July 5, 2024

పట్టుదల

రచన: లావణ్య బుద్ధవరపు

తన డైలీ రొటీన్ ఫాలో అవుతూ ఎప్పటిలానే‌ ఉదయం ఐదున్నరకు నిద్ర లేచి, ఫ్రెష్ అయ్యి యోగా, తర్వాత కాసేపు గార్డెనింగ్ చేసి, అది అవగానే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని పేపర్ తిరగేస్తూ వార్తలు చదువుతున్నాడు జీవన్.
ఒక తెలివైన అందమైన చురుకైన మోస్ట్ ఎలిజిబుల్ బేచలర్ ఆఫ్ హిజ్ సర్కిల్. ఒక లీడింగ్ బ్రాండ్ కార్ మేన్యుఫేక్చరింగ్ యూనిట్ లో సీనియర్ రీసెర్చ్ ఇంజనీర్.
మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అటు లగ్జరీకి, ఇటు పేదరికానికీ మధ్యలో కొట్టుమిట్టాడే కుటుంబ ఆర్థిక సామాజిక పరిస్థితులు చిన్నతనమంతా అతడు చాలా చూశాడు. తల్లి ఉన్న వనరులతో ఇంటిని, వచ్చేపోయే చుట్టాలనీ ఎలా సంబాళించుకుంటూ వచ్చిందో ఊహ తెలిసినప్పటి నుంచీ గమనించి మేనేజ్మెంట్ (అది హ్యూమన్, మెషీన్ ఆర్ క్రైసిస్ అన్నింటినీ) ఆకళింపు చేసుకున్నాడు.
తండ్రి ఒక్కడి సంపాదనతో నడిచే కుటుంబంలో, ఆ ఇంట్లో నలుగురే ఉన్నమాట వాస్తవమైనా, తరచూ వచ్చిపోయే బంధు జనం, వారి అతిథి మర్యాదలు, కావలసిన రకరకాల ఖర్చులు, ఇంతలో ప్రతి నెలా వచ్చిపడే అనుకోని అనారోగ్యాలు, పెళ్ళిళ్ళు పేరంటాలు, ప్రయాణాలు అదిగాక తనది, వాళ్ళ చెల్లెలిది చదువులు, వాటికి సంబంధించిన ఫీజులు, పుస్తకాలు, ట్యూషన్లు ఇలా వచ్చే‌ జీతం చాటంతా, అయ్యే ఖర్చులు చాంతాడంతా ఉండేవి. ఒక పన్నెండేళ్ళ వయసు వరకూ తనకి ఏం తెలియకపోయినా, ఆ తర్వాత తండ్రి ప్రతీ విషయాన్ని విడమరచి చెప్తూ ఉండడం అతడికి బాగా జ్ఞాపకం.
ఇలాంటి పరిస్థితులు చూస్తూ పెరిగిన తను‌ తన చెల్లెలు సుధ ఇద్దరూ తమవంతు కర్తవ్యంగా (బాధ్యత అయితే చేయడం వరకూ పరిమితం, కానీ కర్తవ్యం కార్యోన్ముఖులను చేసి, సాధించేలా చేసేది) భావించి ట్యూషన్లమీద ఆధారపడకుండా స్వయంకృషితో చదువుకుంటూ అన్నింటా డిస్టింక్షన్లతోనే ఉత్తీర్ణులవుతూ వచ్చారు. ఇంట్లో అమ్మకి కూడా చేదోడు వాదోడుగా పనులన్నీ చేయడం కూడా వాళ్ళ కర్తవ్యంగానే భావించేవారు.
ఇలా అటు ఇల్లు, ఇటు సంపాదన రెండింటిమీదా ఒక అవగాహనతో పెరిగిన జీవన్, తను ఇంటర్మీడియట్ అవగానే మెకానికల్ ఇంజనీరింగ్ వైపే‌ ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు. స్నేహితులంతా, మెకానికల్ అంటే ఏదో చిన్నచూపు గా చూసేవారు. కొంత మందైతే అసలు స్నేహమే మానేసారు. (ఇలాంటి వాళ్ళని స్నేహితులనకూడదు లెండి) ఏది ఏమైనా తను పట్టుదలగా చదివి మెకానికల్ ఇంజనీరింగ్ లో తన కాలేజ్ కే ఫస్ట్ వచ్చాడు.
తల్లీ, తండ్రీ ఎప్పుడూ తన ఆలోచనలు కాదనలేదు. కానీ ప్రతి విషయం లోనూ మంచీ చెడులు మాత్రం వివరిస్తూ వచ్చారు. ఎలా ఆలోచించాలో, ఏ విషయాలపై శ్రద్ధ పెట్టాలో వంటివి తనకి తెలియకుండానే అలవాటైపోయాయి. వ్యూహాత్మకమైన ఆలోచన అనొచ్చు దీన్ని ప్రొఫెషనల్ లాంగ్వేజ్ లో.
సరే తనకున్న క్వాలిఫికేషన్, తెలివి, ఉత్సాహం వంటివి ఉద్యోగాన్ని వెంటనే తేలేకపోయినా, అతగాడెప్పుడూ నిరుత్సాహ పడలేదు. ఖాళీ సమయాల్లో వాళ్ళ వీధి చివర గేరేజ్ లో కార్లు రిపేర్ అవుతుంటే అవి చూడడానికి వెళ్ళేవాడు.
తన చిన్నతనమంతా అదే ఏరియాలో గడవడం వలన, వాళ్ళ ఆటలూ అల్లర్లూ కూడా ఆ వీధిలోనే. ఆ క్రమంలో ఈ గేరేజ్ లో నక్కి నక్కి దొంగాటలాడుకునేవారు. అప్పుడే జీవన్ కు అసలు కార్లు, వివిధ స్పేర్ పార్ట్స్, వాటిని విడదీయడం, తిరిగి అన్నీ బిగించడం, ఒక నడవలేని కుంటి కారు క్షణాల్లో వాళ్ళ చేతుల్లో చకచకా పరుగులు పెట్టడం లాంటివి చాలా కుతూహలాన్ని రేకెత్తించే విషయాలుగా ఉండేవి.
ఆ కుతూహలం పెరిగి పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎవరైనా అడిగితే కార్ మెకానిక్కు నవుతా అనేవాడు. తల్చుకుంటే ఇప్పుడతనికి నవ్వొస్తోంది. కానీ, ఆ విషయాన్ని శ్రధ్ధగా కారణాలతో సహా తెలుసుకొన్న తండ్రి, ఐతే మెకానిక్ కన్నా, మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే ఆ విషయాలు ఇంకా సైంటిఫిక్ గా తెలుస్తాయి. పైగా ఉన్నవి యథాతథంగా వాడడమే గాక కొత్తవి కూడా తయారుచేసే తెలివి కూడా వస్తుందని చెప్పేవాడు. ఆయన మాటలు అతనిపై ప్రభావం చూపి మొత్తానికి తన ఇంట్రెస్టుని ఇలా ప్రొఫెషన్ వైపుగా మళ్ళించాడు.
అందుకే చదువుకుంటున్న టైం లో కూడా తరచూ గేరేజ్ కి వెళ్ళి అన్నీ పరిశీలనగా చూడడం, వాళ్ళని ఇదేంటి అదేంటనే ప్రశ్నలు వేసి తెలుసుకుని తాను చదివిన దానికి లింక్ చేసి చూసుకునేవాడు. ఇప్పుడు ఇంకా ఉద్యోగం రాలేదు కాబట్టి ఏదో ఒక కంపెనీలో చేరే లోగా తను ఆ షెడ్ లోనే అసలు ప్రాక్టికల్ గా ఎలా పని చెయ్యాలో తెలుసుకుంటాను అని ఇంట్లో చెప్పాడు. తల్లీ తండ్రీ ఒక రకంగా ఆనందించారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు వాళ్ళిద్దరు. చుట్టాలు ఏమనుకుంటారో, స్నేహితులు ఎలా చూస్తారో లాంటి ప్రశ్నలసలు చర్చకే రాలేదు. అతడు ఆ షెడ్ యజమానితో చిన్నప్పటినుంచీ ఉన్న చనువుతో తనూ అక్కడ జాయిన్ అవుతానని అడగడం, అతగాడు సరేననడం వెంటవెంటనే జరిగిపోయాయి.
తను చురుకుగా నేర్చుకోవడం, ఇంకా తను చదువుకున్నవి అక్కడ ఎప్లై చెయ్యడమే గాక అక్కడున్న వాళ్ళకీ నేర్పించడం, వాళ్ళు పని చేసే తీరు మరింత క్వాలిటేటివ్ గా తయారవడం లాంటివి ఆ యజమాని గమనిస్తూనే ఉన్నాడు. ఒక నెల అనుకున్నది రెండు నెలలు, రెండు నెలలు అనుకున్నది నాలుగు నెలలైపోయింది. అతడి ఉద్యోగం ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. ఏవో అవకాశాలు వస్తూనే ఉన్నాయి గానీ వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి తను ఒక పనికే పరిమితమైపోవాలని తెలుస్తోంది. అది అతడికి ఆనందం ఇవ్వటం లేదు. అందుకే తను అనుకున్న విధంగా ఉండే ఉద్యోగం కోసం చూస్తున్నాడు.
ఆ రోజు ఎప్పటిలానే గేరేజ్ కుర్రాళ్ళతో కలిసి కబుర్లు చెప్తూ ఏదో పనిలో ఉండగా దాదాపు ప్రతీ పార్టు రిపేరుకొచ్చిన కారొకటి షెడ్డుకి వచ్చింది. యజమాని బాగా డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆ కారు అతడికి సెంటిమెంటు. సరే దాని రిపేర్ జీవన్ చూస్తానని మొదలు పెట్టాడు. కారు బాగా పాత మోడల్ కావడం వల్ల పార్ట్స్ దొరకడం కాస్త కష్టమే అయ్యింది. ఇంజిన్ కూడా బోర్ కి వచ్చేసింది. నిజానికి అలంకరణ కోసం మాత్రమే వాడాలి ఇలాంటి యాంటీక్ పీసులని. కానీ అతడు చిన్న చిన్న అవసరాలకి ఈ కారులోనే తిరుగుతాడు. నా ప్రాణం ఉన్నంతవరకూ ఇది నడిచేలా చూడవయ్యా జీవన్ అంటూ నవ్వేస్తూనే సెంటిమెంటు పూసేవాడు.
జీవన్ తనకున్న మెకానికల్ ఇంజనీరింగ్ పట్టాని ఆ చదువుని అప్పుడు ప్రయోగాత్మకంగా వినియోగించడం మొదలు పెట్టాడు. దొరకని కారు భాగాలకి ఆల్టర్నేట్ స్పేర్ పార్స్ మార్కెట్ లో వెతకడం, పాత షెడ్డుకొచ్చేసి పనికిరాకుండా పడి ఉన్న కార్లలోవి కొన్ని పార్ట్స్ తీసుకుని, ఇంక దొరికే అవకాశమే లేని చిన్న చిన్న పార్ట్స్ ని మిగిలిన మెకానిక్స్ తో కలిసి తనే తయారుచేసి ప్రయోగించి చూసి, ఎన్నో ప్రయత్నాల తర్వాత మొత్తానికి ఆ కార్ ని రోడ్డుమీద పెరుగు పెట్టేలా చేశాడు.
కార్ యజమాని సంతోషానికి అవధుల్లేవు. అతడు ఆ సంతోషంతో మంచి ఎమౌంట్ ఆ షెడ్ యజమాని చేతిలో పెట్టాడు. బదులుగా షెడ్ యజమాని, సర్, ఇంకొక చిన్న ఫేవర్ చేయగలరా మీకు అవకాశం ఉంటే అని అడిగాడు. చెప్పమని కారు యజమాని అనగానే, సర్, మీ కార్ రిపేర్ చేసిన జీవన్ సాధారణ మెకానిక్ కాదు. ఒక మెకానికల్ ఇంజినీరు. అతడు తన కాలేజీకే ఫస్ట్ వచ్చాడు. ఇక్కడ ఉద్యోగం వచ్చేవరకూ పనిచేస్తున్నాడు. అతడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరేదైనా మంచి ఉద్యోగం ఇచ్చి సాయం చేస్తే అతడికి చాలా మంచి జరుగుతుంది అనడిగాడు. అలా ఐతే ఇంత ఆలోచన ఎందుకు, మా కార్ మేకింగ్ యూనిట్ లో చేరమనండి. నేను చెప్తాను. అతడికి అతడి అభిరుచికి తగ్గట్టుగానే అన్నీ నేర్చుకోవడానికి, కొత్తవి తయారు చేయడానికీ కూడా అవకాశం వస్తుంది అన్నాడు.
ఇహ ఆలస్యం లేకుండా అక్కడ జాయిన్ అవడం, ఒక జూనియర్ ఇంజినీర్ గా జాయిన్ అయినా, తన తెలివి, ఇదివరకటి అనుభవం రంగరించి పనులు చురుగ్గా చేయడం, కొత్తవి నేర్చుకోవడం లాంటివి ఇట్టే జరిగిపోయాయి.
అతడికి అమ్మ దగ్గర నేర్చుకున్న మేనేజ్మెంట్ పాఠాలు, నాన్న దగ్గర నేర్చుకున్న ఫైనాన్షియల్ బేలెన్స్, ఇంటి వాతావరణం నుంచి వచ్చిన ఎనలైజింగ్, చదువుతో వచ్చిన సైంటిఫిక్ నాలెడ్జ్, మెకానిక్ షెడ్ లో నేర్చుకున్న ప్రాక్టికల్ నాలెడ్ధ్, సహజంగానే తనకున్న ఓర్పు ఒక కాన్ఫిడెన్స్ ని ఇచ్చి, త్వరగానే మంచి ఇంజనీర్ గా పేరు తెచ్చుకున్నాడు ఆ కంపెనీలో.
మూడు సంవత్సరాల క్రితమే అతడిని రీసెర్చ్ విభాగంలో సీనియర్ ఇంజనీర్ గా ప్రమోట్ చేసి, కొత్తవి, మన్నిక మరియు చవకగా అన్ని తరగతుల వాళ్ళకి పనికి వచ్చే స్పేర్పార్ట్స్ తయారుచేసే రీసెర్చ్ లో అతడిని ఉంచారు. అది అంత సులువేం కాదు. కానీ అతని పట్టుదల ముందు ఏ కష్టమైనా తలవంచాల్సిందే. అతగాడు ఎన్నో చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ తన ఆధ్వర్యంలో తయారు చేయిస్తూ తన కంపెనీని మార్కెట్లో ముందుకు దూసుకెళ్ళేలా తనవంతు కృషి చేస్తున్నాడు.
ఉత్తమ రీసెర్చ్ ఇంజనీర్ గా ఎవార్డుని కూడా అందుకున్నాడు. ఇలా సాగుతున్న తన జీవితంలో, ఈ రోజు చాలా స్పెషల్. తను గత కొన్నేళ్ళుగా పగలు ఉద్యోగంలో ఎంత హడావుడిగా ఉన్నా, సాయంత్రం గేరేజ్ కి వెళ్ళి తను చేస్తున్న స్పెషల్ ప్రయోగం పూర్తయ్యి రిజల్ట్ వచ్చే రోజు. తను అనుకున్న విధంగా అతి తక్కువ ఖర్చుతో, నాణ్యమైన భాగాలతో తన తల్లిదండ్రులకోసం తానే స్వయంగా తయారుచేసిన కార్. ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. వాళ్ళకి అలా గిఫ్ట్ గా రెడీ చేశాడు. తను ఆఫీస్ కి సెలవు పెట్టాడు. అందుకే ఎప్పుడూ హడావుడిగా ఉండే తను ఈ రోజు స్థిమితంగా పేపర్ చదువుతున్నాడు.
ఏరా, ఇంకా స్నానం అవలేదా, నేను టిఫిన్ రెడీ చేసేసేను అంటూ వాళ్ళ అమ్మ పిలిచేసరికి ఆలోచనల్లొంచి బయటపడి, పేపర్లోంచి తలెత్తి వచ్చేస్తున్నానమ్మా అంటూ రెడీ అయి తన సర్ప్రైజ్ ని తేవడానికి వెళ్ళాడు….
అది చూసిన తల్లిదండ్రులు ఆనందం, చెల్లెలికి గర్వం, వాళ్ళ సంబరాలు వంటివి చెప్పనలవి కాకుండా నడిచింది. అతడి ఇన్నేళ్ళ దీక్ష పట్టుదల ఆ కారు రూపంలో కళ్ళముందు కొచ్చేసరికి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం భాష్పరూపం దాల్చింది. ఈ సంస్కారం, తెలివి, చదువు, రూపం, చురుకుదనం ఏదైనా వారినుండి సంక్రమించినవే. వారి కాళ్ళకి సవినయ నమస్కారాలు చేసాడు అతడు.

జీవితం కొనసాగుతూనే ఉంటుంది.

సమాప్తం

1 thought on “పట్టుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *