July 5, 2024

గంతకి తగ్గ బొంత

రచన: గిరిజారాణి కలవల

“మర్చిపోయారా? మనల్ని కాదని తక్కువకులం వాడిని కట్టుకున్న మీ చెల్లి ఏ రోజు మన గడప దాటిందో… ఆ రోజే ఆవిడగారికి నీళ్ళొదిలేసాము. ఇప్పుడేమో ఆ మొగుడూ పెళ్ళాం ఏక్సిడెంట్ లో పోయారనీ, మీ మేనకోడలు అనాథ అయిపోయిందని, తెగ జాలి పడిపోయి, ఆ నష్ట జాతకురాలిని తెచ్చి, నా ముఖాన పడేసారు. ఇదేమో తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. ఛస్తున్నాను ఇంటిల్లిపాదికీ చాకిరీ చేయలేక.” భర్త రమణయ్య మీద కయ్యిమంది విజయమ్మ.
“ఏం చేయమంటావే! తల్లీతండ్రీ చచ్చిపోయి, దిక్కూ మొక్కు లేని ఆడ కూతురిని ఎలా వదిలేసి రమ్మంటావు? ఏదో మన అండదండలతో అది చదువు పూర్తి చేసుకుంటే… ఆ తర్వాత, ఏదో ఉద్యోగం రాకపోదు. అప్పుడు దాని తిప్పలు అది పడుతుంది. అంతవరకు ఓపిక పట్టు.” అన్నాడు రమణయ్య.
“సరిపోయింది సంబడం! దీనికి తిండి పెట్టడమే ఎక్కువ అనుకుంటూంటే, మళ్లీ చదువు ఖర్చు కూడానా? ఏమవసరం లేదు. ‘గంతకి తగ్గ బొంత’ ని చూసి ముడిపెట్టేసి, చేతులు దులుపుకుందాము. మా అక్క మరిది కొడుకు ఆరు పాసయాడు. ఇప్పుడు పాతికేళ్ళ వయసు వచ్చినా, చదువు మాత్రం ఒంట పట్ట లేదు. శుభ్రంగా ఆటో నడుపుకుంటున్నాడు. వాడికి ఈ పిల్లనిచ్చి ముడిపెట్టేద్దామని మా అక్క అంటే సరే అన్నాను. రేపు వాళ్ళు సంబంధం ఖరారు చేసుకుందుకు వస్తున్నారు. నువ్వు కానీ, నీ మేనకోడలు కానీ కాదన్నారంటే ఊరుకునేది లేదు.” అంది విజయమ్మ.
వంటింట్లో కాఫీ కలుపుతున్న దివ్యకి, ఈ మాటలన్నీ వినపడుతూనే వున్నాయి. ‘ఇలాంటి మాటలు పడాలనా? నన్ను అనాథని చేసి వెళ్లి పోయారు అమ్మా, నాన్న. తనవంటి దురదృష్టజాతకురాలు ఈ లోకంలోనే వుండి వుండదు.’ అనుకుంటూ, చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది దివ్య.
“ఏమ్మా! మహాతల్లీ! కాఫీ పెట్టడం ఇంకా అవలేదా?” విజయమ్మ అరుపుకి ఉలిక్కిపడి, “తెస్తున్నా అత్తయ్యా!” అంటూ గబగబా కాఫీ గ్లాసులు తీసుకువచ్చి, మేనమామకి, అత్తయ్యకి అందించింది.
తెల్లవారుజామున నిద్ర లేచిన మొదలు, రాత్రి పడుకునేదాకా, ఇంటిపనీ, వంటపనీ మొత్తం దివ్య చేతనే చేయిస్తుంది విజయమ్మ. చదువంటే ప్రాణం. ఇంటరు పూర్తయి, డిగ్రీ మొదటి సంవత్సరంలో వుండగా, బస్సు ప్రమాదంలో తల్లీతండ్రీ తనువులు చాలించడం వలన వేరే ఏ ఆధారం లేక, ఇలా మేనమామ పంచన చేరి, గయ్యాళి అయిన విజయమ్మ చేత నానా కష్టాలు పడుతోంది దివ్య. ఇక్కడకి వచ్చిన వెంటనే చదువు మానిపించి, ఇంటి పనులు చేయించసాగింది. ఎదురు చెప్పే ధైర్యం లేక, చెప్పి, బయట లోకంలో ఒంటరిగా బతకడం చేతకాక, మౌనంగా భరించేది దివ్య.
“విన్నావుగా! రేపు నిన్ను చూసుకుందుకు, పెళ్ళివారొస్తారు. ఇలా ధేభ్యం ముఖంతో కాకుండా మంచి చీర కట్టుకుని తయారవు.” అంటూ హుకుం జారీ చేసింది విజయమ్మ.
మేనమామ వేపు దీనంగా చూసింది దివ్య. అతను, భుజాన వున్న తుండుగుడ్డతో మొహం తుడుచుకుంటూ, అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు.
పరిస్థితిని అర్థం చేసుకున్న దివ్య… ఇక తన జీవితం ఇంతే.. అనుకుని, ‘సరే’ అన్నట్లు తల వూపింది.
మర్నాడు ఆటో డ్రైవర్ రాజుతో పెళ్ళిచూపులు జరిగాయి. పెద్దలందరూ సరే అనుకుని, వారం తిరక్కుండానే దివ్య, రాజుల పెళ్లి, రాములవారి గుళ్ళో జరిపించేసారు. విజయమ్మ తమ బాధ్యత తీరి పోయిందనుకుని చేతులు దులిపేసుకుంది.
అటునుంచి అటే దివ్యని, రాజు తల్లిదండ్రులు వాళ్ళింటికి తీసికెళ్ళిపోయారు.
కొన్ని సంవత్సరాల తర్వాత….
ఇంటి ముందు కారు ఆగిన శబ్దానికి, విజయమ్మ, రమణయ్య బయటకి వచ్చారు. కారులో నుంచి దిగిన దివ్య, రాజులని చూడగానే నిశ్చేష్టులైపోయారు.
ఖరీదైన దుస్తులు ధరించి, బంగారు నగలతో మెరిసిపోతోంది దివ్య.
“బావున్నారా మామయ్యా! అత్తయ్యా!” అంటూ వారి కాళ్ళకి నమస్కారం చేసింది.
ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తున్న వారితో, “గంతకి తగ్గ బొంతని’ నాకు కట్టబెట్టిన మీకు, నేను ఇలా వున్నానేమిటా అని, వింతగా వుంది కదూ? ఆ గంతకి తగ్గ బొంతని’చేసుకున్న నా అదృష్టం ఇది. మంచి మనసున్న రాజు, నాకు చదవంటే ఇష్టమని గ్రహించి, కాలేజీలో చేర్పించాడు. అతని ‘అండదండ’ లతో నేను డిగ్రీ పూర్తి చేయడమే కాకుండా, బేంక్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించుకున్నాను. రాజు కూడా ఇప్పుడు నాలుగు కార్లకి యజమాని. వాటిని అద్దెలకి తిప్పుతూ బాగానే సంపాదిస్తున్నాడు. . అనాథని అయిన నన్ను చేరదీసి, నాకు ఇంతటి గొప్ప జీవితం రావడానికి కారణమైన మీకు కృతజ్ఞతలు చెపుదామవి వచ్చాము.” అంటూ వారిద్దరికీ కొత్తబట్టలు పెట్టింది దివ్య.
ఏం సమాధానం చెప్పాలో కూడా తోచని రమణయ్య, విజయమ్మలు ఇంకా అయోమయంలో వుండగానే… వెనుతిరిగారు దివ్య, రాజు.

సమాప్తం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *