July 7, 2024

బాల మాలిక – ప్రోత్సాహంతోనే విజయం..

రచన: భోగా  పురుషోత్తం

 

‘‘నమస్తే అంకుల్‌!’’  గుమ్మం బయటి నుంచి అంది పక్కింటి ప్రియాంక

తలెత్తి చూశాడు పరంధామయ్య. ప్రియాంక నవ్వుతూ నిల్చొని వుంది.

ఆ అమ్మాయిని చూస్తే పరంధామయ్యకి చిరాకు. ‘‘రవి లేడా అంకుల్‌ ’’ ప్రశ్నించింది ప్రియాంక.

‘‘ఉన్నాడు’’ పుస్తకం కింద పెడుతూ అన్నాడు పరంధామయ్య.

టీవీ ఆపేసి పక్కకి తిరిగి చూశాడు రవి.

పరీక్ష రాయడానికి ఏదో ఒకటి చదవమని పుస్తకం వంక చూడబోయింది ప్రియాంక. హిస్టరీ పుస్తకం అందించాడు రవి.

ఇద్దరూ మాట్లాడుకుంటున్నది బయటి నుంచి చాటుగా వింటున్నాడు పరంధామయ్య.

‘‘నువ్వు ఇంకా బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చువాలి. అదే నా ఆశ ’’ అంది ప్రియాంక.

‘‘అదే… అదే… ’’ ఎంత బాగా చదువుతున్నా మంచి మార్కులు రావట్లేదు’’ ఆదుర్దాగా అన్నాడు రవి.

‘‘అవును రవి! నువ్వు నాకన్నా ఎక్కువ సమయాన్ని చదువుకు కేటాయిస్తున్న సంగతి నాకు తెలుసు.. అయినా నీవు ఎక్కువ మార్కులు పొందలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది…’’

‘‘అయితే ఎక్కువ మార్కులు రావడానికి మార్గం ఏదైనా ఉంటే చెప్పు ప్రియాంక!’’ ఆశగా అడిగాడు రవి.

‘‘చూడు రవి.. నీ మనసు నాకర్థమైంది. మీ నాన్న టీచర్‌ అని, నీకు తక్కువ మార్కులు వస్తున్నాయని నీవు అవమానంతో చితికిపోతున్నావు. ఆందోళనలో పడి చదివింది మరుస్తున్నావు. నిజానికి నువ్వు నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలవు. నిర్భయంగా చదివింది రాయి. అన్నట్టు ఈ నెల డబ్బులు లేక నేను బస్‌ పాస్‌ కట్టలేదు. నీ సైకిల్లో నన్నుస్కూలుకి  తీసుకెళ్లవూ రవి..!’’ అని అడిగింది ప్రియాంక.

రవి అంగీకరించలేదు ‘‘మా నాన్న అనుమతి అవసరం’’ అన్నాడు.

‘‘అవసరం లేదురా! ఆ అమ్మాయి చాలా మంచిది. కనుకనే నిన్ను ప్రోత్సహించి వృద్ధిలోకి తేవాలని చూస్తోంది. కానీ అది గ్రహించలేని నేను ఆ అమ్మాయితో నిన్ను పోల్చి హీనంగా చవట  దద్దమ్మ అని నిరుత్సాహపరిచి నీ మనసును గాయపరిచాను.. నన్ను క్షమించరా.’’ అంటూ అక్కడి కొచ్చాడు పరంధామయ్య.

రవి మనసు కుదుట పడింది.  మరుదినం రవి సైకిల్‌ ఎక్కింది ప్రియాంక. భయం భయంతో ఏదేదో మాట్లాడసాగింది. ‘‘నువ్వేమీ భయపడకు ప్రియాంక ! నిన్ను క్షేమంగా స్కూలుకి చేర్చే బాధ్యత నాదే..’ అన్నాడు రవి.

‘‘అవునవును. పరీక్షల్లో నువ్వు భయం లేకుండా తెలిసింది రాయి రవి!’’ అంది.

ఈ సారి ప్రియాంక కంటే ఎక్కువ మార్కులు సంపాదించాడు రవి. ప్రియాంక అసూయ చెందలేదు. రవి దగ్గరకెళ్లింది.

‘‘ఒక్కసారిగా నీకన్ని మార్కులు ఎలా వచ్చాయి రవి?’’ అడిగింది.

‘‘అంతా నువ్వే ప్రియాంక! మొదట్లో ఎంత చదివినా మా నాన్న మొద్దు.. ఎంత చదివినా  నీవెందుకూ పనికి రావురా.. చవట దద్దమ్మవి’’ అని తిడుతుండేవాడు. దాంతో నా మనసు నిరుత్సాహంతో కృంగిపోయేది. మొన్న నీవిచ్చిన ప్రోత్సాహమే నన్ను విజయపథాన నడిపించింది. నీకు మెనీమెనీ థ్యాంక్స్‌ ప్రియాంక’’ అని చెబుతుంటే తను తిడుతూ నిరుత్సాహపరచడం వల్లే తన కొడుకు చదివించి మరిచిపోయి అధైర్యంతో తక్కువ మార్కులు తెచ్చుకునేవాడని, ప్రియాంక ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఉత్సాహంతో చదివి అందరికన్నా మంచి మార్కులు పొందాడని గ్రహించాడు రవి తండ్రి పరంధామయ్య. తాను టీచరు అయినా విజయరహస్యాన్ని కనుక్కోలేక క్లాసులో అందరినీ నిరుత్సాహపరచడం వల్లే చదువులో వెనుక పడ్డారని  గ్రహించాడు పరంధామయ్య. తను చేసిన తప్పును సరిదిద్దుకుని మరుసటి రోజు నుంచి క్లాసులో అందరినీ బాగా చదవాలని ప్రోత్సహిస్తూ ఉత్సాహ పరుస్తూ మంచి మార్కులు సాధించేందుకు కృషి చేశాడు టీచర్‌ పరంధామయ్య.

 

****

1 thought on “బాల మాలిక – ప్రోత్సాహంతోనే విజయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *