మాలిక పత్రిక మార్చ్ 2018 సంచికకు స్వాగతం

Jyothivalaboju

Chief Editor and Content Head

కొత్త సంవత్సరం, మామిడి కాయలు పళ్లు, కొత్త కుండలో చేసిన పచ్చడి., భక్ష్యాలు…. మల్లెపూలు కూడానూ… తెలుగువారికి ప్రియమైన నూతన సంవత్సం ఉగాది పండగకు స్వాగతం చెప్తూ మాలిక పత్రిక పాఠకులు, రచయితలకు మనఃపూర్వకమైన శుభాకాంక్షలతో మార్చ్ మాసపు సంచిక మీకోసం ఎన్నో విశేషాలను తీసుకొచ్చింది.

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు ప్రత్యేకమైన రచనలు:

1. కలియుగ వామనుడు – 4
2. బ్రహ్మలిఖితం – 16
3. రెండో జీవితం – 6
4. మాయానగరం – 44
5. ఇసైజ్ఞాని ఇళయరాజా
6. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 24
7. ‘మనీ’షి
8. తను కన్నతల్లి
9. ఆపరేషన్ పాంచాలి
10. కృతజ్ఞత
11. కొత్త చీర
12. కొత్తది – పాతది
13. జవాబులు ?
14. పల్లెసద్దు
15.  తోడు
16. దయా మరణం
17. కార్టూన్స్

కలియుగ వామనుడు – 4

రచన: మంథా భానుమతి

అంతలో.. భళుక్ మని టింకూ మమ్మీ మీద కక్కేశాడు.
“ఓహ్.. ఎయిర్ సిక్ నెస్ ఉన్నట్లుంది. ఇదే ఫస్ట్ టైమా? టాయిలెట్ లోకి తీసుకెళ్లండి.” హోస్టెస్ సహాయంతో, టింకూని తీసుకుని వెళ్లింది మమ్మీ.
ఏ మాత్రం అసహ్యించుకోకుండా సొంత అమ్మ లాగే శుభ్రం చేసి తీసుకొచ్చింది. తన బట్టలు కూడా.. ఎవరో చెప్పినట్లున్నారు.. ఒక జత బట్టలు కూడా తెచ్చుకున్నట్లుంది.. అవి మార్చుకునొచ్చింది.
టింకూ, చిన్నాలవి ఎలాగా బాక్ పాక్ లో పైన ఉన్నాయి.
చిన్నా ఆశ్చర్యంగా చూస్తున్నాడు.. అస్సలు కొంచె కూడా అనుమానం రాకుండా, బయట పడకుండా ఆవిడ చేస్తున్న పనులని. బిక్క మొహం వేసుకుని చూస్తున్న చిన్నాకి నవ్వుతూ ధైర్యం చెప్పింది.. ఫరవాలేదంటూ.
ఆ తరువాత టింకూ నిద్ర పోయాడు.
ఎదురుగా ఉన్న టివీలో, చిన్నా న్యూస్ చూడ్డానికి ప్రయత్నం చేశాడు. అంతా ప్రపంచ వార్తలు. దుబాయ్ లో కడుతున్న కొత్త మాల్ విశేషాలు..
ఎక్కడో ఇండియాలో జరిగిన కిడ్నాప్ ల గురించి వాళ్లెందుకు చెప్తారు?
అదీ.. ఇంత కాలం తరువాత.
చిన్నాకి ఉన్నట్లుండి నీరసం వచ్చేసింది. దూరం.. దూరం వెళ్లి పోతున్నాడు. అమ్మా నాన్నలని ఇంక చూడలేడేమో! కొన్నాళ్ల తరువాత, తమని తీసికెళ్తున్న వాళ్లకి తన ప్రత్యేకత గురించి తెలుస్తుంది. అప్పుడేం చేస్తారు?
సరిగ్గా అదే సమయంలో గుర్తుకొచ్చింది..
డాక్టర్ ప్రకాశ్ గారు, నెలకొకసారి వచ్చి, పరీక్షలు చేయించుకోమన్న సంగతి. ప్రతీ నెలా, రక్తం, కాల్షియమ్, పెరుగుదల ఎలా సాగుతోందో.. ఎముకల గట్టిదనం.. అన్నీ పరీక్షిస్తుండాలని అన్నారు.
అప్పుడే రెండునెలలై పోయాయి.
ఇంక అసలు ఏ పరీక్షైనా చేయించుకోగలుగుతాడో లేదో తెలియదు. డాక్టర్ దగ్గరకెప్పుడయినా వెళ్లగలడా.. అంతేనా తన లైఫ్..
హాస్పిటల్లో తనని ఎంతో ముద్దు చేసే డాక్టర్లు, నర్సులు.. అమ్మా, నాన్నా.. నాయనమ్మ..
ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది చిన్నాకి. వెక్కటం మొదలెట్టాడు.
“వాడైంది.. ఇప్పుడు నువ్వా?”మమ్మీ విసుగు కనిపించనీయకుండా అంది.
“కవలలామ్మా? అంతే మరి.. తప్పదు. నీకు వాళ్లు పుట్టినప్పట్నుంచీ అలవాటై పోయుండాలి కదా?” పక్క సీటాయన నవ్వుతూ అన్నాడు.
“టాయిలెట్ కెళ్తావా?”
“అక్కర్లేదు మమ్మీ! చెవులు నొప్పి.”
మమ్మీకి ఏం చెయ్యాలో తోచలేదు. అంతలో హోస్టెస్ ఆంటీ వచ్చింది.
“చాక్లెట్ చప్పరించు. నోరు తెరిచి గట్టిగా గాలి పీల్చు. తగ్గిపోతుంది.” తను రెండు సార్లు చేసి చూపించింది.
కొంచెం సేపటికి సర్దుకుని టివీలో కార్టూన్లు చూడసాగాడు చిన్నా.
నాలుగు గంటల్లో దుబాయ్ వచ్చేసింది.
టింకూని లేపిందావిడ నెమ్మదిగా. కళ్లు నులుముకుంటూ లేచాడు.
“వచ్చేశామా? ఎక్కడికి?”
“ఎక్కడికేంటీ.. డాడీ దగ్గరకి. త్వరగా పదండి.” సూట్ కేసు చిన్నా లాగుతుండగా, బాక్ పాక్ తగిలించుకున్న పిల్లలిద్దరినీ ముందర నడిపించుకుంటూ విమానంలోనుంచి బయటకొచ్చింది మమ్మీ.
“వెల్ కమ్ టు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.” చిన్నా చదివాడు. ఇక్కడన్న మాట తాముండ బోయేది. అది తెలిసుంటే, విమానంలో దీని గురించి బాగా తెలుసుకునేవాడే కదా!
ఇమిగ్రేషన్ క్యూలో నిల్చున్నప్పుడు చిన్నాకి మళ్లీ ఏదే ఆశ..
ఫారిన్ కంట్రీ కదా! ఇంకా జాగ్రత్తగా ఉంటారేమో.. పిల్లల్ని ఇల్లీగల్ గా తీసుకొస్తున్నారని కనిపెడ్తే బాగుండును..
కౌంటర్ దగ్గర అన్ని వివరాలూ చూసి, పొడవాటి తెల్లని గౌనేసుకుని, తలమీద తెల్లని టోపీ లాంటిది పెట్టుకున్నాయన నవ్వుతూ చూశాడు.
చక్కని హిందీలో మాట్లాడ్డం మొదలు పెట్టాడు. ఫోటొలనీ, పిల్లలనీ, మమ్మీనీ తీక్షణంగా, పైనించి కిందికి చూశాడు.
“ఓ.. మీ హబ్బీ కామెల్ రేస్ ఫామ్ లో వర్క్ చేస్తాడా? గుడ్. ఈ సారి రేసెస్ కి నాకొక పాస్ ఇప్పిస్తావా?” నవ్వుతూ మాట్లాడాడు. ముగ్గురికీ ఫొటోలు తీశాడు. ముద్రలేసి పంపేశాడు.
సామాన్లు తీసుకునే దగ్గరే నిల్చుని చూస్తున్నాడు ‘డాడీ’. పిల్లి గడ్డం, నెత్తి మీద టోపీ.. తెల్లని పైజామా, లాల్చీ. తనే దగ్గరికి వచ్చి పలుకరించాడు.
సామాన్లు రావడానికి గంట పైనే పట్టింది.
కళ్లలో అనాసక్తత. ఎటో చూస్తూ యాంత్రికంగా నవ్వుతూ, దగ్గరికి తీసుకున్నాడు పిల్లలని.
సామాన్లు వచ్చే వరకూ అస్థిమితంగా అటూ ఇటూ తిరుగుతూ గడ్డం తడుముకుంటూ గడిపాడు.
“అవిగో..” మమ్మీ అరిచింది.
“చలో.. తొందరగా వెళ్లాలి.” సామాన్లు వచ్చిన వెంటనే.. పెద్ద పెద్ద అంగలేస్తూ బయటికి నడిచాడు.
డాడీని అందుకోడానికి, తమ చిన్న సూట్ కేసులు నెట్టు కుంటూ పరుగందుకున్నారు.
అప్పుడు దుబాయ్ టైమ్ పొద్దున్న ఆరున్నర.
మరొక మజిలీ ప్రారంభమయింది చిన్నా, టింకూలకి.
…………………….

ఒంటె పందాలలో అల్ ముధారి(ఒంటెలకి శిక్షణ ఇచ్చేవాడు) దే ముఖ్యమైన పాత్ర. అతని శిక్షణ బాగా ఉండి, ఒంటెలు గెలుస్తుంటే పేరు, కీర్తి వద్దన్నా వళ్లో వాల్తాయి.
అత్యధిక పారితోషకం తీసుకునే వృత్తులలో ఒంటెల శిక్షణ ముందుంటుంది. మంచి శిక్షకులు అరుదుగా ఉంటారు.
ఒంటెలకిచ్చే శిక్షణ రెండు విడతలుగా ఉంటుంది.
మొదటిది ‘అల్ అదాబ్’.. అంటే ఒంటెలకి అణకువగా ఉండేట్లు శిక్షణ ఇస్తూ ట్రయినర్ ఇస్తున్న ఆదేశాలని గ్రహించేలాగ చెయ్యడం. ఇది సుడానీస్ ట్రయినర్స్ బాగా ఇస్తారని పేరు.
పదమూడు నెలల ఒంటె పిల్లలకి మొదలుపెడతారు ఈ శిక్షణ. మూడు నెలల పాటు సాగుతుందది.
ఒంటె పిల్లని బాగా శిక్షణ పొందిన పెద్ద ఒంటెకి తాడుతో కడతారు. అది గైడ్ కింద పని చేస్తుంది.
దాని కదలికలు అదుపులో పెట్టడానికి, చిన్న ఒంటె తలచుట్టూ ఒక తాడు కట్టి, జాకీ కూర్చొనే మెత్తని జీను (అల్ శదాద్ లేక మహావీ అంటారు) వీపు మీద వేసి అలవాటు చేస్తారు.
అప్పుడప్పుడు ఇరవై పాతిక కిలోలున్న బరువుని కూడా పెట్టి, రేస్ ట్రాక్ మీద నడవడం కూడా నేర్పిస్తారు.. చివరికి ఒంటెకి పరుగెత్తడం వచ్చే వరకూ ఈ శిక్షణ ఉంటుంది.
ఒంటెకి మూడు సంవత్సరాలు వచ్చే సరికి పందెం లో పాల్గొనడానికి అర్హత వస్తుంది. అప్పుడు రెండవ స్టేజ్ మొదలవుతుంది.
రెండవ విడత శిక్షణలో ఒంటెలని మంచి ఫామ్ లోకి తీసుకొస్తారు. బరువు, ఎత్తు, చురుకుదనం.. అన్నీ సమంగా ఉండేలాగ.. గంటకి నలభై కిలోమీటర్లు పైగా పరుగెత్త గలిగేట్లు ట్రయినింగ్ ఇస్తారు.
మొదట్లో, పొద్దున్నే.. ఒంటెలని 20 కిలో మీటర్లు నడకకి తీసుకెళ్తారు. ఎండ ఎక్కువ అవక ముందే ఫామ్ కి తీసుకొచ్చి, అల్ఫా అల్ఫా గడ్డి, బార్లీ పెట్టి నీళ్లు తాగిస్తారు. ఎండ తగ్గే వరకూ నీడలో ఉంచుతారు. మళ్లీ నీళ్లు తాగించి, ఖర్జూరాలు బాగా తినిపిస్తారు.
సెప్టెంబర్ నెల వస్తుందంటే, శిక్షణ తీవ్రం చేస్తారు. నీళ్లు, ఆహారం తమతో తీసుకెళ్తారు. నలభై కిలో మీటర్లు పైగా నడిపిస్తారు. తలకి తాడు, వీపు మీద జీను తప్పదు. ఒక్కొక్క సారి జాకీలని కూడా కూర్చో పెడతారు.
బాగా నీళ్లు తాగిస్తారు. ఒంటె ఒక సారి ఏడు లీటర్ల వరకూ నీరు తాగగలదు. అలాగే.. రెండునెలల వరకూ నీరు లేకుండానూ ఉండగలదు.
అందుకే అది ఎడారి ఓడ అయింది.
చాలా మంది ముధారీలు తమ క్రీడాకారులైన ఒంటెలకి చాలా బలవర్ధకమూ, పోషక విలువలు కలిగిన ఆహారాన్నిస్తారు. ఆవుపాలలో, గొర్రె పాలలో చాలా ఖరీదైన, సహజ సిద్ధమైన తేనె కలిపి ఇస్తారు.
అనుక్షణం కనిపెట్టుకుని శిక్షణ ఇచ్చే ముధారీలకి ఆరబ్ దేశాల్లో చాలా గిరాకీ ఉంటుంది.
వారిలో అబ్దుల్ హలీమ్ ఎన్న దగిన వాడు.

‘అబ్దుల్ హలీమ్’.. యు.ఏ.ఇ దేశాలన్నిటిలో పేరు పొందిన ‘అల్ ముధారి’. . తర తరాలుగా ఎడారుల్లో ఒంటెలని సాంప్రదాయకంగా పెంచే కుటుంబానికి చెందిన వాడు.
ఎన్నో పందాలలో అతను శిక్షణ ఇచ్చిన ఒంటెలు బహుమతులను గెలుచుకోడం చూసి, స్వయంగా షేక్ అతన్ని తన ఒంటెలకి శిక్షణ ఇవ్వడానికి పెట్టుకున్నాడు.
షేక్ కి పాతిక పైగా ఒంటెలున్నాయి. వాటికి చాలా విశాలమైన మైదానం ఉంది. అందులో దాదాపు వంద మంది వరకూ పని చేస్తుంటారు.
అందరికీ, వారి వారి హోదాని బట్టి ఇళ్లు, వాహనాలు ఉంటాయి.
హలీమ్ కి విశాలమైన ఎయిర్ కండిషన్డ్ ఇల్లు, బెంజ్ కారు.. అతని పిల్లలకి యూరోపియన్ స్కూల్లో చదువు, ఇంట్లో పని వాళ్లు.. వంటి సదుపాయాలుంటాయి.. జీతం కాక.
ఒక చిన్న షేక్ కున్నట్లే ఉంటుంది జీవితం.
అతని కింద కాబోయే ముధారీలు నలుగురు పని చేస్తుంటారు. ఒంటెలతో పాటు, వాటి శిక్షకులకి కూడా శిక్షణ ఇవ్వడం అతనికి ఇష్టమయిన వృత్తి.
ఒంటె ఫామ్ కి ఐదు మైళ్లలో ఉంటుంది అతని ఇల్లు.
రోజుకి పన్నెండు గంటలు పైగా పని చేస్తాడతను.
చూడ్డానికి ఎంతో నెమ్మదిగా చిరునవ్వుతో ఉంటాడు.. కానీ తనకి కావసింది సాధించడంలో అంత కఠినంగా ఎవరూ ఉండలేరు.
తన ఒంటెలకి కావలసింది అనుకున్న సమయాని దొరకలేదా.. వెంటనే ఆ మనిషి మీద చర్య తీసుకోవలసిందే.
అదే విధంగా.. చెప్పిన మాట వినక పోతే ఒంటెలనయినా వదలడు. సాధారణంగా ఒంటెలని కొట్ట కూడదనేది, ముధారీల నియమం. మరీ మొండి ఒంటెలు హలీమ్ చేతిలో కొరడా దెబ్బలు తినాలిసిందే.
సెప్టెంబర్ నెల వచ్చిందంటే హలీమ్ కి రోజుకి ఇరవై నాలుగు గంటలు చాలవు. తెల్లవారకుండానే అసిస్టెంట్ లని పిలిచి ఎవరెవరు, ఏ ఒంటెలని ఎటుపక్కకి తీసుకెళ్లాలో.. ఏ ఆహారం ఎంత తీసుకెళ్లాలో అన్నీ పక్కాగా చెప్తాడు.
తమ పుస్తకాల్లో రాసుకుని, తు.చ తప్పకుండా పాటించాలి అందరూ.
అటూ ఇటూ అయిందంటే అంతే సంగతులు. వాళ్లు వేరే చోట పని వెతుక్కోవలసిందే.
అలాగే.. మిగిలిన స్టాఫ్ అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే… ప్రతీ పనీ స్వయంగా పర్యవేక్షిస్తాడు.
చివరికి, ఒంటెల పేడ తీసి శుభ్రం చేసే దగ్గర కూడా.
అక్టోబర్ నెలలో జరగ బోయే పందాలకి సెప్టెంబర్ రాకుండానే, ఒంటెలని ట్రాక్ దగ్గరకి తీసుకెళ్ల నిస్తారు. అక్కడ ప్రాక్టీస్ చేయించ వచ్చు..
అసిస్టెంట్లకి ఒంటెల చేత ట్రాక్ ప్రాక్టీస్ చేయించ మని చెప్పి, జాకీల సెలెక్షన్ కోసం తను ఆగి పోయాడు, అబ్దుల్ హలీమ్.
…………………

విమానాశ్రయం బైటికి వచ్చాక కొత్త అమ్మ, డాడీకి పిల్లలనీ వాళ్ల పాస్ పోర్ట్ లనీ అప్పగించి, తను వేరే వెళ్లి పోయింది.
ఆవిడ తన వీసా పేపర్లలో చూపించిన మొగుడు అసలు మొగుడే. అతను టాక్సీలు ఆగే దగ్గర నిల్చుని చూస్తున్నాడు.
కాకపోతే, పిల్లలు లేరు వాళ్లకి. ఆ సంగతి ఒంటె పందాల అంతాజా (అంతర్జాతీయ) ముఠా వాళ్లు, వాళ్ల గురించి తెలుసుకుని, పట్టుకుని, చిన్నా టింకూలని వాళ్ల పిల్లల కింద బర్త్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ వీసాలని సంపాదించి తీసుకొచ్చేశారు.
ఒక సారి వారనుకున్న దేశం వచ్చేశాక ఎవరి దారి వారిదే. ఆ పని చేసినందుకు లక్షల్లో ఉంటుంది వారికి బహుమానం.
డాడీని చూస్తుంటే మమ్మీని చూసినప్పటి లాగా ఫరవాలేదని అనిపించ లేదు చిన్నాకి. కొంచెం భయం వేసింది.
“సమీర్, సుభానీ.. ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా” పాస్ పోర్ట్ లు తీసి పేర్లు చూస్తూ అడిగాడు, టాక్సీలో ఎక్కి కూర్చున్నాక.
“హా.. డాడీ.” కిటికీ లోంచి పెద్ద పెద్ద భవనాలని చూస్తూ సమాధాన మిచ్చాడు చిన్నా.
టింకూకి అంతా అయోమయంగా ఉంది. విమానంలో ఏమీ తినలేదేమో.. ఆకలిగా, నీరసంగా ఉంది.
కారులో కూర్చున్నాక ఫరవా లేదు కానీ, ఎయిర్ పోర్ట్ బైట నిలుచున్నప్పుడు ఎండకి కళ్లు మండి పోయాయి.. తీక్షణమైన ఎండ.
అలా సీటు మీదికి సోలి పోయాడు. వెంటనే కళ్లు మూసుకుని నిద్ర లోకి జారుకున్నాడు..
“ఎక్కడికెళ్తున్నాం డాడీ?” చిన్నా ప్రశ్నకి పక్కకి తిరిగి వాడి కేసి చూశాడు డాడీ.. ఆ చూపుకే అర్ధమయింది చిన్నాకి, ప్రశ్నలేం అడక్కూడదని. మమ్మీ దగ్గర లాగే కొడుకులా ఉండాలేమో అనుకున్నాడు..
కానీ.. కాదు. ఇప్పుడు పూర్తిగా వేరే పాత్ర వెయ్యాలని తెలిసి పోయింది. అదేం రోలో.. ఏం చెయ్యాలో..
“కొత్త ఇంటికి.”
ఇంకేం మాట్లాడకుండా తను కూడా కళ్లు మూసుకున్నాడు.
కారు ఆగి తలుపు తియ్యగానే తెలివొచ్చింది చిన్నాకి. వేడి గాలి ఈ చెవిలోంచి ఆ చెవిలోకి కొడుతోంది. టింకూని కూడా లేపాడు.
పెద్ద పాలస్ లాంటి ఇల్లు. ఇంటి ముందు పోర్టికోలో నాలుగు కార్లు, రెండు వాన్ లు ఉన్నాయి.
చిన్నా ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూశాడు.
ఇక్కడా తాముండ బోయేది?
టాక్సీని కాసేపు ఆగమని చెప్పి పిల్లలని ఇంట్లోకి తీసుకెళ్లాడు డాడీ.
అంత పెద్ద హాలు సినిమాల్లో కూడా చూడలేదు చిన్నా. తలుపు దగ్గరే ఆగి, తాము వచ్చినట్లు సాబ్ కి చెప్పమని పనామెకి చెప్పాడు డాడీ.
హాలు కప్పు ఎంత ఎత్తుందంటే, చిన్నా మెడ విరిగేట్లు చూడాల్సి వచ్చింది. టింకూ, నోట్లో వేలేసుకుని చిన్నా చెయ్యి పట్టుకున్నాడు.. బిక్క మొహం వేసుకుని బెదురు చూపులు చూస్తూ.
ఇద్దరూ అయోమయంగా చూస్తూ, డాడీ పక్కన నిలుచున్నారు.
లోపల్నుంచి పొడవాటి తెల్ల గౌనేసుకున్నాయన వచ్చాడు. నవ్వుతూ డాడీని పలుకరించాడు.. చిన్నాకి అర్ధం కాని భాషలో.
“గుడ్.. ఈ సారి సక్సెస్ అయిందా మిషన్? బాగున్నారు పిల్లలు. ట్విన్సా? జాగ్రత్తగా డీల్ చెయ్యండి. ఏ దేశం? పాకిస్తానా?” ఏ దేశమైతే ఏంలే అనుకుంటూ అడిగాడు. ఏదో ఒకటి అడగాలి కదా..
“కాదు సాబ్. ఇండియా.”
“ఓ.. ఇండియా! మా రోడ్ కాంట్రాక్టర్ దగ్గర చాలా మంది ఇండియన్స్ పని చేస్తున్నారు. హార్డ్ వర్కింగ్. హోప్.. వీళ్లు కూడా అంతే అనుకుంటా..”
ఐదారేళ్ల పిల్లలు.. హార్డ్ వర్కింగ్ కావాలా? ఆ మాట అర్ధమయిన చిన్నాకి అయోమయంగా ఉంది.
“హా సాబ్.. చాలా శ్రమ అయింది సాబ్.”
“అవునవును. తెలుసు. మానేజర్ ని అడుగు. మామూలు కంటే డబల్ ఇస్తాడు.”
“థాంక్ యూ సాబ్.”
తల పంకించి లోపలికెళ్లపోయాడు తెల్ల గౌనాయన.
పిల్లల్ని తన వెనుకే రమ్మని తలూపి బైటికెళ్లాడు డాడీ.
పెద్ద పెద్ద అంగలేస్తూ.
పరుగెత్తుకుంటూ వెళ్లి కారెక్కారు చిన్నా, టింకూ.
డాడీ చాలా ఖుషీగా ఉన్నాడు. పిల్లలిద్దరినీ నవ్వుతూ పలుకరించాడు. తన పెద్ద జేబులోంచి చాక్లెట్ తీసిచ్చాడు.
విమానాశ్రయం వద్ద కలిశాక ఇదే మొదటి సారి డాడీ ఇలా నవ్వడం.
టింకూ కూడా హాయిగా నవ్వాడు, విమానం లోంచి దిగాక మొదటి సారిగా.
“మనింటికా..” అడగబోయి నోరు మూసుకున్నాడు చిన్నా.
“ఎప్పుడూ నువ్వే మాట్లాడ్తావేంటి? తమ్ముడికి మాటలు రావా?”
“థాంక్యూ డాడీ!” టింకూ సన్నగా అన్నాడు.
*****
ఒంటెల పందాల బిజినెస్ లో ఒంటెల తరువాత అతి ముఖ్యమైన పాత్ర జాకీలది. కానీ ఒంటెల మీద పెట్టిన శ్రద్ధ జాకీల మీద పెట్టరు. జాకీ లు దొరికినంత చవగ్గా ఒంటెలు దొరకవు మరి.
ఒంటెల యజమానుల తరువాత జాకీల యజమానులదే ప్రాముఖ్యత, సంపద అంతా.
ఆ పెద్ద పాలస్ లో ఉన్న పొడవాటి డ్రస్సాయన.. పేరు పొందిన వ్యాపారస్థుడు. అరడజను పైగా పెట్రోలు బావులున్నాయి.
వంద మంది పైగా జాకీలకి యజమాని.
పందాలకి ఒంటెలనీ, జాకీలనీ అద్దెకిచ్చే వాళ్లకి ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉంటుంది.
జాకీల యజమానుల పలుకుబడిని, డబ్బుని ఉపయోగించి పిల్లలకి పాస్ పోర్ట్ లు, వీసాలు తెప్పించ గలుగుతున్నారు రకరకాల స్థాయిల్లో.
ఏ విధంగా తెస్తున్నారూ.. ఎంత ఖర్చు పెడుతున్నారూ అనేది యజమానికి అనవసరం. చివరికి సరుకు చేరిందా లేదా.. అంతే.
తినడానికి, గుడ్లు పెట్టటానికి, కోళ్లు పెంచుతారు..
ఒంటెలని అదిలించడానికి పసివాళ్లని తీసుకొస్తారు.
ఆ కోడి పిల్లలకీ, ఈ మనిషి పిల్లలకీ పెద్ద తేడా ఏం లేదు.
అయితే కోళ్లు ఒక్క వేటుకే పోయి ఆహారమైపోతాయి
కోట్లు సంపాదించడానికి కారకులైన జాకీలని మాత్రం క్షణ క్షణం చిత్రహింస పెడుతూనే ఉంటారు.

చాలా దూరం ప్రయాణం చేశాక ఒక పెద్ద మైదానంలాంటి బయలు ప్రదేశానికి తీసుకెళ్లాడు టాక్సీని ‘డాడీ’.
పెద్ద గేటు. చుట్టూ ఫెన్సింగ్. కనుచూపు మేరలో చెట్టనేది లేదు. ఫెన్సింగ్ చుట్టూ ఉన్న ముళ్లపొదలు తప్ప.
గేటులోంచి లోపలికి వెళ్లాక .. అక్కడ చిన్న చిన్న మెటల్ షెడ్స్ లాంటివి ఉన్నాయి. ఎక్కడా ఎవరూ ఉన్న అలికిడి లేదు.
ఆ మైదానాన్ని ఔజుబా ఫామ్ అంటారు. రేసులు జరిగే స్థలానికి దూరంలో ఉంటాయి ఔజుబాలు. ఆ షెడ్లలో ఉంచుతారు స్మగుల్ చేసిన పిల్లలని.
వాళ్లే కాబోయే కామెల్ జాకీలు.
ప్రపంచ ప్రఖ్యాతమైన ఒంటె రేసుల్లో ముఖ్య పాత్ర ధారులు.
పొద్దున్న తొమ్మిది గంటలు దాటింది.
పైనుంచి నిలువునా కాల్చేసే ఎండ. అది నేల మీదికి పడగానే వెనక్కి పంపే గాజు పొడి లాంటి ఇసుక.
టాక్సీ దిగి బయటికి రాగానే కొలిమిలో అడుగు పెట్టినట్లు అనిపించింది చిన్నాకి. టింకూ ఐతే ఎండి పోయినట్లు అయిపోయాడు.
“ఇదన్నమాట కొత్త ఇల్లు. ఇక్కడుండాలి ఇక నుంచీ. నో మమ్మీ, నో డాడీ..” గొణుక్కుంటూ ఆకాశం కేసి చూశాడు చిన్నా.
టింకూకి నేనూ.. నాకు టింకూ తోడు.
“కనీసం మమ్మల్నైనా ఒక చోట ఉంచేట్లు చూడు సామీ!”
తెల్లని ఆకాశం.. ఎక్కడా మబ్బన్న మాట లేదు. దేవుడికి రాయబారం పంపుదామంటే.
దూరంగా ఉన్న షెడ్ లోంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు.. నల్లగా, పొడుగ్గా, తలమీది జుట్టంతా రింగు రింగులుగా, నెత్తి మీంచీ చెమటలు కక్కుకుంటూ ఒకతను. సినిమాల్లో చూపించే విలన్లు అంత కంటే సున్నితంగా ఉంటారు.
ఎండలో అతగాడి ఒంటిమీది చెమట నిగనిగా మెరుస్తోంది. కాకీ నిక్కరు, మాసి పోయినట్టున్న బనీను.
చిన్న పిల్లలు చూస్తేనే ఝడుసు కునేట్లున్నాడు.
మొహంలో ఈ చివరి నుంచా చివరికి మూతి సాగ దీసి, తెల్లని పళ్లు మెరిసేలా నవ్వుతూ వచ్చాడు.
“నజీర్! ఎలా ఉంది పని? ఇంకో ఇద్దర్ని తీసుకొచ్చా.” చిన్నాకి అర్ధం కాని భాషలో మాట్లాడుకుంటున్నారు.
చేతులు తిప్పడాన్ని బట్టి, సైగలని బట్టీ కొంత అర్ధ మవుతోంది.
ఆ నల్లతని పేరు నజీర్ అని మాత్రం తెలుస్తోంది.
“మామూలే వకీల్ సాబ్. పిల్లలతో మీకు తెలియందేముంది. ఏదో ఒక గొడవే రోజూ. వీళ్లు ట్విన్సా? భలే ఉన్నారు.. చూడ్డానికి. ముందుగా వీళ్లని చూస్తేనే జనం ఫ్లాట్. ఆ పాకిస్తాన్ వాళ్లేనా?”
“ఏ పాకిస్తాన్ వాళ్లు?” వకీల్ అని అందరూ పిలిచే డాడీ అడిగాడు.
“లాస్ట్ వీక్ తెస్తానన్నావు కదా? ఇద్దర్ని..”
“ఓ.. ఆ కేసా? తినడానికి తిండి లేదుకానీ.. ఆ లేడీ కి పౌరుషం చాలా ఉంది. ఇద్దరు పిల్లలూ.. సరిగ్గా మనకి పనికొచ్చేలా ఉన్నారు. వాళ్ల ఫాదర్ మన దగ్గర కొచ్చాడు. రెండో వాడు మరీ టూ ఇయర్స్. మనవే పెంచాలి. ఐనా ఫర్లేదనుకున్నా.. కానీ ఆ మదరే.. చస్తే ఒప్పుకోనంది.”
“అయ్యో.. బాగుండేది. మన క్కూడా, ఇక్కడి కొచ్చాక సగం మందే పనికొస్తున్నారు. తీరా కష్ట పడి ట్రయినింగ్ ఇచ్చాక. అందుకే ఎక్కువ మందిని ట్రయిన్ చెయ్యాల్సి వస్తోంది.” నజీర్ వాపోయాడు.
“ఆ మదర్ తిక్క కుదిరిందిలే.. మొగుడికి ఒళ్లు మండి మొహం మీద యాసిడ్ పోశాడు. లైఫ్ లాంగ్ ఏడవ్వలసిందే.” వకీల్ గట్టిగా నవ్వాడు.
“ప్చ్.. ఆ పని చెయ్యకుండా ఉండాల్సింది. మీడియాకి తెలుస్తే ఎంత ప్రమాదం..” భయంగా అన్నాడు నజీర్.
వకీల్ ఇంకొంచె గట్టిగా నవ్వాడు.
“మీడియా.. ఎలా తెలుస్తుంది?”
కొంచె ఇంగ్లీష్, కొంచెం వచ్చీ రాని అరాబిక్ కలిపి సాగుతున్న సంభాషణ, వాళ్ల హావ భావాలతో బాగానే అర్దమవుతోంది చిన్నాకి.
కాళ్లలోంచీ వణుకు పుట్టింది. వాళ్లు రాక్షసులా మనుషులా..
ఎండ వేడి లోపల్నుంచీ మంట పుట్టిస్తోంది. టింకూ ఐతే శోషొచ్చి పడి పోయేట్లున్నాడు.
“వాళ్ల బదులు వీళ్లిద్దరినీ తెచ్చాను. ట్విన్స్ ట. కరెక్ట్ గా మనకి పనికొచ్చే ఏజ్.” ఇద్దరి పాస్ పోర్ట్ లూ నజీర్ చేతిలో పెట్టాడు డాడీ.
నజీర్ ఎగాదిగా చూశాడు పిల్లల్ని.
టింకూనీ, చిన్నానీ ఒకళ్ల తరువాత ఒకళ్లని నడుం దగ్గర పట్టుకుని గాల్లోకి లేపాడు.
తయారుగా లేరేమో.. అంతెత్తు లేపే సరికి బిత్తరపోయి, ఇద్దరూ కంఠనాళాలు పగిలి పోతాయేమో అన్నట్లు అరిచారు.
అదేం పట్టించుకోలేదు అక్కడున్న ఇద్దరు పెద్దాళ్లూ. పిల్లల్ని అణువణువూ పరీక్షించడంలో మునిగి పోయున్నారు. వాళ్ల అరుపులు దున్న పోతుల మీద జడివాన కురిసినట్లే..
“ట్విన్సా.. అలా లేరే..” తల అడ్డంగా ఆడిస్తూ రెండు చేతులూ తక్కెడ లాగ చేసి, పైకీ కిందికీ ఆడించాడు నజీర్.
చిన్నా చిన్ని గుండె మళ్లీ దడదడలాడింది.
“ఈ ఫెలో కొంచెం ఏజ్డ్ గా ఉన్నాడు. ట్విన్స్ కానే కాదు. బట్.. నాకు ఓకే. బరువు సరిగ్గా ఉంది. మనకదేగా కావాలి.”
“అమ్మయ్య పనికొస్తారు కదా! నువ్వు యస్ అనే వరకూ నాకు టెన్షన్. ఇప్పుడు హాయిగా నిద్రపోతా. ఎంత అలవాటైనా.. ఒక్కొక్క కేసూ క్లియర్ అయే వరకూ బెదురుగానే ఉంటుంది.”
టాక్సీలోంచి ఇద్దరి సూట్ కేసులూ దించి వెళ్లిపోయాడు డాడీ. టాటా ఐనా చెప్ప లేదు.. పిల్లల కేసి చూడను కూడా చూడ లేదు.
అతని దృష్టిలో వాళ్లు రక్త మాంసాలున్న మనుషులు కాదు.
తన వెనుక రమ్మన్నట్లుగా తలూపి రెండో షెడ్ లోకి నడిచాడు నజీర్.
తమ సూట్ కేసులు ఇసుకలో కష్టపడి లాక్కుంటూ నజీర్ వెనుకే నడిచారు చిన్నా, టింకూ.
షెడ్ లోపల అంత వేడి లేదు. కానీ బైట ఉన్న కాల్చేసే ఎండ, మెటల్ కప్పు.. నీరసంగా నడుస్తోందో లేదో అన్నట్లున్న ఏసీ.. అంతలాగ చల్లబర్చడం లేదు. అయినా ఫరవాలేదు. మరి ఆ చిన్ని జాకీలు వడదెబ్బకి మాడి మసై పోకుండా ఉండాలి కదా!
పిల్లలిద్దరూ చెమటతో తడిసి ముద్దయ్యారు.
లోపల అప్పటికే నలుగురు పిల్లలున్నారు. ఒక్కడు తప్ప అందరూ ఇంచుమించు, చిన్నా టింకూ లంతే ఉన్నారు. వెనుకొక తలుపుంది.
తలుపులు లేని గోడల దగ్గర, వరుసగా సూట్ కేసులు, వాటి పక్కన బొంతల్లాంటి పరుపులు ఉన్నాయి. ఖాళీగా ఉన్న చోట్లో చిన్నా, టింకూల సూట్ కేసులు పెట్టుకోమన్నాడు నజీర్.
“అంకుల్.. ఉస్..” టింకూ భయం భయంగా అడిగాడు. పొద్దున్నెప్పడో విమానంలో వెళ్లిందే.. అసలా వేడికి ఒంట్లో ఉన్న నీరంతా ఇగుర్చుకుని పోయినట్లయింది.
వెనుక తలుపు వైపుకి సైగ చేశాడు అంకుల్.
టింకూ వెనుకే చిన్నా కూడా వెళ్లాడు.
కొంచెం దూరంలో వరుసగా ఆరు బాత్రూములున్నాయి.
అక్కడున్న పది షెడ్లకీ అవే. ప్రతీ బాత్రూంలోనూ, షవర్, లెట్రిన్ ఉన్నాయి.
టింకూ వెళ్లి రాగానే చిన్నా కూడా వెళ్లొచ్చాడు. స్నానం చెయ్యాలి..
ఒళ్లంతా జిడ్డు, చెమట.
కానీ భయానికి ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు చిన్నా. టింకూకి కూడా వాడే చేయిస్తున్నాడు రోజూ.
ఆకలేస్తోంది. తింటానికేవన్నా పెడతారా..
“హోహో బాయిస్…. కమాన్.” నజీర్ కేక విని తమ షెడ్లోకి పరుగెత్తారిద్దరూ.
“ఇవి తిని త్వరగా రెడీ అవండి. బైటికెళ్లాలి.” సైగలతో చెప్పి బైటికి వెళ్లి పోయాడు నజీర్.

‘అవి’ చూడగానే ఏడుపందుకున్నాడు టింకూ. ఎండి పోయిన బ్రెడ్ ముక్కలు. చిన్న ప్లాస్టిక్ గ్లాసుల్లో పాలు. టింకూకి బ్రెడ్ అస్సలు సయించదు. ఆకలేస్తోంది. ఎదురుగా ఇష్టం లేని తిండి.
“అమ్మ కావాలీ.. అమ్మా..”
“తినేయి టింకూ! అమ్మ దగ్గరికి ఎలాగైనా వెళ్లి పోదాం. అంత వరకూ మంచిగా ఉండాలి కదా! ఒంట్లో బాలేక కదల్లేకపోయావనుకో.. ఎలా వెళ్తాం? అందుకే ఏది దొరుకుతే అది తినేసి కడుపు నింపు కోవాలి.” బ్రెడ్ పాలలో నంచి టింకూకి పెట్టాడు చిన్నా.
“మీరు తెలుగు వాళ్లా?” ఎక్కడ్నుంచో సన్నగా వినిపించింది.
అటూ ఇటూ చూశాడు చిన్నా. అందరిలోకీ పొడుగ్గా, పెద్దగా ఉన్నాడొక కుర్రాడు. పన్నెండో పధ్నాలుగో ఏళ్లుంటాయి. సన్నగా, పొడుగ్గా.. మొహం కూడా పొడుగ్గా ఉంది. ఎంత సన్నం అంటే.. చేతులు పుల్లల్లా ఉన్నాయి. మొహంలో దవడ ఎముకలు కనిపించేలా ఉన్నాయి.
“అవును. నువ్వు కూడానా?” చిన్నా అడిగాడు, టింకూకి తినిపిస్తూనే.
“తెలుగు వాణ్ణే. తెలుగు ఇంకా గుర్తున్నందుకు నాకే వింతగా ఉంది.” నట్టుతూ ఆగి ఆగి మాట్లాడాడు ఆ అబ్బాయి.
టింకూ తినేశాక, అక్కడున్న సీసాలో నీళ్లు వాడికి తాగడానికి ఇచ్చి తను కూడా తినడం మొదలు పెట్టాడు చిన్నా.
“మీ తమ్ముడా?”
తలూపాడు. ఊరికే.. అందరికీ తమ స్టోరీ ఎందుకు చెప్పడం..
“అంత ఏడవద్దని చెప్పు. కన్నీళ్లు కూడా ఇక్కడ ప్రెషస్. ముందు ముందు ఇంకా చాలా ఏడవాలి.”
ఆశ్చర్యంగా చూశాడు చిన్నా.
“నా పేరు అబ్బాస్. నాకు సిక్స్ ఇయర్స్ అప్పుడు హైద్రాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఎనిమిదేళ్లు పైనయింది. ఇప్పుడు నాకు హిందీ, ఇంగ్లీష్, అరాబిక్ వచ్చు. తెలుగు వాళ్లు చాలా రేర్ గా వస్తారు. అందుకే మీ మాటలు వినగానే నాక్కూడా మా ఊరు గుర్తుకొచ్చింది.”
“అదేంటీ.. మీ అమ్మా నాన్నా గుర్తుకు రాలేదా? నీకు ఫోర్టీన్ ఇయర్సా? నమ్మలేను.”
“అమ్మా.. కొంచెం గుర్తుంది. నాన్న గుర్తు లేదు. అక్కడున్నప్పుడే అంత లేదు. రాత్రి వచ్చే వోడు..రోజూ కొట్లాటలే. నన్ను అమ్మేశారు వీళ్లకి. ఏ రోజుకా రోజు బతకడానికి ఫైట్ చేసి చేసి.. నా అనేవాళ్లు ఎవరూ గుర్తు రారు. అబ్బాస్ పేరు కూడా వీల్లు పెట్టిందే.”
“అమ్మేశారా?” ఇంకా ఆశ్చర్య పోయాడు చిన్నా.
“అంటే మిమ్మల్ని అమ్మెయ్య లేదా?” ఈసారి అబ్బాస్ ఆశ్చర్యం..
“లేదు. మమ్మల్ని కిడ్నాప్ చేశారు. రాత్రి మా ఇంట్లో అరుగు మీద నిద్ర పోతుంటే..”
కళ్లు మూసుకుని కాసేపు ఆలోచించాడు అబ్బాస్.
“జనరల్ గా వీళ్లు కిడ్నాప్ చెయ్యరే. మీకు తెలీకుండా మీ నాన్న అమ్మేశాడేమో..”
“ఛా.. మా నాన్న అమ్మడమా!” ఆగి పోయాడు చిన్నా. అది వరకు కిషన్ కూడా అలాగే అన్నట్లు గుర్తుకొచ్చి..
“ఎవరైనా మీ నాన్నని కలిశారా, అదీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు..” ఆగి పోయాడు. ఉన్నట్లుండి అబ్బాస్ కి అనుమానం వచ్చింది.. ఐదారేళ్ల పిల్లాడికి అదంతా అర్ధ మవుతుందా అని.
“ఆ.. ఒక రోజు మధ్యాన్నం, మేమిద్దరం వీధి వరండాలో చదువుకుంటుంటే.. ఇద్దరు వచ్చారు.. వాళ్ల తో కూడా..”
“మీ నాన్న వచ్చాడా? అప్పుడు మీ అమ్మ ఇంట్లో లేదు కదూ?”
అవునన్నట్లు తలూపాడు చిన్నా.
టింకూ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు.
నాన్న.. అవును. అమ్మేసుంటాడు డబ్బుల కోసం అమ్మని కొడతాడు కదా రోజూ.. వాడి చిన్ని బుర్ర కి నిజమే అనిపించింది.
“అవునూ మీ రిద్దరూ ట్విన్సా? అలా లేరే. నువ్వు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు.” అబ్బాస్ ఇద్దరినీ మార్చి మార్చి చూశాడు. ఎనిమిదేళ్ల నించీ అనేక మంది పిల్లల్ని రకరకాల దేశాల్నుంచి, అనేక రకాల పరిస్థితులలో వచ్చిన వాళ్లని చూశాడు.
పిల్లలనీ వాళ్ల స్థితి గతుల్నీ ఇట్టే పట్టేస్తాడు.
చిన్నా పెద్దగా కనిపిస్తే, టింకూ పాలు కారుతున్న బుగ్గలతో పసివాడిలాగ ఉన్నాడు.
చిన్నా ఆలోచిస్తున్నాడు. ఈ అబ్బాయికి ఎంత వరకూ చెప్పచ్చు.. ఇతను తమ సైడా.. వీళ్ల సైడా..
“నేను మీ సైడే.. ఒక ఆరేళ్ల పిల్లవాడు పడ కూడని బాధలన్నీ పడ్డాను. వీలయినంత వరకూ పిల్లలకి హెల్ప్ చెయ్యాలనే చూస్తాను. మిమ్మల్ని ముందుగానే వార్న్ చేస్తాను. అదీ కాక మీ భాష నాకు వచ్చని ఆ ఎలుగు బంటి గాడికి తెలీదు. నన్ను మీరు నమ్మచ్చు.” అబ్బాస్ నమ్మకంగా చెప్పాడు.
అయినా చిన్నాకి నమ్మకం కలగ లేదు.
మిడుకూ మిడుకూ చూస్తున్నాడు.. బ్రెడ్ ముక్కలు గుటుక్కుమని మింగేసి.
“కావాలంటే వీళ్లని అడుగు.”
“హి.. గుడ్.” అన్నారు అబ్బాస్ ని చూపించి, అక్కడున్న ముగ్గురు పిల్లలూ. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్ధం కాక పోయినా.. చకచకా బట్టలు మార్చుకుంటూనే.. జాలి నిండిన కళ్లతో చిన్నా, టింకూలని చూస్తూ.
“మీరిద్దరూ అన్నదమ్ములు కామని చెప్పు ముందుగా ఆ ఎలుగు బంటికి. లేకపోతే ఇద్దరినీ వేర్వేరు చోట్ల పెట్టేస్తాడు. నన్నూ మా అన్ననీ అలాగే చేశారు. ఇప్పుడు వాడెక్కడున్నాడో నాకు తెలియదు.”
“మేమిద్దరం నిజంగానే అన్న దమ్ములం కాదు. పక్కింటి వాళ్లబ్బాయి వీడు. ఇద్దరం వీధి వరండాలో పక్కన పక్కన పడుక్కుంటే ఎత్తుకొచ్చేశారు.” చిన్నా చెప్పేశాడు. అన్నదమ్ములంటే వేరు చేస్తారన్నాడని.
“నేను చెప్తాలే నజీర్ గాడికి. పక్కింటాళ్లని కూడా చెప్పను. పాస్ పోర్ట్, వీసాల కోసం వీళ్ల ఏజెంట్లు అలా చెప్పారని చెప్తాను. మీరిద్దరూ అంత క్లోజ్ గా ఉండకండి, వాడున్నప్పుడు.”
అలాగే అన్నట్లు తలూపాడు చిన్నా.
“మీరిద్దరూ ఒక వయసు వాళ్లా? అలాగ లేరే..”
“కాదన్నా! వీడు నా కంటే చిన్న. నేను షార్ట్ ఫెలోని. వీడు కొంచెం టాల్. అందుకని ఒకే ఎత్తున్నాం.”
“అదే అనుకున్నా. సర్లే.. తయారవండి. వేరే ఫామ్ కి వెళ్తాం. అక్కడ పెద్ద ఒంటెలు.. రేసులకి పనికొచ్చేవి ఉంటాయి. వాటితో జాకీ ట్రయినింగ్ ఇస్తారు. స్నానం వచ్చాక చెయ్యచ్చు. ఇప్పుడు కావాలంటే బట్టలు మార్చుకుని వచ్చెయ్యండి. ఇంత కంటే పాత బట్టలు లేవా?” అబ్బాస్ కూడా వేరే బట్టలు వేసుకున్నాడు.
“ఇవే పాతవన్నా. అక్కడ అంకుల్ కొత్తవి కొనిచ్చాడు.”
“ఇస్తాడు. ఎందుకివ్వడూ.. ఎన్ని లక్షలు దొబ్బాడో..” కసిగా అన్నాడు అబ్బాస్..
“ఏం ట్రయినింగన్నా? జాకీలు కింద చేస్తారా మమ్మల్ని?” ఇంత కోపం ఎందుకో అనుకుంటూ అడిగాడు చిన్నా.
“చూస్తావు కదా! చాలా ఠయరై పోతారు. నజీర్ గాడికి మాత్రం ఎదురు చెప్పకండి.”
“చెప్పమన్నా. వింటున్నావు కదా టింకూ?”
తలూపాడు టింకూ, నోట్లో వేలేసుకుని చూస్తూ. వాడి మొహం మరీ పసిగా ఉందనుకున్నాడు అబ్బాస్. ఏం తట్టుకుంటాడో.. ఈ టార్చర్.. కడుపులోంచీ జాలి తన్నుకొచ్చింది.
“హొయ్.. హొయ్.. రెడీ?” గట్టిగా అరుస్తూ వచ్చాడు నజీర్.
అందర్నీ లైన్లో నిలబెట్టాడు అబ్బాస్. టింకూని ముందు నిలబెట్టాడు.
“గుడ్ గుడ్.. చలో..” హుషారుగా ఉంటే హిందీ మాటలు వస్తాయి అబ్బాస్ కి. పిల్లలు ఇండియా కదా.. ఆ మాటలకి సంతోషిస్తారని వాడి ఊహ.
షెడ్ బయటికి రాగానే వేడి గాలి కొట్టింది. షెడ్లో మెటల్ పైన ఏదో పరిచినట్లున్నారనుకున్నాడు చిన్నా. అంత వేడిగా లేదు. రెండు తలుపులూ తీసుకుంటే కాస్త గాలి కూడా వేస్తోంది. లోపల చిన్నగా ఏసీ కూడా ఉన్నట్లుంది.
బయట ఒక వాన్.. చుట్టూ ఓపెన్. మెష్ తో కవర్ చేసి ఉంది. లోపల కూర్చోడానికేం లేదు. అందర్నీ ఎక్కించాడు అబ్బాస్. నజీర్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అప్పటికే లోపల అరడజను మంది పిల్లలున్నారు.
ఇద్దరు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినట్లున్నారు.. అదే, తీసుకొచ్చి నట్లున్నారనుకున్నాడు చిన్నా. మిగిలిన వాళ్లు.. తెలియడం లేదు. ఏ భాషలు అర్ధ మవుతాయో..
అందరూ ఐదారేళ్ల పిల్లలే.. ముక్కు పచ్చలారని పసి వారే.
అందరి మొహాలూ నిద్ర నిద్రగా ఉన్నాయి. కళ్లలో ఆకలి కనిపిస్తోంది. ఇవేళ గడిచిపోతే చాలన్నట్లుగా ఉన్నారు.
టింకూ ఇంకా నోట్లో వేలేసుకునే చూస్తున్నాడు. వాడికి భయం వేసినప్పుడు, ఆకలేసినప్పుడు, నిద్ర వస్తున్నప్పుడూ నోట్లో వేలేసుకోడం అలవాటు. ఇప్పుడు మూడూ వేస్తున్నాయి వాడికి.
వాన్ లోకి ఎక్కగానే, ఒక మూల కూర్చుని కళ్లు మూసేసి నిద్రలోకి జారుకున్నాడు టింకూ.
పిల్లలందరూ కిందే కూర్చున్నారు. అందరూ ఎక్కారో లేదో చూసి, అబ్బాస్ ముందు సీట్లో నజీర్ పక్కన కూర్చున్నాడు.
వాన్ బయలు దేరింది దడదడ చప్పుడు చేస్తూ.
చిన్నాకి గుండె ఆగినంత పనయింది.
తమ గురించి చెప్పినవన్నీ చెప్పడు కదా!
సరిగ్గా అదే సమయానికి పక్కకి తిరిగి చిన్నా, టింకూల గురించే చెప్తున్నాడు అబ్బాస్, నజీర్కి.
………………..
5

అబ్దుల్ హలీమ్ తన ఒంటెల తోటలో తిరుగుతూ అంతా పరిశీలిస్తున్నాడు.
ఆ ఫామ్ షేక్ గారిదైనా అదంతా తనదే అన్నట్లుగా పని చేస్తాడు. చేయిస్తాడు. షేక్ కూడా అతనికి పూర్తి స్వతంత్రం ఇచ్చాడు.
ఒక పక్క ఒంటెలకి విశాలమైన షెడ్లు. అక్కడికి దగ్గర్లోనే పనివాళ్ల ఇళ్లు. వాళ్లు చేసే పనిని బట్టి ఇల్లు ఉంటుంది. వాళ్ల పిల్లలు స్కూల్స్ కి వెళ్లడానికి ఒక వాన్. ఇళ్లు కూడా ఎయిర్ కండిషన్డ్.
అన్ని సదుపాయాలూ అమర్చారు.
అందు లోనే ఇసక తిప్పలు.. ఒక ఒయాసిస్ కూడా ఉంది. దాని చుట్టూ ఖర్జూరం చెట్లు. ఎడారిలో పెరిగే చెట్లే కాక, ఒక చోట పార్క్ కూడా తయారు చేశారు. నీటికి ఇప్పుడక్కడ కొదవ లేదు కదా!
అందులోనే ఒక చోట రాళ్లు రప్పలు, మట్టి.. చిన్న కొండ..
మొత్తానికి, ఆ ఫామ్ ఒక చిన్న ఆరబ్ దేశంలా ఉంటుంది.
హలీమ్ కి చాలా ఇష్టమైన చోటు. ఆధునాతన మైన తన ఇంటికంటే తోటలో గడపటమే అతనికి ఇష్టం.
మరి అతను పుట్టిన వంశం, జాతి అటువంటిది.
ప్రాచీన కాలం నుంచీ అరేబియన్ ఎడారుల్లో నివసించిన బేడూ జాతికి చెందిన వాడు హలీమ్.
ఆ ఎడారులే.. ఇప్పటి ఇస్రాయిల్, జోర్డాన్, సిరియా, యు.యే.యి, సౌదీ అరేబియా, ఖతార్ వంటి సంపన్న దేశాలున్న ప్రదేశాలు..
బేడూ జాతి వారు సంచారులు. ఒక చోటని లేక, తమకి ఎక్కడ బాగుందనిపిస్తే అక్కడికి మారి పోతూ ఉండే వారు.. తమ గుడారాలని వెంట పెట్టుకుని.
బిడారులనే పేరు బేడూ నించే వచ్చి ఉంటుంది.
లొట్టిపిట్టలని (ఒంటెలు), గొర్రెలని తమ వెంట తిప్పుకుంటూ.. ఎక్కడ కాస్త నీటి వనరు దొరుకుతే అక్కడికి మారిపోతుంటారు.
బేడూలు తాము యాడమ్ కొడుకు, నోవా సంతతి వాళ్ల మని గర్వంగా చెప్పుకుంటారు. చారిత్రికంగా చాలా పురాతన మైన జాతి. అరేబియన్ కథలన్నింటిలో అందరూ చదివేది వారి గురించే.
వారి కాలంలోనే వర్తకం.. ఓడల్లో తిరిగి, సుగంధ ద్రవ్యాలు, ఉన్ని, ఖ్రజూరం వంటి ఆహార పదార్ధాలూ అన్ని దేశాల్లో అమ్మడం వచ్చింది. వారి మతం ఇస్లామ్. అందుకే ప్రపంచంలో ఇటు తూర్పు, అటు పశ్చిమ దేశాల్లో ఇస్లామ్ బాగా వ్యాప్తి చెందింది.
బేడూలు చాలా సరళ స్వభావులని పేరు. కొత్తవారిని సంకోచాల్లేకుండా తమలో కలిపేసుకుంటారు.
తాటి ఆకులతో కానీ, గొర్రె ఉన్నితో కాని తమ ఇళ్లని కప్పుకుంటారు.
చెట్ల నీడల్లోనైనా కాలం గడిపెయ్యడానికి తయారు.
వారు ఉండే ఎడారులు జనం నివసించడానికి అస్సలు వీలే లేని ప్రదేశాలుగా ఉండేవి. జనాభా చాలా తక్కువ. వర్షాలు ఏడాదికి ఒకటి రెండు సార్లు కురిస్తే గొప్ప. ఒక పక్క వేసంకాలంలో 50 డిగ్రీలు వేడి ఉంటే.. ఇంకొక పక్క చలికాలం సున్నాకి వెళ్లి పోతుంది.
ఇలాంటి వాతావరణంలో కూడా కొన్ని చోట్ల చెట్లు, చిన్న చిన్న చెరువులు (ఒయాసిస్ లు) ఉంటాయి. మొత్తం అంతా ఇసుకే ఉండదు. అక్కడక్కడ మట్టి, రాళ్లు కూడా ఉంటాయి.
జనావాసాలు ఉన్నాయి. జంతువులు జీవిస్తున్నాయి.
అరేబిక్ భాషే మాట్లాడతారు. అన్ని భాషల్లో లాగే వారికి కూడా ఒకే మాటకి, ప్రతి పదార్ధాలుంటాయి.
ప్రేమలు, విరహాలు, యుద్ధాలు.. వాటి మీద కుప్పలుగా కథలు వారికి కూడా సాధారణమే. ఎడారి దొంగలు, హంతకులు, అత్యాచారాలు.. అంతెందుకు, ఆధునిక మానవులలో ఏమేం భావాలు, స్పందనలు ఉన్నాయో.. అన్నీ ఆ ప్రాచీన జాతిలో ఉన్నాయి.
ఆడపిల్లలు పెద్దవాళ్లవుతూనే తలకి, మొహానికీ ముసుగు వేసుకోవడానికి ఇష్ట పడతారు. వారికి ఆచారాలని పాటించడం ఎంతో ఆనందం. మగపిల్లలు వారి చేతి వేళ్లని కూడా తాక కూడదు.
అత్మ గౌరవం, ఆతిథ్యం.. ఇవి రెండూ వారి ముఖ్యమైన లక్షణాలు. చిన్న చిన్న గుంపులుగా ఎడారుల్లో.. దొరికిన నీటి చుక్కలని దాచుకుంటూ తిరిగే వారికి ఆత్మ రక్షణ, ఆత్మ గౌరవం ముఖ్యమైనవే.
అలాగే.. ఎవరైనా వారి గుడారానికి వస్తే.. మైళ్ల తరబడి జనావాసం లేని చోటులో తరిమెయ్యలేరు కదా! మానవత్వంతో అక్కున చేర్చుకుంటారు.
అంతంత ఎండలు భరించాలంటే శరీరాన్ని పూర్తిగా కప్పుకోవలసిందే. అందుకే వారు పొడవాటి గౌన్లు ధరిస్తారు.. ఆడా మగా కూడా..రెండు వరుసల్లో. లేక పోతే, సూర్యుని ప్రతాపానికి శరీరం కమిలి పోతుంది.
తమ ఉనికికే కారణమైన ఒంటెలని, భగవంతుడు వారికిచ్చిన వరాలుగా భావిస్తారు. ఆకలి తీర్చడానికి ఒంటె పాలు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఒంటె వాహనం.
వినోదం కావాలంటె ఒంటెల పరుగు పందాలు.
ఒంటెలని ఏ విధంగా పెంచాలో.. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలీదు.
అందుకనే, ఆధునిక ఒంటె రేసుల నిర్వహణలో బేడూ జాతి వారినే, ఒంటెల సంరక్షకులుగా, ఆ వ్యవస్థకే నిర్వాహకులుగా నియమిస్తారు, ఆరేబియన్ దేశాల సంపన్నులు.
అబ్దుల్ హలీమ్ ఒమన్ దేశపు ఎడారుల్లో ఒక బిడారానికి అధిపతి అయిన బెడూ షేక్ కొడుకు. చిన్నతనం నుంచీ, ఒంటెల నిర్వహణలో తరిఫీదు పొందిన వాడు. షేక్ కొడుకవడంతో ఆ సమూహం లోని అన్ని ఒంటెల బాధ్యతనీ తీసుకునే వాడు.
ఒంటెలని వాహనాలుగా, వ్యాపార సాధకాలుగా వాడటం మానేశాక, బేడూలకి జీవనోపాధి పోయిందనే చెప్పాలి.
అందరూ చమురు బావుల్లో, సూక్ (బజారు) లలో, హోటళ్లలో.. ఇతర వ్యాపార సంస్థల్లో పని చెయ్యడం మొదలు పెట్టారు.
అతి ఖరీదైన రేసు ఒంటెల (ఒక్కొక్క ఒంటె 50,000 డాలర్ల పైనే ఉంటుంది) నిర్వహణ బాధ్యత చాలా క్లిష్టమయింది. బాగా అనుభవం, పేరు ఉన్న వారికే అప్పచెప్తున్నారు షేక్ లు, వ్యాపారస్థులు.
అందుకే.. హలీమ్ కి, ఆ దేశపు సర్వాధికారి తన ఒంటెల బాధ్యతని అప్పగించాడు.
హలీమ్ తన పిన్ని కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. బేడూలు సాధారణంగా ఫస్ట్ కజిన్లనే చేసుకుంటారు. నలుగురు పిల్లలూ అమెరికన్ స్కూల్స్ లో చదువుతున్నారు. పెద్దబ్బాయి, హైస్కూల్ గ్రాడ్యుయేషన్ అయాక అమెరికా వెళ్లి, వెటర్నరీ మెడిసిన్ చెయ్యాలనుకుంటున్నాడు.
సహజ సిద్ధంగా జంతువులమీద ఉన్న అవగాహన, శ్రద్ధ బేడూ సంతానాన్ని వాటికి సంబంధించిన చదువులే ఆకర్షిస్తాయి.

“సాబ్..” సన్నగా వినిపించిన పిలుపుకి ఆలోచనల్లో మునిపోయిన హలీమ్ తల తిప్పి చూశాడు.
“పొద్దుటి నుంచీ ఏమీ తినలేదు. ఒంటెలకి తినిపిస్తే మీ కడుపు నిండదు కదా. అమ్మగారు నన్ను కోప్పడతారు. మీకు నాస్తా తెచ్చేదా?” వంటశాల అధికారి.. మైన్ షెఫ్ అడిగాడు.
“అలాగే.. తీసుకురా.” నవ్వుతూ చూశాడు హలీమ్.
ఆ ఫామ్ లో వంట అందరికీ కామన్ గా ఉంటుంది. ఏమేం చెయ్యబోతున్నారో ముందు రోజే చెప్తారు. మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు.
సరుకులు తెచ్చుకోవడం, వండుకోవడం వంటి బాదరబందీ ఉండకూడదని హలీమ్ ఆ ఏర్పాటు చేశాడు. అవసరమైతే, వంట అవగానే, తమ ఇళ్లకి తీసుకు పోవచ్చు. ఇంటి వాళ్లతోనే తినాలనుకుంటే.
ఆ వార జీతం తగ్గించి, దాంతో వంట శాలనీ అందులోకి పని వారినీ ఏర్పాటు చేశాడు.
దాని వలన అదనంగా కొంత మందికి ఉపాధి దొరికింది.
పని చెయ్యడంలో పూర్తిగా దృష్టి పెట్ట గలుగు తున్నారు. అందరికీ ఆనందం కలిగించింది ఈ పద్ధతి.
ఇతర ఫామ్ లు కూడా అనుసరిస్తున్నాయి ఈ పద్ధతిని.
“సాబ్! ఇదిగో. తిన్నాక చెయ్యండి మిగిలిన పనులన్నీ.” శుభ్రమైన పళ్లాలలో వెన్న నామమాత్రంగా వేసి కాల్చిన బ్రెడ్, ఆమ్లెట్, ఖర్జూరాలు, యాపిల్ ముక్కలు తెచ్చి బల్ల మీద పెట్టాడు షెఫ్.
చుట్టూ గాజు తలుపులున్న ఆ ఆఫీస్ గది హలీమ్ది. ఎత్తైన గుట్ట మీద ఉంటుంది. ఫామ్ మొత్తం గుండ్రంగా కనిపిస్తుంది అక్కడి నుంచి. అంగుళం అంగుళం పరిచయమే అతనికి.
ప్రతీ ఒంటె అతని కన్న బిడ్డ కంటే ఎక్కువ.
రోజుకు ఒక్క సారైనా వెళ్లి పేరు పేరునా పలకరించి వస్తాడు.
సెప్టెంబర్ నించీ మొదలవుతాయని ప్రకటించి నప్పటికీ, వేడి తట్టుకోలేక అక్టోబర్ లో ఆరంభిస్తారు రేసుల్ని.
అయితే.. హలీమ్ సెప్టెంబర్ మొదటి వారానికల్లా తయారుగా ఉంటాడు.. తన ఒంటెలతో, జాకీలతో.
హలీమ్ తినడం అయే వరకూ ఉండి, ఫ్రాస్కులో ఉన్న బ్లాక్ కాఫీ కప్పు లో పోసి ఇచ్చాడు షెఫ్.
“ఎలా ఉంది కిచెన్? ఏదయినా మార్పు కావాలా? సామానేమైనా కావాలా? పనివాళ్లు చెప్పిన మాట వింటున్నారా?” కాఫీ తాగుతూ కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు హలీమ్.
“అంతా బాగుంది సాబ్. ఇంకొక పెద్ద ఆవెన్, బ్లెండర్ కావాలి. ఆర్డర్ ఇచ్చా. రేపు.. సరుకు నాకు వస్తుంది. బిల్ మీకు వస్తుంది.”
చిరునవ్వు నవ్వాడు హలీమ్.
“ఇంకేం సమస్యల్లేవు కదా?”
“ఏం లేవు సాబ్. ఒంటెలకి దాణా బయట తయారయి వస్తుంది. అది చూసుకోవడానికి వేరే ఉన్నారు కదా! నాకే ప్రాబ్లమ్ లేదు.” షెఫ్ పళ్లాలు, కప్పు, ఫ్లాస్కు తీసుకుని వెళ్లిపోయాడు సలాం చేస్తూ.
ఒంటెలు మధ్యాన్నం రెండు గంటలకి కానీ రావు. ఈ లోగా జాకీలని తీసుకురావాలే నజీర్.. ఈ జాకీలని సప్లై చేసే వాళ్లతోనే కొంచె ప్రాబ్లం. అనుకున్న టైమ్కి ప్రామిస్ చేసినంత మందిని తీసుకు రారు. వాళ్లకేం సమస్యలున్నాయో కానీ..
హలీమ్ లోనున్న మంచి గుణం అదే.. ఎవరినైనా ఎత్తి చూపే ముందు వారికున్న ఇబ్బందులేమిటా అని ఆలోచిస్తాడు.
దూరంగా గేటు తీస్తున్నట్లు, అందులో నుంచి ఒక వాన్ లోపలికి రావడం కనిపించింది.
హలీమ్ ఆఫీస్ లోంచి బైటికి వచ్చి, తోటలో ఫౌంటెన్ దగ్గరకొచ్చాడు. విరజిమ్మే నీటి పక్కన ఆహ్లాదంగా ఉంది అక్కడ.
వాన్ వచ్చి కొంచె దూరంలో ఆగింది.
నజీర్, ఆ వెనుక అబ్బాస్ దిగారు.
నజీర్ సలాం చేసి నిలుచున్నాడు.
“తీసుకొచ్చారా?” హలీమ్ వాన్ కేసి చూస్తూ అడిగాడు.
“హా సాబ్.. మొత్తం వన్ డజన్.”
“షేప్ లో ఉన్నారా? బరువు తక్కువే కదా?”
“ఔ సాబ్. పదిహేను కిలోల కంటే ఎవ్వరూ ఎక్కువ లేరు. ఈ రోజు న్యూ యరైవల్ ఇద్దరున్నారు. వాళ్లకి ట్రయినింగ్ ఇవ్వాలి.”
“దింపండి.”
అబ్బాస్ వెళ్లి వెనుక తలుపు తీశాడు. అందరూ దుంకినట్లుగా కిందికి దిగారు. టింకూ తప్ప. వాడింకా నిద్ర పోతున్నాడు. హలీమ్ అందరినీ లెక్కపెట్టి, సాలోచనగా చూశాడు నజీర్ ని.
ఒక్కొక్క జాకీకి, రోజుకి ఇంతని డబ్బులివ్వాలి మరి..
అబ్బాస్, వాన్ లోకి ఎక్కి, టింకూని దింపాడు. వాడు కళ్లు నులుముకుంటూ లేచి చూశాడు. నీడ పట్టున ఉండి పెరిగాడేమో, పాల బుగ్గలింకా పోలేదు. నిద్ర కళ్లతో చూస్తుంటే హలీమ్ కి అనుమానం వేసింది.
“వీడింకా బేబీలాగున్నాడు కదయ్యా? కూర్చో గలడా జీను మీద? కొన్ని రోజులు వేరే పనులు, ఎక్సర్ సైజులు చేయించండి. ఒళ్లు కాస్త గట్టి పడ్డాక రైడింగ్ ఇవ్వచ్చు. ప్రోటీన్ ఫుడ్ పెట్టండి.”
“యస్ సర్..” వినమ్రంగా అన్నాడు నజీర్.
“వెళ్లేటప్పుడు మనీ తీసుకో. నీది మాత్రమే. మీ బాస్ మనీ తనకే క్రెడిట్ అవుతుంది.”
నజీర్ అలాగే అన్నట్లు తలూపి, పిల్లల్ని ఎక్కించి, తీసుకెళ్లాడు.

ఆ ఫామ్ లోనే ఈ బుల్లి జాకీలకి శిక్షణ ఇవ్వడానికి కొన్నిపిల్ల ఒంటెలుంటాయి. ఆ కొన్నింటినీ అక్కడే వాళ్ల ప్రైవేట్ ట్రాక్ మీద ప్రాక్టీస్ చేయిస్తారు.
అవి అప్పుడే పరుగందుకో లేవు. 20 కిలో మీటర్ల కంటే తక్కువ వేగంతో నడుస్తాయి.
ఆ తక్కువ వేగం కూడా, అప్పుడే స్వారీ మొదలు పెట్టిన వాళ్లకి భయం కలిగిస్తుంది.
అందరినీ, హలీమ్ ఫామ్ లో ట్రాక్ దగ్గరకి తీసుకెళ్లి దింపాడు నజీర్.
టింకూనీ, ఇంకొక కుర్రాణ్ణీ తప్ప అందరినీ ఒంటెలెక్కించాడు, హెల్మెట్లు పెట్టి. అసలే వేడి. దానికి తోడు హెల్మెట్.. ఊపిరాడనట్లు అనిపించింది
సుమారు ఏడడుగుల ఎత్తుండే ఒంటె వీపుమీద కూర్చోగానే చిన్నాకి మొదట్లో భయం వేసింది. కానీ.. కొత్త ఇంటికి వెళ్లగానే, నజీర్ అంతెత్తు ఎగరేసి పట్టుకోవడంతో ఎత్తంటే, అంత గాభరా వెయ్యలేదు.
అసలు అందుకే.. ఇది అలవాటు చెయ్యడానికే అలా ఎత్తేశాడేమో అనిపించింది చిన్నాకి.
కాళ్లు అటూ ఇటూ వేసి, వీపు జీను కట్టిన తాడుకి కట్టేసి పడిపోకుండా ఎలా కూర్చోవాలో చూపించాడు అబ్బాస్.. కాబోయే చిన్న ముధారీ.

బ్రహ్మలిఖితం – 16

రచన: మన్నెం శారద

ప్రతి కిలోమీటరుకి అడవి దట్టమవడం గమనించింది లిఖిత. ముందంతా రబ్బరు తోటలున్నాయి.
వాటికి కట్టిన చిన్న చిన్న కుండలలో గాటు పెట్టిన చెట్టు నుండి చిక్కని పాలు కారుతున్నాయి. కొన్ని చోట్ల పాలని ట్రేలో ఎండబెట్టి తయారుచేసిన రబ్బరు షీట్లు ఆరవేసున్నాయి.
కొంత దూరం వెళ్లేక వాతావరణం బాగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులు కొండలమీదకు విహారం వచ్చినట్లుగా తిరుగుతున్నాయి.
ఇది తన తండ్రి చావు బ్రతుకుల సమస్య కాకపోతే తనెంతో ఎంజాయ్ చేసి ఉండేది విహారాన్ని. కాని మనసులో ఆయన ధ్యాస ఒక పక్క ముల్లులా గుచ్చుకుంటున్నది.
“ఎక్కడికెళ్తున్నావ్?”
పక్కన కూర్చున్న వ్యక్తి ప్రశ్నకి తన ఆలోచనలనుండి బయటపడి చూసింది లిఖిత.
ఒక వృద్ధుడు నుదుట అడ్డనామాలతో కూర్చుని లిఖిత వైపే చూస్తున్నాడు.
అతను మళయాళంలో మాట్లాడింది ఆమెకర్ధం కాలేదు.
“ఐ డు నాట్ నో మళయాళం” అంది.
“సైట్ సీయింగ్?”
“ఊ” అంది పొడిగా.
“యువర్ నేం?”
లిఖిత అనబోయి నాలిక్కరుచుకొని “ప్రభు” అంది అప్పటికప్పుడు తోచింది చెబుతూ.
అతను తర్వాతేం మాట్లాడలేదు.
బస్ మరయూర్ చేరింది.
లిఖితతో పాటు ఆ వృద్ధుడు కూడా బస్ దిగేడు. బస్ దిగి లిఖిత ఎటెళ్ళాలొ ఏం చేయాలో తెలీక అలాగే నిలబడింది.
మనసు మళ్ళీ ఆందోళన వైపు మొగ్గిపోసాగింది.
ఆ వృద్ధుడు ఆమెని దీక్షగా గమనిస్తూ “ఎక్కడికెల్లాలో చెప్పు. నేను తీసుకెళ్తాను” అన్నాడు వచ్చీరాని ఇంగ్లీషులో.
లిఖిత అతని మొహంలోకి నిశితంగా చూసింది. అతని వయసు అరవై దాటి ఉంటుంది. అతని కళ్లు గాజుగోళాల్లా ఉన్నాయి. భవరహితంగా అతనికి తను నిజం చెప్పొచ్చో లేదో. చెప్పకపోతే తనకిక్కడ ఆ మాత్రికులుండే దారెవరు చూపిస్తారు. ఇలాంటి పెద్దవాళ్లకి విషయాలు తెలిసుండొచ్చు. అతను వృద్ధుడు తనకెలాంటి హానీ చేయడు అనే నమ్మకం కుదిరిందామెకు.
“ఇక్కడ చేతబడులు, క్షుద్రపూజలు చేసే వాళ్లుంటారట. ఎక్కడో తెలుసా?”
అతను కళ్ళు పెద్దవి చేసి “వాళ్లతో ఏం పని నీకు?” అనడిగేడు.
“మా నాన్నగారు వాళ్ల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకుందామని వచ్చేరు. ఆయన్ని వెదుక్కుంటూ వచ్చేను” అంది లిఖిత.
“నీకు భయం లేదా?” అతనాశ్చర్యంగా అడిగేడు.
లిఖిత లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది.
అతను ‘పద’ అంటూ ముందుకి నడిచేడు.
చందనపు చెట్ల సుగంధ శీతల గాలుల్లో వాళ్లిద్దరూ అలసట మరచి ముందుకు సాగేరు.
అరగంట గడిచింది.
ఆ చెట్లకవతల వున్న ఒక పెద్ద కొండ దగ్గర ఆగేడా వృద్ధుడు. లిఖిత కూడా ఆగింది.
“వెళ్లి ఆ వాగులో కాళ్లు కడుక్కునిరా”
లిఖిత వాలులో ప్రవహిస్తున్న వాగువైపు సాగింది. తన చేతిలోని సంచిని వాగు పక్కన పెట్టి కాళ్లు, చేతులు, మొహం కడుక్కుని తిరిగి చేతిలోకి సంచిని తీసుకుంది. అలా తీసుకోవడంలో ఆమెకు భగవతి కోవెలలో పూజారి కుట్టికారన్ ఇచ్చిన కుంకుమ పొట్ళం జారి క్రిందపదిపొవడం ఆమె గమనించలేదు.
అదే ఆమె దురదృష్టం.

*****

వాల్తేర్ స్టేషన్‌లో రైలు దిగగానే ఈశ్వరి వెంకట్ వైపు సందిగ్ధంగా చూసి “నేనిప్పుడెక్కడికెళ్ళాలి?” అని ప్రశ్నించింది.
“ఇంకెక్కడీకి, మీ ఇంటికే!” అన్నాడు వెంకట్.
“అదెలా? నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాను. మీ ఇల్లే నా ఇల్లు” అంది ఈశ్వరి.
“అది నిజమే అనుకో. కాని.. నేను నీ కోసం మంచిల్లు చూడాలి. అన్ని వస్తువులూ కొనాలి. నువ్వు కూడా మీ ఆయనకి డైవొర్స్ ఇవ్వాలిగా. లేకపోతే శ్రీకృష్ణజన్మస్థానంలో పెడతారు మనిద్దర్ని.” అన్నాడు వెంకట్ ఆమెకి నచ్చచాబుతున్న ధోరణిలో.
ఈశ్వరి మొహం నిరుత్సాహంగా తయారయింది.
“నేను మిమ్మల్నొదిలి బ్రతకలేను” అంది బాధగా.
“ఎంత. నాల్రోజులోపిక పట్టు” అన్నాడు ఓదార్పుగా. ఈశ్వరి వస్తున్న కన్నీళ్లాపుకొని ఆటో ఎక్కింది.
వెంకట్ హమ్మయ్య అనుకొని మరో ఆటో ఎక్కి తన రూం చేరుకున్నాదు. అతను ఆటో చార్జీలు పే చేసి వెనక్కు తిరిగేసరికి అక్కడ తన మామయ్య సూర్యనారాయణ నిలబడి ఉన్నాడు.
అతన్ని చూడగానే గుండె గుభేలుమంది వెంకట్‌కి.
సూర్యనారాయణ గర్భ దరిద్రుడు. ఏ పని చేసినా కలిసి రాలేదు. ముగ్గురు కూతుళ్లు. అందులో ఏ దరిద్ర దేవతనో తనకంటగట్టాలని అతని ప్లాను. ఇదివరకు అనేక ఉత్తరాలు రాసేడు. తను జవాబివ్వకపోవడంతో నేరుగా వచ్చేసేడు.
“బావున్నావా అల్లుడూ! ఇంటికి తాళం కనిపించేసరికి ప్రాణం ఉసూరుమనిపించింది. వెళ్లిపోదామనుకుంటుండగా వచ్చేవు. నా అదృష్టం బాగుంది.” అన్నాడతను నవ్వుతూ.
వెంకట్ వస్తున్న ఏడుపుని నవ్వుగా మార్చుకొని “బాగానె ఉన్నాను. ఆఫీసు పని మీద టూరెళ్లేను” అంటూ ఇంటి తాళం తీసేడు.
“ఉద్యోగం చేస్తున్నావన్నమాట. బాగుంది. ఇంతకీ ఎలాగైనా మా పెద్దది అదృష్టవంతురాలు” అన్నాడాయన కుర్చీలొ దుమ్ము భుజమ్మీద కండువాతో దులుపుకొని కూర్చుంటూ.
తనుద్యోగం చేయడం వాళ్లమ్మాయి అదృష్టంగా ఎలా మారిందో ఆలొచిస్తూ “పని మీద వచ్చేవా?” అనడిగేడు ఎదురుగా వున్న స్టూలు లాక్కుని కూర్చుంటూ.
“పనే మరి! పెద్దదాని పెళ్లి చేయాలనుకుంటున్నాను” అన్నాడాయన నవ్వుతూ.
“కుదిరిందా?” అనడిగేడు వెంకట్ అమాయకంగా.
“పెద్దాడితో పరాచికాలాడకు. అది నిన్ను తప్ప మరొకర్ని కట్టుకోనని భీష్మించుకుంది. అందుకే వచ్చేను” అన్నాడు.
వెంకట్ గుండె గుభేలుమంది.
“అదికాదు మామయ్యా. నాకిప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు” అన్నాడు.
“నువ్విలా మాట్లాడతావనే శుభలేఖలచ్చేయించుకొని మరీ వచ్చేను. నా కూతురు కనకమహాలక్ష్మికేం లోటు. నిన్నే ప్రేమించిందని వెంటబడుతున్నాను కాని.. అప్పుడే విజయనగరంలో అరడజను దిగ్విజయమైన సంబంధాలొచ్చేయి తనకి” అన్నడు.
“మరింకేం చెయ్యలేకపోయేవా?” అంటూ వెటకారంగా అడిగేడు వెంకట్.
“చెబుతున్నాగా నిన్ను ప్రేమించి చచ్చిందని. పైగా చచ్చిన మీ అమ్మ కూడా నిన్ను నా కూతురికి చేసుకోమని చెప్పి మరీ చచ్చింది. లేకపోతే దాని పేరున పది లక్షలు బంపర్ లాటరీ వచ్చిన విషయం తెలిసి జనం ఎగబడుతున్నారు” అన్నాడు సూర్యనారాయణ గర్వంగా.
ఆ మాట వినగానే పాదాల క్రింద బాంబు పెట్టినట్లు ఎగిరి పడ్డాడు వెంకట్.
“ఏంటి మామయ్యా నువ్వు చెబుతున్నది నిజమేనా? కనక బంపర్ కొట్టేసిందా?” అనడిగేడు ఆశ్చర్యంగా.
వెంకట్ వెంటనే పెళ్ళికి ఒప్పేసుకుంటే డబ్బు మీద ఆశ పడుతున్నాడనుకుంటారని “నాకు నికరమైన ఉద్యోగం లేదు. పెళ్ళాన్నెలా పోషిష్తాను?” అన్నాడు బధగా మొహం పెట్టీ.
మగాడికి పెళ్ళాం పట్ల ప్రేమ, తన మగతనం పట్ల నమ్మకముంటే చాలు. ఆడది శుభ్రంగా సుఖపడిపోతుంది. అయినా దానికొచ్చిన డబ్బుల్లో సగం దానికే ఇద్దామనుకుంటున్నాను. ఇక భయం దేనికి?”
మామగారి మాటలు విని వెంకట్ ఉక్కిరిబిక్కిరయిపోయేడు. వెంటనే “నీ ఇష్టం” అన్నాడు సిగ్గు అభినయిస్తూ.
“అయితే నాతో బయల్దేరు” అన్నాడు సూర్యనారాయణ లేచి నిలబడి.
వెంకట్ ఇంటీకి తాళం వేసి అతనితోపాటు మెట్లు దిగేడూ అమితమైన ఆనందంతో.

*****

ఆ గుహ బాగా చీకటిగా ఉంది.
ఆ చీకటిని పారద్రోలేందుకు అక్కడక్కడా గుచ్చిన కాగడాలు ప్రయత్నిస్తున్నాయి.
లిఖిత ఆ వృద్ధుని వెంట లోనికి నడిచింది.
లోపల ఒక పెద్ద హోమగుండం వెలుగుతోంది.
అక్కడ కొందరు నల్లగా దృఢంగా వున్న వ్యక్తులు జనపనార గుత్తుల్లాంటివి నూనెలో ముంచి ఆ హోమగుండంలోముంచి నేలకేసి బాదుతున్నారు. ఆ చర్య అంతరరార్ధమేంటో లిఖితకి అర్ధం కాలేదు.
గుహలోపల ఒక ఎత్తయిన రాతి ఫలకం మీద పది తలలు, ఇరవై చేతుల స్త్రీ విగ్రహం దిశమొలతో ఉంది. ఆ పది తలల కళ్ళు వివిధ భావాల్ని ప్రకటిస్తున్నట్లుగా చూస్తున్నాయి. ఆ విగ్రహం పది నాలుకల్ని బయటకు సాచింది వికృతంగా. పెదవుల కిరువైపులా ఉన్న కోరలకి మాంసపు ముక్కలు గుచ్చి ఉన్నాయి.
బట్టతల, అడ్డబొట్టు పెట్టుకున్న వృద్ధుడొకడు ఆ విగ్రహమ్ముందు కూర్చుని మంత్రాలు చదువుతున్నాడు.
లిఖిత ఆ వాతావరణాన్ని భయంగా చూస్తోంది.
లిఖితతో వచ్చిన వృద్ధుడు ఆమెని అక్కడే నిలబడమని సైగచేసి పూజ చేస్తున్న వృద్ధుడి దగ్గరకెళ్ళి “మహామాయా!” అని పిలిచేడు.
అతదు కళ్ళు తెరచి చూసేడు ఏంటన్నట్లుగా.
“నువ్వు కావాలనుకున్నంత వయసు కుర్రాడు దొరికేడు” అన్నాడు మళయాళంలో.
అతను వెనక్కు తిరిగి చూసేడు.
లిఖిత టోపీతో లుంగీతో నిలబడి ఉంది.
“మన ప్రాంగణంలోకి నెత్తిన టోపీ పెట్టుకుని రాకూడదని చెప్పలేదా?” అన్నాడు మహామాయ
“మరచిపోయేను. ఇప్పుడు చెబుతాను”అంటూ వెనుతిరగబోయేడు వృద్ధుడు.
“ఆగు. పూజ ముగించి నేనొస్తాను. ఇంతకీ వాడు బ్రాహ్మణుడేనా?”
“తెలియదు. అడగలేదు”
“సరే. కాస్సేపాగు”
వృద్ధుడు వెనుతిరిగి లిఖిత దగ్గరకెళ్లి” కూర్చో. మహామాయ వస్తాడు” అన్నాడు.
లిఖిత అక్కడే ఉన్న రాయి మీద కూర్చుంటూ “ఏం చేస్తారిక్కడ?”అనడిగింది అమాయకంగా.
“ఏం చేద్దామని వచ్చావిక్కడికి?”
“మా నాన్న ఉన్నాడేమోనని. ఆయనిటువైపు అడవుల్లోకొచ్చేడని తెలిసి వచ్చేను.”అంది లేచి నిలబడుతూ.
“మీ నాన్న పేరు?”
“కార్తికేయన్”
ఆ జవాబు విని ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి.
“కూర్చో. మహామాయ వచ్చేక మాట్లాడుదువుగాని”
లిఖిత మళ్ళీ కూర్చుంది. దిక్కులు చూస్తూ, అక్కడి వ్యవహారం చూస్తే పిచ్చి పట్టేటట్లుంది.
చీకటిని మింగిన గుహలో, చిరుత కళ్ళలాంటి కాగడాలు వెలుగుతున్నాయి.
ఆ ఎర్రని కాంతిలో నల్లని పోత పొసిన కంచు విగ్రహాల్లాంటి మనుషులు కేవలం మాటలు రాని రోబోట్‌ల్లా యాంత్రికంగా ఊహకందని పనులు చేసుకుంటూ పోవడం, భగభగ మండే హోమగుండం, వికౄతంగా నాలుకలు సాచిన విగ్రహం. తన తండ్రి అకక్డ కూడా లేకపోతే ఏం చేయాలి.
ఆమె ఆలోచిస్తుండగానే మహామాయ ఆమె దగ్గర కొచ్చి నిలబది “నువ్వు కార్తికేయన్ కొడుకువా?” అనడిగేడు.
లిఖిత బెదురుతూ లేచి నిలబడి అవునని తల పంకించింది.
మహామాయ వృద్ధుడికేసి తిరిగి చిరునవ్వు నవ్వి “కుర్రాడు సున్నితంగా అమ్మాయిలా ఉన్నాడు” అన్నాడు మళయాళంలో.
వృద్ధుడు నవ్వాడు.
“ఇక్కడికి నెత్తిన టోపీ ధరించి రాకూడదు. తీసేయ్”
లిఖిత బెదిరినట్లు చూసింది మహామాయ వైపు.
“నీకే చెప్పేది”
“ఇంతకీ మా డేడీ ఉన్నారా ఇక్కడ?”
“ఆ సంగతి తర్వాత. ముందు టోపీ తియ్యి”
లిఖిత భయం భయంగా టోపీ తీసేసింది.
టోపీలో ముడిచిపెట్టిన జుట్టు భుజాల మీదకు జారింది. మహామాయతో పాటు, వృద్ధుడు కూడా నివ్వెరపోయి చూశారామెవైపు.
“నువ్వు అబ్బాయివి కావా? అనడిగేడు వృద్ధుడు ఆశ్చర్యంగా.
“అబ్బాయినే. అబ్బాయినే. నాకు మొక్కుంది.మా నాన్న కనిపించేక జుట్టు తీస్తానని”అంది కంగారుగా.
మహామాయ ఫక్కున నవ్వాదు.
ఆ నవ్వుకి గుహంతా దద్దరిల్లింది. వారి వారి పనుల్లో నిమగ్నమైన వాళ్లందరూ ఏకాగ్రత చెదరి మహామాయవైపు చూశారు.
మహామాయ ఎదుట నిలబడిన అమ్మాయిలాంటి అబ్బాయి మీద వాళ్లందరి దృష్టి పడింది.
“ఎందుకలా భయపడతావురా. నీకు తండ్రంటే ఎంతిష్టమా. సరే. మా దగ్గర చాలామంది భక్తులున్నారు. వాళ్లలో ఎవరు నీ తండ్రో రేపు తెలుసుకుందువుగాని. ఈ రాత్రికి కొలను పక్కన పడుకో. నువ్వు లోనికి రావచ్చునో లేదో అమ్మనడిగి చెబుతాను” అన్నాడు మహామాయ. లిఖిత భుజం చరుస్తూ.
లిఖిత తలవూపి మెల్లిగా బయటకొచ్చి కొలను పక్కన రాతిమీదకూర్చుంది భయంగా.
అప్పుడే చీకటి చెట్ల నీడలతో కలిసి దట్టమైన దుప్పటిలా అడవంతా పరచుకుంటుంది.

*****

“నీకు పూర్తిగా మతి పోయింది”
ఈశ్వరి చెప్పిన కథ విని తెల్లబోయి గట్టిగా అరచింది లావణ్య.
ఆమె అరుపుని విని మిగతా కొలీగ్స్ వాలిద్దరి వైపు చూసారు. ఆ విషయం గ్రహించి ఈశ్వరి “ష్”అంది.
లావణ్య పరిస్థితి గ్రహించి గొంతు తగ్గించి “నువ్వు చాలా పొరపాటుగా ప్రవర్తిస్తున్నావు. ముత్యాల్లాంటిద్దరు పిల్లల్ని, భర్తని పెట్టూకుని ఇంకొకడు నా మొగుడంటూ పెళ్లి చేసుకుంటావా? బుద్ధుందా అసలు” అంది.
ఈశ్వరి నవ్వి “ఏం చేస్తాను. అతనే నా భర్తని తెలిసేక, నువ్వయితే మాత్రమేం చేస్తావేంటి?” అంది తిరిగి ఎదుగు ప్రశ్నేస్తూ.
“నేనిలాంటి దొంగ సన్యాసుల మాటల్ని వినను. అయినా పూర్వజన్మ సింగినాదాల్ని నేను నమ్మను. ఇప్పుడు వీళ్లనేం చేస్తావు?”
“వదిలేస్తాను”
ఆ జవాబు విని తెల్లబోయింది లావణ్య.
“నిన్నెవరో భారీ ఎత్తున మోసం చేస్తున్నారే ఈశ్వరి. వెంటనే వాళ్లమీద పోలీస్ రిపోర్టివ్వు. లేకపోతే నువ్వింకా చిక్కుల్లో పడతావు” అంది.
“అది నీ భ్రమ. వెంకట్ నా జన్మజన్మల భర్త. నేనిక ఈ కుక్కగాడితో కలిసి బ్రతకడం దుర్లభం” అంది ఈశ్వరి నిష్కర్షగా పర్సు తీసుకుని తన సీటు కెళ్లిపోతూ.
లావణ్య ఆమెవైపు బాధగా చూసింది.
“ఈశవరి ఉత్త అమాయకురాలు. పల్లెటూరినుండొచ్చింది. కుటుంబరావుతో ఆమె కాపురమంత వరకూ సజావుగానే సాగుతోంది. ఎవరో ఆమెని మనసు విరిచి పక్కదారి పట్టిస్తున్నారు. ఏ ఉద్ధేశ్యంతోనో” అనుకుంది బధగా.
ఈశ్వరి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నది. తను ఇక ఎంతమాత్రం వెంకట్‌కి దూరంగా ఉండదు. ఉండలేదు. తన గత జన్మ వృత్తాంతం వీలైనంత తొందరగా కుటుంబరావుకి చెప్పి వెంకట్ దగ్గరకెళ్ళిపోవాలి. ఎందుకనో వెంకట్ అహోబిళం నుండి వచ్చే తనకి తిరిగి కనిపించలేదు. ఏమయ్యేడో. ఆమె ఆఫీసవర్సు అయ్యేవరకు అతని గురించే ఆలోచిస్తూ గడిపింది.
అలా ఆలోచిస్తూనే ఆమె ఇల్లు చేరుకుంది.
ఇల్లు, పిల్లలు తనకి సంబంధం లేనివిలా కనిపిస్తున్నాయి. ఆమెని చూసి పిల్లలు పరిగెత్తుకొచ్చి “ఆకలేస్తుంది. ఏవైనా వండమ్మా” అన్నారు.
“అవన్నీ మీ నాన్ననడగండి. ఈ రోజు నుండి నాకేం సంబంధం లేదు” అంది.
పిల్లలు తెల్లబోయి చూశారు తల్లివైపు.
“సరే ఈ పది రూపాయలు పట్టుకెళ్ళి ఏవైనా తెచ్చుకు తినండి. నేను బయటకెళ్ళొస్తాను” అంటూ వాళ్లకి నోటందించి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని చీర మార్చుకుని ఆటో ఎక్కి భీమిలి రోడ్డులోని ఓంకారస్వామి ఆస్రమానికెళ్లింది.
ఈశ్వరిని చూడగానే రాజు ఓంకారస్వామిని చూసి కన్ను గీటేడు.
“ఏం జరిగింది బాలా? అహోబిళం వెళ్ళొచ్చేరా?” అనడిగేడు ఓంకారస్వామి.
“వెళ్ళేం స్వామి. అక్కడ అభుక్తేశ్వరస్వామి మీరు చెప్పినట్లే చెప్పేడు. అతను మా వివాహం కూడా జరిపించేసేడు” అంది ఈశ్వరి.
“మరి మీ ఆయన్ని తీసుకురాలేదేంటి?”
“ఆయనిక్కడికి రాలేదా?” ఆశ్చర్యపోతూ అడిగింది ఈశ్వరి. ఓంకారస్వామి, రాజు మొహమొహాలు చూసుకున్నారు.
అప్పుడే లోనికొచ్చిన సంపెంగి “ఇంకేం వస్తాడిక్కడికి. ఎవర్తినో పెళ్ళి చేసుకుని టింగురంగా అని బీచ్‌లో తిరుగుతుంటే చూశాను. దానికి పది లక్షల లాటరీ వచ్చిందాట. మీతో పని లేదని తెగేసి చెప్పేడు” అంది.
ఆ మాట విని కళ్ళు తిరిగి పడిపోయింది ఈశ్వరి.
“ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందని వాడు పెళ్ళీ చేస్కుంటే ఈవిడిక్కడ సొమ్మసిల్లి పోతుందేంటి?” అన్నాదు రాజు చిరాగ్గా.
“ష్” అన్నాడు ఓంకారస్వామి కోపంగా.
రాజు ఓంకారస్వామి వైపు చూసేడు.
” ఆ అమ్మాయి కనక ఇదంతా బయటపెడితే మన పరిస్థితి పూర్ణా మార్కెట్టయిపొతుంది. కాబట్టి మనం ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వెంకట్‌గాడి జుట్టు మన చేతిలో ఇరికించుకోవాలి. ముందా పిల్ల మీద నీళ్లు జల్లండి” అన్నడు సీరియస్‌గా.
సంపెంగి ఈశ్వరి మొహాన నీళ్లు కొట్టింది.
ఈశ్వరి కాస్సేపటికి తేరుకుని లేచి కుమిలికుమిలి ఏడవటం ప్రారంభించింది.
“అమ్మాయి, ఎందుకలా ఏదో ఊహించుకుని ఏడుస్తావు? అసలేం జరిగిందో తెలుసుకోనివ్వు. ఆ అర్భకుడు మా చేతుల్లోంచి జారిపోడు. జారిపోలేడు. నువ్వు హాయిగా ఇంటికెళ్ళు. మేం విషయం కనుక్కుంటాంగా” అన్నాదు.
ఈశ్వరి కళ్లు తుడుచుకుని వాళ్ల కాళ్లకి దణ్ణం పెట్టి వెనుతిరిగింది.

****

టైమెంటయిందో తెలియదు.
నల్లటి మొహం మీద మచ్చల్లా ఉన్నాయి. ఆ చీకటిలో చెట్ల నీడలు.
రకరకాల జంతువులు ఉండి ఉండీ వింతగా అరుస్తున్నాయి.
నిశ్శబ్దాన్ని ఆసరా చేసుకుని వాగు ఘోషిస్తూ ప్రవహిస్తోంది.
లిఖితని ఆ వాతావరణం క్షక్షణం పిరికిదానిగా మారుస్తోంది.
గట్టు మీద కాళ్ళు ముడుచుకుని ఏ క్షణం ఏ జంతువు మీద పడుతుందోననే ఆందోళనతో చుట్టూ చీకటిని కళ్లు పెద్దవి చేసి దీక్షగా చూస్తోంది.
ఆమె భయాన్ని రెట్టింపు చేస్తూ ఎక్కడో ఏనుగు ఘీంకరించింది. ఆ అరుపుకి ఆమె చేతులు గుండెల మీదకి వెళ్ళేయి.
సరిగ్గా అదే సమయానికి గోరుచుట్టు మీద రోకటిపోటులా రెండు గజాల పొడుగున్న త్రాచొకటి జరజరా పాకుతూ వచ్చి వాగులో తలపెట్టి నీరు తాగసాగింది
లిఖిత ముందు మెరుస్తున్న దాని శరీరాన్ని చూసి ఏంటో అనుకుంది.
కాని ఆ మెరపు కదలడం అచ్చు పాములా ఉండటంతో ప్రాణం కోల్పోయినట్లుగా బిగుసుకుపోయింది.
భయంతో అరవాలన్నా అరుపు గొంతులోనే లుంగ చుట్టుకుపోయింది.
“ఏంటి భయపడ్డావా?”
ఆమె భుజమ్మీద పడ్డ మొరటు హస్తాన్ని చూసి కెవ్వున అరిచింది లిఖిత.
ఎదురుగా చీకటిలో నవ్వుతూ నిలబడ్డాడు మహామయా.

ఇంకా వుంది ..

రెండో జీవితం – 6

రచన: అంగులూరి అంజనీదేవి

ఆముక్త కారుదిగి లోపలకి వస్తుంటే చూసి మండేనిప్పుల కణికలా అయింది శృతిక. రెండడుగులు ఎదురెళ్లి ఉరిమి చూస్తూ….
”ఆయన ఇంట్లో లేరు” అంది అక్కడే ఆగు అన్నట్లు.
అర్థంకాక బిత్తరపోయింది ఆముక్త. అభిమానంతో అడుగు వెనక్కి తీసుకొని, వెనుదిరిగి కారెక్కి వెళ్లిపోతూ ద్రోణకి కాల్‌ చేసింది. అతని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో వుంది.
ఆ రోజు ఫోన్లో కృతికతో శృతిక మాట్లాడటం విని, వెళ్లిపోయిన ద్రోణ ఇంతవరకు ఇంటికి రాలేదు శృతిక ఆ బాధలో వుండగా ఆముక్త ఇలా రావటం ఆగ్రహాన్ని తెప్పించింది. అడవిలో ఎండిన చెట్టుకి నిప్పంటుకున్నట్టు భగభగ మండింది. ఆ టైంలో తనేం చేస్తుందో తనకే అర్థంకాని పనిచేసింది శృతిక. ఆ పనివల్ల పర్యవసానం ఎలా వుంటుందోనని ఆలోచించలేదు. ఎవరైనా తనలాగే చేస్తారని తనని తను మభ్యపెట్టుకుంది.
వెంటనే బయటకొచ్చి తలుపుకి తాళంపెట్టి ఆటో ఎక్కింది.
ఓ గంట ప్రయాణించాక ఆటో దిగి లోపలకెళ్లి…
”అత్తయ్యా!” అంటూ గట్టిగా పిలిచింది శృతిక.
”ఎందుకే అంత గట్టిగా పిలుస్తావ్‌! నాకేమైనా చెవుడా?” అంది విమలమ్మ కోడలివైపు తిరిగి చూస్తూ…
”మీ అబ్బాయి నన్ను వదిలేసి శాంతినికేతన్‌ వెళ్లినట్లుంది. వెళ్లే ముందు నాకు చెప్పలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఎగ్జిబిషన్‌ వున్నా నాకు చెప్పే వెళ్తాడు. ఫోన్‌ చేస్తే కట్ చేస్తున్నాడు. ఇప్పుడెలా? నాకు భయంగా వుంది.” అంది శృతిక.
షాక్‌ తిన్న దానిలా చూసింది విమలమ్మ.
”మాట్లాడరేం అత్తయ్యా! నాకు చాలా కంగారుగా వుంది. మామయ్యగారితో చెబుదాం!” అంటూ ఆయనకోసం కళ్లతోనే వెతికింది శృతిక.
”ఆయన ఇప్పుడే బయటకెళ్లారు. కూర్చో శృతీ! కంగారెందుకు?” అంది నెమ్మదిగా
శృతిక ఆశ్చర్యపోతూ.. ”మామయ్య మీతో చెప్పకుండా ఎటో వెళ్లి, ఫోన్‌ కట్ చేస్తుంటే కంగారుపడరా..?” అంది.
”ఆయనలా వెళ్లరు. చెప్పే వెళ్తారు” అంది విమలమ్మ
”ఈయన అలాకాదు. ఏం చెయ్యను నా ఖర్మ… ఇసుక తోడితే నీళ్లొస్తాయని నమ్మి పిచ్చిదానిలా తోడి, తోడి వేళ్లు పోతున్నాయ్‌! గోళ్లు పోతున్నాయ్‌! నీళ్లు రావటంలేదు. నిప్పులు రావటంలేదు.” అంది నీరసంగా చూస్తూ…
తన కొడుకునలా విమర్శిస్తుంటే బాధగా వుంది విమలమ్మకు వచ్చినప్పటినుండి కొడుకు ఎందుకంత డల్‌గా వున్నాడో ఇప్పుడర్థమైందామెకు…
శృతిక గొంతు విని గదిలోంచి బయటకొచ్చాడు ద్రోణ.
ద్రోణను చూసి ఆశ్చర్యపోతూ ”మీరిక్కడున్నారా? చెప్పరేం అత్తయ్యా! మీరు కూడా మీ కొడుకులాగే ఏడ్పించాలని చూస్తున్నారా?” అంది విమలమ్మ వైపు చూస్తూ…
”నిన్నెవరు ఏడ్పించరు. నువ్వే ఏడ్పిస్తున్నావు…” అన్నాడు ద్రోణ.
ద్రోణవైపు చూడకుండా ”మీరు పెద్దవారు.. ఆయన నాతో గొడవపడి వచ్చినప్పుడు నచ్చచెప్పి ఇంటికి పంపొద్దా? ఇక్కడే వుంచేసుకుంటారా ఎప్పటికి.?” అంది అత్తయ్యనే చూస్తూ పెద్దగా అరుస్తు…
ఏం మాట్లాడాలో తోచలేదు విమలమ్మకి…
ఎదుటిమనిషిని అకారణంగా నిందించటం, విమర్శించటం, ఫిర్యాదులు చెయ్యటం ద్రోణకి నచ్చదు. దేనిలోనైనా నిజాయితీ వుండాలంటాడు.
అందుకే… ”చూడు! శృతీ! నాకు తెలిసున్న పెద్ద యాడ్‌ ఏజన్సీ మేనేజర్‌ నన్ను కలుస్తానన్నారు. ఆ మేనేజర్‌ లేడి! నీకు ఆడవాళ్లు కన్పిస్తే భరించలేవు కదా! అందుకే ఇక్కడ వుంటాను. మీటవ్వమని చెప్పాను. ఆమెకు హోటల్స్‌లో కలుసుకోవటం ఇష్టం వుండదు.” అన్నాడు.
ద్రోణవైపు ఒకరకంగా చూసి.. ”అత్తయ్యా! నన్ను ఈయనకెందుకిచ్చి పెళ్లి చేశారు? ఈ బాధలన్నీ పడానికా? ఎప్పుడు చూసినా బొమ్మలతో, ఆడవాళ్లతో గడుపుతుంటే నా కళ్లతో నేనెలా చూడాలి?” అంది.
కోడలికెలా నచ్చచెప్పాలో తెలియలేదామెకి..
”మనిషికి ఇంత అసంతృప్తి, ఇంత గందరగోళం అవసరం లేదు. తెల్లకాగితంలా వుంచుకోవలసిన హృదయం నిండా పిచ్చిగీతలు గీసుకొని చిన్నాభిన్నం చేసుకుంటున్నావు. గాజుపలకలా వుంచుకోవలసిన మనసుని నీ చేతులతో నువ్వే పగలగొట్టుకుంటున్నావ్‌! ఇందుకు నేను ఏమాత్రం బాధ్యుడ్ని కాదు..” అంటూ తను అక్కడో క్షణం కూడా నిలబడకుండా తన గదిలోకి వెళ్లాడు.
శృతికను అక్కడే వదిలి కొడుకు దగ్గరకి వెళ్లింది విమలమ్మ.
”ద్రోణా! నాలుక కత్తికంటే పదునైంది. అది రక్తం చిందకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది. ఆ బాధేంటో నాకు తెలుసు. కానీ శృతిక ఏడుస్తోంది. నువ్వు లేకుండా గంట కూడా వుండలేనంటోంది.” అంటూ ద్రోణ పక్కన కూర్చున్నాడు తండ్రి సూర్యప్రసాదు.
”అలాగే అంటుంది నాన్నా…! తర్వాత బాగా విసిగిస్తుంది.” అన్నాడు ద్రోణ.
”విసిగిపోయానని విసిరికొట్టానికి ఇదేమైనా క్రికెట్ బంతా! కాపురం. కోడలి ముఖం చూస్తే జాలిగా వుంది” అన్నాడు
”మీ కోడల్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాన్నా! క్షణక్షణం అనుభవించినవాడ్ని. చదువుకున్నానన్న సృహకూడా వుండదామెలో…” అన్నాడు ద్రోణ.
”నిన్ను కోరి – తన కూతుర్ని నీ చేతిలో పెట్టాడు మీ మామయ్య. నువ్వైతే బాగా చూసుకుంటావని.. ఆయన్ని బాధపెట్టకురా!” అంది విమలమ్మ.
”చూసుకుంటానని కాదమ్మా! భరిస్తానని..” అన్నాడు ద్రోణ.
”ఏదో ఒకటి… కోడల్ని ఇంటికి తీసికెళ్లు. తొందరపడకు.” అంటూ నచ్చ చెప్పాడు సూర్యప్రసాద్‌.
”నేనేం తొందరపడ్తున్నాను నాన్నా! నాకు బయటనుండి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని మనసులో పెట్టుకొని వాళ్ల అక్కయ్య ఇంటికెళ్లి స్కూటీ యాక్సిడెంట్ లో నీనా చెయ్యి విరగ్గొట్టింది. వాళ్ల అత్తయ్య నోటికొచ్చినట్లు మాట్లాడితే భయపడి నావెంట వచ్చింది… ఫోన్‌కాల్స్‌ని చూసి ఫీలవుతోందని వాటిని కట్ చేస్తూనే వున్నాను.
కానీ విదేశాలనుండి వచ్చేకాల్స్‌ని, యాడ్‌ ఏజన్సీ వాళ్ల కాల్స్‌ని, పత్రికాఫీసుల కాల్స్‌ని కట్ చేస్తుంటే నన్ను ఆర్టిస్ట్‌ అంటారా? అందరికి అందుబాటులో వుండాల్సిన నేను అలా ఫోన్‌కాల్స్‌ని కట్ చేస్తే ఎలా వుంటుంది? పోకస్‌డ్‌గా డెవలప్‌ కావలసినవాడ్ని అలా మౌనంగా వుండి నా కాళ్లను నేనే విరగ్గొట్టుకున్నట్లు నా కళను నేనే అణచుకోవాలా?” అన్నాడు.
”నువ్వు నాకు అర్థమవుతున్నావు ద్రోణా!” అన్నాడు సూర్యప్రసాద్‌ అంతకన్నా ఇంకేం మాట్లాడలేక…
”నన్ను ఇంట్లోనే వుంచుకొని నాలుగురోజుల నుండి ఇంట్లో లేనని చెప్పటం నన్ను బ్లేమ్‌ చెయ్యటం కాదా? నా క్యారెక్టర్‌పై అవతలవాళ్లకి చిన్న చూపు కలగాలనేగా! అవమానించినా పడొచ్చుకాని, అనుమానించటం నరకం…” అన్నాడు
భార్యవైపు చూశాడు సూర్యప్రసాద్‌.
”ఏమోనండి! ఎవరి సమస్యల్లో వాళ్లు కొట్టుకుపోతున్నారు. మనమేం చెప్పగలం!” అంది రోగం బాగా ముదిరిన రోగుల్ని చూస్తున్న డాక్టర్‌లా చూస్తూ విమలమ్మ.
”అనుమానం ప్రేమవున్న చోటే వుంటుంది ద్రోణా!” అన్నాడు సూర్యప్రసాద్‌.
”అదేం ప్రేమ నాన్నా..? నేను ఎటు చూస్తే అటే చూస్తుంది. అక్కడెవరైనా అమ్మాయి వుందేమోనని… నేను వేసే అమ్మాయిల బొమ్మల్ని-చూసి.. ఇది మీరే వేశారా? ”ఈ బొమ్మను మీ కుంచే కదా తాకింది?” అంటుంది చురకత్తిలా చూస్తూ … ఇదేం ప్రేమో తట్టుకోలేక పోతున్నాను.” అన్నాడు ద్రోణ.
”మీ అమ్మకూడా శృతిక అంత వయసులో అలాగే వుండేదిరా! పోలికలు వస్తాయిగా! మీ అమ్మకి నేనంటే ప్రాణం ద్రోణా! దాన్ని భరించటంలో కూడా ఓ ఆనందం వుంది…” అన్నాడు సూర్యప్రసాద్‌.
ద్రోణ ఇంకేం మాట్లాడలేదు

*****

ఇంటికెళ్లాలని శృతికతో కలిసి కారులో కూర్చున్న ద్రోణను చూసి సంతోషించారు ద్రోణ తల్లిదండ్రులు…
కారులో కూర్చున్నాక శృతిక, ద్రోణ సరదాగా మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకున్నారు.
ముందుగా కారు దిగిన శృతిక తలుపుకి తాళం తీసి నేరుగా వంటగదిలోకి వెళ్లింది.
కారుని పార్క్‌ చేసి హుషారుగా, ఉత్సాహంగా అడుగులు వేస్తూ నిత్యం తను బొమ్మలు వేసే గదిలోకి ప్రవేశించి స్థాణువయ్యాడు ద్రోణ.
ఆ గదిలో బూడిద తప్ప ద్రోణ వేసిన బొమ్మలు లేవు.
ఒక్కక్షణం తన కళ్లను తను నమ్మలేనట్లు గదంతా కలియజూశాడు. ఈ గది నాదేనా అన్న అనుమానంతో ఇది నీ గదే అన్నట్లు స్టాండ్‌ బోర్డ్‌ కన్పించటంతో షాక్‌ తిన్నాడు.
అంతత్వరగా తేరుకోలేని షాక్‌ అది.
నిలబడే శక్తి లేనట్లు కుప్పకూలిపోయాడు.
తను వెళ్లాక తన గదికి షార్ట్‌సర్క్యూట్ అయిందా? అనుకున్నాడు. అలా అనుకోవానికి ఆధారాలు బలంగా లేవు.
మరి ఏం జరిగింది?
తన బొమ్మలెందుకలా తగలబడిపోయాయి?
ఈ బొమ్మలు ఒక్కగంట, ఒక్కరోజులో వేసినవి కావు. నెలలు, సంవత్సరాలు శ్రమపడి వేసిన బొమ్మలు… ఈ మధ్యన ఎగ్జిబిషన్‌లో కొన్ని అమ్ముడుపోగా మిగిలినవి భద్రంగా ఇల్లు చేర్చుకున్నాడు. కొన్ని బొమ్మలు విదేశాలకు పంపాలని ప్యాక్‌ చేసి రెడీగా వుంచాడు. అవి కూడా కాలిపోయాయి. పత్రికలవాళ్లు పంపిన స్క్రిప్టులు కూడా కాలిపోయాయి. అందులో యాడ్‌ఏజన్సీ వాళ్లకోసం వేసిన బొమ్మలు కూడా వున్నాయి. ఇది ఏ ఆర్టిస్ట్‌కి జరగకూడని అన్యాయం… ఇదెలా జరిగింది?
వ్యాపారంలో నష్టమొస్తే కోలుకోవచ్చు. ఏదైనా జబ్బు వస్తే డాక్టర్‌ దగ్గరకి వెళ్లి నయం చేయించుకోవచ్చు… కానీ క్షణమో రకంగా ఫీలయి నెలలు, సంవత్సరాలుగా గీసిన ఈ బొమ్మల్ని ఈ జన్మలో తను మళ్లీ గీయగలడా?
జరిగిపోయిన సృష్టి మళ్లీ రాదు. జరగబోయే సృష్టికి జరిగిపోయిన సృష్టికి చాలా తేడా వుంటుంది. గతజన్మను ఎలా చూసుకోలేడో తన బొమ్మల్ని కూడా తనిక చూసుకోలేడు.
తల పగిలిపోతుంది ద్రోణకి…
శృతిక స్టౌ దగ్గర నిలబడి కాఫీ కలుపుతూ – ఇకపై తన భర్తతో హాయిగా గడపాలని… రోజుకో రకం చీర కట్టుకొని ఆయనకి నచ్చిన విధంగా వుండాలని… ఆయన అప్పుడప్పుడు అడిగే సన్నజాజులు తలలో పెట్టుకొని, పాతతరం అమ్మాయిలా, ఆయన గీసుకునే బొమ్మలా వుండాలని అనుకొంది.
కాఫీ కప్పు పట్టుకొని భర్త వున్న గదిలోకి వెళ్లింది. అక్కడ ద్రోణ సర్వం పోగొట్టుకున్న వాడిలా కూర్చుని వున్నాడు.
సన్నగా నవ్వుతూ అతనికి దగ్గరగా వెళ్లింది. ఆ బూడిదవైపు చేయి చూపి ” ఈ బొమ్మల కోసమేగా ఆడవాళ్లంతా పడి చచ్చి, మీకు ఫోన్లు చెయ్యటం… మీ చుట్టూ తిరగటం.. ఇవే లేకుంటే ఏముందిక్కడ? వట్టి బూడిద. అందుకే వీటిని బూడిద చేశా…” అంది నవ్వుతూ…
వెంటనే కొండను ఢీకొన్న పెనుకెరటంలా లేచి ఆమె చెంప చెళ్లు మనిపించాడు. ఆ దెబ్బ తీవ్రతకి కాఫీ కప్పుతో పాటు ఆమె కూడా తిరిగింది. కాఫీ మొత్తం గదినిండా పడ్డాయి.
నిలబడాలంటే కళ్లు తిరుగుతున్న దానిలా కాస్త తడబడి, నెమ్మదిగా కంట్రోల్‌ చేసుకొని నిలబడి…
”నన్ను కొడతారా?” అంటూ చెంపమీద చేయిపెట్టుకొంది.
”చంపేస్తాను…” అన్నాడు ఆవేశంగా.
”ఏం చేశానని నన్ను చంపుతారు?” అంది
”ఎన్నో సంవత్సరాల నా తపస్సుని పాడుచేశావు. నేను పడ్డ శ్రమనంతా ఒక్కక్షణంలో తగలబెట్టి బూడిద చేశావు.” అన్నాడు
”మీరు రోజూ నా మనసును బూడిద చెయ్యటం లేదా? అంతకన్నా ఇది ఎక్కువా?” అంది
”నీకు మనసుంటే కదా! బూడిద కావటానికి?” అన్నాడు
”నాకు మనసు లేకుంటే మిమ్మల్నింతగా ప్రేమిస్తానా?” అంది.
”నా వినాశనాన్ని కోరే నీ ప్రేమ నాకవసరంలేదు. నా భార్యగా నా పక్కన వుంటూ నామీద నువ్వింత అసూయను పెంచుకున్నావని తెలుసుంటే అప్పుడే మీ ఇంటికి పంపివుండేవాడ్ని…” అన్నాడు.
”నాకు ముందే తెలుసు. మీలాంటి వాడ్ని మార్చటం కష్టమని…” అంది.
”నీకు నాతో మాట్లాడే అర్హతలేదు. చేసిన బూడిద చాలు. నా ముందు నిలబడకు…” అన్నాడు. టెన్షన్‌తో అతని నరాలు పగిలిపోయేలావున్నాయి.
కోపంగా అక్కడనుండి వెళ్లింది శృతిక… కోపం తెచ్చుకునే ముందు పరిణామాలు కన్పించవు. కోపం మనిషిని పశువును చేస్తుంది. విచక్షణను కోల్పోయేలా చేస్తుంది.
సమస్యలు పెద్దవి కావటానికి కారణం కూడా కోపమే. ఆ రోజు భర్తమీద కోపంతో బొమ్మల్ని తగలబెట్టింది. ఇప్పుడు భర్త నిరసనను తట్టుకోలేకపోతోంది.
పర్యవసానం ఆలోచించకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది శృతిక.

*****

దోసిళ్లతో స్వచ్ఛమైన సెలయేటి నీళ్లు తాగినట్లుండాలి జీవితం అనుకున్న ద్రోణకి ఉలకని, పలకని అమ్మ వెంటపడి మొత్తుకున్నట్లుంది. నిప్పుపెదవులపై ముద్దాడి భయపడ్తున్నట్లుంది.
ద్రోణ తలపై చేతులు పెట్టుకొని…. ‘తనకింకేం మిగల్లేదు’ అన్న బాధతో కూర్చుని వున్నాడు.
అప్పుడొచ్చింది ఆముక్త కారు దిగి లోపలకి…
గదిలోకి రాగానే… ”ద్రోణా! నీ బొమ్మలేమయ్యాయి? గదినిండా ఈ బూడిదేంటి? ఫ్యానేస్తే ముఖంమీదకి వచ్చేలా వుంది. అసలేం జరిగింది?” అంది షాకింగ్‌గా చూస్తూ…
ఆముక్తకి ఏంచెప్పాలో ఒక్కక్షణం అర్థంకాలేదు ద్రోణకి.. అబద్ధం చెప్పేకన్నా నిజం చెబితే మంచిదనుకున్నాడు. జరిగింది చెప్పాడు. వేదనగా చూసింది ఆముక్త.
నాదీ అనుకున్నది ఎవరికి దక్కకూడదన్న ఆగ్రహంతో తారాస్థాయిలో తెగించిన శృతిక – ఇంత అతితో కూడిన తన ప్రేమను అవతలవాళ్లు తట్టుకోలేరని గ్రహించి వుండదు. అందుకే ఇలా చేసింది.
ద్రోణ ముఖంలోని వైరాగ్యం ఆముక్త హృదయాన్ని నొక్కి పెట్టినట్టైంది. ఒక కళాకారుని బాధ తోటి కళాకారులకి వెంటనే అర్థమవుతుంది.
బాధంటే ఏమిటో…. బాధపడటం అంటే ఏమిటో… సమస్యలు ఎలా వుంటాయో… ఆ సమస్యలు పైకి చిన్నగా కనిపిస్తూ మనసుని ఎంత పెద్దగా కోస్తాయో ఆముక్తకి ఇన్నిరోజులు తెలియదు. ఇప్పుడు ద్రోణను చూస్తుంటే అంతటి భావకవి అయిన కృష్ణశాస్త్రి – ”నాకు యుగాదులు లేవు. ఉషస్సులు లేవు.” అని ఎందుకు రాశాడో అర్థమయింది. ద్రోణ లాంటి వాళ్లే ఆయన హృదయాన్ని అప్పట్లో కదిలించి వుంటారు.
ఆవేశంగా ద్రోణవైపు చూస్తూ…. ”ఇది పెద్ద విధ్వంసకచర్య వర్షిత్‌ ! నేను మీడియా వాళ్లకి ఫోన్‌ చేస్తాను. దీన్ని పదిమందికి తెలిసేలా చేద్దాం! న్యాయం కావాలని ప్రజల్నే మనం అడుగుదాం! వాళ్ల సమాధానమే మనకి కొండంత అండ…” అంది ఆముక్త.
ఉలిక్కిపడి చూశాడు ద్రోణ…
”నువ్వు నా గురించి బాధపడ్తున్నందుకు థ్యాంక్స్‌ ఆముక్తా! నా సమస్యకి నువ్వు చూపే సొల్యూషన్‌ కరక్ట్‌ కాదు. నన్నిలా వుండనివ్వు.” అన్నాడు
”నీ బాధ చూడలేకపోతున్నాను వర్షిత్‌!” అంది జాలిగా
”మన ప్రమేయంలేకుండా దేన్నైనా కోల్పోయినప్పుడు బాధగానే వుంటుంది ఆముక్తా! జీవితంలో తెలిసి కోల్పోయేవి కొన్ని, తెలియక కోల్పోయేవి కొన్ని వుంటాయి కదా! ఏది ఏమైనా కోల్పోయింది నేను… నువ్వు బాధపడకు. ఇప్పుడేం రాస్తున్నావు?” అన్నాడు దీనిమీద ఇక ఏం మాట్లాడినా అనవసరమే అన్పించి…
”నా ఫ్రెండ్‌ సంవేద మొన్న కొన్ని సమస్యల్ని చెప్పి రాయమంది. ‘సమస్యలు సమస్యలే కదా! ప్రత్యేకించి రాయటం ఎందుకు?’ అని ఆలోచిస్తున్నాను. సపోజ్‌ ఆదాయం లేనివాడు అప్పులు చేస్తాడు. వాడు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని ఆలోచించి కష్టపడే తత్వాన్ని పెంచుకుంటే సమస్య సాల్వ్‌ అవుతుంది. కాని దానిమీద నేను నాలుగు పేజీలు రాస్తే అప్పులు తీరవు కదా! అందుకే నేనా సమస్యను రాయదలచుకోలేదు. ఏదైనా న్యూ సబ్జక్ట్‌ దొరికితే రాస్తాను” అంది.
తలకొట్టుకునే ఆసక్తికూడా లేనట్లు మౌనంగా వున్నాడు.
అటు, ఇటు చూసి ”శృతిక లేదా?” అంది
”వెళ్లిపోయింది” అన్నాడు
”ఎక్కడికి?” అంది
”ఏమో! తెలియదు” అన్నాడు.
”ఇప్పుడెలా?” అంది
”దాని గురించి ఆలోచించే స్థితిలో లేను…” అన్నాడు.
”అందరికి ఒకసారి ఫోన్లు చెయ్యండి! మనం కూడా వెతుకుదాం! భార్య లేకుంటే కష్టం కదా!” అంది.
”కష్టం వచ్చినప్పుడు పడాలి.. కష్టం కదా! అంటే వచ్చిన కష్టం పోతుందా? పోనీ మనం కూడా దాన్నుండి పారిపోలేం. ధైర్యంగా నిలబడితే చూసి, చూసి అదే పారిపోతోంది.” అన్నాడు
అతని ముఖంలోని గంభీరతనే చూస్తూ… ”భార్య లేకుంటే ఎన్ని కష్టాలో ఓ కథ రాస్తాను.” అంది ఉద్వేగంగా.
నిట్టూర్చాడు ద్రోణ.
”నా జీవితం నీకు కధలా వుందా?” అన్నాడు
”నువ్వే కదా జీవితాల్లోకి వెళ్లి రాయమంటావు. సంవేద కూడా అప్పుడప్పుడు అదే చెప్తుంది.” అంది.
ఒకసారి ఆమె ముఖంలోకి జాలిగా చూసి, ‘సమస్యల్ని సృశించే నేర్పుకూడా ఓ కళే కదా!’ అని మనసులో అనుకొని, ఏమనాలో తెలియక ‘ఆల్‌ ద బెస్ట్‌’ అన్నాడు. అంతలో…
పేరెంట్స్ నుండి కాల్‌ రావటంతో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అని ఆముక్తతో చెప్పి పక్కకెళ్లి మాట్లాడి వచ్చాడు.
ఆమె చాలా సేపు ద్రోణ దగ్గరే కూర్చుంది.
*****

అర్ధరాత్రి దాక – అందరు నిద్రపోతున్న సమయంలో గంగాధరం మళ్లీ అరుస్తూ లేచాడు.
నిశిత బెదిరిపోయి లేచి కూర్చుంది. ఆమె వణకటం చూసి…
”నిశితా భయపడకు..” అని మాత్రం అన్నాడు గంగాధరం.
”భయంగా వుంది మామయ్యా! మీరు రోజు ఇలాగే అరుస్తున్నారు. ఎందుకని?” అంది గుండెలపై చేయివేసుకొని.,..
నిశితకి చెప్పాలి! తనేంటో చెప్పాలి. ఏం జరిగిందో చెప్పాలి. ఇన్నిరోజులు వినేవాళ్లు లేక, ఆత్మీయులుగా అన్పించక చెప్పలేదు. ఇప్పుడు చెప్తే కనీసం నిశిత అయినా ధైర్యంగా తనపక్కన వుంటుంది. లేకుంటే తన అరుపులకి భయపడ్తూ ఎన్ని రోజులు ఇలా?
భార్య ఎలాగూ తనని దగ్గరకి రానీకుండా దూరంగా వుంది. అది ఏ జన్మలో చేసుకున్న పాపమోకదా!
ఆయన చెప్పానికి సిద్ధమయ్యాడు.
అది గమనించి మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది నిశిత.
అవి తాగి చెప్పటం ప్రారంభించాడు.
”నేను ఆర్‌.టి.సి. బస్‌లో పనిచేస్తున్న రోజుల్లో నా భార్య డబ్బు మీద ఆశతో నన్ను బాగా సంపాయించమనేది. జీతాన్ని మించిన సంపాదన నాకెలా వస్తుంది? రోజుకోరకంగా, ఏదో ఒకటి లేదంటూ తనలోని వెలితిని బయటపెట్టి బాధపడేది. నన్ను బాధపెట్టేది. రాను రాను ఇంటికి రావాలంటేనే భయపడేవాడిని… అప్పటికే శ్యాం పుట్టాడు. శ్యాం కోసమైనా నేను నా భార్య మాట వినాలి. లేకుంటే నన్ను ఇంటికి రానివ్వదు. బస్‌లో టికెట్స్ ఇవ్వకుండానే ప్రయాణీకుల దగ్గర డబ్బులు తీసు… మాట్లాడలేక పోయాడు.
శ్యాంవర్ధన్‌. మణిచందన్‌ లేడు కాబట్టి నిశితను వుంచాలంటే అభ్యంతరం లేదు. కానీ నిశిత లేకుంటే తనుండలేక పోతున్నాడు. ఈ బలహీనత ఎలా జయించాలో అతనికి అర్థం కాకుండా వుంది.
”కొన్ని బలహీనతలు మనిషిని తన వైపుకి బలంగా అట్రాక్ట్ చేసుకుంటాయంటే ఇన్ని రోజులు నేను నమ్మేవాడ్ని కాదు ఆముక్తగారు ! ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది. మా నాన్నగారి బలహీనత నిశిత! ఎందుకంటే చిన్నపనికి, పెద్దపనికి నిశితపై ఆధారపడ్తున్నాడు. అదే చెప్పాడు”. అంటూ మొత్తం తండ్రి పైకి నెట్టి వేస్తూ తెలివిగా మాట్లాడాడు.
”మామయ్య పనులన్నీ అక్క చేస్తానంది బావా!” అంది నిశిత. ఆమెకు వెళ్లాలని లేదు. కనీసం ఈ మూడు రోజులైనా బావలోని రాక్షస కోరికతో నిండిన చూపుల్ని తప్పించుకుందామని వుంది.
”ఎంతయినా నువ్వున్నట్లు వుంటుందా నిశితా!” అన్నాడు ఆమె కళ్లలోకి సూటిగా, కొంటెగా చూస్తూ…
”ఎలాగోలా అడ్జస్ట్‌ అవుతాడు లెండి! మూడురోజులేగా!” అంది ఆముక్త.
ఇది నిశితను తీసికెళ్లే సందర్భం కాదని అర్థమైంది శ్యాంకి.
అతను మౌనంగా వుండటం చూసి… ”నిశిత నాదగ్గర సేఫ్‌గా వుంటుంది. కావాలంటే అప్పుడప్పుడు మీరు వచ్చి చూసివెళ్లండి!” అంది ఆముక్త.
ఇది నచ్చింది శ్యాంవర్ధన్‌కి.
”నేను రేపు ఆఫీసునుండి ఇటే వస్తానండి! మణిచందన్‌గారు లేరు కాబట్టి మీకేదైనా అవసరం రావొచ్చు. మిమ్మల్ని మా సంవేదతో పాటు నేను కూడా అర్థం చేసుకోగలను. నిశితను వుంచుకోండి!” అన్నాడు శ్యాంవర్ధన్‌.
అతనంత సడన్‌గా మారిపోవటం ఆముక్తతోపాటు నిశితకి కూడా ఆనందం వేసింది.
‘గుడ్‌నైట్…’ చెబుతూ నిశిత వైపు దాహంగా చూశాడు శ్యాం. కంపరంగా అన్పించి ఒళ్లు గగుర్పొడిచింది నిశితకి.
అతను వెళ్లగానే గ్లాస్‌డోర్‌ మూసి, కర్టెన్స్‌ దగ్గరకి లాగి వెనుదిరిగిన ఆముక్త నిశితను చూసి ఆశ్చర్యపోయింది.
నిశిత అనీజీగా గోళ్లు కొరుకుతోంది. చురుగ్గా నేలవైపు చూస్తోంది.
”ఏమిటి నిశితా అలావున్నావ్‌?” అంది ఆముక్త.
‘వీడు.. వీడు.. మా అక్క భర్త కాకపోయివుంటే బావుండేది’ అని పైకి అనలేక మనసులో అనుకొంది.
…మనసులో మాటను మనసులోనే తొక్కి, గోళ్లు కొరకటం ఆపి, సన్నగా ఓ నవ్వు నవ్వీ… ”ఏం లేదక్కా!” అంది.
కానీ పైకి చెప్పుకోలేని సమస్య నిశితలోని నరనరాన్ని నలిపేస్తున్నట్లు ఆముక్త అంచనా వెయ్యలేకపోయింది.

*****

ఇంకా వుంది

మాయానగరం .. 44

రచన: భువనచంద్ర

“ఆపండి. ఏమిటీ ఆలోచన?”మృదువుగా అడిగింది వందన.
“ఏమీలేదు వందనా? జస్ట్ ఓ ఉత్తరం. తెలిసినవాళ్లు రాసింది” మామూలుగా అవడానికి ప్రయత్నించాడుగాని, ఓ రకమైన అనిశ్చిత స్థితి ఆ సమాధానంలో బయటపడింది. వ్యక్తావ్యక్తలకి మధ్యనుండే స్థితి అది.
“ఎనీ ప్రాబ్లం?”
:నో.. ఇట్స్ నాటే ప్రాబ్లం”
“ఎవరన్నా అమ్మాయి రాసిందా? లవ్ లెటరా?”పకపకా నవ్వింది వందన. ఆ నవ్వు వాతావరణాన్ని తేలికపరచడానికి నవ్వినట్టుంది.
“అమ్మాయ్! లవ్ లెటర్ కాదుగానీ మేరేజ్ ప్రపోజల్” అప్రయత్నంగానే నిజం చెప్పాడు ఆ.రా.
“వావ్. ఏమా కథ. బోలో బోలో బోలో…” అంది భుజాల్ని ఊపుతూ అన్నది వందన. ఆమె కళ్లలోకి చూశాడు. ఆ.రా. ఉత్సాహమే కాదు ఓ రకమైన ఉద్విగ్నతా, ఆమె కళ్లల్లో కనిపించింది. ఆసలామె ఏమంటుందో విషయం వింటే అన్న ఆసక్తి అతని మనసులో కలిగింది.
“మాధవి అనే ఆమె నేను అత్యంత… గౌరవించే వ్యక్తి. శోభ అనే అమ్మాయి నన్ను ప్రేమిస్తోందనీ, పెళ్ళి చేసుకోవాలని కళ్లనిండా కలలు కంటొందని, ఆ కలల్ని నిజం చేసే వీలు వుంటుందో లేదో తెలుపమని ఉత్తరం రాసింది.” కళ్లల్లోకి చూస్తూ అన్నాడు.
“ఆ అమ్మాయి అందంగా వుంటుందా. ఆమె అంటే నీకు ప్రేమ వుందా?” గబగబా అడిగింది వందన.
“ఆ అమ్మాయి తెలుసు. చాలా మంచిది. అనాధాశ్రమంలో పెరిగింది. మాధవిగారిని స్వంత అక్కలా భావిస్తుంది. ఎన్నోసార్లు మేం కలిశాం. కానీ, శోభని ప్రేమించడం గానీ, పెళ్లి చేసుకుందామన్న వూహగానీ ఏనాడూ నా మనసులోకి రాలేదు. శోభని శోభగా గౌరవిస్తా. నాకంటే చిన్నది గనక ఓ సహోదర స్నేహంలో చూస్తా. అంతే!”
“వావ్! అలాంటప్పుడు ఆలోచనలెందుకు. హాయిగా రాసేయ్. ప్రేమించడం లేదనీ, పెళ్లి చేసుకోవడం కుదరదనీ..”రిలీఫ్‌గా అన్నది వందన.
” వ్రాయొచ్చు. కానీ శోభ.. హర్ట్ కాకుండా వ్రాయాలి. చిన్నతనం నించీ ఒంటరి గనక చాలా సెన్సిటివ్” అసలు విషయం చెప్పలేక నిట్టూర్చాడు ఆనందరావు.
“నీలో వుండే యీ గుణమే నాకు అద్భుతంగా నచ్చుతుంది ఆనంద. నీ గురించి నువ్వాలోచించవు. ఎదుటివాళ్ల గురించే ఎప్పుడూ ఆలోచిస్తావు. ఐ సింప్లీ లవ్ దట్ క్వాలిటీ ఇన్ యూ. పద హాయిగా ఊరి చుట్టు వద్దాం. హాలిడే కదా” చెయ్యిపట్టి లేవదీసింది వందన.
“నువ్వు పద. నేను డ్రెస్ చేసుకొస్తా” లేచాడు ఆనందరావు. ఆ వుత్తరం అతను అందుకొని ఇరవై నాలుగ్గంటలయింది. మాధవి శోభని పెళ్లి చెసుకోమని రాసిందంటే, మాధవికి నా మీద ఎటువంటి ఉద్ధేశ్యమూ లేనట్టేగా. అసలు నిజంగా నేను మాధవిని ప్రేమించానా? అక్కడ, ఆ వూళ్ళో వున్నంతకాలం మనఃస్పూర్తిగా ప్రేమించినట్లే అనిపించింది. కానీ” ఆలోచిస్తూ నిలబడిపోయాడు ఆనందరావు.
అందరం అనుకుంటాం.. ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చూడాలనీ, చెప్పాలనీ, కానీ, మన మనసుల్లోకి మనమే నిజాయితీగా తొంగి చూసుకోలేం. కారణం మనలోని నిజాలే మనని భయపెడతాయి. మన ముసుగుల్నీ, మన ఆలోచనల్నీ, ఆశల్నీ తరచి చూసుకోము. మనసు తలుపులు తెరిచి చూసుకోము.
“నేను నిజంగా మాధవిని ప్రేమించానా? లేక గౌరవించానా? లేకపోతే ఆమెని ప్రేమిస్తున్నాననే భావనని ప్రేమించానా? ఆమె పక్కమీద పడుకున్నప్పుడు అద్భుతం అనిపించింది. ఆమెతో నడిచేప్పుడూ, మాట్లాడినప్పుడు ఆనందం కలిగింది. కానీ వందనతోటి ఉన్నప్పుడు కలిగేంత ఉత్సాహం ఏనాడూ కలగలేదు. ఆమె పక్కనున్నప్పుడు ఏదో ప్రశాంతి. ఏదో సంతోషం తప్ప, వందనతో వుండేప్పుడు కలిగే యవ్వనపు పొంగు, తీవ్రమయిన ఉల్లాసమూ లేదు. అక్కడ నేను కేవలం యువకుడ్ని. కానీ ఇక్కడ, వందన సమక్షంలో యవ్వనకెరటాల మీద వూయలూగుతున్న యువకుడ్ని. తనలో తనే విశ్లేషించుకున్నాడు ఆనంద్.
“రెడీయా?” కిందనించి అరిచింది వందన. ఆ గొంతులో చెప్పలేని ఉత్సాహం. యవ్వనోత్సాహం.
“యా.. వస్తున్నా” అప్రయత్నంగా అన్నాడు. గబగబా షర్ట్ మార్చుకుని కిందకొచ్చాడు.
“బస్సులో పోదాం. భలే వుంటుంది” చెయ్యి పట్టుకుని నడుస్తూ అన్నది వందన.
“వందన అతన్ని ప్రేమిస్తోందనిపిస్తోందా?” అడిగింది నిరుపమా నింబాల్కర్ , వందన తల్లి.
“అలాగే వుంది మరి. ఇప్పటివరకూ బాయిస్‌తో ఇంత కలివిడిగా చూడలేదు” రెయిలింగ్ మీద చెయ్యి వేసి సాలోచనగా అన్నాడు దిలిప్ నింబాల్కర్. వందన తండ్రి.
వందనకి తెలుసు వాళ్లు వాచ్ చేస్తున్నారని. ఆమె కోరికా అదే, తల్లీతండ్రీ తమని గమనించాలని.
“మా మామ్, డాడ్ పైనించి చూస్తున్నారు తెలుసా. విను అంతే. వెనక్కి తిరిగి చూడకు” గుసగుసగా అన్నది వందన.
“నీకెలా తెలుసూ?” ఆశ్చర్యంగా అన్నాడు ఆ.రా.
“ఆడదానికి తల చుట్టూనే కాదు, వీపునిండా కూడా కళ్లే వుంటాయి” నవ్వింది వందన.
“ఎక్కడికెడదాం?” అడిగాడు ఆనందరావు.
“బస్సెక్కి గ్రాంట్ రోడ్‌కి పోదాం. అతి పురాతనమైన సినిమా హాళ్ళున్నాయి కొన్ని. వాటిని చూద్దాం. అక్కడ్నించి మళ్ళీ భివాండీకి పోదాం. అక్కడా బోలెడన్ని కొత్త పాత సినిమా హాళ్ళున్నాయి. వాటిని చూద్దాం. ఆ తర్వాత బాంబే సెంట్రల్‌కి దగ్గర్లోనే వున్న మరాఠా మందిర్ చూద్దాం. వెయ్యి మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీ వున్న థియేటర్ అది. అంతే కాదు. మా బాంబేవాళ్లకదో ప్రియమైన సెంటిమెంట్” నవ్వింది వందన.
“హాళ్ళు చూడడమేనా? సినిమాలు చూడొద్దా?” తనూ నవ్వి అన్నాదు ఆ.రా.
“వొద్దు. మూడు గంటలు సినిమా హాళ్ళో గడిపే బదులుగా మనం పుట్టకముందు, కొన్నైతే మన తల్లితండ్రులు కూడా పుట్టకముందు కట్టినవాటిని చూడడం గ్రేట్ కదూ!” సడన్‌గా ఆనందరావుకి కళ్లు చెమర్చాయి. ఇంత చిన్న వయసులో ఎంత ఉదాత్తమైన ఆలోచన.
తనని తాను మర్చిపోయి ఆమెని హత్తుకున్నాడు ఆ.రా. ఎంత సడన్‌గా అంటే వందన కూడా వూహించనంత సడన్‌గా. ఆమె మొహంలో ఆనందంతో కూడిన ఆశ్చర్యం. అంత ఆశ్చర్యంలో అతని కళ్లల్లో కన్నీటి బిందువుల్ని చూడగలిగింది.
అతని చెయ్యి గట్టిగా పట్టుకుని మౌనంగా ముందుకి నడిచింది.
తను నడవట్లేదు. నన్ను నడిపిస్తోంది. అవును. గత జన్మల జపతపాల నీడల్లోకి నడిపిస్తోంది. ఒంటరితనం నించి వెలుగులోకి నడిపిస్తోంది. ఇప్పుడు నేనెవర్ని? నేను నేనా లేక ఆమె నీడనా? ఊహలు మాటలై గుండె సవ్వడిలో కలిసిపోతుండగా తనూ మౌనంగా ముందుకి నడిచాడు ఆ.రా.
మాధవికి అర్ధమైంది, ఉత్తరం వ్రాసిన నెలకి కూడా సమాధానం రాకపోతే ఆనంద్ మనసులో వున్నది శొభారాణి కాదని. మరెవరై వుంటారూ? ఒకటీకి వందసార్లు తమతో వున్న ఆనంద ముఖకవళికల్ని గుర్తుకు తెచ్చుకుంది. బాగా ఆలోచించాక అర్ధమైంది. అతని మనసులో వున్నది తనేనని. ఆరాధనాపూర్వకమైన అతని చూపులూ, క్రిందపడిపోయినపుడు అతను ప్రవర్తించిన తీరూ అన్నీ అతని ఆరాధనని తెలుపుతున్నై. అతని స్పర్శలో కూడా అనంతమైన ప్రేమ, గౌరవం తప్ప వాంచ లేదు. మాధవి హౄదయం ఒక్కసారి ఝల్లుమంది. మిస్టర్ రావుని తన వైపునించి ప్రేమించానని అనుకోవడమేగానీ, ఇద్దరి మధ్యా అసలు ఏ మాత్రం ప్రగాఢమైన ప్రేమా చివురు తొడగలేదు. ఇతమిద్దమని తెలియని అలజడిలో కొట్టుకుంది మధవి మనసు. ఒకవేళ అ.రావు వొచ్చి ‘నిన్ను తప్ప ఎవరినీ ప్రేమించలేను’ అంటే? దాని సంగతి అలా వుంచితే ముందు శోభ విషయం ఏం చెయ్యాలీ? ఏమైనా సరే ఇవ్వాళ శోభతో బోస్‌బాబు గురించి ప్రస్తావించాలి. నిజంగా, లోతుగా ఆలోచిస్తే శోభకి అన్నివిధాలా రక్షణ ఇవ్వగలవాడు బోసుబాబే. ఆలోచిస్తూ అలానే నిద్రపోయింది మాధవి. రాత్రి ఎనిమిది గంటలైందనిగానీ, తలుపులు బార్లా తీసి వున్నాయనిగానీ ఆమెకి గుర్తులేదు.

*****
మీకు శత్రువులెవరన్నా వున్నారా?” అడిగాడు ఇన్‌స్పెక్టర్ సుభానీ.
“లేరు” నిర్లిప్తంగా అన్నది మాధవి.
“సరే. మా ఇన్వెస్టిగేషన్ మేం చేస్తాం. మీరు మాత్రం బాగా ఆలోచించి చెప్పండి. ఇది మామూలుగా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కాదు. ఎవరో కావాలని చాలా జాగ్రత్తగా మీ గదికి నిప్పంటించారని అనిపిస్తోంది.”అన్నాడు సుభానీ.
బయటకొచ్చింది మాధవి.
నిన్న రాత్రి సరిగ్గా 9.30 గంటలకి దగ్గుతూ లేచింది. కారణం చుట్టూ పొగ,మంటలూ అలుముకుని వుండటమె. మొత్తానికి పర్సూ, చెక్కుబుక్కూ, నగలతో బైట పడగలిగింది. ఆ పాటికే చుట్టుపక్కలవాళ్లు వచ్చి చాలా సహాయం చేశారు. బట్టలుగానీ, మిగతా వస్తువులు గానీ ఏమీ మిగలలేదు. గదంతా పొగచూరు వాసన. ఎక్కడికెళ్లాలో తెలీదు. మెట్ల మీద మోకాళ్ల మీద తల ఆంచుకుని కూర్చుంది. ఆనందరావు రూము గుర్తొచ్చింది కానీ, అతను లేడుగా. శోభ మూడు రోజుల క్రితం సౌందర్య ఇంటికెళ్ళింది. ఏదో సరదాగా వుండటాని. లక్కీ.. శోభ తన బట్టల్ని తీసికెళ్లడంతో ఆమె సేఫ్. ఇప్పుడెక్కదికెళ్లాలి. బోస్‌బాబు మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది.
“రండి.. సందేహించకండి..”మర్యాదగా అన్నాడు బోసుబాబు.

ఇసైజ్ఞాని ఇళయరాజా

రచన: శారదాప్రసాద్


(శ్రీ ఇళయరాజాగారికి పద్మ విభూషణ్ సత్కారం లభించిన సందర్భంగా, ఆయనను అభినందిస్తూ వ్రాసిన చిన్న వ్యాసం)

ఇళయరాజా … పరిచయం అక్కరలేని పేరు ఇది. పసిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు అతని బాణీలని కూనిరాగాలుగానైనా పాడుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తెలుగు సినిమా సంగీతంలో ఒక నూతన శకారంభానికి కారకుడైన ఈ సంగీత మేధావిని మేస్ట్రో అని పిలిచినా, ఇసైజ్ఞాని అన్నా, అభిమానులు ఇంకెన్ని మకుటాలు తగిలించినా ఈ నిగర్వి నిరాడంబరంగా నవ్వే ఒక చిరునవ్వు ముందు అవి చిన్నబోతాయి. అతడు మకుటాలు అవసరంలేని మహారాజు. పేరు యువరాజు అని పెట్టుకున్నప్పటికీ సంగీత ప్రపంచానికి అతడు రారాజు.
అయితే ఈ ప్రస్థానం అంత నల్లేరు మీది నడకలాగా ఏమీ సాగలేదు.అత్యంత దయనీయమైన బీదరికం నుంచి కేవలం తన విద్వత్తుతో, స్వయంకృషితో, గాడ్ ఫాదర్ ఎవరు లేకుండా ఒక్కడుగా ఆ శిఖరాలను అధిరోహించాడు. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనేందుకు అతని జీవితం నిలువెత్తు తార్కాణం. మనల్ని ఎవరు గుర్తించటంలేదు, మన మేధస్సు అంతా బూడిదలో పోసిన పన్నీరు ఐపోతోందని నిరాశ చెందే యువతరానికి పోరాటపటిమను నేర్పే ఒక చక్కని పాఠం.దక్షిణ భారత సంగీతాన్ని కొత్త మలుపులు తిప్పి, ఎన్నో ప్రయోగాలు చేసి, ప్రతి పాటలో తనదైన శైలిని కనబరచే సంగీత జ్ఞాని శ్రీఇళయరాజ గారు .ఆయన వయసు 73 ఏళ్ళు.ఈ వయసులో కూడా నూతన ప్రయోగాలతో, నేటి తరాన్ని అలరిస్తున్న శ్రీ ఇళయరాజ గారు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని మనసారా ప్రార్ధిస్తున్నాను.ఆ సందర్భంలో వారి జీవిత విశేషాలు క్లుప్తంగా అందిస్తున్నాను.
***
అసలు పేరు : డేనియల్ రాజయ్య
జననం : 2-6-1943
జన్మస్థలం : మదురైలోని పన్నైపురం గ్రామం
తల్లిదండ్రులు : చిన్నత్తాయమ్మాళ్, రామస్వామి
తోబుట్టువులు : అన్నయ్యలు (పావలర్ వరదరాజన్- రామస్వామి మొదటి భార్య కొడుకు, డేనియల్ భాస్కర్), తమ్ముడు (గంగై అమరన్)
చదువు : 8వ తరగతి
భార్య : జీవా(ఈమె మూడు సంవత్సరాల క్రితం మరణించారు)
పిల్లలు : కుమారులు (కార్తీక్‌రాజా, యువన్‌శంకర్‌రాజా), కుమార్తె (భవతారిణి)– సంగీత దర్శకులు, గాయకులుగా రాణిస్తున్నారు
సంగీత గురువు : జి.కె.వెంకటేష్
తొలిచిత్రాలు సంగీత దర్శకునిగా : తమిళం-అన్నకిళి (1976), తెలుగు-భద్రకాళి (1977)
గాయకునిగా : సీతాకోకచిలుకలో ‘అలలు కలలు ఎగసి ఎగసి…’ (తెలుగు)
సంగీత దర్శకునిగా చిత్రాలు : 1000 దాకా
నటించిన సినిమాలు : పుదు పుదు అర్తంగళ్ (1989), అళగర్‌మలై (2009)
రాసిన పుస్తకాలు : తుళకడల్, పాల్ నిలాపాదై
అవార్డులు-పురస్కారాలు : గిటార్ సాధనలో ‘ట్రినిటీ మ్యూజిక్ ఆఫ్ లండన్’ వారి నుండి గోల్డ్‌మెడల్, జాతీయ అవార్డులు… తెలుగులో రెండు, తమిళ, మళయాళాలలో ఒక్కక్కటి, అన్నామలై, అరిజోనా వరల్డ్, మదురై కామరాజ్ యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లు, తెలుగులో మూడు నంది అవార్డులు. పద్మభూషణ్, ఇసై జ్ఞాని… బిరుదులు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి లతా మంగేష్కర్ అవార్డు, కలైమామణి, ఏపీ ప్రభుత్వం నుండి 2008 లో ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుండి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పురస్కారం, మరెన్నో సంగీత అవార్డులు అందుకున్నారు. 2018 లో భారత ప్రభుత్వం ఈయన్ను పద్మ విభూషణ్ సత్కారంతో గౌరవించింది.
భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుందాం!

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 24

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనల్లో చాలా భాగం పల్లవి కొరకరాని కొయ్య. పైకి ఒక అర్ధం గోచరిస్తూ అంతరార్ధం తరచి తరచి చూస్తే గానీ తెలియరాని పరిస్థితి. ఊహ చాలా గొప్పగా ఉంటుంది. అర్ధం మాత్రం చాలా గోప్యంగా ఉంటుంది. జీవితం అన్నది జీవి తెలిసి ఎంచుకున్నది కాదు. అది “సంభవించింది” మాత్రమే! పుట్టినప్పుడు మన శరీరం చాలా చిన్నది, ఇప్పుడిలా పెరిగి పెద్దదైంది. అంటే ఖచ్చితంగా ఈ శరీరం మనం సేకరించుకున్నదే. దేన్నైతే మనం “నా శరీరం” అంటామో, అది మనం తిన్న ఆహార సేకరణ. అలాగే దేన్నైతే మీరు “నా మనస్సు” అంటారో అది భావాల సేకరణ. మన శరీరం మొదట అణురూపంలో సృష్టించబడుతుంది. అలాగే మన మనసు కూడా భావాల సేకరణ మాత్రమే. ఎప్పుడైతే మనం అనుభవాన్నే మనమనుకుంటామో, మనం కానిదానితో మనల్ల్ని గుర్తించుకుంటామో, అప్పుడు మన గ్రహణశీలత పూర్తిగా వక్రీకరింపబడుతుంది. మనం బైటనుంచి సేకరించుకున్న శరీరాన్ని మనం అని భావించిన క్షణం, మన మనస్సుపై పడిన ముద్రలను మనంగా భావించిన క్షణం, జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చూడలేము. మనుగడకి ఏవిధంగా అయితే అవసరమో, ఆవిధంగానే జీవితాన్ని చూస్తారు తప్ప, అది నిజంగా ఎలా ఉందో అలా చూడలేము. అప్పుడు అనేక మాయలలో చిక్కి జననమరణ చక్రపరిభ్రమణంలో ఉండిపోతాము అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. ఈ దేహం ఎప్పటికైనా నశించిపోయేదే అన్న స్పృహ ఉండాలి. ఈ చక్ర పరిభ్రమణలో పడి మనిషి మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉన్నాడు. దీనికి విముక్తి ఏమిటి? అన్నమయ్య ఈ కీర్తనలో చూద్దాం.
కీర్తన:
పల్లవి: అణుమాత్రపుదేహి నంతే నేను
మొణిగెద లేచెద ముందర గానను

చ.1. తగు సంసారపు తరగలు నీ మాయ
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా! ॥అణుమాత్రపు॥

చ.2. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?॥ అణుమాత్రపు॥

చ.3. కులధనములతో జిగురుగండె నీ మాయ
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా? ॥ అణుమాత్రపు॥
(రాగం: సామంతం; రేకు సం: 260, కీర్తన 3-347)

విశ్లేషణ:
పల్లవి: అణుమాత్రపుదేహి నంతే నేను
మొణిగెద లేచెద ముందర గానను
శ్రీనివాసా! అణుమాత్రపు కణంతో జన్మించాను నేను. అణువుతో సమానమైనవాడను. ఈ సంసార చక్రంలో పడి ముణుగుతున్నాను లేస్తున్నాను. అనగా పుడుతూ ఉన్నాను. మరలా జన్మిస్తూ ఉన్నాను. ఏది కొస ఏది మొదలు అనే అంతరం తెలియక కొట్టుమిట్టాడుతున్న వాడను. ముందు ఏమి జరుగుతుందో తెలీదు. తర్వాత ఏమి అవుతుందో తెలీదు. ఇదీ నా పరిస్థితి స్వామీ!

చ.1. తగు సంసారపు తరగలు నీ మాయ
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా!
ఈ సంసారమనే మహాసముద్రంలో వువ్వెత్తున లేచే తరంగాలు నీ మాయ. ఈ మహారణ్యంలో పెనువృక్షాలలాగా వేదవేదాంగాలు అర్ధంకాని పరిస్థ్తిలో ఉన్నవి ఇదీ నీ మాయే! రాత్రి పగళ్ళు, నశించేటువంటి ఈ పుట్టుక నీ మాయ. ఆకాశం ఎంత అగమ్యగోచరమో నీ మాయ అంతే ! ఏమీ అర్ధం కాదు. దీన్ని దాటడం సామాన్యులమైన మా వశమా?

చ.2. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?
స్వామీ! మేము చేతగాని అనేక అవక తవక పనులు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఈ కర్మ బంధాలలో తగులుకుంటూనే ఉన్నాము. నీ నియమానుసారం సంచరించే గాలి ఒక్కోసారి ప్రళయకాల సదృశమై పెనుగాలిగా మారడం నీ మాయ కాదా? సర్వస్వం పెళ్లగించి ఇసుక పాతరలో పూడ్చి పెట్టేయడం నీ మాయ కాదా? నిన్ను ఎదిరించి జయించడం ఎవరికి తరము? మాలాంటి వారికి ఈ ఆటుపోట్లను తట్టుకొని నిలబడే శక్తి ఉంటుందా చెప్పండి అని ప్రార్ధిస్తున్నాడు.

చ.3. కులధనములతో జిగురుగండె నీ మాయ
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా?
స్వామీ మేము గొప్ప కులంలో జన్మించామని కొందరు, గొప్ప కోటీశ్వరులుగా జన్మించామని కొందరు విర్రవీగుతుంటారు. కానీ ఇదంతా నీవు పన్నిన వుచ్చని తెలుసుకోలేని విధంగా మాయలో చిక్కిపోయాము. తెలుసుకోలేకపోతున్నాము. ఇలాంటి మాయా ప్రపంచంలో నివురుగప్పిన మాయతో జీవిస్తున్నాము. శ్రీ వేంకటేశ్వరా! నీవు మమ్మలను ప్రేమతో చేరదీస్తే ఈ మాయను గెలువగలము కానీ మామూలుగా జయింపవశముగాని మాయ ఇది. కనుక మమ్మలను ఈ మాయలో పడకుండా కాపాడి ముక్తిని ప్రసాదించండి అని అన్నమయ్య ప్రార్ధిస్తున్నాడు.
ముఖ్యమైన అర్ధాలు: మొణిగెద = ముణుగుతాను (ఇక్కడ జన్మించడం అనే అర్ధాన్ని స్ఫురింపజేస్తున్నది, అనేక జీవులలో ప్రవేశించడం) లేచెద = లేవడం అనేది సామాన్యార్ధం, ఇక్కడ మరణించడం అనే అర్ధం తీసుకొనాలి; తరగలు = తరంగాలు, అలలు; నిగమములు = వేదాలు; వుచ్చే భవములు = నశించే గుణం ఉన్న పుట్టుకలు; కదవగ = దాటుటకు; బయలు వందిలి = వ్యర్ధ ప్రయత్నాలు; క్రియనిసుకపాతర కెల్లొత్తు = సమూలంగా పెళ్ళగించి ఇసుక పాతరలో పూడ్చివేయడం; జిగురు గండె = పక్షులను పట్టుకొను సాధన విశేషము, ఉచ్చు; ఎలమి = వికాసము.

“మనీ” షి

రచన: కంభంపాటి రవీంద్ర

“లుటే కోయీ మన్ కా నగర్ ..బన్ కె మేరా సాథీ” అని అనిత పాడుతూంటే, చేతిలో ఉన్న ఐస్ కోల్డ్ గా ఉన్న కోక్ టిన్ను పట్టుకుని అలా వింటూండిపోయేడు ఆత్రేయ ! ఆఫీస్ లో ఎవరో యూఎస్ వెళ్తూంటే ఫేర్వెల్ పార్టీ జరుగుతూంది, పార్టీ అనే ఏమిటి, వాళ్ళ ఆఫీస్ లో ఏ ఫంక్షన్ అయినా కూడా అనిత పాట పాడడం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, అంత బాగా పాడుతుంది మరి !
పాట పాడడం అయిపోయిన వెంటనే అందరూ ఒకటే చప్పట్లు, ఇంకొక్క పాట పాడమని తెగ రిక్వెస్టు చేస్తే,” తేరే బినా భి జిందగీ సే కోయి షిఖ్వా తో నహీ” అంటూ ఆ అమ్మాయి పాడడం మొదలెట్టేసరికి, కాస్త దూరంలో ఉన్న దోశ కౌంటర్లో దోశెలేసే నరహరి దోశ తిప్పడం మర్చిపోయి అలా వింటూండిపోయేసరికి, వేస్తున్న దోశ కాస్తా మాడిపోయింది !
పాట పాడడం అయిపోయిన వెంటనే ఆత్రేయ దగ్గిరికి పరిగెత్తుకుని వచ్చేసింది !
“మిథాలీ దగ్గర కాస్సేపు ఉండొచ్చుగా .. మళ్ళీ తను యూఎస్ నుంచి ఎప్పుడొస్తుందో మరి “అన్నాడు ఆత్రేయ
“నువ్వు నా చుట్టుపక్కల ఉన్నప్పుడు, నీ కన్నా నాకెవరూ ఇంపార్టెంట్ కాదు” అని అనిత అంటే,” పోనీ నన్ను వెళ్లిపొమ్మంటావా ?” అని నవ్వేడు ఆత్రేయ .
“ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పను .. సరే .. కాస్సేపు అలా బయటికెల్దామా ?” అడిగింది అనిత.
ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్ బయటనున్న లాన్ లో నడుస్తున్నారు .
“మన సంగతి .. మీ ఇంట్లో చెప్పేవా ?” అడిగింది అనిత
“చెప్పాలంటే భయమేస్తూంది .. అందుకే .. మా పిన్ని హెల్ప్ తీసుకుంటున్నా” అన్నాడు ఆత్రేయ
“ఆవిడ మనకి సపోర్ట్ గా మాట్లాడతారంటావా ?”
“తప్పకుండా.. మొన్న వీకెండ్ మా పిన్ని, బాబాయ్ లని కలిసేను .. నీ ఫోటో చాలా నచ్చింది వాళ్లకి .. అసలు నీకో సిస్టరుంటే వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ కి చేసుకుందురట”
“పోన్లే.. అదొక రిలీఫ్ .. ఆవిడ మీ పేరెంట్స్ ని కన్విన్స్ చేయగలిగితే చాలు” అంది అనిత.
“సరే.. నేను ఇంటికి బయల్దేరాలి .. ఇవాళ మా లక్ష్మి పిన్ని వాళ్ళు ఇంటికొస్తామన్నారు .. హోప్ ఫుల్లీ ..వాళ్ళ సపోర్ట్ తో మన పెళ్లి సంగతి మాట్లాడతాను” అన్నాడు ఆత్రేయ
“లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్” అని అతని చేతిని గట్టిగా నొక్కింది అనిత .
ఆ రోజు రాత్రి ఆత్రేయ వాళ్ళింట్లో పెద్ద చర్చే నడిచింది .
“ఆ పిల్లకి తల్లీ, తండ్రీ లేరు, ఇలాంటి అణా కాణీ సంబంధం ఎందుకు మనకి” అన్నాడు ఆత్రేయ తండ్రి లక్ష్మణ్
“నిజమే బావగారూ .. ఆ పిల్లకి తల్లీ, తండ్రీ లేరు.. చిన్నప్పట్నుంచీ తనని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య పెంచారు .. అయినా కూడా ఎంత చక్కగా పెరిగింది ఆ అమ్మాయి ! బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం చేస్తూంది .. ఇంత కన్నా ఏం కావాలండీ” అని లక్ష్మి అంటే
“చాల్లేవే .. వీడు చేసే ఉద్యోగం లో అమెరికా వెళ్లే అవకాశం ఉంది .. కానీ ఆ పిల్ల అమెరికా వెళ్ళాదట .. తను అక్కడికి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య లని ఎవరూ చూసుకోడానికి ఉండరు కాబట్టి ఇక్కడే ఉంటుందట ..అంటే .. మన వెధవ కూడా ఆ పిల్ల తో పాటు, ఇక్కడే పడి ఉండాల్సిందే ..పైగా .. ఆ ముసలాళ్ళిద్దరి ఖర్చూ కూడా మన వెర్రాడి జేబులోంచే “అంటూ అందుకుంది ఆత్రేయ తల్లి సరస్వతి
“అక్కా .. ఆ అమ్మాయి తనని పెంచినందుకు వాళ్ళని చూసుకోడానికి ఇండియా లోనే ఉండిపోడానికి నిశ్చయించుకుంది అంటే .. ఆ పిల్లది ఎంత గొప్ప మనసో ..” అని లక్ష్మి అంటే.
“మనసుదేవుంది ..అన్నం పెడుతుందా ఏవన్నానా .. వీడి తోటివాళ్ళందరూ అమెరికా, యూరప్ అంటూ ఉద్యోగాలొచ్చి వెళ్లి, డబ్బులు సంపాదించేస్తూంటే, వీడు మటుకు ఆ పిల్లతో పాటు ఇక్కడే ఉండి, ఆ ముసలాళ్ళ సేవలో తరించాలేంటి ? పైగా ..వాళ్ళది మన శాఖ కూడా కాదు ..
కనీసం వెలనాట్లు కూడా కాదు ..నియోగులట !!” ఈసడింపుగా బదులిచ్చింది సరస్వతి
“డబ్బుదేముందక్కా .. గుణం ముఖ్యం గానీ .. ఇంక శాఖాభేదం అంటావా ..ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు కనక ?.. అసలు మీవాడో బ్రాహ్మణ పిల్లని ప్రేమించేడు .. అదే సంతోషం అనుకోవాలి” అంది లక్ష్మి
“నీకు డబ్బూ, శాఖ, కులమూ ప్రధానం కానప్పుడు, ఆ పిల్లని మీవాడికే చేసుకో .. మావాడ్ని వెనకేసుకు రాకు .. ఒకవేళ వీడు మమ్మల్ని కాదని ఆ పిల్లని చేసుకుంటే, వీడికి మేమెవరమూ లేనట్టే” కోపం గా అన్నాడు లక్ష్మణ్
“నాకు ఆత్రేయ, ప్రవీణ్ వేర్వేరు కాదండి . . ఒకవేళ ఆత్రేయ ఆ అమ్మాయిని ప్రేమించకుండా ఉండుంటే, ఆ పిల్లని మా ప్రవీణ్ కి కళ్ళకద్దుకుని చూసుకునేదాన్ని” అనేసి విసురుగా వెళ్ళిపోయింది లక్ష్మి .
మర్నాడు అనితని తీసుకుని, లక్ష్మి పిన్ని వాళింటికెళ్ళేడు ఆత్రేయ.
“పిన్నీ .. ఏం చెయ్యాలో తోచటం లేదు ..అనితేమో పెద్దలు ఒప్పుకోనిదే పెళ్ళొద్దు అంటూంది .. మరి నిన్న మా అమ్మా వాళ్ళ అభిప్రాయం చూసేవు కదా .. నువ్వే చెప్పు ..” అన్నాడు
“ఒరే వెధవా .. ఆ పిల్లని నిజంగా ప్రేమించుంటే, ఏం చెయ్యాలో తోచడం లేదు లాంటి వెర్రిమాటలెందుకొస్తాయి ?.. నిజం చెప్పు .. ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నావా ?” అంది లక్ష్మి
“భలేదానివి పిన్ని .. మా అమ్మతో సమానమైన రెస్పెక్ట్ ఇస్తాను నీకు .. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పేనా ?.. నేను అనిత ని తప్ప వేరెవర్నీ పెళ్లి చేసుకోను .. ప్రామిస్” అన్నాడు ఆత్రేయ
“అయితే …ఇంకేమి. నేనూ, మీ బాబాయి గారు కలిసి వీళ్ళ తాతగారితో మాట్లాడతాము .. మీ అమ్మావాళ్ళూ ఇప్పుడు ఒప్పుకోకపోయినా, తర్వాతయినా ఒప్పుకోక తప్పదు .. నువ్వు తప్ప వాళ్ళకెవరున్నారు కనుక ?” అని భరోసా ఇచ్చింది లక్ష్మి పిన్ని !
“చాలా థాంక్స్ పిన్నీ” అని ఆత్రేయ అంటే,” మీరీ హెల్ప్ చేసినందుకు ఎప్పటికీ మర్చిపోలేమండి” అంటూ అనిత లక్ష్మి పిన్ని కాళ్ళకి దణ్ణం పెట్టేసింది
“ఆమ్మో! మా పెద్ద కోడలు బంగారం” అంటూ ఆశీర్వదించింది లక్ష్మి .

**************************

“మనకి పెళ్ళై రెండేళ్ళవుతూంది. బాబు పుట్టి ఏడాదవుతూంది .. ఇంతవరకూ మావయ్యగారూ వాళ్ళూ మనల్ని కలుపుకోడానికి ఇష్టపడ్డం లేదు” దిగులుగా అంది అనిత
“పెళ్ళైతే మాతో సంబంధం లేదని మా నాన్నగారు ముందే చెప్పేరుగా” అన్నాడు ఆత్రేయ
“కరెక్టే .. కానీ ఇప్పుడు, బాబుని, అమ్మమ్మ వాళ్ళని చూసుకోడానికి నేను జాబ్ మానేసి ఏడాదవుతూంది .. నీ ఒక్కడి శాలరీతో ఇంతమందిని ఎలా పోషిస్తావు ?” బాధగా అంది అనిత
“ఒక మూడు నెలలు అమెరికాకి వెళ్లమంటున్నారు .. కొంచెం ఇలాంటి షార్ట్ ట్రిప్స్ ఒప్పుకుంటే డబ్బులు మిగులుతూంటాయి .. నీకు సపోర్ట్ గా మా లక్ష్మి పిన్ని ఉంటుంది .. ఓసారి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెబుదాం” అని లక్ష్మి పిన్ని వాళ్ళింటికి బయల్దేరదీసేడు .
లక్ష్మి పిన్ని వాళ్ళ ఫ్లాట్ బయట చెప్పులిప్పి కాలింగ్ బెల్ కొట్టబోతూ ఆగాడు ఆత్రేయ,
“ఆ ఆత్రేయగాడిలా పిచ్చి సంబంధమేదైనా ప్రేమా దోమా అంటూ అన్నావంటే ఇదిగో. ఈ సిలిండర్ పేల్చుకుని చస్తా వెధవా .. నీకొచ్చింది అల్లాటప్పా సంబంధం అనుకున్నావా ? పిల్లకి గ్రీన్ కార్డుంది .. కోటీశ్వరులు .. పైగా మన శాఖే .. వైదీకులు” అంటూ తన కొడుకు ప్రవీణ్ మీద విరుచుకుపడుతున్న లక్ష్మి మాటలు స్పష్టంగా వినిపించాయి !

తను కన్నతల్లి

రచన: చెంగల్వల కామేశ్వరి

“అమ్మా” చిన్నగా అరిచింది విమల. సూది గుచ్చుకుంది. వేలులో దిగిన సూదిని తీసి పక్కన పెట్టింది. విమల ఆగకుండా కారుతున్న రక్తం! వదిన వంటింటి లోంచే ఏమయింది! అనడుగుతోంది. తనే గబగబా వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తింది. రక్తం కారుతున్న వేలుని నీళ్లతో కడిగి రక్తం కారడం ఆగాక మళ్లీ వచ్చి కుర్చీలో కూర్చుని మళ్లీ అప్రయత్నంగా గోడ మీద ఉన్న ఫొటోలో నవ్వుతున్న అమ్మ ఫొటో చూసిన విమల కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి.
“అమ్మ “అమ్మ” ఉంటే ఈ పాటికి తన అజాగ్రత్తకు సుతిమెత్తగా తిడ్తూనే కాఫీ పొడి అద్దటం చేసేది. అన్నం కలిపి తినపెట్టేది. అప్పుడే నెలయింది. అమ్మ పోయి. ఇంత సడన్ గా అమ్మ తమందరిని వదిలి వెళ్లిపోతుందని అనుకోలేదు.
“అమ్మ” విలువేంటో అమ్మ గొప్పతనమేమిటో అమ్మ పోయాకే తెలిసింది. నాన్న తాము అమ్మ లేకుండా ఎలా ఉండాలో! అర్ధం కావటంలేదు. నాన్న అమ్మని ఎంత ప్రేమించాడో ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. వాళ్ల దాంపత్యంలో ఉన్న అనుబంధమేమిటో నాన్న నోటినుండి అమ్మ జ్ఞాపకాలుగా వింటుంటే నాన్న ఇంత మాట్లాడటం అది కూడా అమ్మ గురించి. మాట్లాడటం. ఆశ్చర్యంగా ఉంది.
అమ్మ ఫొటోలు వీడియోలు వెతుక్కుని వెతుక్కుని చూస్తూ ఒక్కో సారి నవ్వేసుకుంటూ మరోసారి కళ్లొత్తుకుంటో చూస్తూ అమ్మ వియోగానికి చిక్కిశల్యమవుతున్న నాన్నని చూసి, చిన్న అన్నయ్య, తను ఏడ్వలేక, ఏడుపు ఆపుకోలేక, యాతన పడుతూ నాన్నని ఓదార్చాల్సి వస్తోంది. నాన్నని తనతో తీసుకెళ్లడం కోసమే తను వెళ్లకుండా ఆగిపోయింది.
పెద్దన్నయ్య వాళ్లు ఈ ఊళ్లోనే ఉన్నా పెద్దొదిన ధోరణికి తామెవ్వరూ వెళ్లరు. చిన్నన్నయ్య చిన్నొదిన అమ్మానాన్న అన్నా, తనన్నా ప్రాణం పెడతారు. అందుకే పిల్లలు కూడా ఇక్కడ ఉండటానికే ఇష్టపడతారు. కాని అందరి బదులు అమ్మని ఆడిపోసుకున్న పెద్దొదినకి, అమ్మ విలువ ఏనాటికీ అర్ధంకాదు. అందుకే పెద్దన్నయ్య రమ్మన్నా అక్కడికి వెళ్లలేదు నాన్న .
తను కూడా భర్త సూర్యాన్ని పంపేసి నాన్న కోసం కొన్నాళ్లు ఉండి వచ్చేప్పుడు నాన్నని తనతో తీసుకెళ్లాలని ఆగింది. నాన్న ఇంకా అమ్మ పోయిన షాక్ నుండి తేరుకోలేదు. తన ప్రక్కనే పడుకొన్న అమ్మ అచేతనంగా ఎలా అయిందో అర్ధం కాని అయోమయంలోనే ఉండిపోయాడు. సరిగ్గా నిద్రపోడు. ఏది పెట్టినా తినడు. ఎప్పుడూ తనలో తానే తిరణాలలో తప్పిపోయిన వాడిలా అమ్మ వాడిన వస్తువు దగ్గర పెట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు
వదిన ఏది చేసిపెట్టినా “అచ్చం మీ అత్తగారిలాగే చేసావమ్మా! ఇదివరకు అలా చేసేదానివి కాదు. మీ అత్తయే నీ చేత ఇలా చేయిస్తోందేమో! అని తినడానికి కూర్చున్నా అమ్మ జ్ఞాపకమొచ్చి చేయి కడిగేసుకుంటున్నాడు.
ఇంకో నెలలో అమెరికా వెళ్లిపోతుంది. మళ్లీ ఇండియాకి రావాలంటే అమ్మ లేని ఇంటికి ఎలా రావాలో! అనుకుంటేనే గుండె బావురుమంటోంది. తనని చూడాలని అమ్మ అంటే రెండేళ్లయింది నువ్వెళ్లి ఎప్పుడొస్తావే!
“తల్లి ఉన్నఫ్పుడే పుట్టిల్లు! పాలున్నప్పుడే పాయసం! అని సామెతలు చెప్పేది. కాని ఆ తల్లి ఇంకలేదు అని తెలిసాక ఎంత ఏడ్చిందో! అందరికన్నా చిన్నదని ఎంతో గారం చేసే అమ్మ చివరిక్షణాలలో కూడా చూసుకోలేదు. ఆ తరగని దుంఖంతో దూరం తరగని ఆ దూరప్రయాణం తాను మరువలేదు.
కానీ ఇక్కడే ఉన్న వాళ్లందరూ అమ్మని ఎంత మిస్సవుతున్నారో! వాళ్లెలా మామూలుగా అవుతారో! అమ్మంటే ప్రాణం పెట్టే తమతో పాటు అమ్మమ్మ బామ్మ మామయ్యలు పిన్నిలు బాబయ్యలు అమ్మ ఫ్రెండ్స్ అకస్మాత్తుగా దూరమయిన అమ్మ గురించి ఎంత వేదన పడుతున్నారో!
అమ్మ సహాయం పొందిన వారు అమ్మ గురించి చెప్పుకొని ఏడుస్తుంటే అటువంటి తల్లి కడుపున పుట్టటమే అదృష్టం కాని అమ్మని ఆనందపరిచే అవకాశం తామెవ్వరికీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా తను చేసుకునే మెడిటేషన్ పూజ సామాజిక కార్యక్రమాలతో ప్రశాంతంగా ఆనందంగా తానుంటూ అందరిని ఆనందపరిచేది.
అయినా “చచ్చిన వాళ్ల కళ్లు చారెడేసి !అన్నట్లు అమ్మ బ్రతికున్నప్పుడు అందరూ రకరకాలుగా అమ్మ ని ఏదో ఒకటి అన్నవారే! ఇప్పుడవన్నీ అమ్మతో పాటే మాయమైపోయాయి. అమ్మ మంచితనమే అందరికీ అర్ధమవుతుంది. ఉనికి పోయాకే మనుష్యులు గుర్తింపబడతారా ఏమో,! ఇప్పుడలాగే అనిపిస్తోంది.
అమ్మ ఉన్నప్పుడు అమ్మ కేవలం గృహిణి మాత్రమే కాదు . సామాజికంగా పలు సంస్థలు చేసే కార్యక్రమాలలో పాల్గొనేది. సాహిత్యం పట్ల మక్కువతో పుస్తకాలు కొని చదివేది. ఏవేవో రాస్తూ పుస్తకాలకు పంపేది. ఇలా ఎప్పుడూ తనను తాను బిజీగా ఉంచుకుంటూ సోషల్ మీడియాలో కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఇవన్నీ తమకు గర్వంగానే ఉండేవి. కాని కొందరు కావాలని హేళనగా మాట్లాడేవారు. నాన్న మీద తమ మీద అక్కరలేని జాలి కురిపిస్తూ అమ్మ తమందరినీ గాలికొదిలేసినట్లు నాన్న అమ్మని కట్టడి చేయలేదన్నట్లు చేసే వాఖ్యానాలకి అమ్మ చాలా బాధపడేది.
నాన్న అన్నయ్య తను ఎప్పుడూ అమ్మ వల్ల ఇబ్బంది పడలేదు. అమ్మ బిజీగా ఉంటే తామేదయినా సహాయం చేస్తే దానికే ఎంతో పొంగిపోయేది. ఇంటికెవరో ఒకరు రావడం సాహిత్య చర్చలు జరగడం అన్నీ బాగుండేవి. తమ పెళ్లిళ్లు అవి ఉన్నప్పుడు అవన్నీ మానుకుని ఇల్లాలిగా తల్లిగా తన బాద్యతలు నెరవేర్చేది. అలా ఇంటా బైటా గెల్చి మన్ననలు పొందిన అమ్మ పెద్దొదినకి నచ్చలేదు.
అమ్మ రాసిన విషయాలను కధలను ప్రస్తావించి హేళనగా మాట్లాడటం ఈ వయసులో ఇంత మెయింటెయిన్ చేసే వారినెక్కడా చూడలే్దు పెద్దరికం అంటే వయసుకొస్తే చాలదు. ఇంకా కోడళ్లతో కూతుళ్లతో పోటీ పడతుంది మా అత్తగారు. మనవలనెత్తినా స్వీట్ సిక్స్టీన్ అనుకుంటుంది. ఆ చీరలేంటో ఆ వాలుజడలేంటో! అని ఆవిడ పై ఉన్న ఈర్ష్యాసూయలు వెలిగ్రక్కుతూ ఉండేది. అమ్మ యాక్టివ్ గా ఉండటం వలన ఆవిడ వయసు కన్నా తక్కువగా కనిపించేది. దానికి సాయం ఇంటా బయటా పనుల కోసం తిరిగేదేమో ఉన్నంతలో నీటుగా ఉండేది. అది చూసి ఓర్వలేకపోయేది. పెద్దవదిన.
ఈవిడ మాటలు విని అమ్మేమయినా హర్ట్ అయిందేమో అనుకుని “అవేమి పట్టించుకోవద్దు” అని చెప్పబోతే చాలా తేలికగా నవ్వేసి” నాకు ఇవేమి కొత్తకాదమ్మా! నేనేమిటో మీకు తెలుసు. నాకు తెలుసు. నా గురించి అర్ధం కాని వారనుకుంటే ఎందుకు పట్టించుకోవాలి”అనేది. నాన్న జోక్ చేసేవారు. “భార్యా రూపవతీ శత్రువు” అన్నారు కాని అత్తా రూపవతీ శత్రువనలేదు కదే ! అని అమ్మ భయపడేది. “కోడలు వింటే గొడవలవుతాయి. బైటకెడతూ ఉంటాను కాబట్టి ఏదో రెడీ అయి వెడతాను. కాని, వయసులేదా అత్తగారు అవలేదా అమ్మమ్మ బామ్మ అవలేదా ! మీరు మరీను!” అని కేకలేసేది.
అలా అమ్మ మవునాన్ని అలుసుగా తీసుకుని బాహాటంగా అందరి ఎదురుగా మాట్లాడటం. ప్రతీదానికి వాళ్ల అమ్మతో పోల్చుకుని ఆవిడ మహా పతివ్రత మొగుడు గీసిన గీటు దాటదు. ఇల్లే ముఖ్యం మా అమ్మకి. . ఇవన్నీ ఆవిడా చేయగలదు. కాని, మా అమ్మకి ఇలా వీధులమ్మట సింగారించుకుని తిరగడం ఇష్టంలేదు అని” అయినా ఇలా వచ్చే పోయే వారికి వండి వార్చి ఇల్లు దిబ్బ చేస్తోంది రేపు మాకందరికీ ఉన్నాయి తిప్పలు” అంటూ అమ్మని మాటి మాటికి అంటుంటే నచ్చక ఒకరోజు నాన్నకి చిర్రెత్తింది. .
“ఏమ్మా! మీ అత్తగారు ఎలా ఉంటే నీకేమయింది. దానికి ఏది కట్టినా ఎలావున్నా నప్పుతుంది. ఈ రోజు కొత్తగా వచ్చింది నువ్వొక్కదానివే! అత్తగారు చేసేవి రాసేవి నచ్చకపోతే నీ ఇష్టం! మర్యాద తగ్గించి మాట్లాడితే బాగుండదు”. అని గట్టిగా చెప్పారు. దానికి పెద్ద రాద్దాంతమే జరిగింది.
అమ్మ కూడా కొన్ని సంధర్భాలలో మృదువుగా నచ్చచెప్పి చూసింది. కాని ,ఆ వంకా,ఈ వంకా పెట్టి వేరు కాపురం పెట్టించింది. పెద్దొదిన ఈ పరిస్తితులు చూసి పెద్దన్నయ్య ఇబ్బంది పడుతూ మెయిల్ పెడ్తే, తను కూడా చెప్పింది. “నచ్చనపుడు దగ్గరే ఉండి, నచ్చకుండా ఉండే కంటే, వేర్వేరుగా ఉండటమే మంచిది. ! అని. పాపం వాడు తనొక్కడే వేరయినట్లుగా దిగాలు పడటం చూసి తనూ చిన్నన్నయ్య అమ్మా నాన్న నచ్చచెప్పారు.
” ఏదో అప్పుడప్పుడు రావటం వెళ్లటం తప్ప పెద్దొదినతో పెద్ద అనుబంధం ఏర్పడలే్దు. తనకి కూడా చిన్నొదినలో అమ్మే కనిపిస్తుంది. అందరికీ ఆ చిన్నావిడే కావాలి మేమే ఎవరికీ అక్కర్లేదు అని మధ్య మధ్యలో దులపరించేస్తూ ఉంటుంది. విచిత్రమేమిటంటే అమ్మ పోయినప్పుడొచ్చిన రాజకీయ ప్రముఖులని, వీధంతా నిండిన పలు సంఘాల సభ్యులని చూసి పోయిన అత్తగారి గురించి చిలవలు పలవలు పోతూ పెట్టిన శోకాలు చూసి తమవారందరూ విస్తుపోయారు.
నాన్నకన్నా తను ముందు పోవాలని అనేది కాదుఅమ్మ పెద్దొదిన పెట్టే గొడవలకి కలత చెంది ” మీనాన్న కన్నా నేను ముందు పోతే ముత్తైదువగా పసుపుకుంకాలతో పోతానేమో కాని, నాన్న నేను లేకుండా ఉండలేరే! వాళ్లమ్మ పోయినపుడే ఎంత బెంగపడ్డారో! నేను లేకపోతే నాన్నను నువ్వే చూడాలమ్మా! అంటే అలాంటి మాటలేంటమా! ఏభయ్యేడేళ్లకే ఇలా మాట్లాడతావా! నువ్వింకా రిటైర్ కాలేదు నాన్నే రిటైర్ అయ్యారు. అయినా మీ ఇద్దరిని నాతో తీసుకెళ్లిపోతాను. ఆ సోషల్ వర్కేదో అమెరికాలో చేయి. ,! అనేది.
అలాంటిది ఇలా సడన్ గా వెళ్లిపోయింది. అని బాధ పడుతుంటే నాన్న తన తల నిముర్తూ “దాన్ని నా కళ్లల్లో పెట్టి చూసుకున్నాను. దాన్నెవరికి అప్పచెప్పి పోవాలా అనుకున్నాను. కడతేరేదాకా నా పక్కనే ఉంది. దాని మంచి మనసుతో లోకాన్ని గెలిచింది. ఇంట గెలవలేకపోయింది. ఆ సంగతి నాకు తెలుసమ్మా! దాని ఆశయాలు ఆలోచనలు ఉన్నతమైనవి. అందుకే అదేం చేస్తాను అన్నా అభ్యంతరపెట్టలేదు. కాని మీ అంతా పెద్దయ్యాక పిల్లలు పుట్టాక అమ్మ అభివృధ్ది చెంది అందరి కంటే బిజీగా ఉండటం కొందరికి నచ్చలేదు. అలాంటిది నేను ముందు పోయి అది మిగిలిపోతే దానికేం చేసేవారో కాని దాని మనసుని చంపేసేవాళ్లు. చాలా మందున్నారు. ఎవరి చేతా చేయించుకోకుండా మంచాన పడకుండా పువ్వులా వెళ్లిపోయింది. నేను కూడా అలాగే వెళ్లాలి అనే కోరుకుంటున్నాను” అన్ననాన్నమాటల్లోఎంతో సత్యముందనిపించింది. అందుకే అమ్మ కోరిక ప్రకారం మీరు నాదగ్గరే ఉండండి. నాన్నా! ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్నన్నయ్య దగ్గర ఉందురు గాని అని చెప్పింది తను.
ఇకనుండి నాన్నకు అమ్మానాన్న తనే ! అనుకుంటూ గుచ్చిన పూలదండ తీసుకెళ్లి తల్లి ఫొటోకి అలంకరిస్తూ అమ్మా! నాన్నలోనే నిన్నూ నాన్నను చూసుకుంటాను. నాన్న గురించి బెంగపడకమ్మాఅని చెప్తున్న “తను”చెప్పిన విధంగానే చేస్తున్న” తను “కన్న” తల్లి” తన కూతురి ని దీవిస్తున్నట్లుగా ఫొటోలోంచి నవ్వుతోనే ఉంది అమ్మ. తల్లి కోరిక తీర్చిన తనయగా ఆ దేవతకు మనస్పూర్తిగా మొక్కుకుంది విమల.

ఆపరేషన్ పాంచాలి

రచన: శ్రీదేవి

న్యూయార్క్ నగరం: పొద్దున్నే నిద్ర లేస్తూనే పరుగుపెట్టే పోటీ ప్రపంచంలో మానవాళికి ఏదన్నా సహాయ పడాలి అనే ఉన్నత ఆశయాన్ని ఊపిరిగా చేసుకొని జీవితoతో పోరాడుతున్న యువకుడు దీప్. ఒక విదేశీ కుటుంబానికి భారతీయురాలైన పేద తల్లి చేత దత్తతకి ఇవ్వబడ్డాడు. తన ఆశయం కోసం ఎలాంటి ప్రమాదన్నయినా స్వీకరిస్తాడు అతడు. ప్రపంచమంటే గిరి గీసుకున్న నాలుగు గోడలు కాదని, కొన్ని కోట్ల హృదయాల సమ్మేళనమే అని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి. .
భారత దేశం: అచ్చమయిన పదహారణాల ఆడపిల్ల. విప్లవాత్మకమైన ఆలోచనలు, పుట్టుకతో ఫెమినిస్ట్. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్తత్వం, ప్రస్తుతం చిన్న చిన్న రచనలు చేస్తూ.. గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది-మహన్విత
తన పెంపుడు తల్లి ద్వారా మహన్విత గురించి తెలుసుకుంటాడు దీప్. తమ సంస్థకి గుర్తింపు రావాలంటే కొన్ని ప్రమాదకరమైన పనులు చేయాలని అది మహన్విత ద్వారా సాధ్యమని అతడి తల్లి అతడిని ఇండియాకి పంపుతుంది.
ఇండియాకి వచ్చాక మహాకి, అతడి తల్లికి ఎఫ్. బి లో తన పాత రచనల మీద జరిగిన వాగ్వివాదం గూర్చి చెప్పి సహాయానికి నిరాకరిస్తుంది మహా. ఎలాగో ఆమెను బతిమిలాడి ఒప్పించి తను వచ్చిన విషయం వివరిస్తాడు దీప్.
తనకి ఒక తీవ్రవాది అయిన 37 ఏళ్ల మహిళా జీవిత ఖైదీని ఇచ్చి పెళ్ళి చేయాలని, తద్వారా మానవతా దృక్పథంతో తను చేసిన పనికి, తమ సంస్థకు దేశ వ్యాప్తoగా గుర్తింపు కలుగుతుందని, తర్వాత నిదానంగా ఆమెకు జీవనోపాధి కల్పించి విడాకులు పొందాలని, దానికి మహా సహకరించాలని. మహా అందుకు తీవ్రంగా మండిపడుతుంది. అతడు అసహనంతో కొన్ని వారపత్రికలను ఆమె మొఖం మీద విసిరి కొడతాడు. వాటిలో మహా, తన చిన్ననాటి అభిమాన ప్రఖ్యాత విలేఖరి అయిన షామా చతుర్వేది, ఒక తీవ్రవాదిగా చేయని తప్పుకి 15 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తోంది అని తెలుసుకుని నమ్మలేకపోతుంది. జరిగిన అన్యాయం పూర్తిగా తెలుసుకోవాలని, ఆమెను రక్షించాలని దీప్ కి సహకరిస్తానని మాట ఇస్తుంది.
అప్పటి నించి ‘ఆపరేషన్ పాంచాలి’ మొదలవుతుంది.
**************
ఇద్దరూ షామాను కలిసి పెరోలు మీద తీసుకెళతామని చెప్పగా ఆమె “మీరు ఏమి ఆశించి ఈ సహాయం చేస్తున్నారో”? అంటూ సహాయాన్ని నిరాకరిస్తుంది. వారు నచ్చచెప్పటానికి ప్రయత్నించినా ససేమిరా అంటుంది షామా. ఈ క్రమంలో దీప్ ని చాచి పెట్టి కొడుతుంది ఒక సందర్భంలో షామా. మహా కలగచేసుకొని గొడవ సర్దుబాటు చేస్తుంది.
మొత్తానికి 4 లక్షలు తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టి షామాను పెరోలు మీద విడుదల చేయిస్తాడు దీప్. ఆమె 15 ఏళ్ళ శిక్ష కారణంగా త్వరగా కోలుకోదు. దీప్ కి ఈ విషయం కంఠకంగా మారుతుంది. ఆమెను ఎంత త్వరగా వివాహమాడి ఈ ప్రపంచానికి చూపిస్తే అంతా త్వరగా అతడి అప్పులు తీరి తమ సంస్థకి గుర్తింపు వస్తుంది. ఈ విషయం ఆమెతో చెప్పాలని అతడు శతవిధాలుగా ప్రయత్నించినా కూడా, ప్రతిసారి ఏవో అవాంతరాలు వచ్చి చెప్పలేక పోతాడు. మహా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
ఒక పక్కన 4 లక్షల అప్పు, దాని యొక్క వడ్డీ దీప్ ని వేధిస్తుంటే మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్లు, షామాకి బెయిల్ ఇచ్చిన లాయరు పెళ్లి నాటకం ఆమెకు చెప్తానని బెదిరిస్తుంటాడు, అంతే కాకుండా షామాకి దగ్గరవ్వటానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంటాడు. మహా వాటిని అంతే సమర్ధవంతంగా చెడగొడుతూ ఉంటుంది.
కొన్ని రోజులకి షామా పూర్తిగా కోలుకొని మునుపటి సంస్థలోనే ప్రోగ్రామ్ ఎక్సెక్యూటర్ ఉద్యోగములో చేరుతుంది. పరిస్ధితి మెరుగు పడటంతో షామాకి అసలు విషయం చెప్తుంది మహా. కానీ అప్పటికే తను రిషిని ప్రేమిస్తున్నానని తనకు తిరిగి ఉద్యోగానికి సరిపడే స్థైర్యాన్ని తానే కల్పించాడని, కావాలంటే డబ్బు తిరిగి ఇస్తానని చెప్పి దీప్ ని క్షమించమని కోరుతుంది. దీప్, మహా లు ఆమె సమాధానానికి హతాశులయిపోయి, షామాను బాధ పెట్టకూడదు అని అనుకుంటారు. నిరాశతో దీప్ వేరే ప్రోజెక్ట్ కోసం బయలుదేరుతుండగా మహాకి మెరుపు లాంటి ఆలోచన వస్తుంది.
ఇద్దరు కలిసి రిషి ఇంటికి వెళ్ళి షామా కోసం చేసిన ఖర్చు చూపి వాపసు చేయమని అడుగుతారు. అతడు సంతోషంగా వారి చేతిలో 10 లక్షలు పెడతాడు. గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లు అయ్యి వారిద్దరూ చెక్కు తో ఇంటి ముఖం పడతారు.
షామా, మహా ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారుతుంది. నిశ్చితార్థం కూడా రిషితో అంగ రంగ వైభవంగా జరుగుతుంది.
దీప్ కి డబ్బు వచ్చింది కానీ తను అనుకున్న పని అవ్వ లేదు. పైగా పది లక్షలు తీసుకోవటం అతనికి ఎందుకో మనస్కరించదు. అందుకే రిషికి చెక్కు ఇచ్చి వేయమని షామాకి చెప్పాలని, ఆమె ఇంటికి వెళ్తా డు. అక్కడ ఆమె లేదని ప్రోగ్రామ్ పని మీద MLA క్వార్టర్స్ కి వెళ్ళిందని తెలిసి అక్కడకు వెళ్తాడు.
అక్కడ.. రిషి , షామా పరిస్థితి చూసి అవాక్కు అయిపోతాడు. రిషి గాయాలతో నెత్తుటి మడుగులో అపస్మారక స్థితిలో ఉంటాడు. షామా MLA మహిధర్ వీడియోని షూట్ చేస్తూ ఉంటుంది. మహిధర్ “నేనే షామా మీద తీవ్రవాదీ అని ముద్ర వేసి 15 ఏళ్ళు జైల్ శిక్ష వేయించాను, ఆమె నా కార్యకలాపాలకు అడుగడుగునా అడ్డు పడటం నాకు నచ్చలేదు. ముఖ్యంగా భూకబ్జాల వీడియో ఎక్కడ బయట పెడుతుందో అని పధకం ప్రకారమే ఇదంతా చేశాను” అని పూస గుచ్చినట్లు చెప్పుకొస్తున్నాడు.
ఇంతలో గణగణమంటూ అంబులెన్సు, ఆ వెనుకే పోలీసుల జీపు వస్తాయి. రిషిని హుటా హుటిన తీసుకెళ్తారు వైద్య నిమిత్తం.
దీప్ షామాను చాచి పెట్టి కొడతాడు “ఇందుకేనా నిన్ను బయటకి తీసుకొచ్చింది” అంటూ.
“నీకు పది లక్షలు ఎలా వచ్చాయి దీప్?”
“ఇది నీకు ఇచ్చి వెళ్దామనే వచ్చాను”
“అది నీకు చెందిన చెక్కు, నాకెలా ఇస్తావ్”
“షామా”?
రిషి ఎవరో తెలుసా? నా చిరకాల మిత్రుడు, వాడిని నేను ఎందుకు చంపుతాను? పెరోలు కోసం మహా వచ్చినపుడు రిషి గురించి తెలుసుకొని, వాడు లాయరు అయ్యాడని తెల్సి ఆశ్చర్యపోయాను, వాడికి కబురు పంపాను. కానీ వాడి గూర్చి మీకు చెప్ప లేదు, ఎందుకంటే నా కేసు సాక్షాల సేకరణకు వాడు ఒక్కడే నాకు నమ్మకమైన వ్యక్తి, ఆ MLA శక్తి తెల్సి కావాలనే మీ ఇద్దరినీ దూరముగా ఉంచాను. వాడు తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ‌ ఆపరేషన్ ని ముందుకు తీసుకెళ్లాడు. నిశ్చితార్థం కూడా అతడిని కలవటానికి మేము ఆడిన నాటకమే.. ఈ MLA కారణంగా నా పిల్లలకి దూరం అయ్యాను. నా భర్త కూడా నన్ను అవమానించాడు, ఇప్పటికీ నన్ను గౌరవించటం లేదు, నా వృత్తిని కోల్పోయాను, నా 15 సంవత్సరాల జీవితం కోల్పోయాను.. అంటూ వివరిస్తుంది. నిస్తేజంగా షామా..
షామాను విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్తారు..
దీప్ మీద కదిలి పోతున్న పోలీసు జీపు పొగ చిమ్ముతూ వెళ్ళిపోతుంది.
*********************