ఒక చిన్న చెల్లి ఆత్మకధ 1

రచన: ???? (అనామిక)

ఆడపిల్లగా పుట్టడం నేరమైతే ఆ తప్పు నాది కాదు. అందులో ఆఖర్లో అక్కరలేని సంతానంగా పుట్టడంలో కూడా నా తప్పు లేదు. నా పుట్టుకకు సంతోషించిన వాళ్ళెవరూ లేరు. నా కన్నా ముందు పుట్టినవాళ్ళు తమకు దొరికేవాటిలో మరో భాగస్వామి వచ్చినందుకు బాధపడ్డవాళ్ళే.
పధ్నాలుగవ సంతానం కింద పుట్టిన నాకు చిన్నతనం అపురూపంగా మాత్రం లేదు. అందరిళ్ళల్లో ఆఖర్న పుట్టిన వాళ్ళకు గారాలూ ముద్దు ముచ్చట్లు ఎక్కువని కాస్త పెద్దయ్యాక తెలిసింది. ఇంకా పెద్దయ్యాక అక్కలూ అన్నలూ చిన్న చెల్లంటే ఎంతో ప్రేమగా చూసుకుంటారని ఆమె ఆడింది ఆట పాడింది పాటగా జరుగుతుందని తెలిసింది.
కానీ నా విషయంలో అలా ఎందుకు జరగలేదన్నది పెద్దయ్యాక కూడా అర్ధం కాలేదు. అలాంటి అయోమయంలో నా బాల్యం గడిచింది. నా కన్నా ముందు పుట్టిన అక్కలకు కొంత మందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అక్క పిల్లలు నా కన్నా పెద్దవాళ్ళు.
అమ్మ పాలు తాగిన గుర్తు కానీ అమ్మ ఒడిలో పడుకున్న గుర్తుకానీ లేదు. దానికి కారణం రెండో అక్కయ్య పురుడుకు రమ్మని బావ ఉత్తరం రాసారుట. అమ్మ నన్ను నాలుగో నెలలో వదిలి అక్క పురిటికి వెళ్ళిపోయింది. ఈ విషయం కొంచెం పెద్దయ్యాక అత్త చెప్పింది.
అత్త అంటే సొంత అత్త కాదు. నాన్నగారి బాబయ్య కూతురు. ఆవిడ, చిన్నక్క నీళ్ళు పోసి పాలు పట్టారట. అని వాళ్ళు చెప్పారు. ఎవరు నీళ్ళు పోసారు ఎవరు లాలించారు అది కూడా నాకు గుర్తు లేదు. అమ్మ చేతి గోరు ముద్దలు తిన్న గుర్తుకూడా లేదు. నాకు గుర్తు లేకపొయినా అమ్మ కానీ అక్కయ్యలు కానీ నా బాల్యం లోని మధుర ఘట్టాలు వర్ణించలేదు. చెప్పుకోదగ్గవి ఉంటే చెప్పరూ?.
అత్త ప్రేమ మాత్రం నాకు గుర్తే. నాకు ఊహ వచ్చేదాకా మా ఇంట్లో ఉండేది. స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోసం వచ్చిందిట. అమ్మకు ఆమె ఉండడం ఇష్టం ఉండేది కాదు. కారణం నాకు తెలియదు. ఇంకో మనిషి ఖర్చు భరించడం కష్టమనేమో?
ఒక రోజు పాల కోసం ఏడుస్తున్నానట. ఇంట్లో పాలు లేవు. ఏం చెయ్యాలో అత్తకూ, అక్కయ్యకూ అర్ధం కాలేదట. అప్పుడు అత్తకు ఉడుకుతున్నఅన్నం, పైకి వస్తున్న గంజి చూడగానే తెల్లగా ఉన్నగంజి పాలల్లా కనిపించిందట. వెంటనే గరిటతో ఆ ఉడుకు గంజి తీసి చల్లార బెట్టి చక్కెర వేసి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నోట్లో ఉగ్గు గిన్నె తో పోసిందిట. ఇది కూడాఅ అత్తే చెప్పింది.
నా చిన్ననాటి ముచ్చట్లంటూ ఏమైనా ఉంటే అవి అత్త నోట విన్నవే. అప్పుడప్పుడు అత్త మాటలు మీతో పంచుకుంటాను. ట్రైనింగ్ అయిపోయాక అత్త మా ఇంటి నించి వెళ్ళిపోయింది. ఉద్యోగం వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యింది. మధ్యలో ఎప్పుడైనా మా ఇంటికి వచ్చేది. అలా వచ్చినప్పుడు కొన్ని నాకు ఆరేళ్ళు వచ్చినప్పుడు కొన్ని, నేను కాస్త పెద్దయ్యాక కొన్ని తనకు తెలిసిన నా ముచ్చట్లు నాకు చెప్పేది.
సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మకు మడి ఆచారాలు ఎక్కువ. ఇంటి నిండా వచ్చేపోయే బంధువులు. పిల్లలకోసం వండిన వంట ట్రైన్ దిగిన బంధువుల విస్తళ్ళల్లో వడ్డించి కన్నపిల్లల కంచాల్లో ఆ రోజు ఆమె కన్నీరు తో బాటు ఆవకాయ నంజుకున్న ఆ పిల్లలకు అమ్మ ఏం పెట్టినా అమృతం అనుకుని తింటున్నా కడుపులో సుళ్ళు తిరుగుతున్న బాధను దిగమింగడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చేది.
అందమైన బాల్యం మధురమైన బాల్యం అన్నప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అందుకు కారణం నా బాల్యం అలా జరగలేదన్న బాధ.
స్కూల్లో వేసారు. అక్షరాభ్యాసంలాంటిది జరిగిందో లేదో గుర్తు లేదు. ఇంటికి దగ్గర ఉన్న స్కూల్ లో వేసారు. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఆ స్కూల్ ని ఇద్దరు అన్నదమ్ములు కలిపి నడిపేవారు. అక్కడేం నేర్చుకున్నానో నాకు గుర్తు లేదు. తెలుగు అక్షరాలు పూర్తిగా వచ్చాక ఒకటవ క్లాస్ పుస్తకం చదవడం మొదలు పెట్టాక, నాన్నగారు ఇంగ్లీష్ అక్షరాలు పలక మీద దిద్దించారు. ఇంగ్లీష్ పుస్తకం చూడగానే నాలో ఏదో మక్కువ. అసలవి ఎలా పలుకుతారో తెలియక పోయినా నాకొచ్చిన భాషలో పలకడానికి ప్రయత్నం
అలా ఒకసారి చదువుతుండగా నాన్నగారు విని నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని “ ఏదీ బంగారూ మళ్ళీ ఒక్కసారి చదువు” అన్నారు.
నేనేదో గొప్పగా చదివేసానన్న ఆనందం, నాన్నగారి ఒళ్ళో కూర్చున్నానన్న సంబరం లో పెద్దగా గొంతెత్తి
‘Leg’ ‘కల్’ కాలు. Chair ‘కుర్స్’ కుర్చీ అన్నాను.
నాన్నగారు పగలబడి నవ్వారు. నాన్న ఎందుకు నవ్వుతున్నారో అర్ధం కాలేదు.
“అలా చదవాలని నీకు ఎవరు చెప్పారమ్మా” అన్నారు.
“అలా చదవ కూడదా నాన్నగారూ. తెలుగులో కాలు ని అలా అంటారు గా ఇంగ్లీష్ లో అలా అంటారనుకున్నాను. నాకు అక్షరాలు వచ్చాయి కానీ చదవడం తెలియదు” అన్నాను.
“చాలా మటుకు ఆ అక్షరాలని బట్టే పలకడం ఉంటుంది. ఉదాహరణ కు తెలుగు లో ‘కాలు’ క కు దీర్ఘం ఇస్తే కా ‘ల’కి ఉకారమిస్తే లు ‘కాలు’ అంటావు కదా!అలాగే ఇంగ్లీష్ లో ‘leg’ ని లెగ్ అని చదవాలి.
ప్రతీ భాషకూ ఉఛ్చారణ వేరుగా ఉంటుంది” అని చెప్పారు.
నాన్నగారు అప్పుడు చెప్పినది అర్ధం కాలేదు. తరువాత ఎప్పుడో మాటల వరుసలో చిన్నప్పుడు ఇలా చదివావమ్మా అని చెప్పినట్లు గుర్తు.
మా స్కూల్ మరీ పెద్దదేం కాదు. ఎన్ని గజాలుంటుందో నాకు తెలియదు కానీ మాస్టారు గారు ఉండడానికి రెండు గదులూ వంటిల్లూ ఉండేవి. మా క్లాస్ రూమ్ లన్నీ పాకలే. బెంచీలు మాత్రం ఉండేవి. మాస్టారు పాఠం మాత్రం బాగా చెప్పేవారు.
మా స్కూల్లో ఆడపిల్లలూ మగపిల్లలూ ఇద్దరూ ఉండేవారు. అన్నదమ్ములు కాక ఇంకా ఇద్దరు టీచర్లు ఉండేవారు. మా స్కూల్లో ఐదవ తరగతి వరకే ఉంది. మా అన్నయ్యలు కూడా ఆ స్కూల్లోనే చదివారట. చివర్న పుట్టిన ఇద్దరక్కలూ మాత్రం ఆడపిల్లల బళ్ళో చదివారు. పెద్దక్కలందరికీ “ అష్టవర్షే భవేత్ కన్యా” అని ఎనిమిదేళ్ళు నిండకుండా పెళ్ళిళ్ళు. పదమూడవ ఏట కాపరానికి అత్తవారింటికి పంపడం, ఆ తరువాత వరసగా పిల్లా, పాపా గొడ్డూ, గోదాలతో ఊపిరి సలపని పనుల్లో ములిగి పోవడం.
చిన్నన్నయ్య బినాకా గీత్ మాలా వినేవాడు. అలాగే పాటలు కూడా బాగా పాడేవాడు. అన్నయ్య వెనకాతల పాడేదాన్నిఅలా చాలా పాటలు నాకు వచ్చేసాయి. అలా పాటలంటే తెగ పిచ్చి .
పక్కింటివాళ్ళ రేడియోలో పాటలు వస్తున్నాయి. మిస్సమ్మ లోని పాట “ రావోయి చందమామ” అంటూ. నేను ఆ పాటను నా సన్న గొంతు తో పాడడం మొదలు పెట్టాను.
“ఛట్ నోరుముయ్యి వెధవ కీచుగొంతుకూ నువ్వూనూ” అన్న చిన్నన్న మాట తో నోటికి తాళం పడింది. ఆ పాటంటే ఎంతో ఇష్టం నాకు. నా గొంతు సన్నగా ఉంటుంది దాన్ని కీచు గొంతు అన్న అన్నయ్య మీద బాగా కోపం వచ్చినా ఏమీ చెయ్యలేని అసహాయత. నాకన్నా పద్దెనిమిదేళ్ళు పెద్ద అయిన అన్నగార్ని ఏమనగలను?
కారణం ఉన్నా లేకపోయినా మొట్టికాయలు మొట్టే నాలుగో అన్ననూ ఏమీ చెయ్యలేను. చిన్నపిల్లని కదా!
అలాగే కోపం వచ్చినప్పుడు జడ వెయ్యనని అక్క మొట్టికాయలు మొట్టేది. అక్క జడ వెయ్యకపొతే
అమ్మవేసే జడ నాకు నచ్చదు. అమ్మ బిగుతుగా వేస్తుంది మర్నాటి దాకా ఉండాలంటూ. మడి అని చెప్పి అరటి తడపలతో జడ వేస్తుంది. అది విప్పి మళ్ళీ రిబ్బన్ పెట్టుకోవడం నాకు చాత కాదు. అలా అమ్మ వేసిన జడ తో స్కూల్ కి వెడితే స్నేహితులు ఎగతాళి చేస్తారు
అందుకని అక్క తిట్టినా కొట్టినా ఆమె తోకలా ఉండేదాన్ని. నా కధలో అందరి అక్కల పేర్లూ అక్కరలేదు కానీ ఈ అక్క గురించి చాలా విషయాలు మీతో పంచుకోవాలి. అందుకని ఈ అక్కకు ఓ పేరు పెట్టేసుకుందాము. అబ్బ ఏం పేరబ్బా ఒరిజనల్ పేరొద్దు. సుబ్బమ్మ వెంకమ్మా బాగుండవు అక్క అంటే కొంచెం కోపం ఉన్నా ఎంతైనా అక్క కదా! అందుకని పిచ్చి పేరు వద్దు. పద్మాసిని అని పెడదాం ముద్దుగా ఇక మీదట మా పద్దక్క అని చెపుతూ ఉంటాను.
దసరా పండగ వచ్చిందంటే ఎంత సంబరమో! దానికి కారణం ఇంచక్కా రంగు కాగితాలు కట్టిన విల్లులూ బాణాలూ పట్టుకుని ముందు రోజే ఎవరెవరి పిల్లల తల్లితండ్రులు రమ్మంటారో మాస్టారు తో బాటు అలా పిలిచిన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం చేసేవాళ్ళం.
అలా వెళ్ళిన మాకు ఆ ఇంటి వాళ్ళు పిల్లలకు చాపలు, మాస్టారుకి కుర్చీ వేసి కూర్చోబెట్టాక, మాస్టారు చెప్పగానే,
ఏదయా మీదయా మా మీద లేదు ఇంతసేపుంచుట ఇది మీకు తగునా! దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక రేపురా మాపురా మళ్ళీ రమ్మనక ఇప్పుడే లేదనక ఇవ్వరేమనక అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు
అంటూ ఏక కంఠంతో పాడేవాళ్ళం. ఆ ఇంటివాళ్ళు నవ్వుకుంటూ మళ్ళీ రమ్మనంలెండి అంటూ మాకు పళ్ళెంలో పప్పు బెల్లాలు తెచ్చి దోసెళ్ళల్లో పోస్తే మేం తెచ్చుకున్న రుమాళ్ళల్లో మూట కట్టుకుని మళ్ళీ దోసిలిలో కొన్ని తీసుకుని తినేవాళ్ళం.
మరమరాల్లో గుల్ల సెనగపప్పు (పుట్నాల పప్పు) బెల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు కలిపి ఇచ్చేవారు. ఆ పప్పుబెల్లాలు భలే రుచిగా ఉండేవి. అయ్యవారికి అంటే మాస్టారికి తాంబూలంలో డబ్బు పెట్టి ఇచ్చేవారు. కొంతమంది పంచెల చాపు కూడా పెట్టేవారు.
అలా మా ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం నాన్నగారు చాలా హడావుడి చేసేవారు. పప్పుబెల్లాల తో బాటు పిల్లలకు మా పెరట్లో కాసిన అరటిపళ్ళు (అమృతపాణి)కూడా ఇచ్చేవారు. మా స్నేహితులందరిలో ఆ
రోజు నేను గొప్పదాన్నన్నమాట. ఒకసారి అమ్మ పాలకోవా కూడా పిల్లలకు ఇచ్చినట్లు గుర్తు. అందరూ పంచెలు పెడితే అన్నీ ఏం చేసుకుంటారని, నాన్నగారు మాస్టారికి పాంట్, చొక్కా గుడ్డ ఇచ్చేవారు.
“నాకు తెలుసున్న దర్జీవాడున్నాడయ్యా చవకగా బాగా కుడతాడు నా పేరు చెప్పు” అనేవారు.
నాన్నగారు మాస్టార్ని నువ్వని ఎందుకంటారో అర్ధమయ్యేది కాదు. తరువాత తెలిసింది మాస్టారు కన్నా నాన్న పెద్దవారని. మాకు పెద్దగా డబ్బులెక్కువ లేకపోయినా నాన్నగారికి చదువుకునే వాళ్ళన్నా చదువు చెప్పేవాళ్ళన్నా చాలా ఇష్టం.
మా స్కూల్ బైట పీచు మిఠాయి వాడు, ఒక తాత కర్ర కు కట్టిన రంగు రంగుల జీడి పాకం ముద్ద తో వాచీలు పిట్టలూ చేసి ఇచ్చేవాడు. కొద్ది సేపు చూసి ఆనందించి ఆ తరువాత తినేసేవాళ్లు. తియ్యగా ఉండేది. బటానీలు కూడా అమ్మేవాడు. కొంత మంది పిల్లలు కొనుక్కునేవారు. కానీ నా దగ్గర డబ్బులు లేవుగా అందుకని వాళ్ళు తింటుంటే నేను చూస్తూ తింటున్నట్లు ఫీలయ్యేదాన్ని.
ఒకసారి అలా చూస్తూ నించున్నప్పుడు చిన్నన్నయ్య చూసాడు. ఇంటికి బర బరా లాక్కొచ్చి ఒక్క లెంపకాయ కొట్టాడు. అమ్మ ఎందుకురా కొడుతున్నావు? అని అడిగితే “లేకి దానిలా వాళ్ళు కొనుక్కు తింటుంటే చొంగలు కారుస్తూ చూస్తూ ఉంది అసహ్యంగా” అన్నాడు.
మనకి తినాలని ఉన్నది తినడానికి దొరక్కపోయినా ఎవరైనా తింటుంటే అలా చూడకూడదా? తప్పని అన్నయ్య చెప్పాడు. తప్పేమో మరి. అమ్మ కూడ తప్పమ్మా. “ఎప్పుడైనా డబ్బులిస్తాలే అప్పుడు కొనుక్కుందువు గాని” అంది.
“నిజంగానా!” అన్నాను ఆనందంగా అవునన్నట్లు తలవూపి పనిలోకి వెళ్ళిపోయింది.
అన్నట్లుగానే అమ్మ ఒకరోజు ఒక కానీ ఇచ్చింది. ఆ కానీ చూడగానే సామ్రాజ్యం గెలిచినంత ఆనందం. దాన్ని పోగొట్టుకుంటానేమో అని ఖర్చుపెడితే అయిపోతుందేమో అని దాచుకున్నాను. ఇప్పుడు కావాలంటే నేను పీచు మిఠాయి కొనుక్కోగలను. వాచీ కూడా కొనుక్కోవాలి. అది చేతికి పెట్టుకుని ఎవరైనా టైమ్ ఎంతయ్యిందంటే ఇంచక్కా చెప్పచ్చు.
అలా కలలలు కనేసి ఇంకా ఎక్కువ రోజులు దాచుకుంటే ఎవరైనా తీసేసుకుంటారేమో అన్న భయం తో మర్నాడు స్కూల్ ఐపోయాక జీడి పాకం తాత దగ్గరకు వెళ్ళి దాని తో ఒక వాచీ ఒక పిల్లి బొమ్మ చెయ్యమన్నాను తరువాత పీచు మిఠాయి అబ్బాయితో పీచు మిఠాయి ఇమ్మని చెప్పాను.
అప్పట్లో మేం దీన్ని తాయిలం అనేవాళ్ళం. ఈ పీచు మిఠాయి, తాయిలాల గురించి తరువాత చెప్తానే.

కంభంపాటి కథలు 1 – ఆశ

రచన: రవీంద్ర కంభంపాటి..

“అమ్మా తలుపేసుకో “ అంటూ వెళ్ళిపోతున్న సుభాష్ తో “జాగ్రత్త గా వెళ్ళిరా “ అని చెప్పేలోపే ఏదో ఫోను మాట్లాడుకుంటా వెళ్ళిపోయేడు . అయినా నా చాదస్తం కాకపోతే నా మాట వినేదెవరు ఈ ఇంట్లో ? మళ్ళీ సాయంత్రం నాలుగింటిదాకా ఒక్కదాన్నీ ఉండాలి. అసలే ఊరవతల ఎక్కడో విసిరేసినట్టుండే ఈ విల్లాల్లో “ఎలా ఉన్నారండీ “ అని పలకరించే దిక్కుండదు .
ఇంట్లో కొడుకూ , కోడలూ , మనవలూ అందరూ ఉన్నా కూడా లేనట్టే ఉంటుంది, ఎవరి ఫోను , టాబ్లెట్లలో వాళ్ళు బిజీ గా ఉంటారు . “మీరు కూడా ఫేస్బుక్, వాట్సాప్ చూడడం నేర్చుకోండత్తయ్యా .. అప్పుడు లైఫ్ ఈజీగా టైంపాస్ చెయ్యొచ్చు “ అంటుంది నా కోడలు భార్గవి , కానీ అవన్నీ నా మనసుకి సరిపడవు మరి . ఐదేళ్ల క్రితమే రిటైరయ్యేను , చిన్నప్పట్నుంచీ ఎప్పుడూ ఏదో పని చేసుకోవడమే నాకలవాటు, కానీ ఇలా కాళ్ళూ , చేతులూ కట్టి పారేసినట్టు ఈ ఊరవతల ఉండలేకపోతున్నాను .
“రెండు కోట్లు పెట్టి కొన్నాము . ఇంత పెద్ద ఇంట్లో హాయిగా ఉండడానికేం “ అంటాడు నా కొడుకు , కానీ ఎవ్వరూ మాట్లాడ్డానికి లేనప్పుడు ఇల్లైతేనేం ..శ్మశానమైతేనేం . అన్నట్టు నాకీమధ్య ఈ ఒంటరితనం మూలాన్ననుకుంటా, జీవితం మీద ఆశ పోయి “పోనీ చచ్చిపోతేనో “ అనే ఆలోచనలూ వస్తున్నాయి !
నా ఆలోచనల్లో నేనుండగా , ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తే వెళ్లి తలుపు తీసి చూసేను , ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాసిపోయిన బట్టలూ , వెర్రి చూపులూ చూస్తున్న ఆ పిల్లలు ఇంత ఖరీదైన మా కమ్యూనిటీ లోకి ఎలా వచ్చేరా అని ఆశ్చర్యపోతూ , “ఎవరు మీరు?” అని గట్టిగా అడిగేను .
కోపంగా ఉన్న నా మొహం చూసిన చిన్నవాడు, మూడేళ్లుంటాయేమో , ఏడుపు మొహం పెట్టేసేడు . వాడి కన్నా కాస్త పెద్దగా ఉన్న పిల్ల , వాడిని వెంటనే ఎత్తుకుని “నీళ్లు రావట్లేదండీ “ అంది
“నీళ్లు రాకపోవడమేమిటి ?. ఎక్కడ నుంచొచ్చేరు ?” అని అడిగితే, భయపడుతూ పక్క విల్లా వేపు చూపించింది . విషయం ఏమిటో కనుక్కుందామని మా ఇంటి తలుపేసి , చెప్పులేసుకుని ఆ పిల్లలతో పాటు పక్కింటి వేపు నడిచేను . నాకు తెలిసి ఆ ఇల్లు ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది , మరి వీళ్ళెక్కడినుంచొచ్చేరు?
తలుపు దగ్గిరగా వేసుంది , “అమ్మా ఈవిడొచ్చేరే “ అంటూ ఆ పిల్ల తలుపు కొడితే మెల్లగా తలుపు తీసిందావిడ . నీరసంగా ఉందా అమ్మాయి , ఓ పాతికేళ్ళు ఉంటాయేమో , మొహం మటుకూ కళగా ఉంది . “నీళ్లు రావట్లేదు “ అంది తలొంచుకుని .
“మీరెవరు ? ఈ ఇంట్లోకి ఎలా వచ్చేరు ?” అనడిగేను
“సాయంత్రం ఆళ్ళొస్తారు ..చెబుతారండి “ అంది
“వాళ్లెవరు “ అడిగేను.
తలెత్తకుండా “ఆళ్ళు చెబుతారండీ “ అని “కొంచెం నీళ్లు ఎలా వస్తాయో చెప్పరా ? పిల్లలు దాహం అంటున్నారు “ అంది
ఇంట్లోకెళ్ళి చూసేను, ఎక్కడా ఏ టాపులోనూ నీళ్లు రావడం లేదు . ఇంటర్ కాం లో విల్లా మెయింటెనెన్సు కి ఫోన్ చేసి , విషయం చెబితే , వాళ్ళు ఆ విల్లా తాలూకా వాల్వు విప్పారు . ఓ పది నిమిషాలకి నీళ్లు రావడం మొదలెట్టేయి .
“నువ్వంటున్న “ఆళ్ళు ” రాగానే నన్ను కలవమని చెప్పు“ అనేసెళ్లిపోయేను
మధ్యాహ్నం ఒంటి గంటవుతూంటే , మళ్ళీ కాలింగు బెల్లు మోగింది . తలుపు తీసి చూసేసరికి, ఎవరో భార్యాభర్తలున్నారు . సఫారీ సూటేసుకుని ఆయన , ఒళ్ళంతా నగలతో ఆవిడా చాలా దర్పంగా ఉన్నారు .
“పక్కనున్న విల్లా గురించి మాటాడ్డానికి ఒచ్చేమండి.. మెయిన్ రోడ్లో ఉన్న సూర్య ఫైనాన్స్ కంపెనీ మనదేనండి “ అన్నాడాయన.
లోపలి రానిచ్చేను , సోఫాలో కూచుంటూ చెప్పేడాయన “అక్కడున్నోళ్లు మా వోళ్ళేనండీ “
“మా వోళ్ళే అంటే ?” అడిగేను
“మా లేడీస్ మాట్లాడతారండి మీతో “ అని బయటికెళ్ళేడు
అతను వెళ్ళగానే ఆవిడ మొహమాటంగా చెప్పింది “మాకు పిల్లలు పుట్టరంట .. డాక్టర్ గారు ఏదో సరోగసీ వైద్యం అన్నారు .. అందుకే ఈవిడ మా బిడ్డని మోస్తుంది .. ఊరికినే కాదులెండి ..బిడ్డని మోసినన్నాళ్ళు నెలకి పాతిక వేలు, ఉండడానికి ఇల్లు , ఆవిడకి , పిలల్లకి తిండి కూడా పెడుతున్నాం”
నేనేం మాట్లాడలేదు . కొంచెం అప్పుడప్పుడు ఆ ఇంటి మీద కన్నేసి ఉంచమనీ , తొమ్మిది నెలల అద్దె ముందే కట్టేసేమనీ చెప్పి వాళ్ళెళ్ళిపోయేరు .
ఆ అమ్మాయి పేరు రూప అట , పెద్దకూతురు రమ్య , కొడుకు పేరు కృష్ణ అట, వాళ్ళాయన కి రమ్యకృష్ణ పిచ్చట , అందుకే పిల్లల పేర్లు ఇలా పెట్టించేడు ! మధ్యతరగతి కుటుంబం పిల్ల , ప్రేమలో పడి లేచిపోయిచ్చిందట , మొగుడు ఎక్కడో ఎలక్ట్రీషన్ గా పని చేస్తున్నాడు . కుటుంబం గడవక ఈ బిడ్డ ని మోయడానికి ఒప్పుకుంది. ఏమైతేనేం .. కనీసం నాకు మాటాడుకోడానికో తోడు దొరికింది !
నాకు ఆ పిల్లలిద్దరూ బాగా మచ్చికైపోయేరు , ఏదో నాకు తోచిన చదువు చెప్పేదాన్ని . రూప ని సాయంత్రం పూట నాతో పాటు అలా వాకింగ్ కి తీసుకెళ్ళేదాన్ని. ఎక్కువగా మాటాడేది కాదు , ఏదో ఒక విధమైన నిస్పృహ కనిపించేది ఆ అమ్మాయి లో .
ప్రతి నెల మొదటి తారీకు రోజు మటుకు ఆ అమ్మాయి మొగుడు సఫారీ సూటాయన దగ్గిర పాతిక వేలు తీసుకోడానికొచ్చేవాడు, కాసేపు పిల్లల తో ఆడుకుని వెళ్లిపోయేవాడు .
మధ్యాన్నం పూట తలుపు శబ్దం విని తలుపు తీస్తే , ఆ చిన్న పిల్ల వచ్చి “మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూందండి “ అని చెప్పింది . ఏమిటా అని కనుక్కునేసరికి , ఆ ఎలక్ట్రీషన్ వెధవ దేంతోనో లేచిపోయేడట . ఆ అమ్మాయిని ఊరుకోబెట్టి , ధైర్యం చెప్పి , నాలుగు ముద్దలు బలవంతంగా తినిపించి వచ్చేసేను . మళ్ళీ ఒక్కతీ ఉంటే ఏం అఘాయిత్యం చేస్తుందోనని ఆ రోజుకి రూపనీ , పిల్లల్నీ మా ఇంట్లోనే ఉండమని తీసుకొచ్చేను .
సాయంత్రం వచ్చిన మా కోడలు రూప వేపు ఓ చూపు పారేసి తన గదిలోకెళ్ళిపోయింది , రాత్రి నా కొడుకు అడిగేడు “ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి ఇల్లు కొనుక్కుంది , ఇలాంటి అలగా జనాన్ని రానివ్వడానికా చెప్పు “ అని . ఆ రాత్రి మాత్రం నిజంగా చావాలనిపించింది, వీణ్ణి చిన్నప్పటినుంచీ ఎంత కష్టపడి పెంచేనో, ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చేమో నాకు తెలుసు , వాడికీ తెలుసు , కానీ ఏమీ తెలీనట్టు నటిస్తున్నాడంతే !
రోజులు గడుస్తున్నాయి , పిల్లలు , మనవలు ఆఫీసులకి , స్కూళ్ళకి వెళ్ళగానే పక్క విల్లా వేపు నా అడుగులు పడిపోతున్నాయి . రూప , తన పిల్లల తో గడుపుతూ, వాళ్లకి అవీ , ఇవీ చేసిపెడుతూంటే , ఏదో నా సొంత కూతురికి , మనవలకి చేసిపెడుతున్నట్టుంది . ఆ పిల్లలు కూడా అమ్మమ్మ గారండీ అంటూ పిలవడం మూలాన కావచ్చు !
తొమ్మిదో నెల నిండుతూంది రూపకి , వారం రోజులుగా రెండు పూటలా వచ్చే క్యారేజీ రావడం మానేసింది . నేనే తనకి , పిల్లలకి వంట చేసి పెడుతున్నాను , ఆ సఫారీ సూటాయన కోసం ఫోన్ చేస్తూంటే ఫోన్ స్విచ్చాఫ్ వస్తూంది . సిగ్గు విడిచి మా అబ్బాయిని “ఒరే కొంచెం ఊళ్లోకి వెళ్ళినప్పుడు ఆ సూర్య ఫైనాన్స్ కంపెనీ కి వెళ్లి ఈ అమ్మాయి విషయం చెప్పు , వాళ్ళు ఈ మధ్య ఇటువైపు రావడం మానేసేరు “ అంటూ అడిగితే , వాడు “ఫైనాన్స్ కంపెనీ అన్నా తర్వాత లక్ష పనులు , లక్షన్నర ఇబ్బందులూ ఉంటాయి , రోజూ రెండు పూటలా క్యారేజీ పంపుతూ కూర్చోడానికి వాళ్ళేమైనా దాన్లాగా , నీలాగా ఖాళీ గా ఉంటారనుకున్నావా ?” అన్నాడు , పక్కనే ఉన్న నా కోడలు “ఇప్పుడా ఫైనాన్స్ కంపెనీ ఆయన వైఫ్ కి సొంతంగా ప్రెగ్నెన్సీ వచ్చిందేమో .. అందుకే వీళ్ళని పట్టించుకోవడం లేదు.. అయినా అత్తయ్యా మీరెక్కువగా వాళ్ళతో కమ్యూనిటీ లో తిరుగుతున్నారట కదా .. ధీరజ్ వాళ్ళావిడ ఇందాక ఫోన్ చేసి ఒకటే నవ్వు “ అంటూ నవ్వేసింది . “నువ్వు కూడా వాళ్ళతో తిరగడం మానెయ్యి, లేకేపోతే అనవసరంగా మన నెత్తికి చుట్టుకుంటుందంతా“ అనేసి లోపలికెళ్లిపోయేడు
మర్నాడు ఉదయం ఏడవుతూంటే తలుపు కొట్టేడు ఆ కృష్ణ గాడు . “ఏమైందిరా అని అడిగితే .. మా అమ్మ ఏడుస్తూందండి .. మిమ్మల్ని రమ్మంది “ అని వెక్కుతున్నాడు
గాభరాగా వాళ్ళింటికి పరిగెత్తితే అర్ధమైంది ., రూప కి నొప్పులు మొదలయ్యేయి , నీరు వదిలేసింది . వెంటనే విల్లా సెక్యూరిటీకి ఫోన్ చేసి అంబులెన్సు తెప్పించి , ఆసుపత్రికి తీసుకెళ్ళేను . అదృష్టం కొద్దీ ప్రసవం బాగానే జరిగింది , పిల్లాడు చూడ్డానికెంత బాగున్నాడో !
అప్పుడు గుర్తొచ్చింది .. ఆ సఫారీ సూటాయనకి ఫోన్ చేసి చెబుదామని గబ గబా నడుచుకుంటూ రిసెప్షన్ దగ్గిరికెళ్ళి , అక్కడి ఫోన్ తీసుకుని ఆయనకి ఫోన్ చేస్తూ , యధాలాపం గా ఆ టేబుల్ మీదున్న పేపర్ ని చూసేసరికి ఒక్కసారి గుండె జారిపోయింది ,”అప్పుల భారంతో సూర్య ఫైనాన్స్ ఓనరు , భార్య ఆత్మహత్య “ అనే హెడ్ లైన్ చూసేసరికి కళ్ళు తిరిగిపోయి అక్కడే పడిపోయేను .
కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రి బెడ్ మీదున్నాను . ఒకటే ఆలోచనలు , ఏం చేస్తుంది రూప ఇప్పుడు? ఆ పిల్లాణ్ణి ఇక్కడే ఒదిలేసి తన పిల్లలతో వెళ్లిపోతుందేమో ? ఏమైనా సొంత పిల్లాడు కాదు కదా .. అసలు ఆసుపత్రి లో ఉందా అనుకుని అసహనం గా కదులుతూంటే , కృష్ణ గాడి అరుపు వినిపించింది “అమ్మా .. అమ్మమ్మ గారు కదులుతున్నారే “ అంటూ . కిందకి చూసేసరికి , మంచానికి కాస్త ఎడంగా తన ఇద్దరు పిల్లలతో కింద పడుకుని కనిపించింది ! ఆ మూడోవాడు చనుకట్టునతుక్కుని నిద్రపోతున్నాడు !
“తెలిసిందమ్మా .. పాపం ఆ అమ్మగారు , అయ్యగారు పోయారంట కదా “ అంది
“మరి .. వీడినేం చేస్తావు ?“ అడిగేను
“విత్తనం వాళ్లదే కానీ పెరిగింది నాలో కదమ్మా . ఈడూ నా బిడ్డే.. ఎంత కష్టపడైనా నేనే పెంచుతాను “ అందా రూప
“అమ్మా అన్నావు కదే . ఆళ్ళతో పాటు నన్నూ పెంచుకుంటావా ? “ అన్నాను , జీవితం మీద కొత్తగా పుట్టిన ఆశతో.
నాకేసే చూస్తున్న ఆ ముగ్గురి కళ్ళలోనూ ఏదో తెలియని మెరుపు కనిపించింది !

గోదారొడ్డు కథలు 1 – ఎదరంతా … ఎదురీతే !

రచన: కన్నెగంటి అనసూయ

“ ఎన్నోత్తా? కుంచుడు నానబోత్తావా.. ..” సీతమ్మంది బియ్యవొంక అదే పనిగా సూత్తా..
అలా సూత్తా సూత్తానే బత్తాలోంచి గుప్పెడు గింజల్దీసి కళ్లకాడికంటా తెచ్చుకుని కళ్ళింతంత సేసి మరీ సూత్తా
“ఏటీ..ఇయ్యి పాత బియ్యవేనా? అలా కనిపిత్తాలేదు..”
“ అయ్యా..నీతో నేనాపద్దాలాడతానేటే పిన్నే. ఆడితే నాకేగాని నీగ్గాదని నాకు దెల్దా? “
అన్నాకా నిముషమాగి..
“ ఇంకా నిరుటి బియ్యవే తింటన్నాం. అయ్యయిపోతేనేగాని పొణక్కి సిల్లెట్తం. పాత బియ్యవైతే పిండురువవ్వుద్దని , అరిసిలికి అయ్యే బాగుంటయ్యని మాయమ్మెప్పుడూ అదే పనిగా అంటా ఉండేది సచ్చేలోకానుందోగానీ మాతల్లి. బతికున్నంతకాలం పాకుండల్లోక్కానీ, పాల్తాలికల్లోక్కానీ, కడాకరుకి కారప్పూస, జంతికిల్లోక్కూడా పాత పిండే కొట్టిచ్చి ఎండబెట్టి డబ్బాల్లో పోసుకోమనేది. “
సీతమ్మకి ఆల్లక్క గేపకవొచ్చినట్టుంది..కాసేపేమ్మాట్టాడలేదు. ఇంకా అదేపనిగా సెప్పుకు పోతన్న సరోజ్ని మాటల్కి అడ్డుదగుల్తా..
“ మాయక్క సంగజ్జప్పకు. అదీ..దాని శాదత్తవూను..”
“నమ్ముతుల్లేదేటోగానీ..! నిరిటియ్యేనే పిన్నే..! ..అయినా మూడుసేర్లంటన్నావ్ గానీ అయ్యే .. మూలకే బాబా. ఒక్క పూటలో మిల్లాడిచ్చేత్తారు గుంటలు. రెండో పూటకి నేన్రోడ్డుమీదడాల, ఎక్కడేం దొరుకుతుయ్యోనని ఎతుక్కుంటా. నా పేగుల్లాగెయ్యరా.. . అసలే రేపటేల కాడ్నించీ ఏసోసెలవులు.“
“ మరెంతోద్దావనుకుంట్నా..?”
సేతిలో బియ్యం కిందడకుంటా బత్తాలోకిసిరేత్తా అంది సీతమ్మ..సరోజ్నెనక్కి తేరిపారా సూత్తా..
“ పది శేర్లన్నా పోత్తేనే….కాత్తంత ఆల్లకీ ఈల్లకీ రెండేసరిసెలెయ్యచ్చు. ఏవంటావ్.?”
“ ఊరుకో..పది శేర్లంటే మాటలేటే..! రెండు కుంచాలడ్డెడు.. ఏటనుకుంటన్నావేటి? పిండిలో పోటేసీవోల్లు రాపోతే అప్పుడవ్వుద్ది ..అయినా ఊరంతా పంచుతావా ఏటి ఆ..ఆ..” బుగ్గలు నొక్కుకుంటా తరుముకొచ్చేసింది సీతమ్మ సరోజ్నీని.. కాకి దొడ్లో వాలితే సాలు తరిమేసే పిల్లిలాగా..
“ నీకు తెల్దేటే పిన్నే..! మా గిలక్కాయికి నోరాడతానే ఉండాలి ఇరవ నాలుగ్గంటలూను. ఒట్టి తిండిపోతది.తింటాకేవీ లేపోతే ఆడికైనా ఏదోటెట్టి సరిపెట్టచ్చేవో గానీ దాన్నాపటం మన తరమవదు..
పోనీలే మగ పిల్లోడు గదాని ఆడికి రెండెడితే దీనికి మూడివ్వాలింకోటెక్కువేసి. పెతీదీ ఆడితో పోటీ ముందాడికెన్నిచ్చేనో సూత్తది. ..అయ్యున్నన్నాల్లూ తిండే తిన్దు..”
“ మరింకెంతుకు? పొయ్యయితే..”
పిన్నమ్మ మాటతో.. అప్పటికే సింతపండూ, కుంకుడుకాయల్తో తెల్లగా తలతల్లాడేతట్టు పాలేరుతో తోమిచ్చి ఎండలో బోర్లించెట్టిన రాగి డేక్షా తెచ్చి దాన్నిండా తొట్లోంచి మంచి నీళ్దెచ్చి నింపి, పైట సెంగుతో సెయ్యి తుడుసుకుని ఇత్తడి తవ్వతో బత్తాలోంచి ఒక్కో తవ్వెడూ కొలిసిపోత్తుంటే ..
“పిల్లలంతేలే..! ఇత్తే సమంగా ఇయ్యాల. ఎక్కువ తక్కువలిత్తే పిల్లలేడవరా?
దాన్ది మాత్రం పొట్త కాదా ? అంతుకే అదలా లాక్కుంటంది…సెబ్బరేవుందిలే గానీ కుంచం లేదా ఏటి, తవ్వతో కొలుత్తున్నావ్? ఇంకదేపనా..” సీతమ్మంది.
“ లేపోతవేటి. ఉంది. కాపోతే మసిరి మీదుంది. నాకందదు. నిచ్చేనేసుకునెక్కి తియ్యాలి. పోన్లే..! ఎంతసేపు..”
అంటానే తవ్వతో ఇరవై సార్లు కొలిసి మొత్తం మీద పది శేర్ల బియ్యాన్ని డేక్షాలోని నీళ్లల్లో గుమ్మరిచ్చింది సరోజ్ని.
“ పిండ్లో పోటేసేవోల్లకి సెప్పావా ఎల్లుండి రమ్మని..?”
“ సెప్పేను పిన్నీ. ఆల్లొప్పుకున్నాకే నీక్కబురంపేను..”
“ ఏదీ ..బెల్లం సేటలో ఏసి..సిన్న రోకలిటియ్యి. ముక్కలు కొడతాను..మల్లీ అడావిడైపోద్ది ఆయాల..”
“ తూసి పెట్టేను. మొన్నే తెచ్చేరు బుట్ట. ఎల్తా ఎల్తా రెండీసులు ముక్క నువ్వట్టుకెల్లు. సిన్నాన్న..అటుకుల్లో పాలేసిత్తే తింటాడుగదా..”
అంటా లోపలికెల్లబోయే తలికి.. బేరమంటా ఏడుత్తా వచ్చింది గిలక. అప్పటికే ఏడుత్తా కళ్ళు బాగా నులిమెసుకుందేమో.. బుగ్గలంతా కాటుకే..
గిలక గొంతెత్తిందంటే కొంపలంటుకుపోయినియ్యన్నంత భయమేత్తది సరోజ్నికి.
గిలకనలా సూత్తానే ..
“పేణాలు ఏగిచ్చి పోతన్నయ్యనుకో పిన్నే ఈల్లిద్దరితో. అసలే రేపట్నించీ బళ్ళు లేవేమో..
నాపేగుల్దీసేత్తారీళ్ళు..” అంటానే..గిలక దగ్గరకంటా వచ్చి..
“ఎందుకేడుత్తున్నావే.మల్లీ కొట్టుకున్నారా..?ముకవంతా ఆ కాటుకేటి? రాచ్చసిముండల్లే.. “
అంటా ఈధి గుమ్మంకాడికెల్లి శీనెక్కడున్నాడాని సుట్టూ సూసింది.
ఆడెక్కడా ఆపడపోయేతలికి గిలక రెక్కట్టుకుని బయటికి తీసికెల్తా..
“నేనడుగుతానాడ్ని. నువ్వేడుపాపు. గుండెల్జల్లుమనిపోతన్నయ్. “ అంటానే ఎంతకీ ఏడుపాపని గిలక నెత్తి మీద ఒక్క మొట్టికాయిచ్చింది ఠపీల్మని.
దాంతో..కెవ్వునోసారి అరిసి , అంతలోనే తగ్గిచ్చేసిన గొంతుతో.. నెత్తి మీద దెబ్బ తగిల్నసోట సేత్తో రాసుకుంటానే ఈధెన్నక్కి సూపిత్తా “ ఆడు గో..నాకాపిత్నాడు సూడు…ఆ ఎదవ..తినేసేడు..”
అంది కూడా వచ్చిన తల్లికి దూరంగా ఉన్న శీనుని సూపిత్తా..
ఆడికిదెల్సు గిలకేడిత్తే ఆల్లమ్మ వొత్తాదని..అంతుకే..
ఈల్లిద్దర్నీ సూసి ఏరు సెనగపప్పుండ సివర ముక్కని కూడా నోరు పట్తాపోయినా నోట్లో బలవంతాన కూరేసుకుని సేతులు లాగుకి తుడిసేత్తా.. ఈల్లిద్దర్కీ ఎదురొచ్చేడు అతికట్తం మీద నోట్లో ముక్కని అటూ ఇటూ కదులుత్తా…
అప్పటికే అది సూసేసిన గిలక, ఆకరాశ కూడా అయిపోయే తలికి “ ఐపోయింది..అంతా తినెసేడేమ్మా ఎదవ. ఎఅదవని..” గొల్లున శొకాలెట్టేసింది ఊరంతా ఇనిపించేటట్టు. ఆల్లమ్మ నెత్తిమీద మొట్టినప్పుడు కూడా అంతంత శోకాలెట్తలేదు గిలక.
దాంతో..
విసుగొచ్చేసిన సరోజ్ని ఆమట్ని గిలకని జుట్తట్టుకుని లోపలికి ఈడ్సికెల్తా వీపు మీద చళ్ళున రెండంటిచ్చింది.. “ఏటో సెప్పకుండా మల్లీ ఏడిత్తే నాకేవర్ధమవ్వుద్ది..నోరు మూత్తావా ..ఇంకో రెండెయ్యనా?”
“ఊరుకోవే ..సరోజ్నీ..పిల్లలంటే ఏదోటుంటది. ఎదుగుతున్న పిల్ల..ఇంకో నాల్గయిదేళ్లుంటే ఈడెరిద్ది. దాన్నట్టుకుని ఈడ్సీడ్సి కొడతన్నావ్. తర్వాత బెంగెట్టుకుంటావ్ సెప్తున్నా..గేపకవుంచుకో..”
“ ఏంజయ్యనే పిన్నీ..పెతీదాంట్లోనూ పోటీయే..ఇద్దరూ జతకత్తుల్తో కల్సి ఆడుకుంటానే ఉంటారు. లోపలేదో నా పనుల్లో నేను పుణుక్కుంటా ఉంటానా..ఎప్పుడెవరేడుత్తా వత్తారో తెలవదు.. గుండెపేపిచ్చూపోతన్నాయనుకో..ఏగలేక సత్తన్నా..” అంతా మల్లీ సెయ్యెత్తాబోతలికి
టప్పున నోర్మూసేసి గబుక్కున సిన్నమ్మమ్మ ఒల్లో ఒదిగిపోయింది గిలక.
“ ఏడవకు.కళ్ళు తుడ్సుకో. కాటుకంతా సెరిగిపోయింది. ఏడ్వకు..” అని ఓపక్క పిన్నమ్మ ఓదారుత్తుంటే..సరోజ్ని..
“ ఇప్పుడు సెప్తావా ఎందుకేడ్సేవో? ఏంటాడుతినేది..” అంటూనే దూరంగా గడపవతల నిలబడ్ద శీను కేసి సూత్తా “ ఇలా రారా..ఏటి తింట్నా..?” అనడిగింది..ఆరాగా..
“ మేవిద్దరం ఆడుకుంట్నాం. కుక్కొచ్చింది. ఎనకాలే …”
నీళ్ళు నిండిన కళ్లతో శీనునే సూత్తా ఆడు సెప్పేది ఇంటందేమో….అంతకు ముందు జరిగిందంతా కళ్ల ముందు మెదిలింది గిలకకి.
—- —— —
” నాక్కూతంతెట్టరా..ఎదవా. పెట్టమనిందాకట్నించడుగుతుంటే..పెట్టవేరా సచ్చినోడా…..?”
బెల్లంపాకవట్టిన ఏరుశెనగపప్పుండ నోరూరించేత్తంటే దానెనక్కి సూత్తా లొట్టలేత్తానే ఎన్నిసార్లడిగినా పెట్టకపోయే తలికి వాడీపు మీద పిడిగుద్దులు గుద్దుతా అంది గిలక.
అప్పటికే ఉడుకుమోత్తనంతో ముఖవంతా మంకెన్నపూరంగైపోయిందేమో ఏడుపొక్కటే తరువాయి గిలక గొంతులో..
“నేన్బెట్ను…” అన్నట్టుగా అటుదిరిగేడు శీను తింటానే..
” పోనీ సెప్పరా..అదెవరిచ్చే ర్నీకు..అదైనా సెప్పు..”
ఆశగా ఆడి మొకమెనక్కే సూత్తా బెతిమాలింది తమ్ముణ్ణి గిలక.
ధవలేసరం బేరేజి రేకుల్దాటి ఏప్పుడెప్పుడురుకుదామాన్నట్టున్నాయ్ నీళ్ళతో నిండిన గిలక కళ్ళు.
సెప్పనన్నట్టు అడ్డంగా బుర్రూపాడాడు.
అంతకంతకీ అయిపోతన్న శీనుగాడి సేతిలోని ఏరుసెనగపప్పుండని సూత్తా..గొంతెత్తి బేరమంది గిలక..

—- —- —-

“ఏరుసెనగపప్పుండ..” ఎటో సూత్తా ఆన్నాడాడు.
“ఓసోస్..ఏరుసెనగ పప్పుండకే ఇంతేడుపు..? ఎధవ పప్పుండలని , ఎదవ ఉండలు.
ఎంత సేపడద్ది..గట్టిగాజేత్తే అర్ధగంటట్టదు. రెండు తవ్వల గింజలేపి, పాకవడతానుండు. ఏడ్వకు..మల్లీ మీయమ్మ సూత్తే కొట్టుద్ది .ఆపు..” మనవరాలి కళ్ళు తుడ్సింది సీతమ్మ.
ఇంతలో సరోజ్నంది కొడుకెనక్కే సూత్తా..
“ ఎవరెట్టారు? ఎవరేవెట్టినా తినొద్దన్నానా..? సెప్తే సెవికెక్కదా?”
“పెద్దమ్మెట్టింది…”
“పెద్దమ్మింటికెందుకెల్లేవు?”
తవ్వతో నెత్తి మీద ఒక్కటిచ్చినా అంత బాధుండకపోను సరోజ్నికి. పెద్దమ్మింటికనేతలికి అంత బాధేసిందామెకి.
“నేనెల్లలా..”
“ నువ్వెల్లాపోతే ….నీకాడికొచ్చి పెట్టిందా?..”
“ కాదమ్మా…! మనీది సివర్న..నల్లకుక్క పిల్లల్నెట్టిందిగదా..! అక్కా, నేనూ ఆడుకుంటుంటే పిల్లల్నేసుకుని మా దెగ్గిర్నించి ఎల్లింది. ఒక కుక్కపిల్ల అల్లమ్మ ఎనగ్గా మెల్లగా నడుత్తా..ఉంటే మగ కుక్కలొచ్చి దాన్ని కరుత్తాయేమోనని కూడా ఎల్లేను. అక్కనీ రమ్మన్నాను..” కుక్క కరుత్తాది. నేన్రాను బాబూ “ అంది. ఈ లోపు పెద్ద కుక్క దూరంగా పోతే, నడవలేపోతందని సిన్న కుక్కపిల్లని ఎత్తుకుని పెద్ద కుక్కెనకాల పరిగెత్తేను. నేను దాని పిల్లని దొబ్బేత్తాననుకున్నట్తుందమ్మా పెద్ద కుక్క. అది సూసి అరిసి గభాల్న నా మీదికురకబోతే సరిగ్గా అప్పుడే పెద్దమ్మొచ్చి కుక్కని తరిమి నన్నెక్కడ కరుత్తాదోనని లోపల్కి తీస్కెల్లి ఏరుశెనగ పప్పుండ ఇచ్చింది తినమని. “
“ సేతులు కడుక్కున్నావా? నీకెన్ని సార్లు సెప్పేన్రా..సేతులు కడుక్కోకుండా ఏదీ తినకండర్రా..అని..మాటిన్చావరు. రోగాలొత్తే ఆస్పిటళ్ల సుట్టూ తిరగాలి..లాగుకు తుడిసెయ్యటాలొకటి. ” అంటానే..ఒక్క సెకనాగి..
“ ఏవన్నా ..అడిగిందా..?” మెల్లగా అంది..
“ ఆ..”
“ ఏవడిగింది..సెప్పిసావు..”
“ మీ సిన్నమ్ముమ్మ..ఎంతుకొచ్చిందిరానడిగింది..”
“ అనుకున్నాను..అడిగేసిందా..? నిన్ను లోపలికి రమ్మన్దనగానే నాకర్ధమైపోయింది. “ అంటానే ..పిల్లాణ్ణొదిలేసి..పిన్నమ్మెనక్కి తిరిగి ..
“ సూసేవా..పిన్నీ..! నువ్వొత్తం సూసింది . గుమ్మాలోనే ఉంది నువ్వేచ్చేతలికి. నువ్వీవూళ్ళోనే ఉండి నాకు సేదోడు వాదోడుగా ఉంటన్నావని.ఎంతేడుత్తున్నారో..ఆళ్ల కళ్లల్లో నిప్పులొయ్యా..”
సీతమ్మేవీ మాట్తాళ్ళేదు కాసేపు….
ఇక ఎంతకీ ఆపకుండా ఏటేటో అంటా ఎక్కడెక్కడికో ఎల్లిపోతున్న అప్ప కూతుర్ని సూత్తా..
“ ఏడిత్తే ఏడవనీ..! ఎవరెంతేడిత్తే ..మనకంత మేల్లే..గానీ..నూపప్పు ఎండబెట్టుందా..పంపనా?”
“ ఉన్నయ్లేగానీ …మాతోటికోడల్కెందుకు సెప్పు నువ్వెంతుకొచ్చేవో..”
“ సరందం. ఎవరి కాపరాలాళ్లు సేసుకోక ఎందుకొచ్చిన గొడవలు. అయినా పిల్లాణ్ణి ఆరా లాగుద్దా ఆడి సేతిలో పప్పుండెట్టి..“
“ అదేగదా పిన్నీ నా బాధ. కాదు పిన్నీ..తెల్లారిలేత్తే ఆల్లింటికెంతో మంది వత్తారు, ఎల్తారు. నేనెప్పుడైనా , ఎవర్నైనా అడిగానా..? ఎంతుకోకంతుకొత్తారు. ”
“ సర్లే..వదిలెయ..ఆల్లిద్దర్కీ తానాలు జేయించు. ఆడి మూతంతా జిగురే..
” అంటా సుట్టూ సూసి ..
“ఏదీ పిల్లేది…? ”
— —- —-
శీనుగాడి నోటెంట ఎప్పుడైతే ఏరుశెనగ పప్పుండ పెద్దమ్మిచ్చిందని ఇందో ..గిలక , తల్లి సిన్నమ్మమ్మతో మాటల్లో పడ్దంతో పెద్దమ్మింటికి పరుగందుకుంది.
తీరా అంత పరిగెడతానూ ఎల్లి గుమ్మం కాడికెల్లాకా ఏవనడగాలో తెలవక గుమ్మవట్టుకుని ఏల్లాడతన్న గిలకని సూసి ..
“ దా..దా వచ్చావా? ఆడికిచ్చి నీకివ్వాపోతే ఊరు బజారైపోదా..దా..ఇదిగో..తీసుకో..నువ్వొత్తావనే దీన్ని తీసి పక్కనెట్టేను..అట్టుకెల్లు…!’ స్ధంభం పక్కమ్మట గిన్నెలో ఉంచిన ఉండని తీత్తా గిలక పెద్దమ్మంది.
“ మా తమ్ముడ్నాకెట్లేదు పెద్దమ్మా..ఎంతడిగినా . ఏడ్సేను కూడాను. అయినా ఎట్టలేదు.. అంతుకే …” అంటా అక్కడితో ఆపి..”….అమ్మ కొట్టింది కూడాను…”
“ అయినా నీకాడితో..పోటీయేటే..ఆడు తిన్నయ్యన్నీ నువ్వూ తినాలా?”
గిలక సేతికి ఏరుశెనకపప్పుండ ఇత్తా అంది పెద్దమ్మ.
ఆ మాటల్లో ఆ ఎటకారం ఎంతుకో గిలక్కి అర్ధం కాలేదు.
ఇద్దరున్నప్పుడు ఇద్దరం సమమే కదా..ఆడొక్కడికే సేత్తారెంతుకో అన్నీ..
… పెద్దమ్మా..అంతేనా?
గిలక బుల్లి మనసులో ఎన్ని సందేహాలో..
—-

కౌండిన్య హాస్యకథలు 1 – ఇదేం సరదా

రచన: రమేశ్ కలవల (కౌండిన్య)

ఉద్యోగం రీత్యా గోపాలం ఆ ఊరికి ఈ మధ్యనే ఓ నెల క్రితం వచ్చాడు. పట్నంలో పనిచేసి వచ్చిన బ్యాంకు ఉద్యోగికి ఈ మోస్తరు పల్లెటూర్లో అంతా కొత్తగా అనిపిస్తున్నాయి.
గోపాలానికి, అతని భార్య కామాక్షికి ఆఫీసువారు ఇచ్చిన పెద్ద పెంకుటింట్లో అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది.
ఆ ఇంట్లో పెరట్లోకి నడవగానే ఎదురుగుండా తులసికోట, ఒక ప్రక్క బావి, దాని ఆనుకోని ఎత్తైన కొబ్బరిచెట్లు కనపడటమే కాకుండా మరో పక్క వరుసగా రకరకాలైన మొక్కలతో ఆ పెరడంతా నిండుగా కనిపిస్తుంది.
అంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఉండటం మూలానా, పైగా పట్టణానికి విరుద్దంగా ఆ పల్లెటూరు నిశ్శబ్ద వాతావరణానికి అలవాటు పడటానికి ఇద్దరికీ కొంత సమయం పట్టింది. చీమ చిటుక్కుమన్న శబ్థం కూడా వినిపిస్తుంది ఆ ఇంట్లో.
పట్నంలో చేసుకోవడానికి కుదరక పోతే ఏ హాటలుకో వెళ్ళి తినే అలవాటు ఇద్దరికి. ఇక్కడ ఇంటికే వచ్చి వంటచేస్తారని తెలిసి సంతోషంతో ఒకావిడను కుదుర్చుకున్నారు.
కొత్తగా ఓ వారం క్రితం నుండి ఆ వంటమనిషి వచ్చి చక్కగా వంటచేసి పెట్టి వెడుతోంది. కానీ ఆవిడ వచ్చిన నుండి వంటింట్లో సామన్లు కనపడకపోవడమే కాకుండా పెరట్లో ఉన్న బావిలో ఏదోకటి పడిన శబ్ధం రావడంతో గోపాలంకు చెబుదామనుకుంది కానీ కామాక్షికి కుదరడం లేదు.
సాయంత్రం ఆఫీసు అవ్వగానే ఇంటికి వచ్చాడు గోపాలం. ఇలా కుర్చీలో కూర్చున్నాడో లేదో ధడేల్ మన్న శబ్థానికి కామాక్షి ఉలిక్కిపడి కిటికీలోంచి ఒక్కసారి పెరట్లోకి చూసింది. గోపాలం మాత్రం ఇంకా ఆఫీసు ఆలోచనలతో ఆ శబ్ధాన్ని పెద్దగా పట్టించుకొలేదు.
ఇంతలో కామాక్షి కంగారు పడుతూ “ఏవండి బావిలో ఏదో పడినట్లుందండీ. రెండు మూడు రోజుల నుండి ఏవోకటి పడుతున్న శబ్థాలు మీకు చెబుదామని అనుకుంటున్నాను కానీ కుదరలేదు” అంది
“ఏ కొబ్బరి బోండమో పడి ఉంటుంది” అన్నాడు తీరిగ్గా. కాఫీ సంగతి చూడమన్నట్లు సైగలు చేసాడు.
కామాక్షికి కంగారు తగ్గలేదు ఎందుకంటే ఆయన ఇలా లోపలకు రావడం, ఆ వంటావిడ సాయంత్రం వంటపని ముగించుకొని అలా పెరటిగుండా బయలుదేరడం ఒకే సారి జరిగింది. కాకపోతే ఆవిడ ఇంటి బయటకు వెళ్ళడం గమనించలేదు అందువల్ల కంగారుతో మళ్ళీ గోపాలంతో “కొబ్బరి బోండం పడే శబ్ధం కంటే ఇంకా పెద్ద శబ్ధమే వచ్చిందండి” అంది.
ఆయన ఏమీ పట్టించుకోకపోవడంతో ఆయన దగ్గరకు వెళ్ళి మరీ “అది కాదండి. వంటావిడ ఇందాకా పెరట్లో బావి దగ్గరగా వెళ్ళడం చూసాను. తిరిగి వచ్చినట్లు లేదు…కొంపదీసి..కాలు జారి..” అంటూ సాగతీసేలోగా గోపాలానికి ఒంట్లో కంగారు పుట్టి ఆ పెరట్లోకి బయలుదేరాడు.
ఆ బావిలోకి తొంగి చూసాడు. ఇందాక పడిన దానికి నీళ్ళు కెరటాల అలికిడి కనిపిస్తూనే ఉంది. గోపాలం తలెత్తి ఆ కొబ్బరి చెట్టు వైపుకు చూస్తుండగా కామాక్షి ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ పక్కనే నిలబడి ఆ బావి లోపలకు చూస్తూ “బుడగలు కూడా వస్తున్నాయండి!” అంది. ఆ మాటలకు ఉలిక్కి పడ్డాడు.
“బుడగలు లేవు .. బూడిద గుమ్మడి కాయలు లేవు… నువ్వు అనవసరంగా నన్ను కంగారు పెట్టకు” అన్నాడు కామాక్షి సంగతి తెలిసిన మనిషి కాబట్టి.
కామాక్షి ప్రక్కనే ఉంటే తనకు ఊపిరాడనివ్వదని “ఓ పని చేయి! నన్ను ఆలోచించనీ.. నువ్వు ఈ లోగా ఒక కాఫీ అన్నా పట్రా లేకపోతే ఓ వంద ప్రదక్షిణాలు చేస్తూ ఆవిడకు ఏం జరగకూడదని దణ్ణం పెట్టుకో చాలు” అన్నాడు.
కామాక్షి తులసికోట దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణాలు మొదలుపెట్టి మధ్య మధ్యలో గోపాలంను గమనిస్తూ ఉంది.
గోపాలం కొంత సేపు ఆలోచించాడు. తను ఆ బావిలోకి దిగే పరిస్ధితి కాదు. పోనీ ఆ వంటావిడ పేరు, ఉండే చోటు కనుక్కొని, ఆవిడ్ని వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తే కానీ తన మనసు కుదుటపడదని నిశ్చయించుకొని ఆవిడ వివరాలు కామాక్షిని కనుక్కొని “నేను ఆవిడ ఇంటికి వెళ్ళి వస్తాను. నువ్వు ఈ లోగా ఆ బావి జోలికి వెళ్ళకు. కావాలంటే ఇంకో నూరు ప్రదక్షిణాలు చేసుకో” అంటూ బయలుదేరాడు.
గోపాలం వీధిలో అందరినీ అడుగుతూ, రొప్పుతూ ఆ వంటావిడ ఇల్లు చేరుకున్నాడు. ఆయాసంతో వచ్చీ రాని మాటలతో ఆ ఇంట్లో ఉన్న అతనికి జరిగిన సంగతి చెప్పాడు.
అతను తనే ఆ వంటావిడ భర్తనని పరిచయం చేసుకొని, ఆవిడ ఇంటికి ఇంకా సాయంత్రం పని పూర్తి చేసుకొని రాలేదని వెంటనే గోపాలంతో బయలుదేరాడు.
ఇద్దరూ ఇంటికి చేరుకోగానే కామాక్షి తులసికోట చుట్టూరూ నూరు ప్రదక్షిణాలు ముగించి, ఆ బావి చుట్టూరూ కూడా ప్రదక్షిణాలు చేయడం చూసి కామాక్షితో “నువ్వు ముందు వెళ్ళి ఓ రెండు కాఫీ పట్రా” అంటూ ఆవిడ్ని లోపలకు పంపించాడు.
ఆ వంటావిడ భర్త, గోపాలం మాట్లాడుకున్న తరువాత ఆ వంటావిడ భర్త బావిలోకి దిగటానికి సిద్దమై తాడు నడుముకు బిగించాడు. తను దిగుతూ గోపాలాన్ని బావిలోకి చిన్న చిన్నగా తాడును వదలమన్నాడు.
ఇంతలో కామాక్షి కాఫీలతో బయటకు వచ్చింది. గోపాలంని కంగారుగా వెనకనుండి పిలిచి, సైగలతో అటు చూడమనడంతో అటు వైపుకు చూసాడు.
ఆ పక్కన ఆవరణ నుండి వంటావిడ బావి వైపుకు రావడం గమనించాడు. అది చూసిన గోపాలం ఆ కంగారులో తన చేతిలో ఉన్న తాడును కాస్తా వదిలేసాడు. పెద్ద శబ్థం చేస్తూ ఆ దిగిన ఆయన బావి లోపల పడ్డాడు. త్వరగా తేరుకున్న గోపాలం ఎలాగోలా చివరకు ఆ తాడు కొస మొత్తం బావిలో పడిపోకుండా పట్టుకోగలిగాడు. ఆ పడిన శబ్థానికి ముగ్గురూ కలిసి కంగారుగా లోపలకు తొంగి చూసారు.
ఈసారి నిజంగానే బుడగలు రావడం మొదలయ్యే సరికే గోపాలం దీనంగా ఆ వంటావిడ వైపుకు, కామాక్షి వైపుకు అయోమయంగా చూసాడు. ముగ్గురూ కళ్ళార్పకుండా ఆ బావిలోకి చూస్తున్నారు.
“పాపం ఎవరో ?” అంది ఆ వంటావిడ.
“మీకు దగ్గరైనవారే” అన్నాడు గోపాలం ఏం చెప్పాలో తెలియక.
ఆ దిగిన ఆయన బావిలో గాలించి, బయటకు వచ్చి గాలి పీల్చుకొని, లాగమన్నట్లుగా సైగలు చేయగానే గోపాలం ఆయన్ని బయటకు లాగాడు.
తీరా ఆయనను చూసి ఆ వంటావిడ “ఓ మీరా?” అంది. అదొక ఓ సర్వ సాధారణ విషయంలాగా.
గోపాలంకు ధ్యాస ఆయన చేతిలో ఉన్న దాని మీద పడింది. ఆయన చేతిలోంచి దాన్ని అందించడంతో ఎక్కడ లేని సంతోషంతో ఆ వంటావిడను పట్టుకొని “కామాక్షి …లంకెబిందె దొరికింది. ఎంత అదృష్టమో” అన్నాడు.
పక్కనే ఉన్న కామాక్షి గోపాలం వీపు తట్టింది. తేరుకొని ఒక్క సారిగా ఆవిడ్ని వదిలి కామాక్షి వైపుకు తిరిగాడు “ఏదో సంతోషంలో నువ్వనుకోని…” అనబోతుంటే
కామాక్షి చిరుకోపం ప్రదర్శిస్తూ “అదీ మన సొట్టల బిందె. లంకెబిందా నా మొహమా?” అంటూ
“అయినా అది బావిలో ఎలా పడిందో అర్థం కాలేదు.” అంది
ఆ వంటావిడ భర్త తన చొక్కా నీళ్ళు పిండుతూ “అది మా ఆవిడ పనే అయ్యింటుంది. బావి కనపడితే చాలు ఏదోకటి లోపల పడేసి నవ్వుకోవడం ఆవిడకు ఓ సరదా” అని నోరు జారాడు.
“అదేం సరదా? అందుకేనేమో ఓ వారం నుండి కొన్ని సామాన్లు కనపడటం లేదు“ అంది కామాక్షి.
ఆ మాటకు వంటావిడ కామాక్షి చేతిలో రెండు కాఫీలను తీసుకొని నీళ్ళలాగా త్రాగేసింది. మళ్ళీ అవి కూడా బావిలోకి విసురుతుందేమోనని వెంటనే ఆవిడ చేతిలోంచి అవి లాక్కుంది కామాక్షి.
ఇంటికొచ్చిన తరువాత ఇదే గోల సరిపోవడంతో కోపం వచ్చి గోపాలం అమాంతం అతన్ని ఎత్తి మళ్ళీ బావిలోకి దింపాడు. “ఆవిడ పడేసినవన్నీ తీసుకొస్తేనే మిమ్మల్ని పైకి రానిచ్చేది” అన్నాడు.
ఆయన తప్పేది లేక మళ్ళీ బావిలో దిగి అంతా గాలించిడం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడాలో తోచక ఆ వంటావిడతో “పైనుంచి అప్పుడపుడు కొబ్బరి బోండాలు పడుతుంటాయి. అవి లోపల ఆయన మీద పడకుండా చూసుకునే భాధ్యత మీదే” అన్నాడు. ఆవిడ పైకి చూస్తూ రెండు చేతులు ఎత్తి అప్రమత్తం అయ్యింది అవి గనుక పడితే పట్టుకునేలా”
సమయం తీసుకున్నా మొత్తానికి దొరికిన సామాన్లతో పైకి వచ్చాడు. ఓ బక్కెట్టు గోపాలానికి అందిస్తూ “ఇదిగోండి మీ లంకె బక్కెట్టు.. దాని లోపల లంకె పళ్ళెం, లంకె గ్లాసు వగైరా వగైరా ..”. “అన్నీ ఉన్నాయో లేదో ఓ సారి చూసుకోండి” అని అందించి, వాళ్ళవిడ వైపు తిరిగి దీనంగా “పడేస్తే పడేసావు కానీ ఇకముందు నుంచి చిన్న చిన్న సామన్లు పడేయకు. వెతకడం ఎంత కష్టంగా ఉందో నీకేం తెలుసు… నిమ్మకాయ పులుసు” అన్నాడు.

ఆ వంటావిడ ఆవిడ “మీకే నేనంటే అలుసు…నాకు వంటలన్నీతెలుసు .” అంది బుంగమూతి పెట్టి. ఆవిడకు ఎవరైనా వంటలు గురించి ఏదైనా అంటే పరమ చిరాకు.
వారిద్దరి సంభాషణ గమనించిన గోపాలం ఆయనతో “అంతా బానే ఉంది కానీ… ఇలా ఆవిడ బావిలో సామన్లు పడేయటం, మీరు వాటిని బయటకు తీయడం కొత్త కాదేమో?” అన్నాడు. ఆయన ఇబ్బందిగా నవ్వాడు.
మొత్తానికి వాళ్ళని సాగనంపి లోపలకు వచ్చారు. ఆ సాయంకాలం జరిగిన దానికి అలసిపోయి ఆవిడ చేసినవి ఏమి సరిగా తినకుండానే రాత్రి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు గోపాలం.
తరువాత రోజు ఉదయం లేచాడు. కామాక్షి కోసం వెతుకుతూ అటూ పెరట్లోకి చూసాడు. ఆవిడ తులసికోట దగ్గర ప్రదక్షిణాల హడావుడిలో ఉండటం చూసి మళ్ళీ మంచంలో వాలాడు.
కొంత సేపట్లో ధడేల్ మని శబ్థం వినిపించింది. ఈ సారి నిజంగానే కొబ్బరి బోండం పడింది.
ఇంకా నిన్న జరిగిందానికి తేరుకోనేలేదు.గోపాలం పెరట్లోకి బయలుదేరి చుట్టూరూ వెతికాడు. కామాక్షి ఎక్కడా కనపడకపోయే సరికే ఆ బావి దగ్గరకు వెళ్ళి తొంగి చూసాడు. ఇంకేమీ ఆలోచించకుండా ఉన్న పళంగా నిన్న బావిలోకి దిగిన ఆయన కోసం బయటకు పరిగెత్తాడు.
ఆ వంటావిడ ఇంటికి చేరుకొని ఆయనతో “మీరు త్వరగా మళ్ళీ మా ఇంటికి రావాలి” అన్నాడు గోపాలం.
“మళ్ళీ ఏమయ్యింది మా ఆవిడకు?” అని అడిగాడు
“మీ ఆవిడను కాదు. ఈసారి మా ఆవిడ” అన్నాడు ఆయనతో.
ఇద్దరూ కంగారుగా ఇంటికి బయలుదేరుతుంటే దారిలో గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ తెలిసిన వారిలా అనిపించడంతో అక్కడ వాళ్ళిద్దరూ ఆగారు. తీరా చూస్తే కామాక్షి అక్కడ ఉండటంతో గోపాలం ఊపిరి పీల్చుకున్నాడు.
కామాక్షి వాళ్ళ ఇద్దరి కంగారు చూసి, వివరాలు కనుక్కొని “నిన్న అంతా సవ్యంగా జరిగితే గుడిలో ప్రదక్షిణాలు చేస్తానని మ్రొక్కకున్నానండి” అంటూ
“మీరు నిద్ర లేచేలోగా తిరిగి వద్దామనికొని గుడికి వచ్చాను” అంది.
“మరి మా ఆవిడో అన్నాడు” ఆ వంటావిడ భర్త.
పదండి చూద్దాం అంటూ ముగ్గురూ ఇంటికి బయలు దేరారు. ఇంటికి చేరుకుండగానే ఆ వంటావిడ కూడా ఎదురవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ వంటావిడ కామాక్షితో “వంట పూర్తయ్యింది. నేను వెళ్ళొస్తాను” అంది భర్తతో బయలుదేరబోయింది.
“మీరు ఎలాగూ ఉన్నారు ఓ కాఫీ ఇచ్చి వెళ్దురూ?” అన్నాడు గోపాలం.
ఆవిడ కదలలేదు. “పోనీ నువ్వైనా త్వరగా చేసి తీసుకురా కామాక్షి …ముందు కాఫీ త్రాగితే కాని తల నొప్పి తగ్గదు” అంటూ సైగలు చేసాడు.

కామాక్షి వంటగది లోపలకు వెళ్ళింది. అంతా వెతికి “ఏవండి ఫిల్టరు కనపడటం లేదండి” అంది.
ఆ వంటావిడ భర్తతో చిన్నగా జారుకోబోతుండటం గమనించిన గోపాలానికి పరిస్థితి అర్థం అయ్యి వాళ్ళతో “ఆగండి” అన్నాడు.
ఆవిడ వడివడిగా బయటకు నడిచింది. ఆయనను మాత్రం పట్టుకోగలిగాడు గోపాలం.
“ఆవిడను ఆపకండి. మళ్ళీ ఏదోకటి పడేస్తుంది. నేనున్నాను గా తీయటానికి” అన్నాడు ఆ వంటావిడ భర్త.
ఆయనకు అలవాటైన పనే కదా హుందాగా అటు పెరట్లోకి నడిచాడు.
నిన్నటి నుండి చుక్క కాఫీ పడలేదు అంటూ విసుక్కుంటూ తప్పక ఆయన వెనక నడిచాడు గోపాలం.
ఆయన అదృష్టం బాగుంటే కాఫీ తాగే భాగ్యం కలగడం ఖాయం ఇక కామాక్షికి వంట చేయడం తప్పదేమో? ఏది ఏదైనా అలా బావిలో పడేయటం ఏం సరదా? కొంత మందికి అదో సరదా!

అమ్ము- ఆల్ఫా-ఇన్ఫినిటీ

రచన: శ్రీదేవి

నా పేరు అలివేలు. ముద్దుగా అందరూ అమ్ము అని పిలుస్తారు. నేను చాలా తెలివయిన అమ్మాయిని అని మా పిచ్చి నాన్న నమ్మకం. ఆ అమాయకుడిని చూసి మా అమ్మ తల కొట్టుకోవటం రోజు పరిపాటే మా ఇంట్లో. ఇంతకీ అసలు నేను తెలివిగలదాన్నా ?కాదా? అన్న మీమాంసలోనే నాకు 16 యేళ్ళు వచ్చేశాయి. అన్నయ్య బోoడామ్ అని 24 గంటలు ఎక్కిరిస్తుంటే ఉక్రోషంతో మేడ మీద ఏరోబిక్స్ మొదలెట్టాను. మొదలెట్టిన పది నిమిషాలకే పక్కింటి రమణారావ్ అంకల్ వచ్చి “ఆడ పిల్లలకి కా. . స్థ ఒళ్లుంటేనే బాగుంటుంది” అన్నాడు, చూడకూడని ప్రదేశాల్లో చూస్తూ. . అంతే కాదండోయ్, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఇచ్చాడు. నేను చిరుసిగ్గుతో తీసుకొని కాలి బొటన వేలితో ఒక ముగ్గు వేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. దానికి ఉబ్బి తబ్బిబ్బు అయ్యి “సాయం కాలం ఇదే చోటున లాల్చీ లుంగీ కట్టుకొస్తాను, అమ్మకి అంకల్ లెక్కలు ట్యూషన్ చెప్తాడు అని చెప్పు” అన్నాడు నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందని తెలియక.
ఇప్పుడు అంకల్ ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో ఉన్నారు, వాళ్ళావిడ వీడియో చూసిన తర్వాత ఇచ్చిన ప్రోత్సాహముతో.
ఇంక నా గురించి పరిచయం చాలనుకుంటాను. సరిపోలేదా?
నేను ఛామనచాయ కి కొద్దిగా తక్కువగా, కాస్త బొద్దుగా, ముద్దుగా ఉంటాను. ఏదో అడపా దడపా అయిదు ఆరుగురు అబ్బాయిలు నా వెంట పడ్డా నా కంటికి వాళ్ళు ఆన లేదు. ఎవరైనా సంస్కారవంతుడయిన అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొందామని నా జీవిత ఆకాంక్ష తప్ప, పెద్దగా నాకేం చదువు వంట పట్టటం లేదు. ఇది చూసిన మా అమ్మ రేపల్లే లో ఉన్న మా బావకి ఇచ్చి నాకు పెళ్లి చేసేశారు, 18 వ ఏడు అనే గడిలో పడగానే. నా కధ పాఠశాల నించి నేరుగా పాకశాలలో పారేశావా ఏంట్రా దేవుడా అని తిట్టిపోసాను. . . పాపం దేవుడు బాగా ఫీల్ అయ్యాడు. ఆ రోజు సాయంకాలం వస్తూనే బావ రెస్టారెంట్ కి తీసుకెళ్ళి “చూడు అమ్ము, నువ్వు చాలా తెలివిగల దానివి. అలాంటి నిన్ను వంటకి, ఇంటి పనికి పరిమితం చేయటం నాకు నచ్చలేదు. కాలేజీ లో చేర్పిస్తాను, బాగా చదువుకో” అన్నాడు.
మా బావ చాలా మంచోడు. . కాదు కాదు దేవుడు. నా కన్నా 15 యేళ్ళు పెద్దవాడే అయినా కూడా భర్త అనే దర్పం మచ్చుకైనా లేదు. అమ్మ కంటే లాలన గా మాట్లాడ్తాడు, నాన్నకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. నేను ఏది అడిగినా క్షణాల్లో అమరుస్తాడు. ఆ నిజాయితీ వల్ల నాకు చదువు మీద ఆసక్తి పెరిగింది, ఇపుడు క్లాస్స్ లో నేనే ఫస్ట్ ర్యాంకు అంటే నమ్మండి.
తర్వాత బావ బండి నేర్చుకో అన్నాడు. ఎప్పుడు ఆడ పిల్లలతోనే కాదు, అప్పుడప్పుడు మగ వాళ్ళతో కూడా మాట్లాడాలి, అది నీ కెరీర్ లో చొచ్చుకు పోవటానికి ఉపయోగ పడుతుంది అని తన సహృదయాన్ని చాటుకున్నాడు. మొదటిసారిగా అమ్మకి ధన్య వాదాలు తెలుపుకున్నాను మనస్సులోనే.
*********************
ఒక రోజు రాత్రి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రొజెక్ట్ కోసం బయట ఊరికి వెళ్ళి తిరిగి వచ్చే సరికి 11 గంటలు అయింది. ఇంటికి వచ్చే సరికి ఆశ్చర్యంగా ఇల్లంతా ఫూలు బెలూన్స్ తో అలంకరించి ఉంది. అమ్మ నాన్న కూడా ఉన్నారు. మర్చేపోయాను, ఇవాళ నా పుట్టిన రోజు కదా, బావ ఇంత శ్రద్ధ చూపాడో, అమ్మని సంతోషంతో అమాంతం కౌగలించు కున్నాను. నన్ను ఒక్క తోపు తోసి బలంగా చెంప పగలు కొట్టింది అమ్మ, “ పెళ్లి అయిన ఆడ పిల్ల కి ఈ అర్ధరాత్రిళ్లు తిరుగుళ్ళేంటి, పరాయి మగాళ్లు నిన్ను దిగబెట్టటం ఏంటి?” అంటూ.
నేను గట్టిగా నవ్వాను. నన్ను బావ ఎంతలా మార్చేశాడో అమ్మకి తెలీదు పాపం. . “బావ !పుట్టిన రోజు నాడు అమ్మ కొట్టింది చూడు అన్నాను. కనీసం ఆ అబ్బాయితో రాకుండా ఉండాల్సింది అమ్ము, అప్పుడు ఏదో గుడికి వెళ్ళావని చెప్పేవాడిని” అన్నాడు.
నాకు అర్థం కాలేదు “ఏంటి బావ” అని అడిగాను.
బావ అమ్మకేసి చూస్తూ “అమ్ము ని ఏమన్నా క్రమ శిక్షణలో పెట్టి ఉంటే అది చిన్నప్పుడే చేయాలి ఆంటీ, ఇపుడు కాదు” అంటూ కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళి పోయాడు.
“ఛీ. . ఛీ. . నా కడుపున చెడ పుట్టావ్ కదే, పుట్టింటి పరువు తీసేశావు” అంటూ నాన్న అమ్మని లాక్కొని వెళ్ళిపోయారు.
నాకు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. . .

***************
తెల్లగా తెల్లవారింది. బావ కాఫీ కప్ తో నా వద్దకు వచ్చి “ పిచ్చి అమ్ము, బాధ పడ్డావా? నువ్వే చెప్పు, పల్లెటూరు బైతుని ఎవరన్నా భరించగల రా, ఏదో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం మీ అమ్మ ఇచ్చే కట్నం కక్కుర్తి తప్ప నిన్ను ఎవరన్నా చేసుకుంటారా? “అల్ మోటివేషన్స్ ఆర్ నాట్ ఫర్ గుడ్ అమ్ము” అంటూ విడాకుల పత్రాలు నా చేతిలో పెట్టాడు.
నేను సంతకం పెట్టాను అచేతనంగా. . . .
*************
NH 18 road:
వేగంగా వెళుతున్న వాహనాలకు సమానంగా నా మనస్సు పరుగెడుతోంది. నడుస్తున్న, నడుస్తున్న. . నడుస్తూనే ఉన్నా నేను. అక్కడున్న 84 కి. మీ అనే మైలు రాయి నన్ను చూసి వెక్కిరించింది “ గమ్యం లేని ప్రయాణం ఏక్కడికి” అంటూ. .
నమ్మక ద్రోహం. . నయ వంచన. . జ్వాల రగిలిపోతోంది, మనసులో. . నా దేవుడు నా తండ్రి ముందే నా నడవడిక బాలేదని కుటిలమయిన పన్నాగం తో నిరూపించాడు. నా మట్టి బుర్ర కి ఏం చేయాలో తెల్సే లోపే అంతా జరిగి పోయింది. నా ఆలోచనల సంఘర్షణలో నేనుండగానే, నా ముందు రయ్యిమంటూ ఒక బండి వచ్చి జారీ పడిపోయింది.
చచ్చాడేమో అనుకోని కదలికలు లేని అతన్ని దగ్గరికి వెళ్ళి శ్వాస ఆడుతోందా లేదా అని పరీక్షించాను. వాడు నన్నే విచిత్రంగా చూస్తూ అమ్మంతమ్ లేచి బండి ని అటు తిప్పి ఇటు తిప్పి చూసుకుంటూ దేవుడా! ధన్య వాదాలు:అంటున్నాడు ఆకాశంకేసి చూస్తూ. .
నాకు చిర్రెత్తుకొచ్చి “నీకు బుద్ధుందా? ఇంత దెబ్బ తగిలితే బైకును చూసుకుంటున్నావా? పద కట్టు కడతాను” అంటూ చూన్ని చింప బోయాను.
వాడు ఆగండీ అంటూ చేతులు గాల్లో ఆడించి ఒక వెదురు కంకణం తీసి “ ఆల్ఫా బీటా నీకు నాకు టాటా” అన్నాడు కళ్ళు మూసుకొని, అంతే క్షణంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ వాడి బండి మీద వుంది. నాకు మతి గాని పోయిందా అనుకుంటూ వాడిని “మంత్ర గాడివా”? అని అడిగాను అనుమానంగా.
“కానే కాదు” అంటూ వాడికి వాడే ప్రధమ చికిత్స చేసుకొంటూ, “అవును ఆడ పిల్లవి, ఒంటరిగా హై వే మీద ఏం చేస్తున్నావ్?” అని అడిగాడు.
గట్టిగా ఏడ్చేశాను. కర్చీఫ్ ఇచ్చి, “ఇప్పుడు చెప్పు” అన్నాడు.
పూస గుచ్చినట్లు చెప్పాను.
“వాడికి వేరే పెళ్ళాం ఉందా”
“తెలీదు. . తెలుసుకోవాలని కూడా లేదు, ఇంతకీ నీ పేరు ఏంటి?”
అక్కడ మొగుడు అడగ్గానే సంతకం చేసొచ్చి, తీరిగ్గా నా పేరు అడుగుతున్నావా?
“నీ పేరేంటీ?
ముందు నువ్వు చెప్పు
అలివేలు, కానీ అమ్ము అంటారు.
ఆల్ఫా. .
అదేం పేరు, విచిత్రంగా?
అమ్మ నాన్న శాస్త్ర వేత్తలు, అందుకని.
ఆకలేస్తోంది, అనుకున్నాం ఇద్దరం ఒకే సారి పొట్ట పట్టుకొని. వాడు ఇందాకటి మంత్రమే మళ్ళీ చెప్పి ఫలహారాల పళ్లెము తెచ్చాడు అకస్మాత్తుగా.
తినొచ్చా? లేదా? వీడు మంత్ర గాడిలా ఉన్నాడే? అనుకుంటుండగా. . వాడు తినొచ్చు, మంత్ర గాడిని కాదు ఖచ్చితంగా అన్నాడు. వీడికి ఫేస్ రీడింగ్ కూడా వచ్చా అనుకుంటూ మరో ఆలోచన లేకుండా తినేసాను.
“మీ ఇంట్లో దింపుతా పద” అన్నాడు తింటం అయ్యాక.
ఆ మాట అన్నావో చంపేస్తా జాగ్రత్త”, అని హూంకరించాను.
“పిచ్చి అలివేలు ! సమస్య నించి పారిపోవటం అంటే నిజంగా నడవడిక బాగోలేదని అర్థం. మీ నాన్న ఎప్పటికీ నిన్ను ఇలానే భావించ కూడదు అనుకుంటే, ముందు ఇంటికి వెళ్ళు, ఆ విడాకుల కాగితాలు వెతికి చించేయి”
ఆ తర్వాత నన్ను మా ఇంట్లో పాత మంత్రం ద్వారా దింపేశాడు. నాకు ఏడుపొస్తుంటే నా కళ్ళు తుడుస్తూ నా చేతిలో ఒక వెదురు కంకణం పెట్టి, “నీకు ఎప్పుడు అవసరం వచ్చినా, నా పేరు చెప్పి ఈ కంకణం తో నీకు ఏం కావాలో చెప్పు” అని మాయమయి పోయాడు.
ఈ లోపు మా బావ ఎవరో అమ్మాయి తో లోపలికి వచ్చి నన్ను చూసి “నీకు ఇంకా సిగ్గు రాలేదా? ఎందుకు వచ్చావ్ మళ్ళీ? అన్నాడు.
పొట్టి గౌను వేసుకున్న, తెల్లటి పొడుగాటి కాళ్ళ అమ్మాయి నన్నే చూస్తూ “పూర్ గల్, వదిలేయ్” అంటోంది.
నన్ను ఆల్ఫా దగ్గరికి తీసుకెళ్ళు అన్నాను, వెదురు కంకణంతో, అవమాన భారం తట్టుకోలేక. .
ఎన్‌హెచ్18 రోడ్ మీద ఉన్న వాడి దగ్గర అమాంతం కూలేసింది నన్ను వెదురు కంకణం.
“మళ్ళీ ఏంటీ”
“చాలా స్కెచ్ వేసి ఇరికించాడు నన్ను వాడు, వాడి మొహం చూడాలంటేనే అసహ్యంగా వుంది”.
“కావొచ్చు కానీ వాడు నీ నడవడిక మీద మచ్చ వేశాక అలా వదిలేస్తావా?
“కంకణం ఇచ్చి ఎంత సేపు అయింది, యూస్ యువర్ బ్రైన్ లేడి”
నేను కృత నిశ్చయంతో కంకణం దగ్గరకి తీసుకొని “ఇంటికెళ్లాలి. కాదు కాదు బావ ఆఫీసుకి వెళ్ళాలి అన్నాను.
మొదలు ఇంటికి వెళ్ళి మారు క్షణంలో బావ ఆఫీసులో ఉన్నాను.
“ఇదేంటి . . ఈ మిషనుకేమన్నా పిచ్చా? ఆల్ఫా”
కాదు. . నువ్వేమన్నా సరే అది చేసి తీరుతుంది. అది కూడా చెప్పింది చెప్పినట్టుగా. అందుకే జాగ్రత్తగా ఆలోచించి అడగాలి నువ్వు”
పిచ్చి సంతోషంతో గెంతులేశాను.
బావ చాలా శ్రద్ధగా పని చేసుకొంటున్నాడు. ఇంతలో వాళ్ళ బాస్ వచ్చి ఏదో పావుగంట విడమరచి చెప్పాడు. “నువ్వు బాగా చేయగలవని నీకు మాత్రమే అప్పగిస్తున్నాను” అని చెప్పి వెళ్ళి పోయాడు. ఒక గంట సేపు ఏవో వెతికి మొత్తానికి లెటర్ తయారు చేసి అక్కడున్న గుమాస్తాకు సాయంత్రం నాలుగు కల్లా ఇచ్చేయమన్నాడు. అతను ఎంతో భక్తి గా అది తీసుకు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే ఫోన్ అందుకొని “హే లవ్, లావణ్య. వెరీ హెక్టిక్ డే, నీడ్ యూ బాడ్లీ” అంటూ మెసేజ్ పెడ్తున్నాడు.
నాకు కోపం ముంచుకు వచ్చింది. ఆల్ఫా వైపు చూశాను. నా కోపాన్ని వాడు అప్పుగా తీసుకున్నాడు. సూటిగా మొబైల్ ని చూశాడు. అవతల వైపు నించి మెస్సేజ్ వచ్చింది “ ఐ యామ్ నాట్ యువర్ సెక్స్ టాయ్”
ఖంగు తిన్నాడు బావ.
నా చేయి పట్టుకొని “ ఆల్ఫా బీటా నీకు టాటా “ అన్నాడు బావ వైపు చూస్తూ, ఇద్దరం మాయమై పోయి క్షణంలో బిడ్డింగ్ ఆఫీస్ లో ఉన్నాము. గుమాస్తా అనుకున్న సమయానికి కొటేషన్ కవర్ అధికారులకి అప్పగించాడు.
ఆల్ఫా గాడిని కసి గా ఒక్క గుడ్డు గుద్దాను కసిగా, వాడు కడుపు పట్టుకొని వంగి పోయి “బండ దానా ఏం తింటున్నావే” అంటూ ఒక్కడే మాయమై పోయాడు.
నా కంకణం సహాయం తో నేను మా ఇంటికి చేరాను. మా బావ హఠాత్తుగా నన్ను చూసి షాక్ అయిపోయాడు, “ ఇందాక గదిలో లేవు కదా! అన్నాడు.
నేను బావ కళ్ళల్లోకి చూస్తూ కంకణం సరి చేసుకుంటూ “ఆపిల్ కావాలి” అన్నాను, ఆపిల్ వచ్చి చేతిలో పడింది.
బావ బిత్తర పోతుండగా నేను గదిలో కెళ్ళి తలుపేసుకొని కూర్చొన్నాను.
బయట ఫోన్ మోగింది, నేను పరుగున తలుపులకి చెవులు రిక్కించి నిల్చున్నాను.
సారీ సర్! మీరు చెప్పినట్ల్లు అన్నీ క్రోఢీకరించి, మన ప్రత్యర్థి గుమాస్తా కి లంచం ఇచ్చి వాళ్ల కొటేషన్ తెల్సుకుని ఒక శాతం తగ్గించి మరి కోట్ చేశాను” నమ్మండి.
“షటప్, నీ పల్లెటూరి బైతు కి చెప్పు నీ కధలు నాకు కాదు ”
ఫోన్ కట్ అయింది.
నాకు అర్థం అయింది ఆల్ఫా గాడు కోట్ ప్రింట్ చేసే సమయానికి నెంబర్ మార్చేశాడు.
“ఒరేయ్ ఆల్ఫా ఎక్కనున్నావు రారా? అంటూ సంతోషం గా అరిచాను.
“ఇక్కడే ఉన్నా” అంటూ వాడీ గాల్ ఫ్రెండ్ తో సహా వచ్చాడు.
“చ. . చ ఇదేంటీ. . ఇలా వచ్చావ్. . ?
“మరేం చేయమంటావ్ కంకణం మహిమా, ఉన్న పళంగా లాక్కొస్తుంది”.
ముందు వెళ్ళు ఇక్కడ నించి . . అన్నాను గట్టిగా. .
***************
మరునాడు:
“నేను బాగా చదువుకొని పైకి రావాలి” అన్నాను కంకణం దగ్గర చేసుకొని.
ఉన్నట్టుండి నేను నా పాత ఫాషన్ డిజైనింగ్ క్లాస్ లో కూలబడ్డాను. సర్దుకునేలోపే ఫాకల్టీ మాడమ్ వచ్చి ఇన్ని రోజులూ ఏమీ అయిపోయావు, ఇన్నాళ్ల క్రాఫ్ట్ వర్క్ బుక్ కావాలి అన్నది. అంతే ఆవిడ చేతిలో ప్రాజెక్ట్ పుస్తకం వచ్చి పడింది.
“వెరీ ఆర్రొగంట్ లేడి” అని కళ్ళెర్ర చేసి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత పాఠం మీద నా మనస్సు నిమగ్నమైపోయింది.
సాయంకాలం:
“అవును ఆల్ఫా! క్రాఫ్ట్ బుక్ మా మ్యాడమ్ చేతిలో ఎలా పడింది. ?
“మీ మ్యాడమ్ కంకణానికి దగ్గరగా వచ్చి మాట్లాడి ఉంటుంది. ”
************
నేను ఇంటికి వెళ్ళి నా క్రాఫ్ట్ బుక్ తో కుస్తీ పడుతున్నాను.
మా బావ వచ్చాడు “ ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, కుక్క లాగే ఇక్కడే ఉంటావా? మళ్ళీ క్లాస్ లో చేరావా? అంటే నన్ను విడిచి వెళ్ళవా? అని నా మీద కొచ్చి బెదిరిస్తున్నాడు. నా మెడ పట్టుకొని “లావణ్య అంటే నాకు ప్రాణమే, ఒక పని చేయీ, నా తల పగలుకొట్టు” అన్నాడు.
అంతే వాడి వెనకాల ఒక బెత్తం వచ్చి ఉతకటం ప్రారంభించింది. నేను కంకణం మహిమ అని తెలుసుకొని “స్టాప్ ఇట్” అన్నాను.
**********
రాత్రి జరిగింది ఆల్ఫా గాడికి చెప్పాను. వాడు ఉడికిపోయి ఉన్న పళంగా బావ దగ్గరకు తీసుకెళ్లాడు.
లావణ్య తాగి పడుంది. బావ వాష్ రూమ్ లో ఉన్నాడు , లావణ్య స్థానంలో నన్ను ఉంచాడు ఆల్ఫా. నన్ను చూసి ఒక్క పరుగున వెళ్లిపోయాడు. ఇంతలో లావణ్య లేచింది, హే వేర్ ఆర్ యు? అంటూ మెసేజ్ పెట్టింది, వాడికి.
ఒక్క చూపు చూశాడు ఆల్ఫాగాడు తన మొబైల్ ని . అవతలి వైపు నించి మెసేజ్ వచ్చింది.
“హే సెక్స్ టాయ్, ఐ యాం విత్ మై వైఫ్” అని .
లావణ్య గోడ కేసి కొట్టింది. . మొబైల్‌ని.
****************
లావణ్య మా ఇంట్లో ఉండాలి అన్నాను.
అందరం బావ బెడ్ రూమ్ లో ఉన్నాము.
ఆల్ఫాగాడు బావ చూడాలనే లావణ్య ఫ్రెండ్ తడబడుతూ వెళ్లిపోతున్నట్టు చూపించాడు.
నేరుగా తన పడక గదిలో పడుకొని ఉన్న లావణ్య చెంప పగలు కొట్టాడు అతను.
అదిరి పడిన లావణ్య శివంగిలా రెచ్చి పోయి అది నేర్చుకున్న కుంఫూ, కరాటే అన్నీ వాడి మీద ప్రయోగించి వాడి నడుము విరగ కొట్టింది, అమ్మ నాన్న ఎదురుగా.
మా నాన్న క్షమించు తల్లి అన్నారు. . ఇవాళ నా పుట్టిన రోజు. . ఆల్ఫా గాడు పెద్ద బహుమతినే ఇచ్చాడు.
వెదురు కంకణాన్ని దగ్గరగా తీసుకొని చివరి కోరికగా. . “నేను సెల్ఫ్ రిలయంట్ ఉమెన్ అవ్వాలి” అని వాడికి ఇచ్చేశాను.

నీతి: మన జీవితం, ఆ జీవితములో ప్రేమ మనకెంత విలువైనవో, అవతలి వారికి కూడా అంతే విలువైనవి. మన స్వార్థం కోసం అవతలి వారి జీవితాలను పణంగా పెట్టటం అమానుషం.

విశ్వపుత్రిక వీక్షణం 1 – రమ్య ది రోబో

రచన:విజయలక్ష్మీ పండిట్

సూపర్ బజార్ నుండి ఇంటికి వచ్చిన లక్ష్మి వరండాలో చెప్పుల స్టాండు పై చెప్పులు వదిలి ఇంట్లోకి వెళ్లి తన
హాండ్ బ్యాగ్ ఢైనింగ్ టేబుల్ పై పెట్టి బాత్రూం వైపు నడిచింది. డ్రైవర్ సామాన్ల బ్యాగ్ తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి వెళ్లాడు.
ఫ్రెషప్ అయ్యక కాఫీ తాగాలని వంటింటి వైపు నడుస్తూ అంతలో భర్త రామ్ కు కాఫీ టి ఏదయినా కావాలేమో అడగాలని ఆఫీస్ రూమ్ వై పు నడిచింది.
భర్త ఆఫీస్ రూమ్ నుండి ఎవరో ఆడమనిషి గొంతు ఇంగ్లీషులో మాట్లాడడం వినిపించింది.
వాకిలికెదురుగా కూర్చున రామ్ .
“ఎంతసేపయింది నీవు వచ్చి “అని అడిగాడు లక్ష్మిని.
“ఇప్పుడే పదినిముషాలయింది. మీకు కాఫీ కావాలా నేను చేసుకుంటున్నాను “ అని అడుగుతూ లోపలికి వచ్చి, రామ్ కు ఎదురుగా కూర్చున్న ఆమె వైపు చూసింది. బొమ్మ లాగున్న ఆ అమ్మాయి కండ్లు మిటకరిస్తూ నవ్వు ముహం పెట్టి , “హలో లక్ష్మి హౌవార్ యు, ఇ యామ్ రమ్య “ అంటూ లేచి నిలబడి చేయి చాచింది.
లక్ష్మి అప్రయత్నంగా షేక్ హ్యాండి్ ఇచ్చింది. ఆ చేతిస్పర్శలో ఏదో తేడా ఫీలయింది లక్ష్మి .
“రామ్ మీ గురించి అంతా చెప్పారు “అంది.
“అంతా అంటే “అనుకుంది లక్ష్మి మనసులో.
లైట్ పింక్ పంజాబ్ డ్రస్సులో బాబ్డ్ హేర్ తో చక్కగా అందంగా ఉంది. వయసు ఇరవై ప్లేస్ వుంటుంది. కానీ ఆ అమ్మాయి కదలికలలో ఏదో కొత్తదనం కనిపించింది.
అంతవరకు భార్య ముఖకవళికలతో మార్పును గమనిస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న రామ్,
“ లక్ష్మీ షి ఈజ్ రమ్య ద రోబో. మనం హైటెక్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సలో ‘సోఫియా ‘ రోబోను చూసి వచ్చిన తరువాత నేనన్నాను గుర్తుందా? ఒక రోబోను ఇంట్లో అసిస్టెంట్ గా పెట్టుకుందామని, మూడునెలల ముందు రోబోను బుక్ చేశాను. ఈ రోజే డెలివర్ చేసారు. రమ్య అని పేరు పెట్టాను “ అన్నాడు .
లక్ష్మి కి నమ్మశక్యం కావడం లేదు.
ఇంతలో రామ్, “లక్ష్మి ఇప్పుడే తాగాను కాఫీ రమ్య పెట్టింది. చాలా రుచిగా తయారు చేసింది” అన్నాడు రమ్య రోబో వైపు చూస్తూ .
రమ్య రోబో బ్రాడ్ స్మైల్ ఇచ్చింది.
రామ్ , రమ్య రోబోను ఏదో బుక్ , ఫైల్ తెమ్మని అడిగాడు ఏ అలమరలో ఉన్నాయో చూపెడుతూ. రమ్య రోబో
వెళ్లి చెప్పిన బుక్ , ఫైలు కరెక్ట్ గా తెచ్చి ఇచ్చింది.
రమ్య రోబో ఖాళీ కాఫి కప్పు తీసుకొని వంటింటి వైపు నడుస్తూ ఆగి , ”లక్ష్మీ షల్ ఐ గెట్ కాఫీ ఫార్ యు” అని అడిగింది .
ఆశ్చర్యం నుండి తేరుకొని లక్ష్మి “ఒ కె ప్లీస్”అనగానే రోబో మెల్లగ నడిచి వెళ్లింది .
రామ్ లక్ష్మికి రోబో పనితనం గురించిన పరిచయం చేయడమని గ్రహించింది. తేరపార చూస్తేకాని రోబో అని
తెలవనంత నైపుణ్యంగా తయారుచేశారా రోబోను .
మనిషి మేథస్సుకు మనసులో జోహారులు పలికింది లక్ష్మి.
రోబో కనుమరుగవగానే “మీ రమ్య రోబోకు తెలుగు రాదా?, ఆడ రోబో లే దొరుకుతాయా ? మగరోబోలు దొరకవా ? అన్ని యంగ్ గానే ఉంటాయా ?”అని మనసులో మెదులుతున్న ప్రశ్నలడిగేసింది లక్ష్మి .
భార్య ముఖంలో అనుమానాన్ని , ఈర్ష్యను పసికట్టిన రామ్ లేచి లక్ష్మి బుజంపై చేయివేసి తన వైపుకు తిప్పకుని,
“ఏంటి మైడియర్ అలాగున్నావు. రమ్య కేవలం రోబో అదే బొమ్మే కదా మనిషి ఆకారంలోయంత్రం మాత్రమే. మనకు కావలసిన పనులు చెప్పి చేయించాను”అని ఆగి మరలా,
నా ఆఫీసులో బుక్స్ , ఫైల్స్ ను వాటి స్థలాలలో పెట్టడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, లెటర్లు, డ్రాఫ్టులు టైప్ చేయడం మొదలయిన పనులు చేస్తుంది , నీవు అమెరికా వెళ్లినపుడు అమ్మ నాన్నకు , నాకు సహాయం చేయడం” అని టేబుల్ మీద ఏదో వెతుకుతున్న రామ్ ను
“ నేను లేనప్పుడు మీ కెలాంటి సాయం అంది” లక్ష్మి.
“నీవు లేనప్పుడు అప్పుడప్పుడు నా తలంటడం, వీపు రుద్దడం, స్నానంమపుడు టవలు మరిచిపోతే
అందివ్వడం , తలనెప్పయితే తల మర్దన చేయడం, భోజనం వడ్డించడం . . . ”అంటూ అప్పచెపుతూ పోతున్నాడు రామ్.
“అంతేనా ఇంకా ఏమయినా వున్నాయా మీకు రమ్య రోబో చేయవలసిన పనులు “ అని లక్ష్మి ఘాటుగా అడగ్గానే. . ,
కోపంతో ఎర్రపడిన లక్ష్మి ముఖంలోక చూసి టక్కున ఆపేశాడు రామ్ ఏదో తప్పు జరిగుంటుంది నా మాటల వల్ల అని.
“ఇంకేమున్నాయి. . నాకిష్టమైన మిగతావన్ని
నీవు లేనిదే నాకు లేవు లక్ష్మీ “ అని లక్ష్మి చుబుకం పట్టుకుని, “నిన్ను ఉడికించాలని అలా అన్నాను
లేవోయ్ “అన్నాడు రామ్.
దాదాపు ముపై వసంతాల వైవాహిక జీవితంలో రామ్ ను చదివిన లక్ష్మి కి తెలుసు అతడేమిటో. . ’ తనంటే తమ పిల్లలంటే ఎంత ప్రేమో, బాధ్యతో.
“సరేలేండని” నవ్వేసింది లక్ష్మి .
కాని ఎక్కడో గూడు కట్టుకున్న అనుమానం, ఏదో ఈర్ష్య. ,” అందమయిన రమ్య రోబోకు అలవాటు పడిపోతాడేమో. నేను అమెరికాలో అమ్మాయి దగ్గర ఆరు నెలలు ఉండి వచ్చిన తరువాత ఏన్ని మార్పులు జరుగుంటాయూే” అనే భయం పట్టు కుంది
లక్ష్మి కి. ఇలాంటి అందమయిన ఆడ రోబోలను తయారుచేసిన వాళ్లను మనసులో తిట్టుకుంది.
* * * *
నెల తరువాత అమెరికాలో వర్జీనియాలో లక్ష్మి కూతురు , అల్లుడు ఏయిర్ పోర్ట్ కు వచ్చి లక్ష్మిని రిసీవ్ చేసుకున్నారు ఆప్యాయంగా.
రెండవసారి ప్రెగ్నెన్సీ తో భారంగా నడుస్తున్న కూతురు బుజంపై చేయి వేసి “జయ్ ఏడీ . . . ? రాలేదా రూపా . . ! అని అడిగింది లక్ష్మి కూతురిని. మనుమడిని చాల నెలల తరువాత చూడబోతూ లక్ష్మి .
జయ్ క్రిష్ తో ఆడుకుంటూ రానన్నాడు, మన పక్కింటి వాణి తో చూడమని చెప్పొచ్చాము అని, రూపా వాళ్ల నాన్న గురించి అడుగుతూ, ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు.
హల్లో అడుగు పెట్టగానే “జయ్. . . ఎక్కడున్నావు రా నాన్నా, , ?” అని పిలిచింది మనుమడిని లక్ష్మి.
“బాగున్నారా ఆంటి “అని పలుకరించిన వాణిని, బాగున్నావా వాణి అని పరామర్శించింది . కండ్లు మాత్రం మనవడిని వెతుకుతున్నాయి .
“జయ్ ఎవరొచ్చారో చూడు “అని వాళ్ల నాన్న గట్టిగా పిలవడంతో ప్రక్క రూమ్ నుండి వచ్చాడు నాలుగేండ్ల జయచంద్ర .
“హయ్ అమ్మమ్మా” అంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి చుట్టుకుంటూ.
ఎవరి కోసమో చూస్తూ . . ”వేరీస్ తాత ?“ అని అడిగాడు.
అంతలో రూములోనుండి ఇంకో అబ్బాయి వచ్చాడు . అమెరికన్ల పోలిక, నాలుగయిదు సంవత్సరాల వయసుంటుదని అనుకుంటూ
“నీ ఫ్రెండ్ పేరేమి “అని అడిగింది లక్ష్మి, ఆ అబ్బాయి పట్టి పట్టి నడిచే తీరునుగమనిస్తూ . . . ,
“హి ఈస్ క్రిష్ , మై ఫ్రెండ్ అండ్ హెల్పర్ రోబో అమ్మమ్మా!” అని జవాబిచ్చి క్రిష్ దగ్గరకు వెళ్లి,
“ షి ఈజ్ మై అమ్మమ్మ క్రిష్ . . మై మదర్స్ మదర్ “ అని పరిచయం చేశాడు.
లక్ష్మి తేరపార చూస్తూంది క్రిష్ రోబోను . . మనసులో రమ్య రోబో మెదిలింది .
అంతలో. .
“హాయ్ అమ్మమ్మా హౌఆర్ యూ”. . అని చేయి చాపాడు క్రిష్ రోబో. చేయందుకుని, “ఇ యామ్ ఫైన్, థాంక్యు క్రిష్“ అని జయ్ వైపుతిరిగి,
“ఏం సహాయం చేస్తాడు” అని సహాయం అంటే మనవడికి అర్థం కాలేదని గ్రహించి “వాట్ హెల్ప్ క్రిష్ డు ఫర్ యు” అని ఇంగ్లీషు లో అడిగింది. వీలయినంతవరకు మనవడికి తెలుగు అలవాటు కావాలని తెలుగులోనే మట్లాడుతుంది లక్ష్మి .
“నాకు స్టోరీస్ చదివి వినిపిస్తాడు, నా హోమ్ వర్క్ చేస్తాడు, నా నోట్స్ రాసిపెడతాడు , మాత్స్ లో హెల్ప్ చేస్తాడు , డ్రాయింగ్ , బొమ్మలు గీస్తాడు “అంటూ ఏకరువు పెడుతున్నాడు జయ్.
ఆశ్చర్య పోతున్న లక్ష్మి “ నీవేం చేస్తున్నావు , ఏమి నేర్చుకుంటున్నావు అన్నీ క్రిష్ చేసి పెడుతుంటే. . ?!” అని ఒడిలో కూర్చొని వున్న మనవడినడిగింది చిరాకుపడుతూ.
ఏదో గుర్తుకొచ్చి . . . కూతురును పిలిచింది లక్ష్మి .
రెస్ట్ రూమ్ కెళ్లి వచ్చి అందరూ మొదట కాఫీ తాగుదామని రూప వాణి కాఫీ తయారుచేసి ఇద్దరు కాఫీ కప్పులతో హాల్లోకి వచ్చారు.
“రూపా. . . వాడికన్ని క్రిష్ రోబో చేసి పెడితే వీడికి తెలివితేటలు ఎట్లా పెరుగుతాయి. లెక్కలు, రీడింగ్, రైటింగ్ , కాగ్నిటివ్ , సైకోమోటార్ అన్ని లర్నింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి. చిన్నపుడే మెదడుకు రిసెప్టివిటి బాగా వుంటుంది . అన్ని నేర్చుకుంటే మెదడు కంప్యూటర్ లో స్టోరయి అవసరమయినపుడు వాడుకోడానికి వీలవుతుంది. రేపు జయ్ బదులు క్రిష్ రోబో పరీక్షలు రాయాలి. ఇలాగయితే జయ్ మెదడు పనిచేయక వెస్టేజ్ అయిపోకముందే ఈ హెల్పర్ రోబోను పంపించేయండి, ఎందుకు కొనిచ్చారు “ అని బాధపడిపోయింది లక్ష్మి .
“నాన్న ఆర్డర్ చేసి కొనిచ్చాడమ్మా మనవడికి సర్ప్రయిస్ గిఫ్టు “అంది రూప.
“మీ నాన్న కు రోబోల పిచ్చి పట్టింది, ఇంట్లో ఏమో రమ్య ఆడ రోబోను కొని అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. నేను అమెరికా వచ్చినపుడు ఆఫీసులో, ఇంట్లో మీ నాన్నకు , తాత , నాన్నమ్మ లకు హెల్ప్ కంట. మనవడికేమో క్రిష్ రోబో హెల్పర్.
పెద్ద పెద్ద బిసినెస్లలో , కంపెనీలలో , టీచింగ్ ఎయిడ్స్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరమే కాని కుటుంబాలలో చిన్న పిల్లలకు విద్యలో ఇలాంటి రోబోలవలన ఏమి అనర్థాలకు దారితీస్తాయో ఈ మానవ రోబోలు”
అంటూ వాపోయింది లక్ష్మి .
“మనం వద్దనుకుంటే ట్రయల్ పీరియడ్ లోపల రిటర్న్ చేయచ్చులే అమ్మా. నాన్నకు నేను నచ్చచెబుతానులే . మేమూ రిటర్న్ చేయాలనుకున్నాము. రోబో పైన డిపెన్డయి నేర్చుకున్నవి కూడా మరిచిపోతున్నాడు. ” అని కూతురనగానే కొంచెం కుదుట పడింది లక్ష్మి . రమ్య రోబోను కూడా రిటర్న్ చేసేయాలని నిర్ణయించుకుంది
మనసులో.
అమెరికా వచ్చే ముందు వాళ్ల అత్తమ్మ చేసిన కంప్లయింటు గుర్తు కొచ్చింది లక్ష్మికి.
వాళ్ల అత్తగారు భర్త పలవరింత గురించి చెప్పింది. వయసులో డెబ్బయి పైబడిన భర్త కలవరిస్తున్నాడట “ రమ్యా . . కాలు మెల్లగా వత్తు” అని, మరలా నిద్ర లో నవ్వుతూ. . . ”ఇక చాలు .నీ చేతులు గిలిగింతలు పెడుతున్నాయి “అని మెలికలు తిరుగుతున్నాడట నిద్రలో .
లక్ష్మి వాళ్ల అత్తమ్మ కోడలికి చెప్పి , “ ఇవేమి మరమనుషులే తల్లీ. . . మనలను మరిచిపోయేట్టున్నారు వీళ్లు , వద్దు వాపసు పంపించేయమను రమ్యమ్మను, ”అని అత్తమ్మ అంటూంటే నవ్వాగిందికాదు లక్ష్మికి.
*****
లక్ష్మీ . . . . . లక్ష్మీ. . . . . ఏమయింది అంత గట్టిగా నవ్వుతున్నావు నిద్రలో . బాగా తెలవారి పోయిందిలే . . . అంటూ బుజం పట్టి కుదుపుతూ లేపుతున్నాడు భర్త రామ్.
కండ్లు తెరిచి భర్తను చూసి రోబోల కలల ప్రపంచం నుండి బయటపడిన లక్ష్మి . . ,
“ హమ్మయ్య . కలే “నిజంకాదని కుదుట పడింది మనసు. రామ్ కు ఒక ఎడ్యుకేషనల్ టీచింగ్ లర్నింగ్
ఎయిడ్స్ తయారుచేసే కంపెనీ ఉంది. అతడే దానికి సి. ఇ. ఒ.
లక్ష్మికూడా ఎడ్యుకేషన్ లో ప్రొఫెసర్. ఇద్దరు అకాడమీషియన్స్, క్రొత్త ఎడ్యుకేషన్ టెక్నాలజీలను ఫాలో అవుతూ , అవి ఎంతవరకూ స్కూల్ , కాలేజి విద్యకు తోడ్పడు తున్నాయో స్టడీ చేస్తుంటారు.
ముందురోజు రామ్ తో కూడా హైటెక్ ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ కు వెళ్ళింది లక్ష్మి .
‘సోఫియా రోబో’ను తనతో కూడా తెచ్చాడు డా. డేవిడ్ హాన్సన్ , సోఫియా రోబో సృష్టి కర్త , హాన్సన్ రోబోటిక్స్ కంపెని
స్థాపకుడు .
కాన్ఫరెన్సలో సోఫియా రోబో పెద్ద అట్రాక్షన్ . కండ్లు ఆర్పుతూ, సంభాషణకు తగినట్టు ముఖకవళికలు మార్చుతూ మధ్యలో చిరునవ్వుతో అందరిని ఆకట్టుకుంది. అదొక మరపురాని అనుభవం.
ఇంటికి వస్తూ దారిలో “లక్ష్మీ . . . మనమూ ఒక రోబోను కొనుక్కుందామా మనకు అసిస్టెంట్ గా పనులు చేసిపెడుతుంది” అన్నాడు రామ్.
“అన్ని లక్షలు, కోట్లు డబ్బులు పెట్టి కొనుక్కొని ఇంట్లో పనులకు పెట్టుకుంటారా” అంటూ జోక్ అని కొట్టి పారేసింది లక్ష్మి .
కాని ఇంటికి వచ్చాక సోఫియా రోబో రూపు రేఖలు, హావభావాలు, మాటలు తనను వెంటాడుతునే ఉన్నాయి.
చర్చలో రాబోయే కాలంలో అన్నిరకాల వ్యాపార లావాదేవీలలో ; విద్య, వైద్యం, అగ్రికల్చర్, బయో
టెక్నాలజీ , రిటేల్ మొదలయిన పెద్ద కంపెనీలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పెద్ద ఎత్తున రోబోల అవసరాన్ని అందరూ గుర్తించారు .
సోఫియా రోబో, మాటలలో భవిష్యత్ లోతమ రోబోల కుటుంబం పెరుగుతుందని, మానవ కుటుంబాలతో కలిసి మెలసి జీవించే కాలం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
ఆ మాటలు లక్ష్మి మనసులో నాటుకున్నాయి.
మానవ, రోబో కుటుంబాల సహజీవనమెలా ఉంటుందో అని ఉత్సుకత పెరిగింది లక్ష్మి లో.
ఆ ఆలోచనల పర్యవసానంగా తను అంత సుదీర్ఘ కల కన్నానని కలను నెమరువేసుకుంటూ “ఈ రోబోల తయారీ కుటుంబాలలో ఎమోషనల్ ఘర్షణలకు , పెద్దల్లో సోమరితనానికి , పిల్లలలో మెదడు పనితనాన్ని దెబ్బ తీసే విచ్చలవిడి ఉపయోగాలను నియంత్రించే చట్టాలు పటిష్టంగా ఉండాల”ని అనుకుంటూ బాత్ రూములోకి నడిచింది లక్ష్మి .

—— ********——-

బ్రహ్మలిఖితం – 17

అతన్ని చూడగానే ఎక్కడలేని ధైర్యమొచ్చింది లిఖితకి.
“పాము.. పాము” అంది లేచి నిలబడి అదురుతోన్న పెదవులతో.
“అదేం చేస్తుంది. అంతకంటే భయంకరమైన జంతువులున్నాయీ అడవిలో”అన్నాడతను లిఖితను దగ్గరకు తీసుకుంటూ.
అతను మళయాళంలో మాట్లాడిందేమిటో అర్ధం కాకపోయినా అతని స్పర్శలో ఉన్న నీచదృష్టిని గమనించి అతని చేతుల్ని దూరంగా తోసేయ్యబోయింది లిఖిత.
“ఏంటంత భయపడుతున్నావు. మగపిల్లాడివేగా. మా పెరియార్లు నిన్ను మగపిల్లాడివనుకొని బలికి తీసుకొచ్చేడు. నేనప్పుడే గ్రహించేసేను. ఈ పూజలతో విసిగి పోయినప్పుడు సరసానికి పనికొస్తావని” అంటూ ఆమెని మరింత గట్టిగా కౌగిట్లో బిగించేడు.
లిఖిత విడిపించుకోలేని అశక్తితో గింజుకుంటూ అడవి దద్దరిల్లేలా అరిచింది.
“నువ్వెంత అరిచినా, ఈ గుహ ప్రాంతానికెవరూ వచ్చే సాహసం చేయరు. అనవసరంగా శ్రమపడకు” అంటూలిఖితని నేలమీదకి తోసేడు మహామాయ.
లిఖిత వణికిపోతూ చేతులు జోడించిదతనికి.
కాని.. క్షుద్ర పూజలు చేసి రక్తతర్పణాలు చేసే ఆ నీచోపాసకుడికి ఆమెపట్ల ఎలాంటి జాలికాని, సానుభూతికాని కలగలేదు సరికదా రెట్టింపు ఆనందంతో ఆమెని వశం చేసుకోవడానికి మీదకి జరిగేడు పైశాచికంగా.

******
పరధ్యానంగా కారు నడుపుతోన్న కేయూరవల్లి దూరంగా పేవ్‌మెంటు మీద ఒకమ్మాయితో నడుస్తున్న వెంకట్‌ని చూసి ఉలిక్కిపడి కారు బ్రేక్ వేసింది. కారు కీచుమంటూ ఆగింది.
వెంటనే కారు దిగి పరిగెత్తి “వెంకట్! వెంకట్!” అని పిలిచింది చప్పట్లు చరుస్తూ.
వెంకట్ వెనుతిరిగి కేయూరని చూసి గతుక్కుమన్నాడు.
కేయూర అతనికేసి తీక్షణంగా చూస్తూ “ఎప్పుడొచ్చేవు నువ్వు. లిఖితేది?” అంది అతని పక్కనున్న పిల్లకేసి చూస్తూ.
వెంకట్ ఇబ్బందిగా మొహం పెట్టి “సాయంత్రం ఇంటికొచ్చి చెబుతాను. దయచేసి మీరు వెళ్లిపోండి” అన్నాడు నెమ్మదిగా.
“వీల్లేదు. లిఖిత ఏమయిందో నాకు వెంటనే తెలియాలి. నీకోసం నేను క్షణక్షణం ఎంతగానో ఎదురు చూస్తుంటే, నువ్వు ఊళ్ళోనే ఉండి, నాకే సంగతి చెప్పకుండా తిరుగుతున్నావా?”
“ఆంటీ ప్లీజ్. నేను ప్రొద్దుటే వచ్చేను. నా మాట వినండి” కేయూర సరేనన్నట్లుగా తల పంకించి”ఈ పిల్లెవరు?” అనడిగింది.
“ఆ సంగతి కూడా చెబుతాను” అన్నాడు వెంకట్ ఓర్పుగా.
కేయూర అనుమానంగా ఆ ఇద్దర్నీ పరీకిస్తూ వెళ్ళి కారెక్కింది. మనసు చిందరవందరగా తయారయింది.
“వెంకట్ వస్తాడు. లిఖిత సంగతులు చెబుతాడని ఎంతో ఆశగా తను క్షణాలు లెక్కబెడుతూ భగవంతుణ్ణి ప్రార్ధిస్తుంటే ఇలా జరుగుతున్నదేమిటి? ఈ వెంకట్ అసలెల్లేడా? ఆ పిల్లెవరయి ఉంటుంది?”
ఆలోచించే కొలది ఆమె తలలోని నరాలు ఒక రకమైన ఉద్రిక్తతకి గురయి చిట్లిపోయేంత వేడెక్కిపోతున్నాయి.
కేయూర ఫాక్టరీకి వెళ్లలేక కారు రివర్సు చేసి ఇంటిదారి పట్టించింది.
పది నిముషాల్లో కారు ఇల్లు చేరింది. తాళం తీసి పైకెళ్ళి హాల్లో కూర్చుంది కళ్ళు మూసుకుని.
వెంటనే వందనం శర్మగారు చెప్పిన మాటలు గుర్తొచ్చేయి. తనకిపుడే బలమూ లేదు దైవబలం తప్ప.
రూషము టెక్కెము నందు దాల్చిన
జాణకును ఈ సాయినామము
విషమశరమై ఒప్పుచూ
విమలమౌని శ్రీ సాయి నామము
ఇతరులకి హాని చేస్తూ విషాన్ని కొండెంలో దాల్చి, భగవంతుడికి పూజలు చేసే నీచుల్ని దేవుడు క్షమించడు. వారికి తిరిగి విషమే లభిస్తుంది.
“ఆంటీ!”
కేయూరవల్లి ఉలిక్కిపడి కళ్ళు తెరచి చూసింది.
ఎదురుగా వెంకట్ నిలబడి ఉన్నాదు దీనంగా.
అతన్ని చూడగానే కేయూర కళ్ళెర్రబడ్డాయి.
“నువ్వు కేరళ వెళ్లనే లేదు కదూ!” అంది కోపంగా.
“అనుకున్నాను. మీరు సరిగ్గా అలానే అనుకొని ఉంటారని”అన్నాడు వెంకట బాధ నటిస్తూ.
“మరి లిఖితేది?”
“అదే ఎలా చెప్పాలో తెలీక నిన్ననగా వచ్చి కూడామొహం చాటేసేను”అన్నాడు వెంకట్.
“అంటే… నా లిఖిత కేమైంది?” అంటూ గాభరాగా అడిగింది కేయూర.
అప్పటికే ఆమె కళ్లలోకి వర్షాకలపు వాగుల్లా నీళ్లు వచ్చిపడ్డాయి.
“అబ్బే ఆంటీ! మీరు ఏడవద్దు. లిఖిత నేను వెళ్ళేసరికే కేరళ అడవుల్లోకి వెళ్ళిపోయింది. ఎటు సైడు వెళ్ళిందీ ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయేరు. అప్పటికీ నేను పంపా అవతల అడవులన్నీ వెదికేను. కేరళ మంత్రగాళ్ల దగ్గరకెళ్లిన వాళ్లు తిరిగి బయటపడటం అసంభవమని అక్కడందరూ చెప్పేరు. నన్ను కూడా వాళ్లు…”అంటూ ఆగి కేయూరవల్లి మొహంలోని రియాక్షన్ కోసం చూసాడు వెంకట్.
కేయూర గుండెలదరడం.. మొహం నిండా ఆందోళన అలముకోవడం స్పష్టంగా కన్పిస్తున్నాయి.
“ఎందుకంటే ఆంటీ.. మిమ్మల్ని అన్నీ చెప్పి బాధపెట్టడం. లిఖిత క్షేమంగా రావాలని మీరనుకుంటే.. ఒకటే మార్గముంది”
“ఏంటది చెప్పు. నాకు లిఖిత క్షేమాన్ని మించింది లేదు.” అంది ఏడుస్తూ.
“మీకిష్టముంటుందో లేదో?”
“ఉంటుంది చెప్పు”
భీమిలి రోడ్డులో ఓంకారస్వామి అని ఒక గొప్ప అద్భుత శక్తులున్న స్వామి ఉన్నాడు ఆయన్నాశ్రయించండి. మీకు మేలు జరుగుతుంది” అన్నాడు.
“ఓంకారస్వామా? నేనతని పేరైనా వినలేదే?”అంది కేయూర కళ్లు తుడుచుకుని.
“ఏంటి అన్ని పేపర్లనిండా, పత్రికలనిండా ఆయన గురించి రాస్తుంటే మీరతని పేరైనా వినలేదా? చాలా చిత్రంగా ఉంది.మీకంత అనుమానంగా ఉంటే ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మల్లన్నగారికి ఫోను చేసి కనుక్కోండి” అన్నాడు వెంకట్.
కేయూర వెంటనే రాజ్యలక్ష్మికి ఫోను చేసింది.
“ఏంటి కేయూరా, అంత గాభరాగా ఉన్నావు. లిఖిత సంగతులేమైనా తెలిసాయా?” అనడిగింది రాజ్యలక్ష్మి.
“లేదు రాజ్యం. దానికోసం పంపిన వెంకట్ తిరిగొచ్చేడు. అది ఇంటీరియర్ ఫారెస్టుకెళ్లిపోయిందంట. ఆ మీనన్‌గారు రాకపోతే మాకీ దౌర్భాగ్యం పట్టేది కాదు. నేనే .. బుద్ధిలేని దాన్ని. అనవసరంగా దాన్ని పంపించేను”అంది దాదాపు ఏడుస్తున్నట్లుగా.
“ఏంటిది కేయూర. ధీర గంభీరమయిన కేయూరే మాకు తెలుసు గాని.. ఇలా ఏడ్చి బెంబేలు పడే కేయూర కాదు. కష్టాలు రాగానే కృంగిపోతే ఎలా? శర్మగారేం చెప్పేరు? చివరికి మంచే జరుగుతుందన్నారుగా. ఇంతకీ ఆ విభూది గుమ్మానికి కట్టేవా?” అంది రాజ్యలక్ష్మి.
“లేదు. మర్చేపోయేను. ఇప్పుడే కడతాను” అంది కేయూర రిసీవర్ క్రెడిల్ చేస్తూ.
వెంకట్ పేపర్ చదువుతున్నట్లుగా నటిస్తూ ఆమె మాటల్ని వింటున్నాడు.
ఆవిడ రిసీవర్ క్రెడిల్ చేయగానే పేపర్ మడుస్తూ “ఏంటాంటీ, వస్తున్నావా?” అనడిగేడు.
“లేదు. అద్సరే ఈ విబూది పొట్లం కాస్త వీధి గుమ్మానికి కట్టిపెట్టు”అంటూ దారంతో దాన్ని బిగించి వెంకట్ చేతికిచ్చింది.
“ఏంటిది?” అంటూనే దాన్ని చేతిలోకి తీసుకుని స్టూలేసుకుని గుమ్మంపైన కట్టేడు వెంకట్.
“ఎవరో నందనం నుండి షిర్డీసాయి భక్తుడొచ్చి ఇచ్చేరు. ఎవరో నీచుడి వలన మా కుటుంబానికి ఆపదలు రాబోతున్నాయట. ఇది కడితే అతని ఆటలు సాగవట.” అంది కేయూర అమాయకంగా. వెంకట్ గతుక్కుమన్నాడు.
“ఆ. సింగినాదం. ఇలాంటివి పని చెయ్యవాంటీ!” అంటూ స్టూలు దిగబోతూ జారిపడ్డాడు వెంకట్. వెంటనే కాలు బెణికింది.
“అమ్మా” అని అరిచేడు బాధగా.
కేయూర గబగబా వెళ్ళి అతన్ని లేవదీసి చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టింది.
వెంకట్ బాధతో విలవిల్లాడుతున్నాదు.
కేయూర ఎముక విరిగించేమోననే భయంతో అతని పేంట్ మోకాలిదాక లాగి నొక్కి చూసింది. వాపు రాకపోవడంతో హమ్మయ్య అనుకొని “బెణికినట్లయింది. పద డాక్టరు దగ్గరకు తీసుకెళ్తాను” అంది కేయూర.
“వద్దాంటీ. అదే తగ్గుతుంది” అన్నాదు వెంకట్ నొప్పిని ఓర్చుకుంటూ.
కేయూర లోనికెళ్లి పెయిన్ బామ్ తెచ్చి మర్దన చేస్తూ నా వల్ల ఇదంతా జరిగింది. నా దురదృష్టం నీకూ అంటుకున్నట్లు ఉంది” అంది బాధగా.
“అదేం లేదులే ఆంటీ! దగ్గరుండి లిఖితని తీసుకురాలేకపొయేను. అదే బాధగా ఉంది” అన్నాడు దిగులుగా మొహం పెట్టీ.
కేయూర కళ్లలో మళ్లీ నీళ్లూరేయి.
వాటిని వెంకట్‌కి కనిపించనివ్వకుండా “భగవంతుడు ‘ఇది’ అని నిర్ణయిస్తే దాన్ని మనమెవరమూ అధిగమించలేము. నాకు నమ్మకముంది లిఖిత తిరిగొస్తుందని” అంది.
ఆమె ఆత్మవిస్వాసానికి అతను విస్తుపోయేడు.
పేంట్ సరిచేసుకుని మెల్లిగా లేచి నిలబడుతూ “అయితే మీరు ఓంకారస్వామి దగ్గరకి రారా ఆంటీ?” అనడిగేడు.
“నేనెక్కడికీ రాను. నా లిఖిత క్షేమంగా తిరిగొస్తుంది నా ఇంటికి!” అంది స్థయిర్యంగా.
వెంకట్ తన పథకం పారనందుకు ఆలోచిస్తూ గడప దాటుతుంటే “వెంకట్” అంది కేయూర.
కేయూర పిలుపు విని గతుక్కుమని వెనుతిరిగి చూశాడు.”నా గొడవలో పడి అడగటం మరచిపోయేను. నిన్న నీతో ఉన్న అమ్మాయెవరు?” అనడిగింది.
వెంకట్ ఊహించి దానికి జవాబు సిద్ధం చేఉసుకునే రావడంతో అంత గాభరా కనింపించనివ్వకుండా “మా మావయ్య కూతురు. కాస్త మెంటలొస్తే కె.జిలో షాక్ పెట్టించి తీసుకొస్తున్నాను” అన్నాడు.
” ఆ పిల్ల పిచ్చిదానిలా లేదే?” అంది కేయూర ఆశ్చర్యపడుతూ.
“కొన్ని పిచ్చిలంతే. బయటపడవు. దానికి పెళ్లి పిచ్చి. పిచ్చి కుదిరితేగాని పెళ్లి కాదు. ఏం చేస్తాం” అంటూ తప్పుకున్నాడు వెంకట్.

*****
ఆ చీకటి నిర్మానుష్య రాత్రి తన జీవితం తన జీవితం అన్నివిధాల నాశనమవ్వ బోతున్నదన్న వేదనతో లిఖిత కెవ్వున అరచి కళ్లు గట్టిగా మూసుకుంది.
ఆమె అరుపు ఆ నిశ్శబ్దంలో అనేక వేల తరంగాలు పుట్టించి అడవిని హోరెత్తించింది.
అడవంతా దద్దరిల్లినట్లయింది.
పక్షులు గూళ్లలో నుండి మేల్కొని కువకువలాడేయి.
ఆమె అరుపుకి బదులిస్తున్నట్లుగా మరికొన్ని జంతువులు తిరిగి అరిచేయి.
సరిగ్గా అదే సమయంలో ఒక కిలోమీటరు దూరంలో ఆ కొలనులోనే స్నానం చేసి ఒడ్డున పడుకొన్న ఏనుగు ఉలిక్కిపడి లేచి మెడలో గంటని మ్రోగిస్తూ పరుగున ఆ అరుపు వచ్చిన దిశకి వచ్చింది. ఆ మత్తగజం పరుగుకి అడవంతా కంపించినట్లయింది.కామంతో కళ్ళు మూసుకుపోయి లిఖితని ఒడిసిపట్టుకున్న మహామాయ ఏనుగు పరుగున రావడం గమనించనే లేదు.
ఏనుగు ఎర్రబడిన కళ్లతో తొండంతో చుట్టేసి మహామాయని ఒక్క ఉదుట్న దూరంగా విసిరేసింది. లిఖిత భయంతో వణికిపోతూ ఏనుగుని చూస్తూ అలానే లేచి కూర్చుంది.
“గణా!గణా!” అంటూ ఏనుగు వెనుక ఒక యువకుడు పరిగెత్తుకొచ్చేడు.
ఏనుగు తల తిప్పి అతనివైపు చూసి ఘీంకరించింది.
అతను వచ్చి ఏనుగుని నిమురుతూ లిఖితవైపు చూసేడు. లిఖిత భయంగా లేచి నిలబడింది.
ఏనుగు మాత్రం ఇంకా కోపాన్ని వీడక దూరంగా వాగులో పడ్డ మహామాయ దగ్గర కెళ్లి కాలెత్తి అతని పొట్ట మీద వేసింది. మహామాయ అప్పడంలా మారి వాగులోని ఇసకపొరల్లోకి కూరుకుపోయేడు. అప్పటికే అతని ప్రాణం అనంతవాయువుల్లో కలిసి అయిదు నిముషాలు దాటిపోయింది.
అతను పరుగున వెళ్లి “గణా!గణా!” అంటూ ఏనుగుని ఆపే ప్రయత్నం చేసేడు కాని అప్పటికే అంతా జరిగిపోయింది.
ఏనుగుతో అతను తిరిగొచ్చి లిఖితవైపు చూసి “ఎవరు నువ్వు?” అనడిగేడు.
ఆమెకతని ప్రశ్న అర్ధం కాలేదు.
ఇంకా వీడని భయంతొ అతనిని చూస్తూ నిలబడింది.
అతను ఏనుగుకేదో సంజ్ఞ చేసేడు.
ఏనుగు క్రింద కూర్చుంది.
అతను లిఖితని ఎక్కమని సైగ చేసేడు.
ఆమె భయంగా ఎక్కి కూర్చుంది. అతను ఎక్కేడు. ఏనుగు లేచి నిలబడి నడక సాగించింది. అడవిలో అది నడుస్తుంటే కొమ్మలు వాళ్లని తాకుతున్నాయి. లిఖిత భయంతో దాని మెడకి కట్టిన గంటల తీగెల్ని గట్టిగా పట్టుకుంది. అలా ఆ అడవిలో రెండు కిలోమీటర్ల నడక సాగేక ఒక విశాలమైన మైదానం లాంటి ప్రదేశం వచ్చింది. అక్కడ పూరిపాకల్లాంటి కొన్ని గుడిసెలున్నాయి.
అక్కడికెళ్ళేక “గణా!” అని అరిచేడతను. ఏనుగు మళ్లీ చతికిలబడింది.
అతను దిగి ఆమెకి చేయందించేడు.
లిఖిత కూడా మెల్లిగా ఏనుగు దిగింది.
వాళ్లిద్దర్నీ చూసి ఓక వ్యక్తి పరుగున వచ్చాడక్కడికి.
అతను లిఖితని ఆశ్చర్యంగా చూస్తూ ఏదో ప్రశ్నించేడు. ఏనుగు తాలూకు వ్యక్తి మళయాళంలో ఏదో చెప్పేడు.
అతను లిఖితవైపు తిరిగి “తమిళమా?” అన్నాడు.
“కాదు తెలుగు” అంది లిఖిత.
అతడు వెంటనే ఫక్కున నవ్వి “మన తెలుగే!” అన్నాడు.
వెంటనే ఏనుగు తాలూకు వ్యక్తి లిఖితవైపు చూసి మా నాన్న మళయాళి. మా అమ్మ తెలుగు మనిషే. నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తాది. నా పేరు కాణ్హ. నీ పేరు?” అనడిగేడు.
“లిఖిత” అంది
అప్పుడే తూర్పువైపున చీకటి తెల్లవారుతోంది.
కాస్త దృఢమైన ఆకారం ఆమెకు స్పష్టమవుతోంది. అతనికి పాతికేళ్ళ వయసుంటూంది. మెలి తిరిగిన కండరాలు, ఆరడుగుల ఎత్తు అతను. పూర్తిగా మళయాళీ యువకుడిలా లేడు. తెలుగువాడని కూడా అనిపించడంలేదు. కళ్లలో మెరపులాంటి ఆకర్షణ ఉంది.
లిఖిత అతనివైపు స్నేహపూర్వకంగా చూసి నవ్వింది. అతను కూడా కొద్దిగా నవ్వి “ఆ మాయగాడి దగ్గరకి ఎందుకు వెళ్లావు?” అనడిగేడు.
లిఖిత జరిగిన వృత్తాంతం అంతా క్లుప్తంగా చెప్పింది.”అయితే మీ నాన్న ఆ గుహలో ఉన్నాడంటావా?” అనడిగేడూ కాస్త అనుమానంగా.
“సరిగ్గా తెలియదు. ఉన్నాడని అనుమానం”
“గుర్తుపడతావా?”
“చూడలేదు. కాని పేరు తెలుసు”
బదులుగా కాణ్హ పకపకా నవ్వాడు.
“పేరుతోనే ఎలా కనుక్కుంటావు?” అన్నాడు.
లిఖిత ఖిన్నవదనంతో చూసిందతని వైపు.
ఆమె మొహంలో బాధ తాలూకు క్రినీడలు దోబూచులాడటం గమనించి ప్రయత్నిద్దాంలే ముందు భోంచేద్దువుగాని రా” అంటూ ఆమెని తన గుడిసెలోకి తీసుకెళ్ళేడు.
యభై సంవత్సరాలున్న స్త్రీమూర్తి చేస్తున్న పనాపి “ఎవర్రామ్మాయి?” అని అడిగింది లిఖితని పరిశీలనగా గమనిస్తూ.
కాణ తల్లికి మళయాళంలో జరిగిందంతా చెప్పేడు. ఆమెకు లిఖిత తెలుగు పిల్లని తెలియగానే ప్రాణం లేచొచ్చినట్లయింది.
“ఏమ్మా. ఆ మహామాయ పరమనీచుడని నీకెవరూ చెప్పలేదా? ఒకప్పుడు నేను కూడా నీలానే వాడి చేతిలో చిక్కుకోబోయేను. వీడి తండ్రి నన్ను రక్షించేడు. ఆయన్నే పెళ్ళి చేస్కున్నాను” అంది.
లిఖిత స్నానం చేసి చాలా రోజుల తర్వాత ఆవిడ వండిన తెలుగు భోజనం తిన్నది.
లిఖిత భోంచేస్తుంటే ఆవిడ సాలోచనగా చూస్తూ “ఆ మహామాయ దగ్గర చాలా క్షుద్రవిద్యలున్నాయి. వాణ్ని మన గణ ఎలా చంపగల్గిందో నాకాశ్చర్యమేస్తున్నది” అంది.
“అదే నేనూ అనుకున్నాను. కాని.. ఏ క్షుద్రవిద్యన్నా దేవుడి ముందు తల దించాల్సిందే కదా. ఈవిడ దగ్గరేమన్నా అద్భుత శక్తులున్నాయేమో” అన్నాడు కాణ్హ నవ్వుతూ.
లిఖిత సిగ్గుపడుతూ “ఏం లేవు. నా దురదృష్టం కొద్ది కొచ్చిలోని భగవతి కోవెలలో పూజారి ఇచ్చిన కుంకుమ కూడా పోగొట్టుకున్నాను” అంది.
కాణ్హా ఆమె మాటలు విని సందేహంగా చూస్తూ ఏనుగు దగ్గరికి పరిగెత్తేడు. అతని చర్య అర్ధం కాని అతని తల్లి, లిఖిత కూడా అతనెళ్లిన దిశ వైపు చూసేరు.
కాణ్హా ఏనుగు దగ్గరగా వెళ్లి దాన్ని పరిశీలనగా చూస్తూ”అమ్మా.. అమ్మా ఇలా రా!” అని పిలిచేడు ఉత్సాహంగా.
కాణ్హా తల్లితోపాటు లిఖిత కూడా అక్కడికి చేరుకున్నారు.
కాణ్హా వాళ్ళకి ఏనుగు మొహం చూపిస్తూ “అమ్మా దీని మొహాన ఎర్రగా అంటుకున్నదేమిటి? నేను ఆ మహామాయగాడి రక్తం అనుకున్నాను కాని.. కుంకుమలా లేదూ?” అనడిగేడు.
ఆమె కూర్చున్న ఏనుగు దగ్గరగా వెళ్ళి నుదుటిమీద కొద్దిగా చేత్తో తడిమి “ఇది కుంకుమే. దీని నుదుటున ఎవరు పెట్టేరు?” అంది ఆశ్చర్యంగా..
లిఖిత ఆశ్చర్యంగా ముందుకొచ్చి చూసింది.
కాణా ఏనుగుని ఎగాదిగా చూస్తూ “నువ్వు నీ కుంకుమని ఎక్కడ పోగొట్టుకున్నావు?” అనడిగేడు.
“వాగు ఒడ్డునే. అక్కడే స్నానం చేస్తున్నపుడు పోయినట్లుంది”
కాణా కళ్లు ఆ మాట విని చిత్రంగా మెరిసేయి.
“అమ్మా” అంటూ తల్లిని కౌగలించుకుని గిరగిరా తిప్పేడు.
ఆమె అర్ధం కానట్లుగా చొసి “ఏంటి?” అంది.
“ఈ కుంకుమ భగవతి కోవెలలో పూజారి ఇచ్చిందేనమ్మా. అందుకే మన గణ ఆ నీచుణ్ణి చంపగల్గింది” అన్నాదు ఆనందాతిరేకంతో.
లిఖిత తెల్లబోయి చూసిద్ని.
“ఈ కుంకుంకంత శక్తుందా?” అనడిగింది ఆశ్చర్యపోతూ.
“ఉంది. నీతి, నిజాయితీ, రుజువర్తనానికెప్పుడూ శక్తుంటుంది. దాని ముందు ఏ క్షుద్రశక్తైనా నిలబడదు.నిలబడలేదు. నీచోపాసకులకి, క్షుద్ర ఆరాధకులకి ఎప్పుడూ చివరన ఇలాంటి చావే పడుతుంది. కాణ్హా. గణాకి స్నానం చేయించకు. వెంటనే మీరిద్దరూ దీని మీద వెళ్లి వాడి స్థావరానికి వెళ్లండి. వెళ్లి ఈమె తండ్రిని పట్టుకోండి. ఆ నీచ స్థావరాన్ని నాశనం చేయండి. మీకు భగవతి సహాయపడుతుంది”అంది ఒకరకమైన ఉద్వేగభరితమైన కంఠస్వరంతో అతని తల్లి.
కాణ్హ తల్లి మాటని వెంటనే శిరసావహించేడు.
ఇద్దరూ ఆమెకి నమస్కరించి ఏనుగు మీద వెళ్తుంటే ఆమె భగవతి నామోచ్చారణ చేస్తూ వాళ్లు కనిపించినంత మేరా చూస్తూ నిలబడింది.

మాయానగరం 45

రచన: భువనచంద్ర

జీవించడం తెలీనివాడు జీవితాన్ని మధించలేడు.
అన్నీ వున్నవాడు ఎదుటివాడి ఆకల్ని ఏనాడూ గమనించలేడు.
జీవితం అంటేనే ఒక ఉగాది పచ్చడిలాంటిది. అక్కడ చేదు, పులుపు, తీపి, కారం, వగరూ, వుప్పూ లాంటి రుచులుంటే, ఇక్కడ సుఖం, కష్టం, విరహం, ప్రేమ, కన్నీరు, కపటం, మోసం, మాయలాంటి అనేక విధానాలు వుంటాయి.నిన్నటి దేవుడు ఇవ్వాళా దేవుడుగానే వుంటాడని గ్యారంటీ లేదు. అదే విధంగా నిన్నటి విలన్ ఇవ్వాళా విలన్ పాత్రనే పోషిస్తాడనే నమ్మకమూ లేదు. ఆకాశంలో మబ్బులు రూపు మార్చుకున్నట్టు, మనిషిలోని ఎమోషన్సూ మారుతూనే వుంటాయి.
“అసలు జీవితాన్ని నేను ఏం చూశానూ? ఏమి అనుభవించానూ?” అనే ప్రశ్న రానే కూడదు. ఒక్కసారి ఆ ప్రశ్న బుర్రలో పుడితే చాలు, మరుక్షణం నించీ బుర్రని పురుగు తొలిచినట్టు తొలుస్తూనే వుంటూంది.మాధవి పరిస్థితి ప్రస్త్తుతం అదే.
ప్రస్తుతం మాధవి వున్నది గోవిందరాజస్వామి ఆలయం వున్న స్ట్రీట్‌లో. ఆ యిల్లూ బోస్‌దే. కానీ వేరే పేరు మీద వున్నది. అతనికా వూళ్ళో చాలా ఇళ్ళున్నై. కానీ అలా వున్న విషయం జనాలకి తెలీదు. అద్దెలమీదే దాదాపు పాతికవేల ఇన్‌కమ్ వుందతనికి.
“మాధవిగారూ.. జరిగినదానికి చాలా బాధగా వుంది. జనాలకి మేలు చెయ్యాలనే తలంపు తప్ప వేరేమీ మీ మనసులో వుండదు. అలాంటి మీ ఇంట్లోకే వచ్చి నిప్పు పెట్టారంటే మామూలు విషయం మీకంటూ శతృవులు లేరని నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా”సైలెంటయ్యాడు బోస్.
“ఎవరి పని అయ్యుండొచ్చు. అయినా నన్ను నిప్పులపాలు చేస్తే ఎవరికి లాభం?” నిస్పృహతో అంది.
“నాదీ అనుమానమే. ఖచ్చితంగా ఇది శామ్యూల్ రెడ్డి పని అని చెప్పలేనుగానీ, ఒక అవకాశం అతనికుంది. ఎన్నికల్లోనించి నన్ను తప్పిస్తే అతనికి అవకాశం వస్తుందనే కారణమూ కావొచ్చు. సిన్సియారిటీలు, నిస్వార్ధాలూ మానేసి గెలుపుకి ట్రై చెయ్యమని మా గురువుగారూ హింట్ ఇచ్చారు. ఏమైనా జరిగింది జరిగింది. ఇకనించీ మెరు జాగ్రత్తగా వుండాలి. అఫ్‌కోర్స్ మిమ్మల్ని కంటికి రెప్పలా, అనుక్షణం కాపాడమని మావాళ్లకి ఖచ్చితంగా చెప్పాను. వాళ్లని మీకు పరిచయం చేస్తా. వాళ్లు నాకొసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడరు. నా మాట అంటే వాళ్లకి సుగ్రీవాజ్ఞ లాంటిది” ధైర్యం చెప్పాడు బోసుబాబు.
“వద్దండీ, అదేమీ వొద్దు. లోకానికి భయపడే మనస్తత్వం కాదు నాది. అదీగాక, మీరు బాడీగార్ద్శ్‌ని పెడ్తే లేనిపోని రూమర్లు పుట్టుకొస్తాయి. అవి మీకూ, నాకూ కూడా మంచిది కాదు. అయినా ఈ ఇల్లు అదివరకు దానిలాగా ఒంటరిది కాదుగా. చుట్టూతా ఇళ్లూ, జనాలూ వున్నారు. ప్లీజ్. నా రక్షణ కోసం ఎవర్నీ పురమాయించకండి. నా జాగ్రత్తలో తప్పకుండా నేనుంటాను” స్పష్టంగా, ధైర్యంగానూ జవాబిచ్చింది మాధవి.
“సరే.. మీ ఇష్టం” లేచాడు బోసుబాబు.
*****
“ఇందులో ఎవరి పాత్ర వుండి వుంటుందంటావూ?” అడిగాడు అద్వితీయ ఎదురుగా వున్న ‘పరాగా’న్ని.
“ఏం చెప్పను భాయీ.. ఎవరిదైనా వుండొచ్చు. శామ్యూల్ రెడ్డి కావచ్చు. పొరపాటున ఎక్కడ్నించో ఎగిరిపడి వచ్చిన నిప్పురవ్వది కావొచ్చు. అసలు బోసుబాబుదే కావొచ్చు. ఇంకా ముందు కెడితే బోసుబాబుని ‘సరైనా దారిలో పెట్టడానికి మన మహాగురువుగారు చేయించిన ప్రయోగమైనా కావొచ్చు. ఏదీ ఇతమిద్దంగా చెప్పలేము. ఒక్కటి మాత్రం నిజం. నిజాన్ని వెలికితీసే ప్రయత్నం వల్ల లాభమూ, నష్టమూ రెండూ వున్నై. అసలైన ‘వాడ్ని’ కనుక్కుంటే కాస్త డబ్బు పిండుకోవచ్చు. రాంగ్ నంబర్ అయిందనుకో, మనం విసిరిన బూమెరాంగ్ మన తోకనే తెంపుతుంది.”సుదీర్ఘ వివరణ ఇచ్చాడు పరాగం
‘జర్నలిస్టు’ అనే పదానికి చెడ్డపేరు తెస్తున్నారు మీరు. డబ్బు పిండుకోవడం ఏమిటి అసహ్యంగా” విసుక్కుంది సంఘమిత.
“అమ్మా సంగమ్మా. నీది కడుపు నిండిన వ్యవహారం. మా సంగతంటావా.. ఏరోజు కారోజు వెతుకులాటలే కదా. అయినా నిస్వార్ధాలూ, చట్టుబండలూ పోయి చాలా కాలం అయింది. ఇప్పుడు పత్రికలకి కావల్సింది సర్క్యులేషన్. అదుండాలంటే సెన్సేషన్‌ని క్రియేట్ చెయ్యాలి. అది కూడా అలాంటిలాంటి సెన్సేషన్ కాదు. ఆంధ్రదేశం అట్టుడికిపోవాలి. ఇది నా మాట కాదు. ప్రతి పత్రిక యాజమాన్యం మన చెవుల్లో ఇల్లు కట్టుకుని మరీ నినదించే మాట” కొంచెం కచ్చిగా అన్నాడు అద్వితీయం. ఈ మధ్య సెన్సేషనల్ న్యూస్ ఇవ్వడం లేదని అతనికి ఆల్రెడీ ఎగ్జ్యూటివ్ ఎడిటర్ నించి అల్టిమేటం వచ్చింది మరి. ఏం చేస్తాడు. జర్నలిస్టు కోపం జనాలకి చేటు.
“బాబూ గోడలకి చెవులూ, నోళ్ళూ ఎక్కడెక్కడో కాదు, ఇక్కడా వుంటాయి” నిర్లిప్తంగా అన్నది సంఘమిత్ర. పైకి నిర్లిప్తంగా అన్నా లోపల మాత్రం పరాగం మాటల గురించి ఆలోచిస్తుంది.

*****

ఎవరో మాధవి గదిలో నిప్పు పెట్టారన్న విషయమూ, ఆమె ప్రస్తుతం అనఫిషియల్‌గా బోసు ఇంట్లో నివాసముంటున్న విషయమూ గుడిసెల సిటీని వూపేసింది. నిజంగా చెబితే గుడిసెల్లోని యువకులంతా భగ్గున మండి పడుతున్నారు. బోస్‌తో మాధవి కలిసి గుడిసెలవాళ్లకోసం చేస్తున్న మంచి పనులు మొదట యువతకి చికాకు కలిగించినా, మాధవి మెల్లగా, ప్రేమగా వారికి నచ్చచెప్పడం వల్ల వారూ ‘మార్పు’ని ఆమోదించగలిగే స్థితికి చేరుకున్నారు. ఆ ‘మార్పు’ శరవేగంగా జరుగుతున్న సమయంలో ఇలా తమ నాయకురాలికి జరగడం వాళ్లని కోపోద్రిక్తుల్ని చేసింది.
అసలు గుడిసెవాసుల్లో ఇంతటి రియాక్షన్ వుంటుందని బోసుబాబే వూహించలేదు. మాధవి ఇంతగా జనాల్ని ఆకట్టుకుంటుందనీ, అతనూ వూహించలేదు. రియాక్షన్ చూసిన క్షణమే అతని మనసులో సన్నగా ‘అసూయ’ పొటమరించినా, మరుక్షణమే దాన్ని తృంచేశాడు. కారణం మాధవికొచ్చే పేరు మొత్తం ఉపయోగపడేది తనకేగా. మంచివాడు చెడటానికి క్షణం పట్టదు. కానీ చెడ్డవాడు మంచివాడు కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది.
ఒక్కసారి బోసుబాబు ఆలోచించాడు. మాధవి ప్రణాలికల్ని. “బోస్‌గారూ, మీరు వీరిని బాగు చేద్దామనుకుంటున్నారు. కానీ ఎలా బాగు చేస్తున్నారూ? చలికాలం దుప్పట్లు, రగ్గులు, ఎండాకాలం కుండలు, ప్లాస్టిక్ బిందెలు, వానాకాలం గొడుగులూ ఉచిత సారా పాకెట్లు ఇస్తున్నారు. బాగు చెయ్యడం అంటే ఇదేనా? ఇవ్వాళ ప్రభుత్వం చేస్తున్నదీ, మీరు చేస్తున్నదీ కూడా ఒక్కటే. జనాల్ని బిచ్చగాళ్లుగా మార్చడం. మీరు అన్నదానం అంటూ మొదలెడతారు. అందరూ క్యూలో మీరిచ్చే పులిహోర పేకెట్లు పెరుగన్నం పేకెట్లూ తీసుకుని, ‘కలకాలం*’ వర్ధిల్లు బాబూ అంటూ దీవిస్తారు. పత్రికలూ, చానల్సూ మిమ్మల్ని పొగిడి పొగిడి దానకర్ణుడంటూ ఆకాశానికి ఎత్తేస్తాయి. ఈ పుణ్యం-ఆ పాపం =సరికి సరి అనుకుంటూ గుండెలమీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతారు. జరుగుతున్నది ఇదేగా?” సూటిగా అడిగింది.
అవునన్నట్టుగా తలూపాడు బోసుబాబు. కాదనడం ఎలా, జరుగుతున్నది అదే అయినప్పుడు.
“ఏం చెయ్యాలంటావు అక్కా?”అడిగింది శోభ. సౌందర్య, వసుమతి ఇంకొదరు టీచర్లు అక్కడే వున్నారు. గుడిసెల సిటీలోనించి ఉద్భవించిన కొందరు విద్యార్తులూ అక్కడున్నారు. మంచీ చెడూ విచక్షణా గ్నానం కలిగిన పెద్దలూ కొందరు అక్కడున్నారు.
“సేవ అనేది ఎప్పుడూ ‘దానం’ ప్రాతిపదిక మీద వుండకూడదు. అది పటిష్టమైనదిగానూ, నిర్మాణాత్మకమైనదిగానూ వుండాలి. ఓ పేద్ద వానొస్తుంది. ఇళ్ళలోకి నీళ్ళొస్తాయి. అప్పుడు వరదబాధితులకి ఆహారం అందించడమూ, వారు రాత్రి పదుకోవడానికి పొడిగా వుండే చోటు చూపడమూ మన నైతిక బాధ్యత. అది తాత్కాలికమే అయిన నీడ్ ఆఫ్ ద అవర్. వరదలు వచ్చేముందే నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేసి వరదనించి రక్షింపబడటానికి (అదెప్పుడు వచ్చినా) చర్యలు తీసుకోవడం, శాశ్వత ప్రాతిపదికపై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చెయ్యదం అసలు సిసలైన ప్రజాసేవ.” ఓ క్షణం ఆగింది మాధవి.
“అసలు మీరీ బడుగు ప్రజలకు ఏమి చేస్తే, ఎలా చేస్తే బాగుంటుందనుకుంటున్నారు?” అడిగాడో యువకుడు.
గుడిసెల్లో పుట్టీ, అక్కడ్నించే కష్టపడి చదివి డిగ్రీ తీసుకున్న ముగ్గురిలో అతనొకడు. పాతికేళ్ళ వయసుంటూంది. పట్టణాభివృద్ధి శాఖలో పని చేస్తున్నాడు. గుడిసెల సిటీని ఆనుకుని వున్న మిడిల్ ఇన్‌కం గ్రూప్ (M.I.G) కాలనీలో వుంటున్నాడు.
“చెప్తాను. మనం చేయదలుచుకున్నది ప్రజలకి తెలియాలన్నా, ప్రగతిఫలాలు వారికి అందాలన్నా, మనం తాత్కాలిక విషయాలకి ఇంపార్టెన్స్ ఇస్తూనే, మన పని నిరంతరం కొనసాగించవలసి వుంటుంది. అది ఏ ఏ రంగాల్లో అంటే,
మొదటిది విద్య. రెండోది పారిశుధ్యం. మూడు పొదుపు. నాలుగు పరస్పర సహకారం. అయిదు మూలనిధి. ఆరు సమాచార వ్యవస్థ. ఏడు మద్య బహిష్కరణ. ఎనిమిది అందుబాటులో వుండటం. ఒక్కోదానికి పదిమంది పర్మనెంటు సభ్యులు వుండాలి. అంటే మొత్తం ఎనభై మంది. ప్రతి గ్రూపులో పదిమంది సభ్యులున్నా వారిలో ఒకరైనా ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి. ఈ పై అంశాల మీద ప్రజలకి వివరించి ప్రజల్ని మోటివేట్ చేస్తూనే వుండాలి. ఫలితం వెంటనే కనపడకపోవచ్చు. కానీ, ఒక్కసారి ప్రజల్లో చైతన్యం మొదలైతే, అద్భుతమైన ఫలితాన్ని అదీ శాశ్వత ఫలితాల్ని సాధించగలం..” తన మనసులోని మాటని వివరించింది మాధవి.
మిగతావన్నీ అర్ధమయ్యాయి .. యీ మూలనిధి అంటే ఏమిటి? ఎందుకూ?” అడిగిందో టీచరు.
“మా కాలేజీలో “కూర్గ్” ప్రాంతానికి చెందిన అమ్మాయొకతి వుండేది. ‘తుళు’ బాష మాట్లాడేది. జనరల్ కరియప్ప, తిమ్మప్ప ఇలాంటి మహనీయులని కూడా కూర్గే. వారు మన దేశం వారే అయినా వారి సంప్రదాయాలు కొన్ని అద్భుతమైనవి.మరెక్కడా అవి కనిపించవు.ల్ అదేమిటంటే, బిడ్డ పుట్టీన మరుక్షణం నించే తలకి ‘ఇంత’ అని సంఘానికి కట్టాలి. పిల్లల చదువుల బాధ్యత సంఘానిదే. అలాగే పెళ్లి. ఎంత గొప్పవాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, పెళ్లి సంఘ నియమాల ప్రకారమే జరగాలి. ఆ పెళ్ళి అయ్యాక రిసెప్షన్ పేరు మీద ఓపికున్నంత, నీ స్తోమతు ప్రకారం ఖర్చు చేసుకో. పెళ్ళి మాత్రం సంఘ నియమాలకి లోబడి పరిమితమైన కుటుంబ సభ్యులు, సంఘ సభ్యుల మధ్యే జరగాలి. అలాగే మరణించినపుడు “అయ్యో! డబ్బు ఎక్కడ దొరుకుతుందా?” అని వెంపర్లాడక్కర్లేదు. జీవితంలోని ముఖ్యమైనవన్నీ సక్రమంగా ఏ టెన్షనూ లేకుండా జరిగిపోతాయి” ఆగింది మాధవి.
“అద్భుతమైన సంప్రదాయం ఇది. అబ్బా. ఎవరు చనిపోయినా మనం డబ్బు దొరక్క ఎంత ఇబ్బంది పడతాం” ఆశ్చర్యంతో అన్నాడో పెద్దాయన.
“అసలు ఇదే పద్ధతి అన్ని చోట్లా అమలయితే ఎంత బాగుంటుండునూ” కళ్లు మెరుస్తుంటే అన్నది శోభారాణి.
“అమలయ్యే చాన్స్ లేదు. మాధవిగారన్నట్లు ఆ మూలనిధిని ఏర్పాటు చేసినా, మనవాళ్లయితే గుటుక్కుమని మింగి కూర్చుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రకటించి వాటికి నిధులు సమకూర్చినా ఆ డబ్బు జనానికి అందుతోందా? అందినా, ఎంత శాతం అందుతోంది?” నిర్లిప్తంగా అన్నాడింకో పెద్దమనిషి.
“అయ్యా.. ఆ మూలనిధిని ఒక్క పైసా కూడా వృధా కాకుండా, దొంగల , స్వార్ధపరుల పాలు కాకుండా పర్ఫెక్టుగా అమలు జరిపే పద్ధతి కూడా కూర్గువారే కనిపెట్టారు. కనుక ఆ సొమ్ము ఏమవుతుందనే భయం అక్కర్లేదు. మనమూ మన కోసం అటువంటి మూలనిధిని అమర్చుకుంటే, మరణం సంభవించినప్పుడు నూటికి నలభై రూపాయలకి డబ్బు వడ్డీకి తెచ్చుకోనక్కర్లేదు. జీవితాంతం ‘అసలు’ని కట్టలేక ఇల్లు బళ్ళూ గుల్ల చేసుకోనక్కర్లేదు. సరే, ఆ విషయాలనీ చక్కగా వివరించే మూలనిధిని కలెక్ట్ చేద్దాం. ముందు యీ ఎనిమిది గ్రూపులూ, వాటి పనితీరు గురించి చక్కగా చర్చించుకుందాం. ఒక్కడో, లేక కొందరో ఏమీ చెయ్యలేరు. అందరం సంఘటితమైతే మనం చెయ్యలెని పనే లోకంలో వుండదు” స్థిరంగా అనంది మాధవి.
“అందరం సమ్మతిస్తున్నాం. మీరెం చెప్పినా మాకు సమ్మతమె” అని అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆ సమావేశం జరిగింది రిక్షాలు పార్కు చేసే జండా చెట్టు కింద. అక్కడికక్కడే గా.మో.క సమిష్టి సహకార సంఘం ఏర్పాటయింది. అధ్యక్షుడిగా బోసుబాబు, కార్యదర్శిగా మాధవి, కార్యకర్తలుగా స్థానికుల్లో కొంతమంది ఎన్నుకోబడ్డారు. ఎనిమిది గ్రూపులకీ సభ్యులుగానూ, గ్రూప్ హెడ్స్ గానూ, సలహాదార్లుగానొనొ ఎవరెవర్ని నియమించాలో కూడా నిర్ణయమైంది. ఒక కొత్త వుత్సాహంతో ఆ సభలో పాల్గొన్న అందరూ సభ పూర్తయ్యాక తమ ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాక రాబోయే కాలాన్ని నేడే స్వాగతించామని ఆనందించారు.
బోసుబాబు మనసునిండా కొత్త వుత్సాహం. వారానికోసారి జరిగే సమావేశాల్లో శోభ కూడా పాల్గొంటుంది. అదో మంచి అవకాశం. ఆమెతో చనువు పెంచుకోవడానికి.
మాధవి మనసులో ఆనందం. నిర్లిప్తంగా గడుపుతున్న జీవితానికి, నిర్మాణాత్మకంగా గడిపే అవకాశం వచ్చిందని.
గుడిసెవాసుల్లో ఆనందం. మాధవి చెప్పినట్టు పురిటి ఖర్చు, చదువు ఖర్చు, పెళ్ళి ఖర్చు, అంత్యక్రియల ఖర్చు సంఘమే భరిస్తే జీవితం అద్భుతంగా వుంటుందనీ, తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా వుంటుందనీ.
కానీ, ఇన్ని ఆనందాల మధ్య కాలిపోతున్న మనసు కూడా ఒకటి వుంది. ఆ మనసు మేరీ టీచర్‌ది. పైకి ఆనందంగా చప్పట్లు చరిచి అభినందించినా, లోపల మాత్రం శోభ గురించీ, ఆమెకి ఇతరులు ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించీ అసూయతో మాడిపోతోంది. బోసుబాబు శోభ వంక చూసే చూపుల్లోనే అతని ఇష్టాన్నీ, ప్రేమనీ మేరీ టీచర్ గుర్తించగలిగింది. అందుకే అనంతమైన అసూయతో రగిలిపోతోంది.
ఎవరిమీదైనా సరే కోపగించుకోవాలంటే కారణం వుండాలి. ఎవరి మీదైనా మన మదం చూపాలన్నా, లోభాన్ని చూపాలన్నా కూడా కారణాలు వుంటాయి. అసూయపడటానికి మాత్రం కారణం ఉండక్కర్లేదు. ఎవరు ఎవరిమీదైనా అసూయతో దహించుకుపోవచ్చు. అసలు వాళ్లెవరైనా సరే మాంకి పరిచయం లేకపోయినా సరే, అసూయ మాత్రం ఏమాత్రం సందేహం లేకుండా మనసులో చొరబడుతుంది. ఒక్కసారి అసూయ అనే అగ్ని మనసు అనే కట్టెని అంటుకున్నాక, అది పూర్తిగా దహించకుండా మాత్రం వదిలిపెట్టదు.
సమావేశం అయిన అరగంటలో గుడిసెల సిటీలో జరిగిన ప్రతి మాటా, ప్రతీ నిర్ణయమూ కూడా శామ్యూల్ రెడ్డికి చేరిపోయాయి. మేరీ టీచర్ అనే ప్రత్యక్ష సాక్షి ద్వారా.
“గుడ్. మేరీ. యూ ఆర్ సో గ్రేట్ ఎండ్ లవ్లీ. ఏదో ఓ గ్రూపులో చేరి నువ్వూ సభ్యత్వం దక్కించుకో. ప్రతి సమావేశంలోనూ ఏం జరుగుతుందో ఇలాగే నాకు కబురందించు. అన్నట్లు రేపట్నించీ నిన్ను వైస్ చైర్మన్‌గా ప్రమోట్ చేస్తున్నా” అన్నాడు శామ్యూల్ రెడ్డి.
సంఘమిత్ర సుదీర్ఘంగా నిట్టూర్చింది. గుడిసెల సిటీలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ ఆమె చాలా విపులంగా సెకరించింది. ఇప్పుడే మాధవి ఇంట్లో ఫైర్ పెట్టినవారు ఎవరో తెలిస్తే, స్పష్టంగా గుర్తించగలిగితే డబ్బుని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు పిండుకోవచ్చు. పరాగం అన్నట్టు బూమెరాంగ్‌ని సరైన వ్యక్తి వైపు గురి చూసి విసరాలి. గాఢంగా ఆలోచనలో పడింది సంఘమిత్ర.
*****
వెంకటస్వామి అలజడిగా తిరుగుతున్నాడు. వారం నించీ పరమశివంగాడి జాడ లేదు. అంటే వాడు ఏదో అతి క్రూరమైన ఆలోచనలో వున్నట్టే లెక్క . కేరళ వెళ్ళిపోవడానికి సన్నాహాలు మొదలెట్టాడు. రాత్రికి రాత్రే హోటల్ ఓనర్ కావాలనీ, మహాదేవన్ కూతురిని నగలతో సహా లేపుకుపోతే తన కలలన్నీ ఫలిస్తాయనీ కంటున్న కలలు పగటి కలలు కాబోతున్నాయని అతనికి అనిపిస్తోంది. ఒక్క విషయం మాత్రం నిజం, ఏది జరిగినా ఏమి చేసినా పరమశివంలా కిరాతకంగా చెయ్యకూడదు అని మాత్రం నిశ్చయించుకున్నాడు. నవనీతం కనిపించి కూడా నెలన్నర దాటింది. అసలామెకి ఏమయిందో కూడా తెలీలేదు. ఒకవేళ పరమశివంగాడు ఆమెని ఏమైనా లేపేశాడా? ఒక్కసారి వెంకటస్వామి ఒళ్ళు భయంతో జలదరించింది. రాత్రి ఏడయింది. ఎనిమిదింపావుకి ఖచ్చితంగా గాడిపొయ్యి ఆర్పుతాదు వెంకటస్వామి. అది మహాదేవన్ ఆజ్ఞ. మహాదేవన్ తల్లి కూడా రాత్రి ఎనిమిదింపావుకి పొయ్యి ఆర్పేసేదిట. ఆర్పే ముందు నెయ్యి, ఫ్రెష్‌గా వండిన కొంత అన్నమూ, బెల్లమూ పాలు కలిపి పరమాన్నం కలిపి. ఆ పరమాన్నాని అగ్నిలో వేసి అది పూర్తిగా ఆహుతయ్యాక మంటలు ఆర్పేసేదట. మహదేవన్ అదే ఫాలో అవుతున్నాడు. వెంకటస్వామి వచ్చాక ఆ పనిని అతనికి అప్పజెప్పాడు. అదీ శంఖుచక్రపురం వెళ్లి వచ్చాక. ఆలోచనలతో మరో అరగంట గడిచింది. నెయ్యి, బెల్లం, అన్నం పాలూ తీసుకుని గాడిపొయ్యి దగ్గరికొచ్చాడు వెంకటస్వామి. “ఒరే వెంకటస్వామీ, ఇవ్వాళ మా అమ్మ గుర్తుకొస్తుందిరా. ఇవ్వాళ అగ్నికి నేనే నివేదన చేస్తా. నువ్వు విశ్రాంతి తీసుకో” వెంకటస్వామి చేతిలోంచి ఆ వస్తువులని తీసుకుంటూ అన్నాడు మహదేవన్.
“నందినీ ఇలా రామ్మా” పిలిచాడు మహదేవన్. వచ్చి పక్కన కూర్చుంది నందిని. “కరళే (హృదయమా) నిన్ను నా గుండెల మీద పెంచుకున్నాను. మీ అమ్మ పోయాక నా సర్వస్వం నువ్వే అయ్యావు. తల్లి లేని లోటు తప్ప నీకే లోటూ రానివ్వలేదు. తల్లీ, ఆ పరమశివంగాడు మన దూరపు చుట్టం. వాడిని నీకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. అన్నపూర్ణ తల్లి అనుగ్రహం వల్ల వాడి అసలు రూపు బయటపడింది. పరమ కిరాతకుడు వాడు. ఎలాగో ఆ దరిద్రం వదిలింది. ఎవరికో చెడు చెయ్యబోతే భగవంతుడు వాడ్ని శిక్షించాడు. దాంతో వాడి మతి భ్రమించి మాట పోయిందిట. ఈ విషయం వెంకటస్వామి చెప్పాడు. అమ్మాయ్.. నీ తండ్రి నెమ్మదస్తుడేగానీ అమాయకుడు కాదు. యీ వెంకటస్వామి సామాన్యుడు కాదు. నిన్ను నా దగ్గర్నించి దూరం చేసి నీ నగలు కాజెయ్యాలని వీడి ఆలోచన. వాడికెలా బుద్ధి చెప్పాలో నేను ఆలోచించే వుంచాను. వీడినించి నిన్ను కాపాడాలంటే నిన్ను ఇక్కడ్నించి వేరే చోటికి తీసుకుపోవాలి. ఆ ప్రయత్నాలూ చేసి వుంచాను. అమ్మా. నిన్ను ముగ్గులోకి దింపాలని వీడు చేసిన ప్రయత్నాలన్నీ నేను గమనించినా గమనించనట్టుగా వున్నాను. తల్లీ… నేను నీ తండ్రిని. నిన్నో అయ్య చేతిలో పెట్టడం నీకు శాశ్వత రక్షణ కల్పించడం నాకు ఏకైక బాధ్యత. మరో వారంలొ మనం వేరే చోటికి వెళ్లిపోతున్నాం. జాగ్రత్తగా ఉండు. వీడు ఎన్ని మాటలు చెప్పి నిన్ను నమ్మించాలని చూసినా నమ్మకు. సరేనా” నందినిని దగ్గరగా తీసుకుని మెల్లగా తన మనసులొని మాటని చెప్పాడు మహదేవన్. “అలాగే నాన్నా!” ఓ క్షణం అవాక్కై ఆ తరవాత అన్నది నందిని. వెంకటస్వామిని తండ్రి ఇంతగా గమనిస్తాడని ఆమె వూహకి కూడా అందలేదు. వెంకటస్వామి నగలు తీసుకుని పారిపోదాం అనడమూ ఆమె మర్చిపోలేదు. “వెళ్లు .. విశ్రాంతి తీసుకో” అని నందినిని లోపలికి పంపాదు మహదేవన్.
“తల్లీ అన్నపూర్ణా నీకు వందనం. ఈ జన్మంతా నీకు సేవ చేసుకునే భాగ్యాన్నిచ్చావు. తల్లీ అన్నపూర్ణా.. యీ వాహనునితో యీ పాయసాన్ని నీకు అర్పిస్తున్నానమ్మా. మమ్ము కాపాడు.. లోకాస్సమస్తా సుఖినోభవంతు” అని ప్రార్థిస్తూ పొయ్యి ఆర్పాడు. ఆ నిశ్శబ్దంలో ఎవరో ఓ చాకుని విసిరిన శబ్దం. వెనువెంటనే ప్రాణాలు గాలిలో కలిసేట్టు రెండు ఆర్తనాదాలు..

మళ్లీ కలుద్దాం
భువనచంద్ర.

కలియుగ వామనుడు – 5

రచన: మంథా భానుమతి

హలీమ్ నలుగురికి శిక్షణ ఇస్తుంటే, వాళ్లకి అసిస్టెంట్ల కింద అబ్బాస్ లాంటి వాళ్లు అరడజను మంది ఉంటారు. నజీర్ దగ్గర పని చేస్తూనే, హలీమ్ ఫామ్ కి వచ్చినప్పుడు ట్రయినీ ముధారీ లాగ కొంత డబ్బు సంపాదిస్తాడు అబ్బాస్. అందులో సగం నజీర్ నొక్కేసి, సగం అబ్బాస్ బాంక్ లో వేస్తాడు.
ఒంటె నడుస్తుంటే ఎగరకుండా, గట్టిగా మూపురాన్నీ, మెడకి కట్టిన తాడునీ పట్టుకోమని, ఎలా పట్టుకోవాలో మిగిలిన పిల్లలకి చూపిస్తున్నాడు నజీర్.
గుర్రం మీది సవారీకీ ఒంటె సవారీకీ చాలా తేడా ఉంది. గుర్రం వీపు, రౌతు కూర్చోడానికి సదుపాయంగా, మధ్యలో పల్లంగా ఉంటుంది.
ఒంటెకి నడి మధ్యలో మూపురం ఉంటుంది. అది కూడా తీరు లేకుండా పెరిగిన కొవ్వుతో. రౌతు, మూపురం వెనుక కూర్చోవాలి. అక్కడ ఒంటె శరీరం వెనక్కి వాలిపోయి ఉంటుంది. జారి పోకుండా, కాళ్లు మడిచి పెట్టి బల్లిలా అతుక్కుని కూర్చోవాలి.
అందులో పిల్లలకి మరీ కష్టం. చిన్న చిన్న కాళ్లు.. మడవడానికి రావు. అందుకే ఒకోసారి వెల్కో పెట్టి అతికించేస్తారు.
పడి పోకుండా కూర్చునే పద్ధతి నేర్పించాడు అబ్బాస్ చిన్నాకి. అబ్బాస్ దొరకడం కొంతలో కొంత అదృష్టం అనే చెప్పాలి. చూడగానే చిన్నా అంటే ఇష్టం కలిగింది అబ్బాస్కి.
అంతలోనే.. అక్కడికి హలీమ్ వచ్చాడు.
హలీమ్ ని చూడగానే, గొంతులోకి ఎక్కడలేని సౌమ్యతనీ తెచ్చుకున్న నజీర్.. ఒక్కొక్కళ్ల దగ్గరికీ వెళ్లి, శాంతంగా వివరించాడు..
అందరూ నెమ్మదిగా ట్రాక్ మీద స్వారీ చెయ్యడం మొదలు పెట్టారు. కొన్ని ఒంటె పిల్లలు తల ఒకటే విదిలించడం.. దాంతో తాడు వదిలేసి కెవ్వుమని కేక పెట్టాడు ఒక కుర్రాడు.
వాడి కేకకి బెదిరి పోయిన లొట్టిపిట్ట, వేగం పెంచింది. ఎలాగో ఆ తాడు దొరక పుచ్చుకుని, పట్టుకుని పక్కకి వేళ్లాడుతూ ఆ కుర్రాడు, ఇంకా గట్టిగా కేకలు వెయ్యడం మొదలు పెట్టాడు.
మిగిలిన పిల్లలు.. అదంతా అలవాటయినట్లు, పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు.. బాలన్స్ చేసుకుంటూ.
చిన్నా భయాందోళనలతో చూస్తూ ఉండి పోయాడు.. ఒంటె నడుస్తుండగానే. అది తనకే అయితే.. ఏం చెయ్యాలి?
కొంచెం సేపటికి, ఒంటె ఎగిరిన ఎగురుకి ఆ కుర్రాడు వీపు మీద పడ్డాడు. వేళ్లాడుతున్నవాడు నిల దొక్కుకుని నెమ్మదిగా సర్దుకున్నాడు.
చిన్నాకి కూడా అదృష్టవశాత్తూ ఒంటె నెమ్మదిగా నడుస్తోంది. పైగా పట్టు దొరికింది.
కానీ కొంచెం కూడా కదలకుండా బిగ దీసుకుని కూర్చున్నాడు. ఒంటె, తనే అటూ ఇటూ కదుపుకుంది శరీరాన్ని.
సుమారు గంట పైగా సాగింది స్వారీ.
అయిపోయిందని నజీర్ సిగ్నల్ ఇచ్చాక, అసిస్టెంట్లు వెళ్లి ఒంటెలని తాళ్లు పట్టుకుని ఆపారు.
పిల్లలందరినీ దింపి, ఒక దగ్గరికి చేర్చారు. హెల్మెట్లు తీసేసుకున్నారు.
“చిన్నా…” టింకూ ఏడుస్తూ వచ్చాడు.
“ఏమయిందిరా? నువ్వు ఒంటె ఎక్క లేదుగా?” చిన్నా వెనక్కి ఒళ్లు విరుచుకుంటూ అడిగాడు. వీపు నొప్పెట్టేస్తోంది.. అంత సేపు కదలకుండా నిటారుగా కూర్చోడం వల్ల.
“ఎక్కలేదు. కానీ.. చూడు..” రెండు చేతులూ చూపించాడు.. ఏడుస్తూనే.
అర చేతులు నల్లగా అయిపోయాయి. మధ్యలో ఒక దగ్గర గీరుకుపోయి, కొద్దిగా రక్తం వస్తోంది.
“అయ్యయ్యో..” చుట్టూ చూశాడు చిన్నా.. నీళ్ల కోసం. ఫౌంటెన్ దగ్గర తప్ప ఎక్కడా నీళ్లు లేవు.
తాగడానికి మాత్రం తలా ప్లాస్టిక్ గ్లాసులోనూ నీళ్లి చ్చారు. అందరూ గటగటా తాగేశారు.
చిన్నాకి కూడా దాహం వేస్తోంది.
“నీళ్లు తాగెయ్యి. లేకపోతే కళ్లు తిరుగుతాయి. వాడి చేతులు పౌంటెన్ దగ్గర కడగచ్చు. వాడిని కూడా నీళ్లు తాగ మను. లేకపోతే డీహైడ్రేషన్ వస్తుంది.” అబ్బాస్, పక్కకి వచ్చి చెప్పాడు.
టింకూ చేత నీళ్లు తాగించాడు చిన్నా.. వాడు చేతులు దూరంగా పెట్టి వెక్కుతూనే ఉన్నాడు.
అందరినీ ఫౌంటెన్ దగ్గరకి తీసుకెళ్లి, కాళ్లు చేతులు అక్కడున్న నల్లా దగ్గర కడుక్కోమన్నాడు అబ్బాస్. నజీర్, హలీమ్ ఆఫీసు లోకి వెళ్లాడు.
ఆ రోజుకి డబ్బు ఇచ్చి, పిల్లలందరికీ, మంచి ఫుడ్ పెట్టమని చెప్పాడు హలీమ్.
“ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. అప్పుడు వైట్ పెరక్కుండా, బలం పెరుగుతుంది. రేసులు వచ్చేసరికి, ఎవరూ వీక్ గా సోలి పోయి ఉండకూడదు.”
అలాగే అని బుద్ధిగా తలూపాడు నజీర్.
అయితే.. బరువు పెరక్కుండా సగం తిండే పెట్టడం అతని పద్ధతి. ప్రోటీన్ ఫుడ్ కోసం ఇచ్చిన డబ్బు స్వాహా చెయ్యడం చాలా ఇష్టం.
పిల్ల వెధవలు బలంగా ఉండి ఏం చెయ్యాలి.. పని జరగాలంతే.
“ఏం చేశాడు.. ఇలా అయిపోయాయి అర చేతులు?” చిన్నా అడిగాడు, టింకూ చేతులు పామి పామి కడుగుతూ.. అక్కడే నిల్చుని చూస్తున్న అబ్బాస్ ని.
టింకూని చూస్తుంటే కడుపు తరుక్కు పోయింది చిన్నాకి.
“ఒంటెల పేడ ఎత్తించారు. ఆ పాకలు తుడిపించారు.”
“పేడంతా చేత్తో ఎత్తించారు చిన్నా.. మండి పోతున్నాయి చేతులు.” ఏడుపు కంఠంతో అన్నాడు టింకూ.
“ఇంత చిన్న చేతులతో పేడ ఎత్తించారా?” ఆశ్చర్య పోయాడు చిన్నా.
అందరి కంటే చిన్నవాడవడంతో, వాడు పని చేసే అవసరం రాలేదు ఇంట్లో ఎప్పుడూ. ఉన్నదాంట్లో.. వాడి కడుపు నింపడానికే చూశారు, అందరూ. అందుకే వాడు ఆకలికి ఆగలేడు.
“ఇదెలా గీసుకు పోయింది?” రక్తం చారికలు చూపించాడు.
“పేడంతా నేల మీదుంటుంది కదా.. ఇసుకలో ఉండే సన్నని రాళ్లు గాజు ముక్కల్లా ఉంటాయి. పేడ తీస్తుంటే.. అలాగే గీసుకు పోతుంది.” అబ్బాస్ వివరించాడు.
కళ్ల నిండా నీళ్లతో చూశాడు చిన్నా.
“ఇదింకా బిగినింగే. ముందు ముందు చాలా ఉంటుంది టార్చర్.. అందుకే కన్నీళ్లు దాచుకోమని చెప్పాను. త్వరగా కానీ.. మనం ఇంటికెళ్లాలి. నజీర్ కి కోపం వస్తుంది లేటయితే.” అబ్బాస్ తొందర చేశాడు.
టింకూ చేతులు, కాళ్లు మొహం కడిగి, తను కూడా కడుక్కున్నాడు చిన్నా.
అందరూ అక్కడ పెట్టిన హవాయ్ చెప్పులు వేసుకున్నారు. టింకూ, చిన్నాలకి బట్టలతో పాటు చెప్పులు కూడా కొనిచ్చాడు గుడ్ అంకుల్.
పిల్లల్ని వాన్ ఎక్కించి, అక్కడున్న అసిస్టెంట్ ట్రయినర్లకి టాటా చెప్పి బయల్దేరాడు నజీర్.
అలసి పోయి, ఉండల్లా అయిపోయిన శరీరాలతో తమ కొత్త ‘ఇంటికి’ చేరారు చిన్నా, టింకూ.
కొత్త దేశం.. కొత్త పరిసరాల్లో ఒక పగలు భయంకరంగా గడిచింది.. భరించలేని భవిష్యత్తు చిన్నా కళ్ల ముందు కదలాడింది.
పిల్లలందరూ చెమటతో తడిసి ముద్దయిన తమ బట్టల్ని విప్పేసి తువ్వాళ్లు చుట్టబెట్టుకున్నారు.
వాళ్లతో ఫామ్ కి వచ్చిన మిగిలిన పిల్లలు కూడా అక్కడే ఉన్న షెడ్లలో ఉన్నారు.
అందరూ బాత్ రూమ్ దగ్గర కలిశారు. సాయంకాలం అయిందేమో కాస్త ఎండ తగ్గి చల్ల పడింది.
అబ్బాస్ వచ్చి, చిన్నా, టింకూలకి చెరొక సబ్బూ, దానికో పెట్టె ఇచ్చాడు.
“జాగ్రత్తగా దాచుకోండి. మళ్లీ పదిహేను రోజుల వరకూ ఇవ్వరు.”
చాలా చవకైన సబ్బు అది. ఫరవాలేదు.. ఇంటి దగ్గర కూడా ఇలాంటిదే కదా అనుకున్నాడు చిన్నా. మిగిలిన పిల్లలకి అది కూడా అపురూపమే కదా!
క్రమశిక్షణతో లైన్లో నిల్చుని, స్నానాలు చేశారు. టింకూకి రోజూ లాగానే చిన్నా చేయించాడు. మొత్తం అబ్బాస్ ఆధిపత్యంలో జరిగింది.
ఆకలి దంచేస్తోంది అందరికీ.. ఎప్పుడెప్పుడు తినేసి పడుక్కుందామా అని ఉంది. ఇంక ఏమీ చెయ్యడానికి లేదు.
ఎలాగైతేనేం.. భోజనాలు వచ్చాయి.
నజీర్ రాలేదు. ఇంటికెళ్లిపోయినట్లున్నాడు.
కిచెన్ నించి ఒక పని వాడు తెచ్చి ఇచ్చాడు, డిస్పోజబుల్ బాక్సుల్లో.. గడ్డం, టోపీ లతోఅందరూ ఒక లాగే ఉన్నారు చిన్నాకి. అయితే పొడవాటి గౌను వేసుకోలేదు. అతను పాకిస్థాన్ నుంచి వచ్చాడని చెప్పాడు అబ్బాస్, తరువాత.
“ఇక్కడ పని వాళ్లందరూ మన లాగ జనం ఎక్కువ, డబ్బు తక్కువ దేశాల్నుంచి వచ్చిన వాళ్లే.” కళ్లు పెద్దవి చేసుకుని విన్నాడు చిన్నా.
పీటా బ్రెడ్.. సాస్, కీరా దోసకాయ, కారట్ ముక్కలు.. దాంతో ఒక పచ్చడి లాంటి పదార్ధం.
“ఈ పచ్చడేంటీ?”
“దీన్ని ‘బాబా గనూష్’ అంటారు. ఇక్కడ చాలా కామన్. లావు వంకాయని.. ఎగ్ ప్లాంట్ అంటారిక్కడ, కాల్చి చేస్తారు. బావుంటుంది. బ్రెడ్లో, కారట్ ముక్కల్లో, దోసకాయ ముక్కల్లో.. ఎందులోకైనా నంచుకుని తినచ్చు. ఈ కీరా, కారట్ ముక్కలు ఇందులో ముంచుకుని తినండి. పీటా బ్రెడ్ కి సాస్ రాసి తినండి.” అబ్బాస్ బ్రెడ్ కి సాస్ రాసుకుంటూ ఎలా తినాలో వివరించాడు.
మిగిలిన ముగ్గురు పిల్లలూ ఆం ఫట్ అని తినేశారు. ఇంకో అంత పెడితే తినాలనే ఉంది అందరికీ. అడిగీ ప్రయోజనం లేదని తెలుసు వాళ్లకి.
చిన్నా టింకూలకి సరిగ్గా సరి పోయింది.
“మధ్యలో ఉన్న షెడ్ చూడు.. అది కామన్ హాల్. అక్కడ టివి ఉంటుంది. కావాలంటే వెళ్లి చూడచ్చు. కానీ, ఎవరికీ అక్కడికి వెళ్లాలనే విష్ ఉండదు సాధారణంగా.. పచ్చి పులుసై పోయిన బాడీతో.. ఎప్పుడూ పడుక్కునే ఉండాలని అనిపిస్తుంది.”
అబ్బాస్ ఇంకా కొన్ని వివరాలు చెప్పాడు ఆ ఫామ్ గురించి.. చిన్నాకి కొన్ని అర్ధమయ్యాయి.. కొన్ని కాలేదు.
అందరూ బొంతలు పరిచేసుకుని, దుప్పట్లు కప్పేసుకుని పడుక్కున్నారు.
చిన్నాకి, తిండి తిన్నాక నొప్పులు ఎక్కువయాయనిపించింది. రెండు తొడలూ సలిపేస్తున్నాయి. ఒంటె నడుం లావుగా ఉంది. అటూ ఇటూ కాళ్లు వేసి కూర్చుంటే.. నరాలు లాగేశాయి. పైగా ఒంటె ఎగురుతుంది కూడా! కింద పడిపోకుండా బాలన్స్ చేసుకోవడం..
అలవాటు లేదు కదా..
హాలు లేదు.. టివి లేదు.. టింకూకి కూడా బొంత పరచి, పడుకో పెట్టి, కళ్లు మూసుకున్నాడు చిన్నా.
………………….

ఎవరో వీపు మీద కొడుతున్నారు..
చటుక్కున మెలకువ వచ్చింది చిన్నాకి. ఎక్కడున్నాడో అర్ధం కాలేదు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునే లోపలే.. ఇంకొక కొత్త అనుభవం.
కళ్లు తెరిచి చూశాడు. చీకట్లో తెల్లగా పళ్లు మెరుస్తున్నాయి. కెవ్వుమని కేకేశాడు. అంతలో కళ్లు మిరిమిట్లు కొలిపేట్లు లైటు..
మొహంలోకి చూస్తూ ఎర్రని కళ్లు, నల్లని చింపిరి జుట్టు. కాళ్లతో చిన్నాని ఒక్క తాపు తన్ని, పక్క వాడి దగ్గరికి వెళ్లాడు ఒక నల్లని రాక్షసుడు.
అచ్చంగా.. ఎప్పుడూ తన కలలో వచ్చేవాడిలాగే ఉన్నాడు.
ఇక్కడికి వచ్చే ముందే చిన్నాకి తెలిసి పోయింది.. కొత్త చోట్లో చాలా పని చేయిస్తారని. లేకపోతే.. ఊరికే తిప్పటానికి విమానంలో తీసుకు రారు కదా!
జుట్టంకుల్ లాగా కూర్చోపెట్టి పెట్టరని కూడా అనుకున్నాడు కానీ, ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు.
మనుషులు ఇంత బాడ్ గా ఉంటారా?
చిన్న పిల్లాడైన ప్రహ్లాదుడిని, రాక్షసులు హింస పెట్టారని విన్నాడు. సినిమాలో చూశాడు. కానీ.. నిజంగా, ఈ రోజుల్లో జరుగుతుందా? నమ్మలేక పోతున్నాడు. కానీ.. జరుగు తోంది కదా!
పని చేయించు కోవచ్చు కానీ కొట్టడం, తన్నడం ఎందుకో అర్ధం కాలేదు చిన్నాకి.
చిన్నా, టింకూలు కొత్త దేశానికి, కొత్త ఇంటికి వచ్చి పదిహేను రోజులు అయింది. గోడ గడియారం నాలుగు కొట్టింది.
“లే.. లే.. డ్రీమ్స్ తరువాత. కిచెన్ లోకి పద. ఫైవ్ మినిట్స్ లో..” నజీర్ చిన్నాని తన్నాడు.
టింకూని కూడా చిన్నా లేపాడు. వాడిని కొట్టే వీలు లేకుండా, గోడకీ తనకీ మధ్యలో పడుక్కో పెడుతున్నాడు చిన్నా. అయినా అప్పుడప్పుడు తప్పడం లేదు. వాడసలు స్తబ్దుగా అయిపోయాడు. ఇంత కళ్లేసుకుని చూట్టం తప్ప, ఎప్పుడో కానీ ఏం మాట్లాడట్లేదు. ఏడవడం కూడా తగ్గించేశాడు.
ఇద్దరూ లేచి, పక్క బట్టలు సర్దుకుని బాత్రూంకి వెళ్లారు. లక్కీనే.. కాళీగా ఉంది. మిగిలిన పిల్లలు ఇంకా తన్నులు తింటున్నట్లున్నారు.
గబగబా పళ్లు తోముకుని, కిచెన్ దగ్గరికి పరుగెత్తారు.
వంటతను ఫరవాలేదు. కాస్త కనికరం ఉన్న వాడే.
ఇద్దరికీ కప్పుల్లో ‘టీ’ ఇచ్చి, రెండు బిస్కట్లు కూడా ఇచ్చాడు. అతనికి చిన్నా నచ్చాడు. చెప్పిన పని చక్కగా చేస్తాడని. అప్పుడప్పుడు చిన్ని చేతులతో అల్లం, కారట్ వంటివి గీరడం కూడా నీట్ గా చేస్తాడని.
మిగిలిన వాళ్లకి అంత తీరు లేదు మరి. ఆ వయసులో అమ్మా నాన్నల దగ్గర గారాలు పోతూ ఉండాలి.. విధి రాతను బట్టి అక్కడొచ్చి పడ్డారు.
చిన్నా, టింకూలకి ఇచ్చిన టీ బానే ఉంటుంది. కాస్త పాలు పంచదార వేస్తాడు వంటాయన. మిగిలిన వాళ్లకి బరువు పెరక్కుండా నల్ల టీనే.. అదే తాగుతారు. బిస్కట్లు నంచుకుని.
లేవగానే ఏదో ఒకటి పడాలి కదా
చిన్నాని చూడగానే.. వాడి పని తీరు చూశాక, అందరికీ వాడంటే ఇష్టం కలక్క మానదు. వాడికి ఆరేళ్లని అనుకుని.. ఆ వయసుకి అంత పెద్దరికంగా ఎలా ఉంటాడా అని ఆశ్చర్య పోతుంటారు.
నజీర్ కాకుండా, ఆ ఔజుబాలో.. దాదాపు పది మంది పని చేస్తుంటారు.
కిచెన్ లోనే నలుగురుంటారు. ఆవరణ శుభ్రం చెయ్యడానికి, స్టోర్ నిర్వహణ, సెక్యూరిటీకి.. అన్ని చోట్లా.. ఎక్కువగా పాకీస్థానీలు, ఇండియన్స్ పని చేస్తుంటారు.
అంత మంది ఉన్నా, ఈ చిన్న పిల్లలు ఊరికే తిని పోతున్నారని దుగ్ధ చాలా మందికి. వాళ్ల కోసమే తమకి ఉద్యోగాలొచ్చాయన్న సంగతి మర్చి పోతారు.
ఆ పసివాళ్ల చేత ఏ పని ఎలా చేయించాలా అని పరిశోధన చేస్తున్నట్లుగా ఉంటారు.
చిన్నాని కిచెన్లో వాడుకోడానికి షెప్ నిర్ణయించేశాడు. అతనికి ఎదురు చెప్పలేరెవరూ. చెప్పారంటే.. ఫుడ్ కీ, కాఫీ టీలకీ ఇబ్బందే.
చిన్నా, తనతో టింకూని కూడా పిలవమని షెఫ్ అంకుల్ కి మంచి మూడ్ చూసి చెప్పాడు.
“వీడు పొడుగు పెరిగాడు కానీ, ఏజ్ త్రీ ఇయర్సే అంకుల్. అందుకే బేబీ లాగుంటాడు. నేను వాడి చేత బాగా పని చేయిస్తా. ఇక్కడికి పిలవండంకుల్.. ప్లీజ్..” షెఫ్ కాళ్లు వత్తుతూ అడిగాడు.. వచ్చిన మరు నాడే.
నిల్చుని పని చేసే షెఫ్ కి కాళ్లు వత్తుతుంటే హాయిగా ఉంది.
నాయనమ్మకి రోజూ వత్తడం అలవాటే చిన్నాకి. ఆ పని చేస్తే చాలా సంతోషిస్తారని కూడా తెలుసు.
అంతే.. అప్పటి నుంచీ, చిన్నాతోనే టింకూని కూడా కిచెన్ లో పెట్టుకున్నాడు. టింకూకి చెప్పిన పని కూడా చిన్నా చేస్తుంటాడు కొంత.
పైకి చెప్పలేక పోతున్నారు కానీ మిగిలిన పిల్లలకి చాలా కుళ్లుగా ఉంటోంది.
ఎండలో చిన్న చిన్న చీపుళ్లతో కాంపౌండ్ తుడవడం, అక్కడున్న ఒంటె షెడ్లు, గొర్రెల షెడ్లు శుభ్రం చెయ్యడం ఉన్న కాసిని మొక్కలకీ నీళ్లు పొయ్యడం.. ఇలాంటి పనులు చేస్తూ, చిన్నాని కోరగా చూస్తుంటారు.
ముఖ్యంగా ఆ గొర్రెలు, ఒంటెల షెడ్లు..
పాల కోసం ఒంటెల్నీ, గొర్రెలనీ పెంచుతారు అక్కడ.
పేడ ఎత్తడం, కిందంతా నీళ్లు పోసి కడగడం.. వికారమైన పని.
అంతే కాదు..
అప్పుడప్పుడు ఒంటెలు ఖాండ్రించి ఉమ్మేస్తుంటాయి. షావర్ లాగ పడుతుంది పిల్లల మీద. కంట్లో పడిందంటే.. ఒకటే మంట. నోట్లో కెళ్లిందంటే చేదుగా వికారంగా ఉంటుంది..
సాధారణంగా ఉమ్మవు కానీ, పిల్లలు తమ సహజ బాల్య చేష్టలతో వాటిని రెచ్చగొడితే ఉమ్ము తాయి. నోట్లో ఉండే లాలాజలం మాత్రమే కాదు.. పొట్టలో ఉండే ద్రవాన్నంతా బైటికి తీసుకొస్తాయి. ఆకుపచ్చ బంక లాటి పదార్ధం..
ఆ బంకంతా వదిలించుకోవాలంటే ఆ దేవుడు దిగి రావలసిందే.
అన్ని పనుల్లోకీ కిచెన్ పనే కాస్త హాయిగా ఉంటుంది.
అంత పనీ చేయించుకుని కూడా, కడుపు నిండా తిండి పెట్టడానికి మనసొప్పదు అక్కడి మానేజర్లకి. ఎక్కడికక్కడ మిగుల్చుకోవాలని చూడటమే.
“అంకుల్! ఇవేళ మెనూ ఏంటి” చిన్నా అడిగాడు మెయిన్ షెఫ్ ని. కిచెన్ లో రోజూ చేసే పని అయిపోయింది.
నేలంతా తడి బట్ట పెట్టి తుడవడం, గట్టు ఎక్కి స్టౌ దగ్గర శుభ్రం చెయ్యడం, వెజిటబుల్స్ విడగొట్టడం, డిష్ వాషర్ లోంచి సామాన్లు తీసి సర్దడం ముఖ్యంగా చేసే పనులు.
“మీరు ట్రయినింగ్ కి వెళ్తారని చెప్పాడు నజీర్. తొందరగా కావాలి లంచ్ అని. అందుకే ‘అల్ హరీస్’ చేసి రాత్రే ఆవెన్ లో పెట్టేశా. చాలా సేపు బేక్ అవాలి అది. ఈ పాటికి అయిపోయుంటుంది. చక్కని స్మెల్ వస్తోంది చూడూ.”
“హా.. అంకుల్. మంచి స్మెల్.. కొత్త కుకీస్ బేక్ అవుతున్నాయేమో అనుకున్నా. అదేం డిష్ అంకుల్?”
“వీట్ ఫ్లోర్, సాల్ట్, బటర్, మీట్ వేసి పేస్ట్ లా అయే వరకూ కుక్ చెయ్యాలి. ఆతరువాత సెవరల్ అవర్స్ బేక్ చెయ్యాలి. టైమ్ ఎక్కువ పడుతుంది కానీ చెయ్యడం సింపుల్.” షెఫ్ ఆనందంగా చెప్పాడు.
పిల్లలు, చెప్పిన పని ఏడుస్తూ చేసుకు పోయే వాళ్లే కానీ కుకింగ్ మీద ఎవరూ ఇంట్రెస్ట్ చూపించ లేదు ఇప్పటి వరకూ.
చిన్నాకి కూడా కొత్తగా ఉంది.
నాన్నమ్మ, అమ్మల దగ్గర ఎప్పుడూ బేకింగ్ అనే మాటే విన లేదు. బిస్కట్లు బజార్లో కొనుక్కోవడమే కానీ, అవి ఎలా చేస్తారో తెలియదు.
ఇక్కడేమో అన్నీ బేకింగే.. అదీ ఇదీ కలిపేసి, ఓవెన్ లోకి తోసెయ్యడమే.
అందుకే ఆసక్తిగా అడుగుతుంటాడు.
“మీరిద్దరూ, ఈ కారట్, బీట్రూట్, టమాటో కట్ చెయ్యండి. కాస్త సాల్ట్ పెప్పర్ చల్లేసి పెట్టేద్దాం. అంతే.. లంచ్ రెడీ.”
“ఆల్ హరీస్.. అలాగే తినేస్తారా? సాస్ వద్దా? నేను టమాటా చట్నీ చెయ్యనా?”
చిన్నాని ఒక సారి పైకి లేపి, మొహంలోకి చూసి.. నవ్వుతూ దింపేశాడు షెఫ్.
“నువ్వు ఛఠ్నీ.. చేస్తావా? ఎలా..”
“కొంచెం చేసి చూపిస్తా. వీట్ డిష్ లోకి బాగుంటుంది.”
“ఓ.కే.. ప్రొసీడ్..”
తనకి కావలసిన పదార్ధాలు గట్టుమీద పెట్టమని అక్కడున్న అసిస్టెంట్ ని బతిమాలాడు చిన్నా.
టింకూని తీసుకుని ప్లాట్ ఫామ్ ఎక్కాడు.ఒక్కొక్క టామాటో చొప్పున పది పెద్ద టమాటాలు, బ్లెండర్ లో పడేశాడు. పెద్ద బ్లెండర్ ఉందా కిచెన్ లో.
ఒక సారి నాన్నమ్మని గుర్తుకు తెచ్చుకుని.. అందులో రెండు చెంచాలు ఉప్పు, రెండు చెంచాలు చక్కెర, ఒక చెంచా కారం పొడి, అర చెంచా మిరియాల పొడి వేశాడు.
నాన్నమ్మ కొత్తిమీర వేస్తుందే.. ఇక్కడ అది చూడలేదు..
బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచించాడు. వాడు అలా చేస్తుంటే షెఫ్ నవ్వుతూ చూస్తున్నాడు.
హా.. దొరికింది. గట్టు మీంచి కిందికి దూకి ఫ్రిజ్ తీసి అందులోంచి పుదీనా కట్ట తీశాడు. మళ్ళీ ప్లాట్ ఫామ్ ఎక్కి.. టింకూ తనూ కలిసి, ఆకులు ఒలిచి, కడిగి బ్లెండర్ లో పడేసి, బ్లెండర్ తిప్పేశాడు.
పింగాణీ డిష్ లోకి చట్నీ తీసేశాడు.
పది నిముషాల్లో అయిపోయింది.
ఒక స్పూన్ తో తీసి, షెఫ్ అంకుల్ కిచ్చాడు.
“వావ్.. సూపర్. చాలా బాగుంది. ఇంత సింపుల్? ఆల్ హరీస్ ఎప్పుడు చేసినా.. ఇదే దానికి సాస్. గ్రేట్ సమీర్.” ప్లాట్ ఫామ్ మీది నుంచి ఎత్తుకుని, గట్టిగా హత్తుకున్నాడు.
“థాంక్యూ అంకుల్.”
“వెళ్లండి. వెళ్లి త్వరగా రెడీ అవండి. అప్పుడే తొమ్మిదయింది. వన్ మోర్ అవర్.. వాన్ వచ్చేస్తుంది.”
చిన్నా, టింకూని తీసుకుని పరుగెత్తాడు.
“పూర్ కిడ్స్..” అనుకుంటూ లేచి అసిస్టెంట్లని పిలిచాడు షెఫ్. లంచ్ సర్దించాలి బాక్సెస్ లో.
పిల్లలంతా తయారవుతున్నారు. అందరి మొహాల్లోనూ ఆందోళన.. భయం. ఎన్ని దెబ్బలు తినాలో.. ఒంటెలు ఫ్రెండ్లీగా ఉంటాయో లేదో!
ఒక్కో సారి, ఎంత గట్టిగా పట్టుకుని కూర్చున్నా, ధబీమని పడేస్తుంటాయి. అంతెత్తునుంచి కింద పడితే.. ముందు భయానికే గట్టిగా కేకలు పెడుతుంటారు.
ప్రతీ జాయింట్ దగ్గరా కీళ్లన్నీ కిర్రు మంటుంటాయి.
చిన్న పిల్లలు కనుక ఎముకలు మెత్తగా, కండరాలు ఎటుపడితే అటు సాగేలా ఉంటాయి.. పైగా ఇసుకలో పడతారు. అయినా కూడా.. దెబ్బలు తగులుతుంటాయి అప్పుడప్పుడు.
ముందు వారం ట్రయినింగ్ కి వెళ్లినప్పుడు ఒక కుర్రాడి కాలు బెణికింది. గోల గోల పెడుతూ కుంటుతూ నడుస్తున్నాడు.
హలీమ్ ఫామ్ లో కానీ.. ఇంటికి తిరిగి వచ్చాక ఓజుబాలో కానీ ఎవరూ పట్టించుకోలేదు.
చిన్నాకి నాన్నమ్మ చిటకా వైద్యం గుర్తుకొచ్చింది.. కిచెన్ లోకి వెళ్లి, షెఫ్ అంకుల్ నడిగి, ఒక కోడి గుడ్డు తీసుకొచ్చి, పగల గొట్టి, వాపు దగ్గర రాశాడు. ఆరాక, కాలు పైకి ఎత్తి పెట్టి పడుక్కోమన్నాడు. కాలుకి తడి తగల నియ్యద్దని చెప్పాడు.
నాలుగు రోజుల్లో తగ్గిపోయింది.
అప్పటి నుంచీ, పిల్లలంతా చిన్నా మీద అసూయ పడ్డం మానేశారు.
అందరికీ ఒక పెద్ద దిక్కుగా తయారయ్యాడు.
అబ్బాస్.. అప్పుడప్పుడు నజీర్ పిలుస్తుంటే వెళ్లి పోతుంటాడు.. రెండు మూడు రోజుల వరకూ రాడు. అందుకే పిల్లలు ప్రతీ దానికీ చిన్నా మీద ఆధార పడుతున్నారు.
ఇవేళ్టి ట్రయినింగ్ పెద్ద రేస్ ట్రాక్ దగ్గరని చెప్పాడు అబ్బాస్.
“అంటే.. ఏంటన్నా? ఆ అంకుల్ ట్రాక్ బాగుంది కదా?” పదిహేను రోజుల్లో నాలుగుసార్లు హలీమ్ ఫామ్ కి వెళ్లారు ట్రయినింగ్ కి.
“అది ప్రైవేట్ ఫామ్ లో ప్రాక్టీస్ కోసం చేసిన ట్రాక్. ఇది రియల్ గా రేసులు జరిగేది. చాలా పెద్దగా ఉంటుంది. ఒంటెలు బాగా ట్రయినింగ్ అయినవి. అవి చాలా స్పీడుగా పరుగెడతాయి..”
“ఇప్పు డెందుకు అక్కడికి?” చిన్నా కుతూహలంగా అడిగాడు.
“తొందరలో రేసులు మొదలవుతాయి. అసలీపాటికే మొదలవ్వాలి. షేక్ లందరూ వేరే పనుల్లో బిజీగా ఉండి ఆలిస్య మయింది. అందుకే అక్కడ చేయిస్తారు. ఒంటెలకీ, జాకీలకీ కూడా అలవాటవుతుందని.”
“అబ్బాస్..” బయటి నుంచి పెద్ద కేక..
“హా.. నజీర్ సాబ్. వస్తున్నా. ఫైవ్ మినిట్స్ లో వచ్చెయ్యండి.” గబగబా పరుగెత్తాడు అబ్బాస్.
“ఐతే అక్కడ ఒంటెల పేడ ఎత్తక్కర లేదా చిన్నా? వాటి షెడ్ లుండవు కదా?” టింకూ అడిగాడు. వాడు తయారై పోయి రెడీగా ఉన్నాడు.
ఇప్పుడు పేడ తియ్యడానికి బాధ పడట్లేదు టింకూ. తియ్యనంటే తగిలే తన్నుల కంటే పేడ తియ్యడమే నయం. అబ్బాస్, పిల్లల చేతులకి గ్లోవ్స్ తెప్పించాడు, నజీర్ కి చెప్పి. టింకూ కాక ఇంకా ఇద్దరు చేస్తారా పని.
టింకూకి రైడింగ్ అలవాటు చెయ్య లేదు.
కిందటి సారి ట్రయినింగ్ కి వెళ్లినప్పుడు, హలీమ్ దగ్గరికి తీసుకుని చూశాడు. వాడి ఒళ్లు ఇంకా కొంచెం గట్టిపడాలని చెప్పాడు.
“వాడి బుగ్గలు చూడండి.. కదులుతుంటే ఎలా ఊగుతున్నాయో! ఇంకా బేబీ వీడు.” అనేశాడు.
పేడ తియ్యడానికి ఏడుస్తే పిర్ర మీద తన్నాడు నజీర్.. బోర్లా పడి పోయాడు టింకూ. అప్పటి నుంచీ పేచీ పెట్టటం లేదు.
“ఏమో టింకూ! పేడకి ఒంటెలుంటే చాలు కదా.. షెడ్ లుండక్కర్లేదుగా?” నవ్వుతూ అన్నాడు చిన్నా.
నవ్వులాటకే అన్నా.. చిన్నా నిజమే చెప్పాడు.
వాన్ చాలా దూరం వెళ్లింది. పెద్ద ఓపెన్ గ్రౌండ్. పది కిలోమీటర్లుంటుంది గుండ్రని ట్రాక్. ఆ ట్రాక్ ఇసుకతో నింపి ఉంటుంది. దాని చుట్టూ పక్కా రోడ్..
రేసులు జరిగేటప్పుడు ఆ రోడ్డు మీద, కామెంటేటర్లు, టివి వాళ్లు, జర్నలిస్టులు, రాయల్ ఫామిలీ వాళ్లు వెళ్తుంటారు.
ట్రాక్ లో ప్రతీ కదలిక టివీల్లో వచ్చేస్తుంది.
రేస్ కోర్స్ ఆవరణ లోనే పెద్ద పెద్ద టివీలు అన్ని కోణాల్లోనూ నిలబెట్టి అరేంజ్ చేస్తారు. వాటిలో అంతా చూపిస్తుంటారు. లేకపోతే, ఒక దగ్గర కూర్చున్న వారికి తమ దగ్గర్నుంచి ఒంటెలు వెళ్లి పోయాక ఏమీ కనిపించదు కదా! ఆ ఒంటెల తో పాటే, ఫెన్సింగ్ ఇవతల నుంచి వెళ్లచ్చు.. కానీ ఎంత దూరం వెళ్ల గలుగు తారు? పైగా ఎండ..
కారులో వెళ్లచ్చు కానీ.. అదీ బోరే. తలుపు తీస్తే దుమ్ము. తియ్యకపోతే దుమ్ము కొట్టుకు పోయి గాజు కిటికీ లోంచి ఏమీ కనిపించదు. ఆధునిక కాలంలో చాలా మంది ఇళ్లలో కూర్చుని, తమ టివిల్లో చూడ్డానికే ఇష్ట పడుతున్నారు.
రేస్ కోర్స్ కెళ్లినా కనిపించేదేం ఉండదు. గోల హడావుడి, ఎండ తప్ప.
పది కిలో మీటర్ల ట్రాక్ ని ఒక చోట కూర్చుని గమనించే దేముంటుంది? అక్కడి కెళ్లినా పెద్ద పెద్ద తెరల మీద కూర్చుని చూడ్డం తప్ప ఏవుండదు.
చిన్నా వాళ్ళ వాన్ ని, హలీమ్ ఒంటెలున్న గుంపు దగ్గరకి తీసుకెళ్లి ఆపాడు నజీర్.
హలీమ్ గుంపు రంగు నీలం, పసుపు.
పిల్లలందరికీ ఆ రంగుల్లో ఉన్న హెల్మెట్ లిచ్చారు.
రేసులు నడిచే టప్పుడు ఆ రంగులున్న టీ షర్టులు వేస్తారు. వాటి కింద నీలం రంగు పైజామాలు.
ఆవరణలో కొంచె దూరంలో చిన్న చిన్న గదుల్లాంటివి రేకులతో కట్టినవి ఉన్నాయి. అక్కడ బట్టలు మార్చుకోవడానికి కొన్ని గదులు, కాసేపు కూర్చోడానికి కొన్ని.. వరుసగా బాత్రూములూ, తాగడానికి మంచి నీళ్లూ వంటి సదుపాయాలున్నాయి.
దేనికీ పైన కప్పు లేదు. కూర్చోవడమైనా పడుక్కోవడ మైనా ఇసుక లోనే.
ప్రతీ జాకీకీ చిన్న మంచి నీళ్ల సీసా ఉన్న పోచ్ కూడా ఉంటుంది.. వాళ్ల టీ షర్ట్ కి అతికించి.
“చిన్నా!” టింకూ అరిచాడు. ఆ గోలలో ఏదైనా చెప్పాలంటే అరవ్వలసిందే.
“ఏం కావాలి టింకూ? నువ్వు ఇక్కడే ఒక మూల కూర్చో. వీలున్నంత వరకూ ఎవరి కంటా పడకు.”
“అది కాదు.. అటు చూడూ. కిషన్, సిరాజ్ వాళ్లు..”
చిన్నా టింకూ చూపించిన వేపు తల తిప్పాడు.
నిజమే! ఎరుపు పసుపు రంగుల గుంపు దగ్గర, కిషన్ కనిపించాడు. వాడి పక్కనే, నయీమ్, తబ్రీజ్, సిరాజ్.. ముగ్గురూ చాలా సన్నగా అయి పోయారు.
కిషన్ ఇంకా కొంచెం బొద్దుగా ఉన్నాడు కానీ.. వాడిలో ఉన్న హుషారంతా పోయింది. దిక్కు తోచని వాళ్లలా నిలుచున్నారు.
చిన్నా గుంపు పక్కనే ఉన్నారు వాళ్లు కూడా.
అప్పుడే కిషన్ కూడా వీళ్లని చూశాడు. మొహం విప్పారింది సంతోషంతో. కళ్లలోంచీ ఆగకుండా నీళ్లు.. తమ తమ కష్టాలు చెప్పేసుకోవాలన్న తపన.
ఏటిలో కొట్టుకు పోతుంటే సన్నదైనా, చిన్న కర్ర పుల్ల దొరికినప్పటి సంతోషం మొహాల్లో.
నలుగురూ కుడి చేతులు పైకి లేపారు.
ఒకరి కొకరు దగ్గరగా రాబోయి, తాన్యా మాటలు గుర్తు తెచ్చుకున్నారు అందరూ.
“ఎక్కడైనా కలిసినా పలకరించు కోకూడదు. తెలియనట్లే ఉండాలి.”
అంతే.. వెనక్కెళ్లి పోయారు.
హలీమ్ తన గుంపుని పిలిచాడు. అబ్బాస్, నజీర్లు ఒక్కోక్కళ్లనీ ఒంటెల మీదికెక్కించారు. ఒంటెల శిక్షకులు కూడా దగ్గరే ఉండి, ఒంటెలని మాలీష్ చేస్తూ.. పిల్లలని కట్టేసే వరకూ ఉన్నారు. ఒంటెలకి అలవాటే.. కదలకుండా నిలుచున్నాయి.
జీనుకున్న తాడుతో నడుం మీంచీ కట్టేశారు.
ఒక చేత్తో జీనుకున్న తాడు పట్టుకుని, ఇంకొక చేత్తో ‘సాత్ అల్ జమాల్’ (ఒంటెలని హుషారు పరచడానికి వాడే కమ్చీని) పట్టుకోమన్నారు.
ఒంటెలు పరుగెడుతుంటే, కమ్చీతో అదిలిస్తే స్పీడు పెంచుతాయి.. కమ్చీలని చేత్తో గుండ్రంగా తిప్పుతూ అదిలిస్తారు.
కానీ, అదే మొదటి రోజు కనుక, కమ్చీని చేత్తో ఊరికే పట్టుకుని కూర్చో మన్నారు.
పిల్లలందరిదీ తలొక భాష.. చెప్పే వాళ్లు ఎక్కువగా సైగలతో, తాము చేసి చూపించీ సూచనలు ఇస్తున్నారు. నజీర్ కి కాస్త అలవాటయింది. అతగాడి సైగలు బానే అర్ధ మవుతున్నాయి పిల్లలకి. అబ్బాస్ ఐతే.. అన్ని భాషలూ కలిపి లాగించేస్తాడు.
జాకీ లందరూ బెదురు బెదురుగా, భయంగా కూర్చున్నారు.
అంత మంది జనం.. హమీల్ ఫామ్ లో వాళ్లు, ఒంటెలు తప్ప ఇంకెవరూ ఉండరు. ఇక్కడ ప్రాక్టీస్ కొచ్చిన గుంపులుందరూ ఉంటారు.
పైనించి కాల్చేసే ఎండ.
ఏడడుగుల కదిలే ఎత్తు మీద కూర్చుని, ఎప్పుడు పడిపోతామో అనే భయంతో.. అమ్మ చేతి ముద్దలు తినాల్సిన వయసు పిల్లలు, ఎప్పుడేం జరుగుతుందో అని అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.
వారి గురించి ఆలోచించే వారు లేరక్కడ.
అయితే గియితే, ఎంత బాగా ఒంటె నడుపుతారా అని ఆలోచించే వారే, వారి యజమానులు.
చిన్నాకి కాస్త అలవాటయింది. కాళ్లు మడిచి పెట్టి, తాడు బలంగా లాగి పట్టుకోవడం.. బిర్ర బిగుసుకు పోయి కాకుండా కాస్త స్వేచ్ఛగా కూర్చోడం. కమ్చీతో అదిలించడం కూడా వచ్చింది.
చిన్నా ఏదయినా త్వరగా నేర్చుకుంటాడు. చేసే పని చక్కగా, అందరూ మెచ్చుకునేలా చేస్తాడు.
“నువ్వు చాలా షార్ప్ గా అన్నీ నేర్చుకుంటున్నావు కానీ, బయటికి చూపించకు. అలా చేస్తే ఎక్కువ సార్లు నిన్నే తీసుకెళ్తారు. ఇది చాలా రిస్క్ ఉన్న గేమ్. ఎప్పుడేమవుతుందో తెలీదు. ఇటువంటి వాటిల్లో తెలీనట్లుగా, అర్ధం అవనట్లుగా ఉంటేనే నయం.” అబ్బాస్ బోధించాడొక సారి.
రోజూ.. ట్రయినింగ్ కి వెళ్లకుండా ఔజుబాలో ఉన్నప్పుడు, అందరి చేతా వ్యాయామాలు చేయిస్తూ ఉంటాడు అబ్బాస్.
ఒక రకంగా, ఈ ఫిజికల్ యాక్టివిటీ చిన్నాకి మంచే చేస్తోంది. ఎముకలని బలహీన పరచకుండా, కండరాలని బలంగా చేసేలా చేస్తోంది. బరువు పెరగడం మొదలే లేదు.
అయినా డాక్టర్ గారిని కలవలేక పోతున్నాను.. ఎలా ఉందో ప్రోగ్రెస్.. అని మనసులో బాధ పడుతుంటాడు.
తన కున్న సమస్యని ఏదో విధంగా అధిగమించాలని ఆ చిన్ని బుర్రలో ఎప్పటి నుంచో పాతుకు పోయింది.
ఏం చెయ్యడానికీ లేకుండా.. ఇక్కడ పడేశావా అనుకుంటూ ఆకాశం కేసి చూశాడు.
ఒక్క మేఘం కూడా లేదు.. రాయబారం పంపటానికి.
…………………..

స్టార్ట్.. సిగ్నల్ ఇచ్చారు.
కాళ్లతో ఒంటెల పక్కలు తన్నారు జాకీలు.
ఒక్కసారిగా పరుగు మొదలు పెట్టాయి ఒంటెలు. అవీ.. ఎప్పట్నుంచో ట్రాక్ మీద పరుగు పెట్టడం అలవాటున్న ఒంటెలు.
అదిరి పోయిన జాకీలు కెవ్వుమని కేకలు పెడుతున్నారు.. కొండ నాలుకలు బైటికొచ్చేలాగ అరుస్తున్నారు.
ఆ అరుపులకి రెచ్చి పోయి మరింత వేగాన్ని పెంచుతున్నాయి ఒంటెలు. జాకీలు ఇంకా గట్టిగా అరుస్తున్నారు.
చిన్నాకి గుండె చేతిలో కొచ్చినట్లయి పోతోంది. కొంచెం బాలన్స్ తప్పినా కూడా కింద పడి పోడం ఖాయం.
కమ్చీ విదిలించ కుండానే అలా ఉంది.. ఇంక అది కదిలిస్తే..
ఐదు కిలో మీటర్లు చాలని అక్కడ ఆపేసారు ఒంటెలని. నెమ్మదిగా పిల్లలని దింపారు. కిందికి దిగాక, అందరూ గట్టిగా ఏడుపు మొదలు పెట్టారు.. అక్కడే, ఇసుకలో.. నేల మీద కూలబడి.
కాలి పోతున్న ఇసుక వేడి అనిపించ లేదు.
వాన్లు తీసుకు వచ్చి పిల్లలని ఎక్కించి, వెనక్కి తీసుకెళ్లి, రేకు గదుల దగ్గర ఆపారు. అబ్బాస్ వచ్చి అందరినీ దింపి, బాత్రూం లోకి వెళ్లి కాళ్లు చేతులు మొహం కడుక్కోమని చెప్పాడు.
చిన్నాకి ప్రతీ జాయింట్ దగ్గరా నొప్పి. మామూలు పిల్లల కంటే బుల్లి మనుషులకి బాల్యంలో కూడా జాయింట్లు కొంచెం బలహీనంగా ఉంటాయి. పెరుగుదల సహజంగా ఉండదు కదా!
ఎప్పుడెప్పుడు తన బొంత మీద వాలి పోయి పడుక్కుందామా అని ఉంది.
బాత్రూం లోకి చిన్నా వెళ్లి, పని ముగించుకోగానే.. టింకూ పరుగెత్తుకుంటూ వచ్చాడు, భోరు మని ఏడుస్తూ.. చిన్నాని గట్టిగా వాటేసుకున్నాడు.
చేతుల నిండా కాళ్ల నిండా ఇసుక.
చేతులు నల్లగా, మధ్య మధ్య ఎర్రగా.. మోకాళ్లు, మోచేతులు గీరుకు పోయున్నాయి. మొహం అంతా కూడా ఇసక.
వాడిని అలాగే తీసుకెళ్లి, బట్టలు విప్పి స్నానం లాగ చేయించాడు చిన్నా. అక్కడున్న పేపర్ టవల్స్ పెట్టి ఒళ్లంతా తుడిచి బట్టలు వేశాడు.
కాస్త తేరుకున్నాడు టింకూ. ఇంకా వెక్కుతూనే ఉన్నాడు.
టిష్యూ పేపర్ తో రక్తం ఉన్న దగ్గర అద్దాడు.
విశ్రాంతి కోసం ఉంచిన చెక్క గది లోకి తీసుకెళ్లి, గోడకానించి కూర్చో పెట్టాడు.
అప్పుడే లంచ్ బాక్స్ లు తీసుకుని అబ్బాస్ వచ్చాడు. హడావుడిగా అందరికీ తలో పెట్టే ఇచ్చి వెళ్లి పోయాడు. టింకూ పరిస్థితి చూడ లేదు.
టింకూకి తినిపించి, తను కూడా తిని.. కాస్త సేద తీరాక అడిగాడు..
“ఇప్పుడు చెప్పు. ఏమయింది? ఒక చోట కూర్చో మన్నా కదా? ఎందుకు లేచావు?”
“వాన్ పక్కన నీడలో కూర్చున్నా చిన్నా! నజీర్ అంకుల్ వచ్చి, గట్టిగా అరుస్తూ, చెయ్యి మీద కొడ్తూ తీసుకెళ్లాడు. వాన్ లో నన్నూ ఇంకో అబ్బాయినీ ఎక్కించి డ్రైవ్ చేసుకుంటూ ఒంటెలు పరుగెత్తే రోడ్ పొడుగూతా అక్కడక్కడ ఆగుతూ నడిపించాడు.”
“ఎందుకు? ఏం చేశారు?”
“వాన్ లో గంపలు పెట్టాడు. ఒంటెలు పేడ వేస్తాయి కదా.. ఆ పేడంతా ఎత్తించాడు గంపల్లోకి. ఎండ.. కాళ్లు మాడి పోయాయి.”
“చెప్పులున్నాయి కదా?”
“చెప్పుల్ని వాన్ లో ఉంచెయ్య మన్నాడు.. అవి వేసుకుంటే త్వరగా నడవలేంట.” మళ్లీ భోరు మన్నాడు టింకూ.
“మరీ రక్తాలేంటీ?” నీరసంగా అడిగాడు చిన్నా.. గొంతు పూడుకు పోయినట్లయి మాట రావట్లేదు..
“తొందరగా చెయ్యండని అరుస్తుంటే.. మధ్యలో చాలా సార్లు పడిపోయా. మోకాళ్లు, మోచేతులు గీరుకు పోయాయి. లేవలేక పోతుంటే వచ్చి ఇక్కడ కొట్టాడు.” వీపు చూపించాడు టింకూ. స్నానం చేస్తున్నప్పుడే చూశాడు చిన్నా, వీపు మీద ఎర్ర చారల్ని.
“ఎందుకంత తొందర పెట్టడం?”
“వెనకాల వేరే ఒంటెలు వస్తాయంట. అవి పేడ తొక్కేస్తాయిట. మేం కదలక పోతే మమ్మల్ని కూడా తొక్కేస్తాయిట. కాళ్లు కాలి పోతుంటే, పరుగు పెడ్తూ పేడ ఎత్తుతుంటే, అర చేతులు కూడా గీరుకు పోయాయి.. ఇసక సూదుల్లా గుచ్చుకుంది చేతులకి.”
“మరి గ్లోవ్స్ తెచ్చుకోలేదా టింకూ?”
“ఇక్కడ కూడా పేడ ఎత్తాలని ఎవరూ చెప్ప లేదు చిన్నా.. అమ్మ కావాలీ.. అమ్మ దగ్గరకెళ్లి పోతా. నన్ను తీసుకు పోవా?” గుండె కదిలేలా ఏడుస్తున్నాడు టింకూ.
నిస్సహాయంగా చూడ్డం తప్ప ఏం చెయ్యగలడు చిన్నా?
దగ్గరగా తీసుకుని, కాళ్లు చేతులూ రాస్తూ.. ఊరుకోబెట్టడానికి ప్రయత్నించాడు.
అలాగే వెక్కుతూ నేల మీద పడుక్కున్నాడు టింకూ.
టింకూ ఒక్కడే ఏడవట్లేదక్కడ. వాడికి పెద్ద కంపెనీయే ఉంది.
అరగంట గడవగానే కిషన్ వచ్చాడు, తన స్నేహితుల్నేసుకుని.
ఆ గదుల దగ్గర అంకుల్స్ కాపలా పెట్ట లేదు వాళ్లకి. బాచ్ తరువాత బాచ్ కి ప్రాక్టీస్ చేయిసున్నారు ట్రాకుల మీద. అదొకటి నయం.
వస్తూనే అందరూ ఏడుపు..
“జుట్టంకుల్ దగ్గర ఎంతో బాగుంది. ఇక్కడికొచ్చినప్పటినుంచీ రోజూ తన్నులే. వచ్చిన రోజే, రాత్రి రెండు గంటలకి లేపేశారు చిన్నా..” సిరాజ్.. తన భాషలో వాపోయాడు.
“తిండి అస్సలు పెట్టట్లేదు. ఎండి పోయిన బ్రెడ్ ముక్కలే.. అడుక్కు తినేటప్పుడే బాగుంది.” కిషన్ భోరుమన్నాడు.
“అసలు ఈ ఫుడ్డే బాలేదు. తైరు సాదం, సాంబారు సాదం ఎప్పటికైనా దొరికేనా?” తమిళ బాలుడు నయీమ్..
“జుట్టంకుల్.. ఇక్కడికి మనల్ని జాగర్తగా చేర్చాలి కనుక, బాగా పెట్టే వాడు. వీళ్లకి మనం ఎలా ఉన్నా ఏమై పోయినా ఫర్లేదు. వాళ్ల పని కావాలి.. పైసలు రావాలి. అంతే..” చిన్నా సర్ది చెప్పాడు.
“మీరు బానే ఉన్నారు కదా? ఏం చేస్తున్నారు?” కళ్లల్లో ప్రాణాలున్నట్లుగా ఉన్న తబ్రీజ్ అడిగాడు.
“మన యజమానిని, మనల్ని అప్పగించిన మానేజర్నీ బట్టి ఉంటుందనుకుంటా. వాళ్లు మంచి వాళ్లైతే మన పని బాగుంటుంది. మా మానేజర్ కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు.. ఇండియన్. చిన్న వాడు.. కష్టాలన్నీ పడ్డ వాడు. అతను హెల్ప్ చేస్తుంటాడు.”
“అయ్యో మాక్కూడా అటువంటి వాడుంటే ఎంత బాగుండేది.. మా మానేజర్ బాడ్.. అసిస్టెంట్ మరీ బాడ్..” కిషన్ కన్నీళ్లు కారుస్తూ అన్నాడు.
“కిచెన్లో హెల్ప్ కి మీకు టర్న్ రాదా?”
“వస్తుంది చిన్నా.. బోలెడు పని చేయించు కుంటారు.”
“పెద్ద షెఫ్ ఉంటాడు కదా.. ఆయన కాళ్లు జాపుకుని కూర్చున్నప్పుడు, దగ్గర చేరి, కాళ్లు పట్టు. కబుర్లు చెప్పు. కొంచె మైనా కరక్క పోడు. అప్పుడు నీ కష్టం కొంచెం చెప్పు. ఎక్కువ టైమ్ అక్కడ గడుపు. ఎప్పడెప్పుడై పోతుందా అన్నట్లుండకు. అదే నీ లైఫ్ అన్నట్లు పిక్చర్ ఇవ్వు. సాధారణంగా ఇది వర్కౌట్ అవుతుంది.” చిన్నా మరి కొన్ని చిట్కాలు చెప్పాడు.
“మీకు ఈ రైడింగ్.. జాకీగా ఉండడం బాగా నచ్చిందనే అనిపించేలా ఉండండి. విసుగ్గా.. ఎందుకొచ్చిందిరా బాబూ అన్నట్లు అనిపించినా, పైకి సంతోషంగా ఉండండి. కష్టమే అనుకోండి… కనీసం ఆ ఏడుపు మానండి. మొహంలో కనిపించ నీయకండి.”
అంతలో పిలుపొచ్చింది చిన్నా టింకూలకి.. వాళ్ల గుంపులోని మిగిలిన పిల్లలు కూడా వచ్చేశారు.
“టైమ్ టు గో..” అబ్బాస్ వచ్చి పిలిచాడు.
“అమ్మయ్య.. ఇంకో ట్రయల్ ఉంటుందేమో అనుకున్నా. హాప్పీ అబ్బాస్ అన్నా.” చిన్నా లేచి, టింకూని కూడా పైకి లేపాడు.
కిషన్ బృందం ఆశ్చర్యంగా చూశారు..
ఇంత హాపీగా ఎలా ఉండ గలుగుతున్నాడో చిన్నా..
చిన్నా నిజంగా హాపీగా ఉన్నాడా?
ఉన్నట్లు కనిపిస్తున్నాడంతే.
మల్లె పందిరి లాంటి ఇంటి వాతావరణం నుంచి.. తనది కానీ, తన ఇంట్లో వాళ్లది కానీ ప్రమేయం లేకుండా బురద గుంట లాంటి చోట్లో వచ్చి పడ్డాడు.
మల్లె పువ్వులాగే సుకుమారంగా.. అమ్మా నాన్నల ప్రేమతో, నాయనమ్మ ఆప్యాయతతో పెరిగిన వాడు మోటు మనుషుల మధ్య, యాంత్రికంగా లాభ నష్టాల లెక్కలతో మాత్రమే పిల్లలని చూసే గుంపులోకి వచ్చి పడ్డాడు.
అసలు వాళ్లు చిన్న పిల్లలనే జ్ఞానమే లేని బండ రాళ్లలో పడ్డాడు.
కానీ.. పుస్తకాలు, కంప్యూటర్, సరస్వతీ టీచర్ నేర్పించిన విజ్ఞానంతో, భగవంతుడిచ్చిన తెలివితో పరిస్థితులను తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆ భగవంతుడే ఇచ్చిన అవకరాన్ని తెలివిగా ఉపయోగించుకుని, బైటపడగల అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
చిన్నా పుట్టిన రోజివేళ.
పదకొండేళ్లు నిండుతాయి. తనని తీసుకొచ్చి మూడు నెలలవుతోంది. ఇంటి దగ్గరుంటే ఈ పాటికి, నాయనమ్మ గుడికి తీసుకెళ్లి పూజ చేయించి తీసుకొచ్చేది.
ఇక్కడ ఎక్కడా గుడే కనిపించదు.. మజీదులు తప్ప. అయినా హలీమ్ ఫామ్ కి తప్ప ఎక్కడికెళ్లాడనీ.. ఇవేళ వెళ్లిన రేస్ ట్రాక్.. అంతే కదా!
అమ్మ పాయసం చేసేది. నాయన కొత్త బట్టలు తెచ్చే వాడు. తనకి బట్టలు చిన్న వైపోతాయనే బాధ లేదు కదా.. బోలెడు బట్టలుంటాయి.
అయినా సరే.. నాయన కొత్త బట్టలు తీసుకొస్తాడు. స్కూల్లో పంచడానికి చాకొలేట్లు తప్పదు.
స్కూల్లో పిల్లలకి తన సమస్య అర్ధమయి పోయింది. సరస్వతీ టీచర్, ఒక రోజు బోర్డ్ మీద బొమ్మలేసి మరీ వివరించింది.
ఒక్క సైజులో తప్ప, చిన్నా మీ అందరి కంటే ఎందులోనూ తక్కువ కాదని చెప్పింది. ఎప్పుడూ వేరుగా చూడ కూడదనీ, ఏడిపించ కూడదనీ మాట తీసు కుంది.
“అంతే కాదు.. మీరంతా వాడిని సాధ్య మైనంత వరకూ ప్రొటెక్ట్ చెయ్యాలి.. ఉదాహరణకి రోడ్ దాటుతున్నప్పుడూ, ముందు ముందు ప్రాక్టికల్స్ చేసే టప్పుడూ, పరీక్షలు రాసేటప్పుడు ప్రత్యేకమైన సీటు వేసేటట్లూ..” అంటూఎంతో చక్కగా చెప్పింది.
క్లాసులో పిల్లలంతా తనతో ఆరేళ్ల నించీ చదువు తున్న వారే కదా..
“తప్పకుండా చూసుకుంటాం టీచర్..” అని ప్రామిస్ చేశారు.
అందరూ వంగుని చాక్లెట్లు తీసుకుని, హాపీ బర్త్ డే చెప్తారు.
ఏం చేస్తున్నారో అందరూ? సరస్వతీ టీచర్ ఎలా ఉన్నారో?
పాఠాలేం చెప్తున్నారో.. మాత్స్ లో జామెట్రీ లెసన్స్ మొదలు పెట్టారేమో.. మళ్లీ వాళ్లందరినీ చూడగలడో లేదో!
చిన్నాకి కళ్లలోంచి నీళ్లు ఆగకుండా వస్తున్నాయి.
అక్కడ బుల్లయ్య, సూరమ్మల పరిస్థితి కూడా అలాగే ఉంది.
నాయనమ్మ పొద్దున్నే గుడికి వెళ్లి పోయింది.
మనవడి పేరు మీర అర్చన చేయించింది. ఎక్కడున్నా వాన్ని క్షేమంగా ఉండేట్టు చూడు తండ్రీ అని వేడుకుంది.
ప్రసాదం తీసుకొచ్చి ఇంట్లో కొడుక్కి, కోడలికీ పంచింది.
“లేవే.. పాయసం చెయ్యి. ఆడు క్షేమంగా ఉంటాడు. ఇక్కడున్నట్లుగానే చేసుకుందాం మనం. అరేయ్.. నువ్వెళ్లి బట్టలట్టుకురా! ఎప్పుడొచ్చినా రాగానే ఏసుకుంటాడు.. ఎలాగా సైజేం పెద్ద మారదు కదా..” అంటూనే వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది.
పక్కింటి జానీ పరుగెత్తుకుంటూ వచ్చింది.
“ఏటయింది అమ్మా..”
“ఇయేల చిన్నా పుట్టినరోజే..” భోరున ఏడుస్తూ అంది సూరమ్మ.
అక్కడే నేల మీద కూలబడింది జానీ..
“ఎక్కడున్నారో.. ఏం చేస్తన్నారో.. మనకెందుకొచ్చిందమ్మా ఈ కట్టం? ఏ పాపం చేశాం?” జానీ కూడా ఏడవ సాగింది.
మస్తానయ్య కిక్కురు మనకుండా ఇంట్లోంచి బైటికెళ్లి పోయాడు.
పోలీసులు కేసు మూసేసారు.. అది కాస్త నయం మస్తానయ్యకి. తన మీదికేం రాలేదు.
కొత్త బిల్డింగు పనులవుతున్నాయి. పునాదులు తీస్తున్నారు. ప్రతీ శని వారం తన కూలీ డబ్బులొస్తున్నాయి.
ఇంట్లో బాగా డబ్బులిస్తుండడంతో జానీ కూడా గొడవ పెట్టటం లేదు. పిల్లలు ముగ్గురూ స్కూళ్లకెళ్తున్నారు. కడుపు నిండా తింటున్నారు.
మస్తానయ్య అనుకున్నట్లు టింకూ కిడ్నాప్ డబ్బులేం రాలేదు. రాజా బృందం.. అక్కడి నుంచి మకాం ఎత్తేశారు..
కొత్త చోట్లో, కొత్త బేరాలు చూసుకోడానికి.
వాళ్లకి మాత్రం డబల్ డబ్బులొచ్చాయి.. ఇద్దరు కదా!
“లేరా బుల్లీ.. పూలకెల్లు.. ఒక్క రోజు మానేశావంటే నీ బేరాలన్నీ పోతాయి. దగ్గరుండి కాచుకోవాలి. చిన్నాగాడొచ్చేత్తాడు తొందర గానే.. దిగులు పడమాకండి.”
తల్లి మాటలు విని, సూరయ్య దొడ్లో కెళ్లాడు.. తయారవడానికి.
……………………
6

“కామెల్ రేసెస్ బిగిన్..” అరుస్తూ వచ్చాడు అబ్బాస్.
గదంతా తడి బట్ట పెట్టి తుడుస్తున్న చిన్నా చటుక్కున లేచాడు.
“అంటే.. ఏంటన్నా?”
“మనం ఇన్నాళ్లూ వీటి కోసమే శ్రమ పడ్డాం. అసలు చెప్పాలంటే.. ఈ రేసుల కోసమే మన మంతా ఇక్కడున్నాం. ఇన్ని రోజులుగా చేస్తున్న ప్రాక్టీసు ఈ రేసుల కోసమే. అందరూ తమ సత్తా చూపించు కోవాల్సిందిప్పుడే.”
గదిలో ఉన్న మిగిలిన పిల్లలు కూడా వచ్చేశారు.
చిన్నా, టింకూలు అక్కడి కొచ్చి నెల దాటింది.
టింకూ బాత్రూమ్ కి వెళ్లి, కాళ్లు అటూ ఇటూ వేస్తూ, ఈడుస్తూ వచ్చాడు.
అప్పుడే అందరూ హలీమ్ ఫామ్ లో ప్రాక్టీస్ కి వెళ్లి వచ్చారు.
“ఏమయిందిరా? ఎందుకలా కుంటుతున్నావు?” చిన్నాదగ్గరగా వెళ్లి ఆందోళనగా అడిగాడు.
హలీమ్ పర్మిషన్ ఇచ్చాడని టింకూని ఒంటె ఎక్కించాడు నజీర్. అదీ, పిల్లలందరినీ అబ్బాస్ రౌండ్ కి తీసు కెళ్లాక.
టింకూ బెదిరి పోతూ ఎక్కాడు. నజీర్ స్వయంగా దగ్గరుండి సవారీ చేయించాడు. అదీ ఎక్కువ దూరం లేదు. ఒక్కరగంట చేశాడంతే.
అబ్బాస్ కూడా తన న్యూస్ వాయిదా వేసి టింకూ దగ్గరికి వచ్చాడు.
అదే వయసైనా కూడా.. ఎందుకో.. మిగిలిన పిల్లల కంటే టింకూ చాలా సున్నితంగా ఉంటాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ టింకూ ఏడవడం మానేశాడు. ఏడిచీ ఏమీ సాధించలేనని తెలుసు కున్నాడేమో!
గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండి పోయాడు టింకూ.. మాట్లాడకుండా.
చిన్నా టింకూ కాళ్లు చూడ బోయాడు. ఇంకా దగ్గరగా తీసుకుని మూలుగుతూ పక్కకి తిరిగి పోయాడు.
అబ్బాస్, టింకూ కలిసి బలవంతంగా వాడిని తిప్పి, నిక్కరు విప్పి చూశారు. టింకూ కళ్లలో నీటి పొర..
వాడి తొడలు చూస్తుంటే, చిన్నాకి ఏడుపాగ లేదు. వణుకుతున్న చేతులతో సున్నితంగా రాయ బోయాడు. గట్టిగా కేక పెట్టాడు టింకూ.
పల్చని చర్మం చేతిలోకి వచ్చింది. రెండు తొడలూ ఎర్రగా.. గడ్డ కట్టుకుని పోయిన రక్తం బైటికి దుమకడానికి సిద్ధంగా ఉంది.
మర్మాంగాలు నల్లగా కమిలి పోయాయి.
ఎంత నొప్పెడుతోందో కానీ.. టింకూ వెక్కుతూ ఉండి పోయాడు. గట్టిగా ఏడవడం చాత కాని వాడిలా..
కాలి మీద నుంచి కారు వెళ్లిపోతే మూలిగే కుక్క పిల్లలాగ మూలిగాడు.
“చిన్నా! అబ్బాస్ అన్నా..” మూలుగుతూనే, నీరసంగా పిలిచాడు.
“ఏంట్రా?”
“ఇలా దెబ్బ తగిలిందని నజీర్ అంకుల్ కి చెప్పద్దు. చంపేస్తాడు. ముందే చెప్పాడు. ఈ రేసుల్లో కాక పోయినా వచ్చే రేసుల్లో నేను జాకీ అయి తీరాలిట. ఇన్ని రూపాయలిచ్చార్ట మా నాన్నకి.” చేతులు బార్లా చాపి అన్నాడు టింకూ.
అబ్బాస్ కేసి చూశాడు చిన్నా..
“అలాగే చెప్పను టింకూ. ప్రామిస్.” అబ్బాస్ తల తిప్పుకుని వెళ్లి పోయాడు.
“హూ.. వీడు కూడా అంతే కాబోలు.. గుండె బదులు బండ పెట్టుంటాడు దేవుడు.” చిన్నా తిట్టుకుంటూ, కిచెన్ దగ్గరకి పరుగెత్తాడు.
“షెఫ్ అంకుల్..” కిచెన్ అంతా వెతుకుతూ పిలిచాడు.
“ఏంటి సమీర్?” షెఫ్ నాప్కిన్ కి చేతులు తుడుచు కుంటూ వచ్చాడు.
షెఫ్ కి ఇంగ్లీష బాగా వచ్చు. చిన్నా అతనితో ఇంగ్రీష్ లోనే మాట్లాడతాడు. అసిస్టెంట్లతో సైగలే..
“చిన్న కప్ లో ఆయిల్ కావాలి.”
“ఎందుకు.. మళ్లీ ఏమైనా చిట్కా వైద్యమా?”
“అవునంకుల్. స్కిన్ ఊడి పోయి, బ్లడ్ వస్తోంది.. టింకూకి.”
“ఓ.. ఫస్ట్ టైమ్ కామెల్ ఎక్కాడా?”
తెల్లబోయి చూసాడు చిన్నా.
“ఇక్కడ కామన్ ఆ ప్రాబ్లమ్. అందులో సుభానీ కొంచెం డెలికేట్ గా, ఛబ్బీగా ఉంటాడు కదా.”
అవునన్నట్లుగా తలూపాడు చిన్నా. కంట్లోంచి నాలుగు నీటి చుక్కలు షర్ట్ మీద పడ్డాయి.
“తగ్గి పోతుందిలే. ఇదిగో ఆలివ్ ఆయిల్.” చిన్న సీసాలో తీసి ఇచ్చాడు.
పరుగు పరుగున చిన్నా తమ రూమ్ కి వచ్చే సరికి, అబ్బాస్ ఆయింట్ మెంట్ రాస్తున్నాడు.. టింకూని పడుక్కోబెట్టి.
“ఇది యాంటీ బయాటిక్ కూడా. ఇన్ ఫెక్షన్స్ రావు. ఆయిల్ అక్కడ రాయి.” మర్మాంగాలు చూపించాడు.
అబ్బాస్ ని తప్పుగా అనుకున్నందుకు సిగ్గు పడుతూ, అతను చెప్పినట్లు చేశాడు చిన్నా.
“ఈ మాత్ర వేస్తే నొప్పి తెలీదు. వాటర్ తీసుకురా.” మాత్ర వేస్తూండగానే, టింకూ నిద్ర పోతున్నాడు.
“లంచ్ వచ్చినప్పుడు లేపి తినిపించచ్చు. రండి.. మనం టివి రూమ్ లో కూర్చుందాం.” పిల్లలందరూ అబ్బాస్ వెనుకే వెళ్లారు.
చిన్నా ఇంకా తేరుకో లేక పోయాడు.
“అది చాలా కామన్ చిన్నా. తగ్గి పోతుంది. నీ కాళ్లు, థైస్ సన్నగా ఉన్నాయి. అందుకే నీకు రాలేదా ప్రాబ్లమ్. వీళ్లనడుగు.. టింకూ అంత కాక పోయినా కొంచెమైనా వీళ్లకి వచ్చే ఉంటుంది.”
అవునన్నట్లు తలూపారు ముగ్గురూ.
“ఇంతకీ రేసులు..” చిన్నా సర్దుకుని అడిగాడు.
“అవును. రెండు రోజులు.. చాలా ఫేమస్, ప్రెస్టీజియస్ రేసులు. ఎమిరేట్స్ హెరిటేజ్ క్లబ్ వాళ్లు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ క్లబ్ ఛైర్మన్, డిప్యూటీ ఫ్రైమ్ మినిస్టర్. ఆయన ఆధ్వర్యంలో జరగ బోతున్నాయి.”
“ఎప్పుడు?” నలుగురూ ఒకే సారి అన్నారు.
“ఇంక సరిగ్గా టెన్ డేస్. మనం కనీసం నాలుగు ప్రాక్టీస్ లు చెయ్యాలి, ఈ లోగా.” అబ్బాస్ ఆలోచిస్తూ అన్నాడు.
“ఆ. పెద్ద రేసులెక్కడవుతాయి? మన రేస్ ట్రాక్ లోనేగా? అదే పెద్దది.. అప్పుడు వెళ్లాం కదా!”
“కాదు. పక్క దేశంలో. ఇక్కడికి టూ హన్డ్రెడ్ కిలో మీటర్లు దూరం. ‘ఆల్ కతమ్’ ఎడారిలో. అక్కడ ఇసుక కుప్పలు బంగారు రంగులో మెరుస్తూంటాయి.”
“ఓ..” ఇసుక రంగుతో పనేం లేదు ఈ జాకీలకి.
అక్కడ.. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాల్చేసే ఎండ లేకుండా ఉంటే చాలు.
ఒంటె ఎక్కేటప్పుడు, దిగాక.. చెప్పుల్లేని కాళ్లతో నడవాలి.
ఏ దెబ్బలూ లేకుండా బైట పడితే చాలు.
“హలీమ్ సాబ్.. సెలెక్ట్ చేస్తారు, మన రేస్ ప్రాక్టీస్ చివరి రోజున. ప్రాక్టీస్.. మన రేస్ కోర్స్ లోనే చేస్తాం. మీరు రోజూ ఎక్సెర్ సైజులు చేస్తుండాలి. చాలా ప్రతిష్ట కలిగిన రేసులు. ఫస్ట్ వస్తే మంచి బహుమానం ఉంటుంది.”
“సరే అన్నా. మేం గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తాం. కాసేపు టివి చూసి.” చిన్నా అందర్నీ కూర్చో పెట్టాడు.
“లంచ్ అయాక వెళ్తాం. రెడీగా ఉండండి.”
అబ్బాస్ వెళ్లి పోయాడు.. నజీర్ తో ఇహెచ్ సి రేసుల గురించి చెప్పటానికి.
అదే మొదటి సారి, చిన్నా టివి రూమ్ కి రావడం.
అదంతా చూసి.. అంత వరకూ ఎందుకు రాలేదా అని విచారించాడు.
చాలా విశాలంగా ఉండడమే కాదు.. చల్లగా కూడా ఉంది.
“మేం రూమ్ కి వెళ్తున్నాం. కాసేపు పడుక్కుంటాం.” రూమ్ మేట్స్ చెప్పేసి వెళ్లి పోయారు..

ఎందుకీ మహిళా దినోత్సవాలు??

రచన: శ్రీమతి నిర్మల సిరివేలు

అణకువ కలగిన ఇల్లాలుగా, ప్రేమను పంచే మాతృమూర్తిగా , స్నేహాన్ని పంచే ఆత్మీయ వ్యక్తిగా ఉన్న ఒక మహిళ మహిళా దినోత్సవాల సందర్భంగా మొదటిసారిగా తనలోని ఆలోచనలను, భావాలను ఎంత అందంగా వ్యక్తీకరించారో చూడండి.

పెద్దలకు, ఇంకా పెద్దలకు, ఈ సభకు వచ్చినందుకు మీకందరికి మా ధన్యవాదాలు.
స్త్రీ శక్తి స్వరూపిణి. అన్నింటా తెలివిగలది. చదువులో, వంటలో, తల్లిగా, భార్యగా, చెల్లిగా, ఇల్లాలిగా అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది. మగవానికి స్త్రీ అండదండలు లేకుంటే అసలు ఉన్నతస్థితికి రాలేడు. పర్వతారోహణలోగాని, విమాన యానంలోగాని, బ్యాంకింగ్ రంగంలో కాని, ఒక నటనారూపములోగాని, చెప్పలేనన్ని ఉన్నతస్థితిలో గాని, ఒకవైపు ఇల్లాలిగా, ఒకవైపు తల్లిగా, ఒకవైపు వృత్తిరిత్యా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కుంటూ, పోరాటాలలో నెగ్గుకుంటూ ఉన్నతస్థాయిలో ఉండి సమాజ శ్రేయస్సుకు కూడా సహకరిస్తూ ఉందంటే ఏదో శక్తి ఆమెని ప్రేరేపిస్తూ ఉంది. లక్ష్మీదేవిలో, పార్వతీదేవిలో, సరస్వతీదేవిలో ఆవహించి స్త్రీశక్తిని నడిపిస్తూ ఉంది. రాణీ రుద్రమదేవి, రాణీ ఝాన్సీబాయి వంటి ఎందరో వీరవనితలు ఈనాడు కూడా ఉన్నారు.
ఒక తల్లి తనకు పుట్టిన బిడ్డలలో ఎవరైనా పోలియో వచ్చినా, అందవికారంగా ఉన్నా, మందమతిగా కాని, చూపులేకకాని, మూగ కాని, ఎలా ఉన్నా సరే ఆ తల్లి వారిని మిగతా పిల్లలకన్నా కూడా ఎక్కువ ప్రేమిస్తుంది. 24 గంటలూ ఆ బిడ్డతోనే ఆ తల్లి లోకం.
తాగుబోతు తండ్రి ఇంట్లో ఏమీ ఇవ్వకపోయినా, ఇల్లిల్లు తిరిగి పాచిపని చేసైనా తన బిడ్డలకు తిండి పెట్టాలని తాపత్రయపడుతుంది. కాలక్రమేనా ఆ తల్లి అనారోగ్యం పాలై చనిపోతే ఆ తాగుబోతుల బిడ్డలు అనాధ శరణాలయాలకు చేరుతున్నారు.
ఇలాంటి ఆశ్రమాలు లేకపోతే ఆ బిడ్డల గతి ఏమి కావాలి. అందుకే మనం ప్రతీ శనివారం దేవుడికి కొట్టే కొబ్బరికాయకు పెట్టే 20 రూపాయిలు ఒక అనాధ బిడ్డ కొరకు ఇస్తే అది ఇంత అంతై, అంత ఇంతై, వారికి మనం ఎంతో సాయం చేసినవారం అవుతాం.
దేవకి అష్టమగర్భంలో తనకు నారాయణుడే పుడ్తాడని తెలుసుకొని, ఆ రాక్షసుడు వింటే తన బిడ్డను చంపేస్తాడని ఆ ప్రసవ వేదనని నిశ్శబ్దంగా భరించింది. అంతటి ధీర వనితలు మహిళలు.
నేటికీ ఆడవారు మగాళ్లకు బలిపశువులుగా మారుతున్నారు. కామాందులకు బలి అయిపోతున్నారు. ప్రతీరోజు పేపరులో ఎవరో ఒకరు ఈ అమానుష చర్యలకు బలి అవుతున్నారు. ఈ దాడులను ఎదుర్కునే ధైర్యం ఆడవాళ్లకు ఎలా వస్తుంది. ఎప్పుడు వస్తుంది. తెలియకుండా ఉంది.
ఆడది అర్ధరాత్రి వంటరిగా నడిచే స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? ఎన్ని March 8లు వచ్చినా మహిళలకు ప్రతీ చోటా అవమానాలే. ఎన్ని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నా కూడ స్రీ ఎన్నో విధాలుగా మగవాడి చేతులలో బలి అవుతూనే ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది. స్త్రీ శక్తి ఎప్పుడు మేల్కుంటుంది. అమ్మ శక్తి స్వరూపిణి. నవరాత్రులలో తొమ్మిది రోజులు ఎన్నో విధాలుగా పూజించి మ్రొక్క్లు మొక్కినా కూడా ఆమెకు ఆడదంటే నిర్లక్ష్యమా . ప్రపంచం ఎంత ఉన్నతి సాధించినా మహిళా నీకు ఇంకా పూర్తి స్వతంత్రం లేదు అంటూ ఉంది.
పూర్వకాలం నుండి మగవాడు వయసులో పెద్దగా ఉండాలి. ఆడది వయసులో చిన్నగా ఉండాలి అని పెట్టారు. ఎందుకంటే మగవాడికి సేవ చేసేది ఎవరు? భర్త మంచివాడు అయితే ఫర్వాలేదు. స్త్రీలోలుడు అయితే వాడి శరీరమంతా పుచ్చిపోయినా వాడికి సేవ చేయడానికే ఆడదాని వయసు తక్కువ పెట్టారు. అక్కడ కూడా వారి స్వార్ధం కోసం ఆడవారికి అన్యాయం చేసారు. సంసారం రచకెక్కకూడదు అని, సర్దుకుపోవాలి అని, ఆడదానికే నీతులు చెప్తారు. ఎంత గొడవ జరిగిన మన తప్పు లేకున్నా కొంచం తలవంచితే ఆ గొడవ సద్దుమణుగుతుంది అని ఆడవారికే చెప్తారు .
కొన్నిసార్లు ఆరోగ్యసమస్యలు వచ్చినప్పుడు కొడుకుకోసమైనా, కూతురు కోసమైనా ఒక్క మూత్రపిండం మార్చవలసి వస్తే ముందుగా తల్లే కడుపుతీపితో తన రక్తం పంచుకున్న బిడ్డకోసం తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తుంది. కాని తండ్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతాడు. తన జీవితం ఏమైన పర్వాలేదనుకుంటుంది తల్లి. కాని అమ్మో నా జీవితం అని జంకుతాడు మగవాడు అదే తండ్రి.
భార్యకు ఆరోగ్యం బాగా లేక నాకు ఆరోగ్యం బాగాలేదు ఒక వంటవాణ్ణి మాట్లాడండి అని భర్తతో చెప్తే అతను భార్యతో చూడు నా వంక చూడు. రోజూ నీ వంట తినకపోతే ఈ జన్మ వ్యర్ధం. బయట తినలేను. నువ్వే చేసి పెట్టవా అని అడుక్కుంటాడు. ఇప్పుడు కూడా ఇలాంటి మగాళ్లు/ మొగుళ్లు ఉన్నారు.
“ఐస్‌లాండ్” అనే దేశంలో 1975 అక్టోబర్ నెల 24 న దేశంలోని మహిళలందరూ తమ పనులు ఆపేసి సమ్మె చేసారు. ఈంట్లో వంట , ఉతకడం, కడగడమైనా, ఆఫీసుల్లో, దుకాణాలు మొదలైన వ్యాపార సంస్థల్లో కూడా ఆడవాళ్లు అందరూ పని ఆపేసి సమ్మె చేసారు. దుకాణాలు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూళ్లు, రైల్వే స్టేషన్లు, తెలిఫోన్ ఎక్షేజ్, రేడియో స్టేషన్ మొదలైనవన్నీ మూసేశారు. చాలా తీవ్రంగా జరిగిన ఈ సమ్మె చాలా ప్రభావన్ని చూపింది. వెంటనే ప్రభుత్వం దారికి వచ్చి వారితో చర్చలు జరిపింది. ఆ క్రమంలో తర్వాత ఆ దేశంలోని ఒక మహిళ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది.

ఇటువంటి మార్పు మన దేశంలో కూడా రావాలని అందరూ ఆశిద్దాము. ఆడవారికి ఇబ్బందులు కలుగుతున్నాయనే ఉద్ధేశ్యంతోనే (She) షీ పోలీస్ బృందం ఏర్పాటు చేయబడింది. వీరు స్త్రీలకు చాలా సహకరిస్తున్నారు. అయినా కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలు, అమానుషాలు జరుగుతూనే ఉన్నాయి.
ఆడదానికి ఆడది శత్రువు కాకూడదు. వారి మధ్య సమన్వయం కావాలి. అత్త అయినా, కోడలు అయినా, కూతురు అయినా , అందరూ కలిసి ఆలోచించి అందరూ నావాళ్ళే అనే భావన మనసునిండా నింపుకుని కలిసి ఉండాలి. అప్పుడే కుటుంబం, దేశం కూడా సంతోషంగా, సుభిక్షంగా ఉంటుంది.