మా గురించి

మాలికకు స్వాగతం. సంక్రాంతి, ఉగాది, శ్రావణ పౌర్ణమి, దీపావళి సందర్భంగా వెలువడే ఈ త్రైమాసిక పత్రికగా మొదలై క్రమక్రమంగా రెండు నెలలకోసారి ఆ తర్వాత మాసపత్రికగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది.  దీనిని వెలువరించటానికి మాకు సహాయపడుతున్న అనేకమంది శ్రేయోభిలాషులకు, ఆదరిస్తున్న పాఠకులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఇప్పటికే అచ్చులోను, అంతర్జాలంలోనూ ఇన్నిన్ని పత్రికలు ఉన్నాయి కదా, కొత్తగా మీ పత్రిక ఏమి సాధించబోతోంది అని మమ్మల్ని చాలామందే అడిగారు. అనంతమైన ఈ సాహిత్య ప్రపంచంలో ఇంకా కనుగొనబడని వింతలు విశేషాలూ చాలానే ఉన్నాయి. అమూల్యమైన కృషి చేసి అద్భుతమైన ఫలితాలు సాధించిన అచ్చు మరియు వెబ్ పత్రికలకు అందనివాటిని అందుకోవటం కోసమే మా ఈ తపన. సాహిత్యానికి, సమాచార స్రవంతికి అంతిమ ఘడియలు సమీపించాయని నిర్ణయింపబడేవరకూ మా ఈ అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే శ్రేష్టత, ప్రమాణాలే ఆధారంగా నడుస్తున్న ప్రస్తుత పత్రికలకు, వాటిలో ప్రచురించగలిగే సామర్ధ్యం ఉండి,  ఆ అవకాశాలు చేజిక్కించుకోలేనివారికి మధ్య వారధిలా కూడా ఈ పత్రిక ఉపయోగపడాలనేది మా ఆకాంక్ష. ఇంకా మట్టిలో మిగిలి ఉన్న మాణిక్యాలని వెలికి తీయటం కూడా మా లక్ష్యాలలో ఒకటి.

మిత్రుడు ఆర్కే అన్నట్టు, ఇజాల ఇనపసంకెళ్ల నుంచీ, వాదాల సంకుచిత దృష్టినుంచీ  ప్రపంచాన్ని చూడని మేము అనుసరించే సిద్ధాంతాలు, “ఈశావాస్య మిదం సర్వం”, “ఏకం సత్ విప్రా బహుదా వదంతే”.మరొక ముఖ్యమైన విషయమేమిటంటే ఈ పత్రిక గమనం ఒకే దిశలో ఉండదు. “రచయితలు-పాఠకులు” అనే నిర్దేశిత నమూనాకు బదులుగా వెబ్ 2.0ను అనుకరిస్తూ పాఠకులని కూడా వ్యాఖ్యల ద్వారా లేక ఇతర పధ్ధతుల ద్వారా రచయితలుగా మార్చే ప్రయత్నం ఈ పత్రికద్వారా మేము చేస్తున్నాం. పత్రికాపరంగా జరిగే చర్చలలో సమాచార సాగరం చిలకబడి దానిలోనుండి జ్ఞానామృతం పుట్టుకొస్తే మా ఈ చిన్ని ప్రయత్నం సఫలీకృతమయినట్లే.

ఇక మా బృందం విషయానికి వస్తే ,
ఈ వెబ్ సైటు మీకు కనబడటానికి ముఖ్యకారణమైన వట్టిపల్లి శ్రీను & కుప్పాల రంజీత్ (ఆర్కే),  వారికి సహాయ సహకారాలందించిన ఆత్రేయ విమల్ & నారుమంచి పద్మ, వ్యాసాలను ఈ సైటుకెక్కించటంలో రాత్రింబవళ్ళూ శ్రమించిన పిరియా రవి & ఇంద్రకంటి కార్తీక్, ప్రచారపరంగానూ & ఇతరత్రా సహాయాన్నందించిన మంచుపల్లకీ & శ్రీనివాస్ చౌదరి, డాలస్ కృష్ణ, కుమార్ ఎన్, భాస్కర రామరాజు, మరియు మీ భవదీయుడు మాలిక ముఖ్యసభ్యులు. మాలిక లోగోలకు అందాలు అద్దిన భండారు శివ & ధరణీరాయ్ చౌదరి గార్లకు, ఇతరత్రా సహాయం చేసిన తారకు మా కృతజ్ఞతలు.

పత్రికాపరంగా అయితే  జ్యోతి వలబోజు కంటెంట్ హెడ్, మరియు ప్రధాన సంపాదకురాలిగా ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇతర ముఖ్యసభ్యులు డా. గౌతమి జలగడుగుల.

సంపాదకీయ వర్గంలో ముఖ్యసభ్యులతో పాటు డా.దేవకీదేవి, డా.రాఘవమ్మ, డా.సీతాలక్ష్మి ఉన్నారు. ఈ సందర్భంగా మా శ్రేయోభిలాషులు, సన్నిహితులయిన  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.అనుమాండ్ల భూమయ్యగారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

– (మాలిక బృందం తరపున) వెలమకన్ని భరద్వాజ్