21-వ శతాబ్దంలో వికటకవి – 2

రచన: కిభశ్రీ (శ్రీనివాస భరద్వాజ కిశోర్)

21వ శతాబ్దంలో పుట్టిన రామకృష్ణ కవి, హైస్కూలులో నరసింహారావు మాస్టారి తెలుగు క్లాసులో మత్తకోకిల ఛందస్సు నేర్పి, మరుసటిరోజుకు ఒక పద్యం వ్రాసుకుని రమ్మన్నారు.

మధ్యాహ్నం తెలుగు నాన్డీటెయిల్ క్లాసు. మహా బోరు కొడుతున్న ఆ క్లాసులోకి వెళ్ళేముందు సరదాగా ఈ కింది మత్తకోకిల పద్యం వ్రాసుకుని తన మితృనికి అభినయంతో సహా చదివి వినిపించి ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు.

నత్తలా నడిచేటి బోరగు నాన్డిటేయిలు క్లాసులో
మత్తుయెక్కదె నిద్ర వచ్చిన? మందబుద్ధులమవ్వమే?
నత్తి పల్కుల తిట్టుచున్ మన నారసింహుడు ఉగ్రుడై
బెత్తమున్ ఝళిపించి చూపుచు బెంచిపై నిలబెట్టడే?

కానీ ఆ ఇద్దరూ గమనించని విషయం, నరసింహారావు మాస్టరు వాళ్ళ వెనకాలనే నడుస్తూ పద్యాన్ని విని కోపంతో ఊగిపోతున్నారన్న సంగతి. ఏదోవిధంగా ఆనాటి నాన్ డీటెయిల్ క్లాసు అయిపోయింది. కానీ…

మరుసటి రోజు క్లాసులో నిన్నటి పద్యం మాటిమాటికీ గుర్తు తెచ్చుకుని, రామకృష్ణునికి మంచి గుణపాఠం నేర్పాలనుకున్నారు నరసింహారావు మాస్టారు. అందరికంటే ముందు రామకృష్ణున్ని “త్త” ప్రాసాక్షరంగా తనపై పద్యం చెప్పమనీ, చెప్పకుంటే బెంచిమీద నిలబెడతానని బెత్తం ఝళిపిస్తూ, అన్నారు.

మరి రామకృష్ణునికి, అతని మిత్రునికీ అర్థమైపోయింది మాస్టారుకు తన వికటమైన పద్యంగురించి తెలిసిపోయిందని. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతో వ్రాసి పెట్టుకున్న పద్యం వెంటనే ఎత్తుకున్నాడు రామకృష్ణుడు.

ముత్తెమంటిమనస్సుగల్గిన మూలగుర్వవు నీవయా
ఉత్తముండవు నీవునేర్పిన ఉన్నతోన్నత విద్యలన్
చిత్తమందున నిల్పగన్ యవి జీవితమ్మున తోడ్పడున్
ఎత్తులెన్నిటినెక్కినన్ నిను ఎన్నడూ మరువన్ సుమీ

అంతే – ఆఖరు పాదానికి ఆయన కరిగిపోయి కంటతడి పెట్టుకుని – రామకృష్ణుని సమయస్ఫూర్తికి మెచ్చి మనసారా ఆశీర్వదించారు. రామకృష్ణుడు, అతని మితృడు మాత్రం మనసులోనే ముందురోజు పద్యం తలచుకుని నవ్వు ఆపుకోలేకపోయారు.

21-వ శతాబ్దంలోవికటకవి – 1

రచన: కిభశ్రీ (శ్రీనివాస భరద్వాజ కిశోర్)

ఒకసారి రాయలవారూ, తిరుమలదేవి, రామకృష్ణకవి, హైదరాబాదు పబ్లిక్ గార్డన్స్ లో వ్యాహ్యాళి సమయంలో వాదులాటలో వున్న ఒక యువజంటను చూసి వారి ఘర్షణకు కారణమేమయ్యుంటుందన్న విషయం మీద చర్చ వచ్చి రాయలవారు పొరపాటు అమ్మాయిదయుంటుందనీ , రాణిగారు తప్పు తప్పకుండా అబ్బాయిదేనని, వాదించుకుని కాసేపు, రామకృష్ణకవిని అభిప్రాయం అడుగుతారు. అప్పుడు రామకృష్ణుడు:

కం।। మగువలు వెదకుదురెప్పుడు
తగవుపడగ కారణమ్ము తన తప్పైనా
మగడు సతికి యన్నింటను
సగభాగమునిచ్చెగాన సహియించవలెన్

అని పద్యం చెబుతుండగా రాణిగారి కొరకొర చూపులు గమనించి వెంటనే

అని అంటాననుకున్నట్లున్నారు రాణివారు. కాదు తల్లీ దేవీ ఉపాసకుడను కాబట్టి నా అభిప్రాయం:

కం।। మగువలు నిరతము యేలనొ
తగవుపడుట వలదనుకుని తప్పు తనదనున్
మగడు తనకు యన్నింటను
సగభాగమునిచ్చెననుచు సహనముచూపున్

అని మార్చేసరికి అతని సమయస్ఫూర్తికి రాజు రాణి ఫక్కున నవ్వేస్తారు