Gausips.. ఎగిసే కెరటాలు-13

రచన:- శ్రీసత్యగౌతమి

రాకేష్ తో తెగతెంపులు చేసుకొని నేరుగా కౌశిక్ రూం వైపు నడుస్తూ … లహరి ఆఫీసు రూం ని దాటుతోంది. ఎందుకో కాస్త మనసు బాధ కలిగింది సింథియాకు, అక్కడ లహరి కనబడకపోయేసరికి. ఆమె రూం లో లైట్ లేదు. అందరూ ఆ చుట్టు ప్రక్కలే ఉన్నా నిశ్శబ్దంగా ఉన్నారు. కౌశిక్, సింథియాల అలికిడి ఉన్నా, శబ్దం రాని సముద్రపు అలలా అనిపిస్తున్నది సింథియాకు.

“లహరి నిష్క్రమణ ఇంత బాధిస్తున్నదెందుకు నాకు? చేసిన పాపం వెంటాడుతున్నదా నన్ను? అయినా పాప పుణ్యాలు, స్వర్గనరకలున్నాయా? హు… అంతా భ్రమ! భ్రమల్లో బ్రతికేవాళ్ళకి ధర్మాలు. ప్రాక్టికల్ గా ఆలోచించే మాలాంటి వాళ్ళకు కాదు” … అని అనుకుంటూ మన:స్సాక్షి ని తన హై హీల్ చెప్పుతో తొక్కుకుంటూ లహరి రూం మీదుగా సాగిపోయింది.

“మే ఐ కమిన్?” … నవ్వుతూ డోర్ దగ్గిర ఆగి అడిగింది సింథియా.
రివాల్వింగ్ చైర్ లో కూర్చొని దీర్ఘం గా ఆలోచిస్తున్న కౌశిక్ ఉలిక్కిపడి తల పైకెత్తి చూసాడు.
“ఏంటీ క్రొత్త అలవాటు? మర్యాదివ్వడం నేర్చుకున్నావా?” .. అంటూ నవ్వాడు.
“అంటే నేను మర్యాదస్తురాలను కాదనే కదా… మీ ఉద్దేశ్యం?” అని అడిగింది.
“అహ … లేదులే. మర్యాదగా మర్డర్ చేస్తావ్” … అంటూ ఇంకా ఉడికించాడు.
“మర్డరా?” … అంతెత్తున ఉలిక్కిపడింది. అంటే …… అని దీర్ఘం తీసింది.
“లహరి వచ్చేవారం నుండి డ్యూటీలో జాయిన్ అవుతున్నది” అన్నాడు.
“ఓహ్ .. అదేనా మీ దీర్ఘాలోచన?” అన్నది సింథియా.
“అవును. వచ్చేవారం నుండి ఈ బయో డిఫెన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆమె హ్యాండెవర్ చేస్తున్నది యూనివర్సిటీ”
“అర్ధం కాలేదు. నాకిదంతా అర్ధమయ్యేలా చెప్పాలి”.
“లహరి నాకు బాస్ అవుతుంది, నాకది ఇష్టం లేదు”… అన్నాడు కౌశిక్.
“అలా ఎలా? నాకు చాలా కన్ ఫ్యూజింగ్ గా ఉంది. నాకు మొత్తం చెప్పండి”
“హాస్పిటల్స్ లో జబ్బుల మీద రీసెర్చ్ జరుగదు. రీసెర్చ్ జరిగే ఇన్సిట్యూట్స్ తో కలిసి నేను పనిచెయ్యాలి. నేను సప్లై చేసే రోగుల స్యాంపుల్స్ మీద రీసెర్చ్ చెయ్యడానికి యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్స్ సైంటిస్టులను నాకు ప్రొవైడ్ చేస్తాయి. అలా వచ్చిన వ్యక్తే లహరి. నేను ఆమెకు బాస్ ను కాను” … అని ఆగాడు.
“ఆశ్చర్యపోయింది… సింథియా. మరి ఆమె కేదైనా అయితే యూనివర్సిటీ బాధ్యత పడుతుందా?”
“అవును”… అన్నాడు కూల్ గా కౌశిక్.
“అయితే … ఇప్పుడు ప్రాబ్లం ఏంటీ?”
“ఎందుకు లేదూ?” నాకు వచ్చేదేముంది? ఫండింగ్ నాదికాదు, స్పేస్ నాది కాదు, రీసెర్చ్ నాది కాదు నేను కేవలం ఒక కొరియర్ బాయ్ ని. హాస్పిటల్ కీ, యూనివర్సిటీ కి ఉన్న డీల్. నేను డాక్టర్ ని కాబట్టి స్యాంపుల్స్ ని పొందుతున్నారు. నేను యూనివర్సిటీ లో ఉండాలంటే దానికి ఫండ్ తేవాలి, దానికి నేను గ్రాంట్ రాయాలి. అది ఇప్పటినుండీ లహరి చేస్తుంది, ఆమె తో కలిసి వ్రాయమని, ఆమెకు కొన్ని బాద్యతలను అప్పజెప్పమనీ ఆమె కెరియర్ డెవెలప్మెంట్ కి నేను తోడ్పడాలనీ యూనివర్సిటీ నాకు లెటర్ పంపింది. ఇది నాకు వాళ్ళు వేసిన డ్యూటీ. అది నాకిష్టం లేదు. ఆమె ఒకసారి ఈ ట్రాక్ లోకి వచ్చేసిందంటే నిన్ను కూడా ఉంచదు పనిచెయ్యకపోతే. అందుకే … ఆమె మీద నీచేత కంప్లైంట్లు రాయించాను, వాటిని యూనివర్సిటీ కి పంపించాను, అది నీకు చెప్పలేదు అనుకో… అయినా యూనివర్సిటీ అది పక్కనపడేసి ఆమె పొజిషన్ ని అప్ గ్రేడ్ చేసింది” అని కాస్త ఆగాడు కౌశిక్.

“మరి ఇచ్చిన కంప్లైంట్లకి సమాధానం?”
“నువ్వు యూనివర్సిటీ పర్సన్ వి కాదని తేల్చి, నువ్వు చేసే వర్క్, దాని ప్రోగ్రెస్ పంపమన్నది”
“దానికీ, దీనికీ ఏమిటి సంబంధం?”
“నిన్ను అనుమానించింది. ఆమె వర్క్ కి ఏమన్నా ఇబ్బంది నీ వల్ల కలుగుతుందేమో అందుచేత దాన్ని వారించే పరిస్థితి లో ఈ ఈ ఘర్షణ జరుగుతున్నదేమో” అని.
“ఘర్షణ? ఎవరి మధ్య?”
“అదే … అదే… ఇప్పుడు”
“ఘర్షణ ఎవరి మధ్య? అదే అడిగారు అధికారులు. వాళ్ళు నిన్ను అడిగినా నువ్వూ ఇలాగే అందువు కదా?” అని అక్కసుగా అడిగాడు.
“అవును. నేనెక్కడ ఘర్షణ పడ్డాను ఎవరితో అయినా?”… అని ఆశ్చర్యపోయింది సింథియా.
“ఏ ఘర్షణా, తగవులూ నువ్వు పడకుండానే … లహరి త్రాగేదానిలో, తినేదానిలో డ్రగ్ కలిపేసావా? ఆమెను చంపాలని ప్రయత్నించావా?” అని అన్నాడు సూటిగా.
“వ్వాట్? నేను చంపాలాని ప్రయత్నించానా? అబద్ధం. అంతా అబద్ధం. మిస్టర్ కౌశిక్ … ఇదంతా నాకు చెప్పకుండా నువ్వు నాతో నాటకమాడించావు. ఏదో ఆమె మీద అసూయో, నీ మీద ఉన్న ఇష్టమో చెప్పుడు మాటలు విని నేను నువ్వు చెప్పినట్లు చేసాను, ఆ డ్రగ్ కలిపాను. ఇది అన్యాయం. నా మీదకు ఇంత పెద్ద నేరాన్ని నెట్టేయడం”
“ఏది అన్యాయం? ఎప్పటికప్పుడు నామీద మత్తుమందు ప్రయోగించి, నా బుర్ర దిమ్మెక్కించి నన్ను వాడుకోలేదా నువ్వు? నిన్ను నేను ఇండియా వచ్చినప్పుడే పూర్తిగా అర్ధం చేసుకున్నాను. తాగుడు మైకానికీ, మత్తుమందుకి తేడా గమనించలేనివాడిననుకున్నావా? అందుకే నేను నిన్ను చాన్నాళ్ళు చేరదీయలేదు, నా వెనుక నువ్వెంత తిరిగినా…అయినా నువ్వు తెలివైనదానివి, చటర్జీ ని అతని సిబ్బందిని ఒక ఆట ఆడించినదానివి, నీకు నేను చెప్పాలా?” అన్నాడు.
సింథియా… విల విలలాడింది. తనకు ఏ మత్తుమందులు తెలియవని, వాదించింది. ఇలా వాగ్యుద్ధాలు జరిగాయి. తర్వాత నిశ్శబ్దం ఆవరించింది.
తర్వాత మెల్లగా తేరుకొని అడిగింది సింథియా… “ఇంతకూ ఘర్షణ ఎవరిది?”
“నాది” అన్నాడు గంభీరంగా.
“మరి ఇప్పుడు చెయ్యబోయేది? అని అడిగింది.
“నువ్వు తెలివైన దానివి. నీకు తెలుసు నాకు మళ్ళీ ఎలా దెబ్బకొట్టాలో, ఎలా తప్పించుకోవాలో. ప్రయత్నించుకో” అన్నాడు.
సింథియా అలా మ్రానుపడిపోయింది.
“మరి అధికారులు నా మీద యాక్షన్ తీసుకుంటారా?? నన్ను పిలిచి జరిదిందేమిటి అని అడుగుతారా? కనీసం అప్పుడేం చెప్పాలి నేను? నాకిప్పుడు హెల్ప్ చెయ్యి” అన్నది.
“నువ్వు ఎలా మాట్లాడుకున్నా నాకు పర్వాలేదు. నువ్వు లహరి మీద నాకు వ్రాసినవి నేను వాళ్ళకి ఫార్వార్డ్ చేసానే తప్పా … దానికి నేను సాక్ష్యమివ్వలేదు. అది నీకూ, లహరికి సంబంధిన విషయం”.
“అధికారులు లహరి ని అడిగితే ఆమేమి చెప్పంది?”
“తెలియదు. వాళ్ళడిగారా లేక చెప్పిందా లేక చెప్పబోతోందా అన్న విషయాలేమీ నాకు తెలియవు. ఇది నీ సమస్య”
అనగానే సింథియా పిచ్చిదయిపోయింది. గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది. “ఇదంతా కుట్ర. నీకోసం ఇందులో నన్ను ఇరికించావు”
“నువ్వు కుట్రదారువి కావా? మనమంతా ఒకలాంటి వాళ్ళం, మనలో మనం న్యాయం, ధర్మం అని మాట్లాడుకోవడమేమిటి? అయినా ఉద్యోగం కావాలని వచ్చిందానివి నువ్వు. ఇచ్చాను, ఇదే నువ్వు చెయ్యాల్సింది”.
ఆ మాటతో సింథియా కుప్పకూలిపోయింది. తనకు గ్రీన్ కార్డ్ కి అప్ప్లై చెయ్యడానికి కావలసిన సహాయాలు అడుగాదామని వచ్చింది సింథియా. ఇప్పుడు కౌశిక్ నుండి ఇలాంటి మాటలు వినేసరికి తట్టుకోలేకపోతోంది. మౌనం గా కాసేపు కూర్చొని ఇంటికి వచ్చేసింది.
దీర్ఘాలోచనలో పడింది సింథియా. కాసేపాగి ఛటర్జీకి ఫోన్ చేద్దామని అనుకొన్నది.
“కానీ, ఇదంతా ఎలా చెప్పను? ఛటర్జీ తనని చాలా నమ్మాడు, నేను నా జీవితానికి కావలసింది ఛటర్జీ కి తెలియకుండా ప్లాన్ చేసుకున్నానని ఎలా చెప్పను … ఎలా చెప్పను? అది ఇప్పుడు ఇలా వికటించిందని ఎలా చెప్పను? ఎలా చెప్పను?” అంటూ … పరి పరి విధాల ఆలోచించిస్తూ ఆలోచనల్తో అలసిపోయి అలాగే నిద్ర పట్టింది.
లేచేసరికి తెల్లారిపోయింది. బ్రష్ చేసుకొని డైనింగ్ హాల్ కి వెళ్ళేసరికి మొదటిసారిగా వంటరిగా ఫీల్ అయ్యింది. అక్కడ రాకేష్ లేడు.
కాస్త బాధపడి, మళ్ళీ తన రొటీన్ ఆలోచనలలో పడిపోయింది. రాత్రంతా ఆలోచించాక …ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసింది.
“నాకిప్పుడు సోఫియా యే గత్యంతరం. వాళ్ళెకెందుకు కావాలో ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని … లహరి రాకముందే సోఫియాకి ఇచ్చేస్తాను. దానికి డీల్ గా తనకు కావలసినది చెయ్యమని అడుగుతాను. అలాగయితే ఇవాళే సోఫియా కు హ్యాండవర్ చేసేస్తాను. కౌశిక్, లహరి ఎలా పోతే నాకెందుకు? దీనివల్ల కౌశిక్ నా గ్రిప్ లోకి వస్తాడు భయంతో. లేకపోతే నా జీవితంతో ఇలా ఆడుకుంటాడా? నేనేంటో తెలియజెప్పుతాను”
సోఫియాకు వెంటనే ఫోన్ చేసింది. టైం చెప్పింది కొన్ని విషయాలు మాట్లాడాలని.
*******************************
సోఫీయా ఫోన్ ఎత్తింది. సింథియానుండి ఫోన్ వచ్చేసరికి సోఫియా తో పాటు శామ్యూల్ కూడా ఉన్నాడు.

సింథియా చెప్పిందంతా వినీ, “డీల్ ఏంటి? ఆ రోజు నువ్వు అవేమీ మాట్లాడలేదే నాతో?”
“అవును… ఎట్ థ సేం టైం … నువ్వడిగినది నేను చేస్తానని కూడా ప్రామిస్ చెయ్యలేదు” అన్నది సూటిగా సింథియా.
కాస్త షాక్ అయ్యింది సోఫియా. సింథియా మాటకు.
“సరే … నేను, శామ్యూల్ ఇద్దరం వస్తాం”
“శామ్యూల్ ఎవరు?”
“మాలో ఒకడు. మా రీసెర్చ్ టీం మెంబర్, వర్రీ లేదు” అన్నది సోఫియా.
“ఓకే, మొన్న మనం కలిసిన ప్లేస్ లోనే, అదే టైం కి కలుద్దాం” అన్నది సింథియా.
“ఓకే డన్” అన్నది సోఫియా.
కౌశిక్ తో ఎప్పుడూ వచ్చే ఆ రెస్టారెంట్ ప్లేస్ కి వచ్చింది సింథియా, కానీ వంటరిగా. సాయంత్రపు చలిగాలులు శరీరానికి సన్నగా తగులుతుంటే, మనసు జివ్వుమనేది ఆనాడు సింథియాకు. కానిప్పుడు మనసంతా తుఫాను గాలుల హోరు. తాను మోసపోయానన్న భావనను తట్టుకోలేకపోతోంది. ఎదుటి వారిని మోసం చెయ్యడం ప్రాక్టికల్ గా జీవించడం అనుకున్నదే తప్పా.. అందులో ఇంత పరాభవం ఉంటుందనీ, మనిషి నిరాశా, నిస్పృహల్లోకి నెట్టివేయబడతాడని తాను ఊహించలేదు. ఆ ఊహ ఒక్కసారిగా తనలో పడగానే తాను ఎవరికన్నా తక్కువ కాదనే అహం త్రాచులా తన్నుకొచ్చింది.
“అయ్యిందేదో అయ్యింది. ఒక షాట్ కి రెండు పక్షులు ఒకటి కౌశిక్, రెండూ లహరి ఇద్దరూ తెగి నాకాళ్ళ దగ్గిర పడాలి. సోఫియా గ్యాంగుతో చెయ్యి కలిపి ఆమె కనిపెట్టిందంతా పారాగతం చేస్తాను. దేశరక్షణకోసం గోప్యంగా ఉంచాల్సిన డిఫెన్స్ ప్రోజెక్ట్స్ ని, వాటి ఫలితాలను ఇతరులకు అమ్మేసిందని నమ్మించి అందరూ లహరిని ఛీ అనేలా చేస్తాను. దానివల్ల ఆమెకి జైలు శిక్ష కూడా పడితే ఇంకా మంచిది. ఆమె పీడ నాకు విరగడ అవుతుంది. కౌశిక్ కి కూడా కావలసినది ఆమె పతనమే. ఈ ప్లాన్ వల్ల అంతా అనుకొన్నది అనుకున్నట్లు జరిగితే … కౌశిక్ మళ్ళీ నాకు దగ్గిరవుతాడు. తనకు కావలైనది నేను చేస్తున్నాగా! ఒకవేళ కౌశిక్ నాకు దగ్గిర కాని రోజున … అతని రహస్యాలను వీళ్ళకే బయటపెట్టేస్తాను. థట్స్ హిస్ ఛాయిస్! వన్ షాట్ టూ బర్డ్స్” … అని ఆలోచించుకుంటూ మెల్లగా వైన్ గొంతులోకి దించింది.

అలాగే సన్నటి వెస్ట్రన్ మ్యూజిక్, లోపల వెచ్చదనం మనసుకు తెలుస్తోంది కానీ… ఈసారి తనకా తన్మయత్వం లేదు. ఒక ప్రక్క కౌశిక్ తన చెయ్యి జారిపోతున్నాడనే బాధ. మరోప్రక్క లహరి ఒక ముల్లులా గుచ్చుకుంటున్నది. వారిరువురి ఆనందానికి లహరి ముల్లయిపోయిందని ఆలోచిస్తున్నది సింథియా బ్రెయిన్.

“ఎలా ఉండేవాళ్ళం నేనూ, కౌశిక్? నా దగ్గిర నటించానని చెప్తున్నాడు కౌశిక్, కానీ నేను నమ్మను. లహరి వల్ల తాను బాగా డిస్టర్భ్ అయ్యి అలా నొచ్చుకుంటున్నాడు అంతే. అంతే… అవును అంతే అంతే. నన్ను కోల్పోవాలని కాదు. ఔను కాదు కాదు. కౌశిక్ మళ్ళీ మామూలు అవ్వాలి, ఎప్పటిలా నాతో ఆనందం గా ఉండాలి. అంటే అతనిలోని అసంతోషాన్ని నేను తీసేయాలి. అప్పుడే అప్పుడే … కౌశిక్ ఆనందంగా ఉంటాడు, మళ్ళీ నాతో ఆనందంగా ఉంటాడు. అంటే లహరి ఉండకూడదు. మా ఇద్దరికీ కనుచూపుమేరలో కూడా ఉండకూడదు. నా తెలివి ఎలాంటిదో ఒకసారి చేసి చూపించి అప్పుడు మాట్లాడతాను కౌశిక్ తోటి ఇప్పుడు కాదు … ఇప్పుడు కాదు…

ఇలా దురహంకారంతో ఆలోచిస్తూ పిచ్చిదయి పోతూ కుడితిలో ఎలుకలా కొట్టుకుంటోంది సింథియా. అంతేగాని కౌశిక్ యొక్క కుట్రా, కుతంత్రపు ఆలోచన్లను అర్ధం చేసుకోలేకపోతోంది. అతన్ని ఇంప్రెస్ చెయ్యాలని తప్పు మీద తప్పు చేస్తున్నదే తప్పా … ఒక మనిషి లా ఆలోచించలేకపోతున్నది. పశువైపోతున్నది. హు… రాకేష్ నిజమే చెప్పాడు. ఆమె స్నేహాలు ఆమెను ఎప్పుడూ సహజంగా ఆలోచించనివ్వలేదని!
*****************
సోఫియా, శామ్యూల్ వాళ్ళతో పాటు బర్కా ముగ్గురూ వచ్చారు. కానీ బర్కా ఒకవైపు, సోఫియా శామ్యూల్ మరో వైపు నుండి విడి విడిగా లోపలికి ప్రవేశించారు. సోఫియా, శామ్యూల్ నేరుగా వెళ్ళి సింథియాను కలిసారు. బర్కా వీరందరినీ గమనిస్తూ దూరంగా వేరేచోట కూర్చున్నది. సింథియాతో కరచాలనాలు చేసి, కూర్చున్నారు సోఫియా శామ్యూల్ లు. శామ్యూల్ ని చూస్తూ … అతని గురించి చెప్పమని అడిగింది సింథియా సోఫియా ని. సోఫియాకి ఆశ్చర్యం వేసింది.
“ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావ్, శామ్యూల్ గురించి? అతను మా రీసెర్చ్ టీం మెంబర్” అన్నది సోఫియా.
“అదే … రీసెర్చ్ లో ఏమి చేస్తుంటారు మీరిద్దరూ?” అని నొక్కి వక్కాణించింది సింథియా.
“అది అంత నీకవసరమా?” అని అడిగింది సింథియా.
“వెల్ … అవసరం మీది. ఇక రీసెర్చ్ అంటావా? నాకూ తెలుసు రీసెర్చ్ గురించి, చెబితే అర్ధం చేసుకోగలను”… అని అంది సింథియా.
సింథియా అలా గద్దించేసరికి సోఫియా, శామ్యూల్ ల మొహాల్లో ఒక ప్రశ్నా ర్ధకం వచ్చింది. ఏ చెప్పాలో వెంటనే తెలియలేదు. అయినా మాట క్రింద పడకుండా “ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావ్? నిజం చెప్పు” అన్నది సోఫియా, ఆమె ధైర్యాన్ని చూసి… ఫర్వాలేదే అని మనసులో అనుకుంటూ.
వెంటనె శామ్యూల్ మ్యానేజ్ చేసి …. లహరి ప్రోజెక్ట్స్ లోని కొన్ని విషయాలను తడబడకుండా … ఆ ప్రోజెక్ట్స్ లోని కొన్ని గోల్స్ ని చెప్పాడు, అందులో తన పార్ట్ ఎంతవరకు అలాగే సోఫియా పార్టు ఎంతవరకు అన్నది కూడా సైంటిఫిక్ గా వివరించాడు.
అప్పుడు సింథియా ప్లీజ్ అయ్యింది. వారివురిపైనా నమ్మకం కలిగింది. అయినా ఒకమాట సోఫియా ని అడిగింది. శామ్యూల్ లాగే చెప్పవచ్చుగా నేనడిగినదానికి సమాధానం?
సోఫియా … నవ్వేస్తూ … ఇంకా చెబుదామనే అనుకున్నాను, ఈ లోపు తను చెప్తున్నాడు కదా అని … వింటున్నాను. సింథియా విని ఊరుకున్నది. అలా ఒక 10 నిముషాలు మౌనం రాజ్యం చేసింది.

10 నిముషాలయ్యాక … సింథియా మొదలెట్టింది.
“కౌశిక్చాలా సమస్యలను లహరి వల్ల ఎదుర్కొంటున్నాడు. ఆమెను ఎదుర్కోవడానికి నన్ను సహాయం కోరాడు”
“ఏవా సమస్యలు?” అనడిగారు వీళ్ళిద్దరూ.
“ప్రోజెక్ట్స్ లో. గోల్స్ ని మార్చేస్తున్నది. తాను అనుకున్నదానికి వ్యతిరేకంగా గా రిజల్ట్స్ వస్తే దాన్ని మార్చేసి, తనకు నచ్చిన విధం గా రీసెర్చ్ చేసి, మొత్తానికి ఏదో పని పూర్తి చేస్తున్నది. అందుచేత ఆమె చేసేవాటిలో నిజాయితీ లేదు. అందుచేత … కౌశిక్ ఆమెను నమ్మలేదు. అదే క్వాలిఫికేషన్ ఉన్న నన్ను తీసుకొని, ఆ ప్రోజెక్ట్స్ ని నా చేతిలోకి తీసుకోమన్నాడు. లహరి చేస్తున్న దానిలొవచ్చే రిక్జల్ట్స్ కరెక్టా, కాదా అని చూసి … ఆ రిపోర్ట్స్ ను కౌశికి కు పంపిస్తుంటాను, అది నా ఉద్యోగ బాధ్త్యత”.
“అంటే … లహరి ఎప్పటికప్పుడు నీకు రిపోర్ట్ చేస్తున్నదా? నీవు ఆమె పై అధికారివా?”
“లేదు. ఆమె కౌశిక్ కి మాత్రమే రిపోర్ట్ చేస్తుంది”
“మరి నువ్వెలా ఆమె రీసెర్చ్ ని పరిశీలిస్తున్నావు?”
ఆ మాటకి కాస్త తడబడి… “లే..లేదు, కౌశిక్ కు నేను పర్సనల్ అసిస్టెంట్ ని. నా వద్దకు అందరివీ పంపుతాడు, అలాగే లహరివి కూడా”
“ఓకే … అంటే లహరి చేసిన వాటి మీద నీకు పూర్తి గ్రిప్ ఉందన్నమాట.
“యస్. ఉంది. నా సలహా సంప్రదింపులతోనే … లహరి చాలా మటుకు చేస్తుంది, నేను ఆ ప్రొజెక్ట్ కి చాలా ముఖ్యమైన వ్యక్తిని” అని టక టకా అబద్దాలను కురిపించేసింది.
“సోఫియా, శామ్యూల్ ఓపిగ్గా …సింథియా మాటలన్నీ వింటున్నారు.

(సశేషం)

మాయానగరం -37

రచన: భువనచంద్ర

“జూహూ బీచ్ అద్భుతంగా వుంది ” అదిగో అదే సన్ & సాండ్ ” చూపిస్తూ అన్నది వందన.
“విన్నాను, బోంబే లో ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ ” ఇక్కడి స్మిమ్మింగ్ పూల్ చాలా సినిమాలలో చూపించారు. ‘బత్తమీస్ ” సినిమాలో మొదటిసారి బికినిలో సాధన షమ్మీ కపూర్ ని ఏడిపిస్తూ ” సూరత్ హసీ.. లగతా హై దివానా ” అంటూ పాట కూడా పాడుతుంది అని చెప్పాడు ఆనందరావు. వారి సంభాషణ ఇంగ్లీష్, హిందిలో సాగుతోంది.
“ఇంకేం తెలుసు ” అడిగింది వందన.
“దేవానంద్ చాలా ఏళ్లు యీ హోటల్లోనే ఒక సూట్ లో వున్నారట. ఆ రోజుల్లో సినీతారలు, రాజకీయ నాయకులు అందరికీ ఇదే ‘అడ్డా ‘ అని చదివాను. ” హోటల్ వంక బీచ్ వైపు నుంచి చూస్తూ అన్నాడు ఆనందరావు.
“ఆ పక్కనే ‘సాండ్స్ ‘ హోటల్ వుంది, ఇంకా సీ ప్రిన్సెస్, ఝ్వ్ మారియట్ లాంటి ఫైవ్ స్టార్, సెవన్ స్టార్ హోటళ్ళు బోలెడున్నాయి. హోటల్ రెహమత్ కూడా వుంది. “లీలా ” గ్రూప్ హోటల్స్ వున్నాయి. చనువుగా ఆనందరావు చెయ్యి పట్టుకొని ముందరకి తీసుకెళ్తూ అన్నది వందన.
“ఇదో.. ఇలా వొడ్డునే ఓ కిలోమీటరు నడచి వెళ్ళే రైట్ హాండ్ రోడ్ వస్తుంది. రోడ్డేక్కి మెయిన్ రోడ్ వైపు వెడితే , ధర్మేంద్ర రికార్డింగ్ థియేటర్ “సన్నీ సౌండ్స్” వస్తుంది. చుట్టుపక్కలే ‘ఇస్కాన్ టెంపులూ, రెస్టారెంట్లు ఉన్నై, అక్కడి రెస్టారెంట్ లో అన్నీ ప్యూర్ వెజ్ మాత్రమే కాక ఆవుపాలతో చేసినవే (స్వీట్స్ ) దొరుకుతాయి. అలాగే ‘టీ ‘ కూడా మూలికలతో చేసినది దొరుకుతుంది. జూహూ బీచ్ లోనే కె. ఏ. అబ్బాస్ వీధీ చూడొచ్చు. ఎందరో సినిమా తారలూ, దర్శకులూ, సంగీత దర్శకులూ, యీ జూహూ బీచ్ లో వున్నారో ” వివరించింది వందన.
“కదూ! ” స్టైల్ గా నడవడం మొదలెట్టాడు ఆనందరావు.
“అదేంటీ? నడక మారిందీ? ” ఆశ్చర్యంగా అడిగింది వందన.
“అంతమంది నటీనటులు యీ బీచ్ లో నడిచే వుంటారుగా, వారి అడుగుజాడల్లోనే మనమూ వెళ్తున్నాము. అందుకే… కాసేపు మనమూ స్టార్స్ అయ్యిపోయి నడుద్దాం ! ” పకపక నవ్వి అన్నాడు ఆనందరావు.
“అబ్బా.. నవ్వితే ఎంత బాగున్నాడో ” అని తనలో తాను గొణుకుంది వందన.
“ఏమన్నారు? ” అని అడిగాడు ఆనందరావు.
“ఏమీ లేదు. వూహించుకోవాలనుకుంటే మిమల్ని మీరు ఏ స్టార్ గావూహించుకుంటారా అని అడగబోయి ఆగాను. ” కొంచం సిగ్గుపడి అంది వందన.
“అన్ కండీషనల్ గా రాజ్ కపూర్ ” అన్నాడు ఆనందరావు.
“అదేం? అప్పటి తరం వాళ్ళు తప్ప ఇప్పటి ‘ఖాన్ ‘ సాహెబ్ లు ఎవరూ నచ్చరా? ” ఆశ్చర్యంగా అన్నది.
“అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకుడే కాదు… ఓ గొప్ప ప్రేమికుడు. ఓ గొప్ప నిర్మాత… అన్నిటి కంటే తాను తీసిన సినిమాల్లో స్త్రీకి గొప్ప గౌరవమిచ్చిన వ్యక్తి. ” వందనని చూస్తూ అన్నాడు ఆనందరావు.
“రామ్ తేరి గంగా మైలీ సినిమా చూళ్లేదా? ” చిన్నగా నవ్వింది.
“మీరు అడగదల్చుకున్న ప్రశ్న నాకు అర్ధమైంది. కానీ ఆ షాట్స్ ఒక గొప్ప ఆలోచనతో తీసినవి. ఆ ఆలోచనే “డైలాగ్ ” రూపంలో తరవాత సినిమాలో వస్తుందిగా. సింబాలిక్ షాట్స్ లో రాజ్ కపూర్ గొప్ప ఎక్స్ పర్ట్. ” ఉత్సాహంగా అన్నాడు ఆనంద రావు.
ఆకాశంలో నక్షత్రాలు వెలిగినట్టు జూహూలో బీచ్ షాపుల్లో కెరంటు దీపాలు వెలిగాయి. సన్నగా అలల సవ్వడి. చేతుల్లో చేయి వేసుకొని ఉత్సాహంగా నడుస్తున ప్రేమికులు. కొందరైతే బాహాటంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఇంకొందరు ఒకరిమీదకు ఒకరు వొరిగిపోయి నడుస్తున్నారు. చిరుచలి… రొమాంటిక్ గా వుంది వాతావరణం. “అదిగో ఆ సర్దార్జీ షాప్ లో సమోసాలు అద్భుతంగా వుంటై. అతనిది ఢిల్లీ. ఢిల్లీ సమోసా రుచి ప్రపంచంలో మరే సమోసాకీ రాదు. చూద్దామా? ” అదిగింది వందన.
“చలో జీ, వందనా జీ…. ఆప్ భీ ఏక్ సమోసా ఖావోజీ. మజా కరోజీ. … జీ జీ జీ జీ జీ ” పకపకా నవ్వి అన్నాడు ఆనందరావు.
“నిజం చెప్పండి. మీకు హిందీ వచ్చా? ” అడిగింది వందన
“ఊహూ కొంచమే వచ్చు, కానీ హిందీ పాటలు బోలెడు వచ్చు. ” అన్నాడు ఆనంద రావు.
“ఓ. కే. సో నైస్ .. అయితే ఇక నుంచి డైలీ పాటలు వినవొచ్చన్న మాట ” ఉత్సాహంగా అన్నది వందన.
“మీకూ పాటల ఇంట్రస్టు వుందిగా, పాడుతారా? “అడిగాడు ఆనంద రావు.
“కొంచం! మరాఠీ పాటలు, హిందీ పాటలు,పాడగలను. అయితే ఏవరేజ్ సింగర్ని. ” నవ్వింది వందన.
“అయితే మీకు మా తెలుగు పాటలు కూడా నేర్పుతా, చాలా బాగుంటాయి. కానీ కొంచం కష్టపడాలి. ప్రపంచంలో వున్న గొప్ప భాషల్లో మాదీ ఒకటి. యాభై ఆరు అక్షరాలు. ” గర్వంగా అన్నాడు ఆనందరావు.
“ఓహ్.. సో నైస్.. సో హాపీ… ” ఆనందరావు చెయ్యి పట్టుకొని వూపేసింది వందన. ఓ యవ్వన కెరటం పరిమళ భరితంగా తనని లోపలకి లాగేసుకుంటున్నట్టు అనిపించింది ఆనందరావుకి.
నిజంగా సమోసాలు అద్భుతంగా వున్నాయి. ఢిల్లీ సర్ధార్జీ జూహూ బీచ్ లో చాలా ఫేమస్. జనాలు ఫుల్ గా వున్నారు. “కచోరీ(డీ) భీ లేలో సాబ్ ” తలోకటి వేశాడు సర్దార్జీ. “కచోరీ ” లను కొంత మంది “కచోడి ” అని కూడా అంటారు. రాజస్థాన్, గుజరాతీ లో చాలా ఫేమస్. ఢిల్లీలో కూడా “ఆలూ టిక్కీ ” చాలా చాలా ఫెమస్.
సమోసాలు అయ్యాక ఓ ముప్పావు గంట సముద్ర తీరం వెంట తిరిగారు. బీచ్ నిండా జనాలే. బోంబే నైట్ సిటీ. నిద్రపోనీ నగరం ఏదైనా వున్నదంటే అది బోంబేనే.
“మా వాళ్ళు అంటే ముంబైవాళ్ళు చాలా విశాల హృదయులు. ఏ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా , ఏ అల్లర్లు జరిగినా కులమత భేదాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటారు. ఇక్కడ “డబ్బా వాలా ” వ్యవస్త ప్రపంచంలో మరెక్కడా లేదు. పెర్ ఫెక్షన్ కు మారు పేరు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినవారైనా ఏ దేశాన్నించి వచ్చిన వరైనా మా ముంభై నగరం వొళ్ళోకి తీసుకొని ఆదరిస్తుంది. కాస్మోపాలిటిన్ సిటీకి నిజమైన నిర్వచనం మా ముంబై. ” చాలా గర్వంగా చాలా భక్తితో అన్నది వందన. ఆశ్చర్యంగా చూశాడు ఆనందరావు. ఇక్కడి వాళ్ళందరూ అంతే. అందరి నోటా యీ నగరం గురించి విన్నది ప్రశస్తే! అందరూ తమ తల్లితండ్రుల్ని, గురువుల్ని ప్రేమించినంత గొప్పగా యీ నగరాన్ని ప్రేమిస్తారు. ఇది ఆనందరావుకి నిజంగా కొత్తే!
“హాట్స్ ఆఫ్ వందనా…. మీ ముంబైట్స్ ప్రేమించినంతగా తమ నగరాన్ని ఎవరూ ప్రేమించలేరు. ఆ..! కొంతమంది తమ ఊరిని ప్రేమించి , ఆ వూరినే ఇంటి పేరుగా మార్చుకున్నవారిని చూశాను. లైక్, హస్ రత్ జైపూరీ, మజ్రూ సుల్తాన్ పూరీ, షాహిర్ లుధియానవి, జలాల్ ఫరీదాబాద్, ఇలా. ఓ చిత్రం చెప్పనా? మా తెలుగు వారిలో ఓ గొప్ప గాయకుడు, కవీ వున్నాడు. ఆయన పేరు ప్రతివాద భయంకర శ్రీనివాస్ గారు. వారినే పి. బి. శ్రీనివాస్ అంటారు. ఆయన రెండు లక్షల యాభై వేలకు పైగా వచన, పద్య, గద్య, కవితా రచనలు చేశారు. వారి వూరు కాకినాడ. వారు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, ఉర్ధు, కన్నడ, ఇలా చాలా భాషల్లో నిష్ణాతులు. ఉర్దూ కవితలు రాసినప్పుడు “శాభాష్ కోకానాడి ” పేరుతో రాసేవారు. ” ఆనందంగా అన్నాడు ఆనంద రావు.
“ఓహ్.. సో నైస్… ” అన్నది వందన.
“అంతే కాదు షేక్స్పియర్ నాటకాల్లో నిష్ణాతుడు రాఘవ గారు తన వూరి పేరుతో “బళ్ళారి రాఘవ ” గా సుప్రసిద్ధులు. అలాగే తెలుగులో ఫస్ట్ ఎవర్ సూపర్ స్టార్ , గొప్ప గాయకుడు, సంగీత దర్శకుడు, త్యాగయ్యగా, పోతనగా, రామదాసుగా, చరిత్రలో నిలిచిపోయిన వి. నాగయ్యగారు కూడా ” చిత్తూరు నాగయ్య ” గా ప్రసిద్ధులు. త్యాగరాయ ఆరాధనోత్సవాలకు సర్వం సమర్పించిన నాగరత్నమ్మ గారు బెంగుళూరు నాగరత్నమ్మగా, పెహెల్ వాన్ కాంతారావు నెల్లూరు కాంతారావుగానూ సుప్రసిద్ధులు. ఇంకా ఎంతో మంది వున్నారనుకో ” తెలుగు మీద అభిమానం గంగ లా పొంగుకొస్తుంటే అన్నాడు ఆనందరావు.
“నాకు నా నగరమంటే అభిమానం. మీకు మీ తెలుగన్నా, తెలుగువారన్నా అంత కన్నా అభిమానమెక్కువే. ఓ.కే ఆనంద్ జీ .. ఇప్పుడేం చేద్దాం. మా మరాఠీ భోజనంతో మీరు ఇక్కట్లు పడుతున్నారని తెలుసు. అందుకే మైన్ రోడ్ లో వున్న “శివ్ సాగర్ ” లో డిన్నర్ గానీ, టిఫిన్ గానీ కానిద్దాం. అది మీ సౌత్ ఇండియన్ వాళ్ళదే. ఉడిపి హోటల్. ” మెయిన్ రోడ్ కి పోయి క్రాస్ రోడ్ వైపు దారి తీస్తూ అన్నది వందన.
“ఓహ్ లవ్లీ పైర్… ” పక్క నుంచి పోతున్న వారెవరో కామెంట్ చేయగా విని పులకితురాలైంది వందన.
ఆమె మంచి హైట్ గల వ్యక్తి. ఆనంద రావు మాత్రం చిన్న నవ్వు నవ్వాడు. ఆ నవ్వుకి అర్ధమేంటో అతనికే తెలియదు.

*****************

“లివింగ్ టుగెదర్ ” ఇదీ ఇవాల్టి మన చర్చాంశం. తరతరాలుగా లివింగ్ టుగెదర్ వితౌట్ మారేజ్ అని ఇతర దేశాల్లో వున్నా భారతదేశంలో మాత్రం యీ మధ్యనే ప్రాచుర్యం పొందింది. అది కూడా బాలీవుడ్ సినీ నటీనటుల వలనే! సౌత్ లో కమల్ హాసన్ గౌతమీ తప్ప యీ పద్దతిని పెద్దగా ఎవరూ పాటించడం లేదు. వివాహం కాకుండా ఒక ఆడామగా ఒకే చోట కలిసి వుండడం మంచిదా? కాదా? మంచిదైతే ఎందువల్ల? … కాకపోతే ఎందుకు? ” వివరించాడు శామ్యూల్ రెడ్డి. విస్తుపోయారు టీచర్లు. పిల్లలకైతే అసలు సబ్జెక్టే సరిగ్గా అర్ధంకాలేదు. సినిమా కబుర్లు బాగా చదివే కొంతమంది 10th క్లాస్ వాళ్ళకి మాత్రం సల్మాన్ ఖాన్ , వివేక్ ఓబ్రాయ్ లాంటి వాళ్ళు ఠక్కున గుర్తుకొస్తారు.
“సర్… యీ సబ్జెక్ట్ పిల్లలకి అర్ధం కాదు. అంతే కాదు, యీ చర్చ వల్ల పిల్లలకు ఉపయోగమూ ఉండదు ” స్పష్టంగా చెప్పింది వసుమతి టీచర్.
“అవును సార్… లివింగ్ టుగెదర్ అనేది సమాజం ఆమోదించిన పద్దతి కాదు ” దాన్ని చర్చించడం వల్ల అనవసర కుతూహలాన్ని బాలబాలికల్లో రేపడమే అవుతుంది. ” వసుమతికి వత్తాసుగా అంది సౌందర్య.
శామ్యూల్ రెడ్డికి మండుకొచ్చింది. అయినా శాంతంగా “మీరన్నది నిజమే… ఇది సమాజం ఆమోదించిన విషయం కాదు. రేపటికి ఇదే పద్ధతిని సమాజం హర్షించనూ వచ్చు. ఒక్క విషయం నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. నా దృష్టిలో మనం చెబుతున్న పాఠాలు , భోధనా పద్ధతులే పనికి రానివి. సిలబసన్నది ఒకటున్నది గనకా అదీ మనం ఫాలో అయి తీరాలి గనకా నేను సైలెంటుగా వున్నాను. అసలు విద్యాలయం అంటే ఏమిటి? పాఠాలు చెప్పడం పిల్లల్ని పాస్ చేయ్యడం అంతేనా? చదువయిపోయాక వీళ్ళు బ్రతికేది, బతకాల్సింది ఎక్కడ? సమాజం లోనేగా? ఆ సమాజం, ఆ సమాజపు తీరు తెన్నులు నేర్చుకోకపోతే, రేపటి వీళ్ల పరీస్థితి ఏమిటి? జీవితంలో అతి ముఖ్యమైనది ‘తోడు “. ఆ “తోడు ” అనేది వివాహ రూపంలో రావొచ్చు. రాకనూ పోవచ్చు. ప్రేమ రూపంలో రావచ్చు. రాక, విషాదాన్ని మిగల్చవచ్చు. చెట్టు పుట్టా లేని చోట్లు లోకంలో ఎన్నయినా వుండొచ్చు. ప్రేమలేని, లేక ప్రేమించని హృదయం మాత్రం లోకంలో వుండనే వుండదు.
కేవలం మనిషి మాత్రమే కాదు. పశుపక్ష్యాదులు కూడా తోడు కోరుకుంటాయి. అందుకే కలిసి జీవిస్తాయి. వాటికి ‘వివాహం ‘ అనే తంతో , నిబంధనో లేదే! మానవుడు బుద్ధి జీవి. ఏది మంచిదో నిర్ణయించగల, నిర్ణయించుకోగల తెలివితేటలు మనుష్యులకి వున్నాయి. కొన్ని యుగాల పాటు మనిషి ‘వివాహం ‘ అనే చట్రంలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడిప్పుడే అదో పద్మవ్యూహం అనీ, దాన్ని ఛేదించకపోతే మనో స్వాతంత్రం వుండదని నిర్ణయానికొచ్చాడు. అందుకే యీ లివింగ్ టుగెదర్ పద్ధతిని ఎంచుకున్నాడు. మనుషులకి యీ పద్ధతి కొత్తది కావచ్చు. కానీ సృష్టాది నుంచి పశుపక్షాదులు ఫాలో అవుతున్న పద్ధతి లివింగ్ టూగెదరే! ” ఉపన్యాసానికో చిన్న గాప్ ఇచ్చాడు శామ్యూల్ రెడ్డి.
“అయ్యా… మనిషి బుద్ధి జీవి గనకనే ‘వివాహం ‘ అన్నిటికన్నా ఉత్తమోత్తమైనదని తరతరాలుగా భావించడమే గాక, వివాహ వ్యవస్థలోనే ఇంకా కొనసాగుతున్నాడు. మీరన్నట్టు ‘లివింగ్ టుగెదర్ ” పద్ధతిని ఫాలో అవుతున్నది పశుపష్యాదులు. అంటే, ఇప్పుడు ఇంత నాగరీకత ప్రబలిన తరవాత మనిషిని మళ్ళీ పశు వ్యవస్థవైపు మరలమంటారా? : కొంచం తీవ్రంగా అన్నాడు ఫిజికల్ డైరెక్టర్ డెనియల్ డేవిడ్.
“మిస్టర్ డేవిడ్… ఇది నా స్కూల్ అని, నేను రెక్టార్ ననీ మర్చిపోకండి. ఇవ్వాళ రేపు ఆరేళ్ళ పిల్లలు రియాల్టీ షోల్లో డాన్సర్లు గానూ, సింగర్లు గానూ, పాల్గొంటున్నారు. వారు పాడే పాటలకి గానీ, వారు ఇచ్చే మూమెంట్స్ కి గానీ వాళ్ళకి అర్ధం తెలుసా? ఆరేళ్ల పిల్ల “అప్పటికింకా నా వయసు ” పాటకి యాధాతదంగా దింపేసింది. ఆ పాటకి అర్ధం తెలుసా? అయినా వాళ్ళకి ఓ రకమైన ‘సాధన ” లభిస్తోంది . పదేళ్ళ క్రితం ఏ అర్ధమూ తెలీకుండా రియాల్టీ షోల్లో పాడిన పిల్లలే నేడు సినీ గాయనీ గాయకులులౌతున్నారు.
సమాధానంగా సంగీతమూ, నాట్యమూ ‘కళ ‘ లు అని మీరు చెప్పొచ్చు. కళలు వచ్చినా రాకపోయినా మనిషికి వచ్చిన నష్టం లేదు. లాభం ఎంతైనా వుండొచ్చు గాక. కానీ సరైన ‘తోడు’ జీవితంలో లభించకపోతే మాత్రం జీవితం ప్రత్యక్ష నరకం అవుతుంది. అందుకే యీ చర్చ వుండాలని నేననేది. డెఫాడిల్స్ పద్యం ఆరో తరగతిలో బట్టీపట్టాము. మీనింగ్ ఏమాత్రమూ తెలియకుండానే. కానీ, అదే పద్యం బి.ఏ. లో చదివినప్పుడు ఎంత ఆనందించాము. వీళ్లు, అంటే యీ పిల్లలు రేపు పెద్దయ్యాక యీ చర్చ గుర్తుకు తెచ్చుకొని ప్రభావితం కావొచ్చు. ఎనీ క్వెశ్చన్స్ ” సీరియస్ గా అన్నాడు శామ్యూల్ రెడ్డి.
జవాబు చెప్పేదెవరూ!
“ఓ.కే మేడం మేరీ…. విద్యార్ధులు పాల్గోబోయే ముందే మీ ఒపీనియన్ అన్నట్టు యీ చర్చ కేవలం విద్యార్ధులకు మాత్రమే పరిమితం కాదు, స్టాఫ్ కూడా పాల్గొని తీరాలి.
“సార్… అసలీ పాయింట్ వ్యూహల్లో లేక ముందేనా పెళ్ళి అయ్యిపోయింది సార్. అయినా మీరడిగారు గనక సిన్సియర్ గా చెబుతున్నాను, ట్రెడిషనల్ మారేజీ కంటే లివింగ్ టుగెదరే మంచిది. ఎందుకంటే ఇష్టం వున్న వాళ్ళు కలిసి హాయిగా వుండొచ్చు. ఇష్టం లేని నాడు ఏ గొడవలూ లేకుండా ప్రశాంతంగా విడిపోవచ్చు. ” అన్నది మేరీ. ఆమె శామ్యూల్ కి వత్తాసుగా మాట్లాడిందని అందరికీ తెలుసు. “కాకా ” పట్టే అవకాశం ఏనాడు వదులుకోని వాళ్ళలో మేరీ ఒకతి.
“మరి పిల్లలు పుడితే? కలిసి వున్నారు గనక అఫీషియల్ గా తండ్రి పేరు వుండదు. వాళ్ళ పరీస్థితి ఏమిటి? ” వసుమతి టీచర్ అన్నది.
“తల్లి ఇంటి పేరే వాళ్ళదీ అవుతుంది. బాధ్యత తీసుకుంటే సరే సరి. బాధ్యత తీసుకోనంటే అసలు పిల్లల్నే కనకూడదు ” మేరీ జవాబిచ్చింది.
“సరే… ఒకడు తనకి ఇష్టం వచ్చినంత కాలం స్త్రీని తనతో ఉంచుకొని ఆ తరవాత అక్కర్లేదని వదిలించుకుంటే నష్టపోయేది ఎవరూ? వివాహం అనేది రెస్పానిసిబిలిటీ తో కూడుకున్న వ్యవస్థ. లివింగ్ టుగెదర్ కి పునాది ఆనందమూ, బాధ్యతారాహిత్యము. ” సూటిగా అన్నది సౌందర్య.
“సపోజ్ వాలిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టమైతే అప్పుడు పెళ్ళి చేసుకోవచ్చుగా! ” మేరీ అన్నది.
“కలిసి వుండటం అనేది ప్రేమించుకోవడం లాంటిది. ఎందుకంటే , ప్రేమలో హక్కులూ, బాధ్యతలూ వుండవు. కులాలు, మతాలు, సోషల్ స్టేటస్ వంటివేమీ అడ్డకులు రావు. హాయిగా ఎంతకాలమైనా ప్రేమించుకోవచ్చు. దానికంటే ‘లివింగ్ టుగెదర్” లో స్వేఛ్చ మరింతగా వుంటుంది. ఇద్దరూ హాయిగా శారీరక సంబంధాన్ని కొనసాగించవచ్చు. యవ్వనం వున్నంత వరకు మహోత్సాహంగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. వృద్ధాప్యం వచ్చినా, లేక ఏదైనా ప్రమాదం జరిగి శారీరకమైన అవిటితనం వచ్చినా , సదరు పాట్నర్ చూస్తాడా? బుద్ధి ఉన్న ఆడదైతే లివింగ్ టుగెదర్ కి ఒప్పుకోదు. ఏ సినిమా తారలు యీ లివింగ్ టుగెదర్ ని మహా స్టైల్గా మొదలు పెట్టారో వాళ్ళ జీవితాలని గమనించండి…. అలా వున్న ఆడవాళ్ళె బుద్ధి తెచ్చుకొని మూడుముళ్ళూ వేయించుకొని సంసారాన్ని నడుపుకుంటున్నారు. “డిప్ గానే చర్చించింది కాంతిమతి టీచర్.
“ఓ కొత్త విధానం వచ్చినప్పుడు సనాతన వాదులంతా వ్యతిరేకించడం యీ దేశంలో అనాదిగా వస్తున్నదే ” నొసలు విరిచి అన్నది మేరీ టీచర్.
“కొత్తదైనంత మాత్రాన ఆలోచనారహితంగా స్వాగతించడం అర్ధం లేని పని. ” సూటిగా అన్నది వసుమతి టీచర్.
“నువ్వేమంటావ్ శోభా? ” జావాబివ్వబోతున్న మేరీని మధ్యలో ఆపి అన్నాడు శామ్యూల్.
“సార్.. యీ విషయంలో చర్చించేటంత పెద్ద వయస్సు కానీ లోకానుభవం కానీ నాకు లేదు. ఓ అనాథగా అనాధాశ్రయంలో పెరిగాను. నాకు చుట్టాలైనా పక్కాలైనా మీరందరే. నేనున్న పరీస్థితిలో వివాహం గురించి ఆలోచించడమే తప్పు. దయతలచి మీరో ఉద్యోగం ఇచ్చారు. బి.యి.డి. చేయడం నా మొదటి లక్ష్యం. ఆ తరవాత పోస్ట్ గ్రాడ్యుయేషన్. కనుక నేనేమీ చెప్పలేను సార్ ” వినయంగా చేతులు జోడించి అంది శోభారాణి.
“గుడ్ వేరీ గుడ్.. లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాన్ని అధికమించాలి. ఎనీవే…. మేరేజ్ విషయంలో ఎప్పుడైనా కానీ ఎటువంటి సందేహమొచ్చినా , సలహా కావాలన్నా తప్పక నన్ను అడుగు… సరేనా? ”
తలూపింది శోభ. ఆ తరవాత చర్చ ఓ పదినిమిషాలు సాగింది కానీ , ఉత్సాహంగా సాగలేదు. విచిత్రంగా విద్యార్ధుల నుంచి కనీసం ఒక్కరి పార్టిసిపెషన్ అయినా లేకుండా చర్చ ముగింపబడింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు.
“నీ మనసులోని విషయం తెలుసుకుంద్దామనే శామ్యూల్ యీ చర్చ మొదలుపెట్టి వుండాలి ” నడుస్తూ మెల్లగా శోభతో అంది సౌందర్య.
“అదెలాగా? “ఆశ్చర్యంగా అంది శోభ.
“ఆయనకి ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నారు. మళ్ళీ పెళ్ళి అంటే పెళ్ళాం యీయన గొంతు పిసికి చంపుతుంది. అధికారం ఎంత యీయనదైనా , ఆస్తి ఆవిడదేనని విన్నాను. సో.. బెస్ట్ వే ఏమంటే లివింగ్ టుగెదర్ పేరు మీద కలిసి వుండటం… అదీ భార్యకు తెలిసేటట్టు కాదు… అప్పుడప్పుడు ! ” తన అనుమానాన్నంతా కోపాన్ని అణచుకుంటూ శాంతస్వరంలో చెప్పింది సౌందర్య.

ఇంకా వుంది…

బ్రహ్మలిఖితం 9

రచన: మన్నెం శారద

“లిటరరీ ఫ్లాక్” అనుకుంది మనసులో కసిగా లిఖిత.
చీకటి పడింది. రెండరటిపళ్ళు తిని బెర్తెక్కి పడుకుంది.
శరీరాన్ని వాల్చినా మనసుకి విశ్రాంతి లభించడం లేదు. కొన్ని గంటలుగా కంపార్టుమెంటులో కోయదొర చేసిన విన్యాసాలు మనిషి పల్స్ తెలుసుకొని ఆడుతున్న నాటకాలు గుర్తొచ్చి ఆశ్చర్యపడుతోంది.
ఒక చదువుకోని అడవి మనిషి .. అడవిలో దొరికే పిచ్చి పిచ్చి వేర్లు తెచ్చి వాటిని దగ్గర పెట్టుకుంటే శని విగడవుతుందని అదృష్టం పడుతుందని, అనుకున్న పనులు జరుగుతాయని నిముషంలో ఈ చదువుకున్న గొర్రెల మందకి అమ్మి డబ్బు చేసుకోవడం చాలా చిత్రంగా అనిపించింది.
మనిషి తన చదువుకున్న చదువుని పరీక్షా పత్రాల వరకే పరిమితం చేస్తున్నాడా? అందులోంచి మధించిన విజ్ఞానాన్ని జీవితానికన్వయించుకోలేనంత దీన హీనస్థితిలో వున్నాడా?
దేశానికి ప్రజలకి చీకటిలో జరిగే దారుణాల్ని ఉన్నదున్నట్లుగా తెలియజేసే బాధ్యత వున్న జర్నలిస్టు, అడవిలో అజ్ఞానంలో బ్రతికే ఒక కోయవాణ్ణి మహత్తర శక్తులున్న మనిషిగా చిత్రించి ప్రచారం చెయ్యడం ఎంతవరకు సమంజసం.
తన చేతిలో ఒక పేపరుందని కలముందని తన బుర్రలో పేరుకున్న అజ్ఞానన్ని వేలాదిమందికి పంచడం ఎంతవరకు క్షమార్హం.
అయితే జ్యోతి ఎలా నడిచినట్లు!
ఆలోచిస్తూనే పడుకుంది లిఖిత.
అకస్మాత్తుగా ఎవరో తట్టి లేపినట్లుగా మెలకువొచ్చి బెర్త్ మీద నుండి వంగి చూసింది. తెలతెలవారుతోంది. చలిగాలి జివ్వున వీస్తోంది.
అందరూ అప్పుడే లేచి కూర్చుని తర్జన భర్జన పడుతున్నాడు.
“ఏం చేస్తాం! చచ్చినట్లిక్కడ కూర్చోవాల్సిందే. సాయంత్రం కాని తిరిగి బయల్దేరదంట!” అంటున్నారెవరో.
“ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది లిఖిత.
“తమిళనాడు బందట. రైలిక్కడాపేసేరు. తిరిగి సాయంత్రం వరకు ఇక్కడే మన జాగారం.” అన్నాడా జర్నలిస్టు.
లిఖిత నవనాడులూ కృంగిపోయినట్లయింది.
చాలామంది రైలు దిగి రిటైరింగ్ రూమ్స్‌కి వెళ్తున్నారు.
“ఏ వూరిది?”
జాలారిపేట అని చెప్పేడు జర్నలిస్టు.
లిఖిత ఉసూరుమంటూ బెర్త్ దిగింది.
తన తండ్రిని ఎంత తొందరగా కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నదో అంతగానూ ఆలస్యమవుతోంది. ఇదంతా వెంకట్ చలవ. ఏడుస్తూ ట్రెయిన్ దగ్గర కొచ్చేడు. తన డబ్బు తీసుకుంటూ మరీ శాపాలు పెడ్తాడు. అని విసుక్కుంటూ బాగ్ తగిలించుకొని రైలు దిగింది లిఖిత.
ఏం చేయాలో తోచక నిస్సత్తువుగా ప్లాట్‌ఫాం మీదున్న బెంచి మీద కూర్చుంది.
ఇంతలో ఒక కానిస్టేబుల్ ఆమె దగ్గర కొచ్చి “మే అయ్ నో యువర్ నేం ప్లీజ్?” అనడిగేడు.
“లిఖిత”
“ఎక్కడ బయల్దేరేరు. ఎక్కడికెల్తున్నారు?”
“ఫ్రం సికిందరాబాద్ టు కొచ్చిన్”
“పర్పస్ అఫ్ ద జర్నీ?”
“టు విజిట్ కేరళ”
“అయిసీ! మీ ఫాదర్ పేరు?”
లిఖితకీసారి నిజంగానే కోపమొచ్చింది.
“అవన్నీ చాలా అవసరమా?” అనడిగింది విసుగ్గా.
“అవసరమే మాడం. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే మొదట మీరు దుయ్యబెట్టేది పోలీసు డిపార్టుమెంటునేగా!” అంటూ నవ్వాడతను.
“అయితే బాగా రాసుకోండి. మా ఫాదర్ పేరు కార్తికేయన్. సైంటిస్టు. నా తల్లి పేరు కేయూరవల్లి. నా తాతగారి పేరు లేట్ భాస్కరన్. ఐ.జి ఆఫ్ ది పోలీస్.”
ఆ మాట విని అదిరిపడ్డట్టుగా చూసేడు కానిస్టేబుల్. వెంటనే గబగబా రైల్వే పోలీస్ స్టేషన్‌లో కెళ్ళేడు.
కాస్సేపటీలో ఒక అరడజనుమంది యూనీఫారంలో వున్న ఇన్స్పెక్టరుతో పాటు ఎస్పీ, రైల్వేస్ ఆమె దగ్గరగా వచ్చి సెల్యూట్ చేసేరు.
ఆ హఠాత్ చర్యకి లిఖిత తెల్లబోయి లేచి నిలబడింది. ప్రయాణికులంతా వింతగా చూస్తున్నారు.
“వీళ్లందరికీ మూకుమ్మడిగా పిచ్చిగానెక్కలేదు కదా” అనుకుంది మనసులో.
“నా పేరు హరిహరన్. మీ తాతగారే నన్నీ డిపార్టుమెంటులో రిక్రూట్ చేసింది. ఆయన చలవ వల్లనే ప్రమోషన్ సంపాదించేను. ఆయన్ పోయేక మీ వివరాలు తెలియలేదు. మీ అమ్మగారు బాగున్నారామ్మా” అనడిగేడూ వినయంగా.
లిఖిత తలూపింది.
“పదండి. మిమ్మల్నిక్కడ ఆర్ అండ్ బి గెస్త్ హౌస్‌లో వుంచుతాను. రెస్టు తీసుకుందురుగాని” అన్నారాయన.
“ఎందుకండి మీకు శ్రమ” అంది లిఖిత.
“నోనో! నాటెటాల్. ఇటీజే గ్రేట్ ఆపర్చునిటీ టు గెటే చాన్స్ టు సర్వ్ యూ. కమాన్ బేబీ!” అన్నారాయన లిఖిత భుజం చరుస్తూ.
ఇదంతా చూస్తున్న జర్నలిస్టు గబగబా ఆవిడ దగ్గరగా వచ్చి.”నేనూ మీతో వస్తాను మాడం. నేను మీ ఫ్రెండ్‌నని చెప్పండి” అనడిగేడు.
లిఖిత తలూపి “హీవిల్ ఆల్సో ఫాలో అజ్. ఎనీ అబ్జెక్షన్?” అడిగింది.
“లెట్ హిమ్ కమ్” అన్నారాయన ముందుకి నడుస్తూ.
అందరూ ఫ్లయోవర్ మీద నుండి దిగేరు.
అక్కడున్న అంబాసిడర్‌లో లిఖిత, జర్నలిస్టు ఎక్కేరు. డ్రైవరు పక్కన ఒక ఇన్స్పెక్టరెక్కేడు.
అందరు పోలీస్ ఆఫీసర్సు తమిళ సినిమాల్లో చూపించించే పోలీసాఫిసర్లలానే పెద్ద పెద్ద మీసాలతో వున్నారు.
కారు ముందుకి సాగిపోతుండగా జర్నలిస్టు కారు వెనుక గ్లాసులోంచి చూసి తెల్లబోతూ “మాడం! వెనక్కి చూడండి” అన్నాడు.
లిఖిత వెనక్కి తిరిగి చూసింది.
ఒక మెటడోర్ నిండా పోలీసులు తమ కారుని ఫాలో చేస్తున్నారు.
లిఖిత ఆశ్చర్యపోతూ “వాళ్లంతా ఎక్కడికొస్తున్నారు?” అనడిగింది ముందు సీట్లో కూర్చున్న ఇన్స్పెక్టర్ని.
“మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలని చెప్పేరు ఎస్పీ సార్!” అన్నాడతను వినయంగా.
“నేను మీ గెస్టునా? క్రిమినల్నా?” అంది లిఖిత.
ఆ మాట విని జోక్‌గా తీసుకొని పెద్దగా నవ్వేడు ఇన్స్పెక్టర్.
“ఈ రోజు బంద్. ప్రభుత్వానికనుకూలంగా జరుగుతోంది. అందుకే ఎక్కడి రైళ్లక్కడాగిపోయేయి. మీకే ప్రమాదం జరక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేరు సార్!”
లిఖిత మరేం మాట్లాడలేదు.
కారు ఒక ప్రశాంతంగా చాలా పెద్ద గ్రవుండ్‌లో వున్న గెస్ట్ హౌస్ పోర్టికోలో కెళ్లి ఆగింది.
లిల్ఖిత, జర్నలిస్టు కారు దిగేరు. స్నానాలు ముగించగానే టిఫిన్స్ వచ్చేయి. ఇంతలో ఇన్స్పెక్తర్ వచ్చి ఒక కలర్ టీవీ అరేంజ్ చేసి క్రికెట్ మాచ్ వస్తోంది చూడండమ్మా” అన్నాడు.
“నాకు చాలా అయిష్టమైన ఆటల్లో మొదటిది క్రికెట్!” అంది లిఖిత.
అతను తెల్లబోయి చూసి “వ్వాట్ మాడం. ప్రపంచంలో తొంభయిశాతం క్రికెట్ అంటే పడి చస్తారు. క్రికెట్ మాచ్ చూడడం ఒక క్రెడిట్‌గా ఫీలవుతారు” అన్నాడు.
లిఖిత నవ్వి “నేను మిగతా పది శాతంలోకి వస్తాను. ఎక్కువమంది ఇష్టపడేదాన్ని నేను మనసులో ఇష్టం లేకున్నా ఇష్టమని చెప్పలేను” అంది.
“అయితే ఏదన్నా సైట్ సీయింగ్ చేస్తారా” దగ్గర్లో జలబంధారి అని వాటర్ ఫాల్స్ వుంది. అక్కడ మురుగన్ కోవెలుంది. రొంబ వ్యూటిఫుల్ ప్లేస్” అన్నాడతను.
లిఖిత కన్నా జర్నలిస్టు ఉత్సాహం చూపిస్తూ “వస్తాం. వస్తాం. సాయంత్రం వరకు ఇక్కడేం చేస్తాం?” అన్నడు.
అతను లిఖిత అనుమతి కోసం చూసేడు.
“చెప్పండి మాడం. వస్తామని” అని బ్రతిమాలేడు జర్నలిస్టు.
లిఖిత సరేనంది.

*******

సంపెంగి అందించిన కబాబులు తింటూ, కల్లు తాగుతూ “మనం అనుకున్న దానికంటే బాగుంది మన గిరాకీ. కాని నువ్వప్పుడే చాలా తొందపడిపోతున్నావు నారాయణా! కొత్తమతం తీసుకుంటే గుర్తులెక్కువని ఆ బాంక్ పిల్లకేంటి.. రెండ్రోజుల్లో దాని పూర్వజన్మలోని మొగుడొచ్చి డబ్బిస్తాడని చెప్పేవు. నాటకమాడిద్దామన్నా మన దగ్గరంత డబ్బెక్కడిది? ఇవ్వకపోతే ఓంకారస్వామి ఉత్త నాటకాలరాయుడని పదిమందికి చెప్పి రామక్రిష్ణా బీచ్‌లోని ఇసకంతా మన నెత్తిన పోయిస్తది” అన్నాడూ రాజు విసుక్కుంటూ.
ఓంకార స్వామిగా అవతారమెత్తిన నారాయణ విలాసంగా నవ్వి సంపెంగి వైపు చూసేడు. సంపెంగి మొహం చిటపటలాడుతున్నట్లుగానే వుంది. మైక్రోస్కోపు పెట్టి పరీక్షించినా ఆవిడ మొహంలో నవ్వు మచ్చుకైనా కనిపించదు. కాని.. ఇదివరకులా చిరాకు పడకుండా వాళ్లడిగినంత కల్లు పోస్తున్నది. కారణం.. వాళ్లు ఆడుతున్న కొత్త నాటకం భవిష్యత్తులో బాగా లాభాలు సంపాదించి పెట్టగలదనే ఆశతో మాత్రమే.
“మరీ నన్ను సన్నాసోడిగా జమ కట్టేయకు. దానికి అగిన ఎరేంజ్‌మెంట్లు చేసేనేనప్పుడే. నిన్న వెంకట్ అని ఒక ఆడదాని సొమ్ము తిని బతికే ఏబ్రాసోడొకడు నా దగ్గరకొచ్చేడు. వాడు ప్రేమించిన పిల్ల వీడి ప్రేమని ఎడం కాలితో తన్ని కేరళ వెళ్ళిందంట. అదింక తిరిగి రాకూడదని వీడి ప్లాన్. అంతే కాదు ఆ పిల్ల అమ్మకున్న బట్టల మిల్లు వీడి చేతిలోకి రావాలని దానికి తనే వారసుడు కావాలని నా దగ్గర కొచ్చేడు. వాణ్ణి బుటలో పెట్టేను.
“ఎలా?” కుతూహలంగా అడిగేడు రాజు. నారాయణలో కొంత ఫోజు పెరిగింది.
గర్వంగా సంపెంగి వైపు చూసేడు.
సంపెంగి అర్ధం చేసుకున్న దాన్లా గూళ్ళెత్తి నడుస్తూ వెళ్లి మరొక కల్లు ముంత తెచ్చి నారాయణ కందించింది.
“కబాబులు?” అనడిగేడు నారయణ గర్వంగా.
సంపెంగి మళ్లీ వెళ్ళింది.
“నీ తస్సదియ్యా! రేగి కంపలాంటి నా పెళ్ళాం చేత పనులు చేయిస్తున్నవు. నువ్విన్ని పెళ్ళిళ్ళెలా మానేజ్ చేసేవో నాకర్ధమవుతున్నదిప్పుడు” అన్నాడు రాజు నవ్వుతూ.
“ఎవరికే బలహీనతలున్నదో దాని మీద ఆశ రేకెత్తిస్తే వాళ్లు కుక్కల్లా తోకలూపుతూ మన వెంబడి తిరుగుతారు. నీ పెళ్లానికి డబ్బు పిచ్చి. పూరి గుడిసె లెవలయినా ప్రీమియర్ పద్మినిలో తిరగాలని కలలు కంటుంటుంది. అద్సరే. ఆవిడ కబాబులు కాల్చుకొచ్చేలోపునే అసలు విషయం చెబుతాను. కొన్నావిడ వినకపోవడమే మంచిది. లేకపోతే నిముషానికోసారి మన గుట్టు బయట పెట్టే ప్రయత్నాలు చేస్తుంది.”
“అవునవును” అన్నాడు రాజు.
” ఆ వెంకట్ గాడికి రేపొక ఇరవైవేలు తీసుకెళ్ళి బాంక్‌లో ఈశ్వరి అనే పిల్లకివ్వమని, ఆ పిల్ల ముందు జన్మలో నీ భార్యని చెప్పేను”.
“వాడు నమ్మాడా?”
నారాయణ విలాసంగా నవ్వాడు.
“మన దగ్గర కొచ్చేరంటేనే సగం మానసికంగా మన మాటలు నమ్మడానికి సిద్ధపడొస్తారు. ఇక మనం సాగదీస్తూ, సంశయంగా కాకుండా దైవం పూని మాట్లాడుతున్నట్లుగా మాట్లాడాలి. అలౌకికంగా చూడాలి. చిరునవ్వులొలికించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. వారి ఎదుట నున్నవాడు వాళ్లలాంటి మనిషి కాదని గొప్ప అద్భుత శక్తులున్న దైవాంశ సంభూతుడనే అభిప్రాయం కల్గించహలి. అప్పుడు మనం కొన్ని తప్పులు చెప్పినా వాళ్లు పదిమందిలో బయటపెట్టే సాహసం చెయ్యరు. మొన్నేం జరిగిందో తెలుసా?” అంటూ నవ్వేడు నారాయణ.
రాజులో ఉత్సాహం ద్విగుణీకృతమైంది.
“ఏం జరిగింది?” అనడిగేడూ.
“మల్లన్నని ఆంధ్రా యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసరట. దేవుడు లేదు. దయ్యం లేదని… మాయలూ మంత్రాలూ మోసమని, చేతబడులు, సింగినాదాలూ చీటింగని పాతికేళ్ళూ పుంఖాను పుంఖాలు కనిపించిన ప్రతి పేపర్లోనూ కలం తీసుకుని దూదేకినట్లు ఏకి పారేసేడు. కాని ఇప్పుడేం జరిగిందో సింహంలాంటి మనిషి చెవులేలాడేసుకొని పిల్లిలా మన వరండాలో మూడుగంటల సేపు నా దర్శనం కోసం పడిగాపులు పడ్డాడు.
వాది కులగోత్రలు, పుట్టు పూర్వొత్తరాలూ, మనవాళ్ళొచ్చి నా చెవిలో ఊదెళ్ళి పోయేరు. నేను చేతిలో ఒక ఏపిల్ తీసుకుని పైకెగరేసి పట్టుకుంటూ హాల్లో భక్తుల ముందు ఈ లోకంలో లేనట్లుగా నదుచుకుంటూ వాణ్ణి గమనించినట్లుగా వెళ్లి మళ్లీ వెనక్కొచ్చేసేను. భక్తులతోపాటు వాడు లేచి ఆశీర్వాదం కోసం ఆరాటపడటం నేను క్రీగంట గమనించేను.
నేను తిరిగొచ్చి మన ఓలంటీరుని పంపించి మల్లన్నని లోపలికి పంపమని చెప్పేను. మల్లన్న వెన్నెముకలేని మనిషిలా అతని వెంబడొచ్చి నా కాళ్ల మీద పడ్డాడు”.
“నిజంగానా?” ఆశ్చర్యపోతూ అడిగేడు రాజు.
“కావాలంటే మన ఓలంటీర్లనడుగు. మల్లన్నని పేరుతో పిలవగానే వాడు ఫ్లాటయిపోయేడూ. నీకేం సమస్యలున్నాయని వచ్చావు. అంతా బాగానే వుందిగా. ఆరోగ్యం కూడా ఫర్వాలేదు” అన్నాను.
“మీరన్నట్లు నాకేం లోటు లేదు. ఇల్లు కట్టేను. పిల్లల పెళ్ళిళ్ళు చేసేను. మనశ్శాంతి లేదు. ఇక ఆరోగ్యమంటారా.. మొన్నీమధ్యన కేన్సరొచ్చి తగ్గింది” అన్నాడతను.
“అదే చెబుతుంట. ఇంకే పెద్ద జబ్బులూ రావు నీకు. మొదట్నుంచీ దేవుణ్ణి తూలనాడేవు. అదే నీ అశాంతికి మూలమని చెప్పేను. ఇంకేం ఉంది. లైబ్రరీల్లో వేలాది పుస్తకాలు చదివిన మనిషి నా కాళ్ల మీద కుక్కపిల్లలా పడ్డాడు. వాడలాంటి ట్రాన్స్‌లో వుండగా నేను తగరపు వలసనుండి వచ్చి నాకు ముత్యం వుంగరం యిచ్చిన పాకాల సుబ్బమ్మగారి ఉంగరం గాల్లోంచి తెప్పించినట్లుగా తెప్పించి వాడిని పెట్టుకోమన్నాను. వాడికి మతి పోయింది. కాని దురదృష్టం. ఆ రింగు వాడి ఏ వేలికీ పట్టలేదు. నేనది తిరిగి తీసుకొని అటూ ఇటూ తిప్పి “నీ అదృష్టానికిది కుదరడం లేదు” అని చెప్పి ఇది అసలైన ముత్యమేనా, చూడు!” అంటూ మన ఓలంటీరుకిచ్చేను.
అతను “ఇది మేలిమి బంగారంలో ఇమిడిన స్వాతి ముత్యం స్వామి!” అంటూ దాన్ని తిరిగిస్తున్నట్లుగా కొంచెం పెద్ద సైజులో నా ఆకృతి గుద్దిన రాగి ఉంగరం నా చేతికిచ్చేడు. నేను గాలిలో చేతులు తిప్పి రాగి ఉంగరం తెప్పించినట్లు తెప్పించి అతనికిచ్చేను.
మల్లన్న మొహంలో ఆనందం తాండవించింది.
ఆ ఉంగరాన్ని మహాప్రసాదంగా స్వీకరించి నా ఫోటోలు అడిగి పట్టుకెళ్ళేడు. వచ్చే పౌర్ణమినాడు నా పుట్టినరోజు ప్రకటిస్తున్నాను. ఆ రోజుకి మల్లన్న నా మహత్యాల గురించి అన్ని పేపర్లలోనూ రాసేస్తాడు” అన్నాడు నారాయణ గర్వంగా.
రాజు నిజంగానే నారాయణ తెలివితేటలు చూసి చకితుడయ్యేడు.
విత్తనం నాటిన మూడో నాటికే పందిరంతా అల్లుకుపోయిన గుమ్మడి పాదులా అనిపించేడు నారాయణ అతని కళ్ళకి.
“నిజంగా నువ్వు చాలా తెలివ్వైనవాడివే నారాయణా! నీ మొహంలో ఆ పీడ కళ పోయి తేజస్సు వచ్చింది. కొంపదీసి దేవుడు నిన్ను నిజంగా ఆవహించలేదు కదా!” అన్నాడు సంభ్రమంగా చూస్తూ.
” నా బొంద! భక్తులు తెచ్చిన పళ్ళు, మిఠాయిలు, పంచామృతాలు తాగి నా బుగ్గలు వూరి రంగొచ్చింది. ఇలాంటి ఆహారం తినే పూర్వం మునీశ్వరులు దివ్యకాంతితో వెలిగిపోయేవారు. దాన్నే బ్రహ్మతేజస్సు అనుకునేవారు పిచ్చి ప్రజలు.” అంటూ నవ్వేడు నారాయణ.
“ఇంతకీ ఆ వెంకట్ గాడి సంగేంటి?”
“ఏవుంది. ఎక్కడో రేపటికల్లా ఆ డబ్బు సంపాదిస్తాడు వాడు. చూస్తుండు. అందులో కొంత డబ్బు బాంక్ పిల్ల కృతజ్ఞతతో మనకి సమర్పించుకుంటుంది. కథ అంతటితో ఆగదు. అద్సరే గానీ, రేపణ్ణుంచి నేనీ గుడిసెల దగ్గరకి రాను. మన రహస్యం బట్టబయలైపోతుంది. ఇప్పటికే తగినంత ప్రచారం జరిగింది కాబట్టి నువ్వా చిలకని గాలి కొదిలి నా దగ్గరే పి.ఏ గా చేరు” అన్నాడు నారాయణ.
రాజు సరేనన్నట్లుగా తల పంకించేడు.
“నువ్వు చెప్పిన సలహా బాగుంది. పరమాన్నం పెడతానంతే గంజికాసుకోటానికి గింజలడిగిపెట్టినట్లుగా.. ఆ ఎండలో నాకీ తిప్పలు దేనికి?” అంటూ రయ్యిన లేచి పంజరంలోని చిలకని బయటకొదిలేసేడు రాజు.
అది నిస్సహాయంగా కుంటుతూ బయటకొచ్చింది. చాలా సంవత్సరాలుగా యజమాని పంజరపు తలుపు తెరవగానే వచ్చి కొన్ని కార్డులు కెలికి ఒక కార్డు ముక్కును కరచి అతనికివ్వదానికి అలవాటుపడ్డది కావడంతో చుట్టూ కార్డుల కేసి చూసింది.
“నీ యవ్వ! నీతో నాకింక పని లేదు. ఎగిరిపో” అంటూ రాజు కల్లు తాగిన నిషాతో దాన్ని పట్టుకుని ఎగరేసాడు.
కాని చిలుక దబ్బున క్రిందపడింది.
ఎన్నో రోజులు మంచం మీద తీసుకున్న రోగిష్టి మనిషి లేచి నడవడానికి ప్రయత్నిస్తే ఎలా తూలిపోతాడో అలాగే చిలుక తన రెక్కల్ని సాచి ఎగరలేక నిస్సహాయంగా కూలబడిపోయింది.
అనేక సంవత్సరాలుగా అతనితోనే కలిసి బతుకుతున్నందువలన దాని మూగ హృదయంలో యజమాని పట్ల నమ్మకము, ప్రేమ కూడా బలంగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఇతనే తన బ్రతుకు తెరవు కోసం, హాయిగా పసిడి రెక్కలు పరచి ఆకాశంలో ఎగిరే తనని నిర్దాక్షిణ్యంగా పట్టి రెక్కలు కత్తిరించి పంజరపు పాలు చేసేడన్న ఉక్రోషం, కక్ష మచ్చుకైనా లేవా మూగజీవిలో.
పైపెచ్చు అతన్ని వదులుకోడానికి సిద్ధంగా లేదు దాని హృదయం. తనని నమ్ముకొని అతను పొట్ట పోసుకుంటున్నాడన్న నిజం తెలీని ఆ అమాయకపు పక్షి అతను వేసే గింజలు తిన్నందుకే అతని మీద ప్రేమ పెంచుకుంది. ఒక్కసారిగా తన అవసరానికి వాడుకొని పని తీరేక పొమ్మని వదిలేసిన యజమానిని వదులుకోలేక దాని కంటిలో నీరు గిర్రున తిరిగింది.
కాని..దాని కన్నీరు చూసి కరిగిపోయే మానవత్వం అక్కడున్న ఇద్దరికీ లేదని దానికి తెలియదు.
“థూట్! పొమ్మంటే ఇక్కడే చస్తుంది. పాడు ముండ!” అంటూ ఒక కర్ర పుల్ల తీసుకొని అదిలించబోయేడు రాజు.
అప్పుడే కబాబులు తీసుకొస్తున్న సంపెంగి ఆ దృశ్యం చూసి తెల్లబోతూ “దాన్నొదిలేసేవేంటి?” అంది కంగారుగా.
“ఇక దాంతో పన్లేదే పిచ్చిముండా! మనం పట్టిందంతా బంగారమయ్యే రోజులు దగ్గరకొచ్చేసేయి!” అన్నాడు కర్రతో దాన్ని కొడుతూ.
సంపెంగి కబాబులు వాళ్ల మీదకిసిరి కొట్టి చిలకని ఒడిసిపట్టుకొని “నీకేవన్నా పిచ్చెక్కిందా? జోస్యాలు మానేసినంత మాత్రాన దీన్నొదిలేసుకుంటారా?” అంది కోపంగా మొగుడివైపు చూస్తూ.
నారాయణతో పాటు రాజుకూడా బ్రహ్మరాక్షసిలాంటి ఆ మనిషిలో ప్రేమ, దయ వున్నాయనే విషయం గ్రహించి ఆశ్చర్యపోయేరు.
“చిలక మాంసం ఎంత రుచిగా ఉంటుందో మీరెప్పుడైనా తిని చూశారా? దీన్నిప్పుడే బొచ్చు పీకి కాల్చుకొస్తాను. చూద్దురుగాని” అంది సంపెంగి దాన్ని తీసుకొని లోనికెల్తూ.
ఆ మాట విని నారాయణ ఉలిక్కిపడ్డాడు.
ఎన్నో మోసాలు చేసి అవినీతిగా బ్రతికే అతను కూడా చిలకని చంపబోతున్నదని తెలిసి చలించిపోయేడు.
“వద్దు సంపెంగీ దాన్ని చంపకు”అనరిచేడు కీచుగా.
సంపెంగి వెనక్కి తిరిగి నవ్వింది క్రూరంగా.
“ఏం జాలా?”
“పాపమది మూగజీవి!”
“ఏం కోడి మూగజీవి కాదా? మేకపోతు మూగ జీవి కాదా? వాటితో తయారుచేసిన కబాబులు చప్పరించి తినగా లేంది. చిలక మాంసం తింటే తప్పా! ఎదవ నీతులు చెప్పబోకు.” అంటూ రయ్యిన లోనికెళ్ళిపోయింది.
మరి కాస్సేపటిలో కత్తికి ఎరవుతూ చిలక చేసిన చివరి రొద వాళ్ల చెవిలో పడింది.
నారాయణ “హరిహరి” అంటూ చెవులు మూసుకున్నాడు. అవసరం తీరేక తోటి మనిషిని కూడా మానసికంగా కత్తి లేకుండానే హత్య చేసి అవతలకి విసిరేయగల శక్తి ఈ సృష్టిలో నికృష్టమైన మనిషికి మాత్రమే వుందని గ్రహించే శక్తి నారాయణలాంటి వాళ్లకుండదు.

***********

కారు మెల్లగా వెళ్తోంది.
రోడ్డు కిరువైపులా పెద్ద పెద్ద మర్రి, మారేడు, రావి వృక్షాలు చేతులు పెనవేసుకుని షేక్‌హేండిస్తున్నట్లుగా దట్టంగా పెరిగి దారిన వెళ్ళేవారికి చల్లని గాలిని, నీడని ఇస్తున్నాయి. రోడ్డు పక్కన పెరిగిన చెరకు తోట్టల్లోంచి తియ్యని వాసనలొస్తున్నాయి.
దూరంగా వలయాకారంలో వున్న కొండలు వాటి వెనుక దట్టమైన నీలి రంగులో క్రమ్ముకొన్న మేఘాల పంక్తులు , వాటి కావల దుప్పటిలో దాక్కున్న సూర్యుదు తన ఉనికి చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి నిదర్శనంగా మేఘాల కొసల్ని వెండి అంచులు ఎంతో హృద్యంగా వుందా ప్రాంతం.
కృత్రిమంగా ఎత్తయిన కాంక్రీటు కట్టడాలతో క్రిక్కిరిసి పోతున్న జనారణ్యం నుండి కాలుష్యమెరుగని ఆ ప్రకృతి కాంత వడిలో పయనించడం మనసుకి ఎంతో సుఖాన్నిస్తోంది లిఖితకి.
తండ్రి గురించి తాత్కాలికంగా మరచిపోయి ఆ అరుదయిన అందమయిన దృశ్యాల్ని కంటి ఫ్రేములో కమనీయంగా బిగించే ప్రయత్నం చేస్తుందామె మనసు.
“మాడం!”
“నే రాసిన ఆర్టికలొకసారి చదువుతారా?”
“ఇప్పుడు కాదు” ఆమె చూపు తిప్పకుండానే జవాబు చెప్పింది జర్నలిస్టుకి.
మరో అరగంటలో కారు జలబంధారి చేరింది.
కారు దిగకుండానే లిఖిత చూపులు గుడి మీద పడ్డాయి.
ఆ గుడిని చూడగానే లిఖిత మనసు ఆనందంతో గండులేసింది.
కొండవాలులో కొంత ఎత్తునున్నదా దేవాలయం.
క్రింద విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామి కోవెలలున్నాయి.
కొద్దిగా మెట్లెక్కేక హెక్టాగన్ షేపులో (పంచముఖాలు) వున్న మంటపం, అక్కణ్ణుంచి మరి కొన్ని మెట్లెక్కితే శివలింగాకృతిలో వున్న సుబ్రమణ్యస్వామి కోవెల, ఆ కోవెలకి నీడపడుతూ వేయి తలల శేషేంద్రుడి శిల్పం. తలతలకి ఎర్రని దీపాలు, చాలా గమ్మత్తుగా కట్టేరా గుడిని. గుడి వెనుక కొండమీద నుండి నాలుగయిదు ధారలలో జలపాతం క్రింది జారుతున్నది. దూరం నుండి చూస్తే రాతి కొంతమీద గట్టిగా నామసుద్దతో రాసినట్లు నిశ్చలంగా కనిపిస్తున్నాయి నీటి ధారలు.
“ముందు గుడిలో దర్శనం చేసుకుందాం” అన్నాడు ఇన్‌స్పెక్టర్.
లిఖిత తల పంకించింది.
ముగ్గురూ దేవుడికి అర్చన చేయించేరు
తులసి మాలలతో, గన్నేరు పూలదండలతో శోభాయమానంగా వున్నాడు శ్రీవళ్లీ సమేతుడయిన సుబ్రమణ్యస్వామి.
ఇన్‌స్పెక్టర్ బూట్ సాక్సు తీసి ఇన్‌షర్ట్ బయటికి లాగి చాలా వినయంగా లెంపలేసుకుని ముగురన్‌కి మొక్కుకున్నాడు.
పూజయ్యేక మంటపం దగ్గర కూర్చున్నారు. ఇన్‌స్పెక్టర్ బూట్లు వేసుకుని మళ్లీ టక్ చేసుకుంటుంటే “ఇందాక దేవుడి దగ్గర లెంపలేసుకున్నారెందుకు?” అని కొబ్బరి ముక్క తింటూ చిలిపిగా అదిగింది లిఖిత.
“తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం కదా మాడం!” అన్నాడతను నవ్వుతూ.
“అంటే తెలిసేం చెయ్యరన్న మాట!”
లిఖిత ప్రశ్నకతను ఇబ్బందిగా నవ్వేడు.
“మీతో మాటలడటం రొంబ కష్టం!” అన్నాడు అరవ యాసతో.
“మీ పోలీసు డిపార్టుమెంటు వాళ్లు తెలిసే చేస్తారు. నా ఫ్రెండ్ బస్సెక్కుతుంటే ఒకడు గొలుసు లాగేసేడు. ఆమె వెళ్ళి దగ్గరలో వున్న పోలీసు స్టేషనులో రిపోర్టిచ్చింది. ఆ గొలుసు లాగిన వాడెవరో, ఆ ఏరియాలో ఎవరా పనులు చేస్తారో వాళ్లకి తెలుసు. గొలుసు వెంటనే దొరికిపోయింది. నా ఫ్రెండ్ ఆ సంగతి తెలిసి తన అదృష్టానికి పొంగిపోతూ పోలీసు స్టేషనుకెళ్లింది. ఈ గొలుసు మీదేనా అంటూ ఆ గొలుసుని ఆవిడ మొహం మీడ ఆడించడమే గాని గొలుసు నా ఫ్రెండ్‌కివ్వలేదా ఇన్‌స్పెక్టరు. ఆవిడ విసిగి విసిగి చివరికి ఎవర్నో పట్టుకొని ఒక ఐ.జి.గారి చేత ఆ ఇన్‌స్పెక్టరుకి ఫోను చేయించింది. ఐ.జి.గారు చెప్పినప్పుడల్లా వాళ్లు ఫోనులోనే సాల్యూట్ కొట్టి ఇస్తాననడం, ఈవిడ వెళ్తే ఇవ్వకపోవడం. చివరికి ఆమె విసిగి వదిలేసింది. ఇలాంటివి తెలిసి చేసిన తప్పులు కావా?” అనదిగింది సూటిగా లిఖిత.
ఇన్‌స్పెక్టరు వెర్రిగా నవ్వాడు.
“అయిజీగారు చెప్పినా ఇవ్వలేదా మాడం!” ఆశ్చర్యంగా అడిగేడు జర్నలిస్టు.
“లేదు. కారణం ఆయన వీళ్లకి డైరెక్ట్ హెడ్ కాకపోవడమే. ఈ డిపార్టుమెంటులో హయ్య ర్ అథారిటీ పట్ల విపరీతమైన వినయవిధేయతలు చూపిస్తారు. సాల్యూట్స్ కొటడం, గంటలు గంటలు నిలబడడం, .. కాని ఇవన్నీ కేవలం వీళ్ల ఆఫీసర్సుగా ఉన్నంతవరకే!” అంది లిఖిత.
“ఎక్కడో కొంతమంది అలా ప్రవర్తించినంత మాత్రాన మొత్తం డిపార్టుమెంటుననడం భవ్యం కాదు మాడం!” అన్నాదు జర్నలిస్టు ఇన్‌స్పెక్టరుని వెనకేసుకొస్తూ.
లిఖిత నవ్వింది.
“నిజమే! ఒక లీటరు నీళ్లలో ఒక గ్లాసు పాలు కలిపితే నీళ్ళలో పాలు కలిపేరంటాం కాని పాలలో నీళ్ళు కలిపేరనం. అలానే వుంది. మన దేశంలో అవినీతి పర్సంటేజీ. ఇలాంటి విషయాలు రాయరు మీలాంటి జర్నలిస్టులు. ఏ తార ఏ తారడుతో తిరుగుతుందో, ఏ తార ముసల్దయిపోయిందో, అర్ధం లేని వ్యర్ధపు మాటల్ని బాక్స్‌లు కట్టి మరీ రాస్తారు పెద్ద డిస్కవరీ చేసినట్లుగా” అంది.
జర్నలిస్టు మొహం మాడింది.
లిఖిత అదేం పట్టించుకోనట్లుగా లేచి నిలబడి “పదండి ఆ జలపాతాన్ని దగ్గరగా చూద్దాం!” అంది.
అందరూ కొండెక్కేరు..
దూరం నుండి స్తబ్దంగా చలనం లేనట్లుగా కనిపించిన జలపాతం దగ్గరకు వెళ్తుంటే హోరున శబ్దంతో, తుళ్ళుతూ శక్తిలా క్రిందకి దూకుతోంది. సన్నని పాయలా కనిపించే ఆ జలపాతంలోని నీరు కొండ దిగువున ఒక పెద్ద టాంక్‌లా తయారయింది. దాని నుండి తీసిన కాలువలతో ఆ ప్రాంతంలోని పంటలన్నీ పండుతాయని తెలిసి లిఖిత ఆశ్చర్యపోయింది. రాయికి రాయికి మధ్య చెమ్మలా కనిపించే ఈ నీరెక్కడినుండి ఉద్భవిస్తుంది అనే నిజం సరిగ్గా ఎవరికీ తెలియదు.
కాస్సేపు నీటితో ఆడుకుని తిరిగి బయల్దేరేరు ముగ్గురూ. కారులో తిరిగి “నా ఆర్టికల్ చదవండి మాడం” అంటూ వెంటపడ్డాడు జర్నలిస్టు.
అతని పోరు భరించలేక ఆర్టికల్ తీసుకుని టైటిల్ చూసి మొహం చిట్లించింది లిఖిత.
“అక్షరం తెలీని అడవి మనిషి దగ్గరున్న అద్భుత శక్తులు” అని టైటిల్ పెట్టేడతను.
“ఇదంతా కోయదొర గురించేనా?”
“అవును మాడం. చదవండి.”
“అక్కర్లేదు. టైటిల్ చూస్తేనే పాఠకులకేం చెప్పదలుచుకున్నావో తెలుస్తున్నది. ఏ అద్భుత శక్తి చూశావ్ నువ్వు!”
“అదేంటి? మీరూ చూశారుగా జ్యోతి నడవటం”
“చూశాను.”
“మరింకేమిటి, అదద్భుత శక్తి కాదా? మీరు నడిపించండి చూద్దాం.”
“నడిపిస్తాను. కాస్త ఆముదం, ఒక రాగి బిళ్ళ, కర్పూరం తీసుకురా!” అంది లిఖిత.
“ఊరుకోండి. మీవల్ల కాదు”
“నా వల్లనే కాదు నీ వలన కూడా అవుతుంది కాస్త ఆలోచిస్తే”
“ఎలా?” ఆశ్చర్యపోతూ అడిగేడు జర్నలిస్టు.

ఇంకా వుంది..

జీవితం ఇలా కూడా వుంటుందా? 11

రచన: అంగులూరి అంజనీదేవి

”మేమూ అదే అనుకున్నాం. కానీ మాటల మధ్యలో అన్నయ్యను అనరాని మాటలు అన్నాడట. ఆనంద్‌ పైకి పద్ధతిగా అన్పిస్తాడు కాని కోపం వస్తే మనిషికాడు మోక్షా! అందుకే అన్నయ్య వదిన నగలు అమ్మి ఇచ్చేశాడు. ఎప్పటికైనా ఇవ్వాల్సినవే… ఇవ్వకుండా ఆపి ఇంటిఅల్లుడిని ఇబ్బంది పెట్టడం మాకు కూడా మంచిది కాదు. మా ఇబ్బందులు ఎప్పటికీ వుండేవి. ఇప్పటికే చాలా రోజులు ఆగాడు ఆనంద్‌. ఈ విషయంలో అతను చాలా ఓపిక మంతుడే అనుకోవాలి. చూస్తున్నాంగా వేరేవాళ్ల అల్లుళ్లను…” అందామె ఒకవైపు అల్లుడిని మెచ్చుకుంటూ, ఇంకోవైపు అల్లుడు తన కొడుకుని ఏదో అన్నాడని బాధపడుతూ.
”ఇంతకీ ఆయన దగ్గర నుండి ఆ ప్రోనోటును వెనక్కి తీసుకున్నారా లేదా?”
”పంచాయితీ పెద్దలు ఆ విషయంలో జాగ్రత్తగానే ఉంటారు మోక్షా! అన్నయ్య డబ్బులు ఇవ్వగానే నాన్న రాసిచ్చిన ప్రోనోటును ఆనంద్‌ నుండి ఇప్పించారు”
మోక్ష ఆశ్చర్యపోయి ”పంచాయితీ పెద్దలా!! పెద్ద గొడవే చేసినట్లున్నాడుగా?” అంది.
”చేశాడు మోక్షా! క్షణాల్లో డబ్బు తెచ్చిచ్చేలా చేశాడు”
”ఛ…ఛ… నా తలరాత బాగా లేదమ్మా!”
”నీ తలరాతకేం మోక్షా! నువ్వే అలా అనుకుంటే అసలు పెళ్లిళ్లే కాక ఒంటరిగా ఉద్యోగాలు చేసుకుంటూ తమకంటూ ఓ తోడు లేకుండా నా అనేవాళ్లు లేకుండా వుండే ఆడవాళ్లేమనుకోవాలి? వాళ్లంతా వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్లో వుండి సుఖ పడుతున్నారనుకుంటున్నావా? తృప్తే జీవితం. తృప్తి పడటం నేర్చుకో. లేనిదాని గురించి ఆలోచించకు. పోయిన దాని గురించి అసలే ఆలోచించకు… అలా ఆలోచిస్తే మనకు ఎన్నిసార్లు తుఫాన్లు వచ్చి పంటలు పోలేదు” సర్ధి చెప్పింది.
”అమ్మా! నాకు తలనొప్పిగా వుంది. నీతో మళ్లీ మాట్లాడతాను” అంటూ కాల్‌ కట్ చేసింది మోక్ష.
దృతి వచ్చినప్పటి నుండి తారమ్మ పొలం వెళ్లటం మానేసింది. దృతిని చూసుకుంటూ ఇంట్లోనే వుంది.
ఒకరోజు దృతి ”ఆంటీ! మీరు పొలం వెళ్లకుంటే ఇబ్బందవుతుందేమో! సౌమ్య వుందిగా! మీరు వెళ్లండి పర్వాలేదు. నాకోసమే మీరిలా ఇంట్లో వుంటుంటే నేనొచ్చి మీ పనుల్ని పాడు చేసినట్లు బాధగా వుంది” అంది.
”అలాటి బాధలేం పెట్టుకోకు. పనులకేం తొందర. వాటిపాటికి అవి జరిగిపోతూనే వున్నాయి. ముందు నువ్వు ఇది తిను” అంది అన్నం కలిపి ముద్దలు చేసి దృతికి చేతిలో పెడుతూ.
నాలుగు ముద్దలు తిన్నాక ”అబ్బా… ఇకచాలు ఆంటీ! తినలేను” అంది దృతి లేచి వెళ్లబోతూ…
ఆమె చేయిపట్టి ఆపి కూర్చోబెడుతూ ”ఇప్పుడు నువ్వు తినేది నీకోసమనుకుంటున్నావా? లోపల వుండే నీ బిడ్డకోసం. ఈ టైంలో నువ్వెంత తిన్నా అదంతా నీ బిడ్డకే పోతుంది తెలుసా? అందుకే వద్దు అనకుండా నేను పెట్టింది తిను. మళ్లీ నీకు స్టెరాయిడ్‌ వాడకుండా మనం ఈ తిండితోనే లోపల బిడ్డను పెంచుకోవాలి. బిడ్డ బరువెలా పెరగదో చూస్తాను” అంటూ ఇంకో ముద్ద కలిపి ‘ముందా చేతిలో ముద్ద తిను. ఇది పెడతాను’ అన్నట్లు చూసింది.
అది తిని ఇక తినలేక ”తర్వాత తింటాను ఆంటీ!” అంటూ తప్పించుకోబోయింది.
”అదేం కుదరదు. ఈ కొంచెం తినాలి” అంది మొండిగా తారమ్మ.
దృతి కళ్లలో కన్నీటిపొర లీలగా మెరిసి క్షణంలో మాయమైంది.
చిన్నప్పటి నుండి దృతికి తల్లి ప్రేమ తెలియదు. ఒకవేళ తన తల్లే బ్రతికి వుంటే ఈ తారమ్మలా వుండేదా? దగ్గర కూర్చుని ఇలాగే తినిపించేదా? ఈ తారమ్మకు తనంటే ఎందుకింత ప్రేమ…? ఏమి ఆశిస్తోంది తన దగ్గర? ఏమీ లేదు. అసలు ఇలాటి ప్రేమల్లో ఎలాటి ఆశింపు వుండదు. అందుకే తారమ్మ పక్కన ఎప్పుడు కూర్చున్నా ఒక పన్నీటి కొలను పక్కన కూర్చున్నట్లే హాయిగా వుంటుంది. కూర్చున్నంత సేపు తారమ్మ హృదయాకాశంలోంచి అమృతదారలు కురుస్తూనే వుంటాయి.
గబగబ చేతిలో వున్న ముద్దను తిని తిరిగి తారమ్మ చేతిలో వున్న ముద్దను అందుకుంది దృతి.
”అది. అలా తినాలి. నువ్వలా తింటేనే నీ బిడ్డ సతీష్‌చంద్రలా, ప్రవీణ్‌లా చక్కటి రూపురేఖలతో, మంచి మేధస్సుతో పుడతాడు” అంది.
అది వింటుంటే దృతికి తన లోపల వున్న బిడ్డపై మమకారం పెరగసాగింది. ఇలాటి మాటలు తన అత్తలో లేవు. మామలో లేవు.
”అమ్మా!” అంటూ అల్లుకుపోయింది దృతి తారమ్మను.
తారమ్మ దృతి వీపుపై ప్రేమగా నిమిరింది. ఆమెకు అంకిరెడ్డి దృతికి స్టెరాయిడ్‌ ఇప్పించకుండా ఇక్కడకి తీసుకొచ్చి ప్రిస్క్రిప్షన్‌ ప్రవీణ్‌ చేతిలో పెట్టటం గుర్తొచ్చింది. ఆ దృశ్యాన్ని మరచిపోవాలని తల విదిలించి
”నీకేం కాదురా దృతీ! నేనున్నాను కదా! నీ బిడ్డను లోపల బరువు పెంచే పూచీ నాది… నన్ను నమ్ము” అంది తారమ్మ…. ఆరోజు ప్రవీణ్‌ దృతికి హాస్పిటల్లో స్టెరాయిడ్‌ ఇప్పించి, ఆమెను తారమ్మకు అప్పజెప్పి వెళ్లినప్పటి నుండి తారమ్మకు ఇదే ముఖ్యమైన పనయిపోయింది.
తారమ్మ రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని తన కళ్లకి అద్దుకుంది దృతి.
తారమ్మ దృతికి ప్రతిరోజు పాలు, ఆకుకూరలు, పళ్లు, గుడ్లు, మాంసం, చేపలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్స్రూట్స్ క్రమం తప్పకుండా తినిపిస్తుంది. మూడు పూటల భోజనం, మరో మూడుపూటలు మసాలా లేని స్నాక్స్‌ తినిపిస్తుంది. చాలా జాగ్రత్తగా చూస్తుంది. డాక్టర్‌ దగ్గరకి వెళ్లినప్పుడు కూడా తనేం పెడుతుందో డాక్టర్‌కి చెబుతుంది. ఇంకా ఏం పెట్టాలో అడిగి తెలుసుకుంటుంది.
ఆహారం విషయంలో తారమ్మ అలా వుంటే సౌమ్య ఇంట్లో పనంతా అయ్యాక సాయంత్రం వేళల్లో దృతిని వెంటబెట్టుకొని ఇంటికి దగ్గర్లో వున్న పచ్చి కొండల దగ్గరకి, చెరువు దగ్గరకి వెళ్తుంది. అలా వెళ్లటం వల్ల దృతికి మానసిక ప్రశాంతత వచ్చింది.
ఎప్పుడైనా కడుపు నిండినట్లే మనసు కూడా నిండాలి. లేకుంటే ఏదో లేనట్లు వెలితిగా వుంటుంది. ఆ వెలితిని కూడా ప్రేమాభిమానాలు లేని వ్యక్తుల మధ్యలో వుండి అనుభవిస్తేనే స్పష్టంగా తెలుస్తుంది. నరకాన్ని తలపింపజేసే వాతావరణం ఎలా వుంటుందని ఎవరైనా అడిగితే ‘నేను చెబుతాను’ అంటూ ముందుకొచ్చి చెప్పే అనుభవాలు వున్నాయి దృతికి… వస్తువు పగిలితే శబ్దం వస్తుంది. మనసు పగిలితే శబ్దం రాదు. ఆమె నిశ్శబ్దంగా గడిపిన క్షణాలే ఎక్కువ. ఇప్పుడు అలాటి క్షణాలు లేవు. ఆ వెలితి లేదు.
అన్నం తిన్నాక పండు ఒలిచి పెడుతూ దృతి దగ్గరే కూర్చుని వుంది తారమ్మ. సౌమ్య వాళ్లకి కొద్ది దూరంలో నిలబడి తన చీరలతో పాటు అత్తగారివి, దృతివి మడతలేసి పెడుతోంది.
ప్రవీణ్‌ స్నేహితులు వచ్చి మిర్చి బస్తాలను మార్కెట్ కి తీసికెళ్లాలని పక్కగదిలో వున్న బస్తాలను లారీకెక్కిస్తున్నారు. శేషేంద్ర లారీ దగ్గర నిలబడి వాళ్లతో మాట్లాడటం తారమ్మకు విన్పిస్తోంది.
దృతి వచ్చాక శేషేంద్ర చెయ్యాల్సిన పనులన్నీ ప్రవీణ్‌ స్నేహితులు క్షణంలో చేసి వెళ్తున్నారు. సిటీనుండి ఏది కావాలన్నా పంపుతున్నారు. విత్తనాలకి, మందు బస్తాలకి ఈసారి శేషేంద్ర సిటీకి వెళ్లలేదు. ఒక్కసారే లారీ కట్టెలు తెచ్చి ఇంటిపక్కన వున్న ఖాళీ స్థలంలో గుట్టలా పేర్చి వంటకి ఇబ్బంది లేకుండా చేశారు. ఊరిలో వారు అదంతా చూసి అవాక్కవుతున్నారు.
”నువ్వొచ్చాక మా శేషయ్య ముసలి ప్రాణం హాయిగా వుంది తల్లీ! మాలాటి వాళ్లకి ఈ వయసులో పాతికేళ్ల కొడుకైనా దగ్గర వుండాలి. లేదంటే కొంత సంపద అయినా దగ్గర వుండాలి. మాకు మా కొడుకు నరేంద్ర దగ్గర లేని లోటును ప్రవీణ్‌ భర్తీ చేస్తున్నాడు” అంది తారమ్మ.
దృతి వెంటనే ”అన్నయ్యకు ఇలాటి పనులు అలవాటే ఆంటీ! ఇప్పుడే కాదు, ఎప్పటికీ అన్నయ్య మీకు సపోర్ట్‌గానే వుంటాడు. ఆయన తత్వం నాకు బాగా తెలుసు” అంది.
”సంతోషం తల్లీ!” అంది తారమ్మ. ఆమెకు ఈ మధ్యన శేషేంద్రను చూస్తుంటే భయంగా వుంది. రోజురోజుకి బాగా సన్నబడిపోతున్నాడు.
”మీరు నన్నింత ప్రేమగా చూస్తున్నారని అన్నయ్య వచ్చినప్పుడు చాలా సంతోషపడుతున్నాడు ఆంటీ! ఒక్కరోజు కూడా మా అత్తగారికి నన్నిలా చూడటం వచ్చేది కాదు” అంది.
తారమ్మ నవ్వి ”గర్భంతో వున్నవాళ్లని ఇలా చూడాలి. ఇలాగే చూడాలి అన్నది పుస్తకాలు నేర్పవు దృతీ రావడానికి… మనం బాగుండాలి, మనవాళ్లు బాగుండాలి. మన వంశం బాగుండాలి అన్న భావన తపన వుంటే చాలు”
”ఏమో ఆంటీ నాకు తెలిసి మా మామగారు మాత్రం నన్ను మీరింత బాగా చూస్తారని అనుకుని వుండరు. అలా అనుకొని నన్నిక్కడ వదిలి వుండరు. నాకేదో షెల్టర్‌ కావాలన్న హడావుడిలో ఇది తప్ప మరో దారి లేదన్నట్లు వదిలి వెళ్లారు. కానీ మీరు మాత్రం నాలో ఏదో అద్భుతం వున్నట్లు అపురూపంగా చూసుకుంటున్నారు. ఇదే నాకు ఆశ్చర్యంగా వుంది”
”ఇందులో అంత ఆశ్చర్యపోవలసిందేమీ లేదు దృతీ! నిన్ను కాని, మా సౌమ్యను కాని ఇంకా సైనికుల భార్యల్ని ఎవరినైనా సరే మాలాటి అత్తలు, మామలు, బావలు, తోడికోడళ్లు, ఆడపడుచులు ప్రేమగా చూడాలి. మీరు మీ భర్తల్ని ఏదో సంపాయిస్తార్లే అన్నట్లు అంతదూరం పంపలేదు. యుద్ధం వచ్చినప్పుడు వాళ్లు తప్పకుండా యుద్ధంలోకి వెళ్లాలన్నది తెలియక పంపలేదు. అక్కడికెళ్లాక ఆ శిక్షణలో వాళ్లు దేశం బాగుండడం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టానికి సిద్ధంగా వుంటారని మీకు తెలుసు. వాళ్లక్కడ వుంటేనే మన దేశం మీదకు శత్రువులు రారు. దీనివల్ల మనందరం ఇక్కడ బాగుంటాయి. ఇదంతా మీలాటి భార్యలు, మాలాటి అమ్మలు మగవాళ్లను సైన్యంలోకి పంపటం వల్లనే జరుగుతుంది. మగవాళ్లను సైన్యంలోకి పంపి, ఇక్కడ అత్తలు కోడళ్లని, కోడళ్లు అత్తలని హింసించుకుంటుంటే వాళ్లక్కడ చేసే యుద్ధానికి అర్థం వుంటుందా? ఏ యుద్ధం జరిగినా ప్రశాంతత కోసమే జరుగుతుంది. అత్తాకోడళ్ల యుద్ధం వల్ల వున్న ప్రశాంతత పోతుంది. ఇది మీ అత్తలాటి వాళ్లకే కాదు చాలామంది సైనికుల అమ్మలకి తెలియదు. నాకు ఏమాత్రం అవకాశం దొరికినా అలాటి అమ్మలందర్ని ఓచోట చేర్చి ఇది పద్ధతి కాదు అని చెప్పాలని వుంటుంది. చెబుతాను కూడా…” అంది తారమ్మ.
”మిమ్మల్ని చూస్తుంటే మీరు అనుకున్నది తప్పకుండా చేసేలా వున్నారు ఆంటీ” అంది దృతి.
”చేస్తాను దృతీ! అంకిరెడ్డికి ఏం తక్కువైందని నిన్ను ఇక్కడ వదిలాడు. మాధవీలతకు ఏం బరువయ్యావని కడుపులో వున్న నీ బిడ్డను బరువు పెరగకుండా చేసింది? తెలిసి చేసినా తెలియక చేసినా ఇవన్నీ వాళ్లు చేసిన తప్పులే! కావాలని చెయ్యకపోయినా కావలసి చేస్తున్నా తప్పులు, తప్పులే!” అంది.
దృతి మాట్లాడలేదు. సౌమ్య పక్కనే వుండి వింటోంది.
…మిర్చిలోడు ఎత్తడం పూర్తికాగానే ఇంటిముందువున్న లారీ సిటీ వైపుకి పరుగు తీసింది.
అప్పుడే బయట జీపు దిగిన ప్రవీణ్‌ లోపలకొచ్చాడు. లోపలకి రాగానే తారమ్మ పక్కన కూర్చుని ”శుభవార్త ఆంటీ!” అన్నాడు.
ఆమె ముఖం నిండా నవ్వి ”ఏంటి నాయనా ఆ వార్త?” అని అడిగింది.
”ఉదయం మనం హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు తీసిన దృతి స్కాన్‌ రిపోర్ట్స్‌ రావడం ఆలస్యమవుతుందని మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలి వెళ్లాను కదా! ఆ రిపోర్ట్స్‌ ఇప్పుడు వచ్చాయి. అవి తీసుకొని వెళ్లి డాక్టర్‌ని కలిశాను. ఇక స్టెరాయిడ్‌ వాడనవసరం లేదట. లోపల బేబీ బరువు కూడా బాగానే పెరిగిందట… అది చూసి డాక్టర్‌ ఏమన్నదో తెలుసా ఆంటీ!” అన్నాడు సంతోషంగా.
”ఏమన్నది?” అంతే సంతోషంగా అడిగింది తారమ్మ.
”ఏడోనెల వచ్చాక లోపల శిశువు బరువు పెరగడంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ వుండదట. అలాటిది ‘తారమ్మ నీ చెల్లెలికి ఏం పెట్టిందయ్యా బరువు బాగానే పెరిగింది. అసలు ఇంత ప్రొగ్రెస్‌ వుంటుందని నేను వూహించలేదు. ఇక మనం సిజేరియన్‌ చేసి బిడ్డను ముందుగానే బయటకు తియ్యాల్సిన అవసరం లేదు’ అంటూ డెలివరీ డేట్ కూడా చెప్పింది” అన్నాడు.
”డెలివరీ డేట్ చెప్పిందా? ఎప్పుడు?” అంది తారమ్మ సంబరపడుతూ.
ఈలోపల సౌమ్య ప్రవీణ్‌ చేతిలో వున్న ప్రూట్స్ , డ్రైప్రూట్స్ తీసికెళ్లి లోపల పెట్టి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. సౌమ్య ఇచ్చిన మంచినీళ్లు ఒక గుక్క తాగి డాక్టర్‌ ఇచ్చిన డెలివరీ డేట్ చెప్పాడు. అది వినగానే తారమ్మ ఆనందంతో ఉక్కిరిబిక్కిరై,
”ముందు నువ్వు ఈ విషయం సతీష్‌చంద్రకి ఫోన్‌ చేసి చెప్పు నాయనా!” అంది.
”అలాగే ఆంటీ!” అంటూ ప్రవీణ్‌ తన ప్యాంట్ జేబులో వున్న మొబైల్‌ని బయటికి తీసి సతీష్‌చంద్రకి కాల్‌ చేసి చెప్పాడు.
అవతల వైపున ఆ వార్త విన్న సతీష్‌చంద్ర ”ఓ.కే ప్రవీణ్‌! నాకు అప్పుడు లీవ్‌ ఇస్తారు. ఆ డేట్ వరకు అక్కడ వుంటాను. ఒకసారి ఆంటీకి ఫోన్‌ ఇవ్వు” అన్నాడు.
ప్రవీణ్‌ వెంటనే తారమ్మ చేతికి మొబైల్‌ ఇచ్చి ”మ్లాడండి ఆంటీ! బావగారు లైన్లో వున్నారు” అన్నాడు.
తారమ్మ సతీష్‌చంద్రతో మాట్లాడుతూ కూర్చుంది.
సౌమ్య, దృతి, ప్రవీణ్‌ కొంచెం పక్కకెళ్లి కూర్చున్నారు. ప్రవీణ్‌ సౌమ్యను కూడా దృతిని చూసినట్లే ప్రేమగా చూస్తాడు. సౌమ్య కూడా అతన్ని ‘అన్నయ్యా’ అంటూ దృతి పిలిచినట్లే ఆత్మీయంగా పిలుస్తుంది.
*****
ఈమధ్యన ఆనంద్‌కి, మోక్షకి ప్రతిరోజూ ఘర్షణ జరుగుతూనే వుంది.
ఇవాళ ఏం గొడవా వద్దు. ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకుందాం అని ఆఫీసులో అనుకుంటూనే వచ్చింది మోక్ష. తీరా ఇంటికొచ్చి భోంచేసి బెడ్‌రూంలోకి వెళ్లాక ఆనంద్‌ని చూడగానే తారాజువ్వకు నిప్పు అంటించినట్లు ”మీరు అసలు నాకు తెలియకుండా నా సంతకం పెట్టి లోనెందుకు తీసుకున్నారు? మా ఊరెళ్లి మా అన్నయ్యతో గొడవెందుకు పెట్టుకున్నారు? కనీసం పూర్వి ముఖం చూసైనా వాళ్లతో గొడవ పెట్టుకోకుండా వుండాల్సింది. అసలేం చేస్తున్నారండీ మీరు? ఏం చేయబోతున్నారు? అదైనా చెప్పండి!” అంది.
”ఏం చేయమంటావు?”
”అది నేను చెప్పాలా? మీకు తెలియదా భార్యను, బిడ్డను పోషించాలని… ఇప్పుడెలా పోషించాలను కుంటున్నారు?”
”ఇప్పుడు నువ్వేమైనా తినకుండా చస్తున్నావానే? వేరే పెట్టి పోషించటానికి… రోజూ తింటూనే వున్నావుగా…”
”మీకు తెలుసా రోజూ నా లంచ్‌ బాక్స్‌లో నేనేం తింటున్నానో… మీ అమ్మ నాకేమైనా అమ్మనా అన్నంలో రసం పోసుకున్న వెంటనే ఆమ్లెట్ వేసి పెట్టటానికి… చూడండి! నేను ఈ ఇంట్లో వుండలేను. మీరేం చేస్తారో నాకు తెలియదు. నన్ను మాత్రం వేరే ఇంట్లో వుంచండి! అయినా ఇదేం పెద్ద తీర్చలేని కోరిక కాదే! అంతగా ఆలోచించానికి” అంది.
”నేనేం ఆలోచిస్తున్నాను. నా దగ్గర ఏముంది. అంతా ఆ కమల్‌నాథ్‌కి ఇచ్చాను. అతను తిరిగి ఇచ్చినప్పుడు నువ్వన్నట్లే చేద్దాం!”
”ఎప్పుడిస్తాడు?”
”ఇప్పుడే ఎలా ఇస్తాడు. టైం పడుతుంది”
”ఎంత టైం?”
”నాకేమైనా తెలుసా!”
”తెలియకుండా తెలుసుకోకుండా ఎలా ఇచ్చారు? అయినా డబ్బుల దగ్గర బయటవాళ్లను నమ్మొచ్చా? ఇన్నిరోజులుగా ఉద్యోగం చేస్తున్నారు. ఆ మాత్రం లోకజ్ఞానం లేదా?”
”ఏదో రూపాయికి రూపాయి పెంచుదామనుకున్నాను. అవి పెరిగే లోపలే ప్రశ్నలతో చంపుతున్నావు కదే!”
”అందరూ మీ అంత అమాయకులే వుంటారనుకున్నారా రూపాయిలకు రూపాయిలు పెంచి ఇవ్వటానికి…”
”అంటే ఆ డబ్బులు పోతాయేమోననా నీ డౌట్! నోనో అలా ఏం జరగదు. కావాలంటే రేపే కమల్‌నాథ్‌కి ఫోన్‌ చేసి మాట్లాడతాను. నీతో కూడా మాట్లాడిపిస్తాను. పడుకో”
”నేనెందుకు మాట్లాడటం… మీరు, మీ నాన్నగారు మాట్లాడారుగా. నా సంతకం మీచేత చేయించింది మీ నాన్నే కదూ?”
”అబ్బా! ఇక దాన్ని వదలవా?”
”ఆ ఒక్క సంతకమే కదండీ నన్ను అనాధను, దిక్కులేనిదాన్ని చేసింది. అలాంటి సంతకం విలువ మీకు తెలియకపోవచ్చు. నాకు బాగా తెలుసు. ఒక మనిషిని ఉన్నపళంగా అధఃపాతాళానికి తొక్కినా, పైకి తెచ్చినా ఆ ఒక్క దొంగ సంతకానికే సాధ్యం!”
”అబ్బా! ఇంకెప్పుడూ అలా పెట్టనులేవే పడుకో! తప్పయిపోయిందంటున్నానుగా!” అన్నాడు.
”నేను మీకు చిన్నపిల్లలా కన్పిస్తున్నానా?”
”ఎవరన్నారలా?” అన్నాడు.
ఆమె ఏది మాట్లాడినా అతను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడని అర్థమైంది మోక్షకి. ఇక ఏం మాట్లాడినా వృధా అనుకుంది. అతనికో నమస్కారం పెట్టింది. ఆమె కంట్లో నీళ్లు కదులుతున్నాయి. ముక్కు తుడుచుకుంటూ”ఎలాగైతేనేం చాలా కష్టపడ్డారులెండి! నా కష్టాన్ని నాకు, నా బిడ్డకు దక్కకుండా చేశారు. ఆ పుణ్యం వూరికే పోతుందా!”
”శాపనార్థాలు పెట్టకే! నేను నీ మొగుడిని”
”మొగుడనేవాడు ఎలా వుండాలి. ప్రపంచాన్ని ముంచైనా భార్యను పోషించాలి. కానీ మీరు నన్ను ముంచి నా డబ్బులు తీసికెళ్లి కమల్‌నాథ్‌ అకౌంట్లో వేశారు. ఇదేమైనా బాగుందా?”
”నీకు దణ్ణం పెడతా పడుకోవే! ఆ డబ్బులు ఎక్కడికీ పోవు” అన్నాడు.
”పోవని నేను కూడా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. నన్ను నేను పోషించుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఉద్యోగం కూడా చేస్తున్నాను. నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అడిగి తెచ్చి నా అకౌంట్లో వేయగలరా?”
బిత్తరపోయాడు ఆనంద్‌…. తల గిర్రున తిరిగినట్లైంది.
”తప్పు చేశానా?” అనుకున్నాడు. ఒక్కక్షణం అతనిలో అంతర్మధనం మొదలై మళ్లీ ఆగింది. ‘ఆ… ఇదేం పెద్ద తప్పు కాదులే. డబ్బులు డబులై వస్తాయిగా’ అనుకున్నాడు. మోక్ష వైపు ధైర్యంగా తిరిగాడు.
”నీ అకౌంట్లో డబ్బులేసి నిన్ను ఖర్చు పెట్టుకోమటనానికి వాళ్లు నీకెవరని… తండ్రా, కొడుకా, భర్తా… ఓ పేద్ద చెబుతోంది మాటలు. నువ్వేమైనా కాంట్రాక్ట్‌ బిజినెస్‌ చేస్తున్నావా లేక రియల్‌ఎస్టేట్ నడుపుతున్నావా? నీకు డబ్బులిస్తే ఒక్క రూపాయికి రెండు రూపాయలు తిరిగి వస్తాయని ఆశపడి ఇవ్వటానికి… ఎందుకిస్తారే నీకు డబ్బులు. ఎవరిస్తారని మాట్లాడుతున్నావ్‌! వినే ఓపిక లేదిక. నోరు మూసుకుని పడుకో!” అన్నాడు.
”కమల్‌నాథ్‌ విషయంలో మీరందరూ చేసింది అదే! కానీ పైకి అలా అనిపించదు” అంటూ మోక్ష పడుకుంది. నిద్ర మాత్రం రాలేదు. ఇన్ని రోజులు పూర్విని కూడా దూరంగా వుంచి కెరీర్‌ కోసం కృషి చేసింది. ఇంతా చేసి ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చినట్లైంది. మొదటికి రావడం కాదు. అదనంగా లోన్‌ మిగిలింది. ఇదంతా ఆనంద్‌ వల్లనే. ఇలాటి భర్తలు కూడా వుంటారా?
*****

దృతికి డెలివరీ డేట్ దగ్గర పడుతుందనగా సతీష్‌చంద్ర అస్సాం నుండి వచ్చాడు. అతను నేరుగా తారమ్మ వాళ్ల ఊరెళ్లకుండా తన ఊరే వెళ్లాడు.
ఇంట్లో మనుషులెక్కడో లోపల వున్నట్లు ఇంటిముందు చాలా నిశ్శబ్దంగా వుంది. ఒకప్పుడు వున్నంత శుభ్రంగా కూడా లేదు. గేటు తీసుకొని లోపలకి వెళ్తున్నప్పుడు కూడా కారువైపు చూస్తే ఆ కారు నిండా వేలితో గీతలు గీస్తే స్పష్టంగా కన్పించేంత దుమ్ము వుంది. నీట్ గా పెట్టుకోవచ్చు కదా అనుకుంటూ ఎంట్రన్స్‌ డోర్‌ తీసుకొని హాల్లోకి వెళ్లాడు సతీష్‌చంద్ర.
అక్కడ సోఫాలో కూర్చుని వుంది మాధవీలత.
”అమ్మా!” అని పిలిచాడు సతీష్‌చంద్ర.
ఆమె సతీష్‌చంద్రను చూసింది. చూడగానే పైకి సంతోషపడినట్లు అతనికి అన్పించలేదు.
”ఇదేనా రావడం?” అంది.
”అవునమ్మా!” అన్నాడు.
”నీకు లీవ్‌లు ఇవ్వరేమో! ఉద్యోగం మానేసేమైనా వచ్చావా?” అంది.
సతీష్‌చంద్ర తల్లికి ఎదురుగా కూర్చున్నాడు.
”అమ్మా! బాగున్నావా?” అన్నాడు.
”నా బాగు సరే! నీ సంగతి చెప్పు?” అంది.
”నాకో నెల రోజులు క్యాజువల్‌ లీవులున్నాయి. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోకుండా దృతి డెలివరీ కోసం దాచుకున్నాను. ఇప్పుడు ఆ లీవ్‌ల మీదనే వచ్చానమ్మా!”
”బాగుంది. అయితే ఉద్యోగం మానలేదన్నమాట…” వెటకారంగా అంది. ఆమెకెందుకో సతీష్‌చంద్ర అంటే చిన్నప్పటి నుండి అంతే! ఇప్పుడు దృతి మీద కోపం అతనిమీద చూపిస్తోంది.
”ఉద్యోగం ఎందుకమ్మా మానడం? అక్కడ మా సైనికులకు ఏం తక్కువైందని…?”
”తక్కువేం లేదు. పేద్ద సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నావుగా. కాలనీలో అందరు అదే అనుకుంటున్నారు. అసలు ఆనంద్‌కి వున్న మర్యాద, విలువ నీకు వున్నాయిరా! ఎప్పుడు చూసినా చెత్త స్నేహితులతో తిరిగి నా పరువు తీసేవాడివి. వద్దన్నా వినేవాడివి కాదు. ఇప్పుడేదో వున్నావంటే వున్నావన్నట్లు మేం చెప్పుకుంటున్నాం గాని… నువ్వెంత, నీ ఉద్యోగం ఎంత? ఆఫ్‌ట్రాల్‌ ఒక సైనికుడివి… అంతేగా! అంతమాత్రానికే అక్కడ మాకేం తక్కువని గొప్పలు చెప్పుకుంటావెందుకు?”
”అది కాదమ్మా నేను అనేది. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదు”
”ఏముందిలే అర్థం చేసుకోటానికి…”
”నువ్వలా ఏముందిలే అని అనకమ్మా! అక్కడ మాకు అన్నీ వున్నాయి”
”ఏమున్నాయిరా అన్నీ…?”
”మేము అక్కడికి వెళ్లిన క్షణం నుండి మాకు అన్నీ ఫ్రీగానే లభిస్తాయి. తిండి, బట్టలు, వసతి, మందులు, జీవితభీమా, రవాణా సదుపాయం, కుటుంబం వుండానికి ఇల్లు, సంవత్సరానికి మూడు నెలలు సెలవులు. ఇలా అన్నీ ఉచితంగానే ఇస్తారు. అందుకే మా సైనికులు తమకొచ్చే జీతం మొత్తం ఇంటికే పంపుకుంటారు. ఇంతకన్నా ఏం కావాలి ఎవరికైనా?” అన్నాడు.
ఆమె ముఖంలో సంతోషం కన్పించలేదు.
”నీకు మొదటి నుండి సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ మీద మమకారం ఎక్కువగా వున్నందువల్ల మా సైనికుల విలువ తెలియడం లేదు. కాని ఒక్కసారి మా సైనిక దళాలు ఎలాటి ధైర్యసాహసాలతో కూడిన పనులు, త్యాగాలు చేస్తారో తెలిస్తే నువ్విలా అనవు. గర్వపడతావు”
”ఎవరిక్కావాలి త్యాగాలు? చెప్పుకోటానికి ఏమీ కన్పించనప్పుడు త్యాగాలను మెడలో వేసుకొని తిరగ్గలవా?”
”ఎవరూ ఏదీ మెడలో వేసుకొని తిరగరమ్మా! తృప్తిగా బ్రతికితే చాలనుకుంటారు… ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తనకొచ్చే హైరేంజ్‌ శాలరీతో ఒక మంచి కారు, ఇల్లు కొనుక్కొని తృప్తిపడతాడు. నాలాంటి సైనికుడు దేశం మీదకి శత్రువుని రానివ్వకుండా దేశాన్ని కాపాడి తృప్తిపడతాడు. తృప్తే పరమావధి అయినప్పుడు ఎవరు ఏ రంగంలో వున్నా దానికి న్యాయం చేస్తే చాలు కదా! ఇది కాదు అది కావాలి. అది ఇది కావాలి అనుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు” అన్నాడు.
ఆ మాటలకు ఆమె ఏమాత్రం తృప్తిపడలేదు.
”నాకు క్లాస్‌ తీసుకుంటున్నావా?” అంది.
అతనిక ఆ విషయాన్ని వదిలేసి అటుఇటు చూస్తూ ”అమ్మా! నాన్న లేరా?” అన్నాడు.
”లేడు. అన్నయ్యతో కలిసి ఎటో వెళ్లినట్లుంది”
”కారు తీసికెళ్లలేదా?”
”లేదు. దానికేదో రిపేరు వచ్చినట్లుంది! నాన్న అన్నయ్య పని మీద ఈ మధ్య బిజీగా ఉన్నాడు” అంది.
అంతలో సతీష్‌చంద్ర మొబైల్‌ రింగయింది. నెంబర్‌ చూడగానే వెంటనే లిఫ్ట్‌ చేసి ”ఇప్పుడే వచ్చాను ఆంటీ! అమ్మ దగ్గర వున్నాను. అటే వస్తున్నాను” అన్నాడు.
”త్వరగా రా సతీష్‌! దృతికి నొప్పులొచ్చాయి. హాస్పిటల్‌కి తీసికెళ్తున్నాము. ప్రవీణ్‌ కూడా ఇప్పుడే వచ్చాడు” అంటూ హడావుడిగా కాల్‌ కట్ చేసింది తారమ్మ.
సతీష్‌ లేచి నిలబడి ”అమ్మా! నేను వెళ్తున్నాను. దృతిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారట. నాన్న, అన్నయ్య వచ్చాక మీరంతా హాస్పిటల్‌కి రండి” అంటూ వెళ్లిపోయాడు.
******

సతీష్‌చంద్ర హాస్పిటల్‌కి వెళ్లిన గంటకే దృతికి మగపిల్లవాడు పుట్టాడు.
”ఈ రోజుల్లో ఆపరేషన్‌ లేకుండా కాన్పులు జరగడం అరుదు. నువ్వు అదృష్టవంతుడివి సతీష్‌చంద్రా! దృతికి నార్మల్‌ డెలివరీ అయింది. బాబు బాగున్నాడు” అంటూ ఒక్కొక్కరినే తీసికెళ్లి బాబును, దృతిని చూపించింది తారమ్మ. ఆమె హడావుడి, సంబరం చూస్తుంటే ముచ్చటేసింది సతీష్‌చంద్రకి.
సతీష్‌చంద్ర హాస్పిటల్లో వున్నాడన్న మాటేకాని మాటిమాటికి అతనికి తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు. ముఖ్యంగా బాబు పుట్టాక. వాళ్లంతా వచ్చి బాబును చూడాలని వుంది. చూసి ఆనందపడుతుంటే ఆ ఆనందాన్ని చూడాలని వుంది. అందుకే అతను జర్నీలో వున్నప్పుడే తండ్రికి కాల్‌ చేశాడు. కాల్‌ లిఫ్ట్‌ చేసి
”నేను కొంచెం అర్జంట్ పనిలో వున్నాను సతీష్‌! నీకు మళ్లీ కాల్‌ చేస్తాను” అంటూ సతీష్‌చంద్ర చెప్పబోయేది వినకుండానే కాల్‌ కట్ చేశాడు. ఆయన తిరిగి కాల్‌ చెయ్యలేదు. మరచిపోయి వుంటాడనుకుని మళ్లీ కాల్‌ చేశాడు. అప్పుడు కూడా అంకిరెడ్డి అలాగే మాట్లాడాడు.
ఇప్పుడు వెళ్లి కన్పించి, బాబు పుట్టినట్లు చెప్పి, వాళ్లను హాస్పిటల్‌కి తీసుకొద్దామని ఒక్కడే బయలుదేరి ఇంటికెళ్లాడు సతీష్‌చంద్ర.
మాధవీలత దగ్గరకి వెళ్లి ”నీకు మనవడు పుట్టాడమ్మా! తల్లీ, బిడ్డా హాస్పిటల్లోనే వున్నారు. నిన్ను తీసికెళ్లాలని వచ్చాను. రామ్మా! వెళ్దాం. బాబును చూద్దువు గాని” అన్నాడు సంతోషపడుతూ.
అది వినగానే ”కీరమ్మా!” అంటూ కేకేసింది మాధవీలత.
కీరమ్మ వెంటనే వచ్చి అక్కడ వున్న సతీష్‌చంద్రను చూసి ”బాబుగారు! మీరా! బాగున్నారా?” అంటూ అభిమానంగా పలకరించి వినయంగా నిలబడింది.
ఇప్పుడంత వినయం అవసరమానే. ఓవర్‌ యాక్షన్‌ కాకపోతే అన్నట్లు కీరమ్మవైపు చూసి ”రాత్రేగా నీ చెల్లెలుకు కొడుకు పుట్టాడు. ఎలా వున్నాడు?” అడిగింది మాధవీలత.
”బాగున్నాడమ్మా! ఇప్పుడు అక్కడ నుండే వస్తున్నాను”
”సరే! ఇక నువ్వు వెళ్లు” అంది మాధవీలత.
కీరమ్మ వెళ్లగానే అక్కడ వున్న సతీష్‌చంద్రను చూసి ”అలా పలకరించి తెలుసుకోవటమే నాకు హాయిగా వుంటుంది సతీష్‌! వెళ్లి చూడటం ఇష్టం వుండదు” అంది.
సతీష్‌చంద్ర గాయపడ్డట్లు చూసి ”పనిమనిషి చెల్లెలు కొడుకు నా కొడుకు ఒకటేనా అమ్మా!” అన్నాడు.
ఆమె మాట్లాడలేదు.
”ఇంత మెటీరియలిస్ట్‌గా ఎలా వుండగలుగుతున్నావమ్మా?”
”నాకు మాత్రం తెలుసా సతీష్‌! నేను కలలు కన్న విధంగా నా జీవితం లేక బాధపడుతూ కూర్చుంటే లేని రోగాలు వస్తాయని, బాధపడలేక నవ్వలేక ఇదిగో ఇలా గడుపుతున్నాను” అంది ముఖాన్ని పక్కకి తిప్పుకుని.
ఆమెను పరీక్షగా చూసి ”నేను వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను! నీకు ఒంట్లో బాగుండటం లేదా? కన్ను నొప్పిగా వుందా? దాన్నే ఒకచేత్తో పట్టుకుని మాట్లాడుతున్నావ్‌? అసలా కన్నుకేమైంది?” అన్నాడు.
ఆమె కలవరపడి ”నా కంటికేమైంది… ఏం కాలేదు” అంది గంభీరంగా. ఆమె గత కొద్దిరోజులుగా కంటి పక్కన రెండు మచ్చ లున్నాయని అవి కన్పించకుండా ఒక చేత్తో ఒక కంటిని మూసుకునే తిరుగుతోంది. మోక్ష కన్పించినప్పుడు నువ్విచ్చిన వెదవ సలహా వల్ల, నువ్వు చేసిన దిక్కుమాలిన ఫేస్‌ప్యాక్‌ల వల్ల నా ముఖానికి మచ్చలొచ్చాయని తిడుతూనే వుంది. అది సతీష్‌ దగ్గర దాచింది.
”నువ్వేదో దాస్తున్నట్లున్నావు. ఏమైనా ప్రాబ్లమ్‌ వుంటే చెప్పమ్మా! నిన్ను మా మిలటరీ హాస్పిటల్‌కి తీసికెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అలాంటి ఫెసిలిటీ కూడా వుంటుంది మాకు” అన్నాడు.
”మీకు లేని ఫెసిలిటీస్‌ లేనట్లున్నాయిగా” అంది చులనకనగా చూస్తూ.
సతీష్‌ అది గమనించి ”అమ్మా! నాన్నగారు లేరా? ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చెయ్యటం లేదు” అన్నాడు.
”నీకంటే పనీపాటా లేక ఫోన్లు చేసుకుంటూ కూర్చుంటావ్‌! నాన్నకి అన్నయ్యకి అంత తీరిక ఎక్కడిది. వాళ్లేదో ముఖ్యమైన వ్యవహారం గురించి మాట్లాడుకుంటూ లోపల వున్నారు. వెళ్తావా? ఎందుకులే కూర్చో. నువ్వెళ్లి వాళ్లనెందుకు కదిలిస్తావు. పిల్లాడు పుట్టాడని చెప్పానికేగా. వాళ్లు బయటకొచ్చాక చెప్పొచ్చులే. తొందరేముంది” అంది.
అమె అలా అంటున్నప్పుడే అంకిరెడ్డి, ఆనంద్‌ గదిలోంచి బయటకొచ్చారు. అంకిరెడ్డి సతీష్‌చంద్రను చూసి ”సతీష్‌! నేను, అన్నయ్య వేరే పనిమీద బయటికి వెళ్తున్నాం. నీతో తర్వాత మాట్లాడతాను” అంటూ ఆగకుండా వెళ్లిపోయాడు. ఆయన వెంట ఆనంద్‌ వెళ్లాడు.
సతీష్‌చంద్ర ఆశ్చర్యపోయి
”ఎక్కడికి వెళ్తున్నారమ్మా వాళ్లు? ఎందుకంత టెన్షన్‌ టెన్షన్‌గా వెళ్తున్నారు. కనీసం నాతో ఒక్క మాటయినా మాట్లాడలేదు” అన్నాడు.
”చెప్పానుగా వాళ్ల వ్యవహారాలు పెద్దవని. వాళ్లను చూస్తూ కూడా అడుగుతావేం! కన్పించటం లేదా ఎంత హడావుడిగా వెళ్లారో! లక్ష్యాలు పెద్దవైనప్పుడు టెన్షన్‌ వుంటుంది. వాళ్లు కూడా ఏ టెన్షన్‌ లేకుండా నీలాగ వుంటే ఈ కాలనీలో తలెత్తుకుని తిరగనవసరం లేదు” అంది.
సతీష్‌చంద్ర వెంటనే లేచి ”వెళ్తున్నానమ్మా!” అంటూ నేరుగా హాస్పిటల్‌కి వెళ్లాడు.
రాత్రికి మోక్ష ఆఫీసు నుండి రాగానే మాధవీలతకు నచ్చజెప్పి కారులో ఎక్కించుకొని అంకిరెడ్డి ఆనంద్‌ హాస్పిటల్‌కి వెళ్లారు. దృతిని, బాబుని చూసి వచ్చారు.
*****

వారం రోజులు గడిచాక రాత్రి పదిగంటలయినా మోక్ష ఆఫీసు నుండి ఇంటికి రాలేదు. అంతవరకు మామూలుగానే వున్న ఆనంద్‌ మోక్షకి ఫోన్‌ చేశాడు. ఆమె లిఫ్ట్‌ చెయ్యలేదు. ఆఫీసులో ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పటం లేదు. మోక్ష ఎక్కడికెళ్లింది మాకు తెలియదన్నారు.
డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఒకప్పుడు వున్న సందడి ఇప్పుడు లేదు. వెలితిగా వుంది అంకిరెడ్డికి… మాధవీలత మౌనంగా వుంది.
”కొలీగ్స్‌తో ఏదైనా టూర్‌ వేసుకుని వెళ్లిందేమో రేపొకసారి బాగా ఎంక్వయిరీ చెయ్యి ఆనంద్‌” అంటూ అంకిరెడ్డి తన గదిలోకి వెళ్లిపోయాడు.
తల్లికి, మోక్షకు ఈ మధ్యన మాటలు సరిగా లేవని ఆనంద్‌కి తెలుసు కాబట్టి తల్లి దగ్గర మోక్ష ఇంటికి రాని విషయం ఎత్తకుండా అతను కూడా తన గదిలోకి వెళ్లాడు.
*****

మోక్ష ఎటూ వెళ్లలేదు. ఆఫీసు నుండి నేరుగా బస్టాండ్‌కెళ్లి బస్సెక్కి తన ఊరు వెళ్లింది. రాత్రికి భోజనాల సమయంలో అందరూ వినేలా ”నేను రేపటి నుండి ఆఫీసుకి ఇక్కడి నుండే వెళ్తానమ్మా!” అంది.
అది విని మోక్ష తల్లిదండ్రులు కాని, అన్నయ్య, వదిన కాని ఏమీ అనలేదు. ‘ఆనంద్‌, నువ్వు గొడవ పడ్డారా?’ అని అడగలేదు. ‘గొడవలేమైనా వుంటే సర్దుకుపోండి’ అని చెప్పలేదు. మోక్ష అన్నయ్య మాత్రం ‘ఉదయాన్నే మోక్షకి బాక్స్‌లో అన్నం పెట్టివ్వమ్మా! బస్‌లో వెళ్తుంది. డ్రైవర్‌ నాకు తెలిసినవాడే! రాత్రికి మోక్ష వచ్చే టైంకు బస్‌స్టాండ్‌కి నేను వెళ్లి తీసుకువస్తాను” అన్నాడు.
మోక్ష తల్లి ‘సరే!’ అంది.
ఆ రాత్రికి పూర్వి పక్కన పడుకొని హాయిగా నిద్రపోయింది మోక్ష.
తెల్లవారి స్నానం చేసి ఆఫీసుకెళ్లాలని రెడీ అవుతున్న మోక్షకు తల దువ్వుతూ ”ఎందుకొచ్చావు మోక్షా? ఆనంద్‌ కాని, మీ అత్తగారు కాని ఏమైనా అన్నారా?” అడిగింది మోక్ష తల్లి.
”వాళ్లేమీ అనలేదమ్మా! నాకే ఆ ఇంట్లో వుండాలనిపించలేదు. నువ్వు, పూర్వి గుర్తొస్తున్నారు. ఇక్కడికొచ్చాక నాన్నను, అన్నయ్యను, వదినను చూసుకున్నాక బాగుంది. అంతే!” అంది.
”ఇంకేమైనా వుంటే నాతో చెప్పు మోక్షా! మనసులో పెట్టుకోకు!”
”ఏమీ లేదమ్మా! వుంటే చెబుతాను” అంది.
”మోక్షా! నువ్వొక్కసారి అన్నావ్‌ గుర్తుందా?”
”ఏంటమ్మా అది?”
”దృతి నీ డ్రెస్‌ గురించి కామెంట్ చేసిందని…”
”ఓ అదా! అవును చేసిందట! ఆనంద్‌ చెప్పాడు”
”కానీ నాకెందుకో అది నమ్మబుద్ది కావటంలేదమ్మా! నాకు తెలిసి దృతి అలా అనే మనిషి కాదు”
”నాక్కూడా ఇప్పుడిప్పుడే నీకొచ్చిన డౌటే వస్తోందమ్మా! పాపం అనవసరంగా దృతిని బాధ పెట్టాను. అసలు ఇదంతా ఆనంద్‌ వల్లనే జరిగింది”
”అందుకే చెప్పుడు మాటల్ని వినకూడదు మోక్షా! విన్నా నమ్మకూడదు. ఇది ఎంత వరకు నిజం అన్నది కూడా గమనించుకోవాలి”
”తప్పయిపోయిందమ్మా! దృతి విషయంలో ఆనంద్‌ వల్ల నేను చాలా తప్పు చేశాను. ఆనంద్‌ కన్పిస్తే అడుగుతాను. దృతికి ఫోన్‌ చేసి సారీ చెబుతాను” అంటూ జుట్టుకు చకచక రబ్బర్‌బాండ్‌ తగిలించుకొని, పూర్వికి ముద్దు పెట్టి వదిన ఇచ్చిన లంచ్‌బాక్స్‌ను బ్యాగ్‌లో పెట్టుకుని అన్నయ్య బైక్‌మీద బస్టాండ్‌కి వెళ్లి బస్సెక్కి వెళ్లిపోయింది.
ఆమె వెళ్లేటప్పటికే ఆఫీసులో కూర్చుని వున్నాడు ఆనంద్‌.
ఆనంద్‌ని చూసి ఆశ్చర్యపోలేదు. ”ఏమిటీ ఇలా వచ్చారు?” అని అడగలేదు. నిశ్శబ్దంగా వెళ్లి తన సీట్లో కూర్చుని హ్యాండ్‌బ్యాగ్‌లో వున్న లంచ్‌బాక్స్‌ని డెస్క్‌లో పెట్టింది. హాండ్‌బ్యాగ్‌ని టేబుల్‌పై పెట్టుకొంది. లోపలకెళ్లి ఏర్‌టెల్‌ ఆఫీసువాళ్లు ఇచ్చిన డ్రస్‌కోడ్‌ వేసుకొని వచ్చి తన సీట్లో కూర్చుంది.
ఆనంద్‌లో ఒకప్పటి ఆవేశం, కోపం లేవు. అలా అని ప్రశాంతంగా కూడా లేడు. ఏదో బాధతో కూడిన మౌనం. మోక్షను పలకరించలేకపోతున్నాడు.
మోక్ష పక్కసీట్లో వుండే కొలీగ్‌ వచ్చింది. మోక్షకి ఎదురుగా కూర్చుని వున్న ఆనంద్‌ వైపు చూసి ఆమెకూడా లోపలకి వెళ్లి డ్రస్‌ మార్చుకుని వచ్చింది. రాగానే ఆనంద్‌ని పలకరించింది.
”ఏం ఆనంద్‌ గారు అలా వున్నారు? మొన్నలా లేరే!” అంది కొలీగ్‌.
”కష్టాలొచ్చాయండి! అందుకే మొన్నలా లేను!”
”కష్టాలా?”
”అవును. కమల్‌నాథ్‌ హ్యాండిచ్చాడు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఒకరోజు గోవాలో వున్నాడంటారు. ఒకరోజు మధురైలో వున్నాడంటారు. ఒకరోజు మన పక్క విలేజ్‌లో వున్నాడంటారు. ఎవరికీ కన్పించకుండా తిరుగుతున్నాడు. ఫోన్లో కూడా దొరకడం లేదు. నేను అతనికి చాలా డబ్బు ఇచ్చానండీ! దీనివల్ల నాకు, మా నాన్నగారికి మూడు రోజుల నుండి తిండిలేదు…. నిద్రలేదు”
”అతన్నెలా నమ్మారు సర్‌!”
”అతను నాకు, నా స్నేహితునికి చాలాకాలంగా పరిచయం. రోజూ ఫోన్లో మాట్లాడేవాడు మేడమ్‌! అతని భావాలు, యాటీట్యూడ్‌ నాకు నచ్చాయి. లేకుంటే అంత డబ్బు ఎలా ఇస్తాను”
”ఎంత నచ్చినా, ఎంత తెలిసినా, ఎంత స్నేహితుడైనా ఫోన్లో మాట్లాడగానే అంత డబ్బును ఇచ్చేస్తారా సర్‌! రోజూ కన్పించే భార్య పుట్టిన రోజంటేనే ఒక డ్రస్‌ కొనివ్వాలంటే అంతగా ఆలోచిస్తారే అతనెవరో నాలుగు మాటలు నమ్మకంగా మ్లాడగానే అంత డబ్బు ఎలా ఇచ్చారు?”
”ఇచ్చానండీ! ఇచ్చేవరకు నన్ను అతను ఊపిరి తీసుకోనివ్వలేదు. ‘ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి ఆనంద్‌! లాభాలు వస్తున్నప్పుడే పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు నేను తీసుకున్న కాంట్లాక్ట్‌ వర్క్‌ సామాన్యమైనది కాదు’ అంటూ ఫోన్లో అదేపనిగా వెంటబడ్డాడు. వున్న డబ్బులన్నీ ఓ చోటకి చేర్చి అతని అకౌంటుకి పంపాను. అలా చెయ్యడం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడనిపిస్తోంది ఎంత దిక్కుమాలిన పని చేశానా అని… అతనిక దొరకడేమోనని భయంగా వుంది” అన్నాడు.
”ఇదంతా మోక్షకు చెప్పకుండా చెయ్యటమే మీరు చేసిన పొరపాటు సర్‌! తనకి మీరు చెప్పి వుంటే నా సలహా తీసుకునేది. నేను ఇవ్వొద్దనే చెప్పేదాన్ని. ఎందుకంటే అతను మా వారికి చిన్ననాటి స్నేహితుడు!”
ప్రపంచం ఇంత చిన్నదా అన్నట్లు అదిరిపడి చూశాడు ఆనంద్‌. ఇంతవరకు ఆనంద్‌ కమల్‌నాథ్‌ని పొడిచొచ్చే సూర్యుడే అనుకున్నాడు. అలాగే అందరితో చెప్పాడు.
”మోక్ష నిన్న నాకు చెప్పగానే ‘అయ్యో! వీళ్లు కమల్‌నాథ్‌ చేతిలో అనవసరంగా దెబ్బతిన్నారే అనుకున్నాను. మనిషికి స్వార్థం వుండొచ్చు, మోసం వుండొచ్చు, దుర్మార్గం వుండకూడదు. కమల్‌నాథ్‌ దుర్మార్గుడు ఆనంద్‌గారు!”
”అలాగా! నాకు తెలిసి అతను చాలా మంచివాడిలా అన్పించేవాడు మేడమ్‌! రోజూ ఫోన్లో స్నేహంగా మాట్లాడటమే కాకుండా నాలో ఏ చిన్న అసంతృప్తి వున్నా మాటలతో దాన్ని తుడిచేసేవాడు. నాపట్ల చాలా శ్రద్ధగా వుండేవాడు. ఆరోగ్యానికి మంచిది ఆవునెయ్యి వాడమనేవాడు. ఆయుర్వేదం గురించి, అశ్వనీ దేవతల గురించీ చెప్పేవాడు. అతనికి తెలియని విషయం లేదు. డబ్బును ఎలా సంపాయించాలో, ఎంత నిజాయితీగా ఖర్చు పెట్టాలో చెప్పేవాడు. ఆదివారాలు ఎక్కువగా నేను అతనితోనే వుండేవాడిని…” అన్నాడు.
”అంత బాగా అడిక్ట్‌ అయ్యారన్నమాట అతని మాటలకి…” అంది కొలీగ్‌.
”అలా ఏం కాదు మేడమ్‌! అతని మాటల్లో ఒక రోల్‌మోడల్‌ కన్పించేది. ఉదయాన్నే యోగా చెయ్యమనడం, టీవీలో ప్రవచనాలు వినమనడం, ఏది పాపమో, ఏది పుణ్యమో చెప్పటం, గరుడ పురాణం చదవమనడం, భారత, రామాయణాలను ఇంట్లో పెట్టుకోమనడం, భగవద్గీతను ఒకరోజు కొరియర్లో పంపటం, ఎవరు చేస్తారు మేడమ్‌ ఇలాటివి? అతను చేశాడు… అతనికి పసిపిల్లలు, ముసలివాళ్లు, మూగజీవాలు, పకక్షులు అంటే ప్రేమ. మొక్కలంటే ప్రాణం. ఇంటిపక్కన పండించే కూరగాయల్ని దారినపోయే వాళ్లకి, గుడిలో పూజారులకి, అనాధ పిల్లలు వుండే ఆశ్రమాలకు ఉచితంగా ఇచ్చేస్తాడట… అలా ఎవరు ఇస్తారు? పావురాళ్లకు ప్రతిరోజు గింజలు పెట్టి నీళ్లు పోస్తాడట. ఇదెంత మంచిపని. అతన్ని మంచివాడు కాదని ఎలా అనుకుంటాం?” అన్నాడు.
”ఊ… ఇంకా ఏమనేవాడు?”
”పైరసీ సిడిలలో సినిమాలు చూడటం నేరమనేవాడు. దేశాన్ని దోచుకునేవాళ్లను చూస్తుంటే నా మనసెందుకో క్షోభిస్తుంది ఆనంద్‌ అనేవాడు. అన్యాయాన్ని తట్టుకోలేనట్లు విలవిల్లాడుతూ మ్లాడేవాడు. కసి, కోపం, పట్టుదల లేనివాడు పైకి రాలేడని చెప్పేవాడు. ఇవన్నీ వింటుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది మేడమ్‌?” అన్నాడు ఆనంద్‌.
”పక్కా దొంగవెదవ అన్పిస్తుంది. ఇలాటి మాటలు ఎవరు మాట్లాడినా నమ్మకూడదు. డబ్బులు అవసరమైనప్పుడే, అవతలవాళ్లను ప్లాట్ చెయ్యాలనుకున్నప్పుడే ఎక్కువ శాతం ఇలాటి నీతి కబుర్లు చెబుతుంటారట. మొన్నొక సైకాలజీ సర్వేలో తేలింది. ఎలాగూ అతన్ని నమ్మారు. డబ్బులిచ్చేశారు. ఇక దాని గురించి ఎందుకులెండి ఎంత మాట్లాడుకున్నా వేస్ట్‌!” అంది కొలీగ్‌.
మోక్ష తలవంచుకొని ఏదో పని చేసుకుంటున్నట్లు నటిస్తూ వాళ్లిద్దరి మాటల్ని వింటూ వుంది. ఆనంద్‌ కొలీగ్‌ వైపు చూడకుండా కొద్దిగా తలవంచుకొని ఆలోచిస్తున్నాడు.
”అతను లక్షలే కాదు ఆనంద్‌ గారూ! వందలు, వేలు ఇచ్చినా తీసుకుంటాడట. మళ్లీ తిరిగి ఇవ్వడట! నీలాటివాళ్లు మాకు తెలిసి వందల్లో వుంటారు. వాళ్ల బాధలు చెప్పుకోబోయినా అతను వినడట. ”మీ బాధలు నాకెందుకు చెబుతారు. వినే ఓపిక నాకెక్కడిది” అంటూ కాల్‌ కట్ చేస్తాడట… అతను మిమ్మల్నే కాదు, సొంత బావమరుదుల్నే ముప్పు తిప్పలు పెట్టాడట”
సొంత బావమరుదుల్నా!!! అదెప్పుడూ అతను తనతో చెప్పలేదే! తనుకూడా తన బావమరిదిని కట్నం డబ్బు కోసం బాగానే బాధ పెట్టాడు. తన స్టోరీ వేరు. కమల్‌నాథ్‌ స్టోరీ ఏంటో?
”ఎలా బాధపెట్టాడు మేడమ్‌?” అడిగాడు ఆనంద్‌. ఆనంద్‌కి తన డబ్బులు ఇక రావేమోనన్న బెంగతో నీరసం వస్తోంది.
”చాలా కాలం క్రితం వాళ్ల బావమరుదులతో డబ్బులిస్తాను, స్థలం కొనమన్నాడట. వాళ్లు కొని వాళ్ల పేరుతో పెట్టుకున్నారట. ఇతను కొద్దిరోజులయ్యాక డబ్బులు ఇవ్వకుండానే ‘ఆ స్థలం నాది, అన్యాయంగా మీ పేరుతో పెట్టుకున్నారు. గుడిలోకొచ్చి ప్రమాణం చెయ్యండి’ అంటూ గోలచేసి వాళ్ల వెంటపడ్డాడట… ఇదీ కమల్‌నాథ్‌ బ్యాగ్రౌండ్‌, కమల్‌నాథ్‌ క్యారెక్టర్‌!” అంది కొలీగ్‌.
”ఇదంతా నాకు తెలియదు మేడమ్‌! అతనితో అంత క్లోజ్‌గా వుండి కూడా అతని మనసులో వున్నది తెలుసుకోలేకపోయాను” ఆనంద్‌కి చెమటలు పడుతున్నాయి.
”ఎలా తెలుస్తుంది ఆనంద్‌గారు. అందుకే ఎంత తెలిసినా, ఎంత చూసినా, ఎంత స్నేహితుడైనా పరాయివాళ్లను నమ్మకూడదు. లక్షలకు లక్షలు వాళ్ల అకౌంట్లకు పంపకూడదు. డబ్బు ఇచ్చే వరకే మనం తెలివిగలవాళ్లం. ఆ తర్వాత వాళ్లు తెలివిగల వాళ్లవుతారు. నువ్వే కాదు ఈరోజుల్లో చాలామంది మీలాటి వాళ్లు తాము సంపాయించుకున్న డబ్బుల్ని తమ అకౌంట్లో కన్నా వేరేవాళ్ల అకౌంట్లలో వేసి తృప్తి పడుతుంటారు. అవి ఎప్పటికైనా పెరిగి తిరిగి తమ అకౌంట్లలో వచ్చి పడతాయనుకుంటారు. అదంతా భ్రమ… కష్టపడి సంపాయించుకుంటున్న ప్రతి పైసాను ఫ్యామిలీకి పెట్టుకోవాలి. ఆ తర్వాత అంతో ఇంతో మిగిలితే వృద్దాప్యానికి దాచుకోవాలి. అంతేకాని ఇలాటి ఆశబోతు పనులు చెయ్యకూడదు. జీవితాలు నరకప్రాయం అవుతాయి. కమల్‌నాథ్‌ లాంటివాళ్లు ఎవరితో స్నేహం చేసినా వాళ్లకి భూలోక నరకాన్ని చూపిస్తారు” అంది కొలీగ్‌.
”మీరు చెప్పేది కరక్టే మేడమ్‌! నేను మూడు రోజులుగా పడుతున్న బాధ మామూలుగా లేదు. నేను అతనికి పంపిన డబ్బులన్నీ ఒక్కో రూపాయి నా కళ్ల ముందు మెదులుతుంటే ఏడుపొస్తోంది. అయినా నేను అతన్ని వదలను మేడమ్‌! అందర్నీ వెంటేసుకుని అతను ఎక్కడున్నా వెళ్తాను” అన్నాడు.
”మీరు వెళ్లగలరు. ఆడవాళ్లు వెళ్లగలరా?”
”ఆడవాళ్లా!! ఆడవాళ్లేంటి మేడమ్‌?”
”నేనిలా అనొచ్చో లేదో తెలియదు కాని కొంతమంది అమాయకులైన ఆడవాళ్లకి కమల్‌నాథ్‌ లాంటివాళ్లు పరిచయం అయ్యాక వాళ్లకు వాళ్ల భర్తలు మామూలు పురుషుల్లాగా కమల్‌నాథ్‌ ఒక్కడే యుగపురుషుడులాగా అన్పిస్తాడట. భర్తలు చూపించే ప్రేమ సరిపోక కమల్‌నాథ్‌ చెప్పే దొంగమాటలు, దొంగ ప్రేమ తృప్తిగా అన్పిస్తాయట. అందుకే తమ భర్తల దగ్గర తామేదో నష్టపోతున్నట్లు ఏడ్చుకుంటూ అతనేదో రక్షిస్తాడని అనుకుంటూ అతను ఏమడిగినా (బంగారం, డబ్బు) ఎంత అడిగినా ఇచ్చేస్తుంటారట. మళ్లీ తిరిగి ఇమ్మని అడిగితే ‘మీకెందుకు డబ్బులు? అంతగా బ్రతకలేమనుకుంటే చెప్పండి ‘సైనైడ్‌’ పంపిస్తా. అది చాలా చిన్నగా వుంటుంది. అది తీసుకుంటే వెంటనే ప్రాణం పోతుంది. బ్రతికి ఏం సాధిస్తారు?’ అంటాడట. ఇలా అనే హక్కు అతనికి ఎవరిచ్చారండీ! ఇది దుర్మార్గం కాదా! తన వారసులకి ఆస్తులివ్వడం కోసం ఇంత అన్యాయంగా ప్రవర్తించాలా? అదేం అంటే నేను చేస్తున్న ఏ పని అయినా మోసంతో దుర్మార్గంతో కూడుకున్నదే అయితే ఆ పనిని దేవుడెందుకు చెయ్యనిస్తాడు అంటూ దేవుడి మీదకు నెట్టేస్తాడట. నాకు తెలిసి జీవితం చివర్లో కష్టపడుతూ బ్రతికే ఆడవాళ్లు కొందరికి ఎప్పుడో ఒకప్పుడు కమల్‌నాథ్‌ లాంటి వ్యక్తులతో పరిచయం వుండి వుంటుంది. లేకుంటే అన్ని కష్టాలు రావు” అంది.
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరన్నట్లు ”ఇందులో మీ ఆడవాళ్ల తప్పేమి లేదంటారా మేడమ్‌?” అన్నాడు ఆనంద్‌.
”వుంది ఆనంద్‌ గారు! ప్రతి తప్పు వెనక ఏదో కొంత ఆశ వుంటుంది. ఆశ వేరు, అత్యాశ వేరు. అత్యాశకు లొంగినవాళ్లు చావుదెబ్బలు తింటున్నా అదే ప్రపంచం అనుకుంటారు. ఇంకో ప్రపంచంలోకి వెళ్లలేరు. మా ఆడవాళ్లలో కూడా కొన్ని బలహీనతలు వున్నాయి. వాళ్లకి తమ మాటల్ని శ్రద్ధగా వినేవాళ్లు కావాలి. పంచుకునే వాళ్లు కావాలి. ఆ పంచుకునే వెలితి ఏదో ఆడవాళ్లతోనే పంచుకుంటే ఇలా మోసపోయే అవకాశం వుండదు. నేనూ, మావారు కమల్‌నాథ్‌ గురించి మ్లాడుకునే ప్రతిసారి ఇదే అనుకుంటాం” అంది.
ఆనంద్‌ పిడికిళ్లు బిగుసుకున్నాయ్‌ ”ఏది ఏమైనా కమల్‌నాథ్‌ని నేను వదలను మేడమ్‌!” అన్నాడు.
కొలీగ్‌ మాట్లాడలేదు. మోక్ష తల ఎత్తి చూడటం లేదు.
అతను మోక్షవైపు తిరిగి ”మోక్షా! నువ్వు రాత్రి ఇంటికి రాకపోతే టెన్షన్‌ పడ్డాను. ఒక్క రాత్రి నువ్వు లేకపోతేనే నీ విలువ తెలిసింది. ఇవాళ మీ ఊరు వెళ్లొద్దు. మన ఇంటికి రా!” అన్నాడు.
మోక్ష వస్తాననలేదు, రాననలేదు. సూటిగా అతన్నే చూస్తూ ”ధృతి నా డ్రెస్‌లని కామెంట్ చేసిందన్నారుగా? నిజం చెప్పండి చేసిందా?” అంది.
అతను ఉలిక్కిపడి ”అదిప్పుడెందుకు? ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా?”
”అవసరమే! అబద్దాలను సృష్టించి మా ఇద్దరి మధ్యన గొడవ పెట్టి మాకు మనశ్శాంతి లేకుండా చేశారు”
”అయితే ఇప్పుడేంటి? మన సమస్యను పక్కకి నెట్టి అదెందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నేనా విషయం ఎప్పుడో మరచిపోయాను. మీరైనా చెప్పండి మేడమ్‌! గతంలో జరిగిపోయిన వాటిని గెలకొద్దని…”
”గెలకను. ధృతి నన్ను కామెంట్ చేసిందా లేదా? అది చెప్పండి?”
”చెయ్యలేదు. నేనే కావాలని చెప్పాను”
ఇక ఆనంద్‌ వైపు చూడబుద్ది కాక తల పక్కకి తిప్పుకుంది మోక్ష.
”ప్లీజ్‌! మీరైనా చెప్పండి మేడమ్‌! తను లేకుంటే నేనుండలేను!”
”ఇలాంటివి నేనెలా చెప్పగలను ఆనంద్‌ గారు! ఎవరి ఇన్నర్‌ ఫీలింగ్స్‌ వాళ్ళవి… అయినా తను కూడా వింటుందిగా రావాలనిపిస్తే వస్తుంది. లేదంటే ఆలోచించుకుని మాట్లాడుకోండి” అంది.
కస్టమర్స్‌ రాగానే ఇక మాట్లాడలేదు కొలీగ్‌.
ఆనంద్‌ లేచి తన ఆఫీసు వైపు వెళ్లాడు.
*****

ఇంకా వుంది

జీవితం ఇలా కూడా ఉంటుందా??? 10

రచన: అంగులూరి అంజనీదేవి

”అవి వాడి లోపల వున్న బేబీకి లంగ్స్‌ పెరిగేలా చేస్తారట. లంగ్స్‌ పెరిగితే బ్లెడ్‌ సర్కులేషన్‌ ప్రాపర్‌గా వుండి బాడీ పెరిగే అవకాశాలు వున్నాయంట…”
”అలా ఎన్ని వాడాలి?”
”ముందు ఒకటి వాడి రెండు వారాల తర్వాత స్కాన్‌ తీసి అవసరమైతే మళ్లీ ఇంకో ఇంజక్షన్‌ ఇస్తారట”
”మరి వాడారా?”
”అది నాకు ఇంకా చెప్పలేదు. హాస్పిటల్‌ నుండి రాగానే అమ్మ గొడవ పెట్టుకుందట. ఆ హడావుడిలో అంతవరకే చెప్పాడు నాన్న. స్టెరాయిడ్‌ వాడారో లేదో చెప్పలేదు!”
”వెంటనే వాడమని చెప్పు సతీష్‌! నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఆ మధ్యన నేనో పేపర్‌ న్యూస్‌ చూశాను. మనదేశ జనాభా ఒక బిలియన్‌ కంటే ఎక్కువగానే వుందట. ఇంతమందికి సరిపడే భూమి, నీరు, పర్వతాలు, ఆకాశం వుందో లేదో తెలియదు కాని పల్లెటూర్లలో వుండే 60% కంటే ఎక్కువ మందికి శరీర నిర్మాణం సరిగా వుండటం లేదట. వారి శరీరం, మెదడు పూర్తి స్థాయికి ఎదగడం లేదట. ఇదంతా గర్భస్థ శిశువు స్థాయి నుండే వారికి తగిన పోషణ అందకపోవడమేనట. దీనివల్ల కొంతమంది పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారట. అలా పుట్టిన వాళ్లు ఎప్పటికీ సరిగా ఎదగలేరట. పిండంలో పోషకాహార సమతుల్యత లేక, సరైన బరువుతో పుట్టని వాళ్లకి తర్వాత ఏమి చేసినా వాళ్ళ జీవితంలో వాళ్ల శరీరాలు, మెదడు పరిపూర్ణంగా ఎదగదట” అన్నాడు నరేంద్ర.
అంతా విని ”ఓ మైగాడ్‌! నాలాంటి వాళ్లు పిల్లల్ని కనేకన్నా సరైన పోషణలేని పిల్లల్ని ఆదుకోవడం బెటరేమో” అనుకున్నాడు సతీష్‌.
”నువ్వింకేం ఆలోచించకుండా ఒక్కపని చేయమని చెప్పు సతీష్‌”
”ఏంటాపని? త్వరగా చెప్పు నరేంద్రా!” తొందరపడుతున్న వాడిలా అడిగాడు సతీష్‌.
”మీ నాన్నగారితో చెప్పి ధృతికి వెంటనే స్టెరాయిడ్‌ ఇప్పించమను… ఆ తర్వాత ధృతిని తీసికెళ్లి ఏదైనా లేడీస్‌ హాస్టల్లో జాయిన్‌ చెయ్యమని చెప్పు!” అన్నాడు.
”అలాగే నరేంద్రా! ఇప్పుడే చెబుతాను” అంటూ కాల్‌ కట్ చేసి తండ్రికి ఫోన్‌ చేసి తండ్రితో మాట్లాడాడు సతీష్‌చంద్ర.
”నేను బాగా ఆలోచించే చెబుతున్నాను నాన్నా! నేను వచ్చే వరకు ధృతిని ఏదైనా అమ్మాయిల హాస్టల్లో వుంచు. అమ్మను మాత్రం ఇంట్లోంచి వెళ్లిపోవద్దని చెప్పు!” అన్నాడు.
అంకిరెడ్డి ఎటూ మాట్లాడలేకపోతున్నాడు. ధృతిని లేడిస్‌ హాస్టల్లో చేర్పించటం సులభమే. కానీ అక్కడ ఆమెకు పురుడెవరు పోస్తారు? ఇది చెబితే సతీష్‌ ఇంకా భయపడతాడని ”నేను ఏదో ఒక నిర్ణయం తీసుకొన్నాక నీకు మళ్లీ కాల్‌ చేసి మాట్లాడతాను సతీష్‌! నువ్వేం టెన్షన్‌ పడకు. నేనున్నాను కదా!” అంటూ కాల్‌ క్‌ చేశాడు అంకిరెడ్డి.
చాలాసేపు చూశాడు అంకిరెడ్డి భార్యలో మార్పు వస్తుందే మోనని… రాలేదు. అలాగే మాట్లాడుతోంది. గదిలో పడుకొని బుసలు కొడుతోంది.
”అదే మన కూతురైతే నువ్వింత కఠినంగా వుంటావా?” అన్నాడు.
ఆమె కరగలేదు. ”హితబోధలు చెయ్యకండి! మరీ అంత దిగజారి నేను బ్రతకలేను” అంది.
”అది దిగజారడమా! యాదృచ్చికంగా ఎన్నో జరుగుతుంటాయి. క్షమించలేవా? అయినా నిండు గర్భిణి మీదనా నీ ప్రతాపం? కడుపులో వున్నది నీ మనవరాలో, మనవడో అన్నది మరచిపోతున్నావా?” అన్నాడు.
”ప్రశ్నలు వేసి నన్ను పక్కదారి పట్టించనవసరం లేదు… తక్షణ కర్తవ్యం ఏమిటో చూడు” అన్నట్లు చూసింది. ఆ చూపులు మామూలుగా లేవు. గడ్డపారతో మట్టిని పెకలించినట్లున్నాయి.
ఇక లాభం లేదనుకొని ఒక గంట తరువాత దృతి గది దగ్గరకెళ్లి ”ధృతీ! తలుపు తియ్యమ్మా!” అన్నాడు. ఆమె హాస్పిటల్‌ నుండి రాగానే పండ్లు తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టి తన గదిలోకి వెళ్లి పడుకొంది. ఈ మధ్యన ఎంత ప్రయత్నించినా పడుకోకుండా వుండలేకపోతోంది.
ధృతి తలుపు తీసి బయటకొచ్చి
”చెప్పండి మామయ్యా! కాఫీ కలిపి ఇవ్వనా” అంటూ వంటగదివైపు వెళ్లబోయింది.
”వద్దమ్మా! నువ్వు నీ బట్టలు సర్దుకో! నిన్నో చోటుకి తీసికెళ్తాను”
”ఎందుకు మామయ్యా! మీ అబ్బాయి తీసికెళ్లమన్నాడా? అలా తీసికెళ్తానని మీ అబ్బాయితో చెప్పారా?”
”చెప్పానమ్మా! ఇప్పుడే కాల్‌ చేసి మాట్లాడాను. కావాలంటే నువ్వుకూడా కాల్‌ చేసి మాట్లాడు”
”అవసరం లేదు మామయ్యా! పెద్దవారు, మీరు చెప్పాక మళ్లీ ఆయనకు కాల్‌ చెయ్యటం దేనికి… ఆయన ఒక్కడికే నామీద రెస్పాన్స్‌బులిటి వుంటుందని నేననుకోవడం లేదు. అందుకే ఆయన అంత దూరంగా వున్నా నేనిక్కడ ఇంత నిశ్చింతగా వున్నాను” అంటూ ఆమె లోపలకెళ్లి తన బట్టలన్నీ ఓ బ్యాగ్‌లో సర్దుకొని రెడీ అయింది.
”అత్తయ్యతో చెప్పి వస్తాను మామయ్యా” అంది.
”అవసరం లేదులేమ్మా! తలనొప్పిగా వుందని బాధపడుతోంది. అలాంటప్పుడు మనం వెళ్లి కదిలిస్తే ఆ నొప్పి ఇంకా ఎక్కువవుతోంది. ఆ పాపం మనకెందుకు?” అంటూ కారువైపు నడిచాడు అంకిరెడ్డి.
అంకిరెడ్డి కారులో కూర్చున్నాక, కారు వెనక డోర్‌ ఓపెన్‌ అయింది. ధృతి కూర్చోగానే కారు కదిలి గేటు దాటింది.
అంకిరెడ్డి కారును రోడ్డుమీద నడుపుతున్న విధానం చూస్తుంటేనే ధృతికి అర్థమైంది. ఆయన తనను చాలా జాగ్రత్తగా తీసికెళ్తున్నాడని. ఎంతమంది మామలు కోడళ్లనింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు? ఈ విషయంలో తను నిజంగానే అదృష్టవంతురాలు. గాలికి నుదుిమీద పడుతున్న కురులను వెనక్కు నెట్టుకుంటూ బయటకు చూస్తోంది.
”అమ్మా! దృతీ” అంటూ పిలిచాడు అంకిరెడ్డి.
వెంటనే కాస్త ముందుకు వంగి ”పిలిచారా మామయ్యా!” అంది.
ఆయన కారు నడపడం కొంచెం స్లో చేసి అవునన్నట్లు తలవూపాడు.
ఆయన ఏం మాట్లాడతాడో వినాలని ఆయనవైపు చూస్తూ ”చెప్పండి! మామయ్యా!” అంది.
”రామాయణంలో సీతమ్మతల్లిని లక్ష్మణుడు అడవులకి తీసికెళ్తున్నప్పుడు ‘నన్నెక్కడికి తీసుకెళ్తున్నావయ్యా!’ అని అడిగిందో లేదో తెలియదు కాని నువ్వు నన్ను ‘ఎక్కడికి తీసికెళ్తున్నారు మామయ్యా!’ అని అడగలేదు. ఈ జర్నీ నీకు బాధగా లేదా?” అన్నాడు.
ఆమెకు ఏమాత్రం బాధగా లేదు. ఆ ఇంట్లోంచి బయటకి వచ్చాక ఆమె మనసు, శరీరం ఊహాతీతంగా మారిపోయాయి. అనుకోకుండా ఒక పిల్లతెమ్మెర వచ్చి చెంపల్ని, కనురెప్పల్ని తాకినంత హాయిగా వుంది. ఆయనకు వెంటనే సమాధానం చెప్పకుండా కారులోకి చొచ్చుకువస్తున్న గాలిని ఆస్వాదిస్తూ బయటకు చూడసాగింది.
”బాధ వుంటుందమ్మా! ఎందుకుండదు. కానీ కుటుంబంలో నలుగురం వున్నాక చిన్నచిన్న తేడాలు, బేదాభిప్రాయాలు రావడం సహజం. అవి ఏ రోజుల్లో అయినా తప్పవు. ఇప్పుడు మరీ చిన్నచిన్న విషయాలకే వాదోపవాదాలు ఎక్కువవుతున్నాయి. ఒకరిమీద ఒకరు అరుచుకుంటూ వివాదం పెంచుకోవటం కూడా ఎక్కువైంది. కోపతాపాలతో, రోషావేశాలతో మాటకు మాట అనుకోవటమే కాని ఆలోచించటం లేదు. ఇలాంటి స్థితిలో నువ్వెందుకింత మౌనంగా నీలో నువ్వే బ్రతుకుతున్నట్లు నిశ్శబ్దంగా వుండిపోయావు? ఏది వున్నా మనసులోనే దాచుకుంటున్నావు. ఎందుకిలా?” అన్నాడు.
”నాకు కుటుంబ జీవనం ఎలా వుంటుందో తెలియదు మామయ్యా! నా చిన్నప్పటి నుండి నా వయసు పిల్లలతో కలిసి హాస్టల్లో వుండి పెరిగాను. అందుకే పెద్దవాళ్ల మధ్యలో వుండి ఎలా మసలుకోవాలో తెలియలేదు. దానివల్ల మీ అందరికి ఇబ్బంది కల్గించి వుంటాను. అదే నా భయం. అందుకే నా ఈ మౌనం…”
”ఈరోజుల్లో ఎవరుంటారమ్మా ఇలా…! వున్నారన్నా నమ్ముతారా?”
”వున్నాను కాబట్టే నాకు మీ ఆదరణ, అభిమానం వున్నాయి. లేకుంటే ఎవరికెవరు మామయ్యా! ఒంటరి జర్నీ ఊహించగలమా!”
”ఊహాతీతంగా వున్నావమ్మా! నీలాంటి వాళ్ల జీవితాలకు కాలమే పరిష్కారం చూపాలి” అన్నాడు.
”ఏమో మామయ్యా! నాకైతే భయంగా వుంది. అత్తయ్యగారు, మోక్ష అక్క నాతో మాట్లాడడం మానేశారు ఎందుకో తెలియదు. అత్తయ్యగారు నన్ను మొదట్లో చాలా బాగా చూశారు. ఇంట్లో ఏ స్వీటు చేసినా ముందుగా తెచ్చి కొంత నా గదిలో పెట్టేది తినమని… పాలమీద మీగడ నాకు ఇష్టమని చక్కర కలిపి మరీ ఇచ్చేది. కానీ ఇప్పుడు అవన్నీ లేవు…”
”ఇలా ఎన్ని రోజుల నుండి?”
”చాలా రోజులైంది మామయ్యా!”
”అయితే నేను వూహించిందే నిజమైంది. మీ ముగ్గురి మధ్యన చాలా రోజులుగా గొడవలు వున్నాయి…”
”గొడవలేం లేవు మామయ్యా!”
”పైకి లేవులేమ్మా! నువ్వు పెట్టుకుంటే కదా వుండేది. నీలాంటివాళ్లు కొన్ని కుటుంబాల్లో ఇమడాలంటే అంత తేలిక కాదులే!”
”నా వల్ల పొరపాటు జరిగి వుంటే నన్ను ఎక్స్‌క్యూజ్‌ చెయ్యమని అత్తగారితో చెప్పండి మామయ్యా!” అంది.
అంకిరెడ్డి మాట్లాడలేదు. ధృతి మానసిక స్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు. కొన్ని కుటుంబాలకి అడవులకి పెద్ద తేడా వుండదని తెలుసుకోలేని చిన్నపిల్ల దృతి. అందుకే అక్కడ వుండే పులులను, సింహాలను, తోడేళ్లను కనిపెట్టలేకపోయింది. ముఖ్యంగా సాధుజీవుల మాస్కుల్ని తొడుక్కుని వుండే క్రూరమృగాలను అసలే తెలుసుకోలేక పోతోంది… బాంధవ్యాల నడుమ కూరుకుపోయి చేయని తప్పులకి కూడా శిక్షను అనుభవిస్తోంది.
కారు నెమ్మదిగా వెళ్లి తారమ్మ ఇంటి ముందు ఆగింది. వెనక డోర్‌ ఓపెన్‌ చేసి ”దిగమ్మా!” అన్నాడు అంకిరెడ్డి.
ఒక్కక్షణం తనెక్కడికి వచ్చిందో అర్థమై ఆనందంతో కారు దిగింది ధృతి.
కష్టజీవి తారమ్మ అప్పుడే పొలం నుండి వచ్చినట్లుంది. కాళ్లు, చేతులు కడుక్కుంటూ పంపు దగ్గర వుంది. కారుని కాని, కారులోంచి వాళ్లు దిగడం కాని గమనించలేదు.
అంకిరెడ్డి పంపు దగ్గరకి వెళ్లి ”అమ్మా! తారమ్మా!” అంటూ చాలా దయనీయంగా పిలిచాడు.
తారమ్మ తిరిగి చూసి ”బాబుగారు! మీరా?” అంది.
ఆయన మాట్లాడేలోపలే కారు దగ్గర వున్న ధృతిని చూసి ఆమె దగ్గరకి వెళ్లి ”రా తల్లీ! అక్కడే నిలబడ్డావేం!” అంటూ ప్రేమగా నిమిరి ”బాగున్నావా అమ్మా!” అంది. ఆనందమో, ఆవేదనో తెలియదు తారమ్మ అలా అడగ్గానే ఒక్కసారి కళ్లనిండా కన్నీళ్లు వూరాయి ధృతికి. బేలతనంగా అన్పించే భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. అయినా వాటిని అతికష్టంగా అదుపులోకి తెచ్చుకొని
”మీరెలా వున్నారు ఆంటీ!” అడిగింది ప్రేమగా ధృతి.
”నాకేం తల్లీ! చూడు ఎలా వున్నానో!” అంటూ నవ్వి వాళ్లను లోపలకు తీసికెళ్లి దండెం మీద వున్న దుప్పటి దులిపి నవారు మంచంపై పరచి చాలా గౌరవంగా కూర్చోబెట్టింది. వాళ్లు కూర్చున్నాక… ”ఎటైనా వెళ్తున్నారా బాబు ఇటొచ్చారు?” అంటూ అభిమానంగా అడిగింది. ఆయన మాట్లాడే లోపలే మంచినీళ్లు తెచ్చి చెరొక గ్లాసు ఇచ్చింది.
ఆయన మంచినీళ్లు తాగుతూ అటుఇటూ చూస్తూ ”వీళ్లేరమ్మా?” అన్నాడు.
”మేకల దొడ్లో మేక ఈనిందని మా శేషయ్య, సౌమ్య అక్కడే వున్నారు బాబుగారు దాన్ని చూసుకుంటూ… మేకలకి గాని, ఆవులకి గేదెలకి గాని మనిషికి పురుడు పోసినట్లే పొయ్యాలి. నోరు లేదని వాటిని అలాగే వదిలెయ్య కూడదు. మీరు వచ్చారని చెప్పి వస్తాను” అంటూ ఆమె వెళ్లబోయింది.
”వద్దులేమ్మా! నువ్వు కూర్చో! నేను నీతోనే మాట్లాడాలి” అన్నాడు అంకిరెడ్డి.
తారమ్మ దొడ్లవైపు వెళ్లకుండా ఆగి కూర్చుంది. వాళ్లకు అతిధి మర్యాదలు చెయ్యాలన్న కంగారులో వుందామె… సిటీవాళ్లు కాబట్టి వాళ్లకు సౌమ్య అయితేనే బాగా చేస్తుంది. అందులో వాళ్లు మామూలు వాళ్లు కాదు. ఈ మధ్యన ఇంటిముందు పచ్చగడ్డి (కార్పెట్ గ్రాస్‌) వేయించారు. దానికి వేల రూపాయల్లో ఖర్చు అయిందట. మొన్న వెళ్లినప్పుడు మాధవీలత చెప్పింది. ఇంటికెంత ఇంపుగా వుందో! సిటీలో పెద్ద బంగ్లా, కారు, ఆ బంగ్లాలో వుండే వాళ్లందరికి పెద్దపెద్ద ఉద్యోగాలు… ఒక్క ధృతికి, మాధవీలతకు తప్ప. అమ్మో తలుచుకుంటేనే బిత్తరపోయే జీవితాలు వాళ్లవి… అలాంటి వాళ్లొచ్చి ఎంతో సాదారణంగా తన నట్టింట్లో కూర్చోవటం మాటలా! పైగా తనతో మాట్లాడాలట…
”వుండండి బాబుగారు! నా కోడల్ని, శేషయ్యను పిలుచుకొస్తాను!” అంటూ మళ్లీ లేవబోయింది.
”వద్దు. నువ్వు కూర్చో తారమ్మా!” అన్నాడు.
ఆమె కూర్చుని ”చెప్పండి బాబుగారు” అంది వినయంగా.
”నా కోడల్ని కొద్దిరోజులు నీ ఇంట్లో వుంచుకోగలవా తారమ్మా! నువ్వు కాదనవన్న నమ్మకంతోనే వచ్చాను”
”అదేంటి బాబుగారు?” ఆమె నమ్మలేకపోతోంది.
”పరిస్థితులు అలా వచ్చాయి తారమ్మా! ఏం చేయను చెప్పు! ప్రేమానురాగాలు పలచబడితే చిన్న పొరపాట్లే పెద్ద తప్పులుగా కనబడతాయి కదా!”
”తప్పొప్పుల్ని ఎంచుకునే సమయమా బాబు ఇది? గర్భవతిగా వున్న కోడల్ని పరాయి ఇంట్లో వదలడమేంటి? ఇది తగునా? న్యాయాన్యాయాలు తెలిసినవారు, సతీష్‌ బాధపడడా?”
”నువ్వు అడుగుతున్నది సరియైనదే తారమ్మా! కానీ దేశానికి దేశానికి మధ్య యుద్ధం కన్నా మనిషికీ, మనిషికీ మధ్యన జరిగే మానసిక యుద్ధం భయంకరంగా వుంటుంది. దాన్ని తట్టుకోవడం మామూలు విషయం కాదు. అందుకే కొద్దిరోజులు ధృతికి మానసిక ప్రశాంతతను ఇవ్వటం నా ధర్మంగా, బాధ్యతగా భావించి నీ దగ్గరకి తీసుకొచ్చాను. కాదనకు!” అన్నాడు.
”కాదాంటానా బాబు! కడుపులో పెట్టుకోనూ!!”
”అలా అంటావన్న ధైర్యంతోనే తీసుకొచ్చానమ్మా! లేకుంటే నాకు ఎంతమంది బంధువులు లేరు. వాళ్ల దగ్గరకేమైనా తీసికెళ్లానా?” అన్నాడు.
”ఎవరో అంటే విన్నాను బాబు! మీలాంటి గొప్పవాళ్ల బంధువుల ఇళ్లలో సొంతమనుషులకన్నా పని మనుషులు, బొచ్చుకుక్కలు ఎక్కువగా వుంటాయని. ఉద్యానవనాలు, ఈతకొలనులు చాలా విశాలంగా వుంటాయని. నిజమేనా?” ఆసక్తిగా అడిగింది.
”నిజమే తారమ్మా! మనసు మాత్రం మీ అంత విశాలంగా అయితే ఉండదు. లేకుంటే నేను అడగ్గానే ధృతిని వుంచమనేదానివా? ఎంతమంది వున్నారమ్మా నీలాగ?”
”మనదేముంది బాబు! అంతా ఆ దేవుని దయ. పొలాలు పండిస్తాం కాబ్టి ఇంటినిండా ఆహార ధాన్యం వుంది. ఆవులు పాలిస్తాయి. నాటుకోళ్లు గుడ్లు పెడతాయి. అన్నిరకాల కూరగాయలు పండుతాయి. తిండికి తక్కువేం లేదు. ధృతి కూడా మాలో మనిషే అనుకుంటాం. జాగ్రత్తగా చూసుకుంటాం. సౌమ్య వుంది కాబట్టి ఇద్దరు తోడుగా వుంటారు” అంది.
ఆమె అలా అంటుంటే ఆయనకు సంతోషం వేసింది. మాటల మధ్యలో ”సతీష్‌ హాస్టల్లో వుంచమన్నాడు. పిల్లలు, వాళ్లకేం తెలుసు. హాస్టల్స్‌లో పురుళ్లు పొయ్యరని…” అంటూ ధృతి గురించి డాక్టర్‌ ఏం చెప్పిందో తారమ్మకు చెప్పాడు.
ధృతి శ్రోతలా వింటూ కూర్చుంది.
”డాక్టర్‌ చెప్పకముందే ధృతి పరిస్థితి నేను తెలుసుకున్నాను బాబు! వెంటనే నరేంద్రకి ఫోన్‌ చేసి సతీష్‌చంద్రతో చెప్పమని చెప్పాను. ఆరోజు నేను ఫోన్‌ చెయ్యకపోతే దృతిని గురించి ఎవరూ ఏమీ ఆలోచించేవాళ్లు కాదేమో!” అంది. ధృతి ఆశ్చర్యపోయి విన్నది.
అలా ఆమె అంటుండగానే ప్రవీణ్‌ తన స్నేహితులతో వచ్చాడు. స్నేహితులంటే ఒకరో ఇద్దరో కాదు. పదిమంది వచ్చారు. కొంతమంది షూస్‌ బయట విప్పి లోపలికి వస్తే, కొంతమంది బయట అంకిరెడ్డి కారు ముందు నిలబడ్డారు.
తారమ్మకు తెలియక ”వీళ్లంతా ఎవరు?” అన్నట్లు చూస్తోంది.
”కూర్చో ప్రవీణ్‌!” అన్నాడు అంకిరెడ్డి.
ప్రవీణ్‌ అంకిరెడ్డి ముందు చాలా వినయంగా నిలబడి ”అంకుల్‌! మీరు కాల్‌ చేసినప్పుడు మేమంతా ఇదే ఏరియాలో వున్నాం. కలిసిపోదామని వచ్చాం” అంటూ ధృతి వైపు చూశాడు. అతని కళ్లకు ధృతి పెళ్లికి ముందున్నట్లు లేదు. అప్పటి తేజస్సు అంతా పోయి వాడిపోయిన పువ్వులా వుంది. ఎందుకింత మారిపోయింది. పెళ్లియితే ఆడపిల్లలు ఇలాగే వుంటారా అనుకున్నాడు.
కారెక్కే ముందు అంకిరెడ్డి ఫోన్‌ చేసి ”ప్రవీణ్‌! మీ అత్తయ్యకి ఆరోగ్యం బాగాలేదు. ధృతిని చూసుకోలేకపోతోంది. తారమ్మ అని మనకు తెలిసినామె వుంది. ఆమె దగ్గరకి తీసికెళ్తున్నాను. పలానా ఊరు, పలానా చోట ఇల్లు… సతీష్‌కి కూడా చెప్పాను. సంతోషించాడు” అని చెప్పాడు.
తారమ్మ అంటే ఈమేనా అన్నట్లు తారమ్మవైపు చూశాడు ప్రవీణ్‌.
అది గమనించి అంకిరెడ్డి ”తారమ్మ అంటే ఈవిడే ప్రవీణ్‌! ఈ రోజు నుండి ధృతి ఇక్కడే వుంటుంది. తారమ్మ చూసుకుంటుంది. ఈ తారమ్మ ఎవరో కాదు సతీష్‌ స్నేహితుని తల్లి” అంటూ తారమ్మను ప్రవీణ్‌కి, ప్రవీణ్‌ని తారమ్మకి పరిచయం చేశాడు. ప్రవీణ్‌ వెంటనే వంగి తారమ్మ పాదాలను తాకి ”నమస్తే అమ్మా!” అన్నాడు.
ఆమెకు ప్రవీణ్‌ని చూస్తుంటే నరేంద్రను చూసినట్లే అన్పించింది. ప్రవీణ్‌ వైపే చూస్తూ ”కూర్చో నాయనా!” అంది. ప్రవీణ్‌ కూర్చుని ”మీరేం భయపడకండమ్మా! మేమున్నాం కదా! అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాం!” అన్నాడు. ధృతి దగ్గరకి వెళ్లి ఆమె తలమీద చేయివేసి ప్రేమగా నిమిరి ”ధైర్యంగా వుండు” అన్నాడు.
”అలాగే అన్నయ్యా!” అంది ధృతి.
ధృతిని పెళ్లిరోజు చూసిందే. మళ్లీ చూడలేదు. కారణం ఆనంద్‌ మాటలు నచ్చక. ఈ విషయం ధృతికి కూడా తెలుసు. ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా ”నేను బాగున్నాను అన్నయ్యా!” అనేది. ఇదేనా బాగుండటమంటే అనుకున్నాడు మనసులో…
అక్కడే నిలబడి వున్న అతని స్నేహితుల్లో ఒకతను ప్రవీణ్‌ చెవి దగ్గరగా వంగి ”అన్నా! పండ్లు లోపలికి తేనా?” అన్నాడు. ప్రవీణ్‌ తెమ్మనగానే పెద్దపెద్ద అడుగులేసుకుంటూ తామొచ్చిన జీపు దగ్గరకి వెళ్లి ఓ క్యారీబ్యాగ్‌ నిండా పండ్లు, పూలు తెచ్చి తారమ్మ చేతికి ఇచ్చాడు. ఆమె ఆ బ్యాగ్‌ని సంతోషంగా అందుకొని పక్కన పెట్టింది.
అంకిరెడ్డికి సడన్‌గా ఏదో గుర్తొచ్చిన్నట్లు లేచి నిలబడి ప్యాంటు జేబులోంచి డాక్టర్‌గారి ప్రిస్క్రిప్షన్‌ బయటకు తీసి ”ఇది నీ దగ్గర వుంచు ప్రవీణ్‌! కోడలికి స్టెరాయిడ్‌ వాడాలని డాక్టర్‌ చెప్పినట్లు మీ అత్తగారికి తెలిస్తే భయపడుతుంది. అందుకే తనకి చెప్పలేదు… ఇది నువ్వు చూసుకో! ధృతిని వెంటనే డాక్టర్‌ దగ్గరికి తీసికెళ్లు” అంటూ ఆయన మీద ఉన్న బాధ్యతను ప్రవీణ్‌ మీద ప్టోడు.
”అలాగే అంకుల్‌!” అంటూ ఆ ప్రిస్క్రిప్షన్‌ తీసుకున్నాడు ప్రవీణ్‌.
అంతలో సౌమ్య, శేషేంద్ర మేకల దొడ్ల దగ్గర నుండి వచ్చి, పంపు దగ్గర కాళ్లు, చేతులు కడుక్కుని లోపలికి వచ్చారు. ‘ఎవరు వీళ్లంతా’ అన్నట్లు వాళ్లు చూస్తుంటే తారమ్మ అర్థం చేసుకుని ప్రవీణ్‌ బృందాన్ని భర్తకి, కోడలికి పరిచయం చేసింది. అంకిరెడ్డి, ధృతి వాళ్లకు తెలుసు కాబట్టి వాళ్లని వదిలేసింది.
”ఈరోజు నుండి ధృతి మన ఇంట్లోనే వుంటుంది. ఆమె మన ఇంటి ఆడపడుచు. మనమే పురుడు పోయాలి” అంది పెద్దమనసుతో తారమ్మ. ఆమె మాటకు ఆ ఇంట్లో తిరుగు వుండదు. శేషేంద్ర, సౌమ్య ‘అలాగే’ అన్నట్లు ఆనందంగా తల వూపారు. సౌమ్య వెళ్లి ధృతి చేతుల్ని పట్టుకొని ప్రేమగా, స్నేహంగా నొక్కింది.
”ఇక నేను వెళ్లొస్తాను తారమ్మా!” అంటూ అంకిరెడ్డి లేచి నిలబడ్డాడు.
”సరే! బాబు” అని తారమ్మ కూడా లేచి నిలబడింది.
ధృతి మామగారి కాళ్లకు మొక్కాలని వంగబోయింది. తారమ్మ వెంటనే ధృతిని పట్టుకొని ”వద్దు తల్లీ! ఈ టైంలో నువ్వలా వంగ కూడదు. ఆయన ఆశీస్సులు నీకెప్పుడూ వుంటాయి” అంది.
ప్రవీణ్‌కి ఆ దృశ్యం చూస్తేనే తారమ్మ తన చెల్లెల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోగలదో అర్థమైంది. మనిషిని మనిషి ప్రేమగా చూసుకోటానికి బంధుత్వమే అవసరం లేదు. కష్టజీవిలా కన్పిస్తున్న తారమ్మలో కరుణ వుంది. కరిగే తత్వం వుంది. ప్రకృతి స్వభావం లాగే ఆమె స్వభావం కూడా అందమైనదే. అది చాలు. ఇక బంధుత్వం ఎందుకు?
అంకిరెడ్డి అక్కడ నుండి కదిలి గంభీరంగా నడుచుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నాడు. ఆయన వెంట ప్రవీణ్‌ ఒక్కడే వెళ్లి కారు కదిలి వెళ్లేంత వరకు వుండి లోపలకొచ్చాడు.
లోపల కొచ్చాక తారమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాడు. అతని స్నేహితులు బయట జీపు దగ్గర వున్నారు. సౌమ్య అందరికీ కాఫీ పెట్టింది. శేషయ్య అందరికన్నా ముందు జీపు దగ్గర వున్న ప్రవీణ్‌ స్నేహితులకి కాఫీ పట్టుకెళ్లి ఇచ్చి వచ్చాడు. సౌమ్య, ధృతి కాఫీలు తాగాక వంటపనిలో మునిగిపోయారు.
ఒక గంట తరువాత తారమ్మ, శేషేంద్ర కోరినట్లు ప్రవీణ్‌ బృందం భోం చేసింది.
భోజనాలయ్యాక దూరంగా వుండే దుకాణం దగ్గరకి వెళ్లి అందరికి కూల్‌డ్రింక్స్‌ తెచ్చి ఇచ్చాడు శేషేంద్ర. ప్రవీణ్‌ తారమ్మతో ”మీ ఆతిథ్యాన్ని మరచిపోలేం ఆంటీ! మీరు మాకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు…” అంటూ మరోమారు వంగి ఆమె కాళ్లను తాకాడు.
ఆమె కదిలిపోతూ ”సహాయం చేసే అవకాశం కాని, సమర్ధత కాని దేవుడిచ్చేదే ప్రవీణ్‌! మన చేతిలో ఏమీలేదు” అంది.
”ధృతిని హాస్పిటల్‌కి తీసికెళ్లి డాక్టర్‌ గారికి చూపించి తీసుకొస్తాను ఆంటీ!” అన్నాడు ప్రవీణ్‌.
”నేను కూడా వస్తాను ప్రవీణ్‌! ధృతిని ఎలా చూసుకోవాలో డాక్టర్‌ని అడిగి తెలుసుకుంటాను. కాన్పు అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకోవలసి వస్తుంది” అంది తారమ్మ.
”సరే! ఆంటీ! రండి!” అంటూ ధృతితో పాటు తారమ్మను కూడా జీపులో ఎక్కించుకొని హాస్పిటల్‌కు వెళ్లాడు ప్రవీణ్‌.

ధృతి ఇంట్లోంచి వెళ్లాక మాధవీలతకు చాలా హాయిగా వుంది. పనిమనిషి కీరమ్మను మళ్లీ పనిలో పెట్టుకుంది. కీరమ్మకు వేరే ఎక్కడా పని దొరకక మళ్లీ వచ్చిందే కాని కోడళ్లను చూసుకొని పనోళ్లను మాన్పించేసే మాధవీలత లాంటి వాళ్లు వీధికొకరు వుంటే భూమ్మీద వానలే పడవని ఆమె పనికోసం తిరిగినచోటంతా చెప్పుకుంది. మాధవీలత పనిలోంచి తీసేశాక చాలారోజులు పస్తులతోనే గడిపింది. పని విలువ తెలుసు కాబట్టే మళ్లీ వచ్చి పనిలో చేరింది.
మోక్ష అనడం వల్లనో లేక తన శరీరం మీద నిజంగానే ముడతలు వస్తుండడం వల్లనో తెలియదు కాని మాధవీలతకు తన చర్మాన్ని నున్నగా మార్చుకోవాలన్న కాంక్ష పెరిగింది. దాని వల్ల ఉదయం లేవగానే ఒకటి ఏదో రకం ప్యాక్‌ చేసుకొని స్నానం చేశాకనే ప్రశాంతంగా తిరుగుతుంది. ఒక రోజు ఉదయాన్నే పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పచ్చి పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని పొడిచేసి తగినన్ని నీళ్లు కలిపి ముఖానికి, శరీరానికి పట్టిస్తే అదేరోజు రాత్రికి అరటీస్పూన్‌ వైట్ పెట్రోలియం జెల్లీలో రెండు టీస్పూన్ల గ్లిజరిన్‌ రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి పేస్ట్‌ చేసి చర్మం మీద అప్లై చేస్తుంది… మళ్లీ రోజు ఉదయం సగభాగం ఆపిల్‌ని చెక్కు తీయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి దానిలో 5 టీ స్పూన్ల పాలు, ఒక టీస్పూన్‌ నిమ్మరసం కలిపి పేస్ట్‌ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తుంది. 20 నిముషాలు ఆగి కడిగేస్తుంది. అదేరోజు రాత్రికి క్యార్‌ట్ గుజ్జును కురులకు పట్టించి 15 నిమిషాలు ఆగి కడిగేస్తుంది.
ఇంకోరోజు అరటీస్పూన్‌ ఆవాల నూనెలో కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి దాన్ని వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకొని పది నిముసాల పాటు మసాజ్‌ చేసి గోరువెచ్చని నీటితో కడిగేస్తుంది. ఆ రాత్రికి పాలమీద మీగడ ఒక టీ స్పూన్‌ బాగా పండిన రెండు స్ట్రాబెరీలు కలిపి పేస్ట్‌ చేసుకొని ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తుంది… మళ్లీ రోజూ ఉదయాన్నే నిద్రలేచాక టేబుల్‌ స్పూన్‌ అరిపండు గుజ్జులో అరటేబుల్‌ స్పూన్‌ టోమాటో రసం కలిపి ఆ పేస్ట్‌ను మెడకు, ముఖానికి, చేతులకు పట్టించి 20 నిమిషాలు ఆగి కడిగేస్తుంది. ఆ రాత్రికి టేబుల్‌ స్పూన్‌ శెనగపిండిలో టేబుల్‌స్పూన్‌ పెరుగు, టేబుల్‌స్పూన్‌ పచ్చిపాలు, టీస్పూన్‌ నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేస్తుంది… మళ్లీ తెల్లవారగానే ఉసిరికాయ పేస్టు, గోరింటాకు పొడి, మెంతిపొడి సమానంగా తీసుకొని రెండు టేబుల్‌ స్పూన్ల పచ్చిపాలను చేర్చి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంది. ఇదంతా ఆమెకు మోక్షనే చెయ్యాలి. రోజురోజుకి మోక్షలో అసహనం పెరుగుతోంది.
”రాత్రేగా అత్తయ్యా జుట్టుకి అప్లై చేసింది. మళ్లీ ఉదయాన్నే ఎందుకు?” అని అన్నా వినదు. వద్దంటున్నా వినకుండా కీరమ్మ చేత కారెట్ లను ఉడకబెట్టించి అందులో తేనె కలిపి ఒంటికి పూయమని కోడల్ని పిలిచి కుర్చీలో కూర్చుంది మాధవీలత.
అత్తగారు చెప్పినట్టే మోక్ష పూస్తూ నిలబడింది. పూసిపూసి ఎంత పూసినా ఆ గిన్నెలో గుజ్జు తగ్గడం లేదు. కీరమ్మ మీద కోపంగా వుంది. వుడికించే ముందు రెండు కేరట్లు తక్కువ వేసి ఉడికిస్తే దాని సొమ్మేం పోయింది అని అనుకుంది.
ఆనంద్‌ గట్టిగా కేకేశాడు ”మోక్షా! ఎక్కడున్నావే?” అని…
మోక్ష ఉలిక్కిపడి ”చూడండి! అత్తయ్యా ఆ కేక… మనిద్దరం దడుసుకున్నామా లేదా?” అంది.
”వాడు అంతేలే మోక్షా! నువ్వు కానియ్‌!” అంది.
”ఏం కానియ్యాలో ఏమో! పిలిచిన వెంటనే వెళ్లకుంటే ఉద్యోగం చేస్తున్నానని పొగరే నీకు అంటాడు. వెళ్తాను అత్తయ్యా!”
”ఆ కొంచెం పూసి వెళ్లు. అదంతా పూస్తేనే ముడతలు తగ్గుతాయేమో! పడేస్తే ఏమొస్తుంది?”
”ఎవరంత కలపమన్నారు? యేబై దాక వచ్చిన ముడతలు ఈ గుజ్జంతా పూయగానే పోతాయా? పూసిపూసి నా చేతులు పీకుతున్నాయత్తయ్యా!! ఆ కొంచెం మీరే పూసుకోండి!” అంటూ ఆ గుజ్జున్న బౌల్‌ను కింద పడేసి వెళ్లింది మోక్ష.
అది చూసి కీరమ్మ ‘ఏదో వారానికో, నాలుగు రోజులకో అయితే పర్వాలేదు కాని రోజుకి రెండుసార్లు ప్యాక్‌ చెయ్యాలంటే ఎవరివల్ల అవుతుంది’ అని మనసులో అనుకుంది.
మోక్ష సడన్‌గా బౌల్‌ను కింద పడేసి వెళ్లిందని మాధవీలత బిత్తరపోలేదు. బాధ పడలేదు. మోక్ష ఈ మధ్యన ఒక చిట్కా చెప్పిందామెకు. మనసును ప్రశాంతంగా వుంచుకొని కోపం లేకుండా వుంటే ముఖం మీద ముడతలు పోతాయని… ఎప్పుడూ నవ్వుతూ వుండటం కూడా సౌందర్య రహసంలో ఒక భాగమని… అప్పి నుండి ఏ మాట విన్నా, ఏ చర్య చూసినా పాజిటివ్ గా ఉండటానికే ప్రయత్నిస్తుంది. వెంటనే ఆ గిన్నెను అందుకుని అందులో మిగిలివున్న గుజ్జును తీసి దట్టంగా రుద్దుకుంది. ఓ గంట ఆగి స్నానం చేసి వచ్చింది. జుట్టు ఆరబెట్టుకుంటూ సోఫాలో కూర్చుంది.
కీరమ్మ పనంతా అయ్యాక ”వచ్చేటప్పుడు రాత్రికి కూరగాయలు పట్టుకొస్తాను డబ్బులియ్యండమ్మా!” అంటూ మాధవీలత దగ్గరకి వెళ్లింది.
”సరే!” అంటూ పర్స్‌లోంచి డబ్బులు తీసి కీరమ్మకి ఇచ్చింది.
కీరమ్మ డబ్బులు తీసుకొని మాధవీలత వైపు పరిశీలనగా చూసి ”అదేంటమ్మా! మీ ముఖం అలా వుంది?” అంది.
”ఎలా వుందే! నిన్న కన్నా బాగుందా?” అంది ఉత్సాహంగా.
”లేదమ్మా! వాచినట్లు, పాచినట్లు, కాస్త ఎర్రబడి వుంది. ఎందుకయినా మంచిది అద్దంలో చూసుకోండి!” అంది.
ఆమె ఉలిక్కిపడి ”ఎందుకుందే అలా?” అంది.
”ఏమో నాకేం తెలుసమ్మా! రాత్రికి మీ ముఖానికి ఏమేమి పూయాలో కాగితం మీద రాసివ్వండి! కూరగాయలతో పాటు అవి కూడా పట్టుకొస్తాను. నాకసలే మతిమరుపు. నోటితో చెబితే అసలే గుర్తుండి చావటం లేదు” అంది ఎదురుగా వచ్చి నిలబడి.
”నువ్వెళ్లవే! నాకేంటో ముఖమంతా మండుతున్నట్లుంది” అంటూ లేచి అద్దం దగ్గరకి వెళ్లింది.
ఆమె వెళ్తుంటే వెనక నుండి కీరమ్మ ”మీ ముఖంలో దద్దుర్లే కాదమ్మా రెండు మచ్చలు కూడా కన్పించాయి. అద్దాలు పెట్టుకొని చూసుకోండి! ఎందుకయినా మంచిది. ఇప్పటికే జుట్టు పలచబడి పోయిందని బాధ పడుతున్నారు. దానికి తోడుగా మచ్చలెక్కువైతే ఇంకా బాధపడతారు” అంటూ వెళ్లిపోయింది.
ఇప్పుడు నిజంగానే బిత్తరపోయింది మాధవీలత. ”నా ముఖానికి మచ్చలు కూడా వచ్చాయా? అసలు చిన్నప్పటి నుండి ఒక్క మచ్చ కూడా లేని ముఖం నాది… ఇప్పుడు మచ్చలెందుకొచ్చాయి?” అని మనసులో అనుకుంటూ వెళ్లి డ్రస్సింగ్‌ టేబుల్‌ ముందు నిలబడింది. చేతుల్ని, ముఖాన్ని గుచ్చిగుచ్చి చూసుకుంది… ఆమె కళ్లకి అద్దాలు పెట్టుకున్నా మంచు వాలినట్లు మసక మసగ్గానే వుంది. మచ్చలు వున్నట్లున్నాయి. వెంటనే లేనట్లున్నాయి. లోపలంతా కంగారు. మోక్ష చెప్పినట్లు ఎంత పాజివ్‌గా ఆలోచిస్తూ ప్రశాంతంగా వుందామన్నా వుండలేకపోతోంది. కీరమ్మ అలా అనడం వల్లనో ఏమో భయంతో దిగులుతో ముఖమంతా ముడుచుకుపోయింది. కీరమ్మ చెప్పిన ఆ రెండు మచ్చల్ని వెతుక్కుంటూ అక్కడే నిలబడింది మాధవీలత.
****

….ఎప్పుడైనా మోక్ష ఆఫీసుకి తీసికెళ్లే లంచ్‌బాక్స్‌లో ప్రతిరోజు ఒక బాయిల్డ్‌ఎగ్‌ పెడుతుంది మాధవీలత. ఆఫీసులో ఎంత వర్క్‌ చేసినా తిండి బాగా తింటే అలసట అన్పించదని మంచి పోషకాహారంతో కూడిన పదార్థాలనే బాక్స్‌లో పెడుతుంటుంది. మోక్ష తింటున్నప్పుడు ఆమె కొలీగ్స్‌ కూడా ఆమె టిఫిన్‌బాక్స్‌లోకి తొంగిచూసి ‘మీ అత్తగారు ఎప్పికప్పుడు అప్‌డేట్ అవుతూ ఫుడ్‌చార్ట్‌కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేలా వున్నారు కదా! ఇన్నిరోజులు అర్థం కాలేదు కాని ఇప్పుడర్థమైంది. నువ్వెందుకింత పుష్టిగా వున్నావో’ అని అంటుంటారు. వాళ్ల మాటలు చాలా వరకు నిజమే అన్పిస్తాయి మోక్షకు… ఎక్కువగా మోక్ష పక్కసీటు అమ్మాయినే లంచ్‌టైంలో మోక్ష దగ్గర కూర్చుంటుంది.
ఇవాళ కూడా అలాగే కూర్చుని తింటున్నారు.
”మోక్షా! ఇవాళేంటి నీ లంచ్‌బాక్స్‌లో ఎగ్‌ లేదు. మీ హబ్బీ స్వామిమాల ఏమైనా వేసుకున్నాడా?” అంది కొలీగ్‌.
”నీకొచ్చిన డౌట్ నాకు అర్థమైందిలే… క్లియర్‌ చెయ్యనా?”
”చెయ్యి!”
”మా అత్తగారి ముఖంమ్మీద రెండు మచ్చలొచ్చాయని ఎవరు చెప్పారో తెలియదు కాని అవి నా వల్లనే వచ్చాయని ఆమె అనుమానం. పక్కనుండే అపార్ట్‌మెంటులో ఆమె స్నేహితురాళ్లుంటే అక్కడికి కూడా వెళ్లి అడిగిందట. మచ్చలున్నాయా లేవా? అని వాళ్లు లేవని చెప్పినా నమ్మటం లేదు. అయినా ఆ రెండు మచ్చలు ఇప్పటివి కావు. అవి ఎప్పటి నుండో వున్నాయి. ఈ మధ్యన ఓవర్‌గా ఫేషియల్‌, ఫేస్‌ప్యాకప్‌లు అయినందు వల్ల అవి స్పష్టంగా బయటపడ్డాయేమో. అప్పటికి చెప్పాను. నారింజరసంలో పాలు కలిపి నెలరోజుల పాటు క్రమం తప్పకుండా ముఖానికి పట్టిస్తే మచ్చలు పోతాయని. వినటం లేదు. నా మీద కోప్పడుతోంది. ఇక నా లంచ్‌బాక్స్‌లో ఎగ్‌ కూడానా” అంది.
”ఇదేం కర్మ! అనవసరంగా నోటికాడి ఫుడ్‌ పోగొట్టుకున్నావ్‌!” అంది కొలీగ్‌.
”నాక్కూడా అదే అన్పిస్తోంది. ఆవిడ కోసం నేనెంత కష్టపడ్డానో మీకు తెలియదా? ఎంతమంది బ్యూటీషియన్లను కలిశాను. ఎన్ని ఫోన్‌కాల్స్‌ చేశాను. ఆవిడ ముఖం మీద ముడతలు రాకుండా, మచ్చలు పోతాయనేగా ఫేషియల్‌ చేసేదాన్ని… ముఖం తాజాగా, చర్మం మృదువుగా వుండాలని, వదులవకుండా వుండాలని, మృత కణాలు తొలగిపోవాలనేగా మసాజ్‌ చేసేదాన్ని… జుట్టు ముఖం మీద పడకుండా, ఏది పూసినా జుట్టుకి అంటకుండా వుండాలనేగా హెడ్‌బ్యాండ్‌ తెచ్చాను. అంతేనా ఏప్రాన్‌, బౌల్స్‌, బ్రష్‌, క్రీమ్‌, స్టీమర్‌, ఎక్స్‌ాక్టర్‌, టవల్‌, ఎన్ని తేలేదు. వీికోసం ఎన్నిసార్లు షాపింగ్‌ కెళ్లలేదు. కొంచెం కూడా కృతజ్ఞత వుందా? వుంటే నీవల్లనే మచ్చలొచ్చాయి అంటుందా?” అంది.
కొలీగ్‌ వెంటనే మోక్ష చేయి మీద తట్టి ”బాధపడకు. మీ అత్తగారికి చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ సర్వీస్‌ చేశావు. ఇక అలాంటి సర్వీసేం చెయ్యకుండా సైలెంట్ అయిపో… లేకుంటే నువ్వు డాక్టర్‌ దగ్గరకెళ్లి విటమిన్స్‌ బిళ్లలు మింగాల్సి వస్తుంది” అంది.
”అది కాదువే నా బాధ. ఆవిడను నేనెంత బాగా చూసుకున్నానో తెలుసా? ఇంటికెళ్లాక నాకుండే టైమంతా ఆవిడతోనే గడిపేదాన్ని. మూడు రకాల స్ట్రోక్స్‌తో మసాజ్‌ చేసేదాన్ని. మసాజ్‌ పూర్తయ్యాక ముఖాన్ని కాటన్‌తో తుడిచి ఆవిరి పట్టేదాన్ని… మెత్తి టవల్‌తో చిన్నపిల్లను తుడిచినట్లు తుడిచేదాన్ని… నా బిడ్డ పూర్వికి కూడా నేనలా చేయలేదు, చూసుకోలేదు. చివరకి నావల్లనే మచ్చలొచ్చాయని నాతో మాట్లాడటం మానేసింది. అసలు ఆవిడ ముఖానికేదో అయినట్లు దాచుకొని, దాచుకొని తిరుగుతోంది తెలుసా?” అంది మోక్ష.
”ఖర్మ….” అంది కొలీగ్‌.
మోక్ష అదే విషయంపై చాలాసేపు బాధపడింది. పూర్విని తలచుకుని కళ్లనీళ్లు పెట్టుకుంది.
”నువ్వలా కళ్లనీళ్లు పెట్టుకుంటే చూడబుద్ది కావటం లేదు. నువ్వేనా అన్పిస్తోంది. అయినా నీకేం తక్కువ. జాబ్‌ వుంది హాయిగా తిని హాయిగా వుండు. కాకుంటే పూర్విని తెచ్చుకొని నీ దగ్గరే వుంచుకో. ఆయాను పెట్టుకో. మీ ఇద్దరికి జాబ్స్‌ వున్నాయిగా. కొంతకాలం ఆ ముసలోళ్లకి దూరంగా వుండండి. అలా దూరంగా వుంటే మీరు బ్రతకలేరా? వాళ్లు బ్రతకలేరా? ఇలాంటి తిండి తింటూ ఎన్నిరోజులు బ్రతుకుతావ్‌? దేవుడు మనకు జ్ఞానాన్ని, తెలివితేటల్ని, ఉద్యోగాన్ని ఇచ్చింది ఎందుకు? కడుపు నిండా తిండి తినకుండా డయాబెటిక్‌ పేషంట్లలా బ్రతకమనా?” అంది ఆవేశంగా.
ఆశ్చర్యపోయింది మోక్ష. తనకంటూ ఒక స్నేహితురాలు వుంది కాబట్టి ఇలా మాట్లాడుతోంది. అదే దృతి తరుపున ఎవరు మాట్లాడారు? ఎవరు ఆలోచించారు? తీసికెళ్లి పరాయి ఇంట్లో వదిలేసి వచ్చారు. అత్తమామలు ఎక్కడైనా ఇంత దుర్మార్గంగా వుంటారా? ఏదీ జీర్ణించుకోలేరా? ఇప్పుడు తన పరిస్థితి ఏమి? అప్పుడు అత్తగారు మాట్లాడకపోతే దృతి ఎలా వుండగలిగిందో కాని తను మాత్రం వుండలేకపోతోంది. ఆలోచిస్తూ కూర్చుంది మోక్ష.
”నువ్వేం ఆలోచించకు. పెద్దవాళ్లతో కలిసి వున్నంత వరకు చాలు. ఇంకా ఎందుకు? అసలు రాత్రి సమయంలో కలిసి వుండే భార్యాభర్తలే ఎవరి జీతం డబ్బులు వాళ్లు ఖర్చుపెట్టుకుంటూ ఒకరి బరువు ఒకరి మీద పడకుండా ఎవరి పర్సనాలిటీని వాళ్లు నిలబెట్టుకుంటున్నారు. షేరింగ్‌ అనేది మాటల్లో వుండొచ్చు, మభ్యపెట్టుకోవటంలో వుండొచ్చు కాని మరీ సొంత సంపాదన మీద కూడా అధికారం లేకుండా కనీసం తిండికి కూడా డిపెండ్‌ కావటం టూమచ్‌ పనిష్‌మెంట్. ఏ రిలేషన్‌లో కూడా ఇది మంచి షేరింగ్‌ కాదు. గుడ్‌ రిలేషన్‌ అంతకన్నా కాదు” అంది.
”బరువుగా మాట్లాడి నన్ను భయపెట్టకు… ఇవాళ ఇంటికెళ్లాక ఏదో ఒకి ఆలోచిస్తాను” అంది మోక్ష.
కష్టమర్లు రావడంతో ఇద్దరు వెళ్లి ఎవరి సీట్లో వాళ్లు కూర్చున్నారు.
*****

సతీష్‌చంద్ర తండ్రికి ఫోన్‌ చేసి ”కోపతాపాలను తగ్గించుకొని అమ్మా నువ్వూ వెళ్లి దృతిని చూసిరండి నాన్నా! తను ఎలా వుందో ఎలా తెలుస్తుంది? నేనేమి అడిగినా హ్యాపీగా వున్నట్లే మాట్లాడుతోంది. మీరు వెళ్లి చూసి వస్తే నాక్కూడా ధైర్యంగా వుంటుంది. మీరున్నారన్న నమ్మకంతోనే నేనిక్కడ ప్రశాంతంగా వుండగలుగుతున్నాను. ఒకసారి వెళ్లి చూసి రాండి!” అన్నాడు.
లౌడ్‌ స్పీకర్‌లో నుండి కొడుకు మాటలు విన్న మాధవీలత ”ఈ కళ్లతో దాని ముఖం ఎవరు చూడమన్నా చూడను. వాడేదో పెద్ద ఆఫీసరైనట్లు అక్కడుండి ఆర్డర్లు వేస్తే మనమిక్కడ కీ ఇచ్చి వదిలిన బొమ్మల్లా ఆడతామనుకుంటున్నాడేమో! అది జరిగే పని కాదు” అని దృతిని చూడానికి వెళ్లలేదు. సతీష్‌ని కూడా అవమానించినట్లు మాట్లాడింది.
అంకిరెడ్డి ఒకి రెండుసార్లు వెళ్లి చూసి వచ్చాడు.
*****

ఆఫీసులో కొలీగ్‌ మాట్లాడినప్పి నుండి మోక్షలో మార్పు వచ్చింది. భర్తను తీసుకొని పక్కకెళ్లి పోవాలనుకుంది. అప్పుడు అత్తగారు మాట్లాడకపోయినా బాధలేదు. ఎవరెలా పోయినా చింతలేదు. తనూ, తన భర్త, పూర్వి రెంటెడ్‌ హౌస్‌లో వుండొచ్చు. కీరమ్మలాంటి పనిమనిషిని పెట్టుకుంటే ఉదయాన్నే వంట చేసుకొని పూర్విని స్కూల్‌కి పంపి, తనూ, ఆనంద్‌ ఆఫీసుకి వెళ్లొచ్చు… అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇదే ఆలోచన కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా మోక్షలో…
ఆనంద్‌తో చెప్పింది. ఆనంద్‌ విన్నాడు కాని వెంటనే సమాధానం చెప్పలేదు.
”మాట్లాడరేమండీ! నాకు ఈ ఇంట్లో వుండాలనిపించటం లేదు. మనకేం తక్కువ. బయటకెళ్లి బ్రతకలేమా?”
”ఇప్పట్లో బ్రతకలేం. దానికి కొద్దిగా టైం కావాలి”
”ఎందుకు?”
”మన డబ్బు మొత్తం వేరేచోట ఇన్వెస్ట్‌ చేశాను. ఇప్పుడు మనకు వస్తున్న రెండు జీతాల డబ్బంతా లోన్‌కెళ్లిపోతోంది”
షాకై చూసింది. ”డబ్బేంటి? లోనేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు?”
”నీకు తెలియదులే! నువ్వేం ఆవేశపడకు. నేనీమధ్యన నీకు తెలియకుండా ఓ మంచి పని చేశాను”
”మంచిపనా?”
”అవును”
”ఏంటండీ అది?”
”కమలనాథ్‌ అనే కాంట్రాక్టర్‌కి పదిలక్షలు పెట్టుబడి పెట్టాను. అదంతా ఎలా వచ్చిందనుకున్నావ్‌! లోన్‌ తీసుకుని కొంత, ఇంత వరకు మనం కట్టిన చిట్టీల మీద వచ్చింది కొంత…. ఏదో ఒకటి చెయ్యకపోతే డబ్బులెలా వస్తాయి?”
”ఉద్యోగం చేసుకుంటున్నాం కదా? ఇంకా ఏం చెయ్యాలి డబ్బుల కోసం?”
”ఆ డబ్బులేం సరిపోతాయి మోక్షా? నెలంతా తింటే ఒక్క రూపాయి కూడా మిగలదు. ఇప్పుడేదో మా నాన్న మనకు తిండి పెడుతున్నాడు కాబ్టి ఇద్దరి జీతాలు చిట్టీలకు కట్టి సేఫ్‌సైడ్‌లో వున్నాం. లేకుంటే ఏముంది?”
”అలాగే వుంటే సరిపోయేదిగా! కొత్తగా ఈ లోన్లెందుకు? ఆ చిట్టీ డబ్బులన్నీ తీసుకోవడం ఎందుకు? కాంట్రాక్టర్‌కి ఇవ్వడం ఎందుకు? అయినా ఇంతపని చేస్తూ నాకెందుకు చెప్పలేదు?”
”చెబితే మీ ఆడవాళ్లు ఇలాంటి వ్యాపారాలు చెయ్యనిస్తారా? అన్నీ భయాలేగా మీకు? భయపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేం. నేను పెట్టిన పది లక్షలకి తొందరలోనే ఇరవై లక్షలు వస్తుంది. అలా ఏ రంగంలో వస్తుంది చెప్పు. అందుకే నీకు చెప్పకుండా నీ సంతకాన్ని నేనే చేసి నీ పేరుతో లోన్‌ తీసుకున్నాను. నీ జీతం మొత్తం ఇప్పుడు చిట్టీకి పోదు. ఆ లోన్‌కి పోతుంది. అయినా ఒక నెల దాక దాని మీద వచ్చే లాభం మొత్తం మన పేరుతో బ్యాంక్‌లో వేసుకొని మిగతాది లోన్‌కి కట్టేద్దాం! ఓ.కె.నా! ఇక భయపడకు!” అన్నాడు.
పిచ్చిచూపులు చూస్తోంది మోక్ష.
పక్కనే వుండి వాళ్ల మాటలు విన్న అంకిరెడ్డి వెంటనే వచ్చి వాళ్ల దగ్గర కూర్చున్నాడు. మోక్ష ముఖంలోకి చూశాడు.
”ఆనంద్‌ చెప్పినట్లు చేస్తే సరిపోతుంది. నువ్వేం కంగారు పడకు మోక్షా!” అన్నాడు అంకిరెడ్డి.
”ఇది మీకు తెలుసా మామయ్యా! మీరు కూడా ఆయన మాటలకే సపోర్టు చేస్తున్నారు? ఆయన చేసిన పని మీకు నచ్చుతోందా?” అంది మోక్ష.
”ఆ కాంట్రాక్టర్‌ మంచివాడేనమ్మా! మన డబ్బుకేం ఢోకా లేదు”
”డబ్బులు పోతాయని నేను అనటం లేదు మామయ్యా! లోన్లు తీసుకోవడం ఎందుకు? అదీ నాకు చెప్పకుండా, నేను సంతకం పెట్టకుండా…”
”నీ సంతకం ఆనంద్‌ పెట్టాడు మోక్షా!”
”అది మీక్కూడా తెలుసా మామయ్యా?” అంది. ఆశ్చర్యపోయే ఓపికలేనట్లు చూసింది.
”ఆ…” అన్నాడు అంకిరెడ్డి.
”ఆ… నా! ఏం మాట్లాడుతున్నారు మామయ్యా? మీరు మీరేనా?”
”ఇందులో తప్పేముందమ్మా! నువ్వు నీ ఆఫీసు వదిలేసి ఆఫీసుల చుట్టూ తిరగలేవని నీ కంఫర్ట్‌ కోసం నీ సంతకం ఆనంద్‌ చేశాడు. ఇంత మాత్రానికే ‘మీరు మీరేనా!’ అంటూ నన్ను ప్రశ్నిస్తావెందుకు? అంత పెద్దపెద్ద కళ్లు చేసి చూడానికి ఇప్పుడేం జరిగిందని…?”
మోక్ష తలవంచుకుని కళ్లు మూసుకొని ఒక్క క్షణం పిడికిళ్లు బిగించి ఊపిరి బిగబ్టింది.
ఆనంద్‌ ఆమెను చూసి ”హిస్టీరియా వచ్చిన దానిలా ఎందుకే అలా బిగుసుకుపోయావ్‌?”
ఆమె ఉలిక్కిపడి ”నేను బిగుసుకుపోయానా?”
”కాదా! ఆమాత్రం తెలుసుకోలేనా! నేను ఏది చేసినా నచ్చదు. ఇందుకే ఏం చేయాలన్నా నాకు భయం”
”నువ్వేం భయపడకురా! అసలేంటమ్మా నీ ప్రాబ్లమ్‌?”
”పెద్దవారు. నా సంతకం ఆయన పెడుతున్నప్పుడు మీరు ఆపవద్దా మామయ్యా? అంతా జరిగాక అసలేంటమ్మా నీ ప్రాబ్లమ్‌ అంటే నేనేం చెయ్యగలను. మీరేకదా మాకు కంచెలా వుండాల్సింది”
”తెలివిగా మాట్లాడి మా నాన్నను కించపరిస్తే పెట్టిన సంతకం ఎరేజ్‌ అవుతుందా?” కోపంగా అన్నాడు ఆనంద్‌.
”నువ్వుండరా! దీనివల్ల లాభాలు వస్తాయి కదమ్మా!” అన్నాడు.
”లాభాలు కాదు మామయ్యా! నాకు వేరే ఇల్లు అద్దెకు తీసుకొని వెళ్లాలని వుంది. పూర్విని ఇంకా ఎన్నిరోజులు వాళ్ల దగ్గర వుంచుతాం”
”ఎవరుంచమన్నారు? తీసుకొచ్చుకోమ్మా! ఇక్కడ పూర్వి వుండానికి అభ్యంతరమేంటి? మనతో పాటు వుంటుంది. ఇంత చిన్న విషయానికే వేరే వెళ్లడం ఎందుకు?” అన్నాడు అంకిరెడ్డి.
మోక్షకి ఏం చేయాలో తోచనట్లు పిడికిళ్లు బిగించి చెవుల దగ్గర పెట్టుకుని అటు ఇటూ చూస్తూ కోపంగా ”ఛఛ… నాకు అన్నీ సంకెళ్లే! ఇప్పటికే నా ఇబ్బందులు నాకున్నాయి. అవి చాలక ఈయనగారు నా జీతం మొత్తం లోనుకు కట్టేలా చేసిపెట్టాడు. ఇన్నిరోజులు కట్టిన చీటీ డబ్బులు కూడా లేకుండా చేశాడు. ఈయన వల్ల నాకెప్పుడూ కష్టాలే!” అంటూ అక్కడ నుండి లేచి వెళ్లిపోయింది మోక్ష.
ఆమె అలా వెళ్లగానే కొడుకు వైపు తిరిగి
”ఏంటిరా అలా అంటోంది? నువ్వు చేసిన పని మోక్షకి నచ్చలేదా? ఆ కాంట్రాక్టర్‌ మంచివాడే కదరా! ఎందుకలా భయపడుతోంది. అసలు కమలనాథ్‌ గురించి ఎవరిని అడిగినా మంచివాడనే చెబుతున్నారు. రోడ్డు కాంట్రాక్ట్‌, రైల్వే కాంట్రాక్ట్‌, చెరువుల కాంట్రాక్ట్‌, బిల్డింగుల కాంట్రాక్ట్‌ ఒకటేమిటి ఇప్పటికే అతను చాలా కాంట్రాక్ట్‌లు చేసి వున్నాడు. నేను కూడా అతనితో మాట్లాడాను. అతని మాటల్ని బట్టి చూస్తే ఇది నీకు మంచి ఆపర్చ్యూనిటీ అనిపిస్తోంది. ఇదంతా మోక్షకు నువ్వు ముందే చెప్పాల్సింది. అయినా అంత కోపంగా వెళ్లిపోయిందేం రా?”
”అదెప్పుడూ అంతే నాన్నా! చెప్పింది వినదు. దానికి మనందరం కలిసి వుండటం ఇష్టం లేదు. ఒక్కతే వెళ్లి పక్కనుండాలట… వచ్చిన జీతం మొత్తం నెలంతా ఖర్చు పెట్టుకోవాలట. అదీ దాని సరదా! బాధ్యత తెలిస్తే కదా!” అన్నాడు.
”సరేలే! కమలనాథ్‌ మళ్లీ కలిస్తే చెప్పు! అవసరమైతే ఇంకో 5 లక్షలయినా ఇవ్వానికి సిద్ధంగా వున్నాడు నా స్నేహితుడు? వడ్డీ తక్కువే తీసుకుంటానంటున్నాడు. అవసరమైతే తెచ్చి ఇద్దాం! ఇలాంటి వ్యవహారాల్లో పెట్టుబడి ఎంత ఎక్కువ అయితే లాభాలు అంత అధికంగా వుంటాయి. నువ్వన్నట్లు ఇప్పుడు మన చుట్టూ ఖరీదైన ఇల్లు, కార్లు వున్నవాళ్లంతా ఇలాంటి వ్యాపార లావాదేవీల వల్ల పైకి వచ్చినవాళ్లే!” అన్నాడు.
”సరే! నాన్నా! ఇవాళే ఫోన్‌ చేసి అడుగుతాను” అన్నాడు.
”కాస్త జాగ్రత్తగా మాట్లాడు”
అలాగే అన్నట్లు తల వూపాడు ఆనంద్‌.

మోక్షకు ఈ మధ్యన మనసు బాగుండక తల్లికి ఫోన్‌ చెయ్యలేదు. పూర్వి ఎలా వుందో ఏమో!! ఆఫీసులో కూడా వారం రోజుల నుండి పని బాగా ఎక్కువైంది. ఇంటికొచ్చాక అలసిపోయినట్లయి త్వరగానే నిద్రపోతోంది. ఇవాళ నిద్రపోకుండా ఫోన్‌ చేసింది. పూర్వి లిఫ్ట్‌ చేసి ”మమ్మీ! ఫోన్‌ అమ్మమ్మకివ్వనా?” అంది వచ్చీరాని మాటలతో ముద్దుముద్దుగా.
”వద్దులే నాన్నా! నువ్వు మాట్లాడు. తర్వాత అమ్మమ్మకు ఇద్దువు గాని… ఎలా వున్నావ్‌ నువ్వు?”
”బాగున్నా మమ్మీ! మొన్న డాడీ వచ్చాడు. నువ్వు రాలేదేం?”
”డాడీ వచ్చాడా? ఎప్పుడు?” ఆశ్చర్యపోయింది మోక్ష.
”తాతయ్యతో, మామయ్యతో తగాదా పెట్టుకొని డబ్బులు పట్టుకెళ్లాడు. నువ్వు రాలేదేం మమ్మీ?” అంది. తల్లిని చూడాలన్న తపన పూర్వి గొంతులో స్పష్టంగా విన్పిస్తోంది.
మోక్ష అదేం ప్టించుకోకుండా ”ఫోన్‌ అమ్మమ్మకివ్వు…” అంది.
అక్కడ నుండి కదలకుండానే ”అమ్మామ్మా!!” అంటూ పెద్దగా కేకేసింది పూర్వి.
”వెళ్లవే! అమ్మమ్మ దగ్గరకెళ్లి ఫోన్‌ ఇవ్వు” తొందరపెట్టింది మోక్ష.
పూర్వి పరిగెత్తుకుంటూ వెళ్లి ”అమ్మమ్మా! నీ కూతురు ఫోన్‌” అంటూ మొబైల్‌ని అమ్మమ్మ చెవి దగ్గర పెట్టింది పెద్ద ఆరిందలా.
ఆమె ‘హలో!’ అనగానే ”అమ్మా! ఆయన అక్కడకొచ్చారా?” అడిగింది మోక్ష.
ఆమె ఒక్కక్షణం ఆగి ”వచ్చాడు. నీకు చెప్పి వచ్చి వుండడని మాకు అప్పుడే అన్పించింది. అందుకే అల్లుడుగారు వచ్చినట్టు నీకు చెప్పలేదు.”
”ఏమన్నారు. నాన్నతో అన్నయ్యతో తగాదా పెట్టుకున్నాడా?”
”అవన్నీ ఇప్పుడెందుకు? నువ్వెలా వున్నావ్‌? వేళకి తింటున్నావా?” అడిగింది ఆమె.
వెంటనే మోక్ష కళ్లలో కన్నీళ్లు ఉప్పెనలా ఉబికాయి.
”నువ్వేదో దాస్తున్నావ్‌! చెప్పమ్మా! అసలేం జరిగింది?” అడిగింది మోక్ష.
”ఏం లేదులే మోక్షా! దాని గురించి ఇప్పుడెందుకు? అయినా అతనికి ఇస్తానని ఒప్పుకున్న డబ్బులు ఎప్పుడైనా ఇచ్చేదేగా! అన్నయ్య వెంటనే వదిన నగలు అమ్మి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశాడు”
”అంత జరిగిందా?” నివ్వెరపోతూ అడిగింది.
”నువ్వలా అంటావనే నీకు చెప్పలేదు”
గాలి తీసిన బెలూన్‌లా అయి ”చెప్పినా నేనేం చెయ్యగలనులే! నేను ఎవరిక్కావాలి?” అంది.
”అలా అనకు మోక్షా! నువ్వు కాక మాకు ఇంకెవరు కావాలి? మేము ఏది చేసినా నీకోసమేగా! నువ్వు బాగుండాలనేగా!”
”బాగుండాలంటే వదిన నగలు అమ్మాలా?”
”సందర్భం అలా వచ్చింది. తప్పలేదు” అందామె.
”నాతో ఒక్క మాటయినా చెప్పాల్సింది”
”చెబితే నువ్వు వదిన నగలు అమ్మనిస్తావా? దానివల్ల నీకూ ఆనంద్‌కు విభేదాలు రావా? అందుకే చెప్పలేదు”
”ఈ విషయంలో మీరు చాలా తొందరపడ్డారు. ఆ డబ్బు ఆయనకు ఇవ్వకుండా పూర్వి కోసం వుంచితే బాగుండేది…”

ఇంకా వుంది…

Gausips – ఎగిసేకెరటాలు-12

రచన:-శ్రీసత్య గౌతమి

“సోఫియా … పేరు సోఫియా. ఎవరయి ఉంటుందీ? అమెరికన్లా లేదు. హిస్పానికన్. యస్ హిస్పానికన్. సోఫియా హిస్పానికన్ నేం. ఈమె రీసెర్చ్ చేసే వ్యక్తిలా లేదే? మరి ఈ డేటాలెందుకు? సరేలే … నేను మాత్రం రీసెర్చర్ నా? అయినా నేను లేనూ???… రీసెర్చర్ అంటే లహరిలా ఉండాలి!

కౌశిక్ ని అడిగితే ఈమె గురించి తప్పకుండా వివరాలు దొరుకుతాయి, కానీ సోఫియా నాకెలా తెలుసని అడుగుతాడే..అపుడెలా?” …అని స్వగతంలో ఆలోచిస్తున్నది.

సోఫియా శామ్యూల్ ని వాటర్ ఫ్రంట్ లోని రెస్టారెంట్ లో కలవడానికి బయలుదేరింది. సోఫియా వెళ్ళేసరికి ఒక్క శామ్యూలే కాదు లియోనార్డో, బర్ఖా, డేవిడ్ కూడా ఉన్నారు. ఆశ్చర్యపోతూ …”నా గురించే?”… అనడిగింది అందరినీ ఉద్దేశిస్తూ.
“యస్”.. ఏం వార్త తెస్తావో అనే టెన్షన్! .. అన్నాడు లియో.
“హహా.. చాలా ఈజీ. ఏం చెప్పినా నమ్మేస్తోంది సింథియా”
“ఈస్ ఇట్? ఎలా?”
“భయం తో అనుకుంటా. లహరి చనిపోతే… ఆమెకి ప్రమాదం”
“అవును. కానీ అది ఆమెకి తెలియదు కదా?”
“నేను చెప్పాను. ఆయుధాలవసరం లేదు ఇలాంటివారికి”…అంటూ వికటంగా నవ్వింది సోఫియా.
“పాపం కదా, సింథియా?”
“ఏది పాపం? మనలాంటివాళ్ళకన్నా నీచం. లహరిలాంటి వాళ్ళని పొట్టన పెట్టుకోవడానికి మనసెలా వచ్చింది? తలచుకుంటే మనమిలాంటివి చెయ్యలేకనేనా? కానీ మనం కూడా చెయ్యడానికి ఇష్టపడం, వేరే త్రోవలో మనిషిని అడ్డు తొలగించలాని చూస్తామే తప్పా …ఆమె చేసిన పని ఒక్కసారి బయటికి తెలిసినా, లహరి పసిగట్టినా మనం వేసుకొని ఉన్న ప్లాన్ కూడా వేస్ట్ అవుతుంది. స్టుపిడ్ ఫెలో. అందుకే సాధ్యమయినంతవరకూ మనకా కాయితాలు చేతిలోకొచ్చేయాలి. ఆ తర్వాత ఎలా పోతారో?” అంటూ ముగించింది తన నిందాస్తుతిని సోఫియా.
“కౌశిక్ ని దెబ్బ కొట్టాలి, లేకపోతే మనల్నొదిలి మెల్ల మెల్లగా అలా జారిపోతాడు. కౌశిక్ ఒక అవకశవాది. మనకొక మనీ సోర్స్ చెయ్యి జారిపోతుంది. లహరి గనుక పవర్ ఫుల్ అయ్యి పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుందంటే మన ఆటలు కౌశిక్ తో ఇక సాగవు”
“అదే సమస్య అనుకున్నాము కానీ, ఈ సింథియా అనవసరం గా కాంప్లికేటెడ్ చేసింది. ఈమెకేంటి ప్రాబ్లం? ఈమెకేమి కావాలి కౌశిక్ నుండి? అసలీమెవరు?” అడిగింది బర్ఖా.
“అది తెలుసుకుందాం. మనకవసరమే ఇది” అన్నది సోఫియా.
“అయినా కౌశిక్ ఎందుకు సింథియాను చేరదీశాడు? మనకెవ్వరికీ తెలియని క్రొత్త వ్యక్తి”…బర్ఖా అంటోంది.
“చటర్జీ…చటర్జీ క్యాండిడేట్ సింథియా”… అన్నాడు శామ్యూల్ హటాత్తుగా.
అందరూ ఒక్కసారి శామ్యూల్ వైపే చూశారు.
“నీకు ఆమెవరో తెలుసా? ఎలా?”…అడిగారు అందరూ ఒకేసారి.
“రాకేష్ వల్ల”… శామ్యూల్ చెప్పాడు.
“రాకేష్ ఎవరు?” సోఫియా భృకుటి ముడిచి అడిగింది.
“ఆమె భర్త”… ముక్తసరిగా చెప్పాడు శామ్యూల్.
ఇంకా ఆశ్చర్యపోయారు మిగితావారు… “ఏంటీ, ఆమెకి భర్త ఉన్నాడా?”
శామ్యూల్ చెప్పసాగాడు. “రాకేష్ నాకు మరో తెలిసిన వ్యక్తి ద్వారా నా వద్దకు వచ్చాడు. సింథియా మీద డిటెక్టివ్ కావాలని.
అందరూ నిటారుగా కూర్చున్న్నారు. “వ్వాట్…ఏంటి విషయం?”
శామ్యూల్ చిన్న చిన్న మార్కెటింగ్ వ్యాపారాలు చేస్తుంటాడు జనాలతో కలిసి. కంప్యూటర్ హ్యాకింగ్, సాఫ్ట్ వేర్ వైరస్సులను ఉపయోగించి కాంఫిడెన్షియల్ మ్యాటర్స్ ని బిగ్ షాట్స్ కి ఆమ్మేయడం, దొంగ పాస్ పోర్ట్లు ఇంకా ఇలా ప్రయివేట్ డిటెక్టివ్ వర్క్. మంచి వాళ్ళకోసమయినా, చెడ్డ వాళ్ళకోసమయినా ఏ పన్లు చెప్పినా చెయ్యడం, డబ్బు తీసుకొని బ్రతికేయడం శామ్యూల్ కి అలవాటు. అలాగే వీళ్ళందరూ రకరకాల వాటిలో ప్రావీణ్యత ఉన్నవాళ్ళే. దేనికయినా డబ్బే కదా ప్రధానం. ఆ డబ్బు తక్కువ వ్యవధిలో ఎక్కువ వస్తుందంటే ఎంతో రుచి. అలాగే కౌశిక్ లాంటివాళ్ళకి కూడా ఉపయోగపడే వీళ్ళకి కొన్ని ప్లాన్స్ కౌశిక్ లోని ఆకస్మిక మార్పు వల్ల దెబ్బతింటున్నాయి. ఆ ఆకస్మిక మార్పుకు కారణం లహరి యొక్క సిన్సియారిటీ. ఆమె యొక్క రియల్ అప్రోచెస్ వల్ల హ్యూజ్ ఫండింగ్ వస్తోంది. కౌశిక్ మెల్ల మెల్ల గా తప్పుడు త్రోవల నుండి తప్పుకొంటున్నాడు, దానితో కాస్త రాబట్టుకొనే మనీ తక్కువయిపోతోంది. ఒక పైసా ఎక్కువ వస్తే ఆనందమే గానీ, ఒక్క పైసా తక్కువయినా ఈ గ్యాంగు గిజ గిజలాడిపోతారు.

రాకేష్ తన భార్య సింథియా యొక్క ప్రవర్తన మీద అనుమానం ఉందనీ, ఆమె గురించి పూర్వాపరాలు ఇండియా నుండి తనకు కావాలని అడిగాడు శామ్యూల్ కి. కేసు ఎంత కాంప్లికేటెడ్ అయితే… తనకు ఎంత రిస్క్ ని తెచ్చిపెడితే అంత ఖర్చు అవుతుందనీ ముందుగా హింట్ చేశాడు. రాకేష్ అందుకు ఒప్పుకున్నాడు.

ప్రతీ కధ ఎక్కడో మొదలవుతుంది ఎక్కడో ముగుస్తుంది. పాత కధలు ముగుస్తాయి మళ్ళీ క్రొత్త కధలు ఆరంభమవుతాయి. రాకేష్ …కధ ముగించేద్దామని ఆరాటపడుతున్నాడు.

శామ్యూల్ ఇప్పటివరకూ సింథియా కి కౌశిక్ కి మధ్య జరుగుతున్న విషయాలన్నీ ఫోటోగ్రాఫ్స్ మరియు టైమింగులతో సహా రికార్డ్ చేసేసి అందించేశాడు రాకేష్ కి.

ఈ మాటలు శామ్యూల్ నుండి వింటున్న మిగితా అందరూ … అమితాశ్చర్యన్ని పొందారు. “మరి ఈ విషయాలేవీ నాకు చెప్పలేదేంటీ?” అడిగింది సోఫియా.
“సోఫియా… నిన్ను సింథియా ని చాకచక్యంగా కలిసేలా చేసిందే నేను. ల్యాబ్ లో ఆమె పైన స్పై య్యింగు కి పెట్టాను. ఎందుకంటే రాకేష్ కేసు కోసం అది నా కవసరం. అదికాస్త మన స్వంత ప్లాన్స్ కి కూడా ఉపయోగపడుతోంది” అని ఆపాడు శామ్యూల్.
ఆ సమయస్పూర్తికీ, వెదకబోయిన తీగ కాలికే తగిలినందుకు చాలా సంతోషించారు అందరూ.
“మనమెవరికీ తల వంచము, ఎవరినీ యాచించము. మన తెలివితేటలతో మనం బ్రతుకుతున్నాం. బ్రతకడం ముఖ్యం. మన బ్రతుకు విధానం లో ఎవరయినా సమిధలే. మనమెవరి ప్రాణాలు తియ్యడం లేదు సింథియా లాగ” అని సోఫియా ఆవేశంగా అంటుంటే …
“ఎందుకో సింథియా గురించి అప్సెట్ అవుతున్నావు బాగా సోఫియా” అని అడిగింది బర్ఖా.
“యస్…ఆమె ని చూస్తుంటే నాకానాడు జరిగిన అన్యాయం గుర్తొస్తోంది. ఇలాగే కదా … నా ఉద్యోగంలో ఒకతె, ఒకడు నాకు దెబ్బేసారు!”
“సంతోషించు… భిశ్వాస్ లాగ మానసికం గా దెబ్బతిన్లేదు నువ్వు” అన్నాడు శామ్యూల్.
“భిశ్వాస్?” అందరి నోటా ఒకటే మాట.
“సింథియా తెలివికి అమాయకంగా బలయిపోయిన ఒక పిచ్చి పి.హెచ్.డి. స్టూడెంటు” అన్నాడు శామ్యూల్.
“నిజమా?” అడిగారు అందరూ.
“యెస్? అన్నాడు శామ్యూల్.
“పెద్ద బ్యాక్గ్రౌండే ఉన్నదన్న మాట” సోఫియా అన్నది.
“యెస్. మనకెటువంటి ప్రాబ్లం అయితే లేదు, ఆవిడ బ్యాక్ గ్రౌండ్ తో. ఆమె కౌశిక్ ప్రాబ్లం. కాకపోతే లహరి అన్యాయం గా బలయింది” అన్నాడు శామ్యూల్.
“మరి రాకేష్ విషయం?” అడిగింది సోఫియా.
“రోడ్డున పడబోతోంది సింథియా. రాకేష్ ఆమెకి విడాకులు ఇస్తున్నాడు”.. కొసమెరుపు చెప్పాడు శామ్యూల్.
“ఆ…అతనడిగితే మాత్రం ఇచ్చేస్తుందా? అమెరికా లో స్టాండెక్కడిది ఆమెకి రాకేష్ లేకపోతే?”
“ఏమో…కౌశిక్ ఏమేమి భరోసాలిస్తున్నాడో, ఎవరికి తెలుసు?” అన్నాడు శామ్యూల్.
“ఊ.. అయితే మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి” అన్నది సోఫియా.
“యస్” అని అన్నారంతా.
**************************************************

ఆ రాత్రి చాలా లేటు గా వచ్చింది ఇంటికి సింథియా. వచ్చి అలిసిపోయి పడుకుంది. ప్రొద్దున్న బ్రేక్ ఫాస్ట్ టైం కి డైనింగ్ హాల్ లో కలిసింది. కాఫీ తాగుతూ క్యాజువల్ గా అద్దాల కిటికీ నుండి బయటకు చూస్తోంది.
“ఏంటో ఈమె…తన గురించే తప్పా నా గురించి కనీసం ఒక్క థాట్ కూడా ఉండదు. బయటి వాళ్ళలాగే అవసరానికి అప్పుగా డబ్బులు తీసుకోవడం లేదా ఇవ్వడం మళ్ళీ ఆ అప్పు తీర్చేయడం. తన తిండీ, షాపింగులకు మాత్రం నన్ను ఒక బాయ్ ఫ్రెండ్ లాగ వాడుకోవాలనుకుంటుంది. ఇప్పుడా కౌశిక్ గాడు వచ్చిన దగ్గిరనుండీ నేను కనీసం డ్రైవర్ గా కూడా నచ్చడం లేదు. ఈ మనిషికి పెళ్ళి, సంసారం అనే వాటి గురించే ఏనాడు ఆలోచించి ఉండదు. హ్ము… అమెరికా రావాలనుకొందీ,నన్ను పెళ్ళి చేసుకొంది. డాలర్ కావాలనుకొందీ భిశ్వాస్ కి అన్యాయం చేసిందీ, కౌశిక్ ని పట్టింది. ఇహ నా అవసరం లేదు, పేకలో డిస్కార్డ్ ముక్క గాడిని”… అని ఆలోచిస్తున్నాడు రాకేష్. సింథియ మాత్రం ఒకటే పోజులో ఉంది. కనీసం మాటా మంతీ కూడా లేదు.

“మాట్లాడిందంటే ఏదోక అవసరం ఉంటేనే లేదా ఏదో ఒక గొణుగుడు…తనతో సరదాగా జోకులేస్తూ ఉండననీ, ఆమె ఏమి చెప్పినా, ఏమి చేసినా యాక్సెప్ట్ చెయ్యాలనీ…దాన్నే భార్యకు విలువివ్వడం అంటారనీ, తనకు నచ్చిన విధంగా మారమని అంటూంటుంది. అప్పటివరకూ తన లైఫ్ లోకొచ్చిన వాళ్లందరూ తనను ఎంతో మర్యాద ఇచ్చారనీ ఎంతో సంతోషంగా తనతో ఉన్నారనీ అంటుంది. ఎలా సాధ్యమయ్యిందో వాళ్ళకి? బహుశా నేను భర్తలా ఆలోచిస్తున్నానేమో? ఆమె భార్య కాలేకపోతున్నట్లున్నది. హ్మ్..తను భార్య అయిపోతే … నాతోనే ఉండిపోతుంది అప్పుడు పాపం బాయ్ ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటీ. కాబట్టి ఆమె మారదు, వాళ్ళు మారనివ్వరు. ఇహ నేను నిష్క్రమించడమే సరియైన నిర్ణయం” అని నిశ్చయించుకున్నాడు రాకేష్.

“సింథియా… నాకు విడాకులు కావాలి” అడిగాడు రాకేష్.
సింథియా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. చిన్నగా నవ్వుతూ…”ఎప్పటికీ?” అని అడిగింది.
“నేను ఆల్ రెడీ ప్రాసెసె స్టార్ట్ చేశాను. నీకు చెప్పాలికదా అనీ…”
“సరే..అలాగే కానీయ్. ఈ రోజే నువ్వు అడగడం లేదు కదా. పర్వాలేదు.” అన్నది సింథియా.
ఆశ్చర్యపోయాడు రాకేష్…”నాకేమీ పెద్ద బ్యాంక్ బ్యాలెన్సెలు లేవు…మనం కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడేసుకుంటే లాయర్లకు డబ్బులుపొయ్యాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ఇండియా వెళ్ళి అక్కడి ప్రొసీజర్స్ కూడా పూర్తి చేసుకోవచ్చు” అన్నాడు.
“నీ దగ్గిర డబ్బు ఉన్నా, ఈపాటికల్లా జాగ్రత్త పడిఉండవా? నాకిచ్చేయాలనుకుంటావా ఏంటి? అలాగే … కూర్చొని మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు కాదు, నాకు వేరే పనుంది” అన్నది సింథియా.
రాకేష్ చాలా షాక్ అయ్యాడు. “దీనికి కూడా … నీ పనే ముందు అంటున్నావా? నీకు ఏ ఫీలింగూ లేదా?” అడిగాడు రాకేష్.
“ఎవరికి నచ్చినది వాళ్ళు చెయ్యగలగాలి, ప్రతి మనిషికీ స్వతంత్రంగా బ్రతికే హక్కుంది”
“కాని పెళ్ళి అనే ధర్మం ఉంది దాని గురించి నువ్వు ఆలోచించటం లేదు..అందుకన్…” కారణం చెప్పబోతున్నాడు రాకేష్.
వెంటనే మధ్యలోనే ఆపేసింది సింథియా. “కారణం నేను అడిగానా? నన్ను చూడు … ఎంత హై గా ఆలోచిస్తానో … నీలా నాకు లో క్లాస్ థాట్స్ ఎప్పుడూ రావు. పెళ్ళి చేసుకుంటే మాత్రం? నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఇప్పుడీ విడాకులు కూడా అవసరమా… ఉత్తి టైం వేస్ట్. మనిద్దరం ఒక షెల్టర్ క్రింద ఉంటే మాత్రం … నేనేమన్నా నీకు దేనికైనా ఆపానా? లేదే. అలాగే నా యాక్టివిటీస్ నావి. కనీసం ఇంటికి రాగానే బోర్ కొట్టకుండా సరదాగా ఒక కంపెనీ ఉంటుంది కదా. అదెందుకు ఆలోచించవు? ఇంతకన్నా లైఫ్ ఏముంది? నాకర్ధం కావడం లేదు ఇంతకన్నా నీకేమి కావాలో. ఏమన్నా అంటే సంసారమంటావ్, పిల్లలంటావ్. ఓకే … పిల్లల్ని ఎప్పుడన్నా కనొచ్చు అవసరమనుకుంటే. నేను అన్ని విధాలుగా సహకరిస్తున్నా … నువ్వు కాదనుకుంటున్నావ్, అది నీ బ్యాడ్ లక్కు. దానికి నేనేమి చెయ్యలేను. నీకు విడాకులే కావాలంటే అలాగే పైన్. వంటరిగా బ్రతుకు. దీనికోసం నేను ఎక్కువగా టైం వేస్ట్ చెయ్యదలుచుకోలేదు. నేను భవిష్యత్తులో ఎదగడానికి మెట్లు వేసుకుంటున్నాను. నా దగ్గిర పెద్దగా టైం లేదు. నువ్వు ఎలా అంటే అలానే” అని లేచి వెళ్ళిపోతోంది.

రాకేష్ అవాక్కయిపోయాడు. మిన్ను విరిగి మీదపడుతున్నా ఈమె బైరాగి ఆలోచన్లకు అంతే లేదా?…అంటూ.

************************************

“నీ టైం నేను వేస్ట్ చేస్తున్నానా? మరి పిల్లల్ని ఎలా కంటావ్? ఎలా పెంచుతావ్? సింథియా?” … అడిగాడు ఎలాగో నోరు పెగల్చుకొని ఆమెతో మాట్లాడడం అనవసరం అని అనిపిస్తున్నా.
“వ్వాట్ నాన్ సెన్స్? … వెళ్ళి నీ అమెరికన్ ఫ్రెండ్స్ ని అడుగు. అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్స్ లా ఆలోచించాలి, అమెరికన్స్ లా బ్రతకాలి. ఇండియాలో మనుషుల్లాకాదు. పిల్లలు డేకేర్స్ లో ఉంటారు”
“మరి డేకేర్ వేళలయ్యాకా?”
“నానీ ని మాట్లాడాలి, అంతేగానీ పిల్లలకోసం అమెరికాలో ఎవరూ టైం వేస్ట్ చేసుకోరు, ఇండియాలోనే ఏ డబ్బున్నవాళ్ళూ పిల్లల్ని పెంచుకుంటూ ఉండరు, డబ్బు పడేసి పనివాళ్ళను పెట్టుకుంటారు” అన్నది సింథియా.
“మరి తల్లిగా ఏ టైం లో ఆనందిస్తావ్ సింథియా?” నీరసంగా అడిగాడు రాకేష్.
“అయితే నువ్వు ఉద్యోగం మానెయ్యి లేదా పార్ట్ టైం ఉద్యోగం చేసుకో. నువ్వూ, ఒక నానీ కలిసి షిఫ్టులు వేసుకొని చూడండి. ఇలాంటి పనులు నాకు చేత కాదు”
“దీనికి నువ్వు ఉద్యోగం మానెయ్యాల్సిన అవసరం లేదే, ఫ్రెండ్స్ తో తిరుగుళ్ళు మానెయ్యాలి. ఇప్పటి దాకా నువ్వు ఇండియాలోనే పెరిగీ, ఉండీ ఇలా ఆలోచించగలుగుతున్నావంటే నాకు ఆశ్చర్యమే. నువ్వు డే కేర్లలో, నానీల చేతుల మీదే పెరిగావా” సూటిగా అడిగాడు సింథియాను.
సింథియాకు అది చాలా పెద్ద నేరంగా అనిపించింది.
“నేనెలాగ పెరిగానో అది అప్రస్థుతం. నేనెలా బ్రతికానో అది ముఖ్యం. నా చుట్టూ ఉన్న సర్కిల్ హై క్లాస్ సర్కిల్. అలగా థాట్స్ తో నేనెప్పుడూ బ్రతకలేదు” అని ఠపీ మని చెప్పింది సింథియా.
“హ్ము.. హై క్లాస్ … థాంక్ గాడ్ … ఏది ఏమయినా విడాకులు ఇవ్వడానికి అంగీకరించేసింది. పిల్లో పిల్లడో కలగకపోవడమే మంచి పనయింది. లేకపోతే విడాకులివ్వననేది … ఇంట్లో పనివాడు మిస్ అయితే ఎలాగ???” అని స్వగతంలో అనుకొని రికార్డ్ చేసిన ఆమె మాటల్ని జాగ్రత్తపరిచాడు.

ఆవేశంతో అయినా మొదటిసారిగా మనసు విప్పి మాట్లాడింది సింథియా. లేకపోతే తానెప్పుడుమనసారా మాట్లాడింది, నవ్విందీ, చెప్పిందీ? తానేమాట్లాడినా, చేసినా నాకు అందులో కృత్రిమం మే కనబడింది. సింథియా… నీ స్నేహాలు నిన్నెప్పుడూ నిన్ను సహజంగా ఆలోచించనియ్యలేదు, సహజం గా ఉండనివ్వలేదు. యు మిస్సుడ్ థ బోట్ ఇన్ లైఫ్. ఐ పిటీ యు, గాడ్ బ్లెస్ యు. గుడ్ బై”… అఖరుసారిగా అనుకున్నాడు రాకేష్. (సశేషం)

శుభోదయం

రచన: డి.కామేశ్వరి

ఆమె మాటలకి మాధవ్ కూడా కాస్త విచలితుడయ్యాడు. అంతలోనే పౌరుషంగా “నాకెవరి సహాయం అక్కరలేదు” బింకంగా అన్నాడు.
“నీకక్కరలేదు. కాని రేఖకి కావాలి” లోపల్నించి రాధాదేవి గొంతు గుర్తుపట్టిన రేఖ ఒక్క ఉదుటున పక్కమీద నుంచి లేచి వచ్చి రాధాదేవిని కౌగలించుకుని “ఆంటీ” అని బావురుమంది. ఈ హడావిడికి శారద కూడా లోపల్నించి వచ్చి “అక్కయ్యా, ఎంత పని జరిగిందో చూశావా? నీలాగే అయింది దాని బతుకూ, నిన్ను పెట్టిన ఉసురు మాకు కొట్టింది చూశావా” అంటూ రాధాదేవిని పట్టుకుని ఏడ్చింది.
“ఏమిటీ ఏడుపులు రోడ్డు మీద, లోపలికెళ్లండి” మాధవ్ కసిరాడు.
“ష్.. రేఖా.. ఏమిటమ్మా! ఏం జరిగిందని యీ ఏడుపు, శారదా నీకసలు బుద్ధి లేదు. పిల్లకి ధైర్యం చెప్పాల్సింది పోయి నీవే యిలా అంటావేమిటి?” యిద్దర్నీ మందలిస్తూ లోపలి గదిలోకి నడిపించుకు వెళ్ళింది. మాధవ్ ఈసారి రాధని కర్కశంగా వెళ్ళిపో అని నిందించలేక, ఆవేదనగా కళ్ళు మూసుకుని అలా వుండిపోయాడు.
“రేఖా! నీకు చెప్పిందంతా మర్చిపోయావా? ఆ విషయం మరిచిపొమ్మని చెప్పానా.. యింతపని చేస్తావా యీ విషయానికి..”
“ఇంకా ఏం జరగాలి ఆంటీ ? శ్యామ్ ని హేళన చేసినందుకు, శ్యామ్ లాంటివాడిని నేనూ కంటాను. పెళ్ళి కాని తల్లినవుతాను. అందరూ నవ్వుతారు. ఆంటీ.. నా గర్వానికి దేముడు ఇలా శిక్షించాడు..” మళ్లీ ఏడవడం ఆరంభించింది రేఖ.
“ష్.. రేఖా, నీవిలా ఏడిస్తే నేను వెళ్ళిపోతాను. నీవిలా బాధపడితే నాకు చాలా కోపం వస్తుంది. రేఖా, చూడు.. నావంక చూసి ముందా కళ్లు తుడుచుకో” అంటూ పమిటకొంగుతో కళ్లు వత్తింది.
“నా కూతురి బతుకు అన్యాయం అయిపోయింది. యింక దాన్ని ఎవరు పెళ్ళాడతాడక్కయ్యా” శారద ఏడ్చింది.
“శారదా.. నీవింక ఒక్క మాట మాట్లాడకు. నీవే అసలు రేఖకి పిరికిమందు పోస్తున్నావు” గదమాయించింది.
వాళ్ల మాటలు వింటున్న మాధవ్‌కి రాధాదేవిని వదలుకుని తనెంత పొరపాటు చేశాడో మరోసారి బాగా తెలిసివచ్చింది. గత యిరవయ్యేళ్ళలో రాధాదేవిని వదిలి తనెంత నష్టపోయాడో ఎన్ని వందలసార్లో తెలిసింది. రాధాదేవి అందం, రాధాదేవి మంచితనం, రాధాదేవి సంస్కారంతో.. ప్రతిదానికి శారదని పోల్చి చూసుకుని ప్రతిక్షణం తను కోల్పోయినదాని విలువ గ్రహించి బాధపడ్డాడు. దేని విలువా దగ్గిర వుండగా తెలియదు. రాధాదేవి వెళ్లాక, శారదని పెళ్లి చేసుకున్నాక, ఆ అమాయకురాలితో కాపురం నిప్పులమీద నడకలాగే వుండి ప్రతి చిన్నపని, పెద్ద పని, ఆడపని, మగపని అన్నీ చేసుకుని సంసారం నడుపుకుంటున్నప్పుడల్లా రాధాదేవి గుర్తువచ్చేది. పిల్లలు తల్లి ఆసరా లేకుండా పెరిగారు. ఈరోజు.. రాధాదేవి రేఖని ఓదార్చి కన్నతల్లిలా బుజ్జగిస్తుంటే.. పిల్లలకి కావలసింది యిలాంటి తల్లి, తనకి కావల్సింది యిలాంటి భార్య అనిపించింది. యిలాంటి భార్యని చేతులారా దూరం చేసుకున్న తనకీ శిక్ష సరి అయినదే. ఆలోచిస్తూ కుమిలిపోయాడు మాధవ్.
“రేఖా.. చూడమ్మా. మనకి అక్కరలేదనుకుంటే గర్భం తీయించుకోవడం మూడు నిమిషాల పని. ఎబార్షన్ లీగలైజ్ అయింది. అందులో ఇలాంటి పరిస్థితిలో అసలు అభ్యంతరం లేదు. రేఖా! దీనికోసం ఇంత బెంగపడ్డావా?”
“కాని యింక పెళ్లవుతుందా అక్కయ్యా? యిప్పటికే వూరూవాడా తెలిసింది.” దైన్యంగా అంది శారద.
“శారదా.. జీవితానికి పెళ్లి ముఖ్యమే కాని, పెళ్ళి లేకపోతే జీవితం లేదనుకోవడం వెర్రి. అసలు రేఖకి ఆ బాధ లేదు. నేను పెళ్ళీకొడుకుని వెతికాను. మీకిష్టం అయితే ఆ పెళ్లి రేపే జరుగుతుంది.
రేఖ, శారద ఆశ్చర్యంగా చూశారు. వింటున్న మాధవ్ అంతకంటే తెల్లబోయాడు. రేఖని. యింత జరిగాక పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చిన ఆ ఔదార్యవంతుడెవరు? .. నిజంగా అతనే అభ్యంతరం లేకుండా ఎలా చేసుకుంటాడు? ఒకదాని తరువాత ఒకటిగా జరిగిన సంఘటనలు అతని మతి పోగొట్టాయి. ముందు అబార్షన్ చేయించాలి. రేఖ విషం మింగి చావు బతుకుల మధ్య ఊగిసలాడి ఒక్కరోజులో గుర్తుపట్టలేనంత బలహీనంగా అయింది. డాక్టరు ముందు కాస్త కోలుకున్నాక అబార్షన్ చేస్తాం అన్నారు. వర్రీ అవడానికి ఏం లేదని అందరు డాక్టర్లు ధైర్యం చెప్పారు. ముందు అబార్షన్ చేయించి, రేఖని బాగా చదివించాలి. ఉద్యొగం చేయించాలి. పెళ్ళి అంత సుళువుగా అవదని అతనికి తెలుసు. ఈ దేశంలో మానం పోగొట్టుకుని , గర్భం వచ్చిన స్త్రీకి అంత సుళువుగా పెళ్లి జరగదని తెలుసు. ఏమో, ఎప్పుడో, కొన్నేళ్ళు పోయాక, ఏ ఉద్యోగమో చేసుకుంటుండగా ఎవరన్నా కోరి చేసుకుంటే చేసుకోవచ్చు. యిప్పుడు, ఈ జరిగింది అందరి మనసుల్లో వుండగా రేఖకి పెళ్లి కావడం దుర్లభం. పెళ్ళిమాట మరిచిపోయి రేఖని బాగా చదివించాలి అని గుండె దిటవు చేసుకున్నాడు. ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా రాధాదేవిని తను ఎంత నిర్దయంగా దూరం చేశాడో, భార్యని తాకడానికి కూడా యిష్టపడకుండా ఎంత నిరాదరణ చూపాడో… అన్నీ గుర్తు వచ్చి గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్లుండేది. పెళ్ళి చేసుకున్న భార్యతో సంసారం చేయడానికే తనకిష్టం లేకపోయినప్పుడు ముందుకు వచ్చి తన కూతుర్ని చేసుకునేవాడెవడు? రాధ బాధ, ఆవేదన అర్ధం అయి రేఖకి జరిగిన దానికంటే గతంలో తను రాధకి చేసిన అన్యాయం గుర్తువచ్చి మనిషి కృంగిపోయి కృశించి పోయాడు. ఇంత జరిగినా, పోలీసు కంప్లయింట్ యిచ్చి ఆమె పరువుని రోడ్డుకెక్కించి అవమానించినా, తన కూతుర్ని అభిమానించి, ఓదార్చి, ధైర్యం చెప్పి పెళ్లి సంబంధం తీసుకొచ్చిన రాధ మంచితనం అతని గుండెని కోసింది. అతనికి తెలియకుండానే కుతూహలంగా లేచి గుమ్మం దగ్గిరకి వచ్చి నిల్చుని ఆరాటంగా చూశాడు.
“నిజమా అక్కయ్యా! ఎవరక్కయ్యా అతను?” శారద ఆనందంగా అడిగింది. రేఖ విభ్రాంతురాలై చూడసాగింది.
“రేఖా.. నీకిష్టమయితే .. మాధవ్.. మీ అందరి కిష్టం అయితే మా శ్యామ్ రేఖని చేసుకుంటాడు” రాధాదేవి అందరి మొహాల వంక చూస్తూ అంది.
ఒక్క నిముషం అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఫేను తిరుగుతున్న చప్పుడు తప్ప ఏమీ వినపడలేదు. అందరిలోకి ముందుగా తేరుకున్నది మాధవరావే.
“శ్యామ్.. శ్యామ్ తో పెళ్లా? వీల్లేదు. నేను వప్పుకోను. రేఖకి పెళ్లికాకపోయినా ఫరవాలేదు.. కాని.. కాని.. ఎవడో రౌడీకి పుట్టినవాడికి.. ఆ నల్లవాడికి నా కూతుర్నీయను” ఆవేశంగా అన్నాడు.
రాధాదేవి మొహం ఎర్రబడింది. అయినా రేఖ కోసం ఆవేశం అణచుకుంది. “మాధవ్! శ్యామ్ నా కొడుకు. వాడిని ఒక్కమాట ఏదన్నా అంటే వూరుకోను. ఇంత జరిగినా నీకింకా ఉచితానుచితాలు తెలుసుకునే జ్ఞానం రాలేదంటే విచారంగా ఉంది. కాని.. రేఖకి జరిగింది మరిచిపోయావా?… కట్టుకున్న పెళ్ళానికి శీలభంగం కల్గిందని వదిలేసిన నీలాంటి పుణ్యపురుషుడున్న దేశం యిది. అలాంటిది శీలం పోయిన ఆడదాన్ని కట్టుకోవడానికి ముందుకొచ్చే మగాళ్లు వెయ్యికి ఒకరన్నా ఉండరేమో. నిన్ను నీవే అడిగి చూడు. చాటుమటుగా ఎన్నెన్ని చెయ్యచ్చు? బయటపడనంతవరకు అందరూ పవిత్రులే. కాని, తెలిసి తెలిసి బట్టబయలై నలుగురినోట పడిన ఓ ఆడపిల్లని పెళ్ళాడడానికి వచ్చే ఉదారులు ఎవరు? ఈ సంగతి ఆలోచించు”
“అంటే నీ కొడుకు ఉదారుడన్నమాట. నీవు త్యాగం చేసి అనన్ను ఉద్ధరించి , నీ త్యాగనిరతి లోకానికి చెప్పాలనుకున్నావన్నమాట” అతనిలో తిరిగి పాత అహం తలెత్తింది. తీరా అన్నాక అంత కటువుగా మాట్లాడకపోవల్సింది అనిపించింది అతనికి.
రాధాదేవి అతనివంక తిరస్కారంగా చూసింది. “మాధవ్! నీవు నిజంగా తండ్రివయితే, ఆమె మేలు కోరేవాడవయితే.. ఈ వచ్చిన అవకాశాన్ని ఆనందంగా ఉపయోగించుకుని నాకు కృతజ్ఞత చూపేవాడివి. నేను చేస్తున్నది త్యాగమనుకున్నావు కనక నన్నభినందించు. నేను చేసేది ఏమయినా శ్యామ్ ని మాత్రం నీవు సంస్కారవంతుడిగా అంగీకరించక తప్పదు. ఎవరికి పుట్టినా, ఎలా పుట్టినా శ్యామ్ సంస్కారాలున్నవాడు కాబట్టే ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి తనకు చాతనయినంతగా న్యాయం చేకూర్చాలనే తపనతో ఆమెని చేపట్టి మానవత్వం నిరూపించడానికి వప్పుకున్నాడు. నీలా గొప్ప తండ్రికి పుట్టలేదు. గొప్ప కులస్థుడికి పుట్టలేదు. కాని నీ కన్నా గొప్ప గుణం వుంది అని గర్వంగా చెప్పగలను. మాధవ్ , నీవేమనుకున్నా సరే. .మేం చేసేది త్యాగం అనుకోలేదు. ఎవరో ఏదో చేసిన నేరానికి రేఖ బలి అవడం నాకిష్టం లేక, ఓ ఆడపిల్ల జీవితం చక్కపరచాలని ఈ నిర్ణయానికి వచ్చాం. ఆమోదించేది, మానేది మీ ఇష్టం. రేఖా. నీవూ ఆలోచించుకో. పరిస్థితి విడమరిచి చెప్పాను. నీవు కోల్పోయిన మనశ్శాంతి దొరకాలంటే.. నీ జీవితానికో భద్రత వుందని నీవు నమ్మాలి. నీవూ అందరి స్త్రీలలాగే భర్తతో సుఖంగా వుండగలవని, తల్లివవగలవని నమ్మకం కల్గించడానికి శ్యామ్ నీకు చేయూత యివ్వడానికి సిద్ధంగా వున్నాడు. ఆ చేయి అందుకునేది మానేది నీ యిష్టం. ఎవరి యిష్టాయిష్టాలకి నీ జీవితాన్ని బలిపెట్టకు. నీవు మరీ చిన్నపిల్లవి కావు. మైనారిటీ తీరినదానివి..”
“రాధా.. నా కూతురికి యివన్నీ నేర్పి పెట్టి నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు. దానికిప్పుడు పెళ్ళి తొందరలేదు. నీ సహాయానికి థాంక్స్. పెళ్లి అవసరం అనుకున్నప్పుడు నా కూతురికింకెవరూ మొగుడు దొరకనప్పుడు వస్తాంలే..”హేళనగా అన్నాడు.
రాధాదేవి సహనం ఆఖరి మెట్టుకు వచ్చింది. “అప్పుడు నా కొడుకు నీకందే స్థితిలో వుండదు మాధవ్. శ్యామ్ కి తెలుసు మీరిలా మాట్లాడి అవమానపరుస్తారని. అందుకే వెళ్లవద్దన్నాడు. రేఖకోసం వచ్చాను. వస్తాను రేఖా.. నీకీ ఆంటీతో ఏ అవసరం వున్నా నిరభ్యంతరంగా రా అమ్మా…”
“ఆగండి ఆంటీ.. నేను శ్యామ్ ని చేసుకుంటాను. నా కిష్టమే. నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చిన శ్యామ్ ఔదార్యం నాకర్ధం అయ్యింది. శ్యాంలాంటి భర్త, తల్లిలాంటి మీ నీడ దొరకడం అదృష్టం అనుకుంటాను” రేఖ స్థిరంగా అంది.
“రేఖా!… “మాధవ్ ఏదో అనబోయాడు.
“డాడీ! నన్ను నా యిష్టానికి వదిలేయంది. నేను చిన్నపిల్లని కాను. ఆలోచించే శక్తి వుంది. డాడీ.. ఈ పరిసరాలలో నేనింక వుండలేను. ఆంటీ. శ్యామ్ లాంటి ప్రేమమూర్తులుండే చోట వుండాలని వుంది. నన్ను క్షమించండి డాడీ” రేఖ గద్గదంగా అంది.
మాధవ్ మొహం నల్లబడింది.
“అక్కయ్యా! రేఖ శ్యామ్ ని చేసుకోవడం నాకిష్టమే. కాని.. కాని.. వాళ్లిద్దరూ అన్నాచెల్లెల్లవరూ.. “శారదకామత్రం తెలివితేటలున్నందుకు ఆనందమే కలిగింది.
“ఎలా అవుతారు శారదా? ఒక తల్లికి పుట్టలేదు. ఒక తండ్రికీ పుట్టలేదు. ఆ అనుమానం వద్దు నీకు. పిచ్చిదానివనుకున్నా పరిస్థితి అర్ధం చేసుకొన్నావు గాని, అతి తెలివితేటలున్న నీ భర్త ఆలోచన మారనందుకు విచారంగా వుంది” మాధవ్ వంక చూస్తూ అంది రాధాదేవి. మొహం మాడ్చుకున్నాడు మాధవ్.
“రేఖా.. శ్యాం, నీవు ఒకసారి కలిసి మాట్లాడుకోండి. మీ యిద్దరూ యిష్టపడి చేసుకుంటే ఎవరూ చెయగలిగింది ఏమీ లేదు” మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు.
“రాధా… ఆఖరికి గెల్చావు. నా మీద కసి తీర్చుకున్నావు” అంటూ అక్కడినుంచి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు దభాలున.
“మాధవ్.. ఎప్పటికన్నా నీవు నన్నర్ధం చేసుకునే రోజువ్ అస్తుంది” అంది బాధగా రాధాదేవి.
“ఆంటీ.. బాధపడకండి. నేను డాడీకి చెపుతాను. ఆయనకు మతిపోయింది” అంది రేఖ.
“అక్కయ్యా.. నీవెంత మంచిదానివి? నీ భర్తని నాకిచ్చావు. నీ కొడుకుని నా కూతురికిచ్చావు” అంటూ శారద అమాయకంగా రాధాదేవిని కౌగలించుకుని అంది.

********

“ఏమిటి రాధా.. పేపరు పట్టుకుని అలా కూర్చున్నావు?” పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న రాధాదేవి స్కూటరు ఆపి లోపలికి వచ్చిన రాజారాంని కూడా గమనించకపోవడఃతో రెండు నిముషాలు చూసి అతనే పలకరించాడు. రాధాదేవి ఉలిక్కిపడి తేరుకుని పేపరు మడిచి దీర్ఘంగా నిట్టూర్చి “రా కూర్చో.. ఏముంది. ఎక్కడ చూసినా ఆడవాళ్లకి జరిగే అన్యాయాలే. పేపరు తెరిస్తే చాలు.. మానభంగాలు, కట్నాలు తేలేదని భర్త, అత్తగారు హింసిస్తే భరించలేక ఆత్మహత్యలు చేసుకునే ఆడపిల్లలు. కనీసం ఒక రేప్‌కేసైనా లేని రోజుండదు పేపరులో. ఏమిటో రాను రాను మనం పురోగమిస్తున్నామో, తిరోగమిస్తున్నామో అర్ధం కావడం లేదు. స్త్రీ చదువుకుంది, ఉద్యోగాలు చేస్తుంది. యీ ఆధునిక యుగంలో కూడా స్త్రీని కించపరిచే సంఘటనలు రోజుకు ఇన్ని కబుర్లు అన్నీ కాగితాలమీదనేనా? స్త్రీకి ఈనాటికీ రక్షణలేని మన సమాజం సాధించిన ప్రగతి ఏమిటి?” ఆవేశంగా, ఆవేదనగా అంది రాధాదేవి.
“రాధా! నీ పిచ్చిగాని యీ స్త్రీ, పురుష రెండు తెగలు వున్నంతవరకు ఇలాంటివి తప్పవు. ఏ చట్టాలూ ఏమీ చెయ్యలేవు. అయినా యివన్నీ చదివి మనసెందుకు పాడు చేసుకుంటావు? బాధపడి నీవేం చెయ్యగలవు? నీ చేతిలో వున్నది నీవు చేసావూ. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా సహృదయంతో ఆమెని కోడలిగా తెచ్చుకునే ఏర్పాటు చేశావు. ఈ లోకంలో అందరికీ మనం సాయపడలేం గదా”
“అవుననుకో.. కానీ యీ వార్తలు చదువుతుంటే ఆవేశం వస్తుంది. ఏదో చెయ్యాలన్న ఆరాటం కలుగుతుంది. పాపం మరీ చదువు సంధ్యలు లేని తక్కువ కులాల స్త్రీలు బలి అవుతున్నారు. రోజుకి ఎన్ని కేసులు జరుగుతున్నాయో పల్లెలనిండా, ఆ స్త్రీల గోడు వినిపించుకునే వారెవరు? న్యాయం చేకూర్చవలసిన పోలీసులే, రక్షించవలసినవారే భక్షిస్తున్నారు. కంచె చేను మేసినట్లు పోలీసులే యిళ్ళల్లో జొరపడి పబ్లిక్‌గా ఆడవాళ్లమీద అత్యాచారాలు చేస్తుంటే ఇంక ఆ స్త్రీలకి రక్షణ ఎక్కడుంది? చెప్పినా వారి గోడు వినేవారు లేరు. న్యాయంకోసం పోరాడడానికి అర్ధబలం, అంగబలం రెండూ లేనివారికి దిక్కెవరు?
యిలా ఇద్దరి మధ్య చాలా సేపు ఈ విషయం మీదే చర్చ జరిగింది.
“రాధా! నీది ఉత్తి ఆవేశం కాదని రేఖని నీ కోడలిగా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాప్పుడే అర్ధం అయింది. ప్రతీ ఆడది నీలాగే ఆలోచిస్తే మీ ఆడవాళ్ల కథలు మారేవి. నీవు పురుషులనే ఎందుకు నిందిస్తావు? శీలం పోయిన స్త్రీని కోడలిగా అంగీకరించే స్త్రీలు ఎంతమంది ఉన్నారు చెప్పు? నీలా ఆలోచించే స్త్రీలు నూటికి ఒకరన్నా నీలా వుంటే, మరుతరంలోనే కాదు. యీ తరంలోనే స్త్రీల చీకటి జీవితాలకి “శుభోదయం” కలుగుతుంది. ఆ .. యింక ఈ ఉపన్యాసాలు చాలుగాని చూడు, శుభలేఖలకి ఈ కార్డులు నచ్చాయేమో చూడు ఆర్డరిస్తా..” అన్నాడు.
“రాజారాం. నీక్ నచ్చితే నన్ను వేరే అడగాలా? పిల్లవాడి మేనమామవి. నీదే పెద్దరికం. నీవెలా చెపితే అలా చేస్తాను” రాధాదేవి రాజారాంని చూస్తూ తృప్తిగా అంది.
నెల తరువాత శ్యాం, రేఖల వివాహం జరిగింది. ఉదయం రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేశారు. సాయంత్రం రిసెప్షన్. ఊర్లో చాలామంది మిత్రులు వచ్చారు. ఇదేదో ఆదర్శవివాహం అని చూడడానికి కొందరు కుతూహలంగా వచ్చారు.
“నిజంగా మీది చాల పెద్ద మనసండి. నిజంగా మీరు సహృదయులు. తప్పకుండా అభినందించాలి” అని కొందరు ఆమెని పొగుడుతుంటె..
“ఎందుకండి మధ్య నాకు అభినందన. చక్కటి భార్యని తెచ్చుకున్నందుకు మా అబ్బాయిని అభినందించండి” అంటూ రేఖ భుజం చుట్టూ చెయ్యి వేసి వారి మాటల కర్ధాన్ని మళ్లించింది.
మాధవరావు ఆఖరికి రేఖ పెళ్ళికి మనస్ఫూర్తిగా అంగీకరించక తప్పలేదు. రేఖ ఏమయినా సరే చేసుకుంటానంది. శారద కూడా ఎంతో నచ్చచెప్పింది. కోపం తగ్గాక పది రోజులు రాత్రింబగల్లు ఆలోచించాక తన అహం చంపుకుని శ్యాంని అంగీకరించడం మినహా గత్యంతరం లేదని తెలుసుకున్నాడు. రేఖకి అబార్షనయింది. ఆమె పూర్తిగా కోలుకున్నాక నెలా యిరవై రోజుల తర్వాత పెళ్లి నిర్ణయించారు. ఈ పెళ్లిలో మాధవరావు మనస్ఫూర్తిగా పాల్గొనేటట్టు చెయ్యడానికి రాధాదేవి అనేకసార్లు కలిసి మాట్లాడి వొప్పించింది. రేఖ ఆమెపట్ల కృతజ్ఞత చూపుతూ పదే పదే ఆ మాట అంటుంటే రాధాదేవి ఆమెని మందలించింది. “రేఖా.. శ్యామ్ పట్ల నీకుండాల్సింది ప్రేమగాని, కృతజ్ఞత కాదు. నా పట్ల వుండాల్సింది గౌరవం అభిమానం కాని కృతజ్ఞత కాదు. నీవు మరోసారి అలా మాట్లాడి నిన్ను నువ్వు కించపరుచుకోకు” అని మందలించింది. రాధాదేవి మాటలు విన్నాక మాధవరావు ఆమె సహృదయతని మనసులో అంగీకరించక తప్పలేదు.
రిసెప్షన్ అయి.. అందరూ యింటికి వచ్చి కూర్చున్నారు. “అమ్మా .. నీకు ఓ మంచి శుభవార్త. మంచి బహుమానం యిస్తాను. కళ్ళు మూసుకో” అన్నాదు సంతోషంగా శ్యాం.
“నీ పెళ్లికి మించిన శుభవార్త, రేఖని మించిన బహుమతి యింకేం వుందిరా..” అంటూ నవ్వుతూనే కళ్ళు మూసుకుని కుతూహలంగా చేయి చాచింది. ఆ చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు శ్యాం. “అమ్మా.. మన ప్రధానమంత్రి ఇందిరాగాంధి స్వయంగా రాసిన ఉత్తరం. యింతకంటే పెద్ద శుభవార్త యింకేం కావాలమ్మా” అన్నాడు ఆనందంగా.
రాధాదేవి కళ్ళు విప్పి సంభ్రమాశ్చర్యాలతో ఇంగ్లీషులో వున్న ఉత్తరం చదువుకుంది. స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి వారి రక్షణకు తీసుకోవాల్సిన అంశాల గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలూచించిన ఒక కొత్త న్యాయసూత్రాల బిల్లును ప్రవేశపెట్టబోతున్న విషయం తెలుసుకుని ఎంతో సంతోషించింది.రాధాదేవిని అభినందిస్తూ రాసిన ఆ లేఖని ఆనందంగా చదువుకుంది. చదివినప్పుడల్లా కళ్లు చెమ్మగిల్లేవి. ఆ నీటిపొరల మధ్య “శుభోదయం”లో మెరిసే తొలికిరణాలు తళుక్కుమనేవి..

సమాప్తం..

మాయానగరం – 35

రచన: భువనచంద్ర

“వాన్ని గమనించాను వెంకటస్వామి… నిస్సందేహంగా వాడు పరమశివమే! అయితే వాడు ఇటువైపు రాలేదు. వెనక వైపు నుండి వచ్చి మా పెరట్లోకి దూకాడు. యాక్ట్యువల్ గా ఇవాళ నాకు ఆఫ్. అయినా ఓ చిన్నవిషయం వల్ల ఆఫీస్ కు వస్తూ వాడ్ని చూశాను. వాడి కథంతా మహదేవన్ గారు నాకు చెప్పారు. వాడెంత క్రూరుడో కూడా చెప్పారు. నువ్వే ఎందుకో నాతో చెప్పడానికి సందేహించావు. వాడేదో క్రూరత్వమైన ఆలోచనలతోటే ఇక్కడికొచ్చాడు. బహుశా వాడొచ్చాడని మీకు తెలియడానికే నా ముందు పక్షవాతం వచ్చినవాడిలాగా కాలు యీడ్చుకుంటూ అటు ఇటు తిరిగాడు. కానీ, నిన్న వాడ్ని నేను చూశానని వాడికి తెలీదు. వాడి వెనుక నేనున్నాను. చాలా చలాకీగా నడుస్తున్నాడు. గోడ కూడా ఎక్స్ పర్ట్ గా దూకాడు. మహదేవన్ గారు చాలా భయపడుతున్నారు… వీడి వల్ల ఏం ముప్పు వస్తుందో ఏమో! ” వెంకటస్వామితో వివరంగా అన్నాడు వాచ్‌మన్! వెంకటస్వామి గుండెల్లో రాయిపడింది. అసలే పాము… దాని తోకని తొక్కడం జరిగింది… ఖచ్చితంగా దాని పగ రెట్టింపుకి రెట్టింపై వుంటుంది.
“థాంక్స్ అన్నా.. నీ దగ్గర కొన్ని విషయాలు దాచిన మాట వాస్తవమే…కారణం పరమశివానికి నేను నందినిని ప్రేమిస్తున్నాననే అపోహ వుంది. వాడు అసలే శాడిష్టు. ” అంటూ నందినిని లేపుకుపోద్దామన్న తన ఆలోచన తప్ప మిగతా విషయాలన్నీ, అంటే పరమశివం తన మీద చూపించిన శాడిజంతో సహా అన్నీ విషయాలు పూస గుచ్చినట్టు వాచ్‌మన్ తో చెప్పాడు వెంటస్వామి.
వాచ్‌మన్ అవాక్కై విన్నాడు.
“ఇవన్నీ పోలీసులకి చెప్పి వాడిని పట్టి ఇవ్వచ్చుగా?” అన్నాడు అంతా విని.
“ఆధారాలేవీ? వాడు రాసుకున్న డైరీలో పేజీలున్నాయి. అది రాసింది నేను కాదనొచ్చు. పోనీ అందులో ఏం రాశాడో మహదేవన్ చదివి పోలీసులకి చెప్పినా , పోలీసులు కన్ఫర్మేషన్ కోసం , జరిగినదల్లా ఎంక్వైరీ చెయ్యాలి. అంటే కేరళ పోలీసులని సంప్రదించాలి. రెండు రాష్ట్రాల మధ్య సంగతది. ఎప్పటికి తేలుతుంది? అదీ గాక, తండ్రి దగ్గుతూ వూపిరాడకుండా చనిపోతుంటే కామ్ గా వున్నాడే కానీ , తండ్రిని హత్య చేసి చంపలేదుగా?
అదేమంటే “నా తండ్రి అంటే నాకు ఇష్టం లేదు, అందుకే గమ్మునున్నా” నంటాడు. దానికి పోలీసులేం చెయ్యలేరుగా. ఇన్ని చాకులు, కట్టర్లు, కట్టింగ్ ప్లేయర్లు ఉండటం తప్పేమీ కాదుగా? “నేను వంటవాడిని కనుక అవన్నీ నాకు అవసరానికి పనికొచ్చేవే ” అంటాడు. కాదని ఎవడనగలడు? లేదన్నా… వాడు శాడిష్టే కాదు. భయంకరమైన క్రిమినల్. ఏం చేసినా, ఎలా చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాల్సిందే కానీ , ఏమాత్రం చిన్న ఆధారాన్ని వదిలి పెట్టినా వాడి కాటుకి బలైపోతాము. ” అన్నాడు వెంకటస్వామి.
టీ మీద టీ తాగుతూ వాళ్ళిద్దరు ఓ టీ స్టాల్ ముందు మాట్లాడుకోవడం ఇద్దరు గమనించారు. ఒకడు పరమశివం. రెండోది నవనీతం.
పరమశివానికి తెలుసు… వాచ్‌మన్ ఖచ్చితంగా వెంకటస్వామితో చెబుతాడని. చెప్పాలనే పరమశివం కోరిక కూడా! ‘వేట’ మజాగా సాగాలంటే పులి దగ్గరలోనే వుందని జింకలకి తెలియాలి. కొట్టుకి కొంచం దూరం నుంచి వస్తున్న నవనీతానికి వెంకటస్వామి కనిపించాడు. ఆవిడకు కొండంత ఆనందం కలిగి అతనివైపు గబగబా అడుగులేసింది. ప్రాణదాతాయే పలకరించకపోతే ఎలా?
సడన్ గా ఆగిపోయింది. కారణం వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న పరమశివాన్ని చూడటమే!
వీడే కదూ తన వెనక పరిగెత్తి బలాత్కారం చేయబోయిందీ! ఆవిడకు అన్నీ గుర్తున్నై! ఫాదర్ ఆల్బర్ట్ చెప్పాడు వెంకటస్వామి రక్షించి హాస్పటల్లో చేర్చాడని. ఆ తరవాత చర్చి వాళ్ళు చెప్పారు. ఆ పరమశివంగాడ్ని ఎవరో బుర్ర పగలగొట్టారని, లేకపోతే బలాత్కారానికి గురై వుండేదానివనీ.
నవనీతానికి పెద్దగా చదువు లేకపోవచ్చు. కానీ, జరిగిన సంఘటనని బట్టి పరమశివం నించి తనని రక్షించింది వెంకటస్వామి అని అర్ధం చేసుకుంది.
అతన్ని కలవబోయేది కాస్త గభాల్న వెనక్కి తిరిగి గబగబా నడుచుకుంటూ దూరం వెళ్ళిపోయింది. ఆమె విన్నంత వరకు పరమశివం నడవలేడు, మాట్లాడలేడు. కానీ ఇప్పుడు చూస్తున్న పరమశివం పర్ఫెక్ట్ గా వున్నాడు. అంటే వెంకటస్వామి మీద పగ తీర్చుకోడానికి వచ్చాడా? లేకపోతే దొంగతనంగా వెంకటస్వామిని ఎందుకు అబ్జర్వ్ చేస్తాడు? డైరెక్టుగానే కలిసి వుండేవాడుగా.
ఇప్పుడు తను వాడి కంటపడితే పాముకు పాలుపోసినట్టవుతుంది. తన ప్రాణం కాపాడిన వెంకటస్వామికి ఎలాగైనా పరమశివం వూర్లోనే వున్నాడని అబ్జర్వ్ చేస్తున్నాడనీ, తను చూశానని చెప్పాలి. కానీ, ఎడ్రస్? ఫాదర్ అల్బర్ట్ కి ఫోన్ చేస్తే?

******************

కథ ఓ క్షణం ఆపితే…
ప్రేక్షకులారా… ఈ కథాకాలం ఇప్పటిది కాకపోయినా, అతిపురాతమైనదీ కాదు. ఇవ్వాళ అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లు వున్నాయి. సెల్ ఫోన్లకి ముందు పేజర్లు వచ్చాయి. పేజర్లకి ముందు లాండ్ లైన్లు, ఎస్.టి.డి లే గతి. ఇంకా కొన్ని గ్రామాలలో ఇప్పటికీ కొన్ని బూతులున్నాయి. కారణం సెల్ ఫోన్లు కొందరికి ఇంకా అలవాటు కాకపోవడమూ అవసరం లేకపోవడమూ.
వ్యాపారస్తుల నైపుణ్యం ఎంతదంటే అవసరం లేని వాటిని అత్యంత అవసరమైనవిగా నమ్మించి , ఆ చెత్తనంతా మన చేత కొనిపించడం. ఏ ఇంటికైనా వెళ్ళి చూడండి అవసరమైనవి 5% వుంటే, అనవసరమైనవి 95% వుంటాయి. వాషింగ్ మెషీన్ వచ్చిన రోజుల్లో మధ్యతరగతి వారంతా ఆవురావురుమని కొనేశారు. ఇప్పుడు చూడండి…. అవన్నీ ఓ మూల విశ్రాంతిగా పడివుంటై. కారణం ఏమంటే , ఆ మిషన్ లో బట్టలేసి ఉతికి ఆరవేసే టైం కంటే , హాయిగా మామూలు పద్ధతిలోనే మేలని జనాలకి అర్ధం కావడమే! అదొకటే కాదు, వ్యాపారస్తుడు వ్యాపారం చెయ్యని ‘వస్తు ‘ వంటూ లోకంలో లేదు. కిడ్నీలు, కళ్ళు, గుండెలు, ఇతర అవయవాలతో సహా!

***********************
అప్పటికింకా కామన్ మాన్ చేతుల్లో సెల్ ఫోన్లు లేవు. ఎస్.టి.డి. బూతులున్నాయి. నవనీతం డైరెక్ట్ గా ఎస్.టి.డి బూత్ కి వెళ్ళింది. శంఖచక్రాపురం నంబరు ఆమెకి జ్ఞాపకమే. మూడుసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతోందే కానీ, ఎవరూ ఎత్తలేదు. నిరాశగా ఇంటిదారి పట్టింది నవనీతం. ఆమె మనసు తుఫానులో సముద్రం లాగా వుంది. కారణం తెలీనే తెలీదు. ఓ పక్క బోస్ కొట్టిన దెబ్బ. మరోపక్క సర్వనామం చేసిన ‘అత్యాచారం ‘ ఇప్పుడు మళ్ళీ యీ పరమశివాన్ని చూడటం. ఓ వెర్రిదానిలా నడుస్తూ సారా కొట్టు చేరింది. తాగటం ఆమెకేనాడు అలవాటు లేదు. కానీ, ఎందుకో ఓ గ్లాసులో సారా పోసుకొని గడగడా తాగింది. మళ్ళీ ఇంకో గ్లాసు.
అరగంట తరవాత ఆమె శరీరానికి, మనసుకీ విశ్రాంతి లభించింది. పట్టపగలే నిద్రాదేవి నవనీతాన్ని తన ఒడిలోకి తీసుకుంది
******************

కిషన్ చంద్ మనసు మనసులో లేదు. అతనెవరినీ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు ‘విస్కీ ‘ అతన్ని ఆలోచనల్నుంచి రక్షించేది. ఇప్పుడతను ఏ అలవాటుని ఆశ్రయించలేదు. ఒకే ఒక్క బాధ.
“భగవంతుడా… ఒకే ఒక్కసారి షీతల్ ని నాకు చూపించు. నన్ను చంపినా పర్వాలేదు. తనని సుఖంగా బ్రతికించు. తను లేని జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను. ప్రేమ తప్ప తనేమీ నా నించి ఆశించలేదు. అదీ ఉత్తినే కాదు… అనంతమైన ప్రేమని నాకు ఇచ్చి. దేవుడా… నిజంగా నువ్వుంటే షీతల్ ని నాకు చూపించు. ” ఒకే ప్రార్ధనని మనసులోనే అనంతంగా చేస్తున్నాడు కిషన్.
“కిషన్ ‘ అనునయంగా పిలిచాడు చమన్ లాల్. ఆయన మనసు మనసులో లేదు. వెళ్ళిపోయే ముందు షీతల్ వ్రాసిన ఉత్తరం ఆయన చదివాడు. తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం ఒక అమాయకురాలిపై పడటం అతన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఒక పక్క మూర్ఖురాలు, అహంభావి అయిన కూతురు, మరో పక్క నిశబ్ధంగా తనలో తానే కుమిలిపోతొన్న అల్లుడు, ఇంకో పక్క తెలిసి తెలియని వయసులో ఏమీ అర్ధంకాక అయోమయంగా నడుచుకుంటున్న పిల్లలు. ఏం చెయ్యాలో సేఠ్ చమన్ లాల్ కి పాలుపోవడం లేదు.

గుజరాతీలకి గుంభన ఎక్కువ. మనసులో ఏముందో ఎవరికీ తెలియనివ్వరు. ఎంత డబ్బున్నా, ఏమీ లేకపోయినా, ఒకే విధంగా ప్రవర్తించడం వారికి తెలిసినట్టు ఎవరికీ తెలీదు. కాలాన్ని ‘క్లాసుల్తో ‘ కొలవడం గుజరాతీలకి పుట్టుకతో వచ్చిన విద్య. సమయాన్ని సమర్ధవంతంగా వుపయోగించడం , అవసరమున్న వారితో మాత్రమే కాకూండా అవసరం లేనివారితో కూడా స్నేహపూరితంగా, మర్యాదగా మాట్లాడటం వారి స్వభావం. అఫ్ కోర్స్, వ్యాపారస్తుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం అదే. ఎవరితో ఎప్పుడు పని బడుతుందో ఎవరు చెప్పగలరు? అవసరంలో వున్న వారికి గడ్డిపోచ కూడా మహా వృక్షంతో సమానమే గదా!
“పితాజీ… నన్ను క్షమించండి… నేనేమి మాట్లాడను. సుందరే రైట్. నేను మనిషిని కాదు. మీ అమ్మాయికి కాపలాగా మీరు తెచ్చిన ఆల్సేషన్ డాగ్ నే. కానీ నాలోంచి ఏదో వెళ్ళిపోయింది. ఇప్పుడే ఆల్సెషన్ డాగ్ ఊరకుక్క కంటే భీరువైంది. ” సైలెంట్ అయ్యిపోయాడు కిషన్. ఏం మాట్లాడాలి? ఏమని ఓదార్చాలి? అసలిప్పుడు జరగవలసింది ఏమిటీ?
ఛమన్ లాల్ గమనిస్తూనే వున్నాడు, షీతల్ వెళ్ళిపోవడం కూడా సుందరీ బాయ్ ప్రెస్టేజ్ గా తీసుకుంది. కేవలం తనని సాధించడానికే ఆ పని చేసిందని సుందరి ఆలోచన.
అందుకే ఇంకా ఇంకా ఇంకా కిషన్ ని సాధించడం మొదలెట్టింది. ఆ “రండి ” ఎక్కడుందో నీకు తెలుసు. నువ్వే విడిగా ఎక్కడో దాన్ని కాపురం పెట్టించావు. ఎట్లాగైనా దాని గుట్టు రట్టు చెయ్యక వదల్ను. ఆఫ్ ట్రాల్ ఓ పనిమనిషిని ప్రేమించిన నువ్వూ ఓ మనిషివేనా? కుక్కవి.. ఛీ… ఇలా రకరకాలుగా కూతురు కిషన్ ని రెచ్చగొట్టడం చమన్ లాల్ చెవును దాటిపోలేదు. అయితే అతను భయపడే కారణం వేరు. ఒకవేళ కిషన్ సుందరిని చితకొట్టినా , జుత్తుపట్టుకొని చెంపలు పగలుగొట్టినా చమన్ లాల్ బాధపడేవాడు కాదు. కిషన్ మౌనశిలగా మారడమే చమన్ లాల్ కి భయకారణమైనది.
దెబ్బకి దెబ్బ … మాటకి మాటా బదులిచ్చే వారి గురించి అసలు భయపడాల్సిన పనే లేదు. భయపడాల్సింది బాధపడుతూ కూడా మౌనంగా వుండే వారి గురించి. వాళ్ళ లోపల లోపల అగ్ని పర్వతాల్లా రగిలిపోతున్నా , పైకి మాత్రం హిమాలయాల్లా వుంటారు. రగిలీ రగిలీ ఎప్పుడు క్రోధం లావాలా బయటకి విరజిమ్ముతుందో వాళ్ళకే తెలీదు. ఒక్కసారి అది చిమ్మితే ఎదుటివాళ్ళే కాదు … వాళ్ళూ నాశనమై పోతారు. కిషన్ సహజంగా ఓ ఇంట్రావర్ట్ , తనలోని భావాలను పైకి చెప్పుకునేవాడు కాదు. అంతే కాక తను బీదవాడ్ననే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అతనికి ఉంది. అందువల్లనే ఇన్నాళ్ళు సుందరి సంసారం సజావుగా సాగింది. కానీ అతని జీవితంలో షీతల్ ప్రవేశించడం అనూహ్యంగా జరిగింది. ఆకలిగొన్న వాడికి అమృతం దొరికినట్లయింది. సుందరి చూసీ చూడనట్టుంటే బహుశా కిషన్ ఇంకా ఎక్కువగా ఆమెకి కృతజ్ఞుడై వుండేవాడేమో! కానీ, ఆమె చాలా మూర్ఖంగా ప్రవర్తించడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఏమీ చెప్పలేకా, ఏమీ చెయ్యలేకా చమన్ లాల్ మెల్లగా బయట గార్డెన్ లోకి వచ్చాడు. ఆ గార్డెన్ మొదలెట్టింది సుందరి తల్లి.

***********************

“కొందరి రాక సుఖసంతోషాలను తెస్తే… మరికొందరి రాక బాధనీ నష్టాన్ని తెస్తుంది” అంటారు పెద్దలు. బిళహరి రాక, ఆ తరవాత షీతల్ రాక శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కోవెలకి ఆనందాన్నే కాదు , పేరునీ తెచ్చింది. విశాలమైన గుడి చుట్టూ వున్న స్థలం అంతా ఇప్పుడు నందనవనంలా కళకళలాడుతోంది. అరటి, జామ లాంటి ఫలాలనిచ్చే చెట్లు కూడా చల్లగా పెరుగుతున్నాయి.
చుట్టుపక్కల పిల్లల్ని చేరదీసి ‘ బిళహరి ‘ సంగీతం నేర్పుతోంది. అది చిన్నప్పటి నుంచీ తెలిసిన విద్యే. అంతే కాదు ఆమె వచ్చింది సంగీత కుటుంబం నుంచేగా.
షీతల్ వచ్చాక ఓ చిన్నపాటి చర్చ జరిగింది.
పూజారి : అమ్మా! మనకే కష్టంగా . ఇప్పుడీ హిందీ అమ్మాయికి కూడా ఆశ్రయమిస్తే గడిచేదెలాగో?
షీతల్ ; అయ్యా… నాకు నిజంగా వేరే దిక్కు లేదు. ఏ పని చెప్పినా చక్కగా చెయ్యగలను. వంటతో సహా. దయచేసి నన్ను బయటకు మాత్రం పంపకండి.

బిళహరి : అయ్యా.. చూద్దాం. నాకు సంగీతం వచ్చు. ఆమెకి వంట వచ్చు. ముందర యీ దేవాలయానికి భక్తులు రప్పించే ప్రయత్నం చేస్తే , చాలావరకు సమస్య తీరుతుంది.
పూజారి : ఎలా?
బిళహరి : ఒక వుపాయం వుందండి. కొండపల్లి గుళ్ళో ఒకరీ పద్ధతిని ప్రవేశ పెట్టారు. నెలకి వంద రూపాయిలు కడితే నాలుగు సోమవారాలో, లేక వారికిష్టం వచ్చిన నాలుగు రోజుల్లోనో వారి పేరు మీద అర్చన చేయించి ప్రసాదం ఇంటికే పంపేటట్టు. ఇది చాలా ప్రాచుర్యం పొందటమే కాదు, గుడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది. దానికి ముందుగా మనం చెయ్యవలసింది గుడి పరిసరాలనీ, గుడినీ పరిశుభ్రంగా ఉంచడం. వీలున్నన్ని పూలూ, ఫలాలు ఇచ్చే మొక్కల్ని నాటడం. ఏ ఏ రోజున ప్రత్యేక పూజలు, వ్రతాలూ, జరుగుతాయో లేక జరుపుతామో వాటి వివరాలు ప్రజలకు అందేలా చెయ్యడం.
పూజారి : చాలా మంచి ఆలోచనమ్మా. కానీ నేను పెద్దవాడ్ని, అంత శక్తి, ఓపికా నాకు లేవు.
బిళహరి : మేమిద్దరం ఉన్నాము. మీరు అనుమతిస్తే చాలు… అన్నీ మేమే చూసుకుంటాము.
అనుమతి భేషుగ్గా ఇవ్వబడింది. వారం రోజులపాటు బిళహరి, షీతల్ ఒళ్ళు హూనం చేసుకొని గుడిలోపలి ప్రదేశాన్నంతా శుభ్రం చేశారు. గడ్డిని కోశారు. చిన్న చిన్న పాదులు ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి అరటి జామ, వేప లాంటి మొక్కల్ని నాటారు. ఏనాటి బావో.. నీరు ఏనాడు ఇంకలేదు. తోడి తోడి మొక్కలకి నీళ్ళు పోస్తుంటే ఊట గంగలా ఊరుతోంది. గోంగూర, బచ్చలి కాడా, కొత్తిమీర, వంగ, బెండ, బీర, దోస, తోటకూర, లాంటి విత్తనాలు జల్లి పుష్కలంగా కూరగాయల్ని పండించే ఏర్పాటు చేసుకున్నారు. ఓ దబ్బ మొక్క, రెండు నిమ్మ మొక్కలు, ఓ రాచ ఉసిరి, ఓ ఉసిరి, ఓ బిల్వం ఇలాంటివి కూడా నాటారు.
బయట చుట్టుపక్కల కొట్ల వాళ్ల దగ్గరకి, కొంచం ధనవంతుల ఇళ్లకి బిళహరి పూజారిగారితో వెళ్ళి ‘ప్రజల వద్దకి ప్రసాదం ‘ స్కీం గురించి వివరించింది. ఆఫ్ ట్రాల్ వందే కనుక చాలామంది ముందే అడ్వాన్స్ ఇచ్చారు.
అవన్నీ చక్కగా ఓ పుస్తకంలో రాసింది. శివాలయంలో ఇచ్చేది వీభూతే. అయినా, బిళహరి అద్భుతంగా వండి పులిహోర, వడ ప్రసాదంగా మొదటి సోమవారం అందరి ఇళ్లకి, కొట్లకి లిస్ట్ ప్రకారం పంచడంతో జనాలకి సంతృప్తి కలగడమే కాక నమ్మకమూ పెరిగింది. ఇంకా చాలామంది ముందుకొచ్చారు. అప్పుడే పిల్లలకి ఆడవాళ్ళకి సంగీత పాఠాలు చెపుతానని బిళహరి చెప్పడంతో నేర్చుకోవాలన్న ఉత్సాహం వున్నవాళ్ళు చాలామంది చేరారు. ‘తోచినంత ‘ ఇమ్మందే కానీ ‘ఇంత ‘ అని ఆంక్ష పెట్టక పోవడంతో, అనుకున్నదాని కంటే ఎక్కువ మందే వచ్చారు. సంగీత క్లాసులు నిర్వహించేది కూడా గుడి మండపంలోనే కావడంతో జనాలు గుడికి రావడం ప్రారంభమయ్యింది. మొన్నటి దాకా ఒంటరిగా బిక్కు బిక్కుమంటున్న పూజారి అమరేంద్రవధానులు గారు కూడా ఇప్పుడు ఇనుమడించిన ఉద్యానవనంలో, తోటపని, గుడిపనీ కూడా చూసుకుంటున్నారు. ఆయన ఆశపడకపోయినా, హారతి పళ్ళెంలో మాత్రం దండిగా చిల్లర పడుతూనే వుంది. ఆయనకి ఒకందుకు ఆనందంగా వుంది… కనీసం చక్కని నైవేద్యాలు దేవుడికి సమర్పించగలుగుతున్నందుకు.

ఇంకా వుంది..

శుభోదయం

రచన: డి.కామేశ్వరి

“ఆత్మహత్యా.. ఆత్మహత్యకి తలపడిందా? ఏమయింది, ఎలా వుంది?… అసలేం జరిగింది?” అప్రతిభురాలై అడిగింది.
“అమ్మా.. రేఖ టిక్ ట్వంటీ తాగిందట. ఎంతోసేపటికిగాని ఎవరూ చూడలేడుట. చూసి తీస్కొచ్చి ఆస్పత్రిలో జాయిన్ చేశారట. డాక్టర్లు చాలా ప్రయత్నించాక ఆఖరికి ప్రమాదం గడిచిందంటున్నారు.”
“ఏం జరిగింది? ఎందుకింతపని చేసింది?” తెల్లపోతూ అంది.
శ్యాం తల దించుకున్నాడు. “అమ్మా.. రేఖ.. ప్రెగ్నంట్ అయిందని, అందుకని… సిగ్గుతో, భయంతో ఆ పని చేసిందని అనుకుంటున్నారు. రేఖ ఫ్రెండు .. వాళ్ల ఎదురింట్లో వుండే సునీత చెప్పింది. డాక్టరుకి రేఖ నాన్నగారు చెప్పారుట.”
“మైగాడ్.. ఏదో ఆ గొడవ అంతటితో సమసిపోయిందనుకున్నాను. ఆఖరికిది జరిగిందన్నమాట. రేఖ.. పాపం గాభరాపడి, ఏం చెయ్యాలో దిక్కుతోచక, యీ పనికి తలపడిందేమో? ఎంత తొందరపడింది? ఈ రోజుల్లో.. ఎబార్షన్ లీగలైజ్ అయిన రోజుల్లో యింత గాభరాపడవలసింది ఏముందని ఇలా చేసింది?”
“వాళ్లమ్మే అసలు గాభరా పెట్టి ఏడ్చిందటమ్మా. దాంతో రేఖ భయపడి ఏడ్చిందట నిన్నంతా. యివాళ ఆఖరికిలా చేసిందట.”
” ఆ శారద తెలివితక్కువతనం రేఖని నాశనం చేస్తుంది. శారద అమాయకురాలు. కాని ఆ తండ్రి ఏం చేస్తున్నాడుట. అతనేనా చెప్పవద్దా?”
“లేదమ్మా.. ఆయనకు తెలిసినట్టులేదు. ఆ తల్లి గాభరాపడి ఏడ్చి.. నేనేం చెయ్యనే తల్లీ ఆ రాధకి ఇలాగే జరిగిందే అమ్మా.. అయ్యయ్యో.. అంటూ ఏడ్చి గాభరా పెట్టిందంటుంది సునీత.”
ఆ మాట వినగానే రాధాదేవి మొహం నల్లబడింది. హు.. తన దురదృష్టం రేఖకి అంటకూడదు. రేఖని కాపాడాలి. మాధవ్ ఏమన్నా సరే.. రేఖని ఓదార్చి తను చెయ్యగలిగింది చెయ్యాలి.
తనేం చెయ్యాలి? .. ఏం చెయ్యగలదు? ఆ రోజంతా ఆలోచించింది రాధాదేవి..

*****

“శ్యాం.. ఒక మాట అడుగుతాను. సిన్సియర్‌గా జవాబు చెపుతావా?” ఆ రాత్రి డ్రాయింగురూములో కూర్చున్నప్పుడు శ్యాంని అడిగింది రాధాదెవి.
శ్యాం వింతగా తల్లివంక చూసి “ఏమిటమ్మా?” అన్నాడు.
రాధాదేవి మాటలకి తడుముకుంది. “శ్యాం.. రేఖ.. రేఖంటే నీకు చాలా యిష్టం కదూ. నన్ను ఓ స్నేహితురాలిగా భావించి జవాబు చెప్పు” కొడుకు మొహంలోకి నిశీతంగా చూస్తూ అంది. శ్యాం మొహం ఎర్రబడింది. తల్లివంక చూపు కలపలేక తల దించుకుని “ఎనుకమ్మా యిలా అడుగుతున్నావు?”
“కారణం వుంది శ్యాం. రేఖ అంటే నీకు యిష్టం అని, ఆమె పట్ల ఆరాధన ఉందని.. ఆమె సమక్షంలో నిన్ను చూసిన కొద్దిసార్లలోనే గ్రహించాను. యాం ఐ రైట్.. శ్యాం జవాబివ్వలేదు. తన మనసులో సంగతి తల్లి గుర్తించినందుకు సిగ్గుపడ్డాడు.
“శ్యాం! రేఖ అంటే నీకు చాలా యిష్టం. ఆ అమ్మాయి అంటే నాకూ యిష్టమే. శ్యాం, రేఖని వివాహం ఆడడానికి నీకిష్టమేనా చెప్పు” సూటిగా అడిగింది.
“శ్యాం అప్రతిభుడై చూశాడు. “అమ్మా” అన్నాడు తెల్లబోతూ. అతనిమొహంలో రంగులు మారాయి.
“ఏం శ్యాం? ఎందుకంత ఆశ్చర్య పోతావ్? ఏం? రేఖని పెళ్ళాడడానికి నీకేం అభ్యంతరం.. ఆమెకి అందం, చదువు అన్నీ ఉన్నాయి.”
“అమ్మా.. కాని.. కాని..”
“ఏమిటి కానీ. రేఖ మీద అత్యాచారం జరిగిందని అభ్యంతరమా, రేఖ శీలం కోల్పోయిందని ఆమె పట్ల నీకు ఉత్సాహం పోయిందా.. రేఖ నీకింక తగదనిపిస్తుందా?”
“అమ్మా! హర్ట్ అయ్యాడు శ్యాం. “అమ్మా, నీకు తెలుసు, ఆ కారణంగా నిరాకరించే అర్హతలు నాకు లేవని నీకు తెలుసు” బాధగా అన్నాడు.
కొడుకు మొహంలో బాధ చూసి రాధాదేవి విచలిత అయి”సారీ శ్యాం.. నీ మనసులో మాట తెలుసుకోవాలని అన్నాను. అంతేగాని నిన్ను కించపరచాలని కాదు. శ్యాం, ఫ్రాంక్‌గా చెప్పు. రేఖ వప్పుకుంటే ఆమెని వివాహం ఆడేందుకు నీకేమన్నా అభ్యంతరం వుంటుందా?
శ్యాం తడబడ్డాడు. “రేఖ.. రేఖ లాంటి అందాలరాశి భార్యగా వస్తే అదృష్టం కాదూ! కాని, కాని.. అమ్మా! నేనిష్టపడ్డా.. రేఖ .. వాళ్లు వప్పుకుంటారా?” అన్నాడు. అడగదల్చింది ఒకటైతే అడిగింది మరొకటి.
“అదంతా నేను చూసుకుంటాను. రేఖ యిష్టపడుతుందనే అనుకుంటున్నాను శ్యాం. రేఖ తల్లిదండ్రులకి చాయిస్ లేదు యింక. యింత జరిగాక రేఖకి పెళ్లికావడం మన దేశంలో అంత సులువు కాదు. తెలిసి తెలిసి ఎవరూ ముందుకు వస్తారని అనుకోను. కట్టుకున్న భార్యనే ఈ కారణంగా దూరం చేసిన మాధవ్‌లాంటి పురుషులున్న మన దేశంలో అంత త్యాగబుద్ధితో ముందుకు వచ్చి పెళ్ళి చేస్కుంటారనుకోవడం వెర్రి. ఆదర్శాలు వల్లిస్తారు. ఎవరన్నా చేస్తే అభినందిస్తారు. కాని తమదాకా వచ్చేసరికి తప్పుకుంటారు. ఆడదాని శీలానికి మనవాళ్ళిచ్చిన విలువ అంతా ఇంతా కాదు. ఆ శీలం పోగొట్టుకున్న ఆడదాన్ని ఆదుకునే నాధులు.. ఈనాటికీ లేరు. అంచేత రేఖ పెళ్లి ఒక సమస్యే అవుతుంది.”
“అందుకనా నన్ను చేసుకోమంటున్నావు? అమ్మా ఒకటి చెప్పు. రేఖకి ఇలా జరగకపోతే నన్ను చేసుకుంటుందా? నాకివ్వడానికి వాళ్ల తల్లిదండ్రులు అంగీకరించేవారంటావా?”
“శ్యాం.. రేఖ తల్లిదండ్రులు నా మీద కోపంతో అంగీకరించేవారు కాదు. రేఖ.. ఏమో, ప్రేమ గుడ్డిదన్న సూక్తి వినలేదా శ్యాం.. నీమీద యిష్టమైతే నీ రూపురేఖలని పట్టించుకోకుండా చేసుకునేదేమో? కాని .. కాని, యిప్పుడు రేఖ పరిస్థితి వేరు. ఆమె భవిష్యత్తుకు దారి య్ యించుమించు మూసుకుపోయినట్టే. అంటే బతకలేదని కాదు. కాని పెళ్లి గగనం అవుతుంది. ఆమె తండ్రి విజ్ఞుడు ఐతే నిన్నంగీకరిస్తాడు శ్యాం. రేఖకిప్పుడు కావలసింది ధైర్యం చెప్పేవారు, ప్రోత్సహించేవారు కావాలి. ఆ ఇంట్లో ఆ రెండూ కరువని నాకు తెలుసు. శారదాలాంటి తల్లి నీడన రేఖకి రక్షణ లేదు. మాధవ్‌కి ఆవేశం తప్ప ఆలోచన లేదు. సిగ్గుతో, అవమానంతో, భయంతో దిక్కుతోచక రేఖ ఈ పని చేసిందని నాకు తెలుసు. రేఖకి ధైర్యం చెప్పి “నేనున్నాను, నీకేం కాలేదు” అని ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. శ్యాం, రేఖ నా కోడలయితే ఆమె కోల్పోయిన ధైర్యాన్ని నేనిస్తాను. ఇప్పుడు ఆ ఇంటికికెళ్ళి ఏమీ చెప్పే అవకాశం మాధవ్ నాకీయడు. రేఖతో మాట్లాడటానికి యిష్టపడకపోవచ్చు. రేఖని నీవు పెళ్లి చేసుకో. ఎవరో బలత్కారం చేసినంత మాత్రాన ఆమె ఏదో కోల్పోయిందనడం అమానుషం. శీలం, పవిత్రత అంతా మనసుకి వుండాలి. ఆమె జోక్యం లేకుండా జరిగిన దానిలో ఆమె పాత్ర లేదు. ఆ కారణంగా ఓ ఆడపిల్ల వివాహానికి, మాతృత్వానికి దూరం కాకూడదు శ్యాం. నీవు ఏదో ఆదర్శంగా త్యాగం చేసున్నాని అనుకోకు. రేఖ నీకిష్టం అయితే పెళ్లాడడానికి ఏమభ్యంతరం లేదా? శ్యాం బాగా ఆలోచించుకో. అమ్మ ఏదో అందని చేసుకుని, తరువాత ఆమెని అడుగడుగునా మాటలతో చిన్నపుచ్చి హింసించకూడదు. నేననుభవించాను గనక ఆ బాధ నాకు తెలుసు. ఆమెని ఆమెగా స్వీకరించే ఔదార్యం నీకుంటే చెప్పు. నేను వెళ్ళి రేఖతో, మాధవ్‌తో మాట్లాడతాను.”
“అమ్మా.. నాకప్పుడే పెళ్ళేమిటమ్మా.. ఇరవై ఏళ్లకే. యిప్పటినుంచి చేసుకుని ఏం చేస్తాను? చదువన్నా కాలేదు.”
“శ్యాం చూడు. నాకున్నది నీవొక్కడివి. నా సంపాదన ముగ్గురికి సరిపోదంటావా, ఇద్దరం హాయిగా బతుకుతున్నాం. ఇంకొకరు మనకి బరువా శ్యాం? నీకిప్పుడు పెళ్ళి అవసరం అని కాదు. రేఖకి అవసరం. తను ఇంక మోడులా బతకాలని ఏవేవో ఊహించి మనసు పాడు చేసుకుంటున్న రేఖకి, “కాదు.. నీకేం కాలేదు. నేనున్నాను నీకు” అని దగ్గరకు తీసుకునే సహృదయుడు కావాలి. ఎప్పుడో నీ చదువయి ఉద్యోగం చేసేవరకు రేఖని అలా వదిలేస్తే యీ పిచ్చిపిచ్చి ఆలోచనలతో మనసు పాడుచేసుకుని ఆ చదువన్నా తిన్నగా చదవలేదు శ్యాం. మీ ఇద్దర్ని నా రెండు కళ్లలా చూసుకుంటాను. ఆడపిల్ల లేని లోటు రేఖతో తీర్చుకుంటాను” ఆరాటంగా అంది.
శ్యాం ఏదో ఆలోచన్లతో సతమతమవడం రాధాదేవి గుర్తించింది. “శ్యాం! ఏమిటా ఆలొచన. రేఖ నీకు తగదని అనుకుంటున్నావా? నా బలవంతంవల్ల జవాబు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నవా? శ్యాం, ఆఖరికి నీవూ.. యిలాగే ఆలోచిస్తున్నావా? ఎంతో అభ్యుదయంతో, ఆదర్శంతో పెంచాననుకుంటున్నాను. హు.. నీవూ మగవాడివేగా.. మీ జాతి అంతే. స్త్రీకి నీతులు, శీలాలు, పవిత్రతలు కావాలనే వారిలో నీవూ ఒకడివే గదూ..” బాధగా అంది రాధాదేవి.
“అమ్మా!”హర్ట్ అయ్యాడు శ్యాం. “అమ్మా ప్లీజ్! అలా మాట్లాడకు. నా ఆలోచన అది కాదమ్మా. రేఖ.. ప్రెగ్నంట్. రేపు బిడ్డ పుడితే.. నన్ను మాధవరావుగారు చీదరించుకుని నీచంగా, హీనంగా చూచినట్లు నేనూ చూడనా.. ఎవరికో పుట్టిన బిడ్డని భరించే ఔదార్యం నాకుందా అని ప్రశ్నించుకుంటున్నాను”
“శ్యాం!.. నేనా విషయం ఆలోచించలేదనుకుంటున్నావా? వద్దు శ్యాం. నీలాంటి మరో శ్యాంని ఈ లోకంలోకి తీసుకురావద్దు మనం. నీవన్నట్టు ఎంత కబుర్లు చెప్పినా తనది కాని బిడ్డని ఎవరూ ప్రేమించరు. అందులో పురుషలసలు సహించలేరు. ఆ బిడ్డ కారణంగా మీ జీవితాలు నరకం కాకూడదు. నిన్నీ విషయంలో బలవంతపెట్టి వప్పించే ఉద్ధేశ్యం నాకు లేదు శ్యాం. ఆ హింస, ఆ నరకం నేననుభవించి మళ్లీ, మిమ్మల్ని బాధకి గురి చెయ్యను. రేఖకి అబార్షన్ చేయిద్దాం. జరిగింది పీడకల అని మరిచిపోయి మీరు నూతన జెవితం ఆరంభించాలి” రాధాదేవి ఉత్సాహంగా అంది.
“ఏమో? ఇంతకీ రేఖ, వాళ్ల నాన్న వప్పుకుంటారనుకోను”
“అడిగి చూద్దాం. రేఖ నీకంటే సంవత్సరమే చిన్నది. మైనారిటీ తీరింది. ఆమెకిష్టమయితే మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు. మాధవ్ అంగీకరించకపోయినా” అంది రాధాదేవి..

ఇంకా వుంది..

ఈ జీవితం ఇలా కూడా వుంటుందా? 9

రచన: అంగులూరి అంజనీదేవి

అంకిరెడ్డి ఆఫీసు నుండి ఇంటికి రాగానే సతీష్‌చంద్ర ఫోన్‌ చేసినట్లు మాధవీలతతో చెప్పాడు. ఆమె మాట్లాడకుండా మౌనంగా విని ”సరే! మీకు కాఫీ తెచ్చిస్తాను” అంటూ అక్కడ నుండి కావాలనే లేచి వెళ్లింది.
భార్య కాఫీ తెచ్చేంత వరకు ఖాళీగా కూర్చోకుండా లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి కొత్తగా వచ్చిన వెబ్‌సైట్లు చూసుకుంటూ కూర్చున్నాడు.
”ఊ… ఇదిగోండి కాఫీ” అంటూ ఆయనకు నాలుగు అడుగుల దూరంలో వున్నప్పుడే అంది.
”దగ్గరకి రా! అక్కడ నుండే ఇస్తావా?”
”దగ్గరకి వచ్చాక ఏం జరుగుతుందో నాకు తెలుసు. మీకు కాఫీ యివ్వటం కాదు, త్రాగిస్తూ నిలబడాలి. అంత ఓపిక నాకెక్కడిది? ఉదయం నుండి పనంతా నేనే చేస్తున్నాను”
”ధృతి వుందిగా!”
”ఎక్కడుంది? పడకేసి గదిలోనే వుంది. బయటకొస్తేగా!”
ఆయన వెంటనే లేచి ధృతి కోసం వెళ్లాడు.
ధృతి గది బయట నిలబడి ”అమ్మా! ధృతీ!” అంటూ పిలిచాడు. తలుపు తియ్యలేదు. తలుపు మీద కొట్టి పిలిచాడు. ఈసారి ఆమె కదిలినట్లు గాజుల చప్పుడు విన్పించింది. కానీ తలుపు తియ్యలేదు. మళ్లీ తలుపుకొట్టి గట్టిగా పిలిచాడు. తలుపు తీసి ఎదురుగా వున్న అంకిరెడ్డి వైపు నీరసంగా చూస్తూ ”ఏంటి మామయ్యా?” అంది.
ఆమెను చూసి ఉలిక్కిపడ్డాడు అంకిరెడ్డి. తిండి తిని ఎంతో కాలమైన దానిలా, ముఖమంతా పీల్చుకుని పోయి వుంది.
”ఏంటమ్మా అలా వున్నావ్‌? ఒంట్లో బాగాలేదా?”
”బాగానే వుంది మామయ్యా! పడుకున్నాను. అంతే! వెళ్తాను. వెళ్లి వంట చేస్తాను” అంటూ ఆయన పక్కన దారి చేసుకుంటూ వెళ్లబోయింది.
ఆమెను చూస్తుంటే హృదయమంతా నలిపేసినట్లు బాధగా వుంది అంకిరెడ్డికి.
కంగారుపడి ”వద్దులేమ్మా! పడుకో! వంట మీ అత్తయ్య చేస్తుంది. నీకు అంత బాగున్నట్లు లేదు” అని ధృతిని మళ్లీ గదిలోకి పంపి ఆయన వెళ్లిపోయాడు.
వంట మాధవీలత చేసింది.
రాత్రికి భోజనాల దగ్గర ”ధృతికి ఏమైనా పెట్టారా తినటానికి?” అని అడిగాడు అంకిరెడ్డి భార్యవైపు, మోక్ష వైపు చూసి.
”నేను ఇప్పుడే ఆఫీసు నుండి వచ్చాను మామయ్యా!” అంది మోక్ష.
”నేను వంట చేస్తూ ఖాళీగా లేను” అంది మాధవీలత.
”ఇంట్లో ఇంతమంది వుండి కడుపుతో వున్న మనిషిని ఏమాత్రం పట్టించుకోవటం లేదంటే మిమ్మల్ని ఏమనాలి?”
”ఏమీ అనకండి నాన్నా! ఎవరి పనుల్లో వాళ్లున్నారు. నేను కూడా ఇప్పుడే వచ్చాను ఆఫీసు నుండి… అంతో ఇంతో ఆఫీసు నుండి ముందొచ్చేది నువ్వే” అన్నాడు.
ఆయన ఇంకేం మాట్లాడలేక ”మధూ! నువ్వు వెళ్లి వేడిగా ఒక గ్లాసు పాలు తీసికెళ్లి ధృతికి ఇవ్వు…” అన్నాడు.
ఆమె విసుగ్గా తింటున్న ప్లేట్లో చెయ్యి కడిగేసి ”కోడలికి అత్తగారి చేత సర్వీస్‌ చేయించాలని చూసే మామను మిమ్మల్నే చూస్తున్నానండి! ఇలా ఎక్కడా వుండరు” అంటూ ఆమె గదిలోకి వెళ్లింది. ఆమె మొహం ఎందుకంత చిరాగ్గా, ఏవగింపుగా పెట్టిందో ఆయనకు అర్థం కాలేదు. ఇదేమంత పని అని, అదే తారమ్మ ఎంత గొప్పది, సౌమ్యకి ఎంత గొప్పగా సేవ చేసింది అనుకున్నాడు మనసులో.
ఆమె వెళ్లాక మోక్షను కదిలించాడు- ”నెలనెలా హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారా దృతిని?” అన్నాడు.
ఆనంద్‌ అది విని ప్లేట్లో వున్న అన్నాన్ని మొత్తం నాలుగు ముద్దలుగా చేసి, పెద్దగా నోరు తెరిచి గబగబ తినేశాడు. వాష్‌బేసిన్‌ దగ్గరకెళ్లి చేయి కడుక్కుని ”తినేసిరా!” అన్నట్లు మోక్షవైపు చూసి గదిలోకి వెళ్లాడు.
”రెండో నెల రాగానే తీసికెళ్లాను మామయ్యా! ప్రెగ్నెన్సీ కన్‌ఫం అన్న సంగతి అప్పుడే తెలిసింది. మళ్లీ తీసికెళ్లలేదు”
”ఎందుకని…?”
”ముందురోజు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒక రోజంతా ఓ.పి.లో కూర్చోవాలి. అంత టైమంటే నాకు ఆఫీసులో వీలుకావడం లేదు. అత్తయ్యతో ఈ విషయం చెప్పాను. ఆమె విని పట్టించుకోలేదు. అలాగే గడిచిపోతున్నాయి రోజులు. ఇంకో రెండు రోజులైతే తనకి ఏడో నెల వస్తుంది. ఇది మీకు తెలియదా మామయ్యా?” అంది మోక్ష.
ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.
”ఇలాంటివి ఆడవాళ్లు మీరుకదా చూసుకోవలసింది” అన్నాడు అసహనంగా.
”సరే! మామయ్యా!” అంది మోక్ష.
”సరే కాదు. నువ్విప్పుడు దృతి దగ్గరికి వెళ్లి పాలు తాగించు. రేపు హాస్పిటల్‌కి తీసికెళ్లు” అన్నాడు.
అప్పటికే ఆమె తినడం పూర్తి చేసి లేచింది. వాష్‌బేసిన్‌ దగ్గర చేయి కడుక్కుని నాప్‌కిన్‌తో చేయి తుడుచుకుంటూ ”ఇప్పుడు పాలు ఇవ్వటం నా వల్ల కాదు మామయ్యా. ఇప్పటికే నేను బాగా అలసిపోయి వున్నాను. మా ఆఫీసులో ఇద్దరమ్మాయిలు లీవ్‌ మీద వెళ్లారు. వర్క్‌ పెరిగింది. వాళ్ల పెండింగ్‌ వర్క్‌ కూడా నేనే చెయ్యవలసి వస్తోంది. వాళ్లు తిరిగి ఆఫీసుకు రావానికి వారం రోజులు పడుతుంది. ఇలాంటప్పుడు దృతిని హాస్పిటల్‌కి తీసికెళ్లటం నాకు కుదరదు మామయ్యా! సారీ!” అంది మోక్ష.
ఆయనకు మాట్లాడానికేం దొరకలేదు.
అంకిరెడ్డి మాట్లాడకపోవటంతో మోక్ష మౌనంగా తల వంచుకొని తన గదిలోకి వెళ్లింది. ఆమెకు నేనిలా అబద్దం చెప్పి తప్పు చేస్తున్నానని కొంచెం కూడా అన్పించలేదు. అంకిరెడ్డి లేచి చేయి కడుకున్నాడు. నేరుగా వంట గదిలోకి వెళ్లి పాలు తీసుకొని దృతి గదిలోకి వెళ్లాడు. అంకిరెడ్డి దృతి గదిలోకి వెళ్లటం మాధవీలత కర్టెన్‌ చాటున నిలబడి చూసింది. ఆమెకు కసిగా వుంది, రోషంగా వుంది. కోపంగా వుంది. కానీ ఏం చెయ్యలేక వెళ్లి పడుకుంది.
ధృతిని లేపి ఆమె చేత పాలు తాగించాడు అంకిరెడ్డి.
ధృతిని చూస్తుంటే ఆయనకు చాలా బాధగా వుంది. ఇన్నిరోజులు నా షెడ్యూల్‌ నేను కరెక్ట్‌గా చేసుకుంటే చాలనుకున్నాడు కాని, ఇంట్లో ఇలా ఒకరినొకరు పట్టించుకోవడం లేదని గమనించలేదు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా వున్నారనుకున్నాడు కాని ఒకరిపట్ల ఒకరు ఇంత నిర్లక్ష్యంగా వున్నారనుకోలేదు. ఇంటి పెద్దగా రోజుకి పావుగంట సమయాన్ని కూడా కుటుంబ సభ్యుల కోసం కేయించకపోవడం తనది కూడా తప్పే అనుకున్నాడు.
ధృతి పాలు తాగాక ”మీకెందుకు మామయ్యా శ్రమ. నేను లేచాక వెళ్లి తాగేదాన్నిగా!” అంది మొహమాట పడుతూ.
”నువ్వెప్పుడు లేవాలి… ఎప్పుడు తాగాలి. ఎంతగా నీరసించిపోయి వున్నావో చూడు… ‘నాకు ఒంట్లో బాగుండలేదు మామయ్యా!’ అని ఒక్కమాట నాతో చెప్పి వుంటే హాస్పిటల్‌కి తీసికెళ్లేవాడినిగా! వాళ్లంటే పనుల్లో వున్నారు” అన్నాడు.
”మీరు కూడా ఖాళీగా ఏం లేరుగా మామయ్యా! జ్వరమేగా! తగ్గిపోతుంది.” అంది.
ఆయన వెంటనే తన గదిలోకి వెళ్లి జ్వరం టాబ్లెట్ తెచ్చి ధృతి చేత మింగించాడు. అది కూడా చూసింది మాధవీలత.
ఏ కుటుంబ సభ్యులైనా ఆ ఇంటి స్త్రీ గర్భవతిగా వుంటే చాలా సంతోషపడతారు. ఇష్టమైనవి తెచ్చి పెడతారు. డబ్బులు లేకపోయిన గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసికెళ్లి పరీక్షలు చేయించి మందులు తెచ్చి వాడమంటారు. మంచి ఆహారాన్ని శ్రద్ధగా తినిపిస్తారు. బాబో పాపో పుట్టే వరకు ఆత్రుతగా ఎదురు చూస్తారు.
”పడుకో తల్లీ! రేపు నేను నిన్ను హాస్పిటల్‌కి తీసికెళ్లి డాక్టర్‌కి చూపిస్తాను. అన్ని చెకప్‌లు చేయిస్తాను. సతీష్‌ ఫోన్‌ చేస్తే మామయ్య ఇలా చెప్పాడని చెప్పు. వాడు ధైర్యంగా వుంటాడు” అన్నాడు. ఆ చిన్న మాటకే కరిగి నీరైపోయింది ధృతి. కన్నీళ్లు కారుతుండగా అంకిరెడ్డికి రెండు చేతులెత్తి దండం పెట్టింది. ”అలాగే మామయ్యా!” అంటూ తల వూపింది.
అంకిరెడ్డి తన గదిలోకి వెళ్లిపోయాడు.
మాధవీలత ఆయన్ని చూడగానే ”అయ్యాయా సేవలు?” అంది.
”ఇవి సేవలు కావు. పనులు”
”నాకెప్పుడైనా అలా చేశారా?”
”చెయ్యాల్సిన అవసరం వచ్చివుండదు. వస్తే ఎందుకు చెయ్యను. మనుషులం కదా! మనుషులకి మనుషులే చెయ్యాలి. పశుపక్ష్యాదులు చెయ్యవు”
”అంటే మీ ఇద్దరే మనుషులు. మేమంతా పశుపక్ష్యాదులమా?”
”పడుకో మధూ! ఓపిక లేదు. ఎందుకంత వ్యతిరేకంగా ఆలోచిస్తావు? అయినా అదేమంత పెద్ద పని! ఎందుకింత రాద్ధాంతం? అయినా ధృతి ఏం చేసిందని ఆమె పట్ల నువ్వింత నిరసనగా వున్నావ్‌?”
”ఏదో చేసిందిలెండి! అవన్నీ ఇప్పుడెందుకు?”
”చెప్పరాదు”
”అలాంటివన్నీ చెప్పే సందర్భమా ఇది. సమయం రానివ్వండి చెబుతాను” అంది.
ఏదో జరిగిందని అర్థమైంది అంకిరెడ్డికి.
”సరే! చెప్పకు. కానీ మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూనే వుంటాడుట. మంచి చేస్తే మంచి…. చెడు చేస్తే చెడు… మంచి చేస్తే మంచే జరుగుతుంది. కానీ చెడు చేస్తూ నాకేం కాదులే అని మాత్రం అనుకోకూడదు. మనం చెడు చేసిన వెంటనే మన పతనాన్ని మన వెనకాలే పంపిస్తాడట. ఎందుకంటే కర్మ చేయించేది ఆయనే, దాన్ని ఫలితాన్ని చూపించేది ఆయనే… ఆయన క్యాలిక్యులేషన్‌ చాలా పర్‌ఫెక్ట్‌గా వుంటుందట” అన్నాడు అంకిరెడ్డి.
ఆమె లేచి కూర్చుని ”అంటే నేనేదో చెడు చేసినట్లు నాకు చెడు జరుగుతుందని నా భవిష్యత్‌ను బొమ్మగీసి చూపిస్తున్నారా? నాకు చెడు జరగాలని కోరుకుంటున్నారా?” అంది.
”అలా కోరుకుంటే చెడు జరుగుతుందా మధూ! ఇవాళ వాకింగ్‌లో ఈ మాటల్ని ఎవరో అంటుంటే విని గుర్తు పెట్టుకొని చెప్పాను. నువ్వు కూడా వీటిని గుర్తు పెట్టుకొని నలుగురికి చెప్పు. ఆ నలుగురు ఇంకో నలుగురికి చెబుతారు. మంచి మాటలెప్పుడు చెయిన్‌లా వ్యాపించిపోవాలి” అన్నాడు.
”ఇవేమైనా అంత మంచిమాటలా చెప్పటానికి. వినగానే భయపడి చచ్చేమాటలు” అంది.
”భయం దేనికి? మనమేమైనా చెడు చేస్తే కదా భయపడి చావానికి… నువ్వు చాలా మంచిదానివి మధూ! భయపడాల్సిన పనులెప్పుడూ చెయ్యవు. పడుకో!” అన్నాడు.
ఆమె పడుకోలేదు. ”ఎక్కడో సైన్యంలో వుండేవాడికి పిల్లలెందుకు?” అంది. ఆయన అదిరిపడి చూశాడు.
”ఏం మాట్లాడుతున్నావ్‌ మధూ! అప్పుడేమో వాడికి చదువులేదు. చెప్పుకోదగిన క్యాడర్‌ లేదు. సైన్యంలోనే వుండనివ్వండి అన్నావ్‌! ఇప్పుడేమో సైన్యంలో వుండే వాడికి పిల్లలెందుకు అంటున్నావ్‌! ఇదేమైనా బావుందా?” అన్నాడు.
”బాగుండక ఆవిడ గారు పడుకొని వుంటే పనులెవరు చేస్తారు? పడుకోబెట్టి చెయ్యటానికి, పురుళ్లు పొయ్యటానికి తల్లిదండ్రులేమైనా వున్నారా? లేక ఆవిడగారి అన్నగారేమైనా వచ్చి చేస్తారా?” అంది వ్యంగ్యంగా.
మాధవీలత, అంత వ్యంగ్యంగా మాట్లాడటం ఆయనెప్పుడూ చూడలేదు. అందుకే ఆమెను కొత్త మనిషిని చూసినట్లు చూశాడు. ఆశ్చర్యపోతూ చూశాడు. నువ్వు నువ్వేనా అన్నట్లు చూశాడు.
”నువ్వే ఇలా మాట్లాడితే బయటవాళ్లింకెలా మాట్లాడతారు? అయినా తల్లిదండ్రులు లేని ఆడపిల్లలకి మనదేశంలో పురుళ్లు పొయ్యరా? ధృతికి అమ్మ లేకుంటేనేం అమ్మకన్నా ఎక్కువగా నువ్వున్నావుగా” అన్నాడు.
”అలా అని నేను మీకేమైనా రాసిచ్చానా?” అంది గయ్యిమంటూ.
ఇదేదో తేడాగా వుందనుకున్నాడు అంకిరెడ్డి. వాదించి లాభం లేదనుకున్నాడు… ఆ తర్వాత ఆమె మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు.
*****
ఉదయం పది గంటలు దాటింది.
అంకిరెడ్డి ధృతి హాస్పిటల్‌కెళ్లి నెంబర్‌ తీసుకుని ఓ.పి.లో కూర్చున్నారు. ఒక గంట గడిచాక డాక్టర్‌ గారు పిలుస్తున్నారని నర్స్‌ వచ్చి చెప్పగానే ధృతి నీరసంగా లేచింది. నెమ్మదిగా నడుచుకుంటూ డాక్టర్‌గారి గదిలోకి వెళ్లింది. అక్కడ డాక్టర్‌ లేదు.
డాక్టర్‌ వేరే పేషంటును చూసి వచ్చే లోపల నర్స్‌ ధృతిని తీసికెళ్లి ఒక బల్లను చూపించి ”ఈ బల్లపై పడుకోండి! డాక్టర్‌ గారొస్తారు” అని అనేలోగానే డాక్టర్‌గారొచ్చారు. ధృతి బల్లపై పడుకుంది. డాక్టర్‌ నవ్వుతూ ధృతి దగ్గరకి వచ్చి ”ఎలా వుంది ఆరోగ్యం” అంటూ రెండు చేతులతో పొట్టను నెమ్మదిగా నొక్కుతూ
”ఏడో నెలనా?” అని అడిగింది.
”అవును మేడమ్‌!” చెప్పింది ధృతి.
డాక్టరేం మాట్లాడకుండా ”బేబీ అండర్‌ డెవలప్‌డ్‌” అనుకుంటూ అక్కడే వున్న వాష్‌ బేసిన్‌ దగ్గర చేతులు కడుక్కొని నాప్‌కిన్‌తో తుడుచుకొని వెళ్లి తన సీట్లో కూర్చుంది. ఈ లోపల ధృతి కూడా వచ్చి ఆమెకు ఎదురుగా కూర్చుంది.
”నీతోపాటు ఎవరైనా వచ్చారా?”
”మా మామగారు వచ్చారు మేడమ్‌! బయట వున్నారు”
”ఆయన్ని లోపలికి పిలువు” అని డాక్టర్‌ అనగానే నర్స్‌ వెళ్లి అంకిరెడ్డిని పిలిచింది. ఆయన లోపలకొచ్చి ”నమస్తే మేడమ్‌!” అంటూ డాక్టర్‌కి ఎదురుగా కూర్చున్నాడు.
ఆయన డోర్‌ నెట్టుకొని లోపలకి వస్తున్నప్పుడే ఆయన వైపు ఎగాదిగా చూసినందువల్లనో ఏమో మళ్లీ ఆయన వైపు చూడకుండా పాత చీటీని చూస్తూ
”మిమ్మల్ని చూస్తుంటే చదువుకున్నవాళ్లలా కన్పిస్తున్నారు. ఈమె విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం చేశారు? ప్రెగ్నన్సీ కన్‌ఫం అయిందని తెలిశాక మళ్లీ ఇప్పుడా తీసుకురావటం…” అంది కోపంగా డాక్టర్‌.
”అదీ మేడమ్‌!” అంటూ నసిగాడు అంకిరెడ్డి.
ఆమె అంకిరెడ్డి వైపు చూడకుండా ధృతి వైపు చూసి ”అప్పుడు నీతో వచ్చినావిడ ఎవరు?”
”మా తోడికోడలు మేడమ్‌!” అంది ధృతి.
అది వినగానే డాక్టర్‌ అంకిరెడ్డి వైపు చూసి ”ఆమెతో నేనా రోజు క్లియర్‌గా చెప్పాను. మూడో నెలలో ఒకసారి, ఆరు నెలలు దాక నెలనెలా స్కాన్‌ తీయించాలని… ప్రెగ్నెన్సీ కన్‌ఫం అయినప్పటి నుండి ఐరన్‌ ఫోలిక్‌యాసిడ్‌, క్యాల్సియమ్‌ టాబ్లెట్లు వాడాలని… న్యూట్రీషియస్‌ ఫుడ్‌ పెట్టాలని… కానీ మీరు ఇవేమీ చెయ్యలేదు. ఆమె భర్తను ఒకసారి పిలిపిస్తారా?” అంది డాక్టర్‌.
”ఇక్కడ వుండడు మేడమ్‌! సైన్యంలో వుంటాడు…”
”అయితే రాలేడా?”
”రాలేడు మేడమ్‌! ఏమైనా ఉంటే నాతో చెప్పండి”
”ఏముంది చెప్పడానికి. కనిపిస్తూనే ఉందిగా మీరెంత నిర్లక్ష్యం చేశారో. ఆమెను ఇన్నిరోజులు హాస్పిటల్‌కి తీసుకురాకుండా, మందులు వాడకుండా, పోషకాహారం ఇవ్వకుండా, స్కాన్‌ తీయించకుండా… ఇది మీకెలా అన్పిస్తుందో కాని, నాకు మాత్రం క్షమించరాని చర్యలా వుంది. అతను మిమ్మల్ని నమ్మే కదా ఆమెను మీ దగ్గర వుంచాడు”
”అవును మేడమ్‌!”
”అలాంటప్పుడు ఇలాగేనా చూసేది? లోపల బేబీ పొజిషన్‌ చాలా బ్యాడ్‌గా వుంది. ఇప్పుడేం చేయమంటారు?”
”ఏదో ఒకటి మీరే చెయ్యాలి మేడమ్‌!”
”’ఆలస్యంగా తీసుకొచ్చి ఏదో ఒకటి చెయ్యమంటే ఎలా! ఆమె మామూలు మనిషి కాదు. ఏడు నెలల గర్భిణి స్త్రీ… లోపల శిశువు పెరగలేదు. ఇలాంటప్పుడు లోపల బేబీ చనిపోయినా తెలియదు” అంది డాక్టర్‌ కోపంగా.
”ఓ… గాడ్‌!” తల పట్టుకున్నాడు అంకిరెడ్డి.
”ఇదంతా మీ ఫ్యామిలీ మెంబర్స్‌ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. అతనెక్కడో సైన్యంలో వున్నాడని ఈమెను మీరు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు తల పట్టుకుంటే ఏం లాభం?”
”ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. లోపల బేబీ పెరిగేలా చూడండి డాక్టర్‌!” అంటూ అభ్యర్థించాడు అంకిరెడ్డి.
”మోడరన్‌ సొసైటీలో వుండి కూడా కొడుకు సైన్యంలో ఉన్నప్పుడు కోడల్ని ఇలాగే చూస్తారా సర్‌! సరిగా పట్టించుకోరా? అయినా ఒక ప్రెగ్నంట్ లేడీని ఇంత నెగ్లెక్ట్‌గా చూడడమేంటి? ఇప్పుడేమైనా జరిగితే ఎవరు బాధ్యులు?” కోపం తగ్గించుకుంటూ అడిగింది డాక్టర్‌.
ఆ మాటలకి అంకిరెడ్డి తేరుకున్నాడు. ”ప్లీజ్‌! మేడమ్‌!” అన్నాడు రిక్వెస్ట్‌గా
డాక్టర్‌ ధృతివైపు చూసి ”వాళ్లంటే సరే! నీకేమైంది? నిన్ను నువ్వు కేర్‌గా చూసుకోలేవా? నీ కడుపులో వుండే బిడ్డను నీ అంతట నువ్వే చంపుకుంటావా? అలా జరిగితే! అది తెలిసి జరిగినా, తెలియక జరిగినా ఒక రకంగా క్రైమ్‌ లాంటిదే! నీలాంటి కేసుల్ని చూసి బాధ పడటం తప్ప మాలాంటి వాళ్లం చెయ్యగలిగింది ఏం లేదు” అంది.
ధృతి తల వంచుకుంది. అంకిరెడ్డి డాక్టర్‌ ఫైనల్‌గా ఏం చెబుతుందా అని ఆత్రంగా చూస్తున్నాడు.
”సరే! వెళ్లి స్కాన్‌ తీయించుకురండి!” అంది. ఆమె అలా అనగానే వెళ్లి స్కాన్‌ తీయించుకొచ్చారు.
డాక్టర్‌ వాళ్లు తెచ్చిన స్కాన్‌ రిపోర్ట్స్‌ చూస్తూ ”బేబీ బరువు వుండాల్సిన దానికన్నా చాలా తక్కువగా వుంది. స్టెరాయిడ్‌ వాడాలి. అది చాలా ఖర్చుతో కూడిన పని.”
”ఎంత ఖర్చయినా పర్వాలేదు మేడమ్‌!” అన్నాడు అంకిరెడ్డి. ఆయన ఇప్పుడు కాస్త వూపిరి పీల్చుకున్నాడు. అంతవరకు లోపల బేబీ చనిపోయి వుంటుందనే కంగారు పడుతున్నాడు.
”అది కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఏడు నెలలు దాక లోపల బేబీ గ్రోత్‌ అంతగా వుండదు. తిండి వల్ల, మందుల వల్ల మానసిక ప్రశాంతత వల్ల బరువు పెరిగే అవకాశాలు వుంటే వుండొచ్చు. పెరగకపోతే ముందుగానే సిజేరియన్‌ చేసి బేబీని బయటకు తీసి బరువు పెరిగేలా చెయ్యాలి.” అంది డాక్టర్‌.
అంకిరెడ్డి, ధృతి ఆమె చెప్పే మాటల్ని ఉత్కంఠతో వింటున్నారు.
”అప్పుడు కూడా నేను బేబీకి గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే తల్లి కడుపులో పెరగాల్సిన బేబీని మనం ముందుగానే బయటకి తీసి బరువు పెంచబోతున్నాం. ఎంత ఇంటెన్సివ్‌కేర్‌లో వుంచినా ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే ఛాన్సెస్‌ ఎక్కువగా వుంటాయి”
”లేదు మేడమ్‌! అంతదాకా రాకపోవచ్చు. ఈ విషయం నా భార్యకు తెలిస్తే తల్లడిల్లిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటుంది” అన్నాడు అంకిరెడ్డి.
”సరే! మందులు రాసిస్తున్నాను. వారం రోజుల తర్వాత వచ్చి కన్పించండి! అప్పుడు మళ్లీ స్కాన్‌ తీయవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు చెకెప్‌ అవసరం అవుతుంది” అంటూ మందులు రాసిన ప్రిస్కిప్షన్‌ వాళ్ల చేతికి ఇచ్చి
”నెక్ట్స్‌…” అంది. ఇక మీరు వెళ్లొచ్చు అన్నట్లు చూసింది.
అంకిరెడ్డి, ధృతి లేచి డోర్‌వైపు కదిలే లోపలే ఇంకో పేషంట్ వచ్చి డాక్టర్‌ ముందు కూర్చుంది.
అంకిరెడ్డి, ధృతి మెడికల్‌ షాపులో మందులు కొని కారెక్కారు. దారిలో కారు దిగి ధృతికోసం పండ్లు కొన్నాడు అంకిరెడ్డి. పండ్లు కారులో పెట్టి కారులో కూర్చుని కారుని రివర్స్‌ తీసుకుంటూ నీకు ‘ఇలా వుందని మీ అన్నయ్యతో చెప్పలేదా!’ అని అడిగాడు.
”నేను బాగానే వున్నాను మామయ్యా! మా అన్నయ్యతో చెప్పాల్సినంత బాధలేం నా ఒంట్లో లేవు. అంతా నార్మలే!” అంది.
నిజానికి ఆమె మనసులో వుండేది అదికాదు. ఆమెకు ఆ ఇంట్లో సతీష్‌ వెళ్లిన కొద్దిరోజుల నుండే అసౌకర్యం మొదలైంది. పనిమనిషిని తీసెయ్యటం పెద్ద ఇబ్బంది కాదు గాని, అదే పనిగా ఆనంద్‌ చేసే కామెంట్స్ ని తట్టుకోలేకపోయేది. అలా అని తిట్టరు, కొట్టరు. తిండి తినబుద్ది కాకుండా మాటలతోనే కొట్టేవాళ్లు. ముఖ్యంగా ఒకరోజు ఏమైందో ఏమో ‘ప్రవీణ్‌ ఇలా, ప్రవీణ్‌ అలా, అసలు ప్రవీణ్‌ అంటే ఇదీ, ప్రవీణ్‌ అంటే అదీ’ అంటూ ఆమె ముందే ఆమె అన్నయ్యను చాలా హీనంగా తీసేస్తూ మాట్లాడాడు. ”అసలు ప్రవీణ్‌లాంటి వాళ్లను ఇంటికి రానివ్వకూడదు. వాళ్ల ఇంటికి వెళ్లకూడదు” అన్నాడు. అప్పుడు దృతి వూరుకోలేదు. ఏదో ఒకటి అనకపోతే ఆమె మనసు వూరుకునేలా లేదు. అందుకే అంది. ”మా అన్నయ్యకు ఓ ఇల్లంటూ లేదు. ఎలాంటి వాళ్లు బడితే అలాంటి వాళ్లు ఆయన ఇంటికి వెళ్లటానికి… ఇల్లు వుండేవాళ్లు కదా ఆలోచిస్తారు ఎలాంటి వాళ్లను ఇండ్లకు పిలవాలో! పిలవకూడదో!” అని…. అప్పటి నుండి ఆనంద్‌ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర ఆమెతో అతిగా మాట్లాడటం తగ్గించేశాడు. కామెంట్స్ కూడా లేవు. చాలా ప్రశాంతంగా అన్పించింది. రోజూ ఇలా వుంటే ఎంత బావుండు అనుకుంది. అలా ఓ వారం రోజులే గడిచింది. ఆ తర్వాత ఆమెను చూడగానే ముఖం అదోలా పెట్టుకుని ‘నువ్వంటేనే మాకు నచ్చటం లేదు’ అన్నట్లుగా మాధవీలత, మోక్ష వుంటున్నారు. అలా ఎందుకుంటున్నారో ఎంతకీ అర్థం కాలేదు.
”ఇలా వుంది అన్నయ్యా ఇక్కడ పరిస్థితి. నేను వుండలేక పోతున్నాను. నువ్వొచ్చి నన్ను తీసికెళ్లు” అని ప్రవీణ్‌కి ఫోన్‌ చేద్దామని ఎన్నోసార్లు అనుకుంది కానీ ఒక్కసారి కూడా చెయ్యలేదు. చేస్తే ఏమవుతుంది? బాధపడతాడు. తీసికెళ్లి నేరుగా హాస్టల్లో వుంచుతాడు. అలా హాస్టల్లో వుంచి తన ఒక్కదానికి పెట్టే డబ్బుతో ఎటూ కదలలేని వికలాంగుల కడుపు నింపొచ్చు. దాన్నెందుకు దూరం చెయ్యాలి. పైగా తను వెళ్లి హాస్టల్లో వుండేకన్నా అత్తగారింట్లో వుంటేనే అన్నయ్య సంతోషిస్తాడు. పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రివేళ హాయిగా నిద్ర పోతాడు. అందుకే అన్నయ్యతో చెప్పలేదు.
అంకిరెడ్డి అడిగినప్పుడు ”ఇందుకే చెప్పలేకపోయాను మామయ్యా!” అని అంకిరెడ్డితో చెప్పలేదు ‘అంతా నార్మలే’ అని రెండు చేతులు ఒడిలో పెట్టుకొని కుదురుగా, అలసిపోయిన కుందనపు బొమ్మలా కూర్చుంది.
….మాట్లాడకుండా కారు నడుపుతున్న అంకిరెడ్డి మధ్యమధ్యలో ధృతివైపు చూస్తున్నాడు.
”నీకింత నీరసంగా వుందని కనీసం సతీష్‌కైనా చెప్పావా?”
”చెప్పలేదు మామయ్యా!”
”ఎందుకు చెప్పలేదు?”
”దేశ రక్షణ కోసం కందకాల్లో పడుకొని ఆయన వంతు బాధ్యతను ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయన్నెందుకు మామయ్యా కదిలించటం? ఇప్పుడు ప్రేమకన్నా బాధ్యత ఎక్కువా, బాధ్యతకన్నా ప్రేమ ఎక్కువా అన్నది ప్రధానం కాదు. నా ఒక్కదాని నీరసం కోసం అంత గొప్ప దేశభక్తితో వున్న ఆయన్ని నీరసించిపోయేలా చెయ్యాలని నాకెప్పుడూ అన్పించలేదు. అందుకే ఎప్పుడు కాల్‌ చేసినా ‘నేనిక్కడ ఓ.కె’ అనే చెబుతాను. లేకుంటే ఆయన అక్కడ ప్రశాంతంగా వుండలేరు. అక్కడ వాతావరణం ఎలా వుంటుందో ఆయన నాకు చాలాసార్లు ఫోన్లో చెప్పాడు” అంది.
”ఏమని చెప్పాడు?” అడిగాడు అంకిరెడ్డి.
ఆమెకు వెంటనే తన భర్త తనతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అస్సాం నుండి అరుణాచల్‌ప్రదేశ్‌కు వెళ్లే దారి కొండల మధ్యలో నుండి ఎత్తు పల్లాలతో కూడి ఉంటుంది. దట్టమైన అడవి కూడా ఉంటుంది. ప్రయాణం కష్టతరమే. చుట్టూ దట్టమైన అడవి, మనుషులు చాలా తక్కువగా ఉంటారు. భారత భూభాగంలోకి తరచూ చైనా సైన్యం చొరబాటు చేస్తూ, మన సైనికుల పహారా లేకుంటే ఆక్రమించుకోవడం కూడా జరుగుతుంటుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చాలా భాగం మన సైనిక పహారా లేకపోవటం వలన చైనా దురాక్రమణ చేసి భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. సైనికులు అప్రమత్తంగా ఉండి మన భూమిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంారట.
”ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?” అన్నాడు.
ధృతి వెంటనే తేరుకొని ”ఏం లేదు మామయ్యా! ఉదాహరణకి జమ్మూ నుండి శ్రీనగర్‌ వరకు కొండచరియలు విరిగి పడినప్పుడు రహదారి చెడిపోయినప్పుడు, వంతెనలు కూలబడిపోయినప్పుడు ఆర్మీ ఇంజనీర్స్‌ కొండచరియల్ని తొలిగించి రేయింబవళ్లు నిరాటకంగా వంతెన నిర్మాణానికి గాను టాన్స్‌మ్‌పెనల్‌ లాంటి పరికరాలను ఉపయోగించి త్వరత్వరగా ప్రజలకు రహదారిని వేస్తారట. అలాంటప్పుడు సైనికులు అజాగ్రత్తగా వుంటే వికలాంగులయ్యే ప్రమాదాలే ఎక్కువగా వుంటాయట. అలాంటి స్థితిలో వున్న ఆయనకు నేను నా బాధల్ని చెప్పుకుంటే అక్కడ ఆయన తన డ్యూటీని సరిగా చెయ్యగలరా? అందుకే చెప్పలేదు మామయ్యా!” అంది.
”మంచిపని చేస్తున్నావమ్మా! కానీ సతీష్‌ కాల్‌ చేసి చెప్పేంత వరకు నీ గురించి ఆలోచించాలని కాని, నీ వైపు చూసి ఎలా వున్నావో తెలుసుకోవాలని కాని నాకు అన్పించలేదు. నాది కూడా బాధ్యతా రాహిత్యమే!”
”ఇప్పుడు మీరు నన్ను బాధ్యతగానే చూశారు. ఇంతకన్నా ఎవరూ చూడలేరు!”
”కానీ నువ్వు బాగా తినాలమ్మా!”
”తింటాను మామయ్యా!” అంది.
కారు రోడ్డుమీద నెమ్మదిగా వెళుతోంది.
అదే సమయంలో మోక్ష పనిచేస్తున్న ఏర్‌టెల్‌ ఆఫీసులో ఆమె ఊహించని ఒక సంఘటన జరిగింది.
మోక్ష పక్కసీట్లో వున్న అమ్మాయి వాళ్ల ఎం.డి బయటకి వెళ్లగానే తన మొబైల్‌లో వుండే వీడియోను ఆన్‌ చేసింది. ఆ టైంలో కస్టమర్లు రారు. ఆ వీడియోలోంచి డి.జె. మ్యూజిక్‌ విన్పిస్తోంది. సౌండ్‌ కాస్త తగ్గించి వీడియోలో కన్పిస్తున్న డాన్స్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరమ్మాయి మొబైల్లోకి తొంగిచూస్తూ ఆ డాన్స్‌ చూస్తున్నారు. ఇక మోక్ష ఒక్కతే చూడలేదు. డిజె మ్యూజిక్‌ ఎవరికైనా ఉత్సామాన్ని పుట్టిస్తుంది. అదేంటో చూద్దామని మోక్ష కూడా లేచి పక్కసీట్లోకి తొంగిచూస్తూ కాస్త వొంగి నిలబడింది. అందరి తలలు ఒకేచోటుకి చేరాయి. వాళ్ల చూపులు వీడియోని అతుక్కుపోయాయి. వీడియో ఆగకుండా ప్లే అవుతోంది.
ఆ వీడియోలో ముగ్గురు అమ్మాయిలు అత్యుత్సాహంతో డాన్స్‌ చేస్తున్నారు. ఒక్క సెకెన్‌ కూడా వాళ్లలో జోష్‌ తగ్గటం లేదు. అప్పుడప్పుడు మెడ చుట్టూ వున్న చున్నీని ముందుకి లాగి రెండు చేతులతో పట్టుకుని మ్యూజిక్‌కి తగ్గట్లుగా అడుగులేస్తున్నారు. చేతులు కదిలిస్తున్నారు. వాళ్ల అడుగుల్లో లయ తప్పటం లేదు. వేగం తగ్గటం లేదు. ముగ్గురూ ముగ్గురే అన్నట్లు పోటీపడి చేస్తున్నారు.
”ముగ్గురూ చాలా బాగా చేస్తున్నారు కదూ! ఈ మధ్యన మా చెల్లెలు కూడా వాళ్ల కాలేజిలో జరిగిన ఫ్రెషర్స్‌ పార్టీలో ఇలాగే చేసింది. ఐతే ఆ మ్యూజిక్‌ వేరు, ఆ పాట వేరు. కానీ చాలా బాగా చేసింది” అంది వాళ్లలో ఒకమ్మాయి.
మోక్షకి అర్థంకాక ”ఇప్పుడు వీళ్లెక్కడ చేస్తున్నట్లు? బ్యాగ్రౌండ్‌ చూస్తుంటే కాలేజీలాగా లేదే! అసలు వీళ్లెవరూ? మీ చెల్లెలు ఫ్రెండ్సా లేక నీ ఫ్రెండ్సా!” అని అడిగింది.
”నా ఫ్రెండ్స్‌ కారు, మా చెల్లెలు ఫ్రెండ్స్‌ కారు. ఇదిగో ఈ లైట్ ప్యారట్ కలర్‌ చున్నీ పిల్ల మా ఇంట్లో ఒకప్పుడు పని పిల్ల. దానిపేరు అంజు. మీరు క్లియర్‌గా చూడండి ఇప్పుడు ఈ అంజు ఎవరో మీకే తెలిసిపోతుంది” అనగానే వెంటనే పక్కనున్న అమ్మాయి పరిశీలనగా చూసి
”నేను గుర్తుపట్టాను. ఈ మధ్యనే మోడల్‌గా చూశాను” అంది.
”కరెక్ట్‌! ఈ డాన్స్‌ చూశాకనే పనిపిల్ల కాస్త మోడల్‌ అయింది” అంది.
”అదెలా సాధ్యం? ఎవరు చూశారు? ఏమా కథ?” వేరే అమ్మాయి ఆసక్తిగా అడిగింది.
”ఈ డాన్స్‌ రోడ్డుమీద చేస్తున్నారు. వినాయకుని నిమజ్జనం రోజు దేవుడిని నిమజ్జనం చెయ్యానికి తీసికెళ్తూ రోడ్డుమీద ఆపినప్పుడు డాన్స్‌ చేస్తున్నారు. అదిగో ఆ కన్పిస్తున్న బిల్డింగ్‌లో లేడీస్‌ హాస్టల్‌ వుంటుంది” అంటూ ఆగింది.
”ఆ… వుంది బోర్డ్‌ కన్పిస్తోంది. లేడీస్‌ హాస్టల్‌” అంది మోక్ష దాన్నే చూస్తూ.
”అక్కడ అంజు కాక ఆ ఇద్దరమ్మాయిలు ఆ హాస్టల్‌ అమ్మాయిలే… అంజు వేస్తుంటే వాళ్లు కూడా సరదాగా దిగివచ్చి వేస్తున్నారు. వాళ్లతోపాటు చాలామంది అమ్మాయిలు ఆ హాస్టల్లోంచి కిందకి దిగారు. అదిగో వాళ్లంతా డాన్స్‌ చూస్తూ నిలబడి వున్నారు. ఆ విగ్రహం మెడికల్‌షాపు వాళ్లది. ఆ కాలనీలో వాళ్లే ఎప్పుడైనా వినాయకుని బొమ్మను పెద్దగా పెడతారు. అంజు మా ఇంట్లోనే కాదు మెడికల్‌ షాపువాళ్ల ఇంట్లో కూడా పనిచేసేది. చుట్టూ నిలబడిన మగవాళ్లంతా ఎంత హైసొసైటీకి చెందినవాళ్లో చూస్తున్నారుగా. వాళ్లలో ఒకాయన టీ.వి. ఛానల్‌ డైరెక్టరట. అంజుని తెల్లవారే తనతో తీసికెళ్లి అక్కడే వుంచుకున్నాడు. మోడల్‌ని చేశాడు” అంది.
ఆ మాటలు వింటూ అటే చూస్తున్న మోక్షకి డాన్స్‌ చేస్తున్న ఆ ముగ్గురిలో ఒకరు దృతిలా అన్పించింది. ఒక్కక్షణం షాక్‌ తిని తిరిగి తేరుకుని ”ఈ ఎల్లో కలర్‌ చున్నీ అమ్మాయి మా దృతిలా వుంది కదూ!” అంది.
”లా వుండటమేంటి! ధృతినే!” అన్నారు వాళ్లు.
”ధృతినా!!!”
ఫ్లాష్‌… ఫ్లాష్‌… ఫ్లాష్‌…!!! మోక్ష మెదడులో ఫ్లాష్‌ లాంటి ఆలోచన వచ్చి హుషారుగా కదిలింది. తన మొబైల్‌ని చేతిలోకి తీసుకొని ”ఒక్క నిముషం. ఈ వీడియో క్లిప్‌ని నా మొబైల్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చెయ్యవా?” అంది.
”ఎందుకు? ధృతికి చూపిస్తావా?”
”కాదు”
”ఇంకెందుకు?”
”చెబుతాను కదా ట్రాన్స్‌ఫర్‌ చెయ్యి” అంది.
ఆ అమ్మాయి మెల్లగా మోక్ష మొబైల్‌ని అందుకొని తన మొబైల్‌లో వున్న వీడియో క్లిప్‌ని మోక్ష మొబైల్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసింది.
మోక్ష దాన్ని చేతిలోకి తీసుకొని ”నేను ఇంటికెళ్లి ఇప్పుడే వస్తాను. మన ఎం.డి గారు వచ్చేలోపలే వస్తాను” అంది.
”ఏయ్‌! మోక్షా! ఇది తీసికెళ్లి మీ అత్తగారికి చూపించకు. ఇలాంటివి మనం రిసీవ్‌ చేసుకున్నంత సరదాగా పెద్దవాళ్లు చేసుకోరు. ఇలాంటివి ఇప్పుడు కామన్‌”
”కామనా!!”
”అవును. అనుకోకుండా జరిగిపోయే యాదృచ్చిక సంఘటనలు ఇవి. ఇలాంటివి ఎవరైనా ఆ క్షణంలోనే మరచిపోతుంటారు. కాకుంటే ఆరోజు వినాయకుని విగ్రహం దగ్గరకొచ్చిన అబ్బాయిలెవరో ఆ డాన్స్‌ను వీడియో తీసివుంటారు. అది అందరికి ట్రాన్స్‌ఫరై అలా అలా స్ప్రెడ్‌ అయింది. అంతే! ఇదికూడా నాకు నా క్లాస్‌మేట్ పంపాడు. అంజూని చూడమని!” అంది.
”నేను కూడా ధృతిని చూడమని మా అత్తగారికి చెబుతాను. ఇదికూడా మీ క్లాస్‌మేట్ నీకు చెప్పినట్లే చెబుతాను. తప్పేంటి?”
”అనుకుంటే అన్నీ తప్పులే! అనుకోకుంటే ఏం వుండవు. మా ధృతి కూడా ఒకసారి మా ఇంటికొచ్చిన తారమ్మతో నా డ్రస్‌ల గురించి చెత్తగా కామెంట్స్ చేసిందని మావారు విని నాతో అన్నారు. అదేమైనా నేను తప్పుపట్టానా? ఇది కూడా అంతే! జస్ట్‌ ఫన్‌! దీన్ని తీసికెళ్లి మా అత్తగారికే చూపిస్తాను. మనం చూసినట్లే ఆమె కూడా తన చిన్నకోడలి డాన్స్‌ రోడ్డు మీద ఎంత బాగుందో చూస్తుంది” అంది.
జెట్ స్పీడ్‌తో ఇంటికెళ్లింది మోక్ష.
ఇంటికెళ్లగానే అత్తగారి మొబైల్లోకి ఆ వీడియో క్లిప్‌ని ట్రాన్స్‌ఫర్‌ చేసింది.
”ఇది చూస్తూ ఉండండి అత్తయ్యా! చూశాక ఇలా అంటే ఆగిపోతుంది” అని చెప్పి వెంటనే ఆఫీసుకెళ్లింది. ఆమె దాన్ని చూసి షాక్‌ తిన్నది.
*****
….ధృతిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లిన అంకిరెడ్డి తిరిగి ఇంటికి వచ్చే వరకు మాధవీలత అలాగే కూర్చుని వుంది.
ఆయన నేరుగా మాధవీలత దగ్గరికి వెళ్లి హాస్పిటల్లో డాక్టర్‌ గారు ఏమన్నారో చెప్పి, ధృతికి చేసిన టెస్ట్‌ల గురించి చెప్పాడు. ఆమె ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పి వెంటనే పనిమనిషిని కూడా పెట్టమని చెప్పాడు.
ధృతి కారులో వున్న పండ్లను తెచ్చి ఫ్రిజ్‌లో పెడుతోంది. ఆ ఇంట్లో ప్రస్తుతం ఆనంద్‌ లేడు, మోక్ష లేదు. వాళ్లు ముగ్గురే వున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్న శబ్దం తప్ప అంతా నిశబ్దంగానే వుంది.
మాధవీలత చేతిలో మొబైల్‌ పట్టుకొని రొప్పుతోంది. అంకిరెడ్డిని తినేసేలా చూస్తోంది. ఆయన చెప్పిన మాటలు ఆమె వినటం లేదు.
ఆయనకేం అర్ధం కాక ”ఏంటి మధూ! అలా వున్నావ్‌?” అన్నాడు ఆమెనే చూస్తూ అంకిరెడ్డి.
”దయచేసి ఎక్కువగా మాట్లాడించొద్దు. చిన్నకోడలిని మాత్రం నా కళ్లముందుంచొద్దు. వెంటనే పంపించెయ్యండి!”
ఆయన షాక్‌ తిని ”ఏంటి మధు అలా అంటున్నావ్‌?” అన్నాడు.
”కడుపున పుట్టిన కొడుకే ఎక్కడో వున్నాడు. ఇలాంటి చెత్త రకాలను ఇంట్లో పెట్టుకొని ఏం బావుకుందామని… దాని అన్నేమో ఆ పని చేస్తాడు, ఇదేమో ఈ పని చేస్తుంది. ఒక్కరిలోనన్నా కుటుంబ లక్షణాలు వున్నాయా?”
”ఏం జరిగింది?” అన్నాడు.
”ఏం సంబంధం తెచ్చి చేశారండీ! వాడికి పెళ్లి చెయ్యకుండా వున్నా బాగుండేది. చేశాక వాడు వెళ్లాక ఒక్కరోజు అన్నా మనశ్శాంతిగా వున్నానా? ఏదో పోనీలే అనుకుంటే ఇప్పుడిదొకటి…” అంది. ఆమె రొప్పుతూనే వుంది.
”ఏంటది?” అన్నాడు అంకిరెడ్డి.
”ఇది చూడండి!” అంటూ మొబైల్‌ ఆన్‌ చేసి వీడియో క్లిప్‌ను చూపించింది.
ఆయన చూశాడు. గణపతి విగ్రహం ముందు అమ్మాయిలు డాన్స్‌ చేస్తున్నారు. చుట్టూ నడివయసు మగవాళ్లు ఇంకా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఆ డాన్స్‌ చూసి కేరింతలు కొడుతున్నారు. దారిన వెళ్తున్న అబ్బాయిలు కూడా అది చూసి ఆగి డివైడర్‌ మీద నిలబడి ఆ డాన్స్‌ను తమ మొబైల్‌లలో వీడియో తీస్తున్నారు. లేడీస్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ అప్పుడప్పుడు కన్పిస్తోంది. డాన్స్‌ చేస్తున్న అమ్మాయిల్లో ధృతి వుంది. అది చూసి
”అయితే తప్పేంటి ?” అన్నాడు అంకిరెడ్డి.
”అలా అనడం పెద్ద గొప్పనుకుంటున్నారా? ఇలాంటి వాటిల్లోనా గొప్పతనం?”
”నేనలా అన్నానా?”
”డాన్స్‌ చెయ్యాలనిపిస్తే రోడ్డు మీద చెయ్యాలా? అదేమైనా రికార్డ్‌ డాన్సరా రోడ్డుమీద వెళ్లే ఉత్సవ విగ్రహాల దగ్గర, పెళ్లి కార్లముందు, ఫంక్షన్‌ హాళ్లలో డాన్స్‌ చెయ్యటానికి….” అంది ఆమె ఆవేశంగా.
”అందరూ చేస్తుంటే చేసి వుంటుందిలే. బలవంతంగా పిలిచి వుంటారు. వెళ్లి వుంటుంది. అలా అని వాళ్లంతా రికార్డ్‌ డాన్సర్లవుతారా? అలాంటివి మనం ఎన్ని చూడటం లేదు”
”నేను చూడలేదు. మీరు చూసారేమో! అయినా ఇవేం పద్ధతులు”
”హాస్టల్లో వుండే పిల్లలకి ఇలాంటివి పద్ధతి కాదని ఎలా తెలుస్తుంది. ఎవరేది చేస్తే అదే చెయ్యాలనిపిస్తుంది. ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదు అని వాళ్లకు ఎవరు చెబుతారు? అయినా ఇప్పుడు ఇలాంటి డాన్స్‌లు మామూలైపోయాయి. ఫ్రెషర్స్‌ పార్టీలలో అమ్మాయిలు డాన్స్‌ చెయ్యటం లేదా?” అన్నాడు.
”అది వేరు. విద్యార్థులు, విద్యాధికుల మధ్యలో చాలా గుట్టుగా చేసే డాన్స్‌ అది. అదేమైనా రోడ్డా! ప్రతి అడ్డమైన వెదవా చూసి వీడియోలు తియ్యటానికి… అమ్మాయిలు అమ్మాయిల్లా వుండొద్దా! అదేం అంటే పెళ్లికి ముందు ఎలా వుంటే మీకేం అంటారు. అలా అనడం పద్ధతా?” అంది ఆమె రొప్పుతూనే.
”ఇలాంటివి మరీ అంత లోతులకెళ్లి ఆలోచించకు మధూ! కొన్ని చూసి వదిలెయ్యాలి. కొన్ని చూడకుండా వదిలెయ్యాలి. కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్. పైగా ఒంట్లో జ్వరం కూడా వుంది. ఇలాంటివి మనసులో పెట్టుకొని వేధించటం తగదు” అన్నాడు.
”తగదా? ఏం మాట్లాడుతున్నారండీ మీరు. సమర్థిస్తున్నారా? ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా?”
”పెట్టుకోక ఏం చేయాలో చెప్పు! ధృతి నీకు చిన్నకోడలు. చిన్న కోడల్ని దూరం చేసుకుంటావా”
”హా… దూరం చేసుకోక, అయినా అదెప్పుడో నాకు దూరమైంది. కొత్తగా అయ్యేదేం లేదు. అయినా ఇలాంటిది నాకు ఎందుకు. మోక్ష లేదా?”
”మోక్ష వుందా? ధృతి వద్దా! అదేనా నువ్వు చివరగా చెప్పేది?”
”నేను చెప్పేది ఏముంది. వాడు ఆనంద్‌లా వుండివుంటే ఇలాంటిదాన్ని చేసుకోవలసిన కర్మ పట్టేదా? అదేం అంటే మీరు కూడా అమ్మాయిలకు ఇలాంటి రోడ్డు మీద డాన్స్‌లు మామూలే అని అంటున్నారాయె! నేనెందుకిక మాట్లాడటం… అయినా అలా ఎంతమంది అమ్మాయిలు రోడ్డు మీద డాన్స్‌ చేస్తున్నారు? అబ్బాయిలు డాన్స్‌ చెయ్యాల్సిన చోట అమ్మాయిలు డాన్స్‌ చెయ్యొచ్చా? అదేం ముద్దండీ! ఆడపిల్లలు ఆడపిల్లల్లా వుండొద్దా! అబ్బాయిలతో సమానంగా వుండడమంటే ఇదేనా?” అంది. ఆమె రొప్పుతూనే ఉంది.
”లోతులకెళ్లి మాట్లాడొద్దని నీకు ముందే చెప్పాను. అదే నీ కూతురే అలా చేస్తే ఏం చేస్తావ్‌?” అన్నాడు.
”నా కూతురైతే అలా చేస్తుందా?”
”చేస్తుందని ఏ తల్లీ అనుకోదు. చేసేవాళ్లంతా నీలాంటి తల్లులు వున్న వాళ్లు కాదా? అదేదో పెద్ద అత్యాచారం లాగ, అనాచారం లాగా మాట్లాడుతున్నావ్‌! ఇలాంటివి పొరపాట్లే! కాదని ఎవరంటారు? ఎంత ఉత్సాహంగా వుంటే మాత్రం రోడ్డుమీదకెళ్లి అమ్మాయిలను డాన్స్‌ చెయ్యమని చెబుతామా! ఆ దేవుడు కూడా ఆడపిల్లల్ని ఆడపిల్లల్లాగే వుండమని ఆశీర్వదిస్తాడు. అలా వుంటేనే ఆయన ఆనందిస్తాడు. కానీ వాతావరణ ప్రభావం అనేది మనుషుల్ని ఒక్కోసారి ప్రకోపింప చేస్తుందని నువ్వు వినలేదా? దేనికీ ఎవరూ అతీతులు కారు మధూ… ఇంతెందుకు ఒక తల్లికి కలెక్టర్‌ పుట్టొచ్చు, దొంగ పుట్టొచ్చు. కలెక్టర్‌ని కొడుకని చెప్పుకొని, దొంగని కొడుకని చెప్పుకోని తల్లి వుంటుందా? అలా వుంటే తల్లి తనాన్ని అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం! కానీ నువ్వు ఆనంద్‌ ఒక్కడినే కొడుకుగా ధైర్యంగా చెప్పుకుంటావు. అలా అని దేశం నిండా నీ లాంటి తల్లులే వున్నారా? నువ్వు కొడుకుగా చెప్పుకోలేని సతీష్‌చంద్ర నీ కడుపునేగా పుట్టాడు. అలా అని నువ్వు మంచి తల్లివి కావా?” అన్నాడు.
ఆమె దానికేం మాట్లాడకుండా ”ఆడపిల్లలు ఎలా బడితే అలా వుండొచ్చని మీరే అంటున్నప్పుడు నాతో పనేముందిక” అంది.
”అలా అని నేనన్నానా?”
”కుదిరితే ఇలా వుండొచ్చు. కుదరకపోతే అలా అయినా వుండొచ్చు. ఎలా వున్నా ఒకటే అనేగా మీరనేది….”
అంకిరెడ్డి మౌనంగా చూశాడు.
ఆమె లేచి ”ఈ ఇంట్లో నేను వుండను” అంది.
కంగారు పడ్డాడు అంకిరెడ్డి.
ఆమె తన గదిలోకి వెళ్లి వెంటనే బయటకొచ్చి ”నేను వెళ్తున్నా” అంది.
అంకిరెడ్డి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆపుతూ
”ఈ వయసులో ఇదేం తెగింపు మధూ?”
”ఆ వయసులో రోడ్డుమీద ఆ డాన్సేంటి అని దాన్ని అడిగారా? తెగించానికి ఏ వయసైతేనేం?” అంది. ఆమె గొంతు మామూలుగా లేదు. ఆడపులి గర్జనలా వుంది.
”అడుగుతాను నువ్వు లోపలకి వెళ్లు” అంటూ ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ గదిలోకి పంపి తలుపు పెట్టేశాడు అంకిరెడ్డి.
ధృతి ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు. అంకిరెడ్డి అక్కడే గంభీరంగా నిలబడి ఆలోచిస్తున్నాడు.
ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు పెళ్లికాక ముందు ఎలా వున్నా ఏం చేసినా ఎవరు చూస్తారులే అన్నట్లుంటారు. పెద్దవాళ్లు చూడరు కాబట్టి ఏం చేసినా పర్వాలేదనుకుంటారు, ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటారు. చెయ్యలేకపోతే వెనకబడినట్లు నిశ్శబ్దంగా కూర్చుని విచారిస్తారు. ఆమాత్రం చెయ్యటానికి కూడా నేను పనికిరానా అని బాధ పడతారు. చుట్టూ వున్నవాళ్లు కూడా అంతే! ‘నువ్వు పనికి రానిదానివే!’ అన్నట్లు చూస్తారు. ఎవరెలా చూసినా తనకంటూ ఒక సొంత చూపు వుండాలి. సొంత నడక వుండాలి. సొంత ఆలోచన వుండాలి. ఎదుటివాళ్ల నడక తన నడక కాకూడదు. ఎదుటివాళ్ల ఆలోచన, అభిరుచి, అలవాటు, ఆత్మవంచన, అంతరంగం తనవి కాకూడదు. తను కూడా వాళ్లలాగే వుండాలని అనుకోకూడదు. ఏ రోజుల్లో అయినా వర్షం ఆకాశం నుండి నేలమీద పడుతుందంటే నమ్మాలి కాని మన జనరేషనల్‌లో నేలమీద నుండి ఆకాశం మీద పడుతుందంటే నమ్మకూడదు. ఇలా ఎంతమంది అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఆలోచిస్తున్నారు? ఇప్పుడెలా? ఏం చేయాలి? భార్యను ఇంట్లోంచి పంపించివేయాలా? ధృతిని పంపించివేయాలా? ఎవరిని ఇంట్లో వుంచుకోవాలి? ఎటూ తోచడం లేదు అంకిరెడ్డికి…
సతీష్‌చంద్రకి ఫోన్‌ చేసి జరిగింది మొత్తం చెప్పాడు.
”తప్పేముంది నాన్నా!” అన్నాడు సతీష్‌చంద్ర.
అంకిరెడ్డి ”నేను కూడా మీ అమ్మతో అదే అన్నానురా! వినడం లేదు. దృతి మీద రోడ్డు మీద డాన్స్‌ చేసిందన్న తప్పు పెట్టి ఇంట్లోంచి పంపించెయ్యమంటోంది” అన్నాడు.
”అనవసరంగా దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నట్లుంది నాన్నా అమ్మ. ఊరేగింపులకి, ఉత్సవాలకి, పెళ్లికి, చావుకి రోడ్డే కద నాన్నా వేదిక. దాన్ని ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? అయినా అబ్బాయిలు రోడ్డుమీద డాన్స్‌ చేస్తే లేని తప్పు అమ్మాయిలు చేస్తే వుంటుందా? అలా అని ఫంక్షన్లలో, పార్టీలలో ఎంతమంది అమ్మాయిలు డాన్స్‌లు చేస్తున్నారు? మీకు తెలియందేముంది చేసేవాళ్లు తక్కువ చూసేవాళ్లు ఎక్కువ! ఏదో చూసి ఆ కొద్దిసేపు ఆనందించాలి కాని రోడ్డు రోడ్డు అంటూ ఇంతగా తప్పుపడతారా? అయినా ఒక భర్తగా నాకేం అది తప్పులా అన్పించటం లేదు” అన్నాడు.
”కావొచ్చు సతీష్‌! కానీ మీ అమ్మ మొండికేసినట్లు ఒకటే వాదిస్తోందిరా! ఇప్పుడు జీవితం ఇలాగే వుంటుందని ఎంత చెప్పినా వినటం లేదు. ఏం చేయను చెప్పు? పాడటంలాగే, రాయడం లాగే డాన్స్‌ కూడా ఒక కళ అని ఎంత చెప్పినా వినడం లేదు. అయినా నువ్వన్నట్లు ఇలాంటి డాన్స్‌లు ఎంతమంది చేస్తున్నారు? ఎక్కడో ఎప్పుడో అలా డాన్స్‌ చేసినవాళ్లంతా తప్పు చేసినట్లు కాదని కూడా చెప్పాను. ఏం చేయను సతీష్‌” అన్నాడు అంకిరెడ్డి.
సతీష్‌ మాట్లాకుండా ఆలోచిస్తున్నాడు.
”ఇప్పటికే ధృతి తిండి సరిగా తినకనో ఏమో బిడ్డ లోపల వుండాల్సినంత బరువు లేదట. మంచి ఆహారం తీసుకోవాలి. మానసింగా సంతోషంగా వుండాలి. ఇలాంటి స్థితిలో దృతిని మన ఇంట్లో వుంచుకోవటం అంత సేఫ్‌ కాదేమోననిపిస్తోంది… ప్రవీణ్‌తో చెప్పనా?”
”వద్దు నాన్నా!” అన్నాడు వెంటనే సతీష్‌చంద్ర.
”కడుపుతో వున్న పిల్లను అంతకన్నా ఏం చెయ్యగలం సతీష్‌! అదే కరక్ట్‌ అన్పిస్తోంది నాకు” అన్నాడు.
”అదెలా కరెక్టవుతుంది నాన్నా! ప్రవీణ్‌కేమైనా పెళ్లి అయ్యిందా? అమ్మ వుందా? ఎవరు చూస్తారు ధృతిని…? అసలే తన హెల్త్‌ కండిషన్‌ బాగాలేదని నువ్వే అంటున్నావ్‌!”
”బాగవుతుందిలే సతీష్‌! నువ్వేం టెన్షన్‌ పెట్టుకోకు”
”టెన్షన్‌ ఎందుకుండదు నాన్నా! మన ఇంట్లోనే దృతిని చూసుకోానికి ఇద్దరు ఆడవాళ్లు వుండి కూడా ఎవరూ లేనట్లే మాట్లాడుతున్నావ్‌! దృతిని తల్లిలా చూసుకోవలసిన అమ్మనే అలా మారిపోయినప్పుడు నేనిక్కడ టెన్షన్‌ పడకుండా ఎలా వుండగలను?”
”దృతికి ఏం కాదు. నేనున్నాను కదా!”
”మీరేం చెయ్యగలుగుతారు నాన్నా?”
”ఏదో ఒకటి చెయ్యాలిగా సతీష్‌!”
”అంతేగాని అమ్మకు నచ్చచెప్పలేవా!”
”ఆడవాళ్లను అర్ధం చేసుకోవటం కష్టంరా సతీష్‌! చూస్తుంటే వాళ్ల ముగ్గురిలో చాలా రోజులుగా ఏవో చిన్నచిన్న తేడాలు మొదలైనట్లున్నాయి. మీ అమ్మ అలా మారటానికి ఈ ఒక్క కారణమే ప్రధానంగా నాకు అన్పించటం లేదు. అయినా ఇప్పుడు వాటి గురించి ఆలోచించటం అనవసరం…”
”ఇప్పుడేం చేద్దాం నాన్నా?”
”మీ అమ్మ ఇంట్లోంచి వెళ్లిపోతానంటుందిరా! ఆ వీడియోని ఎవరు చూసినా దృతి మన కోడలని గుర్తుపట్టరా అంటుంది. గుర్తుపడితే నేనీ కాలనీలో ఎలా తిరగాలి అంటోంది. ఇది వినటానికి చిన్నదే అయినా మీ అమ్మకు పెద్ద గాయాన్నే చేసింది సతీష్‌! ఈ పని వల్ల ధృతి సామాజిక హద్దుల్ని దాటినట్లు భావిస్తోంది”
”పిల్లల్ని క్షమించలేరా నాన్నా! ఇంత చిన్న విషయాలనే క్షమించలేనప్పుడు ఆడవాళ్లకి భద్రత ఎక్కడ నుండి వస్తుంది? ఇంట్లోవాళ్లే పరాయివాళ్లలా ప్రవర్తిస్తుంటే ధృతి లాంటి వాళ్లకి దిక్కెవరు? నేను అక్కడ లేకపోవడం వల్లనేగా ధృతికి ఇన్ని బాధలు?”
అంకిరెడ్డి మాట్లాడలేదు.
సతీష్‌చంద్ర తండ్రితో మాట్లాడటం కట్ చేసి వెంటనే నరేంద్రకి ఫోన్‌ చేశాడు. తండ్రి తనతో ఏం మాట్లాడాడో దాచుకోకుండా చెప్పాడు… ”ధృతి వుంటే మా అమ్మ ఇంట్లోంచి వెళ్లిపోతానోంటందట నరేంద్రా! ఇప్పుడేం చేద్దాం?” సలహా అడిగాడు.
నరేంద్ర కూడా జవాబు చెప్పలేనట్లు మౌనంగానే వున్నాడు.
”ఇలాంటి స్థితిలో ధృతిని మా ఇంట్లోనే వుంచితే పరిస్థితి దారుణంగా వుంటుందేమో! నాకెటూ తోచడం లేదు” బాగా డిప్రెషన్‌లోకి వెళ్లి మాట్లాడుతున్నాడు సతీష్‌చంద్ర.
”ఛ…ఛ ఎందుకలా బాధపడుతావ్‌? వేరే ఇంకేమైనా సొల్యూషన్‌ ఆలోచిద్దాంలే! నువ్వేం వర్రీ కాకు…” ధౌర్యం చెప్పాడు నరేంద్ర.
”ఏమో నరేంద్రా! ధృతిని వాళ్లంతా కలిసే ఇలా చేశారేమో అన్పిస్తుంది”
”నెగివ్‌గా ఆలోచించకు సతీష్‌! ఎంతయినా వాళ్లు నీ ఫ్యామిలీ మెంబర్స్‌!”
”ఫ్యామిలీ మెంబర్స్‌ అయితే ఇలా జరిగేదా నరేంద్రా…?”
నరేంద్ర మాట్లాడలేదు.
”ఒక్కటి చెప్పు నరేంద్రా! నేనక్కడ వుండి వుంటే దృతిని వాళ్లంతా అలా చూసేవాళ్లా! అలా చూడొద్దనే కదా అంతంత డబ్బు పంపాను”
… ఎంత డబ్బు పంపినా భర్త దగ్గర లేకుంటే ఏ భార్య పరిస్థితి అయినా అంతే! దీనికెవరూ అతీతులు కారు. ముఖ్యంగా చాలామంది సైనికులకు ఇలాంటి స్థితి అనుభవమే… అయినా కన్నవాళ్లను నమ్మని వాళ్లెవరుంటారు? తల్లి పక్షి పొడుస్తుందని పిల్లపక్షులు వూహిస్తాయా? అందుకే నరేంద్ర మాట్లాడలేదు.
సతీష్‌చంద్రకి బాధగా వుంది. ఆ బాధలో తన కుటుంబ సభ్యులపై కోపం తప్ప ప్రేమ కలగడం లేదు. కనిపిస్తే నోటికొచ్చినట్లు తిట్టాలనివుంది. అదే ఒకప్పుడైతే నిజంగానే తిట్టేవాడు. ఇప్పుడు మిలటరీలో నేర్చుకున్న క్రమశిక్షణ, సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాడు.
”కనీసం డబ్బు పంపినందుకైనా ధృతిని జాగ్రత్తగా చూసుకోవద్దా? అసలు వాళ్లు నా కుటుంబ సభ్యులేనా?” అన్నాడు సతీష్‌చంద్ర ఆవేశంగా
”కూల్‌ కూల్‌ సతీష్‌!”
”ఎలా వుండమంటావు కూల్‌గా! లోపల బేబి ఒక్క కిలో బరువు మాత్రమే వుందట స్టెరాయిడ్‌ వాడాలన్నారట” అన్నాడు.
”అవెందుకు?” నరేంద్ర అడిగాడు.

ఇంకా వుంది…