July 5, 2024

ఇందుకా?

రచన: మంగు కృష్ణకుమారి

ఆనందరావు హుషారుగా ఏర్పాట్లు చేస్తున్నాడు. కరోనా కారణంతో ఎవరూ ఎవరినీ కలవటం లేదు. స్నేహితులతో మందు పార్టీలు, విందు భోజనాలు చేస్తూ గడపడం అంటే చాలా ఇష్టపడే అతనికి, ఇన్నాళ్ళకి పార్టీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఎవరు ఎక్కడ కలిసినా ఎక్కువ ఖర్చు అతనే భరించడం చేత సహజంగా అందరూ ఆనందరావు చుట్టూ చేరతారు.
అతను అన్నీ సద్దేసరికి సుబ్బారావు, గణేశ్, ముకుందం వచ్చేసారు.
“ఏరా కాశీ ఏడిరా?” అన్నాడు గణేశ్ సీసాల పక్క చూస్తూ, గుటకలు వేస్తూ. మాటలోనే చిద్విలాసంగా నవ్వుతూ వచ్చేడు కాశీపతి.
“ఏరా కాశీ, మన సుబ్బుగాడిని కూడా తెస్తానన్నావ్ ఏడిరా?”
ఆత్రంగా అడిగేడు ఆనందరావు. సదరు సుబ్రమణ్యం ‌ఆనందరావుకీ, కాశీపతికి కామన్ ఫ్రండ్.
వారం రోజుల కిందట ఆనందరావుకి బజారులో కనపడ్డాడు. “ఏరా, నీకు ఫోన్ చేస్తే నంబర్ ఇన్వేలీడ్ అని వస్తోందే?” అడిగేడు ఆనందరావు.
“నా సెల్ పోయిందిరా… బ్లాక్ చేయించీసేను. కొత్త సెల్ వేరే నంబరుతో తీసుకున్నాను. అందరి నంబర్లూ పాత సెల్లో ఉండిపోయేయి. మన కాశీగాడి దగ్గర నా కొత్త నంబరు ఉందిలే.‌ నువ్వు తీసుకో… నేనూ అడుగుతాలే” అనేసి హడావిడిగా వెళిపోయేడు సుబ్రమణ్యం.
దాంతో సుబ్రహ్మణ్యాన్ని పిలిచే బాధ్యత కాశీపతికి అప్పచెప్పేడు ఆనందరావు.
ఆనందరావు ఆత్రుతగా అడుగుతూ ఉంటే కాశీపతి ఎలాటి తడబాటూ లేకుండా, “అయ్యో! వాడికి చెప్పడమే మర్చిపోయా… సారీ!” అన్నాడు. “అదేమిట్రా… పోనీ ఇప్పుడయినా వాడి కొత్త నంబరు ఇయ్యి. నేను మాటాడతాను” అన్నాడు ఆనందరావు కోపంగా.
“అబ్బే నా సెల్ కూడా తేలేదురా… నేను. తరవాత నంబరు ఇస్తాలే” అనేసాడు తేలికగా.
పార్టీ హుషారుగా జరిగిపోయింది.

కాశీపతి డోసు మీద డోసువేసి సుష్టుగా తిని మరీ కదిలేడు.
“సుబ్బుగాడి నంబరు పంపరా…” అని ఆనందరావు అంటూ ఉంటే బుర్ర ఊపి వెళ్ళిపోయేడు.
వారం గడిచినా కాశీపతి దగ్గరనించీ ఎలాటి ఫోన్ నంబరూ రాలేదు. అనుకోకుండా ఆ రోజు సుబ్రహ్మణ్యం ఆనందరావుని కలిసిందికి వాళ్ళింటికి వెళ్ళేడు. ఆనందరావు జరిగిందింతా చెప్పి “కాశీగాడు నీ నంబరు ఇవ్వనే లేదురా” అన్నాడు.
సుబ్రహ్మణ్యం విరగబడి నవ్వుతూ, “కాశీగాడు మరచిపోడం కాదూ ఏమీకాదు, వాడు రెండేళ్ళ‌కిందట అవసరం అని పదివేలు తీసుకున్నాడు. ఇప్పటిదాకా ఇవ్వలేదు. నాకూ అవసరాలు ఉన్నాయని కాస్త అప్పు తీర్చమని, ఎక్కువసార్లు తొందర పెట్టేను. అంతే… మొహం చాటేస్తున్నాడు” అన్నాడు.
ఆనందరావు ఆశ్చర్యంగా, “వాడు నాకూ ఇరవై వేల దాకా ఇవ్వాలిరా. నేను ఇంతవరకూ తీర్చమని అడగలేదు. అందుకని కాబోలు నాకు‌ మొహం చాటు చెయ్యలేదు. వామ్మో! ఇందుకా ఇలా తప్పించేడు నిన్ను” అన్నాడు.

***

1 thought on “ఇందుకా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *