July 5, 2024

బాలమాలిక – పాలబువ్వ

రచన: నాగమణి

కొడుకును నట్టింట్లో కూర్చోబెట్టి, తాను వెళ్ళి ఒక గ్లాసుడు నీళ్ళు తాగి వచ్చింది మల్లమ్మ.
అప్పుడు గమనించింది కొడుకు రాము చేతిలోని ఆ కారు బొమ్మను. “ఇదేందిరా అయ్యా! ఈ బొమ్మ ఎక్కడిది? కొంపదీసి, అమ్మగోరి ఇంట్లో బుల్లిబాబుదా?” కోపంగా కొడుకు వైపు చూస్తూ అడిగింది.
“అవునమ్మా!… బాగుందని ఆడుకోవటానికి తెచ్చుకున్నాను…” చేతిలో బొమ్మ వైపు ఆశగా చూసుకుంటూ జవాబు ఇచ్చాడు నాలుగేళ్ళ రాము.
“ఇంట్లో ఒక్కడివి ఉన్నావని, జొరపడి లెగిసావని ఒక్కడినీ ఒదిలేయలేక, పనికి నాతోపాటు తీసుకు బోయినందుకు మంచి పనే సేసావురా… దొంగతనం సేసినావు… బుద్ధి లేదురా? నువ్వు ఈ మల్లమ్మ కొడుకువేనా?” ఆవేశంగా కొడుకు వీపు మీద రెండు దెబ్బలు వడ్డించింది మల్లమ్మ.
“ఎందుకమ్మా కొడుతున్నావు? నువ్వు ఇలాంటియి కొనియ్యవు. నేను తెచ్చుకుంటే దొంగతనం అంటున్నావు…” ఉక్రోషంగా ఏడుస్తూ అడిగాడు రాము.
మల్లమ్మ మనసు నీరైపోయింది.
“ఒరేయ్ నానా, నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవ్వరూ లేరురా మనకు. ఆ అమ్మగారింట్లో పని పోయిందంటే అడుక్కు తినాల. సూడరా బాబు, నువ్వు పేణంగా సూసుకుంటావే, ఆ చెక్కబొమ్మని ఎవరైనా తీసుకుపోతే ఊరుకుంటావారా?”
“అమ్మా… అది నాది, నేనియ్య. నా చిన్నప్పుడు నాన్న తెచ్చాడని చెప్పావుగా, అది నాకేగా… మరి నాన్న లేకపోయినా దాన్ని ఎత్తుకుంటే, నాన్న ఒళ్ళో కూసున్నట్టు ఉంటాది నాకు…” అన్నాడు రాము.
“కదా, మరి బుల్లిబాబు గారిక్కూడా ఈ బొమ్మంటే అంతే ఇట్టం ఉంటాది కదా… మరి ఇది పోయిందంటే అన్నం మానేసి ఏడుత్తాడు కదా…” వాడికి అర్థమయ్యేలా వివరించటానికి ప్రయత్నించింది మల్లమ్మ.
అవునన్నట్టు తల ఊపాడు రాము.
“బుల్లిబాబు నీ దోస్త్ కదా… మరి ఆ బాబు ఏడిత్తే నీకు బాగుంటాదా?”
వెంటనే అడ్డంగా తలూపాడు రాము.
“రేపు నీతో పాటు వచ్చి, ఇది బాబుకి ఇచ్చేస్తానమ్మా…”
మల్లమ్మ మనసు చల్లబడింది. కొడుకును తొందరపడి ఆవేశంతో కొట్టినందుకు మనసు పశ్చాత్తాపపడింది. ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడింది.
“మంచిగా సదువుకోవాల. పెద్దయి, బాగా సదువుకుని ఉజ్జోగం సేత్తే, నీకు బోలెడు డబ్బులు ఇస్తారు ఆపీసోళ్ళు. అప్పుడు నీక్కావలసింది కొనుక్కుందువు లేరా… ఇలా వాళ్లకి తెలీకుండా ఎత్తుకొచ్చేయటం తప్పు. తెలిసిందా?”
తెలిసిందన్నట్టు బుద్ధిగా తల ఊపాడు రాము.
“సూడు, ఒచ్చే నెలలో నీ పుట్టినదినానికి నీకు మంచి బొమ్మ కొనిత్తాలే… దా బువ్వెడతాను, తినేసి, బజ్జుందువు గానీ…” అంటూ వాడిని ఎత్తుకుంది మల్లమ్మ.
తల్లి మెడచుట్టూ చేతులు వేసి, ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు రామూ.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *