June 28, 2024

సెల్లే నా ప్రాణం

రచన: ఉమాదేవి కల్వకోట

అరుణ అన్నం ముట్టి ఈ రోజుకి మూడు రోజులయింది.
కడుపులో గాబరాగా ఉంది. నీరసంతో ఒళ్ళు తేలిపోతోంది.
అసలే అరుణ ఫుడ్డీ… క్రొత్త క్రొత్త వంటలన్నా , చిరుతిళ్ళన్నాఇష్టం. చిన్న తనం నుండి కూడా గంటకు, రెండుగంటలకూ ఏదో ఒకటి తింటూనే ఉండడం ఆమెకు అలవాటు.
అలాంటిది మూడు రోజులనుండి ఏమీ తినకుండా కేవలం నీళ్ళు తాగి ఉండడం ఓ ప్రపంచ వింతే.
ఆమె అలా ఉండడానికి మొగుడేమైనా ఆమెమీద అరిచాడా, అలిగిందా? అంటే, ఆమె భర్త సుబ్బారావు ఆఫీసు పని మీద టూర్ కి వెళ్ళి, నాలుగు రోజులయింది.
మరి కారణమేంటి అంటే ఆమె తిండి కంటే కూడా తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆమె సెల్లు పోయింది.
ఇంకేమైనా ఉందా! ఆమె గుండె బ్రద్దలయిపోయింది.
అసలే కొత్తఫోను. దానికి తోడు ఆమె రోజంతా ఏదో
ఒకటి తింటూ,సెల్లు తోనే,సెల్ చూస్తూనే ఉంటుంది.
సోషల్ మీడియాలో‌ చాలా చురుకుగా ఉంటుంది.
రోజుకో రీలు చేసి పెట్టందే ఆరోజు గడవదు.
ఎప్పటికప్పుడు తన స్టేటస్ తన ఫ్రెండ్స్ అందరికి చూపిస్తూ ఉంటుంది.
తన రీళ్ళకి ఎన్ని లైకులు వచ్చాయో ప్రతి ఐదు నిమిషాలకు చూడకపోతే ఆమె చేతులకు ఒకటే దురదగా ఉంటుంది.
రోజుకో రీలు చేసేప్పుడు మరి రోజుకో చీర లేదా డ్రెస్ కావాలిగా.కానీ పాపం అరుణ బయటకు షాపింగ్ కి వెళ్తే,టైం వేస్ట్ అవుతుందని, తన సెల్లు లోనే ఆన్లైన్లోనే కొంటుంది
తన రీల్స్ గురించి, ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటుంది.
వీటితో క్షణం తీరిక లేక తన అమ్మనాన్నలతో కూడా పదిహేను రోజులకాకసారి కానీ మాట్లాడదు.
అంతెందుకు! భర్త టూర్ వెళ్ళినప్పుడు కూడా అతనితో మాట్లాడే తీరిక కూడా ఆమెకు ఉండదు.
అలాంటిది సెల్లు లేక మూడురోజులు ఎలా బ్రతుకుతుందో ఆమెకే అర్థం కావడంలేదు.
ఎక్కడా, ఎలా పోయింది అనేది కూడా ఆమెకు గుర్తు రావడం లేదు.
అక్కడికీ పనమ్మాయి ఫోనుతో పోలీసులకు కూడా, కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎక్కడ పోయిందో కొంచెం కూడా క్లూ ఇవ్వందే కనిపెట్టడం కష్టం అన్నారు వాళ్ళు. ఎవరైనా తెచ్చి ఇస్తే చెప్తామన్నారు.
ఇలా బాధ పడుతూ, సెల్లు లేని జీవితం గడుపుతూ.
ఉండగా డోర్ బెల్ మ్రోగింది. చూస్తే ‌ఆమె భర్త సుబ్బారావు. అతని చేతిలో తన సెల్లు.
అరుణ ఆనందాశ్చర్యాలతో ఆమె ఒక్కసారిగా అతనిమీద పడిపోయి సెల్లు లాక్కొని, దానిని ముద్దులు పెట్టుకుంటూ ఆనందా శృవులు రాల్చసాగింది.
“ఇదీ…ఇది మీ దగ్గరకు…” ఆమె నోట మాట రాలేదు.
“మొన్ననెప్పుడో నువ్వు మన వీధి చివర షాపులో ఏవో కొనడానికి వెళ్ళి, అక్కడ పెట్టి మరచిపోయావుట. పక్కనున్న అతను పొరపాటున సరుకులతో పాటు తన బ్యాగులో వేసుకొని, ఈ రోజే చూసుకొని, షాపతనికి తెచ్చి ఇచ్చాడట. అతను నేను వస్తుండగా చూసి, పిలిచి ఇచ్చాడు” అని చెప్తుండగానే,
“సరే.. సరే నాకు బోలెడు రీల్స్ చేసుకునేది ఉంది. మీ పని మీరు చూసుకోండి. నన్ను డిస్టర్బ్ చేయకండి.”
అంటూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది అరుణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *