విశ్వపుత్రిక వీక్షణం 2 – తుపాకి సంస్కృతి

రచన: విజయలక్ష్మీ పండిట్

ప్రపంచంలో రాను రాను యుద్ధాలలో చనిపోయే వారి సంఖ్య కంటే తుపాకి సంస్కృతికి బలి అయిపోయేవారి సంఖ్య పెరిగిపోతుందనిపిస్తుంది.

తుపాకి సంస్కృతి అంటే ప్రజలు (సివిలియన్స్‌) తుపాకి లైసెన్స్‌ కలిగి తుపాకులు కలవారు. ఈ తుపాకి సంస్కృతి వల్ల ఆత్మహత్యలు, మాస్‌ షూటింగ్స్‌, ప్రాణాలు పోవడం.

మార్చి 21, 2018న అమెరికాలోని ఫ్లోరిడాలో The March for our Lives అని విద్యార్థుల, టీచర్ల, తల్లితండ్రుల అతిపెద్ద ఊరేగింపు దీనికి నిదర్శనం. మర్‌జోరి స్టోన్‌మాన్‌ డౌలాస్‌ హైస్కూల్‌లో ఒక విద్యార్థి 17 మందిని తన తుపాకితో కాల్చి చంపడం పెద్ద కలవరాన్ని రేపింది. ప్రపంచ వ్యాప్తంగా తుపాకి సంస్కృతి, తుపాకి చట్టాలు, తుపాకి కలిగిన వారి (ఓనర్‌ల) హక్కులు బాధ్యతలపై పెద్ద చర్చకు దారితీసింది.

ఒకసారి ప్రపంచ తుపాకి సంస్కృతికి సంబంధించిన గణాంకాలు తిరగేస్తే ఆశ్చర్యానికి లోనవుతాము.

ఒక అంతర్జాతీయ సంస్థ క్రైమ్‌ చార్ట్‌ ప్రకారం, తుపాకి కాల్పులలో చనిపోయిన వారి సంఖ్య  యు.ఎస్‌ (2016)లో 64%, ఇంగ్లాండు, వేల్స్‌ (2015-16)లో 4.5%,కెనడా (2015)లో 30.5%, ఆస్ట్రేలియా (2013-14)లో 13% .ఈ గణాంకాలు సమర్థించదగ్గ కాల్పులు తీసివేయగా ఇచ్చినవి.

ఇక ప్రపంచ దేశాలలో  దాదాపు వంద ప్రజలలో (Arms per every 100 residents) తుపాకులను కలిగి వున్నారన్న SRM Survey 2011 గణాంకాలు పరిశీలిస్తే పది ముఖ్యమైన దేశాలు వరుసగా అమెరికా (యుఎస్‌) 90 మంది, ఎమెన్‌ 55 మంది, స్విట్జర్లాండ్‌ 45 మంది, ఫిన్‌లాండ్‌ 45 మంది, సిప్‌రస్‌ 38 మంది, సౌది అరేబియా 35 మంది, ఇరాక్‌ 35 మంది, వురుగువే 32 మంది, కెనడా 31 మంది, ఆస్ట్రేలియా 30 మంది సివిలియన్స్‌ వద్ద తుపాకులున్నాయి.

మదర్‌ జోన్స్‌ (Mother Zones) అనే మాగజైన్‌ సర్వే ప్రకారం యు.ఎస్‌.(అమెరికా)లో 1982 నుండి 90 మాస్‌ షూటింగులు (Mass Shooting) జరిగాయి. 2012 వరకు మాస్‌ షూటింగ్‌ అంటే నలుగురు అంతకంటే ఎక్కువగా తుపాకి కాల్పులకు బలి అయిన వారనే నిర్వచనము, 2013 నుండి ఆ సంఖ్యను మూడు నుండి ఆపైన అన్నది నిర్వచించారు. తుపాకి చావుల్లో మాస్‌ షూటింగ్స్‌ భాగం చాలా చిన్నదయినప్పటికీ ఆ సంస్కృతి పెరుగుతుండడం కలవరాన్ని కలిగిస్తుంది. మదర్‌జోన్స్‌ మాగజైన్‌ ప్రకారం 2014లో తుపాకి కాల్పులకు చనిపోయిన వారి సంఖ్య అమెరికాలో మొత్తం 33,594లో 21,386 తుపాకితో ఆత్మహత్యలు, 11,008 హత్యలు (హోమిసైడ్స్‌), అందులో 14 మంది మాస్‌ షూటింగ్‌లో చనిపోయారు. తుపాకులతో ఆత్మహత్యల సంఖ్య హత్యల సంఖ్యకు రెండింతలుంది. ఈ ఆత్మహత్యలు కూడా తుపాకులను కలిగి వున్న కుటుంబాలలోనే అనేది వెల్లడయింది.

అమెరికాలో 1991 నుండి మాస్‌ షూటింగ్‌ చావులను పరిశీలిస్తే 1999లో 13 సంఖ్య, 2017 (Las Vegas – Nevada) 58కి పెరిగింది (Source: FBI, Las Vegas Police).

ఇక ఏరకమైన తుపాకులు వాడుతున్నారన్నది పరిశీలిస్తే దాదాపు కబిదీఖి స్త్రతిదీరీ 60%, రైఫిల్స్‌ 30%, షాట్ గన్స్‌ 10%, మిగిలిన రకాలు 10% అని తేలింది.

ఇంతకీ ఈ తుపాకులను, తుపాకి సంస్కృతిని అరికట్టడానికి ఏ చర్యలు, చట్టాలు జరిగాయని పరిశీలిస్తే అమెరికాలో తుపాకి చట్టాలు కఠినతరం చేయాలని ఎక్కువ మంది అమెరికన్‌ ప్రజలు కోరుతున్నట్లు తెలుస్తుంది. కాని నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ (NRA) తుపాకి కంోల్‌ని నియంత్రణకు వ్యతిరేకంగా ప్రతి ఐదుమంది యు.ఎస్‌. తుపాకి ఓనర్స్‌లో  ఒకరు NRA లో మెంబర్‌ కావడం  ఒక విశేషం. తుపాకి తయారు సంస్థలు, అసోసియేషన్‌లు అమెరికా రాజకీయాలను ప్రభావితం చేస్తూంటే ఈ తుపాకి సంస్కృతి (గన్‌ కల్చర్‌) వ్యాప్తి కాదా!

ఇండియాలో ప్రజలు తుపాకులు కలిగి వుండడంపై కఠిన నిబంధనలు ఉన్నా, ఇండియాలో 40 మిలియన్‌ల తుపాకులున్నట్లు, ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా గణాంకాలు చూపుతున్నాయి! ఇండియాలో ఆయుధాల చట్టము (Arms Act) సర్వే ప్రకారం 80వేల ఆయుధాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్టు నమోదయింది. ఇది 2007 నుండి 2009కి 8% పెరిగినట్టు సూచించారు. ఇండియాలో తుపాకులు ప్రజలు కలిగి వున్నా అమెరికాతో పోల్చినట్లయితే ప్రతి లక్షమంది ప్రజలలో తుపాకుల వల్ల మరణించిన వారు అమెరికాలో 4.96 అయితే ఇండియాలో 2.78. దీనికి కారణం అమెరికాలో తుపాకులు కలిగి వుండడం వారి రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాథమిక హక్కుగా వారు కలిగి వుండడం. భారతదేశంలో  ఆయుధాల చట్టం ప్రకారం ప్రజలకు అలాంటి హక్కును, అవకాశాన్ని కలిగించలేదు. అయినా చాపకింద నీరులా ఈ తుపాకి సంస్కృతి వ్యాపిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో మొదటి నుండి బ్రిటీష్‌ పరిపాలనలో ప్రజలను నిరాయుధీకరణ చేయడం, కొన్ని రాజరికాలు, ప్రివిలేజ్‌ ప్రజలకు మాత్రమే ఆ హక్కు, అవకాశం కలిగించడం, బుద్ధుడు జన్మించిన భూమిలో, భారతదేశ స్వాతంత్య్రపోరాటంలో గాంధీజీ అహింసా సిద్ధాంతం ప్రజలలో ఒక సంస్కృతిగా వున్న కారణం కావచ్చని అభిప్రాయపడతారు. కాని కొంతమంది ఇప్పటితరంలో భారతీయులు కూడా  టెర్రరిస్టుల నుండి, ఉన్మాద ప్రజల నుండి కాపాడుకోవడానికి తుపాకులు కలిగివుండే హక్కు అవసరమంటారు.

ఈ నేపధ్యంలో ఈ తుపాకి సంస్కృతిపై ఒక రచయిత స్పందన పరిశీలిద్దాం.

తుపాకి సంస్కృతిపై రచనలు చేసిన జేమ్స్‌ బోయిసి (James Boice) తన The Shooting అనే రచనలో, ” Guns are our impossible Children|They grow out of our Flaws”. తుపాకులు మన అసాధ్యమయిన పిల్లలు, అవి మన తప్పులనుండి ఎదిగినవే అంటాడు. మనం ఎందుకు అసాధ్యమయిన ఆ తుపాకి పిల్లలపై ఆధారపడ్డామంటే మనం ఒకరంటే ఒకరికి భయం, చావంటే భయం, మనం ఒంటరితనంతో బాధపడుతున్నాము. తోటివారిపై అపనమ్మకం, మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ అసాధ్యమయిన తుపాకి పిల్లలను పెంచి పోషిస్తున్నామన్నాడు.

ఎంత నిజం?! ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతూ మనిషిని మనిషిగా గుర్తించలేని, ప్రేమించలేని కాలంలో భయంతో జీవిస్తూ, తుపాకులను అనునిత్యం రక్షణ కోసమవసరమని నమ్మే సంస్కృతి పెరిగిపోయినప్పుడు తుపాకి సంస్కృతి వ్యాప్తికాక మానదు. ఇక తుపాకులే దేశ ప్రజల సంస్కృతికి కొలమానాలా అనే సందేహం రాకమానదు.

ప్రపంచ ప్రజలలో మనమంతా ఒకే కుటుంబం, ఒకే జాతి పౌరులం అనే స్పృహ కోల్పోతున్న తరుణమిది. ఎవరికి వారు ప్రాంతాలుగా, రాష్ట్రాలుగా, భౌగోళికంగా, దేశాలుగా మానసికంగా అడ్డుగోడలు కట్టుకుంటూ పోతుంటే భయంతో, భీతితో, అపనమ్మకంతో తుపాకులను ఆశ్రయించి నాలుగు గోడల నడుమ ఒంటరి బతుకులు బ్రతకడానికి అలవాటు పడితే నష్టపోయేది మనమే (మానవుడే) కదా! ఈ తుపాకి సంస్కృతిని రూపుమాపడం ప్రతి ప్రపంచ పౌరుని నినాదం కావాలి.

శాంతి సంస్కృతిని (Peace Culture) స్థాపించాలి, వ్యాప్తి చేయాలి. అప్పుడే రాబోయే తరాల బిడ్డలకు శాంతి, సౌఖ్యం.

*****

మాలిక పత్రిక మే 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju

Chief Editor and Content Head

 

అనివార్య కారణాల వల్ల మాలిక పత్రిక మే 2018 సంచిక కాస్త ఆలస్యంగా విడుదల అయింది. క్షమించాలి.. బోలెడు కథలు, కవితలు, వ్యాసాలు, సీరియళ్లు మీకోసం ముస్తాబై వచ్చాయి. ప్రతీనెల మీరు చదువుతున్న రచనలు ఆసక్తికరంగా ఉన్నాయని భావిస్తున్నాము. ఎటువంటి సలహాలు, సూచనలైనా మీరు మాకు పంపవచ్చు.

పాఠక మహాశయులు, రచయితలు అందరికీ శుభాకాంక్షలు

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ సంచికలోని విశేషాలు:

1. ఒక చిన్నారి చెల్లి 2
2. బ్రహ్మలిఖితం
3. గోదారొడ్డు కథలు 2
4. మాయానగరం 46 – 
5. చుట్టపు చూపు
6. రెండో జీవితం 7
7. కలియుగ వామనుడు 6
8. చందమామ పాటలు 2
9. పాజిటివ్ థింకింగ్
10. లాస్య
11. ఇడ్లీ డే
12. తేనెలొలుకు తెలుగు 2
13. తారే జమీన్  పర్
14. జీవితమే ఒక పెద్ద పోరాటం
15. మనోవేదికపై నర్తించిన అక్షర రవళి
16. ఏనుగు లక్ష్మణకవి
17. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
18. అమర్ చిత్రకథ సృష్టికర్త
19. నదుల తీరాలపైనే నాగరికతలన్నీ
20. మొగ్గలు
21. అమ్మేస్తావా అమ్మా!
22. కవితా ఓ కవితా!
23. కార్టూన్స్

ఒక చిన్నారి చెల్లి .. 2

రచన: అనామిక

తాయిలం కొనుక్కున్నాను కానీ ఒక్కరోజులో తినేస్తే ఐపోతుంది.అమ్మ రోజూ డబ్బులివ్వదు గా. ఏం చెయ్యాలి? కొంచెం దాచుకుంటే? అమ్మో! ఎవరైనా తినేస్తారేమో! దాచినా ఎవరికీ కనబడకుండా దాచాలి. చాలా సేపు ఆలోచించి కొంచెం పీచు మిఠాయి తిన్నాను. జీడిపాకం తో చేసిన పిల్లి బొమ్మ తినేసాను.వాచీ మాత్రం దాచుకోవాలనుకున్నాను. చిన్నన్నయ్య పాత కంపాస్ బాక్స్ నా బాగ్ లో దాచుకున్నాను. బలపాలు పెట్టుకుందుకు.

ఆ బలపాలు తీసి ఒక చిన్న కాగితం లో పొట్లాంకట్టి, నేను కట్టుకున్న పరికిణీ తో ఆ కంపాస్ బాక్స్ శుభ్రంగా తుడిచాను. అందులో పీచు మిఠాయి, జీడి పాకం వాచీ దాచుకున్నాను. అది కూడా ఎవరూ చూడకుండా మా క్లాస్ పాక వెనకకి వెళ్ళి. ఇంటికెళ్ళి బధ్రంగా దాచాలి అనుకున్నాను.

స్కూల్ అయ్యేదాకా ఆగడానికి కూడా మనసు ఆగటం లేదు.మొత్తానికి స్కూల్ అయ్యాక ఇంటికెళ్ళి, కంపాస్ బాక్స్ ఎక్కడ దాచాలో ఆలోచించాను. మూల ఉన్న పెద్ద గదిలో బియ్యం డ్రమ్ము పెద్దది ఉంది. అక్కడ అమ్మా,నాన్నా పడుకుంటారు.ఆ గదిలోకి ఎక్కువగా ఎవ్వరూ రారు. నాన్నగారికి ముద్దు వచ్చినప్పుడు నన్ను ఆయన పక్కలో పడుకోబెట్టుకునేవారు. అలా పడుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో?

బియ్యండ్రమ్ము ఒక పెద్ద పీట మీద ఉండేది.ఆ పీట కింద పెడితే ఎవ్వరూ చూడరు. ఎవ్వరూ లేనప్పుడు కంపాస్ బాక్స్ దాని కింద దాచేసాను.

ఐనా భయం ఎవరైనా తీసి తినేస్తేనో? అస్తమానూ ఆ గదిలోకి వెళ్ళడం చూసిన అమ్మ అడగనే అడిగింది. “ఏముందే ఆ గదిలో అన్నిసార్లు వెడుతున్నావు”అని. అమ్మో చెపితే ఇంకేమైనా ఉందా !

మర్నాటి దాకా ఆ తాయిలం దాచుకోవాలిగా మరి..స్కూల్లో చేరాక ఇన్నాళ్ళకు తాయిలం తీసుకెళ్ళే అవకాశం దొరికింది.అప్పుడప్పుడు ఆవకాయ డొక్క అమ్మ చూడకుండా కడిగేసి ఎంగిలి, అంటు,సొంటు అంటుందిగా అందుకని తీసుకెళ్ళేదాన్ని. ఆవకాయ డొక్క అని వెక్కిరిస్తారని చిన్న తెల్లగుడ్డలో చుట్టి ఏదో అపురూపమైన వస్తువులా ఫోజ్ ఇచ్చి మరీ తినేదాన్ని.అదన్న మాట.
ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసి రోజూ కన్నా తొందరగా లేచాను. అమ్మ కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకుంటోంది.

“ఏమయ్యిందే ఇంత తొందరగా లేచావు? నిద్ర పట్టలేదా? రోజూ పదిసార్లు లేపితే కానీ లేవవు కదా!” అంది.

“ఏం లేదు ఊరికేనే”అంటూ నీళ్ళ గదిలో ఉన్న పళ్ళపొడి చేతిలో వేసుకుని గోలెంలో ఉన్న నీళ్ళు చెంబుతో ముంచుకుని పెరట్లో ఉన్న గట్టు మీద కూర్చున్నాను. అక్క లేస్తే పోటీకి వస్తుంది. నాకన్నా పెద్దది కదా! అన్నిటికీ అధారిటీ.

అది చూడకుండా దాని వస్తువులు వాడుకోవడం నాకు సరదా.అప్పుడప్పుడు దాని ఓణీలు కూడా చుట్టబెట్టుకుంటాను.

మొహం కడుక్కుని వచ్చేసరికి అమ్మ తనకీ నాన్నగారికీ కాఫీ కలుపుతోంది.ఇంట్లో నాకొక్కర్తికే పాలు. అందులో కొంచెం నీళ్ళు పోసి ఒక్క చుక్క కాఫీ వేస్తుంది.అప్పటికి మా ఇంట్లో బోర్నవిటా తెలియదు. కోకోమాల్ట్
అని కొంతమంది గొప్పవాళ్ళ పిల్లలు తాగేవారుట. ఒకసారి అమ్మ నాన్నతో చెప్పడం విన్నాను. ఒక డబ్బా
చిన్నదాని కోసం తెండి” అని. నాన్న నవ్వి “అలాగే” అనేవారు.లేదు అన్నమాట ఆయనకు ఇష్టం ఉండేది కాదుట. అది కొంచెం పెద్దయ్యాక తెలిసింది.

అమ్మ ఇచ్చిన పాలు తాగేసి గబగబా స్నానం చేసేసాను. తాయిలం ఎలా ఉందో ఒకసారి చూడాలని ఉన్నా అందరూ అడుగుతారని భయం.
ఎనిమిది దాటాక అక్కని చద్దన్నం పెట్టమంది అమ్మ. ఒక కంచం తీసి కాస్త తరవాణి అన్నం పెట్టి.కొద్దిగా మాగాయ వేసింది అక్క. గబగబా అన్నం తినేసాను.
“అక్కా జడ వెయ్యవా?” అన్నాను. అక్క ఏ మూడ్ లో ఉందో “నీకు ఇవ్వాళ వేరే రకం జడ వేస్తాను”అంది.
బహుశా తన స్నేహితురాలి దగ్గర నేర్చుకుని ఉంటుంది.అది నా మీద ప్రయోగం.
కానీ అక్క జడ చాలాబాగా వేసింది. ఆ తరువాత మా స్కూల్లో కూడా అందరూ తెగ మెచ్చుకున్నారు. స్కూల్ కి తయారయ్యి ఎవరూ చూడకుండా డ్రమ్ కింద ఉన్న కంపాస్ బాక్స్ తీసి తెరిచి చూసాను. ఒక్కసారిగా ఏడుపు వచ్చింది.
పీచు మిఠాయి అసలు కనబడ లేదు. గులాబీ రంగులో చిన్న చిన్న పొక్కుల్లా డబ్బా అంతా నిండి ఉంది. జీడిపాకం తో చేసిన వాచీ వేడికి కరిగిపోయి అది వాచీ వా మరొకటో తెలియకుండా ఉంది.

అప్పుడే అక్కడకు వచ్చిన అక్క ఏడుస్తున్న నన్ను చూసి “ఏమయ్యిందే” అని అడిగింది.ఏడుస్తూ జరిగింది చెప్పాను.
“పిచ్చి మొహమా! పీచు మిఠాయి వెంటనే తినెయ్యాలి. అది గాలితో ఉంటుంది ఆ గాలి పోగానే ఏమీ మిగలదు ఇంక జీడిపాకం వేడికి కరిగిపొతుంది.అన్నీ ఒక్కరోజు కొనుక్కునే బదులు రెండు రోజులు కొనుక్కోవాలసింది”.

నా అజ్ఞానానికి ఏడుపు వస్తున్నా ఏం చెయ్యాలో తెలియక పరికిణీతో కళ్ళు తుడుచుకున్నాను.అక్కకి ఏమనిపించిందో “పోనీలే ఏడవకు ఈసారి అమ్మతో చెప్పి మళ్ళీ డబ్బులిప్పిస్తాలే.ఇప్పుడు మాత్రం ఆ జీడిపాకం కూడా తినకు. ఆ డబ్బా తుప్పు దానికి అంటుకుని ఉంటుంది” అంది.
అక్క అలా అనేసరికి నా బాధ ఏమని చెప్పను. ఎంత ఆపుకున్నా కన్నీళ్ళు ఆగటం లేదు. అపురూపంగా దొరికిన తాయిలం అలా ఐతే ఎవరికైనా ఏడుపు ఆగుతుందా?అందులో చిన్నపిల్లలకు.

అన్నట్లు చెప్పడం మరిచాను. నేను నాలుగేళ్లు దాటాక ఎప్పుడూ గౌన్ వేసుకోలేదు. అమ్మ కు ఇష్టం ఉండదు.ఇంచక్కా పరికిణీ ఐతే కాళ్ళు కనబడవు అనేది.నాన్నేమో బట్ట తక్కువవుతుంది అనేవారు. అమ్మేమో గౌను పొట్టి ఐపోతే మళ్ళీ కొత్త గౌను కుట్టించాలి అనేది.పరికిణీ ఐతే లోపల ఫిల్ట్ వేస్తే రెండు మూడేళ్ళు వాడుకోవచ్చని ఆవిడ అభిప్రాయం

అలా నేను చిన్నపిల్లప్పుడే పరికిణీల్లోకి మారిపోయాను.కానీ మా స్కూల్లో అందరూ గౌన్లే.నేను తప్ప.కన్నీళ్ళు తుడుచుకుని,పలకా బలపం తీసుకుని స్కూల్ కి వెళ్ళాను. స్కూల్ ముందర ఆ పీచు మిఠాయి వాడిని చూడగానే మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు.కానీ అందరూ చూస్తారని మోచేత్తో కళ్ళు తుడుచుకున్నాను. నా బొడ్లో రుమాలు ఉంది.
రుమాలంటే కొన్న ది కాదు.అమ్మ బట్తలు పాడుచేసుకుంటామని. నాన్నగారి పాతపంచెలు చింపి అంచులు కుట్టి రుమాళ్ళ లాగానూ, కొంచెం పెద్ద బట్టలు రాత్రి మంచం ఎక్కేముందు కాళ్ళు కడుక్కుని తుడుచుకుందుకు తయారుచేసేది.

కొత్త పరికిణీ కట్టుకున్నా కింద కూర్చున్నప్పుడు ఇలాంటి బట్ట వేసుకుని కూర్చోవాలి.పరికిణీ మాసిపోతుంది కదా మరి.
మొత్తానికి ఏడుపు ఆపుకుని స్కూల్ లోపలికి వెళ్ళాను. ఆ తరువాత అందరి తో ఆటల్లో మాష్టారు చెప్పే
పాఠంతో నా తాయిలం సంగతి మర్చిపోయాను..

మా ఐదో అన్నయ్య తాను కొంచెం తెలివైనవాడని అనుకునేవాడు.అమ్మా నాన్నా కూడా అలాగే చూసేవారు. ఆ తెలివేమిటో నాకెప్పుడూ అర్ధం కాలేదు.క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడు.అలా ఐతే నేనూ క్లాస్ లో ఫస్ట్ వచ్చి తెలివైనదాన్నని నిరూపించుకోవాలని అప్పుడప్పుడు అనుకునేదాన్ని.

అందుకని అన్నయ్య ఏమడిగినా అమ్మానాన్నా కాదనేవారు కాదు.తాననుకున్నది అయ్యేదాకా అమ్మని సతాయించేవాడు. అమ్మ కోపం వచ్చినప్పుడు “ఏమిట్రా సైంధవుడిలా తగులుకుంటున్నావు”అనేది. నా కెందుకో ఆ పేరు తెగ నచ్చేసింది. అందుకని ఈ నా కధ లో ఈ అన్నయ్య పేరు సైంధవుడనే చెప్తాను.

ఎందుకో ఈ సైంధవుడన్నయ్య కూ నాకూ ఎప్పుడూ పడదు.అమ్మ అన్నట్లు ఎప్పుడూ నా వెనకాల సైంధవుడిలాతగులుకుంటాడు. ఇలా చెయ్యద్దు అలా చెయ్యద్దు అంటూ .అసలు మన కన్నా ముందు పుడితే అజమాయిషీ చెయ్యాలా?
అసలీ పెద్దవాళ్ళు చిన్నపిల్లల మీద ఇంత నిఘా ఎందుకు పెడతారో.వాళ్ళ ఇష్టమున్నట్లు ఉండనివ్వచ్చు కదా! చిన్నపిల్లల కు అందరూ శత్రువులే,అమ్మా,నాన్నా, అన్నయ్యలు, అక్కయ్యలు, బాబయ్యలుంటే వాళ్ళు పిన్నులు,అత్తలూ.ఎంతసేపూ ఇలా చెయ్యకు అలా చెయ్యకు అంటూ.

ఏం వాళ్ళు చిన్నపిల్లలప్పుడు అల్లరి చెయ్యలేదా? పిల్లలు అల్లరి చెయ్యరా? నేను అల్లరి అస్సలు చెయ్యను.ఐనా పాడయిపోయిన కాగితం చింపుతే ఎందుకే ఆ కాగితం చింపి పోగులు పెడుతున్నావు అంటారు. పెరట్లో పుల్ల ముక్కలు ఏరుకొచ్చి ఆడుకుంటే ఇంటి నిండా చెత్తపోస్తున్నావు అంటారు.

బొమ్మలు కొనడానికి నాన్న దగ్గర డబ్బులు లేవు. అక్కకు మూడ్ బాగున్నప్పుడు తాటాకు బొమ్మ చేసి ఇచ్చేది.దానికి చీర కట్టి జాకెట్ట్ ఎలా వెయ్యాలో తెలియక పమిట కప్పేదాన్ని. ఆ చీర కోసం కూడా మా వీధి చివర ఉన్న టైలర్ దగ్గరకు వెళ్ళి గుడ్డముక్కలు తెచ్చేదాన్ని.అక్కని అడిగితే దానికి జాకెట్ కుట్టడం వచ్చు.కానీ దానికి మూడ్ లేకపోతే నన్ను కసురుకుంటుంది.అమ్మకి తెలియకుండా నవల పుస్తకంలో పెట్టి చదవాలిగా.

వేసవి సెలవల్లో బొమ్మల పెళ్ళిళ్ళు. చేసేవాళ్ళం .మా ఇంట్లో కాదు మా స్నేహితుల ఇళ్ళల్లోనే బొమ్మల పెళ్ళిళ్ళు ఎంత బాగుంటాయో? ఇంచక్కా కొంత మందిమి ఆడపెళ్ళివారిగా కొంత మంది మగపెళ్ళివారిగా విడిపోయి, ఎవరి దొడ్లోనైనా పువ్వుల చెట్లు ఉంటే అవన్నీ కోసి మాలలు కట్టడం రాదు కదా అందుకని సూది దారం పెట్టి గుచ్చేవాళ్ళం.
ఎవరింట్లో బొమ్మల పెళ్ళి చేస్తే వాళ్ళ అమ్మలు మాకు తినడానికి ఏదైనా చేసేవాళ్లు.నేనెప్పుడూ ఏదీ తెచ్చేదాన్ని కాదు. ఒకసారి ఇందిర అననే అంది. “ఇదెప్పుడూ వుత్తి చేతులతో వస్తుంది.ఏమీ తెయ్యదు”అని.
దానికి ఎన్నిసార్లు “తెయ్యదు” అనకూడదు అది తప్పు అన్నా వినిపించుకోదు. దానికి సరిగా మాటలే రావు.పోట్లాటకు మాత్రం ముందు ఉంటుంది.
ఈసారి ఎలాగైనా నేనూ ఏదైనా తేవాలి అనుకుని అమ్మను వెళ్ళి అడిగాను. అమ్మ ఏ కళనుందో అలాగే పులిహార చేసి ఇస్తాను లే కారం తక్కువ వేసి .మీరు పిల్లలు తినలేరుగా అలాగే గెల వేస్తే అరటిపళ్ళు కూడా ఇస్తాను” అంది. నాకెంత ఆనందం వేసిందో.అవన్నీ పట్టికెళ్ళి ఆ కజ్జా కోర్ ఇందిర కి చెప్పాలి నేనూ తెచ్చాను చూడు అంటూ.
అన్నట్లుగా అమ్మ పులిహార చేసి డబ్బాలో పెట్టి, అవి తినడానికి పెరట్లో బాదం చెట్టుకు ఉన్న ఆకులు కూడా కోసి ఇచ్చింది.అరటిపళ్ళు రెండు అత్తాలు ఒక గుడ్డ సంచీలో పెట్టి, అన్నయ్యను పిలిచి ఇవన్నీ మా స్నేహితురాలింటికి పట్టికెళ్ళమని,నన్ను కూడా సైకిల్ మీద దింపి రమ్మని చెప్పింది.
అన్నయ్య సైకిల్ సీట్ మీద కూర్చుంటే మహారాణిలాంటి ఫీలింగ్ అక్కడికి నేనేదో గొప్ప అయినట్లుగా అనిపించింది.దానికి కారణం, వాళ్ళందరూ నడిచే వస్తారు. ఒక్క కామాక్షికి కారుంది కానీ అది కూడా ఎప్పుడూ నడిచే వస్తుంది.
నేను తెచ్చిన పులిహార, అరటి పండ్లు చూసి అందరూ సంతోషించారు. ఇందిర మొహం మాత్రం మాడిపోయింది.దాన్ని ఏదేదో చాలా అనేద్దామనుకున్నాను కానీ ఏమీ అనలేదు.

బొమ్మల పెళ్ళి మొదలయ్యింది. తలంబ్రాల కింద కూడా బంతి పువ్వులు విప్పి వాడేవాళ్ళం.ఒకసారి నిజం తలంబ్రాలు కావాలని అరుణ వాళ్ళ ఇంట్లోంచి బియ్యం తెచ్చింది. ఆ రోజు మహా బాగా పెళ్ళయ్యిందనుకున్నాము. మర్నాడు దాని వీపు విమానం మోత మోగిందని తెలిసి ఇంకెప్పుడూ అలా చెయ్యకూడదనుకున్నాము.
ఎంత మాలో మేం దెబ్బలాడుకున్నా మాలో ఎవరికి దెబ్బలు పడ్డా మా అందరికీ ఏడుపు వచ్చేస్తుంది. అదేనేమో స్నేహమంటే.
“పెళ్ళి కొడుకు తల్లి అలిగిందమ్మా”అన్నారెవరో
“ఏం ఏమయ్యింది”?
“వంటలు బాగులేవుట”
“అదేమిటీ పులిహార బాగుందిగా”
నాకు కోపం వచ్చేసింది మా అమ్మ పులిహార బాగా చేస్తుంది.అదీకాక ఈ రోజు మా కోసం ఎక్కువ జీడిపప్పు వేసి కారం లేకుండా కమ్మగా చేస్తానంది. నేను పులిహార డబ్బా తీసి కాస్త నోట్లో వేసుకున్నాను. అబ్బ ఎంత బాగుందో? అలాంటిది ఇది బాగులేదంటుందేమిటీ?
పెళ్ళికూతురి తల్లిగా త్రిపుర, పెళ్ళికొడుకు తల్లిగా కల్యాణి ఉన్నారు. పులిహార నాదిగా అందుకని నేను ఆడపిల్ల వైపు అంటే త్రిపుర వైపు.
పులిహార తిన్న చేత్తోనే కల్యాణి దగ్గరకు వెళ్ళి ఒక్క లెంపకాయ ఇచ్చాను. అది కుయ్యో మొర్రో మని ఏడుపు.
“ఏం దొబ్బుడాయి ఇంత మంచి పులిహార నీ జన్మలో తిన్నావా?”అన్నాను.
అది మాట్లాడకుండా ఒకటే ఏడుస్తోంది.
నా చెయ్యి పట్టుకుని, మా అందరి లోకి కాస్త పెద్దదైన శాంత “ ఊరుకోవే అవన్నీ పెళ్ళిలో ఆడే ఆట. నిజం కాదు. నిజం పెళ్ళిలో పెళ్ళి కొడుకు తల్లి అలిగితే పెళ్ళి కూతురి తల్లీతండ్రి వచ్చి బతిమాలుతారుగా అలాగన్న మాట.అది నిజం అనుకుని నీ పులిహార బాగులేదని దాన్ని చచ్చేటట్లు కొట్టావు”అంది.
అవును నిజమే అలా నిజం పెళ్ళిలా ఉండాలని మేం పెళ్ళిలో చూసినవన్నీ ఇక్కడ కూడా చేస్తాం అది మర్చిపొయాను. అంతే పాపం దాన్ని కొట్టినందుకు నాకు కూడా కళ్ళనీళ్ళు వచ్చాయి. అంతే కల్యాణి ని కౌగలించుకుని సారీ చెప్పాను. దాని చెయ్యి తీసుకుని, నన్ను కూడా కొట్టవే అనగానే ఒక్కసారిగా ఏడుపు ఆపి పకపకా నవ్వింది.
“నిజంగా పెద్దయ్యాక నీ కొడుకు పెళ్ళిలో ఇలాగే చేస్తావేమిటే” అన్నాను నవ్వుతూ.
అప్పట్లో నాకర్ధం కాలేదు. బట్టీ పట్టినట్లు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం మాట్లాడితే అవే మాట్లాడేవాళ్ళం. పిల్లల ముందు పెద్దవాళ్ళు అలా మాట్లాడకూడదని చాలా పెద్దదాన్నయ్యేదాకా నాకు తెలియలేదు.
పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళను అనుకరిస్తారు. ఆడపిల్లలు తల్లిని, మొగపిల్లలు తండ్రిని.ఆ చిన్న సంఘటన తప్ప ఆ రోజు మా స్నేహితుల మధ్య నాకు కూడా ప్రముఖ పాత్ర దొరికింది.

బొమ్మల పెళ్ళిళ్ళు లేనప్పుడు ఆడుకుందుకు ఎవరూ ఉండేవారు కాదు. మాకు నాలుగిళ్ళవతల ఒక అమ్మాయి ఉండేది. నా ఈడే.వాళ్ళు చాలా గొప్పవాళ్ళు.ఒకసారి వాళ్ళింటికి వెళ్ళాను. దాని లక్కపిడతలన్నీ వెండివి.దానితో ఆ రోజు భలే అడుకున్నా. ఆ గిన్నెల్లో బోలెడు వంటలు చేసాం.వాళ్ళ అమ్మగారు మాకు ఆడుకుందుకు రకారకాల స్వీట్స్, కొన్ని మరమరాలు ఇచ్చారు. అవన్నీ ఎంత బాగున్నాయో!

చీకటి పడేదాకా అలా ఆడుతూనే ఉన్నాను. చీకటి చూసి అమ్మకు నేను ఇంకా రాలేదని గాభరా వేసి ఎక్కడున్నానో వెతకమని అన్నయ్యను పంపింది.నేను వెళ్ళడం చూసిన పక్కింటావిడ మీ అమ్మాయి మాచిరాజు వాళ్ళింట్లో ఉంది అని చెప్పిందిట.
అన్నయ్య వచ్చేసరికి ఇంకా ఆడుకుంటున్నాము.అన్నయ్య ఒక్క కేకపెట్టి “నడువు అమ్మ పిలుస్తోంది చీకటిపడ్డా ఇంకా ఆటలేమిటి” అన్నాడు .
అన్నయ్య అలా అనేసరికి ఒక్కసారి భయం వేసింది ఇంటికెళ్ళాక అమ్మ కొడుతుందేమో అని.అమ్మ కొట్టకపోయినా మా సైంధవుడు రెండు మొట్టికాయలు వేస్తాడు. వాడికి నాకు మొట్టికాయలు వెయ్యడమంటే అదేం సరదావో నాకు తెలిసేది కాదు.పెద్దయ్యాక కూడా దెబ్బలు తిన్నాను అది వేరే విషయం.

అన్నయ్య తో ఇంటికెళ్ళాను.అమ్మ కొట్టలేదు. అలా చీకటి పడేదాకా బైట తిరగద్దని చెప్పింది. ఆ తరువాత అన్నం పెడుతున్నప్పుడు చెప్పాను.వాళ్ళింట్లో లక్కపిడతలతో ఆడుకున్నాని,అవి చాలా అందంగా తెల్లగా ఉన్నాయని.
“ఇంకెప్పుడూ వాళ్ళింటికి వెళ్ళద్దమ్మా అవి వెండివి. అందులో ఏ ఒకటి పోయినా నువ్వు దొంగతనం చేసావంటారు”అంది అమ్మ.

నా లక్కపిడతలు కూడా ఎవరో తీసేసుకున్నారు కదా!”అన్నాను.
“అవి వేరు ఇవి వేరు వెండి వి చాలా ఖరీదు ఉంటాయి”అంది అమ్మ.
అర్ధం కాకపోయినా తలూపాను. పెద్దక్క ఎప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు ఒక లక్కపిడతల బుట్ట తెచ్చిపెట్టింది. అది ఉన్నన్నాళ్ళూ చుట్టుపక్కల పిల్లలతో ఆడుకున్నాను. ఆడుకున్న ప్రతీసారి ఒకటి పోయేది.అలా అన్నీ పోయాక మళ్ళీ అమ్మను కొనమంటే కొనలేదు. మళ్ళీ ఆ అమ్మాయి పిలిచినా వెళ్ళలేదు.

సాయంకాలం ఆడుకుందుకు వెళ్ళినా మా అన్నయ్య ఎప్పుడూ నా మీద నిఘా ఉంచేవాడు.అమ్మకు మొగపిల్లలతో ఆడ్డం ఇష్టం ఉండేది కాదు.అప్పటికీ నాన్న చిన్నపిల్ల అవన్నీ దానికేం తెలుసు అని చాలాసార్లు అనేవారు.
మగపిల్లలు ఆడే ఆటలు ఆడపిల్లలు ఆడకూడదుట. అలా అని ఏశాస్త్రాల్లో రాసారో నాకు పెద్దయ్యాక కూడా అర్ధం కాలేదు.
ఇప్పుడు అందరూ అన్నీ చేస్తున్నారు. అమ్మ ఉంటే ఇవన్నీ చూపించాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆడపిల్లకు ఇన్ని ఆంక్షలూ నిబంధనలూ సంకెళ్ళు అవసరమా?అని.

కానీ ఏమీ చెయ్యలేని అశక్తతతోనే జీవితం గడిచిపోయింది.ఆ తరువాత మారిన పరిస్థితులు కూడా నావల్ల మారినవి కావు,మారుతున్నవాటితో మారడమే నేను చేసిన పని.

“ఇదిగో చెల్లాయ్ నీకోసం పిప్పర్ మెంట్ తెచ్చాను”అన్నాడు చిన్నన్నయ్య.
“సరదాగా నిన్ను అలా సైకిల్ మీద తిప్పుకురానేమిటే “అన్నాడు సైంధవుడు.
“ఇవ్వాళ నీకు కొత్త రకం జడ వేసి,దొడ్లో పూసిన మల్లెపూలు పెడతాను”అంది అక్కయ్య.
అయ్యబాబొయ్ ఇవ్వాళ వీళ్ళందరికీ ఏమయ్యింది?ఒక్కసారి అందరూ నా మీద ప్రేమ కురిపిస్తున్నారు.

చిన్నబుర్రకు అర్ధం కాలేదు.” అక్కా నిజంగా జడ వేసి మల్లెపూలు పెడతావా?” అన్నాను.ఎప్పుడూ అదే పెట్టుకుంటుంది. నాకు పెట్టమంటే సూదిపిన్ను కు రెండు గుచ్చి పెడుతుంది.అలాంటిది మాల కట్టి పెడతానంటోంది.
చిన్నన్నయ్య ఇచ్చిన పిప్పరమెంట్ కూడా చాలా బాగుంది.అది నోట్లో పెట్టుకుని కొంచెం తిన్నాక నోరు మూసుకుని బుగ్గలనిండా గాలి పీలిస్తే నోరంతా ఎంత చల్లగా ఉంటుందో..
అసలే మావాళ్ళ దగ్గర నించి ప్రేమ దొరకడం కష్టం ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలని పెద్దలు చెప్పారట. అందుకనీ అన్నీ చేయించేసుకున్నాను.

దానికి చెప్పరా అంటోంది అక్క నువ్వు చెప్పు అన్నాడు చిన్నన్నయ్య. ఈ లోపల నాన్నగారు వచ్చినట్లుగా సైకిల్ చప్పుడు వినిపించింది.

అంతే చిన్నన్నయ్య నన్ను పట్టుకుని లోపలి గదిలోకి తీసుకెళ్ళిపోయాడు.బుగ్గ మీద ముద్దు పెట్టి, “ మా బంగారు తల్లి కదూ. విజయా టాకీస్ లో చెంచులక్ష్మి సినిమా వచ్చింది.నాన్నగారితో సినిమాకెడతాం అని అడగవా?” అన్నాడు.

వాళ్ళు ఈ విషయం లో నన్ను కాకాబట్టారన్న సంగతి అప్పుడు అర్ధం కాలేదు.అంత వయసు కూడా లేదు. సినిమాకి నాన్నగార్ని అడిగితే అన్నయ్యలు,అక్కా నన్ను ప్రేమగా చూస్తారన్నమాట. అనిపించింది.

అలాగే అని తల ఊపి, నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. ఆఫీస్ నించి రాగానే సైకిల్ వరండా లో పెట్టాక ఆయన మీసాలు గుచ్చుకుంటున్నా ఒక్క ముద్దు పెట్టి పెద్ద కంచుగ్లాస్ తో మంచినీళ్ళు తెచ్చి ఇస్తాను.
నాన్నగారికి నేను అలా చెయ్యడం ఇష్టం అని నాకు తెలుసు.

“ఏరా బుజ్జి తల్లీ ఏం చేసావు?” అన్నారు నాన్నా. ఆ రోజు నేను చేసినవన్నీ పూస గుచ్చినట్లు చెప్పాను. అన్నయ్యలేం చేసారు?అన్నారు.

అవి చెపితే నా వీపు విమానం మోతే. “నాన్నా మరేమో విజయాలో చెంచులక్ష్మి సినిమా వచ్చిందట. మా మాస్టారు చెప్పారు చాలా బాగుంటుందని. అక్కయ్యలూ అన్నయ్యలతో కలిసివెళ్ళనా?” అన్నాను.

“ఒరేయ్ చిన్నాడా”అని పిలిచారు నాన్న. నాకు అర్ధం కాకపోయినా వాళ్ళు అడిగించారని నాన్నకు అర్ధమయ్యింది.

నాన్న పిలవగానే బుద్ధిగా అన్నయ్య నాన్న ముందుకు వచ్చాడు. “చిన్నపిల్ల దాంతో అడిగించక పోతే మీరే అడగవచ్చు కదా! ఎన్నాళ్ళయ్యింది వచ్చి?కొత్తదైతే మానేజర్ పంపడు”అన్నారు నాన్న.

ఆ టాకీస్ మానేజర్ నాన్నకు ఫ్రెండ్. రష్ లేనప్పుడు మాకు సినిమా ఫ్రీ.ఇది పెద్దయ్యాక తెలిసింది నాకు.అన్నయ్య చెప్పాడు రష్ లేదని “ సినిమా వచ్చి ఎన్నాళ్ళయ్యింది” అన్నారు నాన్న.

నోటికొచ్చినది చెప్పాడు అన్నయ్య. “సరేలే రేపు తయారుగా ఉండండి వాడితో చెప్తాను”అన్నారు నాన్నగారు.సినిమా ఎలా ఉందో మళ్ళీ వారం.

బ్రహ్మలిఖితం – 18

రచన: మన్నెం శారద

ఓంకారస్వామి కళ్ళు తెరచి ఒక కనుబొమ్మ సాధ్యమైనంత పైకెత్తి వెంకట్ వైపు చూశాడు సీరియస్ గా.
వెంకట్ అసహనంగా దిక్కులు చూస్తూ నిలబడ్డాడు.
వెంకట్ తనకు నమస్కరించకుండా చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వైనమర్ధమయింది ఓంకారస్వామి రూపంలో ఉన్న నారాయణకి.
“ఏంటి పెళ్లికొడకా? అత్తగారింట్లో తిన్న అరిసెలు, మినపసున్నుండలు ఇంకా అరిగినట్టు లేదు. ఇటువైపు సీత కన్నేసే వేంటి?” అన్నాడు తన ఏకాంత మందిరంలో బూరుగు దూది పరుపుల మీద పడుకుని భక్తులు భక్తిప్రపత్తులతో సమర్పించుకున్న పళ్లని ఏరేరి తింటూ.
అక్కడ ఆ గదిలో రాజు, సంపెంగి తప్ప మరెవరూ లేరు.
రిటైర్డ్ ప్రొఫెసర్ మల్లన్న చెడామడా ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ దొరికిన పేపర్లన్నింటిలో రాసిన ఆర్టికల్స్ చదివి ఓంకారస్వామి భక్తబృందం ఆంధ్రదేశమంతటా బాగా పెరిగిపోయింది. దాంతో పలుకుబడి, డబ్బు, సదుపాయాలూ కూడా పెరిగిపోయాయి. కూర్చున్న చోటనుండి కదలకుండా కూర్చుని బాగా తిని అతని చప్పి దవడలు పూడాయి. గుంట కళ్ళలో కాస్త మెరపొచ్చింది.
“ఏదో అర్జెంటుగా చేసుకోవాల్సొచ్చింది” అన్నాడు వెంకట్ నిర్లక్ష్యంగా.
“అర్జంటుగానయితే మాత్రం పెళ్లి మీద పెళ్ళెలా చేసుకున్నావు? ఆ పిల్ల సంగతేంటి?”
” ఏ పిల్ల సంగతి?”
ఓంకారస్వామి పకపకా నవ్వాడు. నవ్వుతూ రాజువైపు తిరిగి “వీడు మరీ మనతోటే పరాచికాలాడుతున్నాడు. ఆ పిల్లెవరో నువ్వు చెప్పు రాజూ!” అన్నాడు నవ్వుతూనే.
“తెలీనట్టు డ్రామాలాడతావేంటి? ఈశ్వరి. ఆ పిల్లకి సంగతి తెలిసి లబోదిబోమంటూ ఏడుస్తూ వచ్చింది. అహోబిళంలో దాన్ని పెళ్లి చేసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటావా?” అన్నాదు రాజు తను జోక్యం చేసుకుంటూ
“అది పెళ్లా, సింగినాదమా? ఏదో మీరు నాటకమాడమన్నారని ఆడేను. దానికి మొగుడు, పిల్లలున్నారు. దాంతో నాకు పెళ్ళేంటి? అసలు నేను మీ దగ్గరకొచ్చిన పని వేరు. లిఖితని లొంగదీసుకునే మార్గం చెప్పమని వచ్చేను. ఆ పని చెయ్యనే లేదు మీరు!” అన్నాడు వెంకట్ అక్కసుగా.
నారాయణ, రాజు మొహమొహాలు చూసుకున్నారు. వెంకట్ తమని స్వాములుగా గుర్తించి, గౌరవించడం లేదని గ్రహించేరు. అలా గ్రహింపుకి రాగానే నారాయణ కళ్ళలోకి పాకిన రక్తం ఎర్రజీరలుగా మారి అతనిలోని క్రౌర్యానికి దర్పణం పట్టింది.
అతను వెంకట్ వైపు తీవ్రంగా చూస్తూ”మమ్మల్నే ధిక్కరిస్తున్నావా?” అన్నాడు కోపంగా.
“లేకపోతే ఏంటండి, నన్ను ఆ ఈశ్వరి కోసం దోషిలా నిలబడతారేంటి?” అన్నాడు వెంకట్.
“సరే! ఈశ్వరి సంగతలా ఉంచు. నువ్వు నీ మావ దగ్గర కట్నమెంత తీసుకున్నావ్? ఆ సంగతి చెప్పు!”
“కట్నమా సింగినాదమా? ఏదో పెళ్లి కెదిగిన ఆడపిల్లలందరూ అలానే నిలబడిపోయేరని ఏడిస్తే…”
“మాకు కట్టుకథలు చెప్పి మా నోట్లో పొట్టు పోద్దామని చూస్తే గాల్లో ధూళిలా కలిసిపోతావు. ఆ పిల్ల పేరున పది లక్షల లాటరీ వచ్చింది. అందులో రెండు లక్షలు తెచ్చి మా హుండీలో వేస్తే సరేసరి. లేదంటే ఈశ్వరి నీ ఇంటికి కాపురాని కొస్తుంది. తర్వాత నీ పాట్లు కథలు కథలుగా చెప్పుకుంటారీ ఊరి జనం”అన్నాడు ఓంకారస్వామి.
“అంటే నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?”
“మెయిలూ లేదు. ఎక్స్‌ప్రెస్ లేదు. డబ్బట్టుకొచ్చేయ్. ఏ పేచీ ఉండదు. నువ్వెవరితో కాపురం చేస్తే మాకేటి?” అంది సంపెంగి సీరియస్‌గా.
“నేను పోలీస్ రిపోర్టిస్తాను” అన్నాడు వెంకట్ కోపంగా.
“ఏమని?” కూల్‌గా అడిగాడు ఓంకారస్వామి.
“మీరు దొంగస్వాములని!”
ఓంకారస్వామి కోపం తెచ్చుకోలేదు.
“రాజు!” అని పిలిచేడు మెత్తగా.
“చెప్పండి స్వామి!” అన్నాడు రాజు వినయంగా.
“రిసెప్షనుకి రింగు కొట్టి ఎస్పీని లైన్లో పెట్టు” అన్నాడు.
రాజు వెంటనే ఆ పని చేసేడు.
ఎస్పీ వెంకటస్వామి లైన్లోకి రాగానే రాజు “నమస్తే సార్! మా స్వామిగారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ” అన్నాడు. ఓంకారస్వామి రిసీవరందుకున్నాడు.
“వాడి చేతికా కార్డ్‌లెస్ ఇవ్వు” అన్నాడు.
వెంకట్ కార్డ్‌లెస్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు.
“నమస్కారం స్వామి! ఏమన్నా అర్జెంటు పనుందా చెప్పండి.నిముషంలో వచ్చేస్తాను” అన్నాడు ఎస్పీ వెంకటస్వామి.
“ఏం లేదు నీ యోగక్షేమం కనుక్కుందామని. మీ ఆవిడ అరోగ్యమెలా ఉంది? అమ్మాయి ప్రసవమయ్యిందా?”
“తమ దయవల్ల బాగానే ఉంది. అమ్మాయికి బాబు పుట్టేడు. మీ పేరే పెట్టుకోవాలనుకుంటున్నాం” అన్నాదు ఎస్పీ.
“అద్సరే! మీ హోం మినిస్టరుగారొస్తారన్నారు. ఎప్పుడూ రావడం?”
“ఈ నెల్లోనే. ఎంత తొందరగా మిమ్మల్ని చూడాలా అని ఆయన తెగ కంగారు పడుతున్నారు. పైకి నక్సలైట్ ఏరియా విజిటని పేరేగాని.. రావడం మీ దర్శనానికే..” అన్నాడు ఎస్పీ గుంభనంగా నవ్వుతూ.
ఓంకారస్వామి రిసీవర్ క్రెడిల్ చేసి వెంకట్ వైపు చూశాడు.
వెంకట్ నుదుటున చెమటలు బిందువులుగా పేరుకోవడం గమనించి మందహాసం చేస్తూ “ఇప్పుడు చెప్పు టాపు టు బాటం నా భక్తులయిన డిపార్టుమెంటులో ఎవరికిస్తావు రిపోర్టు.”అనడిగేడు మందహాసం చేస్తూ.
వెంకట్ తనలోని భయాని అణుచుకుంటూ “ఇప్పుడు నేనేం చేయాలి?”అనడిగేడు.
“చెప్పేనుగా. నీ పెళ్లాన్నడిగి రెండు లక్షలు తెమ్మని”
వెంకట్ తల పంకించి నిస్సహాయంగా చూస్తూ వెనుతిరిగి వెళ్లాదు.
వెళ్టున్న వెంకట్‌ని చూసి చేతిలోని ద్రాక్షపండుని పైకెగరేసి పట్టుకొని “దొంగముండాకొడుకు. నా దగ్గరా నాటకాలు” అంటూ పకపకా నవ్వాడు. అతని నవ్వుతో శృతి కలిపేరు రాజు, సంపెంగిలు.

*****

ఏనుగు ఇనుమడించిన ఉత్సాహంతో లిహితని, కాణ్హని ఎక్కించుకుని అడవిలో వడివడిగా పరిగెత్తినట్లుగా నడవసాగింది. దాని మెడలోని మువ్వలు లయబద్ధంగా సవ్వడి చేస్తూ ఆ నాదం కూడా ఏనుగుతో పాటు పరుగు తీస్తోంది. రెండు కిలోమీటర్లు నడకసాగి అడవిలో ఒక వాగుని ఏనుగు దాటుతుండగా “అక్కా, అక్కా ” అన్న పిలుపు విని అటు తిరిగి చూసింది లిఖిత. దూరంగా మున్నార్ హోటల్లో పరిచయమైన బేరర్ అలుపుగా పరిగెత్తుకొని వస్తూ “అక్కయ్యా ఆగు ఆగు!” అన్నట్టు చెయ్యి ఊపసాగేడు.
కాణ్హ ఏమిటన్నట్లుగా లిఖితవైపు చూశాడు. “ఆపండి ఆ అబ్బాయి నాకు తెలుసు” అంది లిఖిత.
కాణ్హ ఏనుగుని అంకుశంతో అదలిస్తూ “గణా ఆగు” అన్నాడు. ఏనుగు ఆగి మోకాళ్ల మీద వంగి కూర్చుంది. కాణ్హ క్రిందకి దిగి లిఖితకి చేయందించేడు. లిఖిత కాణ్హ భుజాల మీద చేతులానించి ఏనుగు దిగింది.
అప్పటికే బేరర్ కుర్రాడు వాళ్ల దగ్గరకొచ్చి “అక్కయ్యా, మీ నాన్నగారు కూడా మా హోటల్లోనే దిగేరు. నేనాయన్ని గుర్తుపట్టగలను”అన్నాదు వగరుస్తూ.
ఆ మాట వినగానే లిఖిత మొహం సంతోషంతో వికసించింది.
“ఇతనికి మా నాన్న తెలుసు. ఇతన్ని కూడా తీసికెల్దాం”అంది లిఖిత కాణ్హ వైపు తిరిగి.
కాణ్హ బేరర్ని ఏనుగెక్కించేడు. ఆ తర్వాత లిఖిత, కాణ్హ ఎక్కేరు.
ఏనుగు మరో ఇరవై నిమిషాల్లో మహామాయ ఉన్న గుహని చేరుకుంది. అప్పుడే మహామాయ మృతశరీరాన్ని వాగులోంచి తీసి గుహ బయట పడుకోబెట్టేరతని శిష్యులు.
ఏనుగుని ఆ పైన లిఖితని చూడగానే కకావికలై పక్కకి తప్పుకున్నారు.
ఏనుగు ఆ ప్రాంతం చేరగానే చిత్రంగా మారిపోయింది.
ఏదో శక్తి ఆవహించినట్లుగా ఊగిపోతూ తొండాన్ని అటూ ఇటూ వడివడిగా తిప్పుతూ, ఘీంకరిస్తూ గుహలోకి ప్రవేశించింది.
లోపల పూజలు చేస్తున్న కొంతమంది ఏనుగుని చూసి బెదరిపోయి లేచి నిలబడ్డారు.
ఏనుగు ఆ పూజా ప్రాంతాన్ని తన తొండంతో ఒక్కసారి చెల్లాచెదురు చేసింది. తన పాద తాడనంతో హోమగుండాన్ని మసి చేసేసింది.
దాని ఊపుకి అందరూ బెదరి గుహ గోడలకి అంటుకుపోయేరు.
ఏనుగు ఊపుగా దుష్టశక్తిని సమీపిస్తుండగా “విగ్రహాన్ని తాకారంటే నాశనమై పోతారు. వెంటనే వెళ్లకపోయేరా.. ఇదిగో మిమ్మల్నిప్పుడే ఎందుకూ గాకుండా చేస్తాను”అంటూ ముందుకొచ్చి బెదిరించేడొక వృద్ధుడు. అతను బస్సులో కలిసి తనతో ఆ గుహకి తీసుకొచ్చిన వ్యక్తిగా గుర్తుపట్టింది లిఖిత.
“వాడే.. నన్ను తీసుకొచ్చేడిక్కడికి” అంది లిఖిత కసిగా అతనివైపు చూస్తూ..
అంతే!
“గణ” ఏదో అర్ధమయినట్లుగా అతనివైపు తిరిగి తొండంతో అతన్ని చుట్టేసి గిరగిరా తిప్పి బలంకొద్దీ విసిరేసింది. అతను ఉండలా చుట్టుకుని గుహ రాతి గోడకి కొట్టుకొని క్రిందపడ్డాడు గాలి తీసిన బంతిలా.
అంతే! ఆ తర్వాత అతను కదలలేదు.
అతని తల క్రిందనుండి చిక్కగా జాలువారి, వాగులో ప్రవహించి వెలుగులో ఎర్రగా కనబడడం చూసి కళ్ళు మూసుకుని లిఖిత.
ఆ తర్వాత పనిగా ఏనుగు విగ్రహం మీద విరుచుకు పడింది. ఎన్నో సంవత్సరాలుగా అనేక బలుల్ని అందుకున్న ఆ క్షుద్ర దేవత ‘గణ’ మీద ఏ ప్రభావాన్నీ చూపించలేకపోయింది.
గణ కుంభస్థలంతో ఆ విగ్రహాన్ని బలంగా ఢీకొంది. ఆ దెబ్బకి విగ్రహం కుప్పకూలిపోయింది.
ఏనుగింకా కసి తీరనట్లుగా ఆ విగ్రహాన్ని కాళ్లతో తొక్కి పిండి పిండి చేసింది.
అప్పుడు కనిపించేయి. ఆ విగ్రహం కడుపులో ఉన్న యంత్రాలు. కొన్ని రాగిరేకుల మీద ఉన్న కొన్ని క్షుద్ర మంతాలు.
లిఖిత కళ్లు మాత్రం ఆ ప్రాంతమంతా వెతుకుతున్నాయి తన తండ్రి కోసం.
“అక్కా! అక్కా!” అంటూ ఆమెని గట్టిగా కుదిపేసేడు కంగారుగా.
లిఖిత “ఏంటి?” అంది వెనక్కు తిరిగి.
బదులుగా బేరర్ ఓ మూల కూర్చుని జరుగుతున్నదేమీ తనకి పట్టనట్లుగా కళ్లు మూసుకుని జపం చెస్తూ ఈతాకులతో ఉప్పు నీటిని పిండిబొమ్మకి అభిషేకం చేస్తున్న వ్యక్తి కనిపించేడు.
“ఎవరతను?” అనడిగింది లిఖిత.
“మీ నాన్న. కార్తికేయన్” అన్నాడు బేరర్.
ఆ జవాబు విని లిఖిత శరీరమంతా రక్తం ఉద్వేగానికి గురయి వేగంగా ప్రవహించడం వలన పులకించింది.
“కాణ్హ ఏనుగుని ఆపు” అనిద్ కంగారుగా.
కాణ్హ “గణా! ఆగు! శాంతించు!” అన్నాడు చేత్తో దువ్వుతూ.
ఏనుగు చెవులూపుతూ వినయంగా క్రింద కూర్చుంది.
కాణ్హ తను దిగి మిగిలిన ఇద్దర్నీ దింపేడు.
లిఖిత గబగబా తండ్రి దగ్గరికి రివ్వున పరిగెత్తి “డేడీ!డేడీ!” అని పిలిచింది ఆత్రుతగా.
అతను కళ్లు తెరవనే లేదు.
ఏదో మంత్రాన్ని నిశ్శబ్దంగా ఉచ్చరిస్తూ తన పూజ కొనసాగిస్తూనే ఉన్నాడు.
కాణ్హ ‘గణ’వైపు చూశాడు.
“గణ’ ఏదో అర్ధమయినట్లుగా వెళ్లి అతను పూజ చేస్తున్న పిండి బొమ్మని కాలితో తొక్కి విసిరేసింది
అయినా కార్తికేయన్‌లో చలనం లేదు.
లిఖిత అతన్ని పరిశీలించి చూసింది.
బట్టతల, వడలిన శరీరం, చిన్న పంచెతో ఉన్న ఇతను ఒక గొప్ప సైంటిస్టు కార్తికేయనయి ఉంటాడా? అయి ఉంటే అతనింత దిగజారి ఇలాంటి క్షుద్రపూజలు చేస్తాడా?
“తంబి ఇతను నిజంగా మా నాన్నేనా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టే చెబుతున్నావా?” అనడిగింది.
“మీ నాన్నవునో కాదో నాకు తెలియదు. కాని అతను కార్తికేయనే. సైంటిస్టే. అలా రాసుంది మా రిజిస్టరులో.”అన్నాడు బేరర్.
వెంటనే లిఖిత హృదయం ఆర్ద్రమైంది. కన్నీరు పొంగుకొచ్చింది.
పుట్టి పెరిగేక, తనకు జన్మనిచ్చిన తండ్రిని అంత దీనావస్థలో చూడాల్సి రావడం వచ్చినందుకు ఆమె హృదయం బాధతో రెపరెపలాడింది.
“మా డేడీకేదో చేసేరు” అంది ఏడుస్తూ.
కాణ్హ లిఖితని పక్కకు తోసి కార్తికేయన్ దగ్గర కెళ్లి అతని భుజాలు పట్టుకొని కుదిపేడు. అయినా ప్రయోజనం కనిపించలేదు.
కాణ్హ ఒక్క ఉదుటున ఎత్తి అతన్ని ఏనుగు మీద కూర్చోబెట్టేడు.
ఏనుగు బలంగా అతన్ని క్రిందకి నెట్టేసింది.
కాణ్హ ‘గణ’ చేసిన ఆ చర్యకి మొదట తెల్లబోయి చూసేడు. తర్వాత ఏదో అర్ధమయినట్లుగా తల పరికించి “మీ నాన్నకి చేతబడి జరిగింది. చేతబడి జరిగిన వ్యక్తిని గణపతి సమానమైన ఏనుగు తన మీద ఎక్కించుకోదు” అన్నాడు.
లిఖిత ఆ మాట విని ఖిన్నురాలయి “మరెలా, మా నాన్నని తీసికెళ్ళడం!” అంది.
“గణా!” అని అరిచేడు కాణ్హ.
ఏనుగు మోకాళ్ల మీద కూర్చుంది.
“మీరిద్దరు దాని మీద పదండి. నేనాయన్ని తీసుకొస్తాను” అన్నాడు కాణ్హ కార్తికేయన్‌ని లేవదీసి తన భుజాల మీదెక్కించుకుని..
లిఖిత, బేరర్ ఏనుగు మీద వెళ్తుంటే వారిని అనుసరించేడు కాణ్హ కార్తికేయన్‌తో.
గణ వెళ్తూ వెళ్తూ మళ్లీ మహామాయ మృతకళేబరాన్ని మరోసారి తొక్కి ముందుకి నడిచింది ఆగ్రహావేశాలతో.

*****
“వెంటనే నాకు రెండు లక్షలివ్వు” అన్నాడు వెంకట్ భార్యతో.
“నా దగ్గరెక్కడివి?” అంది కనక మహాలక్ష్మి అమాయకంగా చూస్తూ.
“మరీ ఓవర్‌గా నటించేయకు. నీకు లాటరీలో పది లక్షలొచ్చింది అందులోంచివ్వు”
కనకమహాలక్ష్మి ఎన్నాళ్లగానో తిండిలేనట్లుగా కళ్లు తేలేసి “నాకు లాటరీ రావడమేంటి? ఎవరు చెప్పేరు బావా నీకు?” అంది.
“మీ నాన్న. అందుకే నిన్ను పెళ్లి చేస్కున్నాను”
కనకమహాలక్ష్మి మొహంలో కళ తప్పింది.
“అంటే డబ్బుకి ఆశపడి నన్ను పెళ్ళి చేసుకున్నావన్నమాట. నన్ను ప్రేమించనే లేదా అయితే?” అంటూ ముక్కు ఎగ చీదింది.
వెంకట్ పరిస్థితి ఇరకాటంలో పడింది.
ప్రేమించలేదంటే.. అసలే మొండిఘటమైన పెళ్లాం పైసా ఇవ్వకుండా పుట్టింటికి చెక్కేస్తుందన్న భయంతో అమాంతం ఆవిడ కాళ్లు పట్టుకున్నాడు. మంచం మీదనుండి క్రిందకి దూకి.
కనకమహాలక్ష్మి భర్త చేష్టలకి తెల్లబోతూ కాళ్ళు సర్రున వెనక్కు లాక్కుని “మీకు పిచ్చి ఉందని చెప్పలేదే మా నాన్న. కన్నెచెర తప్పించాలని పిచ్చోడికిచ్చి చేసి నా గొంతు కోసేడు!” అంది ఏడుస్తూ.
వెంకట్ అలానే నేలమీద కూలబడి భార్యకి రెండు చేతులు జోడించి నాకు పిచ్చి లేదు కనకం. నేను చాలా ఆపదలో ఉన్నాను. నా పీకమీద కత్తి ఉంది. వ్రేటు పడకుండా రక్షించు” అన్నాడు దాదాపు ఏడుస్తూ.
“అయ్యో . మీకు బాగా ముదిరిపోయినట్లుంది. మీ పీక మీద కత్తి కాదు కదా బ్లేడు ముక్క కూడా లేదు. అయ్యో రామచంద్రా. నాకిప్పుడెవరు దిక్కు!” అని ఏడవటం మొదలెట్టింది.
వెంకట్‌కి ఆవిడ ఏడుపు విని నిజంగానే మతి చలించినట్లయింది.
“కాస్సేపు నీ ఏడుపు ఆపవే దరిద్రపు మొహమా!” అన్నాడు కోపంగా జుట్టు పీక్కుంటూ.,
సరిగ్గా అప్పుడే ఆ ఇంటి తలుపులు ధనధనా మోగేయి. వెంకట్ ఏడుపు ఆపుకొని వెళ్లి తలుపు తీసేడు.
ఎదురుగా ఈశ్వరి నిలబడి వుంది సూట్‌కేస్ చేత్తో పట్టుకొని.

సశేషం..

గోదారొడ్డు కథలు 2 – నందినోర్రావుడు ఈడేరిందంటల్లా..!

“ లచ్చివొదినే.. ఇనపళ్ళేదా? ఏంజేత్నా..వంటవ్వలేదా ఏటి..ఇటో అడుగెయ్..?”
బాగ్గెలచ్వి ఇంటి ఈధరగు మీదున్న తంబానికి నడుంజేరేత్తానే గుమ్మాలోంచి లోనకంటా సూత్తా సూరయ్యమ్మన్న మాటకి సుట్టింట్లో పప్పు గుత్తితో ముద్దపప్పు మెదాయిత్తన్న ఆ ఇంటావిడికి పేనాల్లేచొచ్చినట్తయ్యి దాన్నామట్నే వొదిలేసి సెయ్యి కడుక్కుని సెంగుకి తుడ్సుకుంటా..బేటికొచ్చి
“ఏదీ కానేల గేదీన్నట్టు ..ఇయ్యాల్టప్పుడు ఇలాగొచ్చేవేటి..? ముంతెట్టేసేవేటి “ ఈపుని గోడకి జేరేసి కూకుంటా అంది.
“ బియ్యం కడిగి నానబెట్టిటొచ్చేను ..సేలో మందేత్తాకి ఇయ్యాల తెల్లారగట్తే ఎల్లేరు. పాలెర్నంపుతారంట ముంతకి. అయ్యి రోజూ ఉండేటియ్యేగానీ బాగ్గెలచ్వొదినే….నీ సెవిలో ఓ మాటేద్దావని..” సెవిలో మాటనేది గుసగుసలుగా అంటా అంది సూరయ్యమ్మ.
“ఏటది?” సాగదీసింది బాగ్గెలచ్వి.
“కొత్తపేటలో .. బంగారయ్య లేడా..అదే నందినోరి బంగారయ్య. “
“ ఆ..ఆ.. తెల్వకే..ఏ..పోయేడా ఏటి?”
“ నీ బుద్ధి సుద్దయ్యినట్తే ఉంది. బంగారయ్యెంతుకు పోతాడప్పుడే ..పిడిరాయల్లే ఊరట్టుకు తిరుగుతుంటేనీ..నువ్వు మరీని..”
“నువ్వింత పొద్దున్నే పనిమాల వచ్చేవని అలాగనుకున్నాన్లే..ఏ..ఏవయ్యేడింతకీ..”
“ .. మన్రాలు పెద్దమడిసయ్యిందంట.. ..”
“బంగారియ్య మన్రాలా? ఎవత్తీ..ఆ కుర్రముండే..! రావుడో బీవుడో ఏదో ఉంది దాని పేరు. సీవిడి ముక్కుతో మనీధిలోంచి బళ్ళోకెల్లద్ది అదే గదా..? దాన్దుంపదెగ..లాగేసుకోకుండా బళ్ళోకెల్లద్దది. ఆల్లమ్మతో ఎన్నిసార్లన్నానో..”
“ఇంకిప్పుడెయ్యెకేంసేత్తదిలేగానీ.. .. రావుడే..బీవుడుగాదు… మా సురుకులే పిల్ల. పొద్దున్నే..ఈధూడుత్తుంటే..కొవ్వాకుల రాందాసు సైకిలేసుకుని పడ్తా,లేత్తా అడావిడిగా ఎల్తావుంటే అడ్డంగొట్టడిగేను సైకిలాపి ఏటడావిడని. పిల్ల పెద్దమడిసయ్యింది ..గరువులోకెల్లి తాటాకులు తెగ్గొట్టుకురమ్మని బంగారయ్య కవురెట్టేడంట..కత్తట్టుకునెల్తన్నాడు..”
“కూకోబెడతన్నారా?”
“ఊరుకో వదినే. సత్తానికి ఆ గుంటముండొక్కద్దే గందా… కూకోబెట్రా..! నువ్వు మరీని. సర్లే బియ్యం మరీ నానిపోతే అన్నం సివుడుద్ది..వత్తా…” బుగ్గల్నొక్కుకుంది సూరయ్యమ్మ ఎల్తాకి లేసి నిలబడతా..
, _ _ _
నందినోరి బంగారయ్య పెద్ద కొడుకు సత్తుం కూతుర్రావుడు ఈడెరిందని ఆకులేసి కూకోబెట్టి ఇరుగూ,పొరుగోల్లని పది పన్నెండుమంది ముత్తైదుల్ని పిల్సి బొట్టెట్టి అచ్చింతలెయ్యమని తమల పాకుల్తో కల్పి రెండేసి అరిటిపల్లిచ్చి పంపేరు.
పంపుతా పంపుతా “ ఆయంతుంది..మర్సిపోద్దని , మల్లీ కబురంపుతానని సెప్పి మరీ పంపేరు.
వచ్చినోల్లంతా అచ్చింతలేత్తా ఏత్తా..
“ గోలీలనీ, బచ్చాలనీ, గూటీబిల్లనీ మొగపిల్లల్తో సమానంగా ఆడతా..పాడతా..తిపాదల్లే ఏ పొద్దు సూసినా ఊరట్టుకు ఏలాడేది. అయినియ్యి అమ్మాయి గారాటలు” అంటా ఆసికాలాడతంటే రావుడికి అర్తం అవుతుల్లేదు అయ్యన్నీ ఎంతుకు మానెయ్యాలో..
ఆ రేత్రి..
అసలే పచ్చి తాటాకులు. పైగా ఒకదానిమీదొకటి.. బొత్తల్లే ఏకంగా తొమ్మొదాకులేసేరేమే కూకుంటాకి కట్తంగానే ఉంది రావుడికి.
“ అమ్మా..గుచ్చుకుంటన్నయ్యే..నేనిక్కడ పడుకోను బాబా..! నీదగ్గరొడుకుంటానే..” గారాలువోయింది రావుడు తాటాకుల మీదే దుప్పటి పరిసి తలగడిత్తన్న తల్లితో..
అప్పటికే అద్దందువ్వెనా బొట్టుభరిణీ అన్నీ విడిగా దూరంగా పెట్టుకోమనేతలికి అదేదోలాగుందాపిల్లకి.
“ మేవందరం పడుకున్నోల్లవే..నువ్వెక్కడ్నించన్నా దిగొచ్చేవేటి? పడుకో మాట్తాడకుండాను..నీల్లోసేదాకా ఆకుల్మీదే..” తవురుకొచ్చింది ఆల్లమ్మ సేసమ్మ.
“ అయ్యా..కాత్తంత నాయమారతా సెప్పొచ్చుగదేటి..అలా రోకల్తో దంచినట్టు సెప్పపోతే..” సనుక్కుంటా రావుడు దగ్గరకంటా వచ్చి తాటాకుల్కి తగలకంటా సీర కాల్లమద్దెన జొనిపి నిల్చోని..
“నాయమ్మగదా..కాత్తంత ఓరువట్టమ్మా..తొమ్మిద్దినాలోపికడితే..నీ బల్లోకి నువ్వెల్దుగానీ..నేనూ ఇక్కడే బొంతేసి పడుకుంటాగదా..” అంటా కోడలేపు దిరిగి..
“ మొన్నామజ్జన పాత సీరల్తో కుట్టిన బొంతుందిగందా? అదెయ్యాపోయావా? ఆయంతినాడు సాకలోడికిత్తే ఆడే ఉతుక్కొత్తాడు. పచ్చాకులు గుచ్చుకోవా ? నిదరడద్దో లేదో పిల్లముండకి. అదసలే ఆల్ల నాన్న పక్కలో దూరి దూరి పడుకుంటడి ముడుసుకుని .. “
దిగులుగా సూసింది రావుడు నాయనమ్మొంక తప్పదా అన్నట్టు..
ఇయ్యన్నీ ఏటో ..తెలుత్తాలేదు ఆవెకి. ఆడుకుందావని సీనొత్తే ..గూట్లో బచ్చాముక్కల్దీసి లాగుజేబులో పెట్టుకుందావని గౌనెత్తితే తెల్సిందప్పుడు..
“ ఒసేలమ్మా..ఇదేటే..” అంటా పరిగెత్తిందాల్లమ్మ దగ్గరికి.
గుండెల్లోరాయడిందప్పుడే ఆవెకి కూతురు పెద్దదైపోయిందని..
—- —- — —
నందినోరి బంగారయ్యకి అయిదుగురు కొడుకులు,ఒక్కూతురూను.
అందర్నీ ఊళ్ళోనో, సుట్టుపక్కలూళ్లల్లోనో ఇచ్చేడేమో…ఊళ్ళో అందరూ సేసినట్తే ఇంటిపేరిటోళ్లు రోజుకొకళ్ళు..వంతులేసుకుని మరీ వండుకొచ్చేరు మూర్లూ, గార్లూ, పులివోర, వంకాయాల్లమిగురు, గుమ్మడికాయ దప్పలం కాడ్నించి.
మజ్జ మజ్జలో పిండొంటలకైతే లోటేలేదు.. సున్నుండలనీ, పానకంలో గార్లనీ ..అలసందలొడలనీ..ఒకటిగాదు మరి.
నాల్రోజులు పోయాకా శుక్రోరం, మంగ్లోరం కాకుండా సూసి ఆల్లనీ, ఈల్లనీ రమ్మని..గాడిపొయ్యలెట్టి మరీ బూర్లొండిచ్చి ఊరంతా పంచిపెట్టించ్చింది..బంగారయ్య పెళ్ళం మన్రాలు సాపెక్కిందన్నట్టు.
స్టీలు బక్కెట్టులో ఏసుకుని ఊళ్ళో గెడప గెడపకీ పంచిపెడతాకెల్లేవోల్లకి..” ఇంటిపేరిటోల్లకి..రెండు పుంజీల్చొప్పునెట్టండి..మిగతావోల్లకి పుంజీసాలు..గడప గడప్కీ నా మనవరాలి బూరెల్లాల..” సెప్పిందే సెప్పి సెప్పిందే సెప్తుంటే ఇసుక్కున్నాడు కూడాను కొడుకు సత్తుం.
సుట్తాలకీ, పక్కాలకీ అందర్కీ కబురెల్లింది పలానానాడు ఆయంతుంది రండలాగని.
అన్నదమ్ములందర్లో సత్తువే పెద్దోడవటంతో..మిగతావోల్లందరూ ఆల్లిల్లల్లో సంబరంలా తలో సెయ్యేసేరేమో..అరిటాకులు, మావిడాకులు, గొబ్బరికాయలు , కూరరటికాయల కాడ్నించి పురమాయిత్తం అయిపోయింది.
అంతకు ముందే నెల్లాళ్లనాడు సేలో తాటి సెట్ల మీదున్న ఆకుల్నినరికిచ్చి మేటేసేడేమో..అయినోళ్లింట్లో ఉన్నయ్యంటే సర్వీ బాదుల్దెప్పిచ్చి ఇంటిముందంతా సలవ పండిళ్ళేయించేడు సత్తుం.
“ పెద్ద మనిసైతేనే పెల్లంత సేత్తన్నావ్..పెల్లింకెంత సేత్తాడో మా నందిన సత్తుం “ అంటా ఎటకారాలాడేరు ఇరుగూపొరుగూ ఆడా,మగా.. నవ్వుతా..
బళ్ళొదిలాకా పిల్లలకదో ఆటతలమైందేమో..రావుడు మాత్తరం లబోదిబోమంది ఆలాటలుసూసి.
ఆయంతి రేపనగా..తెల్లారగట్తే మొదలెట్టేసేరు అరిసెలొండుతుం.
పేరంటాల్లందర్కీ బంతి భోజనాలయ్యాకా బొట్టెట్టి, పసుపురాసి..పిల్ల నెత్తి మీద అచ్చింతలెయ్యమని అయిదేసి అరిసిలు, రెండేసి అరటిపళ్ళూ, తవలపాకులూ పంచిపెడతం రివాజేమో..అసలుకే ఊరబంతయ్యేసరికి ఇంటికి అయిదేస్సొప్పున ఎన్నొండితే సరిపోయేను అరిసిలు.
అంతుకే సందేళ ఎల్తురుండగానే మొదలెట్టేసేరు పిండిగొడతం..ఆ రేత్రి పేట్లో పెళ్లైతే ఊళ్ళో మైకు ఓరెత్తినట్టు వోలు పిర్కా మొత్తం..రోకలి పోట్లే ..పోట్లు. కాతంత బియ్యం లొంగినియ్యనుకున్నాకా
అద్దరేతిరి గాడిపొయ్యలంటిచ్చి మూకుళ్ళేసి గానుగునూన్లో నెయ్యి కలిపేరు.
తోటికోడళ్లతో పాటు ఇరుగూపొరుగోల్లు కూడా వచ్చి ఒక సెయ్యేత్తే తప్ప లొంగనే లేదా అరిసెలు. పాకవట్తీవోల్లొకల్లైతే, కొబ్బరిముక్కలూ, నువ్వులూ ఏయించీవోల్లు మరొకల్లు. ఉండలు సేసిచ్చీవోల్లొకల్లైతే, వత్తీవోల్లొకల్లు. ఏయించీవోల్లొకల్లైతే ఆట్ని ఆమట్టునే అట్టికెల్లి..అప్పటికే అమిర్సుంచుకున్న ఎదురుపెళ్ల బుట్ట్లల్లో అడుగున కట్టెపేళ్ళేసి వాలుగా ఉంచే రేమో..ఒకందంగా వాటి మీన సర్ధిచ్చే దూటీ బంగారయ్య పెళ్ళాన్ది.
అంతా అయ్యేతలికి రోజు గడిసిపోనే పొయ్యింది. అదే పెద్ద పని.
— — —
తానం రోజు రానే వచ్చింది.
అప్పటికి తొమ్మిద్దినాల్సించీ ఆకుల మీదే పడకేమో..అలవాటయ్యేతలికి మత్తుగా నిదరట్టిందేమో..తెల్లారగట్తే లేపి తానం జేయించేసింది ఆల్లమ్మ సేసమ్మ.
పిల్ల తానానికెల్లిందోలేదో..మనిసిని పిల్సి ఆకులయ్యీ తీయించేసి..అక్కడంతా కడిగిచ్చేసింది బంగారయ్య పెల్లాం. అద్దరేత్రే వంటలు మొదలెట్తేసేరేమో..కూరగాయలు తరిగేఓల్లొకల్లైతే, డెకిశాలు పొయ్యెక్కించే వోల్లొకల్లు. గుండుగుల్నిండా కావిళ్లతోసెరువు కాడ్నించి నీల్లుదెచ్చి నింపేవోల్లొకల్లైతే..బంతిసాపుందో లేదోనని సూసేవోల్లొకల్లు.
మొత్తం మీద ఇల్లంతా సందడే సందడి..
అంతకు ముందు రాత్రే పచ్చి శెనగపప్పుడకబెట్టి బెల్లం పాకవట్టి పూర్ణాలకి సిద్ధం సేసి అట్తే పెట్టేరేమో..
తెల్లారతానే మినప్పప్పు రుబ్బింది రుబ్బినట్టుగా పూర్ణాలేత్తన్న రెండో కోడలెంక సూత్తా సూత్తా..
“ ముందోయ దేవుడికెట్టి..ఒసే సేసమ్మా..ఎప్పుడనగానో లేసింది పిల్ల..ఆకులో రెండు బూర్లెట్టి నెయ్యేసియ్యి పిల్లకి ..”
ఎవరెక్కడ మాట్తాడతన్నారో..ఎవరికి ఎవరు పనులు పురమాయిత్తన్నారో..అన్నీ కలగాపులగమైపోయి అక్కడంతా అదోలాటి సందడి..అల్లరిసేత్తా ఉంటే..పొద్దెక్కే కొద్దీ
దిగుతున్నారొక్కక్కల్లూ..ఎడ్లబళ్లమీదొచ్చేవోళ్ళొకళ్లైతే, టాట్తర్లమీదో కొందరు. రైళ్ళల్లోనూ, దగ్గరూళ్ళోళ్లైతే..నడ్సి కూడా వత్తన్నారు…
గిలకా, శీనూ అయితే బేగ్ బస్సెక్కొచ్చేరు ఆల్లమ్మ సరోజ్ని కూడా..
“కుదురుగా ఉండండి..అల్లరిసెయ్యకండి..సరోజ్ని పిల్లలనిపిచ్చుకోవాలని.” సెప్పే బస్సెక్కిచ్చుకొచ్చింది సరోజ్ని. అసలు తీసుకురాపోనుగానీ..అయ్యాల ఆదోరం కాటంతో..ఇంట్లో వదిలేసొత్తే ఇల్లు పీకి పందిరేత్తారని ఎంటేసుకొచ్చింది సరోజ్ని.
బస్ దిగి వత్తానే ఎదురొచ్చిన సత్తాన్ని సుట్టుకుపోయారిద్దరూ.
పెతి యాసంకాలంలోనూ..తాటి ముంజలనీ, రేగుపళ్లనీ, మావిడిపళ్లనీ ఏయోటి పిల్లల్దింటారని తోకబుట్తలో సైకిల్ కి కట్టుకుని మరీ సరోజ్ని ఆల్లింటికి ఎల్తాడేమో సత్తుం , ఆతన్ని సూడగానే ఇట్తే ఆనమాలుగట్తేసి సుట్తేసేరు..”సత్తుమ్మాయ్య..సత్తుమ్మాయ్యని” .
సరోజ్నంటే అదో రకం అభిమానం సత్తానికి. సరోజ్ని ఆల్ల నాన్న రంగన్నదీ అదే ఊరు. ఆల్ల సిన్నప్పుడేవో సేలు కోర్టులో పడితే ప్లీడరుగారితో మాట్తాడి ఆటిని వదిలిచ్చేడేమో..రంగయ్య.. ప్లీడర్ల సుట్టూ ఆట్తే తిరగక్కల్లేపోయిందని.., రంగయ్యాబాబు వల్ల ఆట్తే కాలం కూడా పట్తలేదని..అతను సేసిన ఉపకారానికి ఆ పొలాలు ఊరికే వచ్చేసినట్టయ్యిందేమో..సత్తానికి ..ఆ ఇది ఉంది సరోజ్ని ఆల్లపట్ల. అంతుకే సరోజ్నికి మాత్తరం ఏ కాలాల్లో పండేటియ్యి ఆ కాలాల్లో పట్టుకెల్లి ఇత్తానే ఉంటాడు.
అంతుకే సత్తుమ్మాయ్యని సూడగానే ఆల్ల ముకాలు ఆల్చిప్పల్లాగైపోయినియ్యి.
ఈల్లొచ్చేతలికే తెల్లారగట్త..ఆకులయ్యీ తీయించేసి ఇల్లంతా కడిగిచ్చి ముగ్గులెట్టేసేరేమో..రావుడికి తలంటి లంగా జాకిట్తేసేరు.
పద్దినాల తర్వాత తలంటుకుందేమో..గిలకాల్లూ వచ్చేతలికి తలారబోసుకుని పందిట్టో తిరుగుతుంది రావుడు. సెవులికి జుంకాలేలాడదీసి పందిరి దాటెల్లొద్దంది..సత్తుం పెళ్లం.
అయ్యన్నీ కాదుగానీ, తనీడోల్లని సూసి పేనం లేసొచ్చినట్తయ్యింది రావుడికి. అంతకు ముందెప్పుడూ ఆల్ల గురించి ఇంటవేగానీ సూల్లేదేవో.. కాసేపాల్ల సుట్టూ తిరిగినా..తాటాకు పందిరి గుంజల్ని పట్టుకుని ఆటాడేటప్పుడు మాట్తాడేసుకున్నారేమో..అందరూనూ..రావుడు సెప్తుంటే ..ఊకొడ్తవే పనయ్యింది గిలకా శీన్లిద్దరికీ..
“ఎవరే..ఆడేత్తన్నావ్? ఆల్లెవరో తెల్సా..?” అన్నాడు సత్తుం సరోజ్ని పిల్లల్తో ఆడ్తన్న కూతుర్నె సూత్తా..
జూకాలు ఊగేసేట్టు సెప్పింది తలూపుతా తెల్వదన్నట్టు..
“ తేగలూ, శీతాపలప్పళ్ళు సైకిల్కి కట్టుకుంటుంటే అడుగుతావు గందా….ఓరికి నానా..అని..ఈల్లకే..”
నాన్న ఆల్లెవరో సెప్పాకా , సేలో..పండిన పెతీదీ నాన్న సైకిల్కి కట్టుకుని పట్టుకెల్లేది ఆల్లకేనని తెల్సాకా మరింతిదయ్యింది రావుడికి ఆల్లంటే..
అంతుకే మరీ మాట్తాడేత్తంది..రావుడు..ఆల్లెంతో గొప్పోల్లయినట్టు, నాన్నకెంతో ఇట్తమయినట్టూ..ఆల్లకన్నీ సూపించెయ్యాలన్నట్టు..
తేగలూ, రేగిపల్లూ, జున్నూ, తాటిముంజిలూ, సీతాపలప్పల్లూ పట్టుకెల్లేటప్పుడు..అంత అత్తారబతంగా పట్టుకెల్లీవోడు ఎవరికో మినిట్తర్గారికి అట్టుకెల్తున్నట్టు. ఆల్లెవరో సూడాలని సేన్నాల్లనించీ రావుడి మనసులో ఉంది..
“ సత్తుమ్మాయ్య..మాకు రేగిపల్లు తెత్తాడుగదా..అమ్మ ఆట్ని వడియాలెడద్ది..అయ్యంటే మా బళ్ళో సూరేవతికెంతిట్తవో..” గిలకంది..
“ ..మరి ..ఆ సురేసుగాడికి..? ఆడే తినేత్తాడు ఎప్పుడన్నా..అమ్మ..బళ్ళోకెల్లేప్పుడు వడియం ఇత్తేని..”
“ఎంతుకో తెల్సా..? మాయమ్మ..రేగొడియాల్లోనూ..బెల్లవేత్తది..తియ్యతియ్యగా ఉంటాదని..”
“ రావుడక్కా..మరేమో..సత్తుమ్మాయ్య రేగుపళ్ల తెత్తాడుగదా? సెట్టుందా మీకు..” రావుడ్నే సూత్తా అన్నాడు సీను..
“సెట్టేటి..ఎల్లే..ఒక్కటేనేటి? గరువులో సేనా ఉన్నాయ్. మానాన ఏరుకొత్తాడు..తోక బుట్టల్తోటి..”
“ బుట్తకి తోకుంటదా ఎక్కడన్నానూ..? తోక బుట్తంటే అక్కా..” ఎటకారంగా నవ్వేడు శీను గిలకెనక్కి నవ్వుతా సూత్తా..
“ ఆటిని తోక బుట్టలే అంటారని మాయమ్మ సెప్పింది నాకు..”
“ అయ్యేగదా..సత్తుమ్మా..య్య సైకిల్కి అటేపూ, ఇటేపూ ఏలాడేసి ఆటిల్లోనూ..సీతాపలాప్పప్ప్లెట్టుకొత్తాడు..అయ్యేనా? పొడుగ్గా ఉంటాయి ఆనబ్బుర్రల్లాగా..”
“ఊ..అయ్యే..”
“ఎక్కడేరతాడు..” “ సెట్టుకింద..”
“ అయ్యి పైనించి కిందడతాయా..?”
“అయ్యడవ్ ..సెట్టు మీదే ముగ్గుతుయ్ . ఆట్ని కర్రెట్టి కొడితే ..కిందకి రాల్తాయి. ఆటిని ఏరి తెత్తారు..”
“నువ్వూ..కొట్టేవా..ఎప్పుడైనాను..”
“ ఓ.. బోల్డన్నిసార్లు..”
“ అక్కా మనవూ కొడదావా?”
“ సెట్తెక్కడుందో నాకేందెల్సు..?”
“నేన్జూపిత్తాను. ఎల్దాం వత్తారా?” స్సై అన్నారిద్దరూ..
“మీయమ్మేవనదా?” రావుడంది.
“ గౌన్నిండా ఏసుకుని రేగుపళ్ళట్టుకొద్దాం.. అప్పడమ్మేవనదు..”
—- —- —
మెల్ల మెల్లగా ఒకటీ ,అరా పేరంటాల్లు రాసాగారు. పట్టిసీరల రెపరెపలు..ఓ పక్కన వంటలు సేసీవోల్లు సేత్తంటే టిపినీలు సేసీవోళ్ళు అరిటాకుల్లో ఎట్టుకుని తింట్నారు..
“నువ్ పిల్లని తయారుజెయ్. పేరంటాల్లొచ్చే ఏలయ్యింది..” అత్తగారంది కోడల్తో..
“ ఇయిగో..ఇయ్యట్తుకోండి..అదెక్కడుందో తీస్కొత్తా”నంటా పందిట్లోకెల్లినావెకి ఎంత ఎతికినా పిల్ల దొరికితేనా? ఆ ఎతుకుతుం ఎతుకుతుం ..పదిమందడి తలా ఏపునా పడి ఎంతెకినా పిల్ల జాడే లేదు.
ఆల్లతో సరోజ్ని జేరిందేమో సత్తుంలో కంగారెక్కువైంది..
సేసమ్మకైతే కాల్లూ సేతులాడ్తం లేదు..
బంగారయ్య పెల్లావైతే దుడుకొచ్చేసి..పాయిఖానా దొడ్లోకి ఎల్తం, వత్తం, వత్తం ఎల్తం. ఇదేపని .
వంటోళ్ళు వండేసినియ్యి టీలు బక్కేట్టుల్తో ఎత్తేసి ఓసోటెడతన్నారు. ఒకటే బూర్ల వాసన.
పేరంటాల్లొత్తం ఎక్కువైపోయింది..అల్లని కూకొమ్మని సాపలేసేరుగానీ మనసంతా వరదొచ్చిన కాల్వలా ఉంది. ఊరంతా తిరిగీ తిరిగీ ఉత్త సేతుల్తో వచ్చిన కొడుకుని జూసి పై పేనాలు పైనే పోయాయి బంగారయ్య పెల్లానికి ఈడొచ్చిన పిల్ల ఎవడేదానన్నా పడిందా ఏటని.
పొద్దెక్కేకొద్దీ ఇల్లంతా పేరంటాల్లతో నిండిపోతం మొదలయ్యింది. .ఎటు సూసినా పట్టుసీరల రెపరెపలే. ఏ సీర సూత్తే ఏవుంది..ఎటు పీల్సినా పాత టంకుపెట్టి ఓసనే.
సరోజ్ని కాలుగాలిన పిల్లల్లే అటూ ఇటూ బింకంగా తిరుగుతుందిగానీ లోలోపల భయంగానే ఉంది..
మజ్జమజ్జలో సత్తుం, సేసమ్మా..సెప్తానే ఉన్నారు..ఊళ్ళో పెమాదం ఉండదు వచ్చేత్తారని.
“ఏమ్మా..టీసుక్క తాగుతావా?” ఎవరో అడిగేరు. వద్దంది.
“ ఊల్లో భయవేవుండదమ్మా..మా రావుడికన్నీ దెల్సు. ఇక్కడికే ఏ బళ్ళోకో ఎల్లుంటారు..”
ఆవిడెక్కడ భయపడ్తందోనని ఏదేదో సెప్తున్నాడుగానీ నాలుగు మూలల్నుంచీ గుంపులు గుంపులుగా వత్తన్న సూట్టాల్ని సూసేకొద్దీ..కడుపులో దుడుకెక్కువై పాకెనక్కెల్లటవే సరిపోయింది..
“ ఇంతకీ ..రావుడేది..? ఇంకా కూకోబెట్లేదేటి..అయ్యబ్బో..” ఎవరో అంట్నారు..
“వత్తది .లోపల బట్తలేసుకుంటంది..మీరు వణ్నం తినండి..వచ్చేత్తది..”
పిల్లని కూకోబెట్టాల్సిన కుర్చీ ఖాళీగా ఉంటం సూసి సెవులు ముక్కలైపోటం మొదలయ్యిందప్పుడే….
“ పిల్లేది..?” అందరి మొఖాల్లో ఇదే ..
“ ఈధూడుత్తా సూసేను..ఆల్లమ్మ తలంటతం కూడా ఇన్నాను..ఇంతలో ఎక్కడికెల్లిపోయిందో..సత్తుం ఊరంతా ఎతికేడంట..మా ఇంటాయనంట్నాడు..”
పిల్లెక్కడికో పోయిందని తెల్సినోల్లు నోరెల్లబెట్టి సూత్తన్నారు ఏమవుద్దోనని..తెలీనోల్లు ఆల్ల పనాల్లు సేసుకుపోతన్నారు. ఎక్కడ సూసినా అడావుడే అడావుడి..
వచ్చీవోల్లు వత్తన్నారు.తినీవోల్లు తింటన్నారు..ఎల్లేవోల్లదే సమస్యంతానూ..
ఎల్లేముందు ఎంతోకొంత పిల్ల సేతిలో పెట్టి తాంబూలం తీసుకుంటం ఆనవాయితీ. ఆల్ల సమస్యల్లా..ఆ తెచ్చిందేదో ఎవరి సేతిలో పెట్టాలోనని..
సత్తుం పెల్లవైతే..” ఈ గడప తొక్కిన కాడ్నించీ సాపెక్కిన పెతీవోల్లకీ తోసిందేదో పెడతానే ఉన్నాను..నాకొచ్చే ఏలకి పిల్లిలా సేసిందేటి..పంటొచ్చే ఏలకి పైరుగాలెత్తికెల్లినట్టు..దగుల్బాజీ ముండకాపోతే. ఊల్లో సవత్తాడ్నోల్లని సూళ్ళేదా ..అంట…” మనసులోనే ఇసుక్కుంది..
“పోన్లే ..ఏంజేత్తాంమరి. రెండో సారి సవత్తాడినప్పుడు కూకోబెడదాంలే..మరేటి సేత్తాం..” కోడల్నుద్దేశించంది అత్తగారు.
గతుక్కుమంది సత్తుం పెల్లం. ఇప్పటికే తలపేనం తోక్కొచ్చింది..ఇయ్యన్నీ సెయ్యాలంటే. మల్లీ..ఇంకోసారా..?
ఈల్లిలా ఆలోసిత్తుండగానే సరోజ్నియే సొరవ తీసుకుని సంచోటి దెచ్చి కుర్చీ మీదెట్టి..పేరంటాల్లందర్నీ సూత్తా.. “ మా …పిల్లలూ , ఈళ్ళూ ఉప్పుడే కలుత్తుం. పందిట్లో ఊసులాడుకుంటుంటే ఇక్కడే ఉన్నారుగదానుకున్నాం. ఎక్కడికెళ్ళేరో ఏమో..అందరూ అన్నాలు తిన్నారా ?” అనడిగింది.
మూతిమీదేలుంచుకునే తిన్నావన్నట్టు తలూపేరు..పేరంటాల్లంతా..
“ అయితే రావుడికి మీరేవన్నా..పసుపూ కుంకం దెత్తే ఈ సంచీలో ఏసేసి..ఇలాగొచ్చి ఈ తాంబూలం తీస్కెల్లండి…”
అరగంటలో..సంచీ నిండుతుం, ఇల్లు సగం కాలీ అవుతుం కూడా అయ్యింది.
“మామూలుగా అయితే ఎవరెంతెట్టేరో..పుస్తకవెట్టి రాత్తాం. ఈ పిల్ల ముండిలా సేసే సరికి ..మనసులాట్తే బాగోక..”
మిట్తమజ్జానం దాటి మూడంకె సూపిత్తంది గోడ్నున్న గడియారం. నాలుగైనా జాడలేరు. ఊరంతా ఒకటికి రెండుసార్లు గాలిత్తం అయితే అయ్యింది. పిల్లలెవరన్నా బస్సెక్కెల్లారా అని బసులాగేసోటకెళ్ళి సోడా కొట్టోడ్ని అడిగొచ్చేరు. ఎవరూ బస్సెక్కలేదండని సెప్పేడతను. రైలు టేసన్కెల్లి..టేసన్ మేస్టార్నీ అడగటం అయ్యింది..
వచ్చెల్లినోల్లు తప్ప..ఇంటోల్లు పచ్చి మంచినీల్లు ముట్టుకుంటే ఒట్తు.
“పోలీసుకేసెట్తండి..” అంటన్నారెవరో.. ఇంతలో..
జుట్టు రేగిపోయి..మోకాళ్లదాకా దుమ్ముకొట్టుకుపోయి ఉన్న ముగ్గుర్నీ దూరం నుంచి చూసి దొడ్లోకి పరిగెత్తేడు సత్తుం బరికందుకుంటాకి.
“కొట్తకు..అసలే పెద్దమడిసయ్యింది..పచ్చొల్లు..” తల్లి మాటతో తమాయించుకున్నాడు సత్తుం.
అప్పటికే గిలకనీ, శీన్నీ లోపల్కి బరబరా లాక్కెల్లినంత పన్జేసింది సరోజ్ని.
బెదురు బెదురుగా సూత్తన్న తల్లికేసి..సూత్తా..
“ అమ్మా..ఇయ్యి సూడు..గురిందగింజలంట..రావుడక్క సెప్పింది. అచ్చు ఇలాటిదే కదమ్మా..నువ్వు లోపలేస్కునే గొలుసుకి కట్టుకుంటావ్.. నీకోసవే తెచ్చేనమ్మా..”
ఎత్తిన సెయ్యి దిగిపోయింది.
—- —-
“ కాదు నానా..! ఆ పెద్దమ్మోల్లు..మనం సేసుకుంటాకి పొలం ఇల్లిచ్చేరనీ, అంతుకే తేగలూ, రేగుపల్లూ, సీతాపలప్పల్లూ, మావిడిపల్లూ..జున్నూఅన్నీ పట్తుకెల్తన్నానని, మనకి ఉపకారం సేసినోల్లకి ఉపకారం సెయ్యాలనీ సెప్పేవ్ గదా నానా..! మరీ.. మరీ ఆ రేగుసెట్లూ, సీతాపలప్పల్ల సెట్లూ ఎలాగుంటాయో సూత్తానంటే సూపిత్తాకి తీస్కెల్లేన్నాన్నా..మనింటికొత్తే మనవే మర్యాచ్చెయ్యలని కూడా సెప్పేవ్ గదా నాన్నా..ఇప్పుడెవో..కొడతాకి బరికెత్తేవ్..సూడమ్మా..నాన్నే సెప్పి నాన్నే కొడతాడంట..!”
అంటా కుచ్చిల్లల్లో ముఖం దాసుకున్న ఈడేరిన రావుణ్ణి సూసి సేలానే నేర్పాలనుకుంది సత్తుం పెళ్లాం.
—-

మాయానగరం 46

రచన: భువనచంద్ర

రెండు శవాలు. ఒకటి చాకు గుండెల్లో సూటిగా గుచ్చుకుపోగా చచ్చిపోయిన మహాదేవన్‌ది. రెండోది త్రాచుపాము కాటుతో చనిపోయిన పరమశివానిది. చాకుమీద వేలిముద్రలు పరమశివానివని రుజువు కావాలి. త్రాచుపాము కోరల గుర్తులు రుజువయ్యాయి. కోరల గుర్తులే కాదు నల్లగా విషంతో మాడిన శరీరమూ, నోటి నుండి నురగ.
మౌనదేవతలా నిల్చుంది నందిని. ఎంతమంది కూర్చోమన్నా కూర్చోలేదు. తెల్లార్లూ నిలబడే వుంది. నిలబడే ఓపిక లేక కూర్చుండిపోయాడు వెంకటస్వామి. అతని కళ్ళల్లో నీరు ఇంకిపోయింది. పోలీస్ స్టేషన్ పట్టపగల్లా వుంది.
“ముందు శవాల సంగతి చూడండి..” ఇన్‌స్పెక్టర్‌తో రిక్వెస్టింగ్‌గా అన్నాడు సర్వనామం. అతను వచ్చి ఓ అయిదు నిమిషాలయింది.
“మీరెవరూ?” కూల్‌గా అడిగాడు ఇన్‌స్పెక్టర్ సుభానీ. “సర్.. నేను శామ్యూల్‌గారి దగ్గర పని చేస్తూ వుంటాను. చాలాసార్లు మహాదేవన్‌గారి హోటల్లోనే భోంచేశాను. ఆయన చాలా సత్పురుషుడు. పరమశివం మెంటాలిటీ గురించి చెప్పింది కూడా ఆయనే. మరోవారంలో కేరళ వెళ్ళిపోతున్నాననీ, బిడ్డ పెళ్లి చేస్తాననీ కూడా చెప్పారు. పరమశివం గురించి పోలీస్ రిపోర్టు ఇస్తానని నేను చెప్పినా, మహాదేవన్‌గారు వాడి పాపాన వాడ్ని పోనివ్వండి. సొంత చుట్టాన్ని పోలీసులకి వప్పగించే పాపం నేనెందుకు చెయ్యాలి” అన్నారు. సార్ వీడు పరమదుర్మార్గుడు. తండ్రి కళ్లముందు చస్తున్నా గుక్కెడు నీళ్లని పొయ్యకుండా మాటల శూలాలు గుచ్చి ఆనందించిన పరమక్రూరుడు. వీడి చరిత్ర అంతా వాడి పెట్టెలోనే వుందని మహాదేవన్‌గారు చెప్పారు. దేవుడు లేడని అనుమానిస్తాం గానీ, ఖచ్చితంగా వున్నాడు. వీడు పాముకాటుకు గురై చావడమే అందుకు రుజువు. ఆ పుణ్యాత్ముడి శరీరం మాత్రం నిర్లక్ష్యానికి గురికాకూడదు” వినయంగా సుభానీతో అన్నాడు సర్వనామం.
తల పంకించాడు సుభానీ. అతనికొకటి అర్ధమయింది. బయటికి చెప్పినదానికంటే సర్వనామానికి చాలా చాలా తెలుసని. ఇంకోటి కూడా అర్ధమయింది. అతను విప్పదల్చుకుంటే తప్ప అతని నోరు ఎవరూ విప్పించలేరనీ. తండ్రి తలకి తానే ‘కొరివి’ పెడతానని పట్టుబట్టింది నందిని. తనని దూరంగా పంపే ఏర్పాట్లు తండ్రి చేసి వుంటాడని ఆమెకి అర్ధమయింది.
లోకంలో ఓ చిత్రముంది. అన్నెంపున్నెం ఎరుగని అమాయకులు కూడా చిన్న దెబ్బ తగిలితే లోకరీతిని అర్ధం చేసుకోగలిగేంత ఎదుగుతారు క్షణాల్లో. ఒక్కోసారి సర్వం తెలిసినవాళ్లు కూడా ఒక్క దెబ్బకి కుప్పకూలిపోతారు. ఇప్పుడు నందిని కళ్లల్లోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ కూడా అమాయకత్వం లేదు.
“నీ ఆలోచన ఏమిటమ్మా” ఒంటరిగా కలిసి అడిగాడు సర్వనామం. అతని వంక ఓ చూపు చూసింది. ఆ చూపులో “నిన్నెలా నమ్మగలనూ? అసలు నువ్వెవరివీ?” అనే ప్రశ్నలు కనబడ్డాయి సర్వనామానికి. చిన్నగా నవ్వాడు.
“నాకు అర్ధమైంది తల్లీ. నేనెవరనేది నీ ప్రశ్న. అసలు ఎందుకు కల్పించుకుంటున్నానానేది మరో ప్రశ్న. సరే . మీ తండ్రిగారు గతించి నేటికి పదోరోజు. నువ్వు అన్నట్టుగా తెలుగువారి సాంప్రదాయం ప్రకారమే కర్మ జరిపిస్తున్నాను. ధర్మోదకాలు అయ్యాయి. మరో రెండు రోజుల్లో 12వరోజు పెద్ద కర్మ కూడా పూర్తవుతుంది. గత తొమ్మిది రోజులనుండి నేను చాలా పనులు చేశాను. అందులో ముఖ్యమైనవి ఏమంటే మీ నాన్నగారి అభిమతం ప్రకారం నిన్ను కేరళకి మీ నాన్నగారి స్నేహితుడి ఇంటికి క్షేమంగా పంపే ఏర్పాట్లు చెయ్యడం. ఆ ఏర్పాట్లు చూసే సందర్భంలో తెలిసింది, మీ నాన్నగారి స్నేహితుడు పరమపదించాడనీ, అతని బంధువులు మంచివారు కారనీ. మీ నాన్నగారికి వెంకటస్వామి కేవలం నీ ఆస్తి కోసమే నిన్ను వలలో వేసుకుంటున్నాడనే నమ్మకం. అది ముమ్మాటికీ నిజమే. అర్జంటుగా రాత్రికి రాత్రి ‘రిచ్’ అయిపోవాలమనే దురాశ, పేరాశ అతనివి. అలా ఆశపడడం తప్పే అయినా, అదేమీ అసాధారణమేమీ కాదు. వెంకటస్వామి దురాశాపరుడేగాక దుర్మార్గుడు కాదు. మొదట్లో అతని మనసులో ఏమున్నా, మీ నాన్న గతించిన క్షణం నించీ అతనిలో చాలా పరివర్తన వచ్చింది. నీకు నిజం చెబుతా విను.

కంభంపాటి కథలు-2 – ‘చుట్ట’పు చూపు

రచన: కంభంపాటి రవీంద్ర

‘పూర్వం రోజుల్లో మా అక్కా వాళ్ళ కుటుంబం శెలవులకి హైదరాబాద్ వచ్చినప్పుడు అందరం కలిసి భలే సరదాగా గడిపేవాళ్ళం కదండీ. ఇల్లంతా చాలా సందడిగా ఉండేది’ అంది రాధిక.
ఆఫీసు నుంచొచ్చి బాత్రూంలో కాళ్ళూచేతులూ కడుక్కుంటున్న వాళ్ళాయన శ్రీధర్ ’మీ అక్కా వాళ్ళు గుర్తొస్తున్నారా? ఈ ఏడాది శెలవులకి వాళ్ళని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయాల్సింది. ఇప్పటికైనా ఏమొచ్చింది. వాళ్ళకోసారి ఫోన్ చేసి పిలవొచ్చుగా ?. వద్దులే. మీ బావగారికి నేనే ఫోన్ చేస్తానుండు’ అన్నాడు
‘ఏమక్కర్లేదు. వాళ్ల్లు హైదరాబాద్ లోనే ఉన్నారు. కాపోతే మనకి ఏమీ చెప్పలేదు. ఇందాక కూకట్ పల్లి రైతు బజారుకి వెళ్తూంటే చూసాను. రమ్య, వాళ్ళాయన, పిల్లలు అందరూ తెగ నవ్వేసుకుంటూ మంజీరా మాల్ లో కెళ్తున్నారు. ఈ ఊరు వచ్చినట్టు కనీసం మనకి చెప్పను కూడా లేదు’ అంది రాధిక ఏడుపు మొహంతో !
‘ఏమో. వాళ్లకేం ఇబ్బంది ఉందో. మనది చిన్న ఫ్లాట్ కదా. బహుశా మనల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళు వచ్చి ఉండరు’ అన్నాడు శ్రీధర్
‘భలే చెబుతారండీ. పదిహేనేళ్ళనుంచీ ఇదే ఫ్లాట్ లో ఉంటున్నాం. మూడేళ్ళక్రితం దాకా ప్రతి ఏడాదీ వచ్చేవారు కదా. అప్పుడు లేని మొహమాటం ఇప్పుడెందుకు ?’ బాధగా అంది
‘అదే చెబుతున్నాను. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకో తెలీనప్పుడు బాధపడి ఏం ప్రయోజనం ? ఈసారెప్పుడైనా కలిసినప్పుడు మాటల్లో మెల్లగా కనుక్కోడానికి ప్రయత్నించు. లేదా ఈ విషయం ఇంతటితో వదిలెయ్యి’ అంటూ భోజనానికి కూర్చున్నాడు శ్రీధర్
‘మీకు చెప్పడానికి సులువుగానే ఉంటుంది. “ఇంతటితో వదిలేయ్ అని.” . కానీ నా సొంత అక్క ఇలా మనూరొచ్చి కనీసం తెలియపరచకపోతే బాధగా ఉంటుంది కదా’ అంది రాధిక అన్నం వడ్డిస్తూ
‘నిజమే. కాదనను. కానీ ఒకటే అనుకో. మనం మనవైపు నుంచి ఏ తప్పూ లేకుండా వాళ్ళని బాగానే చూసుకున్నాం. అయినా వాళ్ళు మన ఊరొచ్చి కూడా మనకి చెప్పలేదంటే. ఏం చేస్తాం. వాళ్లకేం ఇబ్బందులున్నాయో మరి. ఆ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా తిరిగెళ్లాలని మనసులో దేవుడికి దణ్ణం పెట్టుకో.’ అన్నంలో దోసావకాయ కలుపుకుంటూ శ్రీధర్ అంటే, రాధిక ఇంక ఏమ్మాట్లాడలేదు.

**********************

ఆ రాత్రి దసపల్లా హోటల్ సూట్ రూములో హాయిగా పిల్లలతో కూర్చుని టీవీ చూస్తున్నరమ్యతో వాళ్ళాయన వెంకట్ అన్నాడు ‘మనం ఇందాకా అనవసరంగా వెళ్ళేమేమో ఆ మంజీరా మాల్ వేపు. ఎక్కడ మీ రాధికా, వాళ్ళాయన కనిపిస్తారేమోనని తెగ టెన్షన్ పడ్డాను’
‘మీరు మరీనండి. మా మరిదిగారేమైనా మీలాగా మాంఛి ఆఫిసర్ ఉద్యోగం వెలగబెడుతున్నాడేంటీ ? ఆఫ్టరాల్ ఓ ఫైనాన్స్ కంపెనీలో క్యాషియర్. అంతే. మాల్ మొహం తెలిసిన మొహాలేనా అవి ?. పైగా వాళ్ళింటికెళ్ళేమంటే వాళ్ళనీ మనతో తిప్పాలి. మనకదో ఖర్చు.’ అని రమ్య విసుక్కుంటే, వెంకట్ అన్నాడు ’నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్నేళ్లూ వాళ్ళింటికే వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఇప్పుడలా తీసిపడేస్తావేమిటి ?’
‘ఓ రాకెట్ పైకెళ్తూ ఉంటే అనవసరమైనవి ఒక్కొక్కటీ వదిలేస్తూ పైకెగురుతుంది. మనం కూడా జీవితంలో పైకెదుగుతున్నప్పుడు ఇలాంటి పనికిమాలిన చుట్టరికాలు వదిలిపడేయాలి. ఆ దేవుడి దయవల్ల మీరో పెద్ద ఆఫీసరైయ్యారు. అలాంటప్పుడు మీకో లెవెలుండాలి కదా. హైదరాబాద్ వెళ్ళేం. దర్జాగా దసపల్లా హోటల్లో ఉన్నాం అంటే బావుంటుందా లేక కూకట్ పల్లి రైతు బజారు వెనక సందులో ఉన్న మా తోడల్లుడి రెండు బెడ్ రూం అద్దింట్లో ఉన్నాం అంటే బావుంటుందా ?’ అడిగింది రమ్య
నిజమేనన్నట్టు తలపంకించి ఊరుకున్నాడు వెంకట్ !

*****************

ఆ తర్వాత రెండు రోజులూ రాధిక తనకేమైనా రమ్య వాళ్ళూ ఫోన్ చేస్తారేమో, ఇవాళ మీ ఇంటికొస్తాం అని చెబుతారేమో అని చాలా ఆత్రుతగా ఎదురుచూసింది. రమ్య నుంచి తనకే ఫోనూ రాలేదు. ఆ రాత్రి మళ్ళీ భర్త తో చెప్పింది ’మా అమ్మా, నాన్నా పోయింతర్వాత తనే నాకన్నీ అనుకున్నా. చూసారా. కనీసం ఈ ఊరొచ్చి మనకి ఫోన్ కూడా చెయ్యలేదు. పైకి ఏడవలేదు కానీ ఏడుపొచ్చేస్తూంది’

‘నీకు ఏడుపొచ్చిందనుకో. మనస్ఫూర్తిగా ఏడ్చెయ్యి, నేనేమీ ఆపను . హాయిగా నవ్వగలగడం, మనస్ఫూర్తిగా ఏడవడం కన్నా విలువైన ఆస్తులు లేవని నా అభిప్రాయం’ అన్నాడు శ్రీధర్
కాసేప్పటి తర్వాత కళ్ళు తుడుచుకుంటూ నవ్వుతూ ’హమ్మయ్య. ఇప్పుడు మనసులో దిగులు తగ్గి హాయిగా ఉంది’ అంది రాధిక
***************

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. రాత్రి ఏడవుతూంది. వెంకట్ తెగ కంగారుగా జేబులన్నీ వెతికేసుకుంటున్నాడు. రమ్య మొహం పాలిపోయివుంది.
‘అంత కేర్లెస్ గా ఎలా ఆటో దిగేరండీ?. టిక్కెట్లు, ఫోను, మీ క్రెడిట్ కార్డులు అన్నీ ఆ క్యాష్ బ్యాగులో ఎందుకెట్టేరు ? అదేమైనా కూరల బుట్టా ? అన్నీ వెరైటీలు ఒకే చోట గుమ్మరించడానికి ?’ అంటూ ఏడుపు మొహం పెట్టుకుని అడిగింది రమ్య
‘అసలు దీనికి నువ్వే కారణం మమ్మీ. హాయిగా స్టేషన్ దాకా క్యాబ్ లో వస్తూంటే నువ్వే మధ్యలో ఆ పారడైజ్ దగ్గర బిర్యానీ పాకెట్ అంటూ అక్కడ దింపించి, అక్కణ్ణుంచి పక్కనే అంటూ ఆటో ఎక్కించేవు. ఇప్పుడా ఆటోవాడు మన కాష్ బాగ్ తో ఎటో వెళ్ళిపోయేడు’ అంటూ ఇంతెత్తున రమ్య కూతురు దివ్య ఎగిరితే నిజమేనన్నట్టు తలూపేడు వెంకట్
‘అవును అందరూ నన్ను చూసి ఏడవండి. తర్వాత ఏం చెయ్యాలో మటుకూ ఆలోచించొద్దు’ అని రమ్య అంటే ’చేసేదేముంది. మీ చెల్లెలింటికి ఫోన్ చేసి విషయం చెబుదాం. కొంచెం డబ్బులిస్తే ఊరెళ్ళిన వెంటనే తిరిగి పంపిద్దాం’ అని వెంకట్ అన్నాడు
‘అసలు మిమ్మల్ని ఆఫీసర్ చేసిన ఆ మహానుభావుడికి దణ్ణమెట్టాలి. కొంచెం బుర్ర వాడండి. ఇప్పుడందరం వెర్రి మొహాలేసుకుని క్షమించండి తప్పైపోయింది అంటూ వాళ్లకి చెబుతామా ఏమిటి ?. మీరొక్కరే ఆఫీసుకొచ్చినట్టు. ఇక్కడ మీ పర్సు పోయినట్టు, అబద్ధమాడి మా మరిది దగ్గర డబ్బులుచ్చుకోండి. ఆ తర్వాత మన పాట్లేవో మనం పడదాం’ అంది రమ్య
‘మరి అంతదాకా మీరెక్కడ ఉంటారు?’ అని వెంకట్ అడిగితే ’ఏం చేస్తాం. నేనూ పిల్లలూ ఏ ఆటో వెనకో నుంచుంటాం అతనెళ్ళిపోయేదాకా’ అంది రమ్య

***************

వెంకట్ తన తోడల్లుడైన శ్రీధర్ కి ఫోన్ చేసి’ఇలా ఏదో ఆఫీస్ పని మీద హైదరాబాద్ వస్తే డబ్బులు పోయేయని, కొంచెం స్టేషన్ దగ్గరికొచ్చి ఓ పదివేలు సర్దితే ఊరెళ్ళిన వెంటనే పంపిస్తానని చెబితే ’అయ్యో తప్పకుండా’ అంటూ, శ్రీధర్ వెంటనే బయల్దేరేడు.
‘మా అక్క ఆ పక్కనే ఎక్కడో దాక్కుని ఉంటుంది. దాని మొహం చూడాలని ఉంది. నేనూ వస్తాను.’ అని రాధిక పిల్లల్ని పక్క ఫ్లాట్ లో వాళ్ళకి అప్పజెప్పి శ్రీధర్ తో స్టేషన్ కి బయల్దేరింది.
స్టేషన్ బయట వెంకట్ ని దూరం నుంచి చూసిన రాధిక బైక్ దిగి ’మీరు వెళ్ళండి. ఏమవుతూందో నేను దూరం నుంచి చూస్తూంటాను. అతను వెళ్లిపోయిన తర్వాత నా సెల్ కి ఫోన్ చెయ్యండి. నేను వచ్చేస్తాను’ అంది
బైక్ దిగిన రాధిక రోడ్డుకి అవతలవేపు అన్నివైపులా చూసుకుంటూ గబగబా నడుస్తూంటే దూరంగా ఓ ఆటో వెనకనుంచి పిల్లలతో దాక్కుని, వెర్రిమొహం వేసుకుని దూరంగా మాట్లాడుకుంటున్న శ్రీధర్, వెంకట్ ని చూస్తున్న రమ్య కనిపించింది. రమ్య కంటపడకుండా ఆ షాపుల రద్దీలో వాళ్ళవేపు రాధిక నడుస్తూంది, అలా దాక్కుని దాక్కుని చూస్తున్న రమ్యని చూస్తూంటే నవ్వొస్తూంది తనకి.
*****
షకీల్ కి ఆ సాయంత్రం నుంచి ఒక్క గిరాకీ కూడా తగల్లేదు. ఎవడైనా ఆటో ఎక్కుతాడని చూస్తూంటే ప్రతీ ఒక్కడూ ఓలా, ఊబరు, మరీ కాదంటే మెట్రో, తప్ప తన ఆటో కేసి ఎవ్వడూ చూడ్డం లేదు. ఒక్క గిరాకి తగిల్తే చాలు, ఇంటికెళ్లి పడుక్కోచ్చు, సాయంత్రం నుంచి ఇక్కడే ఎండలో ఉండిపోయేననుకుంటూ, చేతిలో ఉన్న చుట్ట చిరాగ్గా విసిరేస్తే అది కాస్తా ఆ పక్కనే నుంచునున్న ఎద్దుకి తగిలి చిరాగ్గా కాస్త ఆటో వెనక్కి జరిగి, ఒక్కసారి బర్రున అంత పేడ వేసేసింది. తన చీర మీద ఆ పేడంతా పడేసరికి, ఏడుపొచ్చేసింది రమ్యకి.
‘ఛీ ఛీ. అమ్మ చీరంతా బఫెలో పాట్టీ’ అంటూ పిల్లలు దూరంగా జరిగేసరికి, బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటున్నరమ్యతో ’ఫర్వాలేదక్కా! ముందు ఆ షాపు దగ్గిరికెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. కడుక్కుని, ఆ తర్వాత ఏడుద్దువు’ అని అంటున్న రాధికని చూసి ఎందుకేడవాలో కూడా తెలీని ఓ విచిత్రమైన స్థితిలో ఉండిపోయింది రమ్య !

రెండో జీవితం – 7

రచన: అంగులూరి అంజనీదేవి

”నేను ఆర్‌.టి.సి. బస్‌లో పనిచేస్తున్న రోజుల్లో నా భార్య డబ్బు మీద ఆశతో నన్ను బాగా సంపాయించమనేది. జీతాన్ని మించిన సంపాదన నాకెలా వస్తుంది? రోజుకోరకంగా, ఏదో ఒకటి లేదంటూ తనలోని వెలితిని బయటపెట్టి బాధపడేది. నన్ను బాధపెట్టేది. రాను రాను ఇంటికి రావాలంటేనే భయపడేవాడిని… అప్పటికే శ్యాం పుట్టాడు. శ్యాం కోసమైనా నేను నా భార్య మాట వినాలి. లేకుంటే నన్ను ఇంటికి రానివ్వదు. బస్‌లో టికెట్స్ ఇవ్వకుండానే ప్రయాణీకుల దగ్గర డబ్బులు తీసుకోవటం మొదలుపెట్టాను… నా భార్యకి నెలకోసారి ఇచ్చే జీతంకన్నా నేను రోజూ ఇచ్చే పది, ఇరవై చూసి ఎక్కువ సంతోషించేది. ఆ సంతోషాన్ని దూరం చెయ్యలేక నేను ఆ ఉద్యోగానికి దూరమయ్యాను. అంటే స్వాడ్‌ వచ్చినప్పుడు దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకున్నాను.
… పోయిన ఉద్యోగం మళ్లీ రాలేదు. భార్యా, బిడ్డలను పోషించుకోవాలంటే డబ్బులేదు. ప్రొద్దున లేచి ఏదో ఒక పనికి వెళ్లేవాడిని… నేను చెయ్యని పనిలేదు. పడని కష్టం లేదు.
నేను చేసిన తప్పుకి అనుభవిస్తున్న శిక్షను చూసి నామీద నాకే జాలేసేది. ఒకరోజు దొరికిన పని ఇంకోరోజు దొరికేది కాదు.. క్వారీలల్లో రాళ్లు తీసేపని దగ్గరనుండి రైల్వేస్టేషన్లో మూటలు మోసే పనిదాకా అన్ని పనులు చేశాను. చివరికి బరువైన పనులు చెయ్యలేని స్థితికి వచ్చాను. కారణం నాలో కాల్షియం లోపించిందన్నారు డాక్టర్లు.
…అప్పుడు నాకో వ్యక్తితో పరిచయం అయింది. ఆయన పేరు డా||కె.కె. నాయుడు ఆయన నన్నో కోరిక కోరాడు.” అంటూ ఆగాడు గంగాధరం.
”ఏమి మామయ్యా ఆ కోరిక?” అంది నిశిత ఆసక్తిగా..
”వర్షాకాలంలో పొలాల గట్లపై తుంగగడ్డి మొలస్తుంది. ఎక్కడైనా ఆ గడ్డిని కోసి పశువులకి మేతగా వేస్తారు. లోపల గడ్డలు విస్తరించి ఎంత కోసినా ఆ తుంగ మళ్లీ మొలకెత్తటం దాని నైజం. ఆ తుంగను బలంగా పీకితే గడ్డలు బయటపడ్తాయి. ఆ గడ్డల్ని ఎలాగైనా సంపాయించి తనకి సప్లై చెయ్యమని కోరాడు.. నేను పనికెళ్లి రాళ్లు మోస్తే వచ్చే డబ్బుకన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. నేను ఒప్పుకున్నాను…
…ఇంట్లో నా భార్యతో చెప్పాను. సరే వెళ్లమంది. నెల మొత్తంలో నేనెక్కువగా అక్కడే గడపాల్సి వచ్చేది. ఆ తుంగగడ్డల్ని తీసికెళ్లి ఒకరూంలో వుంచి దానికి నేనే కాపలా వుండేటట్లు ఏర్పాటు చేశారు. ఆ తుంగగడ్డల్ని ఎండబెట్టి ఆ గడ్డలనుండి సుగందద్రవ్యాన్ని తయారు చేయ్యాలన్నదే ఆయన ప్రయోగం… అది నిర్విఘ్నంగా సాగుతోంది.
ఆయన నన్ను పూర్తిగా నమ్మి – ఆ గదిని, అందులోని ఇన్‌స్ట్రుమెంట్స్ ని నామీద వదిలి ఇంటికెళ్లేవాడు. నేను ఇంటికెళ్లకుండా రాత్రంతా అక్కడే కాపలా వుండేవాడిని… పగలంతా తుంగగడ్డల్ని సేకరించి ఎండబెట్టేవాడిని. అక్కడ ఆ తుంగగడ్డలకన్నా ఆ డాక్టర్‌గారి ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా ఖరీదైనవి కాబట్టి నేను వాటికి గట్టి కాపలా కాసేవాడ్ని…
ఒకరోజు రాత్రి…
నిద్రకి ఆగలేక టీ తాగుదామని, ఒక చెట్టుకింద టీ కాస్తుంటే నడుచుకుంటూ అక్కడికి వెళ్లాను. అక్కడ అప్పటికే టీ తాగుతూ నిలబడివున్న నలుగురు యువకులు అదే రోడ్డుపై ఆ రాత్రి రెండుగంటలకి వెళ్లే ఓ బస్‌ను దోచుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. వాళ్ల గురించి అప్పుడప్పుడు పేపర్లో రావటం నేను చదవటం వల్ల వెంటనే వాళ్ల ఎత్తుగడల్ని అర్థం చేసుకోగలిగాను.
అప్పటికప్పుడు వాళ్లను ఎదుర్కొనే శక్తి, పట్టించే నేర్పు లేక మౌనంగానే వుండిపోయాను. ఆ రాత్రికి ఆ బస్‌ దోపిడీలో నగలు, డబ్బు దోచుకోవటమే కాక ఇద్దరు చంటిపిల్లల్ని చంపెయ్యటం నన్ను బాగా కదిలించింది. నా మౌనం మంచిది కాదనుకున్నాను. జీవితంలో నేనేంత కష్టపడ్డా నా భార్య, కొడుకుకే ఉపయోగపడ్తాను. వీళ్లను పోలీసులకి పట్టిస్తే చాలామందిని బ్రతికించగలుగుతాను. అని ఓ నిర్ణయానికి వచ్చాను.
చాలా కష్టపడి వాళ్లను ఫాలో అయ్యాను. పోలీసులకి పట్టించాను. వాళ్లలో ఒకడు మాత్రం తప్పించుకున్నాడు. పట్టుపడిన వాళ్లకి వాళ్ల వాళ్ల నేరాలను బట్టి శిక్షలు పడ్డాయి. ఒకడికి యావజ్జీవకారాగార శిక్ష కూడా పడింది.
తక్కువ శిక్షపడ్డవాళ్లు కొద్ది రోజులకే బయటకొచ్చారు. వాళ్లు బయటకి రాగానే ముందుగా తప్పించుకున్న వాడు వాళ్లతో కలిసి నా వెంటపడ్డాడు.
మబ్బుపట్టి, గాలికొట్టి, వానపడ్తు నేలంతా బురదగా వుంది. పెద్దకాలువ కట్టదాటి రోడ్డెక్కిన నేను వాళ్లను తప్పించుకుందామని ఒకప్పుడు హాస్పిటల్‌ కోసం కట్టి పాడుబడిపోయిన బంగ్లాలోకి దూరాను. వాళ్లుకూడా లోపలకి వచ్చారు.
నా చేతిలో సంచిని లాక్కుని విసిరికొట్టారు.. వాళ్లలో క్రోధం, కసి పెట్రేగి పోయి ముగ్గురు కలిసి నా మీద పడ్డారు. నేను ఎంత ప్రయత్నించినా వాళ్లను విడిపించుకోలేకపోయాను. బయటకి అరుపులు విన్పించకుండా నా నోట్లో గుడ్డ కుక్కారు. నేను కళ్లు మూసి తెరిచేలోపలే ఒకడు వెనక నుండి కత్తితీసి నా చేయి నరికాడు. నేను సృహ కోల్పోయాను.. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
హాస్పిటల్లో డా||కె.కె. నాయుడు గారు నాకు వైద్యం చేయించారు. అప్పటికే నేను ఇంటికెళ్లక చాలాకాలమైంది. నాభార్యా, బిడ్డ గుర్తొస్తున్నారు. కానీ, వాళ్ల గురించి ఆలోచించే ఓపిక కూడా లేకుండా అయింది. గాయం పచ్చిగానే వుంది.
కానీ ఈ మధ్య మళ్లీ వాళ్లు నన్ను చూశారు. నన్ను చంపేవరకు నిద్రపోయేలా లేరు. వాళ్ల చేతుల్లో చావటం ఇష్టంలేక ఇలా వచ్చాను.
ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు.
ఇప్పుడు ఇక్కడ నా భార్యా, నాకొడుకు, నా కోడలు – ముఖ్యంగా నువ్వు వున్నారు. చిన్నదానివైనా – ఒక చెయ్యి పూర్తిగా లేని నన్ను అర్థం చేసుకొని, సేవచేసి నా గాయాన్ని నయంచేశావు. పెద్దవాడినన్నది మరచిపోయి నీకు చేతులెత్తి దండం పెట్టాలని, ఒకసారి నీ పాదాలను తాకాలని ఎన్నోసార్లు అన్పించింది. రాగద్వేషాలతో వుండే మానసిక వికలాంగులకన్నా నువ్వు గొప్పదానివి నిశితా!” అన్నాడు.
నిశిత అలాగే విస్తుపోయింది… ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని, కుటుంబానికి దూరమై శారీరకంగా, మానసికంగా ఆయన ఎంత చిత్రహింసకు గురయ్యాడో అర్థంచేసుకొని మనసులో ఏడ్చింది.
”నిశితా! ఆ దురదృష్ట సంఘటన, ఎంత మరచిపోదామన్నా నన్ను వెంటాడి బాధిస్తోంది. అప్పుడు అరిచిన అరుపులు ఇంకా అలాగేనా మైండ్‌లో సెట్ అయి రిపీట్ అవుతున్నాయి. నువ్వు భయపడకు…” అన్నాడు.
”అలాగే ! మామయ్యా! ఇదంతా అత్తయ్యతో, బావతో, అక్కతో చెబుతాను. అందరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరెంత నరకాన్ని అనుభవించారో ముఖ్యంగా అత్తయ్యకి తెలియాలి. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న భర్తని ఇంకా ఎక్కువ సంపాయించమని టార్చర్‌ పెట్టే ఆడవాళ్లకి తెలియాలి.” అంది నిశిత.
గంగాధరం మాట్లాడలేదు
”పడుకోండి మామయ్యా! ఇంకేం ఆలోచించకండి! మేమంతా వున్నాం కదా! ప్రశాంతంగా వుండండి!” అంటూ ధైర్యం చెప్పి, ఆయన పడుకోగానే దుప్పటి కప్పి ఫ్యాన్‌ స్పీడ్‌ పెంచింది.
తండ్రి పడుకోవటం చూసి శ్యాంవర్ధన్‌ వచ్చాడు.
”మా నాన్న కేకలతో నీకు చాలా ఇబ్బందిగా వున్నట్లుంది కదూ?” అంటూ ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు శ్యాం.
”అలాంటిదేం లేదు బావా! అసలేం జరిగిందంటే..!” అంటూ గంగాధరం చెప్పిన విషయం చెప్పబోయింది.
”జరిగిందాన్ని గురించి ఇప్పుడెందుకు? జరగబోయేది కావాలి” అన్నాడు ఒకరకంగా చూస్తూ…
మగవాడి చూపులు తన మీద నిలిచినప్పుడు, అవి ఏ దృష్టితో నిలిచాయన్నది స్త్రీ వెంటనే పసిగడ్తుంది. బావ తనని కోరుకుంటున్నాడని, అది ధర్మం కాదని, అక్కకి అన్యాయం చెయ్యబోతున్నాడని అర్థం చేసుకొంది. అందుకే ఈ మధ్యన అతను ఎప్పుడు కన్పించినా ఇబ్బందిగా విసుగ్గా అన్పిస్తోంది.
”మీరు వెళ్లండి బావా! నాకు నిద్రొస్తుంది” అని అనలేక వెంటనే
”మామయ్యా! పడుకున్నారా ! మీ అబ్బాయి వచ్చాడు.” అంది నిశిత గంగాధరం వైపు చూస్తూ…
శ్యాం కంగారుగా చూస్తూ… ”ఆయన్నెందుకు లేపటం? పడుకోనీయ్‌!” అన్నాడు
…టక్కున దుప్పటి తొలగించి లేచి కూర్చున్నాడు గంగాధరం.
”ఏం శ్యాం! నిద్రరావటంలేదా?” అన్నాడు.
”వస్తోంది నాన్నా! నువ్వేదో అరిచినట్లుంటే వచ్చాను.” అన్నాడు శ్యాం
”అరిచి చాలాసేపయింది” అన్నాడు గంగాధరం.
ఒక్కక్షణం మౌనంగా వుండి ”నేను వెళ్తాను నిద్రొస్తోంది.” అంటూ లేచాడు శ్యాంవర్ధన్‌. అతను వెళ్లగానే
”పడుకో నిశితా! అవసరమైతే నన్నులేపు. భయపడకు.” అన్నాడు గంగాధరం.
దేవుడు మనిషి రూపంలో వుంటాడనానికి గంగాధరమే నిదర్శనంగా అన్పించి – తండ్రి పక్కన పడుకున్నంత ధైర్యంగా పడుకొంది నిశిత.
*****
ఆ రోజు ద్రోణ మీద కోపంతో ఇంట్లోంచి బయటకెళ్లి ఆటో ఎక్కిన శృతికకు ఎటెళ్లాలో అర్థంకాలేదు.
అక్కకన్నా ఆత్మీయులు, తన గురించి ఆలోచించేవాళ్లు ఎవరున్నారు అని అక్క దగ్గరకి వెళ్లింది.
కృతిక ఇంకా ఆఫీసునుండి రాలేదు.
పిల్లలు నానమ్మ పెట్టిన టిఫిన్‌ తింటున్నారు… పిన్నిని చూడగానే ”హాయ్‌” చెప్పారు. శృతిక ఓ నవ్వు నవ్వి… ”బావున్నారా అత్తయ్యా?” అంటూ వంటగదిలోకి వెళ్లింది. ఆవిడ తిట్టిన తిట్లు ప్రస్తుతం గుర్తురాలేదామెకు…
”నేనేదో హాస్పిటల్లో వున్నట్లు ఏమి పరామర్శ? అడగకూడదు కాని ఎందుకొచ్చావిప్పుడు ? ఏదైనా పని కాని, పంక్షన్‌ లాంటిది కాని వుండి వచ్చావా? ద్రోణ ఏడి? ఒక్కదానివే వచ్చావా? నీకలవాటేగా ఇలా రావటం…!” అంటూ ప్రశ్న మీద ప్రశ్న వ్యంగ్యంగా వదిలింది.
బిక్క చచ్చిపోయింది శృతిక. వెంటనే తేరుకొని…
”ఒక్కదాన్నే రాకూడదా? నాకు దారి తెలియదా?” అంది బింకంగా
”దారి తెలిసినా పెళ్లయ్యాక ఆడవాళ్లు ఒంటరిగా ఎటూ వెళ్లరు. వెళ్తే భర్తకి ఇబ్బంది కదా! కలిసి వెళ్తారు. మీకలాంటి ఇబ్బందులేం లేవు కాబోలు…” అంటూ ఇంకో వ్యంగ్యబాణాన్ని విసిరింది.
”నానమ్మా ! మాకు టైమవుతుంది. త్వరగా పాలివ్వు…” అంటూ కేకేశారు పిల్లలు.
”వస్తున్నా! అదిగో! మొన్న నీ చెయ్యి విరగొట్టి వెళ్లిందే మీ పిన్ని! ఆవిడొస్తే మాట్లాడుతున్నా… అన్నట్లూ! నువ్వేం పనిమీద వచ్చావో, అది చూసుకొని వెళ్లు.. తొందరేం లేదు. పిల్లల్ని మాత్రం బయట తిప్పకు. నీకసలే స్పీడెక్కువ.. అదే మా బాధ… నువ్వంత తింటే పోదు. నా కొడుకు, నాకోడలు ఇద్దరు సంపాదనపరులే…” అంది.
ఆ మాటలు శృతిక చెంప చెళ్లుమనిపించాయి.
‘అయినా ఈవిడ మాటలకేంటి… ఇలాగే అంటుంది. ఇవన్నీ పట్టించుకోకూడదు.’ అని మనసులో అనుకొంది.
…కానీ పిల్లలు తనని చూడగానే ‘హాయ్‌!’ చెప్పి ఏ మాత్రం హ్యాపీ లేనివాళ్లలా మౌనంగా ట్యూషన్‌కి వెళ్లటం మనసు చివుక్కుమనిపిస్తోంది. ఇదంతా వాళ్ల నానమ్మ ట్రైనింగే… ‘మీ పిన్ని రాక్షసి నీ చేయి విరగ్గొట్టింది. ఎప్పుడొచ్చినా సరిగా మాట్లాడకండి’ అని చెప్పి వుంటుంది.
మెల్లగా పిల్లలకి నచ్చచెప్పాలి. ‘నేను మీపిన్నిని, మీ అమ్మలాగా నాక్కూడా మీరంటే ప్రేమ వుంటుంది. యాక్సిడెంట్లు అనేవి అనుకోకుండా జరుగుతుంటాయి. అవి కామనే…’ అని వాళ్లను దగ్గరకు తీసుకోవాలనుకుంది.
కృతిక ఆఫీసునుండి, పిల్లలు ట్యూషన్‌ నుండి రాగానే అందరు కలిసి భోంచేశారు.
భోంచేస్తున్నప్పుడు, ఆఫీసు విషయాలు ఆలోచించుకుంటూ పిల్లలతో కాని, శృతికతో కాని మాట్లాడలేదు కృతిక…
అక్క మాట్లాడితే బావుండని ఆశించింది శృతిక.
అక్క మాట్లాడకపోవటంతో అసంతృప్తిగా వుంది.
”ఇవాళ ఆఫీసులో బాగా స్ట్రెయిన్‌ అయ్యాను శృతీ! పడుకుంటాను. మళ్లీ మీ బావ వస్తే ఆయన పని చూడాలి…” అంటూ తన బెడ్‌రూంలోకి వెళ్లింది.
ఆమె అలా వెళ్లిన కొద్దిసేపటికే ఆమె భర్త వచ్చాడు.
అతను ముఖం కడుక్కుని ప్రెషెప్‌ అవుతుంటే ”త్వరగా రండి! వడ్డిస్తాను!” అంటూ నిద్రకళ్లతోనే కేకేలేస్తోంది కృతిక.
పిల్లలు హోంవర్క్‌ చేసుకొని, వాళ్ల గదిలో వాళ్లు పడుకున్నారు. నానమ్మ వాళ్ల గది ముందుండే హాల్లో పడుకొంది.
శృతిక వెళ్లి పిల్లల దగ్గర పడుకొంది… పిన్ని వచ్చి పడుకున్నట్లు ఒక్క కన్ను మాత్రమే తెరిచి గమనించిన మోనా మెల్లగా లేచి వెళ్లి నానమ్మ పక్కన పడుకొంది. శృతిక ఆశ్చర్యపోయింది. టీనా గాఢనిద్రలో వుంది.
మోనా వచ్చిపడుకోగానే.. ”నిద్రరావటం లేదా?” అంటూ పైన చేయివేసింది లాలనగా నానమ్మ.
”పిన్ని మా గదిలోకి వచ్చింది అందుకే ఇలా వచ్చాను.” అంది మోనా.
”వస్తే ఏం? పడుకోవలసింది పిన్నియే కదా!” అంది నానమ్మ
”అప్పుడు చెల్లి చెయ్యి పిన్ని వల్లనే కదా విరిగింది. అందుకే పిన్నిని చూస్తే భయం నాకు… నేను బాబాయ్‌తో చెబుతాను. పిన్నిని ఇలా పంపొద్దని..” అంది మోనా.
”పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు. మీ మమ్మీతో ఏదైనా పనివుండి వచ్చిందేమో!” అంది నానమ్మ. ఆమె సందర్బాన్ని బట్టి కటువుగా మాట్లాడుతుందే కాని పిల్లలు పెద్దవాళ్లను గౌరవించకపోతే హర్షించదు.
”పనేంలేదు నానమ్మా! వాళ్లిద్దరేం మాట్లాడుకోలేదు” అంది టక్కున మోనా.
పిల్లలు పెద్దవాళ్లను ఎంతగా గమనిస్తారో అర్థమైంది నానమ్మకి.
వాళ్లకిప్పుడు ఏది చెబితే అది గ్రహించే శక్తి వుంటుంది.
మంచీ-చెడు అనేవి వెంటనే వాళ్ల మనసులోతుల్లోకి వెళ్లి బాగా పనిచేస్తాయి.
”నానమ్మా! బాబాయ్‌ లేకుండా పిన్ని ఒక్కతే వస్తే తప్పా?” అంది మోనా.
”మంచి ప్రశ్న వేశావు. తప్పులేకపోవచ్చు. కానీ పెళ్లయ్యాక ఆడప్లిల తన సంసారాన్ని అంకితభావంతో చూసుకోవాలి… ‘ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి’ అంటూ పెళ్లిలో భర్తచేసిన ప్రమాణానికి ‘నాతిచరితవ్యం’ అంటూ భార్య ప్రతి ప్రమాణం చేస్తుంది.
…దాన్ని జీవితాంతం పాటించాలి. భర్తతోనే వుండాలి. అవసరాన్ని బట్టి భర్తతోనే బయటకి రావాలి. అంతేకాని అక్కలదగ్గర, చెల్లెళ్ల దగ్గర గడపకూడదు. అలా గడిపితే ఎంత దగ్గరివాళ్లయినా చిన్నచూపు చూస్తారు” అంది నానమ్మ.
అవునా అన్నట్లు చూసింది మోనా.
”ఏ రోజుల్లో అయినా… అంటే ఇప్పటి కంప్యూటర్‌ యుగంలోనైనా సరే పెళ్లయ్యాక ఒడిదుడుకులు వుంటాయి. తట్టుకోవాలి. స్వాతంత్య్రం కూడా తగ్గుతుంది. కట్టుబడాలి. అందరితో అవసరాలు వుంటాయి. అర్థం చేసుకోవాలి.
…ఇతరుల అవసరాల కన్నా భర్త అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంతోషపెట్టాలి. దగ్గరవ్వాలి. అలా అని భర్తంటే భయభక్తులతో ప్రతిక్షణం మనసు చంపుకోమని కాదు. కలిసి, మెలిసి వుండాలి” అంది.
ఇప్పుడు మోనాకు భర్తతో పనిలేకపోయినా భర్తతో ఎలావుండాలి అనేది భవిష్యత్తులో తెలుసుకుంటుందని నానమ్మ ఆలోచన.
మోనా కూడా ఆసక్తిగానే వింటోంది.
”ముఖ్యంగా వ్యక్తిగత జీవితం కన్నా సంసారం బాగుండాలి అనుకోవాలి. అనుమానాలు, చికాకులు వుండకూడదు. అవివుంటే అరిష్టం. అన్ని అరిష్టాలకు మూలం ఆవేశం…” అంది నానమ్మ.
మోనా వింటూ నిద్రపోయింది
శృతికకు నిద్రరాలేదు.
*****
తెల్లవారింది.
తనలోని ఆవేదనను అక్కతో చెప్పుకుంటే కొంతయినా తగ్గుతుందని అక్క దగ్గరకి వెళ్లింది శృతిక… ఆఫీసుకెళ్లే తొందరలో శృతిక చెప్పేది వినకుండానే ఆఫీసుకెళ్లింది కృతిక. బావ కూడా అంతే హడావుడితో తన ఆఫీసుకి వెళ్లాడు. పిల్లలు స్కూల్‌కి వెళ్లారు.
స్నానంచేసి చీరకట్టుకొని హాల్లోకి వచ్చిన శృతిక నానమ్మను చూసి షాకైంది.
కారణం నానమ్మ చెవిదగ్గర సెల్‌ఫోన్‌ పెట్టుకొని పోటో చూస్తోంది. కళ్లార్పితే అవతల మాటలు మిస్సవుతానేమో నన్నట్లు కళ్లుకూడా ఆర్పకుండా అతిశ్రద్ధగా వింటోంది.
‘…ఈ వయసులో ఈవిడ కూడా సెల్‌ఫోన్‌ పట్టుకొని పోటో చూడాలా? ఈవిడకు కూడా ఫీలింగ్స్‌ వుంటాయా? భర్తలేడు. మరెవరితో మాట్లాడుతోంది? చిన్నప్పటి బాయ్‌ఫ్రెండా? అయివుండొచ్చు. ఈ సెల్‌ఫోన్ల పుణ్యమా అని ఎక్కడెక్కడి వాళ్లు లైన్లోకి వస్తుంటారు. అంతటి అవకాశం ఈ సెల్‌ఫోన్ల వల్లనే దొరుకుతోంది.
రాత్రి ఎంతో చక్కగా భార్యా, భర్త అంటూ మోనాతో డైలాగులు చెప్పింది. ఇప్పుడేమో అందరు వెళ్లాక బుద్దిగా కూర్చుని, ఓల్డ్‌ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ తరిస్తోంది. ఇలాంటి వాళ్లను వయసుతో పనిలేకుండా ఏది దొరికితే అది తీసుకొని కొట్టాలి.’ అనుకొంది మనసులో శృతిక.
నానమ్మ మాత్రం అప్పటివరకు సెల్‌ఫోన్‌లో ‘ఓం గణేశా! వందనం!’ అన్న యాడ్‌ని విని.,. విన్నది చాలదన్నట్లు ‘ఇంకా కొద్దిసేపు మాట్లాడితే వాడి సొమ్మేం పోయిందో అప్పుడే ఆపేశాడు’ అని పైకే తిట్టుకుంటుంటే…
శృతిక ”ఆ…” అని ఆశ్చర్యపోతూ ”ఛీ.. ఛీ ఈ ఇంట్లో ఒక్కక్షణం కూడా వుండకూడదు. ఎక్కడికి పోయినా ఇదే గోల” అని మనసులో అనుకుంటూ నానమ్మతో చెప్పకుండానే బయటకొచ్చి ఆటో ఎక్కింది.
*****
ఆటో దిగి శృతిక నేరుగా తను చదువుకుంటున్నప్పుడు వున్న హాస్టల్లోకి వెళ్లింది.
ఆ హాస్టల్లో రకరకాల అమ్మాయిలు వున్నారు. వాళ్లలో చాలావరకు ఆ చుట్టుపక్కల ఊర్లనుండి చదువులకోసం చదువులు ముగించుకొని, ఉద్యోగాలకోసం వచ్చినవాళ్లు వున్నారు. పిల్లల్ని ఉన్నతమైన స్థానాల్లో చూడాలని, అందుకు తగిన స్వాతంత్య్రాన్ని ఇచ్చిన వాళ్ల తల్లిదండ్రుల ఆశలకి వక్రభాష్యం చెప్పకుండా బాగా చదివి వారి లక్ష్యసాధన కోసం ఎంతో పట్టుదలతో శ్రమిస్తూ, కోరుకున్న స్థానాలకు చేరుకోవాలని చూసేవాళ్లే ఎక్కువగా వున్నారు.
ముఖ్యంగా వాళ్లలో చిన్న చిన్న ఊళ్లలో క్రమశిక్షణతో పెరిగిన అమ్మాయిలే ఎక్కువగా వున్నారు. బయట కృత్రిమ వాతావరణం కన్పిస్తున్నా – కన్నవారితో కట్టుబాట్ల మధ్యన పెరిగిన రోజుల్ని మరచిపోకుండా అర్ధరాత్రి వరకు బయట తిరగటం, అబద్దాలు చెప్పటం లాంటి వ్యసనాలకు దూరంగా వుంటూ… చక్కగా చదువుతూ కోరుకున్న భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు.
వాళ్లలో చైత్రిక ఒకతి…
చైత్రిక చూడానికి సున్నితంగా వుండి, మెత్తని స్వభావం గల అమ్మాయిలా అన్పించినా మనోదారుఢ్యంతో ఏ పని అయినా భయపడకుండా కచ్చితంగా చేయగలిగేలా వుంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో వివేకంగా వుండి సరిగా స్పందిస్తుంది.
హాస్టల్లోకి వెళ్లగానే ”నేను చైతూతో మాట్లాడాలి. మీరు కొంచెం బయటకి వెళ్తారా?” అంది మర్యాదగా ఆ రూం మేట్స్ ని ఉద్దేశించి శృతిక. వాళ్లు ”అలాగే” అంటూ బయటకెళ్లి హాల్లో పార్టీషన్‌ చేసిన గదిలో కూర్చున్నారు.
చైత్రికను పట్టుకొని ఏడ్చింది శృతిక.
చైత్రిక శృతికకు బెస్ట్‌ ఫ్రెండ్‌.
ఏడుస్తూనే జరిగింది మొత్తం చెప్పింది. రాజీలు, సహనాలు, ఆత్మవంచనలు బాగా తెలిసినవాళ్లే ద్రోణ దగ్గర వుండగలుగుతారని కూడా చెప్పింది.
”ఏయ్‌! పిచ్చీ! ఏడుపు ఆపు. ఇందులో ఏముందని అంతగా ఏడుస్తున్నావ్‌? నీకసలు బాధలు అంటే ఏమిటో తెలుసా?” అంది చైత్రిక శృతిక గడ్డంపట్టుకొని…
”నీకు తెలుసా?” అంది శృతిక ముక్కుని కర్చీప్‌తో తుడుచుకుంటూ…
”తెలుసు. ఈ ఏడాది రుతుపవనాలు సరిగ్గా పనిచేయక అనేక జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. అదలా వుండగానే మన సి.ఎం. హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. అందులోంచి తేరుకోకముందే కనీవినీ ఎరుగని వరదలతో అనేక జిల్లాలు కొట్టుకుపోయి జనం వీధిన పడ్డారు…” అంది చైత్రిక.
”ఇది పేపర్‌ న్యూస్‌ నాక్కూడా తెలుసు…” అంది శృతిక.
చైత్రిక మాట్లాడలేదు.
”చైతూ! నా ఏడుపు చూడవే. నాగురించి ఆలోచించవే!” అంది శృతిక చైత్రిక భుజం పట్టి కదుపుతూ…
”నీకు కష్టమంటే ఏమిటో తెలిస్తే కదా నేను ఆలోచించటానికి… చాలామంది ఆడవాళ్లు కన్నీళ్లతో నిత్యం తడుస్తున్నారు. దారి తెలియక, ఎటు వెళ్లాలో తెలియక, ఎలా వెళ్లాలో తెలియక చీకటి దుఃఖంలో, దుఃఖపు చీకటిలో బేలగా మారి… గుప్పెడు మాటలకోసం, పిడికెడు మెతుకులకోసం ఎదురుచూస్తూ వున్నారు. వాళ్ల గురించి ఆలోచించేవాళ్లు లేరు. వెన్నుదన్నుగా నిలబడేవాళ్లు లేరు…” అంది చైత్రిక ఆలోచనగా.
”చైతూ ప్లీజ్‌! నీ మాటలతో నాకు ఆర్ట్‌ ఫిలిం చూపించకే. ద్రోణ బయట ఆడవాళ్లతో వున్నంత ప్లజంట్ గా నాతో వుండటంలేదు. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. బాధను బాధగా చూడవే..” అంది.
”అది బాధెలా అవుతుంది. అతను ఆర్టిస్ట్‌. మనసులో ఎన్ని బాధలు వున్నా అవి పైకి కన్పించకుండా నవ్వుతాడు. మట్లాడతాడు. అందరి అభిమానాన్ని పొందుతాడు. అదే అతని పెట్టుబడి…నీదగ్గర అలాంటిదేం అవసరంలేదు. అందుకే నటించడం లేదు.” అంది చైత్రిక.
గట్టిగా చైత్రిక చేతి మీద కండవూడేలా గిల్లింది శృతిక.
”అబ్బా…” అంది వెంటనే చైత్రిక.
”ఎందుకలా అరుస్తావ్‌! నేను గిల్లింది నటన అనుకొని ఎంజాయ్‌ చెయ్‌!” అంది శృతిక.
ఎర్రగా కందిన చేతిని చూస్తూ ‘ఉఫ్‌’ అనుకొంది చైత్రిక ఆ బాధకి చైత్రిక కళ్లలో సన్ని నీటిపొర కదిలి మాయమైంది.
*****
ఆ ఇద్దరు అలా ఓ గంటసేపు మాట్లాడుకోలేదు. ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు.
”చైతూ! నన్నర్థం చేసుకోవే! మునీంద్ర అనే రచయిత నీకు గుర్తున్నాడు కదా! ” అంది శృతిక.
”ఎందుకు గుర్తులేడు! మన ఫ్రెండ్‌ దీపిక ఆయనకి గ్రేట్ ఫ్యాన్‌ కదా! అది ఆయన్ని ప్రేమించి ఆయన తన ఒక్కదానికే సొంతం అని మనతో వాదించేది. మనం ఎంత చెప్పినా వినేది కాదు. ఒకరోజు ఆ రచయిత శాతవాహనాలో వస్తున్నాడని తెలిసి అది వెళ్తుంటే మనం కూడా ఆయన్ని పరిచయం చెయ్యమని వెళ్లాం. ఆయన మనల్ని చూడగానే దాన్ని వదిలేసి మనకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చాడు. అది చూసి దీపిక హర్టయింది. ఆయన ప్రేమ నుండి డైవర్ట్‌ అయింది. అయితే ఏంటి?” అంది.
”ద్రోణ అలాంటివాడే అని నా అనుమానం” అంది శృతిక
”అది తప్పు. అందరు ఒకేలా వుండరు. అందరి అనుభవాలు ఒకేలా వుండవు. నీకో ఎగ్జాంపుల్‌ చెబుతాను విను. ఒక ప్రముఖ కవి మా పిన్నితో ఆయన బయట వున్నంతసేపు ‘నువ్వే నా ప్రాణం’ అంటాడు. ఇంటికెళ్లాక ‘ఇక్కడ నా ప్రాణం పోతుంది’ అని పిన్ని ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చెయ్యడు. కారణం భార్య పక్కన వుంటుంది కాబట్టి.. ఇదేం జీవితంరా బాబు అని మనకి అన్పించవచ్చు. ‘అదే జీవితం’ అనుకుంటారు వాళ్లు…” అంది చైత్రిక.
”కానీ ద్రోణ అలా కూడా చెయ్యటంలేదు. ఇంట్లో నన్ను వదిలేసి ఫోన్‌ పట్టుకొని బయటకెళ్తాడు” అంది శృతిక.
”నీకు ఇబ్బంది అని వెళ్తున్నాడు. కాని ఆ కవిలాగా దొంగ వేషాలు వెయ్యటం లేదు. అలా వేసేవాడే అయితే ఆడవాళ్ల ఫోన్‌కాల్స్‌ ఇంటికి రాకుండా చూసుకుంటాడు” అంది చైత్రిక.
”ఏది ఏమైనా నేనోపని చెయ్యదలచుకున్నాను చైతూ! మన ఫ్రెండ్‌ స్వప్నికను మానవ బాంబులా ద్రోణ మీదకి ప్రయోగించాలనుకుంటున్నాను.” అంది శృతిక.
చైత్రిక ఆశ్చర్యపోతూ ”ఇలాంటి తిక్క ఆలోచన నీకెందు కొచ్చిందో నాకు తెలియదు. కానీ ఆత్మాహుతి దళంలో చేరానికి తన చుట్టూ తన చేతులతోనే బాంబులు పెట్టుకొని వెళ్తున్న అమ్మాయిలా అన్పిస్తున్నావు నువ్వు… ఎందుకంటే స్వప్నిక…” అని ఏదో అనబోయే లోపలే తలుపు నెట్టుకుంటూ గదిలోకి వచ్చింది స్వప్నిక.
శృతికను చూడగానే ”హాయ్‌! శృతీ!” అంటూ చేతిలో వున్న కవరు బెడ్‌మీద పడేసి శృతిక మీదపడి వాటేసుకొంది స్వప్నిక.
”హాయ్‌!” అంది కాని నవ్వలేదు శృతిక.
శృతికను వదిలి ”ఏంటే అలా వున్నావ్‌! ఇంట్లో ద్రోణ దగ్గర నవ్వి, నవ్వి వున్న నవ్వంతా అక్కడే వదిలేసి వచ్చావా?” అంది స్వప్నిక.
శృతిక ఇబ్బందిగా కదిలింది.
”చెప్పు! ఎలావుంది నీవైవాహిక జీవితం? హ్యాపీనా? మేం కూడా పెళ్లి చేసుకోవచ్చా? పర్వాలేదా చెప్పు?” అంది స్వప్నిక తెగ ఉత్సాహపడ్తూ.
‘ఇది ఇలా కూడా ఇంటర్వ్యూ చెయ్యగలదా’ అన్నట్లు చూస్తోంది చైత్రిక.
”ద్రోణతో అప్పుడప్పుడు బయటకెళ్తున్నావా? ఎక్కడెక్కడ తిరిగారు? తిరిగిన ప్రతిచోట నువ్వెలా ఫీలయ్యావ్‌? చెప్పవే? ఏదీ నీ ఫోనింకా రింగ్‌ కాలేదే! మీ ఆయనకి నువ్వు గుర్తురాలేదా ఏం?” అంది స్వప్నిక.
శృతిక మాట్లాడలేదు
”ప్లీజ్‌! స్వప్నీ! దాన్ని వదిలెయ్‌! తలనొప్పిగా వుందట…” అంది చైత్రిక.
స్వప్నిక తను తెచ్చిన కవరు విప్పి…”ఈ గిఫ్ట్‌ ఎలా వుంది?” అంటూ చైత్రిక చేతిలో పెట్టింది. చైత్రిక ఏకాగ్రతతో ఆ బొమ్మనే చూస్తోంది.
అది సజీవ ప్రకృతి చిత్రం.
ఆ చిత్రంలో సాయం సంధ్యవేళ పచ్చని పంటపొలం, ఆ పొలం గట్టున వున్న రెండు తాటితోపుల మధ్యలోంచి అస్తమిస్తున్న సూర్యబింబం. ఆ సాయం సమయంలో అద్భుతంగా అన్పిస్తున్న వాతావరణం.
”చూపు మరల్చుకోలేకపోతున్నావ్‌! అందులో ఏం కన్పిస్తోంది చైతూ?” అంది స్వప్నిక. ఆమెకు పల్లెటూర్లు, పంటపొలాలు నచ్చవు.
ఆ బొమ్మ కింద ద్రోణ పేరును చూస్తూ. ”ద్రోణ బొమ్మలు వేస్తాడని తెలుసుకాని ఇంత బాగా వేస్తాడని తెలియదు.” అంది ఎమోషనల్‌గా చూస్తూ. నెంబరుంటే వెంటనే అబినందించాలనిపించింది చైత్రికకు.
శృతిక ఇలాంటి ఫీలింగ్స్‌ని పట్టించుకోదు. ఆయనేదో గీస్తాడు. వీళ్లేదో చూస్తారు. ఇద్దరు పిచ్చోళ్లే ఆమె దృష్టిలో…
”అయినా నీ బాయ్‌ఫ్రెండ్‌కి ఈ గిఫ్టేం బావుంటుందే…” అంది పెదవి విరిచి చైత్రిక.
”మొన్నటి వరకు బాయ్‌ఫ్రెండే అనుకున్నా చైతూ! కాదని చెప్పేశాడు నిన్న. అందుకే ఇదివ్వాలని తెచ్చాను.” అంటూ షాపులో సెల్‌ఫోన్‌ పెట్టి మరచిపోయినట్లు గుర్తొచ్చి హడావుడిగా బయటకెళ్లింది స్వప్నిక.
”ఇప్పుడు చెప్పు! ద్రోణను స్వప్నికకు అప్పజెప్తే హీటర్‌ని తలమీద పెట్టుకున్నట్టు కాదా? అదేమైనా బొమ్మలు పెట్టి ఆడుకోవటం లాంటిది అనుకుంటున్నావా? తెగ సంబరపడిపోతున్నావ్‌? పిచ్చి, పిచ్చి గేమ్‌లు ఆడకు.” అంది తన స్నేహితురాలు సముద్రంలో మునగబోతుందని తెలిసి తప్పించాలన్నట్లు…
”అదేం కాదులే! స్వప్నిక ద్రోణకి ఫోన్‌చేసి అతని ఫ్యాన్‌లా మాట్లాడుతుంది. అతని మూమెంట్స్, రియాక్షన్స్‌, ఫీలింగ్స్‌ ఎలావుంటాయో నాకు చెబుతుంది. ఆ రోజు దీపిక ఉడ్‌బీ ఎలాంటివాడో టెస్ట్‌చేసి చెప్పింది కూడా స్వప్పికనే… దానివల్ల దీపిక కెంత ఉపయోగమయిందో మనందరికి తెలుసు. ఇదికూడా అంతే!” అంది శృతిక.
”అతను స్టూడెంట్! అతని వెదవ్వేషాలు అక్కడక్కడ విన్నాం కాబట్టి చూస్తూ, చూస్తూ దీపికను అతనకివ్వటం ఇష్టంలేక టెస్ట్‌ చేశాం. ద్రోణ అలా కాదు. పెళ్లయి భార్యవున్న బాధ్యతగల భర్త….” అంది చైత్రిక.
”అంత సీన్‌లేదు. అదేవుంటే ఈ ఇది ఎందుకు నాకు.. అతనికి అమ్మాయిల పిచ్చి వుందని, వెరయిటీ కోరుకుంటాడని నిరూపించటానికి ఇదొక్కటే మార్గం నాకు…” అంది.
”ఇదేంటే బాబూ! ఏదైనా ఒక లక్ష్యం కోసం తపించే వాళ్లున్నారు. పదిమందిలో ఒకరిగా వుండేందుకు తమలో ఏదో ఒక ప్రత్యేకత కన్పించాలని ఆరాటపడే వాళ్లున్నారు. బ్లెడ్‌ టెస్ట్‌ చేసినట్లు ఈ టెస్టేంటి? ఈ అన్వేషణేంటి?” అంది చైత్రిక.
”నన్ను చంపేస్తానన్నాడు. మాట్లాడే అర్హత లేదన్నాడు. తనముందు నిలబడొద్దన్నాడు. ఇంతకన్నా అవమానం ఏం కావాలి? అతని మనసులో బలంగా ఎవరో ఒకరు వుండబట్టేగా ఇదంతా?” అంది శృతిక.
”మనసులోకి తొంగి చూసే యంత్రాలు ఇంకా తయారుకాలేదు శృతీ! కానీ ఎంతోకాలంగా అతను వేసుకున్న బొమ్మల్ని నువ్వలా డేమేజ్‌ చేసివుండాల్సింది కాదు. అతని ప్త్లేస్‌లో ఎవరున్నా అలాగే చేస్తారు. నువ్వు ఇంటికెళ్లి ద్రోణకి సారీ చెప్పు!” అంది చైత్రిక.
”గంటలు, గంటలు గాళ్‌ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడేవాడికి సారీ చెప్పాలా?” అంది శృతిక నిరసనగా చూస్తూ…
”నువ్విక ఈ ఫీలింగ్‌ లోంచి బయటపడవా?” అంది
”పడతాను. కానీ ద్రోణ ఎలాంటివాడో నువ్వు టెస్ట్‌చేసి చెప్పు! ద్రోణను ప్రేమిస్తున్నట్లు తాత్కాలికంగా నటించు..” అంది సడన్‌గా.
స్థాణువైంది చైత్రిక. ఒక్కక్షణం ‘వింటున్నది నిజమా’ అన్నట్లు చూసింది.
”నువ్వు నా ఫ్రెండ్‌వి చైతూ! ఆ మాత్రం హెల్ప్‌ చెయ్యలేవా? ఎలాగూ నీ మనసులో రుత్విక్‌ వున్నాడు కాబట్టి దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది వుండదు.” అంది శృతిక.
శృతిక వదిలేలా లేదని… ”ద్రోణ మరీ అంత వీకా? నేను ప్రేమిస్తున్నానంటే నమ్మానికి? అయినా నేనలా నటించాలన్నా అతనితో మాట్లాడాలన్నా నాకు ఇన్సిపిరేషన్‌ రావొద్దా!” అంది చైత్రిక, నేనీ పని చెయ్యనని ముఖం మీద చెప్పలేక…
”దానికేం! ద్రోణ అందగాడేగా! పెళ్లిలో చూసి ముందుగా ఆయన్ని పొగిడింది నువ్వే… మాట బాగుంది, నవ్వు బాగుంది అని మన ఫ్రెండ్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేశావు. నేను చూస్తూనే వున్నా నీ అల్లరిని… ”మీ ఆయన్ని ఇదెప్పుడో లేపుకెళ్లిపోతుంది జాగ్రత్త.” అని కూడా మన ఫ్రెండ్స్‌ అన్నారు నాతో… ఆ ఇన్సిపిరేషన్‌ చాలదా? ఆయనతో నువ్వు మాట్లాడటానికి…? అంది శృతిక.
అసలే శృతిక ఆనుమానపు పీనుగ… ఇందులో నేను ఇరుక్కుంటే ఎటుపోయి ఎటు తేల్తానో అన్న భయంతో ఏం మాట్లాడలేదు చైత్రిక.
”మాట్లాడు చైతూ!” అంది రిక్వెస్ట్‌గా శృతిక.
”నేను ద్రోణతో మాట్లాడితే నువ్వేమీ అనుకోవుగా…? ఒక్కసారి నీ మనసులోతుల్లోకి వెళ్లి ఆలోచించి చెప్పు! ఎందుకంటే ఇది ‘ప్రేమ’ వ్యవహారం… ఇద్దరి మధ్యన రకరకాల మాటలు దొర్లుతుతుంటాయి. కట్టె, కొట్టె, తెచ్చెలా వుండదు మరి…” అంది చైత్రిక.
ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా చైత్రికపై నమ్మకంతో.. ఉద్వేగంగా చూస్తూ… ”మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నా నేనేమీ అనుకోను.” అంది దృఢంగా.
”నువ్వు వినవు కాబట్టి నీకలాగే అన్పిస్తుంది. కానీ నువ్వు మాఇద్దరి మాటలు వింటావు. ముందు నీకు కాల్‌చేసి తర్వాత ద్రోణకి కాల్‌ చేస్తాను. నీ ఫోన్‌కి కాన్ఫ్‌రెన్స్‌ కలుపుతాను. ప్రతిమాట, ప్రతిఫీలింగ్‌ నువ్వు వినాలి. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధంలేదు.” అంది చైత్రిక. స్వప్నిక చేతిలో ద్రోణ బలికాకుండా వుండాలంటే తనకీ రిస్క్‌ తప్పదనుకుంటూ…
”ఓ.కె. అలాగే కానివ్వు…”అంది శృతిక.
”ద్రోణ నెంబరివ్వు… ” అంది చైత్రిక.
వెంటనే చైత్రిక మొబైల్‌ని తీసుకొని ద్రోణ నెంబర్‌ని సేవ్‌ చేసి ఇచ్చింది శృతిక.
”ఇక నేను వెళ్తాను చైతూ!” అంటూ లేచి నిలబడింది శృతిక.
”అప్పుడే ద్రోణ గుర్తొచ్చాడా? వెళ్తానంటున్నావ్‌?” అంది చైత్రిక
”నేను వెళ్లేది ద్రోణ దగ్గరకి కాదు.” అంది శృతిక.
”మరి…?” అంటూ ఆశ్చర్యపోయింది చైత్రిక.
”మా పేరెంట్స్ దగ్గరకి… నేను దూరంగా వుండి ద్రోణకి నా విలువ తెలిసేలా చెయ్యాలి…” అంది.
ఏం మాట్లాడలేక అలాగే చూసింది చైత్రిక.
*****
ఆముక్త – సంవేద ఇంటికి వెళ్లింది.
కాలుమీద కాలు వేసుకొని, ఫైబర్‌ కుర్చీలో కూర్చుని కుడిచేత్తో పేపర్‌పట్టుకొని చదువుకుంటున్న గంగాధరం – ఒక చేయి లేకపోయినా ఇస్త్రీ చేసిన ఖద్దర్‌ బట్టల్లో ఇప్పుడే ఏదో సోషల్‌వర్క్‌ మీటింగ్‌ నుండి బయటకొచ్చిన ప్రజా నాయకుడులా వున్నాడు.
ఆయన పక్కనే వీల్‌ చెయిర్లో కూర్చుని సంవేద శారీకి పూసలు, అద్దాలు కుడుతోంది నిశిత.
గంగాధరాన్ని చూడగానే గౌరవభావం కల్గిన దానిలా.. ”మీ మామగారా?” అంది ఆముక్త.
”అవును. అప్పుడు చెప్పానుగా ఊరినుండి మా మామగారు వచ్చారని… కూర్చో ఆముక్తా!” అంటూ ఇంకో కుర్చీ తెచ్చి నిశిత పక్కన వేసింది సంవేద.
”నా పేరు ఆముక్త! సంవేద స్నేహితురాలిని…” అంటూ గంగాధరానికి తనని తను పరిచయం చేసుకొంది ఆముక్త.
ఆయన ‘అలాగా’ అన్నట్లు నవ్వి కూర్చోమన్నట్లు కుర్చీవైపు చేయి చూపాడు.
ఆముక్త కూర్చుంది.
”మామయ్యా! ఆముక్త బాగా రాస్తుంది” అంటూ ఆముక్తలో వున్న స్పెషల్‌ క్వాలిటీని గంగాధరానికి పరిచయం చేసింది సంవేద.
”అవునా! నేను బస్‌లో పనిచేస్తున్నప్పుడు బాగా చదివేవాడిని… ఇప్పుడు మానేశాను. ఓపిక తగ్గి కాదు. పుస్తకాల రేట్లు బాగా పెరిగాయి మన రేషన్‌ రేట్లులాగే.. అన్నట్లు మీరు ఏ టైపు రాస్తారు? పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకాలా? లేక నవలలా?” అన్నాడు ఆమెవైపు మర్యాదగా చూస్తూ.
”నావి అలావుండవండి! ఏవో చిన్న, చిన్న కవితలు. అదీ భావకవితలు మాత్రమే” అంది.
”పోన్లే! ఏదో నీ సంతోషం కోసం నువ్వు రాసుకుంటున్నావు. మంచిదే.” అంటూ ఆమె కవిత్వాన్ని చదవకపోయినా తన అభిప్రాయాన్ని చెప్పాడు.
”అంటే ! భావకవిత్వం, రాసేవాళ్లంతా కేవలం వాళ్లకోసమే రాసుకుంటున్నారా? ప్రజలకోసం కాదా? వాటిని చదివేవాళ్లు ప్రజలు కాదా?” అంది ఆముక్త.
”ప్రజలు అన్నీ చదువుతారు. కొన్ని మాత్రమే మనసులో నిక్షిప్తం చేసుకుంటారు.” అన్నాడు గంగాధరం.
”నిక్షిప్తం అంటే?” అంది అర్థమైకానట్లు చూస్తూ…
ఆమె ముఖంలోకి ఓసారి చూసి… ”నేను కృష్ణశాస్త్రి, ఊర్వశి, విశ్వనాధ కిన్నెర చదివాను. అవి చదువుతున్నప్పుడు సూర్యాస్తమయంలోని అద్భుతాన్ని, చంద్రోదయంలోని సౌందర్యాన్ని చూసినంతగా పొంగిపోయాను. మహానుభావులు వాళ్లు. లోకంలో సంచరిస్తూ దొరికిన ప్రతి సౌందర్యశకలాన్ని ఏరుకొని వచ్చి సృష్టించారు. అది కేవలం రసాస్వాదన.
…దానివల్ల స్పష్టమైన లక్ష్యాలు, శక్తిమంతమైన సందేశాలు దొరకవు. వ్యక్తిగత, వృత్తిగత సామర్థ్యం పెరగదు. మనిషికి ఏది ఎంతవరకు అవసరమో మనసులో ఏది నిక్షిప్తం చేసుకుంటే ఎంతవరకు వుపయోగపడ్తుందో ఆలోచించే స్థాయికి ఇప్పటి పరిస్థితులు మనిషిని మార్చివేశాయి. నిక్షిప్తం అంటే ఇప్పుడర్థమైందనుకుంటాను.” అన్నాడు.
ఆముక్త ఎప్పుడైనా అర్థం చేసుకునేంత లోతుగా ఆలోచించి కష్టపడదు. మనసుకి నొప్పి కల్గించుకోదు… ఏదో అలా, అలా జరిగిపోవాలి లైఫైనా, రచన అయినా అనుకుంటుంది.
”రచనలనేవి మనిషి లక్ష్యాలకి, సాధించవలసిన వాటికి సమగ్రమైన వెలుగులా పనిచెయ్యాలి. ఇంకా, ఇంకా ప్రేరేపించి మనిషిలోని జడత్వాన్ని మాయం చెయ్యాలి. అప్పుడు మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు” అన్నాడు. ఆయనకు పుస్తకాలు చదివిన అనుభవం చాలా వుంది. అందుకే అలా మాట్లాడగలిగాడు.
తలదిమ్మెక్కినట్లైంది ఆముక్తకి. ఈ లక్ష్యాలేంటో, ఈ ఉన్నతాలేంటో బొత్తిగా అర్థంకాలేదు. కొద్ది రోజులు పోతే ‘నండూరి ఎంకి తెలుసా?’ అని అడిగితే మా వీధిలో లేదంటారు. ‘కాళిదాసు ఎవరని’ అడిగితే అతనిది మా వూరే అంటారు అనుకొంది ఆముక్త. ఒక్కక్షణం చింతిస్తున్న దానిలా తన చేతివేళ్ల వైపు చూసుకుంటూ..
”నేనిక వెళ్తాను వేదా!” అంది వచ్చిన పని మరచిపోయి ఆముక్త.
”అప్పుడేనా కూర్చో ఆముక్తా!” అంది సంవేద
ఆముక్త భావాలు అర్థమైనవాడిలా ఇంకేం మాట్లాడలేదు గంగాధరం.
తనొచ్చిన పని గుర్తుచేసుకుంటూ.. ”వేదా! మావారు ఊటీ వెళ్లారు. బిజినెస్‌ పార్టనర్స్‌తో కలిసి… అందుకే నన్ను తీసికెళ్లలేదు. ఇంట్లో ఒంటరిగా వుంటున్నాను. పక్కప్లాట్ లో ఎవరూలేరు. భయంగా వుంది. నిశితను తీసికెళ్తాను. ఒక్క మూడురోజులే… మావారు ఇక్కడ ప్లైట్ దిగగానే నిశితను తీసుకొచ్చి వదులుతాను.” అంది ఆముక్త.
అందరు విన్నారు ఒక్క దేవికారాణి తప్ప…
ఆముక్తకి తోడుగా నిశితను పంపిన సందర్భాలు గతంలో వున్నాయి. వెంటనే ఒప్పుకోవాలని వున్నా – అత్తగారితో, మామగారితో ఓమాట చెప్పాలని ”నిశితను ఆముక్తతో పంపమంటారా అత్తయ్యా?” అంది దేవికారాణి దగ్గరకి వెళ్లి సంవేద.
”ముదనష్టం, దరిద్రం త్వరగా పంపు. శాశ్వతంగా ఎప్పుడు పంపుతావో ఏమోదాన్ని… నాకైతే దాన్ని చూడటమే కష్టంగా వుంది. ఈ మధ్యన కొత్తగా ఇంకో మేళం తోడైంది. వాళ్లతో నువ్వెలా వేగుతున్నావో ఏమో!” అంది ఈ మధ్యన నిశిత తనపనులు చెయ్యటం లేదన్న కోపంతో…
ఆమె ఇంకో కొత్తమేళం అని ఎవరిని అన్నదో సంవేదకి తెలుసు. గంగాధరం కూడా ఆ మాటల్ని విన్నాడు. భార్యకి తన రాక ఎంత కష్టంగా వుందో అర్థంకాని క్షణం లేదు. గాయపడని సందర్భంలేదు.
”వాళ్లు మనల్ని ఏం చేస్తున్నారు అత్తయ్యా? వాళ్లవల్ల నాకైతే ఎలాంటి ఇబ్బందిలేదు” అంది
”ఎందుకుంటుంది? కాళ్లు లేనివాళ్లతో, చేతుల్లేని వాళ్లతో వుండటం నీకు అలవాటేగా! ఆ దరిద్రాన్ని నేనైతే భరించలేకపోతున్నా.,..” అంది.
వినసొంపైన మాటల్ని అయితే వినాలనిపిస్తుంది కాని దేవికారాణి ఎప్పుడు నోరెత్తినా ‘నీకో దండం. నే నెళ్లిపోతా!’ అన్నట్లుగా చూడాలనిపిస్తుంది సంవేదకి. కానీ అలా వెళ్లిపోయే బంధం కాదుగా తమది. అత్తాకోడళ్ల ఐరన్‌ రిలేషన్‌..
”నీ చెల్లికి ఈ మధ్యన తలపొగరు ఎక్కువైంది. ఏది చెప్పినా చెయ్యటంలేదు. చెప్పిన మాట వింటేనే బ్రతకటం కష్టమని చెప్పు!” అంది దేవికారాణి.
చెల్లిమీద కోపంవస్తే అక్కతో చెప్పటం.. అక్కమీద కోపమొస్తే చెల్లితో చెప్పి తిట్టడం ఆమెకి అలవాటైపోయింది.
”సరే ! అత్తయ్యా! ఇప్పుడు దాన్ని ఆముక్తతో పంపి వస్తాను.” అంటూ ఆ గదిలోంచి బయటపడింది సంవేద.
”మీరేమంటారు మామయ్యా?” అంది మామయ్యను పక్కకి పిలిచి.
”పంపించు, సంవేదా! ఒంటరిగా వుండలేకనే అడుగుతోంది. మనం ఎదుటివారికి సహాయం చేస్తే ఆపదకాలంలో మనకు కూడా సహాయం చేసేవాళ్లు దొరుకుతారు” అన్నాడు గంగాధరం. ఆయనకు స్నేహం విలువ, సహాయంవిలువ బాగా తెలుసు.
అక్క చెప్పగానే లేచి వర్క్‌ చేస్తున్న శారీని కవర్లో పెట్టుకొని, ఆముక్తతో వెళ్లింది నిశిత.
*****
నిశిత అలా వెళ్లగానే ఆఫీసునుండి వచ్చాడు శ్యాంవర్ధన్‌.
రాగానే ”నిశిత ఏది?” అన్నాడు
”ఆముక్త దగ్గరకి వెళ్లింది” చెప్పింది సంవేద.
”ఎప్పుడొస్తుంది? ” అన్నాడు త్వరగా చూడాలనిపిస్తుంది అతనికి… రోజూ ఈ టైంలో ఏదో ఒక పనిచేస్తూ కన్పించేది. చూడగానే అదోలాంటి రిలీఫ్‌. పదే, పదే కావాలనిపించే రిలీఫ్‌ అది… ఆ ప్రాణానికి అలా అలవాటైంది.
”మూడు రోజుల వరకు రాదు.” అంది సంవేద.
”మూడు రోజులా! ఏదో ఒక్కరోజంటే అప్పుడప్పుడు పంపుతుండే దానివి… ఐనో. కానీ మూడురోజులంటే మాటలుకాదు. ఎవరినడిగి పంపావు?” అన్నాడు కోపంగా.
”అత్తయ్యను, మామయ్యను అడిగే పంపాను. అయినా ఈ విషయంలో ఎందుకింత సీరియస్‌ అవుతున్నారు?” అంది భర్తవైపు చూస్తూ.
”సీరియస్‌ ఎందుకుండదు? ఆడపిల్లల్ని బయటకి పంపే రోజులా ఇవి…? అందులో రాత్రివేళల్లో వేరే ఇళ్లలో పడుకోటానికి పంపటమేంటి? నీకు ఆ మాత్రం ఆలోచించే జ్ఞానం వుండక్కర్లేదా?” అన్నాడు మరికాస్త కోపంగా.
”మీరు అనవసరంగా ఆవేశపడ్తున్నారు. ముందు భోంచేయండి! ఆకలి తగ్గితే ఆవేశం తగ్గుతుంది” అంది సంవేద.
”నీకు నేను చిన్నపిల్లాడిలా కన్పిస్తున్నానా? ” అన్నాడు.
”అని నేను అన్నానా? ” అంది.
”అనకపోయినా అలాగే అన్పిస్తుంది నాకు… లేకుంటే వెళ్లేముందు నాకు కాల్‌ చేయాలని తెలియదా? చేసుంటే వెళ్లొద్దని అప్పుడే చెప్పేవాడిని… ఇప్పుడీ బాధలేకుండా పోయేది.” అన్నాడు.
”ఇప్పుడంత బాధ పడాల్సిందేంలేదు. అది హాయిగా వుంటుందక్కడ..” అంది
”అక్కడ హాయిగా వుంటే ఇక్కడ నేనుండొద్దా? రేప్పొద్దున ఏం జరిగినా బావను నేనుండి ఏం చెయ్యగలిగినట్లు? ఇలాంటి విషయాలు నీకు తెలియవు. నువ్వు తప్పుకో, నేను వెళ్లి నిశితను తీసుకొస్తాను.” అంటూ సంవేద భుజంపట్టి పక్కకి నెట్టి నాలుగడుగులు వేశాడు.
”ఆగు శ్యాం! నేనే వెళ్లమన్నాను. వస్తుందిలే. నువ్విలా వెళ్తే బావుండదు” అన్నాడు అప్పివరకు కొడుకు వాదనను విన్న గంగాధరం.
”బావుండక పోవటానికి ఏముంది ఇందులో… నేను నిశిత కోసం వెళ్తున్నా … ఆముక్త గారి కోసం కాదుగా!” అన్నాడు వ్యంగ్యంగా.
నిశిత మీద తన భర్తకి ఇంత అభిమానం వుందా అని నివ్వెరపోయింది సంవేద. భర్త చాలా ఎత్తులో కన్పించాడు ఆమెకు…
”నువ్వు నిశిత కోసమే వెళ్తున్నావ్‌! కాదనను కానీ ఇది సమయం కాదు.” అన్నాడు గంగాధరం.
”నేనెవరి మాట వినను. నిశితను పరాయి ఇంట్లో వుంచటం నాకిష్టం లేదు అందుకే వెళ్తున్నా …” అన్నాడు గ్టిగా
అతను నిశితకోసం వెళ్తుంటే సంవేద కళ్లు చెమర్చాయి ప్రేమతో…
గంగాధరం సంవేదవైపు చూస్తూ.. ‘పిచ్చిదానా! నీ మొగుడిది అభిమానమనుకుంటున్నావా! కాదు కామం. ఆ కామదాహం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఆ దాహంలో నిశిత జీవితం కొట్టుకుపోయేలా వుంది. ఇది నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. నేనేమో నీకు చెప్పకుండా ఈ అగ్నిని నా మనసులో ఆపుకోలేకపోతున్నా’ అని మనసులో అనుకుంటూ కోడలితో దీన్నెలా చెప్పాలి? చెప్పకుండా ఎలా దాచాలి? అని చూస్తున్నాడు.
”ఆయన మన మాట వినేలా లేరు మామయ్యా!” అంది తనవైపు నిస్సహాయంగా చూస్తున్న మామయ్యను ఉద్దేశించి సంవేద.
…చేసేదిలేక గంగాధరం పడుకున్నాడు.
*****
శ్యాంవర్ధన్‌ ఆముక్త ఇంటికి వెళ్లాడు.
గేటు దగ్గర వున్న గుర్ఖా శ్యాంని చూడగానే సెల్యూట్ చేశాడు.
ఆ ఇల్లు చాలా మోడరన్‌గా వుంటుంది. అంతేకాదు…
గేటు దగ్గరనుండి ఇంటి గుమ్మంవరకు ఓ చిన్న బాటలావుండి, ఆ బాటకి అటు, ఇటు క్రోటన్‌ మొక్కలు హుందాగా నిలబడి ‘హాయ్‌’ అన్నట్లు చూస్తూంటాయి. ఇంటి చుట్టూ లోపల వాళ్లు కన్పించేలా గ్లాసెస్‌ వుంటాయి. కర్టెన్స్‌ వేసి వుంటాయి కాబట్టి లోపలివాళ్లు బయటకి కన్పించరు.
…నేరుగా వెళ్లి అక్కడే ఆగిపోయాడు శ్యాంవర్ధన్‌
కారణం లోపల కూర్చుని శారీకి అద్దాలు కుడుతోంది నిశిత. తలకాస్త వంగి వుండటంతో ఆమె జడలో పెట్టిన ముద్దబంతిపువ్వు అందంగా కన్పిస్తోంది. నిశితకి ఎదురుగా కూర్చుని పుస్తకం చదువుతూ, మధ్య, మధ్యలో నిశిత మాటల్ని వింటోంది ఆముక్త.
…శ్యాంవర్ధన్‌ కూడా ఉత్కంఠతో వింటున్నాడు.
”నిశితా! ఈ మాటలన్నీ నీకెవరు చెప్పారు? ఇంత మెచ్యూర్డ్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నావ్‌?” అంది ఆశ్చర్యపోతూ ఆముక్త.
”మా గంగాధరం మామయ్య రోజూ నిద్రపోయే ముందు చెప్తుంటాడు అక్కా! నేను అవన్నీ గుర్తుపెట్టుకుంటాను.” అంది నిశిత.
”అవునా? మీ మామయ్య మంచి అనుభవజ్ఞానిలా వున్నాడు కదూ?” అంది ఆముక్త.
”అవును. ఆయన అనుభవాలు వింటుంటే కన్నీళ్లొస్తాయి. అభిరుచితో వినాలే కాని ఆ కన్నీళ్లు చెప్పే కథలు కోకొల్లలు.” అంది నిశిత.
చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి నిశితవైపు చూసింది ఆముక్త.
”అవునక్కా! జీవితంలో ప్రతి ఒక్కటీ ప్రాముఖ్యత కలిగి వుంటుందట… ఒక్కోసారి ఇదెంతలే అని దానికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వకుండా తక్కువ అంచనా వెయ్యకూడదట… ఏదైనా మన చేతికి అందేంత దూరంలో వుంటే దాని విలువ గ్రహించం కదా! అదే చేయిదాటిపోతే బాధపడ్తాం… అందుకే ఏదైనా చేజారిపోయిన తర్వాత బాధపడేకంటే ముందుగానే దాని విలువ తెలుసుకోవటం ముఖ్యమని చెబుతాడు.
…అంతేకాదు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా మనలో మనమే బాధపడుతూ కూర్చోకుండా మనమంచి కోరే స్నేహితులకో, ఆత్మీయులకో చెప్పుకోవాలంటాడు. అప్పుడు సమస్య తీరకపోయినా కొంత ప్రశాంతత కలుగుతుందని కూడా చెబుతాడు మామయ్య” అంది నిశిత.
దానికి ఆముక్త ఏమాత్రం ఏకీభవించని దానిలా చూస్తూ.. ”సమస్య ఎప్పుడైనా సమస్యే! చెప్పినంత మాత్రాన తీరదు. అలా చెబితే చీప్‌ అయిపోతాము” అంది.
”అలా అనుకోకూడదక్కా! సమస్య ఎప్పుడూ కష్టంగానే వుంటుంది. కష్టం వచ్చిందని కృంగిపోకుండా ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోవాలి అంటే దానికి ఆత్మీయులు అండ అవసరం అంటాడు మామయ్య!” అంది నిశిత.
”చూడు నిశితా! నువ్వు సమస్య గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెబుతున్నా… జీవితంలో అన్ని సమస్యల్ని పైకి చెప్పుకోలేం. కొన్నిమాత్రమే చెప్పుకోగలం… అదిగో బయట మీ బావ కన్పిస్తున్నాడు. ఒక్క నిముషం…! అంటూ లేచి వెళ్లి పూర్తిగా కర్టెన్‌ తొలగించి శ్యాంవర్ధన్‌ని చూసి ఓ నవ్వు నవ్వి… తలుపుతీసి ఆ నవ్వుతోనే లోపలకి ఆహ్వానించింది.
లోపలకి వచ్చి కూర్చున్నాడు.. ఎ.సి. సౌండ్‌కి, ఆ చల్లదానికి ఆ వాతావరణం గమ్మత్తుగా, మత్తుగా వుంది.
”ఎంతసేపయింది మీరొచ్చి?” అంది ఆముక్త.
”ఇప్పుడే ! మా నిశిత చాలా క్లవర్‌గా మాట్లాడుతుంటే వినాలనిపించి డిస్టర్స్‌ చెయ్యకుండా అక్కడే ఆగిపోయాను” అన్నాడు.
నిశిత, ఆముక్త ఒకరినొకరు చూసుకున్నారు.
ఆముక్త వైపు చూస్తూ ”మా నిశితను తీసికెళ్దామని వచ్చాను” అన్నాడు
ఉలిక్కిపడ్డట్లు చూసి ”ఎందుకు?” అంది ఆముక్త.
”మా నాన్నగారు తీసుకురమ్మన్నారు.” అంటూ అబద్దం చెప్పాడు. అతనికి నిశితను తన బైక్‌మీద కూర్చోబెట్టుకొని వెళ్లాలని, దారిలో ఏదైనా ఓ రెస్టారెంట్లో కూర్చోబెట్టి, తన మనసులో కోరికను బయటపెట్టాలని వుంది.
”మణిచందన్‌ ఊటీ వెళ్లారు. ఒంటరిగా వుండలేక నిశితను తీసుకొచ్చాను ప్లీజ్‌! మీ నాన్న గారికి నచ్చచెప్పండి! నిశిత ఇక్కడే వుంటుంది.” అంది ఆముక్త.
మాట్లాడలేకపోయాడు. శ్యాంవర్ధన్‌. మణిచందన్‌ లేడు కాబట్టి నిశితను వుంచాలంటే అభ్యంతరం లేదు. కానీ నిశిత లేకుంటే తనుండలేక పోతున్నాడు. ఈ బలహీనత ఎలా జయించాలో అతనికి అర్థం కాకుండా వుంది.
”కొన్ని బలహీనతలు మనిషిని తనవైపుకి బలంగా అాక్ట్‌ చేసుకుంటాయంటే ఇన్ని రోజులు నేను నమ్మేవాడ్ని కాదు ఆముక్తగారు ! ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది. మా నాన్నగారి బలహీనత నిశిత! ఎందుకంటే చిన్నపనికి, పెద్దపనికి నిశితపై ఆధారపడ్తున్నాడు. అదే చెప్పాడు”. అంటూ మొత్తం తండ్రి పైకి నెట్టివేస్తూ తెలివిగా మాట్లాడాడు.
”మామయ్య పనులన్నీ అక్క చేస్తానంది బావా!” అంది నిశిత. ఆమెకు వెళ్లాలని లేదు. కనీసం ఈ మూడు రోజులైనా బావలోని రాక్షసకోరికతో నిండిన చూపుల్ని తప్పించుకుందామని వుంది.
”ఎంతయినా నువ్వున్నట్లు వుంటుందా నిశితా!” అన్నాడు ఆమె కళ్లలోకి సూటిగా, కొంటెగా చూస్తూ…
”ఎలాగోలా అడ్జస్ట్‌ అవుతాడు లెండి! మూడురోజులేగా!” అంది ఆముక్త.
ఇది నిశితను తీసికెళ్లే సందర్భం కాదని అర్థమైంది శ్యాంకి.
అతను మౌనంగా వుండటం చూసి… ”నిశిత నా దగ్గర సేఫ్‌గా వుంటుంది. కావాలంటే అప్పుడప్పుడు మీరు వచ్చి చూసివెళ్లండి!” అంది ఆముక్త.
ఇది నచ్చింది శ్యాంవర్ధన్‌కి.
”నేను రేపు ఆఫీసునుండి ఇటే వస్తానండి! మణిచందన్‌గారు లేరు కాబట్టి మీకేదైనా అవసరం రావొచ్చు. మిమ్మల్ని మా సంవేదతో పాటు నేను కూడా అర్థం చేసుకోగలను. నిశితను వుంచుకోండి!” అన్నాడు శ్యాంవర్ధన్‌.
అతనంత సడన్‌గా మారిపోవటం ఆముక్తతోపాటు నిశితకి కూడా ఆనందం వేసింది.
‘గుడ్‌నైట్…’ చెబుతూ నిశిత వైపు దాహంగా చూశాడు శ్యాం. కంపరంగా అన్పించి ఒళ్లు గగుర్పొడిచింది నిశితకి.
అతను వెళ్లగానే గ్లాస్‌డోర్‌ మూసి, కర్టెన్స్‌ దగ్గరకి లాగి వెనుదిరిగిన ఆముక్త నిశితను చూసి ఆశ్చర్యపోయింది.
నిశిత అనీజీగా గోళ్లు కొరుకుతోంది. చురుగ్గా నేలవైపు చూస్తోంది.
”ఏమి నిశితా అలావున్నావ్‌?” అంది ఆముక్త.
‘వీడు.. వీడు.. మా అక్క భర్త కాకపోయివుంటే బావుండేది’ అనిపైకి అనలేక మనసులో అనుకొంది.
మనసులో మాటను మనసులోనే తొక్కి, గోళ్లు కొరకటం ఆపి, సన్నగా ఓ నవ్వు నవ్వీ… ”ఏంలేదక్కా!” అంది.
కానీ పైకి చెప్పుకోలేని సమస్య నిశితలోని నరనరాన్ని నలిపేస్తున్నట్లు ఆముక్త అంచనా వెయ్యలేకపోయింది.
*****
”ద్రోణతో మాట్లాడావా చైతూ? ఇంకాలేదా? ఈ విషయంలో ఎందుకింత లేట్ చేస్తున్నావు? భయపడ్తున్నావా? నేనే చెప్పినప్పుడు భయం దేనికి? అయినా నాకెప్పుడు ఇలాగే అన్యాయం జరగుతోంది. అప్పట్లో ఎంత చదివినా క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేది కాదు. దానితో మా ఇంట్లోవాళ్లు తృప్తిపడకుండా ఎప్పుడు చూసినా హాస్టల్లోనే వుండి చదివి ర్యాంక్‌ కొట్టమనేవాళ్లు… అక్కయ్యతో పోల్చి చూసేవాళ్లు. ఒకవిధమైన నిర్లిప్తతతో, మొండితనంతో హాస్టల్లో వుండకుండా ఎప్పుడు చూసినా స్కూటీమీద తిరిగేదాన్ని…
పెళ్లయ్యాక ద్రోణకి నా వంట నచ్చేది కాదు. విమలత్తలాగ చెయ్యమనేవాడు. ఆ తరం వంటల్ని చెయ్యటానికి నేను చాలా ట్రైనింగవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేనెంతగా అతన్ని ప్రేమించినా అతని ప్రేమ నామీద వున్నట్లు కన్పించటంలేదు… స్వతహాగా అతనెలాంటి వాడో టెస్ట్‌ చెయ్యవే అంటే నువ్వేమో చాలా క్యాజ్‌వల్‌గా తీసుకుంటున్నావ్‌! కనీసం ఇవాళైనా ద్రోణతో మాట్లాడవే! ప్లీజ్‌!” అంది చాలా బ్రతిమాలుతూ శృతిక.
స్నేహితురాలికి హెల్ప్‌ చెయ్యాలనివుంది చైత్రికకి…
కానీ ద్రోణ సెలబ్రిటీ కాబట్టి ఫోన్‌ చేస్తే అతని రిసీవింగ్‌ ఎలావుంటుందో అని ఆగిపోయింది. శృతిక వదిలేలా లేదు. తను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అంటోంది.
చివరకు ఓ నిర్ణయానికి వచ్చి – ద్రోణకి గొప్ప ఫీలింగ్‌తో కూడిన మెసేజ్‌ ఇద్దామని మొబైల్‌ని చేతిలోకి తీసుకొంది.
”హాయ్‌! ద్రోణా! ఐయాం చైత్రిక… మంచుపొగల్ని, వెన్నెలముక్కల్ని కలగలిపినట్లున్న మీ బొమ్మల అందాలు, సూక్ష్మాతిసూక్ష్మమైన రేఖల్లో ఒదిగిన ఆ అద్భుతాలు నన్ను తమలో మమైకం చేసుకొని, నా మనసును మీ భావనలో మునిగిపోయేలా చేశాయి. మీ హృదయభాషను నా మనోనేత్రంతో స్పర్శించి మౌన ప్రణామం చేస్తున్న… అందుకోండి ద్రోణా!” అని ద్రోణ సెల్‌కి మెసేజ్‌ సెండ్‌ చేసింది.
ఒకరోజంతా ఎదురు చూసింది అతని ప్రతిస్పందనకోసం…. సమాధానం లేదు. ఆమెకు నిద్రరావటంలేదు.
‘ఇప్పుడెలా? ఏంచేయాలి?’ అని బాధగా అనుకొని…
”ద్రోణా మీ తలపే నా హృదయస్పందన అయిన క్షణంనుండి ఒక్కక్షణం కుదురుగా వుండలేక పోతున్నాను. అనుక్షణం మీ ధ్యాసే నా ఊపిరైంది. అందుకే నా మనసును ఈ మెసేజ్‌గా పంపిస్తున్నా… దీన్ని మీ పెదవులతో చదువుతుంటే నా మనసును సృశిస్తున్నట్టే వుంటుంది. మిస్‌యు…” అంటూ ద్రోణ సెల్‌కి ఇంకో మెసేజ్‌ ఇచ్చింది.
ఈ మెసేజ్‌ని ఇస్తున్నప్పుడు పర్యవసానం ఎలా వుంటుందన్నది ఆమె ఆలోచించలేదు. శృతికనుండి పుల్‌ పర్మిషన్‌ వుండటంతో దేనికీ వెనుకాడటంలేదు. ఎక్కుపెట్టిన బాణంలా ద్రోణ మీదకి తన భావాలను సంధిస్తోంది
ఈ రోజు కూడా అతని నుండి ఆన్సర్‌ లేదు.
మళ్లీ మొబైల్‌ అందుకొంది. ఈసారి ఆమెలో ఇంకా పట్టుదల పెరిగింది.
”మీ తలపుల దుప్పిలో నన్ను నేను కప్పుకొని మీరంటే ఎంతిష్టమో మీతో చెప్పమని తెల్లని మేఘంలోని ఓ తునకను బ్రతిమాలి మీ దగ్గరకు పంపాను. అందలేదా ద్రోణా? కనీసం మీ మెసేజ్‌ కోసం ఎదురుచూస్తున్నానని అక్కడున్న సన్నజాజి, చల్లగాలి అయినా మీకు గుర్తు చెయ్యటం లేదా? నేనిప్పుడు దుప్పటిలోంచి బయటకొచ్చి, కికీలోంచి చూస్తుంటే… బయటంతా వెన్నెల కురుస్తూ ఆకాశం అద్భుతంగా వుంది. నా ప్రాణంలో ప్రాణమైన మిమ్మల్ని గంగనుండి నీరు తెచ్చి అభిషేకించాలనో ఏమో మేఘాలన్నీ వేగంగా పరిగెడుతున్నాయి… అది చూసి నా మనసు ఉత్సాహంగా, ఆకాశం,భూమి కలిసేచోట కన్పించే గీతలా మారి మీ మెసేజ్‌ కోసం నిరీక్షిస్తుంది.” అని మేసెజ్‌ సెండ్‌ చేసింది.
అతని నుండి సమాధానంలేదు.
*****
నిద్రలేచింది చైత్రిక…
లేవగానే ద్రోణ వర్షిత్‌ గుర్తొచ్చాడు తనకేమైనా మెసేజ్‌ ఇచ్చాడేమోనని ముందుగా మొబైల్‌ అందుకొని చూసింది.
ఒక్క మెసేజ్‌ కూడా రాలేదు. కనీసం కర్టెసీ కోసమైనా రిప్లై ఇవ్వాలనుకోలేదా ఈ ద్రోణ? నేనెవరో అడగాలని కూడా అన్పించలేదా? ఎందుకో గిల్టీగా అన్పించింది చైత్రికకి… తనలోని అహాన్ని మెడలు విరిచినట్లు, అభిమానాన్ని తనంతటతనే చంపుకుంటున్నట్లు కొద్దిక్షణాలు ఇన్‌సల్టింగ్‌గా ఫీలయింది.
ఏ అమ్మాయి అయినా ఒక వయసు వచ్చాక – ‘మగపిల్లలు తాము పిలిస్తే పలుకుతారని, ఏ పని చెప్పినా చేస్తారని, కనుసైగకే పడిపోయి ఇంట్రస్ట్‌ చూపిస్తారని, ముఖ్యంగా ఫోన్‌ చేస్తే పడి చస్తారని’ అనుకుంటారు కానీ ద్రోణ విషయంలో అవన్నీ తలక్రిందులయ్యాయి.
”ద్రోణా! రాత్రంతా నిద్రలేదు. నాకెందుకో మీరు నన్ను అవమానిస్తున్నట్లనిపిస్తోంది. ఒక అమ్మాయి అంత క్రియేటివిటీతో మెసేజ్‌లు పంపితే మీ అంత మౌనంగా ఎవరూ ఉండరనిపిస్తోంది. అంత అద్భుతమైన ఆర్టిస్ట్‌ అయివుండి ఇదేనా ఒక అమ్మాయి మనోభావాలకు మీరిచ్చే ఇంపార్టెన్స్‌? కానీ ద్రోణా ! ఒక్క నిజం చెప్పనా? మనకు తెలియకుండా ఊపిరి తీసుకోవటం ఎంత సహజమో మీరు నా ఊహల్లో మునిగిపోవటం కూడా అంతే సహజం… ” అంటూ ద్రోణ మొబైల్‌కి మెసేజ్‌ సెండ్‌ చేసింది.
నో రెస్పాన్స్‌…!
నిముషాలు గడుస్తున్న కొద్ది చైత్రిక మనసంతా శూన్యం.. ఎందుకో తెలియదు.
ఏదో తెలియని భావం తన పలకరింతతో, స్పర్శతో ఆమెను ఆక్రమిస్తూ, వ్యాపిస్తూ, మనసును అలజడిగా, ప్రజ్వలితంగా చేస్తోంది.
ఇక ఆగలేక – ధైర్యం తెచ్చుకొని, అతనితో మాట్లాడాలని కాల్‌ చేసింది.
‘హాలో….’ అంది విమలమ్మ
ఒక్కక్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు చైత్రికకి… వెంటనే ”ద్రోణ వర్షిత్‌ గారున్నారా?” అంది చైత్రిక.
”ఒక్క నిముషం లైన్లో వుండమ్మా!” అంటూ అప్పుడే నిద్రలేచిన ద్రోణ దగ్గరకి సెల్‌ తీసికెళ్లి ఇచ్చింది విమలమ్మ. అతను సెల్‌ తీసుకొని ‘హాలో’ అనే లోపలే భయంతో కాల్‌ కట్ చేసింది చైత్రిక.
అతను బెడ్‌ చివరకి జరిగి బోర్లా పడుకొని నేలమీద మొబైల్‌ పెట్టి నెంబర్లు నొక్కుతూ మెసేజ్‌లు చూస్తున్నాడు.
అతను పడుకున్న తీరు ఎంత నిర్లక్ష్యంగా వున్నా, ఒత్తైన క్రాపు, గుండ్రి బలమైన భుజాలు యవ్వన శోభను ప్రస్ఫుటం చేస్తున్నాయి.
కొడుకును లేపటం కష్టంగా వుంది విమలమ్మకి. నిద్రలేచినా మళ్లీ పడుకుంటున్నాడు. తిండీ, నీళ్లు ముట్టుకోడు. కాలిపోయిన బొమ్మల్నే గుర్తుతెచ్చుకుంటున్నాడు. బయట ప్రపంచానికి దూరమయ్యాడు. మళ్లీ కుంచె పట్టలేదు.
”లే! నాన్నా! టైమంతా నిద్రలో గడిపేస్తే నీకంటూ టైమేముంటుంది?” అంది కొడుకు తల నిమురుతూ విమలమ్మ.
ద్రోణ ఒకరకంగా నవ్వి… ”నాకిప్పుడు టైమెందుకమ్మా? ఒకప్పుడు ఆ టైం కోసం… అంటే! నాకంటూ కొంత టైం కావాలని, నాదైన ప్రపంచంలో నేనుండాలని, సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవాలని, ఇంట్లోవాళ్లు, మిగతా ప్రపంచం నిద్రలేవక ముందే లేచి బోర్డు ముందు నిలబడి అలౌకిక స్థితిలోకి వెళ్లి, నాకంటూ ఓ శైలిని సంపాయించుకొని బొమ్మల్ని గీసేవాడిని… అలా నా సుదీర్ఘ కఠోర శ్రమ చివరికి నాకేం మిగల్చిందో చూశావుగా…! ఇంకా నాకెందుకీ టైం…?” అన్నాడు.
”అలా అనకు ద్రోణా! పోయినదాన్ని తిరిగి సంపాయించుకో!” అంది విమలమ్మ.
”అది ఒక్కరోజులో ఒక్కరాత్రిలో వచ్చేదికాదు. అయినా నాకు జరిగిన లాస్‌ గురించి మీరెవరు మాట్లాడలేదు. ఎందుకంటే శృతిక నీకు కోడలు కన్నా ముందు నీ అన్నకూతురు. దేన్నైనా కడుపులో పెట్టుకోటానికే ప్రయత్నిస్తారు.” అన్నాడు నిష్ఠూరంగా.
కొడుకు మాటలకి బాధపడ్తూ… ”బూడిద గురించి ఎంత మాట్లాడి ఏం ప్రయోజనం ద్రోణా! ఒక్కోసారి అనుకోకుండా వచ్చే నష్టంలాంటిదే ఇది. కడుపులో పెట్టుకోక తప్పదు. మన వేలు, మన కన్ను పొడుచుకుంటే మన కన్నే పోతుంది.” అంది విమలమ్మ.
”సరే! అమ్మా! నేను మామూలు మనిషిని కావాలంటే నాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు నన్నిలా ఒంటరిగా వదిలెయ్యి…” అన్నాడు.
కొడుకు గదిలోంచి నెమ్మదిగా కదిలి హాల్లోకి వచ్చి కూర్చుంది.
*****
బాగా ఆలోచించి శృతిక తండ్రి నరేంద్రనాధ్‌కి ఫోన్‌ చేసింది విమలమ్మ.
”అన్నయ్యా! శృతికను పంపు…! ఇంకా ఎన్ని రోజులు వుంచుకుంటారు?” అంది విమలమ్మ కోపంగా. కోపమేకాదు. ఏడుపుకూడా వస్తుందామెకు.
”వస్తుందిలేమ్మా! తొందరేముంది?” అన్నాడు చాలా ప్రశాంతంగా.
”ఇంకెప్పుడు? చెరొకచోట వుండటానికా మనం పెళ్లి చేసింది. కలిసివుంటేనే కదా కష్టాన్నైనా, సుఖాన్నైనా భరించే శక్తివస్తుంది? ఇలా వుంటే ఒకరికొకరు ఎలా అర్థమవుతారు?” అంది.
ఆ మాటకి ఆశ్చర్యపోతూ…”ఇంకా అర్థం చేసుకునే స్థితిలోనే వున్నారా వాళ్లు? ” అన్నాడు.
”జీవితాన్ని పూర్తిగా చూసిన వృద్ధదంపతులు కూడా మనసులు కలవక ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకానికి ప్రయత్నిస్తుంటే వాళ్లకేం వయసుందని అన్నయ్యా? మన కళ్లముందు పుట్టారు. నెమ్మదిగా అర్థం చేసుకుంటార్లే… మనం చూస్తూనే వున్నాంగా…! పుట్టాక.. కొంతమంది పిల్లలు త్వరగా నడవలేరు. మాట్లాడలేరు. వీళ్లుకూడా ఆ కోవకు చెందినవాళ్లే…” అంది.
నరేంద్రనాధ్‌ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు.
”శృతికకి ఫోనివ్వు అన్నయ్యా! మాట్లాడతాను.” అంది
”అది ఇంట్లో లేదు విమలా! మీరు చిన్నప్పుడు మన ఇంటి వెనక రింగ్‌బాల్‌ ఆడే స్థలంలో తన ఫ్రెండ్స్‌తో కూర్చుని పాటలగేమ్‌ లాగా మాటలగేమ్‌ ఆడుతూ బిజీగా వుంది… దాని సెల్‌కి చెయ్‌!” అన్నాడు. ఆడపిల్లల్ని ప్రేమించే తండ్రుల్లో అతడొకడు.
వెంటనే శృతిక సెల్‌కి కాల్‌ చేసింది విమలమ్మ.
”ఒక్క నిముషం మీరుండండే… మా అత్తయ్య కాల్‌ చేస్తోంది మాట్లాడి వస్తాను.” అంటూ పక్కకెళ్లి…
”హాలో! అత్తయ్యా! బాగున్నావా?” అంది శృతిక.
”నేను బాగున్నాను. నువ్వెలా వున్నావ్‌?” అంది విమలమ్మ.
”నేను బాగున్నాను అత్తయ్యా!”
”ఇక్కడ నా కొడుకే బాగలేడు.”
”అది ఆయన చేసుకున్నదే!”
”నువ్వు చేసిందేం లేదా?”
”నేను చేసిన దానికన్నా ఆయన నాకు చేసిందే ఎక్కువ. ఒక్కరోజు కూడా ఆయన దగ్గర నేను మనశ్శాంతిగా లేను. నాగురించి ఆలోచించరేం. అత్తయ్యా! పెళ్లికి ముందు నేను స్పీడుగా వున్న మాట వాస్తవమే. పెళ్లయ్యాక పొంగిపోయే పాలు, మాడిపోతున్న పప్పే జీవితంలా మారాను. అర్థం చేసుకోరేం?” అంది శృతిక.
ఓ నిట్టూర్పు వదిలి ”నీకు భర్త విలువ తెలుసా శృతీ?” అంది విమలమ్మ.
”ఎందుకు తెలియదు. నా భర్త చిటికేస్తే నౌకర్లు పరిగెత్తుకుంటూ రావాలని, ఆయన ఎక్కడికెళ్లినా రెడ్‌కార్పెట్ స్వాగతాలు ఎదురవ్వాలని, ప్రతిరోజు అంతర్జాతీయ స్థాయి చర్చల్లో ఆయన మునిగి వుండాలని నేను కోరుకోవటం లేదు. నా స్థాయి విలువల్లోనే నా భర్తను చూడాలనుకుంటున్నాను. ” అంది శృతిక.
”నువ్వు నాకు అర్థం కావటంలేదు శృతీ!” అంది
”ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది అత్తయ్యా! మొదటినుండి నేను చెబుతూనే వున్నాను. ఆయన లోకం ఆయనదే నా మాట వినరని… అయినా మీరు పట్టించుకోవటం లేదు. ఆయనేం చిన్నపిల్లవాడు కాదుగా ఓ కన్నేసి వుండానికి… ”నేను మీ అభిమానిని” అని ఏ అమ్మాయి పిలిచినా వెళ్తాడు. ఇంట్లో వున్నంతసేపు ఒకటే ఫోన్‌ కాల్స్‌…! ఏ అమ్మాయి భరిస్తుంది. అత్తయ్యా ఇలాంటి భర్తని? మీరే చెప్పండి!” అంది శృతిక.
”ఎవరి ప్రొపెషన్లో వాళ్లకి పరిచయాలు, స్నేహాలు వుంటాయి. అంతమాత్రాన అనుమానించాలా? మీ మామగారు ఉమెన్స్‌ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఎందరో అమ్మాయిలు ఇంటికి వస్తుండేవాళ్లు. డౌట్స్ క్లారిఫై చేసుకొని వెళ్లేవాళ్లు. నేనెప్పుడైనా నీలాగ మా పుట్టింటికి వెళ్లానేమో మీ నాన్నని, అమ్మని అడుగు. ఒకవేళ వెళ్లినా ఆయనతో కలిసి వెళ్లి వచ్చేదాన్ని… నీలాగ వెళ్లేదాన్ని కాదు.” అంది విమలమ్మ.
”నాలాగ వెళ్లటం అప్పట్లో మీకు రాలేదు. పుట్టింటిని ఎలా యూజ్‌ చేసుకోవాలో తెలియలేదు. అక్కడే వుండి అన్ని బాధలు పడ్డారు. నాకేంటి నీలాగ అడ్జస్ట్‌ కావలసిన అవసరం? మా అమ్మా, నాన్నవున్నారు. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. అది చాలు నాకు…” అంది.
”చూడు శృతీ! నిన్ను ఒకరు ప్రేమగా చూడాల్సిన వయస్సు కాదు నీది. నువ్వొకర్ని చూడాల్సిన వయసులో వున్నావు. ఇక్కడ నీ ఇల్లు, నీ బాధ్యతలు వున్నాయి. వచ్చి వాటిని చూసుకో…” అంది.
”నేను రాను…” అంది కచ్చితంగా
”నా కొడుకు బాధలో వున్నాడు. నువ్వొచ్చి ఆ బాధలోంచి వాడ్ని బయటకు తీసుకురా! అది నీ బాధ్యత. బాధలు ఎప్పుడూ వుండవు. అవి వున్నప్పుడే మనిషి అవసరం ఎంతగానో వుంటుంది. ముఖ్యంగా మనవాళ్లని మనం చూసుకోవటం కనీస ధర్మం. ద్రోణ నీ భర్త – పరాయివాడు కాదు. పంతాలకు ఇది సమయం కూడా కాదు.” అంది విమలమ్మ.
‘నాకు రావాలని లేదు.”
”ఎందుకు లేదు. ఎప్పుడు చూసినా – నేనూ, నా సమస్య, నా అనుమానం ఇదేనా నీకు కావలసింది? ఇంకేం అక్కర్లేదా? భర్త కావాలని అనిపించదా?”
”అనిపిస్తుంది. అది నాకు తగినది కాదనిపించి దూరంగా వున్నాను.”
”నువ్వు తప్పు చేస్తున్నావు శృతికా!”
”తప్పు తెలుసుకున్నాను అత్తయ్యా!”
”కాదు … పెద్దదానిగా నామాటలు నేను చెబుతున్నాను విను. జీవితంలో ఎన్నో విషమ పరిణామాలు వుంటాయి. తట్టుకోవాలి. చెప్పినా వినలేని భయంకరమైన అలవాట్లు, స్వార్థాలు, ఆత్మవంచనలు వుాంయి. అవన్నీ వుంటేనే జీవితం… ఇవిలేని జీవితాలు ఎక్కడా వుండవు. కానీ ద్రోణ మంచివాడు. అది నీ అదృష్టం చేయిజారనీయకు…” అంటూ కాల్‌ కట్ చేసింది విమలమ్మ.
ఆమెకు తన కొడుకు జీవితం ఇలా అయినందుకు బాధగావుంది. పైకి ఎంత సున్నితంగా అన్పిస్తుందో అంత కఠినమైన సమస్య ఇది.
*****
ద్రోణ మొబైల్‌లో ఇంకా కొన్ని కొత్త మెసేజ్‌లు యాడై ‘నన్ను చూడు..’ అన్నట్లు సౌండ్‌ చేస్తూ వచ్చి చేరుతున్నాయి.
ఆసక్తిలేకపోయినా మొబైల్‌ అందుకొని చూస్తున్నాడు ద్రోణ.
అవి కూడా చైత్రిక పేరుతోనే వున్నాయి.
‘చైత్రిక! చైత్రిక! చైత్రిక! ఎవరీ చైత్రిక? ఇంత ఫీలింగ్‌తో, ఇంత డైరెక్ట్‌గా ఎలా సెండ్‌ చెయ్యగలుగుతోంది? ప్రేమిస్తుందా? తను పెండ్లైనవాడినని తెలియదా?

ఇంకా వుంది…

కలియుగ వామనుడు – 6

రచన: మంథా భానుమతి

మళ్లీ ఎలాగా ట్రాక్ కెళ్లాలి. ఆ రోజు చాలా పనే చేయించారు వాళ్ల చేత. ఎప్పడెప్పుడు కాసేపు వాలదామా అని చూస్తున్నారు.
చిన్నా టి.వి ఆన్ చేశాడు.
వెంటనే ఆన్ అయింది. చిన్నాకి ఆనందంతో గంతులేయాలనిపించింది.
అయితే.. ఒక్క దుబాయ్ ప్రోగ్రామ్స్ మాత్రమే వస్తున్నాయి.
కేబుల్ కనెక్షన్ లేదు.
ఎక్కువ అరేబిక్..
ఏదో ఒకటి. కొత్త మనుషులు, కొత్త పరిసరాలు కని పిస్తున్నాయి. అందులో అరాబిక్ లెసన్స్ ఒక ఛానల్ లో వస్తోంది.
కూర్చుని శ్రద్ధగా చూడ్డం మొదలు పెట్టాడు చిన్నా. కొన్ని మాటలు, పలికే విధానం నేర్చుకున్నాడు.
రోజూ తీరికున్నప్పుడు వచ్చి, కాసేపు టివి చూడాలని నిశ్చయించుకున్నాడు.
అప్పుడు గుర్తుకొచ్చింది తన పుస్తకం.. డ్రాయింగులు వేసుకునేది. ఇక్కడి కొచ్చినప్పట్నుంచీ దాని గురించే మర్చి పోయాడు.
అందులో.. రోజూ తన అనుభవాలు రాసుకోవాలి. తన కోడ్ లోనే.. బొమ్మలు ప్స్.. తెలుగులో రాసుకుంటే, చూడగానే ఎవరికీ అర్ధం కాదు.
“లంచ్ వచ్చింది చిన్నా..” అబ్బాస్ పిలిచాడు, గది బైట నిల్చుని. చిన్నా, టి.వి కట్టేసి, తలుపు దగ్గరగా వేసి బైటికొచ్చాడు.
“త్వరగా తినెయ్యండి.. ఈ రోజు నించీ స్పెషల్ ట్రయినింగ్ అని చెప్పమన్నాడు నజీర్. ఎలుగు బంటిగాడు చాలా హుషారుగా ఉన్నాడు. హలీమ్ సాబ్ ఫోన్ చేశారుట. మన వాళ్లలో ముగ్గురిని సెలెక్ట్ చేస్తామని.” అబ్బాస్ సమాచారం ఇచ్చాడు నవ్వుతూ.
“అన్నా.. టింకూ..”
“చెప్పాను. కిచెన్ లో షెఫ్ అంకుల్ కి చెప్పి పడుక్కోబెడదాం. తగ్గి పోతుంది. నువ్వేం వర్రీ అవకు.”
“వాడు పుట్టినప్పటి నుంచీ నాకు మంచి దోస్త్ అన్నా. చాలా డెలికేట్. వానికేమైనా అయితే.. తట్టుకోలేను.” చిన్నా కళ్లలో మళ్లీ నీళ్లు.
“అదిగో.. ఫరవాలేదని చెప్పానా? పద.. నువ్వుండాలి ఈ రేసులో..”
“అలాగే ట్రై చేస్తా..”
“ఇవేళ లంచ్ నా ఫేవరెట్.. హామ్ బర్గర్స్. షెఫ్ అంకుల్ నడిగి ఒకటి ఎక్స్ ట్రా సంపాదించా. చలో..”
“నేనెప్పుడూ తినలేదన్నా…”
“చాలా బాగుంటాయి. టొమాటో సాస్, కట్ చేసిన కీరా ముక్కలు మధ్యలో పెట్టుకుని తింటే.. సూపర్.”
………………….

ప్రతిష్ఠాత్మకమైన ఎమిరేట్స్ హెరిటేజ్ క్లబ్ రేసులు ప్రారంభించే రోజు రానే వచ్చింది.
ముందు రోజు రాత్రే ఒంటెలని తీసుకుని ముధారీలంతా గ్రౌండ్ కి చేరుకున్నారు.
దగ్గర టౌన్ లో ఉన్న పైవ్ స్టార్ హోటళ్లన్నీ బుక్ ఐపోయాయి.
హలీమ్ యజమాని అయిన షేక్ కి పది ఫామ్ లున్నాయి. అందులో ముగ్గురు ముధారీలు ఇప్పటి రేసుల్లో పాల్గొంటున్నారు.
అందులో హలీమ్ ఉన్నాడు. హలీమ్, నజీర్ల ఆనందానికి అంతే లేదు.
మొత్తం మూడు వందల యాభై మంది పైగా రేసుల్లో పాల్గొంటున్నారు. రేసులలో పాల్గొంటున్న ఒంటెల యజమానులందరూ ముందురోజే వచ్చేశారు.
వారం రోజుల నుంచే అక్కడ పండగ వాతావరణం వచ్చేసింది.
ఒంటెలు, ముధారీలు, జాకీలు.. వారి మానేజర్లు అందరూ కాంపింగ్ చేసేశారు. పెద్ద ఫెన్సింగులు, వాటి లోపల గుడారాలు..
ట్రాక్ కి దగ్గరలోనే ఒంటెలకి హాస్పిటల్ ఉంది. పందేల సమయంలో అవి పడిపోయి దెబ్బలు తగిలించుకుంటే.. వెంటనే వైద్య సహాయం అందుతుంది.
కొంచెం దూరంగా వంట శాలలు.
బెడూయన్ స్త్రీలు తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శనకి పెట్టారు.. ఎంబ్రాయిడరీ చేసిన సంచీలు, టేబుల్ క్లాత్ లు, అల్లికలు.
టార్కాయిస్, ముత్యాలు వంటి జెమ్స్ తో చేసిన హారాలు, బ్రేస్ లెట్లు..
తాటాకు పాకల్లో, గుడారాల్లో తమ వంటలని రుచి చూపిస్తున్నారు.
మగవాళ్లు ఒంటెలని అటూ ఇటూ తిప్పుతూ, చూడ్డానికి వచ్చే వాళ్లని వాటి మీద తిప్పుతున్నారు..
ఇదే సమయం వాళ్లకి.. కాసిని దీనారాలు సంపాదించుకోడానికి.
బోలెడు షాపులు వెలిశాయి. అరేబియన్ కాఫీ, పిండి వంటలు.. కుండలు, పింగాణీ వస్తువులు, హాండీ క్రాఫ్ట్ వస్తువులు.. అన్నీ ప్రదర్శిస్తున్నారు.
కొన్ని గుడారాల్లో మాజిక్ షోలు..
ఒక పక్క చిన్న చిన్న యారెనాల్లో ఎరోబిక్స్ చేస్తున్నారు.
బెడూ యువకులు, పిల్లలు రకరకాల విన్యాసాలతో అలరిస్తున్నారు.
అరేబియన్ సంగీతం గాలిలో తేలుతోంది.
కొందరు ట్రాక్ దగ్గర నృత్యం చేస్తున్నారు.
మధ్యాన్నం అయే సరికి ఆ ప్రదేశమంతా ప్రజలతో నిండి పోయింది. టివి, పత్రికా రిపోర్టర్లు.. వాన్ లలో తయారుగా కూర్చున్నారు.
రెండు గంటలకల్లా అందరూ భోజనాలు ముగించేసుకుని ట్రాక్ దగ్గరకి వచ్చేశారు. చాలా మంది, అక్కడే షాపులలో తినేశారు.
ఎక్కడ చూసినా జన సందోహం..
కోలాహలం. సందడి మిన్నంటుతోంది.
రేసుల్లో పాల్గొనబోయే ఒంటెలు అక్కడే తాత్కాలికంగా వేసిన షెడ్ లలో నిల్చున్నాయి.
మొదటి రోజు, సీనియర్ ఒంటెల పందాలు.. మరీ పెద్ద వయసు (70 ఏళ్లు మాత్రమే) వాళ్లవి 500 మీటర్లు, నడి వయసు (50 సంవత్సరాలు) వాళ్లవి 1500 మీటర్ల రేసులు.. నడుస్తాయి.
ఒక మాదిరి ఆసక్తితో వీక్షిస్తున్నారు ప్రేక్షకులు.
ఎక్కువగా కుశల ప్రశ్నలు, బిజినెస్ వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. అటువంటప్పుడు. అయినా.. అసలు ఒంటె రేసులంటేనే అరేబియన్ దేశాల్లో విపరీతమైన మోజు. అవి ఏ వయసువైతేనేం..
చిన్నా తమ బృందంతో, పాల్గొనే వారికి కేటాయించిన స్థలంలో కూర్చుని చూస్తున్నాడు.
హలీమ్ టీమ్ మరునాడు పాల్గొంటారు.
యవ్వనంలో ఉన్న ఒంటెలు.. 3000 మీటర్ల ట్రాక్.
రేసులు చూడటం కూడా బాగానే ఉంటుందన్నాడు అబ్బాస్. అసలు పందాలు ఎలాసాగుతాయో గమనిస్తే మెంటల్ గా తయారవచ్చు. పరిసరాలు కూడా అలవాటవుతాయి.
పరిసరాలు ఎక్కడైనా ఒకటేగా అనుకున్నాడు చిన్నా. ఆ విషయమే అడిగాడు అబ్బాస్ ని.
అంతా ఇసుకే కదా..
“ఇసుకే కాదురా బాబూ! ట్రాక్ మీద ప్రాక్టీస్ చేసినట్లు కాదు. చాలా ఒంటెలుంటాయి. అంతా.. ఎవరు గెలుస్తామా అన్నట్లుంటారు. ఒంటెలు అడ్డం వచ్చేస్తూంటాయి.. గుంపులుగా. ప్రాక్టీస్ చేసినప్పుడు ఎవరూ అడ్డుండరు. ఇది పూర్తిగా వేరుగా ఉంటుంది.
రేసులప్పుడు ఎవరు అడ్డు పడ్తారో తెలీదు. ఒడుపుగా ముందుకు పట్టుకుపోవాలి. అదంతా అబ్జర్వ్ చెయ్యి. ఒక ఒంటె పరుగెడుతుంటే, ఆ ఒంటెని పట్టుకోవడానికి నీ ఒంటెని పరుగెత్తించాలి.”
నిజంగానే.. ట్రాక్ మీద చాలా భీభత్సంగా ఉంది.
తడవకి పది పన్నెండు ఒంటెలు కంటే పట్టవు.
మొత్తం ముప్ఫై రౌండ్లు జరిగాయి.
కేకలు.. అరుపులు, ఈలలు.. గొడవ గొడవ.
ట్రాక్ పక్కనున్న రోడ్ మీద కార్లలో అందరూ ఫాలో అవుతున్నారు. వీడియోలు తీసే వాళ్లు, మీడియావాళ్లు, పందెంలో పాల్గొనే ఒంటెల యజమానులు ..చూట్టానికొచ్చిన వారు.. ముందుగా వీళ్ల హాడావుడి ఎక్కువగా ఉంది.
అందరూ కూర్చునే దగ్గర, స్టేడియమ్ లో పెద్ద పెద్ద తెరల మీద పందెం అంతా ప్రతీ క్షణం అన్ని కోణాల్లో చూపిస్తున్నారు.
పైనించి హెలికాప్టర్ లలో కూడా మీడియా వాళ్లు వీడియోలు తీస్తున్నారు.
అబ్బాస్ చెప్పింది నిజమే అనుకున్నాడు చిన్నా. ఇంత హడావుడిలో ఒంటె మీద కూర్చుని దృష్టి నిలపడం కష్టమే.
ముందుగా చూడబట్టి కాస్త తెలిసింది. మెంటల్ గా తయారవచ్చు.
సాయంత్రం వరకూ కూర్చుని రేసులన్నీ చూసే సరికే అలిసి పోయారు చిన్నా, మిగిలిన పిల్లలందరూ.
వాన్ తీసుకొచ్చి అందరినీ తమ గుడారానికి తీసుకెళ్లారు నజీర్, అబ్బాస్.
“రేపు మనది సెకండ్ రౌండ్ లో ఉంటుంది. సమీర్ జాగ్రత్త. నువ్వే లీడ్ చెయ్యాలి. మీరిద్దరూ కూడా ఉన్నారు..” చిన్నా రూమ్మేట్లనిద్దరిని కూడా పిలిచి చెప్పాడు నజీర్.
“లైట్ గా తినాలి, ఇప్పుడు డిన్నర్, రేపు లంచ్ కూడా. ఎక్కువ తింటే నిద్దరొస్తుంది.” అబ్బాస్, ఒక కప్పులో సాలడ్, ఒక ఎండి పోయిన రొట్టె ఇచ్చాడు.
పిల్లలకి సగం సగం తినడం అలవాటై పోయింది.
కడుపు కూడా సగం ఎండి పోయింది. అందరూ సన్నగా, గాలేస్తే ఎగిరి పోయేట్లే ఉన్నారు.
“లేవండి.. లేవండి..” నజీర్ డొక్కలో తన్నుతుంటే మెలకువొచ్చింది చిన్నాకి.
కళ్లు నులుముకుంటూ లేచాడు.
టైమెంతయిందో.. అనుకుంటూ, బాత్రూంలోకి నడిచాడు. రివ్వుమని కొట్టింది చలి గాలి. అలాగే, పళ్లు తోముకుని, జివ్వుమనే చల్లని నీళ్లతో మొహం, కాళ్లు చేతులు కడుక్కుని వచ్చాడు.
“చిన్నా.. పళ్లు కరచుకు పోతున్నాయి.. వేడి నీళ్లు ఉండవా?” రూమ్మేట్లు వణుకుతూ వచ్చారు.
ఫకాలున నవ్వాడు చిన్నా.
“ఉంటాయి.. నజీర్ అంకుల్ దగ్గర. వెళ్దామా?”
“హూ..హూ..” అంటూ వాళ్లు కూడా తయారయి గుడారంలోకి వెళ్లారు. అప్పటికే వంటలు తయారవుతున్నట్లుగా వాసనలొస్తున్నాయి.
“రండి.. కిచెన్ లోకెళ్లి టీ, బిస్కట్స్ తీసుకుందాం.” ముగ్గురినీ పిల్చుకెళ్లాడు అబ్బాస్.
భ్లాక్ టీ, గడ్డి లాంటి ఓట్స్ బిస్కట్లు.. కరకరా నమిలి, గడగడా తాగి గట్టిగా ఊపిరి పీల్చి వదిలారు జాకీలు ముగ్గురూ.
“ఎక్సర్ సైజ్ టైమ్.. గ్రౌండ్ లోకి చలో..” అబ్బాస్ వెనుకే వెళ్లారు. చిన్నాతో సెలెక్ట్ అయిన జాకీలని సుడాన్ నించి తీసుకొచ్చారు. వాళ్ల పేర్లు చిన్నాకి ఎప్పుడూ కన్ఫ్యూజనే.. అందుకే రాకీ, సాండీ అని పిలుస్తుంటాడు. ఆ అక్షరాలని పోలి ఉంటాయి వాళ్ల పేర్లు.
జన్యుపరంగా సుడానీల కండరాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి. తీగల్లాగ సాగిపోతారు.
వాళ్ల దగ్గరే స్వారీలో మెళకువలు నేర్చుకున్నాడు చిన్నా.
రాకీకి ఎప్పుడూ ఆకలేస్తూ ఉంటుంది. తిండి సరి పోదు.. కళ్లలో కాంతి అనేది ఉండదు. చిన్నా అప్పుడప్పుడు తన కిచ్చిన దానిలోది పెడుతుంటాడు.
రాకీకి బద్ధకం కూడా ఎక్కువే.
బైట కాంపౌండ్ లో ఉన్న పిచ్చిమొక్కల్ని పీకమంటే.. ఒకటి పీకి, కాసేపు అటూ ఇటూ తిరిగి ఇంకొకటి పీకుతాడు. అందరూ అర పూటలో చేసే పని వాడు రోజంతా చేస్తాడు.
అందుకే నజీర్ చేతిలో దెబ్బలు, వాతలు తింటుంటాడు.
“నాకు చాలా భయంగా ఉంది చిన్నా!” రాకీ వచ్చి గుంజీలు తీస్తున్న చిన్నాతో మొత్తుకున్నాడు.
“ఎందుకు?”
“గెలవక పోతే నజీర్ పనిష్ చేస్తాడు. పొట్ట మీద వాతలు పెడతానన్నాడు.” రాకీ గొంతు వణికింది.
“అదేంటీ.. గెలవటం మన చేతుల్లోనే ఉందా? ఒంటె కదా పరిగెత్తాలీ.. మహా ఐతే మనం కాలితో పది తన్నులు తన్నగలం. అంతే కద!”
“అదే.. ఆ ఒంటెల పక్కలు తన్నడవే, బాగా చెయ్యాలి. కమ్చీని బాగా జాడించాలి. అంతా బైనాక్యులర్స్ లోంచి చూస్తుంటాడు.”
“ఇదివరకు ఆలా చేశాడా?” నమ్మలేనట్లుగా అడిగాడు చిన్నా. అలా వాతలెందుకు పెడతారు? ఇంత చిన్న పిల్లల్ని ఎలా కొట్టబుద్ధేస్తుంది? అందులో.. వాతలు.. తల విదిలించాడు.
“చూడు..” షర్ట్ పైకెత్తి చూపించాడు రాకీ.
బొడ్డు పైనించీ, కింది వరకూ.. పది వాతలైనా ఉంటాయి. గాయం మానిపోయింది కానీ.. అడ్డంగా.. గీతలు.
“ఓ మై గాడ్..” చిన్నాకి కళ్లు తిరిగినంత పనైంది.
“నన్ను కూడా ఎప్పుడూ కొడతాడు తెలుసా..” సాండీ కూడా షర్ట్ పైకెత్తి చూపించ పోతుంటే ఆపేశాడు చిన్నా.. నజీర్ వస్తున్న శబ్దం విని.
“తెలిసింది. మనం ట్రై చేద్దాం. ఆ తరువాత గాడ్స్ విల్. కమాన్.. రన్ చేద్దాం.” చిన్నా లేచి పరుగందుకున్నాడు.
గ్రౌండంతా మనుషులతో నిండి పోయింది.
అప్పుడే ఉదయ కిరణాలు విచ్చుకుంటున్నాయి.
కాఫీ వాసన.. అరేబియన్ కాఫీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బుల్లి బుల్లి కప్పుల్లో, చుక్కలు చుక్కలుగా తాగుతారు. గుండ్రని బల్లలు, వాటి చుట్టూ కుర్చీలు.. అందులో పొడవాటి గౌన్లు వేసుకున్న మనుషులు.
ఎక్కడికక్కడ చిన్న రెస్టారెంట్లు వెలిశాయి.
పిక్నిక్ వాతావరణం వచ్చేసింది.
ఎంతో మంది విదేశీయులు.. అరేబియన్ల సంస్కృతిని ఆస్వాదించడానికి వచ్చేశారు.
బుల్లి జాకీలు భయపడుతున్న సమయం రానే వచ్చింది.
ముగ్గుర్నీ వేర్వేరు రౌండ్లలో పిలిచారు.
నజీర్ చిన్నాని ఒంటెనెక్కించాడు.
చిన్నా ఒంటె ఎక్కాక, కళ్లు మూసుకుంటే, కళ్ల ముందు రాకీకి పెట్టిన వాతలు కనిపించాయి. ఒక్కసారి వెన్నులోంచీ వణికొచ్చింది.
పిల్లలందరినీ ఎక్కించి, నజీర్ లాంటి మానేజర్లు పరుగెత్తుకుంటూ ట్రాక్ మీదనుంచి పక్కకి తప్పుకున్నారు.
అడ్డంగా ఉన్న పెద్ద అడ్డు తెర తొలగింది.
ఒంటెలు పరుగందుకున్నాయి.
అప్పుడు సాయంత్రం ఐదు దాటింది.
రేసు మొదలవగానే, విపరీతమైన గాలి అందుకుంది.. నేల మీదున్న దుమ్మంతా పైకి లేపుతూ.
ఆ దుమ్ములో ఏమీ కనిపించలేదు.. హెల్మెట్లున్నాయి కనుక కళ్లలో దూరలేదు. ఇంకా దుమ్ము రేపుతూ ఎగిరెగిరి పరుగెడుతున్నాయి ఒంటెలు.
జాకీలు, భయానికి కంఠ నాళాలు పగిలేలా కేకలు పెడుతున్నారు. ఒంటెల వీపు మీద ఎగిరెగిరి పడ్తూ జీను కున్న తాడుని గట్టిగా ఒక చేత్తో పట్టుకుని బాలన్స్ చేసుకుంటున్నారు.
చిన్నాకి ఏం జరుగుతోందో ఏమీ తెలియలేదు. కుడిచేత్తో కమ్చీ తిప్పడం, ఒంటె ఎగరేస్తుంటే కింద పడకుండా.. తాడు బలంగా పట్టుకుంటూ, ఒంటె మీదే పడేలాగ చూసుకోవడం.. అంతే.
ఎక్కడ చూసినా దుమ్ము.
కళ్లకేం కనిపించడం లేదు.
“సాత్ అల్.. రన్..” (అదో కమ్చీ పరుగెత్తు)
“కమాన్.. ఫాస్ట్..”
“జమాల్.. రన్ ఫాస్ట్” (ఒంటే..అందుకో పరుగు)
“యా అల్లా..”
గొంతులు చించుకుని అనేక రకాల కేకలు.
ట్రాక్ ని ఆనుకుని ఉన్న రోడ్డు మీద పోయే కార్ల శబ్దాలు.. చెవులు పగిలి పోతాయేమో అనిపించింది.
ఎక్కడో ఊహాలోకంలో ఉన్నట్లు ఉంది చిన్నాకి.
ఒళ్లంతా గాలిలో తేలి పోతున్నట్లుంది.
ఎలాగైతేనేం.. చివరి క్షణం వచ్చింది. ఏ ఒంటె ముందు వెళ్లిందో.. తన ఒంటె ఏ స్థానంలో ఉందో ఏమీ తెలియలేదు. అంతా అయోమయం.
అబ్బాస్ వచ్చి చిన్నాని కిందికి దింపాడు.
చిన్నాకి ఇంకా గాల్లో తేలుతున్నట్లే ఉంది.
“అయి పోయిందా అన్నా?” అడిగాననుకున్నాడు.. నోట్లోంచి గాలి తప్ప శబ్దం బైటికి రాలేదు.
కార్లన్నీ వెనక్కి తిరిగాయి. తరువాతి రేసుని అందుకోవడానికి.
“ఒంటె రేసులకంటే, వాటిని ఫాలో అయే ఈ కారు రేసు ఇంటరెస్టింగ్ గా ఉంది.” కార్లో వెళ్తున్న ఒక విదేశీ వనిత అంటోంది.. పక్కనున్న భర్తతో.
చిన్నాని తీసుకుని గబగబా, పెద్ద తెర కింది నుంచి పక్కకి వెళ్లిపోయాడు అబ్బాస్. ఆలిశ్యం చేస్తే ఏ ఒంటె కాలి కిందో పడి పోతారు.
వాన్ ఎక్కించి, బాత్రూంల దగ్గరికి తీసుకెళ్లాడు.
అప్పటికి కొంచెం తేరుకున్నాడు చిన్నా.
“వాష్ చేసుకుని, టెంట్ దగ్గరికి వెళ్లిపో. తరువాత మాట్లాడుతా.” పరుగెడుతున్నట్లుగా నడుస్తూ బైటికెళ్లిపోయాడు.
కాసేపు, అక్కడే నేల మీద కూర్చుండి పోయాడు చిన్నా.
“ఏమయింది? ఎవరు గెలిచారు?” అక్కడ కూర్చున్న క్లీనింగ్ ఆమెని అడిగాడు.
“ఏం కాలేదు.. అన్ని రేసులూ అయాక రిజల్ట్ తెలుస్తుంది. ఒక్క రేసుకే ఏమవుతుంది?” పాకిస్థాన్ నించి వచ్చిందామె.. హిందీలో మాట్లాడింది.
నెమ్మదిగా లేచి, బట్టలు విప్పి, మొత్తం ఇసకంతా కడుక్కున్నాడు. ఎప్పటికప్పుడు అక్కడ పడ్డ ఇసకంతా తీసి బాగు చేస్తోంది అక్కడున్నామె.
పేపర్ టవల్స్ తో వత్తుకుని, దులిపేసి ఆ బట్టలే వేసుకున్నాడు. అడుగులో అడుగేసుకుంటూ తమ గుడారం దగ్గరికి వెళ్లి పక్క మీద వాలి పోయాడు.
బైట జరుగుతున్న కోలాహలం ఏమీ వినిపించట్లేదు చిన్నాకి.
అలా ఎంతసేపు పడున్నాడో..
“చిన్నా.. చిన్నా! లే. అయిపోయింది. వెళ్లి పోతున్నాం.” అబ్బాస్ వచ్చి లేపాడు.
“ఏమయింది.. ఎవరు గెలిచారు?” పక్క మీద లేచి కూర్చుని అడిగాడు.
“కంగ్రాచ్యులేషన్స్. నీ ఒంటెకి సెకండ్ ప్రైజ్ వచ్చింది.”
ఒక్క ఉదుట్న లేచి నిల్చున్నాడు చిన్నా.
“ఎంత ప్రైజ్?”
“పద్ధెనిమిది వేల దీనారాలు.”
“అవునా.. నేను రావాలా ప్రైజ్ తీసుకోవడానికి?” సంతోషంగా అడిగాడు.
“నువ్వా.. నువ్వెందుకు?” అబ్బాస్ ఆశ్చర్యంగా అడిగాడు.
“నేనే కదా.. తోలింది..” చిన్నా అమాయకత్వానికి జాలిపడ్డాడు అబ్బాస్. పిల్లలకి ఏమీ తెలీదులే అని ఈ రేసుల గురించి ఎక్కువగా చెప్పరు. కానీ.. చిన్నా బాగా మెచ్యూర్డ్. చెప్పి తీసుకు రావలసింది..
“ఒంటె ఎంతో నువ్వు కూడా అంతే.. ఒంటె వెళ్తుందా ప్రైజ్ తీసుకోవడానికి? అలాగే జాకీలు కూడా. వాళ్లకేం డబ్బూ రాదు, పేరూ రాదు. పేపర్లలో ఫోటో సంగతి దేవుడెరుగు.. కనీసం పేరు కూడా వెయ్యరు. ఈ పాటికి ఒంటెతో షేక్ గారి ఫొటో, పక్కన హలీమ్ ఫొటో.. టీవీల్లో వస్తూంటాయి. రేపు పొద్దున్న పేపర్లలో కూడా వస్తాయి ఫొటోలు.”
అబ్బాస్ జాలిగా చూశాడు.
నీరసంగా.. కుంచించుకు పోయి నిలుచున్న చిన్నాని.
“ఒంటె, నేను ఒకటెలా అవుతాం? ఒంటె ఫొటో పేపర్లో వస్తుంది కదా..” చిన్నా పక్కకి తిరిగి తన సంచీ సర్దుకోవడం మొదలు పెట్టాడు.
“అనుకున్నంత అమాయకుడు కాదు చిన్నా..” అబ్బాస్ ఆలోచిస్తూ తన సామాన్లు కూడా సర్దుకున్నాడు.
చిన్నా మాటలెప్పుడూ సంభ్రమంగానే ఉంటాయి అబ్బాస్ కి.
ఇంత మెచ్యూరిటీ ఎలా సాధ్యం?
“అదేంటీ.. పొద్దున్నయి పోయిందా?” గుడారం బైటికొచ్చిన చిన్నా ఆశ్చర్యంగా అడిగాడు.
సగం పైగా ఎడారంతా ఖాళీ అయిపోయింది. కార్లన్నీ వెళ్లిపోయాయి. బెడూవియన్లు తమ సరుకులన్నీ సర్దు కుంటున్నారు.
“అవును. రాత్రంతా చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది. నిన్ను లేపుదామని ట్రయి చేశాను. అలిసిపోయావులే అని ఊరుకున్నా. షేక్ గారి కొడుకు వచ్చి గెలిచిన వారికి ప్రైజులిచ్చారు. షాంపేన్ కాలువలా పారింది. పెద్ద ఫీస్ట్. ఒంటిగంట వరకూ డాన్సులు, పార్టీ.. ఫాబ్యులస్..”
“అయ్యో.. దూరంగా నిల్చునన్నా చూసే వాడిని. మిస్ అయిపోయానన్నమాట. వెరీ సాడ్ అన్నా..” మామూలుగా అంటున్న చిన్నాని ఆరాధనగా చూశాడు అబ్బాస్.
“పార్టీ అవుతూండగానే ఒక్కొక్కళ్లు వెళ్లి పోయారు. వెళ్లే ముందు హలీమ్ సాబ్, నజీర్ ని పిలిచి రెండువేల దీనారాలు ఇచ్చారు.”
“ఓ.. చాలా హాప్పీ అన్నా. నజీర్ అంకుల్ కష్టానికి మంచి నజ్రానా. అవునూ మనిద్దరమే మిగిలామా మన గుంపులో?” చుట్టు పక్కలంతా చూస్తూ అడిగాడు చిన్నా.
“అవును. నేను కిచెన్లో సామానంతా సర్దటంలో హెల్ప్ చేస్తుండి పోయాను. వాన్లన్నీ నిండి పోయాయి. మనం మోటర్ సైకిల్ మీద వెళ్లచ్చులే అని ఆగిపోయా. నేను కూడా నిద్ర పోయాననుకో.”
“బైక్ ఎక్కడిదీ?” అడిగాక సిల్లీగా అడిగాననుకున్నాడు చిన్నా. నజీర్ అరేంజ్ చేసుంటాడు.
సరిగ్గా అబ్బాస్ కూడా అదే చెప్పాడు.
“రెంట్ కి తీసుకున్నాడు నజీర్. మొత్తం బిల్ అంతా షేక్ గారికి వెళ్తుంది. బైక్ మనూర్లో ఇచ్చెయ్యచ్చు.”
“మరి కారే తీసుకోవచ్చు కదా?”
“తీసుకోవచ్చు. కానీ నాకు లైసెన్స్ లేదు. చలో.. బయల్దేరదామా?”
******
ఔజుబా దగ్గరికి వచ్చే సరికి పది గంటలయింది.
“త్రీ అవర్స్ పట్టిందా అన్నా?” చిన్నా కిందికి దూకుతూ అడిగాడు.
“ఆల్ మోస్ట్. కష్టం అనిపించిందా వెనుక కూర్చోడం?”
“ఏం లేదన్నా.. ఒంటె సవారీతో పోలుస్తే ఇదెంత? వాటి మీద రెండేసి గంటలు కూర్చుని ప్రాక్టీస్ చేస్తాం కదా?”
నిజమే అనుకున్నాడు అబ్బాస్. చిన్నాని దింపేసి వెళ్లి పోయాడు
తమ రూమ్ లోకి వెళ్తూనే టింకూ కోసం చూశాడు చిన్నా.
నవ్వుతూ ఎదురొచ్చాడు టింకూ. ముందు పళ్లు రెండూ అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇంకా తొస్సిగానే ఉంది. ఆనంద్ కిడ్నాప్ చేయించడానికి ముందే ఊడిపోయాయి.
“అబ్బో.. పళ్లు వస్తున్నాయే..” దగ్గరగా తీసుకున్నాడు చిన్నా. వాడి మనసులో ఎత్తుకోవాలనే ఉంటుంది..
శరీరం సహకరించదు కానీ.
“చిన్నా.. నన్నెందుకు తీసుకెళ్లలేదూ? ఎంత భయం వేసిందో తెలుసా? షెఫ్ అంకుల్ తన దగ్గర పడుక్కో బెట్టుకున్నారు.”
“అవునా! షెఫ్ అంకుల్ కి థాంక్స్ చెప్దాం. టీ కూడా ఉందేమో కనుక్కుందాం.. పద.” ఇద్దరూ కిచెన్ కేసి నడుస్తున్నారు.
“ఉండు.. బాత్రూం కెళ్లి వస్తా..” చిన్నా బాత్రూంలో దూరాడు.
తాము చాలా లక్కీ అనుకున్నాడు చిన్నా.
రావణాసురుడి చెరలో త్రిజట సీతమ్మని కాపాడుతున్నట్లు షెఫ్ అంకూల్.. అబ్బాస్ అన్న తమని సేవ్ చేస్తున్నారు.
సాయినాధునికి రోజూ పూలు పెట్టిన పుణ్యం అయుంటుంది.
చిన్నాకి రామాయణంలో కొన్ని ఇష్టమయిన పాత్రలున్నాయి. అందులో త్రిజట ఒకటి.
ఒకసారి డిబేట్ పెట్టారు సరస్వతీ టీచర్. అప్పుడు మీకిష్టమయిన రామాయణంలో పాత్ర గురించి మాట్లాడమన్నారు.
మిగిలిన వాళ్లందరూ.. రాముడనీ, లక్ష్మణుడనీ, హనుమంతుడనీ.. చాలా పేర్లు చెప్పారు. కానీ చిన్నా తడుముకోకుండా త్రిజట అని చెప్పాడు.
“అంత చిన్న పాత్ర ఆవిడది, రామాయణంలో.. నీకెందు కిష్టం చిన్నా?” సరస్వతీ టీచర్ అడిగింది.
“సీతమ్మని అశోక వనంలో బంధిస్తే, రాక్షసి విమెన్ ఆవిడని కష్టాలు పెట్టకుండా కాపాడింది. తన వాళ్లెవరూ లేని చోట సీతమ్మని కాపాడింది.” అందుకని.. అంటూ త్రిజట స్వప్నం గురించీ, యుద్ధంలో రామ లక్ష్మణులు చనిపోలేదని సీతమ్మని ఊరడించిన సంగతీ.. అన్నీ చెప్పాడు.
చిన్నాని బల్ల మీద నిలబెట్టి మరీ చెప్పించింది టీచర్. అందరూ చప్పట్లు కొట్టారు.
సాయినాధుని తలుచుకోగానే నాయన గుర్తుకొచ్చాడు చిన్నాకి. ఎలా ఉన్నాడో.. ఏం చేస్తున్నాడో!
ఆలోచిస్తూ బయటికి వచ్చి, టింకూ చెయ్యి పట్టుకున్నాడు.
తను బ్రతికే ఉన్నాననీ, ఎప్పటికైనా ఇంటికొచ్చేస్తాననీ కబురందించ గలుగుతే ఎంత బాగుంటుంది.
దూరంగా కనిపిస్తున్న సెల్ టవర్ కేసి చూశాడు.
ఇన్నిన్ని సదుపాయాలు ఉన్న ఈ రోజుల్లో.. ఇలా బందీ అయిపోతారని ఎవరైనా అనుకోగలరా?
ఒక్క ఫోన్ దొరుకుతే.. సరస్వతీ టీచర్ కి ఫోన్ చెయ్యగలుగుతే?
ఆకాశం కేసి చూశాడు.. సూర్యుడు పైపైకి వస్తున్నాడు.
“మా అయ్య ఈ పాటికి ఇంటికెళ్తుంటాడు. నువ్వు అక్కడ కూడ ఉన్నావుగా.. కాస్త చెప్పరాదా?”
“ఏంటి చూస్తున్నావు చిన్నా?”
కిచెన్ ముందు ఆగి పోయి, ఆకాశంలోకి చూస్తున్న చిన్నాని అడిగాడు టింకూ.
“సూర్యుడిని చూస్తున్నా. మన గురించి అమ్మకీ, నాయనకీ చెప్పమని చెప్తున్నా. ఆయన అక్కడ కూడుంటాడు కదా?”
“అవునవును..” చప్పట్లు కొట్టాడు టింకూ.
“కానీ.. అబ్బాజాన్ కి చెప్పక్కర్లేదు. అమ్మీకి చెప్తే చాలు.” కోపంగా అని వంటింట్లోకి పరుగెత్తాడు టింకూ.
“షెఫ్ అంకుల్.. చిన్నా వచ్చేశాడు.”
“ఓ.. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ చిన్నా. సెకండ్ వచ్చావంట కదా?” షెఫ్, టీ కప్పులో పోస్తూ అడిగాడు.
టీ కప్ తీసుకుని మైక్రోవేవ్ లో పెట్టాడు చిన్నా.
“నేను కాదంకుల్.. జమాల్ (ఒంటె) వచ్చింది సెకండ్. షేక్ సాబ్ కి ప్రైజ్ తెచ్చింది.”
“హూ.. నిజమే..” తలూపాడు షెఫ్. జాకీ ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఆఖరుకి షేక్ కి కూడా.
ఒక్క నజీర్ మాత్రం.. ఇంక రాబోయే రేసులన్నింటికీ చిన్నాని పంపుతాడు. వాడి వల్ల గెలిచినా గెలవక పోయినా లక్కీ అని ప్రూవ్ అయింది కదా!
చిన్నాని చూస్తే జాలేసింది షెఫ్ కి.
“టీ తీసుకో. అందులో కుకీస్ ఉన్నాయి అవి కూడా..”
సగం టీ, ఇంకో కప్ లోకి తీసి, టింకూ కిస్తూ, కుకీలు తీసుకున్నాడు చిన్నా.. టింకూకొకటి, తన కొకటి.
“ఎలా ఉంది రేస్?”
“చాలా బాగుందంకుల్.. ఎంత మంది జనమో! ఫెయిర్ కూడా పెట్టారు. బోలెడు బొమ్మలున్నాయి అక్కడ.” చిన్నా నెమ్మదిగా టీ తాగుతూ చెప్తున్నాడు.
“ఇవేళ డ్యూటీ ఎవరిదంకుల్? చేసేశారా?”
“మీ రూమ్ మేట్స్.. ఇద్దరూ రాలేదు. రాత్రే బయల్దేరి వచ్చేరన్నారు. ఏమయ్యారో.. ఎలా అయినా కొంచెం డల్..”
“తయారై పోయుంటారంకుల్. నేను చేస్తా. ఫ్లోర్ క్లీనింగ్ మొదలు పెడ్తాను.” గబగబా తాగేసి, చీపురు చేతిలోకి తీసుకున్నాడు చిన్నా.
అక్కడన్నీ మిని సైజువే ఉంటాయి.. మరి పిల్లల చేత చేయించాలి కదా!
పిల్లలు గదిలో కూడా కనిపించలేదే? ఎక్కడికెళ్లారో.. అలా వెళ్లటానికి వీల్లేదు కదా! ఏమై పోయారో..
రాకీ, సాండీ కాకుండా ఇంకో కుర్రాడుండాలి. సూడాన్ వాడే.. వాడేమై పోయాడూ?
ఆలోచిస్తూనే, వంటిల్లంతా ఊడిచేసి, నేలంతా తడి బట్ట పెట్టి తుడిచేశాడు.
అంతలో టింకూ, కారట్ లు, కీరా దోస కాయలూ పీలర్ తో గీశాడు.
ఇద్దరూ కలిసి సాలడ్ కి ముక్కలు చేసి పెట్టేశారు.
“లంచ్ ఏంటంకుల్?”
“పాస్తా.”
పాస్తా పెట్టటానికి పెట్టెలు తీసుకొచ్చి పెట్టేసి, తమ గదికి వెళ్లి పోయారు చిన్నా, టింకూ.
“నైస్.. బాయిస్.” షెఫ్ ప్రసన్నంగా చూసి, అసిస్టెంట్ ని పిలిచాడు.
“టింకూ! స్నానం చేసొస్తా. ఇవేళ టి.వీ చూద్దాం. నజీర్ రాడనుకుంటా.. నిన్నటి ఆనందంలో పడుకునుంటాడు. నీ కాళ్లు తగ్గాయా? చూపించు?”
పడుక్కోబెట్టి చూశాడు.
పెచ్చు కట్టింది. తగ్గి పోయినట్లే.. నొప్పి కూడా లేదు కదా!
చిన్నా బాత్రూంలోకెళ్లి తలుపెయ్యబోయాడు. ఒక మూల ఏదో కదులుతున్నట్లు అనిపించింది. బాత్రూంలో కిటికీలు లేవు. మసక వెలుతురులోనే పనులు కానిచ్చుకోవాలి.
తలుపు బార్లా తెరిచి, దగ్గరగా వెళ్లాడు.
ముడుచుకు పోయి, వణుకుతూ తన రూమ్మేట్లిద్దరూ.. సాండీ, ఇంకొక కుర్రాడు.
ఇంకెవరూ లేరు.
మిగిలిన గదుల్లో పిల్లలు కాంపౌండ్ లో తమ పనులు చెయ్యడానికి వెళ్లి పోయినట్లున్నారు.
ఇద్దరినీ బైటికి తీసుకొచ్చాడు. ఆ షెడ్లో, వరుసగా బాత్రూంలు, లెట్రిన్ లు ఉంటాయి. వాటి ముందు పొడవుగా కారిడార్..
ఆ కారిడార్ లో బట్టలు మార్చుకుంటారు. అన్నీ శుభ్రంగానే ఉంటాయి. లేకపోతే తన్నులు తినాలి.
కారిడార్ లో నిలబెట్టి చూశాడు వాళ్లని చిన్నా.
ఇద్దరి మొహాల్లో జీవం లేదు. పొద్దుటి నుంచీ ఏమీ తిన్నట్లు లేదు. ఎలా అడగాలి? భాష..?
“రూమ్ లోకి రండి. టీ తెస్తాను. తాగి మాట్లాడుకుందాం.” సగం సైగలు, సగం తను నేర్చుకున్న ఐదారు అరాబిక్ పదాలు..
రామన్నట్లు తల అడ్డంగా తిప్పారు. ఇద్దరూ గజగజ వణుకుతున్నారు. నజీర్ కొట్టాడా? వాతలు పెట్టాడా? షెఫ్ అంకుల్ సరిగ్గా పని చెయ్యట్లేదని కంప్లైంట్ ఇచ్చాడా?
ఏదో చాలా పెద్ద విశేషమే..
“నజీర్ లేడు. ఇవేళ రాడు. ఐదు నిముషాలాగండి. ఒళ్లంతా ఇసక దూరిపోయింది. స్నానం చేసి వస్తా. రూమ్ లో కెళ్లి మాట్లాడుకుందాం.. ఓ.కే?” మిడిగుడ్లేసుకుని చూశారు. నల్లగా ఉంటారేమో.. వాళ్ల తెల్ల గుడ్లు ఇంకా తెల్లగా మెరుస్తుంటాయి.
వాళ్లనక్కడే వదిలేసి తను బాత్రూంలో దూరాడు చిన్నా.
బైటికొచ్చి, గదిలోకెళ్లి, ఆ పిల్లల తువ్వాళ్లు బట్టలు తీసుకొచ్చాడు.
“స్నానం చేసి రండి. మాట్లాడుకుందాం.”
అడ్డంగా తలూపారు.
సాండీ మరీ వణికి పోతున్నాడు.
“నీ పేరేంటి?” ఇంకో పిల్లాడ్ని అడిగాడు
“సాహిల్.”
“సాహిల్.. ఏం భయం లేదు. నేనున్నా కదా! మిమ్మల్నెవరూ ఏం చెయ్యరు. రండి. స్నానం నే చేయించనా లేకపోతే..” బలవంతంగా లేపి బాత్రూంలోకి పంపాడు.
ఏ పాపం ఎరుగని పసివాళ్లు. ఏ జాతైతేనేం.. ఏ రంగైతేనేం? వాళ్లనలా హింస పెట్టడానికి ఎవరికి హక్కుంది? తనేమీ చెయ్యలేడని తెలుసు. కానీ నాలుగు ముక్కలు చెప్పి ధైర్యం ఇవ్వటంలో తప్పేం లేదు కదా!
ఇద్దరికీ బట్టలేసి, గదిలోకి తీసుకెళ్లి కూర్చో పెట్టి, దుప్పట్లు కప్పాడు. ఇంకా వణుకు తగ్గలేదిద్దరికీ.
షెఫ్ అంకుల్ నడిగి, టీ, బిస్కట్లు తెచ్చి ఇద్దరి చేతా తినిపించి తాగించాడు.
“చెప్పండి. ఏమయింది? రాకీ ఏడి?”
ఘొల్లుమని ఏడుపందుకున్నారు ఇద్దరూ.
“ఏమయింది? రాకీ నిన్న రేసులకొచ్చాడు కదా? నువ్వు కూడా వచ్చావు కదా సాండీ..”
అవునన్నట్లు తలూపాడు సాండీ.
మౌనంగా ఉండిపోయాడు చిన్నా. నిన్న రేసుల్లో ఏదో అయుంటుంది. వాడికి దెబ్బ తగిలిందేమో.. వీడు భయపడి పోయాడు.
“దెబ్బ తగిలిందా? ఏడీ వాడు? తగ్గి పోతుందిలే.”
“కాదు.. కాదు..” తల అడ్డంగా ఊపాడు సాండీ. మెడ విరిగిపోతుందేమో నన్నంత స్పీడుగా..
నిశితంగా వాడి వంక చూశాడు చిన్నా.
“నిన్న నీ రేసు అయ్యాక, నాదీ రాకీదీ అయింది. ఒకటే దుమ్ము.. బాగా ఎక్కువయింది. మధ్యలో రాకీ హెల్మెట్ ఊడి పోయింది.. అంతే..” చేతులు తిప్పుతూ, యాక్షన్ చేసి చూపిస్తూ.. భోరుమన్నాడు మళ్లీ సాండీ.
చిన్నా ఊహించగలడు జరిగింది. దుమ్మంతా కళ్లలోకి వెళ్లిపోయుంటుంది.. పట్టు జారి.. తలుచుకుంటే గాభరా వస్తోంది.
“రాకీ కింద పడి పోయాడు. ఒంటె కూడా పడి పోయింది. గబగబా అందరూ వచ్చి ఒంటెని హాస్పిటల్ కి తీసుకెళ్లి పోయారు.. రాకీని అక్కడే వదిలేసి.”
“మరి రాకీ ఏడీ?”
“మెడ విరిగి పోయింది. కాళ్లు విరిగి పోయి, వేళ్లాడుతున్నాయి. నజీర్ వచ్చాడు. వెంటన్ హస్పిటల్ కి తీసుకెళ్లచ్చు కదా! రిజల్ట్ వచ్చేవరకూ ఆగాడు. అంతలో.. రాకీ..” నేల మీద పడుక్కుని, నాలిక బైట పెట్టి, చనిపోయాడని చెప్పలేక చెప్పలేక చెప్పాడు సాండీ.
“మరి బాడీ..” గొంతు పూడుకుపోగా సైగ చేసాడు చిన్నా.
“అప్పుడే తీసుకెళ్లి పాతి పెట్టేశాడు నజీర్. ఎవరికీ చెప్పక్కర్లేదు కదా! మమ్మల్ని అమ్మేశారు కదా!”
సాండీని చూస్తుంటే కడుపు తరుక్కు పోయింది చిన్నాకి.
దేశం కాని దేశంలో ఒకరికొకరు తోడై బ్రతుకుతున్నారు. కష్టాలని, కన్నీళ్లని కలగలిపి పంచుకుంటూ..
ఆ తోడే.. తన కళ్ల ముందే కను మరుగై పోతే.. అన్ని రకాలుగా కష్టాలు అనుభవించి.. వయసుకి మించి ఎదిగి పోయారు. మానసికంగా.
దగ్గరగా వెళ్లి, హత్తుకుని ఓదార్చడానికి ప్రయత్నించాడు చిన్నా. సాహిల్ కూడా దగ్గరగా వచ్చి చేతులు వేశాడు.
ఎవరైనా అంతే కదా.. రేపు తన పని కూడా..
ఎలాగైనా బైట పడాలి. వీళ్ల అరాచకాలని బైట పెట్టాలి.
గట్టిగా నిశ్టయించుకున్నాడు చిన్నా.
“నిండా మూడడుగులు కూడా లేని తను ఏం చెయ్యగలడు.” అని ఆలోచించలేదు. ఆ క్షణం నుంచీ వేయి కళ్లతో అదే పని మీద ఉండాలని తనకి తనే వాగ్దానం చేసుకున్నాడు.
కనీసం అప్పటి వరకైనా తనని కాపాడమని వేడుకున్నాడు తను నమ్మిన సాయి నాధుని.
ఎక్కడి నుంచో చిన్నగా వెక్కిళ్లు వినిపించాయి. సాండీ, సాహిల్ ల కేసి చూశాడు చిన్నా. ఊహూ.. నేను కాదన్నట్లు సైగ చేశారిద్దరూ..
ఒక మూల ముడుచుకుపోయి, వెక్కుతూ వణికిపోతున్నాడు టింకూ.
వాడికింకా ఇటువంటివి తెలియవు.
ముగ్గురూ ఒక్క ఉరుకులో వాడి దగ్గరకెళ్లి హత్తుకున్నారు. నలుగురూ ఒక మూటలా నేల మీద పడిపోయారు.

………………….
7

అబ్బాస్ ఆ రాత్రి అస్సలు నిద్ర పోలేకపోయాడు. అతనికి ఆ రోజు నజీర్ ఇంట్లో డ్యూటీ.
రాకీ మరణం అతన్ని బాగా కుంగదీసింది. నజీర్ పక్కనే ఉండి, ఆ రాక్షసుడికి అన్నింట్లో సాయం చెయ్యవలసి వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని ఎంత చెప్పినా వినలేదు.
ముందు సెకండ్ ప్రైజ్ విజయం పంచుకోవాలి.. షేక్ వస్తాడు. ఆయన మెప్పుకోళ్లు కావాలి. పురుగుల్లాంటి ఈ పిల్లలు ఉంటేనేం పోతేనేం?
అసలు తమ లాంటి వాళ్లని ఎందుకు పుట్టించాలి ఆ దేవుడు?
శరీరం ఎండిపోయిన చెక్కలాగా, హృదయం బండలాగ అయిపోయినా అప్పుడప్పుడు తను మనిషినన్న స్పృహ కలుగుతుంటుంది అబ్బాస్ కి.
తను ఎవరు?
అమ్మ మొహం గుర్తుందా? మొహం మీద ఇంత పెద్ద బొట్టు గుర్తుంది. చిరిగిన చీర కొంగు కనిపించకుండా దోపుకోడం గుర్తుంది.
గవర్న్ మెంట్ బళ్లో ఒకటో తరగతి చదువుతూ.. బళ్లో మధ్యాన్నం అన్నం తినగానే ఇంటికి వచ్చేసి, వీధిలో కొచ్చిన టాంకరు నుంచి చిన్నచిన్న బకెట్లలో నీళ్లు తీసుకొచ్చి ఇంట్లో డొక్కు ప్లాస్టిక్ బకెట్లలో నింపడం..
కూలికెళ్లిన నాన్న, సంపాదనలో సగం పైగా తాగేసి, చాలీ చాలకుండా బియ్యం, పప్పు తేవడం గుర్తుంది.
మధ్యాన్నం కడుపునిండా తిన్నావుగా అంటూ సగం చాల్లే అని కుండ ఖాళీ చేసే నాన్న .. అతగాడు చూడకుండా రెండు ముద్దలు తను తినేవి పెట్టే అమ్మ..
గుడిసె బయట అమ్మ పక్కనే పడుక్కుని, అమ్మ ఒళ్లోని తమ్ముడిని చూస్తూ.. పైనున్న చందమామని చూపించి, వాడితో కబుర్లు చెబుతుంటే..
ఒక పెద్దాయన.. కోటేసుకుని కారులో వచ్చి, అంత దూరంలో దిగి.. ఫుట్ పాత్ మీద నిలుచుని ఉన్న నాన్నతో మాట్లాడుతూ ఇంటికి రావడం గుర్తుంది.
ఏడుస్తున్న అమ్మని ఓదార్చడం..
“ఇక్కడ చూడమ్మా. అన్నానికి బడికి పంపుతున్నావు. చదువేం చదువుతున్నాడు? ఇంకో ఏడైతే పనికి పంపుతావు. నేనైతే.. వేరే దేశం తీసుకెళ్లి బాగా చదివిస్తా. పిల్లలు లేని వాళ్లు పెంచుకుంటారు.” వరుసగా రెండురోజులు తిరిగి అమ్మని ఒప్పించాడు.
నాన్న సంతోషంగా, అమ్మ ఏడుస్తూ ఆ పెద్దాయనతో పంపడం గుర్తుంది.
ఎలా వచ్చాడో గుర్తు లేదు. నిద్ర.. నిద్ర.. నిద్ర.
ఇప్పుడు తెలుస్తోంది. మత్తు మందు ఇచ్చి ఉంటారని.
ఒంటెల షెడ్ పక్కనే ఇసుకలో పడుక్కుని రాత్రి తీక్షణంగా తనకేసి చూస్తున్న చందమామకి ఆకలేస్తున్న కడుపు చూపించడం బాగా గుర్తుంది.
ఇప్పుడు ఈ పిల్లలకున్నట్లు గదులేవీ తనకి? కప్పులేని తడికల మరుగు.. ఒంటెల షెడ్ పక్కనే.
ఎండ మరీ ఎక్కువైతే, ఒంటెల పక్కనే బితుకు బితుకు మంటూ కూర్చోవడం..
రోజుకొకసారి తెచ్చి పెట్టే తిండి..
ఒంట్లో కండ అనేదే లేకుండా చేసింది.
ఇప్పుడు ఈ పిల్లలు పడుతున్న బాధలకి నాలుగు రెట్లు పడ్డాడు.
వాతలు, తన్నులు అలవాటే.. కరవు లేదు వాటికి. ఇంకా తాగే నీళ్లకి ఉందేమో కానీ.. కన్నీళ్లకి మొదలే లేదు.
పన్నెండేళ్లు వచ్చే వరకూ అబ్బాసే బెస్ట్ జాకీ. కండ లేక పోయినా ఎముకలు పెరుగుతున్నాయి కదా! బరువు పెరిగాడు ముప్ఫై కిలోలు దాటగానే.. ఎప్పుడూ ఫస్ట్ ప్రైజో సెకండో తీసుకొచ్చే ఒంటే.. మొయ్య లేక పోయింది.
పందెం వరకూ ఆగక్కర్లేకుండానే ముందుగానే వాడిని రేసుల నించి తప్పించేశాడు నజీర్. అబ్బాస్ వంటివాళ్లు ఆ వయసు వచ్చే వరకూ అక్కడుండటం అరుదు.
కొంత మందికి, కాలో చెయ్యో విరిగితే వాళ్ల దేశాలకి పంపడమో..
కొందరిని అక్కడే ఇళ్లల్లోనో, కట్టడాలు కట్టే చోట్ల పని వాళ్లుగా వాడుకోవడమో..
ఏమవుతారో వాళ్లని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడికి కూడా అర్ధం కాదు.
అబ్బాస్ అసలు కథ అప్పుడే మొదలయింది.
*****
ఒంటె తన బరువుని మొయ్యలేక మెల్లిగా పరుగెత్తిన రోజు.. నజీర్ ఆగ్రహంలో ఊగిపోయాడు.
అబ్బాస్ ని చేతికందిన దాంతో చితక్కొట్టాడు.
ఎలా పెరిగాడు బరువు?
“ఏం తింటున్నావురా? నాకు తెలీకుండా.. కరెక్ట్ పొజిషన్ లో కొడ్తావు కదా.. అందుకే ఆ ఒంటె నీ మాట వింటుంది. ఇప్పుడేమయింది దానికి?”
అబ్బాస్ కి మాత్రం ఏం తెలుసు? ఎముకలకీ, చర్మానికీ మధ్య ఒక పొర మాత్రం కండ ఉంది వాడికి. పొడవయ్యాడనీ.. ఎముకలు, దొరికిన దాంట్లోంచే వెతుక్కుని పెరుగుతున్నాయనీ.. దాని వల్ల బరువు పెరిగాడనీ చెప్పగలిగిన జ్ఞానం వాడికి లేదు. ఉన్నా చెప్పడానికి అసలే లేదు.
అదే విధంగా ఒంటె కూడా ఆరేళ్లలో పెద్దదవుతుందనీ.. నలభై ఐదేళ్లకీ, యాభై ఏళ్లకీ మధ్య దాని శరీర ధారుఢ్యం తగ్గుతుందనీ కూడా తెలియదు.
నజీర్ కి కూడా అవగాహన లేదు.
తన్ని పనులు చేయించుకోడం తప్ప.
దిక్కు తోచని అబ్బాస్.. ఏడుస్తూ కప్పులేని తన రేకుల గదిలో, ఒక ఛద్దరు వేసుకుని పడుక్కున్నాడు. ఆరేళ్లలో ఒక ఛద్దరు, ఒళ్లు తోముకోడానికి సబ్బు, పళ్లు తోముకోడానికి పేస్టు, బ్రష్షు సంపాదించగలిగాడు.
పెద్దవాడయ్యాడని వాడికోసం హవాయి చెప్పులు, బట్టలు కూడా ఇస్తున్నాడు నజీర్.
నజీర్ కి షేక్ ఎంత ఇస్తాడో కానీ.. వాడు మాత్రం పిల్లలకి గీచి గీచి ఇస్తాడు.
శోషొచ్చినట్టు పడిపోయున్న అబ్బాస్ కి అర్ధరాత్రి ఎవరో ఒంటి మీద రాస్తున్నట్లు అనిపిస్తే మెలకువ వచ్చింది.
నజీర్..
తన్ని లేపకుండా.. ఏదో రాస్తున్నాడు ఒంటికి. తట్టు కింద మారిపోయిన వీపుకి నూనె రాస్తున్నాడు. కాళ్లని సున్నితంగా తడుముతున్నాడు.
ఇంత సౌమ్యత.. ఇంత ఆదరణ. ఇంతటి ఆప్యాయత.. నజీరేనా?
ఆశ్చర్యంగా చూస్తున్న అబ్బాస్ కి రెండు రొట్టె ముక్కలు, గ్లాసులో గొర్రె పాలు ఇచ్చాడు. బరువు పెరుగుతారని పాలు, పిల్లల దగ్గరకి రానియ్యడు నజీర్..
అటువంటిది పాలల్లో ముంచుకుని తినమన్నాడు.
“రేపట్నుంచీ నువ్వు కావలసింది తినచ్చు. నాకు అసిస్టెంట్ కింద ఉండచ్చు. పనేమీ చెయ్యక్కర్లేదు. పిల్లలందరినీ నువ్వే చూసుకో.. నేను ముధారీ ట్రైనింగ్ కి వెళ్తుంటా అప్పుడప్పుడు.” ఎంతో నెమ్మదిగా చెప్పాడు.
అబ్బాస్ కళ్లు పెద్దవి చేసి చూశాడు. అటూ ఇటూ వెతికాడు. మిగిలిన పిల్లలేరీ?
“ఇక్కడెవరూ లేరు. అందరినీ వేరే చోటికి పంపించేశా..”
ఆశ్చర్యంగా చూస్తున్న అబ్బాస్ కళ్ల మీద ముద్దు పెట్టుకున్నాడు..
“ఇదేంటి?”
“నేను చెప్పిన మాట విను.. టోటల్ నీ లైఫే మారి పోతుంది.” దగ్గరగా తీసుకుని ఒళ్లంతా తడుముతున్నాడు.
చెప్పిన మాట వినకపోతే ఏమవుతుందో తెలుసు అబ్బాస్ కి.
చీకట్లో చాలాసార్లు అర్ధరాత్రి అబ్బాయిల మీద పడటం చూశాడు. వాళ్లు అరవకుడా నోరు నొక్కేసి.. చేతులు పట్టుకుని నజీర్ చేసిన పని అబ్బాస్ కి ఇప్పుడు అర్ధమయింది.
కాదనగల ధైర్యం ఉందా?
ఇంకేదైనా అవకాశం ఉందా?
అప్పటి నుంచీ నజీర్ కి ప్రియుడైపోయాడు అబ్బాస్.
“నాకు వేరే ఛాయిస్ ఏముంది?” ఒంటరిగా పడుక్కున్నప్పుడు ఆలోచిస్తుంటాడు. కళ్లలోంచి నీరు తెలియకుండానే కారిపోతుంటుంది.
తన జీవితం పాడయినా.. ఆ ఎలుగు బంటి ఇంకెవరి మీదా పడకుండా తనకి చేతనయినంత చేస్తున్నాడు.
ఆ తరువాత వచ్చిన పిల్లలకి తెలియదు.. అబ్బాస్ తమకి ఎంతటి మహోపకారం చేస్తున్నాడో!
ఎప్పటికైనా పిల్లలకి జరుగుతున్న ఈ అన్యాయాన్ని అరికట్టాలి. అబ్బాస్ కళ్ల ముందు చిన్నారి రాకీ మెదిలాడు.
కానీ.. ఎలా?
ఇంకొకరెవరైనా తోడుంటే? ఎవరికీ చెప్పకోవడాని కానీ, సహాయం అడగటానికి కానీ లేదు.
అల్లావో, రాముడో.. జీసస్సో.. ఎవరైనా సరే! తనకి ఒక తోడు పంపకూడదూ?
అల్లా పంపిన తోడు సంగతేమో కానీ.. సైతాన్ పంపిన కీడు, నజీర్ దెయ్యం పళ్లన్నీ బైట పెట్టి నవ్వుతూ వస్తున్నాడు దగ్గరగా!
…………………..

చిన్నాకి కూడా రాత్రంతా నిద్ర పట్టలేదు. అబ్బాస్ అన్న ఉంటే కాస్త ధైర్యంగా ఉండేది. వారానికి మూడు నాలుగు రోజులు అబ్బాస్ అన్న ఎక్కడికెళ్తాడో.. కానీ, ఆ మరునాడు వచ్చిన అబ్బాస్ ఒంట్లో రక్తం అంతా ఎవరో తోడేసినట్లు నీరసంగా నడుస్తూ వస్తాడు.
నజీర్ అంకుల్ కి క్లోజ్ కదా! ఇద్దరూ బాగా తాగుతారు కాబోలు.. మస్తాన్ అంకుల్ లాగ. కొంచెం అలాగే, అంకుల్ లాగే కాళ్లు ఈడుస్తూ వస్తాడు అబ్బాస్ కూడా. ఎప్పటికో కానీ మామూలుగా అవలేడు.
చిన్నాకి తన శరీరంలో కూడా మార్పులు తెలుస్తున్నాయి. మందులు వేసుకోవట్లేదు. ఏంటో అస్థిమితంగా ఉంటోంది. డాక్టర్ గారి దగ్గరకెళ్తే ఏవో మందులిచ్చేవారు. అక్కడికీ, జాయంట్స్ అవీ సాగదీస్తూనే ఉన్నాడు. చెప్పిన వ్యాయామాలు చేస్తున్నాడు.
తన సమస్య అబ్బాస్ అన్నకి చెప్తే..
ఎవర్ని నమ్మాలో.. ఎవర్ని నమ్మకూడదో!
పొద్దున్న అందరూ ఆలిశ్యంగానే లేచారు. నజీర్ తన్నులు లేవు. కళ్లు నులుముకుంటూ బాత్రూంలోకి వెళ్లారు నలుగురూ.
అప్పటికే అక్కడ అబ్బాస్.. ఎర్రని కళ్లతో.. ఊగిపోతూ, స్నానం చేసి వచ్చి తువ్వాలుతో తుడుచుకుంటున్నాడు.
ఒళ్లంతా ఎర్రని గాట్లు.. రక్తం చిమ్ముతూ.
కెవ్వుమని కేకేశారు.. పిల్లలందరూ.
“ఏమయిందన్నా? ఏం కరిచాయి? అందుకేనా కళ్లు అంత ఎర్రగా ఉన్నాయి? మందు రాసుకున్నావా? మండటం లేదా?” చిన్నా ఆదుర్దాగా దగ్గరగా వెళ్లి అడిగాడు. సాండీ, సాహిల్ తమ చిన్న చేతులతో గాట్ల మీద నిమురుతున్నారు. టింకూ గోడ మూలకి వెళ్లి నోట్లో వేలేసుకుని కళ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు.
ఇంత ఆప్యాయంగా పలుకరించే ఆత్మీయులు! వీళ్లకి తనేమవుతాడనీ.. ఎందుకంత ప్రేమ?
అప్పుడు తెగింది ఆనకట్ట..
ఎన్నో ఏళ్ల నుంచీ లోపల్లోపల దాచుకున్న, గడ్డ కట్టిపోయిన కన్నీరు.. లావాలా బైటికి వచ్చింది.
అబ్బాస్.. ఎప్పుడూ నవ్వుతూ, పిల్లలకి ఏదో విధంగా సహయపడాలని చూసే అబ్బాస్.. హృదయవిదారకంగా ఏడవడం మొదలు పెట్టాడు.
అబ్బాస్ ని బాగా ఏడవనిచ్చి దగ్గరుండి బట్టలు వేసుకోమని, టివి గదిలో కూర్చోపెట్టాడు చిన్నా.
తను గబగబా బాత్రూమ్ లోకి వెళ్లి, పిల్లలని తయారవమని కిచెన్ లోకెళ్లి అబ్బాస్ కీ, తనకీ కాఫీ, బిస్కట్లు తీసుకుని టివీ రూమ్ కి వెళ్లాడు.
“అన్నకి ఒంట్లో బాలేదంకుల్.. అందుకని నేనే తీసుకెళ్తానివేళ..” షెఫ్ కి చెప్పి, పిల్లలకి కూడా టీ, బిస్కట్లు ఇచ్చి, తమ గదిలో కూర్చోమన్నాడు.
“నజీర్ అంకుల్ వస్తే.. ఒకళ్లు పరుగెత్తుకొచ్చి మాకు చెప్పండి.” పిల్లలు ముగ్గురూ తలూపారు.. బెదురు చూపులతో.
అబ్బాస్ కాఫీ తాగాక కాస్త తేరుకున్నాడు.
చిన్నా అతని ఎదురుగా కూర్చుని తను కూడా కడుపు నింపుకున్నాడు.
అబ్బాస్ ఎర్రబడిన మొహంతో అక్కడి నుంచి లేవబోయాడు.
“కూర్చో అన్నా! చెప్పు.. ఏమయింది? ఎవరో కరిచారు నిన్ను. ఎందుకు? నిద్ర పోతున్నప్పుడు కరిచారా? నీకు నొప్పి తెలీలేదా?”
“నీకు చెప్పలేని విషయంరా! నువ్వు చాలా చిన్నవాడివి. అర్ధం కాదు. బతికునన్నాళ్లూ భరించాల్సిందే. ఇక్కడున్నన్ని రోజులూ.. నాకు తెలిసీ, ఇక్కడ నుంచి కదిలే ఛాన్సే లేదు.”
కాసేపు నిశ్శబ్దం.. ఆ గదిలో ఉన్న ఏసి చప్పుడు తప్ప ఏమీ వినిపించడం లేదు. అబ్బాస్ కళ్లు మూసుకుని, గోడనానుకుని వెనక్కి వాలి కూరుచున్నాడు, నేల మీద పరచిన ఛద్దర్ మీద.
ఒక నిర్ణయానికి వచ్చాడు చిన్నా.
“నేను నువ్వనుకుంటున్నంత చిన్నవాడిని కాదు అన్నా!”
కళ్లు తెరచి, ఆశ్చర్యంగా చూశాడు అబ్బాస్.
“అవునన్నా. నేను లిటిల్ పర్సన్ ని. అంటే మరుగుజ్జుని. నాకు పన్నెండో ఏడు నడుస్తోంది. ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నా. చాలా ఇంగ్లీష్ పుస్తకాలు చదివాను. రామాయణ, భారతాలలో చాలా వరకూ కథలు వచ్చు. కార్టూన్ పుస్తకాలే కాకుండా, రాజగోపాలాచారి రామాయణం కూడా చదివాను. నాకు అన్నీ తెలుసు.”
చిన్నా మిగిలిన వాళ్లకంటే కొంచెం పెద్దే అయుంటాడని అనుకున్నాడు కానీ.. ఇంత పెద్దనుకోలేదు అబ్బాస్.
ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న అబ్బాస్ కి తన సంగతి పూర్తిగా చెప్పాడు చిన్నా. ఒకవేళ అబ్బాస్ మంచివాడు కాకపోతే..
ఇంత కంటే చెడిపోయేదేముంది.. ఎలాగా తను ఇంక తన వాళ్లని చూడగలడో లేదో.. ఇతను మంచివాడైతే తప్పించుకోడానికి మరింత అవకాశం దొరకచ్చు. అంతా చెప్పేశాక ఏదో భారం తగ్గి పోయినట్లు నిట్టూర్చాడు చిన్నా.
“అనుకున్నా.. నీకు ఐదారేళ్లకంటే ఎక్కువే ఉంటాయని. కానీ ఇంత ఎక్కువనుకోలేదు.” అబ్బాస్ కి.. ఇంకా తన సంగతెలా చెప్పాలో తెలియలేదు. తనకంటే తప్పలేదు.. ఆ వయసునించే.. కళ్లనిండా నీళ్లు తిరిగాయి.

ఇంకా వుంది

చందమామ పాటలు – 2

చందమామ రావె.. జాబిల్లి రావె అంటూ బిడ్డను చంకనెత్తుకొని తల్లులు గోరుముద్దలు తినిపించే సన్నివేశాలు కనిపించేవి ఒకప్పుడు.ఏ సాంకేతిక ఆటవస్తువులు, ఉపకరణాలు లేని రోజుల్లో నింగిలో మెరిసే చందమామే ఆటవస్తువు. చందమామను అద్దంలో చూపేవరకూ బాల రాముడు పాలబువ్వ తినేవాడు కాదనీ పురాణాల్లోను, పుస్తకాల్లోనూ చదువుకున్నాం. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తరచుగానే సందర్భానుగుణంగా చందమామను చూపించే సన్నివేశాలు ఉండేవి. ఇప్పుడూవున్నా -అప్పుడప్పుడనే చెప్పాలి. నిజానికి దక్షిణాదిన రూపుదిద్దుకున్న అనేక సినిమాల్లో చందమామ కూడా ఒక పాత్రధారే. అమ్మ గోరుముద్దలు పెట్టడానికే కాదు, ప్రణయ గాధలు చెప్పడానికి, ప్రేమ బాధలు చెప్పుకోవడానికి, నాయకా నాయికల గుణగణాలో, అందాలో వర్ణించడానికి.. ఇలా స్క్రీన్‌మీద చందమామ ఎప్పుడూ ముడిసరుకే.

1. పున్నమి వెన్నెల వెలుగులలో ఆ చందమామ కంటే ఆత్మీయుడైన స్నేహితుడు ఉంటాడా..

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే…

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే

మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే కృష్ణా ముకుందా మురారీ
కృష్ణా ముకుందా మురారీ..
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే

2. చాలా కాలం తర్వాత మనసుకు నచ్చిన చెలికాడు వస్తున్నాడన్న సంతోషంలో ఆ కన్య తన ముచ్చట్లన్నీ చంద్రుడితో చెప్పుకుంటుంది.

వస్తాడు నా రాజు ఈ రోజు.. రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీకపున్నమి వేళలోన.. కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీకపున్నమి వేళలోన.. కలికి వెన్నెల కెరటాలపైన
తేలివస్తాడు నా రాజు ఈ రోజు

వేలతారకల నయనాలతో.. నీలాకాశం తిలకించేను
వేలతారకల నయనాలతో.. నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను

ఆతని పావన పాదధూళికై.. అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే.. పాలసంద్రమై పరవశించేను… పాలసంద్రమై పరవశించేను
వస్తాడు నా రాజు ఈ రోజు.. రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

వెన్నెలలెంతగా విరిసినగానీ చంద్రుణ్ణీ విడిపోలేవు
కెరటాలెంతగా పొంగినగానీ కడలిని విడిపోలేవు
కలసిన ఆత్మల అనుబంధాలు.. ఏ జన్మకు విడిపోలేవులే

తనువులు వేరైనా.. దారులు వేరైనా
తనువులు వేరైనా.. దారులు వేరైనా
ఆ బంధాలే నిలిచేనులే.. ఆ బంధాలే నిలిచేనులే
వస్తాడు నా రాజు ఈ రోజు.. రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీకపున్నమి వేళలోన.. కలికి వెన్నెల కెరటాలపైన
వస్తాడు నా రాజు ఈ రోజు

3. తమను వీడి కనపడకుండా పోయిన తండ్రిని, అన్నను వెతుక్కుంటూ పట్నం వచ్చిన చిన్నారుల చందమామనే సాయం కోరుతున్నారు.

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ.. గొల్లుమన్నాము

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున ..
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..
వెతుకుతున్నామూ

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..
రాలేకవున్నావో…

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

4. కొత్తగా పెళ్లైన జంటకి తొలిరేయి తోడుగా ఉండేది ఆ చందురూడే.

మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి
మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి
మా అన్నకు మా చంద్రికి ఇది తొలి రేయి నాకిది వరమోయి ఈ
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి ఈ రేయి

గడుసు పిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ ఈ
మొరటువాని మనసు దానికి పులకరించిందీ ఈ
గడుసుపిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ ఈ
మొరటువాని మనసు దానికి పులకరించిందీ ఈ
ఇద్దరికీ ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి
ఆ ముద్దు చూసి చుక్కలే నిను వెక్కిరించాలి
కళ్ళు కుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవార నీయకోయి ఈ రేయి

పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ ఈ
పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ ఈ
పెళ్లి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ ఈ
పసుపు తాడే నోచుకోని బ్రతుకు నాదీ ఈ
ఈ పెళ్ళి చూసి నేను కూడా ముత్తైదువైనాను
ఈ పుణ్ణెమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి
మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి
మా అన్నకు మా చంద్రికి ఇది తొలి రేయి నాకిది వరమోయి ఈ
కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి తెల్లవారనీయకోయి ఈ రేయి
ఊహూ ఊహూ ఊహూ ఊహూ ఊహూ ఊహూ ఊహూ ఊహూ

5. ఏడ్చే పిల్లవాడు కూడా చందమామను చూపించినా, పాట పాడినా టక్కున ఊరుకుంటాడట.

మామా… చందమామా
వినరావా…నా కథ
మామా చందమామా
వినరావా నా కథ
వింటే మనసు ఉంటే
కలిసేవూ నా జత
మామా…చందమామా

నీ రూపము ఒక దీపము
గతిలేని పేదకు…”2″

నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు
నువు లేక నువు రాక
విడలేవు కలువలు…
జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు….

మింటిపైన నీవు ఓంటిగాడివై
అందరికీ వెన్నెల పంచ
రేయంత తిరగాలి

ఇంటిలోన నేను ఒంటిగాడినై
అందరికీ సేవలు చేయ
రేయి పవలు తిరగాలి

లేరు మనకు బంధువులు
లేరు తల్లిదండ్రులు
మనను చూసి అయ్యోపాపం
అనేవారు ఎవ్వరు
అనేవారు ఎవ్వరు…

మామా చందమామా
వినరావా నా కథ
వింటే మనసు ఉంటే
కలిసేవూ నా జత

6. ప్రేమలో పడిన జంటకి వేళాపాళా ఉండదు. ఆకలి దప్పులు ఉండవంటారు. కాని పగలే వెన్నెలగా ఉందంట. మండే సూర్యకాంతి చల్లని వెన్నెలలా ఉందంట. మరీ విడ్డూరం కదా.

ఈ పగలు రేయిగా
పండు వెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ ఆ… ఊఁ..
వింతకాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి… ఓ ఓ ఓ…

మనసున తొణికే చిరునవ్వెందుకు
పెదవుల మీదికి రానీవు
అహా ఓహో అహా… ఆ…

పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు ఊఁ…

కన్నులు తెలిపే కథలనెందుకు
రెప్పలార్చి ఏమార్చేవు
ఆఁ… ఆఁ… ఓ ఓ ఓ…

చెంపలు పూచే కెంపులు
నాతో నిజము తెలుపునని జడిసేవు
ఓహోహో…

అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు ఉహుహు…

నల్లని జడలో మల్లెపూలు
నీ నవ్వునకద్దము చూపేను ఆహా…

ఆహహాహా… ఆహహాహా…
ఆహహాహా… ఆహహాహా…
ఊహుహూ…

7. ఆహ్లాదకరమైన వేళ,మనసునిండా సంతోషం నిండినవేళ జగమంతా అందంగా, ఆనందంగా ఉంటుందంటారు.

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే
పగలే వెన్నెల జగమే ఊయల

నింగిలోన చందమామ తొంగి చూచే
నీటిలోని కలువభామ పొంగిపూచే
ఈ అనురాగమే జీవన రాగమై
ఎదలో తేనె జల్లు కురిసిపోద

పగలే వెన్నెల జగమే ఊయల

కడలి పిలువ కన్నె వాగు పరుగు తేసే
మురళి పాట విన్న నాగు సిరసునూపే
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా

పగలే వెన్నెల జగమే ఊయల

నీలి మబ్బు నీడలేసి నెమలి ఆడే
పూల రుతువు సైగ చూసి సిఖము పాడే
మనసే వీణగా జనజన మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే …….
పగలే వెన్నెల జగమే ఊయల

8. ఈ చందమామ అందరికీ హితుడైపోయినట్టున్నాడే. ఏ మాట చెప్పుకోవాలన్నా అతనే శరణ్యం..

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

వినుటయే కాని వెన్నెల మహిమలు
వినుటయే కాని వెన్నెల మహిమలు
అనుభవించి నేనెరుగనయా
అనుభవించి నేనెరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు
నీలో వెలసిన కళలు కాంతులు
లీలగా ఇపుడే కనిపించెనయా

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

కనుల కలికమిది నీ కిరణములే
కనుల కలికమిది నీ కిరణములే
మనసును వెన్నెగా చేసెనయా
మనసును వెన్నెగా చేసెనయా
చెలిమి కోరుతూ ఏవో పిలుపులు
చెలిమి కోరుతూ ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

9. ప్రేయసీప్రియుల సరససల్లాపాలలో ఆకాశవీధిలో ఉన్న చందమామ కూడా చేరిపోతాడు. సరాగాలాడతాడు.

ఆకాశ వీధిలో అందాల జాబిలీ వయ్యారి తారను జేరి
ఉయ్యాలలుగేనే సయ్యాటలాడెనే ||3||

జలతారు మేలిమొబ్బు పరదాలు నేసీ తెరచాటు చేసి
పరువాలు దాగి దాగి పంతాలు పోయీ పందాలు వేసి
అందాల చందామామ దొంగాటలాడెనే దోబూచులాడెనే ||ఆకాశ వీధిలో||

జడివాన హోరుగాలి సుడిరేగి రానీ జడిపించబోని
కలకాలం నీవే నేనని పలుబాసలాడీ చెలి చెంత చేరీ
అందాల చందామామ అనురాగం చాటేనే నయగారం చేసెనే ||ఆకాశ వీధిలో||

10. తమ భాగస్వాములు నేలమీద జాబిలిగా భావిస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు?

నేలమీది జాబిలి…నింగిలోని సిరిమల్లి
నా చెలీ… నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి…

నేలమీది జాబిలి…నింగిలోని సిరిమల్లి
నా చెలీ… నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి…ఈ..ఈ..
నేలమీది జాబిలి…

పిలిచెను కౌగిలింత రమ్మనీ…ఇమిడిపోమ్మనీ
తెలిసెను పులకరింత ఇమ్మనీ..దోచి ఇమ్మనీ…

మనసుకు వయసు వచ్చు తీయనీ రేయినీ
ఆ…ఆ…ఆ…
వయసుకు మతిపోయి పోందనీ హాయినీ

తొలి ముద్దు ఇవ్వనీ..మరుముద్దు పొసగనీ
మలి ముద్దు ఏదనీ..మైమరచి.. అడగనీ

నేలమీది జాబిలి…నింగిలోని సిరిమల్లి…
నా చెలీ… నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి…ఈ..ఈ..
నేలమీది జాబిలి…

వెన్నెల తెల్లబోయి తగ్గనీ..తనకు సిగ్గనీ
కన్నులు సిగ్గుమానీ..మొగ్గనీ…కలలు నెగ్గనీ
తరచిన మల్లెలు ఫక్కుమనీ ..నవ్వనీ..
పగటికి చోటివ్వక ఉండనీ..రాత్రినీ..
దీపాలు మలగనీ…ఆ…తాపాలు పెరగనీ…ఆ..
రేపన్న దానినీ ఈ పూటే చూడనీ…

నేలమీది జాబిలి…నింగిలోని సిరిమల్లి…
నా చెలీ… నెచ్చెలీ..చేరుకోరావా నా కౌగిలి…ఈ..ఈ..
నేలమీది జాబిలి…