July 7, 2024

మమత – మానవత

రచన: సుందరీ నాగమణి

అలసటగా కిటికీ ఊచలకు తలాన్చి నిద్రలోకి జారిన కన్నయ్య, ఒక్క కుదుపుతో రైలాగటంతో ఉలిక్కిపడి లేచాడు. క్షణం పాటు తానెక్కడున్నాడో అర్థం కాలేదు. కొన్ని లిప్తల తరువాత, జరిగినదంతా గుర్తు వచ్చింది. కొడుకు ఇంట్లో గొడవ జరగటం, తాను వికలమైన మనస్సుతో స్టేషన్ కి వచ్చి, కదులుతున్న రైలు ఎక్కేయటం… అంతా… బయటకు చూసాడు. ఏదో చిన్న స్టేషన్. సిగ్నల్ కోసమనుకుంటా… ఆగి ఉంది రైలు.
కనుచీకటి పడుతోంది… మసక చీకటిలో బోర్డ్ కనిపిస్తోంది, తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో… అయితే బార్డర్ దాటేసి మళ్ళీ తెలుగు దేశం లోకి వచ్చేసాడన్నమాట తాను… దిగులుగా నిట్టూర్చాడు కన్నయ్య. దాహంగా అనిపించటంతో సంచీలోంచి మంచినీళ్ళ సీసా తీసి గొంతు తడుపుకున్నాడు. కడుపులో చిన్నగా ఆకలి మొదలైంది.
టీసీ వచ్చి టికెట్స్ చెక్ చేయసాగాడు. కన్నయ్య అందించిన పాస్ చూసి తలపంకించి, “ఒక్కరే వెడుతున్నట్టున్నారు… జాగ్రత్తండీ…” అన్నాడు ఆదరంగా… తల ఊపి, తన ఫ్రీడం ఫైటర్ పాస్ జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు.
మనవరాలు పులకిత గుర్తు వచ్చింది. ఆ ఇంట్లో తనను ఆదరంగా చూసేది ఆ పాప ఒక్కతే. కొడుకు ఎప్పుడో కోడలికి వశమైపోయాడు. మనవడు మోక్ష్ పదిహేనేళ్ళవాడు. వాడికి కోడలికి మల్లేనే తన పొడ గిట్టదు. ఎప్పుడూ చీదరించుకుంటూ ఉంటాడు. తన కొడుకు సుజన్ కి తనను పలకరించే తీరిక, ఓపిక రెండూ లేవు.
బెంగుళూరులో ఒక పేరు గాంచిన పెద్ద కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు సుజన్. కన్నడిగురాలైన మంజులను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. భార్యను పోగొట్టుకొని ఒంటరిగా ఊళ్ళో ఉన్న కన్నయ్యను తమ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు సుజన్. కానీ ఆ విషయం మంజులకు నచ్చలేదు. తను, భర్త, సంతానం మాత్రమే తన కుటుంబం అని నమ్మే సగటు నవీన సమాజపు స్త్రీ ఆమె. కానీ ఆ విషయం సుజన్ కి చెప్పకుండా, అయిష్టతను బయట పడనీకుండా మేనేజ్ చేసింది.
మూడు సంవత్సరాలుగా కొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు కన్నయ్య… మనిషిలా కాదు… జీవచ్ఛవంలా… తాను తన గది విడచిపెట్టి బయటకు రాకూడదు. లోపలే ఉండాలి. భోజనం కూడా గదికే పంపిస్తుంది మంజుల. ఆమె బంధువులు, స్నేహితులు వచ్చినపుడు వారి కంట పడకూడదు. పిల్లలతో కూడా చనువుగా మాట్లాడకూడదు. సుజన్ కి తనతో మాట్లాడే తీరిక లేదు. వారానికోసారి గదిలోకి వచ్చి, క్షేమసమాచారాలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. తనకు మాట్లాడే అవకాశమూ ఉండదు. కావలసిన మందులు, పండ్లు కొని ఇచ్చేవాడు. ఆ తరువాత ఆ బాధ్యత కోడలు స్వీకరించింది.
ఓ మూడు నెలలుగా ప్రతీరోజూ వేసుకునే మందులకు కరువు ఏర్పడింది. మందులు అయిపోయాయని చెబితే విసుక్కోవటం మొదలైంది. భోజనం కూడా ఉదయం మిగిలిన అన్నం, లేదా రాత్రి మిగిలిన కూరలు వేసి పంపటం మొదలుపెట్టింది. తినలేక పక్కన పెడితే నానా రాద్ధాంతం చేస్తోంది. కన్నయ్య కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఎలాంటిది తన వైభవం? పది ఎకరాల ఆసామీ తాను. తనకింద ముగ్గురు పాలేర్లు, ఇంట్లో నిత్య పాడి… ప్రతీరోజూ ఒకటో, రెండో విస్తళ్ళు అదనంగా లేవాల్సిందే తనింట్లో. అన్నపూర్ణ కూడా అతిథి అభ్యాగతులకు అమ్మవారిలాగానే భోజనం పెట్టేది. కొడుకును, కూతుర్ని అపురూపంగా పెంచుకున్నారు తాము. కొడుకు పైచదువుల కోసమని, పొలం అమ్మేయక తప్పలేదు.
కూతురు రమ్య తన క్లాస్ మేటుని ప్రేమించానని, పెళ్ళి చేసుకోవటానికి అనుమతి అడిగింది. తాను ససేమిరా అన్నాడు. ఓ శుభముహూర్తాన ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసేసుకుంది. కూతురు చచ్చిపోయింది అనుకున్నాడు కఠినంగా… కూతురి మీద బెంగతో అన్నపూర్ణ కాలం చేసింది. ఒంటరిగా మిగిలిపోయాడు. మిగిలిన ఒక్క ఎకరంలో కూరగాయలు పండిస్తూ, ఉన్న ఇంట్లో కాస్త ఉడకేసుకుంటూ కాలం గడుపుతుంటే, కొడుకు వచ్చి తమతో ఉండమని తీసుకువెళ్ళాడు…

***

కోడలు మంజులకు తన ఉనికి ఇష్టం లేదని తెలుసుకానీ, చద్ది కూడుతో పాటుగా తనకు దొంగ అనే ముద్ర వేస్తుందని మాత్రం ఊహించలేదు. ఓర్వలేని తనం ఏమైనా చేయిస్తుంది…
తన గదిలో స్నానానికని వెడుతూ ఉంచిన చెవి కమ్మలు పోయాయని గొడవచేసింది నిన్న. చిత్రంగా అవి తన గదిలో భగవద్గీత పుస్తకం కింద దొరికాయి. అంతే… క్షణంలో తాను దొంగ అయిపోయాడు. దేశమాత సంకెళ్ళు తెంచటానికని ప్రాణాలొడ్డి పోరాడిన తాను, ఈరోజు నీతిమాలిన దొంగ…
కొడుకు కోడల్ని బ్రతిమాలాడు. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దనీ, తన తండ్రిని తానే ఇంట్లోంచి పంపించివేస్తానని నచ్చజెప్పాడు. ఆ శ్రమ కొడుక్కి ఇవ్వకుండా, వాళ్ళు చూస్తుండగానే గడప దాటి బయటకు వచ్చేసాడు కన్నయ్య. నేరుగా స్టేషన్ కి వెళ్ళి, కదలబోతున్న ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేసాడు.
దొంగ… తానిప్పుడు దొంగ! కన్నయ్యకు దుఃఖం వచ్చింది… ఏదో ఒంటరిగా కాలక్షేపం చేస్తున్న తనను తమ దగ్గరకు తీసుకురావటం ఎందుకు? ఇప్పుడు ఇలా దొంగ అని ముద్రవేసి, దోషిని చేసి వెళ్ళగొట్టటం ఎందుకు? మంజులను తానెప్పుడూ వేరుగా చూడలేదు. తన కూతురనే అనుకున్నాడు. అలాంటిది ఆమెకు తన మీద అంత ద్వేషం ఎందుకనో…
రైలు కదిలింది. చల్లని గాలి ఒళ్ళంతా తడిమింది. బ్యాగ్ లోంచి షాల్ తీసి కప్పుకుని, మంచినీళ్ళు తాగాడు మళ్ళీ. కడుపులో ఆకలి ఎక్కువైంది. కంపార్ట్మెంట్ లోకి అమ్మకానికి ఏమీ రావటం లేదు.

***

కాసేపటికి ఏదో పెద్ద స్టేషన్ లో ట్రైన్ ఆగింది. అక్కడ పులిహోర, పెరుగన్నం పొట్లాలు అమ్ముతున్నారు. వేడివేడిగా ఇడ్లీ కూడా… కానీ తాను కూర్చున్న కంపార్ట్మెంట్ నుంచి కొంచెం దూరంగా… లేచి దిగి వెళ్లాలని అనుకున్నాడు కన్నయ్య. అయితే, సీట్ లోంచి లేచేసరికి ఒళ్ళు తూలినట్టు అయింది…
“అరెరె… జాగ్రత్త అండీ…” అంటూ ఒకతను చేయి ఆసరా ఇచ్చి కూర్చోబెట్టాడు.
“ఏం కావాలండీ? నేను బండి దిగుతున్నాను… చెప్పండి, తీసుకువస్తాను…” అన్నాడతను.
“అబ్బే, ఏంవద్దు బాబూ… ఏమైనా తినటానికి తెచ్చుకోవాలని లేచానంతే…”
“ఫరవాలేదు సర్… నేను అందుకే దిగుతున్నాను. మీకూ ఏమైనా తెస్తాను…” కన్నయ్య వారించేలోగానే దిగిపోయాడు అతను. పదినిమిషాల తరువాత, వాటర్ బాటిల్, చేతిలో టిఫిన్ పేకెట్ తీసుకువచ్చి, కన్నయ్య సీట్ మీద పెట్టి, “తినండి…” అన్నాడు, ఆదరంగా.
కన్నయ్యకు కృతజ్ఞతతో కళ్ళు చెమరించాయి. అప్రయత్నంగా చేతులు జోడించి, పొట్లం విప్పి, వేడి వేడి
ఇడ్లీలు చట్నీలో అద్దుకుని తినసాగాడు. ఎదురుగా కూర్చున్నాడు అతను.
“బావున్నాయ్ కదండీ ఇడ్లీలు? నేను రెండు ప్లేట్లు లాగించి వచ్చాను…” అన్నాడు నవ్వుతూ.
పొలమారింది కన్నయ్యకు… ఒక్కసారిగా దగ్గు తెర కమ్మేసింది. ఉక్కిరి బిక్కిరి అయి, కళ్ళలోకి నీళ్ళు చిమ్మాయి. “అయ్యయ్యో…” అంటూ… నీళ్ళ బాటిల్ మూత తీసి, ఆయనతో తాగించాడు అతను. ఆయన కుదుటపడి, మళ్ళీ తినసాగాడు. తిన్నాక, ఆయన భుజం పట్టుకుని లేపి, వాష్ బేసిన్ దగ్గరకు తీసుకువెళ్ళాడు అతను.
ఆ తరువాత ఫ్లాస్క్ లోంచి డిస్పోసబుల్ కప్పులోకి కాఫీ వంచి, ఆయనకు తాగటానికి ఇచ్చాడు. కాఫీ తాగి తేరుకున్న కన్నయ్య అతని వైపు చూస్తూ రెండు చేతులూ జోడించాడు.
“ధన్యవాదాలు బాబూ… ప్రాణాలు నిలబెట్టావు. ఎంత అయింది టిఫిన్ కి?” జేబులో చేయి పెట్టి, తన దగ్గర మిగిలిన నోట్లు తీసి, చూసుకుంటూ అడిగాడు కన్నయ్య.
“భలేవారే, డబ్బులిస్తారా? లోపల ఉంచండి సర్… మా నాన్నగారి దగ్గరైతే తీసుకుంటానా?” వారించాడు ఆ వ్యక్తి.
“అది కాదు బాబూ…” అంటున్న కన్నయ్యను మాట్లాడనీయలేదు.
“నీ పేరేంటి బాబూ?”
“విజయ్ అండీ… విజయ్ డానియెల్…”
“ఓ… ఎక్కడ ఉంటారు మీరు?”
“వరంగల్లో లెక్చరర్ గా పని చేస్తున్నాను. బెంగుళూర్ లో పని ఉండి, చూసుకుని, తిరుపతి వెళుతున్నాను ప్రస్తుతం. నా భార్య అక్కడ పనిచేస్తోంది…”
“అలాగా, చాలా సంతోషం బాబూ…”
“మీరు కూడా నాతో మా ఇంటికి రాకూడదూ? మా ఆవిడ చాలా సంతోషపడుతుంది…”
“నేనా? నేను… రాజమండ్రి వెళుతున్నాను బాబూ…”
“వెళుదురు లెండి… మేమే వచ్చి మిమ్మల్ని ఎల్లుండి బండి ఎక్కిస్తాము… నాతో పాటు మా ఇంటికి రండి…” మళ్ళీ ఆహ్వానించాడు విజయ్.
“కానీ… నేను మీ ఇంటికి…” విస్మయంతో కన్నయ్యకు మాట రావటం లేదు.
“మీ అమ్మాయి రమ్య ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది మామయ్యా!” విజయ్ కళ్ళలో నీళ్ళు.
కన్నయ్య మీద వేల టన్నుల బరువున్న పర్వతం విరిగి పడినట్టు అయింది.
“అంటే… నువ్వు… మీరు… రమ్య భర్త… కాదు కాదు… నా అల్లుడు… ప్రాణదాత….” ఆయన గొంతు దుఃఖంతో, వివిధ రకాల భావాలతో పూడుకుపోయింది. నమ్మలేనట్టు తల విదిలించి, విజయ్ వైపు చూసాడు. ఆయన కళ్ళలో క్షమాపణ కనిపిస్తోంది… గిల్టీనెస్ కనిపిస్తోంది.
దేశమాత పాదాలకు ప్రతీరోజూ ప్రణమిల్లే తాను, కాబోయే అల్లుడు ఒక ఇతర మతానికి చెందిన వాడని అతన్ని కాదన్నాడు. కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. భారతమాత మతంతో సంబంధం లేకుండా అందరికీ అమ్మే కదా… ఇంత చిన్న విషయాన్ని తానెలా మర్చిపోయాడు?
అపరాధ భావన ఎక్కువ అవుతూ ఉండగా, విజయ్ వైపు చూసి, కన్నీళ్ళతో రెండు చేతులూ జోడించాడు.
“ఛ ఛ! దీవించవలసిన చేతులు ఇలా చేయకూడదు మామయ్యా… ఇంటికి వెళదాము… మీ అమ్మాయి,
మనవడు మీకోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకో పది నిమిషాల్లో తిరుపతి స్టేషన్ వస్తోంది…” వంగి, ఆయన బ్యాగ్ ను సీట్ క్రిందనుంచి బయటకు లాగాడు విజయ్.
“బాబూ… నీ ఇంటికి వచ్చే అర్హత నాకుందంటావా?”
“మీకు కాకపొతే ఎవ్వరికీ లేదు మామయ్యా… ఇప్పటికే చాలాకాలం దూరంగా ఉన్నాము. మన శిక్షాకాలం ముగిసింది…” నవ్వుతూ చెప్పాడు విజయ్.

***

(సమాప్తం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *