ రెడ్డికి నూటికి నూరుపాళ్లు విధేయుడిగా పనిచేశావు. నాకు తెలిసి నువ్వో గొప్ప ఇన్వెస్టిగేటర్‌వి. పోలీసు డిపార్టుమెంటులో అద్భుతమైన ట్రాక్ రికార్డు వున్నా, పైకి కనపదని అత్యాశతో నువ్వు చెయ్యరాని తప్పులు చెసి సస్పెండు కాబడ్డావు. ఆ తరవాత ఆ డిపార్టుమెంటుని ఉపయోగించుకుంటూనే స్వంత ‘బిజినెస్’ స్టార్ట్ చేశావు”ఆగాడు సర్వనామం.
“గురూజీ, నన్ను పిలిపించింది నా గతాన్ని నాకు చెప్పడానికా?” నవ్వాడు రొయ్యబాబు. అతని వంక సూటిగా చూసి నిట్టూర్చాడు సర్వనామం.

“అఫ్‌కోర్స్.. కాదు. హాయిగా క్రైం ఇన్‌వెస్టిగేషన్ ప్రయివేటుగా చేస్తూ మంచిగానే సంపాయిస్తున్నావు. అక్కడే ఆగక నీది కాని పరిధిలోకి ఎందుకొచ్చినట్టు రొయ్యబాబూ! క్రైం వేరు, క్రైం ఇన్‌వెస్టిగేషన్ వేరు. క్రిమినల్ వరల్డ్ వేరు. తేడా ఉల్లిపొరంతే కనిపించవచ్చు. సరే. అవన్నీ మాట్లాడుకుని ఉపయోగం లేదు. నువ్వేం చేశావో నీకూ తెల్సు. పైకి వెళ్లిపోయిన మూడువందల మంది మృతులకి మాత్రం తెలీదు. వారి కుటుంబాలకి తెలీదు. నువ్వు చెయ్యమన్న పని చేసి హాయిగా విస్కీ పుచ్చుకుంటూ హత్య కాబడుతున్నా చిన్న హింట్ కూడా తెలీకుండా హత్య చెయ్యబడ్డ మస్తానయ్యకి తెలీదు. అసలు నువ్వు ఏం చేశావో నీకు హార్డ్ కేష్ నిండిన ‘సూట్‌కేస్’ ఇచ్చిన శామ్యూల్ రెడ్డికి కూడా తెలీదు. కానీ.. అవన్నీ నాకు తెలుసు”నిర్లిప్తంగా, నెమ్మదిగా అన్నాడు సర్వనామం. షాక్ తిన్నాడు రొయ్యబాబు.
సర్వనామం ఉద్ధండుడు అని తెలుసు. కానీ ఇంత ఫాస్ట్ అని తెలీదు.
“సరే.. జరిగినదాని సంగతి వదిలెయ్. సర్వనామంగారూ.. ఎంత కావాలి?” సూటిగా ప్రశ్నించాడు రొయ్యబాబు. పోలీసు వుద్యోగం వొదిలినా పోలీస్ ధాటి పోలేదు.
“హా.. హా.. ఏం కావాలో నీకు తెలీదా? తెలుసు. కానీ తెలీనట్టు నటిస్తావు. గుడ్. రెండుగంటల్లో నవనీతం నా ముందుండాలి”
“నవనీతమా? ఆవిడ ఎక్కడుందో నాకేం తెలుసు?”మొహం నిండా ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అన్నాడు రొయ్యబాబు.
“నీ ప్రశ్నకి సమాధానం కూడా నీ దగ్గరే వుంది. మూడోసారి హెచ్చరించే అలవాటు నాకు లేదు. కరెక్టుగా రెండు గంటల్లో నవనీతం నా ముందుండాలి”లేచాడు సర్వనామం.
“లేకపోతే” నవ్వాడు రొయ్యబాబు.
” నీ క్రైం లిస్టు ఎక్కడుండాలో అక్కడుంటుంది. అంతే కాదు నీ పుట్ట పగులుతుంది. అన్ని పాములూ బయటికొస్తాయి. అంత రచ్చ అవసరం కాదని నువ్వనుకుంటే ఎవరెవరిని నువ్వు బ్లాక్‌మెయిల్ చెయ్యడానికి ఆధారాలన్నీ రికార్డు చేసి పెట్టావో, ఆ రికార్డులన్నీ స్వయంగా నేనే వారికిస్తా. అఫ్‌కోర్స్ ‘తగిన’ పరిహారం తీసుకుని. డిపార్టుమెంటులో వున్నా, బయటికి నెట్టబడ్డా పోలీసోడీ బ్రెయిన్ పోలీసోడిదే. కాస్సేపు క్రిమినల్ బుద్ధి పక్కనెట్టి ఆలోచించుకో!” ముందుకు నడిచాడు సర్వనామం.
వళ్లంతా చెమట్లు పట్టాయి రొయ్యబాబుకి. బులెట్ బండి స్టార్ట్ చెసి దూకించాడు. అంత టేన్షన్‌లోనూ తనని ఎవరైనా వెంబడిస్తున్నారేమో అనే విషయాన్ని అతను మర్చిపోలేదు. జాగ్రత్తగా రకరకాలుగా వీధులు చుట్టి, రిక్షాలూ, ఆటోలూ మార్చి చివరికి నవనీతాన్ని దాచిపెట్టిన ఒంటరి బిల్డిగ్‌లోకెళ్ళి తలుపులు తెరిచి చూశాడు. నవనీతం జాడ లేదు. ఆమెకి కాపలాగా నియమించిన అసిస్టెంట్లు లేౠ. ఆ అసిస్టెంట్లలో ఒకడు ‘మోతాదు’ ప్రకారం పర్ఫెక్టుగా మత్తుమందిచ్చే ఎనస్థటిస్టు. అంటే అతనేమీ డాక్టరో, కాంపౌండరో కాదు. ఓ నర్సుకి లవర్‌గా ఆమెనించి కొంత నాలెడ్జిని సంపాయించినవాడు.
గుండె గుభేలుమంది రొయ్యబాబుకి. ఈ ఇంట్లో నవనీతాన్ని దాచినట్టు నరమానవుడికి కూడా తెలీదని, కనీసం అనుమానమైనా రాదని అతని నమ్మకం. అలాంటిది అసలుకే మోసం రావడం అతనికి కొరుకుడు పడలేదు.
“ఎవరికి వెళ్లాలో వాళ్లకి చేరతై”అన్న సర్వనామం వార్నింగ్ గుర్తొచ్చి వొణికిపోయాడు. గతం గుర్తొచ్చింది. నవనీతం ప్రెగ్నంట్ అనగానే సర్వనామం మొహంలో షాక్, ఆనందం రెండూ గుర్తించాడు రొయ్యబాబు. ఓ మనిషిని ప్రత్యేకంగా నవనీతాన్ని , మరో మనిషిని ప్రత్యేకంగా సర్వనామాన్ని అబ్జర్వ్ చెయ్యడానికి పెట్టాడు. ఆ తరవాత అతనికి బోసుబాబు పొలిటికల్ గురువైన ‘గురువు’గారి దగ్గర్నించి పిలుపొచ్చింది. రొయ్యబాబు అసలు పేరు రుక్మిణీనాధ శాస్త్రి.
“రుక్మిణీ, నీతో పని పడిందిరా” ప్రయివేటు రూంలో రొయ్యబాబుని కూర్చోబెట్టి అన్నాడు గురూజీ.
“చెప్పండి స్వామి.. మీ బంటుని” వినయంగా అన్నాడు రొయ్యబాబు.
“బోసుబాబు పట్టాలు తప్పాడు. ఆ రైలు గమ్యం చేరదు. శామ్యూల్ రెడ్ది పనికొస్తాడు. కానీ, వాడికో అడ్వైజరున్నాడు. వాడి పేరు సర్వనామం. ఆవులిస్తే పేగులు కాదు నరాల్నే లెక్కబెట్టే తెలివితేటలు వాడివి. మెల్లగా నువ్వు శామ్యూల్ రెడ్డికి నమ్మకం కలిగించి గుడిసెల సిటీలో మారణహోమం సృష్టించు. బోస్ చేసినట్టుగా బయటికి రావాలి. కానీ, శామ్యూల్ చేసినట్టు ఆధారాలుండాలి. అంటే, ఒకే దెబ్బకి రెండూ పిట్టలు.. నేల రాలకూడదు, మన చేటిలో చిక్కాలి. అర్ధమయిందా? నీకో ఆయుధం కూడా ఇస్తా. అదేమంటే ఆ జర్నలిస్టు కాని జర్నలిస్టు మాధవి రూంకి నిప్పు పెట్టించింది శామ్యూల్ రెడ్డి. ఆ నేరం వేరేవాళ్ల మీద పడాలని వాడి ఉద్ధేశ్యం. చాలా చిన్న పొరబాటుతో ఆ ప్రయత్నం ‘పొగల’ పాలయ్యింది ” చాలా మెల్లగా స్పష్టంగా చెప్పాడు గురువుగారు.
“సరే స్వామి.. ఇప్పట్నించే మీ పనిలో వుంటాను”వినయంగా అన్నాడు రొయ్యబాబు.
“ఎలా ఎప్రోచ్ అవుతావు?” నల్లకళ్లద్దాలు తీసి స్పష్టంగా లోతుగా రొయ్యబాబు కళ్లలోకి చూసి అన్నాడు గురూజీ.
“ఒక దారి వుంది గురూజీ” అని నవనీతం విషయం చెప్పాడు రొయ్యబాబు. “అదెలా ఉపయోగపడుతుందీ?” కుతూహలంగా అన్నాడు గురొజీ.
“శామ్యూల్ రెడ్డికి తెలీదు. సర్వనామానికీ, బోసుబాబు ఇలాకాలో మొన్నటిదాకా ఉన్న నవనీతానికీ కనెక్షన్ వుందని. నవనీతం కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి సర్వనామం అని నూటికి నూరుపాళ్లు నేను చెప్పగలను. నవనీతం కోసం నిన్ను సర్వనామం డబుల్‌క్రాస్ చేస్తున్నాడనీ, అసలతను పని చెసేది బోస్ కోసమని శామ్యూల్ రెడ్డితో చెబితే?” నవ్వాడు రొయ్యబాబు.
“శభాష్‌రా రుక్మిణీ. ఫెంటాస్టిక్. దిగ్విజయోస్తు. పోయిరా “మహదానందంగా అన్నాడు గురూజీ. ఖర్చుల కోసం ఓ లక్ష రొయ్యబాబుకి ఇప్పించాడు అంత ఆనందంలోనూ గురూజీ మర్చిపోలేదు.
“వద్దు స్వామి..”సిన్సియర్‌గా అన్నాడు రొయ్యబాబు.
“ఇది నీ సిన్సియారిటీకి కాదు. అది వెల కట్టలేనిది. ఇది ఇచ్చేది రోజువారీ ఖర్చులకోసం. చెయ్యాల్సిన పని చిన్నది కాదు. చాలా ఖర్చవుతుందని నాకు తెలుసు. ఇది జస్ట్ అడ్వాన్సు. అంతే” రొయ్యబాబు భుజం తట్టి అన్నాడు గురూజీ.

*****

మరోసారి వొణికిపోయాడు రొయ్యబాబు. నవనీతాన్ని ఇక్కడ్నించి ఎవరు ఎత్తుకెళ్ళి వుంటారూ? అంత ధైర్యం, స్తోమతు, నెట్‌వర్కు వున్నది గురూజీకే. మరెవరికీ అంత ఆలోచన రాదు. సడన్‌గా గురూజీకీ,తనకీ వారం క్రితం జరిగిన మరో సంభాషణ గుర్తుకొచ్చింది.

*****

“రొయ్యబాబుగారూ, గురూజీ మీకేదో పని వప్పగించారంట. దాని తాలూకు వివరాల్ని ఆయనకి పర్సనల్‌గా అందించమన్నారు” చెప్పాడొ అపరిచితుడు పోస్టాఫీసు దగ్గరుండగా. వెంటనే బయలుదేరి గురూజీ నివాస స్థలానికి వెళ్లాడు రొయ్యబాబు.
“గొప్పగా బోస్‌ని ఇరికించావు రుక్మిణీ. అది శామ్యూల్ రెడ్డి చేసినట్టుగా ఎస్టాబ్లిష్ అయ్యే ఆధారాలు కావాలన్నాను. దొరికాయా? ఇస్తావా? ఆధారాలు నువ్వే సృష్టించి వుంటావు గనక దొరకాల్సిన పనిలేదుగా. ఎప్పుడిస్తావు?” సందేహానికి తావు లేకుండ, వంక చెప్పే వీలు లేకుండా ప్రశ్నించాడు గురొజోఎ.
“గురూజీ. అన్నీ భద్రంగా వున్నాయి. మరొక్క జాగ్రత్త తీస్కోవాలి. ఆ జాగ్రత్త తీసుకోడం పూర్తయ్యాక మొత్తం వివరాలు మీకు వొప్పగిస్తాను”స్పష్టంగా , ధైర్యంగా, నమ్మకంగా చెప్పాడు రొయ్యబాబు.
“ఆధారాలకు డూప్లికేట్లు వుండకూడదు రుక్మిణీ. వాటి గురించిన ‘వాసన’ కూడా మిగిలి వుండకూడదు”హెచ్చరించాడు గురూజీ. ఆ స్వరం వెనక వున్న వార్నింగ్ మామూలుది కాదని రొయ్యబాబుకి తెలుసు.
“తప్పకుండా!” వినయంగా అన్నాడు రొయ్యబాబు.
“తప్పకుండా అంటే మరో కాపీ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటావనా!” పకపకా నవాడు గురూజీ. ఉలిక్కిపడ్డాడు రొయ్యబాబు. గురూజీ వార్నింగ్ కంటే, చూపుకంటే భయంకరమైనది ఆయన నవ్వు. చూసేవాళ్లకది వెన్నెల్లా చల్లగా, అమాయకంగా వుంటుంది. కానీ దాని పర్యవసానం అతి భయంకరం. ఆ విషయం రొయ్యబాబుకి స్పష్టంగా తెలుసు. జవాబు చెప్పడానికి తడుముకునే లోపులోనే “జోక్‌గా అన్నాను. టేక్ ఇట్ ఈజీ రుక్మిణీ. వెళ్లిరా. జాగ్రత్త” రొయ్యబాబు భుజం తట్టి లోపలికి వెళ్లిపోయాడు గురూజీ.
నాలుగు వారాలయినా గురూజీకి అందించవలసిన వివరాలు అందించలేదు. గురూజీ అరిచే కుక్క కాదు. అతి ప్రేమగా తోకాడిస్తూనే గొంతు కొరికే భైరవం. భయంతో ఒళ్ళు వణికిపోయింది రొయ్యబాబుకి.
“ఆడ.. ఆడ.. నవనీతాన్ని ఎత్తుకుపోయే అవకాశం ఇంకెవరికుందో ఆలోచించు.” పోలీస్ మనసు హెచ్చరించింది. ఆలోచించాడు రొయ్యబాబు. “శామ్యూల్ రెడ్డికున్నాయి. ఎందుకంటే సర్వనామం గురించి అన్నీ చెప్పినా నవనీతం కడుపులో వున్నది సర్వనామం బిడ్డ అని శామ్యూల్ రెడ్డితో చెప్పలేదు. శామ్యూల్ రెడ్డి ఆ బిడ్డ బోస్ వలన కలిగే బిడ్డ అనే అనుకుంటాడు గానీ, సర్వనామానికి చెందిందని వూహలో కూడా అనుకోడు. శామ్యూల్ రెడ్డి గనక నవనీతాన్ని తన దగ్గర బంధిస్తే, బోస్‌తో నవనీతాన్ని అడ్డం పెట్టుకుని శోభ కొసమూ, పార్టీ టిక్కెట్టు కోసమూ బ్లాక్‌మెయిల్ చెయ్యచ్చు లేదా బేరమాడవచ్చు. సో ఇప్పుడు నేను హేండిల్ చెయ్యాల్సింది శామ్యూల్ రెడ్డిని” పోయిన ధైర్యం వచ్చింది రొయ్యబాబుకి.
బులెట్ వెడుతుండగా సడన్‌గా ఓ ఆలోచన వచ్చి బ్రేక్ వేశాడు రొయ్యబాబు. శామ్యూల్ రెడ్డి తనకి డబ్బిస్తుండగా తీయించిన (రహస్యంగా) ఫోటోలో, టేప్ రికార్డర్ కేసెట్టూ పదిలంగా వున్నాయా అనేదే ఆ ఆలోచన. బండి వెనక్కి తిప్పి తను వుండే చోటికి పోయి లాకర్ తీశాడు రొయ్యబాబు. అక్కడ లాకర్ ఖాళీగా వెక్కిరించింది.
గుండె జారిపోతున్న ఫీలింగ్‌తో నేల మీద కూలబడ్డాడు రొయ్యబాబు.

*****
“సార్.. లారీ ట్యూబుల్లో మందు ఫ్రీగా సప్లై చేసింది మస్తానయ్య. మస్తానయ్య మావాడ వాడే. పరమ సోమరిపోతు. పని చెయ్యడు అని అతని పెళ్ళాని వదిలేసింది. చిల్లర దొంగతనాలు చేస్తాడని మాకు తెలుసు. కానీ మావాడల్లో చెయ్యడు. గత నెలా, నెలా పదిహేను రోజులుగా మహా జల్సాగా తిరుగుతున్నాడు. బీడీముక్క కోసం మా దగ్గర చెయ్యిజాపే వాడు కాస్తా మాకే కింగ్ సైజు సిగరెట్లు తాగమని ఇస్తున్నాడు.
సారా పాకెట్ట్టు కోసం వెంపర్లాడేవాడు యీ మధ్య వైను షాపు నుండి ఫుల్‌బాటిల్ తెస్తున్నాడు. చిరిగిన లుంగీలు కట్టేవాడు కాస్తా పంచలు, కొత్త పేంటూ షర్టులూ వేస్తున్నాడు. డబ్బు ఎక్కడ్నించి వొస్తుందిరా అని నేనే అడిగా. దానికి వాడు “రోజూ నక్కని తొక్కి వస్తున్నాలే అన్నా” అని జవాబు దాటేశాడు. అయ్యా, బోసుబాబు అదివరకటి సంగతేమోగానీ, ఇప్పుడు నిజంగా మంచోడు. మాధవమ్మ మా గుడిసెలవాడలోకి అడుగుపెట్టాక నిజంగా మా బతుకులు బాగుపడుతున్నై. కల్తీ సారా వల్లే డయేరియా వచ్చుంటే, ఆ కల్తీ సారాతో బోసుబాబుకి ఏమాత్రం సంబంధం లేదని సత్యప్రమాణంగా చెబుతున్నా. బోసుబాబు వెనక ఏదో కుట్ర జరుగుతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పగల్ను” బోనులో నిలబడి సాక్ష్యం చెప్పాడు వాడ్రేవుల గవర్రాజు.
“అంత స్పష్టంగా ఎలా చెప్పగలవు?” అడిగాడు జడ్జి. ” ఆ మూడు రోజులు నేనే కాదండి మరో అయిదుగురం బోసుగారితోనే వున్నామండి”
“మరి మస్తానయ్యే మందు సప్లై చేశాడని చెప్పింది అబద్ధమా?”
“కాదండి. వరద పెరిగాక మా యింటావిణ్ణి కూడా తీసుకొస్తానని బయల్దేరి వెళ్లానండి. మస్తానయ్య ట్యూబుల్ని సెంటర్లో వున్న రావిచెట్టు కాడ దింపించడం చూశానంది. ఆడు దింపించింది సామాన్లు షిఫ్టు చేసే చిన్న మోటారు బండిలోనండి. అప్పుడే అనుకున్నానండి. వర్షంలో యీడు ఇంత సరుకు తేవడానికి అప్పెవడిచ్చాడా అని” వివరించాడు గవర్రాజు.
మొత్తం 3 1/2 రోజుల్లో 32 మంది సాక్షులు బోస్‌కేమాత్రం సంబంధం లేదని పటిష్టంగా చెప్పారు. కేస్ కొట్టివేయబడింది. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు బోస్‌బాబుతో వున్న మరో నలుగురూ, అంటే శోభ, మాధవి, మరో ఇద్దరు సంక్షేమ సంఘం వాళ్లూ తమ సాక్ష్యాన్ని ఇచ్చారు. జడ్జి బాగా ఇంప్రెస్ అయింది మాధవీరావు స్టేట్‌మెంటుతో. మాధవి జడ్జికి గుడిసెలవాళ్ల బాగుకోసం తాము చేపట్టిన కార్యక్రమం వివరాలూ, ఆ కార్యక్రమంలో బోసుబాబు చేహ్స్తున్న నిస్వార్ధ సేవ గురించీ చక్కగా వివరించింది.
“అంటేకాదు మేడం. గుడిసెవాసుల్ని మళ్లీ సారాకి బానిసల్ని చేసే అవకాశం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సారాయి దుకాణాన్ని నదిపే బోస్‌బాబు తనే మూసేశాడు. అది వేరొకళ్లు పాడుకునే లోపునే యీ అనర్ధం జరిగింది. దయచేసి అతని చిత్తశుద్ధిని శంకించవద్దండి. ఆయన నిజంగా ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తి” అని స్పష్టంగా చెప్పింది.
మాధవి మాటలు విన్న బోస్‌బాబు కళ్లల్లో కన్నీరు ఉబికింది. ఒక ‘బండరాయిని శిలగా మార్చిన శిల్పి యీ మాధవి” అనుకున్నాడు.
“మాధవిగారూ, ఒక్క విషయం నాకు అర్ధం కావడం లేదు. ఇంతమందిని నాకు సపోర్టుగా నిలబెట్టి నన్ను బయటికి తెచ్చింది ఎవరూ?” మాధవిని అడిగాడు బోసుబాబు.
“నిజంగా నాకూ తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం బోసుబాబూ. మంచి మనసుతో చేసే ఏ మంచిపనికైనా దేముడి అభయం ఎప్పుడూ వుంటుంది” తన ఇంటి తలుపుల్ని తీస్తూ (బోసుబాబు ఇల్లే) అన్నది మాధవి.
బోసుబాబు మాధవితోపాటు శొభ, మేరీ, సౌందర్య, గవర్రాజు ఇంకా కొందరు సంక్షేమ సంఘం సభ్యులు కూడా వున్నారు. బోసుబాబు ప్రశ్నకి మాధవి సమాధానం మేరీని ఆనందం కలిగించలేదు. కానీ ఒక్కటి మాత్రం రుజువైంది. సాక్షుల్ని మోటివేట్ చేసింది మాధవి, శోభ etc కాదు, మరెవరో ఉన్నారన్నది.

మాయానగరం – 47

రచన: భువనచంద్ర

మబ్బులు కమ్ముకుంటున్నై. అప్పటిదాకా జనాల్ని పిప్పి పీల్చి వేసిన ఎండలు నల్లమబ్బుల ధాటికి తలవొంచక తప్పలేదు. తెలుపు నలుపుల సమ్మేళనంలా వుంది వెలుగు. గాలి చల్లగా వీస్తూ చెట్లని, మనుషుల్నీ పరవశింపజేస్తోంది.
“ఓ రెంకన్నొరే.. వర్షవొచ్చీసినట్టుంది. రారేయ్ “ఏలూరినించి వచ్చిన ఓ రిక్షా కార్మికుడు ఆనందంగా అరిచాడు.
“హా భయ్.. బారిష్ ఆయేగీ “ఓ ముస్లీం సోదరుడన్నాడు.
“సారల్.. సారల్.” సన్నగా పడుతున్న చినుకులని చేతుల్లో పట్టేట్టు అటూఇటు నాట్యం చేస్తున్నట్టుగా కదులుతూ అనంది ఓ తమిళపిల్ల. క్షణాల్లో చినుకులు వానగా మారాయి. మబ్బులు గువ్వుల గుంపుల్లా వచ్చాయి. ఓ చీకటి తెర భూమి మీదకి జారినట్టు అనిపించింది.
” ఓ యాదీ.. జర గుడ్డలు భద్రం” అరిచిందో ముసలమ్మ. “ఉన్న గుడ్డలు తడిస్తే ఎలా” అనేది ముసలవ్వ గోల. వానలో తడవాలని పిల్లలకు హుషారు. ఎవరు ఎవర్నించి సలహాలు తీసుకుంటారూ? వర్షం దూరపు చుట్టంలాంటిది. ఆ చుట్టం కనక పేదది అయితే కుచేలుడు అటుకులు తెచ్చినట్టు నాలుగు చినుకుల్ని వర్షించి చక్కా పోతుంది. కాస్త దిట్టంగా డబ్బుల్ని ధారాళంగా చుట్టాలకి ఖర్చు పెట్టి చుట్టమైతే రోజుల తరబడి కురిసి, వీధుల్నీ, గుడిసెల్నీ, కాలువల్నీ, అన్నింట్నీ ‘వాన నీరు’ అనే బహుమతితో అతలాకుతలం చేసి పోతుంది. పేదదైనా, గొప్పదైనా చుట్టం చుట్టమేగా. కొన్ని వర్షాలు దర్జాగా లాండ్ కొలతలకి వచ్చే లంచం మరిగిన అధికారుల్లా వస్తే , కొన్ని వర్షాలు నంగి నంగిగా, దొంగదొంగగా కింద పడ్డ బిస్కెట్ పేకెట్ని తటాల్న పట్టుకుని పారిపోయే అనాధపిల్లల్లా వస్తాయి. కొని రౌడీగాళ్లలా ఉరుములు మెరుపుల్తో వస్తే కొన్ని కబ్జాదారుల్లా వడగళ్ళతో వస్తాయి. వర్షాలు ఎటువంటివైనా వర్షాలేగా! మనుషుల్లో లక్షాతొంభై తేడాలున్నట్టు వాటిలోనూ వున్నాయిమరి
“ఇది మూడో వర్షం కదూ…?” నవ్వుతూ అన్నది వందన.
“అవును” ఆమె అరచేతిలో చెయ్యివేసి అన్నాడు ఆనంద్.
‘మొదటి వర్షమూ జూన్ మాసంలోనే”దగ్గరగా జరిగి అన్నది వందన. వర్షంలో సముద్రాన్ని చూడటం ఓ అద్భుతమైన అనుభవం. ‘మొదటి’ వర్షం గుర్తుకొచ్చింది ఆనందరావుకి
‘రాధాకృష్ణ’ చాట్ షాపు నించి నడుస్తూనే ‘పృధ్వీ థియేటర్స్”కి వెళ్లారిద్దరూ. లోపలికి వెళ్లగానే సుందరీబాయి కనిపించింది ఆనందరావుకి. కలిసి పలకరిద్దామనుకున్నవాడు కాస్తా ఠక్కున ఆగిపోయాదు. ఆమె ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. ఆనందరావు వందన చెయ్యి పట్టుకుని గబగబా సీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నాటకం పేరు కూడా అతనికి గుర్తులేదు. పూర్తిగా సుందరీబాయి ప్రవర్తన గురించిన ఆలోచనలే.
నాటకం పూర్తయ్యాక సుందరీవాళ్లు బయటికి వెళ్లిన కాసేపటి తరవాతే బయటికి వచ్చాడు ఆనందరావు. వందనకి కొంత ఆశ్చర్యం. పూర్తి నాటకం అయ్యేంతవరకూ ఆ.రా ఒక్కమాట కూదా మాట్లాడలేదు. అయ్యాక కూడా తను కూర్చోవడమే గాక వందనని కూడా బలవంతంగా కూర్చోబెట్టాడు.
“ఏం జరిగింది ఆనంద్? ఎందుకు అంతసేపు కూర్చోబెట్టావూ?” అదిగింది వందన. సుందరీబాయి గురించి చెప్పాలో లేదో కూడా అతనికి అర్ధం కాలేదు.
“చెప్పకూడదా?” అతని తటపటాయింపుని గమనించి అన్నది వందన.
“చెప్తాను కానీ అపార్ధం చేసుకోవుగా?” అన్నాడు. ఆ.రా.
“అపార్ధం ఎందుకు చేసుకుంటానూ? హాయిగా చెప్పు. మనం స్నేహితులం. అన్ని విషయాలనీ నమ్మకంగా షేర్ చేసుకోవాలి.” అన్నది వందన ఆ.రా. చెయ్యి తట్టి. సుందరీబాయి పరిచయం నించీ ఆమె తన వెంటపడటం గురించి పూర్తిగా చెప్పి ” మనం థియేటర్లో అడుగుపెట్టగానే నేను చూసింది ఆమెనే. మళ్లీ ఎక్కడ నా వెంట పడుతుందో అనే భయంతోనే నేను దూరంగా ఉంటూ, నిన్ను బయటకి రానివ్వలేదు” అన్నాడు. చాలా సేపు అతని కళ్లల్లోకి చూసి ” ఓ మాట చెప్పనా బేబీ.. నౌ.. ఇప్పుడే చెప్పాలని వుంది. I Love You. I cant live without you అన్నది వందన. ఆమె గొంతులో అంతకు ముందుఎప్పుడూ వినపడని మాట. ఆమె కళ్లల్లో అద్భుతమైన మెరుపు.

*****
“ఏమిటీ ఫస్టు రైన్ గుర్తొచ్చిందా?” మరింత దగ్గరగా జరిగి అన్నది. “అవును. I Love You అని నువ్వు చెప్పగానే నేను మూగబోయాను. ఏదో ఓ అపురూపమైన వరం నాకు దొరికినట్లయింది” దగ్గరగా తీసుకుని అన్నాడు ఆనందరావు.
ఆ తరవాత ఆ.రా వందనకి తన జీవితాన్ని గురించీ, శొభ మొదలైన వారందరి గురించీ చెప్పాడు. మాధవి విషయం మాత్రం ‘ఆమె నాకు అత్యంత గౌరవనీయురాలు’ అన్నాడు. అన్నీ చెప్పాక అతని మనసు వర్షం కురిసి వెలిసిన ఆకాశంలా స్వచ్చమైపోయింది.
“త్వరలోనే వందన మనతో పెళ్ళి గురించి ఎత్తేలా వున్నది. నీ వుద్దేశ్యం ఏమిటీ?” చాలా దూరం నించి నడిచి వస్తున్న ఆ.రా నీ, వందననీ చూసి అన్నాదు దిలీప్ నింబాల్కర్. “వరుడ్ని వెతికే కష్టం తప్పింది. ఆ కుర్రాడు నిజంగా మంచివాడు” అన్నది నిరుపమా నింబాల్కర్.
“అతని వివరాలేమీ మనకి తెలీదు. అతని తల్లిదండ్రులు, అన్నదమ్ముల వివరాలు కూడా తెలీదు” అస్పష్టంగా అన్నాడు దిలీప్.
“మనం వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్న సంగతి మర్చిపోయావా దిలీప్” నవ్వింది నిరుపమ.
“ఒకవేళ వివాహం సక్సెస్ కాకపోతే?” భార్య కళ్లలోకి చూశాడు దిలీప్.
“తల్లిదండ్రులం మనమున్నాం. వందనని లోకంలోకి తీసుకొచ్చింది మనం. దాని జీవితం ఎప్పుడు ఎలా వున్నా, నూటికి నూరుశాతం ధైర్యాన్నీ, భద్రతన్నీ ఇవ్వడం మన బాధ్యత. లోకం లక్ష మాట్లాడనీ. మన బిడ్డని మనం సపోర్టు చెయ్యకపోతే ఇతరులెందుకు చేస్తారూ?” స్పష్టంగా, ధైర్యంగా స్థిరంగా అన్నది నిరుపమ.
“నిరుపమా.. I am in love with you again. మరోసారి మనిద్దరం మళ్లీ పెళ్లి చేసుకుందామా?” నిరుపమని దగ్గరగా లాక్కుని అన్నాడు దిలీప్.
“ష్యూర్. ముందు వాళ్ల పెళ్ళి చేసేద్దాం. మనవల్నీ, మనవరాళ్ళనీ ఎత్తుకుందాం. షష్టిపూర్తి రోజున అందరి ముందు మజామజాగా మళ్లీ పెళ్ళి చేసుకుందాం.” చిలిపిగా నవ్వి కౌగిట్లో ఒదిగిపోయింది నిరుపమ.

*****
“ఐ లవ్ యూ సుందూ బట్ ఐ హేట్ యువర్ డాడ్” మారియట్ హోటల్లో సుందరీబాయి శిరోజాల్ని సవరిస్తూ అన్నాడు మదన్.
వాళ్ళిద్దరి మధ్య శృంగారం కొత్త కాదు. కాలేజీ రోజుల్లోనే కౌగిళ్ల లోతులు దాటారు. నవ్వింది సుందరీబాయి.
“ఎందుకూ హేట్ చెయ్యడం. ఇద్దరికీ పెళ్ళయింది. ఇద్దరికీ పిల్లలున్నారు. అయినా మజా చేస్తున్నాంగదా. మదన్, హేట్రడ్‌తో టైం వేస్ట్ చేసుకోకు. Make Love No War అన్నారంటారు పెద్దలు.”చిలిపిగా అంది సుందరి.
“యూ ఆర్ రైట్ ప్రెటీ” అన్నాడు మదన్. సుందరీబాయికి మదన్ గొప్ప ప్రేమికుడిగా, గొప్ప ఆరాధకుడిగానే తెలుసు. అద్భుతమైన అతని రూపం వెనకాల, తీయని చిరునవ్వుల వెనకాల దాగున్న క్రూరత్వం సుందరికి తెలీదు.
అసలు అహంకారం, అహంభావం వున్న ఏ వ్యక్తికీ ఎదుటివారిలోని అసలు గుణం కనపడదేమో.
కోటీశ్వరుడి నించి కూలివాడిదాకా సెల్‌ఫోన్లున్న కాలం కాదది. మైక్రో కెమెరాలు కొనగలిగే స్తోమత అతి కొద్దిమందికే వుండేది. అటువంటి కెమెరా ఒకటి మదన్ దగ్గర వుందనీ, అతనా రూం బుక్ చేసినప్పుడే తనకి కావలసిన చోట దాన్ని అమర్చాడని సుందరికి ఎలా తెలుస్తుందీ?
సుందరికి తెలిసింది ఒక్కటే , పావలా సుఖాల్ని ఇచ్చి దానికి బదులుగా పది రూపాయల సుఖాన్ని పిండుకోవడం. పక్కనున్నది జరీవాలా అయినా ఒకటే, మదన్ మాలవ్యా అయిన ఒకటే.

మాయానగరం 46

రచన: భువనచంద్ర

రెండు శవాలు. ఒకటి చాకు గుండెల్లో సూటిగా గుచ్చుకుపోగా చచ్చిపోయిన మహాదేవన్‌ది. రెండోది త్రాచుపాము కాటుతో చనిపోయిన పరమశివానిది. చాకుమీద వేలిముద్రలు పరమశివానివని రుజువు కావాలి. త్రాచుపాము కోరల గుర్తులు రుజువయ్యాయి. కోరల గుర్తులే కాదు నల్లగా విషంతో మాడిన శరీరమూ, నోటి నుండి నురగ.
మౌనదేవతలా నిల్చుంది నందిని. ఎంతమంది కూర్చోమన్నా కూర్చోలేదు. తెల్లార్లూ నిలబడే వుంది. నిలబడే ఓపిక లేక కూర్చుండిపోయాడు వెంకటస్వామి. అతని కళ్ళల్లో నీరు ఇంకిపోయింది. పోలీస్ స్టేషన్ పట్టపగల్లా వుంది.
“ముందు శవాల సంగతి చూడండి..” ఇన్‌స్పెక్టర్‌తో రిక్వెస్టింగ్‌గా అన్నాడు సర్వనామం. అతను వచ్చి ఓ అయిదు నిమిషాలయింది.
“మీరెవరూ?” కూల్‌గా అడిగాడు ఇన్‌స్పెక్టర్ సుభానీ. “సర్.. నేను శామ్యూల్‌గారి దగ్గర పని చేస్తూ వుంటాను. చాలాసార్లు మహాదేవన్‌గారి హోటల్లోనే భోంచేశాను. ఆయన చాలా సత్పురుషుడు. పరమశివం మెంటాలిటీ గురించి చెప్పింది కూడా ఆయనే. మరోవారంలో కేరళ వెళ్ళిపోతున్నాననీ, బిడ్డ పెళ్లి చేస్తాననీ కూడా చెప్పారు. పరమశివం గురించి పోలీస్ రిపోర్టు ఇస్తానని నేను చెప్పినా, మహాదేవన్‌గారు వాడి పాపాన వాడ్ని పోనివ్వండి. సొంత చుట్టాన్ని పోలీసులకి వప్పగించే పాపం నేనెందుకు చెయ్యాలి” అన్నారు. సార్ వీడు పరమదుర్మార్గుడు. తండ్రి కళ్లముందు చస్తున్నా గుక్కెడు నీళ్లని పొయ్యకుండా మాటల శూలాలు గుచ్చి ఆనందించిన పరమక్రూరుడు. వీడి చరిత్ర అంతా వాడి పెట్టెలోనే వుందని మహాదేవన్‌గారు చెప్పారు. దేవుడు లేడని అనుమానిస్తాం గానీ, ఖచ్చితంగా వున్నాడు. వీడు పాముకాటుకు గురై చావడమే అందుకు రుజువు. ఆ పుణ్యాత్ముడి శరీరం మాత్రం నిర్లక్ష్యానికి గురికాకూడదు” వినయంగా సుభానీతో అన్నాడు సర్వనామం.
తల పంకించాడు సుభానీ. అతనికొకటి అర్ధమయింది. బయటికి చెప్పినదానికంటే సర్వనామానికి చాలా చాలా తెలుసని. ఇంకోటి కూడా అర్ధమయింది. అతను విప్పదల్చుకుంటే తప్ప అతని నోరు ఎవరూ విప్పించలేరనీ. తండ్రి తలకి తానే ‘కొరివి’ పెడతానని పట్టుబట్టింది నందిని. తనని దూరంగా పంపే ఏర్పాట్లు తండ్రి చేసి వుంటాడని ఆమెకి అర్ధమయింది.
లోకంలో ఓ చిత్రముంది. అన్నెంపున్నెం ఎరుగని అమాయకులు కూడా చిన్న దెబ్బ తగిలితే లోకరీతిని అర్ధం చేసుకోగలిగేంత ఎదుగుతారు క్షణాల్లో. ఒక్కోసారి సర్వం తెలిసినవాళ్లు కూడా ఒక్క దెబ్బకి కుప్పకూలిపోతారు. ఇప్పుడు నందిని కళ్లల్లోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ కూడా అమాయకత్వం లేదు.
“నీ ఆలోచన ఏమిటమ్మా” ఒంటరిగా కలిసి అడిగాడు సర్వనామం. అతని వంక ఓ చూపు చూసింది. ఆ చూపులో “నిన్నెలా నమ్మగలనూ? అసలు నువ్వెవరివీ?” అనే ప్రశ్నలు కనబడ్డాయి సర్వనామానికి. చిన్నగా నవ్వాడు.
“నాకు అర్ధమైంది తల్లీ. నేనెవరనేది నీ ప్రశ్న. అసలు ఎందుకు కల్పించుకుంటున్నానానేది మరో ప్రశ్న. సరే . మీ తండ్రిగారు గతించి నేటికి పదోరోజు. నువ్వు అన్నట్టుగా తెలుగువారి సాంప్రదాయం ప్రకారమే కర్మ జరిపిస్తున్నాను. ధర్మోదకాలు అయ్యాయి. మరో రెండు రోజుల్లో 12వరోజు పెద్ద కర్మ కూడా పూర్తవుతుంది. గత తొమ్మిది రోజులనుండి నేను చాలా పనులు చేశాను. అందులో ముఖ్యమైనవి ఏమంటే మీ నాన్నగారి అభిమతం ప్రకారం నిన్ను కేరళకి మీ నాన్నగారి స్నేహితుడి ఇంటికి క్షేమంగా పంపే ఏర్పాట్లు చెయ్యడం. ఆ ఏర్పాట్లు చూసే సందర్భంలో తెలిసింది, మీ నాన్నగారి స్నేహితుడు పరమపదించాడనీ, అతని బంధువులు మంచివారు కారనీ. మీ నాన్నగారికి వెంకటస్వామి కేవలం నీ ఆస్తి కోసమే నిన్ను వలలో వేసుకుంటున్నాడనే నమ్మకం. అది ముమ్మాటికీ నిజమే. అర్జంటుగా రాత్రికి రాత్రి ‘రిచ్’ అయిపోవాలమనే దురాశ, పేరాశ అతనివి. అలా ఆశపడడం తప్పే అయినా, అదేమీ అసాధారణమేమీ కాదు. వెంకటస్వామి దురాశాపరుడేగాక దుర్మార్గుడు కాదు. మొదట్లో అతని మనసులో ఏమున్నా, మీ నాన్న గతించిన క్షణం నించీ అతనిలో చాలా పరివర్తన వచ్చింది. నీకు నిజం చెబుతా విను.

మాయానగరం 45

రచన: భువనచంద్ర

జీవించడం తెలీనివాడు జీవితాన్ని మధించలేడు.
అన్నీ వున్నవాడు ఎదుటివాడి ఆకల్ని ఏనాడూ గమనించలేడు.
జీవితం అంటేనే ఒక ఉగాది పచ్చడిలాంటిది. అక్కడ చేదు, పులుపు, తీపి, కారం, వగరూ, వుప్పూ లాంటి రుచులుంటే, ఇక్కడ సుఖం, కష్టం, విరహం, ప్రేమ, కన్నీరు, కపటం, మోసం, మాయలాంటి అనేక విధానాలు వుంటాయి.నిన్నటి దేవుడు ఇవ్వాళా దేవుడుగానే వుంటాడని గ్యారంటీ లేదు. అదే విధంగా నిన్నటి విలన్ ఇవ్వాళా విలన్ పాత్రనే పోషిస్తాడనే నమ్మకమూ లేదు. ఆకాశంలో మబ్బులు రూపు మార్చుకున్నట్టు, మనిషిలోని ఎమోషన్సూ మారుతూనే వుంటాయి.
“అసలు జీవితాన్ని నేను ఏం చూశానూ? ఏమి అనుభవించానూ?” అనే ప్రశ్న రానే కూడదు. ఒక్కసారి ఆ ప్రశ్న బుర్రలో పుడితే చాలు, మరుక్షణం నించీ బుర్రని పురుగు తొలిచినట్టు తొలుస్తూనే వుంటూంది.మాధవి పరిస్థితి ప్రస్త్తుతం అదే.
ప్రస్తుతం మాధవి వున్నది గోవిందరాజస్వామి ఆలయం వున్న స్ట్రీట్‌లో. ఆ యిల్లూ బోస్‌దే. కానీ వేరే పేరు మీద వున్నది. అతనికా వూళ్ళో చాలా ఇళ్ళున్నై. కానీ అలా వున్న విషయం జనాలకి తెలీదు. అద్దెలమీదే దాదాపు పాతికవేల ఇన్‌కమ్ వుందతనికి.
“మాధవిగారూ.. జరిగినదానికి చాలా బాధగా వుంది. జనాలకి మేలు చెయ్యాలనే తలంపు తప్ప వేరేమీ మీ మనసులో వుండదు. అలాంటి మీ ఇంట్లోకే వచ్చి నిప్పు పెట్టారంటే మామూలు విషయం మీకంటూ శతృవులు లేరని నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా”సైలెంటయ్యాడు బోస్.
“ఎవరి పని అయ్యుండొచ్చు. అయినా నన్ను నిప్పులపాలు చేస్తే ఎవరికి లాభం?” నిస్పృహతో అంది.
“నాదీ అనుమానమే. ఖచ్చితంగా ఇది శామ్యూల్ రెడ్డి పని అని చెప్పలేనుగానీ, ఒక అవకాశం అతనికుంది. ఎన్నికల్లోనించి నన్ను తప్పిస్తే అతనికి అవకాశం వస్తుందనే కారణమూ కావొచ్చు. సిన్సియారిటీలు, నిస్వార్ధాలూ మానేసి గెలుపుకి ట్రై చెయ్యమని మా గురువుగారూ హింట్ ఇచ్చారు. ఏమైనా జరిగింది జరిగింది. ఇకనించీ మెరు జాగ్రత్తగా వుండాలి. అఫ్‌కోర్స్ మిమ్మల్ని కంటికి రెప్పలా, అనుక్షణం కాపాడమని మావాళ్లకి ఖచ్చితంగా చెప్పాను. వాళ్లని మీకు పరిచయం చేస్తా. వాళ్లు నాకొసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడరు. నా మాట అంటే వాళ్లకి సుగ్రీవాజ్ఞ లాంటిది” ధైర్యం చెప్పాడు బోసుబాబు.
“వద్దండీ, అదేమీ వొద్దు. లోకానికి భయపడే మనస్తత్వం కాదు నాది. అదీగాక, మీరు బాడీగార్ద్శ్‌ని పెడ్తే లేనిపోని రూమర్లు పుట్టుకొస్తాయి. అవి మీకూ, నాకూ కూడా మంచిది కాదు. అయినా ఈ ఇల్లు అదివరకు దానిలాగా ఒంటరిది కాదుగా. చుట్టూతా ఇళ్లూ, జనాలూ వున్నారు. ప్లీజ్. నా రక్షణ కోసం ఎవర్నీ పురమాయించకండి. నా జాగ్రత్తలో తప్పకుండా నేనుంటాను” స్పష్టంగా, ధైర్యంగానూ జవాబిచ్చింది మాధవి.
“సరే.. మీ ఇష్టం” లేచాడు బోసుబాబు.
*****
“ఇందులో ఎవరి పాత్ర వుండి వుంటుందంటావూ?” అడిగాడు అద్వితీయ ఎదురుగా వున్న ‘పరాగా’న్ని.
“ఏం చెప్పను భాయీ.. ఎవరిదైనా వుండొచ్చు. శామ్యూల్ రెడ్డి కావచ్చు. పొరపాటున ఎక్కడ్నించో ఎగిరిపడి వచ్చిన నిప్పురవ్వది కావొచ్చు. అసలు బోసుబాబుదే కావొచ్చు. ఇంకా ముందు కెడితే బోసుబాబుని ‘సరైనా దారిలో పెట్టడానికి మన మహాగురువుగారు చేయించిన ప్రయోగమైనా కావొచ్చు. ఏదీ ఇతమిద్దంగా చెప్పలేము. ఒక్కటి మాత్రం నిజం. నిజాన్ని వెలికితీసే ప్రయత్నం వల్ల లాభమూ, నష్టమూ రెండూ వున్నై. అసలైన ‘వాడ్ని’ కనుక్కుంటే కాస్త డబ్బు పిండుకోవచ్చు. రాంగ్ నంబర్ అయిందనుకో, మనం విసిరిన బూమెరాంగ్ మన తోకనే తెంపుతుంది.”సుదీర్ఘ వివరణ ఇచ్చాడు పరాగం
‘జర్నలిస్టు’ అనే పదానికి చెడ్డపేరు తెస్తున్నారు మీరు. డబ్బు పిండుకోవడం ఏమిటి అసహ్యంగా” విసుక్కుంది సంఘమిత.
“అమ్మా సంగమ్మా. నీది కడుపు నిండిన వ్యవహారం. మా సంగతంటావా.. ఏరోజు కారోజు వెతుకులాటలే కదా. అయినా నిస్వార్ధాలూ, చట్టుబండలూ పోయి చాలా కాలం అయింది. ఇప్పుడు పత్రికలకి కావల్సింది సర్క్యులేషన్. అదుండాలంటే సెన్సేషన్‌ని క్రియేట్ చెయ్యాలి. అది కూడా అలాంటిలాంటి సెన్సేషన్ కాదు. ఆంధ్రదేశం అట్టుడికిపోవాలి. ఇది నా మాట కాదు. ప్రతి పత్రిక యాజమాన్యం మన చెవుల్లో ఇల్లు కట్టుకుని మరీ నినదించే మాట” కొంచెం కచ్చిగా అన్నాడు అద్వితీయం. ఈ మధ్య సెన్సేషనల్ న్యూస్ ఇవ్వడం లేదని అతనికి ఆల్రెడీ ఎగ్జ్యూటివ్ ఎడిటర్ నించి అల్టిమేటం వచ్చింది మరి. ఏం చేస్తాడు. జర్నలిస్టు కోపం జనాలకి చేటు.
“బాబూ గోడలకి చెవులూ, నోళ్ళూ ఎక్కడెక్కడో కాదు, ఇక్కడా వుంటాయి” నిర్లిప్తంగా అన్నది సంఘమిత్ర. పైకి నిర్లిప్తంగా అన్నా లోపల మాత్రం పరాగం మాటల గురించి ఆలోచిస్తుంది.

*****

ఎవరో మాధవి గదిలో నిప్పు పెట్టారన్న విషయమూ, ఆమె ప్రస్తుతం అనఫిషియల్‌గా బోసు ఇంట్లో నివాసముంటున్న విషయమూ గుడిసెల సిటీని వూపేసింది. నిజంగా చెబితే గుడిసెల్లోని యువకులంతా భగ్గున మండి పడుతున్నారు. బోస్‌తో మాధవి కలిసి గుడిసెలవాళ్లకోసం చేస్తున్న మంచి పనులు మొదట యువతకి చికాకు కలిగించినా, మాధవి మెల్లగా, ప్రేమగా వారికి నచ్చచెప్పడం వల్ల వారూ ‘మార్పు’ని ఆమోదించగలిగే స్థితికి చేరుకున్నారు. ఆ ‘మార్పు’ శరవేగంగా జరుగుతున్న సమయంలో ఇలా తమ నాయకురాలికి జరగడం వాళ్లని కోపోద్రిక్తుల్ని చేసింది.
అసలు గుడిసెవాసుల్లో ఇంతటి రియాక్షన్ వుంటుందని బోసుబాబే వూహించలేదు. మాధవి ఇంతగా జనాల్ని ఆకట్టుకుంటుందనీ, అతనూ వూహించలేదు. రియాక్షన్ చూసిన క్షణమే అతని మనసులో సన్నగా ‘అసూయ’ పొటమరించినా, మరుక్షణమే దాన్ని తృంచేశాడు. కారణం మాధవికొచ్చే పేరు మొత్తం ఉపయోగపడేది తనకేగా. మంచివాడు చెడటానికి క్షణం పట్టదు. కానీ చెడ్డవాడు మంచివాడు కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది.
ఒక్కసారి బోసుబాబు ఆలోచించాడు. మాధవి ప్రణాలికల్ని. “బోస్‌గారూ, మీరు వీరిని బాగు చేద్దామనుకుంటున్నారు. కానీ ఎలా బాగు చేస్తున్నారూ? చలికాలం దుప్పట్లు, రగ్గులు, ఎండాకాలం కుండలు, ప్లాస్టిక్ బిందెలు, వానాకాలం గొడుగులూ ఉచిత సారా పాకెట్లు ఇస్తున్నారు. బాగు చెయ్యడం అంటే ఇదేనా? ఇవ్వాళ ప్రభుత్వం చేస్తున్నదీ, మీరు చేస్తున్నదీ కూడా ఒక్కటే. జనాల్ని బిచ్చగాళ్లుగా మార్చడం. మీరు అన్నదానం అంటూ మొదలెడతారు. అందరూ క్యూలో మీరిచ్చే పులిహోర పేకెట్లు పెరుగన్నం పేకెట్లూ తీసుకుని, ‘కలకాలం*’ వర్ధిల్లు బాబూ అంటూ దీవిస్తారు. పత్రికలూ, చానల్సూ మిమ్మల్ని పొగిడి పొగిడి దానకర్ణుడంటూ ఆకాశానికి ఎత్తేస్తాయి. ఈ పుణ్యం-ఆ పాపం =సరికి సరి అనుకుంటూ గుండెలమీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతారు. జరుగుతున్నది ఇదేగా?” సూటిగా అడిగింది.
అవునన్నట్టుగా తలూపాడు బోసుబాబు. కాదనడం ఎలా, జరుగుతున్నది అదే అయినప్పుడు.
“ఏం చెయ్యాలంటావు అక్కా?”అడిగింది శోభ. సౌందర్య, వసుమతి ఇంకొదరు టీచర్లు అక్కడే వున్నారు. గుడిసెల సిటీలోనించి ఉద్భవించిన కొందరు విద్యార్తులూ అక్కడున్నారు. మంచీ చెడూ విచక్షణా గ్నానం కలిగిన పెద్దలూ కొందరు అక్కడున్నారు.
“సేవ అనేది ఎప్పుడూ ‘దానం’ ప్రాతిపదిక మీద వుండకూడదు. అది పటిష్టమైనదిగానూ, నిర్మాణాత్మకమైనదిగానూ వుండాలి. ఓ పేద్ద వానొస్తుంది. ఇళ్ళలోకి నీళ్ళొస్తాయి. అప్పుడు వరదబాధితులకి ఆహారం అందించడమూ, వారు రాత్రి పదుకోవడానికి పొడిగా వుండే చోటు చూపడమూ మన నైతిక బాధ్యత. అది తాత్కాలికమే అయిన నీడ్ ఆఫ్ ద అవర్. వరదలు వచ్చేముందే నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేసి వరదనించి రక్షింపబడటానికి (అదెప్పుడు వచ్చినా) చర్యలు తీసుకోవడం, శాశ్వత ప్రాతిపదికపై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చెయ్యదం అసలు సిసలైన ప్రజాసేవ.” ఓ క్షణం ఆగింది మాధవి.
“అసలు మీరీ బడుగు ప్రజలకు ఏమి చేస్తే, ఎలా చేస్తే బాగుంటుందనుకుంటున్నారు?” అడిగాడో యువకుడు.
గుడిసెల్లో పుట్టీ, అక్కడ్నించే కష్టపడి చదివి డిగ్రీ తీసుకున్న ముగ్గురిలో అతనొకడు. పాతికేళ్ళ వయసుంటూంది. పట్టణాభివృద్ధి శాఖలో పని చేస్తున్నాడు. గుడిసెల సిటీని ఆనుకుని వున్న మిడిల్ ఇన్‌కం గ్రూప్ (M.I.G) కాలనీలో వుంటున్నాడు.
“చెప్తాను. మనం చేయదలుచుకున్నది ప్రజలకి తెలియాలన్నా, ప్రగతిఫలాలు వారికి అందాలన్నా, మనం తాత్కాలిక విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తూనే, మన పని నిరంతరం కొనసాగించవలసి వుంటుంది. అది ఏ ఏ రంగాల్లో అంటే,
మొదటిది విద్య. రెండోది పారిశుధ్యం. మూడు పొదుపు. నాలుగు పరస్పర సహకారం. అయిదు మూలనిధి. ఆరు సమాచార వ్యవస్థ. ఏడు మద్య బహిష్కరణ. ఎనిమిది అందుబాటులో వుండటం. ఒక్కోదానికి పదిమంది పర్మనెంటు సభ్యులు వుండాలి. అంటే మొత్తం ఎనభై మంది. ప్రతి గ్రూపులో పదిమంది సభ్యులున్నా వారిలో ఒకరైనా ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి. ఈ పై అంశాల మీద ప్రజలకి వివరించి ప్రజల్ని మోటివేట్ చేస్తూనే వుండాలి. ఫలితం వెంటనే కనపడకపోవచ్చు. కానీ, ఒక్కసారి ప్రజల్లో చైతన్యం మొదలైతే, అద్భుతమైన ఫలితాన్ని అదీ శాశ్వత ఫలితాల్ని సాధించగలం..” తన మనసులోని మాటని వివరించింది మాధవి.
మిగతావన్నీ అర్ధమయ్యాయి .. యీ మూలనిధి అంటే ఏమిటి? ఎందుకూ?” అడిగిందో టీచరు.
“మా కాలేజీలో “కూర్గ్” ప్రాంతానికి చెందిన అమ్మాయొకతి వుండేది. ‘తుళు’ బాష మాట్లాడేది. జనరల్ కరియప్ప, తిమ్మప్ప ఇలాంటి మహనీయులని కూడా కూర్గే. వారు మన దేశం వారే అయినా వారి సంప్రదాయాలు కొన్ని అద్భుతమైనవి.మరెక్కడా అవి కనిపించవు.ల్ అదేమిటంటే, బిడ్డ పుట్టీన మరుక్షణం నించే తలకి ‘ఇంత’ అని సంఘానికి కట్టాలి. పిల్లల చదువుల బాధ్యత సంఘానిదే. అలాగే పెళ్లి. ఎంత గొప్పవాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, పెళ్లి సంఘ నియమాల ప్రకారమే జరగాలి. ఆ పెళ్ళి అయ్యాక రిసెప్షన్ పేరు మీద ఓపికున్నంత, నీ స్తోమతు ప్రకారం ఖర్చు చేసుకో. పెళ్ళి మాత్రం సంఘ నియమాలకి లోబడి పరిమితమైన కుటుంబ సభ్యులు, సంఘ సభ్యుల మధ్యే జరగాలి. అలాగే మరణించినపుడు “అయ్యో! డబ్బు ఎక్కడ దొరుకుతుందా?” అని వెంపర్లాడక్కర్లేదు. జీవితంలోని ముఖ్యమైనవన్నీ సక్రమంగా ఏ టెన్షనూ లేకుండా జరిగిపోతాయి” ఆగింది మాధవి.
“అద్భుతమైన సంప్రదాయం ఇది. అబ్బా. ఎవరు చనిపోయినా మనం డబ్బు దొరక్క ఎంత ఇబ్బంది పడతాం” ఆశ్చర్యంతో అన్నాడో పెద్దాయన.
“అసలు ఇదే పద్ధతి అన్ని చోట్లా అమలయితే ఎంత బాగుంటుండునూ” కళ్లు మెరుస్తుంటే అన్నది శోభారాణి.
“అమలయ్యే చాన్స్ లేదు. మాధవిగారన్నట్లు ఆ మూలనిధిని ఏర్పాటు చేసినా, మనవాళ్లయితే గుటుక్కుమని మింగి కూర్చుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రకటించి వాటికి నిధులు సమకూర్చినా ఆ డబ్బు జనానికి అందుతోందా? అందినా, ఎంత శాతం అందుతోంది?” నిర్లిప్తంగా అన్నాడింకో పెద్దమనిషి.
“అయ్యా.. ఆ మూలనిధిని ఒక్క పైసా కూడా వృధా కాకుండా, దొంగల , స్వార్ధపరుల పాలు కాకుండా పర్ఫెక్టుగా అమలు జరిపే పద్ధతి కూడా కూర్గువారే కనిపెట్టారు. కనుక ఆ సొమ్ము ఏమవుతుందనే భయం అక్కర్లేదు. మనమూ మన కోసం అటువంటి మూలనిధిని అమర్చుకుంటే, మరణం సంభవించినప్పుడు నూటికి నలభై రూపాయలకి డబ్బు వడ్డీకి తెచ్చుకోనక్కర్లేదు. జీవితాంతం ‘అసలు’ని కట్టలేక ఇల్లు బళ్ళూ గుల్ల చేసుకోనక్కర్లేదు. సరే, ఆ విషయాలనీ చక్కగా వివరించే మూలనిధిని కలెక్ట్ చేద్దాం. ముందు యీ ఎనిమిది గ్రూపులూ, వాటి పనితీరు గురించి చక్కగా చర్చించుకుందాం. ఒక్కడో, లేక కొందరో ఏమీ చెయ్యలేరు. అందరం సంఘటితమైతే మనం చెయ్యలెని పనే లోకంలో వుండదు” స్థిరంగా అనంది మాధవి.
“అందరం సమ్మతిస్తున్నాం. మీరెం చెప్పినా మాకు సమ్మతమె” అని అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆ సమావేశం జరిగింది రిక్షాలు పార్కు చేసే జండా చెట్టు కింద. అక్కడికక్కడే గా.మో.క సమిష్టి సహకార సంఘం ఏర్పాటయింది. అధ్యక్షుడిగా బోసుబాబు, కార్యదర్శిగా మాధవి, కార్యకర్తలుగా స్థానికుల్లో కొంతమంది ఎన్నుకోబడ్డారు. ఎనిమిది గ్రూపులకీ సభ్యులుగానూ, గ్రూప్ హెడ్స్ గానూ, సలహాదార్లుగానొనొ ఎవరెవర్ని నియమించాలో కూడా నిర్ణయమైంది. ఒక కొత్త వుత్సాహంతో ఆ సభలో పాల్గొన్న అందరూ సభ పూర్తయ్యాక తమ ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాక రాబోయే కాలాన్ని నేడే స్వాగతించామని ఆనందించారు.
బోసుబాబు మనసునిండా కొత్త వుత్సాహం. వారానికోసారి జరిగే సమావేశాల్లో శోభ కూడా పాల్గొంటుంది. అదో మంచి అవకాశం. ఆమెతో చనువు పెంచుకోవడానికి.
మాధవి మనసులో ఆనందం. నిర్లిప్తంగా గడుపుతున్న జీవితానికి, నిర్మాణాత్మకంగా గడిపే అవకాశం వచ్చిందని.
గుడిసెవాసుల్లో ఆనందం. మాధవి చెప్పినట్టు పురిటి ఖర్చు, చదువు ఖర్చు, పెళ్ళి ఖర్చు, అంత్యక్రియల ఖర్చు సంఘమే భరిస్తే జీవితం అద్భుతంగా వుంటుందనీ, తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా వుంటుందనీ.
కానీ, ఇన్ని ఆనందాల మధ్య కాలిపోతున్న మనసు కూడా ఒకటి వుంది. ఆ మనసు మేరీ టీచర్‌ది. పైకి ఆనందంగా చప్పట్లు చరిచి అభినందించినా, లోపల మాత్రం శోభ గురించీ, ఆమెకి ఇతరులు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించీ అసూయతో మాడిపోతోంది. బోసుబాబు శోభ వంక చూసే చూపుల్లోనే అతని ఇష్టాన్నీ, ప్రేమనీ మేరీ టీచర్ గుర్తించగలిగింది. అందుకే అనంతమైన అసూయతో రగిలిపోతోంది.
ఎవరిమీదైనా సరే కోపగించుకోవాలంటే కారణం వుండాలి. ఎవరి మీదైనా మన మదం చూపాలన్నా, లోభాన్ని చూపాలన్నా కూడా కారణాలు వుంటాయి. అసూయపడటానికి మాత్రం కారణం ఉండక్కర్లేదు. ఎవరు ఎవరిమీదైనా అసూయతో దహించుకుపోవచ్చు. అసలు వాళ్లెవరైనా సరే మాంకి పరిచయం లేకపోయినా సరే, అసూయ మాత్రం ఏమాత్రం సందేహం లేకుండా మనసులో చొరబడుతుంది. ఒక్కసారి అసూయ అనే అగ్ని మనసు అనే కట్టెని అంటుకున్నాక, అది పూర్తిగా దహించకుండా మాత్రం వదిలిపెట్టదు.
సమావేశం అయిన అరగంటలో గుడిసెల సిటీలో జరిగిన ప్రతి మాటా, ప్రతీ నిర్ణయమూ కూడా శామ్యూల్ రెడ్డికి చేరిపోయాయి. మేరీ టీచర్ అనే ప్రత్యక్ష సాక్షి ద్వారా.
“గుడ్. మేరీ. యూ ఆర్ సో గ్రేట్ ఎండ్ లవ్లీ. ఏదో ఓ గ్రూపులో చేరి నువ్వూ సభ్యత్వం దక్కించుకో. ప్రతి సమావేశంలోనూ ఏం జరుగుతుందో ఇలాగే నాకు కబురందించు. అన్నట్లు రేపట్నించీ నిన్ను వైస్ చైర్మన్‌గా ప్రమోట్ చేస్తున్నా” అన్నాడు శామ్యూల్ రెడ్డి.
సంఘమిత్ర సుదీర్ఘంగా నిట్టూర్చింది. గుడిసెల సిటీలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ ఆమె చాలా విపులంగా సెకరించింది. ఇప్పుడే మాధవి ఇంట్లో ఫైర్ పెట్టినవారు ఎవరో తెలిస్తే, స్పష్టంగా గుర్తించగలిగితే డబ్బుని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు పిండుకోవచ్చు. పరాగం అన్నట్టు బూమెరాంగ్‌ని సరైన వ్యక్తి వైపు గురి చూసి విసరాలి. గాఢంగా ఆలోచనలో పడింది సంఘమిత్ర.
*****
వెంకటస్వామి అలజడిగా తిరుగుతున్నాడు. వారం నించీ పరమశివంగాడి జాడ లేదు. అంటే వాడు ఏదో అతి క్రూరమైన ఆలోచనలో వున్నట్టే లెక్క . కేరళ వెళ్ళిపోవడానికి సన్నాహాలు మొదలెట్టాడు. రాత్రికి రాత్రే హోటల్ ఓనర్ కావాలనీ, మహాదేవన్ కూతురిని నగలతో సహా లేపుకుపోతే తన కలలన్నీ ఫలిస్తాయనీ కంటున్న కలలు పగటి కలలు కాబోతున్నాయని అతనికి అనిపిస్తోంది. ఒక్క విషయం మాత్రం నిజం, ఏది జరిగినా ఏమి చేసినా పరమశివంలా కిరాతకంగా చెయ్యకూడదు అని మాత్రం నిశ్చయించుకున్నాడు. నవనీతం కనిపించి కూడా నెలన్నర దాటింది. అసలామెకి ఏమయిందో కూడా తెలీలేదు. ఒకవేళ పరమశివంగాడు ఆమెని ఏమైనా లేపేశాడా? ఒక్కసారి వెంకటస్వామి ఒళ్ళు భయంతో జలదరించింది. రాత్రి ఏడయింది. ఎనిమిదింపావుకి ఖచ్చితంగా గాడిపొయ్యి ఆర్పుతాదు వెంకటస్వామి. అది మహాదేవన్ ఆజ్ఞ. మహాదేవన్ తల్లి కూడా రాత్రి ఎనిమిదింపావుకి పొయ్యి ఆర్పేసేదిట. ఆర్పే ముందు నెయ్యి, ఫ్రెష్‌గా వండిన కొంత అన్నమూ, బెల్లమూ పాలు కలిపి పరమాన్నం కలిపి. ఆ పరమాన్నాని అగ్నిలో వేసి అది పూర్తిగా ఆహుతయ్యాక మంటలు ఆర్పేసేదట. మహదేవన్ అదే ఫాలో అవుతున్నాడు. వెంకటస్వామి వచ్చాక ఆ పనిని అతనికి అప్పజెప్పాడు. అదీ శంఖుచక్రపురం వెళ్లి వచ్చాక. ఆలోచనలతో మరో అరగంట గడిచింది. నెయ్యి, బెల్లం, అన్నం పాలూ తీసుకుని గాడిపొయ్యి దగ్గరికొచ్చాడు వెంకటస్వామి. “ఒరే వెంకటస్వామీ, ఇవ్వాళ మా అమ్మ గుర్తుకొస్తుందిరా. ఇవ్వాళ అగ్నికి నేనే నివేదన చేస్తా. నువ్వు విశ్రాంతి తీసుకో” వెంకటస్వామి చేతిలోంచి ఆ వస్తువులని తీసుకుంటూ అన్నాడు మహదేవన్.
“నందినీ ఇలా రామ్మా” పిలిచాడు మహదేవన్. వచ్చి పక్కన కూర్చుంది నందిని. “కరళే (హృదయమా) నిన్ను నా గుండెల మీద పెంచుకున్నాను. మీ అమ్మ పోయాక నా సర్వస్వం నువ్వే అయ్యావు. తల్లి లేని లోటు తప్ప నీకే లోటూ రానివ్వలేదు. తల్లీ, ఆ పరమశివంగాడు మన దూరపు చుట్టం. వాడిని నీకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. అన్నపూర్ణ తల్లి అనుగ్రహం వల్ల వాడి అసలు రూపు బయటపడింది. పరమ కిరాతకుడు వాడు. ఎలాగో ఆ దరిద్రం వదిలింది. ఎవరికో చెడు చెయ్యబోతే భగవంతుడు వాడ్ని శిక్షించాడు. దాంతో వాడి మతి భ్రమించి మాట పోయిందిట. ఈ విషయం వెంకటస్వామి చెప్పాడు. అమ్మాయ్.. నీ తండ్రి నెమ్మదస్తుడేగానీ అమాయకుడు కాదు. యీ వెంకటస్వామి సామాన్యుడు కాదు. నిన్ను నా దగ్గర్నించి దూరం చేసి నీ నగలు కాజెయ్యాలని వీడి ఆలోచన. వాడికెలా బుద్ధి చెప్పాలో నేను ఆలోచించే వుంచాను. వీడినించి నిన్ను కాపాడాలంటే నిన్ను ఇక్కడ్నించి వేరే చోటికి తీసుకుపోవాలి. ఆ ప్రయత్నాలూ చేసి వుంచాను. అమ్మా. నిన్ను ముగ్గులోకి దింపాలని వీడు చేసిన ప్రయత్నాలన్నీ నేను గమనించినా గమనించనట్టుగా వున్నాను. తల్లీ… నేను నీ తండ్రిని. నిన్నో అయ్య చేతిలో పెట్టడం నీకు శాశ్వత రక్షణ కల్పించడం నాకు ఏకైక బాధ్యత. మరో వారంలొ మనం వేరే చోటికి వెళ్లిపోతున్నాం. జాగ్రత్తగా ఉండు. వీడు ఎన్ని మాటలు చెప్పి నిన్ను నమ్మించాలని చూసినా నమ్మకు. సరేనా” నందినిని దగ్గరగా తీసుకుని మెల్లగా తన మనసులొని మాటని చెప్పాడు మహదేవన్. “అలాగే నాన్నా!” ఓ క్షణం అవాక్కై ఆ తరవాత అన్నది నందిని. వెంకటస్వామిని తండ్రి ఇంతగా గమనిస్తాడని ఆమె వూహకి కూడా అందలేదు. వెంకటస్వామి నగలు తీసుకుని పారిపోదాం అనడమూ ఆమె మర్చిపోలేదు. “వెళ్లు .. విశ్రాంతి తీసుకో” అని నందినిని లోపలికి పంపాదు మహదేవన్.
“తల్లీ అన్నపూర్ణా నీకు వందనం. ఈ జన్మంతా నీకు సేవ చేసుకునే భాగ్యాన్నిచ్చావు. తల్లీ అన్నపూర్ణా.. యీ వాహనునితో యీ పాయసాన్ని నీకు అర్పిస్తున్నానమ్మా. మమ్ము కాపాడు.. లోకాస్సమస్తా సుఖినోభవంతు” అని ప్రార్థిస్తూ పొయ్యి ఆర్పాడు. ఆ నిశ్శబ్దంలో ఎవరో ఓ చాకుని విసిరిన శబ్దం. వెనువెంటనే ప్రాణాలు గాలిలో కలిసేట్టు రెండు ఆర్తనాదాలు..

మళ్లీ కలుద్దాం
భువనచంద్ర.

మాయానగరం – 42

రచన: భువనచంద్ర

“మీరు ఇలా తిండి మానేస్తే ఎలా బాబూజీ… పిల్లల వంక చూడండి. కిషన్ గారైతే మంచం మీద నుంచి లేవలేకపోయినా మీ గురించి అడుగుతున్నారు ” అనూనయంగా అంది మదాలస.
“ఏం చెయ్యను బేటి… ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎక్కడుందో తెలీదు. అసలేమయ్యిందో తెలీదు. ఎలా తినబుద్ధి అవుతుంది? ” దీనంగా అన్నాడు సేఠ్ చమన్ లాల్. ఒక్క నెల రోజుల్లోనే అతను సగానికి సగం తగ్గిపోయాడు. బాధతోనూ, మనోవ్యధతోనూ శరీరం సగం వడిలిపోయింది.
“సుందరిగారి గురించి నాకు కొద్దో గొప్పో తెలుసు బాబూజీ. ఆమెకి ఏమీ కాదు.గుండె ధైర్యం మెండుగా వున్న మనిషి. తనకి తాను ఏ అపకారము చేసుకోదు. జరిగినదానికి భయపడి , ఎక్కడో కొంతకాలం దాగి వుంటుంది. ఖచ్చితంగా తిరిగివస్తుందని నాకు నమ్మకం వుంది. దయచేసి లేవండి. కనీసం తను వచ్చేవరకైనా మీరు ఆరోగ్యంగా వుండాలిగా ” చమన్ లాల్ ని అనూనయించి ‘రోటీ ‘ తినిపించసాగింది మదాలస.
యాక్సిడెంట్ అయ్యిన రోజు నుంచే ‘మిస్ ‘ అయ్యింది సుందరి. ఆమె ఏర్ పోర్ట్ కి వెళ్ళిందన్న ఆచూకీ మాత్రం ‘స్పష్టం ” గా తెలిసింది. అంతే కాదు బ్యాంక్ నుంచి ఆరు లక్షల కాష్ డ్రా చేసినట్టు కూడా తెలిసింది. ఇంట్లో వెతికితే ఆమె చెక్ బుక్ కూడా కనపడలేదు.
“సారీ డాడ్ … నేను పోలీసులకి వాగ్మూలం ఇస్తూ ఇక్కడ వుండలేను. అందుకే వెళ్తున్నాను. మళ్ళీ వస్తాను… ఎప్పుడొస్తాన్ మాత్రం చెప్పలేను.” అన్న నోట్ మాత్రం సేఠ్ చమన్ లాల్ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది.
యాక్సిడెంట్ లో బహుషా ‘రుషి ‘ చనిపోయి వుంటాడనే భయంతోనే ఆమె వెళ్ళిపోయిందని అనుకున్నాడు చమన్ లాల్. నెల గడిచినా మరే కబురు ఆమె నుంచి రాలేదు.
కిషన్ లాల్, రుషి, ఇద్దరూ హాస్పటల్ లో ఉన్నప్పుడే మదాలసని పిల్లల్ని చూసుకోడానికి , ఇంటి విషయాలు చూసుకోడానికి ‘కేర్ టేకర్’ గా ఉద్యోగమిచ్చాడు చమన్ లాల్. కూతురి ఉత్తరం చూశాక అతనికేమీ పాలుపోలేదు. పిల్లల్ని చూసుకోడానికైనా ఎవరో ఒకరు ఉండాలనే మదాలసకి ఉద్యోగమిచ్చాడు.
చాలా విశాల హృదయంతో నెలకి పది వేల రూపాయిల జీతమూ నిర్ణయించాడు. మూడేళ్ళ కాంట్రాక్టుతో కార్బన్ పేపర్ మీద సంతకం చేయించి పక్కా ‘ అప్పాయింట్ మెంట్ లెటర్ ‘ టైపు చేయించి, సంతకం పెట్టి మరీ ఉద్యోగం ఇవ్వడంతో, మదాలస కూడా ధైర్యంగా ఉద్యోగం విషయం ఇంట్లో చెప్పింది. చెప్పిన మరుక్షణమే మదాలస అత్తగారి గుండెల్లో రాయి పడింది. భర్తగారికైతే కళ్ళు తిరిగినై కారణం అతని జీతం ఏడు వేలు మాత్రమే!
“భలే అదృష్టవంతురాలివమ్మాయ్… నిన్న డిగ్రీ పాస్ అవ్వడం ఇవాళ్టికల్లా పదివేల రూపాయిలొచ్చే ఉద్యోగం దొరకడం. అంతా ఆ శ్రీకృష్ణమూర్తి మహిమానున్నూ.. ఆశీస్సున్నున్నున్నున్నూ… ! లేకపోతే దీంతస్సదియ్యా వీధికో వందమంది ఉద్యోగం కోసం అంగలారుస్తుంటే , మరి నీకు ఠక్కున దొరకడం మహాభాగ్యం కాదూ! ” మెచ్చుకుంటున్నట్టు మెచ్చుకుంటూనే మాట విరుపుతనాన్ని ప్రదర్శించిందో పొరుగింటి పాపాయమ్మ.
“అవునవును.. మహాభాగ్యం కాదూ! అవును కానీ అమ్మాయ్ పిల్లలకి కేర్ టేకర్ అంటే ఆయా ఉద్యోగమా? ఆయాకి పదివేలంటే మహాభాగ్యం కాక మరోహటీ మరోహటీనా? ” నవ్వులో విషాన్ని సమ్యుక్తంగా చిమ్ముతూ అన్నాడో వెనకంటి వైకుంఠ వర ప్రసాదు.
ఒక్కమాట కూడా మాట్లాడకుండా చిన్నగా చిరునవ్వు నవ్వి లోపలకి వెళ్ళిపోయింది మదాలస.
“అబ్బా..! ఆయా ఉద్యోగానికి ఏం టెక్కు పోతోందిరా నాయనా! ” అక్కసునంతా గొంతులో ధ్వనింపచేసిందో ఇరుగింటి ఇల్లేరమ్మ.
“అమ్మాయి! ఇంత కాలానికి నీ కష్టాలు తీరాయనుకో పాపం ఒక్కడి సొమ్ముతో ఇంత ఇంటి భారం మొయ్యాల్సి వచ్చేది. ఇంకనే బ్రహ్మాండంగా సంసార సాగరాన్ని ఈదొచ్చు. అమ్మాయ్ నీరజా.. ఇక నీ పెళ్ళి భోజనమే మిగిలింది. ” ఇప్పటి దాకా ఆ కుటుంబాన్ని మహా ఆదరిస్తున్నట్టు మొహం పెట్టి చిలక పలుకులొలికించాడో చిదంబర శాస్త్రి.
“మంచిమాట అన్నావోయ్. అసలు సిసలు అదృష్టం నీరజదేననుకో ” వత్తాసుపలికాడో కాలక్షేపం శర్మ.
అన్నీ వింటూ మౌనంగా వున్నది మదాలస. “వదినా.. నువ్వు నిజంగా గ్రేట్. ” కావలించుకొని అన్నది నీరజ. అసలేం మాట్లాడాలో ఆమెకు అర్ధం కాలేదు. బయటకు ఎలా వున్నా , మదాలస లోలోపల రగులుతోన్న అగ్నిపర్వతం అని ఆమెకు తెలుసు. “పోనీ ఏ తిరుగుడో ” అని మదాలసతో అన్నప్పటి నుంచి నీరజ తప్పు మాట్లాడానన్న భావం దహిస్తూనే వుంది. మదాలస కూడా అవసరానికి మించి ఎవరితోనూ మాట్లాదటం మానేసింది. పోగొట్టుకున్న చనువును ఎలా తిరిగి పొందడం?
మదాలసకి ఇబ్బందిగా వున్నా ఓ మొండి ధైర్యం మనసులో కొండలా ఎదిగింది. భర్తా అత్తగార్లు ఏమంటారో తెలీదు. ” నీ “అంతట నువ్వు నిర్ణయించుకున్నాక నాదేముంది? ఆఫ్ట్రాల్ మొగుడి గాడ్ని” చెప్పిన వెంటనే విప్పిన చొక్కా మళ్ళీ వేసుకొని బయటకు పోతూ అన్నాడు మూర్తి. ఆ మాట మాట్లాడింది అతను కాదని అతనిలోని అహంకారంతో కూడిన నిస్సహాయత అనీ స్పష్టంగా మదాలసకి అర్ధమయ్యింది.
“మదాలస… కంగ్రాట్స్!! ఏనాడు నువ్వు నీ పూర్తి జీతాన్ని నీ అత్తింటి వారి చేతుల్లో పొయ్యద్దు. వచ్చిన మొత్తం నీ బ్యాంకులోనే, నీ అకౌంటులోనే వేసుకో. అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే కుటుంబం కోసం ఖర్చుపెట్టు. ఎందుకంట్, నీకు ధైర్యాన్ని ఇచ్చేది నీ బ్యాంకు బేలన్సే “స్ఫస్టంగా మదాలసకి చెప్పింది మాధవి, సేఠ్ చమన్ లాల్ ఉద్యోగమిచ్చాడని విన్న మరుక్షణమే.
పొద్దున్నే యధాతథంగా అది వరకు చేసినట్టుగానే ఇంటిపనులు చేసి ఠంచనుగా పదింటికల్లా చమన్ లాల్ గారింట్లో ఉంటోంది మదాలస. ఆమెని ఇంటి దగ్గర నుంది తీసుకొని రాడానికీ, తిరిగి ఇంటికి పంపడానికీ కూడా ‘రిక్షా’ ఏర్పాటు చేసింది చమన్ లాల్ గారే! మదాలస టిఫిను, భోజనం కూడా చమన్ లాల్ ఇంట్లోనే జరిగిపోతున్నాయి. వంటపనికి ఓ గుజరాతి వృద్ధురాలిని తెప్పించారు. పేరుకి మాత్రమే ఆవిడ, చేస్తున్నది మాత్రం మదాలసే! ముసలావిడ చేస్తున్నప్పుడు గుజరాతి వంటకాల్ని జాగ్రత్తగా గమనించి , చాలావరకు పర్ఫెషన్ గానే నేర్చుకుంది మదాలస.

మాయానగరం – 41

రచన: భువనచంద్ర

‘గురువు’ గారి అడ్డ మహా గంభీరంగా వుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో చిన్న సైజు తీర్ధంలా వుంది. పార్టీ సామాన్య కార్యకర్తల నుంచీ, పార్టీ అధ్యక్షుడి దాకా, చిన్న చిన్న ఫేవర్స్ కోసం పడిగాపులు గాచే నిరుపేదవాడి నుంచి కేంద్రమంత్రివర్యుల దాకా వచ్చిపోతూనే వున్నారు. కారణం ఏమైనా’ప్రెస్’ వాళ్ళకీ,’ఛానల్’ వాళ్ళకీ పండగ్గా వుంది.
“మాదేముంది గురూ, పైన పటారం లోన లొటారం.. ఉత్త డొల్ల.. ఏదో ఈ కార్డుని పట్టుకొని తిరగడం కానీ, మా యాజమాన్యం జీతాలెక్కడ ఇస్తుంది? ఓ మాట చెప్పనా? మేమే నయం , మా ఎడ్వటైజర్ ఏడుస్తూనే ఉంటాడు ఎప్పుడూ వాళ్ళని గిల్లో, వీళ్ళని గీకో, ఎలాగలాగో గ్రాసం సంపాదించకపోతే అతనికి మాత్రం ఎట్టా గడుస్తుంది?” గురూగారు ఇప్పించిన కవర్ ని జేబులో పెట్టుకొని అన్నాడు’అద్వితీయం’. అది అతని కలం పేరు. అసలు పేరు అప్పల్రాజు.
“సర్లే! ఏవున్నా లేకపోయినా మీ పత్రికకు సర్కులేషన్ ఉంది. మాకైతే అదీ లేదుగా. సరేకానీ, మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న పుకారు పక్కన పెడితే, ఇవ్వాళ ఇక్కడ ఇంత సంతగా వుంది కదా , అసలు విషయం ఏమిటంటావూ?” గొంతు తగ్గించి అద్వితీయంతో అన్నాడు’ పరాగం’. ఇదీ కలం పేరే!
“నిజం చెబితే నాకూ తెలీదు” సిన్సియర్ గా మొహం పెట్టి అన్నాడు అద్వితీయం.
“చాల్లెండి వాసన పట్టడం పోలీస్ కుక్క కన్నా మీ ముక్కు వెయ్యి రెట్లు గొప్పదని మాకు తెలీదూ? మీ గుడ్లని మేము కొట్టేస్తామనా?” సుతారంగా అద్వితీయాన్ని వేలితో పొడిచి అన్నది సంఘమిత్ర. ఆవిడా జర్నలిస్టే. మాంఛి యవ్వనంతో కసకసలాడేప్పుడే ఫీల్డ్ కొచ్చింది. వచ్చిన కొత్తలో కుర్ర జర్నలిస్ట్ ల్ని మంచి చేసుకొని వార్తల్ని పుంఖాను ఫుంఖాలుగా వదిలింది. ఇప్పుడు వన్నె తగ్గినా, కన్నెపిల్లలా వగలు పోవడం మాత్రం తగ్గలేదు. అనుభవం కూడా తోడవడంతో వార్తా సేకరణలో ఇప్పటికీ ముందంజలోనే వుంది. మరో లాభం కూడా ఆవిడకు వుంది. కొన్నికొన్ని సమయాలలో తను సంపాదించిన’టిప్స్’ ని’క్లూ’ లని మిగతా జర్నలిస్ట్ లకు చవగ్గా’ అందిస్తుంది.
“సంగూ… నిజ్జంగా తెలీదు.. ప్రామీస్..” తల మీద చెయ్యి పెట్టుకొని అన్నాడు అద్వితీయం. చిన్నగా నవ్వింది సంఘమిత్ర. అందరి ముందు అసలు కథ విప్పడానికతను ఇష్టపడటం లేదని అర్ధమైంది.
“క్షమించాలి… ఇప్పటి దాకా కాఫీ, టీ లతో సరిపెట్టినందుకు గురూగారు మీ అందరికీ సారీ చెప్పమన్నారు. ఉదయమే ఏడుగంటలకు ఠంచనుగా వచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు చెప్పమన్నారు. ఇప్పుడు సమయం ఎనిమిది. హాయిగా మీరు టిఫిన్లు కనిస్తే ఎనిమిదీ ముప్పావుకి గురూగారు మీ ముందు కొచ్చి స్వయంగా మాట్లాడుతారు” సవినయంగా అన్నాడు గురూగారు ఆంతరంగిక శిష్యుడొకడు. అతని వెనకే కాటరింగు వాళ్ళు టిఫిన్ సామాన్లు మోసుకొచ్చారు.
“చాలా అయిటమ్స్ వున్నాయి… ఏమై వుంటాయి?” కుతూహలంగా అన్నాడో చిన్న పత్రికకి సంబంధించిన జర్నలిస్ట్. అతనికెప్పుడూ ఆకలే. అర్నెల్లెకోసారీ జీతంలో సగం ఇచ్చినా ఇచ్చినట్టే అతనికి. అతనికి తెలుసు. ఆ కార్డు చేతిలో లేకపోతే కానీకి కూడా కొరగానని.
“నేను చెప్పనా?” సర్దుతున్న కేటరింగ్ వాళ్ళని చూస్తూ అన్నది సంఘమిత్ర.
“చెప్పు.. కరక్ట్ గా గెస్ చేస్తే పార్టీ” చిన్నగా నవ్వి అన్నాడు మోహన్. అతనో పెద్ద పాప్యులర్ ఛానల్ కి ఇన్చార్జ్. చాలా ముఖ్యమైనవాటికి రావడమే కాదు, సమావేశం అయ్యాక కూడా ప్రధాన వక్తన్ని/ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తాడు. ’లోపలి’ సంగతుల్ని వెలికి తీసి ఎంతవరకు విప్పాలో ఎంతవరకు కప్పాలో అతనే నిర్ణయిస్తాడు. చాలామంది అతన్ని సైలెంటుగా ఫాలో అయ్యిపోతారు. బ్రహ్మిని తమ్మి తమ్మిని బ్రహ్మి చేయగల దిట్ట.
“ఓ.కే.. పులిహోర, ఆవడలు, మిర్చీబజ్జీలూ, సేమ్యా + సగ్గుబియ్యం పాయసం , టమోటా పప్పు, నేతి బీరకాయ పచ్చడి, దోసావకాయ, బంగాళదుంప+ వంకాయా + టమోటా కలగలుపు కూర, గోంగూర పచ్చడి, బెండకాయ స్టఫ్ కూర, కంది పొడి, వూరమెరపకాయలు, అప్పడాలూ, గుమ్మెడికాయ వడియాలు.” నవ్వింది సంఘమిత్ర.
“అంత కరక్ట్ గా ఎలా చెప్పగలిగావు?… అయినా ఇది…” సడన్ గా ఆగాడు మోహన్.
“మోహన్ జీ… నేను చెప్పింది మధ్యాహ్నపు మెనూ… ఎందుకంటే ఒంటిగంటన్నర దాకా మనల్ని ఇక్కడే వుంచుతాడు గురూజీ. ఇహ బ్రేక్ ఫస్ట్ మెనూ ఏమంటే , కంచి ఇడ్లి, పొంగల్ వడ, పెసరట్టు ఉప్మా ఎండ్ పూరీ… కాఫీ, టీ, పాలూ, హార్లిక్స్ మామూలే” చిరునవ్వుతో అన్నది సంఘమిత్ర.
“మై గాడ్ .. యూ ఆర్.. గాడ్ .. అసలు ఇంత స్పష్టంగా ఎలా తెలుసు?” ఆశ్చర్యంగా అన్నాడు మోహన్.
“చూశాక చెప్పండి” లేచి అన్నది సంఘమిత్ర. అందరూ బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేస్తున్న మీడియం హాల్లోకి వెళ్ళారు. టిఫిన్లు కరక్ట్ గా సంఘమిత్ర చెప్పినవే. మెనూ చెప్పినప్పుడు విన్నవాళ్ళు ఆశ్చర్యంగా ఆమె వంక చూశారు.
“మాకుండే రిసోర్సెస్ మాకుంటాయి… అద్దీ…” నవ్వింది సంఘమిత్ర.
“ప్లీజ్ ఏమీ మొహమాటపడకండి. రిలాక్సెడ్ గా టిఫిన్ చేయమని మా గురుగారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.” గురువాణి వినిపించాడు శిష్యరత్న.
అల్లంచెట్నీ, కొబ్బరిచెట్నీ, సాంబారు, కారప్పొడి, నెయ్యి, ఉల్లిపాయ టమోటా చెట్నీలు అద్భుతంగా వున్నాయి. రంగూ, రుచీ, వాసనా కూడా నోరూరించేస్తున్నాయి.
సుష్టిగా లాగించారు పాత్రికేయులూ, ఛానల్ వాళ్ళు,
“మధ్యాహ్నంకి కొంచం ఖాళీ వుంచుకుంద్దాము, లేకపోతే సూపర్ లంచ్ మిస్ అవుతాము.” ఫ్రండ్స్ ని హెచ్చరించింది సంఘమిత్ర.
************
పరమశివం గుండె మండిపోతోంది. జీవితంలో మొదటసారి ఒకడు చెంప పగలగొట్టాడు. నవనీతం విషయంలో ఇది రెండోసారి దెబ్బ తినడం. ఊహూ… అది బ్రతకకూడదు. అనుభవించి అనుభవించి దాన్ని చంపాలి. అలాగే నిన్న కొట్టినవాణ్ణి చంపాలి. పరమకిరాతకంగా చంపాలి. అసలు కారణం ఆ వెంకట్ గాడు… ముగ్గుర్ని చంపితే కానీ పగ తీరదు.” అటూ ఇటూ తిరుగుతున్నాడు పరమశివం. వాడికి కనపడకుండా వాడినే అబ్జర్వ్ చేస్తున్నాడు రొయ్యబాబు. రొయ్యబాబు నిజంగా నీళ్ళల్లో చేపలాంటివాడే!
అయితే ఇతను వలలో చిక్కే చేపలాటోడు కాదు. వలకీ, ఎరకీ కూడా అందనివాడు. అవసరమితే త్రాచుపాములా కూడా మారగలడు. అందుకే సర్వనామం అతన్ని పెట్టాడు పరమశివాన్ని అబ్జర్వ్ చేయడానికి.
సర్వనామం ఓ విచిత్రజీవి. అందరినీ అబ్జర్వ్ చేస్తాడు. అందరినీ దృష్టిలో వుంచుకుంటాడు.”ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?” అనుకునే మెంటాలిటి.
ప్రతీపనికి తగినవాళ్ళనే పురమాయించాలి. అన్నీ నేనే చేస్తాననుకునేవాడు పరమమూర్ఖుడు. గంటకు వెయ్యి సంపాదించగల వాడు పది రూపాయిల పనికి పోతే వాడంత వెధవ లోకంలో వుంటాడా? అలాగే, బరువులెత్తేవాడి సమర్ధత బరువులెత్తేవాడిదే, పరుగులెత్తేవాడి సమర్ధత పరుగులెత్తేవాడిదే. వీడిని వాడి ప్లేస్ లో పెడితే? అందుకే జాగ్రత్తగా ఎంచుకోవాలి” యీ పాయింటునే సర్వనామం శామ్యూల్ రెడ్డికి చెప్పింది. ఇప్పుడు తానూ అనుసరిస్తున్నది. గత రెండున్నర రోజుల నుంచీ రొయ్యబాబు పని పరమశివాన్ని నీడలా వెంటాడటమే!
కొన్ని నీడలు కనపడతాయి, కొన్ని నీడలు కనపడవు. చేప ఏడిస్తే ఎవరికీ తెలుస్తుంది? కన్నీరు నీటిలో కలిసిపోతుంది గదా! అలాగే, చీకట్లో నీడ జాడ ఎవరికి తెలుస్తుంది? కానీ పాఠకుడా… మనిషి నీడని ఎలాగోలా పట్టుకోవచ్చు… ఓ చిన్న అగ్గిపుల్ల వెలిగించి. కానీ కోటి సూర్యులైనా’మనసు నీడని’ పట్టుకోగలరా?
“అయ్యా… ప్రస్తుతం మన పిచ్చిక ప్రతీకారం మూడ్ లో వుంది. మీ దగ్గరకు రావచ్చా” అని ఎస్. టి. డి బూత్ నుంచి అడిగాడు.
“రా..” పెట్టేశాడు సర్వనామం.
శామ్యూల్ రెడ్డి నంబర్ కాక ఇంకో ఐదు నంబర్లు , అడ్డాలూ వున్నాయి సర్వనామానికి. పని వుంటే గానీ స్కూల్ కి పోడు.
“చెప్పు” రొయ్యబాబుని చూడగానే అడిగాడు సర్వనామం.
“బాస్… ముగ్గుర్ని ఇతను తరచుగా గమనిస్తున్నాడు, ఒకరు నవనీతం, ఆవిడ…”
“ఆవిడ విషయం వదిలేయ్.. మిగతావాళ్ళ గురించి చెప్పు” కట్ చేసి అన్నాడు సర్వనామం.
“వెంకటస్వామి అనేవాడిని, మహదేవన్ అనే పెద్దాయన్ని వీడు వెంటాడుతున్నాడు. మహదేవన్ కూతురు నందిని. వీడు మహదేవన్ కి చుట్టం. పరమ శాడిస్టు. తండ్రి చస్తున్నా, గుక్కెడు నీళ్ళు నోట్లో పొయ్యని పరమ కిరాతకుడు. మీరు నవనీతంగారి సంగతి వదిలేయ్యమన్నా, ఓ విషయం చెప్పక తప్పదు. వింటానంటే చెబుతా” ఆగాడు రొయ్యబాబు. ఓ నిమిషం సైలెంటుగా వున్నాడు సర్వనామం. చివరికో నిర్ణయానికి వచ్చి” సరే చెప్పు… సందేహం అక్కర్లేదులే నీకు తెలిసినవన్నీ నిర్మొహమాటంగా చెప్పు” అన్నాడు
” వన్ మినిట్” జేబులో హాఫ్ బాటిల్ తీసి” మందు తీసుకుంటూ చెప్పనా? మీరీ పని మీద నన్ను పురమాయించిన క్షణం నుంచీ ఇప్పటి దాకా దీన్ని ముట్టుకోలేదు” కొంచం ప్లీజింగా అడిగాడు.
“అలాగే” బీడీ ముట్టించాడు సర్వనామం
ఎవరి బలహీనతలు వారివి. కానీ, ప్రొఫెషన్ లో వుండగా మందు తాగే బలహీనతకి రొయ్యబాబు దూరంగా వుండటం సర్వనామానికి బాగా నచ్చింది. వృత్తికి ఏనాడు మన బలహీనతలు అడ్డు రాకూడదు అనేది సర్వనామం సిద్ధాంతం.
గబగబా ఓ పెగ్గు ఓ గ్లాస్ లో పోసుకొని నీళ్ళు కలుపుకొని గడగడా తాగేశాడు రొయ్యబాబు. ఓ క్షణం సుదీర్ఘంగా గాలి పీల్చుకొని …
“బాస్… శంఖుచక్రాపురంలో వెంకటస్వామీ, పరమశివం, వంట చేయడానికి వెళ్ళినప్పుడు యీ పరమశివంగాడు నవనీతాన్ని చెరబట్టడానికి ప్రయత్నం చేశాట్ట. వెంకటస్వామి అది చూసి ఓ బండరాయి తీసి పరమశివంగాడి బుర్ర పగలగొట్టాడుట. దాంతో వీడి శరీరం చచ్చుబడిపోయింది. అయినా ఏ దేవుడి కరుణతో కోలుకున్నాడు తెలియదు కానీ, కోలుకున్న మాట వాస్తవం. అక్కడ చర్చ్ నుంచి పారిపోయి వచ్చి ప్రస్తుతం’పగ’ తీర్చుకునే ప్రయత్నంలో వున్నాడు. నాకు తెలిసి వెంకటస్వామీ మంచోడూ కాదు, చెడ్డోడు కాదూ, అర్జెంటుగా’ రిచ్” అయిపోవాలనే ఆలోచన గలవాడు. నేను అబ్జర్వ్ చేసినదాన్ని బట్టి అతనికి నందిని మీద, ఆమె తండ్రి మహదేవన్ ఆస్తి మీద కన్నుందని అర్ధమయ్యింది. పరమశివం’పగ’ కి అదే మొదటి కారణం కావచ్చు. రెండో కారణం నవనీతం విషయంలో వెంకటస్వామి అడ్డు రావడం.” సంభాషణ ఆపి మరో పెగ్గు ‘ఫిక్స్’ చేసుకుంటున్నాడు రొయ్యబాబు.
“మరి… మరి… నవనీతం సంగతి” ఆలోచిస్తూ అన్నాడు సర్వనామం.
“నిజం చెబితే ఒకప్పుడు ఆమె బోస్ బాబు ఇలాకా. ఆమె అంటే పడి చచ్చేవాళ్ళు వందల్లోనే వుంటారు. బోస్ బాబు ఇలాకా కావడం వల్ల ఎవరూ ధైర్యం చేయలేదు. చెయ్యరు. ’కల్తీ సారా’ కేసులకి దూరంగా చుట్టం ‘ ఫాదర్ అల్బర్ట్ డేవిడ్’ గారి సంరక్షణలో కొన్ని నెలలు వుంది. అప్పుడే పరమశివంగాడు ఆమె మీద కన్ను వేశాడు.
ప్రస్తుతం ఆమెకీ, బోస్ కి ఏ విధమైన శారీరక సంబంధం లేదు. ఏదో తెలియని వేదనతో జీవితాన్ని గడుపుతోంది ఆమె.’చచ్చేదాక చచ్చినట్టు బ్రతకాలి’ అనేదానికి ఆవిడ జీవితమే ఓ రుజువు. మనిషి మాత్రం నిజంగా’ముత్యమే’ . మనసూ ’ముత్యమే’ దుమ్ముధూళి సంగతి వదిలేయ్యండి. నిత్యం అభిషేకాలు ఎన్ని చేసినా, రోడ్డు పక్కన దేవాళయాల్లోని దేవుళ్ళకి దుమ్ము అంటుకోవడం లేదా? ఇదీ అలాంటిదే” మాట ఆపి , గడగడా గ్లాసు పని పట్టాడు రొయ్యబాబు.
“సరే… ఇన్ని విషయాలు ఎలా సేకరించావు?” కావాలనే అడిగాడు సర్వనామం.
“అయ్యా… మీరు ఈ ప్రశ్న కావాలనే అడుగుతున్నారు. ప్రతి ప్రొఫిషన్ లో కొన్ని కష్టాలు, కొన్ని సులువులు కూడా వుంటాయి. ఎవరు అనుసరించే పద్ధతి వాళ్ళు అనుసరిస్తారు. న్యాయంగా అయితే మా పద్ధతి మేము బయట పెట్టకూడదు. కానీ, నేను చెప్పదలచుకున్నా. కారణం, నేను చేసిన పనిని నాకంటే ఫాస్ట్ గా మీరు చేయగలరు. నాలాంటి వాళ్ళతో కాదు, అవసరమైతే పోలీసుల్తోనే చేయించగలరు. మీ పేరు సర్వనామం. మీరు’టచ్’ చేయని వృత్తంటూ లేదు.’ఛాలెంజ్’ ని ఎదురుకోవడమంటే మీకు మహోత్యాహం. ప్రస్తుతం మీరు అదర్శ విద్యాలయం రెక్టారు శామ్యూల్ రెడ్డి గారు వెల్ విషరూ, ఫండు, ఫిలాసఫర్, గైడూ” నవ్వాడు రొయ్యబాబు.
“నేనడిగింది నా వివరాలు కాదు, కష్టమర్ కెపాసిటి గురించి ఎంక్వైరీ చేశాకే నువ్వు పని మొదలెడతావని నాకు తెలుసు” నిర్లిప్తంగా అన్నాడు సర్వనామం.
“క్షమించాలి. కాస్త అత్యుత్సాహంతో ఎక్కువగా వాగాను. సరే, ఈ వివరాలన్నీ నేను రాబట్టింది ఓ సెక్యూరిటీ గార్డ్ నుంచి. ఆ మనిషే వెంకటస్వామికి పరమశివం గురించి హెచ్చరించింది.” అంటూ మొత్తం వివరాలన్నీ పూసగుచ్చాడు రొయ్యబాబు.
“గుడ్… వాళ్ళ మీద రెండు కళ్ళూ వేసి వుంచు. అవసరమైతే కొందరు ఎసిస్టెంట్లని కూడా పెట్టుకో. కానీ, ఒక్క క్షణం కూడా ఏమరకూడదు.” మరో బీడీ వెలిగించాడు సర్వనామం.
“అలాగే, కానీ ఒక్క మాట చెప్పొచ్చో లేదో తెలీదు. ఆ వివరం మీకు పనికొస్తుందో లేదో కూడా తెలీదు.” మరో పెగ్గు పోసుకొని అన్నాడు రొయ్యబాబు.
” అన్నీ చెప్పు. ఏది పనికొస్తుందో, ఎప్పుడు పనికొస్తుందో, నిగ్గు తేల్చుకోవాలి. ఆ పని నేను చూసుకుంటా” నిర్లిప్తంగా అన్నాడు సర్వనామం. కానీ అతని లోపల విపరీతమైన కుతూహలం.
“నవనీతం ఇంటి వెనకాల వైపు కాపురముంటున్న ఓ ముసలావిడ ఇంఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు నవనీతం గర్భవతి” నెమ్మదిగా కుండ పగలకొట్టాడు రొయ్యబాబు.
ఇంకా వుంది…

మాయానగరం – 40

రచన: భువనచంద్ర

జీవితం ఎంత చిన్నది… ఎంత గొప్పది… ఎంత చిత్రమైనది.. ఎంత అయోమయమైనదీ! అర్ధమయ్యిందనుకున్న మరుక్షణంలోనే ఏమీ అర్ధం కాలేదని అర్ధమౌతుంది. సంతోషంతో ఉప్పొంగిపోయే క్షణాన్నే ఏదో ఓ మూల నుంచి దుఃఖం ఉప్పెనలా మీదపడుతుంది. ఓ కాలమా… ఎంత చిత్రమైనదానివే నువ్వు?..మమల్ని మురిపిస్తావు.. మమల్ని అలరిస్తావు… సడన్ గా మమల్ని నీలో కలిపేసుకుంటావు! చావు పుట్టుక.. యీ రెండు అట్టల మధ్య కుట్టబడిన పుస్తకమేగా యీ జీవితం.
ఆలోచిస్తూ నడుస్తున్నాడు రుషి. సవ్యాద్రి అండతో జీవితం హాయిగా గడచిపోతోంది. కేవలం పదిహేను రోజుల్లో “కాశీ అన్నపూర్ణ భోజనశాల ” అద్భుతమైన పేరు తెచ్చుకుంది. ఆ పేరులో సగం బిళహరిదీ, శీతల్ దీ. కారణం.. వాళ్ళు తన ఆర్డర్ మీద తయ్యారు చేసి ఇచ్చే పొడులూ, పచ్చళ్ళూ, ఊరగాయలూ. తెల్లవారుఝామునే లేచి కూరగాయలు కూడా వాళ్ళే చక్కగా కడిగి, తరిగి ఇస్తున్నారు. మొదటివారం చివర్లో రుషి వాళ్ళ పనికి తగిన ప్రతిఫలాన్ని ‘కవర్లో ‘ పెట్టి ఇచ్చాడు. వాళ్ళు వద్దన్నారు.
“కాదండీ… ఈ డబ్బు నేను ఊరికే ఇచ్చేది కాదు. మీరు చమటోడ్చి సంపాదించుకున్నదే ” ఒక్క మాట చెబుతాను.. లోకంలో డబ్బే సర్వస్వం కాదు. కానీ, ‘డబ్బు ‘ ఇచ్చే ‘ రక్షణ ‘ మరేదీ ఇవ్వదు. డబ్బుని బ్యాంకులో వేసుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తృప్తే కాదూ, ఇతర్లని ఆదుకోగలమన్న ధైర్యమూ వస్తుంది. ” అంటూ బలవంతంగా వారికి ఇవ్వడమే కాక అదే రోజున ఇద్దరికీ విడివిడిగా బ్యాంకు ఎకౌంట్లు తెరిపించాడు. ఆ పని వల్ల బిళహరికీ, శీతల్ కి అనుకున్నంత ఆనందం కలగకపోయినా అవధాని గారు మాత్రం చాలా సంతోషిచారు.
ఇప్పుడాయనకు బిడ్డలు దగ్గర లేరన్న చింత లేకపోగా దేవుడు తనకి ఇద్దరు కూతుళ్లను ఇచ్చాడని సంబరపడుతున్నాడు. “వాళ్ళెవరూ? ” అని ఎవరేనా అడిగితే, దేవుడిచ్చిన కూతుళ్ళనే చెబుతున్నాడు.
బిళహరికి క్షణం తీరిక లేకుండా పోయింది. ఓ పక్క సంగీత పాఠాలు, మరో పక్క తోటపని, ఇంకోపక్క పచ్చళ్ళ తయ్యారీ, కూరగాయలు తరగడం, వీటన్నిటికంటే ఆవిడకి ముఖ్యమైన పని ప్రసాదాల్ని శుచిగా రుచిగా తయ్యారు చేయడం. శీతల్ ఒళ్ళు దాచుకొనే మనిషి కాదు. బిళహరి చేసే ప్రతి పనిలోనూ శీతల్ అదృశ్య హస్తం వుండనే వుంటుంది. గతాన్ని గురించి జ్ఞాపకాలు ఇద్దరినీ బాధపెట్టేవే! బిళహరికి గతం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏదో ఓ పని తానే కల్పించుకొని అందులో దూరిపోతుంది. లేదా మనసుని సంగీతం వైపు మళ్ళించి గర్భగుడికి ఎదురుగా ఉన్న వేదిక మీద కూర్చొని దేవుడికి పాటలు వినిపిస్తూ ఉంటుంది. సుందరీబాయ్ మనస్తత్వం షీతల్ కి తెలుసు. ఖచ్చితంగా ఆవిడ కిషన్ ని రాచి రంపాన పెడుతూ వుంటుందని తెలుసు. ‘పాపం కిషన్ ‘ అని దుఃఖంలో నిట్టూరుస్తూ వుంటుంది. ఆమె దృష్టిలో కిషన్ చిన్నపిల్లవాడు. నిజమూ అంతే , ఆమెకీ, కిషన్ కి మధ్యనున్నది కేవలం వాంఛ నిండిన శారీరక సంబంధం కాదు. దాన్ని మించినది. అది మాటలకందనిది. మనసుకి మాత్రమే అర్ధమయ్యేది.
గుడిలోకి వచ్చాక శీతల్ కి తెలుగు బాగా అర్ధమవ్వసాగింది. మాట్లాడటం కూడా బాగా వచ్చింది. కానీ ఏనాడు తన గతాన్ని బిళహరికి చెప్పలేదు. అలాగే ఆమె గతాన్ని ఏనాడు అడగలేదు. కానీ ఇద్దరికీ తెలుసు.. ఇద్దరివీ అనాథ బ్రతుకులేయని. ఆ అనాథబ్రతుకులోనూ కొంచం తేడా వుంది… పూర్తి చీకట్లోనుంచి బిళహరి వెలుగులోకి వస్తే, వెలుగుని చవి చూసి చీకట్లోకి నెట్టబడి అందులోనుంచి మళ్ళీ వెలుతురులోకి వచ్చిన జీవితం శీతల్ ది. వెలుగు వెలుగే… కానీ అందులోనూ తేడాలున్నాయి. సూర్యుడి వెలుగు వేరు… చంద్రుడి వెలుగు వేరు. గుడ్డి దీపం వెలుగు వేరు… నక్షత్రాల వెలుగు వేరు. ప్రేమను నిండుగా పొంది చీకట్లోకి వచ్చిన బ్రతుకు శీతల్ ది. ప్రేమే అనుభవించని బ్రతుకు బిళహరిది.
బిళహరికి నవ్వొచ్చింది. ఎందుకంటే ఆమెకు కామేశ్వరరావు గుర్తొచ్చాడు. అతని నాటకీయత, అందులోని అమాయకత్వమూ, మూర్ఖత్వమూ అన్నీ గుర్తొచ్చాయి. మనసులోనే భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంది. ” ఆ రోజు ఇంట్లోంచి బయటబడే ధైర్యం చెయ్యకపోతే యీనాడు నా పరిస్థితి ఏమిటి? ” అని కూడా ఆలోచించి వణికిపోయింది. మళ్ళీ మళ్ళీ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్న సమయంలో లోపలికొచ్చాడు రుషి.
“బిళహరిగారూ.. రేపటికో మాంచి ఆర్డర్ దొరికింది. వెయ్యిమందికి భోజనాలు. మనం చేయగలమా లేదా అన్నది ఆలోచించుకొని చెపుతానన్నాను. భోజనాలు రేపు సాయంకాలానికి అంటే నైట్ కి అందివ్వాలి. శీతల్ ని కూడా పిలిచి ఆలోచించండి. ” స్టూల్ మీద కూర్చున్నాడు రుషి చెప్పవలసింది చెప్పి.
“తప్పకుండా చెయ్యగలం. ముందు ఏవేవి కావాలో ఆ లిస్టు వుందా? ”
“సిద్ధంగా వుంది. పప్పు, రెండు కూరలు, రెండు పచ్చళ్ళు, పులిహోర, బూరెలు, సాంబార్, దోసావకాయ, అప్పడాలు. పచ్చళ్ళో ముఖ్యంగా గోంగూర వుండాలి. పప్పు టోమాటో గానీ, మావిడికాయ గానీ. అవీ కాక అప్పడాలూ, వడియాలూ, ఊరమిరపకాయలు తప్పని సరి. ఇహ పెరుగు అన్నమూ మామూలేగదా! ” గడగడా చెప్పాడు రుషి.
“బ్రహ్మాండంగా చేయచ్చు. అయితే రుషి గారూ… వంటలు మాత్రం ఆగ్నేయ మూలనున్న పాత మండపంలో చేద్దాం. అక్కడకు వచ్చి చేయడం మాకు వీలు కాదు. సామాన్లతో మీరు వచ్చేయండి. గాడిపొయ్యి తవ్వించి ఇక్కడే చేద్దాం. గోంగూరమళ్ళు ఉండనే వున్నాయి. రెండో పచ్చడి నేతి బీరకాయ పచ్చడి చేద్దాం. కావాల్సినన్ని కాయలు వున్నాయ్.
బ్రహ్మాండంగా నేతి బీరకాయ పాదు పాకింది. మిగతా వస్తువులూ, వంటపాత్రలూ ఇక్కడికి పంపండి. మీ గైడెన్స్ లోనే చేస్తాము. వారు అడిగినవన్నీ మాత్రమే కాక కందిపొడీ, ఆవకాయ కూడా అదనంగా ఇద్దాం ” నవ్వింది బిళహరి.
“అలాగే ” లేచాడు రుషి. బిళహరిని చూసినప్పుడల్లా రుషికి ఆనందం. ఓ చల్లని నీడలో ఉన్నంత ఆహ్లాదం. శీతల్ తో కూడా బాగా మాట్లాడుతాడు రుషి… కానీ ఆమెలో ఓ గాంభీర్యం కనపడుతుంది. ఎంత చనువున్నా , ఏదో తెలియని శక్తి కొంతవరకే ఆ చనువుని వాడుకోనిస్తుంది తప్పా , ముందుకు పోనివ్వదు.
*********
మదాలస మనసు ఉరకలేస్తోంది. పరీక్షలో ‘పాస్’ విజయం అనేది ఎప్పుడూ గొప్పే. ఒకటో తరగతి పాస్ అయితే ఎంత ఉత్సాహము పిల్లలకుంటుందో ఐ. ఏ. ఎస్. పాసైనవారికి కూడా అంతే ఉద్వేకమూ, ఉత్సాహమూ ఉంటాయి. విజయం విజయమే. తను పరీక్ష పాసయ్యాననే విషయం మదాలసకి అమితమైన సెల్ఫ్ కాంఫిడెన్స్ ని ఇచ్చింది.
ఎన్ని మాటలూ, ఒక వైపు అత్తగారు, మరోవైపున మొగుడు, ఇంకో వైపు అమ్మలక్కలూ, చూపుల్తోటే మనిషిని మింగేసే వెధవలు… ఇందరి మాటల్ని భరిస్తూ పాసవ్వడం మామూలు విషయం కాదుగా! అవును… ఇంకా సాధించాలి. ఇంకా సాధించాలి. ఆనందతో ఉరకలేస్తూ నడుస్తోంది మదాలస ఈ విషయాన్ని మాధవికి చెప్పాలి. తను మళ్ళీ పుస్తకం పట్టుకోడానికి కారణం మాధవి, ఆనందరావులే.
సర్రున ఓ కారొచ్చి ఆమె పక్కనే ఆగింది, చూస్తే అందులో వున్నది సుందరీబాయి.
“హల్లో మదాలస.. ఎక్కడికి? ” గుజరాతి (గుజ్జు) తెలుగులో పలకరించింది సుందరీ బాయి.
“హల్లో సుందరీబాయి గారు… నమస్తే బాగున్నారా? నేను ఎగ్జామ్స్ లో పాసయ్యానండి. మాధవీ అక్కకు చెబుద్దామని వెళ్తున్నాను. ” చిన్నపిల్లలా సంబరపడుతూ చెప్పింది మదాలస.
“కంగ్రాట్స్… నేను తీసుకొని వెళ్తా రండి. నేను తనని కలిసి చాలా రోజులయ్యింది. మరి పార్టీ ఎప్పుడు? ” డోర్ ఓపెన్ చేసి అన్నది సుందరీబాయి.
“పార్టీ ఇవ్వాలంటే ప్రస్తుతానికి ‘వసతి ‘ లేదండి. అంతే కాదు ముందు ఏదన్నా ఉద్యోగంలో చేరాలని నా కోరికండి. ఆ తరవాత తప్పకుండా పార్టీ ఇస్తా. ” కొంచం బిడియంగా నవ్వుతూ అంది మదాలస.
“ఓహ్… డోంట్ వర్రీ… ఉద్యోగానిదేముంది? మా ఇండ్రస్టీస్ లో నే ఇప్పిస్తా. సరేనా? ” భుజంతట్టింది సుందరీబాయి.
“అవునూ… ఆనంద్ రావుగారేవైనా ఉత్తరాలు రాస్తున్నారా మనవాళ్ళకి? ” స్టీరింగుని మాధవి ఉండే రోడ్డు వైపు తిప్పుతూ అడిగింది సుందరీబాయి.
“తెలీదండి. కానీ ఒకటి రెండు సార్లు శోభ అనడం గుర్తుంది. ఆనంద్ రావుగారు ఉత్తరాలు రాశారని ” అమాయకంగా నిజం చెప్పింది మదాలస. ఆనందరావు బొంబాయ్ లో ఉన్నాడని సుందరికి తెలుసు. కానీ ఎక్కడో తెలీదు. శోభ ద్వారా లాగితే ‘రహస్యం ‘ బయటపడుతుందని సంతోషపడింది సుందరి.
కిషన్ చంద్ మీద ద్వేషం ఆమెకి అసహ్యంగా మారింది. ఆఫ్ట్రాల్ ఓ పనిమనిషిని, తను వుండగానే అతను ప్రేమించడం సుందరీ బాయి జీర్ణించుకోలేకపోయింది. వాడు కుళ్ళీ కుళ్ళీ ఏడ్వాలంటే, వాడెదురుకుండానే తను వేరొక మగాడితో సుఖించాలి. సుందరీబాయి మనసులో ద్వేషాగ్ని మబ్బులా కమ్ముకుంది. తెలీకుండానే ఆమె కాలు ఏక్సిలేటర్ ని అదిమింది. కారు క్షణంలో స్పీడందుకుంది. మదాలసకి ఒకసారి కంగారు పుట్టి “మేడమ్ సుందరిగారూ!” అంటూండగా కారుని రైట్ తిప్పి ఎదురుగా వస్తున్న లారీ నుంచి తప్పించింది సుందరి. కానీ ఆ రైట్ సైడ్ నుంచి వస్తున్న రుషి అమాంతం అంతెత్తున ఎగిరిపడతాడని సుందరి వూహించలేదు. బ్రేకు వేసి కారు ఆపింది. రక్తపు మడుగులో రుషి. షాక్ లో సృహ కోల్పోయింది సుందరి.
******
కిరాణా కొట్టు వాడిచ్చిన పచారీ సరుకుల బిల్లు రుషిని బ్రతికించిందనడంలో అతిశయోక్తి కాదు. ఆ దుకాణం దారుడిచ్చిన అడ్రస్ ని బట్టి రుషి బాబాయికి కబురంపితే, చోద్యం చూసే రిక్షావాడు సుందరిని చూసి చమన్ లాల్ కి కబురెట్టాడు.
హుటాహుటిని రుషి హాస్పటల్ కి తరలించబడ్డాడు. అదో చిన్న హాస్పటలు. డాక్టర్ మహా మంచివాడు. అడ్వాన్స్ కూడా అడకుండా మందులు తన ఫార్మసీ షాప్ నుంచే తెప్పించి రుషిని బ్రతికించాడు. నాలుగు గంటల తరవాత కళ్ళు తెరిచిన రుషికి అర్ధమయ్యింది…. తను హాస్పటల్లో వున్నానని.
అతను చెప్పిన మొట్టమొదటి మాట ఏమంటే, ” బాబాయ్ గుళ్ళో బిళహరి వుంటుంది. అమెతో విషయం చెప్పు. ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకున్న పని మిస్ కాకూడదు. అది నా మాటగా చెప్పు. ఆ వెయ్యి భోజనాలు సక్రమంగా అందించిన తరవాతే హాస్పటల్ కి రమ్మను. ఏదైనా పోగొట్టుకోవచ్చు, నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. అతను చెప్పింది తన బాబాయ్ సహ్యాద్రికి. ఆ మాట విన్నది సహ్యాద్రి మాత్రమే కాదు… మదాలస కూడా విన్నది. ఇంత పెద్ద యాక్సిడెంటు తరవాత కూడా ‘నమ్మకం’ గురించిన మాటలు వింటూ విస్తుపోయింది మదాలస.
వెళ్ళాలా? వద్దా? మదాలస ఆలోచన. రుషి అన్న మాటలు విన్న సహ్యాద్రి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. పేషంటు దగ్గర ఎవరూ లేరు. ఇప్పుడేం చెయ్యాలి? రుషి మొహం వంక చూసింది మదాలస.. చిన్నవాడే! ఆ మొహంలో చెప్పలేని పవిత్రత, ప్రశాంతత. అతను చెప్పిన మాటలను బట్టి అతనో కాటరింగ్ ‘ చేసేవాడనిపిస్తోంది. మాటని బట్టి స్పష్టంగా బ్రాహ్మణుడనిపిస్తోంది.
“ఊహు.. “మత్తుగా కదిలాడు రుషి. ఎనస్తీషియా తన పని బాగా చేస్తోంది. తలకీ, చేతులకీ, మోకాళ్ళకి కట్లున్నాయి. ఎన్ని కుట్లు తలకి పడ్డాయో తెలియదు. వెళ్ళాలా? వద్దా? ఆలస్యం అయితే? ఓ కంఫ్యూజన్ లో ఉంది మదాలస.
“రుషి అనే పేషంట్ ని ఇక్కడ చేర్చారుట కదా… ఎక్కడ? ” గుజరాతి యాస తెలుగులో అన్నాడు చమన్ లాల్.
“ఆ గదిలో ” నర్సు చెప్పిన మాట మదాలస విన్నది. గుజ్జూ యాస బట్టి అది సుందరీ బాయి చుట్టాలెవరేన్నానేమో అనుకుంది మదాలస. ఆమె ఆలోచన పూర్తయ్యేలోగానే లోపలికొచ్చాడు చమన్ లాల్. రుషిని చూసి షాక్ తిన్నాడు.
“మీరెవరమ్మా… అతని భార్యవా? నా పేరు చమన్ లాల్. యాక్సిడెంటు చేసింది మా అమ్మాయి… పేరు సుందరి. ” రుషి చేతిని మెల్లిగా టచ్ చేసి గద్గద స్వరంతో అన్నాడు చమన్ లాల్.
“మీరెవరో నాకు తెలీదండి. సుందరిగారు బాగా తెలుసండి. నేను మాధవిగారింటికి వెళ్తోంటే , తనే దింపుతానని కారు ఎక్కించుకున్నారండి. ఓ లారీని తప్పించబోయి సందులోకి తిప్పారండి పాపం యీయనకి…
ఆమెకు పెళ్ళైందన్న విషయం చూడగానే గ్రహించాడు చమన్ లాల్. అవును, యీ హాస్పటల్లో ఎవర్నో చూస్తూ కూర్చుంటే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారూ… అన్న ఆలోచన వచ్చిందాయనకి.
“నువ్వేం చేస్తావమ్మా? ” అని అడిగాడు
” ప్రవేట్ గా పరీక్ష రాసి పాసయ్యానండి. ఆ విషయంలో మాధవీ అక్కకు చెప్పి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామని బయలుదేరానండి. ఆ సమయంలోనే సుందరీ గారు నన్ను కారెక్కించుకొని… ” మళ్ళీ మధ్యలో ఆపేసింది మదాలస. సుందరి ఉద్యోగం ఇప్పిస్తానన్న విషయం యీ పరిస్థితిలో చెప్పడం ఆమెకి ఎందుకో నచ్చలేదు.
“ఉద్యోగం నేనే ఇస్తా… ఇదిగో నా కార్డ్. నిర్భయంగా వుండు. యీ పిల్లవాడి బాబాయి వచ్చే వరకూ నేనూ ఇక్కడే వుంటా… కూర్చోమ్మా. ” అనూనయంగా అన్నాడు చమన్ లాల్.
సేఠ్ చమన్ లాల్ గారు హాస్పటల్ కి విజిటర్ గా వచ్చిన సంగతి క్షణంలో పాకిపోయింది. డాక్టర్ గారు క్షణంలో ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు.
“డాక్టర్ గారు.. వైద్యానికి ఎంత ఖర్చైనా ఫర్వాలేదు. మీరు ఇతన్ని ఏ హాస్పటల్ లో చేర్చినా ఫరవాలేదు. కానీ, మీ పర్యవేషణలోనే వైద్యం జరగనివ్వండి. ఖర్చు గురించి ఆలోచించవద్దు. ఇతను నాకు చాలా కావల్సినవాడు. ఐ వాంట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ హిమ్ ” అంటూ బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చాడు చమన్ లాల్.
“అయ్యా… డబ్బు ఇప్పుడు వద్దండి…. ఇతనికేం ప్రమాదం లేదు. అతను లేచాక ఎంత ఖర్చయ్యిందో అంతా మీ దగ్గర తీసుకుంటాను. ” వినయంగా చెక్ తిరిగిచ్చాడు డాక్టర్. అప్పుడతని పేరుని చూసింది మదాలస. డాక్టర్ రమణ.” దేవుడున్నాడు డాక్టర్… నిజం.. మీవంటి మంచి మనుషుల హృదయాలలో నిలిచే వున్నాడు ” చమన్ లాల్ కళ్ళలోనుంచి అశృవులు జాలువారాయి. ఎందుకో అతనికి మళ్ళీ తన భార్య గుర్తొచ్చింది.
******

మాయానగరం – 39

రచన: భునవచంద్ర

“మాధవిగారూ… నేను మీకు తెలుసు. నా అనే వాళ్ళు నన్నొదిలేశారు. ఎలా పైకొచ్చానని అడక్కండి. ఏ జీవితాన్ని చూసినా పైకి రావాలంటే రెండే పద్ధతులు. ఒకటి కష్టపడి ఎదగటం… రెండోది ఇతరుల్ని కష్టపెట్టి ఎదగటం. ఇతరుల్ని కష్టపెట్టే ఎదిగేది రౌడీలూ, గూండాలూ మాత్రమే కాదు. ఎదుటివారి వీక్ నెస్ ని సొమ్ము చేసుకునేవారు కూడా! ” ఓ క్షణం ఆగాడు బోసు.
“అదంతా నాకెందుకు చెబుతున్నారూ? ” ఏ మాత్రం కుతూహలం ధ్వనించని స్వరంతో అన్నది మాధవి.
“కారణం ఉంది. చెప్పుకోవాలి. ఎవరితో ఒకరితో చెప్పుకోవాలి. కానీ ఎవరితో చెప్పినా ఉపయోగం ఉండదు సరి కదా, నగుబాటవుతుంది. అందుకే మీతో చెప్పుకుంటున్నాను. మీరు నన్ను అర్ధం చేసుకోగలరనే ఓ ఆశ. ” కొంచం దీనంగా ధ్వనించింది బోసుబాబు స్వరం.
“కారణం నాకు అర్ధం కాకపోయినా… వింటాను… చెప్పండి ” అన్నది మాధవి. బోసుబాబు మొహంలో రిలీఫ్ కనపడింది.
“ఎదుటివారి వీక్ నెస్ ని సొమ్ము చేసుకొని ఎదిగేవాళ్ళు కొందరన్నాను గదా! నేను ఎదిగింది అలానే! మనుషులు తాగుడికి బానిసలవుతారని తెలిసే దొంగసారా బట్టీలు పెట్టాను. చట్టానికి దొరక్కుండా చెప్పలేనంత సంపాదించాను. అయితే ఒకటి మాత్రం నిజం. వాళ్ళు చావాలని మాత్రం నిజంగా ఏనాడూ కోరుకోలేదు. కల్తీ చేసింది మాత్రం నేను కాదు. నేను బట్టీలు మానేసి చాలా కాలం అయ్యింది. నాకు సప్లై చేసినవాడు చేశాడు కల్తీ. సరే అదో గొడవ అనుకోండి. నా వల్ల జరిగింది నష్టం నేను పూడ్చే ప్రయత్నమూ చేశాను. ఎన్ని చేసినా నాకూ ఓ మనసుంది. అది నన్ను నిలదీస్తుంది. ఎన్ని తప్పులో చేశాను. ఎటువంటి తప్పులు అని అడగకండి… ఇప్పటికే సిగ్గుతో చస్తున్నా ” మళ్ళీ ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు బోసుబాబు.
“బోసుగారు… మీరు కన్ఫెషన్ ఇవ్వాలనుకుంటే చర్చికి వెళ్ళాలి. లేదూ, తప్పులు సరిదిద్దుకోవాలంటే వారినో, చట్టాన్నో ఆశ్రయించాలి. ఇవన్నీ నాకెందుకు చెప్పడం? ఓ తీవ్రమైన ఎమోషన్ లో మీ జీవిత రహస్యాలు నాకో, మరొకరికో చెప్పడం వల్ల మీకు నష్టం తప్ప మరేదీ ఒరిగేది వుండదు ” స్పష్టంగా అన్నది మాధవి.
“అవునేమో! కానీ… నాకు చెప్పాలనుంది. కారణం ఏమంటే నాకీ జీవితం మీద విరక్తి పుట్టింది. ఇందులోంచి బయట పడడం తేలిక కాదు. కానీ బయటపడతాను. మాధవిగారూ… నేనేమీ హత్యలూ మానభంగాలూ చెయ్యలేదు. ఎవరి గొంతులూ కోయలేదు. బతకాలంటే డబ్బుండాలి… ముఖ్యంగా నాలాంటి కేరాఫ్ అడ్రస్ లేనివాళ్ళకి. అందుకే సంపాదించా. అది లేనప్పుడు ఎవడూ గౌరవించడు. కుక్కలకంటే మనుషుల్ని హీనంగా చూస్తారు. సరే, అదంతా జరిగిపోయిన కథ. ఇంతకు ముందు నాకు ఆడవాళ్ళు తెలుసు. నేనేమీ పరమపవిత్రుడ్ని కాదు. కానీ జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని ప్రేమించా. ఆమె మీకు తెలిసిన అమ్మాయే.. శోభ. ఆమెని ఎలా అడగాలో నాకు తెలియదు. నా తరఫున మాట్లాడేవాళ్ళు లేరు. మరొకటి ఏమిటంటే ఆమె చుట్టూ కూడా తోడేళ్ళు వలపన్నుతున్నాయి. ‘నువ్వూ అదే పని చేస్తున్నావుగా ” అని మీరు నన్నడగొచ్చు. మాధవిగారూ… నేనామెను మనసా వాచా కర్మణా ప్రేమిస్తున్నాను. ఎంతగా అంటే, నా అంతగా ఆమెని ప్రేమించేవాడు లోకంలో మరొకడు లేనంతగా. నేను హృదయపూర్వకంగా , మనస్సాక్షిగా చెప్పాల్సింది చెప్పాను. ఆమెకి మీరే పెద్ద దిక్కని నా అభిప్రాయం. నాకూ పెద్ద దిక్కుగానే వుండండి. ఆమెతో మాట్లాడండి. ఆమెకి ఇష్టం లేకపోతే… ఓ.కే. నేనేమీ ఆత్మహత్య చేసుకోను. కానీ,… ” నమస్కరించి బయటకు నడిచాడు బోసు.
సైలెంట్ అయిపోయింది మాధవి. అతను మాట్లాడినంత సేపూ జాగ్రత్తగా గమనిస్తూనే వుంది మాధవి. అతని మాటలు కల్లాకపటం లేకుండా వున్నాయి. స్ఫష్టంగా నిస్సందేహంగా మాట్లాడాడు. ఏదీ దాచలేదు. ఇప్పుడేం చెయ్యాలీ? శోభకు చెప్పాలా? శోభ అమాయకురాలు. ఈ లోకంలో బ్రతకాలంటే బలమైన తోడుంటే గానీ శోభ బతకలేదు. బోసు అన్నది నిజమే. శామ్యూల్ లాంటి తోడేళ్ళు శోభని మింగడానికి అదును కోసం ఎదురుచూడటం ముమ్మాటికీ నిజమే. ఇప్పుడేం చెయ్యాలి? ” ఆలోచిస్తోంది మాధవి.
“అక్కా! ” లోపలకి వచ్చి మాధవిని హత్తుకుంది శోభ. ఆమె చేతిలో ఉత్తరం ఉంది. అది ఆనందరావు రాసిన ఉత్తరం.

************************

“కాగజ్ కే ఫూల్ చూశావా? ” అడిగింది వందన
“అద్భుతమైన సినిమా ” ఆనందంగా అన్నాడు ఆనందరావు.
“హం దోనో ”
“లవ్లీ మూవీ ”
“మరి గైడ్ ”
“ఆ సినిమా అంటే నాకు పిచ్చి ”
“యాహా కౌన్ హై తేరా ముసాఫిర్ ”
“ఆజ్ ఫిర్ జీనే కి తమన్న హై ”
“పియా తోసే నైనా లాగీ రే ”
“తేరే మేరే సప్నే అబ్ ఏక్ రంగ్ హై ”
“అబ్బా… పాటల కోసం సినిమా, సినిమా కోసం పాటలూ ఎన్నిసార్లు చూశానో ! నన్నడిగితే దేవ్ ఆనంద్ బెస్ట్ ఫిల్మ్ అదే! ” తన్మయంగా అన్నాడు ఆనందరావు.
“గుడ్…. జానీ మేరా నామ్? ఆమ్రపాలి ”
“వావ్… జానీ మేరా నామ్ ఎంటైర్ టైనర్ అయితే ఆమ్రపాలి అద్భుతం. రాహుల్ సాం కృత్యాయన్ గారి రచన కూడా చదివాను. అవునూ… ఆ సినిమా గురించి ఎందుకడుగుతున్నావు? ” నడుస్తున్నవాడల్లా ఆగి అన్నాడు ఆనందరావు.
” ఆ సినిమాలన్నీ మెహబూబ్ స్టూడియోలో. రేపు మనం ఆ స్టూడియో చూడబోతున్నాము. ” నవ్వింది వందన.
“రియల్లీ ” రోడ్డు మీద వున్నామన్న విషయం మరిచిపోయి రెండు చేతుల్తో ఆమెను పైకెత్తేశాడు ఆనందరావు. పకపకా నవ్వుతూ చిలిపి చూపులు చూసింది వందన.
“లవ్లీ పెయిర్ ” బయటకే అన్నాడు ఓ పెద్దాయన.
ఠక్కున ఆమెను కిందకు దించి “సారీ… ఎక్సైట్ మెంట్ ఆపుకోలేక… ” సిగ్గుతో కళ్ళు దించుకున్నాడు ఆనందరావు.
“హా.. ఇలా ఎత్తుకుంటారని తెలిస్తే రోజుకో సర్ప్రైజ్ ఇద్దును కదా… ప్చ్… ఇప్పటి దాకా ఎంత మిస్ అయ్యానో ” విచారంగా మొహం పెట్టి అంది వందన.
తటాల్న కళ్ళెత్తి ఆమె వంక చూశాడు ఆనందరావు. అల్లరి చూపులు నవ్వుతున్నాయి పువ్వుల్లా.
తనూ నవ్వాడు ఆనందరావు.
“కూల్ బాబా కూల్ ” అతని చెయ్యి నొక్కింది వందన.
“ఇక నుంచి మా చుట్టం ఎక్కడ ఏ స్టుడియోలో రికార్డింగ్ కి వెళ్ళినా నిన్ను తీసుకెళ్ళమని చెప్తాలే! అయినా, సినిమాలంటే అంత ఇష్టమా? ”
“ఊహూ… అన్ని సినిమాలూ కాదు. మంచి సినిమాలంటే ఇష్టము. మంచి పాటలంటే ఇష్టము. మంచి మనుషులంటే ఇష్టము ” మెల్లగా నడుస్తూ అన్నాడు ఆనందరావు.
“మరి నేనూ? “చిలిపిగా అన్నది వందన. ఆమె వంక చూసి ” నువ్వంటే చెప్పలేనంత ఇష్టము ” అప్రయత్నంగా అన్నాడు ఆనందరావు.
వందన బుగ్గలో సిగ్గులు మందారాల్లా మొగ్గతొడిగాయి.
యవ్వనం…. ఒక అద్భుతం
యవ్వనం… ఓ ప్రవాహం
యవ్వనం…. ఓ మధురమైన గీతం
ఆ గీతానికి పరవశించని వారెవ్వరూ?

**********

“నువ్వు చస్తే దాన్ని వదిలిపెడతానేమో అని, తాగి బండి మీద నుంచి కింద పడ్డావా? కిషన్.. నువ్వు చచ్చినా దాన్ని మాత్రం వదల్ను. ఆఫ్ట్రాల్… దాని బ్రతుకు నా చెప్పంత విలువ చెయ్యదు అది నన్ను హేళన చేస్తూ బయటకి పోవడమా? అయినా, కాలో చెయ్యి విరిగేపోయేట్టు యాక్సిడెంటు చేసుకోవాలి గానీ ఇదేంటీ? ” కసిగా చూస్తూ బెడ్ మీదున్న జరీవాలాతో అన్నది సుందరీబాయ్. కిషన్ చంద్ మాట్లాడలేదు. అసలామె వంక చూడలేదు.
” ఏం మాట్లాడవేం? ఆ పనిముండ తప్ప నేను ఆడదానిగా కనిపించడం లేదా? అంతేలే… కుక్క కుక్క దగ్గరకే పోతుంది. అసలు బుద్ధి లేనిది మా నాన్నకి. ” చేతిలో వున్న గ్లాసుని విసిరి గోడకేసి కొట్టింది. మరుక్షణమే ఆమె చెంప ఛెళ్లుమంది. కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూశాడు సేఠ్ చమన్ లాల్.
“ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పటికిప్పుడు నిన్ను ఇంట్లోంచి బయటకి గెంటితే అడుక్కోవడం కూడా రాదు నీకు. రాస్కేల్. ఒక్కతే కూతురు గదా అని గారాబం చేశాను. ఏం చేశాడతను? ఎందుకు సాధిస్తున్నావు? ఫో… నా కళ్ళముందు నుంచి అవతలకి ఫో… లేకపోతే ఇవ్వాళ నేను ఏం చేస్తానో నాకే తెలీదు ” భీకరంగా అరిచాడు చమన్ లాల్. వొణికిపోయింది సుందరీ బాయ్. తండ్రి అంత గట్టిగా అరవడం ఏనాడూ వినలేదు సరి కదా వూహించను కూడా లేదు. మాట్లాడకుండా బయటకు నడిచింది.
“సారీ కిషన్.. దాన్ని క్షమించమని నిన్ను నేను అడగను. అసలు తప్పు నాది. అడ్డు అదుపు లేకుండా పెంచాను. అనుభవిస్తున్నాను. సారీ…” కిషన్ చంద్ భుజం తట్టి తలొంచుకొని బయటకు నడిచాడు చమన్ లాల్. ఏనాడు ఎరుగని అనంతమైన అశాంతిలో అతని హృదయం మునిగిపోయింది.
ఎందుకీ మనుషులకి అహంభావం? ఎందుకు ప్రతి మనిషి ఎదుటి వారు తమ మాటే వినాలనీ, తమ పంతమే నెగ్గాలని ఎందుకు పట్టుదలకి పోతారూ? సడన్ గా అతనికి భార్య గుర్తొచ్చింది. ఆవిడ పేరు రామ్ లత. అత్యంత మృదుభాషి, అత్యంత సౌమ్యురాలు. అటువంటి తల్లికి ఇటువంటి కూతురా? తోటలోకి వెళ్ళాడు చమన్ లాల్. ఆ తోటని వేసింది రామ్ లతా. ప్రతి మొక్క స్వయంగా నాటింది. మామిడి, సపోట, కొబ్బరి, పనస, పంపర పనస, నిమ్మ, గజనిమ్మ, సీతా ఫలం, రామా ఫలం, మారేడు, ఉసిరి, రాచ ఉసిరి, ఇలా ఎన్నో వృక్షాలు! పూలమొక్కలైతే లెక్కలేదు. ఊయలూగడం అంటే రామ లతకు ప్రాణం. మామిడి చెట్టుకి చక్కటి ఉయ్యాలబల్ల వేసింది. ఉయ్యాల బల్ల కట్టిన కొమ్మ చాలా పెద్దది, బలీష్టమైనది. మధ్యాహ్నం వేళ ఆ ఉయ్యాలబల్ల మీద కూర్చొని, తనని కూర్చోబెట్టి తాంబూలం ఇచ్చేది. వెళ్ళి ఆ బల్ల మీద కూర్చున్నాడు చమన్ లాల్.
“ఏంటి తాతయ్య! ఇక్కడ కూర్చున్నావు? ” అని స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు అడిగారు.
“ఏమీ లేదు బేటా. మీరు నాకో మాటివ్వాలి. మీ అమ్మకు కోపం చిరాకు ఎక్కువ. అయినా పెద్దయ్యాక మీరు ఆమెను వదలకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మీ నాన్న చాలా మంచోడు. నోరు విప్పో, మనసు విప్పో తనకేది కావాలో ఏనాటికీ చెప్పలేడు. బిడ్డలారా… మీ నాన్న అచ్చు మీలాంటి వాడే. ఎప్పుడూ ఆయన్ను కష్టపెట్టకండి. “గద్గద స్వరంతో అన్నాడు చమన్ లాల్.
“అదేంటి తాతయ్య… అవన్నీ ఎందుకు చెబుతున్నావు? ” అయోమయంగా అడిగింది మనవరాలు మున్ని.
“ఎందుకో చెప్పాలనిపించింది బేటా! నా మాట మరచిపోవు కదూ! ” మనవరాలూ, మనవడి బుగ్గలు నిమిరి అన్నాడు చమన్ లాల్.
“అలాగే తాతయ్య ” తాతయ్యని కౌగిలించుకొని అన్నారు పిల్లలు.
వాళ్ళని కూడా ఆ ఉయ్యాల బల్ల మీదే పక్కనే కూర్చోబెట్టుకున్నాడు చమన్ లాల్.
గుజరాత్ లో తన కుగ్రామం. చిన్న కిరాణా దుకాణం నడిపిన తండ్రి, పెళ్ళిళ్లలోనూ మిగతా సమయాలల్లోనూ స్వీట్లూ, నమ్‌కీన్, మసాలా పిండివంటలు తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న తల్లి గుర్తొచ్చారు. అతని కళ్ళంపట ధారగా నీరు కారసాగింది.
“ఎందుకు తాతయ్య ఏడుస్తున్నావ్? ” అని మనవడు అడిగాడు.
“ఏమీ… లేదు… బేటా… వెళ్ళండి. నాన్నని పలకరించండి! ” అనూనయంగా వాళ్ళని పంపాడు చమన్ లాల్.
“చాదర్ లాగే… సోజారే సోజా..మైనా అయాహీ సారీరాత్ … జా… ఆ.. ఆ.. గీ.. ” తనని ఎత్తుకొని ఆలపించిన పనిమనిమనిషి కాంతా బాయ్ గుర్తొచ్చింది. ఆమే ఇంట్లోనే వుండేది. పదిహేనేళ్ళు వచ్చినా ఆమె రొమ్ముల మధ్యే తల దూర్చి పడుకునేవాడు. ఎంత ప్రేమించింది. పదేళ్ళ వయసులొనే తల్లిపోయిన తనని ఎంత ప్రేమగా పెంచింది?
సడన్ గా కూతురన్న మాట జ్ఞాపకం వచ్చింది. “ఆఫ్ట్రాల్ పనిమనిషి! ” ఆ మాట గుర్తుకి రాగానే గుండె మండింది చమన్ లాల్ కి. ఊహూ.. ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యకపోతే సుందరి బాగుపడదు. ఆమె బాగుపడకపొతే పిల్లల భవిష్యత్తు అంధకారమే.
ఠక్కున లేచాడు చమన్ లాల్. గబగబా బయటకొచ్చాడు. గూర్ఖా ఆశ్చర్యపొయాడు. కారు లేకుండా నడచి వచ్చే యజమానిని చూసి. ” దౌలత్ సింఘ్ రిక్షాని పిలు ” గేటు బయటకొచ్చి గూర్ఖాతో అన్నాడు చమన్ లాల్.
రోడ్డున పోయే ఓ ఖాళీ రిక్షాను ఆపాడు దౌలత్. ఆ రిక్షా కూడా చమన్ లాల్ దే. ఆయన మెనేజర్ నుండి రిక్షాని అద్దెకు తీసుకున్నవాడి పేరు మొహమూద్. స్టిఫ్ గా సెల్యూట్ కొట్టాడు . అదేవీ పట్టించుకోకుండానే ఎక్కి కూర్చున్నాడు చమన్ లాల్. “పద… మెయిన్ రోడ్డులో లాయర్ సింఘాల్ దగ్గరకు పోనీ ” రిక్షావాడికి చెప్పి కళ్ళు మూసుకున్నాడు చమన్ లాల్. అతని కళ్ళలోనుంచి కన్నీరు ధారగా కారుతూ వుండగా, ఒక్కసారి వాంతయ్యింది… రిక్షా ఆగింది.

మాయానగరం – 38

రచన: భువనచంద్ర

“ఇన్నేళ్ళుగా మీరిక్కడ వుంటున్నారు? నాకు తెలిసి, ఇది నీరు లేక మోడుగా మారిన దేవాలయం. దీన్ని ఇంత పచ్చగా చేసినవారెవరు? ” అడిగాడు రుషి. రుషికి ఇరవై తొమ్మిదేళ్ళు వుంటాయి. అందంగా, దబ్బపండుగా వుంటాడు. వొంటి మీద కాషాయ రంగు పైజామా లాల్చీ వున్నాయి. మెడలో రెండు మూడు పూసల దండలూ, ఓ రుద్రాక్షమాలా వున్నాయి. భుజాన వేలాడుతూ ఓ కాషాయ సంచీ. అతడంతట అతను వచ్చి అమరేశ్వర అవధానిగార్ని పరిచయం చేసుకున్నాడు.
” మీ పేరు చెప్పారు. అసలీ వూరు దేవాలయం, నేనూ, ఇక్కడి పరీస్థితులు మీకెలా తెలుసు? ” కుతూహలంగా అడిగారు అవధానిగారు.
“నేను ఇక్కడే ఆడుకునే వాడ్ని. మీ అబ్బాయిలిద్దరూ నాకు స్నేహితులే. మీకు గుర్తుండకపోవచ్చు. నాకు పదహారేళ్ళప్పుడు మా అమ్మగారు పోయారు. చితా భస్మాన్ని గంగలో కలిపితే మా అమ్మకి ముక్తి లభిస్తుందని మా నాన్న కాశీ బయలుదేరాడు నన్ను వెంట తీసుకెళ్ళారు. ఆవిడ ముక్తి సంగతి తెలియదు కానీ మూడు మునకలు వేసి గంగలోకి జారిపోయాడు మా నాన్న. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో అక్కడి సాధువులు నన్ను ఆదుకున్నారు. జీవితం అనేది ఒక ప్రవాహం అని, నీటిలో ఒక బుడగ పుట్టి, నీటిలోనే పెరిగి నీటిలోనే కలిసిపోయినట్టు, జీవితమనే కాల ప్రవాహంలో జీవులు పుట్టి ఇందులోనే కలిసి పోతాయని బోధించారు. దుఖాన్ని సహించే శక్తి ప్రసాదించారు. తిరిగి రాబుద్ధి కాలేదు. నాలుగు రోజుల క్రితం కాశీలో మా బాబాయిని చూశాను. మా పిన్ని చితాభస్మాన్ని తీసుకొని ఆయనొచ్చాడు. ఆయన్ని చూశాక రక్తం ఎంత చిక్కటిదో అర్ధమైంది. నన్ను చూసి ఆయనా భోరుమన్నాడు. ఆయన బలవంతం మీదే యీ వూరికి మళ్ళీ వచ్చాను. మా ఇల్లు గత పదమూడేళ్ళుగా మా బాబాయి స్వాధీనంలో వుంది. దాన్ని అద్దెకిచ్చి ఆయన కాస్త వేన్నీళ్ళకు చన్నీళ్ళు కలుపుకుంటున్నాడు. అయినా నాకేం కావాలి? ఓ చిన్న గది చాలు. అది కూడా ఎంత కాలముంటానో నేనే చెప్పలేను. నేను అడగక ముందే ఆయన ఇంటిని నా పరం చేశాడు. ఆయన చివరి దశలో నన్నే జాగ్రత్తగా చూడమన్నాడు. భార్య అంటే పిన్ని పోయిందాయే! పిల్ల ఒక్కత్తే! అంటే కూతురన్న మాట. నాకు చెల్లెలౌతుంది. అదిప్పుడు అత్తారింట్లో వుంటోంది. దానికి ఇద్దరు పిల్లలు. కనక అది ఇక్కడ వుంది బాబాయికి సేవ చేసే ప్రసక్తే లేదు. ఆయన గవర్నమెంటు కాలేజీలో లెక్చరర్ గా చేసి వాలెంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నాడు. బి.పీ, షుగర్ రెండూ దండిగా వున్నాయి. అక్కడ రోజు శవదహనాలనీ, చితాభస్మం నిండిన కుండల్ని చూసే కంటే, కొంత కాలం బాబాయికి తోడుగా వుండటమే మంచిదని నాకు అనిపించి వచ్చేశా. అవధానిగారు.. నా పేరు ఋషి. మీ చిన్నప్పటి స్నేహితుడు మాల్యాద్రి మాష్టారి కొడుకుని ” అని చిన్నగా నవ్వి అన్నాడు ఋషి.
“మాల్యాద్రి కొడుకు పేరు పురంధర్ కదా? ” కనుబొమ్మలు ముడిచి అన్నారు అవధాని గారు.
“ఆ పురంధరుడ్ని నేనే. కాశీలో సన్యాసులు నాకు ‘రుషి ‘ అని పేరు పెట్టారు. కాషయంలో వున్నప్పుడు యీ నామమే సరైనది. మీ సందేహం తీరాలంటే ఇంకో విషయం గుర్తు చేస్తా… మీ రెండోవాడు ఫాలక్షావధాని చిన్నప్పుడు సాయబులమ్మాయి అష్రఫ్ ని పెళ్ళి చేసుకుంటానని గొడవ చేస్తే మీరు చావగొట్టారు గుర్తుందా? వాడు మూడు రోజుల పాటు మీక్కనపడకుండా దాక్కుంది మా ఇంట్లోనే ” నవ్వాడు రుషి.
“అవునవును ” తనూ సన్నగా నవ్వారు అవధానిగారు.
“సరే ఇప్పుడేం చెయ్యాలనీ? ” మంటపంలో తను కూర్చుంటూ రుషిని కూడా కూర్చోమని చోటు చూపించి అన్నాడు అవధాని.
“ఆలోచించాలి ఏం చేయాలన్నా ముందీ కాషాయ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టాలి. లేకపోతే జనాలు నన్నో కొత్త దేవుడిగా మార్చే ప్రమాదముంది. వీటిని తీసేసి జాగ్రత్తగా ఓ సంచీలో వేసి, యీ గుడి ఆవరణలోనే ఎక్కడో ఓ చోట పెట్టాలనుంది. మీరు అనుమతిస్తేనే అనుకోండి. ఆ తరవాత పొట్ట కూటి కోసం ఏదో ఓ పని , నాకూ శాంతినిచ్చేదీ, ప్రపంచానికి కొద్దో గొప్పో ఉపయోగపడేది చెయ్యాలనుకుంటున్నాను.
అవధాని గారు రుషి మొహం వంక చూశారు. చాలా ప్రశాంతంగా ఏ దుర్భావనా లేనటుంది. ముఖంలో ఓ వెలుగుంది.
“అలాగే మరి కొత్తబట్టలు? ” అని తల పంకించి అన్నారు అవధాని గారు.
“మీరు సరేనన్నారు గనక నేను బట్టల ఏర్పాటు చేసుకుంటాను, చాలా చాలా సంతోషం అవధానిగారు… అన్నట్టు మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం నాకు చాలా ఎబ్బెట్టుగా ఉంది. మీ స్నేహితుడి కొడుకుని గనుక, మీ బిడ్దల నేస్తాన్ని కనుక మిమ్మల్ని బాబాయి అని పిలవచ్చా? ” అని వినయంగా అన్నాడు రుషి.
“అలాగే పిలు. కానీ బాబూ ఇందాక నువ్వన్నట్టు నీరు లేక ఎండిపోయిన చెట్టులాంటి దేవాలయాన్ని ఇద్దరు ఆడపిల్లలు పచ్చగిల్లేట్టు చేశారు. వారూ నీలాగా ప్రస్తుతం అనాధలు. అందుకే, వారిని నువ్వు తోబుట్టువుల్లా గౌరవించగలిగినప్పుడే ఇక్కడకు రా. లేకపోతే రావొద్దు. మాల్యాద్రి నేను ఐదో తరగతి వరకు కలిసి చదువుకున్నాము. అతను గంగపాలైన సంగతి నీవల్ల నేనూ తెలుసుకున్నాను. వెళ్ళిరా. కానీ నా మాటని మరోసారి మననం చేసుకు వెళ్ళు” లేచారు అవధానిగారు.
“ధన్యవాదాలు బాబాయ్… ” నమస్కరించి బయట వైపుకు నడిచాడు రుషి.
ఈ మాటలు బిళహరికి వినపడలేదు. గర్భ గుడిని శుభ్రం చేస్తున్న షీతల్ కి మాత్రం వినపడ్డాయి, కానీ ఒక్క ముక్క కూడా ఆమెకి అర్ధం కాలేదు. బిళహరి బావిలో నుంచి నీళ్ళు తోడిపోస్తూనే వుంది. నూతి పళ్ళెం నుంచి అవి వాళ్ళు సన్నగా తవ్విన కాలువలో నుంచి కూరగాయల మడుల్లోకి చల్లగా పోతున్నాయి.
ధ్వజస్థంభం మీదకి వాలిన కాకి ముక్కుతో ధ్వజస్థంభం గంటని పొడిచింది. అదే సమయంలో ఓ గాలితెర ఆహ్లాదంగా వీస్తూ మిగతా గంటల్ని కదిలించింది. గంటలన్ని గణగణమంటూ శబ్దించాయి. ఆ శబ్ధాన్ని వింటూ ఆనందంగా నవ్వింది బిళహరి.
“కైలాసనాథ కుమారం
కార్తికేయ మనోహరం ”
అంటూ మధురంగా పాడుకోసాగింది. అది ముత్తుస్వామి దీక్షితుల వారిది. “ఏకదంతం భజేహం ” కీర్తనలోని చరణం. బిళహరి రాగం, త్రిపుట తాళం సమకూర్చబడింది. గుళ్ళోని దేవతలు కూడా అ పాట విన్నారా అన్నంత ప్రసన్న ముఖాలతో వెలిగిపోతున్నారు. సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారిది ఓ ప్రత్యేక పంధా. త్యాగరాజులవారూ, శ్యామశాస్త్రులవారూ, ముత్తుస్వామి దీక్షితులవారూ, కర్ణాటక సంగీతానికి మణిదీపాలవంటివారు. ఒకరు ప్రాణమైతే, వేరొకరు శరీరము, వేరొకరు హృదయము. సంగీతం భగవంతుడి భాష.
షీతల్ పాటగత్తె కాదు. కానీ హింది పాటలు పాడగలదు. ముఖ్యంగా మీరా భజనలు. సంగీతపు లోతులు తెలీకపోయినా స్వరమాధుర్యం శ్రోతల్ని కట్టిపడేస్తుంది. బిళహరి పిల్లలకు సంగీతం నేర్పేటప్పుడు ఆమె కూడా కొంచం దూరంలో కూర్చొని నేర్చుకుంటోంది. ఆ విషయం పెద్దగా బయటకి తెలియనివ్వలేదు. ఆమెకి జ్ఞాపక శక్తి ఎక్కువ. అందుకే బిళహరి పాడే పాటల్ని హిందిలో రాసుకొని తనలో తానే పాడుకుంటూ ఉంటుంది. అక్షరాలు కొంచం వంకర టింకర. చదువుకోడానికి కుదిరితేగా వ్రాయడం వచ్చేది! సుందరీబాయ్ పిల్లలు అక్షరాలు దిద్దేప్పుడు కూర్చున్న చదువే షీతల్ ది.

**************
“అదేమిట్రా… హోటల్ పెడతావా? ” ఆశ్చర్యపోతూ అన్నాడు రుషి బాబాయి.
“అవును బాబాయ్… నాకు చక్కగా వచ్చిన పనుల్లో వంట చేయడం వొకటి. రోజు మనం ఎలాగో వంట చేసుకోక తప్పదు. అదే ఏ హోటలో పెడితే , మన సమస్యా తీరడమే గాక నాలుగు డబ్బులూ వస్తాయి. నా చదువుకి ఏ వుద్యోగం వస్తుంది గనకా? అయినా , ఇన్నేళ్ళు కాశీ అన్నపూర్ణ ప్రసాదంతో బ్రతికిన వాడ్ని. వంట చేయడమంటే ఆవిడ సేవ చేసుకోవడమే! కాదనకు ” అనూనయిస్తోనట్లు అన్నాడు రుషి.
“రుషి.. నాకు మాత్రం ఎవరున్నారురా? ఇదంతా కట్టుకుపోతానా? నా ఉద్యోగం నేను వదిలేసినా బోలెడు పెన్షన్ డబ్బు వస్తూనే వుంది. మీ ఇంటి మీద వచ్చే అద్దే కాదు , యీ ఇంటిని అద్దెకిస్తే హాయిగా జరుగుబాటైపోతుంది. ఎందుకా శ్రమ? ” నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు బాబాయి. “ఖాళీగా వుండలేను బాబాయ్ , నేను చెబుతున్నానుగా, స్వఛ్చమైన పదార్ధాలతో వంట చేస్తా, ఇది నా కోరిక, కాదనకు ” బ్రతిమాలుతున్నట్టుగా అన్నాడు రుషి.
“సరే నీ ఇష్టం ” రుషి భుజం తట్టి అన్నాడు బాబాయ్. ఆయన పేరు సవ్యాద్రి. కాశీలో, ఉత్తరాది సత్రంలో వంట చేసి సంపాదించిన తాలుకు డబ్బు రుషి దగ్గర భద్రంగా ఉంది. కొత్తగా కొన్న లాల్చీ తొడుకొని వంటసామాన్లు ఖరీదు చేయడానికి బయలుదేరాడు రుషి. అతను మలుపు తిరుగుతుండగా ఓ స్కూటర్ వేగంగా వచ్చి , గుద్దెయ్యబోతూ చివరి క్షణంలో తప్పించి ఓ గోడని గుద్దుకొని పక్కకి జారిపోయింది. స్కూటర్ వాలా కింద పడ్డాడు. కానీ లేవలేదు.
రుషి గబగబా వెళ్ళి స్కూటర్ వాలా మీదనుంచి స్కూటర్ ని తీసి పార్కు చేసి స్కూటర్ వాలా నాడిని పరీక్షించాడు. నాడి పర్ఫెక్ట్ గా కొట్టుకుంటోంది అతని బాడీని వెల్లకిలా తిప్పేసరికి తెలిసింది… అతను సృహలో లేడనీ… ఫుల్ గా మందులో వున్నాడనీ, తల నుంచి రక్తం స్రవిస్తోంది.
దారిలో పోయేవాళ్ళ సహాయాన్ని అర్ధించి అతన్నో రిక్షా ఎక్కించాడు రుషి. “హాస్పటల్ కి పోనీ ” అని చెప్పేలోగానే రిక్షావాడు “సార్ యీయన మా ఓనర్ చమన్ లాల్ గారి అల్లుడు ” అన్నాడు.
క్షణాలలో ఎస్. టి. డి. బూత్ నుంచి చమన్ లాల్ కి కబురెళ్లింది. మరో పది నిమిషాలల్లో కిషన్ చంద్ శరీరం రిక్షాలో నుంచి ఆంబులెన్స్ లోకి మార్చబడింది. … అక్కడ్నుంచి సూపర్ స్పెషాలిటి హాస్పటల్ కి అంబులెన్స్ పరుగెట్టింది. శేఠ్ చమన్ లాల్ రుషికి కృతజ్ఞతలు చెప్పడమే కాదు తను పరిచయ పత్రాన్ని కూడా ఇచ్చి , మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్పాడు.
ఆంబులెన్స్ వెళ్ళిపోయినా అక్కడే నిలబడ్డాడు రుషి. ఇంతకీ ఇది శుభసూచకమా? అశుభసూచకమా? సామాన్లు కొనడానికి బయలుదేరుతూనే యాక్సిడెంట్ తప్పింది గనకా ఏక్సిడెంట్ చెయ్యబోయినవాడు కూడా గాయాలలో వున్నా, సరైనా సమయానికి వైద్యశాలకి వెళ్ళడం వల్ల ప్రమాదం నుంచి బయట పడతాడు గనకా, జరిగింది శుభసూచకమేనన్న నిర్ణయానికి వచ్చి ముందుకు కదిలాడు రుషి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు???
*********
సర్వనామం సైలెంటుగా కూర్చున్నాడు. పరమశివం నవనీతం ఇంటి ముందు తచ్చాడటం గమనించాక సర్వనామం గుండె భగ్గునమండుతోంది. వీడెందుకు తిరుగుతున్నాడు? అసలు వీడెవరూ…. నవనీతానికి వీడికి ఏం సంబంధం? సర్వనామం పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు. శామ్యూల్ రాకని గమనించలేదు.
“ఏం భాయ్… ఏమిటంత దీర్ఘాలోచన ? ” తన రాయల్ రివాల్వింగ్ ఛైర్ లో కూర్చుంటూ అడిగాడు శామ్యూల్.
“మీదాకా రావల్సిన విషయం కాదులెండి. ఓ చిన్న విషయంలో ఆలోచన చేస్తున్నాను ”
“అదే ఎవరి గురించా అని ” కుతూహలంగా అడిగాడు శామ్యూల్.
“ఒక వ్యక్తిని చూశాను. వాడి వాలకం సరిగ్గా లేదు. లోకంలో వున్న క్రూరత్వమంతా వాడి మొహంలోనే వుంది. వాడు ఎవడో తెలియాలి. తెలుసుకునే దాకా నా మనసుకి మరో ధ్యాస వుండదు ” సుదీర్ఘంగా నిట్టుర్చి అన్నాడు సర్వనామం.
“తెలుస్కోవడం ఎంత సేపు? పోలీసు డిపార్ట్మెంట్ లో మనవాళ్ళు చాలామందే వున్నారు. వాళ్ళని కదిపితే క్షణాలలో కావల్సిన ఇన్ఫర్మేషన్ టేబుల్ మీదకొస్తుంది. ” తేలిగ్గా నవ్వి అన్నాడు శామ్యూల్ రెడ్డి.
“అదే జనాలు చేసే తప్పు. మీగ్గావలిసిన ఇంఫర్మేషన్ వాళ్ళివ్వడమే కాదు… వాడికి మీకు సంబంధం ఏమిటీ అనే విషయాన్ని కూడా అతి జాగ్రత్తగా గమనిస్తారు. పోలీసులంటే పైసలకి కక్కుర్తిపడే వాళ్ళు మాత్రమే కాదు, అవసరమైతే పైసలిచ్చేవాడిని రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టే మహానుభావులు. పాములోడినైనా నమ్మొచ్చు కానీ పోలీసోడిని మాత్రం కల్లో కూడా నమ్మకూడదు. ” బీడీ వెలిగించాడు సర్వనామం.
శామ్యూల్ రెడ్డికి తల తిరిగింది. ” నిజమే భాయ్… అంతలోతుగా నేను ఆలోచించలేదు. ఇంతకీ వాడి సంగతి తెలిస్తే నీకేంటి లాభం? ” శామ్యూల్ లోని కుతూహలం మళ్ళీ తలెత్తింది.
“అన్నిటికీ లాభాలుండవు రెడ్డిగారు… కొన్ని పనులు కేవలం డబ్బుకోసమే చేస్తాము. కొన్ని పనులు చెయ్యడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఎప్పుడో ఓ రోజున దేవుడి ముందు నిలబడాలిగా! ” నిర్వేదంగా నవ్వుతూ అన్నాడు సర్వనామం.
“నీకు… నీకు దైవభక్తి ఉందా? ” ఆశ్చర్యంగా అన్నాడు శామ్యూల్ రెడ్డి.
“మెడలో రుద్రాక్షాలో, క్రాసో, రోజుకైదు సార్లు నమాజో చేస్తూ ‘నేను భక్తుడ్ని సుమా ‘ అని జనాలని నమ్మించేంత భక్తున్ని కాను గానీ, ఏదో ఓ శక్తి యీ లోకాన్ని నడిపిస్తోందన్న విషయం మాత్రం ఖచ్చితంగా నమ్ముతా. దానికి దైవభక్తి అన్న పేరు పెట్టినా , మరో పేరు పెట్టినా నాకే మాత్రం అభ్యంతరం లేదు. ” నిర్లిప్తంగా అన్నాడు సర్వనామం. శామ్యూల్ సైలెంటైపోయాడు. సర్వనామంలోని యీ కోణాన్ని అతను చూడటం ఇదే ప్రధమం.
” సరే… రెడ్డిగారూ, నేను శెలవు తీసుకుంటున్నా. వీడి విషయం తేల్చుకున్నాకే మీక్కనపడతాను. ” లేచి చరచరా బయటకు నడిచాడు సర్వనామం.
*********
“ఏం చేస్తే నువ్వు మామూలుగా వుంటావు? ” కోపంగా అన్నాడు బోస్.
కళ్ళెత్తి అతని వంక చూసి మళ్ళీ తలదించుకుంది నవనీతం.
“సరే… చికాకులో నా మనిషివేననుకొని కొట్టాను. కాళ్ళ మీద పడమంటావా? చూడు… నాకు పిచ్చెక్కుతోంది. తిట్టాలనుకుంటే తిట్టు… కొట్టాలనుకొంటే కొట్టు… కానీ నీ మొహంతో నన్ను చంపకు. ” చేతులెత్తి టపాటపా చప్పట్లు కొట్టినట్టు పదిసార్లు దండం పెట్టాడు బోసు.
“తప్పు నాది బోసు బాబూ.. నీది కాదు. యజమాని దగ్గర పనిమనిషిగా పడుండాల్సిన దాన్ని, పక్కలోకొచ్చి పెళ్ళాంలా ఉన్న, పడుకున్నంత మాత్రాన పనిమనిషి పెళ్ళాం అవుతుందా? కాదు. శీలం సంగతి వదిలేయ్. అన్నీ ఇచ్చుకున్నదానికి దానితో ఏం పని? దెబ్బతగిలింది నాకూ, నా శీలానికే కాదు… నా నమ్మకానికి. నీ అపనమ్మకం, అది క్షణమే వున్నా సరే నా నమ్మకాన్ని చంపేసింది. నీవేమీ బాధపడొద్దు బాబూ, లోకంలో కావాల్సినంత మంది దొరుకుతారు. ఒక్కటి మాత్రం చెబుతున్నా… ముందు ఎవరేనా మంచిదాన్ని చూసి పెళ్ళి చేసుకో. ఎందుకో తెలుసా? వందేళ్ళు పని చేసినా పనిమనిషిని నమ్మి ఇంటి తాలూకు అన్నీ తాళాలు ఎవ్వరూ ఇవ్వరు. కానీ, మూడుముళ్ళు వేసిన మరుక్షణమే మొత్తం ఇంటినంతా పెళ్ళానికి అప్పగిస్తారు.
మాలాంటి వాళ్ళం రైలాంటోళ్ళం. వస్తాం.. పోతాం. పెళ్ళాం రైలు స్టేషన్ లాంటిది. ఎన్ని రైళ్లు వచ్చినా ఎన్ని రైళ్ళు పోయినా స్టేషన్ మాత్రం స్థిరంగా ఉన్న చోటే వుంటుంది. వెళ్ళు బాబూ వెళ్ళు… మనసు చెడగొట్టుకోకు. ” నిర్లిప్తంగా అని నేల మీద కులబడింది నవనీతం.
బోసుకసలు ఏం మాట్లాడాలో తోచలేదు. ఒకటి స్పష్టంగా అర్ధమయ్యింది … నవనీతాన్ని నూటికి నూరుపాళ్ళు పోగొట్టుకున్నానని… నేలలో ఇంకిన పాలు మళ్ళీ గ్లాసులోకి రావనీ. మౌనంగా బయటకెళ్ళిపోయాడు.
“మంచి సారా వుందా? ” పళ్ళన్నీ కనిపించేలా లోపలికొచ్చాడు పరమశివం. గుండె గుభిల్లుమంది నవనీతానికి.
“సారానే కాదు. బ్రహ్మాండమైన ఫారెన్ మందే వుంది నాతో వస్తే ” అతని వీపు మీద చెయ్యేస్తూ అన్నాడు సర్వనామం.
“నువ్వెవడివి? ” చాకులాంటి చూపులు సర్వనామం మీద ప్రసరిస్తూ అన్నాడు పరమశివం.
“నా పేరు సర్వనామం, అబ్బా.. నీలాంటి వాడి కోసమే వెతుకుతున్నాను. నాతో వస్తే లాభం నీకే. రానంటావా.. నాకు మాత్రం నష్టం వుండదు. ” స్థిరంగా అన్నాడు సర్వనామం.
“ఇదిగో… ఇద్దరికీ చెరో గ్లాసు సారా పొయ్యి ” వెకిలిగా అన్నాడు పరమశివం.
“పొయ్యదు ”
“ఎందుకు పొయ్యదు.. పోసి తీరాలి. బజార్లో కొట్టేట్టాక అమ్మకానికి కాక ఇంకెందుకూ? అయినా దాని తరఫున మాట్లాడటానికి నువ్వెవరూ? దాని ముండాగాడివా? ”
మాట పూర్తయ్యే లోగానే పరమశివం చెంప ఛెళ్ళుమంది. నాలుగు పళ్ళు జలజల నేల మీద రాలాయి. వెల్లకిలా పడ్డాడు పరమశివం.
“లేచి బయటకు పద… బ్రతకాలని నీకుంటే మాత్రమే. లేకపోతే ఇక్కడే చంపి ఇక్కడే పాతిపెడతా ” చాలా నెమ్మదిగా అన్నాడు సర్వనామం.
తలొంచుకొని బయటకు నడిచాడు పరమశివం. అతని ఒళ్ళు ఒణుకుతోంది. సన్నగా రివటలా వుండే సర్వనామంలో అంత బలం వుంటుందని పరమశివం ఊహించలేదు.
“వీడెవడో నాకు తెలియదు. నీకు అపకారం చేస్తాడన్న భయంతోటే లోపలికి వచ్చాను. వీడే కాదు ఏ ఒక్కడు నీ వంక కన్నెత్తి చూడకూడదు. నవనీతం… మాట తప్పి నీ ఎదురుగా వచ్చినందుకు సారీ… ” ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తు చెప్పాలనుకున్నది చెప్పి బయటకు నడిచాడు సర్వనామం.
ఓ కలగన్నట్టు నిశ్చేష్టయై నిలబడింది నవనీతం. సర్వనామం ఇచ్చిన ఫోన్ నంబరు తన పర్సులో భద్రంగా వున్న సంగతి కూడా ఆ క్షణంలో ఆమెకి జ్ఞాపకం వచ్చింది. కలతపడ్డ మనసులోంచి కన్నీరు ఉప్పొంగింది. కళ్ళగుండా ఆ ఉప్పెన ఆమె గుండె మీదకి చుక్కలు చుక్కలుగా జారింది. రెండు చేతుల్తో మొహం కప్పుకొని వెక్కెక్కి ఏడ్చింది. మనసులో వున్న భయాలన్నీ ఆ వరదలో కొట్టుకుపోగా, అక్కడే, ఆ చాప మీదే గాఢంగా నిద్రపోయింది నవనీతం…. ఎప్పటికో!
పాఠకుడా… ఆ నిద్ర ఎలాంటిదంటే పసిబిడ్డ అనుభవించే నిద్ర. ఏకాంత సేవ తరువాత భగవంతుడ్ని ఒడి చేర్చుకొనే నిద్ర.
“నీలాల కన్నుల్లో మెల మెల్లగా
నిదురా రావమ్మ రావే
నిండారా రావే! ”

ఇంకా వుంది..