July 7, 2024

నా ‘మథుర’ యాత్ర

రచన: రమా శాండిల్య

అవి మా అమ్మాయి ఢిల్లీలో ఉన్న రోజులు. ఢిల్లీకి దగ్గరలో అనేక మంచిమంచి దేవాలయాలున్నాయి… తన దగ్గరకు నేను వెళ్ళినప్పుడు అనేక దేవాలయాలు చాలా చూసాను. మమ్మల్ని చూడటానికి వచ్చిన అతిథులతో కొన్ని దేవాలయాలు చూసాను. ఢిల్లీ నుంచి, ఉదయం వెళ్ళి, సాయంత్రానికి వచ్చేసేవాళ్ళం… మరీ సమయం సరిపోదనుకుంటే, మరొకరోజు ఉండి చుట్టుప్రక్కల ఆలయాలు అన్నీ చూసి వచ్చేవాళ్లం. అలా చూసిన ఆలయమే ‘మథుర’.
ఢిల్లీ నుంచి నూటయాభై కిలోమీటర్ల దూరంలో దక్షిణంగా ఉత్తరప్రదేశ్ లో ఉన్నది మథుర. ఆగ్రానుంచి కేవలం ఏభై కిలోమీటర్ల లోపే ఉంటుంది.
చిన్నప్పటి నుంచీ మథుర అనగానే గుర్తుకు వచ్చేది నాకు చిన్ని కృష్ణయ్య. అప్పుడే పుట్టిన పసిబాలుడైన కృష్ణయ్యను మథురలో, ‘కేశవస్వామి’ అంటారు. ఆ కేశవస్వామి పెద్ద కోటలాంటి రాజప్రాసాదంలో, భూగృహంలోని కారాగారంలో జన్మించాడట. ఇప్పటికీ ఆ కేశవస్వామి ఆలయం అక్కడే ఉంటుంది. చాలా చిన్నభాగం. మిగిలిన చాలా పెద్ద ఆలయాన్ని మొగలులు వారి దండయాత్రలో శిథిలపరిచారట.
ఇక, మథురకు పురాణ చరిత్ర చాలానే ఉన్నది. మొదట పురూరవుడు, ఊర్వశిలకు కలిగిన సంతానమైన ఆయువు అనేవాడు మథురలో యమునానది ఒడ్డున అనేక అందమైన రాజప్రాసాదాలను, కోటలను నిర్మించాడట. ఆ కాలంలో భూలోక స్వర్గమై, ‘మథుర’ విలసిల్లినదట.
తరువాతి కాలంలో శూరసేనుడు, తరువాత కంసుడు మొదలైన అనేకమంది పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ సమయంలో దేవకీ, వసుదేవులకు అష్టమ సంతానంగా, కారాగారంలో మన చిన్నిశిశువు కేశవస్వామి జన్మించాడట! మిగిలిన కథ భారతభాగవతాలు చెబుతాయి… మథురలో పుట్టి, బృందావనంలో పెరిగి, ద్వారకలో నివసించి, అక్కడే నిర్యాణం పొందిన కృష్ణస్వామి మొట్టమొదటి జన్మస్థలం మథుర అనుకోగానే, ఒళ్లు పులకరించక మానదు ఎవరికైనా, ఆ మథురను చూస్తుంటే, అక్కడ తిరుగుతుంటే!
తరువాతి కాలంలో మొఘలులు మొత్తం మథురను కైవసం చేసుకుని, ఆ ఆలయాలను ధ్వంసం చేసి, చిన్ని ఆలయాన్ని మాత్రం ఆ కృష్ణజన్మస్థలిలో ఉంచారట. ఆయువు, కట్టిన కోటలో అత్యంత సుందరమైన కుడ్యాలు, ఉద్యానవనాలు, ఉండేవట. వాటిని ధ్వంసం చేసేసి, దానిలోని శిలలు, శిల్పాలతో ఇప్పటికి ఉన్న కోట, జుమ్మామసీదును నిర్మించారుట. మథురను, కేశవ స్వామిని తలుచుకున్నపుడల్లా ‘అంత పెద్ద భగవంతుడు, పరమాత్ముడు, మరీ పెద్దదైన కోటలో జన్మించి, పుట్టినప్పటినుంచి సంకటాలను చూసిన ఆయనకంటే ఎవరూ గొప్పవాళ్ళు లేరు కదా, కష్టం వచ్చిందని చింతించే పనిలేదు కదా’ అనుకుంటూ ఉంటాను!
మథురను చూడటానికి మేము ఢిల్లీ నుంచి ఉదయం అయిదుగంటలకల్లా కారులో బయలుదేరి ఎనిమిదిన్నర వరకూ జేరుకున్నాము. అప్పటికే ఆలయం తెరిచి ఉన్నది. ఆలయ ప్రవేశం చేసిన నాకు మొదటి ఆలోచన, ‘భగవంతుడికి కారాగారమా?’ అని. అదికూడా పూర్తిగా ఆలయం కాదు, కొంతభాగం మాత్రమే! మళ్ళీ పదిన్నరకు అన్నీ పూజలు ముగించి, ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి సాయంత్రం అయిదు గంటలకు మాత్రమే తెరుస్తారట. అంటే, ‘కళ్ళనిండుగా దర్శించుకునే భాగ్యం కూడా లేదా మనకు?’ అనిపించింది. అంటే, భక్తులు పదిన్నర తరువాత వస్తే కోట మాత్రం చూసి వెళ్ళాలి.
ఇంకా మథుర చుట్టుప్రక్కల చూడటానికి చాలా స్థలాలున్నాయి.
మథురలో శ్రీకృష్ణజన్మస్థానం, జైగురుదేవ్ ఆలయం, కంసుడు నివసించిన కోట (ఖంస్ ఖిల్లా) ద్వారకాదీస్ ఆలయం, విశ్రాంఘాట్ అంటే యమునానది తీరం ఇవన్నీ మథురలో ధర్శించాల్సినవి.
మథుర మనం ఊహించుకునేలా అందంగా ఉండదు… కొంచెం నిరాశ అనిపిస్తుంది ధర్శించాక!
***
మథురలోనూ, చుట్టుప్రక్కల చూడాల్సిన దర్శనీయ స్థలాలు ఎన్నోవున్నాయి.
మనం రెండురోజులుండి, దర్శించుకోవడానికి మథుర చుట్టుప్రక్కల చాలా ప్రదేశాలున్నాయి.
అవి, బర్శానా! ఇక్కడ ప్రపంచంలో జరిగే హోలీ పండుగ ప్రారంభమైన స్థలం… తప్పకుండా దర్శించుకోవలసిన చోటు. గోవర్ధన గిరి పరిక్రమ చేస్తూ ఉంటారు, 24 కిలోమీటర్ల కొండ చుట్టూ చేసే ఆ ప్రదక్షిణ నాకైతే చాలా ఇష్టం. ఆ గిరిక్రింద బాలకృష్ణుడు గోవుల మందలను, గోపాలురాను కాచాడు, రక్షించాడు కదా అనే భక్తిభావం కలుగక మానదు ఎవరికైనా. ఇన్నిదేవాలయాలు చూసి, ‘అబ్బా అన్నీ దేవాలయాలేనా!’ అనుకునే వారికి ఇక్కడి విద్యాలయాన్ని కూడా పరిచయం చేస్తాను.
నందగోస్, గోకులము, బృందావనం, గోవిందన్, రాధాకుండ్, మంట్, భారత్పూర్ ఇది ఉత్తరప్రదేశ్ కు రాజస్థాన్ కు బోర్డర్ లో ఉండే ఊరు. డీగ్, మొదలైనవి.
ఇవన్నీ కాక, అతిపెద్ద పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నది.
***
దేవాలయాల గురించి తెలుసుకున్నాము… మరి విద్యాలయాల గురించి కూడా తెలుసుకుందాము.
మథురలో ఉన్న, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ పశువైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలోనూ, దేశంలో నాలుగవ స్థానంలో ఉన్న అతిపెద్ద విశ్వవిద్యాలయం. 1400 ఎకరాలలో ఉన్న అతి పెద్ద యూనివర్సిటీ ఇది. ఇది మొత్తం దర్శించటానికి సమయం ఎంతకావాలో మీరే ఆలోచించుకోండి మరి.
***
ఇవన్నీ చూసి చూసి అలిసిపోయారా? మథురలో దొరికే ఆహారం రుచి చూసేద్దామా? మథురలో దొరికే ప్రసిద్ధ ఆహారాలు పాలతో తయారయ్యే దూద్ పేడ, ఆలూ చాట్ ముఖ్యమైనవి… సోంపాపిడి అనేక రకాల పళ్లవాసనతో దొరుకుతుందిక్కడ. కచోరి, జిలేబీ ఇక్కడి బ్రేక్ ఫాస్ట్ లో తింటారు. రసమలై చాలా రుచిగా ఉంటుంది.
వేడిగా, చల్లగా ఉండే పాలల్లో డ్రై ఫ్రూట్స్ తో దొరికే పాలు చాలా రుచిగా ఉంటాయి. అవి ఇక్కడమాత్రమే తాగగలం…
ఇవన్నీ కాకుండా మసాలాలేమి లేకుండా చారు అన్నం ఇక్కడి హోటల్స్ లో అడిగితే ప్రత్యేకంగా ఇస్తారు. దాని రుచి అద్భుతమే!
మథురను చూసి అలసిపోయారా? కృష్ణయ్యను చూసి అలవటం ఏంటండీ… ఆయన ఆటలు, పాటలు, రాసలీలలు గుర్తు తెచ్చుకోండి హాయిగా! మళ్ళీ నెల మరొక యాత్రతో కలుద్దాము.
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *